Devotion
-
శరన్నవరాత్రులు..రెండో రోజు గాయత్రీ దేవి అలంకారం
పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ శరన్నవరాత్రులు కోలహలం ప్రారంభమయ్యింది. రోజుకో అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు శరన్నవరాత్రి రెండో రోజు గాయత్రి దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. వేదాలకు అధిదేవత అయిన గాయత్రి మాత ఆరాధనతో సమస్త విద్యలు ఒంటబడతాయనేది భక్తుల నమ్మకం. ఈ రోజు అమ్మవారు ఆయా ప్రాంతాల వారిగా పసుపు లేదా కనకాంబరం లేదా నారింజ రంగు చీరలో దర్శనమిస్తారు. పంచముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది.సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది.. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు.. గాయత్రీ దేవి ని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని భక్తుల విశ్వాసం.."ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:యుక్తామిందు నిబద్ధరత్నమకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!గాయత్రీం వరదాభయాంకుశమ్ కశాశ్శుభ్రం కపాలం గదాంశంఖం చక్రమధారవింద యుగళం హసైర్వాహంతీం భజే"శ్రీశైలం వంటి పలు పుణ్యక్షేత్రాల్లో రెండో రోజు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మచారిణి మాతను తపస్సు చేసే దేవత అంటారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తి, సిద్ధి రెండూ లభిస్తాయని పండితులు చెబుతారు. దుర్గాదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయడం కారణంగా బ్రహ్మచారిణిగా పిలవడం జరిగిందనేది పురాణ కథనం. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, సహనం, ధైర్యం వంటివి లభిస్తాయని పండితులు చెబుతారు.'ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమః’ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే కోరిన కోరిక సిద్ధిస్తుందని నమ్మకం.నైవేద్యం: అల్లం గారెలు, పులిహోర (చదవండి: అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ!) -
అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ!
ఇవాళ నుంచే శరన్నవరాత్రులు ప్రారంభం. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు వివిధ అలంకారాలతో, స్తోత్ర పారాయణాలతో అమ్మవారిని భక్తులు కొలుచుకుంటారు. ఈ పర్వదనాల్లో పలువురు అమ్మవారి శక్తి పీఠాలను దర్శించి తరిస్తారు. ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆలవలం అయిన ఈ పుణ్యభూమిలో స్వయంగా అమ్మవారే వచ్చి కొలువై భక్తులను రక్షిస్తున్న అద్భుత ఆలయాలు కూడా ఉన్నాయి. వాటి వైభవం అంత ఇంత కాదు. అలాంటి అద్భుత పుణ్యక్షేత్రాల్లో ఒకటి రాజస్థాన్‌కి చెందిన ఇడాన మాత ఆలయం. ఈ ఆలయంలో జరిగే అద్భుతం సైన్సుకే అంతు చిక్కని మిస్టరిగా చెప్పొచ్చు. ఈ నవరాత్రులు పురస్కరించుకుని ఆ ఆలయ విశిష్టత గురించి సవివరంగా తెలుసుకుందామా..!. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాయత్రి శక్తి పీఠ్ ఆలయంలో దుర్గమ్మ ఇడాన మాతగా పూజలందుకుంటోంది. ఈ అమ్మవారికి చైత్రమాసంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో జరిగే అద్భతం తిలకించేందుకు భక్తులు బారులు తీరి ఉంటారు. ఆ నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారు అగ్నిస్నాన మాచరిస్తుందట. ఉన్నట్టుండి సడెన్‌గా దానంతట అవే అగ్నికీలలపు పుట్టి అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్లుగా సర్వత్రా మంటలు వ్యాపిస్తాయి. అయితే ఇక్కడ అమ్మవారి ఆలయం చత్రుస్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. దాదాపు 10 నుంచి 20 అడుగులు మేర అగ్నికీలలు దానంతట అవిగా ఉద్భవిస్తాయట. ఆ సమయంలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు, వస్త్రాలు బూడిద అవుతాయే తప్ప అమ్మవారి విగ్రహం చెక్కు చెదరదట. అంతేగాదు ఈ విగ్రహం వేల ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఏటా ఈ నవరాత్రుల ప్రారంభమయ్యే తొలి రోజునే అగ్ని స్నానమాచరిస్తారట. అప్పటి దాక ఆలయంలో పూజల జరుగుతూ కోలహాలంగా ఉంటుందట. ఎప్పుడు సంభవిస్తుందో.. ఎలా జరుగుతుందో.. తెలయదు గానీ, ఉన్నట్టుండి హఠాత్తుగా ఆలయం చుట్టూ అగ్నికీలలు వ్యాపిస్తాయని చెబుతున్నారు స్థానికులు. ఇలా ఎందుకు జరుగుతుందనేది సైన్సుకే అంతు చిక్కని మిస్టరీలా మిగిలింది. దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోదనలు చేస్తున్న శాస్త్రవేత్తలు సైతం కారణం ఏంటనేది నిర్థారించలేకపోయారు. విచిత్రం ఏంటంటే అక్కడ మంటలు అంటుకునేలా అగరబత్తులు వంటివి ఏం వెలిగించరట. ఇక పురాణల ప్రకారం..వనవాస సమయంలో పాండవులు ఈ అమ్మవారిని దర్శించి పూజించారని కథనం. అలాగే మరో కథనం ప్రకారం ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు "జైసమంద్"ను నిర్మించే క్రమంలో రాజస్తాన్ రాజు జై సింగ్ ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారని అప్పటి నుంచే ఈ అమ్మవారు "ఇడానా మాత"గా పూజలు అందుకుంటోందని చెబుతుంటారు. చాలామంది భక్తులు ఈ వింత చేసేందుకు ఈ ఆలయానికి తరలివస్తుంటారని చెబుతున్నారు.త్రిశూలం విశిష్టత..పక్షవాత రోగులు, మానసిక విలాంగులు ఈ ఆలయాన్ని దర్శిస్తే రోగం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో అనేక త్రిశూలాలు దర్శనమిస్తాయి. అవి ఆ అద్భుతం జరిగినప్పుడూ..మంటలు పూర్తయిన తర్వాత భక్తులు అమ్మవారికి త్రిశూలాన్ని సమర్పిస్తారట. అయితే ఈ త్రిశూలాన్ని సంతానం లేని మహిళలు పూజిస్తే.. సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.उदयपुर शहर से 60 किलोमीटर दूर स्थित ईडाणा माता ने नवरात्रि के पहले दिन अंग स्नान किया है. माता ने अपना अग्नि स्वरूप दिखाया. हजारों साल से यहां प्रतिमा है. यहां माता ईडाणा अग्नि स्नान करतीं है. पिछला अग्नि स्नान पिछले वर्ष इन्ही दिनों में किया था.@abplive #idanamatamandir pic.twitter.com/nMx9sfKTC4— vipin solanki (@vipins_abp) April 9, 2024 (చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!) -
మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!
శాక్తేయులకు అత్యంత ఆరాధనీయమైనది కామరూప లేదా కామాఖ్యాదేవి ఆలయం. ఇక్కడే దశమహావిద్యలనే పేరు గల కాళి, తార, భువనేశ్వరి, బగళాముఖి, ఛిన్నమస్త, భైరవి, ధూమావతి, కమలాంబిక, షోడశి, మాతంగి అనే పది వేర్వేలు ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయమూ ఒక్కో విద్యకు ప్రసిద్ధమైనది. ప్రధాన ఆలయం కామాఖ్యాలయమే. సతీదేవి ఆత్మత్యాగానంతరం తీవ్రమైన వేదనతో తపస్సమాధిలో లీనమై ఉన్న పరమేశ్వరుని మనస్సును మార్చాలని దేవతలు సంకల్పిస్తారు. ఇందులో భాగంగా మన్మథుడు సమయం చూసుకుని, పూలబాణాలు వేసి, ఆయనకు తపోభంగం కలిగిస్తాడు. దాంతో ముక్కంటి తన మూడవకంటిని తెరచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. మన్మథుడికే కాముడు అనే పేరు. కాముణ్ణి దహించిన ప్రదేశం కనుక దీనికి కామాఖ్య అనే పేరొచ్చిందంటారు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మన్మథుడు తిరిగి రూపాన్ని పొందాడు. అయితే కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే రూపంతో కనిపిస్తాడు. ఇక్కడి బ్రహ్మపుత్రానదిలో భస్మకూటమనే పర్వతం ఉండటం శివుడు మన్మథుని భస్మం చేయడం, తిరిగి ఆయన రూపం పొందాడనడానికి ప్రతీకగా నిలుస్తుంది.ప్రత్యేకతలకు ఆలవాలం... ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో అన్యమతస్థుల దాడుల్లో ధ్వంసం కాగా, 17వ శతాబ్దంలో కుచ్ బీహార్ రాజు నరనారాయణుడు పునర్నిర్మించాడని శాసనాధారాలున్నాయి. తేనెపట్టు ఆకారంలో ఉన్న ఆలయ శిఖరం గణేశుడు తదితర దేవీ దేవతల శిల్పాలతో కనువిందు చేస్తుంది. మాంత్రికులకు, తాంత్రికులకు, వామాచారులకు, క్షుద్రపూజలు చేసేవారికి ఈ ఆలయమే ఆధారం.కారణం ఇది సతీదేవి యోని భాగం పడిన ప్రదేశం. మూడు మంటపాలుగా నిర్మించి ఉంటుంది. అందులో మొదటి ప్రాకారంలో గుహలా ఉండే గర్భాలయంలో యోనిచిహ్నం ఉన్న నల్లటి బండరాయి ఉంటుంది. దానికే పూజలు జరుగుతాయి.అయితే ఆ రూపం కనిపించకుండా భక్తుల దర్శనానికి ముందే పూలతో నింపేస్తారు. ఆ గుహ లోపల రాతి మీద ఎప్పుడూ జల వూరుతూ ఉంటుంది. అందువల్ల మూలవిరాట్టు ఎప్పుడూ తడిగా ఉంటుంది. గర్భాలయం అంతా చిత్తడిగా, జారుడుగా ఉంటుంది. ఆలయం బయటే శీతలాదేవి సన్నిధి ఉంటుంది. దీర్ఘవ్యాధులు ఉన్నవారు ఈమెను సేవించుకుంటే వాటినుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. పూజలు– ఉత్సవాలు... అమ్మవారికి రోజూ చేసే పూజలు గాక దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా దుర్గాపూజ జరిపిస్తారు. ఇవిగాక ఫాల్గుణ మాసంలో దుర్గాడియుల్ అని దుర్గాదేవికి ప్రత్యేక పూజ ఉంటుంది. అదేవిధంగా మానసాపూజ, పోహన్ బియా అంటే పుష్యమాసంలో కామేశ్వరుడికీ, కామేశ్వరీదేవికీ కల్యాణం జరిపిస్తారు. పసిపిల్లవానికి పాలు ఇస్తున్నట్లుగా ఉండే విగ్రహం పశ్చిమ ద్వారాన ఉంటుంది. అమ్మవారు భక్తులను ఎల్లప్పుడూ కన్నతల్లిలా కాపాడుతూ ఉంటుందని చెప్పేందుకు ప్రతీక ఇది. ఈ ఆలయంలో అమ్మవారు సంవత్సరానికి ఒకసారి జూన్ రెండవవారంలో బహిష్టు అవుతారు. స్థానికులు దీనిని అంబుబాషి సమయం అంటారు. ఈ నాలుగురోజులపాటు ఆలయాన్ని మూసి ఉంచి, అయిదోరోజున తలుపు తెరుస్తారు. అంబుబాషి రోజులలో అమ్మవారి ఆలయంతోపాటు మిగతా ఆలయాలన్నిటినీ కూడా మూసి ఉంచుతారు. గౌహతి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో చట్టగామ్లో శీతకుండం దగ్గర గల చంద్రశేఖర పర్వతంపై భగవతి అమ్మవారి ఆలయం ఉంది. కుండం లో నిత్యం అగ్ని ప్రజ్వరిల్లే శక్తి పీఠం ఇది. నరకాసురుడు కామాఖ్యాదేవిని ఆరాధించటం వల్లే అంతటి బలపరాక్రమాలు పొందగలిగాడని పెద్దలు చెబుతారు. అమ్మవారు, పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం కామకేళిలో తేలియాడుతుంటారని, అందువల్లే అమ్మవారికి కామాఖ్య అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాగే శివపార్వతులు ప్రతిరోజూ రాత్రిపూట ఆలయం అంతర్భాగంలో సర్పాల రూపంలో జూదం ఆడుతుంటారని విశ్వాసం. ఈ క్షేత్రంలోనే మరో ఐదు శైవాలయాలున్నాయి. అవి అఘోరేశ్వర, అమృతేశ్వర, కోటిలింగేశ్వర, సిద్ధేశ్వర, కామేశ్వరాలయాలు.కామాఖ్యలో ఇంకా ఏమేం చూడవచ్చు..?కామాఖ్యాలయం నీలాచలం కొండలపై ఉందని తెలుసుకదా, అక్కడే భువనేశ్వరీ ఆలయం, వనదుర్గాలయం ఉన్నాయి. పైన చెప్పుకున్న ఐదు శివాలయాలూ, దశమహావిద్యలకూ సంబంధించిన ఆలయాలూ ప్రధానాలయానికి చేరువలోనే ఉంటాయి. ఇవిగాక శుక్లేశ్వర కొండలపై జనార్దనాలయం, లక్ష్మీమందిరం, గ్రామదేవతా మందిరం, చక్రేశ్వరాలయం, విశ్వకర్మ మందిరం, కాళీపురంలో శివమందిరం, మహావీర్ అక్రాలయం, శని మందిరం, గోపాల మందిరం, కాళీమందిరం, హనుమాన్ మందిరం ఉన్నాయి. ఇంకా లోకనాథాలయం, శీతలామందిరం, నామ్ ఘర్ ఆలయం, గోశాల నేపాలీ మందిరం, రామ్ ఠాకూర మందిరం ఉన్నాయి. ఇవిగాక దిహింగ్ సరస్సు, బుద్ధ మందిరం, నౌకామందిరం, ఎల్విజిస్ మ్యూజియం, తోరుణామ్ ఫుకాన్ పార్క్, శ్రీ జలరామ్ మందిరాలను కూడా సందర్శించవచ్చు.ఆలయానికి ఎలా వెళ్లాలి..?దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి గువహతికి వెళ్లేందుకు, బస్సులు, రైళ్లు, విమానాలూ ఉన్నాయి. గువహతి రైల్వేస్టేషన్ నుంచి 6 కిలోమీటర్లు, ఏర్΄ోర్టునుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలున్నాయి. పిలవని పేరంటానికి వెళ్లి, కన్నతండ్రి చేత ఘోరపరాభవం పొందిన సతీదేవి, ఆ అవమాన భారంతో ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి, అక్కడకు చేరుకున్న శివుడు ఆమె శరీరాన్ని భుజాలమీదకు ఎత్తుకుని రుద్రతాండవం చేస్తుంటాడు. సతీదేవి శరీరం అక్కడ ఉన్నంతసేపూ శివుడిని ఆప శక్యం కాదని తెలిసిన విష్ణువు తన చక్రాయుధాన్ని ఉపయోగించి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు చేస్తాడు. అవి 108 ఖండాలుగా భూలోకంలోని వివిధ ప్రదేశాలలో పడతాయి. ఆమె శరీరంలోని కీలకమైన భాగాలు పడిన ప్రదేశాలలో తిరిగి అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి, అలయాలు నిర్మించారు పూర్వులు. అవే అష్టాదశ శక్తిపీఠాలు. వాటిలో అమ్మవారి యోనిభాగం నీలాచలం కొండలపై పడింది. అదే కామాఖ్యా పీఠంగా గుర్తింపు పొంది, కామాఖ్యాదేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది.ఇతర విశేషాలు..ఎగుడు దిగుడు కొండలు, గుట్టలు, లోయలు ఉండే ఈ ప్రదేశానికి అసమ దేశం అని పేరు. అసమ కాస్తా అస్సాంగా, అసోమ్గా రూపాంతరం చెందింది. శ్రీహరి కొలువై ఉన్న ప్రదేశం కాబట్టి దీనికి హరిక్షేత్రం అని కూడా పేరు. అందుకే అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం లో హరిక్షేత్రే కామరూపా అని ఉంటుంది. ఇక్కడ అమ్మవారి రూపం కానీ, విగ్రహం కానీ ఏమీ ఉండవు. కామాఖ్యాదేవికి నలుపు రంగంటే ప్రీతి. జంతు బలులు ఇక్కడ పరిపాటి. అదీ నల్లటి జంతువులనే బలివ్వాలి. ఆడ జంతువులను వధించరాదని నియమం. ఇది అమ్మవారి యోనిభాగం పడిన ప్రదేశం కావడం వల్ల శివుడు, అమ్మవారు నిత్యం కామకేళిలో మునిగి తేలుతూ ఉంటారని ప్రతీతి. – డి.వి.ఆర్. భాస్కర్(చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!) -
శరన్నవరాత్రులు..తొలిరోజు బాలాత్రిపుర సుందరిగా..
