Pond (Lake)
-
కొత్తచెరువు ఆక్రమణలు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామం పరిధిలోని కొత్తచెరువుకు సంబంధించిన సర్వే నంబర్ 5లోని 5.25 ఎకరాల భూమిలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణలపై పిటిషనర్ల ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరపాలని, నీటి వనరులను పరిరక్షించాలని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ (హైడ్రా) విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా కూల్చివేతలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించింది. రోడ్లు, వీధులు, ఫుట్‌పాత్‌లు, నీటి వనరులు వంటి పబ్లిక్ స్థలాలను ఆక్రమించి చేపట్టే అనధికార నిర్మాణాలకు అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు వర్తించవని తేల్చి చెప్పింది. ఫిర్యాదులు పరిశీలించాల్సిందే కొత్తచెరువు శిఖం ఆక్రమణపై తాము సెప్టెంబర్ 6వ తేదీన, అదే నెల 10న అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఖాజాగూడకు చెందిన ఆర్.రామకృష్ణతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు పత్రాలతో అత్యంత విలువైన భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. బిల్డర్స్, బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీతో పాటు భరతేందర్రెడ్డి, ఘనేశ్వర్, రాఘవరావు ఈ ఆక్రమణలో కుట్రదారులని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టగా.. కొత్తచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) సుమారు 5.5 ఎకరాల్లో విస్తరించి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అక్రమ నిర్మాణాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ముంపు సమస్య తలెత్తుతోందని, నీటి వనరుల మనుగడకు కూడా ముప్పు వాటిల్లుతోందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు సమర్పించిన ఫిర్యాదులను అధికారులు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రైవేట్ ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేయాలని సూచించారు. శిఖం భూమి లేదా ట్యాంక్ బండ్‌పై ఆక్రమణలు గుర్తిస్తే వాటిని తొలగించాలని, నీటి వనరులను పరిరక్షణతోపాటు పర్యావరణ వ్యవస్థకు మరింత నష్టం జరగకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 26వ తేదీకి వాయిదా వేశారు. -
45 ఏళ్ల డేటాతో ఎఫ్టీఎల్ లెక్క
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో చెరువులకు సంబంధించిన పూర్తిస్థాయి నీటి నిల్వమట్టం (ఫుల్ ట్యాంక్ లెవల్ –ఎఫ్టీఎల్)ను గుర్తించడంతోపాటు గరిష్టంగా జలాలు విస్తరించే ప్రాంతం (మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియా– ఎండబ్ల్యూఎస్ఏ)ను తేల్చడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ‘లేక్ ప్రొటెక్షన్ కమిటీ (ఎల్పీసీ)’శాస్త్రీయ విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమైంది. ఎల్పీసీ చైర్మన్‌గా ఉన్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో దీనిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.నీటిపారుదల, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్సీ), స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఎన్ని చెరువులు ఉన్నాయి? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయనే లెక్కలను శాస్త్రీయంగా తేల్చాలని రంగనాథ్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఆయా చెరువులకు గతంలో నిర్ధారించిన ఎఫ్టీఎల్ పక్కాగా లేకున్నా, సహేతుకమైన అభ్యంతరాలు వ్యక్తమైనా.. సమీక్షించి, సవరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణలపై 2018లో కాగ్ ఇచి్చన నివేదికను పరిశీలించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు రంగనాథ్ స్పష్టం చేశారు. 45 ఏళ్ల లెక్కలను తీసుకుని.. ఇక చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, వాటర్ స్ప్రెడ్ ఏరియాను గుర్తించడానికి 45 ఏళ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 1979 నుంచి ఆయా జల వనరులకు సంబంధించిన విలేజ్ మ్యాప్స్, భూ వినియోగం సర్వే నంబర్లతో సహా సమాచారం ఇచ్చే కాడాస్ట్రల్ మ్యాప్‌లను క్రోడీకరించి ఖరారు చేయనున్నారు. హిమాయత్‌సాగర్‌లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపుతో ఈ విధానం ప్రారంభించి మిగతా వాటికీ వర్తింపజేయనున్నారు. గట్టి నిఘా పెట్టేలా చర్యలు చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్దేశించిన ప్రాంతాలు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చర్యలు తీసుకోనుంది. ఆయా ప్రాంతాలను జియో ఫెన్సింగ్, ట్యాగింగ్ చేయడంతోపాటు ప్రత్యేక యాప్‌ను వినియోగంలోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఎక్కడ, ఎలాంటి ఆక్రమణలు జరుగుతున్నా తక్షణమే ఆ సమాచారం హైడ్రాకు చేరేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాప్ ద్వారానే ప్రజలు సమాచారం తెలుసుకోవడంతో పాటు ఫిర్యాదు చేయడానికీ ఆస్కారం ఏర్పడుతుంది. క్షేత్రస్థాయిలో అధికారులు చేపట్టే పరిశీలనలు, వాటి ఫలితాలతోపాటు తీసుకున్న చర్యలను ఇందులో నమోదు చేస్తారు.ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడమే కాకుండా, పూర్వవైభవం తీసుకురావడంపైనా హైడ్రా అధికారులు దృష్టి పెడుతున్నారు. కూలి్చవేతలకు సంబంధించిన వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్పల్లి నల్లచెరువుతో ఈ పనులు ప్రారంభించాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. చెరువుల పరిరక్షణ కోసం ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
చెరువులో పడి ముగ్గురు పిల్లల మృతి
మేడ్చల్ జిల్లా కొల్తూర్‌లో విషాదంశామీర్‌పేట్: ఆటలో భాగంగా మట్టి గణపతిని చేసిన ముగ్గురు పిల్లలు.. ఆ ప్రతిమను నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తూ చెరువులో పడి మృతి చెందారు. మేడ్చల్ జిల్లా కొల్తూర్‌లో శుక్రవారం ఈ విషాదకర ఘటన జరిగింది. చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తుల గాలానికి ఓ మృతదేహం చిక్కడంతో ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్న బాలేకర్ మణి హర్ష (14), సలేంద్రి హర్షవర్ధన్‌న్(13), ఈరబోయిన మనోజ్ (10) స్నేహితులు. దసరా సెలవుల నేపథ్యంలో వీరు శుక్రవారం మట్టి గణపయ్యను చేసి పూజలు చేస్తూ ఆడుకున్నారు. నిమజ్జనం కోసం చెరువు వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయారు. చెరువు వద్ద కొందరు వ్యక్తులు చేపల కోసం నీటిలో గాలాలు వేశారు. ఓ వ్యక్తి గాలానికి ఏదో తగిలినట్లు అనిపించడంతో పైకి లాగగా.. మనోజ్ మృతదేహం కనిపించింది. దీంతో వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా.. మిగతా ఇద్దరి మృతదేహాలు లభించాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ఏపీలో ‘చెర’వులు.. 2,032!
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధికంగా చెరువులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. అత్యధికంగా చెరువులు ఆక్రమణలకు గురైన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే అని కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 1,13,425 చెరువులను పరిశీలించగా.. వాటిలో 2,032 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని తెలిపింది. దేశంలో నీటి వనరులపై మొదటి సారిగా కేంద్ర జల్ శక్తి శాఖ విస్తృతంగా అధ్యయనం చేసింది. 2018–19లో ప్రారంభమైన ఈ అధ్యయనం రెండేళ్ల పాటు కొనసాగింది. ఇటీవల అధ్యయనం వెల్లడైన అంశాలపై నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో చెరువులతో పాటు కుంటలు, రిజర్వాయర్లు, సరస్సులు(లేక్‌లు), చెక్‌డ్యామ్‌లు, ఊట కుంటలు వంటి మొత్తం 1,90,777 నీటి వనరులను పరిశీలించగా వాటిలో 3,920 కబ్జాకు గురైనట్లు తెలిపింది. కబ్జాకు గురైన వాటిలో 51.8 శాతం చెరువులేనని వెల్లడించింది. నీటి వనరులలో 75 శాతానికి పైగా ఆక్రమణకు గురైనవి 199 ఉండగా, 50 నుంచి 75 శాతం ఆక్రమణకు గురైనవి 186, 25 నుంచి 50 శాతం వరకు ఆక్రమణకు గురైనవి 249, 25 శాతం లోపు ఆక్రమణకు గురైనవి 1,828 ఉన్నట్లు చెప్పింది. నీటి వనరులు దేశవ్యాప్తంగా సగటున 1.6 శాతం ఆక్రమణకు గురైతే.. ఆంధ్రప్రదేశ్‌లో 2.06 శాతం కబ్జాకు గురయ్యాయని వెల్లడించింది. నీటి వనరుల ఆక్రమణలపై జల వనరుల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పోలీసులకు చేసిన ఫిర్యాదులు వందల్లో ఉన్నాయని తెలిపింది. నిరుపయోగంగా ఉన్న నీటి వనరులు తక్కువేం కాదు.. రాష్ట్రంలోని నీటి వనరుల్లో 1,49,279 ఉపయోగంలో ఉన్నాయని, వీటిలో 8,475 కుంటలు, 1,03,952 చెరువులు, 60 సరస్సులు, 667 రిజర్వాయర్లు, 32,011 చెక్ డ్యామ్‌లు, ఊట కుంటలు, ఇతర వనరులు 4,114 ఉన్నాయని తెలిపింది. 41,498 నీటి వనరులు నిరుపయోగంగా ఉన్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది. వీటిలో అత్యధికంగా చెరువులు 9,473 ఉండటం గమనార్హం. ఫీడర్ చానళ్లు (వంకలు, వాగులు) కబ్జాకు గురవడం వల్ల వర్షం నీరు చేరకపోవడంతో 9,473 చెరువులు ఎండిపోయి, నిరుపయోగంగా మారినట్లు చెప్పింది. ఇలా నిరుపయోగంగా మారిన చెరువులు ఏపీలోనే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఏటా పూర్తి స్థాయిలో నిండే నీటి వనరులు 79,320 ఉండగా.. సాధారణంగా నీటిని మళ్లించడం ద్వారా నిండేవి 18,198గా తెలిపింది. అరుదుగా నిండేవి 28,633, ఎప్పుడూ నిండని వనరులు 2,171 ఉన్నాయని పేర్కొంది. -
చెరువులో అక్రమ కట్టడం.. పేల్చివేత
కొండాపూర్ (సంగారెడ్డి): హైడ్రాను స్ఫూర్తిగా తీసుకొని సంగారెడ్డిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్ చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముందస్తుగా పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనం పూర్తిగా నీటిలో ఉండటంతో బుల్డోజర్ల సహాయంతో కూల్చివేసేందుకు వీలు కాలేదు. దీంతో తహసీల్దార్ జిలెటిన్ స్టిక్స్ స్పెషలిస్టులను పిలిపించి వారి సహాయంతో భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు. అయితే భవనం కూలుస్తున్న సమయంలో అక్కడే ఉన్న హోంగార్డు గోపాల్‌కు రాయి ఎగిరి వచ్చి బలంగా తాకడంతో తలకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 12 ఏళ్ల క్రితమే నిర్మాణం కొండాపూర్ మండలం కుతుబ్‌షాహీ పేట శివారులోని సర్వే నంబర్ 93లో ఉన్న చెరువుకు సంబంధించిన మూడెకరాల భూమిని సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అక్కడ ఐదంతస్తుల భవనంతోపాటు స్విమ్మింగ్ పూల్, గెస్ట్‌హౌస్‌ను నిర్మించాడు. ఆ భవనం ఎఫ్టీఎల్లో ఉండటంతో భవనం చుట్టూ నీరు చేరకుండా ప్రత్యేకంగా చిన్నపాటి బ్రిడ్జిని కూడా నిర్మించుకున్నాడు. ఇది నిర్మించి 12 ఏళ్లయింది. అయినా హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాక, గ్రామస్తులు ఫిర్యాదు చేసే వరకు అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులో నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా వచ్చిన అధికారులు భవనాన్ని పరిశీలించడం, మామూళ్లు తీసుకోవడం పరిపాటిగా మారిందని అంటున్నారు. -
చెరువులకు జలకళ
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట/నాగార్జునసాగర్: భారీ వర్షాలతో చెరువులకు జలకళ సంతరించుకుంది. దీంతో ఈసారి పంటలకు నీటి సమస్య తలెత్తే అవకాశం లేదు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరుగుతోంది. కోటి పది లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి, నీటిపారుదల శాఖ మొత్తం 19 డివిజన్లుగా విభజించగా, వాటి పరిధిలోని చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఇచి్చన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,176 చెరువులు ఉంటే.. అందులో 15,608 చెరువులు పూర్తిగా మత్తడి దుంకుతున్నాయి. 5,952 చెరువులు మాత్రం ఇంకా 50 శాతం కంటే తక్కువ నీరు ఉన్నట్టు నీటిపారుదలశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 75 నుంచి 100 శాతం మేరకు నిండిన చెరువులు 8,144 ఉన్నాయి. ఇవికాక 50–75 శాతం మేరకు నిండిన చెరువులు మరో 5,012 వరకు ఉన్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. వర్షాకాల సీజన్ ఈనెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ మధ్యలో పడే వర్షాలకు మిగిలిన చెరువులు కూడా పూర్తిస్థాయిలో నిండుతాయన్న ఆశాభావాన్ని నీటిపారుదలశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వర్షాలతో భూగర్భజల నీటిమట్టం కూడా పెరుగుతుందని, తద్వారా నీటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. 50 శాతంలోపు నిండిన చెరువుల్లోకి కూడా నీరు వచ్చి చేరితే, ప్రాజెక్టులు, రిజర్వాయర్లతోపాటు, అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నిండినట్టు అవుతుందని అంటున్నారు. మేడిగడ్డ వద్ద ఉధృతంగా గోదావరి మేడిగడ్డ వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ బరాజ్ నుంచి 9.02 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దాని ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుండగా, వచ్చిన వరదను వచ్చినట్టే వదిలేస్తున్నారు. శ్రీరాంసాగర్‌కు 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే.. దిగవనకు 2.40 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 4.72 లక్షల క్యూసెక్కులు వస్తుంటే.. దిగువకు అంతేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇక సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) బరాజ్‌లో నుంచి 7.23 లక్షల క్యూసెక్కుల నీరు, సీతమ్మసాగర్(దుమ్ముగూడెం) నుంచి 7.55 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. శాంతిస్తున్న కృష్ణమ్మ ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీస్థాయిలో నీటి ప్రవాహం లేకపోయినా.. క్యాచ్మెంట్ ఏరి యాల్లో పడిన వర్షంతో జూరాల నుంచి 2.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలంలోకి వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.16 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంటే.. దిగువకు పదిగేట్లు ఎత్తి 3.61 లక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. నాగార్జునసాగర్ డ్యాంలోకి 3.04 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటే.. అంతే మొత్తాన్ని ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు వదిలేస్తున్నారు. -
అధికారులపైనా కేసులు
సాక్షి, హైదరాబాద్: చెరువులను చెరబట్టిన ఆక్రమణలను కూల్చివేయడంతోపాటు రికార్డులను తారుమారు చేస్తూ, వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపైనా ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’ ఫోకస్ చేసింది. కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రగతినగర్‌లోని ఎర్రకుంట, చందానగర్ ఈర్ల చెరువుల ఆక్రమణలకు సంబంధించి ఐదుగురు ప్రభుత్వ అధికారుల పాత్రను గుర్తించింది. సదరు ఆక్రమణలపై నమోదైన కేసుల్లో ఈ అధికారులను కూడా నిందితులుగా చేర్చాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతికి హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం లేఖ రాశారు. ఎర్రకుంట వ్యవహారంలో నలుగురిపై.. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట బఫర్ జోన్లో 0.29 ఎకరాలను బిల్డర్లు ఆక్రమించి మూడు భవనాలను నిర్మించారు. అవన్నీ గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తుల్లో నిర్మితమయ్యాయి. వాటిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు.. ఈ నెల 14న కూల్చేశారు. ఆ నిర్మాణాలకు కారణాలపై దర్యాప్తు చేయగా.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూ విభాగానికి చెందిన ‘సర్వేయర్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్’ కె.శ్రీనివాస్ ఈ స్థలానికి సంబంధించి రెండు రికార్డులు రూపొందించినట్లు హైడ్రా విచారణలో తేలింది. ఒకదానిలో అది ప్రభుత్వ స్థలమని, మరో దానిలో అది ప్రైవేట్ స్థలమని పొందుపరిచారు. అవసరాన్ని ఒక్కో రిపోర్టును తీసి ఇవ్వడం చేశారు. ఈ అక్రమ నిర్మాణాలకు చెరువు సర్వే నంబర్‌ను కాకుండా దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న మరో భూమికి సంబంధించిన సర్వే నంబర్ కేటాయించారు. ఈ వ్యవహారంలో బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్ పాత్ర కూడా ఉన్నట్టు తేలింది. అంతేకాదు హెచ్ఎండీఏలో అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ఆ స్థలాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండానే అనుమతి మంజూరు చేశారు. ఇందులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి.రామకృష్ణారావు పాత్ర కూడా ఉన్నట్టు హైడ్రా నిర్ధారించింది. దీనితో ఈ కేసులో నలుగురు అధికారులనూ నిందితులుగా మార్చాలని పోలీసులను కోరింది. ఏమీ రాయకుండా ‘చుక్క’ పెట్టి లైన్ క్లియర్! చందానగర్ పరిధిలోని ఈర్ల చెరువు ఆక్రమణ వ్యవహారంపైనా హైడ్రా లోతుగా ఆరా తీయగా మరో బాగోతం బయటపడింది. ఇక్కడ 0.16 ఎకరాలను ఆక్రమించిన కొందరు.. గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తులతో ఒక నిర్మాణం, గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తులతో మరో రెండు నిర్మాణాలను చేపట్టారు. వాటిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు.. ఈ నెల 10న ఆ మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ ఆక్రమణలకు సంబంధించి చందానగర్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ నిర్మాణాలకు ఆన్లైన్లోనే అనుమతులు మంజూరైనట్టు గుర్తించిన హైడ్రా అధికారులు.. పూర్వాపరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ గత డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఎన్.సుధాంశ్‌తోపాటు మాజీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) ఎం.రాజ్‌కుమార్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం బిల్డర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఈర్ల చెరువు ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా.. దరఖాస్తుతోపాటు ఇరిగేషన్ అధికారుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకుని జత చేయాలి. బిల్డర్లు అలా చేయలేదని గుర్తించిన టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీఓ) ఆ వివరాలను పొందుపరుస్తూ రాజ్‌కుమార్‌కు ఫార్వర్డ్ చేశారు. ఈ ఆన్లైన్ అప్లికేషన్‌పై రాజ్‌కుమార్ తన అభిప్రాయాలను జోడిస్తేనే అది డిప్యూటీ కమిషనర్‌కు వెళుతుంది. కానీ రాజ్‌కుమార్ దానిపై ఎలాంటి కామెంట్లు రాయకుండా.. కేవలం ఓ చుక్క (డాట్) పెట్టి డిప్యూటీ కమిషనర్‌కు ఫార్వర్డ్ చేసేశారు. దీని ఆధారంగా డిప్యూటీ కమిషనర్ భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేశారు. ఇది గుర్తించిన హైడ్రా చందానగర్‌లో నమోదైన కేసులో సుధాంశ్, రాజ్‌కుమార్‌లను నిందితులుగా చేర్చాలని సిఫార్సు చేసింది. ఏసీబీ అధికారుల దృష్టికి కూడా.. సాధారణంగా అన్నీ సరిగా ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు అనుమతి కావాలన్నా.. సంబంధిత అధికారుల చేతులు తడపనిదే ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. అలాంటిది చెరువులు, కుంటలు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతోపాటు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు అంటే.. అధికారుల చేతికి ముడుపులు దండిగా అందినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎర్రకుంట, ఈర్ల చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో రూ.లక్షలు చేతులు మారి ఉంటాయని హైడ్రా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల వివరాలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అందించాలని యోచిస్తున్నారు. భవిష్యత్తులో కొన్ని కీలక ఉదంతాలపై విజిలెన్స్ విచారణలు కూడా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా అక్రమార్కుల చుట్టూ ఉచ్చు బిగించాలని హైడ్రా భావిస్తున్నట్టు తెలిసింది. -
నిల్చున్న చోటే నిగ్గుతేల్చే యాప్!
సాక్షి, హైదరాబాద్: ఏ చెరువు పరిధి ఎక్కడి దాకా ఉంది? దాని ఫుల్ ట్యాంక్ లెవల్ ఎంత వరకు? బఫర్ జోన్ ఏ మేరకు విస్తరించి ఉంది? తెలుసుకోవడం ఎలా?.. ఔటర్ రింగు రోడ్డు పరి«ధిలోని ఆక్రమణలపై అనునిత్యం హైదరా బాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కొరడా ఝళిపిస్తున్న నేపథ్యంలో స్థలం, ఇల్లు, ఫ్లాట్ కొనాలని భావిస్తున్న సామాన్యుడికి వస్తున్న సందేహాలు ఇవి. బడా బాబులు, రియల్టర్లు, వ్యాపారుల మాదిరిగా వీరికి సమాచారం సేకరించే నెట్వర్క్ ఉండదు. దీంతో ఏమాత్రం తొందరపడి ముందడుగు వేసినా నిండా మునిగిపోతామనే భయం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఔటర్’ పరిధిలోని చెరువులకు సంబంధించిన సమాచారంతో ఓ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నారు. హెచ్ఎండీఏ ఆన్లైన్లో ఉంచినా.. రాజధానితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న చెరువులకు సంబంధించిన సమస్త సమాచారం ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) వద్ద ఉంది. ఈ విభాగం ప్రతి చెరువు, కుంట, ట్యాంక్‌కు ప్రత్యేక ఐడీ సైతం జారీ చేసింది. దానికి సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల లెక్కలతో పాటు వీటిని గుర్తిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలనూ క్రోడీకరించింది. ఈ వివరాలన్నింటినీ మ్యాపులతో సహా అధికారిక వెబ్సైట్ (https:// lakes. hmda. gov. in) లో అందుబాటులో ఉంచింది. అయితే ఈ వివరాలు పూర్తి సాంకేతిక పదజాలంతో ఉండటంతో సామాన్యుడికి అర్థమయ్యే పరిస్థితి లేదు. టెస్ట్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్... ఇలా సాంకేతిక పరిభాష, అంకెలతో ఉన్న ఆ వివరాలను డీ కోడ్ చేయాలంటే సాధారణ ప్రజలు నిపుణుల సహాయం తీసుకోవాల్సివస్తోంది. లేనిపక్షంలో తాను ఖరీదు చేయబోతున్న ప్రాంతం వివరాల కోసం వివిధ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.వివరాలన్నీ సరళంగా అందుబాటులో.. అదే సమయంలో ప్రస్తుతం హెచ్ఎండీఏ వద్ద అందుబాటులో ఉన్న వివరాలన్నింటినీ సరళంగా మార్చి హైడ్రా కోసం రూపొందించే ప్రత్యేక వెబ్‌సైట్‌తో పొందుపరచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆక్రమణలు సహా వివిధ అంశాలపై ఫిర్యాదులు చేయడానికి వాట్సాప్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలతో పాటు యాప్‌ను హైడ్రా అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులోనే జియో ట్యాగింగ్ డేటాను పొందుపరుస్తారు. అవసరమైతే ఈ విషయంలో గూగుల్ మ్యాప్స్ సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న ఎవరైనా ఓ ప్రాంతంలో నిల్చుని యాప్‌ను ఓపెన్ చేస్తే.. ఆ ఏరియా ఏదైనా చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల కిందికి వస్తుందా? అనేది స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వ భూములు, పార్కులు తదితరాలనూ ఈ యాప్‌లోకి తీసుకురావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భావిస్తున్నారు. నగరంలో ఉన్న చెరువుల్లో సర్వే, ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఫైనల్ వెరిఫికేషన్ ప్రక్రియలు పూర్తయినవి 54 ఉన్నాయి. వీటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై స్పష్టత ఉండటంతో తొలిదశలో వీటికే జియో ఫెన్సింగ్ చేయించనున్నారు. జియో ఫెన్సింగ్‌తో పరిరక్షించనున్న హైడ్రా సువిశాలంగా విస్తరించి ఉన్న నగరంలోని కొన్ని చెరువులు, పార్క్‌లు, ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచడానికి డ్రోన్లు, సీసీ కెమెరాలు, గార్డుల వ్యవస్థ సైతం సరిపోదు. ఈ నేపథ్యంలో కీలకమైన వాటిని పరిరక్షించడానికి జియో ఫెన్సింగ్ విధానాన్ని అమలు చేయడానికి హైడ్రా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ), అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (అడ్రిన్) సహా మరికొన్ని సంస్థలతో సంప్రదింపులు జరపనున్నారు.వీరి సహకారంతో ఉపగ్రహాల ద్వారా ఆయా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల హద్దులను పక్కాగా గుర్తించడంతో పాటు వాటికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా ఆ పరిధిలోకి వెళ్లి పూడ్చటానికి, నిర్మాణాలు చేపట్టడానికి సహా ఏ ఇతర ప్రయత్నం చేసినా ఆ కార్యకలాపాలను జియో ఫెన్సింగ్ ఆధారంగా శాటిలైట్లు గుర్తిస్తాయి. వెంటనే ఆ సమాచారాన్ని హైడ్రా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో పాటు కీలక అధికారులకు అందిస్తూ అప్రమత్తం చేస్తాయి. -
అస్సాంలో ఆ కిరాతకుడు మృతి
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో సంచలనం సృష్టించిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మరణించాడు. నాగావ్ జిల్లాలోని ధింగ్ గ్రామంలో శనివారం ఉదయం అతడు చెరువులో దూకి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని శుక్రవారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు అతడికి బేడీలు వేసి, అత్యాచార ఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లారు. నిందితుడు హఠాత్తుగా పోలీసులపై దాడి చేసి తప్పించుకొని సమీపంలోని చెరువులో దూకాడని నాగావ్ జిల్లా ఎస్సీ చెప్పారు. చెరువులో రెండు గంటలపాటు గాలించి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి దాడిలో ఒక పోలీసుకు గాయాలయ్యాయని, అతడిని ఆసుపత్రిలో చేర్చామని వెల్లడించారు.మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని ఎస్పీ వెల్లడించారు. చెరువులో దూకి చనిపోయిన నిందితుడి అంత్యక్రియలను తమ గ్రామ ఖబ్రస్తాన్లో నిర్వహించడానికి వీల్లేదని అతడి సొంత గ్రామమైన బార్భేటి ప్రజలు తేలి్చచెప్పారు. అంతేకాకుండా అతడి కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంత్యక్రియలకు ముందు జరిగే ప్రార్థనలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. పదో తరగతి చదువుతున్న బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు బంధించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు, హింసను సహించే ప్రసక్తే లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ శనివారం తేలి్చచెప్పారు. మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
చెరువులు చోరీ!
సాక్షి, హైదరాబాద్: చినుకు పడితే చిత్తడి.. రోడ్డెక్కాలంటే రోత.. కాస్త గట్టి వానొస్తే కాలనీలు, బస్తీల్లో ఎక్కడ చూసినా నీళ్లే.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాల పాలవడంతో వచ్చిన దుస్థితి ఇది. రియల్టర్ల ధనదాహానికి, అధికారుల అవినీతి తోడై.. చెరువులు, కుంటలన్నీ కాలనీలుగా, భారీ భవనాలుగా మారిపోతున్నాయి. దీనిపై ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ (హైడ్రా)’ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్ఆర్ఎస్సీ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని 56 ప్రధాన చెరువుల పరిస్థితిని పరిశీలించింది. 1979లో 10,416.8 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జలవనరులు.. గత ఏడాది చివరి నాటికి 3,974.1 ఎకరాలకు పడిపోయాయని తేల్చి0ది. అంటే 61 శాతం మాయమై 39 శాతమే మిగిలినట్టు లెక్కగట్టింది. ఇదిలా కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. ధనదాహం, అవినీతి కలగలిసి.. ‘గ్రేటర్’హైదరాబాద్‌తోపాటు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని జలవనరులు కబ్జా కావడం వెనుక రియల్టర్లు, బిల్డర్ల ధనదాహం, అధికారుల అవినీతి, సామాన్యుల అవగాహన రాహిత్యం కారణమని హైడ్రా చెబుతోంది. చెరువులు, కుంటలు సహా జల వనరులన్నీ సాగునీటి శాఖ అదీనంలో ఉంటాయి. కొన్నిచోట్ల చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ల పరిధిలో పట్టా భూములున్నా.. వాటిని పంటల సాగుకు వినియోగించాలే తప్ప ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ క్రమంలోనే భారీ నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, వెంచర్లు వేసే రియల్టర్లు సాగునీటిశాఖ నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)’తీసుకోవాలనే రూల్ ఉంది. అయితే ఈ ఎన్ఓసీ లేకపోయినా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇరిగేషన్ శాఖ నుంచీ అక్రమంగా ఎన్ఓసీలు జారీ అవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ముందే జారీ.. ఏదైనా భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు.. ఆ నిర్మాణాన్ని ఆద్యంతం పరిశీలించి, నిబంధనలన్నీ పాటించారని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నివాస యోగ్యమంటూ ‘ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ (ఓసీ)’జారీ చేయాలి. కానీ గ్రేటర్ నగరంలోని చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో వెలుస్తున్న చాలా భవనాలకు నిర్మాణ పనులు కూడా పూర్తి కాకుండానే ‘ఆక్యుపెన్సీ’జారీ అయిపోతోంది. కొందరు అధికారుల కాసుల కక్కుర్తే దీనికి కారణం. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి పలు ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు.. లోతుగా విచారణ చేపట్టారు. ఇక చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొన్ని నిర్మాణాలకు ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చినట్టు గుర్తించిన హైడ్రా అధికారులు.. వాటిని రద్దు చేయాలంటూ హెచ్ఎండీఏకు లేఖ రాశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టనున్నారు. జాడ కూడా లేని తుమ్మలకుంట హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 56 జల వనరులను ‘ఎన్ఆర్ఎస్సీ’అధ్యయనం చేసింది. కీసర మండలం అహ్మద్‌గూడలో 101 ఎకరాల్లో ఉండాల్సిన తుమ్మలకుంట పూర్తిగా మాయమైనట్టు తేలింది. ఆ చెరువు మొత్తం ఇప్పుడు ఓ కాలనీగా మారింది. అన్నింటికంటే తక్కువగా ఆక్రమణలకు గురైనది హుస్సేన్‌సాగర్.. 1,475.2 ఎకరాలు ఉండాల్సిన హుస్సేన్‌సాగర్ 21 శాతం ఆక్రమణలకు గురై 1,163.8 ఎకరాల మేర మిగిలింది. సాధారణ ప్రాంతాల్లో ఉన్న జల వనరుల కంటే రక్షణశాఖ పరిధిలో ఏరియాల్లో ఉన్నవి సురక్షితంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. హకీంపేటలో రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న 18 ఎకరాల చెరువు ఇప్పటికీ అలాగే ఉండటం గమనార్హం. ఆయా చోట్ల నిఘా, ఆంక్షలు ఎక్కువగా ఉండమే దీనికి కారణమని అంటున్నారు. సికింద్రాబాద్‌లోని చంద్రపురికాలనీలో ఉన్న చెన్నపురం చెరువు.. విస్తీర్ణం పెరిగినట్టు తేలడం ఆసక్తికరంగా మా రింది. 1979లో 16 ఎకరాలుగా రికార్డుల్లో ఉన్న ఈ చెరువు.. 2023లో 18.2 ఎకరాలు ఉన్నట్టు తేలింది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన హైడ్రా.. అదెలా జరిగిందో తేల్చాలని నిర్ణయించింది.గ్రేటర్ హైదరాబాద్, శివార్లలోని ప్రధాన చెరువులు 5644 ఏళ్ల కిందట ఈ చెరువుల విస్తీర్ణం10,416.8 ఎకరాలుఇప్పుడు వాటి విస్తీర్ణం 3,974.1 ఎకరాలు కబ్జా అయిన శాతం 61%సిటీ నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్లోనూ కబ్జా అయినది 21% -
లేక్‌లు లేఔట్లపాలు
సాక్షి, హైదరాబాద్: ఒకనాడు నిండుగా చెరువులతో, వాటి పక్కన తోటలతో కళకళలాడిన నగరం హైదరాబాద్.. కానీ నాటి చెరువులు కుంటలు అయిపోతే.. కుంటలన్నీ బస్తీలుగా మారిపోయాయి. చెరువు కనిపిస్తే చెరపట్టడమే లక్ష్యంగా చెలరేగిపోయిన కబ్జాదారులతో ఎక్కడికక్కడ భారీ నిర్మాణాలు వెలిశాయి. దశాబ్దాలుగా ఈ తతంగం జరుగుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల కమీషన్ల కక్కుర్తితో.. వందల కొద్దీ చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి. పెద్ద పెద్ద కాలనీలను చూపించి.. ఒకప్పుడు ఇక్కడ పెద్ద చెరువు ఉండేదని చెప్పుకునే రోజులు వచ్చాయి. గత 45 ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 61 శాతం చెరువులు మాయమైపోయినట్టు ‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)’ తేల్చింది. దీనికి సంబంధించి ఇటీవల ‘హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (హైడ్రా)’కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాల తొలగింపుపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. అనేక ప్రాంతాలకు అవే గుర్తింపు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల పేర్లలో బాగ్, తలాబ్, కుంట, కట్ట వంటి పదాలు ఉంటాయి. అవన్నీ నగరంలో చెరువులు, కుంటలు, తోటలు ఉన్న ప్రాంతాలే. దానికితోడు పెద్ద పెద్ద చెరువులూ ఎన్నో ఉండేవి. రియల్ఎస్టేట్ బూమ్‌తో కబ్జాలు, ఆక్రమణలతో పరిస్థితులు మారిపోయాయి. చెరువుల శిఖం భూములతోపాటు తూములు,అలుగులు, నాలాలపై అడ్డగోలుగా నిర్మాణాలు వచ్చి చేరాయి. ఈ క్రమంలో 1979, 2024 మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేసిన ఎన్ఆర్ఎస్సీ.. పెద్ద సంఖ్యలో చెరువులు మాయమైనట్టు తేల్చింది. బుధవారం ఎన్ఆర్ఎస్సీలో జరిగిన సమావే«శంలో ఈ వివరాలను వెల్లడించింది. ఉదాహరణకు శాతం చెరువు విస్తీర్ణం గతంలో 70 ఎకరాలుకాగా.. ఇప్పుడు మిగిలింది పదెకరాలే. ఎల్బీనగర్ కప్రాయి చెరువు 71 ఎకరాలకుగాను 18 ఎకరాలే మిగిలింది. హెచ్ఎండీఏ యంత్రాంగం నిర్లక్ష్యంతో.. ఇటీవలి వరకు గ్రేటర్లో చెరువుల బాధ్యతలను హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పర్యవేక్షించింది. దీని పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 1,728 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పూర్తి నీటి మట్టం (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ హద్దులను నిర్ధారించడంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యం చూపారు. కేవలం 200 చెరువుల హద్దులను మాత్రమే నోటిఫై చేశారు. ఈ కారణంగానే కబ్జాల పర్వం యథేచ్చగా కొనసాగింది. 472 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఫాక్స్‌సాగర్‌లో.. ఇప్పటివరకు 120 ఎకరాలు ఆక్రమణల పాలయ్యాయి. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే రసాయన గోదాములు, భారీ నిర్మాణాలు వెలిశాయి. 2003లో అప్పటి ప్రభుత్వం చెరువు భూముల్లోనే 11 ఎకరాల్లో పేదలకు పట్టాలివ్వడం గమనార్హం. ఇక మూసాపేట మైసమ్మ చెరువు భూముల్లో ఏకంగా ఆకాశ హరŠామ్యలే వెలిశాయి. శేరిలింగంపల్లిలోని దేవునికుంట, సున్నం చెరువు, మంగలి కుంటలు దాదాపు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు గోల్కొండ రాజులకు మంచినీరు అందించిన దుర్గం చెరువు చిక్కిపోయింది. దీని 125 ఎకరాల విస్తీర్ణంలో 25 ఎకరాల మేర గార్డెన్స్ వెలిశాయి. నేతలు, రియల్టర్లు, అధికారులు కుమ్మక్కై చెరువులు, కుంటలు కబ్జా చేసి నిర్మించిన, నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు, లేఔట్ల వెనుక రాజకీయ నాయకులు, రియల్టర్లు ఉంటున్నారు. కొందరు రాజకీయ నాయకులు బినామీ పేర్లతో చెరువుల్లో వెంచర్లు, లేఔట్లు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి కొందరు అధికారుల కక్కుర్తి తోడుకావడంతో అక్రమాలు విచ్చలవిడిగా కొనసాగాయి. కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి, హడావుడి చేయడం పరిపాటిగా మారిపోయింది. వాటిని పూర్తిగా కూల్చివేయడానికి బదులు నిర్మాణాల పైకప్పు, గోడలకు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి వదిలేస్తూ వచ్చారు. నేతలు, రియల్టర్లు తమ పలుకుబడి వినియోగించి తర్వాతి చర్యలు లేకుండా చూసుకుంటున్నారు. భవనాలకు పెట్టిన రంధ్రాలను పూడ్చేసి తమ దందా కొనసాగించేస్తున్నారు. తాజాగా ఎన్ఆర్ఎస్సీ ప్రజెంటేషన్ నేపథ్యంలో ‘హైడ్రా’ డైరెక్టర్ ఏవీ రంగనాథ్ వేగంగా స్పందించారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను పూర్తిగా కూల్చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్మాణంలో ఉన్నవాటిని కూల్చాలని, తర్వాత పాత నిర్మాణాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో.. ఎనిమిది భవనాలను (ఐదు అంతస్తులు, అంతకంటే ఎక్కువ ఎత్తయినవి) అధికారులు కూల్చేశారు. రెండు లేఔట్లను ధ్వంసం చేశారు. స్థిరాస్తి కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోండి చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ భవనాలను కూల్చేయడంతోపాటు వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. శనివారం రెండు ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చివేసి దాదాపు 15 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం. చెరువుల పరిసరాల్లో ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తున్నాయని.. తెలుసుకోకుండా ముందుకెళ్తే నష్టపోవాల్సి వస్తుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్రమ నిర్మానాలు, కబ్జాలపై సమాచారం ఇవ్వాలి. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ -
భాగ్యనగరంలో కంపు కొడుతున్న చెరువులు
-
ఆక్వా చెరువు బోరు నుంచి గ్యాస్
రాజోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఓ ఆక్వా చెరువు వద్ద బోరు బావి నుంచి నీటితో కలిసి 15 అడుగుల మేర గ్యాస్ పైకి ఎగజిమ్మింది. అయితే, మంటలు వ్యాపించకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... రాజోలు మండలంలోని చింతలపల్లి–అరవపాలెం రోడ్డులో కె.విజయేంద్రవర్మ అనే వ్యక్తికి చెందిన ఆక్వా చెరువు వద్ద ఉన్న బోరు బావి నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆకస్మికంగా నీరు ఎగసిపడింది. విద్యుత్ మోటారు, ఆయిల్ ఇంజన్ వంటివి ఏమీ లేకుండానే బోరు బావి నుంచి నీరు 15 అడుగుల మేర ఎగసిపడుతుండటంతో సమీపంలోని కూలీలు వెళ్లి చూశారు. అయితే, గ్యాస్ వాసన రావడంతో భయాందోళనలకు గురైన కూలీలు వెంటనే రాజోలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక అధికారి సీహెచ్ అనిల్‌కుమార్, సిబ్బంది గ్యాస్ లీక్ అవుతున్న బోరు బావి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బోరు బావి లోపల తీవ్రమైన ఒత్తిడి పెరిగి, నీటితో కలసి గ్యాస్ ఉధృతంగా పైకి వస్తోందని గుర్తించారు. నీటిలో సుమారు ఆరు శాతం గ్యాస్ ఉందని నిర్ధారించారు. బోరు బావిని ఇసుకతో పూడ్చివేసి గ్యాస్ పైకి రాకుండా చేశారు. కొత్తగా బోర్లు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉప్పు నీటి కోసం 200 మీటర్ల మేర భూమి లోపలకు బోర్లు వేయడం వల్ల గ్యాస్ పైకి వస్తుందని అనిల్‌కుమార్ చెప్పారు. కొన్నిసార్లు గ్యాస్ శాతం ఎక్కువగా ఉండడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. -
ప్రాణం తీసిన టెస్లా కారు రివర్స్
వాషింగ్టన్: అమెరికాతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ మోడ్‌లో ఉండాల్సిన టెస్లా కారును పొరపాటున రివర్స్ మోడ్‌కు మార్చడంతో అది చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనెటర్ మిట్చ్ మెక్కానెల్ బంధువు, ప్రముఖ షిప్పింగ్ కంపెనీ ఫార్‌మోస్ట్ గ్రూప్ సీఈఓ ఏంజెలా చావో(50) మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆమె తన మిత్రులతో కలిసి టెక్నాస్‌లోని ఆస్టిన్ సమీపంలో ఉన్న తన ప్రైవేట్ అతిథి గృహానికి వెళ్లారు. 900 ఎకరాల్లో ఈ ఎస్టేట్ విస్తరించి ఉంది. మిల్లర్ సెలయేర్ ఇక్కడ ఈ ఎస్టేట్ గుండా ప్రవహిస్తోంది. ఏంజెలా చావో ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, రాత్రిపూట టెస్లా కారులో తన అతిథి గృహానికి బయలుదేరారు. మధ్యతో త్రీ పాయింట్ మూలమలుపు వచి్చంది. దానిని దాటే క్రమంలో ఏంజెలా గందరగోళానికి గురై పొరపాటున కారును రివర్స్ మోడ్‌లోకి మార్చారు. దాంతో అది వేగంగా వెనక్కి వెళ్లి కొలనులో పడిపోయింది. ఏంజెలా భయాందోళనకు గురై స్నేహితురాలికి పోన్ చేశారు. వెంటనే గెస్ట్ హౌస్ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా మునిగిపోయింది. అద్దాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో వాటిని పగలగొట్టడం సాధ్యం కాలేదు. చివరికి కారును బయటకు తీసినా అప్పటికే ఏంజెలా ప్రాణాలు కోల్పోయారు. ఆమె అమెరికాలో ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ జిమ్ బ్రేయార్ సతీమణి. అమెరికా మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సోదరి అవుతారు. -
చెరువుల ఆక్రమణలను తీవ్రంగా పరిగణించాలి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల శిఖం, ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్), ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, చుట్టూ కంచె ఏర్పాటు.. తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించేందుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎస్జీ) గాడి ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్‌రెడ్డిని అడ్వొకేట్ కమిషనర్లుగా హైకోర్టు నియామించింది. రెండు జిల్లాల పరిధిలోని 16 చెరువులను పరిశీలించి మూడు వారాల్లో స్థాయి నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది. అంతరించిపోతున్న చెరువులను కాపాడేందుకు వీరిని నియమించినట్లు చెప్పింది. దీనికంతటికీ అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. ‘భవిష్యత్ తరాలు బాగుండాలన్నదే మా అభిమతం. ఒకప్పుడు హైదరాబాద్‌ను సరస్సుల నగరంగా పిలిచేవారు. ఇప్పుడు చాలా చెరువులు, సరస్సులు ఆక్రమణలతో అంతరించిపోయాయి. హైకోర్టు పక్కనే ప్రవహించే నది(మూసి) దుస్థితినే మనం చూడవచ్చు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. లేదంటే భవిష్యత్ తరాలు క్షమించవు’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వ్యాఖ్యానించారు. 13 నీటి వనరులపై నివేదిక.. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని, శిఖంను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని.. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాశారు. ముఖ్యంగా దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, పిర్జాదిగూడ, దామర చెరువు, దుండిగల్, చిన రాయుని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్‌పేట, బావురుడ తదితర చెరువులు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచించుకుపోయాయని పేర్నొన్నారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్‌గా విచారణ స్వీకరించింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. దుర్గం చెరువు, సున్నం చెరువు, ఫిర్జాదిగూడ పెద్ద చెరువు, చినదామర, చినరాయుని, గ్నాగారం పెద్ద చెరువు, మేడికుంట, నల్లచెరువు, బోయిన్ చెరువు, మద్దెలకుంట, నల్లగండ్ల చెరువు, అంబీర్ చెరువు, గోసాయి కుంట.. 13 నీటి వనరులకు సంబంధించి ఆక్రమణలు, ఎఫ్టీఎల్, కంచె ఏర్పాటుపై నివేదికను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు అందజేశారు. పరస్పర విరుద్ధ స్టేట్మెంట్లతో అడ్వొకేట్ కమిషనర్ల నియామకం అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. దుర్గం చెరువు చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసినందున కంచె వేయడం సాధ్యం కాదని చెప్పారు. అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ అందజేసిన నివేదికలో మాత్రం కంచె ఏర్పాటు చేసినట్లు ఉండటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పరస్పర విరుద్ధంగా స్టేట్మెంట్లు ఉండటంతో అడ్వొకేట్ కమిషనర్ల నియామకం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరు చెరువులను పరిశీలించి నివేదిక అందజేస్తారని చెప్పింది. ఇద్దరికీ రూ.25 వేల చొప్పున రెమ్యునరేషన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణకు జీహెచ్ఎంసీ తరఫున జయకృష్ణ, కేంద్రం తరఫున డీఎస్జీ గాడి ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ తరఫున శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. దుర్గం చెరువు చుట్టూ కంచె ఏర్పాటుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవాలని ఏఏజీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 11కు వాయిదా వేసింది. -
రాత్రికి రాత్రే చెరువు మాయం! తెల్లారేసరికి అక్కడ..!
కొన్ని రాష్ట్రాల్లో జరిగే వింత ఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వామ్మో! ఇదేంటి అనిపిస్తుంది. సాధారణంగా దొంగలు చైన్లు, పర్సులు, ఇళ్లు దోచుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ బిహార్‌లో మాత్రం దొంగలు చాలా వెరైటీగా ఉంటారు. అక్కడ ఒక్కసారి ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకుపోయారు. ఆ తర్వాత ఓ సొరంగం మార్గం ద్వారా బెగుసరాయ్‌లోని రైల్వే యార్డ్ నుంచి ఏకంగా రైలు ఇంజన్ని ఎత్తుకుపోయారు. ఇలాంటి విచిత్రమైన చోరీలతో బిహార్ తరుచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. మళ్లీ ఇప్పుడూ ఈ చెరువు కారణంగా మరోసారి హాట్‌టాపిక్‌గా వార్తల్లో నిలిచింది. ఎక్కడైన చెరువుని ఎత్తుకెళ్లడం గురించి విన్నారా! అదికూడా ఒక్కరాత్రిలో మాయం చేయడం అంటే నమ్ముతారా?. అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ దుండగలు ఎవరో గానీ ఎత్తుకెళ్లే దమ్ముంటే ఏదైనా చెయ్చొచ్చు అన్నా రేంజ్లో చేసి చూపించారు!. ఈ విచిత్ర ఘటన బిహార్‌లోని దర్భంగా జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఓ చెరువు రాత్రికి రాత్రే మాయమైపోయింది. తెల్లారేసరికి ఆ ప్రదేశంలో నీళ్లు లేకుండా మట్టితో పూడుకుపోయి, అక్కడ ఒక గుడిసె మాత్రమే కనిపించింది. దీంతో షాకైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ చెరువుని చేపలు పట్టడానికి, వ్యవసాయానికి వినియోగించేవాళ్లమని స్థానికులు చెబుతున్నారు. ఇంతకమునుపు మండల అధికారులు చెరువు పూడిక తీత పనులు మొదలుపెట్టారని తాము అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ పనులు నిలిపేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా ఎలా జరిగిందన్నాది తామకిప్పటికీ అంతుపట్టడం లేదన్నారు. అంతేగాదు రాత్రికి రాత్రే ఎలా చెరవు మాయం చేశారన్నది తమకు తెలియదని ఫిర్యాదులో పోలీసులకు తెలిపారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ ప్రదేశంలో రోజూ రాత్రిపూట ట్రక్కులు నడిచేవని స్థానికులు చెప్పారు. ట్రక్కులతోపాటు ప్రొక్లెయినర్లు, ఇతర భారీ యంత్రాలు ఆ చెరువు వద్ద పనులు సాగించినట్లు పోలీసులకు తెలిపారు. అయితే అక్కడ ఏం జరుగుతుందనేది తమకు మాత్రం తెలియదని పేర్కొన్నారు. తీరా అక్కడికి వెళ్లి చూడగా.. నీళ్లు ఉన్న చెరువు స్థానంలో మొత్తం మట్టితో నింపేసి.. అక్కడ ఒక గుడిసె వేసినట్లు గుర్తించారు. అంతేగాదు ఈ పని అంతా కేవలం రాత్రి పూట మాత్రమే జరిగిందని స్థానికులు పోలీసులకు తెలిపారు. కానీ దర్భంగాలో పెరుగుతున్న భూముల ధరల కారణంగా దుండగుల దృష్టి ఈ చెరువుపై పడిందని అంటున్నారు. అందుకే ఇంతలా పకడ్బంధీగా చీకట్లోనే చెరువు కబ్జా చేసేందుకు యత్నించారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు, చెరువుని మాయం చేసేలా మట్టిని ఎలా నింపారనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఇది మాములు మిస్టరీ కాదు. ఎదుకంటే? కటిక చీకటిలోనే గుట్టు చప్పుడు కాకుండా అదికూడా ఏకంగా ఓ చెరువునే మాయం చేశారు దుండగలు. (చదవండి: New Year 2024: ఇవాళ ఇవి తింటే..లక్కే లక్కు..డబ్బే..డబ్బు..) -
మురికికూపాలు..సుందర జలాశయాలుగా..
(నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి) నిర్లక్ష్యానికి నిలయాలుగా.. అపరిశుభ్రతకు ఆలవాలంగా.. కాలుష్యపు కాసారాలుగా మారిన పట్టణాల్లోని చెరువులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తరూపు తీసుకొస్తోంది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా చూడముచ్చటగా అభివృద్ధి చేస్తోంది. పార్క్ వాతావరణం, గట్లపై వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, చుట్టూ రక్షణ కంచె, ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ వంటి సౌకర్యాలను ఏర్పాటుచేస్తోంది. వరద నీరు సరైన మార్గంలో అందులోకి చేరేలా, నిండిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా మురుగునీరు వాటిల్లోకి చేరకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. మొదటి దశలో 101 జలాశయాలను, రెండో దశలో మరో 95 చెరువులను సుందరీకరించే పనిని ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీయూజీబీసీ) ఇప్పటికే చేపట్టింది. రాష్ట్రంలోని చెరువులను పునరుద్ధరించి, తిరిగి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీలు–అర్బన్ లోకల్ బాడీలు) 196 చెరువులను ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.522 కోట్లను వెచ్చిస్తోంది. మొదటి దశలోని 101 జలాశయాల్లో ఇప్పటికే 50 చెరువుల్లో సుందరీకరణ పనులు దాదాపు పూర్తిచేశారు. ఆయా పనులకు అవసరమైన ప్రణాళికను పురపాలక శాఖ రూపొందించి, ఇప్పటికే అమలుచేస్తోంది. ఈ నవంబర్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తోంది. మొదటి దశలోని చెరువుల్లో సగం చెరువుల పనులు పూర్తిగా, మిగతావి దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. వరద నష్టాన్ని నివారించేలా మార్పులు.. వరదలు వచ్చినప్పుడల్లా పట్టణాల్లో వీధులు నీటమునగడం పరిపాటిగా మారి, ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం సైతం పట్టణాల్లోని చెరువులను అమృత్ 2.0 పథకంలో అభివృద్ధి చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీలోని పట్టణ జలాశయాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తరూపు తీసుకొచ్చేందుకు నడుంబిగించింది. మొదటి దశలోని 101 చెరువులను రూ.189.07 కోట్లతోను, రెండో దశలో 95 చెరువులకు రూ.332.97 కోట్లతోను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టులో చెరువులను వినియోగంలోకి తీసుకొచి్చ, వరద నీరు సరైన మార్గంలో అందులోకి చేరేలా, నిండిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా వర్షపు నీరు తప్ప మురుగునీరు చెరువుల్లోకి చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వాటిల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగును శుద్ధిచేసి నీటిని స్వచ్ఛంగా మారుస్తున్నారు. జలాశయాల గట్లను రాళ్లతో పటిష్టం చేసి గట్లపై మొక్కలు నాటుతున్నారు. దీనివల్ల వరదలు సంభవించినప్పుడు ఆయా పట్టణాలకు ఈ చెరువులు సహజ రక్షణ వలయాలుగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. నాడు ఈ ఫొటోలో కనిపిస్తున్నది గుంటూరు మున్సిపాలిటీలోని అంకిరెడ్డిపాలెం చెరువు. దాదాపు 12 ఎకరాలకు పైగా ఉన్న ఈ చెరువు ముఫ్పై ఏళ్ల క్రితం వరకు తాగునీటిని అందించింది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో మురుగునీరు, జారిపోయిన గట్లు, ముళ్ల చెట్లతో నిండిపోయింది. దీనినిప్పుడు ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కొత్తగా తీర్చిదిద్దుతోంది. పటిష్టమైన గట్లు, సెంట్రల్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో సందర్శకులకు నిలయమైంది. పక్కనే ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ సైతం ఏర్పాటుచేస్తున్నారు. వచ్చేనెలలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నేడు చెరువుల అభివృద్ధి ఇలా.. మురుగుతో నిండిపోయిన జలాశయాలను శుద్ధి చేస్తారు. గట్లను పటిష్టం చేయడం, వీలైనంత ఎక్కువగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కుల్లా తీర్చిదిద్దుతారు. గట్లపై వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, చుట్టూ రక్షణ కంచె ఏర్పాటుచేస్తారు. ఓపెన్ జిమ్, పిల్లలకు ప్లే స్టేషన్ వంటి సౌకర్యాలను కలి్పస్తారు. ఆక్రమణలు జరగకుండా చుట్టూ రక్షణగా ఇనుప కంచె వేస్తున్నారు. తాగునీటి చెరువులుగా మార్పు జలాశయాల పునరుజ్జీవంలో మొదటి విడతగా 101 చెరువులను తీసుకున్నాం. ఇవి సుమారు 5 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో 50 జలాశయాల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ప్రతి చెరువును శుద్ధమైన నీటితో ఉండేలా ప్రక్షాళన చేయడంతో పాటు, గట్లను పటిష్టం చేసి, పార్కులు, వాకింగ్ ట్రాక్, సెంట్రల్ లైటింగ్, ఓపెన్ జిమ్, పిల్లలకు ఆటస్థలం, వస్తువులతో పాటు చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తున్నాం. పట్టణంలో కురిసిన వర్షపునీరు చెరువులోకి చేరేలా.. అక్కడ నుంచి బయటకు వెళ్లేలా ఇంజినీరింగ్ పనులు చేస్తున్నాం. తాగునీటి చెరువులను సైతం అభివృద్ధి చేస్తున్నాం. నవంబర్‌కి మొదటి దశ చెరువుల అభివృద్ధి పనులు పూర్తిచేస్తాం. – బొమ్మిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఏపీయూజీబీసీ ఎండీ స్థలాల రేట్లు పెరిగాయి ఈ ఊరిలో ఇక్కడే పుట్టి పెరిగాం. ఈ చెరువు నీటితోనే గ్రామం దాహం తీర్చుకునేది. కానీ, గత 30 ఏళ్లుగా నిరుపయోగంగా మారిపోయింది. ఊరు గుంటూరులో కలిసిపోయినా ఇటువైపు ఎవరూ వచ్చేవారు కాదు. ప్రభుత్వం ఈ చెరువును పార్కులా మారుస్తుండడంతో చుట్టుపక్కల స్థలాల రేట్లు పెరిగాయి. చుట్టూ వెంచర్లు కూడా వస్తున్నాయి. వచ్చే ఐదేళ్లల్లో ఈ ప్రాంతమంతా కొత్త పట్టణంగా మారిపోతుంది. – అప్పిరెడ్డి, అంకిరెడ్డిపాలెం (గుంటూరు) మా ప్రాంతానికి ఐకాన్ గతంలో ఈ చెరువులో చేపలు పెంచేవాళ్లం. కలుషిత నీరు చేరడంవల్ల చేపలు చనిపోతుండడంతో మానేశాం. వాకింగ్‌కు భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజెల్స్ లిమిటెడ్ (బీహెచ్‌వీపీ)కి వెళ్లా ల్సి వస్తోంది. కానీ, ఇప్పుడు మా చెరువును ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండడంతో ఇకపై వాకింగ్‌కు, పిల్లలు ఆడుకునేందుకు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఈ ప్రాంతానికి ఇప్పుడీ చెరువు ఐకాన్‌లా మారుతోంది. – వి.వెంకటరమణ, అక్కిరెడ్డిపాలెం (విశాఖ) ఆక్రమణలు తొలగించి ఆహ్లాదకరంగా.. విశాఖపట్నం లంకెలపాలెం చెరువు మూడెకరాలకు పైగా ఉండేది. 20 ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు పెరిగిపోయి అసాంఘిక పనులకు అడ్డాగా మారిపోయింది. ఇన్నేళ్లకు అధికారులు ఆక్రమణలను తొలగించి అద్భుతంగా మారుస్తున్నారు. గతంలో వాకింగ్‌కు స్టీల్ ప్లాంట్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఈ చెరువు గట్టుపైనే చేస్తున్నాం. జిమ్, పార్కు కూడా అభివృద్ధి చేస్తున్నారు. – సాలపు విజయకుమార్, లంకెలపాలెం (విశాఖపట్నం) బోటింగ్ కూడా పెడుతున్నారు హిందూపూర్‌లోని 113 ఎకరాల సూరపుకుంట చెరువు గత నెల వరకు గట్లు అడవిలా, పాములు, పందులకు నిలయంగా ఉండేవి. నీరు కూడా మురికిగా ఉండేది. అధికారులు పదిరోజుల్లో ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు చెరువు గట్టుపై వాకింగ్ చేస్తున్నాం. అధికారులు బోటింగ్ పెట్టాలని కూడా నిర్ణయించారు. బెంగళూరు, ఎలహంకలో ఇలా చెరువుల అభివృద్ధిని చూశాను. – సింగిరెడ్డిపల్లి ప్రసాదరెడ్డి, హిందూపూర్ -
బతుకమ్మ వేడుకల్లో విషాదం.. ముగ్గురు కార్మికులు గల్లంతు
సాక్షి, సిద్దిపేట జిల్లా: జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పండుగ కోసం చెరువులో చెత్తను తొలగిస్తుండగా ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతయిన కార్మికులు గిరిపల్లి బాబు, గిరిపల్లి భారతి, యాదమ్మల కోసం స్థానికులు గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: కూతురు ప్రేమ వ్యవహారం.. ఉన్మాదిగా మారిన తండ్రి ఏం చేశాడంటే -
జేసీబీలో నిండుగర్భిణి తరలింపు
భీమ్‌గల్: ఓ నిండుగర్భిణి పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా దారి మధ్యలో చెరువుకట్ట తెగి నీటి ప్రవాహం పెరిగింది. జేసీబీ సహాయంతో ఆమెను నీటిప్రవాహంలోంచి దాటించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన నిండుగర్భిణి అనిలకు గురువారం పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో పిప్రి నుంచి బాచన్పల్లి వెళ్లే దారిలో ఉన్న చెరువుకట్ట తెగిపోయింది. దీంతో ఆమెను జేసీబీలో కూర్చోబెట్టి దాని సహాయంతో నీటి ప్రవాహాన్ని దాటించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
జైన విగ్రహాలతో చెరువు తూము
సాక్షి, హైదరాబాద్: అదో చెరువు.. అంతగా సాగునీటి వనరులు లేని ఆ గ్రామంలో ఆ చెరువు నీళ్లే వ్యవసాయానికి ఆధారం.. అందుకోసం పల్లంగా ఉన్న ప్రాంతానికి నీటి నిల్వను చెరువుగా చేసి పక్కాగా కట్టకట్టి నీటి విడుదలకు తూము నిర్మించారు. ఇదంతా వందేళ్ల నాటి సంగతి. ఇప్పుడు ఆ చెరువుతో పనిలేదు. అయితే, తూము నిర్మాణానికి వినియోగించిన రాళ్లు మామూలువి కాదని, అవి ఓ జైన క్షేత్రం శిల్పాలతో కూడిన శిలలని తేలింది. వాన నీరు... చెట్టు నీడన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామ చెరువు కట్ట తూము నిర్మాణంలో రాళ్లుగా వినియోగించిన వెయ్యేళ్లనాటి జైన శిల్పాలు ఇప్పుడు వెలుగు చూశాయి. క్రీ.శ. 9–10 శతాబ్దాల నాటి జైన బసది కేంద్రంలో ఉన్న జైన చౌముఖి శిల్పాలను ఈ చెరువు తూములో వినియోగించినట్టు చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఔత్సాహిక పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్‌రెడ్డి ఇటీవల ఎన్కేపల్లి గ్రామానికి వెళ్లారు.ఆ సమయంలో వాన కురుస్తుండటంతో చెట్టునీడన నిలబడి ఉండగా, సమీపంలోని చెరువుకట్టలో శిల్పాలు కనిపించాయి. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆదివారం ఆ చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా, అవి జౌన చౌముఖి శిల్పాలుగా గుర్తించారు. శిలలపై ఆదినాథ, నేమినాథ, పార్శ్వనాథ, వర్ధమాన మహావీరులు ధ్యానముద్రలో ఉన్నట్టు, పైన కీర్తిముఖాలతో మలిచి ఉన్నట్లు శివనాగిరెడ్డి చెప్పారు. వాటిపై 9–10 శతాబ్దాల నాటి తెలుగు, కన్నడ లిపిలో శాసనాలు కూడా చెక్కి ఉన్నాయన్నారు. ఆ శాసనభాగాలు చెరువుగట్టు గోడలోకి చొచ్చుకుపోయి ఉన్నందున చదవటం వీలు కావటం లేదని, జైన బసదికి చెందిన దానశాసనాలు అయి ఉండే అవకాశం ఉందన్నారు. వాటిని బయటకు తీస్తే స్థానిక చరిత్రకు సంబంధించిన వివరాలు వెలుగుచూసే అవకాశం ఉందని తెలిపారు. ఆ ప్రాంతం జైన కేంద్రం.. మొయినాబాద్ ప్రాంతం ఒకప్పుడు జైన కేంద్రం. సమీపంలోని చిలుకూరు ప్రాంతం రాష్ట్రకూట, వేములవాడ చాళుక్యుల కాలంలో సుప్రసిద్ధ జైన కేంద్రమని పేర్కొంటూ ఇటీవలే ఆ ఊళ్లోని జైన దేవాలయ జాడలను వెలుగులోకి తెచ్చారు. చిలుకూరుకు అతి సమీపంలో ఉన్న ఎన్కేపల్లి గ్రామంలో కూడా జైన బసది కేంద్రం ఉండేదని, దానికి సంబంధించిన చౌముఖి శిల్పాలని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఆ జైన బసది, దాని అనుబంధ దేవాలయం ధ్వంసమైన నేపథ్యంలో, వాటి శిథిల శిల్పాలను చెరువు తూముకు వినియోగించి ఉంటారన్నారు. -
అశోక్ సాగర్‌లో విషాద ఘటన.. సూసైడ్ స్పాట్‌గా మారిన పర్యాటక ప్రాంతం
ఖలీల్‌వాడి /ఎడపల్లి : ఆహ్లాదకరమైన వాతావరణం అందించే అశోక్ సాగర్ ఇప్పుడు సూసైడ్ స్పా ట్‌గా మారింది. శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లు ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయగా అందులో మూడేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటనతో అశోక్ సాగర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నాలుగు నెలల్లో సుమారు పది ఘటనల వరకు ఇక్కడ జరిగాయి. ఎడపల్లి మండలం జాన్కంపేట్ పరిధిలో ఉన్న ఈ చెరువు వందేళ్ల క్రితం ఏర్పడింది. దీనిని పెద్ద చెరువుగా పిలిచేవారు. నిజామాబాద్, బోధన్ రహదారిపై చెరువు ఉండటంతో ప్రయాణికులకు ఆహ్లాదం అందించడానికి 2001లో అప్పటి జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ పర్యాటకంగా అభివృద్ధి చేశారు. రాక్ గార్డెన్తో పాటు చెరువులో బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జానకం పేట చెరువు అశోక్ సాగర్‌గా పిలువబడు తోంది. ఇది నగరానికి 12 కిలోమీటర్లు దూరంలో ఉంది. బీజీలైఫ్ గడిపే నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ చెరువు నుంచి 5 కిలోమీటర్ల దూ రంలో అలీసాగర్ ఉద్యానవనం ఉంది. ఈ రోడ్డు బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారి కావడంతో పర్యాటకులకు పిక్నిక్ స్పాట్‌గా మారింది. అయితే గత కొంత కాలంగా అశోక్‌సాగర్ వద్ద ఆత్మహత్యల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ కలహాలు, భర్త మద్యానికి బానిసై వేధింపులకు గురిచేయడంతో మహిళలు పిల్లలతో సహా ఆత్మహత్య చే సుకున్న ఘటనలు ఇక్కడ గతంలో చోటుచేసుకున్నాయి. నిరుద్యోగ యువకులు, వ్యాపారంలో న ష్టం వచ్చి ఆర్థిక ఇబ్బందుతో బాధపడుతున్న వారు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. పోలీసుల భద్రత పెంచాలి అశోక్ సాగర్‌లో పోలీసుల భద్రతతో పాటు బ్లూకోల్ట్స్ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉంది. ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే వా రిని కాపాడి కౌన్సెలింగ్ ఇవ్వాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరకట్న వేధింపులతోనే.. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు అక్షయ, నిఖిత తమ ముగ్గురు పిల్లలతో కలిసి శుక్రవారం అత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందులో అక్షయ కుమారుడు చిన్నా అలియాస్ భువనేశ్వర్ (3) నీటిలో గల్లంతు అయ్యా డు. అక్షయతో పాటు నిఖిత ఆమె పిల్లలు భవశ్రీ, శ్రీమాన్లను రోడ్డున వెళ్లే వారు కాపాడారు. అక్షయ వివాహం హైదరాబాద్‌కు చెందిన హేమంత్‌తో, నిఖిత వివాహం మెదక్‌కు చెందిన మహేశ్‌తో జరిగింది. కొంతకాలంగా హేమంత్, మహేష్ ఇద్దరూ కట్నంగా ఇచ్చిన ఇంటిస్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలని తమ భార్య లను వేధిస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన అక్కా చెల్లెళ్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో రోడ్డు వెంట బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకు లు దీనిని గమనించి, ఘటన స్థలానికి చేరుకున్నారు. నిజామాబాద్ నెహ్రూనగర్‌కు చెందిన షేక్ హైదర్ చెరువులోకి దిగి నిఖిత, అక్షయలతోపాటు భవశ్రీ, శ్రీమాన్లను రక్షించాడు. మిగతా ఇద్దరు గౌస్, షారూక్ ఖాన్ ఒడ్డున ఉండి బాధితులను బయటకు తీశారు. -
కరకట్ట కలేనా..? ముందుకు సాగని నిర్మాణ పనులు
మంగపేట: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి ఒడ్డు వెంట కరకట్ట నిర్మాణం కలగానే మిగులుతుంది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచగా ఉన్న కరకట్ట నిర్మాణంపై ఒక అడుగుముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.. అధి కారులు, ప్రజాప్రతినిధులు. ప్రతి ఏటా వర్షాకాలంలో వరద కారణంగా గోదావరి ఒడ్డు వెంట గల వేలాది ఎకరాల సాగుభూములు గోదావరిలో కలిసిపోతోన్నాయి. దీంతో 30 ఏళ్ల క్రితం నుంచి గోదావరి ఒడ్డు వెంట రైతులుకు వరద కోత గుండెకోతగా మారింది. గోదావరి ఒడ్డు వెంట సాగుభూములు కోతకు గురి కాకుండా ఉండేందుకు 2008లో అప్ప టి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్యాకేజీ వర్క్ కింద రూ.5,77,40,450 నాబార్డు నిధులను మంజూరు చేశారు. కమలాపురం నుంచి సుమారు 3 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణం చేపట్టిన గుత్తేదారు మండల కేంద్రంలోని గౌరారంవాగు బ్రిడ్జి వద్ద నుంచి సుమారు 500 మీటర్ల మేర రిటైనింగ్‌వాల్ నిర్మాణం, పొదుమూరు వరకు కరకట్ట నిర్మించి, దొంగలఒర్రె నుంచి పుష్కరఘాట్ వరకు క రకట్ట నిర్మాణం చేపట్టకుండా వదిలేయడంతో ప్రతి ఏటా గోదావరి ఒడ్డు వెంట సాగుభూములు కోత కు గురవుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గడిచిన 15 ఏళ్లకాలంలో గోదావరి ఒడ్డు వెంట విలువైన వందల ఎకరాల నల్లరేగడి భూములు ఇప్పటికే కోతకు గురై గోదావరిలో కలిసిపోయాయి. గోదావరి ఒడ్డు వెంట ఉన్న ఎకరం, రెండెకరాల సాగుభూమి మొత్తం గోదావరిలో కలిసిపోయిన పేదరైతులు నిరుపేదలుగా మారారు. మండల కేంద్రం కనుమరుగయ్యే ప్రమాదం కరకట్ట నిర్మాణంలో గత 15 ఏళ్ల నుంచి జరుగుతున్న జాప్యం వల్ల మున్ముందు మండల కేంద్రం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని పొదుమూరుకు కిలో మీటరుకు పైగా దూరంలో ఉండే గోదావరి గడిచిన 15 ఏళ్ల కాలంలో ఒడ్డు కోతకుగురి కావడంతో ప్రస్తుతం గ్రామానికి సుమారు 200 మీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతోపాటు ఊరచెరువుకు గోదావరి ఒడ్డుకు సుమారు 80 నుంచి 100 మీటర్ల దగ్గరకు చేరింది. రాబోయే కాలంలో గోదావరి వరద కారణంగా చెరువుకు ప్రమాదం పొంచి ఉండటం, చెరువుకు అతి సమీపంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, లోతట్టు ప్రాంతం మీదుగా గోదావరి వరదనీరు మండల కేంద్రంలోకి వచ్చే ప్రమాదం లేకపోలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే మంగపేట మండల కేంద్రం సైతం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. పనులు చేపట్టకపోవడంలో అంతర్యం ఏమిటో..? ఏటూరునాగారం మండలంలోని రాంనగర్ వద్ద 6 కిలోమీటర్లు, మంగపేట మండలంలోని దొంగలఒర్రె వద్ద నుంచి పుష్కరఘాట్ వరకు 2.5కిలో మీటర్ల వరకు గోదావరి తీరంవెంట కరకట్ట నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ.109.79 కోట్ల, భూసేకరణకు రూ.27 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఆయా పనులు చేపట్టేందుకు హర్ష కన్స్ట్రక్షన్తో 2022 ఏప్రిల్ 04న అగ్రిమెంట్ కూడా పూర్తయింది. ఆయా పనులను ప్రారంభించే క్రమంలో అధిక వర్షాలు, గోదావరి వరదల కారణంగా పనులు నిలిచిపోయినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. 2022 జూలైలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు పడటంతో గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో జూలై 17న సీఎం కేసీఆర్ భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు ముంపు ప్రాంతాలను హెలీకాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏటూరునాగారం ఐటీడీఏలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2008 సర్వే నివేదిక ఆధారంగా చేపట్టే కరకట్ట నిర్మాణం పనుల తాత్కాలికంగా నిలుపుదల చేసి ప్రస్తుత జూలైలో వచ్చిన గోదావరి వరద నీటి ప్రమాదాన్ని నివారించే విధంగా భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు అవసరమైన ప్రతి చోటా కరకట్ట నిర్మించేందుకు రీసర్వే చేసి నూతన ఎస్టిమేట్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎక్స్‌ఫర్ట్ కమిటీని నియమించినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. భూసేకరణకు సర్వే మంగపేటలోని సండ్రోని ఒర్రె నుంచి పుష్కరఘాట్ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించేందుకు రూ.54.09 కోట్ల ఫ్లడ్ బ్యాంక్ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు చేపట్టేందుకు ప్రభుత్వం టెండర్ నిర్వహించగా హర్ష కన్స్ట్రక్షన్ కంపెనీ టెండరు దక్కించుకుంది. పనులు ప్రారంభించేందుకు గోదావరి ఒడ్డు నుంచి సుమారు 30 మీటర్ల వెడల్పుతో రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు 50 నుంచి 60 ఎకరాల భూమి కోసం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించారు. కానీ, వర్షాకాలం వచ్చినా నేటి వరకు పనులు చేపట్టకపోవడంతో ప్రభుత్వం, అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం ప్రభుత్వం, ఎక్స్‌ఫర్ట్ కమిటీ ఆదేశాల మేరకు కరకట్ట నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన మేరకు భూసేకరణ కోసం సర్వే చేశాం. సర్వే నివేదికను ములుగు ఆర్డీఓకు సమర్పించాం. కరకట్ట నిర్మాణానికి డ్రాయింగ్ అప్రూవల్ కోసం పీఈసీడీఓ హైదరాబాద్ వారికి డ్రాయింగ్ సమర్పించాం. ఫ్లడ్ మోడల్ స్టడీస్ కోసం పీఎస్ ఈఆర్ఎల్ వారికి నివేదికలు అందచేశాం. ఆనుమతులు వచ్చిన వెంటనే చర్యలు చేపడతాం. – ఇరిగేషన్ ఏఈఈ వలీ మహ్మద్,మంగపేట సెక్షన్ నాలుగు ఎకరాలు గోదారిలో కలిసింది.. గోదావరి ఒడ్డు వెంట 11 ఎకరాల భూమి కోతకు గురై గోదారిలో కలిసి పోగా ఎకరం మాత్రమే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. ఉన్న ఎకరం పొలంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నా. ఉన్న ఎకరంలో కరకట్ట నిర్మాణం కొరకు అర ఎకరం భూమి పోతోంది. అర ఎకరానికి మాత్రమే నష్ట పరిహారం చెల్లిస్తామంటున్నారు. గోదావరిలో కోల్పోయిన మొత్తం భూమికి పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – బొల్లె రాములు, పొదుమూరు, భూ యజమాని -
వరద కాలువ కోసం భిక్షాటన
కోరుట్ల: పట్టణంలోని మద్దులచెరువును అనుసంధానిస్తూ వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ బీజేపీ నాయకులు బుధవారం పట్టణంలో భిక్షాటన చేశారు. వర్షాకాలంలో చెరువునిండి ఆ వరద నీటితో 10, పదకొండో వార్డులు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. తక్షణమే వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ 11వ వార్డు కౌన్సిలర్ దాసరి సునీత, పదో వార్డు బీజేపీ ఇన్చార్జి దాసరి శేఖర్ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. మున్సిపల్ కౌన్సిల్ పట్టించుకోవటం లేదని, అందుకే భిక్షాటనతో నిధులు సేకరిస్తున్నామని వారు తెలిపారు. మరికొన్ని నిధులు మున్సిపల్ కౌన్సిల్ విడుదల చేసి చెరువు నీళ్ల కోసం వరద కాలువ నిర్మించాలని వారు కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు మాడవేని నరేశ్, పెండెం గణేశ్, నాయకులు బల్మూరి మురళి, ఇందూరి తిరుమల, పోతుగంటి శ్రీనివాస్‌గౌడ్, గిన్నెల అశోక్, బింగి వెంకటేశ్, వాసాల నవీన్, వినయ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువు వైపు చూస్తూ మొరుగుతున్న కుక్క.. పరిశీలనగా చూసి నివ్వెరపోయిన జనం!
తమ పెంపుడు కుక్కకు చెరువులో స్నానం చేయించాలని ఆ అన్నాచెల్లెలు ఎంతో ముచ్చటపడ్డారు. అయితే అదే వారిపాలిట శాపంగా మారింది. స్థానికంగా ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని డోంబివలీ దావాడీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అన్నాచెల్లెళ్లు తమ పెంపుడు కుక్కను తీసుకుని చెరువుకు వెళ్లారు. అక్కడ దానికి స్నానం చేయించాలని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా వారు లోతైన నీటిలో మునిగిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. అయితే దాని ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. ఉమేష్‌నగర్‌కు చెందిన రంజిత్ రవీంద్రన్(22),కీర్తి రవీంద్రన్(16) కుటుంబంతో పాటు ఉంటున్నారు. రంజిత్ ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థి. కీర్తి ఈ ఏడాదే 12వ తరగతిలో చేరింది. వారి తల్లిదండ్రులు ఏదోపనిమీద తమ గ్రామానికి వెళ్లారు. దీంతో ఇంటిలో ఈ అన్నాచెల్లెళ్లలోపాటు వారి పెంపుడు కుక్క కూడా ఉంది. ఆదివారం ఈ అన్నాచెల్లెళ్లు స్కూటర్‌పై కుక్కను తీసుకుని గావ్‌దేవి చెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ కుక్కకు స్నానం చేయించాలనుకున్నారు. ఈ నేపధ్యంలో వారు చెరువులోకి దిగినవెంటనే మునిగిపోయారు. అయితే కుక్క ఈ ప్రమాదం నుంచి బయటపడింది. వారిద్దరూ చెరువులో మునిగిపోవడాన్ని చూసిన ఆ కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. కొద్దసేపటి తరువాత కుక్క అలా మొరుగుతుండటాన్ని గమనించిన గ్రామస్తులకు ఏదో అనుమానం కలిగింది. వారు సంఘటనా స్థలానికి వచ్చి.. ఆ అన్నా చెల్లెళ్లు మునిగిపోయి ఉండటాన్ని గమనించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో భారీ సంఖ్యలో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో రెండు గంటలపాటు చేసిన ప్రయత్నాల అనంతరం ఆ అన్నాచెల్లెళ్ల మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ అన్నాచెల్లెళ్లు చదువు అంటే ఎంతో ఆసక్తి చూపేవారు. కీర్తి 10వ తరగతిలో 98శాతం మార్కులను సంపాదించింది. ఈ అన్నాచెల్లెళ్లద్దరూ ఆ కుక్కను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా..ఆక్రమణదారుల చెరలో 38,496 చెరువులు
సాక్షిప్రతినిధి, వరంగల్: నగరాలు, పట్ణణాలు, పల్లెలు.. ఇవేమీ తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు.. ఫలితంగా వేల సంఖ్యలో జలవనరులు కనుమరుగవుతున్నా యి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చినవాటి లో కొన్ని ఆక్రమణలపాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారాయి. ఇటీవల కేంద్ర మైనర్ ఇరిగేషన్ స్టాటిస్టిక్స్ విభాగం విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కేంద్ర ప్రాయోజిత పథకం కింద ‘ఇరిగేషన్ సెన్సెస్’నిర్వహించింది. అనేక చెరువులు కనుమరుగైనట్లు, మరి కొన్ని ప్రమాదంలో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఓరుగల్లు చెరువులు ఎంతెంత పోయాయంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలో కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలతో కుచించుకు పోయాయి. 100 ఎకరాలకుపైగా ఉండే చిన్నవడ్డేపల్లి చెరువు సుమారు 20 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు కొద్ది రోజుల క్రితం రెవెన్యూ శాఖనే తేలి్చంది. మామునూరు పెద్ద చెరువు 170 ఎకరాలకుగాను సుమారు 40 ఎకరాలు, 126 ఎకరాల్లో విస్తరించి ఉన్న పాతబస్తీ ఉర్సు రంగ సముద్రం (ఉర్సు చెరువును) సుమారు 26 ఎకరాలు, హనుమకొండ హంటర్‌రోడ్ న్యూశాయంపేటలో 150 ఎకరాల విస్తీర్ణంలోని కోటి చెరువులో సుమారు 25–30 ఎకరాల వరకు ప్రైవేటుపరమయ్యాయి. హన్మకొండ, కాజీపేట ప్రాంతవాసుల తాగునీటి అవసరాలు తీర్చే హన్మకొండ వడ్డేపల్లి చెరువులో 40 ఎకరాలకు వరకు, 336 ఎకరాల భద్రకాళి చెరువులో సుమారు 40 ఎకరాల పైచిలుకు కనుమరుగైందని అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఆక్రమణకు గురైనవి 3,032 దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా చిన్ననీటి వనరులు కుచించుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా 38,496 చెరువులు, ట్యాంకులు, సరస్సులు తదితర చిన్ననీటి వనరులు ఆక్రమణకు గురికాగా, సుమారు 14,535 చోట్ల ప్రమాదంలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కాగా అత్యధికంగా ఆక్రమణలకు గురైన ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 64,056 చిన్ననీటి వనరుల్లో 3,032 ఆక్రమణలకు గురైనట్లు నివేదిక తేల్చింది. ఈ 3,032 చెరువుల్లో ఎక్కువ హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు సెంటిమీటర్ల వాన పడితే నగరం మునుగుడే కాకతీయ రాజులు నిర్మించిన అనేక చెరువులు వరంగల్ నగరం చుట్టూ ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణల వల్ల గొలుసుకట్టు చెరువుల సిస్టం దెబ్బతిని ఐదు సెంటిమీటర్ల వర్షం పడితే చాలు నగరం మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఆక్రమణలను నియంత్రించకపోతే ఆ చెరువులు పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉంది. – చీకటి రాజు, రాష్ట్ర కన్వీనర్, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ లోకాయుక్తలో విచారణ జరుగుతోంది వరంగల్‌లో 8కి పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వీటన్నింటిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాం. భద్రకాళీ సహా అన్ని చెరువుల ఆక్రమణపై లోకాయుక్త కోర్టులో చేసిన ఫిర్యాదులపై తదుపరి విచారణ 2024 జూన్ 23న ఉంది. – సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర అధ్యక్షుడు, వినియోగదారుల మండలి చెరువుల ఆక్రమణలపై నోటీసులు వరంగల్ నగరం, పరిసర ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై వచి్చన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మా దృష్టికి వచి్చన వాటిని ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సందర్శించి ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చాము. పోలీసు, రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదులు చేశాం. – ఎ.సుధాకర్ రెడ్డి, ఎస్ఈ, జలవనరులశాఖ చదవండి: ‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై!