Family
-
కోడ్ కూసే..టాలెంట్ నిద్రలేసే..
రెండు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తోన్న ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ బిహార్‌లోని ఎంతోమంది గ్రామీణ యువతులకు ఉచితంగా కోడింగ్ నేర్పిస్తోంది. వారు ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసేలా చేస్తోంది...బిహార్‌లోని ఠాకురంజీ గ్రామానికి చెందిన రవీనా మెహ్తో ఒకప్పుడు వంటల్లో, ఇంటిపనుల్లో తల్లికి సహాయపడుతూ ఉండేది. ప్రస్తుతం రవీనా బెంగళూరులోని ఒక పెద్ద కంపెనీలో పనిచేయనుంది. బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో ప్రారంభించిన ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ లో కోడింగ్ నేర్చుకోవడానికి... ఉన్న ఊరు వదిలి కిషన్‌గంజ్‌కు వచ్చిన 67 మంది యువతులలో రవీనా ఒకరు. 21 నెలల పాటు సాగే ఈ కోర్సులో అరారియా నుంచి గయ వరకు బిహార్ నలుమూలల నుంచి అమ్మాయిలు చేరారు.తరగతులలో ప్రతి ఒక్కరూ తమ ల్యాప్‌టాప్‌లలో పైథాన్, జావాలతో తలపడుతుంటారు. ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. ‘ఇక్కడికి రావడానికి ముందు ల్యాప్‌టాప్ కూడా వాడని వారు వీరిలో ఉన్నారు. జీరో నుంచి శిక్షణ ప్రారంభించాం. తక్కువ టైమ్‌లోనే చాలా చక్కగా నేర్చుకుంటున్నారు’ అంటుంది ట్రైనర్లలో ఒకరైన ప్రియాంక దంగ్వాల్. గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన మహిళలు మన దేశంలోని ఐటీ పరిశ్రమలలో ప్రవేశించడానికి మార్గం సుగమం చేయడానికి నవగురుకుల్, ప్రాజెక్ట్ పొటెన్షియల్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ను ప్రారంభించాయి.కాణీ ఖర్చు లేకుండా సంస్థలో ఉచితంగా కోర్సు నేర్చుకోవడానికి అవకాశం వచ్చినా రవీనాలాంటి వాళ్లకు ఇంటి పెద్దల నుంచి అనుమతి అంత తేలికగా దొరకలేదు. ‘తల్లిదండ్రుల నుంచి అనుమతి కోసం దాదాపు యుద్ధంలాంటిది చేశాను. మొదట అమ్మను, ఆ తరువాత అమ్మమ్మను చివరకు ఇరుగు పొరుగు వారిని కూడా ఒప్పించాల్సి వచ్చింది. నా జీవితాన్ని మార్చే అవకా«శం కోసం పోరాడాను’ అంటుంది రవీన. ‘బిహార్‌లో కేవలం 9.4 శాతం మంది మహిళలు మాత్రమే శ్రామిక శక్తి(వర్క్ ఫోర్స్)లో ఉన్నారు. మన దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ రేటు ఇది. గ్రామీణ మహిళలకు ఉన్నతోద్యోగాలు చేయడానికి సహాయ సహకారాలు అందించడం, శ్రామిక శక్తిలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచడం మా ప్రధాన లక్ష్యం’ అంటున్నాడు ‘ప్రాజెక్ట్ పొటెన్షియల్’ వ్యవస్థాపకుడు జుబిన్ శర్మ.కిషన్‌గంజ్‌లో ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. రాయ్‌పూర్, దంతెవాడ, ధర్మశాలలో ఇలాంటి మరో ఎనిమిది కేంద్రాలు ఉన్నాయి. ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ ద్వారా కూలి పనులు చేసుకునే శ్రామికుల అమ్మాయిలు, ఇంటి పనులకే పరిమితమైన అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మారి నెలకు పాతిక వేలకు పైగా సంపాదిస్తున్నారు. ‘స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మహిళల సంపాదన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా పితృస్వామిక భావజాలాన్ని దూరం పెట్టడంలో సహాయపడతాయి. మహిళలలో ఆశయాల అంకురార్పణకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి దోహద పడతాయి. కార్పొరేట్ ఇండియా తమ సీఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇలాంటి కార్యక్రమాలు పెంచితే, మహిళా సాధికారతలో తమ వంతు పాత్ర పోషించడానికి వీలవుతుంది’ అంటుంది ‘గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్’ ప్రొఫెసర్ విద్యా మహాబరే.రోజూ తండ్రితో పాటు పొలం పనులకు వెళ్లే అమ్మాయిలు, తల్లితో పాటు ఇంటి పనులకే పరిమితమైన అమ్మాయిలు, తోచక కుట్లు, అల్లికలతో కాలం వెళ్లదీస్తున్న పల్లెటూరి అమ్మాయిలు... ఐటీ సెక్టార్లో పని చేయడం సాధ్యమా? ‘అక్షరాలా సాధ్యమే’ అని నిరూపిస్తోంది స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్.మొదట్లో కష్టం... ఇప్పుడు ఎంతో ఇష్టంవిద్యార్థులకు ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’ ద్వారా ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నారు. వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ‘మొదట్లో కోడింగ్ నేర్చుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా ఇష్టంగా ఉంది. ఇప్పుడు కోడ్లతో గేమింగ్‌ను కూడా క్రియేట్ చేస్తున్నాం’ అంటారు విద్యార్థులు. కోడింగ్ నేర్పించడం మాత్రమే కాదు విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడేలా ‘స్కూల్ ఆఫ్ ప్రోగ్రామింగ్’లో శిక్షణ ఇస్తున్నారు.అనగనగా ఒకరోజు...నేను ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు కిషన్‌గంజ్‌లో ఫ్రీ కోడింగ్ స్కూల్ లేదు. బెంగళూరులోని ‘నవగురుకుల్’కు వెళ్లాలనుకున్నాను. అయితే మా పేరెంట్స్ బెంగళూరుకు వెళ్లడానికి ససేమిరా అన్నారు. అయినా సరే వారితో వాదన చేసి రైలు ఎక్కాను. మా కుటుంబం నుంచే కాదు మా ఊరు నుంచి కూడా ఎవరూ బెంగళూరుకు వెళ్లలేదు. నేను బెంగళూరుకు వచ్చిన రోజు భారీ వర్షం కురిసింది. నాకు కన్నడ రాదు. అప్పటికి ఇంగ్లీష్ అంతంత మాత్రమే వచ్చు. చాలా భయం వేసింది. ఇప్పుడు మాత్రం ఎలాంటి భయం లేదు. ఇప్పుడు ఫారిన్ క్లయింట్స్‌తో టకటకా ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతున్నాను. మూడేళ్ల క్రితం కోడింగ్ కోర్సు పూర్తి చేసిన కవిత ప్రస్తుతం కోల్‌కత్తాలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ నెలకు రూ.50 వేలు సంపాదిస్తోంది. – కవితా మెహ్తో(చదవండి: కూతుళ్లంతా అమ్మ చీర కట్టుకుంటుంటే..ఆమె మాత్రం నాన్న..!) -
కూతుళ్లంతా అమ్మ చీర కట్టుకుంటుంటే..ఆమె మాత్రం నాన్న..!
అబ్బాయిలు నాన్న షర్ట్ వేసుకుని ‘లేని మీసాలను’ మెలి తిప్పటం, అమ్మాయిలు అమ్మ చీర కట్టుకుని ‘మోయలేని పెద్దరికాన్ని’ అభినయించటం... ప్రతి ఇంట్లోనూ ఉండేదే. ఎదుగుతున్న పిల్లలకు అవి సరదాలు. పెద్దలకు తమ టీనేజ్‌ని గుర్తుకు తెచ్చే మురిపాలు. పెద్దయ్యాక బాయ్స్ నాన్న ప్యాంటూ షర్టు వేసుకోవటం కనిపించదు కానీ, గర్ల్స్ అమ్మ చీరను కట్టుకుని ఏ ఫంక్షన్లోనో బంధు మిత్రులకు సాక్షాత్కరిస్తుంటారు. వధువులు కూడా కొందరు అపురూపంగా దాచి ఉంచిన అమ్మ పెళ్లి నాటి చీరను ధరించి, పీటల మీద కూర్చుంటారు. అదొక సెంటిమెంట్ కూతుళ్లకు. కానీ నివేషి కాస్త డిఫరెంట్‌గా ఉంది! బహుశా.. నాన్నంటే అఫెక్షన్, అమ్మంటే క్రమశిక్షణలా ఉంది ఈ అమ్మాయికి. తనేం చేసిందో చూడండి! పెళ్లినాటి నాన్న సూట్‌ను బయటికి తీయించి, చిన్న చిన్న మార్పులు చేసి తను తొడుక్కుంది. భారీ బ్రౌన్ టూపీస్ పెళ్లి సూట్లో ఉన్న నాన్న ఫొటోను, ఆ సూట్‌ను వేసుకున్న తన ఫొటోను కలిపి ఆ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ‘‘అమ్మాయిలు తమ తల్లి పెళ్లి చీరను కట్టుకుంటారు. నేను మా నాన్న పెళ్లి సూట్‌ను వేసుకున్నాను’’ అని ఆ క్లిప్‌కు క్యాప్షన్ పెట్టింది. ఇకనేం, లైకుల మీద లైకులు. నివేషి డిజిటల్ క్రియేటర్. తండ్రి సూట్‌ను తనకు సరిపడేలా మార్చటంలోని ఆమె సృజనాత్మక నైపుణ్యాన్ని చూసి, ‘‘మీ కోసమే మీ నాన్న తన పెళ్లి సూట్‌ను ఎంపిక చేసుకున్నట్లు న్నారు..’’ అని ఒక నెటిజెన్ ప్రశంసించారు. మరొకరు.. ‘‘మీరు మీ నాన్నను గర్వపడేలా చేశారు’’ అని కామెంట్ పెట్టారు. చలువ కళ్లద్దాలు ధరించి, సూటులో రెండు చేతులు పెట్టుకుని ఠీవిగా నడిచి వెళుతున్న నివేషి రెట్రో స్టెయిల్ ఎవర్నీ చూపు తిప్పుకోనివ్వటం లేదు! View this post on Instagram A post shared by 𝑵𝒊𝒗𝒆𝒔𝒉𝒊 (@_niveshi) (చదవండి: -
‘మట్టి’లో మాణిక్యాలు
ఏ దేశంలోని మైదానంలోనైనా సరే.. ప్రత్యర్థి జట్టును మట్టికరిపిస్తూ దూసుకెళ్లే భారత హాకీ జట్టు అంటే ప్రపంచ దేశాలకు హడల్.. ఆసియా ఛాంపియన్ ట్రోఫీలతో పాటు ఒలింపిక్స్‌లోనూ భారత్ సత్తాచాటి ఎన్నో మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.. క్రికెట్‌తో పోలిస్తే మన దేశంలో జాతీయ క్రీడ హాకీకి ఆదరణ అంతంత మాత్రమే.. హాకీలో మహిళలు సైతం పతకాల పంట పండిస్తుండటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణ అందిస్తున్నారు. దీంతో కొందరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇక మన రాష్ట్రంలో హాకీ క్రీడకు కనీస సదుపాయాలు లేకపోయినా క్రీడాకారులు మాత్రం తగ్గేదే లే అన్నట్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిమరీ కోచింగ్ తీసుకుంటున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. టర్ఫ్ గ్రౌండ్స్‌ను అభివృద్ధి చేస్తే మరింత ప్రాక్టీస్ చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాల వేట కొనసాగిస్తామంటున్నారు హైదరాబాదీలు.. సికింద్రాబాద్ ఆర్ఆర్సీ గ్రౌండ్లో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 14వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ చాంపియన్‌షిప్ –2024 పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన లాలస తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా, మరో ఇద్దరు సోదరీమణులు భవిష్య, చరిత్ర తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాలస ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) క్యాంపులో ఉంటూ ప్రాక్టీస్ చేస్తోంది. భవిష్య, చరిత్ర కేరళలో సాయ్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు. హాకీ పట్ల ఉన్న మక్కువతో జాతీయ స్థాయికి ఎదిగిన క్రమంలో వీరు పడ్డ కష్టాలు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే..కేరళలో శిక్షణ పొందుతున్నాం: భవిష్య, చరిత్ర మల్కాజిగిరికి చెందిన సందీప్ రాజ్ తెలంగాణ మాస్టర్స్ హాకీ టీమ్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తండ్రి నుంచి స్ఫూర్తి పొందిన ఆయన ఇద్దరు కుమార్తెలు భవిష్య, చరిత్ర తెలంగాణ బాలికల జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక కీస్ హైసూ్కల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన భవిష్య, చరిత్ర తొలినాళ్లలో జింఖానా మైదానంలో కోచ్ కామేశ్ శిక్షణలో హాకీ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. కేరళలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబిరానికి ఎంపిక కావడంతో ప్రస్తుతం అక్కడే ఉండి శిక్షణ తీసుకుంటున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న వీరు అక్కడి రాష్ట్ర భాష మళయాళీ నేర్చుకుని మరీ పరీక్షలకు హాజరవుతున్నారు. తన ఇద్దరు కూతుళ్లు ఇప్పటి వరకు 6 జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. ఆట కోసం ఒడిశా వెళ్లా: లాలస సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్‌లోని ఆక్సిల్లమ్ స్కూల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. స్థానిక జింఖానా మైదానంలో హాకీ శిక్షణ తీసుకున్నా. కోచ్ కామేశ్ ప్రోత్సాహంతో ఆటలో నైపుణ్యం సాధించా.. హైదరాబాద్‌లో టర్ఫ్ కోర్టులు అందుబాటులో లేకపోవడంతో గ్రావల్ (కంకర మట్టి) కోర్టుల్లోనే ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది. ఉత్తమమైన శిక్షణ కోసం తొలుత బెంగళూరుకు వెళ్లా. పదో తరగతి పరీక్షలు అక్కడే రాయాల్సి వచ్చింది. స్థానిక భాష కన్నడ నేర్చుకుని మరీ పదో తరగతిలో పాసయ్యా. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నవల్ టాటా క్రీడాప్రాంగణంలో శిక్షణ తీసుకుంటున్నాను. ప్రముఖ హాకీ క్రీడాకారుడు భారత జాతీయ జట్టు మాజీ కెపె్టన్, గోల్ కీపర్ శ్రీజేశ్ ద్వారా స్ఫూర్తి పొంది గోల్ కీపర్‌గా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే లక్ష్యం. తండ్రి జగన్, తల్లి ప్రోత్సాహం ఉంది. ఇప్పటి వరకు మూడు జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. -
ఐటీ జాబ్స్.. పిటీ లైఫ్
సాఫ్ట్వేర్ జాబ్స్ ఈ తరానికి ఎయిమ్స్ అండ్ డ్రీమ్స్.. మారుతున్న అధునాతన సాంకేతికత, మోడ్రన్ లైఫ్ స్టైల్లో తాము కూడా భాగస్వాములు కావాలనే ఆశయంతో టెకీలుగా మారుతున్న యువకులెందరో.. ఐదంకెల జీతం, ఐదు రోజులు మాత్రమే పని, సామాజిక హోదా, గుర్తింపు, గౌరవం.. ఇలా ఎన్నెన్నో ఆశలతో అక్షయపాత్ర వంటి సాఫ్ట్వేర్ పల్లకీలోకి అడుగెడుతున్నారు. కానీ.. ఒక్కసారి ఈ రంగంలోకి వచ్చాక వారి జీవన శైలి వారు అనుకున్నట్టుగానే ఉంటుందా..? సామాజికంగా, సౌకర్యాల పరంగా వైరల్ అవుతున్న రీల్స్‌లా ఉన్నప్పటికీ, వారి వ్యక్తిగత జీవితం ఆ రీల్స్‌కు వచ్చే కామెంట్ల మాదిరిగా మారింది. మానసిక ఒత్తిడి, శారీరక అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఆర్భాటాలు..! నాణానికి మరో కోణం వంటి ఈ అవస్థల పరిష్కారానికి నగరంలో వెల్నెస్ సెంటర్లు సైతం వెలుస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో శారీరక శ్రమ లేకుండా సాఫ్ట్‌గా కొనసాగుతున్నప్పటికీ.. మానసికంగా ఒత్తిడి మాత్రం పీక్స్‌లో ఉంటుందని టెకీల మాట. సాఫ్ట్వేర్లు, ఐటీ ఉద్యోగుల దైనందిన జీవితం.. కొత్త ప్రాజెక్ట్‌లు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్లు, పైప్‌లైన్ ప్రాసెస్, డిప్లాయిమెంట్, అజైల్ ప్రాసెస్, బెంచ్, టెస్టింగ్, క్వాలిటీ అష్యూరెన్స్ తదితర నైపుణ్యాల మధ్య అందమైన దయనీయంగా కొనసాగుతుంది. ఐదు రోజుల పని, వారానికి రెండు రోజులు సెలవులు. ఇంకేం.. హాయిగా ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటాం.. కానీ క్రెడిట్ బిల్లులు, ఈఎంఐ పేమెంట్స్, రీఫండబుల్ అకౌంట్స్ చెక్ చేసుకుని, సెట్ చేసుకునేలోపు సోమవారం వస్తుందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపారు. ఆఫీసులోనైనా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఐనా, హైబ్రిడ్ ఐనా.. ఒత్తడి మాత్రం తప్పదంటున్నారు గచ్చిబౌలికి చెందిన ఐటీ ప్రొఫేషనల్ గౌతమీ. జాబ్ రాక ముందు ఒక అవస్థ, వచ్చాక దానిని కాపాడుకోవడానికి మరో అవస్థ.. వీటి మధ్య టార్గెట్ రీచ్ కావడానికి, సొల్యూషన్స్ క్లియర్ చేయడానికి ల్యాప్‌ట్యాప్ పైన చేసే యుద్ధం మరో ప్రపంచ యుద్ధాన్ని గుర్తు చేస్తుందని యువ సాఫ్ట్వేర్ నరేష్ తెలిపారు. ఇక బెంచ్‌పై ఉన్న వారి పరిస్థితి వివరించడానికి మరో జావా లాంగ్వేజ్ తయారు చేయాలని స్టీఫెన్ మాట. అసహజ జీవనానికి వేదికలుగా.. అందమైన అద్దాల గ్లోబల్ భవనాల్లోని ఈ సాఫ్ట్వేర్ల ఒత్తిడి వారి జీవితాల పైన పెద్ద ప్రభావమే చూపిస్తుందని ఆరోగ్య నిపుణలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వారి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ను విపరీతంగా పెంచుతుంది. విభిన్న ఆరోగ్య సమస్యలకు ఇది మూల కారణమని నిపుణుల మాట. పనివేళల్లో దాదాపుగా కూర్చొనే ఉండటంతో ఉబకాయం, మధుమేహం పక్క సీట్లోనే ఎదురు చూస్తుంది. వెన్ను నొప్పులు, నరాల బలహీనత ఇలా తదితర సమస్యలకు ఈ హైటీ ఒత్తిడి కారణమవుతోంది. దీనికి తోడు నైట్ డ్యూటీలు సహజ జీవన విధానానికి ఆటంకంగా మారిందిన అంతర్జాతీయ ఆరోగ్య సర్వేలు, అధ్యయనాలు వెల్లడించాయి. ఇలాంటి సమస్యలు పెరుగుతున్న సమయంలో వీరికి సాంత్వన, సహకారం అందించడానికి విభిన్న రకాల వెల్నెస్ సెంటర్లు ఆవిష్కృతమైతున్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, అంతర్గత స్థిరత్వాన్ని అందిపుచ్చుకోవడానికి మెడిటెషనల్ కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. యోగా, మ్యూజిక్, ధ్యానం.. మీరు సాఫట్వేర్ ఉద్యోగా..?! ఐతే మీ కోసమే మా ఈ సెషన్ అంటూ సోషల్ మీడియా యాడ్. ధ్యానం, యోగా సమ్మిళితంగా వినూత్న కోర్స్ అది. ఒత్తిడిమయమైన యువకులకు ఇదో ఉపశమనం. నగర శివార్లలో పచ్చని పారవశ్యంలో ఏర్పాటు చేసిన మరో బైండ్ మ్యాజిక్ సెంటర్. ఇక్కడ వారు నిర్వహించే సైకలాజికల్ సెషన్స్ మెదడుపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మరింత చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ఇలాంటి వారికి స్పిర్చువల్ మ్యూజిక్ హీలింగ్ సెంటర్లు కూడా ఎంతో మేలు చేస్తున్నాయి. ఏరోబిక్స్, జుంబా వంటి ఫిట్నెస్ సెంటర్లు సైతం ఈ అవస్థలకు కాసింత చెక్ పెడుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంగంలోని అనారోగ్య సమస్యలకు ఎర్గనామిక్స్ అనే ప్రత్యేక మెడికల్ సేవలు సైతం ఉన్నాయి. ఈ మధ్య ఈ సేవలు మరింత ఆదరణ పొందుతున్నాయి. ఎన్షూర్ ఫర్ క్యూర్.. సాఫ్ట్వేర్ రంగంలోని ఉద్యోగులు అధిక సమయం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చునే పని చేయాలి. నగరంతో పాటు దేశంలోని ఈ రంగంలో దాదాపు 64 శాతం మంది సెడెంటరీ డెస్క్ జాబ్‌లలో ఉన్నవారే. ఇటీవలి ప్రముఖ అధ్యయనం ప్రకారం ఇలాంటి ఉద్యోగాల వలన ప్రపంచవ్యాప్తంగా 540 మిలియన్లకు పైగా ప్రజలను నడుము నొప్పి ప్రభావితం చేస్తుంది. 25 సంవత్సరాల్లో ఈ పరిస్థితి రెట్టింపు అయ్యింది. శరీరానికి మూలస్థంభమైన వెన్నెముక ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక ఒత్తిడిని, భారాన్ని భరిస్తోంది. ఈ సమస్య అనతికాలంలోనే విభిన్న ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఈ తరుణంలో సంరక్షణ కోసం ఎన్షూర్ హెల్తీ స్పైన్ అనే విధానాన్ని ప్రవేశ పెట్టాం. ఈ అవస్థలు ఎదుర్కొంటున్న వారికి ప్రివెంటివ్ స్పైన్, స్పోర్ట్స్ హెల్త్ సెంటర్‌గా సాధారణ, సరళమైన పద్ధతులు రూపొందించాం. కోర్ కండరాలను బలోపేతం చేయడానికి ప్లాంక్స్, బ్రిడ్జెస్ వంటి వంటి వ్యాయామాలు.. ఫ్లెక్సిబుల్, బ్యాలెన్స్ కోసం మైండ్‌ఫుల్ మూవ్మెంట్స్ పద్ధతులు నిర్వహిస్తున్నాం. వెన్నుముక అవస్థలకు ఎర్గోనామిక్ వర్క్స్పేస్తో చెక్ పెట్టవచ్చు. – నరేష్ పగిడిమర్రి, ఎన్షూర్ హెల్తీ స్పైన్ సీఈఓ. -
వాహ్... ఉస్తాద్‌లు
ఇటీవల ఢిల్లీలో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువపురస్కారం అందుకున్న తెలుగు మహిళలు.ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్... ప్రఖ్యాత సంగీత విద్వాంసులు. నాదం ఆయన షెహనాయ్లో ప్రణవనాదంగా భాసిల్లింది. ఆయన ఉఛ్వాస నిశ్వాసలు నాదంతోనే... నాదస్వరంతోనే. ఆ నాదం స్మృతిగా మిగలరాదు... శ్రుతిగా కొనసాగాలి. కళాసాధనకు అంకితమైన కళాకారులే ఆయన వారసులు. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న మన మహిళలు వీళ్లు.సరిగమల సాగరంలో నేనో బిందువునిఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయ్ వాద్యం అంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికి వందల సార్లు కాదు వేలసార్లు విని ఉంటాను. రాత్రి నిద్రపోయే ముందు కూడా బిస్మిల్లా ఖాన్ సంగీత కార్యక్రమం వింటూ నిద్రపోతాను. మహా సముద్రం అంతటి సంగీతప్రపంచంలో ఆయన ఒక సముద్రం అయితే నేను ఒక నీటిబిందువుని. ఇలాంటి గొప్పవారు నాలాంటి ఎందరో సింగర్స్‌కు స్ఫూర్తినిస్తుంటారు. సంగీతమే శ్వాసగా జీవించిన బిస్మిల్లా ఖార్ పేరు మీద పురస్కారం అందుకోవడం అంటే సంతోషశిఖరాన్ని అధిరోహించినట్లే భావిస్తున్నాను. నాకు ఈ ఏడాది ఎన్నో మధురానుభూతులనిచ్చింది. కన్నడ పాటకు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా సైమా అవార్డు, కర్నాటక ‘విశ్వమన్య’ పురస్కారం, తెలుగులో బలగం సినిమా పాటకు ఐఫా అవార్డు అందుకున్నాను. ఇంకా గొప్ప సంతృప్తి ఏమిటంటే... నేపథ్యగాయని పద్మభూషణ్ ఉషాఉతుప్, పద్మభూషణ్ సుధా రఘునాధన్ వంటి మహోన్నత గాయనీమణులతో కలిసి వేదిక పంచుకోవడం. బాలికల సంరక్షణ కోసం స్వచ్ఛందంగా నిర్వహించిన సంగీతకార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కలిగిన అనుభూతి చాలా గొప్పది. ఇప్పుడు ఈ జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం ఊహించనిది. ఈ ఏడాది నాకు ప్రత్యేకం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. – సత్యవతి ముదావత్ (మంగ్లీ), సినీ నేపథ్య గాయనిలక్ష్యం మారిందిచిత్తూరులో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన రెడ్డి లక్ష్మి ఐఏఎస్ లక్ష్యంతో గ్రాడ్యుయేషన్‌కి ఢిల్లీకి వెళ్లారు. ఆమె మీద కళా తపస్వి విశ్వనాథ్ సినిమాల ప్రభావం కూడా ఎక్కువే. డిగ్రీ చదువుతూ కూచిపూడి నాట్యంలో శిక్షణ మొదలుపెట్టారు. ఆ ఆసక్తి ఆమెను ఏకంగా ఢిల్లీలో డాన్స్ ఆకాడమీ స్థాపించేవరకు తీసుకెళ్లింది. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన వారికి ఇలాంటి పురస్కారాలు భుజం తట్టి ఇచ్చే ప్రోత్సాహం వంటివన్నారు లక్ష్మి. పన్నెండేళ్లుగా ఢిల్లీలో ‘నృత్యవాహిని – అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ను నిర్వహిస్తున్నారామె. ఢిల్లీ వంటి నగరంలో నాట్యప్రదర్శన పట్ల ఆసక్తితో సుశిక్షితులై సాధన చేసినప్పటికీ చాలా మందికి ప్రదర్శనకు సరైన అవకాశం దొరకదు. అలాంటి వారికి నాట్య ప్రదర్శనకు అనువైన ఈవెంట్స్ ద్వారా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు లక్ష్మి. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులు తీసుకోవడం వల్ల ఆమె సేవ ఎల్లలు దాటింది. ఆన్లైన్లో వివిధ దేశాల నుంచి విదేశీయులతోపాటు ఎన్నారైలు కూడా ఆమె దగ్గర నాట్యంలో మెళకువలు నేర్చుకున్నారు. ఢిల్లీలో రెగ్యులర్‌గా నిర్వహించే క్లాసుల్లో తెలుగు వాళ్లతోపాటు వివిధ భాషల వాళ్లున్నారు. బిస్మిల్లా ఖాన్ యువపురస్కారం అందుకున్న సందర్భంగా ఆమె తన గురువు గారి మార్గదర్శనాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈ రోజు ఈ పురస్కారం అందుకున్నానంటే మా గురువుగారు పద్మశ్రీ గురు జయరామారావుగారి సూచనను పాటించడం వల్లనే. ఆయన పిఠాపురంలో పుట్టారు. కూచిపూడికి వెళ్లి నాట్యం నేర్చుకున్నారు. కాకతాళీయంగా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో డాన్స్ అకాడమీ అవసరం చాలా ఉంది. మన కళారీతులను విశ్వవ్యాప్తం చేయడానికి నీ వంతు ప్రయత్నం చెయ్యి... అని నాకొక డైరెక్షన్ ఇచ్చారు. వారి సహకారంతోనే ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్లో డాన్స్ టీచర్‌గా ఉద్యోగం చేశాను. ఎనిమిదేళ్లపాటు ఢిల్లీలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేసినప్పటికీ నాట్యం కోసం పని చేస్తున్నప్పుడు కలిగిన సంతోషం ఉండేది కాదు. నాట్యంలో నా కళాతృష్ణను తీర్చుకోవడానికే పూర్తి సమయం కేటాయించాలనుకున్నాను. ఆ తర్వాత భరతనాట్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఇప్పుడు కూచిపూడి నాట్యంలో పీజీ చేస్తున్నాను. ఇతర నాట్యరీతుల్లోనూ ప్రవేశాన్ని సాధించాను. నాట్యంలో పీహెచ్డీ చేయడం నా ప్రస్తుత లక్ష్యం’’ అన్నారు రెడ్డి లక్ష్మి.నా పాట నాకు నచ్చాలి!‘‘ఇది నా తొలి జాతీయ పురస్కారం. తప్పకుండా నా జీవితంలో మధురమైన ఘట్టమే. చెన్నైలో నా గానం విన్న ప్రముఖులు గోల్డెన్ వాయిస్ అని ప్రశంసించినప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకోవడం కూడా...’’ అన్నారు కర్ణాటక సంగీతకారిణి శ్వేతాప్రసాద్. ‘‘మా ఇల్లు ఒక సంగీతం విశ్వవిద్యాలయం వంటిది. నానమ్మ గాయని, తాతయ్య (రక్తకన్నీరు నాగభూషణం) రంగస్థల ప్రదర్శనల్లో నానమ్మ పాల్గొనేది. అమ్మ వీణలో సిద్ధహస్తురాలు. మరో తాతయ్య (అమ్మ వాళ్ల నాన్న) మోహన్‌రావు. ఆయన హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభ స్థాపించడం, నిర్వహించడంలో కీలకంగా పనిచేశారు. అలాంటి ఇంట్లో పుట్టడం ఒక వరం. మూడేళ్ల వయసు నుంచి సరిగమలు కూడా నాతోపాటు పెరిగాయి. శోభానాయుడు, అలేఖ్య పుంజల వంటి ప్రముఖ నాట్యకారుల కార్యక్రమాలకు గానమిచ్చాను. నాకు సంగీతమే జీవితం. మరొకటి తెలియదు. నా భర్త నట్టువాంగం కళాకారులు. మేమిద్దరం ముప్పైకి పైగా దేశాల్లో ప్రదర్శనలిచ్చాం. మా తాతగారిలాగే ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఉండడమే నా విజయరహస్యం. రక్తకన్నీరు స్ఫూర్తితో... నాగభూషణం తాతయ్య రక్తకన్నీరు నాటకాన్ని ఎనిమిది వేల సార్లు ప్రదర్శించారు. ప్రతి ప్రదర్శన దేనికది భిన్నంగా ఉండేలా చూసుకునేవారు. నిన్నటి కంటే నేడు మరికొంత భిన్నంగా, రేపు మరింత వైవిధ్యంగా ఉండేలా చూసేవారు. అలాగే ఒక ప్రదర్శనకంటే మరో ప్రదర్శన ఇంకా మెరుగ్గా ఉండేటట్లు నాకు నేను మెరుగులు దిద్దుకుంటాను. గాయకులు కానీ చిత్రకారులు కానీ గురువు దగ్గర నేర్చుకున్న విద్య దగ్గరే ఆగిపోకూడదు. సాధన ద్వారా తనవంతుగా మరికొన్ని మెళకువలను అద్దగలగాలి. మన నైపుణ్యం మీద మనకు నమ్మకం ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా ఫలితం సంతోషకరంగా ఉంటుంది. నా మట్టుకు నేను ‘నన్ను నేను మెప్పించుకోవాలి’ అనే కొలమానం పెట్టుకుని పాడుతాను. నా పాట నాకే నచ్చకపోతే మరొకరికి ఎలా నచ్చుతుంది? అనేదే నా ప్రశ్న. నా లక్ష్యం భవనాలు, కోట్ల రూపాయలు సంపాదించడం కాదు. సంగీతం నా ప్యాషన్. శుద్ధ సంగీతాన్ని పాడుతాను. సంగీతంతోనే జీవిస్తాను’’ అంటూ సంగీతం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు శ్వేతాప్రసాద్.– వాకా మంజులా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిది -
వీధి వ్యాపారి కాస్త స్టార్ చాయ్‌వాలాగా మారి ఏకంగా ..!
ఓ సామాన్య వీధి టీ వ్యాపారి తన అసాధారణ టాలెంట్‌తో ఒక్కసారిగా స్టార్ చాయవాలాగా మారి శెభాష్ అనిపించుకున్నాడు. రోజు చూసే చిన్న వ్యాపారమైన కాస్త విభిన్నంగా చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చని చాటి చెప్పాడు. ఒకప్పుడు వీధుల్లో ఏడు రూపాయల టీతో మొదలైన ప్రస్థానం నేడు ఏకంగా రూ. 5 లక్షలు వసూలు చేసే స్థాయికి చేరుకుందంటే..అది ఊహకే అందని విజయంగా చెప్పొచ్చు. ఇంతకీ ఎవరా ఆ స్టార్ చాయ్‌వాలా అంటే..?అతడే డాలీ చాయ్‌వాలాగా పేరుగాంచిన సునీల్ పాటిల్. నాగ్‌పూర్ వీధుల్లో రూ. 7ల కప్పు చాయ్‌తో అతడి టీ వ్యాపారం మొదలయ్యింది. అయితే అందరూ చాయ్వాళ్లలా కాకుండా కాస్త విభిన్నంగా కస్టమర్లను ఆకర్షించేలా టీని తయారు చేయడం, సర్వ్ చేయడం అతడి స్పెషాల్టీ. వ్యాపారానికి కీలకమైన సూత్రం కూడా ఇదే. దాన్నే మనోడు ఎలాంటి బిజినెస్ స్కూల్లో చదవకుండానే జీవన పోరాటంతో తెలుసుకున్నాడు. దాన్ని అప్లై చేసి తన టీ షాపు వద్దకే జనాలు వచ్చేలా చేసుకున్నాడు. దీంతోపాటు తన విలక్షణమైన టీ సర్వీంగ్కి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఫిబ్రవరి 2024లో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ప్రసిద్ధ చాయ్ సర్వీంగ్ కోసం వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా డాలీ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఆ ఒక్క వీడియో అతడి దశనే మార్చేసింది. ఏకంగా దుబాయ్‌లో కార్యాలయాన్ని తెరిచే స్థాయికి చేరుకున్నాడు. అతడు సర్వ్ చేసే విధానమే కాదు వేషధారణ కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది. అత్యంత స్టైలిష్‌గా..ఫంకీ గోల్డెన్ గాగుల్స్, గోల్డెన్ చైన్ తోపాటు వెరైటీ హెయిర్ స్టైల్‌తో ఫ్యాషన్ లుక్‌లో ఉంటాడు. ఒక రకంగా వ్యాపారాన్ని విజయవంతం చేసుకునేలా హంగు ఆర్భాటాలతో స్టైలిష్‌గా సర్వ్ చేస్తాడు. అదే అతడిని ఫేమస్ అయ్యేలా చేసింది. ఇంత స్టార్డమ్ వచ్చిన తన మూలాలను మరిచిపోకుండా తన టీ స్టాల్ సామాన్యుడి వలే పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం అతడు దుబాయ్ నుంచి కువైట్ల వరకు పలు ఈవెంట్లలో డాలీ టీ సర్వీస్ కోసం బుక్ చేసుకుంటారట. అందుకు చాయ్‌వాలా ఏకంగా రూ. 5 లక్షలు దాక వసూలు చేస్తున్నాడు. కానీ జనాలు కూడా లెక్క చేయకుండా అతడి సేవల కోసం ఎంత డభైన వెచ్చించడం విశేషం. ఇంత క్రేజ్ పెరిగినా డాలీ తన దుకాణం వద్ద మాత్రం టీని ఇంకా రూ. 7లకే కస్టమర్లకు అందిస్తుండటం గ్రేట్. View this post on Instagram A post shared by Dolly Ki Tapri Nagpur (@dolly_ki_tapri_nagpur) (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ! యుద్ధం కారణంగా..) -
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : దేవుడా..ప్యాక్ చూసి షాక్!
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినపుడు ఒకటికి బదులు ఒకటి రావడం, లేదంటే ఆహారంలో పురుగులు, సిగరెట్ పీకలు రావడం లాంటి ఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా అమెరికాలోని ఒక మహిళకు మరో వింత అనుభవం ఎదురైంది. తను ఆర్డర్ చేసిన ప్యాకేజీ ఓపెన్ చేసి, చూసి షాకయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. స్టోరీ ఏంటంటే..!న్యూజెర్సీలో డ్రైవర్‌గా పని చేసే ఒక మహిళ ఉబెర్ ఈట్స్నుంచి బురిటో(షావర్మా) లాంటిది ఆర్డర్ చేసింది. ఉబెర్ ఈట్స్ డెలివరీ అందుకొని ఓపెన్ చేసి, తిందామని ఏంతో ఆతృతగా ఫాయిల్ రేపర్ విప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అందులో బురిటోకు బదులుగా గంజాయి ప్యాక్ చేసి ఉంది. ఘటన వాషింగ్టన్ టౌన్షిప్, క్యామ్‌డెన్ కౌంటీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే తన డెలివరీ ప్యాకేజీలో బురిటోకు బుదులుగా ఏదో తేడా వాసన వచ్చినట్టుగా అనిపించిందని బాధితురాలు తెలిపిందని వాషింగ్టన్ టౌన్షిప్ పోలీస్ చీఫ్ పాట్రిక్ గుర్సిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అది ఒక ఔన్స్ గంజాయి అని తేలిందని ఆయన వెల్లడించారు. డ్రగ్స్, ఆల్కహాల్ లేదా మందులను రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఉబెర్ ఈట్స్‌లో ప్యాకేజీ డెలివరీ ఫీచర్‌ను ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు.ఉబెర్ ఈట్స్ స్పందనదీనిపై ఉబెర్ ఈట్స్ కూడా స్పందించింది. ఈ ఘటన తీవ్రంగా కలపర్చేదేనని ఉబెర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులను వెంటనే అప్రమత్తం చేసినందుకు ఆమెను అభినందించారు. ఇలాంటి అనుమానాస్పద డెలివరీలపై వెంటనే రిపోర్ట్ చేయాలని ఇతర డ్రైవర్లను కూడా కోరారు.ఇదీ చదవండి : వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా? -
క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను.. వెరీ ఇంట్రెస్టింగ్!
బ్రిటన్ దివంగత రాణి క్వీన్ ఎలిజబెత్ II పెళ్లి నాటి గౌను వెనుక చాల పెద్ద కథ ఉంది. ఆమె 1947 నవంబర్ 20న ప్రిన్స్ ఫిలిప్‌ని వివాహం చేసుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. దీంతో బ్రిటన్ దేశం ప్రజలు పొదుపు పాటించేలా గట్టి చర్యలు తీసుకుంది. అంటే ఆ సమయంలో ఎలాంటి ఫంక్షన్లకు విలాసవతంగా డబ్బులు ఖర్చుపెట్టడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. ఇది బ్రిటన్ రాజ వంశానికి కూడా వర్తిస్తుందట. ఎందుకుంటే యథా రాజా తథా ప్రజాః అన్న ఆర్యోక్తి రీత్యా బ్రిటన్ రాజవంశానికి కూడా పొదుపు పాటించక తప్పలేదు. దీంతో అదే టైంలో రాణి ఎలిజబెత్ II వివాహం జరగనుండటంతో ఆమె దుస్తుల ఖర్చుల కోసం ఆ రాజవంశం ఎలా పొదుపు పాటించిందో వింటే ఆశ్చర్యపోతారు.దివంగత క్వీన్ ఎలిజబెత్ II వివాహం వెస్ట్మిన్స్టర్ అబ్బేలో ఘనంగా జరిగింది. రాణి వివాహ గౌనులో అత్యద్భుతంగా కనిపించింది. అక్కడకు విచ్చేసిన అతిధులందరి చూపులను ఆకర్షించింది. ఆమె గౌనుని బ్రిటన్ రాజ వంశానికి చెందిన ప్రముఖ ప్యాషన్ డిజైనర్ డచెస్ శాటిన్ రూపొందించారు. దీన్ని చక్కటి పూలు, ముత్యాలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. అతని డిజైన్‌కి అనుగుణంగా వివాహ వెడ్డింగ్ హాలు పెయింటింగ్‌ను కూడా తీర్చిదిద్దారు. ఆ గౌనుపై దాదాపు 10 వేలకు పైగా ముత్యాలను వినియోగించారు. సుమారు 14 అడుగుల పొడవుతో ఎంబ్రాడరీ డిజైన్‌తో తీర్చిదిద్దారు. అయితే ఈ డిజైనన్ని పెళ్లికి మూడు నెలల ముందుగా ఆమోదించింది రాజకుటుంబం. అందువల్ల ఆ డిజైన్‌కి అనుగుణంగా వెడ్డింగ్ డెకరేషన్‌ని ఏర్పాటు చేశారు. దీని ధర వచ్చేసి ఆ రోజుల్లే దాదపు రూ. 25 లక్షల ధర పైనే పలికిందట. అయితే రెండో ప్రపంచ యుద్ధం దృష్ట్యా పొదుపుకి పెద్ద పీట వేస్తూ బ్రిటన్ దేశం ఇచ్చిన రేషన్ కూపన్లను వినియోగించుకుని విలాసవంతంగా డబ్బులు వెచ్చించకుండా జాగ్రత్త పడిందట రాజ కుటుంబం. యుధ్దం కారణంగా బ్రిటన్ ప్రభుత్వం పొదుపు చర్యల్లో భాగంగా ఆహారం, బట్టలు, సబ్బులు వంటి కొన్ని వాటిని రేషన్ చేసింది. దీంతో రాజకుటుంబం ఆ రేషన్‌ని ఉపయోగించుకునే మన రాణి ఎలిబబెత్ పెళ్లి గౌనుని కొనుగోలు చేసిందట. తాము రాజవంశస్తులమనే దర్పం చూపక పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది బ్రిటన్ రాజ కుటుంబం. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?
బ్రెడ్‌ఫ్రూట్ (ఆర్టోకార్పస్ ఆల్టిలిస్) చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. పనస, బ్రెడ్నట్, అంజీర, మల్బరీలకు దగ్గరి జాతికి చెందినదే. తెలుగులో ‘సీమ పనస’, ‘కూర పనస’ అంటారు. ఫిలిప్పీన్స్, న్యూగినియా, మలుకు దీవులు, కరిబియన్ దీవుల ప్రాంతం దీని పుట్టిల్లు. ఇప్పుడు దక్షిణాసియా, ఈశాన్య ఆసియా, పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలు, కరిబియన్, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో సాగవుతోంది. ఈ చెట్లకు కాచే కాయలు లేత ఆకుపచ్చని రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కాయలనే (పండుగా కాదు) అనేక రూపాల్లో తింటూ ఉంటారు. పసిఫిక్ దీవుల్లోని ప్రజలు అనాదిగా దీన్ని బ్రెడ్ లేదా బంగాళ దుంపల మాదిరిగా దైనందిన ఆహారంగా తింటున్నారు. బ్రెడ్‌ఫ్రూట్ చెట్లలో విత్తనాలు ఉన్న, లేని రెండు రకాలున్నాయి. ఈ చెట్టు 26 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. అదే చెట్టుకు ఆడ, మగ పూలు పూస్తాయి. లేతగా ఉన్నప్పు లేత ఆకుపచ్చగా, పండినప్పుడు ముదురు పసుపు రంగులో దీని కాయలు ఉంటాయి. తొక్కపైన చిన్నపాటి బుడిపెలు ఉంటాయి. లోపలి గుజ్జు లేత గోధుమ రంగులో చక్కని వాసనతో కొంచెం తియ్యగా ఉంటుంది. దీని కాయలు కిలో నుంచి 5 కిలోల వరకు బరువు పెరుగుతాయి. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్ తినగానే జీర్ణమైపోయేది కాదు. నెమ్మదిగా అరుగుతుంది. దీనిలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు, జీర్ణమయ్యే పీచుపదార్థం, ముఖ్యమైన విటమిన్లు, విటమిన్ సి, పొటాషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లకు కూడా ఇది నెలవు. ఉత్పాదకత, సుస్థిరతఎదిగిన ఒక బ్రెడ్‌ఫ్రూట్ చెట్టు ఏడాదికి 200 కిలోలకు పైగా కాయలు కాస్తుంది. నాటిన తర్వాత వేరూనుకొని బతికితే చాలు. తర్వాత ఢోకా ఉండదు. మొండిగా పెరిగి, కాయలనిస్తుంది. ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని, నిస్సారమైన భూముల్లోనూ బతుకుతుంది. అందువల్లే ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రజలకు కరువు కాలాల్లో కూడా సుస్థిరంగా ఆహారాన్ని అందిస్తుంది. ఎన్నో రకాలుగా తినొచ్చుబ్రెడ్ఫ్రూట్ను పచ్చిగా, లేతగా, పండుగా.. ఇలా ఏ దశలోనైనా తినొచ్చు. పూర్తిగా మగ్గిన పండుకు బంగాళ దుంప రుచి వస్తుంది కాబట్టి అనేక వంటకాలు చేసుకోవచ్చు. పెరిగిన కాయను ఉడకబెట్టుకొని, కుమ్ములో పెట్టుకొని, వేపుకొని, కాల్చుకొని తినొచ్చు. పచ్చి బ్రెడ్‌ఫ్రూట్ కాయలను పిండి చేసి పెట్టుకొని, బేకరీ ఉత్పత్తుల్లో కూడా కలుపుకోవచ్చు. ఇందులో గ్లుటెన్ ఉండదు కాబట్టి సెలియాక్ జబ్బు ఉన్న వారు కూడా తినొచ్చు. తీపి పదార్ధాల్లో, రుచికరమైన ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవచ్చు. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్లో పోషకవిలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉన్నాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడే ముఖ్యమైన అమినోయాసిడ్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం ఇందులో ఉంటాయి. విటమిన్ సి, బి1, బి5తో పాటు పొటాషియం, రాగి వంటి మినరల్స్ ఉన్నాయి.చదవండి: వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ.. ఆదాయం ఎంతో తెలుసా?ఈ కాయలో కొవ్వు, సోడియం స్వల్పంగా, పీచుపదార్థం అధికంగా ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కల్లో 4.4 మిల్లీ గ్రాముల సోడియం, 60 గ్రాముల పిండిపదార్థాలు, 2.4 గ్రాముల మాంసకృత్తులు, 227 కేలరీల శక్తి, 24.2 గ్రాముల చక్కెర, 0.5 గ్రామలు కొవ్వు, 10.8 మిల్లీ గ్రాముల పీచు పదార్థం ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కలు తింటే ఆ రోజుకు సరిపోయే పొటాషియంలో 23% లభించినట్లే. రోగనిరోధక శక్తిపుష్కలంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను అందించటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించటం, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచగలగటం బ్రెడ్‌ఫ్రూట్ ప్రత్యేకత. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను నిర్మూలించటం, దీర్ఘరోగాల బెడదను తగ్గించటంతో పాటు దేహం బరువును తగ్గించుకోవటానికి ఉపకరిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముక పుష్టికి దోహదపడుతుంది. విటమిన్ ఎ ఉండటం వల్ల కంటి చూపునకు కూడా మంచిదే. వెంటనే అరిగిపోకుండా క్రమంగా శక్తినిస్తుంది కాబట్టి రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. -
మిమ్మల్ని ఒత్తిడి చేసే అధికారం వారికి లేదు..!
మేము ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నాము. ఓనర్లతో మేం రాసుకున్న అగ్రిమెంటు ప్రకారం ఐదు సంవత్సరాల వరకు ఆ అపార్ట్మెంటు నుంచి మమ్మల్ని ఖాళీ చేయించేందుకు వీలు లేదు. కానీ ఓనర్ మమ్మల్ని తక్షణమే ఖాళీ చేయమని బలవంతం చేస్తున్నారు. అలా ఎలా చేస్తాం అని అగ్రిమెంట్ విషయం గుర్తు చేస్తే పోలీసు వారి దగ్గరికి వెళ్లి తన పరపతితో మాపై ఒత్తిడి చేస్తున్నారు. పోలీసు వారు కూడా మమ్ములను సెటిల్మెంట్ చేసుకోండి అంటున్నారు. ఈ పరిస్థితులలో మేము ఏం చేయాలి, సలహా ఇవ్వగలరు. – బి.నారాయణ, హైదరాబాద్సాధారణ ΄పౌరులకసలు ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా పోలీసు వారిని సంప్రదించాలి అని అనిపిస్తుంది. అది కుటుంబ సమస్య, భూమి తగాదా, అద్దె ఇల్లు ఖాళీ చేయక΄ోవటం వంటి ఏ సమస్య అయినా ముందుగా పోలీసు వారి దగ్గరికి వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలి అని కోరుతూ ఉంటారు. అందులో తప్పు లేదు. అయితే మీ సమస్య సివిల్ పరిధిలోకి వస్తుందా లేదా ఏదైనా నేరం అంటే క్రిమినల్ చట్టం కింద జరిగిందా అని పోలీసువారు చూడాలి. సివిల్ కేసులలో పోలీసులు జోక్యం చేసుకునే వీలు లేదు. ఈ విషయాన్ని దిగువ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు చాలాసార్లు స్పష్టం చేశాయి కూడా. అయినప్పటికీ సివిల్ కేసులలో కూడా పోలీసుల తరచు జోక్యం చేసుకుంటున్నారు అనేది వాస్తవం. సివిల్ కేసులలో పోలీసుల జోక్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో నెల నెలా నమోదవుతున్న వందలాది కేసులే అందుకు నిదర్శనం. సివిల్ కేసులకు క్రిమినల్ రంగు పులిమి కేసులు పెట్టడం కూడా కొత్తేమీ కాదు. అలాంటి కేసులను కోర్టులు తిరస్కరించాయి! పోలీసు వారు సివిల్ కేసులను ‘సెటిల్మెంట్ చేసుకోండి’ అని ఒత్తిడి చేయడానికి వారికి ఎటువంటి అధికారమూ లేదు. అలాగని మీరు పోలీసు వారితో వాగ్వాదానికి దిగవలసిన అవసరం లేదు. మీ హక్కులను కాపాడుకోవడానికి చట్టబద్ధమైన చర్యలు మాత్రమే తీసుకోవాలి. మీకు పోలీసుల నుంచి అటువంటి ఒత్తిడి వస్తోందని అంటున్నారు కాబట్టి మీరు పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు తర్వాత కూడా మీ సమస్యకు తగిన పరిష్కారం లభించకపోతే హైకోర్టులో కేసు వేయవచ్చు. పూర్వాపరాలు విచారించిన తర్వాత హైకోర్టు మీకు రక్షణ కలిగిస్తుంది. మీకు అగ్రిమెంట్ ఉంది అంటున్నారు కాబట్టి మీరు కూడా సివిల్ కోర్టును ఆశ్రయించి అగ్రిమెంట్‌ను అతిక్రమించేందుకు వీలు లేకుండా రక్షణ పొందవచ్చు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది (న్యాయయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు )(చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?
మీ గార్డెన్లో పేనుబంక (అఫిడ్స్)ను నియంత్రించటం ఒక సవాలుతో కూడుకున్న పని. కానీ, పేనుబంక పురుగులను అదుపు చేయటానికి అనేక ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. మీరు అనుసరించగల కొన్ని సూచనలు:1. మీ మొక్కలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండిముడుచుకున్న ఆకులపై అంటుకునే పదార్థం లేదా స్టెమ్ లేదా ఆకులపై పేనుబంక సోకుతున్న సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో గమనించటం కోసం మీ మొక్కలను తరచుగా తనిఖీ చేయండి. 2. వేపనూనె వాడండి వేప నూనె అఫిడ్స్‌ను నియంత్రిండానికి వాడే సహజమైన పురుగుమందు. లేబుల్ సూచనల ప్రకారం వేప నూనెను నీటితో కలిపి పేనుబంక సోకిన మొక్కలపై పిచికారీ చేయండి. 3.సబ్బు నీరు స్ప్రే చేయండిపేనుబంకను నియంత్రించడానికి తేలికపాటి డిష్ సోప్‌ను నీటిలోకలిపి ప్రభావిత మొక్కలపై స్ప్రే చేయవచ్చు.4. గార్లిక్ స్ప్రే ఉపయోగించండివెల్లుల్లి సహజ క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పేనుబంకను నియంత్రించడంలో సహాయ పడుతుంది. వెల్లుల్లి రసాన్ని నీటితో కలపండి. ప్రభావిత మొక్కలపై పీచికారీ చేయండి.5. ప్రయోజనకరమైన కీటకాలులేడీబగ్స్, లేస్వింగ్, పరాన్నజీవి కందిరీగలు వంటి ప్రయోజనకరమైన కీటకాలు పేనుబంకను వేటాడతాయి. అఫిడ్స్ పురుగుల సంతతిని నియంత్రించడానికి మీ గార్డెన్ లో ఈ కీటకాలు పెరిగేలా చూసుకోండి.6. తోట పరిశుభ్రత పాటించండికలుపు మొక్కలను తొలగించండి. తెగులు సోకిన మొక్కలను తీసి దూరంగా పారవేయండి. పురుగుల ముట్టడిని నివారించడానికి ఎక్కువ ఎరువులు వేయకుండా ఉండండి.7. స్క్రీన్లు, రో కవర్లను ఉపయోగించండిఅఫిడ్స్ మీ మొక్కలను ఆశించకుండా నిరోధించడానికి ఫైన్–మెష్ స్క్రీన్లు లేదా ఫైన్–వెటెడ్ రో కవర్లను ఉపయోగించండి.8.జీవ నియంత్రణపేనుబంకను తినే పక్షులు, సాలె పురుగులు వంటి సహజ మాంసాహారులను ప్రోత్సహించటం ద్వారా జీవ నియంత్రణకు అవకాశం కల్పించండి.9. పర్యవేక్షించండి, పునరావృతం చేయండి మీ గార్డెన్లో మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. పేనుబంకను సమర్థవంతంగా అరికట్టే నియంత్రణ చర్యలను అవసరాన్ని బట్టి పునరావృతం చేయండి.– హేపీ గార్డెనర్స్ అడ్మిన్ టీం -
వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?
ఫిలిప్పో కర్రర 28 ఏళ్ల యువ రైతు. అతనిది ఇటలీలోని ఉత్తరప్రాంతంలోని పర్మ నగరం. ఇటలీలో పెద్ద కమతాలే ఎక్కువ. ఇప్పుడు సగటు వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం సుమారు 11 హెక్టార్లు. అక్కడ కమతాల సైజు పెరుగుతూ వస్తోంది. 2000వ సంవత్సరంలో 5 హెక్టార్లున్న సగటు కమతం విస్తీర్ణం 2010 నాటికి 8 హెక్టార్లకు, తర్వాత 11 హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయక కుటుంబంలో పుట్టిన ఫిలిప్పో చదువు పూర్తి చేసుకొని ఏడేళ్ల క్రితం వ్యవసాయంలోకి దిగాడు. పేరుకు వ్యవసాయమే అయినా వాణిజ్య దృష్టితో సేద్యం చేయటంలో దిట్ట ఫిలిప్పో. అతను పగ్గాలు చేపట్టేటప్పటికి వారి కుటుంబ వ్యవసాయ కంపెనీ పది హెక్టార్లలో పంటలు సాగు చేస్తుండేది. ఈ ఏడేళ్లలోనే 150 హెక్టార్లకు విస్తరించిందంటే యువ రైతు ఫిలిప్పో పట్టుదల, కార్యదక్షతలను అర్థం చేసుకోవచ్చు. 50 హెక్టార్లలో ఇటాలియన్ బసిల్ పంటను పండిస్తున్నాడాయన. బసిల్ తులసి జాతికి చెందిన పంట. ఇందులో తీపి రకం కూడా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన సలాడ్లలో కలుపుకొని తింటారు. బసిల్ నుంచి నూనెను కూడా వెలికితీసి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. 1996లో పుట్టిన ఫిలిప్పోను ఆ దేశంలో కొత్త తరం రైతులకు, వాణిజ్య స్ఫూర్తికి ప్రతీకగా యువత పరిగణిస్తున్నారు. ‘నేను ఏడేళ్ల క్రితం మా వ్యవసాయం బాధ్యతలు తీసుకున్నాను. పది హెక్టార్ల పొలానికి బాధ్యత తీసుకున్నాను. మా తాత ప్రాంరిశ్రామిక పద్ధతుల్లో భారీ విస్తీర్ణంలో టొమాటోలు సాగు చేసేవారు (ఇటలీ ఉత్తర భాగంలో ఎక్కువ టొమాటోలే సాగవుతూ ఉంటాయి). బసిల్ పంటను అధిక విస్తీర్ణంలో పెంచడానికి అనువైనదిగా గుర్తించాను. ఇది అధికాదాయాన్నిచ్చే పంట. అయితే, రైతులు కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. నేను భారీ యంత్రాలు ఉపయోగించటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం ప్రారంభించాను. బసిల్ ఆకులను తాజాగా, సువాసనతో కూడి ఉండాలని దీనితో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఆశిస్తుంటాయి..’ అంటాడు ఫిలిప్పో (బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?)మనుషులతో కాకుండా భారీ యంత్రాలతో బసిల్ పంట కోతను చేపట్టాలనుకున్నప్పుడు.. తమ పొలంలో మడుల సైజుకు తగిన విధంగా పంట కోత యంత్రాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించి తయారు చేయించాడు. ఫిలిప్పో ఫిలిప్ఫో బసిల్ ఆకును ఆ రంగంలో వేళ్లూనుకున్న 6 కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ‘నేను ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాను. కానీ, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం’ అన్నాడు. ‘ఆరుబయట పొలాల్లో విస్తారంగా బసిల్ పంటను నాణ్యమైన దిగుబడి తీసే విధంగా సాగు చేయటం సవాళ్లతో కూడిన పని. అయితే, ఈ పంటలోనే ఎదిగే అవకాశం ఉందని నేను గుర్తించాను. మా కంపెనీ 3 వేల టన్నుల బసిల్ ఆకులను పండిస్తోంది. టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు). అనేక విషయాలపై ఆధారపడి ఈ ధరలో హెచ్చుతగ్గులుంటాయి అనిఫిలిప్పో చెప్పాడు. 50 ఎకరాల్లో ఏడాదికి రూ. 14.66 లక్షల ఆదాయం పొందుతున్నాడు. (పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?)ఏప్రిల్ రెండోవారంలో బసిల్ విత్తటం ప్రారంభిస్తాం. మొదటి కోత జూన్ రెండోవారంలో మొదలవుతుంది. అక్టోబర్ వరకు కోతలు కొనసాగుతాయి. ‘ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారం వరకు దిగుబడి, నాణ్యత బాగున్నాయి. భారీ వర్షం కురవటంతో పంట దెబ్బతింది.’ అన్నాడు ఫిలిప్పో. పొద్దున్న, సాయంత్రపు వేళల్లో బసిల్ ఆకుల్ని కత్తిరిస్తే వాటి నాణ్యత, రంగు, వాసన బాగుంటాయి. మేం కత్తిరించిన కొద్ది గంటల్లోనే ఫుడ్ కంపెనీకి చేర్చుతాము అని చెప్పాడు. ఇటలీలో ఒకానొక పెద్ద సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ‘ఎలిల్బంక’. ఫిలిప్పో కర్రరకు దీని మద్దతు ఉంది. ఫిలిప్పోకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, వ్యాపారాత్మక దృష్టి అమోఘమైనవి’ అని ఎలిల్బంక ప్రతినిధి ఆండ్రియా కలెఫ్పి ప్రశంసించారు. -
పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ..!
చలికాలంలో పెదాలు పొడిబారినట్లుగా అయిపోయవడమే గాక ముఖం, చర్మం కాంతి విహీనంగా మారుతుంది. ఓపక్క పని ఒత్తిడి వల్ల కళ్లకింద నలుపు, ముఖంంపై ముడతలతో అందవిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఆరోగ్యం కోసం తినే ఫ్రూట్స్‌తో చెక్‌పెడదాం. అదెలాగో చూద్దామా..కీరదోసకాయని చక్రాల్లా కోసుకుని కళ్ళమీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గుతుంది. రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్ బాల్స్‌ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి. మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోనాటు ముడతలుపోతాయి.టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీస్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.టీస్పూన్ పాల మీగడ, అయిదారు గులాబి రేకులు తీసుకుని పేస్ట్ చేసిన మిశ్రమాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు పొడిబారకుండా మృదువుగా ఉంటాయి. చలికాలంలో లిప్‌స్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. లిప్ గార్డ్, మీగడ, వెన్న, నెయ్యి వంటివి రాసుకుంటూ ఉంటే పెదవులు పొడిబారకుండా అందంగా ఉంటాయి. టీ స్పూన్ ఆపిల్ గుజ్జులో టీ స్పూన్ అరటిపండు గుజ్జు, అయిదారు చుక్కల తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఏర్పడ్డ ముడతలు, జిడ్డు తగ్గి ముఖం మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?
ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం’ ముగిసింది. వేలంలో పాల్గొన్న 10 ఫ్రాంచైజీలూ కలిపి ఆటగాళ్ల కోసం రు. 639 కోట్లకు పైగా ఖర్చుపెట్టాయి. మరోవైపు – ఆది, సోమవారాల్లో తొలిరోజు పాట జరుగుతున్నంత సేపూ.. కోటి రూపాయల ప్రశ్న ఒకటి ఇంటర్నెట్ను పల్టీలు కొట్టిస్తూనే ఉంది. ‘‘ఆమె ఎవరు? ఆమె పేరేంటి?’’ – ఇదీ ఆ ప్రశ్న. ‘‘ఆమె జాహ్నవీ మెహతా. కోల్‌కతా నైట్ రైడర్స్’’ – ఇదీ జవాబు. ‘‘జాహ్నవీ మెహతానా! సో క్యూట్’’ – ఒకరు.‘దేవుడా! ఏమిటి ఇంతందం!!’’ – ఇంకొకరు. ఆట ముగిసినా కూడా, ‘‘ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు?’’ అంటూ కొన్ని గంటల పాటు నెట్లో ఆమె కోసం వేట’ సాగుతూనే ఉంది. అందమే కాదు, అందాన్ని మించిన తెలివితేటలు ఉన్న అమ్మాయి జాహ్నవి మెహతా. డాటర్ ఆఫ్ జూహీ చావ్లా. అవునా! అక్కడేం పని ఈ అమ్మాయికి! అక్కడే మరి పని! కోల్‌కతా నైట్ రైడర్స్‌కి కో–ఓనర్ జూహి చావ్లా. టైమ్‌కి ఆమె వేలం పాటకు చేరుకోలేకపోయారు. ‘‘ఇదుగో వస్తున్నా..’’ అంటూ జెడ్డా ఫ్లయిట్ నుంచి వీడియో పంపారు. ఆమె వచ్చేలోపు పాట మొదలైందో, లేక ‘‘నువ్వేశాడు’’ అని అంతటి బాధ్యతను కూతురిపై ఉంచారో.. తల్లికి బదులుగా జాహ్నవి వేలం పాటలో పాల్గొంది. 21 మంది ఆటగాళ్లను దక్కించుకుంది. వాళ్లకు పెట్టిన ఖర్చుపోగా, ఇంకో ఐదు లక్షలు మిగిల్చింది కూడా!జాహ్నవి సోషల్ మీడియాలో కనిపించటం అరుదు. ఆమెకొక ‘పబ్లిక్ ఇన్‌స్ట్రాగామ్ పేజ్’ ఉంది కానీ, అందులో 2022 తర్వాత ఒక్క పోస్టు కూడా ఆమె పెట్టలేదు. అయితే ఆ ఏడాది ఐపీఎల్ వేలంలో మాత్రం షారుక్ ఖాన్ కూతురు సుహానా, కొడుకు ఆర్యన్లతో కలిసి తొలిసారి కనిపించింది. తల్లి తరఫున జాహ్నవి, షారుక్ తరఫున సుహానా, ఆర్యన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కె.కె.ఆర్) వేలంలో కూర్చున్నారు. (షారుఖ్ కూడా కె.కె.ఆర్కి ఒక కో ఫౌండర్). ఆ తర్వాత జాహ్నవి బాహ్య ప్రపంచానికి కనిపించటం మళ్లీ ఇప్పుడే! గత ఏడాదే ఆమె కొలంబియా యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అప్పుడు కూడా ఆమె సోషల్ మీడియాలోకి రాలేదు. జూహీ చావ్లానే గ్రాడ్యుయేషన్ గౌన్‌లో ఉన్న తన కూతురి కాన్వొకేషన్ ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి, ‘కొలంబియా క్లాస్ 2023’ అని కాప్షన్ పెట్టి తన మురిపెం తీర్చుకున్నారు. జాహ్నవి స్కూల్ చదువు కూడా ఇంగ్లండ్‌లోనే అక్కడి చాటర్ హౌస్ స్కూల్లో సాగింది. అంతకుముందు ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. తల్లి పోస్ట్ చేసిన ఫొటోలో గ్రాడ్యుయేషన్ గౌన్‌లో జాహ్నవిని అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఇప్పుడు మాత్రం తల్లి తరఫున ఐపీఎల్ ఆక్షన్‌లో డార్క్ బ్లూ వెల్వెట్ జాకెట్, వైట్ టీ షర్టుతో కనిపించిన జాహ్నవిని చూసి ‘‘ఎవరబ్బా ఈ అమ్మాయి?!’’ అని ఆరాలు తీశారు. ఎవరో తెలిశాక, ‘‘తల్లి పోలికలు ఎక్కడికిపోతాయి?’’ అని ఒకప్పటి మిస్ ఇండియా, బాలీవుడ్ అందాల నటి అయిన జూహీ చావ్లాను కూడా ఆరాధనగా ట్యాగ్ చేశారు. ‘అందం ఒక్కటేనా తల్లి పోలిక? ఆ తెలివి మాత్రం!’ అన్నట్లు ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ విజేత ఎవరో గుర్తుంది కదా. కోల్‌కతా నైట్ రైడర్స్. (చదవండి: -
యూట్యూబర్‌గా సక్సెస్ అయ్యి..ఏకంగా బాలీవుడ్ మూవీ..!
పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘అరోవిల్’నురహస్య నగరం అంటారు. కులం, మతం, డబ్బు లేకుండా కొంతమంది జీవించే ఇక్కడి నుంచే పెరిగి పెద్దదయ్యింది అహిల్య బామ్రూ. వ్యంగ్య వీడియోలు చేసే యూట్యూబర్‌గా ఈమె చేసిన ‘ప్రయోగం’ సక్సెస్ అయ్యి బాలీవుడ్ దాకా చేర్చింది. ఇటీవల విడుదలయ్యి ప్రశంసలు పొందుతున్న‘ఐ వాంట్ టు టాక్’లో అభిషేక్ బచ్చన్ కుమార్తెగా నటించింది. ‘అరోవిల్’లో నాకు దొరికిన స్వేచ్ఛ నన్ను తీర్చిదిద్దింది అంటున్న అహిల్య జీవితం ఆసక్తికరం.‘నేను ముంబైలో పెరిగి ఉంటే ఇలా ఉండేదాన్ని కానేమో. ఆరోవిల్‌లో పెరగడం వల్ల నేను ఒక భిన్నమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలిగాను’ అంటుంది అహిల్యా అమ్రూ. అహిల్యా గురించి చె΄్పాలంటే ఒక విజిటింగ్ కార్డు ఆ అమ్మాయికి చాలదు. ఆ అమ్మాయి గాయని, చిత్రకారిణి, డాన్సర్, నటి, వాయిస్ఓవర్ ఆర్టిస్ట్, డిజిటల్ క్రియేటర్...‘ఇవన్నీ నేను ఆరోవిల్‌లో ఉచితంగా నేర్చుకున్నాను. ఉచితంగా నేర్పించేవారు అక్కడ ఉన్నారు. బయట ఇది ఏ మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతిదానికీ డబ్బు కావాలి’ అంటుంది అహిల్య.ఇంతకీ ఆరోవిల్ అంటే? అదొక రహస్య నగరి. ఆధ్యాత్మిక కేంద్రం. లేదా భిన్న జీవన స్థావరం. ఇది పాండిచ్చేరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం కూడా సందర్శించవచ్చు. ఇక్కడ 42 దేశాలకు చెందిన 3000 మంది పౌరులు జీవిస్తున్నారు. వారి పని? డబ్బు ప్రస్తావన లేకుండా జీవించడం. పండించుకోవడం, తినడం, పుస్తకాలు చదువుకోవడం, తమకు వచ్చింది మరొకరికి నేర్పించడం, మెడిటేషన్. వీరు చేసేవాటిని ‘గ్రీన్ ప్రాక్టిసెస్’. అంటే పృథ్వికీ, పర్యావరణానికీ ద్రోహం చేయనివి. అక్కడే అహిల్య పెరిగింది.స్వేచ్ఛ ఉంటుంది‘మాది ముంబై. నేను అక్కడే పుట్టా. ఆ తర్వాత మా అమ్మానాన్నలు పాండిచ్చేరి వచ్చారు. అక్కడ నేను ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లిష్, ఫ్రెంచ్, బెంగాలీ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆరోవిల్కు మారాము. అక్కడ విశేషం ఏమిటంటే చదువులో, జీవితంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది.ఏది ఇష్టమో అది నేర్చుకుంటూపోవచ్చు. విసుగు పుడితే మానేయవచ్చు. బయట ప్రపంచానికి సంబంధం లేని పోటీతో జీవన శైలితో ఉండవచ్చు. ఇది అందరికీ సెట్ అవదు. కాని నాకు సెట్ అయ్యింది. నేను ఇక్కడ ఎన్నెన్ని నేర్చుకున్నానో చెప్పలేను. ఇక్కడ పెరగడం వల్ల నాకు ఆధ్యాత్మిక భావన అంటే ఏమిటో తెలిసింది. ప్రకృతితో ముడిపడి ఉండటం అంటే ఏమిటో తెలిసింది. భిన్న సంస్కృతులు, జీవితాలు తెలిశాయి. ఆరోవిల్ లక్ష్యం విశ్వమానవులను ఏకం చేయడం. ఇది చిన్న లక్ష్యం కాదు. మనుషులందరూ ఒకటే అని చాటాలి. బయట ఉన్న రొడ్డకొట్టుడు జీవితంతో, ΄ోటీతో విసుగుపుట్టి ఎందరో ఇక్కడకొచ్చి ఏదైనా కొత్తది చేద్దాం అని జీవిస్తున్నారు. ఆరోవిల్ మీద విమర్శలు ఉన్నాయి. ఉండదగ్గవే. కాని ఇది ప్రతిపాదిస్తున్న జీవనశైలి నచ్చేవారికి నచ్చుతుంది’ అంటుంది అహిల్య.రీల్స్‌తో మొదలుపెట్టి...వ్యంగ్యం, హాస్యం ఇష్టం అ«ధికంగా ఉన్న అహిల్య సరదాగా రీల్స్‌తో మొదలుపెట్టి డిజిటల్ క్రియేటర్‌గా మారింది. మన దేశానికి వచ్చిన విదేశీయులు ఆవును చూసి, గేదెను చూసి ఎంత ఆశ్చర్యపోతుంటారో అహిల్య చాలా సరదాగా చేసి చూపిస్తుంది. అందరి యాక్సెంట్, బాడి లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తూ ఆమె చేసే వీడియోలకు ఫ్యాన్స్ కొల్ల. అందుకే అభిషేక్ బచ్చన్ ముఖ్యపాత్రలో నవంబర్ 22న విడుదలైన ‘ఐ వాంట్ టు టాక్’ సినిమాలో మొదటిసారిగా బాలీవుడ్ నటిగా మొదటి అడుగు వేయగలిగింది అహిల్య. ఈ సినిమాలో కేన్సర్ పేషంట్ అయిన సింగిల్ పేరెంట్ అభిషేక్ తన కూతురితో అంత సజావుగా లేని అనుబంధాన్ని సరి చేసుకోవడానికి పడే కష్టం, కూతురుగా అహిల్య పడే తాపత్రయం అందరి ప్రశంసలు పొదేలా చేశాయి. (చదవండి: బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!) -
రీడ్.. రైట్.. రైట్
ఈ మధ్య మంచి సినిమా వచ్చింది చూశావా బ్రో.. ఇన్‌స్టాలో కొత్త రీల్ ట్రెండింగ్‌లో ఉంది తెలుసా మచ్చా.. యూట్యూబ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది సెండ్ చేయాలా? ఈ తరం యువతను కదిపితే వారి నోటివెంట ఎక్కువగా వచ్చే మాటలు. మనలో చాలా మంది ఇలాగే మాట్లాడతారు కూడా. అదే ఏదైనా పుస్తకం గురించి చెప్పామనుకోండి.. పుస్తకమా.. పుస్తకం చదివే టైం ఎక్కడుంది.. అయినా ఈ రోజుల్లో పుస్తకాలు ఎవరు చదువుతారు చెప్పండి! అంటూ తిరిగి ప్రశ్నిస్తుంటారు. నిజమే పుస్తక పఠనం ఈ తరం యువతలో తగ్గిపోయిందని అనుకుంటారు. కానీ మనలో చాలా మంది ఈ ట్రెండ్స్‌ని ఫాలో అవుతూనే ఏదో ఒక పుస్తకాన్ని చువుతూ ఉంటారు. మరికొందరైతే పుస్తకాలంటే పడి చచి్చపోతుంటారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్ పుస్తకాలను తెగ చదివేస్తున్నారు. ఇన్‌స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మాత్రమే చూసే ఈ తరం యువతీ, యువకుల్లో చాలా మంది పుస్తకాలు చదివే వాళ్లు కూడా ఉన్నారా అని మనలో కొందరికి డౌటనుమానం? అయితే అదంతా వట్టి అపోహేనని ఏటా జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు వచ్చే స్పందన రుజువు చేస్తోంది. వేలాది మంది యువత ఈ ఫెయిర్‌లో లక్షల సంఖ్యలో పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు బుక్ ఫెయిర్‌లో అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. నవలలకు ప్రాధాన్యం.. పుస్తకాలు చదివే వారిలో ఎక్కువగా నవలలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పొట్టి వీడియోలు, షార్ట్ న్యూస్ లాగే పొట్టి కథలు చదివేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ నిడివిలో చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసే నవలలకు యువత ఎక్కవగా అట్రాక్ట్ అవుతోంది. ఇక, వచన కవిత్వంపై కూడా యూత్ మనసు పారేసుకుంటోంది. దీంతో పాటు ప్రముఖుల ఆత్మకథలు చదివేందుకు చాలా మంది యువతీ, యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు ఇంగ్లిష్ లో నవలలు చదివేందుకు కాలేజీ విద్యార్థులు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు మాతృభాష అయిన తెలుగు పుస్తకాలు చదివేందుకు ప్రయతి్నస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారు తెలుగు పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.పాఠకులు పెరుగుతున్నారు.. 1990లలో పుస్తకాలు బాగా హిట్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎంత ఆసక్తిగా ఉన్నా కూడా పుస్తకాలు చదివే వారు తక్కువయ్యారని చాలా మంది అంటుంటారు. కానీ పుస్తకాలు చదివేవారు బాగానే పెరిగారు. ఓ సినిమా బాగుంటే ఎలా చూస్తున్నారో.. మంచి కథ.. విభిన్న కథనంతో పుస్తకాలు మార్కెట్లోకి వస్తే కళ్లకద్దుకుని చదివే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వచ్చిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ అనే పుస్తకం దాదాపు లక్ష కాపీలు అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం. నిజ జీవితంలో జరిగే ఉదంతాలనే ఆసక్తిగా రాస్తే పుస్తకాలు చదువుతారని ఆ పుస్తక రచయిత నిరూపించారనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి పుస్తకాలు చదివిన తర్వాత చాలా మంది ఏదైనా మంచి పుస్తకం ఉంటే చెప్పండి బ్రదర్ అని తెలిసిన వారిని ఇప్పటి యువతీ, యువకులు అడుగుతున్న సందర్భాలు కోకొల్లలు.రచయితలుగానూ రాణిస్తూ.. ఇటీవలి కాలంలో పుస్తకాలు రాసేందుకు కూడా యువత ఆసక్తి కనబరుస్తోంది. ముఖ్యంగా మాతృభాషపై మమకారంతో తమకు సాధ్యమైనంత వరకూ రచనలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు హాబీగా ఖాళీ సమయాల్లో రచనలు చేస్తుండగా.. కొందరు మాత్రం రచనను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. మంచి కథతో వస్తే పాఠకులు ఆదరిస్తారనే నమ్మకం పెరగడంతో, మంచి కథలు రాసేందుకు ప్రయతి్నస్తున్నారు. అందరికీ పుస్తకాలు అచ్చు వేయించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చిన్న చిన్న కథలు రాస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఇలా రాస్తూ.. రాస్తూ.. పుస్తకాలు ప్రచురించేసి, ఆదరణ పొందుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇక, పుస్తకాలు, సోషల్ మీడియాలో రాస్తూ సినిమాల్లో గేయ రచయితగా, స్క్రిప్ట్ రైటర్‌గా కూడా వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు.వెలకట్టలేని అనుభూతి.. పుస్తక పఠనం ఎప్పటికీ వన్నె తరగనిది. సామాజిక మాధ్యమాలు తాత్కాలికమే. పుస్తకాలు చదివితే ఏదో వెలకట్టలేని అనుభూతి కలుగుతుంది. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేసుకునే బదులు మంచి పుస్తకం చదివితే కొత్త ప్రపంచాన్ని చూసిన వాళ్లమవుతాం. – డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, రచయితఅవినాభావ సంబంధం చిన్నప్పటి నుంచే చిన్న చిన్న కథలు, వ్యాసాలు రాయడం అలవాటు. తెలుగుపై మమకారంతో తెలుగులో పీజీ చేశాను. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రచయిత్రుల కథా సాహిత్యం– స్త్రీ జీవన చిత్రణ అనే అంశంపై పీహెచ్డీ చేస్తున్నాను. పుస్తక పఠనంతో భాషను మెరుగుపరుచుకోవచ్చు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలు ఆసక్తిగా ఉంటాయి. – పెద్దపల్లి తేజస్వి, పరిశోధక విద్యారి్థని, ఓయూబంగారు భవితకు బాట.. పుస్తక పఠనం యువత బంగారు భవితకు బాటలు వేస్తుంది. సాహిత్య పఠనం ద్వారా సామాజిక స్పృహ కలుగుతుంది. పుస్తకం చదువుతుంటే ఎంతో మందితో సాన్నిహిత్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. భావ వ్యక్తీకరణ, భాషా నైపుణ్యం, ఏకాగ్రత, ఓర్పు, సహనం పెరుగుతుంది. – రావెళ్ల రవీంద్ర, యువ రచయిత -
నీ ఆటే బంగారం... శ్రీవల్లీ
‘క్రికెట్ ప్లేయర్ కావాలనుకుంటున్నాను’ అనే మాట అబ్బాయిల నోట వినిపిస్తే అభినందనలు తెలుపుతారు. ఆశీర్వదిస్తారు. అదే మాట అమ్మాయిల నోటి నుంచి వినిపిస్తే..? అవాక్కవుతారు. ‘అమ్మాయిలకు క్రికెట్ ఎందుకు?’ అని కూడా అంటారు. లక్ష్యం మీద గురి పెట్టిన వారు మాత్రం అలాంటి మాటలను లక్ష్యపెట్టరు. అలాంటి ఒక అమ్మాయి శ్రీవల్లి. ఎన్నో సవాళ్లను అధిగమించి తన కలను నెరవేర్చుకున్న శ్రీవల్లి క్రికెట్లో రాణిస్తోంది. డిసెంబరు 4 నుంచి అహ్మదాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌లో బీసీసీఐ సీనియర్ మహిళల జట్టులో హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.శ్రీవల్లికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం టీవీలో వీక్షణకే పరిమితం కాలేదు. చిన్న వయసులోనే బాల్, బ్యాట్‌తో గ్రౌండ్లో అడుగు పెట్టేలా చేసింది. శ్రీవల్లి అయిదవ తరగతి చదువుతున్న రోజుల్లో... స్కూల్ ప్లే గ్రౌండ్‌కు వెళ్లింది. హైస్కూల్ అబ్బాయిలు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ‘అన్నా... నేను కూడా ఆడతాను’ అని అడిగింది చిన్నారి శ్రీవల్లి. వాళ్లు బిగ్గరగా నవ్వారు.ఆ నవ్వులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ‘అయిదో క్లాసు అమ్మాయి హైస్కూల్ అబ్బాయిలతో ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. ‘ఆడపిల్లలు క్రికెట్ ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. వారి వెటకారపు నవ్వులతో వెనక్కి వెళ్లిపోలేదు శ్రీవల్లి. పీఈటీ రహీం సార్‌కు చెప్పింది. ‘నీ ఉత్సాహం సరే, వారితో ఆడగలవా?’ అని అడిగారు సార్. ‘ఆడతాను’ అని ఉత్సాహంతో తల ఊపింది.నిజానికి అది ఉత్సాహం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన తొలి సంకేతం. విజయపథం వైపు వేసిన తొలి అడుగు. శ్రీవల్లి చేసిన బౌలింగ్‌లో సీనియర్లు షాట్లు బాగానే కొట్టారు. కానీ, తన స్పీడ్‌కు కొందరు బెంబేలెత్తడం పీఈటీ సార్ గమనించారు. లైన్ లెంగ్త్ సరిదిద్దితే శ్రీవల్లిని బాగా తీర్చిదిద్దవచ్చు అని గుర్తించారు. అక్కడ నుంచి తానే కోచ్‌గా మారారు. శ్రీవల్లి బౌలింగ్‌లోని లోపాలను సరిచేస్తూ క్రమంగా స్పీడ్బౌలర్గా తీర్చిదిద్దారు. ‘మీ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంది’ అని శ్రీవల్లి తల్లిదండ్రులకు చె΄్పారు.‘క్రికెట్ అంటే ఏదో సరదాగా ఆడుతోంది కానీ అమ్మాయిని డాక్టర్‌గా చూడాలనేది మా కల’ అని వారు అని ఉంటే శ్రీవల్లి కల ఆవిరైపోయేది. అయితే సార్ మాట విని శ్రీవల్లి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. కుమార్తెకు మరింత సాధన అవసరమనుకున్న తండ్రి లక్షా్మరెడ్డి శ్రీవల్లిని హైదరాబాద్ పంపాడు.‘పై చదువుల కోసమో, ఎంసెట్ కోచింగ్ కోసమో పిల్లల్ని హైదరాబాద్‌కు పంపిస్తారుగానీ క్రికెట్ కోచింగ్ కోసం పంపిస్తున్నావా!’ అని బోలెడు ఆశ్చర్యపడిన వాళ్లు... ‘క్రికెట్లో ఎవరికో ఒకరికి అదృష్టం దక్కుతుంది. ఆడినవాళ్లందరూ స్టార్లు కాలేరు’ అని నిరాశపరిచిన వాళ్లూ్ల ఉండొచ్చు. ఎవరి నుంచి ఎలాంటి మాటలు వచ్చినా ఆ తల్లిదండ్రులకు బాగా నచ్చిన మాట...‘మీ అమ్మాయికి క్రికెట్లో మంచి భవిష్యత్ ఉంది’హైదరాబాద్‌లో కనిష్కనాయుడు శిక్షణలో క్రికెట్లో తన నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంది శ్రీవల్లి. ఫాస్ట్బౌలర్గానే కాకుండా, బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకోగల ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని సొంతం చేసుకుంది.బాల్యంలోనే పెద్ద కలలు కన్న శ్రీవల్లి టీనేజ్‌లో ఆ కలలను తన సాధనతో మరింత సాకారం చేసుకుంది.ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్‌గా రాణించాలనేది శ్రీవల్లి లక్ష్యం. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం. – అనిల్ కుమార్ భాషబోయిన సాక్షి ప్రతినిధి, కరీంనగర్ఆ స్ఫూర్తితోనే...అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు క్రికెట్ ఆడడానికి రకరకాల పరిమితులు ఉండొచ్చు. అయితే ఆడాలనే ఉత్సాహంతోపాటు సంకల్పబలం ఉంటే ఆ పరిమితులు మనకు అడ్డుకావు. ఎంతోమంది స్టార్ క్రికెట్ ప్లేయర్ల అపూర్వ విజయాలతో స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తితోనే క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టాను. ఫాస్ట్ బౌలర్‌గా రాణించాలనేది నా కల. – కట్టా శ్రీవల్లి రెడ్డి -
పేద పిల్లల రిచ్ ఫ్యాషన్
లక్నోలోని నిరుపేద పిల్లలు ప్రముఖ డిజైనర్ సబ్యసాచి స్ఫూర్తితో పెళ్లి దుస్తులను రూపొందించారు. ఈ విషయాన్ని సూచిస్తూ తీసిన వీడియోను ఇటీవల ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వారు రూపొందించిన బ్రైడల్ వేర్‌ను ధరించి, మోడలింగ్ చేసిన వాళ్లలోనూ పేద పిల్లలూ ఉన్నారు.ఫ్యాషన్ పరిశ్రమపై సబ్యసాచి ముఖర్జీ ప్రభావం అతని అద్భుతమైన డిజైన్ లకు మించి విస్తరించింది. దీంతోపాటు భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ హస్తకళనూ ్రపోత్సహిస్తుంది. లాభాపేక్ష లేని సంస్థ ‘ఇన్నోవేషన్ ఫర్ ఛేంజ్’ మార్గదర్శకత్వంలో సబ్యసాచి కళాఖండాలు, అతని దిగ్గజ డిజైన్ లు ఇప్పుడు లక్నోలోని నిరుపేద పిల్లల బృందానికి స్ఫూర్తినిచ్చాయి. ఈ నిరుపేద యువ డిజైనర్లు సగర్వంగా తమ క్రియేషన్ లను ధరించి కెమెరా ముందు ఆత్మవిశ్వాసంతో పోజులిచ్చారు. ’మేం లక్నో ఆధారిత ఎన్జీవోతో కలిసి 400 మంది నిరుపేద పిల్లలతో కలిసి పని చేస్తున్నాం. ఈ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం. ఈ దుస్తులను మా విద్యార్థులు రూపొందించారు. ఇందులో ప్రదర్శనలు ఇస్తున్న విద్యార్థులందరూ మురికివాడల నుండి వచ్చినవారే. వారు తమ సృజనాత్మకత ద్వారా డిజైనర్ దుస్తులను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానికులు, చుట్టుపక్కల వ్యక్తుల నుండి స్వచ్ఛంద సంస్థ ద్వారా పొందే అన్ని దుస్తులను రీయూజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సబ్యసాచి సోషల్ మీడియా అకౌంట్లో మోడల్ దుస్తులను చూసిన తర్వాత వారు ఇలాంటి డిజైన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు’ అని ఇన్నోవేషన్ ఫర్ ఛేంజ్ ఎన్జీవో తెలిపింది. ప్రతిరోజూ తమ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి శ్రద్ధగా కృషి చేస్తున్న 15 ఏళ్ల ఉత్సాహవంతమైన పిల్లలు ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ కామెంట్స్ విభాగంలో హార్ట్ ఎమోజీని పోస్ట్ చేయడం ద్వారా వారికి తన ఆశీస్సులను, ప్రశంసలను అందజేశాడు. అంతేకాదు, ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ‘ఈ పిల్లలకు మరింత శక్తి... ప్రేమ, ఆశీర్వాదాలు అందాలి..’ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. -
అంబానీ వారసుల గురించేనా?.. ఇలాంటి వారి గురించి కూడా తెలియాలి
ఆధ్యాత్మిక ప్రయాణం కోసం ఓ వ్యక్తి చేసే ప్రయాణం కథాంశంగా రాబిన్ శర్మ రాసిన పుస్తకం The Monk Who Sold His Ferrari ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అదే చరిత్రలో.. గౌతమ బుద్ధుడు ఇలా రాజభోగాలను వదిలేసి సన్యాసం తీసుకున్నాడని చదువుకున్నాం. కానీ.. నిజ జీవితంలో ఇలా కోట్ల సంపదను వదిలేసి సన్యాసి జీవితం గడుపుతారా?. అయితే.. ఈ మోడ్రన్ డే సిద్ధార్థుడి కథ చదవాల్సిందే. శ్రీలంక- తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్. మలేషియాలో బిలియనీర్. ఆ దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సుమారు రూ. 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ఆయన ఒక్కగానొక్క కొడుకే పైన ఫొటోలో ఉన్న వెన్ అజన్ సరిపన్యో.👉మలేషియాలో మూడో అత్యంత సంపన్నుడిగా పేరున్న తండ్రిని.. ఆయనకున్న టెల్కాం, శాటిలైట్స్, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాదనుకున్నారు అజన్ సరిపన్యో. ఒకానొక టైంలో సీఎస్కే టీంకు స్పాన్సర్ చేసిన ఎయిర్‌సెల్ కంపెనీకి ఓనర్ ఈయన తండ్రే.👉రెండు పదుల వయసొచ్చేదాకా రిచ్చెస్ట్ పర్సన్ కొడుకుగానే తన ఇద్దరు సోదరీమణులతో లండన్‌లో పెరిగాడు. ఆ టైంలోనే ఎనిమిది భాషలపై అనర్గళంగా పట్టు సాధించారు. ఇక్కడ మరో విషయం.. ఈయన తల్లి మామ్వాజారోగీస్ సుప్రిందా చక్రబన్ థాయ్‌లాండ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తే. అయితే ఈ మూలాలే అతని జీవితాన్ని మార్చిపడేసింది.👉తన 18వ ఏట తల్లి కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు థాయ్‌లాండ్ వెళ్లాడు అజన్ సరిపన్యో. వెళ్లేముందు ఆ ట్రిప్ సరదాగా సాగుతుందని భావించాడు. కానీ, అది అతని జీవితంలో ఊహించని మార్పు తెచ్చింది. అక్కడ ఆధ్యాత్మికత అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇదే తన జీవిత పరమార్థం అనుకుని.. భోగభాగ్యాలను వదులుకుని సన్యాసం పుచ్చేసుకున్నాడతను.👉గౌతమబుద్ధుడి స్ఫూర్తితో అజన్ అవన్నీ వదులుకుని సన్యాసిగా మారిపోయి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవ చేస్తున్నాడు. వేల కోట్ల సంపదలో ఈ ఆనందం దొరకదంటాడాయన. మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ ఓ మఠాధిపతిగా ఉంటూనే.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ అభినవ బుద్ధుడు.👉తన ఆస్తులన్నీ అజన్ సరిపన్యోకు అప్పగించాలనుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుని భావించాడు ఆనంద్ కృష్ణన్. కానీ, అజన్ మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు. ఆ నిర్ణయం బాధించేదే అయినా అజన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఆ తండ్రి గౌరవించాడు. 👉తండ్రి బాటలో అడుగులు వేసి వ్యాపారరంగంలో రాణిస్తున్న అంబానీ వారసుల గురించే కాదు.. ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతున్న అజన్ గురించి కూడా ఈ ప్రపంచానికి తెలియాల్సిందే కదా. -
మంచు కొండల్లో విహారానికి సై
స్నో అడ్వెంచర్లకు కులుమనాలి అనువైన ప్రదేశంగా పేరొందింది. డిసెంబరులో కులుమనాలి చూసేందుకు వేలాది మంది సందర్శకులు వెళుతున్నారట. ఈ ప్రాంతం ప్రపంచంలోనే మంచు క్రీడలకు ప్రత్యేకమైనదిగా ఖ్యాతి గడించింది. అదే సమయంలో ఎన్నో కొత్త జంటలకు మనాలి హనీమూన్ స్పాట్‌గానూ పిలచుకుంటారు. ఉత్తరాఖండ్‌లోని ఔలి ప్రాంతం నుంచి చూస్తే హిమాలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా పర్యాటకుల మనసు దోచుకుంటుంది. అక్కడి ఇళ్లపై మంచు దుప్పటిలా పరుచుకుంటుంది. లద్దాఖ్‌లో మంచు వర్షం పర్యాటకులను కనువిందు చేస్తుంది. జమ్మూకశ్మీర్‌లో కేబుల్ కార్ ప్రత్యేక ఆకర్షణ. శ్రీనగర్, డార్జిలింగ్, కొడైకెనాల్, ఊటీ తదితర ప్రదేశాలకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడిని తట్టుకునే బట్టలు వెంట తీసుకోవడంతో పాటు, వైద్యుల సూచనల మేరకు మందులు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. అక్కడి రహదారులపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. కొత్త అనుభూతినిచ్చింది.. కుటుంబ సభ్యులంతా కలసి మనాలి టూర్ వెళ్లాం. ఎనిమిది రోజుల లాంగ్ టూర్ అది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో వెళ్లాం. అక్కడి నుంచి రాత్రంతా బస్సు ప్రయాణం. మనాలిలో ఒక రోజు బస చేశాం. కొత్త ప్రాంతం మంచు కొండలు, ప్రకృతి అందాలు, గ్రీనరీ మనసుకు హాయిగా అనిపించాయి. నదిలో రాప్టింగ్ చేశాం. హోటల్లో రాత్రి ఫైర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడి వాతావరణం, వస్త్రధారణ కొత్త అనుభూతినిచ్చింది. – విజయ్ కుమార్ జైన్, హైదరాబాద్ప్రయాణం ఇలా.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకూ విమానంలో ప్రయాణించి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రహదారి మార్గంలో చేరుకోవాలి. యువత కార్, మోటారు సైకిళ్లను అద్దెకు తీసుకుని మంచు కొండల్లో రయ్.. రయ్..మంటూ దూసుకుపోతున్నారు. -
పత్తి చేనులో పప్పులు,కూరగాయలు : ఇలా పండించుకోవచ్చు!
వర్షాధారంగా వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులు బహుళ పంటల సాగుకు స్వస్థి చెప్పి పత్తి, కంది వంటి ఏక పంటల సాగు దిశగా మళ్లటం అనేక సమస్యలకు దారితీస్తోంది. వికారాబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు ఈ సమస్యలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. పత్తిలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలను అంతర పంటలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేయటం రైతులకు నేర్పిస్తున్నారు. ప్రధాన పంటపై ఆదాయం పొందుతూనే అంతరపంటలతో కుటుంబ పౌష్టికాహార అవసరాలు తీర్చుకునే దిశగా రైతు కుటుంబాలు ముందడుగు వేస్తున్నాయి.వికారాబాద్ జిల్లాలోని సాగు భూమిలో 69.5% భూమిలో రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. నల్ల రేగడి భూములతో పోల్చుకుంటే ఎర్ర /ఇసుక నేలలు ఈ జిల్లాలో అధికంగా ఉన్నాయి. ఈ నేలల్లో సారం తక్కువ. తేమ నిలుపుకునే శక్తి కూడా తక్కువ. తద్వారా పంట దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ ప్రధానమైన పంట కంది. జిఐ గుర్తింపు కలిగిన ప్రఖ్యాతమైన తాండూర్ కంది పప్పు గురించి తెలిసిందే. పదేళ్ల క్రితం వరకు వికారాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో కంది, పెసర, నువ్వు, పచ్చ జొన్న, బొబ్బెర, కొర్ర, అనుములు, మినుములు, పత్తి, మొక్క జొన్న వంటి పంటలు పండించేవారు. అయితే, ప్రస్తుతం వర్షాధార భూముల్లో 60% వరకు పత్తి పంట విస్తరించింది. రబీలో ప్రధానంగా బోర్ల కింద వేరుశనగ, వరి పంటలు సాగులో ఉన్నాయి. (రూ. 40 వేలతో మినీ ట్రాక్ట్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ)ఒక పొలంలో అనేక పంటలు కలిపి సాగు చేసే పద్ధతి నుంచి ఏక పంట సాగు (మోనోకల్చర్) కు రైతులు మారటం వల్ల చీడపీడలు పెరుగుతున్నాయి. రైతు కుటుంబాలు రోజువారీ వాడుకునే పప్పులు, కూరగాయలను కొనుక్కొని తినాల్సిన పరిస్థితి నెలకొంది. వాసన్ స్వచ్ఛంద సంస్థ ఈ సమస్యలకు పరిష్కారాలు వెదికే దిశగా కృషి చేస్తోంది. దౌలతాబాద్, దోమ, బోమరసపేట మండలాల్లో అరక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, ఇతర సహకార సంఘాలతో కలసి పనిచేస్తోంది. పత్తిలో అంతర పంటల సాగుపై సలహాలు, సూచనలు అందిస్తూ రైతులకు తోడుగా ఉంటూ వారి నైపుణ్యాలు పెంపొదిస్తోంది. పత్తి ప్రధాన పంటగా 5 సాళ్లు, పక్కనే 6వ సాలుగా కంది.. వీటి మధ్య బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు విత్తుతున్నారు. 3–4 నెలల్లో ఈ పంటల దిగుబడి చేతికి వస్తోంది. ఆ పంటల కోత పూర్తయ్యాక ఎండు కట్టెను పత్తి పొలంలోనే ఆచ్ఛాదనగా ఉపయోగిస్తున్నారు. టైప్ 2 ఘన జీవామృతం వేయటంతో పాటు ప్రతి 15–20 రోజులకు ద్రవ జీవామృతం, కషాయాలు పిచికారీ చేస్తున్నారు. దీంతో తొలి ఏడాదిలోనే రైతులు సత్ఫలితాలు పొందుతున్నారని వాసన్ ప్రతినిధి సత్యం (83175 87696) తెలిపారు. మా కుటుంబంలో అమ్మ, నా భార్య, ఇద్దరు పిల్లలు ఉంటాం. ఐదు ఎకరాల పొలం ఉంది. 8 బోర్లు వేసినా రెంటిలోనే నీరు పడింది. ఒకటి 2 ఇంచులు, మరొకటి 1 ఇంచు నీరు ఇస్తున్నాయి. సాధారణంగా 2 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, అలాగే కూరగాయలు సాగు చేస్తుంటాను. 2024 ఫిబ్రవరి, మే నెలల్లో వాసన్ సంస్థ నిర్వహించిన రెండు శిబిరాలకు హాజరై శిక్షణ తీసుకున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే సాగు పద్ధతులు, తక్కువ వర్షం అవసరం ఉన్న పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ ఖరీఫ్‌లో 1 ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేశాను. పంటల సాగుకు ముందు అనేక రకాల పచ్చిరొట్ట పంటలు సాగు చేసి రొటోవేటర్‌తో నేలలో కలియదున్నాను. జులై 3వ తేదీన పత్తి, కంది, బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూర విత్తనాలు వేశాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పట్టుదలతో పాటించాను. నా ప్రయాణంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. విత్తనాలు వేయడం, కషాయాలు, ద్రవ, ఘన జీవామృతాల వాడకం వంటి అన్ని విషయాల్లో వాసన్ సంస్థ వారు నాకు సూచనలు ఇచ్చారు. విత్తనాలు వేసిన నెల నుంచే ఏదో పంట చేతికి రావడం ప్రారంభమైంది, మాకు నిరంతరం ఆదాయం వచ్చేలా చేశారు. ఇంట్లో మేము తినటానికి సరిపడా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు వచ్చాయి. మిగిలినవి అమ్ముకొని మంచి ఆదాయం పొందాం. కానీ, ఈ ఏడు అధిక వర్షాల కారణంగా పత్తి 6 క్వింటాళ్లే వచ్చింది. అనుకున్న స్థాయిలో పంట రాలేదు. ఈ పప్పు ధాన్యాలు, నూనె గింజలు సంవత్సరమంతా మా కుటుంబానికి పోషకాహారాన్ని అందిస్తున్నాయి. ఈ ఎకరానికి రూ. 29,400 ఖర్చయ్యింది. పత్తి, కంది పంటలన్నీ పూర్తయ్యే నాటికి ఆదాయం రూ. 96,500లు వస్తుందని అనుకుంటున్నాను. ఈ వ్యవసాయ పద్ధతి మా కుటుంబానికి ఆర్థిక భద్రతను కలిగించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో మాకు ఆదాయం బాగుంది. అలాగే, నీటి వినియోగాన్ని తగ్గించడంలో ఈ పద్ధతులు మాకు ఎంతో సహాయపడ్డాయి.– అక్కలి శ్రీనివాసులు (96668 39118), రైతు,దోర్నాలపల్లి, దోమ మండలం, వికారాబాద్ జిల్లా ప్రకృతి సేద్యంతో ఆదాయం బాగుందివికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లికి చెందిన బందయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల పొలంలో 6 సార్లు బోర్లు వేసినా ఒక్క బోరులోనే 2 ఇంచుల నీరు వస్తోంది. కుటుంబం తిండి గింజల కోసం ఎకరంలో వరి నాటుకున్నారు. మిగిలిన 1.5 ఎకరంలో వర్షాధారంగా జొన్న, పత్తి, కందులను రసాయనిక పద్ధతిలో సాగు చేసేవారు. పెద్దగా ఆదాయం కనిపించేది కాదు. వాసన్ సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పత్తి పంట సాగుపై రెండుసార్లు శిక్షణ పొంది సాగు చేపట్టారు. ఒక పంట నష్టమైతే మరొక పంటలో ఆదాయం వస్తుందని తెలుసుకున్నారు. ఒక ఎకరంలో పత్తితో పాటు పప్పుదినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను అంతర పంటలుగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేశారు. విత్తనం వేయటం నుంచి, కషాయాలు పిచికారీ, ద్రవ – ఘన జీవామృతాల వినియోగం, పంట కోత విధానం.. ఇలా ప్రతి పనిలోనూ వాసన్ ప్రతినిధుల సూచనలు పాటించారు. మొదటి నెల నుంచి ఆకుకూరలు, 3 నెలల్లో మినుము, పెసర, కూరగాయలు, చిరుధాన్యాలు.. ప్రతినెలా ఏదో ఒక పంట చేతికి రావడంతో సంతోషించారు. ఇంట్లో తినగా మిగిలినవి అమ్మటం వల్ల అదనపు ఆదాయం కూడా వచ్చింది. పత్తి 7 క్వింటాళ్లు, కందులు 4–5 క్వింటాళ్లు వస్తాయని ఆశిస్తున్నారు. ఒకసారి నీటి తడి ఇచ్చారు. నేల మొత్తం పంటలు పరుచుకోవడం వల్ల నీటి అవసరం చాలా తగ్గిందని బందయ్య తెలి΄పారు. పత్తిలో అంతరపంటలు వేసిన ఎకరానికి పెట్టుబడి రూ. 28 వేలు. కాగా, ఇంట్లో వాడుకోగా మిగిలిన పప్పుధాన్యాలు, చిరుధాన్యాల అమ్మకంపై వచ్చిన ఆదాయం రూ. 13,750. పత్తి, కందులపై రాబడి (అంచనా) రూ. 1,01,000. ఖర్చులు ΄ోగా రూ. 86,750 నికరాదాయం వస్తుందని భావిస్తున్నారు. అధిక వర్షం వలన పత్తి పంట కొంత దెబ్బతిన్నప్పటికీ మిగతా పంటల్లో వచ్చిన దిగుబడులు సంతోషాన్నిచ్చాయని, వచ్చే ఏడు కూడా ఈ పద్ధతిలోనే పత్తి, అంతర పంటలు సాగు చేస్తానని బండి బందెయ్య అంటున్నారు. -
క్రికెటర్ రిషబ్ పంత్ వెయిట్ లాస్ సీక్రెట్: ఆ టిప్స్‌తో ఏకంగా 16 కిలోలు..
ఢిల్లీ ఫ్రాంఛైజీతో ఉన్న సుదీర్ఘ అనుబంధానికి వీడ్కోలు పలకనున్నాడు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల వచ్చే ఏడాది పంత్ లక్నోకు ఆడబోతున్నాడు. రిషబ్ పంత్‌కు వందకు పైగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం ఉంది. పైగా వేలాది పరుగులు కూడా సాధించాడు. ఇక యాక్సిడెంట్ తర్వాత కూడా అందే దూకుడుతో మైదానంలో విధ్వసం సృష్టించాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్‌గా పంత్ నిలిచారు. అలాంటి అద్భుత ఆటగాడి డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందామా..!ఈ భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్ జట్టుకు సిద్ధమవుతున్న సమయంలో కేవలం నాలుగు నెలల్లో 16 కిలోలు బరువు తగ్గాడు. ఇంతలా బరువుని అదుపులో ఉంచుకునేందుకు ఆయన ఫాలో అయ్యే సింపుల్ డైట్ టిప్స్ ఏంటో చూద్దామా..!.కేలరీలు తక్కువగా ఉన్న ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చేవాడు. దీనివల్ల అతని శరీరం శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వును ఉపయోగిస్తుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉంటుంది.అలాగే ఇంట్లో వండిన బోజనానికే ప్రాధాన్యత. బయట ఫుడ్ జోలికి వెళ్లడు. ముఖ్యంగా రెస్టారెంట్ లేదా హోటల్ ఫుడ్స్ వైపుకి వెళ్లడు. దీనివల్ల ఇంట్లో వండే పద్ధతుల రీత్యా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవడమే గాక అనారోగ్య సమస్యల బారిన పడకుండా సురక్షితంగా ఉంచుతుంది. ఆయిల్ పరిమితంగా ఉన్న ఆహారమే ఎంపిక చేసుకుంటాడు పంత్అలాగే రాస్మలై వంటి స్వీట్లు, బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ వంటి అధిక క్యాలరీల ఆహారానికి పూర్తిగా దూరం. బరువు అదుపులో ఉండేలా వేయించిన పదార్థాలు, చక్కెర సంబంధిత పదార్థాలను తీసుకోరట పంత్. తగిన సమయానికి నిద్ర పోవడం కూడా తన బరువుని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోందిగోవాన్ భిండి(ఓక్రా) పట్ల తనకున్న మక్కువ, మసాల దినుసుల తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలా పంత్‌లా ఆగ్యకరమైన డైట్‌కి ప్రాధాన్యత ఇస్తే బరువు తగ్గడం అత్యంత ఈజీ. అందుకు కాస్త శ్రద్ధ, నిబద్ధత అవసరం అంతే..!.(చదవండి: ఆర్బీఐ గవర్నర్‌కి ఛాతినొప్పి: ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా?) -
రూ. 40 వేలతో మినీ ట్రాక్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ
పెద్దగా చదువుకోకపోయినా సృజనాత్మక ఆలోచన, పట్టుదలతో కూడి కృషితో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పటానికి ఈ మినీ ట్రాక్టర్ ఓ ఉదాహరణ. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన పెంచల నారాయణ (25) వెల్డింగ్ పనిచేస్తూ జీవిస్తున్నారు. 9వ తరగతి వరకు చదువుకున్న నారాయణ చిన్న రైతుల కోసం కేవలం రూ.40 వేల ఖర్చుతో మినీ ట్రాక్టర్‌ను తయారు చేసి ప్రశంసలు పొందుతున్నారు. ఆటో ఇంజన్ తదితర విడిభాగాలను జత చేసి మినీ ట్రాక్టర్‌ను రూపొందించారు. 2 లీటర్ల డీజిల్‌తో ఎకరా పొలం దున్నేయ వచ్చునని నిరూపించారు. ΄ పొలం దున్నడంతో పాటు నిమ్మ, జామ వంటి పండ్ల తోటల్లో అంతర సేద్య పనులను ఈ మినీ ట్రాక్టర్‌తో అవలీలగా చేసుకోవచ్చని నారాయణ వివరించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు తక్కువ ఖర్చుతో కూడిన మినీ ట్రాక్టర్‌ను అందిస్తానని పెంచల నారాయణ అంటున్నారు. కాన్సెప్ట్ బాగుంది: గణేశంపల్లెసృజన అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం మాట్లాడుతూ.. ‘కాన్సెప్ట్ బాగుంది. ఏమీ తెలియని ఒక అబ్బాయి నడిచే మోటరు వాహనాన్ని తయారు చేయడం సులభం కాదు అన్నారు. ‘రోడ్డు మీద బాగానే నడుస్తోంది. చిన్న ఇంజన్‌తో దుక్కిచేయటం వంటి శక్తితో కూడుకున్న పనులను ఏయే రకాల భూముల్లో ఈ చిన్న టాక్టర్ ఎంతవరకు చేయగలుగుతుందో చూడాలి’ అన్నారాయన. – కే.మధుసూధన్, సాక్షి, పొదలకూరు