Other Sports
-
పతకాల పందెం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..
మొనాకో: లండన్ ఒలింపిక్స్ (2012) జరిగి ఓ పుష్కర కాలం పూర్తయ్యింది. ఈలోపు రియో (2016), టోక్యో (2020), పారిస్ (2024) ఒలింపిక్స్ క్రీడలు కూడా ముగిశాయి. అయితే లండన్ విశ్వక్రీడల్లో మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో పతకాల పందెం ఇంకా.. ఇంకా కొనసాగుతోంది.ఈసారి డోపీగా తేలిన రష్యా రన్నర్ తాత్యానా తొమషోవా పతకం (కాంస్యం) కోల్పోతే, అమెరికా రన్నర్ షానన్ రోబెరి అందుకోనుంది. ఈ ఈవెంట్లో మూడు రంగులు (స్వర్ణం, రజతం, కాంస్యం) మారడం మరో విశేషం. అలా ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పుడిదీ నిలిచిపోనుంది. 12 ఏళ్ల క్రితం టర్కీ అథ్లెట్లు అస్లి కాకిర్ అల్ప్టెకిన్, గమ్జే బులుట్ వరుసగా స్వర్ణం, రజతం గెలుపొందారు.కానీ వీరిద్దరు ఇదివరకే డోపీలుగా తేలి అనర్హత వేటుకు గురయ్యారు. ఈ క్రమంలో ఇథియోపియాలో జన్మించిన బహ్రైనీ మరియం యూసఫ్ జమాల్‌కు గోల్డ్(మూడో స్థానం), ఇథియోపియాకే చెందిన అబెబా అరెగవీకి సిల్వర్(ఐదో స్థానం) మెడల్ దక్కాయి.అదేవిధంగా.. ఐదో స్థానంలో ఉన్న తొమషొవాకు కాంస్యం లభించింది. అయితే, ఇప్పుడు ఆమె కూడా డోపీ కావడంతో ఆరో స్థానంలో ఉన్న అమెరికన్ రోబెరి కాంస్య పతకం అందుకోనుంది. టర్కీ, రష్యా అథ్లెట్లపై ప్రపంచ అథ్లెటిక్స్ నిషేధం విధించింది. మారిన పతకాలను ప్రపంచ చాంపియన్‌షిప్ లేదంటే భవిష్యత్‌లో జరిగే ఒలింపిక్స్‌లో ప్రదానం చేస్తారు. క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీసాక్షి, హైదరాబాద్: రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ 6–4, 6–3తో డానియల్ మసూర్–అలెక్సీ వటుటిన్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బాలాజీ జోడీ ఏడు ఏస్‌లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌లో నాలుగుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకొని... ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. -
తెలుగు టైటాన్స్ దూకుడు
నోయిడా: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో ఏడో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్‌లో ‘టేబుల్ టాపర్’ హరియాణా స్టీలర్స్‌ను మట్టికరిపించిన టైటాన్స్... తాజాగా పట్టికలో రెండో స్థానంలో ఉన్న యు ముంబాను బోల్తా కొట్టించింది. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్ 31–29 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాపై గెలుపొందింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో టైటాన్స్ జట్టు రెయిడింగ్‌లో విఫలమైనా... డిఫెన్స్‌లో రాణించింది. టైటాన్స్ తరఫున ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లు సాధించగా... సాగర్ నర్వాల్, అజిత్ పవార్, మన్జీత్ తలా 4 పాయింట్లు సాధించారు. యు ముంబా తరఫున రోహిత్ 8 పాయింట్లు, మన్జీత్ 7 పాయింట్లతో పోరాడారు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో టైటాన్స్ 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... యు ముంబా 18 పాయింట్లు సాధించింది. లీగ్‌లో 11 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 7 విజయాలు, 4 పరాజయాలతో 37 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు యు ముంబా 12 మ్యాచ్‌లాడి 7 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘టై’తో 40 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానంలో ఉంది. దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. నేడు బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
సింధు శుభారంభం
షెన్జెన్: చైనా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత షట్లర్లు మెరిశారు. బరిలోకి దిగిన వారందరూ విజయాన్ని అందుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం కూడా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మళ్లీ సింధుదే పైచేయి... ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో 21వసారి ఆడిన సింధు ఈసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ ర్యాంక్‌లో ఉన్న సింధు 21–17, 21–19తో బుసానన్ను ఓడించింది. బుసానన్‌పై సింధుకిది 20వ విజయం కావడం విశేషం. 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీ లభించినా కీలకదశలో ఆమె పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. గతవారం జపాన్ మాస్టర్స్ టోర్నీలోనూ తొలి రౌండ్లో బుసానన్పైనే సింధు గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్తో సింధు ఆడుతుంది. మరోవైపు ప్రపంచ 36వ ర్యాంకర్, భారత రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ సంచలన విజయంతో శుభారంభం చేసింది. ప్రపంచ 21వ ర్యాంకర్ లైన్ హొమార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో మాళవిక 20–22, 23–21, 21–16తో విజయాన్ని అందుకుంది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో మాళవిక తొలి గేమ్‌ను కోల్పోయినా ఆందోళన చెందకుడా ఆడి ఆ తర్వాతి రెండు గేముల్లో నెగ్గి ముందంజ వేసింది. ఈ గెలుపుతో ఈ ఏడాది కొరియా ఓపెన్‌లో జార్స్‌ఫెల్డ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుపనిద (థాయ్‌లాండ్)తో మాళవిక తలపడుతుంది. ఏడో ర్యాంకర్‌కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ సంచలన విజయంతో బోణీ చేశాడు. ప్రపంచ 7వ ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 13–21, 21–13తో గెలిచాడు. లీ జి జియాపై లక్ష్య సేన్‌కిది ఐదో విజయం కావడం విశేషం. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ ఆటలో నిలకడ లోపించింది. అయితే కీలకదశలో అతడు గాడిలో పడటంతో విజయం దక్కింది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 15–11 వద్ద లక్ష్య సేన్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–11తో విజయానికి చేరువయ్యాడు. ఆ తర్వాత అతను రెండు పాయింట్లు కోల్పోయాక మరో పాయింట్ నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గాయత్రి జోడీ ముందుకు.... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–15, 21–14తో హు లింగ్ ఫాంగ్–జెంగ్ యు చియె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. ఈ గెలుపుతో భారత జంట సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని మెరుగుపర్చుకుంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 12–21, 21–19, 21–18తో లీ జె హుయె–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత సాతి్వక్–చిరాగ్ ఆడుతున్న తొలి టోర్నీ ఇదే కావడం గమనార్హం. -
కేరళకు రానున్న మెస్సీ బృందం
తిరువనంతపురం: అంతా అనుకున్నట్లు జరిగితే... భారత క్రీడాభిమానులు, కేరళ ఫుట్‌బాల్ ప్రేమికులు ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆటగాళ్ల విన్యాసాలు ప్రత్యక్షంగా చూస్తారు. రెండు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడేందుకు... స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు వచ్చే ఏడాది కేరళకు రానుందని ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దుల్ రహమాన్ బుధవారం ప్రకటించారు. ఈ మ్యాచ్‌లను కేరళ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని... వేదికతో పాటు, ప్రత్యర్థి జట్లు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే ఖతర్, జపాన్ జట్లను ఆహ్వానించాలనే ఆలోచన ఉందని ఆయన వివరించారు. ‘ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో కూడిన ప్రపంచ నంబర్‌వన్ ఫుట్‌బాల్ జట్టు అర్జెంటీనా వచ్చే ఏడాది కేరళకు రానుంది. ఆ జట్టు ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. దీనిపై అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంతో కలిసి త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేస్తాం’ అని రహమాన్ పేర్కొన్నారు. ఇటీవల స్పెయిన్ పర్యటన సందర్భంగా అర్జెంటీనా జాతీయ జట్టును ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. దీనికి ఆ జట్టు నుంచి సానుకూల స్పందన వచ్చిందని... త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వస్తుందని అన్నారు. మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని మంత్రి చెప్పారు. అయితే తమ షెడ్యూల్ ప్రకారం అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘమే భారత పర్యటనకు సంబంధించిన తేదీలను వెల్లడించనుందని పేర్కొన్నారు. అర్జెంటీనా ఆడనున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా 50 వేల మంది అభిమానులు చూసేలా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌ను నిర్వహించే శక్తి సామర్థ్యాలు కేరళ ప్రభుత్వానికి ఉన్నాయని రహమాన్ పేర్కొన్నారు. రెండు మ్యాచ్‌ల నిర్వహణకు రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని స్పాన్సర్ల ద్వారా సమకూరుస్తామని ఆయన తెలిపారు. -
చైనాకు షాక్.. చాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. అరుదైన రికార్డు
రాజ్‌గిర్(బిహార్): నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. వుమెన్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాను ఓడించి.. టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కాగా సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీ భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగింది.అద్భుత విజయాలతో సెమీస్‌కు చేరుకున్న సలీమా బృందం.. అక్కడ జపాన్ను ఓడించి.. ఫైనల్‌కు చేరుకుంది. వరుసగా ఆరో గెలుపు నమోదు చేసి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఫైనల్లో.. పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత, ఆసియా క్రీడల చాంపియన్ అయిన చైనాతో తలపడింది.చైనాను 1-0తో ఓడించిఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు చైనాను 1-0తో ఓడించి.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. ఈ క్రమంలో సౌత్ కొరియాతో కలిసి ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది.ఇక చైనాతో ఫైనల్లో భారత్ తరఫున దీపికా చేసిన ఒకే ఒక్క గోల్‌తో విజయం సలీమా బృందం సొంతమైంది. మూడో క్వార్టర్లో ఆమె గోల్ కొట్టి భారత్‌ను విజయపథంలో నిలిపింది. దీంతో రాజ్‌గిర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.ఇదిలా ఉంటే.. ఈ ప్రతిష్టాత్మ టోర్నీలో 2016, 2023లలో భారత మహిళా జట్టు చాంపియన్‌గా నిలిచింది విజేతగా నిలిచింది. అదే విధంగా.. 2013, 2018లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.వుమెన్స్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ-2024లో పాల్గొన్న భారత జట్టుగోల్ కీపర్స్- సవిత, బిచు దేవి ఖరీబామ్డిఫెండర్స్- ఉదిత, జ్యోతి, వైష్ణవి విట్టల్ ఫాల్కే, సుశీలా చాను పఖ్రంబం, ఇషికా చౌదరిమిడ్ఫీల్డర్స్- నేహా, సలీమా టెటె(కెప్టెన్), షర్మిలా దేవి, మనీషా చౌహాన్, సునేలిటా టొప్పో, లల్రేమిసియామి.ఫార్వర్డ్స్- నవనీత్ కౌర్(వైస్ కెప్టెన్), ప్రీతీ దూబే, సంగీతా కుమారి, దీపికా, బ్యూటీ డంగ్‌డంగ్.చదవండి: ICC: వరల్డ్ నంబర్ వన్‌గా హార్దిక్ పాండ్యా.. దూసుకువచ్చిన తిలక్ వర్మ.. ఏకంగా.. -
పట్నా ఫటాఫట్
నోయిడా: స్టార్ రెయిడర్లు దేవాంక్, అయాన్ విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ ఘనవిజయం సాధించింది. లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో పట్నా పైరెట్స్ 54–31 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన పట్నా ప్రత్యర్థికి కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. దేవాంక్ 16 పాయింట్లు, అయాన్ 12 పాయింట్లతో సత్తా చాటారు. బెంగళూరు బుల్స్ తరఫున అక్షిత్ ధుల్ (7 పాయింట్లు) కాస్త పోరాడాడు. స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ ఒక్క పాయింట్‌కే పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా పట్నా 32 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... బెంగళూరు జట్టు 13కే పరిమితమైంది. ప్రత్యరి్థని మూడుసార్లు ఆలౌట్ చేసిన పైరేట్స్... తాజా లీగ్‌లో ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ఫలితంతో పాయింట్ల పట్టికలో పట్నా పైరెట్స్ మూడో స్థానానికి చేరింది. మరోవైపు బెంగళూరు బుల్స్ వరుసగా ఐదో పరాజయం మూటగట్టుకుంది. పుణేరి పల్టన్, యూపీ యోధాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 29–29 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్‌పుత్ 10 పాయింట్లు సాధించగా... పల్టన్ తరఫున పంకజ్ 9 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో భాగంగా నేడు దబంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
Asian Champions Trophy 2024: ఎదురులేని భారత్
రాజ్‌గిర్ (బిహార్): మరోసారి సాధికారిక ఆటతీరుతో అలరించిన భారత మహిళల హాకీ జట్టు సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఐదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 2–0 గోల్స్ తేడాతో 2018 జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ (48వ నిమిషంలో), లాల్రెమ్సియామి (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. సలీమా టెటె నాయకత్వంలో ఈ టోర్నీలో ఆడుతున్న భారత జట్టుకిది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా నాకౌట్ మ్యాచ్‌లోనూ గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రస్తుత ఆసియా క్రీడల చాంపియన్ చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో చైనా 3–1తో మలేసియాపై గెలిచింది. లీగ్ దశలో భారత జట్టు 3–0తో చైనాపై గెలిచింది. అదే ఫలితాన్ని నేడూ పునరావృతం చేస్తే భారత జట్టు మూడోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా దక్షిణ కొరియా (2010, 2011లలో) జట్టు తర్వాత వరుసగా రెండుసార్లు ఈ టైటిల్‌ను నెగ్గిన జట్టుగా భారత్ గుర్తింపు పొందుతుంది. గతంలో భారత జట్టు 2016, 2023లలో విజేతగా నిలిచింది. 2013, 2018లలో రన్నరప్ ట్రోఫీ సాధించింది. జపాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 12 పెనాల్టీ కార్నర్లు లభించగా... ఒక్కదానిని కూడా టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. లేదంటే భారత గెలుపు ఆధిక్యం భారీగా ఉండేది. మరోవైపు జపాన్ కేవలం ఒక్క పెనాల్టీ కార్నర్కే పరిమితమైంది. -
‘ఆ జ్ఞాపకాలన్నీ పదిలం’
మలాగా (స్పెయిన్): ‘ఒకటి మాత్రం నిజం...నేను నీపై గెలిచిన మ్యాచ్లకంటే నువ్వు నన్ను ఎక్కువ సార్లు ఓడించావు. నీలా నాకు ఎవరూ సవాల్ విసరలేదు. మట్టి కోర్టుపైన అయితే నీ ఇంటి ఆవరణలోకి వచ్చి ఆడినట్లే అనిపించేది. అక్కడ నీ ముందు నిలబడితే చాలు అనిపించేందుకు కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చేది. నా ఆటలో లోపాలు ఉన్నాయేమో అని చూసుకునేలా నువ్వే చేశావు. నీపై పైచేయి సాధించే క్రమంలో రాకెట్ మార్చి కూడా నా అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వచ్చింది’ ... టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్న రాఫెల్ నాదల్‌ను ఉద్దేశించి మరో దిగ్గజం రోజర్ ఫెడరర్ చేసిన ప్రశంసాపూర్వక వ్యాఖ్య ఇది. సుదీర్ఘ కాలం ఆటను శాసించిన వీరిద్దరిలో ఫెడరర్ రెండేళ్ల క్రితం రిటైర్ కాగా... ఇప్పుడు నాదల్ వంతు వచ్చింది. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెడరర్ కెరీర్ ముగిస్తే... 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో నాదల్ గుడ్‌బై చెప్పాడు. కోర్టులో ప్రత్యర్థులే అయినా మైదానం బయట వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రపంచ టెన్నిస్ సర్క్యూట్లో తమ పరస్పర గౌరవాన్ని, అభిమానాన్ని వీరిద్దరు చాలాసార్లు ప్రదర్శించారు. నాదల్ రిటైర్మెంట్ నేపథ్యంలో నాటి జ్ఞాపకాలతో ఫెడరర్ ఒక లేఖ రాశాడు. ఆటను ఇష్టపడేలా చేశావు... ‘నువ్వు రిటైర్ అవుతున్న సందర్భంగా కొన్ని విషయాలు పంచుకోవాలని భావించాను. మ్యాచ్ సమయంలో బొమ్మల కొలువులా వాటర్ బాటిల్స్‌ను పేర్చడం, జుట్టు సవరించుకోవడం, అండర్‌వేర్‌ను సరిచేసుకోవడం... అన్నీ ఒక పద్ధతిలో ఉండటం అంతా కొత్తగా అనిపించేది. నేను ఆ ప్రక్రియను కూడా ఇష్టపడేవాడిని. నాకు మూఢనమ్మకాలు లేవు కానీ నువ్వు ఇలా కూడా ఆకర్షించావు. టెన్నిస్‌పై నా ఇష్టం మరింత పెరిగేలా చేశావు. దాదాపు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించాం. 20 ఏళ్ల తర్వాత చూస్తే నువ్వు అద్భుతాలు చేసి చూపించావు. 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌తో స్పెయిన్, యావత్ టెన్నిస్ ప్రపంచం గర్వపడేలా చేశావు’ అని ఫెడరర్ అన్నాడు. ఆ రోజు మర్చిపోలేను... 2004 మయామి ఓపెన్‌తో మొదలు పెట్టి వీరిద్దరు 40 సార్లు తలపడ్డారు. ఇందులో నాదల్ 24 సార్లు, ఫెడరర్ 16 సార్లు గెలిచారు. ‘నేను తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా మారి సగర్వంగా నిలిచినప్పుడు నీతో మయామిలో తలపడి ఓడాను. అరుదైన ప్రతిభ గలవాడివని, ఎన్నో ఘనతలు సాధిస్తావని అప్పటి వరకు నీ గురించి గొప్పగా విన్నదంతా వాస్తవమేనని అర్థమైంది. 50 వేల మంది సమక్షంలో ఆడిన రికార్డు మ్యాచ్‌తో సహా మనం కలిసి ఆడిన రోజులన్నీ గుర్తున్నాయి. కొన్నిసార్లు ఎంతగా పోరాడే వాళ్లమంటే ఆట ముగిశాక వేదికపై ఒకరిని పట్టుకొని మరొకరు నడవాల్సి వచ్చేది’ అని ఫెడరర్ గుర్తు చేసుకున్నాడు. నీతో స్నేహం వల్లే... మలార్కాలో 2016లో నాదల్ అకాడమీ ప్రారంభోత్సవానికి ఫెడరర్ హాజరు కాగా... రెండేళ్ల క్రితం ఫెడరర్ చివరి టోర్నీ లేవర్ కప్‌లో అతని కోసం భాగస్వామిగా నాదల్ ఆడాడు. ‘అకాడమీ ప్రారంభోత్సవానికి నాకు నేనే ఆహా్వనం ఇచ్చుకున్నాను. ఎందుకంటే నన్ను బలవంతం చేయలేని మంచితనం నీది. కానీ నేను రాకుండా ఎలా ఉంటాను. ఆ తర్వాత నీ అకాడమీలో నా పిల్లలు శిక్షణ తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. వాళ్లు ఎడంచేతి వాటం ఆటగాళ్లుగా తిరిగి రాకుండా చాలని మాత్రం కోరుకున్నాను. లేవర్ కప్‌లో చివరిసారి నీతో కలిసి ఆడినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. నా కెరీర్లో అవి ఎంతో ప్రత్యేక క్షణాలు’ అని ఫెడెక్స్ భావోద్వేగం ప్రదర్శించాడు. కమాన్ రఫా... కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న వేళ నాదల్కు ఫెడరర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు. ‘భావోద్వేగంతో మాటలు రాని పరిస్థితి రాక ముందే నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. నీ ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత మాట్లాడు కోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ సమయంలో నీకు నా అభినందనలు. ఇప్పుడు, ఇకపై కూడా నీ పాత మిత్రుడు చప్పట్లతో గట్టిగా నిన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడనే విషయం మరచిపోవద్దు’ అని ఫెడరర్ ముగించాడు. -
లోకల్ లైగర్.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడలో సిటీ కుర్రాడి సత్తా !
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) క్రీడలో హైదరాబాద్ సిటీ కుర్రాడు సత్తా చాటుతున్నాడు. ప్రత్యర్థులపై పంచ్‌లతో రెచ్చిపోతున్నాడు. ఓవైపు బీటెక్ చదువును కొనసాగిస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ క్రీడల్లో రాణిస్తున్నాడు. అతడే మోహిత్. ఇప్పటికే ఏకంగా ఏడు బంగారు పతకాలు కైవసమయ్యాయంటే అతని పంచ్ పవరేంటో అర్థం చేసుకోవచ్చు. తైక్వాండో నుంచి ఎంఎంఏ.. ఫిర్జాదిగూడలోని మేడిపల్లి ఏవీ ఇన్ఫో ప్రైడ్‌లో నివాసముంటున్న ఎస్ మోహిత్‌కు చిన్నతనం నుంచే క్రీడలంటే అమితాసక్తి. దీంతో అతని పేరెంట్స్ స్కూల్లో తైక్వాండో శిక్షణలో చేర్పించారు. దీంతో పాఠశాల స్థాయిలోనే అనేక పోటీల్లో మెడల్స్ సాధించాడు. యుక్త వయసులోకి వచ్చాక తైక్వాండో నుంచి ఎంఎంఏ వైపు ఆసక్తి మళ్లింది. దీంతో గ్రాప్లింగ్ (రెజ్లింగ్) శిక్షణ మొదలుపెట్టాడు. బీటెక్ చదువుతూనే సాయంత్రం వేళ నారాయణగూడలో శిక్షణ ప్రారంభించాడు. రెజ్లింగ్, బాక్సింగ్, కరాటే, తైక్వాండో, స్ట్రిక్కింగ్ వంటి కొట్లాట క్రీడలను మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు.యూట్యూబ్‌లో టెక్నికల్ స్కిల్స్.. గతేడాది సర్దార్ పటేల్ కేసరిగా పిలిచే జిల్లా స్థాయి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ సమయంలో బీటెక్ పరీక్షల కారణంగా ప్రాక్టీస్‌కు పెద్దగా టైం దొరకలేదు. దీంతో యూట్యూబ్‌లో మునుపటి మ్యాచ్‌లు, ఎంఎంఏ ప్రొఫెషనల్స్ అన్షుల్ జుబ్లీ, అలెక్స్ పెరీరా వీడియోలను చూసి, టెక్నికల్ స్కిల్స్ ప్రాక్టీస్ చేశాడు. ఈ పోటీలో 90 కిలోల కేటగిరిలో పాల్గొని, మహారాష్ట్ర ప్రత్యర్థులను చిత్తు చేసి బంగారు పతకం సాధించాడు. ఈ ఏడాది ఓపెన్ కిక్‌బాక్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచిన తర్వాత బెల్ట్ మ్యాచ్ కోసం పోటీపడ్డాడు. ప్రత్యర్థి తన కంటే 5–6 కిలోల బరువు ఎక్కువగానే ఉన్నాడు. అయినా సరే నైపుణ్యం, దృఢ సంకల్పంతో మ్యాచ్‌లో ప్రత్యర్థిని రెండు సార్లు నాకౌట్‌తో పడగొట్టగలిగాడు. ఇండియాకు ప్రాతినిథ్యం నా లక్ష్యం..చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. దీంతో శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉంటారు. ఎంఎంఏ క్రీడ శిక్షణ, మార్గదర్శకత్వం చేయడంతో పాటు ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించాలన్నదే నా లక్ష్యం. – మోహిత్ -