త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ముఖ్యంగా వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఈ ఆశ్వయుజం. జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారాలను ధరించిన మాసం...ఇవాళ నుంచే దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి మహిళలు, భవాని భక్తులు, నియమ నిష్టలతో అమ్మవారిని ఆరాధించటం ప్రారంభిస్తారు. తొలిరోజు నుంచి మొదలు పెట్టి చివరి రోజు వరకు అమ్మవారిని వివిధ అలంకారాలతో కొలుచుకుంటారు. ఆ క్రమంలో తొలిరోజు అమ్మవారు ఏ రూపంలో భక్తులకు ధర్శనమివ్వనుంది, ఏ నైవేద్యం నివేదిస్తారో చూద్దామా..!అమ్మవారిని బుధవారం అక్టోబర్ 03న సుమహుర్తంలో నవరాత్రలు పూజలందుకోమని స్వాగతం పలుకుతూ కలశస్థాపన చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి అమ్మవారిని రోజుకో అవతారం రూపంలో అలంకరణ చేసి భక్తితో ఆరాధిస్తారు. ఇంట్లో పూజ చేసుకునే వాళ్లు ఎవరైనా కలశస్థాపన సమయం ఉదయం 4:16 ని॥ లకు ఒకవేళ ఆ సమయానికి చేయలేకపోతే, 8 గంటలలోపు కలశ స్థాపన చేయాలి. అప్పుడే ఆఖండ దీపం కూడా పెట్టడం జరుగుతుంది. ఈ తొమ్మిది రోజులు ఎవరీ శక్తిసామర్థ్యాల మేరకు వారు వివిధ స్తోత్ర పారాయణాదులతో అమ్మవారిని ఆరాధించి అనుగ్రహం పొందే ప్రయత్నం చేస్తుంటారుతొలిరోజు..తొలి రోజు ఆయా ప్రాంతాల వారీగా అమ్మవారిని అలంకరించి ఆరాధించడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మను తొలిరోజు బాలా త్రిపురసుందరీగా అలంకారిస్తారు. ఈ అమ్మ దర్శనం కోసం లక్షలాది భక్తులు బారులు తీరి ఉంటారు. ఈ అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే..సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పది. విద్యోపాసకులకు మొట్టమొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెపుతున్నాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి.నైవేద్యంగా కట్టుపొంగలి లేదా పులగం నివేదిస్తారు.మరి కొన్నిచోట్ల తొలిరోజు పాఢ్యమి తిథి పురస్కరించుకుని అమ్వవారిని శైలపుత్రిగా లేదా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆరాధిస్తారు.శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్! వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్!!..నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది. -
పూల సంబరం..రెండో రోజు 'అటుకుల బతుకమ్మ'
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన పూల సంబరాలు మొదలయ్యాయి. ప్రతి ఇల్లు పూల రంగులతో కళకళలాడుతుంటుంది. ఎటు చూసిన జానపద గీతాల సందడులే. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రజలంతా బతుకమ్మ పండుగకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు సంబరాలు అంబారాన్నంటేలా అంగరంగ వైభవంగా సాగాయి. ఇక రెండో రోజు అంటే ఈరోజున(అక్టోబర్ 03) అటుకుల బతుకమ్మను సిద్ధం చేసి ఆడిపాడతారు. గునుగు పూలు, తంగేడు,బంతి, చామంతి, గుమ్మడి, బీర, కట్ల వంటి పూలతో బతుకమ్మను పేర్చి అందంగా తీర్చి దిద్దుతారు.. గౌరమ్మ పాటలతో రంగురంగుల పూలను కీర్తిస్తూ బతుకమ్మ పండుగ వేడుకగా చేసుకుంటారు. అయితే దీన్ని చిన్నారులే ఎక్కువగా చేసుకోవడంతో ఈ బతుకమ్మకు అటుకల బతుకమ్మ అనే పేరు వచ్చిందని కథనం. అయితే పిల్లలు ఆటకు అటుకులు, పప్పులు, బెల్లమే కదా ఉపయోగిస్తారు. అందుకనే ఈ బతుకమ్మకు చిన్నిపిల్లలు ఇష్టంగా తినే అటుకులనే నైవేద్యంగా సమర్పిస్తారు. (చదవండి: బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ) -
దసరా.. ఆ సరదానే వేరు..!
తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు..రంగురంగుపూల బతుకమ్మలు.. ఇంటింటా పిండి వంటలు.. ఆనందోత్సాహాలతో ఆలింగనాలు..పిల్లల కేరింతలు... పెద్దల పలకరింపులు.. రాత్రుళ్లు దీపాల కాంతులు.. టపాసుల మోతలు ఇవే కదా.. దసరా సంబురాలు..చిన్నపండుగొస్తుందంటే నెల ముందు నుంచే హడావిడి మొదలైపోతుంది. అలాంటిది అన్నింట్లోనూ పెద్ద పండుగ. . అలాంటిది అన్నింట్లోనూ పెద్ద పండుగ. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ దసరా వచ్చిందంటే.. ఊరూవాడంతా సంబురాలే. పట్నం విడిచి పల్లెకు పోవడానికి రెండు మూడు నెలల ముందే టికెట్స్ బుకింగ్ అయిపోతాయి. షాపింగ్ మాల్స్ జనంతో కిటకిటలాడతాయి. స్వీట్ షాపుల్లో ఆర్డర్లు పెరిగిపోతాయి. ఇలా... చెప్పుకుంటూ పోతే పండుగ రోజుల్లో ప్రతి క్షణం మనసుకు సంతోషాన్నిచ్చేదే.తొమ్మిది రోజుల పండుగతొమ్మిది రోజులు జరిగే ఈ పండుగలో.. ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో పూజిస్తారు. అమ్మవారి తొమ్మిది రూపాల పేర్లు.. శైల పుత్రి, బాలా త్రిపుర సుందరి, గాయత్రీ దేవి, మహాలక్ష్మి దేవి, అన్నపూర్ణేశ్వరీ దేవి, లలితా త్రిపుర సుందరీ, మహా సరస్వతి దేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, శ్రీరాజరాజేశ్వరి దేవి.ఇక పదవ రోజు.. విజయదశమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. పొద్దున్నే లేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసి, తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు. రకరకాల ఆకులు, పండ్లు కూరగాయలు, ధూపదీపనైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేస్తారు.పురాణాల్లో రాక్షస వధ కోసంమహిషాసుర మర్దిని స్తోత్రందసరా రోజున మహిషాసుర మర్దిని దేవిని పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని మొక్కుతూ ‘అయిగిరి నందిని' స్తోత్రం చదివితే కొత్త శక్తి వస్తుంది అంటారు. దసరా రోజునే కాకుండా మిగతా రోజుల్లోనూ ఈ స్తోత్రం చదవొచ్చు. జీవితంలో నిరాశ కలిగినా, అనుకున్న పని చేయలేకపోతున్నా అమ్మవారిని తలచుకుంటే కొత్త శక్తి వస్తుందని చాలామంది నమ్ముతారు.*అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే! గిరి వర వింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే! భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే!జయ జయ హే మహిషాసుర మర్ధిని రమ్యకపర్దిని శైలసుతే!!*మంచి తరపున పోరాడిన వాళ్లు తమ ఆయుధాలకి పని చెప్పిన సందర్భం ఇదే. కాబట్టి చెడు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయుధపూజ చేస్తారు. రంగురంగుపూలతో బతుకమ్మ పేరుస్తారు. ఆడపడుచులంతా బతుకమ్మ చుట్టూ చేరి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...' అంటూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ ఎంగిలిపూల, అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్న ముద్దల, సద్దుల బతుకమ్మ అంటూ పూజిస్తారు.జమ్మి చెట్టు కథమహాభారతంలోని ఒక కథ కూడా విజయదశమి పండుగ నేపథ్యంగా ఉంది. పాండవులు రాజ్యాన్ని విడిచి అరణ్యవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చిన రోజు.. వాళ్లకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి, 'తిరిగొచ్చేవరకూ వాటిని చూసుకో” అని జమ్మి చెట్టుకి కడతారు. అరణ్యవాసం పూర్తయ్యాక వాళ్లు ఆశ్వయుజ మాసంలోని దశమి రోజున తిరిగొచ్చి తమ ఆయుధాలను తీసుకుంటారు. ఆ తర్వాత కౌరవులపై యుద్ధం చేసి తిరిగి తమ రాజ్యాన్ని పాండవులు దక్కించుకున్న విషయం తెలిసిందే. వాళ్లు దశమిరోజున జమ్మిచెట్టు దగ్గరకు తిరిగి రావడం వల్లే దసరా పండుగను జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఆరోజున జమ్మి చెట్టుకి పూజలు కూడా చేస్తారు. అదే రోజు పాండవులు జమ్మిచెట్టుపై ఒక పాలపిట్టను చూశారు. అందుకని దసరా రోజున పాలపిట్టను చూసి, జమ్మిచెట్టుకు మొక్కితే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ కారణంగానే ఆయుధపూజ చేస్తారు.దసరా రోజు రావణ సంహారం ఎందుకు ?దసరా రోజున రామాలయాలు రామనామంతో మారుమోగిపోతాయి. ఎందుకంటే రామాయణ నేపథ్యంలో కూడా దసరా గురించి ఒక పురాణ కథ ఉంది. శ్రీరాముడు లంకలో రావణుడ్ని చంపింది దశమిరోజే. రాముడు దేవుడు.. రావణుడు రాక్షసుడు. ఇలా చూసినా చెడుపై మంచి గెలవడమే ఉంది. కాబట్టి దసరా రోజున రామున్నిస్మరించుకుంటారు. పెద్ద మైదానాల్లో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. పది తలల రావణుడి బొమ్మను చేసి, దాన్ని బాణాసంచాతో కాలుస్తారు. దసరా తర్వాత 21 రోజులకు దీపావళి వస్తుంది. రావణుడ్ని చంపిన తర్వాత రాముడు తన పరివారంతో అయోధ్యను చేరింది కూడా అప్పుడే.విజయదశమి విజయగాథదసరా రోజున ప్రతి ఒక్కరూ మహిషామర్ధిని కథ చెప్పుకుంటారు. మహిషాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఇంద్రుడి పదవి కోసం దేవతలతో యుద్ధం చేసి వాళ్లను ఓడిస్తాడు. ఆ తర్వాత స్వర్గలోకాన్నే కాకుండా విశ్వాన్నంతటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ రాక్షసుడి బారి నుంచి లోకాన్ని కాపాడాలని ఇంద్రుడు త్రిమూర్తులతో చెప్పుకుంటాడు. అప్పుడు ఆ త్రిమూర్తులకు వచ్చిన కోపం ఒక ప్రకాశవంతమైన శక్తిగా మారుతుంది. ఆ శక్తే ఒక స్త్రీ రూపమై జన్మిస్తుంది. త్రిమూర్తులతో శివుని శక్తి ముఖంగా, విష్ణువు శక్తి భుజాలు, చేతులుగా, బ్రహ్మ శక్తి పాదాలుగా ఆ స్త్రీ మహిషాసురుడిని చంపే శక్తిగా అవతరిస్తుంది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణ దేవుడు పాశాన్ని.. ఇలా ఒక్కో దేవుడు ఒక్కో ఆయుధాన్ని ఇచ్చి మహిషాసుర మర్దిని దేవిని యుద్ధానికి పంపిస్తారు.ఆ యుద్ధంలో భీకరంగా పోరాడి మహిషాసురుడ్ని మట్టుబెడుతుంది అమ్మవారు. చెడుపై మహిషాసుర మర్దిని సాధించిన ఈ విజయానికి గుర్తుగా ఆశ్వయుజ మాసంలో వచ్చే దశమినాడు దసరా పండుగ జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఉగ్రరూపం 'మహిషాసుర మర్దిని' రూపమే. అందుకే దసరా అనగానే దేవీ నవరాత్రి ఉత్సవాలు కళ్లముందుకొచ్చేస్తాయి.