Rajanna Sircilla District Latest News
-
సీఎం మాస్క్‌లతో ర్యాలీ..నిరసన
సిరిసిల్లకల్చరల్/వేములవాడరూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీక్ష చేస్తున్న స మగ్ర శిక్షా ఉద్యోగులు గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ మాస్కులు ధరించి నిరసన తెలిపారు. కలెక్టరేట్ సర్కిల్ నుంచి రగుడు అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. విప్‌ను కలిసిన సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్లు నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిశారు. సానుకూలంగా స్పందించిన విప్ ఆది శ్రీనివాస్ సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ స్వప్న, భవిత సెంటర్ నిర్వాహకురాలు కత్తి జయలక్ష్మి, సీఆర్పీ నగేశ్, సంతోష్, ఎస్వో లింగవ్వ, కల్పన, సంతోషి, శ్యామల, నీరజ పాల్గొన్నారు. -
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
● గురుకులాలను తహసీల్దార్లు, ఎంపీడీవోలు పర్యవేక్షించాలి ● 15 రోజుల్లో పిల్లలకు వైద్యపరీక్షలు చేయించాలి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాసిరిసిల్ల: గురుకులాల్లోని విద్యార్థులకు నాణ్య మైన పౌష్టికాహారం అందించాలని కలెక్లర్ సందీ ప్‌కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెసిడెన్షియ ల్ పాఠశాలలు, సంక్షేమహాస్టల్స్, ఏకలవ్య మోడల్‌స్కూల్స్, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవోలు పర్యవేక్షించాలని సూ చించారు. బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలలో మహిళా సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించేలా చూడాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్‌లో చదివే విద్యార్థులకు 15 రోజుల్లో హెల్త్ చెక్అప్ చేయించాలని ఆదేశించారు. పిల్లల సంఖ్యకు అనుగుణంగా మంచాలు, దుప్పట్లు ఉండేలా చూడాలని, పిల్లలకు డైనింగ్ ఏర్పాట్లు, హాస్టల్స్ పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. కామన్ డైట్ ప్రకారం సరుకులు సరఫరా చేయని కాంట్రాక్టర్లను మార్చాలని సూచించారు. వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఈవో జగన్మోహన్రెడ్డి, ఎస్డీసీ రాధాబాయి, మండల ప్రత్యేక అధికారులు, ఆర్సీవోలు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజుకు హమాలీల సమ్మె
తంగళ్లపల్లి(సిరిసిల్ల): డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సివిల్ సప్లయ్ హమాలీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మద్దతు తెలిపారు. పెరిగిన వేతనాలను లెక్కగట్టి ఇవ్వాలన్నారు. పాత రేట్ల స్థానంలో కొత్త రేట్లను ఇవ్వాలని కోరారు. అజ్జ వేణు, పుప్పాల రాజేశ్, మల్లయ్య, కోమటి శివలింగం, నక్క రాములు, బొల్లి దేవయ్య, రాగుల రాజయ్య, దుమాల రాజిరెడ్డి, నూనె వెంకటేశం, రాగుల భద్రయ్య, జక్కయ్య, వెంకటేశ్, లింగయ్య పాల్గొన్నారు. -
అసైన్డ్ భూకంపం
తంగళ్లపల్లి మండలం తాడూరు శివారులోని సర్వేనంబర్ 1148లో 11 ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా పట్టాలు పొందారని తహసీల్దార్‌కు అందిన ఫిర్యాదుతో తాడూరు మాజీ సర్పంచ్ భర్త సురభీ నవీన్‌రావును రెండు రోజుల కిందట అరెస్ట్ చేశారు. భూమిని అక్రమంగా పట్టాలు పొందారని సురభీ సుధాకర్‌రావు, సురభీ సురేందర్రావులపై తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా బీఆర్ఎస్కు చెందిన సిరిసిల్ల బీసీ సంఘం నాయకులు బొల్లి రామ్మోహన్, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సోదరుడు జిందం దేవదాస్, సర్ధాపూర్ మాజీ సర్పంచ్ ఒజ్జెల అగ్గిరాములును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనలు జిల్లాలో భూకంపాన్ని సృష్టిస్తున్నాయి.కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్‌లకు పత్రం అందిస్తున్న ఈమె మిట్టపల్లి పద్మ. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ మాజీ సర్పంచ్. ఆమె పేరిట 2018లో తాడూరు శివారులోని సర్వేనంబర్ 545/1/1/3/1లో రెండెకరాల ప్రభుత్వ భూమికి పట్టా పొందారు. తనకు కేటాయించిన ఆ రెండు ఎకరాల భూమిని మాజీ సర్పంచ్ పద్మ స్వచ్ఛందంగా ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తూ కలెక్టరేట్‌కు వచ్చి పాస్‌బుక్కును అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ భూమిని ఎవరైనా అక్రమంగా పట్టా పొందితే ఆ భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని తెలిపారు. ఆ భూములను పేదలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు వినియోగిస్తామన్నారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతుబంధు, పంటరుణం వంటి ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందిన వారికి ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని స్పష్టం చేశారు. -
సీఎం కప్ పోటీల్లో జిల్లాకు పతకాలు
సిరిసిల్లకల్చరల్/గంభీరావుపేట(సిరిసిల్ల): సీఎం కప్.. యోగా పోటీల్లో జిల్లా విద్యార్థులు రజత పతకాలు సాధించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో వెలిచాల అర్విన్, స్వర్గం విష్ణుప్రసాద్ రజత పతకాలు సాధించారు. విద్యార్థులను జిల్లా క్రీడల అధికారి అజ్మీర రాందాస్, స్కూల్ హెచ్ఎం చకినాల శ్రీనివాస్, జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్, యోగాచార్యుడు ఉప్పల శ్రీనివాస్, శ్రీకాంత్, కృష్ణ, డేవిడ్, శంకర్ అభినందించారు. ఉషు పోటీల్లో పతకాలు సీఎం కప్–2024 రాష్ట్రస్థాయి ఉషు పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఐదు పతకాలు సాధించినట్లు కోచ్ విక్రమ్‌గాంధీ తెలిపారు. అండర్–14 బాలుర విభాగంలో నిఖిలేశ్ 33 కిలోల విభాగంలో కాంస్యం, అండర్–18 బాలికలలో ప్రవళిక 52 కిలోల విభాగంలో కాంస్యం, 60 కిలోలలో పూజ కాంస్యం, అండర్–18 బాలురలో త్రిశాంత్ 52 కిలోలలో కాంస్యం, లోకేశ్ 60 కిలోలలో కాంస్యం పతకాలు సాధించినట్లు కోచ్ వివరించారు. -
