TS Special
-
కాసేపు టీచర్‌గా మారిన హైదరాబాద్ కలెక్టర్
నాంపల్లి: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికార హోదాను కాసేపు పక్కన పెట్టి టీచర్‌గా మారిపోయారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు. టీచర్లలో ఉత్తేజం నింపారు. ఈ సన్నివేశం గురువారం మల్లేపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక తెలుగు, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదు లను సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. విద్యా ర్థులు చదువుతున్న తీరును గమనించారు. ఈ క్రమంలో ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయులతో బోధనలు చేయించారు. ‘పాఠం అర్థమైందా పిల్లలూ..’అని ఆరా తీశారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, డీఈఓ రోహిణి, తహసీల్దార్ జ్యోతి పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్కు చురకలు.. మల్లేపల్లి ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తలుపులను ఆకతాయి లు రాత్రివేళల్లో పగులగొట్టి లోనికి చొరబడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీచర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనూ స్కూల్లోని కంప్యూటర్లు ఎత్తుకెళ్లారని చెప్పారు. అయితే అక్కడే ఉన్న హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ టంగుటూరి రాంబాబును పిలిచి ‘దొంగలు పడితే ఏం చేస్తున్నారు’ అని కలెక్టర్ చురకలు అంటించారు. వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్ నాంపల్లి ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. -
లిక్కర్ కేసు.. కవిత పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ఇవ్వడాన్ని కవిత సుప్రీం కోర్టులో గతంలోనే సవాల్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ నుంచి కవిత నోటీసులు అందుకున్నారు. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు రాలేనని సీబీఐ, ఈడీలకు కవిత లేఖలు రాశారు. కాగా, లిక్కర్ కేసులో కవిత గత ఏడాది మార్చిలో ఈడీ ముందు పలుమార్లు విచారణకు హాజరయ్యారు. సీబీఐ మాత్రం హైదరాబాద్‌లోని నివాసంలోనే ఆమెను సాక్షిగా విచారించింది. ఇటీవలే అనూహ్యంగా లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 41 ఏ కింద విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేసింది. దీంతో కవిత సీబీఐ, ఈడీల ముందు మళ్లీ హాజరవ్వాలా లేదా అన్న విషయంలో సుప్రీంకోర్టులో 19న జరగనున్న విచారణ కీలకంగా మారనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇటీవల వరుసగా సమన్లు జారీ చేస్తోంది. ఈకేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయ్యారు. ఇదీ చదవండి.. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ -
ఆరుకు నూరు మార్కులెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. శుక్రవారంతో కాంగ్రెస్ పాలనకు వంద రోజులు పూర్తి కానుండటంతో, ప్రభుత్వ పనితీరుపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంత స్వల్ప వ్యవధిలో ప్రభుత్వ పనితీరును అంచనా వేయడం సరికాక పోయినా, ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటన చేయడం చర్చకు తావిచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల పేరుతో 13 హామీలను పొందుపరిచింది. ఈ 13 పథకాల అమలుకు ఏటా దాదాపు రూ.1.30 లక్షల కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేశారు. కానీ ప్రభుత్వం వీటికి బడ్జెట్లో రూ.53 వేల కోట్లే కేటాయించింది. దీనిపై అప్పట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా ఇప్పటివరకు ఐదు హామీలను ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఇంకా ఎనిమిది హామీలు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం తీవ్రమవుతున్న తాగునీరు, విద్యుత్ సమస్యలను కూడా ప్రభుత్వం అధిగమించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వంద రోజుల్లో తాను సాధించిన విజయాలను వివరిస్తూ ప్రభుత్వం గురువారం ప్రగతి నివేదిక విడుదల చేసింది. ఎన్నికల తర్వాతే మిగతా హామీల అమలు? అధికారంలోకి వచ్చిన రెండోరోజే డిసెంబర్ 9న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత 50 రోజులకు పైగా సమయం తీసుకుని ఫిబ్రవరి 28న మరో రెండు పథకాలు షురూ చేసింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించింది. అనంతరం 12 రోజుల సమయం తీసుకుని మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పార్లమెంటు ఎన్నికల కోడ్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో, ఆరు గ్యారంటీల్లో అమలు కాకుండా మిగిలిన 8 హామీల అమలు లోక్‌సభ ఎన్నికల తర్వాతేనని అర్థమవుతోంది. వ్యతిరేకత రాలేదేమో కానీ.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు విషయమై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా ఒకింత అసంతృప్తి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు అందరికీ పథకాలు అందజేస్తామని చెప్పి.. ఇప్పుడు తెల్ల రేషన్‌కార్డు, ప్రజాపాలన దరఖాస్తు పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి లబ్ధీ పొందనివారు, భవిష్యత్తులో ప్రారంభించే పథకాల్లోనైనా తమకు లబ్ధి కలుగుతుందో లేదోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల అమలుకు ఏదో ఒక కొలబద్ధ ఉండాలి కదా... అందుకే తెల్ల రేషన్‌కార్డు నిబంధన అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వం వివరణ ఇవ్వడం గమనార్హం. ఒక్క మహాలక్ష్మికే రూ.40 వేల కోట్లకు పైగా రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ప్రకటించింది. మహాలక్ష్మి పేరుతో రూపొందించిన తొలి గ్యారంటీలోని మొదటి అంశం ఇదే. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 1.65 కోట్ల మంది మహిళలున్నారు. వీరిలో పింఛన్లు పొందుతున్న 26 లక్షల మంది పోను మిగిలిన వారికి నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.41,700 కోట్లు కావాల్సి ఉంటుంది. వరికి బోనస్ వచ్చే సీజన్ నుంచా? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మరో ప్రధాన గ్యారంటీ రైతు భరోసా. రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలతో పాటు క్వింటాలు వరికి రూ.500 బోనస్ ఇందులోని ప్రధాన హామీలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసినా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వలేదు. అయితే వచ్చే వర్షాకాలం సీజన్ నుంచి దీనిని అమలు చేయవచ్చని తెలుస్తోంది. రైతు భరోసా అమలు చేయాలంటే ఏటా కనీసం రూ.34 వేల కోట్లు కావాల్సి ఉంటుంది. చేయూత.. ఎప్పుడో? రాష్ట్రంలోని పేదలు అత్యంత ఆతురతతో ఎదురుచూస్తున్న మరో గ్యారంటీ చేయూత. ఈ గ్యారంటీ కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచాల్సి ఉంది. దీని కోసం 46 లక్షలకు మందికి పైగా పేదలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా చేయూత పథకాన్ని అమలు చేయాలంటే ఏటా రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి రానుంది. యువ వికాసం... గందరగోళం యువ వికాసం గ్యారంటీలో భాగంగా ఇంటర్ నుంచి వృత్తి విద్యా కోర్సుల వరకు అన్ని స్థాయిల్లోని విద్యార్థులకు ఫీజుల నిమిత్తం రూ.5 లక్షల విలువైన విద్యాభరోసా కార్డులు ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ కార్డు ఎలా ఇస్తారు? ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా? వడ్డీ ఎవరు భరిస్తారు? లాంటి వాటిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటివరకు ఇవీ.. ఆరు గ్యారంటీల్లో భాగంగా తొలుత ప్రారంభించింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి. ఈ పథకం ప్రారంభించే నాటికి ఆర్టీసీ బస్సుల్లో సగటు ఆక్యుపెన్సీ రేషియో 66 శాతం మాత్రమే. కానీ పథకం ప్రారంభమయ్యాక అది క్రమంగా వంద శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళల సంఖ్య 25 కోట్లను మించిపోయింది. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక గృహజ్యోతి కింద తొలి నెలలో లబ్ధి పొందిన వారి సంఖ్య తక్కువగానే ఉంది. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తున్న గృహ కనెక్షన్ల సంఖ్య 95.23 లక్షలు కాగా, తెల్ల రేషన్‌కార్డు, ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో లబ్ధిదారుల సంఖ్య సగానికి పైగానే తగ్గిందని తెలుస్తోంది. మరోవైపు ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రంలోని 20 లక్షల మందికి ఇళ్ల సౌకర్యం కల్పించాలన్నది లక్ష్యం కాగా, ప్రస్తుతం సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల నగదు సాయం పథకాన్ని ప్రారంభించారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోని వారి పరిస్థితేమిటి? ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాల కోసం 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో డూప్లికేషన్లు, ఇప్పటికే లబ్ధి పొందిన దరఖాస్తులు కూడా ఉన్నాయని ప్రభుత్వం చెపుతోంది. ఇదిలావుంటే అసలు చాలా మంది ప్రజలు ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోలేదు. దీంతో తెల్ల రేషన్‌కార్డు ఉన్నప్పటికీ పథకాల లబ్ధి పొందలేకపోవడం గమనార్హం. ప్రతి నాలుగు నెలలకోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం చెపుతోంది. ఈ లెక్కన ఏప్రిల్ నెలాఖరులో మరోమారు ప్రజాపాలన నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు ఆరు గ్యారంటీల అమలుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 100 రోజుల్లో అమలు సాధ్యం కాదని తెలిసీ ఎందుకు గ్యారంటీ ఇచ్చారని ప్రశి్నస్తున్నాయి. వంద రోజులు పూర్తయిన తర్వాత పోరాట కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరిస్తున్నాయి. -
మే 20 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను మే 20 నుంచి జూన్ 3 వరకూ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, సమాచార బులెటిన్‌ను ఈ నెల 20న స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే ఈ పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను గత నెల 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, ఈ గడువు ఏప్రిల్ 3తో ముగుస్తుంది. టెట్‌లో అర్హత సాధిస్తే తప్ప డీఎస్సీ రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్ అర్హత లేని బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు డీఎస్సీ రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్‌ను డీఎస్సీకి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. జూన్ 6 వరకూ డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్లైన్ మోడ్‌లో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తు న్నట్టు కమిషనరేట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ ఇదే టెట్‌లో పాల్గొనేందుకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడవ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయడంతో 80 వేల మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. -
ప్రజాసంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
హుజూర్నగర్, పాలకవీడు: ప్రజాసంక్షేమం.. అభి వృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఫణిగిరి గుట్ట వద్ద రూ.74.80 కోట్లతో 2,160 సింగిల్ బెడ్రూం ఇళ్ల పునర్నిర్మాణ పైలాన్ ఆవిష్కరించారు. రూ.50 లక్ష లతో క్రిస్టియన్ సిమెట్రీ, రూ.కోటితో టౌన్హాల్లో అభివృద్ధి పనులు, రూ.33.83 కోట్లతో పాలకవీడు మండలం బెట్టెతండ గ్రామం వద్ద మూసీనదిపై నిర్మించనున్న ఎత్తిపోతల పనులకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లా డుతూ.. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. ఇప్పుడు మరోసారి అవకాశం రావడంతో ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయ న్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభు త్వంలో ధరణి పేరుతో వేలాది కోట్ల ఆస్తులు ఎలా దోచుకుని దాచుకున్నారో..ఆ లెక్కలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం పడ్డ ఆరాటం అభివృద్ధిపై పెట్టలేద ని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లలో అర్హుల ఎంపికకు రాజకీయాలకతీతంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు 17 లక్షల ఇళ్లు అందించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో లక్షా 12 వేల ఇళ్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందిస్తామని చెప్పారు. వంద రోజుల్లో ఇచ్చిన ప్రతీ హామీని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అనేక రంగాల్లో అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభు త్వంలో ఎన్నో లిఫ్ట్‌లు, రహదారులు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. త్వరలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని, ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లత, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు. -
సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఎగ్జిక్యూటివ్ కేడర్ కేటగిరిలో.. మేనేజ్మెంట్ ట్రైనీ (ఈ అండ్ ఎం) పోస్టు లు 42, మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) పోస్టులు 7, నాన్ ఎగ్జి క్యూటివ్ కేడర్ కేటగిరీలో జూనియర్ మైనింగ్ మేనేజర్ ట్రైనీ పోస్టులు 100, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (మెకానిక ల్) పోస్టులు 9, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులు 24, ఫిట్టర్ ట్రైనీ పోస్టులు 47, ఎలక్ట్రిషన్ ట్రైనీ పోస్టులు 98 అందులో ఉన్నాయి. ఈనెల 15 నుంచి వచ్చే నెల 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నా రు. గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు కాగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్సైట్ www.scclmines.com ను సంప్రదించాలని సంస్థ యాజమాన్యం తెలిపింది. -
త్వరలోనే ఇంటి నుంచి పార్శిళ్ల సేకరణ, డెలివరీ
సాక్షి, హైదరాబాద్: టికెటేతర ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వ సహకా రంతో లాజిస్టిక్స్ విభాగ నెట్‌వర్క్‌ను మరింత గా విస్తరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. విని యోగదారులకు వేగవంతమైన సేవలను అందజేసేందుకు త్వరలో ఇంటి నుంచే పార్శిళ్ల సేక రణ, డెలివరీ సేవలను అందుబాటులోకి తేను న్నట్లు వెల్లడించారు. దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన లాజి స్టిక్స్ మోడల్ కౌంట ర్ను గురువారం ఆయ న ప్రారంభించారు. లాజిస్టిక్స్ విభాగం కొత్త లోగో, బ్రోచర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారు లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పార్శిళ్ల హోం పికప్, డెలివరీ కోసం విని యోగించే కొత్త వాహనాన్ని కూడా ఎండీ జెండా ఊపి ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ లాజి స్టిక్స్ విభాగం ద్వారా ప్రతిరోజూ సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నట్లు వివరించా రు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శి ళ్లను ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశామన్నారు. దీంతో ఈ ఏడాది తమకు సుమారు రూ.120 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ ప్రాంతంలో మాత్రమే విని యోగదారుల ఇంటి నుంచి వస్తువుల సేకరణ, డెలివరీ సేవలు అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు... నగరవాసులు ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 040–69440069 కు సంప్రదించవచ్చు.లేదా ఆర్టీసీ వెబ్సైట్ జ్టి్టpట://ఠీఠీఠీ.్టటట్టఛి ౌజజీట్టజీఛిట.జీnలో కూడా లాగిన్ కావచ్చు. -
నేటి నుంచే టీజీ రిజిస్ట్రేషన్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలోని వాహనాలు శుక్ర వారం(నేటి) నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, రోడ్డు రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు భిన్నంగా టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పాడాలనే ఆకాంక్షతో పాల్గొన్న ఉద్యమకారులు, ప్రజలు తమ వాహనాలపై ఆరోజే టీజీ ఆని రాసుకున్నారని గుర్తు చేశారు. అయితే అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ టీజీకి బదులు టీఎస్‌ను తెచ్చి వారి ఆకాంక్షలు, మనోభా వాలను అణచివేసిందని విమర్శించారు. గురువారం హను మకొండ కలెక్టరేట్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌తో కలి సి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు నెరవేరేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని శాసనసభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా లేఖ పంపించామని, శుక్రవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలన్నీ టీజీ మీదనే అవుతాయని, ఇప్పటివరకు రిజిస్టర్ అయిన వాహనాల నంబర్లు అలాగే ఉంటాయని చెప్పారు. ప్రతి వీఐపీ డ్రైవర్‌కు ఫిట్నెస్ టెస్టులు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయంలో నిబంధనలను కఠిన తరం చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రతి వీఐపీ డ్రైవర్‌కు కూడా ఫిట్నెస్ టెస్టులు నిర్వహించాలనే నిబంధనలను తీసుకువచ్చామన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి కొత్తబస్సులు తెచ్చామని, త్వరలోనే మరో వెయ్యి బస్సులు తేనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని కేడర్లకు చెందిన 3,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, కార్మికులు సంతోషంగా ఉన్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇక మూడు సిరీస్‌ల ముచ్చట సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలకు శుక్రవారం నుంచి టీజీ రిజిస్ట్రేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఇకపై మూడు సిరీస్‌లతో తెలంగాణ వాహనాలు కనిపించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వాహనాలకు ఏపీ సిరీస్ కొనసాగింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 జూన్‌లో టీఎస్ సిరీస్ అందుబాటులోకి వచ్చినా, అప్పటివరకు ఏపీ సిరీస్‌తో ఉన్న వాహనాలకు పాత సిరీస్‌నే కొనసాగించొచ్చని నాటి ప్రభుత్వం పేర్కొంది. దీంతో 2014 జూన్(టీఎస్‌గా మారకముందు)కు ముందు నాటి వాహనాలు ఏపీతో, ఆ తర్వాతవి టీఎస్‌తో కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి టీజీ సీరీస్ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. దీంతో మూడు సిరీస్‌లతో వాహనాలు కనిపించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,91,666 వాహనాలు ఉన్నాయి. వీటిల్లో 70,81,345 వాహనాలు ఏపీ సిరీస్‌తో ఉండగా, 98,10,321 వాహనాలు టీఎస్ సిరీస్‌తో నడుస్తున్నాయి. రాష్ట్ర సిరీస్ తప్ప జిల్లా సిరీస్‌లు యధాతథంగా కొనసాగుతాయి. టీజీ జెడ్ ఆర్టీసీ వాహనాలకు, టీజీ09 పీ పోలీసు వాహనాలకు, నంబర్ల పక్కన టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్‌లు రవాణా వాహనాలకు కొనసాగుతాయి. -
ప్రపంచంలో అత్యుత్తమంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ వేదికపై అత్యుత్తమ నగరంగా నిలపాలని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇంధన సామర్థ్య సాధన ద్వారా ప్రపంచంలోనే పెట్టుబడులకు సురక్షిత నగరంగా హైదరాబాద్ త్వరలో రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా మూసీ నది పునరుజ్జీవనానికి తీసుకుంటున్న చర్యలు ఇందులో భాగమని స్పష్టం చేశారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో కలిసి హైదరాబాద్‌లో మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్) పోస్టర్‌ను గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, నగర సామాజిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థల్ని మెరుగుపరచడం కూడా ప్రభుత్వ లక్ష్యమని దానకిశోర్ చెప్పారు. ఇవన్నీ పూర్తయితే లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈసీబీసీతో విస్తృత ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్ రెడ్కో), బీఈఈ సంయుక్త భాగస్వామ్యంతో ఇంధన శక్తి సామర్థ్య నిర్వహణ, పర్యావరణ లక్ష్యాల్ని అందుకునేందుకు దానకిశోర్ నేతృత్వంలో చర్చించి, పలు నిర్ణయాల అమలుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. నగరంలో ఇకపై ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)కు అనుగుణంగానే కొత్త ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నారు. బీఈఈ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈసీబీసీ ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు ఆర్థిక, తదిత విస్తృత ప్రయోజనాలను అందిస్తుందని భావిస్తున్నారు. బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవ్రా, బీఈఈ డైరెక్టర్లు సౌరభ్ దీదీ, ఎస్కే వర్ణా, బీఈఈ దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత జితేందర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి ఆశించారు. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. కానీ, బీజేపీ హైకమాండ్ మాత్రం జితేందర్ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది. దీంతో, టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి భంగపాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదు. తన అన్న ఇంటికి వచ్చాడు అంతే. మాది ఒక్కటే జిల్లా. నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడు. నేను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో సంతోషంగానే ఉన్నాను. నా సీటు గురించి అధిష్టానం చూసుకుటుంది. కాంగ్రెస్‌లో టికెట్లు ఫుల్ ఫిల్ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో వంశీ, చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌కు ఉన్నారు. పార్టీలోకి సీఎం రేవంత్ నన్ను ఆహ్వానించలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం పరామర్శ కోసమే రేవంత్ మా ఇంటికి వచ్చాడు అని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ కేంద్ర పెద్దలపై జితేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. జితేందర్ రెడ్డి గతంలో బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్ చేసి పలు సెటైరికల్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇటీవల కూడా ఒక వీడియోను షేర్ చేయడంతో బీజేపీ నేతలు ఖంగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ జితేందర్ రెడ్డి సీటు నిరాకరించినట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy met former MP BJP leader Jithender Reddy at his residence.#RevanthReddy • @revanth_anumula • @apjithender • @mpponguleti • @Drpmahendereddy pic.twitter.com/biQVwz2R3w — Congress for Telangana (@Congress4TS) March 14, 2024 -
తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండటంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది. 2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
Phone Tapping Case: కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్‌రావు
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) ప్రణీత్ రావు అరెస్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్‌లు చేశానని, ఆ సమాచారాన్ని ధ్వంసం కూడా చేశానని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని స్పెషల్ టీం భావిస్తోంది. ‘‘అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాప్ చేశా. పూర్తి సమాచారాన్ని అప్పటి ఎస్పీ స్థాయి అధికారుల నుంచి ఎస్ఐబీ చీఫ్ దాకా ఆ సమాచారం అందజేశాను. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశా. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్ ఛాటింగ్‌లపై నిఘా పెట్టాను.. .. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అధికారులకు ఇచ్చాను. అప్పటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ఆదేశాల మేరకు ఆ సమాచారం మొత్తం ధ్వంసం చేశా. సెల్ఫోన్లు, హార్డ్ డిస్కులతో పాటు వేల సంఖ్యలో పత్రాలు ధ్వంసం చేశాను’’ అని ప్రణీత్‌రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ మీద చంచల్‌గూడ జైల్లో ఉన్న ప్రణీత్‌రావును మరోసారి విచారించేందుకు ప్రత్యేక టీం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఆయన్ని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరినట్లు తెలుస్తోంది. ఇక ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో.. ఎస్ఐబీ మాజీ చీఫ్ తో పాటు పలువురు ఎస్పీ, డీఎస్పీలను విచారించేందుకు సిద్ధమవుతోంది. -
కేసీఆర్ అన్న కొడుకుపై కేసు నమోదు.. కారణం ఇదే..
సాక్షి, ఆదిభట్ల: తెలంగాణలో భూ కబ్జాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుతో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో, ఈ భూ కబ్జా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు, అతడి గ్యాంగ్ ప్రయత్నించినట్టు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ అంశంపై ఓఎస్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో కన్నారావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఇక, బాధితుల ఫిర్యాదులో తమ భూమి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్ళు పెట్టినట్టు పేర్కొన్నారు. దీంతో, కన్నారావుతో పాటు అతని అనుచరులు బీఆర్ఎస్ నాయకులు 38 మందిపై 307,447,427.,436,148,149 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 38 మందిలో ముగ్గురని పోలీసులు రిమాండ్‌లోకి తీసుకోగా మరో 35 మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. కాగా, కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కన్నారవు బెంగుళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. -
ప్రధాని మోదీ తెలంగాణ షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల నగారా మోగనుందనే సంకేతాల నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఈ నెల 15న మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ..మల్కాజ్గిరి స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. సిట్టింగ్ సికింద్రాబాద్ స్థానం సహా మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలపై ఫోకస్ పెట్టిన కమలదళం..ప్రచారపర్వంలోకి జాతీయ నేతలను రంగంలోకి దించుతోంది. రెండు రోజుల క్రితం హోం మంత్రి అమిత్‌షా నగరంలో పర్యటించగా..పది రోజుల వ్యవధిలోనే ప్రధాని రెండోసారి రాష్ట్రానికి వస్తుండడం గమనార్హం. ఇటీవల నగర శివార్లలోని పటాన్చెరులో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓటర్లను ఆకట్టుకునేందుకు రోడ్‌షోలు నిర్వహిస్తోంది. మల్కాజ్‌గిరిలో సుమారు 5 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించింది. పీఎం పర్యటన నేపథ్యంలో ఆంక్షలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ నెల 15న మల్కాజ్‌గిరిలో జరగనున్న సభలో మోదీ పాల్గొననున్నారు. దీంతో మీర్జాల్గూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు 5 కి.మీ. మేర పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగరవేయడానికి అనుమతి లేదని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188, 121, 121 (ఏ), 287, 336, 337, 338 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ► రేపు సాయంత్రం 4.55కి బేగంపేట విమానాశ్రయంకు చేరుకోనున్న ప్రధాని ► సాయంత్రం 5.15 నుంచి 6.15 వరకు మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టే రోడ్ షోలో పాల్గొననున్నారు. ► 6.40 గంటలకు రాజ్ భవన్ చేరుకోనున్న ప్రధాని.. రాజ్‌భవన్‌లో బస. ► ఈ నెల 16న ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న ప్రధాని ► 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నాగర్ కర్నూల్ వెళ్లనున్న మోదీ ► 11.45 నుంచి 12.45 వరకు నాగర్ కర్నూల్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ ►ఒంటి గంటకు నాగర్ కర్నూల్ నుంచి గుల్బర్గా వెళ్లనున్న ప్రధాని. -
ఇంటర్ స్పాట్ షురూ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. ఈ నెల 16 నుంచి ఈ ప్రక్రియ మరింత ఊపందు కుంటుందని అధికారులు తెలిపారు. నెల రోజు ల పాటు ఇది కొనసాగుతుందని, పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాల (స్పాట్ వాల్యూయేషన్)కు తరలిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూల్యాంకన కేంద్రాలనూ పెంచారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంలో మరో కేంద్రం అదనంగా ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలు గు రువారం ముగియనున్న నేపథ్యంలో మూల్యాంకనం చేపట్టాల్సిన అధ్యాపకులు కొందరు ఇంకా ఇన్విజిలేషన్ విధుల్లోనే ఉన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే వీరు కూడా ‘స్పాట్’లో భాగస్వాములవుతారని ఇంటర్ పరీక్షల విభాగం తెలిపింది. ఈ ఏడాది నుంచి మూల్యాంకనాన్ని ఆన్లైన్లో పూర్తిస్థాయిలో చేపట్టాలని భావించారు. కానీ ప్రభు త్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో ఎప్పటిలాగే సాధారణ పద్ధతిలో మూల్యాంకనం చేపడుతున్నారు. నిరంతర పర్యవేక్షణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సమాధాన పత్రాలు 60 లక్షల వరకూ ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మూల్యాంకన కేంద్రానికి చేరుకోగానే ఓఎంఆర్ షీట్లో ఉన్న విద్యార్థి వ్యక్తిగత సమాచారం తొలగిస్తారు. దీని స్థానంలో కోడ్ నంబర్ ఇస్తారు. కోడింగ్ మొత్తం ఇంటర్ బోర్డుకు ఆన్లైన్ ద్వారా అనుసంధానమై ఉంటుంది. తద్వారా సమాధాన పత్రం ఎవరిది అనే విషయం మూల్యాంకనం చేసే వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఆయా కేంద్రాల్లో నిర్దేశిత సబ్జెక్టు అధ్యాపకులు సమాధాన పత్రాలను పరిశీలించి మార్కులేస్తారు. వీటిని మూడు దఫాలుగా అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మార్కుల వివరాలు ఆన్లైన్ ద్వారా బోర్డుకు అందుతాయి. మార్కులు కంప్యూటరైజ్ చేసిన తర్వాత అధికారులు డీ కోడ్ చేస్తారు. అన్ని సబ్జెక్టు మార్కులను క్రోడీకరిస్తారు. ఆ తర్వాత ఉన్నతాధికారులు సగటున కొన్ని పేపర్లను మరోసారి పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ అంతటిపై ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఆయా దశలను దాటిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. వారం ముందుగానే ఫలితాలు? ఇంటర్ పరీక్ష ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలని బోర్డు భావిస్తోంది. ప్రతి ఏటా ఏ ప్రిల్ నాలుగోవారంలో వెల్లడించడం ఆనవాయితీ. అయితే ఈసారి ఇంతకన్నా ముందే రిజల్ట్స్ ఇవ్వాలని అధికారులు అనుకుంటున్నారు. మూల్యాంకన ప్ర క్రియతో పాటు డీకోడింగ్ విధానాన్ని వేగంగా పూర్తి చేసి మూడో వారంలోనే ఫలితాలు ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. వీలైనంత త్వరగా ఫలితాలు ప్రకటించేందుకు కృషి చేస్తున్నామని ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి జయప్రదాభాయ్ తెలిపారు. -
ఇంజనీరింగ్ కొలువుల భర్తీ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ) ఉద్యోగాల భర్తీలో ముందడుగు పడింది. ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలు నిర్వహించి ఏడాది కావస్తుండగా... తాజాగా కేటగిరీల వారీగా ప్రాథమిక ఎంపిక జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 సెపె్టంబర్లో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 11 ప్రభుత్వ విభాగాల్లో 1,540 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకుగాను గతేడాది జనవరిలో అర్హత పరీక్షలను కమిషన్ నిర్వహించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ... ఆ తర్వాత గతేడాది మే నెలలో మరోమారు అర్హత పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలో తాజాగా ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కమిషన్ వెల్లడించింది. 18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఏఈఈ ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కూకట్‌పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ)లోని పరిపాలన విభాగంలో ఈ పరిశీలన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను తెరిచి చెక్‌లిస్టు డౌన్లోడ్ చేసుకోవాలని, అప్లికేషన్ పత్రాలను రెండు కాపీలు ప్రింట్ తీసుకోవాలని, అదేవిధంగా అటెస్టెషన్ పత్రాలను కూడా రెండు సెట్లు ప్రింట్ తీసుకుని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. చెక్‌లిస్టులో నిర్దేశించినట్లుగా అభ్యర్థులు అన్నిరకాల సర్టిఫికెట్లుతో హాజరు కావాలని పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించకుంటే తదుపరి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులకు సైతం మరో అవకాశం ఇచ్చేది లేదని కమిషన్ తేల్చిచెప్పింది. వెబ్సైట్లో డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓ పరీక్షల తేదీలు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏఓ), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(హెచ్‌డబ్ల్యూఓ) ఉద్యోగ అర్హత పరీక్షల తేదీలను కూడా కమిషన్ వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. డీఏఓ ఉద్యోగ ఖాళీలు 53, హెచ్‌డబ్ల్యూఓ ఖాళీలు 581 ఉన్నాయి. -
ఆ ఎంపీ సీటుపై అయోమయం.. ముగ్గురు మంత్రుల ‘సై’
కాంగ్రెస్ అధిష్టానంకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక సవాల్‌గా మారిందా?.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు చెందిన సంబంధికులు సీరియస్‌గా టికెట్ ట్రై చేస్తూ ఉండటంతో ఎవరికి ఇవ్వాలో తెలియక అయోమయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందా?.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏ పార్లమెంటు సెగ్మెంట్లో లేని పోటి అక్కడే ఉండటానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయా?...కాంగ్రెస్‌కు కొంత తలనొప్పులు తెచ్చిపెడుతున్న ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 స్థానాలలో మిగత 13చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే 13 స్థానాలల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ తలనోప్పిగా మారింది మాత్రం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికననే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయాలు అన్నిఇన్ని కావు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయలంతా ఖమ్మం చుట్టే తిరిగాయని చెప్పాలి. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పాలిటిక్స్ ఖమ్మం వైపే టర్న్ అయ్యాయనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకే మళ్లీ టికెట్ ప్రకటించింది...అయితే బీఆర్ఎస్ లో పెద్దగా పోటి లేకపోవడంతో మళ్లీ నామా కే టికెట్ ఇచ్చారు.. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితితి లేదు. టికెట్ కోసం తీవ్రమైన పోటి ఉండటంతో కొత్త కొత్త ఈక్వేషన్స్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ముగ్గురు మంత్రులు సై అంటే సై అంటున్నారు. బయటకు కనిపించకపోయిన టికెట్ ఎపిసోడ్ లో లోలోపల కత్తులు దూసుకుంటున్నారన్న ప్రచారం నడుస్తుంది. ఖమ్మం పార్లమెంట్ టికెట్‌ను ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు పోటి పడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదేలేదన్నట్లు టికెట్ కోసం పట్టుపడుతూ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లలు పడుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానంను కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా పనిచేసిన కారణంగా పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉన్న సమయంలో పొంగులేటి చేరికతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి...కేసీఆర్ పై తీవ్రస్తాయిలో విమర్శలు చేస్తు దూకుడు గా ముందుకు వెళ్లారు పొంగులేటి...పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానంలో కూడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలవనియ్యను. అసెంబ్లీ గేటు తాకనివ్వను అని పొంగులేటి చేసిన శపథం పెద్ద సంచనలనానికే దారీతీసింది. ఎవరినా కదిలించిన పొంగులేటి శపథంపైనే చర్చ జరిగింది. దీంతో గత ఈక్వేషన్స్ ను లెక్కలోకి తీసుకోని టికెట్ తన సోదరుడుకి ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు. మరోవైపు డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని సైతం తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు దీంతో భట్టి విక్కమార్క సైతం తన సతీమణికి టికెట్ ఇప్పించేందుకు అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక కీలకంగా తను పనిచేశానని చెప్పుకుంటు భట్టి విక్కమార్క సైతం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తుంది. అటు మల్లు నందిని సైతం పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వారికే అధిష్టానం ప్రయార్టీ ఇస్తుందనే దీమాతో ఉన్నారు. టికెట్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కొడుకు తుమ్మల యుగేంధర్ సైతం కమ్మ కోటాలో టికెట్ కోసం ట్రై చేస్తున్నారు..తెరవెనుక చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు టర్న్ అవ్వడంలో తుమ్మల కీలకంగా వ్యవహరించారన్న ఈక్వేషన్స్ తో వారు కూడ రేసులో ముందు వరుసలో ఉన్నామంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముగ్గురు మంత్రులు పనిచేశారు...గ్రూపు పాలిటిక్స్ ను పక్కనే పెట్టి అంత ఒక్కటిగా ముందుకు వెళ్లడంతో ఫలితాలు సైతం కాంగ్రెస్‌కు అనుకులంగా వచ్చాయి. సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలకొచ్చేసరికి ఈక్వేషన్స్ మారిపోయాయి. ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు టికెట్ కోసం పోటి పడుతుండటంతో లెక్కలు తప్పుతున్నాయి..ప్రస్తుతం పైకి అందరు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న టికెట్ విషయంలో చాలా సీరియస్‌గా ఎవరికి వారు వారి వారి రూట్లలో ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు వస్తదంటే తమకు వస్తుందని ముగ్గురు దీమాతో ఉన్నారు. ముగ్గురు సీనియర్ నేతలు కావడంతో ముగ్గురు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ముగ్గురులో అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందన్న ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎ పార్లమెంట్ స్థానంకు ఇంత తీవ్రస్తాయిలో పోటి లేదనే చెప్పాలి...అయితే ఒక మంత్రికి సంబంధించిన వారికి టికెట్ ఇస్తే మిగత ఇద్దరు మంత్రులు వారికి సపోర్ట్ చేస్తారా లేదా అన్న ఆసక్తికర చర్చ సైతం నడుస్తుంది. వాస్తవానికి ఖమ్మం పార్లమెంట్ స్థానంకు మొదట నలుగురు మద్య పోటి ఉండేది. కానీ ఇందులో రేణుక చౌదరికి రాజ్యసభ ఖారారు చేయడంతో కొంత పోటి తగ్గింది అది మూడుకు చేరింది. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానంకే సవాల్‌గా మారిన ఖమ్మం పార్లమెంట్ ఎంపిక విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క.. ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని తెలిపారు. దేవుడిపై భక్తి భావంతోనే అలా చేశానని పేర్కొన్నారు. ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన్నట్లు ట్రోల్ చేస్తున్నారని అన్నారు. తనను ఎవరూ అవమానించలేదని, దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు. యాదాద్రిలో ఫోటో చూసి తనకు అవమానం జరిగిందని కొంత మంది భావించారని.. తనను ఎవరూ అవమానించలేదన్నారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదని తెలిపారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక వంటి మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు. అయితే యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సీఎం దంపతులు, ఉత్తమ్, కోమటిరెడ్డి బెంచ్‌పై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి స్టూల్‌పై కూర్చున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సహా ఇతర పార్టీల నేతలంగా భట్టిని అవమానించారని కాంగ్రెస్ పార్టీపై మండిపడిన విషయం తెలిసిందే. చదవండి: కాంగ్రెస్, బీఆర్ఎస్ అజెండా ఒక్కటే: కేంద్ర మంత్రి అమిత్ షా -
కాంగ్రెస్, బీఆర్ఎస్ అజెండా ఒక్కటే: కేంద్ర మంత్రి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: భాగ్యలక్ష్మి అమ్మవారికి, భద్రాద్రి రాముడికి నమస్కారాలు తెలుపుతూ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎవరు అధికారంలో ఉండాలో తేలిపోతుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా అమిత్ షా.. బీజేపీ సోషల్‌మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.‘ఇళ్లు ఇళ్లు తిరిగి ప్రచారం చేసే కార్యకర్తకు ఎంత హక్కు ఉందో సోషల్ మీడియాకు అంతే. మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి రాబోతుంది.దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ పేరు తప్ప వేరే పేరు వినిపించడం లేదు. తెలంగాణలో 12 కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలవాలి. 10ఏళ్లలో మోదీ సర్కార్ అవినీతిని అంతం చేసింది. దేశం సురక్షితంగా ఉంది అంటే కారణం మోదీ సర్కార్. మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. 5 వందల ఏళ్ల కల నెలవెర్చిన ఘనత మోదీ సర్కార్‌ది. గతంలో కాంగ్రెస్ సర్కార్ చేయని పని మోదీ చేసి చూపించాడు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత మోదీ... కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయం మాత్రమే చేసింది. మోదీ సర్కార్ చేసి చూపించింది. ట్రిపుల్ తలాక్ తీసివేసిన వ్యక్తి మోదీ. మహిళ రిజర్వేషన్ కల్పించారు. సీఏఏ నిర్ణయం కూడా మోదీ సర్కార్ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేయని పనిని మోదీ సర్కార్ చేసి చూపించింది. సీఏఏని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మీ చేతిలో మెక్ ఇన్ ఇండియా ఫోన్ ఉంది.దీని ఘనత మోదీది. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు వేరు ఎజెండా ఒక్కటే, మజ్లిస్ ఎజెండా లో మిగితా పార్టీలు నడుస్తాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మొత్తం కుటుంబ పార్టీలే... అవినీతి పార్టీలే ఈ మూడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్న కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. రూ. 12లక్షల కోట్ల అవినీతి చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అభివృద్ది మోదీ తోనే సాధ్యం.ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తి మోదీ. మోదీ జీవితం మొత్తం ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాడు. మోదీ విరామం లేకుండా పని చేస్తున్నాడు..రాహుల్ బాబా విశ్రాంతి కోసం విదేశాలకు వెళతాడు. సీఎం రేవంత్‌రెడ్డిని అడుగుతున్న గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రూ. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క తెలంగాణకు మోదీ రూ. 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదుల భరతం పట్టాడు మోదీ. ఇండియా అలయన్స్, బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరు. 400 స్థానాల్లో 12 కంటే ఎక్కువ స్థానాలు తెలంగాణ నుండి ఉండాలి’ అని అమిత్ షా అన్నారు. -
జోరుగా బోర్ల తవ్వకం
కౌటాల: సాగు, తాగునీటి అవసరాల కోసం రైతులు, ఇతరులు ఇష్టారాజ్యంగా బోర్లు వేస్తున్నారు. భూగర్భంలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా వందల ఫీట్ల లోతు వరకు తవ్వుతున్నారు. ఇలా డ్రిల్లింగ్ చేసిన వాటిలో 70శాతానికి పైగా విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అవగాహన కల్పించాలి్సన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అవసరానికి మించి.. నీటి లభ్యత, వాడకంపై అవగాహన లేని కొంతమంది రైతులు పంటలకు అవసరానికి మించి నీరందిస్తున్నారు. దీంతో నీటి కొరత ఏర్పడుతుండడంతో బోర్లు తవ్వాలని ఆరాటపడుతున్నారు. బోరు వేసేందుకు నిపుణులైన జియాలజిస్టులను సంప్రదించకుండా బాబాలు, గురువులను ఆశ్రయిస్తున్నా రు. టెంకాయ, తంగెడు పుల్లలతో అశాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ అప్పుల పాలవుతున్నారు. బోరులో నీళ్లు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అవస్థలు పడుతున్నారు. బోర్వెల్ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్కో బోరుబావిని దాదాపు 200 మీటర్ల లోతు వరకు తీస్తున్నారు. అందుకు రూ. 50వేల నుంచి రూ. 60 వేల వరకు డబ్బులు తీసుకుంటున్నారు. పరీక్షలకు స్వస్తి.. భూగర్భ జలాల లభ్యతపై ప్రతీ మండలంలో అధికారులు ఏటా పరీక్షలు నిర్వహించాలి. ఆయా ప్రాంతాలను బట్టి, అంతకు ముందు నమోదైన వర్షపాతంపై ఆధారపడి భూగర్భ జలమట్టం మారుతుంది. నీటి లభ్యత పరీక్షల అనంతరం, అధికారులు తక్కువ నీళ్లున్న గ్రామాల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. తక్కువ ఉన్న జీపీల్లో కొత్త బోరుబావుల తవ్వకాన్ని నిషేధించాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా అసలు ఈ పరీక్షలే నిర్వహించడం లేదు. నిబంధనల ప్రకారం బోర్లు, బావులు తవ్వాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. మీ సేవ ద్వారా చలానా తీసి రెవెన్యూ అధికారులు, రక్షిత మంచినీటి శాఖ అధికారుల ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. నీటి లభ్యత వంద గజాల దూరంలో ఉంటేనే అనుమతి ఇస్తారు. అనుమతి లేకుండా బోర్లు వేస్తే రూ. లక్ష జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. అనుమతులు తీసుకోకుండానే.. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా బోరుబావులు తవ్వకూడదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి బోరు లారీలు వచ్చి మండలాల్లోని ఆయా గ్రామాల్లో జోరుగా అనుమతి లేకుండా బోర్లు వేస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో బోర్లు వేసే యజమానులు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. అధికారులు స్పందించి అనుమతుల్లేని బోరు తవ్వకాలు నియత్రించి రాబోయే తరాలకు నీటి కరువు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
17 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 17వ తేదీ వరకు డ్రైవ్‌ను కొనసాగించాలంటూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, ఇంకా మిగిలిపోయిన దరఖాస్తులను క్లియర్ చేయడమే లక్ష్యంగా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీసీఎల్ఏ సూచించారు. ఇది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే: కోదండరెడ్డి, సునీల్ ధరణి పోర్టల్ విషయంలో తాము ఇప్పటివరకు ఫస్ట్ ఎయిడ్ (ప్రాథమిక చికిత్స) మాత్రమే ఇస్తున్నామని, అసలు ట్రీట్మెంట్ను ఇంకా ప్రారంభించలేదని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, భూమి సునీల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్లో వారు విలేకరులతో మాట్లాడారు. గతంలో పేరుకుపోయిన దరఖాస్తుల పరిష్కారం కోసమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్‌ను ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించిందని చెప్పారు. అయితే ధరణి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం నిరంతరం జరగాల్సిందేనన్నారు. గతంలో కలెక్టర్లు మాత్రమే ఈ దరఖాస్తులను పరిష్కరించేవారని, ఇప్పుడు తహశీల్దార్, ఆర్డీవోల స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరపడమే కాకుండా, పరిష్కారానికి నిర్దేశిత టైంలైన్ విధించామని తెలిపారు. ధరణి పోర్టల్ విషయంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని, చట్టాలు, వ్యవస్థ, సాంకేతికతలో మార్పులు తీసుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న అవకాశాల పరిధిలో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారంపై ప్రభుత్వానికి నివేదికలిస్తామని, ఆ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని అన్నా రు. ప్రస్తుతం చేపడుతున్నవి తాత్కాలిక చర్య లు మాత్రమేనని, 2, 3 నెలల్లో శాశ్వత పరిష్కారాలు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మాజీ ఎంపీ సంతోశ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, నిషేధిత జాబితాలోని భూములను కూడా రాత్రికి రాత్రి బదలాయించుకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. -
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న రేవంత్
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన.. సోమవారం నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో సతీమణి గీతారెడ్డితో కలసి తొలిపూజలో పాల్గొన్నా రు. తొలుత తూర్పు త్రితల రాజగోపురం వద్ద సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దీపజ్యోతి వద్ద సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం వెంట పూజల్లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, మందుల సామెలు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. 12 గంటలకు భద్రాచలం వెళ్లారు. స్వర్ణ తాపడం పూర్తి చేయించండి యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం రేవంత్‌ను ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు పూర్తి చేయించాలని ఆలయ ఈవో రామకృష్ణారావు కోరారు. కొంత బంగారంతో ధ్వజస్తంభం బంగారు తాపడం చేయించామని తెలిపారు. నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం యాదగిరిగుట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమ వారం పంచరాత్ర ఆగమం ప్రకారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఉదయం నిత్యారాధనల అనంతరం శ్రీవిష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలను మొదలుపెట్టారు. స్వస్తి వచనం, రక్షాబంధన కార్యక్రమాలు, పారాయణలు నిర్వహించారు. ప్రొటోకాల్ వివాదం సీఎం పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. దేవస్థానం అధికారులు సీఎంకు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో డిప్యూటీ సీఎంకు.. మంత్రులకు వేసిన పీటల కంటే చిన్నపీట వేయడం వివాదాస్పదమైంది. సీఎం పక్కన ఆయన సతీమణి గీతారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ సమానమైన ఎత్తు పీటలపై కూర్చున్నారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖను ఆశీర్వచనం ఇస్తున్న అర్చకుల వెనుక కూర్చోబెట్టారు. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు స్పందిస్తూ, సీఎంతో పాటు మంత్రులందరికీ పీటలు వేశామని, ఇందులో ప్రొటోకాల్ వివాదమేమీ లేదన్నారు. -
చేతులెత్తి మొక్కుతున్నాం..
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా నామినేటైన తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.. గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ఆమోదించాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్‌భవన్‌లో వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞాపనతో పాటు ఇటీవల హైకోర్టు వెలువరించిన 88 పేజీల తీర్పు కాపీని కూడా జత చేసి గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. తమను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని రాజ్‌భవన్ గేట్లకు మొక్కారు. రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినా, 55 రోజుల తర్వాత కేబినెట్ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారని దాసోజు శ్రవణ్ మీడియాకు తెలిపారు. అయితే తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం గవర్నర్ కోటాలో కోదండరాం, అమేర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారన్నారు. ఈ మేరకు గెజిట్ కూడా విడుదల కాగా, కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను నామినేట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని హైకోర్టు పేర్కొందన్నారు. అట్టడుగు కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలని దాసోజు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తాము ఇద్దరూ గతంలో బీజేపీ, దాని అనుబంధ విభాగాల్లో పనిచేశామని దాసోజు, కుర్రా సత్యనారాయణ తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. -
డూప్లెక్స్ ‘ఇందిరమ్మ’!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లలో ఈసారి డూప్లెక్స్ తరహా నిర్మాణాలు దర్శనమిస్తాయా? పేద వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి ఆధారంగా ప్ర భుత్వం ఆ దిశగా యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది. దిగువ అంతస్తులో కొన్ని గదులు, పై అంతస్తులో కొన్ని గదులు నిర్మించటం దీని ఉద్దేశం. కాదంటే పెద్ద సంఖ్యలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు చేజారే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం 400 చదరపు అడుగుల్లో... గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు చిన్నవిగా ఉండటంతో ఈసారి విశాలమైనవి సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు యూనిట్ కాస్ట్‌ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. ప్రతి ఇంట్లో కచ్చితంగా వంటగది, టాయిలెట్ నిర్మించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇవికాకుండా మరో రెండు గదులు ఉండాలని పేర్కొంది. దీని ప్రకారం ఇల్లు సమకూరాలంటే కనీసం 400 చదరపు అడుగులకు తగ్గకుండా నిర్మించాల్సి ఉంటుంది. అందుకు 60 గజాల వరకు స్థలం అవసరం. కానీ, చాలామంది నిరుపేదలకు అంతమేర స్థలం లేదు. 30 గజాలలోపు స్థలం ఉన్నవారు ఎందరో. అందులో నిర్మించాలంటే, నిబంధనల ప్రకారం ఖరారు చేసిన విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం అసాధ్యం. ఇరుకు ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. అందుకు నిర్ధారిత యూనిట్ కాస్ట్ రూ.5 లక్షల కంటే తక్కువ మొత్తం విడుదల చేయాల్సి ఉంటుంది. ఇది తమ హామీకి విరుద్ధంగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం రూ.5 లక్షలు కచ్చితంగా అందించాలంటోంది. అంత మొత్తంతో ఇంటిని నిర్మించాలంటే 60 గజాల స్థలం ఉన్నవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో తక్కువ స్థలం ఉన్న నిరుపేదల్లో ఆందోళన మొదలైంది. తమకున్న చిన్న స్థలంలో నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించాలంటే కచ్చితంగా డూప్లెక్స్ తరహాలో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పడక గదులను పైన నిర్మించుకుని, వంటిల్లు, హాలు, మరుగుదొడ్డిని దిగువ అంతస్తుల్లో నిర్మించాలి. ఈ నమూనాకు ఆమోదం తెలపాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఆడబిడ్డల పేరిట ఇందిరమ్మ ఇళ్లు
మహిళల పేరిటే ‘ఇందిరమ్మ’ ఇళ్లు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే. ఇంటి పెత్తనం తమ చేతిలో ఉంటే చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పట్టా మహిళల పేరుతోనే ఉంటుంది. తద్వారా ఆ ఇల్లు బాగుంటుంది. పిల్లలు చదువుకుంటారు. ఆ కుటుంబం సమాజంలో గౌరవంగా బతుకుతుందనేది మా ప్రభుత్వ భావన. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని.. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతీ శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టేనని, అందుకే ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే ఇస్తామని చెప్పారు. సోమవారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. తర్వాత ఇక్కడి వ్యవసాయ మార్కెట్ మైదా నంలో నిర్వహించిన సభలో ఇందిరమ్మ ఇళ్ల పథ కాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. రేవంత్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘భద్రాచలం రాముడి సాక్షిగా ఆయన ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. పేదల చిరకాల కోరిక ఇది. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్లు. పేదవాళ్లు ఆత్మగౌరవంతో బతకాలంటే, పది మందిలో తలెత్తుకొని నిలబడాలంటే సొంతిల్లు ఉండాలని ఆలోచించి నాడు వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆకాశమే హద్దుగా లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. పేదలు నేటికీ ఆ ఇళ్లలో ఉంటున్నారు. నాటి పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు. పెళ్లయి పిల్లలతో కుటుంబంగా మారారు. వారు కూడా సొంతింట్లో ఆత్మగౌరవంతో బతకాలనే ఆశయంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఆ అబద్ధాలకు కాలం చెల్లింది 2014 ఎన్నికలకు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బె డ్రూం ఇల్లు ముద్దు అంటూ పేదల సొంతింటి కలలతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారు. పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఇదే కథ మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ మోసాలు, అబద్ధాల కు కాలం చెల్లడంతోనే ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. మేం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లను మంజూరు చేస్తాం. డబుల్ బెడ్రూం ఇళ్లున్న ఊళ్లలో కేసీఆర్ ఓట్లు వేయించుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లలోనే మేం ఓట్లు వేయించుకుంటాం. ఇందుకు కేసీఆర్ సిద్ధమా? ఆ ఊళ్లలో ఓట్లు వేయించుకోండి ప్రధాని మోదీ మాటలకు హద్దే లేదు. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసి తీయని మాటలు చెప్పడం తప్ప చేసేదేమీ లేదు. 2022 నాటికి దేశంలోని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని గత ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. మరి కేంద్రం రాష్ట్రంలో ఎక్కడ ఇళ్లు కట్టించిందో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ చెప్పాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లున్న చోట బీజేపీ నాయకులు ఓట్లు వేయించుకోవాలి. మేం అక్కడ ఓట్లు అడగబోం. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ పెట్టుబడి కూడా రాక లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు. భద్రాచలం రిటైనింగ్ వాల్‌కు రూ.500 కోట్లు గోదావరి ముంపు నుంచి భద్రాచలం పట్టణాన్ని రక్షించేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.500 కోట్లు మంజూరు చేశాం. ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు. రాముల వారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి తుమ్మల అడిగారు. అన్నింటినీ పరిశీలిస్తాం. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నందునే ముగ్గురు మంత్రులను ఇచ్చాం. ఇటీవల రేణుకాచౌదరిని రాజ్యసభకు ఎంపిక చేశాం..’’అని రేవంత్ చెప్పారు. సభలో పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలకు చెందిన పలువురు మహిళలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రులతో కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా సీఎం భద్రాచలం పర్యటన సందర్భంగా కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడంతో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రాములవారిని దర్శించుకున్న సీఎం, మంత్రులు భద్రాచలం అర్బన్: భద్రాచలం పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్, మంత్రులు తొలుత శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న సీఎం, మంత్రులకు అర్చకులు పరివట్టం కట్టి పూర్ణకుంభంతో ఆహ్వనించారు. గర్భగుడిలో సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేసి, బెల్లంతో చేసిన రాముల వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. పేదలు గుర్తుంచుకునే రోజు ఇది..: భట్టి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన, పేదలు గుర్తుంచుకునే సందర్భం ఇది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘‘పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం సీతారామచంద్రస్వామి పాదాల సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద, బలహీన వర్గాల వారు రాములవారి సన్నిధిలో ఇంటి పత్రాలు పొందడం శుభకరం. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని అటకెక్కిస్తే.. మేం అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ప్రారంభించాం. దళిత, గిరిజనులు ఇల్లు కట్టుకోవడానికి రూ.6 లక్షలు, మిగతా వర్గాలకు రూ.5 లక్షలు ఇస్తాం. బీఆర్ఎస్లా హామీలిచ్చి విస్మరించకుండా.. బడ్జెట్లో నిధులు కేటాయించాకే పథకాలను ప్రారంభిస్తున్నాం. ఇళ్ల నిర్మాణం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తొలి దఫాగా రూ.7,740 కోట్లు కేటాయించాం..’’అని చెప్పారు.