Archery
-
జ్యోతి సురేఖకు కాంస్య పతకం
సాక్షి, హైదరాబాద్: జేవీడీ ఓపెన్ ఇండోర్ ఆర్చరీ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ కాంస్య పతకం గెలిచింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ 900 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. 18 మీటర్ల దూరం ఉన్న లక్ష్యంవైపు ఆయా ప్లేయర్లు 30 బాణాలను మూడుసార్లు చొప్పున సంధించారు.నిర్ణీత 90 బాణాల తర్వాత సురేఖతోపాటు ఎలీసా రోనెర్ (ఇటలీ), అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా), ఆండ్రియా మునోజ్ (స్పెయిన్) 900 పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే పతకాల వర్గీకరణ కోసం కేంద్ర బిందువుపై కొట్టిన అత్యధిక షాట్లను లెక్కలోకి తీసుకున్నారు. ఫలితంగా ఎలీసా రోనెర్ (87)కు స్వర్ణ పతకం, అలెజాంద్రా (80) రజతం, జ్యోతి సురేఖ (79)కు కాంస్య పతకం ఖరారయ్యాయి. ఉమామహేశ్‌కు నాలుగో స్థానం న్యూఢిల్లీ: వరల్డ్ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఉమమహేశ్ 208.8 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. -
ఆర్చరీ వరల్డ్‌కప్: రజత పతకం కైవసం చేసుకున్న దీపికా కుమారి
ట్లాక్స్కాలా (మెక్సికో): భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఆర్చరీ వరల్డ్‌కప్ ఫైనల్లో రజత పతకాన్ని (మహిళల రికర్వ్ ఈవెంట్) కైవసం చేసుకుంది. ఫైనల్లో దీపికా.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన అర్చర్ లి జియామన్ చేతిలో 0-6 తేడాతో ఓటమిపాలైంది.మూడేళ్ల విరామం తర్వాత వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరిన దీపికా అద్భుతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్లో దీపికా తడబాటుకు లోనైంది. ఆర్చరీ వరల్డ్‌కప్ టోర్నీలో దీపికాకు ఇది ఆరో పతకం. 2011, 2012, 2013, 2015, 2024 ఎడిషన్లలో దీపికా రజత పతకాలు సాధించింది. 2018 ఎడిషన్‌లో కాంస్యం సొంతం చేసుకుంది.చదవండి: ధీరజ్, సురేఖలకు నిరాశ -
ధీరజ్, సురేఖలకు నిరాశ
ట్లాక్స్కాలా (మెక్సికో): ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత స్టార్ ప్లేయర్లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్, వెన్నం జ్యోతి సురేఖ నిరాశపరిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోని టాప్–8 ప్లేయర్లకు వరల్డ్‌కప్ ఫైనల్స్ టోర్నీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ ధీరజ్ పురుషుల రికర్వ్ విభాగంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే (క్వార్టర్ ఫైనల్) ఓడిపోయాడు. మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ కూడా ఆడిన తొలి మ్యాచ్‌లోనే (క్వార్టర్ ఫైనల్) పరాజయం పాలైంది. పురుషుల కాంపౌండ్ విభాగంలో భారత ప్లేయర్ ప్రథమేశ్ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్రీ మార్టా పాస్ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 145–147 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. ప్రథమేశ్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన ప్రియాంశ్‌పై 147–146తో గెలిచాడు. సెమీఫైనల్లో ప్రథమేశ్ డెన్మార్క్ ప్లేయర్ మథియాస్ ఫులర్టన్ చేతిలో ఓటమి చవిచూశాడు. కాంస్య పతక మ్యాచ్‌లో ప్రథమేశ్ 146–150తో మైక్ ష్లాసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. రికర్వ్ క్వార్టర్ ఫైనల్లో ధీరజ్ 4–6 (28–28, 29–26, 28–28, 26–30, 28–29)తో లీ వూ సియోక్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
ఎక్కుపెట్టిన బాణాలు.. ఈ'విల్' కారులు!
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో హైదరాబాద్‌కు ఒలింపియన్స్ సిటీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి పీవీ సింధూ, సైనా నెహా్వల్, గుత్తా జ్వాల, నగరంతో అనుబంధమున్న గగన్ నారంగ్ వంటి వారు ఒలింపిక్స్ మెడల్స్ సాధించడమే కారణం. అంతేకాకుండా పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో ఒలింపియన్స్ సన్నద్ధమైంది కూడా ఇక్కడే. ఇలా నగరం నుంచి బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, హాకీ, చెస్, రైఫిల్ షూటింగ్ వంటి పలు అంతర్జాతీయ క్రీడల్లో ప్రాతినిథ్యం వహించి నగర ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేశారు. ఇదే కోవలో ఆర్చరీ క్రీడ కూడా భవిష్యత్‌లో రాణించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆర్చరీకి ప్రాధాన్యత చాలా పెరుగుతోంది. ఈ సారి ఒలింపిక్స్‌లో తెలుగు క్రీడా కారుడు ధీరజ్ 4వ స్థానంలో నిలిచిన సంగతి విధితమే. భారతీయ క్రీడా చరిత్రలో తమకంటూ ఒక పేజీ రాసుకోవాలనుకునే నగర క్రీడాకారులు విల్లంబులు చేతబట్టి ఒలింపిక్ వేటకు సిద్ధమవుతున్నారు.ఆర్చరీపై భాగ్యనగర వాసుల గురి..జాతీయ స్థాయి టాప్ 2లో నగర అమ్మాయిలు, టాప్ 8లో అబ్బాయిలు..ఏ క్రీడ ఆడాలన్నా, శిక్షణ పొందాలన్నా మరో క్రీడాకారుడు ఉండాల్సిందే. ఇలా కాకుండా ఇండివీడ్యువల్ గేమ్ (వ్యక్తిగత క్రీడ) విభాగంలో ఆర్చరీ ఒకటి. గత కొన్ని ఏళ్లుగా ఈ గ్లామర్ గేమ్‌పై నగర క్రీడా అభిలాషకులు ఫోకస్ పెట్టారు. నగరం నుంచి ఇప్పటికే పలు క్రీడల్లో చాలా మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంతో తమను తాము నిరూపించుకోవడానికి ఆర్చరీని ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ఇతర క్రీడల్లో కొనసాగుతున్న పోటీని తప్పించుకోవడానికి కూడా ఆర్చరీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో నేషనల్స్‌లో నగర ఆర్చరీ క్రీడాకారులు రాణిస్తుండటం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలంగాణలో ఆర్చరీ శిక్షణ అందించే ‘సాయ్’ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్, గచి్చబౌలి), హకీం పేట్ స్పోర్ట్స్ స్కూల్ రెండూ నగరానికి అనుబంధమున్నవే. వీటితో పాటు నగరంలో దాదాపు ఎనిమిది ప్రైవేటు శిక్షణా కేంద్రాలున్నాయి. ఈ అంశాల దృష్ట్యా ఇక్కడ ఆర్చరీ క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. నేషనల్స్‌లో వెయ్యి మంది రాణింపు..జాతీయ స్థాయిలో టాప్ 2లో నా విద్యార్థులు ఉన్నారు. 2000 సంవత్సరంలో ఆర్చరీ ప్రారంభించిన నేను ఏడేళ్ల పాటు 23 విభాగాల్లో నేషనల్స్, ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్ ఛాంపియన్స్ ఆడాను. 