Tamil Nadu
-
● చైన్నె నగరం, శివారులలో భారీ వర్షం ● విమానాలు, రైలు సేవలకు ఆటంకం ● తమిళనాడు వైపుగా కదులుతున్న అల్పపీడన ద్రోణి ● ఎగసి పడుతున్న కెరటాలు ● కంట్రోల్ రూమ్‌లో డిప్యూటీ సీఎం ● జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. చైన్నె నగరం, శివారు జిల్లాలలో సోమవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. చైన్నెలో మంగళవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రోడ్లు జలమయం కావడంతో ఉదయాన్నే వాహనదారులకు అవస్థలు తప్పలేదు. అయితే సిబ్బంది గంటల వ్యవధిలోనే నీటిని తొలగించారు. వర్షాల నేపథ్యంలో చైన్నె రిప్పన్ బిల్డింగ్‌లోని కంట్రోల్ రూమ్‌లో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో సోమవారం సాయంత్రం అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో రాత్రంతా చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలో అనేక చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది. చైన్నెలో వర్షం కారణంగా పలు విమాన సేవలకు ఆటంకాలు తప్పలేదు. భారీ వర్షంతో విమానాలు కొన్ని అర్ధగంట ఆలస్యంగా టేకాఫ్, ల్యాండింగ్‌లు తీసుకున్నాయి. అలాగే మంగళవారం ఉదయం దక్షిణ తమిళనాడు నుంచి చైన్నె వైపుగా అన్ని రైళ్ల సేవలు ఆలస్యంగా జరిగాయి. గంట ఆలస్యంగా తాంబరం, ఎగ్మూర్ స్టేషన్లకు రైళ్లు వచ్చి చేరాయి. చైన్నె నగరంలో పలు మార్గాలలో రోడ్లపై వర్షపు నీరు చేరడంతో ఆగమేఘాలపై తొలగింపు పనులు చేపట్టారు. గంట..గంటన్నర వ్యవధిలో నీళ్లన్నీ తొలగాయి. ఈ సమయంలో వాహన దారులకు అవస్థలు తప్పలేదు. ట్రాఫిక్ కష్టాలు ఎక్కువే. ఉదయం వరకు వర్షం కొనసాగడంతో చైన్నెలో పాఠశాలలకు మాత్రం సెలవు ప్రకటించారు. చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో చెదురుముదురు వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటలో చైన్నె పెరుంగుడిలో అత్యధికంగా 8 సెం.మీ, మీనంబాక్కం, ఆలందూరు, అడయార్, నందనంలలో 6 సెం.మీ వర్షం కురిసింది. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు, సుంగువారి సత్రం, పడప్పై, చెంగల్పట్టు జిల్లా ఊరపాక్కం, గూడువాంజేరి పరిసరాలలో మోస్తరుగా వర్షం కురిసింది. పంబల్ – అనకాపుత్తూరు మార్గంలో గతుకులతో నిండిన రోడ్డులో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చైన్నె నగరంలో మెట్రో రైలు పనులు జరుగుతున్న మార్గాలలో ట్రాఫిక్ కష్టాలు మరింతగా తప్పలేదు. కోరైకుప్పంలో అలల లాకిడికి లంగరు వేసి ఆపి ఉన్న చిన్న చిన్న పడవలు సముద్రంలో కొట్టుకెళ్లడంతో జాలర్లు అప్రమత్తమై ఒడ్డుకు చేర్చారు. కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో తిరువొత్తియూరు, కాశిమేడు పరిసర జాలర్లు చేపల వేటకు వెళ్లలేదు. అన్నానగర్‌లో రెండు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో చైన్నె నగరంలో 19 వేల చెట్లకు ఉన్న కొమ్మలను ముందు జాగ్రత్తగా తొలగించే పనులు వేగవంతం చేశారు. తమిళనాడు వైపుగా కదులుతున్న ద్రోణి చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు వరకు వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో నెలకొన్న ద్రోణి బలహీన పడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశాలు లేవని వాతావరణ కేంద్రం ప్రకటించింది. బలహీన పడ్డ ఈ ద్రోణి తమిళనాడు వైపుగా ప్రయాణిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇది ఉత్తర తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ మధ్య ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు కుస్తాయని, అయితే నష్టం వాటిల్లే రీతిలో ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. ఇక బుధ, గురువారం చైన్నె, శివారు జిల్లాలలో 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు దక్షిణ తమిళనాడు , పశ్చిమ కనుమల వెంబడి అనేక జిల్లాలో మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ బాలచంద్రన్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతం, మన్నార్ వలిగుడా దీవి, కన్యాకుమారి, దక్షిణ ఆంధ్రా వైపుగా సముద్రంలో గంటకు 55 కి.మీ వేగం వరకు గాలులు వీస్తాయని, అలల తాకిడి అధికంగా ఉంటుందని వివరించారు. ఈ ప్రాంతాల వైపుగా వేటకు వెళ్ల వద్దని జాలర్లను హెచ్చరించారు. ఈ అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం లేదని, ఇది బలహీన పడి తీరం వైపుగా కదులుతున్నట్టు స్పష్టం చేశారు. అక్టోబరు 1వ తేదీ నుంచి మంగళవారం వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాలల్లో 25 సెం.మీ వర్షం కురిసిందన్నారు. ఈ కాలంలో 25.9 సె.మీ వర్షంకు రావాల్సి ఉందని, అయితే, ఒక శాతం తక్కువ అని పేర్కొన్నారు.చైన్నెలో వర్షంలో పాట్లుకంట్రోల్ రూమ్‌లో డిప్యూటీ సీఎం చైన్నెలో రాత్రంతా వర్షం కురవడంతో ఉదయాన్నే డిప్యూటీసీఎం ఉదయనిధి స్టాలిన్ కార్పొరేషన్ భవనం రిప్పన్ బిల్డింగ్‌లోని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకున్నారు. అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించి నీళ్లు త్వరితగతిన తొలగించే పనులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టా లిన్ మాట్లాడుతూ, ముందు జాగ్రత్త చర్యలు మరియు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించామన్నారు. 1,194 మోటార్ పంపులు, 158 సూ పర్ పవర్ మెషీన్లు, 524 జెట్ రాడింగ్ యంత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయని వివరించారు. 329 సహాయ కేంద్రాలు, 120 ఆహార తయారీ కేంద్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అక్టోబరులో కురిసిన వర్షం సందర్భంగా సాగిన సహాయక చర్యలను గుర్తు చేస్తూ, ఈ సారి ఏ ఒక్క సబ్వేలోనూ నీళ్లు చేరలేదన్నారు. 21 సబ్ వేలలో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయని వివరించారు. చైన్నెలోనే కాదు, తిరుచ్చి, మదురై, తంజావూరుల తదితర జిల్లాలో ముందు జాగ్రత్తలన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా, వర్షాలు విస్తారంగా కురుస్తుండటం, ఈశాన్య రుతు పవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు విస్తృతం చేయా లని, సర్వం సిద్ధంగా ఉంచుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
మద్రాసు ఐఐటీలో వర్చువల్ రియాలిటీ సెంటర్
సాక్షి, చైన్నె: జాతీయ స్థాయిలో విద్యా భాగస్వామ్యం లక్ష్యంగా ఐఐటీ మద్రాసులో వర్చువల్ రియాలిటీ సెంటర్ఏర్పాటు కానుంది. ఈనెల 16, 17వ తేదీన జరిగే సమ్మిట్‌లో అత్యాధునిక రంగంలో ఎక్స్ ఆర్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ ఆర్ కోర్సులను విస్తరించడానికి దీనిని తొలిమెట్టుగా నిర్ణయించారు. ఎక్స్పెరెన్సియల్ టెక్నాలజీ ఇన్నో వేషన్ సెంటర్, వర్చువల్ రియాలిటీ సంబంధిత రంగాలలో ఐఐటీ మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ ఎమినెన్స్ సెంటర్, (అకడమిక్ పార్టనర్షిప్ ప్రోగ్రామ్)గా ఎక్స్టెండెడ్ రియాలిటీని పెంచడానికి నిర్ణయించారు. గ్లోబల్ మార్కెట్ కోసం భారతదేశంలో అత్యంత శిక్షణ పొందిన ఎక్స్ ఆర్ డెవలపర్లు డిజైనర్లను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ సెంటర్ మీద దృష్టి పెట్టనున్నారు. ఈ విషయంగా మంగళవారం ఐఐటీ మద్రాసు ఫ్యాకల్టీ హెడ్, ప్రొఫెసర్ మణివణ్ణన్ మాట్లాడుతూ భారతదేశం ఎక్స్ ఆర్ కారిడార్‌ను స్థాపించాలనే లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు చేపట్టామన్నారు. 2047 నాటికి, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ రెండింటిలోనూ అధిక నాణ్యత గల ఎక్స్ ఆర్ సిస్టమ్ డిజైనర్లు, డెవలపర్ల మానవశక్తి వనరులను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైనట్టు వివరించారు. అందుకే ఎక్స్ ఆర్ ఆవిష్కరణలపై దృష్టి సారించే సమ్మిట్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమ్మిట్‌లో టాప్ 10 ఎక్స్ ఆర్ స్టార్టప్‌లు, అంతర్జాతీయ ఎక్స్ ఆర్ స్టార్టప్‌లకు అవార్డులు, సోషల్ ఇంపాక్ట్ అవార్డు లు, ఉత్తమ ఎక్స్ ఆర్ సహకార తదితర అవార్డులను ప్రదానం చేయబోతున్నామని పేర్కొన్నారు. అధిక వడ్డీ ఆశ చూపి 30 మందికి కుచ్చుటోపీ ● సైబర్ నేరగాళ్ల కోసం పోలీసుల విచారణ కొరుక్కుపేట: ఆన్లైన్ యాప్‌లో డబ్బు పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని చెప్పి 30 మంది నుంచి కోట్లాది రూపాయలు లూటీ చేశారు. దీంతో 30 మంది బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. పుదుచ్చేరి, కారైక్కల్లలో రోజురోజుకూ ఆన్లైన్ మోసాల ముఠాలు ప్రజల నుంచి వివిధ మార్గాల్లో డబ్బులు దండుకుంటున్నాయి. వెబ్సైట్లలో ప్రకటనలు, ఆకర్షణీయమైన ఆఫర్లపై ఆధారపడి మోసగాళ్లకు ప్రజలు తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఈ సందర్భంలో ఆన్లైన్ యాప్ వెబ్సైట్లో డబ్బు పెట్టుబడి పెడితే అధిక వడ్డీ వస్తుందని టెలిగ్రామ్ సహా సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగింది. దీన్ని నమ్మి కొందరు వ్యక్తులు యాప్‌లో రూ. వెయ్యి నుంచి పది వేల వరకు పెట్టుబడి పెట్టారు. రెండు రోజుల తర్వాత 10 వేలకు రూ. 2,000 వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టిన సాధారణ ప్రజలకు డబ్బు తిరిగి వచ్చింది. దీంతో మరింత మంది రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. తర్వాత ఎలాంటి వడ్డీ రాకపోవడంతో మోసపోయిన 30 మందికి పైగా బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చైన్నె సంగీతోత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కొరుక్కుపేట: చైన్నెనగరంలో డిసెంబర్లో నిర్వహించే మార్గళి సంగీతోత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోందని మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డ్రామా సంస్థ సీఈవో కల్యాణ సుందరం తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగీత నగరంగా ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన చైన్నెకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏటా డిసెంబర్ 1 నుంచి జనవరి 15 తేదీ వరకు దాదాపు ఒకటిన్నర మాసం పాటు చైన్నె నగరంలో వివిధ సభలల్లో మార్గళి సంగీతోత్సవాలు వైభవంగా జరుగుతాయని తెలిపారు. ఈ సంగీత కార్యక్రమాలకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి సైతం సంగీత ప్రియులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. సంగీత ప్రియులకు ఆయా సభల్లో జరిగే సంగీత కార్యక్రమాలకు ఎండీఎన్డీ సంస్థ టిక్కెట్లను, క్యాటిన్ టోకన్లను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నట్టు తెలిపారు. 2024–25 సంగీతోత్సవాలకు తమ సంస్థ కచేరి టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించామన్నారు. నగరంలోని 14 సంగీత సభలతో భాగస్వామ్యం చేసుకున్నామని తెలిపారు. ఆయా సభల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. టిక్కెట్ల కోసం www.mdnd.in ను చూడవచ్చని తెలిపారు. -
క్లుప్తంగా
పిల్లిని వేటాడుతూ..బావిలో పడిన పులి సేలం : పిల్లిని వేటాడుతూ బావిలో పడిన పులి వలలో చిక్కుకుని తర్వాత తప్పించుకుని పారిపోయిన ఘటన ధర్మపురి జిల్లా పాలక్కోడులో మంగళవారం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా పాలక్కోడు సమీపంలోని మారన్డ హల్లి చంద్రాపురం గ్రామానికి చెందిన రైతు మాదన్. గ్రామంలో ఇతనికి సొంతమైన రైతు బావి ఉంది. ఆ బావిలో నుంచి పిల్లి అరుపుల శబ్ధం విన్న ఓ స్థానికుడు బావిలోకి చూడగా అక్కడ పిల్లితో పాటు పులి ఎదురెదురుగా ఉండడం చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి వలతో వాటిని బావి నుంచి బయటకు తీశారు. ఈ క్రమంలో వలలో నుంచి పులి తప్పించుకుని పారిపోయింది. దీంతో చేసేది లేక అటవీ శాఖ అధికారులు గ్రామంలో పులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైకు ద్వారా హెచ్చరించారు. రైల్వే ఇనుము చోరీ చేసిన యువకుడి అరెస్టు తిరువొత్తియూరు: అన్ననూరు రైల్వేస్టేషన్లో రైలు పట్టాల ఇనుము చోరీ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆవడి సమీపంలోని అన్ననూరు రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం పక్కన పడి ఉన్న రైలు పట్టాలకు సంబంధించిన ఇనుప కమ్ములు తరచు చోరీ అవుతున్నాయి. దీని గురించి రైల్వే భద్రత దళం ఇన్స్పెక్టర్లు సచిన్ కుమార్, నవీన్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్లు అయ్యప్పన్, కార్తికేయన్ తీవ్రంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రైలు పట్టాలకు సంబంధించిన ఇనుమును అంబత్తూరు సమీపంలోని వరగడం ప్రాంతానికి చెందిన కార్తీక్ గుర్తించి అరెస్టు చేశారు. యువకుడి బలవన్మరణం తిరుత్తణి: తిరుత్తణి రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన ఆనంద్‌బాబు(31) ఇంజినీరింగ్ పట్టభద్రుడు. ఇతని తల్లితండ్రులు రెండేళ్ల కిందట మృతిచెందారు. చెల్లికి వివాహం కావడంతో భర్తతో తిరుపతిలో ఉంటోంది. తిరుత్తణి లోని ఇంట్లో ఆనంద్‌బాబు ఒంటరిగా ఉంటున్నాడు. ఈక్రమంలో ఆనంద్‌బాబు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానించిన స్థానికులు సోమవారం రాత్రి తిరుత్తణి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ గుణశేఖర్ పోలీసులతో ఇంటి వద్దకు చేరుకుని ఇంటి తలుపు తెరిచి చూడగా బెడ్రూమ్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆనంద్‌బాబు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆనంద్‌బాబు రెండు నెలల కిందట ఇంటిని విక్రయించేందుకు వీలుగా కొనుగోలుదారుడి నుంచి రూ.30 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు, ఆ డబ్బుతో నిత్యం మద్యం తాగి వుండేవాడని, ఒంటరితనం, మద్యంతో మానసికంగా కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం ● ఒకరి మృతి ● మరొకరి పరిస్థితి విషమం తిరువళ్లూరు: ఆగివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తిరువళ్లూరు జిల్లా మేలానూర్ గ్రామానికి చెందిన శేఖర్(59). ఇతని భార్య శాంతి(49). వీరిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో దంపతులు ఇద్దరు కలసి కూలీ పనులకు సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. ఈకాడుకండ్రిగ వద్ద వెళుతుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుకు సమీపంలో ఆగివున్న లారీని ఢీ కొంది. ఈప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శేఖర్ మంగళవారం మృతిచెందాడు. శాంతిపరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చైన్నె వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు తిరువొత్తియూరు: తేని జిల్లాలో హాస్టల్లో వేధింపులకు గురి చేస్తున్న వార్డెన్‌పై విద్యార్థినులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలు.. తేని సమీపంలోని కోట్టూరులో ఆది ద్రావిడ సంక్షేమ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న 60 మందికి పైగా విద్యార్థినులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈక్రమంలో హాస్టల్ విద్యార్థినులు తేని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అందులో హాస్టల్ వార్డెన్‌గా ఉన్న శశిరేఖ, వంటమనిషి మాలతి విద్యార్థులను కొట్టడంతోపాటు అన్ని పనులూ చేయిస్తున్నారని, నాణ్యత లేని ఆహారం ఇస్తున్నారని ఆరోపించారు. దీని గురించి ఎవరికై నా ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్న ముగ్గురు విద్యార్థినులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే హాస్టల్‌కు చెందిన విద్యార్థినికి నోటిలో పచ్చిమిర్చి పెట్టి వేధించారని, దీంతో ఓ విద్యార్థిని స్పృహతప్పి చికిత్స పొందుతున్న వాపోయారు. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. -
ఆసుపత్రిలో చేరిన ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు నిందితుడు
కొరుక్కుపేట: ఆమ్‌స్ట్రాంగ్ హత్య కేసులోఅరెస్టు అయిన ఓ నిందితుడు ఆర్యోగ సమస్యలు కారణంగా స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్మ్‌స్ట్రాంగ్‌ను గత జూలైలో పెరంపూర్లోని ఆయన ఇంటి సమీపంలో ఓ మిస్టరీ ముఠా నరికి చంపింది. ఈ హత్యకు సంబంధించి మొత్తం 26 మందిని అరెస్టు చేశారు. అలాగే అరెస్టయిన రౌడీ తిరువెంకడం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. ఇక ఆవడిలోని అంగళ పరమేశ్వరి అమ్మన్ కోవిల్ వీధికి చెందిన సెల్వరాజ్ (50) కూడా ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకేసులో అరెస్ట్ అయిపూందమల్లి జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఈక్రమంలో సోమవారం సెల్వరాజ్ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పోలీసు రక్షణలో సెల్వరాజ్ క్రిమినల్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీలో రాళ్ల సమస్య కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. -
కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్
కొరుక్కుపేట: కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు వాల్టర్స్ కువేర్ సంస్థ ఉపాధ్యక్షుడు జోష్ అండర్వుడ్ సూచించారు. చైన్నెలోని మూకాంబిగైనగర్, కళ్లేకుప్పంలోని అరుణోదయం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుపుతున్న విద్యార్థి వసతి గృహాలకు అమెరికాకు చెందిన వాల్డర్స్ క్లువేర్ సంస్థ 18 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ ప్యానెల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆట్రస్టు నడుపుతున్న బాలికల వసతి గృహానికి 10 కిలోవాట్ల విద్యుత్, బాలుర వసతి గృహానికి 8 కిలోవాట్ల విద్యుత్ సరఫరా అయ్యేలా ఈ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థను జోష్ అండర్వుడ్ ప్రారంభించారు ఆ సంస్థ చైన్నె శాఖ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వైద్యనాథన్, అరుణోదయం ట్రస్టు వ్యవస్థాపక మేనేజింగ్ ట్రసీ అయ్యప్పన్ సుబ్రమణియన్ పాల్గొన్నారు. -
కుమరిలో తిరువళ్లువర్ విగ్రహ సిల్వర్ జూబ్లీ వేడుక
● డిసెంబరులో నిర్వహణ ● 14,15 తేదీలలో అరియలూరు, పెరంబలూరుకు సీఎం ● 17 యూనియన్ పంచాయతీలకు భవనాలు సాక్షి, చైన్నె: కన్యాకుమారి సాగరంలో కొలువై ఉన్న తిరువళ్లువర్ విగ్రహ సిల్వర్‌జుబ్లీ వేడుకలను అత్యంత కోలాహలంగా నిర్వహించేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇందుకు సంబందించిన వీడియోను మంగళవారం సీఎం విడుదల చేశారు. కలైంజ్ఞర్ కరుణానిధి కన్యాకుమారిలో తమిళ మహాకవి తిరువళ్లువర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సముద్ర కెరటాలు ఎగిసిపడే కుమారి సముద్రం మధ్యలో 133 అడుగుల తిరువళ్లువర్ విగ్రహం 2000 సంవత్సరంలో కొలువైనట్టు వివరించారు. తిరువళ్లువర్ కీర్తికి నిలువెత్తు దర్పణంగా ఉన్న ఈ విగ్రహం సిల్వర్ జుబ్లీ వేడుకలకు సిద్ధమవుతోందన్నారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించి 25 ఏళ్లు కావస్తుండటంతో డిసెంబరు 31, వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ రెండు రోజుల బ్రహ్మాండ వేడుక నిర్వహించాలని నిర్ణయించామని ప్రకటించారు. ఈ సందర్భంగా తిరువళ్లువర్ తిరుక్కురల్‌లోని అంశాలను గుర్తు చేస్తూ, తిరువళ్లువర్‌కు కాషాయం రంగు రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరువళ్లువర్ తమిళులందరికి చిహ్నం అని వివరిస్తూ, 25 సంవత్సరాల వేడుకకు స్వయంగా తాను హాజరు కాబోతున్నానని ప్రకటించారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని – కళాశాల విద్యార్థుల మధ్య సోషల్ మీడియాలో లఘు చిత్రాలు, వివిధ చిత్రాలు, డిజిటల్ టెక్నాలజీ ద్వారా తిరుక్కురల్ ఘనత చాటే పోటీలను నిర్వహించనున్నామని వివరించారు. ఇదిలా ఉండగా సీఎం స్టాలిన్ క్షేత్ర స్థాయి పర్యటన తదుపరి అరియలూరు, పెరంబలూరు జిల్లాలో జరగనున్నది. ఈనెల 14,15 తేదీలలో ఈరెండు జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఇదిలా ఉండగా, సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంగళవారం గ్రామీణాభివద్ధి, పంచాయతీ శాఖ నేతృత్వంలో రూ.64.53 కోట్లతో పూర్తి చేసిన 17 పంచాయతీ యూనియన్ కార్యాలయాల భవనాలను సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కడలూర్, ఈరోడ్, కన్యాకుమారి, పుదుకోట్టై, తెన్కాశి, తంజావూరు, తేని, తూత్తుకుడి, తిరుచ్చి, తిరుపూర్, విల్లుపురం జిల్లాలో ఈ యూనియన్ పంచాయతీ కార్యాలయాల భవనాలను నిర్మించారు. కాగా, డీఎంకే కార్యకర్తలకు సీఎం స్టాలిన్ ఓ లేఖ రాశారు. ఇందులో ద్రావిడ ప్రజలు మన వెన్నంటే ఉన్నారని, దీనిని చూసి ప్రత్యామ్నాయం అంటూ వస్తున్న వారిలో కలవరం బయలు దేరి ఉందని పరోక్షంగా విజయ్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రత్యామ్నాయం అని వ్యాఖ్యలు చేసే వారికి ద్రావిడ మోడల్ విజయం ఏమిటో, చరిత్ర సృష్టించే విధంగా తెలియచేద్దామని పిలుపు నిచ్చారు. -
విడతలవారీగా అటవీ గ్రామాలకు రోడ్డు వసతి
వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గంలోని అన్ని అటవీ గ్రామాలకు రోడ్డు వసతి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వేడుకున్నారు. అనకట్టు నియోజక వర్గంలో ప్రజలతో ముఖ్యమంత్రి పథకం కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సుమారు నాలుగు గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. అందులో 445 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి వివిధ శాఖల ద్వారా రూ: 9.16 లక్షలు విలువ చేసే సంక్షేమ పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అధికంగా అటవీ గ్రామాలో ఉండటంతో విడతల వారీగా అన్ని గ్రామాలకు రోడ్డు వసతి ఏర్పాటు చేస్తున్నామని త్వరలోనే తారు రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఈ ప్రాంతంలోని వారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే డోలి కట్టి కొండ కిందకు తీసుకొచ్చి ఆసుపత్రికి తీసుకెల్లే వారన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రస్తుతం కొంత వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందజేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను కొండ ప్రాంత వాసులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని చిన్న చిన్న వృత్తులు ప్రారంభించి వాటి ద్వారా అభివృద్ధి చేయాలన్నారు. ప్రస్తుతం పథకాలు అందని లబ్దిదారులకు కూడా త్వరలోనే విచారణ జరిపి అందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మాలతి, జెడ్పీ ఛైర్మన్బాబు, సబ్ కలెక్టర్ బాల సుబ్రమణియన్, తహసీల్దార్ వేండా పాల్గొన్నారు. -
ఇంట్లో మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
అన్నానగర్: చైన్నె మైలాపూర్ అంబేద్కర్ పాలెం షణ్ముగం పిళ్లై వీధిలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు మైలాపూర్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళవారం మారువేషంలో వెళ్లగా.. అక్కడ మద్యం విక్రయిస్తున్న మహిళను పట్టుకున్నారు. విచారణలో ఆ మహిళ పేరు రేవతి (37) అని తేలింది. ఇప్పటికే 6 సార్లు అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడింది. ఆమెకి సహకరించిన వ్యక్తి మైలాపూర్ శ్రీనివాసన్ రోడ్ ప్రాంతానికి చెందిన అయ్యనార్ (24) అని తెలిసింది. అతడిని కూడా అరెస్టు చేశారు. అయ్యనార్, మెరీనా పోలీస్ స్టేషన్ హిస్టరీ రిజిస్టర్ క్రిమినల్, అతనిపై 6 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరు నుంచి 450 క్వార్టర్ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రైతుల సహకారంతో కొత్త శిఖరానికి..
సాక్షి, చైన్నె : రైతుల సహకారంతో తాము కొత్త శిఖరానికి చేరుకున్నట్టు ఇంటర్నేషనల్ ట్రాక్టర్ లిమిటెడ్ జాయింట్ ఎండీ రామన్ మిట్టల్ తెలిపారు. 2024 అక్టోబరులో 20,056 సోనాలికా ట్రాక్టర్స్‌ను సిద్దం చేసి విక్రయాలలో రికార్డు సృిష్టించామని మంగళవారం స్థానికంగా ప్రకటించారు. ట్రాక్టర్ల చరిత్రలో అతిపెద్ద నెలవారీ పనితీరు రైతులకు అనుకూలీకరించినట్టు వివరించారు. ట్రాక్టర్ని కలిగి ఉండటాన్ని సులభతరం చేయడం, స్థిరమైన వ్యవసాయ శ్రేయస్సును అందించే విధంగా కొత్త యాంత్రీకరణ , మిషన్‌కు అనుగుణంగా పయనిస్తున్నామని పేర్కొన్నారు. అతిపెద్ద పండుగల సీజనన్‌లో ‘హెవీ డ్యూటీ ధమాకా’ రైతులకు సరసమైన ధరలకు అధునాతన సాంకేతికతతో నడిచే ట్రాక్టర్లను అందిస్తున్నామని ప్రకటించారు. రైతులు జీవితంలో ముందుకు సాగడానికి ఇది కీలక సహకారంగా ఉంటుందన్నారు. పశువుల కాపరి అనుమానాస్పద మృతి తిరువళ్లూరు: పశువుల కాపరి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ గ్రామానికి చెందిన కదిరవన్(21). ఇతను కూలీ పనులతో పాటు పశువులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 10న పశువులు తోలుకెళ్లిన కదిరవన్ సాయంత్రం ఇంటికి రాలే దు. బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఫలితం లేక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అ యితే పశువుల వద్దకు వెళ్లిన కదిరవన్ సమీపంలోని వ్యవసాయ భూమిలో అనుమానాస్పద స్థితిలో మృతదేహంగా కనిపించాడు. మృతుడి తండ్రి ఇరుదయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెన్కనికోటలో ఏనుగు మృతి అన్నానగర్: క్రిష్ణగిరి జిల్లా తెన్కనికోట సమీపంలో అటవీ మంగళవారం ఉరిగం అటవీ ప్రాంతంలో ఓ బండరాయికి దిగువన ఏనుగు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు గుర్తించి ఆ ఏనుగు ఎలా చనిపోయింది? అనే విషయంపై విచారణ చేపట్టారు. మరో మగ ఏనుగు దానిని ఎత్తయిన ప్రదేశం నుంచి తోసివేయడం వల్లే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఏనుగు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అక్కడే పూడ్చిపెట్టారు. మృతి చెందినది మగ ఏనుగు కావడంతో అటవీశాఖ అధికారులు దాని 2 దంతాలను స్వాధీనం చేసుకున్నారు. -
తరగతి గదిలో విద్యార్థుల నోటికి ప్లాస్టర్
● ప్రభుత్వ పాఠశాలలో వింత శిక్ష ● ప్రధానోపాధ్యాయుడిపై చర్యలకు డిమాండ్ అన్నానగర్: తరగతి గదిలో మాట్లాడిన కొందరు విద్యార్థుల నోటికి టేపు అంటించిన ఘటన సంచలనమైంది. వివరాలు.. తంజావూరు జిల్లా ఒరత్తనాడు పంచాయతీ యూనియన్ పరిధిలోని అయ్యంబట్టి గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, కొందరు గ్రామస్తులు సోమవారం తంజావూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థుల నోటికి ప్లాస్టర్ (టేపు) అంటించారని ఫొటోగ్రాఫిక్ ఆధారాలతో కలెక్టర్ ప్రియాంక పంకజంకు వినతిపత్రం ఇచ్చారు. ఇందులో అయ్యంబట్టి ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 5 మంది విద్యార్థుల నోటికి ప్లాస్టర్ వేసి 4 గంటలపాటు ఉంచారని ఆరోపించారు. దీంతో విద్యార్థులకు అస్వస్థత ఏర్పడిందని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఈమేరకు విచారణ చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక పంకజం పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
3.50 కోట్ల మందికి తాగునీరు
తిరువళ్లూరు: డీఎంకే అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 3.50 కోట్ల మందికి స్వచ్ఛమైన తాగునీటిని అందజేసినట్టు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నెహ్రూ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి కార్పొరేషన్ పరిధిలో రూ.59.92 కోట్ల వ్యయంతో చేపడుతున్న తాగునీటి విస్తరణ పథకం, రూ.98.59 కోట్ల వ్యయంతో సబ్వే డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం మంగళవారం ఆవడిలో జరిగింది. కార్యక్రమాలకు రాష్ట్ర మంతులు, నాజర్, నెహ్రూ హాజరయ్యారు. ఆవడి పరిధిలో వేర్వేరు పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మంత్రి నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వున్న 25 కార్పొరేషన్లకు దశల వారిగా 24 గంటలు తాగునీటిని అందజేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో ముందుగా ఆవడి కార్పొరేషన్‌ను ఎంపిక చేసి గత ఏడాది పనులను ప్రారంభించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 60 శాతం మంది మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్నారని, వీరందరికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమన్నారు. గత మూడేళ్లలో రూ.75 వేల కోట్లు మున్సిపల్ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేటాయించారని, గత అన్నాడీఎంకే హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను సైతం తాము సరి చేశామన్నారు. ఎమ్మెల్యేలు కృష్ణస్వామి, దురైచంద్రశేఖర్, ఆవడి మేయర్ ఉదయకుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ శివరాజు, కమిష నర్ కందస్వామి, డీఆర్వో రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
10 కిలోల వెండి వస్తువులు చోరీ
● రూ.5 లక్షల నగదు కూడా.. అన్నానగర్: చైన్నెలోని ఆళ్వార్‌పేట కో–ఆపరేటివ్ కాలనీకి చెందిన దినేష్ (43)కు ఆళ్వార్‌పేటలోని సెనాడోప్ రోడ్డులో వెండి వస్తువులు విక్రయించే దుకాణం ఉంది. మంగళవారం ఎప్పటిలాగే దుకాణం తెరవడానికి వెళ్లాడు. అప్పుడు అతనికి షాక్ తగిలింది. దుకాణంలోని సెక్యూరిటీ వాల్ట్ తాళం పగులగొట్టి 10 కిలోల వెండి వస్తువులు, రూ.5 లక్షలు చోరీకి గురయ్యాయి. అదే సమయంలో తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన దుకాణంలో ఉద్యోగిగా పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన బాబులాల్ అదృశ్యం కావడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. విచారణలో వెండి వస్తువులు, నగదును ఉద్యోగి బాబులాల్ అపహరించినట్లు తేలింది. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. -
విద్యార్థులకు మత్తు పదార్థాల విక్రయం
● నలుగురు యువకుల అరెస్టు సేలం : పట్టినపాక్కంలో విద్యార్థులకు మత్తు పదార్థాలను విక్రయిస్తున్న నలుగురు యువకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా, గంజా వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడే యువకుల సంఖ్య అధికమవుతున్న స్థితిలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపడుతూ వస్తోంది. ఈ క్రమంలో చైన్నెలో మెతబేటమైన్ అనే మత్తు పొడి అధికంగా సాగుతోంది. ఇటీవల దీనికి సంబంధించి పలువురుని పోలీసులు అరెస్టు చేసి చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ స్థితిలో చైన్నె పట్టినపాక్కం ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్లో కొందరు యువకులు బస చేసి కళాశాల విద్యార్థులకు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్టు సెయింట్ థామస్ మౌంట్ డిప్యూటీ కమిషనర్ సెల్వ నాగరత్నంకు సమాచారం అందింది. ఆ మేరకు పోలీసులు మడిపాక్కంలో ఒక ఇంటిలో ఉంటూ డీజే వ్యాపారం చేస్తున్న ప్రతీప్ (27)ను, అతను ఇచ్చిన సమాచారం మేరకు ఆదంబాక్కంకు చెందిన గోకులకృష్ణన్ (23), వేళచ్చేరికి చెందిన అశ్విన్ (24), విల్లివాక్కంకు చెందిన షాబుదీన్ (24) అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారి నుంచి 23 గ్రాముల కొకై న్, 4 గ్రాముల మెతబేటమైన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
కనీస పింఛన్ కేటాయించాలి
తిరువళ్లూరు: రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ అయిన అంగన్వాడీ, పౌష్టికాహార ఉద్యోగులకు నెలకు కనీసం రూ.7,850 పింఛన్‌గా ఇవ్వాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో వున్న అంగన్వాడీ, పౌష్టికాహార ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తిరువళ్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా తమిళనాడు పౌష్టికాహార అంగన్వాడీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరమ్మాల్, తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇళంగోవన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివ్య హాజరయ్యారు. సుందరమ్మాల్ పాల్గొన్నారు. -
3 ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవా విభాగాలు
● ఉత్తర్వుల జారీసాక్షి, చైన్నె : రాష్ట్రంలోని ఆస్పత్రులలో ఎమర్జన్సీ, డయాగ్నోస్టిక్స్ సేవలను విస్తృతం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు విస్తృతం చేసింది. ఇప్పటికే 28 క్రిటికల్ కేర్ యూనిట్లు, 20 డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ సెంటర్లను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోగా, ఈ పనులు వివిధ దశలలో ఉన్నాయి. ఈ పరిస్థితులలో పెరంబలూరు, తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి , వేలూరు జిల్లా అనైకట్టు ఆస్పత్రులలో ఒక్కో ఆస్పత్రికి రూ. 23 కోట్లతో తలా 50 పడకలతో అత్యవసర సేవా విభాగం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆరోగ్య శాఖ జారీ చేసింది. ఇందుకోసం మొత్తం రూ.71 కోట్లు కేటాయించారు. అలాగే, ఉలుందూరుపేట (కల్లకురిచి జిల్లా), కంబం (తేని జిల్లా), పెరంబలూరు (పెరంబలూరు జిల్లా), వేదారణ్యం (నాగపట్నం జిల్లా), కారైకుడి (శివగంగై జిల్లా) తలా రూ. 1.25 కోట్లతో వైద్య సంబంధించి ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆదేశించారు. అత్యవసర విభాగంలో థెరప్యూటిక్ కేర్ యూనిట్, ఐసోలేషన్ స్పెషల్ కేర్ యూనిట్, మోడ్రన్ ఆపరేటింగ్ థియేటర్లు, అధిక సామర్థ్యం గల ఆక్సిజన్ వ్యవస్థలు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర సేవల నిమిత్తం 50 పడకలతో విభాగాల ఏర్పాటు చేయడానికి ఇన్స్టాల్ చేయబడిన ఇంటెన్సివ్ కేర్ బెడ్లు, వెంటిలేటర్లు, అనస్థీషియా వర్క్స్టేషన్లు, ఆధునిక శస్త్రచికిత్స ట్రీట్మెంట్ హాల్స్‌తో సహా అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. -
విద్యార్థినులకు కార్పొరేట్ నైపుణ్యాలపై శిక్షణ
సాక్షి, చైన్నె : విద్యార్థులకు క్యాంపస్ టూ కార్పొరేట్ నైపుణ్యాలు పేరిట శిక్షణ అందించేందుకు ఫిక్కీ మహి ళా విభాగం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్టెల్లా మెరీస్ కళాశాలకు చెందిన 1000 మంది విద్యారి్థనుల ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు సోమవారం స్థానికంగా జరిగాయి. ఈ ఒప్పందాలపై ఫిక్కీ ఎఫ్ఎల్ఓ చెన్నై చైర్పర్సన్ దివ్యఅభిషేక్ ఆ కళాశాల ప్రిన్సిపల్ స్టెల్లా మెరీ, తమిళనాడు టెక్నాలజీ హబ్ సీఈఓ వనిత వేణుగోపాల్‌లు సంతకాలు చేశా రు. విద్యారిి నైపుణ్యాల అభివృద్ధి, ధ్రువీకరణ కోర్సులతో క్యాంపస్ టూ కార్పొరేట్ ప్రోగ్రామ్‌ను ఆరు నెలల వ్యవధితో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దివ్య అభిషేక్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈప్రయత్నం చేపట్టామన్నారు. మహిళ నాయకత్వం పెరగాలని, బాధ్యతాయుతమైన వ్యాపార వేత్తలు గా, సంస్థలకు నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలన్న కాంక్షతో ముందుకెళ్తున్నామన్నారు. -
ముందస్తు బెయిల్ కోసం కోర్టులో కస్తూరి పిటిషన్
తమిళసినిమా: వివాదాస్పద నటి కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివరాలు.. కస్తూరి ఇటీవల హిందు మక్కల్ కట్చి బ్రాహ్మణుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలంటే పోరాటం నిర్వహించింది. ఆ పోరాటం కార్యక్రమంలో పాల్గొన్న నటి కస్తూరి తమిళనాడులోని తెలుగు ప్రజల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ, తెలుగు సంఘాలు మండిపడ్డారు. కస్తూరిపై చైన్నెలోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు నటి కస్తూరిపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి ఆమెను విచారంచడానికి సిద్ధం అయ్యారు. అందులో భాగంగా ఇటీవల స్థానికి పోయస్‌గార్డెన్‌లోని నటి కస్తూరి ఇంటికి వెళ్లి సమన్లు అందించడానికి వెళ్లగా ఆమె ఇంటిలో లేరు. ఇంటికి తాళం వేసిఉంది. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో పోలీసులు కస్తూరి ఇంటికి సమన్లు అంటించి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి కస్తూరి సోమవారం మదురై కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆమె పేర్కొటూ తాను తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు వివాదానికి తెరలేపారన్నారు. అయితే అందుకు తాను వారికి క్షమాపణ కూడా చెప్పానని అయినా రాజకీయ దురుద్దేశంతో తనపై కేసులు పెట్టారని, కాబట్టి ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. కస్తూరి పిటిషన్‌ను మంగళవారం న్యాయమూర్తి ఆనంద్ సమక్షంలోని బెంచ్ విచారణ జరపనుంది. -
తంజావూరులో.. బుల్లి కొబ్బరి కాయ
సేలం : తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో నరికుడి గ్రామానికి చెందిన రైతు కాశీనాథన్ (60). ఇదే ప్రాంతంలో ఈయనకు సొంతమైన తోటలో ఉన్న కొబ్బరి చెట్టుపై నుంచి ఓ కొబ్బరి బొండంను తీశాడు. ఆదివారం దాని పీచును తొలగించగా లోపల కేవలం 2 సెంటీ మీటర్లు మాత్రమే గల బుల్లి కొబ్బరి కాయ ఉండడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. సాధారణంగా పీచుతో ఉన్న ఒక కొబ్బరి బొండం తీసుకుని, దాని పీచు తీస్తే కనీసం కిలో బరువు గల కొబ్బరికాయ ఉంటుంది. అదే విధంగా ఈ బుల్లి కొబ్బరి కాయ కూడా పీచుతో ఉన్నప్పుడు సాధారణంగా పెద్ద కొబ్బరికాయలాగానే కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ చిన్న కొబ్బరికాయను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాయుధ దళాల విభాగం చీఫ్‌గా జె. సురేష్ ● బాధ్యతల స్వీకరణ సాక్షి, చైన్నె : చైన్నె కేంద్రంగా ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖలోని సాయుధ దళాల విభాగానికి ట్రై – సర్వీసెస్ వింగ్ చీఫ్( కమాండ ర్)గా భారత నావికాదళ సీనియర్ అధికారి కమోడోర్ జే సురేష్ నియమితులయ్యారు. సో మవారం ఆయన స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కమోడోర్ సురేష్‌కు లాజిస్టిక్స్, ట్రూప్ మూవ్మెంట్ వ్యూహాత్మక కార్యకలాపాలలో అపారమైన అనుభవం, నైపుణ్యం ఉంది. భారత నావికాదళంలో విశిష్టమైన కెరీర్లో సంక్లిష్టమైన సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడంలో, దేశ రక్షణకు అవసరమైన లాజిస్టికల్ విధులను సమన్వయం చేయడంలో తన సామర్థ్యాలను మెరుగు పరచుకోవడమే కాకుండా, వివిధ నాయకత్వ బాధ్యతలను చేపట్ట ఉన్నారు. ఇందుకు గుర్తింపుగా ఆయన నాయకత్వంలో చైన్నెలోని ఎంబార్కేషన్ హెడ్ క్వార్టర్స్ దళాలు పనిచేయనున్నాయి. అధికారులను సమన్వయం చేయడం, సైనిక సిబ్బందికి సహకారం, మద్దతు, లాజిస్టిక్స్ సేవలను దక్కే విధంగా కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా ఇది వరకు చీఫ్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన కమోడోర్ జే గురుమణికి ట్రై ఆర్మీ డివిజన్ అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు. గురు మణిని నుంచి సురేష్ బాధ్యతలు స్వీకరించారు.న్యూస్‌రీల్ -
ప్రైవేటు ఎగుమతి సంస్థలో ఈడీ సోదాలు
సాక్షి, చైన్నె : చైన్నె, చెంగల్పట్టులలోని ఆరు చోట్ల ఓ ప్రైవేటు ఎగుమతి సంస్థకు చెందిన కార్యాలయాలలో ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం విస్తృతంగా సోదాలు చేశారు. వివరాలు.. మహారాష్ట్ర కేంద్రంగా సాగుతున్న ఓ సోలార్, విండ్ ఎనర్జీ కి సంబంధించిన పరికరాల సంస్థకు చెందిన కార్యాలయాలు, ఉత్పత్తి సంస్థలు చైన్నెతో పాటు చెంగల్పట్టులో ఉన్నాయి. విదేశాలకు ఎగుమతుల వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టుగా గుర్తించిన ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో చైన్నె, చెంగల్పట్టులలో ఆ సంస్థకు చెందిన ఆరు చోట్ల ఉదయాన్నే భద్రత నడుమసోదాలలో నిమగ్నమయ్యారు. చైన్నెలో కొన్ని చోట్ల అతి పెద్ద భవనాలలో ఉన్న ఈ సంస్థ కార్యాలయాలలో నిఘా నీడలో సోదాలు సాగుతున్నాయి -
తప్పు చేస్తే...ఉపేక్షించొద్దు
● ఫీల్డ్ టీంకు పళణి ఆదేశాలు ● నియోజకవర్గ బాటలో నేతలు సాక్షి, చైన్నె: శ్రీతప్పు చేస్తే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించ వద్దనిశ్రీ ఫీల్డ్ సర్వే బృందానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఎవరెవరు ఏఏ తప్పులు చేసి ఉన్నారో అన్న సమగ్ర వివరాలను నివేదిక రూపంలో డిసెంబరు 7వ తేదీ నాటికి సమర్పించాలని సూచించి ఉన్నారు. వివరాలు.. 2026 అసె ంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారమే లక్ష్యంగా డీఎంకే వ్యూహాలకు పదును పెట్టి దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. వీరికి చెక్ పెట్టి అధికారం తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు అన్నాడీఎంకే సైతం ఎన్నికల పనుల మీద దృష్టి పెట్టింది. బలమైన కూటమి ఏర్పాటు, అధికార పగ్గాలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఫీల్డ్ సర్వే పేరిట ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం నియోజకవర్గాల బాటకు సిద్ధమైంది. సమాలోచన.. పార్టీ పరిస్థితులను జిల్లా, నగర, మండల స్థాయిలోకి వెళ్లి తెలుసుకునేందుకు, కేడర్ అభిప్రాయాలను, నేతల పనితీరును అధ్యయనం చేయడం కోసం ఫీల్డ్ సర్వేకు పళణి నిర్ణయించారు. ఆయా ప్రాంతాలలో పార్టీ నేతల పనితీరు, అనుబంధ విభాగాల పనితీరు ఎలా ఉందో? అధ్యయనం చేయడమే కాకుండా, ప్రజలతో, కింది స్థాయి కేడర్‌తో సంప్రదింపులు జరిపి అభిప్రాయాల సేకరణ దిశగా ఫీల్డ్ సర్వేకు ముఖ్య నేతల బృందాన్ని రంగంలోకి దించారు. మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, దిండుగల్ శ్రీనివాసన్, నత్తం విశ్వనాథన్, తంగం తెన్నరసు, తంగమణి, ఎస్పీ వేలుమణి, టి. జయకుమార్, సీవీ షణ్ముగం, సెమ్మలై, వలర్మతి, అరుణాచలం వంటి నేతలు ఈ కమిటీలో ఉన్నారు. వీరితో సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్‌మాళిగైలో పళణి స్వామి సమావేశమయ్యారు. నేతల సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సర్వే బృందంలోని ఒక్కో నేతకు తలా 20 నుంచి 25 అసెంబ్లీ నియోజవకర్గాలను అప్పగించారు. తమకు కేటాయించిన నియోజకవర్గాలలో ఈ నేతలు అధ్యయనం చేయనున్నారు. పార్టీ వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు. కేడర్‌ను కలవనున్నారు. ఈ సమావేశంలో పళణి స్వామి మాట్లాడినట్టు అంశాలలో కొన్ని సమాచారాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మేరకు పార్టీకి చెందిన నియోజకవర్గం, జిల్లా స్థాయి నేతల పనితీరు గురించి చర్చించాలని, అభిప్రాయాలు సేకరించాలనిసూచించి ఉన్నారు. తప్పులు ఎవరు చేసినా ఉపేక్షించ వద్దని, ఫీల్డ్ సర్వే పూర్తిగా బహిర్గతంగానే ఉండాలని, రహస్యాలు, గోప్యత అవసరం లేదని పేర్కొన్నారు. పాక్షపాతం వద్దని, అన్ని స్థాయిలోని వారిని కలిసి అభిప్రాయాలు సేకరించాలని, ఎవరు తప్పు చేసిన వారి వివరాలతో సమగ్ర నివేదికను డిసెంబరు 7లోపు సమర్పించాలని స్పష్టం చేసినట్లు ప్రచారం సాగుతోంది. -
ఐఐటీ మద్రాస్‌లో.. స్పేస్ క్రాఫ్ట్ అధ్యయన కేంద్రం
సాక్షి, చైన్నె: చైన్నెలోని ఐఐటీ మద్రాసులో స్పేస్ క్రాఫ్ట్ – లాంచ్ వెహికల్ థర్మల్ మేనేజ్మెంట్ను అధ్యయనం చేయడం లక్ష్యంగా పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఇస్రో భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. సోమవారం ఇందుకు సంబంధించిన ఒప్పందాలు చైన్నెలో జరిగాయి. శ్రీసెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్శ్రీ అనే వివిధ భాగాల రూపకల్పన, విశ్లేషణ, పరిశోధనలకు సంబంధించి ఉష్ణ సమస్యలను అధ్యయనం చేయడం లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఈ కేంద్రం నెలకొల్పేందుకు ఇస్రో రూ.1.84 కోట్ల సీడ్ ఫండింగ్‌ను అందించనుంది. ఈ కేంద్రం అంతరిక్ష నౌకలకు నోడల్ కేంద్రంగా పని చేయడమే కాకుండా, ఇస్రో వాహన సంబంధిత ఉష్ణ నిర్వహణ పరిశోధన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ కేంద్రం ద్వారా ఐఐటీ మద్రాస్ అధ్యాపకుల నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడంతో వివిధ భాగాల రూపకల్పన, విశ్లేషణ, పరీక్షలకు సంబంధించిన థర్మల్ సమస్యలను పరిష్కరించడానికి వీలుంది. ఇందుకు సంబంధించి ఐఐటీ మద్రాస్‌లో సోమవారం అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఐఐటీ మద్రాస్ డీన్ (ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్) ప్రొఫెసర్ మను సంతానం, ఇస్రో డైరెక్టరేట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్ – ఇన్నోవేషన్(డీటీడీఐ) డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ అరవింద్ పట్టమట్ట సమక్షంలో ఐఐటీ మద్రాసు మెకానికల్, ఇంజనీరింగ్ విభాగాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద్ పట్టమట్ట మాట్లాడుతూ శ్ఙ్రీఈ సెంటర్ ఒక ప్రత్యేకమైన పరిశ్రమ–అకాడెమియా ఇంటర్ఫేస్ను ప్రోత్సహిస్తుందన్నారు. ఇది ఇస్రో శాస్త్రవేత్తలు , ఐఐటీ మద్రాస్ అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి కీలకమైన రంగాలలో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలు కల్పిస్తుందన్నారు. ఉష్ణశాస్త్రం. సంక్లిష్టమైన థర్మల్ ఇంజినీరింగ్ సవాళ్లను పరిష్కరించడం ద్వారా దేశంలో అంతరిక్ష కార్యక్రమానికి గణనీయమైన సహకారం అందించడం, అంతరిక్ష సాంకేతికతలలో భారతదేశ స్వావలంబనను బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. దేశం కోసం నిజమైన స్వావలంబన, స్వీయ–ఉత్పత్తి అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధునాతన విద్యా పరిశోధన ద్వారా ప్రాథమిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేయవలసిన అవసరాన్ని గుర్తించామన్నారు. అందుకే ఇస్రో, ఐఐటీ మద్రాసు సంయుక్తంగా 1985లో స్పేస్ టెక్నాలజీ సెల్శ్రీను ఇక్కడ ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. అనేక విశిష్టతల సమాహారం.. థర్మల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హబ్‌గా అంతరిక్ష నౌక, లాంచ్ వెహికల్ థర్మల్ మేనేజ్మెంట్ సవాళ్లపై ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. ఈ కేంద్రం ఇస్రోకు కీలక పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సెంటర్‌కు ఇస్రో ప్రారంభ సీడ్ ఫండింగ్ రూ. 1.84 కోట్లు అందించనుంది. అవసరమైన మౌలిక సదుపాయాలు, పరికరాల కోసం, వినియోగ వస్తువులు, నిర్వహణ, ద్రవ–థర్మల్ శాస్త్రాలలో భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం అదనపు నిధులు అవశ్యం కానుంది. అధునాతన పరిశోధన ప్రాజెక్ట్‌గా అంతరిక్ష నౌక ఉష్ణ నిర్వహణ, హైబ్రిడ్ రాకెట్లలో దహన అస్థిరత, క్రయో–ట్యాంక్ థర్మోడైనమిక్స్తో సహా క్లిష్టమైన ప్రాంతాలను కవర్ చేస్తాయి. పరిశ్రమ–అకాడెమియా సహకారంతో ఈ కేంద్రం ఇస్రో శాస్త్రవేత్తలు, ఐఐటీ మద్రాస్ ఫ్యాకల్టీ మధ్య సహకారాన్ని మెరుగుపరుస్తుంది, ద్రవం, ఉష్ణ శాస్త్రాలలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని అధికారులు భావిస్తున్నారు.● ఇస్రోతో భాగస్వామ్యంతో ఏర్పాటు -
● రాణి పేటలో జిల్లా క్రీడా ప్రాంగణం ● పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం ● క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందజేత ● చైన్నె క్రీడానగరం ఏర్పాటుపై 3 నెలలో నివేదిక
ఆధ్యాత్మిక నగరం మదురైలో ఒలింపిక్ అకాడమీ ఏర్పాటు కానుంది. పనులకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే రాణిపేటలో నిర్మించనున్న క్రీడా ప్రాంగణం పనులను కూడా ప్రారంభించారు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ హాస్టళ్లలో ఉంటూ చదువుతున్న క్రీడాకారులకు ప్రోత్సాహకాలు, క్రీడా కిట్లను అందజేశారు. రాష్ట్ర క్రీడల శాఖ, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నేతృత్వంలో చైన్నె నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. సాక్షి, చైన్నె: క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న డీఎంకే ప్రభుత్వం మరో ముందగుడు వేసింది. ఇందులోభాగంగా రూ. 15 కోట్లతో రాణి పేటలో నిర్మించున్న క్రీడా ప్రాంగణం, సముదాయం పనులకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే ఆధ్యాత్మిక నగరంగా, దక్షిణ తమిళనాడులోని జిల్లాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న మదురైలో రూ. 6 కోట్లతో ఒలింపిక్స్ అకాడమీ ఏర్పాటు పనులను సైతం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటన్న 553 మంది క్రీడాకారులకు ఛాంపియన్స్ కిట్లను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,600 మందికి ఈ కిట్లు అందనున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలలో రాణించిన వారిని ఈసందర్భంగా ఉదయ నిధి అభినందించారు. గర్వకారణం.. ఈ కార్యక్రమంలో ఉదయ నిధి ప్రసంగిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. అందుకే నేడు వివిధ అంతర్జాతీయ , జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు దూసుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధానంగా సోదరులైన ప్రవీణ్, రమేష్, సంతోష్,, సోదరీమణులు సుభా, విద్య తమిళనాడు నుంచి ఒలింపిక్స్ వరకు వెళ్లారని భారత దేవం గర్వ పడేలా చేశారని కొనియాడారు. బీఆర్ఐసీ బీచ్ వాలీబాల్‌లో పూంతమిళన్, ఏషియన్ గ్రేడ్ – 2 జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్ (ఆసియన్) పవిత్ర రజతం, సన్నిత తదితరులైన హాస్టల్ క్రీడాకారులు పతకాలను సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నేటి క్రీడా రంగంలో ఉన్న వారంతా రేపటికి గొప్ప సాధకులుగా అవతరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం, వారి విజయానికి మద్దతు, భరోసా , నమ్మకం కలిగించే విధంగా ఛాంపియన్స్ కిట్లను అందజేస్తున్నామన్నారు. ఈ కిట్‌లో ఎనిమిది రకాల వస్తువులు ఉన్నాయని వివరించారు. దేశ విదేశాలలో జరిగే పోటీలలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న వారి ఖర్చుల విషయంలో ఆందోళనను వీడాలని, ప్రతిభకు ఆర్థిక స్తోమత అడ్డుకాకూడదన్నారు. ఇందుకు తమిళనాడు ఛాంపియన్స్ ఫౌండేషన్ ఉందని, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 600 మందికి పైగా క్రీడాకారులకు రూ. 14 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. ప్రతిభ కలిగిన కీడాకారులు టీఎన్ఛాంపియన్స్ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవచ్చు అని సూచించారు. బహిరంగ చర్చకు సిద్ధం..అనంతరం మీడియాతో ఉదయ నిధి మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. డీఎంకే ప్రభుత్వ పథకాలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, బహిరంగ చర్చకు ఆయన సిద్ధమైతే, తాను సిద్ధమేనని సవాల్ చేశారు. గత పదేళ్లలో వాళ్లు ఒరగబెట్టిందేమిటో, మూడున్నరేళ్ల పాలనలో తాము సాధించిన ప్రగతి ఏమిటో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమ పథకాలకు దివంగత అధినేత కలైంజ్ఞర్ పేరు పెట్టకుండా, మరెవ్వరి పేరు పెట్టమంటారు? అని ప్రశ్నించారు. చైన్నెలో క్రీడా నగరం ఏర్పాటు గురించి ప్రశ్నించగా, పరిశీలన, అధ్యయన ప్రక్రియ జరుగుతోందని, మూడు నెలలలో నివేదిక అందుతుందన్నారు. తర్వాత పనుల మీద దృష్టిపెడుతామన్నారు. ఆధునిక సౌకర్యాలు.. క్రీడాకారులకు అంతర్జాతీయిలో శిక్షణ, ఆధునిక సౌకర్యాల కల్పనలో వెనుకాడబోమని ఉదయనిధి స్పష్టం చేశారు. హాస్టళ్లలో ఆధునిక సౌకర్యాల కల్పన మరింత విస్తృతం చేశామన్నారు. ఇండోర్ స్టేడియంలో మహిళలకు బాక్సింగ్ వేదిక ఏర్పాటు చేశామని, ఓపెన్ గ్రౌండ్లో వెయిట్‌లిఫ్టింగ్ హాల్, జిమ్‌ను అంతర్జాతీయ ఫ్రమాణాలతో పునరుద్ధరించినట్లు వివరించారు. ఇక్కడున్న ప్రతి క్రీడాకారుడి కుటుంబంలో సభ్యుడిగా, సోదరుడిగా తాను చెబుతున్నానని, అందరికీ ద్రవిడ మోడల్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన సంక్షేమం, క్రీడలశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ, సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మాజీ డీజీపీ సునీల్‌కుమార్ నియామకంపై విచారణకు హైకోర్టు నిరాకరణ
● ప్రతిదానికీ రాజకీయ రంగు పులమొద్దని న్యాయమూర్తి హితవు కొరుక్కుపేట: తమిళనాడు యూనిఫాం వర్క్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ సునీల్ కుమార్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తక్షణమే విచారించేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. వివరాలు.. తమిళనాడు యూనిఫాం రిటైర్డ్ డీజీపీ సునీల్ కుమార్‌ను స్టాఫ్ సెలక్షన్ బోర్డు ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో సునీల్‌కుమార్ నియామకాన్ని రద్దు చేయాలంటూ అన్నాడీఎంకే అడ్వకేట్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి ఐఎస్ ఇన్బదురై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు ఈ పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సునీల్‌కుమార్‌ను ఆదేశించింది. కాగా కేసు లిస్ట్ కానప్పటికీ, పిటిషనర్.. జస్టిస్ వి. భవానీ సుబ్బరాయన్ ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. నియమించబడిన వ్యక్తి అనర్హుడైతేనే విచారణకు ఆదేశించగలం. లేకుంటే ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఎలా జోక్యం చేసుకుంటాం? ప్రతి విషయానికీ రాజకీయ రంగు పులుమకండి అని న్యాయమూర్తి పిటిషనర్‌కు హితవుపలికారు. -
హైవే భూ బాధిత రైతులకు అదనపు పరిహారం ఇవ్వాలి
తిరుత్తణి: జాతీయ రహదారికి స్థలం ఇచ్చిన రైతులకు అదనపు పరిహారం కోసం డిసెంబర్ 23న టోల్గేట్ ముట్టడించినున్నట్లు రైతులు తెలిపారు. తమిళనాడు రైతు సంఘం ఆధ్వర్యంలో తిరుత్తణి సమీపం కనకమ్మసత్రంలోని కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం చైన్నె తిరుపతి జాతీయ రహదారికి స్థలం ఇచ్చిన రైతుల సమావేశం నిర్వహించారు. జిల్లా చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్ అధ్యక్షత వహించారు. రైతు సంఘం నాయకులు పెరుమాళ్, జయచంద్రన్ స్వాగతం పలికారు. ఇందులో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తులసినారాయణన్, జిల్లా కార్యదర్శి సంపత్ మహానాడులో ప్రారంభించి ఉపన్యసించారు. ముఖ్య అతిథిగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షణ్ముగం పాల్గొని ప్రసంగించారు. జాతీయ రహదారులు, రైల్వే రోడ్ల కోసం రైతుల నుంచి ప్రభుత్వం స్థలం తీసుకుంటున్న ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రదానంగా చైన్నె– తిరుపతి జాతీయ రహదారికి స్థలం కోల్పోయిన రైతులు అదనపు నష్టపరిహారం కోసం పదేళ్ల నుంచి పోరాడుతున్నా జాతీయ రహదారుల కమిషన్ పట్టించుకోవడం లేదని, జిల్లా కలెక్టర్ జాతీయ రహదారుల కమిషన్‌తో మాట్లాడి న్యాయం చేయాలని లేని పక్షంలో డిసెంబర్ 23న తిరుత్తణి తిరువళ్లూరు జాతీయ రహదారిలోని టోల్గేట్ ముట్టడించి ధర్నా చేపట్టనున్నట్లు ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. మహానాడులో వందకు మందికి పైగా రైతులు పాల్గొన్నారు. మహానాడులో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షణ్ముగం -
నటుడు ఢిల్లీ గణేశ్‌కు అంత్యక్రియలు
● ఎయిర్ ఫోర్స్ అధికారుల నివాళితమిళసినిమా: నటుడు ఢిల్లీగణేశ్ భౌతిక కాయానికి సోమవారం స్థానిక నెసపాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. అంతకు ముందు రామాపురంలోని ఇంటి వద్ద సందర్శకుల దర్శనార్థం ఢిల్లీగణేశ్ భౌతికకాయాన్ని ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన తిక కాయానికి నివాళులర్పించారు. నటుడు నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్, నటుడు సత్యరాజ్, వడివేలు, సూరి, ప్రభుదేవా, సెంథిల్, ముత్తుకాళై, దర్శకుడు కేఎస్.రవికుమార్, వెట్రిమారన్, వసంత్, లింగుసామి, నటి దేవయాని, పసి సత్య తదితరులు నివాళులర్పించారు. అలాగే నటుడు ఢిల్లీగణేశ్ సినిమా రంగప్రవేశం చేయక ముందు ఎయిర్‌ఫోర్స్‌లో పని చేశారు. దీంతో ఎయిర్‌ఫోర్ అధికారులు ఆయన భౌతిక కాయానికి జాతీయ పతాకాన్ని కప్పి, నివాళులర్పించారు. అనంతరం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఢిల్లీ గణేశ్ భౌతిక కాయాన్ని రామాపురంలోని సొంత ఇంటి నుంచి ఊరేగింపుగా స్థానికి నెసపాక్కంలోని శ్మశాన వాటిక వరకూ తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఢిల్లీగణేశ్ కొడుకు మహా ఢిల్లీగణేశ్ కర్మకాండ నిర్వహించారు. నటుడు ఢిల్లీగణేశ్ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న ఎయిర్‌ఫోర్స్ అధికారులు