RSS
-
యూపీలో ఇంటింటికీ బీజేపీ–ఆర్ఎస్ఎస్!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ భారీ ఎదురుదెబ్బ నుంచి బీజేపీ పాఠం నేర్చుకుంది. 9 అసెంబ్లీ స్థానాలకు అక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌తో సమన్వయంతో పనిచేస్తోంది. ఇండియా కూటమి కులాధారిత సామాజిక న్యాయ రాజకీయాన్ని హిందూత్వ కార్డుతో ఢీ కొట్టనుంది. ‘ఏక్ హై తో సేఫ్ హై ’ (ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) నినాదాన్ని వచ్చే ఐదు రోజులు విస్తృతంగా ఇంటింటికీ తీసుకెళ్లాలని ప్రయాగ్‌రాజ్‌లో బీజేపీ–ఆర్ఎస్ఎస్ కీలక భేటీలో నిర్ణయించారు. సమాజ్‌వాదీ పార్టీ తెరపైకి తెచ్చిన పీడీఏ (పీడిత్, దళిత్, ఆదివాసీ) ఫార్ములాను ఎదుర్కొనే వ్యూహాలపై భేటీ చర్చించింది. హిందూత్వ అజెండాకు పదును పెట్టాలని సంఘ్ నొక్కి చెప్పింది. ‘బటేంగేతో కటేంగే’ (విడిపోతే చెల్లాచెదురవుతాం) అన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ, సంఘ్ మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దళిత, ఓబీసీ ఓటర్ల మధ్య విభజనకు యత్నాలకు చెక్ పెట్టాలని బీజేపీకి ఆర్ఎస్ఎస్ సూచించింది. -
మహారాష్ట్ర ఎన్నికలు: ఆర్ఎస్ఎస్ సర్వేలో ఏం తేలింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మహాయుతికి చెందిన పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ విజయావకాశాలను తెలుసుకునేందుకు ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే నిర్వహించింది. దీనిలో మహాయుతికి 160 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది.ఆర్ఎస్ఎస్ సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ కూటమికి వ్యతిరేకంగా వచ్చిన ట్రెండ్ అసెంబ్లీలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి పూర్తి మెజారిటీ రానుంది. సంఘ్ వర్గాలు రహస్యంగా అంతర్గత సర్వే నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నాయి. అక్టోబర్ రెండో వారంలో మొత్తం 288 సీట్లపై సంఘ్ సర్వే నిర్వహించింది. సంఘ్ సర్వేలో మహాయుతికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వస్తాయని తేలింది.బీజేపీకి 90 నుంచి 95 సీట్లు, షిండే సేనకు 40-50 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 25-30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూపీ, రాజస్థాన్, బెంగాల్‌లలో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. బీజేపీ వరుసగా సొంతంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అయితే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. -
శతాబ్ది స్ఫూర్తి కొనసాగించేలా స్మృతి మందిరం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)ను 1925 విజయదశమి రోజున నాగ్‌పూర్‌లో డాక్టర్ కేశవరామ్ బలిరామ్పంత్ హెడ్గేవార్ ప్రారంభించారు. హెడ్గేవార్ తాత నరహరిశాస్త్రి సరిగ్గా 168 సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి నుంచి వేదపండితులకు ప్రాధాన్యం ఇచ్చే భోంస్లే సంస్థానమైన నాగ్‌పూర్‌కు వలస వెళ్లారు. ఈ క్రమంలోనే కందకుర్తిలో స్మృతిమందిరంగా ఉన్న వారి ఇంటి వద్ద ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 1989 నుంచి శ్రీ కేశవ శిశు విద్యామందిర్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భరతమాత విగ్రహం, హెడ్గేవార్ కులదైవమైన చెన్నకేశవనాథ్ విగ్రహం, హెడ్గేవార్ విగ్రహం ప్రతిష్టించారు. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ 100వ ఏట అడుగు పెట్టిన నేపథ్యంలో హెడ్గేవార్ పూరీ్వకుల ఇంటి స్థానంలో రూ.12 కోట్ల వ్యయంతో భారీ స్మృతి మందిరం నిర్మిస్తున్నారు. వచ్చే ఉగాదికి దీని నిర్మాణం పూర్తి చేస్తారు. దీని వద్దనే గోదావరి ఒడ్డున మరో 10 ఎకరాల్లో కేశవ స్ఫూర్తి కేంద్రం, పాఠశాల, వసతిగృహం, భరతమాత ఆలయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. పేద పిల్లలు, రైతులు, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. శ్రీ కేశవ శిశు విద్యామందిర్‌లో ముస్లిం విద్యార్థులు సైతం విద్యనభ్యసిస్తుండడం గమనార్హం. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న కందకుర్తి గ్రామాన్ని ఇప్పటికే పలువురు సర్సంఘ్ చాలక్ (ఆర్ఎస్ఎస్ చీఫ్)లు సందర్శించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ స్మృతిమందిరం ప్రారంభానికి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్‌జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరు కానున్నట్టు తెలుస్తోంది. రెంజల్ మండలంలో అక్షరాస్యత పెంచడంలో కేశవ సేవాసమితి కీలకపాత్ర 1989లో శ్రీ కేశవ శిశు విద్యామందిర్ ప్రారంభం కాగా, 2004లో పాఠశాల నూతన భవనాన్ని శ్రీరాంబావ్ హల్దేకర్ జీ ప్రారంభించారు. 2013 నుంచి కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, ఈ–తరగతులు, ఎల్ఈడీ టీవీ సౌకర్యం కలి ్పంచారు. ఉపాధ్యాయులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరోవైపు కందకుర్తి చుట్టుపక్కల గ్రామాల యువతీయువకులకు ఎండాకాలంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించి సరి్టఫికెట్లు అందిస్తున్నారు. కందకుర్తి గ్రామం నుంచి మొదటి సైనికుడిగా ఎంపికైన జుబెర్ బాషా, రెంజల్ మండలం నుంచి మొదటిసారిగా నావికాదళానికి ఎంపికైన శశివర్ధన్ ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించారు. ఇక కేశవ సేవాసమితి పాఠశాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. చుట్టుపక్కల 19 గ్రామాల్లో బాలబాలికలలో సంస్కారం, చదువుకు బాల సంస్కార కేంద్రాలు, బాలికలకు కిషోరి వికాస్ కేంద్రాలు, ట్యూషన్ సెంటర్లు, పెద్దవారికి భజన మండళ్లు, గృహిణులకు మాతృమండళ్లు, యువకులకు క్రీడాకేంద్రం, గ్రంథాలయం, నారాయణ సేవ లాంటి కార్యక్రమాలు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. వీటి వల్ల రెంజల్ మండలంలో అక్షరాస్యత గణనీయంగా పెరిగింది. పేద కుటుంబాల యువతకు చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద..... తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నడుమ కందకుర్తి వద్ద గోదావరి, మంజీర, హరిద్ర నదుల సంగమం ఉంది. ఈ ప్రాంత ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ భాషలు మాట్లాడతారు. భిన్న సంస్కృతులకు నిలయంగా ఈ ప్రాంతం మారింది. త్రివేణి సంగమ ప్రాంతానికి కొన్ని అడుగుల దూరంలోనే కందకుర్తి (తెలంగాణ)–బెల్లూర్ (మహారాష్ట్ర)లను అనుసంధానం చేసే వంతెనను 1992లో నిర్మించారు. ఇక్కడికి 15 కిలోమీటర్ల దిగువన బాసర పుణ్యక్షేత్రం ఉంది. కందకుర్తిలో ఉన్న రామాలయానికి సైతం గొప్ప ప్రాశస్త్యం ఉంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ, ఆయన గురువు సమర్ధ రామదాసు ఈ ఆలయాన్ని సందర్శించారు. గతంలో ఇక్కడ ప్రాచీన స్కంధ (కుమారస్వామి) మందిరం ఉండేది. మూడు నదులు కలిసే కూడలి కావడంతో కూడతి అనేవారు. కాలక్రమంలో కందకుర్తి పేరు వచి్చనట్టు చరిత్రకారులు చెబుతున్నారు. పూర్తిగా కూలిపోయిన స్కంధ మందిరం స్థానంలో కొత్త మందిర నిర్మాణం చేస్తున్నారు. త్రేతాయుగంలో ఇక్కడ శ్రీరాముడు శివాలయాన్ని నిర్మించినట్టు చెబుతున్నారు. దీన్ని తర్వాత రాణి అహల్యాబాయి మందిరాన్ని పునరుద్ధరించారు. -
విజయదశమి రోజున ప్రారంభమై.. విజయదశమి నాడే 100వ ఏట ప్రవేశం!
RSS: హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించటం ఆశయంగా డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ (డాక్టర్ జీ) 1925లో విజయ దశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ను నాగపూర్‌లో స్థాపించారు. ఆ సంస్థ ఈ విజయదశమి రోజున 100వ ఏట ప్రవేశిస్తోంది. ఎటువంటి సభ్యత్వ నమోదు, ఐడెంటిటీ కార్డులు వంటివి లేకుండా ఒక సంస్థను వందేళ్లు దిగ్విజయంగా నడపడం మాటలు కాదు. దాదాపు 80 లక్షల మంది స్వయం సేవకులు కలిగిన 45 లక్షల సంఘస్థాన్ శాఖలు నడుపుతూ ఎటువంటి అంతర్గత కలహాలకూ తావు లేకుండా కొనసాగుతోంది ఆరెస్సెస్.నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ హెడ్గే వార్ని 1921లో విదర్భలోని అకోలా జైలులో ఒక సంవత్సరం రోజులు నిర్బంధించారు. నాడు జైలులోని దేశభక్తుల మధ్య జరిగిన చర్చోపచర్చలలో డాక్టర్ హెడ్గేవార్ మదిలో పురుడు పోసుకున్నదే ఆరెస్సెస్. 1925 నుంచి 1940 వరకు డాక్టర్ హెడ్గేవార్, 1940 నుండి 1973 వరకు మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ), 1973 నుంచి 1993 వరకు మధుకర్ దత్తాత్రేయ దేవరస్లు సర్ సంఘ చాలకులుగా పనిచేసి ఆర్ఎస్ఎస్ను ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారతదేశం అంతటా విస్తరించడానికి తమ జీవితాలను ధారపోశారు. ఆరెస్సెస్ సంఘ శాఖలలో మొదటగా ధ్వజారోహణము, ఆసనములు, యోగ, క్రీడలు, ఆటలు, కర్రసాము, సమాజ హిత సూచనలు, భారతీయ చరిత్ర–సంస్కృతి–సంప్రదాయాలను తెలియజేసే ప్రసంగాలు, ఒకరితో ఒకరు సత్సంబంధాలు పెంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. చివరగా ప్రార్థన వంటి విషయాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.సమాజంలోని రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, న్యాయవాదులు, డాక్టర్లు, వెనుకబడిన, అణగారిన వర్గాలకు ప్రాతి నిధ్యం వహించే విధంగా భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, ఆరోగ్య భారతి, విద్యా భారతి, స్వదేశీ జాగరణ మంచ్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, సంస్కార భారతి, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ సేవికా సమితి వంటి అనుబంధ సంస్థలను కలిపి ‘సంఘ్ పరివార్’గా భావిస్తారు. ఈ సంస్థలు అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఆయా రంగాలలో అవి పని చేసుకుని పోతున్నప్పటికీ అవసరమైన సందర్భాలలో ఆర్ఎస్ ఎస్ నుంచి సలహాలు, సూచనలు ప్రేరణ అందుతాయి.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!1947– 48 మధ్య దేశ విభజన సమయంలో, 1962లో భారత్ – చైనా యుద్ధ సమయంలో, 1972లో భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో, భూకంపం, తుపానులు, కరోనా వంటి విపత్తులు, రైలు ప్రమాదాలు, కరవు కాట కాలు, కరోనా వంటి విపత్తుల సమయంలో ఆరెస్సెస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. భారత్ – చైనా యుద్ధ సమయంలో ఆరెస్సెస్ సేవలను గుర్తించిన నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ 1963లో రిపబ్లిక్ డే కవాతులో ఆరెస్సెస్‌ను పాల్గొనమని ఆహ్వానించడం గమనార్హం. దాదాపు 4 వేల మంది ఆరెస్సెస్ ప్రచారకులుగా (పూర్తి సమయ కార్యకర్తలుగా) కుటుంబ బంధాలకు దూరంగా దేశ, విదేశాల్లో పనిచేస్తూ తమ త్యాగ నిరతిని చాటుతున్నారు.– ఆచార్య వైవి రామిరెడ్డిశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి (నేడు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం) -
నా ఆటోను కాల్చేశారు: గడ్కరీ
శంభాజీనగర్:కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత రాజకీయాలన్నీ పవర్ పాలిటిక్సేనని తేల్చేశారు.రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో శుక్రవారం(సెప్టెంబర్27) జరిగిన రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిసన్‌రావ్ బగాడే సన్మాన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు.ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన సమయంలో ఎన్నో సమస్యలొచ్చాయన్నారు. పార్టీ కార్యకర్తగా 20 ఏళ్లు విదర్భలో పనిచేసినట్లు చెప్పారు. ఆ రోజుల్లో తాము నిర్వహించే ర్యాలీలపై ప్రజలు రాళ్లు వేసేవారని గడ్కరీ గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాతి రోజుల్లో తాను ప్రసంగాలు చేయడానికి వాడే ఆటోను కొందరు తగలబెట్టారని చెప్పారు. ఇప్పుడు తనకు వచ్చిన గుర్తింపు తనది కాదని, హరిభౌకిసన్రావ్ బగాడే లాంటి వాళ్ల కారణంగా వచ్చిందేనన్నారు. కాగా, తనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చిందని ఇటీవలే గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. -
దేశ ద్రోహులకు ఆర్ఎస్ఎస్ అర్థం కాదు: రాహుల్‌కు బీజేపీ కౌంటర్
కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. టెక్సాస్‌లోని యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు గుప్పించారు.అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే అలవాటు గాంధీకి ముందు నుంచే ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ గురించి అర్థం చేసుకోలేరని మండిపడ్డారు. భారతదేశం పరువు తీసేందుకే రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోవాలంటే రాహుల్ లాంటి వారికి ఎన్నో జన్మలు ఎత్తాల్సివస్తోందని అన్నారు. విదేశాలకు వెళ్లి దేశాన్ని విమర్శించే వారికి ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోలేరు. రాహుల్ ఎప్పటికీ ఆ వ్యవస్థ విధానాలను అర్థం చేసుకోలేరు. ఆరెస్సెస్ భారతదేశ విలువలు, సంస్కృతి నుంచి పుట్టిందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.కాగా అంతకముందు రాహుల్ మాట్లాడుతూ.. భారత్ అంటే ఒకే ఆలోచన, భావజాలం అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుందని, మహిళలు కేవలం ఇంటి పనికి, వంట పనికి మాత్రమే పరిమితమని భావిస్తుందని మండిపడ్డారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుకువెళ్లాలని, భారత్ అంటే భిన్న భావజాలం అని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు.భారత్‌లో బీజేపీ, ప్రధాని మోదీకి ఎవరూ భయపడరనే విషయాన్ని ఇటీవల జరిగిన ఎన్నికలు నిరూపించాయన్నారు. భారత సంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. మన రాజ్యాంగంపై ప్రధాని మోదీ దాడి చేస్తున్నారని ప్రజలు గ్రహించారని, మోదీ, బీజేపీకి ఎవరూ భయపడటం లేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అనంతరం దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై వ్యతిరేక పోరాటం స్పష్టంగా కనిపించిందని రాహుల్ విమర్శించారు. -
ప్రజలకు మోదీ భయం పోయింది: రాహుల్ గాంధీ
న్యూయార్క్: లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం ప్రజల్లో బీజేపీపై ఉన్న భయం పోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. భారత దేశం అంటే ఒకే సిద్ధాంతం అనే ఆలోచనతో ఆర్ఎస్ఎస్ ఉంది. కానీ, భారత్ సిద్ధాంత బహుళత్వంగా కాంగ్రెస్ భావిస్తుందని అన్నారు. దానిపైనే తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. భారతీయ రాజకాల్లో ప్రేమ, గౌరవం తగ్గిపోయాయని అన్నారు.‘‘లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోలేదు. దీంతో అప్పటి వరకు ప్రజల్లో ఉన్న బీజేపీ, నరేంద్రమోదీపై భయం పోయింది. ఇది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సాధించిన విజయం కాదు. రాజ్యాంగంపై దాడిని అంగీకరించబోమని గ్రహించిన భారత దేశ ప్రజలు విజయం. అదేవిధంగా మహిళల పట్ల వైఖరిపై కూడా బీజేపీ, ప్రతిపక్షాల మధ్య సైద్ధాంతిక తేడాలు ఉన్నాయి. వాటిపై కూడా మేము పోరాటం చేస్తున్నాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులకు మాత్రమే పరిమితం కావాలని నమ్ముతారు. కానీ మేము అలా కాదు. మహిళలు ఏమి చేయాలని కోరుకున్నా అనుమతించాలని నమ్ముతున్నాం. భారత్ నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చాలా దేశాల్లో ఈ సమస్య లేదు. పెరుగు దేశం చైనా కూడా నిరుద్యోగ సమస్య లేదు’ అని అన్నారు.#WATCH | Texas, USA: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The RSS believes that India is one idea and we believe that India is a multiplicity of ideas. We believe that everybody should be allowed to participate, allowed to dream, and should be given space regardless… pic.twitter.com/uHULrGwa6X— ANI (@ANI) September 9, 2024రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ‘చైనా కమ్యూనిస్ట్ పార్టీతో తనకున్న ఒప్పందం వల్ల రాహుల్ చైనా కోసం బ్యాటింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. విభజించు, పాలించడమే రాహుల్ స్ట్రాటజీ. భారత సిద్ధాంతాలుపై విమర్శలు చేయటం రాహుల్‌కు అలవాటుగా మారింది. ఆయన బెయిల్‌పై ఉన్నందున భారత న్యాయ వ్యవస్థపై దాడి చేస్తాడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు. -
కులగణన సన్నితమైన అంశం, రాజకీయాలకు వాడొద్దు: ఆర్ఎస్ఎస్
దేశంలో కులగణనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కులగణన సున్నితమైన అంశమని పేర్కొంది. అయితే దీనిని ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని తెలిపింది. ఈ మేరకు కేరళలోని పాలక్కడ్‌లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయి సమన్వయ సమావేశాల్లో సంస్థ ప్రతినిధి సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. కులగణ జాతీయ ఐక్యత, సమగ్రతకు చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు.‘కుల గణన అనేది చాలా సున్నితమైన అంశం. దీనిని చాలా తీవ్రంగా పరిగణించాలి. కొన్నిసార్లు ప్రభుత్వాలు డేటా అవసరం కోసం దీనిని చేపట్టవచ్చు. అయితే ఇదికేవలం ఆ వర్గాలు కులాల సంక్షేమం కోసం మాత్రమే ఉండాలి. కానీ.. కుల గణనలను ఎన్నికల ప్రచారాల కోసం వినియోగించకూడదు’ అని అన్నారు.ఈ అంశంపై తీవ్రమైన చర్చల మధ్య, కుల గణనపై ఆర్ఎస్ఎస్ తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కసరత్తును నిర్వహించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని పేర్కొంది. ‘ఇటీవల కాలంలో కులగణన అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీనిని పూర్తిగా సమాజహితానికే వాడతారని భావిస్తున్నాం. వీటిని నిర్వహించే క్రమంలో అన్నిపక్షాలు సామాజిక సమగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి’ అని పేర్కొన్నారు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు సెక్యూరిటీ పెంపు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది. దీంతో ఆయనకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కల్పిస్తున్న తరహాలో భద్రత లభించనుంది.హోం మంత్రిత్వ శాఖ మోహన్ భగవత్ భద్రతను జెడ్ ప్లస్ నుంచి నుండి ఎఎస్ఎల్(అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్)స్థాయికి పెంచింది. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు ఇంతవరకూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండేది. మోహన్ భగవత్‌కు క్పల్పించిన భద్రత సరిపోదని గుర్తించిన ప్రభుత్వం అతని కోసం క్తొత భద్రతా ప్రోటోకాల్ రూపొందించింది. పలు భారత వ్యతిరేక సంస్థలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయనే నిఘావర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నూతన భద్రతా ఏర్పాట్ల ప్రకారం మోహన్ భగవత్ సందర్శించే ప్రదేశంలో సీఐఎస్ఎఫ్ బృందాలు ఉంటాయి. ఆయనకు 2015, జూన్ లో జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో సిబ్బంది, వాహనాల కొరత కారణంగా జెడ్ ప్లస్ భద్రత కల్పించలేదు. ఈ తరహా భద్రతలో 55 మంది కమాండోలు మోహన్ భగవత్ కోసం 24 గంటలపాటు విధులు నిర్వహిస్తుంటారు.ఏఎస్ఎల్ కేటగిరీ భద్రతలో సంబంధిత జిల్లా పరిపాలన, పోలీసు, ఆరోగ్యం, ఇతర విభాగాలు వంటి స్థానిక ఏజెన్సీలు పాలుపంచుకుంటాయి. మోహన్ భగవత్ ఏదైనా కార్యక్రమానికి వెళ్లే సందర్భంలో ఆ స్థలాన్ని పరిశీలించడానికి అధికారుల బృందం వెళ్తుంది. వారు క్లాలిటీ ఇచ్చిన తరువాతనే మోహన్ భగవత్ ఆ కార్యక్రమానికి వెళతారు. -
UP By Election : సంఘ్ చేతికి బీజేపీ ఉప ఎన్నికల బాధ్యతలు
మొన్నటి యూపీ లోక్‌సభ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాల తర్వాత బీజేపీలో అంతర్గత పోరు చోటుచేసుకుంది. ఇప్పుడు దీనిని ఆపేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘ్ నేత అరుణ్‌కుమార్‌ల సమక్షంలో సమావేశం జరిగింది.ప్రభుత్వం- సంఘ్ మధ్య మెరుగైన సమన్వయంతో పాటు ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ ప్రతినిధుల నియామకం తదితర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల సన్నాహాల్లో బీజేపీతో పాటు సంఘ్ కార్యకర్తలను కూడా భాగస్వాములను చేయాలని సమావేశంలో నిర్ణయించారు.దాదాపు రెండున్నర గంటల పాటు సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. పార్టీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు బీజేపీ నష్టపోవాల్సి వస్తుందని సంఘ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలతో పాటు ప్రభుత్వం, సంఘ్ మధ్య పరస్పర సమన్వయంపై చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలను సంఘ్‌కు అప్పగించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సిద్ధాంతానికీ, అధికారానికీ స్పర్థ?
ఏ సంస్థకైనా, పార్టీకైనా స్థాపించినపుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అధికారానికి వచ్చినట్లయితే ఆ సిద్ధాంతానికి భిన్నమైన లక్ష్యాలు ఏర్పడతాయి. అది క్రమంగా ఒక వైరుద్ధ్యంగా మారుతుంది. అధికార పరిష్వంగంలోకి వెళ్లినవారు ఎంత నిష్ఠాగరిష్ఠులైనా, దాని ఆకర్షణలకు లొంగకుండా ఉండటం చాలా అరుదు. వారికి తమ లక్ష్యాల సాధనకు సిద్ధాంతం ఒక పెద్ద ఆటంకంగా తోస్తుంది. అపుడు దానిని అనివార్యంగా ధిక్కరిస్తారు. ప్రస్తుతం ఆరెస్సెస్, మోదీ మధ్య జరుగుతున్నది అదే. స్వాతంత్య్రానంతరం గాంధీ ఆదర్శాల దారి ఏమిటో, కాంగ్రెస్‌వాదుల అధికార పోకడలు ఏ విధంగా ఉన్నాయో చూసిందే. మార్క్సిజానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడినామనే కమ్యూనిస్ట్ పార్టీలలో సైతం ఈ వైరుద్ధ్యాలు చోటు చేసుకున్నాయి.ఆరెస్సెస్ సైద్ధాంతికతకూ, బీజేపీ అధికార కాంక్షకూ మధ్య ఒక స్పర్థ ఏర్పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ సూచనలు గతంలోనూ ఉండేవిగానీ, ఇటీవలి ఎన్నికల తర్వాత అందుకు స్పష్టత ఏర్పడుతున్నది. ఎన్నిక లలో బీజేపీ అంతిమంగా అధికారానికి వచ్చినా అనుకోని విధంగా కొన్ని ఎదురుదెబ్బలు తిన్నది. ఆ వెంటనే ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, బీజేపీపై విమర్శలు చేశారు. ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ కూడా మరికొన్ని విమర్శలతో ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ఇదంతా జూన్ ప్రథమార్థంలో జరిగిన విషయం. ఆ విధమైన విమర్శలు బీజేపీ ప్రత్య ర్థుల నుంచి వచ్చి ఉంటే అందులో విశేషం లేదు. కానీ ఆ పని చేసింది బీజేపీ మాతృ సంస్థ కావటం, ఆ విమర్శలు కూడా బహిరంగంగా చేయటం సంచలనాన్ని సృష్టించింది. అటువంటి ఎదురు దెబ్బలు, సంచలనాత్మక విమర్శల దృష్ట్యా మోదీ తీరు, బీజేపీ పద్ధతులు కొంతైనా మారగలవని అనేకులు అభిప్రాయపడ్డారు. కానీ, ఆ జూన్ ప్రథమార్థం నుంచి ఇప్పటికి గడిచిన రెండు మాసాల కాలంలో మనకు ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. ఇందుకు రెండు తాజా ఉదాహరణలలో ఒకటి, లవ్ జిహాద్ కేసులలో జీవిత ఖైదు విధించే చట్టం చేయగలమన్న అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి ప్రకటన కాగా, రెండవది మోదీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల బిల్లును ప్రతిపాదించటం.ఈ వివరాలలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. ఆరెస్సెస్ ఒక సైద్ధాంతిక సంస్థ. ఆ సిద్ధాంతంతో ఎవరైనా ఏకీభవించ కపోవచ్చుగాక. కానీ వారికి తమ సిద్ధాంతాలు ఉన్నాయి. సంస్థ వయస్సు వందేళ్లు. దాని నాయకత్వాన ఇతర ప్రధాన సంస్థలు, ఉప సంస్థలు కలసి కొన్ని డజన్లు ఉన్నాయి. అన్నింటిని కలిపి సంఘ్ పరివార్ అంటున్నారు. వీటిలో భారతీయ జనసంఘ్ (1951) మొదటి రాజకీయ పార్టీ. తర్వాత అది బీజేపీ (1980)గా రూపాంతరం చెందింది. ఆరెస్సెస్ సిద్ధాంతం 1951 వరకు కూడా హిందూ రాజ్య స్థాపన కోసం సాంస్కృతిక రంగంలో, మతపరంగా కృషి చేయటం తప్ప రాజకీయాలలోకి అసలు ప్రవేశించరాదన్నది! తర్వాత కొన్ని పరిస్థితులలో మొదట జనసంఘ్, తర్వాత బీజేపీ ఏర్పాటుకు సమ్మ తించినా, ఆ పార్టీలు పూర్తిగా ఆరెస్సెస్ నిర్దేశాలకు లోబడి పనిచేస్తూ పోయాయి. బీజేపీ అధికారానికి వచ్చిన రాష్ట్రాలలోగానీ, వాజ్‌పేయి నాయకత్వాన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచినపుడుగానీ, ముఖ్యమైన పరిపాలనా విధానాలకు కూడా ఆరెస్సెస్‌తో చర్చలు జరుగుతుండేవి. అపుడపుడు భిన్నాభిప్రాయాలు తలెత్తినా చర్చల ద్వారా ఏకాభిప్రా యానికి వచ్చేవారు. ఆరెస్సెస్‌ను బీజేపీ నాయకత్వం ధిక్కరించటం జరిగేది కాదు. మోదీ నాయకత్వాన అది మొదటిసారిగా జరుగుతుండటమన్నది గమనించవలసిన విశేషం. మోదీ ధిక్కార ధోరణి వాస్తవా నికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండిన (2001–14) కాలంలోనే మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నది. జూన్ ప్రథమార్థం నాటి భాగవత్, ఆర్గనైజర్ల బహిరంగ విమర్శలను ఆయన లెక్క చేయక వ్యవహరించటం ఇందుకు కొనసాగింపు మాత్రమే.ఇప్పుడు అసలు చర్చలోకి వెళదాము. ఏ సంస్థకైనా, లేక పార్టీ కైనా వాటిని స్థాపించినపుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. తర్వాత అవి అధికారానికి వచ్చినట్లయితే ఆ సిద్ధాంతానికి భిన్నమైన లక్ష్యాలు ఏర్పడతాయి. పూర్తి భిన్నం కాకున్నా పరిస్థితులను బట్టి వేర్వేరు స్థాయిలలో ఏర్పడుతాయి. అటువంటపుడు ఆ సిద్ధాంతాలకు, అధి కార లక్ష్యాలకు మధ్యగల భిన్నత్వం క్రమంగా ఒక వైరుద్ధ్యంగా మారు తుంది. లక్ష్యాల స్వభావాన్ని బట్టి, ఆ వ్యక్తుల స్వభావాన్ని బట్టి వైరుధ్య తీవ్రత ఉంటుంది. మరికొద్ది ఉదాహరణలను కూడా చెప్పు కొని ఆరెస్సెస్, బీజేపీల విషయానికి మళ్లీ వద్దాము.కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పడింది. ఆ పార్టీ 1923లో చీలి కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ ఆవిర్భవించింది. ఎన్నికలలో పాల్గొనేందుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాగా, పాల్గొనాలన్నది స్వరాజిస్టుల వాదన. అప్పటినుంచి 1947లో స్వాతంత్య్రం లభించే వరకు, దేశ విభజన విషయంలో సైతం పార్టీలో పలువురు ప్రముఖులు గాంధీజీని వ్యతి రేకిస్తూ పోయారు. బ్రిటిష్ వారి హయాంలోనే ప్రభుత్వాలలోనూ చేరారు. ఆ వివరాలలోకి ఇక్కడ వెళ్లలేముగానీ, గుర్తించవలసింది సిద్ధాంతానికీ, అధికార కాంక్షలకూ మధ్య వైరుద్ధ్యాలు ఏర్పడటం. ఇక స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ సిద్ధాంతాలు, గాంధీ ఆదర్శాల దారి ఏమిటో, కాంగ్రెస్‌వాదుల అధికార పోకడలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నదే. చివరకు మార్క్సిజానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడినామనే కమ్యూనిస్ట్ పార్టీలలో సైతం ఈ వైరుధ్యాలు చోటు చేసుకున్నాయి. వారు స్వయంగా అధికారాలు నెరపిన దేశాలలోనూ, భారతదేశంలోని రాష్ట్రాలనూ చూసినపుడు ఇది స్పష్టంగా తెలుస్తుంది. వారి అధికార పతనాలకు గల ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి. అధికారం నిజంగానే ప్రజల మేలు కోసం పరిమితమయితే ఈ పరిస్థితి తలెత్తదు. కానీ విషాదకరమైన వాస్తవం ఏమంటే, అధికార పరిష్వంగంలోకి వెళ్లినవారు ఎంత నిష్టాగరిష్ఠులైనా, దాని ఆకర్షణలకు లొంగకుండా ఉండటం చాలా అరుదు. వారికి తమ లక్ష్యాల సాధనకు సిద్ధాంతం ఒక పెద్ద ఆటంకంగా తోస్తుంది. అపుడు దానిని అనివార్యంగా ధిక్కరి స్తారు. ప్రస్తుతం ఆరెస్సెస్, మోదీల మధ్య జరుగుతున్నది అదే.ఇటువంటి పరిస్థితులలో సర్వసాధారణంగా జరిగే క్రమం ఒకటు న్నది. ఒక సైద్ధాంతిక సంస్థకు అనుబంధంగా ఉండే కొందరు ఒక రాజకీయ పార్టీని నెలకొల్పడమంటే అధికార సాధన కోసం మాత్రమే. అటువంటపుడు ఒకవైపు తమ సిద్ధాంతంతో సంబంధం ఉన్నవారిని, లేనివారిని కూడా వీలైనంత విస్తృతంగా పార్టీలో చేర్చుకోవలసి ఉంటుంది. వారి ప్రయోజనాల కోసం కూడా పని చేయవలసి ఉంటుంది. మరొకవైపు ఆ క్రమంలో తాము అనేక అధికార ప్రయోజ నాల ఆకర్షణకు లోనవుతారు. ఈ రెండింటి ప్రభావం వారిని తమ సైద్ధాంతికతకు దూరం చేస్తుంది. సిద్ధాంతాలు గుర్తు చేసేవారిని ధిక్కరించేట్లు చేస్తుంది. కాంగ్రెస్, సోషలిస్టులు, కుల పార్టీలు, ప్రాంతీయ పార్టీల వంటివే కాదు... కమ్యూనిస్టులు, మతవాద పార్టీల వంటి నిష్టాగరిష్ఠత గల సైద్ధాంతిక, కేడర్ పునాది పార్టీలకు సైతం ఈ మాట వర్తిస్తుంది. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నదే. మరొక మాటలో చెప్పాలంటే ఇవన్నీ సైద్ధాంతిక పతనాలు. సిద్ధాంతానికీ, అధికారానికీ మధ్య స్పర్థ. మనం చూసినంతవరకు ఇందులో అధికా రానిదే పైచేయి అవుతూ వస్తున్నది. అధికారానికి వచ్చినవారు భరించ లేకుండా తయారై, ప్రజల తీవ్ర ఆగ్రహాలకు గురై, వారి చేత పరా భవం పొంది, తిరిగి ప్రజలు సిద్ధాంతాల వైపు మళ్లితే తప్ప, పరిస్థి తులు ఈ విధంగానే ఉంటాయి.అయితే ఆరెస్సెస్‌కు సంబంధించిన అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. పార్టీ ఏర్పాటును 1951 వరకు వ్యతిరేకించిన వారు జన సంఘ్ స్థాపనకు, తర్వాత బీజేపీ అవతరణకు ఎందువల్ల సమ్మతించినట్లు? రాజకీయ శక్తిగా మారి అధికారం కూడా సాధించినట్లయితే దానిని ఉపయోగించుకుని హిందూ రాష్ట్ర స్థాపన లక్ష్యాన్ని ముందుకు తీసుకు పోవచ్చునన్నది ఆలోచన. యథాతథంగా అది మంచి వ్యూహమే కావచ్చు. కానీ పైన చెప్పుకున్నట్లు, రాజకీయ శక్తులు, వారి ప్రయోజనాల వలలో చిక్కుకుని అది దారి తప్పింది. ఆరెస్సెస్ నాయ కత్వం స్వయంగా బలహీన పడుతుండటంతో రాజకీయ నాయకత్వం బలం పెరిగింది. ఇంతేకాదు, సాక్షాత్తూ సంఘ్ పరివార్‌లోని కొన్ని వర్గాలు కూడా అధికార ఆకర్షణలకు లోబడటం మొదలైందనే మాటలు కొంత కాలంగా వినవస్తున్నాయి. ఇటువంటి పరిణామాల మధ్య జరిగేదేమిటి? మోదీ, బీజేపీల అధికార ఆయుధానికి పదను పెరుగుతుంది. ఆరెస్సెస్ సైద్ధాంతిక నిష్ఠ క్రమంగా మొద్దుబారుతుంది. ఈ స్పర్థలో మొగ్గు ఎవరిదో కనిపిస్తున్నదే.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నిషేధాలే గానీ సేవలు గుర్తుండవా?
58 ఏళ్ల కిందట నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొననకుండా ప్రభుత్వోద్యోగులపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని మొన్న జూలై 9న కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దానితో ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. సంస్థ భావజాలం, కార్యకలాపాలు నచ్చితేనే ఎవరైనా చేరడమో లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వడమో చేస్తారు. చైనాతో జరిగిన యుద్ధంలో భారత సైన్యానికి తోడుగా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది. ప్రకృతి వైపరీత్యాల కాలాల్లో సేవలు అందించింది. గాంధీ హత్య ఘటనలో పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ అనంతరం ఆర్ఎస్ఎస్పై వచ్చిన ఆరోప ణలన్నీ సత్యదూరమని తేలిపోయింది. అయినాకూడా ఆర్ఎస్ఎస్ను ఇప్పటికీ మహాత్మగాంధీ హత్యతో ముడిపెట్టడం ఎంత దారుణమో ఆలోచించాలి.గోవధను వ్యతిరేకిస్తూ లక్షలాది ప్రజల మద్దతును కూడగట్టిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను నిలువరించేందుకు 1966 నవంబర్ 30న, అంటే 58 ఏళ్ల కిందట నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొననకుండా ప్రభుత్వోద్యోగులపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని మొన్న జూలై 9న కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దానితో ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఆర్ఎస్ఎస్ మీద విధించిన నిషేధాల గురించే తప్ప... ఆ నిషేధాల ఎత్తివేత గురించి గానీ, పాకిస్తాన్, చైనా మన దేశం పైన యుద్ధం చేసిన సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాల కాలాల్లో సామాన్య ప్రజలకు స్వయంసేవకులు అందించిన సేవలను మరిచిపోయారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పినట్టు... మహాత్మా గాంధీ హత్యానంతరం 1948 ఫిబ్రవరి 4న ఆర్ఎస్ఎస్పై పటేల్ విధించిన నిషేధాన్ని 18 నెలల తర్వాత ఆయనే హోంమంత్రి హోదాలో ఎత్తివేశారు. గాంధీ హత్య ఘటనలో పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ అనంతరం ఆర్ఎస్ఎస్పై వచ్చిన ఆరోపణలన్నీ సత్య దూరమని తేలిపోయింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్గా ఉన్న గురూజీ (ఎంఎస్ గోల్వాల్కర్)కి పటేల్ రాసిన లేఖలో సంఘ్ సేవలను ప్రశంసించడమే గాక, స్వయంసేవకులు కాంగ్రెస్‌లో చేరి సేవలను కొనసాగించాలని ఆహ్వానించారు. 1948 సెప్టెంబర్ 11న సర్దార్ పటేల్ రాసిన ఈ లేఖ ‘జస్టిస్ ఆన్ ట్రయల్’ పుస్తకంలో ఉంది. ఆర్ఎస్ఎస్ శాఖను మహాత్మా గాంధీ సందర్శించిన సంఘటనను మనం గుర్తు చేసుకోవాలి. గాంధీజీ 1936లో వార్ధాకు దగ్గరలో జరిగిన సంఘ్ శిబిరాన్ని సందర్శించారు. ఆ తరువాతి రోజు ఆయన్ని కలుసు కోవడానికి డా. హెడ్గేవార్ వారి నివాసానికి వెళ్లారు. అక్కడ వారితో జరిపిన సుదీర్ఘమైన సంభాషణ వివరాలు పుస్తకరూపంలో లభిస్తు న్నాయి. దేశ విభజన సమయంలో ఢిల్లీలోని తన నివాసానికి దగ్గరగా ఉన్న సంఘ్ శాఖకు గాంధీజీ మరోసారి వచ్చారు. స్వయంసేవకులతో మాట్లాడారు. ఈ వివరాలు 1947 సెప్టెంబర్ 27 నాటి ‘హరిజన్’ పత్రికలో ప్రచురితమయ్యాయి. స్వయంసేవకుల క్రమశిక్షణాయుత, కులభేదాలకు అతీతమైన వ్యవహారశైలిని ఆయన మెచ్చుకున్నారు. 1939 మే 12న పూనా నగరంలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల శిబిరానికి సంఘ్ కార్యకర్తల ఆహ్వానం మేరకు బాబాసాహెబ్ అంబే డ్కర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్సంస్థాపకులు డా.కేశవరావు హెడ్గేవార్, ఇతర ఆర్ఎస్ఎస్ స్థానిక ప్రముఖులు, అంబేడ్కర్ అనుయాయి బాలాసాహెబ్ సాలుంకే ఉన్నారు. వీరు 1957–62 మధ్య లోక్‌సభ సభ్యులు. వీరి ఆత్మకథలో ఈ ఘటనను పేర్కొన్నారు. 1957 ఏప్రిల్ 1 ఉగాది రోజున పూనాలో జరిగిన ఆర్ఎస్ఎస్ ఉత్సవంలో ఈ ఘటనను వారు బహిరంగ సభలో తెలియజేశారు. ఆర్ఎస్ఎస్ను అంబేడ్కర్ ఎక్కడా విమర్శించినసందర్భాలే లేవు.చైనాతో జరిగిన యుద్ధంలో భారత సైన్యానికి తోడుగా ఆర్ఎస్ఎస్ ఎంతో కీలక పాత్ర పోషించింది. అది చూసిన నాటి ప్రధాని నెహ్రూ ఎంతో ప్రభావితం అయ్యారు. ఆర్ఎస్ఎస్లోని ఒక దళం పూర్తి యూనిఫాం, బ్యాండ్‌తో 1963 గణతంత్ర దినోత్సవ పెరేడ్లో పాల్గొనేందుకు ఆహ్వానించారు. 1965 నాటి ఇండో–పాక్ యుద్ధ కాలంలో కూడా భారత సైన్యానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవలను గుర్తించి నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అప్పటి ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ ఎం.ఎస్.గోల్వాల్కర్‌ను ప్రశంసించారు.ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975లో విధించిన అత్యవసర పరిస్థితి సందర్భంలో ఒకసారి... అనంతరం 1992లో బాబ్రీ మసీదు ఘటన సందర్భంలో మరోసారి ఆర్ఎస్ఎస్పై నిషేధాలు విధించడం... వివిధ ప్రభుత్వ శాఖల దర్యాప్తులు, న్యాయస్థానాల విచారణల అనంతరం ఎత్తివేయడం జరిగింది. సంఘ్ మీద ఏ సందర్భంలో నిషేధం విధించినా అవన్నీ రాజకీయ కారణాల వల్ల అప్పటి ప్రభు త్వాలు విధించినవే తప్ప ఒక్క ఆరోపణ కూడా కోర్టు విచారణల్లో రుజువు కాలేదు. ఇందిర సర్కారు నిషేధం విధించడానికి ముందే ఈ అంశంపై కోర్టు తీర్పులను పరిశీలిస్తే... పంజాబ్ ఉద్యోగి రాంపాల్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడనే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించగా... ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదంటూపంజాబ్ – హరియాణా కోర్టు అతని తొలగింపు సమర్థనీయం కాదని తీర్పునిచ్చింది. మరో సంఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు సంబంధించినది. 1966లో అక్కడ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా ఉన్న రంగనటచార్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటు న్నాడనే కారణంతో ఆయన పదోన్నతికి ఆటంకం కలుగగా... ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ కాదనీ, హిందువేతరులకు అది వ్యతిరేకం కాదనీ 1966 జూలై 6న మైసూర్ హైకోర్టు తీర్పునిచ్చింది.ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనే విషయంలో ప్రభుత్వో ద్యోగులపై నిషేధం ఉన్నా, లేకపోయినా.. సంస్థ సిద్ధాంతం, భావ జాలం, కార్యకలాపాలు తమకు నచ్చితేనే ఎవరైనా చేరడమో లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వడమో చేస్తారు తప్ప, నిషేధం ఎత్తివేసినంత మాత్రాన దేశంలోని ప్రభుత్వోద్యోగులందరూ మూకుమ్మడిగా ఏసంస్థ కార్యకలాపాల్లోనూ పాల్గొనరు గదా? అందువల్ల ప్రభుత్వోద్యో గులపై ఇన్నేళ్లు ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినందుకు ఏదో జరిగిపోతుందన్నట్టు గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు.కాంగ్రెస్‌లో ఒకప్పటి అగ్రనేత, ఆ పార్టీ సర్కారులో కేంద్రమంత్రి, దేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2018లో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల తృతీయ వర్ష ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాటి కాంగ్రెస్ వర్గాలు ఎంత వ్యతిరేకించినా ప్రణబ్ ఈ వేడుకలో భాగస్వామి అయ్యారు. ‘నేను ఈ రోజున భరతమాత గొప్ప సంతానమైన డా. కేశవ బలిరామ్ హెడ్గేవార్‌కు అంజలి సమర్పించ డానికి వచ్చాను’ అని రాశారు. అదే ఏడాది కేరళలోని కొట్టాయంలో డిసెంబర్ 31న జరిగిన ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షవర్గ ముగింపు కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ థామస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘భారత్‌లో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని ఎవరైనా నన్ను అడిగితే – మొదట రాజ్యాంగం,రెండవది ప్రజాస్వామ్య వ్యవస్థ, మూడు సైన్యం, నాలుగు ఆర్ఎస్ఎస్ వల్ల అని జవాబు చెపుతాను’ అన్నారు. వీరేగాక లోకమాన్య జయ ప్రకాశ్ నారాయణ్, శాస్త్రవేత్తలైన జి.మాధవన్ నాయర్, కె. రాధాకృష్ణన్, కె.కస్తూరి రంగన్ వంటి పెద్దలు సైతం సంఘ్ కార్యకలాపాలను ప్రశంసించారు.ఆర్ఎస్ఎస్ పైన నిషేధాన్ని ఎత్తివేసిన రెండు దశాబ్దాల తరువాత ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం మహాత్మగాంధీ హత్యకు జరి గిన కుట్రపై విచారణ జరిపేందుకు ఒక కొత్త జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జె.జె. కపూర్‌ను చైర్మన్‌గా నియమించారు. ఆ కమిషన్ దాదాపు వందకు పైగా సాక్షులను విచా రించి 1969లో నివేదిక సమర్పించింది. ‘నేరస్థులు ఆర్ఎస్ఎస్ సభ్యు లన్న విషయం ఎక్కడా రుజువు కాలేదు. ఆ సంస్థకు హత్యలో భాగం ఉందని నిరూపితం కాలేదు’ అని కపూర్ కమిషన్ (సంపుటి –1, పేజీ–186) స్పష్టీకరించింది. దేశ విదేశాలలో కోట్లాదిమంది స్వయం సేవకులు ప్రతిరోజూ ప్రాతఃస్మరణంలో గాంధీజీ పేరును తలుచుకుంటారు. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ను మహాత్మాగాంధీ హత్యతో ముడి పెట్టడం ఎంత దారుణమో ఆలోచించాలి. ఈ నిరాధారమైన ఆరో పణలు చేసేవారిని శిక్షార్హులుగా ప్రకటించి చట్టపరమైన చర్యలు తీసు కోవాల్సిన సమయం ఆసన్నమైంది. - వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్- చెన్నమనేని విద్యాసాగరరావు -
రాజ్యాంగ రక్షణే అత్యవసరం
పదవిని కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిరాగాంధీ అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. కానీ ఎమర్జెన్సీ కంటే రాజ్యాంగపు తిరగరాత మరింత ప్రమాదకరమైనది. 2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. అయితే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి.18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘అబ్ కీ బార్ 400 పార్’ అని, ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని నినాదమిచ్చారు. దాని తరువాత ఆయన మోదీ గ్యారెంటీ నినాదమిచ్చారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలో పార్టీని పక్కకు పెట్టి వ్యక్తి గ్యారెంటీ మ్యానిఫెస్టో రాయించారు. ఇది మామూలు విషయం కాదు. ఆ వెనువెంటనే ఆరెస్సెస్, బీజేపీ లీడర్లు కొంతమంది 400 సీట్లు రాగానే దేశ రాజ్యాంగాన్ని తిరగ రాస్తామని ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. అలా తిరగరాత సిద్ధాంతం ఉన్న ఆరెస్సెస్ నాయకులెవరు ఇటువంటి ప్రకటనలను ఖండించలేదు. ఆనాటికి గానీ, ఇప్పుడు గానీ ఎన్డీఏలో ఉన్న పార్టీలవారికి... అనుకున్న 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తిరగరాసే ప్రక్రియను ఎదుర్కొనే శక్తి లేదు. వారికి అధికారం తప్ప బలమైన సిద్ధాంతం కూడా లేదు. వాళ్ళ పార్టీ అధికారం తప్ప దేశం ఎటుపోయినా ఫర్వాలేదు. ఈ స్థితిలో ఇండియా కూటమి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశాన్ని చేసింది. ఎన్నికల తర్వాత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని, అంబేడ్కర్ బొమ్మనీ బహిరంగ సభల్లో చూపిస్తూ తిరిగారు. ఎన్నికల పోరాటమంతా రాజ్యాంగం చుట్టూ తిరిగే స్థితి మొదటిసారి వచ్చింది. ప్రపంచ పత్రికలు కూడా ఒక దేశం రాజ్యాంగ రక్షణ అంశం ఇంత పెద్దఎత్తున ఏ దేశ ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం కాలేదని రాశాయి. టీవీలు, సోషల్ మీడియా మాట్లాడాయి. ఐతే ఎన్నికల సమయంలో ఒక మోదీ తప్ప ఆరెస్సెస్ ప్రధాన నాయకుడైన మోహన్ భాగవత్ సహా రాజ్యంగాన్ని తిరగరాసే ఆలోచన లేదని చెప్పలేదు. మోదీ మాత్రం మేమే ఈ రాజ్యాంగ రక్షకులమని కొన్ని సభల్లో మాట్లాడారు. కానీ ఆరెస్సెస్, బీజేపీ నాయకులంతా సైలెంట్‌గా ఉన్నారు. దానికి ప్రధాన కారణమేమిటంటే, ఈ రాజ్యాంగం పరిధిలో పార్లమెంట్, ఇతర సంస్థలపై సంపూర్ణ పట్టు సాధించి తరువాత ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది వారి ఆలోచన. ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ఇప్పుడున్న రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండే దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనికి మనుధర్మ శాస్త్ర లక్షణాలు ఏ మాత్రం లేవనేది వారి ప్రధాన వాదన. వాళ్ళ అవగాహనలో భారతీయ చట్ట సంస్కృతి అంటే మనుధర్మ శాస్త్ర చట్ట సంస్కృతి. దాంట్లో ప్రధానమైన వర్ణ–కుల వ్యవస్థనీ, స్త్రీ అసమాన జీవితాన్నీ కాపాడటం. సమాజ అసమానతలు భారతీయ సంస్కృతిలో భాగం అని వారి భావన. అదృష్టవశాత్తు బీజేపీకి 240 సీట్లు మాత్రమే రావడం, దానికి రాజ్యాంగ రక్షణ డిబేట్ దోహదపడటం జరిగింది. అయితే రాజ్యాంగ పర చర్చ ప్రజల జీవనంలోకి చొచ్చుకుని పోకుండా ఉండటానికి ఆరెస్సెస్, బీజేపీ ఒక ఎత్తుగడ వేశాయి. అది 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమస్యను ముందుకు తేవడం! ఎమర్జెన్సీలో చాలా అట్రాసిటీలు, అరాచకాలు జరిగిన మాట నిజమే కానీ అది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేటటువంటి ప్రమాద ఘట్టం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసి ఎంతోమంది యువకులు ఎమర్జెన్సీలో ఎదురు కాల్పుల పేరిట చంపబడ్డారు. ఐతే రాజ్యాంగానికి వచ్చేవరకు ఆ కాలంలో చేసిన రెండు సవరణలు: ప్రియాంబుల్‌లో ‘సోషలిజం’ అనే పదం చేర్చడం; రెండవది ఫండమెంటల్ రైట్స్‌కు కొంత అఘాతం కలిగించే ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడం. ఆరెస్సెస్, బీజేపీ సోషలిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడాన్ని వ్యతిరేకించాయి. కానీ ఫండమెంటల్ డ్యూటీస్‌ని రాజ్యాంగంలో చేర్చడాన్ని బలపర్చాయి. బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ నుంచి విడగొట్టి, పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించినందుకు ఇందిరాగాంధీని దుర్గాదేవిగా వర్ణించిన వారిలో ఆరెస్సెస్, బీజేపీ వారు ఉన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు వంటి ఆమె నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ మూడు సిద్ధాంతకర మార్పులు సోషలిస్టు సిద్ధాంత ప్రభావంతో ఇందిరాగాంధీ చేస్తున్నారని వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ వంటి నాయకులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణాల రద్దు... శ్రమ జీవులకు, ఉత్పత్తి కులాలకు మేలు చేశాయి. ఈ క్రమంలో ఆమె భూ సంస్కరణల చట్టం చెయ్యడానికి శ్రీకారం చుట్టారు. 1972లో దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బలమైన భూ సంస్కరణల చట్టం వచ్చింది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి 27 ఎకరాల తరి, 57 ఎకరాల ఖుశ్కి భూమి కంటే ఎక్కువ ఉండటానికి వీలు లేదని చట్టం తెచ్చింది ఆమెనే. ఆ చట్టాన్ని ఎమర్జెన్సీలో భూస్వాములపై ఒత్తిడి తెచ్చి కొంత అమలు చేశారు. నేను 1980లో ఈ చట్టం అమలుపై ఎంఫిల్ «థీసిస్ కోసం చాలా గ్రామాల్లో ల్యాండ్ రిఫామ్ ఎలా జరిగిందో పరిశీలించాను. భూస్వాములు భూములను బినామీ పేర్లమీద మార్చి చాలావరకు కాపాడుకున్నప్పటికీ ఎమర్జెన్సీలో కొంత భూమి పంచబడింది. ఆ కాలంలో తన పదవి కాపాడుకోవడం కోసం ప్రతిపక్ష నాయకులను ఇందిర అరెస్టు చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించారు. నిజమే. అందుకే ఎమర్జెన్సీ ఎత్తివేయగానే దేశంలో ఒక పౌరహక్కుల ఉద్యమం ముందుకొచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దేశంలో పౌరహక్కులను కాపాడవలసిన అవసరముందని మాట్లాడాయి. ఆ ఒక్క దశలోనే బీజేపీ నాయకులు కూడా పౌరహక్కుల ఉద్యమాన్ని బలపర్చారు. తర్వాత వాళ్లు పౌరహక్కుల రక్షణ జోలికి పోలేదు. కనుక ఎమర్జెన్సీ అనేది రెండువైపుల పదునున్న కత్తిలా పని చేసింది. కానీ ఆరెస్సెస్, బీజేపీ ఈ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలనుకున్న ఆలోచనలో శూద్రుల, దళితుల, ఆదివాసుల పక్షపాత ఆలోచనలు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. వాళ్లు అనుకున్నట్టు నిజంగానే 400 సీట్లు వచ్చి ఉంటే వాళ్లు కొత్త కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీని స్థాపిస్తే దాంట్లో ఎటువంటి మేధావి వర్గం ఉండేవారు? ఆ రాజ్యాంగ పరిషత్ కుల అసమానతలను, అంటరానితనాన్ని, బీదరికాన్ని తొలగించే గట్టి ప్రతిపాదనలు చేసే అవకాశం ఉండేదా! నిజానికి బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుపై చర్చ జరుగుతున్నప్పుడు ఆరెస్సెస్, బీజేపీ నాయకుల వాదనలు; రాజరిక వ్యవస్థ పట్ల జమీందారీ హక్కుల పట్ల వాళ్లు ఎంత అనుకూలంగా ఉన్నారో తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాజ్యాంగంలోని ప్రియాంబుల్‌లో ఉన్న ‘సోషలిజం’ అనే పదాన్ని వాళ్లు తొలగించాలనుకునేది భారతీయ కష్ట జీవుల పక్షాన ఉండటానికా? పెట్టుబడిదారుల పక్షాన ఉండటానికా?2024 ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. ఐతే ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం అప్పుడే పూర్తిగా తొలగిపోలేదు. చంద్రబాబు, నితీష్‌కుమార్ వంటి సిద్ధాంత రహిత ప్రాంతీయ నాయకులు కూడా ఈ భవిష్యత్ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడలేరు. దేశం మొత్తంగా ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రక్షించుకునే చైతన్యం పెరగాలి. ఓటు రాజ్యాంగ రక్షణ ఆయుధాలలో కీలకమైంది. ఐతే దాన్ని ప్రజలు, ముఖ్యంగా యువకులు నిరంతరం ఇప్పుడున్న రాజ్యాంగంతో ముడేసి చూడాలి. ఈ ఎన్నికల్లో రాజ్యంగం పట్ల కలిగిన కొత్త చైతన్యాన్ని తగ్గించేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ఎమర్జెన్సీ అంశాన్ని ముందు పెట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాయి. జూన్ 25న వి.పి. సింగ్ జయంతి సభ ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో జరిగింది. మాట్లాడటానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను. అందులోనే చాలా పెద్ద హాలులో రైట్‌వింగ్ ఆలోచనాపరులు ఎమర్జెన్సీలో జె.పి. మూమెంట్‌పై మీటింగ్ పెట్టారు. ఎందుకో తెలుసా? రాజ్యాంగ మార్పు కంటే ఎమర్జెన్సీ ప్రమాదకరమని చెప్పడానికి!ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
చిత్తశుద్ధి కావాలి!
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవల బహిరంగంగా ఇచ్చిన సలహా వల్ల అయితేనేం, స్వీయజ్ఞానంతో అయితేనేం... మొత్తానికి మణిపూర్ భద్రతా వ్యవహారాలపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చాలాకాలం తర్వాత ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. ఈశాన్య రాష్ట్రంలో ఇటీవల మళ్ళీ హింసాత్మక సంఘటనలు చెలరేగడంతో షా సారథ్యంలో సోమవారం జరిగిన ఈ భేటీ సహజంగానే ఆసక్తి రేపింది. భేటీ ముగిసిన అనంతరం కేంద్రం ఎప్పటిలానే తాము మణిపుర్ ప్రజల రక్షణ, భద్రతలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. రాష్ట్రంలోని మెయితీ, కుకీ వర్గాలు రెంటితోనూ చర్చలు జరిపి, జాతుల మధ్య వైమనస్యాలు తొలగించేందుకు సత్వరమే కృషి చేస్తామంటూ హోమ్‌మంత్రి పాతపాటే పాడారు. విపరీతంగా జాప్యమైనా, మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్య గురించి మళ్ళీ కనీసం ఆలోచన చేసినందుకు సంతోషించాలి. కానీ గంటకు పైగా సాగిన భేటీలో మణిపుర్ సీఎం బీరేన్‌సింగ్ కనిపించకపోవడమే విచిత్రం.రాష్ట్రంలో అశాంతిని కట్టడి చేయడంలో తమ ప్రభుత్వం విఫలమైందని లోక్‌సభ ఎన్నికల తర్వాత సాక్షాత్తూ బీరేన్సింగే ఒప్పుకున్నారు. ఆలస్యంగానైనా వైఫల్యాన్ని అంగీకరించారు. తప్పొప్పుల బాధ్యత తలకెత్తుకున్నారు. మణిపుర్లో మెజారిటీ వర్గమైన మెయితీలకు షెడ్యూల్డ్ తెగల హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఈ సుదీర్ఘ ఘర్షణలకు దారి తీసింది. ఆ డిమాండ్‌కు నిరసనగా రాష్ట్రంలోని పర్వతప్రాంత జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టేసరికి గడచిన 2023 మే 3న జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటికీ చల్లారని ఈ చిచ్చుకు ఏడాది దాటిపోయింది. ఈ పదమూడు నెలల్లో 220 మందికి పైగా మరణించగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వేలాది చిన్నారులు చదువుకు దూరమయ్యారు. మయన్మార్ నుంచి ‘అక్రమంగా’ వలసవచ్చిన బయటివారే ఘర్షణలకు బాధ్యులని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మొండిగా వాదిస్తూ వచ్చాయి. మణిపుర్‌లోని పర్వతప్రాంతాల్లో నివసించే కుకీ–జోలు, ఈ మయన్మార్ వలసదారులు ఒకే తెగ వారు గనక రాష్ట్రంలో ఘర్షణలకూ, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికీ వారే కారణమనేది సర్కారు వారి మాట. సమస్య మూలాల్లోకి వెళ్ళకుండా పక్షపాత ధోరణితో రాజకీయంగా వ్యవహరిస్తే, ఇలాగే ఉంటుంది. అసలు 1990లలో ఈశాన్య రాష్ట్రాల్లోకెల్లా అత్యధిక తలసరి ఆదాయం ఘనత మణిపుర్దే. అలాంటి రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యల్ప తలసరి ఆదాయమున్న మూడో రాష్ట్రంగా మారింది. విద్య, వైద్యం మొదలు ఉపాధి, ప్రాథమిక వసతి కల్పన దాకా అన్నింటా వెనకబడింది. ఈ పరిస్థితులు రాష్ట్రంలోని వివిధ జాతుల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్న ధోరణి వనరుల కేటాయింపు, పరిపాలనల్లో సాగుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. క్రమంగా అది వర్గాల మధ్య విభేదాలు పెంచి, ఘర్షణల దాకా తీసుకొచ్చింది. అయితే ఇటీవలి దాకా అశాంతి, అస్థిరతలకు దూరంగా, విభిన్న వర్గాల సమ్మిశ్రిత ఆవాసమైన జీరీబామ్ లాంటి జిల్లాలకూ తాజాగా ఘర్షణలు పాకిపోవడం మరింత ఆందోళన రేపుతోంది. అసోమ్‌ను ఆనుకొని ఉండే జీరీబామ్ జిల్లాలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి అడ్వాన్స్ సెక్యూరిటీ కాన్వాయ్‌పైనే ఈ జూన్ 10న దాడులు జరగడం రాష్ట్రంలోని అరాచక పరిస్థితులకు అద్దం పడుతోంది. ఇటీవలి ఘర్షణలతో ఆ జిల్లా నుంచి వేలాది జనం అసోమ్‌కు పారిపోయారు. రాష్ట్రంలో ఇప్పటికి ఏడాదిగా కొన్ని వేలమంది తమ ఇళ్ళకు దూరంగా నిర్వాసితుల శిబిరాల్లోనో, బంధుమిత్రుల ఇళ్ళల్లోనో తలదాచుకొని, కాలం గడుపుతున్నారు. జీవనోపాధి మాత్రమే కాదు... చివరకు సాధారణ జీవితమే ప్రజలకు దూరమైంది. రాష్ట్రం రావణకాష్ఠంగా మారినా ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. మాటలకే తప్ప చిత్తశుద్ధితో చేతలకు దిగలేదు. గత ఏడాది కాలంలో ప్రధాని మోదీ అనేక పర్యాయాలు ఈశాన్య రాష్ట్రాలను సందర్శించారు కానీ ఒక్కసారైనా మణిపుర్‌కు పోలేదు. మాటల్లోనైనా దాని ఊసెత్తలేదు. చివరకు ఆ మధ్య ఓ ఎన్నికల ప్రసంగంలో మణిపుర్ మాటెత్తినా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, కేంద్రం జోక్యంతో పరిస్థితి మెరుగు పడిందన్నారు. వాస్తవానికి పరిస్థితి మరింత దిగజారిందనేది జగమెరిగిన సత్యం. మణిపుర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారశైలిని నిరసిస్తూ, మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇక, సీఎం సైతం మెయితీల వర్గానికి కొమ్ము కాస్తూ, తప్పంతా గిరిజన కుకీలదే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు ఆది నుంచీ తీవ్ర విమర్శల పాలైంది. గతంలో గుజరాత్, హర్యానాల్లో చిన్న కారణాలకే సీఎంలను మార్చేసిన బీజేపీ అధిష్ఠానం ఇంత జరుగుతున్నా మణిపుర్లో మాత్రం బీరేన్‌ను ఏడాదిగా అలాగే కొనసాగించడం పెను వింత. కనీసం అంతకు ముందు దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న మణిపుర్లో ఇవాళ ఇలా తయారైందంటే తప్పెవరిది? సాయుధ మూకలు తుపాకులు ధరించి, చివరకు సైనిక వాహనాలను సైతం అడ్డగిస్తున్న పరిస్థితి ఉందంటే, ఏమనాలి? సోషల్ మీడియాలో దేశమంతటా తిరుగుతున్న ఈ దృశ్యాలు పాలకులకే సిగ్గు చేటు. ఏ ఒక్క వర్గాన్నో కాదు... మొత్తం రాష్ట్రాన్నే మంటల్లో పడేసిన ప్రస్తుత పరిస్థితి మారాలంటే ప్రభుత్వాలు త్రికరణశుద్ధిగా కార్యాచరణకు దిగాలి. జాతి, మతం, రాజకీయాలతో ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు చేపట్టాలి. మాటలు, సమీక్షల కన్నా సత్వర చర్యలు ముఖ్యం. రాజకీయ జోక్యం మాని, ఉన్మాద చర్యల్ని ఉక్కుపాదంతో అణచివేసేలా భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. అన్ని వర్గాల మధ్య సామరస్యం నెలకొనే నిరంతర రాజకీయ కృషి సాగాలి. నిష్పాక్షికంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తేనే మణిపుర్ మళ్ళీ మామూలవుతుంది. లేదంటే, మణిపురే కాదు... మానవ చరిత్ర కూడా మనల్ని క్షమించదు. -
బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆర్ఎస్ఎస్ నేత యూ టర్న్!
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్‌సభ బీజేపీపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అహం పెరిగిపోవడం వల్లే సరైన ఫలితం రాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పేరు ప్రస్తావించకుండా ప్రతిపక్ష కూటిమిపై విమర్శలు గుప్పించారు. ఇక.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదం రేపటంతో క్లారిటీ ఇచ్చారు.‘‘ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. రాముడిని వ్యతిరేకించిన వాళ్లు అధికారంలో లేరు. రాముడిని గౌరవించాలనే సంకల్పం ఉన్నవాళ్లు ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు. అదే విధంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది’’ అని ఇంద్రేష్ కుమార్ స్పష్టం చేశారు.జైపూర్(రాజస్థాన్) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారు.మరోవైపు.. ప్రతిపక్ష ఇండియా కూటమిపై కూడా విమర్శలు గుప్పించారు.మరోవైపు.. కూటమి పేరును కూడా ప్రస్తావించకుండా .. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని అన్నారు. ఇటీవల ఆఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు. -
మందలింపు మాటలు
పెంచి, పోషించిన పెద్దవాళ్ళకు పిల్లలను మందలించే హక్కు ఎప్పుడూ ఉంటుంది. రెక్కలొచ్చిన పిల్లలు పెద్దల మాట వింటారా, లేదా అన్నది మాత్రం వేరే విషయం. గడచిన పదేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సైద్ధాంతిక తల్లివేరు లాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రభుత్వ పెద్దలపై తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసినప్పుడు ఆ పోలికే గుర్తుకువస్తోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సాగిన భీకర విద్వేష ప్రచారాన్ని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ సోమవారం ఘాటుగా విమర్శించారు. మత ప్రాతిపదికన సమాజంలో చీలికలు తీసుకువచ్చేలా మాట్లాడడాన్ని తప్పుపడుతూ అధికార, ప్రతిపక్షాలు రెంటికీ తలంటి పోశారు. ఎన్నికలనేవి పోటీయే తప్ప యుద్ధం కాదంటూ హితవు పలికారు. అలాగే, కల్లోలిత రాష్ట్రం మణిపుర్‌లోని పరిస్థితిని ప్రస్తావిస్తూ, ప్రాధాన్యతా అంశంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు. గత వారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆరెస్సెస్ ఛీఫ్ తొలిసారిగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇవే కావడం గమనార్హం. అదే సమయంలో ఆరెస్సెస్ అనుబంధ పత్రిక ‘ఆర్గనైజర్’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ఫలితాలలో బోర్లాపడ్డందున బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరగాలని రాయడం విశేషం. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. భాగవత్ నేరుగా మోదీ పేరు ప్రస్తావించకున్నా, ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో అర్థం చేసుకోవచ్చు. అలాగే, క్షేత్రస్థాయిలోని జనం మాట వినకుండా, గాలి బుడగలో ఆనందంగా గడిపేయడమే బీజేపీ స్వయంగా మెజారిటీ సాధించలేని దుఃస్థితికి కారణమంటూ ‘ఆర్గనైజర్’ వ్యాసంలో ఆరెస్సెస్ జీవితకాల సభ్యుడు రతన్ శారద పేర్కొన్నారు. జనంలో రాకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పంచుకుంటూ, సమస్తం మోదీ పేరుతో జరిగిపోతుందని భావించారన్న ఆయన చురకలు బీజేపీకి పెద్దగా రుచించని ఘాటైన మాటలే! నిజానికి, తాజా ఎన్నికల్లో విజయానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, తమ పార్టీ ఆరెస్సెస్‌ను మించి ఎదిగిందనీ, వ్యవహారాలు నడపడానికి దానిపై ఇక ఎంత మాత్రమూ ఆధారపడి లేమనీ అనడం ఆశ్చర్యకరం. బహుశా దానికి పరోక్షంగా ప్రతిస్పందనే భాగవత్ మాటలు, ‘ఆర్గనైజర్’లో వ్యాసమూ అయినా కావచ్చు. మోదీ సైతం ఒకప్పుడు ఆరెస్సెస్ ప్రచారకుడిగా ప్రజాజీవితం ప్రారంభించిన వారే. ఆ భావజాలంతో ఎదిగినవారే. ఆయన ఎదుగుదలలో, సైద్ధాంతిక అజెండాలో, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ పైన దేశ ప్రధానిగా ఆయన ముందుకు నడవడంలో ఆ మాతృసంస్థ పాత్రను విస్మరించలేం. రాజకీయ పార్టీ బీజేపీ అయినా, దానికి పునాది స్థాయిలో పట్టు నిలిపి, గుట్టుమట్లు తెలిపినది ఆరెస్సెస్ అనేదీ జగమెరిగిన సత్యమే. ఇప్పుడు పునాదిని మరిచి, పై మాటలు మాట్లాడడం హాస్యాస్పదం. భాగవత్ చేసిన మణిపుర్ ప్రస్తావన కూడా సరైన సమయానికే వచ్చింది. ఎన్నికల కోసం దేశమంతటా కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగిన ప్రధాని సందర్శించనిది మణిపురే. ఏడాది గడిచినా చల్లారని మంటలతో ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. గత వారం జిరిబామ్‌లో జరిగిన హింసాకాండ, రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాన్వాయ్‌పై తాజాగా జరిగిన దాడి అందుకు నిదర్శనాలు. పరస్పరం నమ్మకం కోల్పోయిన మెజారిటీ మెయితీలు, మైనారిటీ కుకీల మధ్య ఘర్షణను నివారించడానికి భారీ ఎత్తున భద్రతా బలగాలను దింపడం తప్ప, అసలైన రాజకీయ పరిష్కారం కోసం బీజేపీ ప్రయత్నించలేదన్నది నిష్ఠురసత్యం. ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, తానే సమస్యగా మారినప్పటికీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను ఆ పార్టీ కదపనే లేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అఖండ విజయం సాధించి పెట్టిన బీరేన్‌ను స్థానికంగా పార్టీ పట్టు నిలిపే నేతగా అది భావిస్తూ ఉండివుండవచ్చు. కానీ, రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’కు ఇంఫాల్ నుంచి అనుమతి నిరాకరణ సహా రాష్ట్రంలో మారని పరిస్థితుల వల్ల మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్‌సభా స్థానాలనూ కాంగ్రెస్‌కే కోల్పోవాల్సి వచ్చింది. అందుకే, ఇది బీజేపీ చెవి ఒగ్గి వినాల్సిన పాఠం. ఇక, ఎన్నికల ప్రచార వేళ ఇష్టారాజ్యపు వ్యాఖ్యలతో సమాజంలో విభజన తెస్తే, భవిష్యత్తులో దేశాన్ని నడపడమెలా అన్న భాగవత్ ప్రశ్న సహేతుకమైనదే. కచ్చితంగా అన్ని పక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సినదే. కానీ, కొంతకాలంగా అదుపులేని మాటలు అనేకం అధికార పార్టీ నుంచి వస్తున్నా ఉపేక్షించడం, ఆరెస్సెస్ సంఘ్సేవక్లను పక్కనబెట్టి బీజేపీ సొంత కార్యకర్తలతో ఎన్నికల పోరు సాగించిన తర్వాత... అదీ పార్టీకి సొంత మెజారిటీ రానప్పుడే ఈపాటి వివేకం మేల్కొనడమే ఒకింత విడ్డూరం. బీజేపీ, ఆరెస్సెస్‌ల మధ్య సఖ్యత తగ్గిందన్న వాదనకు ఇది ఊతం. అయితే, గతంలో 1998, 2004ల్లో వాజ్‌పేయ్ ఎన్డీఏ ప్రభుత్వాలకు సారథ్యం వహించినప్పుడూ అనేక విధానాలపై రెంటి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నమాట మర్చిపోలేం. మిత్రపక్షాలపై ఆధారపడి పాలన సాగించాల్సిన సంకీర్ణాల కాలంలో నలువైపుల నుంచి అభిప్రాయాలు రావడం సహజం. వాటిలో మంచిచెడులను గుర్తించి నడుచుకోవడం సుస్థిర సర్కారుకు తొలి మెట్టు. మైనారిటీలకు వ్యతిరేకంగా కమలనాథుల వ్యాఖ్యలను ఎన్నికల సంఘమే పెద్దగా పట్టించుకోకున్నా, మాతృసంస్థ ఆలస్యంగానైనా మేల్కొని సుద్దులు చెప్పడమే తటస్థులకు కాస్తంత ఊరట. గత పదేళ్ళలో మోదీ మేనియాలో నోరు విప్పే వీలు లేకుండాపోయిన పలువురు ఇకపై గొంతు సవరించుకుంటారు. సొంత ఇంటి భాగవత్ మొదలు ఎవరు మాట్లాడినా గాయపడ్డ బీజేపీకి పుండు మీద కారం రాసినట్టే ఉండవచ్చు. కానీ గాయం మానాలంటే... మందు చేదుగా, ఘాటుగా ఉందని అనడం సరికాదేమో! -
మణిపూర్‌లో సమస్యకు గన్ పరిష్కారం కాదు: సుప్రియా సూలే
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే స్వాగతించారు. మణిపూర్‌లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అన్నారామె.‘‘ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మణిపూర్‌పై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఎందుకంటే మణిపూర్ భారత్‌లో భాగం. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనందరినీ చాలా తీవ్రంగా కలచివేస్తోంది. మణిపూర్ విషయంపై చర్చ జరగాలి. మణిపూర్‌లో నెలకొన్న అశాంతిపై చర్చ జరపాలని ఇండియా కూటమి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది’’ అని అన్నారు.#WATCH | Pune, Maharashtra: On RSS chief Mohan Bhagwat's statement, NCP-SCP MP Supriya Sule says, "I welcome his statement because Manipur is part of India. And when we see our people suffering so much, it is extremely disturbing for all of us. This is something we have been… pic.twitter.com/JgRvnDET6y— ANI (@ANI) June 11, 2024 ‘‘ ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలతో ఒక మంచి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ద్వారా మణిపూర్ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించాలి. ప్రతి సమస్యకు గన్‌తో పరిష్కారం లభించదు’’ అని సుప్రియా సూలే అన్నారు. మణిపూర్‌లో శాంతి, ఎన్నికలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన ఓ కార్యక్రమంలో తొలిసారి మాట్లాడారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలిచిన అనంతరం మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘‘మణిపూర్‌లో అల్లర్లు చెలరేగి ఏడాది అవుతోంది. అయినా అక్కడ శాంతి నెలకొనటం లేదు. గత పదేళ్లలో శాంతంగా ఉన్న మణిపూర్‌లో ఒక్కసారిగా గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇక్కడి సమస్యను పరిష్కరించటమే తొలి ప్రాన్యంగా భావించాలి. ఎన్నికల్లో చూపించిన మాటల చాతుర్యం వదిలేసి.. దేశంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.‘‘ ఎన్నికల ఫలితాల కంటే ప్రజాస్వామ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా సమాజం మారుతోంది. అదే ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో ఎకరినొకరు దూషించుకోవటం, సాంకేతికతను తప్పుదారి పట్టించటం, నకిలీ వార్తలు సృష్టించటం సరికాదు. ఎన్నికలు, ఫలితాలు వాటి నుంచి బయటకువచ్చి దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి’’ అని మోహన్ భగవత్ అన్నారు. -
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ నేత సుప్రీయా శ్రీనటె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్వియా మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లోని ఫైవ్ స్టార్ హోటెల్స్తో పాటు బీజేపీ కార్యాలయాల్ని వినియోగించారని.. ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్కు చెందిన శంతను సిన్హా తనతో చెప్పినట్లు సుప్రీయా శ్రీనటె తెలిపారు. తక్షణమే మాల్వియాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వాన్ని సుప్రీయా శ్రీనటె డిమాండ్ చేశారు. सवाल यह है कि- BJP की IT सेल है या दरिंदों का जमावड़ामहिलाओं के खिलाफ होने वाले अपराध में हर बार आरोपी BJP का नेता ही क्यों होता है?• BJP के पदाधिकारी पर गंभीर आरोप लगे हैं, लेकिन पूरी BJP चुप है।• ऐसे आरोपों पर खामोशी का सच क्या है, आखिर इस पदाधिकारी को क्यों और किसके… pic.twitter.com/rzwDsOPBjp— Congress (@INCIndia) June 10, 2024 ‘మేం బీజేపీని మహిళలకు న్యాయం చేయమని కోరుతున్నాం. మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియాపై ఆరోపణలు వచ్చాయి. వెంటనే మాల్వియాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నానమి అన్నారు.కాగా, ఈ ఆరోపణల్ని అమిత్ మాల్వియా ఖండించారు. తనపై శంతను సిన్హా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్న పరువునష్టం దావా వేస్తున్నట్లు సూచించారు. -
మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్ఎస్ఎస్: రౌత్
ముంబై: నరేంద్ర మోదీ బలవంతంగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయతి్నస్తే ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదని శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. 2014, 2019లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్ఎస్ఎస్ను బానిసగా మార్చుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రయతి్నంచారని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరి బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. మోదీని ఇంటికి సాగనంపే స్థితిలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఉందన్నారు. -
రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్పై స్వార్థంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రచారం అంతా అసత్యం, అబద్దమని పేర్కొన్నారు.రిజర్వేషన్లను ఆర్ఎస్స్ పూర్తిగా సమర్తిస్తుందని, ఎవరికోసం అయితే కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని తెలిపారు. రిజర్వేషన్లపై వివాదం సృష్టించి లబ్ది పొందాలని అనుకుంటున్నారని, వాటితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.ఇక... 2025 నాటికి రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు కోసం 2025 నాటి కల్లా రిజర్వేషన్లు సమూలంగా రద్దు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్పై వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. -
పశ్చిమ బెంగాల్లో హై అలర్ట్!
పశ్చిమ బెంగాల్లో నేడు(బుధవారం) జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. హిందూ జాగరణ్ మంచ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సుమారు ఐదువేల శోభాయాత్రలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కోల్‌కతాలోని బరాసత్, సిలిగురి బరాబజార్‌లలో కూడా భారీ ఊరేగింపులు నిర్వహించే సన్నాహాల్లో ఉంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం గతంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు హూగ్లీ, హౌరా, ఉత్తర,దక్షిణ దినాజ్‌పూర్, అసన్సోల్, బరాక్పూర్లలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా శాంతిభద్రతలను ఉల్లంఘించినట్లు కనిపిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒక ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ నేటి ఊరేగింపులో ఆయుధాల బహిరంగ ప్రదర్శనకు అనుమతించబోమని, ఊరేగింపులను వీడియోగ్రాఫ్ చేయనున్నామన్నారు. గత ఏడాది మార్చి 30న హౌరాలో జరిగిన శోభాయాత్రలో పరిస్థితి అదుపు తప్పింది. ఆ తర్వాత జరిగిన హింసాకాండ రెండు జిల్లాలకు వ్యాపించింది. పలు ఘటనల్లో పది మంది గాయపడ్డారు. తాజాగా కలకత్తా హైకోర్టు .. విశ్వహిందూ పరిషత్, అంజనీ పుత్ర సేనకు కొన్ని షరతులు విధిస్తూ హౌరాలో రామనవమి శోభా యాత్రను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. నేడు (బుధవారం) జరిగే శ్రీరామనవమి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని హిందూ జాగరణ్ మంచ్ తెలిపింది. హిందూ జాగరణ్ మంచ్ సభ్యుడు సుభాజిత్ రాయ్ మంచ్ మీడియాతో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
ఆ రెండు పార్టీలు విషం లాంటివి: ఖర్గే కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో బీజేపీ నియంత పాలన సాగిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ విషం లాంటివి. ఆ విషాన్ని రుచి చూస్తే.. ప్రాణాలు కోల్పోవడం ఖాయమని అన్నారు. బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయకూడదనే ఉద్దేశ్యంతో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు ప్రజాస్వామ్య పాలన కావాలా? నియంతృత్వ పాలన కావాలా.. మీరే తేల్చుకోవాలి. నియంతృత్వానికి మద్దతిచ్చే బీజేపీ పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలి అని ఖర్గే అన్నారు. సభలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కోరుకునే వారు చేతులెత్తండి.. అనగానే అంతా చేతులెత్తారు. #WATCH | Delhi: Addressing the INDIA alliance rally at Ramlila Maidan, Congress President Mallikarjun Kharge says, "You have to decide if you want democracy or dictatorship... Those who support dictatorship need to be kicked out of the country... BJP and RSS are like poison. You… pic.twitter.com/wdisE7HQpU — ANI (@ANI) March 31, 2024 -
ఆర్ఎస్ఎస్ పురిటి గడ్డలో బీజేపీ గెలిచింది మూడుసార్లే!
మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో నాగ్‌పూర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. నాగ్‌పూర్ విదర్భ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. నాగ్‌పూర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పురిటి గడ్డగా చెబుతారు. మహారాష్ట్రలోని ఐదు కీలక స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో నాగ్‌పూర్ కూడా ఉంది. ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానానికి ఎంపీగా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. నాడు కాంగ్రెస్ అభ్యర్థి అనసూయాబాయి కాలే ఇక్కడి నుంచి గెలిచారు. నాగ్‌పూర్ సీటు కొన్నాళ్లు కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది. 1996లో బీజేపీ తొలిసారి ఇక్కడ నుంచి గెలుపొందింది. నాగ్‌పూర్ ఎన్నికల చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నాయి. 1952లో మొదటి సాధారణ ఎన్నికల్లో నాగ్‌పూర్ స్థానం కాంగ్రెస్‌కు దక్కింది. 1962లో రాజకీయ నేత మాధవ్ శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఆర్ దేవ్ఘరే విజయం సాధించారు. 1971లో నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌కు తొలి పరాజయం ఎదురైంది. ఈసారి సుభాష్ చంద్రబోస్ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ నాగ్‌పూర్ స్థానాన్ని కైవసం చేసుకోగా, భోటే జంబువంతరావు ఎంపీ అయ్యారు. 1977లో కాంగ్రెస్ ఇక్కడ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 1980 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత భోటే జంబువంతరావు విజయం సాధించారు. 1984లో కాంగ్రెస్ నేత బన్వరీలాల్ భగవాన్‌దాస్ విజయం సాధించారు. బన్వరీలాల్ 1989 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో బన్వరీలాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. అయితే ఈసారి బన్వరీలాల్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి దత్తాజీ రఘోబ్జీ మేఘే ఎంపీగా ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ మరోసారి బన్వరీలాల్‌కు టికెట్ ఇచ్చింది. అప్పుడు తొలిసారిగా నాగ్‌పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 1998లో కాంగ్రెస్ పార్టీ నాగ్‌పూర్ సీటును సొంతం చేసుకుంది. విలాస్ ముత్తెంవార్ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009లలో వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో మోదీ వేవ్ కారణంగా చాలా విరామం తర్వాత బీజేపీ తిరిగి నాగ్‌పూర్ సీటును సొంతం చేసుకుంది. ఈసారి నితిన్ గడ్కరీ ఎంపీ అయ్యారు. నితిన్ గడ్కరీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచి తిరిగి తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానం నుండి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారు. సంఘ్‌కు బలమైన కోటగా ఉన్నప్పటికీ నాగ్‌పూర్‌లో బీజేపీ మూడు లోక్‌సభ ఎన్నికల్లో(1996,2014,2019) మాత్రమే విజయం సాధించగలిగింది. -
నిటాషా వివాదం: ‘అందుకే భారత్‌లోకి రానివ్వలేదు’
భారత సంతతికి చెందిన యూకే ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్‌ను భారత్‌లోకి అడుగుపెట్టకుండా అడుకున్న ఘటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆమె కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఓ సెమినార్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై భారత్‌కు వచ్చారు. అయితే అనూహ్యంగా నిటాషాను బెంగళూరు ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమెకు భారత్‌లోకి అనుమతి లేదని వెనక్కి పంపించారు. దీంతో ఈ ఘటన బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదంగా మారింది. తమ రాష్ట్రంలోకి వచ్చే విదేశియురాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుందోని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తాజాగా నిటాషాను భారత్‌లోకి రాకుండా నిరాకరించినందుకు భారత విదేశి వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. ‘ఆమె యూకే దేశానికి చెందిన పౌరురాలు. ఒక విదేశి పౌరుడు/పౌరురాలును దేశంలోకి ప్రవేశం కల్పించటమనేది.. పూర్తిగా భారత దేశ సార్వభౌమాధికారిక నిర్ణయం’ అని విదేశి వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. తనను భారత్‌లోకి రానివ్వలేదని..ఎయిర్‌పోర్టులో కూడా తనను 24 గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే ఉంచారని తెలిపారు. గతంలో తాను ఎన్నొసార్లు భారత్‌కి ఇలా జరగలేదని అన్నారు. అయితే ఆమె గతంలో ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పలు ఆర్టికల్స్ రాశారు. దీంతో ఆమె ఉగ్రవాద సానుభూతిపరురాలు అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. భారత వ్యతిరేకతను నిటాషా ప్రచారం చేస్తుందని కూడా మండిపడ్డారు. -
ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పిన్ బాంబు లభ్యం
మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో గల రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయంలో శనివారం రాత్రి పిన్ బాంబు కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బాంబు చూసేందుకు గ్రెనేడ్ బాంబును పోలివుంది. రాత్రి 12 గంటల సమయంలో వాలంటీర్ రామ్ మోహన్ అందించిన సమాచారం మేరకు ఎస్పీ అసిత్ యాదవ్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు బాంబును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేసే స్థలంలో వాలంటీర్ రామ్మోహన్ ఈ బాంబును గుర్తించారు. అక్కడున్న పిల్లలు ఆ బాంబును రామ్ మోహన్‌కు చూపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుషా, ఎస్పీ అసిత్ యాదవ్, టీఐ కొత్వాలి ప్రవీణ్ చౌహాన్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు బాంబును తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాంబు చాలా ఏళ్ల క్రితం నాటిది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ఫైరింగ్ రేంజ్ ఏరియా ఉండేది. అప్పట్లో ఈ బాంబు మట్టిలో పడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.