Telangana High Court
-
ఆయనేమన్నా టెర్రరిస్టా?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆయన ఏమైనా టెర్రరిస్టా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేబీఆర్ పార్కు వద్ద ఉదయం వాకింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేను బహిరంగ ప్రదేశంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. ఆయన పరారీలో లేరు కదా.. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చట్టప్రకారం అరెస్టు చేయొచ్చు కదా అని పేర్కొంది. గాయపడ్డ వారి వివరాల పక్కన ప్రశ్నార్థకం పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటే వైద్యుడికే స్పష్టత లేదా అని అడిగింది. నరేందర్‌రెడ్డి మరో నిందితుడికి రెండు నెలల కాలంలో 84 సార్లు ఫోన్ చేశారన్న పోలీసుల వాదనపై ఆక్షేపించింది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు నేరపూరిత కుట్రపైనే మాట్లాడుకున్నారని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది.నరేందర్‌రెడ్డికి ప్రమేయం ఉందంటూ నిందితులు చెప్పిన వాంగ్మూలాల కాపీలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం: పీపీ ‘నరేందర్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారు. నవంబర్ 11న రిమాండ్ డైరీలో ఆయన పేరు లేదు. నవంబర్ 13 నాటి డైరీలో చేర్చారు. ఆయనపై పెట్టిన సెక్షన్లలో ఒకటి తప్ప అన్నీ ఐదేళ్లలోపు శిక్ష పడే కేసులే. ఇతర నిందితులు నరేందర్‌రెడ్డి పేరు చెప్పారంటూ చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు. ఘటన జరిగిన రోజున ఆయన నుంచి మరో నిందితుడి (ఏ–4)కి ఒకే ఒక్క కాల్ వెళ్లింది. అలాంటప్పుడు ఘటన వెనుక ఆయన ఉన్నట్లు ఎలా చెబుతారు? రాజకీయ కోణంలోనే మాజీ ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమీ చెప్పకున్నా.. కేటీఆర్ పేరు చెప్పినట్లు, నేరాన్ని అంగీకరించినట్లు తప్పుడు నివేదికను ట్రయల్‌కోర్టుకు అందజేశారు. తోపులాటలో జరిగిన చిన్న గాయాలను రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు’అని గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. ‘ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్‌రెడ్డి మాట్లాడారు. దీని కోసమే మరో నిందితుడికి రెండు నెలల్లో 84 సార్లు కాల్ చేశారు. నరేందర్‌రెడ్డిని ఇంటి వద్దే అరెస్టు చేశాం. విచారణ సాగుతోంది. ఈ దశలో పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. ఆయన పిటిషన్‌ను కొట్టివేయాలి. నరేందర్‌రెడ్డిని పోలీసుల కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై వికారాబాద్ కోర్టు విచారిస్తోంది’అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.ప్రాథమిక విచారణ చేశారా?వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఇంటి వద్దే అరెస్టు చేస్తే, విచారణ సమయంలో సలీమ్ అనే వ్యక్తి సమాచారం ఎందుకు ఇచ్చారు? సొంత పార్టీ వ్యక్తితో మాట్లాడినంత మాత్రాన అరెస్టు చేస్తారా? ఇతర నిందితుల స్టేట్మెంట్లు కాకుండా నరేందర్‌రెడ్డి పాత్రపై ప్రాథమిక విచారణ చేశారా? మీరు చెబుతున్నట్లు కుట్ర కోణం ఉంటే ఘటన జరిగిన రోజున ఇద్దరి మధ్య ఒకే కాల్ ఎందుకు ఉంటుంది? లగచర్ల ఘటనలో అధికారులకు పెద్దగా గాయాలు కాలేదని నిమ్స్ వైద్యుల నివేదిక చెబుతోంది. లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాలను అందజేయండి’అంటూ తీర్పు రిజర్వు చేశారు. అయితే తమ వాదనలకు కొంత సమయం కావాలని పీపీ విజ్ఞప్తి చేయడంతో గురువారానికి వాయిదా వేశారు. -
పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్:లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. కొడంగల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.నరేందర్‌రెడ్డిని 7 రోజుల పాటు తమ కస్టడీ కి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.ఈ పిటిషన్‌పై కోర్టు వాదనలు విననుంది.మరోవైపు కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని నరేందర్‌రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది.తెలంగాణ జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ రావు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఇటీవలే నాంపల్లిలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వీరికి మధ్యంతర బెయిల్ పొడిగించలేమని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. దీంతో, భుజంగరావు.. హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌పై పిటిషన్లు దాఖలు చేయడంతో నేడు విచారణ జరుగనుంది. -
పట్నం కోసం బీఆర్ఎస్ లీగల్ టీమ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
-
పట్నం కోసం రంగంలోకి బీఆర్ఎస్ లీగల్ టీమ్.. పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటన కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ కోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని ఆయన కోరారు. నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి. అయితే, ఈరోజు హైకోర్టుకు సెలవు కావటంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ నేడు హౌజ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. జైలులో ఐదుగురు నేరస్థులతో కలిపి మాజీ ఎమ్మెల్యేను ఉంచారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయనను స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోర్టును కోరనుంది. ఇదిలా ఉండగా.. లగచర్ల ఘటనలో మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్యంగా ఓ ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. మరో కొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. -
కలెక్టర్ నిజాంను మించిపోయారు!
సాక్షి, హైదరాబాద్: భూములను కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ నిజాం నవాబ్‌ను కూడా మించిపోయారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పేదలకు పంచడం కోసం రామచంద్రారెడ్డి దాదాపు 300 ఎకరాలు ఇచ్చారని, అందినకాడికి నొక్కిన అధికారులు వాటి స్వాహాకు సహకరించారని చెప్పింది. భూదాన్ భూములంటూ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీగా ధ్రువీకరించిన వ్యక్తి.. జిల్లా కలెక్టర్‌గా వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఆరోపణలున్న అధికారులు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. పీవీ నరసింహారావు లాంటి ఎందరో మహానుభావులు సీలింగ్ చట్టం వచ్చినప్పుడు వందల ఎకరాలు ఇచ్చేశారంది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నం.182లో 10.29 ఎకరాలకు ఖాదర్ ఉన్నీసాకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాలు చేస్తూ నవాబ్ ఫారూక్ అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. గతంలో భూదాన్ భూములపై ఆర్డీవో ఆదేశాలివ్వగా స్పెషల్ ట్రిబ్యునల్ సమరి్థంచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఖాదర్ ఉన్నీసా ఇచ్చిన దరఖాస్తును కలెక్టర్ ఆమోదించి పాస్‌బుక్ కూడా జారీ చేశారని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో మహానుభావులు ఇచ్చిన వందల ఎకరాలను అమ్ముకుని తినేశారని, భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతోపాటు అధికారులూ విఫలమయ్యారని చెప్పారు. భూదాన్ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగా పట్టా పాస్‌బుక్ జారీ చేశారన్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేశారో కౌంటరు దాఖలు చేయాలని భూదాన్ యజ్ఞబోర్డు, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, నాటి కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ భూములపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
కొత్తచెరువు ఆక్రమణలు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామం పరిధిలోని కొత్తచెరువుకు సంబంధించిన సర్వే నంబర్ 5లోని 5.25 ఎకరాల భూమిలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణలపై పిటిషనర్ల ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరపాలని, నీటి వనరులను పరిరక్షించాలని జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ (హైడ్రా) విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా కూల్చివేతలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించింది. రోడ్లు, వీధులు, ఫుట్‌పాత్‌లు, నీటి వనరులు వంటి పబ్లిక్ స్థలాలను ఆక్రమించి చేపట్టే అనధికార నిర్మాణాలకు అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు వర్తించవని తేల్చి చెప్పింది. ఫిర్యాదులు పరిశీలించాల్సిందే కొత్తచెరువు శిఖం ఆక్రమణపై తాము సెప్టెంబర్ 6వ తేదీన, అదే నెల 10న అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఖాజాగూడకు చెందిన ఆర్.రామకృష్ణతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు పత్రాలతో అత్యంత విలువైన భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. బిల్డర్స్, బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీతో పాటు భరతేందర్రెడ్డి, ఘనేశ్వర్, రాఘవరావు ఈ ఆక్రమణలో కుట్రదారులని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టగా.. కొత్తచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) సుమారు 5.5 ఎకరాల్లో విస్తరించి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అక్రమ నిర్మాణాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ముంపు సమస్య తలెత్తుతోందని, నీటి వనరుల మనుగడకు కూడా ముప్పు వాటిల్లుతోందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు సమర్పించిన ఫిర్యాదులను అధికారులు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రైవేట్ ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేయాలని సూచించారు. శిఖం భూమి లేదా ట్యాంక్ బండ్‌పై ఆక్రమణలు గుర్తిస్తే వాటిని తొలగించాలని, నీటి వనరులను పరిరక్షణతోపాటు పర్యావరణ వ్యవస్థకు మరింత నష్టం జరగకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 26వ తేదీకి వాయిదా వేశారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
సాక్షి,హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం(నవంబర్ 12) రిజర్వు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌పై వాద, ప్రతివాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు బెంచ్ వెల్లడించింది. కాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ అనర్హతపై నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని, ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు.ఇదీ చదవండి: మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు -
కరీంనగర్ రాయితో నూతన హైకోర్టు నిర్మాణం
కరీంనగర్ క్రైం: రాష్ట్ర నూతన హైకోర్టు నిర్మాణంలో కరీంనగర్ నుంచి తెప్పించిన బండను వాడుతున్నామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొప్ప చరిత్ర కలదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించనున్న 12 నూతన కోర్టు భవనాల సముదాయానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అలాగే సీతారాంపూర్ రోడ్డు లో జడ్జీల నూతన నివాస భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కో ర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించాలన్నారు. అందుకు న్యాయవాదులు సహకరించాలని సూచించారు. కేసుల విచారణలో అనవసర వాయిదాల ను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కోర్టు పరిపాలనా జడ్జిగా వ్యవహరిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్‌తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వినోద్‌కుమార్, జస్టిస్ విజయసేన్‌రెడ్డి, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శ్రీనివాసరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణకుమార్ మాట్లాడారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు చెందిన హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ పి.నవీన్రావుతోపాటు వృత్తిలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ న్యాయవాదులు పి.గోపాలకృష్ణ, కె.మాధవరావు, జి.నారాయణరెడ్డి, వి.వెంకటేశ్వరరావు, జి.హనుమంతరావును చీఫ్ జస్టిస్ సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్‌రెడ్డి, న్యాయమూర్తులు, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ ఆర్డీవో మహేశ్వర్, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యే ముందు చీఫ్ జస్టిస్ సహా ఇతర న్యాయమూర్తులంతా మంకమ్మతోటలోని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు. -
పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ హైకోర్టులో వాదనలు
-
3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుల అంశంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లకు విచారణార్హత లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు వాదించారు. ‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఇక్కడ 8 నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..’అని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), తెల్లం వెంకట్రావు (కొత్తగూడెం) దానం నాగేందర్ (ఖైరతాబాద్)లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు. అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యా దు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమ యం ఇవ్వడం లేదంటూ బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి గత నెల హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు విన్పించారు. గడువులోగా నిర్ణయం తీసుకోవాలి.. ‘ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయనను ప్రజలు ఓడించారు. మహారాష్ట్ర, మణిపూర్ కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను పరిశీలిస్తే.. తమ ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిరీ్ణత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూల్ 6, 7 ప్రకారం స్పీకర్ నడుచుకోవడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలి..’అని మోహన్‌రావు కోర్టును కోరారు. కాగా ఏలేటి తరఫున న్యాయవాది జె.ప్రభాకర్ వాదనల కోసం తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. -
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను ఉద్దేశించి హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు
-
అసెంబ్లీ కార్యదర్శి అప్పీళ్లు చెల్లవు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుల అంశంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాదనలు వినిపించారు. స్పీకర్ ముందు అనర్హత పిటిషన్లు ఉంచడం పబ్లిక్ సర్వెంట్‌గా ఆయన విధి అని, ఎలాంటి అర్హత లేకుండా వేసిన అప్పీళ్లు చెల్లవని చెప్పారు. అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సింది స్పీకర్ అని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయడమో లేదో తేల్చుకోవాల్సింది ఆయనేనని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా అసెంబ్లీ కార్యదర్శి సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేయలేరని పేర్కొన్నారు. అధికారాలను అనుభవిస్తూ.. విధులను మాత్రం నిర్వహించను అనడం సహించరానిదని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు. అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెపె్టంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి గత నెల హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. 8 నెలలు కావొస్తున్నా ఏ నిర్ణయం లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న వాదన చట్టబద్ధమే. కైశమ్ మేఘచంద్ర సింగ్ కేసులో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. మూడు నెలల గడువులోగా స్పీకర్ తన ముందున్న పిటిషన్లను పరిష్కరించాలి. శాసనసభ కాలపరిమితి పూర్తయ్యే ఐదేళ్ల వరకు స్పీకర్ వేచిచూస్తూ ఉంటే కోర్టులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. స్పీకర్‌కు ఫిర్యాదు చేయడానికి వెళితే అవకాశం ఇవ్వలేదు. కార్యాలయంలో పిటిషన్లు తీసుకోలేదు. విధిలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు చేసి దాదాపు 8 నెలలు కావొస్తున్నా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేయాలి..’అని కోరారు. అంతకుముందు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి, మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా ?
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా రూ.వేల కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గురువారం కీలక, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డిపాజిట్లను తాము వెనక్కి ఇచ్చేశామని పలుమార్లు చెప్పిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి న్యాయస్థానం గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ అని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు సమక్షంలో గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్‌కు భౌతిక రూపంలో అందజేసిన డిపాజిటర్ల వివరాలను పెన్‌డ్రైవ్‌లో కూడా ఇవ్వాలని మార్గదర్శిని ఆదేశించింది. తాము పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిన అవసరం లేదన్న మార్గదర్శి వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు ఉండవల్లికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు సరైన రీతిలో సహకరించాలంటే డిపాజిటర్ల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిన అవసరం ఉందంది. తద్వారా సాంకేతికత సాయంతో డిపాజిటర్ల వివరాలను క్షుణ్నంగా పరిశీలించి కోర్టుకు తగిన రీతిలో సహకరించేందుకు ఆస్కారం ఉంటుందంది.అయినా పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాలని చెబుతున్న సమాచారం ఏమీ కొత్తది కాదని, ఆ వివరాలను ఇప్పటికే భౌతికంగా ఉండవల్లికి అందజే శారని గుర్తు చేసింది. మార్గదర్శి పెన్‌డ్రైవ్‌లో ఇచ్చే వివరాలను ఈ కేసు కోసం మినహా మరే రకంగానూ ఉపయోగించడానికి వీల్లేదని ఉండవల్లిని హైకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. మార్గదర్శి–ఆర్బీఐకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోర్టు ముందుంచిన నేపథ్యంలో వాటి పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామన్న ఆర్బీఐ సీనియర్ న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు అనుమతించింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ కౌంటర్లు దాఖలు చేయడం, వాటికి సమాధానం ఇవ్వడం లాంటి ప్రక్రియ అంతా డిసెంబర్ 20 కల్లా పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాలను హైకోర్టు ఆదేశించింది.ఆ తేదీ తరువాత దాఖలు చేసే ఏ డాక్యుమెంట్లనూ తీసుకోబోమని పేర్కొంటూ విచారణను 2025 జనవరి 3కి వాయిదా వేసింది. అదే రోజు ఈ వ్యాజ్యాలపై తుది విచారణ తేదీని ఖరారు చేస్తామంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు మరణించినందున ఆ స్థానంలో తనను కర్తగా చేర్చాలంటూ ఆయన కుమారుడు కిరణ్ దాఖలు చేసిన సబ్‌స్టిట్యూట్ పిటిషన్లను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వెనక్కి ఇచ్చేశాం: లూథ్రా మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా వాదనలు వినిపిస్తూ సేకరించిన డిపాజిట్లలో 99.8 శాతం మొత్తాలను వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పారు. రూ.5.33 కోట్లను ఎవరూ క్లెయిమ్ చేయనందున ఎస్క్రో ఖాతాల్లో ఉంచామన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌ను న్యాయస్థానానికి సహకరించాలని మాత్రమే సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. ఈ సమయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కౌంటర్లు దాఖలు చేయలేదా? అని ధర్మాసనం ప్రశించడంతో తాము కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వరరావు నివేదించారు. అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని ఆర్బీఐ తరఫు సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ కోరడంతో ధర్మాసనం అంగీకరించింది.అనంతరం లూథ్రా వాదనలను కొనసాగిస్తూ.. అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కథనాలు రాశామని తమపై కేసు దాఖలు చేశారని, అయితే 2007 నుంచి ఏ డిపాజిటర్ కూడా తాము డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేయలేదన్నారు. తాము వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించకుండా ఎగవేశామా? అనే విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెప్పాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వసూలు చేసిన డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటూ మీరు సమరి్పంచిన వివరాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదని, అందుకే ఈ వ్యవహారాన్ని మళ్లీ తేల్చాలని వెనక్కి పంపిందని లూథ్రానుద్దేశించి ధర్మాసనం పేర్కొంది.ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ జోక్యం చేసుకుంటూ చందాదారుల వివరాలను మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పెన్‌డ్రైవ్‌ను ఉండవల్లికి ఇవ్వడానికి వీల్లేదంటూ లూథ్రా వాదించారు. అలా ఇవ్వడం ఐటీ చట్ట నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నాలుగు వారాల్లో అదనపు కౌంటర్ దాఖలు చేయాలని ఆర్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునని, కానీ మొత్తం ప్రక్రియను డిసెంబర్ 20 నాటికి పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాల న్యాయవాదులకు ధర్మాసనం తేల్చి చెబుతూ విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.ఎస్క్రో అకౌంట్లోని సొమ్ములు ఎవరివి?రామోజీ చాలా శక్తిమంతుడు..తాజా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉండవల్లి చదివారు. అసలైన పెట్టుబడిదారుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించవచ్చని హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్నారని, మరి ఎస్క్రో అకౌంట్లో ఉన్న రూ.5.33 కోట్లు ఎవరివి? అని ప్రశి్నంచారు. ఆ మొత్తాలను ఎవరూ క్లెయిమ్ చేయడం లేదని, దీన్నిబట్టి ఆ మొత్తాలు ఎవరివో సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ఆ డిపాజిటర్లు ఎవరు? క్లెయిమ్ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో తేల్చాలన్నారు. చెల్లింపులు చేశామని మార్గదర్శి చెబుతున్న డిపాజిటర్లలో చాలా మంది నిజమైన డిపాజిటర్లు కాదన్న విషయాన్ని తాను నిరూపిస్తానన్నారు.మార్గదర్శి ఇచ్చిన 59 వేల పేజీల్లో కొన్నింటిని పరిశీలిస్తేనే వారు అసలైన డిపాజిటర్లు కారన్న విషయం అర్థమైందని, అందుకే పూర్తిస్థాయిలో పరిశీలన చేసేందుకు పెన్‌డ్రైవ్‌లో వివరాలు కోరుతున్నట్లు చెప్పారు. రామోజీ చాలా శక్తిమంతుడని, అందుకే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ‘మార్గదర్శిని గెలిపించడం కోసం లూథ్రా వాదిస్తున్నారు. కానీ నేను బాధితులు, చట్టం తరఫున హేమాహేమీలతో యుద్ధం చేస్తున్నా. సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి 5 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయలేదు. 2006 నవంబర్ 6న మార్గదర్శి ఉల్లంఘనలపై కేంద్రానికి ఫిర్యాదు చేశానని, బుధవారంతో 18 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి మార్గదర్శి ఈ విచారణను సాగదీస్తూనే ఉంది’ అని పేర్కొన్నారు.ఉండవల్లికి పెన్‌డ్రైవ్ ఇవ్వాల్సిందే⇒ హార్డ్ కాపీ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవ్వటానికి ఏం ఇబ్బంది?⇒ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఇక్కడ వర్తించదు⇒ డిసెంబర్ 15 కల్లా పూర్తి వివరాలతో పెన్‌డ్రైవ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశండిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం. – మార్గదర్శినుద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య‘అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టు చందాదారుల వివరాలతో కూడిన హార్డ్ కాపీలు ఇచ్చిన అంశాన్ని లూథ్రా తోసిపుచ్చలేదు. అంటే పెన్‌డ్రైవ్‌లో ఇచ్చే వివరాలేమీ కొత్తగా ఇచ్చేవి కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం– 2000 నియమ నిబంధనలు ఇక్కడ వర్తించవు. రేఖా మురార్కా (సుప్రా)లో సుప్రీంకోర్టు ఇదే అంశంపై తీర్పునిచ్చింది. అంతేకాదు.. హైకోర్టుకు సాయం చేయాలని సుప్రీంకోర్టు అరుణ్‌కుమార్‌ను సుప్రీం కోరింది. ఇందుకోసం ఆయన అడిగిన విధంగా పెన్‌డ్రైవ్‌లో వివరాలు డిసెంబర్ 15లోగా అందజేయాలని మార్గదర్శిని ఆదేశిస్తున్నాం.ఆయనను (ఉండవల్లి) ఎలా వినియోగించుకోవాలనేది మేం నిర్ణయిస్తాం. పెన్‌డ్రైవ్‌లో ఇచ్చిన డేటాను అరుణ్‌కుమార్ ఇతరులకు అందజేయకూడదు. పిటిషన్లు, కౌంటర్లు, అఫిడవిట్లతో రిజిస్ట్రీ ఓ ఐడెంటికల్ బుక్ తయారు చేయాలి. ఈ బుక్ కాపీలను పార్టీలతో పాటు అరుణ్‌కుమార్‌కు కూడా అందజేయాలి. దీనికయ్యే ఖర్చంతా మార్గదర్శి నుంచే రిజిస్ట్రీ వసూలు చేయాలి’ అని మధ్యంతర ఉత్తర్వుల్లో తెలంగాణ హైకోర్టు పేర్కొంది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గురువారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. తొలుత కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు.అసలు ఈ అప్పీల్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని సీజే ధర్మాసనం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. ఆ తర్వాత స్పీకర్ సూచన మేరకు షెడ్యూల్‌ను రిజిస్ట్రీ ముందు ఉంచాలని అన్నారు. స్పీకర్ ముందు ఉంచనని చెప్పే అధికారం కార్యదర్శికి లేదని కోర్టు తెలిపింది. అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు. ఆయన కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిందే. అధికారాలను ఎంజాయ్ చేస్తా.. విధులను మాత్రం నిర్వహించనని అంటే సరికాదని పేర్కొంది.అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ మెయింటనబుల్ కాదని అందుకే కొట్టివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎంపీగా పోటీ చేశారని చెప్పారు. వాదనల అనంతరం.. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారు.చదవండి: ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు'.. 4 వారాలు గడువు -
పబ్లిక్ సర్వెంట్ల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్‌లకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. వీరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అనుమతి తీసుకోకుండా ఈడీ కేసు నమోదు చేయడం, దానిని ఈడీ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం సరికాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని తెలిపింది. అయితే భవిష్యత్తులో వీరి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతినిస్తే అప్పుడు కేసు విచారణకు స్వీకరించాలని ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చునంటూ సుప్రీంకోర్టు ఈడీకి సూచించింది. అయితే ఈ వెసులుబాటు ప్రతివాదులైన అధికారులు లేవనెత్తే న్యాయపరమైన అభ్యంతరాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలవి ‘ఈడీ ఫిర్యాదులోని అంశాలన్నింటినీ మేం క్షుణ్ణంగా పరిశీలించాం. ఇండియా సిమెంట్స్‌కు అదనంగా 10 లక్షల లీటర్ల నీటిని కేటాయించారన్నదే ఆదిత్యనాథ్ దాస్‌పై ఉన్న ఆరోపణ. ఫిర్యాదులోని ఆరోపణలు వాస్తవమనుకున్నా, నీటి కేటాయింపులు తన విధి నిర్వహణలో భాగంగానే చేశారు. ఇందూ టెక్ జోన్‌కు 250 ఎకరాలు కేటాయించారన్నది బీపీ ఆచార్యపై ఉన్న ఆరోపణ. ఇది కూడా నిజమనుకున్నా, ఆ నిర్ణయం కూడా విధి నిర్వహణలో భాగంగా తీసుకున్నదే. వారి విధి నిర్వహణకు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధం ఉంది. ఇద్దరు అధికారులు కూడా పబ్లిక్ సర్వెంట్లే. వీరికి సీఆర్పీసీ సెక్షన్ 197(1) వర్తిస్తుంది. ఈ సెక్షన్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కిందకు వచ్చే నేరాలకు సైతం వర్తిస్తుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలో ఏ నిబంధన కూడా సెక్షన్ 197(1)కు విరుద్ధంగా లేదు. అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు, చేపట్టిన చర్యలకు గాను అధికారులను ప్రాసిక్యూట్ చేయకుండా ఉండేందుకు ఈ సెక్షన్‌ను తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం అనుమతినిస్తే మాత్రం ప్రాసిక్యూట్ చేయవచ్చు. అయితే ఈ కేసులో అలా జరగలేదు. అయినప్పటికీ ఈడీ నమోదు చేసిన కేసును ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ నిమిత్తం తీసుకుంది. ఇలా చేయడం ఎంత మాత్రం సరికాదు. అందువల్లే బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్లపై కేసు కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.ఈడీ కేసుల పూర్వాపరాలుఇండియా అరబిందో, హెటిరో గ్రూపులకు జడ్చర్ల ఎస్ఈజెడ్లో 150 ఎకరాల భూమి కేటాయించడంలో అప్పటి ఏపీఐఐసీ ఎండీగా బీపీ ఆచార్య కీలక పాత్ర పోషించారంటూ ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. అలాగే ఇందూ టెక్‌జోన్‌కు 250 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంలోనూ ఆచార్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ అప్పటి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌పై కూడా ఈడీ కేసు నమోదు చేసింది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా ఈడీ తమపై కేసులు నమోదు చేసిందని, అందువల్ల వాటిని కొట్టేయాలంటూ వారిద్దరూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులను కొట్టేస్తున్నట్లు 2019 జనవరి 21న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఈడీ 2019 జూలైలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. చివరిగా గత నెల 15న పూర్తి స్థాయి వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బుధవారం తన తీర్పును వెలువరించింది. a -
రాజ్యాంగ సంస్థలు పరిధి దాటొద్దు
సాక్షి, హైదరాబాద్: చట్టసభలు, న్యాయస్థానాల లాంటి రాజ్యాంగ సంస్థలు తమ పరిధి దాటి ఇతర వ్యవస్థల పరిధిలో జోక్యం చేసుకోవద్దని రాజ్యాంగం పేర్కొంటోందంటూ పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, న్యాయశాఖ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. దేనికదే హుందాతనాన్ని పాటించాలని, స్పీకర్ పరిధిలోని అంశాల్లో న్యాయ సమీక్ష సాధ్యం కాదని పేర్కొన్నారు. స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకునేందుకు కొంత వీలుంటుందని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాలకు గడువిస్తున్నామని.. ఆలోగా దీనికి సంబంధించిన వివరాలు అందజేయకుంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని సెప్టెంబర్ 9న స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి గత నెల హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ వాదనలు వినిపించారు. ‘కైశం మేఘాచంద్ర సింగ్’లో ముగ్గురు జడ్జిల తీర్పు చెల్లదు ‘చట్టప్రకారం తహసీల్దార్ లాంటి వారి నిర్ణయానికి కూడా నెల సమయం ఉంటుంది. అలాంటిది స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి పిటిషనర్లు కనీసం ఆ సమయం కూడా ఇవ్వలేదు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్దిష్ట వ్యవధిలోగా విచారణ పూర్తి చేయాలనే ఉత్తర్వులు ఇస్తే, భవిష్యత్‌లో స్పీకర్ చట్టసభలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. కిహోటో హోలోహన్ (1992) కేసు విచారణ సందర్భంగా ఐదుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్‌ను ట్రిబ్యునల్‌గా పేర్కొన్నందున.. ఆయన నిర్ణయాలపై సమీక్ష జరపొచ్చు. కానీ నిర్ణయం తీసుకోక ముందు కోర్టుల జోక్యం కూడదు. కైశం మేఘాచంద్ర సింగ్ (2020) కేసు విచారణ సందర్భంగా ముగ్గురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం.. స్పీకర్ ముందున్న అనర్హత పిటిషన్లపై జోక్యం చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే ఐదుగురు జడ్జిల తీర్పు తర్వాత ముగ్గురు జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లదు. విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పే పరిగణనలోకి తీసుకోవాలి. సింగిల్ జడ్జి ఉత్తర్వులు కూడా స్పీకర్ పరిధిలో జోక్యం చేసుకున్నట్లే ఉన్నాయి..’అని రవీంద్ర శ్రీవాస్తవ, శ్రీరఘురాం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఫిరాయింపులపై పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫున జె.ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున గండ్ర మోహన్‌రావు, పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి తరçఫున మయూర్‌రెడ్డి హాజరయ్యారు. తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. -
రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!
చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అదీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్..! వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్...! అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్..! కేసు వాదించడానికి స్పెషల్ పీపీని నియమిస్తే పిటిషన్! కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్...! వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్..! హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్...!! సాక్షి, అమరావతి: ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేరింది. డొంక కదిల్చిన ఉండవల్లి... మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నుంచి వివరణ కోరింది. వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. రంగాచారి, కృష్ణరాజు నియామకం.. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు. కోర్టు అనుమతితో తనిఖీలు.. మరోవైపు ఈ కేసులో అదీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచ్చిన సెర్చ్ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ రజనీ స్టేతో మూలపడిన కేసు.. దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. విచారణ.. తీర్పు.. ఒకే రోజు ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమర్ధించారు. హెచ్‌యూఎఫ్.. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అదీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని తెలిపింది. తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
కులం, మతం వద్దు అనుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి ఒక్కరికీ మతం వద్దు, కులం వద్దు అనుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చిందని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. కులాన్ని, మతాన్ని ప్రకటించడానికి, ఆచరించడానికి ప్రజలందరికీ సమాన స్వేచ్ఛ ఉందని అభిప్రాయపడింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్‌ను చేర్చాలంటూ పిటిషనర్లు అక్టోబర్ 29న, నవంబర్ 1న ఇచ్చిన వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నవంబర్ 6 నుంచే సర్వే ప్రారంభమవుతున్నందున ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పింది.ఏ నిర్ణయం తీసుకున్నదీ పిటిషనర్లకు తెలియజేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 4కు వాయిదా వేసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్‌ను చేర్చాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ వాహీద్, కృష్ణ చంద్ రెండుసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధికారుల తీరు ఉన్నత న్యాయస్థానం గత ఉత్తర్వులకు విరుద్ధమంటూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా మంగళవారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం.. ‘మతం లేదు.. కులం లేదు’ అనుకునేవారి కోసం భారత సెన్సెస్ కమిషన్ వాటిని ప్రస్తావించకుండా స్వేచ్ఛను మంజూరు చేసిందని న్యాయమూర్తి తెలిపారు. 2010, 2021లో దాఖలైన పిటిషన్లలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. పాఠశాల విద్యా సర్టిఫికెట్లలో కులం, మతం ప్రస్తావన వద్దంటూ పిటిషనర్లు కోరగా, వారికి అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, జీఏడీ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. -
ఆ పేరుతో సర్టిఫికెట్ మార్చి ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: పేరు మార్చుకున్నప్పటికీ ప్రభుత్వం తన విద్యా సర్టిఫికెట్లలో ఆ మేరకు మార్పు చేయట్లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తికి చివరకు న్యాయం లభించింది. రెండు వారాల్లోగా పిటిషనర్‌కు ఎస్ఎస్సీ బోర్డు కొత్త సర్టిఫికెట్ జారీ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. పిటిషనర్ విజ్ఞప్తిని సర్కార్ అంగీకరించినందున విచారణ ముగిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఇదీ నేపథ్యం.. తన పేరు మార్చుకున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు, ఉస్మానియా యూనివర్సిటీ ఆ మేరకు సర్టిఫికెట్లలో మార్పులు చేయట్లేదంటూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన వి. మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ చర్య 1961 నాటి జీవో 1263 ప్రకారం చట్టవిరుద్ధమన్నారు. ఇది వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. దీంతో ఆ విద్యార్థికి చెందిన సర్టిఫికెట్లలో పేరు మార్చడానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు గత విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై మరోసారి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది కె.అరవింద్, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ ఎస్.రాహుల్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ కోరినట్లు మారిన పేరుపై రెండు వారాల్లో సర్టిఫికెట్ జారీ చేస్తామని ఎస్‌జీపీ బదులిచ్చారు. దీంతో ధర్మాసనం.. పిటిషన్లో విచారణను ముగించింది. -
నిజాయితీగా వాస్తవాలు చెప్పండి
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది. ఉండవల్లి అరుణ్ కుమార్ కోరిన విధంగా ఆయనకు పెన్‌డ్రైవ్‌లో చందాదారుల వివరాలను అందచేసే విషయంలో తగిన సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ కేసు గురించి మీడియా ముందు మాట్లాడకుండా అరుణ్ కుమార్‌ను నియంత్రిస్తూ గ్యాగ్ ఆర్డర్ జారీ చేయాలన్న మార్గదర్శి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎలాంటి విచారణ చేపట్టకుండా ఈ దశలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆయన మాట్లాడిన మాటలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయనుకుంటే తగిన విధంగా ముందుకెళ్లొచ్చునని మార్గదర్శికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ మొదలుపెట్టిన హైకోర్టుచట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి కూడా వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది.ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని, ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణలో వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. తాను నగరంలో లేనందున విచారణను గురువారానికి వాయిదా వేయాలని ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ ధర్మాసనాన్ని కోరారు.ఇందుకు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గదర్శి తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కూడా అంగీకరించారు. ఏ రోజైనా ఇబ్బంది లేదని, తన అభ్యర్థన మాత్రం పెన్‌డ్రైవ్ గురించేనని అరుణ్ కుమార్ చెప్పారు. తదుపరి విచారణకన్నా ముందే పెన్‌డ్రైవ్‌ను అందజేస్తే, కోర్టుకు సహకరించడం సులభంగా ఉంటుందని చెప్పారు. దీనిపై వాదనలు వినే సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. గురువారం అరుణ్ కుమార్‌కు మంచి రోజని లూథ్రా వ్యాఖ్యానించగా.. అవునని, ఆ రోజున తాను స్వయంగా కోర్టు ముందు హాజరవుతానని, మీ ఉపన్యాసం వింటానని ఉండవల్లి చెప్పారు. చందాదారులు ఎవరో ఇప్పటికీ గుర్తించని మార్గదర్శి ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. చందారులందరికీ డిపాజిట్లు చెల్లించలేదని మార్గదర్శే అంగీకరించిందని «తెలిపారు. గత 10–15 సంవత్సరాలుగా ఎస్క్రో ఖాతాలో ఉన్న రూ.5.30 కోట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నారు. ఈ మొత్తాలు ఎవరివో మార్గదర్శి ఇప్పటివరకు గుర్తించలేకపోయిందని తెలిపారు. అందుకే ఈ విషయంలో కోర్టుకు సహకరించదలిచానని, ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకు రావడంలేదన్నారు. వాదనల సమయంలో అన్ని విషయాలపైనా అవసరాన్ని బట్టి తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉండవల్లి పత్రికా ముఖంగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా సలహా ఇవ్వాలని లూథ్రా కోరారు.గ్యాగ్ ఆర్డర్ కోసం అనుబంధ పిటిషన్ వేస్తామన్నారు. దీనిపై ఉండవల్లి తీవ్రంగా స్పందించారు. అవాస్తవాలతో మీరు (లూథ్రా) కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఘాటుగా చెప్పారు. ఈరోజు (సోమవారం) మార్గదర్శి కోర్టు ముందుంచిన 240 పేజీల కేసు వివరాల్లో దాదాపు 100 పేజీలు తన గురించే ఉన్నాయన్నారు. తాను మార్గదర్శిపై మాట్లాడిన విషయాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను తర్జుమా చేసి కోర్టు ముందుంచారని, ఆ తర్జుమాలు చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నారు. పత్రికల్లో ఏదో రాస్తే తనకు ఆపాదిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గత 90 రోజుల్లో మీడియాతో మాట్లాడినట్లు ఏవైనా కథనాలు ఉంటే కోర్టు ముందుంచాలన్నారు. ఇది సంచలన కేసు అని, మీడియాకు ప్రతిదీ తెలుసునని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. గురువారం వాదనలు వింటామని, ఆ రోజుకి మీ మీ శక్తిని దాచిపెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించింది.‘సన్‌లైట్ ఈజ్ ది బెస్ట్ డిస్ఇన్ఫెక్టెడ్’ (పారదర్శకంగా, నిజాయితీగా ఉండటం, వాస్తవాలను బహిర్గతం చేయడం) – మార్గదర్శిని ఉద్దేశించి ధర్మాసనం చెప్పిన యూఎస్ సుప్రీంకోర్టు జడ్జి లూయిస్ బ్రాండీస్ కొటేషన్ -
పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చు
సాక్షి, హైదరాబాద్: చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత.. సమాచారం అందించి కోర్టు అనుమతితో పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారులు అనుమతి కోరితే అనుమతించే అధికారం కోర్టుకు ఉందని స్ప ష్టం చేసింది. ఇలాంటి అంశాల్లో నిందితుల వాదన వినాలన్న నిబంధన ఎక్కడా లేదని తేల్చిచెప్పింది. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కారుపై స్టిక్కర్ ఆధారంగా మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా గుర్తించిన పోలీసులు.. ప్రమాద సమయంలో కారులో షకీల్ కొడుకు రాహిల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే అనూహ్యంగా కారు తానే నడిపాను అంటూ ఆఫ్నా న్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు ఈ కేసులో ఏ1గా ఉన్న రాహిల్‌ను ఏప్రిల్ 8న అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ కేసు తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటి షన్‌పై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. కింది కోర్టులో విచారణ ప్రక్రి య ప్రారంభించాక, సాక్షుల వాంగ్మూలం నమోదు దశలో దర్యాప్తునకు అనుమతించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ న్యాయవాది వాదించారు. రాజకీయ కారణాలతోనే కేసును తిరగదోడుతున్నారన్నారు. కింది కోర్టు ఉత్తర్వులు చట్టబద్ధమేనని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. గతంలో దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందంటూ డీసీపీ ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారని వెల్లడించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. జూబ్లీహిల్స్ కేసులో విచారణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని అభిప్రాయపడ్డారు. కేసులో దర్యాప్తు కొనసాగించినంత మాత్రాన నిందితులకు ఇబ్బంది ఏం కాదంటూ చెప్పారు. రాహిల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. -
సామాన్యుల భాషలో... సన్నిహితమైన న్యాయం
మన దేశంలోని అన్ని హైకోర్టుల్లో అధికారికంగా వాడేది ఇంగ్లీషు భాష. కానీ కేసులో గెలిచినవాడు, ఓడిన సామాన్యుడు కూడా తమ గెలుపోటములకు కారణాలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే తీర్పుల్లోని కారణాలు అర్థమయ్యే భాషలో తెలియ జేసి, సామాన్యుడికి న్యాయ వ్యవస్థ చేరువ కావాలనే సదుద్దేశ్యంతో సుప్రీంకోర్టు, దేశంలోని అన్ని హైకోర్టులు వారి తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాము ఇంగ్లీషులో వెలువరించే ముఖ్యమైన తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించే ప్రక్రియను యుద్ధ ప్రాతి పదికన చేపట్టింది. తదనుగుణంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటోంది. అనువాదకుల కొరత మూలాన ప్రస్తుతానికి ముఖ్యమైన తీర్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అనువాదకుల సేవలు ఉచితంగా స్వీకరించటం లేదు. వారి సేవలకు గాను, హైకోర్టు ప్రతి పేజీకి మూడు వందల రూపాయలు చెల్లిస్తుంది. ఇంగ్లీషులో వెలువరించిన తీర్పుల కాపీలను వారి ఇంటి దగ్గరే అనువాదం చేసి, సహేతుకమైన సమయంలో అను వాదాన్ని హైకోర్టులోని సంబంధిత అధికారులకు స్వయంగా అందజేయడం లేదా ఆన్లైన్లో పంపించటం అనువాదకుల పని. ఈ కార్యక్రమ సక్రమ నిర్వహణ కోసం హైకోర్టు తన పరిపాలనా భవనంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో తెలుగు భాషపై పట్టున్న ఇద్దరు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్‌గా; ఒక విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జిని రిపోర్టర్‌గా నియామకం చేసింది. ఇంగ్లీషు నుండి తెలుగులోకి ప్రైవేటు అనువాదకులు తర్జుమా చేసిన∙ముఖ్యమైన తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి తీర్పుకు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జోడించి, వాటిని తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో నెల వారీగా పెట్టవలసిన బాధ్యత వీరికి అప్పగించింది. వెబ్‌సైట్‌ను 2024 ఆగస్టు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ముఖ్య మైన తీర్పుల తెలుగు ప్రతులను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం కల్పించారు. అనువాదకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోడానికి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. 25 తెలుగు అనువాదకులు, 10 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 5 తెలుగు టైపిస్ట్ పోస్టులను కూడా మంజూరు చేసింది. త్వరలో హైకోర్టు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోలేదు. తెలుగు అనువాదకులు దొరకటం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో కూడా ఈ కొరత ఉందని తెలుస్తోంది.మరో విషయమేమంటే ప్రతి పౌరుడికీ హైకోర్టు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన తెలుగు తీర్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఉందనే విషయం తెలియ జేయాలనే ఆశయంతో... జిల్లా న్యాయమూర్తులు, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు; సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారులు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతగా ప్రచారం కల్పించినా తెలుగులో తీర్పులు చదువుకోవాలనుకునే విషయం, అది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉందనే విషయం అంత సులువుగా సామాన్యుడికి తెలియక పోవచ్చు. అవగాహన కల్పించటానికి సకల ప్రయత్నాలు చేయటానికి న్యాయ వ్యవస్థ గట్టిగానే కృషి చేయాలి. దీనికి న్యాయవాదుల పాత్ర పరిమితమని అనుకోవద్దు. ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కక్షిదారులు తాము దాఖలు చేసిన కేసుల్లో న్యాయ మూర్తులు ఇంగ్లీషులో వెలువరించిన తీర్పులను తమ భాషలో చదివి అర్థం చేసుకొని సంతృప్తి పడాలనే దృక్పథం. అనువాదం అంటే ప్రస్తుత కాలంలో ఎవరికీ అర్థం కాని పూర్తి గ్రాంథిక భాషా ప్రయోగం చేయకుండా, వ్యవహారిక భాషను వాడాలనీ, అవసరమైతే దైనందిన ఇంగ్లీషు పదాలను అదే విధంగా వాడాలనీ హైకోర్టు సూచన చేసింది. టెక్నాలజీ అతి వేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో, ఇప్పటికే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లలో రికార్డ్ చేసిన సాక్ష్యాల నకళ్ళను అప్పటికప్పుడు ఇరు పక్షాలకు ఉచితంగా అందజేసే ఏర్పాటు ఉంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రీ జోక్యం లేకుండా, తీర్పు చెప్పిన రోజే తీర్పు ప్రతిని ఇరుపక్షాలకు కోర్టులోనే ఉచితంగా అందజేయాలి. దిగువ కోర్టుల్లో కూడా సివిల్, క్రిమినల్ తీర్పు అనే భేదం లేకుండా, ఇదే పద్ధతి పాటించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. అయితే నూటికి నూరు శాతం తీర్పుల తెలుగు అనువాదం సరైనది లేదా తప్పులు లేనిదని చెప్పలేం. ఈ తెలుగు తీర్పుల అనువాదం కేవలం చదువుకొని అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం. తెలుగు అనువాదం ఆధారంగా ఎవరు కూడా తప్పొప్పులు ఎంచి దానిపై అప్పీళ్ళు వేసే అవకాశం లేదు. ఇందు కోసం హైకోర్టు వెబ్సైట్లో డిస్ క్లెయిమర్ కూడా చొప్పించారు.తడకమళ్ళ మురళీధర్ వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జిమొబైల్: 98485 45970 -
పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ‘మూసీ నదీ గర్భం (రివర్ బెడ్)లో నిర్మాణం చేపట్టారంటూ మార్కింగ్ చేసిన ఇళ్లను పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా? నోటీ సులు జారీ సహా చట్టప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియను పాటిస్తున్నారా?’ అని రాష్ట్ర ప్రభుత్వా న్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ సమాధానమిచ్చారు. పరిహారంపై నిర్వాసితులతో మాట్లాడి, వారు సమ్మతించిన తర్వాతే ఇళ్ల కూల్చివేత చేపడుతున్నామని కోర్టుకు వివరించారు. ఏఏజీ చెప్పిన అంశాలను నమోదు చేసుకుంటున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు హైడ్రాను ఆదేశించింది.కేఏ పాల్ పిటిషన్ మేరకు..‘‘మూసీకి సంబంధించి సరైన సర్వే నిర్వహించి, ఆక్రమణలను గుర్తించే వరకు భవనాలను కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలని.. బాధితులకు నోటీసులు ఇచ్చి, ఇళ్లు ఖాళీ చేయడానికి లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి నెల రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుల ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.పారదర్శకంగా చర్యలు: ఏఏజీవిచారణ సందర్భంగా ఏఏజీ ఎక్కడ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయ వాదులు హాజరుకాకుంటే ఎలాగని, పిటిషనర్ల వాదనలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొంది. దీనితో ఏఏజీ విచారణకు హాజరై వాదనలు వినిపించారు. ‘‘చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. నోటీసు లిచ్చి సమయం ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు చేప డుతున్నాం. ప్రజలందరి విషయంలో ఒకేలా వ్యవ హరిస్తున్నాం. తారతమ్యాలు లేవు. పారదర్శకంగా, నిష్పక్ష పాతంగా చర్యలు చేపడుతున్నాం’’ అని వివరించారు. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఏర్పాటైందని.. రివర్ బెడ్లోని ఇళ్లకు మార్కింగ్ మాత్రమే చేసిందని, ఇంకా కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా జారీ చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏఏజీ వాదనలను రికార్డు చేశామని, ఈ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. బాధితుల్లో ఎక్కువ మంది పేదలే..: పాల్విచారణ సందర్భంగా పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ తానే వాదనలు వినిపించారు. ‘‘ఆక్రమణదారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిజిస్ట్రేషన్, విద్యుత్, నిర్మాణ, నల్లా అనుమతులు ఇచ్చిన అధికారులు అందరూ ఆనందంగానే ఉన్నారు. అనుమతులు ఉన్నాయి కదా అని కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి వారే రోడ్డున పడుతున్నారు. ‘హైడ్రా’ బాధితుల్లో ఎక్కువ మంది వారే. 462 నిర్మాణాలను, భవనాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారు. ఎన్ కన్వెన్షన్‌ను ఒక్కరోజులో కూల్చిన అధికారులు.. దాదాపు 250 మంది పెద్దలకు మాత్రం నోటీసులు జారీ చేసి వదిలేశారు. పేద, మధ్యతరగతికి సమయం ఇవ్వకుండా ప్రతాపం చూపిస్తున్నారు. కూల్చడానికి నేను వ్యతిరేకం కాదు.. కానీ, చట్టాన్ని పాటించాలి. న్యాయవాదులను పెట్టుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. లక్షల మంది హైడ్రా తమ ఇంటి మీదకు ఎప్పుడో వస్తుందో అని భయంతో బతుకుతున్నారు. అలాంటి వారి కోసమే పిల్ వేశాను. ఇళ్లు కూల్చే వారికి ముందే పరిహారం ఇవ్వాలి. నోటీసులిచ్చి ఖాళీ చేసే సమయం ఇవ్వాలి. తెలంగాణ మరో ఉత్తరప్రదేశ్‌లా మారకముందే చర్యలు తీసుకోవాలి. ఇళ్ల కూల్చివేతపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి’’ అని పాల్ వాదనలు వినిపించారు. -
సీట్లొచ్చినా.. చేరేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీట్ల పెంపును ప్రభుత్వం అడ్డుకుంటే, కాలేజీలే సీట్లు భర్తీ చేసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. క్లాసులు కూడా మొదలయ్యాయి. విద్యార్థులంతా ఇంజనీరింగ్, డిగ్రీ, లేదా ఇతర రాష్ట్రాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు.ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో పెరిగే దాదాపు 3 వేల సీట్లు ఎలా భర్తీ అవుతాయనేది అర్థం కావడం లేదు. కోర్టు తీర్పు రాగానే ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాయి. ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకుంటున్నాయి. విద్యాజ్యోతి కాలేజీలో 120 సీట్లు పెరిగితే 15 మంది స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరారు. మిగతా మూడు కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత మేర జరిగాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీట్ల పెంపును అడ్డుకునేందుకు ప్రభుత్వం.. ఎలాగైనా సీట్లు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలు న్యాయపోరాటానికీ వెనుకాడటం లేదు.వచ్చే ఏడాదిపైనే ఆశడిమాండ్ లేని ఇతర కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ప్రైవేటు కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి. అనుమతులూ తెచ్చుకున్నాయి. దీనికి ప్రభుత్వం ససేమిరా అనడం, వివాదం కోర్టు మెట్లెక్కడం తెలిసిందే. ఆలస్యంగా తీర్పు వచ్చినా ప్రైవేటు కాలేజీలు సీట్లపై ఎందుకు ఆసక్తి చూపుతున్నాయనే సందేహాలు కలుగుతున్నాయి. కాలేజీలు ఈ సంవత్సరాన్నే దృష్టిలో పెట్టుకోలేదు.ఇప్పుడు సీట్లు పెరిగితే, వచ్చే ఏడాదీ ఇది కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రవేశాలు కాకున్నా, కంప్యూటర్ సీట్లు కావడం వల్ల వచ్చే ఏడాది అన్నీ భర్తీ అయ్యే వీలుంది. ఒక్కో బ్రాంచీలో 120 సీట్లు ఉంటే, మేనేజ్మెంట్ కోటా కింద దాదాపు 33 సీట్లు ఉంటాయి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక్కో సీటు రూ.16 లక్షలపైనే పలుకుతుంది. డిప్లొమా కోర్సుల ద్వారా రెండో ఏడాదిలోనూ ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తారు. ఇందులోనూ మేనేజ్మెంట్ కోటా సీట్లు పెంచుకునే వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి కాలేజీలు సిద్ధపడుతున్నాయి.ప్రభుత్వం పట్టుదల ఎందుకు?హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే స్పాట్ ద్వారా చేరిన విద్యార్థులకు ఇబ్బంది తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. సీట్ల పెంపును అడ్డుకోవడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రైవేటు కాలేజీలపై నియంత్రణ దిశగా వెళ్లాలనుకుంటున్న ప్రభుత్వానికి ఈ విషయం కీలకమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సీట్ల పెంపును అనుమతిస్తే, భవిష్యత్‌లో ప్రతీ కాలేజీ సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకునే ప్రమాదం ఉందని, సీఎస్ఈ దాని అనుబంధ కోర్సులే ఉండే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే సీట్ల పెంపును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకూ పోరాడుతోందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.ఇది ప్రభుత్వం కక్షేమౌలిక వసతులన్నీ ఉండటం వల్లే సీట్ల పెంపును కోరాం. ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ అనుమతించింది. కోర్టు కూడా పెంచుకోవచ్చని తెలిపింది. అయినా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం. విద్యారంగంలోకి రాజకీయాలను తీసుకురావడం మంచిది కాదు. సీఎస్ఈ సీట్ల కోసం విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సీట్లు లేకుండా చేయడం సమంజసం కాదు. - సూర్యదేవర నీలిమ (ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకురాలు)