Visakhapatnam District Latest News
-
లైంగిక దాడి కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
విశాఖ లీగల్ : బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడికి 20 ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ నగరంలోని 12వ అదనపు జిల్లా కోర్టు కం పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.ఆనంది శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రభుత్వం బాలికకు రూ.5 లక్షలు చెల్లించాలని ఆ తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలివీ.. నిందితుడు గుడ్ల వెంకటరమణ (27) గాజువాక దగ్గర పెదగంట్యాడ, వెంపల్ నగర్లో ఉంటున్నాడు. వృత్తి రీత్యా సిమెంట్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. నిందితుడు బాధిత బాలికకు మేనమామ అవుతాడు. బాధితురాలిని (13) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిచిపెట్టారు. పెదగంట్యాడకు చెందిన నీలాపు రాజి అనే మహిళ బాలికను చేరదీసి తన ఇంట్లో సహాయకురాలిగా ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో 2023 మార్చి 27వ తేదీన రాత్రి నిందితుడు వెంకటరమణ, ఆమె ఉంటున్న ఇంటి దగ్గర నుంచి బలవంతంగా తన మోటార్ సైకిల్‌పై తీసుకువెళ్లాడు. సమీపంలోని ఒక హోటల్ నుంచి భోజనం తెచ్చి ఒక పాడుపడిన బంగ్లాలో బాలికను ఉంచాడు. ఆమైపె లైంగిక దాడికి ప్రయత్నం చేయగా బాలిక నిరాకరించింది. రాత్రి 9 గంటల సమయంలో బాలికను గాయపరిచి వేధించడంతో నిద్రలోకి జారుకుంది. అదే రోజు రాత్రి ఒంటిగంట సమయంలో బాలికకు మెలకువ వచ్చింది. ఆ సమయంలో నిందితుడు బాలికపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. బాలికను నిర్జన ప్రదేశంలో వదిలిపెట్టాడు. బాలికకు సంరక్షకురాలిగా ఉన్న నీలాపు రాజి నిందితుని పట్టుకుని బాలికలు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూ పోర్టు పోలీసులు ఫిర్యాదు స్వీకరించి నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి 376, 363, పోక్సో చట్టంలోని సెక్షన్ 3, 4 ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేశారు. అప్పటి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వివేకానంద కేసును విచారణ జరిపి నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. ప్రస్తుత ఏసీపీ పెంటారావు కేసును పర్యవేక్షించారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తిపై విధంగా తీర్పునిచ్చారు. -
పరిశ్రమల స్థాపనకు సహకారం
మహారాణిపేట: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశంలో శుక్రవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ విండో విధానంలో సులభతర రీతిలో అనుమతులు జారీ చేయాలని, సమస్యలేమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఆటోనగర్ పారిశ్రామిక వాడలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా పైప్లైన్లకు మరమ్మతులు చేపట్టాలని, ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పీఎం ఈజీపీలో భాగంగా ఎంఎస్ఎంఈ పథకం కింద దరఖాస్తులకు పరిశీలించి ఆమోదం తెలపాలన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని, పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలని, మాక్‌డ్రిల్ నిర్వహించాలని సూచించారు. పరిశ్రమల శాఖ జీఎం సీహెచ్ గణపతి గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి తెలిపారు. ఏడీ రమామణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ ఎం.ఎస్.శోభారాణి, ఆర్అండ్ బీ ఎస్ఈ కె.కాంతిమతి పాల్గొన్నారు. -
యువతను సన్మార్గంలో నడిపించడమే లక్ష్యం
● బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ మద్దిలపాలెం: శివపదాలను విశ్వవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ, విశాఖ రుషిపీఠం సత్సంగ సభ సంయుక్త ఆధ్వర్యంలో రెండో రోజు శుక్రవారం ‘శివ పదం సంకీర్తన యజ్ఞం’ కార్యక్రమం జరిగింది. ముందుగా అకాడమీ అధ్యక్షుడు ఎం.ఎస్.ఎన్.రాజు, కార్యదర్శి డా.రాంబాబు, ప్రధాన నిర్వాహకులు కందాళి వెంకట సత్యశ్యామ్, అరుణ గాయత్రి, వి.వి.ఆదినారాయణ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలు కొనసాగాయి. ఆధునిక సమాజాన్ని, యువతను సన్మార్గం వైపు నడిపించడం ఆధ్యాత్మికతతోనే సాధ్యమన్నారు. శివపదం ప్రతి నోటా జపించేలా చేయడమే దానికి సరైన మార్గమన్నారు. పరమ శివుడిని ధ్యానించే వారికి సులభతరంగా ఉండేలా కొన్ని పద్యాలను రచించామన్నారు. శివపదం స్తుతించడం ద్వారా మానసిక వికాసం లభిస్తుందన్నారు. శబ్ద, బ్రహ్మ స్వరూపమైన శివ నామస్మరణ ఆవశ్యకతను యువతకు దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం నల్లాన్ చక్రవర్తుల కౌశిక్ కల్యాణ్ తమ బృందగానంతో సభికులను అలరించారు. వేజేటి శ్రీరామాచార్యులు, దోర్భల ప్రభాకర శర్మ తదితరులు పాల్గొన్నారు. -
మతిస్థిమితం లేని మహిళ హత్య?
● ఒంటి నిండా గాయాలే.. అక్కిరెడ్డిపాలెం: భెల్ సిగ్నల్ పాయింట్ వద్ద ప్రసన్న వెంకటేశ్వరాలయం సమీపంలోని బస్ షెల్టర్‌లో తీవ్ర గాయాలతో మతిస్థిమితం లేని మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం ఉదయం జీవీఎంసీ, ఆలయ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి.. గాజువాక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వివరాలివీ.. 25 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళ ప్రసన్న వెంకటేశ్వరాలయం సమీపంలోని బస్ షెల్టర్‌లో ఉంటోంది. ఆమె ఎల్లప్పుడూ ఆలయం మెట్ల వద్ద లేదా రాంనగర్‌లోని టిఫిన్ సెంటర్ల వద్దే కనిపించేది. కొంతమంది ఆమెకు ఉదయాన్నే టిఫిన్ ఇచ్చేవారు. ఆమెకు తెలుగు రాదని.. వేరే రాష్ట్రానికి చెందిన మహిళ అయి ఉంటుందని స్థానికులు తెలిపారు. కాగా.. ఆమె మృతి చెందడం స్థానికంగా కలకలం రేగింది. ఆమె మృతదేహంపై నుదుటి నుంచి కడుపు వరకు అనేక గాయాలు ఉన్నాయి. బస్ షెల్టర్ గోడలు రక్తంతో నిండి ఉన్నాయి. కొన్ని కర్ర ముక్కలు ఘటనా స్థలంలో కనిపించాయి. ఆమైపె గురువారం అర్ధరాత్రి ఎవరైనా అత్యాచారానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఎస్ఐ రవికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ ఎ.పార్థసారధి మాట్లాడుతూ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇదేనా మంచి ప్రభుత్వం?
కంచరపాలెం: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా పేదలు భోజనాలకు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీ 45వ వార్డు తాటిచెట్లపాలెం వైఎస్సార్‌కాలనీలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్‌ను 12 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. నాయకుల ఊకదంపుడు ప్రసంగాలతో పేదలు ఆకలితో అలమటించారు. 100 రోజుల్లో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పకుండా ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. చాలీచాలని కుర్చీలు వేసి వచ్చిన ప్రజలకు నరకం చూపించారు. అన్నా క్యాంటీన్ సమయానికి ప్రారంభం కాకపోవడంతో భోజనం అందించడం ఆలస్యమైంది. ఫలితంగా పేద ప్రజలు గంటల తరబడి ఎండలో నిలబడి భోజనం కోసం ఎదురుచూడాల్సి పరిస్థితి వచ్చింది. చివరకు 1.45 గంటలకు క్యాంటీన్‌ను ప్రారంభించి.. రెండు గంటలకు భోజనాలు అందించారు. ప్రజలంతా ఒక్కసారిగా రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎంపీ శ్రీభరత్, జోన్–5 కమిషనర్ బొడ్డేపల్లి రాము, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
ఇరుకు రోడ్డులో అంతస్తులు
జీవీఎంసీ 10వ వార్డు పరిధి ఇందిరాగాంధీనగర్ రామాలయం ఎదురుగా 8 అడుగులు వెడల్పు గల రోడ్డు ఉంది. ఈ రోడ్డు పక్కన సుమారు 160 చదరపు గజాల విస్తీర్ణంలో ఓ వ్యక్తి స్థానిక టీడీపీ నాయకుల అండతో దర్జాగా అనధికారికంగా అంతస్తులు వేసేశాడు. బయటకు కనిపించకుండా గ్రీన్ సేఫ్టీ నెట్స్ వేసి లోపల పని కానిచ్చేశాడు. సదరు వ్యక్తి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి సిల్ట్, గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు వేయడానికి అనుమతులు తీసుకుని నిర్మాణం ప్రారంభించాడు. ఆ తర్వాత అసలు కథ మొదలు పెట్టాడు. అనధికారికంగా మూడు, నాలుగు ఫ్లోర్లు వేశాడు. ఆ ఫ్లోర్లు కనిపించకుండా గ్రీన్ సేఫ్టీ నెట్స్‌తో మూసేశాడు. 10 అడుగులు కూడా లేని ఈ రోడ్డులో ఇన్ని అంతస్తుల నిర్మాణం జరుగుతున్నప్పటికీ.. పక్కనే ఉన్న సచివాలయం టౌన్ ప్లానింగ్ సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఇందిరాగాంధీనగర్‌లో ఇరుకు రోడ్డులో అనధికారిక భవన నిర్మాణం -
అంతస్తులపై అక్రమ అంతస్తులు
అనుమతులు ఓ చోట.. నిర్మాణం మరో చోట జీవీఎంసీ 12వ వార్డు పరిధి సాలిపేటలో ఓ టీడీపీ నాయకుడు రెవెన్యూ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నాడు. ఇది కొండవాలు ప్రాంతం. ఇక్కడ గతంలో సుమారు 190 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు ఇళ్లు ఉండేవి. వాటి వెనుక రెవెన్యూ స్థలం(కొండవాలు) ఉంది. ఇప్పుడు ఆ రెండు ఇళ్ల స్థలంతో పాటు వెనుక ఉన్న రెవెన్యూకి చెందిన సుమారు 100 గజాల కొండవాలును కలుపుకుని నిర్మాణం చేపట్టేశాడు. ఈ బిల్డర్ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేరు చెబుతుండటంతో.. రూరల్ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పైగా వేరే ప్రాంతంలో సర్వే నంబర్‌తో ఈ భవన నిర్మాణం కోసం జీవీఎంసీ నుంచి ప్లాన్ తీసుకోవడం గమనించదగ్గ విషయం. ఈ కొండవాలు సర్వే నంబర్ 24లో ఉంది. కానీ ఈ భవన నిర్మాణానికి మాత్రం సర్వే నంబర్ 67/3పై ప్లాన్ తీసుకున్నాడు. ఆరిలోవ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో ఎవరికై నా మంచి జరిగిందా అంటే అది కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే.! బడికి వెళ్లే పిల్లల దగ్గర నుంచి తల్లులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు.. ఇలా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించి.. సూపర్‌సిక్స్‌ను అటకెక్కించింది. ప్రజలను నిలువునా దగా చేసింది. కాగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు అక్రమాలకు తెరతీశారు. ఈ విషయంలో ఆరిలోవ ప్రాంతం టీడీపీ నాయకులు ఇంకా ముందున్నారు. కొందరు గెడ్డలు, ఖాళీ స్థలాలు ఆక్రమిస్తుంటే.. మరికొందరు అక్రమ నిర్మాణాలతో దూసుకుపోతున్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేరు చెప్పి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను బెదిరిస్తూ.. తమ పని కానిచ్చేస్తున్నారు. టీడీపీ నేతల అక్రమ నిర్మాణాలపై అధికా రులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కార్పొరేటర్ భర్త దందా జీవీఎంసీ 10వ వార్డులో టీడీపీ కార్పొరేటర్ భర్త అక్రమ నిర్మాణానికి తెరతీశాడు. ఆదర్శనగర్ కొండవాలులో సమారు 250 చదరపు గజాల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపడుతున్నాడు. ఇది కొండవాలు కావడంతో భారీ భవంతులు నిర్మించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. అయినా ఇక్కడ దర్జాగా నాలుగో ఫ్లోర్ వేస్తున్నాడు. మరో అంతస్తు వేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇంత పెద్ద భవన నిర్మాణం చేపట్టడానికి కనీసం 30 అడుగులు వెడల్పు రోడ్డు ఉండాలి. ఇక్కడ ఉన్నది 10 అడుగులు రోడ్డు మాత్రమే. దీంతో పాటు ఎలాంటి సెట్ బ్యాక్‌లు లేకుండా నిర్మాణం సాగించేస్తున్నాడు. ఇది అక్రమ నిర్మాణమని తెలిసినా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. 100 రోజుల పాలనలో అక్రమాలకు తెరతీసిన టీడీపీ నేతలు ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు ఎమ్మెల్యే పేరు చెప్పి అధికారులకు బెదిరింపులు -
పోర్టు కార్యకలాపాలపై సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామ్‌చందర్, ఏపీ కమిషన్ డైరెక్టర్ డా.సునీల్ కుమార్ బాబు, కమిషన్ ప్రైవేట్ సెక్రటరీ వి.క్రాంతి కుమార్ శుక్రవారం విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ)ని సందర్శించారు. కమిషన్ బృందానికి పోర్టు డిప్యూటీ చైర్మన్ దుర్గేష్‌కుమార్ దూబే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, అధికారుల సంఘం ప్రతినిధులతో కలిసి పరిపాలన కార్యాలయ ప్రాంగణంలో రామచందర్ మొక్కలు నాటారు. అనంతరం పోర్టులోని ఎస్సీ ఉద్యోగులు, అధికారుల సంఘంతో సమావేశం నిర్వహించి.. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. పోర్ట్ యాజమాన్యంతో రిజర్వేషన్ విధానాల అమలుపై సమీక్ష నిర్వహించారు. -
‘స్టీల్‌ప్లాంట్‌నే రక్షించలేనిది మంచి ప్రభుత్వమా?’
మధురవాడ: ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించలేనిది మంచి ప్రభు త్వం ఎలా అవుతుందని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సంతాప దినాలు ప్రకటించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా ముంచేసిందని.. ఇది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిట్లర్ ప్రభుత్వమని పేరు మార్చుకుంటే ఎంతో బాగుంటుందని కూటమి నేతలకు సూచించారు. రాష్ట్రంలోని ఏకై క అతి పెద్ద పరిశ్రమను పరిరక్షించకపోతే లక్షలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. కేంద్ర ప్రభు త్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించిన రూ.500 కోట్లు పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ, కరెంట్ బిల్లులు కట్టడానికి కూడా సరిపోవన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
యువతను సన్మార్గంలో నడిపించడమే లక్ష్యం
8లోరికార్డుల తారుమారు విశాఖ జిల్లాలో రికార్డులను భారీగా తారుమారు చేశారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా హుద్‌హుద్ సమయంలో రికార్డులు కనిపించకుండా పోయాయనే కారణం చూపి... ఇష్టారీతిలో రికార్డులను తారుమారు చేయడంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ నేతలు ప్రముఖపాత్ర వహించినట్టు తెలుస్తోంది. ఈ విధంగా జరిగిన రికార్డుల తారుమారుతో బీచ్ రోడ్డులో భీమిలి వరకు ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరిగాయని సమాచారం. మరోవైపు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న వ్యక్తి భారీ భవంతిని నిర్మించి... తర్వాత ఇతరులకు విక్రయించారు కూడా. ఈ నిర్మాణాలకు జీవీఎంసీ అనుమతులు ఇవ్వడంతో పాటు విమర్శలు వచ్చినప్పటికీ మిన్నకుండా ఉండిపోయింది. ఈ నిర్మాణం కోసం కూడా రికార్డులను అప్పట్లోనే తారుమారు చేశారనే విమర్శలు వచ్చాయి. బీచ్ రోడ్‌లోని అనేక హెచరీల నిర్మాణాలు ఏకంగా సముద్రంలోకి వెళ్లి మరీ చేపట్టాయి. నిర్మాణం చేపట్టడమే కాకుండా ఇంకా ముందుకు వెళ్లి మరీ భారీ బండరాళ్లతో సముద్రాన్ని సైతం ఆక్రమిస్తున్నారు. అయినప్పటికీ ఇదంతా తమ రికార్డుల్లోని భూమి అని ఆయా యాజమాన్యాలు పక్కాగా సిద్ధంగా చేసుకున్నాయి. మరోవైపు మంగమారిపేట వద్ద ఓ ప్రైవేటు వ్యక్తి సముద్రంలోకి భారీ బండరాళ్లతో కప్పేస్తున్నాడు. ఇదంతా తన భూమి అని పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. అధికారులు కూడా మౌనం వహిస్తున్నారు. -
సముద్రంలోకి వ్యర్థాలు
సముద్రంలోకి దూసుకెళ్లి మరీ భారీ బండరాళ్లతో కప్పేసి... స్థలాన్ని ఆక్రమిస్తున్న హేచరీల యాజమాన్యాలు సముద్ర జలాలను సైతం కలుషితం చేస్తున్నాయనే విమర్శలున్నాయి. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా సముద్రంలోకి ఈ హేచరీల నుంచి వచ్చే వ్యర్థాల ను వదిలేస్తున్నారు. ప్రభుత్వ అధికారులకు నెల నెలా మామూళ్లు ముట్టచెబుతూ.. అటువైపు కన్నెత్తి చూడకుండా చూసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ వ్యర్థాలతో సముద్ర మత్స్యసంపదకు నష్టం వాటిల్లుతోందని స్థానిక మత్స్యకారులు వాపోతున్నారు. మరోవైపు తమ చేపల వేటకు ఈ వ్యర్థాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాలతో మత్స్యసంపద దెబ్బతింటుండటంతో వేట కోసం మరింత దూరం సముద్రంలోకి వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్టీల్‌ప్లాంట్ రక్షణకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డాబాగార్డెన్స్: రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 రోజుల్లో రాష్ట్రంలోని టీడీపీ సర్కార్ మాటలకు తగ్గుట్టుగా చేతల్లో నిర్దిష్ట చర్యలేవీ తీసుకోలేదని ఎద్దేవా చేశారు. ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేయకుండా, బ్లాస్ట్ ఫర్నేస్ తెరిపించకుండా కార్మికులు ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. ఆఫీసర్ల జీతాల్లో 30 శాతం కోత పెట్టడం, కాంట్రాక్ట్ కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలివ్వకపోవడం, ఉద్యోగులకు వేజ్ రివిజన్ చేయకపోవడం వంటి దుర్మార్గపు చర్యలని విమర్శించారు. రూ.500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా తక్షణమే రూ.15వేల కోట్ల రుణాన్ని కేంద్రం నుంచి తెచ్చేలా రాష్ట్రంలోని కూటమి భుజస్కంధాలపై ఉందన్నారు. మూడేళ్లుగా కార్మికులు, ప్రజల పోరాటంతో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని, నేడు దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రంలో కీలక స్థానంలో చంద్రబాబు ఉన్నాడని, మద్దతు ఉపసంహరిస్తే కేంద్రం పడిపోతుందని గుర్తు చేశారు. ప్లాంట్‌పై మోదీ చేస్తున్న కుట్రలను చంద్రబాబు అడ్డుకోలేకపోవడాన్ని తప్పుపట్టారు. సమావేశంలో సిటూ కార్యదర్శి ఎం జగ్గునాయుడు పాల్గొన్నారు. -
పేదల సొంతింటి కల నెరవేర్చాలి
మహారాణిపేట: పేదల సొంతింటి కలను నెరవేర్చాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు. మంజూరైన ప్రతి ఇల్లునూ అధికారులు దగ్గరుండి కట్టించాలని, గుత్తేదార్లకు, లబ్ధిదారులకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె. విశ్వనాథన్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి శుక్రవారం జీవీఎంసీ సమావేశమందిరంలో సమీక్ష నిర్వహించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి నిర్మాణాల్లో జోరు పెంచి, జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు.సమావేశంలో భాగంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 పథకంలో భాగంగా లబ్ధిపొందిన వారికి మరొక్క గృహ సంబంధిత పథకంలో అవకాశం ఉండదని రాజాబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1.0లో లబ్ధి పొందిన వారికి 2.0లో అవకాశం రాదని, మార్పులు చేర్పులు ఉండబోవని తేల్చిచెప్పారు. పెండింగ్ బిల్లులేమైనా ఉంటే నివేదించాలని, వారం రోజుల్లో పరిష్కరిస్తానని గృహ నిర్మాణ శాఖ ఎండీ చెప్పారు. జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిని గృహ నిర్మాణ శాఖ ఎండీకి వివరించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్ వివరించారు. 100 రోజుల ప్రణాళికకు అనుగుణంగా సమన్వయంతో పనిచేస్తామని, ఇళ్ల నిర్మాణాల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పారు. సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ డి. అఖిల, విశాఖ, భీమిలి ఆర్డీవోలు హుస్సేన్ సాహెబ్, భాస్కర్ రెడ్డి, శేషశైలజ, ఇతర విభాగాల అధికారులు, గుత్తేదార్లు పాల్గొన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజాబాబు -
నిర్లక్ష్యంగా లారీ నడిపిన డ్రైవర్‌కు ఏడాది జైలు
విశాఖ లీగల్: లారీని నిర్లక్ష్యంగా నడిపి.. మరో లారీ డ్రైవర్ మృతికి కారణమైన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ నగరంలోని ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పి.ప్రదీప్ కుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. జైలు శిక్షతోపాటు రూ. 6,000 జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో అదనంగా రెండు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు. సీనియర్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మైలపల్లి ఆదినారాయణ అందించిన వివరాలివీ.. నిందితుడు అనకాపల్లికి చెందిన కరణం అప్పారావు. విశాఖపట్నం పోర్టులోని కాంట్రాక్టర్ దగ్గర టిప్పర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. మృతుడు వాడపల్లి వెంకట రమణరాజు కూడా టిప్పర్ డ్రైవర్. పోర్టు ప్రాంతంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ముందు వెళ్తున్న లారీని వెనకనే వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ నిందితుడు అప్పారావుపై 304 ఏ కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
ఎంవీపీకాలనీ: వాల్తేర్ డివిజన్ పరిధి నౌపడ–పూండి సెక్షన్లో ఈ నెల 23, 26, 28 తేదీల్లో భద్రత పనుల కారణంగా పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు సీనియర్ డీసీఎం కె.సందీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న పుదుచ్చేరి–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (12897) రెండు గంటలు ఆలస్యంగా రాత్రి 9.35 గంటలకు, ఈ నెల 25, 27న కేఎస్ఆర్ బెంగుళూర్–భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) 2.30 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 4.10 గంటలకు బయలుదేరుతాయి. 22న రూర్కెలా–గుణుపూర్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్(18117) పలాస వరకు, 23న గుణుపూర్– రూర్కెల్ ఎక్స్‌ప్రెస్ పలాస నుంచి బయలుదేరుతుంది. ఈ రెండు రోజులు పలాస– గుణుపూర్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించవు. 26, 28 తేదీల్లో పలాస మెము(07470/07471) విశాఖ–శ్రీకాకుళం మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తుంది. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని వాల్తేర్ డీసీఎం డీసీఎం సందీప్ కోరారు. -
దర్జాగా కబ్జా
● కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జోరుగా అక్రమ నిర్మాణాలు ● ఆలయాల నిర్మాణం పేరుతో ఆక్రమణలు ● చోద్యం చూస్తున్న రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారులు తగరపువలస: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు ఎక్కువయ్యాయి. రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటూ పరోక్షంగా కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నా రు. దీంతో ఆక్రమణదారులు దొడ్డిదారిన నిర్మాణాలు చేపట్టి అడ్డదారిలో పన్నులు, విద్యుత్ మీటర్లకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. తరువాత వీటిని అనువైన ధరలకు విక్రయించి మరోచోట కన్నేస్తున్నారు. కబ్జాలలో చెరువులు, శ్మశానవాటికలు, ప్రభుత్వ స్థలాలు ఉండటం గమనార్హం. భీమిలి జోన్ రెండోవార్డు సంగివలస అల్లూరి సీతారామరాజు కాలనీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చెరువు గట్టుపై పట్టా సాధించిన ఘనులు ఇప్పుడు పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది అక్రమ నిర్మాణమా, సక్రమ నిర్మాణమా తేల్చాల్సిన వీఆర్వో, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆరుమాసాలుగా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. అలాగే నమ్మివానిపేట చెరువును కబ్జా చేసిన ఘనులు ఏకంగా చెరువులోనే ఆలయం పేరుతో కాంక్రీట్ నిర్మాణం చేపట్టినా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు తమ పని కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వలందపేట రజకవీధిలో కొందరు ప్రబుద్ధులు ఏకంగా నలుగురు నడిచే మార్గాన్నే వినాయకుని మండపం పేరుతో కబ్జా చేసి ఏడాది పొడవునా రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ప్రస్తుతం వలందపేట నుంచి అమేయా స్కూల్ మార్గంలో కోరాడపేట వద్ద సర్వే నంబర్ 39, 56, 57లలో 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రహదారిలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని శ్రీకృష్ణుని ఆలయం పేరుతో చదును చేయించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆక్రమణకు అడ్డుకోగలిగినా కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో ఈ స్థలాన్ని చేజిక్కించుకోవడానికి ఇక్కడి టీడీపీ నాయకులు పావులు కదుపుతున్నారు. మాస్టర్‌ప్లాన్ రహదారిని ఆక్రమిస్తే భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని స్థానికులు అభ్యంతరాలు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా భీమిలి జోన్లో జరుగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
ప్రహసనంగా ‘స్థాయీ’ సమావేశాలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశాలు గాడి తప్పుతున్నాయి. ఆమోదం పొందిన అంశాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ స్థాయీ సంఘ సభ్యులకు అనుకూలంగా ఉన్న కొన్ని అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపుతుండగా..చాలా అంశాలు వాయిదా వేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో స్థాయీ సంఘం సమావేశం ఓ లెక్క..కూటమి ప్రభుత్వం వచ్చాక మరో లెక్క అన్న మాదిరిగా మారిపోయింది. గత ప్రభుత్వ హయాంలో అంతా పారదర్శకంగా సమావేశాలు జరగ్గా..కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి పనికీ ఎంతోకొంత ప్రతిఫలం లేనిదే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు ఆరేడు నెలల తర్వాత ఈ నెల 13న నూతన సభ్యులతో సంఘ సమావేశం నిర్వహించారు. 280 అజెండా అంశాలకు గాను 150 వరకు చర్చించారు. వాటిలో 50 అంశాలు వాయిదా వేశారు. ఈ నెల 17న మిగిలిన అజెండా అంశాలకు సంబంధించి మరో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో 6 అంశాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే..తాజాగా శుక్రవారం స్థాయీ సంఘ సమావేశం స్థాయీ సంఘ చైర్మన్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన నిర్వహించారు. గత రెండు స్థాయీ సమావేశాల్లో వాయిదా పడ్డ 56 అంశాలతో పాటు మరో 68 అంశాలు జోడించి మొత్తంగా 124 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు తీసుకొచ్చారు. వీటిలో 2 అంశాలు(34, 35 అంశాలు) తిరస్కరించగా ఏకంగా 63 అంశాలను సభ్యులు వాయిదా వేశారు. అయితే ఈ అంశాలకు సంబంధించి కార్పొరేటర్లకు సంబంధిత పనులు నిర్వహించే కాంట్రాక్టర్లకు మధ్య డీల్ కుదరకపోవడమే కారణమని తెలుస్తోంది. 59 అంశాలు పరిపాలన, కార్మికుల జీతాలకు సంబంధించిన అంశాలు ఆమోదించారు. వాయిదా అంశాలివే.. ● జీవీఎంసీ మెకానికల్ విభాగానికి సంబంధించి ఆపరేషన్ అండ్ మెయింట్‌నెన్స్ పద్ధతి ద్వారా కాంపాక్టర్ వాహనాలను చెత్త తరలించేందుకు పలు జోన్లలో వినియోగించే విషయమై సభ్యుల ఆమోదానికి చర్చకు వచ్చింది. ● జోన్–2 పరిధి ఆరో వార్డులో డాక్టర్ వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాల్గొన్న దృష్ట్యా ఉచిత తాగునీటి సరఫరా, టీ షర్టులు, గ్లాసులు తదితర వాటికి ఖర్చు అంశాన్ని సభ్యులు వాయిదా వేశారు. ఆమోదం.. మెకానికల్ విభాగానికి సంబంధించి ప్రజారోగ్య శాఖ శానిటేషన్ వాహనాలు సుమారు 400 వాహనాలు(అన్ని జోన్లు కలిపి) మరమ్మతుల చేపట్టే విషయమై వచ్చే అంశాలన్నీ సభ్యులు ఆమోదించారు. ఈ అంశాలను కూడా ఓ పక్షాన సభ్యులు వాయిదా వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతి నెలా మరమ్మతులు చేపట్టే కన్నా..కొత్త వాహనాలు కొనుగోలు చేయ్యోచ్చు కదా..అని పలువురు సభ్యులు అడగ్గా..స్థాయీ సంఘ చైర్మన్ గొలగాని హరి వెంకటకుమారి జోక్యం చేసుకుని ఇవన్నీ 15వ సంఘ ఆర్థిక నిధులు..అంతకన్నా ముందువని, నేరుగా వాహనాలు కొనుగోలు చేసే అధికారం మనకు లేదని, 16వ ఆర్థిక సంఘ నిధులు వస్తే కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఏ అంశమైనా కార్పొరేటర్‌కు తెలపండి వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనులే గాక ఏ పని చేపట్టినా స్థానిక కార్పొరేటర్లకు చెప్పాలని సభ్యులు కోరారు. ప్రతి విషయంలో కార్పొరేటర్‌ను భాగస్వామ్యం చేయాలని చైర్మన్ ద్వారా అధికారులకు తెలిపారు. ఆమోదం పొందిన అంశాలపై విమర్శలు తమకు అనుకూలంగా లేని అంశాలు వాయిదాబయటపడ్డ విభేదాలు స్థాయీ సంఘం సభ్యుల్లో లుకలుకలు బయటపడ్డాయి. జోన్–8 చీమలాపల్లి వద్ద గల సీసీఎస్ ప్రాజెక్టు నిర్వహించే విషయమై పరిపాలన పరమైన ఆమోదానికి సభ్యుల ముందుకు చర్చకు వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్ అండ్ మెయింట్‌నెన్స్ పద్ధతిలో సభ్యుల ఆమోదానికి చర్చకు రాగా..ఆ విభాగానికి సంబంధించిన అధికారి వివరణ ఇస్తూ..స్థాయీ సభ్యుల్లో నలుగురు ఈ విషయమై స్టడీ చేస్తామని, తామే వచ్చి పరిశీలిస్తామని చెప్పారన్నారు. ఈ విషయంలో ఆ నలుగురే సభ్యులా? మిగిలిన వారు కదా అంటూ స్థాయీ సంఘ సభ్యుడొకరు అధికారులను నిలదీశారు. -
జెడ్పీ చైర్‌పర్సన్‌కు పోలీసు భద్రత తొలగింపు
మహారాణిపేట : కూటమి ప్రభుత్వం ఏర్పడి తరువాత ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్రకు 1+1 ఉన్న పోలీసు భద్రతను తొలగించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా మారుమూల ముంచంగిపుట్టుకు చెందిన సుభద్రకు నిబంధనల మేరకు భద్రత కల్పించాలి. గన్మెన్లు లేకుండా శుక్రవారం ఆమె జెడ్పీ కార్యాలయానికి రావడంతో కొందరు విలేకర్లు ప్రశ్నించగా..కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలగించారని ఆమె బదులిచ్చారు. భద్రత కల్పించాలని డీజీపీ, డీఐజీ, ఇంటెలిజెన్స్ ఐజికి లేఖ రాసినా ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదని తెలిసింది. -
28న ‘మన ఇల్లు – మన గౌరవం’ సదస్సులు
మహారాణిపేట: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్, గ్రామీణ పథకంలో లబ్ధిదారులను చైతన్య పరుస్తూ ఈనెల 28వ తేదీన ఆయా లేఅవుట్ల పరిధిలో మన ఇల్లు – మన గౌవరం పేరుతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం జీవీఎంసీ మీటింగ్ హాలులో జరిగిన మన ఇల్లు – మన గౌరవం ప్రాథమిక సమావేశంలో కార్యక్రమ షెడ్యూల్‌ను వివరించారు. పీఎం ఆవాస్ యోజన 1.0లో భాగంగా రాష్ట్రంలో మంజూరైన వాటిలో లక్షల ఇళ్లను మార్చి 2025 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా అందరూ పని చేయాలన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 24 లేదా 25వ తేదీన లేవుట్ స్థాయి, గ్రామస్థాయి అధికారులతో మండల, జోనల్ స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. -
ఫెర్రోస్క్రాప్ నిగం లిమిటెడ్ విక్రయం దుర్మార్గం
ఉక్కునగరం : ఉక్కు మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్న ఫెర్రోస్క్రాప్ నిగం లిమిటెడ్ (ఎఫ్ఎస్ఎన్ఎల్)ను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడం దుర్మార్గమని ఫెర్రోస్క్రాప్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు మంత్రి రాజశేఖర్ అన్నారు. ఫెర్రోస్క్రాప్ను జపాన్‌కు చెందిన మెసర్స్ కొనౌకి ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్‌కు రూ. 320 కోట్లకు విక్రయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ శుక్రవారం స్టీల్‌ప్లాంట్‌లోని ఎఫ్ఎస్ఎన్ఎల్లో కార్మికులు ధర్నా చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో 442 మంది శాశ్వత ఉద్యోగులు, 2500 మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారన్నారు. 1979లో ప్రారంభమైన ఈ సంస్థకు ఇప్పటి వరకు ఏ ఏడాది కూడా నష్టాలు రాలేదన్నారు. ప్రస్తుతం ఫెర్రోస్క్రాప్కు రూ. 150 కోట్లు నిల్వ ఉండగా విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి రూ. 80 కోట్లు, ఇతర స్టీల్ప్లాంట్ల నుంచి రూ. 30 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఫెర్రోస్క్రాప్ నాయకులతో పాటు స్టీల్ ఐఎన్టీయూసీ నాయకులు పీవీ రమణమూర్తి, బీఎన్ రాజు, కొమ్ము ప్రసాద్, ఎస్.ఎ. నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
24, 25 తేదీల్లో సంగీత, నృత్య జాతీయ సదస్సు
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం సంగీత నృత్య విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ‘భారతీయ శాసీ్త్రయ సంగీతం, నృత్య శోభ’ రెండు రోజుల జాతీయ సదస్సు పోస్టర్‌ను ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు శుక్రవారం ఆవిష్కరించారు. సంగీత విభాగం 35వ, నృత్య విభాగం 20వ వార్షికోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. సదసు నిర్వాహకులను వీసీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్‌బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు, ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.నరసింహారావు, సంగీ విభాగాధిపతి, సదస్సు కన్వీనర్ ఆచార్య ఎ.అనూరాధ, సదస్సు సహ కన్వీనర్ ఆచార్య సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
వదల్లేదు..!
సముద్రాన్నీ● సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు ● పట్టించుకోని జీవీఎంసీ అధికారులు ● అధికార పార్టీ ఫిర్యాదు చేస్తే వెంటనే కూలగొడుతున్న జీవీఎంసీ ● కూటమి నేతల నిర్మాణాలపై మాత్రం మౌనం ● వ్యర్థాలనూ సముద్రంలోకి వదిలేస్తున్న హేచరీస్ యాజమాన్యాలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇవే కాదు బీచ్ రోడ్లో అనేక ప్రాంతాల్లో పలు కంపెనీలు, వ్యక్తులు సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టమే కాకుండా ఇందుకు తగినట్టుగా భూ రికార్డులు కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. బీచ్ రోడ్డు వెంట ప్రధానంగా మంగమారిపేట ప్రాంతంలో ఇష్టారాజ్యంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఒకవైపు సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారనే కారణంగా కేవలం గోడలనే తొలగిస్తున్న జీవీఎంసీ సిబ్బంది.... ఈ శాశ్వత నిర్మాణాల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న యాజమాన్యాలకు చెందినవి కావడమే గమనార్హం. -
మనోడు కాదా.. వీఆర్‌లో ఉంచేయ్..!
● రేంజ్ వీఆర్‌లో 57 మంది సీఐలు ● ఈ నెల 1 నుంచి 14వ తేదీ మధ్యే 24 మంది వీఆర్‌కు.. ● పోస్టింగ్‌ల కోసం మూడు నెలలుగా ఎదురుచూపులు ● సిఫార్సు లేఖల కోసం రూ.లక్షలు వసూలు ● స్థానాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బేరంవిశాఖ సిటీ: పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ కూటమి ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇన్స్పెక్టర్ నుంచి ఆ కింది స్థాయి పోస్టింగ్‌లు ఎమ్మెల్యేలకు వరంగా మారాయి. స్టేషన్‌కు ఓ రేటును ఫిక్స్ చేసి సిఫార్సు లేఖలు మంజూరు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా లేని వారిని మాత్రం వీఆర్‌లోనే ఉంచేలా పోలీస్ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో విశాఖ రేంజ్ వీఆర్‌లో ప్రస్తుతం 57 మంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరిలో కొందరు గత మూడు నెలలుగా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కొంత మందిని కక్షపూరితంగా.. మరికొంత మంది నుంచి బేరం కుదరకపోవడంతో వీఆర్కే పరిమితమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందు సిగపట్లు.. తరువాత సర్దుబాట్లు ఐపీఎస్‌ల నుంచి ఏసీపీ వరకు నియామకాలు చినబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. కానీ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆ కింది స్థాయి సిబ్బంది విషయంలో స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల సిఫార్సులు ఉంటేనే ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్‌లు లభిస్తున్నాయన్న టాక్ నడుస్తోంది. దీంతో అనేక మంది సీఐలు ఇప్పటికే ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ బదిలీల ప్రక్రియ ప్రారంభంలో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయి. బదిలీల విషయంలో తమ మాట చెల్లలేదని జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌లు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత మాత్రం అందరూ చక్కగా సర్దుకున్నారు. ఎవరి నియోజకవర్గాల్లో వారిదే పెత్తనం సాగాలన్న ఒప్పందానికి వచ్చారు. అలాగే ఎంపీకి మాత్రం ప్రతి నియోజకవర్గంలో ఒక పోస్టింగ్‌కు అవకాశం కల్పించాలన్న అవగాహన కుదుర్చుకున్నారు. స్టేషన్‌కో రేటు కొంత మంది ఎమ్మెల్యేలు స్టేషన్‌కు ఒక రేటును ఫిక్స్ చేశారు. దీని ప్రకారం సిఫార్సు లేఖలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఇచ్చిన వారికి నచ్చిన పోస్టింగ్‌లు వరిస్తున్నాయి. కొంత మంది సీఐలపై మాత్రం కొందరు ఎమ్మెల్యేలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తమకు అనుకూలంగా లేరన్న నెపంతో సిటీ నుంచి కొందరిని రేంజ్ వీఆర్‌కు పంపించేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా అక్కడి స్థానిక ఎమ్మెల్యేలు ఇదే తరహాలో వ్యవహరించారు. దీంతో వీఆర్‌లో ఉన్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం వీఆర్‌లో 57 మంది ఉండగా.. ఇందులో ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 24 మంది వీఆర్‌కు వచ్చారు. జిల్లాల్లో సీఐల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. వీరికి పోస్టింగ్‌లు మాత్రమే ఇవ్వడం లేదు. అలాగే జూన్ నుంచి కూడా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న వారూ ఉన్నారు. అయినప్పటికీ.. కూటమి నేతలు వారిపై కనికరం చూపించడం లేదు. వారిని తమ దారిలోకి తెచ్చుకోవడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పంచగ్రామాలకు మోక్షం..
పంచగ్రామాల సమస్యకు పరిష్కారం చూపిస్తాను. దశాబ్దాలుగా బాధపడుతున్న ప్రజల కన్నీటిని తుడుస్తానంటూ పెందుర్తిలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు కేబినెట్ సమావేశం జరిగినా.. పంచగ్రామాల సమస్య ప్రస్తావనే వినిపించలేదు. వాస్తవానికి పంచ గ్రామాల భూసమస్య గడిచిన 24 ఏళ్లు నుంచి నడుస్తోంది. 1996లో టీడీపీ హయాంలోనే ఈ సమస్య మొదలైంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ ఈ భూసమస్యను 100 రోజుల్లో పరిష్కారం చేస్తామన్నారు. కానీ పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో పంచ గ్రామాల పరిధిలోని ఇళ్ల మరమ్మతులకు అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం మాత్రం 100 రోజులు గడిచినా ఈ సమస్యను పట్టించుకోలేదు. -
ఉక్కు సంకల్పమంటూ ఉత్తుత్తి మాటలు
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్.. ఇతర కూటమి నేతలు.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రగల్భాలెన్నో పలికారు. ప్లాంట్ ప్రైవేటీకరణ జరగాలంటే.. ముందు మమ్మల్ని దాటి వెళ్లాలంటూ పవన్ కల్యాణ్ బీరాలు పలికారు. అవసరమైతే కార్మిక నేతలతో కలిసి ఢిల్లీ వెళ్తానంటూ గొప్పలు చెప్పారు. కానీ.. ప్రైవేటీకరణ కాకుండా గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్లాంట్‌ను కాపాడింది. అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజులకే కూటమి ప్రభుత్వం.. ప్లాంట్‌ను అప్పనంగా అప్పగించేందుకు పావులు కదుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో సిద్ధం చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తే స్టీల్‌ప్లాంట్ ఉత్పిత్తి పెరుగుతుంది. కానీ అధికారం చేపట్టి మూడు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికే ఉక్కు పరిరక్షణ కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు నెల రోజులుగా చంద్రబాబు, లోకేష్, పవన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా అవకాశం కల్పించడం లేదు. కేంద్రంతో లాలూచీ పడి స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కూడా సహకరిస్తోందనే అనుమానాలు ఇటీవల జరుగుతున్న పరిణామాలతో బలపడుతున్నాయి. ఇలా.. ఏ ఒక్క హామీ గురించి ప్రస్తావన సైతం తీసుకురాకుండా.. వంద రోజుల పాలనను మమా అనిపించేశారు. గత ఐదేళ్ల కాలంలో వెలుగొందిన విశాఖపట్నం జిల్లాను.. అడుగడుగునా దగా చేస్తూ పాలన సాగిస్తున్న కూటమి నేతల శైలిపై ప్రజలు మండిపడుతున్నారు.