పెద్దపల్లి: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్నివిధాలా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. మరోపక్క రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. ఇందులోభాగంగా బీఆర్‌ఎస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులను అన్నిపార్టీల కంటే ముందుగానే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ రెండు పార్టీలకు ఏమాత్రమూ తగ్గకుండా బీజేపీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యేతో సమావేశాలు ఏర్పాటు చేయిస్తోంది.
మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ నాలుగు నెలల ముందే ఎన్నికల వేడిని పెంచుతున్నాయి. అయితే ఇప్పుడు అన్ని పార్టీల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నియోజకవర్గాల వారీగా ఇటీవల విడుదలైన ఓటరు ముసాయిదా జాబితా ఆధారంగా తమ నియోజకవర్గంలో ఏయే సామాజికవర్గాల వారు ఎందరున్నారు..? ఆయా సామాజిక వర్గాల్లో పెద్దలు ఎవరు..? వారు ప్రస్తుతం ఏ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారు..? తమ వైపు ఆ సామాజికవర్గం ఓటర్లను తిప్పుకోవాలంటే ఏం చేయాలి..? తదితర అంశాల ప్రాతిపాదికన కసరత్తు మొదలు పెట్టారు.
మన నియోజకవర్గంలో మన సామాజిక వర్గానికి మెజార్టీ ఓట్లు ఉన్నాయి. అసెంబ్లీలో మన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు. ఈ సారి పార్టీలు పక్కనపెట్టి మన అభ్యర్థిని నిలబెట్టుకుని గెలిపించుకుందాం..’ ఇది ఓ సామాజికవర్గం ఇటీవల నిర్వహించిన సమావేశంలో చేసుకున్న తీర్మానం. ఇక్కడ మా సామాజికవర్గం ఓట్లు 30వేలు ఉన్నాయి.
మా సామాజిక వర్గానికి చెందిన భవన నిర్మాణం పూర్తి చేయించండి. మీరేం చేస్తారో చెబితే సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటాం. అందరినీ సంప్రదించి మీకు మద్దతిస్తాం..’ ఇది ఓ ప్రాంతానికి చెందిన నేతలు బరిలో ఉంటున్న అభ్యర్థులతో బేరసారాల తీరు.
ఆయా నేతలపై ఫోకస్..
అన్ని పార్టీలు వివిధ సామాజిక వర్గాల్లోని ప్రముఖమైన నాయకులను గుర్తించే పనిలో ఉన్నారు. గతంలో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సహకార, మార్కెట్‌కమిటీ తదితర ప్రజాప్రాతినిథ్య పదవులకు పోటీచేసి ఓడిన, గెలిచిన మాజీలను తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. దీంతో నియోజకవర్గాల్లో నేతలు తమ కార్యక్రమాల్లో నేతల చేరికలకు సంబంధించిన కార్యక్రమం ఉండేలా చూసుకుంటున్నారు.
ఇదే అదునుగా ఆయా నేతలు తమ సామాజికవర్గానికి ఏం చేస్తారు..? ఆర్థికంగా ఎలా సహాయపడుతారు..? ప్రభుత్వం అందించే దళిత, బీసీ, మైనార్టీ, గృహలక్ష్మి తదితర పథకాల్లో లబ్ధిదారులుగా తమ అనుచరులను చేర్చితే పార్టీలోకి వస్తామంటూ డిమాండ్లు ముందుంచుతున్నారు. మరికొందరు పార్టీల్లో ఇమడలేక, ఆత్మగౌరవం పేరుతో బయటకు వెళ్లిపోతున్నారు.
బలం చూపించుకునేలా..
నియోజకవర్గాల్లో తమ మద్దతులేకుండా విజయం సాధించలేరని, వీలైతే తమ వర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాకాని పక్షంలో తమ సామాజికవర్గాల నేతలకు భవిష్యత్‌లో వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పదవులపై క్లారిటీ ఇవ్వాలంటూ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. మరికొందరు కుల భవనాలు, ఆలయాల నిర్మాణాలు కోసం ఆర్ధిక సాయం చేయమంటున్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఇలాంటి సమావేశాలు మరిన్ని జోరందుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment