Red wood
-
శేషాచలం కొండల్లో చెలరేగిన మంటలు
తిరుమల: శేషాచలం కొండల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శేషాతీర్థం అటవీ ప్రాంతాల్లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. శేష తీర్థం సమీపంలోని డబ్బారెకుల కొనలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి మంటలు దట్టంగా వ్యాపించాయి. అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో అడవంతా అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే మంటలు చెలరేగిన ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులు చేరడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఆ ప్రాంతానికి కనీసం మనుషులు చేరుకోడానికి ఒక రోజు సమయం పడుతుంది. దీంతో ఆ మంటలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయితే ఆ మంటలు ఎవరైనా ఎర్రచందనం స్మగ్లర్లు పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేసవికాలంలో శేషచల కొండల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం సాధారణం. -
అడవి నిండా.. ఎర్ర దొంగలు!
సాక్షి, తిరుపతి: ఎర్ర చందనం దుంగల కోసం దొంగలు శేషాచలం అడవిలోకి క్యూకడుతున్నారు. రోజూ అడవిలోకి చొరబడుతూ అటవీ అధికారులు, పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అధికారులు దాడులు చేస్తున్నా.. వారు లెక్కచేయడంలేదు. అరెస్టులు చేస్తున్నా.. భయపడటంలేదు. టాస్క్‌ఫోర్స్ అధికారులకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం శేషాచలం అడవిలో ఐదువేల మందికి పైగా తమిళ కూలీలు తిష్టవేశారు. వారిని ఎలా తరిమికొట్టాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న శేషాచలం అడవిలోని ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు విచ్చలవిడిగా నరికేస్తున్న విషయం తెలిసిందే. అలా నరికిన చెట్లను దుంగలుగా చేసి ఇతర దేశాలకు తరలించి కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. అటవీ అధికారులు, టాస్క్‌ఫోర్స్, పోలీసులు చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల పరిధిలో ఇప్పటి వరకూ 175 మంది దొంగలపై పీడీ యాక్ట్ కేసులు నమోదుచేశారు. అయినా వారి నుంచి ఆస్తులు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. దీంతో ఎర్రదొంగలు కూడా పీడీయాక్ట్‌లు, అరెస్టులకు భయపడటంలేదు. తాజాగా చిత్తూరు జిల్లా చెన్నై జాతీయ రహదారిలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా అంతర్జాతీయ స్మగ్లర్ నజీముద్దీన్‌ఖాన్ పట్టుబడ్డాడు. వాహనంలో అతనితో పాటు ఉన్న మరో ముగ్గురు స్మగ్లర్లు పారిపోయారు. స్మగ్లర్లు ప్రయాణిస్తున్న వాహనంలో 392 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నజీముద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు బెంగుళూరులో మరో 1,123 కిలోల ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఇదిలా ఉంటే బాకరాపేట వద్ద 32 మంది దొంగలు దుంగలను తీసుకెళ్తుండగా అటవీ అధికారులు దాడులు చేశారు. దీంతో వాటిని వదలి దొంగలు పారిపోయారు. క్యూ కడుతున్న కూలీలు ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన స్మగ్లరు తమిళనాడులో 45 మంది, బెంగుళూరులో 63 మంది తిష్టవేసి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో స్మగ్లర్ వద్ద 10 నుంచి 20 మంది అనుచరులున్నారు. వీరు కూలీలను శేషాచలం అడవిలోకి పంపుతుంటారు. కూలీలు తీసుకొచ్చిన ఎర్రచందనం దుంగలను మరో ముఠా చెన్నై, కర్ణాటకలోని రహస్య ప్రాంతాలకు చేరవేస్తుంది. వీరిలో ఏ ఒక్క ముఠా పోలీసులకు చిక్కినా.. మరో ముఠా రంగంలోకి దిగుతుంది. సైక్లింగ్ పద్ధతిలా కూలీలను పంపటం.. ఎర్రచందనం దుంగలను రహస్య ప్రాంతాలకు చేరవేయడం.. నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఇందుకోసం స్మగ్లర్లు కూలీలకు ఒక్కొక్కరికి రోజుకి రూ.1,500 నుంచి రూ.రెండు వేల వరకు చెల్లిస్తుండటంతో వారు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎర్రదొంగల ఎదురు దాడులు కూలీలను చేరవేసేందుకు కొందరు ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్లు కూడా సహకరిస్తున్నారు. ఆరు నెలల నుంచి ఎర్రచందనం రవాణా అధికమైందని టాస్క్‌ఫోర్స్ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం అడవిలో ఉన్న కూలీలను తరిమేసేందుకు అటవీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు సాహసం చేయలేకపోతున్నారు. ఆ శాఖలో తగినంత సిబ్బంది, సరైన ఆయుధాలు లేకపోవటమే దీనికి కారణమని ఆ అధికారి వివరించారు. ఒకవేళ సాహసం చేసి కూలీలను పట్టుకునేందుకు వెళితే వారు ఎదురు దాడికి దిగుతున్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి గట్టి చర్యలు తీసుకుంటే తప్ప ఎర్రచందనాన్ని కాపాడలేమని అధికారులు స్పష్టంచేస్తున్నారు. -
రూ. 80 లక్షల విలువైన ఎర్ర చందనం పట్టివేత
అనంతపురం: అనంతపురం జిల్లా బాగేపల్లి టోల్గేట్ వద్ద సోమవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఎర్ర చందనం పట్టుబడింది. ఓ వాహన తనిఖీలో.. సుమారు 80 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఈరాల: పోలీసులు వస్తున్నారనే సమాచారంతో వాహనంలో ఉన్న ఎర్ర చందనంతో పాటు వాహనాన్ని రోడ్డుమీద వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా ఈరాల మండలం ఎర్లంపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనంలో ఉన్న 10 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకన్నారు. వీటి విలువ రూ. 7 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
బడా స్మగ్లర్ల కోసం అన్వేషణ
సాక్షి, కడప : ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు పొరుగు రాష్ట్రాల్లో వేట ముమ్మరం చేశారు. కొంత కాలంగా టాస్క్‌ఫోర్స్ టీం పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లను పట్టుకుంది. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు మరికొందరు బడా స్మగ్లర్లను పట్టుకునేందుకు పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో మకాం పెట్టింది. ఢిల్లీతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో తిరుగుతూ స్మగ్లర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. బెంగుళూరు, ఢిల్లీ, తమిళనాడు ప్రాంతాల్లో కడప పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎర్ర స్మగ్లర్ల కోసం వేట సాగిస్తున్నారు. ఢిల్లీకి చెందిన జయపాల్, కింకుశర్మ, నేపాల్‌కు చెందిన లక్ష్మిడాంగ్ అనే స్మగ్లర్లను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారి ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న స్మగ్లర్ల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కొందరు చైనా స్మగ్లర్ల కోసం కూడా వేట సాగిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో బడా స్మగ్లర్లను కడపకు తీసుకురానున్నారని తెలిసింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న స్మగ్లర్ల నుంచి అందిన సమాచారం మేరకు ఎర్రచందనం డంప్‌పై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా బెంగుళూరుతోపాటు వివిధ ప్రాంతాల్లో దాచిన రెండు టన్నుల మేర ఎర్రచందనం దుంగలను కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. -
నేడో రేపో ఎర్ర డ్రైవర్లు అరెస్ట్
ఎస్పీ టేబుల్‌పై జాబితా కడప అర్బన్ : ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన ఆర్టీసీ డ్రైవర్లను నేడో, రేపో అరెస్ట్ చేయనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ పరిధిలో కర్నూలు రీజియన్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు కొంతమంది ఎర్రచందనం దుంగల నరికివేత, స్మగ్లింగ్‌కు పాల్పడే కూలీలను తరలించడంలో తమవంతు సహకరిస్తున్నట్లు ఇటీవల వెల్లడైంది. ఈనెల 2వ తేదీన కర్నూలుజిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన 11 మంది డ్రైవర్లను జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఏపీఎస్ఆర్టీసీ అధికారులు విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించారు. విజిలెన్స్ అధికారులు ఆయా జాబితాను సిద్ధం చేశారు. 30 మంది పేర్లున్న జాబితాను ఇప్పటికే ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావుకు పంపించారు. అదే నివేదికను జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీకి ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు పంపినట్లు సమాచారం. ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో పోలీసు అధికారులు జాబితాను పరిశీలించి వారి పాత్రను విచారించి త్వరలో అరెస్టు చేయనున్నట్లు తెలిసింది. -
ఎర్ర స్మగ్లర్లు
రాజంపేట: నిఘా పెరిగే కొద్దీ ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. పద్ధతి ఏదైనా వారి దారి రైలు మార్గమే. రోడ్డు మార్గంలో వాహనాల్లో కంటే రైలు మార్గమే సురక్షితమని వారు భావిస్తున్నారని తాజా సంఘటనలు రుజువు చేస్తున్నారుు. ఇటీవల జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పోలీసుశాఖ పట్టుబగించడం.. మరోవైపు శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఉద్ధృతం కావడంతో స్మగ్లర్లు రవాణా రూట్ మార్చుకుంటున్నారు. తాజాగా రైళ్ల ద్వారా ప్రయాణికుల్లా బ్యాగుల్లో దుంగలను తరలించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇటీవల నందలూరులో కూడా బ్యాగులో దుంగలను తరలిస్తుండగా రైల్వే జనరల్ పోలీసులు పట్టుకున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో చెట్లు నరికేందుకు తమిళతంబిలు కూడా రైళ్లలో రాజంపేట, బాలుపల్లె, రైల్వేకోడూరు, మామండూరు, అనంతరాజంపేట, పుల్లంపేట రైల్వేస్టేషన్ల ద్వారా శేషాచలంలోకి ప్రవేశించేశారు. ఇలాంటి వందలాది మందిని గతంలో పట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా దుంగలను రైళ్ల ద్వారా గమ్యాలకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. పునరావృతమైన రైళ్లలో స్మగ్లింగ్ రెండు దశాబ్ధాల కిందట స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను గూడ్స్‌రైళ్లలో రవాణా చేసేవారు. శేషాచల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న బాలపల్లె, మామండూరు తదితర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రవాణా చేసేవారు. చెన్నై హార్బర్‌కు వెళ్లే ఐరన్‌ఓర్ రవాణా చేసే గూడ్స్‌రైళ్లలో దుంగలను తరలించేవారు. వ్యాగిన్‌లో దుంగలు హార్బర్‌కు వెళితే.. అక్కడ నుంచి స్టీమర్ల ద్వారా విదేశాలకు ఎగుమతి అయ్యేది. గూడ్స్‌రైళ్లలో దుంగల తరలింపు అప్పట్లో పెద్దఎత్తున జరిగేది. అయితే ఈ రవాణాపై నిఘా వ్యవస్ధ ్ట తీవ్రస్ధాయిలో దృషి సారించడంతో స్మగ్లర్లు రవాణా రూట్‌ను మార్చుకున్నారు. రోడ్డు మార్గాన్ని ఎంచుకుని చాలా ఏళ్లు సాగించారు. అక్కడ నిఘా ఎక్కువ కావడంతో ఇప్పుడు మళ్లీ ఏకంగా ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణీకుల ముసుగులో దుంగలను తరలించేస్తున్నారు. పరిస్ధితులను బట్టి రవాణా పరిస్ధితులను బట్టి స్మగ్లర్లు దుంగలను రవాణా చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎర్రచందనం స్మగ్లర లారీలు, ఆర్టీసీ బస్సుల నుంచి రైళ్లలో రవాణా జరిగే స్థాయికి పెరిగింది. ఇటీవల ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా పెట్టడంతో శేషాచల అడవుల నుంచి వివిధ మార్గాల ద్వారా తరలిస్తున్నారు. గతంలో లారీలు, ట్రక్కులు, ఆటోలు, జీపులలో చివరికి టు వీలర్లలో సైతం తరలిస్తూ అనేక మంది పట్టుబడ్డారు. ఇటీవల జిల్లా పోలీసు, అటవీ శాఖ అధికారుల విచారణలో ఆర్టీసీ బస్సు ద్వారా కూడా ఈ రవాణా జరుగుతున్నట్లుగా వెల్లడైంది. ఇందులో పలువురు ఆర్టీసీ డ్రైవర్లు సస్పెండ్ కాగా మరి కొందరు కూడా అదేబాటలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గుట్టుచప్పుడుగా.. అక్రమ రవాణాకు అలవాటు పడి కోట్లరూపాయలు సంపాదిస్తున్న వారు తాజాగా రైళ్లలో ఎర్రచందనం తరలిస్తూ రైల్వే పోలీసులకు పట్టుబడటం సంచలనం కల్పిస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని చెపుతోంది. చెన్నై నుంచి గుంతకల్ వైపు వెళ్లే రైళ్లలో దుంగలు తరలింపు కొనసాగుతోంది. అయితే అది కూడా చైన్‌లింక్ సిస్టమ్‌లో కొనసాగుతోంది. ఒక వేళ పట్టుబడిన వ్యక్తికి ఎక్కడి నుంచి దుంగలు వస్తున్నాయో సమాచారం తెలియకుండానే దుంగల రవాణా కానిచ్చేస్తున్నారు. -
దోస్త్ మేరా దోస్త్
సాక్షి ప్రతినిధి, కడప: ‘రక్తాన్నైనా చిందిస్తాం...ప్రజల మాన, ప్రాణాలను రక్షిస్తాం’ అనే స్ఫూర్తిని పోలీసుబాస్‌లు విస్మరిస్తున్నారు. ఆదాయం ఉంటే అక్రమార్కులతో చేతులు కలపడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. నవ్విపోదురుగాక నాకేటి అన్నట్లుగా అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా పయనిస్తున్నారు. రాజ్యాంగ బద్దుడినై.. రాగ ద్వేషాలకు అతీతంగా, చట్టానికి లోబడి విధులు నిర్వర్తిస్తామని బాధ్యతలు స్వీకరించేముందు పోలీసులు ప్రమాణం చేస్తారు. బాధ్యతలు చేపట్టగానే తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా శ్రేయస్సుకంటే ఆదాయం లభించే పోలీసుస్టేషన్‌పై దృష్టిపెడుతున్నారు. అందుకు లకారాలను ముట్టుజెబుతున్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్లతో చెలిమి చేసిన 21 మంది పోలీసు అధికారులపై వేటుపడింది. ఓ దొంగతో చోరీలు చేయించిన ఘనత సైతం జిల్లా పోలీసులకు దక్కింది. కిడ్నాపర్ సునీల్ ముఠాతో మరికొంతమంది పోలీసు అధికారులు త్సంబంధాలు కొనసాగించారు. సంచలనం రేపిన కేసుల్లో కన్పించని పురోగతి.... రాష్ట్రంలో సంచలనం రేపిన అనేక కేసులను జిల్లాలోని కొందరు పోలీసు అధికారులు నీరుగార్చుతున్నారు. అలాంటి కోవలో డీసీఓ చంద్రశేఖర్ కిడ్నాప్ కేసును చెప్పుకోవచ్చు. సహకార ఎన్నికల అనంతరం డీసీసీబ్యాంకు పాలకమండలి ఎంపిక (గత ఏడాది ఫిబ్రవరి20న) సందర్భంగా ఎన్నికల అధికారి అయిన డీసీఓ కిడ్నాప్ ఉదంతం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈఘటనలో అప్పటి అధికారపార్టీ నేతల ప్రమేయం ప్రత్యక్షంగా ఉంది. గుట్టు చప్పుడు కాకుండా అధికార పార్టీ నేతలు సూచించిన ముగ్గురిని అరెస్టు చేసి మమ అన్పించారు. ఏడాది తర్వాత ’కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా’ ఛార్జిషీట్ దాఖలు చేశారు. అలాగే విద్యాధికురాలైన లలితారాణి (అగ్రికల్చర్ ఎమ్మెస్సీ) హత్యోందతాన్ని సైతం నీరుగార్చారు. రాజంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు దోపిడీ కేసులో ఎలాంటి పురోగతి లేకపోయింది. అసాంఘీక కార్యకలాపాలకు పడని బ్రేక్ ...! జిల్లాలో క్రికెట్ బెట్టింగ్స్‌తో పాటు మట్కా కంపెనీలను యధేచ్ఛగా నిర్వహిస్తున్నారు. వీటి వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు పోలీసు అధికారులు, త్రీస్టార్ బాస్‌ల ఐడీ పార్టీలు ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారులు వీటిని కట్టడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్రింది స్థాయి యంత్రాంగం ఏ మాత్రం సహకరించడం లేదు. ఆకస్మిక దాడులు చేయాలని భావిస్తే అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి క్షణాలలో తెలిసిపోవడమే ఇందుకు ఉదాహరణగా పోలీసు వర్గాలే వెల్లడిస్తున్నాయి. అదాయవనరులపై ప్రత్యేక దృష్టి... జిల్లాలోని కొందరు పోలీసు అధికారులకు ప్రకృతి సంపద సైతం అక్రమ ఆదాయవనరుగా మారింది. ఇటీవల ఇసుక, ఎర్రచందనం విషయంలో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉండడంతో ప్రస్తుతం సెటిల్మెంట్లలో నిమగ్నమయ్యారు. అందివచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా కొందరు డబుల్, త్రిబుల్ స్టార్ అధికారులు తలమునకలవుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బుంటేనే పోలీసుస్టేషన్‌కు వెళ్లాలనే భావనను కలుగజేస్తున్నారు. సివిల్ కేసుల్లో సైతం ఉన్నతాధికారులకు పిటీషన్ పెట్టించడం, దాని ఆధారంగా దండుకోవడం రివాజుగా మారింది. సివిల్ కేసుల్లో తలదూర్చమంటూ బోర్డులు పెట్టుకున్న చోటే యధేచ్ఛగా పంచాయితీలు నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇటీవల సీఐల బదిలీలు అయ్యాయి. స్టేషన్లో రిపోర్టు చేసుకుంటూనే కొందరు అధికారులు సివిల్ పంచాయితీలలో తలదూర్చి లబ్ధిపొందే ఎత్తుగడలకు పాల్పడినట్లు తెలుస్తోసంది. జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ శాంతి భద్రతల పరిరక్షణకోసం కృషి చేస్తున్నప్పటికీ కిందిస్థాయి యంత్రాంగంలో ఆశించిన మార్పు కన్పించడంలేదని పలువురు చెప్పుకొస్తున్నారు. -
‘ఎర్ర’ స్మగ్లర్ల అడ్డా ఉదయగిరి
ఉదయగిరి: పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎర్రచందనం సంపద అక్రమంగా తరలిపోతూనే ఉంది. రెండేళ్లుగా సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు ప్రాంతాలకు చెందిన కొందరు ఉదయగిరిని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్ సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువకులకు ఎరవేసి పావులుగా వాడుకుంటున్నారు. వింజమూరుకు చెందిన ఓ వ్యక్తి కోట్లాది రూపాయలు ఆర్జించారు. ఆయన పలువురు అనుచరులను ఏర్పాటుచేసుకుని ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఎస్పీ సెంథిల్‌కుమార్ ఈ వ్యవహారంపై పూర్తి నిఘా పెట్టడంతో స్మగ్లింగ్ జోరు కాస్త తగ్గింది. అయినా అడపాదడపా ఈ ప్రాంతం మీదుగా రవాణా సాగుతోంది. స్మగ్లర్లకు ఉదయగిరి ప్రాంతంలోని కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డుల అండ ఉందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న కొందరికి కూడా ఈ స్మగ్లింగ్ రాకెట్లో ప్రమేయం ఉన్నట్లు ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ఇద్దరు పోలీసు అధికారులు ఈ అక్రమ రవాణాకు పూర్తిగా సహకరించి లక్షలు గడించారనే విమర్శలు అప్పుడు బహిరంగంగా వినిపించాయి. పలువురు కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఈ వ్యవహారంలో ముఖ్యపాత్ర వహించారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇప్పటికీ కొంతమంది ఇంటి దొంగలు ఈ అక్రమ రవాణాకు పరోక్షంగా సహకరిస్తున్నానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని పలువురు అధికారులు, సిబ్బంది ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నారని ప్రచారంకూడా జోరుగా సాగుతోంది. ఈ అక్రమ రవాణాను అరికట్టడానికి పోలీసుల్ని భాగస్వామ్యం చేయడంతో తమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనన్న అటవీ అధికారుల్లో ఆందోళన కన్పిస్తోంది. వరికుంటపాడు మండలంలోని గొల్లపల్లి, పెద్దిరెడ్డిపల్లి, తోటలచెరువుపల్లికి చెందిన కొందరు భైరవకోన అడవుల్లో నుంచి పెద్దఎత్తున ఎర్ర దుంగలను తరలిస్తున్న వైనాన్ని బద్వేలు పోలీసులు రట్టుచేయడంతో స్మగ్లింగ్‌లో స్థానికుల ప్రమేయం వెలుగులోకి వచ్చింది. సీతారామపురం మండలంలో ఓ పోలీసు కానిస్టేబుల్ అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం విదితమే. వింజమూరు ప్రాంతంలో ప్రధాన స్మగ్లరుగా పేరుపొందిన ఓ వ్యక్తి నుంచి అక్కడ పోలీసులు భారీస్థాయిలో లబ్దిపొందారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన ఓ పోలీసు అధికారికి, మరో పోలీసు కానిస్టేబుల్‌కు ఆ స్మగ్లరుతో సంబంధాలు ఉన్నాయనే విషయం అప్పట్లో గుప్పుమంది. దుత్తలూరు మండలం నందిపాడు కేంద్రంగా కొందరు పెద్దలు ఈ వ్యాపారంలో భాగస్వామ్యం కలిగివున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నందిపాడుకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్మగ్లర్ల వివరాలు ఆరా తీసినట్లు సమాచారం. ఈ ప్రాంతానికి చెందిన సుమారు పాతికమంది వ్యక్తుల సమాచారం పోలీసు ల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో దుత్తలూరు మండలానికి చెందిన పలువురు రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఉదయగిరి దుర్గం ప్రాంతంలో హత్య జరిగిందనే వదంతులు పుట్టించి పట్టపగలే భారీ మొత్తంలో ఎర్ర దుంగలను తరలించినట్లు సమాచారం. అదేవిధంగా బద్వేలు సరిహద్దులో సోమవారం పట్టుబడిన వ్యానులో వింజమూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఈ కీలకమైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సమగ్ర విచారణ జరిపితే రెండేళ్లుగా స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న పెద్దమనుషులు, పోలీసులు, అటవీశాఖ అధికారుల గుట్టురట్టయ్యే అవకాశం ఉంది. -
గుట్టుగా ఇంటి దొంగలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకంగా ఉన్న బడా నాయకులు, కొందరు పోలీసులు గుట్టుగా తమ పని కానిచ్చేస్తున్నారు. తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ.. స్మగ్లింగ్‌లో సహకరించిన వారిని కాపాడుకునే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు ఓ మాజీ డీఎస్పీని రంగంలోకి దింపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎర్రచందనం అక్రమరవాణాలో ఇంటిదొంగల భరతం పట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు తనదైన శైలిలో విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. అనుమానం ఉన్న అధికారుల గురించి ఆరా తీస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎర్రదొంగలు కేసులను నీరుగార్చేందుకు పూనుకున్నారు. గూడూరు డివిజన్లో ఓ మాజీ డీఎస్పీ మూడు రోజుల పాటు మకాం వేసి ఎర్రచందనం అక్రమరవాణాలో భాగం ఉన్న పోలీసులను పిలిపిం చుకుని భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. గతంలో ఎర్రచందనం కేసులో నిందితుడిగా దొరికిన ఓ వ్యక్తిని తప్పించడంలో ఓ కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. 14 ఏళ్ల పాటు ఒకే డివిజన్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఐడీ పార్టీ కానిస్టేబుల్‌పై విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఆ కానిస్టేబుల్‌ను విచారిస్తే తమ గుట్టురట్టవుతుందని అక్రమరవాణా వెను క ఉన్న బడా బాబులు ఉలిక్కిపడ్డారు. కానిస్టేబుల్ నోరు తెరిస్తే పలువురు ఉన్నతాధికారులతో పాటు నేతల పేర్లు బయట పడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో కేసును నీరుగార్చి ఆ పోలీస్‌ను పక్కకు తప్పించే యత్నాలను ముమ్మరం చేశారు. అక్రమరవాణాలో పెద్దల హస్తం జిల్లా పరిధిలో జరిగిన ఎర్రచందనం అక్రమరవాణాలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రికి సన్నిహితంగా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, గతంలో జిల్లాలో పనిచేసిన ఓ డీఎస్పీ, రూరల్ పరిధిలో పనిచేసిన సీఐ, మరి కొందరు ఎస్సైల పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీరంతా ఆ కానిస్టేబుల్ని కాపాడే పనిలో నిమగ్నమైనట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లిన ఆ డీఎస్పీ మూడు రోజులుగా ఆర్అండ్బీ అతిథిగృహంలో మకాం వేసి ఎర్రచందనం కేసుకు సంబంధించి ఉన్నతాధికారులతో పాటు, ప్రజాప్రతినిదులతో మాట్లాడి కానిస్టేబుల్‌ను పక్కకు తప్పించమని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బదిలీ అయిన డీఎస్పీ ఎందుకు వచ్చారని పలువురు అనుమానం వ్యక్తం చేయగా... పెండింగ్‌లో ఉన్న రికార్డులను చూసేందుకు వచ్చారని చెప్పుకుంటున్నారు. రికార్డులు చూసేందుకు వచ్చినట్లయితే కార్యాలయంలోనే పనులు పూర్తి చేసుకోవాల్సి ఉండగా అతిథిగృహంలో ఉండి పనులు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దొరికింది కొందరే... దొరికిని వారు దొంగలు.. దొరకని వారు దొరలుగా చలామణి అవుతున్నారు. ప్రస్తుతం జిల్లా పరిధిలో పట్టుబడిన ఎర్రదొంగలు చిన్న చేపలేనని ప్రచారం జరుగుతోంది. స్మగ్లింగ్‌లో నాయకులు, అధికారులు కలసి పనిచేస్తూ కోట్లకు పడగలెత్తారు. ఇటీవల పోలీసులకు చిక్కిన అంబూరు కృష్ణ సూళ్లూరుపేట వద్ద దామానెల్లూరుకు చెందిన వ్యక్తి. ఇతను 20 ఏళ్ల క్రితం నెల్లూరుకు వచ్చారు. గుప్తాపార్క్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఎర్రచందనం అక్రమరవాణాపై దృష్టిపెట్టాక కోట్ల రూపాయలను వెనుకేసుకున్నట్లు సమాచారం. ఆ సొమ్ముతో సంగం, వెంకటగిరిలో కొంత భూమిని కొనుగోలు చేసి ప్లాట్లు వేసి రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవారని చెపుతున్నారు. ఇంకా చెన్నై, బెంగుళూరు, గుత్తిలోనూ పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు పోలీసు వర్గాలు గుర్తించారు. డక్కిలి మండలం లింగసముద్రం వద్ద సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి తరువాత విక్రయించినట్లు స్థానికులు చెపుతున్నారు. అదే విధంగా కలువాయికి చెందిన సుబ్బారెడ్డి, రాపూరు మండలం పెరచర్లకు చెందిన సాంబశివారరెడ్డి, అనంతసాగరానికి చెందిన ఈశ్వరరెడ్డి టీడీపీ అనుచరులు. పార్టీ అధికారంలోకి రాకముందు గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేవారని ఆరోపణలు ఉన్నాయి. సాంబశివారెడ్డి కడప జిల్లాకు చెందిన వారైనా.. పెగచర్లలో వివాహం చేసుకున్నాడు. ఇల్లరికం వచ్చిన ఇతను గత కొన్నేళ్లుగా ఎర్రచందనం అక్రమరవాణా చేసి రెండస్తుల భవనం, కొంత పొలం కొనుగోలు చేసినట్లు తెలిసింది. వీరు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ అక్రమరవాణాను విస్తరించినట్లు తెలుస్తోంది. చెన్నై, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్‌లోని బడా స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని దుం గలను తరలించేవారని తెలిసింది. వీరితో సంబంధం ఉన్న కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. -
ఎర్ర కూలీలకు డ్రైవర్లు సహకారం
