NDA
-
అట్టుడుకుతున్న మణిపూర్.. సంగ్మా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బీజేపీ ఆధ్వర్యంలోని మణిపుర్ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఆదివారం(నవంబర్ 17) ప్రకటించారు.‘మణిపూర్‌లో సంక్షోభాన్ని పరిష్కరించడంలో సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజా హింసాత్మక ఘటనల్లో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మా మద్దతును తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఎన్పీపీ తెలిపింది. మణిపుర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లున్నాయి. వీటిలో 53స్థానాలతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఈ 53 సీట్లలో ఎన్పీపీకి ఏడు సీట్లున్నాయి.హింసాత్మక ఘటనల నేపథ్యంలో మణిపుర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఆదివారం(నవంబర్ 17)ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహించారు. కాగా, మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌తోపాటు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై నిరసనకారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. -
Jharkhand Assembly Election 2024: ప్రాంతాల పోరులో... పైచేయి ఎవరిదో!
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అస్థిరతకు మారుపేరైన జార్ఖండ్ మరోసారి అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. ప్రజాకర్షక పథకాల సాయంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి ఆశపడుతోంది. జనాభాలో మెజారిటీ అయిన గిరిజనులతో పాటు ముస్లిం మైనారిటీల్లో సీఎం హేమంత్ సోరెన్‌కు ఉన్న ఆదరణ గట్టెక్కిస్తుందని నమ్ముతోంది. ఎన్డీఏ సారథి బీజేపీ మాత్రం ఐదేళ్లనాడు చేజారిన అధికారాన్ని ఎలాగైనా ఒడిసిపట్టాలని ఉవి్వళ్లూరుతోంది.హేమంత్ తదితరుల అవినీతినే ప్రధానాస్త్రంగా చేసుకుంది. గత ఎన్నికల్లో ముఖం చాటేసిన గిరిజనులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. వలసలు తదితరాలను ప్రస్తావిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడింది. 81 అసెంబ్లీ స్థానాల్లో 43 సీట్లకు బుధవారం తొలి విడతలో పోలింగ్ జరగనుంది. మిగతా 38 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలెన్ని ఉన్నా జనాభాలో 35 శాతంగా ఉన్న గిరిజనులే మరోసారి ఫలితాన్ని నిర్దేశించనున్నారు.ప్రాంతాలవారీగా చూస్తే గిరిజనులు ఏకంగా 60 శాతముండే కొల్హన్, సంథాల్ పరగణాల్లో జేఎంఎంకు తిరుగులేని పట్టుంది. 25 అసెంబ్లీ స్థానాలున్న కీలకమైన నార్త్ చోటానాగపూర్తో పాటు ఎస్సీ ప్రాబల్య పాలము ప్రాంతంపై బీజేపీ ఆధిపత్యం సాగుతోంది. ఐదో ప్రాంతమైన సౌత్ చోటానాగపూర్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు కూటములు పోటాపోటీగా తలపడ్డాయి. సంథాల్ పరగణా అత్యంత వెనకబడ్డ జిల్లాలున్న ఈ ప్రాంతం ఇటు బిహార్, అటు పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులు పంచుకుంటుంది. ఇక్కడి 18 అసెంబ్లీ స్థానాల్లో ఏడు ఎస్టీ, ఒకటి ఎస్సీ రిజర్వుడు సీట్లు. ఎస్సీలు 8 శాతముంటే ఎస్టీలు 28, ముస్లింలు 23 శాతమున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి ఏకంగా 13 స్థానాలు గెలుచుకోగా బీజేపీకి 5 మాత్రమే దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో: 10 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిపత్యం సాగగా 8 బీజేపీని ఆదరించాయి. కొల్హాన్ ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులు పంచుకునే ఈ ప్రాంతంలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ఒక ఎస్సీ, 9 ఎస్టీ స్థానాలున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 42 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమే ఉంటారు. ముస్లింలు 6 శాతమున్నారు. ఈసారి అధికారం దక్కాలంటే నార్త్ చోటానాగ్‌పూర్‌లో ఆదరణను నిలబెట్టుకుంటూ సంతాల్, కొల్హాన్ ప్రాంతాల్లో పాగా వేయడం ఆ పారీ్టకి తప్పనిసరి. ఇందుకోసం ఇటీవలే జేఎంఎం నుంచి వచ్చిన మాజీ సీఎం చెంపయ్ సోరెన్‌పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అక్రమ వలసల అంశం ఈ ప్రాంతంలో తమకు బాగా కలిసొస్తుందని అంచనా వేస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి 13 స్థానాలు దక్కగా బీజేపీ పూర్తిగా చతికిలపడింది లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఆదరణ దక్కింది. పాలము ఇటు బిహార్, అటు ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దులున్న ప్రాంతం. 9 అసెంబ్లీ స్థానాల్లో రెండు ఎస్సీ, ఒక ఎస్టీ సీట్లున్నాయి. 25 శాతం ఎస్సీలుండటం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి ఐదు సీట్లు దక్కగా బీజేపీ మూడింటితో సరిపెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ సీట్ల పరిధిలో బీజేపీ ఆధిపత్యమే సాగింది. నార్త్ చోటానాగ్పూర్ 25 అసెంబ్లీ స్థానాలున్న అతి కీలక ప్రాంతం. బిహార్, పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులున్నాయి. ఈ ప్రాంతంలో ఒక్క ఎస్టీ రిజర్వుడు స్థానం కూడా లేకపోవడం విశేషం. ఇక్కడ బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచి్చన వాళ్లు ఎక్కువ. 17 శాతం ఎస్సీలు, 16 శాతం ముస్లింలుంటే ఎస్టీలు కేవలం 9 శాతమే ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: బీజేపీ 10, ఇండియా కూటమి 11 సీట్లు గెలుచుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీ హవాయే సాగింది. ఈ పరిణామం కమలనాథుల్లో హుషారు పెంచింది. సౌత్ చోటానాగ్పూర్ ఛత్తీస్‌గఢ్, ఒడిషాలతో సరిహద్దులున్న ఈ ప్రాంతం 15 అసెంబ్లీ స్థానాలకు నిలయం. 11 ఎస్టీ, ఒకే ఒక్క ఎస్సీ స్థానమున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 51 శాతముంటారు. ముస్లింలు 11 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి 8, బీజేపీ ఐదు సీట్లు గెలుచుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో: బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఆ పార్టీ 4 అసెంబ్లీ స్థానాల పరిధిలోనే మెరుగైన ప్రదర్శన చేసింది. మిగతా 11 చోట్లా ఇండియా కూటమి హవాయే సాగింది.67 శాతం రెడ్ అలర్ట్ స్థానాలే! 174 మందిపై కేసులు 235 మంది కోటీశ్వరులుసాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో బుధవారం తొలి దశలో పోలింగ్ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలున్నాయి! బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులుంటే వాటిని రెడ్ అలర్ట్ స్థానాలుగా పరిగణిస్తారు. ఇక 174 (26%) మందిపై క్రిమినల్ కేసులున్నట్టు జార్ఖండ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) వెల్లడించాయి.వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. బీజేపీలో 30 మంది (83%), కాంగెస్‌లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు. -
Jharkhand Assembly Elections 2024: ఆదివాసీ సీట్లే కీలకం!
ఎన్డీఏ, ఇండియా కూటముల అమీతుమీకి జార్ఖండ్‌లో సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా 13వ తేదీన తొలి దశలో 43 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మిగతా 38 సీట్లకు నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్ జరగనుంది. 23న రెండు రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి వెల్లడవుతాయి. జార్ఖండ్‌లో సంఖ్యాధికులైన ఆదివాసీలే ఈసారి కూడా పార్టీ ల గెలుపోటములను నిర్ణయించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 28 ఎస్టీ రిజర్వుడు సీట్లే కావడం విశేషం. వాటితో పాటు పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. దాంతో ఆదివాసీలను ప్రసన్నం చేసుకోవడానికి అధికార ఇండియా కూటమి, విపక్ష ఎన్డీఏ సంకీర్ణ సారథి బీజేపీ పోటీ పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 28 ఎస్టీ స్థానాలకు గాను ఇండియా కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఏకంగా 19 సీట్లలో పాగా వేయడం విశేషం. మొత్తమ్మీద 26 ఎస్టీ స్థానాలూ ఇండియా కూటమి ఖాతాలోకే వెళ్లాయి. బీజేపీకి కేవలం రెండే ఎస్టీ స్థానాలు దక్కాయి. అందుకే ఈసారి ఆదివాసీ స్థానాల్లో పాగా వేయడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకుని బీజేపీ అగ్ర నేతలంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఆదివాసీ హోదా కల్పిస్తూ వారి పొట్ట కొడుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అవినీతిలో పీకల్లోతున మునిగిపోయారంటూ ఊదరగొడుతున్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున హేమంత్‌కు దన్నుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రచార రంగంలో ఉన్నారు. ప్రియాంక కూడా ఒకట్రెండుసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి ఇండియా కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, వామపక్షాలు 3 చోట్ల పోటీలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం), జేడీ(యూ) కలసి పోటీ చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాలు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్‌కు 16 దక్కాయి. జేవీఎంకు 3, ఏజేఎస్యూకు 2 సీట్లొచ్చాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బంధువులు, వారసుల జోరు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారసుల హడావుడి మామూలుగా లేదు. ఈసారి ఏకంగా 25కు పైగా స్థానాల్లో నేతల బంధుమిత్రులు బరిలో ఉన్నారు. జేఎంఎంను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్ కుమారుడు బాబూలాల్ సోరెన్, మరో మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా సాహు, ఇంకో మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా, మరో మాజీ సీఎం మధు కోడా భార్య గీత తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేఎంఎం నుంచి సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఈసారి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ఆయన సోదరుడు బసంత్ సోరెన్, వదిన సీతా సోరెన్ కూడా పోటీలో ఉన్నారు. జేఎంఎం నుంచి 15 మంది దాకా నేతల వారసులు రంగంలో దిగారు. వలసదారులే ప్రధానాంశం! నిరుద్యోగం, ధరల పెరుగుదల, సాగు సంక్షోభం, గ్రామీణుల్లో నిరా శా నిస్పృహలు తదితర సమస్యలె న్నో జార్ఖండ్‌ను పట్టి పీడిస్తున్నాయి. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా వలసల అంశాన్ని తలకెత్తుకుంది. వలసదారుల సంక్షోభాన్ని ప్రధాన ఎన్ని కల అంశంగా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. జా ర్ఖండ్ జనాభాలో ఏకంగా 35 శాతం మంది వలసదారులే కావడం విశేషం. బంగ్లాదేశ్ నుంచి వచి్చపడుతున్న వలసలు ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని బీజేపీ నేతలంతా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం అభ్యర్థిపై ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే సీఎం పదవి చేపట్టబోయేది ఎవరో బీజేపీ కీలక నేత,డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హింట్ ఇచ్చారు. శివసేనకు చెందిన వ్యక్తే తమ కూటమి తరపునన సీఎం అయ్యే అవకాశాలున్నాయని చెప్పకనే చెప్పారు. బుధవారం(అక్టోబర్16) ముంబయిలో ఎన్డీఏ ప్రభుత్వ రిపోర్డు కార్డు విడుదల చేస్తూ ఫడ్నవిస్ మాట్లాడారు. తమ చీఫ్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారని,దమ్ముంటే మహావికాస్అఘాడీ(ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీ చీఫ్ శరద్‌పవార్‌కు సవాల్ విసిరారు. మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదు. మా సీఎం ఇక్కడే ఉన్నారు. ఎంవీఏ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు ఎందుకంటే వాళ్లకు గెలుస్తామన్న నమ్మకం లేదు. శరద్‌పవార్‌కు సవాల్ విసురుతున్నా. ఎంవీఏ కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించండి’అని ఫడ్నవిస్ శరద్‌పవార్‌ను కోరారు. కాగా, ఎన్డీఏ కూటమిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఇదీ చదవండి: షిండే సీఎం కాదు.. కాంట్రాక్టర్ మంత్రి -
కూటమి ఎంపీలను ఏకిపారేసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
-
ఇదేమి మిత్ర‘ధర్మం’?