7 నేషనల్స్‌లో పతకాలు సాధించాను. ఆల్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్‌గా నిలిచాను. అనంతరం మేటి ఆర్చర్స్‌ను తయారు చేయడమే లక్ష్యంగా 2008 నుంచి శిక్షణ ప్రారంభించాను. ఇప్పటి వరకూ నా శిక్షణలో వెయ్యి మందికి పైగా నేషనల్స్ ఆడారు. కొందరు యూత్ ఒలింపిక్స్ ఇండియా క్యాంపుకు వెళ్లారు.దాదాపు 3 వేల మందికి పైగా శిక్షణ అందించాను. ఫ్రెండ్స్ అండ్ ఆర్చర్స్ ట్రైనింగ్ సెంటర్ పేరుతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఖైరతాబాద్, ప్రగతి నగర్, నార్సింగిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అథ్లెట్లను తయారు చేస్తున్నాను. 2028 ఒలింపిక్స్ పతకమే లక్ష్యంగా అద్భుతమైన నైపుణ్యాలున్న ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను సన్నద్ధం చేస్తున్నాను. ఆర్చరీ శిక్షణతో పాటు వీరికి అవసరమైన ఫిట్నెస్, ఫిజియోథెరపీ, సైకాలజీ కౌన్సిలింగ్, స్పెషల్ ట్యూనింగ్ అందిస్తున్నాం. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్చరీకి మంచి భవిష్యత్ ఉంది. రీకర్వ్, కాంపౌండ్ విభాగాల్లో మన ఆర్చర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రభుత్వం తరపున మంచి భద్రతా ప్రమాణాలతో మరిన్ని ఆర్చరీ గ్రౌండ్స్ నిర్మిస్తే వందల మంది ఆర్చర్స్కు అవకాశం ఉంటుంది. ఎక్విప్మెంట్ అందించగలిగితే ఆర్చరీ మరింత రాణిస్తుంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో అద్భుతమైన కోచ్‌లు ఉన్నారు. నా అకాడమీ తరపున చాలా మంది పేద పిల్లలకు ఆర్చరీలో సహకారం అందిస్తున్నాను. వారిలో రాజ్‌భవన్ స్కూల్‌కు చెందిన వైభవ్ నేషనల్స్ మెడల్ సాధించాడు. మరో అమ్మాయి లలితా రాణి నేషనల్స్ ఆడి సత్తా చాటింది. – రాజు, ఆర్చరీ నేషనల్స్ ఛాంపియన్, ప్రముఖ కోచ్, ఫ్రెండ్స్ అండ్ ఆర్చెర్స్ ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్.నగర వేదికగా..నగరం వేదికగా దాదాపు 150 మంది ఆర్చరీ అథ్లెట్స్ ఉన్నారని అంచనా. జాతీయ స్థాయిలో హైదరాబాద్ టీం రెండో స్థానంలో ఉన్నట్లు క్రీడా నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయి సీనియర్స్, జూనియర్స్ విభాగంలో నగరానికి చెందిన అమ్మాయిలు ఇద్దరూ సిల్వర్ మెడల్స్ సాధించగా, అబ్బాయిలు ఎనిమిదో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు.ఆరు కేటగిరీల్లో..ఆర్చరీకి సంబంధించి నేషనల్స్‌లో అండర్ 10, 13, 15, 17, 19, అబౌ 19 విభాగాలు ఉంటాయి. ఒలింపిక్స్‌కు అయితే ఎలాంటి ప్రమాణాలూ ఉండవు. ఎవరైనా పోటీ పడొచ్చు. ఆరు కేటగిరీల్లో ఈ ఎంపిక కొనసాగుతోంది. మెదటి దశ ఓపెన్ కేటగిరీలో దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడొచ్చు. ఇందులోంచి టాప్ 32, టాప్ 16, టాప్ 8, టాప్ 6 ఇలా ఎంపిక చేసి చివరగా ముగ్గురిని ఒలింపిక్స్‌కు పంపిస్తారు.2028 ఒలింపిక్స్ లక్ష్యంగా.. 12 ఏళ్ల వయస్సు నుంచి ఆర్చరీలో రాణిస్తున్నాను. ఇప్పటి వరకూ ఎనిమిది నేషనల్స్ ఆడాను. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నేషనల్స్‌లో ఒక గోల్డ్, మరో సిల్వర్ మెడల్ సాధించాను. 2028 ఒలింపిక్స్‌లో ఆడి పతకం సాధించడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం మోయినాబాద్ కాలేజ్‌లో పీజీ చదువుతున్నాను. – హర్షవర్ధన్నాలుగు నేషనల్స్ ఆడాను..కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాను. ఇప్పటి వరకూ గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడు వంటి ప్రాంతాల్లో నాలుగు నేషనల్స్ ఆడాను. అసోసియేషన్ నేషనల్స్, ఫుల్ నేషనల్స్‌లో పోటీ పడ్డాను. భారతీయ ఆర్చర్‌గా ఒలింపిక్స్‌లో సత్తా చాటి దేశ ఖ్యాతిని మరింత పెంచడమే లక్ష్యం. – లలితా రాణి -
భళా శీతల్... నీకు గిఫ్ట్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను
పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో యావత్ క్రీడా ప్రపంచాన్నీ అబ్బురపర్చింది. 17 ఏళ్ల శీతల్ త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ అదిరిపోయే షాట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. అసాధారణ ధైర్యం, నిబద్ధత, పట్టువదలని స్ఫూర్తి పతకాలతో ముడిపడి ఉండదు అంటూ ట్వీట్ చేశారు. మీరు దేశానికి, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అంటూ సోషల్ మీడియా వేదికగా శీతల్ దేవిని అభినందించారు. Extraordinary courage, commitment & a never-give-up spirit are not linked to medals…#SheetalDevi, you are a beacon of inspiration for the country—and the entire world.Almost a year ago, as a salute to your indomitable spirit, I had requested you to accept any car from our… pic.twitter.com/LDpaEOolxA— anand mahindra (@anandmahindra) September 2, 2024అలాగే ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘18 ఏళ్లు నిండిన తర్వాత ఆఫర్(కారు బహుతి) స్వీకరిస్తారని చెప్పారు. దీని ప్రకారం వచ్చే ఏడాది కారు మీ చేతికి వస్తుంది. మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టారు ఆనంద్ మహీంద్ర.కాగా పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో యువ పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రిక్వార్టర్స్‌కు చేరి అరుదైన రికార్డు సాధించింది. తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ కాలి ఫీట్‌తో అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఆమె చేతులకు బదులుగా కాలితో విల్లు ఎక్కి పెట్టిన దృశ్యం వైరల్ గా మారింది. ప్రత్యర్థి వీల్ చైర్లోకూర్చుని చేతులతోనే బాణం వేసి పతకాన్ని కైవసం చేసుకోవడంతో తృటిలో పతకం చేజారింది. అయితే శీతల్ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలో కొద్దిమందిగా ఉన్న ఆర్మ్లెస్ ఆర్చర్లలో పిన్న వయసు ఆర్చర్‌గా శీతల్ గుర్తింపు తెచ్చుకుంది. దీంతో శీతల్ మున్ముందు అద్భుతాలు సాధిస్తుందంటూ పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు కొని యాడారు. -
ముగిసిన భారత ఆర్చర్ల పోరాటం.. కార్టర్స్‌లో దీపికా ఓటమి
ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆర్చరీ విభాగంలో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్‌ఫైనల్స్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో ఒలింపిక్ ఛాంపియన్ మిచ్చెల్లి క్రొప్పన్‌ను ఓడించి తన సత్తాచాటిన దీపికా కుమారి .. క్వార్టర్లో మాత్రం తన జోరును కొనసాగించలేకపోయింది. దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహియోన్ చేతిలో4-6 తేడాతో దీపికా కుమారి పరాజయం పాలైంది. 3వ సెట్ ముగిసే సమయానికి దీపిక 4-2తో ముందంజలో ఉన్నప్పటకి.. తర్వాత సెట్లలో పేలవమైన షూటింగ్‌ల కారణంగా ఆమె తమ సెమీ-ఫైనల్ బెర్త్‌ను కోల్పోయింది.అదేవిధంగా మరో ఆర్చర్ భజన్ కౌర్ రౌండ్-16లోనే ఇంటిముఖం పట్టింది. ఇండోనేషియాకు చెందిన డియానందా చోయిరునిసా చేతిలో భజన్ కౌర్ ఓటమి చవిచూసింది. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ల ప్రయాణం ముగిసింది. మరోసారి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి భారత ఆర్చర్లు ఇంటిముఖం పట్టారు. -
గురి చెదిరింది.. కాంస్యం చేజారింది
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఒలింపిక్స్ ఆర్చరీలో సెమీఫైనల్‌కు చేరిన భారత మిక్స్డ్ జట్టు.. పతకం పట్టే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత భకత్ జోడీ.. ‘ప్యారిస్’ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో దక్షిణ కొరియా జోడీ చేతిలో ఓడిన ధీరజ్–అంకిత జంట... కాంస్య పతక పోరులో అమెరికా ద్వయం చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. 36 ఏళ్ల ఒలింపిక్స్ ఆర్చరీ చరిత్రలో తొలిసారివిశ్వక్రీడల్లో భారత ఆర్చర్లకు మరోసారి నిరాశ తప్పలేదు. 36 ఏళ్ల ఒలింపిక్స్ ఆర్చరీ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరి పతక ఆశలు రేపిన మన మిక్స్డ్ ఆర్చరీ జట్టు చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో మన ఆర్చర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.శుక్రవారం రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో బొమ్మదేవర ధీరజ్–అంకిత భకత్ ద్వయం 2–6తో (37–38, 35–37, 38–34, 35–37) బ్రాడీ ఎలీసన్–క్యాసీ కౌఫ్‌హోల్డ్ (అమెరికా) జంట చేతిలో ఓడింది. ధీరజ్ గురి అంచనాలకు తగ్గట్లు సాగినా... ఒత్తిడికి గురైన అంకిత పలుమార్లు గురి తప్పడం ఫలితంపై ప్రభావం చూపింది. నాలుగు సెట్లలో కలిపి అంకిత రెండుసార్లు 7 పాయింట్లు సాధించడంతో జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసింది. తొలి సెట్లో అంకిత 7 ,10 పాయింట్లు సాధించగా.. ధీరజ్ రెండు 10లు నమోదు చేశాడు. ప్రత్యర్థి ఆర్చర్లు 10, 9, 9, 10 పాయింట్లు సాధించి ముందంజ వేయగా.. రెండో సెట్‌ను కూడా అంకిత 7 పాయింట్లతో ప్రారంభించింది. చేజారిన కాంస్యంఈసారి కూడా ప్రత్యర్థిదే పైచేయి కాగా.. మూడో సెట్లో అంకిత 10, 9, ధీరజ్ 9, 10 పాయింట్లు గురిపెట్టారు. ప్రత్యర్థి జంట 10, 7, 9, 8 పాయింట్లు చేసి వెనుకబడింది. ఇక నాలుగో సెట్లో అంకిత రెండు బాణాలకు ఎనిమిదేసి పాయింట్లే రాగా.. ధీరజ్ 9, 10 పాయింట్లు గురిపెట్టాడు. అయితే వరుసగా 10, 9, 9, 9 పాయింట్లు సాధించిన అమెరికా జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది.దక్షిణ కొరియా, జర్మనీ జోడీలకు స్వర్ణ, రజత పతకాలు లభించాయి. అంతకుముందు సెమీఫైనల్లో ధీరజ్–అంకిత జోడీ 2–6తో (38–36, 35–38, 37–38, 38–39) ప్రపంచ నంబర్‌వన్ కిమ్ వూజిన్–లిమ్ షిహ్యోన్ (కొరియా) జంట చేతిలో ఓడింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో భారత్ 5–3తో (38–37, 38–38, 36–37, 37–36) స్పెయిన్‌పై, తొలి రౌండ్లో 5–1తో (37–36, 38–38, 38–37) ఇండోనేసియాపై గెలిచింది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి, భజన్ కౌర్ ఈరోజు బరిలోకి దిగనున్నారు. బల్‌రాజ్‌కు 23వ స్థానం పారిస్ ఒలింపిక్స్‌లో భారత రోవర్ బల్రాజ్ పన్వర్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్ రౌండ్ ‘డి’ ఫైనల్లో శుక్రవారం బల్రాజ్ 7 నిమిషాల 2.37 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. అంతకుముందు రెపిచాజ్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు చేరిన బల్రాజ్... అక్కడ ఐదో స్థానానికి పరిమితమవడంతో ఫైనల్‌కు దూరమయ్యాడు. ఫైనల్ ‘ఎ’లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. -
Olympics: చరిత్ర సృష్టించిన భారత ఆర్చరీ జోడీ
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ మరో పతకానికి చేరువైంది. మిక్స్డ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లో బొమ్మదేవర ధీరజ్- అంకితా భకత్ జోడీసెమీ ఫైనల్ చేరుకుంది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్లో స్పానిష్ జంట కనాలెస్- గొంజాలెజ్‌పై విజయం సాధించింది. ఆద్యంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచి స్పెయిన్ ద్వయాన్ని 5-3తో ఓడించి జయభేరి మోగించింది.తద్వారా ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన భారత తొలి ఆర్చరీ జోడీగా చరిత్ర సృష్టించింది. మరో క్వార్టర్స్ పోరులో సౌత్ కొరియా జంట.. ఇటలీపై గెలుపొందింది. ఈ క్రమంలో భారత్- సౌత్ కొరియా జట్ల మధ్య సెమీ ఫైనల్ పోటీ మొదలుకానుంది.కాంస్య పతక పోరులో భారత్ ఓటమిమిక్స్డ్ ఆర్చరీ టీమ్ కాంస్య పతక పోరులో బొమ్మదేవర ధీరజ్- అంకితా భకత్ జోడీ ఓటమి పాలైంది. యునైటెడ్ స్టేట్స్ బ్రాడీ-కేసీ జంట చేతిలో6-2 తేడాతో భారత జోడీ ఓటమి చవిచూసింది. సెమీస్‌లో ఓటమి.. కాంస్య పతకపోరుకు మనోళ్లుసెమీ ఫైనల్లో సౌత్ కొరియా జోడీ లిమ్- కిమ్ జోడీ చేతిలో ధీరజ్- అంకిత ఓడిపోయారు. 6-2తో పరాజయం పాలై స్వర్ణ పతక రేసుకు అర్హత సాధించే అవకాశం కోల్పోయారు. అయితే, కాంస్య పతకం కోసం అమెరికాతో తలపడతారు. ఇక సౌత్ కొరియాతో పాటు జర్మనీ ఫైనల్‌కు చేరింది.ఇప్పటికి మూడు పతకాలుప్యారిస్లో ఇప్పటికే భారత్ మూడు పతకాలు ఖాతాలో వేసుకుంది. షూటింగ్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్, స్వప్నిల్ కుసాలే.. టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్ పతకాలు గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మనూ.. సరబ్‌జోత్‌తో కలిసి ఇదే విభాగంలో టీమ్ మెడల్(కాంస్యం), స్వప్నిల్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత షూటర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఇప్పటికే రెండు పతకాలు గెలిచిన.. మనూ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరి మూడో పతకానికి గురిపెట్టింది. -
ప్రవీణ్ తొలి రౌండ్లోనే...
పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత్ పోరాటం ముగిసింది. ఇప్పటికే తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, సీనియర్ ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ నాకౌట్ మ్యాచ్‌ల్లో పరాజయం పాలవగా... బరిలో మిగిలిన ఏకైక భారత ఆర్చర్ ప్రవీణ్ జాధవ్ కూడా ఇంటిదారి పట్టాడు. వ్యక్తిగత రికర్వ్ తొలి రౌండ్లో ప్రవీణ్ 0–6 (28–29, 29–30, 27–28)తో వెన్‌చావో (చైనా) చేతిలో ఓడాడు. ఇక మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి, భజన్ కౌర్ శనివారం ప్రిక్వార్టర్స్ బరిలో దిగనున్నారు. -
ఆ ఆర్చర్ గురికి ఒకటే పాయింట్!
పారిస్: ఆర్చరీ పోటీల్లో గురి లక్ష బిందువుపైనే ఉంటుంది. ఇది కుదిరితే 10 కాస్త అటుఇటు తప్పితే 9, 8, 7 పాయింట్లు సహజం. కానీ ఆఫ్రికన్ దేశం చాద్ ఆర్చర్ ఇజ్రాయెల్ మదయె దాదాపు టార్గెట్ రింగ్స్ బోర్డుకే దూరమయ్యే బాణం సంధించాడు. త్రుటిలో బోర్డులో పడింది... కానీ వచి్చంది ఒకే పాయింట్! వినడానికి విడ్డూరంగా ఉన్న మదయె రెండో సెట్లో మూడు షాట్లలో ఒకటి ఒక్క పాయింటే తెచ్చి పెట్టింది. విలువిద్యలో కొరియన్ ఆర్చర్లకు తిరుగుండదు. పైగా మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన కిమ్ వూ జిన్ ముందు 36 ఏళ్ల మదయె ఓ పిల్లబచ్చ! ఈ మ్యాచ్‌లో 26–29, 15–29, 25–30 స్కోరుతో కిమ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి సెట్లో 26 పాయింట్లు సాధించిన మదయె రెండో సెట్లో కేవలం 15 పాయింట్లే చేశాడు. అంటే మూడు బాణాల స్కోరుకు (10+10+10)కు సగమన్నమాట! ఇందులో మూడో షాట్ ఒక పాయింట్ తేవడంతో అతను సగం స్కోరుకు పరిమితమయ్యాడు. అయితే మూడో సెట్లో పుంజుకొని 25 పాయింట్లు సాధించాడు. ఇంత ఘోరంగా మదయె ఓడినప్పటికీ స్టేడియంలోని కొరియన్ అభిమానుల నుంచి ఓదార్పు లభించింది. చప్పట్లతో మదయెకు వీడ్కోలు పలికారు. -
ఆర్చరీలో మళ్లీ నిరాశ
ఒలింపిక్స్ ఆర్చరీ క్రీడాంశంలో భారత్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ స్టార్ ఆర్చర్ దీపికా కుమారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో.. తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అంకిత తడబడటం... భజన్ కౌర్ రాణించినా ఫలితం లేకపోవడంతో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు 0–6 (51–52, 49–54, 48–53)తో నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. దీపిక, అంకిత ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీపిక, అంకిత సంధించిన బాణాలకు 4,6,7 పాయింట్లు కూడా రావడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపింది. -
ఆర్చరీలో కొత్త ప్రపంచ రికార్డు
పారిస్ ఒలింపిక్స్ క్రీడలు నేడు అధికారికంగా ప్రారంభమవుతున్నా... గురువారం ఈ క్రీడల్లో తొలి ప్రపంచ రికార్డు నమోదైంది. మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో దక్షిణ కొరియా అమ్మాయి లిమ్ సిహైన్ కొత్త ప్రపంచ రికార్డుతోపాటు ఒలింపిక్ రికార్డును కూడా నెలకొల్పింది. లిమ్ సిహైన్ 694 పాయింట్లు స్కోరు చేసింది. తద్వారా 692 పాయింట్లతో కాంగ్ చాయెంగ్ (దక్షిణ కొరియా; 2019లో) సాధించిన ప్రపంచ రికార్డును లిమ్ బద్దలు కొట్టింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కొరియాకే చెందిన ఆన్ సాన్ 680 పాయింట్లతో నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును కూడా లిమ్ సిహైన్ తిరగరాసింది. -
ఈసారైనా గురి కుదిరేనా!
అంతర్జాతీయ టోర్నీలలో మాత్రం నిలకడగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించడం... ఒలింపిక్స్‌కు వచ్చేసరికి తడబడటం... భారత ఆర్చరీ గురించి ఇలా క్లుప్తంగా చెప్పుకోవచ్చు. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీకి తొలిసారి చోటు దక్కింది. భారత్ మాత్రం 1988 సియోల్ ఒలింపిక్స్‌తో అరంగేట్రం చేసింది. పురుషుల వ్యక్తిగత, టీమ్ విభాగంలో లింబారామ్, సంజీవ సింగ్, శ్యామ్‌లాల్ మీనా భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లోనూ భారత ఆర్చర్లు పాల్గొన్నా ఆరంభ రౌండ్లలోనే నిష్క్రమించారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఎవరూ అర్హత పొందలేదు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పురుషుల విభాగంతోపాటు తొలిసారిగా మహిళల విభాగంలోనూ భారత్ పోటీపడింది. పురుషుల విభాగంలో సత్యదేవ్ ప్రసాద్, తరుణ్‌దీప్ రాయ్, మాఝీ సవాయన్... మహిళల విభాగంలో డోలా బెనర్జీ, రీనా కుమారి, సుమంగళ శర్మ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. సత్యదేవ్ ప్రసాద్, రీనా కుమారి ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... తరుణ్‌దీప్, మాఝీ సవాయన్, డోలా బెనర్జీ తొలి రౌండ్లో, సుమంగళ శర్మ రెండో రౌండ్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత ఆర్చర్లు బరిలోకి దిగినా రిక్తహస్తాలతో వెనుదిరిగారు. గత మూడేళ్ల కాలంలో భారత ఆర్చర్లు నిలకడగా రాణించారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఐదు విభాగాల్లోనూ అర్హత సాధించారు. పురుషుల టీమ్ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్... మహిళల టీమ్ విభాగంలో దీపిక కుమారి, భజన్ కౌర్, అంకిత భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్ పురుషుల టీమ్, వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో... భజన్ కౌర్ మహిళల టీమ్, వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో పోటీపడతారు. 40 ఏళ్ల తరుణ్‌దీప్ రాయ్, 30 ఏళ్ల దీపిక కుమారి నాలుగో సారి ఒలింపిక్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా దీపికా కుమారిపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచకప్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్íÙప్... ఇలా అన్ని మెగా టోర్నీల్లో పతకాలు గెల్చుకున్న దీపిక ఖాతాలో కేవలం ఒలింపిక్ పతకం మాత్రమే లోటుగా ఉంది. ఈ ఏడాది దీపిక మంచి ఫామ్‌లో ఉంది. షాంఘై ప్రపంచకప్ టోర్నీ లో రజత పతకం సాధించగా... ఆసియా కప్‌లో స్వర్ణ పతకం గెలిచింది. ఓవరాల్ గా దీపిక ప్రపంచకప్ టోర్నీ ల్లో 37 పతకాలు... ప్రపంచ చాంపియన్íÙప్లో ఐదుపతకాలు సాధించి భారత అత్యుత్తమ ఆర్చర్‌గా పేరు తెచ్చుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో దీపిక తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన అవసరం ఉంది.కీలకదశలో ఒత్తిడికి తడబడి గురి తప్పడం దీపిక బలహీనతగా ఉంది. అయితే మూడు ఒలింపిక్స్‌లలో పోటీపడ్డ దీపిక ఈ బలహీనతను పారిస్‌లో అధిగమిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. పారిస్ గేమ్స్ నుంచి దీపిక పతకంతో తిరిగొస్తే భారత్‌లో ఆర్చరీకి మరింత ఆదరణ పెరుగుతుంది. విజయవాడకు చెందిన 22 ఏళ్ల ధీరజ్ కూడా కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తూ పారిస్ గేమ్స్‌లో తన నుంచీ పతకం ఆశించవచ్చని ఆశలు రేకెత్తిస్తున్నాడు. గత రెండేళ్లలో ధీరజ్ ప్రపంచకప్ టోర్నీల్లో మొత్తం ఎనిమిది పతకాలు నెగ్గాడు. ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్íÙప్లో, ఆసియా గ్రాండ్‌ప్రి టోర్నీల్లో ఐదు పతకాలు సాధించాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ధీరజ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పతకంతో తిరిగొస్తే భారత ఆర్చరీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ ఈవెంట్ జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతుంది. ఆర్చరీలో కాంపౌండ్, రికర్వ్ అని రెండు కేటగిరీలున్నా... ఒలింపిక్స్‌లో మాత్రం కేవలం రికర్వ్ విభాగంలోనే పోటీలు నిర్వహిస్తారు. –సాక్షి క్రీడా విభాగం -
విశ్వ క్రీడలకు భారత్ నుంచి 117 మంది.. ఏ విభాగంలో ఎందరు?
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొననున్న భారత క్రీడాకారుల సంఖ్య ఖరారైంది. దేశం నుంచి 117 మంది అథ్లెట్లు విశ్వ క్రీడల్లో భాగం కానున్నారని భారత క్రీడా శాఖ అధికారికంగా వెల్లడించింది.క్రీడాకారులతో పాటు 140 మంది సహాయక సిబ్బంది కూడా ప్యారిస్‌కు వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడాకారుల జాబితాలో షాట్ పుట్టర్ అభా కతువా పేరు లేకపోవడం గమనార్హం.అభా పేరు మాయంవరల్డ్ ర్యాంకింగ్ కోటాలో ఆమె ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో వరల్డ్ అథ్లెటిక్స్ , ఒలింపిక్ పార్టిసిపెంట్స్ లిస్టు నుంచి అభా పేరు మాయమైంది. అయితే, ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.కాగా ప్యారిస్ క్రీడల్లో పాల్గొననున్న భారత అథ్లెటిక్స్ బృందంలో 29 మంది ఉండగా.. ఇందులో 11 మంది మహిళా, 18 మంది పురుష క్రీడాకారులు ఉన్నారు. షూటింగ్ టీమ్‌లో 21 మంది ఉండగా.. హాకీ జట్టులో 19 మంది పేర్లు ఉన్నాయి.ఇక టేబుల్ టెన్నిస్ విభాగంలో ఎనిమిది మంది, బ్యాడ్మింటన్‌లో ఏడుగురు, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్ విభాగాల్లో ఆరుగురు చొప్పున, నలుగురు గోల్ఫ్ క్రీడాకారులు, ముగ్గురు టెన్నిస్ ప్లేయర్లు, సెయిలింగ్, స్విమ్మింగ్ నుంచి ఇద్దరు చొప్పున..నాటి పసిడి ప్రత్యేకంఅదే విధంగా.. ఈక్వెస్ట్రియన్, జూడో, రోయింగ్ , వెయిట్‌లిఫ్టింగ్ విభాగం నుంచి ఒక్కొక్కరు భారత్ తరఫున విశ్వ క్రీడల్లో పాల్గొననున్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించారు. అత్యధికంగా ఏడు పతకాలతో తిరిగి వచ్చారు. ఇందులో జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పసిడి పతకం అత్యంత గొప్ప జ్ఞాపకం.చదవండి: Paris Olympics:ఆంధ్రా టు పారిస్.. ఆడుదాం ఒలింపిక్స్ -
Paris Olympics : ఒకే యూనివర్సిటీ నుంచి ఎనిమిది మంది
చండీగఢ్: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందంలో ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఉండటం విశేషం. చండీగఢ్ యూనివర్సిటీకి అలాంటి అరుదైన అవకాశం దక్కింది.ఈ యూనివర్సిటీ విద్యార్థులు భజన్ కౌర్ (ఆర్చరీ), అర్జున్ (షూటింగ్), సంజయ్ (హాకీ), రితిక (రెజ్లింగ్), అక్ష్దీప్ సింగ్ (రేస్ వాకింగ్), యశ్ (కయాకింగ్)లతో పాటు పారాలింపియన్లు పలక్ కోహ్లి (బ్యాడ్మింటన్), అరుణ తన్వర్ (తైక్వాండో) ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ గౌరవం పట్ల చండీగఢ్ యూనివర్సిటీ చాన్స్‌లర్, ఎంపీ సత్నామ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. క్వార్టర్ ఫైనల్లో అనాహత్, శౌర్య ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఇద్దరు భారత క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. అమెరికాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో బాలికల సింగిల్స్‌లో జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్... బాలుర సింగిల్స్‌లో శౌర్య బావా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అనాహత్ 11–6, 13–11, 11–2తో అకారి మిదోరికావా (జపాన్)పై, శౌర్య 11–9, 5–11, 11–5, 13–11తో సెగుండో పొర్టాబాలెస్ (అర్జెంటీనా)పై విజయం సాధించారు. -
తనది.. ఎదురు లేని బాణం!
వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలు.. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్యాలు.. వరల్డ్ కప్‌లో స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో కాంస్యం, 18 ఏళ్ల వయసులోనే తొలి సారి వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్.. ఇదీ ఆమె బయోడేటా. ఇక మిగిలింది ఒలింపిక్స్ పతకమే. గతంలో మూడు ప్రయత్నాలు ఆమెకు తగిన ఫలితాన్నివ్వలేదు. కానీ ఇప్పుడు మరింత శ్రమతో, పట్టుదలతో నాలుగోసారి ఒలింపిక్స్ సమరానికి ఆమె సిద్ధమైంది. దేశంలోనే వెనుకబడిన ఒక ప్రాంతం నుంచి వచ్చే దేశం గర్వించేలా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన ఆమె పేరే దీపికా కుమారి. భారత ఆర్చరీకి సంబంధించి ఆల్‌టైమ్ గ్రేట్. ఎన్నో విజయాలు, మరెన్నో రికార్డులు, ఘనతలతో విలువిద్యలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని దీపికా ప్రస్థానం అసాధారణం, ఎందరికో స్ఫూర్తిదాయకం.దీపికాకు ఆర్చరీ అనే ఒక క్రీడ ఉంటుందనే విషయం కూడా చిన్నప్పుడు తెలీదు. సహజంగానే ఆమె నేపథ్యమే అందుకు కారణం. దేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన జార్ఖండ్ నుంచి ఆమె వచ్చింది. రాంచీకి సమీపంలోని రాతూ చట్టీ అనే గ్రామం స్వస్థలం. తండ్రి ఆటోడ్రైవర్ కాగా, తల్లి నర్సుగా పని చేస్తోంది. కుమ్మరి కుటుంబ నేపథ్యం కారణంగా అప్పుడప్పుడు ఆ పనుల ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చేది.చాలామంది పిల్లల్లాగే రాళ్లతో చెట్ల పైనున్న పళ్లను కొట్టడం లాంటి అల్లరి పనులు తనూ చేసేది. దీనివల్ల ఒక్కసారిగా విల్లు ఆమె చేతికి వచ్చేయలేదు. ఆ కుటుంబానికి చెందిన సమీప బంధువు ఒకరికి ఆర్చరీపై మంచి అవగాహన ఉంది. రాళ్లు విసరడంలో కూడా దీపికా కచ్చితత్వం ఆయనను ఆకర్షించింది.దాంతో ఈమెను సానబెట్టవచ్చనే ఆలోచన వచ్చింది. అయితే సహజంగానే తండ్రి నవ్వి ఊరుకున్నాడు. నేనేంటీ, నా కూతురికి ఆటలేంటీ అంటూ వదిలేశాడు. అయితే అప్పటికే ఆర్చరీలో శిక్షణ పొందుతున్న దీపికా కజిన్ ఈ విషయంలో ఒప్పించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్ ముండా భార్య మీరా ముండా ఒక ఆర్చరీ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. దీపికాను అక్కడకు తీసుకెళ్లి చేర్పించారు. అప్పుడు ఆమె వయసు 11 ఏళ్లు. అక్కడే అసలైన ఆర్చరీ ఆటపై ఆమెకు అవగాహన ఏర్పడింది.2024,వరల్డ్ కప్ సిల్వర్ మెడల్‌తో, 2018, వరల్డ్ కప్ గోల్డ్ మెడల్‌తో..టాటా అండదండలతో మలుపు..ఆర్చరీలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత దీపికా తర్వాతి మజిలీ మరో పెద్ద కేంద్రానికి మారింది. జంషెడ్‌పూర్‌లో ఉన్న టాటా ఆర్చరీ అకాడమీ దేశంలోనే అత్యుత్తమ శిక్షణ కేంద్రం. టాటా అండదండలు, ఆర్థిక సహకారంతో ఎంతోమంది గొప్ప ఆర్చర్లుగా ఎదిగారు. ప్రతిభ ఉంటే చాలు అన్ని రకాల అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు లభించడమే కాదు, ఆటగాళ్లకు స్టైపెండ్ కూడా లభిస్తుంది. దీపికాకు ఇంతకంటే కావాల్సిందేముంది అనిపించింది.తన ఆటతో అందరినీ ఆకట్టుకున్న ఆమెకు అదే సొంతిల్లు అయింది. అక్కడ మొదలైన గెలుపు ప్రస్థానం మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా సాగిపోయింది. టాటా అకాడమీ సభ్యురాలిగానే మరింత పదునెక్కిన దీపికా ఆట గొప్ప విజయాలను అందించింది. అంతర్జాతీయ జూనియర్, యూత్ స్థాయిల్లో పతకాలు సాధించడంతో అందరి దృష్టీ ఆమెపై పడింది.అన్నీ ఘనతలే..2010.. న్యూఢిల్లీలో ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలు. సొంతగడ్డపై ప్రతి క్రీడాంశంలోనూ భారత ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇదే జాబితాలో ఆర్చరీ ఫలితాలు కూడా చర్చకు తెర తీశాయి. 16 ఏళ్ల దీపికా రికర్వ్ విభాగంలో రెండు స్వర్ణాలతో మెరిసి తన రాకను ఘనంగా చాటింది. అటు వ్యక్తిగత, ఇటు టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు ఆమె ఖాతాలో చేరాయి. రెండేళ్ల తర్వాత తొలి వరల్డ్ కప్ మెడల్‌తో ఆమె మెరిసింది.వరుస విజయాలు దీపికాను అందరికంటే అగ్రభాగాన నిలబెట్టాయి. ఫలితంగా ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన అధికారిక ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె మొదటిసారి నంబర్ వన్‌గా నిలిచింది. కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామం నుంచి వచ్చి కొరియా, చైనాలాంటి ఆర్చర్లతో పోటీ పడి శిఖరాన నిలిచిన క్షణం అందరూ గర్వపడేలా చేసింది. ఈ ఘనత సాధించిన రోజున తండ్రి శివ్‌చరణ్ చూపించిన ఆనందం, ఆయన సంబరం మాటల్లో చెప్పలేనిది.భర్త అతాను దాస్‌తో, తల్లిదండ్రులతో..అవార్డులు, రివార్డులు..దీపికా ఘనతలకు సహజంగానే అన్ని వైపుల నుంచి గుర్తింపు, ప్రోత్సాహకాలు లభించాయి. అంతర్జాతీయ వేదికల్లో విజయాలు సాధించిన ఒక ప్లేయర్‌గా మాత్రమే ఆమెను అంతా చూడలేదు. పేద కుటుంబం, వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఆమెను స్ఫూర్తిగా తీసుకునేలా ఉన్న కెరీర్ చాలామందికి దిశను చూపించింది.ముఖ్యంగా అమ్మాయిల కోణంలో చూస్తే ఆమె ఎదిగిన తీరు అసాధారణం. ప్రతిభ, పోరాటతత్వం, కష్టపడే లక్షణం ఉంటే విజయాలు కచ్చితంగా వస్తాయని దీపికా నిరూపించింది. వరల్డ్ నంబర్‌వన్‌గా ఎదిగిన ఏడాదే 2012లో కేంద్ర ప్రభుత్వం క్రీడా పురస్కారం అర్జునతో ఆమెను గౌరవించింది. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు కూడా ఆమె చెంతకు చేరింది. 20 ఏళ్ల వయసులోనే పలు ఘనతలు సాధించిన దీపికాకు ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ‘30 అండర్ 30’లో చోటు కల్పించి ఆమె ప్రత్యేకతను ప్రపంచానికి చూపించింది.అన్నింటినీ మించి ఆమె కెరీర్లో హైలైట్‌గా నిలిచిన అంశం నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ. దీపికా విజయగాథను పెద్ద స్థాయికి తీసుకెళ్లి చూపించాలనే సంకల్పంతో ఉరాజ్ బహల్, షా బహల్ అనే రూపకర్తలు దీపికా కెరీర్‌పై ప్రత్యేక డాక్యుమెంటరీని తయారు చేశారు. ‘లేడీస్ ఫస్ట్’ పేరుతో వచ్చిన ఈ అద్భుత డాక్యుమెంటరీలో ఆమె జీవితం, పోరాటం, విజయాల గాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని పలు నగరాల్లో దీనిని ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే ప్రదర్శించడం విశేషం.ఒకే ఒక లక్ష్యంతో..ఐదేళ్ల క్రితం పారిస్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో మూడు విభాగాల్లో (వ్యక్తిగత, మిక్స్డ్, టీమ్) విభాగాల్లో దీపికా మూడు స్వర్ణాలు గెలుచుకుంది. ఇలా వరల్డ్ కప్‌లో ట్రిపుల్ గోల్డ్ సాధించడం ఆర్చర్ సత్తాకు ఉదాహరణ. కానీ తన సుదీర్ఘ కెరీర్లో 13వ సారి ఇలాంటి ఫీట్‌ను నమోదు చేసి అరుదైన ఆర్చర్ల జాబితాలో దీపికా పేరు లిఖించుకుంది. ఇలా ఎన్నో రికార్డులు ఆమె ఖాతాలో చేరినా, ఒలింపిక్స్ పతకం మాత్రం ఇంకా లోటుగానే ఉంది.వరుసగా 2012, 2016, 2021 ఒలింపిక్స్‌లలో ఆమె పాల్గొంది. మెగా ఈవెంట్‌కు ముందు ఫామ్‌లో ఉండి, ఒక దశలో నంబర్‌వన్‌గా కూడా ఉండి అంచనాలు రేపినా, దురదృష్టవశాత్తూ వేర్వేరు కారణాలతో ఆమెకు పతకం మాత్రం దక్కలేదు. అయితే ఈసారి నాలుగో ప్రయత్నంలో కల నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఇందులో ఆమెకు భర్త అతాను దాస్ అండగా నిలుస్తున్నాడు. సహచర ఆర్చర్, వరల్డ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత అతాను దాస్‌ను నాలుగేళ్ల క్రితం దీపికా పెళ్లి చేసుకుంది.వీరికి వేదిక పేరుతో ఒక పాప ఉంది. సహజంగానే అమ్మగా మారిన తర్వాత ఆటకు కొంత విరామం ఇచ్చింది. ఇక ఆమె కెరీర్ ముగిసినట్లు అనిపించింది. అయితే రెట్టింపు సాధనతో కొన్నాళ్ల క్రితమే మళ్లీ బరిలోకి దిగి దీపికా సత్తా చాటింది. ముందుగా జాతీయ చాంపియన్‌షిప్‌లో విజయాలతో పాటు ఇప్పుడు ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. పారిస్‌పై ఆమె ఎక్కు పెట్టే బాణం సరైన లక్ష్యాన్ని చేరాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
Paris Olympics: ఒలింపిక్స్‌కు భారత ఆర్చరీ జట్లు అర్హత
న్యూఢిల్లీ: మూడు క్వాలిఫయింగ్ టోరీ్నల ద్వారా వీలుకాకపోయినా వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా భారత పురుషుల, మహిళల ఆర్చరీ జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. క్వాలిఫయింగ్ టోరీ్నల ద్వారా ఇప్పటికే ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకున్న 10 జట్లను మినహాయించి... వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండు అత్యుత్తమ జట్లకు మిగిలిన రెండు బెర్త్‌లను కేటాయించారు. పురుషుల విభాగంలో భారత్, చైనా... మహిళల విభాగంలో భారత్, ఇండోనేసియా జట్లకు ఈ అవకాశం లభించింది. ఫలితంగా వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ పురుషుల, మహిళల టీమ్ విభాగాల్లో, వ్యక్తిగత విభాగాల్లో, మిక్స్డ్ టీమ్ విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో (టీమ్, వ్యక్తిగత, మిక్స్డ్) పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 44 ఏళ్ల తరుణ్‌దీప్ రాయ్... మాజీ నంబర్‌వన్ దీపికా కుమారి నాలుగోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నారు. మహిళల వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ విభాగంలో భజన్ కౌర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారత పురుషుల ఆర్చరీ జట్టు: తరుణ్‌దీప్ రాయ్, బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్ జాధవ్. భారత మహిళల ఆర్చరీ జట్టు: దీపికా కుమారి, భజన్ కౌర్, అంకిత. -
ఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ బెర్త్
అంటాల్యా (టర్కీ): మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారైంది. చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఈవెంట్లో భారత ఆర్చర్ భజన్ కౌర్ స్వర్ణ పతకం సాధించడంతోపాటు ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఫైనల్లో భజన్ కౌర్ 6–2 (28–26, 29–29, 29–26, 29–29)తో మొబీనా ఫలా (ఇరాన్)పై విజయం సాధించింది. భారత స్టార్ ఆర్చర్ ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి నిరాశ పరిచింది. నేరుగా మూడో రౌండ్ మ్యాచ్ ఆడిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక 4–6 (28–26, 27–25, 23–26, 24–25, 27–29) తో యెలాగుల్ రమజనోవా (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన అంకిత 4–6 (27–27, 27–28, 29–27, 27–27, 28–29)తో మొబీనా ఫలా (ఇరాన్) చేతిలో పరా జయం పాలైంది. ఇప్పటికే పురుషుల వ్యక్తిగత విభాగంలో ధీరజ్ బొమ్మదేవర భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఫలితంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మిక్స్డ్ విభాగంలోనూ పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. -
పురుషుల జట్టుకూ నిరాశ
అంటల్యా (టర్కీ): పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఆఖరి క్వాలిఫయర్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు కూడా మహిళల టీమ్ బాటలోనే పయనించింది. భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. దాంతో పారిస్ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాలంటే జట్టు ర్యాంకింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచే జట్లకు నేరుగా ఒలింపిక్స్ అవకాశం దక్కేది. క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ 2 భారత పురుషుల జట్టు 4–5 (57–56, 57–53, 55–56, 55–58), (26–26) స్కోరుతో మెక్సికో చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి రెండు సెట్లను గెలిచి ఆధిక్యంలో నిలిచిన భారత్ మూడో సెట్లో సమంగా నిలిచినా సెమీస్ చేరేది. కానీ ఒక పాయింట్ తేడాతో సెట్‌ను కోల్పోయిన జట్టు తర్వాతి సెట్‌ను కూడా మెక్సికోకు అప్పగించింది. అయితే షూటౌట్లో భారత్ మ్యాచ్ కోల్పోయింది. మెక్సికో ఆర్చర్లు ల„ ్యానికి అతి సమీపంగా బాణాలను సంధించి పైచేయి సాధించారు. -
జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి
యెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. భారత స్టార్స్, ప్రపంచ రెండో ర్యాంకర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ 12వ ర్యాంకర్ పర్ణీత్ కౌర్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరగ్గా... ప్రపంచ చాంపియన్ అదితి రెండో రౌండ్ లో, అవనీత్ కౌర్ రెండో రౌండ్లో నిష్క్రమించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో జ్యోతి సురేఖ 142–145తో ప్రపంచ మూడో ర్యాంకర్ సారా లోపెజ్ (కొలంబియా) చేతిలో... పర్ణీత్ 138–145తో హాన్ సెంగ్యోన్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. అదితి 142–145తో అలెక్సిస్ రూయిజ్ (అమెరికా) చేతిలో, అవనీత్ 143–145తో ఒ యుహూన్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రథమేశ్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... ప్రియాంశ్ మూడో రౌండ్లో, అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్ రెండో రౌండ్లో ఓడిపోయారు. సెమీస్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ పారిస్: ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో సాండర్ అరెండ్స్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ, ఒలివెట్టి జోడీ పది ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే సెమీఫైనల్లో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–వాసెలిన్ (ఫ్రాన్స్)లతో యూకీ, ఒలివెట్టి తలపడతారు. -
Archery: ‘టాప్స్’లోకి దీపిక కుమారి
రెండేళ్ల తర్వాత భారత మహిళా స్టార్ ఆర్చర్, ‘ట్రిపుల్’ ఒలింపియన్ దీపిక కుమారికి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు కల్పించారు. ఫామ్‌లో లేకపోవడంతో 2022 జనవరిలో కేంద్ర క్రీడా శాఖ దీపికను ‘టాప్స్’ నుంచి తొలగించింది.2022 డిసెంబర్లో పాపకు జన్మనిచ్చిన దీపిక ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఆసియా కప్ టోర్నీలో స్వర్ణంతో దీపిక పునరాగమనం చేసింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో దీపిక రజత పతకం నెగ్గి సత్తా చాటుకుంది.ఇవి చదవండి: బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత వెలవన్ -
సంచలనం సృష్టించిన భారత ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్లకు షాక్
భారత ఆర్చరీ జట్టు సంచలనం సృష్టించింది. చైనా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ స్టేజ్ 1 పోటీల్లో డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ సౌత్ కొరియాకు ఊహించని షాకిచ్చింది. 🚨 India secured one of its biggest wins in archery as the men's recurve team stunned reigning Olympic champion South Korea to win the gold medal at the ongoing World Cup Stage 1. 🇮🇳🥇👏 pic.twitter.com/hZkHdOicqo— Indian Tech & Infra (@IndianTechGuide) April 28, 2024 ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు.. దక్షిణ కొరియాపై 5-1 తేడాతో చారిత్రక విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అర్చరీ వరల్డ్‌కప్‌లో 14 ఏళ్ల తర్వాత భారత్‌కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇది. ఈ విజయంతో భారత్ పారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. -
రెండు స్వర్ణాలపై భారత్ గురి
షాంఘై (చైనా): ఆర్చరీ సీజన్ తొలి ప్రపంచకప్ టోర్నమెంట్ కాంపౌండ్ విభాగంలో భారత క్రీడాకారుల గురి అదిరింది. మహిళల, పురుషుల టీమ్ విభాగాల్లో భారత జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లి రెండు స్వర్ణ పతకాల రేసులో నిలిచాయి. బుధవారం జరిగిన టీమ్ విభాగాల నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత జట్లు నిలకడగా రాణించాయి.ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 235–230 పాయింట్ల తేడాతో టర్కీ జట్టును ఓడించింది. అనంతరం సెమీఫైనల్లో సురేఖ బృందం 235–230 పాయింట్ల తేడాతోనే ఎస్టోనియా జట్టుపై గెలిచింది.శనివారం జరిగే ఫైనల్లో ఇటలీతో భారత మహిళల జట్టు తలపడుతుంది. క్వాలిఫయింగ్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన సురేఖ జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ లభించింది.మరోవైపు అభిషేక్ వర్మ, ప్రథమేశ్, ప్రియాంశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు తొలి రౌండ్లో 233–227తో ఫిలిప్పీన్స్ జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 237–234తో డెన్మార్క్ జట్టుపై, సెమీఫైనల్లో 235–233తో టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్టుపై విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో నెదర్లాండ్స్‌తో టీమిండియా పోటీపడుతుంది. -
జ్యోతి సురేఖకు రెండో స్థానం
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కొత్త సీజన్లో భాగంగా ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత క్రీడాకారిణులు రాణించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ 711 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన అదితి 704 పాయింట్లతో 8వ స్థానంలో, పర్ణీత్ కౌర్ 703 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. జ్యోతి సురేఖ, అదితి, పర్ణీత్ స్కోర్లతో కలిపి భారత బృందం 2118 పాయింట్లతో టీమ్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
శీతల్ దేవి అద్భుతం: సాధారణ ఆర్చర్లతో పోటీ పడి మరీ!
న్యూఢిల్లీ: ఆర్చరీ పారా క్రీడల్లో వరుస విజయాలతో సత్తా చాటి ‘అర్జున’ అవార్డు అందుకున్న దివ్యాంగురాలు శీతల్ దేవి అరుదైన ఘనతను సాధించింది. రెండు చేతులు కూడా లేని శీతల్ ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సాధారణ ఆర్చర్లతో పోటీ పడి రజత పతకం సాధించడం విశేషం. జూనియర్ వరల్డ్ చాంపియన్ ఏక్తా రాణి ఈ పోటీల్లో స్వర్ణం గెలుచుకోగా... ఫైనల్లో ఏక్తా చేతిలో 140–138 తేడాతో శీతల్ ఓడింది. ‘ఫోకోమెలియా’ అనే అరుదైన వ్యాధి బారిన పడి రెండు చేతులు కోల్పోయిన శీతల్... గత ఏడాది పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది. పారా ఈవెంట్లలో కాకుండా సాధారణ పోటీల్లో పాల్గొంటే తగిన సాధన లభించడంతో పాటు ఆమెలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ఈ ప్రయత్నం చేశామని శీతల్ కోచ్ అభిలాష వెల్లడించారు.