● పట్టాలు పొందిన బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ ● కేసుల భయంతో అసైన్డ్ భూములు వాపస్ ● ఇప్పటికే 300 ఎకరాల అక్రమ పట్టాల గుర్తింపు ● జిల్లాలో బీఆర్ఎస్ నేతలకు బిగుస్తున్న ఉచ్చు
సిరిసిల్ల: పేదల పేరిట పెద్దలకు పట్టాలిచ్చిన అసైన్మెంట్ భూములపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆరా తీస్తోంది. జిల్లా వ్యాప్తంగా గత పదేళ్లుగా ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో అక్రమాలపై విచారిస్తున్నారు. ప్రభుత్వ అసైన్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన భూముల వివరాలు సేకరించి, నివేదిక సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారపార్టీ నేతలకు ప్రభు త్వ భూములను పట్టాలుగా కట్టబెట్టిన తీరుపై కలెక్టర్ సందీర్కుమార్ఝా ఆరా తీస్తున్నట్లు సమాచా రం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 300 ఎకరాల అసైన్మెంట్ భూములు అక్రమంగా అప్పటి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లినట్లు జిల్లా రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. ఈమేరకు అర్హత లేకున్నా పట్టాలు పొందిన వారిపై చట్టపరంగా కేసులు న మోదు చేయాలా? పాత రెవెన్యూ చట్టం నిబంధనల మేరకు వెనక్కి తీసుకోవాలా? ధరణి పోర్టల్ రద్దవుతున్న నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్ట పరి ధిలో చర్యలు తీసుకోవాలా? అనే కోణంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం విచారిస్తోంది. అప్పట్లో పట్టాలు అందించిన రెవెన్యూ అధికారులపైనా కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. అసైన్మెంట్ కమిటీ సిపార్సులపై ఆరా అసైన్మెంట్ కమిటీ సిపార్సుల మేరకు ఎవరెవరికి ఏ ఊరిలో ప్రభుత్వ భూమిని కేటాయించారు? ఎంత కేటాయించారు? ఆ పట్టా పొందిన వ్యక్తి ఇప్పుడు కబ్జాలో ఉన్నారా? ఇతరులకు అమ్ముకున్నారా? నిజానికి ఆ పట్టా పొందిన వ్యక్తి ఏ సామాజిక వర్గానికి చెందిన వారు? అతనికి అప్పటికే ఏమైనా పట్టాభూమి ఉందా? ప్రభుత్వ అసైన్మెంట్ భూమి కేటాయించారా? ఇప్పుడు భూమి స్థితిగతులు ఏమిటి? అనే వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. సమగ్ర వివరాలు సేకరించి అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రభుత్వ భూములను పట్టాలు పొందిన వ్యక్తి పేదవాడైతే నిజంగానే అర్హత ఉంటే.. అలాంటి వారిపై ఎలాంటి కేసులు ఉండబోవని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అధికారుల అండతో ప్రభుత్వ భూమిని చెరపడితే కేసులు నమోదుచేయాలని భావిస్తున్నారు. వాపస్ ఇద్దామా.. వేసి చూద్దామా? గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు పొందిన వారు తాజా పరిణామాల నేపథ్యంలో పట్టాలు పొందిన భూమిని కలెక్టర్‌కు వాపస్ ఇద్దామా? లేక.. వేసిచూద్దామా? అనే ఆలోచనలో పడ్డారు. పట్టాలు పొందిన బీఆర్ఎస్ నాయకులపై పోలీసు కేసులు నమోదవుతున్న తరుణంలో లక్ష్మీ పూర్ మాజీ సర్పంచ్లాగా భూమిని వాపస్ ఇచ్చి కేసుల నుంచి బయటపడదామా? లేక.. రెవెన్యూ అధికారుల చర్యలను కోర్టులో ఎదురుకొందామా? అనే ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా అసైన్మెంట్ భూముల కేటాయింపులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించాయి. అప్పటి కేటాయింపులు చర్చకు తెరలేపాయి. -
గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్
సిరిసిల్లకల్చరల్: రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిందని ఆ సంస్థ ప్రాంతీయ సమన్వయ అధికారి డీఎస్ వెంకన్న గురువారం ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీ అయిన సీట్ల కోసం కూడా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో జరిగిన స్వల్ప మార్పులు గమనించాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా విద్యార్థులకు సంబంధించిన స్టడీ, ఆధార్, కులం, ఆదాయ సర్టిఫికెట్ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. -
బిల్లుల సాధనకు భారీ ఉద్యమం
● కవితను కలిసిన మాజీ సర్పంచులుసిరిసిల్లకల్చరల్: పెండింగ్ బిల్లుల సాధనకు త్వరలోనే భారీ ఉద్యమం చేపట్టనున్నట్లు మాజీ సర్పంచుల సంఘం ప్రతినిధులు అక్కెనపెల్లి కరుణాకర్, చెన్నమనేని స్వయంప్రభ తెలిపారు. గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి పెండింగ్ బిల్లుల సాధనకు మద్దతు కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా మాజీ సర్పంచులు చేసిన పనుల బిల్లుల చెల్లింపులపై మీనమేషా లు లెక్కిస్తోందన్నారు. సంఘం జిల్లా ప్రతి నిధులు దుమ్మ అంజయ్య, తాడెపు ఎల్లం, బొజ్జం మల్లేశం, మ్యాల దేవయ్య, వన్నమనేని వంశీకృష్ణ, గాండ్ల సుమతి, పోపు పరశురాం, ఏనుగులు కేశవరావు, తాడెపు జ్యోతి, కట్కం మల్లేశం, చిందం రమేశ్, గుంటి శంకర్, గుడ్ల శ్రీనివాస్, తంపుల సుమన్ పాల్గొన్నారు. బార్, బెంచ్ స్నేహపూర్వకంగా ఉండాలి వేములవాడ: బార్, బెంచ్ స్నేహపూర్వక వాతావరణంలో కక్షిదారులకు న్యాయసేవలందించేందుకు కృషి చేయాలని జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి పేర్కొన్నారు. బార్ అసోసియేషన్‌లోని న్యాయవాదులను గురువారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, పలు అంశాలపై చర్చించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్‌గౌడ్, రజనీకాంత్, బొడ్డు ప్రశాంత్, రేగుల దేవేందర్, దివాకర్, విద్యాసాగర్‌రావు, కిశోర్‌రావు, దేవయ్య, నవీన్, అభిలాశ్, అనిల్‌కుమార్, అన్నపూర్ణ, సుజాత, పెంట రాజు, జనార్దన్, నరేశ్, నర్సింగారావు పాల్గొన్నారు. మిడ్‌మానేరులో 25 టీఎంసీలు బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజశ్వేర (మిడ్‌మానేరు) ప్రాజెక్టులో నీటిమట్టం గురువారం 25.60 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి 500 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 350 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 70 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. అన్యాక్రాంత భూములను అర్హులకు పంచండిసిరిసిల్లకల్చరల్: జిల్లాలో అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వేల ఎకరాల విలువైన భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్న వారిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కబ్జా చేసిన భూములను కలెక్టర్‌కు తిరిగి అప్పగించేందుకు క్యూలు కడుతున్న వైనం చూస్తుంటే భారీ ఎత్తున భూఅక్రమాలు జరిగాయని తెలుస్తోందన్నారు. అప్పటి ప్రభుత్వ మెప్పు పొందేందుకు తహసీల్దార్ స్థాయి అధికారులు సైతం అక్రమార్కులకు భూములను కట్టబెట్టారని ఆరోపించారు. రైతుబంధు డబ్బుల కోసం అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చుకుని పదేళ్లుగా కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ఆక్రమణకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన నిరపేదలకు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు పంతం రవి, నల్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
అపార్ ఆలస్యం
● ఐడీ కార్డుల కోసం వివరాల నమోదులో జాప్యం ● టీచర్లకు సకాలంలో ఇవ్వని విద్యార్థులు ● ఆధార్‌కార్డుల్లో తప్పులు సరిచేసేందుకు 10 రోజులు ● సహకరించని తల్లిదండ్రులు ● ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ● 31 వరకు ప్రభుత్వ గడువుఉమ్మడి జిల్లాలోని స్కూళ్లు, విద్యార్థుల వివరాలు జిల్లా పాఠశాలలు విద్యార్థులు అపార్ (ప్రభుత్వ, ప్రైవేటు) నమోదు కరీంనగర్ 1,017 1,80,043 7,204 పెద్దపల్లి 721 81,722 15,910 సిరిసిల్ల 678 82,088 6,527 జగిత్యాల 1,103 1,44,238 14,340సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జాతీయ విద్యావిధానంలో భాగంగా దేశంలో ప్రతీ విద్యార్థి విద్యార్హతల వివరాలు ఒకే కార్డులో నిక్షిప్తం చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఏపీఏఏఆర్ లేదా అపార్) ఐడీ కార్డుల కోసం చేపట్టిన వివరాల నమోదులో అంతులేని జాప్యం నెలకొంటోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు తమ వివరాలను సకాలంలో టీచర్లకు అందించకపోవడం, తల్లిదండ్రులు వారికి సహకరించకపోవడం, ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యాలకు అవగాహన లేక, సాంకేతిక సమస్యల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈనెల 31లోగా వివరాల నమోదు పూర్తవ్వాలని ప్రభుత్వం గడువు విధించింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఏమిటీ అపార్ కార్డు? అపార్‌కార్డు ఒక రకంగా పౌరులకు మన దేశంలో ఇస్తున్న ఆధార్‌కార్డు వంటిదే. విద్యార్థికి ఇది అకాడమిక్ పాస్‌పోర్టు లాంటిది. 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థి ఎక్కడ చదివాడు? ఏ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? వ్యక్తిగత వివరాలు.. ఈ కార్డులో పొందుపరుస్తారు. ప్రతీ కార్డులోనూ 12 అంకెల విశిష్ట సంఖ్య ఉంటుంది. విద్యార్థి ఉన్నత విద్యకు, అవార్డులు, ప్రాజెక్టులు, ఇంటర్వ్యూలు తదితరాల్లో ఈ నంబర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దాని వల్ల అపార్‌కార్డు ఎవరిది? చదువులో వారి ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు ఏమిటన్న విషయాలు సులువుగా తెలుసుకునే వీలుంటుంది. విద్యార్థి బదిలీ, కౌన్సెలింగ్, ఉద్యోగ దరఖాస్తుల్లో ఇదే ప్రామాణికం కానుంది. కేవలం కేంద్రం తప్ప ఈ వివరాలు ఇతరులు తెలుసుకోలేరు. కాబట్టి, సమాచార భద్రత ఉంటుంది. స్కూళ్లలో ఏర్పాట్లు పూర్తి స్కూళ్లలో అపార్ వివరాలను ఆన్లైన్ చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటిని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు యూడైస్‌లో పొందుపరుస్తారు. లాగిన్ అయ్యాక.. స్కూల్ రిజిస్టర్లో ఉన్న వివరాలను, పిల్లలు తీసుకువచ్చిన ఆధార్ కార్డు వివరాలను పోల్చి చూస్తారు. సరిపోలితే.. నమోదు చేస్తారు. తేడాలుంటే, ఆధార్‌లో లేకపోతే స్కూల్ రిజిస్టర్లో మార్పులు చేస్తారు.ఏంటి సమస్య? అపార్ నమోదు విషయంలో ఇటు ప్రైవేటు, అటు సర్కారు పాఠశాలలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. విద్యార్థుల ఆధార్‌కార్డుల్లో చాలా తప్పులుంటున్నాయి. ముఖ్యంగా పుట్టిన తేదీ, ఇంటిపేరు, పేరు, చిరునామాల్లో అనేక అక్షరదోషాలు ఉంటున్నాయి. వీటిని సరిచేసుకొని వచ్చే సరికి వారం లేదా 10 రోజులు సమయం పడుతోంది. ఒక్కోసారి స్కూల్ రిజిస్టర్లోనూ, విద్యాశాఖ వద్ద కొందరు విద్యార్థుల వివరాలు తప్పుగా ఉన్నాయి. వీటిని ముందు ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ మండలంలో దొర్లిన తప్పులను ఎంఐసీ కో–ఆర్డినేటర్ సాయంతో ఎడిట్ చేస్తున్నారు. అపార్‌కార్డు వివరాల నమోదుకు తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి. కానీ, చాలామంది తలిదండ్రులకు, విద్యార్థులకు సమాచార, సమన్వయలోపంతో ఈ కన్సెంట్ లెటర్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. -
హ్యాపీ న్యూ ఇయర్ సర్..
సిరిసిల్ల: కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్లకు గురువారం కొత్త సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు సమరసేన, కార్యదర్శి జబీ, సంయుక్త కార్యదర్శులు శ్రీకాంత్, చంద్రకళ, ఆర్గనైజింగ్ కార్యదర్శి సాగర్, ఆఫీస్ కార్యదర్శి వరుణ్, కార్యవర్గ సభ్యులు భాగ్యలక్ష్మి, వినయ్ కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌ను వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీటీవో లక్ష్మణ్, సీపీవో శ్రీనివాసాచార్యులు, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీఎస్వో వసంతలక్ష్మి, డీఏవో అఫ్జల్‌బేగం, ఎల్డీఎం మల్లికార్జున్, మిషన్ భగీరథ ఈఈ జానకి, పరిశ్రమలశాఖ ఏడీ భారతి, మైనింగ్ ఏడీ క్రాంతికుమార్, డీఈవో జగన్‌మెహన్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, డీవైఎస్వో అజ్మీరా రాందాస్, డీటీసీపీవో అన్సారీ శుభాకాంక్షలు తెలిపారు. -
లైసెన్స్ ఉంటేనే బైక్ నడపాలి
● మైనర్ డ్రైవింగ్‌పై నిర్లక్ష్యం వద్దు ● పట్టుబడితే కఠిన చర్యలు ● ఎస్పీ అఖిల్ మహాజన్సిరిసిల్లక్రైం: డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారే వాహనాలు నడపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో లైసెన్స్ కోసం జిల్లా వ్యాప్తంగా 700 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మొదటి దశలో 100 మందికి లైసెన్స్‌లు ఇప్పించామని, ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల్లో దశలవారీగా అందజేస్తామని తెలిపారు. స్థానిక ఆర్టీఏ ఆఫీస్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పలువురికి డ్రైవింగ్‌లైసెన్స్‌లు అందించి మాట్లాడారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే ప్రమాదబీమా వర్తించదని తెలిపారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐలు కృష్ణ, శ్రీనివాస్, డీటీవో లక్ష్మణ్, వంశీధర్, రజనీదేవి పాల్గొన్నారు. -
ఫిర్యాదులతో తనిఖీలు
● ముస్తాబాద్ మండల కేంద్రంలోని కేసీఆర్ నగర్లో ఇళ్లు పొందిన పలువురు స్థానికంగా ఉండడం లేదని అధికారులకు ఫిర్యాదులు అందాయి. గతంలోనే ముస్తాబాద్‌లో అధికారులు తనిఖీ చేసి 18 మంది స్థానికంగా ఉండడం లేదని గుర్తించారు. వారికి నోటీస్‌లు అందజేయడంతో లబ్ధిదారులు వెంటనే అధికారులను కలిసి స్థానికంగానే ఉంటామని, బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లామని తమ ఇళ్లను రద్దు చేయొద్దని విన్నవించుకున్నారు. దీంతో అధికారులు మొదటి హెచ్చరిక కింద పరిగణిస్తూ వారిని నివాసం ఉండేందుకు అనుమతించారు. ● ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని కేసీఆర్‌నగర్ కాలనీలో 14 బ్లాకులలో 167 మందికి ఇళ్లు కేటాయించారు. అయితే ఇటీవల అధికారులు చేపట్టిన తనిఖీల్లో 22 మంది స్థానికంగా ఉండడం లేదని, తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. తర్వాత గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామసభకు రావాల్సిందిగా నోటీస్‌లు అందజేసినా లబ్ధిదారులు హాజరుకాలేదు. ఆ సమావేశంలో అధికారులు నిర్ణయం మేరకు.. తాళం వేసి ఉన్న 22 ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని తీర్మానించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 335 మంది తమకు కేటాయించిన ఇళ్లలో ఉండడం లేదని అధికారులు గుర్తించారు. వారందరికీ నోటీస్‌లు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. -
మంజూరు 6,886.. పూర్తి 3,653
రాజన్నసిరిసిల్ల జిల్లాకు 6886 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి రూ.189.81 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 3,653 ఇళ్లు పూర్తికాగా 3,357 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. మిగతా 2,607 ఇళ్ల పనులే ప్రారంభంకాలేదు. జిల్లా వ్యాప్తంగా చందుర్తి, రుద్రంగి, వేములవాడరూరల్, ఇల్లంతకుంట మండలాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో వెనకబడి ఉన్నాయి. వేములవాడఅర్బన్, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి మండలాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తికాలేదు. లబ్ధిదారుల్లో గుబులు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పలువురు లబ్ధిదారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పొందిన వారందరూ నిరుపేదలే కావడం, స్థానికంగా అందరికీ పనులు లభించకపోవడంతో కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అధికారులు వాసప్ తీసుకుంటామని నిర్ణయించడంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు సొంతిల్లు ఉందనే భరోసాతో ఇతర ప్రాంతాల్లో బతుకుతున్న వారికి అధికారుల నిర్ణయం గుదిబండగా మారింది. వచ్చిన ఇల్లు పోతే తమకు సొంతూరిలో కనీసం నిల్వ నీడ కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పునరాలోచించాలని కోరుతున్నారు. -
ఉంటేనే ఇల్లు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిరుపేదల సొంతింటి కల నిజం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్బెడ్రూమ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గ్రామపంచాయతీల్లో అధికారులు పలుమార్లు గ్రామసభలు నిర్వహించి.. అన్ని అర్హతలు ఉన్న వారినే అర్హులుగా గుర్తించారు. అయితే గ్రామానికి మంజూరైన ఇళ్లు తక్కువగా ఉండడం.. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,357 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేశారు. అయితే ఇళ్లు పొందిన వారిలో చాలా మంది స్థానికంగా ఉండడం లేదని ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీ చేయగా నిజమేనని తేలింది. దీంతో స్థానికంగా ఉండని వారి ఓనర్‌షిప్‌ను రద్దు చేసి మరో అర్హుడికి ఇల్లు ఇవ్వాలని గ్రామపంచాయతీల్లో తీర్మానిస్తున్నారు. డబుల్ ఇళ్ల సమాచారం నిధులు : రూ.189.81 కోట్లు మంజూరైన ఇళ్లు : 6,886 పూర్తయిన ఇళ్లు : 3,653ప్రారంభంకానివి : 2,607లబ్ధిదారులకు అందజేసినవి : 3,357 -
● ‘డబుల్’ ఇళ్లలో ఉండని వారికి అధికారుల షాక్ ● జిల్లా వ్యాప్తంగా 335 మంది ఉండడం లేదని గుర్తింపు ● జాబితా తయారీలో అధికారులు ● నోటీస్‌లు ఇచ్చేందుకు సిద్ధం ● ఇప్పటికే గ్రామసభల ద్వారా సమాచారం
ఇది ఎల్లారెడ్డిపేట శివారులోని కేసీఆర్‌నగర్‌లో గల డబుల్ బెడ్రూమ్ సముదాయంలో తాళం వేసి ఉన్న ఇల్లు. అన్ని అర్హతలు ఉండడంతో అధికారులు ఇంటిని కేటాయించారు. అయితే ఇంటిని తీసుకున్న లబ్ధిదారుడు తాళం వేసి స్థానికంగా ఉండడం లేదు. ఇలాంటి వారు ఈ సముదాయంలో 32 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నివాసం ఉండకుంటే ఇళ్ల యాజమాన్యహక్కులను రద్దు చేస్తామని అధికారులు నోటీస్‌లు జారీ చేశారు. అధికారుల నిర్ణయం లబ్ధిదారులకు షాక్‌గా మారింది. ఇలాంటి పరిస్థితి రాజన్నసిరిసిల్ల జిల్లాలో 385 మంది లబ్ధిదారులు సైతం తమకు కేటాయించిన ఇళ్లలో ఉండడం లేదని అధికారులు వారి తనిఖీల్లో తేల్చారు. అలాంటి వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. -
అభిషేక ప్రియనే శరణమయ్యప్ప
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వామియే శరణ మయ్యప్ప.. అభిషేక ప్రియనే శరణమయ్యప్ప.. నామస్మరణతో ఎల్లారెడ్డిపేట మార్మోగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం నుంచి పురవీధుల్లో అయ్యప్ప శోభాయాత్ర నిర్వహించారు. దారిపొడవున మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. సాయంత్రం ఆభరణాలు ఊరేగించారు. రాజు, శ్రీను గురుస్వాముల ఆధ్వర్యంలో మహాపడి పూజను సరుగు సాయికుమార్ దంపతులు నిర్వహించారు. బొమ్మకంటి జ్యోతి–భాస్కర్ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా భక్తులకు 5వేల లడ్డూలు, అన్నదానం పంపిణీ చేశారు. గురుస్వాములు చకిలం మధు, గోపాల్‌రెడ్డి, కందుకూరి రవి, కొల బాపురెడ్డి, నంది నరేశ్ పాల్గొన్నారు. -
తెగ తాగేశారు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో నయా‘సాల్’ జోష్.. ఫుల్లుగా కనిపించింది. కొత్త సంవత్సరం వేడుకల కోసం డిసెంబరు 31న పాత జిల్లాలో రూ.కోట్లాది కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా లిక్కర్, కేకులు, బిర్యానీలు ఈ కొనుగోళ్లలో అగ్రభాగాన నిలిచాయి. అందులోనూ లిక్కర్ విక్రయాలు సింహభాగం దక్కించుకున్నాయి. కరీంనగర్ జిల్లా రూ.30 కోట్ల విక్రయాలతో ఉమ్మడి జిల్లాలో టాప్‌లో నిలిచింది. జగి త్యాల జిల్లాలో మంగళవారం ఒక్కరోజు రూ.4.42 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. సిరిసిల్ల జిల్లాలో రూ.4.36 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అమ్మకాలు తక్కువగా నమోదయ్యాయి. కరీంనగర్లో గత డిసెంబర్లో రూ.133.78 కోట్ల బిజినెస్ జరగగా.. ఈ ఏడాది రూ.126.30 కోట్లకు పరిమితమైంది. జగిత్యాలలో గతేడాది రూ.81.10 కోట్ల విక్రయాలు జరగగా.. ఈ ఏడాది రూ.73 కోట్ల వద్ద నిలిచిపోయింది. బేకరీలు, రెస్టారెంట్లు కళకళ కొత్త సంవత్సరం అనగానే అందరికీ ముందుగా కేకులే గుర్తొస్తాయి. యువత, చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా కేకులు కోసి పండగ చేసుకుంటారు. ఇలా ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బేకరీలన్నీ కేకుల విక్రయాలతో కిటకిటలాడాయి. అన్ని ముఖ్యకూడళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఆఫర్లతో హాట్, కూల్ కేకులన్నీ అమ్ముడుపోయాయి. సెకన్‌కు 2 కేకులు, 6 బిర్యానీలు కరీంనగర్ జిల్లా కేకులు, బిర్యానీల విషయంలో పాత జిల్లాలోనే టాప్‌లో నిలిచింది. మొత్తంగా 2 లక్షలకుపైగా కేకులతో 24 గంటల్లో సెకనుకు 2 కేకుల చొప్పున అమ్ముడయ్యాయి. ఈ బిజినెస్ రూ.6కోట్ల వరకు ఉంటుంది. బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా 5.50 లక్షల బిర్యానీలు అమ్ముడుపోయి రూ.11 కోట్ల బిజినెస్ అయ్యింది. ఈ లెక్కన సెకనుకు 6 బిర్యానీల విక్రయాల జరిగి సరికొత్త రికార్డు నెలకొల్పాయని వ్యాపారులు తెలిపారు. నేరుగా కొనేవారితోపాటు స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటళ్లు కళకళలాడాయి. కర్రీతో పని ఉండదు. ఎక్కడైనా తినే వీలుండటంతో యువతతోపాటు అన్ని వర్గాలవారు బిర్యానీ తినేందుకు మొగ్గు చూపారు. పైగా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో లోకేషన్ పెట్టిన చోటకు వచ్చి మరీ డెలివరీ చేసే సదుపాయం రావడంతో ఎక్కువ మంది బిర్యానీ తినేందుకు ఇష్టపడ్డారు. జోరుగా సాగిన మద్యం, కేక్‌లు, బిర్యానీ అమ్మకాలు కరీంనగర్లో ఒక్కరోజులోనే రూ.30 కోట్ల లిక్కర్ విక్రయాలు రూ.7 కోట్ల కేకులు, రూ.11 కోట్ల బిర్యానీ సేల్స్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ టాప్ జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లిలోనూ ఇదే తీరుఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు ఇలా జిల్లా మద్యం అమ్మకాలు కరీంనగర్ రూ.30 కోట్లు జగిత్యాల రూ.4.42 కోట్లు సిరిసిల్ల రూ.4.36 కోట్లు పెద్దపల్లి రూ.3.50 కోట్లు కేక్‌లు జిల్లా కేకులు బిజినెస్ కరీంనగర్ రెండు లక్షలు రూ.6కోట్లు జగిత్యాల 15వేలు రూ.30లక్షలు పెద్దపల్లి 30వేలు రూ.60లక్షలు సిరిసిల్ల 20వేలు రూ.40లక్షలుబిర్యానీలు జిల్లా బిర్యానీ బిజినెస్ (సుమారు) కరీంనగర్ 5.50లక్షలు రూ.11కోట్లు జగిత్యాల 8000 రూ.24లక్షలు పెద్దపల్లి 12,500 రూ.31.25లక్షలు సిరిసిల్ల 10వేలు రూ.25లక్షలు (గమనిక: ఇందులో కేవలం ప్రముఖ హోటళ్ల నుంచి సరాసరి వివరాలు మాత్రమే. సంఖ్యల్లో మార్పు ఉండొచ్చు.) -
ఆర్ఎంపీపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి
● చందుర్తిలో సంఘటన ● ఆలస్యంగా వెలుగులోకి.. చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వైద్యునిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వడ్డీవ్యాపారులపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన సదరు వ్యక్తులు దాడికి దిగినట్లు ప్రచారంలో ఉంది. గాయపడ్డ వైద్యుడు రెండు రోజులపాటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఠాణాకు కూతవేటు దూరంలో ఉన్న మండలకేంద్రంలో దాడికి దిగడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా కొట్టిన విషయాన్ని ఎవరికై నా చెబితే ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని హెచ్చరించడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితుడు జంకుతున్నట్లు చర్చ సాగుతోంది. ఆర్ఎంపీ కోసం పోలీసుల గాలింపు దాడి విషయం ఆలస్యంగా తెలియడంతో పోలీసులు బాధితుడైన ఆర్ఎంపీ కోసం గాలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాడి చేసిన వారం రోజుల తర్వాత విషయం బయటకు పొక్కడంతో పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నట్లు తెలిసింది. సంఘటన పూర్వాపరాలను తెలుసుకునేందుకు సీఐ, ఎస్సైలు వేర్వేరుగా అతను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై చందుర్తి సీఐ వెంకటేశ్వర్లను వివరణ కోరగా.. దాడి సంఘటనపై ఆరా తీస్తున్నామని, ఆర్ఎంపీ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో పూర్తి సమాచారం సేకరించలేకపోయినట్లు తెలిపారు. ఆర్ఎంపీని విచారిస్తేనే అసలు విషయం తెలుస్తుందని స్పష్టం చేశారు. -
రౌడీషీటర్ల కదలికలపై నిఘా
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● చందుర్తి ఠాణా తనిఖీచందుర్తి(వేములవాడ): రౌడీషీటర్ల కదలికపై నిఘా పెట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. చందుర్తి పోలీస్‌స్టేసన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల ను పరిశీలించి, సిబ్బంది విధులపై ఆరా తీశా రు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. సిబ్బందికి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డయల్ 100 కాల్స్‌కు బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది తక్షణమే స్పందించాలని కోరారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య తదితరుల ఉన్నారు. 130 మందిపై డ్రంకెన్‌డ్రైవ్ కేసులుసిరిసిల్లక్రైం/ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లా ప్రజలు డిసెంబర్ 31వ తేదీన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మద్యంబాబులు అయితే తెగ తాగేశారు. అయితే మద్యం తాగిన తర్వాత వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డారు. ఇలా డ్రంకెన్‌డ్రైవ్ చేసిన వారిని పట్టుకొని జిల్లా వ్యాప్తంగా 130 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్‌మహాజన్ తెలిపారు. అర్ధరాత్రి వరకు తనిఖీలు జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి దాటినా డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలను పోలీసులు కొనసాగించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 15 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా విడిపోయి గొల్లపల్లి, వెంకటాపూర్, ఎల్లారెడ్డిపేటలోని రెండు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఎస్సై రమాకాంత్ పెట్రోలింగ్ చేశారు. ముస్తాబాద్ మండలంలో 20 మందిపై డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆవునూర్, పోతుగల్, నామాపూర్, గూడెం గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మానేరు చివరి ఆయకట్టుకు నీరందిస్తాం ● ఇరిగేషన్ డీఈఈ రవికుమార్ ముస్తాబాద్(సిరిసిల్ల): మానేరు ప్రాజెక్టు తైబందీ తీర్మానం మేరకు చివరి ఆయకట్టుకు నీరందిస్తామని నీటిపారుదల శాఖ డీఈఈ రవికుమార్ తెలిపారు. గూడూరు నుంచి ముస్తాబాద్, తెర్లుమద్ది వరకు మానేరుకెనాల్లో ఉన్న చెత్త, గుర్రపుడెక్క, తుంగను బుధవారం జేసీబీతో తొలగించారు. డీఈఈ మాట్లాడుతూ ప్రాజెక్టులో నీరున్నా కెనాల్స్ సరిగ్గా లేకపోవడంతో నీటి ప్రవాహం తగ్గిందన్నారు. రైతుల కోరిక మేరకు కెనాల్స్‌ను శుభ్రం చేయిస్తున్నట్లు తెలిపారు. తైబందీ తీర్మానం మేరకు నీటి విడుదల కొనసాగుతుందని, రైతులు సహకరించాలని కోరారు. వారానికి రెండుసార్లు తెర్లుమద్దికి సాగునీటిని విడుదల చేస్తామన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ రాజు, లష్కర్లు పాల్గొన్నారు. అనంతారం చెరువులోకి నీరు వదలండి ఇల్లంతకుంట(మానకొండూర్): అనంతారం చెరువులోకి నీటిని విడుదల చేయాలని కోరుతూ జంగారెడ్డిపల్లి కాంగ్రెస్ నాయకులు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు విన్నవించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఎమ్మెల్యేను బుధవారం శనిగరం స్టేజీ వద్ద కలిశారు. అనంతగిరి జలాశయం నుంచి నీటిని వదిలి అనంతారం ప్రాజెక్టును నింపాలని కోరారు. నాయకులు మంద బాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సెలవులకే సెలవు !
● ఒక్క రోజు కూడా గైర్హాజరుకాని మాస్టారు ● ఆదర్శంగా నిలుస్తున్న సిరిసిల్ల హెచ్ఎం శ్రీనివాస్ ● నెటిజన్ల ప్రశంసల వర్షంసిరిసిల్లకల్చరల్: విద్యార్థుల భవిష్యత్.. స్కూల్ బాగు కోసం ఆ ఉపాధ్యాయుడు కర్తవ్యదీక్షకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. 2024వ సంవత్సరంలో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా నిత్యం స్కూల్ వచ్చారు సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చకినాల శ్రీనివాస్. 2023లో ఒక్క రోజు మాత్రమే సెలవు పెట్టారు. సాధారణంగా ఉద్యోగులకు వేతనంలో కోత లేకుండా 15 సెలవులు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఆ సెలవులను సైతం హెచ్ఎం శ్రీనివాస్ ఉపయోగించుకోలేదు. ఈ విషయాన్ని తనే సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్ల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది. విద్యార్థుల సంఖ్య పెరగడంలో.. 2009లో ప్రస్తుతం పనిచేస్తున్న శివనగర్ స్కూల్లోనే ఎఫ్ఏసీ హెడ్మాస్టర్గా పనిచేసి బదిలీపై వెళ్లారు. ఆ సమయంలో ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 500 ఉండేది. మళ్లీ 2018లో హెడ్మాస్టర్ అదే పాఠశాలకు వచ్చారు. కానీ ఆ పాఠశాలలో శ్రీనివాస్ వెళ్లే సమయంలో 500 మంది ఉండగా.. తిరిగొచ్చే నాటికి 50 మాత్రమే మిగిలారు. దీన్ని చాలెంజ్‌గా తీసుకున్న శ్రీనివాస్.. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విశేష కృషి చేశారు. ప్రస్తుతం శివనగర్ ఉన్నత పాఠశాలలో 301 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు.. మొదట ఉపాధ్యాయులు సమయానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. నిర్ధేషిత టైమ్‌టేబుల్ ప్రకారం సబ్జెక్టుల బోధన, సిలబస్ పూర్తిచేయడం, బడికి వస్తున్న పిల్లల అభ్యసన స్థాయి పెంచడం వంటి వాటిలో విజయవంతమయ్యారు. వేసవిసెలవుల్లోనూ ఇంగ్లిష్ భాషలో నైపుణ్యాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ పోటీల్లో విద్యార్థులను ప్రోత్సహించి మంచి ఫలితా లు సాధించారు. దీంతో తల్లిదండ్రులకు స్కూ ల్పైన, ఉపాధ్యాయులపైన విశ్వాసం పెరిగింది. విద్యార్థుల సంఖ్య 301 మందికి చేరారు. పాఠశాల పురోగతికి కృషిచేసిన శ్రీనివాస్‌ను రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించి ప్రభుత్వం పురస్కారాన్ని ప్రదానం చేసింది. అవార్డు స్ఫూర్తిగా మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు చొరవ తీసుకున్నారు. పూర్వ విద్యార్థుల సౌజన్యంతో విద్యార్థులకు సైకిళ్లు, బ్యాగులు, తాగునీటి వసతి కల్పించారు. గతేడాది పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఇలా ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సెలవులకే సెలవు పెట్టడంతోపాటు విద్యార్థులు ప్రగతిబాటలో పయణించేలా చర్యలు తీసుకొని శభాష్ అనిపించుకుంటున్నారు. -
ఎములాడకు పోటెత్తిన భక్తులు
వేములవాడ: కొత్త సంవత్సరం సందర్భంగా బుధవారం ఎములాడకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 25 వేల మంది రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్దిపోచమ్మకు బోనం మొక్కు చెల్లించడంతోపాటు అనుబంధ దేవాలయాలను దర్శించుకున్నారు. రాజన్న సేవలో విప్‌లు, ఎస్పీ రాజన్నను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. నాయకులు శ్రీనివాస్, తిరుపతిరావు, శ్రవణ్ తదితరులున్నారు. రాజన్న ను ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్, ఎస్పీ అఖిల్ మహాజన్ దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో కొప్పుల వినో ద్‌రెడ్డి వారికి స్వామి వారి ప్రసాదాలు అందించి, సత్కరించారు. ఏఈవో శ్రవణ్, అర్చకులున్నారు. అర్చకుల అంతర్గత బదిలీలు? వేములవాడ రాజన్న ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల అర్చకుల అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్లు సమాచారం. కోడెమొక్కు చెల్లించుకుంటున్న ఎస్పీ అఖిల్ మహాజన్ -
రోడ్డు నిబంధనలు పాటించాలి
● జిల్లా రవాణాఽధికారి వి.లక్ష్మణ్ సిరిసిల్లటౌన్/వేములవాడఅర్బన్: డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించాలని డీటీవో లక్ష్మణ్ కోరారు. సిరిసిల్లలో బుధవారం ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించక పోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎంవీఐ వంశీధర్ ఏఎంవీఐలు రజనీదేవి, పృథ్వీరాజ్‌వర్మ, కానిస్టేబుల్ రమ్య, సౌమ్య, ప్రశాంత్, హోమ్‌గార్డ్ ఎల్లేశ్, లారీ, కార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, డ్రైవర్స్ 100 మంది వరకు పాల్గొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలు వేములవాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలను సిరిసిల్ల ఎంవీఐ వంశీధర్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. డిపో మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బీసీల రిజర్వేషన్లపై అపోహలు తొలగించాలి
సిరిసిల్లటౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అపోహలు తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో బుధవారం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన మల్లేశ్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి బీసీల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొందని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేసిందన్నారు. దేశవ్యాప్త జనగణనలో భాగంగా కులగణన కూడా చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింప చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల బీసీ నినాదం, ఉద్యమం పేరిట హల్చల్ చేస్తుందని, ఆమె నాయకత్వం బీసీలకు అక్కర్లేదన్నారు. జిల్లాలో సంఘం బలోపేతంలో భాగంగా జిల్లా కమిటీ సలహాదారుడిగా తోట్ల రాములుయాదవ్, సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడిగా బచ్చు ప్రసాద్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన మల్లేశ్‌యాదవ్, పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, నాయకులు తోట్ల రాములుయాదవ్, బచ్చు ప్రసాద్, తిరుపతి, నల్ల శ్రీకాంత్, కొండా విజయ్, బోయిని శ్రీనివాస్, తడక శశికుమార్, శ్రీధర్, మల్లేశం పాల్గొన్నారు. ● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు -
బ్రిటీష్ వరల్డ్ రికార్డుల్లో కందేపి
సిరిసిల్లటౌన్: బాలసాహితీవేత్త డాక్టర్ కందేపి రాణిప్రసాద్కు బ్రిటీష్ వరల్డ్ రికార్డుల్లో చోటు లభించింది. సిరిసిల్లలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మానవ శరీర అవయవాలు, బాలసాహిత్యం, ఆస్పత్రి పరికరాల తయారీ, వ్యర్థాలతో అందమైన ఆకృతుల తయారీ తదితర అంశాలతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నందుకు ఈ గౌరవం తనకు దక్కిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు. దాడి సంఘటనలో ఇద్దరిపై కేసు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒకరిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపర్చగా.. బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్సై రమాకాంత్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు. మండల కేంద్రంలోని వడ్డెరకాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డీజే సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. శివరాత్రి నరేశ్, అతని తండ్రి రాజు కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పరశురాములు తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అమ్మిందే మాంసం !
● సిరిసిల్లలో వ్యాపారుల వింత పోకడ ● పదిహేడేళ్లుగా స్లాటర్‌హౌస్ లేదు ● అధికారులకు పట్టింపు లేదు కనిపించని మున్సిపల్ మార్క్ సిరిసిల్ల పట్టణంలో గొర్రె, మేక మాంసం విక్రయాల్లో వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. దశాబ్దంన్నరకు పైగా సాగుతున్న తంతుకు పాలకులు స్వస్తి పలకడం లేదు. తరచూ స్లాటర్‌హౌస్ ప్రారంభిస్తామంటూ హడావిడి చేసి తర్వాత మిన్నకుండడం సిరిసిల్ల బల్దియాకు అలవాటైపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. నిజానికై తే మున్సిపాలిటీల్లో మాంసం విక్రయాలపై అధికారులు నిబంధనల ప్రకారం అమ్మకాలపై పర్యవేక్షణ చేయాలి. వ్యాపారీ గొర్రెను లేదా మేకను కోసేముందు వెటర్నరీ(పశువైద్యుడు) పరీక్షించి దాని నాణ్యతను గుర్తించాల్సి ఉంటుంది. తదుపరి మున్సిపల్ సంబంధిత అధికారి కార్యాలయం సిబ్బంది సీల్ వేస్తారు. ఆ తర్వాతే వ్యాపారులు దుకాణాలకు మాంసం తరలించి విక్రయించాలి. ప్రతిరోజు క్వింటాళ్ల కొద్దీ మాంసం విక్రయాలు జరుగుతాయి. ఇక ఆదివారం సాధారణ రోజులతో పోల్చితే పదింతలు ఎక్కువగా ఉంటుంది. స్లాటర్‌హౌస్ కథా ఏమైనట్టో.. గ్రామపంచాయతీ హయాంలోనే సిరిసిల్లలో స్లాటర్‌హౌస్ ఉండేది. ప్రస్తుతం జిల్లా పోలీస్(ఎస్పీ) ఆఫీస్ పక్కన ఇప్పుడు మున్సిపల్ వారు నిర్మించిన స్విమ్మింగ్‌ఫూల్ స్థానంలో ఉండేది. మార్కెట్లో కూడా ప్రత్యేకంగా మాంసం అమ్మకాల కోసం నిర్మించిన దుకాణ సముదాయం ఉండేది. 17 క్రితం వీటిని అప్పటి కౌన్సిల్ అనుమతిలో కూల్చేశారు. పట్టణ శివారులోని మున్సిపల్ లేఅవుట్ స్థలాన్ని స్లాటర్‌హౌస్‌కు కేటాయించారు. దాని టెండర్లు పూర్తవగా కాంట్రాక్టర్ నిర్ణీత సమయానికి నిర్మించి ఇవ్వలేదు. అప్పటి నుంచి సిరిసిల్లలో స్లాటర్‌హౌస్ లేదు. మున్సిపల్ వారు స్లాటర్‌హౌస్‌కు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తర్వాత స్లాటర్‌హౌస్ కోసం మున్సిపల్ అధికారులు మానేరునది ఒడ్డున స్థలం కేటాయించినా నిర్మాణానికి నోచుకోలేదు. చివరికి ఎనిమిదేళ్ల క్రితం కార్గిల్లేక్ చెరువుపక్కనే మున్సిపల్‌కు చెందిన రెండు గుంటల స్థలాన్ని కేటాయించి రూ.5లక్షలు వెచ్చించి తాత్కాలికంగా షెడ్డును నిర్మించారు. దాన్ని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో వ్యాపారులు అమ్మిందే మాంసంగా మారింది. నాణ్యత గల మాంసం విక్రయించడం లేదు. అయినా సిరిసిల్ల బల్దియా అధికారులు ఏళ్లుగా పట్టించుకోవడం లేదు. వెటర్నరీ అధికారులు పరీక్షించి, సీల్ వేసిన తర్వాతనే మాంసాన్ని విక్రయించాల్సి ఉంటుంది. కానీ జిల్లా కేంద్రంలో ఇలాంటి నిబంధనలు పాటించడం లేదు. ఫలితంగా పట్టణ ప్రజలు ఏది మంచి మాంసమో.. ఏది కాదో తెలుసుకో లేకపోతున్నారు. గత్యంతంర లేక వ్యాపారులు ఇచ్చిందే మాంసంగా తీసుకుంటున్నారు. దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. త్వరలోనే స్లాటర్‌హౌస్ ప్రారంభిస్తాం పదిహేను రోజుల్లో కార్గిల్లేక్ వద్ద గల స్లాటర్‌హౌస్‌ను ప్రారంభిస్తాం. మాంసం విక్రయాలు, జీవాల వధపై వ్యాపారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఇక రైతుబజారు పక్కనే ఇంటిగ్రేటెడ్ స్లాటర్‌హౌస్ నిర్మాణం అంశం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలకు నాణమైన మాంసం అందించడానికి కృషి చేస్తాం. – దుబ్బాక లావణ్య, మున్సిపల్ కమిషనర్