Opinion
-
సుప్రీమ్ కదిపిన తేనెతుట్టె
ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతికే పని పెట్టుకోవద్దని స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయినా సంభల్ మసీదు, అజ్మీర్ దర్గాలను భౌతిక సర్వే చేయాలంటూ కేసులు నమోదయ్యాయి. అంటే, ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు పనికిరాకుండా పోయిందా? ఇది కాగితాలకే పరిమితమైన చట్టమా? 1947 ఆగస్ట్ 15 నాటికి ఉన్నవి ఉన్నట్టుగా ప్రార్థనాలయాల స్వభావాన్ని కాపాడటం కోసం తెచ్చిన ఈ చట్టంలో, కేవలం అయోధ్యనే మినహాయించారు. అయినప్పటికీ జ్ఞానవాపి మసీదు సర్వేకు అనుమతించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం దిగువ కోర్టులకు పూర్తి మిశ్రమ సందేశం పంపింది. నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ వచ్చే కాపీ కేసులతో ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది.ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకడాన్ని వ్యతిరేకించినవారు ఎవరో కాదు, సాక్షాత్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్. అయినా మనం ఈ పరిస్థితికి చేరుకున్నాం.సంభల్‌లోని మసీదు సర్వేకు ట్రయల్ కోర్టు అనుమతించిన తర్వాత పోలీసులకూ, నిరసనకారులకూ మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు ఎలా మరణించారు అనే దానిపై ఉత్తరప్రదేశ్‌లోని జ్యుడీషియల్ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. రాజస్థాన్‌లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అజ్మీర్ దర్గా ఒకప్పుడు శివాలయంగా ఉండేదని వాదిస్తూ తనముందుకు వచ్చిన పిటిషన్ ను స్వీకరించిన తర్వాత స్థానిక కోర్టు పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. దర్గాను భౌతిక సర్వే చేయాలని పిటిషనర్ కోరారు. అయోధ్యకే మినహాయింపుఇది ఎక్కడ ముగుస్తుంది? ప్రార్థనా స్థలాల చట్టం ఇప్పుడు నిరర్థకంగా మారిందా? ఇది కేవలం కాగితాలకే పరిమితమైన చట్టమా? దిగువ కోర్టులకు ఇలా పరస్పర విరుద్ధమైన సందేశం పంపడానికి సుప్రీంకోర్టు బాధ్యత వహిస్తుందా? అసలు నేటి రాజకీయ–మత చర్చకు కేంద్రంగా ఉన్న ఈ చట్టం ఏమిటి? 1991 సెప్టెంబరులో, పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ‘1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనా స్థలంలోనైనా యథాతథ మతపరమైన స్వభావాన్ని కొనసాగించడం కోసం’ పార్లమెంటు చట్టం చేసింది.అయోధ్య కోసం మాత్రం చట్టంలోనే దీనికి మినహాయింపు ప్రత్యేకంగా ఇచ్చారు. ‘ఈ చట్టంలో ఉన్న ఏదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఉన్న రామజన్మభూమి–బాబ్రీ మసీదుగా సాధారణంగా పిలవబడే ప్రార్థనా స్థలానికి వర్తించదు. ఇక్కడ పేర్కొన్న స్థలం లేదా ప్రార్థనా స్థలానికి సంబంధించిన దావా, అప్పీల్ లేదా ఇతర విచారణ వర్తించబడదు’ అని అందులో పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య తీర్పును ప్రకటించినప్పుడు బెంచ్‌లో ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ కూడా ఉన్నారు. ఈ చట్టం ఉద్దేశ్యం ’రాజ్యాంగ ప్రాథమిక విలువలను రక్షించడం, భద్ర పరచడం’ అని నొక్కిచెప్పడానికి ఈ ప్రత్యేక చట్టాన్ని అమలు చేసినట్లు వీరు చెప్పారు. కీలకమైన విషయం ఏమిటంటే, సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రార్థనా స్థలాల చట్టాన్ని, అది రక్షించే విలువలను రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఉంచింది. ఇది కేవలం విద్యా పరమైన లేదా రహస్య వివరాలకు చెందినది మాత్రమే కాదు. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే, కేశవానంద భారతి కేసు తీర్పులో, రాజ్యాంగ మౌలిక స్వరూపం మారరాదు అని స్పష్టం చేసింది. ఏదైనా చట్టాన్ని రూపొందించడానికి/సవరించడానికి మాత్రమే పార్లమెంటుకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధ్యతాయుత చట్టంపార్టీలకు అతీతంగా విస్తృతంగా ప్రశంసలు పొందిన అయోధ్య తీర్పు ఈ చట్టం గురించి ఇలా పేర్కొంది: ‘భారత రాజ్యాంగం ప్రకారం లౌకికవాదం పట్ల మన నిబద్ధతను అమలు చేసే దిశగా ప్రార్థనా స్థలాల చట్టం ఒక కించపరచని బాధ్యతను విధిస్తుంది.అందువల్ల చట్టం రూపొందించిన శాసన సాధనం రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలలో ఒకటైన భారత రాజకీయాల లౌకిక లక్షణాలను రక్షించడానికే ఉంది. తిరోగమించకపోవడం అనేది ప్రాథమిక రాజ్యాంగ సూత్రాల మౌలిక లక్షణం. దీనిలో లౌకికవాదం ప్రధాన అంశం. ఆ విధంగా ప్రార్థనా స్థలాల చట్టం అనేది మనలౌకిక విలువల నుంచి తిరోగమించకుండా కాపాడే శాసనపరమైన జోక్యం’.అయితే, అయోధ్య తీర్పు రచయితలలో ఒకరైన జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ 2023 ఆగస్ట్‌లో జ్ఞానవాపి మసీదు 17వ శతాబ్దపు నిర్మాణాన్ని ముందుగా ఉన్న ఆలయంపై నిర్మించారా లేదా అని నిర్ధారించడానికి సర్వేను అనుమతించారు. సర్వేను అనుమతించిన హైకోర్టు ఉత్తర్వులపై ఏదైనా స్టే విధించడానికి నిరాకరించారు. ఈ నిర్ణయం ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే నన్న వాదనను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించారు. ‘మేము నిర్మా ణాన్ని పరిరక్షిస్తాం. మేము మీ ప్రయోజనాలను కాపాడుతాం’ అని పేర్కొన్నారు.వెనక్కి వెళ్లగలమా?ఇప్పుడు నేను జ్ఞానవాపిపై చారిత్రక, మతపరమైన చర్చకు చెందిన యోగ్యత లేదా లోపాల జోలికి వెళ్లడం లేదు. ఫైజాన్ ముస్తఫా వంటి పండితులు జ్ఞానవాపి కేసు ముస్లిం సమాజానికి అయోధ్య కంటే బలహీనమైన కేసు అని పేర్కొన్నారు. ఇదే మసీదు ఆవరణలో హిందూ భక్తులకు నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకొనే వీలు కల్పించాలని గతంలో ముస్లిం సంఘాల నేతలను ఆయన కోరారు. ప్రతీ వివాదంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడంలోని పరిమితులను ఆయన ఎత్తిచూపారు. అయితే ఇవన్నీ మత పెద్దలు, పౌర సమాజంలోని సభ్యుల నేతృత్వంలో జరగాల్సిన చర్చలు.నిర్దిష్ట ప్రార్థనా స్థలాల స్వభావాన్ని పునర్నిర్ణయించాలంటూ పేరుతో వచ్చే కాపీ కేసులతోనే ఇప్పుడు అసలు ప్రమాదం దాగివుంది. అయితే, సంభల్ మసీదు కమిటీ వేసిన పిటిషన్ విషయంలో, చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు ఎలాంటి చర్యా తీసుకోకుండా నిలుపుదల చేసింది. ఆ సర్వేను అను మతించిన స్థానిక కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పై కోర్టును సంప్ర దించాలని పిటిషనర్లకు సూచించింది. సర్వేకు సంబంధించిన కమి షనర్ నివేదికను గోప్యంగా ఉంచాలని కూడా ఆదేశించింది.ఏమైనా, తేనె తుట్టెను ఇప్పటికే సుప్రీంకోర్టు కదిపి ఉండొచ్చు. ఇప్పుడు, మళ్లీ యథాతథ స్థితిని నెలకొల్పడం అనుకున్నదానికంటే కష్టం కావచ్చు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయురాలు, రచయిత్రి(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఆ వ్యతిరేకత మనకు కలిసొచ్చేనా?
ట్రంప్ తిరిగి ఎన్నిక కావడం ఆయన చైనా విధానం గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. అది ఇండో–పసిఫిక్ క్రియాశీలక శక్తులను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా అమెరికా–చైనా ఉద్రిక్తతల నడుమ భారతదేశానికి పెట్టుబడులను ఆకర్షించే అవకాశాన్ని అందిస్తుంది.గతం నాంది అయినట్లయితే, అమెరికా అధ్యక్షులు వారి రెండవ టర్మ్‌లో మరింత దూకుడుగా ఉంటారని చెబుతారు. ట్రంప్ 2.0 చైనా విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు. ఎందుకంటే, తన మొదటి హయాంలో ట్రంప్, బీజింగ్‌తో వాషింగ్టన్ ప్రాథమిక ఒడంబడికనే మార్చేశారు. 1970ల చివరలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరినప్పటి నుండి, ఆర్థిక, శాస్త్రీయ సాంస్కృతిక రంగా లలో సహకారం పెరిగింది. ట్రంప్ రెండు దేశాల మధ్య ఆ బంధాన్ని తెంచేశారు.వాణిజ్యం, భౌగోళిక రాజకీయాలు, భద్రతలో సవాళ్లను కూడా పరిష్కరించాలని ట్రంప్ చూస్తున్నారు. వాణిజ్య లోటును తగ్గించేందుకు చైనా దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం సుంకాలు విధించిన నేపథ్యంలో చైనా–అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. చైనా సంతకం చేసిన వాణిజ్య ఒప్పంద నిబంధనల ప్రకారం, అమెరికా ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచడానికీ, మేధో సంపత్తికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికీ, అమెరికన్ ఆర్థిక సంస్థలకు ఎక్కువ మార్కెట్ అందుబాటు ఇవ్వడానికీ అంగీకరించింది. అయితే, ట్రంప్ ప్రభుత్వం జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనాను వ్యూహాత్మక ప్రత్యర్థిగా ముద్ర వేసింది. అందువల్ల, జాతీయ భద్రతా ఆందోళనలు ముఖ్యమైనవిగా మారాయి. సున్నితమైన రంగాలలో చైనీస్ పెట్టుబడులపై నియంత్రణలు, హువై, జీటీఈ వంటి చైనీస్ బడా వాణిజ్య సంస్థలపై పరిమితులు పెరిగాయి. టెలికాం నెట్‌వర్క్‌లు, సెల్‌ఫోన్ యాప్ పర్యావరణ వ్యవస్థలు, క్లౌడ్ కంప్యూటింగ్లలో చైనీస్ ప్రభావాన్ని ఎదుర్కోవాలనే ఒత్తిడి పెరిగింది.ఇదే పునాదిపై బైడెన్ పరిపాలన చైనాకు సున్నితమైన సాంకేతికత, పెట్టుబడి, మానవ మూలధన ప్రవాహాలను పరిమితం చేస్తూ తన చైనా విధానాన్ని నిర్మించింది. జిన్‌పింగ్ చైనా ఎలక్ట్రిక్ వాహనాల వంటి సాంకేతికత ద్వారా తన ప్రాధాన్యతను పెంచుకోగా, అమెరికా దాన్ని సుంకాల విధింపు ద్వారా దెబ్బతీసింది. అందువల్ల, రిపబ్లికన్, డెమొ క్రాట్ పరిపాలనల రాజకీయ ఎజెండా మొత్తంగా ఏమిటంటే చైనాను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లు భావించే చర్య లను పెంచడమే.తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, ట్రంప్ వస్తూ త్పత్తిలో అమెరికా ప్రాధాన్యతను పునరుద్ధరించడానికి ప్రయ త్నించారు. అధునాతన సమాచార సాంకేతికత, హై–ఎండ్ న్యూమరికల్ కంట్రోల్ మెషినరీ, రోబోటిక్స్, వైమానిక సామగ్రి, సముద్ర ఇంజనీరింగ్ టెక్నాలజీ వంటి ముఖ్యమైన రంగాలలో ఆధిపత్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్న జిన్‌పింగ్ పాలనలోని చైనా తయారీ రంగ చొరవపై ట్రంప్ దెబ్బకొట్టారు. అధునాతన రైలు పరికరాలు, శక్తిని ఆదా చేసే వాహనాలు, విద్యుత్ పరికరాలు, వ్యవసాయ యంత్రాలు, బయో ఫార్మాస్యూటికల్స్, అధిక పనితీరు గల వైద్య పరికరాలు తదితర చైనా వస్తువులపై అధిక సుంకాలు విధించాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ –19ని జిన్‌పింగ్ తప్పుగా నిర్వహించడమే 2020 ఎన్నికలలో తన పతనానికి దారితీసిందని ట్రంప్ భావిస్తున్నారు.చైనా విషయానికి వస్తే, ట్రంప్ తిరిగి రావడం దాని రాజకీయ, ఆర్థిక పథాలపై ఆందోళనలను రేకెత్తించింది. పాలనా మార్పు ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని తొలగించే ప్రయత్నాలు జరగవచ్చని కూడా జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలలో కూడా దీని ప్రతిధ్వని వినిపించింది. చైనా ఉద్దేశించిన స్థూల దేశీయోత్పత్తి వృద్ధి లక్ష్యమైన 5 శాతాన్ని సాధించకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికా, చైనాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలు, ఆర్థిక మాంద్యం బీజింగ్‌ను అమెరికన్ సంస్థలకు ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానం నుంచి తొలగించాయి. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూరో పియన్ వాణిజ్య సంస్థలు తాము పెట్టిన పెట్టుబడికి గానూ తగ్గిన రాబడులపై ఆందోళన వ్యక్తం చేశాయి. చైనీస్ మార్కెట్లోని సమస్యలు అపరిష్కృతంగానే ఉంటాయని అవి నమ్ముతున్నాయి. నియంత్రణ సమస్యలకు సంబంధించి చూస్తే, ప్రభుత్వ యాజమాన్యంలోని వ్యాపార సంస్థలకు ప్రాధాన్యత, మార్కెట్–ప్రాప్యత అడ్డంకులు, మితిమీరిన సామర్థ్యం కారణంగా చైనాలో పెట్టుబడి పెట్టడం గురించి ఈ సంస్థలు పునరాలోచించవలసి ఉంటుంది. భౌగోళిక రాజ కీయ ఉద్రిక్తతల మధ్య అమెరికా టెక్ కంపెనీలు చైనా నుండి నిష్క్రమించడం కూడా దీనికి తోడ్పడింది.భారతదేశం దీన్నుంచి తన ప్రయోజనాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. ట్రంప్ గెలిచిన తర్వాత ఆయనతో అనుసంధానం అయిన మొదటి నాయకులలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న తొలి సమయంలో సంబంధాలను పెంచుకోవడానికి మోదీ ప్రయత్నించారు. చైనాతో పాశ్చాత్య దేశాల విరక్తిని మరింతగా పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ ఉపయోగించుకోగలదా అనేది ప్రశ్న. ట్రంప్ తొలి హయాంలో పునాది ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా సైనిక సహకారం అభివృద్ధి చెందింది. భారత్, చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నప్పటికీ, ఢిల్లీ తన నిరోధక సామర్థ్యాన్ని పెంపొందించడానికి దాని రక్షణ– పారిశ్రామిక సముదాయాన్ని మెరుగు పరచాలి. ట్రంప్ హయాంలో, 2017లో ‘క్వాడ్’ పునరుత్థానం చెందింది. పాకిస్థాన్ అధోగతి పాలైనవేళ, కశ్మీర్లో ఉగ్ర వాదం మళ్లీ పుంజుకుంటున్న వేళ, తన మొదటి ఇన్నింగ్స్‌లో భారత ఆందోళనలను పట్టించుకున్న ట్రంప్‌తో విధిగా మాట్లాడుతుండాలి. – హర్ష్ వి. పంత్, ‘ఓఆర్ఎఫ్’ చైనా స్టడీస్ ఉపాధ్యక్షుడు– కల్పిత్ మన్కికర్, ‘ఓఆర్ఎఫ్’ చైనా స్టడీస్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
క్షయ నిర్మూలన ఓ అత్యవసరం!
క్షయ (టీబీ) వ్యాధిని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ వ్యాధిపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీబీ నిర్మూలనలో మన దేశం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, రోగులు పూర్తిగా కోలుకునేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని అమలుచేస్తోంది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి, స్వల్పకాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకూ అనుమతి ఇవ్వడం విశేషం.దేశం నుంచి క్షయ (టీబీ)ని పారదోలాలని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆయన నాయకత్వంలో టీబీని నిర్మూలించేందుకు వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సల్లో మార్పు తీసుకువచ్చేందుకు గత కొన్నేళ్లుగా వినూత్న విధానాలను భారత్ అవలంబిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన ‘ప్రపంచ టీబీ నివేదిక – 2024’లో ఇప్పటి వరకు దేశంలో అవలంబిస్తున్న విధానాలను ప్రస్తావించింది. దేశంలో 2015 నుంచి 2023 వరకు 17.7 శాతం మేర టీబీ వ్యాప్తి తగ్గింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాధి క్షీణత రేటు విషయంలో ఇది రెట్టింపు. అలాగే దేశ వ్యాప్తంగా 25.1 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఫలితంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకునేవారి శాతం 2015లో ఉన్న 59 నుంచి 2023 నాటికి 85 గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి దార్శనిక స్ఫూర్తితో టీబీని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం భారత్‌లో ప్రారంభమైంది. క్షయపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్య క్రమాన్ని పంచకుల నుంచి ప్రారంభించింది. వ్యాధి తొలిదశలో ఉండగానే క్షయ రోగులందరినీ గుర్తించి వారికి సకాలంలో అవస రమైన, నాణ్యమైన చికిత్సను అందించాలనే మా సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది. ‘జన్ భగీదారి’ స్ఫూర్తితో మనమంతా– ప్రజాప్రతినిధులు, ఆరోగ్య నిపుణులు, పౌరసమాజం, కార్పొరేట్ సంస్థలు, సంఘాల–సంయుక్తంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేద్దాం.భారత్ నుంచి టీబీని తరిమేసే ప్రయాణంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న చురుకైన భాగస్వామ్యం... ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలుస్తుందనే భరోసాను ఇచ్చింది. టీబీ నిర్మూలనలో మన దేశ సామాజిక విధానం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, టీబీ రోగులు పూర్తిగా కోలుకొనేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం... ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్‌పీవై)ని భారత్ అమలుచేస్తోంది. ఏప్రిల్ 2018 నుంచి 1.16 కోట్ల మంది లబ్ధి దారులకు ఎన్‌పీవై పథకం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ. 3,295 కోట్లు అందించారు. ఈ పథకం ద్వారా నెలవారీగా అందించే ఆర్థిక సాయం గత నవంబర్ నుంచి రూ. 500 నుంచి రూ. 1000కి పెంచడం క్షయ నిర్మూలనలో భారత్ నిబద్ధతను సూచించే మరో అంశం.మరో కీలక అంశం... పోషకాహర సమస్యను పరిష్కరించడంతో పాటు సమాజ భాగస్వామ్యం పెరిగేలా ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ తోడ్పడింది. అలాగే సమాజంలో వివిధ వర్గాలను ఏకం చేసి అవగాహన పెంచడానికి, టీబీ రోగులకు పోషకాహారం, వృత్తిపరంగా, మానసికంగా సాయం అందించే దిశగా సామూహిక ఉద్య మాన్ని సృష్టించింది. జన్ భగీదారి స్ఫూర్తితో ప్రభుత్వ – పౌర భాగ స్వామ్యంతో చేపట్టిన ఈ ఉద్యమం 1.75 లక్షల మంది ని–క్షయ మిత్రల ద్వారా దేశవ్యాప్తంగా 21 లక్షల ఆహార కిట్లను సరఫరా చేసేందుకు స్ఫూర్తినిచ్చింది.టీబీని రూపుమాపడానికి వినూత్న విధానంఅనేక సంవత్సరాలుగా చికిత్స సఫలతా రేటును పెంపొందించేందుకు బెడాక్విలైన్, డెలామనిడ్ వంటి సరికొత్త ఔషధాలను భారత్ ప్రవేశపెట్టింది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి స్వల్ప కాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకు అనుమతి నిచ్చాం. ఇప్పటికే ఉన్న చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది మరింత ప్రభావ వంతంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు 19 నుంచి 20 నెలల పాటు సాగే సంప్రదాయ చికిత్సా విధానంతో పాటు 9 నుంచి 11 నెలల పాటు సాగే చికిత్సా విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ బీపీఏఎల్ఎమ్ విధానంతో రోగులు ఆరు నెలల్లోనే చికిత్సను పూర్తి చేసుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో రోగులందరినీ గుర్తించి సత్వరమే చికిత్స అందించడడానికి వీలుగా అందుబాటులో అధునాతన పరికరాలు ఉండేలా నిరంతర కృషి చేస్తున్నాం. దీని కోసమే సమర్థవంతమైన, కచ్చితమైన పరీక్షా పద్ధతులను ప్రవేశపెట్టాం. అవే జీవ పరమాణు పరీక్షలు (మాలిక్యులర్ టెస్ట్స్). 2014 –15లో కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఉన్న వ్యాధి నిర్ధారణ పరికరాల సంఖ్య ప్రస్తుతం 8,293 కు చేరుకున్నాయి. ఈ పరికరాలు అన్ని జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ స్ఫూర్తితో స్వదేశీ జీవ పరమాణు పరీక్షలను క్షేత్రస్థాయిలో పరీక్షించి రూపొందించిన పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా జిల్లా, బ్లాకు స్థాయిల్లో టీబీ నిర్ధారణకు వెచ్చించే సమయాన్ని తగ్గించడంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించగలిగాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన మన స్వదేశీ మాలిక్యులర్ పరీక్షలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాలు టీబీ నిర్మూలనలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపాయి.2018 నుంచి టీబీ పరిశోధనలపై అధికంగా నిధులు వెచ్చిస్తున్న అగ్ర సంస్థల్లో ఒకటిగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్థిరంగా నిలవడం మనందరికీ గర్వకారణం. రోగులకు అతి చేరువలోనే సమర్థవంతమైన వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో సహా మరిన్ని నూతన సాధనాలను త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు కొనసాగిస్తాం. భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తూ...వివిధ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నిరూపి తమైన సాంకేతికతలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడం... టీబీ నిర్మూలనా దిశలో భారత్ నాయకత్వానికి నిదర్శనాలు. అధు నాతన రోగ నిర్ధారణ, చికిత్సలకు దారితీసే మార్గదర్శక పరిశోధనల నుంచి సార్వత్రిక సామాజిక తోడ్పాటును అందించే నియమాలను ప్రవేశ పెట్టేవరకూ... టీబీని పారదోలడంలో మన దేశం ముందంజలో ఉంది. టీబీని గుర్తించడం, నిర్ధారించడం, చికిత్స, నివారణలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేయడం ఈ సమయంలో అత్యవసరం. 100 రోజుల పాటు ఉద్ధృతంగా సాగే ప్రచారం టీబీని రూపుమాపడంలో సామూహిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వంలో అందరి భాగస్వా మ్యంతో, మానవాళికి పెద్ద శత్రువుగా ఉన్న టీబీని ఓడించి, ఆరోగ్య కరమైన భవిష్యత్తును కల్పిస్తామని నేను విశ్వసిస్తున్నాను.జగత్ ప్రకాశ్ నడ్డా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి -
ఈ మార్పులతో ఏం ఒరుగుతుంది?
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదయిన సందర్భంలో అన్ని వర్గాల్లోనూ చర్చ చాలా లోతుగానే జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తొలి పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తమ ఆకాంక్ష లకు అనుగుణంగా లేదని చాలా స్పష్టంగా ప్రజలు చెప్పారు. తెలంగాణ కోసమే ఒక రాజకీయ పార్టీ స్థాపించి, తెలంగాణ పేరుతో ప్రతినిత్యం తన రాజకీయం నడిపించిన కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినా ప్రజలు శాశ్వతంగా పట్టం కట్టలేదనీ, కట్టరనీ ఏడాది క్రితం ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి.నిజానికి 2014 ఎన్నికల్లో కేసీఆర్‌కు పట్టం కట్టిన ప్రజలు 2019 ఎన్నికలలోపే ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తూ వచ్చారు. ఇది కనిపెట్టిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలతో (2019) పాటు అసెంబ్లీ ఎన్ని కలు జరిగితే మోదీ సునామీలో అధికారం కోల్పోవడం ఖాయం అని ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇతర వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. అందుకే ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ తనదైన టక్కు టమార విద్యలతో 2018 లోనే అసెంబ్లీకి ప్రత్యేకంగా ఎన్నికలు వచ్చే విధంగా ప్రయత్నం చేసి విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగి ఉంటే అదే స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉండేది. రెండవ దఫా ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళనుంచి తెలంగాణ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. తెలంగాణలో అనుకోకుండా దుబ్బాక నియోజకవర్గంలో వచ్చిన ఉప ఎన్నిక ఈ వ్యతిరేకత చూపించడానికి తొలి వేదిక అయ్యింది. సొంత జిల్లా సిద్దిపేటలో అటు గజ్వేల్, ఇటు సిరిసిల్లకు మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలు బీజేపీ తరఫున నిల బడిన నన్ను గెలిపించడం దీనికి నిదర్శనం.ప్రత్యామ్నాయం కోసం తెలంగాణ ప్రజలు తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపితే అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు... ఏడాది కాలంగా సరిగ్గా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నది. ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన మేనిఫెస్టోలో 42 పేజీలలో వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మారి ఏడాది కూడా గడవక ముందే తెలంగాణలో కొత్త సర్కారుపై తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకతలు మొదలయ్యాయి.కేసీఆర్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ‘ఆరు గ్యారెంటీల’ పేరుతో అలవి కాని హామీలను ఇచ్చి ప్రజల ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కి... ఇప్పుడు ప్రజలపై స్వారీ చేస్తోంది రేవంత్ సర్కార్. 6 గ్యారంటీలలో నెర వేర్చినవి కూడా అరకొరగా మాత్రమే ఉండటం గమ నార్హం. ప్రజలకు అవసరం లేని... పేర్లలో మార్పు, విగ్రహాలలో మార్పు చేయడం మాత్రమే ప్రజా పాలనకు నిదర్శనమా? తెలంగాణ తల్లి విగ్రహం మలిదశ ఉద్యమంలో ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ప్రజల మన సుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ విగ్రహం మార్పు చేయడం వల్ల ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉన్నదా? నిజానికి తల్లి... దేవతతో సమానం. అట్లాంటి తెలంగాణ తల్లిని దేవత రూపంలో ఉండకూడదని కాంగ్రెస్ సర్కార్ అనుకోవడమే వారి మూర్ఖత్వానికి పరాకాష్ట. మార్పు చేసిన విగ్రహం కూడా తెలంగాణలో బలిదానాలకు మూల కారణమైన సోనియా గాంధీ పుట్టిన రోజున ఆవిష్కరణ చేయడం తెలంగాణ ఆత్మగౌరవ వంచనగా భావించాల్సిందే. ‘అన్ని బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం’ అని ప్రమాణ పత్రంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ... కేవలం ‘పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సు’ల్లో మాత్రమే ఆడపడుచులు ప్రయాణించడానికి అర్హులని అవమా నిస్తోంది. ఇలా ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ కొట్టు మిట్టాడుతోంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు అవుతాయని ఎదురుచూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి.చదవండి: వ్యవసాయాన్ని పండుగ చేశాం!అత్తాకోడళ్ళతో సహా కుటుంబంలోని మహిళలందరికీ ఇస్తానన్న నెలకు రూ. 2,500 ఎక్కడకు పోయినాయి? వరి ధాన్యానికి రూ. 500 బోనస్ అని... ఇప్పుడు కేవలం కొన్ని రకాల సన్న ధాన్యాలకు ఇస్తా మని చెప్పడం మోసం చేయడం కాదా? రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి, తర్వాత ‘షరతులు వర్తిస్తాయ’ని కార్పొరేట్ తరహా మోసం చేసిన ప్రభుత్వం ఇది. ‘రైతు భరోసా’ పెంచి కౌలు రైతులకు కూడా 15 వేల రూపా యలు ఇస్తామని ముఖం చాటేసిన గొప్ప సర్కారు ఇది. అందుకే మేనిఫెస్టోలో ఉన్న 42 పేజీలపై ప్రజాక్షేత్రంలో చర్చకు రావాలి. వారు అమలు చేశామని చెప్పుకుంటున్న హామీలపై కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేరన్న విషయాన్ని రుజువు చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తాము ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిపక్షంలో ఎన్నికల వరకు కూడా ప్రజలు తిరుగుబాటు చేయకుండా నిలిచే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. తిరుగుబాటు సహజ గుణంగా ఉన్న తెలంగాణ ప్రజలకు ఇది కొత్త కూడా కాకపోవచ్చు.- రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ సభ్యులు -
డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా?
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో హీరో సాక్షాత్తు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇందులో ఆఖరులో కొన్ని డైలాగ్స్ చెబుతారు. అవి ఇప్పటి పరిస్థితులకు అతికినట్లు ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ‘రేయి నిన్నే... వాడు నీ తల మీద ఎక్కి కూర్చుంటే... పెట్రోల్ రేటు పెరిగిపోద్ది. కంది పప్పు పెరిగిపోతుంది. పిల్లల స్కూల్ ఫీజులు పెరిగి పోతాయి. బస్సు చార్జీలు పెరిగిపోతాయి. ఇవి నీకు ఓకేనా. టైం లేదా నీకు. కొత్త సినిమా రిలీజైతే తెల్లవారు జామున ఐదు గంటలకల్లా క్యూలో నిలుచుంటావే. నీకిష్టమైన హీరో సినిమా పది, ఇరవై సార్లు చూస్తావ్. దానికి టైం ఉంటుంది. ఒక్క మ్యాట్నీ వదిలేసి రా ఒక పనైపోద్ది. నీకు హీరో కావాలా? నువ్వు హీరోవి కాదా? నీ ఇంటికి నువ్వే కదరా హీరో! మరి ఇంటి కోసం నువ్వేం చేస్తు న్నావు? మనిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? పోరాడితే పోయేదేమీ లేదు రా ఎదవ బానిస సంకెళ్లు తప్ప. రా... రా... వెయిట్ చేస్తున్నా రా...’ సినిమాలో గొంతు పెద్దది. ఈ డైలాగ్స్ పలి కిన పవన్ నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. అధికార పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని మరిచిపోయి ప్రతి పక్షంపై దాడులకు పూనుకున్న విషయం తెలిసిందే. నడిరోడ్డుపై హత్యలు జరిగాయి. ఇక దౌర్జన్యాలకైతే లెక్కే లేదు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని ఎన్నోసార్లు ప్రకటించిన పవన్ వీటిని ఖండించ లేదు. తన సినిమాలో మాత్రం రా కదలి రా... ప్రశ్ని ద్దామని కన్నెర్ర చేశారు.సినిమా కోసం రైటర్ ఇచ్చిన డైలాగులను బట్టీపట్టి పవన్ సినిమాలో చెప్పారు. కానీ అవి భవిష్యత్ సంకేతాలుగా నిలిచాయి. చంద్రబాబు గద్దె నెక్కాక ప్రజల జీవనయానంపై తీవ్ర ప్రభావం పడింది. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా నిత్యా వసరాల ధరలు తగ్గకపోగా ఆకాశన్నంటుతున్నాయి. మద్యం షాపులపై పెట్టిన శ్రద్ధ బడి పిల్లలపై చూప లేదు. యథేచ్ఛగా ప్రకృతి సంపదను కొల్లగొడు తున్నారు. సంక్షేమ పథకాలకు ఫుల్స్టాప్ పడి పోయింది. భారత రాజ్యాంగం స్థానంలో నేడు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనేది మెజారిటీ ప్రజానీకం అభిప్రాయం.నేడు కొత్త సినిమా టికెట్ల కోసం లైన్లు తగ్గిపోయాయి. ఆన్లైన్లో బుక్ చేసుకుని ఆ టైంకి వెళ్లిపోతున్నారు. ఓటీటీ పుణ్యాన మార్పులు శర వేగంగా వచ్చాయి. ఇప్పుడు వేరే లైన్లు ఉన్నాయి. వలంటీర్లు లేకపోవడంతో పింఛన్ లబ్ధిదారులూ, రేషన్ కోసం మహిళలూ గంటల తరబడి వేచి ఉంటున్నారు. తాను స్వయంగా చెప్పిన డైలాగులను పవన్ మరిచిపోయినట్లున్నారు. పోరాడితే పోయే దేమీ లేదు... ఎదవ బానిస సంకెళ్లు తప్ప అని భావించిన చాలామంది రియల్ హీరోలు ప్రశ్నించాలంటే మ్యాట్నీలు వదలాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలనుకున్నారు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇంకేముంది రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు శిక్షలు మొదలయ్యాయి. ఈ అన్యాయాలను ప్రశ్నించాల్సిన పవన్ మాత్రం నేను సినిమాల్లో మాత్రమే హీరోనని తల పక్కకి తిప్పేశారు. పోరాటానికి ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని కోరుకున్న వ్యక్తి అది నిజంగా జరగడాన్ని ఊహించలేదా? లేక తట్టుకోలేకోయారా? తనకు అధికారం ముఖ్యం కాదని గతంలో ఓ సందర్భంలో చెప్పినట్లు గుర్తు. అయితే ఇప్పుడు ఆ పవర్ ముఖ్యం కావడంతో నోరు కుట్టేసుకున్నారని సమాజం భావిస్తోంది.పవన్ కాకినాడ పోర్టుకెళ్లి స్టైల్‌గా ‘సీజ్ ద షిప్’ అనడం... ఆయన అభిమానులు సోషల్ మీడియాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పోస్టులు పెట్టి సంబర పడిపోవడం చకచకా జరిగాయి. అసలు డిప్యూటీ సీఎం అనాల్సిన మాట వేరే ఉంది. ఆరు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ‘కదలిరండి.. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి’ అనుంటే హాల్లో వినిపించిన చప్పట్ల సౌండ్ నిజ జీవితంలో మరింత గట్టిగా వచ్చేది. కానీ పవన్ సినిమాటిక్‌గానే వ్యవహరించి డిప్యూటీ సీఎం అనేది చంద్రబాబు దర్శకత్వంలో చేస్తున్న ఒక పాత్ర మాత్రమేనని చెప్పకనే చెప్పారు.– వెంకట్ -
సంబంధాల్లో సహనం అవసరం
షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పటి నుండీ... హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. విస్తృత సరిహద్దు రీత్యా, అక్కడి పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి. ఇటీవల శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ లాంటి పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో భారత్ పాఠాలు నేర్చుకోవాలి. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో తోడ్పాటు అందించాలి. హసీనాకు ఏకపక్ష మద్దతివ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన విధానాలను దిద్దుకోవాల్సిన అవసరం ఉందనీ అర్థం చేసుకోవాలి.షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఒక ప్రజా తిరుగుబాటుతో కూల్చివేసినప్పటి నుండీ, హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. అక్కడి మైనా రిటీ హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సంఘటనల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం ‘మైనారిటీలతో సహా బంగ్లాదేశ్ పౌరులందరి భద్రతకు, రక్షణకు ప్రాథమిక బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే’ అని స్పష్టం చేసింది.బంగ్లాదేశ్ పరిణామాలను రెండు రకాలుగా చూడవచ్చు. మొదటిది, హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ ఉక్కు పాదాన్ని తొలగించిన తర్వాత... ఇస్లామిస్టులు, పాకిస్తాన్ కి చెందిన ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్ ్స (ఐఎస్ఐ) పట్టు సాధించారు. ఈ క్రమంలో హిందూ మైనారిటీలు హింసకు గురవుతున్న సందర్భంగా ఆ దేశం పాక్షిక అరాచక స్థితికి చేరుకుంటోంది. రెండవ పరిణామం ఏమంటే, గత దశాబ్ద కాలంగా నిజమైన ప్రజాస్వామ్యం లేని బంగ్లా దేశ్, తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో అడుగులేయడానికి ప్రయ త్నిస్తూ ఒక తాత్కాలిక దశ గుండా పయనిస్తోంది.సరిహద్దుల చుట్టూ?బంగ్లాదేశ్ బహుశా దక్షిణాసియాలో భారతదేశానికి అత్యంత పర్యవసానాలతో కూడిన పొరుగు దేశం. దాని సరిహద్దులను దాదాపు భారత్ పరివేష్టించి ఉంది. 4,367–కిలోమీటర్ల సరిహద్దులో, కేవలం 271 కిలోమీటర్లు మాత్రమే మయన్మార్‌తో ఉండగా, మిగిలిన 4,096 కిలోమీటర్లు భారతదేశంతో ఉంది. త్రిపుర, మిజోరాం, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో ఆ దేశం సరిహద్దులను కలిగి ఉంది. అందుకే ఈశాన్య ప్రాంతపు ఆర్థిక అభివృద్ధి, భద్రతకు ఇది కీలకం. బంగ్లాదేశ్ సరిహద్దు స్వభావాన్ని బట్టి చూస్తే, దానిని పూర్తిగా మూసివేయడం చాలా కష్టం. ఫలితంగా, ఆ దేశంలోని వివిధ ప్రభు త్వాల పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపు తున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి. నియంతలైన జియావుర్ రెహ్మాన్, హెచ్ఎమ్ ఎర్షాద్ తమ నియంత్రణను కొనసాగించే ప్రయత్నంలో దేశంలో ఇస్లా మీకరణను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఈ ఎగుడు దిగుళ్లు తప్ప లేదు. పాకిస్తాన్ లాగే, జమాత్–ఎ–ఇస్లామీ కూడా బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ, ఈ ప్రక్రియలో అది గణనీయమైన పాత్ర పోషిస్తూనే పెరిగింది.భారత వ్యతిరేక గ్రూపులుఅయితే, బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది కేవలం భారతదేశానికి సంబంధించినది మాత్రమే కాదు... చైనా, మయన్మార్, ఆగ్నేయాసి యాతో సహా విస్తృత ప్రాంతంపై దీని ప్రభావం ఉంటోంది. దాని అతి పెద్ద ముస్లిం జనాభాలో పెరిగిపోతున్న సమూల మార్పువాదం (రాడి కలైజేషన్) విస్తృత ప్రపంచ పరిణామాలను కలిగి ఉంటుంది. జమాత్–ఎ–ఇస్లామీతో పాటు, హర్కత్–ఉల్–జిహాద్–అల్–ఇస్లామీ, జమాత్–ఉల్–ముజాహిదీన్ బంగ్లాదేశ్, అలాగే అల్–ఖైదా, ఇస్లామిక్ స్టేట్ల వంటి ఇతర రాడికల్ గ్రూపులు కూడా ఆ దేశంలో ఉన్నాయి. మదర్సా నాయకుల నెట్వర్క్ అయిన హెఫాజత్–ఎ–ఇస్లాం కూడా దేశంలో షరియా పాలనను కోరుకుంటూ, అక్కడ లౌకిక రాజకీయ స్థాపనను వ్యతిరేకిస్తోంది.బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ)తో జమాత్–ఎ–ఇస్లామీ పొత్తు పెద్ద సమస్యగా మారింది. తత్ఫలితంగా, 1991–96లోనూ 2001–06లోనూ ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్న పదవీకాలం అనేది... దాదాపుగా ఐఎస్ఐ, ఈశాన్య ప్రాంతంలో భారతదేశానికి వ్యతిరేకంగా క్రియాశీలంగా ఉన్న తిరుగుబాటు గ్రూపుల వర్గానికి విశృంఖల స్వేచ్ఛను ఇచ్చింది. 2009లో హసీనా ప్రభుత్వ స్థాపనతో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధం స్థిరపడింది. మరీ ముఖ్యంగా, ఇది ఐఎస్ఐ లేదా వివిధ ఈశాన్య తిరుగుబాటు గ్రూపులు, బంగ్లాదేశ్ భూభాగాన్ని భారత వ్యతిరేక శక్తులకు ఉపయోగించడాన్ని తనిఖీ చేయడంలో సహాయపడింది. రెండు దేశాలను కలిపే భూ మార్గాలను తిరిగి తెరవడానికీ, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్ గుండా ప్రాంతీయ ట్రాఫిక్ కదలికను ప్రోత్సహించేందుకు మోటార్ వాహ నాల ఒప్పందంపై సంతకం చేయడానికీ ఈ పరిణామం దారి తీసింది.మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం పక్కనే బంగాళాఖాతం శిఖర ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ స్థానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు, భారతదేశాన్ని నియంత్రించడం అనే తన పెద్ద విధానంలో భాగంగా చైనా తొలి నుంచి బంగ్లాదేశ్‌పై గణనీయమైన ఆసక్తిని పెంచుకుంది. ఇక్కడ చైనా ముఖ్యమైన పెట్టుబడులను కలిగి ఉంది. ఇక్కడి నుండి ఒక పైప్‌లైన్ మలక్కా జలసంధిని దాటవేస్తూ చైనాలోని యునాన్‌కు క్యుక్పియు నౌకాశ్రయం నుండి చమురును తీసుకు వెళుతుంది. బంగ్లాదేశ్‌లో వంతెనలు, రోడ్లు, పవర్ ప్లాంట్లను నిర్మించడంలో చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా దేశానికి అతిపెద్ద సైనిక సరఫరాదారుగా కూడా అవతరించింది.భారత్ చేయాల్సింది!పైన ఉదహరించిన అనేక కారణాల వల్ల, బంగ్లాదేశ్‌లోని వ్యవహా రాలను భారత్ చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. పరిస్థితి చాలా అస్థిరంగా ఉంది. అక్కడ పరిస్థితులు అదుపు తప్పవచ్చు కూడా. ఫలితంగా భారతదేశానికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. అక్కడి ప్రజా ఉద్యమంపై భారత వ్యతిరేక కథనాన్ని రుద్దేందుకు ఐఎస్ఐ ఓవర్‌టైమ్ పని చేసే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత జఠిలమైంది.ఇటీవల పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయ వంతంగా నిర్వహించడం నుండి భారతదేశం పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా, భారత్ గణనీయంగా మంచిపేరు సాధించింది. దీనివల్ల అనూర కుమార దిస్సనాయకే ప్రభుత్వంలో ప్రయోజనాలను పొందు తున్నాం. అదేవిధంగా, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజూతో ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా, ఆయన ప్రచారం చేసిన ‘భారత్ వైదొలిగిపో’ వ్యూహాన్ని మట్టుబెట్టింది.నేపాల్లోనూ ఇలాంటి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. చైనాలో అధికార పర్యటనలో ఉన్న భారత వ్యతిరేక ప్రధాని కేపీ శర్మ ఓలీ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద బీజింగ్‌తో తమ దేశం ఎలాంటి కొత్త రుణ ఒప్పందంపై సంతకం చేయదని ముందే స్పష్టం చేశారు. నిజానికి, నేపాలీలు తమ దేశంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పరిధిని తగ్గించే కొత్త ఒప్పందంపై చైనాతో సంతకం చేయాలనుకుంటున్నారు.బంగ్లాదేశ్‌తో కూడా భారతదేశం వ్యూహాత్మక సహన విధానాన్ని అనుసరించాలి. బంగ్లాదేశ్ పరివర్తనలో ఉన్న దేశం. అక్కడ ప్రజా స్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియకు న్యూఢిల్లీ మద్దతు ఇవ్వాలి.హిందువులపై దాడులను అతిగా చూసే ధోరణి నెలకొంది. ప్రారంభంలో కాస్త పెరిగిన తర్వాత, అటువంటి దాడులు ఇప్పుడు తగ్గాయి. మనం హసీనాకు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన బంగ్లాదేశ్ విధానానికి దిద్దుబాటును అందించాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి.మనోజ్ జోషి వ్యాసకర్త ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’లో డిస్టింగ్విష్డ్ ఫెలో(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఈ దేశానికి ఏమైంది?
దేశంలో చాలా ఘటనలు జరుగుతుంటాయి. కానీ రెండు మాత్రం జరగకూడనివి జరిగాయి. 800 ఏళ్ల నాటి ప్రశస్త చరిత్ర గల అజ్మీర్ షరీఫ్ దర్గా మీద హిందూ సేన కోర్టులో కేసు వేయడం మొదటిది. ఈ దర్గాను లక్షలాదిమంది సందర్శిస్తారు. ఇందులో ముస్లింలే కాదు, హిందువులు కూడా ఉంటారు. దాని కింద శివాలయం ఉందన్నది అభియోగం. నిజంగా ఆలయాన్ని వెలికితీయాలని దీని ఉద్దేశం అనుకోను. కేవలం ముస్లింలను పీడించడం మాత్రమే దీని వెనుక ఉన్న కారణం. ఇక రెండో ఘటనలో బంగ్లాదేశీయులకు వైద్యం చేయరాదని రెండు ఆసుపత్రులు తీర్మానించడం! కులమతాలు, జాతులకుఅతీతంగా వైద్యం చేయాలన్న నైతికతకు ఇది విరుద్ధం. ఈ దేశానికి ఏమయ్యింది?నిజాయితీగా చెప్పాలంటే.. సరైన పదం కోసం వెతుక్కుంటాను నేనిప్పుడు. ఈ మధ్యకాలంలో జరిగిన రెండు పరిణామాలు నన్నీ స్థితికి చేర్చాయి. అర్థం చేసుకోలేనిది అందామా? దూషించదగ్గది అని కూడా అనలేను. బహుశా విచిత్రమైంది అనవచ్చునేమో! ఎందుకంటే ఆ రెండు పరిణామాలు ఆశ్చర్యం కలిగించేవి మాత్రమే కాదు.... అసాధారణమైనవి కూడా! ఇంతకీ ఏమిటా సంఘటనలు?నిజానికి ఇలాంటివి చాలానే చోటుచేసుకుంటున్నాయి ఈమధ్య. మొదటి ఘటన... 800 ఏళ్ల పురాతనమైన అజ్మీర్ షరీఫ్ దర్గాపై కోర్టులో వేసిన వ్యాజ్యం. శివాలయం ఒకదాన్ని ధ్వంసం చేసి దర్గా కట్టారన్నది పిటిషనర్ల ఆరోపణ. దేని ఆధారంగా ఈ కేసు వేశారంటే... 1910లో హర్ బిలాస్ సర్దా రాసిన పుస్తకం!ఇది విన్న వెంటనే ‘‘అయితే ఏంటి?’’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఢిల్లీలోని నేనుండే వసంత్ విహార్ కింద పృథ్వీరాజ్ చౌహాన్ కాలం నాటి రాజదర్బార్ ఉంటే ఉండవచ్చు. హిందూసేన లాంటివి ఏవో కోర్టులో కేసు వేసి... నా ఇల్లు తవ్వి చూస్తానంటే మాత్రం నేను కేకలు పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడో 800 సంవత్సరాల క్రితం జరిగిందంటున్న ఘటన అది. నిజమో కాదో, కేవలం నమ్మకమో తెలియదు. ఉంటే చారిత్రక ప్రాసంగికత ఉంటుంది తప్ప, వందల మంది పూజించే దర్గాను కూల్చేసేందుకు ఇవేవీ కారణాలు కారాదు. దేశ విదేశాల్లోని హిందూ, ముస్లింలు లక్షలు, కోట్ల మంది అజ్మీర్ దర్గాను సందర్శిస్తూంటారు. ప్రార్థనలు చేస్తూంటారు. పోనీ... హిందూ సేన అనేది నిజంగానే ఎప్పుడో కనిపించకుండా పోయిన శివాలయాన్ని వెతికే పనిలో ఉందా? నాకు డౌటే! ముస్లింలను హింసించాలనీ, దర్గాను నాశనం చేయాలనీ తద్వారా ముస్లింలకు వారి స్థాయి ఏమిటో చూపాలన్నదే లక్ష్యమన్నది నా అభిప్రాయం. చరిత్ర గతిలో జరిగిన తప్పులను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడం ప్రతీకారం తీర్చుకోవడమే అవుతుంది కానీ న్యాయం కోసం చేస్తున్న పనిలా అనిపించదు. ఇది ఫక్తు ముస్లిం వ్యతిరేకత. వారి చర్రిత, సంస్కృతి, వారికి స్ఫూర్తినిచ్చే మతంపై వ్యతిరేకత మాత్రమే. నేను ఓ హిందువును. అందుకు గర్విస్తా. అయినంత మాత్రాన ఇలాంటి పిటిషన్లకు ఏమాత్రం మద్దతివ్వను. హిందువుల పేరు చెప్పి బలవంతంగా ఈ అకృత్యం చేయవద్దని విస్పష్టంగా, గట్టిగా అరుస్తా. కానీ ఇలా చేస్తే ఒక ప్రశ్న వస్తుంది. ఇలా అరిచి గీపెట్టే కదా కొంతమంది తమ ఇమేజీని పెంచుకుంటున్నదీ అని! ఇలాంటి చేష్టలపై న్యాయస్థానాలు కొంచెం సీరియస్‌గా ఆలోచించి చర్యలు తీసుకోవాలి కదా? కానీ అలా ఎందుకు చేయడం లేదు? దేశం రెండు ముక్కలవుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విచిత్రమే!రెండో ఘటన... మొదటిదాని కంటే ఎక్కువ బాధపెట్టేది. కోల్‌కతా, త్రిపురల్లోని కొన్ని ఆసుపత్రుల వైద్యులు తాము బంగ్లాదేశీయులకు చికిత్స చేయమని భీష్మించుకున్నారు. ఎంత చిల్లరతనం? అపోహలతో కూడిన ద్వేషం? బంగ్లాదేశ్‌లో ఎవరో భారతీయ జాతీయ పతాకాన్ని అగౌరవ పరిచారన్న వార్తలు చదివి వీరు ఇలా తీర్మానించారట! కోల్‌కతాలో ప్రఖ్యాతి గాంచిన జే.ఎన్ .రే ఆసుపత్రి, అగర్తలలోని ఐఎల్ఎస్ ఆసుపత్రులు వీటిల్లో ఉండటం విచారకరం. జే.ఎన్ .రే ఆసుపత్రి డైరెక్టర్ శుభ్రాంశు భక్త తమ నిర్ణయంపై ఇచ్చిన వివరణ ఏమిటంటే... ‘‘దేశం అన్నింటి కంటే గొప్పది. దేశాన్ని కాదని ఏ పనీ జరగదు. వైద్యవృత్తి చాలా పవిత్రమైంది. కానీ దేశం పరువు మర్యాదలు అంతకంటే పెద్దవి. మిగిలిన ఆసుపత్రులు కూడా ఇదే పని చేయాలి’’ అంటూ సమర్థించుకున్నారు. బాగానే ఉంది కానీ... వైద్యవృత్తిలోకి అడుగుపెట్టేటప్పుడు చేసిన హిపొక్రటిక్ ప్రమాణం మాటేమిటి? రోగులందరికీ వైద్యం అందించాల్సిన నైతిక బాధ్యత మాటేమిటి? కులమతాలు, జాతులకు అతీతంగా స్త్రీ, పురుష భేదం లేకుండా వైద్యం అందించాలని కదా హిపొక్రటిక్ ఓత్ చెప్పేది? వైద్యులు అందరూ గర్వంగా చెప్పుకునే వృత్తి గౌరవం మాటేమిటి? ఎక్కడో... ఎవరో కొందరు అనామక బంగ్లాదేశీయులు త్రివర్ణ పతాకాన్ని తొక్కి ఉండవచ్చునన్న వార్తకే వీటన్నింటినీ పక్కన పెట్టేయాలా? వదిలేసుకోవాలా?నిజంగానే విచిత్రమైంది ఇది. అవసరమైన సమయంలో వైద్యం చేయనని భీష్మించిన వైద్యుడు నా జీవితంలో ఇప్పటివరకూ ఒక్కరూ తగల్లేదు. బ్రిటన్ లో ఓ పర్యాటకుడు ఫుట్‌పాత్ మీద కుప్పకూలిపోతే అక్కడి ప్రభుత్వ నేషనల్ హెల్త్ సర్వీసెస్ అత్యవసర వైద్యం అందిస్తుంది. విదేశీయుడా? అని చూడదు. నిజానికి ఇలా చేయడం నైతిక ధర్మం మాత్రమే కాదు... గౌరవ మన్ననలకు పాత్రమైనవి. రోగులు కూడా సాటి మనుషులేగా? కోల్‌కతాలోని కొంతమంది డాక్టర్లకు మాత్రం బంగ్లాదేశీయులైతే మనుషులుగా కనిపించడం లేదేమో!సరైన పదం కోసం వెతుక్కుంటున్నానని చెప్పాను కదా... ఇందుకే! ఈ పనులు చేసిన వారి తప్పు ఒప్పులు ఎన్నాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ... ఎందుకు తప్పుపట్టకూడదో తెలియక నేను పడుతున్న ఇబ్బందిని వాళ్లకు చెప్పాలని మాత్రం ఉంది. విచిత్రం అని అందామంటే... సాదాసీదాగా ఉంటుంది. ఒకరకంగా మనకు సంబంధం లేనిదన్నట్టుగా అవుతుంది. అసాధారణం, అనూహ్యం కావచ్చు. అనవసరం కూడా కావచ్చు. ఈ రెండు ఘటనలనూ వివరించేందుకు మీకు ఇంకా ఏదైనా మంచి పదం తోస్తే చెప్పండి.- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
కులదూషణ ఏ సంస్కృతికి ప్రతీక?
ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవీ స్వీకారం రోజున చేసే ప్రమాణాలకు కట్టుబడి ప్రజలకు కుల మతాలకు అతీతంగా సేవలు చేయాలి. బాధ్యతలూ నిర్వర్తించాల్సి ఉంటుంది. రాగద్వేషాలకు అతీతంగా వారు ఉండి తీరాల్సిందే. ఏ ఒక్కరిపై విద్వేషపూరితంగా వ్యవహరిస్తూ అనుచిత వ్యాఖ్యలు సైతం చేయకూడదు. అలా చేస్తే రాజ్యాంగాన్ని ధిక్కరించిన వారు అవుతారు. ఇటీవల ఒక ప్రజా ప్రతినిధి ఒక కులాన్ని ఉద్దేశపూర్వకంగా దూషించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఆ ప్రజాప్రతినిధి అలా మాట్లాడవచ్చా? ఎవరో ఏదో చేశారని మొత్తం ఆ కులాన్ని టార్గెట్ చేయడం విస్మయం కలిగిస్తున్నది. ఈ విధానాన్ని అన్ని రాజకీయ పక్షాలూ ముక్తకంఠంతో ఖండించాలి. అప్పుడే ఇలాంటి వారి వైఖరిలో మార్పు వస్తుంది. ఓ సామాజిక వర్గానికి చెందిన నేత 10 ఏండ్లు పాలించిన మాత్రాన ఆయనపై కోపంతో ఈ ప్రజాప్రతినిధి ఆ నేత కులస్థుల నందరినీ దూషించడం భావ్యమేనా? ఈ ప్రజాప్రతినిధి సొంత పార్టీలో కూడా ఆయన తిట్టిన సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన ముగ్గురు అసెంబ్లీ నియోజకవర్గ నేతలకు కూడా ఈ సంబోధన వర్తిస్తుందా అనేది స్పష్టం చేయాలి. అదే పార్టీకి చెందిన పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన ఒక అభ్యర్థి విషయంలో కూడా ఆయన అభిప్రాయం ఇదే అయితే పార్టీని, పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టినట్టే కదా! ఈ విషయంలో వెంటనే స్పందించి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆ ప్రజాప్రతినిధిని వివరణ ఇవ్వాలని ఆదేశించడం శుభపరిణామం. అడ్డదిడ్డంగా మాట్లాడే ప్రజాప్రతినిధులకు ఒక గుణపాఠం కావాలని కోరుకోవడం ఎంతైనా అవసరం.అన్ని కులాలు, జాతుల వారితోపాటు చివరకు ఆయన దూషించిన కులం వారు కూడా ఆయనకు ఓట్లు వేస్తేనే కదా గెలిచింది? ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలకూ ఆయనే కదా ప్రజాప్రతినిధి! అలాంటిది ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగడం దేనికి సంకేతం? ఇదేనా ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు. ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఆ ఒక్క కులాన్నే కాదు... ఏ కులాన్ని దూషించే హక్కూ ఎవరికీ లేదు. ఇలా చేస్తే రాజ్యాంగం మీద ఏ మాత్రం గౌరవం లేనట్టే లెక్క. గౌరవం ఉన్న వారు ఇలా ప్రవర్తించరు.కులాలపై దూషణలకు దిగినా, ద్వేషించినా అన్ని రాజకీయ పార్టీలూ అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఈ విధమైన సంస్కృతిని ఎవరూ ప్రోత్సహించవద్దు. ఎవరైనా ప్రోత్సహించినా తగిన శాస్తి చేయాలి. ప్రజల్లో హీరోయిజం చూపించేందుకు ఇలాంటి మార్గాన్ని ఎన్నుకోవడం దుందుడుకు చర్య అవుతుంది. అరవై, డెబ్భై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీతో అత్యంత అనుబంధం ఉన్న ఆ కులానికి చెందిన నేతలు పెద్ద పెద్ద హోదాల్లో పని చేశారు. కులరహితంగా సేవలందించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా నిత్యం పాటుపడ్డారు. కులాలను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. అందరికీ తోడుగా, నీడగా వ్యవహరించారు. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా భరోసా కల్పించేవారు. దేశం, తెలంగాణ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు. అదే విధంగా మరో జాతీయ పార్టీలో ఆ కులానికి చెందిన నేతలకు ప్రజాప్రతినిధులుగా, గవర్నర్లుగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఏతావతా చెప్పొచ్చేదేమిటంటే... అన్ని పార్టీల్లోనూ ఈ కులస్థులు ఉన్నారనే! ఈ ఇంగితాన్ని మరచి ఒక నేత పట్ల ఉన్న ఆక్రోశంతో అతడి కులస్థుల నందరినీ తిట్టి బాధపడేలా చేయడం సరికాదు కదా! మొత్తం రాజకీయ వాతావరణమే ఈ చర్యతో దెబ్బతిన్నదనేది వాస్తవం. కుల సంఘాల వారు ఇదే రకమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండి, రాజ్యాంగబద్ధంగా వారి హక్కుల కోసం పోరాడడం మంచి పద్ధతి. అలా కాకుండా సోషల్ మీడియా వేదికలపై ఒకరి కులాన్ని మరో కులంవారు తిడుతూ రెచ్చగొట్టుకోవడం సరికాదు. ఈ విషయంలో అందరూ సంయమనాన్ని పాటించాలి. ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తెచ్చి, తమ గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన ఇటువంటి ప్రజాప్రతినిధులపైన ఆ పార్టీ పెద్దలు చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయడం సరైన మార్గం. ప్రజల చేత ఎన్నికై, ప్రజల కోసం పని చేసే నేతలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. వెలమ జాతి ఒక్కరి సొత్తు కాదు. వారు ఒక్కరి దిక్కు ఒరిగి లేరు. నిజానికి ఆ కులాన్ని తిట్టిన ప్రజాప్రతినిధి పార్టీలోనే ఎక్కువ మంది వెలమలు ఉన్నారు అనే విషయం మరిచిపోకూడదు. గత ఏడు దశాబ్దాలుగా వారు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నమాట జగమెరిగిన సత్యం కాదా? ఇవన్నీ మర్చిపోయి ఈ దూషణతో వ్యక్తిగతంగా దిగజారుతూ, పార్టీకి కూడా ఆయన చేసిన పాపం అంటగట్టడం ఎందుకు? దేశానికి ఆపద వస్తే కులమతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పార్టీల మధ్య ఎన్ని వైరుద్ధ్యాలు ఉన్నా భారతీయులందరూ దేశ రక్షణ, అభివృద్ధిలో ఏకతాటిపై ఉండడం సహజం. ఇది మన లక్ష్యం. ఈ విషయంలో అది తెలంగాణ అయినా, మన సొంత జిల్లా అయినా, పక్క జిల్లా అయినా అక్కడ ప్రజలు ఆపదలో ఉంటే కులమతాలకు అతీతంగా ఆదుకొని తీరుతాం. సమాజంలో మనుషులంతా సమానమే. కులాలు వేరు వేరు ఉంటాయి. ఆ కులంలో పుట్టాం... ఈ కులంలో పుట్టాం... అని చింతించుకుంటూ పోతే లాభం లేదు. ఒక చిన్న కులంలో పుట్టడం నేరం కాదు. పెద్ద కులంలో పుట్టానని పొంగిపోవడం మంచిది కాదు. ఒక కులంపై విద్వేషం చిమ్మే విధంగా మరొకరు మాట్లాడడం భావ్యం కూడా కాదు. అసలు కుల ప్రస్తావన తేవడం నేరం కిందకే వస్తుంది. కులం పేరిట దూషిస్తూ స్వలాభం పొందడం రోతపుట్టిస్తుంది.అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సర్కారు కులగణనను ఓ వైపు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ప్రజాప్రతినిధి ఓ కులంపై విషం చిమ్మడం దారుణం. అసలు కులగణన ఎందుకు జరిపిస్తున్నారన్న ఎరుక ఈ ప్రజాప్రతినిధికి ఉందా? వివిధ కులాల వారు ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారి వారి జనాభాల నిష్పత్తుల ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడానికే కదా! అంటే అన్ని కులాలనూ సమానదృష్టితో చూడడానికే కదా! మరి ఈ ప్రజాప్రతినిధి ఒక కులంపై ఇంత దారుణ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సభ్యసమాజంపై ఉంది. ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీలూ, పౌర సమాజం మొత్తం ఇది అర్థం చేసుకొని వ్యవహరించాలి. అప్పుడే సమాజ శ్రేయస్సుకు తోడ్పాటు అందించిన వారు అవుతారు. లేకపోతే సమాజానికే ప్రమాదం. వ్యాసకర్త కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ‘ 9849061481వెలిచాల రాజేందర్రావు -
ఆ నిర్ణయంతో అమెరికాకే నష్టం.. ట్రంప్ భయం అదే!
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్, ‘తాను 2025 జనవరి 20న అధికారం చేపట్టిన వెంటనే అమెరికాతో వాణిజ్యం చేస్తున్న మూడు అగ్రభాగ దేశాలైన చైనా, కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలను విధిస్తానని’ చెప్పారు. చైనాపై ఇప్పటి వరకూ ఉన్న 60 శాతం సుంకాలతో పాటుగా అదనంగా 10 శాతం, కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలను విధిస్తానని ప్రకటించారు. అమెరికా సరిహద్దు వెంబడి అక్రమ మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయనీ, అనధికార వలసదారుల ప్రవేశానికి ప్రతిస్పందనగా తాజా చర్యలు తీసుకోబోతున్నాననీ నవంబరు 26 నాడు ప్రకటించారాయన. తాజాగా నవంబరు 30న ఏకంగా బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలను విధిస్తానని ప్రపంచం విస్తుపోయేలా ప్రకటించారు. ‘బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ దేశాలు) డాలరుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, ప్రత్యామ్నాయ కరెన్సీకి కృషి చేస్తే... బ్రిక్స్ దేశాలు అద్భుతమైన, శక్తిమంతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థతో వాణిజ్య సంబంధాలకు వీడ్కోలు చెప్పాలి. డాలరును వ్యతిరేకించననే నిబద్ధత ఈ దేశాల నుంచి మా కవసరం’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాశారు.2023లో ప్రపంచ దేశాలతో మొత్తం 773 బిలియన్ల (77,300 కోట్ల డాలర్లు) వాణిజ్య లోటుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ జబ్బుపడి ఉంది. కేవలం బ్రిక్స్ దేశాలతోనే 43,350 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును అమెరికా కల్గి ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చైనాతో 279 బిలియన్లు (27,900 కోట్ల డాలర్లు), మెక్సికోతో 15,200 కోట్ల డాలర్లు, చిన్న దేశమైన వియత్నాంతో 10,400 కోట్ల డాలర్ల వాణిజ్యలోటును కలిగి తన కృత్రిమ డాలరు మారకపు విలువతో పబ్బం గడుపుకుంటోంది. బ్రిక్స్ దేశాల నుంచి దిగుమతులను నిషేధిస్తే... ఆ దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే తయారీ వస్తువులను వర్తమాన దేశాలకు, యూరప్‌కు మళ్లించే అవకాశాలుంటాయి. అమెరికాలోని వస్తు ఉత్పత్తి రంగం వెనుకబడి ఉంది. స్వదేశీ డిమాండును ఇప్పుడున్న అమెరికాలోని పరిశ్రమలు తీర్చలేవు. అందువల్ల వస్తు ధరలు విపరీతంగా పెరగవచ్చు. బ్రిక్స్ దేశాలు కొత్త మార్కెట్లను వెతుక్కుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం దిశకు మరలవచ్చు. డాలరు ఏకఛత్రాధిపత్యం కోసం అమెరికా తీసుకొంటున్న చర్యలకు ప్రత్యామ్యాయంగా ఇప్పటికే 3 దశాబ్దాల నుండి యూరో కరెన్సీని ఐరోపా యూనియన్ ప్రవేశపెట్టింది. చైనా, రష్యాలు పరస్పరం తమ కరెన్సీలతోనే వాణిజ్యం చేసుకొంటున్నాయి.2వ ప్రపంచ యుద్ధంలో నష్టపోని అమెరికా ఆయుధ అమ్మకాలతో విపరీతమైన బంగారు నిల్వలను పోగు చేసుకొంది. 1944 జులై నుంచి ‘బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్’ అనే అంతర్జాతీయ ద్రవ్యసంస్థను ఏర్పాటు చేసుకుంది. దాని ద్వారా 44 దేశాల మద్దతుతో డాలరును అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా ఏర్పాటు చేసుకొని 1971 వరకూ బంగారం ఆధారిత డాలరుగా కొనసాగించింది. వాస్తవానికి తన వద్దనున్న బంగారు నిల్వలకు పొంతన లేకుండా డాలరు నోట్లను ముద్రించుకొంటూ ఆధిపత్యం చలాయించింది. ప్రస్తుతం అమెరికా వద్ద 8,133.46 టన్నుల బంగారు నిల్వలున్నాయి. ఈ నిల్వలను అమ్మితే వచ్చే 69,100కోట్ల డాలర్లతో అమెరికా సుమారు 36 లక్షలకోట్ల రుణాలను ఎలా తీరుస్తుంది?1971 మేలో జర్మనీ డాలరుతో తెగతెంపులు చేసుకొని బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ నుంచి బయటపడిన 3 నెలల్లోనే అనూహ్యమైన ఆర్థిక పురోభివృద్ధి సాధించింది. డాలరుతో పోల్చుకొంటే జర్మన్ మార్కు 7.5 శాతం వృద్ధి రేటు సాధించింది. వెనువెంటనే ప్రపంచ దేశాలన్నీ డాలరు విలువను బంగారం విలువతో సరిపెట్టమని డిమాండు చేశాయి. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు జర్మన్ బాటలో పయినించటంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అమెరికా బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ ఆధిపత్యాన్ని కోల్పోయింది. 1971లో (ప్రెసిడెంట్ నిక్సన్ షాక్‌గా పిలవబడే) బంగారు నిల్వతో డాలరు విలువను రద్దు చేసుకొని నేటి ‘డాలర్ ఫియట్ ఫ్లోటింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రస్తుతం ట్రంప్ విధిస్తానన్న వాణిజ్య ఆంక్షలతో బ్రిక్స్ కరెన్సీ ఏర్పడి... రానున్న కాలంలో డాలర్, యూరోలతో పోటీపడినా ఆశ్చర్యపోనవసరంలేదు. అదీగాక రష్యా, చైనా, భారత్ దేశాలు వాణిజ్యపరంగా ఐక్యమైతే ప్రపంచ దిశనే మార్చే అవకాశం ఉంది. ఒకప్పటి ప్రపంచాన్ని తమ కరెన్సీలతో ఆధిపత్యం చలాయించిన దేశాలన్నీ ఇప్పుడు అత్యంత బలహీనమైన ఆర్థికదేశాలుగా మిగిలాయి. అమెరికా కూడా ఈ తరహా దేశంగా మిగులుతుందని ట్రంప్ భయం. పరిస్థితులును పసిగట్టిన ట్రంప్ వాణిజ్య సుంకాలతో ఈ కృత్రిమ డాలరు విలువను నిలబెట్టాలని అనుకుంటున్నారు.- బుడ్డిగ జమిందార్కె.ఎల్. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ -
ప్రాచీన భారతంలో వ్యవసాయ తత్వం
హరప్పా నాగరికత ఇతర పురాతన నగర నాగరికతల కంటే ఎంతో పరిణతిని చూపింది. పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యవసాయ తత్వశాస్త్రం లేకుండా అధునాతన శాస్త్రీయ సాధనాలను తయారు చేయడం సాధ్యం కాదు. క్రీ.పూ. 2600లో నిర్మితమైన చైనా తొలి నగరం చాంగ్జౌలో కాల్చిన ఇటుకలు, అధునాతన చెక్క పనితనం ఆనవాళ్లు దొరకలేదు. అంటే, భారతీయ వ్యవసాయవాద సంస్కృతి చైనా కంటే చాలా అభివృద్ధి చెందినది. అయితే చైనా వ్యవసాయ తత్వం చైనా చరిత్రలో భాగం. అదే భారతదేశంలో అలా జరగలేదు. ఒక తత్వశాస్త్రంగా వ్యవసాయవాదాన్ని అధ్యయనం చేయడానికీ, రాయడానికీ అనర్హమైనదిగా భావించారు. పారను, నాగలిని భారతదేశ నాగరికతకు చిహ్నాలుగా చూడకపోవడం ఉత్పత్తి పురోగతిని బలహీనపరిచింది. నా తాజా పుస్తకం ‘ద శూద్ర రెబెలియన్’ కోసం పరిశోధిస్తున్నప్పుడు, పూర్వ వేద కాలంలో వ్యవసాయవాదపు (అగ్రికల్చరిజం) తాత్విక ధార ఉందో లేదో తెలుసుకోవడానికి పురాతన భారతీయ సాహిత్యం పరిశీలించాను. రాతపూర్వక ఆధారాలు ఏవీ దొరకలేదు. పురాతన చైనా, గ్రీస్, ఇజ్రాయెల్, ఈజిప్ట్‌లో అటువంటి స్రవంతులు ఉండే అవకాశాలను పరిశీలించాను. భారతదేశమే కాకుండా ఈ దేశాలు కూడా పురాతన ఆలోచనా విధానాలకు ప్రధాన నిర్మాతలు అని మనందరికీ తెలుసు. పురాతన చైనాలో చాలా శక్తిమంతమైన వ్యవసాయవాదపు ఆలోచన ధార ఉందని గుర్తించాను. ఇది క్రీస్తు పూర్వం 770 నుండి 221 మధ్య వృద్ధి చెందింది. వ్యవసాయం గురించి ప్రచారం చేసిన, రాసిన ఆ ప్రధాన తత్వవేత్త జు జింగ్ (క్రీస్తు పూర్వం 372–289). ఇది చైనా చరిత్రలో భాగమైంది.నిజానికి భారతీయ వ్యవసాయ నాగరికతా చరిత్ర చైనీస్ నాగరికతకు పూర్వం నాటిది. ఆర్యులకు పూర్వం భారతీయులు హరప్పా నాగరికతను నిర్మించినప్పుడు భారతదేశం చాలా అభివృద్ధి చెందిన వ్యవసాయ ఉత్పత్తిని కలిగి ఉంది. ఆనాటికి చైనాలో అంత అధునాతన వ్యవసాయ నాగరికత లేదు. చైనా తొలి నగరం చాంగ్జౌ. ఇది క్రీ.పూ 2600లో స్థాపించబడింది. హరప్పా నాగరికత దీని కంటే చాలా పురాతనమైనది. పైగా చైనీస్ నగరం చిన్నది; కాల్చిన ఇటుకలు, అధునాతన చెక్క పనితనం, కాంస్య పనిముట్ల వంటి ఆధారాలు దొరకలేదు.హరప్పా నాగరికత ఇతర పురాతన నగర నాగరికతల కంటే ఎంతో పరిణతిని చూపింది. పూర్తిగా అభివృద్ధి చెందిన వ్యవసాయ తత్వశాస్త్రం లేకుండా అధునాతన శాస్త్రీయ సాధనాలను తయారు చేయడం సాధ్యం కాదు. తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం రెండూ సన్నిహిత సంబంధం ఉన్న మానసిక అభివృద్ధి ప్రక్రియలు. వేదాలకు పూర్వం భారతదేశం ఆ మిశ్రమ ఆలోచనా విధానాన్ని కలిగి ఉంది.వ్యవసాయం, వేదాలువేదాలు లిఖితరూపం దాల్చి, గ్రంథాలుగా లిఖితమైన తరువాత, తత్వశాస్త్రంగా వ్యవసాయవాదాన్ని అధ్యయనం చేయడానికీ, రాయడానికీ అనర్హమైనదిగా పరిగణించారు. విషాదంగా ఆ ఆలోచనా స్రవంతి మెల్లగా ఉనికిలో లేకుండా పోయింది. దీని ఫలితంగా ప్రాచీన, మధ్యయుగ భారతదేశంలో వ్యవసాయ, చేతివృత్తుల శాస్త్రంలో, ఉత్పత్తిలో భారీ స్తబ్ధత ఏర్పడింది. తోలు సాంకేతికతను అంటరానిదిగా పరిగణించడం; దాని ఉత్పత్తిదారులతో పాటు, పారను, నాగలిని భారతదేశ నాగరికతకు చిహ్నాలుగా ఎన్నడూ చూడకపోవడం ఉత్పత్తి పురోగతిని బలహీనపరిచింది. అప్పుడు ముస్లిం పాలకులు భిన్నమైన తత్వశాస్త్రంతో వచ్చారు. కానీ తమ పరంపర ప్రకారం కులంలో దైవత్వం ఉందనీ, శూద్ర, దళిత, ఆదివాసీలకు విద్యను అందించడం దేవుని మార్గదర్శకత్వంలో లేదనే పండితులు త్వరగా ముస్లింల చుట్టూ మూగిపోయారు.మరో మాటలో చెప్పాలంటే, భారతీయ వ్యవసాయవాద సంస్కృతి చైనా కంటే చాలా అభివృద్ధి చెందినది. మన జాతీయవాదపు పునాది తత్వశాస్త్రం వ్యవసాయ సంస్కృతే తప్ప వేద సంస్కృతి కాదు. కుల సంస్కృతి వ్యవసాయవాదం గురించి రాయడానికీ, దానిని సంరక్షించడానికీ అనుమతించలేదు. ఎందుకంటే, ఆర్యన్ పూర్వ హరప్పన్ లు అభివృద్ధి చెందిన లిపిని కలిగిలేరు; వైదిక అనంతర కాలంలోనేమో వ్యవసాయదారులను నాల్గవ వర్ణంగా లేదా శూద్ర బానిసలుగా ప్రకటించారు. ఇందులో ప్రస్తుత రెడ్లు, కమ్మలు, కాపులు, మరాఠాలు, పటేళ్లు, జాట్లు, మొదలియార్ల నుండి చాకలి వంటి శూద్ర కులాలన్నీ ఉన్నాయి. క్షురకులు (మంగలి) కూడా వీరిలో ఒక భాగం. అందువల్ల బ్రిటిష్ పాలకులు వారందరికీ పాఠశాలలు తెరిచే వరకు, శూద్ర కులాలకు చదవడానికీ, రాయడానికీ అనుమతి లేదు. అక్బర్ వంటి ముస్లిం రాజులు కూడా, శూద్రులను పర్షియన్ విద్యకు దూరంగా ఉంచాలని చెప్పిన బ్రాహ్మణ పండితుల సలహాను అనుసరించారు. ఇప్పుడు కూడా ఆ చారిత్రక నిరక్షరాస్యత శూద్ర, దళిత, ఆదివాసీ ప్రజానీకంపై తన ప్రభావం చూపుతున్నది.ఆర్థికంగా దృఢంగా ఉన్న శూద్ర, దళిత, ఆదివాసీలు ఇప్పుడు కూడా తత్వశాస్త్రంతో నిమగ్నమై ఉండకపోవడానికి కారణమవుతున్న ఈ అడ్డంకులను నా పుస్తకం పరిశీలిస్తుంది. చాలావరకు ఆర్ఎస్ఎస్ ప్రాపంచిక దృక్పథంతో ప్రభావితులైన సమకాలీన ద్విజులు వ్యవసాయ తత్వశాస్త్రంతో సంబంధం కలిగి ఉండరు. భారతీయ తత్వానికి మూలం వేదాలు అని వారు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. కానీ వేదాలు వ్యవసాయ ఉత్పాదక క్షేత్ర తత్వాన్ని ప్రతిబింబించలేదు. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తాత్విక ఆలోచనలను ఉత్పత్తి చేయగలరని ద్విజ చింతనాపరులు ఇప్పటికీ భావించడం లేదు. వారు వ్యవసాయ తత్వశాస్త్రం, వేదవాదం మధ్య గోడను నిర్మించారు. ఈ గోడ వ్యవసాయ ఉత్పత్తిలో సృజనాత్మకతను నాశనం చేసింది. ప్రస్తుత కాలంలో చైనాలో, ఐరోపాలో జరిగిన విధంగా మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి పెరగడానికి ఈ వాదం అనుమతించలేదు.మంచి ఉత్పత్తి, భూమి, విత్తనాల మధ్య సంబంధం గురించీ; నేల స్వభావం, విత్తనాలు, జంతువులు, మానవులతో దాని సంబంధం గురించీ అనేక తాత్విక దర్శనాలు గ్రామ వ్యవసాయ సమాజాలలో ఉన్నాయి అనేది వాస్తవం కాదా? మన గ్రామాల్లో ఇప్పటికీ తాత్విక ఆలోచనలు కీలక పాత్ర పోషిస్తున్నాయా, లేదా? అవును, అవి పని చేస్తున్నాయి. ఒక ప్రదేశంలో వేట, చేపలు పట్టడం అనేవి తగినంత ఆహారం అందించలేనప్పుడు, మొక్కలు, ధాన్యం, పండ్లు, భూమి, నీటి చుట్టూ ఉన్న తాత్వికత మాత్రమే ఆహారం అందించగలిగింది. ప్రత్యామ్నాయ పద్ధతివ్యవసాయానికి సంబంధించిన భారతీయ తత్వాన్ని పునర్నిర్మించడానికీ, హరప్పా వ్యవసాయం నుండి దాని మూలాలను గుర్తించడానికీ ప్రస్తుత గ్రామ స్థాయి వ్యవసాయ ప్రజానీకాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం మిగిలి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం.పైన పేర్కొన్న పుస్తకంలో శూద్ర వ్యవసాయవాదం, భారతీయ నాగరికత అనే అధ్యాయం ఉంది. ఇది నిజానికి చైనీస్‌తో పోల్చి చూస్తే మన వ్యవసాయ తత్వశాస్త్రపు ప్రాథమిక అధ్యయనం. భారతదేశంలోని వ్యవసాయ కార్యకలాపాలు భౌతికవాదంతో ముడిపడి ఉన్న తాత్విక ఆలోచనలను ఎలా కలిగి ఉంటాయో ఇది నిర్వచిస్తుంది. మతం మాత్రమే తత్వశాస్త్రంతో ముడిపడి ఉందన్నది హిందుత్వ అభిప్రాయం. వాస్తవానికి ఋగ్వేదం రాయకముందే, రామాయణ, మహాభారతాలు రాయకముందే వ్యవసాయ తత్వశాస్త్రం ఆధ్యాత్మిక తత్వశాస్త్రం కంటే లోతుగా ఇక్కడ పాతుకుని ఉంది.వ్యవసాయదారులను శూద్ర బానిసలుగా అణచివేయడం ద్వారా వేదవాదులు వ్యవసాయవాద తత్వాన్ని కూడా అణచివేశారు. పైగా వ్యవసాయ వ్యతిరేక తాత్విక ఆలోచనా ధోరణి కొనసాగింది.అయితే, భారతీయ వ్యవసాయ విధానంపై చాలా కొత్త అధ్యయనాలు జరగాల్సి ఉంది. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం కాబట్టి దీనికి వైదికం, వేదాంతం, ద్వైతం, అద్వైతం కంటే ఉన్నతమైన హోదా ఇవ్వాలి. మనం ఒక సృజనాత్మక దేశంగా మనుగడ సాగించడానికి వ్యవసాయవాదం వంటి గొప్ప తాత్విక ధోరణులను తిరిగి ప్రోత్సహించాలి. వ్యవస్థీకృత మతాలు ఒకప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా లేవు. అనేక శతాబ్దాల తరువాత అవి ఉండకపోవచ్చు. కానీ ఈ భూమిపై మానవ జీవితం ఉన్నంత కాలం ఉత్పత్తి, పంపిణీ తత్వశాస్త్రం మానవ జీవితంలో భాగంగా ఉంటుంది.- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (డిసెంబర్ 8న గుంటూరులో ‘ద శూద్ర రెబిలియన్’ ఆవిష్కరణ)- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
సామాజిక రాజకీయ దార్శనికుడు
ఇది అంబేడ్కర్ యుగం. అంబేడ్కర్ జీవన గాథలో వ్యక్తిత్వ నిర్మాణ శిల్పం ఉంది. హేతువాద భావనా మూర్తిమత్వం వుంది. ఆయన్ని ఈనాడు ప్రపంచమంతా స్మరించుకోవడానికి కారణం ఆయన ప్రపంచ మానవునిగా, మేధావిగా విస్తరించటమే! ఆయన అణగారిన ప్రజల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు. భారతదేశంలో వచ్చిన రాజకీయ పరిణామాలన్నిటిపై ఆయన బలమైన ముద్ర ఉంది. భారత రాజ్యాంగ రూపకల్పనలో లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య భావాలను బౌద్ధ తాత్విక దృక్పథంతో మేళవించారు. అంబేడ్కర్ పోరాటమంతా బహు జనుల రాజ్యాధికార దిశగానే సాగింది. అందుకు సిద్ధాంతాలు, ప్రణాళికలు, పార్టీలు, కార్యాచరణ రూపొందించారు. రాజ్యాధికారమే వారికి సంపదను, సమతను ఇస్తాయని చెప్పారు.అంబేడ్కర్ గుణగణాలు ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి రూపొందించుకున్నవే. ఆయన తల్లిదండ్రులు నీతి, నిజాయితీ గలిగిన సంస్కరణ హృదయులు. ఆనాడే వారి వ్యక్తిత్వం నలుగురు నోళ్ళలో నానింది. మహర్లు సహజంగానే నీతిపరులు. అందునా ఇది సైనిక కుటుంబం. మహర్ సైనికులకు అంబేడ్కర్ తండ్రి టీచర్ కూడా! తండ్రి క్రమశిక్షణతో కూడిన జీవితమే అంబేడ్కర్లో ప్రతిఫలించింది. చాలామంది వ్యక్తిస్వార్థంతో జీవిస్తారు, సామాజికంగా జీవించలేరు. అంబేడ్కర్ కుటుంబం మొదటి నుండి సామాజిక స్పృహతో జీవించింది. అంబేడ్కర్ పూర్ణంగా తల్లి, తండ్రి రూపం. ఆయన చిన్నతనం నుండి కూడా తనకు ఎదురైన ప్రతి సంఘటననూ మొత్తం సమాజపరంగా చూసి దానిమీద పోరాటం చేసే తత్త్వాన్ని తండ్రి నుండే నేర్చుకున్నాడు.తల్లిదండ్రుల వారసత్వంఎక్కడా కూడా ఆయన జీవితంలో చిన్న తప్పు చేయలేదు. మచ్చలేని వ్యక్తిగా ఆయన జీవన క్రమం సాగింది. తల్లితో ఎక్కువ గడపకపోయినా, ఆయన బంధువులందరూ తల్లిని గురించే ప్రస్తావించేవారు. ఆమె సంతానాన్ని కనే సమయంలో ప్రసవ వేదనలకు గురై, శక్తి శూన్యమైనప్పుడు కూడ ‘ధైర్యాన్ని వదలని గొప్ప వ్యక్తి’. అంబేడ్కర్ కూడా జీవితంలో ఎన్నో దుఃఖ ఘట్టాలు వచ్చినా సహించాడు, ఎదురుతిరిగాడు, పోరాడాడు, విజయం పొందాడు. తల్లి రూపంలో ఉన్న సౌందర్యం, సౌకుమార్యం, శిల్పం అంబేడ్కర్‌కు వచ్చాయి. ఈనాడు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏకశిల్పం జాతిని ఏకం చేస్తూ మనకు కన్పిస్తుంది– అదే అంబేడ్కర్ శిల్పం. ఈ రూపాన్ని ఈ దేశానికి, ప్రపంచానికి ఇచ్చిన భీమాబాయి అన్వర్థ నామధేయం గలది. ‘భీమా’ అంటే ‘శక్తి’ అని అర్థం. అంబేడ్కర్ ఒక జాతీయవాదిగా మహర్ రెజీవ్ు వారసునిగా ఎదిగాడు. అంబేడ్కర్ కుటుంబం, వంశం, దేశంకోసం పోరాడిన నేపథ్యం కలిగి వున్నాయి.అంబేడ్కర్ జీవన వర్తనలో కరుణ, ప్రేమ, సామాజిక విప్లవం స్ఫూర్తి, సాంస్కృతికత, తాత్విక అధ్యయనం, ఆచరణ బలంగా ఉన్నాయి. అంబేడ్కర్ తత్వవేత్త, దార్శనికుడుగా ఎదగడానికి కారణం ఆయనలోనే హేతువాద భావనాధ్యయనం ఉండటం. ఆయన వేదాలను, ఉపనిషత్తులను, దర్శనాలను, ఆరణ్యకాలను, ముఖ్యంగా పరాశర స్మృతిని, నారద స్మృతిని అధ్యయనం చేసి, వాటిని నిశితంగా శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషణ చేశారు. భారతదేశంలో వేద వాఙ్మయాన్ని క్షుణ్ణంగా చదివిన పది మందిలో ఆయన ఒకరు. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా, రక్తపాతాన్ని నివారించి, నిర్మాణాత్మక సామాజిక విప్లవాన్ని నడిపించారు. ప్రపంచంలోనే రాజనీతిజ్ఞులుగా పేరొందిన జాన్ డ్యూయికి వారసుడు. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తాత్వికుడు. ప్రజాస్వామ్యంలో దాగున్న నియంతృత్వాన్ని ప్రశ్నించిన పోరాటవీరుడు. భారత స్వాతంత్య్రోద్యమంలో దాగున్న వర్ణ, కులాధిపత్య భావాలను పసిగట్టిన, ప్రకటించగలిగిన రాజకీయ ప్రజా ధురంధరుడు. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అంబేడ్కర్ హిందూ రాజకీయాల నిజ స్వరూపాన్ని గమనించారు. ‘మీరు స్వాతంత్య్రాన్ని కోరుతోంది కేవలం అధికార మార్పిడి కోసమే. కానీ ఈ కులాల ఆధిపత్యాన్ని ఎదిరించడానికి కాదు. కులం నుండి విముక్తి చేయడానికి జరిగే పోరాటమే నిజమైన స్వాతంత్య్ర పోరాటం’ అని అంబేడ్కర్ నొక్కి వక్కాణించారు. అంబేడ్కర్ తన ‘కుల నిర్మూలన’ గ్రంథంలో భారత స్వాతంత్య్రోద్యమ నాయకత్వంలో దాగిన కుల భావాలను బయటకీడ్చారు. భారతదేశంలో కులం చట్రం నుండి బయటకు రాలేక చాలామంది దేశ నాయకులు, ప్రపంచ మేధావులు కాలేకపోయారు. ప్రత్యామ్నాయ తత్వంభారతదేశంలో వచ్చిన రాజకీయ పరిణామాలన్నిటిపై ఆయన బలమైన ముద్ర ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య భావాలను బౌద్ధ తాత్విక దృక్పథంతో మేళవించారు. రాజ్యాంగ నిర్మాణంలో వున్న పటిçష్ఠత వలన దాని మౌలిక రూపాన్ని మార్చాలనుకునే వారి ప్రయత్నాలు విఫలం అవుతూ వస్తున్నాయి. దానికి కారణం రాజ్యాంగం సత్యనిష్ఠగా రూపొందించబడటమే. కులం, అççస్పృశ్యత, లింగవివక్ష, మతమౌఢ్యాలన్నింటినీ ఆయన ఎదిరించగలిగారు. ప్రత్యామ్నాయ తత్వాన్ని రూపొందించగలిగారు.1913 లోనే ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్ళగలిగారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి తన ‘ది ఎవొల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా’ గ్రంథాన్ని సమర్పించారు. అంబేడ్కర్ వ్యక్తిత్వంలో ప్రధాన అంశం అవినీతి రహిత జీవనం. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న నిక్కచ్చితనం అనేది ఆయన్ని ప్రపంచ మానవుడిగా విస్తరింపజేసింది. అనేక దేశాలలో చదివినా ఒక చిన్న మచ్చ లేకుండా, ఏ విధమైన వ్యసనాలూ లేకుండా ఆదర్శంగా నిలిచిన వ్యక్తిత్వ నిర్మాణ దక్షుడు.రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ, బహిరంగ వేదికల మీదా అనర్గళంగా మాట్లాడారు. నిరంతరం రాయడం ద్వారా గొప్ప వాఙ్మయ సంపదను సృష్టించారు. బ్రిటిష్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ కామన్స్ (లండన్ పార్లమెంటు)లో ఆయన శతజయంతిని జరిపింది. ఆ దశకు అంబేడ్కర్ చేరడానికి కారణం ఏమిటి? ఆయనకు ఆ నాయకత్వ లక్షణాలు ఎలా వచ్చాయి? అని పరిశీలిస్తే, కృషి ఉంటే అట్టడుగు లోయల నుండి కూడా పర్వత శిఖరాలను అధిరోహించవచ్చు అని అర్థం అవుతుంది. పాలకులు కండి!అంబేడ్కర్ నిర్మించిన ఇండియన్ లేబర్ పార్టీ 1937లో బొంబాయి ప్రెసిడెన్సీలో కాంగ్రెస్‌కు పటిష్ఠమైన ప్రతిపక్షంగా వ్యవహరించింది. ఇండియన్ లేబర్ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశంతో 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డు క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించారు. ఆ సందర్భంగా, దళితుల సాంఘిక, ఆర్థిక హక్కులను సాధించటానికి వారికి రాజకీయాధికారం కావాలని ప్రబోధించారు. తన ‘రణడే, గాంధీ అండ్ జిన్నా’ గ్రంథంలో ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ ప్రతిపక్షపు ప్రాధాన్యాన్ని నొక్కి వక్కాణించారు. 1952 ఎన్నికలకు సన్నద్ధమవుతూ, షెడ్యూల్డు క్యాస్ట్ ఫెడరేషన్ మాత్రమే గెలవడం కష్టమని భావించి ఇతర వామపక్ష పార్టీలను పొత్తు కోసం పిలిచారు. అçస్పృశ్యతను నివారించే క్రమంలో సామాజిక అసమానతలను రూపుమాపే ముఖ్యసూత్రంపైన ఆయన పార్టీల పొత్తును కోరారు. ఆయన ఈ విషయంపై ప్రజా సోషలిస్టు పార్టీతో చర్చించారు. ‘సోషలిస్టులు కొన్ని విషయాల్లో నమ్మదగ్గవారు కాకపోయినా వారు మతశక్తులు కాదు. రాజకీయంగా వారి మార్గం సరైనదే. అందుకే వారితో నేను కలవడానికి వెనుకాడటం లేదు’ అని వ్యాఖ్యానించారు.అంబేడ్కర్ పోరాటమంతా బహుజనుల రాజ్యాధికార దిశగానే సాగింది. అందుకు సిద్ధాంతాలు, ప్రణాళికలు, పార్టీలు, కార్యాచరణ, రూపొందించారు. రాజ్యాధికారమే వారికి సంపదను, సమతను సమసమాజ నిర్మాణాన్ని కలిగిస్తుందని అంబేడ్కర్ ఆశయం. బానిసలుగా బతకవద్దు, పాలకులుగా బతకండి అని చెప్పారు. అందుకు త్యాగాలు అవసరం. అంబేడ్కర్ త్యాగ జీవితమే మనకు దిక్సూచి. ఆ దిశగా నడుద్దాం.- వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695(నేడు డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి)- డా‘‘ కత్తి పద్మారావు -
ఢిల్లీ బహుత్ దూర్ హై!
ఢిల్లీ బాద్షా ఎవరు? కేంద్ర సర్కార్ బడానేతలు మోదీ–షా ద్వయానికి అతిపెద్ద రాజకీయ సవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక. దశాబ్దంగా దేశ ఎన్నికల రాజకీయాలను దాదాపు శాసిస్తున్న బీజేపీ నాయకత్వానికి మింగుడు పడని గరళ గుళిక ‘ఢిల్లీ’! పదేళ్లలో, వరుసగా 2014, 2019, 2024 మూడు ఎన్నికల్లో ఏడుకు ఏడు లోక్‌సభ స్థానాలు అలవోకగా గెలుస్తూ వస్తున్న బీజేపీ... ఢిల్లీ రాష్ట్రాధికార పీఠాన్ని ఎడబాసి పాతికేళ్లు! దేశ రాజధానిలో పునర్వైభవం కోసం రెండున్నర దశాబ్దాలుగా అది చేయని యత్నం, వేయని ఎత్తు లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఆధిపత్యానికి కొంత గండిపడ్డా.... హరియాణా, మహారాష్ట్ర ప్రభుత్వాలను తిరిగి నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసంతో పార్టీ నాయకత్వం ఢిల్లీ అసెంబ్లీ పోరుకు సిద్ధమౌతోంది.భూమ్మీద రెండో అతిపెద్ద జనాభా (3.4 కోట్లు) నగరం మన రాజధాని ఢిల్లీ. 3.7 కోట్ల జనాభా కలిగిన టోక్యో (జపాన్) తర్వాత మనదే ఎక్కువ జనాభా నగరం. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా చూస్తూ ఓటేసే తెలివిపరుల బరి ఇది. అదే, ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీకి చిక్కులు తెచ్చిపెడ్తోంది. ఏకులా వచ్చి మేకులా, స్థానిక రాజకీయ శక్తిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్థిరపడిపోవడం బీజేపీకి మింగుడుపడట్లేదు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్, పదకొండేళ్లుగా ఢిల్లీని ఏలుతున్న ఆప్‌లకు ఒక లోక్‌సభ సీటు కూడా దక్కనీకుండా బీజేపీ, దశాబ్దకాలంగా సున్నాకే పరిమితం చేసింది. కానీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని వరసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్, మరో మూడుమార్లు ఆప్ గెలవటంతో 26 ఏళ్లుగా బీజేపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతోంది. రాజకీయ ఆటుపోట్ల నడుమ కూడా, 70లో 11 స్థానాలకు ఆప్ అప్పుడే అభ్యర్థులను ప్రకటించి బరిలో దూకింది. ఫిబ్రవరిలో ఢిల్లీ కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. మోదీ నాయకత్వంలోని బీజేపీని ఎదుర్కునేందుకు ఆప్ అస్త్రశస్త్రాలు సన్నద్దం చేసుకుంటోంది. ఎన్నికలవేళ ఓటర్లను ఆకట్టుకునే ‘ఉచితాల మీద (‘రేవడీ పే’) చర్చ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో బీజేపీది రెండు నాల్కల ధోరణి అని విమర్శించే ఆప్, మహారాష్ట్ర హామీల ఉదాహరణలతో వారిని ఎండగట్టాలని ఎత్తుగడ. మరో పక్క కాంగ్రెస్ ‘ఢిల్లీ న్యాయయాత్ర’ ప్రారంభించింది. ఆప్ పాలన బాగోలేదనే విమర్శతో...‘ఢిల్లీ ఇక సహించదు’ అనే నినాదాన్ని ప్రచారం చేస్తోంది.పొత్తుతో ‘ఆప్’కి మేలా, కీడా?ఢిల్లీలో 70 సీట్లకు ఒంటరిగానే పోటీచేస్తామని అటు కాంగ్రెస్, ఇటు ‘ఆప్’ ప్రకటించాయి. ఇక రాబోయేది మూడు ముక్కలాటే! సహజంగానే ‘ఇండియా’ కూటమి మిత్రులుగా ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తాయనుకుంటారు. లోక్‌సభ ఎన్నికల్లో అలాగే చేశాయి. కానీ, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలోకి దిగాయి. 2013 నుంచి ఢిల్లీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. షీలా దీక్షిత్ సీఎంగా మూడు పర్యాయాలు ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పతనం 2013 నుంచే మొదలైంది. ఆ ఎన్నికల్లో 24.7 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌కు 2015లో 9.7%, 2020లో 4.3% ఓట్లే దక్కాయి. 2013లోనే 29.7% ఓట్లతో ఆధిక్యత ప్రారంభించిన ఆప్, 2015లో 54.5% ఓట్లు సాధిస్తే, 2020లో 53.8% ఓట్లు దక్కించుకుంది. మూడు మార్లూ గెలిచింది. పదేళ్లుగా పాలకపక్షం ‘ఆప్’ మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉందనీ, దాన్ని సొమ్ము చేసుకుంటూ తాను పూర్వవైభవం సాధించాలనీ కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే ఆలోచన బీజేపీది. కాంగ్రెస్ – బీజేపీ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే... అది ‘ఆప్’కే లాభం! కాంగ్రెస్‌తో కలిసి ఆప్ పోటీ చేస్తే, లాభం ఉంటుందనే గ్యారెంటీ లేకపోగా ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కాంగ్రెస్ అంటే గిట్టని వారి ఓటు... బీజేపీకి అనుకూలంగా కేంద్రీకృతమయ్యే ఆస్కారాన్ని శంకిస్తున్నారు. మూడు పార్టీల వ్యూహకర్తలు ఎలా ఆలోచిస్తారో చూడాలి. 2013లో 70 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 8 స్థానాల్లో నెగ్గితే, 69 పోటీ చేసిన ఆప్ 28 సీట్లు. 66 పోటీ చేసిన బీజేపీ 31 సీట్లు గెలిచాయి. 2015లో ఫలితాల సునామీ సృష్టించిన ఆప్ 70 చోట్ల పోటీ చేసి 67 గెలిచి, ప్రత్యర్థుల్ని ‘చీపురు’ పెట్టి ఊడ్చింది. 69 చోట్ల పోటీ చేసిన బీజేపీకి 3 సీట్లు లభిస్తే, మొత్తం 70 స్థానాలకూ పోటీ చేసిన కాంగ్రెస్ ఒకచోట కూడా గెలువలేకపోయింది. 2020 లోనూ సుమారు అటువంటి పరిస్థితే! కాంగ్రెస్ (0), బీజేపీ (8) లపై మళ్లీ ఆప్ (62) ఏకపక్ష ఆధిక్యత సాధించింది.ఓటరు పరిణతి వేరుపార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్ని ఢిల్లీ ఓటర్లెప్పుడూ వేర్వేరు వేదికలుగానే చూస్తారు. జాతీయాంశాల పరంగా లోక్‌సభ ఎన్నికల్లో తీర్పిస్తే, దైనందినాంశాలు, పౌర సదుపాయాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలను, వాటి పనితీరును కొలుస్తుంటారు. అక్కడే ‘ఆప్’ క్లిక్ అయింది. తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రవాణా వంటి అంశాల్లో శ్రద్ధ వహిస్తూ, ఢిల్లీ ఓటర్లతో తన నిబద్ధత చాటుకుంది. అర్బన్ ఓటర్లను ఆకట్టుకోగలిగింది. సర్కారు బడుల్ని మెరుగుపరచడం, మొహల్లా ఆస్పత్రుల్ని బాగుచేయడం, ఉచితంగా 400 లీటర్ల వరకు తాగునీరు, 200 యూనిట్ల వరకు విద్యుత్తు, మహిళలకు బస్సులో ప్రయాణ సదుపాయం వంటివి కల్పించడం సంక్షేమపరంగా పెద్ద ముందడుగు. పన్ను చెల్లింపుదారలకు న్యాయం చేసే సర్కారు జవాబుదారీతనం, అవినీతి రహిత పాలననూ ఆప్ ప్రచారం చేసుకుంది. కానీ, ఢిల్లీ మద్యం పాలసీ కేసు వల్ల ఆప్ ప్రభుత్వం అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిందంటూ ప్రత్యర్థులు ప్రచారం చేసే ఆస్కారం వచ్చింది. దీన్ని బీజేపీ ఎలా వాడుకుంటుందో చూడాలి. ఆ కేసులో, ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఉపముఖ్య మంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ తదితర ఆప్ ముఖ్యులు అరెస్టయ్యారు. కేజ్రీవాల్ సీఎం పదవికే రాజీనామా చేశారు. అది కేవలం బీజేపీ కక్ష సాధింపేనని తిప్పికొట్టిన ఆప్ నాయకత్వం, నిర్దోషులుగానే నేతలు బయటపడతారని చెబుతోంది. ‘పాక్షిక రాష్ట్ర హోదా కల్గిన ఢిల్లీపై, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ద్వారా దొడ్డిదారి అధికారం చలాయిస్తూ, ఆప్ ప్రతిష్ఠ్ మసకబారేలా బీజేపీ నాయకత్వం కుయుక్తులు పన్నుతోందని ఆప్ విమర్శిస్తోంది.నాడి పట్టడంలో బీజేపీ విఫలంఎక్కువ నగర, తక్కువ గ్రామీణ జనాభాతో ఉండే ఢిల్లీ ఒకప్పుడు బీజేపీకి ఓటు బ్యాంకు. కానీ, 1998 తర్వాత సీన్ మారింది. ప్రస్తుత సమీకరణాల్లో ఢిల్లీ వాసుల నాడి పట్టలేకపోతోంది. పాతతరం – కొత్తతరం, సంపన్నులు–పేదలు, స్థానికులు–వలసజీవులు... ఇలా వైవిధ్యంగా ఉన్న సమూహాల్లో బీజేపీకి ఆధిపత్యం దొరకటం లేదు. ఒకప్పుడు తిరుగులేని పట్టున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) ఎన్నికల్లోనూ బీజేపీకి క్రమంగా పట్టు జారుతోంది. 98 శాతం ఢిల్లీ అర్బన్ జనాభా 75 శాతం విస్తీర్ణంలో నివాసముంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 7 పార్లమెంటు స్థానాలూ గెలిచిన బీజేపీకి, 52 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యత దక్కింది. ఆప్ (10), కాంగ్రెస్ (8) కు నాలుగోవంతు సీట్లలోనే ఆధిక్యత వచ్చింది. కలిసి పోటీ చేసిన ఆప్ (24.17%), కాంగ్రెస్ (18.19%)ల ఉమ్మడి ఓటు వాటా (42.36%) కన్నా బీజేపీ వాటా (54.35%) ఎక్కువ! 2008 నుంచీ బీజేపీ గెలవని అసెంబ్లీ స్థానాలు 23 ఉంటే, కాంగ్రెస్ గెలవని స్థానాలు 25 ఉన్నాయి. 2013 నుంచి ఆప్ గెలవని స్థానం ఒకటే! 2013, 2015, 2020 అన్ని ఎన్నికల్లోనూ వారు గెలుస్తూ వస్తున్న స్థానాలు 26 ఉన్నాయి.ఆప్ ఓ నాలుగు లోక్‌సభ స్థానాలు పంజాబ్‌లోనైనా గెలిచింది తప్ప ఢిల్లీలో ఖాతాయే తెరవలేదు. ఢిల్లీ మహానగరంలో సామాజిక వర్గాల సమీకరణం కూడా ఈ వైవిధ్య ఫలితాలకు కారణమే! ఢిల్లీ 70 అసెంబ్లీ సీట్లలో... బిహార్, యూపీ రాష్ట్రాల వలసదారుల ఆధిపత్యమున్నవి 17 స్థానాలయితే, అంతే సంఖ్య స్థానాల్లో పంజాబీలు (14 శాతం జనాభా) నిర్ణాయకశక్తిగా ఉంటారు. స్థానికంగా పట్టు కలిగిన గుజ్జర్లు, జాట్లవి ఓ 10 స్థానాలు. ఢిల్లీ మొత్తంలో 12% జనాభా కలిగిన ముస్లింలు 30% మించిన ఓటర్లతో, నిర్ణాయకంగా ఉన్నవి 6 నియోజకవర్గాలు. అన్ని వర్గాలు మిళితమై నిర్దిష్టంగా ఎవరికీ ఆధిక్యత లేని నియోజకవర్గాలు 20 వరకుంటాయి. ఇన్ని వైవిధ్యాల మధ్యనున్న దేశ రాజధాని అసెంబ్లీ పీఠం గురించి ఎన్ని ఎత్తుగడలేసినా... బీజేపీకి, ఇంకా ఢిల్లీ బహుదూరమే (అభీ ఢిల్లీ బహుత్ దూర్ హై)!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
కాప్29... గత చరిత్రకు కొనసాగింపే!
అజర్బైజాన్ రాజధాని బాకూలో ఇటీవలే ముగిసిన వాతావరణ చర్చలకు సంబంధించిన ‘కాప్’ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) 29, వివాదాస్పద ఒప్పందంతో ముగిసింది. వాతావరణపరమైన సహాయాన్ని (క్లైమేట్ ఫైనాన్స్) ఈ చర్చల్లో కేంద్ర ఇతివృత్తంగా భావించారు. ఇది వాతావరణ మార్పులను పరిష్కరించే ఉపశమనం, అనుసరణ చర్యలకు మద్దతునిచ్చే స్థానిక, జాతీయ లేదా అంతర్జాతీయ ఫైనాన్సింగ్‌ను సూచిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు... వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కోవటానికి సమర్థవంతమైన చర్యలు చేపట్టడానికి ఉపయోగపడే అదనపు నిధులను దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి. అదీ ధనిక దేశాలు ఎక్కువ బాధ్యత వహించాలని అంటున్నాయి. ప్రస్తుత సంక్షోభానికి ప్రధానంగా వారిదే బాధ్యత కాబట్టి. పారిశ్రామిక విప్లవ కాలం నుండి ఉత్తరార్ధ గోళం నుండి వచ్చిన చారిత్రక ఉద్గారాలు వాతావరణ సంక్షోభానికి దారితీశాయి. క్లైమేట్ ఫైనాన్స్‌లోని గణనీయ భాగం, దాని మూలం చాలా కాలంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య రగులుకుంటున్న అంశంగా ఉంటూ వస్తోంది.ఈ నేపథ్యంలోనే బాకూ చర్చలు... ఒప్పందంపై మంచి అంచనాలను, ఆశలను పెంచాయి. మొత్తానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2035 నాటికి ప్రతి సంవత్సరం కనీసం 300 బిలియన్ డాలర్ల క్లైమేట్ ఫైనాన్స్ చేయాలనేది ఈ సదస్సు అంతిమ నిర్దేశం అయ్యింది. పబ్లిక్, ప్రైవేట్, ద్వైపాక్షిక, బహుపాక్షిక, ప్రత్యామ్నాయ వనరులతో సహా డబ్బు అనేక రకాల వనరుల నుండి సేకరించాలని నిర్దేశించుకున్నారు. ఈ నిధులను అందించడంలో, అభివృద్ధి చెందిన దేశాలు ముందుంటాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వచ్ఛందంగా సహకారం అందించవచ్చు.బాకూ చర్చల సమయంలో నిర్దేశించబడిన ఆర్థిక లక్ష్యం, ఉండవలసిన లక్ష్యం కంటే చాలా తక్కువగా ఉంది. పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరిన కాలపరిమితి ప్రకారం 2025 నుండి అభివృద్ధి చెందిన దేశాలు ప్రతి సంవత్సరం 1.3 ట్రిలియన్ డాలర్ల ఫైనాన్స్‌ని సమీకరించాల్సి ఉంది. ఎటువంటి తక్షణ కట్టుబాట్లనైనా నివారించడం కోసం లక్ష్యాన్ని నీరుగార్చడం, చాలా ఎక్కువ కాల వ్యవధిని విధించడం అనేది ఇప్పుడు గ్లోబల్ నార్త్ సుపరిచితమైన వ్యూహం. అంతేకాకుండా, వాగ్దానం చేసిన నిధులు కేవలం ధనికుల నుండి మాత్రమే రావు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా దీనికి సహకరించాలి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలను కలవరపెడుతుందని చెప్పవచ్చు. చర్చల ముగింపు సమయంలో, భారతదేశం, బొలీవియా, నైజీరియా ఈ బలహీనమైన ఒప్పందంపై తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి. దీనిని అధికారికంగా ‘న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్’ అని పిలిచారు. వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక వనరులు అవసరం. ఉపశమనానికి డబ్బు అవసరం. దీనర్థం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, ఇంధన సామర్థ్యం, జీవన సహజ వనరులు, భూ వినియోగం నిర్వహణ, భూ– జల జీవవైవిధ్యం, స్వచ్ఛమైన రవాణా వంటి వాటికి మద్దతు ఇవ్వడానికి నిధులు సమకూర్చడమన్నమాట. వాతావరణ ప్రతికూల ప్రభావాలను తగ్గించడం, తట్టుకోవడం కోసం అదనపు నిధులు అవసరం అనేది రెండో ఆవశ్యకత. ఉదాహరణకు, తుఫానులను, వరదలను తట్టుకోగల మౌలిక సదుపాయాలను నిర్మించడానికి నిధులు; పెరుగుతున్న సముద్ర మట్టాలు ఉన్న ప్రాంతాల నుండి అవస్థాపన ప్రాజెక్టుల పునఃస్థాపనకు ఆర్థిక సహాయం, కరువు నిరోధక విత్తనాలను అభివృద్ధి చేయడం– సరఫరా చేయడం మొదలైన చర్యలు చేపట్టడానికి నిధుల అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో దేశాలకు సహాయం చేయడానికి ‘లాస్ అండ్ డామేజ్’ అని పిలువబడే మూడవ వర్గం చర్యలు చేపట్టాడానికీ అదనంగా క్లైమేట్ ఫైనాన్స్ అవసరం.ఆర్థిక లక్ష్యాన్ని కనిష్టంగా ఉంచడానికీ, వీలైనంత వరకు ఆలస్యం చేయడానికీ పాశ్చాత్య సంపన్న దేశాలు ఎత్తులు వేయడానికి ప్రయత్నించాయి. కొత్త, అదనపు నిధులు ఇవ్వడానికి కట్టుబడి ఉండే బదులు, ప్రస్తుతం ఉన్న అభివృద్ధి సహాయాన్నే క్లైమేట్ ఫైనాన్స్‌గా ముద్రవేయడానికి ప్రయత్నం జరిగింది. దీంతో ప్రైవేట్ పెట్టుబడులు, అలాగే అభివృద్ధి–బ్యాంకు రుణాలు, ప్రభుత్వ వ్యయం ద్వారా ‘సమీకరించబడిన’ ప్రైవేట్ ఫైనాన్స్ కూడా... క్లైమేట్ ఫైనాన్స్ గొడుగు కిందకు వచ్చాయి. ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలు కోరుకుంటున్న ఆర్థిక నాణ్యతను పలుచన చేశాయి. అమెరికాలో ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడం, ఆయన వాతావరణ వ్యతిరేక వైఖరులు... బలహీనమైన ఆర్థిక ఒప్పందాన్ని ముందుకు తీసుకురావడానికి అభివృద్ధి చెందిన దేశాలను ప్రభావితం చేశాయి. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన విధంగానే అమెరికా బహుపాక్షిక వాతావరణ ఫ్రేమ్‌వర్క్ నుండి వైదొలిగితే, అది యూఎన్ఎఫ్ సీసీసీని నిర్వీర్యం చేయడంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఈ దేశాలు భయపడ్డాయి. ఐరోపాలోని మితవాద ప్రభుత్వాలు కూడా విదేశీ క్లైమేట్ ఫైనాన్స్‌కు తమ కట్టుబాట్లను తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఐక్యరాజ్యసమితి ప్రక్రియ ప్రకారం, అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్‌తో సహా 24 అభివృద్ధి చెందిన దేశాలు... అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ ఆర్థిక సహాయం అందించాలి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఈ ప్రక్రియ నుండి వైదొలగితే, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ భారాన్ని మోయవలసి ఉంటుంది. అందువల్ల, అభివృద్ధి చెందుతున్న దేశాలు బలహీనమైన ఒప్పందానికి అంగీకరించేలా అభివృద్ధి చెందుతున్న దేశాలను ఒప్పించాయి.వాస్తవ ద్రవ్యం అందుబాటులో లేని స్థితిలో, బాకూ వాతావరణ ఒప్పందం వల్ల వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ఎటువంటి తోడ్పాటు వచ్చే అవకాశం లేదు. కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. శిలాజ ఇంధనాలకు దూరంగా పరివర్తనం చేయడం పెద్దగా పురోగతిని సాధించలేదు. దుబాయ్‌లో జరిగిన కాప్28 సదస్సు బొగ్గు, చమురు, గ్యాస్‌లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే దేశాలు కూడా ఆ పిలుపుకు మద్దతు ఇవ్వడంతో ఇది ఒక సంచలనాత్మక పరిణామంగా ప్రశంసించబడింది. కానీ ఆ పిలుపును కార్యాచరణలోకి తేవడానికి బాకూలో తదుపరి చర్యల గురించి చర్చించలేదు. కాబట్టి, మరో కాప్ సదస్సు వరకు ఇది యథావిధి వ్యవహారం కానుంది.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఉక్రెయిన్‌కు ట్రంప్ పరిష్కారం?
లెబనాన్‌లో కాల్పుల విరమణ జరిపించి, గాజాలోనూ ఆ ప్రయత్నం చేయగలనన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ యుద్ధం గురించి మాత్రం ఎటువంటి ప్రస్తావన చేయకపోవటం గమనించదగ్గది. పైగా, కొత్త అధ్యక్షుడు ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించి ఆ విషయమై తన శాంతి ప్రయత్నాలు ఆరంభించేలోగా, రష్యాతో చర్చలలో ఉక్రెయిన్ బేరసారాల బలాన్ని వీలైనంత పెంచే పనిలో ఉన్నారు. తాను గెలిచినట్లయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధ సమస్యను ఇరవై నాలుగు గంటలలో పరిష్కరించగలనని ఎన్నికల ప్రచార సమయలో ప్రకటించిన ట్రంప్ శాంతి పథకమేమిటో అంచనా వేయటం అవసరం. మరి ఆయన గెలిచి మరొక యాభై రోజులలోనే పదవిని స్వీకరించనుండగా ఈ విషయమై ఏదైనా ఆలోచిస్తున్నట్లా?రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి ఎన్నికల సమయంలో ట్రంప్ ఎటువంటి పథకాన్ని సూచించలేదంటూ చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. అయితే, ఆయన దాని గురించి ఆలోచించటమే కాదు, రష్యా – ఉక్రెయిన్ సమస్యపై తన ప్రతినిధిగా రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ కీత్ కెల్లోగ్ను 28వ తేదీన నియమించారు కూడా. జనరల్ కెల్లోగ్తో పాటు, ట్రంప్ ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తన వ్యవహరణను గమనించి నట్లయితే, సమస్యకు ట్రంప్ ప్రభుత్వం సూచించే పరిష్కారమేమిటో కొంత అవగతమవుతుంది. ట్రంప్ మాటలను ఇప్పటికే చూశాం గనుక, కొత్తగా రంగంలోకి వస్తున్న జనరల్ కెల్లోగ్ వైఖరిని గమనిద్దాం. ఆయన ట్రంప్ మొదటి పాలనా కాలంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు. ఉక్రెయిన్ సమస్యపై కొంతకాలం క్రితమే తన ఆలోచనలను వివరిస్తూ ఒక పత్రాన్ని ప్రకటించారు. ఇతరత్రా టెలివిజన్ చర్చ వంటి వాటిలో పాల్గొన్నారు.ముందు కాల్పుల విరమణకెల్లోగ్ ప్రకారం, ముందుగా రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణ పాటించాలి. ఉభయుల సేనలు ఆ విరమణ రోజుకు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆగిపోవాలి. తర్వాత చర్చలు మొదలు కావాలి. దీనంతటికీ ఉక్రెయిన్ అంగీకరించకపోయినట్లయితే వారికి సహాయం నిలిపివేయాలి. రష్యా కాదన్న పక్షంలో ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగించాలి. పోతే, రాజీ కోసం ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని రష్యాకు వదలుకోవలసి రావచ్చు. అదేవిధంగా, నాటోలో సభ్యత్వ విషయం నిరవధికంగా వాయిదా పడుతుంది. ట్రంప్ ఈ మాటలు ఇంత నిర్దిష్టంగా చెప్పలేదుగానీ, ఉక్రెయిన్‌కు సహాయంపై నియంత్రణలు, వారు తమ భూభాగాన్ని కొంత వదులు కోవలసి రావటం గురించిన ప్రస్తావనలు స్పష్టంగానే చేశారు. అవి యూరప్ అంతటా కలవరం సృష్టించాయి. ట్రంప్ వైఖరిని మార్చేందుకు జెలెన్స్కీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు.ఇదే పథకం అమలుకు ట్రంప్ ప్రయత్నించినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉండవచ్చు? భూభాగం వదులుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు అంగీకరిస్తారా? ఒకవేళ అంగీకరిస్తే ఏ మేరకు అనే కీలకమైన ప్రశ్నను అట్లుంచితే, మొదట కాల్పుల విరమణకు, సేనలను యథాతథ స్థితిలో నిలిపివేయటానికి సమ్మతించటంలో ఎవరికీ సమస్య ఉండకపోవచ్చు. ట్రంప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చర్చలకు సిద్ధమని జెలెన్స్కీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. చర్చల సందర్భంగా జనరల్ కెల్లోగ్ ప్రతిపాదనలు ఏ దశలో ముందుకు వచ్చేదీ చెప్పలేము గానీ, మొదట మాత్రం రష్యా, ఉక్రెయిన్ దేని షరతులు అది విధిస్తుంది. ఆ షరతులేమిటో మనకు ఇప్పటికే తెలుసు. 2014 నుంచి తమ ఆక్రమణలో గల క్రిమియాను ఉక్రెయిన్ తిరిగి కోరకపోవటం, ఉక్రెయిన్ తూర్పున రష్యన్ జాతీయులు ఆధిక్యతలో గల డోన్బాస్ ప్రాంతాన్ని తమకు వదలటం, నాటోలో చేరకుండా తటస్థంగా ఉండటమన్నవి రష్యా షరతులు. నాటో సభ్యత్వం సంగతి ఎట్లున్నా తమ భూభాగాలన్నింటిని తమకు తిరిగి అప్పగించటం, తమ రక్షణకు పూర్తి హామీలు లభించటం ఉక్రెయిన్ షరతులు.భూభాగాలను వదులుకోవాల్సిందే!నల్ల సముద్రంలోని క్రిమియా తమ అధీనంలో లేనట్లయితే రష్యా సముద్ర వాణిజ్యం శీతాకాలం పొడవునా స్తంభించి పోతుంది. కనుక ఆ ప్రాంతాన్ని 2014లో ఆక్రమించిన రష్యా, దానిని వదలుకునేందుకు ససేమిరా అంగీకరించదు. ఈ వాస్తవ స్థితిని అప్పటినుంచే గ్రహించిన ఉక్రెయిన్, అమెరికా శిబిరాలు బయటకు కాకున్నా అంతర్గతంగా రాజీ పడిపోయాయి. పోతే, డోన్బాస్ ప్రాంతంలోని రష్యన్లను ఉక్రెయిన్ రకరకాలుగా వేధించటం ఎప్పటినుంచో ఉంది గనుకనే ఆ భూభాగాలను రష్యాలో విలీనం చేసుకుని తీరగలమని పుతిన్ ప్రకటించారు. ప్రస్తుత యుద్ధ కాలంలో అందులో అధిక భాగాన్ని ఆక్రమించారు కూడా. మరొకవైపున కనిపించే ఆసక్తికరమైన అంశాలు మూడున్నాయి. తమ ప్రభుత్వ వైఖరి ఏమైనప్పటికీ రష్యాతో శాంతి కోసం కొంత భూభాగం వదులు కోవచ్చుననే ఉక్రెయిన్ ప్రజల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఒకవైపు ఉక్రెయిన్‌కు యుద్ధంలో మద్దతిస్తూనే యూరోపియన్ దేశాలు కూడా ఇదే మాట పరోక్షంగా సూచిస్తున్నాయి. యుద్ధానికి నిరవధికంగా సహాయం చేసేందుకు అవి పైకి అవునన్నా వాస్తవంలో సిద్ధంగా లేవు. ఇదంతా పరిగణించినప్పుడు, ఉక్రెయిన్ ఈ రాజీకి సిద్ధపడవలసి ఉంటుందనిపిస్తుంది. అయితే, ఎంత భూభాగమన్నది ప్రశ్న.ఒకసారి యుద్ధం ముగిసినట్లయితే రష్యా నుంచి ముప్పు అన్నదే ఉండదు గనుక, ఉక్రెయిన్‌కు తను కోరుతున్న ప్రకారం రక్షణలు కల్పించటం సమస్య కాకపోవచ్చు. అయితే, నాటో సభ్యత్వ ప్రశ్న చిక్కుల మారిది. సభ్యత్వం కావాలన్నది ఉక్రెయిన్ కోరిక. రష్యా నుంచి ఎప్పటికైనా ఉక్రెయిన్‌కే గాక తక్కిన యూరప్‌కు సైతం ప్రమాదం ఉండవచ్చునని, కనుక ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తూ నాటోను మరింత శక్తిమంతం చేసుకోవాలన్నది యూరోపియన్ యూనియన్ కోరిక. నిజానికి అది అమెరికాకు మొదటినుంచీ ఉన్న వ్యూహం. ఒకప్పటి సోవియెట్ యూనియన్‌తో పాటు వారి నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి 1991లోనే రద్దయినా, రష్యాను దిగ్బంధంలోనే ఉంచేందుకు అమెరికన్లు తమ సైనిక కూటమి నాటోను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే 1991 తర్వాత మరొక 12 యూరోపియన్ దేశాలను నాటోలో చేర్చుకుని రష్యా సరిహద్దుల వైపు విస్తరించారు. ఆ సరిహద్దుల వెంటగల చివరి దేశం ఉక్రెయిన్ కావటం వల్లనే రష్యా తన భద్రత పట్ల ఇంత ఆందోళన చెందుతూ ప్రస్తుత యుద్ధానికి సమకట్టింది. వార్సా కూటమి రద్దయిన దరిమిలా నాటోను విస్తరించబోమంటూ ఇచ్చిన హామీని అమెరికా ఉల్లంఘిస్తూ ఇదంతా చేయటమన్నది వారి ఆగ్రహానికి కారణం.నాటో సభ్యత్వం ఉండదా?ఉక్రెయిన్ నాటో సభ్యత్వ విషయం నిరవధికంగా వాయిదా పడగలదని జనరల్ కెల్లోగ్ అంటున్నారు గానీ, అసలు ఉండబోదని, రష్యా కోరుకున్నట్లు ఉక్రెయిన్ తటస్థంగా ఉండగలదని మాత్రం అనటం లేదు. చర్చల సమయలో రష్యా ఈ షరతును తీసుకురాగలదు. అందుకు ట్రంప్, తద్వారా యూరోపియన్ యూనియన్ అంగీకరించినట్లయితే తప్ప, ఈ నిర్దిష్ట సమస్యపై రాజీ సాధ్యం కాదు. పోతే, ప్రస్తుత యుద్ధం ప్రపంచ యుద్ధానికి, అణుయుద్ధానికి దారితీయవచ్చుననే ఊహాగానాలు కొద్ది కాలం పాటు సాగి ఆందోళనలు సృష్టించాయి. పరిణామాలను గమనించినపుడు అటువంటి అవకాశాలు లేవని అర్థ్థమైంది. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ అనుమతించటంగానీ, అందుకు ప్రతిగా రష్యా మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించటం గానీ, కర్స్క్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిన ఉక్రెయిన్ సేనల నిర్మూలనకు ఉత్తర కొరియా సేనలను రష్యా మోహరించటం గానీ, చర్చల సమయానికి తమది పైచేయిగా ఉండాలనే చివరిదశ ప్రయత్నాలు తప్ప మరొకటికాదు. ఇటువంటి వ్యూహాలు ఏ యుద్ధంలోనైనా సాధారణం. ఇదే వ్యూహానికి అనుగుణంగా, చర్చల కాలం వరకు యుద్ధం మరింత తీవ్రరూపం తీసుకున్నా ఆశ్చర్యపడనక్కర లేదు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఈ చర్య మతసామరస్యానికి శరాఘాతం!
అజ్మీర్ దర్గాకు సంబంధించిన వార్తలు ముస్లింలకు మాత్రమే బాధ కలిగిస్తాయనుకుంటే పొరపాటు. తరతరాలుగా హిందువులు ఆ దర్గాలో ఆరాధనలు జరుపుతున్నారు. ‘చాదర్’ సమర్పిస్తు న్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా ‘గరీబ్ నవాజ్’ అని పిలుచుకునే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఎదుట మొక్కులు తీర్చుకుంటున్నారు. భారత దేశంలోని ముస్లింలు, హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్రాన్ని ప్రతి రోజూ 1.5 లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. భారతీయ ముస్లింలలో అత్యధికులు అజ్మీర్ దర్గాను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారు. అజ్మీర్ దర్గా భారతదేశంలోని ముస్లింలకు మక్కా లాంటిదని పలువురు భావిస్తారు. అజ్మీర్ ఖ్వాజాను ‘హిందూస్థాన్ కే వలీ’ లేదా ‘హింద్ వలీ’ అని పిలుస్తారు.కాని ఇటువంటి ఈ సామరస్య కేంద్రం ఇప్పుడు వార్తల్లో అనవసర కారణాలతో నిలవడం బాధాకరం. భారతదేశంలో బాబ్రీ తర్వాత సాగుతున్న హైందవ సంస్కృతి ఆనవాళ్ల వెతుకులాట మసీదుల చుట్టూ ఇంతకాలం ఉండగా... ఇప్పుడు దర్గాలకు చేరడం, అదీ కోట్లాది మంది సెంటిమెంట్‌గా భావించే అజ్మీర్ దర్గాకు చేరడం ఆందోళన కలిగించే అంశం. చినికి చినికి గాలివాన అయినట్టుగా ఇది ఎక్కడకు చేరబోతున్నదో పాలకులకూ, ఈ వివాదాన్ని రేపుతున్నవారికీ అంచనా ఉందా? ఈ వివాదాన్ని లేపేవారు భారతీయ హిందూ– ముస్లింల మధ్య ఎడతెగని అనిశ్చితి, ఘర్షణ, విభజన, ద్వేషం ఆశిస్తున్నారా? ఒక దేశంలో కలిసిమెలిసి ఉండవలసిన రెండు ప్రధాన మతాలు నిత్యం ఘర్షణల్లో ఉంటే ఆ దేశ ప్రగతి ఏ రీతిలో కొనసాగుతుందనేది మనలో ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి.అయోధ్యలో ప్రార్థనా స్థలంపై జరిగినట్లుగా అజ్మీర్‌లో దీర్ఘకాలంగా పోరాటం లేదు. ఇది మసీదు వంటి బహిరంగ ప్రదేశం కాదు. ఇది సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి. అజ్మీర్ దర్గాపై ఎటువంటి న్యాయపోరాటం లేనప్పుడు, 800 ఏళ్ల సూఫీ సాధువు సమాధి వద్ద యంత్రాలు, గునపాలు చేరడం చట్టవిరుద్ధం. హిందూసేన కోర్టు సహాయంతో అజ్మీర్ ఖ్వాజా దర్గాను సర్వే చేయాలనుకుంటోంది. ఈ సర్వేను నిలిపివేయాలని ఈ దేశంలో బాధ్యతగల పౌరులెవరైనా ఆశిస్తారు. తాజ్‌మహల్, కుతుబ్మినార్ల విషయంలో చేసినట్లుగా అజ్మీర్ దర్గా సర్వేను తిరస్కరించాలి. వివాదాలు లేని చోట వివాదాలు సృష్టించవలసిన అవసరం ఏమిటని గౌరవనీయమైన పెద్దలు ముందుకు రావాలి.హిందూ ముస్లింలకు ఇది దర్గా అని తెలుసు. ఇది రెండు మతాలకు చెందినది కాబట్టి వారు దానిని ఒకే దృష్టితో చూశారు. భక్తులు అక్కడ సంతోషంగా ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారిని భంగపరచి దేశవ్యాప్తంగా ఎందుకు హింసను ప్రేరేపించాలి? శివలింగం ఉందా... లేదా ఉందని వెలికితీయడానికీ, లేదా లేకపోయినా ఉందని వాదించడానికీ పవిత్రమైన 800 సంవత్సరాల నాటి సూఫీ సాధు సమాధిని అన్వేషించడం 140 కోట్ల జనాల మనోభావాలను దెబ్బతీసినట్లే. దర్గా హిందువులు– ముస్లింల మధ్య వారధిగా నిలుస్తుంది. ఈ వంతెనను దెబ్బ తీస్తే, హిందువులు – ముస్లింల మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేసినట్లే. ఇలా చేసి చివరికి ఏమి సాధించబోతున్నారు?గత పాఠాలు బోధించడం, అవగాహన పెంపొందించడంలో చరిత్రకు దాని విలువ ఉంది. ప్రజలను విభజించడానికి లేదా శాంతికి భంగం కలిగించడానికి చరిత్రను ఆయుధంగా వాడకూడదు. చరిత్రను తవ్వకూడదు. చరిత్రకు దానిదైన విలువ ఉంటుంది. చరిత్ర గతిలో గడిచిపోయిన విషయాలను కొన్నింటిని వర్తమానంలోకి తెచ్చినప్పుడు అవి మనం కోరే వ్యాఖ్యానాలు, ఫలితాలు మాత్రమే ఇవ్వవు. తేనెతుట్టెను కదిల్చి తేనెటీగలను ఒక వరుస క్రమంలో ఎగిరి వెళ్లమని కోరడం లాంటిది ఇది. సమాజంలో అన్ని మతాలకూ, వారి పవిత్ర స్థలాలకూ గౌరవం అవసరం. సామరస్యాన్ని కాపాడుకోవాలంటే విశ్వాసం విభజితం కాకుండా ఏకం కావాలని గుర్తించాలి. ఈ మతాతీత ప్రదేశాలు గౌరవం, ఐక్యతలకు సంబంధించిన స్థలాలుగా ఉండాలి.చదవండి: ఒక అపరిచితుడి దయగత రెండు సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ‘మేము కొన్ని పరిస్థితుల్లో ప్రకృతికి విరుద్ధంగా బాబ్రీ మసీదు సమస్యను లేవనెత్తాము. ఇప్పుడు ఆ సమస్య సమసిపోయింది. ఇప్పుడు మరలా ప్రతిరోజూ మసీద్–మందిర్ గొడవలు దేనికని? ఎందుకు అనవసర గొడవలు సృష్టిస్తు న్నారు? ప్రతీ మసీదులో శివలింగం ఉందని వాదించడం సరైనది కాదు. విధానం వేరైనప్పటికి మసీదుల్లో ముస్లింలు చేస్తున్నది కూడా దైవ ఆరాధనే. వారు మనవాళ్ళే, బయట నుండి ఏమి రాలేదు. ఇది అందరూ అర్థం చేసుకోండి’ అని చెబుతూనే వస్తున్నారు. కానీ, జరుగుతున్నది వేరు.సూఫీ సాధువు సమాధి కింద శివలింగం ఉందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవు. హింసను ప్రేరేపించడానికి అలాంటి కల్పనలను వదిలివేయాలి. భాగవత్ మాటలను గౌరవించమని హిందూ సోదరులకు విజ్ఞప్తి. అలాగే ముస్లిం సోదరులు కూడా సంయమనం పాటించాలి. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ కలిసి నడుద్దాం. భారతదేశ జెండాను ప్రపంచంలో ఉన్నత శిఖరాల్లోకి ఎగరవేద్దాం. మేరా భారత్ మహాన్ హై! జై హింద్!!- జహారా బేగంసామాజిక కార్యకర్త (ఇండియా/యు.ఎస్.ఎ) -
ఒక అపరిచితుడి దయ
ఒక మనిషి సాటి మనిషికి సాయానికి రాడని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ముక్కూ ముఖం తెలియని మనుషులు చేయందిస్తారు. అడక్కుండానే మనల్ని సమస్య నుంచి గట్టెక్కిస్తారు. అది ఎంత చిన్నదైనా సరే, ఆ సమయానికి పెద్ద సాయమే అవుతుంది. అయితే, అలాంటి మనుషులను మనం ఎంత నమ్ముతాం? చాలాసార్లు మనుషుల రూపాలను చూసి వాళ్ల గుణాలను అంచనా వేస్తుంటాం. కానీ మనుషులను చూపులతో అంచనా వేయలేం. అలాంటి సందర్భాలు మనకు చాలాసార్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇతరులకు సాయపడటం, ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలు ఎదురైనా అవి గుర్తుంచుకోవాల్సినవి కావు.అధికారికంగా దాని పేరు ‘లండన్ అండర్‌గ్రౌండ్’. కానీ అందరూ పిలిచేది ‘ట్యూబ్’ అని! అది నిజంగానే గొట్టం ఆకారంలోనే ఉంటుంది మరి! కానీ, సొరంగం నుంచి రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వస్తూండటాన్ని చూసినప్పుడు మాత్రం దాన్ని టూత్‌పేస్ట్‌తో పోల్చడం మేలని నాకు అనిపిస్తుంది. పదహారేళ్ల వయసులో మొట్టమొదటిసారి ట్యూబ్‌ను చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన కూడా ఇదే. విక్టోరియా స్టేషన్లో ఉన్నాను అప్పుడు నేను. అప్పుడే ఎయిర్పోర్ట్ వాహనం నుంచి కిందకు దిగాను. రెండు చేతుల్లో భారీ ట్రంకు పెట్టెలు. మీరు నమ్మినా నమ్మకపోయినా... ఆరోజు ఎయిరిండియా విమానం రెండు గంటలు ముందుగానే ల్యాండ్ అయ్యింది. నేను ఉండటానికి వెళ్తున్న నా సోదరి కిరణ్ కూడా దానికి ఆశ్చర్యపోయింది.తమ్ముడు సెలవుల కోసం అనుకోకుండా ప్రత్యక్షమవుతున్నాడన్న ఆనందం, షాక్ నుంచి కోలుకుంటూ ‘‘హీత్రూ నుంచి బస్సు పట్టుకో... బాండ్ స్ట్రీట్‌లో ట్యూబ్’’ అంటూ కిరణ్ తన ఇంటికి దారి చెప్పింది. ‘‘నేను ఆ పక్కన ఉంటా’’ అని ముగించింది.బాండ్ స్ట్రీట్ స్టేషన్ కిరణ్ ఆఫీసుకు దగ్గరలోనే ఉంటుంది. నాకైతే అప్పటికి లండన్ కొత్త. ఒకపక్క ఉత్సాహంగా ఉంది. ఇంకోపక్క కొంచెం ఉద్వేగంగానూ అనిపిస్తోంది. బాండ్ స్ట్రీట్ అన్నది మోనోపలి గేమ్‌లో కనిపించే పేరు. అక్కడున్న జనాలను చూస్తే మాత్రం అమ్మో ఇంతమందా? అనిపించక తప్పదు. అందరూ ఎవరి హడావుడిలో వారున్నారు. చాలామంది వ్యాపారాలు చేసుకునేవాళ్లనుకుంటా. ఒకరిద్దరు మాత్రం అక్కడక్కడా తచ్చాడుతూ కనిపించారు. బెల్‌బాటమ్ ప్యాంట్లు, పొడుచుకువచ్చినట్లు ఉన్న జుత్తుతో ఉన్న వాళ్లకు బూడిద రంగు ఫ్లానెల్స్, సరిగ్గా అమరని స్కూల్ బ్లేజర్‌తో ఉన్న నేను పరాయివాడినన్న విషయం ఇట్టే తెలిసిపోయేలానే ఉంది. వాతావరణం ఇలా ఉన్న సందర్భంలోనే... సొరంగం నుంచి ట్యూబ్ బయటకొస్తూ కనిపించింది. సొరంగంలో ఉండగానే వచ్చిన రణగొణ ధ్వని ట్యూబ్ వస్తున్న విషయాన్ని అందరికీ ఎలుగెత్తి చెప్పింది. శబ్దం వింటూనే చాలామంది ట్యూబ్ రాకను గుర్తించారు. సామన్లు సర్దుకుంటూ రైలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. నాకైతే అంతా కొత్త. పరిసరాలతో పరిచయమూ తక్కువే. ఏం చేయాలో తెలియకుండా అలా... చూస్తూనే ఉండిపోయా కొంత సమయం!ఎవరో గట్టిగా అరిచారు. ‘‘మిత్రమా... రా’’ అని! అప్పటికే రైలు తలుపులు తెరుచుకుని ఉన్నాయి. జనాలు లోపలికి చొరబడుతున్నారు. నేను మాత్రం నా రెండు ట్రంకు పెట్టెలతో ముందుకెళ్లేందుకు తంటాలు పడుతున్నాను. రెండింటినీ ఒక్కో చేత్తో పట్టుకున్నానా... హ్యాండ్‌బ్యాగ్ పట్టుకునేందుకు ఇంకో చేయి లేకుండా పోయింది. సర్దుదామనుకుంటే పెట్టెలు ఎత్తలేనంత బరువైపోతున్నాయి. ఈ లోపు పక్క నుంచి ఏదో గొంతు వినిపించింది... ‘‘ఒంటిచేత్తోనే చేయగలవు.’’ అంటూ. ‘‘రెండు, మూడు కావాలేమో’’ అని కూడా అనేసిందా గొంతు! యాభై ఏళ్లు పైబడ్డ వ్యక్తి మాటలు కావచ్చు అవి. చిందరవందర బట్టలేసుకుని ఉన్నాడు. తలపై టోపీ ఒకటి. గడ్డం కూడా సరిగ్గా గీసుకోలేదు. బహుశా కంపు కూడా కొడుతున్నాడేమో. మామాలుగానైతే ఆ వ్యక్తితో మాట్లాడేవాడిని కాదేమో. భవిష్యత్తులోనైతే అలాంటి వాళ్లకు దూరంగా జరిగిపోయేవాడినేమో. దిమ్మరి అనుకుని వారిని దూరం నుంచే కొనచూపుతో చూస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అలాంటివాళ్లపై నాకున్న అయిష్టం ఇట్టే తెలిసిపోతుంది మరి. అయితే ఆ రోజు నేను ట్యూబ్ ఎక్కేనాటి పరిస్థితి వేరు. కుర్రాడిని. సాయం అవసరం ఉంది. పొగరు ఇంకా తలకెక్కి లేదు. మరీ ముఖ్యంగా... ఆ మనిషి నా ట్రంకు పెట్టెలతోపాటు హ్యాండ్ లగేజీ కూడా లాక్కున్నాడు. ట్యూబ్‌లోకి చేర్చాడు. ఆ వెంటనే రైలు తలుపులు మూసుకున్నాయి. ఆ వ్యక్తి నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నోట్లో కొన్ని పండ్లు ఊడిపోయి ఉంటే... ఉన్నవి కూడా గారమరకలతో కనిపించాయి. ‘‘హమ్మయ్యా... ఎక్కేశాం’’ అన్నాడా వ్యక్తి! సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు నాకు. ఓ నీరసపు నవ్వు నవ్వి ఊరుకున్నాను. ‘‘చిటికెలో రైలు తప్పిపోయేది తెలుసా?’’ అన్నాడు. నాకేమో కొత్తవాళ్లతో మాట్లాడటమంటే భయం. అతడేమో ఒకట్రెండు మాటలతో సరిపెట్టేలా లేడు. మొత్తమ్మీద ఇద్దరి మధ్య కాసేపు మౌనమే రాజ్యమేలింది. రెండు స్టేషన్లు దాటిన తరువాత ఆ వ్యక్తి నా వైపు చూసి, ‘‘ఎక్కడికి మిత్రమా?’’ అన్నాడు. తలూపుతూ నా సమాధానం విన్నాడు. కిటికీల్లోంచి బయటకు చూడటం మొదలుపెట్టాడు. సొరంగం నల్లటి గోడలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు బయట! ఆ వ్యక్తి ఆ నల్లగోడలనే కళ్లప్పగించి మరీ చూస్తూ ఉండిపోయాడు.ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందా? అని నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. లగేజీ ఎలా దింపుకోవాలన్న ఆలోచన మెదడును తొలిచేస్తోంది. ఇంతలో బాండ్స్ట్రీట్ రానేవచ్చింది. పెట్టెలు సర్దుకుందామని అనుకునే లోపే ఆ వ్యక్తి వాటిని తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ‘‘చిన్న లగేజీలు నువ్వు తీసుకో’’ అన్నాడు. ‘‘నీ సైజుకు తగ్గవి’’ అని చతుర్లాడాడు కూడా. ప్లాట్‌ఫామ్ చివరి వరకూ నాకు తోడుగా వచ్చాడు. ‘‘వచ్చేశాం’’ అన్నాడు. ‘‘గుడ్ లక్’’ చెప్పాడు. వచ్చినంత వేగంగా వెనక్కు వెళ్లిపోయాడు. మేమొచ్చిన వైపే వెళ్లాల్సిన ట్యూబ్ కోసం వేచి చూడటం మొదలుపెట్టాడు.ఈ సంఘటన తరువాత నేను ఆ వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. అతడు చేసిన సాయానికి థ్యాంక్స్ అయినా సరిగ్గా చెప్పానో లేదో గుర్తు లేదు. కానీ లండన్ అండర్‌గ్రౌండ్‌లో నాకు ఎదురైనా మధురమైన అనుభూతుల్లో ఇదీ ఒకటిగా నిలిచిపోయింది. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇలా ఇతరులకు సాయపడటం ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలూ ఎదురవుతూంటాయి కానీ, వాటిని నేను గుర్తుంచుకోను. ఢిల్లీలోనూ మెట్రో భూగర్భ మార్గం పడుతున్న నేపథ్యంలో మనకూ ఇలాంటి అనుభవాలు బోలెడన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు చూసిన వెంటనే మనకు కలిగే ఇంప్రెషన్ తప్పు కావచ్చు అని చెప్పేందుకు ఉపయోగపడుతూంటాయి. చూపులతోనే మనిషిని అంచనా వేయలేమని చెబుతూంటాయి!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రపంచాన్ని నడిపించే సరికొత్త ఇంధనం
ఈవీలు కలకాలం నిలుస్తాయా? వీటికంటే మెరుగైన, పర్యావరణ హితమైన వాహనాలు వస్తాయా? చాలామందిని వేధించే ప్రశ్నలివి. ఆ ఇంధనం పెట్రోలు, డీజిళ్ల మాదిరి కాలుష్యాన్ని మిగల్చదు. ఈవీ బ్యాటరీల్లో మాదిరిగా లిథియం వంటి ఖరీదైన, అరుదైన ఖనిజాలు అస్సలు వాడదు. ఏమిటా అద్భుత ఇంధనం? అదే హైడ్రోజన్!మీకు తెలుసా? పెట్రోలు, డీజిల్ ఇంజిన్ల ద్వారా సుమారు 80 శాతం శక్తి వృథా అవుతోందని? లీటర్ పెట్రోలు లేదా డీజిల్ పోసి కారు నడిపితే 20–25 శాతం వరకు మాత్రమే ప్రయాణానికి ఉపయోగపడుతుంది. మిగి లిన 75–80 శాతం ఇంజన్లో ఆహుతి కాని ఇంధనం, వేడి పొగ రూపంలో పొగగొట్టం నుంచి బయటకు వెళ్లిపోతుంది.ఇంజిన్‌లో ఇంధనం మండటం వల్ల పుట్టే వేడి, దానిని చల్లార్చే కూలింగ్ వ్యవస్థ రూపంలో వృ«థా అవుతూంటుంది! విద్యుత్తు బ్యాటరీలు కాలుష్య కారక పొగలు కక్కవు కానీ... వీటి బ్యాటరీల తయారీకి మూడంటే మూడు దేశాల్లో ఉన్న లిథియంపై ఆధారపడాలి. పైగా ఇదే లిథియం మన స్మార్ట్ ఫోన్లతోపాటు ఈ కాలపు ఎలక్ట్రానిక్స్ అన్నింటి బ్యాటరీలకూ కావాలి. విద్యుత్తుతో నడిచే వాహనాలు పర్యావరణానికి మేలు చేసేవే అయినప్పటికీ ఛార్జ్ చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతూండటం, పూర్తిస్థాయిలో రీఛార్జింగ్ నెట్ వర్క్ లేకపోవడం వంటివి వీటి విస్తృత వినియోగానికి అడ్డుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్రోలు, డీజిల్, విద్యుత్తుల కంటే మెరుగైన, చౌకైన, సమర్థమైన ఇంధనం కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. హైడ్రో జన్ లభ్యత భూమండలం మీద అనంతం. ఒక లీటర్ (మంచి) నీటి నుంచి ఎలక్ట్రోసిస్ చర్య ద్వారా 1.2 లీటర్ల హైడ్రోజన్‌ను వేరు చేయవచ్చు. గాలి నుంచి కూడా తీసు కోవచ్చు.ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ కారు(పెట్రోలు + విద్యుత్తు) ‘ప్రియస్’ను తయారు చేసిన రికార్డు టయోటాదే. అలాగే అందరికంటే ముందు హైడ్రోజన్ ఫ్యుయెల్ సెల్ (అక్కడికక్కడ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే బ్యాటరీ లాంటిది) వాహనం ‘మిరాయి’ కూడా టయోటా సృష్టే. ఈ నేపథ్యంలోనే తాము విద్యుత్తు వాహనాల కంటే హైడ్రోజన్ వాహనాలకే ప్రాధాన్యమిస్తామని టయోటా ఛైర్మన్ అకిడో టయోడా ఇటీవల చేసిన ప్రకటన అందరి దృష్టినీ హైడ్రోజన్ పైకి మళ్లించింది. విద్యుత్తు వాహనాల వల్ల ఉపాధి కోల్పో తారని ఆందోళన చెందుతున్న కోట్లాదిమంది టెక్నీషిషన్లకు హైడ్రోజన్ ఇంధనం ఆ దుఃస్థితి రానివ్వదు.హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్ టెక్నాలజీతో ఎన్నో లాభాలున్నాయి. పెట్రోలు, డీజిళ్ల మాదిరిగా హైడ్రోజన్‌ను నిమిషాల వ్యవధిలో నింపుకోవచ్చు. చల్లటి వాతావరణ మైనా, విపరీతమైన వేడి ఉన్నా వాహనం నడపడంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. భారీ బ్యాటరీల అవసరం ఉండదు. బ్యాటరీ వాహనాల కంటే చాలా ఎక్కువ మైలేజీ వస్తుంది. ఫలితంగా భారీ ట్రక్కుల్లాంటివి దూర ప్రాంతా లకు నిరాటంకంగా ప్రయాణించవచ్చు. సౌర, పవన వంటి పునరుత్పత్తి ఇంధనాల సాయంతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తే పర్యావరణ కాలుష్యమూ గణనీయంగా తగ్గుతుంది. పెరిగిపోతున్న భూతాపాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశా లన్నీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేందుకు హైడ్రోజన్ పని కొస్తుంది. హైడ్రోజన్ ఇంధనంతో ఇప్పటికే జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇటలీ, యూకే, కెనడా, జపాన్, దక్షిణ కొరియా చైనా దేశాలు రైళ్లను నడుపుతున్నాయి. కొన్ని దేశాలు ప్రోటో టైపులను రూపొందించి త్వరలో పట్టాలెక్కేంచేందుకు సిద్ధమవుతున్నాయి. రైళ్లకు హైడ్రోజన్ ఇంధనం వాడటం వల్ల ఎలక్ట్రిక్ లైన్లు ఏర్పాటు, నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి.ఈ టెక్నాలజీని ఇప్పటికే నాసా అంతరిక్ష ప్రయో గాల్లోనూ విజయవంతంగా పరీక్షించారు. అంటే రోడ్లు, నీటిపై తిరిగే వాహనాలకు మాత్రమే కాకుండా... అంతరిక్ష ప్రయోగాల్లోనూ దీన్ని వాడే అవకాశాలు ఉన్నాయన్న మాట. భవిష్యత్తులో విమానాలు హైడ్రోజన్ ఇంధనంపైనే నడుస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో హైడ్రోజన్ సరుకు రవాణాకు, బ్యాటరీలు వ్యక్తిగత రవాణాకు పరిమిత మవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే... ప్రస్తుతా నికి హైడ్రోజన్ వాహనం ఉత్పత్తి ఖర్చు కొంచెం ఎక్కువే. కానీ... సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పుల కారణంగా 2030 నాటికి ఈ ఖర్చు సగమవుతుందనీ, ఆ వెంటనే విస్తృత వినియోగమూ పెరుగుతుందనీ హైడ్రోజన్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. హైడ్రోజన్ బాటన ప్రపంచం గత ఏడాది ప్రపంచ హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్ అమ్మకాలు 30 శాతం వరకూ పెరిగాయి. ఈ రంగం విలువ 2022 నాటికే రూ. 1.08 లక్షల కోట్లకు చేరుకోగా 2030 నాటికి రూ. 3.32 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే కొరియా, జపాన్‌లతో పాటు యూరోపియన్ యూని యన్ కూడా హైడ్రోజన్ వాహనాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెట్రోలు బంకుల మాదిరిగానే హైడ్రో జన్ బంకుల్లాంటివి వందల సంఖ్యలో ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. కొరియాలో 2040 నాటికి 1,200 బంకుల ఏర్పాటుకు ప్రయత్నిస్తూండగా జపాన్ 2030 నాటికే ఎనిమిది లక్షల వాహనాలు, 900 రీఫ్యుయలింగ్ స్టేషన్ల కోసం ఏర్పాట్లు చేస్తోంది. యూరోపియన్ యూని యన్ 2050 నాటికల్లా ఐదు లక్షల హైడ్రోజన్ ట్రక్కులు ఉత్పత్తి చేసే దిశగా అడుగులేస్తోంది. ఆ యా దేశాల ప్రభు త్వాలే కాకుండా... ప్రైవేట్ రంగం కూడా చురుకుగా హైడ్రోజన్ మార్కెట్లోకి ప్రవేశిస్తూండటం గమనార్హం. టయో టాతో పాటు హ్యుండయ్, హోండా, బీఎండబ్ల్యూ, మెర్సి డిస్, ఫోర్డ్ వంటి దిగ్గజ వాహన కంపెనీలు కూడా హైడ్రోజన్ టెక్నాలజీలో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్న కారణంగా ఇంకొన్నేళ్లలోనే ఈ ఇంధనం ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుందని అంచనా. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మృత్యుకుహరంగా మహానగరం
‘కాలుష్యం రేపటి తరాలకు శాపం’ అన్నది ఒకప్పటి మాట. నేటి పరిణామాలు గమనిస్తే రేపు కాదు, నేడే ప్రాణాంతకంగా మారింది. అందుకు ఉదాహ రణ దేశ రాజధాని న్యూఢిల్లీ. ఒకప్పుడు ప్రపంచంలోనే అందమైన, ఆహ్లాదకర నగరాలలో ఒకటి. దశాబ్ద కాలం పైబడి మానవ తప్పిదాలు, ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా కాలుష్య కాసారంలో పడి మానవ మనుగడ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిజానికి దేశంలోని అన్ని పెద్ద నగరాలూ ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. వాయుకాలుష్యాన్ని పర్యావరణ సమస్యగానే పరిగణించకుండా, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశంగా చూసి, దాన్నుంచి బయటపడిన కొన్ని దేశాల అనుభవాలు మనకు ఆచరణీయం. కావాల్సిందల్లా తక్షణ నివారణ చర్యల్ని అమలు చేయగలిగే చిత్తశుద్ధి.ఎక్కడైనా గాలి నాణ్యత స్థాయి (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) 50 నుంచి 100 వరకు ఉంటేనే ఆరోగ్యకరంగా ఉన్నట్టు! దేశంలోని అనేక పట్టణాలు, నగరాలలో ఇది 150 దాటుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరులలో ఏక్యూఐ ప్రమాద ఘంటిక లను మోగిస్తోంది. హైదరాబాద్‌లో ప్రస్తుత ఏక్యూఐ సగుటన 130గా నమోదవుతోంది. ఊపిరాడేనా?ఢిల్లీలో నవంబర్ రెండో వారం నాటికి ఏక్యూఐ 467 పాయింట్లకు చేరింది. అక్కడి జహంగీర్‌పూర్‌లో అయితే ఏకంగా 567 పాయింట్లు నమోదైంది. ఊపిరాడని కాలుష్య తీవ్రతకు తోడుగా శీతకాలంలో వచ్చే పొగమంచు ఢిల్లీ ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిల్లీ రన్‌వేపై 400 మీటర్ల తర్వాత ఏముందో కనిపించనంతగా దృశ్య గోచరత (విజిబిలిటీ) తగ్గిపోవడంతో, పలు విమానాల సర్వీసుల్ని రద్దు చేశారు. ఢిల్లీకి వెళ్లే, ఢిల్లీ నుంచే బయలుదేరే రైళ్ల రాక పోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలోని అన్ని స్కూళ్ల ప్రైమరీ క్లాసుల్ని ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. రోడ్ల మీద పెట్రోల్, డీజిల్ వాహనాల రాకపోకలను నిలిపివేసి, కేవలం విద్యుత్, సీఎన్‌జీలతో నడిచే వాహనాలనే అనుమ తిస్తున్నారు. ప్రజారవాణా తప్ప సొంత వాహనాలలో బయటకు వెళ్లే అవకాశం లేని దయనీయ దుఃస్థితి ఏర్పడింది. ఒక్క సమస్య పలు ఇతర సమస్యలకు పుట్లిల్లు అవుతుందని ఓ సామెత. దశాబ్దకాలంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలను వేధిస్తూ వస్తున్న వాయు, నీటి కాలుష్యాలు అనేక అనర్థాలకు దారితీశాయి. వాటిని పరిష్కరించక పోవడం వల్లనే నేడు కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం, భవితవ్యం ప్రశ్నార్థకంగా మారాయి. ఇప్పటికే వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో స్థిర నివాసం ఉంటున్న ప్రజలలో చాలామందికి శ్వాసకోశ సమస్యలు మొదలుకొని క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. నిజానికి, ఢిల్లీ వాయుకాలుష్యంపై అనేక సందర్భాలలో సర్వోన్నత న్యాయస్ధానం జోక్యం చేసుకోవడంతోనే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలనైనా చేపట్టాయి. ఈ అరకొర చర్యలు ప్రజానీకాన్ని రక్షించగలవా?విదేశాల అనుభవాలుప్రపంచంలోని అనేక నగరాలు ఏదో ఒక సమయంలో కాలుష్యం బారిన పడినవే. పరిశ్రమల ఏర్పాటు, భవన నిర్మాణాలు ముమ్మరం కావడం, పట్టణీకరణ పెరగడం తదితర అంశాల వల్ల వాయు, నీటి కాలుష్యాలు అన్నిచోట్లా తీవ్రస్థాయికి చేరాయి. 1952లో లండన్ నగరాన్ని కాలుష్య భూతం కాటేసింది. ‘గ్రేట్ స్మాగ్’ అని పిలిచే ఆ ఉత్పా తానికి 1,200 మంది బలయ్యారు. దాంతో, 1956లో బ్రిటిష్ ప్రభుత్వం ‘క్లీన్ ఎయిర్ యాక్ట్ 1956’ తెచ్చి కఠినంగా అమలు చేసింది. లండన్ నగరంలోని అన్ని పరిశ్రమలనూ సుదూర ప్రాంతా లకు తరలించింది. నగరంలోని ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి పరిచి పచ్చదనం పెంచింది. అలాగే, 2008లో ‘బీజింగ్ ఒలింపిక్స్’ నిర్వహించిన చైనా ప్రభు త్వానికి కూడా వాయుకాలుష్యం సవాలు విసిరింది. భారీ నిర్మాణాలు చేపట్టిన ఆ సందర్భంలో, గాలి నాణ్యత తగ్గకుండా చైనా ప్రభుత్వం అన్ని రకాల పరిశ్రమలనూ దూర ప్రాంతాలకు తరలించింది. వాహ నాలను క్రమబద్ధీకరించడమేకాక, ప్రజా రవాణాను ఉపయోగించుకొనేలా ప్రజలను సమాయత్తం చేసింది. బీజింగ్‌లో వాయు కాలుష్యం తగ్గాక, అక్కడి ప్రజల ఆయుర్దాయం సగటున నాలుగేళ్లు పెరిగిందని చైనా ప్రభుత్వం వెల్లడించింది. పారిశ్రామికంగా ఎంతో ముందంజ వేసిన అమెరికా, మెక్సికో, జపాన్‌లు ఒకప్పుడు వాయుకాలుష్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ, వేగంగా ఆ సమస్య నుండి బయటపడ్డాయి. ప్రభుత్వం, ప్రజలు ఉమ్మడిగా ఆ సమస్యను ఎదుర్కొన్న తీరు అనన్య సామాన్యం. వాయు కాలుష్యాన్ని ఆ ప్రభుత్వాలు కేవలం పర్యావరణ సమస్యగానే పరిగ ణించలేదు, ప్రజారోగ్యానికి సబంధించిన అంశంగా చూశాయి. ప్రభు త్వంలోని అన్ని శాఖలు సమీకృతంగా సమస్యను ఎదుర్కోవడానికి కృషి చేశాయి. అటువంటి రోడ్ మ్యాప్ మన దేశంలో లేకపోవడంతోనే ‘ఇంతింతై వటుడింతౖయె...’ అన్నట్లు కాలుష్య సమస్య పెనుభూతంగా మారింది. పారిశ్రామిక వ్యర్థాలు, వాహనాలు వెలజల్లే కార్బన్ డయాక్సైడ్, భవన నిర్మాణాల కారణంగా గాలిలో కలిసే ధూళి;ఎండిన చెట్లు, చెత్తా, చెదారాలన్నింటినీ తగల బెట్టడం ద్వారా వచ్చే పొగ... ఇవన్నీ వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఢిల్లీకి పక్కనే ఉన్న యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలను విచ్చలవిడిగా వదలడంతో ఆ ప్రాంతం పూర్తిగా కలుషితమైంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న హరియాణా, పంజాబ్ రాష్ట్రాలలో ప్రతి వ్యవసాయ సీజన్ ముగి శాక పంట వ్యర్థాలను కాల్చడంతో... దట్టమైన పొగలు కమ్మేస్తు న్నాయి. వీటికితోడు దీపావళి, కొన్ని వివాహ వేడుకల సందర్భంగా వినోదం కోసం టపాసుల్ని పేల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఇవి కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.ప్రభుత్వాల ముందున్న కర్తవ్యంఢిల్లీని పీడిస్తున్న వాయుకాలుష్యం చాలావరకు స్వయం కృతమే. ఢిల్లీ పరిధిలో 9,000 హోటళ్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున బొగ్గు ఉపయో గిస్తున్నట్లు తేలింది. తందూరీ వంటకాలు చేసే హోటళ్లు బొగ్గును వాడుతున్నాయి. వంటకు గ్యాస్ బదులు కట్టెలు, వ్యవసాయ వ్యర్థాలు, పిడకలు వాడుతున్నవారి సంఖ్య ఢిల్లీలో దాదాపు 20 లక్షలు ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో రోజుకు సగటున 500 టన్నుల మునిసిపల్ సాలిడ్ వేస్ట్ (ఇళ్ల నుంచి సేకరించే వ్యర్థాల)ను కాలు స్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు, నిర్మాణ స్థలాల్ని పూర్తిగా కవర్ చేయడం; సిమెంట్, ఫ్లయ్ యాష్వంటి నిర్మాణరంగ మెటీరియల్స్‌ను కప్పి ఉంచడం తప్పనిసరిగా చేయాల్సి ఉన్నప్పటికీ... ఆ నిబంధనల్ని చాలావరకు పాటించడం లేదు. చమురు శుద్ధి ప్లాంట్ల నుంచి ప్రాణాంతకమైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వెలువడుతుంటాయి. వీటిని నిరోధించే టెక్నాలజీని అమెరికా, చైనా ఉపయోగిస్తుండగా మనకు అందుబాటులోకి రాలేదు. కాలుష్యాన్ని ఎక్కువ వెదజల్లే పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్యను అభివృద్ధి చెందిన దేశాలు 30 శాతానికి తగ్గించాయి. అధునాతన ఫిల్టర్లను ఉపయోగిస్తూ వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాయి. చాలా దేశాలలో పంట వ్యర్థాలను తగులబెట్టకుండా వాటిని బయోగ్యాస్ ఉత్పత్తికి, పశువుల దాణాకు వాడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నింపేటప్పుడూ(అన్లోడింగ్), వాహనాల్లో ఇంధనం పోసేటప్పుడూ గాలిలో ప్రమాదకర ఆర్గానిక్ వ్యర్థాలు కలుస్తాయి. చాలా దేశాలలో ఇంధనం లోడింగ్, అన్లోడింగ్ సమ యాలలో ‘వేపర్ రికవరీ సిస్టవ్‌ు’ టెక్నాలజీని ఉపయోగిస్తూ దీన్ని నివారించగలుగుతున్నారు.ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్య భూతం మాటేసిన మృత్యు వులా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల భాగస్వామ్యంతో యుద్ధ ప్రాతిపదికన తక్షణ నివారణ చర్యల్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. లేకుంటే, దేశ రాజధాని ఆరోగ్య భద్రతను కాపాడు కోలేకపోతోందనే అపప్ర«థ ప్రభుత్వంపై పడుతుంది. అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు -
ఇక ఎయిడ్స్‌కు చరమగీతం!
ఒకప్పుడు మశూచి వ్యాధి బారిన పడి లక్షలమంది మరణించేవారు. అలాగే ప్లేగ్ వ్యాధితో కూడా! అలాంటి భయంకరమైన రోగాలు ఇప్పుడు కలికానికి కూడా లేవు. దీనికి కారణాలు ఆ రోగాలను మట్టుబెట్ట డంలో జరిగిన నిరంతర కృషి.1980వ దశకంలో ఎయిడ్స్ అంటే మరణం. దీని బారిన పడినవారు బతికి ఉన్నా, చచ్చినవారితో సమానం అన్నట్టుగా సమాజం పరిగణించిన రోజులు అవి. హెచ్ఐవీ పాజిటివ్ అని తెలియ గానే గుండెలో బండ పడినట్లే భావించి మానసికంగా మరణా నికి చేరువయ్యేవారు. ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్ర దేశాలు కూడా విలవిలలాడి పోయాయంటే అప్పట్లో ఈ వ్యాధి కలిగించిన భయోత్పాతాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఆనాటి ముఖచిత్రం. ఈనాడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మందే లేదనుకున్న ఈ వ్యాధికి తగిన మందులు లభిస్తున్నాయి. ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే! ఎయిడ్స్‌కు గురి కాకుండా ఎలాగూ కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిందని తెలిసినా, 72 గంటల లోపు పోస్ట్ ప్రొఫలాక్సిస్ మందులు వాడి దాని బారి నుంచి బయటపడవచ్చు. తొమ్మిదేళ్ల క్రితమే క్యూబాలో హెచ్ఐవీ ఎయిడ్స్, సిఫిలిస్ వ్యాధులను పూర్తిగా తుడిచి పెట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎయిడ్స్ గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని, గట్టిగా ప్రయత్నిస్తే, మొత్తం ప్రపంచానికి ఎయిడ్స్ నుంచి విముక్తి కలిగించవచ్చనే గట్టి సందేశాన్ని ఆ దేశం ప్రపంచ దేశాలకు పంపింది. ఎయిడ్స్ పాజిటివ్ దంపతులు నేడు చికిత్స తీసుకొని, ఆ వ్యాధి లక్షణాలు లేని, ఆరోగ్యవంతమైన పిల్లలను కనవచ్చు. హెచ్ఐవీ పాజిటివ్ వాళ్ళు... ఆ వ్యాధి సోకని వాళ్ళను నిక్షేపంగా వివాహం చేసు కొని, ఎలాంటి భయ సంకోచాలూ లేకుండా హాయిగా కాపు రాలు చేసుకోవచ్చు. అనేక శాస్త్రీయ పరిశోధనల పుణ్యమా అని అలాంటి చికిత్సా పద్ధతులు, ఈనాడు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. బీపీ, షుగర్ బాధితులు అతి తక్కువ ఖర్చుతో ప్రతి రోజూ క్రమం తప్పకుండా మాత్రలు వాడుతూ ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపున్న మాదిరిగానే, ఎయిడ్స్ రోగులు కూడా 30 రూపాయలు ఖరీదు చేసే ఒక్క మాత్రను క్రమం తప్పకుండా రోజూ వేసుకుంటూ, తగు విశ్రాంతి, పోషకా హారం తీసుకుంటూ క్రమశిక్షణతో జీవితం గడిపితే, 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవించవచ్చు. ఈ విషయాన్ని ప్రఖ్యాత వైద్య జర్నల్ ‘లాన్ సెట్’, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం, పలు అధ్య యన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.వైద్యపరంగా ఇంతటి భరోసా లభిస్తున్నా, ఎయిడ్స్ రోగులు మానసికమైన భయాందోళనలతో చికిత్సకు దూరంగా ఉంటూ అల్లాడిపోతున్నారు. రోజువారీ వాడాల్సిన మాత్రలు తమ దగ్గర ఉంటే పక్కవారికి తెలిస్తే, పరువు పోతుందనే భయంతో సక్రమంగా వాడకుండా కోరి ప్రమా దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంత ప్రగతి సాధించినా ఇప్పటికీ సామాన్యులే కాక, విద్యాధికులైన హెచ్ఐవీ రోగులు కూడా అపోహలు, మూఢ నమ్మకాలతో శాస్త్రీయంగా ఎలాంటి నిర్ధారణ కాని పొడులు, కషాయాలతో వ్యాధిని మరింత ముదరబెట్టుకొంటున్నారు. కొందరు పాము విషం తీసుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుందనే ప్రచారాలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ ఒకటవ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినం కోసం ‘అందరం కలసి శ్రమిద్దాం– ఎయిడ్స్‌ను నిరోధిద్దాం‘ అన్న నినాదాన్ని ప్రకటించింది. 2030 నాటికి ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని సృష్టించడానికి, ఆధునిక చికిత్సా పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంచాలని సంకల్పించింది. హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నూటికి నూరుపాళ్ళు నివారించే వీలున్న వ్యాధి కనుక నిరంతరం దీనిపై ప్రజల్లో అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఆత్మహత్యల నిరోధానికి కౌన్సెలింగ్ ఇస్తున్న తరహాలోనే ప్రజలకు అందుబాటులో ఎయిడ్స్ కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక టోల్ ఫ్రీ నంబరుతో రోగులకు, సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం చేపడితే మరిన్ని సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తామెవరు అన్నది పైకి తెలిసే అవకాశం ఉండదు కనుక రోగులు నిర్భయంగా, ఎలాంటి సంకోచమూ లేకుండా వైద్యులను సంప్రతించి సక్రమంగా చికిత్స తీసుకునే వీలుంటుంది. నిర్మూలనకు మంచి అవకాశాలు ఉన్న ఎయిడ్స్ వ్యాధి ముప్పును ప్రపంచానికి పూర్తిగా తప్పించాలంటే కలసికట్టు కృషి అవసరం. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పరస్పర సహకారంతో ప్రజల్లో, ప్రత్యేకించి ఎయిడ్స్ బాధితుల్లో చక్కటి అవగాహన కల్పించే ప్రయత్నాలు నిరంతరం చేయగలిగితే... మశూచి, ప్లేగు వ్యాధుల మాదిరిగానే అతి త్వరలోనే ఎయిడ్స్ అనే భయంకర రోగాన్ని ప్రపంచం నుంచి తరిమివేయడం అసాధ్యం ఏమీ కాదు. అలాంటి శుభ దినం త్వరలోనే రాగలదని ఆశిద్దాం. డా‘‘ కూటికుప్పల సూర్యారావు వ్యాసకర్త ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ సభ్యులు ‘ 93811 49295(నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం) -
ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యు.బి.టి.) రాయని డైరీ
శరద్ పవార్, నేను, నానా పటోలే ఒక దగ్గర కూర్చొని ఉన్నాం. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్‌జీ హఠాత్తుగా! 83 ఏళ్ల వయసులో కూడా ఆయన, మెలకువలోంచి కళ్లు తెరిచినట్లుగా... హఠాత్తుగా, ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం’’ అనే ప్రశ్న వేయగలిగారంటే అది ఆయనలోని తరగని రాజకీయ చైతన్యానికి ఒక స్పష్టమైన సంకేతమనే అనుకోవాలి. ఎక్కడ కూర్చొని ఉన్నామో చెప్పబోయాన్నేను. ‘‘ఉద్ధవ్జీ! మీరాగండి నేను చెబుతాను’’ అన్నారు నానా పటోలే!! విస్మయంగా ఆయన వైపు చూశాను. ‘‘సరే, మీరే చెప్పండి నానాజీ’’ అన్నాను. నానాజీ ఏం చెప్పినా – మేము కూర్చొని ఉన్నది ముంబై హెర్డియా మార్గ్‌లోని ఎన్సీపీ పార్టీ ఆఫీసు తప్ప మరొకటి అవటానికి లేదు. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నామంటే శరద్‌జీ... సరిగ్గా ఒక పరాజయ పీఠం మీద! అది కూడా ముగ్గురం సర్దుకుని కూర్చున్నాం...’’ అన్నారు నానాజీ!అంటే... ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్. ‘‘మీరేమంటున్నారు నానాజీ, కలిసి పోటీ చేయటం వల్ల మన మూడు పార్టీలు ఓడిపోయాయనేనా?’’ అన్నాను. ‘‘ఉద్ధవ్జీ... అక్కడ బీజేపీ కూటమిలో శివసేన ఉంది, ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ శివసేన ఉంది. అక్కడ బీజేపీ కూటమిలో ఎన్సీపీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ ఎన్సీపీ ఉంది. అయినప్పటికీ వాళ్లే ఎందుకు గెలిచారో తెలుసా?’’ అన్నారు నానాజీ. ‘‘కానీ నానాజీ, మనమిక్కడ కూర్చున్నది వాళ్లెందుకు గెలిచారు అని కాక, మనం ఎందుకు ఓడిపోయామో ఒకర్నుంచి ఒకరం తెలుసుకోటానికి కదా...’’ అన్నాను. ‘‘అదే అంటున్నాను ఉద్ధవ్జీ... వాళ్లెందుకు గెలిచారో తెలిస్తే, మనమెందుకు ఓడిపోయామో తెలుస్తుంది. పోనీ, మీరన్నట్లు మనం ఎందుకు ఓడిపోయామో తెలుసుకుంటే వాళ్లెందుకు గెలిచారో తెలుస్తుంది కానీ, వాళ్ల గెలుపుతో మనకు పనేమిటి? మన ఓటమి గురించి మనం ఆలోచించాలి కానీ...’’ అన్నారు నానాజీ!ఆలోచనలో పడ్డాన్నేను. గెలుపోటములు అన్నవి రెండు భిన్నమైన స్థితులా లేక, పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే పరిస్థితులా?‘‘సరే చెప్పండి నానాజీ! వాళ్లెందుకు గెలిచారని మీరు అనుకుంటున్నారు?’’ అన్నాను. ‘‘గెలవకుండా ఎలా ఉంటారు ఉద్ధవ్జీ! ‘విడిపోతే దెబ్బతింటాం. కలిసుంటే భద్రంగా ఉంటాం’ అని కదా వాళ్ల నినాదం. అది పట్టేసింది మహారాష్ట్రా వాళ్లకు, మహారాష్ట్రలో ఉండే గుజరాతీలకు; ఇంకా... హిందువులకు, ముస్లిములకు! పైకే నినాదం. లోపల అది బెదిరింపు. ఓట్లు విడిపోతే పాట్లు తప్పవని...’’ అన్నారు నానాజీ. ‘‘అందుకే ఓడామా మనం?’’ అన్నాను. ‘‘కాదు’’ అన్నారు. ‘‘మరి?’’ అన్నాను. ‘‘శివసేన నుంచి శివసేన, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయి, ఒకదాన్ని ఒకటి ఓడించాయి. రెండూ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాయి’’ అన్నారు నానాజీ... ‘మీతో కలిసి మేం దెబ్బతిన్నాం’ అనే అర్థంలో!!నేను మౌనంగా ఉండిపోయాను. నానాజీ కూడా కాసేపు మౌనం పాటించారు. ‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్‌జీ హఠాత్తుగా!అప్పుడు గానీ... ఆయన్ని పట్టించు కోకుండా మేమిద్దరమే చాలాసేపటిగా మాట్లాడుకుంటూ ఉన్నామన్న సంగతి మాకు స్పృహలోకి రాలేదు!‘ఎక్కడ కూర్చొని ఉన్నాం’ అనే తన ప్రశ్నకు, ‘‘పరాజయ పీఠం’’ మీద అన్న నానాజీ జవాబు ఆయన్ని సంతృప్తి పరిచే ఉండాలి. లేకుంటే – ‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అనే కొనసాగింపు ప్రశ్న వేసి ఉండేవారు కాదు శరద్‌జీ. -
మూగబోయిన దళితుల గొంతుక
పది రోజుల క్రితం మరణించిన వి.టి.రాజశేఖర్ మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే దళితవాదం వైపు మళ్లారు. ఒక కన్నడ అగ్రకుల శూద్ర శెట్టి అయినప్పటికీ దళితుల కోసం అదే పేరుతో(దళిత్ వాయిస్) ఒక పత్రికను స్థాపించారు. దానివల్ల సామాజిక ఒంటరితనాన్ని అనుభవించారు. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. చివరివరకూ దళిత ఉద్యమకారులకు, రచయితలకు అండగా నిలిచారు. దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించిన ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.2024 నవంబర్ 20న 93 సంవత్సరాల వయస్సులో వి.టి.రాజశేఖర్ మరణం, ఒక కోణంలో నన్ను తీవ్రంగా బాధించినప్పటికీ, మరో కోణంలో ఆయన జీవితాన్నీ, వారసత్వాన్నీ వేడుకగా జరుపుకొనే వీలు కల్పించింది. ఆయన భారతదేశ వ్యాప్తంగానూ, దేశం వెలుపలా కూడా ఉన్న నాలాంటి ఉద్యమకారులకు, రచయితలకు ధైర్యం, విశ్వాసం కలిగించిన స్నేహితుడూ, మార్గదర్శకుడూ! ఆయన వల్లే నా పుస్తకం ‘నేను హిందువు నెట్లయిత’ (వై ఐ యామ్ నాట్ ఎ హిందూ)కు 2008లో ‘లండన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా’(లీసా) అవార్డు వచ్చింది. వెస్ట్‌మినిస్టర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ (బ్రిటిష్ పార్లమెంట్)లో నా ఉపన్యాసం తర్వాత జరిగిన అవార్డు వేడుకకుఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. మేము లండన్‌లో ప్రపంచ రాజ కీయాల గురించి చర్చించుకుంటూ, కలిసి భోజనం చేస్తూ విలువైన సమయం గడిపాము.ఆయన, ఆయన పత్రిక గురించి నాకు తెలియకముందే, ఒక చక్కటి సమీక్ష రాసి, నా పుస్తకానికి తన ‘దళిత్ వాయిస్’ పాఠకులలో ప్రాచుర్యం కలిగించారు. ఆయన భిన్నాభిప్రాయాలకు సంబంధించిన విషయాలపై వెంటనే తగాదాకు తెరతీయగల వ్యక్తి, కానీ అదే సమయంలో విషయాలు ఆమోదయోగ్యమైన స్థానాలకు మారిన ప్పుడు స్నేహాన్ని పునరుద్ధరించగల వ్యక్తి. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో పని అనుభవంతో, దృఢమైన పాత్రికేయ నేపథ్యంతో, బంట్ అని కూడా పిలువబడే కన్నడ శెట్టి సంఘం నుండి వచ్చిన వి.టి. రాజశేఖర్‌కు దళిత విముక్తిపై ఉన్న తిరుగులేని వైఖరి నిజంగా విశేషమైనది. చనిపోయే వరకు ఆయన దళితవాద నిబద్ధతతోనే ఉన్నారు. ఆయన తరాన్ని అలా ఉండనివ్వండి, అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.‘దళిత్ వాయిస్’ని ప్రారంభించిన తర్వాత తన మధ్యతరగతి ఉన్నత కుల స్నేహితులందరినీ కోల్పోయానని ఆయన చెప్పారు.బెంగళూరులోని తన సొంత ఇంటి నుండి ఆ పత్రిక రచన, ముద్రణ, పంపిణీని ఒంటరిగా నిర్వహించారు.మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే ఆయన దళితవాదం వైపు మళ్లారు. అప్పట్లో అంబేడ్కర్ అనంతర దళితులకు ఇంగ్లిష్ చదవడం, రాయడానికి సంబంధించిన పాండిత్యం లేదు. దళిత్ పాంథర్ మరాఠీ సాహిత్య ఉద్యమం కారణంగా దళిత్ అనే పదం కొన్ని మీడియా సర్కిళ్లలో మాత్రమే గుర్తించబడుతోంది.ఆయన కూడా ఒక రిపోర్టర్‌గా బొంబాయి నగరంలో ఉన్నందున, ఏకంగా ఒక పత్రికను ప్రారంభించడం ద్వారా ‘దళిత’ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలోని ప్రాముఖ్యతను వెంటనే అర్థం చేసు కున్నారు. కానీ ఒక కన్నడ అగ్ర కుల శూద్ర శెట్టికి ఆ నిర్ణయం తీసుకోవడం, పర్యవసానంగా సామాజిక ఒంటరితనాన్ని ఎదుర్కో వడం, ముఖ్యంగా తన జర్నలిస్టు సర్కిళ్లలో ఒక హింసాత్మక ప్రక్రియ అయి ఉండాలి!ఒక లాభదాయకమైన జర్నలిస్టు ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఆ శీర్షికతో ఆంగ్ల పత్రికను ప్రారంభించడం మండల్‌కు ముందటి పరిస్థితుల్లో ఊహించుకోండి. 2024 లోనే దళిత, ఓబీసీ, ఆదివాసీలకు చెందిన జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ ఒక జాతీయ మీడియా సమావేశంలో ప్రశ్నించగా, అందులో ఎవరూ చేయి ఎత్తలేదు. అది కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ నేత, విదేశీ మీడియా సమక్షంలో... ఇదీ పరిస్థితి! దేశంలోని ప్రముఖ మీడియాలో ఉన్న ఆంగ్ల బ్రాహ్మణ జర్నలిస్టు కులతత్వపు వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన ఒంటరి శూద్రుడు వీటీ రాజశేఖర్ అయివుండాలి! ప్రధాన స్రవంతి మీడియాలోని కులతత్వం కారణంగా ఆయన నిరాశతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. తన ప్రత్యర్థులతో పోరాడేందుకు రాడికల్ దళిత్ జర్నల్ను ప్రారంభించానని నాకు చెప్పారు.ఆయన భారతదేశంలోని అగ్రవర్ణ జర్నలిజంతో ఎప్పుడూ రాజీ పడలేదు. దళిత్ వాయిస్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన కథనాలు ఏ జాతీయ ఆంగ్ల వార్తాపత్రికలోనూ కనిపించలేదు. భారతీయ మీడియా గురించి చర్చ జరిగినప్పుడల్లా ఆయన దాని కులతత్వాన్ని దుయ్యబట్టేవారు. అగ్ర కులాల భారతీయ వార్తాపత్రికలన్నీ ‘టాయి లెట్ పేపర్లు’ అనేవారు. నేను జాతీయ వార్తాపత్రికలలో రాస్తున్నానని తెలుసుకున్నప్పుడు, ఆయన నాతో ‘మీ ఆలోచనలను అగ్రవర్ణాల వారికి అమ్మవద్దు, వారు మారరు’ అన్నారు. వాస్తవానికి నేను చిరునవ్వుతో దానిని అక్కడే వదిలేశాను. ఎందుకంటే ప్రధాన స్రవంతి మీడియాలో వీలైనంత ఎక్కువగా పాల్గొనాలనీ, రాయాలనీ నేను నమ్ముతాను. అలాంటి విభేదాలు ఉన్నప్పటికీ ఆయన చనిపోయే వరకు మా స్నేహం ఆప్యాయంగా కొనసాగింది.దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించి ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. దళితుల కంటే ఓబీసీలు ఆర్ఎస్ఎస్/బీజేపీతో కలిసి వెళ్తారని ఆయన అన్నారు. ఆయన ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. తన పాకిస్తాన్ పర్యటనల కారణంగా కొంతకాలం పాటు ఆయన వీసా రద్దు చేయబడింది. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. యూదులకు వ్యతిరేకంగా పదే పదే వ్యాసాలు రాశారు.తన జీవితం చివరి రోజుల్లో ఆరోగ్య కారణాల వల్ల బెంగళూరు నుండి మంగళూరుకు మారిన తర్వాత ఆయన మౌనం మరింత పెరిగింది. అయినప్పటికీ, తన 80వ దశకం చివరి వరకూ ప్రయాణిస్తూనే ఉన్నారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్యకు వ్యతిరేకంగాజరిగిన నిరసన సభకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు నేను చివరిసారిగా ఆయనను కలిశాను. దురదృష్టవశాత్తు క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి ఆయనను అనుమతించలేదు. అయినప్పటికీ గేటు వద్ద చాలాసేపు నిల్చొని నిరసన తెలిపారు. అది దళితుల పట్ల ఆయనకున్న నిబద్ధత.ఆయన ఎప్పుడూ ఖాదీ కుర్తా, పైజామా ధరించే వ్యక్తి. ఒక సాధారణ కన్నడ కాంగ్రెస్ రాజకీయ నాయకుడిలా కనిపిస్తారు. కానీ ఆయన నిజమైన మతం మారిన దళిత మేధావి.ఈ సంవత్సరం ప్రారంభంలో పాల్ దివాకర్ బృందం ‘దళిత్ వాయిస్’ను డిజిటలైజ్ చేశారు. ఆ వెబ్సైట్ ప్రారంభోత్సవానికిబెంగళూరు ఇండియన్ సోషల్ ఇన్ స్టిట్యూట్‌కు నన్ను ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను వెళ్ళలేకపోయాను. అయితే ఈ లెజెండరీ దళితుడు జీవించి ఉన్నప్పుడే అది జరిగింది.శూద్ర అగ్రవర్ణం నుండి దళితవాదంలోకి మారి, వారి విముక్తి కోసం తన జీవితాంతం పోరాడగలిగే మరో రాజశేఖర్ ఉద్భవిస్తాడని అనుకోలేము. ఆయన దళిత్ వాయిస్ పత్రిక ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికాలో, అనేక ముస్లిం దేశాలలో ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలోని అత్యంత అణగారిన ప్రజల విముక్తి కోసం బతికిన ఆయన ఇంత సుదీర్ఘ జీవితం తర్వాత ఈ భూమిని విడిచి పెట్టారు. కాబట్టి, మనం కూడా జీవించి ఉన్నంత కాలం వీటీ రాజ శేఖర్ జీవితాన్ని, ఆలోచనలను, రచనలను వేడుకగా జరుపుకోవాలి. గుడ్ బై వీటీఆర్.-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ దిశగా అడుగులు!
కనీస మద్దతు ధరల చట్టం... దశాబ్దాలుగా రైతులు కంటున్న కల! ప్రపంచంలో గుండు సూది నుంచి విమానం వరకు ఏ వస్తువు కైనా ధరను నిర్ణయించే అధికారం వాటిని ఉత్పత్తి చేసే వారికే ఉంటుంది. కానీ ఇంటిల్లి పాది రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసే పంటలకు ధరలు నిర్ణయించుకునే అధికారం రైతులకు లేదు. రిటైల్ ధరలలో మూడో వంతు కూడా సాగు దారులకు దక్కని దుస్థితి కొనసాగు తోంది. రైతులు పండించే పంట ఉత్పత్తులపై ఆధారపడి జీవించే దళారులు, టోకు, రిటైల్ వ్యాపారులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వర్గాలు మాత్రం కోట్లు గడిస్తు న్నారు. వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసే కెచప్, మసాలా వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్టులకు ఎమ్మార్పీలు ఉంటాయి. వాటికి ప్రాథమిక ముడి సరుకైన రైతు పండించే పంటలకు ఉండవు. అదే విషాదం!ఏటా పెరుగుతున్న పెట్టుబడులు రైతులకు తలకు మించిన భారంగా మారాయి. ప్రకృతి వైపరీత్యాలకు తోడు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే తెగుళ్లు, పురు గులు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్ మాయాజాలం కారణంగా పంట కోతకొచ్చే నాటికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. పంట సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ డాక్టర్ స్వామినాథన్ కమిటీ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. వాస్తవానికి 23 పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ)తో చట్టబద్ధత కల్పించాలనీ, ఈ విషయాన్ని ప్రభుత్వం రైతుల ఆర్థిక కోణంలో చూడాలనీ రైతులు కోరుతున్నారు. అయితే ఇందుకు ఏమాత్రం తలొగ్గని కేంద్రం ఏటా 10–15 పంటలకు మాత్రమే మద్దతు ధరలను ప్రకటిస్తోంది. ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే కేంద్రంపై ఏటా రూ. 12 లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని నీతి అయోగ్ చెబుతున్న విషయాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి ముఖం చాటేస్తోంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధ్యయనం ప్రకారం... డెయిరీ రంగంలో పాడి రైతులు తమ ఉత్పత్తులకు రిటైల్ ధరలలో 60–70 శాతం పొందగలు గుతున్నారు. మాంసం రిటైల్ ధరలో 60 శాతం పొందుతున్నారు. టమోటా రైతులు 33 శాతం, ఉల్లి రైతులు 36 శాతం పొందుతున్నారు. ఇక పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లకు 31 శాతం, మామిడి పండ్లకు 43 శాతం, బత్తాయి, కమల వంటి పండ్లకు 40 శాతం పొందుతున్నారు. మార్కెట్లో కిలో రూ. 50–75 మధ్య పలికే బియ్యం (ధాన్యం) పండించే రైతులకు మాత్రం ఆ ధరలో కనీసం 10–20 శాతం కూడా దక్కని దుఃస్థితి నెలకొంది.రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 77 జాతీయ నమూనా సర్వే వెల్లడిస్తోంది. ఈ సర్వే ప్రకారం దేశంలో సన్నకారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4 వేలకు మించిలేదు. ఆదాయాలు పెరగకపోవడంతో వారి రుణభారంలో తగ్గుదల కనిపించడంలేదు. వ్యవసాయం గిట్టుబాటు కాక, రుణ భారం తట్టుకోలేక రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు ఏటా పెరుగు తున్నాయి.చదవండి: నీటిలో తేలియాడే రాజధానా?స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత గడచిన 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా... కేంద్రం ప్రకటించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించడమే కాదు... మార్కెట్లో ధర లేని సమయంలో ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’ కింద మద్దతు ధర దక్కని ఉత్పత్తులను కొను గోలు చేసి మద్దతు ధర దక్కేలా కొంత మేర కృషి చేయగలిగింది ఏపీలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గ్రామస్థాయిలో ఏర్పాటైన ఆర్బీకే వ్యవస్థ, రైతులకు వెన్నుదన్నుగా నిలవగా, వాటికి అనుబంధంగా దాదాపు రూ. 16 వేల కోట్ల అంచనా వ్యయంతో కోల్డ్ స్టోరేజ్‌లు, కలెక్షన్ రూములు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు బీజం పడింది. మద్దతు ధరల నిర్ణయం, కల్పన, అమలు కోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఏపీ ఫామ్ ప్రొడ్యూస్ సపోర్టు ప్రైస్ ఫిక్సేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టు–2023’కు రూపకల్పన చేసింది. కానీ అధికారుల తీరు వల్ల అసెంబ్లీలో చట్టరూపం దాల్చలేక పోయింది.చదవండి: విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంఏపీ తయారు చేసిన చట్టాన్ని మరింత పకడ్బందీగా జాతీయ స్థాయిలో తీసుకొస్తే రైతులకు ఎంతోమేలు జరుగుతుంది. ఈ విషయంలో జాప్యం చేసే కొద్దీ మద్దతు ధర దక్కని రైతులు వ్యవసాయానికి మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుత వ్యవసాయ దారుల్లో 60 శాతం మంది లోటు ఉత్పాదకత కారణంగా సాగును వదలి వేయాలని నిర్ణయించుకున్నట్లు దేశంలోని 21 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ఓ జాతీయ సర్వే సంస్థ ఇటీవల తేల్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మింగ్ దిశగా అడుగులు వేసి ఈ రంగాన్ని బలోపేతం చెయ్యాలి.- తలకోల రాహుల్ రెడ్డి మార్కెట్ ఎనలిస్ట్, కన్సల్టెంట్ -
అణుయుద్ధంగా మారనుందా?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 1,000 రోజుల మార్కును దాటేసింది. అమెరికా అనూహ్యంగా ఇచ్చిన అనుమతితో ఉక్రెయిన్ ఏటీఏసీఎంఎస్ క్షిపణులను రష్యా మీద ప్రయోగించింది. ఉత్తర కొరియా దళాలను ఈ యుద్ధంలో చేర్చిందనీ, ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్లను ఉపయోగిస్తోందనీ రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల యుద్ధ పరిధి రెండు దేశాలను దాటి, బహుళజాతి స్వభావానికి విస్తరించినట్టయింది. దీనికితోడు పుతిన్ తమ అణ్వా యుధ సిద్ధాంతాన్ని సవరించడం ద్వారా ఆందోళనను రేకెత్తించారు. 1962 క్యూబా సంక్షోభంలో అమెరికా, రష్యాల్లోని రాబందులు ఘర్షణను తీవ్రతరం చేయాలని కోరినప్పటికీ, అధినేతలు వివేకంతో వ్యవహరించారు. కానీ, ఈ అస్థిర కాలంలో అలాంటి వివేకం సాధ్యమా?రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నవంబర్ 19 నాటికి 1,000 రోజుల మార్కును దాటేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్ 17న అమెరికా సైన్యపు టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎంఎస్)ను ఉపయోగించే అధికా రాన్ని ఉక్రెయిన్‌కు కట్టబెట్టగానే ఆ యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది.ఈ నిర్ణయం ద్వారా, ‘అంకుల్ జో’ ఎట్టకేలకు ‘ధైర్య ప్రదర్శన’ చేసినట్లుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కాకతాళీయమో, ఉద్దేశ పూర్వకమో గానీ యుద్ధంలో ఆకస్మికమైన, ప్రమాదకరమైన పెరుగు దల స్పష్టంగా కనబడుతోంది.తీవ్రతను పెంచిన జో!దీర్ఘ–శ్రేణి పాశ్చాత్య తయారీ క్షిపణులను ఉపయోగించే ఆమోదం కోసం ఉక్రెయిన్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అయితే యుద్ధాన్ని ఇద్దరు ప్రత్యర్థులకే పరిమితం చేసే వివేకంతో, సంయమనం చూపుతూ వాషింగ్టన్ దీనిని నిలిపి ఉంచింది. అలాంటిది బైడెన్ అధ్యక్షత దాని ‘అత్యంత బలహీన’ దశలో ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వైట్ హౌస్ పీఠం కోసం నవంబర్ మొదట్లో అమెరికా ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, జనవరి 20న కొత్త అధ్యక్షుడు (డోనాల్డ్ ట్రంప్) బాధ్యతలు స్వీకరించే సంధి కాలం ఇది.ఉక్రెయిన్ తన కొత్త ఆయుధాలను ఉపయోగించడంలో ఎక్కువ సమయాన్ని పోగొట్టుకోలేదు. నవంబర్ 20న రష్యాలోని లక్ష్యాలపై ఏటీఏసీఎంస్ క్షిపణులను ప్రయోగించింది. పైగా, బ్రిటన్ సరఫరా చేసిన స్టార్మ్ షాడో క్షిపణులతో అనంతర దాడిని కొనసాగించింది.అంతకుముందు, ఉత్తర కొరియా దళాలను ఈ యుద్ధంలో చేర్చిందనీ, ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్లను కూడా ఉప యోగిస్తుందనీ రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. తద్వారా రష్యా– ఉక్రెయిన్ మధ్య నుండి యుద్ధ పరిధి రెండు దేశాలను దాటి, విస్తృత బహుళ జాతి స్వభా వానికి విస్తరించినట్టయింది.భయాన్ని పెంచిన రష్యాఅయితే మాస్కో దాదాపు వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. నవంబర్ 21న రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తమ సైన్యం తూర్పు ఉక్రేనియన్ నగరమైన డ్నిప్రోపై ‘కొత్త సాంప్రదాయిక మధ్యంతర శ్రేణి క్షిపణి’ని ఉపయోగించి దాడి చేసిందని ప్రకటించారు. దీన్ని ఒరేష్నిక్గా వర్గీకృతమైన ప్రయోగాత్మక మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా గుర్తిస్తున్నారు.అమెరికన్, బ్రిటిష్ దీర్ఘ–శ్రేణి ఆయుధాల వినియోగానికి ప్రతి స్పందనగా, నవంబర్ 21న రష్యన్ సాయుధ దళాలు ఉక్రెయిన్ సైనిక–పారిశ్రామిక సముదాయాలలో ఒకదానిపై దాడిని నిర్వహించా యని పుతిన్ పేర్కొన్నారు. ‘హైపర్సోనిక్ ఒరేష్నిక్ క్షిపణిని ఉప యోగించడానికి కారణం ఏమిటంటే, అమెరికా నేతృత్వంలోని కూటమి ఈ యుద్ధాన్ని మరింత మారణ హోమంవైపు పెంచాలని నిర్ణయించుకుంటే, రష్యా దృఢమైన రీతిలో ప్రతిస్పందిస్తుంది. రష్యా ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉంది. ఎవరైనా ఇప్పటికీ దీనిని అనుమానించినట్లయితే, వారలా చేయకూడదు. ఎల్లప్పుడూ రష్యా ప్రతిస్పందన తగురీతిలో ఉంటుంది’ అని పుతిన్ పేర్కొన్నారు.ఈ ప్రతిస్పందన అణ్వాయుధ సహితంగా ఉంటుందా? అనేక ఐరోపా దేశాలు భయపడే ఘోరమైన దృష్టాంతం ఇది. పుతిన్ తమ అణ్వాయుధ సిద్ధాంతాన్ని సవరించడం ద్వారా ఈ ఆందోళనను మరింతగా రేకెత్తించారు.రష్యా మునుపటి అణు సిద్ధాంతం, సాంప్రదాయ నమూనాలో రూపొందినది. అంటే అణ్వాయుధం అంతటి విధ్వంసకరమైన సామ ర్థ్యాన్ని ఉపయోగించడం గురించి ఆలోచించకుండా, కేవలం ప్రత్యర్థిని, అంటే అమెరికాను ‘నిరోధించడానికి’ మాత్రమే ఉద్దేశించబడింది. రెండవ షరతు ఏమిటంటే, రాజ్య ఉనికికి ముప్పు కలిగించే సాంప్రదాయ సైనిక దాడిని తిప్పికొట్టడం.అయితే, మాస్కో సవరించి ప్రకటించిన నవంబర్ సిద్ధాంతం మొత్తం పరిధిని విస్తరించింది. అణుశక్తి మద్దతు ఉన్న అణుయేతర శక్తి ద్వారా ఎదురయ్యే ఏ దాడినైనా సరే... ఉమ్మడి దాడిగా పరిగణి స్తామని రష్యా పేర్కొంది. అలాగే, మిలిటరీ కూటమిలోని ఒక సభ్య దేశం (ఈ సందర్భంలో, అమెరికా నేతృత్వంలోని కూటమి) చేసే ఏ దాడినైనా మొత్తం కూటమి చేసిన దాడిగా పరిగణిస్తామని కూడా రష్యా స్పష్టం చేసింది.2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ప్రారంభ దశ నుండి కూడా మాస్కో తన అణు సామర్థ్యం గురించి యోచిస్తోంది. అయితే, ఒక అవగాహన ప్రకారం రష్యా ఈ రెడ్ లైన్ ను దాటదనీ, దీనిని కేవలం ఒక బెదిరింపుగా మాత్రమే చూడాలనీ కొంరు పాశ్చాత్య వ్యాఖ్యాతలు కొట్టేశారు. కానీ అలాంటి ఆత్మసంతృప్తి తప్పుదారి పట్టించేదీ, ప్రమాదకరమైనదీ కావచ్చు.వివేకం కలిగేనా?అమెరికాకూ, మునుపటి సోవియట్ యూనియన్ కూ మధ్య 1962 క్యూబా క్షిపణి సంక్షోభం ఆ సంవత్సరం అక్టోబర్ మధ్యలో ప్రారంభమై ప్రపంచాన్ని దాదాపుగా అణుయుద్ధంలోకి నెట్టింది. అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీ, సోవియట్ అధ్యక్షుడు నికితా కృశ్చేవ్ అనే ఇద్దరు నాయకులు చివరి నిమిషంలో ప్రదర్శించిన వివేకం కారణంగా ఈ విధ్వంసకరమైన పరస్పర హనన కార్యక్రమం నిలిచిపోయింది. వారు 1962 నవంబర్ 20న సంయుక్తంగా దీనికి ‘మంగళం పాడేయాలని’ నిర్ణయించుకున్నారు.రెండు దేశాల్లోని రాబందులు ఆ ఘర్షణను తీవ్రతరం చేయాలని కోరినప్పటికీ, శిఖరాగ్ర స్థాయిలో అధినేతలు దృఢమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. సోవియట్ జలాంతర్గామి కెప్టెన్ ప్రదర్శించిన వ్యూహాత్మక సంయమనం కారణంగా అదృష్టవశాత్తూ అణు నిషేధం ఉల్లంఘనకు గురికాలేదు. ప్రస్తుత అస్థిర కాలంలో అలాంటి సంయ మనం పాటిస్తారా?ఒరేష్నిక్ను ఆవిష్కరించడం ద్వారా, రేడియేషన్ లేకుండా అణ్వా యుధానికి దగ్గరగా ఉండే అసాధారణ సామర్థ్యాన్ని రష్యా ప్రదర్శించింది. ఒరేష్నిక్ అనేది 2,500 కి.మీ. పరిధి కలిగిన కొత్త తరం రష్యన్ మధ్యంతర శ్రేణి క్షిపణి అనీ, దీన్ని 5,000 కి.మీ. పరిధి వరకు విస్తరించవచ్చనీ రష్యన్ మీడియా నివేదించింది.సహజసిద్ధంగా హైపర్ సోనిక్ అయిన ఈ క్షిపణి వేగం ‘మాక్ 10–మాక్ 11’ మధ్య ఉంటుంది (గంటకు 12,000 కి.మీ. కంటే ఎక్కువ). అంటే దీన్ని గుర్తించడం కష్టం. పైగా, ప్రస్తుత క్షిపణి నిరోధక సాంకేతికత ఈ క్షిపణిని అడ్డగించలేదు. కాలినిన్ గ్రాడ్లోని రష్యన్ స్థావరం నుండి దీన్ని ప్రయోగిస్తే యూరోపియన్ రాజధానులను చాలా తక్కువ సమయంలో (సెకన్లలో) ఢీకొంటుంది: వార్సా 81; బెర్లిన్ 155; పారిస్ 412; లండన్ 416. రష్యా ఉప విదే శాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ అక్టోబర్ 3న ప్రకటన చేస్తూ, అణ్వా యుధ శక్తుల మధ్య ప్రత్యక్ష సాయుధ ఘర్షణ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయలేమని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 1,000 రోజుల మార్కును దాటింది. ఇది క్లిష్టమైన శిఖరాగ్రానికి సిద్ధంగా ఉంది. ఒక పౌర అణు ప్రమాదం లేదా ఉద్దేశపూర్వక సైనిక సంఘటన రెండూ విపత్తుతో కూడి ఉంటాయి. పైగా అమెరికా పాలనలో అత్యంత బలహీనమైన ప్రస్తుత దశ ఏ సంభావ్యతకూ అవకాశం ఇవ్వకూడదు. బైడెన్ పాలన తర్వాత వస్తున్న ట్రంప్ 2.0 అధ్యక్షత విఘాతం కలిగించేదిగానూ, దుస్సాహ సికంగానూ ఉంటుంది. మొత్తం మీద 2025 సంవత్సరం మరింత అల్లకల్లోలంగా ఉండబోతోంది.సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ఢిల్లీలోని సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
తెలంగాణ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల మరణాలు ఆగేదెన్నడు?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో వరుసగా ఆహారం కలుషిత మైన (ఫుడ్ పాయిజన్) సంఘటనలు, విద్యార్థుల మరణాలు కొనసాగున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపాన్నీ, సౌకర్యాల కల్పనలో వైఫల్యాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఘటనలన్నిటికీ రాష్ట్ర సర్కారే భాధ్యత వహించాలి. ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలవ్వగా, 42 మంది విద్యార్థుల మరణాలు సంభవించాయి. వీరిలో ఫుడ్ పాయిజన్ వలన అనారోగ్యంతో మరణించిన వారు, బలవన్మరణానికి పాల్పడినవారూ, అనుమానాస్పదంగా మృతి చెందినవారూ ఉన్నారు.ఇదే ఏడాది ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ, తూనికలు, శానిటరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 10 హాస్టళ్ళలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందడం లేదని గుర్తించారు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారని తెలిసింది. ఎక్కడ కూడా ఆహార మెనూ పాటించడం లేదు. అరటిపండ్లు, గుడ్లు ఇవ్వడం లేదు. హాస్టళ్ళ చుట్టూ ప్రహరీ గోడలు లేవు. వంటశాలలు రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు నిలువచేస్తున్నారనీ, మరుగుదొడ్లు– బాత్రూంలలో కనీస శుభ్రత లేదనీ, విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేదనీ తేలింది. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ పర్వం ఇంకా కొనసాగుతున్నదని రుజువవుతోంది. నవంబర్ ఆరవ తేదీన మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు ఆరోగ్యం దెబ్బతిన్నది. అక్టోబర్ 30వ తేదీన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 8న జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థినులు, ఆగస్టు 7న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని తెలంగాణ మైనారిటీ రెసి డెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మార్చి నెల నుంచి నవంబర్ 15 వరకు 200 మంది గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా... 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆగస్టు 22న భువనగిరిలోని ఈ గురుకులాన్ని ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్’ బృందం సందర్శించినప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు.చదవండి: విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. పిల్లలకు నాణ్యమైన చదువు దూరం!ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసు కోకపోతే పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి. ప్రతి హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్స్‌లను నియమించాలి. ఇటీవల పెంచిన మెస్ చార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేసే విధంగా విద్యార్థి – యువజనులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు వివిధ రూపాలలో పోరాటాలు కొనసాగించి ఒత్తిడి తేవాలి.– కోట ఆనంద్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు -
నీటిలో తేలియాడే రాజధానా?
వెనుకబడిన ప్రాంతాల ఆకాంక్షలు నెరవేరినప్పుడే సమగ్ర అభివృద్ధి జరిగినట్లు. అలా కాకుంటే ప్రాంతాల మధ్య అసమా నతలు పెరిగిపోతాయి. అంటే పేదరికం, నిరుద్యోగం ప్రబలడం, పెత్తందారులు, బలవంతులు పేట్రేగిపోవడంజరుగు తుంది. దాని ఫలితంగా తీవ్రవాదం వైపు పీడితులు ఆకర్షితులు అవుతారు. అత్యంత వెనుకబడిన 1.59 కోట్ల జనాభా కలిగిన రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇచ్చి సమా నాభివృద్ధి సాధించామని శాసనసభలో చెప్పడం సరికాదు. విభజన చట్టంలో పొందుపరచిన ఎయిమ్స్, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ,బుందేల్‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, హార్టికల్చర్ హబ్, హైకోర్టు, లా యూనివర్సిటీ, లా అకాడమీ, కియా లాంటి పరిశ్రమల ఏర్పాటుతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం వల్లనే రాయ లసీమ అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం తదితర చర్యల ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికీ కృషి చేయాలి.అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఉమ్మడి సంప దను అన్ని ప్రాంతాలవారికీ సమానంగా పంచడం. అది భిక్ష కాదు. అభివృద్ధి ఫలాలు పొందడం ప్రతి పౌరుని హక్కు. ఇప్పటికే ఏడాదికి మూడు పంటలు పండుతూ అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన అమరావతి నిర్మాణానికి ఐదేళ్లలో 50 వేల కోట్లు ఖర్చు పెట్ట పూను కోవడం ఏ పాటి వికేంద్రీకరణో, ఎటువంటి న్యాయమో పాలకులే చెప్పాలి. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని మేధావులు చెప్పినా వినకుండా ఒక వర్గం, కేవలం 29 గ్రామాల ప్రాంత ప్రయో జనాల కోసమే లక్ష కోట్లు ఖర్చు పెడతామని టీడీపీ ప్రభుత్వం అనడం సమంజసమేనా? 2014 నుండి 2019 వరకు 5,000 కోట్లు తాత్కాలిక నిర్మా ణాల కోసం చేసిన ఖర్చు నీటిపాలు అయ్యింది. నేడు మరలా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ల నుంచి 15 వేల కోట్లు, హడ్కో నుంచి 12 వేల కోట్లు, ఇతర సంస్థల నుండి రుణాలు, బాండ్ల ద్వారా 23 వేల కోట్లు... మొత్తం 50 వేల కోట్లు అప్పులు చేసి, ఐదేళ్లలో ఖర్చు పెట్టాలని ప్రభుత్వం పూనుకుంది. 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు అనగా ఐదు నెలల కాలంలోనే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి బడ్జెట్లో నిధులు కేటా యించింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ష్యూరిటీతో ఏడీబీ ద్వారా తీసుకుంటున్న 15 వేల కోట్ల రూపాయలలో కేవలం అమరావతి రక్షణ చర్య లకే... అంటే కొండవీటి వాగు, బుడమేరు వంక నీటి మళ్లింపు కాలువలు; కృష్ణా నది కరకట్ట, వివిధ రిజర్వాయర్ల నిర్మాణం, డైవర్షన్, డ్రైనేజీ కెనాల్స్, లిఫ్ట్ స్కీములకే రూ. 8000 కోట్లు ఖర్చు చేయాలని... అప్పు ఇచ్చే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిర్మాణ ప్రాంతాన్ని పడవలలో ప్రయాణం చేసి తనిఖీ చేసిన తర్వాత నిర్ణయించడాన్ని బట్టి అది ‘నేల మీద నిర్మించే రాజధాని కాదు, నీటి మీద నిర్మించే తేలియాడే (ఫ్లోటింగ్) రాజధాని’ అని అర్థమయిపోతుంది. రాష్ట్రంలో సువిశా లమైన భూములు ఉండి కూడా తేలి యాడే రాజధాని నగరాన్ని నిర్మించడం వెర్రితనం.కాబట్టి టెక్నాలజీకి మేమే ఆదిగురువులమని చెప్పుకునే కూటమి నాయకులు శాస్త్రీయ పద్ధతులలో ఆలో చన చేసి అమరావతిలో శాసనసభ,సచి వాలయం నిర్మాణాలకు పరిమిత మైతే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ఉండే విశాఖపట్నం, తిరుపతి, కర్నూల్, అనంతపురం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలను పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్ది, ఆదాయ వనరులుగా మార్చుకోవాలి. అప్పుడే సంపద సృష్టికి వీలుంటుంది. లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు చెబుతున్న 2047 విజన్ సాకారం కాక పోగా, రాష్ట్రం అప్పులపాలై తాకట్టు పెట్టే పరిస్థి తులు తప్పవు, తస్మాత్ జాగ్రత్త!– కె.వి. రమణ ‘ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు