Other Sports
-
టైసన్... అదే దూకుడు
టెక్సాస్: ఆరు పదుల వయసు సమీపిస్తున్నా... తనలో దుందుడుకుతనం తగ్గలేదని బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ చాటుకున్నాడు. కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన ఈ ప్రపంచ మాజీ హెవీ వెయిట్ చాంపియన్... సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జాక్ పాల్‌తో బౌట్లో తలపడనున్నాడు. ప్రధాన పోటీకి ముందు జరిగిన ఆటగాళ్ల ప్రత్యేక కార్యక్రమంలోనే రెచ్చిపోయిన టైసన్... జాక్ పాల్ చెంప చెళ్లుమనిపించాడు. సుదీర్ఘ కెరీర్లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్లను నాకౌట్ చేశాడు.అసలు పోరుకు ముందు నిర్వహించిన ‘ఫేస్ ఆఫ్’ కార్యక్రమం సమయంలో నిర్వాహకులు అడుగుతున్న ప్రశ్నలకు విసుగెత్తిన టైసన్... ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ని చెంపదెబ్బ కొట్టాడు. ఇప్పటికే ఈ బౌట్‌పై విపరీతమైన అంచనాలు పెరిగిపోగా... టైసన్ ప్రవర్తనతో అది మరింత ఎక్కువైంది. శనివారం జరగనున్న ఈ బౌట్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో ప్రసారం చేయనున్నారు. ఈ ఫైట్‌ను ప్రత్యక్షంగా 60 వేల మంది అభిమానులు... ప్రసార మాధ్యమాల ద్వారా కోట్లాది మంది వీక్షించనున్నారు. 2005లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టైసన్... ఆ తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. షెడ్యూల్ ప్రకారం టైసన్, జాక్ పాల్ మధ్య బౌట్ ఈ ఏడాది జూలైలోనే జరగాల్సి ఉన్నా... ఆ సమయంలో టైసన్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో దాన్ని వాయిదా వేశారు. దూకుడు మీదున్న టైసన్‌కు... ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో పది బౌట్లు నెగ్గిన 27 ఏళ్ల జాక్ పాల్ ఏమాత్రం పోటీనిస్తాడో చూడాలి. ‘చివరి బౌట్లో కెవిన్ మెక్‌బ్రైడ్ చేతిలో ఓడిన తర్వాత జీవితంలో చాలా చూశాను. ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నాను. కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపాను. అన్నిటికి మించి బాక్సింగ్‌నే ఇష్టపడతా. ఒకప్పటి టైసన్ ఇప్పుడు లేడు. నా జీవితంలో ఎక్కువ ఏమీ మిగిలి లేదు. అందుకే మంచి అనుభూతులు సొంతం చేసుకోవాలనుకుంటున్నా’ అని ఫైట్‌కు ముందు టైసన్ అన్నాడు. -
దేవాంక్ ధమాకా
నోయిడా: స్టార్ రెయిడర్ దేవాంక్ 15 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ ఆరో విజయం ఖాతాలో వేసుకుంది. లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో పట్నా పైరేట్స్ 52–31 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది. పట్నా తరఫున దేవాంక్ 10 రెయిడ్ పాయింట్లు, 5 బోనస్ పాయింట్లు సాధించగా... అయాన్ 11 పాయింట్లతో సత్తా చాటాడు. సందీప్ కుమార్ (8 పాయింట్లు), దీపక్ రాఠి (5 పాయింట్లు) కూడా రాణించడంతో పట్నా జట్టు ఘనవిజయం సాధించింది. మరోవైపు బెంగాల్ వారియర్స్ తరఫున నితిన్ కుమార్ (11 పాయింట్లు) ఒంటరి పోరాటం చేశాడు. తాజా సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన పట్నా 6 విజయాలు, 4 పరాజయాలతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకొని నాలుగో స్థానానికి చేరింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 32–24 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 9 పాయింట్లు, నీరజ్ నర్వాల్ 6 పాయింట్లతో రాణించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమాన్ సింగ్ 11 పాయింట్లతో పోరాడిన జట్టును గెలిపించలేకపోయాడు. 9 మ్యాచ్‌లాడిన జైపూర్ 5 విజయాలు, 3 పరాజయాలు, ఒక ‘టై’తో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ (రాత్రి 8 గంటలకు), దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి. -
విజయంతో ముగించిన బోపన్న–ఎబ్డెన్ జోడీ
ట్యూరిన్: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న 2024 సీజన్‌ను విజయంతో ముగించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచింది. ‘బాబ్ బ్రయాన్ గ్రూప్’లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించిన బోపన్న–ఎబ్డెన్ ద్వయం... శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7–5, 6–7 (6/8), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యూట్జ్ (జర్మనీ) జంటను ఓడించింది. ఈ క్రమంలో బోపన్న (44 ఏళ్ల 8 నెలలు) ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో విజయం సాధించిన అతి పెద్ద వయసు్కడిగా రికార్డు నెలకొల్పాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన క్రావిట్జ్–ప్యూట్జ్ జోడీ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. 2023లో ఎబ్డెన్తో జతకట్టిన బోపన్న ఈ టోరీ్నలో చివరిసారి అతనితో కలసి ఆడాడు. వచ్చే సీజన్లో వీరిద్దరు వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగుతారు. ఓవరాల్‌గా బోపన్న–ఎబ్డెన్ జంట ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌తో కలిపి నాలుగు ఏటీపీ టోరీ్నల్లో టైటిల్స్ గెల్చుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా సాధించింది. -
రన్నరప్ ప్రజ్ఞానంద
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 9 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, సో వెస్లీ (అమెరికా) 5.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ప్రజ్ఞానందకు రెండో స్థానం, సో వెస్లీకి మూడో స్థానం లభించాయి. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 7.5 పాయింట్లతో ర్యాపిడ్ టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు. భారత గ్రాండ్‌మాస్టర్లు నిహాల్ సరీన్ (4 పాయింట్లు) ఆరో ర్యాంక్‌లో, ఇరిగేశి అర్జున్ (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో, విదిత్ (3 పాయింట్లు) తొమ్మిదో ర్యాంక్‌లో, ఎస్ఎల్ నారాయణన్ (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్‌లో నిలిచారు. వంతికకు మూడో స్థానం ఇదే టోర్నీ మహిళల ర్యాపిడ్ విభాగంలో భారత యువ క్రీడాకారిణి వంతిక అగర్వాల్ 5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 7.5 పాయింట్లతో అలెక్సాండ్రా గొర్యాక్చినా (రష్యా) చాంపియన్‌గా అవతరించింది. 5.5 పాయింట్లతో నానా జాగ్‌నిద్జె (జార్జియా) రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక (4.5 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో, దివ్య దేశ్‌ముఖ్ (3.5 పాయింట్లు) ఏడో ర్యాంక్‌లో, వైశాలి (3.5 పాయింట్లు) ఎనిమిదో ర్యాంక్‌లో, కోనేరు హంపి (3 పాయింట్లు) చివరిదైన పదో ర్యాంక్‌లో నిలిచారు. -
పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో వరుసగా నాలుగు విజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టుకు పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 34–40 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్ తరఫున విజయ్ మలిక్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా... కెప్టెన్ పవన్ సెహ్రావత్ 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. యూపీ యోధాస్ తరఫున భవాని రాజ్‌పుత్ 12, భరత్ 11 పాయింట్లు సాధించారు. తాజా సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 5 విజయాలు, 4 పరాజయాలలతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ యోధాస్ లీగ్‌లో నాలుగో మ్యాచ్ నెగ్గి 25 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో యు ముంబా 35–32 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. యు ముంబా తరఫున మన్జీత్ 10 పాయింట్లు, అజిత్ చవాన్ 8 పాయింట్లు సాధించగా... తలైవాస్ తరఫున మోయిన్ 10 పాయింట్లతో పోరాడాడు. 10 మ్యాచ్‌లాడి 6వ విజయం నమోదు చేసుకున్న యు ముంబా జట్టు 34 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరగా... వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓటమి పాలైన తమిళ్ తలైవాస్ 22 పాయింట్లతో పట్టికలో 10వ స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
సింధు ఐదో‘సారీ’
కుమమోటో: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న మూడో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ 23వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా ప్లేయర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–17, 16–21, 17–21తో పోరాడి ఓడిపోయింది. మిచెల్లి లీ చేతిలో సింధుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. మిచెల్లిపై 10 సార్లు నెగ్గిన సింధుకు ఈసారి మాత్రం నిరాశ తప్పలేదు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... ఆ తర్వాతి రెండు గేముల్లో కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకుంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో రెండుసార్లు (మిక్స్డ్ టీమ్ మ్యాచ్, సింగిల్స్ సెమీఫైనల్) సింధును ఓడించిన మిచెల్లి ఆ తర్వాత 2023లో థాయ్‌లాండ్ ఓపెన్‌లో మూడోసారి సింధుపై నెగ్గింది. ఈ ఏడాది ఆర్క్టిక్ ఓపెన్‌లో నాలుగోసారి సింధును ఓడించిన మిచెల్లి నెల తిరిగేలోపు జపాన్ ఓపెన్‌లో మరోసారి గెలుపు రుచి చూసింది. -
దీపిక ఐదు గోల్స్... సెమీస్‌లో భారత్
రాజ్‌గిర్ (బిహార్): ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్ జట్టుతో గురువారం జరిగిన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 13–0 గోల్స్ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. భారత్ తరఫున దీపిక అత్యధికంగా ఐదు గోల్స్ (3వ, 19వ, 43వ, 45వ, 45వ నిమిషంలో) చేయగా ... ప్రీతి దూబే (9వ, 40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (12వ, 56వ నిమిషంలో), మనీషా చౌహాన్ (55వ, 58వ నిమిషంలో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. బ్యూటీ డుంగ్‌డుంగ్ (30వ నిమిషంలో), నవ్‌నీత్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఈ గెలుపుతో భారత జట్టు అధికారికంగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఆరు జట్లు మూడేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, భారత్ 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే గోల్స్ అంతరం కారణంగా చైనా (చేసిన గోల్స్ 22; ఇచ్చిన గోల్స్ 1) టాప్ ర్యాంక్‌లో, భారత్ (చేసిన గోల్స్ 20; ఇచ్చిన గోల్స్ 2) రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. 3 పాయింట్లతో మలేసియా మూడో స్థానంలో, 2 పాయింట్లతో జపాన్ నాలుగో స్థానంలో, 1 పాయింట్‌తో కొరియా ఐదో స్థానంలో, 1 పాయింట్‌తో థాయ్‌లాండ్ ఆరో స్థానంలో ఉన్నాయి. నిర్ణీత ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్తాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా చైనా, భారత జట్ల తొమ్మిది పాయింట్లను మిగతా జట్లు దాటే పరిస్థితి లేదు. దాంతో ఈ రెండు జట్లకు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. మూడో నిమిషంలో మొదలై... గత పదేళ్లలో ఏడోసారి థాయ్‌లాండ్‌తో తలపడిన భారత జట్టుకు ఈసారీ ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌కు ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకొని 39 గోల్స్ సాధించిన భారత జట్టు ఏడోసారీ అదే దూకుడును కొనసాగించింది. మూడో నిమిషంలో దీపిక చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అటునుంచి టీమిండియా వెనుదిరిగి చూడలేదు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 11 పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో ఐదింటిని మాత్రమే భారత్ గోల్స్‌గా మలిచింది. లేదంటే విజయాధిక్యం మరింతగా ఉండేది. గురువారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో చైనా 2–1 గోల్స్‌తో జపాన్‌పై, మలేసియా 2–1 గోల్స్‌తో కొరియాపై గెలిచాయి. శనివారం జరిగే నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియాతో జపాన్; కొరియాతో థాయ్‌లాండ్; చైనాతో భారత్ తలపడతాయి. -
Peruri Jyoti Varma: పవర్ ఫుల్
విరామం అంటే వెనక్కి తగ్గడం కాదు, పరాజయం అంతకంటే కాదు. విత్తనం నాటిన రోజు నుంచి అది పచ్చగా మొలకెత్తడానికి మధ్య కూడా విరామం ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్‌బాల్ గేమ్ నేషనల్ ప్లేయర్ అయిన జ్యోతి పెళ్లి తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. విరామం తర్వాత మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పేరూరి జ్యోతి పవర్ లిఫ్టింగ్‌లో తక్కువ సమయలోనే సాధన చేసి గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో 45 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది. నిజానికి అది పతకం కాదు... అపూర్వమైన ఆత్మవిశ్వాసం...జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్‌పూర్. పెళ్లికిముందు హ్యాండ్‌బాల్ గేమ్‌లో నేషనల్ ప్లేయర్. 1994లో ‘విజ్ఞాన్ యూనివర్శిటీ’లో ప్రొఫెసర్‌గా చేస్తున్న డాక్టర్ పిఎల్ఎన్ వర్మతో వివాహం జరగడంతో గుంటూరుకు వచ్చింది. కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు దూరంగా ఉండక తప్పలేదు. అయితే వ్యాయామాలకు, యోగ సాధనకు విరామం ఇవ్వలేదు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం పని... వంటి అభిరుచుల పట్ల మక్కువను విడవలేదు. మనం అడుగుపెట్టే స్థలాలు కూడా భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి అంటారు. జ్యోతి విషయంలో అలాగే జరిగింది.ఏడాది క్రితం స్థానిక ‘ఇన్ఫినిటీ జిమ్’లో చేరి రకరకాల వ్యాయామాలు చేసేది. ఆమె ఉత్సాహం, పట్టుదల చూసి కోచ్ రమేష్ శర్మ ‘మీరు పవర్ లిఫ్టింగ్‌లో అద్భుతాలు సాధించగలరు’ అన్నారు. ఆమె నవ్వుతూ ఊరుకుంటే ఆ కథ అక్కడితో ముగిసేది. కోచ్ మాటలను ఆమె సీరియస్‌గా తీసుకుంది. ‘ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు’ అనుకున్నది. అలా అనుకోవడంలో పతకాలు సాధించాలనే ఆశయం కంటే... ఆటల పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమే కారణం. ఆరు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్‌లో సాధన మొదలుపెట్టింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఇంకా నువ్వు కాలేజీ స్టూడెంటే అని అనుకుంటున్నావా’ లాంటి వెటకారాలు వినిపించాయి. అయితే ఈ వెటకారాలు, మిరియాలు ఆమె సాధన ముందు నిలవలేకపోయాయి. మరింత దీక్షతో సాధన చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్‌లో కొద్దితేడాతో పతకం మిస్ అయింది. ‘పతకంతో తిరిగి వస్తావనుకున్నాం’ అన్నారు మిత్రులు. ‘వంద పతకాలతో తిరిగి వచ్చాను’ అన్నది జ్యోతి నవ్వుతూ. ఆమె చెప్పిన వంద పతకాలు... ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్స్ చాంపియన్ షిప్లో రికార్డు స్థాయిలో 45 కేజీలు బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిజానికి ఇదిప్రారంభం మాత్రమే. ఆమె ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో పడతాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే...ఏదైనా సాధించాలంటే మన విలువ మనం ముందుగా గుర్తించాలి. నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుంది. నాకు ఆరోగ్య సమస్యలున్నాయి. హైపో థైరాయిడ్, స్పాండిలైటిస్ నన్ను ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాను. రోజూ యోగ, జిమ్, మెడిటేషన్, గార్డెనింగ్ చేస్తాను.– పేరూరి జ్యోతి– దాళా రమేష్‌బాబు, సాక్షి, గుంటూరుఫొటోలు: మురమళ్ల శ్రీనివాసరావు. -
సింధు శుభారంభం
కుమమోటో: జపాన్ ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుసానన్ ఒంగ్మమ్రుంగ్ఫన్ (థాయ్‌లాండ్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–12, 21–8తో అలవోకగా గెలిచింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న బుసానన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకొని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఓవరాల్‌గా సింధు, బుసానన్ల మధ్య ఇది 20వ ముఖాముఖి పోరు కావడం విశేషం. సింధు ఏకంగా 19 సార్లు గెలుపొందగా... థాయ్‌లాండ్ ప్లేయర్ ఒక్కసారి మాత్రమే సింధును ఓడించింది. బుసానన్ ఆటతీరుపై స్పష్టమైన అవగాహన ఉన్న సింధుకు తొలి గేమ్ ఆరంభంలో గట్టిపోటీ లభించింది. ఒకదశలో సింధు, బుసానన్ (11–10) మధ్య ఒక్క పాయింటే అంతరంగా నిలిచింది. అయితే నెమ్మదిగా సింధు జోరు పెంచగా... థాయ్‌లాండ్ ప్లేయర్ తడబడింది. స్కోరు 14–12 వద్ద సింధు చెలరేగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... వరుసగా ఏడు పాయింట్లతో అదరగొట్టిన సింధు తొలి గేమ్‌ను 21–12తో దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ ఆరంభంలో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. స్కోరు 5–4 వద్ద సింధు విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 10–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బుసానన్ వరుసగా మూడు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. కానీ స్కోరు 10–7 వద్ద సింధు వరుసగా 10 పాయింట్లు సంపాదించి 20–7తో ముందంజ వేసింది. ఆ తర్వాత బుసానన్ ఒక పాయింట్ సాధించిన వెంటనే సింధు కూడా ఒక పాయింట్ నెగ్గడంతో భారత స్టార్ విజయం ఖరారైంది. పోరాడి ఓడిన లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత కథ తొలి రౌండ్లోనే ముగిసింది. భారత స్టార్ లక్ష్య సేన్ 74 నిమిషాల పోరులో కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ 31వ ర్యాంకర్ జున్ హావో లియోంగ్ (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 22–20, 17–21, 16–21తో ఓడిపోయాడు. గతంలో జున్ హావోపై మూడుసార్లు నెగ్గిన లక్ష్య సేన్ ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. -
సినెర్ అలవోకగా...
ట్యూరిన్ (ఇటలీ): సొంతగడ్డపై ఇటలీ టెన్నిస్ సూపర్‌స్టార్ యానిక్ సినెర్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సినెర్ వరుసగా రెండో విజయం సాధించాడు. ‘ఇలీ నస్టాసే గ్రూప్’లో భాగంగా టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో సినెర్ 6–4, 6–4తో గెలుపొందాడు. ఈ విజయంతో సినెర్‌కు సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖరారైంది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ ఆరు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఒక్కో సెట్లో ఒక్కోసారి ఫ్రిట్జ్ సర్వీస్‌ను సినెర్ బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు గెలిచాడు. 21 విన్నర్స్ కొట్టిన అతను 22 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు ఫ్రిట్జ్ ఏడు ఏస్‌లతో రాణించినా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. 20 విన్నర్స్ కొట్టిన ఫ్రిట్జ్ 31 అనవసర తప్పిదాలు చేశాడు. ‘జాన్ న్యూకోంబ్ గ్రూప్’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ తొలి విజయం నమోదు చేసుకున్నాడు. ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6–3, 7–6 (10/8)తో గెలుపొందాడు. గంటా 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ 10 ఏస్‌లు సంధించాడు. రెండుసార్లు రుబ్లెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ 33 విన్నర్స్‌తో అలరించాడు. బోపన్న జోడీకి మరో ఓటమి ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీకి వరుసగా రెండో పరాజయం ఎదురైంది. మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)–మ్యాట్ పావిచ్ (క్రొయేíÙయా) జంటతో జరిగిన మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 5–7, 3–6తో ఓడిపోయింది. -
జాతీయ జట్టులోకి విదేశీ ఆటగాళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాల్లో మాదిరిగా భారత్‌లో కూడా విదేశీ ప్లేయర్లను జాతీయ జట్టు తరఫున ఆడించే నిబంధనలను అమల్లోకి తెస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని భారత ఫుట్‌బాల్ జట్టు గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు. చాలా దేశాల్లో విదేశీ క్రీడాకారులు నిర్దిష్ట సమయంపాటు నివసిస్తే వాళ్లకు ఆ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చే నిబంధన అమల్లో ఉంది. అయితే భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వం, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఆ దిశగా ఆలోచన చేయడం మంచిదని గుర్ప్రీత్ సూచించాడు. దాని కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకువస్తే మంచిదని సూచనాప్రాయంగా అన్నాడు. ఇలా విదేశీ ప్లేయర్లు జాతీయ జట్టు తరఫున ఆడితే... మన ప్లేయర్లకు కూడా చాలా ఉపయుక్తకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఏఎఫ్సీ ఆసియా కప్‌నకు అర్హత సాధించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్న గుర్ప్రీత్... కొత్త కోచ్ మానొలో సారథ్యంలో జట్టు మంచి విజయాలు సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీకి ముందు భారత్ చివరి అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఈ నెల 18న హైదరాబాద్ వేదికగా మలేసియాతో తలపడుతుంది. మలేసియా జట్టులో పలువురు విదేశీ ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో గుర్ప్రీత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం గుర్ప్రీత్ ఆన్లైన్లో మాట్లాడుతూ... ‘గతం గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. జరిగిందేదో జరిగింది. ప్రతీసారి గెలవాలనే లక్ష్యంతోనే మైదానంలో అడుగు పెడతాం. కొన్నిసార్లు అది సాధ్యం కాదు. మలేసియాతో పోరు కోసం బాగా సన్నద్ధమవుతున్నాం. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు మాకు ఇదే చివరి మ్యాచ్. మలేసియా జట్టులో విదేశాలకు చెందిన 14 మంది ప్లేయర్లు ఉన్నారు. స్పెయిన్‌కు చెందిన మారాలెస్, బ్రెజిల్‌కు చెందిన ఎన్డ్రిక్ డాస్, సాన్టోస్ వంటి పలువురు ఆటగాళ్లు మలేసియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నిబంధన వల్ల వాళ్లకు అదనపు ప్రయోజనం చేకూరడం ఖాయం. మనం కూడా ఆ దిశగా ఆలోచిస్తే మంచిది. శ్రీలంక జట్టు కూడా ఇలా విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఇస్తోంది’ అని అన్నాడు. భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదు. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే గతంలో విదేశాల్లోస్థిరపడిన భారత సంతతి ఆటగాళ్లను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేసినా... అది కార్యరూపం దాల్చలేదు. -
హరియాణా స్టీలర్స్ ‘టాప్’ షో
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో హరియాణా స్టీలర్స్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోరులో హరియాణా స్టీలర్స్ 37–32 పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. లీగ్‌లో హరియాణా జట్టుకు ఇది వరుసగా నాలుగో విజయం కాగా... 36 పాయింట్లు ఖాతాలో వేసుకున్న స్టీలర్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరింది. హరియాణా తరఫున వినయ్, మొహమ్మద్ రెజా చెరో 6 పాయింట్లతో సత్తా చాటారు. పట్నా తరఫున దేవాంక్, అయాన్ చెరో 7 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 47–28 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది. తాజా సీజన్లో గుజరాత్‌కు ఇది రెండో విజయం కాగా... బెంగాల్‌కు మూడో పరాజయం. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), తమిళ్ తలైవాస్‌తో యు ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
అర్జున్ మూడు గేమ్‌లు ‘డ్రా’
టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తొలి రోజు ఆడిన మూడు గేమ్‌లనూ ‘డ్రా’ చేసుకున్నాడు. కోల్‌కతాలో జరుగుతున్న ఈ టోర్నీలో అర్జున్–నిహాల్ సరీన్ (భారత్) తొలి గేమ్ 44 ఎత్తుల్లో... అర్జున్–విదిత్ (భారత్) రెండో గేమ్ 35 ఎత్తుల్లో... అర్జున్–నారాయణన్ (భారత్) మూడో గేమ్ 67 ఎత్తుల్లో ‘డ్రా ’గా ముగిశాయి. మహిళల విభాగంలో భారత స్టార్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య కూడా తమ తొలి మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. -
భవ్‌తేగ్ సింగ్ గిల్‌కు స్వర్ణం
ప్రపంచ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ భవ్‌తేగ్ సింగ్ గిల్(Bhavtegh Singh Gill) పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషల స్కీట్ విభాగంలో 21 ఏళ్ల భవ్‌తేగ్ సింగ్ గిల్ 58 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచాడు. జూనియర్ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న భవ్‌తేగ్ సింగ్... ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో నాలుగు పతకాలు సాధించాడు.వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లోనూ భవ్‌తేగ్ సింగ్ అదిరే గురితో ఆకట్టుకోగా... పెట్రోస్ ఎంగ్లెజోడిస్ (సిప్రస్)కు రజతం, భారత షూటర్ అభయ్ సింగ్‌కు కాంస్య పతకాలు లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 125 పాయింట్లకు గానూ 122 పాయింట్లు సాధించిన అభయ్ సింగ్ అగ్రస్థానంలో నిలవగా... 119 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో భవ్‌తేగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. దీంతో పాటు మంగళవారం భారత్ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు కూడా చేరాయి.అదే విధంగా.. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో సిమ్రన్ప్రీత్ కౌర్ బ్రార్, మహిళల స్కీట్ విభాగంలో యశస్వి రాథోడ్, పురుషుల స్కీట్ ఈవెంట్లో అభయ్ సింగ్ షెఖాన్ కాంస్యాలు గెలుచుకున్నారు. మహిళల స్కీట్‌లో యశస్వి 38 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. గియాడా లోంఘీ (ఇటలీ), అడెలా సుపెకోవా (స్లొవకియా) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో యశస్వి 114 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుదిపోరుకు చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సిమ్రన్ప్రీత్ 30 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. కిమ్ మినెసో (35 పాయింట్లు; కొరియా), ఫౌరె హెలోయిస్ (34 పాయింట్లు; ఫ్రాన్స్) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో 23 దేశాలకు చెందిన 220 మంది షూటర్లు పాల్గొంటున్నారు. -
ఢిల్లీ, పుణేరి హోరాహోరీ
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో హోరాహోరీ సమరాలు కొనసాగుతున్నాయి. మంగళవారం దబంగ్ ఢిల్లీ–పుణేరి పల్టన్ మధ్య జరిగిన పోరు 38–38 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. దబంగ్ ఢిల్లీ తరఫున అషు మాలిక్ 17 పాయింట్లతో సత్తాచాటగా... మోహిత్ దేశ్వాల్ (6 పాయింట్లు) అతడికి సహకరించాడు. ఇతర ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తన సూపర్ రెయిడ్లతో అషు పాయింట్లు సాధించడంతో ఢిల్లీ జట్టు పోటీలో నిలిచింది. మరోవైపు పల్టన్ తరఫున ఆకాశ్ షిండే (8 పాయింట్లు), మోహిత్ గోయత్ (6 పాయింట్లు), అమన్ (6 పాయింట్లు) రాణించారు. ఓవరాల్‌గా దబంగ్ ఢిల్లీ మ్యాచ్‌లో 24 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... పుణేరి పల్టన్ 18 పాయింట్లకే పరిమితమైంది. ట్యాకిలింగ్‌లో ఢిల్లీ 9 పాయింట్లు సాధిస్తే... పల్టన్ 13 పాయింట్లతో సత్తాచాటింది. ఇరు జట్లు రెండేసి సార్లు ఆలౌట్ కాగా... దంబగ్ ఢిల్లీ జట్టుకు ఒక సూపర్ రెయిడ్ పాయింట్ దక్కింది. ఈ ఫలితంతో తాజా సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన పుణేరి పల్టన్ 5 విజయలు, 2 పరాజయాలు, 2 ‘టై’లతో 33 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ప్లేస్‌లో కొనసాగుతోంది. 10 మ్యాచ్‌లాడిన దబంగ్ ఢిల్లీ 4 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 27 పాయింట్లు సాధించి పట్టిక ఐదో స్థానంలో ఉంది. అర్జున్ అదరహో..పీకేఎల్‌లో భాగంగా మంగళవారమే జరిగిన మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ ఘనవిజయం సాధించింది. షహీద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన పోరులో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు 39–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో దుమ్మురేపాడు. రెండుసార్లు పీకేఎల్ టైటిల్ సాధించిన జైపూర్ జట్టను అర్జున్ ఒంటి చేత్తో విజయం సాధించి పెట్టాడు. రెయిండింగ్‌లో అర్జున్ దూకుడు కనబరిస్తే... డిఫెన్స్‌లో లక్కీ శర్మ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ప్రదీప్ నర్వాల్ గైర్హాజరీలో బరిలోకి దిగిన బెంగళూరు బుల్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రధాన ఆటగాడు దూరం కావడంతో... ఆ జట్టు పింక్ పాంథర్స్‌కు పోటీనివ్వలేకపోయింది. అజింక్యా పవార్ (9 పాయింట్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... పింక్ పాంథర్స్ 19 పాయింట్లు సాధించింది. ట్యాకిలింగ్‌లో బుల్స్ 8 పాయింట్లకు పరిమితం కాగా... జైపూర్ 14 పాయింట్లతో సత్తాచాటింది. జైపూర్ పింక్ పాంథర్స్‌కు 8 మ్యాచ్‌ల్లో ఇది నాలుగో విజయం కాగా... 3 పరాజయాలు, ఒక ‘టై’తో 25 పాయింట్లు సాధించి పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన తమ్మిది మ్యాచ్‌ల్లో ఏడో పరాజయం మూటగట్టుకున్న బెంగళూరు బుల్స్ పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. -
మెద్వెదెవ్ విజయం
ట్యూరిన్ (ఇటలీ): టాప్ టెన్నిస్ స్టార్ల మధ్య జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్ టోర్నమెంట్లో రష్యా ప్లేయర్ డానిలి మెద్వెదెవ్ రెండో లీగ్ మ్యాచ్‌లో గెలిచి గట్టెక్కాడు. మంగళవారం జరిగిన పోరులో మెద్వెదెవ్ 6–2, 6–4తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగిన పోరులో వరుస సెట్లలో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో కంగుతిన్న రష్యన్ స్టార్ ఈ సారి ఆ పొరపాటు చేయలేదు. ఆరంభం నుంచే తన రాకెట్‌కు పదును పెట్టిన మెద్వెదెవ్ ఆస్ట్రేలియా ప్రత్యర్థిపై అలవోక విజయం సాధించాడు. ఆసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టాప్–8 ర్యాంకింగ్ ప్లేయర్లను గ్రూపులో నలుగురు చొప్పున విభజించి రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ సీజన్ ముగింపు టోర్నీని నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్ నుంచి తొలిరెండు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు సెమీఫైనల్స్‌కు అర్హత సంపాదిస్తారు. గురువారం జరిగే పోటీల్లో సినెర్‌తో మెద్వెదెవ్, ఫ్రిట్జ్‌తో డి మినార్ తలపడతారు. మరో గ్రూప్ మ్యాచ్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4తో రుబ్లెవ్ (రష్యా)పై గెలుపొందాడు. డబుల్స్ పోరులో ఏడో సీడ్ హ్యారి హెలియోవార (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) జోడీ 7–6 (8/3), 7–5తో ఆస్ట్రేలియాకు చెందిన ఐదో సీడ్ జోర్డాన్ థాంప్సన్–మ్యాక్స్ పుర్సెల్ జంటపై గెలుపొందింది. -
దీపిక డబుల్ ధమాకా
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు జోరు కనబరుస్తోంది. తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో మలేసియాను చిత్తు చేసిన భారత జట్టు... రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియాను బోల్తా కొట్టించింది. హోరాహోరీగా సాగిన పోరులో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై గెలుపొందింది. మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాల ముందు స్ట్రయికర్ దీపిక కుమారి పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలచడంలో భారత్ ఈ టోరీ్నలో వరసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. మన జట్టు తరఫున దీపిక (20వ, 57వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో మెరవగా... సంగీత కుమారి (3వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. కొరియా తరఫున యూరీ లీ (34వ ని.లో), కెపె్టన్ ఇన్బి చియోన్ (38వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ... దూకుడైన ఆటతో ముందుకు సాగిన భారత్... మూడో నిమిషంలోనే సంగీత కుమారి ఫీల్డ్ గోల్‌తో ఖాతా తెరిచింది. ఆ తర్వాత రెండో క్వార్టర్లో దీపిక మరో ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 2–0తో సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. అప్పటి వరకు భారత గోల్ పోస్ట్‌పై ఒక్కసారి కూడా దాడి చేయలేకపోయిన కొరియా ప్లేయర్లు... మూడో క్వార్టర్స్‌లో నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరు సమం చేశారు. ఇక అక్కడి నుంచి ఆధిక్యం కోసం ఇరు జట్లు హోరాహోరీగా ప్రయత్నించగా... చివరకు దీపిక గోల్‌తో భారత్ విజయపతాక ఎగరేసింది. మరోవైపు థాయ్‌లాండ్, జపాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’ కాగా... చైనా 5–0తో మలేసియాపై విజయం సాధించింది. తమ తదుపరి మ్యాచ్‌లో గురువారం థాయ్‌లాండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత జట్టు 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. -
జ్యోతి సురేఖకు కాంస్య పతకం
సాక్షి, హైదరాబాద్: జేవీడీ ఓపెన్ ఇండోర్ ఆర్చరీ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ కాంస్య పతకం గెలిచింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ 900 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. 18 మీటర్ల దూరం ఉన్న లక్ష్యంవైపు ఆయా ప్లేయర్లు 30 బాణాలను మూడుసార్లు చొప్పున సంధించారు.నిర్ణీత 90 బాణాల తర్వాత సురేఖతోపాటు ఎలీసా రోనెర్ (ఇటలీ), అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా), ఆండ్రియా మునోజ్ (స్పెయిన్) 900 పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే పతకాల వర్గీకరణ కోసం కేంద్ర బిందువుపై కొట్టిన అత్యధిక షాట్లను లెక్కలోకి తీసుకున్నారు. ఫలితంగా ఎలీసా రోనెర్ (87)కు స్వర్ణ పతకం, అలెజాంద్రా (80) రజతం, జ్యోతి సురేఖ (79)కు కాంస్య పతకం ఖరారయ్యాయి. ఉమామహేశ్‌కు నాలుగో స్థానం న్యూఢిల్లీ: వరల్డ్ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఉమమహేశ్ 208.8 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. -
శుభారంభంపై సింధు దృష్టి
కుమమొటో: భారత స్టార్ షట్లర్లు పూసర్ల వెంకట (పీవీ) సింధు, లక్ష్యసేన్ వైఫల్యాలను అధిగమించి టైటిళ్ల వేటలో పడాలనే పట్టుదలతో జపాన్ ఓపెన్ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి జపాన్ మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్ జరగనుంది. ఇద్దరు భారత అగ్రశ్రేణి షట్లర్లు పారిస్ ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన ఏ టోర్నీలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేకపోయారు. గతంలో ఒక సీజన్లో వరుస టైటిల్స్ సాధించిన వారు ఇప్పుడు కనీసం క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోవడం ఇబ్బందికరంగా మారింది. రెండు ఒలింపిక్ పతకాల విజేత, ఆంధ్రప్రదేశ్ వెటరన్ స్టార్ పీవీ సింధు ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే విఫలమైనా... డెన్మార్క్ ఓపెన్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్ చేరింది. కానీ లక్ష్యసేన్ మాత్రం ఈ రెండు టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే కంగుతిని ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 29 ఏళ్ల సింధు... థాయ్‌లాండ్‌కు చెందిన ఎనిమిదో సీడ్ బుసానన్‌తో తలపడనుండగా, పురుషుల ఈవెంట్లో 23 ఏళ్ల లక్ష్యసేన్ మలేసియాకు చెందిన లియోంగ్ జున్ హవొను ఎదుర్కొంటాడు. తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే... అతను రెండో రౌండ్లో ఎనిమిదో సీడ్ ఆంథోనీ గిన్టింగ్ (ఇండోనేసియా)తో పోటీపడే అవకాశముంది. ఇక డబుల్స్‌లో ఒకే ఒక్క భారత జోడీ బరిలో ఉంది. పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జంట మహిళల డబుల్స్ మొదటి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన సూ యిన్ హూ–లిన్ జి యున్ జోడీతో తలపడుతుంది. కొత్త కోచ్‌ల మార్గదర్శనంలో టోర్నీ కోసం సిద్ధమైనట్లు సింధు చెప్పింది. ‘నేనిపుడు బాగా ఆడుతున్నాను. శారీరకంగా, మానసికంగానూ దృఢంగా ఉన్నాను. కొన్ని లోపాలపై కసరత్తు చేశాం. కోర్టులో డిఫెన్స్, స్పీడ్ మెరుగుపర్చుకునేందుకు ఇటీవల బాగా శ్రమించాను. జపాన్‌తో పాటు త్వరలో చైనాలో జరిగే టోరీ్నలోనూ రాణిస్తాను’ అని సింధు ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం, కోచ్ లీ స్యూన్, అనూప్ శ్రీధర్‌లతో ఆమె శిక్షణ తీసుకుంటుంది. -
పట్నా పైరేట్స్ ప్రతాపం
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ జోరు కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 40–27 పాయింట్లతో ఏకపక్ష విజయం సాధించింది. పైరేట్స్ తరఫున రెయిడర్ అయాన్ 10 పాయింట్లతో టాపర్‌గా నిలవగా... దేవాంక్ (6 పాయింట్లు), సందీప్ (5 పాయింట్లు) సహకరించారు. గుజరాత్ ఆటగాళ్లలో అంతా సమష్టి ప్రదర్శన చేసినా అది ఓటమి నుంచి తప్పించుకునేందుకు సరిపోలేదు. గుమన్ సింగ్, పార్తీక్ దహియా చెరో 5 పాయింట్లు స్కోరు చేశారు. తొలి అర్ధభాగంలో 21–16తో ముందంజలో నిలిచిన పట్నా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో నెగ్గిన గుజరాత్ టీమ్‌కు ఇది వరుసగా ఏడో పరాజయం కావడం విశేషం. పట్టికలో ప్రస్తుతం పట్నా పైరేట్స్ నాలుగో స్థానంలో (27 పాయింట్లు), గుజరాత్ జెయింట్స్ చివరి స్థానంలో (7 పాయింట్లు) కొనసాగుతున్నాయి. నేడు జరిగే పోటీల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్... పుణేరీ పల్టన్‌తో దంబగ్ ఢిల్లీ తలపడతాయి. హరియాణా స్టీలర్స్ హ్యాట్రిక్ మరోవైపు హరియాణా స్టీలర్స్ జట్టు తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. లీగ్‌లో వరుసగా మూడో విజయంతో స్టీలర్స్ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా 48–39 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాను ఓడించింది. విశాల్, శివమ్, మొహమ్మద్ రెజా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెయిడర్లు విశాల్, శివమ్ చెరో 11 పాయింట్లతో సత్తా చాటగా... ఆల్‌రౌండర్ రెజా 10 పాయింట్లు సాధించాడు. ముంబా తరఫున అజిత్ చౌహాన్ ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. రెయిడర్ అజిత్ ఒక్కడే ఏకంగా 18 పాయింట్లు సాధించగా... మిగతా వారంతా విఫలమయ్యారు. తొలి అర్ధ భాగం ముగిసేసరికి ముంబా 23–23 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నా... రెండో అర్ధభాగంలో అనూహ్యంగా వెనుకబడిపోయింది. ముంబా 16 పాయింట్లు మాత్రమే సాధించగా... హరియాణా ఖాతాలో 25 పాయింట్లు చేరాయి. 8 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించిన హరియాణా మొత్తం 31 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 29 పాయింట్లతో ముంబా మూడో స్థానంలో కొనసాగుతోంది. -
భారత కొత్త నంబర్‌వన్‌గా శ్రీవల్లి రష్మిక
మహిళల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో భారత కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక అవతరించింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో 22 ఏళ్ల రష్మిక రెండు స్థానాలు పడిపోయి 302వ స్థానంలో నిలిచింది. మూడు నెలలుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ ప్లేయర్ సహజ యామలపల్లి ఏకంగా 18 స్థానాలు పడిపోయి 304వ ర్యాంక్‌కు చేరుకోవడం రషి్మకకు కలిసొచి్చంది. భారత్‌కే చెందిన అంకిత రైనా 306వ ర్యాంక్‌లో, వైదేహి 405వ ర్యాంక్‌లో ఉన్నారు. -
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీ విజేత అరవింద్
చెన్నై: వరుసగా రెండో ఏడాది చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీ టైటిల్ భారత గ్రాండ్‌మాస్టర్‌కు దక్కింది. గత ఏడాది ఈ టైటిల్‌ను తమిళనాడు ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ దక్కించుకోగా... ఈ ఏడాది తమిళనాడుకే చెందిన గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. నిరీ్ణత ఏడు రౌండ్ల తర్వాత అరవింద్, అరోనియన్ (అమెరికా), భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 4.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. చివరిదైన ఏడో రౌండ్లో అరవింద్ 64 ఎత్తుల్లో పర్హామ్ (ఇరాన్)పై గెలుపొందగా... లాగ్రెవ్‌తో అర్జున్; అరోనియన్‌తో అమీన్; విదిత్‌తో అలెక్సీ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్‌ను నిర్వహించారు. ఓవరాల్‌గా మెరుగైన టైబ్రేక్ స్కోరు కారణంగా అరవింద్ నేరుగా ఫైనల్లోకి ప్రవేశించగా... అర్జున్, అరోనియన్ మధ్య జరిగిన సెమీఫైనల్లో అరోనియన్ గెలిచి ఫైనల్లో అరవింద్‌తో తలపడ్డాడు. ఫైనల్లో అరవింద్ 2–0తో అరోనియన్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించాడు. అర్జున్‌కు మూడో స్థానం లభించింది. -
భారత్ శుభారంభం
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 4–0 గోల్స్ తేడాతో మలేసియా జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (8వ, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ప్రీతి దూబే (43వ నిమిషంలో), ఉదిత (44వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఇతర తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా 15–0తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేయగా... జపాన్, కొరియా మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. మలేసియా చేతిలో ఓటమి ఎరుగని భారత జట్టు ఈసారీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఎనిమిదో నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను సంగీత లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు కొనసాగించినా ఫినిషింగ్ వేధించింది. ఫలితంగా 42వ నిమిషం వరకు భారత్ ఖాతాలో మరో గోల్ చేరలేదు. అయితే రెండు నిమిషాల వ్యవధిలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను ప్రీతి దూబే, ఉదిత సది్వనియోగం చేసుకోవడంతో భారత్ ఒక్కసారిగా 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా సంగీత ఫీల్డ్ గోల్‌తో భారత ఆధిక్యం 4–0కు పెరిగింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత్‌కు 11 పెనాల్టీ కార్నర్లు, మలేసియాకు ఒక పెనాల్టీ కార్నర్ లభించాయి. -
భార్య అంటే శ్రీకాంత్‌కు ఎంత ప్రేమో!.. చెప్పినట్లే విన్నాడు! వీడియో
Srikanth Kidambi - Shravya Varma Wedding Reception: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లిపీటలెక్కాడు. టాలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లో శనివారం అంగరంగ వైభవంగా శ్రీకాంత్- శ్రావ్యల పెళ్లి జరిగింది.రిసెప్షన్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునబ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌తో పాటు పలువురు క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాగా.. శ్రావ్య తరఫున టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, కీర్తి సురేశ్ తదతర స్టార్లు వీరి పెళ్లిలో సందడి చేశారు. ఇక ఆదివారం నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తదితర విశిష్ట అతిథులు తళుక్కుమన్నారు.కాగా కొంతకాలంగా ప్రేమలో ఉన్న శ్రీకాంత్- శ్రావ్య పెద్దల అంగీకారంతో ఒక్కటైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి అన్యోన్య బంధానికి అద్దంపట్టేలా ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రిసెప్షన్ వేడుకలో శ్రావ్య భారీ లెహంగా ధరించిగా.. శ్రీకాంత్ వైట్సూట్లో మెరిసిపోయాడు.నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా!అయితే, పార్టీ మొదలుకావడానికి ముందే నాగార్జున హాల్లో అడుగుపెట్టాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో శ్రావ్యకు ఫోన్ చేశాడు. దీంతో కంగారూపడిన శ్రావ్య.. ‘‘నాగ్ సర్ వచ్చారు.. త్వరగా రా’’అంటూ భర్త శ్రీకాంత్‌కు ఫోన్ చేసింది. వెంటనే శ్రీకాంత్ శ్రావ్యతో కలిసి లిఫ్ట్‌లోకి చేరుకున్నాడు.‘‘నేను వేగంగా వెళ్లాలి కాబట్టి.. నువ్వు నా లెహంగాను పట్టుకోవాలి’’ అంటూ శ్రావ్య భర్తకు ప్రేమపూర్వకంగా ఆర్డర్ వేసింది. అందుకే ఎంచక్కా తలూపిన శ్రీకాంత్ ఆమె చెప్పినట్లుగానే లెహంగాను పట్టుకుని.. భార్య వెనకాలే పరిగెత్తాడు. ఇద్దరూ కలిసి నాగార్జున దగ్గరకు వెళ్లగా.. కొత్త జంటను ఆశీర్వదించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు శ్రీకాంత్‌కు భార్య అంటే ఎంత ప్రేమో.. భయం- భక్తీ రెండూ ఉన్నాయంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడుకాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్ నమ్మాల్వార్ కిదాంబి 1993, ఫిబ్రవరి 7న జన్మించాడు. తొలుత కామన్వెల్త్ యూత్ గేమ్స్-2011లో మెన్స్ డబుల్స్ విభాగంలో కాంస్యం గెలిచిన శ్రీకాంత్.. మిక్స్డ్ డబుల్స్‌లో రజత పతకం కైవసం చేసుకున్నాడు.అదే విధంగా.. 2013లో థాయ్‌లాండ్ ఓపెనర్ గ్రాండ్ పిక్స్ గోల్డ్ టైటిల్‌ను శ్రీకాంత్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. చారిత్రాత్మక థామస్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా! ఇక ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌గా ఎదిగిన శ్రీకాంత్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ ,అర్జున అవార్డులతో సన్మానించింది.చదవండి: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్‌మనీ View this post on Instagram A post shared by Shravya Varma & Srikanth Kidambi (@weshranth) -
ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా! రూ. 40 కోట్ల 55 లక్షల ప్రైజ్‌మనీ
రియాద్: ఓటమి అంచుల్లో ఉన్నా... ఆందోళన చెందకుండా పోరాడిన అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో 20 ఏళ్ల కోకో గాఫ్ విజేతగా నిలిచింది. మూడోసారి ఈ టోర్నీలో ఆడుతున్న కోకో గాఫ్ తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఏకంగా.. 3 గంటల 4 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 7–6 (7/2)తో ప్రపంచ ఏడో ర్యాంకర్, చైనా రైజింగ్ స్టార్ కిన్వెన్ జెంగ్పై చిరస్మరణీయ విజయం అందుకుంది.విజేతగా నిలిచిన కోకో గాఫ్నకు 48,05,000 డాలర్ల (రూ. 40 కోట్ల 55 లక్షలు) ప్రైజ్‌మనీ, 1300 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కిన్వెన్ జెంగ్‌కు 23,05,000 డాలర్ల (రూ. 19 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీ, 800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్ చేరే క్రమంలో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై గెలిచిన కోకో గాఫ్నకు తుది పోరులో గట్టిపోటీనే ఎదురైంది.టైబ్రేక్‌లో కోకో పైచేయితొలి సెట్‌ను చేజార్చుకున్న కోకో రెండో సెట్లో ఒకదశలో 1–3తో వెనుకబడింది. కానీ వరుసగా మూడుసార్లు కిన్వెన్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కోకో అదే జోరులో సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో కోకో 3–5తో వెనుకంజలో పడింది. తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్న కోకో పదో గేమ్‌లో కిన్వెన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేసింది.ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో కోకో పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకొని 2014లో సెరెనా విలియమ్స్ తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలిచిన అమెరికా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది కోకో మొత్తం 54 మ్యాచ్‌ల్లో గెలిచి, 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓవరాల్‌గా మూడు టైటిల్స్ (బీజింగ్ ఓపెన్, ఆక్లాండ్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్) సొంతం చేసుకుంది. View this post on Instagram A post shared by Tennis (@tennischannel)