Greenhouse
-
2100 నాటికి ఉష్ణోగ్రతలో... 3.1 డిగ్రీల పెరుగుదల!
వాతావరణ మార్పుల కట్టడి కోసం ప్రస్తుతం ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న చర్యలు ఏమాత్రం సరిపోవని ఐక్యరాజ్యసమితి తేలి్చచెప్పింది. భూగోళంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్న గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను అరికట్టడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఎండగట్టింది. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సగటు ఉష్ణోగ్రత మరో 3.1 డిగ్రీల సెల్సియస్(5.4 డిగ్రీల ఫారెన్‌హీట్) పెరుగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు వార్షిక ఉద్గారాల నివేదికను ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసింది. వాస్తవానికి ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకే(2.7 ఫారెన్‌హీట్) పరిమితం చేయాలన్న ప్రతిపాదనకు ప్రపంచదేశాలు మద్దతు పలికాయి. 2015లో పారిస్‌లో జరిగిన కాప్–21 సదస్సులో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి. భూగోళంపై జీవుల మనుగడ కొనసాగాలంటే ఉష్ణోగ్రతల పెరుగుదలను కట్టడి చేయాల్సిందేనని నిపుణులు స్పష్టంచేశారు. పారిస్ ఒప్పందంపై సంతకాలు చేసి దాదాపు పదేళ్లవుతున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండడం శోచనీయమని ఐక్యరాజ్యసమితి ఆక్షేపించింది. → ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, వాస్తవ పరిస్థితిని చూస్తే 2100 నాటికల్లా ఉష్ణోగ్రతలు 3.1 డిగ్రీల దాకా పెరిగిపోనున్నాయి. అంటే లక్ష్యం కంటే రెండింతలు కావడం గమనార్హం. ప్రభుత్వాల చర్యలు ఎంత నాసిరకంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. → కర్బన ఉద్గారాలను అరికట్టడం, వాతావరణ మార్పులను నియంత్రించడం తక్షణావసరమని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు. లేకపోతే మనమంతా మహావిపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. → 2022 నుంచి 2023 దాకా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు 1.3 శాతం పెరిగినట్లు ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది 57.1 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానం. → ఒకవేళ ఇప్పటినుంచి ఉద్గారాల నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసినప్పటికీ ఉష్ణోగ్రతలు 2100 కల్లా 2.6 డిగ్రీల నుంచి 2.8 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. → కర్బన ఉద్గారాల్లో అధిక వాటా జీ20 దేశాలదే. వాతావరణ మార్పులను అరికట్టడంతో ఆయా దేశాలు దారుణగా విఫలమవుతున్నాయని ఐక్యరాజ్యసమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ లక్ష్యాల సాధనలో చాలా వెనుకంజలో ఉన్నాయని వెల్లడించింది. → ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను 2030 నాటికి 42 శాతం, 2035 నాటికి 57 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమేనని నిపుణులు అంటున్నారు. → ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పారీ్టస్(కాప్–29) సదస్సు వచ్చే నెలలో అజర్బైజాన్లో జరుగనుంది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ సదస్సులో కీలక తీర్మానాలు ఆమోదిస్తారని పర్యావరణ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Global Warming: భూమిని వేడెక్కిస్తున్న పాపం... పెద్ద దేశాలదే!
గ్లోబల్ వార్మింగ్. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. దీని దెబ్బకు భూగోళపు సగటు ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అవి ఇంకో అర డిగ్రీ మేరకు పెరిగినా సర్వ వినాశనం జరిగే పరిస్థితి! ప్రాణికోటి మనుగడకే పెను ముప్పు! ఈ ప్రమాదం ఎంతో దూరం కూడా లేదని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా పరిస్థితిలో పెద్దగా మెరుగుదల లేదు. ముఖ్యంగా గ్లోబల్ వార్మంగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అంతర్జాతీయ పర్యావరణ సదస్సుల్లో దీనిపై ఎంతగా ఆందోళన వ్యక్తమవుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది. ఉద్గారాలకు ముకుతాడు వేస్తామన్న సంపన్న దేశాల వాగ్దానాలు నీటిమూటలే అవుతున్నాయి. తరచి చూస్తే, గ్రీన్‌హౌస్‌వాయు ఉద్గారాల్లో సింహ భాగం పెద్ద దేశాలదే. మాటలే తప్ప చేతల్లేవు 2022లో ప్రపంచ దేశాలన్నీ కలిపి విడుదల చేసిన గ్రీన్హౌస్ వాయువుల పరిమాణమెంతో తెలుసా? ఏకంగా 5,000 కోట్ల మెట్రిక్ టన్నులు! పర్యావరణ కాలుష్య కారకాల్లో అతి ముఖ్యమైనవి గ్రీన్హౌస్ ఉద్గారాలే. భూగోళాన్ని వేడెక్కించడంలో కూడా వీటిదే ప్రధాన పాత్ర. ఇంతటి ప్రమాదకరమైన సమస్య విషయంలో మన నిర్లిప్త వైఖరికి ఏత ఏడాది గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల పరిమాణం మరో తాజా ఉదాహరణ మాత్రమే. ఈ పాపంలో సంపన్న దేశాల పాత్రే ఎక్కువ. చైనా విషయమే తీసుకుంటే, గతేడాది ప్రపంచ గ్రీన్హౌస్ ఉద్గారాల్లో ఆ ఒక్క దేశం వాటాయే ఏకంగా 30 శాతం! 2022లో అది 1,440 కోట్ల టన్నుల మేరకు కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేసిన చెత్త రికార్డును మూటగట్టుకుంది. కొన్ని దశాబ్దాలుగా చైనా పారిశ్రామిక వ్యవస్థ ప్రధానంగా బొగ్గుపై ఆధారపడటమే ఇందుకు ప్రధాన కారణం. ఇక 639 కోట్ల టన్నులతో అమెరికా రెండో స్థానంలో ఉంది. 343 కోట్ల టన్నులతో యూరోపియన్ యూనియన్(ఈయూ) నాలుగో స్థానంలో ఉంది. గణాంకాలపరంగా 352 కోట్ల టన్నులతో ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు కనిపించినా జనాభాను బట్టి చూస్తే కర్బన ఉద్గారాల పాపంలో మన వాటా నిజానికి చాలా తక్కువ. మన తలసరి వార్షిక కర్బన ఉద్గారాలు కేవలం 2.5 టన్నులు! ప్రపంచ వేదికలపై పెద్ద మాటలు చెప్పే అమెరికాదే ఈ పాపంలో అగ్ర స్థానం! ఒక్కో అమెరికన్ ఏటా సగటున 19 టన్నుల సీఓటూ ఉద్గారాలకు కారకుడవుతున్నాడు. కేవలం 2.5 కోట్ల జనాభా ఉన్న ఆ్రస్టేలియాలో తలసరి కర్బన ఉద్గారాలు 20 టన్నులు, 3.8 కోట్ల జనాభా ఉన్న కెనడాలో 18 టన్నులు, 14 కోట్ల జనాభా ఉన్న రష్యాలో 14 టన్నులు! 20.7 టన్నుల తలసరి ఉద్గారాలతో సౌదీ అరేబియా ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండటం విశేషం. మొత్తమ్మీద ప్రపంచ కర్బన ఉద్గారాల్లో చైనా, అమెరికా, ఈయూ వాటాయే దాదాపు సగం! వీటిలోనూ చారిత్రకంగా చూసుకుంటే అమెరికా, ఈయూ రెండే ప్రపంచ కాలుష్యానికి ప్రధాన కారకులుగా ఉంటూ వస్తున్నాయి. వేడెక్కుతున్న భూమి భూగోళపు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు నాటితో గత 150 ఏళ్లలో 1.5 డిగ్రీలకు మించి పెరిగిపోయింది! ఇటీవల ఒకానొక దశలో అది 2 డిగ్రీలకు మించి కలవరపరిచింది కూడా. దాన్ని 1.5 డిగ్రీలకు మించకుండా కట్టడి చేయాలన్న పారిస్ ఒప్పందానికి ప్రపంచ దేశాలన్నీ పేరుకు అంగీకరించాయే తప్ప ఆచరణలో చేస్తున్నది పెద్దగా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ఏ క్షణమైనా పేలనున్న మందుపాతర మీద ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా ఆందోళన వెలిబుచి్చంది. కర్బన ఉద్గారాల ప్రవాహం ఇలాగే కొనసాగి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ పోతే ప్రపంచ దేశాలన్నీ ఎలాగోలా ప్రస్తుత పర్యావరణ లక్ష్యాలను చేరుకున్నా భూమి 2 డిగ్రీలను మించి వేడెక్కడం ఖాయమని హెచ్చరించింది. అప్పుడు కనీవినీ ఎరగని ఉత్పాతాలను, ఘోరాలను నిత్యం కళ్లజూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్–28 జరుగుతోంది. అందులోనైనా కర్బన ఉద్గారాలకు కళ్లెం వేసి భూగోళాన్ని కాపాడుకునే దిశగా ఏమైనా నిర్ణయాత్మకమైన అడుగులు పడతాయేమో చూడాలి. ఏమిటీ కర్బన ఉద్గారాలు? బొగ్గు, చమురు, గ్యాస్‌ను మండించినప్పుడు అవి వాతావరణంలోకి భారీ పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. అది కొన్ని వందల ఏళ్లపాటు వాతావరణంలోనే ఉండిపోయి భూమిని వేడెక్కిస్తూ ఉంటుంది. ‘‘ఆ లెక్కన భూమికి ముప్పు కేవలం 2022 తాలూకు కర్బన ఉద్గారాలు మాత్రమే కాదు. పారిశ్రామికీకరణ ఊపందుకున్నాక గత 150 ఏళ్లలో విడుదలైన కర్బన ఉద్గారాలన్నీ ఇప్పటికీ భూమిని వేడెక్కిస్తూనే ఉన్నాయి. ఆ లెక్కన ఈ 150 ఏళ్లలో అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన అమెరికాదే గ్లోబల్ వార్మింగ్‌లో ప్రధాన పాత్ర అని చెప్పాల్సి ఉంటుంది’’ అని బ్రిటన్‌లోని ఎక్స్టర్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త పియరీ ఫ్రెడ్లింగ్‌స్టెయిన్ కుండబద్దలు కొట్టారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
G20 Summit: డిక్లరేషన్‌పై తొలగని ప్రతిష్టంభన
జీ20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమై అగ్రరా జ్యాధినేతలు విచ్చేసి భేటీకి సిద్ధమవుతున్న వేళ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఇంకా ప్రతిష్టంభన తొలగలేదు. శిఖరాగ్ర సదస్సులో దేశాధినేతల మధ్య విస్తృత స్థాయి చర్చలు పూర్తయ్యాక చివరి రోజున ఉమ్మడి తీర్మానం(ఢిల్లీ డిక్లరేషన్) విడుదల చేస్తారు. ఆ తీర్మానంలో ఏఏ అంశాలపై ఉమ్మడి నిర్ణయాలు ప్రకటించాలనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ఇప్పటికే ఆయా దేశాధినేతల తరఫున అధికారిక ప్రతినిధు(షెర్పా) లు పలుమార్లు కలిసికట్టుగా అంతర్గత చర్చలు జరిపారు. ఈ మంతనాల్లో ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎలాంటి ఉమ్మడి నిర్ణయాలు తీసుకో లేదు. శిఖరాగ్ర సదస్సులో అధినేతలు ఏమేం అంశాలు చర్చించాలనేది ముందే నిర్ణయం అయిపో తుంది. సదస్సు అత్యంత సాఫీగా సాగేందుకు వీలుగా ఆయా అంశాలపై అధినేతల నుంచి ఉమ్మ డి నిర్ణయాలు వెలువడేందుకుగాను ముందే షెర్పా లు భారీ కసరత్తు చేస్తారు. సభ్య దేశాల అధినేతల అధికారిక ప్రతినిధులైన ఈ షెర్పాలు దౌత్యమార్గంలో అంతర్గతంగా ముందే అందరూ చర్చించుకుంటారు. దీంతో శిఖరాగ్ర సదస్సులో అధినేతలు నేరుగా కలిసి మాట్లాడేటపుడు ఆయా అంశాల లోతుల్లోకి వెళ్లరు. సూత్రప్రాయ అంగీకారం మాత్రమే తెలుపుతారు. మిగిలిన పని అంతా ముందే ఏర్పాటు చేసిపెడతారు కాబట్టి ఆతర్వాతి ప్రక్రియ సులువు అవుతుంది. అయితే, తాజాగా షెర్పాల మధ్య జరిగిన చివరి రౌండ్ చర్చల్లోనూ కొన్ని కీలక అంశాలపై సయోధ్య కుదరనే లేదు. వాటిల్లో పర్యావరణ మార్పు, ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రధాన అంశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని పేర్కొంటూ ఒక పేరాగ్రాఫ్‌లో భారత్ చేసిన ప్రతిపాదనలపై షెర్పాల చిక్కుముడి పడింది. ఉక్రెయిన్‌లో రష్యా ఆగడాలను అడ్డుకునేలా చర్యలు ఆ పేరాగ్రాఫ్‌లో లేవని అమెరికా, బ్రిటన్, యురోపియన్ యూనియన్లు వేలెత్తిచూపాయి. ఢిల్లీ డిక్లరేషన్‌లో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై ఏకాభిప్రాయం తెలపాలంటే తమ డిమాండ్లు నెరవేర్చాలని అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు పట్టుబడుతున్నాయి. దీంతో ఈ అంశంపై సమ్మతి సాధ్యపడలేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే ముందుగానే జకార్తాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌లు చర్చలు జరిపి డిక్లరేషన్ సంబంధ అంశాలపై చర్చించినా ఫలితం లేకపోయింది. భారత నాయకత్వ ప్రతిష్టకు సవాల్ తొలిసారిగా జీ20 కూటమి సారథ్య బాధ్యతలు తీసుకున్న భారత్ ఈ సదస్సు తర్వాత ఎలాగైనా సరే ఉమ్మడి తీర్మానం ప్రకటించాలని చూస్తోంది. అయితే అటు పశ్చిమ దేశాలు, ఇటు రష్యా–చైనా పక్ష దేశాలు ఎవరి మంకుపట్టు వారు పట్టడంతో ఉ మ్మడి తీర్మానం సాధ్యమయ్యేలా లేదు. అదే జరిగి తే అంతర్జాతీయంగా భారత ప్రతిష్టకు భంగం వా టిల్లే ప్రమాదం ఉంది. సంయుక్త ప్రకటన సాధ్యంకాని పక్షంలో జీ20 అధ్యక్ష హోదాలో మోదీ కేవలం సారాంశ ప్రకటన విడుదల చేస్తారు. వాతావరణ మార్పు: ఇదే అసలైన అవరోధం చర్చల్లో ఏకాభిప్రాయానికి ప్రధాన అవరోధంగా వాతావరణ మార్పు విధానం నిలుస్తోంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవడం, పునరుత్పాదక ఇంథనాల వైపు మళ్లడం, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు లక్ష్యాలను నిర్దేశించుకోవడం, గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను తగ్గించుకోవడం వంటి అంశాల్లో జీ20 సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది షెర్పాల భేటీలో స్పష్టంగా కనిపించింది. 2030 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను క్రమంగా పెంచుకోవాలని, 2035 ఏడాదికల్లా గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాల స్థాయిని తగ్గించుకోవాలని పశ్చిమ దేశాలు చేసిన ప్రతిపాదనలను భారత్, రష్యా, చైనా, సౌదీ అరేబియాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శిలాజ ఇంధన ఆధారిత ఆర్థికవ్యవస్థ కలిగిన సౌదీ అరేబియా అయితే ఈ ప్రతిపాదలను ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పింది. జ్ఞానాధారిత రంగాలు, ఇతర సెక్టార్ల వైపు మళ్లేందుకు తమకు దశాబ్దాల కాలం పడుతుందని వాదిస్తోంది. వెలువడుతున్న కర్భన ఉద్గారాలు, ప్రకృతిలోకి శోషించబడుతున్న కర్భన ఉద్గారాల నిష్పత్తి సమంగా ఉండేలా అంటే కార్బన్ నెట్ జీరో(కర్భన స్థిరత్వం) సాధించేందుకు జీ7 దేశాలు తొందర పెడుతున్నాయి. శిలాజ ఇంధనాల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాటి ద్వారా వచ్చే విద్యుత్ సాయంతోనే ఆర్థిక వ్యవస్థలో సుస్థిరాభివృద్ధి సాధిస్తామని ధీమాగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు.. ఈ జీ7 దేశాల ప్రతిపా దనలను తప్పుబడుతున్నాయి. ‘దశాబ్దాలుగా శిలా జ ఇంధనాలను విపరీతంగా వాడేసి పారిశ్రా మిక విప్లవంతో పశ్చిమ దేశాలు సంపన్న దేశాలుగా అవ తరించాయి. ఇప్పుడు మాకు ఆ అవకాశం ఇవ్వండి. వాతావరణ మార్పుల మాటున అభివృద్ధిని అడ్డుకో కండి’ అని భారత్‌సహా దేశాలు వాదిస్తు న్నాయి. 2020కల్లా వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పేద దేశాలకు ఏటా 100 బిలి యన్ డాలర్ల నిధులను ఇస్తామన్న సంపన్న దేశాలు ఆ వాగ్దానాన్ని నెరవేర్చనేలేదు. ఎప్ప టికల్లా సాయం చేస్తాయనేదీ స్పష్టంచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్లైమేట్ పాలసీపై ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టమే. ఇలాంటి తరుణంలో మొదలవు తున్న జీ20 సదస్సు క్లిష్టమైన కూడలిలో నిల్చుంద నే చెప్పాలి. దేశ ప్రయోజనా లను పక్కనబెట్టి మానవాళి శ్రేయస్సు కోసం అగ్రనేతలు ఏ మేరకు ఉమ్మడి వాగ్దానాలు చేస్తారనేది బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. జీ20లో ఏకాభిప్రాయం కుదరక పోతే త్వరలో యునైటెడ్ అరబ్ ఎమిరే ట్స్‌లో జరగ బోయే కాప్28 సదస్సులోనూ మేలైన ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుంది. –సాక్షి నేషనల్‌డెస్క్ -
యూనిస్ న్యూటన్ ఫుట్: గూగుల్ డూడుల్‌లో ఉన్న వ్యక్తి ఎవరంటే..
ఈ రోజు గూగుల్ 11 స్లయిడ్‌లతో ఓ ఇంటారాక్టివ్ డూడుల్‌ని రూపొందించింది. అందులో ఓ మహిళ ఫోటో ఉంది ఎవరు ఆమె?. ఎందుకు గూగుల్ సోమవారం ఆ మహిళతో ఉన్న డూడిల్ రూపొందించిన నివాళులర్పించింది. తొలిసారిగా గ్రీన్హౌస్ ప్రభావాన్ని కనుగొన్న తొలి వ్యక్తే ఆమె. ఆమె పేరు యూనిస్ న్యూటన్ ఫుట్, అమెరికన్ శాస్త్రవేత్త. స్త్రీలు అంతగా చదువుకోని ఆరోజుల్లో ఆమె చదువుకోవడమేగాక ఇలాంటి పరిశోధనల వైపుకి వెళ్లే అవకాశమేలేని స్థితిలో అటువైపుకే అడుగులు వేయడం విశేషం. ఇక ఫుట్ 1856లో ఓ ప్రయోగాన్ని నిర్వహించింది. గాజు సిలండర్లలో పాదరసంతో కూడిన థర్మామీటర్లను ఉంచింది. సిలిండర్‌లో కార్బన్ డయాక్సైడ్ ఉండటం వల్లే సూర్యరశ్మీ ప్రభావానికి బాగా గురైందని కనుగొంది. దీని ఫలితంగా గాల్లో ఉండే కార్బన్ డయాక్స్డ్ స్థాయిల వల్ల వాతావరణం చాలా సులభంగా వేడుక్కుతుందనే విషయాన్ని నిర్థారించింది. ఆ పరిశోధనలే నేటి వాతావరణ మార్పుల అవగాహన సదస్సులకు మూలం అయ్యింది. ఇలా ఫుట్ తన పరిశోధనలను ప్రచురించిన తర్వాత వాతావరణ స్థిర విద్యుత్‌పై రెండొవ అధ్యయనాన్ని రూపొందించింది. మొత్తంగా ఆమె రెండు భౌతిక శాస్త్ర అధ్యయనాలను ప్రచురించిన మొదటి మహిళ. వాటిపై జరిగిన చర్చలే తదుపరి ప్రయోగాలకు దారితీశాయి. ఆ తర్వాత దాన్నే ఇప్పుడు మనం 'గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌గా' పిలుస్తున్నాం. ఆమె వేసిన పునాది వల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు వాతావరణ శాస్త్రాన్ని అభివృద్ధి చేసేందుకు కారణమైంది. అంతేగాదు గ్రీన్హౌస్ ప్రభావాన్ని, గ్లోబల్ వార్మింగ్ దాని ప్రభావం గురించి అధ్యయనం చేసిన తొలి మహిళగా అమెరికన్ శాస్త్రవేత్త ఫుట్ నిలిచింది. నిజానికి ఫుట్ 1819లో కనెక్టికట్‌లో జన్మించింది. ఆమె ట్రాయ ఫిమేల్ సెమినరీ అనే పాఠశాలలో చదువుకున్నారు. ఇది విద్యార్థులను సైన్స్ తరగతులకు హాజరయ్యేలా చేయడమే గాక కెమిస్ట్రీ ల్యాబ్‌లోని ప్రయోగాల్లో పాల్గొనేలా ప్రోత్సహించేది. ఇక్కడ నుంచి ఫుట్కి సైన్స్‌పై మక్కువ ఏర్పడింది. అంతేగాదు ఫుట్ ఇలా పరిశోధనలు చేస్తూనే మహిళా హక్కుల ప్రచారానికి కూడా సమయం కేటాయించింది. ఫుట్ 19848లో సెనెకా ఫాల్స్‌లో జరిగిన మొదటి మహిళా హక్కుల సమావేశానికి హాజరయ్యి డిక్లరేషన్ ఆఫ్ సెంటిమెంట్స్‌పై సంతకం చేసింది. ఇది సామాజికంగా చట్టపరమైన హోదాలో మహిళలకు సమానత్వాన్ని కోరే పత్రం. ఐతే గొప్ప శాస్త్రవేత్త అయిన ఫుట్ 1888లో మరణించడంతో ఒక శతాబ్దానికి పైగా ఫుట్ విజయాలను గుర్తింపు లభించలేదు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఆమెకి నివాళులర్పిస్తూ సోమవారం ఈ డూడుల్‌ని రూపొందించింది. అది ఆమె సాధించిన విజయాలను తెలిపేలా గ్రీన్హౌస్ ప్రభావాన్ని కూడా వివరిస్తోంది. (చదవండి: ఈ వర్షాకాలంలో ఈ పండ్లు తీసుకుంటే..ఇమ్యూనిటీ ఫుల్) -
Tuvalu: ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశం.. ఉనికి మాటేమిటి?!
తాజాగా ఈజిప్టులో ముగిసిన కాప్ 27 సదస్సు మరోసారి ప్రపంచ పర్యావరణ సమస్యలు, గ్లోబల్ వార్మింగ్ ప్రమాదాలపై చర్చకు వేదిక అయ్యింది. నవంబర్ మొదటి, రెండు వారాల్లో జరిగిన ఈ సమావేశం చివరకు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోగలిగినందుకు సంతోషించాల్సిందే. పర్యావరణ మార్పుల వల్ల నష్టపోతున్న బడుగు దేశాలను ఆదుకోవడానికి ప్రత్యేక నిధి ఏర్పాటుకు ఈ సమావేశంలో అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. వాస్తవంగా ప్రపంచం పర్యావరణ ప్రమాదం బారిన పడటానికి ప్రధాన కారణం కాలుష్య కారకాలుగా మారిన ఈ అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలే. గ్రీస్‌హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవాల్సిన బాధ్యత ఈ దేశాల పైనే ఉంటుంది. అది ఒక చర్చనీయాంశం. ఈ సమావేశం సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించింది పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం ‘టువాలు’. ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలో జరిగిన కాప్ 27 సమావేశంలో టువాలు ప్రపంచం ముందు ఒక సవాలుగా నిలబడింది. ప్రపంచ బాధ్యతను గుర్తు చేసింది. వేగంగా జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన అంశమే. ఈ పెరుగుదల ఇలానే కొనసాగితే మరో 60, 70 ఏళ్ళల్లో ఈ ద్వీప దేశం జల సమాధి కాకుండా ఎవరూ ఆపలేరు. టువాలు మొత్తం 9 ద్వీపాల సమూహం. హవాయి, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఒకదాని వెంట ఒకటిగా చిన్న చిన్న దీవులు బారులు తీరి ఉంటాయి. దేశం మొత్తం కేవలం 26 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే సుమారు 6400 ఎకరాలు. 2022 జనాభా అంచనా ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 11 వేల 200. బ్రిటన్ నుండి 1978లో స్వాతంత్య్రం పొందింది. ఈ దేశం సముద్ర మట్టానికి కేవలం నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి హైదరాబాద్ నగరం 542 మీటర్ల ఎత్తున ఉంటే... సముద్రం ఒడ్డునే ఉన్న విశాఖపట్నం 45 మీటర్ల ఎత్తున ఉంది. దీన్ని బట్టి టువాలు పరిస్థితిని అంచనా వేయవచ్చు. సముద్ర మట్టానికి ఇంకా తక్కువలో ఉన్న మరో ద్వీప దేశం మాల్దీవులు. సముద్ర మట్టాలు పెరుగుతున్న కొద్దీ ఈ దేశాల ఉనికి ప్రమాదం దిశగా పయనిస్తున్నట్లే. టువాలు కంటే ఆర్థికంగా కాస్త బలమైన మాల్దీవులు తమ దేశాన్ని కాపాడు కోవటానికి తేలియాడే నగరాన్ని నిర్మిస్తోంది. 20 వేల మంది జనాభాకు కృత్రిమంగా నిర్మిస్తున్న ఫ్లోటింగ్ సిటీ ఆవాసంగా మారనుంది. ఇటువంటి ఏర్పాట్లు చేసుకునే స్థోమత టువాలుకి లేదు. అందుకే అది తమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, భౌగోళిక స్వరూపం, రోడ్లు, నిర్మాణాలు.. మొత్తంగా తన అస్తిత్వాన్ని భద్ర పరుచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. తమ దేశాన్ని వర్చ్యువల్ రియాలిటీ సాంకేతికత ఉపయోగించి ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశంగా అయినా మార్చాలనే సంకల్పంతో ఉంది. ఇక్కడే కొన్ని కీలకమైన సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ దేశంలోని జనాభాకు భౌతికంగా భూ మండలంపై ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది అనేది పెద్ద ప్రశ్న. పోనీ ఏదో ఒక దేశం స్వాగతించినా వీరు ఆ దేశానికి వలసదారులు, లేదంటే ఆ దేశ పౌరులు అనే హోదాను మాత్రమే పొందగలుగుతారు. మరి టువాలు సార్వభౌమత్వం సంగతి ఏంటి? స్వయం పాలనకు అవకాశం కోల్పోవటమేనా? దేశం సముద్రంలో మునిగిపోతే అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇప్పుడు ఉన్న హక్కులు, మెరైన్ సరిహద్దు పరిధిలో ఉండే సహజ వనరులను కోల్పోక తప్పదా? భౌతికంగా కనిపించని టువాలును ఐక్యరాజ్యసమితి ఒక దేశంగా గుర్తించే అవకాశం ఉంటుందా? టువాలు ఇవాళ ప్రపంచం ముందు ఒక ప్రశ్నగా నిలబడి ఉంది. (క్లిక్ చేయండి: ముందు నుయ్యి... వెనుక గొయ్యి) - రెహాన సీనియర్ జర్నలిస్ట్ -
కిమ్ రూటే సెపరేట్: క్షిపణి ప్రయోగం చేసిన స్థావరంలోనే..
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా మిసైల్ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడూ తాజాగా మిసైల్ ప్రయోగ స్థావరంలోనే గ్రీన్ హౌస్ ఫామ్‌కి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పూర్వ రియోనిఫో వైమానికి స్థావరంలో ఈ గ్రీన్హౌస్ ఫాంని ప్రారంభించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రారంభోత్సవానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరయ్యారు. ఇది ఉత్తర కొరియాలో అతిపెద్ద కూరగాయాల ఫాంలో ఒకటిగా పేరుగాంచనుంది. దీన్ని ఉత్తర కొరియాలో ప్రభలంగా ఉన్న ఆహార కొరత సమస్యలను పరిష్కరించడానికి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ నిర్మించిన ప్రాంతంలోనే 2019, 2021 వరసగా కెఎన్ 25, కెఎన్ 23 వంటి స్వల్స బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. ఈ ఫాం హౌస్‌ని ఉత్తర కొరియాలో ప్రధాన సెలవు దినమైన పాలకుల వర్కర్స్ పార్టీ స్థాపన వార్షికోత్సవం రోజున ప్రారంభించింది. ఉత్తరకొరియా ప్రజల కోసం గత డిసెంబర్లోనే ఈ ఫామ్‌ను ఆటోమెటెడ్‌గా మార్చే ప్రాజెక్టుని ప్రారంభించింది. ఈ వ్యవసాయ క్షేత్రంలో సుమారు 280 హెక్టారుల విస్తీర్ణంలో 850కి పైగా గ్రీన్హౌస్ ఫామ్‌లు ఉన్నాయి. అంతేగాదు ఈ ఫాం హౌస్‌ని కొద్దినెలల్లోనే పూర్తి చేసినందుకు కార్మికులను, సైనికులను కిమ్ ప్రశంసించారు. అంతేగాదు ఇలాంటి మరిన్ని ఫామ్ హౌస్‌లను అభివృద్ధి చేయాలని శాస్త్రీయ పద్ధతుల్లో కూరగాయలను ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. ఒకపక్క దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నౌకదళ విన్యాసాలు చేశాయన్న అక్కసుతో మిసైల్ దూకుడుతో కవ్వింపు చర్యలకు దిగింది. మరోవైపు దేశ ప్రజల ఆహార కొరత సమస్యను పరిష్కరించే దిశగా వైమానిక ప్రయోగా స్థావరాల్లోనే ఫామ్ హౌస్‌లను ఏర్పాటు చేసి ఆశ్చర్యపరించింది. ఏదైనా కిమ్కే చెల్లింది. (చదవండి: ఐరాసలో రష్యాకు భారత్ షాక్.. కీలక ఓటింగ్‌లోనూ భారీ షాక్ ఇస్తుందా?) -
మూడింతల దిగుబడికి కొత్త రూటు!
మంది పెరిగితే మజ్జిగ పలచనవుతుందని నానుడి. ఇంట్లో అయితే ఓకే గానీ.. అంగుళం నేల కూడా పెరగని భూమిపై జనాభా ఇబ్బడిముబ్బడి అయితే ఆహారం ఎల్లా? ఈ చిక్కు ప్రశ్నకు శాస్త్రవేత్తలు రకరకాల పరిష్కారాలు వెతుకుతున్నారు గానీ. తాజాగా సిడ్నీ, క్వీన్స్‌ల్యాండ్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతికి పదును పెడుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పదేళ్ల క్రితం ప్రయత్నించి, వదిలేసుకున్న ఒక పద్ధతితో పంట దిగుబడులు మూడు రెట్లు ఎక్కువ చేయవచ్చునని వీరు అంటున్నారు. మొక్కలు ఎదిగేందుకు కీలకమైన కిరణజన్య సంయోగక్రియ మరింత మెరుగ్గా, రోజంతా జరిగేలా చేయడం ఈ ‘స్పీడ్ బ్రీడింగ్’ టెక్నిక్‌లోని కీలకాంశం. దీంట్లో మొక్కలు వేగంగా పెరిగేందుకు, కాపుకొచ్చేందుకు అనువైన నిర్దిష్ట తరంగదైర్ఘ్యాలతో కూడిన కాంతిని చౌక ఎల్ఈడీ బల్బులతో అందిస్తారు. ఒక గ్రీన్హౌస్లో తామిప్పటికే కొన్ని ప్రయోగాలు చేశామని ఏడాది సమయంలో ఆరు పంటల గోధుమలు పండించడమే కాకుండా... సెనగ, బార్లీ, ఆవ పంటలు కూడా వేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లీ హెకీ తెలిపారు. వేరుసెనగ, గోంగూర, పప్పుధాన్యాలు, సూర్యకాంతి, మిరియాలు, ముల్లంగి వంటి పంటలను కూడా స్పీడ్ బ్రీడింగ్ ద్వారా ఎక్కువగా పండిచేందుకు అవకాశముందని వివరించారు. కొత్త పద్ధతి ద్వారా కేవలం ఒక చదరపు మీటర్ వైశాల్యంలో 900 బార్లీ మొక్కలను పండించామని, దిగుబడులతోపాటు పౌష్టిక విలువలను కూడా కాపాడుకోవచ్చునని వివరించారు. జన్యుపరమైన మార్పులేవీ అవసరం లేకుండా... అతితక్కువ ఎరువులు, కీటకనాశనుల సాయంతో మూడింతల దిగుబడి సాధించగల స్పీడ్ బ్రీడింగ్ వివరాలు నేచర్ ప్లాంట్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
వరికి రుణ పరిమితి రూ.31 వేలు
2017–18 సంవత్సరంలో పంటలకు రుణ పరిమితి ఖరారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ పంటలు సాగు చేసే రైతులకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణపరిమితి ఖరారైంది. 2017–18 వ్యవసాయ సీజన్లో ఆ ప్రకారమే బ్యాంకులు రుణాలివ్వాలి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) ఆధ్వర్యంలోని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఈ రుణపరిమితిని ఖరారు చేసింది. రాష్ట్రంలో సగటు పంటల సాగు వ్యయం ఆధారంగా దీనిని రూపొందిం చింది. ఈ మేరకు నివేదికను నాబార్డుకు, వ్యవసాయశాఖకు పంపించింది. దీని ఆధారంగానే నాబార్డు వ్యవసాయ రుణ ప్రణాళికను తయారుచేయనుంది. సాగునీటి వనరులున్నచోట వరికి ఎకరానికి రూ. 29 వేల నుంచి రూ. 31 వేల వరకు రుణ పరిమితిని నిర్ధారించారు. 2016–17 కంటే ఇది రూ. వెయ్యి అదనం. పత్తికి సాగునీటి వనరులున్నచోట రూ. 33 వేల నుంచి రూ. 35 వేలకు ఖరారు చేశారు. 2016–17 కంటే ఇది రూ. 5 వేల వరకు అదనం. ఇదే పంటకు సాగునీటి వనరులు లేనిచోట రూ. 28 వేల నుంచి రూ. 30 వేలు ఖరారు చేశారు. ఇలా మొత్తం 70 పంటలకు రుణ పరిమితిని ఖరారు చేశారు. అయితే గ్రీన్హౌస్ పద్ధతిలో సాగు చేసే రైతులకు మాత్రం రుణపరిమితి ని నిర్ధారించలేదు. లక్షల్లో సాగు ఖర్చు ఉన్నందున దానికి కూడా రుణపరిమితి నిర్ధారిస్తే బాగుండేదన్న చర్చ జరుగుతోంది. రుణ పరిమితి లేకపోవడంతో గ్రీన్హౌస్ ద్వారా సాగు చేసే రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదన్న విమర్శలున్నాయి. -
గ్రీన్హౌస్ బదులు నెట్‌హౌస్
⇒ ఈ ఏడాది నుంచి దృష్టి సారించనున్న ఉద్యానశాఖ ⇒ గ్రీన్‌హౌస్‌కు రూ. 40 లక్షలైతే... నెట్‌హౌస్‌కు రూ. 17 లక్షలే సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ బదులు నెట్‌హౌస్‌ను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. గ్రీన్హౌస్ నిర్మాణానికి ఎకరాకు రూ.40లక్షల వరకు ఖర్చు అవుతుంటే... నెట్‌హౌస్ నిర్మాణానికి రూ. 17 లక్షలు కానుంది. పైగా నిర్వహణ భారం తక్కువగా ఉండటం, పంటల దిగుబడి గ్రీన్హౌస్తో సమానంగా ఉండటంతో నెట్ హౌస్ వైపు వెళ్లడమే ఉత్తమమని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గ్రీన్హౌస్ తోపాటు నెట్హౌస్నూ ఎక్కువగా ప్రోత్స హించాలని.. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అందువల్ల వచ్చే బడ్జెట్లో గ్రీన్‌హౌస్‌తోపాటు నెట్హౌస్కూ నిధులు కేటాయించాలని ఆ శాఖ ప్రభు త్వాన్ని కోరింది. రెండింటికీ కలిపి రూ. 300 కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖను కోరినట్లు తెలిసింది. ధనిక రైతులకే గ్రీన్హౌస్..? గ్రీన్‌హౌస్‌కు బడ్జెట్లో ప్రభుత్వం అధికంగానే నిధులు కేటాయిస్తోంది. 2016–17 బడ్జెట్లో రూ.200కోట్లు కేటాయించింది. 800 ఎకరా ల్లో సాగు చేయాలన్నది లక్ష్యం. గ్రీన్హౌస్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం ఏకంగా 75 శాతం సబ్సిడీ ఇస్తోంది. దేశంలో ఇంత భారీ సబ్సిడీ ఇచ్చే రాష్ట్రం మరోటి లేదు. గ్రీన్‌హౌస్‌కు ఎకరానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతుండగా... అందులో రైతు తన వాటాగా రూ. 10 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. మూడు ఎకరాల వరకు సబ్సిడీ ఇస్తుండటంతో అందుకోసం రైతు రూ. 30 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇది ధనిక రైతులకే ఉపయోగపడుతోంది. ఒకవైపు కంపెనీలకు, మరోవైపు పేద, మధ్యతరగతి రైతులకు భారంగా మారుతున్న గ్రీన్హౌస్ బదులు నెట్‌హౌస్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక ఎకరా నెట్‌హౌస్ నిర్మాణానికి రూ.14 లక్షలు, సాగునీటి వ్యవస్థల ఏర్పాటుకు రూ.1.60 లక్షలు, సాగు ఖర్చు రూ. 2 లక్షలు కలిపి రూ. 17.60 లక్షలు ఖర్చు అవుతుందని ఉద్యానశాఖ అంచనా వేసింది. అందులో ప్రభుత్వం రూ. 13.20 లక్షలు సబ్సిడీ ఇవ్వనుంది. రైతు తన వాటా గా రూ. 4.40 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ జీడిమెట్లలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో నెట్హౌస్లను ఏర్పాటు చేశారు. నెట్హౌస్తో లాభాలేంటంటే... ∙తక్కువ ఖర్చుతో నెట్‌హౌస్‌ను నిర్మించు కోవచ్చు. ∙గ్రీన్హౌస్ నిర్మాణానికి వాడే ప్లాస్టిక్ షీట్‌తో సూర్యరశ్మి ద్వారా వచ్చే వేడి మొక్కలపై పడుతోంది. దీంతో ఏసీలను వాడాల్సి వస్తోంది. నెట్‌హౌస్‌కు ప్లాస్టిక్ షీట్ వేసినా రంధ్రాలు ఉండటం వల్ల గాలి లోనికి వెళ్లడంతో వేడి సాధారణంగానే ఉంటుంది. ∙నెట్ల వల్ల కొన్ని రకాల చీడపీడల నుంచి రక్షణ పొందొచ్చు. ∙నెట్‌హౌస్‌లో ప్లాస్టిక్ రంధ్రాలున్న నెట్ షీట్ల వల్ల 130 కిలోమీటర్ల గాలి వేగాన్ని కూడా తట్టుకోగలుగుతుంది. -
గ్రీన్హౌస్ సబ్సిడీపై నీలినీడలు
- రూ. 244 కోట్ల సబ్సిడీ సొమ్ము రైతులకు చెల్లించని సర్కారు - రెండేళ్లలో రూ. 303 కోట్ల సబ్సిడీలో రైతుకిచ్చింది రూ. 58 కోట్లే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్హౌస్ రైతులు గగ్గోలు పెడుతున్నారు. గ్రీన్హౌస్ నిర్మాణాలకు అప్పులు చేసి లక్షల రూపాయలు చెల్లించిన రైతులు.. ఇప్పుడు ప్రభుత్వం నుంచి సబ్సిడీ సొమ్ము రాక లబోదిబోమంటున్నారు. గ్రీన్హౌస్ సాగు పద్ధతి ద్వారా ఎకరానికి రూ. 10 లక్షలు ఆపై వరకు లాభాలు ఆర్జించవచ్చని ప్రభుత్వం భారీ ప్రచారం చేయడంతో అనేకమంది అటు మొగ్గారు. ముందే తమ వాటాగా 25 శాతం పెట్టుబడులు పెట్టడం.. ఆ తర్వాత వివిధ దశల్లో రావాల్సిన సబ్సిడీ సొమ్ము ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవడంతో అనేకచోట్ల గ్రీన్హౌస్ నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో కంపెనీలు కూడా మధ్యలోనే పనులు వదిలేసి పోయాయి. ఈ రెండేళ్లలో ప్రభుత్వం కేవలం 20 మంది రైతులకే పూర్తి స్థాయిలో సబ్సిడీ సొమ్ము విడుదల చేసింది. 90 మంది రైతులకు సగమే విడుదల చేశారు. రైతులకు రూ. 244 కోట్లు బకాయి పడిన సర్కారు రాష్ట్రంలో గ్రీన్హౌస్ ద్వారా పెద్ద ఎత్తున కూరగాయలు, పూల దిగుబడులను పెద్ద ఎత్తున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్‌హౌస్‌ను రైతుల్లోకి తీసుకెళ్లేందుకు భారీ సబ్సిడీని ప్రకటించింది. ఉదాహరణకు ఒక ఎకరంలో గ్రీన్హౌస్ నిర్మాణం చేపట్టడానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు అయితే రైతు 25 శాతం వాటాగా రూ. 10 లక్షలు... ప్రభుత్వ సబ్సిడీ రూ. 30 లక్షలు కానుంది. ఎస్సీ, ఎస్టీలైతే 95 శాతం సబ్సిడీగా ప్రభుత్వం నుంచి రూ. 38 లక్షలు... తమ వాటాగా రూ. 2 లక్షలు చెల్లించాలి. అంటే ఒక్కో ఎకరానికి సాధారణ రైతులు తమ వాటాగా రూ. 10 లక్షలు కంపెనీలకు చెల్లించారు. కానీ సబ్సిడీ సొమ్ము విడుదల చేయడంలో సర్కారు విఫలమైంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించారు. 495 మంది రైతులు గ్రీన్హౌస్ నిర్మాణాలు చేపట్టారు. కానీ విడుదలైంది కేవలం రూ. 58.50 కోట్లే. అంటే ఆ ఆర్థిక సంవత్సరంలో రూ. 191.20 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. 2016–17 సంవత్సరంలో గ్రీన్హౌస్ సబ్సిడీ కోసం బడ్జెట్లో రూ. 199.50 కోట్లు కేటాయించారు. 177 మంది రైతులు గ్రీన్హౌస్ నిర్మాణాలు చేపట్టారు. అందుకోసం రూ. 53.14 కోట్లు విడుదల చేయాలి. కానీ ఇప్పటివరకు ఒక్కపైసా విడుదల కాలేదు. ఇలా ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం రైతులకు రూ. 244 కోట్లు బకాయి పడింది. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. -
వందశాతం లక్ష్యాలు సాధించాలి
- గ్రీన్హౌస్, షేడ్‌నెట్‌పై మరింత దృష్టి పెట్టాలి – ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్)/దేవనకొండ/కోడుమూరు రూరల్: పండ్లతోటల అభివృద్ది, సూక్ష్మ సేద్యం విస్తరణపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి రైతులకు సూచించారు. మంగళవారం ఆయన కోడుమూరు మండలం ప్యాలకుర్తి, గూడూరు మండలం వై.ఖానాపురం, దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామాల్లో పర్యటించారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, రైతులతోను ముఖాముఖి మాట్లాడారు. సాయంత్రం స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఉద్యాన, ఏపీఎంఐపీ అధికారులు, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో విడివిడిగా సమావేశమై సమీక్షించారు. ఉద్యానశాఖలోని నార్మల్ స్టేట్ ప్లాన్, స్టేట్ హార్టీకల్చర్ మిషన్, ఆకేఈవై కింద ఇచ్చిన లక్ష్యాలు, ఇంతవరకు సాధించిన ప్రగతిపై సమీక్షించారు. ఇప్పటి వరకు ప్రగతి అంతంత మాత్రంగానే ఉందని ఇకపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రీన్ హౌస్, షేడ్‌నెట్ టెక్నాలజీని మరింతగా రైతుల్లోకి తీసుకెళ్లాలన్నారు. పందిరిపై తీగజాతి కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. కొత్త పండ్లతోటల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం ముగిసేలోగా మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. డ్రిప్ కోసం వచ్చిన దరఖాస్తులనుజాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. ఆయన వెంట హార్టీ కల్చర్ పీడీ శ్రీనివాసులు, జేడీఏ ఉమా మహేశ్వరమ్మ, ఆయా శాఖల ఏడీలు, సిబ్బంది ఉన్నారు. -
గ్రీన్హౌస్ నిర్మాణాలకు బీమా
- ఓరియంటల్, యూఐఐ బీమా కంపెనీలకు అప్పగింత - ఏడాదికి ఎకరానికి రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రీమియం నిర్ధారణ - తొలి ఏడాది గ్రీన్హౌస్ నిర్మించిన కంపెనీలదే ప్రీమియం చెల్లింపు బాధ్యత - ఈదురు గాలులు, అగ్ని ప్రమాదాల్లో నష్టపోతే రూ.24 లక్షల వరకు పరిహారం సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ (పాలీహౌస్) నిర్మాణాలకు బీమా సౌకర్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈదురు గాలులు, భారీ వర్షాలు, తుపాన్లు, వరదలు, భూకంపాలకు గ్రీన్హౌస్ నిర్మాణాలు ధ్వంసమైతే రైతులకు బీమా సొమ్ము లభిస్తుంది. గ్రీన్హౌస్ నిర్మాణాలకు బీమా కల్పించేందుకు ఓరియంటల్ బీమా కంపెనీ, యునెటైడ్ ఇండియా బీమా (యూఐఐ) కంపెనీలు ముందుకొచ్చాయి. గత ఆరు నెలల్లో గ్రీన్‌హౌస్‌లు నిర్మించిన రైతులందరినీ తప్పనిసరిగా బీమా పరిధిలోకి తీసుకొస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో వారంతా తప్పనిసరిగా ప్రీమియం చెల్లించాలి. త్వరలో విధివిధానాలను ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామని ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రూ.34 లక్షల మొత్తానికి బీమా... తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌హౌస్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎకరా గ్రీన్హౌస్ నిర్మాణానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు కానుంది. అందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇతర రైతులకు 75 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఇంత భారీగా సొమ్ము ఇస్తున్న నేపథ్యంలో ఈదురు గాలులు, వరదలు, ఇతరత్రా నష్టం జరిగితే చెల్లించిన సొమ్మంతా నష్టపోయే పరిస్థితి రానుంది. అందుకోసం బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎకరాకు రూ. 34 లక్షల బీమా చేయించడానికి అవకాశం కల్పించింది. ఓరియంటల్ బీమా కంపెనీ ఏడాదికి రూ. 7,013 ప్రీమియంగా వసూలు చేస్తుంది. గ్రీన్హౌస్లో పాలీ షీట్లకు ఏడాదికి 50 శాతం, అలాగే నిర్మాణంపై 15 శాతం తరుగుదలగా లెక్కిస్తుంది. ఇక యునెటైడ్ ఇండియా బీమా కంపెనీ కూడా పాలీషీట్లపై 40 శాతం, నిర్మాణంపై 15 శాతం తరుగుదలను లెక్కించింది. ఈ కంపెనీ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రూ. 