Literature
-
డాక్టర్ కేఎస్ రావుకు సృజన్ శిఖర్ పురస్కారం!
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం లభించింది. వారణాసికి చెందిన ప్రముఖ సాహిత్య సంస్థ నాందీ సేవా న్యాస్ సమితి ప్రతియేటా ప్రముఖ సాహితీ వేత్తలను ఈ పురస్కారంతో సన్మానిస్తుంది.భారతీయ భాషాసాహిత్యాల అభివృద్ధికి చేస్తున్న కృషికి, జాతీయస్థాయిలో నిరంతర సాహితీసేవకూ గుర్తింపుగా డాక్టర్ కే. శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ పురస్కారం ప్రదానం చేస్తున్నట్టు నాందీ సేవా న్యాస్ సమితి సన్మాన పత్రంలో పేర్కొంది.వారణాసిలో బుధవారం జరిగిన సుప్రసిద్ధ హిందీ సాహితీవేత్త రాజేంద్రప్రసాద్ పాండే స్మారక సాహిత్య కార్యక్రమంలో డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు సృజన్ శిఖర్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేశారు. ప్రముఖ సాహితీవేత్తలు ప్రొఫెసర్ రాధా వల్లభ్ త్రిపాఠి, ప్రొఫెసర్ ప్రభాకర్ సింహ్ పాండే, డాక్టర్ శశికళా పాండే ప్రభృతులు పాల్గొన్నారు.ఇవి చదవండి: అధునాతన ఫ్యాషన్‌కు కేంద్రంగా హైదరాబాద్.. -
నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
"వాడు గొంతెత్తితే అమరగానమట వెళ్ళి విందామా అనడుగుతే.. ఎహే! సర్విలో చాయ్ తాగి సిగరెట్ వెలిగించుకుని ఆటో ఎక్కితే పది నిముషాల్లో ప్రెస్ క్లబ్. రాజాగారి పుస్తకావిష్కరణ అనంతరం తాగినంత చుక్క, మెక్కినంత ముక్క పద గురూ.." అలా పద పద మని పరిగెత్తే సాహితీ పద సవ్వడులు హడావుడిలో గోపి గారు గీసిన కుంచె మెత్తని సిరాగానం ఎవరికీ పట్టలేదు. అసలు అవసరమే లేదు, అవసరమనే ఎరికే లేదు. ఒక మూడేళ్ల క్రితం ఆయన బొమ్మని వదిలి వెళ్ళిపోయారు. ఆయన్ని మనం, మనల్ని ఆయన ఎప్పుడూ పట్టుకుని లేము కాబట్టి గోపి నిష్క్రమణ వల్ల ఎవరికీ నష్టం లేదు, ఏదో ఒక పుంజీడు మంది బొమ్మ తడమగలిగిన వ్రేళ్ళున్న గుడ్డి వాళ్లకు తప్ప. అట్లా తడమగలిగిన మెత్తని అరచేతుల కోసం.. ఒక నాలుగు మాటల గోపి అనే ఒక గొప్ప చిత్రకారుడి కథ, బొమ్మ, కబుర్లు!⇒ అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదివ సంవత్సరం. బషీర్‌బాగ్ ప్రాంతం. ఇటు సుప్రభాతం పత్రికకి, అటు మాభూమి మాగజైన్ కి మధ్యలో ఒకటే కట్టడం అడ్డు. ఇక్కడ సుప్రభాతంలో పనిచేసే వాళ్లంతా అటేపు మాభూమిలో జాయినయిపోయారు. మా సుప్రభాతం వాళ్ళు కాక అక్కడ మాభూమికి కొత్తగా వచ్చింది ఆర్టిస్ట్ పాండు ఒకడే. వాడు తప్పా మిగతా మాభూమి పత్రిక అంతా సుప్రభాతంలానే ఉండేది. అదే వాసు గారు, ఏబికేగారు, నాగ సుందరీ, కొండేపూడి నిర్మల... అయినా పాండు తప్పా వాళ్లంతా నాకు పరాయి వాళ్ళు గానే ఉండే వాళ్ళు. ఆ మద్యాహ్నం నేను ఈ పత్రికలో భోజనం ముగించుకుని ఆ పత్రికలో పాండుతో కలిసి టీ తాగుదామని చేరా. అక్కడ పాండు తను వేసిన బొమ్మలని ఆర్టిస్ట్ గోపి గారికి చూపిస్తున్నాడు. ఆయన బహుశా ఆ పత్రికలో ఏదయినా ప్రీలాన్సింగ్ పని నిమిత్తం వచ్చి ఉంటారు. అదే నేను గోపిగారిని మొదట చూడ్డం. అయినా ఆయన గోపీగారని నాకు తెలిసిపోయింది! ఎలానో నాకే తెలీదు. పాండు బొమ్మలని చూసి గోపి గారు ఇలా అంటున్నారు.. "ఒకే ఆర్టిస్ట్ బొమ్మలు చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు పాండు, చాలా మంది బొమ్మలని చూసి అందరి నుండి నేర్చుకొవాలి, అందరి స్టయిల్స్ నుండి నీకంటూ ఒక కొత్త శైలి ఏర్పడుతుంది" పాండు బుద్దిగా తల ఊపుతుంటే నాకు నవ్వు వచ్చింది.⇒ అయినా నేను నవ్వలా, గోపి గారు తలెత్తి నావంక చూసి నవ్వారు, ఆయన నవ్వు దయగా ఉంటుంది. ఆయనెప్పుడు చిన్నగా, సన్నగా దయగా, కరుణగా చూస్తారు, నవ్వుతారు. నేను అన్వర్ నని అప్పుడు ఆయనకు తెలీదు. నేనప్పుడు ఆర్టిస్ట్ నని నాకు ఒక అనుమానం. చాలా ఏళ్ళు గడిచి "ఇప్పట్లో మీ అభిమాన చిత్రకారుడు ఎవరు ఆర్టిస్ట్ జీ" అని గోపీ గారిని ఒక ఇంటర్యూ లో అడిగితే ఆయన అన్వర్ పేరు చెప్పారు. నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ నని ఏమంత నమ్మకం లేదు. ఏళ్ళు ఇన్ని వచ్చాక ఇంకా విషయం తెలీకుండా ఉంటుందా! ఆర్టిస్ట్ అంటే కేవలం బాపు, బాలి, చంద్ర, గోపీ, మోహన్, పి ఎస్ బాబు, కరుణాకర్, సురేష్, చారీ, హంపి మరియూ గింపి ఆని.⇒ మణికొండలో ఆర్టిస్ట్ కడలి సురేష్ గారు ఉండేవారు. పిబ్రవరి ఎనిమిది రెండువేల పదహైదు మధ్యాహ్నం నేనూ, అనంత్ అనే జర్నలిస్టు ఒకాయన కలిసి సురేష్ గారి ఇంటికి వెళ్ళాం ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయింటింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ప్రేములుగా రామాయణం బొమ్మల సిరిస్. అన్నీ అద్భుతాలే. నేను ఒక కంట ఆయన బొమ్మలు మరో దొంగ కంట ఆయనది కాని మరో బొమ్మ చూస్తున్నా, టీవి వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్ క్యాలెండర్ బొమ్మ ఒకటి.ఎక్కడుంది. ప్రతి షీట్ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. ముచ్చట గొలిపే బొమ్మలు, అందమైన బొమ్మలు. గంగా, జమున, నర్మద, తమస, గోదావరి, కావేరీ నదీమతల్లుల చరిత్రని ఐదు గళ్ళల్లో బొమ్మలుగా చెప్పిన నీటివర్ణపు చిత్రలేఖనాలు అవి.⇒ గోపీ అనే సంతకమంత సింపుల్ లైన్ బొమ్మలు అవి. పెన్సిల్ పట్టి వంద ఎవరెస్ట్ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు అవి. గొప్ప బొమ్మల్ని చూస్తే నాకు కంట దుఖం ఆగదు. కన్నీరు అంటే మలినం నిండిన హృదయాన్ని ప్రక్షాళన చేస్తూ కడిగెయ్యడమే, బొమ్మ ముందు నిలబడి ఆ కాసింత సేపు శాపవిమోచనం జరిగిన మనిషిగా మనగలడమే. ఒక సారి రాబర్ట్ ఫాసెట్ అనే గొప్ప చిత్రకారులు గారు చిత్రించిన బొమ్మ చూసి ఇలా కంట తడిపెట్టిన అనుభవం ఉంది నాకు, వాంగాగ్ బొమ్మల గిరికీలలో ఇలానే చాలాసార్లు అయిన సంఘటనలు ఉన్నాయి నాకు. కుంచె అంచున అమృతం చిందించిన వాడికి కూడా మరణం తప్పదా అని మరలి మరలి దుఖం అవుతుంది జీవితం.⇒ సురేష్ గారు వేసిన వేలాది బొమ్మలని వదిలి ఆదిగో ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డు వచ్చింది. అడిగినా "అన్వర్ గారు కావలిస్తే నా బొమ్మలు అన్ని పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి" అనేవారే సురేష్ గారు. ఎందుకంటే గోపీ గారు చిత్రకారులకే చిత్రకారుడు. గోపీ గారి గురించి మహాను’బాపు’ తమదైన పొదుపైన మాటలతో ఇలా అన్నారు. "నాకున్న గురువుగార్ల ల్లో ఒక గురువు శ్రీ గోపి- ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిసలాడుతూ వుంటాయి. ఆయన ఇమాజినేషన్ కూడా అంత డైనమిక్ గా ఉంటుంది-గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతా వాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్ ఫీట్! పగడ్బందీగా- కొమ్మకు వేలాడుతూ- అంతస్తులు- కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఒకసారి ఇంజనీర్ల కన్వెన్షన్ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే , శ్రీ గోపి గారు దానికి ముఖచిత్రంగా గిజిగాడు బొమ్మ వేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టికి ఇంజనీర్లు ప్రతి సృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమానిజషన్ అంటే, అదీ గోపీ అంటే!⇒ ఆర్టిస్ట్ మోహన్ గారు చెప్పేవారు కదా" గోపి అబ్బా! వాడబ్బా! ఉస్మానియా యూనివర్శిటి బిల్డింగ్ అంతటిని వేసి గుంపులు గుంపులుగా ఆ మెట్ల మీద నడిచి వచ్చే వందల కొద్ది స్టూడెంట్స్ బొమ్మ వేశాడబ్బా. చచ్చి పోతామబ్బా ఆ కాంపోజిషన్ చూస్తుంటే, వాడి బొమ్మలు మీరేం చూళ్ళేదబ్బా!, మీరంతా వేస్టబ్బా! మిమ్మల్ని తన్నాలబ్బా" మోహన్ గారికి బాపు, బాలి, చంద్ర, గోపి అంటే వల్లమాలిన ప్రేమ, వ్యామోహం, ఆయన ముందు వాళ్ళని ఏమయినా పొల్లు మాట అని చూడండి, తంతాడు మిమ్మల్ని పట్టుకుని. తరువాత రోజుల్లో ఆదివారపు అబిడ్స్ వీదుల్లో, పాత పుస్తకాల రాశుల్లో మోహన్ గారు చెప్పిన ఆ ఉస్మానియా కాంపోజిషన్ నా కంట పడింది.⇒ అదే కాదు అపరాధ పరిశోధన అనే డిటెక్టీవ్ పత్రికల్లో ఆయన గీసిన కార్టూన్ బొమ్మల క్యారెక్టర్లు, అత్యంత అధునాతనమైన ఆ శైలి ఈరోజు వరకు తెలుగులో ఏ చిత్రకారుడు సాధించలేక పొయారు. అడపా దడపా ఏపిఎస్ ఆర్టిసి వారి కోసం వేసిన పోస్టర్ బొమ్మలు ఆ డ్రయివరు, అ బస్సు, డ్రయివర్ భార్యా పిల్లల బొమ్మల ఫ్రేములనుండి నవ్వుతున్న మొహాలు, టాటా బైబైలు ఏం బొమ్మలవి! ఏం రంగులవి! ఏం రోజులవి! ఏం పత్రికలవి!!! అనగనగా అనే ఆ రోజుల్లో సాహిత్యం- చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగారించుకునేది.⇒ ఆయన ఒక కన్ను చేతనున్న కుంచెవేపు మరో కన్ను కెమెరా వంక చూస్తూ ఉన్న కాలమది. ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు " మీరు కాకపోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి అంటే బాపు గారి పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే"! గోపి గారు అమిత పెర్ఫెక్షనిస్ట్. బొమ్మ ఆయనకు నచ్చేలా వచ్చేదాక జనం ఆగలేరుగా, మళ్ళీ బాపు గారి దగ్గరికి వెళ్ళి "ఏవండి మీరేమో గోపి దగ్గరికి వెళ్లమన్నారు, ఆయనేమో సమయానికి బొమ్మలు ఇవ్వట్లేదు" అని పిర్యాదు చేస్తే "నేను రేడియో మంచిది అన్నాను, అందులో ప్రోగ్రాములు మీకు నచ్చకపోతే నేనేం చెయ్యను" అని ఒక నవ్వు.⇒ గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపు బొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండి పోయిన పత్రికల రోజులని గోపి అనే దీపం వంటి సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్ పేజీల డ్రాయింగులకి కొత్త కాంతులు చూపించింది, రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగిమలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్నిటిని ఆయన డైనమిక్ టచ్ తో మార్చేశారు. రాత్రికి రాత్రి కలలా వచ్చి కూచున్నది కాదు ఆయన చేతిలోని డైనమిక్ టచ్! రాక్షస సాధన అంటారే అలా లైప్ డ్రాయింగ్ ని సాధన చేశాడు ఆయన. మెలకువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్ బుక్ ఉండేదిట. కనపడిన ప్రతీది బొమ్మగా మలిచేవారు, చూసిన సినిమా ల్లో సన్నివేశాలు గుర్తు పెట్టుకుని వచ్చి ఆ యుద్ద పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్ డాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ప్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెరపటం, మళ్ళీ గీయటం....⇒ హైదరాబాదు మహా నగరంలోని ఆర్టిస్టుల్లో మోహన్ గారు మహా చులకన ఇరవై నాలుగు ఇంటూ ఏడు రోజులు అనే ఎక్కం మాదిరి ఆయన ఎప్పుడయినా దొరికేవాడు, కలవాలి అనుకుంటే బాలి గారు చంద్ర గారు కూడా ఈజీగా దొరికేసి గంటలు గంటలు కూడా దొర్లిపోయేంత కబుర్లుగా దొరికేవారు. చివరకి మద్రాసి బాపుగారిని కూడా నేను ఎప్పుడంటే అప్పుడు దొరికించుకునే వాణ్ణి. గోపి గారే ఎక్కడ ఉంటారో, ఎప్పుడు కనపడతారో, ఒకసారి వదిలిపోతే మళ్ళీ ఎప్పుడు చిక్కుతారో అసలు అర్థం అయ్యేది కాదు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు "అన్వర్ గురువు గారు ఎలా ఉన్నారు" అని అడిగే వారు. గురువు గారు అంటే బాపు గారు. " మా అబ్బాయికి మ్యూజిక్ మీద మంచి ఆసక్తి ఉంది, ఈ సారి గురువు గారు వస్తే చెప్పు అన్వర్, మా వాణ్ణీ ఎక్కడయినా సినిమాల్లో పెట్టిస్తారేమో కనుక్కుందాం" అనేవారు. అనడం వరకే మాట ఈ జంతరమంతర జీవితంలో ఎవరికీ దేనికే సమయం దొరికే సందే లేదు. చివరకి చూస్తే డైరీల పేజీలన్ని ఖాలీ గానే ఉంటాయి.⇒ పెంటెల్ పాకెట్ బ్రష్ పెన్ అని జపాన్ ది. దాని మీద గోపీ గారికి మనసు పడింది. అది ఒకటి నాకు కావాలి అన్వర్ అని అడిగాడు, దానితో పాటే కొన్ని డిప్ నిబ్స్ కూడా ఇవ్వగలవా అన్నారు? "సార్ కొన్ని రోజులు ఓపిక పట్టండి మనకు మామూలుగా దొరికే, హంట్, విలియం మిషెల్ నిబ్స్ కాకుండా, తచికావా అని కామిక్ నిబ్స్ కొన్ని ఇండియాకు ఇంపోర్ట్ కాబోతున్నాయి, అవి మీకోసం తెప్పిస్తా" అని ఆయన బొమ్మల గుర్రాన్నిపట్టి ఆపి ఉంచా. ఒక రెండు వారాలు గడిచాకా ఫోన్ చేసారు "అంత తొందర ఏమీ లేదులే, ఊరికే ఆ నిబ్బులు అవీ ఎప్పుడు వస్తాయో కనుక్కుందామని" అన్నారు, నాకు ఎంత అయ్యో అనిపించిందో.⇒ మా ఇంపొర్టర్ కి ఫోన్ చేశా. వస్తువులు వచ్చి ఉన్నాయి, కరోనా తలనొప్పి వల్ల కస్టమ్స్ నుండి కంటైనర్ రిలీజ్ కాలేదని వార్త. మరో రెండు వారాలు భారంగా గడిచిపోయాకా అప్పుడు చేతికి వచ్చాయి సరంజామా మొత్తం. రాగానే గోపీ గారికి ఫోన్ చేసా, "ఇంటికి రానా? ఆఫీసుకు రానా?" అన్నారు. అంత పెద్దాయనను రప్పించడం ఎందుకనిలే అని నేనే వస్తా సార్ అన్నా ఆయన వినిపించుకోలా, అసలే నాకు పని పెట్టి అవి తెప్పించానని ఆయనకు గిల్టి గా ఉంది. ఆయనే ఈ మధ్య ఓ మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు. ఎదురు వెళ్ళి ఇంటికి పిలుచుకొచ్చుకున్నా. మా లావణ్య ఇంట లేదు, ఉండి ఉంటే ఇంత ఉడుకుడుకుగా ఏదయినా వండి పెట్టేది. ఆయన్ని కూచోబెట్టి టీ తయారు చేసి తెచ్చా.⇒ అన్నట్టు ఆర్టిస్ట్ చంద్ర గారు టీ ఎంత బాగా పెడతారో, ఆయన చేతి పచ్చిపులుసు,కోడిగుడ్డు పొరటు తిన్నామా! బస్. బొమ్మలు గిమ్మలు మరిచి పోతాము. ఎందుకు లేండి వెధవ బొమ్మలు, ఇంకో గంట ఆశమ్మపోశమ్మ కబుర్లు చెప్పుకుని తిన్నతిండి అరిగాకా ఇంకో ట్రిప్ అన్నంలోకి పచ్చిపులుసు, కోడిగుడ్డు పొరటు కలుపుకుని తిందామా? అని ఆశగా అడిగేంత బాగా వండుతారు. బాపు గారు మంచి కాఫీ కలిపి ఇస్తారు. నా గురించి నేను చెప్పుకోకూడదనుకుంటా కానీ నేను టీ బాగా చేస్తా. గోపి గారు రెండు కప్పులు తాగారు. చీ! ఏం చెబుతున్నా తపేలా కబుర్లు కాకపోతే!! గోపి గారు ఆయన కోసం తెప్పించిన బ్రష్ పెన్నుని చిన్న పిల్లవాడు చాక్లెట్ అందుకున్నంత ఆత్రంగా తీసుకున్నారు, అందులోకి ఇంక్ కాట్రిడ్జ్ బిగించి ఇచ్చి, కుంచెలోకి ఇంకు ప్రవహించడానికి కాస్త సమయం ఇచ్చి, ఇంకా నాదగ్గర ఉన్న రకరకాల పెన్నులు ఆయన కోసమని తీసిపెట్టినవన్ని అందించా.⇒ మురిపంగా ఒక్కో పెన్ను మూత విప్పడం ఆ పక్కన పెట్టి ఉంచిన నోట్ బుక్‌లో గీతలు రాసి చూసుకోడం! ప్రతీది ఒక్కో రకం వయ్యారం పోగానే" అబ్బా! అన్వర్ దీనితో మ్యాజిక్ చేయొచ్చు! అని ముచ్చట పడిపోవడం. బుధా బాడా - మేము యాగే! హూకం కాకి- కాకి కూకే బొమ్మలు కావాలే! అని తోట రాముడు అంటే బ్రష్ పెన్ మాత్రం బొమ్మలు పెడుతుందా? నాకు ఆయన అమాయకత్వం చూస్తుంటే దిగులుగా ఉంది. మ్యాజిక్ అంతా ఆయన చేతిలో ఉంది కదా. ఇటువంటి విదేశీ పనిముట్లు ఏమీ అందుబాటులో లేని రోజుల్లో వట్టి ఈ చేతులతో కదా, ముంజేతుల మీదికి పుల్ హాండ్స్ స్లీవ్స్ మడిచి రూపయిన్నర స్కెచ్ పెన్ తో, మూడు రూపయల జేకే బోర్డ్ పేపర్ మీద కలబడింది.బొమ్మలకు బొమ్మలు ఉత్పత్తి చేసింది. ఆయనలో అన్ని వేల బొమ్మలు వేసినా ఇంకా ఏదో సాధించాలనే ఒక అమాయకత్వం మిగిలి ఉంది, ఉందిలే మంచీ కాలం ముందూ ముందూన అనే పాట ఒకటి ఆయన చెవుల్లో ఎప్పుడూ వినపడుతూనే ఉంటోంది అనుకుంటా.⇒ ప్చ్! మీకు ఏం తెలుసబ్బా? ఏమీ తెలీదు. నా దగ్గర బాపు గారి వేసిన స్టోరీ బోర్డులు ఉన్నాయి, ఎలాంటి వర్క్ అనుకున్నారు అది. ఇండియా మొత్తం మీద అలా ఇండియన్ ఇంకు పెట్టి గీత గీసి ఫోటో కలర్ పూసి అటువంటి బొమ్మ చేయగలిగిన వాడు మునుపు లేడు ఎప్పటికీ రాడు. నెల్లూరు లో రాం ప్రసాద్ గారని ఒక పాత కార్టూనిస్ట్ ఉంటారు, ఆయన దగ్గర బాలిగారు గీసిన పిల్లల బొమ్మల కథలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. అమాంతం రంగుల అడవిలోకి దిగబడి పోయినట్లే- జంగల్ జంగల్ బాత్ చలి హై, అరే చడ్డి పెహన్ కే ఫూల్ ఖిలీ హై అనే పాటను ఆయన తన బొమ్మలతో వినిపించారు. మోహన్ గారు ఒక రాత్రి ఊరికే అలా కూచుని వాత్స్యాయనుడు ఎన్ని జన్మలెత్తినా కనిపెట్టలేని "కామసూత్ర" ని చిత్ర కళా సూత్రాలుగా వందలుగా బొమ్మలు వేశారు అవీనూ ఒక వేపు వాడిపారేసినా ఫోటో స్టాట్ కాగితాలపై, అందునా ముష్టి అఠాణా అప్సరా పెన్సిల్ టూబి చేతపట్టి.⇒ గోపి గారు కనుక కాస్త అసక్తి చూపి గ్రాఫిక్ నావెల్ అనే దారివంక ఒక చూపు చూసి ఉంటే ఇక్కడ కథ వేరే ఉండేది. ఆయన పేరు దేశం అంతా మారుమ్రోగి ఉండేది. ఈయన వంటి కాంపోజిషన్ ని, రేఖని ఈ దేశం తెలిసి వచ్చేది. ఈ రోజు ఫేస్ బుక్ ఉంది, ఇన్స్టాగ్రాం ఉంది, నాకు తెలుసుగా, నేను చూస్తానుగా అందరి బొమ్మలని. ఈ రోజు మన దేశంలో పెద్ద పేర్లు తెచ్చుకున్న కామిక్ బుక్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. బొమ్మలకు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రపంచానికి బొత్తిగా ఇక్కడ బాపు, బాలి, చంద్ర, గోపి, మోహన్, కరుణాకర్, బాబు అనే పేర్లే తెలీవు, వాళ్ళ పనే తెలీదు. వాళ్ల సంగతి ఎందుకు అసలు మీకు తెలుసా వీళ్ళ లైన్ క్వాలిటే అంటే ఏమిటి అని. ఈ రోజు బొమ్మలు వేసే వాళ్లంతా కంట్రోల్ జెడ్,, కంట్రోల్ హెచ్ బాపతు జాతీస్. నల్లని ఇంకు ఒకటి ఒకటి ఉంటుందని అందులో కుంచెని కానీ, నిబ్బుని కాని ముంచి వాటిని ఎకాఎకి పద్నాలుగో గేరు లో పరిగెత్తించి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆపగలిగే కంట్రోల్ చేయగలిగిన చేతి వేళ్ళు మా గురువులకు, పెద్దలకు ఉండేవి. మేము చూశాము ఆ విన్యాసాలని.⇒ అక్కడెక్కడో ఊరి బయట ఆర్టిస్ట్ రాజు గారు ఉంటారు రికామీగా కూచుని వాటర్ కలర్ నీళ్ళల్లో కుంచె ముంచి చలగ్గా డిస్నీ వాడు కూడా ఇమాజిన్ చేయని క్యారెక్టర్ డిజైన్ అలా గీసి పడేసే వారు, మేము పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని టేబుల్ అంచుకు గడ్డాలు ఆనించుకుని అలా చూస్తూ ఉండిపోయేవాళ్ళం మా ఇరవైల ప్రాయాల్లో. ఇప్పటికయినా గట్టిగా రాజుగారి చేతి వేళ్లకు ఒక కెమెరా కన్ను గురిపెట్టి అది జెల్ పెన్ కానివ్వండి, ఇండియనింక్ బ్రష్ అవనివ్వండి, అందివ్వండి. సరసర గీత కట్లపాములా సాగుతుంది, ఆగుతుంది బుసకొడుతుంది. ఇవన్నీ చూడ్డానికి, గ్రహించడానికి మానవజన్మలో ఒక పుణ్యపు నరం చేసుకుని పుట్టుండాలి. అచ్చం రజనీకాంతే అని విరగబడి చూసి నవ్వి కిలకిలలు పోతుంటారు పి ఎస్ బాబు అనే మహా చిత్రకారుడ్ని చూసి, మీ బొంద! ఆయన గారు చందమామ శంకర్, చిత్రాలని ఒక మెట్టు కింద ఆగమని చెప్పి అదే చందమామలో విక్రముడి సాహసాలు అనే బొమ్మల కథ వేశారు. అంత గొప్పగా ఉంటాయి ఆయన బొమ్మలు, ఆ స్పీడ్.ఆ బర్డ్ వ్యూ యాంగిల్.⇒ అదంతా మనకు తెలీని మన చరిత్ర. బాబు గారు, ఇండియా టుడే లో కథలకు బొమ్మలు వేస్తే, కథ కథకు బొమ్మల శైలీ మారిపోయేది, ఆ అమ్మాయి కన్నులతో నవ్వింది అని చెప్పడానికి అందమైన బొమ్మాయికి రెండు కళ్ళకి బద్దులు ముద్దులొలికే నాలుగు పెదాలు వేసి ఊరుకున్నాడు, ఫౌంటైన్ పెన్ తో నలుపు తెలుపు బొమ్మలు వేసేవాడు. సైకిల్ హేండిల్ గట్టిగా బిగించి పట్టిన రెండు పిడికిళ్ళ బొమ్మ ఉంటుంది. ఊరికే ఆ హేండిల్ మీద సర్రున ఒక పెన్ను గీత లాగాడు అంతే! ఎండకు తళ తళ మని మెరిసే సూర్యుని కాంతిలా భగ్గుమంది ఆ గీత. అలాటి ఆర్టిస్ట్ లు ఉన్నారు మనకు, ఉండేవాళ్ళు మనకు అనుకోవాల్సిన ఖర్మ పట్టింది ఇప్పుడు.⇒ సరే, ఏదెట్టా పోతే ఏముందిలే. గోపి గారు ఆ వేళ నా వద్దకు వచ్చి బ్రష్ లు తీసుకున్నారు, పెన్నులు తీసుకున్నారు, ఇంకు పుచ్చుకున్నారు, అన్వర్ ఇది ఉంచుకోవచ్చా, అది ఉంచుకోవచ్చా అని బెంగగా అడిగారు, అవన్ని ఆయన అరచేతుల్లో పెట్టి గట్టిగా దండం పెట్టుకోడం తప్ప బ్రతుకుకు ఇంకేం గొప్ప మిగులుతుంది? "అన్వర్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు" కాస్త సర్దుబాటు అయ్యాక నీకు ఇస్తా అన్నారు. నేనప్పుడు ఆయన ముందు మోకాళ్ల మీద కూచున్నా. " సార్ ఈ రోజు నేనూ, నా కుటుంబం మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నాము అంటే మీవంటి వారు మీ బొమ్మల ద్వార మాకు బ్రతుకులకు చూపించిన దారి సార్ ఇది! ఎంత చేస్తే మాత్రం మీకు గురు దక్షిణ ఇచ్చిన రుణం తీరుతుంది.⇒ ఆయన సన్నగా, దయగా నవ్వారు. కాసేపు ఆగి ఆయన్ని తోడ్కొని పిల్లర్ నెంబర్ ఎనభై అయిదు దగ్గరికి వచ్చా, ఆయన అక్కడ వెల్తున్న షేరింగ్ ఆటో ఆపి ఎక్కి, ఒక నల్లని మాస్క్ తీసి మొహానికి తొడుక్కుని నాకేసి చేతులు ఊపారు, మాస్క్ వెనుక ఆయన సన్నగా నవ్వే ఉంటారు. అది నాకు తగిలిన ఆయన చివరి నవ్వని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసింది. బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు- బొమ్మలని జీవనోపాధిగా చేసుకోడం వేరు. గోపి గారే కాదు, చాలా మంది చిత్రకారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు.⇒ ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చి పెట్టని, సంపాదించి పెట్టని డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డారు. యవ్వనం- ఆరోగ్యం సహకరించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నాని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదను తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి, ఆయన బొమ్మల జ్నాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్ చప్పుడులు తెలిసిన జ్నానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు కానీ, గోపి గారి భౌతిక దేహం వద్ద కూచుని చెవి దగ్గర "మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆర్టిస్ట్ గానే పుడతారా గోపీ గారు?" అని అడిగితే ప్రాణం లేని ఆ తల "ఊహు" అని తల అడ్డంగా ఊపడానికి కాస్త ప్రాణం ఖచ్చితంగా తెచ్చుకునేదే. -
సాహితీ విస్తరిలో అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం”
వరద కాలం, కవన కుతూహలం అనేవి అబ్బూరి రాజేశ్వరరావు గారి సాహితీ కాలమ్స్. అబ్బూరి గారి నడకతో, శైలితో దీటుగా నడిచిన తెలుగు సాహితీ కబుర్ల రస గుళికలు అత్యంత పరమ అరుదు. సాహిత్య విస్తరి ముందు కూచున్న వారి భోజనం అబ్బూరి కాలమ్స్ చదవకుండా ఎప్పటికీ పూర్తి కానే కాదు.అబ్బూరి వరదరాజేశ్వరరావు “కవన కుతూహలం” నుండి చిన్న ముక్క.వెంకటశాస్త్రి గారంటే శ్రీశ్రీకి అపార గౌరవభక్తులుండేవి. శాస్త్రి గారితో పరిచయమయిన తరువాత శ్రీశ్రీ కొంచెం తడబడుతూ “కవిత్వం మీద తమ అభిప్రాయమేఁవి” టన్నాడు. అప్పటికే వయోవృద్ధులూ, అస్వస్థులూ అయిన శాస్త్రిగారు మందహాసం చేసి “నేను కవి నేనా?” అని అడిగారు. తనలా అడగటంతో ఏమన్నా పొరబాటు చేశానా అని సందేహిస్తూ “మీరు కాకపోతే ఈ ఆంధ్రదేశంలో మరెవ్వరండీ కవి?” అన్నాడు శ్రీశ్రీ గట్టిగా. శాస్త్రిగారు నవ్వారు. “కవిత్వం అంటే ఏదికాదో చెప్పటం సులభం కానీ, ఏది కవిత్వమో చెప్పటం కష్టం… మన కవిత్వానికి లక్షణం కంఠవశం కాగల రచన. మననం చేసుకోవటానికి అనువయిన పద సంచయనం చెయ్యాలి. కర్ణపేయంగా ఉండాలి. రసనాగ్ర నర్తకి! అంతవరకూ నేను సాధించాను”. శాస్త్రి గారు తనలో తాను నవ్వుకుంటూ పడకకుర్చీ మీద వెనక్కి తలపెట్టారు. ఆకస్మాత్తుగా ముందుకు వంగి “అయితే అంతమాత్త్రాన అది కవిత్వం అయిపోదు…” శాస్త్రిగారెవర్నో లోపలినుంచి పిలిచారు. మేము లేచాం. శ్రీశ్రీని చూస్తూ శాస్త్రి గారన్నారు. -“నువ్వు చెప్పు కవిత్వం అంటే ఏఁవిటో… అంత సులభఁవటయ్యా? అసలు నిర్ణయించేవారే లేరే ఈ దేశంలో. నీకు నేనూ నాకు నువ్వూ తప్ప…అంచేతనే కాబోలు మనం అనువాదాలూ, అనుసరణలతో ప్రారంభించాం… పోయిరండి” అన్నారు.-అన్వర్ సాక్షి -
'ఓ సంచారి అంతరంగం'..మనసును కదిలించే పుస్తకం!
విపులాచపృథ్వీ అన్నట్టు తెలుసుకోవడానికి బయలుదేరితే భూమి చాలా పెద్దది. కంటికి నిత్యం కనపడే మానవుడు అంతకంటే లోతు . నా బాల్యంలో మా గ్రామంలో ప్రతి ఉదయాన్నే ఇళ్ల ముందుకు "అమ్మా రాత్రి అన్నం, కూరలు మిగిలి ఉంటే. ఇయ్యండమ్మా" అని సాధారణంగా నిత్యం వినపడే కేక వెనుక ఎంత ఆకలి పేగుల ఏడుపు ఉందో, అన్నపు మెతుకు ఎంత బరువైనదో తెలుసుకునే శక్తి అప్పుడు లేదు. సాహిత్యం ఎందుకు అంటే ఇందుకే అంటాను. సాహిత్యం చెవులకు కొత్తగా వినడాన్నీ, కళ్ళకు కొత్తగా చూడటాన్నీ, మనసుకు కొత్తగా అందటాన్ని సాధన చేయిస్తుంది.సాధన జీవితానికి ప్రాణవాయువు, సాధన జీవితపు ఆ దరికి చేరడానికి సులువు కానించే తెడ్డు. మా ఊళ్ళో మేము సంచార జాతి వారిని, వారి పిల్లా పీచు, గొడ్డు మేకలు సమస్తాన్ని రోజూ చూస్త్తోనే ఉండేవాళ్ళం. మా ఇంటి ముందే డేరాలు వేసుకుని ఉండేవాళ్ళు, ఆ డేరాలు ముందే వాళ్ళ ఉడుములు కట్టేసి ఉండేవి. నేను ఆ ఉడుముల్లో ఒకదానిని ఎలాగైనా తెచ్చుకుని దాని తోకకు తాడుకట్టి ఏ కోటయినా సరే దానిని ఎక్కి ఆక్రమించుకుందామా అని చూసేవాడిని తప్పా ఆ డేరాల లోపల బీద మనుషుల బ్రతుకులు ఏమా అని తొంగి చూడాలనుకున్న వాడిని కాను.ఇంట్లో పెద్దలు కూడా వారేమిటో, వారి బ్రతుకులు ఏమిటో, బ్రతుకు దారి ఎంత పొడవో, లోతో కొలత పాఠం చెప్పిన పాపానికి పోలేదు. ఈ జాతుల పిల్లలు జన్మజన్మల దారిద్య్రం, ఆకలితో క్యాట్ బెల్ చేతపట్టి కాకుల్ని కొట్టేవాళ్ళు. ఆ కాకుల్ని వాళ్ళు తింటారని తెలిసినపుడు అసహ్యం వేసింది. కాకుల్నే కాదు అవసరం, ఆకలి అయినపుడు మనిషి మనిషిని కూడా పీక్కు తింటాడని సాహిత్యమే చెప్పింది, ఒక మనిషి తన పొట్ట ఆకలిని తీర్చడానికి స్వయాన తన కాలిని తిన్న సంగతి కూడా సాహిత్యమే నేర్పింది. నా చిన్న తనంలో చిన్న మా ఊరులో రోజూ కనపడుతూ ఉండే ఈ సంచార మనుషులు ఉన్నట్టుండి, ఊర్లు బలిసి, పసిరిక పాము వంటి మెలిక దారులు అజగరల్లా వైశ్యాల్యమయి పోయి ,ప్రపంచం పెద్దదై పోయి వీరెక్కడ కానరాకుండా పోయిన కాలంలో ఒక టీచరమ్మ పూదోట శౌరీలు నాకు " ఒక సంచారి అంతరంగం" అనే ఈ పుస్తకాన్ని కానుక చేసారు.ఈ రచనను చాలా కాలం క్రితం "అమ్మ నుడి " పత్రికలో ధారావాహిక గా చూసేవాడిని. చదవలేదు. 2017 లో అచ్చు పుస్తకంగా వచ్చిన ఈ రోజు చదివే అవకాశం కలిగింది. శ్రీ రంగనాధ రామచంద్రరావు గారి అనువాదం బావుంది. మూల రచయిత కుప్పే నాగరాజుగారు తన చేయి పట్టుకుని పాఠకుడిని 192 పేజీల సంచారం చేయించారు. ఈ పుస్తకంలో కనపడే మనుష్యులకు,తాము కనపడకుండా పుస్తకం రావడానికి దోహదం చేసిన మహా మానవులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.పుస్తకం వెల: రూ. 200/-ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు, 1-2-740, హనుమాన్ మందిరం దగ్గర, రాకాసిపేట, బోధన్-503 185 నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. --అన్వర్, సాక్షి (చదవండి: సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!) -
ఉచితంగా ఇంగ్లిష్ నైపుణ్యాలు : ఈజీగా స్పొకెన్ ఇంగ్లీష్
సాక్షి, హైదరాబాద్: ఉపాధికి తప్పనిసరి అర్హతగా మారుతున్న ఇంగ్లీషులో మరింత మంది నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందని ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ వ్యవస్థాపకుడు, చీఫ్ కోచ్ డాక్టర్ ఏ. చిరంజీవి అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఏ రంగంలోనైనా ఇంగ్లిష్‌పై పట్టున్న వారికే అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో ప్రాథమిక విద్య నుంచీ ఇంగ్లీషు మీడియాన్ని అందుబాటులోకి తేవటం చాలా ప్రశంసనీయమన్నారు. రేపటి తరం పిల్లలంతా ఇంగ్లీషు విద్యను అభ్యసిస్తున్నారు కనక.. వారితో మ్యాచ్ కావాల్సిన నిన్నటితరం పెద్దలు, ఇంగ్లీషు భాషా నైపుణ్య లోపాల కారణంగా మెరుగైన అవకాశాలు అందుకోలేని యువత.. వీరందరి కోసం తమ సంస్థ ఉచితంగా ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సును అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ‘‘ఇంగ్లీషు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికోసం ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మా ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి 30 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈజీ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆన్లైన్లో ఉచితంగా అందజేస్తాం’‘ అని చిరంజీవి తెలియజేశారు. ఈజీ ఇంగ్లీష్ ద్వారా రాష్ట్రంలోని యువతకు కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే కాకుండా దాదాపు 9 రకాల అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. ఉచితంగా.. అందరికీ ‘‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్‌ను 1994లో ప్రారంభించాం. విశాఖపట్నంలో ఆరంభించి తెలుగు రాష్ట్రాల్లో 18 శాఖలుగా విస్తరించాం. ప్రస్తుతం ఆన్లైన్ మాడ్యూల్స్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం. మా సంస్థకు 30 ఏళ్లయిన సందర్భంగా అందిస్తున్న ఉచిత ఇంగ్లిష్ నైపుణ్య కోర్సుకు ఆసక్తి ఉన్న ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం దిగువ ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుంటే చాలు. వారి మొబైల్‌కు రిజిస్ట్రేషన్ లింకు వస్తుంది. లేనిపక్షంలో 9866006662 ఫోన్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపినా వారి మొబైల్ ఫోన్‌కు లింకును పంపిస్తాం". అదే విధంగా పది అంశాల్లో శిక్షణ.. "ఈజీ ఇంగ్లీష్ ద్వారా స్పొకెన్ ఇంగ్లీష్ తరగతులే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, గోల్ సెట్టింగ్, పాజిటివ్ మెంటల్ ఆటిట్యూడ్, పబ్లిక్ రిలేషన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్‌పై శిక్షణ ఇస్తాం. ప్రతి రోజు శిక్షణ ముగిసిన తర్వాత పరీక్ష పెట్టడంతో పాటు స్టడీ మెటీరియల్‌నూ ఇస్తాం. ఈ కార్యక్రమాలను ఆన్లైన్ పద్దతిలో లైవ్‌లో అందిస్తాం. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభిస్తాం. ఈ శిక్షణ కోసం మేధా ఇన్స్టిట్యూట్ తరపున 30 మంది నిపుణుల బృందం పనిచేస్తుంది. లైవ్‌లో నిర్వహించే ఈ తరగతులపై ఏవైనా సందేహాలుంటే చాట్ ద్వారా జవాబులిస్తాం’’ అని చిరంజీవి తెలిపారు. ఇవి చదవండి: వారెవ్వా.. నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు! -
సవాలుగా మారిన సరికొత్త నాటకం ‘నచికేత’
సవాళ్ళు ఎదురైనప్పుడే సృజనాత్మకత మరింత రాటుదేలుతుంది. నాటక రచయితగా మొదలై, సీరియల్స్ నుంచి సినిమా రచయితగా ఎదిగిన నాకు ఆ సంగతి అనుభవైకవేద్యం. ‘నరవాహనం’ నాటకం నుంచి ‘రంగమార్తాండ’ చిత్రం, తాజా ‘కన్నప్ప’ సినిమా వరకు రచనలో క్లిష్టమైన సందర్భాలు ఎదురైనప్పుడల్లా నాలోని రచయిత రాటుదేలడానికి అది దేవుడిచ్చిన అవకాశంగా భావించాను. రంగస్థలంపై ఇటీవల నాకు అలాంటి ఓ కొత్త సవాలు – ‘నచికేత’ నాటకం. ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా, రసరంజని 31వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆచార్య కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో ‘నచికేత’ నాటకాన్ని ప్రదర్శించాం. భారతీయ ఉపనిషతుల్లో సుప్రసిద్ధమైన కఠోపనిషత్తులోది నచికేతుడి కథ. సాక్షాత్తూ మృత్యుదేవత యముడే నచికేతుడికి బోధించిన మరణరహస్యం ఇందులోని ప్రధాన అంశం. ‘నచికేతుడి’ కథను నాటకంగా మలిస్తే బాగుంటుందనేది కోట్ల హనుమంతరావు ఆలోచన. ఆ ఆలోచన ఆయన నాతో పంచుకున్నప్పుడు ఉపనిషత్ రహస్యాన్ని నాటకంగా ఎలా మలచాలి అనేది పెద్ద సవాలుగా మారింది. ఈ విషయంపై లోతుగా చర్చించాం. నాటక రచన ప్రయత్నంలో భాగంగా పలు పుస్తకాలను తిరగేయడం మొదలుపెట్టాను. మొదటగా రామకృష్ణమఠం వారు ప్రచురించిన స్వామి స్వరూపానంద గారి ‘ఉపనిషత్ కథలు’, ‘ఆర్ష విద్యాతరంగాలు’ ప్రచురణ, స్వామి పరమార్థనంద గారి కఠోపనిషత్తు, విఎస్ఆర్ మూర్తిగారి ‘ఉపనిషత్ సుధ’ చదవడం మొదలెట్టాను. ఉపనిషత్తులోని లోతైన విషయం అర్థమమయింది గానీ, దాన్ని ఎలా చెప్పాలో అంతుచిక్కలేదు. యథాతథంగా రాస్తే పండితులకూ, మేధావులకూ, కేవలం ఈ విషయంపై ఆసక్తిగలవారికి మాత్రమే అర్థమవుతుంది. అలా కాకుండా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రాయడం ఎలా అని ఆలోచించాం. అప్పటికీ నాటకీయంగా ఈ విషయం ఎలా అందించాలి అనే అంశంపై ఆలోచనలు కొలిక్కిరాలేదు. సంప్రదాయ పద్ధతిలో ఉపనిషత్తులు గురుశిష్య సంవాదరూపంలో వున్నాయి గనుక అదే పద్ధతిని అనుసరించి నాటక రచన చేస్తే, స్పష్టమైన అంశాలను సంభాషణలుగా రాస్తే నాటకీయత ఎలావున్నా విషయాన్ని సులభంగా అందించినట్టవుతుందని, గురువు - శిష్యుల ఫార్మెట్‌ని అనుసరించి ఈ నాటక రచన మొదలుపెట్టడం జరిగింది. అయితే, కేవలం సంభాషణలు మాత్రమే రాస్తే శ్రవ్య నాటికగా ఉంటుందేమోగానీ, దృశ్యనాటికగా ఎలా రక్తికడుతుంది? అదీ సంశయం. దాంతో, కచ్చితంగా దృశ్య రూపకంగా అందించాలని నిర్ణయించుకున్నాం. పదేపదే ఆ కథను చదివితే కొన్ని దృశ్యాలు వచ్చాయి. ఆ దృశ్యాలకు పొందికైన రూపమివ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు మరో సందేహం వెంటాడింది. చాలా విషయాలు జటిలంగా ఉన్నప్పుడు నృత్యరూపకంగా అందిస్తే, కొన్ని హావభావాలను బాగా అందించే అవకాశం వస్తుందని నృత్యనాటిక రూపంలో మొదట రాశాను. దర్శకులు కోట్ల హనుమంతరావు అది చదివి బాగుందనుకున్నా, కేవలం నృత్యరూపకంగా అందిస్తే ‘నాటకీయత’ లోపించే ప్రమాదం ఉందంటూ నాటకంగా రాయమన్నారు. వెరసి, నృత్యరూపకంలో ఉన్న అంశాల్లో కొన్ని నాటకరూపంలోకీ వచ్చాయి. మళ్ళీ మరో సందేహం! నృత్యరూపకం, నాటకరూపం - రెండూ చదివాను. ఆ క్రమంలో ప్రస్తుత సమాజానికి ఈ కథ ద్వారా సందేశం ఏమైనా ఉందా అని ఆలోచనలో పడ్డాను. కేవలం సందేశాలకే నాటకాలు పరిమితం అయిపోవాలన్న భావన లేకపోయినా, ఉపనిషత్తు ఆధారంగా అందులోని కథను నాటకంగా రాసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎందరో ఋషులు, దార్శనికులు అన్ని కాలాలలో దర్శించిన విశ్వజనీన సత్యాలకు నాటకరూప మిస్తున్నప్పుడు, దేశ కాలాతీతంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఉపనిషత్ సారాన్ని, వర్తమాన సమాజానికి అన్వయించే ప్రయత్నం చేస్తే వస్తుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు రూపం ఇవ్వడానికి ప్రయత్నించాను. నృత్యరూపకాన్నీ, నాటకాన్నీ కలిపి, నాటకీయతను జోడించి రచించడం జరిగింది. చివరకు చిన్నచిన్న పాటలను, శ్లోకాలను కలిపి ‘నచికేత’ నాటకం రాయడం జరిగింది. ఒక కొత్త నాటకం రచన, ప్రొడక్షన్ వెనుక ఇంత కథ నడించింది. మరో విషయం... ఈ నాటకం తయారు అవుతున్నప్పుడు స్వామి కృష్ణానంద ‘కామెంట్రీ ఆన్ కఠోపనిషత్’, వేద సమితి ఉపనిషత్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎండ్ ఉపనిషత్ పుస్తకాలను కూడా చదవడం జరిగింది. చివరి నిముషంలో సాధ్యమైనన్ని మార్పులు చేసుకుంటూ ఈ నాటక ప్రదర్శన జరిగింది. ఈ ‘నచికేత’ నాటకాన్ని రసరంజని వారి నిర్వహణలో తొలిసారిగా ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు ప్రదర్శించడం ఆనందం కలిగించింది. నాటకంలో భాగంగా నచికేతుడు యమపురికి వెళ్ళే మార్గం, మరణానంతరం ఆత్మ జ్యోతులుగా సాగిపోవడం, యమధర్మరాజు - నచికేతుల మధ్య సంభాషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. కథను సమకాలీన పరిస్థితులకు అన్వయించే ప్రయత్నంలో ‘ప్రాయో మార్గాన్ని’ అనుసరించిన వ్యక్తి , అతని ప్రవర్తన, ‘మృత్యువు’ను పర్సానిఫై చేసిన వైనం ప్రదర్శన తిలకించినవారిని ఆకర్షించాయి. ఎంతటి జటిలమైన అంశాన్నయినా సరళంగా అందించే ప్రయత్నం చేస్తే, సహృదయులైన ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని అర్థమైంది. గత 31 సంవత్సరాలుగా నాటకరంగానికి విశేషమైన సేవలు అందిస్తున్న ‘రసరంజని’ చొరవ తీసుకుని, ఒక విభిన్న అంశంతో కూడిన నాటకానికి వేదిక కల్పించడం ఆనందం. అదే విధంగా, కేవలం టి.వీలకి, సిన్మాలకి పరిమితం కాకుండా, ప్రత్యక్షంగా నాటకం చూడడానికి దూరప్రాంతాల నుంచి సైతం ప్రేక్షక దేవుళ్ళు రావడం సంతోషం. తెలుగు రంగస్థలం మరింత ముందుకు సాగడానికి మరిన్ని కొత్త ప్రయత్నాలు కావాలి, రావాలి. ఆ క్రమంలో మా ‘నచికేత’ ఓ చిరు ప్రయత్నం. - ఆకెళ్ళ శివప్రసాద్, ప్రముఖ నాటక – సినీ రచయిత -
"కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం!"
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల 18వ తేదీన అకాడమీ ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయ సంగీత వాదుల నుంచి నిరసనల గళం పెద్దఎత్తున వినపడుతోంది. ఇది ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఎం కృష్ణను సమర్థిస్తూ కూడా కొన్ని వర్గాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వున్నారు. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలను బలపరిచేవారు, సనాతన సంప్రదాయం పట్ల గౌరవంలేనివారు, నాస్తికులు అందులో వున్నారు. టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కార ప్రకటనను నిరసిస్తూ, గతంలో ఈ పురస్కారాన్ని తీసుకున్న కొందరు వెనక్కు ఇచ్చేస్తున్నారు. చాలామంది కళాకారులు ఇక నుంచి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాడబోమని, సంగీత కచేరీలు చేయబోమని తమ నిరసనను చాటుకుంటున్నారు. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక అధినేతలలో ఒకరైన ఎన్.మురళి ప్రస్తుతం మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షులుగా వున్నారు. టీఎం కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంలో మురళి పాత్ర ప్రధానంగా వున్నదని సంగీత సమాజంలో గట్టిగా వినపడుతోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేట్టు లేదు. రకరకాల రూపం తీసుకుంటోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ చరిత్రలో ఇంతటి వివాదం గతంలో ఎన్నడూ చెలరేగలేదు. టీఎం కృష్ణకు ఒక వర్గం మీడియా మద్దతు, సహకారం కూడా బాగా వున్నాయని అనుకుంటున్నారు. ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే.. మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే ప్రచారం వుంది. వేదికలపైన పాడేటప్పుడే కాక, వివిధ సందర్భాల్లోనూ ఆయన చేసే విన్యాసాలు, హావభావాలపై చాలా విమర్శలు వచ్చాయి. అట్లే, ఆయనను మెచ్చుకొనే బృందాలు కూడా వున్నాయి. సంప్రదాయవాదులు ఎవ్వరూ ఇతని తీరును ఇష్టపడరు. ఈ క్రమంలో రేపు డిసెంబర్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికలో జరగబోయే ప్రతిష్ఠాత్మకమైన వేడుకలకు చాలామంది దూరంగా జరుగుతారని అనిపిస్తోంది. ప్రసిద్ధ జంట కళాకారిణులు రంజని - గాయత్రి పెద్ద ప్రకటన కూడా చేశారు. హరికథా విద్వాంసులు దుష్యంతి శ్రీథర్, విశాఖ హరి వంటీఎందరో నిరసన స్వరాన్నే అందుకున్నారు. తెలుగునాట కూడా అవే ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. 1976లో తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో, శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన కృష్ణ మొదటి నుంచీ కొత్త గొంతును వినిపిస్తున్నారు. బ్రాహ్మణత్వంపైన, కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణుల పెత్తనం పెరిగిపోతోందంటూ కృష్ణ నినదిస్తున్నారు. సమాజంలో, సంగీత సమాజంలో ఎన్నో సంస్కరణలు రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని మాట్లాడుతున్నారు. తాను గురుశిష్య పరంపరలోనే సంగీతం నేర్చుకున్నప్పటికీ దాని పైన తన దృక్పథం వేరని చెబుతున్నారు. చెంబై విద్యనాథ భాగవతార్ - కె జె ఏసుదాసు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు - అన్నవరపు రామస్వామి వంటివారి గురుశిష్య బంధాలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతున్నాయో? అనే ప్రశ్నలు వస్తున్నాయి. త్యాగయ్య మొదలు మహా వాగ్గేయకారులందరిపైనా ఆయన వివిధ సమయాల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రాహ్మణత్వంతోనే ప్రవర్తించారని, అదే పద్ధతిని అనుసరించి పాడుతూ పెద్దపేరు తెచ్చుకున్నారని, ఆ కీర్తి కోసమే ఆమె ఆలా చేశారని గతంలో కృష్ణ చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి. బ్రాహ్మణత్వాన్ని పులుముకోకపోతే ఈ శాస్త్రీయ సంగీత రంగంలో ఇమడలేరని, రాణించలేరని, అందుకే సుబ్బలక్ష్మికి కూడా అలా ఉండక తప్పలేదని కృష్ణ బాధామయ కవి హృదయం. కులాన్ని బద్దలు కొట్టాలని, కళలు, సంగీతం అందరికీ అందాలని, అది జరగడంలేదని వాదిస్తూ, సముద్ర తీరాలలో, మత్స్యకార వాడల్లో, వివిధ సమాజాల్లో కచేరీలు, సంగీత ఉత్సవాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ విధ్వంసంపైన, బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, వివిధ ఉద్యమ వేదికల ద్వారా తన వ్యతిరేకతను చాటుకుంటూ వస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాల దగ్గరకు తీసుకెళ్లాలంటూ చేసిన ప్రదర్శనలు మీడియాను కూడ బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంతో 2016లో ప్రతిష్ఠాత్మక 'రామన్ మెగసెసే అవార్డు' కూడా అందుకున్నారు. తమిళ భాషను, యాసను ప్రచారం చేసే క్రమంలో కృష్ణ తెలుగును చిన్నచూపు చూస్తూ వస్తున్నారు. త్యాగయ్య కీర్తనలు ఈనాటికి పనికిరావని, ఆ సాహిత్యం మూఢమైనదనే భావనలను కూడా ప్రచారం చేశారు. మహా వాగ్గేయకారులు రచించిన కీర్తనలను సాహిత్యానికి, భావానికి, భాషకు సంబంధం లేకుండా నడ్డివిరచి పాడుతూ మహనీయులను హేళన చేస్తున్నాడని, తెలుగు భాషను అవమానపరుస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇతను కేవలం సంగీత విద్వాంసుడుగానే కాక, ఉద్యమకారుడుగానూ ప్రచారంలోకి వచ్చాడు. ఈ.వి రామస్వామి పెరియార్ భావాలను అనుసరిస్తూ, గీతాలను సృష్టిస్తూ, గానం చేస్తూ, ప్రచారం చేస్తూ వున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ పాటలు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్వరపరచి ఎందుకు పాడకూడదు? అన్నది అతి వాదన. బ్రాహ్మణులు, దైవం, హిందూమతం, కాంగ్రెస్, మహాత్మాగాంధీని పెరియార్ వ్యతిరేకించారు. కృష్ణ కూడా ఇంచుమించు అవే భావనలలో వున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్పైన కూడా అనేకసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన ప్రస్తుత పురస్కారం ఎంపిక విధానాన్ని, అర్హతను గమనిస్తే, ఇతని కంటే గొప్పవాళ్ళు, జ్ఞాన, వయో వృద్ధులు ఎందరో వున్నారు. వాళ్లందరినీ కాదంటూ ఈయనకు ఈ పురస్కారం ఇవ్వాల్సినంత శక్తి సామర్ధ్యాలు, అనుభవం ఆయనకు లేవన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సంప్రదాయ వ్యతిరేకత ముసుగులో, సంస్కరణ మాటున సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవమానిస్తున్నాడని సంప్రదాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నాడని తెలుగు భాషాప్రియులెందరో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల, వాగ్గేయకార మహనీయుల పట్ల, తెలుగు భాష పట్ల గౌరవం లేనప్పుడు అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడని అనేకులు మండిపడుతున్నారు. సంగీత కళానిధి పురస్కారం సంగతి అటుంచగా, ఇంతటి విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూస్తూ ఊరుకోబోమనే మాటలు సనాతన సమాజాల నుంచి వినపడుతున్నాయి. ఈ పురస్కార ప్రకటనను మ్యూజిక్ అకాడమీ విరమించుకుంటుందని చెప్పలేం. ఈ ధోరణులతో నడుస్తున్న కృష్ణ శాస్త్రీయ రాగాలను ఎంచుకోకుండా, తాను కొత్త కొత్త రాగాలను పుట్టించుకొని అందులో పాడుకొమ్మని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సనాతన భారతంలో "కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం " అని సంప్రదాయ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతనిపై న్యాయస్థానాలలో కేసులు కూడా పెడుతున్నారు. ఏమవుతుందో చూద్దాం. - రచయిత, మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
‘‘డిజిటల్ యుగంలో డా.అంబేద్కర్ భావజాలం’’ పుస్తకంపై విజయభాను కోటే రివ్యూ
పుస్తక సమీక్ష: “Dr. Ambedkar’s Ideology in the Digital Era” (రచయిత- డా. జేమ్స్ స్టీఫెన్ మేకా (రిజిస్ట్రార్-ఆంధ్ర విశ్వవిద్యాలయం) ప్రపంచం మరుపులో కూరుకుపోతున్నట్లు కనిపించినప్పుడు, కొంతమంది వ్యక్తులు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రతిధ్వనులను కలిగించే స్వరాలను ఎక్కుపెడతారు. డాక్టర్ జేమ్స్ స్టీఫెన్ మేకా గారిని తన తాజా పుస్తకం "డాక్టర్ అంబేద్కర్స్ ఐడియాలజీ ఇన్ ది డిజిటల్ ఎరా" గురించి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అదే భావోద్వేగం కలిగింది. “మీ పుస్తకం శీర్షిక వినూత్నంగా ఉంది. అసలు డిజిటల్ శకానికి, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వారధి కట్టాలని మీకు ఎలా అనిపించింది?” ఈ ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ జేమ్స్ స్టీఫన్ చూపించిన వీడియో చూసి నేను, నా సహచరుడు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురయ్యాము. డాక్టర్ అంబేడ్కర్ చైర్ గా సేవలు అందించిన డాక్టర్ జేమ్స్ స్టీఫన్ వంటి అంబేడ్కరిస్ట్ ను టీవీ కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు వేదనకు గురిచేసింది. ఈ కార్యక్రమంలో అడిగిన ఒక ప్రశ్నకు హాట్ సీట్ లో పాల్గొంటున్న వ్యక్తి మాత్రమే కాక కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులు కూడా అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం తెలియని పరిస్థితుల్లోకి భారతదేశం వెళ్లిపోతోందని అర్థం అయిన ఆయన ఆ సమస్యను తీవ్రమైన సమస్యగా గుర్తెరిగి, పరిష్కారంగా ఈ పుస్తకాన్ని రచించారు. ఆ “మీలో ఎవరు కోటీశ్వరుడు” ప్రోగ్రామ్ వీడియోలో అడిగిన ప్రశ్న, “వీరిలో బాబాసాహెబ్ గా పేరొందిన వారు ఎవరు? దీనికి పార్టిసిపెంట్‌కు జవాబు తెలియక, షోలో భాగంగా “ఆడియన్స్ పోల్” ఎంచుకోవడం, అందులో అంబేడ్కర్ కు 27శాతం మాత్రమే ఓటింగ్ రావడం, చివరికి వల్లభాయి పటేల్ అని జవాబు చెప్పడంతో తనకు సమస్య తాలూకా తీవ్రత అర్థంఅయిందనీ, పనులెన్ని ఉన్నా, లోపల మండుతున్న ఒక నిప్పు రవ్వ నిద్రపోనివ్వని కారణంగా ఈ రచన జరిగిందని చెప్తారు డా. జేమ్స్ స్టీఫన్. అంబేడ్కర్ అనుచరులు ఆయనను ఆప్యాయంగా, అభిమానంతో పిలిచే పేరు “బాబాసాహెబ్”. బాబా అంటే తండ్రి, సాహెబ్ అంటే సార్ అనే గౌరవ సంబోధన. అంబేడ్కర్ “బాబాసాహెబ్” గా భారతదేశం లోనే కాక అంతర్జాతీయంగా కూడా పేరు పొందారు. మన దేశంలో విశ్వవిద్యాలయాలు ఆయన పేరుతో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో ఒక జిల్లా, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా. అంబేడ్కర్ జయంతిని ఘనంగా జరిపే భారతావనిలో నేటి యువత ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యతను. ఆ వ్యక్తి భారతదేశానికి చేసిన అత్యున్నత సేవను, ఆ వ్యక్తి చరిత్రలో వేసిన ముద్రను తెలియని స్థితిలోకి జారిపోతున్నారన్న ఆలోచన, ప్రస్తుతం సమాజంలో, ముఖ్యంగా నేటి యువతలో అంబేడ్కర్ గురించిన అవగాహన పెంచడానికి, డిజిటల్ వ్యవస్థను వినియోగించడం ఎలా అన్న అంశాన్ని లోతైన అధ్యయనాల ద్వారా ఈ పుస్తకంలో తెలియజేశారు. అంతే కాక అంబేడ్కర్ సిద్ధాంతాలు నేటి డిజిటల్ యుగానికి ఏ రకంగా అవలంబించవచ్చో తెలియజేశారు. ఈ 20 అధ్యాయాల పుస్తకం నిజమైన అంబేద్కర్‌ను ప్రపంచానికి పరిచయం చేయవలసిన ఆవశ్యకతను వెల్లడిస్తుంది. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు అందించబడాలని నిక్కచ్చిగా చెబుతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఇండియా వీడీఎం ఇండియా ఆన్ ద మూవ్ ఛైర్మన్ ఆచార్య శ్రీ అజయ్ కుమార్ "ఈ పుస్తకం అంబేద్కర్ యొక్క విజన్, ఒక గొప్ప నాయకుని ఆశయాలు మరియు ఆలోచనలను డిజిటల్ యుగం యొక్క పరివర్తన శక్తితో సమకాలీకరించే ఉన్నతమైన పనిని పూర్తి చేస్తుంది." అన్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి సిద్ధాంతాలను ప్రస్తుత కాలానికి అన్వయించాలంటే ఆ వ్యక్తి గురించిన లోతైన అధ్యయనం చెయ్యాలి, ఆ సిద్ధాంతాలు ఏ కాలానికైనా అవలంబించదగినవని తెలియాలంటే, అనుసంధాన ప్రక్రియ బలంగా ఉండాలి. ఈ పుస్తకంలో రచయిత చేసినది అదే! చరిత్ర భవిష్యత్తుకు పునాదిగా పనిచేస్తుంది. మనం డాక్టర్ అంబేద్కర్‌ను కేవలం గురువుగా మాత్రమే కాకుండా, వారి ఆలోచనలు మరియు దృష్టిని మన భవిష్యత్తుకు అన్వయించగల వ్యక్తిగా కూడా గుర్తుంచుకోవాలి. ఏ కాలానికైనా వర్తించే ఆలోచనలను కొద్ది మంది మాత్రమే ప్రతిపాదించగలరు. అలాంటి వారిలో డాక్టర్ అంబేద్కర్ ఒకరు. డాక్టర్ అంబేద్కర్ జీవితం అన్ని కాలాలకు ఆదర్శంగా నిలుస్తుంది. జ్ఞానాన్ని ఆయుధంగా వాడుకున్న యోధుని గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. భారతదేశపు మొదటి న్యాయ మంత్రిగా ఆయన ఎప్పుడూ గుర్తింపు పొందారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని పాటించినంత కాలం ఆయన మన పౌర జీవితాల్లో జీవిస్తారు. అంబేద్కర్ తన విద్యను సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఉపయోగించారు. మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలకు ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేసుకునే హక్కు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 20 అధ్యాయాలుగా విభజించబడ్డ ఈ పుస్తకంలో ఒక్కో అధ్యాయాన్ని పుస్తకం యొక్క మూల లక్ష్యాన్ని నిర్మాణాత్మకంగా చేరేలా రచించారు. డాక్టర్ అంబేడ్కర్ జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతూ ఆయన ఎదుర్కొన్న వివక్ష ఎంత కాలం, ఎలా ఆయన జీవితాన్నివెంటాడిందో తెలియజేస్తూ, ఆయనలో వివక్షకు వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు ధోరణి, ఆ తిరుగుబాటుకు సూచనగా ఆయన విద్యను ఆయుధంగా ఎంచుకోవడం, ఆ తిరుగుబాటును వ్యక్తీకరించడానికి ఆయన రచనను ఆయుధంగా, వ్యక్తీకరణ సాధనంగా ఎంచుకోవడం గురించి సూక్ష్మంగా అయినా, పదునుగా తెలియజేస్తారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ భావజాలం అప్పట్లో ఒక తిరుగుబాటుగానే పరిగణించబడింది. తన సిద్ధాంతాలను సమాజ మార్పుకు పునాదులుగా చేయడానికి ఒక వ్యక్తి చేసిన అనితరసాధ్య, నిరంతర సంఘర్షణల ఫలితమే అంబేడ్కరిజం. ఆయన సిద్ధాంతాలు లేదా భావజాలం యొక్క పురోగతి వేల యుద్ధాలను దాటిన అనుభవంగా మనం చెప్పవచ్చు. ఇక డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి గల నాయకుడని ఆయన రచనలు చదివే ఈ నాటి యువతకు అర్థం అవుతుంది. ఆయన దృష్టిలో సమ న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక చేర్పు అనే అంశాలను నేటి సాంకేతిక యుగానికి అనుసంధానం చేస్తూ, డిజిటల్ డివైడ్ లేని సమాజం వైపు అడుగులు వేయడం వలన సాంకేతిక సమసమాజ చేర్పుకు నాంది పలకాలని పిలుపును ఇవ్వడం ఈ పుస్తకం యొక్క ఒక ముఖ్య ఉద్దేశ్యం. సాంకేతిక విప్లవం నేటి కాలపు విజయం అని అభివర్ణించే ఈ కాలంలో విద్య మరియు సాంకేతిక సాధికారత గురించి, సాంకేతిక ప్రజాస్వామ్యం గురించి రచయిత లేవనెత్తిన అంశాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇక ఈ కాలంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య సమాచార గోప్యత లేకపోవడం లేదా సమాచార దోపిడీ (మనకు తెలియకుండానే మన సమాచారం ఇతరులు వినియోగించడం. ఉదాహరణకు మనకు తెలియని కంపెనీల నుండి, బ్యాంకుల నుండి మనకు ఫోన్ రావడం రోజూ జరుగుతూనే ఉంటుంది. అది సమాచార చౌర్యం అని తెలిసినా మనకు ఏమి చెయ్యాలో తెలియదు) గురించి వివరించారు రచయిత. ప్రపంచ సమాజం మొత్తం ఇపుదు డిజిటల్ ఆక్టివిజం లోనే ఉందన్నది వాస్తవం. సాంకేతిక క్రియాశీలత వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి అని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతూనే ఉంటారు. అయితే ఈ సాంకేతిక క్రియాశీలత వలన ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయి. ఉదాహరణకు బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ సేవలను గురించి చెప్పుకోవచ్చు. మరి సామాజిక మాధ్యమాల విషయానికి వస్తే నేడు వార్తా పత్రికల కన్నా సామాజిక మాధ్యమాల ద్వారా వార్తలను తెలుసుకునేవారి సంఖ్య పెరిగింది. ఈ మాధ్యమాలు చర్చావేదికలుగా మారాయి. దేశపు సాధారణ పౌరుల నుండి అత్యున్నత అధికారులు, రాజకీయ నాయకులు కూడా తమ అకౌంట్ల ద్వారా సమాచారాన్ని, ప్రకటనలను వెలువరిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న సాంకేతిక క్రియాశీలత ద్వారా సామాజిక మార్పు సాధ్యాసాధ్యాల గురించి రచయిత విపులంగా చర్చిస్తారు. ఆల్గారిథమిక్ బయాస్ అనేది సమాజంలో ఇప్పటికే ఉన్న పక్షపాతాలను ప్రతిబింబించే డేటాపై అల్గారిథమ్‌లను రూపొందించినప్పుడు లేదా శిక్షణ ఇచ్చినప్పుడు సంభవించే దైహిక మరియు అన్యాయమైన వివక్షను సూచిస్తుంది. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను నిలబెట్టడానికి, అల్గారిథమిక్ డెసిషన్ మేకింగ్‌లో ఇటువంటి పక్షపాతాలను నిశితంగా పరిశీలించి సరిదిద్దడానికి కృషి చేయాలి. డాక్టర్ అంబేడ్కర్ భావజాలాన్ని నేటి సాంకేతిక యుగం లో సామాజిక న్యాయం మరియు సమత్వం గురించి చర్చిస్తూ, అట్టడుగు వర్గాలను ఈ డిజిటల్ యుగంలో సామాన్య హక్కుదారులుగా ఎలా చేర్చాలో చర్చిస్తారు. సాంకేతిక యుగంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్షలను కూకటివేళ్ళతో ఎలా పెకిలించాలో దిశానిర్దేశం చేస్తారు. అలాగే డిజిటల్ విద్య అవసరత, తద్వారా ఉపాధి లేదా సామాన అవకాశాల ఆవశ్యకత గురించి చర్చిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ సమసమాజ స్థాపన కొరకు పాటు పడ్డారు. అది విద్య, సాధికారత వలనే సాధ్యం అవుతుందని భావించారు. ఈ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుని, సాంకేతిక సాధికారత, సామాజిక సమానత్వం తీసుకురావడంలో సాంకేతికత పాత్ర గురించి వివరిస్తూ, జీవితకాల అభ్యాసం వలన వనగూరే లాభాలను గురించి ప్రకటిస్తారు. ఈ పుస్తకంలో ఒక మంచి అంశం చాలా చోట్ల కేస్ స్టడీస్ (ఉదాహరణ అధ్యయనాలు) ను తీసుకోవడం. డాక్టర్ అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను పునాదిగా చేసుకుని నేటి కాలపు స్థితులకు అనుగుణంగా పౌరులను చైతన్యపరచడంలో రచయిత సఫలీకృతులు అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూరదృష్టి గల సంఘ సంస్కర్త మరియు భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి. ఈ ఆదర్శాల గురించి లోతైన అంతర్దృష్టులను అందించారు. డిజిటల్ వ్యాపారంలో సైతం అసమాన్యతల తొలగింపు గురించి చర్చిస్తూ పౌర నిర్వహణ లేదా పౌర భాగస్వామ్యం గురించి రాసిన విధానం పౌరులందరినీ ఆలోచింపజేస్తుంది. అట్టడుగు వర్గాలకు అందని కొన్ని ప్రయోజనాలు, అనుమతి అసమాన్యతల గురించి చర్చిస్తూ భౌగోళిక అంశాలను గురించి వివరించడం, ఆన్లైన్ అభ్యాస మార్గాలలో అసమానతల నిర్మూలనకు మార్గాలను నిర్దేశించడం జరిగింది. అసమానతలు దేశ ఆర్థికాభివృద్ధిపై చూపే ప్రభావం, వ్యవస్థాపకత లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి కారణాలను తెలియజేస్తుంది ఒక అధ్యాయం. ఇక ఆన్లైన్ అంశాలలో బ్లాగింగ్, వీడియోల ద్వారా సమాచార ప్రచారం, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార ప్రసారం మొదలైన ఎన్నో విషయాలను చర్చిస్తాయి ఇందులోని అధ్యాయాలు. నేటి కాలంలో టెలీ మెడిసిన్, ఆన్లైన్ హెల్త్ కేర్ మొదలైన అంశాలను కూడా తన పుస్తకంలో చేర్చారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ సూత్రాల ఆధారంగా సాంకేతిక అసమానతలను అధిగమించేందుకు సోపానాలను ఒక అధ్యాయంలో వివరించారు రచయిత. సమాచారం సాధికారతకు సోపానం అంటారు రచయిత. అందుకే డిజిటల్ గ్రంధాలయాలకు ఓపెన్ యాక్సెస్ గురించి మాట్లాడుతారు. అందరికీ సామాన విద్య గురించి మాట్లాడుతూ ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అంటారు. డిజిటల్ విద్య అంతరాన్ని తగ్గించడంపై అందరం దృష్టి పెట్టాలి. అలాగే డిజిటల్ లిటరెసీను పెంపొందించే కార్యక్రమాల ఆవశ్యకత, డిజిటల్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జ్ఞానసముపార్జనను ప్రజాస్వామీకరించడం వంటి విలువైన అంశాలను ఈ పుస్తకంలో చేర్చారు. ఈ ప్రక్రియలో భాగంగా మనం ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలకు పరిష్కారాలను, డాక్టర్ అంబేడ్కర్ చారిత్రక ఉద్యమాలను ఉదాహరణలుగా చూపుతూ చర్చించారు. డిజిటల్ వేదికల సద్వినియోగం, అంతర్జాతీయ సహకారం యొక్క ఆవశ్యకత, వెసులుబాటు అవకాశాలు, మార్గాలు, సమాచార భద్రత, సమాచార జీవావరణ వ్యవస్థ (డేటా ఏకొ సిస్టమ్), సమాచార దోపిడీ వలన కలిగే హాని, సమాచార ఆధారిత వివక్ష, సమాచారం యొక్క నైతిక వినియోగం, నిఘా పటిష్టత మొదలైనవాటి గురించిన సంక్షిప్త సమాచారం ఈ పుస్తకంలో ఉంది. రచయిత గోప్యతను మానవ హక్కుగా పేర్కొంటూ రాసిన అధ్యాయం అందరూ చదివి తీరాలి. ఈ అంశాలన్నింటినీ డాక్టర్ అంబేడ్కర్ దృష్టికి, సిద్ధాంతాలకీ అన్వయించి వివరించిన విధానం బావుంది. అదే విధంగా ఆన్లైన్ నేరాలు, సైబర్ బుల్లియింగ్ మొదలైన వేధింపుల గురించి, ఫిర్యాదు పద్ధతుల గురించి ఈ పుస్తకంలో విపులంగా ఉంది. సురక్షితమైన ఆన్లైన్ వేదికల సృష్టి యొక్క ఆవశ్యకతను వివరించారు. కృత్రిమ మేధస్సు సాంకేతికతలో పురోగతి, తద్వారా ఎదుర్కొనే సవాళ్ళు, నైతిక అనిశ్చితి గురించి వివరిస్తూ, సామాజిక సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ గవర్నెన్స్, డిజిటల్ వ్యవస్థాపకతల గురించి డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలతో పోలుస్తూ కొన్ని అధ్యాయాలు రాశారు. వెనుకబడిన సమూహాలకు అందుబాటులో సాంకేతికత ఉండాలన్నది ఆయన వాదన. తద్వారా సామాన అవకాశాలు దక్కుతాయని ఉదాహరణ అధ్యయనాల ద్వారా నిరూపించిన తీరు అమోఘం. డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలను నేటి సాంకేతితక ద్వారా ప్రచారం చేయడానికి పూనుకోవాల్సిన ఆవశ్యకత అవగతం అవుతుంది చదివిన ప్రతి ఒక్కరికీ. అంబేడ్కర్ గురించి అందరికీ తెలియాలి! నేటి సమాజానికే కాదు, ఏ కాలానికైనా ఆయన దార్శనికత వెలుగు చూపే దివ్వె అవుతుందని తెలియాలి! అంబేద్కర్ భావజాలాన్ని డిజిటల్ యుగానికి చేర్చాలనే ఆలోచన భారతదేశ పౌరులతో పాటు మొత్తం ప్రపంచ పౌరులలో అంబేద్కర్ భావజాలం యొక్క అక్షరాస్యతను మెరుగుపరుస్తుందన్నది వాస్తవం. ఈ పుస్తకం మన అందరి భవిష్యత్ ఆలోచనా సరళి మార్పును, భవిష్యత్ తరాలకు అంబేడ్కర్ ఆశయాలను చేర్చేందుకు తీసుకోవలసిన చర్యల ఆవశ్యకతను సూచిస్తుంది. శరవేగంతో పరుగులు పెడుతున్న అభివృద్ధి భారతదేశాన్ని ఏ స్థాయిలో నిలబెట్టగలదో అంచనా వేసేందుకు కొన్ని అధ్యయనాలు, కొన్ని ఆచరణలు అవసరం అని అందరికీ తెలుసు. భారతదేశ భవిష్యత్తు గురించి అత్యున్నత దృక్పథాన్ని కలిగి ఉన్న జాతీయ నాయకుడికి భిన్నమైన భావజాలం ఉంది. దూరదృష్టి కలిగిన ఆ దార్శనికుని మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అందిపుచ్చుకోగలిగితే, అది భారతదేశాన్ని అభివృద్ధిలో శిఖరాగ్రంలో ఉంచగలదన్న విషయాన్ని అర్థం చేసుకుని, సాంకేతికత పరంగా కూడా ఆ భావజాలాన్ని వినియోగించుకోగలగాలి. ఇంత విపులంగా అంబేడ్కర్ ఆశయాల సాధన కొరకు నేటి కాలం సాంకేతికతను సమ్మిళితం చేయగలిగే విధానాలను సూచిస్తూ రచించిన ఈ పుస్తకం ఎంతో మంది పరిశోధకులు, పౌరులు, విద్యార్థులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక పరిజ్ఞాన అభ్యాసకులకు మార్గదర్శిగా ఉండగలదు. - విజయభాను కోటే ఫ్రీలాన్స్ రైటర్, టీచర్, హ్యుటగాజీ ఎక్స్పర్ట్ 8247769052 (పుస్తకం దొరుకు చోటు: Amazon: Dr. Ambedkar's Ideology in The Digital Era https://a.co/d/9erV5My) -
అమర్ రచన "మూడు దారులు" పై.. కల్లూరి భాస్కరం సమీక్ష!
సహచర పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ తన నాలుగున్నర దశాబ్దాల అనుభవసారం రంగరించి రచించిన ‘మూడు దారులు - రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు’ అనే ఈ పుస్తకంలో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి. ‘రాజకీయాలు-ఒక సమాలోచన’ అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ రచనలో అమర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు-మొదట ఆంధ్రరాష్ట్రాన్ని, ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను - ఏకచ్చత్రంగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి, కాంగ్రెస్ ముఠాకలహాల గురించి, ఒకరినొకరు పడదోసుకుంటూ సాగించిన రాజకీయక్రీడ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి వివరించి ఈ తొలి అధ్యాయం ద్వారా ఈ పుస్తకానికి ఒక చారిత్రక ప్రతిపత్తిని సంతరించారు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయాన్ని ‘చరిత్రను తిరగ తోడటం దేనికి?’ అనే ప్రశ్నతో అమర్ ప్రారంభిస్తారు. ‘చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా, రావచ్చు కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది’ అంటూ ప్రారంభంలోనే ఈ పుస్తకంలోని థీమ్‌కి ఒక డెప్త్ తీసుకువచ్చారు, దీనిని చరిత్రగా చూపించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఒకే కాలంలో రాజకీయరంగ ప్రవేశం చేయడం, భిన్నమైన దారుల్లో వెళ్లడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశం ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ఈ విషయాల్లో ఎక్కడా రచయిత బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ కాలేదు. బేసిక్ ఫ్యాక్ట్స్‌పై, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలపై ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్‌ను డిస్టార్ట్ చేయడం గానీ, కప్పిపుచ్చడం గానీ చేయలేదని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ముగ్గురు నాయకులూ, వారు అనుసరించిన దారుల గురించి ప్రధానంగా చర్చించిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వైస్రాయి ఘట్టం చదువుతున్నప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఒక సినిమాకు సబ్జెక్టు అది. అమర్ ఈ పుస్తకంలో బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ అవలేదనడానికి ఇంకో ఉదాహరణ ఏం చెబుతానంటే, వైస్రాయ్‌తో ముడిపడిన ఈ మొత్తం ఉదంతంలో ఎన్టీఆర్ స్వయంకృతం కూడా చాలా ఉంది. రాజకీయంగా అనుభవం లేకపోవడం, చెప్పినా వినకపోవడం, మొండితనం వంటివి కూడా దీనికి కొంత దోహదం చేశాయి. ఆ సంగతినీ అమర్ ప్రస్తావించారు. ఆవిధంగా రెండువైపులా ఏం జరిగిందో చిత్రించారు. అలాగే లక్ష్మీపార్వతి జోక్యాన్నీ ఆయన దాచలేదు. ఆ తరువాత మీడియా! ఇందులో ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి, అల్లుళ్లతో సహా ఆయన కుటుంబ సభ్యుల పాత్ర, ఆయన అర్ధాంగి పాత్ర.. వీటన్నిటితో పాటు మీడియా కూడా ప్రధాన పాత్రధారి. ఎన్టీఆర్ అధికారచ్యుతికి సంబంధించిన మొత్తం ఉదంతంలో మీడియా పాత్ర గురించి, మీడియా వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం రావాలని! ప్రీ-తెలుగుదేశం, పోస్ట్-తెలుగుదేశం అనే డివిజన్‌తో తెలుగు మీడియా చరిత్ర రాయాలని నేనంటాను. నాదెండ్ల భాస్కరరావు చేసిన దానికి చంద్రబాబు చేసినది ఒకవిధంగా పొడిగింపే. మొత్తం మీద అమర్ ఈ పుస్తకంలో పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలనే అందించారు. ప్రత్యక్షసాక్షిగా తన దృక్కోణాన్ని కలుపుకుంటూ వాటిని కథనం చేశారు. చివరిగా జగన్ మోహన్ రెడ్డిగారి విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, ఇతరత్రా చర్యలు, విధానాల గురించి చెప్పారు. ఈ అధ్యాయంలో కూడా అమర్ ఫ్యాక్ట్స్‌తో రాజీపడలేదనే విశ్వసిస్తున్నాను. (ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు పుస్తక పరిచయ సభలో పాత్రికేయ ప్రముఖులు, రచయిత కల్లూరి భాస్కరం చేసిన సమీక్ష నుంచి ముఖ్య భాగాలు). ఇవి చదవండి: Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం -
కేంద్ర సాహిత్య అకాడెమికి ఘన గౌరవం!
అవును,మనం వింటున్నది నిజమే!ఈ ఉత్సవం పెద్ద చరిత్ర సృష్టించింది, రికార్డుల పంట పండించింది, భారతదేశానికి,కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు మునుపెన్నడు లేని పెద్ద ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. ఇది చిన్న ఉత్సవం కాదు, మహోత్సవం,సారస్వత మహాయజ్ఞం. ఈ మహాయగాన్ని నిర్వహించింది 'కేంద్ర సాహిత్య అకాడెమి'. దీనిని నడిపింది ఆ సంస్థ కార్యదర్శి కె.శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ పదహారణాల మన తెలుగువాడు. కృష్ణా తీరంవాడు, దివిసీమవాడు,కవిసీమవాడు. దశాబ్దాల కేంద్ర సాహిత్య అకాడెమి చరిత్రలో కార్యదర్శి హోదాను పొందిన మొట్టమొదటి తెలుగువాడు శ్రీనివాస్. అకాడెమి ప్రయాణంలో ఈ స్థాయిలో సాహిత్య మహోత్సవాలు జరగడం గొప్ప చరిత్ర. 'ప్రపంచ అతి పెద్ద సాహిత్య మహోత్సవం ' పేరుతో దిల్లీలో, కేంద్ర సాహిత్య అకాడెమి ప్రాంగణంలో,రవీంద్ర భవన్ లో ఈ మార్చి 11 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకూ వేడుకలు ఘనంగా జరిగాయి.పోయిన ఏడాది కూడా జరిగాయి. ఈసారి ప్రత్యేకత ఏంటంటే? 'ఐన్ స్టీన్ వరల్డ్ రికార్డ్స్', దుబాయ్, 'వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్',లండన్ నుంచి ఘనమైన గుర్తింపు లభించింది. కేంద్ర సాహిత్య అకాడెమి సంస్థకు,అధిపతి కె.శ్రీనివాస్‌కు కూడా విశేషమైన అభినందనలు అందాయి. ఒక్కరోజులోనే, అతిపెద్ద సంఖ్యలో, అనేక భాషలవారు వివిధమైన సారస్వతాన్ని వినిపించినందుకు 'వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ ', లండన్ గొప్ప రికార్డుగా నమోదు చేస్తూ సర్టిఫికెట్ పంపించింది. 1100 మంది ప్రతినిధులు 175 భాషలకు ప్రాతినిధ్యం వహిస్తూ,190 సెషన్స్ గా, వరుసగా 6రోజుల పాటు సారస్వత మహోత్సవంలో పాల్గొనడాన్ని అపూర్వమైన విశేషంగా అభివర్ణిస్తూ దుబాయ్ కి చెందిన ప్రతిష్ఠాత్మకమైన సంస్థ 'ఐన్ స్టీన్ వరల్డ్ రికార్డ్స్ ' ఈ ఉత్సవాన్ని ప్రపంచ స్థాయిలో అద్భుతమైన విషయంగా భావిస్తూ సర్టిఫికెట్స్ అందజేసింది.భాషా,సాహిత్య, సాంస్కృతిక ప్రేమికులకు గొప్ప ఆనందాన్నిచ్చే గొప్ప సందర్భం, సంరంభం మన దేశరాజధానిలో వెల్లివిరిసాయి. 'సామాజిక న్యాయం' అనే మాట ఈమధ్య మనం తరచుగా వింటున్నాం. సామాజిక న్యాయంతో పాటు సాహిత్యానికి కూడా ఈ మహోత్సవంలో గొప్ప న్యాయం జరిగింది. ప్రతి ఏటా జరుగుతోంది, ఈ ఏడు మరింత విశేషంగా జరిగింది.సాహిత్యంలోని విభిన్న ప్రక్రియలకు ప్రాతినిధ్యం కల్పించిన వేళ,ఆ యా రూపాలకు తత్ తుల్యమైన గౌరవం కూడా దక్కింది. దేశంలోని అనేక భాషల వాణి వినపడడమే కాక,లింగవివక్షకు తావులేకుండా అందరికీ సమ ప్రాతినిధ్యం లభించింది. కవితలు,కథలు,చిన్న కథలు, కళలు,సమీక్షలు,విమర్శలు,చర్చలు ఒకటేమిటి? ఈ ఆరురోజుల్లో ఎన్నో జరిగాయి. లబ్దప్రతిష్ఠులే కాక,మాన్యులు, సామాన్యులు,అతి సామాన్యులకు కూడా ఈ వేడుకలకు ఆహ్వానం అందింది. ఒక్కొక్క సభా వేదికకు ఒక్కొక్క మహనీయుని పేరు పెట్టి, ఆ మాననీయులకు నీరాజనం పలికారు. మహాకవి వాల్మీకి, వేదవ్యాసుడు,మీరాబాయి, కబీర్,శంకరదేవుడు,తులసీదాస్, తిరువాళ్వార్ వంటి మహానీయులను వేదికల ద్వారా తలచుకొని,తలపులలో నిలుపుకొని,నమస్కరించుకొనే సౌభాగ్యం కూడా ఈ వేదికల ద్వారా ప్రాప్తమైంది. కళలకు సాహిత్యం అవసరమా? మహిళాసాధికారికత, బాలసాహిత్యం,యువసాహితి, అనువాదం,అస్మిత,చదువరితనం, రచించే శక్తి,అభిరుచి, సమకాలీన సాహిత్య సరళులు, గిరిజన భాషా,సాహిత్య, సంస్కృతులు,నవల,నవలిక, నాట్యం,నాటకం, సారస్వత గమనంలో సవాళ్లు, భారతీయుల ఇంగ్లిష్ రచనా నిపుణత,ఈ -బుక్స్, ఆడియో బుక్స్, ప్రచురణకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కవిత్వంలో స్త్రీ, సాహిత్యం అందించే ఆనందం, ప్రేరణ,ప్రభావం, సరిహద్దుల అవతల భారతీయ సాహిత్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మన సారస్వత వారసత్వ వైభవం, విద్య అందించే సృజన, జనపదాలు, జానపదకథలు, కవిత్వ వ్యవసాయం, స్వాతంత్య్రానికి పూర్వం సాహిత్యం, భక్తి ఉద్యమ కవిత్వం, భావోద్వేగాలు, రచయితలతో ముఖాముఖీ, రామకథావిశేషాలు, మన ఘన సాంస్కృతిక వారసత్వం, మన మహాకావ్యాలు, మన తత్త్వ గ్రంథాలు, తాత్వికత,సైన్స్ ఫిక్షన్, సాహిత్యం సమకూర్చే విలువలు, ఆత్మకథలు,మీడియా, భిన్నత్వంలో ఏకత్వం, ఇతిహాసాలు,పురాణాలు, అణగారిన వర్గాల ఆలోచనా ధోరణులు,దళిత సాహిత్యం, వందేళ్ల భారత సాహిత్యం, భారతీయ భాషల సంరక్షణ, భిన్న స్వరాల్లో భారతీయ కవిత్వం, మౌఖిక సాహిత్యం, స్వాతంత్ర్యానంతర సాహిత్య సృష్టి... ఇలా ఎన్నో అంశాలను,రంగాలను స్పృశిస్తూ ఈ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదే వేదికలపై 'కేంద్ర సాహిత్య అకాడెమి -2023' అవార్డుల ప్రదానోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియలో 24 భాషీయులు పురస్కార ఘన గౌరవాన్ని అందుకున్నారు. అందులో మన తెలుగువారైన తల్లావఝల పతంజలిశాస్త్రి కూడా ఉండడం మనకు ముదావహం. సినిమా సాహిత్యంపై ప్రఖ్యాత ఉర్దూ కవి,రచయిత,గీతకారుడు గుల్జార్ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో మాటవిడుపుగా మధ్య మధ్యలో సాగిన నృత్య,నాటక, సంగీత రూపక ప్రదర్శనలు కొంగ్రొత్త విందులను చిందించాయి. ఈ ఉత్సవాలతో పాటు గతంలో సిమ్లాలో,భోపాల్ లో నిర్వహించిన ' ఉన్మేష ఉత్సవాలు' రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఆరు రోజుల ఉత్సవాలకు ఆహ్వానించిన ప్రతిఒక్కరికీ అన్ని ఖర్చులు,భోజన,వసతి,పారితోషిక వగైరాలన్నింటినీ అకాడెమి భరించింది. ఎన్నో వ్యయప్రయాసలతో నిర్వహించిన ఈ సాహిత్య మహోత్సవం అపూర్వ పర్వంగా అందగించింది. భారతీయ భాషా,సాహిత్య, సాంస్కృతులకు పెద్ద దివిటీలు పట్టిన శుభఘడియలు ఈ ఆరు దినములు. ప్రతి ఏటా ఇలాగే జరిగితే మన సారస్వత శోభ ప్రభాసమానమవుతుంది. 'ఆజాదీ కా అమృతోత్సవ్' లో భాగంగా జరిగిన ఉన్మేష ఉత్సవాలు కూడా ఆగకుండా జరగాలి. ఇంతటి చారిత్రక సభల ప్రభలు కట్టిన కేంద్ర సాహిత్య అకాడెమికి వీరతాళ్లు వేద్దాం. -రచయిత మా శర్మ, సీనియర్ జర్నలిస్టు (చదవండి: తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!) -
‘సప్తపర్ణ’ శోభితం... సురభి ‘భక్త ప్రహ్లాద’ నాటకం
జంట నగరాలలోని నాటక కళాభిమానులకు మరోసారి కన్నుల విందయింది. ప్రసిద్ధ సాంస్కృతిక సభాంగణం ‘సప్తపర్ణి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆరుబయలు ప్రాంగణంలో రెండురోజుల పాటు ‘సురభి’ వారి నాటకాల ప్రత్యేక ప్రదర్శనలు ఆనందాన్ని పంచాయి. శనివారం ‘మాయా బజార్’ నాటకం ప్రదర్శించగా, ఆదివారం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ‘భక్త ప్రహ్లాద’ నాటక ప్రదర్శన రెండుగంటల పైచిలుకు పాటు ఆద్యంతం రసవత్తరంగా నడిచింది. భాగవత పురాణ కథే అయినప్పటికీ, సంభాషణల్లో కొత్త తరానికి సులభంగా అర్థమయ్యే సమకాలీనతను జొప్పించడం గమనార్హం. 1932లో రిలీజైన తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’కు సైతం ఈ నాటకమే ఆధారం కావడం విశేషం. కాగా, తాజా నాటక ప్రదర్శనలో రోజారమణి నటించిన ఏవీఎం వారి పాపులర్ ‘భక్త ప్రహ్లాద’ సినిమాలోని ‘నారాయణ మంత్రం...’, ‘జీవము నీవే కదా...’ లాంటి పాటలను సైతం జనాకర్షకంగా సందర్భోచితంగా వాడుకోవడం గమనార్హం. నటీనటులు, సంగీత, లైటింగ్ సహకారం అంతా చక్కగా అమరిన ఈ నాటకంలో ఆరేళ్ళ పసిపాప ప్రహ్లాదుడిగా నటిస్తూ, పాటలు, భాగవత పద్యాలను పాడడం అందరినీ మరింత ఆకర్షించింది. గాలిలో తేలుతూ వచ్చే సుదర్శన చక్రం, పామును గాలిలో ఎగురుతూ వచ్చి గద్ద తన్నుకుపోవడం, మొసలిపై ప్రహ్లాదుడు, స్టేజీ మీద గాలిలోకి లేచే మంటలు లాంటి ‘సురభి’ వారి ట్రిక్కులు మంత్రముగ్ధుల్ని చేశాయి. చిన్న పిల్లలతో పాటు పెద్దల్ని సైతం పిల్లల్ని చేసి, పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయించాయి. ఏకంగా 150 ఏళ్ళ పై చిలుకు చరిత్ర కలిగిన ‘సురభి’ నాటక వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆరో తరానికి చెందిన ఆర్. జయచంద్రవర్మ సారథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 52 మంది దాకా నటీనటులు, సంగీత వాద్యకళాకారులు కలసి ఈ ప్రదర్శనలు చేయడం విశేషం. కిక్కిరిసిన ఆరుబయలు ప్రాంగణం, గోడ ఎక్కి కూర్చొని మరీ చూస్తున్న నాటక అభిమానులు, ఆద్యంతం వారి చప్పట్లు... వేదికపై ప్రదర్శన ఇస్తున్న నటీనటులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కరోనా సమయంలో తమను ఎంతో ఆదుకొని, ప్రేక్షకులకూ – తమకూ వారధిగా నిలిచి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసిన రంగస్థల పోషకురాలు – ‘సప్తపర్ణి’ నిర్వాహకురాలు అనూరాధను ‘సురభి’ కళాకారులు ప్రత్యేకంగా సత్కరించి, తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఎంబీఏ, సీఏ లాంటి పెద్ద చదువులు చదివిన పెద్దల నుంచి స్కూలు పిల్లల వరకు అందరూ ఈ రెండు రోజుల నాటక ప్రదర్శనల్లో నటించడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది తెలుగు వారు కాపాడుకోవాల్సిన ప్రత్యేకమైన ‘సురభి’ కుటుంబ నాటక వారసత్వమని ప్రదర్శనలకు హాజరైన పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. -రెంటాల జయదేవ -
మూడు దారులు.. వేరు.. వేరే!
'ముగ్గురు ముఖ్యమంత్రుల్ని దగ్గరగా చూసే అవకాశం చాలా తక్కువ మందికే ఉంటుంది. అలా చూడాలంటే అయితే రాజకీయ నాయకుడైనా అయి ఉండాలి లేకపోతే పాత్రికేయుడైనా అయి ఉండాలి. దేవులపల్లి అమర్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న పాత్రికేయుడు కావడంతో రాజకీయాల్లో దిగ్గజాలనదగిన ముగ్గురు నాయకులను అతి సమీపంనుంచి చూసి, వారి నడతను, వ్యవహార శైలినీ, రాజకీయ పరిణతిని అంచనా వేసే అవకాశం దొరికింది.' రాసింది ముగ్గురు నేతల గురించే అయినా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటునుంచి మొదలుపెట్టి, ఆంధ్రప్రదేశ్ అవతరణ మీదుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన వరకూ తెలుగునాట చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను రచయిత విపులంగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాలపట్ల ఆసక్తి కనబరిచే ఈ తరానికి, ముఖ్యంగా యువతరానికి ఈ విషయాలన్నీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. (ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వం కాంగ్రెస్‌లో వేళ్లూనుకుపోయిన ముఠా సంస్కృతి కారణంగా కూలిపోయిందన్న సంగతి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ఇలాంటి విస్తుగొలిపే అనేక రాజకీయ పరిణామాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది) అప్పటి పరిణామాల గురించి ఈనాటి యువతరానికి జరిగింది జరిగినట్లు చెప్పేందుకు చేసిన ఓ ప్రయత్నమే ఈ పుస్తక రచన అని రచయితే స్వయంగా పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. వైఎస్ఆర్, చంద్రబాబుల గురించి విశ్లేషించే క్రమంలో వారిద్దరినీ రచయిత ఒక తాసులో ఉంచి తూచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు స్నేహితులుగా, తర్వాత రాజకీయ విరోధులుగా మారిన ఇద్దరు అగ్రశ్రేణి రాజకీయ నాయకులను ఇలా తూచి తీర్పు చెప్పడం తప్పేమీ కాదు. పైగా అప్పట్లో జరిగిన అనేక రాజకీయ పరిణామాలకు రచయిత సాక్షిగా ఉన్నందువల్ల సాధికారికంగా ఇలా బేరీజు వేసే అర్హత ఆయనకు ఉంది. ‘అధికారం కోసం పార్టీ మారి, అందలం కోసం అయినవాళ్లకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చి తృటిలో తప్పిపోయినా అదే పార్టీలో కొనసాగిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డికు ఏ విషయంలోనూ పోలిక లేదు’ అంటారు రచయిత. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు జగన్ చేసిన ప్రయత్నాలనూ, అధిష్ఠానం తృణీకార ధోరణిని భరించలేక వేరు పార్టీ పెట్టిన వైనాన్ని కూడా పుస్తకంలో విశదంగా పొందుపరిచారు. పదహారు నెలలు జైలులో ఉండి, బయటకు వచ్చి ప్రజాభిమానంతో ఆయన ముఖ్యమంత్రి అయిన క్రమాన్ని ఆసక్తికరంగా రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన చంద్రబాబు మీద రచయిత విమర్శనాస్త్రాలు సంధించినా వాటన్నింటినీ సహేతుకంగా, సాధికారికంగా విశ్లేషించారు. ముఖ్యంగా 1984లో నాదెండ్ల భాస్కరరావు కుట్ర, 1995లో చంద్రబాబు వెన్నుపోటు ఉదంతాలను సరిపోలుస్తూ, ఈ రెండూ సంఘటనలూ ఒకే రీతిలో జరిగినా నాదెండ్ల తిరుగుబాటు జరిగినప్పుడు ప్రజల నుంచీ, ప్రజాస్వామ్య పక్షాలనుంచీ, మీడియా నుంచీ ఎన్టీఆర్‌కు లభించిన మద్దతు 1995లో చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే లభించలేదంటారు. వెన్నుపోటు సంఘటనను వివరించేందుకు ‘ఆ తొమ్మిది రోజుల్లో ఏం జరిగింది?’ అంటూ రచయిత ఒక ప్రత్యేక అధ్యాయాన్నే కేటాయించారు. తొమ్మిది రోజులపాటు రోజువారీ చోటు చేసుకున్న పరిణామాల గురించి చదువుతున్నప్పుడు రచయిత మరోసారి పాత్రికేయుడిగా పరకాయప్రవేశం చేశారనిపిస్తుంది. అన్నీ తనవల్లనే జరిగాయని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారన్న రచయిత.. అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతి చేసింది తానేనని, ప్రధాని అయ్యే అవకాశం తనకు రెండుసార్లు వచ్చిందనీ, తానే ఒప్పుకోలేదని చంద్రబాబు చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. ఈ రెండూ అబద్ధాలేనంటూ తగిన సాక్ష్యాలతో నిరూపించే ప్రయత్నం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలననూ సాధికారికంగా విశ్లేషించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు విషయంలో జగన్ చిత్తశుద్ధిని, అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ, అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్ పాలనను వివరించడానికి రచయిత ఒక ప్రత్యేక చాప్టర్‌ను కేటాయించారు. ఫోటోల ఎంపికలో రచయితకు ఫుల్ మార్కులు పడతాయి. ఆంధ్ర రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల ఫోటోలు ప్రచురించడం మెచ్చుకోదగినది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన వైఎస్ఆర్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఆకట్టుకుంటుంది. రాజకీయాల్లో అవినీతి, అక్రమాలపై, నీతిబాహ్యమైన చర్యలపై రచయితకు గల ధర్మాగ్రహం ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది. తప్పయితే తప్పనీ, ఒప్పయితే ఒప్పనీ బల్లగుద్ది చెబుతూ సాగే రచయిత శైలి ఆకట్టుకుంటుంది. ఇప్పటి తరానికే కాదు, భావితరాలకు కూడా తెలుగు రాజకీయ పరిణామాలపై ఈ పుస్తకం ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. – బీ.ఎస్. రామకృష్ణ (బీ.ఎస్.ఆర్) ఇవి చదవండి: భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు' -
తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!
తెలుగు తల్లీ, అదుగోనమ్మా త్యాగయ్య నాదోపాసన రవళిస్తున్నది నీకు భూపాలమై! కర్ణాటక సంగీతం ముమ్మూర్తుల్లో ఒకరైన శ్రీమాన్ త్యాగరాజు 177వ ఆరాధనోత్సవాలు తిరవైయ్యారులో ఘనంగా జరిగాయి. "విదులకు మ్రొక్కెద సంగీత కోవిదులకు మ్రొక్కెద" అంటూ నాదోపాసనతో నిధికన్నా రాముని సన్నిధి చాల సుఖమని అనుకుని ఆపై "ఏ నోము ఫలమో నీ నామామృత / పానము అను సోపానము దొరికెను" అని తెలుసుకుని జీవించారు; నాదబ్రహ్మమై జీవిస్తున్నారు త్యాగరాజు. వారు పాడింది మనం వినలేకపోయాం. వారి సంగీతం సుఖమైంది మనకు చదువయింది. "సామగాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ అమృతవర్షిణి రాగంలో రూపక తాళంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక కీర్తన చేశారు. కర్ణాటకసంగీతం త్యాగయ్య వల్ల పరిపుష్టమైంది. తెలుగుకు గర్వకారణమైంది. "చల్లని భక్తి", "స్మరణే సుఖము", "కులములెల్ల కడతేఱినట్లు", "పరమానందమనే కమలముపై" వంటివి అన్న త్యాగరాజు గొప్పకవి కూడా. వారు రాసింది చదవగలిగే భాగ్యం మనకు అందింది. సంగీతం కోసమే అన్నా వారి నోటి వెంట గొప్ప కవిత్వమూ పలికింది. "భావాభావ మహానుభావ శ్రీరామచంద్ర భావజనక నా భావము తెలిసియు..." "తన తలుపు తీసినట్టి ఒకరింటికి తాఁ గుక్కల తోలు రీతిగాదో" "తవిటికి రంకాడబోతె కూటి తపిల కోతి కొంపోయినట్టుగాదో" "రాగము తాళము రక్తి భక్తి జ్ఞాన యోగము మఱి యనురాగము లేని భాగవతు లుదర శయనులేగాని..." "మనసు స్వాధీనమైన యా ఘనునికి మఱి మంత్రతంత్రములేల" "యజ్ఞాదులు సుఖమను వారికి సము లజ్ఞానులు కలరా ఓ మనసా" "చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర మెలఁగుచుండే బిరుదు వహించిన సీతారామ..." "ఏఱు నిండి పాఱిన పాత్రకు తగు నీరు వచ్చుగాని" "లేమి దెల్ప పెద్దలెవరు లేరో" (ఇది ఇవాళ్టి తెలుగు కవిత్వానికి, భాషకు, సమాజానికి ఈ మాట సరిగ్గా పొసుగుతుంది) "శాంతము లేక సౌఖ్యము లేదు" ఇవి, ఇలాంటివి ఇంకొన్నీ అన్న వాగ్గాన (వాగ్గేయ) కారులు త్యాగరాజు. రాముణ్ణి "సప్తస్వర నాదాచల దీపం" గా పరిగణించి ఆ వెలుగులో "సంగీత శాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనసా" అని అన్న త్యాగరాజు తెలుగుభాషకు సంగీతం పరంగానే కాదు కవిత్వం పరంగానూ వరవరం. "సామ గాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ మంగళంపల్లి బాలమురళికృష్ణ నుతిస్తే తెలుగువాళ్లం మనం "కవన సాగర పూర్ణసోమ స్వామి త్యాగరాజ నామ" అంటూ కూడా త్యాగరాజును స్తుతిద్దాం. --రోచిష్మాన్, 9444012279 (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
'మూడుదారులు': రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు!
నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. కాకపొతే, ఈ మువ్వురిలో చంద్రబాబు నాయుడిది రాజకీయంగా భిన్నమైన మార్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలభయ్ ఏళ్ళ చరిత్ర ఈ ముగ్గురితో ముడిపడి వుంది. ఈ చారిత్రక పరిణామాలను ఒక సీనియర్ జర్నలిస్టుగా దగ్గరనుంచి పరిశీలించగలిగిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని దేవులపల్లి అమర్, తన అనుభవ సారాన్ని తాను రాసిన మూడు దారులు అనే ఈ రెండువందల పేజీల గ్రంథంలో సవిస్తరంగా ప్రస్తావించారు. చంద్రబాబు అనగానే గుర్తు వచ్చే మరో ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ. రామారావు. ఆ పేరు వినగానే తలపుకు వచ్చే మరో పదం వైస్రాయ్ ఎపిసోడ్. ఇప్పుడు మూడు, నాలుగు పదుల వయసులో వున్నవారికి గుర్తు వుండే అవకాశం లేదు కానీ, కొంత పాత తరం వారికి తెలుసు. విచిత్రం ఏమిటంటే వారికీ పూర్తిగా తెలియదు. ఆ కాలంలో చురుగ్గా పనిచేసిన కొందరు జర్నలిస్టులు అప్పటి రాజకీయ పరిణామాలను నిశితంగా చూసిన వారే అయినా, ఇంకా ఏదో కొంత సమాచారం మరుగున ఉందేమో అనే సందేహం, వారు ఈ అంశంపై రాసిన రచనలు, వార్తలు, పుస్తకాలు చదివినప్పుడు పాఠకులకు కలగడంలో ఆశ్చర్యం లేదు. కారణాన్ని కూడా అమర్ తన గ్రంథంలో ప్రస్తావించారు. ఆయన అప్పట్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్రప్రభలో రిపోర్టింగ్ బ్యూరో ఇంచార్జ్ గా వున్నారు. ‘మరి, అప్పట్లో ఇటువంటి (ఈ గ్రంథంలో పేర్కొన్న) విషయాలను మీరెందుకు రిపోర్ట్ చేయలేదని కొందరు మితృలు నన్ను ప్రశ్నించారు. వాళ్ళు అలా అడగడం సబబే. ఇలా అడిగిన వారిలో మీడియా మితృలు కూడా వున్నారు. పత్రికా స్వేచ్ఛ నేతి బీరకాయ చందం అని వారికి తెలియనిది కాదు. పత్రిక పాలసీని సంపాదకులు కాకుండా యజమానులే నిర్ణయించే కాలానికి వచ్చాక జరిగిన ఉదంతం ఇది. అప్పుడు నేను పనిచేస్తున్న పత్రిక యజమాని, చంద్రబాబు నాయుడు పక్షం ఎంచుకున్నారు. ఇక మా ఎడిటర్ ఆయన్ని మించి బాబు భక్తి ప్రదర్శించేవారు.’ అంటూ రాసుకొస్తూ అమర్ ఆ రోజుల్లో జరిగిన డిస్టిలరీ అనుమతి ఉదంతాన్ని పేర్కొన్నారు. ‘బాబుకు అనుకూలంగా రాసిన ఆ వార్తను ఈనాడు పత్రిక మాత్రమే ప్రముఖంగా ప్రచురించడం, ఆ వార్త మా పత్రికలో మిస్ అవడం తట్టుకోలేని మా ఎడిటర్, మా బ్యూరోను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. జరిగిన పొరబాటును దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా మర్నాడు మొదటి పేజీలో, సుదీర్ఘంనైన సంపాదకీయం రాసి, చంద్రబాబు పట్ల తన విధేయతను చాటుకున్నారు. అయితే సంపాదకుడి వైఖరికి నిరసనగా ఉద్యోగాన్ని వదిలి వేయవచ్చు కదా అంటే, నిజమే చేయవచ్చు. కానీ అప్పట్లో వెంటనే మరో చోట ఉద్యోగం దొరికే అవకాశం లేక ఆ సాహసం చేయలేదు. చాలామంది జర్నలిస్టుల పరిస్థితి అదే. బయటకు చెప్పుకోలేక పోవచ్చు. ఇప్పుడయినా ఆ వివరాలన్నీ రాసే అవకాశం వచ్చింది. వైస్రాయ్ సంఘటనలో నిజానిజాలు గురించి నేటి యువతరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సవివరంగా రాయడం జరిగింది’ అని అమర్ ఇచ్చిన వివరణ. మూడు దారుల్లో ఇదొకటి. మిగిలినవి రెండూ వై.ఎస్. ఆర్., వై ఎస్. జగన్ ఎంచుకున్న దారులు. ఈ దారులపై మీడియా కావాలని వికృత ధోరణితో వార్తలు వండి వార్చింది అనే ఆరోపణలకు సంబంధించి కొన్ని దృష్టాంతాలను అమర్ ఈ గ్రంథంలో పేర్కొన్నారు. నాటి సంఘటనలకు సాక్షీభూతులైన అనేకమందిని కలుసుకుని, చంద్రబాబు అనుకూల, ప్రతికూల జర్నలిస్టులు, రచయితలు రాసిన పుస్తకాలలోని అంశాలను కూడా ఆయన ఉదహరించి, తన రచనకు సాధికారతను ఒనగూర్చే ప్రయత్నం చేశారు. తాను స్వయంగా గమనించిన విషయాలతో పాటు, తనకు తెలియ వచ్చిన మరి కొన్ని అంశాలను ధ్రువపరచుకునేందుకు అమర్ చాలా కసరత్తు చేసినట్టు ఈ పుస్తకం చదివిన వారికి తెలుస్తుంది. కన్నవీ, విన్నవీ విశేషాలతో కూడిన గ్రంధరచన కాబట్టి కొంత వివాదాస్పదం అయ్యే అవకాశాలు వున్నాయి. నాటి సంఘటనలకు నేనూ ఒక ప్రత్యక్ష సాక్షిని కనుక పుస్తకం చదువుతున్నప్పుడు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంగతులు మూగ మనసులు సినిమాలోలా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాఠకులను ఇది ఆకర్షిస్తుంది. ఈ పుస్తకాన్ని ముందు అమర్ ఆంగ్లంలో DECCAN POWER PLAY అనే పేరుతొ ప్రచురించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. తెలుగు అనువాద రచన మూడు దారులు పుస్తకావిష్కరణ కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్లో మరోమారు జరగనుంది. తోకటపా: విజయవాడ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగ ఉవాచ: ‘దేవులపల్లి అమర్ కు వై.ఎస్. రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ. జగన్ మోహన్ రెడ్డి అంటే పిచ్చి. ఇక ఈ పుస్తకంలో చంద్రబాబు గురించి ఏమి రాసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు’. భండారు శ్రీనివాస్ రావు, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు) -
కళాత్మక భావనలు విరిసిన వేదిక!
హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్, వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరపు అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుక భావ్-2024 బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో వైభవంగా జరిగింది. దిగ్గజ కళాకారులచే కదిలించే ప్రదర్శనలు, పౌరాణిక పాత్రల ఆధారంగా రచించిన కళారూపకాలు, రామాయణ భావోద్వేగ చిత్రణలు, అంతరించి పోతున్న కళారూపాల పునరుజ్జీవనం మొదలైన అంశాలతో జరిగిన ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి అత్యుత్తమ సాంస్కృతిక ప్రతిభావంతులు, వర్ధమాన కళాకారులు హాజరయ్యారు. మానవతావాది, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వం, ప్రేరణతో జనవరి 25 నుండి 28 వరకు జరిగిన ఈ కార్యక్రమం సంస్కృతి, కళలతో ఆధ్యాత్మికతను మేళవించి సరికొత్త ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. కళాకారుడి భావోద్వేగ స్థితి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా, “కళాకారులు భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రేక్షకులను సంతోషపెట్టే ప్రయత్నంలో కళాకారులు తరచుగా తమను తామే మరచిపోతారు. పాత్రలతో మమేకమై తమ అంతరంగాన్ని, తమ సహజ స్వభావాన్ని సైతం గమనించలేరు. పైగా మనకు ఒకటి కాదు, కోపం, ధైర్యం, దుఃఖం, విరహం – ఇలా తొమ్మిది రకాలైన భావోద్వేగాలు (నవ రసాలు) ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం కావాలంటే ఈ భావాలన్నిటినీ అధిగమించి వెళ్లాలి. వీటికి ఆవలగా వెళ్లగలిగినప్పుడే మనకు బలం వస్తుంది.” అని ప్రబోధించారు. ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాలకు చెందిన సంగీత, నృత్య కళాకారులు హాజరయ్యారు. వర్ధమాన కళాకారులను, ఇందులో భాగంగా 61 అంశాలపై 153మంది కళాకారులతో పరస్పర చర్చలు, ప్రదర్శనలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, బృందచర్చలు మొదలైనవి ఏర్పాటు చేశారు. శతాబ్దాల క్రిందటి సంప్రదాయ వర్కరీ యాత్ర, శేషులత కోసురు మొదలైన కర్ణాటక సంగీత ప్రముఖులచే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఈ భావ్-2024 లో భాగంగా నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశం గురించి వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ డైరెక్టర్ శ్రీవిద్య యశస్వి మాట్లాడుతూ.. “ఇటువంటి ప్రదర్శనలలో మనం ఆ ప్రాచీన కాలానికి వెళ్ళిపోయి చూస్తాం. కళాకారుడు కేవలం దైవానికి సమర్పణగా మాత్రమే ప్రదర్శన ఇస్తాడు. ఇక చూసేవారు ఆ అనుభవానికి ప్రేక్షకులుగా ఉంటారు” అని పేర్కొన్నారు. “ఉదాహరణకు, అయోధ్యలోని దేవాలయాల నుండి 7000 సంవత్సరాలకు పైగా తరతరాలుగా సంప్రదాయబద్ధంగా నాట్యం చేస్తున్న కళాకారులను మేము ఆహ్వానించాము. వారి కళానిబద్ధత, అనుభవ సారాంశం ఇక్కడ జరుగుతున్న అన్ని ప్రదర్శనలలోనూ మనం చూడవచ్చు.” అని ఆమె పేర్కొన్నారు. కళారూపాలకు తమ జీవితాలను అంకితం చేసి, వాటిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన ప్రముఖ కళాకారులకు కళాసారథి అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలలో ఈలపాటకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డా. కొమరవోలు శివప్రసాద్, కేరళకు చెందిన డా. కళామండలం సరస్వతి, మొదలైనవారు ఉన్నారు. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యుడు, ఈలపాట మాంత్రికునిగా, ఆంధ్రకోకిలగా పేరొందిన డా. కొమరవోలు శివప్రసాద్ మాట్లాడుతూ.. ''కళా సారథి అవార్డు అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను కానీ ఈ కళాసారథి అవార్డు దివ్యత్వంతో కూడినది. పవిత్రమైన ఈ ఆశ్రమ వాతావరణంలో ఎక్కడ చూసినా చాలా కష్టపడి పనిచేసిన కళాకారులు కనిపిస్తున్నారు. 93 ఏళ్ల వయస్సు ఉన్న కళాకారులు సైతం ఉన్నారు. వారిని కలుసుకోగలగడం, వారి ఆశీస్సులు తీసుకోవడం ఒక అందమైన అనుభవం." అని పేర్కొన్నారు. భావ్-2024 సదస్సులో తన అనుభవాన్ని శేషులత కోసూరు పంచుకున్నారు, తనకు సంగీతమే గొప్ప సాంత్వన చేకూరుస్తుందని తెలిపారు. ఇతరుల అనుభవాలను తెలుసుకునేందుకు గొప్ప అవకాశాన్నిచ్చిందని ప్రముఖ వైణికుడు ఫణి నారాయణ పేర్కొన్నారు. ఇలాంటికార్యక్రమాలు ప్రతీ ఏటా జరగాలన్నారు. సంగీతకారులకు భావ్ అనేది చాలా సముచితమైన గౌరవం అని ఈమని శంకరశాస్త్రిగారి కుమార్తె ఈమని కళ్యాణి పేర్కొన్నారు. భానుమతీ నరసింహన్ రచించిన ‘సీత’ పుస్తకం ఆధారంగా నృత్యరూపకాన్ని ప్రదర్శించిన ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి క్రాంతి నారాయణ్, వర్ధమాన నాట్య కళాకారిణి వనజా ఉదయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్తాద్ ఫజల్ ఖురేషీతో పండిట్ కాళీనాథ్ మిశ్రా తబలా వాద్య కచేరీ, కేరళకు చెందిన ఇర్రంగాపురం బాబు చెండ వాద్యం, కథక్ కేంద్ర చైర్పర్సన్ ఉమా డోగ్రా ప్రదర్శించిన ‘శబరి’ నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడు తరాలకు చెందిన కథక్ నృత్య కళాకారిణులు పద్మాశర్మ, గౌరీ, తారిణి తమ అభినయాన్ని ఈ వేదికపై లయబద్ధంగా ప్రదర్శించారు. దృష్టిలోపం, ప్రత్యేక అవసరాలు కలిగిన కళాకారులు రంగ్ గంధ్ పేరిట ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవి చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు! -
శిష్టమైన, విశిష్టమైన కవిత్వ ఆవిష్కరణ వేటూరి అభివ్యక్తి
అత్యంత ప్రతిభావంతమైన కవి వేటూరి సుందరరామ్మూర్తి. తెలుగు సినిమా పాటలో కావ్య కవిత్వాన్ని పండించారు వేటూరి. తెలుగు సినిమా పాటల్లో వేటూరి రాసి పెట్టినంత గొప్ప కవిత్వం మరొకరు రాయలేదు. వేటూరి కాలానికి తెలుగు సినిమాలో సముద్రాల, మల్లాది రామకృష్ణశాస్త్రి, పింగళి, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, ఆత్రేయ, దాశరథి, నారాయణ రెడ్డి వంటి గొప్పకవులున్నారు. కానీ సినిమా పాటకు సంబంధించినంత వరకూ వేటూరి అందరికన్నా గొప్పకవి. ఇప్పటికీ వేటూరి అంత గొప్పకవి తెలుగు సినిమాలో రాలేదు. మొత్తం దక్షిణాది సినిమాలో గొప్పకవి తమిళ్ష్ కణ్ణదాసన్. అంత కణ్ణదాసన్‌ను మరిపించగలిగింది వేటూరి మాత్రమే. వేటూరి రాసిన "మానసవీణ మధుగీతం..." కణ్ణదాసన్ కూడా రాయలేరేమో?తొలిరోజుల్లో పంతులమ్మ చిత్రంలో వేటూరి రాసిన "మానస వీణా మధు గీతం" పాట నుంచీ ఆయన చేసిన కవిత్వ ఆవిష్కరణ ప్రశస్తమైంది. "కురిసే దాకా అనుకోలేదు శ్రావణ మేఘమని, తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని" అని ఆయనన్నది అంతకు ముందు తెలుగు సినిమాకు లేని వన్నె. అడవి రాముడు సినిమాలో "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" పాట సీసపద్యం. ఆ పాటలో పైట లేని ఆమెతో "నా పాట నీ పైట కావాలి" అన్నారు వేటూరి. ఆ సినిమాలోని "కుహు కుహు కోయిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి..." పదాల పొందికలోనూ, భావుకతలోనూ ఎంతో బావుండే పాట. మల్లెపూవు సినిమాలో వేటూరి రాసిన "ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో" పాటా, ఆ పాటలో వేశ్యల దుస్థితిపై "ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో/ ఏ ఖర్మం ఈ గాయం చేసిందో" అని అన్నదీ వేటూరి మాత్రమే చెయ్యగలిగింది. ఇలాంటి సందర్భానికి మానవుడు దానవుడు సినిమాలో నారాయణ రెడ్డి రాసిన పాట ఈ పాటంత సాంద్రంగానూ, ఇంత పదునుగానూ, గొప్పగానూ లేదు. ఈ సందర్భానికి ముందుగా ప్యాసా హిందీ సినిమాలో సాహిర్ లూధియాన్వీ రచన "ఏ కూచే ఏ నీలామ్ ఘర్ దిల్ కషీకే" వచ్చింది. దానికన్నా భావం, వాడి, శైలి, శయ్యల పరంగా వేటూరి రచనే గొప్పది. ఝుమ్మంది నాదం సై అంది పాదం" పాట తొలి రోజుల్లోనే వేటూరి గొప్పకవి అవడానికి నిదర్శనమైంది. ఈ పాట సందర్భంలోనూ హిందీ సినిమా సర్గమ్ పాట కన్నా వేటూరి రచనే మేలైంది. "శారదా వీణా రాగచంద్రికా పులకిత శారద రాత్రము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము" అని అనడం సినిమా పాటలోనే కాదు మొత్తం తెలుగు సాహిత్యంలోనూ మహోన్నతమే."తత్త్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము" అని అన్నప్పుడూ "అద్వైత సిద్ధికి అమరత్వలబ్దికి గానమె సోపానము" అనీ అన్నప్పుడు త్యాగరాజును వేటూరి ఔపోసన పట్టారని తెలుస్తోంది. వేటూరిలో అన్నమయ్య పూనడం కూడా జరిగింది. అందువల్లే "జానపదానికి జ్ఞాన పథం" అనీ, "ఏడు స్వరాలలే ఏడు కొండలై" అనీ ఆయన రాయగలిగారు. "కైలాసాన కార్తీకాన శివరూపం / ప్రమిదేలేని ప్రమాదా లోక హిమ దీపం" అని వేటూరి అన్నది మనం మరో కవి ద్వారా వినంది. సాగర సంగమం సినిమాలో "ఓం నమశ్శివాయ" పాటలోని సాహిత్యం న భూతో న భవిష్యతి. భావుకత, కల్పనా శక్తి , పద కూర్పుల పరంగా అది ఒక మహోన్నతమైన రచన. ఈ పాటలో "నీ మౌనమే దశోపనిషత్తులై ఇల వెలయ" అన్న వాక్యం వేయి కావ్యాల పెట్టు. ప్రస్థానత్రయంలోని ఉపనిషత్తులు పదే. ఆ సత్యాన్నీ, మౌనమే వేదాంతం అన్నదాన్నీ అద్భుతంగా మనకు అందించారు వేటూరి. "గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై" అనడం రచనా సంవిధానంలో వేటూరి మహోన్నతుడని నిరూపిస్తోంది. ఇక్కడ ఈశ్వరుడి సంకల్పం అంటే ఈ సృష్టి - దీనికి గజముఖ,షణ్ముఖ, ప్రమధ గణాలు ఋత్విజ వరులు (అంటే యజ్ఞం చేసే ఋత్విక్కులలో శ్రేష్ఠమైన వాళ్లు) అయ్యారు" అని అన్నారు. ఇక్కడ ఋత్విజ వరులు అన్న పదం వాడడం వల్ల ఈశ్వర సంకల్పం ఒక యజ్ఞం అని యజ్ఞం అన్న పదం వాడకుండా చెప్పారు వేటూరి. ఇది మహాకవుల లక్షణం. వేటూరి ఒక మహాకవి. "శంకరా నాద శరీరా పరా" పాటలో ఆయన వాడిన సంస్కృతం తెలుగు సినిమా పాటకు జిలుగు. వేటూరికి ముందు మల్లాది రామకృష్ణ శాస్త్రి సంస్కృతాన్ని తెలుగు సినిమా పాటలో చక్కగా వాడారు. వేటూరి సంస్కృతాన్ని చిక్కగానూ వాడారు. సప్తపది చిత్రంలో "అఖిలాండేశ్వరి..." పాట పార్వతీ, లక్ష్మీ, సరస్వతీ స్తోత్రంగా పూర్తి సంస్కృతంలో అద్భుతంగా రాశారు వేటూరి. తన పాటల్లో వేటూరి ఎన్నో మంచి సమాసాల్ని, అలంకారాల్ని, కవి సమయాల్ని అలవోకగా ప్రయోగించారు. "చినుకులా రాలి నదులుగా సాగి" పాట ప్రేమ గీతాలలో ఒక ఆణిముత్యం. "ఏ వసంతమిది ఎవరి సొంతమిది?" అని వేటూరి కవిత మాత్రమే అడగగలదు. "ఈ దుర్యోధన, దుశ్శాసన..." పాటకు సాటి రాగల పాట మన దేశంలో మరొకటి ఉంటుందా? "ఏ కులమూ నీదంటే గోకులము నవ్వింది / మాధవుడు, యాదవుడు మా కులమే లెమ్మంది" ఇలా రాయడానికి ఎంతో గరిమ ఉండాలి. ఆది శంకరాచార్య, కాళిదాసు, కణ్ణదాసన్లలో మెరిసే పద పురోగతి (Word-proggression) వేటూరిలో ఉంటుంది. తమిళ్ష్‌లో కణ్ణదాసన్ రాశాక అంతకన్నా గొప్పగా తెలుగులో ఒక్క వేటూరి మాత్రమే రాశారు. వేటూరికి ముందు కణ్ణదాసన్ పాటలు రాసిన సందర్భాలకు తెలుగులో రాసిన కవులున్నారు. వాళ్లు కణ్ణదాసన్ స్థాయిని అందుకో లేకపోయారు. వేటూరి మాత్రమే కణ్ణదాసన్ రాసిన సందర్భానికి తెలుగులో ఆయన కన్నా గొప్పగా రాయగలిగారు. అమావాస్య చంద్రుడు సినిమాలో కణ్ణదాసన్ "అందమే అందమూ దేవత/ వేయి కవులు రాసే కావ్యము" అని రాస్తే ఆ సందర్భానికి వేటూరి "కళకే కళ ఈ అందము, ఏ కవీ రాయని కావ్యము" అని రాశారు. ఇలా ఆ పాటలో ప్రతిచోటా వేటూరి రచనే మిన్నగా ఉంటుంది. ఆ సినిమాలో మరో పాట "సుందరమో సుమధురమో" పాట సందర్భానికి ముందుగా తమిళ్ష్‌లో వైరముత్తు రాశారు. ఆ సందర్భానికీ వేటూరి రచనే తమిళ్ష్ రచనకన్నా గొప్పది. కన్నడ కవి ఆర్.ఎన్.జయగోపాల్ సొసె తన్ద సౌభాగ్య సినిమాలో "రవివర్మ కుంచె కళకు భలే సాకారానివో/ కవి కల్పనలో కనిపిస్తున్న సౌందర్య జాలానివో" అని రాస్తే ఆ బాణికి రావణుడే రాముడైతే సినిమాలో "రవివర్మకే అందని ఒకే ఒక అందానివో/ ఆ రవి చూడని పాడని నవ్య నాదానివో" అని వేటూరి రాశారు. ఈ పాట చరణాలలో వేటూరిదే పైచేయి అయింది. ఆ విషయాన్ని ఈ వ్యాస రచయిత జయగోపాల్‌తో ప్రస్తావిస్తే ఆయన కాదనలేకపోయారు. కన్నడ రాష్ట్రకవి జి.ఎస్. శివరుద్రప్ప రాసిన ఒక కవిత తరువాతి రోజుల్లో మానస సరోవర అన్న సినిమాలో పాటైంది. ఆ సినిమా తెలుగులో అమాయక చక్రవర్తి పేరుతో వచ్చింది. ఆ సందర్భానికి శివరుద్రప్ప రచనకన్నా తెలుగులో రాసిన వేటూరి రచనే మేలుగా ఉంటుంది. "వేదాంతి చెప్పాడు బంగారం అంతా మట్టి, మట్టి/ కవి ఒకడు పాడాడు మట్టి అంతా బంగారం, బంగారం" అని కన్నడ రచన అంటే "వేదాంతమంటున్నది జగమంతా స్వప్నం, స్వప్నం/ కవి స్వాంతమంటున్నది జగమంతా స్వర్గం, స్వర్గం" అని వేటూరి అన్నారు. ఈ సందర్భంలోనూ పూర్తిగా వేటూరే మేలుగా నిలిచారు. వేటూరి సినిమా పాటల్లో సాధించిన గజలియత్ గజళ్లు అని రాసి కూడా నారాయాణ రెడ్డి తీసుకురాలేకపోయారు. వీరభద్రుడు సినిమాలో "ఏదో మోహం, ఎదలో దాహం..." పాట పల్లవిలో "నిదురించే నా మనసే ఉలికిపడే ఊహలతో" అని అన్నాక రెండో చరణంలో "చందమామ ఎండకాసే నిప్పు పూలదండలేసే/ గుబులు గుబులు గుండెలోన అర్థరాత్రి తెల్లవారే" అనీ, "ఉండి ఉండి ఊపిరంతా పరిమళాల వెల్లువాయే/ ఆపలేని విరహవేదనే తీపి తీపిగా ఎదను కోయగా" అని వేటూరి అన్నది తెలుగులో గజల్ అని రాసిన, రాస్తున్న చాల మందికి పట్టిబడని గజలియత్. అంతర్జాతీయ స్థాయి కవి గుంటూరు శేషేంద్రశర్మ విశ్వఘోష కవితలో "వేసవి కాలపు వాగై, శుక్ల పాడ్యమీ వేళ శశిరేఖకు విడుచు నూలు పోగై అడగారిందేమో" అని ఒక శ్రేష్ఠమైన రచనా సంవిధానాన్ని ప్రదర్శించారు. వేటూరి ఆ స్థాయిలో, ఆ సంవిధానంలో "వానకారు కోయిలనై/ తెల్లవారి వెన్నెలనై/ ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని/ కడిమివోలె నిలిచానని..." అనీ, "రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మెదనై/ ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని..." అన్నారు. ఇది ఒక సృజనాత్మక రచనా వైశేష్యం. "ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక / ఏదారెటు పోతుందో ఎవరెనీ అడగక" అనీ, "త్యాగరాజు కీర్తనల్లే ఉన్నాది బొమ్మ రాగమేదో తీసినట్టుందమ్మా" అనీ, "ఆబాలగోపాల మా బాల గోపాలుని/ అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ" అనీ, "ఏ పూలు తేవాలి నీ పూజకు/ ఏ లీల చేయాలి నీ సేవలు" అనీ, "దీపాలెన్ని ఉన్నా హారతొక్కటే/ దేవతలెందరున్నా అమ్మ ఒక్కటే" అనీ, "ఇది సంగ్రామం మహా సంగ్రామం/ శ్రమ జీవులు పూరించే శంఖారావం/అగ్ని హోత్రమే గోత్రం ఆత్మశక్తి మా హస్తం/ తిరుగులేని తిరుగుబాటు మా లక్ష్యం" అనీ, "ఆకాశాన సూర్యుడుండడు సందె వేళకి/ చందమామకు రూపముండదు తెల్లవారితే" అనీ, "కరిగే బంధాలన్నీ మబ్బులే" అనీ, "వేణువై వచ్చాను భువనానికి / గాలినై పోతాను గగనానికి" అనీ, "ఏడు కొండలకైనా బండ తానొక్కటే" అనీ అంటూ వేటూరి సుందరరామ్మూర్తి ఎన్నో కావ్య వాక్యాలను వాక్య కావ్యాలను విరచించారు. "సలిల సావిత్రీ", గమన గాయత్రీ", "అమ్మా ఓం నమామి, నిన్నే నే స్మరామి", "దైవాలకన్నా దయ ఉన్న హృదయం, అమ్మ మా ఇంటి దీపం" వంటి వాక్యాలతో టి.వి. సీరియళ్ల సాహిత్యాన్నీ వెలయించారు వేటూరి. శిష్టమైన, విశిష్టమైన కవిత్వ ఆవిష్కరణ వేటూరి సుందరరామ్మూర్తి అభివ్యక్తి. - రోచిష్మాన్ 9444012279 -
తెలుగు సాహిత్యంలో రారవే వెలుగులు
రాజాం: సాహిత్యం, సమాజం రెండు కళ్లు అనే మూలసూత్రంతో జనవరి 25, 2015లో రాజాం రచయితల వేదిక (రారవే) ఆవిర్భవించింది. రాజాంకు చెందిన రిటైర్డ్ హెచ్ఎం గార రంగనాథం, మరికొందరు కవులతో కలిసి ఏర్పాటుచేసిన రారవే తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. ప్రతినెలా చివరి ఆదివారం ఒక సాహిత్య సమావేశం చొప్పున అనతి కాలంలోనే 107 సమావేశాలు పూర్తిచేసుకుని ఆదివారం (28వ తేదీ) 108వ సమావేశానికి సిద్ధమైంది. రాజాం పట్టణంలోని జేజే ఇనోటెల్ వేదికగా కేంద్ర సాహిత్య అకాడమీ, రారవే సంయుక్తంగా అబ్బూరి వరద రాజేశ్వరరావు పేరుతో సాహిత్య సదస్సు నిర్వహిస్తుంది. ఈ సమావేశాన్ని రాష్ట్ర నలుమూలలుకు చెందిన సాహితీవేత్తలతో పాటు అకాడమీ తెలుగు కన్వీనర్ సి.మృణాళిని, తెలుగు సలహా మండలి సభ్యుడు చింతకింది శ్రీనివాసరావు తదితరులు పాల్గొననున్నారు. ఉన్నతంగా రాణిస్తున్న రారవే కవులు రారవే సభ్యులు తమ రచనలతో పేరుసంపాదిస్తున్నారు. రారవే నిర్వాహకుడు గార రంగనాథం వ్యాసాలు, కవితలు రాస్తుండగా, పిల్లా తిరుపతిరావు వ్యాసాలు, డాక్టర్ ఆల్తి మోహనరావు, పొదిలాపు శ్రీనివాసరావు వ్యాసకర్తలు, కథకులుగా రాణిస్తునఆనరు. కుదమ తిరుమలరావు, ఉరిటి గున్నేశ్వరరావు, పోలాకి ఈశ్వరరావు, కవితలు రాస్తూ మెప్పు పొందుతున్నారు. పద్య రచనలో గురుగుబెల్లి జగన్నాథరావు, ఒమ్మి రమణమూర్తి, కవితా రచనలో గార రంగనాథం, కుదమ తిరుమలరావు రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు. రారవే వరుసగా మూడేళ్లపాటు గెడ్డాపు అప్పలస్వామి నందనందనం, వెంకటరావు పరిమళభావ తరంగాలు, గార రంగనాథం తరంగధ్వానాలు పుస్తకాలు ప్రచురితమయ్యాయి. నేడు రాజాంరచయితల వేదిక వార్షికోత్సవం సాహిత్యకారులతో చర్చాగోష్టికి ఏర్పాట్లు 2015లో ఏర్పడిన రారవే -
ఒక పుస్తకం-ఒక మోహన్-ఒక ఆర్కే!
జ్ఞానోదయంనాడు ఈ పుస్తకాన్ని చూశాను. జ్ఞానము ఫటాపంచలయింది. సంవత్సరాలు పూర్తి మీద పూర్తి సంపూర్తి అయిపోతూనే ఉన్నాయి. ఒక్క బొమ్మ పూర్తి కాలేదు, అసలు మొదలు పెడితే కదా, పూర్తవడానికి! అసలే జీవితము బరువైంది, ఆపై ఈ పుస్తకం వచ్చి సిందుబాదు భుజాలమీద కూచున్నట్టుగా వచ్చి కూర్చుంది. ఎంతకూ దిగనంటుంది. అది దిగనంటుందా? దించుకోవడానికి నాకే ఇష్టం లేదా. ఏమో! తెల్లవారివారంగానే ప్రేమగా మా మొహాలను అద్దంలో చూసుకుని వాటి పై ఖాండ్రించి ఉమ్మేసి, మురిపెంగా మా కళాఖండాలను ముట్టుకుని నుసి మసి బారేంత కాల్చెయ్య గలిగిన దమ్మునిచ్చింది ఈ పుస్తకం. ఈ ముండమోపి బతుకులో కాస్తొ కూస్తొ అందం కనపడిదంటే వొక బాపు, వొక పతంజలి, వొక మోహన్, లాంటి మరి కొందరు ఒకే ఒకరులు అనే వాళ్ళ సాంగత్యమే, పొగురే, బలుపే. ఒకే ఒక కార్టూన్ కబుర్లు పుస్తకంతో స్నేహిత్యమే. 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ పుస్తకం రాబోతుందని అంధ్రజ్యోతి ఆదివారపు చాట పత్రికలో చాటింపు పడింది. ఆ తరువాత మాఊరికి వచ్చిన విశాలాంద్ర పుస్తకాల బండిలో ఈ పుస్తకం కంటపడింది. నా దురదృష్టవశాత్తు నేను కొనుక్కున్న పుస్తకంలో 90 వ నెంబరు పేజీ మిస్సు కాలేదు. అయి ఉంటే బావుణ్ణు. ఆ పేజిలో పైనుండి కిందికి రెండవ పేరాలో మోహన్ గారు ఇలా అంటాడు కదా " ఇలాంటి ప్రాజెక్ట్ మీద ఆసక్తి గల ఆర్టిస్టులెవరన్నా రావచ్చు. నాతో పాటు యానిమేషన్ చేసే అసిస్టెంట్స్ అందరితో కలిసి కూచుని బొమ్మలేసి, చూసి ఆనందం పొందవచ్చు. మరి జీతము, తిండి, బతుకూ ఎలా అనే తుఛ్చమైన ఐహికమైన ప్రశ్నలుంటే అవి గూడా పర్సనల్‌గా మాట్లాడుకుందాం. ఇలా పబ్లిగ్గా ఎందుకు. నేను 316243 అనే ఫోన్ నెంబర్ లో టెన్ టు సిక్స్ మాత్రమే కాకుండా ఆ తర్వాత గూడా గుమాస్తాగారికంటే హీనంగా పనిచేస్తూఉంటా. రండి ఇది మాయా యానిమేషన్స్, రెడ్ హిల్స్, హైదరాబాద్" ఈ మాటలు చదవడానికి ముందు నాకెప్పుడూ హైదరాబాదుకు వెళ్ళాలని కాని, మోహన్ గారిని కలవాలని గాని కోరికేమి ఉన్నది కాదు. నాకు ఆ సమయంలో ఒక ఉద్యోగం కావాలి. నేను బొమ్మలేస్తానని నాపై నాకు నమ్మకం ఉన్నది. మోహన్ గారి ఆ ఉద్యోగ ప్రకటన చూసిన తరువాత ఆయనని కలిసింది తొలుత నేను కాదు నా ప్రెండ్ కిశోర్, ఆ తరువాత లావణ్య. అదంతా చెప్పాల్సిన వేరే ముచ్చట. నాకు ఆయన ఉద్యోగం ఇచ్చాడా లేదా? జీతం, తిండి, బతుకూ కల్పించాడా లేదా వంటి తుఛ్చమైన ఐహికమైన ప్రశ్నలకు జవాబు మరో భాగంలో , మరెప్పుడయినా. నేను విశాలాంద్ర పుస్తకాల బండిలో కార్టూన్ కబుర్లు పుస్తకం కొనుక్కున్నా. హైద్రాబాదుకి చేరిన తరువాత ఆ పుస్తకానికి నల్లని చమన్ లాల్ బోర్డ్ తో అట్టవేసుకుని దానిపై తెల్లని జిరాక్స్ ముద్రణ గల లోత్రెక్ ఫోటో అతికించుకుని, పొస్టర్ కలర్‌తో నాదైన అక్షరాల్లో "కార్టూన్ కబుర్లు" అని రాసుకున్నాను. ఆ పుస్తకం చూసి మోహన్ గారు ముచ్చట పడ్డారు. అరే భలే ఉందబ్బా ఈ కవర్, నెక్స్ట్ ఎడిషన్‌కి ఇలా కవర్ వేద్దాము అని కూడా అన్నాడు. ( చాలా సంవత్సరాల తరువాత కొత్త కార్టూన్ కబుర్లు పుస్తకానికి నాతో డిజైన్ంగ్, లే అవుట్ చేయించుకుందామని ఆశ కూడా పడ్డారు) ఆ తరువాత, ఆ నా పుస్తకాన్ని పట్టుకుని అలానే అందరమూ కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉండే హార్ట్ ఆనిమేషన్ స్టూడియోకి చేరి అక్కడ ప్రిన్సిపాల్ గారు శ్రీ జయదేవ్ గారిని కలిసి నమస్కరించాము. ఆ తదుపరి నా నల్లని కార్టూన్ కబుర్ల పుస్తకం కవరు తెరిచి లోపల తెల్లని పేజీ పై "జయదేవ్ గారికి ప్రేమతో మోహన్" అని వ్రాసి సంతకం చేసి ఇచ్చాడు. అలా ఇవ్వడానికి మీకు ఏ అధికారం లేదు మొర్రో, అది నా పుస్తకం కుయ్యో, దానిని మా ఊర్లో మా నాయన జేబులో డబ్బులు కొట్టేసి కొనుక్కున్నా అయ్యో అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోవడానికి ఎవరికీ ఆసక్తి లేదు. అందరూ చిరునవ్వుతో గ్రూప్ ఫోటో దిగే మూడ్ లో ఉన్నారు. ఆ తరువాత నేను చాలా అనే అయిదారు కార్టూన్ కబుర్లు పుస్తకాలు కొనుక్కున్నా. ప్రతి పుస్తకం పై మోహన్ గారు టు అన్వర్ విత్ లవ్ మోహన్ అని సంతకం చేసి ఇచ్చేవాడు. అప్పుడప్పుడూ నా ప్రియతములకి నేను ఆ పుస్తకాలు పంచుకునే పని పెట్టుకున్నా. అ మధ్య కూడా డాక్టరమ్మ ఒక భార్గవి గారి ఇంట్లో కార్టూన్ కబుర్లు రెండు కనపడితే నీకు రెండు పుస్తకాలు ఎందుకమ్మా అని దబాయించి , ఒక పుస్తకాన్ని నా కొత్తవకాయ ప్రెండ్ సుస్మిత చేతిలో పెట్టాను. ఈ మధ్య మా అమ్మ సత్యవతి భారతదేశాన్ని, నిషా బార్ గల్లీని ఖాలీ చెసి వెడుతూ "పుత్తర్ నీకేమైనా పుస్తకాలు కావాలా తేల్చుకో" అంది. ఆవిడ పుస్తకాల బీరువాలోంచి కార్టూన్ కబుర్లు తీసుకుని గుండెలకు హత్తుకున్నా. ఈ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివి ఉంటానో లెక్కే లేదు. చదివిన ప్రతిసారి రూపాయి కాయిన్ టెలిఫోన్ బాక్స్ లోంచి మోహన్ గారికి ఫోన్ చేసేవాడిని. అప్పుడు మొబైళ్ళు లేని కాలమది. హైద్రాబాద్ బ్రతుకు మీద చిరాకు, దుఖం, బాధ, పగ కలిగినప్పుడల్లా ఇంటి గోడమీద రక్తపు చూపుడు వేలుతో రెండు పేర్లు రాసేవాణ్ణి. నా హిట్ లిస్ట్ అది. ఒకటి మోహన్ రెండు ఆర్కే. వీళ్ళు ఇద్దరూ కలిసి ఈ పుస్తకాన్ని వేయకుండా ఉండి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు కదా. ఎప్పటికయినా ఆ పేర్ల మీద ఇంటూ మార్క్ వేసి వికట్టాటహాసం చేయాలని ఎనభైల సినిమా నాతెలుగు నరనరనా నింపుకున్న కొరిక అది. రెఢ్ హిల్స్ లో మేడమీద గదిలో బుద్దిగా బొమ్మలేసుకుంటున్న సమయాన మధ్యాహ్నపు కిటికి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ "మోహనా ఓ మోహనా" అని పిలుపు వినపడేది. కిటికిలోంచి తొంగి చూస్తే బొద్దుగా ఉండే స్కూటర్ మీద , స్కూటర్ లా బొద్దుగా ఉండే ఆర్కే గారు ఒంటికాలి మీద వాలి, చిరునవ్వుతో కిటికి వంక నవ్వుతూ చూస్తూ కనపడేవాడు. అప్పుడు వయసు నలభయ్లలో ఉన్న మానవులు వీరు. కుర్చీలోంచి లేచి ప్యాంట్‌ని పొట్టమీదకు లాక్కుని, ఎదురు టేబుల్ మీద పెన్నుల పెట్టుకునే డబ్బాలోని దువ్వెనతో తల దువ్వుకుని మోహన్ గారు మెట్లు దిగేవాడు. చాయ్, సిగరెట్, మీనాక్షి సాదా, ఆర్కే అనేవి అప్పటి ఆయన అలవాట్లు. ఆర్కే గారు పని చేసే బ్యాంకు మోహన్ గారి ఆఫీసుకు దగ్గరే. అప్పుడప్పుడూ , ఎప్పుడూ మోహన్ గారు తన టేబుల్ సొరుగులోనుండి విత్ డ్రాయల్ ఫాం తీసి అందులో తనకు కావలసిన అమౌంట్ నెంబరు రాసి, ఫామ్ వెనుక డియర్ ఆర్కే, అన్వర్ నో, శంకర్ నో పంపిస్తున్నాను మర్యాదగా ఒక రెండు వందలు నా అకవుంట్ నుండి ఇవ్వగలవు. అసలు మోహన్ గారి అకవుంట్ లో డబ్బులే ఉండవు. పట్టుకు వెల్లిన కాగితాన్ని చదివి ఆర్కెగారు తన జేబులోంచి డబ్బులు తీసి మాకు ఇచ్చేవాడు. ఇలా డబ్బులు కలెక్ట్ చేసే పని మోహన్ గారు ప్రకాష్ అనే తన తమ్ముడికి గానీ, శంకర్ కి కానీ, నాకు కానీ అప్పగించేవాడు కాని. అక్కడే ఉండే మరో గొప్ప కళాకారుడు శ్రీరాం కి మాత్రం చచ్చినా ఇచ్చేవాడు. శ్రీరాం చాలా ఉన్నత శ్రేణికి చెందిన ఆర్టిస్ట్ అనే భయంతో కాదు, ఆ డబ్బులు తీసుకుని మోహన్ గారి స్నేహానికి ఎక్కడ రాజీనామా చేసి పోతాడేమోననే భరించలేని గౌరవం కొద్ది. ఒకానొక సమయంలో తెలుగులో గొప్ప పుస్తకాలు అనే లిస్ట్, తెలుగు పుస్తకాల్లో ఆకర్షణీయమైన తీరుతెన్నులు అనే లిస్ట్ తో రెండు ఆదివారపు పత్రికలు తమతమ ఉద్దేశాల కథనాలు ప్రకటించాయి . ఆ రెండిటి ఉద్దేశాల ప్రకారము ఆ జాబితాలో ఎక్కడానూ "కార్టూన్ కబుర్లు" లేదు. కార్టూన్ కబుర్లు చదివి, దానిని బుర్రకు ఎక్కించుకోవాలంటే ముందు అటువంటి లిస్ట్ తయారు చేసేవారికి ఒక బుర్ర ఉండాలి కదా, పోనీలే అని సమాథాన్ పడ్డాను. తెలుగులో గొప్ప వందపుస్తకాలు జాబితా అనేది ఒకటి ఉంటే అందులో కార్టూన్ కబుర్లు ఉంటుంది. తెలుగులో పది గొప్ప పుస్తకాలు అని ఒక వరుస వేసినా అందులో కార్టూన్ కబుర్లు చేరుతుంది. తెలుగులో రెండే గొప్ప పుస్తకాలు అని లెక్క తేలినపుడు కూడా అందులో ఒక పుస్తకం పేరు కార్టూన్ కబుర్లు అయి తీరుతుంది. మామూలుగానే తెలుగులో బొమ్మలు చూడటమూ, బొమ్మలు చదవడమూ అంటేనే అది అంధులు చదవవలసిన లిపి, బధిరులు వినదగ్గ సంగీతము అనే స్థాయికి చేర్చిన రచనల మధ్య, రచయితల మధ్య కార్టూన్ కబుర్లు కానీ కార్టూనిస్ట్ మోహన్ కానీ ఆతని వచన విన్యాసం కానీ మరియొక్కటి ఎప్పటికీ పుట్టనిది, మరియొక్కడు చేయలేనిది. మోహన్ గారి వచనం అనేది, బాపు గీత అనేది తయరయితే వచ్చేది కాదు. సమస్త జీవులకు ఒక సూర్యుండు వలె. అవి ఒకసారి మాత్రమే పుడతాయి దానిని చూసి , చదివి ఆనందించగల హృదయ సౌందర్యం అనేది మన సంస్కారం పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రతి చిత్రకారుడి దగ్గర ఉండవలసిన పుస్తకం కార్టూన్ కబుర్లు, కార్టూన్ కబుర్లు చదవడం కొరకైనా ప్రతి చిత్రకారుడు నేర్చుకోదగ్గ భాష తెలుగు. ఏ రచయిత చదువుకొనంత, ఏ కవి వినలేనంత, ఏ చిత్రకారుడు గీయలేనంత ఏ జర్నలిస్ట్ చూడలేనంతటి ఒకడే మోహన్, ఒకే కార్టూన్ కబుర్లు పుస్తకం. వాస్తవానికి ఒక కార్టూన్ కబుర్లు పుస్తకం మరో రెండు కార్టూన్ కబుర్లుగా రావలసినది, రాలేదు. రాదు కూడా. ఎందుకని సమగ్ర బాపు బొమ్మల కళ. ఎందుకని బొమ్మల్లో చంద్ర మరియూ అతని గొప్ప డిజైనింగ్, ఎందుకని బొమ్మల బాలి-బాలి బొమ్మలు, ఎందుకని కరుణాకర్ ఒక మానవ శరీరసౌదర్య మూర్తి చిత్రణ, ఎందుకని గోవర్ధన గిరిని కుంచె చివరి గీతతో పైకెత్త గల గోపి బొమ్మల పూల మాల, ఎందుకని ఎందుకని ఎందుకని చాలా చాలా గొప్ప పనులు పుస్తకాలుగా రావో అందుకే ఇదీనూ రాదు . అంతవరకూ ఒక కార్టూన్ కబుర్లు ప్రస్తుతానికైతే ఉంది. అందుకని ఆ పుస్తకానికి జిందాబాద్. ఆర్కే గారికి జిందాబాద్ . నాకు మీ నమస్కారాలు. మోహన్ గారికి హేపీ బర్త్ డేలు. (చదవండి: అత్యంత ఖరీదైన పుస్తకం: విశ్వ జనుల విశ్వశాంతి గీతమే ‘An Invaluable Invocation’) -
విశ్వకవి జీవితంతో స్ఫూర్తి పొందిన జపాన్ కళాకారిణి..!
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఎంత చెప్పిన తక్కువ. ఆయన ఎందరికో స్ఫూర్తి. ఆయన సాహిత్య రచనలు, సిద్ధాంతాలు ఎందరినో కదిలించాయి. కానీ ఓ జపాన్ కళాకారిణి మన రవీంద్ర నాథ్ ఠాగూర్ ఆలోచనలకు ఫిదా అయ్యానని చెబుతోంది. పైగా ఆ కవి తన స్ఫూర్తి అని చెబుతోంది. ఓ విదేశీయురాలు మన విశ్వకవిని ఆరాధిస్తున్నాడంటే..ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఫీలై సంఘటన. ఇంతకీ అతను ఎవరంటే.. కోల్‌కతాలోని జపాన్ కాన్సులేట్ ఒక సిటీ క్లబ్లో సంగీత వేడుకను నిర్వహించింది. ఆ కార్యక్రమంలో ఓ జపాన్ కళాకారిణి విశ్వకవి గురించి ఎంతగొప్పగానే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బెంగాల్ కవి రవీంద్ర నాథ్ ఠాగూర్ ఆలోచన, సిద్ధాంతాలు తనను కదిలించాయని చెబుతోంది జపనీస్ కళాకారుడు పియానిస్ట్ యుకికో కుసునోకి. ఆయన ప్రేరణతోనే ఈ కార్యక్రమంలో ఎన్నో మధుర గీతాలను, ఇతర జపనీస్ ట్యూన్లను ప్లే చేశానని చెప్పింది. తన ఆదర్శాలు, ఆలోచనలు ఠాగూర్ తో మమేకమయ్యాయనని ఆనందంగా చెబుతోంది. ఇటీవలే ఠాగూర్ నివాసమైన శాంతినికేతన్ని సందర్శించినట్లు వివరించింది. అక్కడ ప్రజలను కలుసుకుని సంగీత ప్రదర్శన ఇవ్వడం తనకెంతో సంతోషం అనిపించిందని చెబుతుంది. తనకెప్పటీ నుంచో శాంతినికేతన్ని చూడాలన్నేదే చిరాల కోరిక అని అది ఇప్పటికీ నెరవేరిందని సంతోషంగా చెప్పింది. నిజానికి సంగీతం అనేది హద్దులు లేనిది. దీంతో మానవజాతి మధ్య శాంతి సామరస్యలను, ప్రేమ వంటి వాటిని పెంపొందించొచ్చు. అంతేగాదు తాను 2022లో భారత్ సందర్శనానికి వచ్చినప్పుడే ఠాగూర్‌కి సంబంధించిన మెలోడి సంగీతాన్ని కనుగొన్నానని దానిని తాను ఎంతో కష్టబడి యూట్యూబ్ సాయంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. (చదవండి: 56 ఏళ్ల వయసులో ఎమ్మెస్సీ పాసైన సెక్యూరిటీ గార్డు!ఏకంగా 23 సార్లు..) -
అప్పట్లో బాలల దినోత్సవం అంటే అలా ఉండేది..ఆరోజులే వేరు
అప్పట్లో పండగలంటే పంద్రా ఆగస్ట్, అక్టోబర్ రెండు, జనవరి ఇరవయ్యారు ఇదిగో నవంబర్ పద్నాలుగు అనే బాలల దినోత్వవమేగా ! అదిగదిగో, తెల్లవారుఝాము నుంచే మొదలయ్యేది హాడావిడి. ఇంట్లో వాళ్ళు పొయ్యి మీద డేగిశా నీళ్ళు అలా పెట్టి ఇలా తరిమేవారు చాకలాయన దగ్గరికి. అప్పటికీ అక్కడికీ చేరిన ఇరుగూ పొరుగూ అని అన్ని రకాల బడి పిల్లలు ఒకరికొకరు బద్ద శత్రువుల్లా కనపడేవారు ఆ కాసింత కాలం. ఎవరికి వారు ముందుగా తమ తమ యూనిఫాంలు ఇస్త్రీ రుద్దించుకోవాలి మరి. "కొండలా కూచుంది ఎంతకీ తరగనంది ఏందిరో వింత గొడవా అనే పాట అప్పుడు తెలీకపోయినా పాడుకునే ఉంటాము ఇస్త్రీ చెయ్యవలసిన ఆ బట్టల కొండనీ చూసి ఆ జాతీయ పండగలకు దగ్గర్లో ఏ శుభకార్యం వచ్చినా, పిల్లల పుట్టిన రోజు వచ్చినా పనిలో పని అని , కలిసి వస్తాయి స్కూల్ డ్రెస్సు లే కుట్టించేవారు ఇంట్లో పెద్దలు. స్కూల్ డ్రస్సే కదాని చిన్న చూపేమీ లేదు మాకు, కొత్త తెల్ల అంగి, బ్లూ నిక్కర్ డ్రస్ వేసుకుని బడికి వెల్లడం ఎంత దర్జా ఒలకబోసే పని.చాచా నెహ్రూ పుట్టిన రోజు ఎప్పుడో తెలీదు, బాలల దినోత్సవం అంటే మాత్రం ప్రతి బాలబాలికల యొక్క రెండో పుట్టిన రోజని మాత్రం ఖచ్చితంగా తెలుసు. బిలబిల్లాడుతూ దారివెంట గలగలల కబుర్లు నడిచేవి. పుయ్యిమని మా PET సుందరం సార్ విజిల్ మోతతో కబుర్లన్నీ అఠెన్షన్ మూసి పెట్టి కాలికి కాలు, చేతుకి చేతులు దగ్గరగా చేర్చి విధ్యార్థులు వరుసలు కట్టిన మా బాలల జాతికి మా హెడ్మాస్టర్ హనీఫ్ గారు ఒక సందేశాన్ని ఇచ్చేవారు, విద్యార్థి వరుసల మధ్యలో క్లాస్ లీడర్లు, కండపుష్టి, దబాయింపు తెలిసిన కుర్రాళ్ళు వచ్చి మా అరచేతుల్లో పంచి పెట్టే నెయ్యి చాక్లెట్ తిని మళ్ళీ హానీఫ్ గారి ప్రసంగానికి అంకితం అయ్యేవాళ్ళం. బాగా చదివే పిల్లలకు, బాగా పరిగెత్తే పిల్లలకు, ఖోఖో,కబాడి ఇత్యాది మల్లయుద్దాలు ఆడే పిల్లలకు, క్రమం తప్పకుండా బడికి హజరయ్యే వాళ్ళకు బహుమతులు ఇచ్చేవారు. స్టేజీ మీద పాటలు పాడి కొంతమంది రంజింపజేసేవారు, ఇంకొంతమంది అయ్యామే డిస్కో డాన్సర్ ’ అనీనూ, ’ఒలమ్మీ తిక్క రేగిందా ’ అని కూడాను స్టెప్పులు వేసేవారు. వారికి బహుమతులతో పాటు చొక్కాలకు రూపాయి నోట్లు పిన్నీసు పెట్టి తగిలించేవారు. విజిళ్ళు వేసీ , చప్పట్లు చరిచి ఎంకరేజింగ్ కూడానూ. పదేళ్ల పాటు సాగిన నా బడి బ్రతుకులో నాకు కాసింత అబ్బిన చిత్రకళకు చోటు ఎప్పుడూ దొరకలేదు,ఏనాడు స్టేజి ఎక్కి ఇదిగో బొమ్మకు ఈ బహుమతి అని అందుకున్నది లేదు. అది ఈ రోజుకూ లేదనుకో. అయినా బొమ్మలు వేసినందుకు బడిలో తన్నకపోవడమే మహద్భాగ్యం. ఇంకా పురస్కారాలు కూడానా? ఆశకు అంతుందా ఎక్కడయినా ? పిల్లల పండగ వస్తుందనగానే పిల్లలందరం కలిసి తలా ఇంతా ఇంతా చిల్లర డబ్బులు వేసుకుని క్లాసు రూములకు సున్నాలు కొట్టి, ఝండాలు కట్టి, నల్ల బల్లలకు బుడమాకు-బొగ్గు కలిపిన సింగారం చేసి, తరగతి గది ముందు కళ్ళాపి చల్లి, రంగురంగుల ముగ్గులు చిత్రించి అవి చూసుకోవడానికి ఇంతింత కళ్ళయ్యేవాళ్లం. బడి లోపలి గోడల మీద నేను వేసిన చాచా నెహ్రూ కోటు మీది గులాబి పువ్వుని అందుకుని అమ్మాయిలు జడల్లొ తురుముకునేవారు. అదీ ఒక పురస్కారం వలెనే అని అప్పుడు తెలీదు. ఇప్పుడు తెలిసినా లాభం లేదు. అప్పుడు మా నూనెపల్లేలో ఉన్నట్లు ఇప్పుడు ఏ పల్లె పాఠశాలల్లో కూడా బడి పాకలు ఉన్నట్టు లేవు, చెట్టు కింద తరగతులు నడుస్తున్నట్టు కానరావు, క్లాస్ ముగియగానే నిక్కర్ల వెనుక దుమ్ము దులుపుకుంటు మగపిల్లలు పైకి లేస్తే , లంగాలు విదిలించుకుంటూ ఆడపిల్లలు నిలబడేవారు, వారి వడి నిండా క్లాసుల తరబడి గంటలుగా వింటూ వింటూ తిన్న పొద్దుతిరుగుడు, కర్బూజా విత్తనాల పొట్టు తెల్లగా రాలేది క్లాసుల నిండా. ఆ రాలినదల్లా విత్తనాల పొట్టు మాత్రమే కాదని అవి నా భవిష్యత్తు లో తలుచుకోబోయే జ్నాపకాల పూల చినుకులని ఇప్పడు తెలుస్తుంది. బాల్యం చెదిరి, వయసు ముదిరి ఇప్పుడు ఆ రాశిని రెండు చేతులా ఎత్తి పట్టుకుని "ఏవి తల్లి! నిరుడు కురిసిన ఆ హిమసమూహములు?" అంటున్నారు సాహిత్య వాళ్ళు.నూనెపల్లె వాళ్ళకు హిమము ఎక్కడిదిరా? అవి కర్బూజా గింజెల పొట్టురా నాయనా. ఒక్కసారి కళ్ళు మూసుకుని వెనక్కి వెళితే అవన్నీ అక్కడే ఉన్నాయిరా, ఇంకా ఈత గింజలూ, రేగు గింజలు, సీతా ఫలం గింజలు, ఉసిరికాయ గింజలూ, రంగు జండాలు, బాలలదినోత్సవమునూ, చాచా నెహ్రూ నూ. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
విశ్వ జనుల విశ్వశాంతి గీతమే ‘ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’
సృజనాత్మక రంగం, తనకు సంబంధించిన అంశాలలో సరికొత్త విజయాలు సాధిస్తూ, అనేక అంతర్జాతీయ అవార్డులు సాధించిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని ఆంగ్లాచార్యులు, కవి, రచయిత. 2010 లో ఇంగ్లిష్ జాతీయాలు, సామెతలపై ఆయన రాసిన 'హ్యాండీ క్రిస్టల్స్...’ అనే పుస్తకాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది. జాతీయసేవ, మానవీయ నైపుణ్యాల విభాగాల్లో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్‌గా ఆయన కీర్తి పొందారు. ఆంగ్ల భాషకు సంబంధించి ఆసియా, లిమ్కా, ఇండియా, తెలుగు బుక్ రికార్డులు ఎప్పుడో ఆయనను అలంకరించాయి. ఇన్ని ఘనతలు సొంతం చేసుకున్న శ్రీనాథాచారి ఇప్పుడు ఓ అద్వితీయ సామాజిక కార్యక్రమాన్ని తలపెట్టారు. రికార్డులకోసం కాకుండా, వసుధైవ కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు ప్రపంచ శాంతి ఆవశ్యకతను ఎలుగెత్తి చాటడం కోసం 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్' పేరుతో ఓ మానవీయ మహాకావ్యాన్ని ఆవిష్కరించారు. ‘హ్యుమానిటీ ఎక్స్ పెరిమెంట్’ అనే వినూత్న భావనతో రూపుదిద్దిన ఈ మహాకావ్యం ద్వారా వచ్చే ప్రయోజనం మొత్తాన్ని సమాజానికే ధారాదత్తం చేస్తానని ప్రకటించడం ఎందరికో స్ఫూర్తిదాయకం. డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఇంగ్లిష్ లో పీహెచ్డీ చేసి, పాలమూరు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో సహాయ ఆచార్యులుగా నియమితులై, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఆంగ్ల విభాగాధిపతిగా వివిధ హోదాలలో సమర్థవంతంగా సేవలందించారు. అలాగే ఆయన సైకాలజీ, బిజినెస్ మేనేజ్ మెంట్ లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అభ్యసించారు. 'ఫర్సేక్ మీ నాట్' అనే టైటిల్ తో డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఆంగ్లంలో ఓ కవితా సంపుటి వెలువరించారు. అది అమెజాన్ ఆన్ లైన్ లో ‘ఈ-బుక్’ గా అందుబాటులో ఉంది. ఆంగ్లంలో ఆయన రాసిన కవితలు ఎన్నో పత్రికలలో అచ్చయ్యాయి. ప్రస్తుతం ఆంగ్లభాష, వ్యక్తిత్వ వికాసం, మానవీయ నైపుణ్యాల శిక్షకులుగా, ‘ఫ్రీలాన్స్' సేవలు అందిస్తూ పలు విద్యా సంస్థలు, ఐటీ సంస్థల్లో ప్రభావవంతమైన ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రపంచ సాహిత్యంలోనే ఎప్పటికీ నిలిచిపోయేలా డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఇటీవల 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్' ( An Invaluable Invocation ) పేరుతో ఆంగ్లంలో ఓ సంబోధనాత్మక భావగీతాన్ని రచించారు. విశ్వ శాంతి-ప్రపంచ దేశాల సమన్వయం తక్షణ అవసరమనే ఇతివృత్తం తీసుకొని సాహితీ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఓ సుదీర్ఘమైన ‘ఓడ్’ (సంబోధనాత్మక భావగీతం) ఈ విశ్వానికందించారు. ఈ శాంతిగీతం ఆంగ్ల సాహిత్యంలోనే అత్యంత సుదీర్ఘ భావగీతం కావడం విశేషం. ఇలాంటి భావగీతాన్ని ప్రపంచ సాహిత్యంలోనే ఇప్పటివరకు ఏ ఒక్కరూ రాయలేదు. దైవం, దైవస్వరూపులైన మానవాళిని అత్యంత ఆర్ద్రతతో ప్రార్థిస్తూ, ‘ఈ ప్రపంచాన్ని భూతలస్వర్గంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనదే, దానికి ఈ భూమిపై ఉండే ప్రతిఒక్కరమూ సమర్థులమే, అందుచేత మనమంతా బృందంగా ఏర్పడి ఓ వసుధైవ కుటుంబాన్ని నిర్మించుకుందాం, అందరూ కదలిరండి’ అనే పిలుపుతో సమస్త విశ్వజనులకు కవి ఇచ్చిన శాంతి మంత్రమే ఈ భావగీతం. ఆ డబ్బును కూడా సమాజ సేవకే ప్రపంచ దేశాల్లో కోట్ల సంఖ్యలో నిస్సహాయ స్థితిలో అభాగ్యులుగా ఉన్న సామాన్య ప్రజల ధర్మాగ్రహ ఆవేదనే ఈ ఆధునిక పద్యకావ్యం! సామాన్య మానవుని ఆవేదన, ఆవేశం, ఆగ్రహం, ఆక్రందనలను అత్యంత వినయ విధేయతలతో ఆలపించే అద్వితీయ శాంతిగీతం ‘ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’. కవి తన విశ్వశాంతి భావనను అక్షర శిల్పిగా చెక్కడం ఒక ఎత్తైతే, ఆ అక్షరాల వెనుకనున్న భావనను చిత్రకారుడు మహేశ్ తన గీతల్లో సజీవంగా చిత్రీకరించడం మరో ఎత్తు. ఈ మహాకావ్యం ద్వారా వచ్చే నూరు శాతం డబ్బును తిరిగి సమాజ ప్రయోజనాలకే అందజేయడం జరుగుతుంది కాబట్టి, దాని ధరను కూడా ప్రపంచ స్థాయిలోనే నిర్ణయించారు కవి. ఈ ఏకైక ప్రతి ధర రూ. 5 కోట్లు. దీన్ని అమ్మడం ద్వారా వచ్చే మొత్తంలో 50 శాతం ఐక్యరాజ్యసమితికి, 25 శాతం భారతదేశానికి, 25 శాతం తెలంగాణ రాష్ట్రానికి లోకోపకార కార్యక్రమాలకు వినియోగించేలా అందజేయడమనేది ఈ పుస్తకం ప్రత్యేకతలలోనే మరింత ప్రత్యేకమైనది. ఐక్యరాజ్యసమితి దినోత్సవం (24-10-2023) నాడు ఈ పుస్తకాన్ని ఆయన హైదరాబాద్‌లో తల్లిదండ్రులు, గురువులు, ప్రముఖులు, మేధావుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి ఐక్యరాజ్యసమితికి అంకితం చేయడం వంటి అంశాలన్నీ ఈ పుస్తకం విశిష్టతలను తెలియజేస్తున్నాయి. ఈ భావగీత రచన నిర్మాణ క్రమాన్ని పరిశీలిస్తే, రామాయణం కాండలుగా, మహాభారతం పర్వాలుగా రచించినట్టు, ఈ మహా కావ్యాన్ని కవి పది కాంటో (Canto) లుగా విభజించారు. (కవి డాక్టర్ శ్రీనాథాచారి తల్లిదండ్రులు శ్రీమతి నీలావతమ్మ, శ్రీ రామానుజాచారి) ఈ పది కాంటోలు వరుసగా శాంతి పీఠిక, ప్రార్థన, మానవజాతి-ఐక్యత, దుఃఖమయ ప్రపంచం, ప్రపంచ శాంతి- ఐక్యత, ఐక్య రాజ్యాలు-ఐక్య కార్యాచరణ, భూమాత పరిరక్షణ, మానవ శక్తిసామర్థ్యాల గుర్తింపు, అంతిమ పద్యకృతి-ప్రపంచ శాంతి ప్రయాణ సారాంశం, కృతజ్ఞతాంజలి. ఈ పది కాంటోలు మొత్తం 237 ఉపశీర్షికలతో విశ్వ శాంతి- సమన్వయం ప్రాధాన్యతను నొక్కి చెప్పే స్వతంత్ర పద్యాలుగా తీర్చిదిద్దారు కవి. ఈ కావ్య రచనలో కవి పాటించిన సాహితీ నియమాలు, కచ్చితత్వం అత్యంత ప్రశంసనీయం. ఐక్యరాజ్యసమితిలో ఉన్న 193 సభ్య దేశాలు, 2 సభ్యేతర దేశాలు మొత్తంగా 195 దేశాలకు సంబంధించి ‘ఐక్య రాజ్యాలు-ఐక్య కార్యాచరణ’ పేరుతో ఉన్న సుదీర్ఘమైన కాంటో ఈ కావ్యానికే ప్రత్యేకం. ప్రతి దేశానికి ఆరు పంక్తులు కేటాయించి, వాటి పక్కనే ఆ దేశ జాతీయ జెండా ముద్రించి కవి తన పరిశోధనాత్మక సామర్థ్యాలు ఎంతో ప్రశంసనీయంగా నిరూపించుకున్నారు. మొదటి రెండు పంక్తులు ఆ దేశ గతవైభవం, తర్వాతి రెండు పంక్తులు కవి ఈ పుస్తకాన్ని రాసే సమయంలో తన పరిశోధనలో తేలిన ఆ దేశంలోని ఒకటి లేదా రెండు ప్రధాన సమస్యలు, చిట్టచివరి రెండు పంక్తులు ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రామాణిక పద్ధతిలో సూచించడం కవి ప్రతిభాపాటవాలకు నిదర్శనం. ఈ మహాకావ్యంలో కవి ఏయే సమస్యలు ప్రస్తావించారని ప్రశ్నించే బదులు ఏయే సమస్యలు ప్రస్తావించలేదని ప్రశ్నించుకోవాలి. యద్ధం, నిరుద్యోగం, ఆకలి, అవినీతి, పేదరికం, తీవ్రవాదం, ఆహార భద్రత, ఆర్థిక అసమానత, లింగ వివక్ష, ప్రభుత్వ ధర్మాలు, పర్యావరణ విపత్తులు, చిన్నబోతున్న చిన్నారుల బాల్యం, వ్యధతో నిండిన వృద్ధుల జీవనం, భూమాత పరిరక్షణ, సామాజిక పతనం, మానసిక సంఘర్షణలు, సాంకేతిక వ్యసనాలు, యువత తీరుతెన్నులు, జీవకారుణ్యం,... ఇలా మానవాళి ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యలకు అద్దం పట్టి, వాటికి పరిష్కార మార్గాలతో కూడిన కార్యాచరణ తయారుచేసి, దాని అమలుకై ‘కడలి రండి విశ్వ శాంతికి చైతన్యవంతులై, క్రియాశూరులై, కార్యసాధకులై...’ అంటూ విశ్వజనులకు కవి ఇచ్చిన ఘనమైన పిలుపే ఈ పద్యకావ్యం. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని ఓ భూతల స్వర్గంగా, శాంతిసౌధంగా మార్చగల సమర్థులు. కావలసిందల్లా సమాజాన్ని ప్రేమించాలనే దృక్పథం, సహృదయం. ఇది ఏమాత్రం ఖర్చుతో కూడుకున్నది కానేకాదు. ఎవరికి వారు తమదగ్గర ఉన్నది పంచితే చాలు. లేనిది ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రపంచ శాంతి, సామరస్యం పట్ల మక్కువ ఉన్న కవిత్వ ప్రియులు, పండితులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులుగా, కార్యదక్షులుగా ప్రేరేపించే ఓ విశిష్ట సాహితీ కళాఖండమే 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్'. ఈ శాంతి గీత రూపకల్పన కవికి ముప్పై సంవత్సరాల కల. అంతేకాదు, మూడేళ్ల కఠోర రచనా పరిశ్రమ వల్లనే ఈ కావ్య రచన సుసాధ్యమైందని డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ పుస్తకాన్ని కొనేదెవరని కవిని ప్రశ్నిస్తే ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. “ప్రపంచంలో నాలుగు రకాల మనుషులుంటారు. ఒకటి, చాలా సంపదకలిగి సమాజ అవసరాల కోసం దాతృత్వం చూపే లోకోపకారులు; రెండు, చాలా సంపదకలిగి సమాజ అవసరాల కోసం దాతృత్వం చూపలేని సామాన్య మానవులు; మూడు, సమాజం పట్ల దాతృత్వపు భావాలున్నా డబ్బు లేని మానవమాత్రులు, నాలుగు, పేదరికంవల్ల లోకోపకార పనులు చేయలేని నిస్సహాయులు. వీరే కాకుండా అయిదో రకం మనుషులుంటారు; సమాజం పట్ల అమితంగా దాతృత్వపు భావాలుండి, డబ్బు లేకున్నా, అందరూ బృందంగా ఏర్పడి, వితరణ చూపి సమాజాన్ని గెలిపించే సజ్జనులు. ఈ భూమ్మీద ప్రపంచాన్ని ప్రేమించే దైవస్వరూపులు ఎంతోమంది ఉన్నారని నిరూపించే ఓ ‘హ్యుమానిటీ ఎక్స్ పెరిమెంట్’ నా ఈ ప్రయత్నం” అంటారు శ్రీనాథాచారి. చరిత్రను గమనిస్తే, ప్రఖ్యాత చిత్రకారుల పెయింటింగ్స్ కొన్ని వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. కొందరు హాలీవుడ్ తారల వస్త్రాలను ఎన్నో కోట్లకు కొనుగోలు చేసిన దాఖలాలున్నాయి. దైవ ప్రసాదాలైన లడ్డూలు కొన్ని కోట్ల రూపాయలకు వేలంపాటల్లో విక్రయమౌతున్నాయి. వాటి నుంచి వచ్చిన డబ్బు సమాజానికి చెందితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. ఇదే తరహాలో, 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్' పద్యకావ్య తొలిప్రతి ద్వారా వచ్చే నూరు శాతం డబ్బు సమాజానికే అందించడం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అసాధారణమైన సృజనాత్మకత, సమాజంపట్ల ప్రేమ కలిస్తే దాని ధర వెలకట్టలేనిది. అలా చూస్తే, ఐదు కోట్లూ తక్కువే. ఓ పది అంతస్తుల భవనాన్ని నేల మీదినుంచి చూస్తే ఎంతో పెద్దగా కనబడుతుంది. అదే భవనాన్ని విమానంలోంచి కిందకు చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. అట్లే, ఈ పుస్తకం ధర సామాన్యుడి దృష్టికోణంలో చూస్తే అసాధ్యమైన ధరలా అనిపించినా, విశాల హృదయంగల సంపన్న లోకోపకారికి చాలా చిన్న విషయం. 'ఒక చెట్టు నుంచి లక్ష అగ్గిపుల్లలు తయారుచేయెుచ్చు. కానీ లక్ష చెట్లను నాశనం చేయడానికి ఒకే ఒక్క అగ్గి పుల్ల చాలు. అలాగే, లక్ష మంచి ఆలోచనల్ని ఒక దురాలోచన నాశనం చేయగలదు. (ఎడమ నుంచి కుడికి... కవి డాక్టర్ శ్రీనాథాచారి తల్లిదండ్రులు శ్రీమతి నీలావతమ్మ, శ్రీ రామానుజాచారి, డీఐజీ శ్రీమతి సుమతి బడుగుల ఐపీఎస్, కవి డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి, గుంతా లక్ష్మణ్ జీ, ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం, కవి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ ఎస్. కె.నిజాముద్దీన్, ప్రముఖ సినీ దర్శకులు జె.కె. భారవి) దాన్ని ఆపే శక్తి పుస్తకానికుంది' అంటారు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. నా దగ్గర సమాజానికి పంచడానికి డబ్బు లేకున్నా, ఓ గొప్ప దాతను నేననుకున్న లక్ష్యం వైపు ప్రేరేపించేందుకు ఈ సుదీర్ఘ కావ్యం ఉపయోగపడితే అంతకన్నా ఆనందం మరొకటుండదని అంటారాయన. ఈ పుస్తకంలో రియా (RIA) అనే అద్భుతమైన ‘గ్లోబల్ పీస్ మంత్ర’ ఉపదేశిస్తారు కవి. Reflection, Introspection, Action అనే ఆంగ్ల పదాల ప్రారంభపు అక్షరాల కూర్పే రియా. ప్రతి ఒక్కరు స్వార్థపు పరిధులు దాటి, వసుదైవ కుటుంబకంగా మారి పదుగురికి ఉపయోగపడే ఆలోచన చేయడమే Reflection; ఆ మంచి ఆలోచన విషయంలో సహేతుకమైన లోతైన అధ్యయనం చేయడమే Introspection; చేసిన మంచి ఆలోచనను ఆచరించడమే Action. Reflection ఓ మంచి విత్తనాన్ని నాటడమైతే, Action ఆ చెట్టు ఫలాలు పొందడం. ఆది నుంచి అంతం వరకు ఈ రియా ఆసాంతం సానుకూల ఫలితాన్నిచ్చే ప్రక్రియ. విశ్వశాంతి వ్యక్తిగత ప్రశాంతతతో మొదలౌతుంది. మనందరి సమష్టి ప్రశాంతతే గ్లోబల్ పీస్. వ్యక్తిగత ప్రశాంతతకు మూలం ‘ఇవ్వడం’. ప్రతిఒక్కరు రియా అనే మంత్రాన్ని పాటిస్తూ, ఎవరికి వారు తమ వద్ద ఉన్నది ఉదారంగా ఈ ప్రపంచానికి ఇస్తే చాలు, భూతల స్వర్గం కళ్ళముందు సాక్షాత్కరిస్తుందంటారు కవి. అక్షరాల అయిదు కోట్ల రూపాయల ధరగల ఈ సుదీర్ఘ భావగీత పుస్తకం వెల కట్టలేనంత సామాజిక స్పృహ, దాని ధరను మించిన ప్రయోజనాన్ని చేకూర్చుతుందని, ఈ అమూల్య ఆంగ్ల కావ్యాన్ని ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరిస్తాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. నోబుల్ ఆలోచనలతో, నోబెల్ బహుమతికి సైతం తీసిపోని విశ్వజనుల శాంతిగీతమీ మహాకావ్యం. రవీంద్రుని ‘గీతాంజలి’ తర్వాత అంతటి స్థాయిని, సార్వజనీన వసుధైవ కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేయగలిగే సత్తా ఉన్న భారతీయ కవి మానస పుత్రిక 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్'. సమాజం ముందుకువెళ్లేలా నిర్మాణాత్మకంగా సమస్యలను ఎత్తి చూపుతూ, వాటికి సాధ్యపడే పరిష్కార మార్గాలు చూపే వాడే నిజమైన కవి. ఈ విషయంలో డాక్టర్ శ్రీనాథాచారి ఘనవిజయం సాధించారనే చెప్పవచ్చు. ఈ పద్యకావ్యం చదువుతున్నంతసేపూ మనం కోల్పోతున్న ఉపయుక్త అంశాల పట్ల బాధ, తర్వాతి తరాలకు మనం చూపాల్సిన బాధ్యత కళ్ళకు కట్టినట్టు బోధపడుతుంది. ఈ రచన మొదటి నుంచి చివరి దాకా ప్రతి విషయం పట్ల కవి ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం అనన్య సామాన్యం. సాహితీ రంగంలో నోబెల్ భారత్ కు అందుతుందనే నమ్మకాన్ని నమ్మకంగా అందించే విశిష్ట రచన ఈ కావ్యకృతి. ఎంతోమంది ప్రపంచవ్యాప్త సాహితీ విద్యార్థులకు ఇదో పరిశోధనా గ్రంథంగా ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, విశ్వం వినితీరాల్సిన వినూత్న విశ్వశాంతి గీతం 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్'. పలురకాలుగా ఎందరికో ప్రేరణనిస్తున్న డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి సృజనాత్మక సాహితీ రంగంలో మరింతగా రాణించి ఎన్నో అత్యున్నత అవార్డులు, గౌరవాలు పొందాలని ఆకాంక్షిద్దాం. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం!) -
దట్టమైన అడవిలో,చిమ్మ చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు
1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి. జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు. ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు. ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు. ‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్…’’ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు… గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది. లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామె. అయోమయంగా చూశాడు డాక్టర్. ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా… ‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ఓ వ్యక్తి… ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది… ఏం చేయాలో డాక్టర్‌కు బోధపడటం లేదు… తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు… ఎందుకంటే..? తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు… కానీ ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు… డాక్టర్ కదా… ఊరుకోలేకపోయాడు…నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు… ఆమెను అడిగాడు… ‘అసలు ఎవరు నువ్వు..? ఇక్కడికి ఎలా వచ్చావు..? ’‘డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు… నేనొక భూస్వామి కూతురిని’ ఆమె గొంతులో ధ్వనిస్తున్న బాధ… ‘‘మా ఊళ్లో హైస్కూల్ కూడా లేదు… అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు… అక్కడ ఓ క్లాస్‌మేట్‌ను ప్రేమించాను… ఈ కడుపు ఆ ప్రేమ వల్లే… కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్… నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు… కానీ అప్పటికే ఆలస్యమైంది… ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడ ఉంచారు… ఇటువైపు ఎవరూ రారు… నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు, తెలియవద్దనే ఈ ఏర్పాటు…’’ అంటూ రోదించసాగింది…డాక్టర్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు… మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది… కానీ ఆ బిడ్డ ఏడవడం లేదు… పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది… డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి… నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావొద్దు ప్లీజ్… ’కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు… పిల్ల ఏడ్చింది… ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇవ్వబడ్డాయి… అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే… తన జీతమే 75 రూపాయలు… ఫీజు తీసుకున్నాడు, లెక్కపెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మరిచిపోయినట్టు గుర్తొచ్చింది… ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లాడు… ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు…‘‘సంతోషమో, దుఖమో.. మన చేతుల్లో ఏమీ లేవు… జరిగిందేదో జరిగిపోయింది… అన్నీ మరిచిపో… నీ జీవితం నీది… ప్లాన్ చేసుకో… ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్లు, అక్కడ నర్సింగ్ కాలేజీ ఉంటుంది… అందులో నా దోస్త్ ఆప్టే ఉంటాడు… వెళ్లి కలువు, కులకర్ణి పంపించాడని చెప్పు… తను తప్పక సాయం చేస్తాడు… ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో, ఇప్పుడైతే నేన్నీకు వేరే సాయం ఏమీ చేయలేను’’ అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు… ఏళ్లు గడిచాయి… కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు… ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు… అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు… ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర చకచకా నేరుగా తన దగ్గరకు వెళ్లింది… ‘సర్, మీరు ఎప్పుడైనా చందగఢ్ వెళ్లారా..?’ అనడిగింది…‘అవును, చాలా ఏళ్ల క్రితం.,. నాకు ఆ ఊరితో బంధముంది… అక్కడ కొన్నాళ్లు పనిచేశాను’ ‘అయితే మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్…’ ‘డాక్టర్ చంద్రా, మిమ్మల్ని తొలిసారి కలిశాను, మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్బ్… నాకు బాగా నచ్చింది… కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను… మళ్లీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను, ఏమీ అనుకోవద్దు ప్లీజ్…’ ‘సర్, దయచేసి ఒక్కసారి రండి, కాసేపు… మీ టైం ఎక్కువగా తీసుకోను, మీరొక్కసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మరిచిపోను’.. కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు… ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్దుడిని చేసింది… ఆమె వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది… లోపలకు అడుగు పెట్టకముందే… ‘అమ్మా, మనింటికి ఎవరొచ్చారో ఓసారి చూడు…’ అని గట్టిగా పిలిచింది. డాక్టర్ చంద్ర తల్లి బయటికి వచ్చింది… కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది… జలజలా కన్నీళ్లు కారిపోతున్నాయి అసంకల్పితంగా… ఆయన పాదాలపై పడింది… ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నయ్… ఆయన గందరగోళంలో పడిపోయాడు… తరువాత ఆమె చెప్పింది… ‘ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు… ఆరోజు పుట్టింది ఈ బిడ్డే… మీరు చెప్పినట్టే పూణె వెళ్లాను, మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను… స్టాఫ్ నర్స్ అయ్యాను… నా బిడ్డను ఓ మంచి గైనకలాజిస్టును చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను… మీరే స్పూర్తి… ఆశీర్వదించండి సార్…’ అంది చేతులు జోడిస్తూ…ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి… తన తొలి డెలివరీ కేసు ఆమె… అదీ ఓ గడ్డు స్థితిలో… డాక్టర్ చంద్రను అడిగాడు… ‘ఇంతకీ నన్నెలా గుర్తించావు..?’ అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను… అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది… సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు… అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను… ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే… మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది… ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది… సార్, ఈమె స్పూర్తి రీత్యా మీ బిడ్డే…’ ఆమె చెబుతూనే ఉంది…ఇప్పుడు ఆయన కళ్లల్లో ఎందుకో నీళ్లు… ఆగడం లేదు… జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు… కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే… ఇది కథ కాదు.! జరిగిన కథ.! స్ఫూర్తిని గుండెల నిండా నింపే అనుభూతి... -
అర్థవంతమైన జీవితం
‘ఆసక్తి ఉంటే అనంత విశ్వాన్ని మధించవచ్చు’ అనడానికి ప్రతీక శకుంతలాదేవి. అరవై దాటిన తర్వాత యూ ట్యూబర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యారు. అంతకంటే ముందు ఆమె తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఆ ప్రపంచంలో సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మీడియా వేదికగా సృజనాత్మకతను పంచుతున్నారు.భర్త బాటలో తాను కూడా మరణానంతరం దేహాన్ని డొనేట్ చేశారు. శకుంతలాదేవి అత్యంత సాధారణ గృహిణి. నలుగురు పిల్లల్ని పెంచుతూ ఆమె తన అభిరుచులను కొనసాగించారు. సాహిత్యాన్ని ఆస్వాదించకుండా ఉట్టిగా పాటలు వినడంలో ఏదో అసంతృప్తి. అందుకే హిందీ పాటల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి హిందీ– తెలుగు డిక్షనరీలో అర్థాలు వెతుక్కున్నారు. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాలను ఉబుసుపోని పోస్టులకు పరిమితం చేయలేదామె. సాంకేతిక పాఠాలను స్మార్ట్‌ఫోన్ తోనే నేర్చుకున్నారు. వీడియో రికార్డ్ చేయడం, ఎడిటింగ్, థంబ్‌నెయిల్ పెట్టడం, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేయడం వరకు అవసరమైనవి అన్నీ సొంతంగా నేర్చుకున్నారు. తనకు తెలిసిన మంచి విషయాలను డిజిటల్ మీడియా వేదికగా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ‘నన్ను ప్రపంచానికి తెలియచేసిన యూట్యూబ్‌కి తొలుత కృతజ్ఞతలు’ అంటూ తన వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు స్వర్ణ శకుంతలాదేవి. ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయం వరకు ... ‘‘మాది తెనాలి దగ్గర మూల్పూరు గ్రామం. నాన్న వ్యవసాయంతోపాటు గుడిలో పూజలు చేసేవారు. ఏడుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివింది నేనే. మా వారు బీఏఎమ్ఎస్ చదువుతూ ఉండడంతో ఆయన చదువు పూర్తయ్యే వరకు, నాకూ చదువుకునే అవకాశం వచ్చింది. ఫిఫ్త్‌ఫారమ్‌లో ఉండగా పెళ్లయింది. తర్వాత పుట్టింట్లోనే ఉండి ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసి రిజల్ట్స్ వచ్చే నాటికి చీరాలలో అత్తగారింటిలో ఉన్నాను. అప్పట్లో ఆ చదువుకే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగం ఇచ్చేవారు. మా అత్తగారు ‘ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందిప్పుడు’ అనడంతో ఇంటికే పరిమితమయ్యాను. టీచర్ అయ్యే అవకాశం అలా చేజారింది. కానీ మా వారి నుంచి ప్రోత్సాహం మాత్రం ఎప్పుడూ ఉండేది. ఆయన ఆయుర్వేద వైద్యులుగా ఒంగోలు దగ్గర అమ్మనబ్రోలులో ప్రాక్టీస్ చేసేవారు. అక్కడే 35 ఏళ్ల పాటు ఉన్నాం. ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత వీణ నేర్చుకున్నాను. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు. వాళ్లందరి ఆలనపాలన చూస్తూ నా అభిరుచులను కొనసాగించగలిగాను. ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి రంగనాయకమ్మ రాసిన బలిపీఠం, కౌసల్యాదేవి– చక్రవాకం, రవీంద్రనాథుని గీతాంజలి, బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి.. ఇలా అదీ ఇదీ అనే వర్గీకరణ లేకుండా చదివేదాన్ని. యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, శ్రీశ్రీ రచనలను, అబ్దుల్‌కలామ్ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను ఇష్టంగా చదివాను. కొన్ని రచనలు రేడియోలో నాటికలుగా వచ్చేవి. వాటి కోసం రేడియోకి అంకితమయ్యేదాన్ని. ఇలా సాగుతున్న జీవితంలో పిల్లలు నలుగురూ సెటిల్ అయిన తర్వాత మా వారుప్రాక్టీస్ చాలించారు. 2005లో చీరాలకు వచ్చాం. పెద్దబ్బాయి కొత్తదారిలో నడిపించాడు మా పెద్దబ్బాయి నన్ను కొత్తగా ఆవిష్కరించాడు. తను మెకానికల్ ఇంజనీర్. తాను ఆసక్తి కొద్దీ జెమాలజీ కోర్సు చేశాడు. రత్నాల గురించిన కబుర్లు నాకు ఎక్కువ ఆసక్తినివ్వడంతో రత్నాలకు – రాళ్లకు మధ్య తేడాను గుర్తించడం నేర్పించాడు. ముత్యాలు, పగడాలతోపాటు రకరకాల బీడ్స్, జెమ్స్, సెమీ ప్రెషియస్ స్టోన్ ్సతో ఆర్నమెంట్ మేకింగ్ నేర్పించాడు. జీవితాన్ని మనం ఎంత ఉత్సాహవంతంగా, రాగరంజితంగా మార్చుకున్నప్పటికీ ఏదో ఒక వెలితిని సృష్టించి ప్రశ్నార్థకంగా మన ముందు పెడుతుంది. నా అభిరుచులు మాత్రమే నాతో మిగిలాయి, వాటినిప్రోత్సహించిన మావారు మాకు దూరమయ్యారు. ఆయన కోరిక మేరకు దేహాన్ని వైద్యవిద్యార్థుల అధ్యయనం కోసం ఒంగోలులో మెడికల్ కాలేజ్‌కి ప్రదానం చేశాం. ఆయన బాటలో నేను కూడా మరణానంతరం నా దేహాన్ని డొనేట్ చేస్తూ సంతకం చేశాను. మనం జీవిస్తూ మరొకరికి ఉపయోగం కలిగించడమే జీవితానికి అసలైన అర్థం అని నమ్ముతాను. ఆయన జ్ఞాపకాలతో రోజులు సాగుతున్న సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. యూ ట్యూబ్ ఆత్మీయులనిచ్చింది కోవిడ్ సమయంలో అగాధంలాంటి విరామం. ఆ విరామం ఎంత కాలమో కూడా తెలియదు. యూ ట్యూబ్ చానెల్స్ చూస్తూ, మా వారు సుబ్రహ్యణ్య కుమార్ రాసిన వైద్య గ్రంథాన్ని చదువుతూ గడిపాను. అప్పుడు నాక్కూడా నాకు తెలిసిన సంగతులు చెప్పాలనిపించింది. గూగుల్ లేని రోజుల్లోనే నిత్యాన్వేషిగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత ఇక కష్టమేముంది? యూ ట్యూబ్‌కి సంబంధించిన పరిజ్ఞానమంతా ‘హౌ టూ అప్లోడ్, హౌ టూ డూ ఎడిటింగ్, హౌ టూ డూ థంబ్‌నెయిల్’ అంటూ ‘హౌ టూ’ అని అడుగుతూ నేర్చుకున్నాను. మొదట వంటలు, ఇంటి అలంకరణ, మా వారు రాసిన వైద్యగ్రంథంలోని విషయాలను చెప్పాలనుకుని 2021లో యూ ట్యూబ్ చానెల్ మొదలుపెట్టాను. కొంతకాలం తర్వాత యూ ట్యూబ్ గుర్తించాలంటే ఏదో ఒక టాపిక్ మీదనే దృష్టి పెట్టమని సూచించారు పిల్లలు. వంటలు చాలామంది చేస్తున్నారు. ముత్యాలు, పగడాల గురించి చాలామందికి తెలియని సంగతులు చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పమన్నారు మా పిల్లలు. ఆ తర్వాత నాకు సబ్‌స్రైబర్స్ రెండున్నర లక్షలకు పెరగడంతోపాటు ఫాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. డాక్టర్లు, సైంటిస్ట్‌లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు... సందేహాలడుగుతుంటే నాకు తెలిసినదెంత? ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ల సందేహాలు నేను తీర్చడమేమిటని ఆశ్చర్యంగా ఉంటుంది కూడా. అసలు ముత్యాన్ని, నకిలీ ముత్యాన్ని ఎలా గుర్తించాలి, తైవాన్ పగడం ఎలా ఉంటుంది, ఇటాలియన్ పగడాలెలా ఉంటాయి, వేటిని క్యారట్లలో తూస్తారు, వేటిని గ్రాముల్లో తూస్తారు... వంటి విషయాలనెన్నో చెప్పాను. యూ ట్యూబర్‌గా నేను డబ్బుకంటే వెలకట్టలేని ఆత్మీయతను, అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆంటీ, అమ్మా అనే పిలుపులతోపాటు ఈ తరం యువతులు వాళ్ల సందేహాల కోసం ఫోన్ చేసి ‘అమ్మమ్మా’ అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంటోంది. మనిషి, మెదడు పని లేకుండా ఖాళీగా ఉండకూడదు. అలాగే ఎంటర్టైన్ మెంట్ మన మైండ్‌ని చెడగొట్టకూడదని నమ్ముతాను. అందుకే టీవీ సీరియల్స్ నన్ను ఆకర్షించలేదు. నాకు నేనుగా సమయాన్ని ఇలా ఆనందంగా, ఉపయుక్తంగా మలుచుకున్నాను’’ అన్నారు శకుంతలాదేవి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చీకటి నీడ!..ఒక బాస్ జంటల మధ్య సాగే థ్రిల్లింగ్ కథ!
వర్షం ధారగా కురుస్తూ రాత్రిని చల్లగా తడుపుతోంది. కన్నీటి వాన నా మనసును బాధతో తడుముతోంది. కొద్దిసేపటికో లేదా మరునాటికో వర్షం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. నా కన్నీరు కూడా అలాగే ఆగిపోతుందేమో. కానీ నా మనసులోని బాధ ఎప్పటికి తగ్గుతుంది? నేను మళ్లీ సాధారణ స్థితికి రాగలనా..! ఎదురుగా కనిపిస్తున్న పిస్తా రంగు వెడ్డింగ్ కార్డుపై గోల్డ్ కలర్లోని ‘మానస వెడ్స్ తరుణ్’ అనే అక్షరాలను చూస్తుంటే నా బాధ రెట్టింపు అవుతోంది. ఇన్ని సంవత్సరాల నా రిలేషన్‌షిప్‌ని ఎలా వదులుకోగలుగుతోంది మానస. ఆ తరుణ్ అనే వాడితో అంత సులువుగా పెళ్లికి ఎలా ఒప్పుకుంది? ఎంత ఆలోచించినా కారణం అంతుబట్టడం లేదు. కార్డు ఇస్తున్నప్పుడు అదే విషయం అడిగాను. ‘చిల్ యార్. తరుణ్‌తో పెళ్ళి అమ్మా..నాన్న, సొసైటీ కోసమే! నా మనసులో నీ స్థానం ఎప్పటిలాగానే పదిలంగా ఉంటుంది. నా పెళ్లి తరువాత కూడా మనం మునుపటిలాగానే కలుసుకుందాం..’ అని ఎంత ఈజీగా చెప్పేసింది. నా మనసులో మానసకు తప్ప మరో మనిషికి చోటు లేదు. కానీ తనెందుకు ఇలా చేసింది! బాల్కనీలోకి వచ్చి సిగరెట్ వెలిగించాను. ఆమె పరిచయం, సాన్నిహిత్యం తరువాత నేనొక అనాథనని మరచిపోయాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒంటరినని తలుచుకుంటే దుఃఖం ముంచుకొస్తోంది. బెడ్ పై వాలి కళ్ళు మూసుకుంటే నిద్ర దరి చేరటం లేదు. నాలుగేళ్ల క్రితం నాటి మా మొదటి పరిచయం గుర్తుకు వచ్చింది. ∙∙ చురుకుగా ఉండటం, సమయస్ఫూర్తి, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీతో పాటు చూడగానే ఆకర్షించే నా రూపం.. చిన్న వయసులోనే.. పేరున్న కంపెనీలో టీమ్ లీడర్‌గా ఎదగటానికి దోహదపడింది. అది నా రెండో ప్రాజెక్ట్ అనుకుంటా. కొత్తగా ఒక జావా డెవలపర్ అవసరం పడింది. షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురిలో ఒకరిని ఫైనల్ చేసి రిక్రూట్ చేసుకొనే బాధ్యతను నాకు అప్పగించారు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ప్రొఫైల్స్ చూస్తే ముగ్గురూ టాలెంటెడ్ అనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరినీ నా క్యాబిన్లోకి పంపించమన్నాను. మొదట వచ్చిన అమ్మాయిది.. బంగారు వర్ణం. ఒకసారి చూస్తే ఏ మగాడికైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సోయగం. కొన్ని కోడ్స్, ప్రాబ్లెమ్ ఎనాలిసింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేశాక ఎందుకో సంతృప్తి కలగలేదు నాకు. తరువాత వచ్చిన అబ్బాయి ఎన్.ఐ.టి గ్రాడ్యుయేట్. కానీ అతనిలోని కొంచెం నిర్లక్ష్యపు దోరణి నచ్చక రిజెక్ట్ చేశాను. చివరగా వచ్చింది మానస. చామనఛాయ రంగు దేహం.. ఆ కళ్ళలోని మెరుపు సమ్మోహనంగా ఉంది. ‘గుడ్ మార్నింగ్’ అంటూ సన్నని నవ్వు. అదేంటి ఆశ్చర్యంగా ఆ నవ్వు నాలో చక్కిలిగింతలు పెడుతోంది. ఇదేమి వింత! ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపించింది. కానీ ఆ పొడవాటి మొహంలోని కాంతి, మెడ దగ్గరి నునుపు నన్ను కళ్ళు తిప్పుకోనివ్వ లేదు. తమాయించుకొని ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్ డిస్కస్ చేశా. అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలే. ఆటిట్యూడ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే ముచ్చటేసింది. ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని చెప్పాను. ‘థాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ. ఈ జాబ్ నాకు రావటానికి మీరే కారణం. మీ గైడెన్స్‌లో పనిచెయ్యటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆ మెత్తని స్పర్శకు నా నరనరాల్లో వేల వోల్ట్ల విద్యుత్ ప్రవహించిన అనుభూతి. సర్దుకొని ‘బై ద వే.. నీ డేట్ అఫ్ బర్త్ చూశాను. నువ్వే నా కన్నా ఆరు నెలలు పెద్ద. సో నేను నీ బాస్ అయినప్పటికీ మీరు అనొద్దు. నువ్వు అని సింగిలర్ యూస్ చెయ్యి. నో ప్రాబ్లెమ్’ అన్నాను. కళ్ళతోనే నవ్వింది. ఆ చూపు గుచ్చుకొని నా హృదయంలో తియ్యని అలజడి మొదలయ్యింది. అలా తొలి పరిచయంలోనే తను నాకు బాగా కావాల్సిన వ్యక్తిలా కనిపించింది. తరువాత నుండి ప్రతిరోజు తనను చూడాలనే తహ తహ మొదలయ్యింది. అయితే ఒకటే టీమ్ అయినా ఆఫీస్‌లో ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైమ్ అస్సలు ఉండేది కాదు. మీటింగ్స్ కుడా జూమ్‌లోనే అయ్యేవి. కానీ నాకు మాత్రం రోజుకి ఒక్కసారైనా మానసని చూడాలని, చలాకీగా తను మాట్లాడుతుంటే వినాలని అనిపించేది. మానస ఇదేమీ గమనించేది కాదు. నాలో తన పట్ల కలుగుతున్న ప్రేమ పూరిత భావనలు తను కనిపెట్టే అవకాశం అస్సలు లేదు. ‘నువ్వు సిగరెట్లు తగ్గించు. పెదాలు కొంచెం నలుపు రంగులోకి మారేలా కనిపిస్తున్నాయి’ అంది ఒక రోజు. ‘ఇంత అందంగా ఉంటావు. ఆఫీస్‌లో ఇప్పటివరకు ఎవ్వరూ ప్రపోజ్ చెయ్యలేదా నీకు?’ చొరవగా అడిగింది ఇంకో రోజు. ‘నువ్వు మామూలు డ్రెస్‌లో కంటే జీన్స్.. టీ షర్ట్‌లో సూపర్ ఉంటావు’ మరో రోజు కాంప్లిమెంట్. ఎప్పుడూ క్యాంటీన్లోనే తినే నాకోసం అప్పుడప్పుడు తన లంచ్ బాక్స్ షేర్ చేసేది. కొద్ది రోజుల్లోనే ఒక స్నేహితురాలిగా దగ్గరయ్యింది. ఆఫీస్ విషయాలు, ఇంట్లో సంగతులే కాకుండా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేది. ఎప్పుడైనా తను లీవ్ పెడితే ఆ రోజంతా నా మనసు విలవిల్లాడేది. తను పరాయి మనిషి కాదు అని నా కోసమే పుట్టిందేమో అనే తీవ్రమైన భావన నాలో! నేను తనకి ఇంకా దగ్గర అవ్వకముందే మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి మారిపోయింది. మా ఆఫీస్‌లో తన లాస్ట్ వర్కింగ్ డేనాడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు నా కళ్ళలోని తడిని చూసి ‘హే.. ఇప్పుడు ఏమైంది? నేను వేరే కంట్రీకి ఏమీ పొవట్లేదు. ఈ సిటీలోనే ఉంటున్నా. ఇంకా చెప్పాలంటే మనిద్దరి ఆఫీస్‌ల మధ్య దూరం పది నిమిషాలే. రెగ్యులర్‌గా టచ్‌లో ఉందాం. ఓకే నా’ అంటూ హగ్ చేసుకొంది. ఆ కౌగిలి తను కాజువల్‌గా ఇచ్చినా అప్పుడు మా రెండు దేహాల స్పర్శలో నేను పొందిన ఆనందం అనిర్వచనీయం. అలారం క్లాక్, మొబైల్ రెండూ ఒకేసారి మోగుతుండగా నిద్ర లేచాను. టైమ్ చూస్తే పది. మానస గురించి ఆలోచిస్తూ లేట్‌గా పడుకున్నానేమో మెలకువ రాలేదు. మొబైల్ చూస్తే తన నుండే కాల్. ‘హలో.. గుడ్ మార్నింగ్ ’ అన్నాను. నా గొంతులో విషాదం నాకే తెలుస్తోంది. ‘హే గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? కమాన్ క్విక్‌గా రెడీ అయ్యి బేగంపేట షాపర్స్ స్టాప్‌కి వచ్చేయ్. చిన్న షాపింగ్. తరుణ్ కూడా వస్తున్నాడు. నువ్వుంటే నాకు బాగుంటుంది’ అని చెప్పేసి ఫోన్ కట్ చేసింది. ఏమనుకుంటుంది ఈ మనిషి అసలు! మా ఇద్దరి మధ్య ఏమీ లేనట్లు ఇంత క్యాజువల్‌గా ఎలా మాట్లాడుతుంది? తరుణ్‌తో షాపింగ్ చెయ్యటానికి నన్నెందుకు రమ్మంటోంది? వాళ్ళిద్దరినీ పక్క పక్కన చూస్తే నేను తట్టుకోగలనా! అలా ఆలోచిస్తూనే రెడీ అయ్యి కిందకి వచ్చి కార్ స్టార్ట్ చేశాను. రాత్రి తగ్గిన వర్షం మళ్ళీ సన్నని తుంపరతో మొదలయ్యింది. కొన్ని జ్ఞాపకాలకు మరణమే ఉండదు. కొన్ని జ్ఞాపకాలు అస్సలు పురుడు పోసుకోవు. డ్రైవ్ చేస్తూ మళ్ళీ పాత జ్ఞాపకాలను వెతుక్కొన్నాను. మొదటిసారి తను నా కార్ ఎక్కటానికి కూడా ఇలాంటి వర్షమే కారణం. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి చిన్న ముసురు. నా కార్ దగ్గరికి వెళ్తూ, నీటి బిందువులతో ఆనందంగా పరవశిస్తున్న చెట్ల ఆకుల సోయగాన్ని చూస్తే ఎందుకో మానస గుర్తుకు వచ్చింది. స్కూటీ పై ఆఫీస్‌కి వచ్చే తను ఈ వర్షంలో ఇంటికి ఎలా వెళ్తుందో అనిపించి మొబైల్ తీసి కాల్ చేశా. నేనేం మాట్లాడక ముందే ‘హే.. హౌ అర్ యూ? ఒక్క మెసేజ్ లేదు, కాల్ లేదు. మర్చిపోయావనుకున్నా బేబీ’ అన్నది గారాలు పోతూ. ఆ గొంతులో ఆ చనువుకి నా వొళ్ళు సంతోషంతో పులకరించింది. ‘ఐ యామ్ గుడ్. వర్షం వస్తుంది కదా ఎలా వెళ్తావు? ఫైవ్ మినిట్స్‌లో వస్తా. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా’ అన్నాను. ‘థాంక్ గాడ్. క్యాబ్ కోసం ట్రై చేస్తుంటే రెస్పాన్స్ రావట్లేదు. కమాన్ తొందరగా వచ్చేయ్. నీతో కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అవుతోంది. వెయిటింగ్ ఫర్ యూ..’ అన్న తన మాటలకి కొత్త ఉత్సాహం ఆవరించింది నన్ను. రెడ్ కలర్ చుడీదార్ పై కొన్ని వర్షపు చినుకులు అద్దుకొని మంచి పరిమళాన్ని మోసుకుంటూ వచ్చి కార్లో కూర్చుంది. ఆ కళ్ళు చూస్తేనే మైకం కమ్ముకుంటుంది నాలో. ఎప్పటిలాగానే గలగలా మాట్లాడుతుంటే ముందున్న అద్దంలో మెరిసే తన పెదాలనే చూస్తున్నా. ‘హే.. ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకైతే చల్లటి ఐస్‌క్రీమ్ చప్పరించాలని ఉంది’ అంది. ‘నిజం చెప్పనా! నాకైతే నిన్ను చూస్తూ చిల్డ్ బీర్ కొట్టాలని ఉంది’ అన్నాను. ‘అబ్బా.. నీకెప్పుడూ బోల్డ్ థాట్స్ వస్తాయి.. లెట్స్ డూ ఇట్..’ అంటూ కన్ను గీటింది. తను అలా చేస్తే ఏదో తెలియని థ్రిల్ ఫీలింగ్ కలిగింది నాకు. ‘అయితే చలో నా ఫ్లాట్‌కే పోదాం. ఫ్రిజ్‌లో ఐస్‌క్రీమ్, బీర్ రెండూ ఉన్నాయి’ అంటూ నేను కూడా కన్ను గీటాను కావాలని. ‘డన్..’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాల్కనీలో కూర్చొని, వర్షాన్ని ఆస్వాదిస్తూ తను బటర్ స్కాచ్‌ని, నేను బడ్వైజర్ని రుచి చూస్తున్నాం. ఎలా మొదలు పెట్టాలో అర్థంకావటం లేదు నాకు. డైరెక్ట్‌గా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా? ఒప్పుకోకుంటే భరించలేను. నా గురించి అందరికీ చెపితే ఆ అవమానాన్ని తట్టుకోలేను. బాల్కనీ కుండీల్లో రకరకాల మొక్కలు ఉంటే, వాటివైపు చూస్తూ ఏదో ఆలోచిస్తోంది మానస. బీర్‌తో పాటు నైట్ క్వీన్ గుబాళింపు ఒక వైపు, మరువం పరిమళం ఇంకో వైపు నాకు మత్తుని కలిగిస్తున్నాయి. ధైర్యం చేసుకొని తన దగ్గరగా వెళ్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను. అదే మెరుపు. నవ్వుతూ నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా..చప్పున తన భుజాలు పట్టుకొని ముద్దు పెట్టి ‘లవ్ యూ మానసా..’ అన్నాను. ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయి నిలుచుంది తను. నా వొంట్లో భయం కలిసిన ఉద్విగ్నత. ‘నీకు ఎందుకు ఇలా అనిపించింది. ఇది కరెక్టేనా?’అని అడిగింది. ముద్దు పెడితే ఏమీ అనకుండా ఆ ప్రశ్న అడగటంతో నాకు ధైర్యం వచ్చింది. ‘కరెక్టో కాదో అన్నది ప్రశ్న కాదు. నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. నాకు నువ్వు కావాలి. జీవితాంతం నీ తోడు కావాలి’ అన్నాను. అంతే లతలా నన్ను పెనవేసుకొని ‘లవ్ యూ టూ డియర్’ అని నా నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది. ఆ క్షణం ఈ ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది నాకు. ఆ రోజు నుండి మా ఇద్దరి ప్రపంచం కొత్తగా మొదలయ్యింది. ఎన్నో కబుర్లు, సినిమాలు, పార్టీలు, అలకలు, ఆనందాలతో జీవితం రంగుల హరివిల్లులా సాగుతూ.. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేని ప్రేమలోకంలో విహరించసాగాం. అలా అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఇలా సడన్‌గా తరుణ్‌తో నా పెళ్లి అంటూ వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బేగంపేట్ వచ్చింది. ∙∙ నేను వెళ్లేసరికి వెడ్డింగ్ డ్రెస్ సెలక్షన్లో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ‘తరుణ్.. మీట్ మై బాస్ ఇన్ మై ఫస్ట్ జాబ్. అఫ్కోర్స్ ఇప్పుడు మాత్రం తనే నాకున్న ఒకే ఒక్క క్లోజ్ ఫ్రెండ్ అనుకో’ అని నన్ను పరిచయం చేసింది. ఆ మాటకు నా హృదయం భగ్గుమంది. ‘ఎంతకు తెగించావే రాక్షసి. నేను క్లోజ్ ఫ్రెండ్ అంతేనా? ఇంకేమీ కానా? అయినా ఎలా చెపుతావు లే!’అని మనసులో అనుకున్నాను. మొహం మీద బలవంతంగా నవ్వు పులుముకొని ‘హాయ్’ అన్నాను. ఇంకేం మాట్లాడబుద్ధి కాలేదు. వాళ్లిద్దరినీ అలా చూస్తుంటే బాధ, కోపం, కసి, చిరాకు.. మనసంతా చేదుగా అయిపోయింది. మానస లేకుండా నేను అసలు జీవించగలనా! ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ఈ ఇడియట్ తరుణ్ గాడు? మమ్మల్ని వేరు చెయ్యటానికే పుట్టినట్లున్నాడు. నాకు వాడంటే అసూయ, అసహ్యం రెండూ కలిగాయి. షాపింగ్ అయిపోయింది. వస్తుంటే ‘మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. ఇది నా నుండి ఇన్విటేషన్’ అన్నాడు తరుణ్. ‘ష్యూర్.. సీ యూ’అని చెప్పి బయట పడ్డాను. మానస ఎప్పటికైనా నాకే సొంతం కావాలి. తను లేకుంటే నాకు చావే దిక్కు అనిపించింది. దేవుడా ఎలాగైనా ఈ పెళ్లి ఆపు అని జీవితంలో మొదటిసారి దేవుడికి మొక్కుకున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించలేదు. వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నా కళ్ల ముందు అంతా శూన్యం. ఇంత చేసినా ఆశ్చర్యంగా నాకు మానస మీద కోపం మాత్రం రావట్లేదు. ప్రతిరోజు తన గొంతు వినాలని, తనని చూడాలని అనిపించి పిచ్చెక్కేది. కాల్ చేస్తే జస్ట్ హాయ్, బాయ్ అని రెండు మూడు మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేసేది అంతే. ఇప్పుడు నా భవిష్యత్తు గురించి నేనో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అది ఎంత కఠినమయినా కచ్చితంగా ఆచరణలో పెట్టాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళ పెళ్ళైన వారం రోజుల తరువాత ఒక రోజు ఉదయాన్నే ఫోన్ చేసింది మానస. ‘హేయ్.. ఏం చేస్తున్నావ్? మరిచిపోయావా మమ్మల్ని? ఈ రోజు నేను ఆఫీస్‌కి వెళ్లట్లేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. వచ్చేయ్ ఇంటికి’ అంది. అడ్రస్ అడిగి జుట్టు కూడా సరిగ్గా దువ్వుకోకుండా బయటపడ్డాను. ఎందుకు రమ్మంది? క్యాజువల్గానా లేక ఇంకేదైనా చెప్పటానికా? నాలో అంతులేని ప్రశ్నలు. నేను వెళ్లేసరికి తరుణ్ ఇంకా పోలేదు. రెడీ అయ్యి షూ వేసుకుంటున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యంగా ‘అరే చెప్పకుండా వచ్చారు? ముందే చెపితే నేను కూడా లీవ్ పెట్టే వాడిని కదా! ఎనీవే ఆఫ్టర్ నూన్ వచ్చేస్తాను. లంచ్ ముగ్గురం కలిసే చేద్దాం. బాయ్’ అంటూ వెళ్ళిపోయాడు. వీడికి మా ఇద్దరి మీద డౌట్ వచ్చే అవకాశం అస్సలు లేదులే అనుకున్నాను. నన్ను చూస్తూనే గట్టిగా కౌగిలించుకొని ‘మిస్ యూ బేబీ..’ అంటూ ముద్దు పెట్టింది మానస. నాకు ఏడుపు ఆగలేదు. ‘ఎందుకిలా చేశావ్? నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావ్? నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా?’ నిలదీశాను. నా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ‘ఇప్పుడేమైంది? నిన్ను దూరం పెట్టను అని చెప్పాగా. నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమే’ అంది. ‘మరి అలాంటప్పుడు ఆ తరుణ్గాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు?’ కొంచెం కోపంగా అడిగాను. ‘ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకుంటే లోకం ఒప్పుకోదు కాబట్టి. చూడు అమృతా.. నాకు నీ ప్రేమ కావాలి. సోషల్ లైఫ్ కావాలి. అలాగే పిల్లలు కూడా కావాలి. అందుకోసం తరుణ్‌ని పెళ్లి చేసుకున్నాను. కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉంటావు..’ అని చెప్పుకుంటూ పోతోంది. తన నుండి దూరంగా జరిగి ‘ప్రేమంటే రెండు దేహాల కలయిక మాత్రమే కాదు. రెండు మనసుల అపూర్వ సంగమం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. ఇంకో వ్యక్తికి చోటు ఉండదు. కానీ నువ్వు అలా కాదు. నీది నిజమైన ప్రేమ కాదు’ అన్నాను. ‘అమృతా.. ప్లీజ్ అలా అనకు. నన్నర్థం చేసుకో’ నా చేతులు పట్టుకుంటూ అడిగింది. ‘ఒకే జెండర్ అయినా, జెండర్స్ వేరైనా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు మూడో వ్యక్తితో రిలేషన్ అంటే అది మొదటి ప్రేమికుడు లేదా ప్రేమికురాలికి ద్రోహం చేసినట్లే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అది మానసిక వ్యభిచారం లాంటిదే’ స్థిరంగా చెప్పాను. ‘అమృతా.. చెప్పానుగా.. సమాజం కోసం.. ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్ కోసమే నేను తరుణ్‌ని పెళ్లి చేసుకుంది. నాకు నువ్వే ప్రాణం’ అంది. ‘నేను నీ ప్రాణమే అయితే నన్నిలా వదిలేసే దానివి కాదు. జీవితాంతం నాకు తోడుగా ఉండేదానివి. నీ కోసం ఎవ్వరినైనా ఎదిరించి బతకటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు? నీది స్వార్థం. నిజమైన ప్రేమకు కావాల్సింది నమ్మకం. అది నీ మీద నాకు ఇప్పుడు లేదు. మళ్ళీ నా జీవితంలో ప్రవేశించాలని చూడకు. గుడ్ బై’ అని చెప్పి బయటకు నడిచాను. --మొగలి అనిల్ కుమార్ రెడ్డి (చదవండి: -
పిల్లల కథ! వ్యాపారానికి కావాల్సిన స్ట్రాటజీ!
అంజి అనే కోతి కొత్తగా మూలికలతో ఔషధాలు తయారుచేసి అడవిలో అమ్మటం మొదలుపెట్టింది. అది కొంతకాలం పక్క అడవిలో ఉండే తన మిత్రుడు మారుతి అనే కోతి దగ్గర మూలికలతో ఔషధాలు తయారుచేయడం నేర్చుకుంది. తిరిగి తన అడవికి వచ్చి మొక్కల వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్లను.. ఉపయోగించి ఎత్తుపెరగటానికి, బరువు తగ్గడానికి, జుట్టు పెరగటానికి, అందంగా అవడానికి.. ఇలా చాలావాటికి మందులు తయారు చేసేది. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది.. ఏ ఆకును ఏ రకంగా వాడాలో అంజికి పూర్తిగా తెలుసు. తన మూలికల ఔషధాలను అడవంతా విస్తరింపచేయాలనే ఆలోచనతో నలుగురు అమ్మకందారులనూ నియమించాలనుకుంది. వెంటనే అడవి అంతా చాటింపు వేయించింది. అంజి తయారుచేసే మందులను అమ్మి పెట్టేందుకు ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది ముందుకు వచ్చాయి. ఔషధాలను తీసుకుని నాలుగూ నాలుగు దిక్కులకు వెళ్ళాయి. పదిరోజులైనా ఒక్క మందూ అమ్ముడుపోలేదు. అంజి తయారుచేసిన మందుల అడవిలోని జంతువులకు గురి కలగలేదు. దాంతో అంజి ఔషధాల తయారీని నిలిపివేయాలనుకుంది. విషయం తెలుసుకున్న మారుతి.. అంజిని కలసి ‘మిత్రమా! నీకు ఔషధాల తయారీలో మంచి నైపుణ్యం ఉంది. లోపం ఎక్కడుందో రేపు కనిపెడతాను’ అంటూ ధైర్యం చెప్పింది. మరునాడు అంజి వెంట మారుతి వెళ్ళి ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పంది మందులను ఎలా విక్రయిస్తున్నాయో గమనించింది. అవి ఎండలో పెద్దగా అరుస్తూ ఔషధాలు కొనమని వాటి గుణాలను వివరిస్తున్నాయి. ఆ అరుపు విని జంతువులు, పక్షులు వస్తున్నాయి. ఏనుగు, ఎలుగుబంటి, నక్క, పందిని.. వాటి చేతుల్లో ఉన్న మందులను చూసి వెళ్ళిపోతున్నాయి. కానీ కొనటంలేదు. లోపం ఎక్కడుందో మారుతికి తెలిసిపోయింది. కాసేపు అలాగే పరిశీలించి.. అంజి, మారుతి రెండూ తిరిగి ఇంటికి బయలుదేరాయి. దారిలో ‘మిత్రమా! నువ్వు చేసిన మందులు సరైనవే’ అంది మారుతి. ‘మరి అమ్మకందారుల్లో లోపమా?’ అడిగింది అంజి. ‘పాపం నిజానికి అవి ఎండలో పెద్దగా అరుస్తూ, కష్టపడుతున్నాయి. వాటి శ్రమలోనూ ఎలాంటి లోపం లేదు’ అంది మారుతి. ‘మరి కారణం ఏంటీ?’ అడిగింది అంజి. ‘సరైన ఔషధాన్ని సరైన అమ్మకందారు అమ్మటం లేదు’ అంది మారుతి. అర్థంకాలేదు అంజికి. గ్రహించిన మారుతి ‘మిత్రమా! మొదట మన మీద నమ్మకం కుదిరితేనే మనం ఎదుటివారికి అమ్మగలం. ఒంటినిండా జుట్టుండే ఎలుగుబంటి జుట్టు పెరగటానికి ఔషధం అమ్మితే ఎలా ఆకర్షితులౌతారో.. సన్నబడడం గురించి ఏనుగు మాట్లాడితే అలాగే పారిపోతారు’ అంది మారుతి. ‘ఔషధం ఎంత గొప్పదైనా నమ్మకం లేకపోతే పనిచేయనట్లు.. తను ఔషధాన్ని ఎంత చక్కగా తయారుచేసినా సరైన వారు విక్రయించకపోతే అది వినియోగదారుడిని ఆకర్షించదని అర్థమైంది అంజికి. ‘మిత్రమా! ప్రతిజీవిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని సరైన సమయంలో, సరైన పనికి, సరిగ్గా వినియోగించుకోవాలి’ అని చెప్పింది మారుతి. ఆ సూచన పాటించి చిన్న చిన్న మార్పులతో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగింది అంజి. పైడి మర్రి రామకృష్ణ (చదవండి: పుట్టుకతో ఎవరూ మోసగాళ్లు కాదు! కానీ ఆ మోసం విలువ..!) -
తారామతి బారాదరిలో కన్నుల పండుగగా నాట్యతోరణం!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కూచిపూడి.. మరోవైపు భరతనాట్యం.. ఇవే కాదు, ఇంకా కథక్, మోహినియట్టం, ఒడిస్సిలతో పాటు తెలంగాణలోని పురాతన నృత్యశైలి అయిన పేరిణి నృత్యం.. ఇవన్నీ ఒక్కచోటే కొలువుదీరాయి. నగరంలోని ప్రముఖ కళావేదిక అయిన తారామతి బారాదరిలో గల కేలిక ఇండోర్ ఆడిటోరియంలో శనివారం సాయంత్రం అమృత కల్చరల్ ట్రస్టు వారి మూడో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన నాట్యతోరణం-2023 కళాప్రియుల మది దోచుకుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథి, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఆన్లైన్ సందేశం పంపారు. “అమృత కల్చరల్ ట్రస్టుకు ఆల్ ది బెస్ట్. నా పని నిరంతరం మారుతుంటుంది. అందువల్ల నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేటి సాంస్కృతిక ఉత్సవాన్ని నేను వ్యక్తిగతంగా వచ్చి ఆస్వాదించలేకపోతున్నాను. స్వీయ వ్యక్తీకరణ ఉత్తమ రూపాలలో నృత్యం ఒకటి. భారతీయ శాస్త్రీయ నృత్యాలు మన దేశ గొప్ప సాంస్కృతిక, సాంప్రదాయ వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి. నేటి కాలంలో వీటికి మన ప్రోత్సాహం అవసరం. కళాకారులకు తోడ్పాటునందించి, ప్రామాణిక నృత్య పాఠశాలల నుంచి విస్తృతమైన శాస్త్రీయ నృత్య రూపాలను తెలంగాణకు తీసుకువచ్చిన అమృత కల్చరల్ ట్రస్టును అభినందిస్తున్నాను” అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ఈరోజు అవార్డులు గెలుచుకున్నవారితో పాటు నృత్యాలు ప్రదర్శించిన కళాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలుపుతూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను చూసిన అత్యుత్తమ జుగల్బందీలలో ఇది ఒకటి. ఇంతకుముందు కూడా అమృత కల్చరల్ ట్రస్టు కార్యక్రమాల్లో పాల్గొని మన సామాజిక నిర్మాణంలో సంప్రదాయాలను పరిరక్షించడానికి వారు చూపుతున్న అంకితభావానికి మంత్రముగ్ధుడినయ్యాను. ఈ వారసత్వాన్ని మిగతా తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలోని ఇతర ప్రాంతాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను” అని చెప్పారు. నిర్వహణ కమిటీ చీఫ్ రాజేష్ పగడాల మాట్లాడుతూ, “అమృత కల్చరల్ ట్రస్ట్ అనేది లాభాపేక్షలేని సంస్థ, ఇది కళలను పెంపొందించడం, ప్రోత్సహించడంలో ముందుంటుంది. తనను, చుట్టుపక్కల ప్రజలను మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సాధించడానికి, భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, పురాణాల మూలాలను అర్థం చేసుకోవడానికి ఒక నృత్య కళాకారుడికి జీవితకాల అంకితభావం అవసరమన్నది మా బలమైన నమ్మకం. నృత్యాన్ని వృత్తిగా ఎంచుకునే ప్రతిభావంతులైన కళాకారులకు స్కాలర్షిప్లు కూడా అందిస్తాం” అన్నారు. యాక్టివ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పర్సన్ భార్గవి పగడాల మాట్లాడుతూ, “పాత, కనుమరుగవుతున్న శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను బలోపేతం చేయడం.. సాంకేతికత, సామాజిక మాధ్యమాలను ఉపయోగించి అవగాహనను ప్రోత్సహించడం మా లక్ష్యం. ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా యువ ప్రతిభావంతులను ప్రేరేపిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల శాస్త్రీయ నృత్యరీతులను ఒకే వేదికపైకి తీసుకువస్తాము. మా ప్రేక్షకులు, అభిరుచి గల ఔత్సాహికులు ముందుకు రావడానికి, భారతీయ శాస్త్రీయ నృత్యకళలకు దోహదం చేయడానికి చేస్తున్న మా ఈ ప్రయత్నాలు.. కళాకారుల అవగాహనను పెంచుతాయని మేము విశ్వసిస్తున్నాము” అని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు... ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి బడుగుల, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్ నృత్య విభాగాధిపతి డాక్టర్ అనురాధ జొన్నలగడ్డ, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నృత్య విభాగాధిపతి కళారత్న డాక్టర్ వనజ ఉదయ్, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి కుమార్తె, అభినయవాణి నృత్యనికేతన్ వ్యవస్థాపకురాలు చావలి బాలా త్రిపురసుందరి, ప్రముఖ నాట్యగురువు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని లాస్యకల్ప ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ వ్యవస్థాపక డైరెక్టర్ డి.ఎస్.వి. శాస్త్రి. (చదవండి: ఇజ్రాయెల్ యుద్ధం వేళ తెరపైకి వచ్చిన దుస్సల కథ! ఎందుకు హైలెట్ అవుతోందంటే..) -
పుట్టుకతో ఎవరూ మోసగాళ్లు కాదు! కానీ ఆ మోసం విలువ..!
జోరున వర్షం కురుస్తోంది.. ఆకాశానికి చిల్లు పడిందాన్నట్టుంది. దట్టంగా మేఘాలు అలుముకోవడంతో పగలే చీకటి ఆవరించింది. సాయంత్రం నాలుగింటికే అర్ధరాత్రిని తలపిస్తోంది. అచ్చం నా మనఃస్థితిలానే ఉంది వాతావరణం కూడా! ఆ వర్షానికి తడిచిన చీర.. కాళ్ళకడ్డం పడుతున్నా అలానే నడుస్తున్నాను. చినుకులు సూదంటు రాళ్ళలా గుచ్చుతున్నాయి. అవి నా మనసుకు తగులుతున్నాయి. రోడ్డుకి అడ్డంగా నడుస్తున్న నా ముందు, కార్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ‘ఏమ్మా.. చావాలనుకుంటున్నావా? పక్కనే సముద్రముంది, వెళ్ళి అందులో దూకు. మమ్మల్నెందుకు చంపుతావ్?’ విసుగ్గా అని వెళ్ళిపోయాడు. కార్ డ్రైవర్ మాటలకి పక్కకు తిరిగి చూశాను. వర్షానికి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గమ్యం లేని నా నడకకు, అదే చివరి మజిలీ అనిపించిందా క్షణం. నా అడుగులు అటువైపు పడ్డాయి. వర్షంలో సముద్రాన్ని చూడాలనేది ఒకప్పటి నా కోరిక. ప్రళయకాల రుద్రుడిలా విరుచుకుపడుతున్న అలలు.. నన్నేం భయపెట్టడం లేదు. నిన్నటి వరకు చిన్న బొద్దింక కనబడినా భయపడే ఆ మహిత ఇప్పుడు లేదు. చేతిలో ఫోన్ రింగ్ అవుతుండటంతో తీసి చూశాను. 143వ కాల్ కట్ అయ్యి, మిస్డ్ కాల్‌గా మారిపోయింది. ∙∙ ఒకప్పుడు ఆ నంబరంటే విపరీతమైన క్రేజ్. ఆ నంబర్ వెనుకున్న శౌర్య అంటే ఇష్టం. శౌర్యతో జీవితం, ఇదిగో ఇక్కడే మొదలైంది. నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో కలసి చదువుకున్న క్లాస్మేట్. ఈ అనంతసాగరం ఒడ్డున ఫైనలియర్లో చుట్టూ స్నేహితుల సాక్షిగా.. మోకాళ్ళపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. అందరూ చెయ్యడం వేరు.. శౌర్య ప్రపోజ్ చెయ్యడం వేరు అనిపించింది నాకు. అందగాడు.. చదువుల బిడ్డ.. అమ్మాయిలు కోరుకునే లక్షణాలన్నీ శౌర్యలో పుష్కలంగా ఉన్నాయి. అలాంటి శౌర్య.. నాకు ప్రపోజ్ చెయ్యడమనేది నేను ఉహించనిది కావడంతో వెంటనే ఎగిరి గంతేసి కౌగిలించుకుని మరీ ఒప్పుకున్నాను. ఆ తరువాత ఐస్‌క్రీమ్ పార్లర్ నుంచి బీచ్, కొత్త సినిమా ఇలా ప్రతిచోటా తిరిగి, ప్రేమికులుగా మా ముద్ర వేశాం. నాకు అందంగా కనిపించిన ప్రేమ.. నా తల్లిదండ్రులకు కనిపించలేదు. కులం నుంచి అంతస్తుల వరకు ఎత్తి చూపించారు. ఏడు తరాలు చూడాలన్నారు. అరే..మనిషి ఎదురుగా తన గుణం కనిపిస్తుంటే, కనబడని ఏడు తరాలు గురించి మీకెందుకన్నాను. వాళ్ళు మెట్టు దిగలేదు. నేను మాత్రం ఆ ఇంటి మెట్లు దిగి, శౌర్య భార్యగా మెట్టినింట అడుగుపెట్టాను తల్లిదండ్రులను వద్దనుకుని! నేనంటే ఎంతో ప్రేమ చూపించే అత్తగారు, ప్రాణంలా చూసుకునే శౌర్య. నా అంత అదృష్టవంతురాలు లేదనుకున్నాను. నా ఆనందాన్ని కాలదన్నబోయిన తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకుని, కనీసం ఫోనైనా చెయ్యలేదు. ఈనాడు శౌర్య కాకుండా నాకు మరో కుటుంబం, స్నేహం ఏదీ లేదు. నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నానేమో, ఇప్పుడిక కన్నీళ్ళు రావడం లేదు. మనిషికి ఎక్స్పైరీ డేట్ ముందే తెలిస్తే అది ఇంత బరువుగా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. అవును!! నేను చనిపోబోతున్నాను. నాకున్నది కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఎన్ని కోరికలు, ఆశలు, ఆశయాలుండేవో వాటన్నిటికీ తెర పడింది. ఇంత బాధను అనుభవిస్తూ పోయేకన్నా ఇప్పుడే పోతే? నా ఆలోచనలానే విశాలమైన సంద్రం, రెండు చేతులు చాచి.. ‘నా గర్భంలో నీకు చోటుంది మహితా’ అని చెబుతున్నట్టుంది. వర్షం తగ్గి, మనుషులు తిరగడం ఎప్పుడు మొదలుపెట్టారో గమనించలేదు. సాగర గర్భంలోకి వెళుతున్న నా చేతిని పట్టుకుందో చిట్టి చెయ్యి. బోడిగుండుతో ముద్దుగా, బుజ్జి వామనుడిలా ఉన్నాడు. కిందికి వంగి కళ్ళెగరేశాను. వర్షానికి తడవకుండా, తన చొక్కాలో దాచుకున్న డిబ్బీ తీసి చూపించాడు వాడు. ‘కల్పతరువు’ దాని మీద ఉన్న పేరు అదే! ‘అనాథాశ్రమమా?’ మాట జారి బాధపడ్డాను. బుజ్జి వామనుడు తలూపాడు. మెడలో వేలాడుతున్న మంగళ సూత్రాలతాడు తీసి, డిబ్బీలో వేసేశాను. వాడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. నవ్వి తల నిమిరాను. చేతికి కుట్లు తాలుకు గోతులు తగిలాయి. వామనుడ్ని వెనక్కి తిప్పి చూసి, ‘ఏంటివి?’ అడిగాను. ‘ఇంకొద్ది క్షణాల్లో చనిపోయే నీకెందుకు?’ అంటూ అంతరాత్మ ప్రశ్నించింది. ‘వాడికి బ్రెయిన్లో కణితి ఉందంట అక్కా! ఆపరేషన్ చేసి తీశారు. కానీ మళ్ళీ ఇంకొకటి వచ్చిందట. ఈసారి ఆపరేషన్ అనవసరమంటా’ అంది.. వాడి కూడా వచ్చిన అమ్మాయి వాడిని ఎత్తుకుని వెళుతూ. ఎక్స్పైరీ డేట్ మెడలో వేసుకుని కూడా నవ్వుతూ తిరుగుతున్న బుజ్జి వామనుడు.. తనవంకే చూస్తుండిపోయాను. ‘నిన్ను వ్యాన్ దిగొద్దని చెప్పాను కదా? ఈ సారి ఇలా చేశావంటే బయటకు తీసుకురాను చెబ్తున్నా’ అంది ఆ అమ్మాయి వాడిని బెదిరిస్తూ. బుజ్జి వామనుడు నవ్వుతున్నాడు. ఎక్స్పైరీ డేట్ పూర్తయ్యేవరకు కూడా నవ్వుతూ బతకచ్చని చెప్పిన వాడి పరిచయంతో నా గమ్యం మారింది.వాళ్ళ వెనకే వెళ్ళాను. వాళ్ళందరినీ జాగ్రత్తగా వ్యాన్ ఎక్కిస్తున్న వాలంటీర్ ‘ఏమ్మా, ఆశ్రమానికి వస్తావా?’ అడిగింది. ఆమెకది అలవాటనుకుంటా.. బహుశా విధివంచితలెందర్నో చూసిన అనుభవమయ్యుంటుంది. అప్రయత్నంగానే తలూపాను. ∙∙ వ్యాన్ పెద్ద ఆశ్రమంలోకడుగుపెట్టింది. కల్ప తరువు పేరు మెరుస్తోంది. ఊరికి దూరంగా, విశాలంగా ఉంది. చాలా బిల్డింగ్స్ తరువు శాఖల్లా విస్తరించాయి.‘పేరేంటమ్మా?’ నా కన్నా చిన్నదే రిసెప్షనిస్ట్.. ఆత్మీయంగా అడిగింది. నా పేరు చెప్పాను.ఒక గదిలోకి తీసుకెళ్ళి.. ‘ఇక్కడే కూర్చోండి! మేడమ్‌గారు వచ్చి మీతో మాట్లాడతారు’ అని వెళ్ళిపోయింది. మళ్ళీ మొదలైన వర్షాన్ని, కిటికీలోంచి చూస్తున్నాను. నాలానే వర్షం కూడా ఆగి ఆగి తన బాధను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టుంది. ‘నీ మజిలీ ఈ అనాథాశ్రమమా!’ అంతరాత్మ ప్రశ్నిస్తోంది. ‘హాయ్ మహితా! ఐయాం గౌరీ’ చక్కటి కాటన్ చీరలో పొందికగా ఉంది వచ్చినామె. నా కన్నా ఐదేళ్ళు పెద్దదేమో బహుశా! నా చూపులో నిర్లిప్తత చూసి.. నా పక్కకొచ్చి నుంచుంది గౌరీ.‘నేను.. నీలానే ఈ కల్పతరువుకి వచ్చాను. వర్షం చూస్తూ ఇదే గదిలో బెరుగ్గా, భయంగా నుంచున్నాను. ఇప్పుడిక్కడే పని చేస్తున్నాను. ఇక్కడ మనలా చాలా మంది ఉంటారు మహితా! అదిగో ఆ బ్లాక్‌లో అనాథపిల్లలు ఉంటారు.. దాంట్లో వృద్ధులు.. ఇదిగో ఇందులో మోసపోయిన ఆడవాళ్ళుంటారు. అందులోనేమో హెచ్ఐవీ బాధితులు ఉంటారు.’ఉలిక్కిపడ్డాను ఆమాటకు! ‘నువ్వు ఏ బ్లాక్‌లో ఉంటావ్ మహితా?’ మాట సౌమ్యంగా ఉన్నా..‘ నువ్వు ఏ జాతి పక్షివి’ అని నన్ను ప్రశ్నిస్తున్నట్టే ఉంది. భయంగా చివర్లో చెప్పిన బ్లాక్ వైపు చూపించాను. ఓదార్పుగా నా చుట్టూ చెయ్యి వేసి ‘ఎప్పటినుంచి?’ అడిగింది గౌరీ. ‘నిన్నటి నుంచి’ నా ప్రమేయం లేకుండానే బుగ్గలను కన్నీళ్ళు తడిపాయి.‘చూడు మహితా.. నువ్వు బాధపడుతుంటే ఓదార్చగలను. కానీ పరిష్కారం చూపించలేను. జరిగింది చెప్పు. చెప్పలేనంటవా అదిగో అక్కడ చాలా మంది ఉన్నారు. నీలానే వాళ్ళకూ కథలున్నాయి. వెళ్ళు.. కలువు, మాట్లాడు. నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు సరేనా!’ అనునయించింది గౌరీ. తలూపాను కానీ వెళ్ళలేదు. ఏం చెప్పాలి? నాలాంటి కథ ఇంకొకరికి ఉంటుందా? ఈ లోకంలో నా అంత చెత్త కథ ఎవరికీ ఉండదేమో..!? ∙∙ మూడు వారాల ముందు ఆఫీసులో, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అందరిలానే నేనూ ఇచ్చాను. కానీ వచ్చిన రిజల్ట్స్ నన్ను షాక్ చేశాయి. ఆ విషయం శౌర్యకి ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతూ, ఏడుపును దిగమింగుకుంటూ నాకసలు హెచ్ఐవీ ఎలా అంటుకుందో అర్థంకాక ప్రతీ సందర్భాన్ని గుర్తుచేసుకుంటుంటే.. రెండు నెలల క్రితం నేను బ్లడ్ డొనేట్ చెయ్యబోతే అడ్డుకున్న శౌర్య గుర్తొచ్చాడు. ‘ఆడవాళ్ళకు పీరియడ్స్ సమయంలోనే బోలెడంత బ్లడ్ పోతుంది. మళ్ళీ నువ్వేం ఇవ్వక్కర్లేదు’ అని అందరిముందు నుంచి నన్ను లాక్కొచ్చాడు. శౌర్యకి నా మీదున్న ప్రేమకి మురిసిపోయాను ఆ క్షణం. కాని సన్నగా మొదలైన అనుమానం.. నన్ను గదంతా వెతికేలా చేసింది. నా అనుమానం నిజమయ్యే సాక్ష్యాలు కనబడటంతో శౌర్య మీదకు విసిరికొట్టి అడిగాను అవేంటని!‘మహా.. సారీ మహా! కావాలని చేసిందికాదు’ కోపంగా మూసేసిన తలుపులు బాదుతూ, బతిమాలడం మొదలుపెట్టాడు. ‘నీకెప్పుడు తెలుసు శౌర్యా?’ ఇంకా ఎక్కడో మిణుకుమంటూ ఆశ.. కన్నీళ్ళను తుడుచుకుని, కిటికీ దగ్గరకొచ్చి అడిగాను.‘మన పెళ్ళికి రెండు రోజుల ముందు. కానీ, నేను తప్పు చెయ్యలేదు మహా! ఇదిగో ఈ టాటూ వలన వచ్చింది. ప్రామిస్! నా జీవితంలో ఉన్న అమ్మాయివి నువ్వొక్కదానివే. ప్లీజ్ మహా, తలుపు తీయ్యి’ కిటికీ దగ్గర నుంచుని అడిగాడు. మరి నన్నెలా పెళ్ళి చేసుకోవాలనిపించింది శౌర్యా? నిన్నట్నుంచి నేనెంత బాధపడుతున్నానో తెలుసా! నీకెక్కడ నా వలన వస్తుందో, ఇప్పటికే వచ్చిందో తెలియక.. నరకం అనుభవిస్తున్నాను. నాకు హెచ్ఐవీ అని తెలిసినప్పటి నుంచి నాకన్నా నీకోసమే ఎక్కువ ఆలోచించాను. నన్నెలా మోసం చెయ్యాలనిపించిందిరా?’ ఏడుస్తూ చేరగిలపడ్డాను.‘చెప్పాలనే అనుకున్నాను మహా..! ధైర్యం సరిపోలేదు. అప్పటికే నువ్వు నా కోసం ఇంటి నుంచి వచ్చేశావ్. నిన్ను వదిలి నేనుండలేను. అందుకే పెళ్ళి చేసుకున్నాను. కానీ నీకు గుర్తుందా మహా..! రెండు నెలల వరకు నిన్ను కనీసం ముట్టుకోలేదు. ఆ తరువాత డాక్టర్ని అడిగి సేఫ్టీ వాడాను. కానీ నా దురదృష్టం.. నీకు వచ్చేసింది’ తల బాదుకుని ఏడుస్తూ చెప్పాడు శౌర్య. ఎంత సులువుగా చెప్పేశాడో..!? నిన్నటి నుంచి ఎన్నో ఆలోచనలు! శౌర్యకి టెస్ట్ చేయించి నెగెటివ్ వస్తే.. ఇక అతని జీవితంలో నుంచి తప్పుకోవాలనుకున్నాను. ఆ నిర్ణయం ఎంత బాధ కలిగించినా సరే.. పాజిటివ్ మాత్రం రాకూడదని ఎంతమంది దేవుళ్ళను మొక్కుకున్నాను!? ఇదే మాటా పెళ్ళికి ముందు చెప్పినా నేను ఒప్పుకునేదాన్ని. శౌర్య అంటే నాకంత ఇష్టం. ‘మోసం చేశావ్ శౌర్యా.. దారుణంగా మోసం చేశావ్!’ గోడకానుకుని ఏడుస్తుండగా.. అత్తయ్య వచ్చినట్టుంది. శౌర్య ఏవేవో చెబుతున్నాడు కానీ నాకేం వినిపించడం లేదు. సగం సగం మాటలు.. ఏవో చెబుతుంటే.. అనుమానంగా తలుపు దగ్గర నుంచి విన్నాను. పలుచటి మంచు పొర కరిగిపోయింది. అత్తయ్య కిటికీ దగ్గరకు వచ్చి ‘అమ్మా మహితా! వాడి మాటలు విను. నిన్ను మోసం చెయ్యాలని కాదు, నిన్ను వదులుకుని బతకలేక అలా చేశాడు.’ శౌర్య కన్నా ఆవిడ మాటలే నాకెక్కువ గుచ్చుకున్నాయి. ఆమెకూ ముందే తెలుసు. ఎంత మోసం! ‘హు..! నేను కోడల్ని కదా?’ చాలా నిస్పృహగా ఉంది. ఇక అక్కడ ఉండబుద్ధవ్వలేదు. బట్టలు, సర్టిఫికెట్స్ అన్నీ సర్దుకుని వెనుక గుమ్మం తలుపు తీసుకుని.. బయటకొచ్చేశాను. ‘మహితక్క అంటే నువ్వేనా?’ చిన్న పాప వచ్చి అడిగింది. తలూపాను. ‘గౌరీ అక్క నిన్ను మా దగ్గరికి తీసుకెళ్ళమంది. దా.. బ్యాగ్ ఎక్కడుంది?’ చెయ్యి పట్టుకుని లాక్కెళుతూ అడిగింది. ఆ అమ్మాయి వెనుకే అప్రయత్నంగా కదిలాను. చిన్న గది, మూడు మంచాలున్నాయి ఆ గదిలో. ‘అదేమో నాది, ఇదేమో మా తమ్ముడిది. నువ్వు ఈ మంచం తీసుకో!’ ముద్దుగా పంపకాల లెక్కలు చెప్పింది పాప. అవేం పట్టనట్టు పరధ్యానంగా నాకు చూపించిన మంచంపై వాలాను. మనుషుల్ని ఎలా మోసం చేస్తారు? అంత సులువుగా ఎలా మోసపోయాను? ‘నువ్వు నీ తల్లిదండ్రులను చేసింది మోసం కాదా?’ అంతరాత్మ ప్రశ్నించింది. ప్రేమంటేనే మోసమా? సమాధానం లేని ప్రశ్న. ఒక్క రోజులో మారిపోయిన నా జీవితం.. నాకే విచిత్రంగా అనిపిస్తోంది. మర్నాడు యోగా హాల్ అని.. అక్కడకు తీసుకెళ్ళింది పాప. అందరూ ఆసనాలు వేస్తున్నారు. నేను బయటికొచ్చి బెంచ్‌పై కూర్చున్నాను. మొహం మీద సూర్య కిరణాలు పడుతున్నాయి. ‘హాయ్ ఐయాం కిరణ్’ నా మీద కాస్తా పెద్దవాడేమో.. నవ్వుతూ చెయ్యిచ్చాడు.‘మహిత’ దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ చెప్పాను. కవలలు.. ముద్దుగా ఉన్నారు. ‘వాళ్ళకి అమ్మ, నాన్న లేరా?’ కిరణ్‌ని అడిగాను. ‘ఇద్దరూ చదువుకుని జాబ్ చేస్తున్న వాళ్ళే. డెలివరీ టైమ్‌లో హెచ్ఐవీ అని తెలిసింది. ఆమె ఆ దిగులుతో చనిపోతే, అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు.’‘అంటే ఆ పసిపిల్లలకు..?’ లేదని చెప్పాలి అని మనసులోనే వేడుకుంటూ అడిగాను. ‘ఇంచుమించు ఇక్కడున్న ప్రతి పిల్లలవీ ఇలాంటి కథలే మహితా! వాళ్ళకు ఏ మాత్రం సంబంధం లేకుండానే చావును మోస్తూ తిరుగుతున్నారు. కొందరిది అమాయకత్వం, కొందరిది మూర్ఖత్వం. ఇంకొందరు డబ్బు కోసం ఒళ్ళమ్ముకుని ఇప్పుడు ఆ దారి కూడా లేక వీథిపాలైన వాళ్ళు. విచిత్రం ఏమిటంటే చదువుకోని వాళ్ళ కన్నా చదువుకుని మోసపోయిన వాళ్ళే ఎక్కువిక్కడ’ అన్నాడు. ‘నువ్వెందుకున్నావ్ కిరణ్?’ ఆ చిన్న పరిచయం ఇచ్చిన చనువుతో ఏకవచనంలోనే ప్రశ్నించాను. ‘మీరా.. తన పేరు! ప్రేమించుకున్నాం. ఒక మైకంలో హద్దులు దాటాం. తనకి నేనే అంటించానని నా మీద తోసేసి పారిపోయింది. తల్లిదండ్రులు అసహ్యించుకున్నారు. ఇంతమంది వద్దనుకున్న బతుకు నాకు మాత్రం ఎందుకనిపించింది. హెచ్ఐవీ అనేది జస్ట్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ అంతే మహిత. మందులు వాడితే కొన్ని ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గిపోతాయి, కొన్నింటికి సమయం పడుతుంది. దీని వ్యవధి మాత్రం జీవితకాలం అంతే! మన కోరికలు, ఆశలు ఏవీ నాశనమయిపోవు. హ్యాపీగా మన లైఫ్ మనం లీడ్ చెయ్యొచ్చు. ఇదే నేను తెలుసుకున్నాను. చాలామందికి ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నాను’ అన్నాడు కిరణ్. కిరణ్ సమాధానం.. నిన్నటి నుంచి భయపడుతున్న నా ప్రశ్నలన్నింటికీ సమాధానమైంది. ఇంచుమించు ఇద్దరం ఒకే సిట్యుయేషన్లో ఉన్నామనిపించింది. ‘మీరా మోసం నీకు బాధ కలిగించలేదా?’ అడిగి.. కిరణ్ జవాబు కోసం ఎదురుచూడసాగాను. ‘పుట్టుకతోనే ఎవరూ మోసగాళ్ళు కాదు. పరిస్థితుల దృష్ట్యా కొన్ని జరిగాకనే.. వారు లోకం ముందు మొసగాళ్ళలా నుంచుంటారు’ అంటూ లేచి నిలబడి చేతులు విశాలంగా చాపి ఆ బిల్డింగ్ ఆవరణను చూపిస్తూ ‘మీరా మోసం విలువ ఈ ఫాండేషన్’ అని చెప్పి.. ‘ఐయాం వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ కల్పతరువు.. వెల్కమ్ మహితా!’ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు కర్తవ్య బోధచేస్తున్నట్టుగా అనిపించింది. 420వసారి మోగుతున్న ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి కిరణ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. -నార్కిడిమిల్లి జ్యోతి శ్రీ (చదవండి: వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!) -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం!
ఎందరో రచయితలు ఎన్నో పుస్తకాలు రాస్తారు. అవి పాఠకులెందరినో అలరించాయి. కొన్ని పుస్తకాలు విశేషమైన ప్రజాదరణతో పాఠకుల మనసులను రంజింప చేస్తాయి. కానీ ఈ పుస్తకం మాత్రం అరుదైన గౌరవం పొందేలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం పాఠకులను ఆకట్టుకోవచ్చు లేదా రంజింపచేయకపోవచ్చేమో! గానీ చదివే వారిని ఆలోచింపజేసి చైతన్యవంతుల్ని చేస్తుంది. ఇలాంటి ఆలోచనలతో కూడిన గీతాలు ఉంటాయా? ఇలా కూడా సమాజ సేవ చేయొచ్చా అనిపించేలా ఉంటుంది ఈ విశిష్ట పుస్తకం. ఆ పుస్తకం కథాకమామీషు గురించే ఈ కథనం!. పుస్తకం పేరు "ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వోకేషన్". ఇది ప్రపంచ శాంతి, సామరస్యం ప్రధాన ఇది వృత్తంగా ఆంగ్లభాషలో సవివరంగా రచించిన సుదీర్ఘ కావ్యం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రపంచశాంతి కోసం రచించిన ఓ అమూల్యమైన ప్రార్థన. ఇందులో మానవచరిత్రలోనే ప్రపంచశాంతి కోసం సాగిన విస్తృత అన్వేషణ గురించి తెలియజేసే భావగీతం ఉంటుంది. పైగా ఈ విశిష్ట పుస్తకం విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము నూరు శాతం సమాజానికే కేటాయించడం మరో విశేషం. ఈ పుస్తక రచయిత తెలంగాణకు చెందిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. పుస్తకాన్ని ఈ నెల అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితికి అంకితం చేయనున్నారు. ఈ పుస్తక విక్రయం ద్వారా వచ్చే డబ్బును ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాలకు వరుసగా 50%, 25%, 25% చొప్పున లోకోపకార కార్యక్రమాలకు వినియోగించేలా అంకితం చేశారు. ఈ పుస్తక థీమ్ ప్రపంచ శాంతి, సామరస్యం కాగా, ఇందులో 10 కావ్యభాగాలు ఉన్నాయి. ఈ విశిష్ట పుస్తకంలో ఏం ఉంటాయంటే.. పుస్తకం టైటిల్ / శీర్షిక : “ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్” (An Invaluable Invocation) ఓ అమూల్యమైన ప్రార్థన కవి/రచయిత : డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి సాహిత్య ప్రక్రియ/ జానర్ : సుదీర్ఘ కావ్యం (Epic poem) రచన ఉద్దేశం, ఆశయం (Scope) : మానవ చరిత్రలోనే ప్రపంచ శాంతి, సామరస్యం గురించి ఆంగ్ల భాషలో ప్రత్యేకంగా రచించిన సుదీర్ఘ భావగీతం. ప్రధానాంశం / ఇతివృత్తం (Theme) : ప్రపంచ శాంతి, సామరస్యం రచన నిర్మాణక్రమం (Structure) : 10 కావ్యభాగాలు / ఆశ్వాసాలు (Cantos) 1.Prelude to Peace (శాంతి ప్రస్తావన / శాంతి పీఠిక) 2.Invocation (ప్రార్థన) 3.Humanity and Unity (మానవజాతి-ఐక్యత) 4.The Broken World (దుఃఖమయ ప్రపంచం) 5.Global Peace and Unity (ప్రపంచ శాంతి-ఐక్యత) 6.United Nations, United Efforts (ఐక్య రాజ్యాలు, ఐక్య కార్యాచరణ) 7.Protecting Our Planet (భూమాత పరిరక్షణ) 8.Realization and Power (మానవ శక్తి సామర్థ్యాల గుర్తింపు) 9.The Final Verse : A Summation of Our Journey (అంతిమ పద్యకృతి--ప్రపంచ శాంతి ప్రయాణ సారాంశం) 10.Acknowledgments (కృతజ్ఞతాంజలి) ఈ పుస్తకం ఎవరికోసం అంటే.. ప్రపంచ శాంతి, సామరస్యం పట్ల మక్కువ ఉన్న కవిత్వ ప్రియులు, పండితులు, ప్రపంచ పౌరులు, ప్రతీ ఒక్కరినీ చైతన్యవంతులుగా, కార్యదక్షులుగా ప్రేరేపించే అద్వితీయ, అమేయ భావగీతమిది. పుస్తక రచయిత శ్రీనాథాచారి నేపథ్యం దగ్గరకు వస్తే..ఆయన ఇంగ్లిష్‌లో పీహెచ్డీ, సైకాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేశారు. అలాగే మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, కళాశాల ప్రిన్సిపల్, ఆంగ్ల విభాగాధిపతిగా సేవలందించారు. అంతేగాదు బహుళ విభాగాల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డును దక్కించుకున్న విశిష్ట వ్యక్తి. ప్రస్తుతం ఫ్రీలాన్స్‌గా వక్తిత్వ వికాస నిపుణులుగా పలు సంస్థల్లో సేవలందిస్తున్నారు. ఇక ఆయన రచనల విషయానికి వస్తే.. ఫర్సేక్ మీ నాట్(Forsake Me Not) టైటిల్ ఓ ఆంగ్ల కవితా సపుటిని వెలువరించారు. ఇది ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో eబుక్‌గా అందుబాలో ఉంది కూడా. ఎన్నో పత్రికల్లో ఆయన కవితలు అచ్చు అయ్యాయి. ఇంగ్లీష్ జాతీయాలపై ఆయన రాసిన హ్యాండీ క్రిస్టల్స్ (Handy Crystals) పుస్తకం 2010లో లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ బుక్ విభాగంలో గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. (చదవండి: అక్షరాల... టైమ్ ట్రావెల్!) -
కూచిపూడి నాట్యాన్ని.. విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు - 'పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం'
సాక్షి, పత్రికా ప్రకటన: మచిలీపట్నం అక్టోబర్ 15: పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కూచిపూడి నాట్య సాంప్రదాయ పరిరక్షణకి, పునరుద్ధరణకి, ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారని మంత్రి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యుదయ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఆర్కే రోజా కొనియాడారు. ఆదివారం కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్, కూచిపూడి అకాడమీ చెన్నై, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జయహో భారతీయం సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ముఖ్యంగా అక్షర, ఇమాంసి, అన్షికలు టెంపుల్ నృత్యం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ వెంపటి చినసత్యం మనవరాలు కామేశ్వరి బృందం చెన్నై వారి ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని నృత్యం ఎంతో అద్భుతంగా కమనీయంగా ప్రదర్శించారు. అలాగే నాలుగవ ప్రపంచ కూచిపూడి దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది విద్యార్థులు డాక్టర్ వెంపటి చిన సత్యం రూపొందించిన బ్రహ్మాంజలి మహా బృంద నృత్యం ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. తొలుత ఇంచార్జి మంత్రివర్యులు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రకాశనం చేసి డాక్టర్ వెంపటి చినసత్యం వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సీఈవో ఆర్ మల్లికార్జున రావు రూపొందించిన డాక్టర్ వెంపటి చినసత్యం చిత్రపటాన్ని మంత్రులు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆర్కే రోజా మాట్లాడుతూ మన సంస్కృతి, కళలను సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులని అన్నారు. ఈ వేడుకలతో కూచిపూడి ప్రాంతమంతా అంగరంగ వైభవంతో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి ఆ గ్రామానికి పరిమితం కాకుండా కూచిపూడి నృత్యాన్ని ప్రపంచంలో మారుమోగేలా కృషి చేశారన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ కార్యక్రమంలోనైనా మొదట తెలుగు నేలను తెలుగు ఖ్యాతిని ప్రతిబింబించే విధంగా కూచిపూడి నృత్యంతో ప్రారంభిస్తారన్నారు. డాక్టర్ వెంపటి చిన సత్యం మరణించి 13 సంవత్సరాల అయినప్పటికీ వారి శిష్యులు ప్రదర్శించే హావభావాలు,, నృత్యంలో సజీవమై కనిపిస్తున్నారన్నారు. సినిమా పరిశ్రమలో కూడా వైజయంతి మాల, హేమమాలిని, జయలలిత, ప్రభ ,చంద్రకళ, మంజు భార్గవి వంటి ఎందరో నటీమణులు వారి వద్ద శిష్యరికం చేశారన్నారు. 2011లో 1800 మంది చిన్నారులతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయిందన్నారు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని తద్వారా వారికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు అన్నారు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులని ప్రశంసించారు. గతంలో విజయవాడ చెన్నై లో జరిగే వారి జయంతి వేడుకలను మంత్రి ఆర్కే రోజా చొరవతో ఈరోజు వారు జన్మించిన కూచిపూడి గ్రామంలోనే జరుపుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కూచిపూడి నృత్యం వంటి కళారూపాలను మరిచిపోతున్న తరుణంలో డాక్టర్ వెంపటి చినసత్యం వారి శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఆరాధిస్తుండడం వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక కళారూపం ముఖ్యంగా చెప్పుకుంటున్నామని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూచిపూడి నృత్యం, ఒరిస్సాకు ఒడిస్సి, ఉత్తరప్రదేశ్ కు కథాకళి, కేరళ కు మోహిని అట్టం వంటి కళారూపాలు ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. మరుగున పడిపోతున్న కూచిపూడి నృత్యానికి డాక్టర్ వెంపటి చిన సత్యం జీవం పోసి విశ్వవ్యాప్త ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారన్నారు. వివిధ ప్రాంతాల్లోని నాట్యాచారులను, విద్యార్థులను ఒక చోట చేర్చి ఇలాంటి పెద్దయెత్తున వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలో మహానుభావులు డాక్టర్ వెంపటి చినసత్యం జన్మించిన కూచిపూడి గ్రామం ఉండటం వారి ద్వారా కూచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే మన జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు జన్మించిన ప్రాంతం బాట్ల పెనుమర్రు కూడా తన పరిధిలోనే ఉండటం సంతోషకర విషయం అన్నారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని, మంత్రిని కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో రెండు కళాశాలలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కూచిపూడి లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజు భార్గవికి డాక్టర్ వెంపటి చినసత్యం జయంతి పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మంత్రులు అతిథులు అందజేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రులు అతిథులు ఆవిష్కరించారు. అలాగే శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం కూచిపూడి ప్రధానాచార్యులు కేంద్ర సంగీత నృత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి సిద్ధేంద్ర యోగి పురస్కారం, నాట్యాచార్యులు మాధవ పెద్ది మూర్తికి వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం, వేదాంతం రాదే శ్యామ్‌కు డాక్టర్ పద్మశ్రీ శోభా నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, పార్వతీ రామచంద్రన్ కుమారి లంక అన్నపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం, పటాన్ మొహిద్దిన్ ఖాన్ కు వెంపటి వెంకట్ సేవా పురస్కారాలను మంత్రులు అతిధులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్పీ భారతి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష, అధికార బాషా సంఘం సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్ మల్లికార్జున రావు, డిఆర్ఓ పి. వెంకటరమణ, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, డిఆర్డిఎడ్ డ్వామా పీడీలు పిఎస్ఆర్ ప్రసాదు, సూర్యనారాయణ, విద్యుత్ అధికారి భాస్కరరావు, తహసిల్దార్ ఆంజనేయ ప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు, వారి తల్లిదండ్రులు, కళాభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది. -
దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు!
సాక్షి: "కాకి పిల్ల కాకికి ముద్దు" అన్న చందాన, ఎవరి భాష వారికి ఇష్టమే. మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషను నిత్యం కొలిచే సంప్రదాయం మన సంస్కృతిలోనే ఉంది.కాల ప్రవాహంలో, జీవనగమనంలో చాలామంది ఈ మూడింటికీ దూరమవుతున్నారు. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ.. ముగ్గురు అమ్మలూ ఏడ్చే పరిస్థితులే కాన వస్తున్నాయి. తెలుగు భాషా సంస్కృతులు పరాయిభూముల్లోనే పరిఢ విల్లుతున్నాయి. ఉద్యోగ ఉపాధి కోసం విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు నిత్యం తెలుగుతల్లిని గుండెల్లో నిలుపుకునేలా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం అభినందనీయం. ఎంత ఎంత ఎడమైతే... అంత తీపి కలయిక అన్నట్లుగా, ఏదో ఒక రూపంలో తల్లి భాషకు దగ్గరయ్యే కృషి విదేశాల్లో ఉన్న తెలుగువారు చేస్తున్నారు. కవులను, కళాకారులను ఇక్కడ నుంచీ అక్కడకు పిలుపించుకుని మన పద్యాలు, అవధానాలు, వాగ్గేయకార కీర్తనలు,కూచిపూడి నృత్యాలు,భువన విజయరూపకాలకు పట్టం కడుతున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి తల్లిపాలకు,తల్లిభాషకు చాలా వరకూ దూరమవుతున్నాం. మన దేశాన్ని దోచేద్దామని వచ్చిన బ్రౌన్ దొర గుండెను సైతం మన పద్యం దోచేసింది.దొరగారు వేమన్న వెర్రిలో పడిపోయాడు. తమిళవారు మహాకవిగా భావించే సుబ్రహ్మణ్యభారతికి తెలుగువంటి తీయనైన భాష ఇంకొకటి లేనేలేదని అనిపించింది. శ్రీకృష్ణదేవరాయల పితృభాష తుళు.కానీ మాతృభాష తెలుగేనని చరిత్రకారులు చెబుతున్నారు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు పలికినా, వినుకొండ వల్లభరాయడు చెప్పినా, అవి అక్షర సత్యాలు. దేశ భాషల్లో 'అచ్చు'తో అంతమయ్యే అజంత భాష తెలుగు. మూడు భారతీయ భాషల విశేషం.. తెలుగు మాట్లాడుతూ ఉంటే సంగీత మెదియో వింటున్నట్లు ఉండే అమృత భాష తెలుగు,అని ఎందరెందరో కీర్తించారు. మిగిలిన భాషలను గౌరవిస్తూనే,మన భాషను పూజించుకోవాలి. అన్ని భాషలు విలసిల్లాలి. అన్ని సంస్కృతులు విరాజిల్లాలి.సర్వమత సహనం వలె,సర్వ భాషల పట్ల ప్రియంగా ఉండమని యునెస్కో చెబుతోంది. ఈ సందర్భంగా, భాషల స్థానాన్ని విశ్లేషించుకుందాం. ప్రపంచంలోనే ఎక్కువమంది మాట్లాడే భాషల్లో నాల్గవ స్థానం హిందీకి, ఆరవ స్థానం బెంగాలీకి, 10వ స్థానం లహందీకి (పశ్చిమ పంజాబీ)దక్కాయి. ఈ పదింటిలో మూడు భారతీయ భాషలు ఉండడం విశేషం. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న భాషల్లో ఇంగ్లీష్ దే అగ్రపీఠం. మాతృభాషతో పాటు తప్పకుండా నేర్చుకోవాల్సిన భాష ఇంగ్లిష్. వీటికి తోడు అదనంగా నేర్చుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్న భాషల్లో చైనీస్,స్పానిష్,జర్మన్, ఫ్రెంచ్,అరబిక్,రష్యన్,పోర్చుగీస్, జపనీస్,హిందీ,ఇటాలియన్ కొరియా ప్రధానమైనవి. భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో హిందీ మొదటి స్థానంలో ఉంది. సుమారు 50కోట్ల మంది ఈ భాషను మాట్లాడేభాషగా ఉపయోగిస్తున్నారు. రెండవ స్థానం బెంగాలీకి, మూడవ స్థానం మరాఠీకి, నాల్గవస్థానం తెలుగుకు ఉన్నాయి. కేవలం జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ క్రమంలో విభజించారు. జనని సంస్కృతంబు సకల భాషలకు.. "జనని సంస్కృతంబు సకల భాషలకు " అంటారు. మన జ్ఞానం మొత్తం ఇందులోనే దాగి వుంది. మనం మాట్లాడే చాలా మాటలు సంస్కృతం నుంచి పుట్టినవే. ఇంతటి సంస్కృత భాషకు మనం దూరమై చాలా కాలమైంది. బ్రిటిష్ వాళ్లు మన విద్యా విధానాన్ని పాడు చేసిన క్రమంలో, సంస్కృతం మనకు దూరమైపోయింది. సంస్కృతాన్ని అభ్యసించడం, పరిరక్షించుకోవడం అత్యంత కీలకం. దేశంలో ఎన్ని భాషలు ఏర్పడినా, సంస్కృతంలో అవలీలగా, అలవోకగా ఒదిగిన భాషల్లో తెలుగుదే అగ్రతాంబూలం. సంగీత,సాహిత్యాలకు జీవంపోసే రసపుష్టి తెలుగులో ఉన్నంతగా మిగిలిన భాషలకు లేదు. ఉర్దూ కూడా గొప్ప భాష. ఈ భాషలో రాజసం ఉంటుంది. మొన్న మొన్నటి వరకూ సంస్థానాలలో,రాజాస్థానాలలో సంగీత, సాహిత్యాలలో రాజ్యమేలిన భాష ఉర్దూ. ఇది భారతీయమైన భాష. ఇండో-ఆర్యన్ వర్గానికి చెందిన భాషగా దీనికి గుర్తింపు వుంది. ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో ఉర్దూ 11వ స్థానంలో ఉంది. భారతీయ భాషలకు దక్కుతున్న ఈ గౌరవాలను చూసి, ఆనందిస్తూనే, మన తల్లిభాష తెలుగు గురించి మరింత ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. అత్యంత ప్రాచీన భాషలలోను మనకు హోదా దక్కింది. దీన్ని సాధించుకోడానికి రాజకీయంగా పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చింది. మనతోటి దక్షిణాది భాషల్లో కన్నడ లిపికి, మన లిపికి ఎంతో సారూప్యతలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ రెండూ కలిసే ఉన్నాయి. మన కంటే కాస్త ముందుగా తమిళం సొంత పదాలు సృష్టించుకొని, స్వాతంత్య్రం పొందింది. మన జాను తెనుగు, అచ్చ తెనుగు వికసించినా, సంస్కృత భాషా సంపర్కం మన భాషకు వన్నెలద్దుతూనే ఉంది. విద్యా బోధనలో, ఉద్యోగ, ఉపాధిలో తెలుగును వెనక్కు నెట్టేస్తున్నారన్నది చేదు నిజం. అభివృద్ధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఏ భాషలు ఎంత అవసరమైనా, తెలుగును విస్మరించకుండా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఇంగ్లీష్ భాషలో బోధన అవసరమే అయినప్పటికీ, కనీసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ తెలుగులో బోధన ఉండడం ముఖ్యం. ఒక సబ్జెక్టుగా తెలుగును తప్పనిసరిగా ఉంచడం కంటే, ఇంగ్లీష్ లేదా తెలుగులో విద్యాభ్యాసం చేసే సదుపాయం ఉంచడం అత్యంత కీలకమని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను గౌరవించడం ప్రభుత్వాల బాధ్యత. తల్లిభాష తల్లిపాల వంటిది.. ఏ భాషలోనైనా చదువుకునే వెసులుబాటు కల్పించడమే వివేకం. మనో వికాసానికి, మేధో వైభవానికి తల్లిభాష తల్లిపాల వంటిది. అది అందరూ గుర్తించి తీరాలి. పట్టుదల, అవసరం, తెలివి, కృషి ఉంటే ఎన్ని భాషలనైనా, ఎప్పుడైనా నేర్చుకోవచ్చునని మన పూర్వులెందరో చేసి చూపించినవే. వివిధ స్థాయిల్లోని తెలుగు పాఠ్యాంశాలలో పద్యం దూరమవుతోంది. వ్యాకరణం, ఛందస్సు దూరమవుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఆధునిక సాహిత్య ప్రక్రియలకు స్థానం కలిపిస్తూనే, సంప్రదాయమైన పద్యాన్ని సమున్నతంగా గౌరవించేలా పాఠ్యాంశాలు ఉండాలి. పద్యం మన తెలుగువాడి సొత్తు. వ్యాకరణం లేకపోతే పునాదిలేని భవనంలా భాషలు దెబ్బతింటాయి. నిన్నటి వరకూ మైసూర్లో ఉన్న తెలుగు కేంద్రం మన నెల్లూరుకు తరలి రావడం మంచి పరిణామమే. ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనూ, కేంద్రం నుంచి తెలుగు భాషా వికాసాల కోసం నిధులను తెప్పించుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిపై అన్ని విశ్వవిద్యాలయాలలోనూ పరిశోధనలు పెరగాలి. తెలుగు చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధిల్లో విశిష్ట స్థానం కలిపించాలి. ఈ బాధ్యత ప్రభుత్వాలదే. భాషలు జీవ నదుల వంటివి. అనేక అన్యభాషలను కలుపుకుంటూనే ప్రవహిస్తూ ఉంటాయి. కాకపోతే మురికినీరు చేరకుండా, చేరినా, చెడు జరుగకుండా చూసుకోవడం మన కర్తవ్యం. మాండలీకాలకు ఉండే సొగసు సోయగం వేరు. వాటిని గేలి చేయకుండా, ఆ పరిమళాలను ఆస్వాదిద్దాం. తల్లి తెలుగు భాషను నెత్తిపై పెట్టి పూజించుకుంటూ, ఆ వెలుగులో, ఆ వెలుతురులో రసమయంగా జీవిద్దాం. పిల్లలకు ఉగ్గుపాల దశ నుంచే తల్లిభాషపై మమకారం పెంచడం పెద్దల బాధ్యత. - మాశర్మ -
సింహం వద్ద సలహదారు ఉద్యోగం!
ఉదయగిరి దగ్గర వున్న అడవికి భైరవ అనే సింహం రాజుగా ఉండేది. సుబుద్ధి అనే నక్క దానికి సలహాదారుగా ఉండేది. ఒక రోజు సాయంత్రం సుబుద్ధి.. దిగాలుగా ఇల్లు చేరింది. ‘అలా ఉన్నావేం? ఒంట్లో బాగా లేదా?’ అంటూ ఆతృతగా అడిగింది సుబుద్ధి భార్య. పెద్దగా నిట్టూర్చి సుబుద్ధి ‘రాజుగారు రేపటి నుంచి రావద్దని చెప్పారు. నా పదవి ఊడింది’ అంది. ‘అయ్యో, ఇప్పుడెలా? ఇంతకీ ఉద్యోగం ఎందుకు పోయినట్లు?’ అడిగింది సుబుద్ధి భార్య. ‘నాకు వయసు మీద పడిందట. ఇదివరకటిలా చురుగ్గా లేనట. ఇక ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకోమన్నారు రాజుగారు’ విచారంగా చెప్పింది సుబుద్ధి. ‘అలా ఎలా? పోనీ మన అబ్బాయిని సలహాదారుగా పెట్టుకోమని అడగండి’ అన్నది సుబుద్ధి భార్య. ఆ సలహా నచ్చి మర్నాడే తన కొడుకు వీరబుద్ధితో సింహం గుహకి వెళ్ళింది సుబుద్ధి. ‘మహారాజా.. వీడు నా కొడుకు వీరబుద్ధి. వీడిని మీ సలహాదారుగా పెట్టుకోండి. ఎన్నో ఏళ్ళుగా మీ దగ్గర నమ్మకంగా పని చేశాను. అన్యాయం చేయకండి’ అని వేడుకుంది సుబుద్ధి. సింహం నవ్వి ‘అలాగే.. చూస్తాను. వీడిని నా దగ్గర వదిలి వెళ్ళు’ అంది. వీరబుద్ధి రోజంతా గుహ బయటే కూర్చుంది. దానికి ఏ పనీ లేదు. తిండికీ లోటు లేదు. రాత్రి ఇంటికి వస్తూనే వీరబుద్ధి..‘అమ్మా.. ఇన్నాళ్లూ నాన్న చేసిన ఉద్యోగం.. రోజంతా గుహ బయట కూర్చుని, మూడు పూటలా భోంచేసి రావడం.. అంతే!’ అన్నది పెద్దగా నవ్వుతూ. మర్నాడు సింహం గుహ బయట పచార్లు చేస్తూండగా గూఢచారిగా పనిచేసే గద్ద ఒక దుర్వార్త మోసుకుని వచ్చింది. భైరవకోనలో ఉండే సింహం.. అక్కడ కరువు నెలకొనడంతో పొరుగున సుభిక్షంగా ఉన్న ఉదయగిరి అడవి మీదకు దండయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.. మహారాజా!’ అంటూ. ‘సమాచారం చేరవేసినందుకు ధన్యవాదాలు. ఏం చేయాలో మేం ఆలోచిస్తాం. ఇక నువ్వు వెళ్లొచ్చు’ అంది సింహం గంభీరంగా. ‘చిత్తం’ అంటూ రివ్వున ఎగిరిపోయింది గద్ద. దీర్ఘంగా నిట్టూరుస్తూ ‘నీ సలహా ఏమిటి? ఇప్పుడు మనం ఎలా ముందుకు వెళ్లాలి?’ అంటూ అక్కడే ఉన్న వీరబుద్ధిని అడిగింది. వీరబుద్ధి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. ఏం చెప్పాలో తోచక బుర్ర గోక్కుంటూ ఉండిపోయింది. ‘మన అడవిని కాపాడుకోడానికి మనం యుద్ధానికి సిద్ధం అయితే ఎలా ఉంటుంది ?’ అని అడిగింది సింహం. ‘భేషుగ్గా ఉంటుంది మహారాజా.. యుద్ధంలో చచ్చిన వాళ్ళు స్వర్గానికి వెళతారు అని చెప్పేవాడు మా తాత’ అన్నది వీరబుద్ధి. సింహం కాసేపు అటూ ఇటూ తిరిగి ‘కానీ యుద్ధం అంటే ప్రాణ నష్టం తప్పదు. పోనీ మనం వాళ్ళతో సంధి కుదుర్చుకొతువులుని ఆ అడవిలోని జనం కూడా స్వేచ్ఛగా మన అడవిలో తిరుగుతూ, చెలమల్లో నీళ్ళు తాగడానికి అనుమతిస్తే ఎలా ఉంటుంది?’ అని అడిగింది సింహం. ‘ఈ ఆలోచన బాగుంది. అవి మన అడవిలో తిరిగితే మనకు నష్టం ఏమీ ఉండదు’ అన్నది వీరబుద్ధి. ‘అప్పుడు మనం స్వతంత్రం కోల్పోయినట్లే! అలాకాదు.. ఇంకా వాళ్ళు దండయాత్ర చేసే ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి ముందు మనమే వాళ్ళ మీదకు దండయాత్ర చేస్తే? ఇంకా పూర్తిగా సిద్ధంగా లేని వాళ్ళను ఒడించవచ్చు కదా?’ అంది సింహం. ‘అవునవును.. మనం అలాగే చేయాలి. అప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుంది’ అన్నది వీరబుద్ధి. ‘సరే.. నువ్వు ఇంటికి వెళ్ళి మీ నాన్నను తీసుకుని రా’ అని పురమాయించింది సింహం. వీరబుద్ధి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి తండ్రి సుబుద్ధితో తిరిగి వచ్చింది. అప్పటికి సింహం ఇంకా గుహ బయటే పచార్లు చేస్తోంది. అది పాత సలహాదారును చూస్తూనే.. ‘చూడు సుబుద్ధీ.. వంశపారంపర్యంగా చేసుకునేందుకు సలహాదారు ఉద్యోగమేమీ వ్యవసాయం కాదు. ఆలోచనా శక్తి, సమయస్ఫూర్తి.. సమస్యను సరిగ్గా అర్థం చేసుకునే తెలివి వంటి లక్షణాలు అన్నీ ఉండాలి. నీ కొడుకుకి సమస్య మనమే వివరించి.. దానికి పరిష్కారమూ మనమే అందించాలి. మనమేం చెబితే దానికి తలాడించే వాడు సలహాదారుడు కాలేడు. వాడు చురుగ్గా తిరగ్గలడు. అందుకు తగిన ఉద్యోగం చూస్తానులే’ అన్నది సింహం. ‘అలాగే మహారాజా, నాది కూడా ఒక విన్నపం. నాకు వయసు మీద పడి చురుకు తగ్గినా.. ఆలోచన శక్తి మాత్రం తగ్గలేదు. సలహాదారు ఉద్యోగానికి బుద్ధితో తప్ప వయసుతో సంబంధం లేదు. ఆ మాటకు వస్తే వయసుతో తెలివి, అనుభవం పెరుగుతాయి. మరోసారి నా విషయం ఆలోచించండి’ అన్నది సుబుద్ధి వినయంగా. సింహం తల పంకించి కొత్తగా వచ్చిన సమస్యను వివరించి ‘ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు’ అని అడిగింది. సుబుద్ధి కాసేపు ఆలోచించి ‘నా సలహా మీకు కోపం తెప్పించే విధంగానే ఉంటుంది. మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భైరవకోన యువరాణికి ఒక కన్ను లేదు. ఆమె పెళ్ళి చేయలేకపోతున్నానన్న దిగులు ఆ రాజుగారిని పట్టి పీడిస్తోంది. మీరు పెద్ద మనసు చేసుకుని మన యువరాజుకు భైరవకోన యువరాణితో పెళ్ళి జరిపిస్తానని కబురు పంపితే రాబోయే ఈ కయ్యం కాస్తా వియ్యంగా మారుతుంది. ఈ అడివి కోసం మీ రాజ కుటుంబం త్యాగం చేయకతప్పదు. అలా జరిగిననాడు మన యువరాజు ఈ రెండు అడవులకు చక్రవర్తి అవుతాడు’ అన్నది.‘భేష్.. సుబుద్ధి తెలివితేటలకు, ఆలోచన శక్తికి వయసుతో పనిలేదని నిరూపించావు. నీ సలహా ప్రకారమే చేస్తాను. రేపటి నుంచి కొలువులోకి వచ్చేయ్’ అంది సింహం సంతోషంగా! (చదవండి: వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!) -
వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!
ప్రభుత్వం నన్ను విచారణాధికారిగా నియమించింది. నా కమిటీలో సభ్యులుగా ఒక ఎస్పీ, ఒక మహిళా డిఎస్పీ కూడా వున్నారు. ఆమె పేరు సౌమ్య. ముగ్గురం కారులో బయల్దేరాం. లక్నో నుంచి ఆరు గంటల ప్రయాణం. అది చిత్రకూట్ జిల్లా. దాని ముఖ్యాలయం కర్వీ. అక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేశారు. అల్పాహారం తీసుకొని, ఉదయం తొమ్మిది గంటలకు బయల్దేరాం. మాకు మార్గం చూపించేందుకు ఒక ఎస్సైను పైలెట్‌గా పెట్టారు. ఎటు చూసినా కొండలు. వింధ్యాచల పర్వతాలు. పచ్చటి చీర కట్టుకున్న కొండల మేనిపై సూర్యోదయ కిరణాలు మరింత తళతళలాడుతున్నాయి. రాళ్ళూ రప్పలతో ఎప్పుడూ ఎండిపోయిన ముఖంతో దీనంగా వుండే బుందేల్‌ఖండ్ నేల.. పచ్చని పొలాలతో, చెట్లతో యవ్వన చైతన్యంతో వెలుగుతోంది. ఆ ప్రకృతిని చూస్తుంటే, చాన్నాళ్ల నా కళ్ల ఆకలి తీరిపోయిందనిపించింది. కారు నత్తనడక నడుస్తోంది. డ్రైవర్ తప్పు కాదు. రోడ్డు లోపం అంతకన్నా కాదు. అన్నా ఆవుల వల్ల. వందల కొలది ఆవులు రోడ్డుకు అడ్డంగా తిరుగుతుంటాయి. పాలివ్వని ఆవుల్ని యిలా గాలికి వదిలేస్తారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపించే ముఖచిత్రం యిది. అన్నా ఆవులు, నీలి ఆవులు కలిసి పంటల్ని నాశనం చేస్తుంటాయి. రైతులు తమ కన్నీళ్లను కడుపులోనే దాచుకుంటున్నారు. మా కారు కొండల పాదాల వద్ద వున్న గుడిసెలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఆగింది. అక్కడి నుండి నడక. అక్కడ సుమారు వంద గుడిసెలు. మట్టితో కట్టినవి. విద్యుత్తు లేని వూరులుంటాయా అన్న అనుమానం రాకుండా అవి సాక్ష్యంగా నిలబడ్డాయి. శ్రీశ్రీ వర్ణించిన ‘భిక్షు వర్షీయసి’ ని గుర్తు చేస్తున్నట్లున్నాయి ఆ గుడిసెలు. నడుచుకుంటూ ఆ వూరి మధ్యలోంచి వెళ్తున్నాం. ఇళ్ల చూర్ల మధ్య ముఖాలు పెట్టి, మమ్మల్ని చూస్తున్నారు జనం. ఒకరిద్దరిని పిలిచి హిందీలో అడిగాం. ‘ఇవాళ పనిలోకి వెళ్ళలేదా?’ అని. ‘పని లేదు సాబ్ ’ హిందీలోనే నిర్లిప్త సమాధానం. పోలీసుల్ని చూసి వాళ్ళ కళ్లు భయపడలేదు. ఇందరు అధికారులు ఆ గుడిసెల దగ్గరకి ఎందుకు వచ్చారన్న ఆశ్చర్యం లేదు. నాకు ఆశ్చర్యమనిపించింది. ఏ హావభావాలు లేని వాళ్ళ పెదాలు చూసి. దేశాన్ని ఒక్క కుదుపు కుదిపిన ఘటన. విభిన్న విచారణ సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఘటన. అగ్ని పర్వతం పుట్టిన చోటును వీసమంతయినా కదపలేకపోయింది. వచ్చిన పని వెదుక్కుంటూ బాధితురాలు బబ్లీ ఇంటికి చేరాం. పన్నెండేళ్ల బాలికను తీసుకొని, వాళ్లమ్మ బయటకొచ్చింది. తల్లి కొంగు చాటున అమాయకంగా నిలబడింది. ఎటు చూసినా పేదరికం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మా కమిటీ సభ్యురాలు సౌమ్య ఆమెను వివరాలు అడుగుతున్నది. అన్నింటికీ వాళ్ళమ్మే సమాధానం చెబుతోంది. పని వెదుక్కుంటూ మీర్జాపూర్ జిల్లా నుండి ముప్పై ఏళ్ల క్రితం వలస వచ్చారట. వాళ్లందరికీ గుడిసెలు కట్టుకోవడానికి ఒక భూస్వామి మూడెకరాల పొలాన్ని కేటాయించాడట. ఒకరి తర్వాత ఒకరు చేరి, ఇప్పటికి వంద కుటుంబాలయ్యాయి. గత పదేళ్లలో ఇసుక తవ్వకాల పనులు బాగా ఎక్కువయ్యాయని చెప్పింది. అందులో కూలీ పని నిత్యం వుంటుందని చెప్పింది. ‘ఈ చిన్న పిల్లలు కూడా కూలి పనికి వస్తారా?’ అడిగాం. లేదు. వీళ్ళు ఇంటి దగ్గరే వుండి, వంట చేస్తారు.’ ‘వీళ్ళు ఇసుక పని దగ్గరకు అస్సలు రారా?’ ‘అప్పుడప్పుడు భోజనం తీసుకుని వస్తారు.’ ‘అంటే, రోజూ మీరు వెళ్ళేప్పుడే భోజనం తీసుకెళ్తారా?’‘అవును.’‘గుత్తేదారు జీతం యివ్వడానికి యిబ్బంది పెడతాడా?’‘ లేదు. ప్రతి సోమవారం పేమెంట్ చేస్తారు. ’‘ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఒక్కటే జీతమా?’‘ రోజుకి ఆడవాళ్ళకి రెండొందలు. మగవాళ్లకు మూడొందలు.’ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు అక్కడ పోగయ్యారు. ఆసక్తిగా వింటున్నారు. ‘ఎక్కువ జీతం ఎర చూపి, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ఎప్పుడైనా ప్రవర్తించారా?’ ‘లేదు సాబ్. అలాంటిదెప్పుడూ లేదు. పనిలో మేమందరం కలిసే వుంటాం. కలిసే వస్తాం’ అంది మరొక ఆమె. ‘ఈమెవరు?’ అని అడిగాను. ‘గుడియా వాళ్ళమ్మ’ అని బదులిచ్చింది మరొకామె. మేం దర్యాప్తు చేస్తున్న మరొక బాధితురాలు గుడియా. మహిళా అధికారి.. బబ్లీని దగ్గరకు పిలిచింది. బిక్కు బిక్కుమంటూ వచ్చింది. భోజ్‌పురిలో అడగడం మొదలు పెట్టింది. ‘ఎవరికీ భయపడనక్కర లేదు. జరిగింది జరిగినట్లు చెప్పమ్మా!’ మౌనంగా నిలుచుంది. ఏ ప్రశ్న లేని వుత్తరంలా వుంది ఆమె ముఖం. ‘మేమున్నాం. నీకే భయం లేదు. గుత్తేదారు నిన్నేం చేశాడో చెప్పు.’ ‘కుచ్∙నహీ కియా’ నూతిలో నుండి ఒడ్డుకు వచ్చినట్లుగా, ఆమె పెదాలను దాటి వచ్చింది ఆ మాట. మహిళా అధికారి మరింత సౌమ్యాన్ని ప్రదర్శించింది. ‘చెప్పమ్మా. ఆ రాక్షసుడు నీ చెయ్యి పట్టుకు లాగాడా?’‘ నహీ.. కుఛ్∙నహీ హువా.’ అదే వ్యక్తీకరణ. ‘గుత్తేదారిని ఎప్పుడన్నా చూశావా?’ ‘నహీ’ ‘నువ్వు ఆ ఇసుక తవ్వకం పని చేశావా?’ ‘నహీ.’ ‘నిన్ను గుత్తేదారు మనుషులెవరన్నా రమ్మన్నారా?’ ‘నహీ’ ‘మరి నువ్వు ఏం చేస్తావు?’ ‘ఖానా బనాతీ హూ’ ‘చదువుకున్నావా?‘ ‘నహీ’‘టీవీ వాళ్లకు అలా ఎందుకు చెప్పావు?’ ‘పైసా కే లియే’‘అలా చెబితే డబ్బులు యిస్తానన్నారా?’ ‘హా!’ అక్కడ నుండి బబ్లీ వాళ్లమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. ‘ఈ వూరిలో చదువుకున్నవాళ్ళెవరైనా వున్నారా?’ అని అడిగాం. ‘ఆ! యిదిగో ఈ దుర్గే పెద్ద చదువు చదివింది’ అన్నారు. మూడేళ్ళ పాపను ఎత్తుకుని నిలబడ్డ దుర్గ గర్వంగా చూసింది. ‘ఏం చదువుకున్నావమ్మా?’ అడిగాను నేను. ముసి ముసిగా నవ్వుతోంది. పరవాలేదు, చెప్పమ్మా అన్నట్లుగా ఆమె వైపే చూస్తున్నాను. ‘పాంచ్’ అంది మెల్లగా ముసి ముసి నవ్వులో నుంచి బయట పడుతూ. నా గుండె ఆ క్షణం కొట్టుకోవడం మానేసింది. వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువు. ఆరా తీశాను. చదువు మీద వాళ్లకు నమ్మకం లేదు. చదువు కూడు పెట్టదంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఆవారాగా తిరుగుతున్న చదువుకున్నోళ్లను లెక్కబెడుతున్నారు. ‘ఇంతకీ, ఏం జరిగిందో నువ్వు చెప్పు’ అంటూ ఆ చదువుకున్న అమ్మాయిని అడిగాను. ఏమీ జరగలేదంది. మా కమిటీలో మహిళా సభ్యురాలు సౌమ్య గుడియాను పిలిచింది. ఏం జరిగిందో చెప్పమని అడిగింది. ‘బతాదియానా’అంది మెల్లగా. ఎవరికి చెప్పావంటూ మళ్ళీ అడిగింది సౌమ్య. ‘బహుత్ బార్’ అంది. ఆ తర్వాత దేనికీ సమాధానం చెప్పలేదు. ‘అదేం చెబుతుంది చిన్నపిల్ల. నేను చెబుతాను రాసుకోవమ్మా’ అంటూ నోరు తెరచి బిగ్గరగా మున్నీదేవి కూతుర్ని వెనక్కి నెట్టి నిలబడింది. ‘నా పేరు మున్నీ. నాకు అక్షరం ముక్క రాదు. అయినా పూస గుచ్చినట్లు చెబుతాను’ అంటూ భోజ్‌పురిలో మొదలు పెట్టింది. ‘నాకు ఆరుగురు పిల్లలు. నా వయస్సెంతో నాకు తెలీదు. నేను అబద్ధం చెప్పను’ అంటూ ధారాప్రవాహంగా సాగిపోతున్నాయి ఆమె మాటలు. ‘మా వూరిలోకి ఒక సంస్థ నుంచి అంటూ ఒక మహిళ వచ్చింది. ఆమెతో పాటు ఒక వీడియో కెమెరా పట్టుకుని ఒక కుర్రాడు, మాట్లాడేది చేత్తో పట్టుకుని ఒక అమ్మాయి వచ్చారు.’ ఆమె గుక్క తిప్పుకోకుండా చెప్పుకు పోతోంది. ‘మొదట మా గుమ్మం దగ్గరికి వచ్చారు. సంస్థ తాలూకు మహిళ మీకు మేలు జరుగుతుందని మమ్మల్ని ప్రలోభ పెట్టింది. మేం చెప్పినట్లు కెమెరా ముందు చెప్తే, మీకు బోల్డు డబ్బులు వస్తాయంది. మావి కాలుతున్న కడుపులు కదా. పైగా చదువూ సంధ్యాలేని బతుకులు. ఎవరేది చెప్పితే, అది నమ్మేస్తాం. డబ్బు ఎర చూసే సరికి సరే అన్నాం.’ ఆమె గొంతులో కొంచెం బాధ, కొంచెం పశ్చాత్తాపం తొంగి చూశాయి. గొంతు సవరించుకుంది. ‘వాళ్ళు మా గుడియాకు ఎలా మాట్లాడాలో చెప్పారు. వాళ్ళు చెప్పినట్లే కెమెరా ముందు చెప్పింది.’ ‘ఏం చెప్పింది?’ సౌమ్య అడిగింది. ‘జీతం కోసం శరీరం యివ్వాల్సి వస్తుందని. గుత్తేదారు మాతో పాటు, మా లాంటి ఆడపిల్లల్ని పాడు చేస్తున్నాడని.’‘అందులో నిజం లేదా?’ సౌమ్య ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగింది. నిమిషం పాటు మౌనం. ఆ తర్వాత అందుకుంది. ‘కేసులు పెట్టొచ్చు. మీరు కోల్ జాతి వాళ్ళు కాబట్టి దళిత చట్టం కింద పరిహారం వస్తుంది అని సంస్థ మహిళ నమ్మబలికింది.’‘మా ఇంటి దగ్గర నుండి బబ్లీ ఇంటికి వెళ్లారు. అవే మాటలు చెప్పించారు. దాన్నే టీవీల్లో తెగ చూపించారంట.’ఆమె సహజ వక్త. ఎక్కడ నొక్కి పలకాలో, ఎక్కడ తగ్గి పలకాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ గొంతు పెంచాలో స్వాభావికంగా చేస్తోంది. ‘ఇప్పటి దాకా మీలా ఐదు బృందాలు వచ్చాయి. అందరికీ చెప్పిందే చెబుతూ విసిగిపోయాం.’ మానవధికార సంఘం, చైల్డ్ లేబర్, మహిళా హక్కుల సంఘం, హైకోర్టు బృందం, జిల్లా కలెక్టరు బృందం వచ్చి వెళ్లినట్లు నాకు తెలుసు. ఈ అన్ని కమిటీలు కూడా టీవీలో, పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగానే వచ్చాయి. ఎవరి ఫిర్యాదు వల్లనో వచ్చినవి కావు. ‘ఆ సంస్థ వాళ్ళు మీకు డబ్బులేమైనా యిచ్చారా?’ అనడిగింది సౌమ్య. ‘చెరో రెండు వేలు చేతిలో పెట్టి వెళ్లిపోయారు. మీరే చెప్పండి యిప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు ఏం కాను?’ అంటూ ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. ఇక ఆమె మాట్లాడలేదు. నెమ్మదిగా వెనక్కి జారుకుంది. వూరంతా గాలించాం. సాక్ష్యం కోసం. ఆడ, మగా అంతా ఖాళీగా వున్నారు. గుసగుసలు. అక్కడక్కడ ఏవగింపులు. గుంపులు గుంపులుగా కూర్చున్నారు. కొరోనా భయం కూడా లేకుండా. ‘పనిలోకి వెళ్ళలేదు ఏం?’ అని ఒకరిద్దరి మగాళ్లను అడిగాం. ‘పని ఆగిపోయింది’ అన్నారు. టీవీలో వచ్చిన విషయం గురించి అడిగాం. ఒక్కరు కూడా దాన్ని సమర్థించలేదు. అబద్ధం అన్నారు. గుడిసెల మధ్యలో నుండి మాలో మేం మాట్లాడుకుంటూ మెల్లగా కారు దగ్గరికి వచ్చాం. నేను కారులో కూర్చుంటుండగా మున్నీదేవి వేగంగా నడుచుకుంటూ వచ్చింది. నా చేతిలో ఒక చిన్న భరిణ పెట్టింది. ‘ఏంటిది?’ అని అడిగాను. ‘కారులో కూర్చొని చూడండి’ అని వూరిలోకి వెళ్ళిపోయింది. మా కారు ఆ గుడిసెల్ని విడిచిపెడుతూ కదిలిపోయింది. భరిణ తెరచి చూశాను. ఇంకిపోయిన రెండు కన్నీటి బొట్లు..! (చదవండి: ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా) -
తెలంగాణ సిక్కుల వెనక అసలు కథ రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ
గురునానక్ (1469-1539) ప్రభోధనల ఆధారంగా ఏర్పడిందే సిక్కు మతం. గురునానక్ బోధనల్లో మతాల మధ్య పెద్ద తేడా కనిపించలేదు. హిందూ, ఇస్లాం రెండు మతాలను ఒక్క తాటి కిందికి తేవాలన్న ప్రయత్నంలో భాగంగా దేశ మంతా తిరిగి,మక్కా మదీనాల యాత్ర కూడా చేసి వచ్చి, ఆయనిచ్చిన గొప్ప సందేశం ఏంటంటే.. 'హిందువు లేడు, ముస్లిం లేడు, ఇద్దరూ ఒక్కటే!' 200 ఏళ్ల కిందే సిక్కులొచ్చారు హైదరాబాద్‌లోని సిక్కుల చరిత్ర దాదాపు 200 సంవత్సరాల నాటిది. మహారాజా రంజిత్ సింగ్ కాలంలో ఆనాటి హైదరాబాద్ 4వ నిజాం ( 1829-1857) తన ప్రధాని చందూలాల్ (పంజాబ్ ఖత్రీ) సలహాపై ఒక ఒప్పందం ప్రకారం 1832 లో లాహోరి ఫౌజ్‌లో భాగంగా వీరిని హైదరాబాద్ కు పిలిపించుకున్నాడు. వారు నిజాం ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసి పెట్టడంలో కూడా సేవలు అందించారు. ఆనాడు సిక్ రెజిమెంట్ క్యాంపు అత్తాపూర్ దగ్గరున్న బరంబలాలో ఉండేది. అక్కడే హైదరాబాద్ లోని మొట్ట మొదటి గురుద్వారా నిర్మింపబడింది. తెలంగాణ అంతటా ఎన్నో గుర్తులు అలా వచ్చిన సిక్కులు హైదరాబాద్ జంట నగరాల్లోనే కాకుండా తెలంగాణా అంతా విస్తరించారు, స్థానికులతో కలిసిపోయారు. మాతృ భాష పంజాబీని మరిచిపోకుండానే తెలుగు భాషా సంస్కృతులకు అలవాటు పడ్డారు. సికింద్రాబాద్ లో ఏకంగా ఒక సర్దార్జీల గ్రామమే ఉంది. ప్యారడైజ్‌కు మూడు కిలో మీటర్ల దూరంలోనున్న ఆనాటి 'సిక్కుల తోట'నే కంటోన్మెంట్ పరిధిలోనున్న నేటి 'సిక్ విలేజ్'. వ్యాపారాల్లో ఉద్ధండులు చాలా మంది సర్దార్జీ లు వివిధ వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ స్థిరపడి పోయారు. ఇక్కడో గురుద్వారా కూడా నిర్మించుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒకప్పటి 'గచ్చుబాయ్ తాండా' ఇప్పుడు' గురుగోవింద్ నగర్ 'గా మారిపోవడం విశేషం. సిక్ హెరిటేజ్ ఫౌండేషన్ వారు 'డెక్కన్ సిక్కుల సంస్కృతి'పై సాలర్ జంగ్ మ్యూజియం లోనున్న పెక్కు చారిత్రక వ్రాత ప్రతుల ఆధారంగా పరిశోధన చేయడం ముదావహం. సిక్కు జీవితంలోంచి వచ్చిన కథ ఇక తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన సిక్కు కుటుంబాల్లోంచి వచ్చిందే రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ. పూర్వ కరీంనగర్ జిల్లాలోని రాఘవ పట్నం కు చెందిన బహు గ్రంథకర్త రామసింహ కవి( 1857 - 1963 ) సర్దార్జీయే. నిజాం కాలం నాటి ఈ కవి ఆత్మకథ వారి మునిమనవడైన సర్దార్ గురుదేవ్ సింగ్ గారి వద్ద లభించగా దాన్ని వేముల ప్రభాకర్ పరిష్కరించి, మిత్రుడు తాళ్లపల్లి మురళీధర్ గౌడ్ పర్యవేక్షణలో ప్రచురించగా తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘము వారి వేదికపై (తెలంగాణ సారస్వత పరిషత్ సమావేశ మందిరంలో) తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్, ప్రముఖ కథకుడు శ్రీ కాలువ మల్లయ్య ఆవిష్కరించారు. -
ఇద్దరూ మహాత్ములే! ఆఖరికి ఆ ఇద్దరి..
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడుగా విశ్వ ప్రసిద్ధుడయ్యారు. లాల్ బహుదూర్ శాస్త్రి కూడా మహాత్ముడే. ఇద్దరు గొప్పవాళ్ళు పుట్టినతేదీ ఒకటే కావడం ఆశ్చర్యకరం, పరమానందకరం. ఇద్దరూ అక్టోబర్ 2వ తేదీనాడు జన్మించారు. భారతనేతగా గాంధీ, భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా లాల్ బహుదూర్ శాస్త్రి చరిత్రకు చెప్పలేనంత గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆధునిక నాయకులు. ఇద్దరి ముగింపు విషాదాంతమైంది. గాంధీ తుపాకీ కాల్పులకు గురియై మరణించారు.లాల్ బహుదూర్ మరణం అనుమానాస్పదం. హత్యకు గురిఅయ్యారనే భావనే ఎక్కువమందిలో ఉంది. లాల్ బహుదూర్ శాస్త్రి చాలా గొప్పవాడైనా, గాంధీ-నెహ్రూ ప్రాభవం మధ్య చరిత్రలో, లోకంలో రావాల్సినంత పేరు రాలేదని చరిత్రకారుల అభిప్రాయం. గాంధీ భారతీయ ఆత్మ. ఆత్మాభిమానం రూపం దాల్చుకుంటే అది లాల్ బహుదూర్. ఇంత ఆదర్శవంతమైన లాల్ బహుదూర్ శాస్త్రి.. జవహర్ లాల్ నెహ్రూకు, గాంధీకి ప్రియ శిష్యుడు. మహాత్మాగాంధీ జీవితం ఒక ప్రయోగశాల. కేవలం భారతదేశానికే కాదు, ఎల్ల ప్రపంచనాయకులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహానాయకుడు గాంధీ. సత్యాగ్రహం,అహింస అనేవి గాంధీ నిర్మించిన రెండు గొప్ప సిద్ధాంతాలు. ధర్మాగ్రహంతో,న్యాయాగ్రహంతో సత్యాగ్రహంతో అహింసా మార్గంలో నడిచి,భారతదేశానికి బ్రిటిష్ శృంఖలాల నుంచి విముక్తి కలిగించి, స్వేచ్ఛను ప్రసాదించాడు. భగవద్గీతను ఆశ్రయించాడు. కర్మసిద్ధాంతాన్ని ఆచరించాడు, న్యాయపోరాటంలో గాంధీ జాతికి జయాన్ని కానుకగా ప్రసాదించాడు.భారతదేశ చరిత్రలో ఆధునిక కాలంలో,స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారత్ కు తొలి విజయాన్ని అందించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. 1965లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో దేశాన్ని నడిపించి, గెలిపించిన ధీరుడు లాల్ బహుదూర్ శాస్త్రి. 20వ శతాబ్దంలో ప్రపంచమానవాళిని ప్రభావితం చేసినవారిలో మహాత్మాగాంధీదే అగ్రస్థానం.సత్యాగ్రహం, సహాయనిరాకరణ గాంధీ ఎంచుకున్న శక్తిమంతమైన ఆయుధాలు.వీటి విలువను ప్రపంచదేశాలు అర్ధం చేసుకోడానికి చాలా కాలం పట్టింది.ఇప్పటికీ చాలా దేశాలకు అసలు అర్ధమే అవ్వలేదు.హిందూ-ముస్లింల మత సామరస్యానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆ అంశమే అతన్ని బలితీసుకుంది. టాల్ స్టాయ్ ను గాంధీ గురువుగా భావించాడు.సామ్రాజ్యవాదం, హింసా విధానాలపై వ్యతిరేకత వీరిద్దరినీ మానసికంగా కలిపింది. గాంధీ జీవితం మొత్తం సత్యశోధనకు అంకితం చేశారు. తను చేసిన తప్పులను తెలుసుకోవడం,వాటి నుంచి నేర్చుకోవడం మార్గంగా సాగారు. అందుకే గాంధీ ఆత్మకథకు 'సత్యశోధన' అని పేరు పెట్టుకున్నారు. సత్యంతో చేసిన ప్రయోగాలే అతని జీవితం. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి స్వాతంత్ర్య యోధులకు స్ఫూర్తిగా నిలిచినవాడు మహాత్మాగాంధీ.ఇటువంటి వ్యక్తి నిజంగా మన మధ్యనే జీవించాడంటే? తర్వాత తరాలవారు నమ్మలేరని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ చేసిన వ్యాఖ్య అజరామరం. జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరించాడని మరో మహానేత మార్టిన్ లూథర్ కింగ్ అన్నాడు.నా జీవితమే సందేశం,అని గాంధీయే అన్నాడు. ఇంతటి గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగి దేశభక్తి,నిజాయితీ, ప్రయోగాలు,పవిత్రత,సత్యం, ఆత్మాభిమానం ఉఛ్వాసనిశ్వాసలుగా జీవించినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నో నూత్న ప్రయోగాలు ఆవిష్కరించాడు. జవానులను, రైతులను సమానంగా భావించాడు. ఒకరు యుద్ధక్షేత్రంలో ఉంటారు. ఇంకొకరు వ్యవసాయ క్షేత్రంలో ఉంటారు.జై జవాన్-జై కిసాన్ నినాదం తీసుకువచ్చినవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. వ్యవసాయ విప్లవానికి (గ్రీన్ రెవల్యూషన్) కు బాటలు వేసింది కూడా ఈయనే. పంటకు ఎంత విలువ ఇచ్చాడో, పాడికి కూడా అంతే విలువ ఇచ్చాడు.శ్వేతవిప్లవం ఈయన తెచ్చిందే.సోవియట్ యూనియన్, శ్రీలంకతో ఒప్పందాలు కుదుర్చుకొని బంధాలను గట్టి పరచి, విదేశీ విధానంలోనూ తన ముద్ర వేసుకున్నాడు.నెహ్రు క్యాబినెట్ లో మొట్టమొదటి రైల్వే మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి. దేశంలో జరిగిన ఒక రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.అన్నేళ్లు కేంద్ర మంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయనకు చివరకు సొంత ఇల్లు కూడా లేదు.కుటుంబ సభ్యుల ఒత్తిడితో అప్పుచేసి కారు కొనుక్కున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే? మహాత్మాగాంధీ , జవహర్ లాల్ నెహ్రు విధానాలకు లాల్ బహుదూర్ శాస్త్రి ఆత్మీయమైన అసలు సిసలు వారసుడు.ఆర్ధిక విధానాలలో నెహ్రును కూడా దాటి ముందుకు వెళ్లారు.మరో గాంధీ పుట్టడు, మరో లాల్ బహుదూర్ శాస్త్రి పుట్టడు.వీరి సిద్ధాంతాలు, ఆచరించిన మార్గాలు ప్రస్తుత కాలంలో ఆచరించడానికి కష్టమైనా,ఏదో ఒక రోజు వీరిని తప్పక అనుసరించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ మహానేతలు సర్వకాలీనులు. వీరి సిద్ధాంతులు ఎప్పటికీ అవసరంగానే నిలుస్తాయి. -మాశర్మ సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా! మళ్లీ ఆయన..) -
గాంధీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా! మళ్లీ ఆయన..
మహాత్ముడి అవసరం పెరిగిందిగాంధీజీ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. తన సిద్ధాంత బలంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారు. ఆయన పోరాట పంథా వినూత్నమైనది. అహింస అనే ఆయుధంతో, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం ‘డూ ఆర్ డై’ ఎందరినో ఉత్తేజితులను చేసింది. ‘విజయమో, వీర స్వర్గమో’ అనే నినాదంతో యావత్ దేశ ప్రజలు ముందుకురికి భారత గడ్డ మీద నుంచి బ్రిటిష్ వారిని తరిమేశారు. మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. స్వాతంత్య్రం సిద్ధించి సంవత్సరం తిరగకుండానే 1948 జనవరి 30న ఆయన హత్యకు గురై దేశాన్ని శోకసంద్రంలో ముంచారు. ఆయన ఘనత ప్రపంచ మంతా గుర్తించింది. అయితే భారతదేశంలో ఆయన్ని మెల్లగా మరచిపోతున్న ధోరణి కనిపించడం బాధాకరం. గాంధీజీ జయంతి సందర్బంగా ఆయన ఆశ యాలు, సిద్ధాంతాలను మరోసారి గుర్తు చేసుకోవ లసిన అవసరం ఉంది. ‘అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్లు ఎప్పుడైతే క్షేమంగా వెళతారో ఆరోజే నా దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని ప్రకటించారు గాంధీ. గాంధీ సహించనివి– మగువలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, హత్యలు, కక్షలు, వైషమ్యాలు. కానీ ఇవే ఎక్కువైన ఈ సమాజంలో ఆయన ఆదర్శం గాలికి కొట్టుకుపోయిందని చెప్పక తప్పదు. మతసామరస్యాన్ని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. కానీ ఇవాళ మత అసహనం పెచ్చరిల్లుతోంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి చంపేసే దృశ్యాలు అనేకం చూస్తున్నాం. నేడు అంతటా, అన్ని రంగాలలో అవినీతి పెచ్చరిల్లింది. గాంధీజీ స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా గ్రామాలు స్వయం పోషకత్వం సాధించి ఏ గ్రామానికది ‘స్వరాజ్యం’గా అభివృద్ధి చెందాలనుకున్నారు. మరి ఆయన కలలను మన పాలకులు ఎంతవరకు నెరవేర్చారో సమీక్షించుకోవాలి. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు, తాడిపత్రి ‘ 93915 23027 (చదవండి: తెలంగాణ పోరాట స్ఫూర్తి!) -
చీకట్లో చిరుదీపం! ఆ యాక్సిడెంట్ ఓ కొత్త బంధాన్ని..
‘ఫ్లైట్‌లో భలే ఉంది డాడీ! ఇప్పుడు జుయ్య్ మంటూ పైకి ఎగిరి పోతుందా? మబ్బుల్లోకి దూరిపోతుందా? మనం మబ్బులను తాకవచ్చా?’ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది పింకీ. ‘ఫ్లైట్ పైకి ఎగిరిపోతుంది కానీ మనం మబ్బులను తాకలేము. నువ్వు అల్లరి చేయకుండా కూర్చోవాలి. లేకపోతే ఎయిర్ హోస్టెస్ నిన్ను కిందకు దింపేస్తుంది’ అన్నాడు వశిష్ట. ‘అమ్మా! మనం అమెరికా వెళ్ళగానే జార్జ్ మామయ్య ఎయిర్ పోర్ట్‌కి వచ్చి మనల్ని తీసుకెళ్తారా? ఒకవేళ మామయ్య రాకపోతే మనం ఏం చేద్దాం?’ సందేహంగా అంది పింకీ.‘జార్జ్ మామయ్య తప్పకుండా వస్తాడు పింకీ!’ నమ్మకంగా అన్నాను. ‘లేఖా! ఎప్పుడయినా ఇలా అమెరికా వెళ్తాము అని అనుకున్నామా?’ ఆనందంగా అన్నాడు వశిష్ట. ‘అలాంటి పగటి కలలు కనే అలవాటు మనకు లేదు కదండీ! మనం ఊహించనిది జరగడమే జీవితం’ నవ్వుతూ అన్నాను. అంతలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది అని ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ వినిపించడంతో ప్రయాణికులు అందరూ సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు. మేము కూడా వాళ్ళను అనుసరించాం. సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కొద్ది రోజుల వెనక్కి వెళ్ళాను. ∙∙ నేను ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్ నర్సుగా పని చేస్తున్నాను. ఆస్పత్రికి వెళ్ళే దారిలో రైల్వే పట్టాలు ఉంటాయి. వాటిని దాటి వెళ్తే దారి కలిసి వస్తుందని ఎక్కువగా అటువైపు నుండే నడిచి వెళ్తాను. ఆలస్యం అయినరోజు చుట్టూ తిరిగి ఆటోలో వెళ్తాను. సరిగ్గా రైల్వే పట్టాల దగ్గరకు వచ్చేసరికి చాలా మంది జనం గుమిగూడి కనిపించారు. ఏమైందోనని జనం మధ్యలో నుండి తొంగిచూశాను. ‘ఎవరో ఒక యువకుడు పడిపోయి ఉన్నాడు. తలకు కట్టు కట్టి ఉంది. బట్టలన్నీ చినిగిపోయి అర్ధనగ్నంగా ఉన్నాడు. ఆ అబ్బాయి మా ఆస్పత్రిలో నిన్నటి దాకా ఉన్న పేషెంట్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. బయటకు ఎలా వచ్చాడు? ఎప్పుడు స్పృహ వచ్చిందో? నుదుటి మీద దెబ్బలున్నాయి. ఎవరో రాళ్లతో కొట్టినట్లున్నారనుకుని, గబగబా దగ్గరకు వెళ్ళి చూశాను. స్పృహలోనే ఉన్నాడు కానీ మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి అతన్ని మళ్ళీ ఆస్పత్రిలో చేర్పించాను.. చికిత్స కోసం! సరిగ్గా ఒక పదిహేను రోజుల క్రితం ఆ ప్రాంతంలోనే ఒక రైలు పట్టాలు తప్పి పడిపోయింది. ఆ ప్రమాదంలో దెబ్బలు తగిలిన వాళ్ళను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చాలామందికి చిన్న చిన్న గాయాలే అయ్యాయి. ప్రాణనష్టం జరగలేదు. కానీ పది మందికి మాత్రం తీవ్రంగా గాయాలు అయ్యాయి. అందులో తొమ్మిది మంది సమాచారం వాళ్ళ వాళ్లకు చేరింది. కానీ ఒకే ఒక యువకుడి తాలూకు అడ్రస్ మాత్రం తెలియలేదు. అతని దగ్గర బ్యాగ్ కానీ, ఫోన్ కానీ.. అతని ఉనికిని తెలిపే ఏ వస్తువు కానీ లేవు. తలకు బలమైన దెబ్బలు తగిలాయి. నిన్నటి వరకు పూర్తి స్పృలో కూడా లేడు. ‘అతను బయటకు ఎలా వెళ్ళిపోయాడు?’ అంటూ డాక్టర్ గారు స్టాఫ్ అందరినీ గట్టిగా కేకలు వేశారు. ఆ తరువాత అతనికి స్పృహ వచ్చిందని మీడియాకి సమాచారం అందించారు. కాంపౌండర్‌కి చెప్పి అతని బట్టలు మార్పించి గాయాలు తుడిచి కట్టు మార్చి, మందులు వేశాను. అతను కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడటం లేదు. అసలు మనం మాట్లాడేది అర్థం అవుతోంది లేనిది కూడా తెలియడం లేదు. ‘బహుశా తలకు తగిలిన దెబ్బ వల్ల మాట పోయిందా? లేక మతి భ్రమించిందా? అసలు చెవులు వినబడుతున్నాయా? లేదా?’ అనుకున్నాను. ‘శ్రీలేఖా.. ఏక్సిడెంట్తో ఇతను షాక్‌లోకి వెళ్లినట్లున్నాడు. వాళ్ల వాళ్లు వచ్చే వరకు మనమే టేక్ కేర్ చేద్దాం, జాగ్రత్తగా చూసుకోండి’ అని చెప్పారు డాక్టర్ గారు ఆ యువకుడిని పరీక్షించాక. ∙∙ మీడియా వచ్చి అతని ఫొటోస్ తీసుకొని.. వివిధ రకాల ప్రశ్నలు వేసింది. అతడి నుండి ఎటువంటి సమాధానమూ రాకపోయేసరికి నిరాశతో వెనుదిరిగింది. ‘నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పదిహేను రోజుల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఒక యువకుడికి రెండు రోజుల క్రితమే స్పృహ వచ్చిందని డాక్టర్ గారు సమాచారం ఇచ్చారు. అతను షాక్‌కి లోనయి ఉండటం వల్ల మాట్లాడటం లేదు. ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి వివరాలు తెలిసిన వారు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని సంప్రదించగలరు.’ అంటూ పేపర్లో వార్తగా వచ్చింది ఆ యువకుడి విషయం. రెండు.. మూడు.. వారం రోజులు గడిచాయి. ఎవరూ రాలేదు. అతడు ఎవరితో మాట్లాడటం లేదు. తిండీ తినడం లేదు. ఎవరయినా పలకరించినా అలా చూస్తూ ఉంటున్నాడు. కానీ సమాధానం చెప్పడం లేదు. డ్యూటీలోకి రాగానే ముందు అతడిని చూడటం.. అలాగే డ్యూటీ నుండి వెళ్లిపోయే సమయంలో నైట్ డ్యూటీ స్టాఫ్‌కి అతడి గురించిన జాగ్రత్తలు చెప్పి వెళ్లడం నా దినచర్యలో భాగమైంది. ఒకరోజు డాక్టర్ గారు రొటీన్ చెకప్‌లో భాగంగా ఆ అబ్బాయిని చూసి.. ‘శ్రీలేఖా.. అతని తాలూకు ఎవరూ రావడం లేదు కదా! మనం మాత్రం ఎన్నాళ్లని అతని బాధ్యత తీసుకోగలం? అందుకే డిశ్చార్జ్ చేసేద్దాం’ అన్నారు. ‘సర్.. అతనికి ఆకలి, దాహం కూడా తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో బయటకు పంపిస్తే ఎలా? అతని వల్ల మనకు సమస్యేమీ లేదు కదా! ఇంకొన్నాళ్లు చూద్దాం సర్’ అన్నాను రిక్వెస్టింగ్ ధోరణిలో. ఇక ఆయన ఏమీ మాట్లాడలేదు. ∙∙ ఒకరోజు ఉదయం నేను వచ్చేసరికి నర్సు కమల అతని మీద అరుస్తోంది. ‘ఏమైంది కమలా.. ఎందుకు కోప్పడుతున్నావు?’ అడిగాను కంగారుగా. ‘ఇతను తిండి తిని రెండు రోజులు అవుతోంది మామ్! ఎంత చెప్పినా మెతుకు ముట్టడు. కాంపౌండర్ అన్న వచ్చి స్నానం చెయ్యమంటే చేస్తాడు. రెండు జతల బట్టలు ఆస్పత్రిలో ఉంటే ఇచ్చాం. అవి ఉతుక్కోమంటే మా ముఖాలు చూస్తాడు. వినపడదో.. చెప్పింది అర్థంకాదో తెలీట్లేదు. ఈ గోల ఎక్కడ పడం మామ్.. పంపించేస్తే సరిపోతుంది కదా!’ అంది కమల. అతని వైపు చూశాను. ముఖం కిందకు దించుకొని చూడసాగాడు. నేను దగ్గరకు వెళ్లి అక్కడున్న ఇడ్లీ ప్లేటు అతని ముందుకి జరిపి అక్కడే కూర్చున్నాను. ఒక ముక్క తుంపి అతని చేతికి ఇచ్చి ‘తీసుకో! తిను’ అన్నాను మెల్లిగా. కాసేపు అలాగే చూసి ఇడ్లీ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అలాగే నెమ్మదిగా మొత్తం తినేశాడు. నేను తెచ్చుకున్న అరటి పండునూ ఇచ్చాను నా బ్యాగ్‌లోంచి తీసి. మౌనంగానే ఆ అరటి పండునూ తిన్నాడు. ‘మామ్! ఎవరం ఎంత చెప్తున్నా అతను వినడం లేదు. తిండి తినడం లేదు. కానీ మీరు చెప్పగానే భలే తినేశాడే! అలాగే అతను శుభ్రత విషయంలోనూ కాస్త సాయం చేద్దురూ.. ’ అంది కమల నవ్వుతూ. ‘సరే, ప్రయత్నిస్తాను కమలా!’ అని.. కాంపౌండర్ గోపిని పిలిచాను. ‘గోపీ.. ఇతన్ని స్నానానికి తీసుకెళ్లు. తర్వాత ఓ రెండు నైట్ డ్రెసెస్ కొనుక్కురా. ఆ.. సాయంత్రం నీ డ్యూటీ అయ్యాక సెలూన్‌కి తీసుకెళ్లు. అతని మానాన అతన్ని వదిలేయకుండా కాస్త జాగ్రత్తగా చూసుకో. నేను డాక్టర్ గారికి చెప్తాను’ అని పురమాయిస్తూ నా బ్యాగ్‌లో నుండి డబ్బులు తీసి గోపి చేతిలో పెట్టాను. ఆ రోజు ఇంటికి వెళ్ళాక ఆసుపత్రిలో జరిగినదంతా మా ఆయనతో చెప్పాను. ‘లేఖా! అతను ఎవరో అనాథై ఉండాలి. లేకపోతే ఏక్సిడెంట్ జరిగి ఇన్నాళ్ళయినా అతని కోసం ఎవరూ రాకపోవడం ఏంటీ! నువ్వు చెప్పేది వింటున్నాడు అంటే కచ్చితంగా మూగవాడు అయ్యుండడు. ఏదో ఒకరోజు నార్మల్ అవుతాడులే’ ప్రోత్సహకరంగా మాట్లాడాడు వశిష్ట. హోమ్‌వర్క్ చేస్తున్న పింకీ ‘అమ్మా.. అమ్మా!’ పిలిచి.. నా అటెన్షన్ తన మీద పడగానే తన చేతిలో ఉన్న నోట్‌బుక్‌ను చూపిస్తూ..‘నా పేరును కలరింగ్ చేసి తీసుకు రమ్మన్నారు మా టీచర్. చూడు బాగుందా?’ అంది. ‘చాలా బాగుంది’ అంటూ పింకీని ముద్దు పెట్టుకొని కిచెన్‌లోకి వెళ్లాను. పింకీ పేరు చూడగానే నాకు మళ్లీ అతను గుర్తొచ్చాడు. అతని పేరు ఏంటీ? ఎలా తెలుసుకోవడం? ∙∙ మరుసటి రోజు ఉదయం ఆస్పత్రికి వెళ్ళగానే అతను ఎదురొచ్చాడు. గోపి అతనికి క్రాఫ్, గడ్డం చేయించినట్లున్నాడు. ముక్కు, ముఖం స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్టలు కూడా కొత్తవి వేసుకున్నాడు. చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అతన్ని చూస్తే చదువురాని వాడిలా అనిపించడం లేదు. నన్ను చూసి చెయ్యి చాపాడు. నాకు ముందు అర్థం కాలేదు.. తరువాత అర్థమయింది. బ్యాగ్‌లో నుండి అరటి పండు తీసి ఇచ్చాను. తిన్నాడు. అంటే నిన్న నేను అరటిపండు ఇచ్చింది గుర్తుందన్నమాట! సాయంత్రం డ్యూటీ పూర్తి అయ్యాక అతని కోసం వెతికాను. పేషంట్స్ ఉండే రూమ్స్‌లో ఒక చోట కూర్చొని ఉన్నాడు. లోపలికి వెళ్లాను. నన్ను చూశాడు. కానీ నవ్వలేదు. ముఖం మాత్రం ప్రసన్నంగా మారింది. బయటకు రమ్మని సైగ చేశాను. కదల్లేదు. అలాగే చూస్తున్నాడు. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని నాతో తెచ్చుకున్న పుస్తకం మీద ‘శ్రీ లేఖ’ అని తెలుగులో, ఇంగ్లిష్‌లో, హిందీలో రాశాను. ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో అతను నా కుర్చీ దగ్గర.. నేను రాసేది చూస్తున్నాడు. గమనించీ గమనించనట్టుండిపోయా. నా చేతిలో ఉన్న పెన్ను ఇవ్వమని చెయ్యి చాపుతూ ఏదో అన్నాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. యాసతో వచ్చిన మాట! స్పష్టత లేదు. కానీ మొదటిసారి అతను నోరు తెరిచాడు. అతనికి పెన్ను ఇచ్చాను. నా చేతిలోని పుస్తకం తీసుకున్నాడు. దాని మీద ‘జార్జ్’ అని రాశాడు ఇంగ్లిష్‌లో. ఆ నిముషంలో నాకు ఎగిరి గంతులు వేయాలి అన్నంత సంతోషం కలిగింది.. నా ఆలోచన సరిగ్గానే పని చేసిందని! ‘జార్జ్’ అతని పేరు అయ్యుంటుంది. ఇక ఇతర వివరాలు తెలియాలి. పెన్నును పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రైలు ఏక్సిడెంట్ అయిన రోజు నుండి వచ్చిన న్యూస్ పేపర్లు అన్నీ అటెండర్‌తో తెప్పించాను. ఎక్కడ కూడా జార్జ్ అన్న పేరుతో ఒక్క వార్తా లేదు. గాలిలోకి బాణం వేస్తున్నానేమో అనిపించింది. అంతలోనే నా దృష్టి ‘హైదరాబాద్‌లో విలియమ్స్ అనే ఓ విదేశీయుడు అమీర్‌పేట్‌లోని ఒక స్టార్ హోటల్లో రాత్రివేళ రూమ్ తీసుకొని మరుసటి రోజు ఉదయం లాక్ చేసుకొని బయటకు వెళ్ళాడు. తిరిగి రాలేదు. అతను ఇచ్చిన ఫోన్ నంబర్ కూడా అందుబాటులో లేదు. హోటల్ వాళ్ళు మారు తాళం చెవితో రూమ్ తెరిచి చూస్తే అతని బట్టల సూట్‌కేస్ ఉంది. అవి అమీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు’ అన్న చిన్న న్యూస్ మీద పడింది. ఈ వార్తకు, జార్జ్‌కి ఏదయినా సంబంధం ఉందేమో అనిపించింది ఎందుకో! రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను దాని గురించి. నా అనుమానాలన్నిటినీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక వశిష్ట దగ్గర వెలిబుచ్చాను. ‘నువ్వు నర్సు ఉద్యోగం మానేసి సీఐడీలో చేరితే బాగుంటుందేమో!’ అన్నాడు నవ్వుతూ వశిష్ట. ‘అలా ఎగతాళి చేయకండీ! ఆ అబ్బాయి చూస్తే తమ్ముడిలా అనిపిస్తున్నాడు. అతనికంటూ ఒక కుటుంబం ఉండుంటే.. అతను ఇలా జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల తన వాళ్లను చేరుకోలేక.. అనాథలా మిగిలిపోతాడేమో!’ అన్నాను బాధగా. ‘హోటల్ మేనేజ్మెంట్ వాళ్లకు ఫోన్ చేసి చూద్దాం!’ అన్నాడు వశిష్ట నన్ను అనునయిస్తూ. గూగుల్‌లో హోటల్ నంబర్ చూసి రిసెప్షనిస్ట్‌తో మాట్లాడాడు వశిష్ట..‘మామ్! మేము నిజామాబాద్ జిల్లా నుండి మాట్లాడుతున్నాం. పేపర్లో మీరు ఇచ్చిన వార్త చూశాం. మొన్న ఇక్కడ జరిగిన రైలు ఏక్సిడెంట్లో ఒక వ్యక్తి గతం మరచిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. అతనికీ, మీ హోటల్ నుండి మాయమైన విలియమ్స్కీ ఏదయినా సంబంధం ఉందేమోనని ఫోన్ చేశాను’ అంటూ. రిసెప్షనిస్ట్ మేనేజర్‌కి కనెక్ట్ చేసింది. మేనేజర్ కూడా వెంటనే స్పందించాడు. ‘విలియమ్స్ వచ్చిన రోజు సీసీ కెమెరాలో క్యాప్చర్ అయిన ఆయన ఫొటోను పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఇచ్చాం. అది ఒకటి నా దగ్గరా ఉంది. మీ నంబర్‌కి వాట్సప్ చేస్తాను’ అని చెప్పి.. మరికొద్ది సేపట్లోనే విలియమ్స్ ఫొటోను వశిష్టకు వాట్సాప్ చేశాడు హోటల్ మేనేజర్. అందమైన ఓ పాతికేళ్ల యువకుడు.. చేతిలో ఒక లెదర్ సూట్ కేస్, క్యాబిన్ బ్యాగ్‌తో ఉన్న ఫొటో అది. పరీక్షగా చూస్తే అతనిలో జార్జ్ పోలికలు కనిపించాయి. ‘అతనే ఇతను!’ ఆనందంగా అరిచాను. ‘అయితే నీకు సీఐడీ పదవి గ్యారంటీ’ నవ్వుతూ అన్నాడు వశిష్ట. ∙∙ మరుసటి రోజు ఉదయం ఆస్పత్రికి వెళ్ళగానే మా చీఫ్ డాక్టర్ గారికి విలియమ్స్ ఫొటో చూపించి జరిగిందంతా చెప్పాను. ఆయన నిజామాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌కి కాల్ చేసి సమాచారం అందించారు. వాళ్ళు అంతా విన్నాక అమీర్‌పేట్ పోలీసులతో మాట్లాడి అక్కడ ఉన్న జార్జ్ లగేజ్ నిజామాబాద్‌కి పంపించే ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు హైదరాబాద్ నుంచి పోలీసులు లగేజ్‌తో ఆస్పత్రికి వచ్చారు. జార్జ్‌ని తీసుకురమ్మని అటెండర్‌కి పురమాయించారు డాక్టర్ గారు. అప్పుడు నేనూ అక్కడే ఉన్నాను. జార్జ్‌ని తీసుకొచ్చాడు అటెండర్. వచ్చీరావడంతోనే జార్జ్ దృష్టి పోలీసుల దగ్గరున్న సూట్‌కేస్ మీద పడింది. అలా చూస్తూ నిలబడిపోయాడు. నేను అతనినే గమనిస్తున్నాను. సూట్‌కేస్‌ను పోలీసులు ఇదివరకే ఓపెన్ చేసి చూశారు. అందులో కొన్ని జతల బట్టలు తప్ప ఇంకేమీ లేవు. అందుకే వాళ్లకు వివరాలు తెలియలేదు. పిచ్చివాడిలా.. అయోమయంగా చూస్తుండే జార్జ్ చురుకుగా మారాడు. గబగబా వెళ్ళి సూట్‌కేస్ తీసుకొని ఓపెన్ చేశాడు. ‘వేర్ ఈజ్ మై ఫోన్?’ అడిగాడు అమెరికన్ యాసలో. అక్కడున్న అందరం తుళ్ళిపడ్డాం. ‘మీ ఫోన్ పోయింది. మీరు ఫోన్ చేసుకోవాలి అనుకుంటే ఇదిగో’ అని ఇంగ్లిష్‌లో చెబుతూ తన ఫోన్ ఇచ్చాడు ఒక పోలీస్. జార్జ్‌కి ఆ పోలీస్ ఇంగ్లిష్ అర్థం కాలేదని అతని ముఖ కవళికలు చెప్పాయి. భావం అర్థమైనట్టుంది అందుకే పోలీస్ చేతిలోని ఫోన్ తీసుకున్నాడు. వెంటనే ఎవరికో కాల్ చేశాడు. అటు వైపు ఉన్నవారు జార్జ్ గొంతు విని చాలా సంతోషించినట్లు తెలుస్తోంది. జార్జ్ మాట్లాడలేకపోతున్నాడు. సమాధానం చెప్పలేక అయోమయంగా చూస్తున్నాడు. నేను అది గ్రహించి అతని దగ్గర నుండి ఫోన్ తీసుకొని.. జరిగింది అంతా అవతలి వైపున వ్యక్తికి వివరించాను. ఆ మాటలను బట్టి ఆ వ్యక్తి జార్జ్ తండ్రని అర్థమైంది. ఆయన నా ఫోన్ నంబర్, ఆస్పత్రి అడ్రస్ తీసుకున్నాడు. జార్జ్‌కి ఫోన్లోని నా సంభాషణ ద్వారా కాస్త ఊరట దొరికినట్టయింది తప్ప భరోసా అందినట్టు లేదు. అందుకే పూర్తిగా మామూలు స్థితికి రాలేదు. పోలీసులు జార్జ్‌కి సూట్‌కేస్ అందచేసి వెళ్లిపోయారు. ఏదో ఒక పెద్ద విజయం సాధించిన భావం నాలో! అనామకుడు అనుకున్న వ్యక్తిని తన కుటుంబంతో కలుపుతున్న ఆనందం! ఇంటికి వెళ్లగానే అడిగాడు వశిష్ట.. ‘ఏమైంది నీ ఇన్వెస్టిగేషన్?’ అంటూ కాస్త వెక్కిరించినట్టుగానే. జరిగిందంతా పొల్లు పోకుండా చెప్పాను. ‘అయితే జార్జ్ విలియమ్స్ పూర్తి కథ తెలుసుకునే సమయం దగ్గరకు వచ్చేసిందన్నమాట!’ అన్నాడు. ‘అవును’ అన్నాను సంతోషంగా! ∙∙ ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఉదయం తొందరగా లేచి మా ముగ్గురి లంచ్ బాక్స్‌లతో పాటు జార్జ్‌కి కూడా బాక్స్ సర్దాను. వశిష్ట వెక్కిరించినా పట్టించుకోలేదు. నేను ఆస్పత్రికి వెళ్ళగానే జార్జ్ కోసం వెతికాను. ఎప్పటిలా నాకు ఎదురు రాలేదు. నేనే అతను కూర్చున్న చోటుకు వెళ్ళాను. నేను దగ్గరకు వెళ్ళగానే ఎప్పటిలా చెయ్యి చాచలేదు. నేనే అరటి పండు తీసి ఇచ్చాను. తీసుకున్నాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నించి ఆగిపోయాడు. మధ్యాహ్నం నేను తెచ్చిన లంచ్ బాక్స్ అతనికి ఇచ్చి, నేను కూడా అక్కడే కూర్చుని తిన్నాను. సాయంత్రం జార్జ్ తండ్రి హైదరాబాద్ వచ్చాక నాకు ఫోన్ చేశాడు. డాక్టర్ గారు సహా స్టాఫ్ అంతా ఆయన కోసం ఎదురు చూడసాగాం. అంతలోనే ఓ కారు వచ్చి ఆగింది. ఇద్దరు మగవాళ్ళు, ఒక ఆడమనిషి దిగారు. ఆ ఆడమనిషికి.. జార్జ్‌కి పోలికలు కనిపించాయి. ఆమె అతని తల్లి అయ్యుంటుంది. అమెరికన్ల రంగు కాదు ఆవిడది. ఇండియన్ల కలరే. అందుకే మేమెవ్వరం జార్జ్‌ని అమెరికన్ అని అనుకోలేకపోయాం. జార్జ్‌ని చూడగానే అతని కుటుంబం భావోద్వేగానికి లోనయింది. జార్జ్ తల్లితండ్రుల ద్వారా మాకు తెలిసిన విషయం ఏమిటంటే.. ‘జార్జ్ విలియమ్స్.. ఎమ్మెస్ పూర్తి చేసి భారతీయుల జీవన విధానం మీద ఆసక్తితో రీసెర్చ్ కోసం ఇండియా వచ్చాడు. పేరెంట్స్‌కి అతను ఒక్కగానొక్క సంతానం. కోట్లకు అధిపతి. హైదరాబాద్ వచ్చి హోటల్లో దిగిన తరువాత నిజామాబాద్ జిల్లా పర్యటన కోసం రైల్లో బయలుదేరాడు. అనుకోకుండా ఏక్సిడెంట్లో అతని బ్యాగ్.. అందులో ఉన్న ఫోన్ పోయాయి. అతని తలకి బలమైన గాయం తగలడం వల్ల షాక్‌కి లోనయ్యాడు. ఇక్కడి భాష, మనుషులు.. వాతావరణం.. అతన్ని మరింత అయోమయంలోకి నెట్టాయి. ఈ కాంటాక్ట్ లేక జార్జ్ సమాచారం అందక అతని తల్లితండ్రులు ఆందోళన పడ్డారు’ అని. ‘శ్రీలేఖ మా ఆస్పత్రిలో హెడ్ నర్స్‌గా పని చేస్తోంది. తను పేషంట్స్‌ను సొంత మనుషుల్లా చూస్తుంది. మీ అబ్బాయి కోసం ఎవరూ రాలేదు కాబట్టి నేను అతన్ని డిశ్చార్జ్ చేసెయ్యమని చెప్పాను. కానీ తను ఒప్పుకోలేదు. అతడి వివరాలు తెలిసేవరకు ఎదురుచూద్దాం అంది. ఈ అమ్మాయి వల్లే మీ అబ్బాయి మీకు దొరికాడు’ చెప్పారు చీఫ్ డాక్టర్ గారు జార్జ్ తల్లి తండ్రులకు. ‘అమ్మా! నీ ఋణం తీర్చుకోలేను’ అంటూ నా రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది జార్జ్ తల్లి. ఖాళీ చెక్ పైన సంతకం చేసి ‘అమ్మా ఇది నా కొడుకు మమ్మల్ని చేరేలా చేసినందుకు మా బహుమానం. తప్పుగా అనుకోకుండా తీసుకో.. నీకు కావలసినంత రాసుకో’ అంటూ నా చేతుల్లో చెక్ లీఫ్‌ని పెట్టాడు జార్జ్ తండ్రి. దాన్ని ఆయనకు తిరిగి ఇస్తూ ‘నా డ్యూటీ నేను చేశాను. దీన్ని నేను తీసుకుంటే డబ్బు కోసం చేసినట్లు అవుతుంది. జార్జ్‌ను చూస్తుంటే నాకు నా తమ్ముడిలా అనిపించింది. ఆ వాత్సల్యంతో అతడి వివరాల కోసం ప్రయత్నం చేశాను’ అన్నాను. ఆ మాటలు వింటున్న జార్జ్ వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కృతజ్ఞతా భావం. నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. వాళ్ళు ఎంత బలవంతం చేసినా నేను డబ్బు తీసుకోలేదు. వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. కానీ మా మధ్య బంధం రోజురోజుకీ బలపడుతూనే వచ్చింది. ఇదిగో ఇలా మేం అమెరికా వెళ్లిదాకా! ∙∙ ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది అని ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ వినిపించడంతో నేను వాస్తవంలోకి వచ్చాను. వశిష్ట, పింకీ ముఖాలలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. జార్జ్‌ని చూడబోతున్నానన్న ఆనందంతో నా మనసు నిండిపోయింది. (చదవండి: గజరాజు గర్వభంగం!) -
గజరాజు గర్వభంగం!
పూర్వం ఓ అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. ఆ అడవిలో తనే పెద్ద జంతువునని, తనకన్నా పెద్ద జంతువు లేనేలేదని, అందరూ తననే గౌరవించాలని చెబుతూ పెత్తనం చలాయించేది. ఏనుగు తీరుతో కుందేలు, తాబేలు, కోతులు, చీమలు భయంతో వణికిపోయేవి. ఆ గజరాజు అడుగుల శబ్దం వినిపిస్తే చాలు జంతువులన్నీ పారిపోయేవి. ఒక రోజు ఓ కోతుల గుంపు వెలక్కాయ చెట్టుపై ఉండడం గమనించింది ఏనుగు. వెలక్కాయలను కోతులు తింటూండం చూసిన ఏనుగుకూ నోరూరింది. చెట్టు దగ్గరకు వచ్చింది. కాయల్ని కోసుకోవడానికి కొమ్మల్ని వంచాలని తొండంతో ప్రయత్నించింది. అందలేదు. పైనే కూర్చున్న కోతులను చూసి ఉరిమింది. అవి భయపడలేదు. తనకు ఓ పది కాయలు ఇవ్వమని కోతులను ఆజ్ఞాపించింది. ‘మాకు పిల్లలున్నాయి. అవి ఆకలితో అలమటిస్తున్నాయి. వాటికి తీసుకెళ్లాలి. దయచేసి మమ్మల్ని విడిచిపెట్ట’మని అవి ఏనుగును వేడుకున్నాయి. గజరాజు కదలలేదు. ‘ఇంత పెద్ద జంతువును.. నాకు ఆహారం పెట్టకుండా ఎక్కడో ఉన్న పిల్ల కోతుల ఆకలి గురించి ఆలోచిస్తారా? మీకు నేనంటే కొంచెం కూడా భయం లేదు. ఈ అడవంతా నాదే. నేను చెప్పినట్లే మీరంతా వినాలి. నా మాట వినకుంటే ఏం చేస్తానో చూడండి!’ అంటూ తొండంతో ఆ చెట్టును ఊపింది. ఒక్కసారిగా చెట్టు ఊగడంతో కోతులు మరో చెట్టు మీదకి దూకాయి. అవి తనమాట వినలేదని వాటి మీద మరింత కోపం పెంచుకుంది ఏనుగు. బిగ్గరగా ఘీంకరిస్తూ కోతులు ఎగురుతున్న చెట్లన్నిటినీ తొండంతో కూల్చేసింది. కోతులు తమ పిల్లల కోసం కోసిన వెలగపండ్లను లాక్కుని కాలితో తొక్కేసింది. ఏనుగు వికృత చేష్టలకు కోతులు భయపడి అక్కడి నుంచి తప్పించుకున్నాయి. ఏదోక రోజు ఏనుగుకు తగిన శాస్తి చేయాలని కంకణం కట్టుకున్నాయి. ఆ రోజు రానే వచ్చింది. ఏనుగు తన తొండంతో భారీ చింత చెట్టును కూల్చివేస్తుండగా చెట్టు కొమ్మలు విరిగి దాని మీద పడ్డాయి. బాధతో విలవిల్లాడింది. అలా గాయాలపాలైన ఏనుగు ఎటూ కదల్లేక ఆ చెట్టు చెంతనే కూలబడిపోయింది. ఆహారం లేక నీరసించిపోయింది. నాలుగు రోజులైనా ఆ దారిన ఎవరూ కనపడలేదు. అప్పుడే ఆ దారిన గంతులేస్తూ వెళ్తున్న కోతులు దానికంటబడ్డాయి. వాటిని పిలుస్తూ తనను రక్షించమని వేడుకుంది. ఏనుగు కష్టం చూసిన కోతులు ‘మమ్మల్ని ఏడిపించిన నీకు తగిన శాస్తే జరిగింది’ అని నవ్వుకున్నాయి. ‘అవును.. మిమ్మల్ని, ఇతర జంతువులను ఏడిపించినందుకు నాకు సరైన శిక్షే పడింది. జీవితంలో ఇక ఎప్పుడూ ఎవరినీ ఏడిపించను. బుద్ధి వచ్చింది. నన్ను ఈ నరక యాతన నుంచి రక్షించండి’ అని కంటతడి పెట్టుకుంది. కోతుల మనసు కరిగిపోయింది. వాటికి అల్లంత దూరంలో ఓ పెద్ద చెట్టును కూల్చుతున్న మనుషులు కనిపించారు. వారి వద్దకు వెళ్లి ఆపదలో ఉన్న ఏనుగు గురించి చెప్పి రక్షించాలని వేడుకున్నాయి. వాటి అభ్యర్థనను ఆలకించిన మనుషులు ఏనుగు వద్దకు వెళ్లి చూశారు. జేసీబీతో చెట్టు కొమ్మలు తొలగించి ఏనుగును రక్షించారు. వైద్యుడినీ రప్పించి దాని గాయాలకు తగిన వైద్యం అందించారు. కోతులు, కుందేళ్లు ఏనుగుకు సేవలు చేశాయి. పశ్చాత్తాపం చెందిన ఆ ఏనుగు తనను క్షమించమని ఆ జంతువులన్నిటినీ వేడుకుంది. (చదవండి: తెలంగాణ పోరాట స్ఫూర్తి!) -
మహావిషాదానికి 115ఏళ్లు, వందల మంది ప్రాణాలు కాపాడిన చింతచెట్టు
‘సెప్టెంబర్ 28’... ఈ తేదీ రాగానే 1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలే గుర్తుకొస్తాయి. అప్పట్లో ఈ వరదలు నాటి నగరంలో అధిక భాగాన్ని జలమయం చేశాయి. వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చాయి. వరదలు వచ్చి నేటికి 115 ఏళ్లు గడిచినా ఈ నగరానికి నాటి స్మృతులు నేటికీ తడి ఆరకుండానే ఉన్నాయి. అఫ్జల్ గంజ్ పార్క్ (నేడు ఉస్మానియా ఆసుపత్రిలో భాగం)లో ఉన్న ఓ చింత చెట్టునాటి జ్ఞాపకాలను నేటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు... ఈ ఏడాది సైతం సెప్టెంబర్ 28న అలనాటి వరద సమయంలో ఎంతో మందిని రక్షించిన చింతచెట్టు కింద జరిగే సమావేశం ఒక నాటి బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ... నేటి పరిస్థితుల్లో నగరాభివృద్ధికి నిపుణులు చేసే సూచనలకు వేదిక కానుంది. ప్రాణాలు కాపాడిన చింతచెట్టు.. మూసీ నదికి ఎన్నో సార్లు వరదలు వచ్చాయి. కానీ 1908లో వచ్చిన వరద మాత్రం కనివిని ఎరుగనిది.ఆ వరద బీభత్సానికి 48 గంటల్లో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వరదలో కొట్టుకుపోయారు. 80 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి.లక్షన్నర మందికి గూడు లేకుండా పోయింది. వందలకొద్దీ చెట్లు నెలకొరిగాయి. కొందరైతే భవనల పైకి వెళ్లి తమ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు. తాము బతికుంటామో లేదో తెలియదు అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు. అలాంటివారిలో కొంతమంది ప్రాణాలను కాపాడింది. ఒక చింత చెట్టు. అది ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. వరదల సమయంలో ఆ చింతచెట్టుపై ఎక్కి 150 మందికిపైగా ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల సాక్షిగా వందల మంది ప్రాణాలు కాపాడిన చెట్టు ఇప్పటికీ సజీవంగానే ఉంది. రెండు రోజుల పాటు వారు తిండితిప్పలు లేకుండా అలాగే ఉండిపోయారని చెబుతారు. ఆ చెట్టుకు 400ఏళ్లనాటి చరిత్ర ఉందని భావిస్తున్నారు. ఆ వరదలు వచ్చిన మూడేళ్లకు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గద్దెనెక్కారు. అలాంటి విపత్తు మరోసారి రావద్దని భావించారు. అందుకోసం సిటీ ప్లాన్ రూపొందించాలని, మౌలిక వసతులు కల్పించాలని సంకల్పించారు. 1914 లోనే సిటీ ఇంప్రూవ్ మెంట్ బోర్డు (సీఐబీ)ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ప్లానర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకత్వంలో సీఐబీ అనేక పథకాలను అమలు చేసింది. అప్పట్లో నగర ప్రణాళిక... బాగ్ (ఉద్యానవనాలు), బౌలి (బావులు), తలాబ్ (చెరువులు)తో ముడిపడి ఉండింది. పచ్చదనం, జలాశ యాలు నగరప్రణాళికలో కీలక పాత్ర పోషించాయి. హైదరాబాద్.. ఎన్నో సమస్యలు ఈ శతాబ్ది కాలంలో నగరం ఎంతో అభివృద్ధి సాధించింది కాకపోతే... నగరం ఊహకు అందని విధంగా విస్తరించింది. జనాభా బాగా పెరిగిపోయింది. నగరంలో అనేక ప్రాంతాలు ఓ మోస్తరు వర్షానికే జలమయమైపోతున్నాయి. పుట్ట గొడుగుల్లా మురికివాడలు వెలిశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’, ‘సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్’ సంస్థలు ఇతర ఎన్జీఓలతో కలసి అర్బన్ ప్లానింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, నగరాభివృద్ధితో ముడిపడిన సంస్థలకు అనేక సూచనలు చేశాయి. 1908 నాటి వరదల భయంకర పరిస్థితికి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన చింతచెట్టు నీడలో ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది. 2008 సెప్టెంబర్ 28 నుంచి కూడా ఏటా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరం నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. వర్షాకాలంలో కాల్వలుగా మారుతున్న రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం, పెరిగిపోతున్న ట్రాఫిక్, వాహన కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం,మంచి నీటి సమస్య, డ్రైనేజీ ఇక్కట్లు, ప్రజా రవాణా, మూసీ నది కలుషితం కావడం... మూసీ తీరంలో ఆక్రమణల తొలగింపు ఇలా చెబుతూపోతే... ఈ జాబితాకు అంతు ఉండదు. ఈ సమస్యల్లో చాలా వాటిని పరిష్కరించేది హైదరాబాద్‌కు చక్కటి ‘ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్’ మాత్రమే. హైదరాబాద్‌లో మంచినీటి సమస్య పరిష్కారమయ్యింది. రహదారులు వృద్ధి చెందాయి. ఓ.ఆర్.ఆర్. లాంటివి ఎన్నో వచ్చాయి. ఆర్.ఆర్.ఆర్.లు వస్తున్నాయి. ఫ్లై ఓవర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎయిర్ పోర్ట్, మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. నాలాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే నగరం శరవేగంగా విస్తరిస్తున్నందున సదుపాయాలను పెంచవలసి ఉంది. రాబోయే రోజుల్లో మంచిరేవుల నుంచి ఘట్ కేసర్ దాకా మూసీ మీదుగా రూ.10 వేల కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్, విమానాశ్రయంతో పాటు, ఇతర ప్రాంతాలను కలుపుతూ ఎక్స్ ప్రెస్ వే కూడా రానుంది. ఇది ఒక్కటే కాదు. నగరానికి నాలుగు వైపులా సుమారుగా 100 కి.మీ దాకా ఇదే తరహా అభివృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ మనకు సానుకూల సంకేతాలే అనడంలో సందేహం లేదు. అభివృద్దితో పాటు సమస్యలూ.. అభివృద్ధితో పాటూ సమస్యలూ తలెత్తుతాయి. వీటిని దుర్కొనడానికి మాస్టర్ ప్లాన్ అత్యంత కీలకం. 1975 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వివిధ సంస్థల ద్వారా హైదరాబాద్‌కు 6 మాస్టర్ ప్లాన్లు వచ్చాయి. వాటిని కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ అమలుచేయాలి. హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న సమస్యల్లో వాహన కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ ముఖ్యమైన అంశాలుగా మారిపోయాయి. వీటిని నివారించేందుకు ప్రజా రవాణా ఒక్కటే మార్గం. అందులోనూ గ్రీన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించాలి. రెండవ దశ ఎమ్ఎమ్ టీఎస్ వ్యవస్థను మరింతగా విస్తరించాలి. దాంతో పాటుగా ఇప్పటికే ఉన్న లోకల్ రైల్ లాంటి వాటిని అభివృద్ధి చేయాలి. నగరం ఎదుర్కొంటున్న మరో ముఖ్యమైన సమస్య డ్రైనేజీ, వరదనీళ్లు. ఎక్కడికక్కడ మురుగునీటిని శుద్ధి చేసి ఆ నీటిని స్థానికంగా వినియోగించుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి. మిగులు నీటిని (శుద్ధి అయినవి మాత్రమే) స్థానిక చెరువుల్లోకి, మూసీనదిలోకి పంపించేలా చూడాలి. హైదరా బాద్‌కు వలసలను నివారించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రాజధానికి 100 కి.మీ. వెలుపల కౌంటర్ మాగ్నెట్స్గా వివిధ చిన్న పట్టణాలను అభివృద్ధి చేయాలి. ఈ తరహా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాలి. వారసత్వాన్ని కాపాడుకోవాలి ఈ రోజున హైదరాబాద్ యావత్ దేశపు గ్రోత్ఇంజిన్లలో ఒకటిగా నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరానికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయాలి. హైదరాబాదు నగరంలో నేటికీ ఎన్నో చారిత్రక భవనాలు వారసత్వ జాబితాలోకి ఎక్కవలసి ఉన్నాయి. అలాంటి వాటిని పరిరక్షించుకోవాలి. కనీసం 5 లేదా 6 ప్రాంతాలు యునెస్కో గుర్తింపు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలి. అఫ్జల్ గంజ్ పార్క్ లో ఉన్న చింత చెట్టునూ, ఆ స్థలాన్నీ నగర సహజ వారసత్వంలో భాగంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ‘నేను నిర్మించిన నగరం చేపలతో నిండిన మహా సముద్రంలా ఉండాలి’ అని అప్పట్లో కులీ కుతుబ్ షా కోరుకున్నారు. అది నిజమైంది. నగరం జనసంద్రమైంది. ఇప్పుడు కావాల్సింది ఆ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మరింతగా అందించడం. హైదరాబాద్ నగరం కూడా శీతోష్ణస్థితి మార్పుల ప్రభావానికి లోనైంది. అతి తక్కువ సమయంలోనే అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పరిస్థితి ఇలానే కొనసాగితే 115 ఏళ్ల క్రితం వరదలే మరోసారి నగరాన్ని ముంచెత్తే పరిస్థితి కూడా పొంచి ఉంది. పైన పేర్కొన్న అన్ని సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక లతో ముందుకెళ్లడం నేటి తక్షణావసరం. వ్యాసకర్త: ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఛైర్మన్ మొబైల్: 98480 44713 -
తెలంగాణ పోరాట స్ఫూర్తి!
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ). నిజాం నవాబుకూ, ఆయన తొత్తులైన భూస్వాములకూ వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చిందామె. 1895 సెప్టెంబర్ 26న సద్దుల బతుకమ్మ నాడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్ణాపురంలో ఆమె జన్మించింది. చిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన నర్సయ్యతో వివాహం అయింది. పాలకుర్తి పరిసరాల్లో మల్లంపల్లి దొరవద్ద కొంత భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకొని సాగు చేసింది. ఇది పాల కుర్తి పొరుగునే ఉన్న విస్నూర్ గ్రామానికి చెందిన దేశ్‌ముఖ్ రేపాక రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది. దొర గడీల్లో వంతుల వారీగా వెట్టి చేసే ఐలమ్మ కుటుంబం సొంతంగా భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకోవడం సహించలేక పోయాడు. ఐలమ్మ భూమిని కాజేయాలనీ, ఆమె పండించిన పంటను గూండాలతో కొల్లగొట్టించాలనీ చూశాడు. ఐలమ్మ ‘ఆంధ్ర మహాసభ’ నాయకత్వంలో ఎర్రజెండా పట్టింది. పోరాడింది.‘గుత్పల సంఘం’ సభ్యులు, గ్రామ స్థుల సహకారంతో పంటను తరలించుకు పోవడానికి వచ్చిన గూండాలను తరిమి కొట్టింది. ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణలో భూపోరాటానికి నాంది అయింది. చివరకు రైతాంగ సాయుధ పోరాటం సాగి వేలాది ఎకరాలు సాగు చేసుకునే రైతుల పరం అయ్యాయి. ఐలమ్మ 1985 సెప్టెంబర్ 1న తుది శ్వాస విడిచింది. ఉద్యమనాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక చొరవతో వేసిన సబ్ కమిటీ తెలంగాణ పాఠశాల విద్యలో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజక వర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌కి ‘చాకలి ఐలమ్మ’ పేరు పెట్టి ప్రభుత్వం ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకొంది. అంతేకాదు చిట్యాల ఐలమ్మను ‘తెలంగాణ తల్లి’గా గుర్తించి 2021 సెప్టెంబర్ 26 నుండి ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. – కొండూరు సత్యనారాయణ, రజక సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన సలహాదారు -
వేగుచుక్కల వెలుగు కథలు
చరిత్ర వలెనె సాహిత్య చరిత్ర కూడా ఎప్పటికప్పుడు ఉపాంతీకరణకు గురైన భిన్న సామాజిక వర్గాల క్రియాశీల శక్తి సామ ర్థ్యాలనూ, సృజన విమర్శ శక్తులనూ సమీకరించి, చేర్చుకొంటూ సమగ్రం కావాల్సిందే. అలా తెలుగు సాహిత్య చరిత్ర స్త్రీల, దళిత బహుజనుల, ముస్లిముల సాహిత్యంతో 1980ల నుండి చెతన్యవంతంగా సంపద్వంత మవుతూనే ఉంది. ఈ చరిత్రలో భాగంగానే ‘విరసం’ ఇప్పుడు ‘వియ్యుక్క’ అనే పేరుతో ఆరు కథా సంకలనాలు ప్రచురిస్తున్నది. ‘‘ఈ సంకలనాల్లో చేరిన కథలు అజ్ఞాత మావోయిస్టు ఉద్యమంలో పని చేసి అమరులైనవారూ, కొనసాగుతున్నవారూ, అరెస్టయినవారూ, ఏ ఇతర కారణాల వల్లనైనా కొంత కాలం పని చేసి బయట ఉన్నవారూ రాసిన కథలు’’ అంటారు సంకలనాల సంపాదకు రాలు బి. అనురాధ. ఆ రకంగా అటు విప్లవ సాహిత్యంలోనూ ఇటు స్త్రీల సాహిత్యంలోనూ ఇది ఒక చారిత్రక ఘట్టం. 2007 నుండి అజ్ఞాత రచయిత్రుల కథల సేకరణ చేస్తూ వచ్చిన అనురాధ స్త్రీల పేర్లతో ఉన్న కథలు అన్నీ స్త్రీలు రాసినవో కావో నిర్ధారించుకొనటానికి, ఒక రచయిత్రి ఎన్ని కలం పేర్లతో రాసిందో గుర్తించిఒక పేరును ఖరారు చెయ్యటానికి అనుసరించిన పద్ధతులు చాలాఆసక్తికరమైనవి. మహిళా ఉద్యమంతో తనకు ఉన్న సంబంధంతో పాటు, ఈ కథల గురించి విరసం ప్రకటనకు ఆ రచయిత్రులుస్పందించి పత్రికా ముఖంగా ఇచ్చిన వివరాలు కూడా ఈ పనికి ఉపకరించాయి అంటుందామె. ‘వియ్యుక్క’ గోండీ భాషాపదం. వేగుచుక్క అని దాని అర్థం.ఇందులోని 282 కథలు 52 మంది మహిళా విప్లవకారులు రాసినవి. స్త్రీల కథాసంకలనాలు ఎన్నో వచ్చాయి గానీ ఒక రాజకీయార్థిక సామాజిక అవగాహన కలిగిన 52 మంది స్త్రీల సంకలనాలు మాత్రం ఇప్పటికి ఇవే. వ్యక్తులుగా ఎవరు ఎన్ని కథలు రాశారన్నది చెప్పటం ఈ సంకలనాల ఉద్దేశం కాదు. ఒకటి రెండు కథలు రాసినవాళ్లు కూడా ఇందులో ఉన్నారు. విప్లవ జీవితం అందరికీ సమష్టి అనుభవం. ఆ అవగాహన నుండే విప్లవోద్యమంలో వచ్చిన పరిణామాన్ని స్త్రీల అనుభవ కోణం నుండి నమోదు చేయటం ఈ సంకలనాలకు లక్ష్యం. ఆరు సంకలనాలలో మొదటి మూడు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. మొత్తం ఈ 146 కథలకు విప్లవోద్యమమే వస్తువు. సొంత కుటుంబాలు, ఆస్తులు, పేర్లు – అన్నీ వదులుకొని శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం, ఉత్పత్తి సంబంధాలలో మార్పు కోసం, ఉన్నత మానవీయ విలువలతో నూతన సమాజ నిర్మాణం కోసం విప్లవోద్యమంలోకి వెళ్ళిన వాళ్ళ అనుభవ కథనాలు ఇవి. ఈ కథలకు వస్తువైన జీవిత సందర్భాలు, శకలాలు భిన్నం కావచ్చు. కానీ సాధారణ ప్రజల అసాధారణ ధిక్కారం ఈ అన్ని కథలకూ అంతః సూత్రం. ఆచారాలు, రివాజులు, దోపిడీ, పీడన, రాజ్యం, దాని అణచివేత, సామ్రాజ్యవాద చొరబాటు వంటివన్నీ ఈ కథల సాధారణ అంశం. దాని సారం క్రియాశీల సౌందర్యం. ప్రాణాలు పణం పెట్టే సంసిద్ధత, మృత్యువుతో క్రీడలు, వీటన్నిటి దుఃఖోద్వేగాలు ఈ కథల ప్రత్యేకత. ఇవన్నీ వ్యక్తిగత స్థాయిని దాటి విశ్వ ప్రేమగా ఈ కథలలో ఆవిష్కృతమయ్యాయి. గనుల తవ్వకాలకు అడవులను ఆక్రమిస్తున్న బహుళ జాతి కంపెనీ లకు మద్దతును ఇచ్చే ప్రభుత్వ అభివృద్ధి నమూనాకు ఆదివాసీల నిర్వాసితత్వానికి ఉన్న సంబంధాన్ని మానవ సంబంధాలలో భాగంగా అర్థం చేయించే సోయి, ‘సీతాబాయి గెలుపు’, ‘లక్ష్మణరేఖ’ వంటి కథలు ఎన్నో ఇందులో ఉన్నాయి. విప్లవోద్యమం మనుషులను అన్య వర్గ, ఆధిక్య భావన నుండి విముక్తం చేసి కొత్త మనుషులుగా మారు స్తుందని ‘చాయ్ గ్లాస్’ (2012) కథ చెప్తుంది. అహంకారాన్నీ, అధికా రాన్నీ వదులుకొంటూ ఎదుటివాళ్లను వినగలిగిన, వాళ్ళ నుండి నేర్చు కొనగలిగిన సంసిద్ధత విప్లవ సాంస్కృతిక పర్యావరణంలోనే సాధ్య మని ‘ఇద్దరు శస్త్రకారులు’ కథ నిరూపిస్తుంది. ఎన్కౌంటర్ అయిన పిల్లల శవాల కోసం ఆసుపత్రికి వెళ్లిన తల్లులు... మరణించిన బిడ్డలందరి కోసం తల్లులందరి గర్భశోకాన్ని మోసేవాళ్ళు కావటం, ఆ బిడ్డలకు అంత్యక్రియలు గౌరవకరంగా జరగాలనుకొని తమ కడుపున పుట్టకపోయినా ఒడిలోకి తీసుకొని బిడ్డలుగా ప్రకటించే చైతన్యవంతులు కావటం అత్యంత సహజంగా చిత్రితమైన కథలు ‘ఈ శోకం ఎందరిది’, ‘నాబిడ్డనే’, ‘ముగ్గురు తల్లులు’. వాళ్ళు విప్లవ విశ్వమాతలుగా ఎదిగినవాళ్లు. మాతృత్వం విప్లవ మాతృత్వంగా ఆకాశమే హద్దుగా వ్యాపించటం ఈ కథల విశిష్టత. మావోయిస్టుల కార్యకలాపాల గురించీ, దళ జీవితం గురించీ, గిరిజనులకు వాళ్లకు ఉండే సంబంధాల గురించీ పత్రికలలో వచ్చే పాక్షిక కథనాలూ, వక్రీకరణలూ, వాటి వల్ల కలిగే దురభి ప్రాయాలనూ దాటి ఇతిహాసపు చీకటి కోణం అడుగున పడి కనిపించని వాస్తవాల వైపు మన చూపు తిప్పే ఈ కథలు తప్పక చదవవలసినవి. వ్యాసకర్త ప్రరవే కార్యదర్శి, తెలంగాణ (ఈ 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదులో ‘వియ్యుక్క’ కథా సంకలనాల ఆవిష్కరణ) -
అక్షరాల... టైమ్ ట్రావెల్!
ఒక జాతి, ఒక భాష, ఒక సంస్కృతి... చిరంతనంగా నిలవాలంటే సాహిత్యం సుసంపన్నంగా వెలగాలి. ముద్రణ లేని రోజుల్లో మౌఖికం, తాళపత్ర బంధితంగానే మిగిలిన అపార మైన, అపురూప సాహిత్యాన్ని ఆ తర్వాత పుస్తక రూపంలో అందరికీ దగ్గర చేసి, అక్షరాస్యతా ఉద్యమంలో భాగమైన పుణ్యమూర్తులైన ప్రచురణకర్తలు ఎందరెందరో! ఆధ్యాత్మిక సాహిత్యానికి సంబంధించి ఇవాళ వందేళ్ళ గోరఖ్‌పూర్ గీతాప్రెస్ గురించి ఎంతో వింటుంటాం, చూస్తుంటాం. కానీ, అంత కన్నా కొన్ని దశాబ్దాల ముందే ఒక తెలుగు ప్రచురణ సంస్థ అంతకు మించిన భాషా, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సేవ చేసిందని ఈ తరంలో ఎంత మందికి తెలుసు? తెలుగు ప్రచురణల ద్వారా అక్షర యాగం చేసి, మన జాతి సాహితీ సంస్కృతులకు ఎనలేని సేవ చేసినసంస్థ – వావిళ్ళ సంస్థ. ఇప్పటికి దాదాపు 170 ఏళ్ళ క్రితం... 1854లోనే పుస్తక ప్రచురణ రంగంలో ప్రవేశించి, అఖండ విజయం సాధించిన మహనీయులు వావిళ్ళ వారు. పురాణాలు, ప్రబంధాలు, స్తోత్రాలు, వేదాంత శాస్త్రాలు, శతకాలు, వ్రతకల్పాలు, వ్యాకరణాలు, నిఘంటువులు... ఇలా వారు ప్రచురించనిది లేదు. అనేక తాళపత్ర గ్రంథా లనూ, చేతిరాతలనూ, ప్రాచీన కావ్యాలనూ పండితులతో పరిష్కరింపజేసి, సవివరమైన పీఠికలతో సప్రామాణికంగా అందించిన ప్రచురణకర్తలు, కవిపండిత పోషకులు, దేశభక్తులు వారు. సంస్థాపకులు వావిళ్ళ రామస్వామి శాస్త్రి సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలకు చేసిన సేవ అనుపమానం. ఆరు పదులైనా నిండక ముందే ఆయన పరమపదిస్తే, అనంతరం ఆయన కుమారుడు వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు ఆ కృషిని కొనసాగించారు. తండ్రి నాటిన మొక్కను మహావృక్షంగా పెంచారు. తెలుగుకే కాదు... సంస్కృత, తమిళ, కన్నడ భాషా రచనల్ని కూడా ప్రచురించి, ఆ సాహిత్యాలకు విశేష సేవలందించారు. తెలుగులో ‘త్రిలిఙ్గ’, ఇంగ్లీషులో ‘ఫెడరేటెడ్ ఇండియా’, తమిళంలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి సహ కారంతో ‘బాల వినోదిని’ మాసపత్రిక... ఇలా పలు పత్రి కలూ నడిపారు. ఇవాళ్టికీ వావిళ్ళ వారి ప్రచురణ అంటే ప్రామాణికతకూ, సాధికారికతకూ, సాహితీ విలువలకూ ఐఎస్ఐ మార్క్. ముద్రణ దశలోని ప్రూఫ్ గ్యాలీలను తమ ప్రెస్ బయట అంటించి, ప్రచురిస్తున్న పుస్తకంలో అక్షర దోషం పట్టుకుంటే తప్పుకు ఇంత చొప్పున డబ్బులిస్తామని వావిళ్ళ వారు ధైర్యంగా ప్రకటించేవారని పాత తరంవారు చెప్పేవారు. అందుకే, ప్రస్తుతం పలు సంస్థలు చలామణీలోకి తెస్తున్న అనేక పాత పుస్తకాల కొత్త ప్రింట్లు వావిళ్ళ ప్రతులకు సింపుల్ జిరాక్స్ కాపీలే! ఈ తరం పాఠకులకు వావిళ్ళ సంస్థ కృషిని పరిచయం చేయాల్సిన పరిస్థితుల్లో, అదే లక్ష్యంగా వచ్చిన పుస్తకం–‘వావిళ్ళ సాహితీ వికాసం.’ సాంకేతిక విద్యానైపుణ్యం పుష్కలంగా ఉండి, కేంద్ర ప్రభుత్వ అధికారిగా సేవలందించి పదవీ విరమణ చేసిన డాక్టర్ వి.వి. వేంకటరమణ ఈ పుస్తక రచయిత. కంప్యూటర్ విజ్ఞానం నుంచి కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని రచనల దాకా వివిధ అంశాలపై ఇప్పటికే 15 ప్రామా ణిక రచనలు చేసిన నిరంతర జిజ్ఞాసి. ఆయన పుష్కర కాలం శ్రమించి, పరిశోధించి మరీ చేసిన రచన ఇది. దాదాపు 700 పేజీల పుస్తకంలో ఎన్నో తెలియని విషయాలనూ, ఇంతకు ముందెన్నడూ చూడని చిత్రాలనూ అందించారు. వెయ్యికి పైగా వావిళ్ళ ప్రచురణల్ని పట్టికలు, తేదీలతో సహా పాఠక లోకం ముందుంచారు. ప్రపంచంలో ముద్రణారంభం, బ్రిటీషు కాలంలో మన దేశంలో ముద్రణ, మద్రాసులో ముద్రణ తొలినాళ్ళు, పుదూరు ద్రావిడులైన వావిళ్ళవారు ముద్రణా రంగం లోకొచ్చిన తీరు, వారు నడిపిన పత్రికలు, చేసిన సాహిత్య సేవ, అప్పట్లో జరిగిన వాదవివాదాలు, వావిళ్ళపై వచ్చిన ప్రత్యేక సంపుటాల విశేషాలు... ఇలా ఈ పుస్తకం ఓ సమా చార గని. ‘కన్యాశుల్కం’ రచన గురజాడదా? గోమఠం శ్రీని వాసాచార్యులదా? అంటూ అప్పట్లో వావిళ్ళ చుట్టూ నడిచిన వివాదం ఆసక్తిగా చదివిస్తుంది. తండ్రి ఆరంభించిన ‘ఆది సరస్వతీ నిలయం’ నుంచి కుమారుడు నడిపిన వావిళ్ళ ప్రెస్ దాకా, ఆ తర్వాత జరిగిన చరిత్రకు అద్దం ఈ రచన. అలా ఇది వావిళ్ళ వారు చేసిన బృహత్తర యజ్ఞంపై ఓ అరుదైన లో చూపు. బోలెడుశ్రమతో ఈ రచనలో పునర్ముద్రించిన వావిళ్ళ వారి ప్రచురణల ముఖచిత్రాలు, ఫోటోలు, వార్తల్ని చూస్తూ పేజీలు తిప్పినా ఇది అక్షరాలా 170 ఏళ్ళ టైమ్ ట్రావెల్! – రెంటాల జయదేవ(నేడు నెల్లూరులో ‘వావిళ్ళ సాహితీ వికాసం’ ఆవిష్కరణ) -
ప్రకృతికి మించిన గురువు లేరు.. పిల్లల్లో అలాంటి సమస్యకు కారణమదే!
ప్రకృతి,వన్యప్రాణుల జీవనంపై చిన్ననాటి గుర్తులు ఏమైనా గుర్తు ఉన్నాయా? నేను పట్టణవాసిని అయినా ఒక కొండముచ్చు మా ఇంట్లోకి జొరబడి హడావుడి చేయటం, ఇంటి బాల్కని నుంచి చూసిన లకుముకి,గిజిగాడు పిట్టలు, రాత్రిపూట మిణుగురు పురుగులు పట్టుకొని అవి మెరుస్తుంటే చూసి ఆనందించిన క్షణాలు నాకింకా గుర్తు ఉన్నాయి. పిల్లలకు ప్రకృతితో విడదీయరాని అనుబంధం,ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి మెండుగా ఉంటాయి. కానీ పట్టణవాసంవల్ల ప్రకృతితో అనుబంధం అనుకున్నంత ఉండటం లేదు. తగిన అవకాశం, ప్రోత్సాహం లభిస్తే, ప్రకృతితో పిల్లల అనుబంధం మరింత బలపడి వారి భౌతిక, మానసిక వికాసానికి దోహదకారి అవుతుంది. ప్రకృతితో ప్రత్యక్ష అనుబంధం పిల్లల సర్వతోభివృద్దికి ఎంతో అవసరమని ఎన్నో అధ్వయనాలు చెపుతున్నాయి. అవి వారి ఏకాగ్రత, పరిసీలనాశక్తిని, ప్రావీణ్యతసి, మానసికాభివృద్దికి తోడ్పడుతుంది అని అందరికి తెలిసిన విషయమే. కాని,పట్టణవాసం వల్ల ప్రకృతితో ప్రత్యక్ష అనుబంధం తగినంత లేకపోవటంతో మనలో చాలామంది Nature deficit Disorder తో బాధపడటం ఉండటం గమనార్హం. దీంతో చాలామంది పిల్లల్లో స్థూలకాయం, ఎకాగ్రతాలోపం, నిరాశ వంటి సమస్యలు తలెత్తడం గమనిస్తున్నాము. అయితే ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతితో మమేకమవటం ఎలా? ప్రకృతిలో ఒక భాగమయిన పక్షులు, జంతువులు, కీటకాలు, సరీసృపాలు కేవలం గ్రామాలు, అడవుల్లోనే ఉంటాయి అనుకోవటం పొరపాటు.ఇవి అన్నిచోట్లా మన పరిసరాలలో కనిపిస్తూనే ఉంటాయి.పిల్లలను తరచుగా మన దగ్గరలో ఉన్న పార్కులు, చెరువులు,స్కూల్ ఆటస్తలలో కనపడే పక్షులను, కీటకాలను మరియు ఇతర జంతువులను పరిసీలించటం నేర్పితే వారికి బయటకు వెళ్ళాలనే ఉత్స్యాహం కలిగించిన వారవుతారు. పక్షులు ప్రకృతిలోని ఒక ప్రధాన భాగస్వాములు. భూమిఫై మన మనుగడకు విడదీయరాని అనుబంధం కలిగి ఉంటాయి. అది పిల్లలలోని పరిశీలనాశక్తిని, ఊహాశక్తిని మేల్కొలిపి నూతన ఉత్శాహం కలిగిస్తాయి.పక్షులు తమ ఆహ్లదమయిన రంగులతో, ప్రత్యేకమయిన కూతలతో మన పరిశీలనాశక్తిని పెంపొందిస్తాయి. చాలా వలస పక్షులు వింత వింత విన్యాసాలతో అబ్బురపరచే క్రమశిక్షణతో గుంపులు గుంపులుగా వలస పోవటం గమనిస్తే రోజువారీ జీవితంలోని అలవాట్లు, అరుపులు గమనిస్తే మనకు ఎంతో ప్రేరణ, ఆనందం కలుగుతాయి.ప్రకృతిలో భాగమయిన పక్షులను వీక్షించి ఆనందించటం ప్రకృతితో మమేకం అవటానికి మీ జీవితాంతం దొరికే అపూర్వ అవకాశం. మీ పిల్లలు, విధ్యార్ధులకు ప్రకృతితో పరిచయయంకల్పించటానికి పక్షులను వీక్షించే కార్యక్రమంతోప్రారంభిచటం శ్రేయస్కరం. దీనికి మీకు ఎటువంటి పరిజ్ఞానం లేదని అనుకోవద్దు. పక్షి శాస్త్రం గురించి విశేష పరిజ్ఞానం లేకపోయినా సరైన సహనం, ఆసక్తితో మీరు చూసిన పక్షులు,వాటి భౌతిక లక్షణాలు, ప్రత్యేకమయిన కూతల గురించిన సమాచారం విధ్యార్ధులతో పంచుకోవటంలో ఉండే ఆనందం, అనుభవం ఎంతో వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తాయి. రేపు లేదనే ఆలోచనతో జీవించు, కలకాలం ఉంటాననే భావంతో విజ్ఞానాన్ని సంపాదించు అని మహాత్మా గాంధీ ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ఎన్నో కొత్త ప్రయోగాలకు నాంది పలికాడు. పక్షుల గురించి ఆయనకు ఉన్న ఆసక్తితో విద్యార్థుల కోసం ird Bingo అనే ఒక వినూత్న కార్యక్రమం రూపొందించటానికి దోహదం చేసింది. దీనికి నలుగురు విద్యార్దులను ఒక జట్టుగా ఏర్పరచి, వారికి ఒక బింగో షీట్, పెన్సిల్, పుస్తకం ఇచ్చి స్కూల్ ఆవరణలో వారు చూసిన విశేషాలను అన్నిటిని రాయమని చెప్పి తర్వాత వాళ్లను క్లాస్‌రూమ్‌లో సమావేశపరిచి వాళ్లు సేకరించిన సమాచారం ఇతర విద్యార్థులకు వివరించడం జరగుఉతుంది. తగిన తగిన బహుమతులు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలవల్ల ప్రకృతిని పక్షులను గుర్తించటమే కాకుండా విద్యార్దుల పరిశీలనాశక్తిని , సమాచారాన్ని రాతపూర్వకంగా పదిలపరిచే నిపుణత, తమ చుట్టూ ఉన్న పకృతి విశేషాలను నిశితంగా పరిశీలించే అవకాశం తప్పకుండా కలుగుతుందని భావిస్తాము. ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్దులలో ప్రకృతిపట్ల అనురక్తిని కలిగించే విలువైన సాధనాలుగా భావించి ఎన్నో వినూత్న కార్యక్రమాలు Indian wild life society ద్వారా విద్యార్దుల ప్రయోజనంకోసం రూపొందించటం జరిగింది. ఈ క్రమంలో నదేశంలో సాధారణంగా కనిపించే పక్షుల గురించి రూపొందించిన ఒక ఫ్లాష్ కార్డు ఆట అయితే “ Shell Shoker” తాబేళ్ల గురించి ఆడే కార్డు ఆట మరియు Snake-O-Doo పాములు,నిచ్చనలు ఉండే పరమపదసోపాన పటం/ వైకుంఠ పాళీ ఆట. ఇవన్నీ మనకు online లో దొరుకుతాయి. మరికొన్ని ఆటలు ఆన్లైన్ వెబ్‌సైట్స్ ద్వారా డైన్లోడ్ ఉచితంగా చేసుకోవచ్చు. వివిధ కళాత్మక,సృజనాత్మక కార్యకలాపాలద్వారా పిల్లలలో ఎంతో సంతులనాత్మక అభివృద్దిని సాధించగలం. వివిధ కళాత్మక కార్యకలాపాలద్వారా పిల్లల పరిశీలన దృష్టిని గమనించి వారిని సంబంధిత పాత్రికెయులుగా, వివిధ కళాత్మక ప్రయోగాలు చేయగలిగేవారిగా తయారు చేయగలం. మన దేశంలో సాధారణంగా కనిపించే పక్షుల బాహ్యలక్షణాలు, వాటి చరిత్ర గురించి వేరు వేరు సంసృతులలో ప్రస్తావించిన విశేషాలఫై అవగాహన కలిగి ఉండటం వల్ల పక్షల గురించి కోత్తవారికి ఆసక్తికరంగా మరింత ఉత్సుకత కలిగే విధంగా వివరించే అవకాశం కలిగి ఉండి వారిలో ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగించిన వారవుతారు. కాకి వంటి సాధారణ పక్షి తెలివితేటల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పిల్లలకు పంచతంత్ర కధలలోని ‘ నీటి కుండలోని నీరు గులకరాళ్ళువేసి పయికితెచ్చి దాహం తీర్చుకున్న తెలివయిన కాకి” కధ చెప్పి వారిని ఆనందింపచేయవచ్చు.మీ పరిసరాలలో కనపడే సాధారణ పక్షుల గురించిన సమాచారం ఎన్నో మాధ్యమాల ద్వారా పొందగలరు. ఇందులో ప్రముఖంగా మెర్లిన్అనే అప్ ద్వారా మీ పరిసరాలలో ఉన్న పక్షుల గురించిన సమాచారం పొందవచ్చు. Early bird అనే App నుంచి వివిధ రకాల పక్షుల ఫోటోలు తీసి వాటి లక్షణాలను, కూతలను కూడా వినే అవకాశం ఉంది. ఈ యాప్స్ అన్ని భారతీయ బాషలలో అందుబాటులో ఉంది. పిల్లలకు ప్రకృతితో అనుబంధం కల్పించడం చాలా అవసరం. పర్యావరణ అనిస్టితి కారణంగా పిల్లలలో ప్రకృతి పట్ల మరింత అవగాహన కల్పించటం వలన వారిలో మరింత ఆసక్తి, ప్రకృతి పట్ల స్నేహభావం,కలిగించి భూ వాతావరణంపట్ల మరింత జాగరూకతతో తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో శ్రీ డేవిడ్ సోరెల్ అన్నట్లు.. పిల్లలు ఉజ్వల భవిష్యత్తు, బముముఖ సాధికారత పొందడానికి మొదట ఈ భూమిని ప్రేమించేలా చేయడం, తర్వాత దాని సంరక్షణ కోసం చర్యలు తీసుకునేలా చేసి ప్రకృతిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. Author - గరిమా భాటియా ఫోటోలు: సౌమిత్రా దేశ్‌ముఖ్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా
కొండకు బోయొచ్చినప్పటి నుంచి కత్తి గెలిసిన కోడే గతం మా జయక్క మగం ఎలిగిపోతావుంది. కుమ్మరి ఎంగటప్ప చేత్తో తయారు చేసిన మొంటి ఉండీని మా జయక్క పది రూపాయలుకి ఇంటికి కొనక్కచ్చింది. ఎంగటప్ప దానికి ఎంతో సుందరంగా పూజులు కూడా తీర్సినాడు. ఆ ఉండీని ఎంగట్రమణ సామి పటాలకాడ పెట్టి ‘ఉండీ నిండిన్నాపొద్దు దావకర్సులకు ఈ దుడ్డు పెట్టుకొని నీ కొండకు వస్తాను సామీ’ అని మొక్కుంది. ఆ పొద్దు నుండి జయక్క చీర కొంగున ముడేసిన రూపాయి బిల్లలు, అరుదుగా చేతికి మిగిలే ఐదు రూపాయల బిల్లలు, ఎబుడన్న కతగెతిగ మిగిలిన యాబై రూపాయల నోట్లు, పంటపలం అమ్మిన సొమ్ములో అవసరం కోసం అప్పుచేసిన డబ్బుల్లో, కూలి డబ్బుల్లో కొద్దిగా తీసి ఉండీలో ఏసేది. అన్ని రకాల డబ్బుల్లో నుండి ఈ నోటు పక్కకు పోయిన బాద లేదులే అనుకోని ఏసిన నూరు రుపాయల నోట్లు, ఎంత ఉన్నా మనచేతిలో కర్సయిపోతుంది అనుకోని తెంపుచేసి ఏసిన ఒగటో రెండో ఐదు నూర్లు కాగితాలు కూడా ఉండేవి. ఈ రకంగా మూడేండ్ల నుండి కూడేసిన ఉండీ నిండి నిబ్బాలాడతా ఉంది. "మా ఊర్లోవాల్లు తిరుపతి కొండకు పోవాలంటే ఒగ ఇంట్లోవాల్లే పోరు. ఊర్లో కాగలిగినోల్లు అమ్మలక్కలు, అబ్బలబ్బలు మాట్లాడుకుని ఒగ పది పదైదు మందన్న జమై పోతారు." జయక్క నన్ను నా మొగున్ని పైనం చేసే. ‘ఇద్దరం వొచ్చేస్తే ఇంటికాడ మనిసి ఉండల్ల ఆ యమ్మిని తోడుకొనిపో’ అనే నా మొగుడు. ‘ఏం పాపా ఈ పైనం అట్ల పదాం పద మూడేళ్ల నాటి మొక్కుబడి తీర్సుకొని వద్దాము’ అనే జయక్క. ‘సర్లే’ అంటి. తిరపతికి పోను జతకు మనిసి దొరికితే సాలు అని కాసుకోనుండేవాల్లు. మా ఊరి లింగమ్మత్త, రెడ్డమ్మ, సరోజి, మగోల్లు నాగన్న, ఎంగటప్ప, రమణన్న.. అంతా తొమ్మిది మంది జమైనాము. మా ఊరు దావన పోయే తొమ్మిదిగంట్ల రైలు ఎక్కితే సరిగ్గా రెండు గంటలకు తిరపతిలో దిగతాం అని ఈ పొద్దే అందరం మాట్లాడుకొని పయనాలు కడతా ఉండాము. మా జయక్క ఉండీని చేతికి ఎత్తుకొని బరువు చూసే. కోటీసురాలు ఐనట్టు ఎలిగిపోతా వుంది మగం. ఆ వుండి పగలగొట్టే. సిల్లరంతా జల్లున రాలే. నోట్లన్నీ ఓపక్క, సిల్లరంతా ఓ పక్క లెక్కేసుకుండే. అంతా మూడేలు పైచిలుకు ఉన్నింది. ‘ఈ దుడ్డు మల్ల మిగిలించుకొని రాకూడదంట పాపా. అంతా కర్సు పెట్టేయలంట’ అని నాకు బింకంగా సెప్తా ఉంది. ఆ మరుసునాడు తెల్లారుజామునే లేసి అందరం తయారై ఒగ పూటకు సింతపులుసన్నం, గోదుమ రొట్లు, చెనిగ్గింజల గెట్టూరిబిండి ఏసి మనిసికి ఒగ పట్లాము కట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని పోతిమి. మా జయక్క వక్కాకు బలే ఏస్తుంది. ‘పాపా నాకు అన్నము లేకపోయినా ఉంట. వక్కాకు లేకుండా ఉండ్లేను’ అంటుంది. ఈ అమ్మకు దోడుమైనోల్లే సరోజమ్మ.. లింగమ్మ కూడా. ఈ ముగ్గురూ మేము పోయే తొక్కు వక్కాకు సిక్కదేమో అని మల్ల కొండ నుంచి తిరుక్కోని ఇంటికి వొచ్చిందంక ఉండేటిగా టౌనుకు పోయి కాలకట్ట తమలపాకులు, పిడుకుడు వక్కలు, పావు సేరు దుగ్గు తెచ్చుకున్నారు. మొగోల్లు మా యంగటన్న బీడీలు ఇపరీతంగా తాగతాడు. నాగన్న, రమణన్న కూడా తాగేవాల్లే. వాల్లకు కావాల్సిన బీడీలు, అగ్గిపెట్లు తెచ్చుకొని బ్యాగుల్లో పెట్టుకున్నారు. రెడ్డెక్క నేను తప్పనిడిసి మిగతా ఏడు మందికి బస్సెక్కినా రైలెక్కినా కిటికీ పక్కన వారసీటే కావాలంటారు వక్కాకు ఊంచుకోను. గెడిసేపన్నా వాల్ల నోర్లు ఊరికే ఉండవు. మేక నమిలినట్లు నమలతానే ఉంటారు. యాడబడితే ఆడ ఊంచుతారు. మాకు సగిచ్చదు. మేము వాల్ల మింద సిటుమొరుక్కుంటానే తిరపతి అలిపిరి మెట్లకాడికి పోతిమి కాలిదావన పోదామని. మా జయక్క కొండకు ముందే రెండుసార్లు వొచ్చింది. ఎంగటన్న కూడా ముందు వొచ్చినోడే. మిగతావాల్లకు ఇదే తొలిసారి. అందరం కియిలోకి పొయి నిలబడి ఆడ నుంచి బ్యాగుల్ని మనుసుల్ని తనికీ చేసే తావుకు పొయినాం. వీలంతా ఎనకెనకనే గుంజిట్లు పెడతా ఉంటే నేను రెడ్డెక్క ముందుగా పోతిమి. మావి చూసి అంపించేసిరి. మేము కడగా బారడు దూరం నిలబడితిమి. ఈల్లు ఎంచేపటికీ రాలా. మల్లొచ్చిరి. ఏమట ఇంతసేపు అంటే మా జయక్క మగం తప్ప మిగతా అందరివీ చింతాకంత అయిపొయినాయి. లింగమత్త ఐతే ఏడుపు మగమే పెట్టేసింది. ఎంగటన్న మటుకు నగుమొగంతో కనపడే. సరోజమ్మ ఉండుకొని ‘నేను నా వక్కాకు తిత్తి కనపడదు కదా అని పావడ నాడాకు కట్టి రెండు కాళ్ళ సందులో దిగేసుకోనుంటే అదెవుతో పోలీసిది ఒల్లంతా పామేటప్పుడు మూట పెద్దగా ఉండి చేతికి తగిలింది. తీయే అని పెరుక్కొని అంతా ఇసిరి పారేస. వక్కాకు పోతేపానీ బంగారట్ల తిత్తి ఆరు పారవులు ఏసి కుట్టిండేది. ఆరు ఏండ్లుకు ముందు కనుపూరి గంగమ్మ తిరణాల్లో తీసుకోనుంటి. ఎంత దుడ్డు మోసిందో ఎంత వక్కాకు మోసిందో! దుడ్డుతో ఎక్కువ బిక్కటైనబుడు తిత్తిని గాలిస్తే ఏదో ఒగ పార్వలో అంతో ఇంతో దొరికేది. అంత అచొచ్చిన తిత్తి పాయనే’ అని ఒకటే బాధపడే. ఇంతలో లింగమ్మ ‘ఓ నీ తిత్తి పోతే మల్ల తీసుకోవచ్చులే నాది సీమెండి పొడువు సున్నంకాయి. మాయమ్మ వాల్ల అమ్మ కాడ నుండి మూడు తరాల కాయి. మాయమ్మ గుర్తుగా అట్లే పెట్టుకో నుంటి. కాయినిండా ఒకసారి సున్నం పెడితే వారమంతా నమిలినా అయిపోయేదికాదు. ఆ సున్నంగాయి మూతకు ఎండి గొలుసు ఏసి, మూడు గెజ్జిలు కట్టి సున్నం లోడుకోను చిన్నగెంటి, పొల్లు గుచ్చుకునే పుల్ల, గుబిలిగెంటి ఇవన్నీ మూతకు కుచ్చు ఏసింటి. నా శనికాటం దాన్ని యాడన్న దాసిపెట్టుకోకూడదా! కడుపు సెన్నిట్టు అయిపోయా’ అని బాధపడే. నేను ఉండుకొని ‘పోతేపోనీలే వక్కాకే కదా ఏమో కలిమి పోయినట్టు ఏడస్తుండారే’ అంటే ‘అయ్యో నాయనా అదే మా పానాదరవ. పది దినాలు పస్తయిన ఉంటాము. గెడిసేపు వక్కాకు లేదంటే తలకాయి ఎర్రియాకోలం పడుతుంది. తెలిసినోల్లను గాని తెలీనోల్లను గాని అడగదామా అనిపిస్తుంది. మే జయా నువ్వు ముందే వచ్చింటివి కదా మాకు చెప్పిండకూడదా ఇంతకు నువ్వేమి చేసినావు’ అని అడిగిరి. ‘నేను వొట్టి తిత్తి నడుములో చెక్కోని వక్కాకు అంత మూటగట్టి గుడ్ల బ్యాగులో నడన పెట్టిన. ఆ నడుసుకొని పోయే మిసన్లో బ్యాగు ఏస్తే అది కిర్రుమనే. ఆ పోలీస్‌ది బ్యాగులో ఏందో ఉంది తీ బయటికి అనే. అమ్మా బజన చెక్కలు గిని అంటే ఏది చూపించు అనే. అవి పైనే ఉన్నాయి ఒగ జత అవి తీసిచూపిస్తే సరే పో అనే. పోనిలే మా ఇల్లిలప దేవుడు ఆ ఎంగట్రమన సామే నన్ను కాపాడినాడు. ఆ యప్ప సాస్టాగా నాపాలిటున్నాడు’ అని చెప్పే జయక్క. కత్తి గెలిసిన కోడేగతం మా జయక్క మగం ఎలిగిపాతా ఉంది. లింగమ్మకు కోపమొచ్చే ‘ఎంత మోసకారుదానివే! నీ యట్లాదాని మాటలకు ఎంగట్రరమణ సామే యామారి పోయినాడంట. నీ యట్లాడిది సామీ నేను అనుకునింది జరిగితే నీకు సిటికెల పందిరి ఏపిస్తాను అని మొక్కునిందంట. దేవుడు ఒరే ఇంతవరకు ఎవరు "తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు." ఏపీలేదే ఎట్లుంటుంది ఈ సిటికెల పందిరి చూద్దాం అని అసోద్దపోయి ఆ యమ్మ కోరిన మొక్కుతీర్సినాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడంట ఇంగ ఎప్పుడు వచ్చి ఏపిస్తుంది సిటికెల పందిరి అని. ఆ యమ్మ నలగరు ఆడోల్లను పిలుసుకొనిబొయ్యి నలగర్నీ నాలుగు సమకాలంగా నిలబెట్టి నడిమిద్ద ఆ యమ్మ నిలబడుకొని అందరూ కలిసి సుట్టూ సిటికెలు ఏసిరంట. ఇదేసామి సిటికెల పందిరి నా మొక్కు సెల్లిపోయింది అంటే సామే బెబ్బిర్లకపోయి ఓరే ఎంత యామారిపోయినాను అనుకున్నంట. అట్లా దానివి నువ్వు’ అనే! లింగమ్మ చెప్పిన కతకు అందరం నగుకుంటూ ఉండగానే మగోల్ల మగాలు కూడా సప్పగిల్లినాయి. ఈల్ల బీడీలకట్టలు కూడా పెరుక్కొన్నారు. రమనన్న బీడీలకట్టని సరాయి లోజోబిలో పెట్టుకొని ఉన్నాడు. పోలీసులు తడిమేటప్పుడు చేతికి తగిలి పెరికి అక్కడ బారేసినరంట. నాగన్నది కూడా అట్లే పెరుక్కొన్నారు. ఎంగటప్ప మాత్రానికి బీడీలు కట్ట అగ్గిపెట్టి కట్ డ్రాయర్లో ఆయప్ప మాను కింద పెట్టుకున్నాడంట! ఈయప్ప ముందే రెండుసార్లు కొండకు వచ్చి పోయినాడు అందుకే తెలివి చేసినాడు. ఆయప్పవి మిగిలినాయి. మెటికిలు ఎక్కేటప్పుడు నాగన్న ఊరికే ఉండేదిలే కొండంతా పారజూస్తా ఎదో ఒకటి చెబతానే ఉంటాడు. ‘తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు. ఎంగట్రమణ సామికి పెండ్లి పెట్టుకున్నారు. చెప్పులు కుట్టే ఆయప్పకు జరం వొచ్చి మూర్తం టయానికి ఇవ్వలేక పెండ్లి అయిపోనంక చెప్పులు కుట్టకపోయి ఇచ్చినాడంట. మూర్తం టయానికి చెప్పులు బిన్నతేలేదని నువ్వు ఎన్ని మెట్లు కుట్టిన నీకు మెట్టు కరువైతుంది అని ఆ దేవుడు శపించినాడు. అందుకే కుట్టేవోనికి మెట్టు కరువు అనేది. ఇప్పుడు కూడా దినామూ మన మాదిగోడు జత మెట్లు కుట్టకపోయి ఆడ పెట్టాల అందుకే కొండన మనకు పావలా బాగం వస్తుంది’ అనే! అయితే ‘మనం దీని గురించి సెరియ తీసుకోవాల్సిందే’ అని ఎకసక్కలాడిరి. సద్ది మూట్లు మోయాలంటే బరువు అదే కడుపులో ఉంటే అంత బరువు ఉండదని నడన అందరూ కూసోని తినేస్తిమి. కొండెక్కి గుండ్లు కొట్టుకొని ఆ దేవుని దర్శనం బాగా చేసుకుంటిమి. గుళ్లో నుండి బయట పన్నాము. లింగమ్మ, సరోజమ్మ.. జయక్క యాడికిపోతే ఆడికి పోయేది ఎనకాలే వక్కాకు కోసం. ఎంగటప్ప యాడికి పోతే ఆడికి నాగన్న రమనన్న బంట్రోతులే గతం బీడీల కోసం పోయేది. అవి ఆయప్ప సామాన్లో పెట్టుకోనున్నివైనా సరే వాల్లు ఇడిసిపెట్లా. ఇదే తంతు ఇంటికి వచ్చిందంక. మా జయక్క మాత్రానికి వక్కాకు మిగిల్చినందుకు ఎంగట్రమణ సామి పటం తెచ్చుకుంది పూజించుకోను! (చదవండి: అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం! ) -
అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం!
పూర్వం ‘విద్యానగరం’ అను పట్టణంలో కుబేర వర్మ అను గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతని వద్ద అపారమైన సంపద ఉండేది. అదంతా తన పూర్వీకుల నుండి సంక్రమించిందే. తన వద్ద ఉన్న సంపదనంతా దానధర్మాలు చేసి తాను ఒక అపర కర్ణుడిగా పేరు సంపాదించుకోవాలనే కీర్తి కాంక్ష కలిగింది అతనికి. ఆ ఉద్దేశంతోనే అడిగిన వారికి లేదనకుండా ధన, కనక, వస్తు, వాహనాలను దానం చేస్తూ వచ్చాడు. అంతేకాదు గుళ్ళు గోపురాలు కట్టించి వాటి మీద తన పేరు చెక్కించుకున్నాడు. తాను చేసిన ప్రతి దానం అందరికీ తెలియాలని తాపత్రయపడ్డాడు. అలా పూర్వీకుల ఆస్తిని దానం చేసి అతను కోరుకున్నట్టుగానే అపారమైన కీర్తిని సంపాదించుకున్నాడు. అది దేవలోకానికీ చేరింది. ఈ విషయంలో దేవలోకం కుబేర వర్మను పరీక్షించాలనుకుంది. ఒకసారి ఒక సన్యాసి కుబేర వర్మ వద్దకు వచ్చి ‘నాకు ఆకలిగా ఉంది. మూడు రోజులైంది తినక కాస్త భోజనం పెట్టించండి’ అని అడిగాడు. అందుకు కుబేర వర్మ నవ్వి ‘అన్నదానం ఏముంది.. ఎవరైనా చేస్తారు. మీకు వెండి.. బంగారం.. డబ్బు.. ఏం కావాలన్నా ఇస్తాను. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న దానాలు చేసి నా ప్రతిష్ఠ తగ్గించుకోను. అన్నమే కావాలంటే ఇంకో ఇంటికి వెళ్ళండి’ అని చెప్పాడు. సన్యాసి ‘నేను సన్యాసిని. నాకెందుకు అవన్నీ? భోజనం లేదంటే వెళ్ళిపోతాను’ అంటూ అక్కడి నుండి కదిలాడు. పక్క వీథిలోని దేవదత్తుడి ఇంటికి వెళ్లాడు ఆ సన్యాసి. దేవదత్తుడు సామాన్య కుటుంబీకుడు. గొప్ప దయా గుణం కలవాడు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టేవాడు. అంతేకాదు సాటివారికి తనకు ఉన్నంతలో సాయం చేసేవాడు. తను చేసే దానధర్మాల వల్ల తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఏనాడూ ఆశించలేదు. అలాంటి దేవదత్తుడి ఇంటికి వచ్చిన సన్యాసి తనకు ఆకలిగా ఉందని.. భోజనం పెట్టించమని కోరాడు. దేవదత్తుడు ఆ సన్యాసిని సాదరంగా ఆహ్వానించి కడుపునిండా భోజనం పెట్టించాడు. అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సన్యాసి. కొంతకాలం తర్వాత వయసు మీద పడి దేవదత్తుడు చనిపోయాడు. ఆ తర్వాత కుబేర వర్మ కూడా చనిపోయి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ స్వర్గంలో.. చాలామందితో పాటు తనకంటే ముందుగానే చనిపోయిన దేవదత్తుడూ ఉన్నాడు. ప్రథమస్థానంలో ప్రత్యేక ఆసనంపై కూర్చొని. కుబేర వర్మకు పదకొండవ స్థానం లభించింది. అది సహించలేని కుబేర వర్మ మండిపడుతూ దేవదూతలతో వాగ్వివాదానికి దిగాడు.. ‘నా ముందు దేవదత్తుడెంత? మా పూర్వీకులు సంపాదించిన అపార సంపదనంతా ప్రజలకు పంచిపెట్టాను. ధన,కనక, వస్తు, వాహనాలు దానం చేశాను. అలాంటి నాకంటే పట్టెడన్నం పెట్టిన దేవదత్తుడు గొప్పవాడు ఎలా అవుతాడు? అసలు నాకంటే ముందున్నవాళ్లంతా ఎవరు?’ అంటూ. అందుకు దేవదూతలు ‘అందరికంటే ముందున్న దేవదత్తుడు ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాడు. అన్నిటికన్నా అన్నదానం గొప్పది. అతనిలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలం జాలి,దయ, ప్రేమతోనే అన్నార్తుల ఆకలి తీర్చాడు. సాటివారికి సహాయం చేశాడు. ఇకపోతే మిగిలినవారిలో.. ఆసుపత్రులను కట్టించి ఎంతోమంది రోగులకు ఉపశమనం కలిగించినవారు కొందరు. వికలాంగులను ఆదరించి పోషించిన వారు మరికొందరు. ఇంకా కొందరు చెరువులు తవ్వించి ప్రజలకు, పశువులకు నీటి కొరత లేకుండా చేశారు. వాటన్నిటినీ ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండానే చేశారు. కాబట్టే నీకంటే ముందున్నారు. ఇక నువ్వు కీర్తి కోసం స్వార్థంతో మీ పూర్వీకుల సంపదనంతా అపాత్రదానం చేశావు. అందుకే నీకు పదకొండవ స్థానం లభించింది. ఎప్పుడైనా దానం అనేది గుప్తంగా ఉండాలి. కాని నువ్వు అలా చేయలేదు’ అని చెప్పారు. అంతా విన్నాక కుబేర వర్మకు జ్ఞానోదయం అయింది. తన పూర్వీకులు సంపాదించిన సంపదనంతా కీర్తి కాంక్షతో దుర్వినియోగం చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. (చదవండి: ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా! ఎక్కడుందంటే..) -
బుద్ధం.. శరణం గచ్చామి
తెనాలి: తెలుగునాట ప్రసిద్ధి చెందిన బౌద్ధ రచయిత బొర్రా గోవర్ధన్‌కు మహాకవి గుర్రం జాషువా సాహి తీ పురస్కారం ప్రదానం చేయనున్నారు. జాషువా కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో గుంటూరులోని కార్డ్స్, ఆర్నాల్డ్ పౌలస్ ఆడిటోరియంలో శనివారం ఉదయం 10గంటలకు ఏర్పాటయ్యే మహాకవి గుర్రం జాషువా జయంతి ఉత్సవంలో ఈ అవార్డు అందజేస్తారు. డాక్టర్ పోలె ముత్యం అధ్యక్షతన జరి గే సభలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, రిటైర్డ్ డీఐజీ ఎస్.బాలస్వామి, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్, జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్, భీమ్ సేనా సేవాదళ్ అధ్యక్షుడు ఎన్.నీలాంబరం పాల్గొంటారు. ప్రజాగాయకుడు పీవీ రమణ సభను నిర్వహిస్తారు. గొప్ప సృజనకారుడు గేయ రచయితగా, గాయకుడిగా, సమాజ చైతన్యానికి అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సాగుతున్న గొప్ప సృజనకారుడు బొర్రా గోవర్ధన్. ఇంకిపోయిన నీరులాగ ఉండిపోయిన బౌద్ధ ధర్మ ఊటను సాహిత్య రూపంలో పైకి రప్పించడానికి తెలుగు నా ట కొన్నేళ్లుగా రచయితలు కృషి చేస్తున్నారు. దానిని మరింత విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళుతున్న ఘనత గోవర్ధన్‌కు దక్కుతుంది. స్వస్థలం నిజాంపట్నం మండలం బొర్రావారిపాలెం. వ్యవసాయ కూలీ కుటుంబం. హైస్కూలు చదువులో దేశభక్తి గీతాలతో రచన అలవడింది. విప్లవ గ్రూపుతో ఏర్పడిన పరిచయంతో ఇంటర్లో చదు వు మానేశారు. పౌరహక్కుల ఉద్యమంలో విప్లవ గీతా లు రాయడం, గానం చేయడం సాగించారు. 1985 తర్వాత విప్లవ రాజకీయాలకు స్వస్తి పలికి, నగరంలో పాఠశాల ప్రారంభించారు. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, షట్‌దర్శనాలతో సహా ప్రాచీన భారతాన్ని అధ్యయనం చేశారు. బుద్ధుని బోధనలే ఏకై క పరిష్కారం కులసమాజ నిర్మూలనకు బుద్ధుని బోధనలే ఏకై క పరిష్కారమని బొర్రా గోవర్ధన్ విశ్వసించారు. బౌద్ధంలోని మానవత్వ పరిమళాలు తననూ ఆ దిశగా నడిపించాయంటారు. అంబేడ్కర్ స్ఫూర్తితో 2005 నుంచి బౌద్ధ రచనలు ఆరంభించారు గోవర్ధన్. బౌద్ధ భిక్షువు శాసన రక్షతి నుంచి బోధలు తీసుకుని, 2006లో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. సంక్లిష్టమైన బౌద్ధ సాహిత్యాన్ని సరళ భాషలో ప్రజలకు చేరువచేయసాగారు. రాహుల్ సాంకృత్యాయన్ ‘బౌద్ధ దర్శన్’ను ‘బౌద్ధ దర్శనం’గా తెలుగులోకి అనువదించారు. హిందీలోంచి తెలుగులోకి అనువదించిన మరో పుస్తకం ‘భగవాన్ బుద్ధ’కు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ అనువాద గ్రంథ పురస్కారం అందజేసింది. వివిధ అంశాలపై 101 పుస్తకాలు రాస్తే, అందులో 35 వరకు బౌద్ధ సాహిత్యమే. మహాకవి జాషువాపై రచించిన ‘నా కథ’ ప్రసిద్ధి చెందినది. వీరి బౌద్ధ రచనలకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అకాడమీ ఆఫ్ యూనివర్సిల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్‌ను బహూకరించింది. -
విప్లవాగ్ని జ్వలితుడు
తలవంచని విప్లవ కవిగా, పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్నారు వరవరరావు! 1957–2017 మధ్య కాలంలో ఆయన రాసిన సుమారు 50 కవితలను పెంగ్విన్ రాండమ్ హౌస్ ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’ పేరుతో ఆంగ్లంలో ప్రచురించింది. ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం’ వైపు పయనిస్తున్న ‘వరవర’కు తగిన గౌరవం. ‘‘లోకంలో మేధావులనుకుంటున్నవారు సహితం పిరికిపందలుగా ఉంటారు. అలాంటి పిరికి పందలకన్నా మనోధైర్యంతో, దమ్ములతో బతకనేర్వడం అతి అరుదైన లక్షణంగా భావించాలి.’’ – ‘వికీలీక్స్’ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ప్రపంచ దేశాలపై అమెరికా నిరంతర కుట్రలను బహిర్గతం చేసినందుకు జీవిత మంతా కష్టాలను కాచి వడబోస్తున్న మహాసంపాదకుడు, ప్రపంచ పాత్రికేయ సింహం... జూలియన్ అసాంజ్. అలాంటి ఒక అరుదైన సింహంగా, తలవంచని విప్లవ కవిగా ఈ క్షణం దాకా పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్న కవి వరవరరావు! దఫదఫాలుగా దశాబ్దాలకు మించిన జైళ్ల జీవితంలో ఆయనను (1973లో తొలి అరెస్టు మొదలు) 25 కేసులలో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇబ్బందులు పెట్టారు. అలాంటి విప్లవకవి వరవరరావు తెలుగులో 1957–2017 మధ్య కాలంలో రాసిన సుమారు 50 కవితలను ఎంపిక చేసి... కవి, సాహితీ విమర్శకులు, మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమాలకు నిరంతరం చేయూతనందిస్తున్న పాత్రికేయులు ఎన్.వేణుగోపాల్, నవలాకారిణి, కవయిత్రి మీనా కందసామి ఇండియాలోని సుప్రసిద్ధ పెంగ్విన్ రాండమ్ హౌస్ కోరికపై అందజేసిన గ్రంథమే ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’! సర్వత్రా ‘సామ్యవాద రంకె’ వినిపించిన వరవరరావు 1972 లోనే: ‘దోపిడీకి మతం లేదు, దోపిడీకి కులం లేదు దోపిడీకి భాష లేదు, దోపిడీకి జాతి లేదు దోపిడీకి దేశం లేదు తిరుగుబాటుకూ, విప్లవానికీ సరిహద్దులు లేవు’ అని చాటుతూనే, తనను శత్రువు కలమూ, కాగితమూ ఎందుకు బంధించాయో తెగేసి చెప్తాడు: ‘ప్రజలను సాయుధులను కమ్మన్నందుకు గాదు/ నేనింకా సాయుధుణ్ణి కానందుకు’ అన్నప్పుడు జూలియన్ అసాంజ్ చేసిన హెచ్చరికే జ్ఞాపకం వస్తుంది. అంతేగాదు, ‘వెనక్కి కాదు, ముందుకే’ అన్న కవితలో ‘వరవర’: ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం దాకా పయనించే ఈ కత్తుల వంతెన మీద ఎంత దూరం నడిచి వచ్చావు – ఇంకెంత దూరమైనా ముందుకే సాగు’ గాని వెనకడుగు వెయ్యొద్దని ఉద్బోధిస్తాడు! ధనస్వామ్య రక్షకులైన పాలకుల దృష్టిలో ‘ప్రజాస్వా మ్యా’నికి అర్థం లేదని– ‘పార్లమెంటు పులి కూడ /పంజాతోనే పాలిస్తూ సోషలిజం వల్లించుతూనే / ప్రజా రక్తాన్ని తాగేస్తుంద’నీ నాగుబాము పరిపాలనలో / ప్రజల సొమ్ము పుట్ట పాల’వుతున్న చోటు – ‘జలగల్ని పీకేయందే – శాంతి లేదు/ క్రాంతి రాద’ని నిర్మొహమాటంగా ప్రకటిస్తాడు. ‘జీవశక్తి’ అంటే ఏమిటో కవితాత్మకంగా మరో చోట ఇలా స్పష్టం చేస్తాడు: ‘అన్ని రోజులూ కన్నీళ్లవి కావు / అయినా ఆనంద తీరాలు ఎప్పుడూ తెలియకుండా / దుఃఖం లోతెట్లా తెలుస్తుంది? ఆ రోజులూ వస్తాయి / కన్నీళ్లు ఇంద్రధనుస్సులవుతాయి నెత్తురు వెలుగవుతుంది / జ్ఞాపకం చరిత్ర అవుతుంది బాధ ప్రజల గాథ అవుతుంది!’ జైలు జీవితానుభవాన్ని సుదీర్ఘ అనుభవం మీద ఎలా చెప్పాడో! ‘జైలు జీవితమూ అంగ వైకల్యం లాంటిదే నీ కంటితో ఈ ప్రపంచాన్ని చూడలేవు నీ చెవితో వినలేవు, నీ చేయితో స్పృశించలేవు నీ ప్రపంచంలోకి నువ్వు నడవలేవు నీవుగా నీ వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు ఎందుకంటే – అనుభూతి సముద్రం పేగు తెగిన అల ఇక్కడ హృదయం!’ ఇప్పటికీ దేశవ్యాపితంగా ప్రజా కార్యకర్తలపైన, పౌరహక్కుల నాయకులపైన యథాతథంగా హింసాకాండ అమలు జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణగా, అనేక రకాలుగా వికలాంగుడైన ప్రజా కార్యకార్త ప్రొఫెసర్ సాయిబాబానే కార్పొరేట్ శక్తుల కన్నా ప్రమాదకరం అన్నట్టుగా పాలకులు వ్యవహ రించడం ఏమాత్రం క్షంతవ్యం గాదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
Ganesh Chaturthi 2023: మనం కొలిచే తొలి దైవం ఆయనే..ఆనాటి నుంచే ఆచారం
సమస్త విఘ్నాలను పోగొట్టి,సర్వ విజయాలను,సత్వర ఫలాలను అందించే విఘ్ననాయకుడు వినాయకుడి పండుగను సభక్తి పూర్వకంగా జరుపుకోవడం అఖండ భారతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం.మనం పూజించే తొలి దైవతం ఆయనే. ఎంతటి నాయకుడైనా వినాయకుడి ముందు సాగిలపడాల్సిందే.తమ ఇచ్ఛలు తీరాలంటే ఈ దేవుడిని కొలవాల్సిందే.భిన్న మతాలు,జాతులు కులాలు,సంస్కృతుల సంగమమైన భారతదేశాన్నిఏకం చేసింది,ఈ నేలపై జీవించేవారినందరినీ ఐక్యంగా నిలిపిందీ సనాతన ధర్మం.సహనం,సమ భావనందానికి ఆధారం."సర్వేజనా సుఖినో భవంతు"అన్న ఆర్యవాక్కులు దానికి మూలాధారం.సర్వజనులు బాగుండాలనే మంచితనం మనవారి రక్షణ కవచం.ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వచ్చి,మనల్ని దురాక్రమించారు. వందల ఏళ్ళు ఈ రాజ్యం పరాయి పాలనలో సాగింది.ఎన్నో భాషా సంస్కృతులు వచ్చి చేరాయి.చాలా సంపదను కోల్పోయాం,విష కౌగిళ్ళ మధ్య నలిగిపోయాం.తుచ్ఛ సంస్కృతి వీధుల్లో ఏరులై పారింది.వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డాం.మన ఉనికిని కాపాడుకున్నాం.మనదైన సంప్రదాయం మృగ్యమవకుండా చూసుకున్నాం.ప్రపంచ దేశాలలో భారత్ ను విశిష్టంగా గౌరవింప చేసింది,వివేకానంద వంటి మహనీయులు ప్రసంగిస్తుంటే ఆంగ్లేయులు సైతం మ్రాన్పడి వినేలా చేసింది మనదైన సంస్కారం.ఈ విశిష్ట విధానమే మన జీవనశైలి,మన పెంపకం.కలిసిమెలిసి వుండే కుటుంబ బంధాలు,గొప్ప వివాహ వ్యవస్థ మన దేశాన్ని సర్వోన్నతంగా నిలిపాయి.అదే మన సనాతన ఆచారంలోని ఔన్నత్యం. ఆచారం అంటే ఆచరించేది.హంగూ అర్భాటాలతో ప్రదర్శించేది కాదు.ఆత్మశుద్ధితో సాగే ఆరోగ్య స్రవంతి.పండుగలు మన జీవితంలో భాగం.హృదయంగమంగా జరుపుకోవడం ఒక యోగం.ఇంతటి ఉదాత్త విధానాల రూపమైన పండుగలు,ఆచారాలు రాజకీయాలకు వేదికలుగా మారడం మారుతున్న సమాజానికి, అడుగంటుతున్న విలువలకు అద్దం పట్టే విషాదం.అనంత కాలప్రవాహంలో,లక్షలాదిసంవత్సరాల మానవ జీవన పయనంలో కరోనా కాలం ఎంతో బాధించింది.ఇప్పుడు నిఫా వైరస్ అంటున్నారు.గతంలోనూ ఇటువంటివి ఎన్నో వచ్చి వెళ్లిపోయాయి.రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.మంచిరోజులు వస్తాయి.భక్తి ప్రదర్శన కాదు.ఆత్మగతమైన అనుభూతి,బుద్ధిని ప్రక్షాళనం చేసే సద్గతి,అని మన పూర్వులు చెప్పారు.అఫ్ఘాన్ వంటి దేశాలను చూస్తేవారి రాక్షస ప్రవృత్తే వారిని ఏకాకులను చేసింది. డబ్బు పరంగా అగ్రరాజ్యమనే పేరున్నా,అమెరికాపై ప్రపంచ దేశాలకు విశ్వాసం లేదు.తుపానులా పైకి లేచిన చైనాను ఎవ్వరూ నమ్మరు.మూలక్షేత్రానికే దెబ్బకొడదామని చూసే పాకిస్తాన్ పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు.క్షణక్షణానికి బంధాలు మార్చుకుంటున్న రష్యా తీరూ అంతే.ఒకప్పుడు అనంతమైన సంపదకు,సర్వ విద్యలకు నెలవుగా ఉన్న భారతదేశం,నేటికీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నప్పటికీ,ప్రపంచం మనల్ని విశ్వసిస్తోంది,గౌరవిస్తోంది.ప్రపంచ తత్త్వశాస్త్రాలను -భారత తత్త్వ సిద్ధాంతాలను తులనాత్మకంగా విశ్లేషించి,భారతీయమైన ఔన్నత్యాన్ని ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో వివరిస్తూ, ప్రసంగం సాగిస్తే! మేధోసమాజమంతా ఆయనకు,ఆయనలోని భారతీయతకు మోకరిల్లింది. భారతీయ తత్త్వం తెలిసినవారే పాలకులుగా ఉండాలన్నది సర్వేపల్లివారి సంకల్పం.కులాలు,మతాలు, ప్రాంతాలు దాటి రాజకీయాలు సాగే పరిస్థితులు నేడు లేనే లేవు.వినాయకచవితి పండుగ ఎలా జరుపుకోవాలో వాళ్లే నిర్దేశిస్తున్నారు.ఒకరికి నచ్చినది ఇంకొకరికి నచ్చదు.ప్రజలను తదనుగుణంగా తమవైపు తిప్పుకొని రాజకీయమైన లబ్ధి పొందాలనే దృష్టి తప్ప,సంప్రదాయంపై,ఆచార వ్యవహారాలపై ప్రేమ కాదని తెలుస్తూనే ఉంటుంది.వివాదాలకు కావాల్సినంత ప్రచారం జరుగుతూనే ఉంటుంది.పండుగలను వివాదాలకు,ఆచారాలను రాజకీయాలకు వేదికగా మారని సమాజాన్ని చూడాలన్నది విజ్ఞుల హృదయం.సర్వజనులకు జయావహం,ప్రియంవదమైన వాతావరణం రావడమే పర్వదినం. సర్వ విఘ్నాలను తొలగించి,సకల జనులకు సకల జయాలను కలిగించి,ముప్పులకు ముగింపు పలికి,ప్రగతి ప్రయాణానికి ముహూర్తం పెట్టాలని విఘ్ననాయకుడికి విజ్ఞప్తి చేసుకుందాం.సనాతన ధర్మం, భారతీయత అందించిన సదాచారాల మధ్య,సమభావనతో,సోదర తుల్యంగా సహజీవనం చేద్దాం.పర్వదినం అంటే? సర్వులకు మంచిరోజు.పర్యావరణ హితంగా పండుగ జరుపుకుందాం. సరికొత్త సంకల్పాలకు శ్రీకారం చుడదాం.సిద్ధి దిశగా కృషి సాగిద్దాం. --మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
Pudami Sakshiga :పక్షిగూడు గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
“ఋతుపవనాలు అడవుల గుండా పయనిస్తున్నపుడు మన ప్రపంచంలోనే ఉన్న మరో చిన్న ప్రపంచంలోని ఆకర్షణ, రమ్యత చూసే కనులు పరవశమొందే హృదయం ఉన్న ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది." - Dr. Salim Ali, eminant Ornithologist నిజమేనండి, పక్షుల ప్రపంచం ఎంతో అద్భుతమైనది. కొంచెం పరికించి చూస్తే ఆ చిన్ని ప్రపంచం లోని వింతలు విడ్డూరాలు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. పక్షులు చిన్నగా కనిపించినప్పటికీ అవి నివసించే తీరు వాటి జీవన విధానం మనకందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఆ చిన్ని గూటిలో ఎదుగుతున్న ఆకలితో ఉన్న పిల్లలు తమలో తాము సామరస్యంగా సర్దుబాటు చేసుకునే విధానం నిజంగా ఆశ్చర్యకరం. కుటుంబంలోని ఈ ఇచ్చి పుచ్చుకోవడం మనందరం అలవర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం. ఆ పక్షి ప్రపంచంలోకి వెళ్ళి అవి గూడు కట్టుకునే విధానం గురించిన కొన్ని విశేషాలని తెలుసుకుందామా! గూడు (ఇల్లు) మనందరి మౌళిక అవసరం. సాయంత్రమైతే చాలు ఎప్పుడు ఇంటికి చేరి కొంత సేదదీరుదామా అని మనమందరం ఎదురు చూస్తాం. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నామంటే చాలు బెంగ పట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా అని మనసు గొడవ పెడుతూ ఉంటుంది. మరి పక్షులు సాయంత్రమైతే ఎక్కడికి వెళ్తాయి? ఇదేం ప్రశ్న గూటికి పోతాయి అనుకుంటున్నారు కదూ, అలా అనుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. పక్షులు జతకట్టి, గుడ్లు పెట్టి, పిల్లలను సాకే కాలంలోనే గూళ్ళు కట్టుకుంటాయి. మిగతా సమయాలలో గుబురుగా పెరిగిన పొదలలోనో, బొరియలు చెట్టు తొర్రలలోనో, కొమ్మ వంచలలో శత్రువుల బారిన పడకుండా ఉండేలా చూసుకుని పడుకుంటాయి. సంతానోత్పత్తి కాలంలో రకరకాల పక్షులు వివిధ రకాలుగా గూళ్లను కట్టుకుంటాయి. కొన్ని గడ్డి పరకలను అల్లిగూడు కడితే, కొన్ని ఆకులను కుట్టి గూటిని కడతాయి. పుల్లలు, పుడకలు, బూజు, గరిక, మట్టి వంటి వాటితో ఎలాంటి సివిల్ ఇంజనీరు సాయం లేకుండా తమంతట తామే గూటిని నిర్మించుకుంటాయి. కొన్ని చెట్ల కాండాలపై రంధ్రాలు చేసి గూడును కడితే, కొన్ని నేలలో బొరియలను తవ్వి గూటిని నిర్మించుకుంటాయి. నీళ్ళపై తేలియాడే గూళ్ళు, వేలాడే గూళ్ళు అబ్బో ఎన్నో రకాల గూళ్ళు. కొన్ని కప్పు లాగా ఉంటే మరికొన్ని సాసర్ లా. ఇంకొన్ని గూళ్లయితే నేల మీదే. ఇలా పక్షులు కట్టుకునే గూళ్లను గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందామనుకుంటుంటే చదవడం కొనసాగించండి మరి. ►తీతువ, తెల్ల బొర్ర నీటి కోడి వంటి నీటి పక్షులు నీటి అంచుకు దగ్గరగా ఆకులు, గడ్డితో నేల మీదే గూళ్ళు కట్టుకుంటాయి. గుడ్ల రంగు వాటిపై ఉండే మచ్చలు నేల, గడ్డి రంగులతో కలిసిపోయి శత్రువుల బారిన పడకుండా ఉంటాయి. కబోద పక్షి( నైట్ జార్) రాలిన ఆకులలోనే గుడ్లు పెడుతుంది. ► కాకులు, కొంగలు, గ్రద్దలు, పావురాలు పుల్లలతో గూడును నిర్మించుకుంటాయి. గూడు లోపల మెత్తని పీచు వంటి వాటిని పరిచి గుడ్లను పెడతాయి. ► చెట్ల తొర్రలలో గుడ్లగూబలు, కొమ్ముకసిరి (హార్న్ బిల్), చిలకలు, మైనాలు గూటిని ఏర్పాటు చేసుకుంటాయి. కంసాలి పిట్ట,వడ్రంగి పిట్టలు మొదట చెట్లకు రంధ్రాలు చేసి గూటిని నిర్మించుకుంటే, తరువాత చిలుకలు, మైనాలు వాటిని తమకు అనువుగా మార్చుకుంటాయి. మనం పాత ఇంటిని రీ మోడలింగ్ చేసుకున్నట్లు. ► కొమ్ము కసిరి గూడు కట్టుకుని పిల్లలను సాకే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆడ మగ పక్షులు జతకట్టి గూటిని ఎంచుకోగానే ఆడ పక్షి ఆ తొర్రలో చేరి తన ముక్కు పట్టేంత ఖాళీ మాత్రం ఉంచి ద్వారాన్ని తన విసర్జకాలు, మట్టితో మెత్తి మూసేస్తుంది. ► గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలకు కనీసం ఒక వారం వయసు వచ్చే వరకు ఆడ పక్షి అలా నిర్భందం లోనే ఉండిపోతుంది. ఈ నిర్భందం సమయంలో మగ పక్షే ఆహారాన్ని అందిస్తుంది. పిల్లలకు కనీసం వారం వయసు వచ్చాకకట్టిన గోడను ముక్కుతో పొడుచుకుని ఆడ పక్షి బయటకు వచ్చి, మరలా అడ్డుగోడను కట్టేస్తుంది. అక్కడి నుంచి అమ్మానాన్నలిద్దరు పిల్లలను సాకడంలో నిమగ్నమైపోతారు. ► పసరిక పిట్టలు (బీ ఈటర్స్), లకుముకి పిట్ట (కింగ్ ఫిషర్), కూకూడు పిట్ట (హూపో) వంటి పక్షులు కొంచెం ఎత్తైన నేల మీద మట్టిలో బొరియలు చేసుకుని లేదా కొండ అంచులలో బొరియలు తవ్వి గూడు కట్టుకుంటాయి. ► పికిలి పిట్టలు (బుల్బుల్), పిచ్చుకలు, వంగ పండు (గోల్డెన్ ఓరియల్), పసుపు జిట్ట (ఐయోర) వంటి పక్షులు కొమ్మ వంచలలో దొన్నె లాంటి గూటిని కట్టుకుంటాయి. ► చుక్కల జీనువాయి (మునియ) గడ్డితో గుండ్రటి బంతి లాంటి గూటిని కట్టుకుంటుంది. ఆకుల పోతడు (దర్జీ పిట్ట) ఆకుల అంచులను కలిపి గొట్టంలా కుట్టి గూడు పెడుతుంది. ► తేనె పిట్టలు ఆకులు, గడ్డి, బూజును వాడి వేలాడే గూటిని కడితే, గిజిగాడు (బాయా వీవర్) గడ్డి పోచలతో వేలాడే అందమైన గూటిని అల్లుతుంది. గిజిగాడు నీటి అంచులలో ఉన్న చెట్లపై బాగా వాలి ఉన్న కొమ్మల చివర గడ్డితో గూటిని అల్లుతుంది. ► మొదట గడ్డితో ముడి వేసి, చట్రాన్ని అల్లి మిగిలిన గూటిని అల్లుతుంది. ఇదంతా మగ పక్షి మాత్రమే చేస్తుంది. ఇలా అల్లిన గూటిని ఆడ పక్షి పరిశీలించి నచ్చితే జతకట్టి గూటిని నిర్మించడం కొనసాగిస్తాయి. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షి మరో గూటిని కట్టడం మొదలు పెడుతుంది. ఇలా సంతానోత్పత్తి కాలంలో రెండు నుండీ మూడు గూళ్లను కడుతుంది. ఒక వేళ ఆడపక్షికి గూడు నచ్చక పోతే పని మళ్ళీ మొదటికే, ఆ గూటిని పీకి కొత్త గూటిని అల్లాల్సిందే. ఈ గూటిని కట్టడానికి వెయ్యి దాకా గడ్డి పోచలు అవసరపడతాయట. గూడు పచ్చగా ఉన్నపుడే ఆడ పక్షి పరిశీలించేది, గూడు అల్లటం ఆలస్యం అయినా కధ మళ్ళీ మొదటికే. ఇంతే కాదు, నీటికాకులు, కొంగలు, పసరిక పిట్టలు, అడవి పిచ్చుకలు, వలస పక్షులు కలిసికట్టుగా కాలనీలుగా గూళ్ళు నిర్మించుకుంటాయి. పిల్లలను శత్రువుల బారినుండి సంరక్షించుకునేందుకు కాలనీ సహాయపడుతుంది. ఇక్కడ తమంతట తాము గూటిని నిర్మించుకోలేని కోకిల జాతి పక్షులను గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. కోకిల సొంతంగా గూటిని కట్టుకోలేదు, కాకి గూటిలోనో, బొంత పిచ్చుకల గూటిలోనో గుడ్లను పెడుతుంది. పిల్ల పెరిగి పెద్దదయిన తర్వాత గాని పెంచిన తల్లిదండ్రులకు తెలియదు. ఇలా పక్షులు రకరకాలుగా గూటిని నిర్మించుకునే విశేషాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ! చాలా వరకు పక్షులు మే నుంచి సెప్టెంబరు లోపు అంటే వానలు పడి పురుగులు, గడ్డి, గడ్డి గింజలు, పళ్ళు ఎక్కువగా దొరికే కాలంలో గూటిని కట్టుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. మీరు కొంచెం బద్దకం వీడి నాలుగడుగులు వేసి మీ చుట్టుపక్కల పరిశీలిస్తే తప్పకుండా ఒకటి రెండు గూళ్లను చూసే అవకాశం దక్కించుకోవచ్చు. ఏమిటి లేచే ప్రయత్నం చేస్తున్నారా? రచయిత : రవి కుమార్ ద్వాదశి, ravikumardwadasi@gmail.com తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
డేంజర్ జోన్లో భారత్, తీవ్రవైన కరువు దేశంగా..
భూతాపం కారణంగా తీవ్రమైన కరువును ఎదుర్కోవాల్సిన దేశాలలో భారత్ కూడా ఉంది.రాబోయే 30 ఏళ్ళల్లో ఈ తీష్ణత మరింతగా పెరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.భారతదేశంలోని 50 శాతం మందిపై కరువు బరువు పడే సూచనలు కనిపిస్తున్నాయి.భూతాపం 3డిగ్రీల సెల్సియస్ పెరిగితే చాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగినా పరిణామాలు తీవ్రంగానే ఉండనున్నాయి.ముఖ్యంగా వ్యవసాయభూమి దాదాపు సగానికి పైగా కరువుక్షేత్రంగా మారిపోతుందని పరిశోధకులు చెబుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ప్యారిస్ ఒప్పందంలో చెప్పినట్లుగా ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం నాటికి తీసుకురాగలిగితే చాలా వరకూ ముప్పును తప్పించుకో గలుగుతాం. ఆచరణలో అది జరిగేపనేనా? అన్నది పెద్దప్రశ్న. భూమి వేడిక్కిపోతోందిరా! బాబూ అంటూ శాస్త్రవేత్తలు నెత్తినోరు మొత్తుకుంటూనే ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకై ఎప్పటి నుంచో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలు కలుసుకున్నప్పుడల్లా చర్చించే అంశాల్లో ఇదొకటి.ఉపన్యాసాలు, ఒప్పందాలు, నినాదాలు తప్ప అంతటా ఆచరణ శూన్యం. భూమి వేడిక్కిపోతున్న ప్రభావంతో శీతోష్ణస్థితుల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉష్ణోగ్రతలను కొలవడం ద్వారా దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలను సంబంధిత విభాగాలు ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నాయి.వాతావరణంలో మార్పులు చేర్పులు అన్నది అనాదిగా జరిగే పరిణామం. శీతోష్ణస్థితుల ప్రభావం ప్రపంచంపై, మానవుల మనుగడపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా, 20వ శతాబ్దం మధ్యకాలం నుంచీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అసాధారణ స్థితికి చేరిపోయింది.ఈ ప్రభావంతో రుతువుల ప్రయాణం కూడా గతితప్పింది. అకాల వర్షాలు, ప్రకృతి భీభత్సాలు, కరువుకాటకాలు, వింత వింత జబ్బులు అన్నింటికీ భూమి వేడెక్కిపోవడమే ప్రధాన కారణం. పారిశ్రామికం వెర్రితలలు వేసి,ఆర్ధిక స్వార్థం ప్రబలి, హరిత చైతన్యం అడుగంటడం వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి.ఆరోగ్యకరమైన అభివృద్ధికి అవరోధాలు పెరుగుతున్నాయి.కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారమే కొంప ముంచుతోంది. భూమి వేడెక్కిపోవడం వల్ల ఏర్పడుతున్న పరిణామాలు విస్తృతంగా ఉంటాయి.సముద్ర మట్టాలు పెరిగిపోవడం, మహా సముద్రాల ఆమ్లీకరణం,అడవులు మండిపోవడం, అనేక జాతులు అంతరించిపోవడం, పంటల దిగుబడి తగ్గిపోవడం, ఆహారకొరత చుట్టుముట్టడం మొదలైన ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు కూడా తరలిపోవాల్సి వస్తుంది.భూతాపాన్ని అడ్డుకోవడం అందరి సమిష్టి బాధ్యత. ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు, ప్రజలు అందరూ కలిసి రంగంలోకి దిగాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దుస్థితికి కారణం మనిషి. మనిషిలోని స్వార్ధ చింతన, బాధ్యతా రాహిత్యం, రేపటి పట్ల ఏ మాత్రం స్పృహ లేకపోవడం ఈ దుస్థితికి చేర్చాయి. ఐక్య రాజ్య సమితి ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశం బలంగా చర్చకు వచ్చింది. ఉద్గారాలను పెద్దఎత్తున తగ్గించాలి.భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయాలని 2016లో పారిస్ లో ఒప్పందం జరిగింది. ఈ ఆరేడేళ్లలో అది తగ్గకపోగా మరింత పెరిగింది.భూమిని, వనరులను వాడుకొనే విధానంలో పెను అనారోగ్యకరమైన విధానాలు వచ్చాయి. నివాసయోగ్య భూమి -అటవీ భూమి మధ్య ఉన్న నిష్పత్తులు మారిపోయాయి. వ్యవసాయభూమిని వాడుకోవడంలోనూ మార్పులు వచ్చాయి. వ్యవసాయం కంటే మిగిలిన వాటికి ఆ భూమిని వాడే సంస్కృతి పెరిగిపోయింది. పర్యవసానంగా అటవీ భూమి, వ్యవసాయ భూమి తగ్గిపోయింది. కొన్ని రసాయనాల సమ్మేళనం మేఘాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.భూమికి చేరే సూర్యకాంతి పరిమాణంలో కూడా తగ్గుదల మొదలైంది. దీనిని 'గ్లోబల్ డిమ్మింగ్ ' అంటారు. భూమికి సూర్యుడే ప్రధానమైన శక్తి.ఆ వనరులు తగ్గిపోవడం అత్యంత ప్రమాదకరం.ఇప్పటికైనా మేలుకోవాలి. గ్రీన్ వాయివులను తగ్గించుకోవాలి. సౌరశక్తి, పవన శక్తిని ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి. కార్బన్ వాడకాన్ని తగ్గించడం ఎంత ముఖ్యమో,అడవులను పెంచడం అంతకంటే ముఖ్యం. పబ్లిక్ రవాణా విధానంలో చాలా మార్పులు రావాలి.కార్లు మొదలైన వాహనాల వాడకం తగ్గించి, నడక, సైకిళ్ల వాడకం పెంచమని నిపుణులు సూచిస్తున్నారు.భూతాపం వల్ల 2030 నాటికి మరో 12 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి వెళ్ళనున్నారని నివేదికలు చెబుతున్నాయి.వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆరోగ్యకరమైన విధానాలను పాటిస్తే ఉధృతి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ప్రకృతిని గౌరవిస్తే, అది మనల్ని కాపాడుతుంది. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
సంతానోత్పత్తి తగ్గుముఖం..! తొలిస్థానంలో భారత్..!!
సాక్షి న్యూస్: "ఉన్నది పుష్టి మానవులకో యదు భూషణ.. ఆలజాతికిన్ తిన్నది పుష్టి.." అన్నారు తిరుపతి వెంకటకవులు ఓ పద్యనాటకంలో. మానవుడికి చేతిలో, వంట్లో, ఇంట్లో ఉన్నదే పుష్టికిందకు వస్తుంది. జంతువులకు అప్పటికప్పుడు తిన్నదే పుష్టి. కాబట్టి మానవుడు పుష్టిని సుష్టుగా సంపాయించుకొని ఉండాలన్నది సారాంశం. "ధాతు పుష్టి - వీర్యవృద్ధి సమృద్ధిగా ఉండాలి" అని చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి పదే పదే చెబుతుండేవాడు. తగ్గిపోతున్న సంతాన ఉత్పత్తిని చూస్తుంటే.. ఇవన్నీ గుర్తుకు రాక మానవు. అసలు విషయానికి వద్దాం. జనాభాలో ఒకటవ స్థానంలో ఉన్న చైనాకు మనం దాదాపుగా సమానంగా వచ్చేశాం. త్వరలో ఆ దేశాన్ని కూడా అధిగమించి, మొదటి స్థానానికి భారత్ చేరుకుంటుందని కొన్నాళ్ళుగా సర్వేలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా, జనాభా తగ్గుముఖం పడుతోందనే వార్తలు కొత్త ఆలోచనలను రేకేత్తిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ పరంగా, భారతదేశం అతి పెద్దది. అందుకనే అమెరికా, చైనా వంటి అగ్రదేశాల కళ్ళన్నీ మన పైనే ఉన్నాయి. మానవవనరుల సేవా రంగంలో భారతీయుల స్థానం విశిష్టమైనది. సమాచార సాంకేతిక రంగాల్లోనూ మనదే పై చేయి. The top 5 most populous nations and their fertility rates in 2023 1. 🇮🇳India 2.0 2. 🇨🇳China 1.76 3. 🇺🇸USA 1.76 4. 🇮🇩Indonesia 2.34 5. 🇵🇰Pakistan 3.03#fertility #population pic.twitter.com/HRpdNgrdyf — FacTrendStats (@factrendstats) September 13, 2023 ప్రగతి ప్రయాణంలో చైనాతో పోల్చుకుంటే మనం చాలా వెనుకబడి వున్నాం. జనాభాతో పాటు ఆర్ధికంగానూ బలమైనదిగా ఎదిగి,ఉత్పాదకత, పనిసంస్కృతిలోనూ చైనా ముందంజలో ఉంది. జాతి ఎదుగుదలలో,దేశ ప్రగతిలో మనిషి పాత్ర చాలా గొప్పది. అష్ట ఐశ్వర్యాలలో సంతానం కూడా ఒకటిగా భారతీయులు విశ్వసిస్తారు. అందుకే ఒకప్పుడు ఎక్కువమందికి జన్మనివ్వడంపై మక్కువ చూపించేవారు. క్రమంగా ఈ అభిప్రాయం మారుతూ వచ్చింది. ఆర్ధిక పరిస్థితులు, ఆరోగ్యం దృష్ట్యా సంతానోత్పత్తిని తగ్గించుకుంటూ వస్తున్నారు. ముగ్గురు లేదా ఇద్దరు,ఇద్దరు లేదా ఒక్కరూ అని మొదలై, చివరికి ఒక్కరే ముద్దు అనే ప్రచారాన్ని ప్రభుత్వమే చేపట్టింది. 'చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం'.. అనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది. ఈ క్రమంలో, 2019-2021లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటి వరకూ నమోదైన అత్యల్ప స్థాయి ఇదే. 2015-16లో 2.2శాతంగా ఉండేది. 1998-99లో ఈ రేటు 3.2గా ఉండేది. అంటే? భారతీయ మహిళ సగటున ముగ్గురికి జన్మనిచ్చేది. బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ తప్ప మిగిలిన రాష్ట్రాలన్నింటిలో సంతానోత్పత్తి సగటు కంటే కూడా తక్కువగా నమోదవుతోంది. TN doesn't have an exodus problem but Kerala does. https://t.co/JPshe2qmyT pic.twitter.com/UNPKl7ecD9 — Rishi 🗽🌐🔰🏙🥥 (@RishiJoeSanu) September 11, 2023 కుటుంబ నియంత్రణ సాధనాల వాడకం కూడా పెరుగుతూ వస్తోంది. గతంలో 54 శాతం ఉండేది. ప్రస్తుతం 67 శాతాన్ని దాటిపోయింది. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ధిక పరిస్థితులు,శారీరక దృఢత్వం తగ్గుతూ రావడం, లేటు వయస్సు పెళ్లిళ్లు, సౌందర్యం /గ్లామర్ తగ్గుతుందనే భయం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగై పోవడం మొదలైనవి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ మన సంఘ సంస్కర్తలు ఎందరో ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. ఆ దురాచారాన్ని దూరం చేయడానికి ఎంతో కృషి చేశారు.కానీ అది పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశంలో ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరికి 18 ఏళ్ళు నిండకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. వివాహ బంధాలు,ప్రేమ పెళ్లిళ్లు కూడా కలకాలం నిలవడం లేదు. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడానికి ఇవన్నీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 1950 ప్రాంతంలో, భారతీయ మహిళ సగటున ఆరుగురికి (5.9) జన్మనిచ్చేది. జనాభా పెరుగుదల వల్ల పోటీ పెరగడం, సదుపాయాలు తగ్గిపోవడం,వనరుల కొరత, అధిక ధరలు, డిమాండ్ - సప్లై మధ్య భారీ వ్యత్యాసం మొదలైన దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయి. #India may have edged out China as the world’s most populous country earlier this year, but it is facing a declining #fertility rate. India’s fertility rate faces sharp decline amid rising concern over lifestyle factors, infertility pic.twitter.com/w5iXXnf76s — Hans Solo (@thandojo) September 7, 2023 మహిళలలో అక్షరాస్యత పెరగడం తద్వారా ఉద్యోగాలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టడంలో ఈ అంశాలు కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మానవ వనరుల సద్వినియోగం జరగకుండా, కేవలం జనాభా పెరగడం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. పేదరికాన్ని తగ్గించాలన్నా, అభివృద్ధిని సాధించాలన్నా, జనాభా ఉత్పత్తిలో సమతుల్యతను సాధించడమే శ్రేయస్కరం. శారీరక,మానసిక పటుత్వం సాధన దిశగా దృష్టి సారించడం అంతకుమించి అవసరం. మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..) -
దేశ సమైక్యతకు చిహ్నం ఆ భాష! జాతీయ భాషగా నీరాజనాలు అందుకుంటోంది
భాషతో బంధంజాతి నిర్మాణంలో భాష పాత్ర చాలా గొప్పది. అనేక విషయాలను అధ్యయనం చేయడం, విజ్ఞాన సాంకేతిక తదితర ఉన్నత రంగాల్లో ప్రావీణ్యత పొందడం ఒక భాష ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వ్యక్తి సమగ్ర వికాసానికి భాష ఆయువుపట్టు. అదే భాష దేశాన్ని ఒకే తాటిపై నిలబడేలా, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించినప్పుడు ఆ భాష ‘జాతీయ భాష’గా నీరాజనాలు అందుకుంటుంది. ఆ పాత్రను అక్షరాలా ‘హిందీ’ భాష నిర్వర్తించింది, నిర్వర్తిస్తోంది కూడా. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రజలను జాగృత పరచడంలో క్రియాశీల పాత్ర పోషించి, ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడే రెండవ భాషగా వికసించిన భాష హిందీని కొందరు ఇంకా పరాయి భాషగా భావించడం దురదృష్టకరం. హిందీ ఒక భాష మాత్రమే కాదు, మన దేశ సమైక్యతా చిహ్నం కూడా! దేశంలో హిందీ మాట్లాడేవారు, అర్థం చేసుకునే వారు అధికంగా ఉండడం చేత కేంద్ర ప్రభుత్వము హిందీని అధికార భాషగా ప్రకటించింది. ప్రస్తుతం పదికి పైగా రాష్ట్రాలలో ప్రథమ భాషగా, మిగతా రాష్ట్రాల్లో ద్వితీయ భాషగా హిందీ ప్రచలనములో ఉన్నప్పటికీ, ఆంగ్ల భాషపై మోజుతో హిందీని నిర్లక్ష్యం చేస్తున్నారు. గాంధీజీ స్వయంగా దక్షిణ భారతదేశంలో ఈ భాష ప్రచార కార్యక్రమా నికి ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ స్థాపనతో శ్రీకారం చుట్టారు. ఆ మహాత్ముని ఆశయాలను అనుసరిస్తున్న మనం ఆయన విస్తరింపచేసిన భాషను తగిన విధంగా ఆదరించలేక పోవడం విచారకరం. వివిధ దేశాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాల్లో హిందీని పాఠ్యాంశంగా బోధించడం గమనార్హం. కానీ, మన దేశంలో మాత్రం అంతగా హిందీకి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ‘త్రిభాషా సూత్రా’న్ని అనుసరించి మాతృ భాష ప్రథమ భాషగా ద్వితీయ భాషగా హిందీని, తృతీయ భాషగా ఆంగ్లం. పాఠశాల విద్యార్థులకు బోధించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాలు ఈ సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నాయి. పరాయి భాషలు అవసరానికి ఎన్ని నేర్చుకున్నా, మన మాతృ భాష, అధికార భాషలను నిర్లక్ష్యం చేయరాదు. – భైతి దుర్గయ్య, హిందీ ఉపాధ్యాయుడు (చదవండి: మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..) -
పౌరాణిక నటదిగ్గజం సోమిరెడ్డి
ఆచార్య దేవ, హహ్హ ఏమంటివి? ఏమంటివి? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా! ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?............... మా వంశమునకు మూలపురుషుడైన వశిష్టుడు దేవ వేస్యయగు ఊర్వశీపుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న హ.. ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రభీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదములెందుకు? ... అంటూ ద్రోణుడి జాత్యాహంకారాన్ని వ్యతిరేకిస్తూ సుయోధనుడి పాత్రధారి కుమ్మెత సోమిరెడ్డి గంభీరంగా డైలాగులు పలికినప్పుడు రంగస్థల ప్రాంగణం చప్పట్లతో ఓ ఐదు నిమిషాల పాటు మార్మోగింది. ఆ తర్వాత వన్స్‌మోర్ నినాదాలతో ప్రేక్షకులు రెచ్చిపోయారు. పౌరాణిక నాటకాలంటే ముందుగా అనంత పేరు గుర్తొచ్చేలా నవరసాలను పలికిస్తూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న వారిలో c ముందు వరుసలో ఉంటారు. అనంతపురం కల్చరల్: అచ్చు సీనియర్ ఎన్టీఆర్‌ను తలపించేలా ఉండే కుమ్మెత సోమిరెడ్డి.... రారాజు పాత్ర వేశాడంటే అభిమానులు మంత్ర ముగ్దులవ్వాల్సిందే. డైలాగులు చెప్పే తీరు, మధురంగా ఆలపించే పద్యాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రతిచోటా కరతాళధ్వనులు, వన్స్మోర్లతో ఆడిటోరియాలను మార్మోగించే కళాకారుల్లో సోమిరెడ్డిది అగ్రస్థానం. ఆయనలోని కళాకారుడిని గుర్తించిన అనేక సంస్థలు అవార్డులు, రివార్డులతో సత్కరించాయి. కర్ణాటకకు రాఘవ కళాసంస్థ వారు ప్రతిష్టాత్మక నటులకిచ్చే ‘బళ్లారి రాఘవ పురస్కారం’తో పాటు మరెన్నో పురస్కారాలను ఆయన అందుకున్నారు. పాత్రేదైనా ఒదిగిపోవడమే కూడేరు మండలం పి.నారాయణపురానికి చెందిన సీనియర్ రంగస్థల కళాకారుడు కుమ్మెత చిన్నారెడ్డి కుమారుడు సోమిరెడ్డి... చిరుప్రాయం నుంచే రంగస్థలం వైపు ఆకర్షితులయ్యారు. తనకు దక్కిన ప్రతి పాత్రకూ న్యాయం చేస్తూ వస్తున్నారు. వారణాసిలో సత్యహరిశ్చంద్రునిగా, మహాభారతంలో భీముడిగా, రామాయణ ఘట్టాల్లో రాముడిగా, భాగవతంలో కృష్ణుడిగా, బాలనాగమ్మలో బాలవర్ధిగా అసమాన నటనను ప్రదర్శించే సోమిరెడ్డి ముఖ్యంగా రారాజు పాత్రలో ఒలికించే రాజసానికి ప్రేక్షకులు నీరాజనాలు పడుతుంటారు. గత 40 ఏళ్లలో ఆయన ఎన్ని పాత్రలు పోషించినా.. సుయోధనుడి పాత్ర మాత్రం ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అనంతలోనే కాకుండా తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు తదితర చోట్ల ఆయన నటించిన మయసభ సీను చూసిన ప్రేక్షకులకు ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఏమిచ్చినా తీర్చుకోలేం పౌరాణిక నాటకానికి తగినట్లుగా మంచి వర్చస్సు, అభినయం, ఆంగికం అన్నీ కుదరాలంటే సద్గురువుల ఆశీస్సులుండాలి. ఆంధ్రదేశంలో విఖ్యాతి పొందిన గుమ్మడి గోపాలకృష్ణ, కోటేశ్వరరావు లాంటి వారి సరసన నటించే అవకాశం నాకు దక్కడం అదృష్టమే. దుర్యోధనుడు, భీముడి పాత్రలు నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అనంత రంగస్థలానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అందుకే గత నాలుగేళ్లగా నా సొంత ఖర్చుతో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తున్నా. -
మాట తప్పిన ఆత్రేయ! ముచ్చటపడ్డా.. ఆ కోరిక నెరవేరకుండానే..
మాట తప్పడం ఆత్రేయకు మామూలు అనీ, ఆయన మాటను పాటిస్తే అది విశేష మని లోక వ్యాప్తమైన ప్రతీతి. ఆత్రేయ రాయక నిర్మాతలను ఏడిపించేవారనీ, అందుకే ఆయన పుల్లయ్య నుంచి మురారి వరకూ అనేక నిర్మాతల ఆగ్రహానికీ, ఆ తర్వాత ఆనందానికీ కారకులయ్యే వారని పరిశ్రమలో కథలు వినిపించేవి. వృత్తి రీత్యా ఆత్రేయ సత్యహరిశ్చంద్రుడు కాకపోవడం నిజమైనా, అవసాన కాలంలో ఆయన ఎంతో ముచ్చటపడి ఇచ్చిన మాట విధి వశాత్తూ వమ్ము కావడం ఆయన సుకవి మీద అభిమానులందరికీ సానుభూతి కలిగించే విషాద కరమైన ఉదంతం! ముద్రణ పట్ల వ్యామోహం లేని ఆత్రేయకు ఆఖరి దశలో తను రాసిన సినిమా పాటల్లో కొన్నిటిని ‘నా పాట నీ నోట పలకాలి’ అనే పేరుతో పుస్తక రూపంలో తీసుకురావాలనే కోరిక కలిగింది. కొందరు నిర్మాతలు వాగ్దానాలు చేసినా, అది సాకారం కాలేదు. చివరకు చిరకాల మిత్రులైన కొంగర జగ్గయ్య దగ్గర ఈ విషయం వెల్లడించగా, ఆయన ఆత్రేయ అంతవరకు రాసిన మొత్తం సినిమా పాటల్ని రెండు, మూడు సంపుటాలుగా వెలువరిద్దామని ప్రతిపాదించారు. అనుకోకుండా తన కల నెరవేరబోతున్నందుకు ఆనందంతో తలమునకలైన ఆత్రేయ ఆ పాటల సంపుటాలు అట్ట పెట్టెల్లో ఉంచే ‘సెట్స్’గా రావాలని అభిలషించారు. జగ్గయ్య ఆమోదించారు. ఆ రోజు నుంచే (1989 ఆగస్టు 13) ఆత్రేయ తన పాటల సెట్లను ఊహించుకొని మురిసిపోతూ, ఆ ముద్రణ ముచ్చట గురించి ఆత్మీయులకు చెప్పసాగారు. సభలకూ, సమావేశాలకూ దూరంగా ఉండే ఆత్రేయ ఒక ఆప్త మిత్రుని బలవంతం మీద ప.గో. జిల్లా భీమవరంలో జరుగు తున్న ‘అల్లూరి సీతారామరాజు సంగీత నాటక కళా పరిషత్’ నాటక పోటీలకు చూడ్డానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ ప్రదర్శనలతో స్ఫూర్తి పొంది తను రాయాలనుకున్న ‘ఆఖరి నాటకా’నికి శ్రీకారం చుట్టాలనే తలంపుతో ఆయన రెండ్రోజులపాటు ఆ నాటకాలను చూస్తూ ఉండిపోయారు. అలాంటి అరుదైన అవకాశాన్ని వినియోగించుకోవాలని స్థానిక రామరాజభూషణ సాహిత్య పరిషత్ వారు ఒక సాయంకాల సమావేశానికి ఆత్రేయను అతిథిగా ఆహ్వానించారు. ఆ సమావేశంలో పలువురు కవులు, సాహితీవేత్తలు ఆత్రేయ నాటకాల గురించి, పాటల గురించి అద్భుతమైన ప్రసంగాలు చేసి వారి రచనలను ఆయనకు కానుకలుగా సమర్పించారు. వారి అభిమానానికి ముగ్ధులైన ఆత్రేయ ప్రతిస్పందిస్తూ ముక్తసరిగా మాట్లాడి, మరోసారి వచ్చి ఆ సభ్యులంతా తృప్తిపడేలా సుదీర్ఘోపన్యాసం చేస్తానన్నారు. అంతేగాక త్వరలో అచ్చుకానున్న తన పాటల సంపుటాలను భీమవరం పంపిస్తానని వాటిని తనకు పుస్తకాలనిచ్చిన రచయితలందరికీ అందజేయాలనీ పరిషత్ నిర్వాహకులు రాయప్రోలు భగవాన్ గారిని కోరారు. పుస్తక ముద్రణ గురించి చర్చించడానికి జగ్గయ్య గారిని తిరిగి కలవడానికి నిర్ణయించిన 1989 సెప్టెంబరు 13న ఆత్రేయ మాట తప్పారు. ఆకస్మికంగా తిరిగిరాని లోకానికి పయన మయ్యారు. పాటల సంపుటాలతో పాటు మనస్విని సౌజన్యంతో వెలువడిన 7 సంపుటాల ‘ఆత్రేయ సాహితి’ని ఆయన చూసుకోలేదు. ఉద్వేగంతో ఆయన మాటిచ్చినట్టు ఆత్రేయ రచనల సెట్ రామరాజ భూషణ సాహిత్య పరిషత్ సాహితీ వేత్తల కందలేదు! పైడిపాల, వ్యాసకర్త సినీగేయసాహిత్య పరిశోధకులు (చదవండి: నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి) -
నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా', 'వంశీ ఇంటర్నేషనల్' అండ్ ' సాంస్కృతిక కళాసారథి- సింగపూర్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "నవరసాల నటసామ్రాట్" (అక్కినేని నటనా వైదుష్యం) అనే విలక్షణ కార్యక్రమం అంతర్జాల మాధ్యమంలో ఆదివారం 2 గంటల పాటు అద్భుతంగా నిర్వహింపబడింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారి శతజయంతి సందర్భంగా.. అమెరికా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్, భారత్ దేశాల నుంచి 50మంది ప్రఖ్యాత రచయితలు/రచయిత్రులు పాల్గొని, ఆణిముత్యాలైన 50 సినిమాలలో అక్కినేనిగారి నటనా వైదుష్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు అందించారు. నిర్వాహక సంస్థల అధ్యక్షులైన డా వంగూరి చిట్టెన్ రాజు, డా వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్, ప్రముఖ సినీ కవి భువనచంద్ర తమ సందేశాలు అందించగా, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించారు. ప్రముఖ అవధాని డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, రచయిత్రులు కె.వి కృష్ణకుమారి, గంటి భానుమతి, డా తెన్నేటి సుధాదేవి, తిరునగరి దేవకీదేవి, గాయని సురేఖ మూర్తి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డా టి గౌరీశంకర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డా సూర్య ధనంజయ్ మొదలైనవారు ఈ కార్యక్రమంలో ప్రసంగించగా, "మనం" సినిమా మాటల రచయిత అయిన సినీ నటుడు హర్షవర్ధన్ మనం సినిమాపై విశ్లేషణ వ్యాసం అందించారని నిర్వాహకులు డా వంశీ రామరాజు తెలియజేశారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ అక్కినేని గారి అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలను, తనకు వారితో ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గురించి పంచుకున్నారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక, భగ్న ప్రేమిక, హాస్య భరిత, భక్త పాత్రలలో దేనిలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి చిత్రం ఆసాంతం ఆకట్టుకునేలా నటించగలిగే అద్వితీయ ప్రతిభ అక్కినేనిగారిది. దానిని నిరూపించే విధంగా ఉన్న 50 సినిమాలలో వారి నట విశ్వరూపాన్ని విశ్లేషిస్తూ ఏడు దేశాల నుంచి 50 మంది వక్తలు మాట్లాడటం ఇదే తొలిసారి అని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. అనితర సాధ్యమైన నటనతో, అతి స్పష్టమైన ఉచ్చారణతో, కళ్ళతోనే అనేక భావాలు పలికించగలిగే అక్కినేని నాగేశ్వరరావు గారి నటన గురించి వారి శతజయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమం శ్రీ సాంస్కృతిక కళాసారథి అండ్ కల్చరల్ టీవి యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. సుమారు వెయ్యి మందికి పైగా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాల నుంచి వీక్షించారు. (చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం) -
పేదరికపు కష్టాల మధ్య.. విద్యార్థి నుంచి రాష్ట్రపతిగా.. సర్వేపల్లి ప్రస్థానం
పేదరికపు కష్టాల మధ్య,అవమానాల సుడిగుండాల నడుమ చదువుకోడానికి ఆయన ఎంత కష్టపడ్డారో ఆయనకే తెలుసు.ఉత్తమ విద్యార్థి దశ నుంచి ఉన్నత విద్యావంతుడుగా ఎదిగాడు,ఉన్నత విద్యావంతుడి స్థాయి నుంచి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు.ఆ అజేయప్రస్థానం అంతటితో ఆగలేదు.అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి చేర్చింది. మహోన్నతమైన 'భారతరత్న' పురస్కారాన్ని అందించింది. సర్వోత్తమమైన 'భారతరత్న' సత్కారాన్ని ప్రకటించిన తొలినాళ్ళల్లోనే (1954) సాధించేలా చేసింది.సర్వేపల్లి రాధాకృష్ణ మన తెలుగువాడు,మన భారతీయుడు.ఆయన జన్మదినం 'జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం'. దేశంలో ఎందరో ఉన్నత విద్యావంతులు,ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. వారెవ్వరికీ దక్కని విశిష్ట గౌరవాన్ని పొందిన భాగ్యశాలి. జ్ఞానమే తన ఐశ్వర్యం, ధైర్యమే తన దీపం, క్రమశిక్షణే తన మార్గం,పట్టుదలే తన సోపానం.రాధాకృష్ణ విజయగాథ సర్వ మానవాళికి సర్వజ్ఞాన ప్రబోధ.ప్రపంచంలోని అగ్రశ్రేణి తత్త్వశాస్త్ర ఆచార్యులలో ఆయన తొలివరుసలోని వారు. చదువు,అనుభవం రెండూ తన తోడునీడలు.జీవిత తత్త్వాన్ని, జీవన సారాన్ని,సారాంశాన్ని మధించుకుంటూ వెళ్లారు. పసిడికి తావి అబ్బినట్లు, తనను వరించి వచ్చిన ప్రతి పదవిలో,తనను తాను మరింతగా తీర్చిదిద్దుకున్నారు. జీవన సమరం బాగా ఎరిగినవాడు కనుక,తను గడించిన అనుభవాన్ని,పొందిన తాత్త్విక సారాన్ని దేశానికి అన్వయం చేసుకుంటూ అంకితమయ్యారు.అందుకే,ప్రతి క్లిష్ట సమయంలో దేశానికి అండగా నిలిచారు. క్లిష్ట సమయంలో దేశానికి అండగా.. చైనా,పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేయాల్సిన అత్యంత క్లిష్టమైన సమయాల్లో,ప్రధాన మంత్రులకు అత్యద్భుతంగా మార్గనిర్దేశం చేశారు.ప్రపంచ తత్వశాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ ఆపోసన పట్టారు.భారతీయతను ఆణువణువునా నిలుపుకొన్నారు.బోధనలో,పరిపాలనలో ఆ అమృతకలశాలను పంచిపెట్టారు.ఎంత గొప్పగా మాట్లాడుతారో,అంత శ్రద్ధగా వింటారు. ఎంత బాగా రాస్తారో, అంత బాగా చదువుతారు.అందుకే ఆయనకు పాఠకుడి హృదయం,ప్రేక్షకుడి నాడి రెండూ తెలుసు. సర్వేపల్లివారి రచనలు,ఉపన్యాసాలు పరమ ఆకర్షణా శోభితాలు. యూనివర్సిటీలో క్లాస్‌లో 24నిముషాలసేపు మాత్రమే గంభీరంగా పాఠం చెప్పేవారు. అది ముగిసిన వెంటనే,సరదా కబుర్లు,ఛలోక్తులు విసిరి, విద్యార్థులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేవారు.24 నిముషాలకు మించి,ఏ విషయాన్నీమెదడు ఆసక్తిగా లోపలికి తీసుకోలేదని ఆయన సిద్ధాంతం. కేవలం 21 ఏళ్లకే... మానవ జీవ రసాయన చర్యలు,విద్యా మనస్తత్వశాస్త్రం (ఎడ్యుకేషనల్ సైకాలజీ) కూడా మధించినవాడు కాబట్టే,సర్వోన్నత ఉపాధ్యాయుడుగా ఖ్యాతి గడించారు.సర్వజన రంజిక ఉపన్యాసకుడిగా గొప్ప కీర్తినిఐశ్వర్యంగా పొందారు.ఆయన రాసిన'భారతీయ తత్త్వశాస్త్రం'ప్రపంచ పండితులకునిత్య పఠనీయ గ్రంథమైంది. ఈ సహజ ప్రతిభా భాస్వంతుడికి సాధన మరింత ప్రభను, ప్రభుత్వాన్ని చేకూర్చింది. కేవలం 21సంవత్సరాల వయస్సులోనే ఆచార్య పదవిని దక్కించుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్,అశుతోష్ ముఖర్జీ వంటి దిగ్దంతులు కలకత్తా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పమని స్వాగతించారు. మన ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ద్వితీయ వైస్ ఛాన్సలర్‌గా అలంకరించిన అద్వితీయుడు సర్వేపల్లి .హిరేన్ ముఖర్జీ,హుమయూన్ కబీర్ వంటి మేధాగ్రణులను ఆహ్వానించి, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పించారు. Rare Footage of our former President of India and World's renowned #philosopher Sarvepalli Radhakrishnan, when he visited Britain in 1963 ! A must watch ! Courtesy BFI & via Social Media #SarvepalliRadhakrishnan #TeachersDay pic.twitter.com/ZdB6GvZmjr — Sonmoni Borah IAS (@sonmonib5) September 6, 2020 ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే.. మేధావుల విలువ తెలిసిన మేధాగ్రణి.దేశ,విదేశాలలోని అన్ని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఆయన అసంఖ్యాకంగా ప్రసంగాలు చేసి అందరినీ అలరించారు. భారతీయ విద్యా విధానంలో ఉన్నతమైన సంస్కరణలు జరగాలని కలలుకన్న తొలితరం మేధావి.జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం నియమించిన ఆ కమిటీకి తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే సాగింది. విద్యార్థి దశలో కటిక పేదరికాన్ని అనుభవించారు. భోజనం చేయడానికి అరిటాకు కూడా కొనలేక,నేలను శుభ్రం చేసుకొని,భోజనం చేసిన సందర్భాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఉదంతం వింటే?హృదయం ద్రవించినా,జీవితాన్ని ఆయన పండించుకున్న తీరు ఆనందభాష్పాలు కురిపిస్తుంది,మెదడును కదిలిస్తుంది,గుండెను మరింత దృఢంగా మారుస్తుంది,కర్తవ్యం వైపు నడిపిస్తుంది.పేదవాడికికొండంత స్ఫూర్తిని అందిస్తుంది.డబ్బు విలువ,దేశం విలువ తెలిసినవాడు కనుక,రాష్ట్రపతి హోదాలో తనకు వచ్చే వేతనంలో కేవలం 25శాతం మాత్రమే తీసుకొని,మిగిలినది ప్రధానమంత్రి సహాయనిధికి తిరిగి ఇచ్చేవారు. "చదువది ఎంత కలిగిన..రసజ్ఞత ఇంచుక చాలకున్న..ఆ చదువు నిరర్ధకంబు...'' అన్నట్లు,జీవితాన్ని తెలుసుకోడానికి ఉపయోగపడని ఏ శాస్త్రమైనా నిరర్ధకమని ఆయన అభిప్రాయం.జీవితాన్ని అర్ధం చేసుకోడానికి తత్త్వం ఒక మార్గమన్నది ఆయన బోధన.వివేకం,తర్కం ఇమిడివున్న భారతీయ తాత్త్విక చింతనప్రపంచ తత్త్వశాస్త్రాలకే తలమానికమని చాటిచెప్పిన సర్వోన్నత ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణ. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
ఆదిభట్ల అంటే 'హరికథ'..'హరికథ' అంటే..
తెలుగు వారిని ఊరించి ఊగించి ఉప్పొంగించిన కళాస్వరూపాలలో అపురూపమైనది 'హరికథ'. ఈ కళాకేళికి అపూర్వమైన కీర్తిని కట్టబెట్టినవాడు ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల అంటే హరికథ - హరికథ అంటే ఆదిభట్ల. వీరికి పూర్వం కూడా హరికథ ఉంది,హరికథకులు ఉన్నారు. ఈ ప్రక్రియకు కొత్తరూపును, సరికొత్త ప్రాపును తెచ్చినవాడు కేవలం నారాయణదాసు. సంగీత సాహిత్య సార్వభౌముడుగా, లయబ్రహ్మగా ప్రసిద్ధుడు. 'హరికథా పితామహుడు'గా సుప్రసిద్ధుడు.'ఆటపాటల మేటి'గా అనంత వైభవశ్రీమంతుడు. ఆధునిక కాలంలో,తెలుగునేలపై ఇంతటి బహుముఖ ప్రతిభామూర్తి మరొకరు లేరనడం అతిశయోక్తికాదు. సామాన్యులను, అసామాన్యులను అనుపమానంగా మెప్పించి 'హరికథ'కు పట్టం కట్టిన ప్రతిభాశాలి.కేవలం తెలుగువారే కాదు,యావత్తు భారతీయులు,ఆంగ్లేయులు సైతం ఆయన ప్రజ్ఞకు మోకరిల్లారు. బహుకళా ప్రావీణ్యం,బహుభాషా ఆధిక్యం ఆదిభట్ల సొమ్ము."ఆధునిక కాలంలో నా దృష్టిలో దైవాంశ సంభూతులు ముగ్గురే ముగ్గురు. ఒకరు అసమాన దేహబల సంపన్నుడైన కోడి రామ్మూర్తి, ఇంకొకరు మారుత వేగ కవితా స్వరూపులైన కొప్పరపు కవులు, మరొకరు పంచముఖీ పరమేశ్వరుడైన ఆదిభట్ల నారాయణదాసు"..... అని 'కవి సమ్రాట్ ' విశ్వనాథ సత్యనారాయణ ఒక సమావేశంలో నారాయణదాసు శక్తి స్వరూపానికి అక్షరార్చన చేశారు. నారాయణదాసుపై అద్భుతమైన పరిశోధన చేసి డాక్టరేట్,గోల్డ్ మెడల్ తీసుకున్న డాక్టర్ గుండవరపు లక్ష్మీనారాయణ (గుంటూరు) ఈ విషయాన్ని ఆత్మీయుల దగ్గర చెబుతుండేవారు. కథాగానం చేస్తూ..ఏకకాలంలో శరీరంలోని ఐదు భాగాలతో ఐదు తాళలను మేళవించడం అతిమానుష శక్తిగా (సూపర్ హ్యూమన్ ) నాటి మహాకవి పండిత,క ళామూర్తులు నిలువెల్లా భజించారు. రెండు చేతులు,రెండు కాళ్ళు, తలతో అయుదు తాళాలకు దరువు వేసి చూపించే ఆ ప్రజ్ఞ ప్రపంచంలోనే ఎవ్వరికీ లేదు. అది అనితర సాధ్యం. ఇంతటి శక్తి కేవలం నారాయణదాసుకే వశమైంది. ఇది నభూతో ! న భవిష్యతి! గా పెద్దలందరూ నిర్ణయించారు. మహారాష్ట్రలో 'అభంగులు', తమిళనాడులో 'కాలక్షేపం', కర్ణాటకలో 'హరికథా కాలక్షేపం', మనకంటే కాస్త ముందుగా రూపుదిద్దుకున్నాయి. మనకు 'యక్షగానం ఉంది. ఉన్నప్పటికీ, హరికథకు - యక్షగానానికి కొన్ని పోలికలతో పాటు, కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. నారాయణదాసు చేతిలో 'తెలుగు హరికథ' సర్వాంగ సుందరంగా కొత్త రూపును దిద్దుకుంది, తీరు మార్చుకుంది, కొంగ్రొత్త వన్నెలు, వయ్యారాలు పోయింది. మరాఠా, తమిళ, కన్నడుల ప్రభావంతో, మన తెలుగుదేశంలో నారాయణదాసు కంటే ముందు కొందరు హరికథా ప్రదర్శనలు చేశారు.' కథాగానం' మూలంగా రూపుదిద్దుకున్న ఈ కళ అత్యంత ప్రాచీనమైంది. మిగిలిన రాష్ట్రాలలో సంగీతం, సాహిత్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ కథాగానాలు సాగేవి. అందులో నృత్యం, అభినయం అనేవి ఉండేవి కావు. సంగీతం,కవిత్వం, నృత్యం, అభినయం, నాటకం పెనవేసుకున్న అపూర్వ సర్వ కళాస్వరూపం మన ఆదిభట్ల చేతుల్లో అవతారమెత్తిన 'హరికథా రూపం. హాస్య ప్రసంగాలు, పిట్టకథలు, విసుర్లు,చెణుకులు, చమత్కార భరితమైన చాటుపద్య మణిమంజరులతో,గజ్జెకట్టి, చిరు తాళాలు మోగిస్తూ... నారాయణదాసు హరికథా ప్రదర్శన చేస్తూంటే... కొన్ని వేలమంది ఒళ్ళు మరచి,ఆ రససముద్రంలో మునిగితేలేవారు. తెల్లవార్లూ సాగే ఆ ఆటపాటలతో అలిసిసొలసి పోయేవారు. ఆదిభట్ల వారి 'బేహాగ్' రాగ ప్రస్థానానికి 'విశ్వకవి' రవీంద్రనాథ్ ఠాగూర్ మంత్రముగ్ధుడైపోయారు. సర్వేపల్లి రాధాకృష్ణ, సరోజనీదేవి వంటి విజ్ఞులు,ప్రాజ్ఞులు ఎందరో ఆదిభట్లవారి ప్రజ్ఞకు నీరాజనాలు పట్టారు. విజయనగరంలో ఐదుతాళాలతో కథాగానం చేసి, దక్షిణాది పండితులను ఓడించి 'పంచముఖీ పరమేశ్వర' బిరుదును గెలుచున్న ఘనుడు ఆదిభట్ల. హరికథలే కాక, అష్టావధానాలు చేశారు. తెలుగు,సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లిష్, అరబ్బీ, పార్శీ మొదలైన అనేక భాషల్లో ప్రావీణ్యం ఆయన ఐశ్వర్యం. శతాధిక గ్రంథాలు రాశారు. సంగీతాన్ని - సాహిత్యాన్ని సమ ప్రతిభతో ప్రదర్శన చేశారు. అనేక అంశాలపై అపురూపమైన పరిశోధనలు చేశారు. సంగీతంపై లాక్షణిక గ్రంథాలు రాశారు. తాత్వికత సిద్ధాంతాల శాస్త్ర గ్రంథాలు రాశారు. హరికథలు, ప్రబంధాలు,శతకాలు, నాటకాలు,అనువాదాలు ఇలా అనంతముఖంగా ఆ రచనా విన్యాసం విజృంభించింది. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలను అనువాదం చేసిన తీరు అనన్య సామాన్యం.నాలుగు విధాలుగా ఆ అనువాదం సాగింది. పారశీలో నుంచి సంస్కృతంలోకి, అచ్చ తెలుగులోకి అనువాదం చేశారు. పీట్స్ జెరల్డ్ ఇంగ్లిష్ లో రాసిన దానిని కూడా అచ్చతెలుగు,సంస్కృతంలో భిన్న ఛందస్సుల్లో అనుసృజన చేసిన తీరు ఆదిభట్లకే చెల్లింది. 'నవరస తరంగిణి' అద్భుతమైన రచన.కాళిదాసు సంస్కృత కవిత్వం,షేక్స్ పియర్ ఇంగ్లిష్ సాహిత్యంలోని నవరసాలను తెలుగులో అనువదించిన వైనం అనితర సాధ్యం.'దశవిధ రాగ సవతి కుసుమ మంజరి' మరో మాణిక్యం. మంజరీ వృత్తంలో 90 రాగాలతో ఈ రచన సాగింది.ఋగ్వేదంలోని ఋక్కులను స్వరపరచి వీణపై వినిపించడమే కాక,ఎందరికో నేర్పించారు.ఆ ఋక్కులను తెలుగుగీతాలు గానూ సృష్టించాడు.ఆయన 'శంభో..' అంటూ నినాదం చేస్తూంటే.. విజయనగరం మొత్తం వినపడేది. కేవలం,ఆయన గురించే విజయనగరంలో సంగీత విద్యాలయాన్ని స్థాపించారు.దానికి ఆయనే మొట్టమొదటి ప్రిన్సిపాల్. నోబెల్ ప్రైజ్ కు నామినేట్ చేయడానికి బ్రిటిష్ వారు ఉత్సాహం చూపించినా, ఆయన సున్నితంగా తిరస్కరించారు.ఎన్నో రచనలు చేశారు.ఎన్నో వేషాలు వేశారు. 'అచ్చతెలుగు'పై మక్కువ ఎక్కువ పెంచుకొని విశిష్టమైన కృషి చేశారు, రచనలు అందించారు. నూరుగంట, మొక్కుబడి,వేల్పువంద,తల్లి విన్కి (లలితా సహస్ర నామం), వెన్నుని వేయిపేర్ల వినికరి (విష్ణు సహస్ర నామ కీర్తనం) మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అనేక అచ్చతెలుగు పదాలను సృష్టించారు. ఆయన ముట్టని కళ లేదు.ఆయనకు దక్కని బిరుదు సత్కారాలు లేవు.తెలుగునాట గజ్జెకట్టి కథ చెప్పే ప్రతి హరిదాసు మొట్టమొదటగా తలుచుకొనేది నారాయణదాసునే.సర్వ విద్యా పారంగతుడు,సర్వ కళాస్వరూపుడైన ఆయనకు గురువంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు.ఆన్నీ స్వయంగా సిద్ధించినవే.రససిద్ధిని చేకూర్చినవే.చెన్నపట్టణానికి చెందిన భాగవతార్ కుప్పుస్వామి నాయుడు విజయనగరంలో చెప్పిన హరికథ విని,నారాయణదాసు 'ధ్రువ చరిత్రం' అనే హరికథను రాశారు.అదే ఆదిభట్ల రచించిన మొట్టమొదటి కథ. సొంత కీర్తనలు,భాగవత పద్యాలు, పంచతంత్రకథలు కలిపి రూపకల్పన చేశారు. వేణుగోపాలస్వామి దేవాలయంలో 1883లో తొట్టతొలిగా ప్రదర్శన చేశారు. కాళ్ళకు గజ్జెకట్టి ఆడిన ఆ ఆటే తర్వాత ' ఆటపాటల మేటి'గా అనంతమైన కీర్తిశిఖరాలకు చేర్చింది. శ్రీకాకుళం జిల్లా ఉర్లాం సంస్థానంలో తొలిసారిగా సంగీత సాహిత్య సమలంకృతంగా 'అష్టావధానం' చేశారు. ఎవరో సవాల్ విసిరితే! రాత్రికి రాత్రి 'అంబరీషోపాఖ్యానం' హరికథను రూపొందించారు. అదంతా ధారణలో ఉంచుకొని, ఆ మర్నాడే అద్భుతంగా ప్రదర్శించి అందరినీ అమితాశ్చర్యపరచారు. అది కూడా ఉర్లాం సంస్థానంలోనే జరిగింది. ఇది ఆయన రూపొందించిన రెండో హరికథ. 20 ఏళ్ళ వయస్సు రాకముందే ప్రదర్శనలు ఇచ్చి, తెలుగు హరికథకు కొత్త రూపాన్ని ఇచ్చారు. ఆయన ఏకసంథాగ్రాహి. ఏదైనా కేవలం ఒక్కసారి వింటే,హృదయంలో నాటుకుపోయేది. చిన్నప్పటి నుంచీ అదే తీరు. నాలుగేళ్ల వయస్సులోనే భాగవత పద్యాలు చదివేవాడు. పద్నాలుగేళ్ళ వయస్సు వరకూ స్కూల్ ముఖమే చూడలేదు. కొన్ని వందల పద్యాలు, శ్లోకాలు,కీర్తనలు కేవలం విని హృదయస్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఎఫ్ ఏ పాసయ్యారు. పదేళ్ల ప్రాయంలోనే తాళపత్ర రచనలో ప్రావీణ్యం పొందారు. వీణావాదనా ప్రజ్ఞ కూడా సహజ ప్రతిభా సంస్కారాలతోనే అబ్బింది. బొబ్బిలి సంస్థాన విద్వాంసుడు వాసా సాంబయ్య దగ్గర కేవలం ఒక నెలరోజుల పాటు వీణలో శిష్యరికం చేశారు. తదనంతర జీవితంలో ఎందరో పెద్దలతో పరిచయ భాగ్యం ఏర్పడింది. వారి నుంచి అనేక విశేషాలు, మెళుకువలను తన సూక్ష్మగ్రాహ్య ప్రజ్ఞతో ఒంటపట్టించుకున్నారు. ఆ గానం,ఆ గాత్రం,ఆ ప్రదర్శనం,ఆ వ్యక్తిత్వం,ఆ వైభవం ఆన్నీ ముగ్ధమనోహరమైనవే.ఆయన ఆత్మకథ ' నా ఎరుక' పెను సంచలనం.తన ముప్పైఏళ్ళ వరకూ జీవితంలో సాగిన విశేషాలన్నీ అందులో ఉంటాయి.తన విలాస పురుషత్వం,రసికత్వం ఆన్నీ అక్షరబద్ధం చేశారు. ఏ అనుభవాన్నీ దాచిపెట్టని తెగువ ఆయనకే చెల్లింది. ఆయన జీవితమే ఒక ప్రభంజనం. ఆగష్టు 31 ఆదిభట్లవారి జయంతి.యఎనిమిది పదుల సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన పరిపూర్ణుడు (1864-1945). సూర్యనారాయణ నుంచి నారాయణదాసుగా మహా అవతారమూర్తిగా వాసికెక్కిన ప్రతిభామూర్తి. ఈ హరికథా పితామహుడు మన తెలుగువాడు. సర్వ కళలకు రేడు. మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: భాషోద్యమంలో పిడుగు గిడుగు!) -
భాషోద్యమంలో పిడుగు గిడుగు!
"దేహబలమున కోడి రామమూర్తి- బుధ్ధిబలమున గిడుగు రామమూర్తి" అంటూ అభివర్ణించిన ఓ కవి మాటలు ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నాయి. నేడే (ఆగష్టు 29) గిడుగు వెంకటరామమూర్తి జయంతి. ఆ మహనీయుని యశఃకాయానికి 160 ఏళ్ళు నిండుతున్న పండుగ వేళలో మనమున్నాం.ఇప్పటికే వారోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి.ప్రతి ఆగస్టు 29వ తేదీ గిడుగు స్మృతికి నివాళిగా 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకోవడం ఎప్పటి నుంచో సాగుతోంది. సరే! కొందరు మొక్కుబడిగా చేస్తారు. మరికొందరు భాషానురక్తితో మొక్కుగా భక్తితో చేస్తారు. ఈరోజు మనం రాసే భాష వెనకాల ఆయన స్వేదం ఉంది. నిత్యం తలచుకోవాల్సిన మాననీయుడు గిడుగు. తెలుగు వెలుగు గిడుగు ఆధునిక తెలుగు మానవుడు ఎలా చదవాలి, ఎలా రాయాలి,ఎలా అర్ధం చేసుకోవాలి,భాషామయమైన ప్రయాణం ఎలా చెయ్యాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు. ఈరోజు మనం రాసే భాష,చదివే భాష,పుస్తకాల్లో,పత్రికల్లో, ఉపన్యాసాల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న భాష,మనల్ని కదిలిస్తున్న భాష గిడుగు చేసిన త్యాగాలు,వేసిన మూలాల ఫలమేనని విశ్వసించాలి. గిడుగు వెంకటరామమూర్తి ఎప్పుడో 160ఏళ్ళ నాటి వాడు. ఎటు చూసినా పండితులు, కవులు, వారికి మాత్రమే అర్ధమయ్యే గ్రాంథిక భాషామయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగినవాడు. ఈ విధానం ఇదే రీతిలో సాగితే, సామాన్యుడికి ఆ జ్ఞాన ఫలాలు ఎప్పుడు అందాలి,భాష ఎప్పుడు వికాసం చెందాలి, జనబాహుళ్యం ఆ భాషకు ఎన్నడు దగ్గరవ్వాలని మదనపడి మనకోసం అలోచించిన మనమనీషి. Warm wishes on #TeluguLanguage Day! The KMC team pays homage to Gidugu Venkata Ramamurthy, whose ideas and literary work for social reform endure, leaving an indelible mark on generations. pic.twitter.com/bnErRj3wmV — Commissioner Kadapa (@KadapaComsr) August 29, 2023 ఆధునిక భాషా మహోద్యమంలో తొలి అడుగు వేసినవాడు గిడుగు. భాషాసాహిత్యాలు,చరిత్ర పుష్కలంగా,క్షుణ్ణంగా చదువుకొని,ముందుగా తను జ్ఞాన స్వరూపుడిగా తయారై, సామాన్యుడి చెంతకు భాషను చేర్చాలని రంగంలోకి దిగిన చిచ్చరపిడుగు గిడుగు. ఇటు వ్యావహారిక భాష - అటు సవర భాష కోసం జీవితమంతా అంకితమయ్యాడు. ఆరోగ్యం కోల్పోయాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. గిరిజనులను ఇంట్లోనే ఉంచుకొని భోజనం పెట్టి పాఠాలు చెప్పాడు. కొండలు కోనలు తిరిగి భాషను సామాన్యుడికి చేర్చిన అసామాన్యుడు గిడుగు. అందరికీ అర్ధమవ్వాలానే తపన తప్ప,గ్రాంథిక భాషను ఎన్నడూ వ్యతిరేకించలేదు. పద్యాలను, కావ్యాలను, వ్యాకరణాలను,ఛందస్సును పండితులను,కవులను ఎప్పుడూ తూలనాడలేదు.సంప్రదాయమైన సర్వ వ్యవస్థలనూ గౌరవించి, అధ్యయనం చేసి, భవ్య మార్గాన్ని పట్టిన నవ్య ప్రయోగశీలి గిడుగు వెంకటరామమూర్తి. అడవుల్లో జీవించేవారు మాట్లాడుకునే 'సవర' భాషకు వ్యాకరణం రూపకల్పన చేసి, శాస్త్రీయత తీసుకువచ్చిన ఘనుడు. అధ్యాపకుడిగా, జ్ఞాన సముపార్జన కోసం విద్యార్థులు పడే కష్టాన్ని అర్ధం చేసుకున్నాడు. తమ భావాలకు అక్షరరూపం ఇవ్వడానికి సామాన్యులు పడే తపనను తెలుసుకున్నాడు. గ్రాంథిక భాషా బంధనాల నుంచి విద్యా విధానాన్ని తెంచి, ప్రజలభాషలోకి తెచ్చాడు.దాని వల్ల చదివేవారి సంఖ్య,చదువరుల సంఖ్య పెరిగింది.తద్వారా, తెలుగునేలపై అక్షరాస్యత పెరిగింది. ఆలోచన పెరిగింది. ఆలోచనను వ్యక్తీకరించే శక్తి పెరిగింది.వాడుకభాష అవసరాన్ని చెబుతూ వీధివీధులా తిరిగాడు. The Governor said the Telugu Language Day marks the birth anniversary of eminent Telugu linguist, poet and visionary Sri Gidugu Venkata Ramamurthy.#Telugulanguageday #giduguvenkataramamurthy — governorap (@governorap) August 29, 2023 పండితులతో గొడవలు పడ్డాడు. ఇంటినే బడిగా మార్చాడు. సొంతంగా 'తెలుగు' అనే పేరుతో ఒక పత్రికను నడిపాడు. గురజాడ,కందుకూరి వీరేశిలింగం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి,తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి,పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైనవారు గిడుగుకు అండగా నిలిచారు.ఆయనతోకలిసి, వాడుకభాషా ఉద్యమంలో నడిచారు. బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియొ చెల్లకో, జండాపై కపిరాజు, అలుగుటయే ఎరుంగని మొదలైన వాడుక భాషా పదాలతో తిరుపతి వేంకటకవులు 'పాండవ ఉద్యోగ విజయాలు' పేరుతో పద్యనాటకాలు రాయడానికి ప్రేరకుడు గిడుగు. దానికి కారకుడు,పోషకుడు పోలవరం జమీందారు రాజా కొచ్చెర్లకోట వెంకటకృష్ణారావు. వాడుకభాష కోసం ఉద్యమించే గిడుగు వ్యాకరణానికి,ఛందస్సుకు ఎవరైనా గౌరవం ఇవ్వకపోయినా, వ్యాకరణపరమైన తప్పులు జరిగినా ఊరుకునేవాడు కాడు. ఎంతటి పండితుడినైనా చీల్చి చెండాడేవాడు. మీసాలపై తిరుపతి వేంకటకవులు చెప్పిన పద్యం తెలుగులోకంలో సుప్రసిద్ధం. మీసం పెంచడం సంగతి తర్వాత... ముందు..ఆ పద్యంలో ఉన్న దోషం సంగతి చూడు...అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి గిడుగు మొట్టికాయలు వేశాడు. గెల్చితిరేని అని ఉండాలి.నువ్వు గెల్చిరేని అని రాశావు,ఇది తప్పు,సరిదిద్దుకో... అంటూ తిరుపతి వేంకటకవులను నిలదీశాడు. ఆమ్మో! గిడుగు పిడుగే అంటూ చెళ్ళపిళ్ళ సర్దుకున్నాడు. #TeluguLanguageDay Gidugu Venkata Ramamurthy, born on 29 August 1863, was a Telugu writer and one of the earliest modern #Telugu linguists and social visionaries during the British rule. He championed the cause of using a #language comprehensible to the common man #philately pic.twitter.com/15sG2jw4Q1 — South India Philatelists' Association, Chennai (@SIPA_chennai) August 29, 2023 అంతటితో ఆగక 'గిడుగు పిడుగే' అని ప్రత్యేక వ్యాసం కూడా రాశాడు. 'పాండవ ఉద్యోగవిజయాలు' వంటి పద్యకృతులతో పాటు,చెళ్ళపిళ్ళ ఎన్నో వచన రచనలు చేశారు. ఇవన్నీ వ్యావహారిక భాషలోనే రాశారు. ఇలా,తిరుపతి వేంకటకవుల వంటి సంప్రదాయ పద్యకవులను కూడా వాడుక భాషవైపు మళ్లించిన ఘటికుడు గిడుగు. ముఖ్యంగా చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి ఆ బాటలో నడిచారు. స్వయంకృషితో శాసనాల భాషను అర్ధం చేసుకోవడం నేర్చుకున్న పట్టుదల గిడుగు సొంతం.ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు పర్లాకిమిడి వంటి తెలుగుప్రాంతాలు కూడా ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్లిపోయాయి. ఈ విధానాన్ని గిడుగు తీవ్రంగా వ్యతిరేకించడమేకాక, తెలుగునేలపైనే జీవించాలనే సంకల్పంతో,తన సొంతవూరు పర్లాకిమిడిని వదిలి రాజమండ్రికి తరలి వచ్చేశాడు. గిడుగుకు తెలుగుభాష,గాలి,నేలపై ఉండే భక్తికి,ప్రేమకు అది గొప్ప ఉదాహరణ.1937లో తాపీ ధర్మారావు సంపాదకుడిగా 'జనవాణి'అనే పత్రికను స్థాపించారు.కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయడం మొదలుపెట్టారు.అదంతా కూడా గిడుగు ప్రభావమే.గిడుగు,గురజాడ ఇద్దరూ విజయనగరంలో సహాధ్యాయులు. ఇద్దరూ వాడుకభాషకోసం ఉద్యమించినవారే కావడం విశేషం. సంస్కృతం, ఇంగ్లిష్,చరిత్ర ముఖ్య విషయాలుగా గిడుగు బి.ఏ పూర్తి చేశారు. సంస్కృతం,ఇంగ్లిష్,తెలుగు బాగా చదువుకున్నారు. సామాన్యులకు అర్ధం కావడం కోసం తన భాషాపాండిత్యాన్ని కుదించుకొని,వాడుకభాషలో రచనలు చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజలను చైతన్య పరిచారు,జ్ఞానాన్ని సామాన్యుడి చెంతకు చేర్చారు. కావ్యాలను, ప్రబంధాలను,గ్రాంథికభాషను, అలంకారశాస్త్రాలను గౌరవిస్తూనే, ఆధునిక భాషాయానం చేసిన అత్యాధునికుడు,దార్శనికుడు, ఆదర్శప్రాయుడు గిడుగు. భాషను సామాన్యుడికి చేర్చమని చెప్పాడు కానీ,భాషాపాండిత్యాలు, అధ్యయనాల స్థాయిని దిగజార్చమని ఎప్పుడూ చెప్పలేదు. ఛందస్సు,వ్యాకరణం,పద్యాలు, ప్రబంధాలను వదిలివెయ్యమని గిడుగు ఏనాడూ అనలేదు. భాషకోసమే శ్రమించి,సామాన్యుడి కోసమే తపించి జీవించిన పుణ్యమూర్తి గిడుగు రామమూర్తి. విద్యార్థికి ప్రతి దశలో తెలుగు భాషను అందించాలి. కనీసం 10ఏళ్ళ వయస్సు వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.… pic.twitter.com/Ie0WoIsL0z — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2023 తెలుగుభాషా,సాహిత్యాలు చదువుకున్నవారికి ప్రోత్సాహంలో, ఉపాధిలో, ఉద్యోగాలలలో పెద్దపీట వెయ్యాలి. తెలుగు చదువుకున్నవారు ఆత్మన్యూనతకు గురయ్యే పరిస్థితులు కల్పించరాదు. 'పద్యం' మన ఆస్తి, 'అవధానం' మన సంతకం. ఆధునికత పేరుతో వ్యాకరణం, ఛందస్సులను దూరం చేస్తే? కొన్నాళ్ళకు మనవైన పద్యాలు, అవధానాలు కానరాకుండా పోతాయి. మన భాషా భవనాల పునాదులు కదిలిపోతాయి.మెల్లగా మనదైన సంస్కృతి మృగ్యమైపోతుంది. తెలుగును వెలిగించడం, ఆ వెలుగులో జీవించడమే గిడుగు వంటి తెలుగు వెలుగులకు మనమిచ్చే అచ్చమైన నివాళి. భాష,సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడమే నిజమైన వేడుక. మా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి! నేడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి) -
Telugu Language Day: గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి!
గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి వ్యవహారిక భాష అనగానే మన మదిలో మెదిలేది గిడుగు వేంకట రామమూర్తి పంతులు. నాలుగు దశాబ్దాలకు పైగా వ్యవహారిక భాషో ద్యమం కోసం గ్రాంథిక వాదులతో అలు పెరగని పోరాటం చేశారు. వారు సలిపిన భాషోద్యమం అచ్చంగా అభ్యుదయ సమాజం కోసమే అని చెప్పాలి. నోటి మాటకు, చేతిరాతకు సంధానం కుదిరినప్పుడే భాష పోషకంగా ఉంటుందని భావించారు. పండితులకే పరిమితమైన భాషను, కొద్దిమంది మాత్రమే చదువుకునే వెసులుబాటు ఉన్న విద్యను సామాన్య ప్రజలందరికీ అందుబాటు లోకి తేవాలని ఆయన పరితపించారు. శిష్ట వ్యవహారిక భాషకు పట్టం కట్టినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన సంప్రదాయ భాషా వాదులపై సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే సంప్రదాయ భాషా వాదులు ఆయన వాదనను బలంగా తిరస్కరించారు, అయినా గిడుగు వారు ఉద్యమించారు. ప్రజల భావాలకు అనుగుణంగా భాష ఉండాలనీ, వాళ్ళ భావాలను అందరికీ అర్థ మయ్యే రీతిలో రాయగలగాలనీ, అందుకే వాడుక భాష చాలా అవసరం అని గిడుగు వారు వాదించారు. సంప్రదాయ సాహిత్య వాదులు, కవులు అయిన తిరుపతి వేంకట కవులు కూడా భాషలో మార్పుల్ని సమర్థించారు. ప్రారంభంలో కందు కూరి వారు సంప్రదాయ సాహిత్య పక్షాన నిలి చినా తదనంతరం గిడుగు వారి ఉద్యమ దీక్షలో సత్యాన్ని గ్రహించి ఆయన కూడా వ్యవహారిక భాషోద్యమానికి బాసటగా నిలిచారు. ఫలితంగా గిడుగు వారి ఉద్యమం మరింత బలపడింది. గురజాడ, గిడుగు ఇద్దరూ అభ్యుదయవాదులు మాత్రమే కాదు, అద్భుతమైన భావజాలాలను కలబోసుకున్న మిత్రులు. విజయనగరంలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఎంతో కష్టపడి సవరభాష నేర్చుకొని అదే భాషలో పుస్తకాలు రాసి, సొంతడబ్బుతో బడులు ఏర్పాటు చేసి, సవరలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు గిడుగు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో ‘రావు బహదూర్‘ బిరుదు ఇచ్చారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్నీ, 1936లో ‘సవర–ఇంగ్లీషు కోశా’న్నీ తయారు చేశారు. ప్రభుత్వం ఆయనకు ‘కైజర్–ఇ–హింద్’ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1919–20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాస పత్రిక నడిపారు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ సభలో నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేశారు గిడుగు. ‘సాహితీ సమితి’, ‘నవ్య సాహిత్య పరిషత్తు’ వంటి సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి. గిడుగు రామ మూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించారు. ఆ క్రమంలో విశ్వవిద్యాలయాలన్నీ వ్యవ హారిక భాషకు పట్టం కట్టడం ప్రారంభించాయి. కాగా మరోవైపు గిడుగు వారి అనుంగు శిష్యుడైన తాపీ ధర్మారావు సంపాదకీయాలతో ప్రారంభ మైన వ్యవహారిక భాష... పత్రికల్లోనూ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళానికి ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వ తాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు అలు పెరుగని వ్యవహారిక భాషోద్యమం చేస్తూ జనవరి 1940 జనవరి 22న కన్ను మూశారు. భాషను పరిపుష్టం చేయడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. భాషాభి మానులందరూ కూడా ఇందులో మమేకం కావాలి. తెలుగువారు తెలుగుతో పాటుగా ఇంగ్లీషు వంటి అంతర్జాతీయ భాషలలో పట్టు సాధించగలిగితే మన సాహిత్య అనువాదాలు ప్రపంచవ్యాప్తమవుతాయి తెలుగు వారు ఉన్నత స్థితిలో నిలిచినప్పుడు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా అదే స్థాయిలో నిలబెట్ట గలుగుతారన్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. అందుకే మనకోసం, మన పాలనావసరాల కోసం, ‘మన సంస్కృతి–సంప్రదాయాల కోసం, తెలుగు భాష... భవిష్యత్తు అవసరాల కోసం ఇంగ్లీష్ భాష’ అనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ నేపథ్యంలో భాషావాదులు కువిమర్శలు పట్టించు కోకుండా వాస్తవాలను గ్రహించగలిగితే, తెలుగు భాష అజంతం, అజరామరం అనేదానికి సార్థకత ఉంటుంది. ప్రపంచ పటంలో తెలుగు కీర్తి రెపరెప లాడుతుంది. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (చదవండి: ''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..'') -
Gidugu Rammurthy : భాష..భావాలకు వారధి
ఏయూ క్యాంపస్: భాష భావాలకు వారధి. భావాలను పలకించడం అమ్మ నుంచి అలవడుతుంది. అమ్మ నుంచి అబ్బిన భాష మనకు ఆధారంగా మారుతుంది. అమ్మ తొలి పలుకు బిడ్డలో ఆలోచనాశక్తికి ఆలంబనగా నిలుస్తూ పరిసరాలపై అవగాహన పెంచుతుంది. సమాజంపై అవగాహన పెంచడానికి, అనుబంధం పెనవేయడానికి అమ్మభాష ఉపకరిస్తుంది. ప్రపంచ భాషల్లో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న మన మాతృభాష తెలుగు. తెలుగు వారి ఆస్తి గిడుగు వాడుక భాష వ్యావహారిక భాష కావాలని పరితపించి, పోరాడి సాధించిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు, అందరికీ తెలుగు భాషను చేరువ చేయాలనే లక్ష్యంతో వ్యవహారిక తెలుగును వాడుకలోకి తెచ్చిన తొలి వ్యక్తి రామ్మూర్తి పంతులు. ఆయన జయంతి (ఆగస్టు 29)ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఆయన 1893 ఆగస్టు 29న పర్వతాలపేటలో జన్మించారు. గురజాడ వేంకట అప్పారావుకు సమకాలీకుడు గిడుగు. బీఏ పట్టా పుచ్చుకునే వరకు ఇద్దరూ కలిసి చదువుకున్నారు. సవరభాషపై ఉన్న ఆసక్తితో ఆ భాషను సైతం గిడుగు రామ్మూర్తి పంతులు నేర్చుకున్నారు. తొలి విభాగం భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రవిశ్వవిద్యాలయం తొలుత కేవలం నాలుగు కోర్సులతో మాత్రమే ఆరంభమైంది. 1926లో ప్రారంభమైన ఏయూలో తెలుగు, చరిత్ర, అర్ధశాస్త్రం, రాజనీతిశాస్త్రం కోర్సులను ప్రారంభించారు. తెలుగు భాషకు ప్రాధాన్యత కల్పిస్తూ తొలి ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్రవిశ్వవిద్యాలయానికి కాస్త భిన్నంగా ఆంధ్ర విశ్వకళా పరిషత్ అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగా తరువాత కాలంలో సంగీతం, నృత్యం, నాటకం వంటి కళలను సైతం దీనిలో భాగం చేశారు. నేటి పాలకులు మరింత ముందుచూపుతో ఆలోచన చేస్తూ డిజిటల్ రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసి, ఆడియో ఇంజినీరింగ్, ఫిల్మ్ ఎడిటింగ్ వంటి కోర్సులను అందిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు తెలుగు విభాగం విరాజిల్లుతోంది. ప్రస్తుత ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి ఇటీవల ఎయిడెడ్ కళాశాలల నుంచి అధ్యాపకులను తీసుకువచ్చి తెలుగు విభాగానికి పూర్వ వైభవాన్ని, జవసత్వాలను అందించారు. ఏయూకు పుస్తకాలు బహూకరించారు గిడుగు రామ్మూర్తి పంతులు తాను సేకరించిన, చదివిన అనేక పుస్తకాలను ఏయూలోని డాక్టర్ వీఎస్ కృష్ణ గ్రంథాలయానికి బహూకరించారు. నేటికీ ఈ పుస్తకాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. పద్మకాదంబరి, కుమారకంఠము, బాలదేవీభాగవతము, పార్వతీ పరిణయం, గిరిక పెండ్లి, భజనానంద తరంగిణి, మేజువాణీ, పెద్దాపుర సంస్థాన చరిత్రము, నాట్యోత్పలము, మాతృదేశ సంకీర్తనము, మణిమేఖల వంటి పుస్తకాలు ఏయూ గ్రంథాలయంలో భద్రపరిచారు. స్వాతంత్య్రానికి పూర్వం ముద్రించిన అనేక పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. -
Gidugu Rammurthy : తేట తెలుగు.. తేనెలొలుకు
విద్యానగర్/కరీంనగర్ కల్చరల్(కరీంనగర్): మనిషి జీవన విధానంలో ఆయువుపట్టు వంటిది మాతృభాష. అందులో జ్ఞానాన్ని పొందలేనివారిలో అభివృద్ధి తక్కువగా ఉంటుందని, వ్యక్తిత్వ వికాసం, మేధాపరమైన ప్రగతి మందగిస్తాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని, ఇటాలియన్ ఆప్ ద ఈస్ట్ అని ప్రశంసలందుకున్న తెలుగుకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ భాషలోని నుడికారాలు, సామెతలు, జాతీయాలు, లోకోక్తులు వేటికవే ప్రత్యేకం. అమ్మ భాషలోనే మన భావోద్వేగాలను హాయిగా వెల్లడించగలుగుతాం. తెలుగు భాష ఉన్నతి కోసం విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి(ఆగస్టు 29న) సందర్భంగా ఏటా ఈరోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. మాతృభాష తృణీకారం.. మాతృదేవి తిరస్కారంతో సమానం – సినీ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా.. చావవెందుకురా..! – ప్రజాకవి కాళోజీ ప్రాధాన్యత కోల్పోతున్న తెలుగు గిడుగు వెంకట రామ్మూర్తి కృషితో తెలుగుకు కొత్త వెలుగులు వచ్చినప్పటికీ పాలకుల నిర్వాకంతో అమ్మ భాష రోజురోజుకూ నిరాదరణకు గురవుతోంది. తెలుగులో రాయడం ఆత్మన్యూనతగా, ఆంగ్ల మాధ్యమంలో చదవడం నాగరికంగా మారిన కారణంగా సొంత గడ్డపైనే తెలుగు పరాయిదయిపోయింది. అధికార భాషగా తెలు గును అమలు చేయాలన్నది ఆచరణలో అంతంతమాత్రంగానే ఉంది. తెలుగు ప్రజల విజ్ఞప్తి మేరకు 2011లో కేంద్ర ప్రభుత్వం తెలుగును ప్రా చీన భాషగా ప్రకటించింది. తెలుగువారి ప్రస్తావ న మహాభారతం, బౌద్ధుల కాలంలోనూ ఉంది. తెలుగు మహాసభలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒక వేది కపై తీసుకువచ్చి, తెలుగు భాషా సంస్కృతి, చరి త్ర, కళలను తెలుసుకొని, స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టింది. 1975 నుంచి 2012 వరకు అప్పటి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 మే 2న తెలంగాణ సాహితీ అకాడమీ ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అదే ఏడాది అక్టోబర్‌లో తెలుగు మహాసభలు నిర్వహించారు. అప్పటినుంచి మళ్లీ వాటి ఊసే లేకుండా పోయింది. చిరస్మరణీయుడు.. గిడుగు గిడుగు చిరస్మరణీయుడు. ఆయన వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. విశ్వవిద్యాలయాల్లో వాడుక భాష రాజ్యమేలుతోంది. పత్రికలూ పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. – నంది శ్రీనివాస్, సాహితీ గౌతమి అధ్యక్షుడు కవులు చైతన్యం తీసుకురావాలి ఆంగ్ల భాష వ్యామోహంలో పడి, తెలుగు భాషను విస్మరిస్తున్నాం, ఉద్యోగ నియామకాల్లో తెలుగు మీడియంలో చదివినవారికే ప్రాధాన్యం ఇవ్వాలి. కోర్టు తీర్పులు తెలుగులో వెలువడేలా చూడాలి. కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలి. – దాస్యం సేనాధిపతి, ప్రముఖ కవి, విమర్శకుడు తెలుగులో సాంకేతిక విద్యనందించాలి ఆలోచనలను వ్యక్తపరిచే సాధనం అమ్మ భాష. నేడు తెలుగులో మాట్లాడటమే చిన్నతనంగా భావించడం బాధాకరం. సాంకేతిక విద్యను సైతం తెలుగు మీడియంలో అందించాలి. తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలి. – గాజుల రవీందర్, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మాతృభాష నేర్పించండి తెలుగు భాషను పరిరక్షించాలి. ప్రాథమిక చదువులు మాతృభాషలో కొనసాగితేనే ఆలోచన శక్తి, ప్రశ్నించేతత్వం విద్యార్థుల్లో పెరుగుతాయి. తల్లిదండ్రులు ఆంగ్లంపై ఉన్న వ్యామోహన్ని తగ్గించి, పిల్లలకు మాతృభాష నేర్పించాలి. – కేఎస్.అనంతాచార్య, సమైక్య సాహితీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పరిపాలనలో అమలు చేయాలి తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్ వర్తింపజేయాలి. వారికి పోత్సాహకాలు ఇవ్వాలి. పాలకులు పరిపాలనలో తెలుగును పక్కాగా అమలు చేయాలి. అందరం అమ్మ భాషకు పట్టం కడదాం. – మాడిశెట్టి గోపాల్, సమైక్య సాహితీ అధ్యక్షుడు, కరీంనగర్ కొత్త తరానికి అందించాలి భాషా నుడికారాలు, సాహిత్య సౌరభాలను కొత్త తరానికి అందించాలి. ప్రపంచీకరణతో మన భాషా సంస్కృతులను రక్షంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంగ్ల భాష వ్యామోహం నుంచి మాతృభాష వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. – కొత్త అనిల్‌కుమార్, తెలంగాణ రచయితల సంఘం, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు -
''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..''
పొద్దు మీకింది. మొగులు మీద చుక్కలు ఎల్లినయి. వాడకట్టుల దీపాలు ఎల్గినయి. ఎపటి తీర్గనే ఆనంద్ బాగ్ చౌరస్త కాడ్కి బోయిన. గాడ రవి పాన్ డబ్బ ఉన్నది. గది మాదోస్తుల అడ్డ.‘‘ఎలచ్చన్లు దగ్గర బడుతున్నయి. లీడర్లు ఏం జేస్తున్నరు?’’ అని సత్నారి అడిగిండు.‘‘ముందుగాల సర్వేలు జేపిచ్చిండ్రు’’ అని యాద్గిరిజెపిండు.‘‘సర్వేలు ఎందుకు?’’‘‘ఎవలకు ఎంత బలముందో ఎర్క జేస్కునేతందుకు.’’‘‘ఎర్క జోస్కోని ఏం జేస్తరు?’’‘‘ఎవ్వలికి ఎక్వ బలముంటె గాల్లకు ఎమ్మెల్యె టికిట్ఇస్తరు.’’‘‘టికిట్ రానోల్లు ఏం జేస్తరు?’’‘‘గోడ దుంకుతరు. లేకుంటె రెబల్ క్యాండిడేట్లుగ పోటి జేస్తరు.’’‘‘అన్ని పార్టిల లీడర్లు ఏం జేస్తరు?’’‘‘పాదయాత్రలు జేస్తరు. బస్సు యాత్రలు జేస్తరు.’’‘‘ఇంకేం జేసిండ్రు?’’‘‘పార్టీ కార్యకర్తలకు ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు.’’‘‘ఎవలితోని ఇపిచ్చిండ్రు?’’‘‘ముందుగాల బిచ్చపతి అనేటి బిచ్చగానితోని ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు. ‘ఒక్క పది రూపాయలు దానమియ్యి. దానమిస్తె పున్యమొస్తది. నీ పేరు జెప్పుకోని బత్కుత. నీ పెండ్లాం పిల్లలు సల్లగుంటరు అనుకుంట బిచ్చమడ్గాలె. బిచ్చమేసె దాంక సతాయించాలె. ఇండ్లల్ల అడుక్కునేటప్పుడు గింత బిర్యాని పెట్టమ్మా, సోర్వ ఎయ్యమ్మా అని పాడాలె. ధర్మతల్లీ! నాకు బిచ్చమేస్తె మీ ఇంటికి లచ్చిందేవొస్తది. నీ మొగని జీతం బెర్గుతది. నీ బిడ్డ పెండ్లి అయితది. నీ కొడ్కుకు కొల్వు దొర్కుతది. నీ మెడలకు బంగారి గొల్సు, నడ్ముకు వడ్డాన వొస్తయి. చేతులకు బంగారి గాజులు,చెవులకు కమ్మలొస్తయి. నీ మొగడు దినాం నిన్ను మోటర్ల దిప్పుతడు. అమెరిక గొంచబోతడు. రొండంత్రాల బంగ్ల గట్టిస్తడు. నువ్వు ఏం గావాలన్నాఇస్తడు. గింత ఉడుకుడు బువ్వెయ్యమ్మా! గింత కూర, మామిడి తొక్కు బెట్టమ్మా! గిలాసల జెరంత సల్లబొట్టు బొయ్యమ్మా అని అనాలె. బిచ్చం బెట్టెదాంక ఇంటి ముంగటనే ఉండాలె. ఇయ్యాల బిచ్చమడ్గొస్తె రేపు ఓట్లుఅడ్గుడు మీకు అల్కగైతది’అనుకుంట బిచ్చపతి పాటం జెపిండు.థియరీ క్లాసులైనంక ప్రాక్టికల్స్ షురువైనయి. చిన్గిన అంగి, పైంటును పార్టీ కార్యకర్తలు దొడుక్కున్నరు. ఒక చేత్ల బొచ్చె, ఇంకో చేత్ల కట్టె బట్టుకున్నరు. కొందరు గుడి మెట్ల మీద గూసోని బిచ్చమడిగిండ్రు. కొందరు రేల్టేషన్ల, బస్టాండ్లల్ల బిచ్చమడిగిండ్రు. కొందరు గుడ్డోల్లు, కుంటోల్ల లెక్క యాక్టింగ్ జేస్కుంట బిచ్చమడిగిండ్రు.పొద్దు మీకినంకగా దినం అడ్క తెచ్చినయి గాల్లు బిచ్చపతికి సూబెట్టిండ్రు. గవ్విటిని జూసి గాడు మార్కులేసిండు.’’‘‘ఇంకెవలితోని ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు?’’‘‘తిట్ల మీద పాటం జెపెటందుకు నర్సమ్మ అనేటామెను బిల్సిండ్రు. గామె తిట్లల్ల మషూర్. ముందుగాల తిట్టినంకనే గామె మాట్లాడ్తది. ‘నీ నోట్లె మన్నువడ. నీ ఇంట్ల పీన్గెల్ల. నీ దౌడల్ దగ్గర బడ. నీ తలపండు బల్గ. నీకు పిండం బెట్ట. నీ పెండ్లాం ముండమొయ్య. నీ ముక్కుల దూది బెట్ట. నీ చేత్ల జెష్ట మొల్వ. నీకు గజ్జి లెవ్వ. నీ యాపారం జెడ. నువ్వు ఆకల్తోని సావ. నువ్వు లంగవు. లఫంగవు.బట్టె బాజ్ గానివి. బద్మాష్వి. సన్నా సివి. దద్దమ్మవు. బేకార్గానివి. నక్కవు. గజ్జి కుక్కవు.పందివి. జిల్ల పుర్గువు. నీ కాల్లు చేతులిర్గ. నీకు గత్తర్ దల్గ’ అనుకుంట నర్సమ్మ తిట్ల దండకం సదివింది. తిట్ల దండకంను చపాయించి తలా ఒక కాపి ఇచ్చిండ్రు.’’‘‘ఇంకెవ్వరితోనైన ట్రేనింగ్ ఇపిచ్చిండ్రా?’’‘‘ఒక గూండాను బిలిసిండ్రు. మీటింగ్‌లను ఎట్ల చెడగొట్టాలెనో, సూటి జూసి కోడిగుడ్లు, టమాటలు, పాత చెప్పులు ఎట్ల ఎయ్యాలెనో గాడు నేరిచ్చిండు. ఒక బైరూపులోడు వొచ్చిండు. రంగు బూస్కోకుంటనే యేసాలు ఎట్ల ఎయ్యాలెనో జెపిండు.ఇంకొగాయిన వొచ్చిండు. ఏం లేకున్నా గంటలు,గంటలు ఎట్ల సీచ్ గొట్టాలెనో పాటాలు జెపిండు.’’గీ తీర్గ మా దోస్తులు మాట్లాడుకుండ్రు. -తెలిదేవర భానుమూర్తి, సీనియర్ జర్నలిస్ట్,99591 50491 -
'ఆ చిన్నచూపే ఆమె కళ్లలోని కలలను చిదిమేశాయని తెలుసుకో'
అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ వేర్వేరా? అంటే కశ్చితంగా కాదు అని చెప్పగలిగే ధైర్యం, సమానత్వం ఈ సమాజంలో ఉందా? ఆడవాళ్లకు దేశాన్ని పాలించే సత్తా ఉంది అని టీవీల్లో, పేపర్లో చూసి వాళ్లను మెచ్చకుంటారు..కానీ అలాంటి నైపుణ్యాలు ఉన్న ఆడపిల్ల నీ ఇంట్లోనూ ఉందని ఏనాడైనా తెలుసుకున్నావా? అబ్బాయిని పై చదువులకు పంపాలంటే ధూమ్‌ధామ్‌గా పంపే తల్లిదండ్రులు అమ్మాయిల చదువులకు మాత్రం ఆలోచిస్తున్నారు. ఆ డబ్బలన్నీ కట్నం కింద పోగేసి పెళ్లి చేసేస్తే పెద్ద బాధ్యత తీరిపోతుంది అనుకునేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఇది ఎంతకాలం? అమ్మాయి తల్లిదండ్రులు ఎప్పటికీ భయపడుతూ, భయపెడుతూ బతకాల్సిందేనా? నీ దృష్టిలో అబ్బాయే ఆదర్శనీయుడైతే, అమ్మాయి కూడా ఆధునికురాలే. మహిళ దేశాన్ని ఏలగలదు అనుకుంటావు. కానీ నీ కూతుర్ని మాత్రం ఇంకా ఆ పుక్కిడి పురాణాల్లోనే బంధిస్తున్నావు. నువ్వు కనీసం ఒక్కసారైనా ఇలా ఆలోచించలేదు.నువ్వుంటున్న ఆ గాఢాంధకారం వల్లే ఆమె ఇంకా వెలుగులను చూడలేకపోతుందని.ఒక్కసారి ఆ కళ్ళలోతుల్లోకి చూసే ప్రయత్నం చేశావా? నువ్వు చూసిన ఆ చిన్న చూపే ఆమె కళ్ళలో ఉన్న కలలను చిదిమేశాయని తెలుసుకో.తను ఒంటరై ఏడ్చిన ఆ కన్నీళ్ల బరువు తెలుసుకో.ఏ సమాజమైతే ఆమెను ఇన్నాళ్లు ఛీత్కరించిందో అదే హీన చూపు తనను ఇంకా అభద్రతా భావంలోకి నెట్టేసిందని తెలుసుకో.అయినా గతమంతా ఇదే కదా..అదే కథా!ఇప్పటికే ఆ చీత్కారాలే ఇంకా చెవుల్లో కర్ణకఠోరంగా మ్రోగుతూనే ఉన్నాయి. ఓ ప్రియ మిత్రమా.. ఇది నీకే ..ఇప్పటికీ నువ్వు పిశాచాల వేటకు బలికావలసిందేనా?నీ జీవితమంతా ఇతరులపై ఆధారపడడమేనా?కానీ వాళ్ళు నీ అసలు సిసలు నిర్వచనాన్ని ఎలా మరిచారు?బహుశా నీతో పోటీ పడలేమని వాళ్ల భయం కావచ్చు. అందుకే నీ లక్ష్యాలను అణచివేయాలని నిర్ణయించుకున్నారు కావచ్చు. వాళ్ళు ఎలా మరచిపోయారు నిన్ను చేరుకోవడం అసాధ్యం అని.ప్రేమను పంచడంలో ఒక అమ్మ స్థానాన్ని వేరెవరూ భర్తీ చేయలేరని.నిస్వార్థమైన ప్రేమను చూపే కూతురి సంతోషం ముందర ప్రపంచంలో ఉన్న మొత్తం ఆనందాలను తీసుకొచ్చినా సరిపోల్చలేమని.నీ కలల సామ్రాజ్యానికి నువ్వే మహారాణివైతే వేరెవరి విమర్శలు నీ స్థానాన్ని తగ్గించలేరని.. ఇంగ్లీష్ రచన -శ్రీయాన్షు, సెయింట్ ఆన్స్ స్కూల్,హైదరాబాద్ తెలుగు అనువాదం - శ్రీధర్ కందుకూరి, హైదరాబాద్ -
చందామామ శంకర్! పిల్లలకు మాత్రం బొమ్మల మామ!
చాలా ఏళ్ల క్రితం మాట. దారులు గూగుల్ ని పరవని రోజులు, మొబైళ్ళు ఊబర్ ని పిలవని కాలాలు. " పెరియ ఓవియ శంకర్ వీటిర్కు సెల్లుమ్ వలి?" అని అడుగుతూ అడుగుతూ మదరాసులోని చందమామ శంకర్ గారి ఇల్లు చేరుకున్నాము మిత్రుడు విజయవర్దన్ గారూ, నేనూను. దాదాపు నాలుగయిదు గంటలు ఆయనతో గడిపాము. ఇదంతా పన్నెండు సంవత్సరాల క్రితపు మాట . అప్పుడు ఆయన దాదాపు తొంబయ్ సంవత్సరాలకు దగ్గరగా ఉన్నారు. తొంబయ్ అనేది ఒక సంఖ్య మాత్రమే అంతులేని ఆయన ఉత్సాహానికి, ఆరోగ్యానికి తగిలించడానికి ఏ అంకె లేదు. మానవుడు మిల మిలా మెరిసిపోతున్నారు. ఆరోగ్యకరమైన బుర్ర ఉన్న వారి శరీర లక్షణమది. చందమామ, యువ, రామకృష్ణ ప్రభ పత్రికల్లో బొమ్మలు తప్పా ఈయన ది గ్రేట్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి శిష్యుడని, ఇంకా నూనుగుమీసాల ప్రాయంలో మహత్మా గాంధీ ఎదురుగా ఒక్కడు నిలబడి తగువుపెట్టుకున్నవాడని అప్పటికి తెలియనే తెలియదు. ఆ మిలాఖత్ అంతా మా ప్రెండ్ విజయ్ వర్దన్ గారు అప్పట్లో వీడియో ఎక్కించినట్లు కూడా గుర్తు నాకు. అది దొరికితే ఇంకా బావుణ్ణు. బోల్డన్ని కొత్త కబుర్లు వ్రాయవచ్చు. ఇప్పుడు చెప్పేదంతా, నా బుర్రలో మిగిలి ఉన్నా జ్ఞాపకాల గుర్తులే . చదువుకున్నదేమో పెయింటింగ్! జీవితాంతం రేఖా చిత్ర కళను గీచి దేశంలో ఉన్న అతి గొప్ప రేఖా చిత్రకారుల్లో ఒకడిగా నిలబడి చందమామ శంకర్ గా భారతదేశంలోని కొన్ని తరాల పిల్లలకు బొమ్మల మామ అయినవాడు. చందమామ శంకర్’ గారిని అడిగితే ఆర్టిస్ట్ చిత్రా గారికి కడుపులో అల్సర్ అయ్యిందని, దాని వల్ల ఆయన మరణం సంభవించిందని చెప్పినట్లు నాకు గుర్తు. అప్పుడంతా ఆయనని చూసిన ఆనందంలో ఉన్నాము కాబట్టి ఏం అడిగింది! ఏం అడగాలి, మేము అడిగినది, ఆయన చెప్పింది అంతా రాసి పెట్టుకోవాలి అని కూడా నాకేమి కోరిక లేదు. ఆయనని చూడటమే ఒక భాగ్యంగా అక్కడికి వెళ్ళాము. నాకు ఉన్న కొరిక అల్లా, శంకర్ గారు, అటువంటి గొప్ప గొప్ప మానవులను, ఆయన అభిమానులుగా మనమందరం సత్కరించుకొవాలి , వారికి ఆ సత్కారం గొప్ప మధురానుభవంగా జీవితాంతం గుర్తు ఉండేలా చేయాలనే వెర్రి అత్యాశ మాత్రమే. ఇక్కడ మనం అనేది కేవలం మాటకు మాత్రమే బహువచనం. ముందు దారులు వేసి మన నడకకు అడుగు మెత్తగా పరిచినవారిని గౌరవించుకోవాలనే సంస్కారం ఎప్పుడు ఎంతగా చూసినా నాకు ఇక్కడెవరూ కనపడలేదు. ఓపిక ఉన్నంత కాలం అటువంటి వ్యర్థ ప్రయత్నాలు చేసీ చేసీ ఇదిగో ఇప్పుడు ఇలా శుష్క వ్యాసాలు రాసుకునే స్థాయికి దిగింది జీవితం. ప్రాధమిక విద్య తరువాత బొమ్మలు నేర్చుకుందామని శంకర్ గారు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ప్రవేశం కోసం పరీక్ష కు హాజరయ్యారట. అక్కడ పెయింటింగ్ పరీక్షలో బొమ్మలు వేయడానికి తన దగ్గర సరైన సామాగ్రి లేక అక్కడే కాలేజీ ఆవరణ లో పడి ఉన్న పడి ఉన్న పాత ఎండి పోయిన కుంచెతో బొమ్మ వేశారట. ఆయన వేసిన బొమ్మ చూసి కాలేజీ ప్రిన్సిపల్ దేవి ప్రసాద్ రాయ్ చౌధురి గారి డంగై పోయి " ఉరేయ్ నాయనా, ఇది పెన్ అండ్ నైఫ్ టెక్నిక్, ఈ టెక్నిక్ లో బొమ్మలు వేసిన వాడికి తిరుగేముంది? ఇక్కడ చేరడానికి నీకు ఇక్కడ అడ్డం ఏముంది" అని కాలేజి లో సీట్ ఇచ్చేసారట. శంకర్ గారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా అంటారు " నాయానా! అది టెక్నిక్ కాదూ నా మొహమూ కాదు. బ్రష్ చివరలన్ని రాలి పోయి మొండి అయి పోయింది. అటువంటి దానితే గీస్తే ఎలా వస్తుందో అలానే గీశా నేను, అందులో నా ప్రతిభ ఏం లేదు, ఆ విషయం డి పి చౌధురి గారికి తెలీదు, నా భాగ్యం ఆయనవంటి గొప్ప గురువుదగ్గర చదువుకోడం" అంటూ చేతులెత్తి ఆకాశానికి దండం పెట్టుకున్నాడు. కాలేజిలో ఆయన చదువుకున్నది పెయింటింగ్. మరి ఇంత ప్రతిభావంతంగా లైన్ డ్రాయింగ్ ఎలా గీసారు అని అడిగిన మాటకు చందమామ లో చేరే వరకు రేఖ మీద సాధన చేసింది లేదు, అవసరార్థం అభ్యాసం చేసాను నా గీతకు గురువులు బర్న్ హోగార్త్, హాల్ ఫోస్టర్. బాపు గారి గురించి ఏమైనా చెప్పండి అని అడిగాను" ఆయన దర్శకుడుగా ఉండవలసిన అర్హతలు ఉన్న ఆర్టిస్ట్ బాబు, అలా అందరూ కాలేరు" మెచ్చుకోలుగా తల ఊపుతూ అన్నారు ఆయన. అదేంటో నాకు అర్థం కాలేదు. " మరి బాపు గారిని కలిసేవారా?" "లేదండి, కుటుంబరావు గారు ఆయన్నీ, మమ్మల్ని కలవనిచ్చేవారు కాదన్నాడు. బహుశా తెలుగు-తమిళ అనుకునే గొడవలు ఏమైనా వస్తాయని అనుకునే వారో ఏమిటో. బాపు ఎప్పుడు వచ్చే వారో ఎలా వెళ్ళేవారో తెలీదు. వచ్చి కుటుంబరావు గారిని కలిసి అలానే కనపడకుండా వేరే వైపు నుండి వెళ్ళిపోయేవారు. వడ్డాది పాపయ్య గారిని కూడా మాతో పాటు ఉండనిచ్చే వారు కాదు. ఆయనకు ఒక ప్రత్యేకమైన గది, ఆయన దగ్గర అవీ ఇవీ చేసి పెట్టడానికి ఒక కుర్రవాడు ఉండేవాడు. నాకు పాపయ్య గారు అంటే చాలా ఇష్టం ఉండేది కానీ కార్యాలయంలో స్నేహం కుదరలేదు. ఒక రోజు రోడ్డు మీద పాపయ్య గారు ఒక పుస్తకాల కొట్టు దగ్గర బయట తాడుకు వేలాడ గట్టిన పుస్తకాలు తిరగేస్తూ కనపడ్డారు. పుస్తకాలు కొనకుండా అలా తిరగేసి నలిపేస్తు ఉన్నాడని కొట్టువాడు ఆయన్ని విసుక్కుంటున్నాడు. ఆ కొట్టువాడు నాకు బాగా పరిచయస్తుడే, నేను గబా గబా అక్కడికి వెల్లి "ఒరేయ్ ఆయన ఎవరనుకున్నావురా? నువ్వూ, నీ కుటుంబం ఈ రోజు నాలుగు ముద్దల అన్నం తింటున్నారు అంటే ఆ మహానుభావుడు వేసిన బొమ్మల పుస్తకాలు అమ్ముడు పోతున్నందుకే. ఆయన వడ్డాది పాపయ్య" అని చెప్పి మందలించారట. ఆ షాపతను కొట్టు దిగి కిందికి వచ్చి పాపయ్య గారి కాళ్ళకు దండం పెట్టుకున్నాట్టా. ఇక ఎప్పుడు పాపయ్య గారు అటు వచ్చినా ఒక కుర్చీ వేసి కావలసిన పుస్తకాలు ఆయన ముందు ఉంచేవారని చెప్పుకుంటూ పోయారు. పాపయ్య గారికి చేపలు అంటే చాలా ఇష్టమని , ఇక్కడ మంచి చేపలు ఎక్కడ దొరుకుతాయని అడిగారట. శంకర్ గారు మద్రాసు పైన్ ఆర్ట్స్ కాలేజీలో చదివేటప్పుడే ఒకసారి గాంధి గారు మద్రాసుకు వచ్చారుట ఒక బహిరంగ సభ నిమిత్తం. ఈ బొమ్మలేసే కుర్రాళ్ళతో ఆయనకు పనిపడింది. వారు ఆ సభా ప్రాంగణాన్ని, ఆ మైదానాన్ని, ఆ గోడలను రంగులతో, రంగ వల్లులతో, తోరణాలతో తమ సమస్త చిత్రకళతో అలంకరించారు. పనంతా అయిపోయింది. ఈ చిత్రకళా రత్నాలకు గాంధి గారి ఆటోగ్రాఫ్ కావాలి. చిన్న దేహాలు ముక్కలు చెక్కలు చేసుకుని మరీ బాపు సేవకు అంకితం అయ్యారు కదా, "అదెంత పనర్రా పిల్లలూ రండ్రండి నా దగ్గరకు" అని బోసినవ్వుతో పిలుస్తారనుకున్నారు. సంతకం కోసం సందేశం తీసుకెళ్ళిన పెద్ద మనిషితో అన్నారుట. "నా సంతకం అయిదు రూపాయలు. అటు నోటు ఇచ్చి ఇటు దస్తఖత్ అందుకోవచ్చు" అని బాపు మాట. పిల్లలకు వళ్ళు మండింది. ఎండనక నీడనెరుగక ఇంత పని చేసాం కదా, మాకు ఇవ్వాల్సిందిపోయి పైగా మా దగ్గరే ఎదురు వసూలా? అని అన్నిరంగుల పిల్లలు ఒకే ఎర్ర రంగై పోయి నానా గోల చేస్తే " ఇలా గోల కూడదురా , మీలో మీ తరుపున ఎవరో ఒకరు రండి, పెద్దాయనతో మాట్లాడండి" అని కాలేజీ ప్రిన్సిపాల్ గారు నచ్చచెప్పారు. పిల్లల తరపున యువ నాయకుడు శంకర్. ఆటో ఇటో తేలిపోవాలి అనుకుంటూ గాంధీ గారి గదిలో చేరారుట. శంకర్ గారు ఇలా అన్నారు "లోపల ఆ గదిలో ఆ మధ్య కూచుని ఉన్నాడండీ మహాత్ముడు. పచ్చని శరీర ఛాయ, పోతపోసిన బంగారు విగ్రహం వంటి మనిషి . నా కోపం గీపం, మనిషిని ఎగిరెగిరి పడ్డం అదంతా ఎలా పోయిందో నాకు తెలీదు. చేతులు రెండూ ఒకటై ఆయనకు నిలువెల్లా దండం అవ్వడం మాత్రం ఎరుగుదును" గాంధి గారు ఆయనతో అన్నారుట. "బాబూ నేను మిమ్మల్ని డబ్బు ఆడిగానంటే నాకోసమనా? ఈ దేశానికి స్వాతంత్రం కావాలి ఆ ఉద్యమానికి ధనం అవసరం! ఆ ధనం కోసమని అమ్ముకోడానికి నాకు నేనే మార్గం" అంతా ఐపోయాకా నా బుద్ది తక్కువ బుర్రకు ఒక అనుమానం వచ్చి ఇలా అడిగా "మరే శంకర్ గారు, బాపు మహాత్ముడు పచ్చని పసిమి అయితే ఆ ఫోటోల్లో ఆలా నల్లగా ఉంటారే?" అని. " లేదు నాయనా ఆయన ఈశ్వరుడి సాక్షిగా పచ్చని మనిషి. కాంతులీనే దేహం" . తరువాత బల్బు వెలిగింది. మనం చూసిన గాంధి అల్లా , పాత ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫిల్ముల్లో, పాత పత్రికల్లోని తెలుపూ తెలుపూ ఫోటోగ్రాఫుల్లోనే కదా ఆ రెండు రంగుల ముద్రణ ముందు ఎర్రని ఎరుపయినా , పచ్చని పసిమయినా నలుపూ తెలుపేగా! పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన ఇంకో సంగతి శంకర్ గారి స్నేహితుడు ఒకాయన- పెద్ద స్థాయికి చేరుకున్న అధికారితో మాటా మాటా మాట్లాడుతూ శంకర్ గారు తన బొమ్మల జీవితం కన్నా తన మిత్రుడు ఆర్థికంగా చాలా బావున్నారని అసంతృప్తి వెల్లడిస్తే ఆయన ఒక విషయం చెప్పారట. తన ఉద్యోగ బాధ్యత నిమిత్తం ఈయన ఒక అతి మారుమూల గిరిజన ప్రాంతానికి వెళ్లవలసి వచ్చిందని కాకులూ, చీమలు చొరబడని ఒక పల్లె వంటి పల్లె లో ఆవులు కాచుకునే కుర్రాడొకడికి ఒక పుస్తకం ఎలా దొరికిందో తెలీదు కానీ దొరికిందట. వాడు ఆ పుస్తకాన్ని చెట్టు తొర్రలో దాచుకుని, అప్పుడప్పుడూ ఆ పుస్తకాన్ని తీసి అందులో ఉన్న బొమ్మలని చూసి మురిసి పోతున్నాడట. ఈయన వెళ్ళి చదువు రాని కుర్రవాడు ఆ పుస్తకం లో ఏమి చూసి అంత మైకం ఎక్కించుకుంటున్నాడు అని చూస్తే ఆ పుస్తకం పేరు చందమామ, పిల్లాడు మైకం ఎత్తించుకున్న ఆ బొమ్మల రేఖామాంత్రికుడు పేరు శంకర్. "నేను ప్రజల దృష్టిలో ఒక హోదా గల అధికారిని మాత్రమే, నువ్వు అలాంటి లక్షలాది పిల్లల మనసు తొర్రలలో ఆనందానివిరా శంకరా" అన్నాడని చెబుతూ ఎంత సంతోషపడ్డారో ఆ మహా చిత్రకారులు.(చదవండి: 'మా తెలుగు తల్లికి' రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు) నేను కలిసేనాటికి కనీసం ఆయనకు తొంబయ్ సంవత్సరాల వయసు. ఎంత లేదనుకున్నా అంతకు మునుపు డెబ్బయ్ సంవత్సరాలుగా బొమ్మలు వేస్తూ వస్తున్నారు. ఆయన బొమ్మల ఒరిజనళ్ళు చూద్దామని ఉంది. ఆయన మమ్మల్ని లోపలి గదిలో కి తీసుకెళ్ళారు. అక్కడ ఎప్పటిదో ఒక పాత బొమ్మ, కొండమీద తపస్సు చేసుకుంటున్న మహర్షి ఇంక్ డ్రాయింగ్ అది. చిక్కని రేఖలు, తిన్నని హేచింగ్, "ఈ బొమ్మ అనుకునట్టుగా కుదరలేదు నాయనా అందుకని పాడయి పోయిన ఈ బొమ్మ మాత్రము ఇక్కడ అట్టి పెట్టుకున్నా. వేసిన బొమ్మలన్నీ సంస్థకు ఇచ్చేశా" కర్మ యోగము అంటే ఏమిటో అర్థమయ్యింది. పని చేస్తున్నంత వరకే ఆయన ఒక చిత్రకారుడు. పని పూర్తయ్యాక ఆయన చిత్రకారుడు కాదు, ఆ పని ఆయనదీ కాదు. ఆయన మొహంలో ఉన్న కాంతికి అర్థం తను చేసిన పనిది కాదు. తను ఏమి అవునో తెలిసిన ఎరుకది. ఆయన పెక్కు శంకరులు. మేము ఆ రోజు కలిసింది ఆనాటి ఒక శంకరుడిని మాత్రమే, ఆ శంకరుడు ఎవరు అన్నది కాదు ప్రశ్న. అసలు నేను ఎవరిని. నన్ను నేను ఎన్ని రకాలుగా వదిలించుకుంటాను అన్నదే నేను వెతుక్కోవలసిన జవాబు. ఆ రోజు ఆ శంకరుడి సతీమణి గిరిజమ్మ చేతి కాఫీ తాగాము. ఎన్నదగిన భాగ్యము . మా మిత్రుడు విజయవర్దన్ గారు తన పాత కలెక్షన్ లోనుండి ఆ నాటి వీడియో వెతికి తీస్తే మరిన్ని మాటలు పంచుకోవచ్చు. ఏదో ఒక రోజు. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి -
Independence Day Song : తరం, తరం, నిరంతరం
దేశ స్వాతంత్య్రంలో సాహిత్యం పాత్ర మరువలేనిది. నిజానికి ఏ ఉద్యమం అయినా.. సాహిత్యంతో ప్రజలను జాగృతం చేస్తుంది. ఒక్కతాటిపైకి తెస్తుంది. అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాటలు, నినాదాలు, కవిత్వాలు, ప్రసంగాలు.. ఒకటేమిటి.. ఉద్యమ స్పూర్తిని పెల్లుబికెలా చేశారు మహానుభావులు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా యువతను మరింత బలోపేతం చేస్తూ, జాతి నిర్మాణ బాధ్యతను చక్కగా గుర్తు చేసే ప్రేరణ గీతాన్ని ప్రజల ముందుకు తెచ్చారు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. పాటకు సంగీతం, కూర్పు, గానం అందించారు సినీ గాయకులు రవివర్మ పోతేదార్. (సినీ గాయకులు రవివర్మ పోతేదార్) || పల్లవి || తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు జగతి కొరకు..., జాతి కొరకు..., జాగృతమవ్వాలి మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! || చరణం 1 || ఎగిసి పడే రక్తం మీరు ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు ఎగిసి పడే రక్తం మీరు ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు సునామీ కెరటం మీరు అరుణ సింధూర విజయ సౌరభం మీరు సునామీ కెరటం మీరు అరుణ సింధూర విజయ సౌరభం మీరు పాల సంద్రాన ఆదిశేషుని వేయిపడగల హోరు మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! || చరణం 2 || భయం తెలియని ధైర్యం మీరు భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు భయం తెలియని ధైర్యం మీరు భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు శంఖనాదం మీరు చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు శంఖనాదం మీరు చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు శిలయు మీరు, శిల్పి మీరు, చరితకెక్కే స్థపతి మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! ||తరం, తరం, నిరంతరం… || (రచన:డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి; 9848023090) -
ఘనంగా శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాషా సంస్థ అధ్యక్షులు పి. విజయబాబుగారు, సభ్యులు జి .రామచంద్రారెడ్డి గారు శంకరంబాడి సుందరాచారి గారి చిత్రపటానికి పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు విజయబాబుగారు మాట్లాడుతూ.. శంకరంబాడి సుందరాచారిగారు “ మా తెలుగు తల్లికి మల్లె పూదండ “ గీతంలో రాష్ట్రం నలుమూలలా ఉన్న విశేషాలను పొందుపరచి రాష్ట్ర వైభవాన్ని చాటారని, అంతేకాకుండా ఆధునిక ఆంధ్ర కవులలో అగ్రశ్రేణిలో నిలిచే శంకరంబాడి బుద్ధ గీత, అగ్నిపరీక్ష, గీతాంజలి వంటి రచనలతో పాటు సుందరభారతం, సుందర వాల్మీకి రామాయణము వంటి గొప్ప రచనలు అందించిన మహాకవి అనీ. తెలుగు జాతికి తేటగీతులలో అందించిన మధుర కవి అన్నారు. నటుడిగాను పత్రికారంగంలో ఉపసంపాదకుడిగా, సినీ గీత రచయితగా, అధ్యాపకుడిగా, వివిధ రంగాల్లో తన ప్రతిభాభాటలని పేర్కొన్నారు. శంకరంబాడి గారి నిరాడంబరత, ముక్కుసూటి తత్వం గురుంచి రామ చంద్రారెడ్డి గారు వివరించారు. శ్రీవారి భక్తులైన వీరు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుమల తిరుపతిలో జీవించారు. ప్రముఖులైన జ్ఞానపిఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ, రాళ్లపల్లి రాయప్రోలు, పుట్టపర్తి వంటి ప్రముఖలైన కవుల ప్రశంసలు అందుకున్నారు. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో వీరి రచనలకు తగిన ప్రోత్సాహం లభించింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యావేత్త, రచయిత్రి శృంగేరి శారద గారు మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వంటి ప్రముఖల సమక్షాన కవితలను వినిపించి ప్రశంసలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి శంకరంబాడి సుందరాచారి అని కొనియాడారు. (చదవండి: అరుదైన పత్రికా రచయిత తుర్లపాటి కుటుంబరావు) -
అరుదైన పత్రికా రచయిత తుర్లపాటి కుటుంబరావు
సాక్షి: జర్నలిజంలో పది, ఇరవై ఏళ్లపాటు కొనసాగడమే కష్టం. అలాగే జర్నలిస్టుగా జీవితం ఆరంభించి, కన్ను మూసే వరకు అదే వృత్తిలో ఉంటూ పత్రికలలో వ్యాసాలు రాయడం దాదాపు అసాధ్యం. అందరికీ ఆ అవకాశం లభించదు. అలాంటిది తుర్ల పాటి కుటుంబరావు డెబ్భై ఏళ్లపాటు జర్నలిస్టుగా కొనసాగగలిగారు. ఏభై ఏళ్లపాటు ‘వార్తలలో వ్యక్తి’ పేరుతో ఒక శీర్షిక నిర్వహించగలగడం గొప్ప విషయం. ఒక వ్యాస శీర్షికను ఏభై ఏళ్లు నడపమంటే తేలికైన పని కాదు. కాని తుర్లపాటి వల్ల అది సాధ్యపడింది. ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత ‘వార్త’ దినపత్రికలలో ‘వార్తలలోని వ్యక్తి’ కాలమ్‌ను నిర్వహించేవారు. ఇంత సుదీర్ఘ కాలం జర్నలిస్టుగా ఉండి ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకపోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. పాత్రికేయుడిగానే కాకుండా, ‘ఉపన్యాస కేసరి’ అని పిలిపించుకున్న ఏకైక జర్నలిస్ట్ తుర్ల పాటి. 18 వేల ప్రసంగాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డులలోకి ఎక్కారు. అదే సమయంలో పలు పుస్తకాలు రచించారు. ‘జాతి నిర్మాతలు’, ‘1857 విప్లవ వీరులు’ వంటి పలు పుస్తకాలు వీరు రచించినవే. ఆంధ్ర యూనివర్శిటీ నుంచి ‘కళా ప్రపూర్ణ’, ‘ముట్నూరి కృష్ణారావు అవార్డు', ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా ‘నేషనల్ సిటిజన్స్ అవార్డు’, అమెరికాలోని బయోగ్రాఫికల్ సంస్థ వారి ‘ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ వంటి అవార్డులు దక్కాయి. తుర్లపాటి కుటుంబరావు 1933 ఆగస్టు పదో తేదీన జన్మించారు. కృష్ణా జిల్లా గన్నవరం, విజయవాడల్లో చదువుకున్నారు. 14 ఏళ్ల వయసులోనే పత్రికా రంగంలోకి రావడం ఒక ప్రత్యేకత. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుకు చెందిన ‘ప్రజా పత్రిక’లో ఆయన చేరి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. 1959లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సహాయ సంపాదకుడిగా ఆరంభమైన ఆయన జర్నలిస్ట్ ప్రస్థానం జీవితాంతం కొనసాగింది. 18 మంది ముఖ్య మంత్రులతో ఆయనకు సంబంధాలు, మంచి పరిచయాలు ఉండేవి. అలాగే సినీ రంగంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తదితరులకు ఈయనంటే ఇష్టం. వారి గురించిన వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా రాశారు. వారికి బిరుదులు ఇచ్చి విజయవాడలో సత్కార, సన్మాన కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉదాహరణకు ఏఎన్నార్‌కు ‘నట సామ్రాట్’ అనే బిరుదును ఖాయం చేసి ప్రదానం చేసింది ఈయనే. ‘నంది’ అవార్డులను సినిమావారికి ప్రవేశపెట్టాలని కోరుతూ, అవి వచ్చేందుకు తుర్లపాటి విశేష కృషి చేశారు. జాతీయ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా, జ్యోతిచిత్ర సినిమా పత్రిక సంపాదకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీయ, సినీ రంగం రెండిటిలోనూ ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించగలగడం అందరికీ కుదరదు. సాహిత్య, సంగీతాభిలాషి అయిన ఆయన అభ్యుదయవాది కూడా. ప్రముఖ కూచిపూడి నర్తకి కృష్ణకుమారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలతోనే కాదు... పలువురు జాతీయ స్థాయి నాయకులతో కూడా ఆయన సంబంధాలు, ఉత్తరప్రత్యుత్తరాలు నెరపేవారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అంబేడ్కర్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటివారితో తరచు ఇంటరాక్ట్ అయ్యేవారు. ఇక ఇంది రాగాంధీ, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్, రాజీవ్ గాంధీ వంటి వారు ఏపీకి వచ్చినప్పుడు, వారి ఉపన్యాసాలకు అనువాదకులుగా ఉండేవారు. నెహ్రూపై ఉన్న అభిమానంతో ఆయన తన కుమారుడికి ఆ పేరే పెట్టుకోవడం విశేషం. ప్రేమ వివాహానికి గుర్తుగా కుటుంబ రావు తమ కుమార్తెకు ‘ప్రేమ జ్యోతి’ అని పేరు పెట్టారు. చతురోక్తులతో ప్రసంగాలు చేయడం ఆయన విశిష్టత. ఆయా సందర్భాలను బట్టి ఆయా ప్రముఖుల చరిత్రను, వర్తమానాన్ని కలిపి, జీవిత విశేషాలతో ఆ కాలమ్ రాసి పాఠకులను ఆకట్టుకునేవారు. ఇన్ని గొప్పదనాలు ఉన్నవి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. తెలుగు జర్న లిస్టులలో ఆ గౌరవం పొందింది ఈయన ఒక్కరే కావడం విశేషం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ (నేడు తుర్లపాటి కుటుంబరావు జయంతి) -
ఆగిన కోట్లాది గానం..! మూగబోయిన విప్లవ గొంతుక..!!
వరంగల్: ఎక్కడ అన్యాయం జరిగినా.. తనకే జరుగుతున్నట్లు అన్వయించుకుని.. అందుకు తగ్గట్టుగా పాటలు అల్లి.. తన దరువుతో ఉర్రూతలూగించిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. ఆయన ఇక లేరనే వార్త విన్న ఉమ్మడి వరంగల్ కళాకారులు, కవులు, రచయితలు, ప్రజలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆటపాటలతో ఉద్యమాలను రగిల్చిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు.. ఓరుగల్లుతో విడదీయరాని అనుబంధం ఉంది. తన గళంతో మేధావులు, భూస్వాముల బిడ్డలను సైతం సాయుధ పోరాటం వైపు ఆకర్షితులను చేశారు. అనేక మందిని పీపుల్స్ ఆర్మీగా తయారుచేశారు. ఇప్పుడా పాట మూగబోయింది. పీపుల్స్‌వార్(మావోయిస్టు) పార్టీ కీలక ఘట్టాలకు వేదికై న ఓరుగల్లులో.. గద్దర్ ఉద్యమ ప్రస్థానం ఇలా.. కారంచేడు దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ గద్దర్ చేపట్టిన ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఉద్యమకారులు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. ► 1979 నుంచి 1983 వరకు చాపకింద నీరులా కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ వ్యాప్తి క్రమంలో జనగామ జిల్లాలో మేథావి, విద్యార్థి, ప్రజాకవులతో ప్రజాగాయకుడిగా సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జన నాట్యమండలి రాష్ట్ర సారధిగా గద్దర్ వ్యవహరించడంతో జిల్లా నుంచే అత్యధిక కళాకారుల చేరారు. ► 1989 : పీపుల్స్‌వార్ పార్టీకీ అప్పటి సీఎం చెన్నారెడ్డి లీగల్ పీరియడ్ ఇచ్చారు. దీంతో తొలుత జనగామలోనే గద్దర్ బహిరంగ సభ నిర్వహించి ప్రజాసమస్యల సాధనతోపాటు సమసమాజ స్థాపన లక్ష్యంగా పెద్దఎత్తున యువత చేరేలా తన ఆటాపాటలతో చైతన్యం కలిగించారు. ► 1997 : సెప్టెంబర్‌లో వరంగల్ డిక్లరేషన్ సదస్సుకు హాజరయ్యారు. ► 1999 : కరీంనగర్ కొయ్యూరు ఎన్కౌంటర్లో అశువులు బాసిన జనగామ జి ల్లా కడవెండికి చెందిన మావోయిస్టు ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్ అంత్యక్రియలకు ప్రభుత్వం నిర్భందాలను అధిగమించి వేలాది మంది నివాళురి్పంచేలా తన ఆటపాటలతో చైతన్య పరిచారు. మైదనా ప్రాంతంలో నక్సల్ పార్టీ ప్రభావం తగ్గిన క్రమంలో దొడ్డి కొమురయ్య స్వగ్రామం కడవెండిలో పలు సామాజిక ఉద్యమ పోరా టాల్లో పాల్గొనడం అనివార్యంగా మారింది. ► 2007 : మలివిడద తెలంగాణ సాధన ఉద్యమంలో జనగామ డివిజన్ పరిధి బైరాన్‌పల్లి నుంచి కడవెండి మీదుగా తెలంగాణ అమరుల దీపయాత్ర ప్రారంభించారు. మణుగూరు వద్ద గోదావరి నుంచి ప్రారంభమైన కళాకారుల శాంతియాత్ర అన్ని జిల్లాల్లో 24 రోజులపాటు సాగింది. ► 2008 మే 25, 2009 : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సమావేశంలో పాల్గొన్నారు. ► 2009 : వరంగల్ ప్రజాసంఘాలతో కలిసి తెలంగాణ ప్రజాఫ్రంట్, ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జిల్లా ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, కళాకారులతో కలిసి తెలంగాణ ఉద్యమంపై ధూంధాం నిర్వహించారు. ► 2010 : ప్రత్యేక తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని ఐదు రోజులు జిల్లాకు చెందిన ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, కళాకారులతో కాజీపేట, హనుమకొండ, వరంగల్‌లో పాదయాత్ర చేశారు. చివరిరోజు ఆజంజాహి మైదానంలో జరిగిన సభలో గద్దర్ తన పాట, ప్రసంగంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారు. ► 2010 అక్టోబర్ 6 : హనుమకొండ టీఎన్జీఓ భవన్లో జరిగిన వరంగల్ జిల్లా జేఏసీ స్టీరింగ్ సమావేశంలో గద్దర్ పాల్గొన్నారు. 2011 : బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లిలో అంబేడ్కర్ విగ్రహాన్ని గద్దర్ ఆవిష్కరించారు. రాష్ట్ర సాధనలో గద్దర్ తనదైన శైలిలో దీపారాధన, గీతారాధనతో కార్యక్రమం చేపట్టారు. ► 2012 : ‘ఓపెన్ కాస్ట్ హఠావో సింగరేణి బచావో’ నినాదంతో చేపట్టిన బొగ్గు గనుల సంరక్షణ ఉద్యమం సందర్భంగా ములుగులో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి వరకు ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ► 2022 జూన్ : గద్దర్ వరంగల్‌లో జరిగిన తెలంగాణ అమరవీరుల సంతాపసభలో పాల్గొన్నారు. -
గద్దర్ గళం... విప్లవ గానం
కరీంనగర్/ కరీంనగర్‌కార్పొరేషన్/ తిమ్మాపూర్: ఉమ్మడి జిల్లాతో గద్దర్‌కు ఎనలేని బంధం ఉంది. హుస్నాబాద్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం మర్రి చెన్నారెడ్డి నక్సల్స్‌పై నిషేధం సడలించిన సమయంలో ఆమరవీ రుల స్తూపాన్ని ఆవిష్కరించడం ప్రధాన ఘ ట్టమని చెప్పవచ్చు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా రాజీనా మా చేసి 2006లో ఉపఎన్నికకు సిద్ధమైతే కళా కారులను, కవులను పోగు చేసి జిల్లాకేంద్రంలోని సర్కస్‌గ్రౌండ్‌లో తెలంగాణ ధూంధాం వేదికకు పురుడుపోసిన అగ్రగన్యుల్లో గద్దర్ ఒకరు. దళిత, సామాజిక, వామపక్ష, కుల,వర్గ పోరాటాల్లో గద్దర్ తన పాటలతో జనాన్ని జాగృతం చేసిన తీరును ఉమ్మడి జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. ఆర్ నారాయణమూర్తి భావోద్వేగం గద్దర్ మరణంపై నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఒక అన్నమయ్య పుట్టారు, దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు, దివంగతులయ్యారు. ఒక పాల్ రబ్సన్ పుట్టారు, దివంగతులయ్యారు. ఒక గద్దర్ పుట్టారు, దివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది' అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల జైత్రయాత్ర.. పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీల నిర్మాణా నికి ఊపిరులూదిన జగిత్యాల జైత్రయాత్రలో అప్పటి విప్లవ రఽథసారఽఽథులతో కలిసి గద్దర్ పాల్గొన్నారు. జననాట్య మండలి తరఫున గడీల్లో దొరల పాలన, వెట్టిచాకిరీ, భూస్వాముల ఆగడాలపై పాటతో ధ్వజమెత్తారు. సింగరేణి పరిరక్షణకు.. గద్దర్‌తో సింగరేణికి విడదీయరాని అనుబంధం ఉంది. సింగరేణి సంస్థ పరిరక్షణకు గోలేటి నుంచి కొత్తగూడెం వరకు చైతన్యయాత్ర నిర్వహించారు. సంస్థవ్యాప్తంగా గనులపై మీటింగ్‌లు నిర్వహించారు. ఏఐటీయూసీతో కలిసి సంస్థ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. మానేరుతీరం.. గద్దర్ పాట ప్రవాహం సిరిసిల్ల, వేములవాడలో సాగిన సాయుధ పో రాటంలో గద్దర్ పాట ప్రవాహమైంది. 1990 దశకంలో నిజామాబాద్‌లో జరిగిన అప్పటి పీపుల్స్‌వార్(మావోయిస్టు) పార్టీ బహిరంగ సభకు జిల్లా నుంచి వేలాది మంది యువకులు తరలివెళ్లారు. లారీలు, బస్సుల్లో తరలివెళ్లి గద్దర్ సభలో పాల్గొన్నారు. ఆ స్ఫూర్తితో వందలాది మంది యువకులు పీపుల్స్‌వార్ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. గద్దర్ గళంతోనే పోరుబాట స్వరాష్ట్ర సాధనలో ప్రతిఒక్కరూ పోరుబాట పట్టడానికి గద్దర్ గళమే కారణమని మేయర్ సునీల్‌రావు తెలిపారు. విప్లవోద్యమంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని గుర్తుచేశారు. ఎర్ర జెండాను ఎత్తి పీడిత ప్రజలను పోరుబాట పట్టించిన వ్యక్తి అన్నారు. గద్దర్ మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోటన్నారు. 1973 నుంచి పరిచయం 1973లో వేములవాడలో రైతుకూలీ సభలో పాల్గొనేందుకు జననాట్యమండలి గాయకుడిగా వచ్చిన గద్దర్‌తో పరి చయమైందని మాజీ ఎమ్మెల్సీ నారదా సు లక్ష్మణ్‌రావు అన్నారు. నాటి నుంచి నేటి వరకు అనేక సామాజిక, దళిత, తెలంగాణ మలిదశ ఉద్యమాలతో పా టు సాంస్కృతిక ఉద్యమాల్లో పాలుపంచుకున్నానని గుర్తు చేశారు. తీరని లోటు ప్రజా యుద్ధనౌక, జననాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం అణగారిన వర్గాలకు తీరని లోటన్నారు. 1978లో వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్(ఆర్ఈసీ)లో మొట్టమొదటిసారి తాను ఇంటర్ విద్యార్థిగా గద్దర్‌ను చూశానని తెలిపారు. అప్పుడు విద్యార్థులనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. పొడుస్తున్న పొద్దు అస్తమించింది ప్రజాగాయకులు గద్దర్ మరణం నమ్మలేకపోతున్నామని, పొడుస్తున్న పొద్దు అస్తమించిందని, గర్జించే గొంతు మూగబోయిందని మానకొండూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. -
హాస్యం... సెంటిమెంట్ కలిస్తే... అది శ్రీరమణ!
శ్రీరమణ పేరు చెప్పగానే చాలాకాలం పాటు ఆయన హాస్యం, వ్యంగ్యం గుర్తుకు వచ్చేవి. హాస్యానికీ, వ్యంగ్యా నికీ చిరునామాగా ఆయన పేరే వినబడేదంటే అతిశ యోక్తి కాదు. తర్వాత సినీ రచయితగా, బాపు–రమ ణల అంతే వాసిగా ప్రసిద్ధు లయ్యారు. ‘బంగారు మురుగు’ కథ తర్వాత నుంచి ఆయనకు గొప్ప కథకుడిగా పేరు వచ్చింది. హాస్యమూ, వ్యంగ్యమూ మాత్రమే కాదు, సెంటిమెంటు కూడా అంతే గొప్పగా పండించ గలడన్న సంగతి పాఠక లోకానికి విదితమైంది. ఇక ‘మిథునం’తో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఏ వృద్ధ దంపతులను చూసినా ‘మిథునం’ గుర్తుకు వచ్చేటంతగా ఆయన పాఠకుల హదయాలపై ముద్ర వేసేశారు. ముసిముసి నవ్వులు పూయించే వికటకవే కాదు, గుండెను తట్టి మనసు పొరల్లో తడి స్రవింపచేసే కవీ తనలో ఉన్నాడని నిరూపించుకున్నారు. హాస్య ప్రక్రియల్లో అన్నిటికన్న క్లిష్టమైనది ప్యారడీ రచన. దానికి ఎంతో అధ్యయనం, పరిశీలన కావాలి. రచయిత రచనాశైలిలో ఉన్న ప్రత్యేకత ఏమిటో పట్టుకోగలగాలి. దాన్ని తరచుగా వాడడాన్ని గమనించి, దాన్ని ఎత్తి చూపితే నవ్వు పుట్టించే అవకాశం ఉందని గ్రహించాలి. దాన్ని ఉత్ప్రేక్షించి, ఆ అవకరాన్ని సామాన్య పాఠకుడి దృష్టికి తీసుకుని రాగల రచనాకౌశలం ఉండాలి. శ్రీరమణ ఆధునిక వచన రచయితలలో ప్రముఖులందరినీ ప్యారడీ చేశారు. వచనాన్ని ప్యారడీ చేయటం అంత సులభం కాదు. వారి మూలరచనలు చదివినవారికే ఆ ప్యార డీలలో స్వారస్యం బోధపడుతుంది. శ్రీరమణ ఆ సాహిత్యాలన్నీ చదివి ఒంటపట్టించుకున్న పండి తుడు, నిశిత పరిశీలన Výæల విమర్శకుడు, దానిలో వక్రతను పసిగట్ట గలిగిన రసజ్ఞుడు. వారిలో యింకో విశేష మేమిటంటే, ఈయన చేత చురకలు వేయించుకున్న వారు కూడా పగలబడి నవ్వేటంత సంస్కార యుతంగా రాయగలగడం! పాత్రికేయ ఉద్యోగానికే పరిమితమైతే ఆయన ఒక పరిధిని దాటలేక పోయే వారేమో! కానీ ఆయన మద్రాసు వెళ్లారు. బాపు – రమణలతో చేరారు. వారి సమస్త వ్యవహారాలూ ఈయన చూసే వారు. వారు సొంతానికైతీసిన సినిమాలలో, ఇతరులకు తీసి పెట్టిన సినిమాలలో ఈయన అనేక బాధ్యతలు నిర్వర్తించేవారు. వాళ్లు వెళ్లిన చోటకల్లా వెళుతూ వారిలో ఒకడిగా ఉన్నారు. దీని కారణంగా ఆయనకు ఎంతో విస్తృత ప్రపంచం దర్శనమైంది. ‘బంగారు మురుగు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించ బడినప్పుడు సంచలనాన్ని సృష్టించింది. దాదాపు 800 ఉత్తరాలు వచ్చాయట. ఇది మా బామ్మ కథే అని ఒకరు, కాదు కాదు... మా అమ్మమ్మ కథ అని మరొకరు... ఇలా అందరూ తమని తాము ఐడెంటిఫై చేసేసుకున్నారు. ‘మిథునం’ వెలువడే టప్పటికి అందరూ వారిలో తమ తలిదండ్రులను ఐడెంటిఫై చేసుకున్నారు. శ్రీరమణ పాత్రలు మన నిత్యజీవితంలో చూసేవే. షోడా నాయుడు, ధన లక్ష్మి... వీళ్లందరూ మన చుట్టూ ఉన్నవాళ్లే! ‘ధనలక్ష్మి’ కథలో ఆయన వ్రాసిన మాండలిక పదాలు, తెలుగు పలుకుబడులు, తెలుగువారికి దొరికే అరుదైన మృష్టాన్న భోజనం. కొన్ని వర్ణనలు క్రొంగొత్తగా అనిపించి అలరిస్తాయి. ఉదాహరణకు: ‘‘రోషం కమ్మేసిన అతని మొకం తుమ్మల్లో పొద్దుగూకి నట్లుంది.’’ ‘‘...చీమలకు చక్కెర దొర గ్గాలేంది, మనుషులం మనకు నాలుగు మెతుకులు దొరకవా...’’ ‘‘...పిండిమర మెళుకువలన్నీ ఇప్పుడు ధన మ్మకు కొట్టినపిండి...’’ ఇలాంటి చమక్కులెన్నో వారి రచనల్లో కనిపి స్తాయి. శ్రీరమణకు మొహమాటాలు తక్కువ, తెగువ ఎక్కువ. మతం పేరుతో చేసే అట్టహాసాలను వెక్కి రించడంలో దిట్ట. ఆచార వ్యవహారాల కంటె మాన వత్వానికే పెద్దపీట వేసే ‘బంగారు మురుగు’లో బామ్మ స్వాములారిని కడిగి పారేస్తూంటే మనకు లోపల్నుంచి సంతోషం తన్నుకు వస్తుంది. అలాగే ‘అరటిపువ్వు స్వాములా’రి పాత్ర ద్వారా కుహనా ప్రవచనకారులకు చాకిరేవు పెట్టేశారు. వారపత్రికా సంపాదకుడిగా ఆయన రాజకీయ నాయకుల గురించి కూడా నిర్భయంగా తూర్పార బట్టారు. నిజజీవితంలో కూడా ఆయన వ్యాఖ్యల్లో వెక్కిరింత, మాటల్లో వగరు మనల్ని తాకుతూనే ఉంటాయి. కానీ ఆయన విమర్శలో ఉన్న వాస్తవం మనల్ని ఆకట్టుకుంటుంది. నాకు బాపు–రమణలు అత్యంత ఆప్తులు. వారికి నేను వీరాభిమానిని. శ్రీరమణతో నాకు ఉన్నది పరిమిత పరిచయమే. కానీ వారి రచనలు చాలా ఇష్టంగా చదువుతాను. వారి రచనల ద్వారా, వారిలో ఉన్న హాస్యాన్ని పండించే శైలి ద్వారా సెంటిమెంట్ వ్రాయడంలో వారికున్న ప్రతిభ ద్వారా నాకు బాగా నచ్చిన, బాగా ఇష్టపడిన రచయితగా నా మనః పథంలో శాశ్వతంగా ఉండిపోతారు. అంతేకాకుండా నా ఆప్తమిత్రులు బాపు–రమణలకు అంతేవాసిగా కూడా నేను వారిని బాగా ఇష్టపడతాను. కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, వ్యాసకర్త వ్యవస్థాపక ఛైర్మన్,శాంతా బయోటెక్నిక్స్ -
నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? ..ఒక్కసారిగా గిర్రున కన్నీళ్లు..
నేను పదవతరగతిలో ఉన్నప్పుడో, ఇంటర్ మీడియట్ లో ఉన్నప్పుడో సరిగా గుర్తు లేదు కానీ ఆంధ్రజ్యోతి లో ఓక పుస్తక ప్రకటన వచ్చింది . నవోదయ పబ్లిషర్స్ వారిది. "శ్రీ రమణ రంగుల రాట్నం. చమత్కారాలు, మిరియాలు, అల్లం బెల్లం, మురబ్బాలూ" అని. అప్పటికి నాకు శ్రీరమణ ఎవరో తెలీదు. ముళ్ళపూడి వెంకట రమణే శ్రీరమణ అని అనుకునేవాడిని. నాకు బాపుగారు తెలుసు. బాపు గారు ఏ రమణకి బొమ్మవేసినా ఆ రమణ శ్రీముళ్ళపూడి రమణే అయి ఉంటారని ఒక లెక్క తెలుసు. నాకు ఆ పత్రికా ప్రకటనలోని అల్లం బెల్లం మురబ్బాలు కావాలి అనిపించింది. మా రఘుగాడి ధన సహకారంతో అనుకుంటా ఆ పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించుకున్నాను. అట్ట పైన, అట్ట లోపలా అంతటా ఎంత బావుంటుందో ఆ పుస్తకం. రమణ గారి రాతల చమత్కారం, బాపు గారి బొమ్మల మహధ్భాగ్యం. రీచర్చీ కాలర్లు, చేయి జారిన అదృష్టరేఖలు, కథలూ-కజ్జికాయలు, మెంతికూర చింతామణి, ఉత్తరగ్రహణం, మూడు ప్రింట్లు ఆరు ఆటలూ, విద్యాలయాల్లో పిడకల వేట, కిటికీ పక్క సీటు, పొట్టలో చుక్క, కార్తీకంలో కవిత్వ సమారాధన, గళ్ళ నుడికట్టు చీర ఇట్లా ఒకటా రెండా ఎన్నెన్నో శీర్షికల మకుటాలతో ఆ వ్యాసాలు చక్కిలిగింతల హాస్యాలు పలికాయి. మొన్నటికి మొన్న ఒకానొక రచయిత్రి గురించి అనుకుంటూ " ఈ రచయిత్రి పెట్టే చివరి సిరాచుక్క అంధ్ర సరస్వతి నొసట కస్తూరి చుక్క" అని ఎప్పుడు అవుతుందో కదా దేముడూ అని శ్రీరమణ భాషలో దండం పెట్టుకున్నా కూడా . పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో కొనుక్కున్న, చదువుకున్న శ్రీరమణ గారిని ఈ రోజుకూ చదువుకోవడం, వాటిని గుర్తుగా తలుచుకోవడం అనేది మన గొప్ప కాదు. శ్రీరమణ గారే అన్నట్టు "గింజకు జీవశక్తి ఉంటే అది ఎక్కడ పడేసినా పోదు" తెలుగు పాఠకుడికి బుర్ర ఉన్నంత కాలం అందులో జీవశక్తి ఉన్న గింజలు మాత్రమే బ్రతికి ఉంటాయి. శ్రీరమణ గారి నుడి ,ఆయన పలుకు అటువంటిది. అది పురాజన్మలో శ్రీ మహావిష్ణువు చేతి బంగారు మురుగు. కలం రూపం ధరించి, రమణ అనే కలం పేరు దాల్చి కొంతకాలం ఇక్కడికి వచ్చింది. ఈ రోజు అది వెనక్కి మరలి శ్రీహరి చేతినే చేరింది. నా ఇంటర్ మీడియట్ రోజులు, చదువు దినాలు గడిచి, అలా అలా నడిచి ఒకచోట వచ్చి నిలబడ్దాను. ఇదిగో ఇప్పుడు నేనున్న నా ఇంటి నుంచి రెండో మలుపు దగ్గర సరాసరి కాస్త డౌన్ దిగితే శ్రీరమణ గారి ఇల్లు. వారానికి రెండు మూడు సార్లు ఆయన్ని కలిసి బోలెడన్ని కబుర్లు గడిచేవి. ఫోన్ లో కాలక్షేపాలు నడిచేవి. వారి ఇంటికి వెళితే శ్రీమతి జానకి గారి కాఫీ ఆతిథ్యాలు. మా ఆవిడ ఎప్పుడయినా ఏదయినా పనిమీద ఊరికి వెడితే మొహమాటపడకుండా తమ ఇంటికి వచ్చి భోజనం చెయ్యమనేవారు. నేను ఓ యెస్, తప్పకుండా వస్తా అనేవాడ్ని, రాకుండా అలానే మొహమాటపడేవాడ్ని. కాస్త సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఇంటికి వస్తే వారిని పిలుచుకుని మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినంత చనువైన దర్జాతో ఆయన ఇంటికి తీసుకు వెళ్ళి కబుర్లు పెట్టించేవాడిని. ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. నా పుట్టినరోజు పండగ నాడు ఉదయాన్నే ఆయన కాళ్లకు దండం పెట్టుకుని వారి ఆశీస్సులు తీసుకునేవాడిని. నా తొలి పుస్తకం రాగానే దగ్గరి వారని, పెద్ద దిక్కని, ఆయన వద్దకు వెళ్ళి పుస్తకాన్ని అందించాను. ఆయన ఆ పుస్తకం సలక్షణీయతను ముచ్చటగా రెపరెపలాడించి, నా భుజం మీద చేయి వేసి బాపు గారు ఈ రోజు ఉండి, ఈ పుస్తకం చూసి ఉంటే ఎంత పొంగిపోయి ఉండేవారో తెలుసా? అని నా కళ్ళలో చిన్న తడిని తెప్పించారు. తెల్లవారుఝామున వాకింగ్ కని నాలుగు గంటలకు లేచి నడుస్తూ అక్కడ మలుపు తిరుగుతానా, నా కళ్ళు శ్రీరమణ గారి ఇంటి గేటుకు అంటుకు పోయి ఉంటాయి. ఎన్నిసార్లు బిగుతైన ఆ గేటు కిర్రుకిర్రులని పలకరించి ఉంటాను? ఆ ఇంట్లో ఒక కుక్క ఉండేది అది ఎవరు వచ్చినా తెగ అరుస్తూ గోల చేసేది. గత రెండు, రెండున్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కరోనా రోజుల్లో రమణ గారు వారి పెద్దబ్బాయి ఇంటికి వెళ్ళిపోయారు. నేను రోజూ ఉదయపు నడకలో ఆ ఇంటివైపు చూస్తాను. రమణ గారు వచ్చి ఉంటారేమోనని ఆశ. కలిసి బోల్డని కబుర్లు చెప్పుకోవచ్చని కోరిక. ఆయన ఆరోగ్యం చాలా కాలంగా బావుండటం లేదని కబురు తెలుసు నాకు.అయినా ఆయన దగ్గరికి వెళ్లలేక పోయా. ఎప్పుడు కలిసినా కూర్చుని మాట్లాడే ఆయనని మంచం మీద చూడ్డం నాకు ఇష్టం లేకుండా ఉండింది. రమణగారు నాతో ఒక పుస్తకం గురించి చెప్పేవారు దాని శీర్షిక " సింహాల మధ్య నేను" అని గొప్పగొప్ప వారి మధ్య గడిపిన ఒక వ్యక్తి జ్ఞాపకాల సమాహారం ఆ పుస్తకం. అట్లాంటి పుస్తకం నేను ఒకటి వ్రాస్తానండి. ఎంత గొప్పవారి మధ్య గడిపాననుకున్నారు నేను అని చెప్పుకుని పొంగిపోయేవారు ఆయన. శ్రీరమణ గారూ, నేనూ మీ వంటి ఒక సింహం సాన్నిహిత్యంలో గడిపాను సర్. మిమ్మల్ని గుహలో చూడటమే నాకు తెలుసు. మంచం మీద దుప్పటి కప్పుకున్న సింహన్ని ఈ కళ్ళతో చూడలేక పోయాను సర్. అందుకే ప్రతి రోజూ మీరు తిరిగి వచ్చే రోజుకోసం మీ ఇంటివైపు చూపులను అట్టిపెట్టేవాడ్ని. నేను చిన్నతనం రోజులనుంచి చదువుకున్న శ్రీరమణ గారిని 2002 ఆ ప్రాంతాల్లో ఆంధ్రజ్యోతిలో మొదటిసారిగా కలిసాను. మునుపు కాలంలో మూతపడ్డ ఆంధ్రజ్యోతిని అప్పుడు కొత్తగా మళ్ళీ మొదలెట్టారు. నాకు ఆ పత్రికలో శ్రీ రమణగారు ఉద్యోగం చేస్తూ ఉన్నారని తెలీదు. నేను కార్టూనిస్ట్ శంకర్ ని కలవడానికి అక్కడికి వెళ్ళాను. శంకర్ కూచునే దగ్గరలోనే రమణగారి సీటు. నేను ఆయన్ని చూస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళి "మీరెవరో నాకు బాగా తెలుసు అనిపిస్తుంది. కాని తెలీదు, మీరు ఎవరు సార్" అని అడిగా. ఆయన నవ్వుతూ ఆయన ఎవరో చెప్పారు. నేను థ్రిల్ అయిపోయా, ఈయనేనా నా బాల్య స్నేహితుడు. ఈయన రచనలనేగా నవ్వులు నవ్వులుగా చదువుకున్నది . ఈ రోజు కళ్ళ ఎదురుగా నా ముందు ... ఆ రోజు కలిసిన మహూర్త బలం గొప్పది. ఇక ప్రతి రోజూ ఆయన్ని కలిసేవాడిని. అప్పుడు నా ఉద్యోగం ఆంధ్రప్రభలో పతంజలి గారితో, ఉదయం పూట ఆయనతో ఎన్నెన్ని కబుర్లు నవ్వులు గోల. సాయంత్రం కాగానే శ్రీరమణ గారి తో ముచట్లు. ఎట్లాంటి రోజులవి. ఎంత బంగారు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అవి ! వెలిగిన రోజులవి. ఒక సాయంత్రం శ్రీరమణ గారి కలిస్తే నవ్వుతూ అన్నారు కదా" మీ గురువు గారిని కాస్త మమ్మల్ని క్షమించి దయ చూడమనవచ్చు కదా మీరు" "ఏమీ సర్? ఏవయ్యింది," "నేనిలా అన్నానని మీరు ఆయనతో చెప్పండి చాలు" నేను మరుసటి రోజు పతంజలి గారిని కలిసి శ్రీరమణ గారు ఇలా అన్నారు, ఏమిటి సర్ విషయం అని అడిగా. "నిన్న ఒక ఎడిటోరియల్ వ్రాసాను మిత్రమా" అన్నారు పతంజలి గారు. అది తెచ్చుకుని చదివా. నాకు గుర్తున్నంతరకు దానిపేరు "ఒక చిరునవ్వు, ఒక వెక్కిరింత, ఒక లేమి" అటువంటి ఒక సాహితీ చురక వ్రాయలన్నా, దానిని పుచ్చుకుని సిగ మల్లెగా దరించాలన్నా, సరస్వతీ దేవి అద్దంలో తనను చూసుకుంటూ వ్వే వ్వే వ్వే అనుకొడమే. లేరిక అటువంటి సాహితీవేత్తలు. రారిక ఆ మత్తేభాలు, శార్దూలాలూ. బాపు రమణల గురించి కానీ , ఆ కాలం సాహితీ జనం గురించి కాని, ఎన్ని కబుర్లు, ఎన్ని విశేషాలు ఆయన దగ్గర ఉండేవో! ఫలానా కథ గురించి చెప్పాలన్నా, ఫలానా సాహితీ విశేషం గురించి ముచ్చటించాలన్నా, ఆనాటి సినిమా తెర వెనుక ముచట్ల వంటి అల్లం మురబ్బా ఘాటు నుండి శార్వరి నుండి శార్వరి దాక ఎన్ని విశేషాల లోతుల్లోకి మునకలు వేయించేవారో! శార్వరి నుండి అంటే నాకు గుర్తుకు వచ్చింది , రమణగారు మీరు నాకు విశ్వనాథ వారి నవల సెట్టు బాకి ఉన్నారు. మాట దక్కించుకోకుండా ఎలా వెల్లిపోయారు మీరు? మా ఇద్దరికి ఉన్న మరో పిచ్చి స్టేషనరీ. రంగు రంగు కాగితాలు పెన్నులు పెన్సిల్లు, క్లిప్పులు. తాను మదరాసు లో ఉన్నప్పుడు కొన్న సరంజామా గురించి చక్కగా వినిపించేవారు. ఆయనకు గుర్తు వచ్చినప్పుడల్లా నా పైలట్ ఎలాబో పెన్నును అడిగి తీసుకుని దాన్ని అలా ఇలా తిప్పి చూసేవారు. జాగ్రత్తగా ఉంచుకొండి దీన్ని, చాలా ఖరీదైన పెన్ను కదా ఇలా చొక్కా జేబుకు తగిలించుకు తిరగవద్దు, అని హెచ్చరించేవారు. పదేళ్ల క్రితమే దాని ధర పన్నెండు వేల రూపాయలు. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ. అన్నం పెట్టే విద్యకు సంబంధించిన టూల్స్ ని ఇలా భక్తి గా కొనుక్కునే నా గుణం పై ఆయనకు చాలా మక్కువగా అనిపించేది. మేము చివరిసారిగా కలవడానికి ముందు ఇంటికి పిలిచి ఒక మంచి తోలు బ్యాగు కానుకగా ఇచ్చారు. ’"నాకు దీని క్వాలిటీ బాగా నచ్చిందండి, రెండు తీసుకున్నా. నాకొకటి, మీకొకటి. ఇప్పుడు అవన్నీ తలుచుకున్న కొద్ది బాధగా ఉంటుంది. మనమేం పుణ్యం పెట్టి పుట్టాం ఇంత అభిమానం, ప్రేమ పొందడానికి. నేను స్కూటర్ కొన్న కొత్తలో కార్టూనిస్ట్ జయదేవ్ గారూ, నేనూ ఒక పత్రికలో కలిసి పని చేసేవాళ్లం. నాకు ఆయన్ని స్కూటర్ మీద ఎక్కించుకుని తిరగాలని చాలా కోరిగ్గా ఉండేది. ఆయనకు నా డ్రయివింగ్ మీద అపనమ్మకం కాబోలు. ఎపుడు రమ్మన్నా, మీరు పదండి అన్వర్, నేను మీ వెనుకే నడుచుకుంటూ వస్తా గా అని నవ్వేవాడు. నేను కారు కొనబోతున్న కొత్తలో కార్ల గురించి శ్రీరమణ కబుర్లు పెట్టేవాణ్ణి. ఆయనా చాలా విషయాలు చెప్పేవారు కార్ల గురించి , బెజవాడలో నవత డ్రయివింగ్ స్కూలు వారి గురించి, వారితో స్నేహం, బాపు గారు వ్రాసి ఇచ్చిన లోగో గురించి. సర్, నేను కారు కొన్నాకా నా కారు ఎక్కుతారా మనం కలిసి తిరుగుదామా అనేవాడ్ని, తప్పకుండా అండి అని ఆయనా భరోసా ఇచ్చారు. కానీ మేము ఇద్దరమూ వేరే కార్లు ఎక్కి తిరిగాము కానీ, మా కారు మాత్రం ఎక్కి తిరగలా. అది ఎందుకో కుదరలా. ఒకసారి ఒక ప్రయాణం ప్రపోజల్ పెట్టారు. ఏవండీ ఓడ ఎక్కి శ్రీలంక వెళ్లి వద్దామా? ప్రయాణం భలే బావుంటుంది. మీరు వస్తాను అంటే మీకు కూడా టికెట్ బుక్ చేపిస్తా అన్నారు . అయితే ఓడ కన్నా ముందే కరోనా వచ్చింది. ప్రయాణం మునకేసింది.ఆయన హాస్యమూ, చురకా రెండూ పదునైనవి దానికి ఎటువంటి మినహాయింపులు ఉండేవి కావు. ఫలానా ఆయన ఈయనకు బాగా దగ్గరివారు అనుకుంటామా ,ఆ దగ్గరి వారిపైన అయినా ఒక చురక వేయవలసి వస్తే వేయడమే కానీ మన పర అని ఏమి ఉండేవి కావు. బాపు గారి దగ్గర ఉండి ఉండి రమణ గారికి కూడా బొమ్మల లోతుపాతులు కొంతమేరకు తెలుసు . పిచ్చి బొమ్మ, వంకర, బొమ్మ, బొమ్మ తక్కువ బొమ్మ, మేధావి బొమ్మ ల మీద ఆయనకు బాగా చిన్న చూపు. ఇదంతా దొంగ బొమ్మల సంగతి. అలా అని ఆయనతో పికాసో గురించో, లక్ష్మాగౌడ్ గురించో, తోట వైకుంఠం గురించో మాట్లాడి చూడండి. పులకించి పోతూ చెబుతారు. ఒకసారి ఒక పత్రికాఫీసులో మేమిద్దరం కబుర్లు చెబుతూ కూచున్నామా, స్కానింగ్ డిపార్ట్మెంట్ నుండో , ఆర్ట్ డిపార్ట్మెంట్ నుండో ఒకాయన వచ్చి "సర్ ఆర్టిస్ట్ బొమ్మ వేసి ఇంటికి వెల్లిపోయారు, అయితే బొమ్మ ఏది పై భాగమో, ఏది కింది భాగమో అర్థం అవడం లేదు. మీరు కాస్త చెప్పండి అన్నారు. ఆయన ఆ బొమ్మని ఎత్తి పట్టుకుని " ఈ బొమ్మని ఇలాగే ఎడిట్ పేజీలో ఆర్టికల్ కి ఉపయోగించుకోండి, ఇదే బొమ్మని కుడివైపుకు తిప్పి ఎడిట్ పేజిలోనే ఆ చివర ఒక కవిత వస్తుంది కదా, దానికి వాడుకోండి. బొమ్మని ఎడమ వైపుకు తిప్పి పెట్టుకుని ఆదివారం అనుబంధంలో కథకు ఇలస్ట్రేషన్ గా పెట్టుకోండి. ఇక ఈ రోజు మన కార్టూనిస్ట్ రాకపోతే ఆ కార్టూన్ ప్లేస్ లో ఈ బొమ్మని తలకిందులు చేసి పెట్టుకుంటే సరిపోతుంది" మొహంలో కోపం, విసుగు, చిరాకు ఏమీ లేకుండా ఆయన అలా కూల్ గా చెబుతుంటే , మనం పేపరాఫీసు పైకప్పు ఎగిరి పోయేలా నవ్వుతూ ఉంటే ఏం మర్యాద? రమణ గారు ఒక రచయితకు ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు" మనం ఒక పుస్తకం అచ్చుకి ఇస్తున్నాము అంటే దాని అర్థం , ఒక వెదురు పొదను సమూలంగా నాశనం చేస్తున్నామని . ఒక వెదురు పొద పచ్చగా బ్రతకాలా? లేదా మీ పుస్తకం బయటికి రావాలా అనేది మీ విజ్ఞత కే వదిలేస్తున్నా.చెప్పాగా, ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. లక్షల రూపాయల పనులని ఆయన నాకు ఇప్పించారు. ఆయన వ్రాసిన ఒక పుస్తకానికి నేను బొమ్మలు వేసి ఋణం కొద్దిగా మాత్రమే తీర్చుకున్నాను. ఆయన వెంకట సత్య స్టాలిన్ పుస్తకానికి బొమ్మలు వేద్దామని నాకు చాలా కోరిగ్గా ఉండేది. శ్రీరమణ గారికి ఉన్న అభిమానుల్లో ఒక పెద్ద అభిమాని చిత్రకారులు శ్రీ మోహన్ గారు. ముచ్చట పడి ఆయన వెంకట సత్య స్టాలిన్ కి బొమ్మలు వేస్తానని చెప్పి వేసి పెట్టారు. నిజానికి ఆ బొమ్మలు ఏమీ బాగో ఉండవు. ఆ దగ్గర శ్రీరమణ గారు హెల్ప్ లెస్. అయితే శ్రీ మోహన్ గారు, శ్రీరమణ గారు చిలకల పందిరి అని ఒక సూపర్ డూపర్ హిట్ శీర్షిక నడిపారు. ఆ రచన, ఆ బొమ్మలు బంగారం మరియూ తావే. మోహన్ గారన్నా, ఆయన వచనం అన్నా, ఆయన రేఖలు అన్నా శ్రీరమణగారికి కూడా చాలా ముచ్చట. ఆ మధ్య పాత పుస్తకాలు వెదుకుతుండగా ఆయన సోడా నాయుడు కథకి గోపి గారు వేసిన నలుపూ తెలుపు బొమ్మ నా కంటపడింది. ఎంత అందం . కథంత అందం ఆబొమ్మది. పత్రికాఫీసుల్లో పని చేసారు కదా ఆయనకు చాలా చాలామంది చిత్రకారులతో పరిచయం , చాలా దగ్గరితనం ఉండేది . అయితే ఆయన రచనలకు బాపు గారు తెచ్చిన అందం ఎవరూ తేలేదు, తేలేరు కూడా. వ్యక్తిగతంగా , వృత్తిగతంగా కూడా ఆయనకు ఇష్టమైన చిత్రకారులు బాపు కాకుండా మోహన్ గారు గిరిధర్ గౌడ్ గారు మాత్రమే నని నాకు తెలుసు. ఈ రోజు ఉదయం శ్రీరమణ గారిని చివరి చూపుగా పలకరించడానికి ప్లోటిల్లా అపార్ట్మెంట్ కి వెళ్ళాము నేను, కవి నాయుడు గారు. రమణ గారు అద్దాల పెట్టె లో పడుకుని ఉన్నారు. అలా మాటడకుండా, నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? నా కంటి అద్దాల లోపల నీరు గిర్రున తిరిగింది, అద్దాలు తీసు కళ్ళు తుడుచుకునే పని చేయలేదు. ఆ గాజు పెట్టె లో నిలువెల్లా ఆయన నాకు కనపడుతున్నారు. ఏదో లోపం, ఏదో తప్పు జరిగింది, నేనేదో మరిచిపోయా. కొంత కాలం క్రితం ఒకసారి మా ఇద్దరి మాటల్లో మనం ఎవరి ఇంటికయినా వెడుతూ వారికి ఏమీ పట్టుకు వెడితే బావుంటుంది? మనం ఖర్చు పెట్టే రూపాయ ఎట్లా వృధా పోకుండా ఉండాలి? ఆ ఇంట్లో వాళ్లకు షుగర్ ఉంటే ఎలా? ఈ పూలు, బొకేలు అవీ పట్టుకు పోతారు కదా, పూలు ఎట్లాగూ వాడిపోతాయి కదా ,దానికి డబ్బులు దండగ కదా అని శ్రీరమణ గారితో మాటలు పెట్టుకున్నాను . దానికింత గొడవెందుకండి? ఏదయినా పట్టుకు వెళ్ళొచ్చు. ఆ ఇంట్లో వయసు పెద్ద వాళ్ళే ఉండి , వారికి షుగర్ ఉంటే మాత్రమేం? తీసుకు వెళ్ళిన స్వీట్లు వాళ్ళ ఇంట్లో పిల్లలు తింటారు, పిల్లలు లేకపోతే పక్కింటి వారికో, లేదా వారి పనివారికో పంచుతారు.పూల బొకేలు ఇస్తే డబ్బులు దండగ ఏమీ కాదు. పూల గుత్తిని చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందండి . వాంగో సన్ ప్లవర్స్ పెయింటింగ్ లాగా, దాని రంగులు, రెక్కలు చూస్తూ గడపవచ్చు కదా. అప్పుడు ఇంటికి ఇంటికి వచ్చిన వారెవరైనా ఎక్కడిది పూలగుత్తి, ఏమిటి విశేషం అని అడిగితే " మమ్మల్ని చూడ్డానికి ఇంటికి అన్వర్ గారు వచ్చి వెళ్లారు , మా కోసం పూలు పట్టుకు వచ్చారు" అని సంతోషంగా చెప్పుకుంటారు కదా. శ్రీరమణ గారు ఈ రోజు మీకొక పూల మాల తేవాల్సింది నేను. తేనందుకు మీరు ఫీల్ అయ్యేది ఏమీ లేదు. సింహాల మధ్య తిరిగి ఉండి కూడా నేను మర్యాద తెలీని శిష్యుడిగా మిగిలిపోలా! ఇపుడు ఏం చేసేది? బుద్ది లేని జన్మ. థూ! ఒకసారి నేను ఒక కథ చదివాను . వేలూరి శివరామశాస్త్రి గారిది. కథ పేరు 'తల్లి లేని పిల్ల"ఆ కథలో ఇలా ఉంటుంది "చిట్టెమ్మ మేకల మంద నడుమ కూచుంది . చుట్టూ పది పన్నెండు దుత్తలు, ఐదారుచెంబులూ. చిట్టెమ్మ కొడుకు రాఘువులు మేకపాలతో ఒక చిన్న గుంట అలికి దానిలోనూ, ఒక చిన్న రాతి తొట్టిలోనూ కుక్కలకూ, కుక్క పిల్లలకూ మేకపాలు పోస్తున్నాడు. రాఘువులు తండ్రి నాగాయ మంద చివర నించుని మేకలని పరీక్ష చేసి పళ్ళు కదిలిన వానికి క్షౌరం చేసి చక్రాంకితాలు వేశాడు. కొన్ని మేకల డెక్కల నడుమ ముళ్ళు లాగాడు. ఒక మేకవి కాలిమీది వెంట్రుకలు లిక్కితో కోసి నెత్తురు కంటచూసి- 'ఓరే నాయనా! ఉప్పుపెట్టి రుద్దు" అని పురమాయించాడు" నాగాయ తన కొడుకును పురమాయిస్తే పురమాయించాడు కానీ, నాకు అనుమానాలు, ఎందుకుని ఈ చక్రాంకితాలు, అదీనూ పళ్ళుకదిలినవాటికే ఎందుకు? లిక్కి దూసి మేక నెత్తురు పరీక్ష చెయ్యడం అదేవిటి? సరే ఉప్పు రాయడం ఎందుకో కాస్త అంచనాకు అందిందనుకో. ఎవరిని అడిగితే వీటికి సమాధానం దొరకాలి? అపుడు నాకు ప్రతి ప్రశ్నకు సమాధానంగా శ్రీరమణ గారు ఉండేవారు. మహానుభావుడు కేవలం ఆధునిక సాహిత్యాన్ని, ప్రాచీన వాగ్మయాన్ని చదువుకున్న మనిషే కాదు. జీవితాన్ని పరిశీలనగా చూసిన వాడు కూడా . పల్లెలో పుట్టి పెరిగినవాడు, అన్నీ తెలుసు. తెలిసిన వాటిని విప్పి చెప్పే హృదయం ఉంది. ఇలా ఉన్న హృదయాలన్ని మూసుకుపోయి ఇప్పుడు మనసు లేని మనస్సుల , మనుష్యుల మధ్య బ్రతకడం ఎంత కష్టమో, చికాకో సింహాల మధ్య తిరిగిన మీకు ఏమి తెలుస్తుంది ? చెప్పినా ఏమి అర్థమవుతుంది. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి దిన పత్రిక -
బొమ్మల చొక్కా, పూల చీర కార్టూన్లు మరి కనిపించవు..
గత వారం రవీంద్ర భారతిలో నిర్వహించిన చలం గారి సభకు వెళ్ళి వస్తుండగా మా అబ్బాయి మోహన్ నీలోఫర్ కేఫ్ మీదుగా వెడదాం, పని ఉంది అన్నాడు. ఆ నీలోఫర్ రోడ్డు, రెడ్ హిల్స్ తోవ వెంట నాకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ హైద్రాబాద్ నగరంలో నా బ్రతుకు ప్రారంభమయ్యింది ఇక్కడే . ఈ ప్రాంతాల్లోనే తొలిసారిగా తెలుగు సాహిత్యంలో మహామహులను చూశాను, కలిశాను, కొన్ని వందల రోజులు, గంటలు, రాత్రింబవళ్ళు వారితో కలిసి ఉన్నాను. అమాయకంగా, బ్రతుకు భాగ్యంగా ఎన్ని మంచి అనుభవాలు జ్ఞాపకాలను ఇక్కడ సంపాదించుకుని మూట గట్టుకున్నానో! ఎపుడు ఆ స్మృతుల దస్తీ విప్పినా గుప్పుమని జాజుల పరిమళమే, మిగల మగ్గిన నేరేడు పళ్ల తీపి వగరు వాసనే. ఇక్కడి హనుమాన్ టెంపుల్ పక్కనే సత్యసాయి డిజైనింగ్ స్టూడియోలో నా తొలి ఉద్యోగం మొదలయ్యింది. సత్యసాయి డిజైనింగ్ స్టూడియో యజమాని ప్రముఖ కార్టూనిస్ట్ సత్యమూర్తి గారు. నేను చేరినప్పుడు అక్కడ ఉన్నది నలుగురం. సత్యమూర్తి గారు, వారి అబ్బాయి సాయి భాస్కర్, నేను, అఫీస్ అసిస్టెంట్ రామకృష్ణ. అది పంతొమ్మిది వందల తొంభై ఏడు. ఆయన దగ్గర నేను ఒక నెల మాత్రమే ఉద్యోగం చేశాను. ఈ రోజుకు అది ఇరవై ఆరు సంవత్సరాల కాలంగా గతించి పోయినప్పటికీ, నేను ప్రతి రోజూ సత్యమూర్తి గారిని తలుచుకుంటాను. ఎలా అంటే ఇదిగో ఇక్కడ నా ఎడమ పక్కన తల తిప్పి చూస్తే గోడ వైపుగా పెలికాన్ రంగు ఇంకు సీసాల మీదు గా నేను నిత్యం వాడే క్రొక్విల్ నిబ్ ఒకటి ఉంటుంది. దాని హేండిల్ చూశారూ, అది అల్లాటప్పా, అణాకాని రకమో, ఎక్కడ పడితే అక్కడ దొరికేదో కాదు, ఆర్డర్ చెయ్యగానే పొస్ట్ లో వచ్చిపడే కంపేనీ తయారి రకం ది అసలే కాదు. అదే పనిగా కొలతలు ఇచ్చి మరీ తయారు చూపించిన హేండిల్ అది. ఎబోనైట్ మిశ్రమంతో తయారు చేయించింది. సత్యమూర్తి గారు ఒక పెన్నుల కంపెనీలో ఫలానా రకంగా కావాలి అని కోరి చేపించిన హేండిళ్లు నాలుగో ఐదో ఉన్నాయి. అందులో ఒకటి ఆయన మహా చిత్రకారులు చంద్ర గారికి ఇచ్చారు , ఒకటి నాకు ఇచ్చారు. మిగతావి ఆయన వద్దే ఉన్నాయి. చంద్ర గారికి నేనంటే ఎంత వాత్సల్యం ఉండేది అంటే ఆయన దగ్గరికి వెళ్లిన ప్రతి సారి ఏదోఒక వస్తువు నా చేతిలో పెట్టేవారు. నా జేబులో ఉంచేవారు. సత్యమూర్తి గారు కాదు నాకు మొదట ఆ హేండిల్ ఇచ్చింది. చంద్ర గారే. ఈ తయారి వెనుక కథ కూడా ఆయనే చెప్పారు. చాలా అందంగా ఉంటుంది ఆ నిబ్బు హేండిల్. దాని పై నుండి నా కన్ను తిప్పుకోలేకపోతుంటే దానిని నా చేతిలో పెట్టి ఉంచుకో అని చల్లని వెన్నెల నవ్వు నవ్వారు. అ జరిగిన కొద్ది కాలానికి పత్రికల్లో నా బొమ్మలు చూసి నన్ను తెగ ప్రేమించిన సత్య మూర్తి గారు మరో రెండు హేండిళ్ళు, కొన్ని డిప్పింగ్ నిబ్బులు చేతిలో పెట్టి ఆయనా నవ్వారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను వేస్తున్న ప్రతి బొమ్మ వెనుక నిబ్బులా నిలబడి సత్యమూర్తి గారు గుర్తు ఉండనే ఉంటారు. కథంతా ఇక్కడ మొదలు కాలేదు. అంతకు ముందే, నేను బడిలో , జూనియర్ కాలేజీలో చదువుతున్న రొజుల్లోనే మొదలయ్యింది. బొమ్మలంటే ఇష్టం. బొమ్మలు వేయడం ఎలాగో తెలీదు. అలాంటప్పుడు విశాలాంద్ర వారి పుస్తకాల వ్యానులో పుస్తక్ మహల్ వారి ప్రచురణ, సత్యమూర్తి గారి రచన "హౌ టు డ్రా కార్టూన్స్" పుస్తకంలో ఔత్సాహికులకు స్టెప్ బై స్టెప్ పాఠాలు ఉన్నాయి. సత్యమూర్తి గారి పేరు ఆ పుస్తకం లో చూడ్డం అంతకన్నా కన్నా ముందే నాకు తెలుసుగా. పత్రికల్లో కార్టూన్లు, కాలెండర్ల మీద గోడకెక్కిన బొమ్మలు, పుస్తకాల ముఖచిత్రాలు మాతరానికి పరిచయమే గా. బొమ్మల పరిచయం వేరు, బొమ్మలు ఎలా వెయ్యాలో చెప్పే మాష్టారుగా తెలుసుకోవడం వేరు. ఆయన రచించిన ఆ పుస్తకం ఒళ్ళో ఉంచుకుని నేను బొమ్మల సాధన చేసాను. ఆ పుస్తకం దయ వల్లనే నేను రోటరింగ్ అనే పెన్నును, బౌ పెన్ అనే సాధనాన్ని, నల్లని ఇండియన్ ఇంకు ను, తెల్లని పోస్టర్ వైట్ ని ... ఇట్లా అవసరమైన సాంకేతిక వ్యవహార జ్ఞానాన్ని తెలుసుకున్నాను. నేల మీద పడుకుని చూస్తే మనిషి ఎట్లా కనపడతాడు? ఫ్యాను రెక్క ఎక్కి చూస్తే మనిషి ఏమని తెలుస్తాడు అనే వివరాలు నేర్చుకున్నాను. నాకు ఊహ తెలిసీ తెలియగానే మారియో మిరండా బొమ్మలు ప్రాణమై కూచున్నాయి. మనుషుల ఆ ఆకారాలు, డ్రాయింగ్ లో ఆ రిచ్ నెస్. పూలు, తీగలు, ఎగబాకిన కొమ్మలు, నిలువుగా నిలబడ్డ చెట్లు, వెనుక భవనాల సముదాయాలు, ఆ గోడకు లతల డిజైన్లు, కిటికీల మీద షోకు వంపులు. బ్రైట్ గా కనపడే ఇంకు రంగులు, గట్టి నిబ్బు పనితనం. అవంటే నాకు బాగా ఆకర్షణ. ఆ రకంగా సత్యమూర్తి గారిని తెలుగు వారి మారియో గా భావిస్తాను నేను. ఆయన రేఖ చాలా తీరుగా ఉంటుంది. కాంపొజిషన్ బాలెన్స్ గా , అక్షరాలు తీర్చి దిద్దినట్లుగా కుదురుతాయి. జస్ట్ చిక్కని నలుపుతో అలా ప్రింట్ అయిన స్టికర్ తీరుగా ఉంటుంది ఆయన చిత్ర రచన. చాలా మట్టమైన పని కనబరుస్తారు ఆయన తన బొమ్మల్లో. మనుషుల వ్యవహారం, ఆ నవ్వు, ఆ భంగిమలు, వారు తొడుక్కున్న చొక్కాలపై, కట్టుకున్న చీరల మీద, కూచున్న సోఫాల మీద పొందికైన పూలు, బొమ్మలు, నిలువు, అడ్డం చారలు, కాళ్లకు తొడుక్కున్న బూట్ల మీద వెలుతురు తళుకు. పిక్చర్ పెర్ఫేక్ట్. మనిషి గా కూడా ఆయన పెర్ఫెక్ట్ గా ఉండే వారు. తిన్నని సఫారీ సూటు, తీర్చి దువ్విన క్రాపింగ్, గట్టి కళ్ళజోడు. నేను ఆయన్ని చూసే సరికి యాభైలు దాటేసారు. యవ్వనపు రోజుల్లో ఆయన అద్భుతమైన అందగాడని, అలా ఆయన నడిచి వస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవని ఆయన రోజుల ఆర్టిస్ట్ లంతా చెప్పేవారు. ఆయన గురించి చంద్ర గారు చెప్పే ఒక సరదా ముచ్చట వినతగ్గది. చాలా చాలా ఏళ్ల క్రితం అప్పటికీ చంద్ర గారు ఇంకా బొమ్మల్లోకి అడుగు పెట్టని సమయంలో హైద్రాబాద్ లో సెవెన్ స్టార్ సిండికేషన్ వారు తొలిసారిగా బాపు గారి బొమ్మల కొలువు ఏర్పాటు చేసారుట. ఆ రోజుల్లో తెలుగు పత్రికల్లో బొమ్మల పాపులర్ ఫిగర్స్ ఇద్దరే. ఒకరు బాపు, మరొకరు "చదువుల్రావు" అనే కార్టూన్ స్ట్రిప్ వేసే సత్యమూర్తిగారు. ఆ చదువుల్రావు క్యారెక్టర్ సత్యమూర్తి గారి స్వంత బొమ్మేనని నా అనుమానం. ఆ పక్కనే జయశ్రీ అనే పెద్ద కళ్ల చిత్రసుందరి భలే ఉంటుంది . సరే! చంద్రగారు ఎక్జిబిషన్ హాల్ లో అడుగు పెట్టి బొమ్మలన్ని చూసేసి ఈ బొమ్మలేసినాయన ఎక్కడున్నాడా అని వెదుక్కుంటూ వెడితే ఒక చోట అల్లా కోలాహలంట . ఎంచక్కని చుక్కలు బొలెడు మంది ఒక పురుషుణ్ణి చుట్టు ముట్టి ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ అని అటో పక్కా ఇటో పక్క తనుకులాడుతున్నారుట. అంతా చేస్తే ఆయన బాపుగారు కాదు, చదువుల్రావుట. సత్యమూర్తి గారి బొమ్మకు, ఆయన హీరో పర్సనాలిటికీ అంత క్రేజ్ ఉండేదిట ఆ రోజుల్లో. బాపు ఎక్కడా అని చూస్తే ఒక చెట్టు కింద నిలబడి వంటరిగా తనమానాన ఒక సిగరెట్ కాల్చుకుంటున్నాట్ట మహానుబావుడు. సత్యమూర్తి గారి స్టూడియో లో నేను కొంత కాలం పని చేసాను కదా. భలే ప్రొఫెషనల్ గా ఉండేది ఆయన సెటప్, బొమ్మలు గీసే పద్దతి, ఆ స్టూడియో. అచ్చం అమెరికన్ చిత్రకారుల మాదిరి డ్రాఫ్టింగ్ టేబుల్, పక్కన బొమ్మల సరంజామా, ఇంకులు, రంగులు. కాసింత దూరంలో అరలు అరలు గా తెరుచుకునే ఒక పెద్ద టేబుల్, అందులో సైజుల వారిగా, మందం వారిగా అద్భుతమైన డ్రాయింగ్ షీట్లు. చమన్ లాల్ కాగితాలు. బొమ్మలని చాలా పద్దతిగా గా వేసే వారు ఆయన , ఒక బొమ్మ మీద రకరకాల పెన్నులు వాడేవారు. చాలా వెడల్పైన ఫ్లాట్ నిబ్స్ తో రేఖలు గీసేవారు. సాలిడ్ బ్లాక్ ఫిల్లింగ్. బొమ్మల కథలు, అడ్వర్టైజ్మెంట్ కార్టూన్లు, పెద్ద పెద్ద కంపెనీల లోగొలు, మోనోగ్రామ్ లు. తీరైన పుస్తకాల కలెక్షన్, ఎన్నో విధాలైన టైపోగ్రాఫ్స్, ఫాంట్ ల పుస్తకాలు, కలర్ స్కీం గైడ్లు. అప్పుడు ఇంకా కంప్యూటర్ ఇంకా రాలేదు. ఈ రోజు మీరు చూసే పాల ప్యాకెట్ దగ్గరి నుండి, అగ్గిపెట్టె దగ్గరి నుండి, తలకాయ నొప్పి మందు, తిన్నది సరిగా జీర్ణంకావడానికి సిరప్... అవీ ఇవని కాదు వ్యాపార ప్రపంచంలోని సమస్త వస్తోత్పత్తికి సంబంధించిన బొమ్మలు, ఎంబ్లంలు, అక్షరాలు స్వయంగా, తీరొక్క రీతిగా అన్నీ చేత్తోనే వ్రాసేవారు, చిత్రించేవారు అప్పటి చిత్రకారులు . ఇప్పుడు ఆ రోజులు, అటువంటి పనిమంతులు కరువై పోయారు. ప్రతీదీ కాపీ పేస్ట్. స్వంత బుర్ర పెట్టి ఏదీ రావడం లేదు. అన్నీ కంప్యూటరే, అన్నీ ప్రింట్ కాగితాలే, అంతా ప్లాస్టిక్ ప్రచారమే, అన్నీ కాపీ ఈజ్ రైటే. అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించిన రూపూ, రంగూ, రేఖ మీద, ఆ జీవితం మీద ఒక పుస్తకం తెలుగు సాహిత్యానికి , జీవితానికి మనం బాకీ ఉన్నాము. నిజానికి దానిని మనకు అందించి ఉండవలసినది సత్యమూర్తి గారు. తెలుగు పొస్టర్ డిజైన్ కు సంబంధించి చాలా విషయజ్ఞానం ఉన్న మరో వ్యక్తి శ్రీ గీతా సుబ్బారావు గారు. ఆయన ఎలా ఉన్నారో! ఏం చేస్తున్నారో తెలీదు. ముందు మనం ఏదయినా పుచ్చుకొవాలనే తపన ఉంటే కదా ఇచ్చేవారికి ఇవ్వాలి అనిపించేది. గీతాసుబ్బారావు గారి అన్నగారు శ్రీ వీరాజీ గారూ ఆయన ఒక తరం తెలుగు పత్రికా జీవితాన్ని తన ఆత్మకథ గా అద్భుతంగా చెప్పుకున్నారు. అది ఏవయిందో తెలీదు. అవన్నీ పుస్తకాలు గా రావలసినది. ఏదీ రాదు. ప్రెస్ అకాడమిలు ఎందుకు ఉన్నవో నాకైతే నిజంగా తెలీదు. నేను ఆయన వద్ద ఉద్యోగం చేసింది నెల మాత్రమే . చిన్న ఊరినుండి వచ్చిన వాడిని .ఏమీ తెలీదు. స్కేలు పట్టుకోవడం, సెట్ స్క్వయర్ ఉపయోగించడం, ప్రెంచ్ కర్వ్స్ వాడి లోగో డిజైన్ లు చేయడం, అక్షరాలూ వ్రాయడం, తొంబై డిగ్రీల్లో టెక్నీకల్ పెన్ను వాడటం అన్ని ఆయన దగ్గరే తొలిసారి చూసాను, తెలుసుకున్నాను. ఆయన నా గురువు. చాలా కాలం విరామం తరువాత ఒకసారి ఆయన్ని ఒక కార్టూన్ షోలో చూశాను. నన్ను చూసి ఎంతో సంతోషించారు. ఇంటికి రమ్మన్నారు, ఇంటికి వెలితే గుప్పెట నిండా గుప్పెడు నిబ్బులు పెట్టారు. ఒక మంచి డ్రాఫ్టింగ్ టేబులు వాళ్ల అబ్బాయి తో ఇప్పించారు. ఇపుడు ఏది తలుచుకున్నా గతం. ఒకానొక కాలంలో ,ఒకే కాలంలో బాపు, జయదేవ్, సత్యమూర్తి, బాలి, చంద్ర, గోపి, మోహన్, రాజు, బాబూ, కరుణాకర్... గార్ల వంటి అత్యంత అరుదైన చిత్రకారులు ఇక్కడ ఉండేవారు, మాతో మాట్లాడేవారు, అభిమానించేవారు, తప్పులు దిద్దేవారు ఒప్పులుగా మిగలడానికి తమదైన ప్రయత్నం చేసేవారు అని అనుకోవడం తప్పా మరేం మిగల్లేదు. ఇప్పుడు గురువులు ఎవరూ లేరు. శిష్యులుగా మిగలడానికి ఎవరికీ రానిదీ, తెలియనిదీ ఈరోజుల్లో ఏదీ లేదు. తెలుగులో బొమ్మలకు, కార్టూన్ కళకు, మనకు ఒకప్పుడు ఉండిన ఒక కళకు, నల్లని సిరాకు, పదునైన పాళికి చివరి రోజులివి. సత్యమూర్తిగారికి కూడా శ్రద్దాంజలి (ప్రముఖ కార్టూనిస్ట్, ఒక తరం గురువు సత్యమూర్తి గారు 83 ఏళ్ళ వయసులో 25-05-23 న మననుండి దూరమయ్యారు, తెలుగు కార్టూన్ లో చివరగా మిగిలిన బొమ్మల చొక్కాలు, పూల చీరలు, నిలువు చారల, అడ్డ గీతల ఫర్నీచర్ కూడా మాయమయ్యింది. అన్వర్ అర్టిస్ట్, సాక్షి