voter list
-
కులగణనా.. ఓటర్ల జాబితానా?
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు కులగణన చేపట్టాలా..లేదా తాజా ఓటర్లజాబితా ఆధారంగా చేయాలా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోలేకపోతోంది. స్థానిక రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల పాలకమండళ్ల పదవీకాలం ముగిసి, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలై ఆరునెలలు కావొస్తోంది. ఇక జిల్లా, మండల ప్రజాపరిషత్‌ల గడువు ఈ నెల 4వ తేదీతో ముగియగా, రాష్ట్రవ్యాప్తంగా 32 జెడ్పీలు, 563 మండలాల్లోని దాదాపు 6 వేల ఎంపీటీసీ, 563 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లకు వచ్చే నిధులు ఆగిపోయాయి. బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఎలా ? స్థానిక సంస్థల్లో బీసీలకు గరిష్టంగా 21 శాతం రిజర్వేషన్లు ఉండగా, దానిని 42 శాతానికి పెంచుతామని, ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి ఏ పద్ధతి అనుసరించాలనే అంశంపై ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుతనంపై బీసీకమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల (స్థానిక స్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిని తేల్చాలని స్పష్టం చేసింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50 శాతానికి మించరాదని కూడా పేర్కొంది. ఓటర్ల జాబితాతో అయితే... రాష్ట్రవ్యాప్తంగా కులగణన నిర్వహణ అనేది చాలా ఎక్కువ సమయం పట్టే› ప్రక్రియ. దీంతో కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన లిస్ట్) ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించి..ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్ల వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. ఓటర్ల జాబితా ఆధారంగా ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బీసీ సంఘాలు, వివిధ కులసంఘాలు, జిల్లాల్లోని రాజకీయపార్టీలతో సమావేశాలు, బహిరంగ విచారణ, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించి ముందుకు సాగొచ్చునని బీసీ కమిషన్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఓటర్ల లిస్ట్ ప్రకారమైతే పెద్దగా శ్రమ లేకుండా మూడునెలల్లో క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చవచ్చునని, సామాజిక, ఆర్థిక, కుల సర్వే అయితే సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది. -
Lok Sabha Election 2024: పేరు మరిచిన మహిళలు!
ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచిపోయిన కథ అందరికీ తెలుసు. 1951- 52లో మన దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళల విషయంలో ఇలాంటి ‘ఈగ’ తరహా కథే జరిగింది... మొదటి సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డ కేంద్ర ఎన్నికల సంఘానికి చిత్రమైన సమస్య ఎదురైంది. చాలా రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు తమ సొంత పేర్లు నమోదు చేసుకోలేదు! బదులుగా తమ కుటుంబంలోని పురుష సభ్యులతో తమ సంబంధాన్ని బట్టి ఫలానా వారి భార్యను, ఫలానా ఆయన కూతురును అని నమోదు చేసుకున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు.. నాడు దేశవ్యాప్తంగా నమోదైన 8 కోట్ల మంది మహిళా ఓటర్లలో ఏకంగా 2.8 కోట్ల మంది ఇలా వైఫాఫ్, డాటరాఫ్ అని మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యభారత్, రాజస్తాన్, వింధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. దాంతో ఎన్నికల సంఘానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. అలాంటి మహిళా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సొంత పేర్లతో తిరిగి నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించారు. పురుష ఓటర్లతో ఉన్న సంబంధపరంగా కాకుండా విధిగా మహిళా ఓటర్ల పేరుతోనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు చెప్పడానికి నిరాకరించిన మహిళను ఓటరుగా నమోదు చేయొద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం బిహార్‌కు ఒక నెల ప్రత్యేక గడువిచ్చారు. ఈ పొడిగింపు బాగా ఉపయోగపడింది. ఆ గడువులో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారు. రాజస్తాన్‌లో మాత్రం పొడిగింపు ఇచ్చినా అంతంత స్పందనే వచ్చింది. దాంతో అక్కడ చాలామంది మహిళా ఓటర్లను తొలగించాల్సి వచ్చింది! తొలి ఎన్నికల్లో 17.3 కోట్ల పై చిలుకు ఓటర్లలో మహిళలు దాదాపు 45 శాతమున్నారు. వారికోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 27,527 పింక్ బూత్‌లను మహిళా ఓటర్లకు రిజర్వ్ చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రేడియోలో వరుస ప్రసంగాలు, చర్చలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితాలో మొత్తం 47.1 కోట్ల మంది మహిళలున్నారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ! -
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఎన్నికల సంఘం అనేక సౌకర్యాలు కల్పించింది. ఓటరు జాబితా సవరణలో ఏ కారణం చేతనైనా మీ పేరు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఓటరు జాబితా పరిశీలనకు అధికారులు వచ్చినప్పుడు మీరు లేకపోతే మీ పేర్లను తొలగించేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా అబ్సెంట్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఒక జాబితా రూపొందుతుంది. అంతేకాకుండా... ఒకవేళ మీ అడ్రస్ మారి ఉంటే, ఇంకో జాబితా, మరణించిన వారి కోసం కూడా ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేస్తారు.ఈ జాబితాలన్నీ ఓటరు జాబితాతోపాటు ప్రిసైడింగ్ అధికారికి అందుబాటులో ఉంటాయి. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాలి. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్ధారించుకుంటారు.అనంతరం ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దివ్యాంగులకు వాహన సదుపాయం...దివ్యాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం కోసం స్థానిక బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ)ని సంప్రదించాలి. ఆటో ద్వారా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తారు.పోలింగ్ కేంద్రం తెలుసుకోవడం ఇలా... ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు జారీ చేస్తుంది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు. -
ఓటు నమోదుకు మూడు రోజులే గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటు నమోదుకు ఇక మూడు రోజుల సమయమే ఉంది. 18 సంవత్సరాల వయసు నిండి.. ఓటర్ జాబితాలో పేరులేని వారంతా ఈ నెల 15లోగా ఆన్లైన్ ద్వారా గానీ లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో గానీ ఫాం–6ను సమర్పించడం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓటర్ జాబితాలో పేరుందో, లేదో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ.. జాబితాలో పేరు లేకపోతే పోలింగ్ రోజు ఓటు వేయలేరు. పేరు లేకపోతే ఈ నెల 15లోగా ఫాం–6 సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తాం. సాధారణంగా అయితే నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశముంటుంది. 15వ తేదీ తర్వాత నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు జారీ చేయడానికి 10 రోజుల సమయం పడుతుంది. అందువల్ల చివరి వరకు ఆగకుండా ఏప్రిల్ 15లోగా నమోదు చేసుకోవడం మంచిది’ అని సూచించారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు రాకుండా.. అధికారులు అన్ని ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అని సరి చూసిన తర్వాతే ఓటర్‌గా నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నా.. ఫిజికల్‌గా ఆధార్ కాపీ, వయసు నిర్దారణ ధ్రువపత్రంతో పాటు ఇంత వరకు ఎక్కడా ఓటు హక్కు లేదన్న ధ్రువీకరణ పత్రాలను తీసుకొని ఓటర్‌గా నమోదు చేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేసి వదిలేయకుండా.. అన్ని కాపీలను తీసుకువచ్చి ఇవ్వాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్‌గా నమోదు కావడమే కాకుండా మే 13న జరిగే పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని మీనా సూచించారు. -
ఓటును మించిన ఆయుధం లేదు
గచ్చిబౌలి (హైదరాబాద్): బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని, ఓటును మించిన ఆయుధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవా లని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే బాధ్యతగల పౌరులుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందుకు ‘సివిజిల్’ యాప్‌ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు అందిన వంద నిమిషాలలోపు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్ తెలిపారు. బ్యాలెట్ పవర్ గొప్పది: రోనాల్డ్‌రాస్ బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ చాలా గొప్పదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అన్నింటా ముందున్నా, ఓటింగ్‌లో 50 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది చెక్ చేసుకోవాలని, లేనట్లయితే ఈనెల 15లోగా ఫారమ్–6 ద్వారా దరఖాస్తు చేసుకొని ఓటుహక్కు పొందాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, పెద్దసంఖ్యలో యువత, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైటెక్స్ రోడ్‌లోని మెటల్ చార్మినార్ వరకు రన్ కొనసాగింది. -
నిర్ణయాధికారం ‘ఆమె’దే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సోమవారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తేలింది. రాష్ట్రం మొత్తం ఓటర్లలో ఎలక్ట్రోలర్ లింగ నిష్పత్తి సగటు కూడా ఎక్కువగానే ఉంది. పదేళ్లుగా పెరుగుతున్న నిష్పత్తి రాష్ట్రంలో 2014 నుంచి వరుసగా 2024 వరకు ఓటర్ల జాబితాల్లో మహిళా ఓటర్ల నిష్పత్తి పెరుగుతూనే ఉంది. అర్హులైన యువతులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో 18 నుంచి 19 సంవత్సరాల వయసుగల ఎలక్ట్రోరల్ లింగ నిష్పత్తి 778 నుంచి 796కు పెరిగింది. ఈ వయసుగల మహిళా ఓటర్లు 3.5 లక్షల మంది ఉన్నారు. గిరిజనుల్లోని ప్రత్యేక సంచార జాతులను కూడా ఓటర్లుగా నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 4.29 లక్షలుండగా 18 సంవత్సరాలు నిండిన 2.94 లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. బోడో గడబా, గుటోబ్ గడబా, చెంచు, బొండో పోర్జా, ఖోండ్ పోర్జా, పరేంగి పోర్జా, డోంగ్రియా ఖోండ్, కుటియా ఖోండ్, కోలం, కొండారెడ్డి, కొండ సవరాల జాతుల్లోని అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు. -
ఏపీ 2024 ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా విడుదల
-
AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్సైట్(CEO Andhra)లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లుగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్సైట్లో ఈసీ అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఈసీ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు: 4,08,07,256 మహిళా ఓటర్లు: 2,07,37,065 పురుష ఓటర్లు: 2,00,09,275 రాష్ట్రంలో సర్వీస్ ఓటర్లు: 67,434 థర్డ్ జెండర్ ఓటర్లు: 3482. కాగా, గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.ఏపీలో పురుషుల కంటే మహిళల ఓటర్లే అధికం ఉండటం గమనార్హం. జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు జిల్లా పురుషులు స్త్రీలు ఇతరులు సర్వీస్ ఓటర్లు మొత్తం ఓటర్లు తిరుపతి 8,68,273 9,10,597 188 867 17,79,058 చిత్తూరు 7,65,90 7,88,725 84 3,379 15,58,257 ఎన్టీఆర్ 8,17,484 8,57,361 150 16,74,995 కాకినాడ 7,88,105 8,10,781 15,99,065 కృష్ణా 7,37,394 7,80,796 65 15,18,255 యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తాం ఏపీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత 5.08 లక్షల ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు. యువ ఓటర్లు 8.13 లక్షల ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. యువ ఓటర్లు ఇంకా నమోదు కావాల్సి ఉందని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తామని అన్నారు. ఒకే డోర్ నెంబర్‌పై అధిక ఓట్లు ఉన్న ఫిర్యాదులను 98 శాతం పరిష్కరించామని తెలిపారు. లక్ష 50 వేల ఇళ్లలో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు 4వేల ఇళ్లకు తగ్గాయని, ప్రతి ఎన్నికల్లోనూ ఇలాంటి ఓట్లు ఉండేవని అన్నారు. ఫామ్ 7 ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 70 చోట్ల పోలీసు కేసులు నమోదు చేశామని అన్నారు. మళ్లీ కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. వికలాంగులు, 80 ఎళ్ల పైబడిన వారికి ఇంటి వద్ద ఓటింగ్‌కి అవకాశం ఇస్తామని అన్నారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. చదవండి: లోలోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు -
లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం
నల్లగొండ : ఏప్రిల్ నెలల జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాను కాకుండా కొత్త ఓటరు జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగానే కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. మూడు రోజుల క్రితమే ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జిల్లాలో మొత్తం 14,64,080 మంది ఓటర్లు ఉండగా ముసాయిదా జాబితాలో 14,67,573 మంది ఓటర్లున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు 3,493 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. ఈ నెల 22 వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అవగాహన కల్పిస్తున్న బీఎల్ఓలు 1 జనవరి 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఈనెల 22వ తేదీ వరకు ఓటరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం బీఎల్ఓలు ఓటర్ల జాబితాను తీసుకుని ఇల్లిల్లూ తిరిగి ఓటు ఉందా లేదా తెలుసుకుని ఓటు లేకపోతే దరఖాస్తు చేసుకోమని అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 2వ తేదీ లోగా పరిష్కరించనున్నారు. మార్పులు, చేర్పుల అనంతరం ఓటరు తుది జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. ఈ జాబితాతోనే ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించనున్నారు. -
టీడీపీ అక్రమాలపై చర్యలు తీసుకోండి
సాక్షి అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో టీడీపీ భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారుల బృందానికి ఫిర్యాదు చేశారు. మైపార్టీ డ్యాష్ బోర్డు.కామ్ వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ అక్రమంగా సేకరిస్తోందన్నారు. ఆ పార్టీకి మద్దతు తెలపని ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం తప్పుడు సమాచారంతో భారీ ఎత్తున ఫామ్–7లను ఎన్నికల సంఘానికి సమర్పిస్తోందన్నారు. పైగా దొంగే దొంగ అన్నట్లు టీడీపీ నేతలే ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ అధికారుల బృందం శనివారం కూడా సమీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో సీఈసీ బృందాన్ని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొఠారు అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, నవరత్న పథకాల అమలు వైస్ చైర్మన్ నారాయణమూర్తిలతో కూడిన వైఎస్సార్సీపీ బృందం కలిసింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 14న సీఈసీకి చేసిన ఫిర్యాదులను మరోసారి వైఎస్సార్సీపీ నేతలు సీఈసీ బృందం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో టీడీపీ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే.. తెలంగాణలో ఓట్లున్నవారిని ఏపీలో చేరుస్తోంది.. తెలంగాణలో ఓట్లు ఉన్న వారిని రాష్ట్రంలోనూ ఓటర్లుగా చేర్పించడానికి టీడీపీ ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున శిబిరాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఒక ఓటు.. రాష్ట్రంలో మరో ఓటు ఉన్నవారు రాష్ట్రంలో 4.30 లక్షల మంది ఉన్నారు. వారి ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాం. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని తప్పుడు సమాచారంతో పది లక్షలకుపైగా ఫామ్–7లను దాఖలు చేసిన టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేశ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం. మేనిఫెస్టో పేరుతో వచ్చే ఐదేళ్లలో ఒక్కో కుటుంబానికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ప్రమాణపత్రాలను ఓటర్లకు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాం. టీడీపీ, జనసేన చట్టవ్యతిరేక కార్యకలాపాలు.. గతంలో సేవా మిత్ర యాప్ తరహాలోనే ఇప్పుడు మై పార్టీ డ్యాష్ బోర్డ్.కామ్ అనే వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ అక్రమంగా సేకరిస్తోంది. టీడీపీ, జనసేన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికీ వెళ్లి టెక్నాలజీని ఉపయోగించి ప్రలోభాలకు గురిచేస్తున్నాయని ఎన్నికల అధికారుల బృందానికి వివరించాం. వైఎస్సార్సీపీ ఓటర్లను గుర్తించి వారి ఓట్లను తొలగించడానికి టీడీపీ నేతలు దరఖాస్తు చేస్తున్నారు. తెలంగాణలో ఓట్లు ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హోటల్స్‌కి పిలిపించుకుని రాష్ట్రంలో ఓట్లు ఎలా నమోదు చేసుకోవాలో చెబుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీఈసీ బృందానికి ఫిర్యాదు చేశాం. ఒకరికి ఒక ఓటే మా విధానం ఒకరికి ఒక ఓటు ఉండాలన్నదే వైఎస్సార్సీపీ విధానం. తెలంగాణలో ఓటు ఉన్నవారు ఏపీలోనూ ఓటు నమోదు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండటం నేరం. రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు మానేసి ఎన్నికల ఫిర్యాదులపై విచారణలో నిమగ్నం కావాలనే టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. టీడీపీకి చెందిన కోనేరు సురేశ్ 10 లక్షలకు పైబడి దొంగ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఇందుకు నిదర్శనం. వాటిని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు పంపి విచారణకు ఆదేశించింది. కోనేరు సురేశ్ తప్పుడు ఫిర్యాదు చేశారని జిల్లా కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. కోనేరు సురేశ్ తప్పుడు ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆశ్చర్యపోయారు. -
సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు
సాక్షి, అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్), సాధారణ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం నోవాటెల్‌లో ప్రారంభమైన సమీక్ష సమావేశం శనివారం కూడా కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ (వ్యయం) యశ్చి0ద్ర సింగ్‌తో పాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర తదితరులు హాజరయ్యారు. జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా స్వచ్చికరణ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, వారి ఫిర్యాదుల పరిష్కారం, ఇంటింటి సర్వే, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, శిక్షణ తదితరాలపై శుక్రవారం 19 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వగా, శనివారం ఇతర జిల్లాల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా ప్రతి దశలో అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికతతో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఓటర్ల జాబితాలన్నీ దోష రహితంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా ఒక్క మరణించిన వ్యక్తి కానీ, డబుల్ ఎంట్రీ కానీ ఉండకుండా జాబితాల స్వచ్చికరణ జరగాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా, నిర్భయంగా, సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఈవీఎంలు, ఎన్నికలకు అవసరమయ్యే ప్రతి మెటీరియల్‌ను మైక్రో ప్లాన్‌కు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు, పౌరులు, అభ్యర్థులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలపై పూర్తిస్థాయి అవగాహన అవసరమని తెలిపారు. లొకేషన్ మేనేజ్మెంట్ (డిస్పాచ్ సెంటర్, రిసీట్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్లు)కు కూడా పటిష్ట ప్రణాళిక ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి సమర్థవంతమైన మాస్టర్ ట్రైనర్లతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంలు కూడా కీలకమని చెప్పారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక స్వీప్ ప్రణాళిక గత ఎన్నికల్లో నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ శాతాలను విశ్లేషించుకొని, దాని ఆధారంగా ప్రాంతాలనుబట్టి ప్రత్యేక సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమస్యలకు కారణాలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, స్థానికుల్లో భయాలను పోగొట్టాల్సిందిగా చెప్పారు. సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), ఎథికల్ ఓటింగ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్ నిర్వహణ, ఎన్ఫోర్స్మెంట్ తదితరాలపైనా ఎన్నికల సంఘం ప్రతినిధులు మార్గనిర్దేశం చేశారు. ఈ రెండు రోజుల సమీక్షలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, సమ్మిళిత ఎన్నికల నిర్వహణకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు భేష్ రెండు రోజుల సమీక్ష సమావేశాలకు మంచి ఏర్పాట్లు చేసి, విశిష్ట ఆతిథ్యమిచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు నేతృత్వంలోని అధికార యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ బృందం ధన్యవాదాలు తెలిపింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికలపై ఈసీఐ అధికారుల నేతృత్వంలో విజయవంతంగా జరిగిన నిర్మాణాత్మక సమీక్ష సమావేశాలు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు మార్గదర్శిగా నిలిచాయని కలెక్టర్ డిల్లీరావు చెప్పారు. ఈ సందర్భంగా ఈసీఐ అధికారులను జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సరిహద్దుల్లో నిఘా పెంచాలి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి సూచించారు. వారు శనివారం సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో సమావేశమై సార్వత్రిక ఎన్నికల సన్నద్దతలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, ఎన్నికలకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాయి. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, మద్యం సరఫరా వంటివి నిరోధించడానికి ఎక్సైజ్ శాఖ, సెబ్ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని స్థాయిల్లో సమాచారం నిరంతరాయంగా వెళ్లేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా ఇంటెలిజెన్స్ సహాయంతో సకాలంలో చర్యలు తీసుకోగలమని తెలిపారు. దుర్గమ్మ సేవలో కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ శర్మ ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, ప్రత్యేక అధికారి ధర్మేంద్ర శర్మ శనివారం దర్శించుకున్నారు. ధర్మేంద్ర శర్మకు ఆలయ ఏఈఓ ఎన్.రమేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందజేశారు. ధర్మేంద్రశర్మ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్, వెస్ట్ ఏసీపీ హనుమంతరావు ఉన్నారు. -
AP: టీడీపీ నిర్వాకం.. డూప్లి‘కేట్స్’..!
ఈ ఫొటోలోని చండ్ర సరళ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పదవిలో ఉన్నారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెనాలి మున్సిపాలిటీ 31వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఈమె నెల్లూరు జిల్లా పామూరుపల్లి కోడలు. అయితే పుట్టినిల్లైన తెనాలిలోనూ ఆమెకు ఓటుంది. ఇంటి పేరు మార్పుతో రెండు చోట్లా ఓటరుగా కొనసాగుతున్నారు. జాస్తి సరళ పేరుతో తెనాలిలో ఓటరుగా నమోదు చేసుకోగా చండ్ర సరళ పేరుతో పామూరుపల్లిలో ఓటు హక్కు పొందారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ ఎంతో కీలకం! ఒకే ఒక్క ఓటు సైతం అభ్యర్థుల తలరాతలను తారుమారు చేస్తుంది! గెలుపోటములను నిర్దేశిస్తుంది! ఒకపక్క ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ గగ్గోలు పెడుతున్న విపక్ష టీడీపీ మరోపక్క చాపకింద నీరులా దొంగ ఓట్ల నమోదుకు బరి తెగించింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుల దొంగ ఓట్ల బాగోతం బహిర్గతమైంది. పలువురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లోనూ ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఓటర్ల జాబితా పరిశీలన, నమోదు, తొలగింపు, సవరణ లాంటి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన పలువురు రెండు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు బయటపడింది. అక్కడా ఉంటారు.. ఇక్కడా ఉంటారు! నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని పామూరుపల్లి 300 ఓటర్లు ఉండే చిన్న గ్రామం. అక్కడ టీడీపీ మద్దతుదారులకు సంబంధించి 30 ఓట్ల డబుల్ ఎంట్రీ వ్యవహారం తాజాగా బయటపడింది. గ్రామంలో ఓటు హక్కు ఉన్న చింతగుంపల ప్రసాద్, చింతగుంపల అరుణ, చింతగుంపల ముఖేష్‌కు కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం రాచెరువురాజుపాలెం గ్రామంలోనూ ఓటర్లుగా నమోదయ్యారు. చండ్ర చలపతిరావు, చండ్ర సరళకు పామూరుపల్లిలో పాటు తెనాలిలోనూ ఓట్లు ఉన్నాయి. చండ్ర ఈశ్వరమ్మకు వరికుంటపాడులోనే రెండు చోట్ల ఓట్లు ఉండటం గమనార్హం. వివాహమై అత్తారింటికి వెళ్లిన కొందరు మహిళలకు అటు మెట్టినింట్లోను, ఇటు పుట్టింటిలోనూ 2 చోట్ల ఓట్లున్నాయి. సోమిరెడ్డి – నారాయణ కుట్రలు ► సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలలో 11,291 మంది వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి తన అనుచరులతో ఫారం–7 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయించారు. వెరిఫికేషన్ సమయంలో అనుమానం రావడంతో పరిశీలించగా టీడీపీ నేతలు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. ► ఇదే తరహాలో నెల్లూరు నగరంలో దాదాపు 12 వేల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీమ్ ప్రయత్నించింది. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను ఆన్లైన్లో ఫారం–7 ద్వారా తొలగించేందుకు దరఖాస్తు చేయించారు. అయితే నెల్లూరు కార్పొరేషన్ నుంచి సంబంధిత ఓటర్లకు సమాచారం వెళ్లడంతో ఈ కుట్రలు విఫలమయ్యాయి. నెల్లూరు నగర నియోజకవర్గం జనార్దన్‌రెడ్డి కాలనీ పోలింగ్ బూత్ నెంబర్ 10లో గౌస్‌బాషా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కావడంతో అతడి ఓటును తొలగించేందుకు ఎల్లో గ్యాంగ్ ఆన్లైన్లో ఫారం–7 ద్వారా దరఖాస్తు చేసింది. బూత్ నెంబర్ 9లో ఎస్ మస్తాన్, పెల్గగరి దేవయానం మృతి చెందినట్లు పేర్కొంటూ ఓటర్లుగా తొలగించేందుకు ఫారం–7 ద్వారా దరఖాస్తు చేశారు. -
పోల్ మేనేజ్మెంట్పై బీజేపీ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ బూత్ మేనేజ్మెంట్పై బీజేపీ దృష్టిసారించింది. పార్టీ అభ్యర్థులకు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతోంది. బూత్‌స్థాయిలో ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ పర్యవేక్షణకు నియమించిన పన్నా ప్రముఖ్‌ల ద్వారా ఓటర్లంతా కచ్చితంగా ఓటేసేలా చూడాలని పార్టీ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. బూత్ కమిటీల సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడుతున్నారు. పార్టీ వైపు మొగ్గుచూపే ఓటర్లను కచ్చితంగా బూత్‌కు రప్పించేలా చేయడంలో లోటుపాట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని పార్టీ నాయకులు క్యాడర్‌కు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై నాయకులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బుధవారం కూడా టెలికాన్ఫరెన్స్ చేపట్టి పోల్ మేనేజ్మెంట్పై తగిన సూచనలు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 వేల పోలింగ్ బూత్‌లకుగాను 90 శాతం బూత్‌లలో బీజేపీ సంస్థాగతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుంది. జాతీయ నేతల ప్రచారంతో గెలుపుపై ధీమా... రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతలు నిర్వహించిన విస్తృత ప్రచారం బీజేపీ అభ్యర్థుల గెలుపునకు, ఓటింగ్ శాతం పెంచేందుకు దోహదపడుతుందనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మరికొన్ని చోట్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర జిల్లాల్లో కేంద్ర మంత్రుల ప్రచారం ప్రభావం చూపిందనే విశ్వాసాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. -
తెలంగాణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. శుక్రవారం ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే.. నామినేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు శాసనసభ్యులను ఎన్నుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో కోరింది ఈసీ. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఎన్నికల సంఘం. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్వో(ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్) కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు సూచనలు ►నేటి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ ►ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ ►నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అభ్యర్థి వెంట నలుగురికి అనుమతి ►నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను దాఖలు చేయాలి ►నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి EC కి వెల్లడించాలి. ►కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే అభ్యర్థి ఖర్చు వివరాలను తెలపాలి ►సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయం కల్పించిన ఎన్నికల సంఘం ►ఆన్లైన్ లో దాఖలు తరువాత పత్రాలను RO కు అప్పగించాలి ►ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలు వెల్లడించనున్న RO ►ప్రతిరోజు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్ పత్రాలను డిస్ప్లే చేయనున్న RO ►నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడేవిట్ పత్రాలను 24గంటల్లోనే CEO వెబ్సైట్ లో పెట్టనున్న ఎన్నికల అధికారులు ►అభ్యర్థులు అవసరమైతే 15వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు 3 వాహనాలు.. ఐదుగురికే అనుమతి శుక్రవారం ఉదయం 11 గంటలలోపు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించే సహాయ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోలు) పేరు, రిటర్నింగ్ అధికారి కార్యాలయ చిరునామాను ప్రకటిస్తూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ‘ఫారం–1’నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉదయం 11 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్‌తో పాటుగా నిర్దేశిత ఫారం–26లో అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు వంటి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ కోసం నామినేషన్ల దాఖలుకు కనీసం ఒకరోజు ముందు ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘సువిధ’పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే సంతకాలు చేసిన హార్డ్ కాపీని గడువులోగా ఆర్వోకు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 35,356 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇటీవల ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. త్వరలో ప్రకటించనున్న అనుబంధ ఓటర్ల జాబితాతో ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఓటింగ్ ఫలితాలు వెల్లడవుతాయి. సర్వం సిద్ధం! రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో సమాయత్తమైంది. దాదాపుగా ఏడాది ముందు నుంచే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. క్రమంగా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా రెండో సవరణ, ఈవీఎంలు సిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పౌలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస సదుపాయాల కల్పన, దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాల కల్పన, భద్రత ఏర్పాట్లను పూర్తి చేసింది. పటిష్ట బందోబస్తు, ఎక్కడికక్కడ నిఘా ఎన్నికల్లో ఓటర్లను డబ్బులు, మద్యం, ఇతర కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈసారి ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 4 రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే 17 జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. 89 పోలీసు చెక్‌పోస్టులు, 14 రవాణా, 16 వాణిజ్య పన్నులు, 21 ఎక్సైజు, 8 అటవీ శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్ టీమ్‌లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలియన్స్ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, పరిపాలన, పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం 39 మంది ఐపీఎస్ అధికారులను నియమించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న సుమారు 50 మందిని వ్యయ పరిశీలకులుగా నియమించింది. పోలింగ్ రోజు అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
ఓటర్ల నమోదుకు రేపే చివరి అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో మీ పేరు లేదా? జాబితాలో పేరు ఉన్నా మరో ప్రాంతానికి నివాసం మార్చారా? మీ పేరు, ఇతర వివరాలు తప్పుగా అచ్చు అయ్యాయా?.. ఇలాంటి కారణాలతో నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓటేయలేమని బాధపడుతున్నారా? అయితే మీలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పిస్తోంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6, ఇతర ప్రాంతానికి ఓటు బదిలీ, పేరు, ఫొటో, ఇతర వివరాల దిద్దుబాటు కోసం ఫారం–8 దరఖాస్తులను అక్టోబర్ 31లోగా సమర్పిస్తే వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికల్లో మీకు ఓటు హక్కు లభించనుంది. నివాసం ప్రస్తుతం ఉండే నియోజకవర్గంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా, లేదా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారినా ఫారం–8 దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఓటరు జాబితా/ ఓటరు గుర్తింపు కార్డులో ఫొటో సరిగ్గా లేకపోయినా, పేరు, ఇతర వివరాలు తప్పుగా వచ్చినా ఫారం–8 దరఖాస్తు ద్వారానే సరిదిద్దుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారితో ప్రత్యేకంగా అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రచురించనుంది. తుది ఓటర్ల జాబితాతో పాటు అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందు నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. నవంబర్ 3న రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, 10తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దానికి 10 రోజుల ముందు అనగా, అక్టోబర్ 31 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు. దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, వివరాల దిద్దుబాటు.. తదితర సేవల కోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https://voters.eci.gov.in లో అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్(వీహెచ్ఏ)ను మొబైల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని కూడా ఈ సేవలను పొందవచ్చు. లేకుంటే స్థానిక బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ), ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో)ను కలసి సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి అందజేయాల్సి ఉంటుంది. ఓటరు నమోదు కోసం కొత్తగా దిగిన ఫొటోతో పాటు చిరునామా, వయసు ధ్రువీకరణ కోసం పదో తరగతి మార్కుల పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు డిమాండ్ నోటీసు, గ్యాస్/బ్యాంక్ పాసుపుస్తకాలు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి? ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ? అనేది తెలుసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా https://electoralsearch.eci. gov.in అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. ఓటరు వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్), మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులువు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేయడానికి వీలుండేది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయసు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు. అయితే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరును సులువుగా సెర్చ్ చేయవచ్చు. కొత్త ఎపిక్ కార్డు నంబర్ ఎలా తెలుసుకోవాలి? గతంలో కేంద్ర ఎన్నికల సంఘం 13/14 అంకెల సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయగా, గత కొంత కాలంగా 10 అంకెల సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. పాత ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఆధారంగా మీ కొత్త ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ https://ceotserms2.telangana.gov.in/ ts search/ Non Standard Epic.aspx ను సందర్శించి మీ పాత కార్డు నంబర్ ఆధారంగా కొత్త ఎపిక్ కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు. -
ఏఎస్డీ జాబితాలో ‘వలస’ ఓటర్లు
ఓటరు నమోదుకు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి? వేరే ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకోవచ్చా? వికాస్‌రాజ్: కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, వేరే ప్రాంతానికి బదిలీ/వివరాల దిద్దుబాటుకు ఫారం–8ను అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. నామినేషన్లు నవంబర్ 10తో ముగుస్తాయి.ఆ తర్వాత అర్హులైన వారి పేర్లతో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం. కొత్త ఓటర్లకు కార్డుల పంపిణీ ఎప్పుడు చేస్తారు? ఇప్పటికే 27.5 లక్షల కొత్త ఓటర్లకు సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి స్పీడు పోస్టు ద్వారా వారి చిరునామాలకు పంపాం. మరో 12.5 లక్షల కార్డులను ముద్రించి నవంబర్ 15లోగా పంపిస్తాం. నవంబర్ 10 తర్వాత ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌లో పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక చాలామంది ఓటేయలేకపోతున్నారు? పోలింగ్ కేంద్రం వివరాలతో ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులను పంపిణీ చేస్తాం. ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’తోపాటు ఈసీఐ వెబ్‌సైట్‌లోని ‘ఓటర్ సహాయ మిత్ర’ అనే లింక్ ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు కార్డు నంబర్ ద్వారా వివరాలు తెలుస్తాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొందరి పోలింగ్ కేంద్రాలు మారొచ్చు. ఓటర్ల జాబితాలో 120 ఏళ్లకు పైబడిన ఓటర్లు వందల సంఖ్యలో ఉన్నారు? ఎలా సాధ్యం? పుట్టిన సంవత్సరం సరిగ్గా తెలియక కొందరు తమ పుట్టిన సంవత్సరాన్ని 1900గా నమోదు చేయించారు. దీంతో కొందరు ఓటర్ల వయసు 120 ఏళ్లకు పైగా ఉన్నట్టు జాబితాలో వచ్చింది. ఆ ఓటర్లే తమ పుట్టిన సంవత్సరం సవరణకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఎలా పొందాలి? 80 ఏళ్లుపైబడిన వృద్ధులు, 40శాతానికి మించిన వైకల్యమున్న ఓటర్లు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయొచ్చు. ఇందుకోసం వీరికి ‘ఫారం–12డీ’ దరఖాస్తులను పంపిణీ చేస్తున్నాం. వీటిని బీఎల్ఓలు సేకరిస్తారు. ముందే నిర్దేశించిన తేదీల్లో ప్రిసైడింగ్ అధికారి నేతృత్వంలోని బృందం వీరి ఇళ్లకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ అందజేస్తుంది. రహస్యంగా ఓటేసేందుకు వీలుగా ఇంట్లో కంపార్ట్మెంట్ సైతం ఏర్పాటు చేస్తుంది. వీడియో కెమెరా బృందం, పోలీసులు సైతం ఉంటారు. పార్టీల ఏజెంట్లనూ అనుమతిస్తారు. ఓటేసిన తర్వాత ఓటరే స్వయంగా బ్యాలెట్ పత్రాన్ని కవర్లో ఉంచి సీల్ చేసి ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. జర్నలిస్టులతో సహా 13 అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చే కేంద్రాల్లోనే పోలింగ్ ఫెసిలిటేటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే వారికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఓటు వేయించుకుంటాం. ప్రగతి భవన్లో బీ–ఫారాల పంపిణీ, రజాకార్ సినిమా, సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై అధికార, విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి కదా? ఆ ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నాయి. అక్కడి నుంచి అందే సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్రంలోపెద్దఎత్తున అధికారులను ఆకస్మిక బదిలీ చేసింది? కారణమేంటి? బదిలీ ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా కారణాలేమీ తెలపలేదు. వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలిస్తే నామినేషన్ తిరస్కరిస్తారా? అఫిడవిట్లో తప్పుడు సమా చారమిస్తే రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించరు. అన్ని కాలమ్‌లను భర్తీ చేయనిపక్షంలో అభ్యర్థికి నోటీసులిస్తారు. అయినా భర్తీ చేయకుంటే ఆ నామినేషన్‌ను తిరస్కరించవచ్చు. నేర చరిత్రపై అభ్యర్థులు, పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అనామక పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయి? త్వరలో అన్ని పార్టీలకు సూచనలు జారీ చేస్తాం. సర్క్యులేషన్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలో ఓ జాబితాను పార్టీలకు అందజేస్తాం. ఆన్లైన్ ద్వారా ఓటర్లకు నగదు బదిలీపై నిఘా ఉంచారా? యూపీఐ ద్వారా ఏ బ్యాంకు ఖాతా నుంచి ఎంత డబ్బు బదిలీ చేస్తున్నారు? అనే అంశంపై ఆదాయ పన్ను శాఖకు రోజువారీగా నివేదికలు అందుతున్నాయి. రాష్ట్రానికి కేంద్ర బలగాలు ఎన్ని వస్తున్నాయి? ఎన్నికల బందోబస్తు కోసం 65 వేల మంది పోలీసుల సేవలు అవసరం కాగా, రాష్ట్రంలో 40వేల మంది ఉన్నారు. మరో 25,000 మంది బలగాలను పంపాలని డీజీపీ అడిగారు. 100 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి వస్తున్నాయి. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్..
ఆదిలాబాద్: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన క్రమంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్‌రాజ్ అ న్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కోడ్ వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమి షన్ సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదల చేసిందని తెలిపారు. దీంతో నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుందని, 10 వరకు నామినేషన్ల గడువు, 13న పరిశీలన, 15న ఉపసంహరణ, 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని వివరించారు. ఓటర్లు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటరు లిస్టుతో తమ పేర్లు ఉన్నయో లేవో పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా పేర్లు లేకపోతే నామినేషన్లకు పది రోజుల ముందు వరకు ఫారం–6 ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులకు నిబంధనలతో కూడిన బుక్లెట్ అందజేస్తామన్నారు. నియమావళిని పరిశీలించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్ నియమించినట్లు తెలిపారు. అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్కడ నిరంతరం సీసీ నిఘా, వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. వీటిని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానం చేశామన్నారు. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తామన్నారు. అలాగే సర్వేలైన్ అధి కారుల ద్వారా పరిస్థితులను సమీక్షిస్తామన్నారు. ఒకవ్యక్తి రూ.50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లరాదని, అంతకు మించి తీసుకెళితే సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే డబ్బును సీజ్ చేస్తామన్నారు. అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, సభలు, సమావేశాలు నిర్వహించే ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయూత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొ ని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా రు.ఎన్నికల నిర్వహణ కోసం అన్నిఏర్పాట్లు చేస్తా మన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పె డుతామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షే మ పథకాలు సూచించే ఫ్లెక్సీలు తొలగించామన్నారు. ఇందులో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్‌బాజ్‌పాయ్ పాల్గొన్నారు. -
TS Election 2023: కసరత్తు పూర్తి.. తుది ఓటరు జాబితా సిద్ధం..!
జోగులాంబ: త్వరలో అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధాన ఘట్టమైన తుదిఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 21వ తేదీన విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై మార్పులు, చేర్పులు, 18సంవత్సరాలు నిండిన వారికి కొత్తగా ఓటుహక్కు కల్పించేందుకు సెప్టెంబర్ 19వ తేదీ వరకు తుది అవకాశాన్ని కల్పించింది. ఈక్రమంలో ఫాం–6, 7, 8లకు సంబంఽధించి (చేర్పులు, మార్పులు, తొలగింపు)జిల్లా వ్యాప్తంగా 44,963 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు పోలింగ్ స్టేషన్ల వారీగా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి తుదిజాబితాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టులో ముసాయిదా జాబితా విడుదల.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపు ప్రక్రియకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఆధారంగా చేసుకుని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో ఆగస్టు 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,78,951మంది ఓటర్లున్నట్లు పేర్కొన్నారు. ఇందు లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపా రు. వీటిపై ఏమైన అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదుల చేసుకునేందుకు అదేవిధంగా 18సంవత్సరాలు నిండిన వారికి ఓటుహక్కు కల్పించేందుకు సెప్టెంబర్ 19తేదీ వరకు మరో అవకాశం కల్పించింది. పెరగనున్న ఓటర్లు.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 4,78,951 ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా ఓటరు జాబితా లెక్కలు చెబుతుండగా, వీటిపై మార్పులు, చేర్పులు, తొలగింపునకు సంబంధించి 44,963 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన వాటిని ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య కంటే మరికొంత మేర ఓటర్ల సంఖ్య పెరగనుంది. జాబితాను ఎన్నికల సంఘం నిర్ధేశించిన ప్రకారం ఈనెల 4వ తేదీన విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది. మొత్తం 44,963 దరఖాస్తులు! ముసాయిదా ఓటరు జాబితాపై చేర్పులు, మార్పులు, తొలగింపు ప్రక్రియకు సంబంధించి ఫాం–6, 7, 8 కింద జిల్లా వ్యాప్తంగా 44,963 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గద్వాల నియోజకవర్గంలో ఫాం–6కి 13,746, ఫాం–7కి 7,800, ఫాం–8కి 8450 దరఖాస్తులు, అలంపూర్ నియోజకవర్గ పరిధి లో ఫాం–6కి 8,432, ఫాం–7కి 3,001, ఫాం–8కి 3,531 దరఖాస్తులు వచ్చినట్లు తె లిపారు. వీటన్నింటిని జిల్లా వ్యాప్తంగా ఉన్న 593పోలింగ్ స్టేషన్లలలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించాం.. ముసాయిదా జాబితాపై ఫాం–6,7,8లకు సంబంఽధించి వచ్చిన దరఖాస్తులను పోలింగ్ స్టేషన్ల వారిగా సందర్శించి పరిశీలించడం జరిగింది. తుది ఓటరు జాబితాను ఈనెల 4వ తేదీన విడుదల చేస్తాం. – వల్లూరు క్రాంతి, కలెక్టర్ -
Telangana: ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. గత మే 23 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యే క సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని, మరో వారంలో తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈవీఎంలన్నింటికీ ప్రాథమిక స్థాయి తనిఖీలతోపాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను సైతం పూర్తి చేశామన్నారు. శాసనసభ ఎన్నికల కవరేజీ కోసం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించి పరిశీలిస్తారని, బ్యాలెట్ పత్రాల ముద్రణ తర్వాత ఈవీఎంలకు ద్వితీయస్థాయి తనిఖీల(ఎస్ఎల్ఎఫ్)ను నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహిస్తారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల తొలి వారంలో వచ్చే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా, షెడ్యూల్‌ను ఈసీ ప్రకటిస్తుందని బదులిచ్చారు. జిల్లాల్లో చురుగ్గా ఏర్పాట్లు అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటుందని వికాస్‌రాజ్ చెప్పారు. ఈవీఎంల పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను గుర్తించి శిక్షణ ఇస్తామని తెలిపారు. నిబంధనల మేరకు ర్యాంపులు, విద్యుదీకరణ, టాయిలెట్లు వంటి కనీస సదుపాయాలు ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉన్నాయా? లేవా? అని పరిశీలించామని, సదుపాయాలను కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. కేంద్ర బలగాలకు వసతి, రవాణా సదుపాయాలు కల్పించడంతోపాటు ఎంత మందిని సమస్యాత్మక ప్రాంతాల్లో నియమించాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 6.99 లక్షల మంది యువ ఓటర్లు గత జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 15 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారని, వీరిలో 6.99 లక్షల మంది 18–19 ఏళ్ల యువ ఓటర్లు ఉన్నారని వికాస్‌రాజ్ తెలిపారు. లక్ష మంది దివ్యాంగ ఓటర్లను గుర్తించామన్నారు. 80 ఏళ్లుపైబడిన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ కమిషన్ పర్యటించనుందని ఆయన తెలిపారు. కమిషన్ రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్, డీజీపీ, 20కి పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. దర్యాప్తు సంస్థల నుంచి ఇప్పటికే నివేదికలు తమకు అందుతున్నాయన్నారు. ఓటరు నమోదు కోసం.. ఓటర్ల జాబితాతో సహా ఇతర అంశాలపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని, ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపి ఫిర్యాదుదారులకు సైతం నివేదిక ప్రతిని అందజేస్తున్నామని వికాస్‌రాజ్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 700 బృందాలు నాలుగు వేలకు పైగా ఇళ్లను సందర్శించి చిరునామా మారిన ఓటర్ల తొలగింపును చేపట్టారని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు సీఈఓలు సర్ఫరాజ్ అహ్మద్, లోకేష్‌కుమార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, జాయింట్ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. -
ప్రతి ఓటరూ ఆధార్‌తో లింక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించడంతోపాటు ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఈవో ముఖేష్‌కుమార్ మీనాను మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, పార్టీ నేత దేవినేని అవినాశ్‌తో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కలిసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటో లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడీతో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని సీఈవో దృష్టికి తెచ్చామన్నారు. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న తమ విజ్ఞప్తిపై సీఈవో సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రమిస్తున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం అక్రమాలు టీడీపీ సర్కార్ నిర్వాకాలే.. ఓటర్ల జాబితాలను ప్రభుత్వం మార్చేస్తోందంటూ గత 15 రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 2017, 2018, 2019 ఓటర్ల జాబితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2023లో ఓటర్ల జాబితా ఎలా ఉందనే విషయాన్ని సీఈవోకి ఉదాహరణలతో సహా తెలియచేశాం. పేరులో చిన్న మార్పు, అడ్రస్‌లో చిన్న మార్పుతో ఒకే మనిషికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. అలా 59,18,631 ఓట్లు ఉన్నట్లు 2019 ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇవాళ 2023 జాబితాను చూస్తే పేరు, చిరునామాలో చిన్న మార్పులు, ఫోటోల మార్పుతో.. ఒకే మనిషికి రెండు మూడు చోట్ల దాదాపు 40 లక్షల ఓట్లు ఉండగా.. తెలంగాణ, ఏపీలో రెండు చోట్లా ఓట్లున్న వారు దాదాపు 16.59 లక్షల మంది ఉన్నారు. ► 9,242 ఇళ్లలో 20 నుంచి 30 ఓట్ల వరకు ఉండగా 2,643 ఇళ్లలో 31 నుంచి 40 ఓట్ల వరకు ఉన్నాయి. 1,223 ఇళ్లలో 41–50 ఓట్లున్నాయి. ఇంకా 1,614 ఇళ్లలో 51–100 వరకు ఓట్లున్నాయి. 386 ఇళ్లలో 101–200 ఓట్లున్నాయి. 96 ఇళ్లలో 201 నుంచి ఏకంగా 500 వరకు ఓట్లున్నాయి. 14 ఇళ్లలో 501 నుంచి 1,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఇవన్నీ 2019 ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయి. ఇక ఏ డోర్ నెంబరూ లేకుండా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లున్నాయో కూడా సీఈవోకు వివరించాం. 2019లో కూడా ఆ ఓట్లపై చర్యలు తీసుకోవాలని మేం కోరినా అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఓటర్ల జాబితాను సవరించాలని సీఈవోను కోరాం. నాడు కళ్లు మూసుకున్నావా రామోజీ? ► ఒకే డోర్ నెంబరుతో 500 ఓట్లున్నాయని ఈనాడు రామోజీరావు మమ్మల్ని నిందిస్తున్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం విజయవాడ సూర్యారావుపేట పోలింగ్ బూత్‌ను పరిశీలిస్తే కడియాలవారి వీధి పేరుతో ఉన్న డోర్ నెంబర్లో 2019లో కూడా 500 ఓట్లు ఉన్నాయి. మరి ఆ ఆషాఢభూతి ఇప్పుడు కొత్తగా ఓట్లు చేర్చారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. పాపాలు చేసింది వారైతే నిందలు మోపేది మాపైనా? ► రేపల్లెలో ఎడాపెడా దొంగ ఓట్లున్నాయని ఒక పేపర్లో రాశారు. నిజానికి అది 2019 నాటి ఓటర్ల జాబితా. అప్పుడే అవకతవకలు చేశారు. ఒకే డోర్ నెంబర్లో 148 ఓట్లు న్నాయి. జర్నలిస్టుల ముసుగులో కుల పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. ఆ అవకతవకలన్నీ 2019 ఓటర్ల జాబితాలో ఉన్నాయి. మరి ఆనాడు ఎందుకు వార్తలు రాయలేదు? ► పార్వతీపురం నియోజకవర్గంలో సున్నా నెంబర్ ఇంట్లోనూ వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. మరి ఆనాడు మీకు ఇవేవీ కనిపించలేదా? ధృతరాష్ట్రుడిలా రామోజీకి కళ్లు కనిపించలేదా? ► 2019లోనే ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి. అప్పుడే మేం వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వాటిని ఇప్పుడు మేం సవరిస్తుంటే దొంగ ఓట్లు చేరుస్తున్నామంటూ నిందిస్తున్నారు. జాబితాలో పెరిగిందెక్కడ? రాష్ట్రంలో 2019 జనవరి నాటికి 3,98,34,776 మంది ఓటర్లు ఉండగా 2023 జనవరి నాటికి 3,97,96,678 మంది ఓటర్లున్నారు. మరి అలాంటప్పుడు మేం కొత్తగా ఓటర్లను ఎక్కడ చేర్పించినట్లు? మేం నిజంగా ఆ పని చేసి ఉంటే ఓటర్ల సంఖ్య పెరగాలి కదా? గజదొంగ చంద్రబాబు దొంగతనాలు చేసి నీతికధలు చెబుతున్నాడు. ఓటమి భయంతో మాపై ఆరోపణలు చేస్తున్నాడు. ప్రజలను కాకుండా కుట్ర రాజకీయాలను నమ్ముకున్న చంద్రబాబును సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తున్నాయి. డూప్లికేట్లనే తొలగించామని సీఈవోనే చెప్పారు ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొంగ ఓట్లను గుర్తించి 2020లో 1,85,193 ఓట్లను తొలగించింది. 2021లో 1,11,076 ఓట్లు, 2022లో 11.23 లక్షల ఓట్లు వెరసి మొత్తం 14 లక్షలకు పైగా దొంగ ఓట్లను తొలగించారు. డూప్లికేట్ ఓట్లు, ఒకే ఫోటో ఉన్న ఓట్లకు సంబంధించి 10,52,326 ఓట్లను తొలగించినట్లు సీఈవోనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఒకవేళ మేం దొంగ ఓట్లను చేర్పిస్తే ఇలా తొలగిస్తామా? ఆ నీచ రాజకీయం బాబుదే.. రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితాలే ఇవాళ్టికి కూడా కొనసాగుతున్నాయి. ఆ లోపాలను సవరించమని మేం కోరుతున్నాం. దొంగ ఓట్లను చేర్చడం.. అవతల పార్టీ ఓట్లను తొలగించడం చంద్రబాబుకే అలవాటు. తప్పుడు మార్గాల్లో గెలవాలని ప్రయత్నించడం ఆయనకు ఆనవాయితీ. ► తెలంగాణకు చెందిన బీజేపీ నేత బండి సంజయ్ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాడు. చంద్రబాబు కోసం ఆయన పని చేస్తున్నారు. ఎందుకీ దిక్కుమాలిన రాజకీయాలు? ► నాడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అంటే 2015 జనవరి నాటికి 22,76,714 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరో ఏడాదిలో అంటే 2016లో 13,00,613 మంది ఓటర్లను తొలగించారు. 2017లో మరో 14,46,238 మందిని తొలగించారు. అలా మూడేళ్లలో టీడీపీ హయాంలో మొత్తం 50,23,565 మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. ► సేవామిత్ర అనే యాప్ ద్వారా వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గుర్తించి వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దానిపై మేం పోరాడాల్సి వచ్చింది. కోర్టులు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఆ ఓట్లను తిరిగి చేర్పించే ప్రయత్నం చేశాం. -
ఓటరు జాబితా ‘ప్రక్షాళన’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ కోసం ఎన్నికల సంఘం పకడ్బంధీ చర్యలు చేపట్టింది. సమగ్ర ఇంటింటి సర్వే ద్వారా పలు రకాల తప్పులను గుర్తించి ఓటరు జాబితా రూపకల్పనలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఒకే ఇంటి నెంబర్‌తో భారీ సంఖ్యలో ఓట్లు నమోదైన విషయాన్ని పలు రాజకీయ పా ర్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకురావడంతో పాటు ఓటరు జాబితా తయారీలో తప్పులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచనల ఆధారంగా ఈ సర్వే చేపట్టినట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించారు. కమిషన్ వర్గాల సమాచారం ప్రకారం ఈఆర్వో.నెట్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఓటరు డేటాను పరిగణనలోకి తీసుకుని ఇంటింటి సర్వే నిర్వహించడం ద్వారా సూక్ష్మ పరిశీలన జరిపారు. ఈ విధంగా జరిపిన పరిశీలనలో రాష్ట్రంలోని మొత్తం 7,66,557 ఆవాసాల్లో ఉన్న 75,97,433 ఓట్ల సవరణ జరిగింది. హైదరాబాద్ నగరంలోని కార్వాన్ నియోజకవర్గంలో అత్యధికంగా 17,398 ఆవాసాల్లోని 2,20,316 మంది ఓటర్లు, యాకుత్‌పురా పరిధిలోని 14,883 ఆవాసాల్లో ఉన్న 1,84,060 ఓటర్లు, రాజేంద్రనగర్‌లోని 13,901 ఆవాసాలకు చెందిన 1,57,972 ఓటర్లు, ఎల్బీనగర్ పరిధిలోని 13,987 ఆవాసాల్లో ఉన్న 1,48,378 ఓటర్లు, మల్కాజిగిరి నియోజకవర్గంలోని 10,649 ఆవాసాల్లోని 1,06,336 మంది ఓటర్లను గుర్తించి సవరణలు చేశారు. దీంతో పాటు ఓటర్ కార్డులోని చిరునామాతో పాటు ఇతర మార్పులు, ఓటరు కార్డుల మార్పు కోసం ఫారం–8 ద్వారా వచ్చిన దాదాపు 9,00,115 దరఖాస్తులను ఎన్నికల కమిషన్ పరిష్కరించింది. ఇందులో అత్యధికంగా ఆసిఫాబాద్ నుంచి 25,026 దరఖాస్తులు రాగా గద్వాల, హుస్నాబాద్, ఖానాపూర్, మక్తల్‌ల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే అత్యధికంగా సిద్దిపేటలో 18,148, శేరిలింగంపల్లిలో 17,312, మేడ్చల్‌లో 16,569 దరఖాస్తులు రాగా, వాటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం పరిష్కరించినట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించాలి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చనిపోయిన, ఇతర ప్రాంతాలకు తరలిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌కు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గాల్లో ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లను ఒకే పోలింగ్ బూత్‌లోకి మార్చాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ జాతీయ ఈసీ కమిటీ సభ్యుడు ఓం పాఠక్, రాష్ట్రపార్టీ ఈసీ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులు ఏడెల్లి అజయ్ కుమార్, పొన్న వెంకటరమణ, కేతినేని సరళ, కొల్లూరి పవన్ కుమార్ వినతిపత్రం సమర్పించారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను తప్పుల తడకగా తయారుచేసిన ఈఆర్వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఈవోకు మరో వినతిపత్రం అందజేశారు. -
పాత ఎపిక్ ఉన్నా.. ఓటు డౌటే!
హైదరాబాద్: ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉందనుకొని ఇప్పుడు ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకోకపోతే.. తీరా పోలింగ్‌నాడు వెళ్లినా మీకు ఓటు లేదని నిరాకరించవచ్చు. ఇప్పటికే ఎపిక్ కార్డులున్నప్పటికీ చాలామంది పేర్లు ఓటర్ల జాబితాల్లో ఉండటం లేవు. వాస్తవానికి ఒక ఓటును తొలగించాలంటే నిబంధనల మేరకు ఎన్నో పాటించాల్సి ఉంది. ఓటరు కచ్చితంగా లేడని నిర్ధారించుకున్నాకే తొలగించాల్సి ఉన్నప్పటికీ ఇవేవీ లేకుండానే ఇష్టానుసారం ఓట్లను తొలగించారు. దీంతో మీకు ఎపిక్ ఉన్నప్పటికీ జాబితాలో మీ పేరు లేకపోవచ్చు. తప్పు ఎవరిదైనా మీకు ఓటు వేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో మీ పేరుందో, లేదో చూసుకొని లేకుంటే దరఖాస్తు చేసుకొమ్మని కోరుతున్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్. తాజాగా వెలువరించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో చూసుకోవాలని సూచించారు. ఏ అవసరానికి ఏ ఫారం వినియోగించాలంటే.. ► 18 సంవత్సరాల వయసు దాటినప్పటికీ, ఇప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకునేందుకు, ఎపిక్ ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకునేందుకు, రాబోయే అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు నిండే వారు ఇప్పుడే నమోదు చేసుకునేందుకు ఫారం 6. ► ఆధార్‌తో అనుసంధానానికి ఫారం 6బి. ► జాబితాలోంచి అనర్హుల పేర్లు తొలగించేందుకు, కొత్త ఓటరు చేర్పుపై అభ్యంతరాలు తెలియజేసేందుకు ఫారం 7 ► పేరు, వివరాల్లో దోషాలు సరిచేసుకునేందుకు, నియోజకవర్గం పేరు పొరపాటుగా ఉన్నప్పుడు,కుటుంబ సభ్యులందరి పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో కాకుండా వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నప్పుడు, ఫొటో సవ్యంగా లేనప్పుడు, జాబితాలో మొబైల్ నంబర్ అప్డేషన్కు ఫారం 8. ► ముసాయిదా ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకునేందుకు www.ceotelangana.nic.in ► జాబితాలో పేరుండి పొరపాట్ల సవరణ, మార్పుచేర్పుల కోసం www.voters.eci,gov.in లేదా voterhelpline app ద్వారా ► ఇతర వివరాలకు ఓటర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1950 సంప్రదించవచ్చు. -
నిరాశ్రయులకు ఓటు హక్కు కల్పించేలాచర్యలు చేపట్టండి
సాక్షి, విశాఖపట్నం: అర్హత కలిగి ఉండి.. నిరాశ్రయులుగా ఉన్నవారికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ–2024పై రెండు రోజుల సమీక్ష విశాఖలో గురువారం ముగిసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా అధ్యక్షతన సదస్సు జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హృదేశ్కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర ఎన్ బుటాలియా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్‌కుమార్ హాజరయ్యారు. ప్రత్యేక సంక్షిప్త సవరణపై అవగాహన కలెక్టర్లకు ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్)–2024పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. మానవ వనరుల లభ్యత, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఎన్నికల సిబ్బందికి, పోలింగ్ స్టేషన్లకు కనీస సౌకర్యాలు, ఫిర్యాదు నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ముగింపు సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్ మాట్లాడుతూ అర్హులైన వారందర్నీ ఓటరు జాబితాలో 100 శాతం చేర్పించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా నిరాశ్రయులపై శ్రద్ధ వహించాలనీ, అట్టడుగు సమాజంలో ఉన్న వారిని, మురికివాడలు, సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీ ప్రజలు, గిరిజన తండాల్లో నివాసితులు, పీవీజీటీ పరిధిలో (బలహీన గిరిజన సమూహాలు) ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ విలువైన ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనంతరం ఓటర్ల నమోదుపై వచ్చే ప్రతి ఫిర్యాదుపై శ్రద్ధ వహించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు ఓటింగ్, ఎన్నికల గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలన్నారు. ఈవీఎంలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని స్పష్టం చేశారు. యువ ఓటర్లు, వలస ఓటర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఎస్ఆర్–2024 ప్రక్రియ పూర్తయ్యే సమయానికి అర్హులైన ఓటర్లతో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిస్థాయి పారదర్శకంగా ఉన్న ఓటర్ల జాబితా తయారు చేసేందుకు 26 జిల్లాల కలెక్టర్లు నిరంతరం కృషి చేయాలని ధర్మేంద్రశర్మ, నితీష్ ఆదేశించారు. -
ధ్రువీకరణ పత్రాలు త్వరగా అందించాలి... కలెక్టర్ రాజర్షి షా
మెదక్ కలెక్టరేట్: మీ సేవ కేంద్రాల ద్వారా ధ్రువపత్రాల కోసం చేసుకున్న దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి జారీ చేయాలని కలెక్టర్ రాజర్షి షా తహసీల్దార్లకు సూచించారు. బుధవారం అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువపత్రాల జారీ, ఇంటింటి ఓటరు జాబితా సర్వే, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గుర్తింపు పై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సర్వర్ సమస్య కూడా తీరిందని, ఆదాయ, కుల, రెసిడెన్షియల్ ధ్రుపత్రాలను త్వరగా జారీ చేయాలన్నారు. ప్రధానంగా రుణసాయం కోసం దరఖాస్తు చేసుకునే బీసీ కులాల వారికి త్వరితగతిన అందజేయాలని సూచించారు. ఓటరు జాబితా తయారీలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే గురువారం పూర్తి చేయాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో మృతిచెందిన, షిఫ్టింగ్ అయిన వారి పేర్లను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. పొరపాట్లు జరిగినట్లయితే ఫారం 6 ద్వారా తిరిగి ఓటరుగా నమోదు చేయాలన్నారు. అదేవిధంగా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ సందర్భంగా వస్తున్న ఫామ్ 6,7,8 లను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తూ వచ్చిన పక్షం రోజులలోగా డిస్పోస్ అయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసి ర్యాంపులు ఉండేలా చూడాలన్నారు. 1500 పైగా ఓటర్లు ఉన్న బూతులతో కొత్తగా పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భవనాలను గుర్తించాలన్నారు. త్వరలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశమై తగు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌కు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సాయిరాం, శ్రీనివాసులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
Hyderabad: 90 లక్షలు దాటిన గ్రేటర్, శివారు ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,44,072 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,12,700 ఓటర్లుండగా, చార్మినార్‌లో అత్యల్పంగా 2,14,774 ఓటర్లున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మేడ్చల్ జిల్లాలోని 5 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 91,86,375 మంది ఓటర్లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో కొంతభాగం మాత్రమే ఉండటంతో దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. హైదరాబాద్ జిల్లాలో ముసాయిదా జాబితాలో 41.46 లక్షల ఓటర్లుండగా, తుదిజాబితాలో ఆ సంఖ్య 42.15 లక్షలకు పెరిగింది. ఓట్లు గల్లంతయిన వారితోపాటు కొత్త ఓటర్ల నమోదుతో ఈ సంఖ్య పెరిగింది. (క్లిక్ చేయండి: మెట్రో ఛార్జీలు పెంపు!)