సాక్షి, అమరావతి: నామినేటెడ్ పదవుల పంపిణీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇదేమి మిత్రధర్మమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించగా అందులో జనసేనకు 3, బీజేపీకి కేవలం ఒకటి ఇచ్చారు. ప్రకటించిన కార్పొరేషన్లలో ఛైర్మన్లు, ఒక వైస్ ఛైర్మన్‌తోపాటు కొన్నింటిలో డైరెక్టర్ పదవులుండడంతో వాటినీ భర్తీ చేశారు. డైరెక్టర్లతో కలిసి మొత్తం 99 నామినేటెడ్ పదవులు భర్తీ చేసినట్లు టీడీపీ ప్రకటన విడుదల చేసింది.కీలకమైన కార్పొరేషన్లను చంద్రబాబు తమ పార్టీ వారికే ఇచ్చుకున్నారు. ఆర్టీసీ, ఏపీఐఐసీ, శాప్, హౌసింగ్ బోర్డు, సీడాప్, మారిటైమ్ బోర్డు, మార్క్‌ఫెడ్, ఏపీటీడీసీ వంటి ప్రధానమైన కార్పొరేషన్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. జనసేనకు ఇచ్చిన మూడు కార్పొరేషన్లు కూడా అప్రాధాన్యమైనవేనని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. పెద్దగా గుర్తింపు లేని, ఎవరూ పట్టించుకోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్, టిడ్కో, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లను జనసేనకు కేటాయించారు. బీజేపీకి 20 సూత్రాల కమిటీ చైర్మన్ పదవి ఒకటే దక్కింది. అది కూడా టీడీపీ పాత నాయకుడు లంకా దినకర్‌కు ఇవ్వడంతో అది పేరుకు బీజేపీ ఖాతాయే తప్ప పదవి టీడీపీదేనని చెబుతున్నారు.ఒరిజినల్ బీజేపీ నేతలు ఎంతో మంది ఉండగా వారెవ్వరినీ పట్టించుకోకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకుడికి ఇవ్వడంపై ఆ పార్టీలో అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ముఖ్య నాయకులందరినీ పక్కన పెట్టి ఆ పార్టీలో ఉన్న తన శిష్యుడైన లంకా దినకర్‌కు పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి కంటి తుడుపుగా ఒక పదవి ఇవ్వడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లోపించిన సామాజిక సమతూకంమరోవైపు నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు ఓసీలకే ప్రాధాన్యత ఇవ్వడంపై మిగతా సామాజికవర్గాల నేతలు గుర్రుగా ఉన్నారు. 20 పదవుల్లో 9 ఓసీలకే కట్టబెట్టారు. బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నా ఏడు పదవులే ఇచ్చారని వెనుకబడిన వర్గాల నేతలు వాపోతున్నారు. ఎస్సీలకు రెండు, ఎస్టీ ఒకటి, మైనారిటీలకు ఒకటి కేటాయించి చేతులు దులుపుకున్నారని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పదవుల పంపకంపై టీడీపీ నేతలు సైతం అసహనంగానే ఉన్నారు. పదవులు ఆశించిన ఆలపాటి రాజా, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ముఖ్యమైన నేతలకు మొండి చేయే చూపారు. దీంతో సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
జమిలికి జై
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు ఈ టర్మ్‌లోనే ఉంటాయని కొద్ది రోజులుగా స్పష్టమైన సంకేతాలిస్తూ వస్తున్న మోదీ సర్కారు ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. దేశమంతటా అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన ’ఒక దేశం ఒకే ఎన్నిక’ ప్రతిపాదనకు జై కొట్టింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతో మన దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నుల్లో భారీ సంస్కరణలకు రంగం సిద్ధమైంది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు అన్ని స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేయడం తెలిసిందే. తొలుత దీనికి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాలని, ఆ మీదట దశలవారీగా నిర్ణయాన్ని అమలు చేయాలని సూచించింది. ‘కమిటీ సిఫార్సుల మేరకు అన్ని వర్గాలతోనూ సంప్రదింపుల ప్రక్రియ చేపట్టిన అనంతరం కేంద్ర న్యాయ శాఖ బిల్లు ప్రతిని రూపొందించి కేబినెట్ ముందు పెడుతుంది. అనంతరం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతాం‘ అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే శీతాకాల సమావేశాలే ఇందుకు వేదిక కావచ్చని చెబుతున్నారు. ఈ మేరకు ఒకే బిల్లు గానీ, అవసరమైతే పలు బిల్లులు గానీ ప్రవేశపెట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు లా కమిషన్ కూడా జమిలిపై త్వరలో నివేదిక సమర్పించనుంది. 2029 నుంచి ఒకేసారి అన్ని ఎన్నికల నిర్వహణ, హంగ్ వచ్చే పక్షంలో ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటు తదితర సిఫార్సులను కమిషన్ చేయవచ్చని సమాచారం. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలు కీలక వాగ్దానంగా ఉంటూ వస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని బీజేపీ, ఎన్డీయే పక్షాలు స్వాగతించగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు మాత్రం ఇది ఆచరణసాధ్యం కాదంటూ పెదవి విరిచాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ సర్కారు ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణించాయి. త్వరలో అమలు కమిటీ జమిలి ఎన్నికలకు ఇప్పటికే చాలా రాజకీయ పక్షాలు సమ్మతి తెలిపాయని కేంద్రం పేర్కొంది. ఇప్పుడు వ్యతిరేకిస్తున్న పారీ్టలు కూడా వైఖరి మార్చుకుంటాయని ఆశాభావం వెలిబుచ్చింది. దేశ ప్రజల్లో అత్యధికులు ఈ ప్రతిపాదనను సమర్థించిన నేపథ్యంలో ఆ దిశగా వాటిపై అంతర్గత ఒత్తిళ్లు వస్తున్నాయని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కోవింద్ కమిటీ సిఫార్సులను ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో ఒక అమలు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.‘ఈ అంశంపై రానున్న కొద్ది నెలల పాటు ప్రజలు, పార్టీలు, మేధావులు... ఇలా అన్ని రకాల వేదికల్లోనూ లోతుగా చర్చలు జరుగుతాయి. జమిలి ఎన్నికలకు విస్తృత ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తాం. దీర్ఘకాలంలో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసే ఇలాంటి కీలక అంశాలపై ఏకాభిప్రాయం కావాలన్నది మా ప్రభుత్వ విశ్వాసం. ఇది మన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే చర్య‘ అని చెప్పుకొచ్చారు. కమిటీ చేపట్టిన సంప్రదింపుల సందర్భంగా ఏకంగా 80 శాతం మందికి పైగా జమిలికి మద్దతిచ్చారని ఆయన చెప్పారు. ముఖ్యంగా యువత దీన్ని పూర్తిస్థాయిలో సమర్థించిందన్నారు. కాబట్టే జమిలికి ప్రస్తుతం విపక్షాల వ్యతిరేకంగా ఉన్నా.. విపక్షాలపై కూడా వైఖరి మార్చుకుందామంటూ అంతర్గతంగా ఒత్తిడి వస్తోందని ఒక ప్రశ్నకు బదులుగా మంత్రి అభిప్రాయపడ్డారు. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో జమిలి బిల్లు పెడతారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా బదులివ్వలేదు. మోడీ 3.0 హయాంలోని దీన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. 1967 దాకా జమిలి ఎన్నికలే స్వాతంత్య్రం వచ్చాక 1951 నుంచి 1967 దాకా దేశమంతటా లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత మధ్యంతరాలు తదితర కారణాలతో జమిలికి తెర పడింది. ఈ నేపథ్యంలో జమిలి కోసం భారీ కసరత్తే చేయాల్సి ఉంటుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరపడం, కొన్నింటిని ఆలస్యం చేయడం వంటి చర్యలు అవసరం అవుతాయి. రెండు దశల్లో అమలు కోవింద్ కమిటీ సిఫార్సుకోవింద్ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమర్పించింది. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ‘తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. 100 రోజు ల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపాలి‘ అని పేర్కొంది. అన్ని ఎన్నికలకూ ఉమ్మ డిగా ఒకే ఎలక్టోరల్ రోల్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల సంఘాల మధ్య సమన్వయం అవసరం. ఎందుకంటే ప్రస్తుతం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను సీఈసీ, స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలు నిర్వహిస్తున్నాయి. -
మోదీ 100 రోజుల పాలన.. రూ.3 లక్షల కోట్లతో ప్రాజెక్టులు: అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పడి వంద రోజులు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఓ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి పనులను ఇందులో వెల్లడించారు.జాన్‌లో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి దాదాపు రూ. 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వంరూ. 3 లక్షల కోట్లు కేటాయించిందని, 49,000 కోట్లతో దాదాపు 25,000 గ్రామాలను రోడ్డు నెట్‌వర్క్‌లకు అనుసంధానం చేసినట్లు తెలిపారు. 50,600 కోట్లతో దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులను విస్తరించాలని కేంద్రం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. గత పదేళ్లలో ఇళ్లు, టాయిలెట్లు, గ్యాస్ కనెక్షన్లు, త్రాగునీరు, విద్యుత్తు, ఉచిత ఆహార ధాన్యాలు, ఆరోగ్యం అందించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు దేశంలోల్లు లేని వారు ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయనున్నట్లు అమిత్ షా తెలిపారు.మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చిందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, ప్రజలు వాటికి సాక్ష్యాలుగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. రూ. 76,000 కోట్లతో మహారాష్ట్రలోని వాధ్వన్లో మెగా పోర్ట్‌ను నిర్మించనున్నారని చెప్పారు. ఇది ప్రపంచంలోనే టాప్ 10 పోర్టులలో ఒకటిగా మారనుందని తెలిపారు. ప్రభుత్వం PM eBus సేవా పథకాన్ని ప్రారంభించిందని, స్టార్టప్‌ల కోసం ఏంజెల్ పన్ను రద్దు ద్వారా 31% పన్ను భారాన్ని తొలగించిందని, అభివృద్ధి కోసం భారతదేశం అంతటా 12 పారిశ్రామిక జోన్లను గుర్తించిందని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ గురించి మంత్రి మాట్లాడుతూ.. సైబర్‌క్రైమ్‌ను పరిష్కరించడానికి వచ్చే ఐదేళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలను నియమించనున్నట్లు చెప్పారు.చదవండి: Atishi Marlena: ఢిల్లీ సీఎం కాబోతున్న ఈ మహిళ ఎవరుయువత కోసం రూ. 2 లక్షల కోట్ల ప్రధానమంత్రి ప్యాకేజీని కూడా ప్రకటించామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఐదేళ్లలో 4.10 కోట్ల మంది యువత దీని ద్వారా లబ్ధి పొందుతారని, కోటి మంది యువతకు అలవెన్సులు, వన్‌టైమ్ సహాయంతో పాటు అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కూడా అందించాలనితమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ‘ఈ 100 రోజుల్లో మధ్యతరగతి వారికి కూడా చాలా ఉపశమనం లభించింది. ఇప్పటి వరకు రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటిపన్ను లేదు. ఒక ర్యాంక్ వన్ పెన్ష మూడవ ఎడిషన్ అమలు చేస్తున్నాం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు మంజూరు చేశాం. వాటిలో 1 కోటి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు నిర్మాణం జరుగుతున్నాయి.పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా, బీహార్‌లోని బిహ్తా విమానాశ్రయాన్ని అప్‌గ్రేడ్ చేస్తున్నా. అగట్టి, మినికాయ్‌లో కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లను కూడా నిర్మిస్తున్నాం. బెంగళూరు మెట్రో, పూణే ప్రాజెక్టులను కూడా చేపట్టాం. ఈ 100 రోజుల్లో మెట్రో, థానే ఇంటిగ్రేటెడ్ రింగ్ మెట్రో అనేక ఇతర మెట్రో పనులు చేస్తున్నాం.వ్యవసాయ రంగంలో, 17వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ యోజనలో 9.5 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం రూ. 20,000 కోట్లు పంపిణీ చేసింది ఇప్పటి వరకు 12.33 కోట్ల మంది రైతులకు రూ. 3 లక్షల కోట్లు పంపిణీ చేశాం. గుజరాత్‌లోని సనంద్‌లో రూ. 3,300 కోట్లతో ప్రభుత్వం సెమీకండక్టర్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తుంది. యూనిట్ రోజుకు ఆరు మిలియన్ చిప్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. "రాబోయే 10 సంవత్సరాలలో, సెమీకండక్టర్స్‌లో భారతదేశం ప్రధాన పాత్ర పోషిస్తుంది.’ అని తెలిపారుఇదిలాఉండగా.. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా వివిధ మంత్రిత్వశాఖలు, పార్టీ నాయకులు వివరణాత్మక ప్రణాళికను రూపొందించాయన్నారు. ఇందులోభాగంగా సేవా పఖ్వాడా అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమాలు మంగళవారం నుంచి అక్టోబరు 2 వరకు కొనసాగుతాయన్నారు. -
రాజ్యసభ: మెజారిటీ మార్క్‌కి చేరిన ఎన్డీయే.. 12 మంది ఏకగ్రీవం
ఢిల్లీ: రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మంగళవారం.. మెజారిటీ మార్కుని చేరుకుంది. బీజేపీ బలం 96కి చేరుకుంది. కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 112కి చేరింది. అధికార కూటమికి ఆరుగురు నామినేటెడ్ ఎంపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది.మొత్తం 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 మంది బీజేపీ వారు కాగా, మరో మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఒకరు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నుంచి ఒకరు, ఆర్ఎల్ఎం నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాజ్యసభలో మొత్తం స్థానాలు 245 కాగా, ప్రస్తుతం ఎనిమిది ఖాళీగా ఉన్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్ నుంచి 4 ఉండగా, మరో నాలుగు నామినేట్ చేయబడ్డాయి. ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 237 కాగా, మెజారిటీ మార్క్ 119. కాంగ్రెస్ బలం 27కి చేరుకోవడంతో ప్రతిపక్షం హోదాను దక్కించుకుంది. ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే పార్టీకి కనీసం 25 మంది ఎంపీలు ఉండాలి. -
దారికొచ్చిన ఎన్డీయే సర్కారు!
అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపై కూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుక ముస్లిం సమాజంతో మాత్రమేకాదు...రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్‌సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్40 చెబుతోంది. అటు తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్‌దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట...కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించబోమని చెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం. -
ఇప్పుడు అర్జంటుగా ఎందుకు సార్! ఎన్నికలు లేవు! ప్రధానమంత్రి అభ్యర్థుల లొల్లీ లేదు!
-
డోన్ ఎమ్మెల్యే దుశ్చర్య.. యువకుల్ని చితకబాదిన కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
కూటమి ప్రభుత్వంలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయనేది అనే సంఘటనలు రుజువు చేశాయి. చేస్తూనే ఉన్నాయి. తాజాగా, కర్నూలులో ఎమ్మెల్యే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇద్దరు యువకుల్ని కర్రలతో చితకబాదిన వీడియో వైరల్‌గా మారింది.పంచాయితీ పేరుతో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు యువకుల్ని చితకబాదారు. తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని దూషిస్తూ కర్రతో కొట్టారు.వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులు తప్పు చేశారంటూ పంచాయితీ పెట్టి వారిని కొట్టారు ఎమ్మెల్యే. వాల్మిక సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకుల్ని ఇంత దారుణంగా అవమానించడం పట్ల కులసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు,న్యాయ వ్యవస్థ ఉండగా ఇలా ఎమ్మెల్యేనే తీర్పు చెప్పి దండించడం ఏంటని కులసంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. -
NITI Aayog: నితీశ్ అసంతృప్తి?
నీతిఆయోగ్ భేటీకి విపక్ష ఇండియా కూటమి సీఎంలతో పాటు పాలక ఎన్డీఏ సంకీర్ణంలో కీలక భాగస్వామి అయిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా డుమ్మా కొట్టడం విశేషం. ఆయన బదులు ఉప ముఖ్యమంత్రులు సమర్థ్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పాల్గొన్నారు. ఆయన కోరుతున్నట్టుగా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం ఇటీవలే స్పష్టం చేయడం తెలిసిందే. దీనిపై అసంతృప్తితోనే భేటీకి నితీశ్ దూరంగా ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే ఆయన గైర్హాజరుకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదని జేడీ(యూ) పేర్కొంది. గతంలో కూడా నితీశ్ పలుమార్లు నీతిఆయోగ్ భేటీకి గైర్హాజరయ్యారని గుర్తు చేసింది. కేంద్ర బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆరోపిస్తూ తెలంగాణ, కర్నాటక తమిళనాడు, కేరళ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, పాండిచ్చేరి సీఎంలు కూడా భేటీకి దూరంగా ఉన్నారు. ‘‘10 రాష్ట్రాల సీఎంలు భేటీకి రాలేదు. అది ఆయా రాష్ట్రాలకే నష్టం’’ అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం అన్నారు. ‘‘మమత సమయం పూర్తవగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మైక్‌పై తట్టారు. వెంటనే ఆమె మాట్లాడటం ఆపేసి వాకౌట్ చేశారు’’ అని ఆయన వివరించారు. బిహార్ అసెంబ్లీ సమావేశాల కారణంగా నితీశ్ రాలేకపోయారన్నారు. -
బాధ్యత లేని ‘బోగస్’ గెలుపు!
కష్టపడి సంపాదించిన వాడికే డబ్బు విలువ తెలుస్తుందంటారు. విలువ తెలుసు కనుక దానిపట్ల బాధ్యత కూడా పెరుగుతుంది. దొంగ సొత్తుకూ, అక్రమ సంపాదనకూ ఈ సూత్రం వర్తించదు. డబ్బు సంపాదనే కాదు, విజయ సాధన కూడా ఇంతే. అది ఎన్నికల విజయమైనా మరే రకమైన విజయమైనా సరే. పోరాడి గెలిచిన వాడికి తనకు దక్కిన విజయం పట్ల గౌరవం ఉంటుంది. విజయ హేతువుల పట్ల వినమ్రత ఉంటుంది. బాధ్యత ఉంటుంది. అన్ని రంగాల్లోనూ దొడ్డిదారి విజయాలు కూడా ఉంటాయి. ఎన్నికల్లో కూడా ఉంటాయి. పరోక్ష ఎన్నికల్లో ఇటువంటి దొడ్డిదారి విజయాల వికటాట్టహాసం మనకు తెలియనిది కాదు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల తీర్పును ‘దొంగిలించడమ’నే సరికొత్త సాంకేతిక ప్రక్రియ రంగప్రవేశం చేసింది. ఈ పరిణామం పట్ల మనదేశంలోని మేధావుల్లో, ప్రజాస్వామ్య వాదుల్లో, అభ్యుదయ శక్తుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి ఆందోళనే మహారాష్ట్రలోని కొంతమందిని ఒక దగ్గరకు చేర్చింది. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్‌డీ) అనే వేదిక తయారైంది.వీఎఫ్‌డీ అనే వేదికపైకి కొందరు వ్యక్తులతోపాటు కొన్ని సంస్థలు కూడా చేరుకున్నాయి. దేశంలో జరిగిన మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వేదిక కూడా మినహాయింపు కాదు. కానీ వీఎఫ్‌డీ మాత్రం ఆశ్చర్యంలోనే మునకేసి ఉండకుండా ఒక ముందడుగు వేసింది. ఎన్నికల ప్రక్రియను ఆసాంతం అధ్యయనం చేసి ఒక 225 పేజీల నివేదికను ఈమధ్యనే ఆ సంస్థ విడుదల చేసింది. ఈ నివేదికలో పొందుపరిచిన పలు అంశాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మన ప్రజాస్వామ్య ప్రక్రియ పవిత్రతను సహేతుకంగా శంకిస్తున్నాయి.ఈవీఎమ్‌ల పనితీరుపైనా, పారదర్శకతపైనా అనుమానాలు, అభ్యంతరాలు పాతవే. వీడీఎఫ్ కేవలం సందేహాలకు మాత్రమే పరిమితం కాకుండా పోలింగ్ సందర్భంగా, కౌంటింగ్ సందర్భంగా జరిగిన అవకతవకలను ఎత్తిచూపింది. ఎన్నికల ప్రక్రియకు ముందు ఎన్నికల సంఘంలో జరిగిన అసాధారణ మార్పులను ఎండగట్టింది. ప్రక్రియ ముగిసేవరకూ ఎన్నికల సంఘం అవలంభించిన ఏకపక్ష ధోరణిని నిర్ధారించింది. ఫలితాల ప్రకటనలోని అసమంజసత్వాన్ని వెలికి తీసింది.సాధారణంగా పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం ఏడు లేదా ఎనినిమిది గంటలకల్లా పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించడం రివాజు. ఎక్కడైనా కొన్ని బూత్‌లలో పోలింగ్ ఆలస్యంగా జరిగితే అవి కూడా కలుపుకొని రాత్రి ఆలస్యంగా గానీ, అరుదుగా మరుసటిరోజు గానీ తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటిస్తూ వస్తున్నది. ఈ పెరిగిన ఓటింగ్ శాతం గతంలో ఎన్నడూ కూడా ఒక శాతాన్ని మించిన అనుభవాలు లేవు. ఈసారి మాత్రం ఏడు దశల పోలింగ్‌లోనూ అసాధారణ పెరుగుదల నమోదైంది. కనిష్ఠంగా 3.2 శాతం నుంచి గరిష్ఠంగా 6.32 శాతం వరకు పెరుగుదల ఈ ఏడు దశల్లో కనిపించింది.గరిష్ఠంగా నాలుగో దశ పోలింగ్‌లో 6.32 శాతం పెరుగుదల నమోదైంది. ఈ దశలోనే పోలింగ్ జరుపుకున్న ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం పెరుగుదల కనిపించడంపై వీఎఫ్‌డీ విస్మయం వ్యక్తం చేసింది. మన చెవుల్లో పెద్దపెద్ద తామర పువ్వులుంటే తప్ప ఈసీ చేసిన ఈ దారుణమైన ఓటింగ్ పెంపును నమ్మడం కష్టం. పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత, తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించడం మరింత విభ్రాంతిని కలిగించే విషయం. ఇంత అసాధారణ స్థాయిలో పోలింగ్ శాతాల పెరుగుదలపై వచ్చిన సందేహాలకు ఇప్పటివరకు ఎన్నికల సంఘం సరైన వివరణ ఇవ్వలేదనే సంగతిని దృష్టిలో ఉంచుకోవాలి.ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ జరిగితేనో, లేక పోలింగ్ జరిగిన ఈవీఎమ్‌ల బదులు కౌంటింగ్‌లో కొత్త మిషన్లు వచ్చి చేరితేనో తప్ప ఈ అసాధారణ పెరుగుదల సాధ్యంకాదని వీఎఫ్‌డీ అభిప్రాయపడింది. కనుక ఈ పెరిగిన ఓట్లను బోగస్ ఓట్లుగా అది పరిగణించింది. ఈవీఎమ్లలో ఏదో ఇంద్రజాలం జరిగిందనడానికి మరో దృష్టాంతాన్ని కూడా వీఎఫ్‌డీ నిర్ధారించింది. తుది ప్రకటన చేసిన పోలైన ఓట్లకూ, కౌంట్ చేసిన ఓట్లకూ మధ్య భారీ వ్యత్యాసాలు కనిపించాయి. కొన్నిచోట్ల కౌంట్ చేసిన ఓట్లు పెరిగాయి. మరికొన్ని చోట్ల తగ్గాయి. ఇదెలా సాధ్యమవుతుంది? ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 3,500 నుంచి 6,500 వరకు ఓట్లు కౌంటింగ్ సమయానికల్లా తగ్గిపోయాయి. ఇటువంటి నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా 174 ఉన్నాయని వీఎఫ్‌డీ తెలియజేసింది.వీఎఫ్‌డీ సంస్థ బోగస్‌గా పరిగణించిన ఓట్ల కంటే తక్కువ తేడాతో ఎన్డీఏ గెలిచిన సీట్లను వాస్తవానికి ప్రతిపక్షాలు గెలవాల్సిన సీట్లుగా వర్గీకరించారు. రాష్ట్రాలవారీగా పెరిగిన బోగస్ ఓట్ల మొత్తాన్ని ఆ రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు సమానంగా విభజించిన అనంతరం ఆ సంఖ్య కంటే తక్కువ తేడాతో ఓడిపోయిన సమీప ప్రత్యర్థిని అసలైన విజేతగా వీఎఫ్‌డీ లెక్కకట్టింది. ఈ లెక్కన 79 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి ఓడిపోవాల్సింది.వీఎఫ్‌డీ గణిత సమీకరణం ప్రకారం ఒడిశాలో బీజేడీ, ఆంధ్రలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పోలైన ఓట్లలో 49 లక్షల పైచిలుకు ఓట్లను బోగస్‌గా ఆ సంస్థ పరిగణించింది. ఆ ఓట్లను మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య సమంగా పంచితే ఇరవై ఎనిమిదవేలవుతుంది. అంతకంటే తక్కువ తేడాతో వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గాల సంఖ్య 77. గెలిచిన 11 వీటికి జత చేస్తే మొత్తం 88. అంటే సింపుల్ మెజారిటీ.వీఎఫ్‌డీ సంస్థ ఆషామాషీగా బోగస్ ఓట్ల సంఖ్యను నిర్ధారించలేదు. అనుమానించడానికి హేతుబద్ధమైన అనేక ఉదంతాలను అది ఉదహరించింది. షెడ్యూల్ ప్రకటనకు కొద్దిరోజుల ముందే అరుణ్ గోయల్ అనే కమిషనర్ ఎందుకు తప్పుకున్నారని ప్రశ్నించింది. షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు కమిషనర్లుగా ఇద్దరు అధికారులు చేరారు. వీరిలో ఒక అధికారి పూర్వాశ్రమంలో అమిత్‌షా దగ్గర అధికారిగా పని చేశారనీ, మరొక అధికారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి వద్ద పనిచేశారని ఆ సంస్థ వెల్లడించింది.పోలింగ్ ముగిసిన వెంటనే పార్టీ ఏజెంట్లకు ఇవ్వాల్సిన 17–సి ఫామ్‌లను ఎంతమంది ఏజెంట్లకు ఇచ్చారో తెలపగలరా అని ఆ సంస్థ సవాల్ చేసింది. ఈవీఎమ్‌ల వారీగా ఫామ్ 17–సీ లలో నమోదు చేసిన ఓటింగ్ వివరాలు కౌంటింగ్‌లో లెక్కించిన ఓట్లతో సరిపోల్చడానికి ఒక స్వతంత్ర అధ్యయనం జరగవలసిన అవసరం ఉన్నదని వీఎఫ్‌డీ అభిప్రాయపడింది.ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు ఈ బోగస్ ఓట్ల బాగోతం ఒక భాగం మాత్రమే. తొలి అంకం వేరే ఉన్నది. కూటమి నేతలు – యెల్లో మీడియా సంయుక్తంగా సాగించిన విష ప్రచారం, కూటమి ఇచ్చిన మోసపూరితమైన హామీలు ఈ భాగం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఏపీలో కూటమి చేసింది దుష్ప్రచారమేనని మొన్నటి యూనియన్ బడ్జెట్‌తో తేలిపోయింది. ఏపీలో ప్రారంభించిన ఈ సంస్కరణ దేశమంతటా జరగాలని కేంద్రం కోరుతున్నది. అందుకోసం రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది.జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, రాష్ట్రం దివాళా తీసిందని, శ్రీలంకలా మారిందని రాసిన రాతలకూ, కూసిన కూతలకూ అంతే లేదు. మొన్న యూనియన్ బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే జగన్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను కొనియాడటంతో యెల్లో కూటమి ముఖాన కళ్లాపి చల్లినట్టయింది. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నదని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో 10 లక్షల కోట్లని గవర్నర్ చేత చెప్పించారు. ఈ కుప్పిగంతులనూ, శ్వేతపత్రాల తప్పుడు తంతులనూ చీల్చి చెండాడుతూ వైసీపీ అధ్యక్షుడు ప్రెస్‌మీట్ పెడితే సమాధానం చెప్పడానికి ఇప్పటిదాకా ఏ యెల్లో మేధావీ ముందుకు రాకపోవడం గమనార్హం.ఇసుక మీద నసిగిన వాగుడెంత?... రాజేసిన రాద్ధాంతమెంత? అప్పుడే మరిచిపోతామా? ఇసుక ధరలు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువయ్యాయని ఊరూవాడా గగ్గోలు పెడుతున్నది. ఈ పబ్లిక్ టాక్‌ను అడ్రస్ చేయడానికి ఒక్క సర్కారీ సిపాయి కూడా ఇంతవరకు సాహసించలేదు. లిక్కర్ పాలసీ మీద వెళ్లగక్కిన ప్రచారం సంగతి సరేసరి. ఇప్పటివరకైతే అదే పాలసీ కొనసాగుతున్నది. దీన్నే కొనసాగిస్తారో, లేదంటే బెత్తెడు దూరానికో బెల్టు షాపు సుగంధాలు వెదజల్లిన తమ పాతకాలపు పాత పాలసీకి వెళ్తారో వేచి చూడాలి.విషప్రచారాల ప్రస్తావనలోకి వెళ్తే దానికి అంతూదరీ ఉండదు. ఇక మోసపూరిత హామీల సంగతి మరో మహేంద్రజాల అధ్యాయం. ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతోపాటు సూపర్ సిక్స్ పేరుతో ఒక షట్సూత్ర వాగ్దాన మాలను ఓటర్ల మెడలో వేశారు. యువకులందరికీ నెలకు 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బడికెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి 15 వేల రూపాయలిస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. 19 నుంచి 59 సంవత్సరాల మధ్యనున్న ప్రతి మహిళకు నెలకు 1500 అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణమని నమ్మబలికారు.ఇప్పటివరకు ఇందులో ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియదు. ఇది షట్సూత్ర హామీ కాదు షడయంత్ర ప్రయోగమని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. సాక్షాత్తూ శాసనసభలోనే స్వయంగా ముఖ్యమంత్రే ‘సూపర్ సిక్స్’ తూచ్ అని ప్రకటించారు. పైగా ఇది సాధ్యంకాదనే విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని కూడా ఎమ్మెల్యేలను కోరారు. విష ప్రచారంతో, తప్పుడు హామీలతో ఓట్లడగడం కూడా ఓట్లను దొంగిలించడం కిందే లెక్క. వంచన కిందే లెక్క. రెండు రకాలుగా చోరీ చేసిన ఓట్లతోనే గద్దెనెక్కారు కనుక వారికి ప్రజల పట్ల బాధ్యత లేదనే విషయాన్ని వారే నిరూపించుకుంటున్నారు.బాధ్యతల నుంచి తప్పుకోవడానికీ, హామీల అమలుకోసం జనం వీధుల్లోకి రాకుండా ఉండటానికే రెడ్‌బుక్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. శాసనసభలో విపక్ష నేతపై సభానాయకుడు వాడుతున్న భాష, వేస్తున్న నిందలు చాలా దిగజారిన స్థాయిలో ఉంటున్నాయి. హామీలు అమలుచేయపోతే ఎక్కడ తిరుగుబాటు వస్తుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. ‘ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు’ అనే తెలుగు నానుడిని ఆయన గుర్తు చేసుకుంటే మేలు.చంద్రబాబుకు కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామగారు ఎన్టీ రామారావు ఆయన గురించి ఏమన్నారో గుర్తు చేసుకుందామా? ‘‘చంద్రబాబు దుర్మార్గుడు... మేకవన్నె పులి, గాడ్సేనే మించినవాడు, అభినవ ఔరంగజేబు, అతడో మిడత. మూర్తీభవించిన పదవీకాంక్షాపరుడు, ప్రజాస్వామ్య హంతకుడు, కుట్రకు కొలువైనవాడు, గూడుపుఠాణీకే గురువు, మోసానికి మూలస్తంభం, గుండెల్లో చిచ్చుపెట్టినవాడు, గొడ్డుకన్నా హీనం, చీమల పుట్టలో పాములా చేరినవాడు... తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నగా చెబుతున్నాను.’’ ఇవన్నీ ఎన్టీఆర్ డైలాగులే. ఆన్ రికార్డ్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వివక్ష కాదు.. కక్ష.. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై బుధవారం శాసనసభలో చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరసనను తెలియజేస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి శాసనసభలో జరిగే చర్చలో అన్ని పార్టీలు పాలుపంచుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చర్చలో పాల్గొనాలని సూచించారు. ‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షతో కాదు.. కక్ష పూరితంగా వ్యవహరించింది..’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ను కుర్చీ బచావో బడ్జెట్‌గా అభివరి్ణంచారు. నితీశ్, నాయుడు డిపెండెంట్ అలయెన్స్‌గా ఎన్డీఏ మారిందని ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ విషయంలో వైఖరిని మార్చుకుని, బడ్జెట్‌ను సవరించి విభజన హామీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోరిన అంశాలకు అనుగుణంగా కేటాయింపులు జరపాలని కోరారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పెద్దన్నలా వ్యవహరించాలని కోరినా.. ‘మా ప్రభుత్వం, మంత్రివర్గ సహచరులు 18 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర హోం మంత్రి,ని ఇతర మంత్రులను కలిశారు. స్వయంగా నేను మూడుసార్లు ప్రధానిని కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని కోరా. రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పాం. కానీ మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదం పలకడానికే కేంద్రం ఇష్టపడలేదు. వారి మనసులో తెలంగాణ పట్ల ఇంత కక్ష ఉందని అనుకోలేదు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి నిధులు కేటాయించిన కేంద్రం, అదే చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు?..’అని సీఎం నిలదీశారు. వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదా? ‘బయ్యారం, ఖాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు, గిరిజన యూనివర్సిటీకి నిధుల ఊసు లేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదం. వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారా? ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. కుర్చీ బచావో బడ్జెట్. బిహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదు. ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదు. బీజేపీని 8 సీట్లలో గెలిపించిన రాష్ట్రానికి ఇంత మోసం చేస్తారా? కేంద్ర వైఖరికి నిరసనగా కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేసి బయటకు రావాలి. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే.. ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కేవలం క్విడ్ ప్రో కో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది. బడ్జెట్‌ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే. కిషన్‌రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దు..’అని రేవంత్ అన్నారు. త్వరలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం ‘ఏపీలో అమరావతికి వేల కోట్లు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లో అభివృద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఎందుకు ఇవ్వదు? పోలవరానికి నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు ఇవ్వరు? బిహార్, ఏపీ కోసం బడ్జెట్ పెట్టినట్లు ఉంది. కుర్చీ లాలూచీలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాస్తే ఊరుకోం. పార్లమెంట్లో నిరసనకు బీజేపీ ఎంపీలూ, ఎంఐఎం కూడా కలిసి రావాలి. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది. అందుకే త్వరలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నా. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక సీఎంలు ఒప్పుకున్నారు. కేరళ, ఆంధ్రప్రదేశ్ కలిసి వస్తాయో లేదో చూస్తాం. వివక్షతోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాం.’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చర్చలో కేసీఆర్ పాల్గొనాలి.. ‘బుధవారం ప్రశ్నోత్తరాల తరువాత స్పీకర్ అనుమతితో కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి చర్చించాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సూచిస్తున్నా. ఈ చర్చలో ఎవరు విలీనాల ప్రక్రియలో ఉన్నారో.. ఎవరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారో బయటపడుతుంది. తెలంగాణ హక్కులు, నిధులపై జరిగే చర్చలో కేసీఆర్ పాల్గొనాలని సూచిస్తున్నా. లేకపోతే కేసీఆర్ కూడా మోదీకి మోకరిల్లినట్లే భావించాల్సి వస్తుంది..’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏం చేయాలన్నా డబ్బుల్లేవు
సాక్షి, అమరావతి : పనులు చేయడానికి డబ్బుల్లేవని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ముందుగా రోడ్ల గుంతలు పూడుద్దామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే అప్పుడే జగన్ విమర్శలు మొదలు పెట్టేశారన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. తప్పులు చేయడం, వాటిని పక్క వారిపై నెట్టేయడం జగన్‌కు అలవాటని అన్నారు.వివేకా హత్యను వేరే వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేశారని, వినుకొండలోనూ అదే జరుగుతోందని చెప్పారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యపై జగన్ ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారని చెప్పారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడటాన్ని అగ్నిప్రమాదంగా చెబుతున్నా, అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటన చూశాక పరిపాలన ఎంత పతనమైందో బయటపడిందన్నారు.శాంతిభద్రతల విషయంలో చాలా గట్టిగా ఉంటామని, ఏ పార్టీ వాళ్లనైనా సహించేది లేదని అన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిద్దామని, రాజకీయ కక్ష సాధింపులు వద్దని చెప్పారు. ఇసుక విషయంలో చిన్న విమర్శ కూడా రాకూడదని చెప్పారు. క్వారీల్లో ఇసుక తవ్వకం, రవాణా ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేస్తామన్నారు. ప్రతి నెలా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొనాలని సూచించారు. పవన్‌కళ్యాణ్ కోరినట్లుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రబాబు నిర్ణయాలకు సహకరిస్తాం : పవన్ జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలతో కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలాలని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను, తన పార్టీ నూరు శాతం సహకరిస్తామని తెలిపారు. ఏపీకి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందామని బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదన్నారు. కూటమిలోని మూడు పారీ్టల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. -
బీహార్ కు స్పెషల్ స్టేటస్ పై కేంద్రం క్లారిటీ..!