అలయ్ బలయ్జమ్మి చెట్టు ఆకుల్ని ‘బంగారం'తో పోలుస్తారు. అందుకని జమ్మి చెట్టుకు మొక్కినాక జమ్మి ఆకుల్ని తెంపి బంధువులకు, స్నేహితులకు ఇస్తారు. అంటే బంగారాన్ని చేతిలో పెట్టి కౌగలించుకోవడం అన్నమాట. ఈ సంప్రదాయం పేరే అలయ్ బలయ్. మగవాళ్లు ఆడబిడ్డల కాళ్లకు దండం పెట్టి జమ్మి ఆకులని చేతికిస్తారు. నాన్నమ్మ, అమ్మమ్మ, మేనత్త, అమ్మ, చిన్నమ్మలే కాదు.. అక్క, చెల్లి, వదినల కాళ్లు కూడా మొక్కుతారు. ఇలాంటి సంప్రదాయం ఒక్క తెలంగాణలోనే ఉంది. జమ్మి చెట్టును పూజిస్తూ చదివే స్తోత్రం..శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశినీ అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ!! కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్ సుఖం మయా తత్ర నిర్విఘ్న కర్రీత్వం భవ శ్రీరామ పూజితా!!ఆయుధ పూజ విశేషంకులవృత్తులు చేసేవాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధమే వాళ్లకు జీవితాన్నిస్తుంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీది నుంచి తీసిన రోజున దసరా. అందుకే ఆయుధపూజ చేయిస్తారు. బండి, మెషిన్, నాగలి, కొడవలి, పిల్లలకైతే పుస్తకాలు కూడా ఆయుధాలే. ఆయుధపూజ చేయించడం ద్వారా విజయం మనవైపే ఉంటుందని నమ్ముతారు.వంటింటి ఘుమఘుమలుదసరా వస్తుందంటేనే రకరకాల పిండి వంటలు చేయడానికి రెడీ అయిపోతారు. అరిసెలు, అప్పలు, సకినాలు, లడ్డూలు.. ఇలా ఎన్నో రకాల స్వీట్లు, హాట్లు వండిపెడతారు. వీటితోపాటు అమ్మవారికి రోజుకో వెరైటీలు నైవేద్యంగా పెడతారు. అంతేకాదు.. దసరా పండుగకు నోరూరించే నాన్‌వెజ్ స్పెషల్స్ అస్సలు మిస్సవ్వరు.(చదవండి: బతుకమ్మ సంబరాలకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ) -
బతుకమ్మకు వేళాయే.. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి చిహ్నం ఈ బతుకమ్మ పండుగ. ప్రకృతితో మమేకమై పండుగ ఇది. జానపద గీతాలతో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆడుతూ పాడుతూ చేసుకునే గొప్ప పండుగ. రంగురంగుల పూలతో తెలంగాణలోని ప్రతి గ్రామం శోభాయమానంగా మారిపోతుంది. ప్రకృతి రమణీయత కొట్టొచ్చినట్లుగా కనిపించే కలర్‌ఫుల్ పండుగ ఇది. ఇవాళ నుంచే (అక్టోబర్ 2) బతుకమ్మ సంబరాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆ పండుగ విశిష్టత, తొలిరోజు జరుపుకునే ఎంగిలి బతుకమ్మ పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది తదితర విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.బతుకు అంటే తెలుగులో జీవించే లేదా జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దాన్నే బతుకమ్మ అని అంటారు. అంటే.. జీవితమంతా సంతోషకరంగా సాగిపోవాలనేది ఈ బతుకమ్మ పండుగ ఆంతర్యం. ఈ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది.దీన్ని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి.. వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడి పాడడం సంప్రదాయం. అయితే ఇలా తొలిరోజున పేర్చిన బతుకమ్మను 'ఎంగిలిపూల బతుకమ్మ'గా పేర్కొంటారు. అలాగే ఈ రోజున అమ్మకు తులసి ఆకులు, వక్కలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆట పూర్తయిన తర్వాత మహిళలు ఈ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా తొలి రోజు బతుకమ్మ పూర్తవుతుంది.ఆ పేరు ఎలా వచ్చిందంటే..బతుకమ్మ తయారీ కోసం ఒక రోజు ముందే పూలను సేకరించి అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారని కథనం. కొన్ని ప్రాంతాలలో తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఏది ఏమైనా బతుకమ్మ ఓ కమనీయ పూల సంబరం. ఈ రోజున మహిళలు చక్కగా ముస్తాబై గునుగు, తంగేడు, కట్ల, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, మందార, పారిజాతం, కమలం, తామర, గన్నేరు వంటి రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ ఎంగిలిపూల బతుకమ్మకు స్వాగతం పలుకుతారు. ముందుగా ఇంట్లో బతుకమ్మను పూజిస్తారు. ఆ తర్వాత సాయంత్రం సమీపంలో ఉన్న దేవాలయాలు, చెరువుల వద్ద మహిళలంతా గుమిగూడి సమిష్టిగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారునైవేద్యంగా..నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. -
ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!
ఈ ఏడాది దసరా వెకేషన్‌కి స్కూల్‌కెళ్లే పిల్లల పేరెంట్స్ హాయిగా పోర్బందర్ బాట పట్టవచ్చు. గాంధీజీ పుట్టిన నెలలో గాంధీజీ పుట్టిన నేల మీద విహరించడంలోని సంతృప్తిని ఆస్వాదించవచ్చు. జాతిపితకు నివాళులర్పించనూ వచ్చు. పిల్లలకు ఇది మరిచిపోలేని పర్యటనగా మిగిలిపోతుంది.ఈ టూర్లో బాపూ పుట్టిన ఇంటిని, ఆయన స్మారకార్థం నిర్మించిన కీర్తిమందిర్, అందులో ఆయన జీవితంలోని ముఖ్యఘట్టాలతో ఉన్న ఫొటో ఎగ్జిబిషన్, గాంధీజీ నూలు వడికిన రాట్నం... వీటన్నింటినీ చూసిన తర్వాత గాంధీజీకి చేతులెత్తి మొక్కుతాం. పిల్లల మనసులు గౌరవంతో నిండి΄ోతాయి. గాంధీజీ పుట్టిన ఇంటి నిర్మాణం ఆసక్తికరంగా ఉంటుంది.ఉడెన్ కార్వింగ్, రాతి కిటికీలను పోలిన డిజైనర్ విండోలతో అక్కడక్కడా పర్షియన్ నిర్మాణశైలితో ఎగుమ మధ్యతరగతి కుటుంబాన్ని పోలి ఉంటుంది. ఇంటి లోపల ఏర్పాట్లను గమనిస్తే నిరాడంబర జీవనశైలి అనిపిస్తుంది. గోడల మీద ఆయిల్ పెయింటింగ్స్ కళాత్మకతను ప్రతిబింబిస్తాయి. ఇంట్లో గాంధీ పుట్టిన ప్రదేశం ప్రత్యేకంగా మార్క్ చేసి ఉంటుంది. బాపూజీ ఇంటి వెనుక వైపునున్న కస్తూర్బా గాంధీ ఇంటిని మర్చిపోకూడదు.బాపూ మందిర్, కీర్తిమందిర్లను చూసిన తరవాత బయటకు వస్తే చౌరాస్తాలో గాంధీజీ విగ్రహం ఉంటుంది. ఆ సెంటర్‌ని గాంధీ చౌక్ అంటారు. ఈ టూర్లో గాంధీ స్మారకాలతోపాటు చూడాల్సినవి చాలా ఉన్నాయి. శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముని మందిరం, వాళ్ల గురువు సాందీపుని మందిరం, హుజూర్ ప్యాలెస్, బర్డ్ సాంక్చురీ, తారామందిర్ (ప్లానిటేరియం), భారత్ మందిర్(జామెట్రికల్ మాథ్స్ ప్రదర్శనాలయం), రామకృష్ణ మిషన్ ఉన్నాయి. చక్కటి ఎయిర్‌పోర్టు కూడా ఉంది. అరేబియా తీరంలో సూర్యాస్తమయం ఈ టూర్లో బోనస్.(చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
ధర్మం చెప్పింది విను..!
ధర్మం చెప్పడానికి ప్రమాణాలుగా శృతి, స్మతి, పురాణం, శిష్టాచారమ్ కాగా చిట్టచివరిది– అంతరాత్మ ప్రబోధమ్. లోపలినుంచి భగవంతుడు చెబుతుంటాడు... ఇది తప్పు.. అని చేయకు. ఇది సరైనదే..చెయ్..అన్నప్పుడు చేసేయ్. ఏది చేయమని అంతరాత్మ ప్రబోధించిందో అది ధర్మం. ఏది వద్దని హెచ్చరించిందో అది అధర్మం. అందువల్ల అంతరాత్మ ప్రబోధమ్ చివరి, అథమ ప్రమాణం. కర్తవ్యమ్... నేను చేయవలసినదేది? అక్కడ మొదలు కావాలని చెబుతుంది శాస్త్రం. నేనేమి చేయాలో నాకు తెలియాలి. అంటే దానికి చదువుకోవాలి.. ఇది దేనికోసం.. భగవంతుని అనుగ్రహం కోసం. భక్తి రెండుగా మొదలవుతుంది. భగవంతుడు వేరు, నేను వేరు అని... నా కర్తవ్యాన్ని నేను నిర్వహించడం మొదలుపెడితే.. ΄ోయి ΄ోయి నది సముద్రంలో కలిసిపోయినట్టు.. అది ఒకటవుతుంది.. అప్పుడు ఇక తానెవరో తెలిసిపోతుంది. అంటే కర్తవ్యాన్ని నిర్వహిస్తూపోతే ఒక సత్యం తెలుస్తుంది. అదేమిటి? ఇది నేను కాదు –అని. నోటితో చెబితే అది తెలిసి΄ోయిందని కాదు... అనుభవంలోకి రావాలి. ఇది.. ఈ శరీరం.. నేను కాదు, లోపల ఒకటి ఉంది. అది నేను. అదే సత్యం. అది కత్తిచేత నరకబడదు, అగ్నిచేత కాల్చబడదు, నీటిచేత తడపబడదు, వాయువు చేత కొట్టబడదు.... అదే నేను. అంతే తప్ప ఇది.. అంటే ఈ శరీరం నేను కాదు. .. అని తెలుసుకోవడం. అలా తెలుసుకున్నట్టు గుర్తు ఏమిటంటే... ఇది .. ఈ శరీరం పడిపోతున్నా... ఇది ‘నేను’ కాదు అని లోపల ఉన్న ‘నేను’ చూస్తూ సాక్షీభూతంగా ఉండడం. ఆ అనుభవంలోకి మారడం దగ్గర ఈశ్వర కృప కావాలి. ఈశ్వర కృప ఎవరికిస్తారు? ‘‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరఃసంయతేంద్రియః/ జ్ఞానం లబ్ద్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి’’ ... శ్రద్ధావాన్ లభతే జ్ఞానం... గురువుగారు చెప్పిన మాట, శాస్త్రాలు చెప్పిన సూత్రం సత్యం అనిముందు నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసంతో, శ్రద్ధతో ప్రారంభం అయినప్పుడు వారికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. చదువుకున్న దాని మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఇంద్రియాలను కట్టడి చేస్తాడు. అక్కడ ‘ధర్మేచ అర్థేచ కామేచ ఏషా నాతి చరితవ్యా... అక్కడ తనను తాను ధర్మచట్రంలో ఇముడ్చుకోగలుగుతాడు. ధర్మాన్ని అతిక్రమించని అర్థకామాలు ΄పొందుతాడు. అప్పుడు ధర్మకామార్థసిద్ధయేత్... గృహస్థాశ్రమానికి ఆశీర్వచనం అయి΄ోయింది. ‘నీకు ధర్మార్థ కామములు సిద్ధించుగాక. ధర్మము నుండి విడివడిపోకుండుగాక!.. మనుష్య జన్మను సద్వినియోగం చేసుకోవడానికి పరమ తేలిక మార్గం–గహస్థాశ్రమం. అంటే నీ కర్తవ్యం తెలియడం దగ్గర మొదలయింది. కర్తవ్యం తెలియకుండా నేనెవరో తెలుసుకుంటానంటే ... అది సాధ్యం కాదు. దానికది మార్గం కాదు. భగవాన్ రమణులలాగా గోచి పెట్టుకుని... నేనెవరో నాకు తెలిసిపోతుంది .. అంటానంటే కుదరదు. మీరు జ్ఞానిని అనుకరించలేరు. సాధన పండితేనే జ్ఞానం కలుగుతుంది. సాధనకు అర్హత.. అధ్యాపనం బ్రహ్మయజ్ఞః. ఏవి నీకోసం రుషులు ఇచ్చారో వాటిని చదువు. వేదాలన్నీ చదవనక్కరలేదు. రామాయణం, భాగవతం చదువు. భారతం పంచమ వేదం. అది సమస్త పురాణ సారాంశం. అవి చదువు. ఇవి లోకం కోసం ఇస్తున్నా.. అన్నాడు వ్యాసుడు. (చదవండి: మార్పు మనుగడ కోసమే...) -
మార్పు మనుగడ కోసమే...
జీవితంలో ఎదురయ్యే వివిధ పరిస్థితులకు మనం ఏ విధంగా స్పందిస్తాం... వాటిని ఏ కోణంలో చూస్తామనే విషయం మీదే మన అభివృద్ధి, ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.. మనసు బాగోలేనపుడు చాలా విషయాలను మనం సమస్యలుగా చూస్తాం.. ప్రశాంతంగా ఉన్నపుడు అవే పరిస్థితులను సవాళ్లుగా భావిస్తాం. అందువల్ల మన అభివృద్ధి ఏదైనా అది మనం ఆయా సమస్యలను స్వీకరించే స్థితి మీదే ఆధార పడి ఉంటుంది..మనిషి జీవితం పూల పాన్పు కాదు.. అదేవిధంగా ముళ్ళ కిరీటం కూడా కాదు.. ఈప్రాథమిక సూత్రాన్ని అవలోకనం చేసుకుని మన జీవితంలో వచ్చే ప్రతి మార్పును ఆహ్వానించినపుడే మన జన్మకు సార్ధకత లభిస్తుంది.. బతుకూ పండుతుంది. మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు వెరుస్తూ, మార్పును ఆహ్వానించకపోతే అది మనలో ఆత్మన్యూనతను పెంచుతుంది. ఒక పనిలో విఫలమైనపుడు దానిలో ఎందుకు విఫలమయ్యామా... అని బుర్ర బద్దలు కొట్టుకుని మనసు పాడు చేసుకునే కన్నా, ఏం జరిగినా అది మన మంచికోసమేనని ఆత్మను సంతృప్తి చేసుకుంటే మనసు కుదుట పడుతుంది. ఆనందం సొంతమవుతుంది. జీవితంలో ఎదురయ్యే మార్పును ఎప్పటికప్పుడు ఆహ్వానించి, దానిని మన జీవితానికి సోపానాలుగా మార్చుకోవాలి తప్ప, ఆత్మన్యూనతతో కుంగి పోకూడదు.కనుక మార్పు అన్నది ఈ సృష్టిలో నిరంతరం జరిగే ఒకానొక సహజమైన ప్రక్రియ... పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ మనలో శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా సంఘపరంగా, ఆత్మపరంగా ఇంకా అనేకానేక కోణాలలో, అనేకానేక స్థితులలో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి... అనివార్యం గా ఇలా మనలో జరిగే ప్రతి ఒక్క మార్పునూ మనం అంగీకరించాలి.కురుక్షేత్ర సంగ్రామంలో తాను అస్త్ర సన్యాసం చేస్తానని అర్జునుడు చింతించినపుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు. మార్పును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని, ఇది çసృష్టి ధర్మమని, మార్పును అంగీకరించినపుడే భవిష్యత్ నిర్దేశం కలుగుతుందని బోధించాడు. అలా శ్రీ కృష్ణభగవానుడి స్ఫూర్తితో అర్జునుడు యుద్ధం చేసి ధర్మ సంరక్షణలో తన వంతు పాత్ర పోషించాడు.ప్రతి ఒక్కరూ మార్పును అంగీకరించాలి. ఆధునిక పోకడలకు అనుగుణంగా వేగంగా దూసుకువెళ్లాలి. ఉన్నతంగా ఎదగాలనే వారు.. మనతో మనం పోటీ పడాలని మానసిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. మార్పును అంగీకరించకపోతే, మన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా వుంటుంది. కనుక మొదట్నుంచీ తల్లిదండ్రులు మార్పుకు అనుగుణంగా జీవితాలను మలచుకోవాలనే దృక్పథాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. వర్తమాన ప్రపంచానికి, పరిస్థితులకనుగుణంగా వారికి వారు నైపుణ్యాలు పెంచుకునే విధంగా ్రపోత్సహించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే హక్కును కూడా ఇవ్వాలి అలాగే, వారి వ్యక్తిత్వాలు, ్రపాధాన్యతలు, పరిమితులను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడాలి. కుటుంబాలు, పాఠశాలలు పిల్లల సామర్థ్యం, ఉత్సుకత, సృజనాత్మకత, అలవాట్లను పిల్లల భావి జీవితానికనుగుణంగా తీర్చిదిద్దినపుడు జీవితంలో వస్తున్న మార్పులను అంగీకరించే సామర్థ్యాన్ని ΄÷ంది, పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారన్న వాస్తవాన్ని గుర్తించి మసలుకోవాలి. దాసరి దుర్గాప్రసాద్ -
Ananda Nilayam: ఒకేచోట.. ఈ అష్టాదశ శక్తిపీఠాలు!
పురాణాల ప్రకారం, అమ్మవారిని ఆరాధించే దేవాలయాలలో ప్రశస్తమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. శివుడి అర్ధాంగి సతీదేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠాలను దర్శించుకుని, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని భక్తులు భావిçస్తుంటారు. రకరకాల కారణాల వల్ల కొంతమందికి శక్తిపీఠాల దర్శనభాగ్యం కరవవుతోంది. అలాంటివారికి అన్ని శక్తిపీఠాలను ఒకేచోట దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ అష్టాదశ శ«క్తిపీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించారు.అది ఎక్కడో కాదు తెలంగాణ, సిద్దిపేట జిల్లా, కొండపాక గ్రామ శివారులోని ఆనంద నిలయంలో! గత ఏడాది నవంబరులో.. ఇక్కడి అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో 18 శక్తిపీఠాలతో పాటు లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులనూ ప్రతిష్ఠించారు.గట్టు రాంరాజేశం గుప్త సంకల్పంతో..సిద్దిపేటకు చెందిన గట్టు రాంరాజేశం గుప్త అమ్మవారికి అపర భక్తుడు. అష్టాదశ శక్తి పీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఒకసారి, తన మనసులో మాటను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆనంద నిలయ వ్యూహకర్త కేవీ రమణాచారి ముందుంచారు. ఆయన ట్రస్ట్ సభ్యులతో చర్చించి, ఆనంద నిలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రాంరాజేశం రూ. 1.5 కోట్లను అందజేశారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమ ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాలను నిర్మించారు. అమ్మవార్ల రాతి విగ్రహాలను తమిళనాడులో తయారుచేయించారు. వీటిని పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రతిష్ఠించారు.22 దేవాలయాలు..పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదిహేడు మనదేశంలో ఉండగా, శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. మన దేశంలో ఉన్న కామాక్షీదేవి (కంచి, తమిళనాడు), శృంఖలాదేవి (కోల్‌కతా, పశ్చిమబెంగాల్), చాముండేశ్వరీదేవి (మైసూరు, కర్ణాటక), జోగులాంబ (ఆలంపూర్, తెలంగాణ), భ్రమరాంబికాదేవి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), మహాలక్ష్మీదేవి (కొల్హాపూర్, మహారాష్ట్ర), ఏకవీరాదేవి (మాహుర్, మహారాష్ట్ర), మహాకాళీదేవి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), పురుహూతికాదేవి (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), గిరిజాదేవి (జాజ్‌పూర్, ఒడిశా), మాణిక్యాంబాదేవి (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), కామాఖ్యాదేవి ( గౌహతి, అస్సాం), మాధవేశ్వరీదేవి (ప్రయాగ, ఉత్తరప్రదేశ్), వైష్ణవీదేవి (జమ్మూ, జమ్మూ– కశ్మీర్ రాష్ట్రం), మంగళగౌరీదేవి (గయ, బిహార్), విశాలాక్షీ (కాశి), సరస్వతీదేవి (శ్రీనగర్) రూపాలను కొండపాక శివారులోని ఆనంద నిలయంలో దర్శించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరకత లింగం, శివపార్వతులతో కూడిన 22 దేవాలయాలను నిర్మించడం విశేషం. ఆయా శక్తిపీఠాల్లో జరిగినట్లుగానే ఇక్కడా పూజాకార్యక్రమాలుంటాయి. ప్రతి పౌర్ణమికి హోమం, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు.సామాజిక సేవ.. ఆధ్యాత్మిక శోభ!ఆనంద నిలయంలో సామాజిక సేవతోపాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సుమారు వంద ఎకరాల్లోని ఈ ట్రస్ట్‌లో ఒకవైపు వృద్ధాశ్రమం, మరోవైపు అనాథాశ్రమం, ఇంకోవైపు సత్యసాయి పిల్లల హృద్రోగ ఆసుపత్రి, జూనియర్ కళాశాల ఉన్నాయి. భక్తులు, సామాజిక సేవకుల సందర్శనతో ఈ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. ఇది హైదరాబాద్‌కు 73 కిలోమీటర్లు, సిద్దిపేటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట, ఫొటోలు: కె సతీష్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్శక్తిపీఠాల్లో జరిగినట్టుగానే..ఇక్కడ పూజాకార్యక్రమాలన్నిటినీ శక్తిపీఠాల్లో మాదిరే జరుపుతాం. భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం పోస్తారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు శివుడికి, మరకత లింగానికి రుద్రాభిషేకం చేస్తాం. – పురుషోత్తమ రామానుజ, అర్చకుడుఅందరికీ దర్శనభాగ్యం కలగాలని.. అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకోవటం కొందరికి సాధ్యపడకపోవచ్చు. అలాంటివారికి శక్తిపీఠాల దర్శనభాగ్యం అందాలనేది నాన్నగారి కోరిక. కేవీ రమణాచారి, ఇంకెంతో మంది దాతల సహకారంతో నేడు అది నెరవేరింది. – గట్టు అమర్నాథ్, రవి, శ్రీనివాస్అమ్మవారి అనుగ్రహం..కొండపాకలో అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణం అమ్మవారి దయ. అమ్మవారి అనుగ్రహం, అందరి సహకారంతో దేవాలయ నిర్మాణాలు సాధ్యమయ్యాయి. – డాక్టర్ కేవీ రమణాచారి, ఆనంద నిలయ వ్యూహకర్తఇవి చదవండి: అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే.. -
Dussehra 2024 అమ్మవారికిష్టమైన ఘుమ ఘుమల చింతపండు, ఇంగువ పులిహోర
తెలుగువారికి పులిహోర లేనిదే ఏ పండుగ, వేడుక అయినా నిండుగా ఉండదు. అందులోనూ చింతపండుతో చేసి, ఇంగువ వాసనతో ఘుమఘుమలాడుతూ ఉంటే.. ఆహా అద్భుతం అంటూ ఆరగిస్తారు. ఇక దసరా నవరాత్రులలో అమ్మవారికి పులిహోర ఎంత ముఖ్యమైందో చెప్పాల్సిన పనిలేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, గుడిలో ప్రసాదమంత పవిత్రంగా, రుచికరంగా అద్భుతమైన పులిహోర తయారీ ఎలానో తెలుకుందాం పదండి!కావాల్సిన పదార్థాలు :బియ్యం పావుకేజీ, 100 గ్రా. చింతపండు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు,తాజాగా కరివేపాకు రెబ్బలు మూడు, నాలుగైదు పచ్చిమిరపకాయలు, ఆవాలు- రెండు టేబుల్ స్పూన్లు, అల్లం- చిన్నముక్క నాలుగు ఎండుమిర్చి , చిటికెడు ఇంగువ, కొద్దిగా బెల్లంపొడి, తాలింపు గింజలు, పల్లీలు లేదా జీడిపప్పుతయారీ ముందుగా బియ్యాన్ని(పాత బియ్యం అయితే బావుంటుంది) కడిగి, కాస్త పదునుగా అన్నాన్ని వండుకోవాలి. ఉడికేటపుడు కొద్దిగా ఆయిల్ వేస్తే మెత్తగా అయిపోదు. చింతపండు శుభ్రం చేసుకొని నీళ్లలో నానబెట్టుకోవాలి.అన్నం ఉడికిన తరువాత ఒక బేసిన్‌లోకి తీసుకొని వేడిగా ఉన్నపుడే రెండురెబ్బల కరివేపాకులు, పసుపు, ముందుగా నూరిపెట్టుకున్న ఆవాల ముద్ద కొద్దిగా ఉప్పు, నూనె వేసి కలిపుకోవాలి. మెతుకు నలిగి పోకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి.నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు తీసుకోవాలి. ఇపుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి చింతపండు పులుసుపోసి అది చిక్కగా అయ్యేంతవరకు ఉడిరకించుకోవాలి. ఇందులోనే చిటికెడు, పసుపు, ఉప్పు, నాలుగు పచ్చిమిరపాయలు చీల్చి వేసుకోవాలి. పులుసులో ఉడికి కారం లేకుండా తినడానికి బావుంటాయి. ఇందులోనే రవ్వంత బెల్లం కలిపి, స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ పులుసును చల్లారిన అన్నంలో అన్నీ బాగా కలిసేలాగా జాగ్రత్తగా కలపాలి.ఇక చివరిగా కడాయిలో ఆయిల్ పోసి, ఆవాలు, ఎండు మిర్చి వేసి, తరువాత వేరు సెనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు బాగా వేయించాలి. ఆ తరువాత కాస్తంత ఇంగువ వేయాలి. పోపు వేగి కమ్మటి వాసన వస్తున్నపుడు స్టవ్ మీదినుంచి దింపేయాలి.దీన్ని పులుసు కలిపి ఉంచుకున్న అన్నంలో కలిపితే.. ఘుమ ఘుమలాడే పులిహోర రెడీ. అమ్మవారికి నైవేద్యం పెట్టినంక , ఇంట్లోని వారందరూ తింటే ఆ రుచే వేరు! -
Dussehra 2024 : బతుకమ్మ బిడ్డ, బొడ్డెమ్మ పండుగ గురించి తెలుసా?
‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో నిచ్చమల్లె చెట్టెసె ఉయ్యాలో చెట్టుకు చెంబెడు ఉయ్యాలో నీళ్లయినా పోసె ఉయ్యాలోకాయలు పిందెలు ఉయ్యాలో గనమై ఎగిసె ఉయ్యాలోబతుకమ్మ పండుగలో అతి ముఖ్యమైంది బొడ్డెమ్మ పండగ. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఐదు రోజుల ముందు బహుళ దశమి తిధి నుండి దీన్ని ప్రారంభించుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో మూడు రోజుల ముందు బహుళ ద్వాదశి నుండి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాలలో భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ) ముందు ప్రారంభించి తొమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజించి,ఘ ఆటపాటలతో గౌరీ దేవిని పూజించి, తొమ్మిదవ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తారు.బతుకమ్మ బిడ్డె బొడ్డెమ్మ అని భక్తుల విశ్వాసం. అందుకే ఇది ఆడబిడ్డలకు ప్రత్యేకం. ఈ పండుగను బొడ్డెమ్మ పున్నమి కూడా అంటారు. బాలికలు, పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే బొడ్డెమ్మ ఆడుతారు.బొడ్డెమ్మ పండుగను తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. బొడ్డెమ్మను తయారు చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా ప్రాంతాల వారిగా తయారు చేస్తారు. పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ , పందిరి బొడ్డెమ్మ, బాయి(వి) బొడ్డెమ్మ. పీటమీద పూజించే బొడ్డెమ్మను పీట బొడ్డెమ్మ అనీ, గుంటల రూపంలో ఉండే బొడ్డెమ్మను 'గుంట బొడ్డెమ్మ' అనీ, పందిరిలా అలంకరించే బొడ్డెమ్మను 'పందిరి బొడ్డెమ్మ', బావిలాగా గొయ్యి తయారు చేసే బొడ్డెమ్మను 'బాయి బొడ్డెమ్మ' అని పిలుచుకుంటారు. ఆకారం ఏదైనా, పూజా విధానం మాత్రం ఒకేలా ఉంటుంది.బొడ్డెమ్మ ఆటలుభాద్రపద బహుళ పంచమి నుంచి చతుర్ధశి వరకు బొడ్డెమ్మ ఆడతారు. చెరువు మట్టి లేదా పుట్ట మట్టిని తెచ్చి చెక్కపీటపై ఐదు దొంతరులుగా వలయాకారంలో బొడ్డెమ్మను తయారు చేస్తారు. దీన్ని ఎర్రమట్టితో అలికి బియ్యం పిండి, కుంకుమ, పసుపుతో అలంకరించి, ముగ్గులు వేస్తారు. ఐదు అంతస్తులపైన కలశం పెట్టి అందులో బియ్యం పోస్తారు. పైన కొత్త గుడ్డతో చుట్టి తమలపాకులో పసుపు గౌరమ్మను ప్రతిష్ఠిస్తారు. ఈ గౌరమ్మకు ఉదయం ఇంట్లో భక్తితో పూజింజి సాయంత్రం ఇంటి వాకిట్లో అలుకు చల్లి చుక్కల ముగ్గులు వేసి పీట బొడెమ్మను తెచ్చి ప్రతిష్టించి సాయంత్రం పూసే ఉద్రాక్ష, బీర, మల్లె, జాజిపూలతో అలంకరించి ఫలహారాలు పెట్టి చుట్టూ తిరుగుతూ బొడ్డెమ్మ పాటలు పాడుతారు. చివరగా బొడ్డెమ్మను నిద్రపుచ్చే పాటలు పాడుతారు. పాడడం అయిపోయాక తెచ్చుకున్న ఫలహారాలు ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకుని బొడ్డెమ్మను ఎవరింట్లో ఆడుతున్నారో వారింట్లోనే దేవుని దగ్గర పెట్టి వెళ్లిపోతారు. ఇలా తొమ్మిదిరోజులు ఆడిన తర్వాత చివరిరోజు సాగనంపే పాటలు పాడి బావిలో నిమజ్జనం చేస్తారు. బొడ్డెమ్మను బావిలో వేసిన తెల్లారి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. తెలంగాణా పల్లెల్లో కొన్ని చోట్ల బొడ్డెమ్మ పండుగ సంబరాలు మొదలు కాగా, అక్టోబరు 2వ తేదీనుంచి ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు షురూ అవుతాయి. -
Dussehera 2024 : నవరాత్రి స్పెషల్, కమ్మని ప్రసాదాల తయారీ
దసరా వేడుకలకు సమయం సమీపిస్తోంది. ఒకవైపు షాపింగ్, మరోవైపు పిండివంటలు సందడి షురూ అయిపోయింది. తొమ్మిది రోజులు అమ్మవారికి పలు రకా నైవేద్యాలు మాత్రమేకాదు, ఇంటికొచ్చే అతిథులకు, మనవళ్లు, మనవరాళ్లకు రకరకాల వంటలు చేసి పెట్టాల్సిందే. ముఖ్యంగా స్వీట్లపై పెద్ద పీట. అటు అమ్మవారికి నైవేద్యంగా ఉపయోగపడేలా, ఇటు ఇంట్లో అందరూ ఇష్టంగా తినేలా కొన్ని వంటకాలు చూద్దాం.పండుగరోజు పులిహోర, పూర్ణం బూరెలు,గారెలు, బొబ్బట్లు (భక్య్షాలు) తదితర వంటకాలు చేసుకోవడం అలవాటు. కానీ సులువుగా చేసుకొనే మరికొన్ని వంటకాలను చూద్దాం.పెసరపప్పు పొంగలికావాల్సిన పదార్థాలుబియ్యం - ఒక కప్పుపెసరపప్పు - ఒక కప్పుబెల్లం - రెండు కప్పులుకొబ్బరి ముక్కలు - అరకప్పుజీడిప్పులు ,బాదం, కిస్ మిస్కొద్దిగా, యాలకు పొడి అరస్పూనునెయ్యి - అర కప్పుతయారీ బాండ్లీలో కొద్దిగా నెయ్యి వేసి, కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాతజీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులను నేతిలో దోరంగా వేయించుకోవాలిఇప్పుడు బియ్యం, పెసపప్పు బాగా కడిగి నీళ్లుపోసి నాలుగు మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చిక, అన్నంలో ముందుగా తరిగిపెట్టుకున్న బెల్లం తురుము వేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. బెల్లం పాకం వచ్చి, పాయసంలాగా తయారవుతూ, కమ్మని వాసన వస్తూంటుంది. ఇపుడు ముందుగా వేయించుకున్న కొబ్బరిముక్కలు, జీడిపప్పులు, కిస్ మిస్లు,బాదం పలుకులు వేసి బాగా కలపాలి. చివర్లో కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసుకుంటే కమ్మని పెసరపప్పు పొంగలి నైవేద్యం రెడీ.కట్టు పొంగలి కావలసిన పదార్థాలుబియ్యం: రెండు కప్పులు,పెసరపప్పు: ఒక కప్పు, మిరియాలు, జీలకర్రకరివేపాకు రెండు రెబ్బలు, అయిదారు పచ్చిమిరపకాయలు కొద్దిగా నెయ్యి, నూనె,ఉప్పు తగినంత, చిటికెడు ఇంగువ: చిటికెడుతయారీ: ఒకటి రెండు చొప్పున పెసరప్పు, బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.ఇపుడు స్టవ్‌మీద మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తరువాత కొలతకు తగ్గట్టుగా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానిన బియ్యం, పప్పు , ఉప్పు వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికాక నేతిలో వేయించుకొన్న జీడిపప్పులు వేసుకోవాలి. అంతే మిరియాలు, ఇంగుల ఘాటుతో, వేడి వేడి నెయ్యితో రుచికరమైన కట్టు పొంగలి రెడీ.బాదం పాయసంకావాల్సిన పదార్థాలుబాదం పప్పులు: ఒక కప్పుపాలు - ఆరు కప్పులుపంచదార - ఒక కప్పునీళ్లు - ఒక గ్లాసుకుంకుమ రేకలు: అయిదు రేకలుతయారీ: ముందుగా బాదం పప్పులను నానబెట్టుకోవాలి. శుభ్రంగా పొట్టుతీసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇపుడు కడాయి పెట్టి చిక్కని పాలు పోసి బాగా మరగనివ్వాలి. పాలు మరిగాక బాదం పేస్టు వేసి బాగా కలపాలి. కదుపుతూ పదినిమిషాల పాటూ ఉడికించాలి. బాదం పాలల్లో బాగా కలిసాక, పంచదార వేయాలి. పంచదార వేసాక పాయం చిక్కబడుతుంది. అడుగు అంటకుండా మెల్లగా కలుపుతూ మరింత చిక్కగా అయ్యేదాకా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇపుడు కొద్దిగా యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు రేకులను అలా పైన చల్లుకోవాలి. అంతే, టేస్టీ, టేస్టీ బాదం పాయసం సిద్దం. -
'అంబాజీ ఆలయం': గర్భాలయంలో విగ్రహమే లేని శక్తిపీఠం!
దసరా సందడి కోలహాలం మొదలు కానుంది. ప్రతి చోట సంబరాల హడావిడి మొదలయ్యింది. శరన్నవరాత్రుల్లో దుర్గమ్మని భక్తి కొద్ది కొలుచుకుని ఆమె అనుగ్రహంతో సంతోషం ఉండాలని కోరుకుంటారు. అలాంటి పర్వదినాన ఈ పుణ్యభూమిలో అలరారే విశేష శక్తి పీఠాలు స్మరించుకోవడం, సందర్శించడం వంటివి చేస్తుంటాం. వాటిలో మనకు తెలియని విచిత్రమైన శక్తి పీఠాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి గుజరాత్‌లోని అంబాజీ ఆలయం. అయితే ఈ ఆలయంలో విగ్రహమే భక్తులకు కనిపించదు. కానీ పెద్ద ఎత్తున పూజలు, ఉత్సవాలు చేస్తారట. ఏంటా ఆలయ విశిష్టత? ఎలా చేరుకోవాలి? తదితర విశేషాలు తెలుసుకుందామా..!గుజరాత్-రాజస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంది ఈ అంబాజీ ఆలయం. మౌంట్ అబు నుంచి రెండు గంటల ప్రయాణం. ఈ ఆలయం అరసుర్ కొండలలో నెలకొంది. ఈ ప్రదేశం అంతా ఆ జగదంబికకే సొంతం. ఇక్కడ వెలిసిన అమ్మవారిని 'అరసురి అంబ' అని, అంబాజీ అని పిలుచుకుంటారు భక్తులు. శక్తి స్వరూపిణిగా భావించే దుర్గమ్మ అంశయే ఈ అంబాదేవి అని భక్తుల నమ్మకం. శివుని విశ్వతాండవం లేదా విధ్వంస నృత్యం సమయంలో సతీదేవి శరీర భాగాలు పడిపోయిన ప్రదేశాలలో ఇది ఒకటిగా చెబుతుంటారు. పురాణ ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని చెబుతారు. దీన్ని సతిదేవి హృదయం పడిన ప్రదేశమని పురాణ వచనం. మరొక కథనం ప్రకారం..ఈ ప్రాంతంలోనే రెండు దేవాలయాలు ఉన్నాయట. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని ఐదు కిలోమీటర్ల దూరంటో గబ్బర్ కొండపై మరొక ఆలయం ఉందట. దీన్ని దేవత నిజ ఆలయంగా చెబుతుంటారు ప్రజలు. అయితే కొండ ఎక్కి అమ్మవారిని దర్శించడం కష్టంగా ఉండటంతో దంతా రాజ్యపు రాజు దేవతను తన రాజ్యానికి వచ్చి ఉండాల్సిందిగా ప్రార్థిస్తాడు. అందుకు అంగీకరించిన దేవతా రాజుకి ఒక షరతు పెడుతుంది. "రాజా నిన్ను అనుసరిస్తూ వస్తుంటాను కానీ వెనదిరగ కూడదు. మాటతప్పితే అక్కడ భూస్థాపితం లేదా అక్కడ వెలవడం జరుగుతుంది." అని రాజుతో చెబుతుంది దేవతా. అందుకు ఒప్పుకున్న రాజు సంతోషంతో వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లుతుంటాడు. అయితే కొంత దూరం వెళ్లాక ఆమె పాదాల శబ్దం వినిపంచడం లేదనిపించి గిర్రున వెనుదిరుగుతాడు. అంతే అమ్మ అక్కడే భూమిలోకి పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే నేడు భక్తులచే పూజలందుకుంటున్న మహిమాన్వితమైన అంబాజీ దేవాలయం. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే..ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు బదులుగా దేవత చిహ్నమైన 'శ్రీ వీసా యంత్రం' ఉంటుంది. అది కూడా ముసుగుతో కప్పబడి ఉంటుంది. ఈ యంత్రాన్ని చూసేందుకు కూడా భక్తులకు అనుమతి లేదు. కానీ ఆలయ పూజారులు విగ్రహాన్ని పోలి ఉండే విధంగా గర్భాలయాన్ని అలంకరిస్తారు. నవరాత్రుల సమయంలో ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతుంది. ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అంబాజీ డ్యాన్స్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించే హారతి(అంటే యంత్రాన్ని పూజించే ముందు వారి కళ్లకు తెల్లటి గుడ్డ కట్టుకోవాలి) అత్యంత వైభవోపేతంగా ఉంటుంది. ఆ కార్యక్రమంలోనే "గర్భా" అనే జానపద నృత్యాన్ని భక్తిపూర్వకంగా చేస్తారు. ఏడాదిపొడువునా ఈ ఆలయం భక్తుల కోలాహాలంతో సందడిగా ఉంటుంది. ఇక భాద్రపద పౌర్ణమి రోజు నిర్వహించే "భదర్వి పూనం" ఉత్సవమే ఈ శక్తిపీఠంలో జరిగే అతిపెద్ద వేడుక. ఈ వేడుకను తిలకించేందుకు వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలివస్తారు. ఇక్కడే ఐదు జైన దేవాలయాల సముహమైన కుంభారియా అనే జైన దేవాలయాన్ని కూడా చూడవచ్చు. అద్భుతంగా చెక్కబడిన పాలరాతి స్తంభాలకు ఇది ప్రసిద్ధి చెందింది.ఎలా చేరుకోవాలంటే..అహ్మదాబాద్ విమానాశ్రయానికి 175 కిలోమీటర్ల దూరంలో ఉంది.అబురోడ్ రైల్వే స్టేషన్‌కి 21 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.(చదవండి: దుర్గాదేవి విగ్రహాల తయారీలో 'పుణ్యమట్టి' కథేంటో తెలుసా..! ..!) -
దుర్గాదేవి విగ్రహాల తయారీలో 'పుణ్యమట్టి' కథేంటో తెలుసా..!
బొజ్జ గణపయ్య నవరాత్రులు పూర్తైన వెంటనే దసరా సందడి, హడవిడి మొదలైపోతుంది. ఇక శిల్పులంతా దుర్గాదేవి విగ్రహాల తయారీలో తలమునకలై ఉంటారు. అయితే ఈ దుర్గమ్మ విగ్రహాల తయారీలో ఓ ప్రత్యేకత ఉంది. అది అనాదిగా వస్తున్న సంప్రదాయమని చెబుతున్నారు శిల్పకారులు. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వింత చూసి ఎంతైన 'అమ్మ' కదా ఏ బిడ్డను చులకనగా వదిలేయదు కదా..అనిపిస్తుంది. ఇంతకీ ఏంటా ప్రత్యకత అంటే..దుర్గమ్మ విగ్రహాలు తయారు చేయాడానికి నాలుగు విషయాలు అత్యంత కీలకం. తయారీకి శిల్పులు గంగానది ఒడ్డును ఉన్న మట్టి, గోవు పేడ, గో మూత్రం, ఇంకా వేశ్యల ఇంటిలోని మట్టిని ఉపయోగిస్తారు. ఈ మట్టిని ” నిషిద్ధో పల్లిస్ ” అని పిలుస్తారు. ఇందులో ఏది లేకపోయినా విగ్రహం అసంపూర్ణమని వారు భావిస్తారట. అంతేగాదు అందుకోసం ప్రతి శిల్పకారుడు వేశ్య గృహాలకు వెళ్లి వారి ప్రాంగణంలో మట్టి కావాలని అభ్యర్థిస్తారట. తమకు మట్టి లభించేవరకు వాళ్లని ప్రాధేయపతారు. అంతేగాదు దసరా సీజన్ రాగానే వారిని గౌరవంగా, చిరునవ్వుతో పలకరించి మరీ మట్టిని తీసుకునే ప్రయత్నం చేస్తారట శిల్పకారులు. ఈ ఆచారాన్ని బెంగాలీ శిల్పకారులు ఇప్పటికీ పాటిస్తుండటం విశేషం. ఎందుకు ఇలానే అనేందుకు స్పష్టమైన వివరణ లేదు. కానీ కొన్ని కథానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ కారణం ఏంటంటే..దుర్గాదేవి మహిషాసురిడితో తలపడుతున్న సమయంలో ఆమెను తాకే ప్రయత్నం చేశాడట. దీంతో ఆమె కోపంతో తన పరాక్రమాన్ని అంతా ఉపయోగించి ఆ రాక్షసుడిని అంతం చేసిందట. అందుకే ఆ సంప్రదాయమని పండితుల వచనం. మరొక కథనం ప్రకారం..నారీ శక్తికి సూచన దుర్గమ్మ. సమాజంలో ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని తీసుకువచ్చారని చెబుతుంటారు. అంతేగాదు ఇలా వేశ్య ఇంటిలోని మట్టితో దుర్గామాత విగ్రహం తయారు చేస్తే అందులోకి అమ్మవారి కళ వచ్చి శోభాయమానంగా కనిపిస్తుందట. మన పెద్దలు ఈ సంప్రదాయం ఎందుకని పెట్టారో స్పష్టంగా తెలియకపోయినా.. దేవుడి దృష్టిలో అందరూ సమానమే..ఎవ్వరిని కించపరచకూడదు, హేయభావంతో చూడకూడదు అనే చక్కని సందేశాన్ని ఇస్తోంది ఈ ఆచారం..!(చదవండి: Dussehra 2024 సంబరాల దసరా: ఇంత తతంగం ఉంటుంది!) -
నిలువెత్తు నిదర్శనం
పూనా పట్టణం నుంచి ఓ పత్రికా విలేఖరి స్వామిని చూడాలని తిరుమల కొండకు బయలుదేరాడు. స్వామి వారి దర్శన సమయానికి వైకుంఠం వద్దకు చేరాడు. అక్కడి శ్రీవారి సేవకులు దర్శన టికెట్ చూసి ‘క్యూ’ లోకి పంపుతున్నారు. విలేఖరి ముందు ఓ ఆరు పదులు పైబడిన వృద్ధురాలు నిలబడి ఉంది. ఆమెకు తోడుగా పన్నెండేళ్ళ మనవడు కూడా వచ్చి ఉన్నాడు. ఆమె తన సంచిలోని టికెట్ చూపడానికి చాలా అవస్థలు పడుతూ ఉంది. పత్రికా విలేఖరి ఆమెకు సహాయం చేశాడు. ముగ్గురూ క్యూలోకి ప్రవేశించారు. ఆ రిటైర్డ్ టీచర్ కి మోకాలి నొప్పులు ఎక్కువగా ఉండటంతో కష్టంగా నడుస్తోంది. మాటల్లో ఆమె రిటైర్డ్ టీచర్ అని, వారిది తమిళనాడు ఈరోడ్ అని తెలిసింది.‘‘నడవటానికి ఇంత కష్ట పడుతున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా?’’ అని అడిగాడు విలేఖరి. ‘‘మోకాలి చిప్పలు బాగా అరిగి పోయాయి. రెండు కాళ్ళకూ ఆపరేషన్ అవసరమన్నారు డాక్టర్లు. ఇంటి వ్యవహారాల వల్ల కుదరక ఆపరేషన్ చేయించుకోలేదు’’ అని చెప్పింది. కొద్దిదూరం నడిచాక, సెక్యూరిటీ వారు చెకింగ్ చేయసాగారు. అక్కడ ఆమె చక్కగా నిలబడలేక తూలి పడబోయింది. పక్కనే ఉన్న మనవడు ఆమెను కింద పడనీయకుండా పట్టుకున్నాడు. అందర్నీ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లో కూర్చోమన్నారు. మంచి గాలి, వెలుతురు వచ్చే ప్రదేశం చూసి కూర్చున్నాడు విలేఖరి. కుంటుకుంటూ వస్తున్న రిటైర్డ్ టీచర్ కి, ఆమె మనవడికి కూడా స్థలం పెట్టి పెట్టాడు. అభిమానంగా కూర్చోమని స్థలం చూపాడు. ఆమె కూర్చోలేదు. మనవడు మాత్రం కూర్చున్నాడు.‘‘కొద్దిసేపు కూర్చుంటే అలసట తగ్గుతుంది, మీ మోకాలి నొప్పులు కూడా తగ్గుతాయి’’ అని చె΄్పాడు. ‘‘ఫర్లేదు!’’ అని చెప్పి నిలబడే ఉంది. గంట గడిచింది. కంపార్ట్ మెంట్ గేటు తీయలేదు. మరో గంట గడిచింది. అప్పుడు తీశారు. జనం పోలో’మని పరుగులు తీశారు. ఆ రెండు గంటలూ మోకాలి నొప్పులకి ఆమె బాధ పడుతూనే నిలబడి ఉంది. చిన్నగా మోకాళ్ళను అప్పుడప్పుడూ అదుముకుంటూ నడుస్తోంది.ఆమె తను చెప్పినట్లు కూర్చోక పోవడం విలేఖరికి నచ్చలేదు. ‘రెండు గంటలు నిలబడుకోవాల్సిన అవసరం ఏముంది. కూర్చుని ఉండవచ్చు కదా!’ అనుకున్నాడు. వాళ్ళకి దూరంగా జరిగి జనంతో పాటు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకో మనస్కరించలేదు. వారితో పాటే నడవసాగాడు. తిరుమల నంబి ఆలయం వద్ద ఉండే మూవింగ్ బ్రిడ్జి దగ్గరికి వచ్చింది క్యూ లైను. తట్టుకోలేని నొప్పితో బాధ పడుతోంది ఆ రిటైర్డ్ టీచర్. ధైర్యం చెబుతున్నాడు మనవడు. అక్కడ కొద్దిసేపు కూర్చునే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఆమె కూర్చోలేదు. అలా ఇబ్బందిగా నడుస్తూనే మహా ద్వారం దాటి, ధ్వజ స్తంభానికి నమస్కరించి బంగారు వాకిలి గుండా లోపలికి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు.ఉచిత లడ్డూ ప్రసాదం తీసుకుని గుడి బయటికి వచ్చాక పుష్కరిణి వద్ద కూర్చుని అవ్వా మనవడు లడ్డు తింటూ ఉన్నారు. వారితో పాటు ఉన్న విలేఖరి ‘‘వైకుంఠం నుంచి, దర్శనం పూర్తయ్యేంతవరకు మీరు ఎందుకుకూర్చోలేదు?’’ అని అడిగాడు ఆమె గుడివైపు తిరిగి చేతులెత్తి నమస్కరిస్తూ ‘‘పెరుమాళ్ళు వేంకటేశ్వర స్వామి కొన్ని వేల సంవత్సరాలుగా అలా గర్భగుడిలో మన కోసం నిలబడే ఉన్నాడు. స్వామి వారి దర్శనం కోసం వచ్చినప్పుడు మనం కూర్చోవడం భావ్యం కాదు కదా’’ అని సమాధానమిచ్చింది. ఆమెకు స్వామి వారి పట్ల ఉన్న భక్తి, గౌరవం, నమ్మకానికి విలేఖరి కళ్ళు తడి అయ్యాయి. ‘స్వామీ... ఎన్ని బాధలో మనిషికి. లిప్తకాలం నిన్ను చూస్తే... ఎంత ఉపశమనమో కదా’ అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ఏది ధర్మం? ఏది అధర్మం?
పంచ మహాయజ్ఞాలలో మొదటిది అధ్యాపనం అంటే ఒకరికి చెప్పడం. మరొకరికి చె΄్పాలంటే ముందు మనం చదవాలిగదా! దేనికోసం... కర్తవ్యమ్. అదేమిటో ముందు మనం తెలుసుకోవాలి. అంటే కర్తవ్యమే ధర్మం. ధర్మం ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు. నిరంతరం మారి΄ోతుంటుంది. ఎప్పుడు ఏ ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెప్పవలసివస్తే... చెప్పేవారు.. ఎవరి మనోభావాలనుబట్టి వారు చెవుతుంటారు. నాకేది ఇష్టమో నేనదే ధర్మమని చెబుతా. ఇంకొకాయన ఆయనకు నచ్చినది ధర్మమని చెబుతాడు. అప్పుడు నిజానికి ఏది ధర్మం?ధర్మం చెప్పడానికి ఒక ప్రమాణం ఉండాలి. అది ఏది అంటే ... యోగమే. యోగం ఎవరు ? భగవంతుడే. నాకూ నా ఊపిరికీ తేడా లేదు. నేను ఊపిరి తీసి విడిచిపెడుతున్నంతకాలం ‘నేను’ ఉన్నాను–అంటారు. నా ఊపిరే నా వాక్కుగా మారుతున్నది. అలాగే భగవంతుని ఊపిరి వాక్కుగా మారితే అదే వేదం. అందుకే భగవంతుడికీ, వేదానికీ వ్యత్యాసం ఉండదు. వేదం ఎంత సనాతనమో భగవంతుడంత సనాతనం. భగవంతుడిని ఎవరూ సృష్టించలేదు. ఆయనే అన్నీ సృష్టించాడు. వేదం కూడా అంతే.. అ΄ûరుషేయం. దానిని ఎవరూ రాయలేదు. అందుకే వేదం, ఈశ్వరుడూ ఒకే స్వభావంతో ఉంటారు. కారణం – నిజానికి అవి రెండు కాదు కాబట్టి. అటువంటి వేదం ధర్మం చెప్పడానికి మొదటి ప్రమాణం.నేను వేదం చదువుకోలేదని ఎవరయినా అంటే!!! వేదాంతర్గతమైన ఆచార సంబంధ నియమాలను రుషులు క్రోడీకరించి ఇచ్చారు. గౌతముడిస్తే అది గౌతమ స్మృతి అయింది. అత్రి ఇస్తే అత్రి స్మృతి, యాజ్ఞవల్క్యుడిస్తే యాజ్ఞవల్క్య స్మృతి.. అలా ఈ స్మృతి గ్రంథాలు ప్రమాణం. ఆవువెంట దూడ ఎలా వెడుతుందో శ్రుతి వెంట స్మృతి అలా వెడుతుంది..అంటాడు కాళిదాసు. కాబట్టి శ్రుతి తరువాత స్మృతి ప్రమాణం.స్మృతిగ్రంథాలు కూడా తెలియవని అంటే...!!! పురాణం ప్రమాణం. పురాణం జరిగి΄ోయిన చరిత్ర కాదు. కల్పింపబడిన కథ కూడా కాదు. జాగ్రత్తగా పరిశీలించండి... కల్పనయితే అందులో రచయిత వేరు, కథావస్తువు వేరుగా ఉంటుంది. అందువల్ల ఇది కల్పన కాదు. పురాణాలను ఇతిహాసములు–అంటారు. ఇతిహాసం... అంటే ‘‘ఇది ఇట్లే జరిగినది. అందులో అనుమానం లేదు’’... అని.రామాయణంలో వాల్మీకి మహర్షి అంతర్భాగం. ఆయనది పాత్రకాదు. అందులో ఒక వ్యక్తి. అలాగే భారతంలో, భాగవతంలో వ్యాసుడు అంతర్భాగం. అంతేకానీ వ్యాసుడు వేరు, భారత భాగవతాదులు వేరు కావు. అది వాళ్ళ కాలంలో యధార్థంగా జరిగిన విషయాలను వాళ్ళు రచించి మనకిచ్చారు. అవి జీవుడి ప్రస్థానాన్ని పూర్తిగా చెబుతాయి. అందుకే పురాణాలు చదివితే ఒక స్పష్టత ఏర్పడుతుంది. అందువల్ల పురాణం ప్రమాణం.నాల్గవది. శిష్టాచారం. యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరోజనః / స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే’’ అంటాడు గీతాచార్యుడు. శ్రేష్టులయినవారు, శాస్త్రమెరిగినవారు... లోకంలో ఎలా ప్రవర్తిస్తారో దాన్ని మిగిలినవారంతా అలా అనుకరిస్తారు’’ అని. ధర్మం చెప్పడానికి, అనుసరించడానికి ఈ నాలుగు మార్గాలు ్రపామాణికం. -
ఉత్తముల లక్షణం
తమ ప్రతిభని ఎవరు ఎంత వరకు గ్రహించగలరో అంత వరకే ప్రదర్శిస్తారు ఉత్తములు. అంతే కాని తమకి ఉన్న పాండిత్యాన్ని అంతా ఎవరి వద్ద పడితే వారి వద్ద ప్రదర్శించరు.ఒకటవ తరగతి చదివే పిల్లలకి వ్యాకరణం బోధిస్తే కంగారు పడి మళ్ళీ దాని జోలికి వెళ్ళటానికి ఇష్టపడరు. వారికి అక్షరాలు చాలు. అంత మాత్రానికే తమకి ఎంతో తెలుసు అనుకుంటారు. తనకి ఎంత తెలుసు అని కాదు, ఎదుటివారికి ఏమి కావాలి? ఎంత వరకు అర్థం చేసుకోగలరు? అన్నది ప్రధానం. ఈ మాట తుంబురుడి గాన విద్యా ప్రావీణ్యం చూసిన నారదుడు అనుకున్నది. ఒక పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థుల కోసం పాడ మంటే రాగం, తానం, పల్లవి ఆలపిస్తే వారు జన్మలో శాస్త్రీయ సంగీతం జోలికి వెళ్లరు. అయినా ప్రతివారి వద్ద తమ ప్రతిభని ప్రదర్శించ వలసిన అవసరం లేదు. చెవిటి వాడి ముందు శంఖం ఊదితే కొరుకుడు పడటం లేదా? సహాయం చేయనా? అని అడుగుతాడు. అంతేకాదు ఎవరి వద్ద క్లుప్తంగా చె΄్పాలి, ఎవరి వద్ద వివరంగా చె΄్పాలి అన్నది కూడా తెలియ వలసిన అవసరం ఉంది. మాట నేర్పరితనంలో ఇది ప్రధానమైన అంశం. దీనికి హనుమ గొప్ప ఉదాహరణం. సీతాదేవిని చూచి వచ్చిన హనుమ తన కోసం ఎదురు చూస్తున్న అంగదాదులతో ముందుగా ‘చూడబడినది నా చేత సీత’ అని క్లుప్తంగా చెప్పి, సావకాశంగా కూర్చొన్న తరువాత వారి కోరిక పైన తాను బయలుదేరిన దగ్గరనుండి ఆ క్షణం వరకు జరిగినదంతా పూసగుచ్చినట్టు చె΄్పాడు. అందులో తన ప్రతాపం చాలా ఉంది. అది అంతా సత్యమే! అది విని ముఖ్యంగా యువరాజు, ఈ బృందనాయకుడు అయిన అంగదుడు, తన శక్తిని గుర్తించి, గుర్తు చేసి, వెన్నుతట్టి ప్రోత్సహించిన జాంబవంతుడు, కపులు సంతోషిస్తారు. పైగా కపివీరులు అవన్నీ తామే చేసినట్టు ΄÷ంగి ΄ోయారు. అదే విషయం సుగ్రీవ శ్రీరామచంద్రులతో క్లుప్తంగా చె΄్పాడు. వారు తన యజమానులు. వారి వద్ద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారి సమయం విలువైనది. పైగా రాజుల వద్ద దాసులు తమ ఘనత చెప్పుకోకూడదు. అది రాచమర్యాద కాదు. అందుకే తన ప్రతాపం ఎక్కడా మాటల్లో వ్యక్తం కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఒక్క మాటలో సముద్రం లంఘించి వెళ్ళాను అని తేల్చి వేశాడు. అది మర్యాద మాత్రమే కాదు, వినయశీలత. విరాటరాజు కొలువులో ప్రవేశించటానికి వెడుతున్న పాండవులకు వారి పురోహితుడు ఇచ్చిన సూచనలు అందరికీ ఉపయోగ పడేవే. రాజుకన్న విలువైన వస్త్రాలు ఆభరణాలు ధరించ కూడదు, రాజుగారి భవనాని కన్న పెద్ద, ఎతై ్తన భవనంలో ఉండ కూడదు అన్నవి ఇక్కడ పేర్కొన దగినవి. తమ ఘనత సందర్భానుసారం ప్రకటించాలి. ఎదగటం లేదా ఒదగటం పరిస్థితులను అనుసరించి ఉండాలి. పిడుగుకి బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టు ఉండరు తెలివైన వారు. దీనికి చక్కని ఉదాహరణ చెపుతాడు పింగళి సూరన.‘‘ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మీ’’ అని. చెరువులో నీటి మట్టం పెరిగితే తామర కాడ చుట్లు విచ్చుకొని, పువ్వు గాని, మొగ్గ గాని ఆకు గానీ ఉపరితలం మీద తేలుతాయి. నీరు తగ్గితే కాడ చుట్టలు చుట్టుకొని పువ్వు మాత్రమే నీటి ఉపరితలం మీద ఉంటుంది. నీరు ఎండి΄ోతే దుంపలో తన జీవశక్తిని నిక్షిప్తం చేసి ముడుచుకొని ΄ోయి ఉంటుంది. నీరు నిండితే చిగురిస్తుంది. ఉత్తముల గొప్పతనం కూడా అంతే! – డా. ఎన్. అనంతలక్ష్మి -
ఏకశిలా నిర్మితమైన కైలాసాలయం
ఒకే రాతితో చెక్కిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి కైలాసాలయం. దీనిని కైలాసం అని కూడా అంటారు. కొండను పై నుంచి తొలిచి ఏకశిలతో నిర్మించిన ఈ అతి పెద్ద దేవాలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కనిపిస్తుంది. ఎల్లోరాలో ఉన్న గుహాలయాలలో ఇది ఒకటి. 276 అడుగుల పోడవు, 154 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 400,000 టన్నుల శిలలను వందల సంవత్సరాలుగా తవ్వించారని అంచనా. ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహాలయాలలో ఇది ఒకటి. ఆలయ గోడలపై లభించిన ఉలి జాడల ఆధారంగా మూడు రకాల ఉలులను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో మూడు అంతస్తులు కలిగి ఉంది. ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాలలో కైలాస దేవాలయం ఒకటి. ఇది 16వ గుహ. దీనిని 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం. స్థలపురాణం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసేవరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. వెంటనే ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కోకసా అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చె΄్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుకుని వచ్చారు. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు.శిల్పరీతిఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు అంతస్తుల గోపురం ఉంది. ప్రవేశ ద్వారం వైపున శైవులు, వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం నుంచి రెండు అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి. ఉత్తరం, దక్షిణ ప్రాంగణంలోని రాయిల మీద పెద్ద ఏనుగు నిలుచుని ఘీంకరిస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రకూట రాజులు తమ గజ దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి, ఏనుగులను తమకు ఇష్టమైన జంతువులలో ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో గజ శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని సూచిస్తుంది. ప్రధాన ఆలయంలో లోపల గోడపైన కమలంపై ఆసీనురాలై ఉన్న గజలక్ష్మి ప్రతిమ దర్శనమిస్తుంది. ఆ ప్రతిమ వెనుక నాలుగు ఏనుగులు ఉన్నాయి. రెండు పెద్ద ఏనుగులలో ప్రతి ఒక్కటి పై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి పైన తొండంతో నీటిని అభిషేకిస్తున్నట్లు, రెండు చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుంచి కుండలను నింపుతున్నట్లు చిత్రీకరించబడ్డాయి. శిఖరం దాని కింద అంతస్తునుండి 96 అడుగుల ఎత్తులో ఉంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాళ గది ఉంది, ఇది ఒక పెద్ద సభ–మండపం (స్తంభాల హాలు) తో కలిసి ఉంటుంది. దీనికి పక్కల అర్ధమండపం, ముందు భాగంలో అగ్రమండపం ఉన్నాయి. నంది–మండపం, గోపురం, పూజా మందిర అగ్ర–మండ΄ానికి మధ్య ఉంది, మూడు భాగాలను ఏకరాతి దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణ మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాల వరుసలు ఉన్నాయి. కొండ పక్కన ఉన్న ప్రదక్షిణ మార్గ ఆలయ ్ర΄ాంగణంలో ఐదు వేరు వేరు దేవాలయాలు ఉన్నాయి, ఆలయ నిర్మాణంలో రెండు వేర్వేరు 45 అడుగుల ఎత్తయిన విజయ స్తంభాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజ స్తంభం వెనుక వెలుపలి గోడపై మహాభారతం, రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణమూర్తి త్రిమితీయ శిల్పం వలన ఈ ఆలయానికి ‘కైలాస‘ అని పేరు వచ్చింది. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. ఒక మండపం నుంచి మరొక మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం, స్థలం క్రమేపీ తగ్గుతూ ΄ోతుంది. వెలుతురు కూడా తగ్గిపోతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అనేక పర్యాయాలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. -
వినాయక నిమజ్జనం రోజు ఆచరించే వ్రతం! ఎలా చేస్తారంటే..?
భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశిని 'అనంత చతుర్థి' అంటారు. ఈ రోజే వినాయక నిమజ్జనం చేస్తారు. ఆ రోజు ఆచరించే అనంతపద్మనాభస్వామి వ్రతం అత్యంత మహిమాన్వితమైనది. ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీ కృష్ణడే పాండవులు సూచించాడని వ్యాసమహర్షి రచించిన మహాభారతంలో ఉంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే దారిద్ర్యం తొలగిపోయి...విజయం, అభయం, ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణ వచనం. అనంత వ్రతం అనగా..మాయాజూదంలో ఓడిన తర్వాత పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాల గురించి శ్రీ కృష్ణుడు తెలుసుకుంటుండేవాడు. అలా ఓసారి పాండవుల దగ్గరకు వెళ్లిన శ్రీ కృష్ణుడితో.. ఏ వ్రతాలను ఆచరిస్తే తమకు కష్టాలు తొలగిపోతాయో వివరించమని అడిగాడు ధర్మరాజు. అందుకు సమాధానంగా శ్రీ కృష్ణుడు సూచించినదే అనంత పద్మనాభస్వామి వ్రతం. ఎవరీ అనంతడు...అనంత పద్మనాభుడు ఎవరని అడిగిన ధర్మరాజు ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. అనంతుడు అంటే ఎవరో కాదు స్వయంగా తానే అని వివరించాడు. అనంతుడు అంటే అంతటా వ్యాపించినవాడు, కాల స్వరూపుడు అని అర్థం. అనంత విశ్వంలో అణువణువు నిండి ఉండేది తానే అని వివరించాడు కృష్ణుడు. సృష్టి, స్థితి,లయలకు కారణం అయినా కాలస్వరూపుడి రూపంలో ఉన్నది, దశావతారాలు ఎత్తేది తానే అని చెప్పాడు. అందుకే చతుర్ధశ భువనాలు నిండి ఉన్న అనంతస్వరూపం అయిన అనంతుడిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయన్నాడు. ఏటా భాద్రపద మాసం పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. సూర్యోదయానికి తిధి ఉండడం ప్రధానం కాబట్టి చతుర్దశి ఏ రోజైతే సూర్యోదయానికి ఉంటుందో ఆ రోజుని పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇవాళ (సెప్టెంబరు 17, 2024) మంగళవారం ఉదయం 11 గంటలవరకూ చతుర్దశి ఉంది...అందుకే ఈ రోజే స్త్రీలు ఈ వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరించి ఆ దైవం అనుగ్రహంతో తమ కష్టాల నుంచి బయటపడతామని విశ్వసిస్తారు. వ్రత విధానం..ఏ పూజ తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలి..అందుకే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆరంభించే ముందు వినాయకుడిని పూజించాలి. అనంతరం నవగ్రహ పూజ ఆచరించి ఆ తర్వాత అనంతపద్మనాభుడికి షోడశోపచార పూజ చేయాలి. 14 దారాలను కలిపి ఎరుపు రంగు తోరాన్ని పూజించి..వ్రతం అనంతరం కట్టుకోవాలి. ఇలా అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని 14 ఏళ్లు ఆచరించాలని శ్రీ కృష్ణుడు వివరించాడు. శ్రీకృష్ణుడి సూచన పాండవులు ఈ వ్రతం చేసి అడగడుగున ఎదురైన కష్టాల నుంచి బయటపడటమే గాక కోల్పోయిన తమ రాజ్యాన్ని సంపదను తిరిగి దక్కించుకోగలిగారు. కలిగే ప్రయోజనాలు..వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు..సంపద పెరుగుతుంది.వృత్తి జీవితంలో వెంటాడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.(చదవండి: ఓనం వేళ దరువుతో అలరించే పులికలి..! ఏకంగా 200 ఏళ్ల..) -
ఓనం వేళ దరువుతో అలరించే పులికలి..! ఏకంగా 200 ఏళ్ల..
కేరళలో ఓనమ్ పది రోజుల పంట పండుగ. ఈ సందర్భంగా సద్య తాళిని ఆస్వాదించడానికి, పూల అలంకరణలు చేయడానికి, పడవ పందాలను చూడటానికి, ఆటలు ఆడటానికి, దయగల, ఎంతో ప్రియమైన రాక్షస రాజు మహాబలి స్వదేశానికి రావడాన్ని గౌరవించే వేడుక ఓనమ్. ఈ వేడుకలలో నాల్గవ రోజున కేరళలోని అత్యంత అద్భుతమైన దేశీయ కళారూపాలలో పులికలిను ప్రదర్శించారు. కొన్ని ప్రదేశాలలో దీనిని కడువాకలి అని కూడా పిలుస్తారు. ఇక్కడ కళాకారులు పులి వేషం ఓనం రోజుల్లో పులికొట్టు లేదా డ్యాన్స్ తోపాటు వేసే దరువులు త్రిస్సూర్‌లో ప్రతిధ్వనిస్తాయి. త్రిస్సూర్‌లోని పులికలి తప్ప మరే ఇతర ప్రదేశంలోనూ ఈ ప్రత్యేక లయ లేదని చెప్పుకోవచ్చు. పులికలిక్కర్లు వారి నడుముకు గంటలు జోడించి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండే ఈ అసుర లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. వందల ఏళ్ళ నృత్యంపులికలి 200 ఏళ్లనాటిది. అప్పటి కొచ్చిన్ మహారాజా రామవర్మ శక్తన్ థంపురాన్ దీనిని ప్రవేశపెట్టినట్లు చెబుతారు. సహజసిద్ధమైన రంగులను శరీరానికి పూసుకుని, కదులుతున్న పులుల వలె అలంకరింపబడిన పులికెత్తికళి ప్రదర్శనను స్థానికులు ఎంతగానో ఆస్వాదిస్తారు. త్రిస్సూర్‌లో ఈనాటికీ పురాతనమైన నృత్య శైలి మనుగడలో ఉంది. పులి వేషంలో నృత్యం చేసే కళాకారులను పులికలిక్కర్ అంటారు. వాద్యమేళం (కేరళకు చెందిన ఆర్కెస్ట్రా) లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. పులికలిక్కర్ పెయింటింగ్‌లో చారలు ముదురు పసుపు, నలుపు రంగులో ఉంటాయి. పులినిపోలి ఉండేలా శరీరం మొత్తం పెద్ద మచ్చలతో ఈ ఆర్ట్ వేస్తారు. అట్టముక్కలు, సైకిల్ ట్యూబ్‌లు‘కళాకారులు ఓనమ్‌కి రెండు లేదా మూడు నెలల ముందే పులికాలి సన్నాహాలు ప్రారంభిస్తారు. బాగా తిని, పొట్టను సిద్ధం చేసుకుంటారు. దీని వల్ల కళలో వారు మంచి ప్రదర్శనను ఇవ్వగలుగుతారు‘ అని చెబుతారు. ఆరు రకాల చారలతో శరీరం అంతా పెయింట్ చేస్తారు. నేడు కళాకారులు ఫేస్ మాస్క్‌లతో మరింత నూతనంగా డిజైన్ చేస్తున్నారు. ఫేస్ మాస్క్ కోసం కాగితపు అట్టలను కత్తిరించి, దంతాలగా అటాచ్ చేయడానికి జిగురును ఉపయోగిస్తారు. నాలుకను సైకిల్ ట్యూబ్‌ను కత్తిరించి తయారు చేస్తారు. చివరి టచ్–అప్ ముఖానికి సాంప్రదాయక రంగులతో తగిన షేడ్స్‌ను సృష్టిస్తారు. ప్రాచీన నృత్యాలురంగుల ముసుగు నృత్యం త్రిసూర్, పాలక్కాడ్ జిల్లా, దక్షిణ మలబార్‌లోని కొన్ని ప్రాంతాలలో జరుగుతుంది. మొదటి రోజు నుంచి ఓనమ్ నాల్గవ రోజు వరకు ప్రదర్శకులు ఇంటింటికీ వెళతారు. శరీరమంతా కప్పి ఉంచేలా పర్పటక గడ్డితో దుస్తులు సిద్ధం చేస్తారు. దేవతలు, మానవులు, జంతువులు కుమ్మట్టికలిలో కనిపిస్తాయి. కళాకారులు ధరించే పాత్రలు, ముఖాలలో శివుడు, బ్రహ్మ, రాముడు, కృష్ణుడు, గణేశుడు, కాళి మొదలైనవారు ఉంటారు. ముసుగు వేసుకున్న కుమ్మట్టి (మాతృమూర్తి) నటన కళ్లారా చూడాల్సిందే. ఇతర నృత్యాలుస్త్రీలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి చేసే ప్రత్యేకమైన నృత్యం. అలంకరించిన ముగ్గు, మధ్యన సంప్రదాయ దీపం.. దాని చుట్టూ మహిళలు చేరి నృత్యం చేస్తారు. నీటితో నిండిన పాత్ర , బియ్యం పాత్ర.. వంటివి కూడా ఉంచుతారు.(చదవండి: 30 కిలోల చాక్లెట్‌తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!) -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: పంచ మహాయజ్ఞం
పంచమహా యజ్ఞం అని ఐదు యజ్ఞాలు నిరంతరం జరిగే ప్రదేశం గహస్థాశ్రమం. గృహస్థాశ్రమ ప్రవేశం చేసినవారు ఈ ఐదింటిమీద శ్రద్ధపెట్టి ఉండాలి. అందుకే దీనిని యజ్ఞం అని వదిలేయకుండా మహాయజ్ఞం అని అన్నారు. సాధారణంగా యజ్ఞం అంటే అగ్నిముఖంగా హవిస్సును ఇవ్వడం ఉంటుంది. స్వాహాకారంతో అగ్నిహోత్రుడిని పిలిచి ఇచ్చిన హవిష్యాన్నం దేవతలకు అందచేయడానికి ..అని యజమాని సంకల్పం చేస్తాడు. కానీ అగ్ని ఆరాధనం పంచ యజ్ఞాలలో అంతర్భాగం అయినప్పటికీ ... మిగిలిన నాలుగింటినీ కూడా యజ్ఞాలనే పిలిచారు. వీటినే మహాయజ్ఞాలని అన్నారు. అలా అనడానికి కూడా ఒక కారణం ఉంది. దీనికి ప్రత్యేకంగా హోమశాలకానీ, ప్రత్యేకంగా మంత్రభాగం కానీ అవసరం లేకుండా ప్రతివారు కూడా శ్రద్ధతో అనుసరించాల్సిన విషయాలు ఈ ఐదింటిలో అంతర్లీనంగా ఉంటాయి. ‘‘నేను ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించినందుకు దీనిని ధన్యం చేసుకుని తరించడానికి ఈ ఐదు ఆలంబనాలు. వీటిని ఊతంగా చేసుకుని తరించాలి’’ అని గృహస్థు భావిస్తాడు. అందుకే ఇవి గృహస్థాశ్రమంలోనే నడుస్తాయి.వీటిలో మొదటిది – అధ్యాపనం బ్రహ్మయజ్ఞః–అంటారు. అధ్యాపనం అంటే బోధ చేయడం. బోధ చేయడాన్నే బ్రహ్మ విద్య.. అంటారు. బోధ దేనికి! మనిషి తరించడానికి ఇది మార్గాన్ని చెబుతుంది. సనాతన ధర్మం గొప్పతనం ఏమిటంటే.. అది ఏది పట్టుకోవాలో చెబుతుంది, ఏది పట్టుకోకూడదో చెబుతుంది. పట్టుకోకూడదన్నంత మాత్రం చేత అదంత సులభసాధ్యం కాదు కాబట్టి పట్టుకోకుండా ఉండడానికి ఎటువంటి మనస్తత్వాన్ని సాధించుకోవాలో ఇది బోధ చేస్తుంది. అది మన రుషుల ప్రత్యేకత.మనకు సంవత్సరం ఆరంభంలో అంటే సంవత్సరాదినాడు చేదుపచ్చడి తినిపిస్తారు. సంవత్సరం పూర్తి ఎప్పుడు.. అంటే చాంద్రమానంలో కాదు, ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య కాదు, సౌరమానంలో వచ్చే భోగి పండగను ప్రమాణం చేస్తారు. భీష్మ ఏకాదశి, కష్ణాష్టమి, మహాశివరాత్రి, శ్రీరామనవమిల లాగా తిథులతో కూడుకుని రాదు. భోగికి తిథి ఉండదు. దక్షిణాయనానికి చిట్టచివర వచ్చేది.. భోగిపండగ అవుతుంది. దక్షిణాయనం ఉ΄ాసనా కాలం. ఉపాసన కష్టంగా ఉంటుంది. పరిశ్రమ చేయడానికి, ఉపాసన చేయడానికి సిద్ధపడితే అది చేదు తినడం.. కష్టపడాలి కాబట్టి ఉగాది పచ్చడిని ప్రారంభంలో తినిపిస్తారు. కష్టపడడం దేనికి! తరించడానికి అవకాశం రావాలంటే ముందుగా ఈశ్వరుడు పెట్టుబడిగా ఇచ్చిన శరీరాన్ని సాధన ద్వారా సిద్ధపరచాల్సి ఉంటుంది.ఎవరు కష్టపడ్డారో, ఎవరు ఉగాదినాడు చేదు పచ్చడి తిన్నారో, వారు భోగినాడు పొంగల్.. మధుర పదార్థం తింటారు. అంటే భోగం అనుభవించే అర్హత పొందుతారు. ఏ ఉపాసన చేయకుండా, ఏ శాస్త్రాన్నీ పాటించకుండా, ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని ధన్యం చేసుకోకుండా భాగ్యం కావాలంటే సాధ్యం కాదు. ఇవన్నీ బోధించి గహస్థాశ్రమ ప్రవేశం చేయించి, అక్కడ విధివిధానాలు సక్రమంగా నిర్వర్తించేటట్లు బోధించడమే ..అధ్యాపన యజ్ఞం. అంటే ఒకరికి చెప్పడం.. అదెప్పుడు సాధ్యం. ముందుగా మన చదివి ఉంటేనే కదా.. దేనికోసం చదవాలి....అంటే ఇది మన కర్తవ్యం ఏమిటో మనం తెలుసుకోవడం కోసం ఉపయోగపడేది. -
ప్రేమించు... జీవించు...
ఈ సృష్టి సమస్తం ప్రేమ మయం.. సృష్టిలో సమస్త జీవరాశుల పట్ల ప్రేమ కలిగి ఉండటమే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సాధన అని మహాభారతం చెబుతోంది. ప్రాణం పోసే మహత్తర శక్తి ప్రేమకు ఉంది. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాలకు ప్రేమ ఎంతో అవసరం. ప్రేమకు కొలతలు లేవు. తరతమ భేదాలు లేవు. అది అనంతమైనది. విశ్వవ్యాప్తమైనది.. మనిషి సంఘజీవి. ఏకాకిగా అతడు సంఘంలో ఎక్కువ కాలం ఉండలేడు. అతడు జీవించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ లేనిదే మనిషి జీవితం వ్యర్ధం. మనిషి మనుగడకు మూలం ప్రేమ. మానవ సంబంధాలు నిలబడేది, కొనసాగేది ప్రేమ పునాది పైనే. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీయువకుల మధ్య ఉండే ప్రేమ.. కేవలం యువతీయువకులదే కాదు ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. సమస్త మానవాళిలో ఉన్న ప్రేమను అవగతం చేసుకుంటే అది మానవ జీవితానికి పరిపక్వతనిస్తుంది. ప్రేమ గురించి సంపూర్ణంగా తెలిసినవారే, దాన్ని ఆస్వాదిస్తారు. ఇతరులకు పంచగలుగుతారు. ప్రేమ మనిషిని దైవంగా మారుస్తుంది.. ఆ దైవత్వంతోనే మనిషి ఎలాంటి కార్యాలనైనా సాధించగలుగుతాడు.. ప్రేమ గురించి , దాని శక్తి గురించి స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్త్ లాంటి ఎందరో మహనీయులు ఈ లోకానికి తెలియ చేశారు. ఈ క్రమంలో ప్రేమతత్వం ద్వారా కోట్ల మందిని ప్రభావితం చేశారు. ప్రేమలో నిర్భయత్వాన్ని, ఆనందాన్ని సాధించే మార్గాలను వారు ఈ లోకానికి అందించారు. అయితే ప్రేమ అనేది కేవలం మనుషుల మధ్యనే కాదు అది సమస్త జీవరాశుల మీదా ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్రకతి అంతా ప్రేమ మయంగా అందంగా, ఆహ్వాదంగా కనిపిస్తుంది. బొందితో స్వర్గానికి వెళ్ళే అర్హత ధర్మరాజుకు ఉంది. ఆయన స్వర్గానికి వెళ్ళే సమయంలో ఓ కుక్క అతని వెంట పడుతుంది. ఆ కుక్కను ప్రేమగా చూసిన ధర్మరాజు కుక్కను వదిలి స్వర్గానికి వెళ్ళడానికి అంగీకరించడు. ఇలా చివరి క్షణంలో సైతం కుక్క మీద ప్రేమ కురిపించి మూగజీవాల పట్ల తన దయాగుణాన్ని చాటుకున్నాడు. సాక్షాత్తు శిరిడీ సాయి నాధుడు ఎప్పుడూ ప్రజలతో పాటు మూగ జీవాలను కూడా ఎంతగానో ప్రేమించేవారు. అలాగే రమణ మహర్షితో పాటు ఇంకా అనేక మంది యోగులు, మునులు, సిద్ధులు తమ ప్రేమను జంతు జీవాలపై కురిపించి విశ్వ మానవ ప్రేమను చాటుకున్నారు...ఇలా ఆపదలో ఉన్నవారిని, రోగ గ్రస్తులను మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను ప్రేమించిననాడే మానవ జీవితానికి పరిపక్వత సిద్ధిస్తుంది. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తారసపడుతుంది. జీవితంలో ప్రతి మనిషి తన స్నేహితులను, తల్లితండ్రులను, పిల్లలనూ ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే సుందరమైన నదులు, కొండలపై జారు జలపాతాలు, ఇసుకతో కూడిన ఎడారులు, ప్రకతి శోభ, చెట్టు చేమ, జంతువులు, పక్షుల, వింతగా కనిపించే మబ్బులు, మిణుకు మిణుకుమనే నక్షత్ర సముదాయం, రోదసి, అందం, సుందరం, బుజ్జి పాపాయి అమాయక నవ్వు, మనుషుల స్నేహం, అభిమానం, వీటి అన్నింటిలో కూడా ప్రేమ కనిపిస్తుంది. వికసిస్తుంది. ప్రేమ మనకు ప్రకృతి ఇచ్చిన వరం.మనిషి మౌలికంగా దైవస్వరూపుడని, శరీరంలో నివసించే ఆత్మే దైవమని అనేక మంది మహనీయులు సెలవిచ్చారు. జ్ఞానం పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత వికసిస్తుంది. అలా వికసించినపుడే అన్ని భేదాలు అంతరించి ప్రేమతత్వం సాధ్యపడుతుంది. ఏవిధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, మంచి మనసుతో మనం ఒకరి పట్ల చూపే నిస్వార్థమైన ఆదరణే ప్రేమ‘. ఇది ఒక ఉన్నతమైన, పవిత్రమైన, గొప్పదైన భావన.– దాసరి దుర్గాప్రసాద్ -
ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆధ్యాత్మికత వైపు..
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ చెప్పుకొనేదే.. నగరంలో ఉరుకులు పరుగుల జీవితం.. మానసిక సమస్యలు, చిరాకులు, కుటుంబ సమస్యలకు దారి తీస్తున్నాయనే విషయం తెలిసిందే. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆందోళనలకు గురవుతూ.. మత్తుపానీయాలకు బానిసలు అవుతున్నారు. కంపెనీల్లో ఒత్తిడి ఎంతలా ఉందంటే ఒత్తిడి నుంచి బయటపడేందుకు పలు కంపెనీల్లో ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్స్ ఏర్పాటు చేశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.చాలామంది ఉద్యోగులు వారాంతాల్లో కుటుంబంతో, స్నేహితులతో కలిసి జాలీగా గడిపేందుకు ప్లాన్స్ చేసుకుంటారు. సమీపంలోని ప్రశాంతంగా ఉండే రిసార్టులకు కొందరు వెళ్తుంటారు. మరికొందరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ కుటుంబసభ్యులతో గడుపుతుంటారు. అయితే కొందరు ఉద్యోగులు.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం భక్తి చింతన, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే యువత కొత్త దారి వెతుక్కుంటూ.. నగరంలోని, శివారు ప్రాంతాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు.ఎందుకిలా..? సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ప్రాజెక్టులు, టార్గెట్లు, రిపోర్టులు, సబి్మషన్లు ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఒత్తిళ్లతో రోజును భారంగా గడుపుతుంటారు. నెలాఖరు రాగానే లోన్లు, ఈఎంఐలు కట్టేందుకు నానా తిప్పలు మరింత కామన్. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాటు చేసుకుని, అధికంగా సేవిస్తుంటారు. దీనికి తోడు ఎలాంటి శారీరక వ్యాయామాలు లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీంతో కలల ప్రపంచం ఒక్కసారిగా నేలకు దిగిపోతుంటుంది. అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొత్త దారి వెతుక్కుంటారు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ అనగానే వీకెండ్స్ పార్టీలకు వెళ్తుంటారు అని భావిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్లినా కూడా తమ ఉద్యోగ జీవితాల ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకునేంత ప్రశాంతత దొరకట్లేదని ఆధ్యాతి్మక చింతన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.చిన్న వయసులోనే..వారాంతాల్లో నగరంలోని పలు దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు యువతీ, యువకులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని పలు ప్రముఖ ఆలయాలు, ఆధ్మాత్మిక క్షేత్రాలతో పాటు శివారు ప్రాంతాల్లోని నగరాలకు కూడా ఉద్యోగులు క్యూ కడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా ఇక్కడికి చేరుకుని చిన్న వయసులోనే వారిలో ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. ముఖ్యంగా ఏకాంతంగా కూర్చుని దేవుడి ముందు ధ్యానం చేసుకుంటూ కనిపిస్తున్నారు. నగరంలోని ఇస్కాన్ టెంపుల్స్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వంటి క్షేత్రాల్లో నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందుతున్నారు. కృష్ణుడి సంకీర్తనలు, భజనలు చేసుకుంటూ వారిలోని ఆధ్యాత్మిక భావాన్ని చాటుకుంటున్నారు. జీవితానికి కొత్త ఒరవడిని చూపుకొంటున్నారు. జీవిత సత్యాన్ని తెలుసుకునేందుకు అన్వేషిగా బయల్దేరుతున్నారు.ఆ రోజులే బాగున్నాయి.. చాలీచాలని డబ్బులతో ఉద్యోగం కోసం వెతుక్కుంటూ హైదరాబాద్‌లో తిరిగిన రోజులే బాగున్నాయి. అప్పుడు ఉద్యో గం వస్తే చాలు అనుకునే వాడిని. ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. అయినా ఏదో పోగొట్టుకున్న వెలితి ఉంది. సవాలక్ష సమస్యలు చుట్టు ముడుతున్నట్లు ఉంది. ప్రశాంతత అనే మాటే కరువైంది. నెలాఖరు రాగానే లోన్లు.. ఈఎంఐల వెంట పరిగెత్తాల్సి వస్తోంది. డబ్బులు అన్నీ ఇవ్వదనే విషయం అవగతమవుతోంది. అందుకే భక్తి మార్గం ప్రశాంతతను ఇస్తుందనే ఉద్దేశంతో ప్రతి వారం ఏదైనా గుడికి వెళ్లి ఒంటరిగా కాసేపు గడుపుతాను. – నల్లం నవీన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్మనసుకు ప్రశాంతత నాకు ఆధ్యాతి్మక భావన ఎక్కువ. చిన్నప్పటి నుంచి దేవాలయాలకు వెళ్లడం, పూజా కార్యక్రమాలు చేపట్టడం అలవాటు. పెళ్లయిన తర్వాత ఉద్యోగం, విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. వారంలో శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. పిల్లలు, ఇల్లు కుటుంబాన్ని చూసుకోవడానికే సరిపోతుంది. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయాలకు వెళ్తుంటాం. తిరుపతి, శ్రీశైలం, అరుణాచలం, వేములవాడ, యాదగిరిగుట్ట, ఈ మధ్య స్వర్ణగిరి వెళ్లాం. – నిహారికారెడ్డి, మియాపూర్