Women Power
-
నైపుణ్యమే సంపద
‘జీవితంలోని ప్రతి దశలోనూ గైడ్ చేస్తూ నా ఎదుగుదలకు దోహదపడిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ నాకు గురువులే..’ అంటూ పరిచయం చేసుకున్నారు వనమల స్వప్న. హైదరాబాద్ లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్’ లో అసోసియేట్ ఫ్యాకల్టీగా ఉన్న వనమల స్వప్నకు ఇటీవల నేషనల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు వచ్చింది. గురువారం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’తో తన విజయానందాన్ని పంచుకున్నారు. ‘‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం శిక్షణా తరగతులను నిర్వహించడంలో 18 ఏళ్ల అనుభవం ఉంది. 12 ఏళ్లుగా మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎమ్ఎస్ఎమ్ఇ’లో వర్క్ చేస్తున్నాను. స్పెషలైజేషన్ ఇంక్చువ ప్రాపర్టీ రైట్స్ ఇన్ఛార్జిగానూ వర్క్ చేస్తున్నాను.వారధిగా.. సాయంబిజినెస్ చేయాలని, రాణించాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ, సరైన నైపుణ్యాలు ఉండవు. అలాగే, ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ గురించి కూడా తెలియవు. స్కిల్స్‌తో పాటు వ్యాపార అవకాశాలు, లోన్లు, ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి.. అనే విషయాల్లో సాయం చేస్తాం. మా అకాడమీ నుంచి వివిధ రకాల స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు నాలుగు స్కీమ్స్‌తో నిరుద్యోగ యువత, మహిళలకు ఎంట్రప్రెన్యూర్షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. నాలుగేళ్ల నుంచి మల్టీమీడియా, ఫ్యాషన్, బ్యూటీ.. వంటి రంగాలలో దాదాపు 4000 మంది యువతకు శిక్షణ ఇచ్చాం. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్స్‌లోని వాళ్లకూ స్కిల్ ట్రెయినింగ్స్ ఇస్తున్నాం. మంచి రేటింగ్ త్రీ స్టార్స్ రేటింగ్ రావడంతో ఎమ్ఎస్ఎన్మి ఇన్నోవేటివ్ స్కీమ్ కింద సివిల్ సర్వెంట్స్‌కు శిక్షణ ఇవ్వడానికి మా ఇన్స్టిట్యూట్కు అప్రూవల్ వచ్చింది. వివిధ రంగాలలో నిపుణులైన వారు కూడా శిక్షణ తరగతులకు హాజరవుతుంటారు. తాము సృష్టించిన ఉత్పత్తులను ప్రదర్శించడానికి వేదికలను కూడా ఏర్పాటు చేస్తుంటాం. ఇటీవల శిక్షణ తీసుకుంటున్న వారిలో మహిళల శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో 55 స్కిల్ప్రోగ్రామ్స్ మహిళలకే పరిచయం చేస్తున్నాం. జిల్లా, గ్రామీణ స్థాయి మహిళలకు కూడా 60 స్కిల్స్ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. ప్రతి రోజూ సవాళ్లే దేశవ్యాప్తంగాప్రోగ్రామ్స్, శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడానికి ఆయా ్రపాంతాలకు వెళ్లినప్పుడు కాలేజీలు, యూనివర్శిటీల సాయం తీసుకుంటాం. అక్కడ చాలా వరకు శిక్షణకు కావల్సిన సరంజామా ఉండదు. దీంతో ప్రతీదీ సవాల్‌గానే ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన శిక్షణ ఇచ్చేటప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో ఏ లోపం లేకుండా ముందస్తుగానే ΄్లాన్ చేసుకుంటాం. ఇటీవల సైబర్‌సెక్యూరిటీకి సంబంధించి కాకినాడ ప్రభుత్వ కాలేజీలో, డిజిటల్ మార్కెట్‌కు సంబంధించి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వారితో కలిసి వర్క్ చేశాం. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇండోర్ ఫ్యాషన్ ఇన్సిట్యూట్తో కలిసి వర్క్ చేశాం. 2023–24 సంవత్సరానికి గాను 200కు పైగా ప్రోగ్రామ్స్ చేశాం. ట్రైనింగ్ క్లాసులకు ప్రిపేర్ అవడం,ప్రోగ్రామ్స్‌ని నిర్వహించడం, జనాల్లోకి రీచ్ అయ్యేలా చేయడం ఓ పెద్ద ప్రణాళిక. కుటుంబ మద్దతునేను పుట్టింది తెలంగాణలోని సిద్దిపేట. మా నాన్నగారి ఉద్యోగరీత్యా రామగుండంలో చదువుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చేశాను. మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మాకు ఇద్దరు పిల్లలు. మహిళగా నా వర్క్‌లో రాణించాలంటే కుటుంబం స΄ోర్ట్ ఉండాలి. మా పేరెంట్స్ ఉన్న అపార్ట్మెంట్లోనే నేనూ ఇల్లు తీసుకోవడంతో పిల్లలకు సంబంధించి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ నుంచి రోజూ నా ప్రయాణం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో దశలో నన్ను గైడ్ చేయడానికి వచ్చారు. వారంతా నాకు గురువులే’ అంటూ తెలిపారు స్వప్న. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
'వీ హబ్'తో వాధ్వాని ఒప్పందం..
సాక్షి, సిటీబ్యూరో: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో వీ హబ్ కార్యక్రమాలకు మద్దతు అందించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు వాధ్వాని ఫౌండేషన్ ప్రకటించింది. ఈ ఒప్పందం సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో వాధ్వాని ఫౌండేషన్ సీఈఓ సంజయ్‌షా మాట్లాడుతూ ఇప్పటి వరకు, వీ హబ్ మద్దతుతో 6 వేల మంది మహిళలు తమ వ్యాపారాలను విజయవంతంగా ప్రారంభించి, అభివృద్ధి చేసుకున్నారన్నారు.తమ ఇరు సంస్థలు కలిసి మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లను ముందుకు నడిపించడానికి అంకితభావంతో కృషి చేస్తామన్నారు. మహిళలు పోటీ ప్రపంచంలో రాణించడానికి విస్తరించడానికి వారికి సాధనాలను సమకూర్చుతామని చెప్పారు. సమావేశంలో వీ హబ్ సీఈఓ సీతా పల్లచోళ్ల మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించడం ద్వారా వాధ్వాని ఫౌండేషన్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను గణనీయంగా ప్రభావితం చేసిందని, స్థిరమైన సామాజిక–ఆర్థిక మార్పుకు దోహదం చేసిందన్నారు.అలాంటి ఫౌండేషన్‌తో భాగస్వామ్యం మహిళలను వృద్ధి పథంలోకి చేర్చే తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి రూపొందించిన కార్యక్రమాల ద్వారా మహిళల–నేతృత్వంలోని వ్యాపారాలను ప్రారంభించేందుకు దోహదం చేస్తామని, అదేవిధంగా మహిళా వ్యాపారవేత్తలు తమ స్టార్టప్ ప్రయాణంలో ఎదుర్కొనే క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వాధ్వాని ప్రతినిధులు తెలిపారు. వీ ఎంగేజ్ – స్పార్క్ (ఎర్లీ స్టేజ్) ప్రోగ్రామ్, వీ ఎంగేజ్ – ప్రొపెల్ (ఎర్లీ–ట్రాక్షన్ స్టేజ్)లు విజయవంతంగా అమలయ్యేలా చూస్తాయన్నారు. -
'ఆ తల్లి గొప్ప యోధురాలు': 55 ఏళ్ల వయసులో..!
ఓ ఒంటరి తల్లి రెస్ట్ తీససుకునే వయసులో ఆటో నడుపుతూ ఎందరికో ప్రేరణగా నిలిచింది. చెట్టంత కొడుకు ఉండి కూడా అనాథలా తన పొట్ట పోషించుకోవడానికి ఆటో డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. అందులో ఎదురయ్యే సవాళ్లను లెక్కచేయకుండా యోధురాలి వలే రాత్రిళ్లు కూడా ఆటో నడుపుతోంది. పైగా అడుక్కోవడం తప్పుగాని పనిచేసుకుని బతకడం తప్పుకాదని చెబుతుండటం విశేషం. అందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో 55 ఏళ్ల ఓ మహిళ ఆటోను నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఆటో డ్రైవర్‌గా అర్థరాత్రి సమయాల్లో తిరగడం కష్టమైనా ఉక్కు సంకల్పంతో ధీశాలిగా ఆటోని నడుపుకుంటూ వెళ్లడం విశేషం. తన కొడుకు తనను గౌరవించకపోగా డబ్బుకోసం తనతో గొడపడుతున్నాడనే విషయాన్ని చెప్పుకొచ్చింది. బహుశా నా పెంపకంలోని లోపం అయ్యి ఉండొచ్చని బాధగా చెప్పింది. ఆమె తన భర్తను కోల్పోవడం వల్ల ఇలా రోడ్డు మీదకు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ వృత్తి చేసేందుకు నామూషీగా అనిపించలేదా అని అడగగా..అడుక్కోవడం సిగ్గు కానీ, ఏదో పనిచేసుకుంటున్నప్పుడూ సిగ్గు ఎందుకు అని ఎదురు ప్రశ్న వేస్తోంది. కష్టాల్లో కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించిన తీరు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోని ఆయుష్ గోస్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆ ఆ తల్లి గొప్ప యోధురాలు అని, మరికొందరూ..ఆమె కొడుకు మనిషిగా విఫలమయ్యాడు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ayush Goswami | Business (@aapkartekyaho) (చదవండి: 'అమ్మ చేతి వంటే కంఫర్ట్ ఫుడ్'..!) -
తల్లిదండ్రులే.. టెక్ గురువులు!
ఆఫ్‌లైన్‌లో బాలికలు/మహిళలపై జరుగుతున్న దారుణాలను మించి ఆన్లైన్లో చోటుచేసుకుంటున్నాయి అంటున్నారు సైబర్ నిపుణులు. ప్రతి పది మంది బాలికల్లో ఒకరు సైబర్ బెదిరింపులకు గురవుతున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. తల్లిదండ్రులే ఆన్లైన్ గురువులుగా మారి బాలికలకు అవగాహన కల్పించాల్సిన అవసరం నేటి రోజుల్లో ఎంతో ఉంది.సైబర్ నేరస్థులు ప్రధానంగా బాలికలు, మహిళలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. నేరస్థులు బాలికలు, మహిళల చిరునామాలు, ఆర్థిక వివరాలు, వ్యక్తిగత సంభాషణల వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. బాధితులు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే బాలికలు/మహిళల వ్యక్తిగత డేటాను బయటపెడతామని, అందరిలో పరువు పోతుందని నేరస్థులు బెదిరిస్తుంటారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక బాలికలు/మహిళలు నేరస్థులకు డబ్బులు పంపడం లేదా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలకు రావడం జరుగుతుంటుంది. చాలా మంది బాధిత మహిళలు ఇలాంటి విషయాలు బయటకు చెప్పుకోవడానికి, పోలీసులకు కంపై్టంట్ చేయడానికి ఇష్టపడరు. ఇలాంటప్పుడు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు పెద్దలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.టెక్నాలజీని పేరెంట్స్ నేర్చుకోవాలి... – పిల్లలను టెక్నాలజీ వాడకుండా అడ్డుపడకూడదు. పాజిటివ్ కోణంలోనే పిల్లలకు టెక్నాలజీని నేర్పాలి. పిల్లలతో పాటు పెద్దలూ టెక్నాలజీ జర్నీ చేయాలి. – పిల్లలకు ఫోన్ ఇవ్వడంతో పాటు ఒక హద్దును సృష్టించాలి. అదే సమయంలో వయసును బట్టి ఫిల్టరింగ్ సాఫ్ట్‌వేర్స్‌ను వాడాలి.– క్రీడల్లో కొన్ని బౌండరీస్ ఎలా ఉంటాయో టెక్నాలజీ బౌండరీస్‌ను పెద్దలే గీయాలి.– టెక్ఫోన్ ఫ్రీ జోన్స్ నిబంధనలను అమలు చేయాలి. (బెడ్రూమ్, డైనింగ్ ప్లేస్.. వంటి చోట్ల ఫోన్ వాడకూడదు..)– YAPPY (యువర్ అడ్రస్, యువర్ ఫుల్‌నేమ్, యువర్ పాస్‌పోర్ట్...ఇలా పూర్తి వివరాలు) ఆన్లైన్లో ఎవరికీ ఇవ్వకూడదని చెప్పాలి.– ఫొటోలు/డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు నిజనిర్ధారణ చేసుకోవాలి. డౌన్‌లోడ్స్‌కి వెళ్లకూడదు ∙పనిష్మెంట్గా లేదా రివార్డ్గానూ ఫోన్/ట్యాబ్.. వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పిల్లలకు ఇవ్వకూడదు.– స్క్రీన్ టైమ్– గ్రీన్ టైమ్‌కి తేడా తెలియాలి. వర్చువల్ గేమ్స్, గ్రౌండ్ గేమ్స్‌కి కండిషన్స్ పెట్టాలి ∙వయసుకు తగ్గట్టుగా ఆడే ఆన్లైన్ గేమ్స్‌కి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. వాటిని పాటించేలా జాగ్రత్తపడాలి.మనో ధైర్యాన్ని పెంచుకోవాలి..ఏవరైనా వ్యక్తితో ఇబ్బంది ఉంటే ఆ వ్యక్తి అకౌంట్‌ని బ్లాక్ చేయాలి ∙మనోధైర్యాన్ని పోగొట్టుకోకుండా ఏవైనా వీడియోలు, ఫొటోలు, చాటింగ్ సంభాషణ ... వంటివి ఉంటే డిలీట్ చేయకుండా బ్యాకప్ స్టోరీజే చేసుకోవాలి. పెద్దలతో మాట్లాడి https://cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలి.బొట్టు బిళ్లతో కవర్ చేయాలి...∙ఏదైనా వెబ్సైట్ https:// (ప్యాడ్‌లాక్ సింబల్ ఉన్న సైట్‌నే ఓపెన్ చేయాలి. పాస్వర్డ్ ఎప్పుడూ (క్యాపిటల్, స్మాల్ లెటర్స్, నంబర్స్) ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ∙ఫోన్ ఇతర గ్యాడ్జెట్స్ లొకేషన్ ఎప్పుడూ ఆఫ్ చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆన్ చేసి, మళ్లీ ఆఫ్ మోడ్‌లో ఉంచాలి ∙వెబ్ కెమరాను బొట్టు బిళ్లతో కవర్ చేసుకోవడం మేలు. ఫోన్లోనూ వెబ్ క్యామ్ అనేబుల్ క్యాప్షన్‌లో ఉంచాలి ∙తెలిసిన పరిచయాలు కాంటాక్ట్స్‌లో ఉండాలి. పరిచయస్తులతో మాత్రమే సంభాషణ జరపాలి ∙యాప్స్ కూడా ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేయాలి. ఆసక్తిగా కనిపించిన లింక్స్ అన్నీ ఓపెన్ చేయద్దు.భయపడకూడదు..మోసగాళ్లు అందుబాటులో ఉన్న మీ డేటాను, గత సోషల్‌మీడియా పోస్టింగ్‌లను, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్ని ΄÷ంది, ఆన్లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారి తీస్తుంటారు. వాయిస్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా సంభాషణ జరిపి ఆ సమాచారంతో బెదిరింపులకు పాల్పడేవారి సంఖ్య పెరిగింది. మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ పరిచయాల నుండి డబ్బు అడగడం, ద్వేషపూరిత మెసేజ్‌లు చేయచ్చు. ఆన్లైన్లో ఎవరి నుంచైనా అనైతిక ప్రవర్తనతో ఇబ్బంది పడితే భయపడకుండా కుటుంబ సభ్యులతో, టెక్నాలజీ మిత్రులతో పంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. స్కూళ్లలోనూ టీచర్లు టెక్నాలజీ విషయాల్లో అమ్మాయిలకు అవగాహన కల్పించడం తప్పనిసరి.– అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
Deepthi Jeevanji: గేలిచేస్తే గెలిచేసి...
పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో మన వరంగల్ బిడ్డ దీప్తి జీవాన్జీ కాంస్యం సాధించింది. 400 మీటర్ల టి20 విభాగంలో ఆమె ఈ ఘనతను లిఖించింది. పారా ఒలింపిక్స్‌లో ఏ విభాగంలో అయినా పతకం సాధించిన అతి చిన్న వయస్కురాలు దీప్తే. ఊర్లో అందరూ వెక్కిరించినా హేళనతో బాధించినా వారందరికీ తన విజయాలతో సమాధానం చెబుతోంది దీప్తి. ఒకనాడు హేళన చేసిన వారు నేడు ఆమె పేరును గర్వంగా తలుస్తున్నారు.మొన్నటి మంగళవారం (సెప్టంబర్ 3) పారిస్ పారా ఒలింపిక్స్‌లో దీప్తి పరుగు తెలుగు వారికీ దేశానికి గొప్ప సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చింది. 400 మీటర్ల టి20 (బుద్ధిమాంద్యం) విభాగంలో దీప్తి 55.52 సెకండ్లలో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ ΄ోటీలో మొదటి స్థానంలో ఉక్రెయిన్‌కి చెందిన యూలియా (55.16 సెకండ్లు), రెండవ స్థానంలో టర్కీకి చెందిన ఐసెల్ (55.23) సెకన్లు నిలిచారు. ఇంకొన్ని సెకన్లలో ఆమెకు స్వర్ణమే వచ్చేదైనా ఈ విజయం కూడా అసామాన్యమైనదే ఆమె నేపథ్యానికి.షూస్ లేని పాదాలుదీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. పుట్టుకతో దీప్తి బుద్ధిమాంద్యంతో ఉంది. ఆమె రూపం కూడా పూర్తిగా ఆకారం దాల్చలేదు. దాంతో స్కూల్లో చుట్టుపక్కల అన్నీ హేళనలే. మాటల్లో వ్యక్తపరచడం రాని దీప్తి అన్నింటినీ మౌనంగా సహించేది. కొందరు ‘కోతి’ అని వెక్కిరించేవారు. స్కూల్లో ఆమె ఆటల్లో చరుకుదనం చూపించేసరికి తల్లిదండ్రులు కనీసం ఈ రంగంలో అయినా ఆమెను ్ర΄ోత్సహిస్తే కొంత బాధ తగ్గుతుందని భావించారు. పిఇటీ టీచర్ బియాని వెంకటేశ్వర్లు ఆమెను ్ర΄ోత్సహించారు. హనుమకొండలో స్కూల్ లెవల్లో ఆమె పరుగు చూసి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ ్ర΄ోత్సహించాడు. రాష్ట్రస్థాయి ΄ోటీలకు హైదరాబాద్ రమ్మంటే షూస్ లేకుండా ఖాళీ పాదాలతో వచ్చిన దీప్తికి సహాయం అందించేందుకు నాగపురి రమేశ్ పూర్తి దృష్టి పెట్టాడు. దాంతో అంచలంచెలుగా ఎదిగిన దీప్తి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. పుల్లెల గోపిచంద్ కూడా ఆమె శిక్షణకు ఆర్థిక సహాయం అందించారు.బంగారు పరుగు2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. అదే సంవత్సరం బ్రిస్బే¯Œ ఆసియానియా ΄ోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిపతకం గెలిచింది. 400 మీటర్లను 57.58 సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మే 2024లో జపాన్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు పారిస్‌లో కాంస్యం సాధించడంతో ఆమె దేశ పతాకాన్ని తల ఎత్తుకునేలా చేసింది. ఒకప్పుడు గేలి చేసిన ఊరికి ఆమె పేరు ఇప్పుడు చిరునామాగా మారింది. -
ఎవరీ తులసిమతి మురుగేశన్? పుట్టుకతో వచ్చే వైకల్యం దాటుకుని..
మనం చిన్న సమస్యకే విలవిలలాడిపోతాం. కాస్త బాగోకపోతేనే చేస్తున్న పనిని వదిలేస్తాం. కానీ ఈ అమ్మాయి పుట్టుకతో వచ్చే లోపంతో పోరాడింది. అది ప్రాణాంతకంగా మారి పరిస్థితిని దారుణంగా దిగజార్చింది. ఏదోవిధంగా కోలుకుని బయటపడిందనుకున్నా..దివ్యాంగురాలిగా చేసి బాధపెట్టింది. అయితేనేం తగ్గేదే లే..! అంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించడమేగాక పారాలింపిక్స్‌లో సత్తా చాటింది. రజత పతకంతో యావత్ దేశం గర్వపడేలా చేసింది. ఇంతకీ ఎవరీమె? ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తులసిమతి మురుగేశన్ సెప్టెంబర్ 2న జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె SU5 ఫైనల్లో మహిళల సింగిల్స్‌కు చేరుకుంది. అయితే చైనాకు చెందిన యాంగ్ క్విక్సియా చేతిలో ఓడిపోయింది. కేవలం 30 నిమిషాల్లో 21-17, 21-10తో యాంగ్ క్విక్సియా మ్యాచ్‌ను గెలుచుకుంది. చివర వరకు ఉత్కంఠను రేపేలా ఆడి రజత పతకంతో భారతదేశం గర్వించేలా చేసింది. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న తొలి భారతీయ మహిళగా మురుగేషన్ చరిత్ర సృష్టించారు.ఎవరంటే ఆమె..?తులసిమతి మురుగేశన్ తమిళనాడులోని కాంచీపురానికి చెందింది. ఆమె పుట్టుకతో వచ్చే వైకల్యం తులసిమతి జీవితాన్ని అగాధంలోకి నెట్టిసింది. ఆ వైకల్యం కారణంగా బోటన వేలును కోల్సోవమే గాక ప్రాణాంతకమై ఆమె పరిస్థితిని దిగజార్చింది. ఏదోవిధంగా కోలుకున్నా.. ఎడమ చేయి చలనం కోల్పోయి దివ్యాంగురాలిగా చేసింది. అయితాన లెక్క చేయక క్రీడలపై దృష్టిసారించి. కక్రీడల పట్ల అమిత ఆసక్తిగల తండ్రి సాయంతో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. సమర్థులైన క్రీడాకారులతో ఆడేలా నైపుణ్యం సంపాదించుకుంది. అంతేగాదు ఆమె వెటర్నరీ సైన్సు విద్యార్థి కూడా. ఆమె సోదరి కిరుత్తిమా కూడా బ్యాడ్బింటన్ క్రీడాకారిణి. ఆమె అనేక జిల్లా స్థాయి ఆటలను గెలుచుకుంది. అంతేగాదు తులసీమత్ ఐదవ ఫజ్జా దుబాయ్ పారా-బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2023లో మహిళల డబుల్స్ ిభాగంలో మానసి జోషితో కలిసి బంగారు పతకాన్ని సాధించింది. ఆమె అదే ఈవెంట్లో నితేష్ కుమార్‌తో కలిసి కాంస్య పతకాన్ని కూడా సాధించింది. ఆమె అకుంఠితమైన పట్టుదల, శ్రమ ఎన్నో అవార్డులను, గౌరవ సత్కారాలను తెచ్చిపెట్టాయి. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలిచింది. జీవితం ఇచ్చే పెట్టే పరీక్షకు తలొగ్గక నచ్చినట్లుగా నీ తలరాతను రాసుకునేలా దూసుకుపోవడం అంటే ఏంటో చేసి చూపింది.A moment of immense pride as Thulasimathi wins a Silver Medal in the Women's Badminton SU5 event at the #Paralympics2024! Her success will motivate many youngsters. Her dedication to sports is commendable. Congratulations to her. @Thulasimathi11 #Cheer4Bharat pic.twitter.com/Lx2EFuHpRg— Narendra Modi (@narendramodi) September 2, 2024 (చదవండి: కిమ్ కర్దాషియాన్‌లా కనిపించాలని ఏకంగా రూ. 8 కోట్లు..పాపం ఆమె..!) -
కర్రసాము.. మార్షల్ ఆర్ట్స్.. ఇప్పుడు 'హర్ ఘర్ దుర్గ'!
కోల్‌కతాలో అభయ... హైదరాబాద్‌లో దిశ... ఢిల్లీలో నిర్భయ. చెప్పుకుంటూ పోవడమేనా? వేదన నింపుకోవడమేనా? లేడి కొమ్ములు దిగబడిన పులి కళ్లల్లో భయం కూడా సాధ్యమే. శిక్షణ తీసుకుంటే రక్షణాయుధాన్ని వాడితే దుర్మార్గం ఆగుతుంది. దుష్టుడు మన చేత చిక్కి కటకటాల పాలవుతాడు.ఆపద వస్తే ఎవరు సహాయం చేస్తారా అని నిస్సహాయంగా చూడడం కాదు, తనను తాను రక్షించుకోవడానికి ‘ఆమె’ను సమాయత్తం చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పని చేస్తోంది. ‘హర్ ఘర్ దుర్గ’ (ప్రతి ఇంట్లో దుర్గ) అనే నినాదంతో మహిళలకు స్వీయరక్షణ ప్రచారం మొదలుపెట్టింది. అమ్మాయిలకు కరాటే, జూడోలలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఐటీఐలన్నింటిలోనూ అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం కరాటే, జూడో క్లాసులు నిర్వహించనుంది. వారంలో కనీసం రెండు గంటల సమయం శారీరక వ్యాయామం, ఆత్మరక్షణ విద్యలకు కేటాయిస్తున్నారు. ఇందుకోసం స్వచ్ఛంద సంఘాల సహకారం తీసుకోనున్నట్లు తెలియచేశాయి అధికార వర్గాలు. మనదగ్గర ఈ పని ఐదేళ్ల్ల కిందటే మొదలైంది. తెలంగాణ, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తగుళ్ల స్వర్ణయాదవ్ అనే యువతి కర్రసాము నేర్చుకుని, హైదరాబాద్‌లో అకాడమీ స్థాపించి బాలికలకు నేర్పిస్తోంది.కర్రసాము... మార్షల్ ఆర్ట్స్స్వర్ణ యాదవ్ ఫోక్ సింగర్. పాటలు పాడడానికి ఒంటరిగా వెళ్లాల్సి వచ్చేది. ్రపోగ్రామ్ పూర్తయిన తర్వాత ఇంటికి చేరేసరికి రాత్రి పది దాటుతుంది. తనను తాను రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుందామె. మన దగ్గర కర్రసాము ఉందిగాని నేర్పించేవారు లేరు. తమిళనాడులో సిలంబం (కర్రసాము) ఆర్ట్ బాగా విస్తరించి ఉంది. తమిళనాడు వెళ్లి రెండేళ్ల కోర్సు చేశారు స్వర్ణ. తాను నేర్చుకుంటే సరిపోదు, వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు నేర్పించాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన తర్వాత 2019 నుంచి స్కూళ్లలో నేర్పించడం మొదలు పెట్టింది. ‘స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ’ని 2022లో రిజిస్టర్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ బంగ్లాలో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు అందుకుంది. పది మందికి శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయిలో శిక్షకులుగా తయారు చేసి వారి సహాయంతో యూసుఫ్‌గూడ, ఉప్పల్, పటాన్చెరు, ఎల్బీనగర్, మాదాపూర్, కూకట్‌పల్లిలో ఫ్రీ క్యాంపులు నిర్వహించింది. స్కూళ్లలో కూడా ఉచితంగా నేర్పించింది.. హైదరాబాద్ నగరంలో శిక్షణ తర్వాత తమ సర్వీస్‌ని తెలంగాణ జిల్లాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెబుతోందామె.అబ్బాయిలకు కూడా!‘‘కర్రసాముతోపాటు మనదేశీయ యుద్ధకళలన్నింటినీ మా అకాడెమీలో పరిచయం చేయాలనేది భవిష్యత్తు ఆలోచన. రాబోయే వేసవికి పంజాబ్ మార్షల్ ఆర్ట్ ‘గట్కా’ను ప్రవేశపెడుతున్నాం. స్కూళ్లలో అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్ అబ్బాయిల్లో దేహదారుఢ్యం తగినంతగా ఉండడం లేదు. స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయి ఊబకాయులవుతున్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, అబ్బాయిల్లో ఫిట్నెస్ పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు స్వర్ణ యాదవ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
స్పేస్‌లోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా కర్సెన్ కిచెన్..!
ఇంతవరకు పలనా పర్యటన చేశామని గొప్పగా చెప్పుకునే వాళ్లుం. ఇక నుంచి స్పేస్‌గా వెళ్లమని గొప్పలు చెప్పుకుంటామేమో..!. ఇక ముందు అలాంటి రోజులే ఉంటాయేమో కాబోలు. ఈ జాబితాలో చేరిపోయింది 21 ఏళ్ల కర్సెన్ కిచెన్. 21 ఏళ్ల ఈ ఆస్ట్రానమీ స్టూడెంట్ ఇటీవలే బ్లూ ఆరిజిన్ సంస్థ నిర్వహించిన అంతరిక్ష యాత్రలో భాగమైంది. తద్వారా అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ స్పేస్ ఔత్సాహికురాలి ఎవరూ..? ఆ ఛాన్స్ ఎలా లభించింది తదితరాల గురించి తెలుసుకుందామా..!.చాపెల్ హిల్‌లోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో చదువుతున్న కర్సెన్ కిచెన్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు. ఆమెతో పాటు నాసా ప్రాయోజిత ఏరోస్పేస్ శాస్త్రవేత్తతో సహా మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మొత్త ఆరుగురు సభ్యుల సిబ్బంది ఆగస్టు 29న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:07 గంటలకు వెస్ట్ టెక్సాస్ సైట్ ఉప కక్ష్యలోకి దాదాపు 10 నిమిషాల తర్వాత ల్యాండ్ అయ్యారు. భూమి ఉపరితలాన్ని దాటి భార రహిత స్థితిలో సుమారు మూడు నిమిషాలకు పైగానే గడిపింది. తద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది కిచెన్.‘అంతరిక్షంలోకి వెళ్లాలన్న నా కల నెరవేరింది. రోదసీ నుంచి భూమి అందాల్ని చూసి ముగ్ధురాలినయ్యా. ఇంత అందమైన గ్రహంపై జీవించడం నా అదృష్టంగా ఫీలయ్యా. ఇలా ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో నేనే పిన్న వయస్కురాలిని కావడం మరింత ఆనందంగా ఉంది. ఈ యాత్రలో భాగంగా కొన్ని వేల మైళ్ల వేగంతో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడం, అంతరిక్షంలో భార రహిత స్థితిలో తేలియాడడం, చీకటిగా ఉన్న ఆకాశం, అక్కడ్నుంచి నీలం రంగులో కనిపించే భూమి.. ఇలా ప్రతిదీ మర్చిపోలేని మధురానుభూతే!’ అంటూ తన అంతరిక్ష యాత్ర అనుభవాల్ని గూర్చి కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇలా తన కుటుంబంలో స్పేస్‌లోకి వెళ్లోచ్చిన తొలి వ్యక్తి మాత్రం కాదు. ఎందుకంటే ఆమె తండ్రి కూడా అంతరిక్ష ఔత్సాహికుడే. అతను ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అంతరిక్షంపై ఆసక్తితో ఎప్పటికైనా స్పేస్ టూర్‌కి వెళ్లాలనుకున్నారాయన. ఆయనకు ఆ అవకాశం 2022లో వచ్చింది. ఆ సమయంలో బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన ‘ఎన్ఎస్-20 మిషన్’లో రోదసీలోకి వెళ్లారాయన. ఇలా తన తండ్రి కల నెరవేరడంతో తానూ అంతరిక్ష యాత్ర చేయాలన్న ఆసక్తిని పెంచుకుంది కిచెన్. (చదవండి: ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న సైనా నెహ్వాల్..క్రీడాకారులకే ఎందుకంటే..?) -
Paris 2024 Paralympics: పారాలింపిక్స్‌లో... ప్యారే అథ్లెట్స్
కొన్ని విజయాలు ఆనందంతో ముడిపడినవి మాత్రమే కాదు. వ్యక్తిగత విజయానికే పరిమితమైనవి కావు. దారి లేని వారికి దారి చూపే విజయాలు. ధైర్యం లేని వారికి అసాధారణ ధైర్యం ఇచ్చే విజయాలు. పారాలింపిక్స్‌లో ఈ ప్యారే’ అథ్లెట్లు సాధించిన విజయాలు అలాంటివే. చరిత్ర సృష్టించిన విజయాలే కాదు నిస్సహాయులం, అశక్తులం అనుకునే వారికి స్ఫూర్తినిచ్చి శక్తిమంతం చేసే విజయాలు...బతకడమే కష్టం అంటే ... పతకం తెచ్చిందిపరుగు ఏం చేస్తుంది?‘మనం ఊహించని శక్తి మనలో ఉంది అని గుర్తు తెస్తుంది’ అంటుంది ఒక ప్రసిద్ధ మాట. ఈ మాట ప్రీతి పాల్‌కు అక్షరాలా సరి΄ోతుంది. ‘ఈ అమ్మాయి బతకడం కష్టం. బతికినా మంచానికే పరిమితం అవుతుంది’ అనుకున్న అమ్మాయి ‘పరుగు’ను బలం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై విజేతగా మెరిసింది. తాజాగా...పారిస్ పారాలింపిక్స్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో 100 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించిన ఆనంద క్షణాలలో...‘ఇది కలా నిజామా!’ అనుకుంది ప్రీతి.ఆ ఆనందం నుంచి ఇంకా పూర్తిగా బయటపడక ముందే 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకంతో మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక రైతు కుటుంబంలో పుట్టిన ప్రీతికి కష్టాలు పాత చుట్టాలు. బలహీనమైన కాళ్లతో పుట్టింది. ఫలితంగా ఆమె వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. కాళ్లను బలోపేతం చేయడానికి వివిధ సంప్రదాయ చికిత్సలు చేయించారు. అయిదు నుంచి ఎనిమిదేళ్ల వరకు కాలిపర్లు ధరించింది ప్రీతి. ‘ఈ అమ్మాయి ఇక మంచానికే పరిమితం అవుతుంది’... ఇలాంటి బలహీనమైన మాటలు ఆమె ఆత్మబలం ముందు వెల వెల బోయాయి. ప్రాణాంతక పరిస్థితులను అధిగమించి శక్తిమంతురాలిగా రూపుదిద్దుకోవడానికి తనలో ఆశావాదమే కారణం. ‘నా పరిస్థితి ఇలా అయింది ఏమిటి’ అనే బాధ కంటే ఏదో సాధించాలనే ఉత్సాహం తనలో ఉరకలు వేసేది. ‘ఈ బలహీనమై కాళ్లతో నేను ఏం సాధించగలను’ అనే ఆమె సందేహానికి టీవీలో కనిపిస్తున్న పారాలింపిక్స్ దృశ్యాలు సమాధానం చెప్పాయి. ఇక అప్పటి నుంచి పారాలింపిక్స్‌పై ప్రీతికి ఆసక్తి పెరిగింది. పారాలింపిక్ అథ్లెట్ ఫాతిమ పరిచయం ప్రీతి జీవితాన్ని మలుపు తిప్పింది. ‘నీలో ప్రతిభ ఉంది’ అని ప్రీతిని ప్రోత్సహించడమే కాదు ఆటలోని మెలకువలు నేర్పింది. ఫాతిమ మార్గదర్శకత్వంలో రాష్ట్ర,జాతీయ స్థాయి ఈవెంట్స్‌లో పాల్గొంది ప్రీతి. మీరట్‌లో ప్రాథమిక శిక్షణ తరువాత దిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రు స్టేడియంలో కోచ్ గజేంద్ర సింగ్ దగ్గర శిక్షణ తీసుకున్న ప్రీతి పాల్‌కు రన్నింగ్ టెక్నిక్‌లు నేర్చుకొని తన ప్రతిభకు సానపెట్టుకునే అవకాశం వచ్చింది.గత సంవత్సరం చైనాలో జరిగిన ఆసియా పారా చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల ఈవెంట్లలో రెండో స్థానం, నాల్గో స్థానంలో నిలిచినప్పటికి ప్రీతి నిరాశపడలేదు. పారిస్ పారాలింపిక్స్ టీ35 100 మీటర్ల ఈవెంట్లో 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్యాన్ని సాధించింది. తొలి పారాలింపిక్స్‌లోనే పతకం సాధించినందుకు తనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘పారిస్‌కు రాక ముందు పతకం సాధించాలని గట్టిగా అనుకున్నాను. నా కల నిజమైంది’ అన్న ప్రీతి పాల్ రెండో పతకాన్ని కూడా సాధించి చరిత్ర సృష్టించింది. ‘పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి ట్రాక్ మెడల్ సాధించినందుకు గర్వంగా ఉంది’ అంటుంది ప్రీతి.శరణార్థి... సీక్రెట్ జిమ్రెఫ్యూజీ పారాలింపిక్ టీమ్ నుంచి పతకం సాధించిన తొలి పారా తైక్వాండో అథ్లెట్‌గా జకియా ఖుదాదాది చరిత్ర సృష్టించింది. మహిళల 47 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ‘ఇక్కడికి రావడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఈ పతకం ఆఫ్గానిస్తాన్‌లోని మహిళలందరికీ, ప్రపంచంలోని శరణార్థులందరికీ దక్కుతుంది. ఏదో ఒకరోజు నా దేశంలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాను’ అంటుంది జకియ. ముంజేయి లేకుండా జన్మించిన జకియ పదకొండు ఏళ్ల వయసులో ఆఫ్గానిస్తాన్‌లోని తన స్వస్థలమైన హెరాత్‌లోని రహస్య జిమ్‌లో రహస్యంగా తైక్వాండో ప్రాక్టీస్ చేసేది. టోక్యో ఒలింపిక్స్ తరువాత జకియ ఖుదాదాది ΄్యారిస్‌లో స్థిరపడింది. ఆమె గెలుపు చారిత్రాత్మకం. ఆమె జీవితం ఆసక్తికరం.కాలు, చెయ్యి లేకున్నా చేపలాగా...‘సగౌరవంగా కనిపించాలి. గెలుపుపై మెరవాలి’ అంటుంది పందొమ్మిది ఏళ్ల చైనీస్ స్విమ్మర్ ఇయాంగ్ యుయాన్. పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో మహిళల 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్6 ఈవెంట్లో స్వర్ణం గెలుచుకున్న ఇయాంగ్ దివ్యాంగులు తమ కలలను సాకారం చేసుకోవడానికి తన వంతుగా స్ఫూర్తి నింపాలని అనుకుంటుంది. టోక్యో పారాలింపిక్స్ ఎస్6 50 మీటర్ల బట్టర్ఫ్లై ఈవెంట్లో కొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించి స్వర్ణం గెలుచుకుంది. తాజాగా... 32.59 సెకన్లతో మరోసారి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. నాలుగు సంవత్సరాల వయసులో కారు ప్రమాదంలో కుడి చేయి, కాలును కోల్పోయింది ఇయాంగ్. ‘నువ్వు ఎలాగైనా గెలవాల్సిందే...అంటూ నాపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. ఈ గేమ్స్‌లో నేను పోటీ పడటాన్ని చాలా మంది దివ్యాంగులు చూస్తారని నాకు తెలుసు. నా గెలుపు వారి గెలుపు కావాలనుకున్నాను’ అంటుంది ఇయాంగ్. ‘మీరు కలలు కనండి. వాటిని సాకారం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయండి’ అని దివ్యాంగులకు పిలుపు ఇస్తుంది.వీల్ చైర్ రగ్బీలో చక్రం తిప్పి...టీమ్ యూఎస్ వీల్‌చైర్ రగ్బీ అథ్లెట్ సారా ఆడమ్ అమెరికా వీల్‌చైర్ రగ్బీ జట్టులో ఆడిన తొలి మహిళగా, పారాలింపిక్స్‌లో స్కోర్ చేసిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర నృష్టించింది. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి కెనడా జట్టుపై అమెరికా వీల్‌చైర్ రగ్బీ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో సారా ఆడామ్ కీలక పాత్ర ΄ోషించింది. 2016లో సారా ఆడమ్‌కు మల్టీపుల్ స్లె్కరోసిస్గా నిర్దారణ అయింది. ‘క్రీడారంగంలో ఉన్న మహిళలకు నిజంగా ఇది ఉత్తేజకరమైన కాలం. అభిమానులు ఆటలో మేము చూపించే నైపుణ్యాలను ప్రశంసించడమే కాదు మా నేపథ్యాలు, మేము పడిన కష్టాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎలిట్ అథ్లెట్‌గా ఎదగడానికి బాగా కష్టపడ్డాను’ అని అంటుంది సారా. ఆటల్లోకి అడుగు పెట్టకముందు సారా ఆడమ్ మిస్సోరిలోని సెయింట్ లూయిస్ యూనివర్శిటీలో ఆక్యుపేషనల్ ప్రొఫెసర్. -
భళా శీతల్... నీకు గిఫ్ట్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను
పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో యావత్ క్రీడా ప్రపంచాన్నీ అబ్బురపర్చింది. 17 ఏళ్ల శీతల్ త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ అదిరిపోయే షాట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. అసాధారణ ధైర్యం, నిబద్ధత, పట్టువదలని స్ఫూర్తి పతకాలతో ముడిపడి ఉండదు అంటూ ట్వీట్ చేశారు. మీరు దేశానికి, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అంటూ సోషల్ మీడియా వేదికగా శీతల్ దేవిని అభినందించారు. Extraordinary courage, commitment & a never-give-up spirit are not linked to medals…#SheetalDevi, you are a beacon of inspiration for the country—and the entire world.Almost a year ago, as a salute to your indomitable spirit, I had requested you to accept any car from our… pic.twitter.com/LDpaEOolxA— anand mahindra (@anandmahindra) September 2, 2024అలాగే ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘18 ఏళ్లు నిండిన తర్వాత ఆఫర్(కారు బహుతి) స్వీకరిస్తారని చెప్పారు. దీని ప్రకారం వచ్చే ఏడాది కారు మీ చేతికి వస్తుంది. మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టారు ఆనంద్ మహీంద్ర.కాగా పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో యువ పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రిక్వార్టర్స్‌కు చేరి అరుదైన రికార్డు సాధించింది. తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ కాలి ఫీట్‌తో అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఆమె చేతులకు బదులుగా కాలితో విల్లు ఎక్కి పెట్టిన దృశ్యం వైరల్ గా మారింది. ప్రత్యర్థి వీల్ చైర్లోకూర్చుని చేతులతోనే బాణం వేసి పతకాన్ని కైవసం చేసుకోవడంతో తృటిలో పతకం చేజారింది. అయితే శీతల్ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలో కొద్దిమందిగా ఉన్న ఆర్మ్లెస్ ఆర్చర్లలో పిన్న వయసు ఆర్చర్‌గా శీతల్ గుర్తింపు తెచ్చుకుంది. దీంతో శీతల్ మున్ముందు అద్భుతాలు సాధిస్తుందంటూ పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు కొని యాడారు. -
ఓ గూటికి చేరిన చెదిరిన అక్షరం
‘ఎవరితోనూ కలవలేను, ఎవరికీ చెందిన దానిని కాను అనే భావనతో జీవితమంతా గడి΄ాను’ అంటోంది ‘హోమ్‌లెస్’ రచయిత్రి కె. వైశాలి. అస్తవ్యస్తంగా పలకడం, రాయడం అనే డిస్లెక్సియా, డిస్గ్రాఫియా సమస్యలను అధిగమించి తన అనుభవాలను అక్షర రూపంగా మార్చి పుస్తకంగా తీసుకొచ్చింది. ఈ ఏడాది సాహిత్య అకాడమీ యువ పురస్కార్ (ఇంగ్లిష్) అవార్డును గెలుచుకున్న వైశాలి 22 ఏళ్ల వయసులో ముంబైలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చి, హైదరాబాద్‌లో ఎలాంటి వసతులూ లేని హాస్టల్ రూమ్‌లో ఉంటూ తనలో చెలరేగే సంఘర్షణలకు సమాధానాలు వెతుక్కుంది. దేశంలో పెరుగుతున్న డిస్లెక్సియా బాధితులకు ఈ పుస్తకం ఒక జ్ఞాపిక అని చెబుతుంది. తనలాంటి సమస్యలతో బాధపడుతున్నవారిని కలుసుకుని, వారి అభివృద్ధికి కృషి చేస్తోంది.‘సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకోవడం అంటే నేను ప్రతి ఒక్కరికీ సమర్థురాలిగానే కనిపిస్తాను’ అంటూ ‘హోమ్‌లెస్’ పుస్తకం గురించి వైశాలి రాసిన వాక్యాలు మనల్ని ఆలోచింప చేస్తాయి. బయటకు చెప్పుకోవడం చిన్నతనంగా భావించే వ్యక్తిగత సమస్యలపై వైశాలి ఒక పుస్తకం ద్వారా తనను తాను పరిచయం చేసుకుంటుంది. వ్యక్తిగత జీవితం, సమాజం పట్టించుకోని మానసిక వైకల్యాలు ఉన్న పిల్లలకు వసతి కల్పించడంలో విఫలమయ్యే విద్యావ్యవస్థలోని లో΄ాలు, నిబంధనలను ధిక్కరించే వారి పట్ల సమాజం చూపే అసహన ం వంటి అంశాలెన్నింటినో వైశాలి కథనం మనకు పరిచయం చేస్తుంది. ‘‘నా బాల్యంలో డిస్లెక్సియా, డిస్గ్రాఫియాల (అస్తవ్యస్తంగా పలకడం, రాయడం) ప్రభావాన్ని అధిగమించడానికే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ కథను చెప్పడానికి నా బాల్యంలోని అన్ని అంశాలనూ అనేకసార్లు గుర్తుచేసుకున్నాను. పదే పదే పునశ్చరణ చేసుకున్నాను.బాధపెట్టిన బాల్యంనాలో ఉన్న న్యూరో డైవర్షన్స్ నన్ను నిరాశపరచేవి. వాటి వల్ల ఎవరితోనూ కలిసేదాన్ని కాదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేదానిని. నాలోని రుగ్మతలను ఇంట్లో రహస్యంగా ఉంచేవాళ్లు. నిర్ధారించని రుగ్మతల కారణంగా భయంతో నా రాతలు ఎవరికీ తెలియకుండా దాచేదాన్ని. నాలోని ఆందోళనలను, రుగ్మతలను నేనే పెంచి ఉంటానా? నేను ఇం΄ోస్టర్ సిండ్రోమ్ (తమ ప్రవర్తన, తెలివి తేటలపై తమకే అనుమానాలు ఉండటం)తో బాధపడుతున్నానా?.. ఇలా ఎన్నో సందేహాలు ఉండేవి.అద్దెలేని హాస్టల్ గదిలో..ఇరవై ఏళ్ల వయస్సులో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం ్ర΄ారంభించాను. నాదైన మార్గం అన్వేషించడానికి మా ఇంటిని వదిలేశాను. అటూ ఇటూ తిరిగి హైదరాబాద్ చేరుకున్నా. నా దగ్గర డబ్బుల్లేవు. మొత్తానికి మురికిగా, ఈగలు దోమలు ఉండే ఓ హాస్టల్లో గది ఇవ్వడానికి ఒప్పుకున్నారు అక్కడి యజమాని. ఆ హాస్టల్ గదికి తలుపులు కూడా సరిగ్గా లేవు. అలాంటి చోట నా అనుభవాల నుంచి ఒక పుస్తకం రాస్తూ, నా పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. డిస్లెక్సియా బాధితురాలిని, స్వలింగ సంపర్కం, ప్రేమలో పడటం, బాధాకరంగా విడి΄ోవడం, చదువులో ఫెయిల్, అనారోగ్యం, నిరాశ, జీవించడం అంటే ఏంటో అర్థం కాని ఆందోళనల నుంచి నన్ను నేను తెలుసుకుంటూ చేసిన ప్రయాణమే హోమ్‌లెస్ పుస్తకం.కోపగించుకున్నా.. కుటుంబ మద్దతుఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణకు మా అమ్మ హాజరైంది. ఆమె నాకు ఇచ్చిన ఆసరా సామాన్య మైనది కాదు. అయితే, మొదట నా పుస్తకంలోని రాతల వల్ల అమ్మ మనస్తాపం చెందింది. కానీ, నేనెందుకు అలా నా గురించి బయటకు చె΄్పాల్సి వచ్చిందో ఓపికగా వివరించాను. అవార్డు రావడంతో నాపై ఉన్న కోపం ΄ోయింది’’ అని ఆనందంగా వివరిస్తుంది వైశాలి.సమాజంలో మార్పుకుఅనిశ్చితి, దుఃఖం, గజిబిజిగా అనిపించే వైశాలి మనస్తత్వం నుంచి పుట్టుకు వచ్చిన ఈ పుస్తక ప్రయాణం ఒక వింతగా అనిపిస్తుంది. సైమన్, ఘుస్టర్, యోడా ప్రెస్ సంయుక్తంగా వైశాలి పుస్తకాన్ని మన ముందుకు తీసుకువచ్చాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ ్ర΄÷ఫెసర్ మనీష్ ఆర్ జోషీ రాసిన అభినందన లేఖ వైశాలికి ఎంతో ఓదార్పునిచ్చింది. ‘డిస్లెక్సిక్ వ్యక్తుల గురించిన విధానాలు, చట్టం, మార్గదర్శకాలపై నా పుస్తకం ప్రభావం చూపగలదని ఆశాజనకంగా ఉంది. గదిలో ఒంటరిగా కూర్చుని రాసుకున్న పుస్తకం సమాజంలో మార్పుకు దారితీస్తుందని తెలిసి ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది’ అని చెబుతుంది వైశాలి. తన పుస్తకం తనలాంటి సమస్యలు ఉన్న వారితో ఓ ‘గూడు’ను కనుగొన్నట్టు చెబుతుంది వైశాలి. -
ఇషా అంబానీకి ఆరేళ్లున్నప్పటినుంచీ..తొలి ఫీజు రూ. 25లే : వీణా
సెలబ్రిటీ మెహందీ కళాకారిణి, వీణా నగ్దా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన ప్రత్యేక మెహందీ కళతో సెలబ్రిటీ వధువుల ఫస్ట్ ఆప్షన్ ఆమె. బాలీవుడ్ క్వీన్స్ అందాల హీరోయిన్ శ్రీదేవి మొదలు ఈతరం దీపికా పదుకొనే, అలియా భట్, ట్వింకిల్ ఖన్నా, కృతి ఖర్బందా దాకా ఆమే హాట్ ఫ్యావరేట్. పలు బాలీవుడ్ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. వీణా. అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబంతో ఆమెకు సుదీర్ఘం అనుబంధం ఉంది. అంబానీలతో తన 38 ఏళ్ల అనుబంధం గురించి ప్రస్తావించిన వీణా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషం.వీణా నగ్దా మెహందీ ఆర్ట్‌పై తన తనకున్న ప్రేమను వివరించడంతోపాటు, 38 ఏళ్ల అంబానీ కుటుంబంలో కోకిలాబెన్ అంబానీ నుండి నీతా అంబానీ వరకు తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అంబానీ కుటుంబంలో రెండు చేతుల నిండా నిండుగా గోరింటాకు పెట్టినందుకు తీసుకున్నతొలి రెమ్యునరేషన్ రూ, 25 రూపాయలట. ఆ సమయంలో ముఖేష్ అంబానీ కోకిలాబెన్ ఫోన్ నెంబరు, కార్డు ఉండాలని సలహా ఇచ్చాడు. దీంతో ఆమె సలహా పాటించినట్టు వీణా తెలిపారు. తనను ఎంతో మెచ్చుకునేవారని ఆమె చెప్పారు. అంతేకాదు అంబానీ ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు, ఎక్కువ ఫీజు వసూలు చేయాలని సూచించారట పొరుగింటివారు. కానీ తాను ఎన్నడూ అలాగ చేయ లేదని వెల్లడించింది. అంబానీలతో కలిసి పని చేయడమే గొప్ప అవకాశంగా భావించి సాధారణ కస్టమర్ల నుంచి పొందే ఛార్జీనే తీసుకోవాలని తన తల్లి కోరిందట. ఆ సలహా తనకు ఎప్పుడూ గుర్తుండేదంటూ చెప్పుకొచ్చారు.ఇషాకు ఆరేళ్లప్పటినుంచి గోరింటాకు పెడుతున్నాఇషా అంబానీ , శ్లోకా మెహతాకు 6 సంవత్సరాల వయస్సులో గోరింటాకు వారి చేతులను అలంకరించిన విషయాన్ని వీణా నగ్దా గుర్తు చేసుకుంది ఇషాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వీణా నగ్దాను మెహందీ ఆర్టిస్ట్‌గా ఉన్నారు. ధీరూభాయ్ అంబానీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి తాను హాజరయ్యానని, ఆయన కుమార్తెల చేతులకు కూడా మెహందీ పెట్టానని తెలిపింది. అప్పుడు శ్లోకాకి కూడా ఆరేళ్లు అని కూడా వీణా గుర్తు చేశారు. వారంతా చదువుల కోసం సింగపూర్‌లో ఉండేవారికి ఇంటికి వచ్చినప్పుడల్లా మెహందీ పార్టీలు చేసుకునే వారని వివరించారు.పారిస్ ఒలింపిక్స్ 2024, మెహిందీ ఆర్ట్పారిస్ ఒలింపిక్స్ 2024కి ఆహ్వానించినపుడు తానెంతో పొంగిపోయానని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటేందుకు నీతా అంబానీ చేసిన పనికి థ్రిల్ అయ్యానని వీణా వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియన్ హౌస్‌లోని మెహందీ స్టాల్ గురించి మాట్లాడటం, ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది ఒలింపిక్ రింగ్‌ను మెహందీ డిజైన్ వేయించుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. 'మెహెందీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్' అని ట్యాగ్ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన కళకు విస్తరణకు అందించిన సహాయాన్ని కూడా వీణా గుర్తు చేసుకున్నారు. -
ప్రమాదం నుంచి పతకం దాకా, చరిత్రను తిరగరాసింది
‘పుస్తకం హస్తభూషణం’ అంటారు. అయితే అది అలంకారం మాత్రమే కాదు అంధకారాన్ని పారదోలే వజ్రాయుధం అనేది ఎంత నిజమో చెప్పడానికి అవని లేఖరా ఒక ఉదాహరణ. కారు ప్రమాదం తాలూకు జ్ఞాపకాల కారు చీకట్లో నిస్తేజంగా మారిన అవని జీవితంలో ఒక పుస్తకం వెలుగు నింపింది. విజేతను చేసింది. తాజాగా... పారిస్ పారాలింపిక్స్ షూటింగ్లో స్వర్ణం గెలుచుకొని మరోసారి సత్తా చాటింది అవని లేఖరా..టోక్యోలో జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది అవని లేఖరా. చిన్నప్పటి నుంచే అవనికి ఆటలు అంటే ఇష్టం. తండ్రి సలహా మేరకు ఆర్చరీ ప్రాక్టీస్ చేసేది. ఆ తరువాత తన ఆసక్తి షూటింగ్ వైపుకు మళ్లింది. జైపూర్(రాజస్థాన్)లోని కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్న అవని అక్కడే షూటింగ్లో తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది.2012లో కారు ప్రమాదంలో వెన్నెముక గాయంతో పక్షవాతానికి గురైంది అవని. పక్షవాతం మాట ఎలా ఉన్నా మానసికంగా తాను బాగా బలహీనపడింది. ఆ సమయంలో స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఆత్మకథ అవనికి ఎంతో స్ఫూర్తి ఇచ్చింది, జీవితాన్ని ఉత్సవం చేసుకునే శక్తిని ఇచ్చింది. అలా 2015లో తనకు ఇష్టమైన షూటింగ్‌లోకి వచ్చింది. ఒక యజ్ఞంలా సాధన మొదలు పెట్టింది. ఒకే పారాలింపిక్స్ (టోక్యో)లో రెండు పతకాలు అందుకున్న భారతదేశ ఏకైక మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. గత మార్చిలో అవనికి పిత్తాశయ శస్త్ర చికిత్స జరిగింది. మరోవైపు తన ముందు పారిస్ పారాలింపిక్స్ కనిపిస్తున్నాయి. కొన్ని నెలల విరామం తరువాత మళ్లీ రైఫిల్ చేతిలోకి తీసుకుంది. ఆ సమయంలో ఆపరేషన్ తాలూకు శారీరక బాధ, మానసిక ఒత్తిడి తన నుంచి దూరమయ్యాయి. లక్ష్యం ఒక్కటే తన కళ్ల ముందు కనిపించింది,టోక్యో ఒలింపిక్స్ విజేతగా అవనిపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. అయితే ఆమెకు ఒత్తిడి అనుకోని అతిథి ఏమీ కాదు. టోక్యో పారాలింపిక్స్ తన తొలి ఒలింపిక్స్. దీంతో ఎంతో ఒత్తిడి ఉంటుంది. అయినా సరే ఆ ఒత్తిడిని చిత్తు చేసి చరిత్ర సృష్టించింది.తాజాగా పారిస్ పారాలింపిక్స్‌లోనూ విజయభేరీ మోగించింది.ఒక క్రికెటర్ టోర్నీలో విఫలమైతే తనను తాను నిరూపించుకోవడానికి పట్టే సమయం తక్కువ. అదే ఒలింపియన్ విషయంలో మాత్రం నాలుగేళ్లు వేచిచూడాలి’ అభినవ్ బింద్రా ఆత్మకథలోని వాక్యాన్ని అవని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. దీనివల్ల బంగారంలాంటి అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత పడుతుంది. ఆ జాగ్రత్తే ఈసారి కూడా బంగారు పతకాన్ని మెడలోకి తీసుకువచ్చింది. టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 పాయింట్లతో రికార్డ్ నెలకొల్పింది అవని. తాజాగా 249.7 పాయింట్లతో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసుకోవడం మరో విశేషం. -
రెడ్ ఐ పై కన్నెర్ర చేద్దాం!
‘గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టు బడింది’. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన ఇది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అసాంఘిక కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్న వాళ్లు కూడా విద్యావంతులే. ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు వ్యవస్థ మొత్తం నిద్రలేవడం, ఆ తర్వాత మర్చిపోవడమే జరుగుతోంది. స్పై కెమెరాల దుర్వినియోగం మీద నిఘా వ్యవస్థ రోజూ పని చేయాల్సిందేనన్నారు ‘యాంటీ రెడ్ ఐ’ యాక్టివిస్ట్ వరలక్ష్మి. ఈ డేగకన్ను గురించి సామాన్యుల్లో అవగాహన కల్పించడానికి సినిమా హాళ్లలో ప్రకటనల రూపంలో స్పై కెమెరాలు ఎన్ని రకాలుగా అమర్చే అవకాశం ఉంటుందో బొమ్మలతో చూపిస్తూ న్యూస్ రీల్ వేయాలన్నారు. తరచూ తనిఖీలు తప్పనిసరి! విద్యాసంస్థలకు అనుమతులిచ్చేటప్పుడే అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్ భవనాలు ఏ దిశలో ఉన్నాయి. రెండు భవనాల్లో బాత్రూమ్లు ఒకరికొకరు కనిపించని విధంగా నిర్మాణం ఉండాలి. షీ టీమ్స్, భరోసా టీమ్ సభ్యులు ప్రతి విద్యాసంస్థ నుంచి కొందరు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఉమెన్ క్యాడెట్లను సమీకరించి వర్క్‌షాపులు నిర్వహించాలి. ఆ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు తమ విద్యాసంస్థలో వర్క్‌షాపులు నిర్వహిస్తూ స్పై కెమెరాలను గుర్తించడం, గుర్తించిన వెంటనే ఇంటర్నల్ కమిటీలకు తెలియచేయడం మీద చైతన్యవంతం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టణం, నగరంలోని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, హాస్పిటళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్‌లో తనిఖీలు చేసి ‘ఫలానా తేదీన, ఫలానా టైమ్‌లో తనిఖీ జరిగింది. అసాంఘికంగా ఎటువంటి స్పై కెమెరాలు లేవు’ అనే స్టిక్కర్ అతికించాలి. స్పై కెమెరాను గుర్తిస్తే ఆ విద్యాసంస్థ, వ్యాపార సంస్థ ఏదైనా సరే తక్షణమే మూసివేయడం, యజమాని మీద నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం వంటి కఠినచర్యలు ఉండాలి. రోజూ నగరంలో ఏదో ఒక చోట తనిఖీలు జరుగుతుంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం పడుతుంది. వ్యాపార సంస్థల ప్రకటనల హోర్డింగ్‌లో స్పై కెమెరా లోగో, ‘మహిళల భద్రత మా బాధ్యత’ అనే క్యాప్షన్ ముద్రించడం తప్పనిసరి చేయాలి. స్పై కెమెరాలు లక్షల్లో అమ్ముడవుతున్నాయి! స్పై కెమెరాల అమ్మకం మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్పై కెమెరా కొంటున్న వారి ఆధార్ నంబరు, స్పై కెమెరా కొంటున్న అవసరం ఏమిటో స్పష్టంగా తెలియచేయాలనే నిబంధన పెట్టాలి. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో లోకల్ కమిటీలున్నాయి. జిల్లా కలెక్టర్, షీ టీమ్స్ సేవలను విస్తృతం చేయడంతోపాటు బాధితులు సమాచారం అందించడానికి జిల్లాకో ఫోన్ నంబరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట పడుతుంది. కెమెరా లేదనే భరోసానిద్దాం! హెవెన్ హోమ్స్ సొసైటీ ద్వారా ఆపదలో ఉన్న అమ్మాయిలను రక్షించడం, వారికి సాధికారమైన ఉ΄ాధి కల్పించడం, వివిధ సామాజికాంశాలపై అవగాహన కోసం సదస్సులు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో స్పై కెమెరాల మీద యుద్ధం మొదలు పెట్టాం. ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి ఒక నియమావళిని రూపొందించాను. ఆ సూచనలతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మహిళల భద్రత కోసం ‘నో హిడెన్ కెమెరా ఇన్సైడ్’ అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టింది. సీసీటీవీలున్న చోట ‘మీరు సర్వేలెన్స్ కెమెరా నిఘాలో ఉన్నారు’ అనే హెచ్చరిక ఉన్నట్లే... ‘స్పై కెమెరా లేదా హిడెన్ కెమెరా లేదు, మీరు ధైర్యంగా ఉండవచ్చు’ అని భరోసా కలిగించే క్యాప్షన్ కూడా ఉండాలి. నిర్భయ నిధులు ప్రతి రాష్ట్రానికీ విడుదలవుతుంటాయి. కానీ ఖర్చు చేయకుండా ఉండి పోతుంటాయి. ఆ నిధులను ఇలా సద్వినియోగం చేయాలి. – అడపా వరలక్ష్మి, సామాజిక కార్యకర్త – వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Juhi Chawla: సిరిలో బెస్ట్
‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమాతో దేశానికి పరిచయం అయిన జూహీ చావ్లా మన దేశంలో అత్యంత సిరి గల మహిళల్లో ఒకరిగా నిలిచింది.తాజాగా విడుదలైన ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024’ ప్రకారం మనదేశంలో అత్యధిక సంపద కలిగిన మొదటి పదిమంది స్త్రీలలో జూహీ 6 వస్థానంలో ఉంది. సినిమా, క్రికెట్ వంటి రంగాల్లో పెట్టిన పెట్టుబడి ఆమెను ఈ స్థానానికి చేర్చింది. ఆమె పరిచయం, మిగిలిన స్థానాల్లో ఉన్న ఇతరుల గురించి కథనం.సంపద మగవాడి సొత్తు అనుకునే రోజుల నుంచి సంపద సృష్టించే మహిళా ΄ారిశ్రామికవేత్తల వరకూ కాలం మారింది. మారిందనడానికి వివిధ సూచికలు సాక్ష్యం పలుకుతున్నాయి. మన దేశంలో సంపన్నుల జాబితాను ఏ ఏటికా ఏడు వెల్లడి చేసే ‘హురున్ ఇండియా’ సంస్థ 2024కు గాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో స్త్రీలు పెద్ద సంఖ్యలో ఉండటం సంతోషం కలిగించే సంగతి. పురుషుల్లో అదానీ 1,161,800 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే అంబాని 1,014,700 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే స్త్రీలలో జోహొ గ్రూప్‌కు చెందిన రాధా వెంబు 47,500 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, నైకా గ్రూప్‌కు చెందిన ఫాల్గుణి నాయక్ 32,200 కోట్లతో రెండోస్థానంలో ఉంది. పురుషులతో ΄ోల్చితే స్త్రీల దగ్గర సగం సంపదే ఉన్నా స్త్రీలు ఆ స్థాయిలో వ్యా΄ార సంపదను సృష్టించడం పెద్ద ఘనత. మరో ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే సంపద ఎక్కువ కలిగిన స్త్రీలలో జూహి చావ్లా 4,600 కోట్లతో ఆరవ స్థానంలో నిలవడం.సినిమా రంగంలో 2వ స్థానం‘హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ 2024’ వివిధ కేటగిరీలలో సంపద కలిగిన వారి ర్యాంకులను ఇచ్చింది. సినిమా రంగానికి సంబంధించి షారుక్ ఖాన్ 7,300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా జూహి చావ్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. మూడో స్థానంలో హృతిక్ రోషన్ (2000 కోట్లు), ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ (1200 కోట్లు), కరణ్ జోహార్ (1400 కోట్లు) ఉన్నారు. జూహి చావ్లా దాదాపుగా సినిమాలలో నటించక΄ోయినా బాలీవుడ్లో భారీ ΄ారితోషికం తీసుకునే నటీమణులు ప్రస్తుతం ఉన్నా ఆమె సంపద భారీగా కలిగి ఉండటం ఆమెలోని ఆర్థిక దృష్టికి నిదర్శనం.ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ కూతురుజూహీ చావ్లా అంబాలా (హర్యాణా)లో పుట్టి ముంబైలో పెరిగింది. తండ్రి ఇన్‌కంటాక్స్ ఆఫీసరు. తల్లి గృహిణి. బాల్యంలో నటి ముంతాజ్, తర్వాత శ్రీదేవిలను చూసి సినిమాల్లోకి రావాలనుకున్న జూహీ మోడల్‌గా పని చేసింది. 1984లో ‘మిస్ ఇండియా’ కిరీటం సాధించడంతో ఆమెను బాలీవుడ్ గుర్తించింది. అదే సంవత్సరం ఆమె నటించిన మొదటి సినిమా ‘సల్తనత్’ భారీ అపజయం మూటగట్టుకుంటే వేషాలు లేని జూహి దక్షిణాదికి వచ్చి కన్నడ సినిమా ‘ప్రేమలోక’ (1987) చేసింది. ఆ సినిమాతో ఆమె పేరు మార్మోగింది. 1988లో ‘ఖయామత్ సే ఖయామత్ తక్’లో నటించాక ఆమె వెనక్కు తిరిగి చూసే పని లేకుండా΄ోయింది.షారూక్ ఖాన్‌తో ్ర΄÷డక్షన్ హౌస్‘రాజూ బన్‌గయా జంటిల్మెన్’ సినిమాలో షారూక్, జూహీ చావ్లా స్నేహం మొదలయ్యింది. ఆ స్నేహం బలపడి నేటికీ కొనసాగుతూ ఉంది. మొదట అతనితో కలిసి ‘డ్రీమ్స్ అన్లిమిటెడ్’ అనే ్ర΄÷డక్షన్ సంస్థ స్థాపించి ‘ఫిర్ భీ దిల్ హై హిందూస్థానీ’, ‘అశోక’, ‘చల్తే చల్తే’ సినిమాలు తీసింది జూహీ. ఆ తర్వాత షారూక్ స్థాపించిన రెడ్ చిల్లిస్ సంస్థలో భాగస్వామి అయ్యింది. ఐíపీఎల్ మొదలయ్యాక షారూక్‌తో కలిసి కోల్కటా నైట్‌రైడర్స్‌కు సహ భాగస్వామి అయ్యింది.వ్యా΄ారవేత్తతో వివాహంజూహీ చావ్లా ‘మెహతా గ్రూప్’ అధినేత జయ్ మెహతాను 1995లో వివాహం చేసుకుంది. జయ్ మెహతా మొదటి భార్య సుజాతా బిర్లా విమాన ప్రమాదంలో మరణించడంతో జయ్ మెహత్ ఈమెను వివాహం చేసుకున్నాడు. ఆఫ్రికా దేశాలలో సిమెంట్, ΄్లాస్టిక్ తదితర పరిశ్రమలు ఉన్న జయ్ మెహతా వ్యా΄ారాల్లో కూడా జూహీ భాగస్వామి కావడంతో ఆమె సంపద మెల్ల మెల్లగా పెరుగుతూ ΄ోయింది. అయితే ఈ క్రమంలో ఆమె ఎన్నో ఆటు΄ోట్లు ఎదుర్కొంది. సొంత అన్న, చెల్లి ఇద్దరూ మరణించారు. ఒక దశలో మాధురి దీక్షిత్ వంటి స్టార్ల హవా వల్ల సినిమాలు లేని స్థితి. ‘అయినా నీ లోపల ఉన్న ఆత్మిక శక్తిని ఉద్దీపనం చేయగలిగితే నువ్వు ముందుకు ΄ోగలవు’ అంటుంది జూహీ.మన దేశ మహిళా శ్రీమంతులురాధా వెంబు (మొదటి స్థానం – 47,500 కోట్లు): సోదరులు శ్రీధర్ వెంబు, శేఖర్ వెంబుతో కలిసి రాధా వెంబు స్థాపించిన ‘జోహో’ సంస్థ భారీ విజయాలు సాధిస్తుండటంతో ఆమె సంపద పెరిగింది. జోహో అందరికంటే ఎక్కువ వాటా ఉన్న రాధాకే. చెన్నైలో పుట్టి పెరిగిన రాధ ఐఐటీ మద్రాసులో చదువుకుంది. పబ్లిసిటీకి దూరంగా ఉండటాన్ని ఇష్టపడుతుంది. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.ఫాల్గుణి నాయర్ (రెండవ స్థానం – 32,200 కోట్లు): ఆన్లైన్ బ్యూటీ బ్రాండ్‌కు ఏమాత్రం అనుకూలత లేని కాలంలో ‘నైకా’ స్థాపించి ఘన విజయం సాధించింది ఫాల్గుణి నాయర్. నైకా ్ర΄ారంభించేనాటికి ఆమెకు 50 ఏళ్లు. ఐ.ఐ.ఎం. అహ్మదాబాద్‌లో చదవడం వల్ల ఆమెకు వ్యా΄ారసూత్రాల మీద పట్టు వచ్చింది. సౌందర్య సాధనాల పట్ల ఉన్న ఆసక్తి వినియోగదారులకు ఎలాంటివి కావాలో తెలిసేలా చేసింది. ఫాల్గుణి అమ్మే ఉత్పత్తులు ఆమెకు సంపద తెచ్చిపెడుతున్నాయి.జయశ్రీ ఉల్లాల్ (మూడవ స్థానం – 32,100 కోట్లు): లండన్ లో పుట్టి ఢిల్లీలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన జయశ్రీ ఉల్లాల్ ఇం/టనీరింగ్‌లో ఎం.ఎస్ చేసి ‘అరిస్టా’ అనే క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీని స్థాపించి బిలియనీర్‌గా ఎదిగింది.కిరణ్ మజుందార్ (నాలుగో స్థానం – 29,000 కోట్లు): తన బ్యాంకు ఖాతాలో ఉన్న పది వేల రూ΄ాయల పెట్టుబడితో ఒక కారుషెడ్డులో మొదలైన బయోకాన్ ఇండియా సంస్థ కిరణ్ మజుందార్‌ను ఇవాళ ప్రపంచవ్యాప్త గుర్తింపుతో, సంపదతో నిలబెట్టింది. నాడు మహిళలు ఎవరూ చదవని విభాగం ‘ఫర్మంటేషన్’లో పి.జి చేసిన కిరణ్ తొలత ఎంజైమ్స్ తయారు చేస్తూ నేడు మానవాళికి మేలు చేసే జీవ రక్షకాల తయారీ వరకూ చేరుకుంది. కిరణ్ ఎప్పుడూ అపర కుబేరుల టాప్ లిస్ట్‌లో ఉంటూనే ఉంటుంది.నేహా నార్ఖెడె (ఐదో స్థానం – 4,900 కోట్లు): కాన్ఫ్లుయెంట్ అనే క్లౌడ్ కంపెనీకి కో ఫౌండర్‌గా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న నేహా నార్ఖెడె ఇందిరా గాంధీ, కిరణ్ బేడీ వంటి మహిళల నుంచి స్ఫూర్తి ΄÷ంది జీవితంలో ఏదైనా సాధించాలనుకుంది. పూణె నుంచి అమెరికా వెళ్లి చదువుకుని 2014లో కాన్‌ఫ్లుయెంట్‌ను స్థాపించింది. -
Dr Anita Shah: ఆధ్యాత్మిక కళకూ.. ఒక చరిత్ర ఉంది!
ఆమెది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. ఆమె వృత్తీ, ప్రవృత్తీ రెండూ కళలను అధ్యయనం చేయడమే కావడం వల్ల భారతీయ చిత్రరీతుల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. మనదేశంలో విలసిల్లిన కళారూపాలు ఏయే దేశాల మ్యూజియాల్లో ఉన్నాయో తెలుసుకుని ప్రతి విషయాన్నీ గ్రంథస్తం చేస్తున్నారు. ఆమే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన డాక్టర్ అనితా షా, చిత్రకళల పరిశోధకురాలు.ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐసీఓఎమ్)లో కీలక సభ్యురాలిగా ప్రపంచదేశాల్లో పర్యటిస్తూ మ్యూజియాలజీ విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మనదేశంలో విస్తరించిన వైవిధ్యభరితమైన చిత్రకళారూపాల గురించిన సమగ్రమైన వివరాలతో ‘కలర్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో ఆవిష్కరించారు. అమెరికా, ఇండియాల్లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిత్రకళ మీద సదస్సులు నిర్వహిస్తున్న అనితా షా గతంలో ఆమె భర్త భరత్ షాతో కలిసి ‘త్రెడ్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో రాజస్థాన్, గుజరాత్‌లోని కచ్‌లో అభివృద్ధి చెందిన ఎంబ్రాయిడరీలతో ప్రదర్శన నిర్వహించారు.రాస్తే కావ్యం... గీస్తే చిత్రం..‘‘చిత్రం అంటే సాహిత్యాన్ని కంటితో చూపించే ప్రక్రియ. నిరక్షరాస్యులకు ఒక గ్రంథసారాన్ని బొమ్మల్లో చూపించవచ్చు. చిత్రకారులు కాలానుగుణంగా మార్పులను జోడించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో దక్కనీ– హైదరాబారీ ఆర్టిస్టులు సంయుక్తంగా కృషి చేసి గోల్డెన్ కలంకారీ పెయింటింగ్స్‌కు రూపకల్పన చేశారు. ఇది పద్దెనిమిదవ శతాబ్దపు చివరి రోజుల్లో అభివృద్ధి చెందింది. కళాకారుల కళానైపుణ్యం అంతా కృష్ణుడు, గోపికల రూపాలను తీర్చిదిద్దడంలో కనిపిస్తుంది. నేను శ్రీవల్లభాచార్య వల్లభ సంప్రదాయ తత్వం పుష్టిమార్గం మీద ఎక్కువగా పని చేశాను.వల్లభాచార్య తత్వం శుద్ధ అద్వైతం, కృష్ణతత్వంతో ఉంటుంది. శైవం ప్రభావం కొన్ని చిత్రాల్లో కనిపిస్తుంది. ఇందులో తాత్విక చింతన, పురాణాల అవలోకనమే ప్రధానంగా సాగుతుంటుంది. సద్గురువుల ప్రవచనాలు, ప్రబోధాల వల్ల అనేక ఊహాచిత్రాలకు రూపం వచ్చింది. సామాన్యులకు ఆరోగ్యకరమైన, ఆచరణీయమైన దైనందిన జీవనశైలిని కూడా పౌరాణిక కథల ద్వారానే వివరించేవారు. తల్లి బిడ్డను లాలనగా నిద్రలేపడం, బిడ్డకు స్నానం చేయించి దుస్తులు ధరింపచేసి చక్కగా అలంకరించడం వంటివన్నీ కృష్ణుడు, యశోద పాత్రల ద్వారా బొమ్మల్లో రూపుదిద్దుకున్నాయి.చిత్రకళలో కృష్ణతత్వం..మన చిత్రకళ, శిల్ప కళ అన్నీ చరిత్ర, పురాణేతిహాసాల ఆధారంగానే అభివృద్ధి చెందాయి. సామాజిక మార్పులను ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతుంటాయి. భాగవత పురాణాల ప్రభావం ఉత్తరాదిలో ఎక్కువ. కాబట్టి ఉత్తరాది చిత్రకళలు ఎక్కువగా కృష్ణతత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. కృష్ణుడు ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యుడే. ప్రతి సంఘటనను కృష్ణుడితో అన్వయించుకుంటారు.ముస్లిం ఆర్టిస్టులు హిందూచిత్రాలు..నా తాజా రచన కలర్స్ ఆఫ్ డివోషన్ పుస్తకం వెనుక ఏడేళ్ల శ్రమ ఉంది. ఇది పాఠకుల సాంస్కృతిక, సామాజిక దృష్టి కోణాన్ని విస్తృతపరుస్తుందని చెప్పగలను. హిందూ పురాణాల ఆధారంగా చిత్రాలకు రూపకల్పన చేసిన వారిలో ముస్లిం చిత్రకారులున్నారు. ఆదిల్ షా స్వయంగా సరస్వతీ మాతను పూజించాడు. ఇలాంటి అనేక సామరస్య సహజీవన ఆధారాలు మనప్రాచీన చిత్రాల్లో దొరుకుతాయి. భారతీయ చిత్రకళలో సాంస్కృతికప్రాముఖ్యతను తెలియచేశాను.గతంలో ‘విజిటర్స్ టూ సౌత్ ఇండియన్ మ్యూజియమ్స్– మ్యూజియోలాజికల్ కాంటెక్ట్స్ అండ్ విజిటర్ స్టడీ’ పేరుతో పుస్తకం తెచ్చాను. చిత్రకళారీతులతోపాటు వాటిని చిత్రించిన వస్త్రనైపుణ్యాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించాలి. మన చిత్రకళారీతులన్నీ ఒకచోట గుదిగుచ్చి లేక΄ోవడం దురదృష్టకరం. ఒక్కొక్కటి ఒక్కోచోట ఉండడంతో ఒక సమగ్రమైన స్వరూపం రావడం లేదు. అందుకే మ్యూజియాల్లో ప్రదర్శనలో ఉన్న కళాఖండాల ఫొటోలు, వివరాలతో రచనలు చేస్తున్నాను. ఇదే నా పని’’ అని వివరించారు డా. అనితాషా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అన్నీ తానై.. తానే నాన్నయి
తండ్రి ఉన్నప్పుడు అఖిలకు చదువే లోకం. ఎప్పుడో తప్ప పొలానికి వెళ్లేది కాదు. నాన్నకు మాత్రం వ్యవసాయమే లోకం. నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తరువాత అఖిలకు దుఃఖం తప్ప బతుకు దారి కనిపించలేదు. ఆ విషాద సమయంలో ‘నాన్నా... నీకు నేను ఉన్నాను’ అంటూ పచ్చటి పొలం అఖిలకు అభయం ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను తలకెత్తుకున్న అఖిల ఇప్పుడు రైతుగా మారింది. తన రెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలుస్తోంది. ‘డిగ్రీ సదివి ఏందమ్మా ఈ కష్టం’ అంటారు చాలామంది సానుభూతిగా. కానీ వ్యవసాయం చేయడం తనకు కష్టంగా కంటే ఇష్టంగా మారింది. ఎందుకంటే... పొలం దగ్గరికి వెళితే నాన్న దగ్గరికి వెళ్లినట్లు అనిపిస్తుంది. నాన్న ఎక్కడి నుంచో తన కష్టాన్ని చూస్తున్నట్లు, సలహాలు ఇస్తున్నట్లు అనిపిస్తుంది.యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఎల్మ శ్రీనివాస్ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ‘చనిపోవాల్సిన వయసు కాదు’ అని తల్లడిల్లిన వాళ్లు.... ‘పిల్లల గతి ఏం కావాలి’ అని కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ‘ఇంత అన్యాయం చేసి పోతవా కొడకా’ అంటూ వృద్ధాప్యంలో ఉన్న శ్రీనివాస్ తల్లి ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారికి ఏడుపు ఆగలేదు.‘కాలం ఎంత బాధకు అయినా మందుగా పనిచేస్తుంది’ అంటారు. అయితే రోజులు గడిచినా, నెలలు గడిచినా శ్రీనివాస్ భార్య బాధ నుంచి తేరుకోలేదు. ఆ బాధతోనే ఆమె మంచం పట్టింది. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది పెద్దకుమార్తె వివాహం జరిగింది. ఇక కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత చిన్న కుమార్తె అఖిలపై పడింది.‘ఎవుసాయం నీ వల్ల ఎక్కడ అవుతుంది బిడ్డా... పట్నంలో ఏదన్న ఉద్యోగం చూసుకో’ అన్నారు కొందరు. ‘వ్యవసాయం అంటే వంద సమస్యలుంటయి. నీ వల్ల కాదుగని పొలాన్ని కౌలుకు ఇయ్యండ్రీ’ అని సలహా ఇచ్చారు కొందరు. ‘వ్యవసాయం ఎందుకు చేయకూడదు. అఖిల చెయ్యగలదు’ అనే మాట ఏ నోటా వినిపించలేదు.పూరింట్లో మంచం పట్టిన అమ్మను, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మను విడిచి పట్నంలో ఉద్యోగంలో చెయ్యలా? ‘చెయ్యను. వ్యవసాయమే చేస్తాను’ అని గట్టిగా నిశ్చయించుకుంది అఖిల. వ్యవసాయం అనేది కాలేజీని మించిన మహా విశ్వవిద్యాలయం. ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. కాలేజీలో చదివే వారికి సంవత్సరానికి ఒక సారే పరీక్ష ఉంటుంది. కాని రైతుకు ప్రతిరోజూ పరీక్షే.‘యస్... ఆ పరీక్షల్లో నేను పాస్ కాగలను’ అంటూ ధైర్యంగా పొలం బాట పట్టింది కాలేజి స్టూడెంట్ అఖిల. ‘వచ్చినవా బిడ్డా’ అంటూ నాన్న చల్లగా నవ్వినట్లు అనిపించింది. ఆ ఊహ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ‘నేను పరాయి దేశానికి పోలేదు. నాన్నకు ఇష్టమైన చోటుకే వచ్చాను. నాకు భయమెందుకు!’ అనుకుంది.మొదట బైక్ రైడింగ్ నేర్చుకుంది. ఆ తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు తనకు మరింత ధైర్యం, ‘వ్యవసాయం చేయగలను’ అనే నమ్మకం వచ్చింది. పొలంలో రెండు బోర్ల సాయంతో రెండు ఎకరాల వరకు వరి సేద్యం చేస్తోంది. ఇప్పుడు అఖిలకు వ్యవసాయం మాత్రమే కాదు... ఏ పనులు చేసుకోలేక మంచానికే పరిమితమైన తల్లి ఆలనాపాలన, నానమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలాంటి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఇప్పుడు అమ్మకు అమ్మ అయింది. నానమ్మకు కొడుకు అయింది అఖిల. నాన్న చెప్పిన మాట‘ఎందుకింత కష్టపడతవు నాన్నా’ అని పిల్లలు అన్నప్పుడు ‘రెక్కల కష్టం వుట్టిగ పోదురా’ అని నవ్వేవాడు నాన్న. ‘రెక్కల కష్టం’ విలువ గురించి చిన్న వయసులోనే నాన్న నోటి నుంచి విన్న అఖిల ఇప్పుడు ఆ కష్టాన్నే నమ్ముకుంది. ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలపై దృష్టి పెట్టింది. కానిస్టేబుల్ కావాలనుకుంటోంది. అలా అని వ్యవసాయానికి దూరం కావాలనుకోవడం లేదు. ఎందుకంటే... తనకు వ్యవసాయం అంటే నాన్న! – బిర్రు బాలకిషన్,సాక్షి, రాజాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా -
వన ఉత్పత్తులకు.. దమ్మక్క బ్రాండ్!
అడవుల జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలు ఎదుగుతున్నారు. ఐదేళ్ల కిందట శిక్షణతో మొదలైన వారి ప్రయాణం నేడు ఈ కామర్స్ వాకిలి వరకు చేరుకుంది. వీరి విజయ గాథ...నైపుణ్య శిక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళలు 2018లో హైదరాబాద్‌కు ఐటీడీఏ తరఫున వెళ్లారు. అక్కడ సబ్బులు, షాంపులు తయారు చేసే ఓ సంస్థలో మూడు నెలలు శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణతోనే సరిపెట్టుకోకుండా అదే కంపెనీ లో మరో తొమ్మిది నెలల పాటు పనిచేసి తమ నైపుణ్యానికి మరిన్ని మెరుగులు అద్దుకున్నారు. ఇందులో పదిహేను మంది సభ్యులు కలిసి దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్‌గా ఏర్పడ్డారు. రూ. 25 లక్షలతో షాంపూ, సబ్బుల తయారీ పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించుకున్నారు.అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ..దమ్మక్క గ్రూప్ సభ్యుల ఉత్సాహం చూసి అప్పటి ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు బ్యాంకు అధికారులతో మాట్లాడి లోను ఇప్పించడంతో భద్రాచలంలో 2019 నవంబరులో షాంపూ తయారీ యూనిట్నుప్రారంభించారు. పనిలో చేయి తిరగడం అలవాటైన కొద్ది రోజులకే 2020 మార్చిలో కరోనా విపత్తు వచ్చి పడింది. లాక్డౌన్ లు, కరోనా భయాల వల్ల బయటకు వెళ్లి పని చేసేందుకు ఇంట్లో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం ఒక ఇబ్బందైతే, మరోవైపు తయారీ యూనిట్లో షాంపూ బాటిళ్లు పేరుకుపోయాయి. ఇంతలోనే ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు షాంపూ బాటిళ్లు కావాలంటూ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి ఆర్డర్ రావడంతో కొంత ఊతం లభించింది.’’ అంటూ దమ్మక్క గ్రూపు జాయింట్ సెక్రటరీ బేబీరాణి అనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.ఊపందుకున్న అమ్మకాలు..షాంపూ కొనుగోలుకు జీసీసీ నుంచి మార్కెట్ అందుబాటులో ఉండటంతో పాటు షాంపూ నాణ్యత విద్యార్థులకు నచ్చడంతో క్రమంగా దమ్మక్క యూనిట్ పనితీరు గాడిలో పడింది. 100 మిల్లీలీటర్ల షాంపూ బాటిళ్ల తయారీ 2021లో యాభైవేలు ఉండగా 2022 ముగిసే నాటికి లక్షకు చేరుకుంది. ఆ మరుసటి ఏడాది ఏకంగా రెండు లక్షల బాటిళ్ల షాంపూలు తయారు చేసి విక్రయించారు. షాంపూల తయారీలో వచ్చిన అనుభవంతో ఈ ఏడాది మొదట్లో గ్లిసరిన్ ప్రీమియం సబ్బుల తయారీనిప్రారంభించి జీసీసీ స్టోర్లలో ప్రయోగాత్మకంగా అమ్మకాలుప్రారంభించగా... తొలి దఫాలో ఐదు వేల సబ్బులు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అమ్మకాలు ఊపందుకున్నాయి.బ్యాంక్ రుణం కూడా తీర్చేశారు!యూనిట్ ఆరంభమైన తర్వాత ఏడాదిలో కేవలం మూడు నెలలే గ్రూపు సభ్యులకు పని దొరికేది. షాంపూ, సబ్బులకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది వరుసగా ఎనిమిది నెలలు అంతా పని చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బ్యాంకు రుణం కూడా తీర్చేశారు. ప్రతి సభ్యురాలికి ఖర్చులు పోను కనీసం రూ.10 వేల వరకు ఆదాయం వచ్చినట్టు గ్రూప్ ట్రెజరర్ పూనెం విజయలక్ష్మి తెలిపారు.ఈ కామర్స్ దిశగా..రాబోయే రోజుల్లో ఈ కామర్స్ వేదికగా ఈ ఉత్పత్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు గ్రూపు అధ్యక్షురాలు తాటి రాజసులోచన తెలిపారు. ఈ మేరకు బ్రాండ్‌నేమ్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అది విజయవంతం అయితే మరెందరో కొత్త వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాక్షి, భద్రాచలంఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్!
మహిళా సాధికారతకు ఉత్తమ సాధనాలలో ఒకటిగా నిలిచింది డ్రోన్ శిక్షణ. ఢిల్లీకి ఉత్తరాన ఉన్న సింఘోలా, నైరుతి జిల్లాల్లోని 200 మంది మహిళలు శిక్షణ తీసుకొని డ్రోన్ లైసెన్స్ పొందేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలకు సాధికారిత కల్పించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని కిందటేడాది చేపట్టింది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన మహిళలు దేశ రాజధానిలో ఇటీవల కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన డ్రోన్ దీదీలు పైలెట్ లైసెన్స్ సర్టిఫికెట్స్ పొంది, స్వయం ఉపాధి అవకాశాలను పొందుతారు. శిక్షణ పొందిన వారికి డ్రోన్లను ప్రభుత్వమే అందజేస్తుంది.స్వయం ఉపాధికి..డ్రోన్లను స్వయంగా ఉపయోగించడానికి, అద్దెకు ఇవ్వడానికి అనుమతిస్తారు. సర్వేలు, ఈవెంట్ షూట్లు, ఫొటోగ్రఫీ, వ్యవసాయంలో సీడింగ్, పురుగుమందులు చల్లడం వంటి వాటి కోసం డ్రోన్లను ఉపయోగించడమే లక్ష్యంగా ఉద్యోగావకాశాలు పొందుతారు.ఆర్థికాభివృద్ధికి..మూడేళ్ల కాలంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 15 వేల డ్రోన్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయంతో పాటు అదనంగా మహిళలు డ్రోన్ సంబంధిత వ్యాపారాలను చేసుకునే అనుమతి లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి, అభివృద్ధికి మరింతగా దోహదపడుతుంది. ఎరువులను చేతితో పిచికారీ చేసే సాంప్రదాయ పద్ధతులను డ్రోన్లతో భర్తీ చేయడం ద్వారా పురుగు మందుల వల్ల కలిగే ప్రమాదం తగ్గుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది.అంతేకాదు, డ్రోన్ల వాడకంలో ఖర్చులు తగ్గి, రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. టెక్నాలజీలో ఆధునాతన శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి కృషి జరపడం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను మరింత శక్తిమంతులుగా తయారు చేయడమే.ఇవి చదవండి: Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా? -
Rakshitha: కాళ్లే కళ్లయ్యి..
కళ్లు మూసుకొని నాలుగడుగులు వేయలేము. కళ్లు కనపడకుండా పరిగెత్తగలమా? ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు తేలేని బంగారు పతకం మన దివ్యాంగ క్రీడాకారులు తెస్తారని ఆశ. కర్ణాటకకు చెందిన అంధ అథ్లెట్ రక్షిత రాజు 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న తొలి భారతీయ పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించనుంది. పతకం తెస్తే అది మరో చరిత్ర. రక్షిత రాజు పరిచయం.అక్టోబర్ 26, 2023.రక్షిత రాజుకు ఆనందబాష్పాలు చిప్పిల్లుతున్నాయి. కన్నీరు కూడా ఉబుకుతోంది. ఆమె హాంగ్జావు (చైనా) పారా ఆసియా గేమ్స్‌లో 1500 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. చాలా పెద్ద విజయం ఇది. ఈ విషయాన్ని ఆమె తన అమ్మమ్మతో పంచుకోవాలనుకుంటోంది. కాని పంచుకోలేక΄ోతోంది. కారణం? అమ్మమ్మకు వినపడదు. చెవుడు. మాట్లాడలేదు. మూగ. కాని ఆ అమ్మమ్మే రక్షితను పెంచి పెద్ద చేసింది. ఆమె వెనుక కొండలా నిలుచుంది. ఆ ఘట్టం బహుశా ఏ సినిమా కథకూ తక్కువ కాదు. నిజజీవితాలు కల్పన కంటే కూడా చాలా అనూహ్యంగా ఉంటాయి.ఊరు వదిలేసింది..కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోని చిన్న పల్లెకు చెందిన రక్షిత రాజు పుట్టుకతోనే అంధురాలు. ఆమెకు నాలుగు సంవత్సరాలు ఉండగా తల్లిదండ్రులు మరణించారు. దాంతో ఊరంతా రక్షితను, ఆమె చిన్నారి తమ్ముణ్ణి నిరాకరించారు. చూసేవాళ్లు ఎవరూ లేరు. అప్పుడు రక్షిత అమ్మమ్మ వచ్చి పిల్లలను దగ్గరకు తీసుకుంది. ఆమె స్వయంగా చెవుడు, మూగ లోపాలతో బాధ పడుతున్నా మనవళ్ల కోసం గట్టిగా నిలుచుంది. మనవరాలిని చిక్‌బళ్లాపూర్‌లో అంధుల కోసం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ స్కూల్లో చదివించింది. అక్కడి హాస్టల్లో ఉంటూ అప్పుడప్పుడు అమ్మమ్మ వచ్చి పలుకరిస్తే ధైర్యం తెచ్చుకునేది. అంధత్వం వల్ల భవిష్యత్తు ఏమీ అర్థం అయ్యేది కాదు. దిగులుగా ఉండేది.వెలుతురు తెచ్చిన పరుగు..ఆశా కిరణ్ స్కూల్లో మంజన్న అనే పీఈటీ సారు రక్షిత బాగా పరిగెత్తగలదని గమనించి ఆమెను ఆటల్లో పెట్టాడు. స్కూల్లో ఉన్న ట్రాక్ మీద పరిగెట్టడం ్రపాక్టీసు చేయించాడు. జైపూర్‌లో పారా గేమ్స్ జరిగితే తీసుకెళ్లి వాటిలో పాల్గొనేలా చేశాడు. అక్కడే రాహుల్ అనే కర్ణాటక అథ్లెట్ దృష్టి రక్షిత మీద పడింది. ఈమెను నేను ట్రెయిన్ చేస్తాను అని చెప్పి ఆమె బాధ్యత తీసుకున్నాడు. అప్పటివరకూ సింథెటిక్ ట్రాక్ అంటేనే ఏమిటో రక్షితకు తెలియదు. రాహుల్ మెల్లమెల్లగా ఆమెకు తర్ఫీదు ఇచ్చి అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెట్‌గా తీర్చిదిద్దాడు.గైడ్ రన్నర్ సాయంతో..అంధ అథ్లెట్లు ట్రాక్ మీద మరో రన్నర్ చేతిని తమ చేతితో ముడేసుకుని పరిగెడతారు. ఇలా తోడు పరిగెత్తేవారిని ‘గైడ్ రన్నర్‘అంటారు. అంతర్జాతీయ ΄ోటీల్లో రాహులే స్వయంగా ఆమెకు గైడ్ రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. హాంగ్జావులో 1500 మీటర్లను రక్షిత 5 నిమిషాల 21 సెకన్లలో ముగించింది. ‘చైనా, కిర్గిజ్స్తాన్ నుంచి గట్టి ΄ోటీదారులు వచ్చినా నేను గెలిచాను. పారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’ అంటుంది రక్షిత.అదే సవాలు..అంధులు పరిగెత్తడం పెద్ద సవాలు. వారు గైడ్ రన్నర్ సాయంతోనే పరిగెత్తాలి. ‘మాతోపాటు ఎవరైనా పరిగెత్తొచ్చు అనుకుంటారు. కాని గైడ్ రన్నర్లకు, మాకు సమన్వయం ఉండాలి. మమ్మల్ని పరిగెత్తిస్తూ వారూ పరిగెత్తాలి. ఎంతోమంది ప్రతిభావంతులైన అంధ రన్నర్లు ఉన్నా గైడ్ రన్నర్లు దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. ఒకప్పుడు నా కళ్ల ఎదుట అంతా చీకటే ఉండేది. ఇప్పుడు పరుగు నాకు ఒక వెలుతురునిచ్చింది. పారిస్‌లో స్వర్ణం సాధించి తిరిగి వస్తాను’ అంటోంది రక్షిత. -
ఆడుకుందాం రండి
‘ఎప్పుడూ ఆటలేనా... చదువుకోవచ్చు కదా’ అనే తల్లిదండ్రులే ఎక్కువ. ‘ఎప్పుడూ చదువేనా... ఆటలు కూడా ఆడవచ్చు కదా’ అనే తల్లిదండ్రులు అతి తక్కువ. చదువు విషయంలోనే కాదు ఆటల్లో కూడా పిల్లలను ్రపోత్సహిస్తే చారిత్రక అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి బలమైన ఉదాహరణ... స్టార్ షూటర్ మను బాకర్. ‘మీకు డాక్టర్ లేదా ఇంజినీర్ కావాలని లేదా... అయితే ఆటల ప్రపంచంలోకి రండి. అదొక అద్భుత ప్రపంచం’ అంటుంది ఒలింపిక్స్‌లో డబుల్–మెడల్ గెల్చుకున్న మను బాకర్. విద్యార్థుల దృష్టిని ఆటలపై మళ్లించడానికి నేషనల్ టూర్ చేస్తోంది...తన పర్యటనలో భాగంగా చెన్నైలోని వేలమ్మళ్ నెక్సెస్ స్కూల్‌కు వెళ్లిన మను బాకర్ ఆటలకు ఉండే శక్తి ఏమిటో ఆసక్తికరంగా చెప్పింది. ‘ఆటలు అనే దారి వైపు వచ్చి చూడండి. ఆ దారిలో ముందుకు వెళుతున్న కొద్దీ మీలో ఉత్సాహం, శక్తి అంతకంతకూ పెరుగుతూ పోతాయి’ అంటుంది మను.‘టోక్యో ఒలింపిక్స్‌లో నా గురి తప్పింది. ఓటమి పలకరించింది. అలా అని నిరాశలోనే ఉండిపోలేదు. ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి అంతే సహజం. గెలుపు ఓటములు ఆటలో శాశ్వతం కాదు. ఆటలో ఉన్న అందం, అద్భుతం ఇదే’ అంటుంది మను.‘డ్రీమ్ బిగ్’ అని మను అన్నప్పుడు పిల్లలు చప్పట్లు కొట్టారు. ‘మనం ఒక లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటామా లేదా అనేది పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుందంటూ తన గత అనుభవాలను విద్యార్థులతో పంచుకుంది.‘ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకే ఆటలు సరిపోతాయి. పేద, మధ్యతరగతి పిల్లలకు కష్టం’ అనే అపోహను తోసిపుచ్చింది మను. ‘ఆత్మస్థైర్యం నుంచి ఆర్థికసహాయం వరకు క్రీడా ప్రపంచంలో ఏది కష్టం కాదు. మీరు పెద్ద కల కంటే పెద్ద విజయాన్ని సాధిస్తారు. పేదరికం మీకు ఎప్పుడూ అడ్డు కాదు. ఈ విషయాన్ని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది’ అంటుంది మను బాకర్. ‘మీ ఇన్స్పిరేషన్ ఎవరు?’ అనే ప్రశ్నకు– ‘ఇంకెవరు... మా అమ్మే’ అని చెప్పింది మను. ‘ఎప్పుడూ ఆటలేనా!’ అని ఎప్పుడూ అనేది కాదు ఆమె. ఆటల్లో కూతురు చూపుతున్న ప్రతిభకు సంతోషించేది.‘క్రీడల్లో పిల్లలు రాణించడం, పెద్దస్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంది’ అంటుంది మను బాకర్.ఆటలు ఇంకా ఏం చేస్తాయి? మను మాటల్లో చె΄్పాలంటే ప్రపంచాన్ని చూపిస్తాయి. ‘షూటింగ్ కెరీర్ వల్ల ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాను. దీనివల్ల రకరకాల మనుషులు, రకరకాల సంస్కృతులు, చరిత్ర, పోరాటాలు... ఒక్కటా రెండా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. నేను ఆటల్లోకి రాకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు’ అంటుంది మను.‘మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఎక్కడికి వెళ్లాలనేది ముఖ్యం’ అంటారు పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన విజేతలు. ఇదే విషయాన్ని పిల్లలకు చెబుతుంటుంది మను.‘మేము పేదవాళ్లం, నాకు ఇంగ్లీష్ రాదు, నేను బలహీనంగా ఉంటాను, ఇతరులతో పోటీ పడగలనా... ఇలాంటి ఆలోచనలేవీ పెట్టుకోవద్దు. ఎన్ని పరిమితులు ఉన్నా కష్టపడే తత్వం, అంకితభావం ఉంటే మన ప్రయాణానికి అవేమీ అడ్డు కాదు. ప్రయాణం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం. నా విషయానికి వస్తే... మొదట్లో నాకూ ఇంగ్లీష్ పెద్దగా రాదు, ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఏమీ తెలియదు... అనుకుంటే అక్కడే ఉండిపోతాం. తెలుసుకుంటాను’... అనే పట్టుదల ఉంటే తెలుసుకోగలం. నేను ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల వరకు ఎవరితోనైనా మాట్లాడవచ్చు’ అంటుంది మను.‘మీకు ఎన్నో కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. అవేమీ మీకు ఆసక్తిగా లేకపోతే ఆటల ప్రపంచంలోకి రండి’ అని విద్యార్థులను ఆహ్వానిస్తోంది మను బాకర్. ఆమె మాటల స్ఫూర్తి ఎంతోమందికి విజయ మంత్రం కావాలని ఆశిద్దాం. -
తల్లిగా ఉండటమే గొప్ప- సుస్మితా సేన్
ఈ రోజుల్లో పిల్లల పెంపకం పెద్దలకు ఓ సమస్యగా ఉంటే తమ కెరియర్ను వృద్ధి చేసుకుంటూనే పిల్లలను పెంచడం ఒంటరి తల్లులకు అతిపెద్ద సవాల్‌తో కూడుకున్నదని దాదాపు 70 శాతం ఒంటరి తల్లిదండ్రులు తమ ఉద్యోగావకాశాలను వదులుకోవడానికి కారణం ఇదే అని స్పష్టం చేసింది న్యూయార్క్ కెరీర్ మైండ్స్ అధ్యయనం. గ్లోబల్వైజ్గా టెక్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పించే ఈ సంస్థ తమ ఇంటర్వ్యూలలో పాల్గొనే సింగిల్ పేరెంట్స్ పిల్లల కోసం ఉద్యోగాలను వదులుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేసింది. ఒంటరి తల్లిదండ్రులు తమ కెరియర్ను కాపాడుకుంటూనే పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు సూచనలు ఇస్తున్నారు.ఒంటరిగా పిల్లలను పెంచడం చాలా కష్టమైన టాస్క్. ముఖ్యంగా ఒంటరి తల్లుల్లో భావోద్వేగ సమతుల్యత తప్పనిసరి. క్రమశిక్షణలో ఉంచాలా? లేక ప్రేమ, ఆప్యాయతలను చూపాలా.. అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒంటరి తల్లులు అప్పటికే జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఉంటారు కాబట్టి క్రమశిక్షణతో పెంచాలనుకుంటారు.కఠినమైన శిక్షణ కూడదునేను కరెక్ట్‌గా ఉంటేనే నా పిల్లలను బాగా పెంచగలను అనుకునే దోరణిలో పేరెంటింగ్ కూడా సవాల్‌గా తీసుకుంటున్నారు. అయితే, ఈ విధానం వల్ల తరచూ భయాందోళనకు లోనవుతుంటారు. ఫలితంగా ప్రతి చిన్న విషయంలోనూ ఉద్వేగానికి లోనవుతుంటారు. వీళ్లు తమని తాము ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎవరి సపోర్ట్ లేకుండా ‘సూపర్ ఉమన్’లాగా ఉండాలనుకోవడం అన్ని సందర్భాలలో కుదరదు. శారీరకంగానూ, మానసికపరమైన సమస్యలతోనూ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకని, తమ పెద్దవారి మద్దతు తీసుకోవడం అవసరం. కఠినమైన క్రమశిక్షణ వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.సమతుల్యత తప్పనిసరిఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్‌ని పిల్లల ముందుకు తీసుకురాకూడదు. సింగిల్‌గా ఉండటం వల్ల పెద్దలు ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. దీనివల్ల పిల్లలు ‘తామేదో కోల్పోతున్నాం’ అనే భావనలో ఉంటారు. పిల్లలు పెద్దలను గమనిస్తుంటారు అని గుర్తుంచుకోవాలి. ‘అమ్మకు నాకన్నా ఫోన్ లేదా వర్క్ అంటేనే ఎక్కువ ఇష్టం’ అనే ఆలోచన పిల్లల్లో రానీయకూడదు.అభిప్రాయాలను తీసుకోవాలిపిల్లలు చిన్నవాళ్లు కదా అనుకోకుండా వాళ్ల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఇంటి నిర్ణయాల్లో వారిని పాలుపంచుకోనివ్వాలి. దీనివల్ల తమను నిర్లక్ష్యం చేయడం లేదు అనే ఆలోచన పిల్లల్లో కలుగుతుంది. ఇంట్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపించినా బయట వెతుక్కుంటారు.తమ మాటే వినాలనుకోవద్దుఒంటరి తల్లుల పెంపకంలో పిల్లలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఎక్కువ. పిల్లలు నా మాట వినాలనే ఆలోచనతో పూర్తిగా పిల్లలు చెప్పినట్టు వినడం...లేదంటే తాము ఒక రూలర్‌గా ఉండాలను కుంటారు. టీనేజ్ దశలో ఈ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధానం వల్ల పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో పెద్దవాళ్లకు తెలియడం లేదు. కానీ, పెద్దలను ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లలకు బాగా తెలుసు. పిల్లలు ఇద్దరుంటే వారిద్దరినీ సమానంగా చూడాలి. వీలున్నప్పుడల్లా వారిద్దరికీ టైమ్ కేటాయించి వారి ప్రతి అవసరాన్నీ తీర్చాలి. నమ్మకం ముఖ్యంపిల్లల అవసరాలు తెలుసుకొని సాధ్యమైనంతవరకు వాటిని పూర్తి చేయాలి. పిల్లల ఆలోచనా విధానాన్ని పంచుకునే విధానం ఇంట్లో ఉండాలి. స్నేహపూర్వకమైన వాతావరనంలో రోజులో కనీసం పది నిమిషాలైనా పిల్లల కోసం సమయం కేటాయించాలి. తమ పని గురించి చెబుతూనే పిల్లల విషయాలనూ పట్టించుకోవాలి. అప్పుడే ఏదో కోల్పోతున్నామనే భావన పిల్లల్లో కలగకుండా పెరుగుతారు. -ప్రొఫెసర్ జ్యోతిరాజ,సైకాలజిస్ట్, లైఫ్‌స్కిల్ ట్రెయినర్ తల్లిగా ఉండటమే గొప్పఇద్దరు అమ్మాయిలను ఒంటరితల్లిగా పిల్లలను పెంచుతూనే, తన కెరియర్‌నూ బిల్డ్ చేసుకుంటున్న బాలీవుడ్ నటి సుస్మితాసేన్ స్ఫూర్తిదాయకమైన విషయాలనూ సోషల్‌మీడియా ద్వారా తెలియజేసింది. ‘ప్రతిరోజూ ఒక తల్లిగా నన్ను నేను భుజం తట్టుకునే పని ఏం చే యాలనేది ముందే నిర్ణయించుకుని, అది పూర్తి చేస్తాను. నా పిల్లలకన్నా నాకు ఎక్కువ తెలుసు అనుకోను. వారి ద్వారా కూడా ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఇలా ఉండటం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేనొక కళాకారిణిగా కన్నా తల్లిగా ఉండటమే గొప్పగా భావిస్తాను. ఆ రోజంతా ఎన్ని పనులు చేసినా పిల్లల వద్దకు వస్తూనే అన్నీ దులిపేసుకొని వారి ముందు ప్రేమగా ఉంటాను.’– సుస్మితాసేన్ -
డయానాలా కనిపించే ప్రముఖ ప్యాషన్ ఐకాన్ ఆమె..!
కొన్ని రకాల నైపుణ్యాలు, తెలివితేటల జీన్స్ రీత్యా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి. ఆ కుటుంబంలో అత్యంత ప్రతిభావంతుడు ఉంటే. ఆ పరంపర అతని తర్వాత తరంలో ఎవరో ఒకరు కొనసాగిస్తుంటారు. వెంటనే అతన్ని అంతకు ముందు జనరేషన్ వ్యక్తితో పోల్చుకుంటూ..ఆ వ్యక్తి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం సహజం. అలానే ఓ ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్ని చూడగానే నాటి అందాల యువ రాణి దివంగత డయానాని గుర్తు తెచ్చుకుంటారు అంతా. ఇంతకీ ఎవరా మోడల్ అంటే..?ఆ మోడల్ పేరు కేథరిన్ కిట్టి ఎలియనోర్ స్పెన్సర్. ఆమె గ్లామర్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తోంది. చూడటానికి దివంగత యువరాణి డయానాలా అందంగా ఉంటుంది. కిట్టి ఎర్ల్ స్పెన్సర్-విక్టోరియా ఐట్కెన్ల పెద్ద కుమార్తె. ఇక్కడ కిట్టి తండ్రికి స్వయనా అక్కే వేల్స్ దివంగత యవరాణి డయానా. అంటే కిట్టి స్వయానా.. డయాన మేనగోడలు. బహుశా ఆ జీన్స్ ఆమెలో కూడా ఉంటాయి కాబట్టి కిట్టి డయానాలా ఉండి ఉండొచ్చు. ఇక కిట్టీ 2015 నుంచి మోడల్‌గా మారింది. ఎస్టీ లాడర్, బల్గారి, వోగ్, రాల్ఫ్ లారెన్, జిమ్మెర్మాన్లతో సహా ప్రపంచంలోని అనేక ప్రతిష్టాత్మక బ్రాండ్లతో కలిసి పనిచేశారామె. ప్రిన్స్ హ్యారీ- మేఘన్ మార్క్లేల వివాహంలో తొలిసారిగా కిట్టీ పేరు మారు మ్రోగిపోయింది. మరో డయానాలా ఉందే అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత టాట్లర్ కవర్‌పై మోడల్‌గా కనిపించిన ఆమెనే కిట్టి అని ప్రపంచమంతా గుర్తించడం ప్రారంభించింది. ఈ గుర్తింపే కిట్టిని ఫ్యాషన్ కెరియర్ మకుటం లేని రాణిని చేసింది. అయితే కిట్టీ తల్లి విక్టోరియా ఐట్కెన్ కూడా మాజీ బ్రిటిష్ మోడలే కావడం విశేషం. ఇక కిట్టి మోడలింగ్ ఏజెన్సీ స్టార్మ్ మేనేజ్మెంట్కు సంతకం చేయడమే గాక ఇటాలియన్ లగ్జరీ పవర్‌హౌస్ డోల్స్ అండ్ గబ్బానాకు గ్లోబల్ అంబాసిడర్‌గా కూడా ఉంది.వ్యక్తిగత జీవితం..బిలియనీర్ మైఖేల్ లూయిస్‌ని పరిణయమాడింది. అంతేగాదు తన వివాహ సమయంలో లగ్జరీ బ్రాండ్ ఫ్యాషన్ హౌస్ నుంచి డికాడెంట్ గౌనుని ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక కెరీర్ పరంగా.. ఆమె లండన్ రీజెంట్స్ యూనివర్శిటీలో లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్లో ప్రత్యేకత కలిగిన యూరోపియన్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. కాగా, 33 ఏళ్ల కిట్టి ఇటీవలే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నాలుగు నెలల తర్వాత తన బిడ్డ పేరుని, ఫోటోని షేర్ చేసుకుంది.(చదవండి: హృదయాన్ని కదిలించే ఘటన: 19 ఏళ్ల తర్వాత భారత్‌లో తండ్రిని..!) -
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్ లతో బ్లాక్‌మెయిలింగ్‌లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి.నోట్: పేరు, వివరాలు గోప్యంగా ఉంచాలని కోరితే..వారి అభిప్రాయాలను ‘సాక్షి’ గౌరవిస్తుంది -
సెంచరీ వయసులో స్కైడైవింగ్ చేసిన బామ్మ! ఏకంగా..!
సెంచరీ వయసులో సైడైవింగ్ చేసి చరిత్ర సృష్టించింది. అది కూడా ఓ స్వచ్ఛంద సంస్థ కోనం నిధులు సమకూర్చేందుకు చేయడం విశేషం. ఆ బామ్మ ఎవరంటే..?సఫోల్క్‌కు చెందిన మానెట్ బైల్లీ అనే బామ్మ 102 ఏళ్ల వయసులో ఈ సాహసం చేసి ఆశ్చర్యచకితులను చేసింది. ఆమె ఉమెన్స్ రాయల్ నావెల్ సర్వీస్‌కు మాజీ సభ్యురాలు. తన పుట్టిన రోజును స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరించే పనితో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. బైల్లీ ఒక ఛారిటీ ఈవెంట్లో భాగంగా యూకే పారాచూటింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌తో కలిసి ఈ సాహసం చేసింది. ఆమె బెన్హాల్ విలేజ్ హాల్, మోటార్ న్యూరాన్ డిసీజ్ అసోసియేషన్, ఈస్ట్ ఆంగ్లియన్ ఎయిర్ అంబులెన్స్ అనే మూడు ఛారిటీ సంస్థల కోసం ఈ నిధులను సేకరిస్తోంది. ఇప్పటి వరకు దగ్గర దగ్గర రూ. 11 లక్షలు సేకరించింది. అయితే రూ. 33 లక్షల వరకు నిధులు సేకరించాలనేది ఆ బామ్మ లక్ష్యం. ఈ బామ్మ ఈస్ట్ ఆంగ్లియాలోని బెక్లెస్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఏకంగా ఏడు వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసింది. ఈ మేరకు స్థానికి మీడియాతో మాట్లాడుతూ.."నాకు చేసేటప్పుడూ కొంచెం భయంగా అనిపించింది. గట్టిగా కళ్లు మూసుకున్నానని ఒపుకోవాల్సిందే. ఆ తర్వత ధైర్యంగానే ఉన్నట్లు తెలిపింది. అంతేగాదు తన ఆరోగ్యకరమైన వృధాప్యం గురించి కూడా మాట్లాడారు. ఎనిమిది లేదా తొమ్మిది పదుల వయసులో దేన్ని వదులుకోకూడదు. ఈ వయసులో కూడా తాను ఫిట్‌గా ఉండటం అనేది అదృష్టం అనే చెప్పాలి. తన వయసులోనే ఉన్న ఇతర వ్యక్తులు ఆర్థరైటిస్‌తో వికలాంగులుగా మారారు. అయితే తాను అలా ఉండేందుకు ఇష్టపడనని అంటోంది." ఈ బామ్మ. కాగా, ఆమె ఇలాంటి సాహసాలు చేయడం మొదటిసారి కాదు. తన వందో పుట్టిన రోజు సందర్భంగా కూడా ఇలాంటి సాహస కృత్యమే చేసింది. సిల్వర్‌స్టోన్ చుట్టూ 130 మీటర్ పర్ అవర్ వేగంతో ఫెరారీ కారుని నడిపి మరో రికార్డుని నెలకొల్పింది. తన స్నేహితుడి తండ్రి 85 ఏళ్ల వయసులో ఇలాంటి సాహసకృత్యాలు చేయడం చూసి స్ఫూర్తి పొందానని అన్నారు. బామ్మ బైల్లీ ధైర్యం, సమాజం కోసం నిస్వార్థంగా చేస్తున్న కృషి బ్రిటన్ రాజ కుంటుంబాన్ని ఆకర్షించింది. అంతేగాదు ప్రిన్స్ విలియం ఆ వయసులో ఆ బామ్మ చలాకీగా చేస్తున్న సాహసాలను మెచ్చుకున్నారు. వందవ పుట్టిన రోజునే ఫెరారీ రేసింగ్‌తో చరిత్ర సృష్టించిన మీరు ఈ స్కైడైవింగ్ని అవలీలగా చేయగలరు. ఆశ్చర్యపోనవసరం లేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ బామ్మ ఆరోగ్య రహస్యం..ఎప్పుడూస్నేహితులు, ప్రజల మధ్య ఉంటుంది. బిజీగా ఉంటుంది. ప్రతిదానిపై ఆసక్తిని కలిగి ఉంటుంది. తన చుట్టూ ఉన్నవారి పట్ల దయతో ప్రేమగా మెలుగుతుందట. అవే ఆమె దీర్ఘాయువుకి కారణం అని ఆనందంగా చెబుతోంది బైల్లీ.The incredible Manette Baillie skydiving this morning at Beccles airfield for her 102nd birthday sponsored by Goldster!! #manettebaillie #102yearoldskydiver pic.twitter.com/q1FOZtqzyU— Goldster (@GoldsterClub) August 25, 2024 (చదవండి: టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!)