-
జులై 21న అఖిలపక్ష సమావేశం.. టీఎంసీ డుమ్మా!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలుఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జులై 21న (ఆదివారం) పార్లమెంట్ ఉభయసభల్లోని అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ సెషన్, సభా వ్యవహారాలపై చర్చించేందుకు కేంద్రం సమావేశానికి ఆహ్వానించింది. జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని ప్రధాన కమిటీ రూమ్‌లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్) హాజరు కావడం లేదు. జులై 21న రాష్ట్ర అమరవీరుల దినోత్సవం నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావడం లేదని టీఎంసీ ని ర్ణయించుకుంది.కాగా ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకావడం ఇదే తొలిసారి కానుంది. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
రాజ్యసభలో మరింత కీలకంగా వైఎస్సార్సీపీ!
న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. రాజ్యసభలో మాత్రం మెజార్టీ తగ్గిపోయింది. నామినేటెడ్ ఎంపీలైన నలుగురు రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జఠ్మలాని పదవికాలం శనివారంతో ముగియడంతో పెద్దల సభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్రపది ద్రౌపది ముర్ము వీరిని నియమించారు. వీరు అనంతరం రాజ్యసభలో అధికార ఎన్డీయే కూటమికి మద్దతుగా నిలిచారు. అయితే నలుగురు ఎంపీల రాజీనామాలతో రాజ్యసభలో బీజేపీ సంఖ్య 86కు చేరగా.. ఎన్డీయే కూటమికి 101 మంది ఎంపీల బలం ఉంది. మొత్తం 245 సభ్యులు కలిగిన పెద్దల సభలో మెజార్టీ మార్కు 113గా ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో 225 మంది ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 87 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇందులో కాంగ్రెస్‌కు 26, తృణమూల్ కాంగ్రెస్‌కు 13, ఆమ్ ఆద్మీపార్టీ 10, డీఎంకే పార్టీకి 10 మంది సభ్యులు ఉన్నారు. వీరితోపాటు ఇక అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమిలో భాగంగా లేని తెలంగాణలోని బీఆర్ఎస్, పలువురు నామినేటేట్ ఎంపీలు, స్వతంత్రులు ఉన్నారుఅయితే ఎగువ సభలో బిల్లులను ఆమోదించడానికి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీయేతర పార్టీలపై ఆధారపడి ఉంది. దీంతో గతంలో ఎన్డీఏకు మిత్రపక్షంగా వ్యవహరించిన తమిళనాడులోని అన్నాడీఎంకే, అంశాలవారీగా పలుమార్లు మద్దతిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇపుడు కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీల ఎంపీలనూ ( అన్నాడీఎంకే 4, వైఎస్సార్ సీపీ11) కలిపితే 101 ప్లస్ 15.. మొత్తంగా 116 కావటంతో.. బిల్లులు ఆమోదం పొందడానికి ఈ రెండు పార్టీలూ కీలకంగా మారాయి.గతంలో కూడా పలు సందర్భాల్లో వైఎస్సార్సీపీ(11), అన్నాడీఎంకే (4) పలు బిల్లుల విషయంలో ఎన్డీయేకు మద్దతిచ్చాయి. కానీ ఇటీవల ఎన్నికలకు ముందు గత ఏడాది డిసెంబర్లో అన్నాడీఎంకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ, జనసేనతో కూటమి గట్టి మరీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పోటీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీకి ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. బిల్లులు గట్టెక్కాలంటే వైఎస్సార్సీపీ సపోర్టు ఎన్డీయేకు తప్పనిసరి. ఎందుకంటే 11 మంది సభ్యులున్న వైస్సార్సీపీ... రాజ్యసభలో నాలుగవ అతిపెద్ద పార్టీ కావటం విశేషం. ఇక గతంలో ఎన్డీయేకు మరో మిత్రపక్షంగా ఉన్న ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతాదళ్ కూడా ఎన్నికల ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే బీజేడీ తేల్చి చెప్పింది. బీజేడీకి తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లుల ఆమోదానికి వై ఎస్సార్సీపీ , బీజేడీ , బీఆర్ఎస్ మద్దతు కీలకం.ప్రస్తుతం రాజ్యసభలో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 11 మంది ఎన్నికయ్యేవారు కాగా.. ఈ ఏడాది ఈ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో మహారాష్ట్ర, అస్సాం, బీహార్లలో రెండు, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమికి అస్సాం, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, త్రిపుర నుంచి ఏడు చోట్ల గెలిచే అవకాశం ఉంది ఇక మహారాష్ట్రలో మరో రెండు దక్కించుకునే ఛాన్స్ ఉంది. దీంతో బీజేపీకి అదనంగా తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు నామినేటెడ్ సభ్యుల ఓట్లు, వైఎస్సార్సీపీ ఓట్లు కలిపితే బీజేపీకి మెజారిటీ మార్కును దాటేందుకు కావాల్సినంత బలం ఉండనుంది. -
రాజ్యాంగ రక్షణే అత్యవసరం
పదవిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. కానీ ఎమర్జెన్సీ కంటే రాజ్యాంగపు తిరగరాత మరింత ప్రమాదకరమైనది. 2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి.18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘అబ్ కీ బార్ 400 పార్’ అని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని నినాదమిచ్చారు. దాని తరువాత ఆయన మోదీ గ్యారెంటీ నినాదమిచ్చారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలో పార్టీని పక్కకు పెట్టి వ్యక్తి గ్యారెంటీ మ్యానిఫెస్టో రాయించారు. ఇది మామూలు విషయం కాదు. ఆ వెనువెంటనే ఆరెస్సెస్, బీజేపీ లీడర్లు కొంతమంది 400 సీట్లు రాగానే దేశ రాజ్యాంగాన్ని తిరగ రాస్తామని ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా తిరగరాత సిద్ధాంతం ఉన్న ఆరెస్సెస్ నాయకులెవరు ఇటువంటి ప్రకటనలను ఖండించలేదు. ఆనాటికి గానీ, ఇప్పుడు గానీ ఎన్డీఏలో ఉన్న పార్టీలవారికి... అనుకున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రక్రియను ఎదుర్కొనే శక్తి లేదు. వారికి అధికారం తప్ప బలమైన సిద్ధాంతం కూడా లేదు. వాళ్ళ పార్టీ అధికారం తప్ప దేశం ఎటుపోయినా ఫర్వాలేదు. ఈ స్థితిలో ఇండియా కూటమి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశాన్ని చేసింది. ఎన్నికల తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని, అంబేడ్కర్ బొమ్మనీ బహిరంగ సభల్లో చూపిస్తూ తిరిగారు. ఎన్నికల పోరాటమంతా రాజ్యాంగం చుట్టూ తిరిగే స్థితి మొదటిసారి వచ్చింది. ప్రపంచ పత్రికలు కూడా ఒక దేశం రాజ్యాంగ రక్షణ అంశం ఇంత పెద్దఎత్తున ఏ దేశ ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం కాలేదని రాశాయి. టీవీలు, సోషల్ మీడియా మాట్లాడాయి. ఐతే ఎన్నికల సమయంలో ఒక మోదీ తప్ప ఆరెస్సెస్ ప్రధాన నాయకుడైన మోహన్ భాగవత్ సహా రాజ్యంగాన్ని తిరగరాసే ఆలోచన లేదని చెప్పలేదు. మోదీ మాత్రం మేమే ఈ రాజ్యాంగ రక్షకులమని కొన్ని సభల్లో మాట్లాడారు. కానీ ఆరెస్సెస్, బీజేపీ నాయకులంతా సైలెంట్‌గా ఉన్నారు. దానికి ప్రధాన కారణమేమిటంటే, ఈ రాజ్యాంగం పరిధిలో పార్లమెంట్, ఇతర సంస్థలపై సంపూర్ణ పట్టు సాధించి తరువాత ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది వారి ఆలోచన. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ఇప్పుడున్న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండే దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మనుధర్మ శాస్త్ర లక్షణాలు ఏ మాత్రం లేవనేది వారి ప్రధాన వాదన. వాళ్ళ అవగాహనలో భారతీయ చట్ట సంస్కృతి అంటే మనుధర్మ శాస్త్ర చట్ట సంస్కృతి. దాంట్లో ప్రధానమైన వర్ణ–కుల వ్యవస్థనీ, స్త్రీ అసమాన జీవితాన్నీ కాపాడటం. సమాజ అసమానతలు భారతీయ సంస్కృతిలో భాగం అని వారి భావన. అదృష్టవశాత్తు బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడం, దానికి రాజ్యాంగ రక్షణ డిబేట్ దోహదపడటం జరిగింది. అయితే రాజ్యాంగ పర చర్చ ప్రజల జీవనంలోకి చొచ్చుకుని పోకుండా ఉండటానికి ఆరెస్సెస్, బీజేపీ ఒక ఎత్తుగడ వేశాయి. అది 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమస్యను ముందుకు తేవడం! ఎమర్జెన్సీలో చాలా అట్రాసిటీలు, అరాచకాలు జరిగిన మాట నిజమే కానీ అది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రమాద ఘట్టం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసి ఎంతోమంది యువకులు ఎమర్జెన్సీలో ఎదురు కాల్పుల పేరిట చంపబడ్డారు. ఐతే రాజ్యాంగానికి వచ్చేవరకు ఆ కాలంలో చేసిన రెండు సవరణలు: ప్రియాంబుల్‌లో ‘సోషలిజం’ అనే పదం చేర్చడం; రెండవది ఫండమెంటల్ రైట్స్‌కు కొంత అఘాతం కలిగించే ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడం. ఆరెస్సెస్, బీజేపీ సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించాయి. కానీ ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడాన్ని బలపర్చాయి. బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ నుంచి విడగొట్టి, పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించినందుకు ఇందిరాగాంధీని దుర్గాదేవిగా వర్ణించిన వారిలో ఆరెస్సెస్, బీజేపీ వారు ఉన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు వంటి ఆమె నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ మూడు సిద్ధాంతకర మార్పులు సోషలిస్టు సిద్ధాంత ప్రభావంతో ఇందిరాగాంధీ చేస్తున్నారని వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ వంటి నాయకులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు... శ్రమ జీవులకు, ఉత్పత్తి కులాలకు మేలు చేశాయి. ఈ క్రమంలో ఆమె భూ సంస్కరణల చట్టం చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. 