క్రైం (కడప అర్బన్) : ఎర్రచందనం కూలీలకు ఆర్టీసీ డ్రైవర్లు చేయందించారు. కూలీలను వివిధ ప్రాంతాలకు చేరవేడంలో సహకరించారు. ఈ విషయం తమ విచారణలో వెల్లడైందని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ తెలిపారు. కడప జోన్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన కొన్ని బస్సుల డ్రైవర్లు బస్సుల్లో చెన్నై నుంచి కోయంబేడ్ ప్రాంతం వద్ద తమిళ కూలీలను ఎక్కించుకుని జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, కుక్కలదొడ్డి అడవుల వద్దకు చేర్చేవారని నిర్ధారణ అయిందన్నారు. తమిళ కూలీలను అరెస్టు చేసినపుడు వారి వద్ద ఉన్న బస్సు టిక్కెట్ ఆధారంగా ఆర్టీసీ డ్రైవర్ల ప్రమేయం ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. 11 మంది ఆర్టీసీ డ్రైవర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఐదుగురు తమిళనాడుకు చెందిన కూలీలను సోమవారం సాయంత్రం రాజంపేట-రాయచోటి మార్గంలోని రోళ్లమడుగు రహదారి వద్ద అరెస్టు చేసి విచారించగా ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర ఉన్నట్లు తెలిసిందన్నారు. కూలీల నుంచి రూ.3.30 లక్షల విలువైన 110 కిలోలున్న ఐదు దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన డైవర్లు కూలీలను తరలించడంలో సహకరించారన్నారు. ఇందులో నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ అక్బర్ హుస్సేన్ (54) కీలకపాత్ర పోషించాడన్నారు. ఇతను తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు మధ్యవర్తులుగా ఉండి కూలీలను చెన్నైలోని కోయంబేడు బస్టాండుకు తీసుకు వస్తారని, అక్కడినుంచి ఆర్టీసీ డ్రైవర్లు అక్బర్ హుసేన్, మిగతా డ్రైవర్లు వారినికర్నూలుకు చెందిన పలు సర్వీసుల ద్వారా రాజంపేట, రైల్వేకోడూరు, కుక్కలదొడ్డి వద్దకు కూలీలను మూకుమ్మడిగా తీసుకొచ్చి చేర్చేవారన్నారు. కూలీలను తరలించేందుకు డ్రైవర్లు రూ.1000 నుంచి రూ. 2000 తీసుకునే వారన్నారు. అక్రమాలకుపాల్పడిన ఆర్టీసీ డ్రైవర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని పేర్కొన్నారు. స్మగ్లర్ల అరెస్టు, ఎర్రచందనం స్వాధీనం జిల్లాలోని మైదుకూరు రూరల్ పరిధిలో బ్రహ్మంగారిమఠం లింగాలదిన్నె గ్రామంలో భూమిరెడ్డి ప్రతాప్‌రెడ్డి తోటలో దాచిన 75 లక్షల విలువైన 45 దుంగలతోపాటు ముగ్గురు స్మగ్లర్లను, ఖాజీపేట పోలీసుస్టేషన్ పరిధిలోని కోనవారిపల్లె అటవీ ప్రాంతంలో ఆరుగురు ఎర్రచందనం మేస్త్రీ, కూలీలను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ. లక్ష విలువైన అయిదు దుంగలను, ఎద్దుల బండిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బి.మఠం మండలం లింగాలదిన్నెలో స్వాధీనం చేసుకున్న డంప్‌లో లింగాల దిన్నెకు చెందిన భూమిరెడ్డి మురళీమోహన్‌రెడ్డి (36), అనంతపురం జిల్లా తాడిమర్రికి చెందిన బండి శివ (35), వనిపెంటకు చెందిన బండారు నరసింహులు (25)లను అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. భూమిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, వజ్రాల సురేష్ పరారీలో ఉన్నారన్నారు. ఖాజీపేట పోలీసుస్టేషన్ పరిధిలో దుంగలను స్వాధీనం చేసుకున్న కేసులో తవ్వా ఓబుల్‌రెడ్డి అలియాస్ మసాల, త్యాగం మాధవరెడ్డి, నలుగురు కూలీలను అరెస్టు చేశామన్నారు. అలాగే ఒంటిమిట్ట పరిధిలోని పట్రపల్లె సమీపంలోని జర్రిబోడు వద్ద ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లెకు చెందిన మల్లికార్జున (22) అనే స్మగ్లర్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 170 కిలోల బరువున్న నాలుగు దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మోటారు సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారన్నారు. రైల్వేకోడూరు సీఐ మురళీధర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు రామచంద్ర, శివప్రసాద్ కోడూరు మండలం బాలుపల్లె సమీపంలో తుండుకొండ చెక్‌డ్యాం వద్ద దుంగలు తరలిస్తుండగా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 338 కిలోల బరువున్న రూ. 6.76 లక్షలు విలువైన 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. పోస్టర్ల విడుదల ఎర్రచందనం కూలీలను హెచ్చరిస్తూ ఎస్పీ పోస్టర్లను విడుదల చేశారు. ఎర్రచందనం నరికితే తీసుకునే కఠిన చర్యలను అందులో తెలియజేశారు. ఏఎస్పీ విజయకుమార్, రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, మైదుకూరు డీఎస్పీ శ్రీధర్‌రావు, సీఐలు వెంకటేశ్వర్లు, నాగభూషణం, రెడ్డెప్ప, మురళీదర్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొబ్బరి బోండాల్లో ‘ఎర్ర’దుంగలు
చిత్తూరు పశ్చిమ అటవీశాఖ అధికారులు కొబ్బరిబోండాల లోడ్‌తో వెళుతున్న ఓ లారీని పట్టుకున్నారు. ఇందులో పైన కొబ్బరి బోండాలు, లోపల 107 ఎర్రచందనం దుంగలు ఉండటాన్ని గుర్తించారు. చిత్తూరు (అర్బన్) : కొబ్బరి బోండాల కింద ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న లారీని సోమవారం తెల్లవారు జామున అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పది చక్రాల లారీలో చిత్తూరు నుంచి యాదమరి మీదుగా తమిళనాడుకు ఈ ఎర్రచందనం తరలిస్తున్నట్టు చిత్తూరు పశ్చిమ అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు చిత్తూరు నగరంలోని మాపాక్షి-తుమ్మిందపాళెం రోడ్డులో అటవీశాఖాధికారులు వేచిఉండగా అటువైపు వస్తున్న లారీని ఆపడానికి ప్రయత్నిస్తే ఆగలేదు. కొట్టాల సమీపంలో తమిళనాడుకు 800 మీటర్ల దూరం ఉందనగా లారీ వేగం పెరిగింది. అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ గుంతలో ఒరిగిపోయింది. అందులోని వ్యక్తులు పారిపోయారు. ఆ లారీలో దాదాపు రెండు వేల కొబ్బరి బోండాలు ఉన్నారుు. దీని కోసం రాత్రిపూట ఛేజింగ్ చేశామా.. అన్నట్టు అటవీశాఖ అధికారులు నిట్టూర్చారు. తీరా కొబ్బరి బోండాల కింద కొయ్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా.. సోమవారం ఉదయం ఈ లారీ తమిళనాడు సరిహద్దులో ఉం దని అక్కడి అటవీశాఖ అధికారులు, కాదు మా సరిహద్దేనని చిత్తూరు అధికారుల వాగ్వాదాలు జరిగారుు. తాము చేసిన ప్రయత్నాన్ని చిత్తూరు అటవీశాఖ అధికారులు తమిళనాడు అధికారులకు వివరించగా, దాదాపు 3 టన్నుల బరువుగల 107 ఎర్ర చందనం దుంగల్ని మన అధికారులకు అప్పగించారు. రూ. 70 లక్షల విలువ... చిత్తూరు పశ్చిమ అటవీశాఖ రేంజర్ నారాయణస్వామి మాట్లాడుతూ అటవీశాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున దుంగల్ని స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమమని తెలిపారు. లారీతో కలిపి పట్టుబడ్డ సరుకు విలువ దాదాపు రూ.70 లక్షలు ఉంటుందన్నారు. లారీని వెంబడించినప్పుడు కొద్ది దూరం వెళ్లాక అందులోని వ్యక్తులు తమపై దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. లారీ ఓ గుం తలో దిగబడటంతో వారు పారిపోయారన్నారు. కొట్టాల గ్రామస్తులు, యాదమరి పోలీసుల సాయంతో లారీని, అందులోని దుంగల్ని స్వాధీనం చేసుకున్నామని ఎఫ్ఆర్వో తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని చెప్పారు. ఈ దాడిలో డెప్యూటీ ఎఫ్ఆర్వో సుభాష్, సిబ్బంది హరిబాబు, హరికుమార్, నాగరాజు, కళ్యాణి, గణేష్‌బాబు, రమేష్, ప్రసాద్, ప్రకాష్, సతీష్, భాషా పాల్గొన్నారని తెలిపారు. -
రూ.50 లక్షల ఎర్రచందనం పట్టివేత
జడ్చర్ల: అరటిగెలల మాటున ఎవరికీ అనుమానం రాకుండా రాష్ట్రాలు దాటిపోతున్న ఎర్రచందనాన్ని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. జడ్చర్ల సీఐ జంగయ్య కథనం ప్రకారం.. జడ్చర్ల మీదుగా లారీలో ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున జాతీయరహదారిపై తనిఖీలు నిర్వహించారు. వారు వెతుకుతున్న యూపీ 78ఏఎన్ 8185 నెంబర్‌గల డీసీఎం జడ్చర్ల మండలం మాచారం గ్రామం వద్ద శ్రీలక్ష్మీ నరసింహ దాబా వద్ద ఆగి ఉండడం గమనించారు. అనుమానంతో అక్కడికి వెళ్లి విచారణ చేస్తుండగా డ్రైవర్‌తోపాటు వెంట వచ్చిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. చాలాసేపటి వరకు ఎవరూ రాకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని అటవీశాఖ సీసీఎఫ్ రమణారెడ్డి, డీఎఫ్ఓ నరేందర్, రేంజర్ మహేందర్లకు సమాచారం అందించారు. వారొచ్చి దుంగలను పరిశీలించి విలువను అంచనా వేశారు. డీసీఎం ఉత్తరప్రదేశ్ సీరియల్ నంబర్‌గా ఉన్నా కర్ణాటక రాష్ట్రం బళ్లారీలో రిజిస్ట్రేషన్ అయినట్లుగా విచారణలో తేలిందని తెలిపారు. -
కాల్పుల మోత
ఓబులవారిపల్లె: శేషాచలం అడవుల్లో బుధవారం మరో ఎన్కౌంటర్ జరిగింది. స్పెషల్‌పార్టీ పోలీసులు జరిపిన కాల్పుల్లో తమిళనాడుకు చెందిన ఇరువురు ఎర్రచందనం కూలీలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. శేషాచలం అడవుల్లోని నీచుగుంత ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికివేస్తున్నట్లు సమచారం అందడంతో స్పెషల్‌బ్రాంచ్ ఎస్ఐ రమేష్‌బాబు స్పెషల్‌పార్టీ పోలీసులను అప్రమత్తం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు ఉదయం 6 గంటల ప్రాంతంలో నీచుగుంత ప్రాంతంలో కూంబింగ్‌కు దిగారు. చెట్లు నరుకుతున్న శబ్ధాలు గ్రహించిన ఆర్ఎస్ఐ రాజు సాయుధబలగాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే ఎర్రకూలీలు రాళ్లు, కర్రలు, గొడ్డళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు వారి దాడులను ప్రతిఘటించారు. ఎర్రకూలీలు జరిపిన దాడిలో ఇరువురు కానిస్టేబుళ్లు స్వల్పంగా గాయపడటంతో ఆత్మ రక్షణ కోసం గాల్లో రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అయినా ఎర్రకూలీలు దాడులను ఆపలేదు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఎర్రచందనం తరలింపునకు అడ్డాగా నీచుగుంత: ఎన్కౌంటర్ జరిగిన పరిసరాలను గమనిస్తే ఎర్రచందనం స్మగ్లింగుకు నీచుగుంత అడ్డాగా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్కౌంటర్ స్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నీచుగుంత ప్రాంతం గాదెల అటవీప్రాంతానికి చాలా దూరంలో ఉంది. ఎత్తయిన కొండ ఎక్కి లోతైనదిగువ ప్రాంతానికి వెళ్ళాలి. నీటి సౌకర్యం ఉండటంతో పాటు వంటకు, రాత్రుల్లో ఉండేందుకు అనువుగా ఉంది. ఈ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాన్ని అడ్డాగా ఎంచుకుని ఎర్రచందనం స్మగ్లర్లు కూలీల చేత చెట్లను నరికించి దుంగలను తరలించుకుపోతున్నారు. నీచుగుంత ప్రాంతం అంతా నిత్యావసర వస్తువుల ప్యాకెట్లు, కూలీలకు అవసరమయ్యే ఇతర వస్తువులతో నిండిపోయి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతంలో ఎర్రచందనం కూలీలు అనేక రోజులుగా అక్కడే ఉంటున్నట్లు ఘటనాస్థలాన్ని సందర్శించిన రాజంపేట డీఎస్పీ జీవీ రమణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కూంబింగ్ నిర్వహించే ప్రత్యేక పోలీసు బృందాలుగానీ, అటవీశాఖ అధికారులు కానీ ఈ ప్రాంతంలో సంచరించిన దాఖలాలు ఉంటే ఎర్రచందనం కూలీలుగానీ, స్మగ్లర్లు కానీ ఎక్కువ రోజులు ఇక్కడ ఉండేవారు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో సుమారు 50 గొడ్డళ్లు, అక్కడక్కడా నరికివేసిన ఎర్రచందనం దుంగలు, బియ్యం, బీడీలు, అగ్గిపెట్టెలు తదితర వస్తువులను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం కూలీల సంచులను తనిఖీ చేయగా గత నెల 11, 30 తేదీల్లో గుత్తి నుంచి తిరుపతికి కొన్న రైలు టిక్కెట్లు లభించాయి. తమిళ తంబీల కోసం తనిఖీలు రాజంపేట: శేషాచలంలోని గాదెల అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల నేపథ్యంలో ఎర్ర కూలీల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. సుమారు 50 మంది కూలీలు తప్పించుకుని పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా రూరల్ సీఐ వై.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రామాపురం వద్ద వాహనాల తనిఖీ చేశారు. లారీలు, బస్సులు, ఆటోలతో పాటు వివిధ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అనుమానం వచ్చిన వారి గురించి ఆరా తీశారు. -
మేమున్నాం..
కడప అర్బన్ : మీకేమీ భయం లేదు.. మీకు అండగా మేముంటాం.. రోజుకు రూ. 2 వేలు కూలీ ఇస్తాం. ఒకవేళ మీకేమైనా జరిగితే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఇస్తాం.. ఎర్రచందనం కూలీలతో స్మగర్లు చేసుకుంటున్న అగ్రిమెంట్ ఇది. ప్రపంచంలోనే అరుదైన, నాణ్యమైన ఎర్రచందనం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో లభిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఆపేందుకు 2001 నుంచి పోలీసులు, అటవీ శాఖ అధికారులు శతవిధాలా కృషి చేస్తూనే ఉన్నారు. ఐదారేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్ పెరిగింది. మండల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి స్మగ్లర్లు ఎదిగారు. కొందరు పోలీసులు, అటవీ సిబ్బంది వీరికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2001 నుంచి ఇప్పటివరకు కడప, ప్రొద్దుటూరు, రాజంపేట డివిజన్లలోని అన్ని ఫారెస్టు కార్యాలయాల పరిధిలో దాదాపు 2500 టన్నుల మేర ఎర్రచందనం దుంగలను గోడౌన్లో భద్రపరిచారు. అయితే 5 నుంచి 10 రెట్లు అనగా పదివేల టన్నులకు పైగా ఎర్రచందనం అక్రమ రవాణా యధేచ్చగా జరిగిందని చెప్పవచ్చు. అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను అనంతపురం మీదుగా బెంగళూరుకు, అక్కడి నుంచి చెన్నైకి చేరవేస్తున్నారు. చెన్నై నుంచి నేరుగా విదేశాలకు షిప్‌ల ద్వారా గానీ, కంటైనర్లలో గ్రానైట్స్, ప్లాస్టిక్ పైపుల మాటున కోల్‌కతాకు జాతీయ రహదారుల్లో తరలిస్తున్నారు. చెన్నై, కోల్‌కతా, చైనా, దుబాయ్‌లకు ఎర్రచందనం చేరవేయడం స్మగ్లర్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. స్మగ్లర్ల ఆఫర్లకు తలాడిస్తున్న కూలీలు స్థానికులకు బదులుగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన ఎర్రకూలీలను తీసుకుని రావడం రెండు సంవత్సరాలుగా మొదలైంది. ఒక్కో ‘ఎర్ర’ కూలీకి రోజుకు రూ. 2వేలు కూలీగా ఇస్తామని తీసుకొస్తున్నారు. ఆరు నెలలుగా ఎర్రకూలీలు తమిళనాడు నుంచి వచ్చి యధేచ్చగా ఎర్రదుంగలను నరికివేస్తున్నారు. ఈ క్రమం లో అనేక సార్లు పోలీసులకు, ఎర్రకూలీల మధ్య దాడు లు, ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు అటవీ సిబ్బంది, ఇద్దరు ఎర్రకూలీలు ఇటీవల మృతి చెందారు. ఇదిలా ఉండగా పోలీసుల కాల్పుల వల్ల ఏదైనా జరిగితే రూ. 5 నుంచి 10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషి యా చెల్లిస్తామని అగ్రిమెంట్ చేయించుకుని తమిళనాడు, కేరళ నుంచి కూలీలకు తీసుకొస్తున్నట్లు సమాచారం. -
అనైతికం
అటవీ గోడౌన్లలో ఎర్రచందనం నిల్వలు అపారంగా ఉన్నాయి. వాటిని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయిస్తాం. తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతాం. రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చేందుకు ఈ సొమ్ము ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. సాక్షి ప్రతినిధి, కడప: ఎర్రచందనం అరుదైన ప్రకృతి సంపద. అది రాయలసీమకే సొంతం. ప్రపంచ దేశాల్లో భారీ డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు అడ్డంగా అడవులను నాశనం చేస్తున్నారు. 90 శాతం అక్రమ రవాణా అవుతుండగా కేవలం 10శాతం మాత్రమే పట్టుబడుతోంది. అలా పట్టుబడిన ఎర్రచందనం సుమారు 9వేల టన్నులు అటవీ గోడౌన్లలో మగ్గుతోంది. దానిని విక్రయించి రుణమాఫీ చేస్తామని ఓమారు, రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తామని మరోమారు రాష్ట్ర మంత్రులు ఒకరి తర్వాత మరొకరు ప్రకటనలు గుప్పిస్తున్నారు. అమాత్యుల తీరు చూస్తుంటే సొమ్మొకరిది.., సోకొకరిది అన్నట్లుగా ఉందని రాయలసీమ వాసులు నిలదీస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం విశేష కృషి చేపట్టాల్సిన పాలక పక్షం అలాంటి ఆలోచన చేయడం లేదని మదనపడుతున్నారు. ఎర్రచందనం విక్రయం ద్వారా లభించే ఆదాయాన్ని ఆ ప్రకృతి సంపద లభ్యమయ్యే ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు ఫారెస్టు డివిజన్లలోనే .. ప్రకృతి సంపద అయిన ఎర్రచందనం వైఎస్సార్, చిత్తూరు, కర్నూల్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే లభ్యమవుతోంది. కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, తిరుపతి, చిత్తూరు ఈస్ట్, నంద్యాల, గిద్దలూరు, నెల్లూరు ఫారెస్టు డివిజన్లలోనే ఎర్రచందనం అక్రమనిల్వలు ఉన్నాయి. ప్రధానంగా వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం అపారంగా ఉంది. ఇక్కడి నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అటవీ చెక్‌పోస్టులు, పోలీసులు ద్వారా పట్టుబడిన ఎర్రచందనం 8,870 టన్నుల నిల్వలు ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. విదేశాలకు ఎగుమతి చేసే సందర్భాలలో పోర్టులు వ ద్ద డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ (డీఆర్ఐ) దాడులు చేసినప్పుడు స్వాధీనం చేసుకున్న చందనం వేల టన్నుల్లో ఉన్నట్లు సమాచారం. ఎర్రచందనం ఎక్కడ పట్టుబడ్డా విక్రయాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని 2011లో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం నిల్వలను విక్రయించి తాను ఇచ్చిన ఎన్నికల హామీల కోసం వెచ్చించాలని చంద్రబాబు నాయుడు భావిస్తుండటాన్ని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజానీకం ఆక్షేపణ వ్యక్తం చేస్తోంది. ఎర్రచందనం ద్వారా లభించే రూ.1000 కోట్లు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలనే డిమాండ్ ఊపుందుకుంటోంది. సాగునీటి పనులుకు, భూగర్భజలాలు పెంపొందించే కార్యక్రమాలకు ఈ సొమ్మును వినియోగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సీమలోనే ఖర్చు చేయాలి... ఎర్రచందనం విక్రయం ద్వారా లభించే ఆదాయం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోనే ఖర్చు చేయాలి. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులకు వినియోగించాలి. ఈప్రాంతం ప్రజల హక్కు అది. ఎర్రచందనాన్ని ఆదాయ వనరుగా చూడడమే పెద్ద తప్పు. హామీల అమలు కోసం ఎర్రచందనం సొమ్మును వినియోగించుకోవాలనుకోవడం తీవ్ర ఆక్షేపణీయం. - దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి, తుంగభద్ర జలాల సాధన కమిటీ నాయకుడు, చెరువుల పునః నిర్మాణం కోసం వెచ్చించాలి.... ఎర్రచందనం విక్రయం ద్వారా లభించే ఆదాయాన్ని రాయలసీమలో చెరువులను పునః నిర్మించేందుకు ఉపయోగించాలి.ఇప్పటికే రాయలసీమ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉంది. ఇక్కడి సంపద ద్వారా వచ్చే డబ్బును వేరెక్కడో ఖర్చు చేస్తామనడం ఎంతమాత్రం భావ్యం కాదు. - బొజ్జా దశరథరామిరెడ్డి, రాయలసీమ ఐక్యకారాచరణ కార్యదర్శి నంద్యాల. -
ఎల్లలు దాటుతున్న ఎర్రబంగారం
సూళ్లూరుపేట: ఎంతో విలువైన ఎర్రచందనం దేశసరిహద్దులు దాటుతోంది. నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని అటవీప్రాంతాల నుంచి తమిళనాడు మీదుగా విదేశాలకు భారీఎత్తున ఎర్రచందనం రవాణా అవుతోంది. ఈ అక్రమ రవాణాను ఆసరాగా అటు స్మగ్లర్లు, ఇటు అధికారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ వ్యవహారం దొరికితే దొంగలు లేదంటే దొరలు అన్నట్టుగా తయారైంది. జిల్లాలోని వెంకటగిరి, రాపూరు, సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట ప్రాంతాల్లోనే కాకుండా చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఏదో ఒకచోట ఎర్రచందనం తరలించే వాహనాలు తరచూ పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ అక్రమ రవాణాకు మినిలారీలు, పార్శిల్ లారీలు, ఖరీదైన కార్లకు సీట్లు తొలగించి ఉపయోగిస్తున్నారు. ఖరీదైన అధునాతన వాహనాలకు ఏదో ఒక రాజకీయ నాయకుడి(ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) స్టిక్కర్లు వేసుకుని దర్జాగా రవాణా చేస్తున్నారు. ఎర్రచందనానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలోని వెలిగొండ అటవీప్రాంతంలో సుమారు 2 లక్షల హెక్టార్లలో, అదే విధంగా తిరుమల-తిరుపతి కొండల్లోని శేషాచలం అడవుల్లో విస్తారంగా ఎర్రచందనం విస్తరించి ఉందని అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. అక్రమ రవాణాలో పట్టుబడిన వారంతా ఎర్రచందనాన్ని నరికే కూలీలే ఎక్కువ. అసలు సిసలైన బడా వ్యక్తులు మాత్రం పట్టుబడరు. సంవత్సరానికి సుమారుగా రూ.260 కోట్లు నుంచి రూ.500 కోట్లు విలువచేసే ఎర్రచందనాన్ని ఎల్లలు దాటిస్తున్నారని అధికారుల లెక్కలే చెబుతున్నాయి. ఇటీవల కడప, రాజంపేట, తిరుపతి పట్టణాల్లో ఎర్రచందనాన్ని నరికే కూలీలను భారీ ఎత్తున అరెస్ట్ చేసినప్పటికీ రవాణా ఆగలేదంటే పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుపతి, కడప ప్రాంతాల్లో నిఘా ఎక్కువ కావడంతో కూలీలు కర్నాటక మీదుగా రూటు మారి రావడమే కాకుండా ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాలను కేంద్రంగా చేసుకుని స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. నియోజకవర్గంలోని తడలో 2005లో పోలీసుల సాయంతో తమిళనాడు గుమ్మిడిపూండికి చెందిన ఓ స్మగ్లర్ జాతీయ రహదారికి పక్కనే మూతపడిన ఓ కంపెనీని లీజుకు తీసుకుని ఏకంగా సామిల్లు పెట్టాడు. ఈ సామిల్లులోనే ఎర్రచందనాన్ని కటింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి సుమారు మూడు కోట్లు విలువైన ఎర్రచందనాన్ని ఈ సామిల్లులో పట్టుకున్నారు. ఇటీవల సూళ్లూరుపేట మండలంలో సుగ్గుపల్లి చెరువు కేంద్రంగా చెరుకుతోటల్లో, కాలువల్లో, చెరువుల్లో భారీ ఎత్తున నిల్వ చేసిన ఎర్రచందనం దుంగలను పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాయుడుపేట మండలంలో రెండు విడతలుగా సుమారు వంద దుంగలను పట్టుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా శనివారం దొరవారిసత్రం మండలం నెలబల్లి అటవీప్రాంతంలో నిల్వ చేసిన రూ.5 లక్షల ఎర్రచందనం దుంగలను పట్టుకుని లోడ్ చేస్తున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు మండలాలకు చెందిన కొంతమంది పోలీసులకు ఎర్రచందనం అక్రమ రవాణాలో భారీ ఎత్తున మామూళ్లు అందుతుండటంతో వాళ్లే రూట్ చూసి పంపిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పోలీసుల్లో కొంతమంది స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాతో పాటు ఎర్రచందనం అక్రమ రవాణాలో కూడా పోలీసుల పాత్ర ఎక్కువగా ఉండడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనేది బహిరంగ రహస్యమే. -
స్మగ్లర్లపై ఉక్కుపాదం
రైల్వేకోడూరు రూరల్, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణా చేసే స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. స్థానిక ఎర్రచందనం పార్కులో రాజంపేట, తిరుపతి డివిజన ఫారెస్టు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ రాజంపేట డివిజన్ ఫారెస్టు వైఎస్సార్ జిల్లా పరిధిలోకి వస్తుందని, బాలుపల్లె ఫారెస్టు డివిజన్ చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తుందన్నారు. దీంతో కొంత సమన్వయ లోపం ఉందన్నారు. ఇకపై సమన్వయంతో పనిచేసి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఫారెస్టు అధికారులు మాట్లాడుతూ బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద సీసీ కెమెరాలు అమర్చుతామన్నారు. ఇకపై ప్రతి చెక్ పోస్టు పరిధిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల కోడూరులో తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ప్రవర్తించిన తీరుపై తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశానికి రాజంపేట డీఎస్పీ జీవీ రమణ, స్క్వాడ్ డీఎఫ్ఓ పవన్ కుమార్, తిరుపతి డీఎఫ్ఓ నాగరాజు, రాజంపేట డీఎఫ్ఓ నాగార్జునరెడ్డి, ఏఆర్ డీఎస్పీ చిన్నిక్రిష్ణ, ఇతర అధికారులు హాజరయ్యారు. -
ఎల్లలు దాటుతున్న ఎర్రచం‘ధనం’
గిద్దలూరు, న్యూస్‌లైన్: ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే ఎర్రచందనం గిద్దలూరు అటవీ డివిజన్ నుంచి యథేచ్ఛగా తరలిపోతోంది. ఎర్రచందనం దుంగలను తమిళనాడులోని చెన్నైకి చేర్చి..అక్కడి నుంచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. గిద్దలూరు సబ్‌డివిజన్ పరిధిలో గిద్దలూరు మండలంలోని ఉయ్యాలవాడ, బోధి, కొమరోలు మండలంలోని అల్లీనగరం, నల్లగుంట్ల, చింతలపల్లె బీట్లలో ఎర్రచందనం అధికంగా ఉంటుంది. వీటితో పాటు గిద్దలూరు అటవీ ప్రాంతం ఆనుకుని ఉన్న వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దుల్లో ఎర్రచందనం అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి ఎర్రచందనం నిరంతరం తరలుతున్నట్లు సమాచారం.దుంగలను అటవీ ప్రాంతంలో నరుక్కుని గిద్దలూరు, కొమరోలు మండలాల్లోని గ్రామాల మీదుగా అటు ఒంగోలు, ఇటు నంద్యాల వైపు నుంచి తరలిస్తుంటారు. ప్రతిరోజూ నాలుగైదు వాహనాల్లో తీసుకెళ్తున్నట్లు సమాచారం. దుంగలను తరలించేందుకు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించారు. అడవిలో చెట్లు నరికిన ప్రదేశం నుంచి వాహనం నిలుచున్న ప్రదేశానికి ఒక రేటు, వాహనం ప్రధాన రోడ్డు ఎక్కిస్తే ఒక రేటు, గిద్దలూరు దాటిస్తే మరో రేటు,నెల్లూరు, చెన్నై..ఇలా ఒక్కో ప్రదేశానికి ఒక్కో రేటు ఇచ్చి యువకులతో ఎర్రచందనం దుంగలను తరలిస్తుంటారు. ఎర్రచందనం అత్యంత ఖరీదైంది కావడంతో స్మగ్లర్లు అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించి తమ పనికి అడ్డు లేకుండా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అడవిపై కొరవడిన నిఘా అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లు ఉన్న నల్లమలపై అటవీ శాఖాధికారులు నిఘా తగ్గించడంతో ఎర్రచందనం దుంగ లు యథేచ్ఛగా ఎల్లలు దాటుతున్నాయి. అక్రమార్కులు తమ ఇష్టానుసారంగా దుంగలను నరికి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. స్మగ్లర్లకు కొందరు అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుండటం వల్లే ఎర్రచందనం తరలించేందుకు అవకాశం ఉంటో ందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉయ్యాలవాడ, జమ్ముల్లపల్లె గ్రామా ల్లో కూలీల మధ్య నగదు పంపకాల్లో వివాదాలు చోటుచేసుకుని గొడవలు అయినట్లు సమాచారం. ఇంత జరుగుతు న్నా సంబంధిత అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. తామూ ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడుతున్నామన్నట్లు పనిచేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో స్మగ్లర్లను అడ్డుకోలేకపోతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గిద్దలూరు రేంజి, టాస్క్‌ఫోర్స్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 2011-12లో 37 కేసులు నమోదుచేసి 21 వాహనాలను సీజ్ చేయగా 24 మంది నిందితులపై కేసులు పెట్టారు. 2012-13లో 19 కేసులు నమోదు చేయగా 11 వాహనాలను సీజ్‌చేసి 13మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా తగ్గింది - నీలకంఠేశ్వరరెడ్డి, రేంజి అధికారి, గిద్దలూరు ఎర్రచందన అక్రమ రవాణా తగ్గింది. నేను గత ఏడాది నవంబరులో విధుల్లో చేరినప్పటి నుంచి 3 లేదా నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. -
కూలీలు సరే...సూత్రధారుల మాటేమిటో..!
సాక్షి,కడప : టన్నులకు టన్నుల ఎర్రచందనం రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. వందల కొద్దీ కూలీలు ఆడవుల్లోకి చొరబడి ఎర్ర బంగారాన్ని నరికేస్తున్నారు. రోజూ ఏదో ఓ మూలన ఎర్ర చందనం పట్టుబడటం, దాన్ని నరికి తరలించే కూలీలను ఆరెస్టు చేయడం రివాజుగా మారింది. కూలీలను జైళ్లకు పంపిస్తున్న అధికారులు సూత్రధారులను వలపన్ని పట్టుకుందామనే ఆలోచన చేయడం లేదు. రూ. కోట్లు విలువ చేసే ఎర్రచందనాన్ని బడా స్మగ్లర్లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నా టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ అధికారులు మాత్రం కూలీలపైనే తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. అధికంగా కేసులు చూపించుకోవడం, అడవిలోకి దిగుతున్న కూలీలను స్మగ్లర్లుగా చూపుతూ జైలుకు పంపడం తప్ప అసలు స్మగ్లర్లపై నిఘా వేయడం లేదు. గతంలో అసలు సూత్రధారులపై నిఘా పెట్టడంతోపాటు పీడీ యాక్టులు పెట్టి ఊచలు లెక్కింపజేసిన అధికారులు ఉన్నారు. వారికి సహకరించిన అటవీ, పోలీసుశాఖ అధికారులను సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చొరవే కరవవుతోంది. కూలీల అరెస్ట్‌తోనే అధికారులు సరిపెట్టుతుండటంతో స్మగ్లింగ్‌కు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. దాడులకు తెగబడుతున్న కూలీలు ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు తిరుపతి కేంద్రంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. చిత్తూరు, వైఎస్సార్‌జిల్లాల ఎస్పీలతోపాటు అటవీశాఖ అధికారులతో కలిసి స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘాతోపాటు నివారణ చర్యలు చేపట్టాలి. దీనికోసం ఓఎస్డీ స్థాయి అధికారిని కూడా ఏర్పాటు చేశారు. అయినా తమిళనాడు నుంచి వస్తున్న ఎర్రచందనం కూలీలు మాత్రం అధికారులపై ఇప్పటికీ దాడులకు దిగుతునే ఉన్నారు. రాళ్లు రువ్వడం, కొన్నిచోట్ల ఆయుధాలతో కాల్పులకు దిగడం రివాజుగా మారింది. దీనిలో భాగంగానే ఇద్దరు అటవీ అధికారులు మృతి చెందారు. వీరికి చెట్లు కొట్టేపని అప్పజెప్పుతున్నది ఎవరు.. తుపాకులు ఇస్తున్నది ఎవరు.. అనే అంశాలపై లోతైన విచారణ సాగడం లేదు. వాస్తవానికి తమిళనాడు నుంచి రైళ్లలో వందలాది మంది కూలీలు వస్తున్నారన్న సమాచారం తెలుసుకోవడంతోనే అధికారులు ఇక తమ పని అయిపోయిందని భావిస్తున్నారు. దాని ఫలితంగా ఒకరి తర్వాత ఒకరు కూలీలు వస్తున్నారు. అధికారులపై దాడులు చేస్తూనే ఉన్నారు. రాజకీయ ముసుగులో బడా స్మగ్లర్లు కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన బడా స్మగ్లర్లు రాజకీయ ముసుగులో యథేచ్చగా తిరుగుతున్నారనేది జగమెరిగిన సత్యం. దీనికి తోడు ఇక్కడి నుంచి రవాణా చేసిన తర్వాత ఎవరు ఆ ఎర్రచందనాన్ని కొనుగోలు చేస్తున్నారు.. ఇతర దేశాలకు ఎలా తరలిస్తున్నారనే విషయమై విచారణ చేయాల్సి ఉంది. మూలాల్లోకి వెళితే అక్రమ రవాణాను అడ్డుకోగలమనే భావన అందరిలో కనిపిస్తున్నా రాజకీయ పలుకుబడి వీరిని కట్టిపడేస్తున్నదనేది నగ్నసత్యం. -
చిక్కిన ఎర్రదొంగలు
ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను కడప పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 12.70 లక్షల నగదుతో పాటు 31 దుంగలు, టవేరా కారును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు తప్పించుకున్నారని వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులను ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు. కడప అర్బన్, న్యూస్‌లైన్ : ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను కడప పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వారి నుంచి రూ.12.70 లక్షల నగదు, 31 దుంగలు, టవేరాకారు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మరో ఇద్దరు దొంగలు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆయన పట్టుబడిన ఎర్రచందనం దుంగలను విలేకరుల ఎదుట హాజరుపరిచారు. దొరికింది ఇలా.. ఎర్రచందనం అక్రమ రవాణాపై కడప అర్బన్ సర్కిల్ పోలీసులతో పాటుు అటవీ శాఖ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఉదయం 6.30 గంటలకు కడప సాయిపేట చెరువు కట్ట సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన టవేరా కారును ఆపారు. అయితే కారును ఆపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే వెంటబడి పట్టుకున్నారు. అందులో పది మంది ఉన్నారు. వారందరూ కర్ణాటకతో పాటు కడపకు చెందిన వారు ఉన్నారు. అరెస్టైన వారిలో కర్ణాటక రాష్ట్రం మంగుళూరుకు చెందిన డ్రైవర్ షర్ఫుద్దీన్(32), అబ్దుల్ మజీద్(29), బద్రుద్దీన్(22)తో పాటు కడపకు చెందిన వడుగూరి రవికుమార్ అలియాస్ సతీష్(25), గుంట అనిల్‌బాబు(25), ఖాదర్‌ఖాన్ కొట్టాలకు చెందిన వ్యాన్ డ్రైవర్ చాగలమర్రి మల్లికార్జున(25), మరో వ్యాన్ డ్రైవర్ మారే రవి(23), పులివెందులకు చెందిన వేబ్రిడ్జి మేనేజర్ వల్లెపు వెంకటరమణ(54), డ్రైవర్ ఖాదర్‌బాషా(30), సిద్ధవటానికి చెందిన మెడికల్ రెప్రజంటేటివ్ నిమ్మకాయల గంగిరెడ్డి(30) ఉన్నారన్నారు. నిందితుల నేపథ్యం : కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన మొదటి నిందితుడు షర్ఫుద్దీన్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతను అదే రాష్ట్రం హోసకోటే తాలూకా మాలూరు రోడ్డులోని కాటేగానహల్లికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ షబ్బీర్ అలియాస్ రహమత్(45)తో పరిచయం ఏర్పరచుకున్నాడు. రెండేళ్లుగా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లతో షర్పుద్దీన్ సంబంధాలు పెట్టుకొని యథేచ్చగా ఎర్రచందనం దుంగలను తరలించేవాడు. దుంగలను కాటేగానహల్లికి చెందిన షబ్బీర్‌కు కిలో రూ.1500 చొప్పున విక్రయిస్తూ తాను కమీషన్ తీసుకునేవాడు. వాటిని షబ్బీర్ చెన్నై, ముంబై, ఢిల్లీలో తనకు తెలిసిన స్మగ్లర్లకు అమ్మేవాడని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం పట్టుబడిన ముఠా సభ్యులంతా గత నెల 21న ఈచర్ వ్యాన్(ఏపీ 02 డబ్ల్యూ 5000) షబ్బీర్‌కు ఎర్రచందనం దుంగలు అమ్మి, దారిలో వస్తూ హసనకోటలోని చింతామణి రస్తాలో పోలీసుల తనిఖీలను గమనించి వ్యాన్‌ను అక్కడే వదిలేసి పరారయ్యారని చెప్పారు. స్పెషల్ పార్టీ బృందానికి ఎస్పీ అభినందన కేసును చేధించి స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, కడప అర్బన్ సీఐ బి.శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐ ఎస్.మహబూబ్‌బాషా, టూ టౌన్ ఎస్ఐ రోషన్, చిన్నచౌకు ఎస్ఐ హేమకుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కీలక సూత్రధారి షర్ఫుద్దీన్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెం దిన ఎర్రచందనం స్మగ్లర్లతో షర్పుద్దీన్ విసృ్తతమైన పరిచయాలు ఏర్పరచుకున్నాడని ఎస్పీ తెలిపారు. వారి ద్వారా ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తూ షబ్బీర్ అలియాస్ రహమత్‌కు విక్రయిస్తూ తన చీకటి వ్యాపారాన్ని యధేచ్చగా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పట్టుబడిన వారి లో సతీష్, అనిల్‌బాబు, రవికుమార్, మల్లికార్జున, మారే రవి, వల్లెపు వెంకటరమణ, షేక్ ఖాదర్‌బాషా, గంగిరెడ్డి తదితరులు షర్ఫుద్దీన్కు ప్రధాన అనుచరులు. ఐదు రోజుల కిందట రవికుమార్, అతని అనుచరులు విక్రయించిన దుంగలకు సంబంధిం చిన డబ్బును అందజేసే నిమిత్తం, సేకరిం చిన ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేసేందుకు వచ్చిన షర్ఫుద్దీన్ అనూహ్య రీతిలో పోలీసులకు పట్టుబడ్డాడని ఎస్పీ తెలిపారు. ముఠాలోని మిగిలిన కాటేగానహల్లి షబ్బీర్, నందలూరుకు చెందిన మహబూబ్‌బాషా పరారీలో ఉన్నారన్నారు. -
ఎనిమిది మందిపై పీడీ యాక్ట్
బ్రహ్మంగారిమఠం, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన స్మగ్లర్లపై ప్రత్యేక నిఘాను ఉంచడంతో పాటు 8 మందిపై పీడీ యాక్టుకు ప్రతిపాదనలు పంపినట్లు డీఎఫ్ఓ పల్లె శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. బి. మఠం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు డివిజన్ పోరుమామిళ్ల, బద్వేలు, వనిపెంట రేంజ్ పరిధిలోని నలుగురిపై పీడీ యాక్ట్ పెట్టాలని కలెక్టర్‌ను కోరగా సానుకూలంగా స్పదించారన్నారు. అలాగే మరో నలుగురిపై పీడీ యూక్ట్ కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. డివిజన్ పరిధిలో 25 మంది సాయుధ బలగాలు ఉన్నారన్నారు. పొలీసు సిబ్బందితో ప్రతి రేంజ్ పరిధిలో కవాతు నిర్వహిస్తున్నామన్నారు. బి.మఠం మండలంలో ఎర్రచందనం కూలీలే స్మగ్లర్లుగా మారుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇందులో మల్లెపల్లెకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారన్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. -
కలికిరిలో ‘ఎర్ర’దొంగలు!
నర్సరీలో ఎర్రచందనం చెట్ల నరికివేత జిల్లా అధికారుల జాబితాలో కలికిరివాసుల పేర్లు {పైవేట్ భూముల్లోనూ చె ట్లు నరికిన వైనం కలికిరి, న్యూస్‌లైన్: సీఎం సొంత మండలమైన కలికిరిలో ఎర్రదొంగలు పడ్డారు. పీలేరు- కలికిరి మార్గమధ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక వనవిభాగం కార్తీకవనంతో పాటు మరికొన్ని ప్రైవేట్ భూముల్లో ఎర్రచందనం చె ట్లు నరికి గుట్టుచప్పుడు కాకుండా తరలించేశారు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం కార్తీకవనంలో నాలుగు చెట్లు నరికారు. వీటిలో రెండు చెట్ల దుంగలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మరో రెండు చెట్లను నరికి అక్కడే వదిలేశారు. మదనపల్లె మార్గంలోని సాయిరాం డాబాకు వెనుకవైపున ఓ ప్రైవేట్ స్థలంలో ఉన్న ఎర్రచందనం చెట్టును నరికి దుంగలు తీసుకెళ్లారు. ఈ రెండు చోట్లా ఒకేరోజు ఎర్రచందనం చెట్లు నరికి అపహరించుకుపోయినట్లు సమాచారం. దీన్ని బట్టిచూస్తే స్థానికంగా ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎర్రావారిపాళెం మండ లం నుంచి కేవీపల్లె మండలం మీదుగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కలికిరి మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్నట్లు వినికిడి. వారిపేర్లు జిల్లా పోలీస్ యంత్రాంగం వద్ద ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అడవిని వదిలి..పొలాలపై పడ్డారు ఇటీవల అధికారులు విస్తృత దాడులు చేస్తున్నారు. శేషాచలం అడవుల్లో గస్తీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం దొంగలు పొలాలు, నర్సరీల వద్ద ఉన్న చెట్లపై పడ్డారు. -
అటవీ వలలో ‘ఎర్ర’ దొంగలు
రైల్వేకోడూరు అర్బన్, న్యూస్‌లైన్: అటవీ, పోలీస్ శాఖల అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం దుంగల తరలింపు ఆగడం లేదు. ప్రతి రోజూ దుంగలు తరలిపోతూనే ఉన్నాయి. అక్కడడక్క మాత్రం కొందరు పట్టుబడుతున్నారు. తాజాగా శుక్రవారం రైల్వేకోడూరు రూరల్ మండలం బాలుపల్లె, జ్యోతి కాలనీ సమీపంలో వచ్చిన లారీపై అనుమానమొచ్చిన అటవీ అధికారులు ఆపారు. వీరిని చూడగానే లారీని ఆపి అందులోని దొంగలు పరారయ్యారు. లారీని పరిశీలించిన అధికారుల కంట 30 దుంగలు కంటపడ్డాయి. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు అవుతుందని రేంజర్ శ్రీరాములు తెలిపారు. ఎఫ్‌బీఓలు లింగారెడ్డి, శ్రీరామమూర్తి పాల్గొన్నారు. సిద్దవటంలో... గొల్లపల్లె బీట్‌లోని నిమ్మకాయలబండ అటవీ ప్రాంతం నుంచి 38 ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందిన సమాచారం మేరకు గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత దాడులు నిర్వహించిన అటవీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోనే స్మగ్లర్లు దాగి ఉంటారన్న అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టగా మైదుకూరు మండలం లక్ష్మీపల్లెకు చెందిన వెంకటకృష్ణయ్య అనే కూలీ దొరికాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సిద్దవటం రేంజ్ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు. -
పీడీ.. వద్దులెండి
సాక్షి ప్రతినిధి, కడప: హలో అటవీ అధికారే కదా..! నేను చంద్రమోహన్(పేరు మార్చాం)ను మాట్లాడుతున్నా. రాష్ట్ర స్థాయి మాజీ డెరైక్టర్‌ను. అదే.. మీరు రెడ్డినారాయణ, గుట్ట బాబులను అరెస్టు చేశారు కదా...అంతటితో సరిపెట్టండి... పీడీ యాక్టు అమలు చేయాలని ఉన్నట్లు తెలుస్తాంది. ఇంకేమి పెట్టొద్దులేండి.. నేను ముఖ్యనేత తమ్ముడు కు మీగురించి మంచిగా చెబుతాలే! సరేనా.. మీ కింది అధికారి వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడుతాడు.. ఇంకేమి అడ్డంకులు పెట్టొద్దు.. సరే ఉంటాను... ‘సిఫార్సులకు కాదేదీ అనర్హం’ అన్నట్లుగా జిల్లాలో అధికార పార్టీ నేతల శైలి కన్పిస్తోంది. ఆదాయం వస్తుందంటే ఎలాంటి సిఫార్సులైనా, ఎవరికైనా చెస్తుండడం పరిపాటి మారింది. తాజాగా ఎర్రచందనం ఘరానా స్మగ్లర్లుగా పేరుగాంచిన రెడ్డినారాయణ, గుట్టబాబుల వ్యవహారాన్ని అధికార పార్టీ నేతలు రక్తి కట్టిస్తున్నారు. అరెస్టు వరకూ సరే.. పీడీ యాక్టు అమలు చేయవద్దని పెద్ద ఎత్తున సిఫార్సులు వస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ముఖ్యనేత సోదరుడితో స్వయంగా చెప్పిస్తామని ఒక విధంగా బెదిరింపు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ మద్దతుదారుడైనప్పటికీ.... రెడ్డినారాయణ సంబేపల్లె మండల వాసి. స్థానికంగా టీడీపీ మద్దతుదారుడు. ఎవరూ లేకపోతే పోటీకి తానున్నానని ఓ సందర్భంలో ముందుకు వచ్చిన వ్యక్తి. ఎర్రచందనం అక్రమ రవాణాతో రెడ్డినారాయణ ఎదిగారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో చిత్తూరు జిల్లా టాస్క్‌పోర్స్ పోలీసులు రెడ్డినారాయణతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. గతంలో రెడ్డినారాయణపై పీడీ యాక్టు అమలు చేస్తే సుప్రీంకోర్టుకెళ్లి కొట్టివేయించుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఉన్న నేర చరిత్ర కారణంగా ప్రస్తుతం పీడీ యాక్టు అమలు చేయాలనే తలంపులో అటవీ యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. ఈవిషయం ఫారెస్టు యంత్రాంగంలోని కొందరు సిబ్బంది ద్వారా బహిర్గతమైనట్లు సమాచారం. దీంతో అధికారపార్టీ నేతలు రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ మద్దతుదారుడైనా తమకు అదాయం దక్కితే చాలు అన్నట్లుగా అధికార పార్టీ నేతలు ఉన్నట్లు ఈవిషయం రుజువు చేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. మంచి పోస్టింగ్ ఇప్పిస్తా! సహకరించు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ మాజీ డెరైక్టర్ ఒకరు రెడ్డినారాయణకు వత్తాసు పలుకుతున్నారు. సబ్‌డివిజన్ పరిధిలోని ఓ అధికారితో మంత్రాంగం నడిపారు. తనకు ముఖ్యనేతతోనూ, ఫారెస్టు యంత్రాంగంలో ఉన్నతస్థాయి అధికారులతోనూ ఉన్న పరిచయాలు మీకు తెలిసిందే. మీకు మంచి పోస్టింగ్ ఇప్పిస్తాను, ఈవ్యవహారంలో సహకరించాల్సిందిగా కోరినట్లు సమాచారం. అందుకు ప్రతిఫలం కూడా ఉంటుందని చెప్పడంతో ఆ అధికారి ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ఎక్కడ ‘కీ’ తిప్పాలో అక్కడ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆశాఖలో గుప్పుమంటోంది. పీడీ యాక్టు అమలు ఆలోచనలో ఉన్నాం...డీఎఫ్ఓ నాగరాజు ఎర్రచందనం స్మగ్లర్లు రెడ్డినారాయణ, గుట్టబాబుల నేర చరిత్ర కారణంగా వారిపై పీడీ యాక్టు అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. గతంలో ఓమారు అమలు చేశాం. కోర్టు ఉత్తర్వుల కారణంగా విడుదల అయ్యారు. ఎలాంటి పైరవీలు నా వరకూ రాలేదు.