Devotion
-
మది నిండుగా.. శ్రావణ బోనం!
ఆషాఢం వచ్చిందంటే తెలంగాణలో బోనాల పండుగ ్రపారంభం అవుతుంది. గోల్కొండ జగదాంబికకు తొలిబోనం సమర్పణతో మొదలై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి, లాల్ దర్వాజ బోనాలతో నగరం పల్లె రూపం నింపుకుంటుంది. ఆషాఢమాసంలో బోనాలు హైదరాబాద్‌లో ముగుస్తాయి. శ్రావణమాసం ్రపారంభం అవుతూనే అమావాస్య ఆదివారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన బోనాల పండుగ ప్రతి ఇంట సంబరమవుతుంది. మన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలూ బోనాల పండగను జరుపుకోవడం విశేషం.సామూహిక చైతన్యం..గ్రామదేవతలకు వండి పెట్టే భోజనమే బోనం అంటారు. బోనాన్ని గుడిలో అమ్మవారికి సమర్పించడంతో నైవేద్యం అవుతుంది. బోనాన్ని జేజ బువ్వ అని కూడా (తెలంగాణలోని కొన్నిప్రాంతాల్లో్ల) అంటారు. వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, రుతుమార్పుల వల్ల వచ్చే అంటురోగాలు, ఆనారోగ్యాల పాలు కాకుండా ఉండాలని అమ్మ దేవతలకు మొక్కుకుంటారు. ్రపాచీన కాలం నుంచి ఒక ఆచారాన్ని తీసుకువచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి కూడా ఈ బోనం సంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు.గిరులలో సిరులు కురవాలని..గిరిజనులు సంవత్సరానికి ఒకసారిపోడు వ్యవసాయం ద్వారా పంట పండిస్తారు. దున్నే సమయంలో ముందు కొట్టే చెట్టుకు మొక్కుతారు.‘నేను వ్యవసాయం కోసమే నిన్ను కొడుతున్నాను. నీమీద నాకేం కోపం లేదు క్షమించమ్మా! రెండు రోజుల తర్వాత వస్తాన’ని చెప్పి మూడోరోజు దుక్కి దున్ని గింజలు నాటుతారు. చిక్కుడుపంట పండితే చిక్కుళ్ల పండుగ చేసుకుంటారు. ఇంటిపాదుల్లో పెట్టిన విత్తనాలు మొలకలే, తీగలై పారితే ఎంతో సంతోషిస్తారు. ఆ పాదుల్లో మొదటగా పూసిన బీరపువ్వుకు బొట్లు పెడతారు. ఏడుగురు అక్క చెల్లెళ్లు..పూర్వకాలంలో నిరక్షరాస్యులైన ప్రజలు, గిరిజనులు రాయిని కడిగి పసుపు కుంకుమతో బొట్లుపెట్టి దేవత అని మొక్కేవారు. ప్రపంచమంతటా ఈ అమ్మ దేవతల పూజ ఉంది. రూపాలు లేవు కాని వివిధ పేర్లతో అమ్మవార్లను పూజించుకుంటారు. దేవతల్లో ప్రధానంగా ఏడుగురు అక్కా చెల్లెళ్లు. సప్తమాతృకల్లో ఉండే చాముండి దేవతను సౌమ్య రూపంగా గుళ్లల్లో ప్రతిష్టించుకుని పూజలు చేస్తారు.పోషణ ఇచ్చేదిపోచమ్మ తల్లి అని తెలంగాణలో కొలుస్తారు. గ్రామాల్లో ..పోచమ్మ, మైసమ్మ, ఊరమ్మ, ఊరడమ్మ, కట్ట మైసమ్మ, సరిహద్దులపోచమ్మ, వనంపోచమ్మ, దుర్గమ్మ, మహంకాళమ్మ, బద్ది΄ోచమ్మ, పెద్దమ్మ,పోలేరమ్మ, ఎల్లమ్మ, మాతమ్మ.. ఇలా రక రకాల పేర్లతో ఉన్న ఎందరో అమ్మ తల్లులకు బోనాలు సమర్పిస్తారు. కాటమరాజు, బీరప్ప, మల్లన్న.. తొట్టెలు,పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ప్రజల విశ్వాసాలకు అద్దం పడతాయి. బోనాల పండుగకు అత్తగారింటినుంచి తల్లిగారింటికి వచ్చిన ఆడపిల్లలు బోనం ఎత్తుకోవడం అంటే ఆ ఇంటికి లక్ష్మీదేవే వచ్చినట్టుగా భావిస్తారు. – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
నిష్కల్మషం నిరంతర ప్రక్రియ
బతికి ఉన్నంత కాలం అన్నం తినటం ఎంత అవసరమో శుచిగా ఉండటం అంతే అవసరం. శుచిగా ఉండటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కసారి ఆపితే మకిలి పేరుకు పోతుంది. తరువాత యథాస్థితికి తేవటానికి సమయం చాలా అవసర మౌతుంది. రాగిచెంబుని ఎంత తోమితే అంత మెరుస్తుంది అని ఒక నానుడి. రాగిచెంబే కాదు జీవితమైనా అంతే. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఇల్లయినా, ఒళ్లయినా, సమాజమైనా, దేశమైనా, మరేదైనా సరే! భౌతికమైన అంటే పరిసరాల, శారీరక శౌచం మాత్రమే కాదు మనసుని కూడా శుభ్రం చేస్తూ ఉండాలి. జీవప్రక్రియ జరుగుతున్నప్పుడు వ్యర్థాలు వెలువడటం సహజం. వాటిని ఎప్పటి కప్పుడు తొలగించక పోతే చెత్త పేరుకుపోతుంది. ఆరోగ్యం పాడవటం జరుగుతుంది. మనసు కూడా బాగా పని చేసినప్పుడు మథనంలో కావలసిన ఆలోచనలతో పాటు అక్కర లేనివి కూడా వస్తాయి. వాటిని పరిహరించక పోతే బుర్ర చెడి పోతుంది. ఒక్కక్షణం ఏమరుపాటు కలిగినా జరగవలసిన హాని జరిగిపోతుంది. మనకి మిత్రులలాగా కనపడుతూ కీడు చేసే శత్రువులు అవకాశం కోసం ఎదురు చూస్తూ తొంగిచూస్తూ ఉంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనసులో తిష్ఠవేసుకుని కూర్చుంటారు. ఆ శత్రువుల విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎంతో కాలంగా సాధన చేశాను, ఇంకెంత కాలం నియమ నిష్ఠలతో సాధన చెయ్యాలి? ఇంక చాలు – అంటూ ఉంటారు కొంతమంది. పుట్టినప్పటి నుండి గాలి పీలుస్తూనే ఉన్నాం కదా, ఇక గాలి పీల్చటం మానేద్దాం అని ఎవరైనా అనుకుంటారా? ఆఖరిక్షణం వరకు వీలైనంతగా కొనసాగించ వలసిందే. ఒక్కక్షణం ఆపితే ..? ఇంకేముంది? ఆ తరువాత గాలి పీల్చవలసిన పని ఉండదు. ఎందుకంటే గాలి పీల్చటం ఊపిరితిత్తుల ద్వారా రక్తాన్ని శుభ్రం చేయటమే. అందుకే అన్ని సంప్రదాయాల్లోను శౌచం అనే దానికి చాలా ్రపాధాన్యం ఉంది. అది పరిసరాలతో ్రపారంభమై శరీరం, మనస్సు, ఆత్మల వరకు విస్తరిస్తుంది. దీనిని సూచించటానికే జీసస్ పాత్రలు శుభ్రం చేస్తున్న చిత్రం ఒకటి కనపడుతుంది. అదేవిధంగా షిరిడీ సాయి బాబా కూడా పాత్రలు శుభ్రం చేస్తున్న చిత్రం ఉంటుంది. వాళ్ళకి ఎంగిలిపళ్ళాలు కడగవలసిన అవసరం ఏమిటి? అనే సందేహం ఎవరికైనా ఎప్పుడయినా వచ్చిందా?వాళ్ళు కడుగుతున్నది తమ శిష్యులు, లేక భక్తులు, లేక అనుయాయుల మనస్సులని కప్పిన పాపాలనే మలినాలని. పాపరహితులైన వారే నిరంతరం శుభ్రం చేయటానికి ్రపాధాన్యం ఇస్తూ ఉంటే సామాన్యుల మైన మనవంటి వార మెంత?పుట్టినప్పుడున్నంత నిష్కల్మషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒక్కరోజు నిర్లక్ష్యం చేస్తే అప్పటి వరకు చేసినదంతా తుడిచి పెట్టుకు పోతుంది. రోజూ తుడుస్తున్న అద్దాన్ని ఒక్కసారి తుడవకపోతే దుమ్ము΄÷ర ఉండి దానిలో ప్రతిబింబం సరిగ్గా కనపడదు. ఇది అందరికి ప్రత్యక్ష ప్రమాణం. అదే మనస్సనే అద్దం మీద కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే మలినాలు ఉంటే దానిలో పరమాత్మ రూపం సరిగ్గా ప్రతిఫలిస్తుందా? ఎన్నో మార్పులతో కనిపిస్తుంది. అందుకే సాధకులకి ఒక్కొక్కరికి దైవం ఒక్కొక్క విధంగా ఉన్నట్టు తోస్తుంది. వీటికితోడు అహంకార మమకారాలు ఆడే నాటకాలు కూడా తక్కువేమీ కావు. ఈ ΄÷రలు కప్పి ఉండటం వల్లనే ఎన్నో వికల్పాలు కలుగుతూ ఉంటాయి. కనుకనే వీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. లేకపోతే అదే సహజమైన రూపం అని భ్రమపడే ప్రమాదం ఉంది. ఈ భ్రమప్రమాదాల కారణంగా సాధన పెడత్రోవ పట్టే అవకాశం ఉంది. – డా.ఎన్. అనంత లక్ష్మి -
కేవలం వాయుభక్షణతో.. పదివేల ఏళ్లు తపస్సు!
సమస్త లోకాలకు ఆధారభూతమైన ధర్మాన్ని దేవ దానవులు ఎవరూ చూడలేదు. సత్య స్వభావం కలిగిన ధర్మ స్వరూపాన్ని దర్శించడం కోసం దుర్వాసుడు తపస్సు ప్రారంభించాడు.కేవలం వాయుభక్షణతో పదివేల ఏళ్లు తపస్సు కొనసాగించినా, ధర్ముడు కరుణించలేదు. దర్శనమివ్వలేదు. తపస్సు చేసి చేసి దుర్వాసుడు కృశించిపోయాడు. ఆయనకు ధర్ముడి మీద పట్టరాని ఆగ్రహం కలిగింది. కోపం పట్టలేని దుర్వాసుడు ధర్ముడిని శపించాలనుకున్నాడు. అది గ్రహించిన ధర్ముడు వెంటనే దుర్వాసుడి ముందు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. తనతో పాటు సత్యం, బ్రహ్మచర్యం, తపస్సులను; యమ నియమ, దానాలను కూడా వెంటబెట్టుకు వచ్చాడు.సత్యం, బ్రహ్మచర్యం, తపస్సు బ్రాహ్మణుల రూపంలో రాగా, యమం ద్విజుడి రూపంలోను, నియమం ప్రాజ్ఞుడి రూపంలోను, దానం అగ్నిహోత్రుడి రూపంలోను వచ్చాయి. వారికి తోడుగా క్షమ, శాంతి, లజ్జ, అహింస, స్వచ్ఛత స్త్రీల రూపంలోను, బుద్ధి, ప్రజ్ఞ, దయ, శ్రద్ధ, మేధ, సత్కృతి, శాంతి, పంచయజ్ఞాలు, వేదాలు స్వస్వరూపాలతో వచ్చి నిలిచాయి. ఈ విధంగా ధర్ముడు సపరివారంగా దుర్వాసుడి ముందుకు వచ్చాడు.‘మహర్షీ! తపోధనుడివైన నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? కోపం శ్రేయస్సును, తపస్సును నశింపజేస్తుంది. పుణ్యకర్మలను క్షయింపజేస్తుంది. అందువల్ల ప్రయత్నపూర్వకంగా కోపాన్ని విడనాడాలి. దయచేసి శాంతించు! నీ తపోధనం చాలా గొప్పది’ అన్నాడు ధర్ముడు.ధర్ముడు అనునయంగా మాట్లాడటంతో దుర్వాసుడు కొద్ది క్షణాల్లోనే శాంతించాడు.‘మహాత్మా! దివ్యపురుషుడిలా కనిపిస్తున్న నువ్వెవరివి? నీతో వచ్చినవారంతా తేజస్సంపన్నులుగా ఉన్నారు. వారంతా ఎవరు?’ అడిగాడు దుర్వాసుడు. ధర్ముడు తనతో వచ్చిన తన పరివారాన్ని ఒక్కొక్కరినే దుర్వాసుడికి సవివరంగా పరిచయం చేశాడు. ‘అందరిలోనూ వృద్ధురాలిగా కనిపిస్తున్న స్త్రీ నా తల్లి దయ. గొప్ప తపస్విని. నేను ధర్ముడిని, ధర్మ పురుషుణ్ణి’ అని పలికాడు. ‘ఓ ధర్మపురుషా! మంచిది. మీరంతా నా వద్దకు ఎందుకు వచ్చారు? నేను మీకు చేయగల సాయమేమైనా ఉందా?’ ప్రశ్నించాడు దుర్వాసుడు.‘మహర్షీ! శాంతించు. నా మీద ఎందుకు కోప్పడుతున్నావో చెప్పు? నేను నీ పట్ల చేసిన అపచారం ఏమిటి? కారణం చెప్పాలనిపిస్తేనే చెప్పు. ఇందులో నిర్బంధమేమీ లేదు’ అన్నాడు ధర్ముడు. ‘ధర్మపురుషా! నా కోపం నిష్కారణమైనది కాదు. నా కోపానికి తగిన కారణం ఉంది. చెబుతాను, విను! నేను చాలా కష్టపడి దయా శౌచాలతో నా శరీరాన్ని పరిశుద్ధం చేసుకున్నాను. నీ దర్శనం కోసం పదివేల ఏళ్లు అత్యంత కఠోరంగా తపస్సు చేశాను. అయినా, నువ్వు నన్ను కరుణించలేదు. ఇంతకాలం వేచి ఉండేలా చేశావు. నీకు నా మీద దయ లేదు. అందుకే నీ మీద కోపం వచ్చింది. అందుకే నిన్ను శపించాలనుకున్నాను’ కొంచెం కినుకగా పలికాడు దుర్వాసుడు.‘మహర్షీ! దయచేసి శాంతించు. నువ్వు తొందరపడి శపిస్తే, నీ శాపానికి నేను నాశనమైతే, ఈ లోకమంతా నశిస్తుంది. నీ బాధకు మూలకారణాన్ని తొలగిస్తాను. ఇహపరాల్లో నీకు గొప్ప సుఖం కలిగేలా చేస్తాను. లోకంలో ముందు సుఖాన్ని పొందినవాళ్లు తర్వాత దుఃఖాన్ని పొందుతున్నారు. ముందు దుఃఖాన్ని పొందినవాళ్లు తర్వాత సుఖాన్ని పొందుతున్నారు. పాపాత్ములు ఏ శరీరంతో పాపం చేస్తారో, అదే శరీరంతో బాధలు అనుభవిస్తారు. అది వారు చేసిన పాపానికి ఫలం’ అని ధర్ముడు హితబోధ చేశాడు.అంతా విన్నప్పటికీ దుర్వాసుడు కినుక మానలేదు. ‘ధర్మపురుషా! నువ్వెన్ని చెప్పినా, నీ మీద నాకు కోపం తగ్గడంలేదు. అందువల్ల నిన్ను శపించాలనే అనుకుంటున్నాను’ అన్నాడు. ‘ఓ మహర్షీ! నా వల్ల నీకు కోపం వస్తే, దయచేసి క్షమించు. క్షమించకుంటే నన్ను దాసీపుత్రుడిగా చేయి లేదా రారాజుగా చేయి లేదా చండాలుడిగా చేయి. వినయంగా ఉండేవారిపై బ్రాహ్మణులు ప్రసన్నత చూపరు కదా!’ అన్నాడు. దుర్వాసుడు వెంటనే, ‘ధర్మపురుషా! నువ్వు కోరినట్లే రారాజువుగా, దాసీ పుత్రుడిగా, చండాలుడిగా జన్మించు’ అని ఏకకాలంలో మూడు శాపాలనిచ్చి వెళ్లిపోయాడు.దుర్వాసుడి శాపఫలితంగా ధర్మపురుషుడు తర్వాతి కాలంలో పాండురాజుకు ధర్మరాజుగా, దాసీపుత్రుడు విదురుడిగా, విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధించినప్పుడు చండాలుడిగా పుట్టాడు. చివరకు ధర్మపురుషుడు కూడా తాను చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. – సాంఖ్యాయన -
కౌరవుల ఆలయాల గురించి విన్నారా? ప్రసాదంగా కల్లు, పొగాకు..!
పంచమహా వేదంగా పిలిచే మహాభారతం గురించి కథకథలుగా చదువుకున్నాం. అదీగాక వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అన్న నానుడి కూడా ఉంది. ఎందుకంటే భారతం వింటూంటే రసవత్తరంగా ఉంటుంది. కథలో ఏం జరిగింతుందో.. అని చివరి వరకు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. పలు ట్విస్ట్‌లు, భావోద్వేగాలు, సంఘర్షణలు,కుటుంబ విలువలతో మిళితమైన గొప్ప పురాణ గ్రంథం. అయితే ఈ పురాణ కథలోని కృష్ణుడికి, పాండవులకు దేవాలయాలు ఉన్నాయి. కానీ కౌరవులకు కూడా దేవాలున్నాయన్న విషయం తెలుసా..!. మొత్తం నూరుగురి కౌరవులకు దేవాలయాలు ఉన్నాయట. ఈ మూర్తులకు పెట్టే ప్రసాదంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటంటే..కేరళలోని కొల్లాంలో కౌరవుల యువరాజు దుర్యోధునుడి ఆలయం ఉందంట. ఏటా లక్షలాదిమంది ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేస్తుంటారట. అక్కడ ప్రజలు దుర్యోధనుడుని శక్తిమంతమైన దేవత అని, తమ కోరికలను తప్పక నెరవేరుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. ఇక్కడ కేవలం దుర్యోధనుడి ఆలయమే కాదు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందమంది కౌరవులకు, కర్ణుడుకి ఆలయాలు ఉన్నాయట. కేరళలోని కురవ వంశ ప్రజలు కౌరవులను తమ పూర్వీకులుగా భావించి పూజిస్తారట. ఈ కౌరవుల ఆలయాలన్ని కొండల మీదే ఉండటం విశేషం. శుక్రవారమే విడిచిపెట్టడంతో..శుక్రవారంలో మరీ ప్రత్యేక పూజలు చేస్తుంటారట. ఎందుకంటే వనవాసం చేసిన పాండవులును వెంబడిస్తూ అలసిపోయి దాహంతో ఉన్న దుర్యోధనుడు తన వందమంది సోదరులతో కలిసి మలనాడ ప్రాంతానికి చేరుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు ఒక వృద్ధ మహిళ దుర్యోధనుడికి కల్లు (పామ్ వైన్) ఇచ్చి అతడి దాహాన్ని తీర్చిందట. పైగా అక్కడి గ్రామస్తుల ఆతిథ్యానికి ముగ్ధుడయ్యాడు" పైగా దురోధనుడు శుక్రవారమే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాడట. అక్కడి ప్రజలకు మళ్లీ శుక్రవారం ఇక్కడకు వస్తానని హామీ కూడా ఇచ్చాడట. ఒకవేళ రాని పక్షంలో గ్రామస్థులు తాను చనిపోయాడని భావించి అంత్యక్రియలు చేయాలి అని దుర్యోధనుడు చెప్పాడని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అయితే దుర్యోధనుడు తిరిగిరాలేదు. కానీ గ్రామస్థులు అతని ఆత్మ అక్కడికి తిరిగి వచ్చి పరబ్రహ్మను ఆరాధించిందని నమ్ముతారట. అందుకే అక్కడి ప్రజలు ఆయన పేరు మీద ఆలయాన్నికట్టి మరీ పూజలు నిర్వహిస్తున్నారు. అంతేగాదు ఈ ఆలయం పేరు మీదుగా చాలా భూములు కూడా ఉన్నాయట. ఒక్క దుర్యోధనునికే కాదు శకుని, దుస్సల, కర్ణునికి కూడా దేవాలయాలు ఉన్నాయట. పవిత్రేశ్వరంలో మలనాడ మహాదేవ శకుని ఆలయం ఉంది. ఈ ఆలయం దుర్యోధన ఆలయానికి 14 కి.మీ దూరం. ఈ పవిత్రేశ్వరంలోననే శకుని, ఇతర కౌరవులు కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన తమ ఆయుధాగారాన్ని సిద్ధం చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. వారు తమ బాణాల కొనను పదును పెట్టడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన రాయి ఇప్పటికీ ఈ ఆలయం సమీపంలో ఉందంట. అంతేగాదు శకుని మోక్షం కోసం శివుడిని ప్రార్థించిన ప్రదేశంలో ఇప్పటికీ..ఒక నల్లని ఉందని చెబుతారు. మోసపూరిత శకుని ఇక్కడ శుద్ధి పొంది మోక్షాన్ని పొందాడు కాబట్టి ఇది పవిత్రమైన ప్రదేశం అని అక్కడి ప్రజల నమ్మకం. ఇక కున్నతుర్లోని శకుని ఆలయం నుంచి 30 నిమిషాల ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన కర్ణ దేవాలయం ఉంది.కర్ణుడు కౌరవుల కోసం పోరాడాడు, దుర్యోధనుని అత్యంత మిత్రుడుగా పేరుగాంచినవాడు.పైగా పాండవులలో పెద్దవాడు. అలాగేశూరనాద్లో, 100 మంది కౌరవ సోదరుల ఏకైక సోదరి అయిన దుస్సలకి కూడా ఆలయం ఉంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత, దుస్సల ఇక్కడ ఒక వరి పొలానికి చేరుకుందనిని స్థానికులు నమ్ముతారు. నీటి అవసరం ఉండడంతో తాగునీరు దొరక్క కర్రతో పొలంలో తవ్వి ఆ కర్రను అక్కడే పూడ్చిపెట్టిందని కథలు కథలుగా చెబుతున్నారు. ఈ పొలం నుంచి వచ్చిన వరి ఇప్పటికీ ఈ ఆలయంలో పూజల కోసం ఉపయోగించడం విశేషం. ఇక ఈ దక్షిణ కేరళ అంతటా శకుని, కర్ణుడు కాకుండా 101 మంది కౌరవులకు ఆలయాలు ఉన్నాయట. వాటిలో కొన్నింటి జాడ తెలియాల్సి ఉందని వివరించారు స్థానికులు.ప్రసాదం కూడా ప్రత్యేకమే..దేవాలయాల ప్రత్యేకత మాత్రమే కాదు, పూజా విధానం, నైవేద్యాలు కూడా ప్రత్యేకమైనవి. కేరళలోని కురవలు దుర్యోధనుడు లేదా శకుని వంటి దేవతలను అప్పోప్పన్ (పూర్వీకుడు) గా భావించి పూజిస్తారు.ఇక్కడి ప్రజలు తమ రక్షణ కోసం, మంచి పంటలు కోసం ఈ దేవతలను ప్రార్థిస్తారు.ఇక్కడ ప్రధాన నైవేద్యం కల్లు, పొగాకు ఆకులతో పాటు కోడి, మేక, ఎద్దు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు.2019లో ఇక్కడ ప్రసాదంగా పెట్టిన 101 ఓల్డ్ మాంక్ రమ్ సీసాలు హైలెట్‌గా నిలిచాయి.అంతేగాదు భక్తులకు కూడా ఆ కల్లునే తీర్థంగా పంపిణీ చేయడం మరింత విశేషం. ఈ దేవాలయాలు భారతదేశ విశ్వాసాల వైవిధ్యానికి మరియు భారతీయ సంస్కృతిలో కథల శక్తికి కూడా నిదర్శనం. ఇది ఒక వేద వ్యాసుని మహాభారతమే అయినా.. ఇక్కడ వంద మంది కౌరవులకు మాదిరిగా వారికి సంబంధించిన ఆలయాలు గురించి వంద కథనాలు ఉన్నాయి.(చదవండి: వాల్నట్స్ తింటున్నారా..?ఐతే అలాంటివాళ్లు మాత్రం..!) -
భక్తుని వేదన..
సాధారణంగా కష్టాలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో మనిషి నిరాశకు గురవుతాడు. తన ప్రార్థనలు, వినతులు దైవం వినిపించుకోడా ఏమిటి అనే సందేహం కలుగుతుంది. భగవంతునికి అనేక మంది భక్తులుంటారు. వాళ్ళు గొప్పగా పూజలు చేస్తుంటారు. అంతమందిలో తానేం గుర్తుంటాడు? ఇలా ఆలోచిస్తూ సాధారణంగా నిస్పృహకు లోనవుతుంటారు మానవులు.సరిగ్గా భక్త హృదయాలను చదివినట్లుగా నరసింహ శతక కవి, ‘ఓ దేవా! నా వంటి సేవకుల సమూహం నీకు కోట్ల కొలది ఉంటారు. వారి సందడిలో, వారి సేవలలో నన్ను అశ్రద్ధతో మర్చిపోవద్దు. వారి పుణ్యాతిశయం చేత చాలా మంది సేవకులు నీవెంట పడేవారుండగా నీకు నేనే మాత్రం! నీవు మెచ్చే పనులు నేను చేయలేను. ఈ భూజనులలో నేను పనికిమాలిన వాణ్ణి. అయినా, నీ శుభమైన చూపు నాపై ప్రసరించు’ అని ప్రార్థిస్తాడు.అలాగే ‘నా రెండు కన్నులతో నిన్ను చూసే భాగ్యం నాకెప్పుడు? నా మనసులో కోర్కె తీరునట్లు నీ రూపం చూపించు. పాపం చేసినవారికి కనిపించనని ప్రమాణం చేసుకున్నావా? కానీ, పాపులను పరిశుద్ధు లను చేసే దేవుడివి నువ్వే అని మహాత్ములంతా నిన్ను స్తుతిస్తారు. పాపులను రక్షించి నందుకే నీకింత కీర్తి. చెడ్డవాడినైననూ నాకు కనిపించవా!’ అని వేడు కుంటాడు.ఇందులో భక్తులందరి వేదనా ఉంది. ఆర్తి ఉంది. తనను మాత్రమే దేవుడు పట్టించుకోవట్లేదేమో అనే సందేహం ఉంది. భగవంతుని కరుణ శీఘ్రంగా తనపై ప్రసరించాలని, ఆ దివ్య రూపాన్ని కళ్లారా దర్శించి తరించాలనే తపన ఉంది. తాను భగవంతుడు మెచ్చే పనులు చేయటం లేదేమో, అందుకే ఆయన దయ తనకు లభించడం లేదేమో, అలా మెప్పించే శక్తి తనకు లేదుకదా అనే నిస్సహాయత ఉంది. భగవంతుని విషయంలో భక్తుల హృదయాలలో సహజంగా కనిపించే వేదన ఇదే! – డా. చెంగల్వ రామలక్ష్మి -
‘రామ కథా యాత్ర’పై డాక్యుమెంటరీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రఖ్యాత ఆధ్యాతి్మక వేత్త మొరారి బాపు ఇటీవల తాను చేసిన ద్వాదశ జ్యోతిర్లింగ రామకథా యాత్రపై ఒక డాక్యుమెంటరీని విడుదల చేశారు. రెండు రైళ్లలో ఒకదానిలో ప్రయాణించిన బాపు, ఆయన బృందం దీనిని చిత్రీకరించిందనీ, మంచు కప్పేసిన హిమాలయ శిఖరాల మీదుగా పచ్చని లోయలు విశాలమైన సముద్ర తీరాల వరకూ సాగిన ఈ యాత్రలో అనేక ఆధ్యాతి్మక విశేషాలను వీక్షించవచ్చని రూపకర్తలు తెలిపారు. అదే విధంగా బాపు రచించిన జర్నీ విత్ యాన్ ఇని్వజబుల్ పవర్, సాక్ర్డ్ స్టోరీస్ ఫ్రమ్ ది 12 జ్యోతిర్లింగాస్ పుస్తకాలు అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
దానంలో ఘటికుడు
పూర్వం కశ్యపు బుద్ధుని కాలంలో వేగళింగ అనే నగరం ఉండేది. అ నగర శివారులో ఘటికారుడు అనే కుమ్మరి ఉండేవాడు. అతనికి జ్యోతిపాలుడు అనే మిత్రుడు ఉండేవాడు. అప్పుడు ఆ ్రపాంతాన్ని కికీలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఘటికారుడు కశ్యప బుద్ధుని ఉపాసకుడు. కశ్యపుని ధర్మ ప్రబోధాలు విని ధార్మికంగా జీవిస్తూ ఉండేవాడు. కుండలు చేయడానికి కావలసిన మట్టిని పలుగు పారలతో తవ్వి తీసేవాడు కాదు. క్రిమికీటకాలు తన పలుగు కింద పడి చనిపోతాయని. ఎలుకలు తవ్విపోసిన మట్టిని మాత్రమే తీసుకుని పోయి కుండలు చేసేవాడు. ఆ కుండల్ని కూడా ఎక్కువ ధరకు అమ్మేవాడు కాదు. వాటిని ఆరుబయట ఉంచేవాడు. కావలసిన వాళ్లు కుండల్ని తీసుకుని అక్కడ ఉంచిన గంపల్లో తాము చెల్లించాల్సిన ధరకు సరిపడే ధనాన్ని గానీ, నూకల్ని గానీ, ధాన్యాన్ని గానీ ఉంచి వెళ్ళేవారు. అలా... నిజాయితీగా, ధర్మబద్ధంగా తాను జీవిస్తూ అందరూ జీవించాలని కోరుకునేవాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ అంధులు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారి ఆలనా ΄ాలనా చూసేవాడు. వారు కూడా ధార్మికులే. ఇతరులు లేని సమయంలో ఎవరైనా భిక్షువులు గానీ, యోగులుగానీ భిక్షకు వస్తే...‘‘అయ్యా! మేము ఇద్దరం గుడ్డివాళ్ళం. లేవలేని ముసలివాళ్ళం. అదిగో ఇంట్లో ఉట్టిమీద ఆహారం ఉంది. మీకు కావలసినంత మీరే తీసుకోండి. మేము ఇచ్చే భిక్షగా భావించండి’’ అనేవారు. ఒకరోజున కికీలుడు తన రాజభవనం ముందు నిలబడ్డాడు. అటుగా కశ్యపబుద్ధుడు తన శిష్యగణంతో వెళ్తున్నాడు. కికీలక మహారాజు వారి ముందుకు వచ్చి నమస్కరించి– ‘‘భగవానులు మమ్ము అనుగ్రహించాలి. భిక్షుసంఘంతో వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి’’ అని వేడుకున్నాడు. ‘‘లేదు మహారాజా! నేను వేరొకరికి మాట ఇచ్చాను’’ అన్నాడు. ‘‘ఎవరికి భగవాన్? నేను ఈ దేశానికి రాజుని. ప్రభువుగా వెళ్ళి వారిని అర్థిస్తాను. ఈరోజు ఆ అవకాశం నాకు ఇవ్వమంటాను. మరోమారు వారిని తీసుకోమంటాను’’ అన్నాడు. ‘‘లేదు మహారాజా! ఈ రోజు నేను వారి ఇంటనే భిక్ష స్వీకరించాలి’’ అని ముందుకు నడిచాడు. భిక్షుగణం ఊరి చివరకు వెళ్ళింది. అప్పటికే పట్టిన మబ్బుల్నుండి సన్నని చినుకులు రాలుతున్నాయి. భిక్షు సంఘం వెళ్ళేసరికి... ఘటికారుని పూరి΄ాక మీద పరచిన ఎండు గడ్డిని తీసివేసి కట్టలు కట్టారు. ఆ కట్టల్ని ఎవరో మోసుకుపోతున్నారు. గడ్డి తీయడంతో పాక మీద ఖాళీలు కనిపిస్తున్నాయి. కశ్యప బుద్ధుణ్ణి వారు గౌరవంగా ఇంటి వసారాలోకి ఆహ్వానించారు. ఆ చూరు కిందే కూర్చుని పచ్చడి మెతుకుల భిక్ష స్వీకరించారు. వర్షం పెరిగింది. తడుస్తూనే ధర్మోపదేశం చేశాడు కశ్యపుడు. ఘటికారుడు కశ్యపునికి పాదాభివందనం చేశాడు. భిక్షాగణం తిరిగి బయలుదేరింది. దారిలో చెట్టుకింద కికీలమహారాజు కనిపించాడు. ‘‘చూశావా! మహారాజా! ఘటికారుడు ఎంతటి దానపరుడో! ఎవరో గడ్డి అడిగారు. తన దగ్గర లేదు. అయినా తన ఇంటి మీద పరచిన గడ్డిని తీసి దానం చేశాడు. అతను మహాదాత. అతని భిక్ష స్వీకరించడం మాకు ఎంతో సంతోషం’’ అంటూ ముందుకు కదిలాడు. తాను సమర్పించే గొప్ప భోజనాన్ని కాదని, పూరిగుడిసెలో పచ్చడి మెతుకుల కోసం కశ్యపు బుద్ధుడు ఎందుకు వెళ్ళాడో రాజుకి అర్థమైంది. తనకంటే ఘటికారుడే గొప్పవాడని గ్రహించాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
... అదే మనల్ని పట్టుకున్నది
ఇంద్రియాలను నిగ్రహించడం అంత తేలికకాదు. రావణాసురుడు రాముడి చేతిలో పది తలలు తెగి పడిపోయి ఉన్నాడు యుద్ధభూమిలో. మండోదరిని పల్లకీలో తీసుకొచ్చారు. అక్కడ ఆమె దిగింది. కాస్త దూరంలో రామలక్ష్మణులు నిలబడి ఉన్నారు. అందరూ అనుకున్నారు.. ‘‘నా భర్తను నువ్వే చంపేసావ్ ... దుర్మార్గుడివి..’’ అని రాముణ్ణి తిడుతుందనుకున్నారు. ఎంతయినా భర్త కదా, ఆక్రోశంలో నిందిస్తుందనుకున్నారు. ఆమె నేరుగా నేలపై పడి ఉన్న రావణుడి దగ్గరకు వెళ్లి..‘‘ ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనం త్వయా / స్మరద్భిరవ తద్వైరమింద్రియైరేవ నిర్జితః’’ అన్నది. నీవు ఒకప్పుడు త్రిభువన సామ్రాజ్యాన్ని కోరుకున్నావు. ఆ కోరిక తీరడానికి తపస్సు చేసావు. ఆ సమయంలో ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించావు. కాలికింద తలదించుకుని రాము అవకాశం కోసం ఎదురు చూసినట్లు నీవు కోరుకున్న సామ్రాజ్యం రాగానే నీ ఇంద్రియాలే నిన్ను కాటేసాయి. మహా పతివ్రత సీతమ్మను వేధించావు. రాముని చేతిలో చచ్చిపోయావని అందరూ అనుకుంటున్నారు. నీ భార్యగా నాకు తెలుసు. రాముడి చేతిలో కాదు, నీ ఇంద్రియాల చేతిలోనే నీవు చచ్చిపోయావు’’ అంది. ఈ మాటలను సీతమ్మ కూడా ముందే ఇంచుమించు ఇలాగే చెప్పింది..‘‘నీ కామం నీ భార్యయందుంచుకో. ధర్మానికి కట్టుబడి ఉండు. దోషం లేదు. నీ కామం నీ భార్యను దాటిపోయిందా నీకు మహాపాపం చుట్టుకుంటుంది... వద్దు. ధూర్త విషయాలజోలికి వెళ్ళకు’ అని హెచ్చరించింది కూడా..అందువల్ల ఇంద్రియాలను నిగ్రహించడం అంత తేలికయిన పనేం కాదు. అరిషడ్వర్గాలకు దూరంగా ఉండాలని చెప్పడం చాలా తేలికే. అంటే కామానికీ, కో΄ానికీ... దూరంగా ఉండమంటున్నారు.. సరే.. అసలు కామాన్ని పట్టుకుని ఉంటే కదా... ఈ మాట అనవలసింది. మరి ....మనం పట్టుకోవడం కాదు... అదే మనల్ని పట్టుకుంటున్నది. అది వదలాలి అంటే... మొదట అది మనల్ని పట్టుకుందని గుర్తించాలి. తరువాత మనం ఏం చేస్తే అది పట్టు వదులుతుందో కూడా తెలుసుకోవాలి. ఇది అందరికీ అన్వయం అవుతుందా లేదా.. పక్కనబెట్టి గృహస్థుకు ఏ ధర్మం అన్వయం అవుతుందో అదే అన్వయం చేసుకోవాలి. అందుకే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ ...‘‘లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా / నీకము జిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధు జేయు నీ/ భీకర శత్రు లార్వుర బ్రభిన్నుల జేయుము ్ర΄ాణికోటిలో/ నీకు విరోధి లే డొకడు నేర్పున? జూడుము దానవేశ్వరా!’ అంటాడు. నీవు లోకాలన్నీ గెలిచానంటున్నావు కదా... ముందు నీ ఇంద్రియాలను నీవు గెలిచావా? నీ మనసును గెలిచావా? అది చెప్పు.. వాటిని గెలవడం అంత తేలిక కాదు. వాటిని గెలువు. గెలిస్తే... అప్పుడు నీకు శత్రువన్న వాడెవడూ ఎదురుగా కనబడడు. అందరూ మిత్రులే...అంటాడు. కాబట్టి అది అనుష్ఠానం చేత గెలవాలి. అంటే సుఖాన్ని ధర్మంతో కట్టేసి ఉంచాలి. అప్పుడు ధర్మబద్ధమైన అర్థం ప్రభవిస్తుంది. కామం ధర్మబద్ధమైనప్పుడు సంతానం కూడా ధర్మబద్ధంగానే ఉంటుంది. సమాజం నైతికంగా ఒక క్రమ పద్ధతిలో, సుఖసంతోషాలతో, ప్రశాంతంగా పురోగమిస్తుంది. -
ఒదిగితేనే ఎదుగుదల
ఉరుకులు పరుగులతో ఉరవడిగా వచ్చి తనని చేరిన నదిని సముద్రుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ‘‘నీ ప్రవాహ వేగానికి మహావృక్షాలు విరిగి పడిపోతూ ఉంటాయి. ప్రబ్బలి మొక్కలు అలాగే ఉంటాయి. వాటిని నువ్వు ఏమీ చేయవా?’’ అని. నది ఈవిధంగా సమాధానం చెపుతుంది. ‘‘ప్రబ్బలి మొక్కలు వేగంగా ప్రవాహం వస్తుంటే ఎదురు నిలవక తలవంచి ఉంటాయి. ప్రవాహ వేగం తగ్గగానే యథాప్రకారం తలెత్తుతాయి. మహావృక్షాలు తలవంచవు’’ అని!నది చెప్పినది వృక్షాలకి సంబంధించినదే అయినా మనకి కూడా వర్తిస్తుంది. ఎగిరెగిరి పడినా, ఎదిరించి నిలిచినా, ఎదురొడ్డి నిలిచినా విరిగి పడటం జరుగుతుంది. పొగరు బోతు గొర్రె పొటేలు కొండని గెలవగలనని కుమ్మి తల చిట్లి నశించినట్టు అవుతుంది. తమకి శక్తి లేక పోయినా అహంకారంతో ఎదుటివారి శక్తి సామర్థ్యాలని తక్కువగా అంచనా వేసి దెబ్బతింటూ ఉంటారు మహావృక్షాల వంటి వారు. పైగా తమ నీడలో మరి ఏ మొక్కకి కూడా పెరిగే అవకాశం ఇవ్వరు. దానితో ఆపదలో ఆదుకునే వారు, తోడ్పడేవారు ఉండక కూలిపోక తప్పదు. తల ఎగరేసి, తల పొగరుతో ఉండక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తలవంచటం, పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు తలెత్తటం చేస్తారు తెలివిగలవారు గడ్డిపోచల లాగా. పెరుగుతున్న మొక్కకి ఏదైనా అడ్డు వస్తే, కొన్ని పక్కకి వంగి వెలుగు వచ్చే దారి చూసుకుని ఎదుగుతాయి. నిటారుగా మాత్రమే ఎదుగుతాము, వంగము అనుకున్న మొక్కలు గిడసబారతాయి. సముద్రంలో స్నానం చేయటానికి గాని, ఈత కొట్టటానికి గాని వెళ్ళేవారు అలకి అనుకూలంగా వెడతారు. అలతో పాటు లేచి పడతారు. అలకి వ్యతిరేక దిశగా ఈత కొడితే జరిగే అనర్థాలు అందరికీ తెలుసు. నదుల్లోనూ, కాలవల్లోనూ ఈతకి వెళ్ళేవారు ప్రవాహం ఎటువైపు ఉంటే అటే వెడతారు. వ్యతిరేక దిశలో వెడితే అది ఎదురీత. పడవలు కూడా ప్రవాహం వెళ్ళే దిశలో వేగంగా వెడతాయి. వ్యతిరేక దిశలో ప్రయాణం శ్రమతో కూడుకొని ఉంటుంది. పరిస్థితులని గమనించకుండా ఉండే ఈ ప్రవర్తనకి మనిషిలో ఉండే అహంకారమే కారణం. నా అంతటి వారు లేరు అనే గుణం. నన్ను ఎదిరించగల వారు లేరు అనే పొగరు. ఎదుటివారి సామర్థ్యాన్ని గుర్తించలేని గుడ్డితనం. ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అదిరిపాటుకి అంతూ దరీ ఉండవు. దీనినే ‘మదం’ అని కూడా అంటారు. విరగబాటుతనం ఉంటే ప్రవాహానికి ఎదురొడ్డిన మహావృక్షాల లాగా విరిగి పడటం తప్పదు. అంటే ఎప్పుడూ పరిస్థితులకి, అవతలి వారి ఇష్టానిష్టాలకి తల ఒగ్గి, వ్యక్తిత్వం అన్నది లేకుండా బతక వలసిందేనా? అన్న సందేహం రావటం సహజం. పరిస్థితులని మార్చగల శక్తిసామర్థ్యాలు ఉంటే మంచిదే. ఎప్పుడూ అట్లా ఉండటం అసంభవం. ప్రతికూలంగా ఉన్న సందర్భాలలో ఎట్లా ఉండాలి అన్నది కూడా తెలియాలి కదా! రోగాన్ని తగ్గించే అవకాశం లేకపోతే ఉపశమనం కలిగించాలి. అనుకూల వాతావరణం వచ్చేదాకా ఊరుకోవటం ఉత్తమం. ‘‘కొంచెముండు టెల్ల కొలది కాదు’’ అన్న వేమనని అనుసరించటం శ్రేయస్కరం. ఎదురీత నదిలోనే కాదు ఎక్కడైనా శ్రమతో కూడుకున్నదే. జీవితమనే ప్రవాహంలో కదిలే మనిషి అనుకూలమైన దిశలో సాగితే ప్రయాణం సుకరంగా ఉంటుంది. వ్యతిరేక దిశలో వెళ్ళటానికి ఎంతో శక్తిని వెచ్చించ వలసి ఉంటుంది. జీవితం సంఘర్షణ అవుతుంది. కొన్ని సందర్భాలలో ప్రవాహం ముందుకి తోస్తుంటే, తాను వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అంగుళం కూడా కదలక ఉన్న చోటనే నిలిచి పోవలసి రావచ్చు, నిలదొక్కుకోలేక కూలబడవచ్చు. అప్పుడు ప్రవాహంలో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. వీలు, వాలు చూసుకోవాలని పెద్దలు చెప్పేది అందుకే! -
గురుపౌర్ణమి విశిష్టత: గురువు అనుగ్రహం కోసం ఏం చేయాలి?
ఆషాఢ శుక్ల పౌర్ణమిని గురు పౌర్ణమిగా పరిగణించడం సాంప్రదాయం. ఈరోజు వ్యాస దేముడని గురువుగా భావించి వ్యాస పీఠం మీద భారత, భాగవతాది పవిత్ర గ్రంధాలను ఏర్పాటు చేసుకొని, వ్యాస, లేక విష్ణు అష్టోత్తర నామాలతో పూజించు కోవడం మన సాంప్రదాయం. అలాగే మనకు భగవద్ జ్ఞానాన్ని, ఓసగిన గురువులను నూతన వస్త్రాలతో దక్షిణ తాంబూలాలతో సత్కరించు కోవడం ఒక సాంప్రదాయం. అదే విధంగా వేదం ప్రతిపాదించిన మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, రమణ మహర్షి శంకరాచార్యులు వంటి వారిని పూజించి తరించాలి.గిరి ప్రదక్షిణ :- అవకాశం ఉన్నవారు గోవర్ధనం, అరుణగిరి, సింహాచలం వంటి గిరులకు పరిక్రమ చేయడం ఆధ్యాత్మికంగా. ఆరోగ్య పరంగా చాలా ఉత్తమం. ఈరోజు రాత్రి సమయం లో చంద్ర కిరణాలలో ఓషధీ తత్వం ఉండి మనస్సు, ప్రశాంతత చిక్కుతుంది. ఇది అవకాశం లేని వారు ఈరోజు రాత్రి చంద్రోదయం తరువాత వెండి గిన్నెలో ఆవుపాలు పోసి అందులో ఏలక పొడి పటిక బెల్లం కలిపి ఆ గిన్నెను చంద్రకిరణాలు సోకే విధంగా తులసికోట వద్ద ఉంచి లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం చేసి ఆ లలితా అమ్మ వారికి నివేదన చేసి ఇంటిల్ల పాదీ తీర్థంగా తీసుకొంటే వారిపై ఆ తల్లీ కరుణ సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే మన గురు పరంపర స్మరించుకోవడం ఉత్తమం.నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమథాఽస్య శిష్యం ...ఈరోజు ఈ శ్లోకం చదువు కుని గురు పరంపర స్మరించు కోవాలి. అదే విధంగా వ్యాసో నారాయణో హరిః. అనే నామాన్ని జపించుకోవాలి. గురుశబ్దం త్రిమూర్తితత్త్వం. సృష్టి, స్థితి, లయకారం, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు.!!గురూ అనే శబ్దాన్ని విడదీస్తే ‘గ్ – ఉ – ర్ – ఉ’ అనే అక్షరాలు కనబడుతుంటాయి.వీటిలో ‘గ’ కారం సిద్ధకమైన బ్రహ్మకు, ‘ర’కారం పాపనాశకరమైన శివశాక్తికి సంకేతాలు. ఈ రెండూ పాలస్వభావం కలిగిన ‘విష్ణుశక్తి’తో కలిసినప్పుడే ‘గురు’ అనే పదం ఏర్పడి ‘గురు’తత్త్వం మూర్తీభవిస్తుంది. అందుకే గురువును మనం త్రిమూత్రిస్వరూపంగా భావిస్తూ పూజించుకుంటున్నాం. ‘గురి’ని కల్పించేవాడు గురువు. లక్ష్యసాధనామార్గాన్ని చూపేవాడే గురువు అని స్థూలార్థం. గురువు పరంపరాగత క్రమశిక్షణగలవాడైతే, శిష్యునకు ఉపదేశాన్నిఅందిస్తాడు!!జగద్గురువు అయిన తను కూడా ప్రకృతి నుండి గురువులను గ్రహించానుఅని దత్తగురువు చెప్పాడు!! శ్రీకృష్ణపరమాత్మ ఆవిర్భవించిన యాదవ వంశానికి మూలపురుషుడైన “యదువు” అనే మహారాజునకు ఒకప్పుడు శ్రీఅవధూత దత్తస్వామి దర్శనం లభించింది. వారిలో చీకూచిన్తలేని స్థితిని చూసిన యదురాజు, “స్వామీ! అంతర్గతంగా ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉండటం వలన మీకీ స్థితి లభించింది? దయతో నాకు ఉపదేశించండి” అని అభ్యర్థించాడు.అతని మాటలోనున్న ఆర్తిని, వినయాన్ని చూచిన శ్రీ అవధూత ఇలా సమాధానము ఇచ్చాడు!! “యదురాజా! నేను లోకాన్ని విస్తృతంగా పరిశీలించి, ఎందరెందరో గురువుల నుండి రవ్వంత జ్ఞానాన్ని సంపాయించాను. రాజా! నాకు ఇరువది నలుగురు(24) గురువులున్నారు!!జాగ్రత్తగా విను. 1. భూమి, 2. వాయువు, 3. ఆకాశము, 4. నీరు, 5. అగ్ని ఇవియే పంచభూతాలు. మరియు – 6.సూర్యుడు, 7. చంద్రుడు, 8. పావురాలు, 9. అజగరము (కొండచిలువ), 10. సముద్రము, 11.మిడత, 12. తుమ్మెద, 13. గజము, 14. మధుహారి (తేనెటీగ), 15. లేడి, 16. చేప, 17. ‘పింగళా’ – అనే వేశ్య, 18. కురరము (లకుముకిపిట్ట), 19. బాలుడు, 20. బాలిక, 21. శరకారుడు, 22. సర్పము, 23. సాలీడు, 24. పురుగు !!ఇవి నా గురువులు.వాటి నుంచి గ్రహించినది విను. భూమి నుం – క్షమా, పరోపకారత్వం!!వాయువు నుండి – నిస్సంగత్వము, నిర్లేపత్వము!! ఆకాశము నుండి – సర్వవ్యాపకతత్త్వం!!జలం నుంచి – నిర్మలత్వం, మాధుర్యం, స్నిగ్ధత్వం!! అగ్ని నుంచి – తేజస్సు, ఈశ్వరతత్త్వం!!సూర్యుని నుంచి – జలగ్రాహి, జలత్యాగియు. లోక బాంధవుడతడు. సర్వలోకాలకు అతడొక్కడే!! చంద్రుని నుంచి – వ్రుద్ధిక్షయాల రూపుడు, అట్టివి షడ్భావ వికారాలు దేహానికేకాని, తనకు (ఆత్మకు) కావని చంద్రుడు నేర్పించాడు.!! పావురాల జంట నుంచి – కామక్రోధాలకు వశమైనచో ‘ఆత్మానురాగం’ కోల్పోతారని గ్రహింపు.!!అజగరము నుంచి – దైవికంగా లభించినదానికి తృప్తి చెంది, ఆత్మనిష్ఠ కలడైయుంటుంది.!! సముద్రం నుంచి – తనలో దేన్నీ ఉంచుకోదు. అపవిత్రమైనది కల్మషమైనదియు అనగా అడియోగాతత్త్వం కలది. కామాన్నీ, వికారాన్నీ కూడా తనలో చేరనీయదు. తన మనోభావాన్ని బైటకు పొక్కనీయదు.!! మిడత నుంచి – మ్రుత్యురూపమైన మోహమనెడి జ్వాలాగ్నికి బలియవడం, సుఖమను తలంపుతో మృత్యురూపం పొందుతుంటుంది.!!తేనెటీగ నుంచి – ఏ పూవును కూడ బాధించకుండ తను పొందాల్సినదానిని (మధురమును) పొంది జీవిస్తుంది. యోగి కూడ ఎవరిని నొప్పించకుండా భిక్ష గ్రహించి పోషించుకొంటాడు. ప్రతి పుష్పాన్ని వదలక ఉండటమనేది, ముని ప్రతీ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, నేర్పుతో సారాన్ని గ్రహించడం, కానీ, కూడబెట్టిన మధుసంపద రేపటికిని ఉంచుకొంటే అది పరుల సోత్తగునని గ్రహించదు. అందుకే ముని తాను పొందిన భిక్ష మరునాటికని ఉంచుకొనడు. ఉంచుకొన్నా అది పనికిరానిదవుతుంది కదా!! గజం నుంచి – తానెంత బలిష్ఠమైనదో, అంట మ్రుత్యురూపమగు మోహంగలది. అనగా స్త్రీలౌల్యం కలది. ఆ మోహంలోపడి తాను ఇతరులకు వశమవుతుంది.!!మధుహారి నుంచి – ఇతరులు కూడబెట్టుకొనిన వస్తువు (మధువు)ను, లోభం చేత న్యాయాన్యాయాలు లెక్కించక, అపహరించువాడు కడు నీచుడు.!!లేడి నుంచి – అమాయకత్వంలో సంగీతం మోజుతో వేటగానికి చిక్కుతుంది, ఋష్యశృంగముని సంగీత నాట్యాలకు భ్రమసి మాయ వలలో పడ్డాడు.!! చేప నుంచి – ‘ఎర’కు (జిహ్వ) చాన్చాల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి గాలానికి చిక్కుతుంటుంది. ‘జిహ్వ’ కానరాని దొంగ కదా!! పింగళ నుంచి – ధనాశతో కాలహరణం, భౌతిక వాంఛకు శరీరాన్ని భ్రష్టత్వమొనర్చుకొనుట.!! కురరము నుంచి – తనకు ప్రియమైనది, ఇతరులకు ప్రియమైనది లెక్కించక పోటీపడుటలో పొందు దుఃఖము.!!బాలుడు నుంచి – యోగితో సమానుడు. పాప పుణ్యాలు ఎరుగనివాడు. భగవత్ర్పాప్తి వల్ల నిరుద్యముడై ఉంటాడు.!! కన్యక నుంచి – తనకున్న లేమిని కనబరచకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుకొంటుంది.!! శరకారుడు నుంచి–ఏకాగ్రతనుసాధిస్తాడు!సర్పము నుంచి – ఈ శరీరం క్షణ భంగురమని, తనకంటూ ఒక గృహము ఏర్పరచుకోదు.!!సాలెపురుగు నుంచి – పరబ్రహ్మతత్త్వం తెలియును. సృష్టిలయములు క్రియస్వరూపి.!! పురుగు నుంచి – రోదచేస్తున్న తుమ్మెదనే చూస్తూ మనస్సనంతయు ఆ తుమ్మెదవైపు లగ్నమొనర్చినా, కొంతసేపటికి, తాను ఆ తుమ్మెద రూపం పొందుతుంది. అనగా భక్తుడు దేనిపై లగ్నమొనర్చునొ అటుల భగవత్ రూపధారి అవుతాడు. ఉదా|| భరతుడు. (శ్రీరాముని తమ్ముడు).అలాగే, అనకు ప్రతీ అణువు గురువేయని, తనలోని మనస్సే తనగురువని కూడ చాటాడు అవధూత శ్రీదత్తాత్రేయులు.!!. ఇక, ఆచార్యులు గురువులు జ్ఞానంతో పాటూ సదనుష్టానాన్ని కలిగివుండాలి. అటువంటి ఆచార్యులకు చక్రవర్తియైనప్పటికీ తలొంచవలసిందే!!(చదవండి: తొలి ఏకాదశి విశిష్టత? ఆ పేరు ఎలా వచ్చిందంటే..?) -
ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
ఈరోజు(ఆదివారం) గురుపౌర్ణమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల వేడుకలు నిర్వహిస్తున్నారు. యూపీలోని వారణాసికి పెద్దసంఖ్యలో చేరుకున్న భక్తులు గంగాఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తూ, పూజలు చేస్తున్నారు. భక్తుల భద్రత కోసం అధికార యంత్రాంగం ఘాట్ల దగ్గర పటిష్ట ఏర్పాట్లు చేసింది. యూపీలోని లక్నో, ఆగ్రా, కాన్పూర్, మీర్జాపూర్, ఘాజీపూర్, ప్రయాగ్‌రాజ్ తదితర ప్రాంతాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సనాతన సంప్రదాయంలో గురుపౌర్ణమి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సాయిబాబా కొలువైన మహారాష్ట్రలోని షిర్డీలో జరుగుతున్న గురుపౌర్ణమి వేడుకలకు తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా గురుపౌర్ణమి సందర్భంగా సాయినగరి షిర్డీ భక్తులతో కిటకిటలాడుతోంది. షిర్డీలో మూడు రోజుల పాటు గురుపౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయిబాబా సంస్థాన్ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. శనివారం తెల్లవారుజామున కాగడ హారతితో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తరువాత సాయి జీవిత చరిత్ర పుస్తకాల ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం రోజంతా సాయి మందిరాన్ని భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంచనున్నారు. -
చంద్రసేనుడి ఔన్నత్యం! స్వర్ణగిరి, చంద్రగిరి రాజ్యాల మధ్య..
స్వర్ణగిరి, చంద్రగిరి రాజ్యాల మధ్య తరతరాలుగా శత్రుత్వం ఉంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చంద్రగిరి రాజు చంద్రసేనుడు ఇరుగుపొరుగు రాజ్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఒకరోజు స్వర్ణగిరి రాజు సూర్యసేనుడికి ఒక లేఖ పంపాడు. ‘సూర్యసేన మహారాజులవారికి నమస్కారములు.నేను మీతో మైత్రి కోరుకుంటున్నాను. శత్రుత్వమనేది మన తండ్రుల మధ్య ఉండేది. మన మధ్య కాదు. ప్రజల మధ్య కాదు. ఆ శత్రుత్వం వారితోనే అంతమవనీ. మన రాజ్యాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని కోరుకుంటున్నాను. మీరు అంగీకరించగలరని భావిస్తున్నాను’ అని లేఖలో కోరాడు.సూర్యసేనుడు అందుకు సమాధానంగా..‘మా నాన్న తన జీవితకాలమంతా మీ రాజ్యాన్ని శత్రురాజ్యంగానే భావిస్తూ వచ్చాడు. మీతో కలవలేదు. నేనూ మా నాన్నగారి మార్గంలోనే నడుస్తాను. మీతో స్నేహం నాకిష్టం లేదు’ అంటూ చంద్రసేనుడితో స్నేహాన్ని తిరస్కరిస్తూ లేఖ రాశాడు. ఇరుగు పొరుగు రాజ్యాలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం మంచిదని, వారు స్నేహ హస్తం అందిస్తున్నప్పుడు తిరస్కరించడం మంచిది కాదని మంత్రి ఎంత చెప్పినా సూర్యసేనుడు ఒప్పుకోలేదు.ఒకసారి చంద్రగిరి రాజ్యంలో విపరీతంగా వర్షాలు కురవడంతో చెరువులు తెగి వరద వచ్చింది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పేదల గుడిసెలు కొట్టుకొని పోయాయి. వరద వల్ల చాలా నష్టం వాటిల్లింది. ఇరుగు పొరుగు రాజ్యాల రాజులు ఆహారపదార్థాలు, నిత్యావసర వస్తువులు, వస్త్రాలు,« దనం, ఔషధాలు మొదలగునవి అందించి వరద బాధితులను ఆదుకున్నారు. సూర్యసేనుడు మాత్రం మంత్రి చెప్పినా ‘శత్రురాజ్యానికి మనమెందుకు సాయం చేయాలి?’ అంటూ పూచిక పుల్ల కూడా సాయం చేయలేదు.ఒకసారి సాయంత్రం సూర్యసేనుడు వనవిహారం చేస్తూ ఓ మొక్కపై అందంగా ఊగుతున్న ఓ పువ్వును చూశాడు. దాన్ని తుంచి వాసన చూశాడు. కొద్ది సేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. రాజ భటులు భవనానికి చేర్చారు. రాజ వైద్యుడు వైద్యం చేసి మెలకువ తెప్పించాడు. ఆ రోజు నుండి ఆయన తీవ్రమైన నరాల నొప్పితో బాధ పడసాగాడు. రాజవైద్యుడు.. అనేక రకాల ఔషధాలు వాడినా నరాల జబ్బు నయం కాలేదు. మంత్రి, రాజవైద్యుడు చుట్టు పక్కల రాజ్యాల నుండి రాజవైద్యులను పిలిపించి వైద్యం చేయించారు.రోజురోజుకీ నొప్పి పెరుగుతోంది కానీ తగ్గలేదు. రాజవైద్యుడు సూర్యసేనుడితో ‘మహారాజా! మీరు అంగీకరిస్తే ఒక మాట చెబుతాను. చంద్రగిరి రాజ్య వైద్యుడు సౌశీల్యుడిని మించిన వైద్యుడు ఈ చుట్టుపక్కల లేడు. వైద్యశాస్త్రంలో దిట్ట. ఆయనకు తెలియని వైద్యం లేదు. ఆయన మాత్రమే మీ జబ్బును నయం చేయగలడని నా నమ్మకం’ అని చెప్పాడు. సూర్యసేనుడు తటపటాయిస్తూ ‘చంద్రసేనుడు మనతో స్నేహం కోరితే తిరస్కరించాను. ఆ రాజ్యం వరదలతో అతలాకుతలమైతే నేను పూచిక పుల్ల కూడా సాయం చేయలేదు. ఇప్పుడు నా కోసం వాళ్ళ వైద్యుడిని చంద్రసేనుడు పంపుతాడంటారా?’ అన్నాడు సందేహంగా.అక్కడే ఉన్న మంత్రి ‘ప్రయత్నిస్తే తప్పులేదు కదా! నేనే స్వయంగా వెళ్లి అడుగుతాను’ అన్నాడు. సూర్యసేనుడు అంగీకరించాడు. మంత్రి చంద్రగిరి రాజ్యానికి వెళ్లి చంద్రసేనుడితో విషయం చెప్పాడు. చంద్రసేనుడు మారుమాట్లాడకుండా తన వైద్యుడిని పంపడానికి సమ్మతించాడు. సౌశీల్యుడు.. మంత్రిని జబ్బు వివరాలు అడిగి రకరకాల ఔషధాలు తీసుకుని స్వర్ణగిరికి వచ్చాడు. సూర్యసేనుడిని పరీక్షించి కొంతకాలం ఆ రాజ్యంలోనే ఉండి తన వైద్యంతో జబ్బును నయం చేశాడు.చంద్రసేనుడి పట్ల తన ప్రవర్తనకు సూర్యసేనుడు పశ్చాత్తాపపడ్డాడు. ఇరుగుపొరుగుతో శత్రుత్వం మంచిది కాదని, అందరితో కలసిమెలసి ఉండటమే ఉత్తమ లక్షణమని, పట్టింపులతో సాధించేదేమీ లేదని సూర్యసేనుడు గ్రహించాడు. చంద్రసేనుడి ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ, స్నేహం కోరుతూ లేఖ రాశాడు. ఆనాటి నుంచి రెండు రాజ్యాల మధ్య స్నేహం చిగురించింది. – డి.కె.చదువులబాబుఇవి చదవండి: ఈ దొంగతనమనేది ఒక పెద్ద జబ్బు.. చివరికి? -
తొలి ఏకాదశి విశిష్టత? ఆ పేరు ఎలా వచ్చిందంటే..!
హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి సవివరంగా తెలుసుకుందాం..ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.పూజకు పూజ.. ఆరోగ్యానికి ఆరోగ్యం..ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట.ఏకాదశి విశిష్టత..కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట. నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుషులు చెబుతారు.ఏం చేయాలి..?ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటాడు. దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణుభక్తులకు పరమపవిత్రం. ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ రోజు జగన్నాథుడికి స్వర్ణాలంకారం జగన్నాథుడి తిరుగు రథయాత్ర మొదలైన మరునాడు– అంటే, తొలి ఏకాదశి రోజున జగన్నాథుని స్వర్ణాలంకృతుని చేస్తారు. దీనినే స్థానికంగా ‘సునా బేషొ’ అంటారు. జగన్నాథుడి స్వర్ణాలంకార వేషాన్నే ‘రాజ వేషం’, ‘రాజాధిరాజ వేషం’ అని కూడా అంటారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలకు బంగారు కాళ్లు, చేతులను, ముఖాలకు బంగారు ఊర్థ్వపుండ్రాలను అలంకరిస్తారు. జగన్నాథుడి ఊర్ధ్వపుండ్రానికి వజ్రం, బలభద్రునికి కెంపు, సుభద్ర ఊర్ధ్వపుండ్రానికి పచ్చ ΄దిగి ఉంటాయి.జగన్నాథుడి చేతుల్లో బంగారు శంఖు చక్రాలను, బలభద్రుడి చేతుల్లో బంగారు గద, హలాయుధాలను అలంకరిస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు వజ్రాలు సహా రత్న కిరీటాలు, కర్ణకుండలాలు, నాసాభరణాలు, కంఠహారాలు, బంగారు పుష్పమాలలు, వడ్డాణాలు, రాహురేఖలను అలంకరిస్తారు. జగన్నాథుడి కిరీటంపై ప్రత్యేకంగా బంగారు నెమలి పింఛాన్ని కూడా అలంకరిస్తారు.(చదవండి: రూ.14 వేలకే 'దివ్య దక్షిణ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..!) -
మంకీ ట్రాప్ గురించి విన్నారా..?
మంకీ ట్రాప్ ఏంటీ అనుకోకండి. ఎందుకుంటే తెలియకుండానే మన అందరం ఈ ట్రాప్‌లో పడిపోతున్నాం. చేజేతులారా జీవితాలని నాశనం చేసుకుంటున్నాం. నిజానికి మన పెద్దవాళ్లు కొన్నింటిని వదిలేసేందుకు ఇష్టపడితేనే హాయిగా ఉండగలం అని చెబుతుంటారు. కానీ మనం వదలం. పట్టుకుని కూర్చొంటాం. జరగాల్సిన నష్టం జరిగేటప్పటికే మనం ఉండం. ఇలా ఈ భూమ్మీద ఎందరో ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. అసలు ఏంటీ ట్రాప్..? అంతలా మనం ఆ ట్రాప్‌లో ఎలా పడతామంటే..రెండు రోజుల క్రితం పేపర్లో వచ్చిన వార్త పరిశీలిస్తే..భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి సంచిలో అక్షరాల మొత్తం 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తం". ఇక్కడ... విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రం.మంకీ ట్రాప్ అంటే..దీన్నే "మంకీ ట్రాప్" అంటారు. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని ఒక తెగ వారు ఉపయోగిస్తారు. వాళ్లు కోతులను వేటాడటానికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంద్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంద్రములో చేయి పేట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది. తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది. చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.నిజంగా మనకు ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతే..? అయితే ఇటువంటి మంకీ ట్రాప్‌లో మనం ఉన్నట్లే.. కష్టపడి సంపాదించుకున్న డబ్బులను దాచిపెట్టుకొని ..ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు రాక.. తనువు చాలించిన వారు చాలా మందే సమాజంలో ఉన్నారు. డబ్బు నిజంగా మనిషిని అంతగా కట్టి పడేస్తుందా?? అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్‌లో పడేస్తుంది. నిశితంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం కూడా అదే ట్రాప్ లో ఉన్నామనే విషయం గ్రహించకపోవడం విశేషం. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేం? ఒక్క మాట పంతానికి పోయి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా? వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు ఉన్నారు. అందుకే చిన్న మోతాదులో కానీ, పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్‌లో ఏమైనా ఉన్నామేమో? చెక్ చేసుకోవాలి.అది బంధం కావచ్చు, డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం. ఉదాహారణకు..మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు...నో చెప్పలేని మోహమాటలు...తిరిగి అడగలేని అప్పులు...దండిచలేని ప్రేమలు...ఊపిరి సలపనివ్వని పనులు...ఒత్తిడి పెంచే కోరికలు....ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు...పేరు కోసం తీసే పరుగులు....అన్నీ మంకీ ట్రాప్ లే!!అందుకే కొన్నిటిని వదిలేయడం అలవాటు చేసుకుందాం...... మరింత మనశ్శాంతిగా...ప్రశాంతముగా" ఉండేందుకు ప్రయత్నించండి అని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు. (చదవండి: ఉల్లిపాయలు తీసుకోకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..!) -
క్రైస్తవ్యం చెప్పే యుగాంతం
పరిశుద్ధ గ్రంథంలో యుగాంతం గురించిన ప్రస్తావన విరివిగానే కనిపిస్తుంది. దీనిని యేసు ప్రభువు రెండవ రాకడ, ప్రభువు దినం, యుగసమాప్తి, కడవరి దినాలు, అంత్యకాలంగా పేర్కొనడం జరిగిందిప్రారంభంలో ఈ సృష్టిని చేసిన దేవుడు చివరిగా మానవులను సృజించాడు.బైబిల్లో మొదటి గ్రంథమైన ఆదికాండంలో రాసి ఉన్నట్లుగా నరులు భూమ్మీద విస్తరించే సమయంలోనే మానవులపై దేవుడికి ఎంతో కోపం వచ్చినట్లుగా గమనిస్తాం. కారణం వారు దేవుని మార్గాన్ని విడిచారు. చీకటి మార్గాలు, సాతాను మార్గాలు వెదకడంప్రారంభించారు. నరుల చెడుతనం భూమిమీద బహుగా విస్తరించడం వారి హృదయ తలంపులు, ఊహలన్నీచెడ్డవిగా ఉండటం దేవుడు గమనించి, భూమి అంతా బలత్కారంతో నిండబడి ఉండటం దేవునికి సంతా΄ాన్ని కలుగజేసింది. ఫలితంగా నీతిమంతుడైన ఒక్క నోవహు కుటుంబాన్ని సకల పశుపక్ష్యాదులు, జంతువులను రెండేసి చొప్పున ఓ ప్రత్యేక ఓడ ద్వారా రక్షించి మిగతా మానవులందరినీ మహాజలప్రళయం ద్వారా నశింప చేసినట్లుగా చూస్తాం. నోవహు సంఘటన క్రీస్తుపూర్వం సుమారు 2,400 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా బైబిల్ పండితులు చెబుతుంటారు. మరల భూమి మీద పాపం విస్తరించినప్పుడు రెండువేల సంవ్సరాల క్రితం దేవుడే యేసుక్రీస్తు రూపంలో నరరూపుధారుడై ఈ భూమ్మీదకి వచ్చాడు.. పాపుల రక్షణార్థమై సిలువమీద మరణించాడు. 3వ రోజున పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు తన బోధల్లో ఈ భూమి అంతం గురించి చాలా స్పష్టంగా తెలియ చేశాడు. త్వరలోనే యుగసమాప్తి ఉంటుందని పాపపు జీవితాన్ని వదిలివేసి దేవుని నమ్ముకొని మారుమనస్సు పోంది దేవుడిచ్చే ఉచిత రక్షణను స్వీకరించడం ద్వారా పరలోకానికి వారసులవుతారని, పాపులందరి కోసం నరకం సిద్ధంగా ఉందని చెప్పాడు. యుగ సమాప్తి సమయంలో దీనిని యేసుక్రీస్తు మరల రెండవసారి భూమ్మీదకు వస్తాడు. ఆ తర్వాత అంతం ఉంటుంది. దీనిని యేసు ద్వితీయ ఆగమనంగా, క్రీస్తు రెండవ రాకడగా పిలుస్తారు. అయితే ఈ రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? దానికి సూచనలేంటి అని శిష్యులు ఏసుప్రభువును అడిగినప్పుడు యుద్ధాలను గూర్చిన సమాచారం ఎక్కువగా వింటారని, జనాలమీదికి జనం, రాజ్యంమీదికి రాజ్యం లేస్తాయని, కరువులు, భూకంపాలు కలుగుతాయి. భూమ్మీద దేవుని బిడ్డలకు మహాశ్రమ వేదన కలుగుతుందని, మనుష్యుల్లో ఒకరిపట్ల ఒకరికి ద్వేషం పెరుగుతుందని, అక్రమం విస్తరించి మనుషుల్లో ప్రేమ చల్లారుతుందని, అలాగే యుగసమాప్తంలో సూర్యుడు వెలుగు ఇవ్వడని, చంద్రుడు కాంతి కోల్పోతాడని, ఆకాశం నుండి నక్షత్రాలు రాలతాయని, తుదకు క్రీస్తు మహా ప్రభావంతో భూమ్మీదకు వస్తాడని పేర్కొన్నాడు. అయితే ఆయన రాకడ అందరికీ తెలిసే విధంగా ఉండక అకస్మాత్తుగా దొంగ వచ్చినట్లు ఉంటుందని, అందుకే దేవుని భయం కలిగి పరిశుద్ధ జీవితం కలిగి జాగరూకతతో జీవించాలని యేసు చె΄్పాడు. అంత్యదినాలలో అ΄ాయకరమైన దినాలు వస్తాయని భక్తుడైన పాలు చెప్పాడు. మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, అబద్ధాలాడే వారు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రు లు, తల్లిదండ్రులను గౌరవించని వారు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరేవారుగా ఉంటారని భక్తుడు చెప్పాడుఅయితే యేçసు చెప్పిన రెండవ రాకడ గురుతులు చాలా ఇప్పటికే జరిగాయని, ప్రస్తుత సమాజం చూసినా అది బహిర్గతమౌతుందని, యేçసు రాకడ త్వరలో ఉందని దైవజనులు చెపుతున్నారు. ఏ దినమైనా ఏ సమయంలోనైనా ఈ యుగ సమాప్తి జరగవచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని బోధిస్తున్నారు. – బందెల స్టెర్జి రాజన్అంత్యకాలంలో జరిగే విషయాలన్నీ బైబిల్లోని ప్రకటన గ్రంథంలో వివరంగా రాయబడ్డాయి. ఆయా కాలాలలో దేవుడు తన భక్తులకు భూమి అంతం గురించి తెలియజేస్తూనే ఉన్నాడు. అంతిమంగా ఈ భూమ్మీద జన్మించిన ప్రతిమనిషి దేవుని తీర్పును ఎదుర్కొంటాడని, దేవుని నమ్ముకున్నవారు, భూమ్మీద పాపం లేకుండా పవిత్రంగా జీవించిన వారు మాత్రమే దేవునితో సదాకాలం జీవించడానికి పరలోకానికి కొనిపోబడతారు. అక్రమంగా జీవించిన వాళ్ళంతా నిత్య నరకాగ్నిలో నిరంతరం వేదన అనుభవిస్తూ జీవిస్తారు. -
ప్రవక్త జీవితంలో ముఖ్య ఘట్టం.. మొహర్రం
ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం సంవత్సరంలోని మొదటి నెల ‘మొహర్రం ’. ప్రతి సంవత్సరం ఈ నెల వస్తూనే ముహమ్మద్ ప్రవక్త (స) వారి జీవితంలోని ఓ ముఖ్యమైన ఘట్టం మనసులో మెదులుతుంది. అదే ‘హిజ్రత్’. (మక్కా నుండి మదీనాకు వలస). హిజ్రత్ తరువాతనే ధర్మానికి జవసత్వాలు చేకూరాయి, ధర్మం ఎల్లెడలా విస్తరించింది. ధర్మ పరిరక్షణ, మానవ సేవ, మానవులకు సత్య సందేశాన్ని అందించడం లాంటి మహత్తర ఆశయం కోసం కష్ట నష్టాలను సహించాల్సి వచ్చినా, చివరికి స్వదేశాన్ని విడిచి వలస వెళ్ళవలసి వచ్చినా వెనకాడకూడదనే విషయాన్ని ముహర్రం ప్రతి సంవత్సరం విశ్వాసులకు గుర్తు చేస్తూ ఉంటుంది.దేవుడు భూమ్యాకాశాలను సృష్టించిన నాటినుండి నెలల సంఖ్య పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు పవిత్ర మాసాలు’. అందులో ‘మొహర్రం’ కూడా ఒకటి. ప్రవక్త(స) ప్రవచనం ప్రకారం: ‘పన్నెండు నెలలు ఒక సంవత్సరం. అందులో నాలుగు నెలలు గౌరవప్రదమైనవి. జుల్ ఖ అద, జుల్ హిజ్జ, ముహర్రమ్, రజబ్. కనుక ఈ నెలలో ఎక్కువగా సత్కార్యాలు ఆచరిస్తూ పాపాలకు దూరంగా ఉండాలి. సమాజంలో సత్యం, న్యాయం, ధర్మం, మానవీయ విలువల పరిరక్షణకు కృషి చేయాలి. సమాజంలో ప్రబలిన అన్ని రకాల చెడులను రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. సతతం దైవ భీతి (తఖ్వా) తో గడపాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. ఈ నెల ఘనతకు సంబంధించి ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా అన్నారు. ‘ముహర్రం అల్లాహ్ నెల. రమజాన్ ఉపవాసాల తరువాత శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలే.’ (సహీహ్ ముస్లిం: 2755) రమజాను ఉపవాసాలు ఫర్జ్ కాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండేది. అదే రోజు కాబాపై కొత్తవస్త్రం కప్పేవారు. ప్రవక్త మహనీయులు మదీనాకు వలస వెళ్ళిన తరువాత, అక్కడి యూదులు రోజా (ఉపవాసం) పాటించడం గమనించారు. అది ముహర్రం పదవ తేదీ. (యౌమె ఆషూరా) అప్పుడు ప్రవక్త వారు, ‘ఏమిటి ఈరోజు విశేషం?’ అని వారిని అడిగారు. దానికి వారు, ‘ఇది చాలా గొప్పరోజు. ఈ రోజే దైవం మూసా ప్రవక్త(అ) ను, ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. అప్పుడు మూసా ప్రవక్త, దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజు ఉపవాసం పాటిస్తాము’. అని చె΄్పారు. అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం’ అని చెప్పి, తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు. ముహర్రం మాసం 9, 10 లేదా 10, 11 కాని రెండురోజులు రోజా (ఉపవాసం) పాటించాలి. ఆషూరా ఉపవాసం పాటించడం వల్ల గత సంవత్సరకాలం పాపాలు మన్నించబడతాయని కూడా ఆయన సెలవిచ్చారు. (సహీహ్ ముస్లిం 1162).మొహర్రం నెల ్రపాముఖ్యం, హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం మామూలు విషయం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో హజ్రత్ ఇమామె హుసైన్, ఆయన పరివారం వీరమరణం పొందారు. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం ్రపాణాలను సైతం లెక్క చేయకుండా ΄ోరాడి అమరుడయ్యారో మనం దాని నుంచి ప్రేరణ పొందాలి. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, సమాజ శ్రేయోభిలాషులు, న్యాయప్రేమికులు, ΄ûరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయం కోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా ΄ోరాడాలి. ఇదే ఇమామె హుసైన్ అమరత్వం మనకిస్తున్న సందేశం.( 17, బుధవారం మొహర్రం – యౌమె ఆషూరా)కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ్రపాముఖ్యత మరింతగా పెరిగి΄ోయింది. అంతమాత్రాన ముహర్రం నెలంతా విషాద దినాలుగా పరిగణించనక్కర లేదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. అమరత్వం అనేది మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమోగాని, విషాదం ఎంతమాత్రం కాదు. ‘కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి ΄ోషించవలసిన పాత్రను ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ నెలలో ఆయన త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్మరించుకుంటారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
రైభ్యుడికి సనత్కుమారుడి దర్శనం..
రైభ్య మహర్షి ఒకసారి పితృతీర్థమైన గయాక్షేత్రానికి వెళ్లాడు. అక్కడ పితృదేవతలకు పిండప్రదానాలు చేసి, వారిని తృప్తిపరచాడు. ఆ తర్వాత అక్కడే ఆయన కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. రైభ్యుడు తపస్సు చేస్తుండగా, ఒకనాడు అతడి ముందు ఒక దివ్యవిమానం నిలిచింది. అందులో ఒక యోగి నలుసంత ప్రమాణంలో ఉన్నాడు. అతడు గొప్పతేజస్సుతో సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. అతడు ‘ఓ రైభ్యా! ఎందుకు ఇంత కఠోరమైన తపస్సు చేస్తున్నావు?’ అని అడిగాడు. రైభ్యుడు బదులిచ్చేలోగానే ఆ యోగి తన శరీరంతో భూమ్యాకాశాలంతటా వ్యాపించాడు. రైభ్యుడు విభ్రాంతుడయ్యాడు. ‘మహాత్మా! మీరెవరు? అని ప్రశ్నించాడు.‘నేను బ్రహ్మమానస పుత్రుణ్ణి. నా పేరు సనత్కుమారుడు. భూలోకానికి పైనున్న ఐదో ఊర్ధ్వలోకమైన జనలోకంలో నివసిస్తుంటాను. నాయనా రైభ్యా! నువ్వు ఉత్తముడివి, వేదాభిమానివి. పవిత్రమైన ఈ గయాక్షేత్రంలో పితృదేవతలను సంతృప్తిపరచినవాడివి. నీకు నేను ఈ పితృతీర్థ మహాత్మ్యం గురించిన ఒక వృత్తాంతం చెబుతాను విను’ అని ఇలా చెప్పసాగాడు.‘పూర్వం విశాలనగరాన్ని విశాలుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి పుత్రసంతానం లేదు. ఒకనాడు విశాలుడు విప్రులను పిలిపించి, పుత్ర సంతానం కోసం ఏం చేయాలో చెప్పండని అడిగాడు. ‘రాజా! పుత్రసంతానం కావాలంటే, మీరు గయాక్షేత్రానికి వెళ్లి అక్కడ పితృదేవతలకు పిండప్రదానాలు చేసి, అన్నదానం చేయాలి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే తప్పక పుత్రసంతానం కలుగుతుంది’ అని విప్రులు సలహా ఇచ్చారు. విప్రుల సూచనతో సకల సంభారాలను తీసుకుని, పరివారాన్ని వెంటబెట్టుకుని విశాలుడు గయాక్షేత్రానికి బయలుదేరాడు. అక్కడ మఖనక్షత్రం రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచి, పిండ ప్రదానాలు చేయడం మొదలుపెట్టాడు.విశాలుడు అలా పిండప్రదానాలు చేస్తుండగా, ఆకాశంలో ముగ్గురు పురుషులు ఆయనకు కనిపించారు. వారు ముగ్గురూ మూడు రంగుల్లో– తెల్లగా, పచ్చగా, నల్లగా ఉన్నారు. వారిని చూసిన విశాలుడు ‘అయ్యా! తమరెవరు? ఎందుకు వచ్చారు? మీకేం కావాలి?’ అని అడిగాడు.వారిలో తెల్లగా ఉన్న పురుషుడు ‘నాయనా! విశాలా! నేను నీ తండ్రిని. నన్ను పితుడు అంటారు. నా పక్కన ఉన్న వ్యక్తి నా తండ్రి. అంటే, నీకు తాత. బతికి ఉండగా, బ్రహ్మహత్య సహా అనేక పాపాలు చేశాడు. ఇతడి పేరు అధీశ్వరుడు. ఇతడి పక్కనే నల్లగా ఉన్న పురుషుడు నా తండ్రికి తండ్రి. అంటే, నీకు ముత్తాత. బతికి ఉన్నకాలంలో ఎందరో మహర్షులను చంపాడు.నాయనా! విశాలా! నా తండ్రి, అతడి తండ్రి చేసిన పాపాల ఫలితంగా మరణానంతరం అవీచి అనే ఘోర నరకంలో భయంకరమైన శిక్షలను అనుభవించారు. నేను వారిలా పాపకార్యాలు చేయకపోవడం వల్ల, చేతనైన మేరకు పుణ్యకార్యాలు చేయడం వల్ల ఇంద్రలోకం పొందాను. ఈనాడు నువ్వు శ్రద్ధగా పితృతీర్థమైన ఈ గయాక్షేత్రంలో పితృదేవతల సంతృప్తి కోసం సంకల్పించి, పిండప్రదానాలు చేయడం వల్ల వీరిద్దరూ నన్ను కలుసుకోగలిగారు. పిండప్రదాన సమయంలో నీ సంకల్పబలం వల్లనే మేం ముగ్గురమూ ఒకేసారి ఇలా కలుసుకోగలిగాం.ఈ తీర్థమహిమ వల్ల మేం ముగ్గురమూ ఇప్పుడు పితృలోకానికి వెళతాం. ఇక్కడ పిండప్రదానం చేయడం వల్ల ఎంతటి దుర్గతి పొందినవారైనా సద్గతులు పొందుతారు. ఇందులో సందేహం లేదు. నాయనా! నీ కారణంగా మాకు సద్గతులు కలుగుతున్నందుకు ఎంతో ఆనందిస్తూ, నిన్ను చూసి వెళ్లాలని వచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది. నీకు సకల శుభాలు కలుగుగాక!’ అని ఆశీర్వదించి పితృదేవతలు ముగ్గురూ అక్కడి నుంచి అంతర్థానమయ్యారు. పితృదేవతల ఆశీస్సుల ఫలితంగా విశాలుడు కొంతకాలానికి పుత్రసంతానాన్ని పొందాడు.‘రైభ్యా! నువ్వు కూడా ఈ పరమపవిత్ర గయాక్షేత్రంలో పితృదేవతలకు పిండప్రదానాలు చేశావు. వారికి ఉత్తమ గతులు కల్పించావు. అంతేకాకుండా, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని, గొప్ప తపస్సు చేస్తున్నావు. అంతకంటే భాగ్యమేముంటుంది? అందుకే నువ్వు ఉత్తముడివి, ధన్యుడివి అంటున్నాను. రైభ్యా! ఈ గయాక్షేత్రంలోనే గదాధారి అయిన శ్రీమహావిష్ణువు కొలువున్నాడు. నువ్వు ఆయనను స్తుతించి స్వామి అనుగ్రహాన్ని పొందు’ అని చెప్పి సనత్కుమారుడు అంతర్థానమయ్యాడు.రైభ్యుడు సనత్కుమారుడి మాట ప్రకారం గదాధరుడైన శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ ఆశువుగా ‘గదాధరం విభుదజనై రభిష్టుతం ధృతక్షమం క్షుదితజనార్తి నాశనం/ శివం విశాలాసురసైన్య మర్దనం నమామ్యహం హతసకలాశుభం స్మృతౌ...’ అంటూ గదాధర స్తోత్రాన్ని పలికాడు. రైభ్యుడి స్తోత్రానికి పరమానందభరితుడైన పీతాంబరధారిగా, శంఖచక్ర గదాధారిగా శ్రీమహావిష్ణువు అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘రైభ్యా! నీ స్తోత్రానికి సంతోషించాను. నీకు ఏ వరం కావలో కోరుకో’ అన్నాడు శ్రీమహావిష్ణువు.‘స్వామీ! నీ సాన్నిధ్యంలో సనక సనందాది మహర్షులు ఉండే స్థానాన్ని అనుగ్రహించు’ అని కోరాడు.‘తథాస్తు’ అన్నాడు శ్రీమహావిష్ణువు.రైభ్యుడు వెంటనే సనక సనందాది సిద్ధులు ఉండే స్థానానికి చేరుకున్నాడు. – సాంఖ్యాయన -
భక్తిలో విశ్వాసం..!
భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా కేవలం యాంత్రికంగా ఎన్ని రకాల, ఎన్ని వర్ణాల పూలతో పూజ చేసినా ఉపయోగం ఉండదు. విశ్వాసం లేకుండా చేసే తీర్థయాత్రల వల్ల, గంగా స్నానాల వల్ల ఫలితం ఉండదు. గంగలో మునక వేస్తే పాపాలు హరిస్తాయంటారు కానీ నిజంగా అలా జరుగుతుందని నమ్మకం ఏమిటి? అనే అవిశ్వాసం తోనే చాలా మంది ఉంటారు. మనుషులలో సందేహ జీవులే ఎక్కువ.ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఈ విషయం గురించే ‘నిత్యం గంగలో ఎంతోమంది స్నానం చేస్తూ, శివస్మరణ చేస్తున్నారు కానీ ఎవరిలోనూ పూర్తి విశ్వాసం కనిపించటం లేదని అనుకుంటారు. నిజమైన భక్తి ఎవరిదో పరీక్షిద్దామని అనుకుని వృద్ధ దంపతుల రూపంలో గంగా తీరానికి వెళతారు. అక్కడ వృద్ధుడు ఒక గోతిలో పడిపోతాడు. భార్య దుఃఖిస్తూ ఎవరైనా చేయందించి తన భర్తను కాపాడమని అక్కడ చుట్టూ చేరిన వారిని కోరుతుంది.వాళ్ళు ముందుకు రాబోతుంటే ఆమె ‘మీలో ఎప్పుడూ ఏ పాపం చేయని వాళ్ళు మాత్రమే నా భర్తను కాపాడండి. లేకుంటే, చేయందిస్తున్నప్పుడు మీ చేయి కాలిపోతుంది’ అంది. అక్కడ ఉన్నవారంతా గంగా స్నానం చేసినవారు. నిరంతరం శివ స్మరణ చేసేవారు. అయినా, తమ భక్తి మీద తమకు నమ్మకం లేదు. ఎవరూ ముందుకు రాలేదు. వృద్ధుణ్ణి కాపాడే ప్రయత్నం చేయలేదు.అంతలో ఒక దొంగ అక్కడకి వచ్చాడు. వృద్ధురాలు చెప్పిన విషయం తెలుసుకుని, వెంటనే గంగలో మూడు మునకలు వేశాడు. వృద్ధుణ్ణి కాపాడాడు. గంగలో మునిగిన తర్వాత తన పాపాలన్నీ నశించిపోయాయని అతని నమ్మకం. వృద్ధునికి చేయందించినపుడు అతని చేయి కాలలేదు. అదీ విశ్వాసమంటే! ఆ తర్వాత అతడు దొంగతనాలు మాని శివభక్తుడయ్యాడు. అపనమ్మకంతో, సందేహంతో చేసే పనులు ఏవీ సత్ఫలితాన్నివ్వవు. చేసే పనిపై విశ్వాసం ఉండాలి. – డా. చెంగల్వ రామలక్ష్మి -
ధర్మ జిజ్ఞాస: కలిపురుషుడు.. కల్కి అవతారం!
మనం ఏదైనా పూజాది కార్యక్రమాలలో సంకల్పం చెప్పుకునేప్పుడు కలియుగే, ప్రథమ పాదే అని చెప్పుకుంటాం. అంటే కలియుగం మొదటి నాలుగవ వంతులో అని అర్థం. కలియుగం పైన అధికారం కలిపురుషుడిది. అతడి పెత్తనంలో ఉండే కలియుగ లక్షణాలని కొద్దిగానో, విపులంగానో అన్ని పురాణాలు ప్రస్తావించాయి. ధర్మం ఒక పాదం అంటే నాలుగవ వంతు మాత్రమే ఉంటుంది, మూడు పాళ్ళు అధర్మమే ఉంటుంది. అది మరింత పెచ్చు పెరిగి సజ్జనులు బతక లేని పరిస్థితి వచ్చినప్పుడు శ్రీమహావిష్ణువు దుష్టసంహారం చేసి, శిష్టరక్షణ చేయటానికి భూమిపై అవతరిస్తాడు. ఆ అవతారం పేరు కల్కి.శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు అనే సదాచార సంపన్నుడైన నైష్ఠిక బ్రహ్మణుడికి, సుమతికి జన్మించి, పద్మావతి అనే సింహళ రాజకన్యని వివాహమాడి, తెల్లని గుర్రాన్ని అధిరోహించి ఖడ్గం ధరించి దుష్టసంహారం చేస్తాడు. భూ భారాన్ని తగ్గిస్తాడు – ఇదీ పురాణాలన్నింటి క్లుప్తసారాంశం. ఈ అవతారం కలియుగం చివరలో వస్తుంది. త్రేతాయుగం చివరలో రామావతారం, ద్వాపరయుగం చివరలో కృష్ణావతారం వచ్చినట్టు.కల్కి ఎప్పుడు అవతరిస్తాడు? కలి విజృంభించినప్పుడు కల్కి అవతరిస్తాడు, యుగాంతంలో. యుగాంతం అనగానే సృష్టి అంతా జలమయం అయిపోయి ఏమీ లేని స్థితి అని అర్థం కాదు. కలి లక్షణాలు కలవారు, కలిప్రభావితులు సమసిపోతారు. కృతయుగంలో ఉండదగిన వారు మిగిలి ఉంటారు.కలి లక్షణాలు: పరీక్షిత్తు పరిపాలన చేస్తున్న కాలంలో కురు జాంగల దేశాలలో పర్యటిస్తూ ఒంటికాలితో సంచరిస్తున్న వృషభరూపంలో ఉన్న ధర్మదేవుడు, గోరూపంలో ఉన్న భూమాతల సంభాషణ విన్నాడు. గోమాత కన్నీరు కార్చటానికి కారణం ధర్మదేవుడు అడిగాడు. ‘‘దేహం వ్యాధిగ్రస్తమై, ముఖం వాడిపోయి ఉన్నాయి. బంధువులకి ఆపద కలిగిందా? మూడు కాళ్ళు లేని నన్ను పట్టుకుంటారని బాధపడుతున్నావా?ఇక ముందు లోకమెట్లా ఉంటుందో తలుచుకుని దుఃఖిస్తున్నావా?’’ అని గోవు భయానికి కారణాలని అడుగుతాడు. అవి కలియుగ లక్షణాలు. 1. యజ్ఞాలు లేక దేవతలకి హవిస్సులు అందవు. 2.భర్తలు భార్యలను భరించరు. 3. పిల్లలు తల్లితండ్రులను పోషించరు. 4. సరస్వతి చెడ్డవారిని ఆశ్రయిస్తుంది. 5 ఉత్తమ విప్రులు రాజులకి సేవ చేస్తారు. 6. ఇంద్రుడు వానలు కురిపించడు. 7. దేశంలో న్యాయం నశించి పోతుంది. 8. మానవులు ఆహార నిద్రా భయ మైథునాదుల పట్ల మాత్రమే ఆసక్తి కలిగి ఉంటారు. 9. నీచులు పరిపాలిస్తూ ఉంటారు."కలి ఉంటే ప్రపంచం ఎట్లా ఉంటుందో గోవు మాటల్లో తెలిసింది. ఈ లక్షణాలు మానవులలో కొద్దిగానైనా ఉంటాయి. అవి కృతయుగంలో నామ మాత్రంగా ఉంటే, త్రేతాయుగంలో సగానికి సగం ఉంటే, ద్వాపరంలో మూడువంతులు ఉంటే, కలియుగంలో క్రమక్రమంగా పెరిగి అవి మాత్రమే ఉండే స్థితికి చేరుకోటం జరుగుతుంది. అప్పుడు కల్కి గుర్ర మెక్కి వచ్చి, కత్తితో దుష్టసంహారం చేస్తాడు. అది ఎప్పుడు? గో వృషభ సంభాషణలో కలియుగం ఎప్పుడు మొదలైనది తెలిసింది కదా! కృష్ణ నిర్యాణంతో. కలియుగం ఆరంభం అయి 5,125 సంవత్సరాలు." ‘‘ఇదంతా కృష్ణుడు శరీరం వదలటం వల్ల జరిగింది. నీవు కూడా ఒక్క కాలితో కుంటుతూ ఉన్నావు. కలిపురుషుడి ప్రేరణతో భయంకర పాపకృత్యాలని చేస్తున్న మానవులని చూస్తే దుఃఖం కలుగుతోంది. దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, నాకు, నీకు, నానా వర్ణాశ్రమాలకి, గోవులకి బాధ కలుగుతోంది.’’ అని తన బాధకి కారణాన్ని చెప్పింది గోరూపధారి అయిన భూదేవి. ఇది కలి ప్రభావం యొక్క ఫలితం.పరీక్షిత్తు ధర్మదేవుణ్ణి, భూదేవిని సముదాయించి, కలితో కఠినంగా మాట్లాడుతూ కత్తి తీశాడు. భయపడిన కలిపురుషుడు రాజచిహ్నాలని వదలి పరీక్షిత్తు కాళ్ళమీద పడి దయ తలచమనిప్రార్థించాడు. పరీక్షిత్తు అతడిని చంపక ధర్మవర్తనులు ఉండే తన రాజ్యం వదలి దూరంగా ΄÷మ్మన్నాడు. కలిపురుషుడు తాను ఎక్కడ ఉండాలో చెప్పమనిప్రార్థించాడు. పరీక్షిత్తు అతడు ఉండటానికి నాలుగు ప్రదేశాలని సూచించాడు. అవి జూదం, మద్యపానం,ప్రాణివధ, స్త్రీ (పరస్త్రీ వ్యామోహం) ఉన్న చోట్లు. అవి చాలవు మరికొన్ని కావాలని అడిగాడు. బంగారం అనే ఐదో చోటు కూడా కలికి ఇచ్చాడు. బంగారంతో వచ్చే అసత్యం, గర్వం, కామం, హింస, వైరం అనే మరొక ఐదు స్థానాలు కలి నివాసాలు అయ్యాయి.ఇప్పుడే ఇట్లా ఉంటే, చివరి నాలుగోవంతు సమయంలో ఎట్లా ఉంటుందో? అని భయం అక్కర లేదు. ధర్మమార్గంలో చరించే వారి దగ్గరకు కలిపురుషుడు రాడు. అధర్మమార్గంలో ఉండేవారిని చక్కజేసి, ప్రేరేపించే వారిని మట్టుపెట్టటానికి కల్కి రానే వస్తాడు. – డా.ఎన్. అనంతలక్ష్మి -
Telangana Bonalu 2024: అమ్మా బైలెల్లినాదో...
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గ్రామదేవతలకు ప్రతియేటా ఆషాఢమాసంలో పూజలు జరిపి, బోనాలు సమర్పించే ఈ సంప్రదాయం ఎనిమిది వందల ఏళ్లుగా వస్తోంది. నగర వాతావరణంలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా, కాలగమనంలో సంప్రదాయక పండుగలెన్నో పేరు తెలీకుండా అదృశ్యమై పోతున్నా,ఈ బోనాల వేడుకలు మాత్రం అలనాటి ఆచార సంప్రదాయాలతో వైభవోపేతంగా నేటికీ కొనసాగుతుండడం విశేషం.మూసీ నది వరదల కారణంగా అంటువ్యాధులకు ఆలవాలమైన నగరంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాని మహారాజా కిషన్‌ప్రసాద్ సలహా మేరకు నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్‌దర్వాజ సమీపంలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి చార్మినార్ వద్దకు చేరిన వరద నీటిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు సమర్పించాడట. అప్పటికి అమ్మ తల్లి శాంతించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో నవాబులే బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.ఎందుకు సమర్పిస్తారు?ఆషాఢమాసమంటే వర్షాకాలం.. అంటే అంటువ్యాధులకు ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, ΄÷ంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లంగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. అచ్చ తెలంగాణ జానపదాలు బోనాలపాటలు ఆడమగ, చిన్న పెద్ద, ధనిక బీద తారతమ్యం లేకుండా ఆనందంతో చిందులేస్తూ చెవులకింపైన అచ్చ తెలంగాణ జానపదాలు‘‘గండిపేట గండెమ్మా దండ బెడత ఉండమ్మా....., బోనాలంటే బోనాలాయే బోనాల మీద బోనాలాయే....., అమ్మా బైలెల్లినాదే....అమ్మా సల్లంగ సూడమ్మ..... మైసమ్మా మైసమ్మా.... వంటి పాటలు, పోతురాజుల నృత్యవిన్యాసాలు, శివసత్తుల చిందులు చూపరులను అలరిస్తాయి. అమ్మవార్లకు సోదరుడు పోతురాజుపోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. తమ ఇంటి ఆడపడుచును ఆదరించేందుకు, ఆమెకు సమర్పించే ఫలహారపు బండ్లకు కాపలా కాసేందుకు విచ్చేసే పోతురాజులు నృత్యవిన్యాసాలు చేస్తారు. చిన్న అంగవస్త్రాన్ని ధరించి ఒళ్ళంతా పసుపు రాసుకుని కాళ్ళకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మపండ్లు, కంటికి కాటుక, నుదుట కుంకుమ దిద్దుకుని మందంగా పేనిన పసుపుతాడును కొరడాగా ఝళిపిస్తూ, తప్పెట్ల వాయిద్యాలకు అనుగుణంగా గజ్జెల సవ్వడి చేస్తూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ కన్నుల పండుగ చేస్తారు.బోనం అంటే... భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయ లతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచుతారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.ఇంటి ఆడబిడ్డ లెక్కఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ్రపాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ ్రపాంతానికి చేరుకుంటుంది. ఆషాడంలోనే కాకుండా కొన్ని ్రపాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. గోల్కొండ జగదంబికదే తొలిబోనంబోనాల మొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, ఇక ఆ తర్వాత అన్నిచోట్లా బోనాల సంరంభం మొదలవుతుంది. సికింద్రాబాద్ పరిసర ్రపాంతాల్లో ఒక్కోరోజు ఆషాఢ ఘటోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఊరేగింపు తర్వాతే బోనాల వేడుకలు ్రపారంభమవుతాయి. గోల్కొండ జగదాంబిక ఆలయంలో మొదలైన ఉత్సవాలు తిరిగి ఆ అమ్మకు సమర్పించే తుదిబోనంతో ముగియడం ఆచారం.– డి.వి.ఆర్. భాస్కర్ -
Jagannath Rath Yatra 2024: పూరీలో వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు. ఆమె, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. -
సౌశీల్యం అంటే,,?
రాముడి పదహారు గుణాలలో ప్రత్యేక గుణం అని చెప్పదగినది సౌశీల్యం. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరి వెడుతున్నప్పుడు గుహుడి రాజ్యంలో ప్రవేశించాడు. అప్పుడు గుహుణ్ణి ‘‘ఆత్మవత్సఖః’’ అంటాడు. అంటే గుహుడు రాముడికి ఎంత అంటే తనతో సమానమైన వాడు. అరమరికలు లేకుండా ఎవరితో ఉండ గలడో అతడు. రాముడు వస్తున్నాడని తెలిసి గుహుడు వద్ధులైన మంత్రులతో కలిసి రాముడికి ఎదురు వెళ్ళాడు స్వాగతం చెప్పటానికి. రాముడు తానే ముందుగా అతడిని పలుకరించి కౌగిలించుకున్నాడు. రాముడు చక్రవర్తి కుమారుడు. గుహుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక సామాన్యమైన వనచర రాజ్యానికి అధిపతి మాత్రమే. రాముడికి అటువంటి భేదాలు లేవు. రాముడికి పట్టాభిషేకం అని ప్రకటించిన తరువాత సుమంత్రుడు రాముడి అంతఃపురంలో ప్రవేశించటానికి అనుమతి అడుగుతుంటే అటువంటిది అవసరం లేదు అంటాడు. తాను కాబోయే రాజు అయినా చిన్నతనం నుండి ఎత్తుకుని ఆడించిన వాడు కనుక తారతమ్యం చూపించ లేదు. జటాయువుని పక్షి అని చూడకుండా అంత్యక్రియలు నిర్వర్తించాడు. దశరథుడు కూడా అటువంటి సౌశీల్యం కలవాడు కనుకనే జటాయువుతో మైత్రి నెర΄ాడు. దేవతలు దశరథుడితో మైత్రి కలిగి ఉండటానికి ఈ గుణమే కారణమేమో! కృష్ణ సుధాముల మైత్రి కూడా ఇటువంటిదే. పైగా కుచేలుడుగా ప్రఖ్యాతి పోందిన సుధాముడు కృష్ణుడి ఐశ్వర్యాన్ని చూసి చనువుగా ఉండటానికి కొంచెం సందేహిస్తుంటే, తానే ఎదురు వెళ్ళి, తీసుకు వచ్చి, కాళ్ళు కడిగి, సకల మర్యాదలు చేసి, అతడిలో ఉన్న ఆ కాస్త బెరుకుని పోగొట్టటానికి గురుకులంలో గడిపిన కాలాన్ని గుర్తు చేస్తాడు. పైగా అతడికి ఏమీ ఇచ్చి పంపలేదు వెళ్లేటప్పుడు. అతడి లేమిని ఎత్తి చూపి, తన ఆధిక్యం చూపించుకున్నట్టు అవుతుంది అని. ఇంటికి చేరే సరికి గుట్టు చప్పుడు కాకుండా అన్నీ సమకూర్చాడు. ఎంతటి సౌశీల్యం! దీనికి భిన్నమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాట తప్పి తనను చూడటానికి వచ్చిన ద్రోణుణ్ణి అవమాన పరుస్తాడు. తగిన ఫలం అనుభవించాడు. లోకంలో తరచుగా ఇటువంటివారే ఎక్కువగా కనపడుతూ ఉంటారు. స్నేహానికి కూడా అంతస్తు చూస్తారు. అవసరానికి స్నేహం నటించటం ఉంటుంది. పని అయిపోయిన తరువాత అంతకు ముందు ఉన్న సుహద్భావం కనపడదు. అవసరం వచ్చి నప్పుడు అడ్డు రాని అంతస్తులు, హోదాలు, పదవులు, ఆర్థిక వ్యత్యాసాలు అప్పుడు కనపడతాయి. మరొక ప్రధానమైన గుణం – మిత్రులు తక్కువ స్థాయిలో ఉన్నారు కనుక వారిని తమ స్థాయికి తీసుకు రావటానికి ప్రయత్నం చేయరు. అంటే, వారి స్థాయిని గుర్తించినట్టే కదా! అది వారిని అవమానించినట్టే అవుతుంది. వారు ఉన్న స్థితి వారికి నచ్చినది, తప్తి కలిగించేది. వారికి కావలసినది ప్రేమ, ఆత్మీయత, ఆదరణ. దానిని చూపించటమే సౌశీల్యం. ఈ లక్షణం ఎంత అపురూపమో కదా! – డా. ఎన్. అనంత లక్ష్మి‘‘మహతః మందై స్సహ నీరంధ్రేణ సంశ్లేషః సౌశీల్యం’’ జాతి చేత విద్య చేత ఐశ్వర్యం చేత చాలా గొప్పవాడైనా తన కంటే తక్కువ వారితో అరమరికలు లేక కలిసి ఉండటం సౌశీల్యం.ఒక్కసారి మైత్రి ఏర్పడిన తరువాత అది జిడ్డు లాగా అంటుకు పోతుంది. అందుకే దానిని స్నేహం అన్నారు. స్నేహం అంటే నూనె, పట్టుకుంటే వదలని జిడ్డు అని అర్థం. చిన్నతనంలో ఇటువంటి తేడాలు తెలియవు కనుక అందరితో కలిసి మెలిసి ఉంటారు. ఎదుగుతున్న కొద్ది దూరం జరగుతూ ఉంటారు. కానీ, సజ్జనులు అటువంటి భావాలని దారికి రానీయరు. -
ఇంద్రియాలతో జాగ్రత్త !
రుషిరుణం తీరడానికి బ్రహ్మచర్య ఆశ్రమం సరిపోతుంది. కానీ పితృరుణం, దేవరుణం తీరాలంటే గృహస్థాశ్రమ స్వీకారం తప్పదు. పితరుణం అంటే... తండ్రి మనకు ఒక జన్మనిచ్చాడు... సరే... దీని వెనుక ఉన్న తాత్వికత ఏమిటి ? ఇప్పుడు మన శరీరానికి ఒక పేరుంది. వచ్చేటప్పుడు ఆ పేరుతో భూమి మీదకు రాలేదు. వచ్చిన తరువాత పెద్దలు పేరు పెట్టారు. కానీ ఈ జీవుడు ఇప్పుడుకాదు సనాతనంగా అలా వస్తూనే ఉన్నాడు. ఎన్ని శరీరాలు ΄పోందాడో!!! ఎన్ని వదిలాడో !!! పునరపి జననం పునరపి మరణం/పునరపి జననీ జఠరే శయనం/ఇహ సంసారే బహుదుస్తారే/కపయా పారే పాహి మురారే. ఇలా మారిపోతున్నప్పుడు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుబంధం.. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు... ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరు తల్లిదండ్రులు...అలా మారిపోతుంటారు. కానీ చేసిన పాలున్నాయి. అవి అనుభవం చేత పోతాయి. అనుభవం దుఃఖమయం కావాలి. పుణ్యం సుఖరూపంలో పోవాలి. నిజానికి సుఖదుఃఖాలు రెండూ కూడా అనుభవాలే..ఒకటి బాగున్నట్లు ఉంటుంది, మరొకటి బాధపెట్టినట్లుంటుంది. మొత్తానికి పుణ్యమో ΄ాపమో క్షయమయిపోతుండాలి. అది మానసికంగా అనుభవించడం కుదరదు. శరీరం ఉంటే తప్ప దుఃఖాన్ని అనుభవించడం కుదరదు. అలాగే సుఖాన్ని కూడా అనుభవించడం వీలు కాదు. కాబట్టి ధర్మానుష్ఠానం చేయాలి అంటే శరీరం ఉండాలి. కాళిదాస మహాకవి అంతటివాడు ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్’ అన్నాడు. జీవుడు ఈ శరీరాన్ని తొడుక్కుని రాలేదనుకోండి. అప్పుడు ఆ జీవుడికి ΄ాపపుణ్యాలు పోగొట్టుకోవడం కుదరదు. అసలుపాపపుణ్యాలు లేవనుకోండి. ఇక శరీరం పోందాల్సిన అవసరమే ఉండదు. ΄ాపం క్షయమై΄ోయి పుణ్యం బాగా సంపాదించుకోవాలి, సుఖంగా ఉండాలనుకుంటే దానికి శరీరం తప్పనిసరి.కాబట్టి శరీరం అనేది అత్యంత ప్రధానం. దీనిని జీవుడు పోందాడు అంటే... అది తల్లిదండ్రుల మహోపకారం. వాళ్ళిద్దరి అనుగ్రహంగా ఈ శరీరం లభించింది. అంటే తండ్రి ఏబాటలో ప్రయాణించాడో కొడుకు కానీ, కూతురు కానీ అదేబాటలో ప్రయాణించాలి. అంటే వేరొకరికి జన్మనివ్వాలి. సంతానం పెరగాలి. అయితే ఇక్కడ ఒక ధర్మసంక్లిష్టత వస్తుంది. సంతానాన్ని పోందడం.. అన్నప్పుడు కామం సహజంగా శరీరంలో పోటమరిస్తుంది. ఈ విషయంలో విశంఖలత్వం పనికిరాదు. అది ధర్మంచేత కట్టుబడాలి. అది చేయనప్పుడు ఇంద్రియాలు ఎప్పుడు కాటేస్తాయో తెలియదు.గడ్డిలో నడుచుకుంటూ పోతున్నాం. అనుకోకుండా కాలు అక్కడున్న పోము పడగపై పడింది. మిగిలిన శరీరంతో అది కాలును చుట్టేసింది. అది మనల్ని కాటువేయలేదు.. కారణం ... దాని తల మన కాలి కింద ఉంది కనుక. కాటువేయలేదు కాబట్టి మనం సురక్షితంగా ఉన్నాం ... అనుకుంటూ ప్రశాంతంగా ఉండగలమా ? ఎప్పుడు ΄ాదం తొలిగితే అప్పుడు కాటేయడానికి ΄ాము కాచుకుని ఉంటుంది. దీని బారినుంచి ఎప్పుడు తప్పుకుందామా అని మనం చూస్తుంటాం. మనం కానీ, అది కానీ క్షేమంగా మాత్రం లేము, ఉత్కంఠ అటూ ఉంది.. ఇటూ ఉంది. మన ఇంద్రియాలు కూడా అంతే. కాలుకింద ΄ాము తల అణిగి ఉన్నట్లు అణిగి ఉంటాయి. సమయం చూసి కాటేస్తాయి. వాటిని నిగ్రహించడం అంత తేలిక కాదు. బౌద్ధవాణి -
శేషాచలంలో సాగర ఘోష!
ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ సంగీత విద్వాంసుడికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి ‘అలాగే, అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని’ చెప్పి పంపాడు.ప్రయాణం మొదలైనప్పటినుంచీ ఆ సాధకుల్లో ఓ సందేహం మొదలయ్యింది. ‘తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు, మరి గురువు ఎందుకు అలా చెప్పాడో...’ అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను విచారించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. ‘అయినా గురువు తప్పు చెప్పడు కదా!’ అని ఆలోచించారు. ‘ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం!’ అనుకున్నారు. అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడమంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే, వారికి గురువు చెప్పింది గుర్తుకొచ్చింది. కనిపించిన భక్తులతో సముద్రం గురించి ఆరా తీశారు. వారు సమాధానం ఇవ్వకపోగా వీరి వైపు వింతగా చూశారు. ‘తిరుమల కొండలపైన సముద్రం కాకపోయినా, సముద్రం లాంటిదేమైనా ఉంటుందేమో చూద్దామని’ బయలుదేరారు. ఆకాశ గంగ, పాపవినాశనం, జాపాలి, పాండవ తీర్థం లాంటి ప్రదేశాలన్నీ గాలించారు. వారికెక్కడా సముద్రం ఆనవాలు కనిపించలేదు. గురువు పొరపాటుగా చెప్పినట్లున్నారని తీర్మానించుకుని కొండ దిగడం ్రపారంభించారు.వారికి దారిలో ఏడవ మైలు వద్ద ఆకాశం ఎత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. భక్తితో నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా కూర్చున్నారు. వారి చెవులకు... లీలగా... మైకులో నుంచి ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము... పదివేల శేషుల పడగల మయము‘ అనే అన్నమాచార్య కీర్తన వినిపించింది. వారి ఒళ్ళు పులకరించింది. ముఖాల్లో నేతి దీపాల మెరుపు మొదలయ్యింది. గురువు చెప్పిన ‘సముద్రం’ లోతు తెలిసింది. ఏడు స్వరాలు ఏడుకొండలై అన్నమయ్య సంగీత స్వరంతో ప్రవహించడం గమనించారు.‘మనమనుకునే ఉప్పు నీటి సముద్రం శేషాచలం కొండల్లో లేదు కానీ అన్నమయ్య గానామృత సముద్రం ఈ కొండల దగ్గర ఉంది’ అని తెలుసుకున్నారు. పండితులను, పామరులను సైతం ఓలలాడించే ముప్పది రెండువేల సంకీర్తనలు తెలుగులో అందించిన ఆ పదకవితా పితా మహుడికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామస్మరణలు చేస్తూ కొండ దిగారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: చదువు – లోకహితం కోసమే
రామాయణంలో ఒక చోట ‘‘సర్వే వేద విదః శూరః సర్వే లోకహితే రతః /సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః’’ అని ఉంటుంది. రామలక్ష్మణ భరత శతృఘ్నులకు గురువులు ఎన్నో విషయాలు నేర్పారు.ఎన్ని నేర్పినా, వాళ్ళకు నేర్పుతున్నప్పుడే అంతర్లీనంగా ఒక బోధ చే శారు. ‘‘ఈ చదువు మీకు ఒక కొత్త విభూతిని కట్టబెడుతుంది. ఈ చదువు మీకు ఒక కొత్త అధికారాన్ని తీసుకొస్తుంది. మీకున్న ఏ విభూతిని కూడా స్వార్థ ప్రయోజనానికి వాడుకోకుండా కేవలం ప్రజాహితానికి మాత్రమే వాడాలి.’’–అని.చదువు లేనివాడు మోసం చేయడానికి సంతకం కూడా పెట్టలేడు. చదువుకున్నవాడు వాడిని పిలిచి నిలదీస్తే వాడు భయపడి ‘ఇంకెప్పుడూ ఇలా చేయనండీ ...’ అంటాడు. కానీ బాగా చదువుకున్నవాడు అందరికీ నియమనిష్టలు చెప్పగలిగినవాడు తప్పు చేసినప్పుడు.. ... తన తప్పును అంగీకరించక΄ోగా అదే ఒప్పు అని సమర్థించుకోవడానికి సవాలక్ష వాదనలు ముందు పెడతాడు. రావణాసురుడికి ఏ విద్యలు తెలియవని!!! అయినా ‘‘స్వధర్మో రక్షసాం భీరు సర్వథైన న సంశయః! గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా!!’’ అని వాదించాడు. ‘నా తప్పేముంది కనుక. నేను రాక్షసుడిని.నా జాతి ధర్మం ప్రకారం నాకు కావలసిన స్త్రీలను అవహరిస్తాను, అనుభవిస్తాను. నేను చూడు ఎంత ధర్మాత్ముడినో’’ అని సమర్ధించుకునే ప్రయత్నం చేసాడు. అంత చదువుకున్నవాడు అంత మూర్ఖంగా వాదిస్తే అటువంటివాడిని అభిశంసించగలిగిన వాడెవడుంటాడు!!! చదువు సంస్కారవంతమై ఉండాలి.సామాజిక నిష్ఠతో ఉండాలి. అందరి మేలు కోరేదై ఉండాలి. విశ్వామిత్రుడుకానీ, వశిష్టుడు కానీ రామలక్ష్మణులకు విద్యను నేర్పించేటప్పుడు ‘ఇంత ధనుర్వేదాన్ని వీళ్లకు అందచేస్తున్నాం. వీళ్ళు తలచుకుంటే ముల్లోకాలను లయం చేయగలరు. అంత శక్తిమంతులవుతారు..’ అన్న ఆలోచనతో దానిని ఎక్కడా దుర్వినియోగపరచకుండా ఉండేవిధంగా విద్యాబోధనలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. నిజానికి రామచంద్రమూర్తి నేర్చుకున్న ధనుర్విద్యా΄ాటవం అటువంటిది. ఆచరణలో ఆయన దానికి పూనుకుంటే ఆపడం ఎవరితరం కాదు. ఆయన బాణ ప్రయోగం చేస్తే అగ్నిహోత్రం కప్పేస్తుంది సమస్త భూమండలాన్ని... అది ప్రళయాన్ని సృష్టించగలదు. కానీ అంత బలాఢ్యుడై ఉండి కూడా రాముడు ఒక్కసారి కూడా స్వార్థం కోసం హద్దుదాటి ఎవరినీ శిక్షించలేదు. అంటే గురువులు ఇచ్చిన విద్య లోకప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగపడాలన్న స్పృహతో ఉండడమే కాదు, అందరికీ తన నడవడిక ద్వారా ఒక సందేశం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు.రుషులు లోకహితం కోరి మనకు అందించిన పురాణాలు మనల్ని వారికి రుణగ్రస్థుల్ని చేసాయి. ఎప్పుడో వయసు మీరిన తరువాత, పదవీవిరమణ తరువాత చదవాల్సినవి కావు అవి. చిన్నప్పటినుంచి వాటిని చదువుకుంటే, అవగాహన చేసుకుంటే మన జీవితాలు చక్కబడతాయి. అదీకాక రుషిరుణం తీరదు కూడా. ఇది తీరడానికి బ్రహ్మచర్య ఆశ్రమం చాలు. బ్రహ్మచారిగా ఉండగా రామాయణ భారత భాగవతాదులు, ఇతర పురాణాలు, వేదాలు ఏవయినా చదువుకోవచ్చు. కానీ మిగిలిన రెండు రుణాలు–పితృరుణం, దేవరుణం మాత్రం గృహస్థాశ్రమ స్వీకారంతోనే తీరతాయి.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు