Tamil Nadu
-
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
తిరువళ్లూరు: సైబర్ నేరగాళ్ల ఖాతాలపై బ్యాంక్ అధికారులు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆవడి పోలీసు కమిషనర్ శంకర్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్ పరిధిలోని 51 ప్రభుత్వ బ్యాంకులు, నోడల్ అధికారులతో ఆవడి పోలీసు కమిషనర్ శంకర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషనర్ శంకర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు కాజేసే నగదును తిరిగి బధితులకు అప్పగించడానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలకు బ్యాంకు అధికారులు తమ సహకారాన్ని అందించాలని పిలుపు నిచ్చారు. సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. నేరగాళ్లు కాజేసే నగదును సులువుగా డ్రా చేసుకోకుండా అప్రమత్తంగా వ్యహరించాలని కమిషనర్ శంకర్ తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆర్నాల్డ్మాస్టర్, పోలీసులు, ఉన్నతాధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
మరోసారి లాఠీ పట్టనున్న కార్తీ
తమిళసినిమా: చిరుతై చిత్రంలో పోలీసు అధికారిగా నటించి మంచి విజయాన్ని అందుకున్న కార్తీ ఆ తర్వాత సర్దార్ చిత్రంలోనూ పోలీస్ అధికారిగా నటించి హిట్ సాధించారు. ప్రస్తుతం మరో రెండు చిత్రాలలో కార్తీ పోలీస్ అధికారిగా నటిస్తుండడం విశేషం. అందులో ఒకటి సర్దార్–2. మరొకటి వా వాద్దియార్. కాగా ఇటీవల సూర్య కథానాయకుడిగా నటించిన కంగువా చిత్రంలో తుది ఘట్ట సన్నివేశాల్లో అనూహ్యంగా మెరిసి అభిమానులతో ఈలలు, చప్పట్లు కొట్టించుకున్న కార్తీ తర్వాత వా వాద్దియార్ చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. నవీన్ కుమార్‌స్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. నటి కృతిశెట్టి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వా వాద్దియార్ చిత్ర టీజర్‌ను ఇటీవల చేశారు. టీజర్లో కార్తీ పోలీస్ అధికారిగా కనిపించగా, ఆనందరాజ్ ఎంజీఆర్ గెటప్ లోనూ, సత్యరాజ్ మరో విభిన్నమైన గెటప్లోనూ, రాజ్‌కిరణ్ ఎంజీఆర్ అభిమానిగా కనిపించడం విశేషం. టీజర్లో కార్తీ తన అభిమానులతో కలసి డాన్స్ చేసే సన్నివేశాలే ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ఈ చిత్ర టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కథ చిత్ర విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. మరో విశేషం ఏంటంటే కార్తీ పోలీస్ అధికారిగా నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి అన్నది సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. . దీంతో వా వాద్దియార్ చిత్రంపై మంచి అంచనాలు ఏర్ప డుతున్నాయి. -
ఆ టైంలో చాలా కష్టపడ్డా!
తమిళసినిమా: ప్రముఖ నటుడు కమలహాసన్ వారసురాలు శ్రుతిహాసన్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. అదేవిధంగా కథానాయకిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శ్రుతిహాసన్ కథానాయకిగా లక్ అనే హిందీ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. అయితే ఆ చిత్రం ఆమె సినీ జీవితానికి ఎలాంటి లక్కూ ఇవ్వలేదు. ఆ తర్వాత తెలుగులో అనగనగా ఒక ధీరుడు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం కూడా నిరాశనే కలిగించింది. ఆ తర్వాత మాతృభాష తమిళంలో 7ఆమ్ ఐరివు చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు. సూర్య కథానాయకుడిగా నటించిన ఆ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం బాగానే ఆడింది. ఆ తర్వాత ధనుష్ సరసన 3 చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. వైవిద్య భరిత ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించలేదు. అయితే అందులోని వై దిస్ కొలైవెరి డీ అనే పాట మాత్రం దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. అంతేకాకుండా ధనుష్ శ్రుతిహాసన్ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత శ్రుతిహాసన్‌కు అవకాశాలు రాలేదట. దీని గురించి ఆమె ఇటీవల ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంటూ 3 చిత్రం తర్వాత రెండేళ్లు అవకాశాలు లేక ఖాళీగా ఉన్నానని, ఆ సమయంలో చాలా కష్టపడ్డానని చెప్పారు. అయితే అదే చిత్రం 10 తర్వాత రీ రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించిందని, ఆ విజయం ఏదో మొదట్లోనే సాధిస్తే బాగుండేదని అభిప్రాయాన్ని శ్రుతి వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకు తమిళ చిత్రాల్లో నటించడం ఇష్టమన్నారు.. ఇప్పుడు కూడా ఒక తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. ఈమె ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ చిత్రంలో నటిస్తున్నారు. అయితే శ్రుతిహాసన్ హిందీ, తమిళ భాషలో కంటే తెలుగులోనే పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. -
క్లుప్తంగా
కొలనులో మునిగి బాలుడి మృతి అన్నానగర్: కొలనులో మునిగి ఓ బాలుడు మృతిచెందాడు. చైన్నె సమీపం కోవిలంబాక్కం ఓంశక్తి నగర్‌కు చెందిన శ్రీనివాసన్. ఇతని కుమారుడు కమలకన్నన్ (14). కోవిలంబాక్కం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం పాఠశాల ముగించుకుని ఇంటికి వచ్చిన కమలకన్నన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి సున్నాంబు కులత్తూరు ప్రాంతంలోని ఆలయ కొలనులో స్నానానికి దిగారు. కమలకన్నన్న్లోతు ప్రాంతానికి వెళ్లడంతో ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఇది చూసి స్నేహితులు కేకలు పెట్టారు. విషయం తెలిసి వేళచ్చేరి అగ్నిమాపక సిబ్బంది కొలనులో గల్లంతైన కమలకన్నన్ మృతదేహాన్ని వెలికితీశారు. పల్లికరనై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ పొదుపుపై పెయింటింగ్ పోటీలు కొరుక్కుపేట: విద్యుత్ పొదుపుపై రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లోని విజేతలుగా నగదు బహుమతులను ప్రదానం చేశారు. ఈ మేరకు ఇంధన పొదుపుపై జాతీయ ప్రచారంలో భాగంగా, విద్యుత్ మంత్రిత్వ శాఖ సహకారంతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. చైన్నెలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో తమిళనాడు రాష్ట్ర స్థాయి విజేతలకు బహుమతులు ప్రదానోత్స వం ఘనంగా జరిగింది. తమిళనాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నరేష్ ముఖ్యఅతిథిగా, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ దీపక్ శామ్యూల్ హాజరయ్యారు. కార్యక్రమానికి సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్–2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిత్రంబలం కృష్ణకుమార్ ఇంధన పొదుపు ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ నరేష్ రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు నగదు బహుమతిని అందజేసి అభినందించారు. -
పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరం!