1972లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బలమైన భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 27 ఎకరాల తరి, 57 ఎకరాల ఖుశ్కి భూమి కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదని చట్టం తెచ్చింది ఆమెనే. ఆ చట్టాన్ని ఎమర్జెన్సీలో భూస్వాములపై ఒత్తిడి తెచ్చి కొంత అమలు చేశారు. నేను 1980లో ఈ చట్టం అమలుపై ఎంఫిల్ «థీసిస్ కోసం చాలా గ్రామాల్లో ల్యాండ్ రిఫామ్ ఎలా జరిగిందో పరిశీలించాను. భూస్వాములు భూములను బినామీ పేర్లమీద మార్చి చాలావరకు కాపాడుకున్నప్పటికీ ఎమర్జెన్సీలో కొంత భూమి పంచబడింది. ఆ కాలంలో తన పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిర అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. నిజమే. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. తర్వాత వాళ్లు పౌరహక్కుల రక్షణ జోలికి పోలేదు. కనుక ఎమర్జెన్సీ అనేది రెండువైపుల పదునున్న కత్తిలా పని చేసింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ ఈ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలనుకున్న ఆలోచనలో శూద్రుల, దళితుల, ఆదివాసుల పక్షపాత ఆలోచనలు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. వాళ్లు అనుకున్నట్టు నిజంగానే 400 సీట్లు వచ్చి ఉంటే వాళ్లు కొత్త కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీని స్థాపిస్తే దాంట్లో ఎటువంటి మేధావి వర్గం ఉండేవారు? ఆ రాజ్యాంగ పరిషత్ కుల అసమానతలను, అంటరానితనాన్ని, బీదరికాన్ని తొలగించే గట్టి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉండేదా! నిజానికి బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుపై చర్చ జరుగుతున్నప్పుడు ఆరెస్సెస్, బీజేపీ నాయకుల వాదనలు; రాజరిక వ్యవస్థ పట్ల జమీందారీ హక్కుల పట్ల వాళ్లు ఎంత అనుకూలంగా ఉన్నారో తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌లో ఉన్న ‘సోషలిజం’ అనే పదాన్ని వాళ్లు తొలగించాలనుకునేది భారతీయ కష్ట జీవుల పక్షాన ఉండటానికా? పెట్టుబడిదారుల పక్షాన ఉండటానికా?2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఐతే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. చంద్రబాబు, నితీష్‌కుమార్ వంటి సిద్ధాంత రహిత ప్రాంతీయ నాయకులు కూడా ఈ భవిష్యత్ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడలేరు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి. ఓటు రాజ్యాంగ రక్షణ ఆయుధాలలో కీలకమైంది. ఐతే దాన్ని ప్రజలు, ముఖ్యంగా యువకులు నిరంతరం ఇప్పుడున్న రాజ్యాంగంతో ముడేసి చూడాలి. ఈ ఎన్నికల్లో రాజ్యంగం పట్ల కలిగిన కొత్త చైతన్యాన్ని తగ్గించేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ఎమర్జెన్సీ అంశాన్ని ముందు పెట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. జూన్ 25న వి.పి. సింగ్ జయంతి సభ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో జరిగింది. మాట్లాడటానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అందులోనే చాలా పెద్ద హాలులో రైట్‌వింగ్ ఆలోచనాపరులు ఎమర్జెన్సీలో జె.పి. మూమెంట్‌పై మీటింగ్ పెట్టారు. ఎందుకో తెలుసా? రాజ్యాంగ మార్పు కంటే ఎమర్జెన్సీ ప్రమాదకరమని చెప్పడానికి!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
పార్లమెంట్ రౌండప్.. విపక్షాల వాకౌట్
ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాలు బుధవారం(జులై 3)తో ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడారు. ప్రధాని మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు ఆందోళన చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపారు. విపక్షాల వాకౌట్‌పై ప్రధాని మోదీతో పాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు సభా మర్యాదను విడిచి వెళ్లారన్నారు. కాసేపటి తర్వాత ప్రధాని తన ప్రసంగాన్నితిరిగి కొనసాగించారు. ప్రధాని మాట్లాడటం పూర్తయిన తర్వాత రాజ్యసభను చైర్మన్ నిరవధిక వాయిదా వేశారు. లోక్‌సభ మంగళవారమే నిరవధిక వాయిదా పడటంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ముగిసినట్లయింది. కాంగ్రెస్‌పై మళ్లీ విమర్శల దాడి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ప్రధాని మరోసారి కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేశారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత దేశంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మూడోసారి పవర్లోకి వచ్చిందన్నారు. ఇది సాధారణ విషయం కాదన్నారు. మళ్లీ తామే అధికారంలోకి రావడంతో కొందరు అసంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఓ నేత తమను మూడోవంతు ప్రభుత్వం అని విమర్శిస్తున్నారని ప్రధాని అన్నారు.. ఇది నిజమేనని, తాము మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు. తమ పాలనలో కేవలం మూడవ వంతు మాత్రమే ఇప్పటికి పూర్తయిందన్నారు.ప్రతిపక్షాల హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన నడిచిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థవృద్ధిలో భారత్‌ను ప్రపంచంలో పది నుంచి ఐదో స్థానానాకి తీసుకువచ్చామని, భవిష్యత్తులో మూడో స్థానానికి చేరుస్తామని ప్రధాని చెప్పారు. మణిపూర్, నీట్‌లపై స్పందించిన ప్రధాని..మణిపూర్, నీట్ అంశాలపై సమావేశాల తొలి రోజు నుంచి విపక్షాలు చర్చకు పట్టుపట్టడంతో ప్రధాని రాజ్యసభలో ఈ అంశాలపై స్పందించారు. మణిపూర్‌లో శాంతి స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనిపై రాజకీయాలు చేయొద్దని సూచించారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీపైనా ప్రధాని మాట్లాడారు. నీట్లో అక్రమాలకు పాల్పడినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుధామూర్తికి ప్రశంసలు..దాత, రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రసంగంపై ప్రధాని బుధవారం సభలో ప్రశంసలు కురిపించారు. సుధామూర్తి దేశంలో మహిళల ఆరోగ్యానికి సంబంధించి విలువైన సూచనలిచ్చారని కొనియాడారు. తమ ప్రభుత్వం గత పదేళ్లలో మహిళల కోసం ఎన్నో ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు. -
గత పదేళ్లు ఒక్క లెక్క.. ఈ ఐదేళ్లు మరో లెక్క అనుకోవాల్సిందేనా ?
-
బడులు తెరిచారు.. బరువు మోపారు.. 'వందనమేదీ'!
వెంటనే పిల్లలందరికీ ఇవ్వాలి..నాకు ఇద్దరు పిల్లలు. ఒక పాప ఆరో తరగతి, మరో అమ్మాయి ఐదో తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ డబ్బులిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు డబ్బులు రాలేదు. గత ప్రభుత్వంలో స్కూళ్లు తెరవగానే మా ఖాతాలో డబ్బులు జమ చేసేవారు. – పదముత్తం లక్ష్మి, ఏరూరు, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లాసాక్షి, అమరావతి: ‘ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకంఅమలు చేస్తాం. ఒక్కరుంటే రూ.15 వేలు ఇస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తాం. ఇంకా పిల్లలను కనండి.. పథకాలు అందుకోండి..’ అంటూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిచోటా చాటింపు వేసిన సీఎం చంద్రబాబు ఒకపక్క పాఠశాలలు పునఃప్రారంభమై నెల కావస్తున్నా ఆ ఊసే పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రేగుతోంది. మంత్రి నారా లోకేశ్‌తోపాటు ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నాయకులంతా ప్రజలకు బహిరంగంగా ఈ ఇచ్చిన హామీపై నోరు మెదపడం లేదు. రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థులు, బడి ఈడు పిల్లలు దాదాపు కోటి మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వీరందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలంటే ఏటా సుమారు రూ.15 వేల కోట్లు అవసరం. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కోటి మంది పిల్లలకు ‘తల్లికి వందనం’ ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోగా ఈ హామీని ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాదంతా కాలయాపన చేసి లబ్ధిదారులను తగ్గించేందుకు పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏరుదాటాక తెప్ప తగలేయడంలో నిపుణుడైన చంద్రబాబు 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీని నెరవేర్చకుండా కోటయ్య కమిటీ పేరుతో కోతలు విధించిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.ఖర్చులు తడిసిమోపెడు..పాఠశాలలు తెరవటమే ఆలస్యం.. పిల్లల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ‘అమ్మ ఒడి’ పథకం నాలుగేళ్ల పాటు తల్లిదండ్రులకు నిశ్చింత కల్పించింది. పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నా సరే వంద శాతం పారదర్శకతతో గత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. విద్యార్థులను క్రమం తప్పకుండా బడికి రప్పించడమే లక్ష్యంగా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. ఏటా రూ.6,400 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.26 వేల కోట్లకుపైగా అమ్మ ఒడి ద్వారా అందించడం పిల్లల చదువుల పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. భావి పౌరుల భవితవ్యానికి భరోసా కల్పిస్తూ వెలుగులు పంచిన ఈ పథకంపై ఇప్పుడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ పథకం పేరు మార్చేసి ‘‘తల్లికి వందనం’’ అంటూ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ హామీ కింద ప్రకటించిన కూటమి సర్కారు స్కూలుకి వెళ్లే విద్యార్థులతో పాటు ప్రతి బిడ్డకూ ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఒక్కో ఇంట్లో నలుగురు ఐదుగురు పిల్లలున్న కుటుంబాలు తమకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకు లబ్ధి చేకూరుతుందని ఆశపడ్డారు. ఇప్పటికే పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ‘తల్లికి వందనం’పై ఇంతవరకూ కొత్త సర్కారు నోరు మెదపకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్న తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, పుస్తకాల ఖర్చులు తడిసిమోపెడు కావడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలయాపన.. కోతలు2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక అనేక కొర్రీలు వేసి లబ్ధి పొందే రైతులను భారీగా తగ్గించేసి అరకొరగా విదిలించారు. ఇప్పుడు తల్లికి వందనంపైనా ఇలాగే ముందుకెళ్లాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఒక్కో బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికీ పథకం వర్తింప చేస్తామని ఇచ్చిన హామీ ప్రభుత్వ పెద్దల్లో కూటమి సర్కారులో గుబులు రేపుతోంది. ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం కావడం ఇందుకు కారణం. దీంతో వలంటీర్లను గౌరవ వేతనం రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామన్న హామీని గాలికి వదిలేసినట్లే... ‘తల్లికి వందనం’ కూడా లబ్ధిదారుల ఎంపిక పేరుతో ఈ ఏడాది కాలయాపన చేసి అనంతరం రకరకాల నిబంధనలతో కోతలు విధించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. టీడీపీ హయాంలో రైతుల రుణమాఫీపైనా ఇదే విధానం అనుసరించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అదే జరిగితే తమ పిల్లల చదువులు నాశనమవుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. డ్రాప్ అవుట్స్‌కు అడ్డుకట్ట..బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండేలా, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి విద్యారంగాన్ని బలోపేతం చేసింది. పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్‌ను గణనీయంగా తగ్గించాలనే సదుద్దేశంతో అమ్మఒడి పథకానికి విద్యార్థి హాజరును ప్రామాణికంగా తీసుకుంది. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించింది. 2019– 20, 2020–21 విద్యా సంవత్సరాల్లో మాత్రం కోవిడ్ కారణంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. జీఈఆర్...2018లో ప్రాథమిక విద్యలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) జాతీయ సగటు 99.21 శాతం కాగా ఆంధ్రప్రదేశ్ 84.48 శాతానికే పరిమితమైంది. నాడు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో అట్టడుగు స్థానం ఏపీదే కావడం గమనార్హం. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలతో నాలుగేళ్లలో జీఈఆర్ వంద శాతానికి పెరిగింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు 10–12వ తరగతుల్లో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించడమే కాకుండా వారికి కూడా అమ్మఒడిని గత సర్కారు అందించింది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునేలా ఈ నిర్ణయం నూరు శాతం ఉపయోగపడింది.జూన్‌లోనే జమకు గత సర్కారు ఏర్పాట్లు..పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో 2019 జూన్‌లో జగనన్న అమ్మఒడి పథకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్కూళ్లు తెరిచిన వెంటనే జూన్‌లోనే అంతకుముందు సంవత్సరం హాజరును బట్టి రూ.15 వేలు చొప్పున అందిస్తూ రూ.వెయ్యి టాయిలెట్ మెయింట్‌నెన్స్ ఫండ్‌కి, మరో రూ.వెయ్యి స్కూల్ నిర్వహణ నిధికి జమ చేసింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి అందించి చదువులకు భరోసా కల్పించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్.. ఇలా ఎక్కడ చదువుతున్నా సరే పథకాన్ని నూరు శాతం పారదర్శకతతో అమలు చేసింది. 2022–23కి సంబంధించి గతేడాది జూన్ 28వ తేదీన 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. ఐదో విడత అమ్మఒడి కింద ఈ ఏడాది జూన్‌లో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినా కొత్త ప్రభుత్వం రావడంతో సాయం నిలిచిపోయింది. జూలై వచ్చినా తల్లికి వందనంపై కూటమి సర్కారు స్పందించకపోవడంతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళన చెందుతున్నారు.మాట ప్రకారం డబ్బులివ్వాలిగత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద ఏటా సకాలంలో నగదు నా ఖాతాలో జమ చేశారు. పిల్లల చదువుల కోసం అది ఎంతో ఉపయోగపడేది. కూటమి పార్టీలు ప్రతి విద్యార్ధికీ రూ.15 వేలు చొప్పున డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చాయి. బడులు ఇప్పటికే తెరిచినా కొత్త ప్రభుత్వం ఇంత వరకు ఏమీ చెప్పడం లేదు. చేసేదేమీ లేక రూ.15 వేలు అప్పు చేసి పిల్లలకు అవసరమైనవి కొన్నాం. మాట ప్రకారం పిల్లల చదువులకు డబ్బులు ఇవ్వాలి. – పద్మ, విద్యార్థి తల్లి, పుత్తూరు, తిరుపతి జిల్లాపాత వాటికి పేర్లు మార్చారే కానీపిల్లలు స్కూళ్లకు వెళుతున్నా ఏ పథకం అందలేదు. పాత పథకాలకు పేర్లు మార్చారే కానీ లబ్ధిదారులకు ఇంతవరకు ఏ పథకం ద్వారా డబ్బులు ఇవ్వకపోవడం దారుణం. ఇలాగే ఉంటే మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే పథకాలు అందేలా చూడాలి. – సి.జానకి, జల్లావాండ్లపల్లె, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లాఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదునా కుమార్తె లిఖిత జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇంతవరకూ మాకు అమ్మ ఒడి డబ్బులు పడలేదు. గతంలో ఎప్పుడూ ఇలా ఆలస్యం కాలేదు. అసలు డబ్బులు పడతాయో లేదో కూడా తెలియడం లేదు. ఎవరిని అడిగినా మాకు తెలియదంటున్నారు. పిల్లల చదువుల కోసం అప్పు చేయాల్సి వస్తోంది. – మరడాన జ్యోతి, రామభద్రపురం, విజయనగరం జిల్లాబడులు మొదలైనా ఆ ఊసే లేదు గతంలో స్కూళ్లు తెరవగానే అమ్మ ఒడి అందేది. పిల్లల చదువులకు ఎంతో ఉపయోగపడేవి. ఈసారి బడులు ప్రారంభమైనా ఇంతవరకూ ఆ ఊసే లేదు. అసలు డబ్బులు ఇస్తారో లేదో కూడా ఈ ప్రభుత్వంలో స్పష్టత లేదు. గతంలో ఉన్న లబ్ధిదారులందరికీ అమ్మఒడి ఇవ్వాలి. – రమణమ్మ, అంకేపల్లి, మర్రిపూడి, ప్రకాశం జిల్లా పిల్లలను ఆదుకోండయ్యా..! పాఠశాలలు తెరిచి రెండు వారాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏ పథకం అందలేదు. మా పిల్లలను ఆదుకుని పథకాలు వర్తింపచేసేలా ప్రభుత్వం చొరవ చూపాలి. – పి.రామలక్ష్మమ్మ, మల్లూరు, చిన్నమండెం మండలం, అన్నమయ్య జిల్లా -
రాహుల్లా ప్రవర్తించొద్దు!
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం సభలో అనుచితంగా మాట్లాడారని, ఆయనలాగా ఎవరూ ప్రవర్తించకూడదని, మాట్లాడకూడదని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. మంగళవారం ఎన్డీయే పక్షాల ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ నిబంధనలు, విధివిధానాలను ప్రతి ఒక్కరూ తూ.చా. తప్పకుండా పాటించాలని, సభలో స్రత్పవర్తన కలిగి ఉండాలని తెలిపారు.సభలో అనుసరించాల్సిన ఉత్తమ విధానాల గురించి సీనియర్ ఎంపీల నుంచి నేర్చుకోవాలని కొత్తగా ఎన్నికైన ఎంపీలకు సూచించారు. కాంగ్రెస్సేతర నాయకుడు, అందులోనూ ఒక సాధారణ చాయ్‌వాలా మూడోసారి ప్రధానమంత్రి కావడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలని, సభకు తప్పనిసరిగా హాజరు కావాలని, నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రభావవంతంగా ప్రస్తావించాలని పేర్కొన్నారు.ఏదైనా అంశంపై మీడియాతో మాట్లాడాలనుకుంటే తొలుత దానిపై అధ్యయనం చేయాలని చెప్పారు. నియోజకవర్గాలతో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉండాలని, మనకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పడం మన బాధ్యత అని వివరించారు. పార్లమెంట్ సభ్యులుగా దేశ సేవకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి మ్యూజియాన్ని ఎంపీలందరూ సందర్శించాలని, భారత ప్రధానమంత్రుల జీవిత ప్రస్థానం గురించి అక్కడ తెలుసుకోవాలని సూచించారు. -
రాహుల్లా ఎవరూ ప్రవర్తించకండి: ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) తొలిసారి సమావేశమయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో మిత్రపక్ష ఎంపీలను ఉద్ధేశించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ సమావేశాల్లో రాహుల్ గాంధీ, విపక్షాల దాడి నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన విధానాలపై ఎన్డీయే కూటమి ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించారు. ఎన్డీయే కూటమి ఎంపీలు పార్లమెంట్ నిబంధనలను పాటించాలని, సభలో వారి ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, రాహుల్‌గాంధీపై మోదీ విమర్శలు గుప్పించారు. వరుసగా మూడోసారి కాంగ్రేసేతర పార్టీకి చెందిన నేత ప్రధాని కావడాన్ని విపక్షాలు సహించలేకపోతున్నట్లు విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ సభలో అవమానకర ప్రసంగం చేశారని మండిపడ్డారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించొద్దని.. ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని సూచించారు.సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. దేశసేవ చేసేందుకు ఎంపీలంతా పార్లమెంట్‌కు రావాలని మోదీ సూచించారని తెలిపారు. సభలో ఎలా నడుచుకోవాలో కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పారు. తమ నియోజకవర్గానికి చెందిన అంశాలను పార్లమెంట్లో రెగ్యులర్‌గా ప్రస్తావించాలని, పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలని చెప్పినట్లు పేర్కొన్నారు.‘నిన్న పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రవర్తించిన తీరు అమర్యాదకరం. స్పీకర్ స్థానాన్ని ఆయన అవమానించారు. రాహుల్‌గా ఎన్డీయే సభ్యులెవరూ ప్రవర్తించొద్దు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పిట్లో ఉంచుకుంది. కానీ మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది.పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్ (గతంలోని నెహ్రూ మ్యూజియం)ను సందర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి’ అని ప్రధాని ఎంపీలకు సూచించినట్లు రిజిజు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి కౌంటర్ మోదీ ఇస్తారని, ఆ సందేశం ప్రతి ఒక్కర్నీ ఉద్దేశించి ఉంటుందని రిజిజు పేర్కొన్నారు.