Extra
-
రోండా హిన్సన్.. 'అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ'?
‘అమ్మా రోమ్! నీకు ఏమైంది తల్లీ?’ అంటూ పెద్దగా కలవరిస్తూ మంచం మీద నుంచి ఉలికిపడి లేచి కూర్చుంది జూడీ. అప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి ఒంటిగంటైంది. వేగంగా మంచం దిగి, పక్కనే ఉన్న గదికి వెళ్లి, లైట్ వేసి, రోండా(రోమ్) మంచం వైపు చూసింది. అక్కడ రోండా లేకపోవడంతో కంగారు కంగారుగా పరుగున వెనుకకు వచ్చి, తన మంచం మీద గాఢనిద్రలో ఉన్న భర్తను కుదిపి కుదిపి లేపింది. అతడు నిద్రమత్తులోంచి తేరుకోకముందే, ‘మన.. మన రో..మ్.. కనిపించడం లేదు బాబీ!.. మ..మంచం మీద లేదు.. నాకు చా..చాలా భయంగా ఉంది’ అంటూ తడబడుతూనే ఏడ్చేసింది జూడీ. బాబీకి మైండ్ బ్లాక్ అయ్యింది. ‘ఏం మాట్లాడుతున్నావ్ జూడీ?’ అన్నాడు కంగారుగా.‘మన.. మన రోమ్ చచ్చిపోయింది. ఉన్నట్టుండి లోయలో పడిపోయింది. తనకి ఊ.. ఊపిరి ఆడటం లేదు. నా కళ్లముందే.. నా కళ్లముందే పడిపోయింది’ వణుకుతున్న స్వరంతో చెప్పింది జూడీ. బాబీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. పరుగున లేచి వెళ్లి, లైట్ ఆన్ చేశాడు. గడియారం వైపు చూసి, టేబుల్ మీద వాటర్ బాటిల్ అందుకుని, జూడీకి తాగించాడు. పక్కనే కూర్చుని, ఓదార్పుగా ‘జూడీ! మన రోమ్ ఇంట్లో ఎందుకుంటుంది? క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి నిన్నే వెళ్లింది కదా, రేపు ఉదయాన్నే వస్తానంది కదా?’ అని నిదానంగా గుర్తు చేశాడు. దాంతో జూడీ పూర్తిగా తేరుకుంది.అప్పటిదాకా బిడ్డ కోసం మెలితిరిగిన కన్నపేగు అదంతా పీడకల అని గుర్తించింది. అయినా తల్లి మనసు ఇంకా అల్లాడుతూనే ఉంది. ‘బా..బీ..! నాకు చాలా భయంగా ఉంది. నాకొచ్చింది కలే కాని, నా బిడ్డ(రోండా) ఏదో సమస్యలో ఉందని నా మనసు చెబుతోంది. అసలు తను ప్రాణాలతో ఉందా? ఇప్పుడే తనని చూడాలనుంది’ అంటూ ఏడ్చింది జూడీ. దాంతో బాబీ.. ‘పిచ్చిగా మాట్లాడకు. మన రోమ్‌కి ఏమీ కాదు. ఇప్పుడు టైమ్ చూడు, ఈ సమయంలో ఎక్కడికని వెళ్దాం? రేపు తనొస్తానన్న టైమ్‌కి రాకపోతే కచ్చితంగా మనమే వెళ్దాం సరేనా?’ అని నచ్చజెప్పాడు బాబీ.జూడీ, బాబీలకు చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి రోండాకి పంతొమ్మిదేళ్లు. చదువు పూర్తిచేసుకుని, మూడు నెలల క్రితమే ఉద్యోగం సంపాదించుకుంది. ‘ఆఫీస్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అటు నుంచి రాత్రికి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి, రేపు మధ్యాహ్నానికి వస్తా’ అని చెప్పి వెళ్లింది.ఉదయం 6 దాటేసరికి కాలింగ్ బెల్ మోగింది. జూడీ తలుపు తీసేసరికి ‘రోండా మీ అమ్మాయేనా?’ అడిగారు ఎదురుగా ఉన్న పోలీసులు. ‘అవును ఏమైంది?’ అంది జూడీ కంగారుగా. ‘మీ అమ్మాయి కారుకి యాక్సిడెంట్ అయ్యింది. ఆమె చనిపోయింది’ చెప్పాడు వారిలో ఒక అధికారి. జూడీకి గుండె ఆగినంత పనైపోయింది. ‘నో.. నో..!’ అంటూ అక్కడే ఉన్న వస్తువులన్నీ నేలకేసి కొట్టింది జూడీ. ‘నేను నమ్మను. నా బిడ్డకు ఏమీ కాదు. మీరు అబద్ధం చెబుతున్నారు. ఇది నా కల! నిజం కాదు’ అని అరుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. ఆ అరుపులకు లోపల నుంచి బాబీ పరుగున వచ్చి జూడీని పట్టుకున్నాడు. పోలీసులు మరోసారి అదే మాట చెప్పడంతో ఆ దంపతులు మార్చురీకి పరుగు తీశారు.పోస్ట్‌మార్టమ్‌లో మాత్రం రోండా బాడీలో బుల్లెట్ దొరికింది. కేవలం వెనుక సీట్లో కూర్చున్న వాళ్లే అలా కాల్చగలరని తేలింది. దాంతో యాక్సిడెంట్ కేసు కాస్త హత్య కేసుగా మారిపోయింది. కారు రోడ్డు పక్కకు ఒరిగినట్లు, డ్రైవర్ సీట్ వైపు డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లు, కారుకి కాస్త దూరంలో రోండా నేలమీద బోర్లా పడి ఉన్నట్లు ఆ రాత్రే రెండు గంటల సమయానికి గుర్తించారు పెట్రోలింగ్ పోలీసులు.అపరిచితులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని రోండా, తెలియని వారికి లిఫ్ట్ ఇచ్చే చాన్సే లేదని జూడీ, బాబీ నమ్మకంగా చెప్పారు. దాంతో రోండా పరిచయస్థులంతా విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఫీస్‌లో క్రిస్మస్ వేడుకల నుంచి రోండా ఎక్కడికి వెళ్లింది? ఎవరెవరిని కలసింది? ఇలా ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి పన్నెండున్నరకు తన స్నేహితురాలిని డ్రాప్ చేసిన రోండా.. పది మైళ్ల దూరంలో ఉన్న తన ఇంటికే ఒంటరిగా కారులో బయలుదేరిందని తేలింది. కారు, మృతదేహం రెండూ ఇంటికి అరమైలు దూరంలోనే దొరికాయి.అయితే ఆ రాత్రి అదే తోవలో వెళ్లిన ఒక సాక్షి ‘రోండా కారు దగ్గర ఒక నీలం కలర్ కారు చూశాను. అందులో ఇద్దరు యువకులు ఉన్నారు’ అని చెప్పాడు. మరో సాక్షి.. కారు ముందు వైపుకు.. రోండా వాలిపోవడం చూశానని, ఆమె పక్కనే ఓ యువకుడు ఉన్నాడని, అయితే అది క్రైమ్ సీన్ అనుకోలేదని, తాగిన మత్తులో ఉన్న ప్రేమజంటగా భావించి, ఆగకుండా వెళ్లిపోయానని చెప్పాడు. అంటే ఆ సమయానికే రోండా చనిపోయిందని, అప్పుడు కిల్లర్ రోండా పక్కనే ఉన్నాడని అధికారులకు అర్థమైంది. వెంటనే ఆ సాక్షుల అంగీకారంతో వారికి హిప్నాసిస్ టెస్ట్ చేసి, కిల్లర్స్‌లో ఒకడు ముదురు గోధుమరంగు జుట్టుతో, 5.10 అడుగుల ఎత్తు ఉంటాడని నిర్ధారించుకున్నారు. ఇక రోండా చిన్ననాటి స్నేహితుడు మైక్‌ని కూడా గట్టిగానే నిలదీశారు.నిజానికి రోండా చదువుల్లోనే కాదు, ఆటల్లోనూ ఫస్టే! ప్రతిదానిలోనూ దూసుకునిపోయే రోండా, తన మరణానికి నెల్లాళ్ల ముందు నుంచి చాలా వింతగా ప్రవర్తించిందట! ప్రతిదానికి భయపడటం, పగటిపూట కూడా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, రాత్రి సమయాల్లో మెలకువగా ఉండటం, అర్ధరాత్రి వేళ స్నానం చేయడం లాంటివి చేసేదట! సాధారణంగా ౖలñ ంగిక వేధింపులకు గురైనవారి ప్రవర్తన అలానే ఉంటుందని కొందరు సైకాలజిస్ట్‌లు.. అధికారులకు చెప్పారు.ఆ క్రిస్మస్ వేడుకలకు కూడా స్నేహితురాలు పట్టుబట్టడంతో రోండా బలవంతంగా వెళ్లిందని పేరెంట్స్ గుర్తు చేసుకున్నారు. ‘పెళ్లి అయిన వారిని ప్రేమించడం, వారితో రిలేష¯Œ షిప్లో ఉండటం తప్పా?’ అని రోండా తన తల్లిని పదేపదే అడిగేదట! స్నేహితులకు సలహా ఇవ్వడానికి అలా అడిగిందేమో అనుకుందట జూడీ. కానీ రోండా మరణం తర్వాత జూడీకి ‘రోండా జీవితంలో ఎవరైనా వివాహితుడు ఉన్నాడా? అతడే కిల్లరా?’ అనే అనుమానం మొదలైంది. ఇప్పటికీ జూడీ, బాబీ దంపతులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.1981 డిసెంబర్ 22, నార్త్ కరోలినాలోని మౌంటైన్ రోడ్లో ఆమె ఇంటికి అర మైలు దూరంలోనే హత్యకు గురైంది. నేటికీ హంతకులు ఎవరో తేలక ఈ కేసు మిస్టరీగానే మిగిలింది. అయితే సరిగ్గా రోండా ప్రాణం పోయే సమయానికే.. నిద్రలో ఉన్న తల్లి జూడీకి ఎలా తెలిసింది? అనేది కూడా మిస్టరీనే! – సంహిత నిమ్మనఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
భీష్ముడు చెప్పిన.. పులి–నక్క కథ!
అంపశయ్య మీదనున్న భీష్ముడి వద్దకు వెళ్లిన ధర్మరాజు ‘పితామహా! లోకంలో కొందరు లోపల దుర్మార్గంగా ఉంటూ, పైకి సౌమ్యంగా కనిపిస్తుంటారు. ఇంకొందరు లోపల సౌమ్యంగా ఉన్నా, పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లను గుర్తించడం ఎలా?’ అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు ‘ధర్మనందనా! నువ్వు అడిగిన సందేహానికి నేను పులి–నక్క కథ చెబుతాను’ అంటూ కథను మొదలుపెట్టాడు.‘పూర్వం పురిక అనే నగరాన్ని పౌరికుడు అనే రాజు పాలించేవాడు. బతికినన్నాళ్లు క్రూరకర్మలు చేయడం వల్ల నక్కగా జన్మించాడు. పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల ఈ జన్మలో మంచిగా బతుకుదామని తలచి, అహింసావ్రతం చేస్తూ ఆకులు అలములు తినసాగాడు. ఇది చూసి అడవిలోని తోటి నక్కలు ‘ఇదేమి వ్రతం? మనం నక్కలం. ఆకులు అలములు తినడమేంటి? నువ్వు నక్కల్లో తప్పపుట్టావు. నీకు వేటాడటం ఇష్టం లేకుంటే చెప్పు, మేము వేటాడిన దాంట్లోనే కొంత మాంసం నీకు తెచ్చి ఇస్తాం’ అన్నాయి.పూర్వజన్మ జ్ఞానం కలిగిన నక్క ‘తప్పపుట్టడం కాదు, తప్పనిసరిగా నక్కగా పుట్టాను. నాకు ఆకులు అలములు చాలు. నేను జపం చేసుకునే వేళైంది. మీరు వెళ్లండి’ అని చెప్పి మిగిలిన నక్కలను సాగనంపింది. నక్క అహింసావ్రతం చేçస్తున్న సంగతి అడవికి నాయకుడైన పులికి తెలిసింది. ఒకనాడు పులిరాజు స్వయంగా నక్క గుహకు వచ్చాడు.‘అయ్యా! నువ్వు చాలా ఉత్తముడివని తెలిసింది. నువ్వు నాతో వచ్చేయి. నీకు తెలిసిన మంచి విషయాలు చెబుతూ, నన్ను మంచిదారిలో నడిపించు’ అని వినయంగా ప్రాధేయపడ్డాడు. ‘రాజా! చూడబోతే నువ్వు గుణవంతుడిలా ఉన్నావు. అయినా నేను నిన్ను ఆశ్రయించలేను. నాకు ఐహిక సుఖాల మీద మమకారం లేదు. నీతో రాలేను’ అని బదులిచ్చింది నక్క.‘నాతో రాకపోయినా, నాతో సఖ్యంగా ఉంటూ నాకు మంచీచెడ్డా చెబుతూ ఉండు’ కోరాడు పులిరాజు.‘పులిరాజా! నువ్వూ నేనూ స్నేహంగా ఉంటే, నీతోటి వాళ్లు అసూయ పడతారు. మనిద్దరికీ విరోధం కల్పించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు తప్పదు. అందువల్ల నా మానాన నన్ను విడిచిపెట్టు’ బదులిచ్చింది నక్క.‘లేదు మహాత్మా! నీమీద ఎవరేం చెప్పినా వినను. అలాగని మాట ఇస్తున్నాను, సరేనా!’ అన్నాడు పులిరాజు. నక్క సరేనని ఆనాటి నుంచి పులితో సఖ్యంగా ఉండసాగింది.పులిరాజుకు నక్క మంత్రిగా రావడం మిగిలిన భృత్యులకు నచ్చలేదు. నక్క ఉండటం వల్ల తమకు విలువ దక్కడం లేదని అవి వాపోయాయి. చివరకు ఎలాగైనా నక్క పీడ విరగడ చేసుకోవాలని కుట్ర పన్నాయి. ఒకరోజు పులిరాజు గుహలో దాచుకున్న మాంసాన్ని దొంగిలించి, నక్క ఉండే గుహలో దాచిపెట్టాయి.గుహలో మాంసం లేకపోయేసరికి పులిరాజు భృత్యులందరినీ పిలిచి వెదకమని నాలుగు దిక్కులకూ పంపాడు. వెదుకులాటకు తాను కూడా స్వయంగా బయలుదేరాడు. నక్క గుహ దగ్గరకు వచ్చేసరికి మాంసం వాసన పులిరాజు ముక్కుపుటాలను తాకింది. లోపలకు వెళ్లి చూస్తే, తాను దాచిపెట్టుకున్న మాంసమే అక్కడ కనిపించింది.‘ఎంత మోసం!’ పళ్లు పటపట కొరికాడు పులిరాజు.ఈలోగా మిగిలిన భృత్యులంతా అక్కడకు చేరి, ‘మహారాజా! మీరు స్వయంగా గుర్తించబట్టి సరిపోయింది. లేకుంటే, నక్క ఏమిటి? అహింసావ్రతమేమిటి? మీ ఆజ్ఞకు భయపడి ఊరుకున్నామే గాని, దీని సంగతి ఇదివరకే మాకు తెలుసు’ అన్నాయి.‘వెళ్లండి. ఈ ముసలినక్కను బంధించి, వధించండి’ ఆజ్ఞాపించాడు పులిరాజు.ఇంతలో పులిరాజు తల్లి అక్కడకు వచ్చింది. ‘ఆగు! వివేకం లేకుండా ఏం చేస్తున్నావు? భృత్యులు చెప్పేదంతా తలకెక్కించుకునేవాడు రాజుగా ఉండతగడు. అధికులను చూసి హీనులు అసూయపడతారు. ఇలాంటివాళ్ల వల్లనే ఒకప్పుడు ధర్మం అధర్మంలా కనిపిస్తుంది. అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. రాజు దగ్గర సమర్థుడైన మంత్రి ఉంటే, తమ ఆటలు సాగవని దుష్టులైన భృత్యులు నాటకాలాడతారు. అలాంటివాళ్లను ఓ కంట కనిపెట్టి ఉండాలి’ అని హితబోధ చేసింది.పులిరాజు తన భృత్యుల మోసాన్ని గ్రహించాడు. వెంటనే నక్కను పిలిచి, ‘మహాత్మా! నావల్ల పొరపాటు జరిగిపోయింది. మన్నించు. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను’ అని వేడుకున్నాడు.‘పులిరాజా! తెలిసిగాని, తెలియకగాని ఒకసారి అనుమానించడం మొదలుపెట్టాక తిరిగి కలుపుకోవాలని అనుకోవడం అవివేకం. ఒకవేళ నువ్వు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా, ఇక నాకిక్కడ ఉండటం ఇష్టంలేదు’ అంటూ పులి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది. నిరాహారదీక్షతో శరీరం విడిచి, సద్గతి పొందింది.రాజు ఎన్నడూ చెప్పుడు మాటలకు లోబడకూడదు. మంచిచెడులను గుర్తెరిగి, మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలుసుకుని మసలుకోవాలి’ అని ధర్మరాజుకు బోధించాడు భీష్ముడు. – సాంఖ్యాయనఇవి చదవండి: రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా! -
జ్యూల్ థీఫ్.. సేల్స్ గర్ల్ శ్రమ!
‘వెల్ డన్! నీ సీనియర్స్‌ని బీట్ చేసి.. శాలరీ కన్నా డబుల్ అమౌంట్‌ని ఇన్సెంటివ్‌గా తీసుకుంటున్నావ్.. కంగ్రాట్స్’ అని ప్రశంసిస్తూ ఆమె చేతిలో ఓ ఎన్వలప్ పెట్టాడు మేనేజర్.‘థాంక్యూ సర్’ అని వినమ్రంగా బదులిచ్చి, బయటకు వచ్చింది. ఆమెకోసం బయట వెయిట్ చేస్తున్న కొలీగ్స్ ‘పార్టీ ఇస్తున్నావ్ కదా!’ అంటూ ఆమెను చుట్టుముట్టారు. కుడిచేతితో ఆ ఎన్వలప్ కొసను పట్టుకుని మరో చివరను ఎడమ అరచేతిలో కొడుతూ ‘ఈ డబ్బు పార్టీ కోసం కాదు. నా ఫస్ట్ అసైన్మెంట్ జ్ఞాపకంగా దాచుకోడానికి’ అన్నది తనకు మాత్రమే వినిపించేలా! ‘ఏం సణుగుతున్నవ్ పిల్లా?’ వేళాకోళమాడింది ఆ గుంపులోని ఓ కొలీగ్. ‘ఈ మొహాలకు పార్టీనా.. అని అనుకుంటుందేమోలేవే’ అంది ఇంకో కొలీగ్. ‘అనుకోదా మరి.. ఫ్లూయెంట్ ఇంగ్లిష్, హిందీతో కస్టమర్స్‌ని కన్విన్స్ చేస్తూ తన సెక్షన్ జ్యూల్రీ సేల్స్‌ని పెంచిన ఆమె కాన్ఫిడెన్స్ ఎక్కడా.. ప్రతిదానికి భయపడుతూ ఇన్ఫీరియర్గా ఉండే మీరెక్కడా!’ అన్నాడు సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ‘అయ్యో.. అలా ఏం కాదన్నా! ఫస్ట్ శాలరీ.. వెరీ ఫస్ట్ ఇన్సెంటివ్ కదా.. దీన్ని మా ఇంట్లో వాళ్ల కోసమే ఖర్చుపెడదామనుకుంటున్నా!’ అందామె.ఆ సిటీలోనే అతిపెద్ద జ్యూల్రీ షాప్ అది. దానికున్న మూడు బ్రాంచెస్ని వరుసగా యజమాని ముగ్గురు కొడుకులు, కార్పొరేట్ ఆఫీస్‌ని యజమాని చూసుకుంటున్నారు. ఆమె మెయిన్ బ్రాంచ్‌లో పనిచేస్తోంది. నెల కిందటే జాయిన్ అయింది. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్‌తో నెల రోజులకే సీనియర్స్ కన్నా ఇంపార్టెన్స్‌ని సంపాదించుకుంది.మరో పదిహేను రోజులకు.. ఆ ఏటికే మేటైన అమ్మకాన్నొకటి అందించిందామె! మేనేజ్మెంట్ ఖుషీ అయిపోయి ఇంకో ఇన్సెంటివ్నిచ్చింది. వర్కింగ్ అవర్స్‌లో సెల్ ఫోన్‌ను క్యారీ చేసే అవకాశాన్ని కూడా! తర్వాత వారంలో మరో బిగ్ సేల్నిచ్చింది. ఈసారి మేనేజ్మెంట్ ఆమెను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోట్ చేసి.. క్యాష్, జ్యూల్రీ, గోల్డ్ బిస్కట్స్, డైమండ్స్ లాకర్స్ యాక్సెస్నిచ్చింది. అంతేకాదు ఆ షాప్ యజమాని ఇంట్లో జరిగే ఫంక్షన్లకూ ఆమెను పిలవసాగింది.. కుటుంబ సభ్యులకు సాయమందించడానికి. స్టాఫ్ అంతా ముక్కున వేలేసుకున్నారు.. ‘ఎంత ఎఫిషియెంట్ అయితే మాత్రం అంత నెత్తినపెట్టుకోవాలా?’ అని! ఎవరెలా కామెంట్ చేసుకున్నా యాజమాన్యానికి మాత్రం ఆమె ‘యాపిల్ ఆఫ్ ది ఐ’ అయింది. తరచుగా ఆమెను అన్ని బ్రాంచ్‌లు తిప్పుతూ అక్కడున్న సేల్స్ స్టాఫ్‌కి ఆమెతో ట్రైనింగ్ ఇప్పించసాగింది. తనకున్న చొరవతో కార్పొరేట్ ఆఫీస్‌లోని కీలకమైన విషయాల్లోనూ నేర్పరితనం చూపించి, ఆ బాధ్యతల్లోనూ ఆమె పాలుపంచుకోసాగింది. అలా చేరిన రెణ్ణెళ్లకే ఆ షాప్ ఆత్మను పట్టేసింది. ప్రతి మూలనూ స్కాన్ చేసేసింది.ఒక ఉదయం.. పదిన్నరకు ఎప్పటిలాగే ఆ జ్యూల్రీ షాప్ అన్ని బ్రాంచ్‌లూ తెరుచుకున్నాయి. కార్పొరేట్ ఆఫీస్ కూడా. అన్నిచోట్లా ఒకేసారి దేవుడికి దీపం వెలిగిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ నాలుగు చోట్లతోపాటు ఆ జ్యూల్రీ షాప్ యజమాని ఇంటికీ ఐటీ టీమ్స్ వెళ్లాయి. మెయిన్ బ్రాంచ్‌లో ఆమె సహా స్టాఫ్ అంతటినీ ఓ పక్కన నిలబడమన్నారు. సోదా మొదలైంది. ఆమె నెమ్మదిగా ఫోన్ తీసి స్క్రీన్ లాక్ ఓపెన్ చేయబోయింది. అది గమనించిన ఐటీ టీమ్‌లోని ఓ ఉద్యోగి గబుక్కున ఆమె ఫోన్ లాక్కుని, పూజ గదిలా ఉన్న చిన్న పార్టిషన్లోకి వెళ్లాడు.ఆ షాప్‌కి సంబంధించి రెయిడ్ చేసిన అన్ని చోట్లా దాదాపు అయిదు గంటలపాటు సోదాలు సాగాయి. పెద్దమెత్తంలో డబ్బు, బంగారం, డైమండ్స్ దొరికాయి. ఆ ఏడాది అతిపెద్ద రెయిడ్ అదే అనే విజయగర్వంతో ఉంది ఐటీ స్టాఫ్! ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని, ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేయసాగారు. మెయిన్ బ్రాంచ్‌లో కూడా అంతా పూర్తయి, ఆ టీమ్ ఆఫీసర్ ఫైనల్ కాల్ చేయబోతుండగా.. కౌంటర్ దగ్గర నుంచి మేనేజర్ గబగబా ఆ బ్రాంచ్ చూసుకుంటున్న యజమాని పెద్దకొడుకు దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే అతను అలర్ట్ అయ్యి.. ‘ఎక్స్క్యూజ్ మి సర్..’ అంటూ ఐటీ టీమ్ ఆఫీసర్ని పిలిచాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకునే ‘యెస్..’ అంటూ చూశాడు. ‘ఒక్కసారి ఇలా రండి’ అంటూ కౌంటర్ దగ్గరకు నడిచాడు. డయల్ చేసిన కాల్ని కట్ చేస్తూ ఫాలో అయ్యాడు ఆఫీసర్. మేనేజర్ వంక చూశాడు యజమాని పెద్ద కొడుకు. కౌంటర్ టేబుల్ మీదున్న కంప్యూటర్ స్క్రీన్‌లో అంతకు కొన్ని క్షణాల ముందే రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ప్లే చేశాడు మేనేజర్. పూజ గదిలో సోదా చేస్తున్న ఐటీ ఉద్యోగి ఒక సీక్రెట్ సేఫ్‌లో దొరికిన డైమండ్స్లోంచి ఒక డైమండ్‌ని జేబులో వేసుకోవడం కనిపించింది అందులో. చూసి నివ్వెరపోయాడు ఆఫీసర్. ఏం జరుగుతోందో అంచనా వేసుకుంటున్న ఆ ఉద్యోగి మొహంలో నెత్తరు చుక్క లేదు.‘సర్.. మీడియాను పిలవమంటారా?’ స్థిరంగా పలికాడు యజమాని పెద్ద కొడుకు. వెంటనే ఆ ఐటీ ఆఫీసర్ మిగిలిన చోట్లలో ఉన్న టీమ్స్‌కి ఫోన్ చేసి ‘రెయిడ్ క్యాన్సల్.. అంతా వదిలేసి వచ్చేయండి’ అన్న ఒక్క మాట చెప్పి గబగబా బయటకు నడిచాడు. అనుసరించింది టీమ్. వాళ్ల వంకే అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది ఆమె!పదేళ్ల కిందట జరిగిన రెయిడ్ ఇది. ఆమె ఐటీ న్యూ ఎంప్లాయీ. ఆ షాప్స్, ఆ యజమాని ఇంటికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి అందులో సేల్స్ గర్ల్‌గా చేరింది. చాకచక్యంతో ఫోన్ యాక్సెస్‌ను సంపాదించుకున్న ఆమె, డీటెయిల్స్ అన్నిటినీ స్కాన్‌చేసి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్కి పంపేది. వాటి ఆధారంగానే రెయిడ్ చేశారు. ఫోన్ చూస్తున్నట్టు నటించడం, దాన్ని లాక్కోవడం అంతా కూడా ఐటీ వాళ్ల డ్రామా, యాజమాన్యానికి అనుమానం రాకుండా! అంతా సవ్యంగానే జరిగేదే.. ఆ ఉద్యోగికి సేఫ్‌లోని డైమండ్స్‌ని చూసి ఆశ పుట్టకపోయుంటే! ఆ పార్టీషన్లో సీసీ కెమెరా ఉందన్న విషయాన్ని మరచిపోయి గబుక్కున డైమండ్‌ని జేబులో వేసుకుని దొరికిపోయాడు. అంత పెద్ద రెయిడ్ క్యాన్సల్ అవడానికి కారణమయ్యాడు.( ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు , వ్యక్తుల పేర్లు ఇవ్వలేదు. ప్రతివారం ఇలాంటి ఆసక్తికర కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.) – శరాది -
మొక్కలు చీడపీడల్లేకుండా, పచ్చగా ఉండాలంటే, ఇవిగో చిట్కాలు!
పచ్చదనం అంటే.. ఎక్కడో పార్క్లకో, అడవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. మన పెరట్లో నాలుగు మందార, గులాబీ,చేమంతి మొక్కలో ఉంటే సరిపోతుంది. ఇంటి ముందు గుబురుగా పెరిగిన తులసి మొక్క చాలు మనసు ప్రశాంతంగా ఉండటానికి. చిన్న చిన్న మొక్కలతో ఇల్లు అందంగా కనిపించడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.అయితే మనకున్నచిన్న బాల్కనీలో, పెరట్లో మొక్కల్ని పెంచడం అంత ఈజీ కాదు సాధారణంగా మొక్కలను ఇష్టపడేవారు బయటి నుంచి మొక్కలు తెచ్చి తమ తోటల్లో లేదా ఇళ్లలోని కుండీల్లో నాటుతారు. మొక్కలకు సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, వాడిపోతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఎండిపోతాయి. సరైనపోషణతో కీటకాల బెడద లేకుండాపచ్చగా ఎదగాలంటే ఏం చేయాలి?మొక్కలు జాగ్రత్తగా పరిశీలించకపోయినా,పోషణ అందకపోయినా, నీళ్లు ఎక్కువైనా చని పోతాయి. పురుగులు కీటకాలు మొక్కలను మాత్రమే కాకుండా కుండలోని మట్టిని కూడా దెబ్బతీస్తాయి. జాగ్రత్తలు, చిట్కాలుదెబ్బతిన్న, చనిపోయిన ఆకులని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. దీని వల్ల చెట్లు చక్కగా పెరుగుతుంది. కాబట్టి, వీటిని కత్తెరతో కత్తిరించడం మంచిది.మొక్కలకి నీళ్ళతో పాటు సరైన కాంతి అవసరం. మరీ ఎండలో కాకుండా సమానమైన ఎండ తగిలేలా చూసుకోవాలి. అలా అని చీకటికూడా మంచిది కాదు. కాస్తంత వెలుతురు కావాలి.మొక్కలకి ఇంట్లోనే తయారు చేసుకున్న అనేక ఎరువులు ఇస్తూ ఉండాలి. పుల్లటి మజ్జిగ ద్రావణం, బనానా పీల్ ఫెర్టిలైజర్, పంచగవ్య, ఎండిన పశువుల ఎరువు, వేపనూనె, వేపగింజలు, ఆకుల కషాయం లాంటివి మొక్క, కుండా సైజును బట్టి ఇవ్వాలి.పుల్ల మజ్జిగ ద్రావణంగ్లాసు పుల్లటి మజ్జిగలో ఐదు గ్లాసులు నీళ్లుపోసి కలపాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్లో పోసి మొక్కలపై చల్లాలి. ఉదయం సాయంత్రం ఒకసారి ఈ నీటిని మొక్కలు పోయడం వల్ల చీడపీడలు పోయి మొక్కలు చక్కగా పెరుగుతాయి.పచ్చి బఠానీతో పచ్చగా... పచ్చి బఠాణి మనకు ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. అయితే బఠాణి పిక్కలు తీసి తొక్కలను పారేస్తుంటాము. కానీ ఈ తొక్కలు మొక్కలకు చక్కని పోషకాలు అందిస్తాయి. అందుకే తొక్కలను మిక్సీజార్‌లో వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టులో కాసిని నీళ్లు ΄ పోసి వడగట్టాలి. ఈ నీటిని గార్డెన్‌లోని మొక్కలకు పోషకాలు ఈ నీరు మంచి బలవర్థకమైన టానిక్‌లా పనిచేసి మొక్కలు చక్కగా పెరిగేందుకు దోహదపడతాయి.తెగుళ్లు, నివారణమొక్కలు సాధారణంగా పురుగులు,తెగుళ్లు నుంచి ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకోవాలి. తెల్ల నల్లి, గొంగళి లాంటి వాటిని చేతితో తీసేయవచ్చు. పసుపు, ఉప్పు, ఇంగువ నీళ్లు చల్లినా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కనీసం రెండు రోజులకు ఒకసారైనా మొక్కల్ని పరికించి చూడాలి. లేదంటే గొంగళిపురుగులు, ఆకుతొలిచే పురుగులు ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. మట్టిలో తేమ కారణంగా, కొన్నిసార్లు చిన్న నత్తలు లేదా పాకే పురుగులు మొక్కలను పూర్తిగా నాశనం చేస్తాయి. వీటికి పొడి గుడ్డు పెంకు పొడి బాగా ఉపయోగపడుతుంది. గుడ్డు పెంకులను పూర్తిగా శుభ్రం చేసి, పొడి చేసి మట్టిలో కలపాలి.పువ్వులపై మైనంలాగా కనిపించే తెల్లటి మీలీ బగ్స్ (మందార, గులాబీ మొక్కలపై) వాటిని వదిలించుకోవడానికి, ఒక లీటరు నీటిలో చిటికెడు బేకింగ్ సోడా, 1 టీస్పూన్ షాంపూ, 2-3 చుక్కల వేపనూనె కలిపి మొక్కలపై చల్లుకోవాలి. టొమాటో, బెండకాయ, బీన్స్, ఓక్రా మొదలైన కొన్ని కూరగాయలపై కూడా ముందుగానే చల్లుకోవాలి. దాల్చిన చెక్క పొడికూడా బాగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా -
‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో
మనిషికి,కుక్కకు మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. విశ్వాసానికి మరో పేరుగా , గ్రామసింహంగా మనుషులతో పరస్పర సాన్నిహిత్యాన్ని కలిగి ఉండే పెంపుడు జంతువు శునకం. కాసింత గంజిపోసినా, ఏంతో విధేయతగా ఉంటుంది. తనను ఆదరించిన యజమాని కొండంత ప్రేమను చాటుతుంది. అవసమైతే ప్రాణాలు కూడా ఇస్తుంది. ఇందులో ఎలాంటి సందేహంలేదు. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఈ వైరల్ వీడియో గురించి తెలుసుకుందాం పదండి! A dog was running after the ambulance that was carrying their owner. When the EMS realized it, he was let in. ❤️ pic.twitter.com/Tn2pniK6GW— TaraBull (@TaraBull808) September 12, 2024అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తిని ఆంబెలెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుంన్నారు. అలా వెళ్తున్న యజమానానిని చూసి కుక్క మనసు ఆగలేదు. అంబులెన్స్‌ను అనుసరిస్తూ పోయింది. చివరికి దాని ఆత్రం, ఆరాటాన్ని చూసిన ఆంబులెన్స్ డ్రైవర్కూడా చలిచించిపోయాడు. వెంటనే వెహికల్ ఆపి ఆగి దాన్ని కూడా ఎక్కించుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఎక్స్‌లో తెగ వైరలవుతోంది. తారా బుల్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన 27 సెకన్ల వీడియో దాదాపు 80 లక్షల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ దృశ్యాలను ఒక ద్విచక్రవాహనదారుడు వీడియో తీశాడు. ఇది నెటిజన్ల మనసులకు బాగా హత్తుకుపోయింది. చాలామంది కుక్క ప్రేమను, యజమానిపై దానికున్న విధేయతను ప్రశంసించారు. మరి కొందరు మూగజీవి ఆవేదన అర్థం చేసుకున్నాడంటూ డ్రైవర్ మంచి మనసును మెచ్చుకోవడం విశేషం. (కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!)పెంపుడు జంతువుల్లో మేటి కుక్క. యజమానిని కాపాడటం కోసం, యజమాని ఇంట్లో పిల్లలకోసం ప్రాణలను సైతం లెక్క చేయకుండా పోరాడి, ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. ఒంటరి జీవులకు తోడుగా నిలుస్తుంది. ఆసరాగా ఉంటుంది. అసలు ఒక కుక్కను పెంచు కోవాలనే ఆలోచనలోని అర్థం పరమార్థం ఇదే. అంతేకాదు యజమానులు కూడా తమ డాగీ అంటే ప్రాణం పెట్టే వారే. ఎంత ప్రేమ అంటే దాన్ని కుక్క అనడం కూడా వాళ్లకి నచ్చదు. దానికి పెట్టిన పేరుతోనే పిలవాలి. ఇంట్లో మనిషిలాగా, చంటిపిల్లకంటే ఎక్కువగా సాదుకుంటారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అల్లాడి పోతారు. చనిపోతే భోరున విలపిస్తారు. అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతేకాదండోయ్.. డాగీలకు పుట్టినరోజులు, సీమంతాలు ఘనంగా చేసే వారూ ఉన్నారు. (ఎమిలి ఐడియా అదుర్స్, బనానా వైన్!) -
'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది!
కన్నీటికి కూడా ఇష్టం ఉన్నట్టుంది. కన్నీటికి కూడా ఒక మనిషి కంటినే అంటి పెట్టుకొని ఉండాలన్న కోరిక ఉన్నట్టుంది. కన్నీరు ఎందుకనో ఒకే మనిషిని పదే పదే ఆలింగనం చేసుకుంటూ ఆ మనిషికి మరింత ప్రేమను పంచాలని అనుకుంటున్నట్టుంది. కేరళలో ఒకమ్మాయి శ్రుతి. ఆ అమ్మాయి గత కొన్ని రోజులుగా కన్నీరు కారుస్తోంది. ఆమెను ఊరడించడానికి కేరళ ప్రభుత్వం, కేరళ ప్రజలు కదిలారు. ఈ ప్రేమ కోసమేనా కన్నీరుకు ఆమెపై ప్రేమ?‘బాధ పడకు. నీకు నేనున్నాను. నేను చనిపోయినా నువ్వు ఒంటరివి కావు. నీకంటూ ఒక భరోసా ఉండేలా చూస్తాను’ అన్నాడా యువకుడు ఆ అమ్మాయితో ఓదార్పుగా. ఇవాళ ఆ యువకుడు కన్నుమూశాడు. ఆ యువకుడి మాటలను గుర్తు చేసుకుంటున్న కేరళ ప్రజలు ‘మేమున్నాం’ అంటూ ఆ అమ్మాయికి తోడుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఘటన చాలా అరుదు.ఆ అమ్మాయి పేరు శ్రుతి..అందరు అమ్మాయిల్లాంటిదే శ్రుతి. కోజికోడ్‌లో ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేయడం... సెలవులలో ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో గడపడం... తండ్రి చిన్న ఉద్యోగి... తల్లి చిన్న షాపు నడిపేది... చెల్లెలు కాలేజీ చదువుతోంది. వాళ్ల కుటుంబం వాయనాడ్‌లోని చూరలమలలో కొత్త ఇల్లు కట్టుకుని వరదలకు నెల ముందే షిఫ్ట్ అయ్యారు. అక్కడే శ్రుతి నిశ్చితార్థం జరిపించారు. ఈ డిసెంబర్లో పెళ్లి చేయాలని 4 లక్షల డబ్బు. 15 సవర్ల బంగారం ఇంట్లో దాచారు. అంతా సంతోషమే. కాని...జూలై 30 రాత్రి..ఆ రాత్రి ఉద్యోగరీత్యా శ్రుతి చూరలమలకు రెండు గంటల దూరంలో ఉన్న కోజికోడ్‌లో ఉంది. వరద విజృంభించింది. శ్రుతి వాళ్ల కొత్త ఇల్లు ధ్వంసమైంది. తల్లి, తండ్రి, చెల్లెలు... పెళ్లి కోసం దాచిన డబ్బు మొత్తం పోయాయి. ఎవరూ మిగల్లేదు. ఏమీ మిగల్లేదు. శ్రుతి కన్నీరు కట్టలు తెంచుకుంది. అది ఆగలేదు. ఆపేందుకు ఒక్కడు పూర్తిగా ప్రయత్నించాడు. అతని పేరు జాన్సన్. శ్రుతికి కాబోయే భర్త.నేనే తోడుంటా..‘శ్రుతికి ఇప్పుడు ఏమీ మిగల్లేదు. అంతమాత్రం చేత నేను వదిలేస్తానా? పదేళ్లుగా మేము స్నేహితులం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇప్పుడు ఆమె సర్వం కోల్పోయినా నేను వదలను. తోడుంటా. నేను చనిపోయినా ఆమె ఒంటరిదై పోకుండా మంచి ఉద్యోగం, ఇల్లు ఏర్పాటు చేస్తా’ అన్నాడు. ఆ మాటలు ఎందుకన్నాడో. అవి వాయనాడ్ విషాదాన్ని ప్రసారం చేసేటప్పుడు టీవీలో టెలికాస్ట్ అయ్యాయి.ఆ తోడు కూడా పోయింది...శ్రుతికి ఇక ఏడవడానికీ కన్నీరు మిగల్లేదు. జాన్సన్ చనిపోయాడు. మొన్నటి మంగళవారం వాయనాడ్‌లో అతను, శ్రుతి, శ్రుతి బంధువులు కొంతమంది ప్రయాణిస్తున్న వ్యాను బస్సుతో ఢీకొంది. శ్రుతి, ఆమె బంధువులు స్వల్పంగా గాయపడ్డారు. కాని జాన్సన్ మృత్యువుతో పోరాడి బుధవారం మరణించాడు. అన్నీ కోల్పోయిన శ్రుతికి ఆఖరి ఆసరా కూడా పోయింది. ఆమె ఏం కావాలి?మేమున్నాం..ఇక కేరళ జనం తట్టుకోలేకపోయారు. మేమున్నాం అంటూ శ్రుతి, జాన్సన్ జంట ఫొటోలను డీపీగా పెట్టుకోసాగారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ నేనున్నానంటూ ఫేస్బుక్ పోస్ట్ రాశారు. ఫహద్ ఫాజిల్, మమ్ముట్టి సంతాపం వ్యక్తం చేశారు. కేరళ మంత్రి ఒకరు శ్రుతికి మంచి ఉద్యోగం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది... కేరళ ప్రజలది అన్నారు. శ్రుతి కోసం కేరళ కన్నీరు కారుస్తోంది. శ్రుతి కన్నీటిని కేరళ పంచుకుంది. అయినవారిని లాక్కుని పరాయివారినెందరినో ఆమె బంధువులుగా మార్చింది కన్నీరు. ఈ కన్నీటిని ఏమని నిందించగలం. కన్నీరా కనికరించు... చల్లగా చూడు అనడం తప్ప.ఇవి చదవండి: బెయిలా? జైలా?.. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం తీర్పు -
కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!
చిన్నారులపై కుక్కలు పాశవివంగా దాడిచేసి, ప్రాణాల్ని తీసేసిన ఘటనలు మనందరి హృదయాల్ని పిండేసాయి. కారణాలేమైనప్పటికీ పిల్లలు,పెద్దలపై కుక్కల స్వైర విహారం ఉదంతాలు ఈ మధ్య కాలంలో కనిపించాయి. అలాగే రోడ్డుపై వెళుతున్నపుడు కూడా ఒక్కసారిగా మీదకు ఉరుకుతాయి. భయంకరంగా మొరుగుతూ కొద్ది దూరం వెంబడిస్తాయి కూడా. ద్విచక్రవాహనదారులకు ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. అయితే కుక్క మనపై దాడికి ప్రయత్నించినా, గట్టిగా మొరిగినా పరిగెత్తకుండా, నిలబడి గట్టిగా అదిలిస్తే చాలా వరకు వెనక్కి తగ్గుతాయి. దాదాపు అలాంటి వీడియో ఒకటి ఎక్స్‌లో ఆకట్టుకుంటోంది.ప్రమాదం మన ముందుకొచ్చినపుడు ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గం అంటూ ఒక వీడియోను ది ఫిగెన్ అనే ఎక్స్ యూజర్ దీన్ని షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగింది అనేది వివరాలు అందుబాటులో లేన్నప్పటకీ, ఈ ఫుటేజ్ ప్రకారం ఇద్దరు చిన్నారులు (పాప,బాబు) వీధిలో నడుస్తుండగా కుక్కలు ఎదురపడ్డాయి. దీంతో పక్కనున్న పాప భయంతో పారిపోయింది. తరువాత ఒంటరిగా మిగిలిన చిన్నారి మీదికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు కుక్కలు ఎగబడ్డాయి. అప్పుడా బాలుడు ధైర్యంగా నిలబడిన తీరు విశేషంగా నిలిచింది.When you're cornered, your only option is to be brave ... pic.twitter.com/uLDXhtNvcw— Figen (@TheFigen_) September 11, 2024ఆ బాలుడి గుండె ధైర్యానికి సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నువ్వెంత బలవంతుడివో నీకు తెలియదు.. ధైర్యంగా ఉండటమే నీకున్న ఏకైక మార్గం అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. -
విడాకుల తరువాత పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా?
పెళ్లయినప్పటినుంచి భర్త వేధింపులు తప్పడం లేదు. పిల్లలు పుట్టి వాళ్లు కాస్త పెద్దవాళ్లయినా మారలేదు సరి కదా, ఇంకా ఎక్కువైంది. ఇంక భరించలేక విడిపోతున్నాను. నాకు, నా పిల్లలకు ఆస్తిలో వాటా వస్తుందా? – పి. అనిత, నెల్లూరుసాధారణంగా స్థిరాస్తులు ఎవరి పేరుతో అయితే ఉంటాయో వారికి మాత్రమే చెందుతాయి వారి స్వార్జితం కిందనే పరిగణించ బడతాయి. కానీ అన్నివేళలా అదే నియమం వర్తించదు. భార్యకు భర్త ఆస్తిలో హక్కు ఉందా లేదా అనే అంశం భర్త మతాచారంపై ఆధారపడి ఉంటుంది. హిందువులకు వర్తించే చట్టాల ప్రకారం మీ భర్త పేరిట ఉన్న ఆస్తి వారసత్వం ద్వారా సంక్రమించింది అయితే గనక అందులో మీ పిల్లలకు పూర్తి హక్కు ఉంటుంది. మీ పిల్లలు మైనర్లు అయితే వారి తరఫున మీరు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. మీ పిల్లలకి వారి వాటా వారికి దక్కుతుంది. అదే మీ భర్త స్వార్జితం అయితే మాత్రం తన తదనంతరం వీలునామా ప్రకారం, వీలునామా లేని పక్షంలో హిందూ వారసత్వ చట్టం ప్రకారం లేదా భర్త జీవితకాలంలో స్వయంగా ఇవ్వాలి అని తలిస్తే మాత్రమే భార్యకి హక్కులు ఉంటాయి.మరో విషయం... భార్యకు తన జీవితకాలం మొత్తం భర్త ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ లేదా విడాకులు తీసుకునే సమయంలో భర్త ఆస్తిలో భార్యకు వాటా వచ్చే అవకాశం ఉంది. ఎంత శాతం వాటా ఇవ్వాలి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. హిందూ లా, ముస్లిం లా, క్రిష్టియన్ లా, ఇలా వేర్వేరు మతస్తులకు వేరే విధమైన హక్కులు ఉంటాయి.మీరు భర్త వేధింపులు తట్టుకోలేక విడి΄ోతున్నాను అని చె΄్పారు కాబట్టి, డీ.వీ.సీ. చట్టం (గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం, 2005) కింద కేసు వేసినట్లయితే, అందులో అనేక రకాల హక్కులను, ఉపశమనాలను పొందవచ్చు. కేసు తేలేంతవరకు మీ భర్త ఆస్తులను అమ్మకుండా కోర్టు వారు స్టే విధించే అవకాశం కూడా ఉంది. డీ.వీ.సీ. చట్టం సెక్షన్ 22 ప్రకారం అదనపు దరఖాస్తు చేసుకుంటే, మీరు కోరిన ఉపశమనాలతో పాటు మానసిక హింస, మానసిక క్షోభతో సహా మీకు కలిగిన గాయాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించవచ్చు. డీ.వీ.సీ. చట్టం ప్రకారం భర్త ఆస్తి పై కేసు వేసే వీలుందా లేదా అన్నది ప్రతి కేసులోనూ విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న లాయర్ని సంప్రదిస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల , హైకోర్టు న్యాయవాది -
అత్యంత పురాతనమైన త్యాగరాజస్వామి ఆలయం! ఇక్కడ కళ్యాణం..
చెన్నైనగర శివారు ప్రాంతమైన తిరువొట్రియూర్లో అత్యంత పురాతనమైన త్యాగరాజస్వామి ఆలయం ఉంది. అత్యద్భుతమైన శిల్పసౌందర్యంతో, అణువణువునా సొగసైన పనితనం ఉట్టిపడే ఈ ప్రాచీన కట్టడం త్యాగరాజస్వామి ఆలయమైతే, ఈ ఆలయ ప్రాంగణంలోనే పరమశివుడు తన భక్తుడైన సుందరుని కల్యాణాన్ని జరిపించిన వృక్షం నేటికీ భక్తులకు దర్శనమిస్తూ, వారి మనోరథాలను నెరవేరుస్తుంటుంది.స్వామివారి సన్నిధికి కుడివైపునే వడి ఉడై అమ్మన్ ఆలయం ఉంది. ఎడమవైపున జగన్నాథుడు, జగదాంబికల సన్నిధులు నేత్రపర్వం చేస్తుంటాయి. ఆ పక్కనే వినాయకుడు, కుమారస్వామి, బాలపరమేశ్వరుడు, కాళికాంబ సన్నిధులు కనువిందు చేస్తూ, భక్తులకు పరమశివుడి సాన్నిధ్యాన్ని కనులముందు సాక్షాత్కరింపజేస్తుంటాయి. తిరువొట్రియూర్ ఆలయంలోని మరో విశిష్టత ఏమిటంటే, ఇక్కడ నక్షత్రలింగ సన్నిధి అని 27 నక్షత్రాలకు సంబంధించి 27 శివలింగాలున్నాయి. ఈ సన్నిధిలో 27 నక్షత్రాలకు సంబంధించిన భక్తులు తమ జాతక దోషాలను ΄పోగొట్టుకునేందుకు పూజలు చేస్తుంటారు. ఉత్సవమూర్తి అయిన త్యాగరాజస్వామి, మూలవిరాట్టు అయిన ఆదిపురీశ్వరుని విగ్రహాలు భక్తులను ఆనంద పరవశ్యంలో ముంచి వేస్తుంటాయి. సువర్ణకవచాన్ని అలంకరించుకుని ఉన్న మూలవిరాట్టు ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ, భక్తులకు కొంగుబంగారంగా భాసిల్లుతుంటుంది. ఎక్కడా లేనివిధంగా ఇక్కడి మూలవిరాట్టు ఆదిపురీశ్వరుడు నిత్యం తైలాభిషేకంలో మునిగి తేలుతుంటాడు. ఆయనకు అభిషేకించిన తైలం పిల్లల మాడుమీద అంటి, నొసట బొట్టులా పెడితే చాలు– బాలారిష్టాలూ, దృష్టిదోషాలూ అంతరించిపోతాయనీ, బాలలు ఆయురారోగ్యాలతో నిత్యం ఆనందంతో కేరింతలు కొడతారని ప్రతీతి. భక్తులు ప్రత్యేక రుసుము చెల్లించడం ద్వారా ఆలయంలో స్వామికి చందనకాప్పు (గంధపు పూత), మంజళ్ కాప్పు (పసుపు పూత), పంచామృతాభిషేకం, క్షీరాభిషేకాలను స్వయంగా నిర్వహించుకోవచ్చు. దోషనివారణ చేసుకోవచ్చు.ఎక్కడ ఉందంటే..?చెన్నై నగరానికి శివారు ప్రాంతంలోనే ఉంది తిరువొట్రియూర్. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి బస్సులు, లోకల్ రైళ్లు ఉన్నాయి. ఆటోలలో కూడా ఆలయానికి చేరుకోవచ్చు. తిరువొట్రియూరులో తెలుగు వారు తక్కువేమీ కాదు. అందువల్ల తెలుగుమాత్రమే తెలిసిన వాళ్లకు ఇబ్బంది ఏమీ ఉండదు. బస, భోజన వసతులకు కూడా బాగానే ఉంటాయిక్కడ. తిరువొట్రియూరులో కూడా అలాంటి సౌకర్యం ఉంది కాబట్టి యాత్రికులు తిండికోసం ఇబ్బంది పడనక్కరలేదు.అతిపెద్ద ఆలయం... త్యాగరాజస్వామికి తిరువారూరులో అతిపెద్ద ఆలయం ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా పేర్కొనే ఈ గుడి తంజావూరు జిల్లాలోని తిరువారూరులో ఉంది. ఈ గుడికి నాలుగువైపులా నాలుగు గోపురాలున్నాయి. ఈ దేవాలయం 30 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఉంది. దీనికి అనుసంధానంగా పెద్ద కోనేరు ఉంది. కమలాలయం అనే పేరుగల ఈ కోనేరు ఆలయంకన్నా పెద్దగా ఉండటం విశేషం. దక్షిణ భారతదేశంలో ఇదే అతి పెద్ద కోనేరు. చోళరాజుల కాలం నాటి ఈ గుడి శిల్పసౌందర్యానికి పెట్టింది పేరు. అత్యంత విలువైన దివ్యాభరణాలతో అలంకృతమై ఉన్న త్యాగరాజ స్వామివారి విగ్రహం ఈ గుడిలో కనువిందు చేస్తుంది. అంతేకాదు, ఆలయంలో అనేకమైన తైలవర్ణ చిత్రాలున్నాయి. వాటిలో శయనముద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రం చూపు తిప్పుకోనివ్వనంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎదపైన నటరాజస్వామి నర్తిస్తూ ఉన్నట్లు చిత్రించి ఉండటం మరో అద్భుతం. తిరువారూరులో ఏటా బ్రహ్మాండమైన రథోత్సవం జరుగుతుంది. అంతేకాదు, ఇక్కడ కమలాలయం కోనేరులో జరిగే తెప్పోత్సవానికి కూడా మంచి పేరుంది. -
తెలుగునాట ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయాలివే..!
మన తెలుగునాట ఎన్నో ప్రసిద్ధి గాంచిన గణిపతి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటి మహిమ అంతా ఇంతా కాదు. కోరిన కోరికలు తీర్చే మహా వినాయకుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ మహిమాన్వితమైన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందామా..!బిక్కవోలు గణపతి ఆలయంతూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలులో నెలకొని ఉన్న గణపతి ఆలయం క్రీస్తుశకం 848 – 891 మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య ప్రభువు మూడవ విజయాదిత్యుడు బిక్కవోలును రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ఇతనికి గణుగ మహారాజు, త్రిపురమర్త్య, మహేశ్వర, వల్లభ అనే బిరుదులతో పాటు బిరుదాకరామభీమ అనే బిరుదు కూడా ఉంది. ఈ బిరుదు ఆధారంగానే ఈ గ్రామానికి బిరుదాంకరాయపురం అని పేరు వచ్చింది. కాలక్రమంలో బిరుదాంకనవోలుగా మారి ప్రస్తుతం బిక్కవోలుగా వ్యవహారంలో స్థిరపడింది.చారిత్రక ఆధారాలను బట్టి తూర్పుచాళుక్య రాజులలో రెండవ విజాదిత్యుడు జైనులైన రాష్ట్రకూటులతో 108 యుద్ధాలు చేశాడు. ఇతడు నరేంద్ర మృగరాజుగా పేరు పొందాడు. యుద్ధాలు చేసినందుకు పాప పరిహారంగా ఒకొక్క యుద్ధభూమిలో ఒక్కొక్కటిగా మొత్తం 108 శివాలయాలను నిర్మించాడు. మూడవ విజయాదిత్యుడు కూడా అనేక యుద్ధాలు చేసి విజయాలు సాధించి, విఘ్నేశ్వరాలయాలను కట్టించాడు. అందులో ఒకటి ఈ ప్రసిద్ధ బిక్కవోలు గణపతి ఆలయం. చాళుక్యుల తరువాత వివిధ రాజవంశీయులతో పాటు పెద్దాపురం సంస్థానాధీశులు ఈ ఆలయం కోసం అనేక దానధర్మాలు చేశారు. బిక్కవోలు గణపతిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, కష్టాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. కాణిపాక వరసిద్ధి వినాయక క్షేత్రంచిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలసిన శ్రీవరసిద్ధి వినాయక క్షేత్రం ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రం. పూర్వం దీనిని విహారపురిగా వ్యవహరించేవారు. 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం కట్టించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1336లో విజయనగర రాజులు దీనిని అభివృద్ధి చేశారు. బహుదా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ సింహద్వారం వద్ద చోళరాజ శిలాప్రతిమ ఉంది. ఆలయానికి ఎదురుగా కోనేరు, మండపం ఉన్నాయి. ఈ ఆలయానికి వాయవ్యంలో మరకతాంబికా సమేతుడైన మణికంఠేశ్వరాలయం ఉంది. ఒకసారి బహుదా నదికి వరదలు రావటం వల్ల ఆ వరదల్లో ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరాలయలోని వినాయకుడు జరిగి దగ్గరలో ఉన్న బావిలో పడిపోయాడు. ఆ వినాయకుడే మరల తన ఉనికి వరసిద్ధి వినాయకునిగా పూర్వం గుడ్డి, చెవిటి, మూగ అయిన ముగ్గురు వికలాంగులు తమ పొలంలోని బావిని లోతు చేయటం కోసం తవ్వుతుండగా స్వామివారు స్వయంభువుగా ప్రకటితమయ్యారు. ప్రతియేటా వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు ఈక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. చివరి రోజున తెప్పోత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాలలో కాణిపాకం గ్రామస్థులే కాకుండా, చుట్టుప్రక్కల గ్రామస్థులు రోజుకొక వాహనసేవలో పాల్గొనటం విశేషం.కొలనుపాక గణపతి ఆలయంయాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక వీరశైవ మతానికి సంబంధించి గొప్ప చారిత్రక ప్రదేశం. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతం చాళుక్యుల వశం అయ్యింది. ఇక్కడ సోమేశ్వరాలయం ఉంది. వీరశైవ మతానికి చెందిన రేణుకాచార్య ఈ ప్రాంతంలోనే జన్మించినట్లు వివిధ ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ఆలయ ప్రాగణంలోనే వినాయక, కార్తికేయ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడి గణపతి విగ్రహం చాళుక్యుల శిల్పకళా చాతుర్యంతో కూడుకుని ఉంది. పశ్చిమ చాళుక్యుల కాలమైన పదకొండవ శతాబ్దంలో చెక్కబడిన సర్వాభరణ భూషితుడైన వినాయకుడు చతుర్భుజాలతో పీఠంపై ఆసీనుడైనట్లుగా ఉంటాడు. రెండు చేతులలో అంకుశం ధరించి ఉంటాడు. ఎడమచేతిలో మోదకం ఉంటే, కుడిచేయి మోకాలుపై ఆధారంగా ఉంటుంది. ఈ వినాయకుడి ఉదరానికి ఉన్న సర్పబంధం అద్భుతంగా కనపడుతుంది. తొండం ఎడమవైపు వంగి ఉంటుది. ఇక్కడి గణపతికి ముడుపులు కట్టి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అయినవిల్లి సిద్ధివినాయక ఆలయంకోనసీమజిల్లా అమలాపురానికి చేరువలోని అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం అత్యంత పురాతనమైనది. పవిత్ర గోదావరి నదీపాయ ఒడ్డున ఉన్న ఈ వినాయక ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించారని ఇక్కడి స్థలపురాణం. వ్యాసమహర్షి దక్షిణ యాత్ర ప్రారంభించటానికి ముందు ఈ వినాయకుని ప్రతిష్ఠించాడని ప్రతీతి. అయినవిల్లి ఆలయాన్ని పెద్దాపురం సంస్థానాధీశులు పునర్నిర్మించి, పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయినవిల్లి వినాయకునికి శైవాగమం ప్రకారం విశేషార్చనలు, నారికేళఫలోదకాలతో అభిషేకాలు చేస్తారు. భక్తులు 1,116 కొబ్బరికాయలతో స్వామివారికి అభిషేకం చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆలయంలో వినాయక చవితితోపాటు, ప్రతినెలా ఉభయ చవితి తిథులలో పూజ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దశమి, ఏకాదశి రోజుల్లోనూ విశేష పూజలు చేస్తారు.చోడవరం స్వయంభూ వినాయక ఆలయంఅనకాపల్లి జిల్లా చోడవరంలోని గౌరీశ్వరాలయం, వినాయక ఆలయాలకు స్వయంభువులుగా అనేక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. చోడవరం గ్రామానికి తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయాన్ని సుమారు 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశ రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఆ ఆలయంలోని గర్భగుడి ద్వారంపై ఉన్న చేప చిహ్నాల వల్ల ఇక్కడి స్వామివారిని మత్స్య గణపతిగా పేర్కొంటారు. శ్రీ గౌరీశ్వరుడు మత్స్యవంశ రాజుకు కలలో కనిపించి చోడవరం కోట తూర్పు దిక్కున తాను వెలుస్తున్నానని ఆ ప్రదేశం చెమ్మగా ఉంటుందని చెప్పటంతో ఆలయం ఉన్నచోట తవ్వకాలు జరపగా, చుట్టూ నీటితో కూడిన శివలింగం బయల్పడటంతో అక్కడే ఆలయ నిర్మాణం చేశారు.తురుష్కుల దాడిలో ఆలయంలోని గౌరీశ్వరస్వామి లింగాకృతి ఛిన్నాభిన్నమైంది. అప్పటి నుంచి ఆ ఆలయంలో గౌరీశ్వరుడు పుట్ట ఆకృతిలో దర్శనమిస్తున్నాడు. చోళవంశ రాజులు ధ్వంసమైపోయిన శివలింగం స్థానంలో కాశీ నుంచి కొత్త లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించదలచారు. కాని, స్వయంభువుగా వెలసిన వినాయక విగ్రహానికి మాత్రమే పూజలు జరిపించాలని స్వామి కలలో కనిపించి చెప్పటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చోడవరం స్వయంభూ వినాయకుడు చిన్నపాటి నీట ఊటలో నల్లని రాతివిగ్రహం మూడు అడుగులకు పైగా పొడవు, వెడల్పులతో ఛాతీభాగం వరకే స్వామివారు దర్శనమిస్తారు. మిగతా భాగం భూమి లోపలే ఉండటం విశేషం. తొండం చివరి భాగం కూడా కనిపించదు.శ్రీశైల సాక్షిగణపతిప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో సాక్షిగణపతి ఆలయం పరమ పవిత్ర స్థలంగా అనాదిగా పూజలందుకుంటోంది. శ్రీశైల మల్లికార్జునుని దర్శించటానికి వచ్చిన భక్తుల వివరాలను గణపతి ఇక్కడ నమోదు చేస్తాడని ప్రతీతి. అందుకే ఈ గణపతిని సాక్షిగణపతి అని పేరు. సాక్షిగణపతి విగ్రహం వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడి విగ్రహం ఎడమచేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకుని కుడిచేతిలో ఘంటంతో భక్తుల పేర్లు రాస్తున్నట్లుగా ఉంటుంది. శ్రీశైలాన్ని దర్శించి వెనక్కు వెళ్ళే భక్తులు మార్గమధ్యంలో ఉన్న ఈ సాక్షి గణపతి ఆలయాన్ని దర్శిస్తారు. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడి స్వామివారికి గోత్రనామాలు విధిగా చెప్పుకోవాలని పెద్దలు చెబుతారు.రాయదుర్గం దశభుజ శ్రీమహాగణపతిఅనంతపురం జిల్లా రాయదుర్గంలో మూడు గణపతి ఆలయాలు ఉన్నాయి. అందులో రాయదుర్గం కొండపైకి వెళ్ళే మార్గంలో కోట మెట్ల కింద ఆత్మకూరు వీథిలో దశభుజ గణపతి ఆలయం ప్రముఖమైనది. నాలుగు మీటర్ల కొండరాయిపై మలచిన వినాయకుని రూపం ఎంతో ఆకర్షిస్తుంది. సుమారు పదిహేను అడుగుల ఎత్తుగల వినాయకుని రూపం చూడటానికి రెండుకళ్ళూ చాలవు. భారీశిలపై పదిచేతులు గల వినాయకుడిని ఎంతో నేర్పుగా మలచినట్లు కనిపిస్తుంది. ఈ విగ్రహంలో వినాయకుని తొండం కుడివైపు తిరిగి ఉంటుంది. కూర్చుని ఉన్న ఈ వినాయక విగ్రహం ఎడమ తొడపై ఒక స్త్రీరూపు చెక్కబడి ఉంది. విజయనగర సామ్రాజ్యకాలంలో విజయనగర రాజుల ఏలుబడిలో దశభుజ గణపతి ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.రాయదుర్గం దశభుజ వినాయకరూపం షోడశగణపతి రూపాలలో ఒకటి. ఇది శ్రీమహాగణపతి రూపం. ఈయన సమగ్రమూర్తి. కుడివైపు తిరిగిన తొండంతో ఎడమచేతితో తొడపై కూర్చున్న అమ్మవారిని ఆలింగనం చేసుకున్నట్లు ఉంటుంది. పదిబాహువులతో కుడిచేత చక్రం, ఓషధి, కలువపువ్వు, నిధి« ధరించి ఉంటాడు. ఎడమచేత పాశం, చెరకుగడ, పద్మం, గద ధరించి ఉంటాడు. కిరీటంపై అర్ధచంద్రుడి అలంకారం అలరారుతుంటుంది.యానాం సిద్ధిగణపతి (పిళ్ళైయార్) ఆలయంపుదుచ్చెరిలోని పూర్తి తెలుగు ప్రాంతమైన యానాంలో వెలసి పరమ భక్తుల సేవతో విరాజిల్లుతున్న సిద్ధిగణపతి పిళ్ళైయార్ స్వామి నమ్మిన భక్తులకు కోరిన కోర్కెలు తీరుస్తూ అనుగ్రహిస్తున్నాడు. పురాణరీత్యా గోహత్యా పాపవిమోచన కోసం గంగానది సహా ఇతర తీర్థాలలో స్నామాచరిస్తూ గౌతమ మహర్షి గోదావరి నదిని గోష్పాదక్షేత్రం (కొవ్వూరు) వరకు తీసుకురాగా సప్తమహర్షులు ఆ నదిని ఏడుపాయలుగా విభజించి సాగరాన సంగమం గావించారు. సప్తఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి గోదావరి శాఖను యానాంకు కొద్దిదూరంలో ఉన్న చొల్లంగి వద్ద సముద్రంలో సంగమింప చేశాడు.ఈ ప్రదేశం కోరంగికి సమీపంలో ఉంది. కురంగి సంచరించిన ప్రదేశం కాలక్రమంలో కోరంగిగా మారింది. కురంగం అంటే కృష్ణ్ణజింక అని అర్థం. ఆ యానాం పావని వృద్ధగౌతమీనదీ తీరం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో చాళుక్య రాజుల కాలంలో ప్రతిష్ఠించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అప్పటి విగ్రహ శిల్పకళా సౌందర్యం దీనికి తార్కాణం. గజరాజుల మధ్య లక్ష్మీదేవిని ద్వారంపై చెక్కి ఉండటం చాళుక్యుల దేవాలయ నిర్మాణ చిహ్నం. ఈ సిద్ధి గణపతిని ఆనాడు విజయ గణపతిగా కొలిచేవారు. తీరప్రాంతం అవటంతో ఉప్పెనలు, వరదలు, తుపానుల కారణంగా, భౌగోళిక మార్పుల వల్ల ఈ స్వామి పుట్టలతో కప్పివేయబడ్డాడు.1723 నాటికి మోటుపల్లి యానం ఫ్రెంచివారి పాలనలోకి చేరింది. కోరంగి కాలువ ద్వారా వారు వ్యాపారాలు నిర్వహించేవారు. పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాం, చంద్రనాగూరు ఫ్రెంచివారి అధీనంలో ఉండేవి. ఈ ప్రాంతాలకు 13 జూన్ 1954న స్వాతంత్రం లభించింది. సరిగా ఆ సమయలోనే తమిళుడైన రెడ్డియార్ పట్టిస్వామి అనే వైద్యుడు యానాం చేరాడు. ప్రస్తుతం ఉన్న ఆలయ సమీపంలోని రావిచెట్టు కింద వైద్యం చేసేవాడు. ఒకనాడు స్వామివారు ఆయనకు కలలో కనిపించి రావిచెట్టు వద్ద ఉన్న పుట్టలో తానున్నట్లు చెప్పాడు. అప్పటి నుంచి స్వామివారి ఉనికి తిరిగి బహిర్గతమైంది. లభించిన పురాతన ప్రాకారాలతో, స్తంభాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇక్కడి స్వామివారికి 108 ప్రదక్షిణలు చేయటం, 108 టెంకాయలు కొట్టడం, స్వామివారి ఎదుట భక్తులు గుంజిళ్లు తీయడం ఆచారంగా ఉంది.రుద్రారం సంకష్టహర సిద్ధివిద్యాగణపతి ఆలయంసంగారెడ్డిజిల్లా పటాన్‌చెరువుకు అతి చేరువలోని రుద్రారంలో స్వయంభువుగా వెలసిన శ్రీ సంకష్టహర సిద్ధివిద్యాగణపతి ఆలయం ఉంది. వందల ఏళ్ళనాటి ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారం. రుద్రారం గణపతిని శివరాంభట్ అనే ఆధ్యాత్మిక గురువు ప్రేరణతో నిర్మితమైంది. ఈయన రుద్రారం ప్రాంతం నుంచి రేజింతల వరకు గల ప్రాంతంలో ఐదు వినాయక ఆలయాలను నిర్మించారు. అవి చింతలగిరి, చీకుర్తి, మల్కల్–పాడు, మల్కల్–గుట్ట (రేజింతల్) కాగా, చివరిది ఈ రుద్రారం గణపతి ఆలయం.రుద్రారం గణపతి చతుర్భుజాలతో ఉంటారు. ఉదరానికి నాగబంధం ఉంటుంది. ఈ వినాయకునిపై శ్రీచక్ర బీజాక్షరాలు ఉండటంచేత ఆ శక్తిని సామాన్యులు తట్టుకోవటానికి స్వామివారికి ప్రతిరోజూ సింధూర లేపనం పూస్తారు. ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న పంచ వినాయక ఆలయాలలో స్వామివారికి సింధూర లేపనం పూస్తారు. ఇక్కడి స్వామి విద్యాగణపతి కావటంతో విద్యార్థులు వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు చేసి, దర్శనం చేసుకుంటూ ఉంటారు. సంకష్టహర చతుర్థినాడు ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి.రేజింతల సిద్ధివినాయక ఆలయంసంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు పదమూడు కిలోమీటర్ల దూరంలోని రేజింతల గ్రామంలో నెలకొని ఉన్న స్వయంభూ సిద్ధివినాయక స్వామి రెండువందల సంవత్సరాలకు పైగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు అతి చేరువలో ఉంది. జహీరాబాద్‌కు ఉన్న పూర్వనామం పెద్దమొక్కహెల్లి. జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉండటంతో తెలుగు ప్రజలే కాకుండా, కన్నడ ప్రజలూ అధికసంఖ్యలో వచ్చి ఈíసిద్ధివినాయక స్వామివారిని దర్శించుకుంటారు.శివరాంభట్ అనే ఆధ్యాత్మిక గురువు తన శిష్యగణంతో తిరుమలకు ప్రయాణమవుతూ రేజింతల గ్రామంలో ఆగారు. ఆయనకు రేజింతల కొండ వద్ద వినాయకుని రూపంలో ఒక శిల కనబడింది. అదే ఈ స్వయంభూ వినాయక విగ్రహం. కోరిన కోర్కెలు తీర్చడం వల్ల సిద్ధివినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు.సికింద్రాబాద్ గణపతి ఆలయంసికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు అతి చేరువలో ఉన్న ఈ గణపతి ఆలయం బహు ప్రసిద్ధమైనది. పూర్వం ఈ ప్రాంతం సైనిక నివాస ప్రాంతంగా ఉండేది. 1824లో సైనికులు మంచినీటి కోసం బావి తవ్వగా ఈ వినాయక విగ్రహం బయట పడింది. అప్పుడు చిన్న గుడిగా ఉండేది. 1932లో ఈ ఆలయ ప్రాంగణంలోనే వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మన్యస్వామి ఆలయం, శివాలయం, అమ్మవారి ఆలయం, ఆంజనేయ ఆలయం నర్మించారు. 1960లో ఆలయ ప్రాంగణంలోని బావి పూడ్చి ఆలయానికి నూతన రూపం కల్పించారు. ఈ ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.విశాఖ సంపత్వినాయగర్ ఆలయంవిశాఖ నగరంలో శ్రీసబంధన్ అండ్ కంపెనీవారి కార్యాలయ ప్రాంగణంలో 1962లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ కార్యాలయ యాజమాన్యం మాత్రమే పూజలు చేస్తుండేది. ఆ తరువాతి కాలంలో భక్తజనానికి దర్శనం అనుమతించారు. ఈ ఆలయాన్ని 1967లో సందర్శించిన కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి ఇక్కడ గణపతి యంత్రాన్ని ప్రతిష్ఠించారు.1971లో పాకిస్తాన్‌తో మనదేశానికి యుద్ధం వచ్చినప్పుడు అప్పటి తూర్పు నౌకాదళాధిపతి కృష్ణన్ ఈ వినాయక స్వామిని దర్శించుకురు. యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ సముద్రం మార్గంలో విశాఖ నగరాన్ని ముట్టడి చేయాలన్న ఉద్దేశంతో ఘాజీ అనే జలాంతర్గామిని పంపింది. ఈ జలాంతర్గామిని మన దేశ నౌకాదళాలు ముంచేశాయి. ఆ వెంటనే మన నౌకాదళాధిపతి కృష్ణన్ ఈస్వామివారిని దర్శించుకుని, 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. విశాఖ సంపత్వినాయగర్ ఆలయాన్ని ప్రతిరోజూ వేలసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడి వినాయకునికి ప్రతిరోజూ పంచామృతాభిషేకం చేస్తారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.కాజీపేట శ్వేతర్కమూల గణపతి ఆలయంహనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేప్రాగణంలో శ్వేతార్కమూల గణపతి ఆలయం ఉంది. ఇక్కడి వినాయకమూర్తి తెల్ల జిల్లేడువేరు మొదలు నుంచి ఉద్భవించింది. ఈ విగ్రహన్ని చెక్కడంగాని, మలచటంగాని చేయలేదు. స్వయంగా భూమి నుంచి పుట్టిన శ్వేతార్క గణపతికి నేత్రాలు, నుదురు, మోచేయి, అరచేయి, సుఖాసనము, తల్పము, ఎలుక అన్నీ స్పష్టంగా కనపడతాయి.నారద పురాణంలో తెల్ల జిల్లేడు చెట్టు వందేళ్ళు పెరిగితే ఆ చెట్టుమూలంలో గణపతి రూపం తయారవు తుందని చెప్పారు. వినాయకుడు ప్రకృతి స్వరూపుడు అని పురాణాలు చెబుతున్నాయి. శ్వేతార్కమూలాన్ని వెలికితీసి, మట్టిని కడిగివేసి, నీళ్ళల్లో నానబెట్టి, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ వేరు మీద గణపతి ఆకృతి కనిపిస్తుందని చెబుతారు.1999లో నల్లగొండ ప్రాంతంలోని మాడా ప్రభాకరశర్మ ఇంటి పరిసరాల్లో ఈ శ్వేతార్క గణపతిని అయినవోలు అనంత మల్లయ్యశర్మ గుర్తించారు. ఈ శ్వేతార్కమూల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి, పూజలు మొదలు పెట్టారు. 2002లో దేవాలయాన్ని నిర్మించారు. 2008లో ఆలయాన్ని విస్తరించారు. ప్రతినెలా కృష్ణపక్షంలో వచ్చే సంకష్టహర చతుర్థికి ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.- కప్పగంతు వెంకటరమణమూర్తి(చదవండి: వినాయక విజయం: విచిత్ర వినాయకుడు..!) -
వినాయక విజయం: విచిత్ర వినాయకుడు..!
వాతాపి నగరానికి సాధువుల గుంపుతో కలసి ఒక పద్నాలుగేళ్ల కుర్రవాడు వచ్చాడు. ఆ కుర్రవాడు వాతాపి గణపతి ఆలయాన్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉండిపోయాడు. అతడి ఊరేదో పేరేదో అతడికే తెలియదు. అతడి నుదుటి మీద గాయం మానిన మచ్చ చూసిన జనాలు, పాపం ఏదో దెబ్బ తగిలి గత స్మృతి అంతా పోగొట్టుకున్నాడని అనుకున్నారు. ఆ కుర్రవాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఎంతసేపూ వాతాపి ఆలయ మంటపం రాతి పలకల మీద, గోడల మీద సుద్దతో బొమ్మలు గీస్తూ ఉండేవాడు. బొమ్మలు గీస్తున్నంత సేపూ అతడి ముఖం చిరునవ్వుతో వెలుగుతూ ఉండేది. బొమ్మలు గీస్తూ ఆనందం పొందుతుండే ఆ బాలుడిని వాతాపి వాసులు చిత్రానందుడు, చిత్రముఖుడు అని పిలవసాగారు. అతడు ఎక్కువగా వినాయకుడి బొమ్మలే గీస్తుండటంతో వినాయక చిత్రకారుడనే పేరును సంక్షిప్తంగా మార్చి విచిత్రుడు అని పిలవసాగారు. కాలక్రమంలో ఆ బాలుడికి విచిత్రుడు అనే పేరు స్థిరపడింది.వాతాపి నగరంలో గణపతి భక్తుడైన గజానన పండితుడు రోజూ సాయంత్రం ఇంటి వద్ద పిల్లలకు వినాయక కథలు చెబుతుండేవాడు. మిగిలిన పిల్లలతో కలసి విచిత్రుడు కూడా గజానన పండితుడు చెప్పే కథలను అరుగు మీద కూర్చుని శ్రద్ధగా ఆలకించేవాడు. కథ విన్న మర్నాడు ఆ కథలోని సన్నివేశాలను గోడల మీద చిత్రించేవాడు. విచిత్రుడు చిత్రించే వినాయకుని బొమ్మలు చూసి గజానన పండితుడు మురిసిపోయేవాడు. విచిత్రుడికి ఎన్నో విఘ్నేశ్వరుడి కథలను ప్రత్యేకంగా చెబుతుండేవాడు.విచిత్రుడి వెంట ఎప్పుడూ పిల్లలు గుంపులు గుంపులుగా ఉండేవారు. అతడు చిత్రించే బొమ్మలను వారు అబ్బురంగా చూస్తుండేవారు. కొందరు అతడిలాగా బొమ్మలు గీయడానికి ప్రయత్నిస్తూ చిత్రకళా సాధన చేస్తుండేవారు. విచిత్రుడి ప్రభావంతో వాతాపి నగరంలోని పిల్లలకు చిత్రకళ అబ్బింది.విచిత్రుడు పగలంతా గోడల మీద బొమ్మలు వేస్తూ, వాతాపి గణపతి ఆలయంలో పంచే ప్రసాదంతో కడుపు నింపుకొనేవాడు. రాత్రిపూట ఆలయం మెట్ల మీద ఒక మూలనో, ఊరి చివరనున్న వాడలో ఏ ఇంటి అరుగు మీదనో నిద్రపోయేవాడు. వాడలోని కుమ్మరులు, చర్మకారులు విచిత్రుడంటే ప్రాణం పెట్టేవారు. అతడు ఏ రాత్రి వచ్చినా, అతడి కోసం దాచిపెట్టిన భోజనం తినిపించి, అతడి పడకకు ఏర్పాట్లు చేసి మరీ నిద్రపోయేవారు. అలా విచిత్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు.కాలం ఇలా గడిచిపోతుండగా, వాతాపి నగరంలో వినాయక నవరాత్రుల కోలాహలం పండుగకు కొద్ది రోజుల ముందు నుంచే మొదలైంది. ఉత్సవాల సందర్భంగా ఒక శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు జరిగింది. ప్రదర్శనలో అత్యుత్తమంగా నిలిచిన విగ్రహాన్ని ఉత్సవ నిర్వాహకులు వెయ్యి బంగారు కాసులు ఇచ్చి కొంటారు. ఆ విగ్రహాన్ని మలచిన కళాకారుడిని నగరపాలకులు రత్నఖచిత స్వర్ణకంకణంతో ఘనంగా సత్కరిస్తారు.ఆ పోటీ ప్రదర్శనలో చుట్టుపక్కల రాజ్యాల ఆస్థాన చిత్రకారులు సహా ఎందరో పేరుగాంచిన శిల్పులు, చిత్రకారులు తమ తమ విగ్రహాలను తీసుకొచ్చారు. విదేశాల నుంచి తెప్పించిన రంగులు, బంగారు పూతలతో, రంగురాళ్లతో ఒకరిని మించి మరొకరు కళ్లు మిరుమిట్లు గొలిపేలాంటి వినాయక విగ్రహాలను రూపొందించి, ప్రదర్శనకు పెట్టారు.తాను రూపొందించిన విగ్రహాన్ని కూడా ప్రదర్శనలో పెట్టాలని విచిత్రుడు ఉబలాటపడ్డాడు. అతడికి ఒక కుమ్మరి మిత్రుడు ఉన్నాడు. విచిత్రుడు తీర్చిదిద్దిన రూపురేఖలతో అతడు బంకమట్టిని ఉపయోగించి విగ్రహం తయారు చేశాడు. సున్నం, బొగ్గుమసి, జేగురు, పచ్చమట్టి, ఆకుపసర్లు ఉపయోగించి విచిత్రుడు ఆ విగ్రహానికి చక్కగా రంగులు వేశాడు. ప్రదర్శనలో పెట్టడానికి విచిత్రుడు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లాడు. అక్కడి పెద్దలందరూ విచిత్రుడి విగ్రహాన్ని ప్రదర్శనలో పెట్టనివ్వలేదు. తన విగ్రహాన్ని చిట్టచివరనైనా ఉంచాలని విచిత్రుడు ఎంతగా ప్రాధేయపడినా, వారు కనికరించలేదు. ‘కులగోత్రాలు లేనివాడివి, ఊరూ పేరూ లేనివాడివి, కడజాతుల వారితో కలసి తిరిగేవాడివి. అలాంటి నీ చేతుల్లో తయారైన విగ్రహానికి వంశప్రతిష్ఠలు గల సుప్రసిద్ధ చిత్రకారుల విగ్రహాల సరసన ప్రదర్శించే అర్హత లేదు’ అని నిర్దాక్షిణ్యంగా అతడి కోరికను తిరస్కరించారు.విచిత్రుడు చాలా బాధపడ్డాడు. అతడి బాధను చూసిన కుమ్మరి మిత్రుడు ‘ప్రదర్శన పందిట్లో పెట్టకపోతే పోయారు. మనం వేరే చోట ఈ విగ్రహాన్ని అందరికీ కనిపించేలా పెడదాం, పద!’ అని నచ్చచెప్పాడు. ప్రదర్శన పందిరికి ఎదురుగా కొంత దూరంలో ఉన్న ఒక చెట్టు మొదట్లో విగ్రహాన్ని పెట్టి, విచిత్రుడిని తనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. పెద్దలందరూ పందిరిలో ప్రదర్శించిన విగ్రహాలను తిలకిస్తుంటే, పిల్లలు మాత్రం గుంపులు గుంపులుగా విచిత్రుడు రంగులద్దిన విగ్రహం ముందు గుమిగూడారు.ఒకవైపు పందిట్లోని ప్రదర్శనలో పెద్దల సందడి, మరోవైపు చెట్టుకింద విగ్రహం వద్ద పిల్లల కోలాహలం కొనసాగుతుండగా, ఎక్కడి నుంచో ఇద్దరు యువతులు వచ్చారు. మెరుపుతీగల్లాంటి వారిద్దరూ నిండుగా విలువైన నగలు ధరించి కళకళలాడుతూ ఉన్నారు. జనం వారిని ఆశ్చర్యంతో చూస్తుంటే, వారిలోని పెద్దామె ‘అయ్యలారా! మాది కళానంద నగరం. మాకు నచ్చిన వినాయక విగ్రహం కోసం పదివేల వరహాలు పట్టుకొచ్చాం’ అంటూ చేతిలోని బంగారు అల్లిక జలతారు సంచిని గలగలలాడించింది. ప్రదర్శనలో పిచ్చాపాటీ మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్న చిత్రకారులందరూ ఆమె మాటలతో అప్రమత్తమయ్యారు. ఎవరి విగ్రహాల దగ్గరకు వారు చేరి, గంభీరంగా నిలుచున్నారు.‘మా అక్క ప్రసన్నవదన గొప్ప గాయనీమణి. విగ్రహపుష్టి మాత్రమే కాదు, గొప్ప తిండిపుష్టి, గాత్రపుష్టి ఉన్నది. గొంతు విప్పిందంటే, ఆమె పాటకు ఎంతటి వారైనా మైమరచిపోవాల్సిందే!’ అంటూ ఇద్దరిలోనూ చిన్నది కాలి గజ్జెలను మోగిస్తూ, అక్కడున్న అందరి వంకా ఓరచూపులు విసిరింది.‘మా చెల్లి మోహన గొప్ప వాగుడుకాయ. అంతకు మించి గొప్ప నర్తకీమణి. చూడటానికి నాజూకు చిన్నదిలా ఉన్నా, నాట్యమాడుతూ నన్నే ఎత్తి తిప్పేస్తుంది. నాట్యంలో దాని చురుకుదనం చూడటానికి రెండు కళ్లు చాలవు. మాతో ఆడించడం, పాడించడం సాక్షాత్తు ఇంద్రుడికి, కుబేరుడికే సాధ్యం కాదు. అయితే, ఇక్కడ మాకు నచ్చిన విగ్రహం ముందు ఆటపాటలను ప్రదర్శిస్తామని వినాయకుణ్ణి మొక్కుకున్నాం’ అని చెప్పింది ప్రసన్నవదన. వారి మాటలకు మంత్ర ముగ్ధులైన జనాలు, వారు విగ్రహాలు చూడటానికి వీలుగా పక్కకు తొలగి, దారి ఇచ్చారు.అక్కా చెల్లెళ్లిద్దరూ ఒక్కొక్క విగ్రహం దగ్గర ఆగి, వాటిని పరిశీలనగా చూస్తూ ముందుకు సాగారు. అన్ని విగ్రహాలనూ చూసినా, ఏదీ నచ్చకపోవడంతో పెదవి విరిచి బయటకు మరలుతుండగా, ప్రదర్శన పందిరి ఎదురుగా పిల్లల కోలాహలం కనిపించింది. ‘అక్కడ పిల్ల వెధవలెవరో తయారు చేసిన తక్కువరకం విగ్రహం ఉంది లెండి’ అని గుంపులోంచి ఎవరో అనడం వాళ్లకు వినిపించింది. అది విని మోహన, ‘పదవే అక్కా! అక్కడేదో విగ్రహం తక్కువలోనే దొరికేటట్లుంది’ అంటూ ప్రసన్నవదన చేయి పట్టుకుని అటువైపుగా దారితీసింది. ప్రదర్శనశాలలోని జనాలంతా వాళ్లనే అనుసరిస్తూ బయటకు వచ్చారు. ప్రదర్శనశాలలో ఒక్కరూ మిగల్లేదు.ప్రసన్నవదన చెట్టు కిందనున్న విగ్రహం వద్దకు వెళ్లి, ఆ విగ్రహం ముందు వరహాల సంచి పెట్టింది. తన మెడలోని రత్నహారాన్ని తీసి, విచిత్రుడి చేతికి కంకణంలా తొడిగింది. అది చూసిన జనం ‘వీళ్లకేదో పిచ్చి ఉన్నట్లుంది! గొప్ప విగ్రహాలను కాదని వచ్చి, ఈ నాసిరకం విగ్రహం ముందు డబ్బు ధారపోస్తున్నారు’ అన్నారు.వాళ్ల మాటలు విన్న ప్రసన్నవదన జనాల వైపు చూసి, ‘ఇక్కడున్న విగ్రహంలోని ఏ విశేషాన్ని చూసి పిల్లలందరూ మురిసి ముచ్చటపడుతున్నారో, ఆ విశేషమే మమ్మల్ని కూడా ఆకట్టుకుంది. బాల దీవెనలు బ్రహ్మ దీవెనలు.అందుకే ఈ పిల్లల ఎంపికను శిరసావహిస్తున్నాము’ అని చెప్పింది.‘మట్టిశిల్పంలో లేని రూపసౌందర్యాన్ని సామాన్యమైన జేగురు వంటి రంగులతోనే తీర్చిదిద్దిన ఈ చిత్రకారుడి ప్రతిభ అమోఘం, అద్వితీయం. ఈ విగ్రహానికి మా బహుమానం అతిస్వల్పం’ అంది మోహన.‘మా కోరిక నెరవేరింది. ఇక్కడే మా మొక్కు చెల్లించుకుంటాం’ చెప్పింది ప్రసన్నవదన.వినాయక విగ్రహాన్ని అంటిపెట్టుకుని కూర్చుని, ప్రసన్నవదన తాళాలు మోగిస్తూ, ‘తాండవ నృత్యకరీ గజానన’ అంటూ కీర్తన మొదలుపెట్టింది. ఆ వెంటనే మోహన విద్యుల్లతలా నాట్యం ప్రారంభించింది. జనాలందరూ విస్మయచకితులై ఆ ప్రదర్శనను తిలకించసాగారు.ప్రసన్నవదన గానం ఇంట్లో ఉన్న గజానన పండితుడి చెవిన పడింది. అప్పటికే శతాధిక వృద్ధుడైన ఆయన ఇల్లు కదల్లేని స్థితిలో ఉన్నాడు. అయితే, ప్రసన్నవదన గానానికి ఆయనకు ఎక్కడలేని జవసత్త్వాలూ వచ్చాయి. మంచం మీద నుంచి లేచి, ఒక్క పరుగున ప్రదర్శన జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. ప్రసన్నవదనను చూసి, చేతులెత్తి జోడించి, సాగిలబడి, ధ్యాన ముద్రలో అలాగే ఉండిపోయాడు.నృత్యం చేస్తూ, చేస్తూ మోహన అంత పెద్ద వినాయక విగ్రహాన్నీ భుజం మీదకెత్తుకుంది. అది చూసిన జనం ‘అంత బరువు మోయలేవమ్మా! పడిపోతావు!’ అని కేకలు వేశారు. ‘నాకు అలవాటేగా!’ అని చెబుతూ ఆమె విగ్రహాన్ని భుజాన పెట్టుకునే నాట్యం చేస్తూనే పరుగులాంటి నడకతో బయలుదేరింది. జనం ఆమెను పరుగు పరుగున అనుసరించారు. ఈ సందడిలో ప్రసన్నవదన ఎప్పుడు అదృశ్యమైపోయిందో కూడా ఎవరూ గుర్తించలేదు.మోహన ఆలయ తటాకం వద్దకు చేరుకుంది. నాట్యం చేస్తూ, ఒక్కొక్క మెట్టే దిగుతూ తటాకంలో మునిగి అదృశ్యమైంది. కొద్ది క్షణాల్లో ఒక చిట్టెలుక విగ్రహాన్ని వీపున మోసుకుంటూ, నీటిలోకి మాయమైంది. ఆ రోజే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే రోజు. జనాలు ఈ దృశ్యాన్ని చూసి, దిగ్భ్రాంతులయ్యారు.గజాననుడు ధ్యానముద్ర నుంచి తేరుకునే సరికి చెట్టు కింద విచిత్రుడు, అతడి కుమ్మరి మిత్రుడు, బంగారు జలతారు వరహాల సంచి తప్ప మరేమీ కనిపించలేదు. గజాననుడు లేచి, విచిత్రుడి వద్దకు వెళ్లి, అతడి తలమీద చేయివేసి ‘వాతాపి గణపతి ఆలయాన్ని నీ కళతో చిత్రశోభితం చేయి. కావలసిన ధనాన్ని ఆ విఘ్ననాయకుడే అనుగ్రహించాడు కదా! నీ వల్ల వాతాపి నగరం పావనమైంది. ఇక నుంచి నువ్వు పావనమిశ్రుడిగా ప్రఖ్యాతి పొందుతావు’ అని ఆశీర్వదించాడు. – సాంఖ్యాయన(చదవండి: దూర్వాయుగ్మపూజ అనగా..? గరికతోనే ఎందుకంటే..?) -
దూర్వాయుగ్మపూజ అనగా..? గరికతోనే ఎందుకంటే..?
వినాయక చవితి వ్రతవిధానంలో దూర్వాయుగ్మపూజ విశేషమైనది. గరికతో వినాయకుని ప్రత్యేకంగా పూజించటమే దూర్వాయుగ్మపూజ. ఏకవింశతిపత్ర పూజలో భాగంగా, వినాయకచవితి వ్రతవిధానంలో దూర్వాయుగ్మంతో పూజ తప్పనిసరి. గణనాథుని దశనామాలను స్మరిస్తూ గరికను దేవునికి అర్పించటం ఈపూజలో భాగం.వంద యజ్ఞాలు ఇవ్వలేని ఫలితాన్ని ఒక్క గరికపోచ ఇస్తుంది. గరికలేని వినాయక పూజ వ్యర్థమని సాక్షాత్తు ఆ గణపతే పేర్కొన్నాడు. అందుకే, వినాయక చవితినాడు గరికకు అంతటి ప్రాధాన్యం. గరిక మహిమను తెలిపే కథలు మనకు గణేశ పురాణంలో కనిపిస్తాయి.పూర్వం సులభుడనే ఒక గంధర్వరాజు ఉండేవాడు. ఆయన భార్య సముద్ర. ఒకసారి ఆ దంపతులు పురాణశ్రవణంలో ఉండగా, అక్కడకు మధుసూదనుడనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతనిని చూడగానే సులభుడికి పేద, గొప్ప అనే తారతమ్యం గుర్తొచ్చి నవ్వాడు. పేదవాడైన మధుసూదనుడి అహం దెబ్బతినటంతో కోపగించిన అతను, గంధర్వరాజును చూసి ‘రాజా! గర్వాంధుడవైన నీవు పొలం దున్నే ఎద్దుగా జన్మిస్తావు’ అని శపించాడు. అతని శాపాన్ని విని కోపగించిన గంధర్వరాజు భార్య సముద్ర ‘దరిద్రుడా! నువ్వు చెత్తాచెదారం తినే గాడిదగా జన్మించు‘ అని మధుసూదనుడికి ప్రతిశాపం ఇచ్చింది. ఆమె శాపానికి ఆగ్రహోదగ్రుడైన మధుసూదనుడు ఆమెను ‘చండాలురాలివి కమ్ము’ అని శపించాడు.ఆవిధంగా శాపగ్రస్తులైన ఆ ముగ్గురూ, శాపకారణాన శరీరాలను త్యజించారు. చండాలినిగా మారిన సముద్ర దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ గణపతి ఆలయాన్ని చూసింది. ఆరోజు చతుర్థి. గుడిలో గణేశారాధన జరుగుతోంది. బయట కుండపోతగా వర్షంకురుస్తోంది. వానకు తట్టుకోలేని చండాలిని ఇళ్ళవైపుకు పోగా, అక్కడివాళ్ళు ఆమెను తరిమారు. వేరే గత్యంతరంలేని ఆమె గణేశాలయ ప్రాకారం కిందకు వచ్చి, గడ్డీగాదం పోగుచేసి మంటవేసి చలి కాచుకోసాగింది. ఇంతలో శాపానికి గురైన ఎద్దు, గాడిదలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పోగుచేసిన గడ్డిని తినసాగాయి. గడ్డి కోసం ఎద్దు, గాడిదలు కుమ్ములాడుకోగా, కొన్ని గడ్డిపరకలు గాలికి కొట్టుకెళ్ళి గుడిలోని వినాయకుని శిరస్సుపై పడ్డాయి. ఇంతలో చండాలిని తన చేతిలోని దుడ్డుకర్రతో వాటిని బాదసాగింది. అవి రెండూ పరుగెత్తుకుంటూ, గుడిలోకి ప్రవేశించి అక్కడున్న ఖాద్య వస్తువులన్నిటినీ తినసాగాయి. అక్కడున్న పూజారులు వాటిని తరమసాగారు. ఈ కలకలం చెవినబడ్డ చండాలిని ఏమిటన్నట్టుగా ఆలయంలోకి ప్రవేశించింది. అప్పుడామె చేతిలోని గడ్డిపోచలు వినాయకుని తలపై పడ్డాయి. అటుగా వచ్చిన భక్తులు ఆమెను అక్కడి నుంచి తరిమి, తలుపులు మూసేశారు. అలా బయటపడిన ఆ మూడు జీవుల పరిస్థితి దుర్భరంగా మారింది. అయితే, తెలియక వారు వినాయకునికి సమర్పించిన గడ్డిపోచలు తన శిరస్సును అలంకరించినందుకు సంతసించిన గణపతి వారిని కరుణించాడు.వెంటనే గణపతి భృత్యులు విమానంలో దిగివచ్చి వారు ముగ్గురినీ ఉత్తమ లోకాలకు తీసుకువెళ్లసాగారు. ఆ వింతదృశ్యం చూసిన ఋషులు చేతులు జోడించి, ఓ దేవతలారా! వీరికి ఎలా శాశ్వత గతులు లభించాయి. ఈ జీవులు పూజలు పునస్కారాలు చేసినవారు కారే! ఇందుకు ఏదైనా సులభోపాయం ఉంటే సెలవివ్వగలరు’ అంటూ వినమ్రంగా ప్రశ్నించారు. వారి ప్రశ్నలను ఆలకించిన గణేశ దూతలు గరిక మహిమను తెలియచేసే ఇంద్ర–నారద సంవాదంలోని ఆసక్తికరమైన కథను ఇలా వివరించారు:పూర్వం స్థావరం అనే పట్టణంలో కౌండిన్యుడు అనే ముని పరమ గణేశ భక్తుడు. ఆయన భార్య ఆశ్రమ. ఆమె ఒకరోజు తన భర్తను, ‘స్వామీ! మీరు గణపతి విగ్రహం శిరస్సు మీద గరిక పెట్టి పూజించటంలో ఆంతర్యమేమిటి?’ అని ప్రశ్నించింది.అందుకు కౌండిన్యుడు ఈవిధంగా చెప్పాడు. పూర్వం ధర్మ అనే నగరంలో జరిగిన ఒక మహోత్సవానికి, సిద్ధులు, చారులు, యక్షులు, నాగులు, మునులు అంతా విచ్చేశారు. అక్కడ తిలోత్తమ నాట్యమాడుతుండగా, ఆమె ధరించిన పైవస్త్రం జారి కిందపడింది. అప్పుడు ఆ సభలో ఉన్న యముడు ఆమెను చూసి మదన తాపానికి గురై ఆమెను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. ఆయన అలా ప్రవర్తించటం సభా గౌరవానికి భంగం అని అందరూ భావించటంతో ఆ విషయాన్ని గ్రహించిన యముడు సభ నుంచి బయటకు వచ్చాడు. అలా వచ్చిన యముని రేతస్సు స్ఖలితమై భూమిపై పడింది. ఆ రేతస్సు నుంచి వికృతాకారుడైన రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడి జటలు ఖగోళాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నాయి. ఆ రాక్షసుడు పెద్దపెద్ద అరుపులతో అందరినీ భయపెట్టసాగాడు. అప్పుడు దేవతలు, ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణు వేడగా, ఆయన వారిని గణపతి వద్దకు వెళ్లమని సూచించాడు. దాంతో వారందరూ గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేశారు. అప్పుడు పద్మంవంటి నేత్రాలతో కోటిసూర్యుల తేజస్సుతో మల్లెపువ్వుల కంటే తెల్లనైన పలువరుసతో, శంఖంవంటి కంఠంతో, నానాలంకారాలతో దివ్యాంబరాలను ధరించి రత్నసింహాసనంపై కూర్చొని దేవతలకు బాలగణపతిగా దర్శనమిచ్చాడు. దేవతల కోరిక మేరకు బాలగణపతి ఆ అనలాసురుడనే రాక్షసుడిని చంప నిశ్చయిస్తాడు. బాలగణపతిని చూసిన అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ ముందుకురాగా, తన యోగమాయా బలంతో అనలాసురుడిని మింగుతాడు. కాని అనలాసురుడు కడుపులోకి వెళితే, తన కడుపులో ఉన్న భువనాలు దగ్ధమవుతాయని తలచిన స్వామి, ఆ రాక్షసుడిని తన కంఠంలోనే నిలుపుకున్నాడు. ఆ తాపాన్ని ఉపశమింప చేయటానికి ఇంద్రుడు చంద్రకళను గణపతికి ప్రసాదించాడు. అప్పటి నుంచి స్వామివారు ఫాలచంద్రుడయ్యాడు. బ్రహ్మదేవుడు సిద్ధి, బుద్ధి అనే మానవకన్యలను సృష్టించి స్వామికి ప్రసాదించాడు. వారిని ఆలింగనం చేసుకోవటం వల్ల స్వామివారి తాపం కొంతమేరకు శాంతించింది. విష్ణువు పద్మాలను ప్రసాదించటంతో స్వామి పద్మహస్తుడు అయ్యాడు. అప్పటికీ అగ్నిని శాంతింప చేయడానికి వరుణదేవుడు నీటితో స్వామిని అభిషేకించాడు. పరమేశ్వరుడు ఆదిశేషుడిని ప్రసాదించాడు. దానితో స్వామివారి ఉదరం బంధింపబడటం వల్ల ఆయనకు వ్యాళబద్ధుడనే పేరు వచ్చింది. అప్పటికీ తాపం శాంతించలేదు. అప్పుడు ఎనభైవేలమంది ఋషులు వచ్చి ఒకొక్కరు, ఇరవై ఒక్క దుర్వాంకురాలు (గరికపోచలు) చొప్పున స్వామికి ప్రసాదించటంతో స్వామివారి తాపం పూర్తిగా ఉపశమించింది. అందుకే గణపతికి గరిక ప్రీతిపాత్రమైనది. అప్పటి నుంచి గణపతి పూజలో గరికకు విశిష్ట స్థానం దక్కింది. – కప్పగంతు వెంకటరమణమూర్తి(చదవండి: పూరి జగన్నాథుడిని గణనాథుడిగా ఆరాధిస్తారని తెలుసా..!) -
పూరి జగన్నాథుడిని గణనాథుడిగా ఆరాధిస్తారని తెలుసా..!
భారతదేశంలో అత్యం ప్రసిద్ధి గాంచిన పూరీ క్షేత్రంలో జగన్నాథుడిని, బలభద్రుడిని ఏకదంతుడి రూపంలో ముస్తాబు చేసి మరీ పూజలు చేస్తారు. ఈ వేడుకనే ‘హాథీబేష’ (ఏనుగు వేషం) అని పిలుస్తారు. ఇలా ఆషాడ మాసంలో గణపతి రూపంలో ముస్తాబు చేసి మరీ జగన్నాథుడిని పూజిస్తారు. ఈ వేడు జేష్ట పౌర్ణమి రోజున జరగుతుంది. ఇలా పూరీ జగన్నాథుడుని పూజించడానికి కారణం ఉందంటూ.. మంచి ఆసక్తికర గాథ ఒకటి చెబుతుంటారు పండితలు. అదేంటంటే..పూర్వం రోజులలో పూరి రాజు దగ్గరికి గణపతి భక్తుడు అయిన గణపతి బప్ప అనే పండితుడు వచ్చాడు. ఆ సమయంలో పూరిలో జగన్నాథుడిని స్నాన యాత్ర వేడుకకు సిద్ధం చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనవల్సిందిగా గణపతి బట్టను రాజు ఆహ్వానిస్తాడు.దానికి ఆయన తాను గణపతిని మాత్రమే పూజిస్తానని, ఆయన తనకు అన్నీ అని చెబుతాడు. అయితే రాజు ఒత్తిడి చేయడంతో అయిష్టపూర్వకంగానే జగన్నాధుడి స్నాన యాత్రకు గణపతి బప్ప రావడం జరగుతుంది. అయితే అక్కడికి వెళ్లేసరికి ఊహకే అందని లీలా వినోదం సృష్టిస్తాడు ఆ దేవాదిదేవుడు జగన్నాథుడు. ఆ పూరీ క్షేతంలోని జగన్నాథుడు, పండితుడి గణపతి బప్ప కంటికి ఏకదంతుడి రూపంలో రూపంలో కనిపిస్తాడు. ఇదేంటి జగన్నాథుడు గణనాథుని రూపంలో కనిపించడం ఏంటని ఆశ్చర్యపోతాడు. ఇది కల మాయా అని గందరగోళానకి లోనవ్వుతాడు. విచిత్రంగా బలభద్రుడు కూడా ఏకందంతుడి రూపంల కనిపించడంతో మరంత విస్తుపోతాడు. అప్పుడు గణపతి బప్పకి తన అజ్ఞానానికి కన్నీరుమున్నీరుగా విలపిస్తాడు. తనకు బుద్ధి చెప్పాలనే ఆ చిలిపి కృష్ణుడు ఇలాంటి మాయ చేశాడని గ్రహిస్తాడు. భగవంతుడు ఏ రూపంలో ఉన్న పరమాత్మ అనేది ఒక్కటే అనే విషయం తెలుసుకుంటాడు. ఆనాటి నుంచే పూరి జనన్నాథుని రథయాత్రకు ముందు అనగా జేష్ట పౌర్ణమి రోజు జరిపే స్నాన యాత్ర సమయంలో ఆలయ పూజరులు జగన్నాథ, బలభద్రుల ముఖాలకు ఏనుగు తొడుగులు ధరింపజేస్తారు.బలరాముడు తెల్ల ఏనుగు రూపంలో, జగన్నాథుడు నల్ల ఏనుగు రూపంలో భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తాడు. దీన్ని పూరి దేవాలయా సంప్రదాయంలో హాథిబేష అని పిలుస్థారు. ఇలా పూరీ జగన్నాథుని ఏకదంతుడి రూపంలో ధరిస్తే తమకు మంచి జరగుతుందని భక్తలు ప్రగాఢ నమ్మకం.(చదవండి: సకలకార్యాల సిద్ధికై.. తొలిపూజ మహాగణపతికే!) -
పెళ్లిలో తోడిపెళ్లి కూతురు/పెళ్లి కొడుకు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..!
పెళ్లితంతులో తోడిపెళ్లి కూతురు లేదా తోడి పెళ్లికొడుకుగా చిన్న పిల్లలను కూర్చొబెడతాం. వాళ్లు సిగ్గుపడిపోతూ..బుల్లి నవ్వులతో ఏదో సాధించిన వాళ్లలా పెట్టే వారి ముఖాలు చూస్తే ముచ్చటేస్తుంది. ఇలా ఎందుకు కూర్చొబెడతారనేది తెలియదు. అదీగాక ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ఆచారిస్తున్నారనేది కూడా కచ్చితంగా తెలియదు. కానీ ఈ సంప్రదాయం గురించి పలు ఆసక్తికర కథనాలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దామా..!పూర్వం తోడి పెళ్లికూతురుగా వధువు స్నేహితురాలు లేదా సన్నిహిత బంధువులు ఉండేవారు కాదట. ఆమె సేవకులు అనుసరించేవారట. అంటే వధువు ఇష్టమైన పనిమనిషి ఆమెను అనుసరించేదట. అంతేగాదు ఆ కాలం పెళ్లైన మహిళ కూడా ఆ సేవకురాలు అత్తారింటిలో అడుగుపెట్టేదట. అక్కడ ఆమెకు కొత్త ప్రదేశం కావాల్సిన పనుల్లో సహయం చేసేదట. అలాగే ఒకవేళ నెలతప్పితే సపర్యలు చేసేందుకు ఇలా తోడి పెళ్లికూతురు అనే సంప్రదాయం వచ్చిందని కథనం. మరొక కథనం ప్రకారం..తోడి పెళ్లికూతురుని దుష్ట శక్తులు, చెడు ఉద్దేశ్యాలు ఉన్నవాళ్లని గందరగోళ పరిచేందుకు లేదా వారి దృష్టి పోవడానికి ఇలా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇక్కడ ఇరువురు ఒకే విధమైన దుస్తులు ధరిస్తారు గానీ, ఆభరణాలు, అలంకరణ హైలేట్‌గా కనిపించేది అసలైన వధువే. అంటే ఇక్కడ వధువు అందమైనదనో లేక హైలెట్‌గా కనిపించేందుకు ఇలా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతున్నారు. అంతేకాదు ఈ సంప్రదాయం పురాతన రోమన్ కాలం నుంచి కూడా ఉందట. ఇక పండితుల ప్రకారం..ఇది వరకు కొందరు రాజులు పెద్ద మనిషి అయిన పిల్లలను ఎత్తుకు పోయేవారట. వారే పాలకులు కావడంతో ఎదిరించడం సామాన్య ప్రజల వల్ల అయ్యేది కాదు. అందుకు పరిష్కారంగా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబతున్నారు. అంటే ఇక్కడ ..పెళ్లైన వారిని ఎవ్వరూ కన్నెత్తి చూడటం, ముట్టుకోవడం వంటివి చేసేవారు కాదు. అంతేగాదు ఈ కారణం చేతనే రజస్వల కాకముందే పెళ్లి చేయడం లేదా బాల్య వివాహాలు చేయడం అనే సంప్రదాయం వచ్చిందని చెబుతున్నారు. మన పెద్దవాళ్లు ఏ ఉద్దేశ్యంతో ఈ ఆచారం తీసుకొచ్చారనేది స్పష్టం కాకున్న..చిన్నారులను ఇలా తోడి పెళ్లికూతురు లేదా తోడి పెళ్లికొడుకుగా సిద్ధం చేయడం, దీనికి తోడు పెద్దలు విసిరే ఛలోక్తులు, జోకులు భలే సరదా సరదాగా ఉంటాయి కదూ..!.(చదవండి: ఆయనే రుషి..అక్షర కార్మికుడు..!: విజ్ఞాన మూలంను గౌరవించే రోజు) -
శంఖం... లక్ష్మీ స్వరూపం
ప్రాచీన భారతీయ సంస్కృతిలో శంఖానికి విశిష్ట స్థానం ఉంది. శ్రీమన్నారాయణుని మన సనాతన ధర్మంలో శంఖాన్ని మహావిష్ణు స్వరూపంగా, లక్ష్మీప్రదంగా వివరించారు.శంఖంలో పోస్తేనే తీర్థమన్నారు మనవారు. శాస్త్రప్రకారం శంఖం లక్ష్మీస్వరూపం.సముద్రంలో జీవించు ఒక ప్రాణి ఆత్మరక్షణ కోసం శరీరానికి నాలుగువైపుల రక్షణ కవచం నిర్మించుకొంటుంది. కొంతకాలం తర్వాత అది కవచం వదిలి కొత్త కవచం కట్టుకోవడంలో లీనమవుతుంది. ఆ కవచమే మనకు చిరపరిచయమైన శంఖం.అర్చన సమయాలలో శంఖనాదం చేస్తారు. బెంగాల్లో వివాహ సందర్భంగా శంఖధ్వని తప్పనిసరి, శంఖం లోపలి భాగం ముత్యంలా ఉంటుంది. అందులో చెవి పెట్టి వింటే సముద్ర ఘోష వినిపిస్తుంది. శంఖంలో ΄ోసిన తీర్థం సేవించడం వల్ల వాత పిత్త దోషాలు, సమస్త రోగాలు తొలగి ΄ోతాయని పరమపురుష సంహిత చెబుతోంది.శంఖాలలో దక్షిణావర్త శంఖం శ్రీ విష్ణువుకు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అయింది. ఈ శంఖం ఉన్న ఇంటిలో అఖండ సంపదలతో లక్ష్మి నివసిస్తుందని ప్రతీతి. చాలామంది పూజలో ఈ శంఖాన్ని పెడతారు. పుణ్యదినాలలో ఇంట్లో పూజచేసి దేవతార్చనలో పెట్టాలి. శ్రీరామనవమి, విజయదశమి, గురుపుష్యమి, రవిపుష్యమి నక్షత్రాలు, పుణ్యతిథులు ఈ పర్వదినాల్లో తప్పకుండా పూజ చేయాలని పెద్దలు చెప్పారు. -
ఆయనే రుషి..అక్షర కార్మికుడు..మార్గదర్శి..!
ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. శిష్యుల భవిష్యత్‌కు నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవో భవ అంటూ గురువుకి స్థానం ఇచ్చాం. గురువు బ్రహ్మ.. గురువు విష్ణువు.. గురువు శివుడు అంటూ కీరిస్తాం.. దేశాన్ని ఏలే రాజైనా సరే ఒక గురువుకి శిష్యుడే.. ప్రపంచాన్ని శాసించే పరమాత్ముడైనా ఒక గురువుకి శిష్యుడిగా మారి విద్యను అభ్యసించాల్సిందే.. గురుభక్తి ఉన్న శిష్యుడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. గురువు ఆశీస్సులతో మనం ఏదైనా సాధించగలం. ఈ రోజు (సెప్టెంబర్ 5న) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే ఉత్తమ గురు-శిష్య జంటల గురించి తెలుసుకుందాం.మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో..!గురువులకే గురువు..యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు హోవెల్. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు సోవియట్ అధినేత స్టాలిన్. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయ్యింది.తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు.గురువు గొప్పదనం..మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలోని అంశం.. యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.మన సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్న ఆ గురుదేవులందర్నీ స్మరించుకుంటూ.. ఈ ఉత్తమ గురు-శిష్య ద్వయం నుంచి నేటి తరం అపారమైన జీవిత పాఠాన్ని నేర్చుకుని స్ఫూర్తి పొందొచ్చు.(చదవండి: గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?) -
గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెబరు 5న మన దేశంలో టీచర్స్‌డే జరుపుకోవడం ఆనవాయితీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజ నీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా విశేషసేవంలందించి, భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్నం’ అందుకున్న గొప్ప వ్యక్తి.ఉధ్యాయ దినోత్సవం అనగానే విద్యార్థులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.ఒక విధంగా చెప్పాలంటే ఇదొక అరుదైన సందర్భం అని చెప్పవచ్చు. టీచర్లు, విద్యార్థుల కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ గడిపే చక్కటి అవకాశం. తమ అభిమాన టీచర్ల వేషధారణలో సందడి చేస్తారు. వారిని అనుకరిస్తారు. భవిష్యత్తులోతామూ ఇలాగే కావాలని కలలు కంటారు. జీవితాంతా తమ అభిమాన టీచర్లను, వారి జ్ఞాపకాలను తమ గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. ‘‘రాయిని వజ్రంలా మార్చగలిగే శక్తే ఉపాధ్యాయుడు’’గురువు అంటే మనల్ని అజ్ఞానంనుంచి జ్ఞానంవైపు నడిపించే అద్భత శక్తి. విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పించేవాడే గురువు. గురువు లేనిదే ఏ మనిషికీ పురోగతి లేదు. గురువు అనేక రూపాలలో ఉంటాడు. గైడ్ అనే ఆంగ్ల పదం సంస్కృత పదం గురు నుండి ఉద్భవించింది. నిస్వార్థంగా తన విజ్ఞానమంతా శిష్యుడికి ధారపోస్తాడు గురువు. ఆ జ్ఞానంతో తన శిష్యుడు లోకానికి మేలు చేయాలని భావిస్తాడు.‘‘విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసిన ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.’’అమితాబ్ బచ్చన్: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. గంభీరమైన ఆయన వాయిస్‌కు ఫిదా కాని వారు ఉండరు. ఆయన స్వరమే ఆయనకు కొండంత ఆస్తి. ఆయన స్వరంగా ఇంత గొప్ప ఖ్యాతి గడించినడానికి, పాపులర్ కావడానికి కారణం ఇంగ్లీష్ టీచర్ మార్టిన్. తప డిక్షన్‌ను అభివృద్ధి చేయడంలో మార్టిన్ ఎంతో సాయం చేశారని, తనను ఎంతో ప్రోత్సహించేవారని మార్టిన్ గురించి ఎపుడూ చెబుతూంటారు.ఏ.పీ. జే అబ్దుల్ కలాం: భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం చాలా మందికి స్ఫూర్తి. మరి ఆయనకు ప్రేరణ ఇచ్చిన టీచర్ ఎవరో తెలుసా? కలాం పాఠశాల ఉపాధ్యాయుడు ఇయాదురై సోలమన్. పెద్ద కలలు కనడం, ఆ కలల సాకారం కోసం కష్టపడి పనిచేసే లక్షణాలను ఆయన సోలమన్ నుంచే నేర్చుకున్నారట.ప్రియాంక చోప్రా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు ప్రేరణ. తన హైస్కూల్ టీచర్, ఓ'బ్రియన్ గురించి ప్రియాంక తరచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. నిర్మాణం విషయంలో తనను ఎంతో ప్రోత్సహించేవారని చెప్పేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ఆర్ గా ప్రసిద్ధి చెందిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఉపాధ్యాయులనుచి బాగా ప్రభావితమయ్యారు. తనపై తన టీచర్లు ప్రభావం గణనీయంగా ఉంటుందని స్వయంగా ఆయన చెప్పేవారు. ముఖ్యంగా కేవీ సుబ్బారెడ్డి తన శక్తి సామర్థ్యాలను ఆదిలోనే గుర్తించి, ఉన్నత విద్యను అభ్యసించి, ప్రజా సేవలో కొనసాగాలని సూచించారట. ఆయన మార్గదర్శకత్వం, ప్రోత్సహంతోనే నిబద్ధతతో కూడిన ప్రజాపాలనలో, క్రమశిక్షణతో, ఉన్నతమైన ఆశయాలతో తాను రాణించినట్టు వైఎస్ఆర్ చెప్పేవారు. సచిన్ టెండుల్కర్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సాధించిన విజయాలను, క్రమశిక్షణ గురించి ప్రత్యేక పరిచయం అవసం లేదు. తన కోచ్ రమకాంత్ అచ్రేకర్ శిక్షణే తనను లెజెండరీ క్రికెటర్, "మాస్టర్ బ్లాస్టర్", "ది గాడ్ ఆఫ్ క్రికెట్" గా క్రికెట్ చరిత్రలో నిలబెట్టింది. అతని క్రికెట్ ప్రయాణంలో కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్‌లో సచిన్‌కు శిక్షణ ఇచ్చాడు. వినోద్ కాంబ్లీ కూడా ఇతని శిష్యుడే. అచ్రేకర్ చెప్పిన స్ఫూర్తివంతమైన మాటలే తన జీవితాన్ని సమూలంగా మార్చేశాయని సచిన్ గుర్తు చేసుకున్నారు. -
ఆట కదరా శివా!
పాండిచ్చేరి పట్టణానికి చెందిన ఉన్నత విద్యావంతుడైన ఓ యువకుడికి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయాలనిపించింది. అనుకున్నదే తడవుగా అరుణాచలం బస్సు ఎక్కాడు. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుని రాజగోపురం వద్ద నిలబడి వినాయకుణ్ణి ప్రార్థించి నడక ప్రారంభించాడు. అష్టలింగాలను చూస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలని అతడి ఆలోచన.నడుస్తూ నడుస్తూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు. అక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన ఓ ఆధ్యాత్మిక వేత్త పరిచయం అయ్యాడు. ‘‘అలజడి లేని జీవితాన్ని గడ΄ాలంటే ఏమి చేయాలి?’’ అని ఆసక్తిగా ఆ ఆధ్యాత్మికవేత్తను అడిగాడు యువకుడు. ఆధ్యాత్మిక వేత్త చిరునవ్వు ముఖంతో ‘‘ఇద్దరూ ఆడగలిగి, ఇద్దరూ గెలవగలిగే ఆట ఆడాలి’’ అని బదులిచ్చాడు. అర్థం కాని ముఖం పెట్టాడు ఆ యువకుడు. ఆధ్యాత్మికవేత్త యువకుడి హావభావాలు పట్టించుకోకుండా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ‘ఇద్దరు ఆడితే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ, ఇద్దరూ ఎలా గెలుస్తారు?’ అని ఆలోచనలు మొదలయ్యాయి ఆ యువకుడిలో. సమాధానం తెలుసుకుందామని తను కూడా వేగం పెంచాడు. వల్లలార్ ఆశ్రమం వద్ద మళ్ళీ ఆధ్యాత్మిక వేత్త కనిపించాడు. ఆశ్చర్యంగా ‘‘మీరు చెప్పింది ఎలా సాధ్యం?’’ అని ప్రశ్నించాడు. ‘‘ఆలోచించు. నీకే అర్థమవుతుంది. తమాషా ఏమిటంటే ఇద్దరే కాదు, ఆ ఆటని యాభై మంది ఆడినా... అందరూ గెలుస్తారు. అంతేకాదు... అది అందరూ ఆడగలిగిన ఆట కూడాను’’ అంటూ ఆధ్యాత్మిక వేత్త వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మొదటికి వచ్చింది యువకుడి పరిస్థితి. ఎవరినైనా అడిగి తెలుసుకుందామని ముందూ వెనుకా చూశాడు. తెలిసిన ముఖాలేవీ కనిపించలేదు. చేసేదేం లేక ఆధ్యాత్మికవేత్తను వెదుక్కుంటూ వెళ్ళాడు.ఎలాగైతేనేమి ఈశాన్య లింగం వద్ద కనిపించాడు. గెసపోసుకుంటూ చెమటలు కారుస్తూ వెళ్ళి‘‘మీరు సమాధానం చెప్పక΄ోతే నా తల బద్దలై ΄ోయేలా ఉంది’’అని దిగులుగా ముఖం పెట్టాడు. యువకుడి భుజం తడుతూ ఆ ఆధ్యాత్మికవేత్త ‘‘విచిత్రం ఏమిటంటే... వందమంది ఆ ఆట ఆడినా, వందమందీ గెలుస్తారు. అదేమిటంటే... ఎదుటివారిని ప్రేమించే ఆట. అక్కడ అందరూ విజేతలే. ఓటమి పాలయ్యేవారు ఎవ్వరూ ఉండరు’’ అని సమాధానమిచ్చి అక్కడినుంచి మెరుపు వేగంతో వెళ్ళి΄ోయాడు.‘‘నిజమే. జీవితమనేది ఒక ఆటలాంటిది. ప్రేమ విత్తనాలు వెదజల్లే ఆట ఆడటం ప్రారంభిస్తే జీవితం పూల తోట అవుతుంది. దానికి వయస్సు, భాష, లింగం, ్ర΄ాంతం, కులం, మతం అనే హద్దులు ఉండవు ’’ అనుకుంటూ ఆ యువకుడు గిరి ప్రదక్షిణ పూర్తి చేశాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
పిందె.. పండు...వైరాగ్యం
రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలంటే ధర్మపత్ని సహకారం ఉండి తీరాలి. అంటే నీవు గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తున్నావు. అప్పుడు నీవు ఏమి చేసినా అవి ధర్మంతో కట్టుబడి ఉంటాయి. చేయవలసినవి చేస్తూ తరించి΄ోతుంటావు. కారణం– అడుగున ధర్మం ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల నీ కర్మలన్నీ శాపాలను విప్పేస్తుంటాయి. అందుకే ఈ తేలిక మార్గాన్ని నిర్దేశించారు. అది లేక΄ోతే ఇంద్రియాలు అకస్మాత్తుగా కాటువేసే అవకాశం ఉంది. అంటే ధర్మచట్రంలో ఉన్న అర్ధకామాలు దేనినయినా అనుభవించు... క్రమ క్రమంగా ఒక వయసు వచ్చేసిన తరువాత ధర్మానుష్ఠాన బలం వైరాగ్య సుఖాన్నిస్తుంది. క్రమేణా ఒక నిరాసక్తత, ఒక అనుభవం బయల్దేరుతుంది లోపల. అంటే బలవంతంగా అంటించుకున్నది కాదు, అది ఈశ్వర కృపతో వచ్చేది. వైరాగ్యమంటే.. ఈ సుఖాలన్నీ ఒక సుఖాలా... అనిపించడం... ఏమీ పట్టించుకోకుండా అని కాదు. గాలి తన పని తాను చేసుకు΄ోతుంటుంది. జాజి పందిరి మీదినుంచి ΄ోతే పరిమళభరితం అవుతుంది..అప్పుడు గాలిని అభినందిస్తే ΄÷ంగి΄ోదు. ఒక కళేబరం మీది నుంచి΄ోయినప్పుడు దుర్గంధాన్ని వ్యాపింపచేస్తుందని అభిశంసిస్తే అది కృంగి΄ోదు. దాని పని అది చేసుకుంటూ ΄ోతుంది. అలా ΄÷ంగి΄ోవడాలు, కుంగి΄ోవడాలు లేకుండా... నీ కర్తవ్యం నీవు చెయ్యాలి. నీ నిజాయితీ నీ అంతరాత్మకు, ఈశ్వరుడికి తెలిస్తే చాలు..‘‘లోకుల్ నన్గని మెచ్చనీ యలగనీ లోలోన నిందించనీ/ చీకాకున్ బడనీ మహాత్ముడననీ../ మూకీభావమునన్ తిట్టనీ త్రోయనీ / నీ కారుణ్యము కల్గి ఉండినను అంతేచాలు నోశంకరా!’’ అంటారు శంకరాచార్యులు. నీ స్వచ్ఛత ఈశ్వరుడికి తెలిసినంత కాలం నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన ముందు కూడా నీవు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తే... పూజామందిరంలోకి వెళ్ళు.. లెంపలేసుకుని క్షమాపణలడుగు.‘ఈశ్వరా! నా వల్ల ఇటువంటి అపరాధం మళ్ళీ జరగకుండు గాక!’ అని శరణువేడుకో. చాలు.ఎవరయితే ద్వంద్వాలకు అతీతులయిపోతున్నారో వారు నాకు దగ్గరవుతున్నట్లు.. అంటాడు గీతాచార్యుడు. వైరాగ్యం క్రమంగా సత్యాన్ని అంగీకరించే స్థాయికి తీసుకువెడుతుంది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం కరిగిపోతున్నది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఈ శరీరం ఉండగానే నీవు చేయవలసిన కర్తవ్యాలు నెరవేర్చు. సద్వినియోగం చేసుకో. అంటే మంచి విషయాల్లోనే అనురక్తి ఉంటుంది తప్ప లౌకిక విషయాలపట్ల నిరాసక్తత పెరగడమే వైరాగ్యం. ‘కోటిమంది వైద్యులు కూడి వచ్చినకాని మరణమన్న వ్యాధి మాన్పలేరు’. అంటే ఈ వైరాగ్యం ఎప్పుడు వస్తుంది..?. పిందెకూ పండుకూ తేడా తెలుసుకుంటే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. పిందె పట్టుకుని ఉండాలి. పండు తనంతటతాను విడి΄ోయి పడి΄ోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే పట్టుకోవాల్సిన వయసులో అన్నీ పట్టుకో... ధర్మబద్ధంగా. విడవాల్సి వచ్చినప్పుడు నిస్సంకోచంగా విడిచేసెయ్. కొబ్బరికన్నా పెంకును గట్టిగా పట్టుకునే వాళ్ళు ఎవరుంటారు... నీళ్ళు లోపలికి ఎప్పుడు ఎలా వెళ్ళాయో తెలియదు, ఎలా ఆవిరయ్యాయో తెలియదు. లోపల గురుగుడుమంటూ ఉంది... అంటే విడిపోయింది. పూర్ణాహుతికి పనికొస్తుంది. అంటే ఈ శరీరం నేను కాదు...ఆత్మ అని అనుభవంలోకి రావడమే వైరాగ్యం. దీనికి ఈశ్వరకృప ప్రధానమయినా, నీ కర్మాచరణ లేకుండా ఈశ్వర కృప ఉండదు. -
మంత్రి ఎన్నిక! చంద్రగిరి రాజ్యాన్ని..
చంద్రగిరి రాజ్యాన్ని విజయసింహుడు పాలించేవాడు. కొంతకాలంగా మంత్రికి ఆరోగ్యం బాలేకపోవడంతో కొత్త మంత్రిని ఎన్నిక చేయాలనుకున్నాడు. అందుకు ఓ ప్రకటన చేయించాడు రాజు. అన్ని ప్రాంతాల నుంచి సుమారు పాతిక మంది దాకా మంత్రి పదవి పోటీకి వచ్చారు. వారికి నిర్వహించిన పోటీలలో గెలిచి చివరకు ధర్మయ్య, శివయ్య, సీతయ్య అను ముగ్గురు మిగిలారు. ‘వారిలో ఎవరు మంత్రి పదవికి సరిపోతారు?’ అని న్యాయనిర్ణేతను అడిగాడు రాజు. ‘ఆ ముగ్గురు మాసానికి ఎంత జీతం కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి నిర్ణయిద్దాం మహారాజా’ అని చెప్పాడు న్యాయనిర్ణేత.మొదటగా ధర్మయ్యను అడిగాడు రాజు ‘నీకు మాసానికి ఎంత జీతం కావాలి?’అని. ‘మహారాజా! నాకు మాసానికి పది వరహాలు కావాలి’ చెప్పాడు ధర్మయ్య. అలాగే మిగిలిన ఇద్దరినీ అడగగా శివయ్యేమో ఎనిమిది వరహాలు కావాలని, సీతయ్యేమో ఆరు వరహాలు చాలని చెప్పారు.ముగ్గురి జవాబులు విన్న తరువాత ‘ధర్మయ్యా.. నీకు కాస్త ఆశ ఎక్కువగా ఉన్నట్టుంది. మాసానికి పది వరహాలు అడిగావు. అవతల ఇద్దరేమో రెండేసి వరహాలు తగ్గించి చెప్పారు’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాకు ఈ మధ్యనే వివాహం అయ్యింది. నా తల్లిదండ్రులు నా మీదే ఆధారపడి ఉన్నారు. వారిని చూసుకోవలసిన బాధ్యత కూడా నాదే. కుటుంబ పోషణ, ఇంటి అద్దె ఇవన్నీ పోనూ ఒక వరహా అటూ ఇటూగా మిగులుతుంది. అప్పు లేకుండా జీవితం సాఫీగా జరిగిపోతుంది. నేను కోరింది న్యాయమైన జీతం’ బదులిచ్చాడు ధర్మయ్య.‘నువ్వు రెండు వరహాలు తగ్గించి ఎనిమిది వరహాలని ఎలా చెప్పావు?’ అని శివయ్యను అడిగాడు రాజు. ‘మహారాజా! నాకూ వివాహం అయ్యింది, తల్లిదండ్రులూ ఉన్నారు. ఖర్చుదేముంది ఎంతైనా పెట్టవచ్చు. ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను. అందుకే ఎనిమిది వరహాలే చెప్పాను’ చెప్పాడు శివయ్య. ‘నువ్వు కూడా మరో రెండు వరహాలు తగ్గించి ఆరు వరహాలే చెప్పావు. వివరణ ఇవ్వు’ అని సీతయ్యనూ అడిగాడు రాజు. ‘మహారాజా! నాకూ భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంది. ఎలాగోలా సర్దుకుంటాను. అందుకే ఆరు వరహాలు చాలు అన్నాను’ చెప్పాడు సీతయ్య.‘నువ్వేవిధంగా సేవలు అందిస్తావు?’ అడిగాడు ధర్మయ్యను న్యాయనిర్ణేత. ‘న్యాయపరంగా రాజుగారికి సలహాలు ఇవ్వడం, అవినీతి, లంచగొండితనానికి చోటు లేకుండా, ధర్మమార్గంలో నడుస్తూ అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తాను’ అన్నాడు ధర్మయ్య. శివయ్య, సీతయ్యలనూ అదే ప్రశ్న అడిగాడు న్యాయనిర్ణేత. తామూ మంచి దారిలోనే సేవలు అందిస్తామని చెప్పారు వారు.‘మహారాజా! ధర్మయ్య కోరింది న్యాయమైన జీతం. తక్కువ జీతం కోరిన శివయ్య, సీతయ్యలు కొలువు వస్తే చాలు అనే పద్ధతిలో రెండు వరహాలు తగ్గించి చెప్పారు. మంత్రి పదవి వచ్చాక కోటలో, బయట ఆ పదవికి భయపడే వారు ఎక్కువ. పక్కదారి పట్టి లంచాలు తీసుకుంటారు. కనుక ధర్మయ్యకే మంత్రి పదవి ఇవ్వండి’ అన్నాడు న్యాయనిర్ణేత.‘ధర్మయ్యా! మంత్రి పదవి నీకే ఇస్తున్నాను. చక్కగా కొలువు చేసుకో!’ చెప్పాడు రాజు. ‘మహారాజా! చాలా సంతోషం.. నా మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఆ క్షణమే నా ఉద్యోగం నుంచి తొలగిపోతాను’ అన్నాడు ధర్మయ్య. చెప్పినట్టుగానే నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటూ తన పేరును సార్థకం చేసుకున్నాడు ధర్మయ్య.ఇవి చదవండి: ఇంద్రుడితో గృత్సమదుడి మైత్రి.. -
ఇంద్రుడితో గృత్సమదుడి మైత్రి..
శౌనక మహర్షి వంశంలో సునహోత్రుడు అనే తపస్వి ఉన్నాడు. ఆయన వేదవేదాంగ శాస్త్ర పారంగతుడు, ధర్మనిరతుడు, శమదమాది సంపన్నుడు. సంసారాశ్రమంలో ఉన్నా, నిత్య కర్మానుష్ఠానాన్ని నియమం తప్పక ఆచరించేవాడు. అతడికి ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు: కౌశుడు, శాల్ముడు, గృత్సమదుడు. సునహోత్రుడి ముగ్గురు కొడుకుల్లోనూ గృత్సమదుడు మహాతపస్విగా ప్రఖ్యాతి పొందాడు.వేదవేత్త అయిన గృత్సమదుడు అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకోదలచాడు. వేదమంత్రాలతో అగ్నిదేవుడిని భక్తిగా స్తుతించాడు. అగ్నిదేవుడికి ప్రీతికరమైన మంత్ర సప్తకాన్ని పఠిస్తూ, యజ్ఞం చేశాడు. గృత్సమదుడి నిష్కళంక భక్తితత్పరతలకు అగ్నిదేవుడు అమిత ప్రసన్నుడయ్యాడు. అతడి ఎదుట దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. గృత్సమదుడు వరమేదీ కోరకపోయినా, అతడికి అగ్నిదేవుడు దివ్యశరీరాన్ని అనుగ్రహించాడు. ముల్లోకాలలో మూడు శరీరాలతో ఒకేసారి సంచరించగల దివ్యశక్తిని ప్రసాదించాడు.అగ్నిదేవుడి కటాక్షంతో దివ్యశరీరధారి అయిన గృత్సమదుడు సాక్షాత్తు ఇంద్రుడిలా ప్రకాశించసాగాడు. భూమిపైన, ఆకాశంలోను, గాలిలోను ఒకేసారి మూడు దివ్యశరీరాలతో స్వేచ్ఛగా తిరుగాడసాగాడు. అలా తిరుగుతూ ఒకనాడు గృత్సమదుడు స్వర్గానికి వెళ్లాడు. ఇంద్రుడి శత్రువులైన ధుని, చమురి అనే ఇద్దరు రాక్షస సోదరులు స్వర్గంలోని నందనవనంలో ఉల్లాసంగా విహరిస్తున్న గృత్సమదుడిని చూశాడు. ఇంద్రుడిలాంటి దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న గృత్సమదుడిని చూసి, అతడే ఇంద్రుడనుకున్నారు. ‘మన అదృష్టం కొద్ది ఇంద్రుడు ఒంటరిగా దొరికాడు. ఇదే తగిన అదను. ఇక్కడే అతణ్ణి మట్టుబెట్టేద్దాం’ అని రాక్షస సోదరులిద్దరూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆయుధాలు పట్టుకుని, ఒక్కుమ్మడిగా అతడిపై దాడికి విరుచుకుపడ్డారు.హాయిగా విహరిస్తున్న తన ఎదుట ఇద్దరు రాక్షసులు ఆయుధాలతో ప్రత్యక్షమవడంతో గృత్సమదుడు ఒకింత ఆశ్చర్యపోయాడు. దివ్యదృష్టితో వారి ఆంతర్యాన్ని కనుగొన్నాడు. ఏమాత్రం తొణకకుండా, తన క్షేమం కోసం, వారి నాశనం కోసం ఇంద్రుడి గుణగణాలను ప్రశంసించే వేదమంత్రాలను పఠించాడు. ఇంద్రుడి గుణగణాలను వినగానే దాడికి తెగబడ్డ ఇద్దరు రాక్షసులకూ భయంతో గుండె జారినంత పనైంది. ‘అనవసరంగా పొరపాటు చేశామా’ అని ఆలోచనలో పడ్డారు. వారు ఇంకా తేరుకోక ముందే ఇంద్రుడు అక్కడకు ఐరావతంపై వచ్చాడు. రాక్షస సోదరులు ధుని, చమురి ఒకేసారి ఇంద్రుడి మీదకు ఆయుధాలు ప్రయోగించారు. ఇంద్రుడు వాటిని తన వజ్రాయుధంతో తుత్తునియలు చేశాడు. ఇద్దరు రాక్షసులనూ తన వజ్రాయుధంతోనే మట్టుబెట్టాడు.ఆ సంఘటనతో ఇంద్రుడిని ప్రత్యక్షంగా చూసిన గృత్సమదుడు పరమానందం పొందాడు. మళ్లీ ఇంద్రుడిని స్తుతిస్తూ వేదమంత్రాలను పఠించాడు. ఇంద్రుడి శౌర్యప్రతాపాలను, గుణగణాలను వేనోళ్ల పొగిడాడు. గృత్సమదుడి స్తోత్రానికి ఇంద్రుడు సంతోషించాడు. ‘మునివర్యా! నేటితో నువ్వు నాకు మిత్రుడివయ్యావు. నువ్వు చేసిన ప్రశంస నీ నిష్కల్మషమైన అంతఃకరణకు సాక్షి. నీ స్తోత్రం నాకు ప్రీతి కలిగించింది. నువ్వు చేసిన స్తుతి నీ సమస్తమైన కోరికలనూ ఈడేరుస్తుంది. నీకేం కావాలో కోరుకో!’ అన్నాడు.‘దేవేంద్రా! నీ కటాక్షంతో నాకు దివ్యమైన వాక్చమత్కృతి, సకల ఐశ్వర్యాలు కలగనివ్వు. నిరంతరం నా హృదయంలో నీ స్మరణనే ఉండనివ్వు. ఎల్లప్పుడూ నీ అనుగ్రహాన్ని పొందనివ్వు’ అని కోరాడు. ఇంద్రుడు ‘తథాస్తు!’ అన్నాడు. అంతే కాకుండా, గృత్సమదుడి చేయి పట్టుకుని, తనతో పాటు తన ప్రాసాదానికి తీసుకుపోయాడు. అతిథి మర్యాదలు చేశాడు. గృత్సమదుడికి ఇంద్రుడు అతిథి మర్యాదలు చేస్తుండగా, దేవగురువు బృహస్పతి అక్కడకు వచ్చాడు. బృహస్పతిని చూసిన గృత్సమదుడు ఆయనను స్తుతిస్తూ వేదమంత్రాలను పఠించాడు. బృహస్పతి సంతోషించి, ‘సురేశ్వరుడిని, సురగురువును విద్యా వినయాలతో సంతృప్తి పరచినవాడి కంటే మేధావి మరొకడు లేడు’ అని పలికాడు. కొన్నాళ్లు ఆతిథ్యం పొందాక గృత్సమదుడు ఇంద్రుడి వద్ద సెలవు తీసుకుని, తన ఆశ్రమానికి బయలుదేరాడు.అగ్నిదేవుడి వరప్రభావంతో గృత్సమదుడు కోరుకున్నప్పుడల్లా త్రిలోక సంచారం చేస్తూ కాలక్షేపం చేసేవాడు. క్రమం తప్పకుండా ఆచరించే నిత్యానుష్ఠానాలలో అగ్నిని, ఇంద్రుడిని, బృహస్పతిని స్తుతిస్తూ వేదమంత్రాలను పఠిస్తుండేవాడు. ఇలా ఉండగా, ఒకనాడు ఇంద్రుడికి గృత్సమదుడి భక్తిని పరీక్షించాలనే ఆలోచన పుట్టింది.వెంటనే ఇంద్రుడు ఒక పక్షిరూపం ధరించాడు. అడవిలో అరణిని, దర్భలను ఏరుకుంటూ ఉన్న గృత్సమదుడి భుజం మీద వాలాడు. గృత్సమదుడు కొంత దూరం ముందుకు కదిలినా, భుజం మీద వాలిన పక్షి ఎగిరిపోలేదు. గృత్సమదుడు దివ్యదృష్టితో తన భుజం మీద వాలిన పక్షి ఇంద్రుడేనని గ్రహించాడు. పక్షిరూపంలో ఇంద్రుడి ఆకస్మిక ఆగమనానికి సంతోషభరితుడై, ఇంద్రుడిని ఖగేంద్రుడిగా, సురేంద్రుడిగా స్తుతిస్తూ స్తోత్రం పఠించాడు.గృత్సమదుడికి తనపైనున్న అనన్యభక్తికి సంతోషించిన ఇంద్రుడు నిజరూపంలో అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘మిత్రమా! నీ భక్తి తత్పరతలపై నాకిక ఎటువంటి సందేహమూ లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ నీవు నాకు మిత్రుడవై ఉంటావు. నాకు నిన్ను మించిన ఉత్తమ భక్తుడెవరూ లేరు. నీ కోసం స్వర్గద్వారాలు, ఇంద్రభవన ద్వారాలు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. నీవు ఎప్పుడు కోరుకున్నా, యథేచ్ఛగా, నిరాటంకంగా నా వద్దకు వచ్చిపోతూ ఉండు’ అని పలికి, సెలవు తీసుకుని స్వర్గానికి పయనమయ్యాడు. – సాంఖ్యాయన -
'పాజ్ అండ్ రిఫ్లెక్ట్' : ఆర్ట్ ఎగ్జిబిషన్, సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు
కళల కాణాచి హైదరాబాద్ నగరం మరో ప్రత్యేకమైన ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు వేదిక కానుంది. మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ వేదికగా ఢిల్లీ ఆర్ట్ మాగ్నమ్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్ట్ క్యూరియేటర్ అన్నపూర్ణ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. ప్రముఖ ఆర్టిస్టులు ధ్రువ్ పటేల్, దుష్యంత్, రఘు, ముఖ్తార్ అహ్మద్‌లు తమ ప్రత్యేకమైన కళాఖండాలను ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు. చిత్రకళా రంగంలో సరికొత్త కోణాన్ని కళా ప్రేమికుల ముందుకు తీసుకువస్తున్నారు. ఉరుకుల, పరుగుల యాంత్రిక జీవితంలో ఒక్క క్షణం ఆగి ఆస్వాదించడమే ఈ పదర్శన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.ఆర్టిస్ట్ రఘు తనదైన శైలితో ఆకట్టుకుంటారనీ, అలాగే ఆర్టిస్ట్ ముఖ్తార్ అహ్మద్ వర్షం, ధూళి కారణంగా పాడుబడ్డ భవనాలు చిత్రాలు ప్రత్యేకంతా నిలువనున్నాయి. ధృవ్ పటేల్ లంగూర్ల చిత్రలతోనూ, ఆర్టిస్ట్ దుష్యంత్ ఆర్ట్ లో వాటర్ కలర్స్ చిత్రాలను వీక్షకులను బాగా ఆకర్షించ నున్నాయి. ఈ ఆర్టిస్టులు అంతా కలిసి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తారు. ఈ ప్రదర్శన కేవలం కళ ప్రదర్శన మాత్రమే కాదు, అందరినీ ఒక అడుగు వెనక్కి తీసుకుని, జీవితంలో సాధారణ ఆనందాలను ఆస్వాదించేలా ప్రేరేపిస్తుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంటిలిజెన్స్ ఐజీ సుమతి, అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డా.కోట నీలిమ హాజరు కానున్నారు. వివరాలు : 2024 సెప్టెంబర్ 1న, ఆదివారం ఉదయం 11 గంటలు.వేదిక: మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ,ప్రదర్శన వివరాలు : సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు, ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు. -
వరలక్ష్మి కృపకు ఆఖరి శుక్రవారం...ముఖ్యంగా పెళ్లికాని పడతులకు
మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం శ్రావణమాసపు రెండో శుక్రవారం జరుపుకోవడం శాస్త్రంగా ఎంతో కాలం జరుగుతూ వస్తున్నది. అయితే ఏదైనా కారణాల వల్ల వరలక్ష్మి వ్రతం కానీ, ప్రత్యేక పూజలు కానీ చేసుకోలేని వాళ్లకు ఆఖరి శుక్రవారం చివరి అవకాశంగా భావిస్తారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి, సకలశుభాలు కలగాలని ప్రార్థిస్తారు.చివరి రోజు మరింత ప్రత్యేకం..శ్రావణమాసం, శుక్రవారాలు ఎంత ప్రత్యేకమైనవో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే శుభప్రదమైన శ్రావణమాసంలో చివరి వారం కావడంతో బోలెడంత సందడి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిల లక్ష్మీ దేవి పూజకు మరింత ప్రత్యేకమని చెప్పాలి. ఆఖరి రోజు వ్రతం చేస్తే:ఆఖరి రోజున ఉపవాసం పాటించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజున యథావిధిగా రకరకాల పిండి వంటలు, క్షీరాన్నం, పళ్లు, పూలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ శుభసమయంలో శ్రీ యంత్రానికి పూజలు నిర్వహిస్తారు. రాత్రి నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ హ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే లక్ష్మి ఇంట్లో నివాసం ఉంటుందని నమ్మకం.అలాగే వరలక్ష్మి రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 11 పసుపు పిండి ముద్దలను లక్ష్మీదేవి పాదాలకు సమర్పించి, పూజ తర్వాత వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచితే దీనివల్ల ఆర్థిక లబ్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవికి కొబ్బరికాయ సమర్పించాలి. దీనివల్ల ఆర్థిక లబ్ది పొందే అవకాశం ఏర్పడుతుంది. పెళ్లికాని పడుచులకు వరం..పూజ చేసుకున్న వారి నుంచి తాంబూలం తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలకు తొందరగా పెళ్లవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. వరమహాలక్ష్మి వివిధ రూపాలలో కరుణిస్తుందని, అన్ని సమస్యలు తొలగిపోయి పెళ్లి జరిగేలా అనుకూలత ఇస్తుందని నమ్మకం. అందుకే కొన్ని ప్రాంతాలలో ఈ రోజు భక్తితో ఉపవాసం ఉండి, పూజ చేసుకుని ముత్తైదువుల నుంచి తాంబూలం అందుకుంటారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. -
చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..
కృష్ణాష్టమి వస్తోందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. మరీ ఈ పర్వదినం రోజున చిన్ని కృష్ణయ్యకు సమర్పించే నైవేద్యాలు ఏంటీ..? ఎలాంటి పదార్థాలు నివేదిస్తారు వంటి వాటి గురించి సవివరంగా చూద్దాం..!.ఈ పర్వదినం పురస్కరించుకుని వీధుల్లో జరిగే ఉట్టికొట్టే వేడుకు కోసం వేలాదిగా ప్రజలు గుమిగూడతారు. చిన్న పెద్దా అనే తారతమ్యం లేకుండా అంతా ఈ వేడుకలో పాల్గొంటారు. మరీ ఈ వేళ చిన్ని కన్నయ్యకి సమర్పించే సంప్రదాయ వంటకాలేంటంటే..చప్పన్ భోగ్ విందు ఏర్పాటు చేస్తారు. ఇది ప్రజలంతా భక్తితో సమర్పించే గొప్ప విందు. ఈ చప్పన భోగ్ విందు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..చప్పన్ భోగ్ వెనుక స్టోరీ..ఉత్తర ప్రదేశ్‌లో మధుర శ్రీ కృష్ణుడు నడయాడిన ప్రదేశం ఉందని తెలుస. అక్కడ బృందావనంలో కృష్ణుడి పెరిగినట్లుగా మనం పురాణల్లో విన్నాం. అక్కడ బృందావన్‌లో ప్రజలు అంతా ముద్దుల కృష్ణయ్య, కన్నయ్య అనే పిలుచుకునేవారు. యశోదమ్మ కృష్ణుడికి చేసిన గారాభం కారణంగా అందరిని ఆటపట్టిస్తూ తుంటరిగా ఉండేవాడు. అంతా.. అమ్మ యశోదమ్మ నీ కృష్ణుని అల్లరి భరించలేకపోతున్నాం అని ఫిర్యాదులు చేస్తే తిరిగి వాళ్లదే తప్పు అన్నట్లు మందలించే యశోదమ్మ కృష్ణ ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే. అయితే ఒకరోజు బృందావనంలోని ప్రజలంతా ఇంద్రుడిని ఆరాధించే నిమత్తం చప్పన్ భోగ్ కార్యక్రమానికి సన్నహాం చేస్తున్నారు. దీన్ని చూసిన చిన్ని కృష్ణుడు తన తండ్రి నందుడుని ఏంటీ వేడుక? ఎందుకు చేస్తున్నాం అని అడగగా..వర్షాలు బాగా పడేలా ఇంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న పూజ అని చెబుతాడు. వెంటనే కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా పండ్లు, కూరగాయాలు, జంతువులకు మేత అందించే గోవర్థన గిరిని పూజించాలని అంటారు. అందుకు గ్రామస్తులు అంగీకరించి గోవర్థన గిరికి పూజ చేస్తారు. దీంతో ఇంద్రుడు కోపంతో ఏకథాటిగా ఎనిమిది రోజులు కుండపోత వర్షం కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు బృందావన ప్రజలను గోవర్థన గిరి వద్దకు వచ్చి తలదాచుకోవాల్సిందిగా చెప్పి ఆ పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఉంచి రక్షించాడు. ఆయన వారందర్నీ రక్షించేందుకు ఎనిమిది రోజులగా నిరాహారంగా ఉండిపోతాడు. అన్ని రోజుల తమ కోసం తినకుండా సంరక్షించిన ఆ జగన్నాథుడికి కృతజ్ఞతగా ఈ చప్పన్ భోగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు బృందావన ప్రజలు. అప్పటి నుంచి కృష్ణుడికి ఇష్టమైన ఆహారాలతో భారీ విందు ఏర్పాటు చేయడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అలాగే యశోదమ్మను కృష్ణుడు ఇష్టంగా ఏం తింటాడని అడిగిమరీ వండి నివేదించడం జరిగిందని పురాణ వచనం. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. ఈ చప్పన భోగ్లో మొత్తం 56 రకాల ఆహారాలను సిద్ధం చేస్తారు. ఇందులో వివిధ రుచులతో కూడిన ఆహార పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా చేదు, ఘాటు, పులుపుతో కూడిన వంటకాల నుంచి మొదలై, తీపి వంటకాలతో ముగుస్తుంది. ఇందులో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పాలు, మీగడ, పెరుగుకి సంబంధించిన వివిధ తీపి వంటకాలు కూడా ఉంటాయి. (చదవండి: కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే..ఆ ఆరింటిని..!) -
కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే..ఆ ఆరింటిని..!
దేవుళ్ల అందరిలోనూ ప్రత్యేక విలక్షణమూర్తి శ్రీకృష్ణుడు!. ఆయన బాల్యం- లీలా మాధుర్యానికి ఆట పట్టు, అనంత దార్శనిక సూత్రాల తేనెపట్టు. ఆయన శృంగార మహత్వం- లౌకిక దృష్టికి సమ్మోహనం, అలౌకిక దృష్టికి విలక్షణం. ఒకరకంగా గొప్ప రాజనీతిజ్ఞుడు. మరో కోణంలో మహా విషాద నాయకుడు ఇలా ఇద్దరు కృష్ణుడిలో తారసపడతారు. ముఖ్యంగా అరిషడ్వర్గాలను- మోక్షమార్గాలుగానూ, స్వర్గద్వారాలుగానూ అద్భుతంగా నిరూపించాడాయన. ఆ వైవిధ్య స్వభావం గురించి భాగవతం సప్తమ స్కంధంలో నారద మహర్షి విశేషంగా వర్ణించాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు తలలతో మన మానస్సు అనే సరోవరాన్ని అను నిత్యం కలవరపరుస్తుంటుంది. అవే మన లోపలి శత్రుకూటమి. దాన్ని సమూలంగా తుద ముట్టించాలంటే, కోపం అనే ఘీంకారాన్ని విడిచిపెట్టి ఓంకారాన్ని అందుకుని గజేంద్ర మోకంలోని గజేంద్రుడిలా భగవంతుణ్ని ఆశ్రయించాలికృష్ణుడి ప్రత్యేకత ఏమంటే... ఆ ఆరింటినీ సాధనాలుగా మార్చు కొని, వాటి సాయంతోనూ తనను పొందవచ్చునని హామీ ఇచ్చాడాయన. కోరిక, కోపం, భయం, భక్తి, అనురక్తి, ఆసక్తి, ద్వేషం, స్నేహం... చివరకు శత్రుత్వంతో సైతం శ్రీకృష్ణుణ్ని తమవాణ్ని చేసుకోని పొందొచ్చ్చని భాగవతం నిరూపించింది. అలా ఎవరెవరు ఏయే మార్గాల్లో ఆయనకు దగ్గరయ్యారో నారదుడు వర్ణించి చెప్పాడు కూడా. దారి ఏదైనా గమ్యం ఒక్కటే అన్నాడాయన ధర్మరాజుతో. అదెలా అంటే..మనం చెప్పుకొన్న శత్రువర్గంలో కామం మొదటిది. దాని ద్వారానే గోపికలు హరిని సొంతం చేసుకొన్నారు. కామం అంటే కోరిక ఆసక్తి అనురక్తి... తనకు దక్కాలనే తహతహ. ధర్మా ర్థకామమోక్షాలనే నాలుగు రకాల పురుషార్థాలకు సంబంధించి- కామంలోని నాలుగు కోణాలను భరతముని తన నాట్యశాస్త్రంలో విశ్లేషించాడు. గోపికలది మధురభక్తికి చెందిన కామం. మోక్ష కాంక్షలోంచి ఉప్పొంగిందది. కాబట్టి వారిది 'మోక్ష సంబంధి శృంగారం' అన్నారు పెద్దలు. భరతుడి వివరణలోని మోక్షకామానికి సరైన ఉదాహ రణ గోపికల కామం.'కోరికతో గోపికలు, భయం చేత కంసుడు, అసూయాద్వేషాలతో శిశు పాలాదులు, చుట్టరికం రీత్యా యాదవులు, ప్రేమాభిమానాల మూలంగా పాండవులు, భక్తి కారణంగా ముని జనులు శ్రీకృష్ణుడికి చేరువ అయ్యారు' అన్నది నారదమహర్షి విశ్లేషణ. ఇదేవిధంగా ఇకృష్ణుడు చెప్పిన మోక్ష మార్గాలు..ఇంతమందిని ఇన్ని రకాలుగా ఉద్దరించిన కృష్ణుడి జీవితం మాత్రం ఎంతో విచిత్ర మైనది. కళ్లు తెరిచింది- కటకటాల్లో. ఊపిరి పీల్చింది అపాయాల్లో. బతుకు గడిచింది- గండాల్లో. చివరకు ఆయన చరమదశా- పరమ దారుణం. తన కళ్లముందే తన వారంతా ఒకళ్లనొకళ్లు చంపుకొని దుర్మరణం పాలవుతుంటే- కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలి బొటనవేలికి వేటగాడి బాణం నాటుకుని బొట్టుబొట్టుగా నెత్తురు స్రవించి మనుగడ కడతేరిపోవడమంటే- ఎంత విషాదకరమైన ముగింపు!. ఏమనాలి ఆయన జీవితాన్ని?.ఇది అద్భుతమా..!కృష్ణకథను చెబుతూ వ్యాసమహర్షి 'అద్భుతం' అనే పదాన్ని ప్రయోగించారంటే- ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? కృష్ణుడి పుట్టుక అద్భుతం. ఆయన లీలలు అద్భుతం. ఆయన బోధించిన భగవద్గీత పరమాద్భుతం. 'ధర్మం' అనే పదానికి రూపం వస్తే రాముడైనట్లు- అద్భుతం అనే భావానికి ప్రాణం పోస్తే- అది కృష్ణుడు. ఎంత చక్కగా ఆయన జీవిత కథ జీవిత పరమార్థాన్ని విశదరపరుస్తుంది. భగవంతుడు సైతం మనిషిగా పుట్టినప్పుడూ కష్టాలు అనుభవించక తప్పదని, ఉన్నత, పతన స్థితుల కలబోత అనే ఆయనే స్వయంగా అవతారం ఎత్తి చూపించాడు. సో కష్టాలకు కలవరపడొద్దు, ఆ జగన్నాథుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మీద భారం వేసి నిశ్చింతగా జీవించి సుఖమయ జీవితాన్ని పొందుదాం. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..?)