● రాష్ట్ర మంత్రి నాజర్ తిరువళ్లూరు: ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే శ్రేయస్కరమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోషకాహారాన్ని నిర్ధారించండి పేరుతో కార్యక్రమాన్ని 2022వ సంవత్సరంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. ఇందులోభాగంగానే ప్రతి ఏడాది నవంబర్ రెండవ వారంలో బాలింతలకు పౌష్టికాహారం, న్యూట్రీషియన్ కిట్‌ను అందజేసే కార్యక్రమాలను విసృతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్‌లో బాలింతలకు పోషకాహార కిట్‌ను అందజేసే కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రభుశంకర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి నాజర్ హాజరై 2,926 మందికి కిట్‌ను అందజేశారు. అనంతరం ఆయన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ జన్మించిన శిశువుకు ఆరునెలల వరకు తల్లిపాలే శ్రేయస్కరమని వ్యాఖ్యానించారు. మొదటి దశలో జిల్లాలోని బాలింతలకు 1,743 మందికి, రెండవ దశలో 2,926 మందికి పోషకాహార కిట్లను అందజేసినట్టు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణస్వామి, మేయర్ ఉదయకుమార్ పాల్గొన్నారు. -
సహకార బ్యాంకులతోనే అభివృద్ధి
వేలూరు: సహకార బ్యాంకుల ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అభివృద్ధి చెందగలరని మంత్రి దురై మురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని ప్రైవేటు కల్యాణ మండపంలో కోఆపరేటివ్ 71వ వారోత్సవాలు కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంలోనే ఈ శాఖకు అధిక నిధులు కేటాయించామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందజేయడంతోపాటు వాటికి ఎన్నికలు నిర్వహించామన్నారు. ప్రస్తుతం సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రజలకు వారధులుగా నిజాయితీతోపాటు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు. నిరుపేద రైతులను ఆదుకునేందుకు సహకార సంఘాలు అనేక రకాలైన సహాయ సహకారాలు అందజేస్తాయన్నారు. వీటిని దుర్వినియోగం చేయకుండా అర్హులైన వారికి అందే విధంగా చూడాలన్నారు. బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు వాటిని తిరిగి చెల్లించేందుకు ఆసక్తి చూపాలని అప్పుడే ఇతరులకు రుణాలు ఇచ్చేందుకు కుదురుతుందని తెలిపారు. ఎన్నికల నాటికి రుణమాఫీ చేస్తారని రైతులు అనుకోకుండా రుణాలను తిరిగి చెల్లించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో సహకార సంఘాల ద్వారా రూ.1,051 కోట్ల 41 లక్షలు విలువ చేసే పంట రుణాలతోపాటు మహిళా సంఘాలకు రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కార్తికేయన్, నందకుమార్, అములు, జడ్పీ చైర్మన్ బాబు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్ కోఆపరేటివ్ బ్యాంకు జాయింట్ రిజిస్ట్రార్ తిరుగుణ అయ్యప్పదురై తదితరులు పాల్గొన్నారు. అనంతరం గుడియాత్తం డివిజన్లోని నిరుపేదలకు ఇంటి పట్టాలను అందజేశారు. -
హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె ఎన్నూరు సత్యవాణి ముత్తునగర్‌కు చెందిన సంతోష్(33)పై రౌడీషీట్ ఉంది. అతనిపై హత్యాయత్నంతో సహా 7 కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో అదే ప్రాంతం ఇందిరానగర్ చెందిన మరొక రౌడీ సూర్య అనే వ్యక్తితో సంతోష్‌కు గొడవలు ఉన్నాయి. దీని కారణంగా గత 11వ తేదీ ఇంటిలో ఉన్న సంతోష్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. దీంతో తీవ్ర గాయాలపాలైన సంతోష్‌ను స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి రౌడీ సూర్య, లోకేష్‌తో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసులో నిందితుడి తల్లి అరెస్టు అన్నానగర్: చైన్నె ఆజాద్‌నగర్ రాజగోపాల్ వీధిలో నివసించే తమీమ్ అన్సారీ (47) ఆటో నడుపుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఎదురింట్లో నివశించే మహ్మద్ ముక్తార్‌తో అతనికి గొడవ జరిగింది. తమీమ్ అన్సారీ ఇంటి ముందు నీళ్లు పోసి కడిగాడు. ఇది మహమ్మద్ ముక్తార్కి నచ్చలేదు. తమీమ్ అన్సారీ వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. అది ఘర్షణగా మారింది. దీంతో ఆగ్రహించిన మహ్మద్ ముక్తార్ ఇంట్లో నుంచి కత్తి తీసి తమీమ్ అన్సారీ మెడపై పొడిచాడు. ఇందులో తమీమ్ అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో పడి మృతి చెందాడు. మహ్మద్ ముక్తార్ అన్నానగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అయితే తమీమ్ అన్సారీ హత్యకు ప్రేరేపించిన మహ్మద్ ముక్తార్ తల్లి రష్యా బేగం(65)ని అరెస్ట్ చేయాలని 300 మందికి పైగా 11వ తేదీన అమందైకరై పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ వారితో మాట్లాడి పంపించారు. ఈ స్థితిలో శుక్రవారం ఆటోడ్రైవర్ హత్య కేసుకు సంబంధించి నిందితుడి తల్లి రష్యా బేగంను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అమెను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. న్యాయవాద సంస్థకు బాంబు బెదిరింపు కొరుక్కుపేట: చైన్నెలో ప్రైవేట్ లాయర్ల బాంబు బెదిరింపు ఘటన కలకలం రేపింది. చైన్నెలోని రాధాకృష్ణన్ రోడ్లో ప్రైవేట్ లాయర్ల సంస్థ పనిచేస్తోంది. గురువారం కంపెనీ ముంబయి కార్యాలయానికి ఒక ఈ మెయిల్ వచ్చింది. చైన్నె కార్యాలయంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలిపారు. దీనిపై మైలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత చైన్నెలోని న్యాయవాద సంస్థని పోలీసులు వచ్చి తనిఖీ చేయగా బాంబు బెదిరింపు నకిలీదని తేలింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ప్రభుత్వ వేడుకల్లో మా పేర్లు ఏవీ? ● వీసీకే, కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు గగ్గోలు సేలం: ప్రభుత్వ వేడుకల పత్రికల్లో తమ పేర్లు ఉండడం లేదని వీసీకే, కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు. నాగై జిల్లాలో మంత్రి అన్బిల్ మహేష్ పాల్గొన్న ప్రభుత్వ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో వీసీకే ఎమ్మెల్యే ఆలూర్ షా నవాజ్, మార్కిస్ట్ కమ్యూనిస్టు ఎమ్మెల్యే నాగై మాలీ పాల్గొన్నారు. ఆలూర్ షా నవాజ్ మాట్లాడుతూ తాము డీఎంకేలో కూటమిలో ఉన్నామని, అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల ఆహ్వాన పత్రికల్లో తమ పేర్లు ఉండడం లేదని, అయినా తాము కార్యక్రమాలలో పాల్గొంటున్నామన్నారు. తమ ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే నాగై మాలీ కూడా అదే ఆవేదనను వ్యక్తం చేశారు. -
క్లుప్తంగా
బాలికపై లైంగిక దాడి తిరువొత్తియూరు: చైన్నెలోని కీల్పాక్కం పుల్లాపురం ప్రాంతానికి చెందిన జాన్‌పాల్ అదే ప్రాంతంలో రోడ్డు పక్కన బిర్యానీ దుకాణం నడుపుతున్నాడు. జాన్‌పాల్ ఇంటిలో ఒంటరిగా ఉన్న తన దుకాణంలోని పని చేస్తున్న కార్మికుడి చెల్లైలెన 13 ఏళ్ల బాలికపై అనేకసార్లు బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దానిని ఫోన్లో వీడియో రికార్డు చేసి ఏం జరిగిందో బయటపెడితే సామాజిక మాధ్యమాల్లో పెడుతానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక ఆరోగ్యం దెబ్బతింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకు తీసుకుని వెళ్లారు. దీనిపై ఫిర్యాదు మేరకు కీల్పాకం పోలీసులు కేసు నమోదు చేసి, జాన్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. వృద్ధుడి ఆత్మహత్య తిరువొత్తియూరు: పోరూరు పక్కనే ఉన్న అయ్యప్పన్ తంగల్ బస్టాండ్ సమీపంలోని అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో శివకుమార్(74) అనే వ్యక్తి నివశిస్తున్నాడు. అతని భార్య గోదై. వీరి ఇద్దరు కుమారులు విదేశాల్లో ఉంటున్నారు. దీంతో భార్యాభర్తలు మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో 13వ అంతస్తులోని ఇంటి బాల్కనీలో శివకుమార్ హఠాత్తుగా కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త శివకుమార్ కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడంతో భార్య గోదై దిగ్భ్రాంతి చెందారు. శివకుమార్ గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. పోరూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిప్పంటించుకుని యువకుడు బలవన్మరణం తిరువొత్తియూరు: అశోక్ నగర్ పుదూర్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ రపాఠశాల ఆవరణలో అర్ధరాత్రి ఓ యువకుడు అకస్మాత్తుగా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కలకలం రేపింది. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిపై అశోక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, తీవ్రంగా విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు అదే ప్రాంతానికి చెందిన అన్బు కుమారుడు చంద్రు(20) అని తెలిసింది. నందనం కళాశాలలో చదువుతున్న చంద్రు చదువును మధ్యలోనే వదిలేసి శివ భక్తుడయ్యాడు. శివాలయాల్లో డప్పు కొట్టే పని కొనసాగించాడు. పనిలేకుండా తిరుగుతున్న అతడిని తల్లి అలమేలు మంగై మందలించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన చంద్రు పాఠశాల ఆవరణలోకి వెళ్లి నిప్పంటించుకున్నట్లు వెల్లడించారు. అతని ఆత్మహత్య నిర్ణయానికి మరేదైనా కారణం ఉందా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రేయసిపై కక్షతో చిన్నారి హత్య సేలం: ప్రియురాలిపై కక్ష తీర్చుకోవడం కోసం ఆమె ఆరేళ్ల చిన్నారి గొంతు నులిమి హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపూర్ జిల్లా పల్లడం సమీపంలో కారనాంపేట నూలు కర్మాగారం ఉంది. ఈ ప్రాంతంలో 300 మందికి పైగా ఉత్తరాది వారు నివశిస్తూ పని చేస్తున్నారు. ఈ కర్మాగారంలో ఒడిశాకు చెందిన కందుదాస్ (31) సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. గతంలోనే రెండు వివాహాలు చేసుకుని ఉన్న ఒడిశాకు చెందిన అనిత తన కుమారుడు గణేష్(6)తో ఒంటరిగా ఉంటూ నూలు కర్మాగారంలో పని చేస్తోంది. కందుదాస్కు అనితతో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధంగా మారింది. ఈ క్రమంలో ఆమెకు ఇటీవల అదే కర్మాగారంలో పని చేస్తున్న సురేష్ అనే మరో కార్మికుడితో అక్రమ సంబంధం కలిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అనితకు కందుదాస్కు మధ్య గొడవ ఏర్పడింది. ఒక రోజు మద్యం మత్తులో కంపెనీకి వచ్చిన కందుదాస్ అనితతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో అతనిని కంపెనీ యాజమాన్యం పని నుంచి తొలగించేసింది. ఆగ్రహించిన కందుదాస్ ఇంటిలో ఒంటరిగా ఉన్న అనిత కొడుకు గణేష్‌ను బయటకు తీసుకువచ్చి గొంతు నులిమి హత్య చేశాడు. కుమారుడు కనిపించకపోవడంతో అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలించారు. అక్కడికి సమీపంలో ముళ్లపొదల్లో గణేష్ మృత దేహం కనిపించింది. పోలీసులు చిన్నారి మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని కందుదాస్ హత్య చేసినట్టు సందేహించిన పోలీసులు అతన్ని శుక్రవారం అరెస్టు చేశారు. ట్రిప్లికేన్‌లో అర్ధరాత్రి చోరీ కొరుక్కుపేట: చైన్నె ట్రిప్లికేన్‌లోని ఎస్బీఐ బ్యాంక్ లో అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం బ్యాంక్ ఓపెన్ చేసేందుకు వెళ్లగా సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. లోపలికి వెళ్లే సరికి పలు డాక్యుమెంట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో, బ్యాంక్ కార్యాలయం ఎదురుగా ఉన్న ట్రిప్లికేన్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం పోలీసు ఫోరెన్సిక్ విభాగం, కుక్కల పంజాతో సెల్‌లోకి వెళ్లి వేలిముద్రలు నమోదు చేసి విచారణ జరుపుతోంది. గ్రిల్ గేట్ పగులగొట్టి పోలీస్ స్టేషన్ ఎదురుగా చోరీకి ప్లాన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తుల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎలాంటి శబ్దం లేకుండా తాళం పగులగొట్టి స్టీల్ కట్టర్లను ఉపయోగించి దొంగలు ఈ ఘటనకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలోని గుర్తుతెలియని వ్యక్తి ఫొటోను పోల్చి దర్యాప్తు చేస్తున్నారు. -
సామూహిక సత్యనారాయణస్వామి వ్రత పూజలు
కొరుక్కుపేట: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మొగప్పెర్ తెలుగు కల్చరల్ అండ్ సోషియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలను వైభవంగా నిర్వహించారు. చైన్నె మొగప్పెర్ సంతాన శ్రీనివాస పెరుమాళ్ సత్ సంఘ్ మండపం వేదికగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ 60 మంది దంపతులతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, దీప పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సత్యనారాయణ స్వామి చిత్ర పటాన్ని ఉంచి సామూహిక పారాయణం మధ్య పూజలను దంపతులు భక్తితో చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సంఘం అధ్యక్షుడు డాక్టర్ గిరి హనుమంతరావు, వీవీబీ రావు, ఎన్.నిర్మల్ చందర్, టీఎంకే కుమార్, సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించే ముత్తైదువులకు పసుపు, కుంకుమను అందజేశారు. -
యువతి కిడ్నాప్
కొరుక్కుపేట: బంధువుతో కలసి బైక్‌పై వెళ్తున్న కాలేజీ అమ్మాయిని జీపులో వచ్చిన ఆమె ప్రియుడు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లాడు. కృష్ణగిరి జిల్లా గుండారపల్లి ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె ప్రశాంత్ (30)తో ప్రేమలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు గత మూడు నెలలుగా తమ కుమార్తెను వరత్తనపల్లి సమీపంలోని పెళ్లవర్తిపల్లిలో బంధువుల ఇంట్లో ఉంచారు. అక్కడి నుంచి బంధువు రోజూ ఉదయం బైక్‌పై కాలేజీకి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాడు. అదేవిధంగా గురువారం తన బంధువుతో కలిసి ఆమె బైక్‌పై కాలేజీకి వెళుతోంది. మాత గుడి సమీపంలోకి వెళ్తుండగా.. జీపులో అటుగా వచ్చిన వ్యక్తులు కాలేజీ విద్యార్థినిని బలవంతంగా జీపు ఎక్కించి కిడ్నాప్ చేశారు. బంధువు దీన్ని ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ విషయమై ఆమె తండ్రి మహారాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అందులో ప్రశాంత్ తన స్నేహితులతో కలసి జీపులో వచ్చి అపహరించినట్లు వెల్లడైంది. పోలీసులు ఇంకా వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. -
హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు
● నైల్లె కోర్టు తీర్పు అన్నానగర్: వల్లియూర్లో డీఎంకే యూత్ ఆర్గనైజర్ హత్య కేసులో ఐదుగురికి శుక్రవారం జీవిత ఖైదు పడింది. తిరునెల్వేలి జిల్లా వల్లీయూర్ ఉత్తర రథ వీధికి చెందిన ముత్తురామన్ (32). ఇతను నైల్లె తూర్పు జిల్లా డీఎంకే యూత్ టీమ్ ఆర్గనైజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో, వల్లియూర్ ముప్పత్తియమ్మన్ ఆలయ ఉత్సవానికి భక్తులను స్వాగతిస్తూ ఈఓ తరఫున జెండాను పట్టుకున్నారు. సౌత్ వల్లీయూరు ఉత్తర వీధికి చెందిన తంగవేల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ గొడవపడ్డాడు. ఈ విషయమై ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 12, 2020న, ముత్తురామన్ సౌత్ వల్లీయూర్లోని ఒక ఎస్టేట్‌కు వెళ్లి కారులో ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతని కారును అడ్డగించిన ఐదుగురు వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. పనగుడి పోలీసులు దక్షిణ వల్లియూరుకు చెందిన ముత్తురామన్ (32), రాంకుమార్ (27), తిల్లై (26), గుణ (26), తంగవేల్ (50)లను అరెస్టు చేశారు. తిరునెల్వేలి మొదటి అదనపు కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. నేరం రుజువుకావడంతో కేసును విచారించిన న్యాయమూర్తి వి.పద్మనాభన్ ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు, నలుగురికి రూ.2,500, ఒకరికి రూ.2వేల చొప్పున శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎం.కరుణానిధి హాజరయ్యారు. -
ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా
● స్వల్ప గాయాలతో బయట పడ్డ విద్యార్థులు వేలూరు: తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తున్నారు. ఇందులో జోలార్పేటతోపాటు చుట్టు పక్కల ఉన్న గ్రామాల నుంచి 700 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులను గ్రామీణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చేందుకు పాఠశాల యాజమాన్యం బస్సు వసతి ఏర్పాటు చేసింది. బస్సు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులను తీసుకెళ్లేది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పాఠశాల నుంచి ఒక బస్సు జోలార్‌పేట సమీపంలోని పుత్తుకోయిల్ ప్రాంతానికి వెళ్లి 25 మంది విద్యార్థులను ఎక్కించుకొని తిరుగు పయనమైంది. సోతాన్పేట వద్ద వస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయయి. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. విద్యార్థుల అరుపులు విన్న ఆ ప్రాంతవాసులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జోలార్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను చికిత్స నిమిత్తం జోలార్‌పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను మరొక బస్సులో పాఠశాలకు పంపారు. బస్సు బోల్తా పడిన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా ప్రభుత్వాసుపత్రి వద్దకు, పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ధన్వంతరిలో పౌర్ణమి యాగ పూజలు
వేలూరు: వాలాజలోని శ్రీధన్వంతరి ఆరోగ్య పీఠంలో తమిళ ఐపసి మాస పౌర్ణమిని పురస్కరించుకుని లోక క్షేమం కోసం ప్రత్యేక యాగ పూజలు నిర్వహించారు. స్వామివారికి అన్నాభిషేకం చేశారు. ముందుగా పీఠాధిపతి మురళీధర స్వామీజీ ఆధ్వర్యంలో పీఠంలో గణపతి పూజ, గోపూజ నిర్వహించారు. అనంతరం మహా ధన్వంతరి పెరుమాళ్‌కు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణ, దీపారాధన పూజలు చేశారు. అనంతరం పీఠంలో ఈశ్వరునికి, శ్రీఏకరవు రాహుకేతులకు అన్నాభిషేకం నిర్వహించారు. లోక క్షేమం కోసం ప్రత్యేక యాగ గుండంలో వనమూలికలు, పట్టు వస్త్రాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని వేసి లోకంలోని ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతూ వేద పండితుల వేద మంత్రోచ్ఛారణ మధ్య ప్రత్యేక యాగ పూజలు చేశారు. అదే విధంగా పీఠంలోని 468 సిద్ధ లింగాలకు ప్రత్యేక అభిషేకాలు చేసి పుష్పాలంకరణ, దీపారాధన పూజలు చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. తమిళ ఐపసి మాసం ఆఖరి రోజు పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. యాగ పూజల్లో పాల్గొన్నారు. శివాలయాల్లో అన్నాభిషేకం పళ్లిపట్టు: పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లోని శివాలయాల్లో అన్నాభిషేకం వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. పళ్లిపట్టు బస్టాండు సమీపంలోని పార్వతి సమేత శ్రీసంఘమేశ్వర స్వామి ఆలయంలో అన్నాభిషేకం సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామి విశేష పూజలు జరిగాయి. అన్నం, పండ్లు, కూరగాయలతో శివలింగం ప్రతిష్టించి మహాదీపారాధన పూజలు చేపట్టారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అన్నం. పండ్లు, కూరగాయలతో ప్రతిష్టించిన శివిలింగాన్ని ప్రసాదంగా భక్తులుకు పంపిణీ చేశారు. అలాగే ఆలయ నిర్వాహకులు వెయ్యి మందికి అన్నదానం చేశారు. తిరుత్తణి సమీపంలోని కేజీ.కండ్రిగ చెంచమ్మ కోనలో కొలువైన శ్రీసదాశివ లింగేశ్వరస్వామి ఆలయంలో అన్నాభిషేకం పూజలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అన్నాభిషేకం సందర్భంగా ఆలయాల్లో భక్తజనం రద్దీ నెలకొంది. -
ఘనంగా ఎస్‌కేపీడీ వార్షికోత్సవం
కొరుక్కుపేట: చైన్నె జార్జ్‌టౌన్‌లోని ఎస్‌కేపీడీ చారిటిస్ నిర్వహిస్తున్న బాలుర ప్రాథమిక, మహోన్నత పాఠశాల 107వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఎస్కేపీ కళాశాల ఇండోర్ ఆడిటోరియం వేదికగా ఏర్పాటైన ఈ వేడుకలకు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ సి.సతీష్ హాజరయ్యారు. ఈసందర్భంగా 2023–24 విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రోలింగ్ ట్రోఫీలతో పాటు వివిధ పోటీల్లోని విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్ సతీష్ పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి రూ.25 వేల విరాళంతో పాటు ప్రతి ఏడాది విద్యార్థులకు ఉచితంగా వైద్యశిబిరాలు నిర్వహిస్తానని ప్రకటించారు. సుదర్శనం, హెచ్ఎంలు ఓ.లీలారాణి, ఈ.రమేష్, బాలకుమారస్వామి ఎస్‌కేపీడీ ధర్మకర్త వెంకటచంద్రశేఖర్, ఊటుకూరు శరత్‌కుమార్, దేసులక్ష్మీనారాయణ, బద్రీనాథ్ పాల్గొన్నారు. -
జాతీయ సైక్లింగ్ పోటీలు
సాక్షి, చైన్నె: తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా 76వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ పోటీలను నిర్వహిస్తోంది. మేలకోట్టయూరులోని తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీ ఆవరణలోని ట్రాక్‌లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఈ పోటీలను క్రీడల మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఎంఎస్ఎంఈ మంత్రి అన్బరసన్, ఎంపీ సెల్వం, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్యమిశ్రా, స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ సీఈఓ , సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డి జెండాఊపి ప్రారంభించారు. ముందుగా విజేతలకు అందజేయనున్న ట్రోఫీని విద్యార్థులతో కలసి ఆవిష్కరించారు. ఈ పోటీల్లో జాతీయస్థాయిలో సైక్లింగ్ క్రీడాకారులు తరలివచ్చారు. -
గర్భిణులకు పౌష్టికాహారం అవసరం
పళ్లిపట్టు: గర్భిణులకు పౌష్టికాహారం అవసరమని ఎమ్మెల్యే చంద్రన్ తెలిపారు. పళ్లిపట్టు సమీపం అత్తిమాంజేరిపేటలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మండల చిన్నారుల సంరక్షణ అధికారి డానియా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వ పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. క్రమం తప్పకుండా ప్రతినెలా సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చేందుకు గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. బీడీఓ మిల్కా రాజాసింగ్, యూనియన్ డీఎంకే కార్యదర్శి చంద్రన్, యూనియన్ వైస్ భారతి సహా అనేక మంది పాల్గొన్నారు. -
ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం
అన్నానగర్: కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2కోట్ల విలువచేసే ఏనుగు దంతాల బొమ్మలను స్వాధీనం చేసుకున్నారు. విల్లుపురంలోని తిరుచ్చి రోడ్డులోని హాస్టల్లో ఏనుగు దంతాల బొమ్మలు విక్రయిస్తున్నట్లు తమిళనాడు అటవీ, చైన్నె జోనల్ వైల్డ్‌లైఫ్ క్రైమ్ స్క్వాడ్ కార్యాలయానికి గురువారం రాత్రి పక్కా సమాచారం అందింది. అధికారులు అక్కడికి వెళ్లి చూడగా, గోనె సంచిలో ఏనుగు దంతాలతో చేసిన 4 ఏనుగు బొమ్మలు, అలంకార హారంతో మహిళ సహా 12 మంది పట్టుబడ్డారు. వీరిలో 12 మంది తంజావూరు, తిరుచ్చి, ఒట్టంఛత్రం, ధర్మపురి, సేలం ప్రాంతాలకు చెందిన వారని విచారణలో తేలింది. బొమ్మల విలువ రూ.2కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి కేసులో 12 ఏళ్ల జైలు శిక్ష అన్నానగర్: గంజాయి స్మగ్లింగ్ కేసులో నలుగురికి మదురై కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దిండుక్కల్‌లో గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసులకు గతేడాది పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు దిండుక్కల్ గాంధీజీ పుదురోడ్డు జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. అటుగా వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా అందులో 72 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి అరుణ్‌కుమార్ (48), సురేష్ (41), సేలం జిల్లా దడగప్ పట్టికి చెందిన యోగరాజ్ (24), అజిత్‌కుమార్ (26)లను దిండుక్కల్ పోలీసులు అరెస్టు చేశారు. మదురై మాదక ద్రవ్యాల కేసుల ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి 12 ఏళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎ.ఎస్.హరిహరకుమార్ గురువారం తీర్పు చెప్పారు. -
ఎలుకల మందు ఘాటుకు చిన్నారుల మృతి
అన్నానగర్: కుండ్రత్తూర్‌లో ఎలుకల మందు ఘూటకు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. తండ్రి, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కాంచీపురం జిల్లా కుండ్రత్తూరు సమీపంలోని దేవేంద్రన్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో గిరిధరన్ (34) నివసిస్తున్నాడు. ఇతని భార్య పవిత్ర (30). వీరి కుమార్తె విశాలిని (6), కుమారుడు సాయిసుదర్శన్ (1). గురువారం ఉదయం ఈ నలుగురూ వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. దీంతో స్థానికులు నలుగురిని కోవూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విశాలిని, సాయిసుదర్శన్ ఇద్దరూ మృతిచెందారు. గిరిధరన్, పవిత్ర ఇద్దరిని పోరూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై కుండ్రత్తూర్ పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండడంతో మందు పిచికారీ చేసిన కంపెనీని సంప్రదించి ఆన్లైన్లో మాట్లాడాడు. ఇద్దరు ఉద్యోగులు ఇంటికి కొచ్చి ఇళ్లంతా పిచికారీ చేసి వెళ్లిపోయారు. రాత్రి నలుగురు ఇంట్లో నిద్రిస్తుండగా ఘాటుకు వాంతులతో స్పృహతప్పి పడిపోయారు. ఎలుకల మందు ఎక్కువగా వేయడంతో పిల్లలిద్దరూ మృతిచెందారని, భార్యాభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసింది. అనంతరం టీ.నగర్‌కు చెందిన కంపెనీపై కేసు నమోదు చేసిన కుండ్రత్తూర్ పోలీసులు ఎలుకల మందును ఇంట్లో వదిలేసిన ఉద్యోగి దినకరణ్ (29)ను అరెస్టు చేశారు. కంపెనీ యజమాని ప్రేమ్‌కుమార్, మరో ఉద్యోగి కోసం గాలిస్తున్నారు. -
క్లుప్తంగా
విధులు బహిష్కరించిన వైద్యులు తిరుత్తణి: చైన్నెలోని గిండి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిపై కత్తితో దాడి సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు గురువారం విధులు బహిష్కరించారు. ఈ కారణంగా తిర్తుతణి లోని ప్రభుత్వాస్పత్రిలో ఓపీ, ఇన్ పేషెంట్ల విభాగాల్లో వైద్యసేవలు అందించేందుకు వై ద్యులతోపాటు వైద్యసిబ్బంది అందుబాటు లో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ప డ్డారు. తిరుత్తణి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వై ద్యులు విధులను బహిష్కరించడంతో అత్యవసర విభాగంలో మాత్రం వైద్యులు విధులు నిర్వహించారు. ఓపీలో వైద్యసేవలు స్తంభించడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోగులు వేచిచూసి చికిత్స అందక వెనుదిరిగారు. తిరువళ్లూరులో.. తిరువళ్లూరు: గిండి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్‌పై యువకుడు కత్తితో దాడి చేసిన సంఘటనను నిరసిస్తూ తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. తిరువళ్లూరులోని ప్రభుత్వ వైద్యశాల ఎదుట జరిగిన ఆందోళనకు సంఘం జిల్లా కార్యదర్శి నందకుమార్, జిల్లా అధ్యక్షుడు ప్రభుశంకర్ హాజరై ప్రసంగించారు. డాక్టర్ ప్రభుశంకర్ మాట్లాడుతూ గిండి ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్‌పై కత్తితో దాడి చేసిన సంఘటన హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వ డాక్టర్లపై తరచూ దాడులు జరుగుతున్నా డాక్టర్ల భద్రతపై ప్రభుత్వం కఠిన చట్టాలను చేయడం లేదన్నా రు. ప్రభుత్వ డాక్టర్‌పై దాడికి దిగిన యువకుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో అదనపు పోలీసు బలగాలు, సెక్యూరిటీ పెంచాలని కోరారు. సంఘం నేతలు రత్నవేలుకుమరన్, మహిళా విభాగం కార్యదర్శి అనురత్న, కోఆర్డినేటర్ జగదీష్ పాల్గొన్నారు. -
వైద్యం వికటించి బాలింత మృతి
రాస్తారోకో చేస్తున్న బంధువులు – బంధువుల రాస్తారోకో వేలూరు: ప్రభుత్వాస్పత్రిలో వైద్యం వికటించి ఓ బాలింత మృతి చెందింది. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని దేవలాపురం గ్రామానికి చెందిన విజయ్ భార్య దుర్గాదేవి(26) ప్రైవేటు షూ కంపెనీలో పనిచేస్తుంది. ఈమె రెండు రోజుల క్రితం ఆంబూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం కోసం చేరింది. ఆ సమయంలో ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో నర్సులు చికిత్స అందించారు. దీంతో దుర్గాదేవి ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆమెను తిరుపత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆడ శిశువుకు జన్మించింది. అక్కడ నుంచి సేలం, ధర్మపురి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి దుర్గాదేవి మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆంబూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు లేక నర్సులు చికిత్స చేయడంతోనే దుర్గాదేవి మృతి చెందిందని ఆరోపిస్తూ గురువారం ఉదయం ఆంబూరు– పేర్నంబట్టు రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఆంబూరు పోలీసులు వెంటనే ఆందోళనకారుల వద్దకు చేరుకుని చర్చలు జరిపి, రాస్తారోకోను విరమింపజేశారు. -
బాలుడిపై పోక్సో కేసు
సేలం: బాలికను గర్భవతిని చేసిన బాలుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయంకు చెందిన 15 ఏళ్ల బాలికకు ఇటీవల తరచూ కడుపునొప్పి వస్తుండడంతో ఆమె తల్లి తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలికకు చేసిన వైద్యపరీక్షల్లో ఆరు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. ఇది విని షాక్‌కు గురైన బాలిక తల్లి తన కుమార్తెను వివరాలు అడిగింది. ఆ సమయంలో బంధువు కుమారుడైన 17 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లే గర్భం దాల్చిందని బాలిక చెప్పింది. వెంటనే బాలిక తల్లి ఘటనపై గోపిశెట్టిపాలయం మహిళా పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు 17 ఏళ్ల బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ ఢీకొని దంపతుల దుర్మరణం అన్నానగర్: కంటైనర్ లారీ బైక్‌ను ఢీకొన్న ఘటనలో దంపతులు దుర్మరణం పాలయ్యా రు. ఈ ఘటన తిరువొత్తియూర్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. చైన్నెలోని తిరువొత్తియూర్ భారతీనగర్‌కు చెందిన విజయన్ (39) చైన్నెలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఇతని భార్య జయరాసిత (33). వీరిద్దరూ బుధవా రం రాత్రి తిరువొత్తియూర్ నుంచి బైక్‌లో మాఽ దవరం రౌండ్ఠానాకు వెళుతున్నారు. మాధవ రం మంజంబాక్కం చిన్నరౌండ్ఠానా సమీపం వద్ద వెళుతుండగా మనలి నుంచి మాధవరం వైపు వెళుతున్న కంటైనర్ లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డుపై పడ్డ వీరిపై కంటైనర్ దూసుకెళ్లింది. ఈప్రమాదంలో దంపతులు ఇద్ద రు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తె లిసి మాధవరం పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ తెన్కాశికి చెందిన మురుగన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శివాలయాల్లో ఘనంగా ప్రదోష పూజలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోని ఆలయాల్లో ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్ద నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని హరోంహర నామస్మరణల మధ్య, శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూరహారతులు పట్టారు. అనంతరం స్వామివార్లను అధికార నంది వాహనంలో కొలువుదీర్చి మాడ వీధుల్లో మేళ తాళాల నడుమ ఊరేగించారు. అలాగే వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయకూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్‌కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాల్లోని శివాలయాల్లోని నంది భగవాన్‌కు పూజలు చేసి ప్రార్థనలు జరిపారు. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరాలయంలో ప్రతి నెలా పౌర్ణమి రోజున ఆలయం కొండ చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల దూరం గిరివలయం వెళ్లడం ఆనవాయితీ. దీంతో ఆలయ నిర్వాహకులు గిరివలయం వెళ్లేందుకు సమయాన్ని విడుదల చేశారు. అందులో భాగంగా శుక్రవారం వేకువ జామున 5.43 ప్రారంభించి 16వ తేదీన 3.30 గంటల వరకు పౌర్ణమి ఉండడంతో ఆ సమయంలో భక్తులు గిరివలయం వెళ్లవచ్చని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. -
నయనతార చిత్రంలో వీర సమర్
తమిళసినిమా: నటనకు అర్హత ప్రతిభ ఒకటే. అది ఉంటే ఎవరైనా నటించవచ్చు అలా ఇ ప్పటికే పలు రంగాలకు చెందినవారు నటులుగా రాణిస్తున్నారు. అలాగే ప్రముఖ కళా దర్శకుడు వీర సమర్ కూడా నటుడిగా మంచి గుర్తింపు పొందుతున్నారు పలు చిత్రాలకు కళా దర్శకుడు గా పనిచేస్తున్న ఈయన ఇప్పటికే పలు చిత్రాల్లో కథానాయకుడిగా, గుణ చిత్ర పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరశేఖరన్ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన ఈయనకు జంటగా నటి అమలాపాల్ కథానాయకగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాదల్, వెయిల్, పూ.పాండి, ముత్తుకు ముత్తాగా, వేలాయుధమ్, పాండి ఒలిపెరుక్కి నిలయం, కొంబన్, ఆరు కిడాయిన్ కరుణై మను,కడై కుట్టి సింగం, కుడిమగన్, నమ్మి వీటి పిళ్లై , జాక్‌పాట్, తన్నివండి, డీఎస్పీ, యాదుమ్ ఊరే యావరం కేళీర్, తమిళ్ కుడిమగన్, 1943 కప్పలేరియ తమిళన్, తదితర 30 చిత్రాలకు పైగా వివిధ పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన కళా దర్శకుడుగాను కొనసాగడం విశేషం. కాగా తాజాగా నటి నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్న మన్నాంగట్టి చిత్రంలో వీర సమర్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం తనకు మరింత పేరును తెచ్చిపెడుతుందంటున్న ఈయన ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న పరమశివన్ పాత్తిమా చిత్రంలో హాస్య పాత్రను, అదేవిధంగా ఇళయబాల దర్శకత్వంలో రూపొందుతున్న తొడర్పు ఎల్లైక్కు అప్పాల్ చిత్రంలోని మంచి పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు ఇకపోతే పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో కళాదర్శకుడిగా పని చేస్తూ కీలక పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. -
ౖపైపెకి..!
త్రిష క్రేజ్తమిళసినిమా: నటి త్రిష క్రేజ్ మామూలుగా లేదు. ఇంకా చెప్పాలంటే అదృష్టవంతురాలు అంటే ఈమెనే అని చెప్పక తప్పదు. ఎందుకంటే త్రిషపై ప్రేమ పెళ్లి వంటి వదంతులు చాలానే వైరల్ అయ్యాయి. అయితే అవేవీ ఈమె వృత్తిపై ప్రభావం చూపకపోవడం విశేషమే. ఈమె నటిగా పరిచయమై రెండున్నర దశాబ్దాలు దాటింది. మొదట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన ఈ బ్యూటీ అందాల పోటీల్లో చైన్నె సుందరిగా కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే సాధారణంగా మోడలింగ్ రంగం నుంచి వచ్చిన నటీమణులకు డైరెక్ట్‌గా హీరోయిన్ ఛాన్సులు వస్తుంటాయి. అయితే నటి త్రిషకు అందుకు భిన్నంగా సిమ్రాన్ కథానాయకిగా నటించిన జోడి చిత్రంలో ఆమె స్నేహితురాలుగా చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అయితే అవకాశాన్ని కూడా త్రిష సద్వినియోగం చేసుకున్నారు. అదే ఆమెను స్టార్ హీరోయిన్ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత సూర్యకు జంటగా నటించిన మౌ నం పేసియదే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత విక్రమ్ సరసన నటించిన సామి, విజయ్‌తో జతకట్టిన గిల్లీ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో త్రిష స్టార్ డమ్ పెరిగిపోయింది. ఆ తర్వాత ఆమెకు కెరీర్ పరంగా దానికి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. తెలుగులోనూ ప్రభాస్ సర్జన్ నటించిన వర్షం సిద్ధార్థ్‌కు జంటగా నటించిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అక్కడ కూడా త్రిష స్టార్ హీరోయిన్ అయిపోయారు. అదేవిధంగా, హిందీ, కన్నడం, మలయాళం నటించిన ఈమె పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందారు అలాంటి సమయంలో నటించిన కొన్ని ఉమెన్ సెంట్రల్ కథా చిత్రాలు నిరాశ పరచడంతో ఒకసారిగా డౌన్ అయిపోయింది. అలాంటి సమయంలో మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం త్రిషకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈమె సీనియర్ స్టార్ హీరోలకు ఏకై క ఆప్షన్‌గా మారారు. ఇప్పుడు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తమిళంలో అజిత్ సరసన ఏక కాలంలో విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌కు జంటగా మరోసారి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. -
బాల్య వివాహాలు అరికట్టాలి
వేలూరు: ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురష్కరించుకొని శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేలూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ సుబ్బలక్ష్మి ప్రారంభించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బాల్య వివాహాలు, మహిళలపై జరుగుతున్న లైంగికదాడులను అరికట్టాలని ర్యాలీ నిర్వహించి అవగాహన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్న వయస్సులో సెల్ఫోన్లకు బానిస కాకుండా విద్యకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో బాలకార్మికులు లేకుండా బాలలను బడిలో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాలికలపై ఎక్కడైనా లైంగిక వేధింపులు జరిగితే వెంటనే 1098, 181 అనే నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. శిశుసంక్షేమశాఖ జిల్లా అధికారి సంజీత్, సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఉమ పాల్గొన్నారు.