Orissa
-
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న చెస్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల ఎంపిక పూర్తయింది. ఈ మేరకు చెస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఈఓ కేవీ.జ్వాలాముఖి ఎంపికై న క్రీడాకారుల జాబితాను మంగళవారం ప్రకటించారు. ఇటీవల మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన పేర్కొన్నారు. పోటీలలో అండర్–6 బాలికల విభాగంలో జి.వేద సాయి శ్రీ(పీఎస్ఆర్ స్కూల్) ఎన్.ధాన్విక (భాష్యం స్కూల్) సీహెచ్.రేణూశ్రీ (చాణక్య స్కూల్).. బాలుర విభాగంలో ధీరజ్(ఫోర్ట్ సిటీ స్కూల్) యశస్విన్ (చాణక్య స్కూల్) ఎంపికై నట్లు తెలిపారు. అదేవిధంగా అండర్–8 బాలికల విభాగంలో జాష్విక(ఫోర్ట్సిటీ స్కూల్) అనన్య(బీసెంట్ స్కూల్)..బాలుర విభాగంలో ధనుష్(ఆదిత్య స్కూల్) హిమాంక్(ఇన్స్పైర్ స్కూల్), అండర్–10 బాలికల విభాగంలో అమృత(కేంద్రీయ విద్యాలయ), వైష్ణవి(ప్రభుత్వ పాఠశాల, తిమిడి), బాలుర విభాగంలో పర్వేష్(బీసెంట్ స్కూల్) జిగ్నేష్(కేంద్రీయ విద్యాలయ) ఎంపికై నట్లు పేర్కొన్నారు. అలాగే అండర్–12 బాలికల విభాగంలో సాయి ధృతి(సన్ స్కూల్) గరిమ సంస్కృతి(నేషనల్ స్కూల్)..బాలుర విభాగంలో ఆదిత్య(మానస స్కూల్), చైతన్య శ్రీనివాస్(సెయింట్ జోసెఫ్ స్కూల్) ఎంపికయ్యారు. అండర్–14 బాలికల విభాగంలో బి. షణ్ముఖ ప్రియ(సెయింట్ ఆన్స్ ప్రభుత్వ పాఠశాల), జి. కుందన ప్రియ(నేషనల్ స్కూల్), బాలుర విభాగంలో జీకేఎం అభినవ్ రెడ్డి(బీపీఎం ప్రభుత్వ పాఠశాల), వి.లోకేష్(భాష్యం) ఎంపికయ్యారని ప్రకటించారు. అండర్–16 బాలికల విభాగంలో కె.లహరి(జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మరడాం), సీహెచ్. గాయత్రి దేవి(ఏపీ మోడల్ స్కూల్, మరుపల్లి), బాలుర విభాగంలో డి.లీలా మనోహర్(ఫోర్ట్ సిటీ స్కూల్) కె.హర్ష వర్థన్(పల్లవి స్కూల్)లు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన వారిలో ఉన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో వేదపండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా చండీయాగం నిర్వహించారు. ఆలయ ఈఓ డీవీవీ.ప్రసాదరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
నిధులు కేటాయించండి
జయపురం: జయపురంలో చారిత్రిక జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులలో మున్సిపల్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే, మునిసిపాలిటీ అధికారులు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ నరేంఽద్రకుమార్ మహంతి, వైస్ చైర్పర్సన్ బి.సునీత నేతృత్వంలో బీజేడీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు కలిసి నిధుల కోసం రాజధాని భువనేశ్వర్‌కు మంగళవారం వెళ్లారు. జగన్నాథసాగర్ పనులు నిలిచిపోవటం వలన ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర గృహ, పట్టణాభివృద్ధి విభాగ మంత్రి కృష్ణ చంద్ర మహాపాత్రోను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతితో కలిసి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్, తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర గృహ, పట్టణాభివృద్ధి విభాగ ప్రధాన కార్యదర్శి ఉషా పాడిని కలిసి జగన్నాథ్ సాగర్ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీజేడీ కౌన్సిలర్లు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్‌ను కలిసి జయపురం జగన్నాథ్ సాగర్ పురుద్ధరణ కోసం నిధులు వెంటనే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా నరేంద్రకుమార్ మహంతి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం మారిన తరువాత జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణకు నిదులు విడుదల చేస్తారని ఆశించామని, నేటివరకు నిధులు రాలేదని వెల్లడించారు. పునురుద్ధరణ పనులు నిలిచిపోయాయని, అందువల్ల తామంతా భువనేశ్వర్ వచ్చామన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. -
డీజీఎం సుబాష్ పండా అరెస్టు
భువనేశ్వర్: రాష్ట్ర విజిలెన్స్ పోలీసులు ఒడిశా పోలీసు హౌసింగ్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజరు సుబాష్ పండాని మంగళవారం అరెస్టు చేశారు. అక్రమ ఆస్తుల ఆర్జన ఆరోపణ ఆధారంగా సోమవారం సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో 2 బహుళ అంతస్తు భవనాలు, 1 ఫ్లాటు, 870 గ్రామలు బంగారం, 5 ఇళ్ల స్థలాలు, నగదు రూ. 13 లక్షల 50 వేలు, పొదుపు, పెట్టుబడుల్లో రూ. 1 కోటి 80 లక్షలు ఉన్నట్లు గర్తించారు. వీటి సమగ్ర విలువ ఆదాయం కంటే 303 శాతం అధికంగా లెక్క తేలింది. తల లేని మృతదేహంలో కేసులో ఆరుగురు అరెస్టు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 57 గ్రామంలో నదిలో బస్తాలో కట్టి పడేసిన మృతదేహాన్ని గత గురువారం కలిమెల పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహానికి తల లేదు. దర్యాప్తులో మృతుడు సుర్లుకొండ గ్రామానికి చెందిన పదియా మడ్కమి (47)గా తెలిసింది. ఇతను చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఆరుగురు వ్యక్తులు పొలంలో నిద్రపోతున్న సమయంలో తల నరికేసి తలలో పడేసినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తెలుస్తోంది. నిందితులైన సోడి పోడియామి, రామ పోడియామి, మున్న పోడియామి, ఇర్మా పోడియామి, పధలం పోడియామి, రామ కావసీలను మంగళవారం సుర్లుకొండ గ్రామంలో అరెస్టు చేసి కలిమెల పోలీస్‌స్టేషన్‌కు తెచ్చారు. ఈనెల 8న హత్య చేసినట్లు నిందితులు తెలిపారు. రెండు బైక్‌లు ఢీ: నలుగురికి గాయాలు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీసు స్టేషన్ పరిధిలో గల ఎంవీ 126 గ్రామం వద్ద ఈ రోజు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో రెండు బైక్‌లు ఢీకొని నలుగురు గాయపడ్డారు. కనిమెట్ల గ్రామానికి చెందిన గంగా పోడియామి, కార్తీక్ పోడియామిలు ఒక బైక్‌పై వస్తున్నారు. మోటు వైపు నుంచి భీమా మధిర, నీల్ మధిర అనే ఇద్దరు మరో బైక్‌పై వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. స్థానికులు చూసి వీరిని అంబులెన్స్ సాయంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మల్కన్‌గిరి తరలించారు. ఐఐసీ చంద్రకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
వాలీబాల్ పోటీల్లో మడ్డువలస విద్యార్థి సత్తా
వంగర: విజయవాడలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో మండల పరిధిలోని మడ్డువలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆవు సాయిబాలాజీ సత్తాచాటాడు. జిల్లా జట్టును రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలపడంలో కీలక పాత్ర పోషించడం పట్ల ప్రిన్సిపాల్ కొరటాన నారాయణరావు, అధ్యాపకకులు, తల్లిదండ్రులు ఆవు చిన్నప్పలనాయుడు, సుభాషిణి తదితరులు బాలాజీని అభినందించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌పై విచారణరేగిడి: మండలంలోని గుళ్లపాడు పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మీసాల మంగమ్మపై మంగళవారం విచారణ నిర్వహించారు. ఎంపీడీఓ శ్యామలాకుమారి, ఏపీఓ హరనాథలు ఈ విచారణ చేపట్టారు. వేతనదారులను పిలిపించి పనులు సక్రమంగా జరుగుతున్నాయా? ఫీల్డ్ అసిస్టెంట్ సకాలంలో జాబ్‌కార్డులు ఇస్తున్నారా? అని ఆరా తీశారు. వేతనదారులు ఇచ్చిన వివరాలతో నివేదిక తయారీచేసి జిల్లా అధికారులకు అందిస్తామని ఎంపీడీఓ తెలిపారు. -
మిల్లు తిప్పి ఉపాధి కల్పించండి
నెల్లిమర: అక్రమ లాకౌట్‌లో ఉన్న జూట్‌మిల్లును తిప్పి కార్మికులకు ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం విశాఖపట్నంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వద్ద నెల్లిమర్ల జూట్ మిల్లు సమస్యపై జాయింట్ సమావేశానికి సీఐటీయూ అనుబంధ సంఘం జూట్‌మిల్ వర్కర్స్ యూనియన్ తరఫున కిల్లంపల్లి రామారావు, అప్పలనర్సయ్య, ఐఎఫ్టీయూ తరఫున నామాల తిరుపతి రావు, కె.అప్పల సూరి, టి.అప్పారావు, శ్రామిక సంఘం తరఫున చిక్కాల గోవింద రావు, సముద్రపు సత్య నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 9సంవత్సరాలుగా జూట్‌మిల్లు యాజమాన్యం గ్రాట్యుటీ బకాయిలు ఇవ్వలేదని, అలాగే పోస్ట్ డెటెడ్ చెక్‌లు ఇచ్చి రిటైర్డ్ కార్మికులు బ్యాంకు వద్దకు వెళ్తే ఖాతాలో నగదు లేక యాజమాన్యం ఇచ్చిన చెక్‌లు బౌనన్స్ అయిపోతున్నాయని తెలిపారు. అంతేకాకుండా గడిచిన 3సంవత్సరాలుగా యాజమాన్యం ఈఎస్ఐ, పీఎఫ్ నగదు కార్మికులనుంచి తీసుకుంటూ సంబంధిత అధికారులకు చెల్లించలేదని ఆరోపించారు. కార్మికులనుంచి యాజమాన్యం డెత్ ఫండ్ వసూలు చేసి రెండు, మూడు నెలల తరువాత ఆయా కుటుంబాలకు యాజమాన్యం వాటా లేకుండా ఇస్తోందన్నారు. లాకౌట్ అన్యాయం ముడిసరుకు కొరత విషయంలో కార్మికులు సహకరించలేదని జూట్‌మిల్లు యాజమాన్యం చెప్పడం భావ్యం కాదని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వెలిబుచ్చారు. 1989నుంచి కార్మికులు రూ. 5,రూ.10,రూ.18 కార్మికులనుంచి యాజమాన్యానికి రుణంగా ఇచ్చి సహకరించినట్లు తెలిపారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని జూట్ యాజమాన్యానికి కార్మికులు సహకరిస్తుంటే యాజమాన్యం మాత్రం ముడి సరుకు కొరత పేరిట మిల్లును అక్రమ లాకౌట్ చేసి ఉపాధి లేకుండా చేయడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి మిల్లు తిప్పి ఉపాధి కల్పించడమే కార్మిక సంఘాల లక్ష్యమని పేర్కొన్నారు. లేకపోతే మిల్లు తిప్పి ఉపాధి కల్పిస్తారా? ఇతర మిల్లుల్లా గ్రాట్యుటీ బకాయిల చెల్లింపుతో పాటు కార్మికులకు యాజమాన్యం ఇవ్వాల్సిన రూ.5, రూ.10,రూ.18 తిరిగి చెల్లించి సెటిల్మెంట్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏసీఎల్ వచ్చే నెల 17కి చర్చలు వాయిదా వేస్తున్నామని అప్పటికీ యాజమాన్యం రాకపొతే కలెక్టర్, ఉన్నాతాధికారులకు నివేదిస్తామని ఏసీఎల్ చెప్పినట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఉమా జూట్మిల్స్ కన్సొలేషన్ మీటింగ్ వాయిదాకొత్తవలస: మండలంలోని కోటపాడు రోడ్డు సీతంపేట సమీపంలో గల ఉమా జూట్మిల్స్ను ఈ ఏడాది జూలై–15 వతేదీన యాజమాన్యం అక్రమంగా లాకౌట్ ప్రకటించి మూసేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి కార్మిక సంఘం ఎఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విజయగనరం డీసీఎల్, విశాఖపట్నం జేసీఎల్లు యాజమాన్యం, కార్మికులతో 9 పర్యాయాలు చర్చలు నిర్వహించినా యాజమాన్యం గైర్హాజరవుతూ వస్తోంది. దీంతో చివరిగా డిసెంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే కన్సొలేషన్ చర్చలకు యాజమాన్యం కచ్చితంగా హాజరుకావాలని జేసీఎల్ ఆదేశించినట్లు కార్మిక సంఘం అధ్యక్షుడు గణేష్ పండా మంగళవారం తెలిపారు. ఈ సమావేశానికి యాజమాన్యం హాజరు కాకపోతే కేసును ముగించి ప్రభుత్వానికి నివేదిస్తామని జేసీఎల్ స్పష్టం చేసినట్లు పండా తెలిపారు. కార్మిక సంఘాల విజ్ఞప్తి -
అనారోగ్య శిశువు జన్మించకూడదు
విజయనగరం ఫోర్ట్: రానున్న రోజుల్లో జిల్లాలో ఆరోగ్యపరమైన లోపాలతో ఏ ఒక్క శిశువూ జన్మించకూండా చూడాలనే లక్ష్యంతో అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ అన్నారు. కిశోరీ బాలికల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను కిందిస్థాయి వరకు తీసుకువెళ్లి అవగాహన కల్పించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయ పడ్డారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కిశోరీ వికాసం కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ప్రసవాల్లో 6 శాతం మంది పిల్లలు రక్తహీనత, మరికొంతమంది తగిన బరువు లేకుండా, ఇతర లోపాలతో పుడుతున్నారన్నారు. తక్కువ వయసులో జరిగే వివాహాలు, తగిన పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాలే గర్భిణుల్లో అనారోగ్యానికి దారితీస్తున్నాయనే విషయాన్ని అర్థమయ్యేలా తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు, డీఈఓ మాణిక్యం నాయుడు, ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి, డీసీపీయూ యాళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ -
300 సారా ప్యాకెట్లతో వ్యక్తి అరెస్ట్
సీతానగరం: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీతానగరం సర్కిల్ పరిధిలో ఉన్న గరుగుబిల్లి మండల కేంద్రం ప్రధాన రహదారిపై సోదాలు చేస్తుండగా ఒకవ్యక్తి దగ్గరున్న ప్లాస్టిక్ సంచిలో 300 సారా ప్యాకెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ డి. పద్మావతి తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ మంగళవారం మూడు మండలాల్లో సిబ్బందితో ప్రధాన రహదారుల్లో వాహనాలు సోదా చేశామన్నారు. ఈ సోదాల్లో గురుగుబిల్లి మండలకేంద్రం సమీపంలో సారా ప్యాకెట్లతో పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. సర్కిల్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయించినా, బెల్ట్‌షాపులు నిర్వహించినా, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 30 మద్యం బాటిల్స్ స్వాధీనంబొబ్బిలిరూరల్: మండలంలోని కొత్త పెంట గ్రా మానికి చెందిన బొబ్బిలి రాంబాబు అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఈ మేరకు ఏఎస్సై భాస్కరరావు చెప్పిన వివరాల ప్రకారం సాయంత్రం బొబ్బిలి నుంచి కొత్త పెంట గ్రామానికి తరలించేందుకు సిధ్దం చేసిన 30 మద్యం బాటిల్స్‌ను గొల్లవీధి జంక్షన్లో పట్టుకుని రాంబాబును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్సై భాస్కర్‌రావు వివరించారు. -
మానవ మనుగడకు మహిళలే ఆలంబన
విజయనగరం: సీ్త్ర లేకపోతే జననం లేదు. గమనం లేదు. సీ్త్ర లేకపోతే సృష్టిలో జీవం లేదు. అసలు సృష్టే లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం గురజాడ స్మారక కేంద్ర గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని మాట్లాడుతూ తల్లిగా లాలిస్తూ..తోబుట్టువుగా..భార్యగా బాగోగులు చూస్తూ.. సేవకురాలిలా కుటుంబ భారాన్ని మోసేది మహిళే అని అన్నారు. మానవ ఉనికికి మూలం, మనుగడకు ఆలవాలం మహిళేనని మానవ బంధాలను, సంబంధాలను కలుపుతూ కదిలే కావ్యం మహిళ అని వివరించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా రంగంలో కృషిచేసిన 15 మంది మహిళలకు సంఘం అధ్యక్ష కార్యదర్శులు గురుప్రసాద్, సుభద్రాదేవిలతో కలసి పతకాలను ప్రదానం చేసి అభినందించారు. సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు, నిర్మల, రమణమ్మ, దాసరి పద్మ, సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ అధికారులు సహకరించాలి
విజయనగరం క్రైమ్: జిల్లాలో నమోదవుతున్న సైబర్ మోసాల నియంత్రణకు బ్యాంక్ అధికారులు ప్రత్యేక బాధ్యత వహించి, సైబర్ కేసులను దర్యాప్తు చేసే పోలీసు అధికారులకు సహాయ, సహకారాలు అందించాలని ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు. ఈ మేరకు వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న మేనేజర్లు, ఇతర అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ మోసాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, మోసగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూ, ప్రజల నుంచి డబ్బులను దోచేస్తున్నారని, ఈ తరహా మోసాలను నియంత్రించేందుకు బ్యాంక్ అధికారులు కూడా సకాలంలో స్పందించి, వారివంతు సహాయ, సహకారాలను పోలీసు అధికారులకు అందించాలని కోరారు. పోలీసు అధికారులు కూడా దర్యాప్తులో భాగంగానే బ్యాంకుల నుంచి సమాచారాన్ని కోరుతారన్న విషయాన్ని అధికారులు గ్రహించాలని చెప్పారు. దర్యాప్తు అధికారులు కోరిన సమాచారాన్ని బ్యాంక్ అధికారులు సకాలంలో స్పందించి సమాచారాన్ని ఇవ్వకుంటే మోసానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకునే ఆస్కారంతో పాటు తన బ్యాంక్ అకౌంట్లో జమ అయిన నగదును ఇతర బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుందన్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేయాలి కొత్తగా బ్యాంక్ అకౌంట్‌ను ప్రారంభించే సమయంలో ఖాతాదారు గుర్తింపు కార్డులను పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్ ప్రారంభమయ్యే విధంగా చూడాలని సూచించారు. అలాగే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపే అనుమానాస్పద బ్యాంక్ అకౌంట్లపై నిఘా పెట్టాలని, ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులుండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యాంక్‌లు, ఏటీఎం కేంద్రాలను రాత్రి గస్తీ సమయాల్లో పోలీసు సిబ్బంది, అధికారులు సందర్శించే విధంగా పాయింట్ బుక్కులను ఏర్పాటు చేసుకునే విధంగా స్దానిక పోలీసు అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసుల్లో సమయం చాలా ముఖ్యమైనదని, ఇవ్వాల్సిన సమాచారాన్ని సకాలంలో బ్యాంక్ అధికారులు దర్యాప్తు అధికారులకు అందిస్తే, మోసాలకు పాల్పడిన నిందితులు పరారీ కాకుండా త్వరితగతిన పట్టుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐలు, వివిధ బ్యాంకుకు చెందిన మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ -
పింఛన్ల రికవరీపై విచారణ
వీరఘట్టం: మండలంలోని నడిమికెల్ల గ్రామానికి చెందిన అనర్హులైన ఏడుగురు వ్యక్తులు పింఛన్లు తీసుకుంటున్నారని లోకాయుక్తకు అందిన ఫిర్యాదుతో పలుమార్లు విచారణ చేపట్టిన అధికారులు తాజాగా మంగళవారం మళ్లీ గ్రామంలో మరోమారు విచారణ చేపట్టారు. పాలకొండ డీఎల్డీఓ వి.గోపాలకృష్ణ, తహసీల్దార్ చందక సత్యనారాయణ, ఎంపీడీఓ బి.వెంకటరమణలు పింఛన్‌దారులను పిలిపించి వివరాలు సేకరించారు. గత టీడీపీ పాలనలో 2018–19 మధ్య కాలంలో గ్రామానికి చెందిన ఎన్.లచ్చిశెట్టి రూ.23,500(11 నెలలు),గంట రాము రూ.23,500(11 నెలలు),బోను అప్పయ్య రూ.34,750( 21 నెలలు), కొమరాపు పోతయ్య రూ.34,750(21 నెలలు),బి.లక్ష్మం రూ.34,750 (21నెలలు) వై.వెంకయ్య రూ.32,500(19 నెలలు) కె.సీతమ్మ రూ.29,000(14 నెలలు) మొత్తం రూ.2,12,750 లు వృధ్యాప్యపు పింఛన్ల ద్వారా తీసుకున్నారని, వారంతా అనర్హులని గ్రామానికి చెందిన యామక అప్పలనాయుడు అప్పట్లో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పలుమార్లు అధికారులు విచారణ చేశారు. 2019లో డిసెంబర్లో వీరికి వస్తున్న పింఛన్లను అధికారులు నిలిపివేశారు. వారి నుంచి ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రికవరీ చేయాలని ఈ ఏడాది ఆగస్టులో లోకాయుక్త నుంచి ఆదేశాలు అందాయి. రికవరీ ఎందుకు చేయలేదని మరోమారు లోకాయుక్త నుంచి ఆదేశాలు రావడంతో విచారణ చేపట్టినట్లు డీఎల్డీఓ గోపాలకృష్ణ తెలిపారు.అయితే వారిలో ఇద్దరు వ్యక్తులు వై.వెంకయ్య,కె.సీతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందినట్లు గుర్తించారు.మిగిలిన వారిని పిలిచి విచారణ చేశామని అధికారులు తెలిపారు. తొందరగా తీసుకున్న సొమ్ము తిరిగి కట్టాలని వారిని ఆదేశించామని అధికారులు చెప్పారు. లోకాయుక్త ఆదేశాలతో కదిలిన యంత్రాంగం -
ఉపాధి వేతనదారుకు అస్వస్థత
బాడంగి: ఓ విషపురుగు పాదంపై కాటు వేయడంతో ఉపాధివేతనదారు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలాఉన్నాయి. మండలంలోని రేజేరు గ్రామానికి చెందిన పూడి అప్పలస్వామి ఉపాధి వేతనదారు. ఎప్పటిలాగానే పనిలోకివెళ్లి పనిచేస్తుండగా కనిపించని విషపురుగు కాలిపాదంపై కాటువేయగా స్పృహకోల్పోయాడు. వెంటనే తొలుత తెర్లాం పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్సచేయించారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం స్థానిక సీహెచ్‌సీకి తరలింగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఎంపీడీఓ ఎస్ రామకృష్ణ పరామర్శకు వెళ్లగా ఒకరోజుపాటు తమ అబ్జర్వేషన్లో ఉంచాలని డాక్టర్లు చెప్పారు. -
వరిపంట దగ్ధం
బలిజిపేట: మండలంలోని కూర్మనాథపురం రెవెన్యూ పరిధిలో గల 52సెంట్ల భూమిలో వరిపంట ప్రమాదవశాత్తు మంగళవారం దగ్ధమైంది. గ్రామానికి చెందిన బి.లక్ష్మణరావు భూమిలో సుమారు రూ.30వేల విలువైన పంటకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ నష్టాన్ని పరిశీలించి నివేదిక తయారుచేసి అధికారులకు అందించనున్నట్లు వీఆర్ఓ స్వామినాయుడు చెప్పారు. కార్యక్రమంలో పలువరు రైతులు పాల్గొన్నారు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యరాజాం సిటీ: మండల పరిధి సోపేరు గ్రామానికి చెందిన కోటగిరి మధు (48) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై ఎస్సై నర్సింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం మధు కొన్నేళ్లుగా కాళ్లూచేతులు పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో తీవ్రమనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెందాడు. ఈ నేపథ్యంలో వ్యవసాయం నిమిత్తం ఇంట్లో ఉంచిన పురుగుమందును ఈ నెల 18న తాగేశాడు. విషయం గమనించిన కుటుంబసభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తరువాత మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుని సోదరుడు అశోక్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. రూ.50వేల నగదు చోరీగుర్ల: మండలంలోని పాలవలస గ్రామంలో మంగళవారం దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన తాడ్డి గౌరినాయుడు ఇంట్లో దొంగలు పడి బీరువాను పగలగొట్టారు. బీరువాలో బంగారు అభరణాలు ఉన్నప్పటికీ సుమారు రూ.50 వేల నగదు అపహరించినట్లు గౌరినాయుడు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ దొంగతనంపై బాధితులు గుర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై పి.నారాయణ రావు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. విచారణ చేసి నిందితులను పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. గంజాయి కేసులో మరో నిందితుడి అరెస్ట్విజయనగరం క్రైమ్: గంజాయి కేసులో మరో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారపూడి గ్రామశివారులో ఇటీవల ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా ఈనెల 12న వారిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో నిందితుడు భువనేశ్వర్‌కు చెందిన రాజేష్ బాగ్‌ను విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద సోమవారం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడి దగ్గర నుంచి రెండు కిలోల గంజాయిని, రూ.210 నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలియజేశారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన సీఐ లక్ష్మణరావు, ఎస్సై వి.అశోక్ కుమార్‌లను డీఎస్పీ అభినందించారు. ఆధార్ అనుసంధానం తప్పనిసరి విజయనగరం అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 60 శాతం పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లను బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి రామానందం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమీప గ్రామ/వార్డు సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్/వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, పోస్టాఫీస్ వారిని సంప్రదించి ఎన్పీసీఐ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోతే డబ్బులు జమకావన్నారు. చెరకు టన్ను రూ.3151 ● మద్దతుధర ప్రకటించిన సంకిలి ఈఐడీ చక్కెర కర్మాగారం ● ఈనెల 20 నుంచి క్రషింగ్ ప్రారంభం రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం యాజమాన్యం చెరకు రైతులకు తీపికబురు చెప్పింది. ఈ నెల 20 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కర్మాగారం వద్ద మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ అసోసియేటివ్ వైస్ ప్రెసిడెంట్ వి.పట్టాభిరామిరెడ్డి మాట్లాడారు. ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం 2024–25 క్రషింగ్ సీజన్‌కు సంబంధించి టన్ను చెరకకు రూ.3,151లు మద్దతు ధర చెల్లిస్తామని వెల్లడించారు. గత ఏడాది కంటే టన్నుకు రూ.71లు పెంచినట్టు పేర్కొన్నారు. క్రషింగ్ సీజన్ అనంతరం రైతులకు ప్రోత్సహకాలు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో కేన్ డీజీఎం ఆర్.రమేష్ పాల్గొన్నారు. -
ఆగిన గుండె.. 90 నిమిషాలకు తిరిగి కొట్టుకుంది!
భువనేశ్వర్: ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను.. తిరిగి కొట్టుకునేలా చేసి ఆ వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు. శుభాకాంత్ సాహు అనే ఈ జవాను వయసు 24 ఏళ్లు. అక్టోబర్ 1వ తేదీన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే..ఉన్నట్లుండి ఈ మధ్య అతని గుండె ఆగిపోయింది. దీంతో డాక్టర్లు సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయినా చలనం లేకపోవడంతో ఎక్స్ట్రాకార్పోరియల్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) చేశారు. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. ఆపై 30 గంటల గుండె లయబద్ధంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరో 96 గంటల తర్వాత అతనికి ఎక్మోను తొలగించారు. ఇలా..ఒడిషా భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ బృందం అతని ప్రాణాలు నిలబెట్టింది. సాంకేతికంగా ఈసీపీఆర్ విధానం అనేది సవాళ్లతో కూడుకున్నదని, అయినప్పటికీ గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని డాక్టర్ శ్రీకాంత్ బెహరా చెబుతున్నారు. ప్రస్తుతం శుభాకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారాయన. -
ముమ్మరంగా విజిలెన్సు దాడులు
భువనేశ్వర్: రాష్ట్ర విజిలెన్స్ వర్గాలు సోమవారం ముగ్గురు అక్రమ ఆస్తిపరులైన ప్రభుత్వ సిబ్బంది స్థావరాలపై దాడులు చేశాయి. ఢెంకనాల్ కామాక్ష్య నగర్ సబ్ కలెక్టరు నారాయణ చంద్ర నాయక్, ఒడిశా పోలీసు హౌసింగ్ బోర్డు డిప్యూటీ జనరల్ మేనేజరు సుబాష్ పండా ఇండ్లపై భువనేశ్వర్, ఢెంకనాల్, బరంపురం, భద్రక్, మయూర్భంజ్ ప్రాంతాల్లో 14 వేర్వేరు చోట్ల ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మంది డీఎస్పీలు, 10 మంది ఇనస్పెక్టర్లుతో అనుబంధ సిబ్బంది పాలుపంచుకున్నారు. ప్రత్యేక విజిలెన్సు న్యాయమూర్తులు జారీ చేసిన గాలింపు చర్యల అధికార ఉత్తర్వులతో ఈ దాడులు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరో దాడిలో లంచం తీసుకుంటున్న సీ్త్ర వైద్య నిపుణుడు డాక్టరు అశోక్ కుమార్ దాస్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆయన కలహండి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సంయుక్త డైరెక్టరుగా పని చేస్తున్నారు. గర్భిణి చికిత్స కోసం రూ. 6,000 లంచం తీసుకోగా.. అక్కడికక్కడ పట్టుబడ్డాడు. సబ్ కలెక్టరు అక్రమ ఆస్తులు ఢెంకనాల్ జిల్లా కామాక్ష్య నగర్ సబ్ కలెక్టరు నారాయణ చంద్ర నాయక్ ఇళ్లలో విజిలెన్స్ వర్గాలు చేపట్టిన సోదాల్లో 4,800 చదరపు అడుగుల విస్తీర్ణపు 3 అంతస్తుల భవనం, 6900 చదరపు అడుగుల విస్తీర్ణపు 3 అంతస్తుల భవనం, 6200 చదరపు అడుగుల విస్తీర్ణపు 2 అంతస్తుల భవనం, 14 ఇళ్ల స్థలాలు, బ్యాంపు పొదుపు ఖాతాల్లో రూ. 34 లక్షల 57 వేలు, నగదు రూ.1 లక్ష 48 వేలు, బంగారం 365 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. డీజీఎం సంపన్నుడు లెక్కాజమ లేని ఆర్జనలతో ఒడిశా పోలీసు హౌసింగు డిప్యూటీ జనరల్ మేనేజరు సుబాష్ పండా తులతూగుతున్నట్లు సోదాల్లో బట్టబయలైంది. ఈ సోదాల్లో లెక్కకు అందని 2 బహుళ అంతస్తు భవనాలు, 1 ఫ్లాటు, 870 గ్రామలు బంగారం, 5 ఇండ్ల స్థలాలు, నగదు రూ. 13 లక్షల 50 వేలు, పొదుపు, పెట్టుబడుల్లో రూ. 1 కోటి 80 లక్షలు ఉన్నట్లు గర్తించారు. సోదాల్లో అక్రమ సొమ్ము లెక్క బయటపడకుండా చేసేందుకు పొరుగింటి డాబాపైకి రూ. 10 లక్షల విలువైన నోట్ల కట్టల్ని విసిరేసినట్లు విజిలెన్సు అధికారుల దృష్టికి రావడం విశేషం. -
వినతుల వెల్లువ
మల్కన్‌గిరి: జిల్లా చిత్రకొండ సమితి స్వభీమాన్ ఏరియా పెప్పరమేట్ల పంచాయతీలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు ఈ ప్రాంతాంలో మొత్తం 3754 మంది గిరిజనులు నివసిస్తున్నారు. 153 ఫిర్యాదులు స్వయంగా కలెక్టర్‌కు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ అతి త్వరలో ఇక్కడ ఉన్న ముఖ్య సమస్య పలు గ్రామాలకు రహదారిని పూర్తిచేస్తాన్నారు. గిరిజన రైతులు ఈ ప్రాంతాంలో పసుపు పంటకు కావల్సిన సౌకర్యలు కాల్పిస్తామన్నారు. ఈ స్వభీమాన్ ఏరియాలోని రల్లేగేడ, పనాస్‌పూట్, జోడాంబో, జాంత్రీ, గాజుల్ మామ్మిడి, జాన్‌బాయి, పెవప్పరమేట్ల, బోడపోధర్, బోడపోడ పంచాయతీల్లో ఒకప్పుడు కేవలం గంజాయి సాగు మత్రమే పండించేవారు. గిరిజనులు మావోలు చేతిలో కీలు బోమ్మాల్లా ఉండేవారన్నారు. ఇప్పటికీ గిరిజనులకు అధికారులు అంటే ఎవరో తేలిసిందన్నారు. తమ గ్రామాల్లోకి అధికారులు రావడం ఎంతో ఆనందంగా ఉందని గిరిజనులు అంటున్నారు. కలెక్టర్, ఇతర అధికారులకు ఘన స్వగతం పలికారు. సబ్ కలేక్టర్ దూర్యోధన్ భోయి, జిల్లా అదనపు ఎస్పీ తపాన్ నారాయణ్ రోతో, చిత్రకొండ సమితికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. -
మహిళలు పైలెట్లుగా ఉండాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: మహిళలు పైలట్లగా ఉండాలనే సరికొత్త లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని కేంద్ర పౌర విమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉమెన్ ఇన్ ఏవియేషన్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఏవియేషన్ డే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎక్కడున్నా.. ఏ రంగంలో ఉన్నా కష్టపడి పనిచేస్తారన్నారు. దీనికి మరింత నైపుణ్యం జోడిస్తే అన్ని రంగాల్లో రాణించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5 శాతం మంది మాత్రమే మహిళా పైలెట్లు ఉండగా, భారతదేశంలో 15 శాతం మంది ఉండడం గొప్ప విషయమన్నారు ‘బేటీ కీ ఉడాన్.. దేశ్ కా స్వాభిమాన్’ అనేది విమానయాన శాఖ ధ్యేయమని, యువతులను విమానయాన శాఖలోని మరిన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుతో పాటు మూలపేట పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లాలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఉమెన్ ఇన్ ఏవియేషన్ ఇండియా సంస్థ ఉపాధ్యక్షురాలు కమల చక్రవర్తి, సభ్యులు అంజలి చౌహా, అర్చన, కీర్తి తివారి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు, వైస్ ప్రిన్సిపాల్ పి.శంకర్‌నారాయణ, సీహెచ్ కృష్ణారావు, పద్మావతి, మెట్ట సుజాత తదితరులు పాల్గొన్నారు. -
ఔషధాలపై జీరో జీఎస్టీ అమలు చేయాలి
జయపురం: దేశంలో అన్ని రకాల మందులపై జీరో జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలని ఒడిశా సేల్స్ రిప్రెజింటివ్స్ యూనియన్ కొరాపుట్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. సోమవారం స్థానిక కార్మిక భవన ప్రాంగణంలో నిర్వహించిన 28వ జిల్లా కాన్ఫరెన్స్‌లో యూనియన్ అధ్యక్షుడు కృష్ణచంద్ర సామంతరాయ్ కార్మిక పతాకం (ఎర్ర జెండా) ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన అధ్యక్షతన జరిగిన కాన్ఫ్రెన్స్కు ముఖ్యఅతిథిగా సంబల్పూర్ యూనియన్ నేత డాక్టర్ కేదార్ నాత్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ మందుల ధరలు సామాన్యుడికి అందలేనంతగా పెరిగి పోయాయని, మందులపై జీఎస్టీ తొలగించి జీరో జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలని కోరారు. ఔషధ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. దేఽశంలో మూతపడిన ప్రభుత్వరంగ ఔషధ కర్మాగారాలను తెరవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కలను అణిచివేసే నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సేల్స్ రిప్రజెంటీవ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పోరాటాలు చేసి డిమాండ్లు సాధించుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో సంఘ కార్యదర్శి రంజిన కుమార్ మిశ్ర, కార్మిక సమన్వయ కమిటీ ఉపాధ్యక్షుడు నళినీ రథ్, ఒడిశా సేల్స్ రిప్రెజింటీవ్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ కుమార్ మిశ్ర, సహాయ కార్యదర్శి నృసింహ ప్రసాద్ బ్రహ్మ తదితరులు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను దుయ్యబట్టారు. జిల్లా ఒడిశా సేల్స్ రిప్రెజింటీవ్స్ యూనియన్ కొరాపుట్ నూతన కార్యవర్గ ఎన్నకలు నిర్వహించారు. సరోజ్ కుమార్ పట్నాయక్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా యోగెన్ చౌదరి, జిల్లా కార్యదర్శిగా రంజన్ మిశ్ర, కార్మదర్శిగా సంతోష్ దొలాయ్, కమిటీ సభ్యులుగా మోహన్ పాత్రో, దేబాశిష్ మిశ్ర, ఆశిష్ సాహు, శివ శంకర పాత్రో, ప్రిన్ష్ కిలాడి, కృష్ణ చంద్ర సామంతరాయ్, బికాశ గౌడ, రవీంద్ర ప్రదాన్, అహమ్మద్ రాజ, సుమన్ సాహు, పవన్ కుమార్, నికుంజ సాహును ఎన్నుకున్నారు. -
పోరాటం ఉద్ధృతం చేస్తాం
● 6వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శానిటరీ మేసీ్త్రలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు టి.తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కల్యాణి అప్పలరాజు, అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రావులు మున్సిపల్ అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. శానిటరీ మేసీ్త్రలను అకారణంగా తొలగించడాన్ని నిరసిస్తూ మున్సిపల్ శానిటరీ మేసీ్త్రలు, పారిశుద్ధ్య కార్మికులు 6వ రోజు సోమవారం అర్ధనగ్నంగా శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో చెత్త పేరుకుపోయి ప్రజారోగ్యాలు పాడైపోతున్నా అధికారులు పరిష్కారం చూపకపోవడం దారుణమన్నారు. అధికారులు వెంటనే కళ్లు తెరిచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మేసీ్త్రల సంఘం అధ్యక్షుడు ముద్దాడ రామారావు, అల్లు రవి, టొంపల షణ్ముఖరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు జె.గురుమూర్తి, ఎన్ పార్థసారథి, ఆర్.గణేష్, అర్జీ పెద్దమనేద్ర, తారక, డి.రమణ, రసూల్, సోగ్గాడు, కె.తిరుమలరావు, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
హమాలీల సమస్యలు పరిష్కరించండి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సివిల్ సప్లయ్ హమాలీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఏపీ సివిల్ సప్లయ్ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిక్కాల గోవిందరావు డిమాండ్ చేశారు. స్థానిక సివిల్ సప్లయ్ గోడౌన్ వద్ద యూనియన్ పిలుపు మేరకు సోమవారం హమాలీలు ధర్నా నిర్వహించి, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ.. గతేడాది డిసెంబర్లో హమాలీల కూలీ రేట్ల అగ్రిమెంట్ ముగిసినా, నేటికీ కొత్త కూలీ రేట్ల అగ్రిమెంట్ చేయకుండా సంబంధిత అధికారులు కాలయాపన చేయడం సరికాదన్నారు. హమాలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, వెంటనే కొత్త కూలీ రేట్లుతో అగ్రిమెంట్ ఇవ్వాలని కోరారు. కూలీ డబ్బులు కూడా సకాలంలో అకౌంట్లలో జమ అవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన హమాలీల పీఎఫ్ డబ్బులు సకాలంలో రావడం లేదని తెలిపారు. కొత్తగా చేరినవారి పేర్లు రికార్డుల్లో నమోదు చేసి పీఎఫ్ అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో సంఘ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, ఎంఎల్ఎస్ గోడౌన్ మేసీ్త్రలు గౌరీ శంకర్, కృష్ణారెడ్డి, రామారావు, సీహెచ్ సతీష్, జి.దుర్యోధన, రాము, సీతయ్య, కామరాజు తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో చేరిన ఎస్బీ డీఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా స్పెషల్ బ్రాంచి డీఎస్పీగా జి.సీతారామారావు సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈయన సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. అనంతరం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు శాఖ అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం)గా కె.వి.రమణ సోమవారం ఉదయం తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇంతకుముందు పనిచేసిన అదనపు ఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. కె.వెంకటరమణ కోనసీమ జిల్లా కొత్తపేట ఎస్డీపీవో (డీఎస్పీ)గా ఉంటూ ఇటీవలే అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చారు. 1991 ఎస్ఐ బ్యాచ్‌కు చెందిన ఈయన విశాఖ సిటీలో ఎక్కువ కాలం పనిచేశారు. విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలు శ్రీకాకుళం పాతబస్టాండ్: డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో గల విభిన్న ప్రతిభావంతులకు కేటగిరీల వారీగా సీ్త్ర, పురుషులకు వేరు వేరుగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏడీ కె.కవిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు కలెక్టరేట్ దగ్గరలో, డి.ఆర్.డి.ఎ కాంప్లెక్స్ ఎదురుగా గల, డచ్ భవనం ఎదురు మైదానంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామని తెలిపారు. డిగ్రీ మూడో సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మూడో సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సీనియర్ అధ్యాపకులను ఎగ్జామినర్లుగా జంబ్లింగ్ పద్ధతిలో నియమించినట్లు అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్చార్జి డీన్ జి.పద్మారావు చెప్పారు. పలు అంశాల్లో విద్యార్థులకు పోటీలు ఎచ్చెర్ల క్యాంపస్: సంకల్పం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించనున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పి.సుజాత అన్నారు. వర్సిటీ నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం, గంజాయి వినియోగం, చిన్నారులు, మహిళలపై జరగుతున్న అఘాయిత్యాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై పోస్టర్ తయారీ, వీడియో లఘుచిత్రాలు అంశంపై పోటీ ఉంటుందని చెప్పారు. ఈ నెల 25వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, నోడల్ అధికారి జేఎల్ సంధ్యారాణి ఫోన్ నంబర్ 9866027906లను సంప్రదించాలని అన్నారు. ఎస్జీటీ ఓవరాక్షన్‌పై ఫిర్యాదు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో పలాస మండల పరిధిలోని ఎంపీయూపీ స్కూల్లో ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న తమ్మినాన శ్రీనివాసరావు డీఈవో కార్యాలయంలో చేసిన ఓవరాక్షన్‌పై ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ జిల్లాశాఖ (ఏపీఎస్ఈఎస్ఏ) ప్రతినిధులు మండిపడుతున్నారు. ఈనెల 7వ తేదీన సదరు ఎస్జీటీ శ్రీనివాసరావు డీఈవో కార్యాలయానికి వచ్చి నాన్ టీచింగ్ స్టాఫ్‌పై దుర్భాషలాడుతూ దౌర్జన్యంగా ప్రవర్తించినట్లు సంఘ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఎంపీయూపీ స్కూల్ పెద్దరోకల్లపల్లి ఎస్జీటీగా పనిచేస్తున్న సమయంలో మరో ఉపాధ్యాయుడితో జరిగిన ఘర్షన కారణంగా శ్రీనివాసరావు సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఘర్షణ జరిగిన మరో ఉపాధ్యాయుడి పోస్టింగ్‌కు అనుకూలంగా డీఈవో కార్యాలయ సిబ్బంది పనిచేశారనే నెపంతో వారిపై విరుచుకుపడ్డారు. వారి అంతు చూస్తానని.. వారి అందరిపై లెటర్రాసి చస్తానంటూ భయపెట్టడంతో విషయాన్ని డీఈవో డాక్టర్ తిరుమల చైతన్య దృష్టికి తీసుకెళ్లారు. సంఘటన జరిగి రెండు వారాలు కావొస్తున్నా సదరు ఉపాధ్యాయుడిపై డీఈవో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు(ఏపీఎస్ఈఎస్ఏ) జిల్లా కలెక్టర్‌ను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లియాకత్ ఆలీఖాన్, గోపాలకృష్ణ త్రిపాఠి, ఆరుగు పట్నాయక్, సూర్యప్రకాష్, రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే స్టేషన్ వద్ద గంజాయి స్వాధీనం
రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు నిందితులను పట్టుకుని వారి నుంచి 25 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు సొమవారం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అరెస్టయిన వారిలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన సూరజ్ పాసవాన్, హర్సా శర్మలు ఉన్నట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కొరాపుట్ నుంచి అక్రమంగా గంజాయిని రాయగడకు తీసుకువచ్చిన నిందితులు రాయగడ నుంచి అహ్మదాబాద్‌కు ఆ గంజాయిని తరలించేందుకు ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే పోలీసులు ప్లాట్ఫారం వద్ద యథావిధిగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరి బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. దీనిపై కేసు నమోదు చేసి నిందితులను కొర్టుకు తరలించారు. -
డ్యామ్ లీక్‌పై రైతుల ఆందోళన
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితిలోగల తెలింగిరి సాగునీటి డ్యామ్‌లో నీరు లీక్ కావటంపై అధికారులు తలలు పట్టుకోగా.. రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రబీ సీజన్లో నీరు అందబోదన్న వార్త చింత జయపురం, కొట్‌పాడ్, బొరిగుమ్మ సమితుల్లో 24 వేల మంది రైతులను పట్టి పీడిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ జలాశయంలో నీటి మట్టం తగ్గుతోంది. లీకేజీని అరికట్టే మార్గం కనుగొనాలని సోమవారం రైతులు చీఫ్ ఇంజినీర్ కార్యాలయాన్ని ముట్టించారు. వెంటనే తగు చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ మెమొరాండం సమర్పించారు. బొరిగుమ్మ సమితిలో 9 గ్రామ పంచాయతీ రైతులు కార్యాలయం ముట్టడించటంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. డ్యామ్ లీకేజీని అరికట్టాలంటే మరమ్మతులు చేయాలి. అది జరగాలంటే నీరంతా ఖాళీ చేయాలి. అందుకు మార్గాలను ఇంజినీర్లు అన్వేషిస్తున్నారు. డ్యామ్ ఖాళీ చేయాలా లేదా మరో మార్గం చూపుతారా అన్నది ఉన్నతాధికారులు నిర్ణయంపైనే ఆధార పడి ఉన్నట్లు అదనపు చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్ పాణిగ్రహి వెల్లడించారు. దీంతో రైతులకు ఎవరూ సంతృప్తికర సమాచారం ఇవ్వలేకపోయారు. గత శుక్రవారం ఆంధ్ర నుంచి వచ్చిన ఇంజినీర్ నిపుణులు డ్యామ్‌లో నీరు పూర్తిగా ఖాళీ చేసినప్పుడే డ్యామ్ లీకేజీని అరికటేందుకు మరమ్మతు పనులు సాధ్యమని స్పష్టం చేసినట్లు సమాచారం. అదే జరిగితే రబీ పంటలకు సాగు నీరు లభించదని అంటున్నారు. కోట్లాది రూపాయిల వ్యయంతో రైతుల భూములకు సాగునీరు సమకూర్చేందుకు నిర్మించిన తెలంగిరి డామ్ నిర్మాణం జరిగి ఐదేళ్లకే నీరు లీక్ కావటం నిర్మాణ లోపమేన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డ్యామ్ నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. -
ఘనంగా భౌగోళిక సమాచార వ్యవస్థ దినోత్సవం
పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఓపెన్ ఆడిటోరియంలో సోమవారం భౌగోళిక సమాచార వ్యవస్థ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ శరత్ చంద్ర సాహు హాజరయ్యారు. అలాగే జేఎన్టీయూ కాకినాడ ప్రొఫెసర్ ఎం.ఎల్ నర్సింహం, కన్వీనరు, డీన్, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ ప్రఫుల్ల కుమార్ పండా, డైరెక్టర్ (అడ్మిన్) డా.దుర్గాప్రసాద్ పాఢి, రిజిస్ట్రారు డాక్టర్ అనితా పాత్రో సివిల్ ఇంజనీరింగ్ ముఖ్యశాఖ విక్రం నారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎం.ఎల్. నర్సింహం మాట్లాడుతూ, భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా ప్రకృతి విపత్తులు ముందుగానే పసిగట్టి అప్రమత్తం కావచ్చని అన్నారు. జియోస్పెషల్ టెక్నాలజీ ద్వారా రిమోట్ సెన్సింగ్, జీపీఎస్ టెక్నాలజీ మనకు కచ్చితమైన సమాచారం శాటిలైట్ ద్వారా అందిస్తుందని మాజీ డైరెక్టర్ ఐఎండీ డాక్టర్ శరత్ చంద్ర సాహు అన్నారు. అనంతరం భౌగోళిక సమాచార వ్యవస్థపై ముద్రించిన సావనీర్‌ను గౌరవ అతిథులు ఆవిష్కరించారు. ఆన్లైన్ ద్వారా డాక్టర్ జె.మురళీధరన్, స్మార్ట్ సిటీ, భవిష్యత్ అభివృద్ధిపై మాట్లాడారు. కార్యక్రమం అనంతరం శరత్ చంద్రసాహు, ఎంఎల్ నర్సింహంలను సత్కరించారు. -
పట్టుదలే విజయ సూత్రం
జయపురం: నేటి విద్యార్థులే.. రేపటి దేశ రథ సారథులని, వీరిని ఉత్తములుగా తీర్చిదిద్దాలని ఒడిశా రాష్ట్ర స్కూల్స్, మాస్ ఎడ్యుకేషన్ మంత్రి నిత్యానంద గోండ్ అన్నారు. సోమవారం స్థానిక నేహ్రూ నగర్‌లోని సిటీ ఉన్నత పాఠశాలలో ట్రస్ట్ తెలుగు సంస్కృతిక సమితి కొత్తగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్, క్లాస్ రూమ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలోనూ ప్రతిభ ఉంటుందని, ఆత్మ విశ్వాసంతో ఉంటే అద్భుత విజయాలు సాధించవచ్చన్నారు. తానేమీ చేయగలను అని భావిస్తే ఏమీ చేయలేరన్నారు. టీ విక్రయించే వ్యక్తి నేడు దేశ ప్రధాని అయ్యారని, ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా పేరుగాంచారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పరోక్షంగా ఉదహరించారు. విద్యార్థులలో ఆత్మస్థర్యం, సాధించాలన్న పట్టుదల ఉండాలన్నారు. తెలుగు సంస్కృతిక సమితి కార్యవర్గం పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, విద్యార్థులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించి నడపటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కమిటీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావు 1981లో ఈ పాఠశాల ఏర్పాటుకు ఏర్పడిన పరిస్థితులు వివరించారు. స్థానిక బాలికోన్నత పాఠశాలలో తెలుగు మాద్యమాన్ని ఎత్తివేయటంతో 6వ తరగతి నుంచి తెలుగు బోధనతో ప్రారంభించిన సిటీ స్కూల్ అనేక బాలారిష్టాలు అధిగమించి నేడు ఈ స్థాయికి ఎదిగిందని వివరించారు. తెలుగు సంస్కృతిక సమితి, సిటీ గర్ల్స్ ఉన్నత పాఠశాలల ఫౌండర్ శశిపట్నాయక్ ఉపాధ్యాయుల కొరతను వివరించారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు, ఈ సభలో నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీశంకర మఝి, జిల్లా విద్యాధికారి ప్రశాంత్‌కుమార్ మహంతి, హెచ్ఎం సుజాత పాల్గొన్నారు. కమిటీ సభ్యులు విద్యామంత్రిని సన్మానించారు. పాఠశాల విద్యార్థులు ఆదివాసీ నృత్యాలతో మంత్రికి స్వాగతం పలికారు. రాష్ట్ర స్కూల్స్, మాస్ ఎడ్యుకేషన్ మంత్రి నిత్యానంద గోండ్