District
-
బెల్లంపల్లి జిల్లాపై ఆశలు
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన రావడంతో బెల్లంపల్లి కొత్త జిల్లా ఏర్పాటుపై ఆశలు రేకెత్తాయి. రాష్ట్రం ఏర్పడితే కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైశాల్యంలో పెద్దదైన ఆదిలాబాద్ జిల్లాను విడదీసి తూర్పు ప్రాంతంలో జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాల కాలం నుంచి ఉంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రతిపాదన వస్తే తూర్పు ప్రాంతంలో జిల్లా ఏర్పాటు అంశాన్ని పరి శీలిస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో బెల్లంపల్లి, మంచిర్యాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఏ ప్రాంత ప్రజ లు ఆ ప్రాంతంలోనే కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని గతంలో ఆందోళనలు కూడా నిర్వహించారు. బెల్లంపల్లి, మంచిర్యాల లో ప్రత్యేకంగా రాజకీయ, కార్మిక, వ్యా పార, వాణిజ్యవర్గాలతో కమిటీలను కూ డా ఏర్పాటు చేశారు. తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ పోటాపోటీగా విజ్ఞాపన పత్రాలు అందజేశారు. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో జిల్లా అంశం తెరపైకి వచ్చింది. వనరులు పుష్కలం జిల్లా ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులు బెల్లంపల్లిలో పుష్కలంగా ఉన్నా యి. విశాలమైన భవనాలు, క్వార్టర్లు, వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు వినియోగానికి అందుబాటులో ఉన్నా యి. తూర్పు ప్రాంతం కేంద్రంగా బెల్లంపల్లి ఇప్పటికే పోలీస్ జిల్లాగా ప్రాచుర్యం పొందింది. ప్రత్యేకంగా అదనపు ఎస్పీ కా ర్యాలయంతోపాటు ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్-న్యూఢిల్లీ ప్రధా న రైల్వే మార్గం, ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, ఇతర ప్రభుత్వ కార్యాల యాలు ఉన్నాయి. తూర్పు ప్రాంతంలో చెన్నూర్, మంచిర్యాల, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి కేంద్ర బిందువుగా ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. గెస్ట్‌హౌజ్‌లు ఇతర సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మున్సిఫ్ కోర్టు మంజూరు కాగా, బస్ డిపో మంజూరు కోసం స్థల పరిశీలన కూడా జరిగింది. భౌగోళిక, నైసర్గిక పరిస్థితులు పూర్తిగా జిల్లా ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నాయి. అందుకే చిరకాలంగా ఈ ప్రాంత వాసులు జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు. మౌలిక వసతులు అపారంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారంపడే అవకాశాలు ఉండవనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో ఈ ప్రాంత ప్రజలు బెల్లంపల్లి జిల్లా అవుతుందనే కొండంత ఆశతో ఉన్నారు. -
సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : దేశంలో 60శాతం ఉన్న యువత సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు అన్నారు. బుధవారం స్థానిక పద్మావతి గార్డెన్స్‌లో జరిగిన నవభారత యువ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, ఉద్యోగం తదితర రంగాల్లో ఎలాంటి అవకాశాలు లేక అభివృద్ధికి దూరమవుతున్నారని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నేడు ఆహార ఉత్పత్తి పెరగడం లేదని, పక్కనే గోదావరి ఉన్నా సాగునీరు లేక పంటలు చేతికందడం లేదని తెలిపారు. పాజెక్టుల నిర్మాణంతో రైతాంగానికి సాగునీరందించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాల్సి ఉన్నా ప్రభుత్వాల చేతిగాని తనంతో వ్యవసాయం నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని డిమాండ్ చేశారు. నేటి యువత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నా.. అవకాశాలు లేక మేథాసంపత్తి సరిహద్దులు దాటుతోందని తెలిపారు. ఏమాత్రం అవకాశాలు ఉన్నా యువత తమ ప్రతిభా పాటవాలతో దేశాన్ని 200ఏళ్లు ముందుకు తీసుకెళ్లే సత్తా చాటుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో బీజేపీ ప్రాధాన్యతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని అన్నారు. జాప్యం చేయకుండా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని, ఇందుకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, హైదరాబాద్ లేని తెలంగాణ అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త రాజకీయ పంథాను చాటేలా ఈ నెల 17న హైదరాబాద్‌లో నిర్వహించనున్న నరేంద్రమోడీ సభను జయప్రదం చేయాలని కోరారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి తులా ఆంజనేయులు, బీజేపీ జిల్లా ఇన్చార్జి వి.మురళీధర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోనె శ్యాంసుందర్‌రావు, ఆరుముళ్ల పోశం, జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమ న్న, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు పెద్దపల్లి పురుషోత్తం, తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ వెరబెల్లి రవీందర్రావు, నాయకులు మున్నారాజ్ సిసోడియా, పెందూర్ ప్రభాకర్, పూసాల వెంకన్న పాల్గొన్నారు. -
కిలో ఉల్లి రూ.34
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ :జిల్లాలోని 13 రైతు బజారులతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలు కిలో రూ.34కు వినియోగదారులకు విక్రయించేందుకు ఏర్పాటు చేసినట్టు జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలోని ఉల్లిపాయల హోల్‌సేల్ విక్రయదారులు, రైతు బజారుల ఎస్టేట్ అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహిం చారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు అసాధారణంగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకు రైతుబజార్లు ద్వారా తక్కువ ధరలకు ఉల్లిపాయలను అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గురువారం నుంచి నిర్దేశించిన ధరకు ప్రత్యేకౌంటర్లలో ఉల్లిపాయలను అందిస్తామన్నారు. ఉల్లిపాయల సరఫరా, ధరల నియంత్రణను అదుపు చేసేందుకు హోల్‌సేల్ విక్రయదారులు కిలో రూ.33లకు సరఫరా చేయాలన్నారు. వాటిని ప్రత్యేక కౌం టర్లలో రూ.34కి ప్రజలకు విక్రయించాలని రైతుబజారుల ఎస్టేట్ అధికారులను ఆయన ఆదేశించారు. ఇంకా అవసరమైన ప్రాంతాల్లో ఈ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్, గాంధీ నగర్ రైతు బజారుల్లో , అమలాపురం రైతు బజారులోను, రాజమండ్రిలోని ఏడు రైతు బజార్లలో, రామచంద్రపురం, రావులపాలెం, కొత్తపేట రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ఏర్పా టు చేశామన్నారు. కాకినాడలోని మసీద్ సెంటర్, రమణయ్యపేట, రామారావుపేట, నాగమల్లితోట జంక్షన్లలోని సూపర్ బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాల న్నారు. పౌరసరఫరాల శాఖాధికారులు, తహశీల్దార్లు, ఆర్డీలు నిరంతరం పర్యవేక్షించాలని జేసీ ఆదేశించారు. -
14కు తెలుగు అకాడమీ కేసు వాయిదా
తిరుపతి లీగల్, న్యూస్‌లైన్: తిరుపతి తెలుగు అకాడమీ శాఖలో 2008లో జరి గిన నిధుల దుర్వినియోగం కేసు విచారణను తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి ఈనెల 14వ తేదీకి వాయిదా వేశారు. కేసులో నిందితుడిగా ఉన్న తెలుగు అకాడమీ శాఖ ఉద్యోగి రాఘవరెడ్డి బుధవారం కోర్టులో సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా న్యాయవాదులు కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. వేద పాఠశాల కేసు 19కు వాయిదా తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో ఓ విద్యార్థిపై జరి గిన లైంగిక వేధింపుల కేసు విచారణను తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి కమలాకర్‌రెడ్డి ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. కేసులో సాక్షిగా ఉన్న రుయా ఆస్పత్రి డాక్టర్ వెంకటేశ్వర్లను నిందితుల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. న్యాయవాదులు బుధవారం హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. తదుపరి విచారణకు ఇరుపక్షాల వారు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. -
ఊపిరాడక కార్మికుడి మృతి
శ్రీరాంపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : ఏరియాలోని ఆర్కే-7 గనిలో కోల్‌ఫిల్లర్ కార్మికుడు ఆడెపు రాజన్న(54) ఊపిరాడక మృతి చెందాడు. తోటి కార్మికుల కథనం ప్రకా రం.. ఎప్పటిలాగానే రాజన్న మంగళవారం రాత్రి డ్యూటీకి వచ్చాడు. 2ఏ సీమ్, 34 లెవల్ వద్ద విధులు నిర్వహించాడు. బుధవారం ఉద యం 6.00 గంటల సమయానికి రెండు టబ్బ ల వరకు నింపాడు. రెండో టబ్బులో కొంత ఖాళీ ఉంది. ఇంతలో అస్వస్థతగా అనిపించడం తో కుళాయి వద్దకు వెళ్లి నీళ్లు తాగివచ్చాడు. మళ్లీ తట్టా ఎత్తడం మొదలు పెట్టగానే ఒక్క సారిగా కాళ్లు, చేతులు లాగుతున్నాయంటూ కుప్పకూలాడు. ఒళ్లంతా చెమటలు పట్టడంతో తోటి కార్మికులు అతడిని గాలి ఉన్న ప్రదేశానికి తీసువచ్చి సపర్యలు చేస్తుండగానే మృతి చెం దాడు. మైనింగ్ సర్దార్ నాగేశ్వర్రావు, ఓవర్‌మన్ రాయమల్లు, కార్మికులు కలిసి మృతదేహా న్ని ఉపరితలానికి తీసుకువచ్చారు. తర్వాత రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లా రు. మృతుడికి భార్య భారతి, ఇద్దరు కుమార్తె లు, ఒక కొడుకు ఉన్నారు. గాలి అందకే మృతి : కార్మికులు గాలి సరిగా అందకనేరాజన్న మృతి చెందాడ ని కార్మికులు ఆరోపించారు. పని స్థలంలో గాలి సరిగా లేదని, ఎక్కువగా ఉక్కపోస్తుంద ని, ఒక్కోసారి ఊపిరి ఆడడంలేదని తెలిపారు. మూడు నెలలుగా సమస్యను అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వివిధ కార్మిక సంఘాల నేతలు గని వద్దకు చేరుకుని గని మేనేజర్ రామారావు, సేఫ్టీ అధికారి లక్ష్మణ్, ఏరియా ఎస్‌ఓటూ జీఎం మల్లికార్జున్రా వు, ఏజీఎం(పర్సనల్) మహమ్మద్ అబ్బాస్, గని ఏజెంట్ హబీబ్హుస్సేన్లను నిలదీశా రు. కనీసం మృతుడి భార్యా పిల్లలు గని వద్ద కు రాకుండానే శవాన్ని ఆస్పత్రికి ఎలా పంపిం చారని మండిపడ్డారు. అధికారులు ఏమని రిపోర్టు రాసారో చూడకుండానే గుర్తింపు సం ఘం నాయకులు, అధికారులు కలిసి హాడావుడిగా పోస్టుమార్టంకు తరలించారని ఆరోపిం చారు. అక్కడి నుంచి ఆస్పత్రికి చేరుకున్న గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ తదితర యూని యన్ల నాయకులు మృతుడి కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. సంస్థ నిర్లక్ష్యమే కారణం : ఏఐటీయూసీ యాజమాన్యం నిర్లక్షం కారణంగానే రాజన్న మృతి చెందాడని, గని మేనేజర్, రక్షణ అధికారులపై చర్య తీసుకోవాలని ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి కె.వీరభద్రయ్య, ఉపాధ్యక్షు డు మంద మల్లారెడ్డి, నాయకులు అశోక్‌రెడ్డి, జడల పోశం డిమాండ్ చేశారు. గతంలో ఇదే గనిలో గడ్డం రాజయ్య అనే కార్మికుడు ఊపిరాడక మృతి చెందినప్పుడు గనిలో వెంటిలేషన్ బాగుందని కితాబిచ్చిన అధికారులు నేడు జరి గిన ఘటనకు సమాధానం చెప్పాలన్నారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషి యా చెల్లించాలని డిమాండ్ చేశారు. చర్య తీసుకోవాలి : వైఎస్సార్ టీయూసీ రాజన్న మృతికి కారకులైన అధికారులపై చర్య తీసుకోవాలని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్తినేని రవికుమార్, చీఫ్ ఆర్గనైజిం గ్ సెక్రెటరీ చల్లగుల్ల విజయశ్రీ డిమాండ్ చేశా రు. చాలా గనుల్లో వెంటిలేషన్ సమస్య ఉంద ని, యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై చూపిస్తున్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై చూపడం లేదన్నారు. ఇటివల కాలంలో గనుల్లో ఇలాం టి మరణాలు అధికంగా జరుగుతున్నాయని, వీటిని గుండెపోటులుగా చిత్రీకరిస్తూ అధికారు లు తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : ఐఎఫ్టీయూ గనిలో వెంటిలేషన్ సరిగా అందించనందుకు బాధ్యులైన అధికారులందరిపైనా చర్య తీసుకోవాలని ఐఎఫ్టీయూ శ్రీరాంపూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు కె.దేవయ్య డిమాండ్ చేశారు. కార్మికుడు చనిపోతే గని వద్దకు అతని భార్య, పిల్లలు రాకముందే శవాన్ని ఆస్పత్రికి తరలిం చారని ఇది అధికారుల అమానవీయ చర్యకు నిదర్శనమన్నారు. -
సమైక్యమే అజెండా
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో మరింత ఊపందుకొంది. ఊరూవాడా ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు, వంటావార్పు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యుత్ ఉద్యోగులు విడివిడిగా జేఏసీలుగా ఏర్పడి ఆందోళనలో పాలుపంచుకున్నారు. సాక్షి, రాజమండ్రి :‘ఓరి తె లుగు వాడా తగదింటి నడుమ గోడ’ అంటూ సమైక్యవాదులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో ప్రతీ గ్రామంలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం వేళ్లూనుకుంది. జనం స్వచ్ఛందంగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార వర్గాలు వేర్వేరు జేఏసీలుగా, రాజకీయేతర సంఘాలు, కుల సంఘాలు విడివిడిగా తమ నిరసనలు కొనసాగించాయి. మానవహారాలు, రాస్తారోకోలు, రోడ్లపై వంటావార్పు కార్యక్రమాలు, నిరాహార దీక్షలు నిర్వహించారు. ఉద్యమించిన విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ ఉద్యోగులు బుధవారం సమైక్యాంధ్ర పోరులోకి దిగారు. విశాఖపట్నం కేంద్రంగా ఈపీడీసీఎల్, ట్రాన్స్‌కోలకు చెందిన 12 సంఘాలు విద్యుత్ జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ జేఏసీ జిల్లా చైర్మన్ జి. నరసింహారావు, కన్వీనర్ ఎన్.శామ్యూల్, కోశాధికారి వి.వి.ఎస్.ఎల్.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఎస్ఈ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్షా శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. నిరశన దీక్షలు ఈనెల 11 వరకూ కొనసాగుతాయని విద్యుత్ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. జేఏసీల కార్యాచరణ రాజమండ్రి కాస్మోపాలిటిన్ క్లబ్ లో బార్ కౌన్సిల్, వ్యాపార వర్గాల జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాలు, అలాగే ఉభయగోదావరి జిల్లాల జర్నలిస్టులు జేఏసీగా ఏర్పడి రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశాయి. గురువారం నుంచి శాంతియుతంగా సమైక్య ఉద్యమం కొనసాగించాలని జర్నలిస్టుల జేఏసీ నిర్ణయించింది. రాజమండ్రిలో... కోటగుమ్మం సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దీక్షలు ఆరోరోజూ కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆల్కాట్‌తోట నుంచి కోటగుమ్మం వరకూ పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ బలసాలి ఇందిర, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీలక్స్ సెంటర్ నుంచి కోటగుమ్మం వరకూ ర్యాలీ నిర్వహించి పాత ఫిలింరీళ్లు దహనం చేశారు. తాడితోట సెంటర్లో సెయింట్ జోసఫ్ పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్మించారు. మున్సిపల్ ఉద్యోగులు, కలప వర్తకులు, వడ్రంగి పనివారు, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ అసోసియేషన్, క్యాటరింగ్ వర్కర్స్ ర్యాలీలు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అభ్యాసకులు కోటగుమ్మం సెంటర్లో విన్యాసాలు నిర్వహించి సమైక్యవాదం వినిపించారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇన్నీసుపేట వద్ద బీసీ హాస్టల్ విద్యార్థులు వంటా వార్పు నిర్వహించారు. రాజమండ్రి రూరల్ మండలంలో పంచాయతీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. లాలాచెరువు హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన 300 కుటుంబాలు నిరాహార దీక్షలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. కడియం, ధవళేశ్వరంలో నిరసనలు కొనసాగాయి. కాకినాడలో... జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడలో కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటి వద్ద ఆందోళన చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటి వద్ద ఆందోళన చేసి ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు. జిల్లా సమాచార కేంద్రానికి తాళం వేశారు. మెయిన్‌రోడ్డులో భారీ ర్యాలీ చేశారు. వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ పార్లమెంటరీ పార్టీ నాయకుడు చలమశెట్టి సునీల్, కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ జెడ్పీ మాజీ చైర్మన్ వేణుగోపాలకృష్ణ, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ ఆందోళనల్లో పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టు వారణాసి సాయిపెరుమాళ్లు వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సహచరులు వారించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భానుగుడి సెంటర్లో సమైక్య హోమం నిర్వహించారు. సుమారు 40 ఆటో వర్కర్ల సంఘాలు నగర బంద్ పాటించాయి. క్వారీ లారీల సంఘం లారీల ప్రదర్శన చేపట్టింది. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు రిలే దీక్షలు ప్రారంభించారు. కోనసీమలో... అమలాపురం, అమలాపురం రూరల్, ఉప్పలగుప్తంలలో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీలు నిర్వహించారు. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. జేసీబీ నిర్వాహకులు, నిర్మాణ కాంట్రాక్టర్ల అసోసియేషన్ల ఆధ్వర్యంలో జేసీబీలతో ర్యాలీ జరిగింది. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల సంఘం అమలాపురంలో ర్యాలీ నిర్వహించారు. నల్లావారి వీధిలో యువకులు కర్రసాము నిర్వహించారు. న్యాయవాదులు కోర్టుల వద్ద వంటా వార్పు చేపట్టారు. మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డులో ర్యాలీ జరిగింది. వ్యవసాయశాఖ ఉద్యోగులు, మార్వాడీ సంఘాలు గడియారం స్తంభం సెంటర్లో నిరనన ప్రదర్శన చేశారు. ఆటోడ్రైవర్లు, తాపీమేస్త్రులు నిరసనలు నిర్వహించారు. కొత్తపేట, అంబాజీపేటల్లో ఆందోళనలు సాగాయి. పి.గన్నవరం, అయినవిల్లిలో వైఎస్సార్ సీపీ దీక్షలు ఐదోరోజుకు చేరాయి. నిరాహార దీక్షలు సామర్లకోట, ఏలేశ్వరం, రామచంద్రపురంలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరశన దీక్షలు కొనసాగాయి. సీతానగరం కోరుకొండ, తుని, రంపచోడవరం, రాజానగరంలో అడుసుమిల్లి రమేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. హైవేపై రాస్తారోకోలు ప్రత్తిపాడులో కాంగ్రెస్ కార్యకర్తలు, జగ్గంపేటలో వివిధ విద్యాసంస్థలకు చెందిన 5000 మంది 16వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారిపై వంటావార్పు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ క్రికెట్ ఆడారు. తునిలో మున్సిపల్ కార్మికులు వంటా వార్పూ నిర్వహించారు. ఆకట్టుకున్న ర్యాలీ తెలుగుతల్లిని సోనియాగాంధీ బల్లెంతో పొడుస్తుంటే కారుతున్న రక్తాన్ని గెద్ద రూపంలో కేసీఆర్ తాగుతున్న చిత్రం రామచంద్రపురంలో అందరినీ ఆకట్టుకుంది. ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ చిత్రీకరించిన ఈ బొమ్మతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. అనపర్తి, మండపేట నియోజకవర్గాలో దీక్షలు, ర్యాలీలు కొనసాగాయి. రంపచోడవరంలో ఆటోవర్కర్స్ యూనియన్ ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టింది. -
వరద ప్రాంతాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : వర్షం, వరదలతో జిల్లా అతలాకుతలమైంది. పక్షం రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురియడం, వరదలు పోటెత్తడం, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి ఉప్పొంగి బ్యాక్‌వాటర్ గ్రామాల్లో చేరింది. పక్షం రోజులుగా కాగజ్‌నగర్, చెన్నూర్, ఆదిలాబాద్ డివిజన్లలోని వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. జైనథ్, బేల, తాంసి, కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూరు, దహెగాం, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు తదితర మండలాల్లోని గ్రామాల్లో వరదలతో జంతువుల కళేబరాలు ఇళ్లలోకి చేరాయి. చెత్తాచెదారం కొట్టుకొచ్చి గ్రామాలు కంపుకొడుతున్నాయి. డ్రెయినేజీలు, రహదారులపై నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. మంచనీటి బావుల్లో వర్షం నీరు చేరడంతో వాంతులు, విరోచనాలు అవుతున్నాయి. దోమలు, ఈగలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పక్షం రోజుల వ్యవధిలోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు. వందలాది మంది జ్వరం, విషజ్వరం, డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్, ఒళ్లునొప్పులతో బాధపడుతున్నారు. అనేక పల్లెలు మంచం పట్టాయి. ప్రజలు అంటూవ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో భయపడుతున్నారు. రహదారులు కోతలకు గురవడంతో వైద్య చేయించుకోవడానికి బయటికి వెళ్లలేని పరిస్థితి. వైద్యులు కూడా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది కనీసం బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేయడం లేదు. ఉప్పొంగుతున్న వాగులు.. ప్రాణాలు హరీ.. వర్షాలు, వరదలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. రహదారులపై నుంచి వరద పారడంతో బాహ్యగ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, కాజ్‌వేలు, బ్రిడ్జిలు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఎటూ వెళ్లాలన్నా కాలినడక వెళ్లాల్సిందే. ఆసిఫాబాద్, చెన్నూర్, కాగజ్‌నగర్ డివిజన్లలోని కెరమెరి, బెజ్జూర్ మండలాల్లో రోగులను మంచంపై తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొందరు పరిస్థితి విషమంగా ఉండటంతో పడవలు ఆశ్రయించారు. బెజ్జూరు మండలం నందిగామ్‌కు చెందిన దుర్గం కార్తిక్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికాగా భారీ వర్షాలతో గ్రామం దాటే పరిస్థితి లేదు. దీంతో మోకాళ్లలోతు నీళ్లలో బెజ్జూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం కావడంతో ప్రాణాలు వదిలాడు. ఇదే మండలంలో ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కిలోమీటర్ వరకు వాగు దాటించి ఆస్పత్రికి చేర్పించారు. ఇదే విధంగా వేమనపల్లి మండలం జాజులపేట గ్రామంలో అంజలి అనే చిన్నారి మృత్యువాత పడింది. మందుల కొరత జిల్లా ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. వాంతులు, విరోచనాలకు వచ్చే ఫ్యూరోజొలిడాన్, డోమ్‌పెరిడాన్ ద్రావణాలు కూడా అందుబాటులో లేవు. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో కూడా ఇదే పరిస్థితి. రోగులు బయట మందుల దుకాణం నుంచి కొనుగోలు చేస్తున్నారు. వాంతులు, విరోచనాలు అయ్యేటప్పుడు ఉపశమనం కోసం ఇచ్చే ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్లు, ప్యూరోజొలిడాన్ సిరప్ కొరత ఉంది. పిల్లలకు జ్వరం కోసం పారాసిటమాల్ సిరప్ లేకపోవడంతో పరిస్థితి తీవ్రంగా ఉంది. దగ్గు కోసం ఇచ్చే వ్యాధి నిరోధక మందులు అమాక్సిలిన్ పలు ఆస్పత్రుల్లో లేవు. దగ్గు కోసం ఇచ్చే సీపీఎం సిరప్, దమ్ము కోసం ఇచ్చే సాల్బుటమాల్ సిరప్, దమ్ము, దగ్గు కోసం ఇచ్చే డేరిఫిలిన్ ఇంజక్షన్ కూడా లేకపోవడంతో రోగులకు సరైన చికిత్స అందడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిమ్స్‌లోనే రోగులు ఒకే బెడ్డుపై ఇద్దరు పడుకుని చికిత్స పొందుతున్నారు. దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటున్నారు. జిల్లాలోని ఏరియా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు కూడా పెద్ద ఎత్తున జ్వరపీడితులు రావడంతో పడకలు ఖాళీలేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో పడకపై ఇద్దరు రోగులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు రిమ్స్‌లో ప్రతి వార్డులోను కనిపిస్తున్నాయి. దీంతో సరైన చికిత్స అందకుండానే తిరుగుముఖం పట్టిమృత్యువాత పడుతున్నారు. బజార్హత్నూర్ మండలం దిగ్నూర్ గ్రామానికి చెందిన ఇస్రు డయేరియా బారిన పడగా రిమ్స్‌కు చికిత్స కోసం తరలించగా సరైన చికిత్స అందించకుండానే ఆయనను డిశ్చార్జి చేయడంతో గ్రామానికి తీసుకెళ్లారు. మరుసటి రోజే మృతి చెందాడు. వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించకుండానే పలు చోట్ల మెడికల్ క్యాంపులను ఎత్తివేస్తుండడంతో వ్యాధిగ్రస్థులు సతమతమవుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం వర్షాలు, వరదలతో చెత్తాచెదారం, కొత్తనీరు వచ్చి చేరింది. డ్రెయినేజీలు, రహదారులపై నీరు నిల్వ ఉంటుంది. దోమలు, ఈగలు వ్యాపిస్తున్నాయి. వీటిని నివారించడానికి బ్లీచింగ్, క్లోరినేషన్ చే యాలి. సిబ్బంది కొరత కారణంగా పారిశుధ్య కార్యక్రమాలు స జావుగా జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని 866 గ్రామ పంచాయతీలకు గత నెల రూ.10 వేల చొప్పున ఒక్కో గ్రామ పంచాయతీకి ఎన్ఆర్హెచ్ఎం నిధులను మలేరియా విభాగం నుంచి విడుదల చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా రు. కలుషిత నీరు తాగిన ప్రజలు అస్వస్తకు గురవుతున్నారు. దో మ లార్వాలు వృద్ధి చెందకుండా బెటైక్స్ స్ప్రే చేయాల్సి ఉన్నప్పటికి గ్రామాల్లో నిధుల కొరత కారణంగా అది జరగడం లేదు. కొత్త సర్పంచ్‌లు కొలువుదీరినప్పటికి ఇంక చెక్‌పవర్ మంజూరు కాకపోవడంతో నిధుల విడుదలలోను జాప్యం జరుగుతుంది. ఎంపీడీఓలు, స్పెషల్ అధికారులు, ఈవోఆర్డీలు పారిశుధ్య కార్యక్రమాలపై దృష్ఠిసారించకపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. వైద్యుల కొరత జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో 20 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో మూడు ఏరియా ఆస్పత్రులు నిర్మల్, భైంసా, మంచిర్యాల, ఆరు కమ్యునిటీ హెల్త్ సెంటర్లు ఖానాపూర్, ఉట్నూర్, సిర్పూర్-టి, బెల్లంపెల్లి, ఆసిఫాబాద్, నిర్మల్ ఎంసీహెచ్ ఉండగా ఏరియా, కమ్యునిటీ హెల్త్సెంటర్లలో సగానికిపైగా కాంట్రాక్టు డాక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. ఉట్నూర్, ఆసిఫాబాద్‌లో రెగ్యులర్ వైద్యులు లేరు. సిర్పూర్లో ఒక్కరు మాత్రమే రెగ్యులర్ వైద్యుడు ఉన్నారు. జిల్లాలో ఎజెన్సీ ప్రాంతంలోని 33 పీహెచ్‌సీలను కలుపుకొని మొత్తంగా 72 పీహెచ్‌సీలు ఉండగా 174 వైద్యుల పోస్టులకు గాను 142 మంది పనిచేస్తున్నారు. దీంట్లో 89 మంది రెగ్యులర్ కాగా 53 మంది కాంట్రాక్టు వైద్యులు ఉన్నారు. ఒక్కో వైద్యునికి మూడు, నాలుగు పీహెచ్‌సీల ఇన్‌చార్జీలుగా నియమించడంతో పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉట్నూర్ అడిషనల్ డీఎంహెచ్‌వోనే ఆరు పీహెచ్‌సీల బాధ్యతలను నిర్వర్తిస్తూ అదనంగా అడిషనల్ డీఎంహెచ్‌వో బాధ్యతలు నిర్వర్తిస్తుండడం గమనార్హం. అయినా అధకారులు వైద్య శిబిరాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాగా వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి స్వామి తెలిపారు. -
సమైక్య సెగ ఢిల్లీని తాకాలి
కురబలకోట, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం లేదని, సమైక్యంగా ఉండడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఆయన కురబలకోట మండలం అంగళ్లుకు వచ్చారు. అక్కడి సమైక్య ఉద్యమ సారథి గోల్డన్‌వ్యాలీ రమణారెడ్డి, జేఏసీ కన్వీనర్ వై.సతీష్‌రెడ్డి వారికి స్వాగతం పలికారు. అంగళ్లులో జరిగిన బహిరంగ సభలో పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సీమాంధ్రులు చేస్తున్న సమైక్య ఉద్యమం ఢిల్లీని తాకాలని పిలుపునిచ్చారు. కొడుకు కోసం సోనియా రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డారన్నారు. మన రాష్ట్రం వారు కాకుండా బయటి రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ అధి నాయకులు రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. తరాలుగా కలసి ఉన్న తెలుగువారి విభజన దేశానికే ముప్పన్నారు. సమైక్యవాదాన్ని వినిపించడానికే తాను బస్సు యాత్ర ప్రారంభించానని వెల్లడించారు. రాయలసీమ, కోస్తా, ఆంధ్ర ప్రాంతాల్లో తిరగనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన లేదని కేంద్రం హామీ ఇచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు విశాలాంధ్ర సభ నాయకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పదవీ కాంక్షతో రగులుతున్న కేసీఆర్, అతని పరివారం మాత్రమే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ చేస్తున్నారని వివరించారు. ప్రజాప్రతినిధులను నిలదీయడం ద్వారా సమైక్యాంధ్ర సాధన సులభమవుతుందన్నారు. -
‘చితి’కిపోతున్నారు
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : డిగ్రీ చదువుకున్న వెంగల చక్రధర్‌కు ఉద్యోగం కరువైంది. కులవృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుందామని ఆశపడితే వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఆ చేతులకు పనిలేకుండా చేసింది. అప్పుల బాధతో పచ్చని సంసారంలో చిచ్చు రేగగా, మానసిక సమస్యలూ చుట్టుముట్టడంతో ఆవేదనకు లోనైన చక్రధర్ బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చక్రధర్ ఇంట్లో అందరూ శ్రమించేవారే. తల్లి లక్ష్మీదేవి బీడీ కార్మికురాలు. తండ్రి భూపతి మరమగ్గాల కార్మికుడు. చెల్లెలు వీణ డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తోంది. ఇంట్లో అందరూ పనిచేస్తున్నా ఇల్లు గడ వడం కష్టంగానే ఉంది. పద్మనగర్‌లో చిన్న పెంకుటిం ట్లో ఉంటున్న చక్రధర్ వారం రోజులుగా పని సరిగా లేక.. సాంచాలు నడవక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఏడాదిన్నర కిందట శాంతినగర్‌కు చెందిన కవితతో అతడికి పెళ్లయింది. పెళ్లికి రూ.లక్షన్నర వరకు అప్పులయ్యాయి. ఆ అప్పుల బాధలు.. చెల్లెలు పెళ్లికి ఎదగడం... వచ్చే ఆదాయం పొట్టపోసుకోవడానికే సరిపోతుండడంతో మానసిక వేదనకు గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లోనే సెల్ఫోన్లో పాటలు వింటూ పరదా చాటున కూర్చున్నాడు. ఇంట్లో ఎవరి పనుల్లో వారుండగా ఉరేసుకున్నాడు. చేనేత దినోత్సవం వేళ.. ప్రపంచ చేనేత దినోత్సవం సంబరాలను సిరిసిల్లలో నేతన్నలు బుధవారం నిర్వహించగా.. ఆ సంబరాల మాటునే విషాదం చోటుచేసుకుంది. చక్రధర్ ఆత్మహత్య సంఘటన కార్మిక క్షేత్రంలో విషాదం నింపింది. సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమకు దిగుమతయ్యే యారన్ (నూలు) రేట్లు భారీగా పెరగడం, ఉత్పత్తవుతున్న పాలిస్టర్ గుడ్డకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం పెరిగి ఆదాయం రాకపోవడంతో సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులు రెండు వారాలుగా పూర్తిస్థాయిలో వస్త్రోత్పత్తి చేయడం లేదు. దీంతో సిరిసిల్లలో పద్నాలుగు వేల మరమగ్గాలు మూతపడ్డాయి. ఎనిమిది వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ సంక్షోభమే ఓ యువకుడి నిండుప్రాణాన్ని బలితీసుకుంది. భరోసా ఇవ్వని సర్కారు రాష్ట్రంలోనే అత్యధికంగా 38 వేల మరమగ్గాలు జిల్లాలో ఉండగా... ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి పాతికవేల మంది కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి గురై ఇబ్బందులు పడుతుంటే భరోసా ఇవ్వాల్సిన సర్కారు నివేదికల పేరిట కాలయాపన చేస్తోంది. దివంగత నేత రాజశేఖరరెడ్డి హయాంలో సిరిసిల్ల నేతన్నలకు భరోసా ఇచ్చేందుకు 35 కిలోల బియ్యం, ఇంటింటికీ పావలా వడ్డీ రుణాలను సంపూర్ణ ఆర్థిక చేకూర్పు ద్వారా అందించారు. జాబ్‌మేళాలు నిర్వహించి నేత కుటుంబాల యువకులకు ఉద్యోగాలిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.లక్షన్నర ప్యాకేజీ అందించి ఆదుకున్నారు. ప్రస్తుత పాలకులు నేతన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై బుధవారం సాయంత్రం చేనేత జౌళిశాఖ అధికారులు ఆర్డీవో సమక్షంలో సమావేశమయ్యారు. పరిశ్రమను నడపాలని వస్త్రోత్పత్తిదారులను కోరారు. పెరిగిన నూలు రేట్లతో పరిశ్రమను నడపలేమని యజమానులు తేల్చిచెప్పారు. ప్రభుత్వం మాత్రం నేతన్నలను ఆదుకోవడానికి ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించకపోవడం శోచనీయం. ఈ కన్నీళ్లకు బాధ్యులెవరు? ఒక్కగానొక్క కొడుకు కళ్లెదుటే ఉరేసుకుని తనువు చాలిస్తే ఆ కన్నతల్లి గుండె చెరువైంది. గుండెలు బాదుకుంటూ ‘కొడుకా ఎంత పని చేసినావంటూ..’ లక్ష్మీదేవి చేస్తున్న రోదనలు అందరినీ కదిలించాయి. ‘అన్నయ్యా... ఎందుకీ పని చేశావని’ చెల్లెలు వేదనకు అంతేలేదు. ‘అయ్యో కొడుకా.. నేను సాంచాల్ పనికి పొయ్యేసరికి పాణం తీసుకుంటివి..’ అంటూ కన్న తండ్రి భూపతి కుమిలిపోతున్నాడు. అందరికి ఆ‘ధారమై’న చక్రధర్ ఇక సెలవంటూ.. ఈ లోకాన్ని వీడడంతో ఆ కన్నీళ్లకు బాధ్యలెవరు?. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజలను రక్షించేదెవరు ?
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ప్రజల రక్షణ కోసం ఏర్పడిన పోలీసు వ్యవస్థ అర్థం మారుతోంది. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు జాతీయ నేతల వ్రిగహాలకు, పార్టీ కార్యాలయాలకు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు కాపలా కాస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల రక్షణ గాలికొదిలేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో నెల్లూరులోని రెండిళ్లల్లో పట్టపగలే దొంగలు పడి దొరికినకాడికి దోచుకెళ్లారు. గొలుసుదొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో మూడు చోట్ల మహిళల మెడల్లోని గొలుసులను లాక్కెళ్లారు. పోలీసు రికార్డులకెక్కని సంఘటనలు కోకొల్లలు. వరుస ఘటనలు నగర ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నియంత్రించాల్సిన పోలీసులు సమైక్య ఆందోళనలు, రాస్తారోకోల పర్యవేక్షణ, విగ్రహాలకు భద్రత తదితర కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. ఫలితంగా దొంగలు తమ హస్తలాఘాన్ని ప్రదర్శిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ శాతం మంది పోలీసులకు వివిధ ప్రాంతాల్లో డ్యూటీలు వేయడంతో పోలీసుస్టేషన్లు దాదాపు ఖాళీ అయ్యాయి. మొక్కుబడిగా నలుగురైదుగురు మాత్రమే స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించే వారిని పట్టించుకొనేవారు కరువయ్యారు. సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టసాధ్యం. ఉద్యమాల పేరుతో నిరసనలు, రాస్తారోకోలు, దీక్షలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ట్రాఫిక్ నియంత్రణ సాధ్యం కావడం లేదు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. దీనికి తోడు నగరంలోని ప్రధాన రహదారి నిర్మాణంలో ఉండటం తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి తమ రక్షణపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
పల్లె కదిలింది
సాక్షి, నెల్లూరు: సమైక్య ఉద్యమానికి ప్రతి పల్లె తాను సైతం అంటూ కదిలి వస్తోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా ప్రజానీకం ఆందోళనలు ఉధృతం చేస్తోంది. తొలుత విద్యార్థులు, ఉద్యోగులతో ప్రారంభమైన సమైక్యాంధ్ర ఆందోళన ఇప్పుడు పల్లెలకు వ్యాపించింది. ప్రతిరోజూ గ్రామీణులు రోడ్లపైకి వస్తూ ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నారు. రోడ్లపై ఎద్దుల బండ్లు, రాళ్లు, కట్టెలు అడ్డం పెట్టి ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున పాల్గొనడం రాష్ట్ర విభజనపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు పుట్టగతులు లేకుండా చేస్తామని ప్రజలు శపథం చేస్తున్నారు. 50 ఏళ్లకు పైగా శ్రమించి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుంటే, ఇవాళ ఆ నగరం మీది కాదంటూ కాంగ్రెస్ అధిష్టానం విభజనకు పాల్పడడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల ముఖ్యంగా సీమాంధ్ర కు అందులోనూ నెల్లూరు జిల్లా ఉద్యోగులు, విద్యార్థులకు నష్టం జరగడమే కాక అంతకు మించి సాగు,తాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయన్న మాట యధార్థం. ఈ దిశగా మేధావులు,నేతల వాదనలను ఇక్కడి ప్రజలు ఆలకిస్తున్నారు. భవిష్యత్తులో సీమాంధ్రకు జరగనున్న అన్యాయం కళ్లముందు కనిపిస్తుండడంతో ఇక్కడి ప్రజలు ముఖ్యంగా రైతులు ఆగ్రహావేశాలతో ఆందోళనలలో పాల్గొంటున్నారు. తెలంగాణ ఏర్పడితే కృష్ణా జలాల సమస్య తలెత్తుతుందని, తెలంగాణ నేతలు ఎట్టి పరిస్థితిలోనూ దిగువకు నీళ్లు వదలరని ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అప్పుడు గొడవ పడినా ప్రయోజనం ఉండదన్నది ప్రజల వాదన. ఇప్పుడు ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ,కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంలను చూసేందుకు కూడా సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలనే ఆయా రాష్ట్రాలు రానివ్వని విషయాన్ని సామాన్య జనం ఉదహరిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే చుక్కనీరు దిగువకు రానివ్వరని, దీంతో కేవలం వరదలు వస్తే తప్ప సోమశిలకు సరైన సమయంలో నీరు వచ్చే పరిస్థితి ఉండదన్న ఆందోళన అందరిలోనూ ఉంది. ఏడాదికేడాదికి వాతావరణ పరిస్థితులలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సాధారణ వర్షపాతం కూడా సరిగ్గా నమోదవుతున్న పరిస్థితులు లేవు. ఈ క్రమంలో వరదలు వస్తే తప్ప దిగువకు నీళ్లు రావన్న భయం ప్రజల్లో ఉంది. పర్యవసానంగా సోమశిల ఆధారంగా ఉన్న 8 లక్షలకు పైగా ఆయకట్టు బీళ్లగా మారే పరిస్థితి లేకపోలేదని డెల్టా రైతాంగం మరింత ఆందోళనతో ఉంది. ఇదే జరిగితే జిల్లాలోనే కాక ఇతర ప్రాంతాలకు సైతం తిండి గింజలు అందిస్తున్న నెల్లూరు జిల్లాలోనూ కరువు కాటకాలు తప్పవన్నది విశ్లేషకుల మాట. ఇక జిల్లాకు చెందిన వేలాది మంది విద్యావంతులు హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో వీరందరి పరిస్థితి అగమ్య గోచరంగా మారనుంది. ఇప్పటికే అక్కడి ఉద్యోగుల పరిస్థితి దినదినగండమైంది. రాష్ట్రం విడిపోతే భవిష్యత్తులో ఇక్కడి విద్యార్థులకు ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. మొత్తంగా రాష్ట్ర విభజన అన్నివర్గాల వారి బతుకులను అతలాకుతలం చేయనుంది. అందరి భయం ఇదే. దీంతో ఇక్కడి ప్రజలు గ్రామస్థాయిలో వీధుల్లోకి వచ్చి ఆందోళన బాటపట్టారు. జిల్లాలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా ప్రత్యక్ష ఆందోళనకు దిగి ఉద్యమకారులకు అండగా నిలిచింది. దీంతో ఉద్యమం పతాకస్థాయికి చేరింది. టీడీపీ ఆలస్యంగా ఉద్యమానికి మద్దతు పలికింది. రాష్ట్ర విభజన పాపం మూటగట్టుకొని తొలుత ముఖం చాటేసిన ఇక్కడి కాంగ్రెస్ నేతలు మరింత ప్రజాగ్రహం చవిచూడక ముందే ఉద్యమంలోకి ఆలస్యంగా ప్రవేశించారు. అన్ని రాజకీయ పార్టీలు సమైక్యంగా ఉద్యమాన్ని నిర్వహిస్తే రాష్ట్ర విభజనను అడ్డుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ఉద్యమ కారులు,రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనను అడ్డకోకపోతే భావితరాలు క్షమించవని, సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై ఉద్యమంలోకి రావాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. -
కదం తొక్కారు
నెల్లూరు (సెంట్రల్), న్యూస్‌లైన్ : సమైక్య ఉద్యమజ్వాల రోజురోజుకూ జిల్లాలో ఎగిసి పడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉద్యమం బుధవారం ఉవ్వెత్తున ఎగిసింది. పల్లె మొదలుకుని పట్టణం వరకు ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారకులైన సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నెల్లూరులో బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు స్వగృహాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులా ట చోటుచేసుకుంది. సమైక్యాంధ్రపై ఎలాంటి ప్రకటన చేయని మంత్రి రామనారాయణరెడ్డిని ప్రజలు నిలదీ స్తారనే ముందు జాగ్రత్తతో పోలీసులు చూపిన అత్యుత్సాహం విమర్శలకు దారితీసింది. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ నుంచి భారీ ప్రదర్శనగా వెళ్లి మినీబైపాస్‌రోడ్డులో వంటావార్పు నిర్వహించారు. బుజబుజనెల్లూరులో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళి, వైఎస్సార్సీసీ సీఈసీ సభ్యుడు, నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో హైవేపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ బారులుతీరాయి. సమైక్య విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్‌పై రాస్తారోకో నిర్వహించారు. వీఎస్‌యూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ భారీగా సాగిం ది. ఎన్జీఓ అసోసియేషన్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను విధులను బహిష్కరించేలా చేసి నిరసనలు వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల సం యుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. కావలి లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు జెండా సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వర కు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. దీంతో పాటు న్యాయవాదులు, ట్రక్కు ఆటో డ్రైవర్ల యూనియన్లు, ఎన్జీఓలు ప్రత్యేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ముత్తుకూరులో విద్యార్థి, యువజన సంఘాలు బస్టాండ్ కూడలిలో మానవహారంతో నిరసన వ్యక్తం చేశారు. అలాగే పొదలకూరులో ట్రక్కు ఆటోల ప్రదర్శన, మనుబోలు, వెంకటాచలంలలో విద్యార్థులు రాస్తారోకోలు నిర్వహించారు. వెంకటగిరిలో జర్నలిస్టుల సంఘం, సమైక్య పోరాట సమితి ఆధ్వర్యంలో కాశీపేట సెంటర్లో సోనియా బొమ్మకు నిప్పంటించారు. సైదాపురంలోని సీఆర్ఆర్ కళాశాల విద్యార్థులు సోనియా చిత్రపటానికి శవయాత్ర చేసి శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు. వింజమూరులోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతోపాటు కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఉదయగిరిలో జర్నలిస్టులు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో రిలే నిరాహార దీక్షకు దిగారు. వరికుంటపాడు, సీతారాంపురం మండలాల్లో విద్యార్థులు వైఎస్సార్సీపీ నేతలు వంటా వార్పుల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు. కోవూరులో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం, విడవలూరులలో సమైక్యాంధ్ర, జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీల ద్వారా నిరసనలు కొనసాగించారు. సూళ్లూరుపేటలో ఆర్టీసీ జేఏసీ, వ్యవసాయ శాఖాధికారులు, పెన్షనర్ల అసోసియేషన్, వైఎంఆర్సీ క్లబ్‌ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. నాయుడుపేటలో ఎమ్మెల్యే పరసారత్నం సమైక్యాంధ్ర కోరుతూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెళ్లకూరు, ఓజిలి, దొరవారిసత్రంలలో కూ డా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గూడూరులో మత్స్యకార మహిళలు కేసీఆర్ బొమ్మకు శవయాత్ర నిర్వహించి క్లాక్ టవర్ వద్ద దహనం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు నిర్వహిస్తున్న కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాద్‌రావు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గూడూరులో సమైక్యాంధ్ర జేఏసీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్ కుమా ర్, బాలచెన్నయ్య కూర్చొని తమ మద్ద తు ప్రకటించారు. ట్రాన్స్‌కో సిబ్బంది డీఈ కార్యాలయం ఎదుట ఆందోళనలతో నిరసన వ్యక్తంచేశారు. చిట్టమూ రు, కోట మండలాల్లో సోని యా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. -
ఊపిరి తీసిన వర్షాలు
ఉట్నూర్ రూరల్/తానూర్/దండేపల్లి, న్యూస్‌లైన్ : వర్షాలు రైతుల ఊపిరి తీస్తున్నాయి. పక్షం రోజులుగా కురిసిన వర్షం నీరు చేలలో చేరడంతో మొక్కలు కుళ్లిపోయాయి. దీంతో దిగుబడి రాదని, అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి ఎలా తీర్చాలనే బెంగతో ముగ్గురు రైతులు మనస్తాపం చెంది బుధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉట్నూర్ మండలం సాలేవాడ(బి) గ్రామపంచాయతీ పరిధిలోని తాండ్రా గ్రామానికి చెందిన గిత్తే కిషన్(48), తానూర్ మండలం హిప్నెల్లి తండాకు చెందిన రాజేశ్(25), దండేపల్లి మండలం తానిమడుగు గ్రామానికి చెందిన మాదావత్ శ్రీరాం(48)లు ఆత్మహత్య చేసుకున్నారు. చేలో నీరు చేరి.. ఉట్నూర్ మండలం సాలేవాడ(బి) గ్రామపంచాయతీ పరిధిలోని తాండ్రా గ్రామానికి చెందిన గిత్తే కిషన్(48)కు మూడెకరాల భూమి ఉంది. ఇందులో పత్తి సాగు చేశాడు. మొదటి కురిసిన వర్షాలకు మొక్కలు కుళ్లిపోయాయి. మళ్లీ సోయా సాగు చేశాడు. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షాలకు మొక్కలు కొట్టుకుపోయాయి. రెండుసార్లు పెట్టుబడి నష్టం వాటిల్లడంతో మనస్తాపం చెందాడు. బుధవారం వేకువజామున ఇంట్లో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. కిషన్‌కు భార్య గంగాబాయి ఉంది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువరైతు.. తానూరు మండలం హిప్నెల్లి తండాకు చెందిన రాజేశ్‌కు ఆరు నెలల క్రితం వివాహమైంది. తనకున్న రెండెకరాలతోపాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. పెట్టుబడి కోసం ప్రైవేటుగా రూ.లక్ష అప్పు చేశాడు. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షానికి చేలలో నీరు నిలిచి మొక్కలు కుళ్లిపోయాయి. దిగుబడి వచ్చే అవకాశం లేక అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెంది ఇంట్లో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు గమనించి భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజేశ్‌కు తల్లి సక్కుబాయి, తండ్రి ఉత్తం, భార్య లక్ష్మి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై మసూద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి భైంసా ఏరియా ఆస్పత్రిలో రాజేశ్ మృతదేహన్ని పరిశీలించారు. ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కౌలు రైతు.. దండేపల్లి మండలంలోని తానిమడుగు గ్రామానికి చెందిన మాదావత్ శ్రీరాం(48)కు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు. గతేడాది పెద్దకూతురుకు పెళ్లి చేశాడు. దీంతో కొంత అప్పుల పాలయ్యాడు. మరో ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి ఉన్నారు. ఈ యేడు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. ఇందుకు రూ.లక్ష అప్పు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి చేనులో నీళ్లు నిలిచి మొక్కలు కుళ్లిపోయాయి. దీంతో పంట దిగుబడి రావడం అనుమానమే అని భావించాడు. ప్రస్తుతం, గతంలో చేసిన అప్పులు రూ.2లక్షలు కావడంతో మనస్తాపం చెందాడు. బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించే లోపు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్ వివరించారు. -
8 రోజులుగా రాకపోకల్లేవు
సాక్షి, తిరుపతి : ప్రయాణికులతో కిటకిటలాడే తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ ఎనిమిది రోజులుగా నిర్మానుష్యంగా మారింది. చూసినంత దూరం ప్లాట్‌ఫారాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక్క తిరుపతి ఆర్టీసీ బస్టాండే కాదు. చిత్తూరు రీజియన్‌లోని 14 ఆర్టీసీ బస్‌డిపోల పరిధిలోని 18 బస్టాండ్లలోనూ ఇదే వరస. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సహకరించి విధులకు గైర్హాజరు అవుతుండటంతో సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది. ఎనిమిది రోజులుగా జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీనికి తోడు జిల్లాలో రహదారుల దగ్బంధం కొనసాగుతోంది. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందం గా రోడ్లపైకి వచ్చి వాహనాలు ఆపేస్తున్నారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం కూడా బస్సులను డిపోలకే పరిమితం చేసింది. చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, సత్యవేడు, పుంగనూరు, పల మనేరు వంటి పట్టణాలకు రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కేవలం ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయించి ప్రజలు గమ్యస్థానాలకు వెళ్తున్నారు. తమిళనాడు, కర్ణాటక బస్సు సర్వీసులను కూడా ఆయా రాష్ట్ర సంస్థలు నిలిపేశాయి. రీజియన్‌కు రూ.11 కోట్ల నష్టం ఆర్టీసీ చిత్తూరు రీజియన్‌కు ఇప్పటి వరకు రోజుకు రూ.1.25 లక్షల చొప్పున ఎనిమిది రోజులకు రూ.11 కోట్ల వరకు నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 14 డిపోల్లో 1450 దూర ప్రాంత బస్సులు రోడ్డెక్కకపోవటంతో ఈ నష్టం వాటిల్లినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మాత్రం ఉద్యమకారులు మినహాయింపు ఇవ్వటంతో 450 బ స్సుల వరకు తిరుగుతున్నాయి. జిల్లాలో మారుమూ ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఒకటి అర గ్రామీణ స ర్వీసులు, దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసు లు, హైటెక్, వోల్వో సర్వీసులు కదలడం లేదు. ఇప్ప టి వరకు అలిపిరి డిపో పరిధిలో ఒక బస్సు స్వల్పం గా దగ్ధం కాగా, సత్యవేడు డిపో పరిధిలో రెండు బస్సులు ధ్వంసమయ్యాయి. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు రైళ్లలో వెళ్తున్నారు. దీంతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రైవేట్ వాహనాల నిలువుదోపిడీ ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనాలకు వరంగా మారింది. సామాన్య ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణా లైన తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, పలమనే రు, మదనపల్లి, పుంగనూరుకు సమీప గ్రామాల నుంచి రోజువారి ఉపాధి కోసం వచ్చేవారు, చిరు వ్యాపారాలు సెవెన్సీటర్లను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. తిరుపతి నగరంలో సిటీ బస్సులు తిరగకపోవటంతో కొద్ది దూరానికి కూడా కనీసం రూ.50 ఇవ్వనిదే ఆటోవారు రావటం లేదు. దీంతో సామాన్యులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే సెవెన్ సీటర్లే దిక్కుగా మారాయి. హైవేల పై సెవెన్సీటర్లు అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు గుల్లచేస్తున్నాయి -
మళ్లీ మైక్రో ఫైనాన్స్ వేధింపులు
కందుకూరు, న్యూస్‌లైన్: ‘షేర్ మిలా...’ఈ పేరు వినపడిందంటే గ్రామాల్లోని ప్రజలకు ఒకప్పుడు వణుకుపుట్టేది. మైక్రో ఫైనాన్స్ సంస్థకు చెందిన ప్రతినిధులు గ్రామాల్లోకి వస్తున్నారంటేనే రుణం తీసుకున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు అదిరిపోయే వారు. అవసరాలకు వారి వద్ద రుణం తీసుకుంటే వారం వారం కచ్చితంగా కట్టాల్సిందే. వారి వద్ద అప్పు తీసుకొని తిరిగి చెల్లించడానికి మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొనేవి. ఇది 2008 - 10 సంవత్సరాల్లోని మాట. మైక్రో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధుల ఆగడాలకు గ్రామాల్లో రుణాలు తీసుకుని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారూ ఉన్నారు. ప్రజల అవస్థలు ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో ఆయా సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. దీంతో సంస్థల ప్రతినిధులు తట్టాబుట్టా సర్దుకొని వెనక్కి తగ్గారు. అయితే అప్పటి వేధింపులు ఇప్పుడు మళ్లీ వెంటాడడం ప్రారంభించాయి. షేర్ మైక్రో ఫైనాన్స్ సంస్థ 2009 సంవత్సరంలో ఒక్క కందుకూరు ప్రాంతంలోనే సుమారు 2,300 మందికిపైగా అప్పులిచ్చింది. అప్పట్లో ప్రభుత్వ చర్యలకు భయపడి వసూళ్లకు వెనకాడిన సంస్థ ప్రతినిధులు తాజాగా వారం పది రోజుల నుంచి రుణాలు తిరిగి చెల్లించాలంటూ బకాయిదారులకు నోటీసులు పంపించడం ప్రారంభించారు. కొంత మంది తిరిగి కట్టినా..మళ్లీ తీసుకున్న రుణం మొత్తం కట్టాలని నోటీసులు వచ్చాయి. దీంతో ఇప్పటికే డబ్బు కట్టేసిన వారు ఆందోళనలో ఉన్నారు. తీసుకున్న రుణానికి వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులతో పాటు అదనంగా కొంత చెల్లించాలంటూ షేర్ మైక్రో ఫైనాన్స్‌కు చెందిన ప్రతినిధులు బాధితుల వద్దకు రావడం ప్రారంభించారు. దాదాపు 90 శాతం వరకు రుణం తిరిగి చెల్లించిన వారు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించినా..లేదు మొత్తం కట్టాల్సిందేనని మొండికేయడంతో కందుకూరుకు చెందిన శ్రీనివాసరావు, నాగూర్ అనే బాధితులు మంగళవారం కందుకూరు పోలీసులను ఆశ్రయించారు. రూ.3 వడ్డీ అని ముందు చెప్పి రూ. 12 వరకు వసూలు రుణం ఇచ్చేటప్పుడు నెలకు నూటికి మూడు రూపాయలు మాత్రమే వడ్డీ పడుతుందని సంస్థ ప్రతినిధులు నమ్మబలుకుతారు. కానీ నెలవారీ కిస్తీలకు వచ్చే సరికి బాధితులు కట్టే అదనపు మొత్తం ఒక సారి లెక్కేసి చూసుకుంటే రూ.100లకు సరాసరిన రూ. 12ల వరకు వడ్డీ పడుతుంది. సాధారణంగా సరాసరిన వేసే వడ్డీకి వారం వారం లేక నెల నెలా కట్టే కిస్తీ మొత్తాన్ని తీసివేసి ఆ తర్వాత ఉన్న మొత్తానికి వడ్డీ వేయాలి. అయితే అసలుకు ముందే వడ్డీ నిర్ణయించి కిస్తీలు వేయడం వల్ల బాధితునిపై అదనపు భారం పడుతోంది. చివరి మూడు నెలలు కట్టాలి 2009 డిసెంబర్లో రూ. 30 వేలు రుణం తీసుకున్నా. మొత్తం 12 నెలల్లో వడ్డీతో కలిపి మొత్తం చెల్లిస్తానని సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నా. చివరి మూడు నెలలు మాత్రమే కుస్తీలు చెల్లించాల్సి ఉంది. అందుకు తగిన ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయి. కానీ మొత్తం చెల్లించాలని సంస్థ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగా నోటీసులు కూడా పంపించారు. - నాగూర్, కందుకూరు తిరిగి చెల్లిద్దామంటే ఎవరూ రాలేదు కందుకూరులోని రైతు బజారు వద్ద కోడి గుడ్ల వ్యాపారం చేసుకుంటున్నాను. 2010లో రూ.30 వేలు వ్యాపార అవసరాల కోసం తీసుకున్నాను. కానీ అప్పటి నుంచి తిరిగి చెల్లిద్దామంటే ఎవరూ రాలేదు. ఇప్పుడేమో రెండింతలు మొత్తం చెల్లించాలని నోటీసులు పంపించారు. అంత మొత్తం చెల్లించడం ఇప్పట్లో నావల్ల అయ్యే పని కాదు. మూడు సంవత్సరాలకు రెట్టింపు కట్టమంటే వడ్డీ రూపంలో చాలా పడుతుంది. సాధారణ వడ్డీ అయితే కట్టేందుకు సుముఖంగానే ఉన్నాను. - నల్లూరి శ్రీనివాసరావు, కోడిగుడ్ల వ్యాపారి పరిశీలించి కేసు నమోదు చేస్తా మైక్రో ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు, వాళ్ల విధి విధానాలను పరిశీలిస్తున్నాను. బాధితులు కొంత మంది మమ్మల్ని ఆశ్రయించారు. కొంత రుణం తిరిగి చెల్లించినా కట్టలేదని ప్రతినిధులు చెప్తున్నట్లు బాధితులు మా దృష్టికి తీసుకొచ్చారు. సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేస్తున్నాం. అక్రమాలు ఉన్నాయని తేలితే కేసు నమోదు చేస్తాం. - హుస్సేన్‌బాషా, పట్టణ ఎస్సై -
రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తట్టుకోలేక ఆగుతున్న గుండెలు
సాక్షి, ఏలూరు: రాష్ట్రాన్ని నిలువునా చీల్చుతుంటే తెలుగువారంతా విలవిల్లాడుతున్నారు. రాష్ట్రం ముక్కలవుతుంటే తట్టుకోలేక కొందరి గుండెలు ఆగిపోతున్నాయి. విడిపోయి బతకలేమని, తమ ప్రాణ త్యాగంతోనైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమంటూ మరికొందరు ఆత్మ బలిదానం చేస్తున్నారు. ఆవేదన నుంచి పుట్టిన ఆవేశంతో.. కన్నీళ్ల నుంచి జనించిన తెగింపుతో.. జై సమైక్యాంధ్ర అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జనం గొంతెత్తి నినదిస్తున్నారు. ఎన్ని రోజులైనా, మరెన్ని కష్టాలెదురైనా విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో నడుస్తున్న సమైక్య ఉద్యమ ఆందోళనలు బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. అన్నివర్గాల ప్రజలు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు, విద్యార్థులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, పీసీసీ సభ్యుడు కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఒకే రోజు నలుగురు మృతి.. పెయింటర్ ఆత్మబలిదానం రాష్ట్ర విభజనను తట్టుకోలేక బుధవారం ఒక్కరోజే ఐదుగురు గుండెపోటుతో మరణించగా ఓ పెరుుంటర్ ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. ఇరగవరం మండలం కాకిలేరులో దిగుమర్తి రాజీవ్‌గాంధీ (24)అనే పెయింటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తిలి మండలం గుమ్మంపాడులో వినుకొండ వెంకటసుబ్బమ్మ అనే మహిళ (54), ఉండి గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీను (31), పెంటపాడు మండలం రామచంద్రపురానికి చెందిన మేనేటి కోటేశ్వరరావు(61), ఉంగుటూరు మండలం నారాయణపురంలో తాపీ కార్మికుడు కర్రి నాగరాజు(35) గుండెపోటు గురైతో మృతిచెందారు. ‘అందాల రాక్షసివే.. గుండెల్లో గుచ్చావే’ ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో సోనియాగాంధీని రాక్షసిగాను, కేసీఆర్‌ను మహిళగానూ చిత్రీకరించిన ఫ్లెక్సీలతో ప్రదర్శనలు చేశారు. ఆ ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టారు. కేసీఆర్, సోనియాల దిష్టి బొమ్మలను దహనం చేశారు.వైఎస్సార్ సీపీ నాయకులు గుడిదేసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. జిల్లాలోని విద్యుత్ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాయి. కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చిన్నారులు భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, శివాజీ వేషధారణలతో ఉద్యమాన్ని ఉత్తేజపరిచారు. రైతాంగ సమాఖ్య ర్యాలీ భారీ నిర్వహంచింది. తెలుగుతల్లి చిత్ర పటం వద్ద సావిత్రి భూదేవ సేవా సంఘం 108 కొబ్బరి కాయలు కొట్టి నిరసన తెలిపింది. ఫైర్‌స్టేషన్ సెంటర్లో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు, వసంతమహల్ సెంట ర్లో గాయత్రి పురోహితుల సంఘం, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ది పశ్చిమగోదావరి జిల్లా అధీకృత ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన బైక్‌లు, ట్రాక్టర్లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించగా, లారీలు, టాటా మ్యాజిక్, జీప్‌లు, కార్ల సంఘాలు కూడా ర్యాలీ నిర్వహించా యి. దీంతో ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి పాతబస్టాండ్ వరకు రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. వంటా వార్పులు.. నిరసన దీక్షలు పాలకొల్లు నియోజకవర్గంలో అనేకచోట్ల వంటావార్పు నిర్వహించారు. యలమంచిలి మండలం చించినాడలో రిలే నిరహారదీక్షలు ప్రారంభించారు. తణుకులో కేసీఆర్ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు వాహనాన్ని అడ్డుకుని వైఎస్సార్సీపీ నాయకులు ఘెరావ్ చేశారు. ఆచంట, వ ల్లూరు, పెనుగొండ, మార్టేరు సెంటర్లలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆచంటలో జేఏసీ నాయకులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్లో మంత్రి పితానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమైక్యవాదులతో మంత్రి తనయుడు వెంకట్ వాగ్వివాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడిలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. కొవ్వూరు సంస్కృత పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పటం ఆకారంలో కూర్చుని సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు. బంద్ విజయవంతం నిడదవోలు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. గణేష్ చౌక్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహర దీక్షలు మూడవ రోజుకు చేరుకన్నాయి. కైకరంలో జాతీయ రహదారిపై వికలాంగులు రాస్తారోకో చేశారు. భీమవరం ప్రకాశం చౌక్ నిరసనలతో హోరెత్తింది. ఉండి మండలం మహదేవపట్నం, కాళ్ల మండలం పెద అమిరంలో రహదారులను దిగ్బంధించి రాస్తారోకో నిర్వహించారు. సోనియా, కేసీఆర్‌లకు పిండ ప్రదానం చేశారు. ఆకివీడులో ఆందోళనకారులు రిలే నిరాహార దీక్షలతోపాటు రాష్ట్రానికి, దేశానికి పట్టిన కీడు పోవాలని వేద పండితులతో అగ్ని హోమాన్ని నిర్వహించారు. -
సమైక్య పోరు నిరసనల హోరు
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే కళ్లుమూసుకున్నారా? అంటూ జనం పాలకులపై నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర విభజనను ఒప్పుకునేది లేదని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు తాళాలు వేసి విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి సమైక్య గళం వినిపిస్తున్నారు. పార్టీలకతీతంగా అన్ని రకాల కుల వృత్తులు, వ్యాపార, కార్మిక, సేవా రంగాలకు చెందిన అసోసియేషన్ల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఫ్లెక్సీలను పట్టుకుని వీధుల్లో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా, మానవహారాలు నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారు. జిల్లాలో ఎనిమిదో రోజు సమైక్యవాదులు కదం తొక్కారు. సాక్షి, తిరుపతి : సమైక్య ఉద్యమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. జిల్లాలోని రెవెన్యూ, ఎంపీడీవో, మునిసిపల్ కార్పొరేషన్, విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. రెవెన్యూ, పల్లె పాలనను చూసుకునే మండల పరిషత్‌లు, నగర పాలక సంస్థలు, మున్సిపల్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలకు తాళాలు వేసి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ఉద్యమిస్తున్నారు. వైద్యశాలకు తాళాలు సమైక్య ఉద్యమంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు, సిబ్బంది రోడ్డెక్కారు. తిరుపతి నగరంలో రుయా, స్విమ్స్, పలు కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యం ఆందోళనలు చేస్తు న్న ఉద్యమకారులకు సంఘీభావం తెలియజే స్తూ సమైక్యవాదులకు అండగా నిలుస్తున్నారు. వైద్యులు, సిబ్బంది కలిసి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. వినోదానికి బ్రేక్ ఉద్యమంలో జనం కీలకపాత్ర పోషిస్తుండటంతో వినోదాలకు బ్రేక్ ఇచ్చారు. జిల్లాలోని సినిమా హాళ్లు మూసివేశారు. టీవీలో ఎంటర్టైన్మెంట్ చానళ్లను కూడా నిలిపేసి కేబుల్ నెట్వర్క్ యూనియన్లు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. మూడు రోజులు గా టీవీలో ప్రసారాలు రావటం లేదు. వ్యాపార వర్గాలన్నీ షాపులు మూసివేసి ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. ఎనిమిదవ రోజు కొనసాగిన ఆందోళనలు జిల్లాలో ఎనిమిదవరోజు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తాళాలువేసి విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి సమైక్య గళం వినిపించారు. చంద్రగిరిలో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మకు చీర, పసుపు, కుంకు మ, గాజులు, పూలతో సారెపెట్టి మహిళలు నిరసన తెలియజేశారు. తిరుపతిలో అంధులు సమైక్యాంధ్ర కోసం నగర ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో షాపులను మూయించి బంద్ నిర్వహించారు. సత్యవేడులో సమైక్యవాదులు ఏ చిన్నవాహనా న్ని కూడా వీధుల్లో తిరగనివ్వకుండా అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బాలాజీ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతిలో క్రీడాకారులు స్విమ్మింగ్ ఫూల్లో ఈతకొడుతూ విన్నూత్న రీతిలో నిరసన తెలియజేశారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు తిరుపతిలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి కళాకారులతో కలసి గద చేతబట్టి ఆం దోళనలో పాల్గొన్నారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు విన్నూత్నంగా నిరసన తెలియజేశారు. తిరుపతి ఎస్వీయులో విద్యార్థుల ఆమరణ నిరాహరదీక్షలు కొనసాగాయి. మెడికల్ కళాశాల ముం దు డాక్టర్లు రిలేనిరాహారదీక్ష చేపట్టారు. నాలుగుకాళ్ల మండపం వద్ద మాజీ కౌన్సిలర్లు రిలే నిరాహారదీక్షలు కొనసాగిం చారు. కాంగ్రెస్ సెలూన్లో కటింగ్ కోసం వచ్చిన సీఎం కిరణ్, బొత్స, కావూరిలకు గుండు కొట్టి పంపించటా న్ని ఒక చిత్రకారుడు గీసి చూపించారు. శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్ యజమానులు టీవీలకు పలువురు విభజన పరుల చిత్రాలను అంటించి రోడ్డుపై పగులగొట్టి నిరసన తెలిపారు. -
సమైక్యాంధ్రకు ‘పశ్చిమ’లో మిన్నంటుతున్న నిరసనలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వేలాది మందితో ఉప్పు సత్యాగ్రహం.. వెల్లువెత్తిన విదేశీ వస్త్ర బహిష్కరణ.. సహాయ నిరాకరణ.. పన్నుల చెల్లింపు నిరాకరణ.. ఇవన్నీ దేశ స్వాత్రంత్య ఉద్యమం నాటి ఘట్టాలు. 70 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనల్ని అప్పటి తరం వాళ్లు చెబుతున్నా.. ఆ ఘట్టాలకు సంబంధించిన వివరాలను చదువుతున్నా శరీరం రోమాంఛితమవుతుంది. ‘అబ్బా.. అప్పట్లో ఉద్యమాలు అలా జరిగేవా.. అప్పటి ప్రజలు అంతటి పోరాట పటిమ కలిగి ఉండేవారా.. అలాంటి ఆందోళనలు ఈ తరాల వారికి సాధ్యమేనా.. వారి నిబద్ధత ప్రస్తుత సమాజానికి సాధ్యమేనా’ అనే ప్రశ్నలెన్నో ఉద్భవిస్తాయి. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం జిల్లాలో వెల్లువెత్తుతున్న ఉద్యమాలు ఆ ప్రశ్నలను పటాపంచలు చేస్తున్నాయి. పైగా ఆ కాలంలో మహా నాయకులెందరో ముందుండి చైతన్యం రగిలించారు. స్వాతంత్య్ర ఉద్యమాల్ని ముందుకు నడిపించారు. ఇప్పుడు అలాంటి నాయకులెవరూ లేరు. కానీ.. సామాన్య జనమే ఉద్యమపథంలో ఉరకలు వేస్తున్నారు. భావోద్వేగాలు రగిలినప్పుడు ఉద్యమాలు వాటికవే పుడతాయనడానికి సమైక్యాంధ్ర ఉద్యమ పోరాటం ఓ గొప్ప ఉదాహరణగా కనిపిస్తోంది. ఈ అభిప్రాయూన్ని వ్యక్తం చేస్తున్నది సాదాసీదా జనం కాదు. సాక్షాత్తు మేధావులు చెబుతున్న మాట ఇది. ఖాకీ కవాతుల్ని తోసిరాజని... రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు పోలీసులు చేసిన కవాతులు.. పారామిలటరీ బలగాల హడావుడి సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో చేష్టలుడిగి చూస్తున్నారుు. జిల్లా చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా, ఎవరూ ఊహించని స్థాయిలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజురోజుకూ విస్తరిస్తోంది. తొమ్మిది రోజుల క్రితం రాష్ట్ర విభజన ప్రకటన వెలువడింది మొదలు ఇప్పటివరకూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆందోళనలు నిరంతరాయంగా మిన్నంటుతూనే ఉన్నాయి. ఎవరి ప్రోద్బలం లేకుండానే.. ఎవరూ నాయకత్వం వహించకుండానే ప్రజలు స్వచ్ఛం దంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తుండటం మేధావుల్ని సైతం ఆశ్చర్చ చకితుల్ని చేస్తోంది. ఇక్కడి ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా రాష్ట్రాన్ని విడగొడుతున్నారనే సరికి ఒక్కసారిగా అన్ని వర్గాలవారు తమంతట తాముగా రోడ్లపైకి వస్తుం డటం ఆశ్చర్యపరుస్తోంది. విభజన ప్రకటనకు ముందు రోడ్లపై పోలీసులు చేసిన కవాతులు, పారామిలటరీ బలగాల హడావుడి ఉద్యమం ధాటికి కనుమరుగయ్యూరుు. పోలీ సులు కూడా ఏంచేయలేక అచేతనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వినాయక చవితి, దసరా ఉత్సవాలకు ప్రతి వీధి నుంచి నిమజ్జనాల ఊరేగింపులు రోడ్లపైకి వచ్చినట్లుగా ఏలూరు నగరం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నా రుు. ఉద్యమకారులు ప్రధాన కూడళ్లకు చేరుకుంటున్నారు. పల్లెలు సైతం తొలి రోజునుంచే ఉద్యమబాట పట్టారుు. వినూత్నానికే వినూత్నం ఉద్యమం అంటే ఒక ప్రదర్శన.. ఒక ధర్నా.. ఒక బహిరంగ సభ.. రాస్తారోకో వంటి పద్ధతులు మాత్రమే ఉంటాయని అందరికీ తెలుసు. అప్పుడప్పుడూ వినూత్న నిరసనలూ చూస్తుంటాం. కానీ సమైక్య ఉద్యమంలో చేస్తున్నన్ని వినూత్న ఆందోళనలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న పెద్దలు చెబుతున్నారు. దిష్టిబొమ్మల దగ్ధాలు, వంటా వార్పు నుంచి పిండ ప్రదానాలు, హోమాలు, శవయాత్రలు, మానవహారాలతోపాటు రోడ్లపై ఆటలు ఆడి తమ నిరసన తెలుపుతున్నారు. తొమ్మిది రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమంలో పాల్గొనని రంగం లేదంటే నమ్మక తప్పదు. ప్రతి అసోసియేషన్ సమైక్య ఉద్యమంలో పాల్గొనడం తమ బాధ్యతగా భావిస్తోంది. వ్యక్తి నుంచి సంఘం వరకూ.. యువకులు, విద్యార్థులు ఉద్యమానికి కొండంత అండగా నిలబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో కార్యరంగంలోకి దిగారు. రైతులు, కార్మికులతోపాటు రిక్షా కార్మికులు, తోపుడు బళ్లు, ఇస్త్రీ బళ్లు, జట్టు కూలీలు, మేదరులు ఒకటేమిటి చివరకు హిజ్రాలు సైతం సమైక్య ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వ్యాపారులు షాపులు మూసివేసి షట్టర్లకు సమైక్యాంధ్రకు మద్దతుగా ఫ్లెక్సీలు వేలాడదీశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఏలూరు ఆర్‌ఆర్‌పేట మొత్తం నిర్మానుష్యంగా మారి ప్రతి షాపు ఎదుటా ఈ ఫెక్ల్సీలే కనబడుతున్నాయి. తోపుడు బండిపై పళ్లు అమ్ముకునే వ్యక్తి సైతం సమైక్యాంధ్ర నినాదాన్ని ఒక అట్టముక్కపై రాసి పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడంటే ఉద్యమం ఎంత లోతుల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. కార్లు, ఆటోలు, రిక్షాలపైనా సమైక్యాంధ్ర స్టిక్కర్లే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ జేఏసీలు ప్రారంభంలో ఎవరికివారే విడిగా చేసిన ఉద్యమాలు రెండు మూడు రోజుల్లోనే ఒకే గొడుకు కిందకు వచ్చాయి. పట్టణాల్లో జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఏలూరులో 60కిపైగా సంఘాలున్న జేఏసీ సమావేశమై వారం రోజుల కార్యాచరణను ప్రకటించింది. తాడేపల్లిగూడెం, భీమవరం జేఏసీలు తమ కార్యక్రమాలను ప్రకటించాయి. మిగిలిన పట్టణాలతోపాటు చాలా మండల కేంద్రాల్లోనూ జేఏసీలు ఉద్యమాలకు పకడ్బందీగా రూపకల్పన చేసి అమలు చేస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు కూడా తమ గ్రామాల్లో ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. స్వాతంత్య్రోద్యమం ఎలా జరిగిందో తాము చూడలేదు కానీ.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం అందుకు తీసిపోదని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యమ కేంద్రాలుగా భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం జిల్లాలో సమైక్య ఉద్యమానికి ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ ఉదయం నుంచి రాత్రి వరకూ ఆందోళనలతో హోరెత్తుతోంది. ప్రతిరోజూ ఈ సెంటర్లో 12 నుంచి 15 వరకూ ఆందోళనలు జరుగుతున్నాయి. లారీ, ట్యాక్సీ, జీపు, ట్రాక్టర్ల ఓనర్లు, వర్కర్లు, కళాకారులు, రైతాంగ సమాఖ్య, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, విద్యుత్, హాస్టల్ ఉద్యోగులతోపాటు ఇతర రంగాలకు చెందిన 23 సంఘాలు బుధవారం ఫైర్‌స్టేషన్ సెంటర్లో ఆందోళనలు జరపాయంటే ఉద్యమం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భీమవరం ప్రకాశం చౌక్‌లోనూ నిత్యం 15కిపైగా ఆందోళనలు జరుగుతున్నాయి. సమైక్య నినాదంతో ఈ సెంటర్ దద్ధరిల్లుతోంది. తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్లో కూడా ప్రతిరోజూ పదికిపైగా ఆందోళనలు నమోదవుతున్నాయి. ఇక మిగిలిన పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ నిరసనలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. మారుమూల గ్రామాలు సైతం సమైక్యాంధ్ర కోసం పోరుబాట పట్టాయి. -
చంద్రబాబు లేఖతోనే రాష్ట్ర విభజన
ఒంగోలు , న్యూస్‌లైన్ : రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించింది వైఎస్ఆర్ సీపీ ఒక్కటేనని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక పార్టీ జిల్లా క్యార్యాలయంలో చేపట్టిన దీక్షలు బుధవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు పార్టీ బీసీ సెల్ నాయకులు దీక్షలో కూర్చున్నారు. వీరికి బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, చీరాల నియోజకవర్గ సమన్వయకర్త అవ్వారు ముసలయ్య, కందుకూరు మున్సిపల్ మాజీ చైర్మన్ బూర్సు మాలకొండయ్యలు పూలదండలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేస్తారని తెలియగానే సమైక్యాంధ్ర ప్రజలకు మొట్టమొదట అండగా నిలిచిన పార్టీ వైఎస్ఆర్ సీపీయేనన్నారు. అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని గుర్తు చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు ఇంకా పదవుల కోసం పాకులాడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చే ముందు సీమాంధ్ర ప్రజల ఆకాంక్ష తెలుసుకోవాలన్న కనీస జ్ఞానం చంద్రబాబుకు లేకపోవడం విచారకరమన్నారు. కొందరు నేతలు రాజీనామా డ్రామా ఆడుతున్నారని, వారికి చిత్తశుద్ధి ఉంటే సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపించాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను సైతం తుంగలో తొక్కి తెలంగాణను హడావుడిగా ప్రకటించడం వెనుక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వప్రయోజనాలున్నాయని ఆరోపించారు. ఆమె తన కుమారుడిని ప్రధాని చేసేందుకే తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సమైక్యవాదులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఖండించారు. పోలీసుల తీరు తెలంగాణ వాదానికి అనుకూలంగా ఉందేమోనన్న అనుమానం బాలాజీ వ్యక్తం చేశారు. పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చామన్న మెప్పు పొందేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉంటే ఇప్పటికైనా రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరారు. చీరాల నియోజకవర్గ సమన్వయకర్త అవ్వారు ముసలయ్య మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ బతికున్నప్పుడు సీమాంధ్రులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన సమర్థంగా తిప్పికొట్టారని గుర్తు చేశారు. ఇప్పటి నేతలు కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమన్నారు. సమైక్యవాదులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఉద్యమం దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుందన్నారు. బీసీ సెల్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటరాజు, బీసీ విభాగం నగర కన్వీనర్ బొప్పరాజు కొండలరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు జాజుల కృష్ణ, వల్లెపు మురళి, కండే రమణయ్య యాదవ్, పొగర్త చెంచయ్య, జంపని శ్రీనివాసగౌడ్, కొణతం విల్సన్‌బాబు, గంజి ప్రసాద్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. దీక్షలో కూర్చున్న వారిని పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ వై.వెంకటేశ్వరరావు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ ముదివర్తి బాబూరావు, స్టీరింగ్ కమిటీ జిల్లా సభ్యులు తోటపల్లి సోమశేఖర్, నాగిశెట్టి బ్రహ్మయ్య, సింగరాజు వెంకట్రావులు అభినందించారు. -
వెంకట్రామన్నగూడెంలో విషాదం
వెంకట్రామన్నగూడెం (తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్: ముద్దు ముద్దు మాటలతో అలరిస్తున్న మూడేళ్ల చిన్నారి మరణం ఆ కన్న తల్లిదండ్రులకు కడుపుకోతకు గురిచేసింది. కళ్ల ముందే తమ కంటిపాప విగతజీవిగా మారేసరికి ఆ కుటుంబం రోదనకు అంతులేకుండా పోయింది. ఆ చిట్టి పాప బోసి నవ్వులు ఇక లేవనే నిజం తెలిసి బంధువులతో పాటు చుట్టుపక్కల వారూ ఆవేదనకు గురయ్యారు. బుధవారం వెంకట్రామన్నగూడెంలో నీళ్ల తొట్టెలో పడి సకాలంలో వైద్యం అందక మృతి చెందిన చిన్నారి ఝాన్సీ (3) ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకట్రామన్నగూడెం గ్రామానికి చెందిన నాగబాబు, రత్నం కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఝాన్సీ (3) ఉన్నారు. వీరు గతంలో సమీప బంధువైన బొట్టా నారాయణమూర్తి ఇంటిలో అద్దెకు ఉండేవారు. ఇటీవలే నాగబాబు స్థలం కొనుక్కొని తాటాకిల్లు కట్టుకోవడంతో ఆ ఇంటికి వెళ్లిపోయారు. చిన్నారి జాన్సీ మాత్రం నారాయణమూర్తి ఇంటికి వెళ్లి అక్కడి పిల్లలతో ఆడుకుంటుంది. బుధవారం నాగబాబు కుమార్తె జాన్సీతో కలిసి నారాయణమూర్తి ఇంటికి వెళ్లాడు. నాగబాబు, నారాయణమూర్తి టీవీ చూస్తుండగా జాన్సీ పిల్లలతో ఆడుకుంటూ ఇంటి ఆవరణలోని నీటితొట్టెలో పడిపోయింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటికి జాన్సీ కోసం నాగబాబు, నారాయణమూర్తి చుట్టుపక్కల గాలించారు. నారాయణమూర్తి కుమారుడు శ్రీనుకు అనుమానం వచ్చి నీటి కుండీ దగ్గరకు వెళ్లిచూడగా అందులో కొట్టుకుంటోంది. వెంటనే బయటకు తీసి బాలికను భుజాన్న వేసుకుని సమీపంలోని పీహెచ్సీ వద్దకు వెళ్లగా అక్కడ అటెండర్ పట్టిం సుబ్బారావు మాత్రమే ఉన్నాడు. ఈ ఘటన మధ్యాహ్నం 1.15 గంటలకు జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఆ సమయంలో పీహెచ్సీలో వైద్యాధికారి ఆశాకిరణ్ పెదతాడేపల్లిలో నిర్వహించే 104 సేవలు కార్యక్రమానికి వెళ్లగా శిరీష అనే మరో వైద్యురాలు, సిబ్బంది అందుబాటులో లేరు. అటెండర్ సుబ్బారావు బాలికను పరిశీలించి పొట్టలో ఉన్న నీటిని బయటకు కక్కించాడు. అప్పుడు బాలిక మెదిలినట్లు పాప బంధువులు తెలిపారు. అయితే వైద్యులు లేకపోవడంతో చికిత్స అందక బాలిక మృతి చెందింది. జాన్సీ తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ మిన్నంటింది. బంధువులు, గ్రామస్తుల ఆందోళన వైద్యులు లేకపోవడంతోనే తమ చిన్నారి చనిపోయిందని ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు రోడ్డుకు అడ్డుగా టెంట్‌వేసి ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. స్థానిక అధికారులు డీఎంహెచ్‌వో, కలెక్టర్‌కు అందించారు. ఆర్డీవో సూచనల మేరకు గూడెం తహసిల్దార్ వచ్చి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. బాధితులు ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌వో శకుంతల కూడా పీహెచ్‌సీకి వచ్చి వైద్యులను, సిబ్బందిని విచారించారు. బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. వైద్యులు, సిబ్బంది తీరుపై ఫిర్యాదు ఈ సందర్బంగా పీహెచ్సీలో డాక్టర్లు, సిబ్బంది తీరుపై డీఎంహెచ్‌వోకు, తహసిల్దార్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఉదయం 8 గంటలకు తీయాల్సిన ఆసుపత్రి పది గంటలకు తీస్తున్నారని, 12 గంటలకు మూసి వేస్తున్నారని ఆరోపించారు. వైద్య సేవలకు అటెండరే దిక్కవుతున్నాడని వాపోయారు. డీఎంహెచ్‌వో శకుంతల ఆదేశాల మేరకు బాలికకు వెంకట్రామన్నగూడెం పీహెచ్‌సీలోనే పోస్టుమార్టం చేశారు. తాడేపల్లిగూడెం సీఐ చింతా రాంబాబు, ఎస్సైలు తిలక్, భగవాన్‌ప్రసాద్, కొండలరావు పాల్గొన్నారు. -
‘కస్తూర్బా’లో కలుషిత ఆహారం
కల్వకుర్తి, న్యూస్‌లైన్: కల్వకుర్తిలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థినులకు కలుషిత ఆహారమే పరమాన్నమైంది. కడుపు మాడ్చుకోలేక.. ఆకలిబాధను ఎవరికీ చెప్పుకోలేక కుళ్లిన భోజనం తిని బుధవారం 18 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అధికారుల నిర్లక్ష్యం.. వసతిగృహ పర్యవేక్షకుల కక్కుర్తి వెరసి విద్యార్థినులకు ప్రాణసంకటంగా మారింది. వివరాల్లోకెళ్తే..స్థాని క కస్తూర్బాగాంధీ విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నా రు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి హాస్టల్లో అన్నం, పప్పు, చెట్నీ వడ్డించారు. భో జనాలు ముగించుకుని నిద్రకుపూనుకున్న విద్యార్థినులు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒకరి తరువాత మరొకరు.. ఇలా 18 వాం తులు, విరేచనాలు చేసుకున్నారు. రాత్రి అందుబాటులో ఎవరూ లేకపోవడంతో త మ బాధను ఎవరికీ చెప్పుకోలేపోయారు. రాత్రంతా అలాగే గడిపిన విద్యార్థినులు ఉ దయం హాస్టల్‌కు వార్డెన్ రాగానే విషయం చెప్పగా..హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వారిలో కవిత, రోజా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్ శివరాం ఆధ్వర్యంలో విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించారు. కలుషిత ఆహారం తినడం వల్లే ఇలా జరి గిందని తెలిపారు. అస్వస్థతకు గురైన వి ద్యార్థులకు డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుం డా సెలైన్ ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్ చె ప్పారు. జరిగిన ఘటనపై వార్డెన్ శ్రీలతను వివరణ కోరగా..విద్యార్థినులకు బయటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని చెప్పుకొచ్చారు. సందర్శించిన ఎమ్మెల్యే విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆస్పత్రి చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతి గృహానికి వెళ్లి సమస్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి సంఘటన లు తలెత్తకుండా చూడాలని వార్డెన్ శ్రీలత ను ఆదేశించారు. -
రెండో ప్రవూద హెచ్చరిక ఉపసంహరణ
కొవ్వూరు, న్యూస్‌లైన్: గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద నీటిమట్టం తగ్గినా ఆలయాలు ముంపులోనే ఉన్నాయి. ఇక్కడ రెండు అడుగుల మేరకు వరదనీరు ప్రవహిస్తోంది. రహదారులపై బురద పేరుకుపోయింది. గురువారం సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గే అవకాశముందని అధికారులు అంటున్నారు. ఏడు రోజులుగా వరద ముంచెత్తడంతో గీతామందిరం ప్రాంగణంలో సుమారు మూడు అడుగుల మేర ఒండ్రు మట్టి పేరుకుపోయింది. మద్దూరులంక గ్రామం వరద ముంపు నుంచి తేరుకుంది. అయినా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది. సముద్రంలోకి 13.02 లక్షల క్యూసెక్కులు ఎగువ నుంచి వచ్చే వరద నీరు తగ్గడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం తగ్గుతుంది. ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 13.70 అడుగులకు తగ్గడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఉదయం 6 గంటలకు 15.10 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం 7 గంటలకు 13.50 అడుగులకు తగ్గింది. ఆనకట్ట నుంచి 13,02,785 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక గురువారం మధ్యాహ్నానికి ఉపసంహరించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దెబ్బతిన్న పంటలు : వరద ముంచెత్తడంతో పోలవరం, కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి, ఆచంట, యలమంచిలి మండలాల్లో వేలాది ఎకరాల లంక భూముల్లోని పంటలు ముంపుబారిన పడ్డాయి. అరటి, దొండ, వంగ, కూరగాయలు, చెరకు, మొక్కజొన్న రైతులు నష్టపోయారు. చెరకు తోటల్లో బురద చేరి పంటలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. అంటువ్యాధులు వ్యాపించే అవకాశముందని లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి బోర్లు, చేతిపంపుల్లో నుంచి వరద నీరు వస్తోందని అంటున్నారు. లోతట్టు ప్రాం తాల్లో బురద తొలగించేందుకు పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
పంచాయతీలకు నిధుల గండం
గిద్దలూరు (రాచర్ల), న్యూస్‌లైన్: ఎట్టకేలకు పంచాయతీల పాలకవర్గాలు కొలువుదీరాయి. రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేక ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ప్రత్యేక పాలనలో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులుపడ్డారు. కొత్తగా ఏర్పాటైన పాలకవర్గాలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అనేక తీర్మానాలు చే శాయి. అయితే వాటి పరిష్కారానికి పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో కొత్త సర్పంచ్‌లు అయోమయంలో పడ్డారు. ప్రజలకెన్నో వాగ్దానాలు చేసి గెలిచిన తాము ఆ హామీలనెలా నిలబెట్టుకోవాలో అని మథనపడుతున్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలి: సర్పంచ్‌లకు అధికారాల వికేంద్రీకరించడంలో పాలకుల నిర్లక్ష్యం, వ్యవస్థలో ఉన్న లోపాలు గ్రామాల అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్నాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా 29 రకాల అధికారాలను పంచాయతీలకు బదలాయించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అందులో పేర్కొన్న విధంగా నేటికీ అమలవడం లేదు. గ్రామాల అభివృద్ధికి బాధ్యులుగా ఉన్న సర్పంచ్‌లకు జిల్లా ప్లానింగ్ కమిటీలో ప్రాతినిధ్యం లేకపోవడంపై పలు విమర్శలున్నాయి. జిల్లా ప్లానింగ్ కమిటీ సభ్యులకు గ్రామ స్థాయిలో అవగాహన లేకపోవడం వలన గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. చాలా గ్రామాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పంచాయతీలకు అధికారాలు బదలాయించాలి: ప్రభుత్వం పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు బదలాయించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. జిల్లా ప్లానింగ్ కమిటీలో సర్పంచ్‌లకు స్థానం కల్పించినప్పుడే పల్లె సీమలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడుతున్నారు. గిద్దలూరు మండలంలో 18, రాచర్లలో 14 పంచాయతీలుండగా, అందులో ఒకటి, రెండు పంచాయతీలు మినహా అన్ని పంచాయతీల్లో నిధుల కొరత పట్టి పీడిస్తోంది. గ్రామ స్థాయిలో ఇంటి పన్ను, ఇతర పన్నులు ఆశించిన స్థాయిలో వసూలు కాకపోవడంతో మురికి కాలువలను శుభ్రం చేయడం, తాగునీటి పథకాలను నిర్వహించడం తలకు మించిన భారమవుతోంది. కొన్ని గ్రామాల్లో తప్పని సరై మౌలిక వసతుల కోసం పనులు చేసి సర్పంచ్‌లు అప్పులపాలవుతున్నారు. రెండేళ్ల సుదీర్ఘ ప్రత్యేక పాలన అనంతరం ఎట్టకేలకు సర్పంచ్‌లు కొలువు తీరారు. వారిని పలకరించగా వారి మనోగతాలిలా ఉన్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం పంచాయతీలకు అధికారాలివ్వాలని, ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామసీమల అభివృద్ధికి సహకరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీలు నిధుల లేమితో నిర్వీర్యమవుతున్నాయి మధిర చంద్రశేఖరరెడ్డి, సర్పంచ్, గుడిమెట్ట నిధులు, అధికారాలు లేక పంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయి. నిధులన్నింటినీ నేరుగా పంచాయతీలకు అందజేయాలి. వివిధ పద్దుల కింద వచ్చే నిధులను కచ్చితంగా పంచాయతీలకు ఇవ్వాలి. అప్పుడే సర్పంచ్‌లు గ్రామాభివృద్ధి చేయగలరు. తగినన్ని నిధులు కేటాయించాలి శంకర్‌నాయక్, సర్పంచ్, కే.యస్.పల్లె ప్రభుత్వం పంచాయతీలకు తగినన్ని నిధులు కేటాయించడం లేదు. నిధులివ్వకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. వీధి లైట్లు వేయలేని దుస్థితిలో సర్పంచ్‌లున్నారు. చేతిలో చెక్‌బుక్ ఉన్నా, ట్రెజరీలో డబ్బులు లేకపోతే ఏంచేయాలి. చిన్న పంచాయతీల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. తాగునీటి వసతి కల్పనకే నిధులు సరిపోవు సూరా రామలక్ష్మమ్మ, సర్పంచ్ పంచాయతీలో తాగునీటి కల్పన భారంగా మారింది. తగ్గుతున్న భూగర్భ జలాలతో మోటార్లు మరమ్మతులకు గురికావడం, నూతన బోర్లు వేయడం కోసం నిధులు అధికంగా ఖర్చుచేయాల్సి వస్తోంది. పంచాయతీల్లో అవసరమైన అన్ని రకాల వసతులకు సరిపడే నిధులు కేటాయించాలి. -
తెలంగాణకు వ్యతిరేకం కాదు
గద్వాల/న్యూటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణకు పార్టీ వ్యతిరేకం కాదని, కానీ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని వైఎ స్ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ స భ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కేం ద్రం నిర్ణయం తీసుకునే ముందు ఇరుప్రాం తాల ప్రజల అభిప్రాయాలను తీసుకుని, ఎ వరికీ అన్యాయం జరగకుండా చూడాల్సి ఉండేదన్నారు. బుధవారం గద్వాలలో బృం దావనం గార్డెన్ ఫంక్షన్హాల్లో జరి గిన స ర్పంచ్‌లు, సింగిల్‌విండో డెరైక్టర్ల సన్మానసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ పై పార్టీ ప్లీనరీ ప్రకటనకు కట్టుబడి ఉందన్నారు. సంప్రదింపుల పేరిట అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలను పిలిచిన కేంద్రం, నిర్ణయం వెలువరించే ముందు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. వై ఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తెలంగాణకు వ్యతిరేకం గా రాజీనామాలు చేసినట్లు వ్యతిరేక మీడియా చే స్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. తమ పార్టీ రెండు ప్రాంతాల ప్రజలకు అండగా నిలుస్తుందని ఇడుపులపాయలో మరోసారి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్పష్టం చేయడం ద్వారా ఇప్పటికైనా బురదజల్లే పద్ధతి మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రతోవైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించాయన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడినా పార్టీ ప్రభంజనం కొనసాగడం ఖాయమన్నారు. రాజన్న పాలనను ప్రజలు మళ్లీ చూస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. కేవలం తమ పార్టీ నుంచి కొండా సురేఖ బయటకు వెళ్లినంత మాత్రాన పార్టీ నుంచి తెలంగాణ వారంతా వెళ్లినట్లుగా పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విమర్శకులకు సూచించారు. తెలంగాణ, సీమాంధ్రలోనూ వైఎస్ఆర్ సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టంచేశారు. అనంతరం మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్నం నాగిరెడ్డి మాట్లాడుతూ..మహానేత వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. పాలక, ప్రతిపక్ష పార్టీలు ఏకమై జగన్‌ను రాబోయే ఎన్నికల్లో సీఎంగా చూడాల్సి వస్తుందన్న భయంతోనే కుట్రపన్ని అక్రమ కేసులతో జైలుకు పంపారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కనుమరుగుకావడం ఖాయం: ఎడ్మ జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మకిష్టారెడ్డి మాట్లాడుతూ.. గుర్తుల్లేని ఎన్నికల్లో గెలిచిన వారందరినీ తమ వారిగా చెప్పుకోవచ్చన్న ఆలోచనతో సర్పంచ్ ఎన్నికలను ప్రభుత్వం ముందస్తుగా నిర్వహించిందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ బలమేందో తెలుస్తుందన్నారు. ఇక ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీడీపీలు కనుమరుగుకావడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ, సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ హవా కొనసాగుతుందన్నారు. పార్టీ గద్వాల నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ..గద్వాల ప్రాంతంలో దౌర్జన్యపాలన కొనసాగుతుందని, ప్రజలు దౌర్జన్యానికి భయపడి తమకే ఓటు వేసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టిన వారి భ్రమలు ఇక సాగవని హెచ్చరించారు. పల్లెల్లో తాగడానికి నీళ్లు దొరకడం లేదని, కానీ భరతసింహారెడ్డి మద్యం దొరికే పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, కొండాపురం షఫిఉల్లా, చిన్నయ్య, కృష్ణారెడ్డి, మజీద్, గోవింద్, గంట రమేష్, భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సాగర్ డ్యాంలో పెరిగిన నీటిమట్టం
దర్శి, న్యూస్‌లైన్: సాగర్ కాలువలు జలకళను సంతరించుకోనున్నాయి. సాగర్ జలాశయం నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 585.40 అడుగులకు చేరింది. మరో నాలుగడుగుల మేర నీరు చేరితే జలాశయం పూర్తిస్థాయిలో నిండినట్లే. బుధవారం సాయంత్రానికి సాగర్ ప్రాజెక్టు 26 క్రెస్టుగేట్లు ఐదడుగుల మేర ఎత్తి లక్షా 90 వేల 116 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలకు 8 వేల క్యూసెక్కుల చొప్పున నీరు వదులుతున్నారు. సాగర్ కుడి కాలువ 53/2 మైలు వద్ద చేజెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని జోన్-2 కింద ఉన్న ప్రకాశం జిల్లాకు విడుదల చేశారు. క్రమంగా నీటి పరిమాణాన్ని పెంచనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. జిల్లా సరిహద్దు 85/3 వద్దకు నీరు చేరేసరికి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. 2009లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చాయి. అప్పట్లో సాగర్ జలాశయం పూర్తిగా నిండింది. ఆ తరువాత మూడేళ్లపాటు సరిగా వర్షాలు కురవలేదు. దీంతో జలాశయంలో నీటి నిల్వ డెడ్‌స్టోరేజ్‌కు చేరింది. ఈ ఏడాది కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిశాయి. వారం రోజులుగా సాగర్ జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది ప్రాజెక్టు పరిధిలో పూర్తి ఆయకట్టుకు నీరందించగలమని సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ యల్లారెడ్డి తెలిపారు. ఆయకట్టు రైతులంతా ఖరీఫ్‌లో వరిసాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహం: ఈ ఏడాది ముందస్తుగా సాగర్ కాలువలకు నీటి విడుదల చేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహం వెల్లివిరుస్తోంది. మాగాణి సేద్యానికి సన్నద్ధమవుతున్నారు. విత్తనాల సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. గత ఏడాది సాగుచేయక రైతులు రాబడి కోల్పోయారు. ఆయకట్టులో సాగు పనులుంటే కూలీలకు కూడా దండిగా ఉపాధి లభిస్తుంది. ఇతర ప్రాంతాలకు వలసలు తప్పుతాయి. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో మాగాణి సాగవుతుంది. ఎకరాకు 35 నుండి 40 మంది కూలీలకు పని లభిస్తుంది. ఆధునికీకరణ పనుల నిలిపివేత త్రిపురాంతకం, న్యూస్‌లైన్: సాగర్ జలాశయానికి సమృద్ధిగా నీరు చేరి కుడి కాలువకు విడుదల చేయడంతో మరో రెండు రోజుల్లో జిల్లాకు సాగర్ జలాలు అందనున్నాయి. సాగర్ ప్రధాన కాలువకు అనుబంధంగా ఉన్న అద్దంకి, దర్శి, ఒంగోలు బ్రాంచి కెనాల్స్ ద్వారా మేజర్లకు నీటి సరఫరా చేయనున్నారు. సాగర్ ప్రధాన కాలువ, మేజర్లపై చేపట్టిన ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తికాలేదు. కాలువలకు నీళ్లు వదులుతుండటంతో పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లను అధికారులు ఆదేశించారు. సాగర్ జలాలు వస్తుండటంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దుక్కులు దున్నుకోగా, మరికొన్ని చోట్ల నారుమళ్లు పోశారు. తాగునీటి అవసరాల నిమిత్తం ముందుగా నీరు విడుదల చేస్తామని సాగర్ అధికారులు తెలిపారు. వీటితో తాగునీటి చెరువులు, ఎస్ఎస్ ట్యాంకులు నింపనున్నట్లు తెలుస్తోంది.