Hyderabad
-
కుల గణన చారిత్రాత్మక విజయం: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాలను తట్టుకుని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో అనేక పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర సాధనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు అంటూ కామెంట్స్ చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా ప్రభుత్వం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటోంది. ప్రజావాణితో పార్టీ భావజాలాన్ని నమ్మి.. ఓటేసిన ప్రజల అభిప్రాయాలను, ఇబ్బందులను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నాం. గత ప్రభుత్వం ఎప్పుడూ గడీల మధ్య ఉండి పాలన చేసింది. విద్య, వైద్యం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు 40శాతం పెంచి అందిస్తున్నాం. అనేక పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.రాష్ట్ర సాధనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు తెచ్చుకున్నాం. ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి.. 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు సరిగ్గా నిర్వహించలేక గాలికి వదిలేశారు. బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాలను తట్టుకొని ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ.. ఆ వడ్డీని ప్రభుత్వం కట్టనుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. కుల గణన చారిత్రాత్మక విజయం. దేశానికి తెలంగాణ మోడల్‌గా కుల గణన నడుస్తుంది. కుల గణనను అడ్డుకోవాలని దోపిడీదారులు ప్రయత్నం చేస్తున్నారు. వనరులు ప్రజలకు సమానంగా పంచాలి అని కోరుకునే వారు కుల గణనకు మద్దతు ఇవ్వాలి’ అని కోరారు. -
హైదరాబాద్ శిల్పారామంలో జానపద జాతర.. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం
భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్ మంథన్’ పేరుతో నవంబర్ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని ఒక్కో రాష్ట్రంలో లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల నుంచి సైతం ఒక్కో తెగ, ఒక్కో జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకారులు దాదాపు 1500 మంది ఈ ‘జానపద జాతర’లో తమ కళలను ప్రదర్శిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం చాటే ఈ మేళా ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అగ్ర నేత మోహన్ భాగవత్‌తో పాటూ అనేకమంది కేంద్రమంత్రులూ వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.భారతీయ జానపద కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ దేశమంతా ఒకటేననే ఏకత్వాన్ని నిరూపించడమే లోక్ మంథన్ ప్రధాన లక్ష్యం. ‘జాతీయ గిరిజన గౌరవ దివస్’ పేరుతో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సులు, సమావేశాల ఆధారంగా ప్రపంచంలోని వనవాసి, గిరివాసి సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషిస్తారు. సంప్రదాయ సాంస్కృతిక వాయిద్యాలు, పనిముట్లు ప్రదర్శిస్తారు. ఈ జాతరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారు.ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే ‘కేచక్’ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కు హాజరవుతున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సూర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం ఉన్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆయా దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహణ విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో చేసి చూపిస్తారు. చదవండి: మణిపుర్ ఘర్షణలకు ముగింపెప్పుడు?ఈ సందర్భంగా జరిగే ఎగ్జిబిషన్లో తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళలు, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ గ్రామీణ క్రీడలు, సాహిత్యం, ఇతర సాంస్కృతిక అంశాలౖపై చర్చలు ఉంటాయి. భారతీయ ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా... వారి అందరి సాంస్కృతిక పునాదులు జానపదంలోనే ఉన్నాయి. మన మూలాలను ఒకసారి అందరికీ చాటిచెప్పే లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతరకు అందరూ ఆహ్వానితులే. ఉత్సవాలు జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది.– పగుడాకుల బాలస్వామి; ప్రచార ప్రసార ప్రముఖ్, వీహెచ్‌పీ, తెలంగాణ రాష్ట్రం(నేటి నుంచి ‘లోక్ మంథన్’ ప్రారంభం) -
వేసవి వస్తోంది.. బీర్ల ఉత్పత్తి పెంచండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఏటా వేసవిలో బీర్ల కొరత ఏర్పడుతుంది. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు. సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా బ్రాండెడ్ బీర్లు దొరక్క బీరు ప్రియులు అల్లాడుతుంటారు. రానున్న వేసవిలో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్‌శాఖ ము(మ)ందస్తు జాగ్రత్త తీసుకుంటోంది. బీర్ల ఉత్పత్తిని పెంచాలని బెవరేజెస్ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్‌శాఖ బెవరేజెస్ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు.డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి.. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బెవరేజెస్ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేస్ల బీర్లు ఉత్పత్తి ఉంటుంది. ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేస్లకు పెంచింది. ఒక్కో కేస్‌లో 12 సీసాలు (650 ఎంఎల్) ఉంటాయి. మరో మల్టీనేషనల్ బెవరేజెస్ కంపెనీ నెలకు సుమారు 25 లక్షల కేస్ల బీరు ఉత్పత్తి చేస్తుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని సుమారు 30 లక్షల కేస్ల వరకు పెంచినట్టు ఎక్సైజ్‌వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ మాదిరిగా కాకుండా, బీర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల లోపే వినియోగం జరగాలి. దీంతో ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచుకుంటూ వెళితేనే వేసవి డిమాండ్‌కు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచొచ్చని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది.డిమాండ్‌కు తగినట్టుగా ‘బీర్ల డిమాండ్‌ను ముందుగా అంచనా వేసి బెవరేజెస్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటాయి. సాధారణంగా బ్రాండెడ్ బీర్లకు వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటాయి’అని ఎక్సైజ్‌శాఖ బ్రూవరీస్ విభాగం అధికారి తెలిపారు.సంగారెడ్డి నుంచే రాష్ట్రమంతటికీ సరఫరా.. సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. యూబీ కంపెనీకి చెందినవి రెండు, కల్స్‌బర్గ్, క్రౌన్, లీలాసన్స్, ఏబీ ఇన్‌బీవ్ అనయూసర్–బుష్, వంటి బ్రీవరేజెస్ కంపెనీలు ఇక్కడ బీర్ల ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రమంతటికీ బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచే జరుగుతుంది. ఎక్సైజ్‌శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బెవరేజెస్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6,800 లక్షల లీటర్లు. అయితే ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్లైన్లనే వేసుకున్నాయి. కొన్ని కంపెనీలు మంజీర నదీ జలాలనే వినియోగిస్తున్నాయి. -
సర్టిఫికెట్ల ధ్రువీకరణ ప్రహసనమేమీ కాదు
సాక్షి, హైదరాబాద్: విద్య, ఉద్యోగం సహా వివిధ వీసాలపై విదేశాలకు వెళ్లే వారికి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో ఆయా సర్టిఫికెట్ల ధృవీకరణ అత్యంత కీలకం, అనివార్యం. సాంకేతికంగా అటెస్టేషన్, అపోస్టిల్గా పిలిచే ఈ ప్రక్రియ పెద్ద ప్రహసనం అనే భావన అనేకమందిలో ఉంది. ఈ కారణంగానే ఏజెంట్లను ఆశ్రయించి అధిక మొత్తం చెల్లించడమో, ఢిల్లీ వరకు వెళ్లి దీన్ని పూర్తి చేసుకోవడమో జరుగుతోంది. అయితే.. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం అ«దీనంలో ఉన్న బ్రాంచ్ సెక్రటేరియట్ ఈ ప్రక్రియల్ని చేపడుతుందని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ (ఆరీ్పఓ) జొన్నలగడ్డ స్నేహజ పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి ఆమె బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు ఒకే బ్రాంచ్ సెక్రటేరియట్ విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలంటే విద్యార్హత పత్రాలతో పాటు జనన, వివాహ ధ్రువీకరణ పత్రాలతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధం అంశాల్లో కమర్షియల్ డాక్యుమెంట్లు సైతం అటెస్టేషన్, అపోస్టిల్ అనివార్యం. ఈ ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి అయితేనే ఆయా దేశాల్లో ఆ సర్టిఫికెట్ల చెల్లుబాటవుతాయి. దరఖాస్తుదారులు సమరి్పంచే పత్రాలను పరిశీలించి, సరిచూసి అవి సరైనవే అంటూ సరి్టఫై చేయడాన్నే అటెస్టేషన్, అపోస్టిల్ అంటారు. ఇందులో భాగంగా ఆయా ధ్రువపత్రాలకు వెనక అపోస్టిల్ స్టిక్కర్‌తో పాటు స్టాంపు, సంతకం చేస్తారు. ఈ సేవల్ని అందించడం కోసం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దేశ వ్యాప్తంగా బ్రాంచ్ సెక్రటేరియట్లను నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించింది సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం అ«దీనంలో ఉంది. దరఖాస్తులను సచివాలయాల్లో సమర్పించాలి ధ్రువీకరణ ప్రక్రియల్ని ఆర్పీఓ అధీనంలోని బ్రాంచ్ సెక్రటేరియట్ చేస్తున్నప్పటికీ.. దరఖాస్తుదారులు మాత్రం నేరుగా సంప్రదించే అవకాశం లేదు. ఆయా రాష్ట్ర సచివాలయాల్లోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆధ్వర్యంలో పని చేసే కౌంటర్లలోనే పత్రాలు సమరి్పంచాల్సి ఉంటుంది. దీనికి ముందు మీ సేవ, ఆన్లైన్ విధానాల్లో నిరీ్ణత రుసుము చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ విభాగం అధికారులు ఆయా సర్టిఫికెట్లు జారీ చేసిన విద్యా సంస్థ, ప్రభుత్వ విభాగం, చాంబర్లను సంప్రదించి వాటి విశ్వసనీయతను నిర్ధారించే జీఏడీ సిబ్బంది అథంటికేట్ అంటూ స్టాంప్ వేసి, సంతకం చేసి దరఖాస్తుదారుకు తిరిగి ఇస్తారు. ఈ పక్రియలో నూ సాధారణ, తత్కాల్ అనే విధానాలు అమలులో ఉన్నాయి. ఆపై దరఖాస్తుదారు ఎంఈఏ అ«దీకరణ తో పని చేసే ఏజెన్సీల ద్వారా ఈ సర్టిఫికెట్లను ఆర్పీ ఓ బ్రాంచ్ సెక్రటేరియట్‌కు పంపాల్సి ఉంటుంది. అదే రోజు ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి రాష్ట్ర ప్రభుత్వం అదీనంలో ఉండే జీఏడీ నుంచి ఆర్పీఓలోని బ్రాంచ్ సెక్రటేరియట్‌కు అదీకృత అధికారుల వివరాలను చేరతాయి. వీరి వివరాలు, సంతకాలు, స్టాంపులను ఆయా ఏజెన్సీల నుంచి వచ్చిన దరఖాస్తుదారు సర్టిఫికెట్లపై ఉన్న వాటితో సరిచూస్తారు. అన్నీ సరిపోలితే అటెస్టేషన్, అపోస్టిల్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ సర్టిఫికెట్ల మళ్లీ ఏజెన్సీ ద్వారానే దరఖాస్తుదారుడికి చేరతాయి. యూఏఈ, సౌదీ వంటి దేశాలు అటెస్టేషన్‌ను, హెగ్ కన్వెన్షన్‌లో ఉన్న మిగిలిన 126 దేశాలు అపోస్టిల్ను అంగీకరిస్తున్నాయి. బ్రాంచ్ సెక్రటేరియేట్ అటెస్టేషన్‌ను ఉచితంగా, అపోస్టిల్ను ఒక్కో పత్రానికి రూ.50 చొప్పున వసూలు చేసి పూర్తి చేస్తోంది. ఏజెన్సీ మాత్రం సరీ్వస్ చార్జీగా ఒక్కో పత్రానికి రూ.84 (స్కానింగ్ ఫీజు రూ.3 అదనం) తీసుకునేందుకు ఎంఈఏ అనుమతిచ్చింది. బ్రాంచ్ సెక్రటేరియట్ ఒకసారి చేసిన అటెస్టేషన్, అపోస్టిల్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ చదివిన విదేశీ విద్యార్థులకూ తప్పనిసరి.. కేవలం భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారికే కాదు.. ఆయా దేశాల నుంచి వచ్చిన, ఇక్కడ విద్యనభ్యసించి తిరిగి వెళ్లే వారికీ అటెస్టేషన్, అపోస్టిల్ అనివార్యం. అప్పుడు ఇక్కడి విద్యాసంస్థలు జారీ చేసిన సరి్టఫికెట్లు అక్కడ చెల్లుబాటు అవుతాయి. ఎంఈఏ అధీకరణతో పని చేసే ఏజెన్సీల వివరాల కోసం వెబ్‌సైట్‌ను (www.mea.gov.in/ apostille. htm) సందర్శించాలి. అలాగే అటెస్టేషన్, అపోస్టిల్ అంశాల్లో ఇబ్బందులు ఉంటే ఈ–మెయిల్ ఐడీ(hobs.hyderabad@mea. gov.in) ద్వారా సంప్రదించాలి. ప్రస్తుతం ప్రతి నెలా 200 వరకు దరఖాస్తులు వస్తున్నాయి. – జొన్నలగడ్డ స్నేహజ, రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ -
కుక్క మీద ప్రేమ.. పీఎస్‌కు పంచాయతీ
బంజారాహిల్స్: పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమ రెండు కుటుంబాలను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే చాంద్ షేక్ ఒక విదేశీ కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పక్క ప్లాట్‌లో నివసించే రుచిక అగర్వాల్ అనే యువతికి సైతం ఈ కుక్క అంటే ఎనలేని ప్రేమ. ఈ కుక్కతో ఆమె అనుబంధాన్ని మరింతగా పెంచుకుంది. అంతేకాకుండా కుక్కను తన ఇంటికి తీసుకెళ్తూ ఆహారం కూడా అందించేది. తరచూ ప్రయాణాలు చేసే ఈ పెంపుడు కుక్క యజమాని చాంద్ షేక్ ఎక్కడికైనా వెళ్లినప్పుడు కుక్క బాగోగులు చూసుకోవడానికి రుచిక అగర్వాల్ కు అప్పగించేవాడు. ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాంద్ షేక్ విదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్కను చూసుకోవాల్సిందిగా రుచిక అగర్వాల్ కు అప్పగించి వెళ్లాడు. అయితే ఈ కుక్క అంటే చాంద్ షేక్ తండ్రి షేక్ సుభానికి కూడా మహా ప్రాణం. తాను అల్లారు ముద్దుగా చూసుకునే కుక్క పక్కింట్లో ఉండటాన్ని జీరి్ణంచుకోలేక షేక్ సుభాని రుచిక ఇంటికి వెళ్లి కుక్కను తనతో పాటు తీసుకొని వచ్చాడు. దీంతో రుచిక కోపం పట్టలేక కుక్క మీద ఉన్న ప్రేమతో సుభానితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కుక్క కోసం రుచిక తో పాటు ఆమె సోదరుడు ఆమె వద్ద పనిచేసే వికాస్, జేమ్స్, ఆమె వదిన గొడవ పడ్డారు. కుక్కను తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా సుభాని అడ్డుకున్నాడు. ఈ గొడవలో సుభానికి స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహం పట్టలేక రుచికాపై విరుచుకుపడ్డాడు. దీంతో తనను తిట్టాడంటూ రుచిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సుభాని కొడుకు చాంద్ షేక్ కూడా తన తండ్రిని కొట్టారంటూ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేశాడు. ఇరు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు సెక్షన్ 329(4), 115(2), 351(2), రెడ్ విత్ 3(5) బీఎన్ ఎస్ కింద ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
HYD: మైండ్ స్పేస్ భవనం వద్ద టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మైండ్ స్పేస్ టవర్‌పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. హైటెక్ సిటీలో వద్ద ఉన్న మైండ్ స్పేస్ టవర్‌లో 13వ ఫ్లోర్ నుంచి దూకి టెకీ వంగ నవీన్ రెడ్డి(24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ రెడ్డి ఎన్సీఆర్ యోయిస్ కంపెనీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
మొదలైన ‘గజగజ’!.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుత సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, మరోవైపు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవటంతో జ్వరాలు, జలుబు, దగ్గులాంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రమంతా పడిపోతున్న ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 9.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన పట్టణాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.1 డిగ్రీలు నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 11.8 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, హనుమ కొండ, మెదక్, పటాన్చెరు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు.. హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడురోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
అద్దె బస్సులతో ఆర్టీసీ ఆగమాగం!
సాక్షి, హైదరాబాద్ : అద్దె బస్సులు ఆర్టీసీని కబళించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతానికి రూపొందించిన ప్రణాళిక ప్రకారం అద్దె బస్సులు సమకూరితే, ఆర్టీసీ సొంత బస్సుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. క్రమంగా ఇది సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేయనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అద్దె బస్సుల సంఖ్యను పెంచటంపై చాలాకాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని నిధుల వినియోగంపై ప్రభుత్వం అనధికారికంగా పరిమితులు విధిస్తుండటంతో, సొంతంగా కొత్త బస్సులు కొనటం ఆర్టీసీకి కష్టంగా మారింది. దీంతో అద్దె బస్సులకు గేట్లు బార్లా తెరిచేస్తోంది. అద్దె బస్సులకు డ్రైవర్లను వాటి నిర్వాహకులే నియమిస్తారు. డ్రైవర్ల జీతాల పద్దు తగ్గుతుండటంతో ఆర్టీసీ దీనివైపు మొగ్గు చూపుతోంది. 30 శాతానికి చేరిన అద్దె బస్సులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014లో ఆర్టీసీలో అద్దె బస్సుల వాటా 17 శాతం మాత్రమే. అద్దె బస్సుల సంఖ్యపై పరిమితి ఉన్నందున, అంతకు మించి వాటిని సమకూర్చుకునేందుకు వీలుండేది కాదు. కానీ ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు బకాయి పడటం, గ్రాంట్లు ఇవ్వకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటి సంఖ్య పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 9,800 బస్సులు తిరుగుతున్నాయి. వీటిల్లో ప్రైవేటు వ్యక్తులు ఆర్టీసీకి అద్దెకిచ్చిన బస్సులు 2,800 ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్’పథకం కింద సమకూరి హైదరాబాద్ విమానాశ్రయానికి తిప్పుతున్న 40 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒలెక్ట్రా అన్న సంస్థ అద్దెకిచ్చినవే. అదే సంస్థ ఇటీవల మరో 100 బస్సులు సమకూర్చింది. ఇటీవల ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ మరో 90 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చింది. అలాగే మరో 40 బస్సులు కూడా కొత్తగా వచ్చాయి. వీటిని ప్రారంభించాల్సి ఉంది. ఇలా ప్రస్తుతం మొత్తం బస్సుల్లో అద్దె బస్సుల వాటా దాదాపు 30 శాతానికి చేరింది. ఇక ఏడాది, ఏడాదిన్నరలోగా ఆర్టీసీ, అద్దె బస్సుల సంఖ్య చెరి సగం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముంచెత్తనున్న అద్దె బస్సులు హైదరాబాద్‌లో తిరిగేందుకు మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉంది. వాటిల్లో కొన్ని వచ్చాయి. ఏడాది కాలంలో మరో 400 సమకూరుతాయి. జేబీఎం సంస్థ కూడా 500 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చాల్సి ఉంది. ఇప్పటికి కొన్ని బస్సులే రాగా మరో 400 బస్సులను సమకూర్చాల్సి ఉంది. దశలవారీగా అవి కూడా వస్తాయి. ఇక హైదరాబాద్‌లో కాలుష్యాన్ని నివారించేందుకు మొత్తం బ్యాటరీ బస్సులనే తిప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘పీఎం ఈ–డ్రైవ్’పథకం కింద 2,800 బస్సులు మంజూరు చేయాలంటూ ఆర్టీసీ దరఖాస్తు చేసింది. దేశవ్యాప్తంగా ఆ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు తిప్పేందుకు కేంద్రం 9 నగరాలను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. అంటే ఆర్టీసీ దరఖాస్తు మేరకు ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కానున్నాయి. తాజాగా మహిళా సంఘాలు 1,000 బస్సులను ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మూడేళ్లలో అద్దె బస్సుల సంఖ్య 8 వేలకు చేరే అవకాశం ఉంది. అప్పుడు ఆర్టీసీ సొంత బస్సులు 6 వేల లోపే ఉంటాయి. అయితే అప్పటికి చాలా బస్సులు పాతబడి తుక్కుగా మారిపోతాయి. వాటి స్థానంలో కొత్తగా సొంత బస్సులు రాకపోతే ఆర్టీసీ సొంత బస్సుల సంఖ్య 4 వేలకు తగ్గుతుంది. అద్దె బస్సులు భారీగా వస్తున్నందున సొంత బస్సులు కొనేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపే పరిస్థితి ఉండదని అంటున్నారు. డ్రైవర్ల నియామకం అంతేనా? ఆర్టీసీలో ప్రస్తుతం డ్రైవర్లకు కొరత ఉంది. దీంతోఇటీవలే దాదాపు 2 వేల పోస్టుల భర్తీకి ఆర్టీసీ ప్రతిపాదించింది. దానికి ప్రభుత్వం కూడా సమ్మతించి రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశాలిచ్చి0ది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది. కానీ వాటి ఊసే లేకుండాపోయింది. భవిష్యత్తులో అద్దె బస్సుల సంఖ్య పెరుగుతున్నందున సొంత డ్రైవర్ల అవసరం అంతగా ఉండదన్న ఉద్దేశంతోనే ఎంపిక ప్రక్రియను వాయిదావేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్థ మనుగడకేప్రమాదం: సంఘాల నేతలు ‘ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య విచ్చలవిడిగా పెరగటం సంస్థకు మంచిది కాదు. భవిష్యత్తులో సంస్థ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తుంది. ఇది ప్రైవేటీకరణను ప్రేరేపిస్తుంది. గతంలోలాగా అద్దె బస్సుల సంఖ్యపై సీలింగ్ విధించి కావాల్సినన్ని బస్సులను ప్రభుత్వమే కొనాలి..’అని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు నరేందర్, నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. -
మాకు ‘సాగర్’ పగ్గాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ పగ్గాలను తమకే అప్పగించాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్‌తోపాటు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై చర్చించడానికి డిసెంబర్ 3న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనున్న 19వ సమావేశం ఎజెండాలో మొత్తం 24 కీలక అంశాలను కృష్ణాబోర్డు చేర్చడంతో వీటిపై వాడీవేడీ చర్చ జరగనుంది. బోర్డు చైర్మన్, కన్వీనర్‌తోపాటు ఏపీ, తెలంగాణ అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ డిమాండ్లు ‘ఆనకట్టల భద్రత చట్టం 2021లోని సెక్షన్ 16(1ఏ) ప్రకారం నాగార్జునసాగర్ భద్రతకి సంబంధించిన నిఘా, 16(1బీ) ప్రకారంతనిఖీలు, 16(1సీ) ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. యావత్ జలాశయం కార్యకలాపాలన్నింటినీ తెలంగాణకే అప్పగించాలి. ఈ విషయంలో ఏపీ జోక్యానికి, తెలంగాణ విధుల ఆక్రమణకు తావులేదు. కృష్ణా బోర్డు సూచనల మేరకు రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా, గతేడాది నవంబర్ 28న ఏపీ అధీనంలోకి తీసుకుంది. కుడికాల్వ రెగ్యులేటర్ నుంచి నీళ్లను విడుదల చేసింది. ఈ ఘటనకు పూర్వ స్థితిగతులను పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ 2023 డిసెంబర్ 1న ఏపీని ఆదేశించింది’అనే అంశాలను తెలంగాణ సూచనల మేరకు ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచింది. నో అన్న ‘అపెక్స్’.. మళ్లీ బోర్డుకు పంచాయతీ కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటా నుంచి ఏపీ, తెలంగాణకు పంపకాలు జరగలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో 2015–16 అవసరాల కోసం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు. 2016–17లో సైతం ఇదే కేటాయింపులను కొనసాగించాలని 2016లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. దీని ఆధారంగానే 2017–18లో ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని 2017లో కృష్ణా బోర్డు నిర్ణయించింది. 2021–22 వరకూ దీన్నే కొనసాగించారు. 2022–23లో దీని కొనసాగింపును తెలంగాణ వ్యతిరేకించింది. 50:50 నిష్పత్తిలో పంపిణీ జరపాలని తెలంగాణ కోరగా, 66:34 నిష్పత్తిలోనే కొనసాగించాలని ఏపీ పట్టుబట్టింది. తాత్కాలిక కోటాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని కోరుతూ వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు రెఫర్ చేయగా, అపెక్స్ కౌన్సిల్ నీటి పంపకాల జోలికి వెళ్లదని జలశక్తి శాఖ చెప్పింది. దీంతో వివాదం మళ్లీ కృష్ణా బోర్డుకు చేరింది. ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచిన అంశాలివీ.. » కృష్ణా బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు. » గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించాలి. » ఇరు రాష్ట్రాల్లోని అనధికార ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలి. » రెండో విడతలో 9 టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపు. తెలంగాణ ఇతర డిమాండ్లు » తాము వాడుకోకుండా నాగార్జునసాగర్‌లో పొదుపు చేసిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి. » సాగర్ టెయిల్‌పాండ్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా ఏపీజెన్కో అనధికారికంగా 4 టీఎంసీలను విడుదల చేసింది. ఇప్పటికే కృష్ణా డెల్టాకు ఏపీ 117 టీఎంసీలను విడుదల చేసింది. ఇకపై టెయిల్‌పాండ్ విద్యుత్ కేంద్రం నుంచి వరదలున్నప్పుడే నీళ్లు విడుదల చేయాలి. సాగర్ టెయిల్‌పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణనూ తెలంగాణకే అప్పగించాలి. » ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుపడుతుండటంతో తమ వాటా జలాలను తీసుకోలేకపోతున్నాం. కృష్ణా ట్రిబ్యునల్–2 నీటి కేటా యింపులు జరిపే వరకు ఆర్డీఎస్ కుడికాల్వ పనులను కొనసాగించే అధికారం ఏపీకి లేదు. » ఏపీ నీటి వినియోగాన్ని లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్‌ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. » రాయలసీమ ఎత్తిపోతలతో సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి. » శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ చేపట్టరాదు. » శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్‌కి ఏపీ అత్యవసర మరమ్మతుల నిర్వహించాలి. -
మెరిట్ ఉన్నోళ్లకే మేనేజ్మెంట్ సీటు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల బేరసారాలకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యామండ లి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్ విధానంలోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కన్వినర్ కోటా సీట్లను ఈ తరహాలో కేటాయిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను సమూలంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చలు జరిగాయి. కొన్ని కాలేజీల మేనేజ్మెంట్ల అభిప్రాయాలను అధికారులు సేకరిస్తున్నారు. కొంతమంది ఆన్లైన్ విధానాన్ని సమర్థిస్తున్నట్టు కౌన్సిల్ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ సీట్ల భర్తీ వ్యవహారంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు మండలి అధికారులు తెలి పారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంట నే విధివిధానాలను రూపొందిస్తామన్నా రు. ప్రభుత్వం కూడా ఆన్లైన్ సీట్ల భర్తీపై పట్టుదలగా ఉందని మండలి ఉన్నతాధికారులు చెప్పారు.ఏటా రూ. కోట్ల వ్యాపారం రాష్ట్రంలో దాదాపు 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ప్రస్తుతం 70 శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. దాదాపు 38 వేల సీట్లను యాజమాన్య కోటా కింద కాలేజీలే నింపుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం 15% బీ కేటగిరీ కింద భర్తీ చేయాలి. ప్రభుత్వం నిర్ణ యించిన మేరకే ఈ కేటగిరీకి ఫీజులు వసూలు చేయాలి. వీరికి ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. అయితే, జేఈఈ, ఈఏపీసెట్, ఇంటర్ మార్కుల మెరిట్‌ను పరిగణలోనికి తీసుకోవాలి. కాలేజీలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. కౌన్సెలింగ్ తేదీలకు ముందే ఒక్కో సీటును రూ.7 నుంచి 18 లక్షల వరకూ అమ్ముకుంటున్నాయనే ఫిర్యాదులున్నాయి. ఏటా ఈ తరహా సీట్ల అమ్మకంతో రూ.వందల కోట్ల వ్యాపారం జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ప్రతీ సంవత్సరం ఉన్నత విద్యామండలికి వందల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయా లని విద్యార్థి సంఘాలతోపాటు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాదే దీనిపై ఆలోచన చేసినా, కాలేజీ యాజమాన్యాలు అడ్డుకున్నట్టు తెలిసింది.ఎన్‌ఆర్‌ఐలకే సీ’కేటగిరీయాజమాన్య కోటాలో 15% ప్రవాస భారతీయులకు కేటాయిస్తారు. ఈ కోటాలో సీటు పొందే వాళ్లు ఏడాదికి 5 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలు సిఫార్సు చేసిన వాళ్లకు సీట్లు ఇవ్వడం ఇప్పటి వరకూ ఉంది. ఇక నుంచి నేరుగా ఎన్ఆర్ఐ పిల్లలకు మాత్రమే ఈ కేటగిరీ కింద సీట్లు ఇవ్వాలనే నిబంధనను తేవాలని మండలి భావిస్తోంది. ఒకవేళ ఎన్ఆర్ఐలు లేక సీట్లు మిగిలితే... ఆ సీట్లను బీ కేటగిరీ కిందకు మార్చాలని భావిస్తున్నారు. ఏటా ఇంజనీరింగ్ సీట్ల కోసం అనేక రకాలుగా సిఫార్సులు వస్తున్నాయి. కొన్ని కాలేజీలు వీటిని తప్పించుకోవడానికి ఆన్లైన్ విధానం సరైందిగా భావిస్తున్నాయి. ఆన్లైన్ సీట్ల భర్తీని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచి్చంది. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కచ్చితంగా అమలు చేస్తాం..ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచిఅమలు చేస్తాం. సీట్ల అమ్మకానికి తెరవేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. మేనేజ్మెంట్ కోటా సీట్లయినా మెరిట్ ఉన్నవాళ్లకే కేటాయించేలా చేస్తాం. – వి.బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
మెరిసిన వరి రైతు... మునిగిన పత్తి రైతు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆలోచన మారుతోంది. కష్టంతో కూడుకున్న వాణిజ్య పంటల కంటే సంప్రదాయ వరి సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో పెరిగిన సాగునీటి వనరులతోపాటు కష్టం, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ అనే ఉద్దేశంతో వరి వైపు మళ్లుతున్నారు. దీనితో ఏటేటా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరితోపాటు పత్తి కూడా ప్రధాన పంటగా కొనసాగుతోంది. కానీ పత్తి ధరలు పడిపోతుండటం, దాని సాగు ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఆ రైతులు మెల్లగా వరి సాగు చేపడుతున్నారని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం వరకు కరీంనగర్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎక్కువగా పత్తిసాగు చేసేవారు. ఇప్పుడీ ప్రాంతాల్లో పత్తి తగ్గిపోయి, వరి పెరిగింది. ప్రస్తుతం నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో అధికంగా.. ఖమ్మం, వరంగల్‌లలో ఓ మోస్తరుగా పత్తి సాగు జరుగుతోంది. కానీ భవిష్యత్తులో ఈ జిల్లాల్లోనూ సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి మాత్రమేకాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు పట్ల కూడా రైతుల్లో ఆసక్తి తగ్గుతోందని పేర్కొంటున్నారు. ఈ ఏడాది మునిగిన పత్తి రైతు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 2022 సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 7 లక్షల ఎకరాల మేర తక్కువ. కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్ధతు ధర రూ.7,521గా నిర్ణయించింది. కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహించడంతో రైతుకు గిట్టుబాటు ధర అందలేదు. సెప్టెంబర్ లో కురిసిన వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పంట దిగుబడి కూడా తగ్గింది. పైగా పత్తి ధర తగ్గడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్లలో పత్తి క్వింటాల్‌కు రూ.5,300 నుంచి రూ.7,000 వరకు మాత్రమే ధర పలికింది. దేశంలోనే మూడో స్థానం ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 2.74 కోట్ల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. అత్యధిక సాగులో మహారాష్ట్ర, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో.. తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 1.60 కోట్ల టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అందులో తెలంగాణలో 25.33 లక్షల టన్నుల మేర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇన్నాళ్లూ ఒక ఏడాది ధర గిట్టుబాటు కాకపోయినా.. మరుసటి ఏడాదైనా అందుతుందన్న ఆశతో రైతులు పత్తి సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ గత రెండు, మూడేళ్లుగా తెలంగాణ రైతులు పత్తికి బదులు ఇతర పంటల వైపు చూస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.వరి దిగుబడి పెరగడంతో ఆనందం ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేసిన రైతులకు వాతావరణం కూడా కలసి వచ్చి0ది. రాష్ట్రంలో సుమారు 66 లక్షల ఎకరాల్లో వరిసాగవగా.. అందులో 40 లక్షల ఎకరాల్లో సన్న రకాలు, 26 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు వేశారు. వరి కోతకు వచ్చే వరకు అకాల వర్షాల బాధలేకపోవడం, గతంతో పోలిస్తే చీడ, పీడలు, తెగుళ్లు తక్కువగా ఉండటంతో ఈసారి వరి దిగుబడి భారీగా పెరిగింది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం వరి దిగుబడి 150 లక్షల మెట్రిక్ టన్నులకుపైనే. వరికి మద్దతు ధర రూ.2,320కాగా... నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో మేలు రకం సన్న ధాన్యాన్ని రూ.2,500 నుంచి రూ.3,000 ధరతో మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేశారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా బియ్యానికి పెరిగిన డిమాండ్‌తో ధరలు పెరిగాయి. ఇక 70 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కనీస మద్ధతు ధరకు తీసుకుంటుండటం, గతంలో కన్నా దిగుబడి పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాలకు వచ్చే సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామనడంపైనా హర్షం వ్యక్తమవుతోంది. -
నిజాం షుగర్స్ నుంచి ‘డెల్టా’ ఔట్?
సాక్షి, హైదరాబాద్: నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా.. ఇందులో భాగస్వామ్యం ఉన్న డెల్టా పేపర్స్ లిమిటెడ్ సంస్థ తన 51 శాతం వాటాను ఉపసంహరించుకుని బయటికి వెళ్లనుంది. నిజాం షుగర్స్‌ను పునరుద్ధరించినా తాము నడపలేమంటూ డెల్టా సంస్థ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో సంస్థ ఆస్తుల విలువ, యూనిట్ల సాంకేతిక స్థితిగతులను మదింపు చేయడంతోపాటు న్యాయపరమైన అంశాలపై సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం ‘క్యాపిటల్ ఫార్చూన్స్’అనే సంస్థను కన్సల్టెంట్‌గా ఎంపిక చేసింది. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి వివరాలతో తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రైవేటు భాగస్వామ్య సంస్థ వాటాను తిరిగి చెల్లించాక.. నిజాం షుగర్స్‌ను ఏ తరహాలో నడపాలనే అంశంపై స్పష్టత రానుంది. తొలుత రుణ విముక్తి చేసి.. నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామన్న హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 12న మంత్రులు శ్రీధర్‌బాబు చైర్మన్‌గా, దామోదర్ రాజనర్సింహ వైస్ చైర్మన్‌గా ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. పునరుద్ధరణకు అనుకూలంగా ఈ కమిటీ ఇచి్చన ప్రతిపాదనలను ఆగస్టులో కేబినెట్ ఆమోదించింది. 2015లో ఎన్డీఎస్ఎల్ యూనిట్లు మూతపడేనాటికి సంస్థ ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లుగా లెక్కించారు. మరోవైపు బ్యాంకర్లు వడ్డీతో కలిపి ఈ సంస్థకు ఇచ్చిన రుణ మొతాన్ని రూ.390 కోట్లుగా పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం బ్యాంకర్ల కన్సార్షియంతో సంప్రదింపులు జరిపి వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ.190 కోట్లు చెల్లించడంతో నిజాం షుగర్స్‌కు రుణ విముక్తి కలిగింది. రుణ విముక్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.171 కోట్లు, డెల్టా పేపర్స్ రూ.19 కోట్లు చెల్లించాయి. ‘డెల్టా’తప్పుకోవడంపైనా మార్గనిర్దేశం కన్సల్టెన్సీ సంస్థ న్యాయపరమైన అంశాలు, ఆస్తుల విలువ, యూనిట్ల సాంకేతిక స్థితిగతులను మదింపు చేయడంతోపాటు యూనిట్ల పునరుద్ధరణకు సంబంధించిన సాంకేతిక, ఆర్థికపరమైన ఖర్చులపై కసరత్తు ప్రారంభించింది. 51 శాతం వాటా కలిగిన డెల్టా పేపర్స్ భాగస్వామ్యం నుంచి తప్పుకోవడంపైనా కన్సల్టెన్సీ సంస్థ మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. కన్సల్టెన్సీ సంస్థకు అవసరమైన సమాచారాన్ని ఎన్డీఎస్ఎల్ తరఫున ఎప్పటికప్పుడు అందించేందుకు గతంలో చక్కెర పరిశ్రమ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో రిటైరైన ఓ అధికారిని సమన్వయకర్తగా నియమించినట్టు తెలిసింది. కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చే మధ్యంతర నివేదికల ఆధారంగా నిజాం షుగర్స్ పునరుద్ధరణ తీరుతెన్నులపై చర్చించనున్నారు. ఈ మేరకు 26 లేదా 28వ తేదీన శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘ప్రైవేటు’చేతుల్లోకే నిజాం షుగర్స్? నిజాం షుగర్స్ నుంచి డెల్టా పేపర్స్ సంస్థ బయ టికి వెళ్లనున్న నేపథ్యంలో.. దానిని ఎవరు నడపాలనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ లేదా సహకార రంగంలో నడపడం సాధ్యం కాదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్వ హణకు ముందుకొచ్చే ప్రైవేటు సంస్థలకు లీజు ప్రాతిపదికన ఇవ్వడమో లేదా విక్రయించడమో జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆయనేమన్నా టెర్రరిస్టా?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆయన ఏమైనా టెర్రరిస్టా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేబీఆర్ పార్కు వద్ద ఉదయం వాకింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేను బహిరంగ ప్రదేశంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. ఆయన పరారీలో లేరు కదా.. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చట్టప్రకారం అరెస్టు చేయొచ్చు కదా అని పేర్కొంది. గాయపడ్డ వారి వివరాల పక్కన ప్రశ్నార్థకం పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటే వైద్యుడికే స్పష్టత లేదా అని అడిగింది. నరేందర్‌రెడ్డి మరో నిందితుడికి రెండు నెలల కాలంలో 84 సార్లు ఫోన్ చేశారన్న పోలీసుల వాదనపై ఆక్షేపించింది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు నేరపూరిత కుట్రపైనే మాట్లాడుకున్నారని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది.నరేందర్‌రెడ్డికి ప్రమేయం ఉందంటూ నిందితులు చెప్పిన వాంగ్మూలాల కాపీలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం: పీపీ ‘నరేందర్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారు. నవంబర్ 11న రిమాండ్ డైరీలో ఆయన పేరు లేదు. నవంబర్ 13 నాటి డైరీలో చేర్చారు. ఆయనపై పెట్టిన సెక్షన్లలో ఒకటి తప్ప అన్నీ ఐదేళ్లలోపు శిక్ష పడే కేసులే. ఇతర నిందితులు నరేందర్‌రెడ్డి పేరు చెప్పారంటూ చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు. ఘటన జరిగిన రోజున ఆయన నుంచి మరో నిందితుడి (ఏ–4)కి ఒకే ఒక్క కాల్ వెళ్లింది. అలాంటప్పుడు ఘటన వెనుక ఆయన ఉన్నట్లు ఎలా చెబుతారు? రాజకీయ కోణంలోనే మాజీ ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమీ చెప్పకున్నా.. కేటీఆర్ పేరు చెప్పినట్లు, నేరాన్ని అంగీకరించినట్లు తప్పుడు నివేదికను ట్రయల్‌కోర్టుకు అందజేశారు. తోపులాటలో జరిగిన చిన్న గాయాలను రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు’అని గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. ‘ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్‌రెడ్డి మాట్లాడారు. దీని కోసమే మరో నిందితుడికి రెండు నెలల్లో 84 సార్లు కాల్ చేశారు. నరేందర్‌రెడ్డిని ఇంటి వద్దే అరెస్టు చేశాం. విచారణ సాగుతోంది. ఈ దశలో పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. ఆయన పిటిషన్‌ను కొట్టివేయాలి. నరేందర్‌రెడ్డిని పోలీసుల కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై వికారాబాద్ కోర్టు విచారిస్తోంది’అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.ప్రాథమిక విచారణ చేశారా?వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఇంటి వద్దే అరెస్టు చేస్తే, విచారణ సమయంలో సలీమ్ అనే వ్యక్తి సమాచారం ఎందుకు ఇచ్చారు? సొంత పార్టీ వ్యక్తితో మాట్లాడినంత మాత్రాన అరెస్టు చేస్తారా? ఇతర నిందితుల స్టేట్మెంట్లు కాకుండా నరేందర్‌రెడ్డి పాత్రపై ప్రాథమిక విచారణ చేశారా? మీరు చెబుతున్నట్లు కుట్ర కోణం ఉంటే ఘటన జరిగిన రోజున ఇద్దరి మధ్య ఒకే కాల్ ఎందుకు ఉంటుంది? లగచర్ల ఘటనలో అధికారులకు పెద్దగా గాయాలు కాలేదని నిమ్స్ వైద్యుల నివేదిక చెబుతోంది. లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాలను అందజేయండి’అంటూ తీర్పు రిజర్వు చేశారు. అయితే తమ వాదనలకు కొంత సమయం కావాలని పీపీ విజ్ఞప్తి చేయడంతో గురువారానికి వాయిదా వేశారు. -
నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: రెండురోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. గురు, శుక్రవారాల్లో (21, 22వ తేదీల్లో) ఆమె హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అటునుంచి రాజ్‌భవన్‌కు చేరుకొని 6.20 గంటల నుంచి 7.10 వరకు విశ్రాంతి తీసుకొంటారు. రాత్రి 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకొని, అక్కడ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు శిల్పకళా వేదికలో జరుగుతున్న ‘లోక్ మంథన్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మ ధ్యాహ్నం 12.05 గంటలకు తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
మధ్యాహ్న భోజనం తిని 100 మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్/మాగనూర్: మధ్యాహ్న భోజనం విషతుల్యం కావటంతో100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మాగనూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు వడ్డించారు. ఆహారం తిన్న కొద్దిసేపటికే సుమారు వందమంది విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. ఆ విషయం టీచర్లకు చెప్పగా ‘మీరు రోజూ ఇలాగే చెప్తున్నారు’అని బెదిరించినట్లు తెలిసింది. కానీ, కడుపునొప్పి మరింత తీవ్రం కావటంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొందరు విద్యార్థులు వాంతులు చేసుకొన్నారు. దీంతో టీచర్లు స్థానిక ఆస్పత్రికి సమాచారమిచ్చారు. స్థానిక ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు స్కూలుకు వచ్చి విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించినా కొందరి పరిస్థితి మెరుగుపడకపోవటంతో మండల వైద్యాధికారి అఫ్రోజ్‌కు సమాచారం అందించారు. ఆయన స్కూలుకు వచ్చి విద్యార్థులను పరీక్షించారు. తొలుత 10 మందిని మక్తల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి ప్రైవేట్ అంబులెన్స్‌లో మరో 9 మంది విద్యార్థులను మక్తల్ ఆస్పత్రికి పంపించారు. వీరిలో 15 మందిని మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రియాంక, అనిల్, నందిని పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి కొంచం మెరుగ్గా ఉన్న ఇతర గ్రామాల విద్యార్థులను టీచర్లు ఇంటికి పంపించివేశారు. ఇళ్లకు చేరుకున్న తర్వాత కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. తల్లిదండ్రులు వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మొత్తం వందమంది విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ అయినట్లు గుర్తించారు. కాగా, కడుపులో నొప్పిగా ఉందని చెప్పిన కొందరు విద్యార్థులను టీచర్లు కొట్టినట్లు చెపుతున్నారు. ఇక్కడ ఫుడ్‌పాయిజన్ మొదటిసారి కాదు! విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొన్న డీఈఓ అబ్దుల్ ఘనీ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఈ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం ఇది మూడోసారి అని విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓతో వాగ్వాదానికి దిగారు. వంట ఏజెన్సీ, పాఠశాల హెచ్ఎం (ఇన్చార్జ్ ఎంఈఓ) నిర్లక్ష్యం కారణంగానే ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఆరోపించారు.విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని వంట ఏజెన్సీని తక్షణమే మార్చాలని హెచ్ఎంతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా పాఠశాలకు చేరుకుని ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈఓను, ఎస్ఐ అశోక్‌బాబును ఆదేశించారు. ఎమ్మెల్యే తన వాహనంతోపాటు ప్రైవేట్ అంబులెన్స్‌లో విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. సీఎం సీరియస్: మాగనూర్ ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. విద్యార్థుల అస్వస్థత విషయం తెలియగానే వారి ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకొన్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సంఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని సీఎం హెచ్చరించారు. విద్యార్థుల అస్వస్థతపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠాలు నేర్చుకోవడం కాదు.. ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచి్చందని ఆరోపించారు. ‘గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా?’అని ప్రశ్నించారు. -
పరిశ్రమలు పెడుతుంటే ఎందుకంత కడుపుమంట?: సీఎం రేవంత్
నాడు నేడు అదే కోడెవేములవాడ: చిత్రంలోని కోడెను గత మార్చిలో వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ రాజన్నకు మొక్కు చెల్లించారు. అదే కోడెను బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి మొక్కు చెల్లించారు. ఇద్దరూ ఇలా ఒకే కోడెను మొక్కు చెల్లించడం యాదృఛ్చికమంటూ అంతా చర్చించుకున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘నేను జెడ్పీ సభ్యుడి నుంచి సీఎం దాకా అన్ని పదవులూ చేపట్టా.. నాకు భూమి విలువ ఏంటో తెలుసు. గ్రామాల్లో మనకు ఉన్న గౌరవం భూమి...నాకు తెల్వదా..? అందుకే సేకరించే భూమికి మూడింతలు అధికంగా పరిహారమివ్వాలని అధికారులకు చెప్పా. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని ఆదేశించా. మా వెనకబడిన కొడంగల్‌ను స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పట్టించుకున్న వారులేరు. మా ప్రాంతంలో యువతకు ఉపాధి కోసమని పరిశ్రమలు పెడతానంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ఎందుకంత కడుపు మంట? ఎందుకంతదుఃఖం? మీ హయాంలో ప్రాజెక్టుల కోసం ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయించిన్రు. నేను కేవలం 1,100 ఎకరాలు తొండలు కూడా గుడ్లు పెట్టని భూమిని తీసుకుంటుంటే కాళ్లలో కట్టెలు పెడుతున్నరు. రౌడీ మూకలతో కలెక్టర్, ఆర్డీవోలపై దాడి చేయించారు. భూ సేకరణ లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయ్? బుద్ధి లేదా కేసీఆర్?..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘రుణమాఫీ మీద లెక్కలు కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. రైతుల భూములు లాక్కున్న హరీశ్ సమాధానం చెప్పాలి. కేటీఆర్ ఉరుకులాట గమనిస్తున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బావబామ్మర్దుల సంగతి చెప్తాం. వారికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాజయాల పాలై మెదడు పోయింది..’అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో వేములవాడ చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత పలువురు మంత్రులతో కలిసి రాజరాజేశ్వరుడి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దాల మండపంలో వేద పండితులు సీఎంను, మంత్రులను ఆశీర్వదించారు. అనంతరం ఆలయ విస్తరణ, ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణం, మూలవాగు నుంచి ఆలయం వరకు రోడ్ల విస్తరణ, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ (ఏటీసీ) తదితర మొత్తం రూ.679 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మిడ్‌మానేరు నిర్వాసితులకు రూ.236 కోట్లతో 4,696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. 30వ తేదీలోపు మిగిలిన పనులన్నీ పూర్తి ‘గత ఎన్నికల సమయంలో సమ్మక్క సారక్క ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన రోజు కేసీఆర్ గడీలు కూలాలి, రాజన్నను మోసం చేసిన కేసీఆర్‌ను గద్దె దించాలి అనుకున్న. పరిహారం కోసం మిడ్ మానేర్ నిర్వాసితులు చేస్తున్న పోరాటంలో పాల్గొన్న. అధికారంలోకి వస్తే కళికోట ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన. కొండగట్టు హనుమంతుడి ఆశీర్వచనం తీసుకున్న. ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ఉన్నా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చా. ఈ నెల 30 తేదీ లోపు ఉమ్మడి కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు వచ్చి మిగిలిపోయిన పనులన్నీ పూర్తయ్యేలా చూస్తారు. దేశానికి దిశ దశ చూపిన మహనీయుడు పీవీ నరసింహారావు సొంత జిల్లా కరీంనగర్ ప్రజల్లో చైతన్యం ఎక్కువ. సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు మర్చిపోలేం. 2004లో తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డ మీద నుంచే సోనియాగాంధీ మాట ఇచ్చారు. జైపాల్‌రెడ్డి చాతుర్యంతో పొన్నం ప్రభాకర్ పెప్పర్ స్ప్రేలను ఎదుర్కొని కొట్లాడారు. ఆంధ్రలో, కేంద్రంలో ఓడిపోతామని తెలిసినా.. 4 కోట్ల తెలంగాణ వాసులకు ఇచ్చిన మాట కోసం సోనియా తెలంగాణ ఇచ్చారు..’అని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ మాటిస్తే ఎంత దూరమైనా వెళ్తుంది ‘కాంగ్రెస్ మాటిస్తే ఎంత దూరమైనా వెళ్తుంది. పొన్నంను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. అదే బండి సంజయ్ గెలిచి ఏం తెచ్చారు? వినోద్‌కుమార్, కేసీఆర్ నిధులు ఇచ్చి ఉంటే ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? రూ.7 లక్షల కోట్లు అప్పు తెచ్చిన కేసీఆర్ రూ.100 కోట్లతో రాజన్న గుడిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? మీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల కోసమే పనిచేసే మనిషి. సిరిసిల్ల మెడికల్ కాలేజీకి హాస్టల్ ఇచ్చాం. గల్ఫ్ కార్మీకులకు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి రూ.5 లక్షల నష్ట పరిహారం ఇస్తున్నాం. పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనిని మేము చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లు కాళ్లల్లో కట్టెలు పెట్టేందుకు వస్తున్నారు. నాడు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. గత పాలనలో కేవలం రూ.11 వేల కోట్ల రుణమాఫీ చేస్తే మేం కేవలం 11 నెలల్లో 23 లక్షల మందికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశాం. సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టి హీరో అనుకుంటున్నారు..’అని సీఎం విమర్శించారు. నిజాన్ని ఎదుర్కోవాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ‘కేసీఅర్.. నువ్వు నిజాన్ని ఎదుర్కోవాలంటే అసెంబ్లీకి రావాలి. నేను 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చా. అందులో ఒక్కటి తక్కువుందని నిరూపిస్తే ఎల్బీ స్టేడియంలో క్షమాపణ చెప్తా. మేం కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క ఎత్తిపోయలేదు. అయినా మన రైతులు రికార్డు స్థాయిలో 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశారు. కేసీఆర్ రూ.1.80 లక్షల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టి ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేదు. కేసీఆర్, హరీశ్‌లు.. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్లను తమ ఫామ్‌హౌస్‌లకు నీరు పారించడానికి కట్టారు. రైతుల నుంచి సేకరించిన భూములను హరీశ్ లాక్కున్నారు. దీనిపై ఆయన సమాధానం చెప్పాలి. కేటీఆర్ కూడా ఉరుకులాడుతున్నరు. ఫామ్‌హౌస్‌ల డ్రగ్స్ తీసుకుంటే అరెస్టు వద్దంటున్నాడు. నీ బామ్మర్దిపై కేసు పెట్టద్దా సన్నాసీ? కుట్రలు చేస్తే ఊచలు లెక్కపెడతావ్..’అని ముఖ్యమంత్రి అన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పీసీసీఅధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, బల్మూరి వెంకట్, ఎమ్యెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్‌సింగ్, విజయరమణరావు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సవాళ్లకు అనుగుణంగా శిక్షణలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో మారిన నేరసరళి, పోలీస్ విధుల ఆధారంగా నూతన కానిస్టేబుళ్ల శిక్షణలో పలు మార్పు లు చేసినట్టు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, శిక్షణ విభాగం డీజీ అభిలాష బిస్త్ తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశాలు, మత్తుపదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్‌కు సంబంధించిన అంశాలను ఈసారి కానిస్టేబుల్స్ శిక్షణలో అదనంగా చేర్చినట్టు వెల్లడించారు. లింగ వివక్షకు తావులేకుండా శిక్షణలో పలు కీలక అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 8,047 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో బిస్త్ పలు అంశాలను పంచుకున్నారు. సిలబస్‌లో సైబర్ సెక్యూరిటీరాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 పోలీస్ శిక్షణ కేంద్రాల నుంచి 8,047 మంది కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొననున్నారు. వీరిలో 4,116 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 3,685 మంది ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), 228 మంది ఐటీ కమ్యూనికేషన్స్, 18 మంది పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) కానిస్టేబుళ్లు ఉన్నారు. శిక్షణ సిలబస్‌లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు, యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్ అంశాలను తొలిసారిగా చేర్చి అవగాహన కల్పించాం. సైబర్ నేర విధానం (మోడస్ అపరెండీ) ఎలా ఉంటుంది, ఇతర అంశాలపై కనీస పరిజ్ఞానం ఉండేలా తరగతులు నిర్వహించాం. యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్‌లో పాల్గొనడం, దర్యాప్తులో పై అధికారులకు సహకరించడం తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చాం. సెల్ఫ్ డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇన్‌డోర్‌తో పాటు ఔట్‌డోర్ శిక్షణలో సెల్ఫ్ డిఫెన్స్‌కు ప్రాధాన్యత పెంచాం. పని ఒత్తిడి తట్టుకునేలా శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండేలా కొన్ని మార్పులు చేశాం. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే సివిల్ కానిస్టేబుళ్లకు కూడా నూతన నేర చట్టాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాం. నేర దర్యాప్తు, కేసుల నమోదు, క్షేత్రస్థాయి విధుల్లో తరచూ అవసరమయ్యే చట్టాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం. అదేవిధంగా నేరం జరిగిన ప్రాంతానికి చేరుకోగానే ఏం చర్యలు తీసుకోవాలి, పై అధికారి వచ్చే వరకు క్రైం సీన్‌ను కాపాడడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చాం. ఈ బ్యాచ్‌లో 5,470 మంది గ్రాడ్యుయేట్లు, 1,361 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 15 మంది ఎల్ఎల్బీ పూర్తి చేసిన వారున్నారు. -
తెలంగాణ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పర్యటించనున్నారు. శిల్పారామం వేదికగా ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే లోక్‌మంథన్-2024 కార్యక్రమం జరగనుంది. లోక్‌మంథన్-2024లో 22న వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే మేధోమథన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారు.ఇందులో భాగంగా రేపు, ఎల్లుండి తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు రానున్నారు. రేపు సాయంత్రం 6.20 గంటల నుంచి 7.10 గంటల వరకు రాజ్‌భవన్‌లో ఉండనున్నారు. రేపు రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. -
హిమాచల్ భవన్ జప్తు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను కాకుండా.. బదులుగా సర్కస్లను నడుపుతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. హిమాచల్‌లో రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్.. తన చేతకాని ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీసుసుకున్న అప్పును తీర్చలేక ఢిల్లీలో హిమాచల్ భవన్‌ను కోల్పోవాల్సి వస్తుందని విమర్శలు గుప్పించారు. గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం, చేతికందినన్ని అప్పులు చెయ్యడం, ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం కాంగ్రెస్ అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. మొన్న గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థితి హస్తానికి తలెత్తిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నేడు కాంగ్రెస్ చెల్లించాల్సిన అప్పు తేల్చకపోతే, డిల్లీలో హిమాచల్ భవన్‌ను జప్తు చేస్తాం అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. తమ హామీలకు నిధులు సమకూర్చడం కోసం చట్టబద్ధంగా గంజాయిని విక్రయించడానికి కాంగ్రెస్ అనుమతి కోరిందని ప్రస్తావించారు. మరి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడానికి ఏం విక్రయిస్తారంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.కాగా ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్ భవన్ జప్తుకు రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించింది. దీంతో పది గ్యారెంటీల పేరుతో రెండేళ్ల క్రితం హిమాచల్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం! చేతికందినన్ని అప్పులు చెయ్యడం! ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం! ఇది ఏ జూదగాని ఇంటి కథ కాదు! సాక్షాత్తు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు! గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థి… pic.twitter.com/1lfvoR1Bu7— KTR (@KTRBRS) November 20, 2024 -
పట్నం కేసులో తీర్పు రిజర్వ్.. కొనసాగుతున్న సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. లగచర్ల ఘటనలో రిమాండ్‌ను కొట్టివేయాలని నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం.. ప్రస్తుతం చర్లపలి జైలులో ఉన్నారు.లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో పట్నం నరేందర్ రెడ్డి.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నరేందర్ రెడ్డి తరఫున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తున్నారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. పట్నం న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ..పట్నం నరేందర్‌ది అక్రమ అరెస్ట్..ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసోడింగ్స్ ఫాలో కాలేదు..ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు..11వతేదీన ఘటన జరిగినప్పుడు నరేందర్ రెడ్డి అక్కడ లేడు.సురేష్ అనే నిందితుడి కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు.11వ తేదీన కేవలం ఒకే ఒకసారి సురేష్‌తో నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు.సుప్రీంకోర్టు తీర్పులను పోలీసులు ఉల్లఘించారు.సుప్రీంకోర్టు తీర్పులను కింది కోర్ట్ కనీసం పరిగణలోకి తీసుకోలేదుఅరెస్ట్ గ్రౌండ్స్‌ను చూడకుండానే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారు.అదుపులోకి తీసుకున్న పోలీసులు కన్ఫెషన్ ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారుపోలీసులకు నచ్చింది రాసుకునీ అదే కన్ఫెషన్ రిపోర్ట్ అని కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారుపబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ..లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిరపరించేందుకు కుట్ర చేశారు.కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేయించారు.అన్నింటికీ ప్రధాన సూత్రదారి పట్నం నరేందర్ రెడ్డి.హైకోర్టు ప్రశ్న.. నరేందర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించిన హైకోర్టు..తన అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని పీపీ చెప్పుకొచ్చారు.ఎవరు అనుచరులు అతని హోదా? ఏంటని కోర్టు ప్రశ్న.పీపీ వాదనలు..సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడుఘటన జరిగిన రోజు సురేష్, నరేందర్ కాల్స్ మాట్లాడుకున్నారు.అరెస్ట్ సందర్బంగా ఎలాంటి నియమాలు పాటించారని ప్రశ్నించిన హైకోర్టు..కేటీఆర్ పార్కులో ఒక మాజీ ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్ చేస్తారన్న హైకోర్టు..పార్కులో అరెస్ట్ చేయలేదని తన ఇంట్లో అరెస్ట్ చేశామని కోర్టుకు తెలిపిన పీపీ..సుప్రీం తీర్పులను ఎందుకు పాటించలేదన్న హైకోర్టు.ఈ కేసులో కుట్ర కోణం ఉంది చాలా విషయాలు బయటకు వచ్చాయి అన్న పీపీ.ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును కోర్టు వాయిదా వేసింది. రిజర్వ్ చేసింది. -
ఉద్రిక్తతల నడుమే.. ఒరిగిన బిల్డింగ్ కూల్చివేత ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి సిద్ధిఖ్ నగర్లో గత రాత్రి ప్రమాదకర స్థాయిలో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేత ప్రారంభమైంది. బుధవారం ఉదయమే హైడ్రాలిక్ ‘బాహుబలి’క్రేన్‌తో అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఉద్రిక్త వాతావరణంలోనే తమ పనిని ప్రారంభించారు. సదరు భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉండడంతో.. చుట్టుపక్కల మరే నష్టం జరగకుండా కూల్చివేస్తున్నారు.ఈ ఉదయం ఆ భవనం పక్కన ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు.. బిల్డింగ్ కుంగడానికి ప్రధాన కారణమైన పిల్లర్లను పూడ్చేశారు. డీఆర్ఎఫ్ సిబ్బంది కూల్చివేతలో పాల్గొంటున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బందితో పాటు ఆంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. గుంతలు తవ్విన భవన యాజమానిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక..ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా గుంతలు తవ్వడం వల్లే పక్కన ఉన్న భవనం కుంగిందని, అలాగే కుంగిన ఆ భవనాన్ని కూడా నిబంధనలకు లోబడి కట్టలేదని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఒరిగిన బిల్డింగ్ యాజమాని మాత్రం తమ వెర్షన్ వినిపిస్తున్నారు. ‘‘ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తవ్వకాలు చేపట్టారు. సెల్లార్ గుంతలు తవ్వడం వల్లే మా బిల్డింగ్ కుంగిపోయింది. మాకు ఆ ఓనర్‌తో నష్టపరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు.వసుకుల లక్ష్మణ్ అనే పేరిట ఈ ప్లాట్ ఉంది. జీప్లస్ ఫోర్లో రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. చుట్టుపక్కల ఐటీ కారిడార్‌లో పని చేసేవాళ్లంతా. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలోనే గోడ కూలినట్లు శబ్దం వచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8.30 గంటల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోందని అరుపులు వినిపించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆదరాబాదరాగా కిందకు వచ్చేశారు. ఇంతలోనే మూడో అంతస్తులో ఉండే సాదిక్ హుస్సేన్ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాది మృతి
కుత్బుల్లాపూర్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఉషా ఫ్యాన్స్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి రామ్‌ఆశిష్‌సింగ్ కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్–2లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సందీప్ కుమార్ యాదవ్ (21) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని ఒహియా వెళ్లాడు.అయితే.. తాజాగా అక్కడ రోడ్డు ప్రమాదంలో సందీప్ మృతి చెందాడు. ఈ నెల 17న (భారత కాలమానం ప్రకారం) రాత్రి తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు కారులో బయల్దేరారు. మౌంట్ గిలిడ్ వద్ద మరో కారు వేగంగా ఎదురు వచ్చి ఢీకొట్టడంతో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా రామ్‌ఆశిష్ సింగ్ వేడుకుంటున్నారు. -
జీహెచ్ఎంసీ అడ్డగోలు నోటీసులు}
సాక్షి, సిటీబ్యూరో: ‘తిమ్మిని బమ్మి చేసే సత్తా వారి సొంతం. వారు తల్చుకుంటే లక్షల రూపాయల ఆస్తిపన్ను వేలల్లోనే వస్తుంది. వందల్లో రావాల్సింది వేలల్లో కూడా అవుతుంది’.. జీహెచ్ఎంసీ బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల గురించి సామాన్య జనానికి ఉన్న అభిప్రాయం ఇది. ఈ పరిస్థితిని నివారించేందుకే గతంలో ఆస్తిపన్ను అసెస్మెంట్ల కోసం ప్రజల ఇళ్ల వద్దకు ట్యాక్స్ సిబ్బంది వెళ్లవద్దని అప్పటి కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఆ విధానం వల్ల ఏ డాక్యుమెంట్లు పెట్టినా ఆస్తిపన్ను గుర్తింపు నంబరు(పీటీఐఎన్) జనరేట్ కావడంతో పాటు చివరకు జీహెచ్ఎంసీ భవనాలను సైతం ఎవరైనా తమ ఆస్తిగా చూపించుకునే అవకాశం ఏర్పడటంతో దానికి స్వస్తి పలికారు. మరోవైపు.. జీహెచ్ఎంసీకి వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు హస్తిమశకాంతరం వ్యత్యాసం ఉండటంతో.. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా తిరిగి అసెస్మెంట్ను ట్యాక్స్ సిబ్బంది ‘సుమోటో’గానే చేసేందుకు గత జూలైలో ఆదేశించారు. దీంతో ఎంతోకాలం చేతులు కట్టిపడేసినట్లున్న ట్యాక్స్ సిబ్బందికి ఒక్కసారిగా వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఇంకేముంది? అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా కొత్త భవనాల వద్దకు, అసెస్మెంట్లలో వ్యత్యాసాలున్నాయంటూ అన్ని భవనాల ప్రజల వద్దకు వెళ్తున్నారు. వారి వైఖరికి ఆసరానిస్తూ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి ఆస్తిపన్ను ద్వారా ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా.. తేడాలున్నట్లు గుర్తించిన వాణిజ్య భవనాలను, అదనపు అంతస్తులు వెలసిన ఇతరత్రా భవనాలను గుర్తించి నిజమైన ఆస్తి పన్ను విధించాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులు సూచించారు. ట్యాక్స్ సిబ్బంది మాత్రం నివాస, వాణిజ్య భవనం అన్న తేడా లేకుండా.. అదనపు అంతస్తులు నిర్మించినా, నిర్మించకున్నా జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 213 కింద నోటీసులిచ్చేస్తున్నారు. సదరు సెక్షన్ మేరకు సరైన ఆస్తిపన్ను నిర్ధారించేందుకు జీహెచ్ఎంసీ కోరిన వివరాల్ని భవన యజమానులు లేదా ఆక్యుపైయర్లు తెలియజేయాలి. లక్ష్యం ఒకటి.. పని మరొకటి నిజమైన ఆస్తిపన్ను కట్టకుండా లక్షలు, కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నవారి నుంచి సరైన ఆస్తిపన్ను వసూలు చేయడం, ఇప్పటికే ఉన్న భవనాల మీద కొత్తగా నిర్మించిన అదనపు అంతస్తులను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడం ద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోవాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం. దీంతోపాటు దశాబ్దం క్రితం జరిగిన కంప్యూటరీకరణ సందర్భంగా చాలా ఇళ్ల ప్లింత్ ఏరియా ఎంత ఉందో నమోదు చేయలేదు. అలాంటి వాటి ప్లింత్ ఏరియాను ఆన్లైన్లో నమోదు చేసేందుకు వివరాలు సేకరించాల్సి ఉండగా.. అన్ని ఇళ్లనూ ఒకే గాటన కట్టి నోటీసులిస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎక్కువ ఆస్తిపన్నును తక్కువ చేస్తామంటూ ట్యాక్స్ సిబ్బంది జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేని పక్షంలో ఎక్కువ ఆస్తిపన్ను కట్టాలంటూ బెదరగొడుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నోటీసులిలా.. భవనం లేదా స్థలం.. యజమానులు కానీ ఆక్యుపైయర్లు కానీ ఏడు రోజుల్లోగా దిగువ పత్రాలు, సమాచారం అందజేయాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. 1. సేల్ డీడ్ 2. లింక్ డాక్యుమెంట్ (ఏదైనా ఉంటే) 3. మంజూరు ప్లాన్/అనుమతి కాపీ 4. ఎప్పటి నుంచి ఉంటున్నారు ? 5.ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ 6. టాక్స్ రసీదు 7. రిజిస్టర్డ్ లీజ్ డీడ్(ఏదైనా ఉంటే) లేదా రెంటల్ అగ్రిమెంట్ 8. భవనం కలర్ ఫొటో దశాబ్దాల క్రితం నిర్మాణ అనుమతులు పొందిన వారిలో చాలామంది వద్ద పైన పేర్కొన్న డాక్యుమెంట్లన్నీ అందుబాటులో లేవు. కొన్ని భవనాలు చాలామంది చేతులు మారాయి. వాటన్నింటినీ ఇప్పుడెలా తేవాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు. -
50 కోట్లకు చేరిన ఉచిత బస్సు ప్రయాణ మహిళల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య 50 కోట్లకు చేరింది. గృహిణులు సహా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, విద్యారి్థనులు తదితర రంగాల్లో పని చేసే చిరుద్యోగినులు, ఐటీ కారిడార్లలో పని చేసే హౌస్‌కీపింగ్ సిబ్బంది వంటి వివిధ కేటగిరీలకు చెందిన మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకుంటున్నారు. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ ఆరీ్టసీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీని రెట్టింపు చేశారు. ఉచిత ప్రయాణ సదుపాయం వల్ల మహిళా ప్రయాణికులకు ఇప్పటివరకు రూ.1,152 కోట్లు ఆదా అయింది. అదే సమయంలో ‘జీరో’ టికెట్ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో ఆరీ్టసీకి ఆదాయం పెరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ‘మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో 45 శాతం మహిళలు, 55 శాతం పురుషులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు. ఈ పథకం అమల్లోకి వచి్చనప్పటి నుంచి 70 శాతానికి పైగా మహిళలు, 30 శాతం పురుషులు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఆక్యుపెన్సీ అదరహో.. ప్రస్తుతం గ్రేటర్‌లోని 25 డిపోల పరిధిలో సుమారు 2,500 బస్సులు ప్రతి రోజు 7.67 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. రోజుకు 21.50 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో 14.70 లక్షల మంది మహిళలే కావడం గమనార్హం. 6.80 లక్షల మంది మాత్రమే మగవారు ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముందు సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 65 నుంచి 70 శాతం వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా 105 శాతానికి పెరిగింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలే ఎక్కువగా ప్రయాణం చేస్తుండగా మగవారు మెట్రోడీలక్స్, ఏసీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. మెట్రో పాస్‌లపై రాకపోకలు సాగించిన విద్యారి్థనులు సైతం ఉచిత పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో 1.30 లక్షల బస్సు పాస్‌ల సంఖ్య 60 వేలకు తగ్గినట్లు అధికారులు చెప్పారు. అలాగే మహిళలు, ఎన్జీఓల పాస్‌లు కూడా సుమారు లక్ష వరకు తగ్గాయి. మెట్రోపై ప్రభావం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంతో గ్రేటర్లో ఆటోలు, సెవెన్ సీటర్ ఆటోలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. నిర్మాణ రంగానికి చెందిన కూలీలు, చిరుద్యోగులు, శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించేవారు ఆటోలను ఎక్కువగా వినియోగించేవారు. ప్రస్తుతం ఆ ప్రయాణికులంతా ఆర్టీసీ వైపు మళ్లారు. అలాగే మెట్రో ల్లోనూ ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రతిరోజూ 4.8 లక్షల మంది వరకు మెట్రోల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్పి ప్రవేశపెట్టిన తర్వాత కనీసం 10 శాతం మంది మహిళలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించినట్లు మెట్రో అధికారుల అంచనా. మొత్తంగా ఇతర రవాణా సదుపాయాల నుంచి సుమారు 6 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల వైపు మళ్లారు. చిరుద్యోగులకు భరోసా... వస్త్ర దుకాణాలు షాపింగ్‌మాళ్లు, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు, ఐటీ సంస్థలు తదితర ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు ఆర్థికంగా ఈ పథకం భరోసా ఇచ్చింది. ప్రతినెలా సుమారు రూ.3500 వరకు చార్జీల రూపంలో చెల్లించే మహిళలు ఇప్పుడు ఆ డబ్బులను ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ‘ఇంటి కిరాయిలు, కూరగాయల ధరలు, నిత్యావసరవ వస్తువుల ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారం తగ్గడం కొద్దిగా ఊరటే కదా’ అని అశోక్‌నగర్‌కు చెందిన సునీత అనే ప్రయాణికురాలు అభిప్రాయపడ్డారు. -
తప్పిన పెను ప్రమాదం
కీసర: ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొడుతూ వెళ్లి ముందున్న చెట్టు కు ఢీకొని నిలిచిపోయింది. విప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులున్నారు. వీరిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం కీసర మండలం కుందన్‌పల్లి చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. చీర్యాల చౌరస్తాలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు రోజు మాదిరిగానే కీసర, కీసరదాయర, రాంపల్లి దాయర, గోధుమకుంట, కుందన్పల్లిల నుంచిద్యార్థులను తీసుకుని వస్తోంది. ఈక్రమంలో కుందన్‌పల్లి చౌరస్తా సమీపంలో ఎదురుగా వచి్చన కారును తప్పించడానికి డ్రైవర్ బస్సును పక్కకు తిప్పాడు. వేగంతో బస్సు అదుపు తప్పి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని కొట్టింది. స్తంభం విరిగి కింద పడిపోయింది. ఆ ధాటికి మరో రెండు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయి. కరెంటు తీగలు బస్సుపై పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. బస్సు అదే వేగంతో చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. కాగా.. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బస్సు ఢీకొని ఉంటే పెను ప్రమాదమే సంభవించేది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ రాజు బస్సును అక్కడే వదిలేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. స్థానికంగా ఉన్న ప్రజలు, అటుగా వెళ్తున్న వాహనదారులు విద్యార్థులను బస్సులోంచి బయటకు దింపారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను వాహనాల్లో ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.