9,844 ప్రీమియంగా నిర్ణయించింది. ఈ జిల్లాలు భూకంప జోన్లు కాబట్టి అధిక ప్రీమియం చెల్లించాలని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో రూ. 9,649గా నిర్ధారించింది. గ్రీన్హౌస్ నిర్మాణం, పాలీషీట్లు, షేడ్నెట్లకు కూడా కవరేజీ ఉంటుంది. గ్రీన్హౌస్లో పండించే పంటలకు మాత్రం కవరేజీ ఉండదు. రూ. 23 లక్షల నుంచి రూ. 24.64 లక్షల వరకు క్లెయిమ్స్ తరుగుదలను, ఇతరత్రా వాటిని లెక్కలోకి తీసుకుంటే గ్రీన్హౌస్ నిర్మాణం, పాలీషీట్లు పాడైపోతే ఓరియంటల్ బీమా కంపెనీ గరిష్టంగా రూ.24.64 లక్షల వరకు క్లెయిమ్ ఇవ్వనుంది. అందులో నిర్మాణంపై రూ. 23.27 లక్షలు, పాలీషీట్పై రూ.1.34 లక్షలు క్లెయిమ్స్ ఇవ్వనుంది. యునెటైడ్ ఇండియా బీమా కంపెనీ రూ.23.06 లక్షలు క్లెయిమ్స్ ఇవ్వనుంది. అందులో నిర్మాణంపై రూ.22.05 లక్షలు, పాలీషీట్లపై రూ.1.01 లక్షలు ఇవ్వనుంది. పాలీషీట్లపై రెండో ఏడాది 80 శాతం తరుగుదల చూపిస్తారు. దీనివల్ల రైతుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా పాలీషీట్లపై ఐదేళ్ల వారంటీని కూడా కంపెనీ కల్పించింది. కాబట్టి రెండో ఏడాది పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక ఈదురు గాలులతో పాలీషీట్లు ధ్వంసం అవుతాయే కానీ... గ్రీన్హౌస్ నిర్మాణానికి పెద్దగా జరిగే నష్టం ఏమీ ఉండదు. కాబట్టి కంపెనీలకు కూడా లాభదాయకమే అవుతుంది. -
రైతుబడ్జెట్లో పాలమూరుకు ప్రాధాన్యం
రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గద్వాలలో రూ. 10కోట్లతో దాణా పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య కర్మాగారం ప్రారంభం గద్వాల : రాబోయే 2016-17 రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయరంగంలో అన్ని జిల్లాల కంటే పాలమూరు జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గద్వాలలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన దాణా పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య కర్మాగారాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జిల్లాలోని 44 మండలాల్లో 20వేల మంది పాడి రైతులు విజయ డెయిరీకి నిత్యం పాలను అందిస్తున్నారని చెప్పారు. డెయిరీకి అందుతున్న పాల సేకరణలో 2లక్షల లీటర్లు ఉంటుందన్నారు. రైతులు వరి పంటపైనే ఆధారపడకుండా పాలీ హౌస్, గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేసుకొని కూరగాయలు, పూలు సాగు చేసుకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోకుండా లాభాలు అర్జించవచ్చని పేర్కొన్నారు. పాలీహౌస్‌లకు ప్రభుత్వం 80 నుంచి 90 శాతం రాయితీ ఇస్తుందని తెలిపా రు. ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ. 2,514కోట్లు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా ఆశించిన స్థాయిలో సహాయం అందలేదన్నారు. తొలకరి వర్షాలకు ముందే నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. బిందుసేద్యంలో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీని ప్రభుత్వం అందజేస్తుంద న్నారు. నష్టం జరిగితే కంపెనీలపై చర్యలు గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో విత్తనపత్తి సాగులో జరిగిన నష్టంపై కమిటీ వేసి నివేదిక తెప్పించడం జరిగిందన్నారు. విత్త నం ద్వారా పత్తి పంటలకు నష్టం చేకూరితే బాధ్యులైన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీడ్‌పత్తి విత్తనాల ద్వారా నష్టపోతే ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించడంతో పాటు కంపెనీల లెసైన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలువురు రైతులకు రాయితీపై మంజూరైన ట్రాక్టర్లను, రొటొవేటర్, వ్యవసాయ పరికరాలను మంత్రి పోచారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, రాష్ర్ట పాడి పరిశ్రమశాఖ మేనేజింగ్ డెరైక్టర్ నిర్మల, జేసీ రాంకిషన్, ఉద్యానవనశాఖ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, టీఆర్ఎస్ నాయకులు కృష్ణమోహన్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్ది, గట్టు తిమ్మప్ప, బండ్ల రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎక్కువకు తక్కువ.. తక్కువకు ఎక్కువ
ఉద్గారాలు విడుదల చేసే దేశాలపై ఇదీ ప్రభావం లండన్: కనీస మొత్తంలో గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తున్న దేశాలు.. ఎక్కువ మొత్తంలో కాలుష్యానికి కారణమవుతున్న దేశాల కంటే కూడా విపరీతమైన వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నాయని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీలు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలు తెలిపాయి. ఈ నివేదిక ప్రకారం అతి తక్కువ గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తున్న దేశాల్లో తరచూ విపరీతమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని, అలాగే ఇది ఆయా దేశాల ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోందని పరిశోధనలో తేలింది. ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో ఉద్గారాలను విడుదల చేస్తున్న 36 దేశాల్లోని ప్రధానమైన యూఎస్, కెనెడా, ఆస్ట్రేలియా, చైనా, పలు పశ్చిమ యూరప్ లాంటి 20 దేశాలు తక్కువ ప్రభావాలను ఎదుర్కొంటున్నాయని వివరించింది. తక్కువ మొత్తంలో ఉద్గారాలను విడుదల చేస్తున్న 17 దేశాల్లో.. 11 దేశాలు ఎక్కువ ప్రభావాలకు గురవుతున్నాయి. ఆయా దేశాల్లో తరచు ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతోపాటు, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నాయి. ఈ జాబితాలో ఉప సహారా దేశాలు, దక్షిణ ఆసియా దేశాలు ఉన్నాయి. ఇవి తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొంటున్నాయని వివరించింది. ‘అధిక మొత్తంలో ఉద్గారాలు విడుదలవుతున్న దేశాల కంటే.. ఉద్గారాల విడుదలను నియంత్రించుకుంటున్న దేశాలే తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ఈ రెండు రకాల దేశాల మధ్య ప్రకృతి వైపరీత్యాల ప్రభావంలో తీవ్ర వ్యత్యాసం ఉంద’ని పరిశోధనకు నేతృత్వం వహించిన వర్సిటీ పరిశోధకుడు గ్లెన్ ఆల్తర్ తెలిపారు. ఈ వ్యత్యాసం కొనసాగకుండా పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం అని ఆయన చెప్పారు. ఈ వ్యత్యాసం ‘దమ్ముకొట్టని వారికి క్యాన్సర్ వచ్చినట్టు’ అని సహ పరిశోధకుడు జేమ్స్ వాట్సన్ అభివర్ణించారు. -
ఇంతింతై.. ఉల్లింతై..
* గ్రీన్హౌస్లో ఉల్లిసాగు... దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో.. * రంగారెడ్డి జిల్లా కీసరలోని రైతు క్షేత్రంలో ఉద్యాన శాఖ శ్రీకారం * నాలుగింతలు పెరగనున్న దిగుబడులు... 70 రోజుల్లోనే పంట * ఎకరాకు రూ.6లక్షల ఆదాయం.. ఒక్కో ఉల్లి గడ్డ బరువు 200 గ్రాములు సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యపరంగా ఉల్లి చేసే మేలు అందరికీ తెలిసిందే. ఆర్థికంగా అది కలిగించే మేలుపై తెలంగాణ ఉద్యాన శాఖ ప్రయోగం చేపట్టింది. అధిక దిగుబడి, అధిక ఆదాయం సాధించే దిశగా ఉల్లిసాగును చేపట్టింది. గ్రీన్హౌస్ (పాలీహౌస్)లో ఉల్లిసాగుకు తెలంగాణ ఉద్యానశాఖ నడుం బిగించింది. దేశంలోనే మొదటిసారిగా రంగారెడ్డి జిల్లా కీసరలో ఒక రైతు పొలంలో ఉల్లి సాగు చేపట్టింది. సాధారణంగా ఒక్కో ఉల్లి గడ్డ బరువు 60 నుంచి 70 గ్రాములుంటుంది. కానీ, గ్రీన్హౌస్లో పండించే ఉల్లి గడ్డ బరువు 180 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది. ఉల్లి కొరతతో తెలంగాణ సతమతమవుతోన్న నేపథ్యంలో గ్రీన్హౌస్ ద్వారా అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. పబ్లిక్ గార్డెన్లో ప్రయోగం సక్సెస్ వాస్తవంగా గ్రీన్హౌస్లో పూలు, కూరగాయల సాగు చేపడతారు. దేశ, విదేశాల్లోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఉల్లి కొరత నేపథ్యంలో తెలంగాణ ఉద్యానశా ఖ ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల పబ్లి క్ గార్డెన్లో ఒక గ్రీన్హౌస్ నిర్మించి అందులో 50 ఉల్లి మొక్కలను నాటింది. అందులో ప్రయోగాత్మకంగా చే పట్టిన ఉల్లి సాగు విజయవంతమైంది. ఎకరా గ్రీన్హౌస్ సాగులో ఏకంగా 30 మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుబడి వస్తుందని తేలింది. సాధారణంగా బయట క్షేత్రా ల్లో ఉల్లిని పండిస్తే కేవలం ఏడు మెట్రిక్ టన్నుల మేర కే దిగుబడి వస్తుంది. గ్రీన్హౌస్లో ఉల్లి సాగు వల్ల నాలుగింతల దిగుబడి వస్తుందని ప్రయోగం లో తేలడంతో రంగారెడ్డి జిల్లా కీసరకు చెందిన రైతు వెంకటేశ్వరరెడ్డిని ఉద్యానశాఖ సంప్రదిం చింది. అర ఎకరం భూ మిలో ఆ రైతు ఉల్లి సాగు చేపట్టారు. 75 వేల మొక్కలు నాటారు. 70 రోజుల్లో ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం సాధారణంగా ఉల్లి పంట 110 రోజులకు దిగుబడి వస్తుంది. అలాంటిది గ్రీన్హౌస్లో 70 రోజులకే పంట చేతికి వస్తుంది. సాధారణం కంటే నాలుగింతల దిగుబడి రానుండటంతో ఎకరాకు రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతుందని ఉద్యానశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కీసర రైతు అర ఎకరానికిగాను రూ. 3 లక్షల ఆదాయం పొందుతారని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వెంటనే కొత్తమీర, దోసకాయ, క్యాప్సికం సాగు చేయాలని అధికారులు అతనికి సూచించారు. ఆ ప్రకారం ఏడాదికి అర ఎకరా భూమిలో కనీసంగా రూ. 10 లక్షల వరకు ఆదాయం పొందుతారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. గ్రీన్హౌస్ ద్వారా మూడు నాలుగు పంటలు ఏడాదికి వేసే అవకాశం ఉంది. -
నారు పోస్తుంది.. నీరూ పోస్తుంది!
విత్తు మొదలు నారు పెంపు వరకు యాంత్రీకరణ పద్ధతిలోనే.. ♦ రూ.11 కోట్ల కూరగాయల నారుమడికి శ్రీకారం ♦ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ కింద ములుగులో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు ♦ 7న ప్రారంభించనున్న సీఎం సాక్షి, హైదరాబాద్: తోటల పెంపకానికి నారే అత్యంత కీలకం. నారు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో దాని నుంచి వచ్చే పంట అంతే స్థాయిలో అధిక దిగుబడినిస్తుంది. సహజంగా నారు మడులను రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో తయారు చేస్తారు. కొన్నిచోట్ల నర్సరీల్లోనూ తయారు చేస్తారు. అలా తయారైన నారును తీసేటప్పుడు కొన్ని మొక్కల వేర్లు తెగిపోతుంటాయి. ఫలితంగా అందులో కొన్ని చనిపోతాయి. చీడపీడలు ఆశించి మరికొన్ని చనిపోతాయి. మరోవైపు దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది. కూరగాయల సాగులో ఈ పరిస్థితి రైతుకు నష్టదాయకంగా మారుతోంది. ఈ పరిస్థితిని అధిగమించాలని తెలంగాణ ఉద్యానశాఖ, ఆగ్రోస్ నిర్ణయించాయి. చంటి బిడ్డను కాపాడుకున్నట్లుగా నారును పెంచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించాయి. ఫ్లగ్ టైప్ నర్సరీని నెలకొల్పి రైతుకు నారును సబ్సిడీపై అందజేయాలని సర్కారు నిర్ణయించింది. కోళ్ల ఫారాల్లో కోడిగుడ్లను ట్రేలల్లో పెట్టి సరఫరా చేసినట్లుగానే నారును కూడా అలాగే పెంచి రైతులకు సరఫరా చేయనున్నారు. రూ.11 కోట్లతో ఫ్లగ్ టైప్ నర్సరీ ఫ్లగ్ టైప్ నర్సరీలో ఆటోమేషన్ యూనిట్, గ్రీన్హౌస్, ప్రైమరీ హార్డినింగ్ చాంబర్ తదితరాలుంటాయి. అంతా వ్యవసాయ సంబంధిత యంత్ర పరికరాలే అందులో ఉంటాయి. ఆటోమేషిన్ యూనిట్లో విత్తనానికి సంబంధించిన ప్రక్రియ, వాటికి ఎంతెంత నీరు, ఎరువు, ఉష్ణోగ్రత ఉండాలో నిర్దారణ జరుగుతుంది. ఆ తర్వాత వాటిని ఆటోమేటిక్‌గా గ్రీన్హౌస్లోని సీడ్ జర్మినేషన్ చాంబర్‌కు పంపిస్తారు. అక్కడ నారుకు ఉష్ణోగ్రత, నీరు, తేమ ఎంత మోతాదులో ఉండాలనే వాటిని కంప్యూటర్ ద్వారానే నియంత్రిస్తారు. ఎరువు, నీరు కూడా కంప్యూటర్ ఆదేశాల మేరకు నిర్ణీత పరిమాణంలో విత్తనానికి చేరుతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆపరేట్ చేయడానికి, శాస్త్రవేత్తల పర్యవేక్షణ కోసం తప్ప ఇతరత్రా కూలీలు, మనుషులతో పనిలేనేలేదు. నారు తయారయ్యాక కన్వేయర్ బెల్టు ద్వారా నారు ట్రేలల్లో బయటకు వస్తుంది. ఇదీ ఫ్లగ్ టైప్ నర్సరీకి సంబంధించిన ప్రాథమిక అంశాలు. ఈ ఫ్లగ్ టైప్ నర్సరీలో కూరగాయల నారును పెంచుతారు. ఒక్క నారు మొక్క కూడా చనిపోదు. దే నికీ చీడపీడలు రావు. అలా తయారైన నారు మొక్కలను రైతులకు ఇస్తే అవి పెరిగి పెద్దవై 30 శాతం అదనపు దిగబడులు ఇస్తాయి. ప్రస్తుతం ఫ్లగ్ టైప్ నర్సరీలు రాయపూర్, కేరళల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో మొదటిసారిగా మెదక్ జిల్లా ములుగులో ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంగణంలోనే సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ కింద ఫ్లగ్ టైప్ నర్సరీ నిర్మాణానికి సీఎం శ్రీకారం చుడతారు. రూ.11 కోట్లు ఖర్చు చేసి 50 ఎకరాల్లో ఈ నర్సరీని ఏర్పాటు చేస్తారు. వీటిల్లో బీర, సోర, కాకర, దోస, టమాటా, వంకాయ సహా వివిధ రకాల కూర గాయల నారును పెంచుతారు. ఈ నర్సరీ సామర్థ్యం ఏడాదికి 80 లక్షల నారు మొక్కలను తయారు చేయగలదు. ఆ నారు 666 ఎకరాలకు సరిపోతుందని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఇక్కడ తయారయ్యే కూరగాయల నారును రైతులకు సబ్సిడీపై ఇస్తామన్నారు. పరిశ్రమగా అభివృద్ధి చేసే యోచన గ్రీన్‌హౌస్‌కు సబ్సిడీ ఇచ్చినట్లుగానే ఫ్లగ్ టైప్ నర్సరీకి కూడా సబ్సిడీ ఇచ్చే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. దీన్ని సాధారణ రైతులు నెలకొల్పుకోవడం అసాధ్యం. అనవసరం కూడా. అయితే దీన్నో పరిశ్రమగా ప్రోత్సహిస్తే ఫ్లగ్ టైప్ నర్సరీల్లో తయారయ్యే నారు మొక్కలతో కూరగాయల ఉత్పత్తిని 30 శాతం వరకు పెంచుకోవచ్చు. ఔత్సాహికులుంటే వారిని ఫ్లగ్ టైప్ నర్సరీ వైపు ప్రోత్సహిస్తామని ఆగ్రోస్ ఎండీ ఎ.మురళి ‘సాక్షి’కి చెప్పారు. -
సృజనతోనే రెండంకెల జాతీయోత్పత్తి!
సీఐఐ ఎగ్జిమ్ కాన్క్లేవ్లో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో అనేక రంగాల్లో ప్రపంచానికి నేతృత్వం వహించే సామర్థ్యమున్నప్పటికీ...సంక్లిష్టమైన విధానాలు, మితిమీరిన నియంత్రణలు నిరోధకాలుగా మారుతున్నాయని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) తెలంగాణ శాఖ బుధవారం ఏర్పాటు చేసిన ‘ఎగ్జిమ్ కాన్క్లేవ్ 2015’ సదస్సుకు కృష్ణ ఎల్లా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో వ్యాపార, ఎగుమతి అవకాశాలను ఆవిష్కరించడం అన్న అంశంపై ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, అవి అందిపుచ్చుకోవడం వ్యాపారవేత్తల వంతని అన్నారు. సజ్జల్లాంటి తృణధాన్యాలు, నేరేడు పండ్ల రసాన్ని ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలుగా ఎగుమతి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. ఇలాంటి వినూత్న అంశాలను గుర్తించి, తగిన బ్రాండిం గ్ చేయడం ద్వారా ఎగుమతులను పెంచుకోవచ్చునని వివరించారు. దాదాపు 90 శాతం సబ్సిడీ ఉన్న గ్రీన్హౌస్ వ్యవసాయాన్ని, గల్ఫ్ ప్రాంతాలకు రోజూ ఉన్న విమాన సర్వీసులను కలిపిచూస్తే ఎగుమతులకు మరో అవకాశం కనిపిస్తుందని అన్నారు. రెండంకెల స్థూల జాతీ యోత్పత్తి సాధించాలనుకుంటున్న దేశం అందుకోసం సృజనాత్మకతను ఆసరాగా చేసుకోవాలని సూచించారు. సీఐఐ లాంటి సంస్థలు సృజనను ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సృజనాత్మక ఆలోచనలకు, ఉత్పత్తులకు పేటెంట్లు సంపాదించేందుకు రూ.ఐదు కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని అన్నారు. -
గ్రీన్‌హౌస్‌కు ప్రత్యామ్నాయంగా ‘షేడ్‌నెట్’
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్‌తోపాటు షేడ్‌నెట్‌ను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ఉద్యాన శాఖ నిర్ణయించింది. భారీ పెట్టుబడితో కూడిన గ్రీన్‌హౌస్‌ను ధనిక రైతులే ఉపయోగించుకుంటున్నందున.. అందుకు ప్రత్యామ్నాయంగా చిన్న సన్నకారు రైతులకు అందుబాటులో ఉండేలా షేడ్‌నెట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు ఉద్యాన శాఖ కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి షేడ్‌నెట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. రైతుకు భారంగా గ్రీన్హౌస్ గ్రీన్‌హౌస్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అందుకోసం ఈ ఏడాది 847 ఎకరాలకు రూ.250 కోట్లు కేటాయించింది. గ్రీన్హౌస్ కోసం ముందుకు వచ్చే రైతులకు దాని నిర్మాణ వ్యయంలో 75 శాతం సబ్సిడీని ఇస్తోంది. ఆ ప్రకారం ఎకరా విస్తీర్ణంలో గ్రీన్హౌస్ నిర్మాణం చేపట్టాలంటే రూ. 39.50 లక్షలు ఖర్చవుతోంది. ఇందులో 75 శాతం సబ్సిడీ ఇస్తున్నా ఎకరాకు సుమారు రూ. 10 లక్షలు ఖర్చు చేయడం రైతుకు భారంగా మారుతోంది. దీంతో గ్రీన్‌హౌస్‌కు అనుకున్నంత స్థాయిలో రైతుల నుంచి స్పందన రావడంలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు 30 ఎకరాల్లోపే గ్రీన్హౌస్ నిర్మాణం జరిగింది. ఎస్సీ, ఎస్టీలు ఎవరూ గ్రీన్‌హౌస్‌కు దరఖాస్తు చేయలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మార్గదర్శకాల్లో మార్పులు చేశారు. రైతులకే నేరుగా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. అయినా గ్రీన్‌హౌస్‌కు భారీగా పెట్టుబడి పెట్టాల్సి రావడంతో సన్న చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీలు దానివైపే చూడడంలేదు. ఈ పరిస్థితిని గమనించిన ఉద్యాన శాఖ షేడ్‌నెట్ నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది. చిన్నసన్నకారు రైతుల కోసమే షేడ్‌నెట్.. గ్రీన్హౌస్ నిర్మాణానికి ఎకరాకు రూ. 39.50 లక్షలైతే, షేడ్‌నెట్‌కు రూ. 12 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతోంది. గ్రీన్హౌస్లో వేసే పంటలకు అవసరమైన ఉష్ణోగ్రతలను పూర్తిస్థాయిలో నియంత్రించుకునే వీలుంటుంది. వర్షం పడినా గ్రీన్ హౌస్‌లో పంటలపై పడదు. షేడ్‌నెట్ కేవలం ఒక పందిరిలాంటిది అనుకోవచ్చు. నాలుగు పక్కలా ఆగ్రో నెట్(ఆకుపచ్చ రంగులో కనిపించే వలలు) లేదా ఇతర విధంగా నేయబడిన వలతో కప్పివేయబడి ఉంటుంది. మొక్కలకు అవసరమైన సూర్యరశ్మి, గాలి, తేమ ఆ వలలోని సందుల గుండా ప్రసరించేలా అనువైన వాతావరణం ఉంటుంది. షేడ్‌నెట్‌లో ఎండ, గాలి, వడగండ్ల నుంచి మాత్రమే రక్షించుకోవచ్చు. వర్షం వస్తే మాత్రం పంటలపై బోరున పడుతుంది. అందువల్ల రబీలోనే షేడ్‌నెట్ వల్ల ప్రయోజనం ఉంటుందని, వర్షాకాలంలో దీనివల్ల అంతగా ప్రయోజనం ఉండదని ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. గ్రీన్హౌస్ ద్వారా పూల సాగు చేస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుందని, షేడ్‌నెట్ ద్వారా రబీలో కూరగాయల సాగు చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షేడ్‌నెట్‌ను వచ్చే ఏడాది నుంచి భారీగా ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ భావిస్తోంది. ఎకరాకు రూ. 12 లక్షలు ఖర్చు అవుతున్నందున గ్రీన్‌హౌస్‌కు ఇచ్చినట్లే దీనికి కూడా 75 శాతం సబ్సిడీ ఇవ్వాలని.. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో 5 వేల ఎకరాల్లో షేడ్‌నెట్ సాగు చేపట్టాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం గ్రీన్హౌస్ నిర్మాణానికి ముందుకొచ్చిన కంపెనీలతోనే షేడ్‌నెట్ నిర్మాణాలు చేపట్టేలా చూడాలని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో మార్గదర్శకాలు తయారుచేసి షేడ్‌నెట్‌పై విరివిగా ప్రచారం చేయాలని యోచిస్తున్నారు. -
స్వల్ప ఖర్చుతో పాలీహౌస్లో ప్రకృతి సేద్యం!
పాలీహౌస్‌లను కేవలం 20% ఖర్చుతోనే నిర్మించుకోవటం.. ఇందులో అరుదైన దేశవాళీ సేంద్రియ వంగడాలను ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేయడంపై తెలుగు రైతులకు శిక్షణ ఇవ్వడానికి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రస్టు సన్నద్ధమైంది. తొలిదశలో రంగారెడ్డి జిల్లాలో వెయ్యి మంది కూరగాయ రైతులకు, ‘ఇంటిపంట’లు పండిస్తున్న హైదరాబాద్ నగరవాసులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడానికి, సేంద్రియ విత్తనాలు ఇవ్వడానికి వీలుగా ట్రస్టు తెలంగాణ ఉద్యాన శాఖతో ఇటీవల అవగాహన కుదుర్చుకుంది. ట్రస్టుకు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డా. బండి ప్రభాకరరావు ఇటీవల హైద్రాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’కి అందించిన సమాచారం ఆయన మాటల్లోనే.. మీ కోసం.. పంచాంగం ప్రకారం ఇప్పుడు వర్షాలు రావటం లేదు. వాతావరణంలో చాలా మార్పులొచ్చాయి. వర్షాకాలంలో వర్షం సరిగ్గా కురవటం లేదు. అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. రైతులు చాలా కష్టపడుతున్నారు, నష్టపడుతున్నారు. గ్రీన్‌హౌస్‌ల ద్వారా వాతావరణంపై నియంత్రణ సాధించి, పంటలు పండించుకోవచ్చు. గ్రీన్హౌస్లను స్వల్ప ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవచ్చు. స్థానికంగా లభించే బాదులతోనే దీన్ని నిర్మించుకొని, ప్లాస్టిక్ షీట్ వేసుకోవచ్చు. పొలాల్లో రైతులు.. నగరాలు, పట్టణాల్లో ‘ఇంటిపంట’ల సాగుదారులు స్వయంగానే నిర్మించుకోవచ్చు. కంపెనీల కొటేషన్ల ధరలో 20% ఖర్చుతోనే నిర్మించుకోవచ్చు. ఇంటిపంటల సాగు కోసం వెయ్యి నుంచి 40 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. వెయ్యి చదరపు అడుగుల పాలీహౌస్‌కు కొటేషన్ అడిగితే రూ.2.25 లక్షలని కంపెనీల వాళ్లు చెప్పారు. నేను నా ఫామ్‌లో రూ. 25,000 ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నాను. ప్లాస్టిక్ షీట్, నెట్ల ఖర్చే రూ. 18,000 వరకు ఉంటుంది. మిగతాది వెదురు, యూకలిప్టస్, సర్వి వంటి బాదులు, కూలీల ఖర్చు. మేం నిర్మించిన పాలీహౌస్‌లు 120 కి. మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకుంటాయి. పాలీహౌస్లో దేశీ ఆవు పేడ, మూత్రంతో నిశ్చింతగా ప్రకృతి సేద్యం చేయవచ్చు. 1/3 మట్టి, 1/3 శుద్ధిచేసిన కొబ్బరిపొట్టు, 1/3 సేంద్రియ పదార్థం (పశువుల ఎరువు లేదా ఎండుగడ్డి లేదా రంపపు పొట్టు) కలిపి.. బెడ్స్ తయారు చేసుకోవాలి. 15 రోజులకోసారి జీవామృతం ఇవ్వాలి. చీడపీడల నివారణకు నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వాడొచ్చు. తిరిగి వాడుకోవడానికి వీలయ్యే 560 రకాల దేశీ వంగడాలను ట్రస్టు సేకరించి పండించింది. ఇందులో 140 రకాల కూరగాయలు, ఆకుకూరల వంగడాలున్నాయి. ప్రతి ఒక్కరూ భోజనంలో 5% పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తినాలన్నది రవిశంకర్ గురూజీ అభిప్రాయం. రంగు, ఆకృతి, వాసన, రుచి విభిన్నంగా ఉండే వంగడాలు ఇందుకు అనువుగా ఉంటాయి. వీటిని అందుబాటులోకి తెస్తున్నాం. ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేయడం సులభం. ఈ వంగడాలు రసాయనాల్లేకుండా వాటికవే పెరుగుతాయి. చీడపీడలు అంతగా సోకవు. రైతులకు, నగరవాసులకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పద్ధతులపై రైతులకు, నగరవాసులకు సాంకేతిక శిక్షణనివ్వడానికి ఎస్.ఎస్.ఐ.ఎ.ఎస్.టి. ట్రస్టు సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ తొలుత కొందరు మాస్టర్ ట్రయినర్లకు శిక్షణనిచ్చి, వారి ద్వారా మిగతా వారికి శిక్షణ ఇస్తాం. హైదరాబాద్‌లో రైతులు వినియోగదారులకునేరుగా సేంద్రియ ఉత్పత్తులను విక్రయించే మార్కెట్లను వారానికి రెండు రోజులు ఏర్పాటు చేస్తాం. రైతులు పండించే పంటలను ఎండబెట్టి అమ్మే సాంకేతికతలను కూడా అందిస్తాం. వివరాలకు: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు పి. రామకృష్ణారెడ్డి 98490 57599, email: rakripulireddy@gmail.com, ఉమామహేశ్వరి 90004 08907 uma6408@gmail.com. డా. బండి ప్రభాకరరావు -
గ్రీన్ హౌస్ కల్టివేషన్కూ సబ్సిడీ
సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ కల్టివేషన్ కింద రెండు వందల చదరపు మీటర్ల పరిధిలో పం టలు వేసుకున్న రైతులకు కూడా సబ్సిడీ ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రూ.2.12 లక్షల ఖర్చులో రూ.1.59 లక్షల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని, రైతులు కేవలం రూ.53 వేలు ఖర్చుపెట్టుకుంటే సరిపోతుందని తెలిపారు. ప్లాంట్మెటీరియల్కు కూడా ప్రభుత్వం రూ.28 వేలు ఇస్తుందన్నారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో గ్రీన్హౌస్ సాగు అభివృద్ధి, దీనికి గుర్తించిన ప్రాం తాలు, రైతులకు సబ్సిడీ తదితర అంశాలపై ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జి.సంజీవరావు, ఎం.అంజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పుట్టా మధుకర్ వేసిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మూడెకరాల వరకు చిన్న, సన్నకారు రైతులకు, ఎస్సీ, ఎస్టీ రైతులకు రిజర్వేషన్‌తో ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు తెలిపారు. -
గ్రీన్‌హౌస్‌కు మోక్షం
కేంద్ర ప్రభుత్వ స్లాబులనే ఖరారు చేసిన టీ-సర్కారు అందుకనుగుణంగా ధరలను సవరించాలని కంపెనీలకు విజ్ఞప్తి ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్(పాలీహౌస్)కు మోక్షం లభించింది. యూనిట్ ధరలపై దాదాపు నెల రోజులుగా కొనసాగుతోన్న సందిగ్ధతకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ ధరను గ్రీన్హౌస్ నిర్మాణ కంపెనీలు అంగీకరించకపోవడం..ఆ వ్యవహారంపై పునఃపరిశీలన చేసిన ఉద్యానశాఖ సాంకేతిక కమిటీ కేంద్ర ప్రభుత్వ యూనిట్ ధరలను ఖరారు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 15 రోజులుగా దీనిపై ఎటూ తేల్చని సర్కార్.. మంగళవారం కేంద్ర ప్రభుత్వ ధరలనే ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రీన్హౌస్ నిర్మాణానికి ఉత్తర్వులు వెలువడ్డాయి. టెక్నికల్ బిడ్లు పూర్తైన నేపథ్యంలో అందులో పాల్గొన్న 8 గ్రీన్హౌస్ కంపెనీలతో చర్చించి కేంద్ర ప్రభుత్వ ధరలకే నిర్మాణాలు చేపట్టాలనీ, అన్ని సంస్థలు అందుకు అంగీకరించాలని ప్రభుత్వం కోరనుంది. అనంతరం రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది. దరఖాస్తుల స్వీకరణకు 15 రోజుల గడువు ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కో స్లాబుకు ఒక్కో యూనిట్ ధర... కేంద్రం 4 స్లాబుల్లో యూనిట్ ధరలను నిర్ణయించింది. వాటినే రాష్ట్రంలో అమలుచేస్తారు. ఆ ప్రకారం 500 నుంచి 560 చదరపు మీటర్ల స్లాబుకు చదరపు మీటరకు రూ. 1,060 చొప్పున కంపెనీలకు చెల్లిస్తారు. 560 నుంచి 1,008 చదరపు మీటర్లు ఉంటే రూ. 935 చొప్పున, 1,008 నుంచి 2,080 మధ్య ఉంటే రూ. 890, 2,080 నుంచి 4,000లకు పైగా చదరపు మీటర్ల స్లాబుకు రూ. 844 చొప్పున కంపెనీలకు చెల్లిస్తారు. ఆ యూనిట్ వ్యయంలోనే అన్ని పన్నులూ కలిపి ఉంటాయి. ఆ ప్రకారం రైతులకు 75 శాతం సబ్సిడీ ఉంటుంది. అయితే బిడ్‌లో పాల్గొన్న 8 కంపెనీలు వివిధ ధరలను కోట్ చేశాయి. వీటిని కేంద్ర ప్రభుత్వ ధరలకు అనుగుణంగా సవరించాలని కోరనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ ఏదైనా కంపెనీ అందుకు అంగీకరించకపోయినా జాబితాలో ఉంచుతారు. రైతులు తమకు ఇష్టమైన కంపెనీనే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కల్పిస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం నిర్ణీత సొమ్మునే చెల్లిస్తుంది. ఆ మేరకే ప్రభుత్వం రైతులకు సబ్సిడీ చెల్లిస్తుందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ సహా నగరానికి 100 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చే మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని ప్రాంతాల రైతులు గ్రీన్‌హౌస్‌కు సిద్ధం కావాలని అధికారులు కోరారు. -
‘గ్రీన్హౌస్’..కాస్త ఖరీదే
కేంద్రం ఖరారు చేసిన ధరకే సన్నద్ధమైన యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: గ్రీన్హౌస్ (పాలీహౌస్) నిర్మాణ వ్యయం పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించిన యూనిట్ ధరనే ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ సర్కారు ప్రకటించిన ధర తమకు గిట్టుబాటు కాదని భావించిన గ్రీన్హౌస్ కంపెనీలు ఎక్కువ ధరకు ఆర్థిక బిడ్ దాఖలు చేశాయి. దీంతో గ్రీన్హౌస్పై ఏర్పడిన ఉద్యానశాఖ నిపుణుల కమిటీ ఆ కంపెనీలతో చర్చలు జరిపింది. అవి కేంద్రం ఇస్తున్న ధరను ఖరారు చేయాలని డిమాండ్ చేశాయి. తప్పనిసరి పరిస్థితిలో ఆ ధరకే సాంకేతిక కమిటీ కూడా ఓకే చేయాల్సి వస్తోంది. దీనిపై సోమవారం సమావేశమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది.దీని వల్ల ప్రభుత్వంపై భారం పడినా అది రైతులకు మేలు కలిగిస్తుందని... నిర్మాణంలో నాణ్యత ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు అంటున్నారు. ఒక్కో స్లాబుకు ఒక్కో యూనిట్ ధర గ్రీన్హౌస్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు ఒక్కో చదరపు మీటరుకు రూ. 700 ఇవ్వాలని తొలుత భావించింది. నాలుగు వేల చదరపు మీటర్లకు ఖర్చు రూ. 28 లక్షలు అవుతుంది. ఇదిగాక కంపెనీకి సంబంధం లేకుండా విత్తనాలు, భూమి చదును, ఇతరత్రా నిర్వహణ వ్యయం చదరపు మీటరుకు రూ. 140 ఇవ్వాలని భావించింది. మొత్తంగా రైతుకు 75 శాతం సబ్సిడీ ప్రకటించింది. దీన్ని సవరించాలని సాంకేతిక కమిటీ తాజాగా నిర్ణయానికి వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం నాలుగు స్లాబుల్లో ప్రకటించిన ధరల అమలుకు నిర్ణయించింది. ఆ ప్రకారం 500 నుంచి 560 చదరపు మీటర్ల స్లాబుకు చదరపు మీటరుకు రూ. 1,060 వంతున చెల్లిస్తారు. ఇక 561 నుంచి వెయ్యి చదరపు మీటర్ల వరకు చదరపు మీటరుకు రూ. 935 చెల్లిస్తారు. ఇక 1001 నుంచి 2000 చదరపు మీటర్ల స్లాబుకు చదరపు మీటరుకు రూ. 890 చొప్పున చెల్లిస్తారు. రెండు వేలకు పైగా దాటిన స్లాబుకు రూ. 844 కంపెనీలకు చెల్లిస్తారు. ఆ యూనిట్ వ్యయంలోనే అన్ని పన్నులు కలిపి ఉంటాయి. ఈ ధరలనే ఖరారు చేయాలని సాంకేతిక కమిటీ యోచిస్తోంది. అయితే బిడ్‌లో కంపెనీలు కోట్ చేసిన ధరలు భిన్నంగా ఉన్నాయి. ఇండియన్ గ్రీన్హౌస్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 935, నోయిడాకు చెందిన జెస్తా డెవలపర్స్ లిమిటెడ్ రూ. 840, హైదరాబాద్‌కు చెందిన భానోదయం ఇండస్ట్రీస్ రూ. 1044, శ్రీసాయి ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 1260, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ. 1244, హైతాసు కార్పొరేషన్ రూ. 991, బెంగళూరు, తమిళనాడులకు చెందిన అగ్రి ఫ్లాస్ట్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 844, మహారాష్ట్రకు చెందిన సన్మార్గ్ ఆగ్రో సర్వీసెస్ రూ. 1,035 కోట్ చేశాయి. వారి ప్రతిపాదనలు ఎలా ఉన్నా కేంద్రం ప్రకటించిన మేరకు ధర నిర్ధారించి సర్కారు ఆమోదం లభించగానే వాటిని ఖరారు చేయాలని నిపుణుల కమిటీ భావిస్తోంది. తర్వాత తుది జాబితా తయారుచేస్తారు. ఏదైనా కంపెనీ కేంద్రం ధరకు మించి కోట్ చేస్తే నిర్ధారిత సొమ్ముపైనే రైతులకు సబ్సిడీ ఇస్తారు. మిగిలినది రైతులే భరించాల్సి ఉంటుంది. అన్నీ ఖరారయ్యాక నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులు తమకు ఇష్టమైన కంపెనీని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తామంటున్నారు. -
నిర్మిస్తాం.. అమ్మిపెడతాం
గ్రీన్‌హౌస్‌ల పంటకు మార్కెటింగ్ కూడా కల్పిస్తామంటున్న కంపెనీలు ఉద్యాన అధికారులతో నోయిడా కంపెనీ ప్రతినిధుల చర్చలు సాంకేతిక నైపుణ్యం లేని రైతులకు ఇది ప్రయోజనకరమని వెల్లడి గ్రీన్‌హౌస్‌కు 9 కంపెనీల టెండర్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్హౌస్ సాగుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఆ సాగు విధానంపై ఉద్యాన అధికారులకు, రైతులకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు గ్రీన్హౌస్ నిర్మాణం చేపట్టడమే కాకుండా నిర్వహణ బాధ్యతలు చేపట్టి, పంట పండించి, మార్కెట్ లో అమ్మి రైతులకు డబ్బు అందజేస్తామని చెబుతున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచాయి. తాజాగా నోయిడాకు చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు శనివారం ఉద్యానశాఖ అధికారులను కలిసి ఈ మేరకు విన్నవించారు. రైతులకు సాంకేతిక నైపుణ్యం లేనందున తామే గ్రీన్హౌస్ నిర్వహణ బాధ్యత తీసుకొని పంట పండించి మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తామని ముందుకు వచ్చారు. ఆదాయంలో 20 శాతం ఇస్తే చాలు: గ్రీన్హౌస్ నిర్మాణానికి కంపెనీలను టెండర్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వాటితో జాబితా త యారుచేస్తుంది. అనంతరం రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి అర్హులను గుర్తిస్తుంది. రైతు తన ఇష్టానుసారంగా కంపెనీలను ఎంపిక చేసుకోవచ్చు. నిర్ణీత కంపెనీ నెలన్నరలో గ్రీన్హౌస్ నిర్మాణాన్ని పూర్తిచేసి పంట పండిస్తారు. దీనివల్ల రైతులకు ఎలాంటి రిస్క్ ఉండదని, వచ్చిన ఆదాయంలో 20 శాతం తమకు ఇస్తే చా లని అంటున్నాయి. ఏడాది పాటు నిర్వహించి చూపిస్తే రైతులు నేర్చుకుంటారని కంపెనీ ప్రతి నిధులు చెబుతున్నారు. నిర్వహణపై ప్రభుత్వం తో సంబంధం లేకుండా రైతులతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. 30న కంపెనీల తుది జాబితా : గ్రీన్హౌస్ కోసం పిలిచిన టెండర్లలో మొత్తం తొమ్మిది కం పెనీలు పాల్గొన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పుణెకు చెందిన పూజా గ్రీన్హౌస్ ఇండస్ట్రీస్, ఇండియన్ గ్రీన్హౌస్ ప్రైవేటు లిమిటెడ్, నోయిడాకు చెందిన జెస్తా డెవలపర్స్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన భానోదయం ఇండస్ట్రీ స్, శ్రీసాయి ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్, జైన్ ఇరి గేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, హైతాసు కా ర్పొరేషన్, బెంగళూరు, తమిళనాడులకు చెందిన అగ్రి ఫ్లాస్ట్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ప్రైవేటు లిమిటెడ్, మహారాష్ట్రకు చెందిన సన్మార్గ్ ఆగ్రో సర్వీసెస్‌లు టెండర్లలో పాల్గొన్నాయి. సాంకేతిక నైపుణ్యం, అనుభవం, నిబంధనల ఆధారంగా వాటిలో కొన్నిం టిని ఖరారు చేసి ఈ నెల 30న తుది జాబితా తయారు చేస్తామని అధికారులు చెబుతున్నారు. -
నచ్చిన కంపెనీతోనే గ్రీన్హౌస్ నిర్మాణం
రైతులకు వెసులుబాటు.. సాంకేతిక మార్గదర్శకాలు ఖరారు రెండు మూడు రోజుల్లో టెండర్ల ప్రకటన జారీకి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: టెండర్ల ద్వారా అర్హత పొందిన గ్రీన్హౌస్ కంపెనీల జాబితా నుంచి నచ్చిన వాటిని ఎంచుకునే సదుపాయాన్ని రైతులకు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. గ్రీన్‌హౌస్‌కు సంబంధించి వ్యవసాయశాఖ సాంకేతిక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు సమావేశమైన ఆ కమిటీ తాజాగా తుది మార్గదర్శకాలు ఖరారు చేసింది. గ్రీన్హౌస్ కంపెనీలకు కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. అలాంటి వాటినే టెండర్లకు ఆహ్వాని స్తారు. ఏడాదికి కనీసం 25 ఎకరాల్లో గ్రీన్హౌస్ ప్రాజెక్టు చేపట్టి ఉండాలి. బ్యాంకు సెక్యూరిటీ రూ. 25 లక్షలు చూపాలి. రూ. 5 లక్షలు డిపాజిట్ చెల్లించాలి. ప్రాజెక్టు అప్పగించాక 21 రోజు ల్లో పని మొదలుపెట్టి.. రెండు నెలల్లోగా పూర్తిచేయాలి. ఆలస్యమైతే జరిమానా విధిస్తారు. అనుకున్న మెటీరియల్ వాడకపోయినా.. కొలతలు తక్కువగా ఉన్నా ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెడతారు. చెల్లించిన సొమ్ము తిరిగి రాబడతారు. పాలిథిన్ ఏది వాడాలో కూడా ముందుగా స్పష్టంచేయాలి. నాలుగు స్లాబుల్లో ధరల నిర్ణ యం ఉంటుంది. వీటన్నింటికీ ఒప్పుకున్న కంపెనీలకే టెండర్లలో అవకాశం కల్పిస్తారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కంపెనీల జాబితాను బహిరంగ పరిచి రైతులకు అందజేస్తారు. దరఖాస్తు చేసుకొని అర్హత పొందిన రైతులు సంబంధిత కంపెనీ జాబితా నుంచి తమకు ఇష్టమైన కంపెనీని ఎంచుకునే సదుపాయం కల్పించారు. వ్యవసాయ యంత్రాల కొనుగోలులో నచ్చిన వాటిని కొనుక్కునే వెసులుబాటును రైతులకు ఎలా కల్పిస్తున్నారో.. గ్రీన్హౌస్ విషయంలో కూడా రైతులకు అలాగే కల్పించాలని నిర్ణయించారు. ఒకవేళ ప్రభుత్వం అనుకున్న ధర కన్నా ఎక్కువ కోట్ చేసిన కంపెనీని కూడా రైతు ఎంపిక చేసుకొనే అవకాశం కల్పిస్తారు. అయితే ప్రభుత్వం మాత్రం నిర్ణీత సబ్సిడీనే చెల్లిస్తుంది. మిగతాది రైతు భరించాల్సి ఉంటుంది. యుద్ధప్రాతిపదికన గ్రీన్హౌస్.. ప్రభుత్వం గ్రీన్హౌస్ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల్లోనే టెండర్లకు ప్రకటన జారీచేయాలని ఉద్యానశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి.. రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి జనవరి నుంచి గ్రీన్హౌస్ నిర్మాణ పనులు మొదలుపెట్టాలని నిర్ణయించింది. సాం కేతిక కమిటీ సభ్యులే టెండర్లను ఖరారు చేస్తా రు. దాదాపు 20 కంపెనీల వరకు జాబితా ఉం డేలా చూస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ. 250 కోట్లతో వెయ్యి ఎకరాల్లో గ్రీన్హౌస్ చేపట్టాలంటే యుద్ధప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే తమకు ఉండాల్సిన 160 మంది సిబ్బందిలో 100 వరకు ఖాళీలున్నాయని ఓ అధికారి ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత తక్కువ సిబ్బందితో ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా పూర్తిచేయాలో అర్థంకావడంలేదని ఆయన అన్నారు. -
ఇవీ గ్రీన్హౌస్లే...
నేల విడిచి వ్యవసాయం చేయడంపై ప్రపంచమంతా పెరిగిపోతోందనేందుకు నిదర్శనమీ రెండు చిత్రాలు. అంతకంతకూ పెరిగిపోతున్న అవసరాలు, తగ్గట్టుగా పెరగని వ్యవసాయ ఉత్పత్తుల మధ్య సమతౌల్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగం కూడా. మొదటి చిత్రంలో ఉన్నది నీటిపై తేలియాడే గ్రీన్హౌస్. స్టుడియో మొబైల్ అనే ఆర్కిటెక్ట్ సంస్థ డిజైన్ చేసింది. దాదాపు 750 చదరపు అడుగుల విస్తీర్ణముండే ఈ నిర్మాణం 96 ప్లాస్టిక్ డ్రమ్ములపై నిర్మించారు. పైకప్పులోని సోలార్ స్టిల్ ద్వారా నీరు అక్కడికక్కడే ఉత్పత్తి అవుతుంది. మొక్కలకు ఉపయోగపడుతుంది. సముద్రపు నీరు లేదా కలుషిత నీటి నుంచి కూడా స్వచ్ఛమైన నీటిని తయారు చేసుకునేందుకు అనువైన ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో. తగిన పోషకాలు అందిస్తూ నేల అవసరం లేకుండా ప్లాస్టిక్ తొట్టెల్లో (ఈరకమైన వ్యవసాయాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు) మొక్కలు పండిస్తారు. ఇక రెండో చిత్రం... యునెటైడ్ కింగ్డమ్కు చెందిన కేట్ హాఫ్మన్, టామ్ వెబ్‌స్టర్ అనే ఇద్దరు ఔత్సాహికులు వాడేసిన షిప్పింగ్ కంటెయినర్‌తో చేసిన వినూత్న ప్రయోగమిది. కంటెయినర్ పైభాగంలో పారదర్శకమైన గ్రీన్హౌస్ ఏర్పాటు చేసి మొక్కలు, తొట్టెల్లో చేపలూ పెంచుతున్నారు. చేపల వ్యర్థాలు మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతోంది. దాదాపు 400 మొక్కలు పెంచుతూ వచ్చిన పంటను అక్కడికక్కడే అమ్మేస్తున్నారు. ఐడియా భలే!