రన్నరప్ శిబి శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: చదరంగోత్సవ ఆలిండియా ఓపెన్ ఫిడే రేటేడ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్ శిబి శ్రీనివాస్ ఐన్‌స్టీన్ రన్నరప్‌గా నిలిచాడు. బెంగళూరులోని బీఎంఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం ముగిసిన ఈ టోరీ్నలో 21 ఏళ్ల శిబి శ్రీనివాస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో శిబి శ్రీనివాస్‌తోపాటు మరో ఇద్దరు కరణం నాగ సాయి సార్థక్ (కర్ణాటక), అవిరత్ చౌహాన్ (మహారాష్ట్ర) 7.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... శిబి శ్రీనివాస్‌కు రెండో స్థానం, సాయి సార్థక్‌కు మూడో స్థానం, అవిరత్కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. 8 పాయింట్లతో ప్రశాంత్ నాయక్ (కర్ణాటక) విజేతగా నిలిచాడు. శిబి శ్రీనివాస్ ఈ టోరీ్నలో ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. ప్రణవ్ వసంత్ కుమార్ రావు, తోట విధు, అద్వైత్, హరి అన్నామలై, ఆనంది, వినాయక్ కులకరి్ణ, రవి గోపాల్ హెగ్డేలపై శిబి శ్రీనివాస్ గెలిచాడు. సంపత్ కుమార్ తిరునారాయణన్ చేతిలో ఓడిన శిబి... సాయి సార్థక్‌తో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. రన్నరప్‌గా నిలిచిన శిబి శ్రీనివాస్‌కు రూ. 40 వేల ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీ లభించింది. -
విన్నర్ సినెర్
రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ ఇప్పటికే టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకోగా... సెర్బియా స్టార్ జొకోవిచ్ కూడా త్వరలోనే వీరి బాటలో నడిచే అవకాశముంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పురుషుల టెన్నిస్ ‘ముఖచిత్రం’ ఎవరనే ప్రశ్నకు సమాధానంగా ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్ దూసుకొచ్చాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఫైనల్స్‌లో సినెర్ తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సింగిల్స్ ఫైనల్లో సినెర్ అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని సినెర్... 1986లో ఇవాన్ లెండిల్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఇటీవల డోపింగ్ వివాదంతో విమర్శలపాలైనా... ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పిదం చేయలేదని వివరణ ఇచి్చన సినెర్... తాజా విజయంతో సీజన్‌ను చిరస్మరణీయంగా ముగించాడు. ట్యూరిన్: సొంతగడ్డపై ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ అదరగొట్టాడు. ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో తొలిసారి విజేతగా అవతరించాడు. అమెరికా ప్లేయర్, యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్‌తో జరిగిన సింగిల్స్ ఫైనల్లో సినెర్ 6–4, 6–4తో గెలుపొందాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ తుది సమరంలో సినెర్ 14 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. తొలి సర్వీస్ లో 40కుగాను 33 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 16కు 13 పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి సర్వీస్ ను రెండుసార్లు బ్రేక్ చేసిన సినెర్ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు. నెట్ వద్దకు 5 సార్లు దూసుకొచ్చిన ఇటలీ స్టార్ మూడుసార్లు పాయింట్లు నెగ్గాడు. 28 విన్నర్స్ కొట్టిన సినెర్ కేవలం 9 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు ఫ్రిట్జ్ 8 ఏస్‌లు సంధించి, 2 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 8 సార్లు దూసుకొచ్చి 7 సార్లు పాయింట్లు నెగ్గిన ఫ్రిట్జ్ 15 అనవసర తప్పిదాలు చేశాడు. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా విజేతగా నిలిచినందుకు సినెర్ 48,81,100 డాలర్ల (రూ. 41 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీ, 1500 ర్యాంకింగ్ పాయింట్లు గెల్చుకున్నాడు. టేలర్ ఫ్రిట్జ్కు 22,47,400 డాలర్ల (రూ. 18 కోట్ల 96 లక్షలు) ప్రైజ్‌మనీ, 800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2006లో జేమ్స్ బ్లేక్ తర్వాత ఏటీపీ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో ఆడిన అమెరికన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన ఫ్రిట్జ్ కీలక సమరంలో తడబడ్డాడు. ఒకవేళ ఫ్రిట్జ్ గెలిచి ఉంటే 1999లో సంప్రాస్ తర్వాత ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన అమెరికా ప్లేయర్‌గా గుర్తింపు పొందేవాడు. మరోవైపు ఇవాన్ లెండిల్ (1986లో; చెక్ రిపబ్లిక్/అమెరికా) తర్వాత ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా ఘనత వహించాడు. 2024 ఏడాదిని సినెర్ 70 విజయాలు, 6 పరాజయాలతో ముగించాడు. ఆండీ ముర్రే (బ్రిటన్; 2016లో) తర్వాత ఒకే సీజన్ లో 70 విజయాలు సాధించిన ప్లేయర్‌గా సినెర్ నిలిచాడు. 8 ఈ ఏడాదిలో సినెర్ సాధించిన టైటిల్స్ సంఖ్య. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, షాంఘై మాస్టర్స్, ఏటీపీ ఫైనల్స్ టోర్నీలలో సినెర్ విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా సినెర్ కెరీర్లో 18 టైటిల్స్ నెగ్గాడు. -
తెలుగు టైటాన్స్ తడాఖా
నోయిడా: తెలుగు టైటాన్స్ ఈ సీజన్లో చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న హరియాణా స్టీలర్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు పది మ్యాచ్‌లాడిన హరియాణా స్టీలర్స్ కేవలం 2 మ్యాచ్‌ల్లోనే ఓడి, ఎనిమిదింట విజయం సాధించిది. అలాంటి మేటి ప్రదర్శన కనబరుస్తున్న హరియాణాపై తెలుగు టైటాన్స్ సాధికార విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ పోరులో కీలకమైన ఆటగాడు, కెప్టెన్ పవన్ సెహ్రావత్ గాయంతో బరిలోకి దిగలేదు. అయినా సరే టైటాన్స్ 49–27తో స్టీలర్స్‌కు ఊహించని పరాజయాన్ని రుచి చూపించింది. ఆట ఆరంభమైన పది నిమిషాల్లోనే తెలుగు టైటాన్స్ రెయిడర్లు, డిఫెండర్లు సత్తా చాటుకోవడంతో హరియాణా ఆలౌటైంది. సరిగ్గా ప్రథమార్ధం ముగిసే సమయానికి (20 నిమిషాలు) మళ్లీ ఆలౌట్ చేసిన టైటాన్స్ ఆధిక్యాన్ని 23–11కు పెంచకుంది. ద్వితీయార్ధంలో స్టీలర్స్ పాయింట్లు చేసినప్పటికీ క్రమం తప్పకుండా తెలుగు టైటాన్స్ చేస్తున్న స్కోరును ఏ దశలోనూ చేరుకోలేకపోయింది. రెయిడర్లు ఆశిష్ నర్వాల్ (11 పాయింట్లు), కెపె్టన్ విజయ్ మలిక్ (8) అదరగొట్టారు. డిఫెండర్ సాగర్, ఆల్‌రౌండర్ శంకర్ చెరో 5 పాయింట్లు చేశారు. హరియాణా తరఫున కెప్టెన్ రాహుల్ (6), ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (5), రెయిడర్ జయసూర్య (5) రాణించారు. ప్రస్తుతం 10 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టు ఆరో విజయంతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. అనంతరం హోరాహోరిగా జరిగిన రెండో మ్యాచ్‌లో యు ముంబా 38–37 ఒకే ఒక్క పాయింట్ తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. ముంబా తరఫున రెయిడర్ అజిత్ చౌహాన్ (10) ఆకట్టుకున్నాడు. అమిర్ మొహమ్మద్, కెప్టెన్ సునీల్ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. బెంగళూరు జట్టులో ప్రదీప్ నర్వాల్ (10), సుశీల్ (6), నితిన్ రావల్ (6) రాణించారు. నేడు జరిగే పోటీల్లో పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటల నుంచి)... బెంగళూరు బుల్స్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా..
రాజ్‌గిర్ (బిహార్): లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు కీలక సమరానికి సమాయత్తమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో నేడు మాజీ చాంపియన్ జపాన్‌తో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లో తలపడనుంది. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలతో సంబంధం లేకుండా ఈ నాకౌట్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. మరో సెమీఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనాతో మలేసియా పోటీపడుతుంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. లీగ్ దశలో భారత్ మొత్తం 26 గోల్స్ సాధించి ప్రత్యర్థి జట్లకు కేవలం 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. ‘డ్రాగ్ ఫ్లికర్’ దీపిక ఏకంగా 10 గోల్స్‌తో అదరగొట్టింది. సంగీత కుమారి నాలుగు గోల్స్... ప్రీతి దూబే మూడు గోల్స్ చేశారు. లాల్రెమ్సియామి, మనీషా చౌహాన్, నవ్‌నీత్ కౌర్ రెండు గోల్స్ చొప్పున సాధించారు. ఉదిత, కెప్టెన్ సలీమా టెటె, బ్యూటీ డుంగ్‌డుంగ్ ఒక్కో గోల్ చేశారు. మరోవైపు జపాన్ జట్టు ఓవరాల్‌గా 6 గోల్స్ మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో భారత్ తమ సహజశైలిలో ఆడితే వరుసగా ఆరో విజయంతో ఐదోసారి ఈ టోరీ్నలో టైటిల్ పోరుకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఏడుసార్లు జరగ్గా.. భారత జట్టు రెండుసార్లు చాంపియన్‌గా (2016, 2023) నిలిచి, మరో రెండుసార్లు (2013, 2018) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. జపాన్ జట్టు మూడుసార్లు (2010, 2013, 2023) ఫైనల్‌కు చేరుకొని ఒకసారి (2010లో) విజేతగా నిలిచి, రెండుసార్లు తుది పోరులో ఓడిపోయింది. ‘మా జట్టు బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో సభ్యులందరికీ తెలుసు. మా బలాన్ని మరింత పెంచుకొని, భవిష్యత్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ టోర్నీని వినియోగించు కుంటున్నాం. ఇప్పటి వరకైతే భారత జట్టు అద్భుతంగా ఆడింది. అయితే నాకౌట్ మ్యాచ్ అయినా సెమీఫైనల్లో జపాన్ను తక్కువ అంచనా వేయకూడదు’ అని భారత జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. -
విజయం లేకుండానే...
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ జట్టు 2024ను ఒక్క విజయం లేకుండా ముగించింది. ఏడాదిలో చివరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనే కనబర్చినా చివరకు గెలుపు మాత్రం దక్కలేదు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం భారత్, మలేసియా జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) స్నేహపూర్వక అంతర్జాతీయ మ్యాచ్ 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. మలేసియా తరఫున పావ్లో జోస్ 19వ నిమిషంలో గోల్ సాధించగా... భారత్ తరఫున రాహుల్ భేకే 39వ నిమిషంలో హెడర్ ద్వారా గోల్ కొట్టాడు. రెండో అర్ధభాగంలో గోల్ చేయడంలో ఇరు జట్లు విఫలమయ్యాయి. ఈ ఏడాది మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన మన జట్టు 6 పరాజయాలు, 5 ‘డ్రా’లు సాధించింది. భారత ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పెయిన్‌కు చెందిన మనోలో మార్కెజ్‌కు తొలి విజయం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. భారత్ తమ తర్వాతి అంతర్జాతీయ మ్యాచ్ 2027 ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా వచ్చే ఏడాది మార్చిలో ఆడుతుంది. జోరుగా ఆరంభం... ఆరంభంలో భారత్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. తొలి 15 నిమిషాల పాటు బంతిని తమ ఆ«దీనంలోనే ఉంచుకున్న జట్టు కొన్ని సార్లు గోల్‌పోస్ట్‌కు చేరువగా వెళ్లగలిగినా... ఆశించిన ఫలితం దక్కలేదు. ఆరో నిమిషంలో రోషన్, చంగ్లే అందించిన పాస్‌తో ముందుకు దూసుకెళ్లిన లాలెంగ్మవియా కొట్టిన షాట్ క్రాస్ బార్ మీదుగా దూసుకెళ్లింది. అయితే భారత కీపర్ గుర్‌ప్రీత్‌సింగ్ సంధూ చేసిన తప్పు ప్రత్యరి్థకి ఆధిక్యాన్ని అందించింది. భారత బ్యాక్‌లైన్ వద్ద మలేసియాను అడ్డుకునే ప్రయత్నంలో సంధూ తన పోస్ట్ వదిలి ముందుకొచ్చాడు. వెంటనే చక్కగా బంతిని అందుకున్న పావ్లో జోస్ ఖాళీ నెట్‌పైకి కొట్టడంతో మలేసియా ఖాతాలో తొలి గోల్ చేరింది. తర్వాత కొద్ది సేపటికే ఫౌల్ చేయడంతో రాహుల్ భేకే ఎల్లో కార్డ్‌కు గురయ్యాడు. 28వ నిమిషంలో రోషన్ ఇచ్చిన కార్నర్ క్రాస్‌ను అందుకోవడానికి ఎవరూ లేకపోవడంతో భారత్‌కు మంచి అవకాశం చేజారింది. ఈ దశలో కొద్దిసేపు ఇరు జట్లూ హోరాహోరీ గా పోరాడాయి. చివరకు భారత్ ఫలితం సాధిం చింది. బ్రండన్ ఇచ్చిన కార్నర్ పాస్‌ను బాక్స్ వద్ద ఉన్న భేకే నెట్లోకి పంపడంతో స్కోరు సమమైంది. హోరాహోరీ పోరాడినా... రెండో అర్ధభాగంలో ఇరు జట్లు పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమించాయి. అయితే తమకు లభించిన అవకాశాలను సది్వనియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయి. తొలి అర్ధభాగంతో పోలిస్తే ఈసారి భారత డిఫెన్స్ మెరుగ్గా కనిపించింది. 47వ నిమిషంలో బాక్స్ వద్ద అగ్వెరో కిక్‌ను సందేశ్ జింగాన్ సమర్థంగా అడ్డుకోగా... 53వ నిమిషంలో కార్నర్ ద్వారా భారత ప్లేయర్ బ్రండన్ చేసిన గోల్ ప్రయత్నం వృథా అయింది. మరో ఏడు నిమిషాల తర్వాత వచ్చిన అవకాశాన్ని ఫరూఖ్ వృథా చేశాడు. చివరి ఐదు నిమిషాల ఇంజ్యూరీ టైమ్‌లో కొన్ని ఉత్కంఠ క్షణాలు సాగాయి. సుమారు 15 వేల మంది ప్రేక్షకులు మద్దతు ఇస్తుండగా భారత్ పదే పదే మలేసియా పోస్ట్‌పైకి దూసుకెళ్లినా గోల్ మాత్రం దక్కలేదు. మరోవైపు భారత కీపర్ సంధూ కూడా ప్రత్యర్థి ఆటగాళ్ళను సమర్థంగా నిలువరించగలిగాడు. -
హరియాణా పాంచ్ పటాకా
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో హరియాణా స్టీలర్స్ జట్టు జోరు కొనసాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్న హరియాణా స్టీలర్స్ లీగ్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లో విజయం సాధించింది. శనివారం జరిగిన పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన హరియాణా స్టీలర్స్ 36–29 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది.స్టీలర్స్ తరఫున స్టార్ రైడర్ వినయ్ 10 పాయింట్లతో సత్తా చాటగా... డిఫెన్స్‌లో మొహమ్మద్ రెజా (8 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. తమిళ్ తలైవాస్ తరఫున మొయిన్ 7 పాయింట్లతో పోరాడాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హరియాణా జట్టు 21 రెయిడ్ పాయింట్లు సాధించి ఆధిపత్యం చెలాయించగా... 12 రెయిడ్ పాయింట్లకే పరిమితమై తమిళ్ తలైవాస్ పరాజయం పాలైంది. ఆడిన పది మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 2 పరాజయాలు సాధించిన హరియాణా స్టీలర్స్ 41 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మరోవైపు 11 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 6 పరాజయాలు ఒక ‘టై’తో 28 పాయింట్లు సాధించిన తమిళ్ తలైవాస్ జట్టు పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. పుణేరి పల్టన్‌పై జైపూర్ పింక్ పాంథర్స్ గెలుపు మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 30–28 పరుగుల తేడాతో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. జైపూర్ జట్టు తరఫున అర్జున్ దేశ్వాల్ 8 పాయింట్లు, అంకుశ్ 6 పాయింట్లతో రాణించారు. పుణేరి పల్టన్ తరఫున ఆకాశ్ షిండే 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడటంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో జైపూర్ జట్టు కీలక సమయంలో ఆధిక్యం చేజిక్కించుకుంది. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో 12 రెయిడ్ పాయింట్లు సాధించగా... ట్యాకెలింగ్లో జైపూర్ 14 పాయింట్లు, పుణేరి పల్టన్ 10 పాయింట్లు సాధించాయి. తాజా సీజన్లో 9 మ్యాచ్‌లాడిన జైపూర్ పింక్ పాంథర్స్ 5 విజయాలు, 3 పరాజయాలు, ఒక ‘టై’తో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు 9 మ్యాచ్‌లాడిన పుణేరి పల్టన్ 5 విజయాలు, 2 ఓటములు, 2 ‘టై’లతో 33 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా సోమవారం జరగనున్న మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో హరియాణా స్టీలర్స్ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో యూ ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
చాంపియన్ రుత్విక–రోహన్
రాయ్‌పూర్: సీఎం ట్రోఫీ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని టైటిల్ గెలిచింది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో రుత్విక శివాని–రోహన్ కపూర్ జంట అదరగొట్టింది. ఐదు విభాగాల్లోనూ (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) భారత క్రీడాకారులకే విన్నర్స్, రన్నరప్ ట్రోఫీలో దక్కడం విశేషం. గత వారం హైదరాబాద్ వేదికగా జరిగిన ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలోనూ ఐదు విభాగాల్లో భారత ఆటగాళ్లకే విన్నర్స్, రన్నరప్ ట్రోఫీలు లభించాయి. తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ చాంపియన్‌గా నిలిచిన రుత్విక శివాని–రోహన్ కపూర్ జంట... తాజా టోర్నీ ఫైనల్లో ఆదివారం 21–16, 19–21, 21–12తో టాప్ సీడ్ అమృత ప్రముథేశ్–అశిత్ సూర్య ద్వయంపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ టైటిల్ రక్షిత శ్రీ సంతోష్ రామ్రాజ్ కైవసం చేసుకుంది. తుదిపోరులో రక్షిత 17–21, 21–12, 21–12తో క్వాలిఫయర్ తన్వి పత్రిపై గెలుపొందింది. తొలి గేమ్ కోల్పోయిన రక్షిత ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో విజృంభించి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి విజేతగా నిలిచింది. గత వారం హైదరాబాద్‌లో జరిగిన టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన రక్షిత ఈ సారి టైటిల్ చేజిక్కించుకుంటే... 13 ఏళ్ల తన్వి పత్రి ఆడిన తొలి సీనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో రన్నరప్ టైటిల్ గెలుచుకోవడం విశేషం. పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ మిథున్ మంజునాథ్ టైటిల్ హస్తగతం చేసుకున్నాడు. ఫైనల్లో మిథున్ 13–5తో ఆధిక్యంలో ఉన్న సమయంలో రాహుల్ భరద్వాజ్ గాయంతో తప్పుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో హరిహరణ్ అంసాకరుణన్–రూబన్ కుమార్ జంట 21–15–21–16తో డింకూ సింగ్–అమాన్ మొహమ్మద్ ద్వయంపై గెలుపొందింది. మహిళల డబుల్స్ ఫైనల్లో ఆరతి సారా సునీల్–వర్షిణి విశ్వనాథ్ శ్రీ జోడీ 21–18, 21–19తో కావ్య గుప్తా–రాధిక శర్మ జంటపై గెలుపొందింది. -
భారత్ X మలేసియా
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ నగరం ఇప్పుడు మరో అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు వేదిక కానుంది. గచ్చిబౌలి వేదికగా నేడు మలేసియాతో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు స్నేహపూర్వక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ ఏడాది ఆరంభంలో ఏఎఫ్సీ ఆసియా కప్ సందర్భంగా గాయపడి తిరిగి కోలుకున్న సీనియర్ డిఫెండర్ సందేశ్ జింగాన్ 10 నెలల తర్వాత పునరాగమనం చేయనుండటంతో భారత జట్టు డిఫెన్స్ బలం మరింత పెరగనుంది. చివరగా భారత జట్టు హైదరాబాద్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో మారిషస్, వియత్నాంతో ‘డ్రా’ చేసుకొని సిరియా చేతిలో 0–3తో పరాజయం పాలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 2027 ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు భారత ఫుట్‌బాల్ జట్టుకు ఇదే చివరి మ్యాచ్. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు జరగగా... చెరో 12 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. మరో ఎనిమిది మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. భారత ఫుట్‌బాల్ జట్టు ఇప్పటి వరకు అత్యధిక సార్లు తలపడిన జట్టు మలేసియానే కావడం విశేషం. ఫిఫా ప్రపంచ ర్యాకింగ్స్లో ప్రస్తుతం భారత జట్టు 125వ స్థానంలో ఉండగా... మలేసియా 133వ ప్లేస్‌లో ఉంది. అయితే విదేశీ ఆటగాళ్లను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించడంతో మలేసియా జట్టు... టీమిండియా కంటే మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. భారత జట్టు తరఫున గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు, సందేశ్ జింగాన్, మెహతాబ్, విశాల్, రోషన్ సింగ్, అమరిందర్ సింగ్, సురేశ్ సింగ్ కీలకం కానున్నారు. భారత ఆటగాళ్లకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) అనుభవం ఈ మ్యాచ్‌లో కలిసిరానుంది. ఈ ఏడాది ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి, మరో నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్న భారత్... తొలి విజయం కోసం ఎదురు చూస్తోంది. ఆసక్తి గల అభిమానులు ్టజీఛిజ్ఛ్టుజ్ఛnజ్ఛీ.జీn లో మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. -
అమ్మాయిలు అజేయంగా
రాజ్‌గిర్ (బీహార్): మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ లీగ్‌లో ఎదురు లేని ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–0తో జపాన్ పై ఘన విజయం సాధించింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ (37వ నిమిషం), దీపిక కుమారి (47వ ని., 48వ ని.) గోల్స్ నమోదు చేశారు. ఆడిన మూడూ గెలిచిన భారత్ 15 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలువగా... పారిస్ ఒలింపిక్స్ రన్నరప్, రజత పతక విజేత చైనా (12) రెండో స్థానంలో నిలిచింది. జపాన్‌తో జరిగిన పోరులో తొలి క్వార్టర్ నుంచే భారత స్ట్రయికర్లు తమ దాడులకు పదునుపెట్టడంతో మూడు పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించాయి. 8వ నిమిషంలో దీపిక తొలి ప్రయత్నాన్ని ప్రత్యర్థి గోల్‌కీపర్ యూ కుడో చాకచక్యంగా ఆడ్డుకుంది. మిడ్‌ఫీల్డర్లు కెపె్టన్ సలీమా టేటే, నేహా, షరి్మలా దేవిలు రెండో క్వార్టర్లో చక్కని సమన్వయంతో ఫార్వర్డ్ లైన్‌కు గోల్స్ అవకాశాలు సృష్టించారు. కానీ జపాన్ రక్షణ పంక్తి అడ్డుకోగలిగింది. దీంతో దీపిక రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. ఎట్టకేలకు మూడో క్వార్టర్లో భారత్ ఖాతా తెరిచింది. వైస్‌కెపె్టన్ నవ్‌నీత్ కౌర్ రివర్స్ షాట్ కొట్టి ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఖరి క్వార్టర్ మొదలవగానే దీపిక చెలరేగింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించుకొని గోల్‌పోస్ట్ లక్ష్యంగా దాడులు చేసింది. ఈ క్రమంలో వరుస పెనాల్టీ కార్నర్లను దీపిక గోల్స్‌గా మలిచి భారత్‌ను గెలిచే స్థితిలో నిలిపింది. చివరి వరకు ఇదే ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ ప్రత్యరి్థకి మాత్రం ఒక్క గోల్ కొట్టకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది. చాంపియన్స్ ట్రోఫీలో దీపిక దూకుడుకు ప్రత్యర్థి డిఫెండర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ టోర్నీలోనే ఆమెది అసాధారణ ప్రదర్శన. నాకౌట్‌కు ముందే ఆమె పది గోల్స్ సాధించింది. ఇందులో 4 ఫీల్డ్ గోల్స్ కాగా, ఐదు పెనాల్టీ కార్నర్ గోల్స్ ఉన్నాయి. మరొకటి పెనాల్టీ స్ట్రోక్‌తో చేసింది. ఆదివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మలేసియా 2–0తో థాయ్‌లాండ్‌పై, చైనా 1–0తో దక్షిణ కొరియాపై గెలుపొందాయి. భారత్ సెమీస్ ప్రత్యర్థి కూడా జపానే! మంగళవారం జరిగే సెమీఫైనల్లో భారత అమ్మాయిల జట్టు... నాలుగో స్థానంలో ఉన్న జపాన్‌తో తలపడుతుంది. -
మాగ్నస్ కార్ల్సన్ ‘డబుల్’
ప్రపంచ నంబర్‌వన్ గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. రెండు రోజుల వ్యవధిలో 18 రౌండ్ల పాటు (9 చొప్పున) జరిగిన ఈ కేటగిరీ పోటీల్లో అతను మరో రౌండ్ మిగిలుండగానే టైటిల్ సాధించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ర్యాపిడ్ టైటిల్ గెలుచుకున్న 33 ఏళ్ల నార్వే సూపర్‌స్టార్ బ్లిట్జ్‌లోనూ తిరుగులేదని నిరూపించుకున్నాడు. శనివారం ఎనిమిదో రౌండ్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ చేతిలో కంగుతిన్న కార్ల్సన్ ఆదివారం జరిగిన ‘రిటర్న్’ ఎనిమిదో రౌండ్లో అర్జున్నే ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకోవడం విశేషం. అప్పటికే 12 పాయింట్లు ఉండటంతో టైటిల్ రేసులో అతనొక్కడే నిలిచాడు. చివరకు ఆఖరి రౌండ్ (9వ)లోనూ కార్ల్సన్... భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతిని ఓడించడంతో మొత్తం 13 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఫిలిపినో–అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో 11.5 పాయింట్లతో రన్నరప్‌తో సంతృప్తి పడగా, తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేశి(10.5)కి మూడో స్థానం దక్కింది. భారత ఆటగాళ్లు ఆర్. ప్రజ్ఞానంద (9.5), విదిత్ (9) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. -
18 ఏళ్ల తర్వాత తొలిసారి..
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో ఈసారి నూతన చాంపియన్ అవతరించనున్నాడు. ఇటలీలోని ట్యూరిన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అమెరికా ప్లేయర్, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్(Taylor Fritz) 6–3, 3–6, 7–6 (7/3)తో రెండుసార్లు చాంపియన్ (2018, 2021), ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలుపొందాడు.18 ఏళ్ల తర్వాతఫలితంగా 18 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో ఓ అమెరికా ఆటగాడు టైటిల్ కోసం తలపడనున్నాడు. చివరిసారి 2006లో అమెరికా ప్లేయర్ జేమ్స్ బ్లేక్ ఫైనల్లోకి ప్రవేశించి తుది సమరంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. 1999లో పీట్ సంప్రాస్ తర్వాత మరో అమెరికా ప్లేయర్ ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ సాధించలేకపోయాడు.ఇక జ్వెరెవ్‌తో 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ఫ్రిట్జ్ 15 ఏస్‌లు సంధించాడు. ఒకసారి తన సర్వీస్‌ను కోల్పోయి, ఒకసారి జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. 31 విన్నర్స్ కొట్టిన ఫ్రిట్జ్ 34 అనవసర తప్పిదాలు చేశాడు. ఫ్రిట్జ్‌తో సినెర్ అమీతుమీఇదిలా ఉంటే.. ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), ప్రపంచ ఆరో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో.. సినెర్ అద్భుత విజయం సాధించాడు. రూడ్‌ను 6-1, 6-2తో చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ క్రమంలో టేలర్ ఫ్రిట్జ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.రొనాల్డో మ్యాజిక్ పోర్టో: యూరోప్ నేషన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పోర్చుగల్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పోలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. పోర్చుగల్ తరఫున రొనాల్డో రెండు గోల్స్ (72వ, 87వ నిమిషాల్లో) సాధించాడు. 87వ నిమిషంలో రొనాల్డో గాల్లో ఎగురుతూ ఓవర్‌హెడ్ కిక్‌తో చేసిన గోల్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రాఫెల్ లియో (59వ నిమిషంలో), ఫెర్నాండెస్ (80వ నిమిషంలో), పెడ్రో నెటో (83వ నిమిషంలో) పోర్చుగల్‌కు ఒక్కో గోల్ సాధించి పెట్టారు. పోలాండ్ జట్టుకు మార్జుక్ (88వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. -
అశు రెయిడింగ్ అదుర్స్
నోయిడా: స్టార్ రెయిడర్ అశు మలిక్ 14 పాయింట్లతో సత్తా చాటడంతో... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో దబంగ్ ఢిల్లీ ఐదో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ జట్టు 35–25 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. 12 రెయిడ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లతో అశు మలిక్ విజృంభించగా... అతడికి డిఫెన్స్‌లో యోగేశ్ దహియా (5 పాయింట్లు) సహకరించాడు. బెంగళూరు బుల్స్ తరఫున నితిన్ రావల్ 7 పాయింట్లు సాధించగా... స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ 5 పాయింట్లకే పరిమితమయ్యాడు. ఫలితంగా మ్యాచ్ ఏ దశలోనూ బెంగళూరు జట్టు ఢిల్లీకి పోటీనివ్వలేకపోయింది. తాజా సీజన్లో 11 మ్యాచ్‌లాడిన దబంగ్ ఢిల్లీ 5 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 32 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఐదో స్థానానికి ఎగబాకింది. పది మ్యాచ్‌ల్లో 8వ పరాజయంతో బెంగళూరు జట్టు పట్టికలో 11వ స్థానానికి పరిమితమైంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 46–31 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. తలైవాస్ తరఫున విశాల్ 12 పాయింట్లతో రాణించగా... బెంగాల్ తరఫున విశ్వాస్ 9 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన తమిళ్ తలైవాస్ 4 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 27 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో ఉంది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తమిళ్ తలైవాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
చైనానూ చుట్టేసి...
రాజ్‌గిర్ (బిహార్): సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా జట్టుతో శనివారం జరిగిన నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (32వ నిమిషంలో), కెప్టెన్ సలీమా టెటె (37వ నిమిషంలో), దీపిక (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో చివరిదైన ఐదో పెనాల్టీ కార్నర్‌ను దీపిక గోల్‌గా మలిచింది. తమకు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను చైనా జట్టు వృథా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఆరంభంలో గట్టిపోటీ లభించింది. తొలి రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. మూడో క్వార్టర్లో భారత క్రీడాకారిణులు ఒక్కసారిగా విజృంభించి ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించారు. చివరి నిమిషంలో దీపిక గోల్‌తో భారత్ విజయం సంపూర్ణమైంది. ఇతర నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ 2–1తో మలేసియాపై, కొరియా 4–0తో థాయ్‌లాండ్‌పై గెలిచాయి. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన చైనా జట్టు 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లకు ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. లీగ్‌లో టాప్ ర్యాంక్ అధికారికంగా ఖరారు కావాలంటే నేడు జపాన్‌తో జరిగే చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్‌ను (సాయంత్రం గం. 4:45 నుంచి) భారత జట్టు ‘డ్రా’ చేసుకుంటే చాలు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత జట్టు 23 గోల్స్ చేసి 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. మరోవైపు చైనా జట్టు 22 గోల్స్ చేసి, 4 గోల్స్‌ను ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. నేడు జరిగే ఇతర చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌తో మలేసియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), దక్షిణ కొరియా జట్టుతో చైనా (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి. -
కార్ల్‌సన్‌కు అర్జున్ షాక్
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్‌వన్, నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌పై అర్జున్ విజయం సాధించాడు. ఎనిమిదో రౌండ్ గేమ్‌లో అర్జున్ ఎత్తులకు చిత్తయిన కార్ల్సన్ 20 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. ఓపెన్ విభాగంలో 10 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు బ్లిట్జ్ టోర్నీ జరుగుతోంది. తొలి రోజు శనివారం 9 రౌండ్ గేమ్‌లు జరిగాయి. తొమ్మిది రౌండ్ గేమ్‌లు ముగిశాక కార్ల్సన్ 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద 6 పాయింట్లతో రెండో స్థానంలో, అర్జున్ 5.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. తొలి రోజు అర్జున్ నాలుగు గేముల్లో గెలిచి (నొదిర్బెక్, నిహాల్ సరీన్, విదిత్, కార్ల్సన్లపై), మూడు గేమ్‌లను (విన్సెంట్, డానిల్ దుబోవ్, నారాయణన్‌లతో) ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో (సో వెస్లీ, ప్రజ్ఞానంద చేతుల్లో) ఓడిపోయాడు. ఇదే టోర్నీలోని మహిళల బ్లిట్జ్ విభాగంలో తొలి రోజు 9 రౌండ్ గేమ్‌లు ముగిశాక భారత ప్లేయర్లు దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, కోనేరు హంపి 4.5 పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక 4 పాయింట్లతో ఏడో స్థానంలో, వైశాలి 3.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. -
ఒడిశా పురుషుల హాకీ జట్టు సంచలనం... తొలిసారి జాతీయ టైటిల్ సొంతం
సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ సీనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్‌లో కొత్త చాంపియన్ అవతరించింది. చెన్నైలో శనివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షి ప్లో ఒడిశా జట్టు తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఒడిశా జట్టు 5–1 గోల్స్ తేడాతో మూడుసార్లు చాంపియన్ హరియాణా జట్టును బోల్తా కొట్టించి జాతీయ చాంపియన్‌గా నిలిచింది. ఒడిశా తరఫున శిలానంద్ లాక్రా (48వ, 57వ, 60వ నిమిషాల్లో) మూడు గోల్స్ సాధించగా... రజత్ ఆకాశ్ టిర్కీ (11వ నిమిషంలో), ప్రతాప్ లాక్రా (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. హరియాణా జట్టుకు జోగిందర్ సింగ్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు.96 ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో ఒడిశా జట్టుకిదే తొలి టైటిల్ కావడం విశేషం. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు 2–1తో మణిపూర్ జట్టును ఓడించింది. -
మైక్ టైసన్‌కు షాకిచ్చిన యువ బాక్సర్ జేక్ పాల్
ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్ మైక్ టైసన్ ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్‌లో జరిగిన బిగ్ బౌట్లో మైక్ టైసన్‌ను సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జేక్ పాల్ ఖంగు తినిపించాడు. ఈ మ్యాచ్‌లో జేక్ పాల్ చేతిలో 74-78 తేడాతో ఐరన్ మైక్ మైక్ ఓటమిపాలయ్యాడు.టైసన్ గేమ్‌లో వయస్సు ప్రభావం స్పష్టంగా కనిపించింది. 58 ఏళ్ల టైసన్ తనకంటే 37 ఏళ్ల చిన్నోడైన జేక్ సూపర్ పంచ్‌లకు తట్టుకోలేకపోయాడు. తొలి రెండు రౌండ్లలో మైక్ టైసన్ ఆధిపత్యం కనబరిచినప్పటకి.. తర్వాతి 8 రౌండ్లలో జేక్ పాల్ తన అద్బుతమైన బాక్సింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.ఆ తర్వాత మైక్ తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయాడు. కొన్ని పంచ్‌లు ఇచ్చినప్పటికి పెద్దగా పవర్ కన్పించలేదు. దీంతో మహాబలుడు మైక్ టైసన్ యువ బాక్సర్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే గెలిచిన వెంటనే జేక్ పాల్ మైక్ టైసన్‌కు తల వంచి నమస్కరించాడు. టైసన్ కూడా పాల్‌ను మంచి ఫైటర్‌గా కొనియాడాడు. ఇక విజేతగా నిలిచిన బాక్సర్ జేక్ పాల్ కు 40 మిలియన్ అమెరికా డాలర్లు ప్రైజ్ మనీగా లభించింది. కాగా మ్యాచ్ ఈ మొదలు కాగాగే పోటెత్తిన వ్యూయర్షిప్తో నెట్‌ఫ్లిక్స్ క్రాష్ అయింది.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు