CM Siddaramaiah
-
MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్
బెంగళూరు : కర్ణాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదానికి కారణమైన భూములను మైసూరు నగర అభివృద్ధి సంస్థకు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.దీనిపై స్పందించారు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య. రాజకీయ విద్వేషాలకు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ముడా కేసు వివాదంలో సోమవారం సిద్ధరామయ్యపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. లోకాయుక్త ఆధారంగా కేసు నమోదైంది. ఈ తరుణంలో సిద్ధ రామయ్య భార్య ఓ లేఖను విడుదల చేశారు. అవినీతి మరక లేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 ప్లాట్లను తిరిగి ముడాకే ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. తన భర్త గౌరవం, ఘనతను మించి ఈ ఆస్తులు పెద్దవి కావని అన్నారు పార్వతి సిద్దరామయ్య.అవసరమైతే దర్యాప్తుకు సహకరిస్తానని, రాజకీయ రంగానికి దూరంగా ఉండే తనలాంటి మహిళలను వివాదాల్లోకి లాగొద్దని లేఖలో రాసుకొచ్చారు. అయితే, సిద్ధ రామయ్య ప్రకటనపై విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. విచారణ నుంచి బయట పడేందుకే ఈ డ్రామాలని ఆక్షేపించింది. ఏ తప్పు జరక్కపోయింటే ఎందుకు తిరిగి ఇస్తున్నారంటూ నిలదీశారు బీజేపీ నేతలు. దర్యాప్తులో వాస్తవాలు వస్తాయని ముందే ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు.అంతకుముందు ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాకిచ్చింది. ఆయన మీద మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది. ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. Karnataka CM Siddaramaiah''s wife Parvathi decides to return 14 controversial sites to MUDA— Press Trust of India (@PTI_News) September 30, 2024 -
ముడా స్కామ్.. సీఎం సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు
బెంగళూరు : మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరిన్ని చిక్కులు ఎదుర్కోనున్నారు. బుధవారం ముడా స్కామ్ కేసులో లోకాయిక్త విచారణ చేయాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేపట్టి మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో కర్ణాటక మైసూర్ జిల్లా లోకాయిక్తా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.మరోవైపు ఇదే ముడా స్కామ్ కేసులో ఇరుక్కున్న సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం ఇదే ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ జారీ చేసిన ఆదేశాల్ని హైకోర్టు సమర్థించింది. గవర్నర్ గెహ్లోత్ ఆదేశాల్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగ ప్రసన్న విచారణ చేపట్టారు. గవర్నర్ నిర్ణయం చట్టబద్ధమేనని.. సిద్దరామయ్య పిటిషన్‌ను కొట్టివేశారు.ముడా స్థల కేటాయింపుల్లో అవకతవకలు ఉన్నట్లు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సిద్ధరామయ్య భార్యకు మైసూరు పరిసరాల్లో భూములు కేటాయించడం అక్రమమని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. భూములు కేటాయింపుల కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.45 కోట్లు నష్టం వాటిల్లినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. 👉 చదవండి : సీఎంపై విచారణ.. గవర్నర్ ఆదేశాల్ని సమర్థించిన హైకోర్టునాకు భయం లేదుముడా స్కామ్ కేసులో స్పెషల్ కోర్టు లోకాయిక్త విచారణ చేపట్టాలని జారీ చేసిన ఆదేశాలపై సిద్ధరామయ్య స్పందించారు. ‘ముడా స్కామ్ కేసులో చట్టబద్ధంగా పోరాటం చేస్తాం. నేను దేనికీ భయపడను. విచారణకు నేను సిద్ధం’ అని వ్యాఖ్యానించారు. -
సోషల్ మీడియాకు సీఎం సిద్ధరామయ్య ఖర్చెంత?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంటారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణం కేసు ఆయనను వెంటాడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆయన ప్రతీనెలా సోషల్ మీడియాకు ఎంత ఖర్చు చేస్తారనేది వెల్లడై వైరల్‌గా మారింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆర్టీఐ కార్యకర్త మారలింగ గౌర్ మాలీ పాటిల్ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించడానికి ఎంత ఖర్చచేస్తారనేదానికి సమాధానం కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తు చేశారు. దీనికి ప్రభుత్వ ఏజెన్సీ కర్ణాటక స్టేట్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అండ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ (ఎంసీఏ) సమాధానం తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 25 నుంచి మార్చి 2024 వరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్‌మీడియా కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆర్టీఐ అందించిన సమాచారం ప్రకారం సీఎంఓ ప్రతి నెలా దాదాపు రూ.53.9 లక్షలు ఖర్చు చేసింది. ఇందులో 18 శాతం జీఎస్టీ కూడా ఉంది. సిద్ధరామయ్య ఖాతాలను నిర్వహించే పాలసీ ఫ్రంట్ అనే కంపెనీకి ఈ చెల్లింపు జరిగింది. ఈ కంపెనీలో 25 మంది సభ్యులు ఉన్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రులతో పోలిస్తే, సిద్ధరామయ్య సోషల్ మీడియాలో చాలా తక్కువ ఖర్చు చేస్తారని సీఎం కార్యాలయం తెలిపింది. -
అవినీతి మరక లేకపోతే ఎందుకు భయం ?
మైసూరు: 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను శుద్ధంగా ఉన్నానని వందసార్లు చెప్పిన సీఎం సిద్ధరామయ్య అవినీతికి పాల్పడకుండా శుభ్రంగా ఉంటే సీబీఐ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ నిలదీశారు. ఆయన శుక్రవారం సాయంత్రం నగరంలోని భాజపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాల్మీకి కుంభకోణాన్ని తొక్కిపెట్టేందుకు యత్నించారని, ఈడీ రంగంలోకి దిగగానే తప్పు జరిగిందని ఒప్పుకున్నారన్నారు. పెట్రోల్ బంకులతో పాటు వివిధ వనరుల నుంచి రాష్ట్రానికి చెందిన డబ్బు తెలంగాణ ఎన్నికలకు తరలించారన్నారు. వాల్మీకి కుంభకోణం గురించి సీఎంకు చాలా సమాచారం ఇచ్చానని, అయితే ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సీఎం ప్రజలను మభ్యపెడుతున్నారని ఆర్.అశోక్ మండిపడ్డారు. ముడా కుంభకోణానికి వ్యతిరేకంగా జేడీఎస్‌తో కలిసి పాదయాత్ర చేస్తున్నామన్నారు. ముడా కుంభకోణంపై మీ సొంత పార్టీ అధ్యక్షుడు మరిగౌడ ఈడీ అధికారులకు లేఖ రాశారు కదా అని గుర్తు చేశారు. అలా అయితే మీ పార్టీ నేత అబద్ధాలు చెబుతున్నారా? అని నిలదీశారు. జనాందోళన సభకు కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చారని అశోక్ విమర్శించారు. -
కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: సీఎం సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటకలో ఉన్న మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండో దశ ఎన్నికల్లో 14 స్థానాలకు ఓటింగ్ జరిగింది. మిగిలిన మరో 14 స్థానాలకు మూడో దశలో మే 07న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఆదివారం ఇక్కడ ధర్నాకు దిగారు.కరువు సహాయ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని సిద్దరామయ్య పేర్కొన్నారు. విధానసౌధ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట వీరంతా ధర్నా నిర్వహించారు.కర్ణాటకలోని మొత్తం 236 తాలూకాల్లో 226 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, 48 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని మంత్రులు పేర్కొన్నారు. కరువు సహాయం కోసం రూ. 18,171 కోట్లు డిమాండ్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 3454 కోట్లు మాత్రమే విడుదల చేయడానికి సిద్దమైనట్లు వెల్లడించారు. ఈ మొత్తం రాష్ట్ర డిమాండ్‌లో నాలుగో వంతు కూడా లేదని ఆయన పేర్కొన్నారు. -
నీటి కొరత లేదు.. పరిష్కారం ఉంది: సీఎం సిద్ధరామయ్య
జూన్ నెలాఖరు వరకు బెంగళూరు నీటి అవసరాలు తీర్చేందుకు పరిష్కారం ఉంది. కావేరి, కబినీ నదులలో నగరానికి కావలసిన నీటిని ప్రభుత్వం నిల్వ చేసిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ రోజు (సోమవారం) ప్రకటించారు. తాగునీటికి కొరత లేదని దీనికోసం బెంగళూరు పౌరసరఫరాల సంస్థ తగినన్ని నిధులు సమకూరుస్తున్నాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నగర పాలక సంస్థ అధికారులతో సమావేశం వెల్లడించారు. బెంగళూరులోని 14,000 బోర్‌వెల్స్‌లో 6900 ఎండిపోయాయి. నగరంలో ప్రతిరోజూ దాదాపు 2600 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉంది. ఈ నీటి కొరతను తీర్చడానికి కావలసినన్ని జలాలు ఉన్నాయి. బెంగళూరులో మాత్రమే కాకుండా చుట్టుపక్కల మొత్తం 110 గ్రామాలకు కూడా నీరు అందిస్తామని సీఎం వెల్లడించారు. కబినీ, కేఆర్ఎస్ డ్యామ్‌లలో సరిపడా నీరు ఉంది. జూన్ మొదటి లేదా రెండో వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని సీఎం చెప్పారు. ఇప్పుడు నీటి కొరతను నియంత్రించడానికి కావలసిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దీనికోసం 313 కొత్త బోర్లు వేయనున్నట్లు స్పష్టం చేశారు. క్రియారహితంగా ఉన్న 1200 బోర్లను పునరుద్ధరిస్తామని చెప్పారు బెంగళూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో నిర్ణీత ధరలకే నీటిని సరఫరా చేయాలని రెండు వారాల క్రితం ప్రభుత్వం ప్రైవేటు ట్యాంకర్లను ఆదేశించింది. దీని కోసం దాదాపు 1700 వాటర్ ట్యాంకర్లను రిజిస్టర్ చేశామని, ప్రైవేట్ బోర్వెల్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని సీఎం చెప్పారు. -
ఐదేళ్లూ కుర్చీ.. మడత పేచీ
బనశంకరి: అధికార హస్తం పార్టీలో తరచూ ఏదో ఒక వివాదం పుట్టుకొస్తోంది. డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని మాగడి కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ.బాలకృష్ణ డిమాండ్ చేయడం, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధిక సీట్లు గెలిస్తే సీఎం సిద్దరామయ్యే పూర్తికాలం సీఎంగా ఉంటారని ఆయన కుమారుడు యతీంద్ర ప్రకటించడంతో అధికార పార్టీలో వేడి రగుల్కొంది. ఇది ప్రతిపక్షాలకు కూడా విమర్శలకు అవకాశమిచ్చింది. సీఎం పదవిని తలా రెండున్నరేళ్లు పంచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్లు సర్కారు ఏర్పాటు సమయంలో జోరుగా ప్రచారం సాగింది. కానీ సీఎం, డీసీఎంల అనుచర ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు విరుద్ధమైన ప్రకటనలు చేయడం చర్చనీయాంశమవుతోంది. హైకమాండ్ పదే పదే చెప్పినా.. సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఎవరూ చర్చించరాదని, గ్యారంటీ పథకాల అమలు, లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా హైకమాండ్ పెద్దలు పదేపదే హెచ్చరికలు జారీచేస్తున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు నోటికి పనిచెబుతూనే ఉన్నారు. మంగళవారం యతీంద్ర చేసిన ప్రకటన మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది. ఆయన ప్రకటనపై మంత్రులు, సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు. యతీంద్రవి వ్యక్తిగత వ్యాఖ్యలని, దీనికి పార్టీకి సంబంధం లేదని చాలామంది తప్పించుకున్నారు. కానీ బీజేపీ నేతలు హస్తంలో లుకలుకలు తీవ్రమైనట్లు ఆరోపణలు గుప్పించారు. డీకేశిని చూస్తే జాలేస్తోంది: సింహా మైసూరు: సీఎం కుర్చీలో పూర్తికాలం పాటు కొనసాగాలని సీఎం సిద్ధరామయ్య పథకమేశారని, డిప్యూటీ సీఎం డీకేశిని చూస్తే పాపమనిపిస్తోందని ఎంపీ ప్రతాప సింహా ఎద్దేవా చేశారు. బుధవారం మైసూరులో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికసీట్లు గెలిస్తే మా నాన్న పూర్తి కాలం సీఎంగా ఉంటారని యతీంద్ర చేసిన వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తరువాత సీఎం కావాలని కలలు కంటున్న డీకే శివకుమార్‌ను ఇప్పుడు తలుచుకుంటే జాలి వేస్తోందని వ్యంగ్యమాడారు. డీకే సీఎం అవుతారని ఆయన వర్గీయులు ఓట్లు వేశారని, అయితే వారందరికీ మోసం జరిగిందని అన్నారు. సిద్ధరామయ్య అందరి మధ్య గొడవలు పెట్టి పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగాలని చూస్తున్నారని విమర్శించారు. కోలారులో రాముని ఫ్లెక్సీని దుండగులు చింపేయడంపై ఎంపీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ హయాంలో రామునికి గౌరవం దక్కదని ఆరోపించారు. యతీంద్ర పదవీ బాధ్యత లేని నేత, తమ నాయకునికి శక్తి ఇవ్వాలని ప్రజలను అడగడంలో తప్పుపట్టే పని లేదని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు. మా నాన్న ఐదేళ్లూ సీఎం ఉండాలనేలా యతీంద్ర మాట్లాడడాన్ని బుధవారం కుమారకృప వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా డీకే మాట్లాడారు. తమ ప్రభుత్వం కొనసాగుతుందని, సిద్దరామయ్య తమ ముఖ్యమంత్రి అన్నారు. సిద్దరామయ్య సీఎంగా, నేను కేపీసీసీ అధ్యక్షునిగా ఇద్దరూ కలిసి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. అందులో ఎలాంటి అనుమానం లేదని, ఆశపడటం, శక్తి ఇవ్వాలని ప్రజలను అడగడంలో తప్పులేదు, నేను కూడా మా ప్రజలను ఇలాగే అడుగుతానంటూ వివాదాన్ని సద్దుమణిగేలా మాట్లాడారు. -
బస్సులు ఫుల్, చార్జీలు డబుల్
కర్ణాటక: రాష్ట్రంలో ఆర్టీసీ కోసం కొత్తగా 5,675 కొత్త బస్సులు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. శనివారం సీఎం నివాస కార్యాలయం కృష్ణాలో రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. బడ్జెట్లో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.500 కోట్లు కేటాయించాం, కొనుగోలు ప్రక్రియనే త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం శక్తి వల్ల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య 15 శాతం పెరిగింది, రద్దీని తట్టుకొనేలా బస్సులను అందుబాటులోకి తేవాలన్నారు. వాహన తనిఖీల ద్వారా రూ.83 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో రవాణా, దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి పాల్గొన్నారు. బనశంకరి: దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు స్వంత ఊర్ల బాటపట్టగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు టికెట్ బుకింగ్ ధరలు గణనీయంగా పెరిగాయి. లగ్జరీ/ ఏసీ బస్ చార్జీలు రెట్టింపు అయ్యాయి. బెంగళూరు మెజస్టిక్, మైసూరు రోడ్డు, శాంతినగరలో గల కేఎస్ఆర్టీసీ బస్టాండులు ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రైవేటు బస్సులు యజమానులు సైతం ఎక్కువ సంఖ్యలో సర్వీసులు నిర్వహించారు. సొంతూర్లకు నగరవాసులు దసరా వల్ల శనివారం నంచి మంగళవారం వరకూ వరుసగా సెలవులు రావడంతో ఐటీ, బీటీ, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సొంతూళ్ల బాటపట్టారు. లక్షలాది మంది బస్సులు, క్యాబ్‌లు, సొంత కార్లలో బయల్దేరడంతో నగరంలో ప్రధాన రోడ్లలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలామంది శుక్రవారం సాయంత్రమే కుటుంబసమేతంగా బయలుదేరి వెళ్లారు. అలాగే మైసూరు రోడ్డు, తుమకూరురోడ్డు, హోసూరు, అనేకల్ రోడ్లలో ట్రాఫిక్రద్దీ ఏర్పడింది. బెంగళూరులో మెజస్టిక్, మైసూరు రోడ్డు, శాటిలైట్ బస్టాండు, శాంతినగర, జయనగర బస్టాండ్లు కిటకిటలాడాయి. సాధారణ బస్సుల్లో సీట్ల కోసం తొక్కిసలాట ఏర్పడింది. రైళ్లు సైతం ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. అలాగే తిరిగి వచ్చేవారి కోసం అక్టోబరు 24 నుంచి 29 మధ్య ఇతర నగరాల నుంచి బెంగళూరుకు ప్రత్యేక బస్సులు వేశారు. టికెట్‌పై రూ. వెయ్యి వరకూ పెంపు శనివారం ఉదయం నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు చైన్నె, కేరళ, హైదరాబాద్‌కు ఎక్కువ ప్రయాణాలు మొదలయ్యాయి. టికెట్ ధరను రూ.500 నుంచి 1000 పెంచారు. పండుగ సాకుతో బస్సుల యజమానులు దోచేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. ప్రైవేటు బస్సుల్లో బెంగళూరు నుంచి కొచ్చికి టికెట్ చార్జి రూ.3,500 , హైదరాబాద్ –బెంగళూరు, ముంబై–బెంగళూరుకు రూ.3,500గా నిర్ణయించారు. పండుగలకు ఊళ్లకు వెళ్లనివారు కొడగు, చిక్కమగళూరు, ఊటి, మైసూరు, పుదుచ్చేరి తదితర టూర్లకు వెళ్తున్నారు. బెంగళూరు నుంచి ఒకరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల మధ్య ప్యాకేజీలు ఉన్నట్లు ట్రావెల్‌ఏజెంట్లు తెలిపారు. -
అప్పులు చేసి ఆడంబర వివాహాలొద్దు
మైసూరు: వ్యవసాయం పేరిట అప్పులు చేసి ఆ సొమ్ముతో ఘనంగా పెళ్లిళ్లు చేసుకోవడం నిలిపేయాలని సీఎం సిద్ధరామయ్య సూచించారు. పేదలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోకూడదని, ఎంత మంచం ఉంటే అంతలోనే కాళ్లు చాపుకోవాలని హితవు పలికారు. బుధవారం చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని శ్రీ మలై మహదేశ్వరబెట్ట దేవస్థానంలో ఏర్పాటు చేసిన సామూహిక వివాహోత్సవంలో సిద్ధరామయ్య పాల్గొని మాట్లాడారు. పేదలు, మధ్యతరగతి వారు అప్పులు చేసి ఘనంగా పెళ్లిళ్లు చేసుకుని జీవితాంతం ఆ అప్పులు తీర్చుకుంటూ ఉంటున్నారని, ఇది సరికాదని సూచించారు. నూతన దంపతులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. మలై మహదేశ్వర బెట్టలో ఉన్న రాష్ట్రపతి భవన్‌ను ఇకనుంచి తపోభవనం అని పిలవాలని సూచించారు. మాదప్పకు సీఎం పూజలు మలె మహదేశ్వర స్వామిని సీఎం దర్శనం చేసుకున్నారు. దండిగా వర్షాలు కురిపించి కరువు, కావేరి వివాదం నుంచి గట్టెక్కించాలని పూజలు చేసినట్లు తెలిపారు. సుమారు 20 నిమిషాల పాటు వీరు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. కావేరిపై సుప్రీంను ఆశ్రయిస్తాం తమిళనాడుకు మరో 15 రోజుల పాటు రోజూ 3 వేల క్యూసెక్కుల కావేరి నీటిని విడుదల చేయాల్సి ఉందని, దీన్ని ప్రశ్నిస్తు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటప్పుడు నీటిని వదలాలనే నిర్ణయం సరికాదని అన్నారు. చామరాజనగరకు వచ్చిన సీఎం కొన్నినెలల్లోనే పదవిని పోగొట్టుకుంటారనే ప్రచారాన్ని ప్రస్తావించగా, గతంలో చామరాజనగరకు వచ్చి ఐదేళ్ల పాటు పాలన సాగించామని, ఈ అపవాదును తొలగించామని సీఎం తెలిపారు. -
ఎమ్మెల్యేలతో సీఎం వరుస భేటీలు
శివాజీనగర: పార్టీ ఎమ్మెల్యేలతో రెండో రోజూ మంగళవారం కూడా సీఎం సిద్దరామయ్య భేటీ అయ్యారు. ఉదయం సీఎం నివాసం కృష్ణాలో రాయచూరు, విజయపుర, కొప్పళ జిల్లాల ఇన్చార్జి మంత్రుల, ఎమ్మెల్యేలతో సమావేశం జరిపారు. సోమవారం తుమకూరు, యాదగిరి, చిత్రదుర్గ, బాగలకోట, ధారవాడ జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చించారు. మంగళవారం సమావేశంలో పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకంగా మీడియా ముందు అధికారిక వ్యాఖ్యలు చేయరాదని, నియోజకవర్గ నిధులతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. ఇంతకు ముందు బదిలీల విషయానికి సంబంధించి ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఈ విషయంపై సీఎల్పీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చర్చ జరిపి, అసంతృప్తిని పక్కకుపెట్టి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కల్యాణ కర్ణాటక ఎమ్మెల్యేలు చేసిన విన్నపానికి స్పందించిన ముఖ్యమంత్రి అధిక నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. -
అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య రికార్డు.. 14 వ సారి
కర్ణాటక: రాష్ట్ర శాసనసభా సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానుండగా, అధికార, విపక్షాల మధ్య పోరాటం ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠభరితంగా మారింది. కాంగ్రెస్ సర్కారు ఐదు గ్యారంటీల పథకాల అమల్లో గందరగోళం, కరెంటు చార్జీల పెంపు, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మత మార్పిడి చట్టం, ఏపీఎంసీ చట్టం రద్దు చేసే విషయాలతో పాటుగా పలు విషయాలు అసెంబ్లీలో సెగలు పుట్టించే అవకాశముంది. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న 2వ అసెంబ్లీ సమావేశం కాగా, నెల కిందట తొలి అసెంబ్లీ సమావేశం కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, నూతన సభాధ్యక్షుల ఎంపికకు పరిమితమైంది. మూడు పక్షాల వ్యూహాలు ఇక నేడు సోమవారం నుంచి ఈ నెల 14 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ హామీలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టేందుకు ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్ రెడీగా ఉన్నాయి. విపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార పక్షంలో సీనియర్లు సన్నద్ధమయ్యారు. గత ప్రభుత్వంలో పలు అంశాల్లో కుంభకోణాలు జరిగాయంటూ వాటిపై దర్యాప్తు కు ఆదేశించినట్లు చెబుతూ అధికార కాంగ్రెస్ ఎదురుదాడి చేయడానికి కాచుకుంది. గ్యారంటీలపై బీజేపీ దృష్టి ముఖ్యంగా గ్యారంటీలపైనే బీజేపీ దృష్టి సారించింది. వీటిని అమలు చేయకుండా ప్రజలను మోసగించారని, తాము అసెంబ్లీ లోపల, బయటా ఆందోళనలు చేస్తామని ప్రకటించడం తెలిసిందే. అసెంబ్లీ లోపల కూడా పోరాటం చేపట్టేందుకు కాషాయం సిద్ధమైంది. జేడీఎస్ కూడా గ్యారంటీల మీదే ఎగువ, దిగువ సభల్లో గళమెత్తనుంది. అందుచేత ఈ సమావేశాలు వేడెక్కే అవకాశాలే అధికం. బీజేపీ ప్రభుత్వ అవధిలో జారీ అయిన మతమార్పిడి నిషేధ చట్టం, ఏపీఎంసీ చట్టాల రద్దు బిల్లులను అసెంబ్లీలో సర్కారు ప్రవేశపెట్టనుంది. అలాగే గతంలో సవరణలు ముందున్న ఏపీఎంసీ చట్టాన్నే మళ్లీ అమలులోకి తెస్తూ బిల్లును ప్రవేశపెట్టనుంది. అలాగే గోహత్య నిషేధం చట్టంపైనా చర్చ జరగవచ్చు. జూలై 7న సిద్దరామయ్య బడ్జెట్ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2023–24వ సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక శాఖ కూడా ఆయనే వద్దనే ఉంది. ఇప్పటివరకు ఆయన 13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించి రికార్డు సృష్టించారు. ఇది 14వ సారి అవుతుంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 13 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఒక రికార్డుగా ఉంది. నేడు గవర్నర్ ప్రసంగం తొలిరోజైన సోమవారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాధారణంగా సంవత్సర ఆరంభంలో సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయం. అదే ప్రకారంగానే గత ఫిబ్రవరిలో సమావేశాల్లో ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కావడంతో గవర్నర్ ప్రసంగంతోనే ఆరంభించాలని నిర్ణయించారు. -
సీఎం గారూ.. మా బాధలు పట్టించుకోండి
కర్ణాటక: సీఎం సిద్ధరామయ్య గారు.. కొంచెం విషం ఇవ్వండి.. ప్రాణాలు తీసుకుంటాం అంటూ చిక్కమగళూరు జిల్లాకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన బాధను వీడియో రూపంలో విన్నవించుకొన్నారు. శక్తి పథకం ద్వారా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తమకు గిరాకీలు లేవన్నారు. ఆటోల్లో ప్రయాణించేవారు తక్కువయ్యారని, బా డుగలు లేక ఇంటికి వెళ్లలేకపోతున్నామన్నారు. చేతులెత్తి మొక్కుతున్నా.. ఇలాంటి చిత్రహింస ఎవ్వరికీ వద్దు, ఆటో డ్రైవర్లపై కరుణ చూపించాలని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఇవే చివరి ఎన్నికలు
మైసూరు: ఇవే నాకు చివరి ఎన్నికలు, ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని, ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉంటానని, ప్రజల సేవ కొనసాగిస్తానన్నారు. శనివారం ఆయన మైసూరు, వరుణలో పర్యటించారు. బిళిగెరె గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చానన్నారు. ఇదే తనకు చివరి ఎన్నికలు అని చెప్పారు. ప్రజలు బీజేపీని ఓడించి చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. జూలైలో 3 గ్యారంటీలు మైసూరు జిల్లాలో గ్యారంటీ పథకాలైన అన్నభాగ్య, బెళగావిలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. సుత్తూరు దేశికేంద్రస్వామిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జూలై 1న కలబురిగిలో గృహజ్యోతి, అదేరోజు పది కేజీల బియ్యాన్ని ఇచ్చే అన్నభాగ్యను మైసూరులో, అలాగే జూలై 16లో బెళగవిలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 2022–23లో ఉత్తీర్ణులైన డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు 24 నెలల్లో పని లభించకపోతే నిరుద్యోగ భృతిని అందిస్తామన్నారు. ఎస్ఐ నియామకాల కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. -
‘గోవధ నిషేధ చట్టం’ తొలగిస్తారా? సిద్ధరామయ్య ఏమ్ననారంటే..
బెంగళూరు: గోవధ నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తామంటూ ప్రకటన ఇవ్వడంతో.. నిరసనలను ఉధృతం చేసేందుకు ప్రతిపక్ష బీజేపీ సిద్ధమైంది. గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో స్పష్టత లేదని, రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చిస్తుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అయితే.. ఈ చట్టాన్ని ఎత్తేసే అంశంపై ఏదైనా అడుగుపడిందా? అని మీడియా అడగ్గా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘‘కేబినెట్లో ఈ అంశంపై చర్చించాల్సి ఉంది. ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు’’ అని చెప్పారాయన. అంతకు ముందు కర్ణాటక పశుసంవర్థక శాఖ మంత్రి కే వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దున్నపోతుల్ని వధించినప్పుడు.. గోవుల్ని ఎందుకు వధించకూడదు? అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. గత బీజేపీ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. అందులో దున్నపోతుల్ని వధించొచ్చని చెప్పింది. కానీ, గోవుల్ని మాత్రం వధించడానికి వీల్లేదని చెప్పింది. ఈ అంశంపై మేం చర్చించి.. నిర్ణయిస్తాంఅని పేర్కొన్నారాయన. అలాగే.. వయసుపైబడిన ఆవుల్ని వధించడం వల్ల రైతులకు ఉపశనమే తప్పా నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారాయన. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ట్విటర్లో మండిపడగా.. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 1964 చట్టం ప్రకారం(రద్దైన చట్టం).. 12 ఏళ్లు పైబడిన గోవులను, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడని గోవులను వధించేందుకు వీలుంది. మంత్రి వెంకటేష్ చెప్పాలనుకుంది కూడా అదే. కానీ, ఆయన సరిగా వివరించలేకపోయారు అని సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్ మినిస్టర్‌ను సమర్థించారు. కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కాటిల్ యాక్ట్‌ను 2020లో తీసుకొచ్చింది కర్ణాటక బీజేపీ సర్కార్. ఆ మరుసటి ఏడాది నుంచి అది అమలు అవుతోంది. దీని ప్రకారం.. కర్ణాటకలో పశువుల్ని వధించడం నిషేధం. ఆవుల్ని, లేగల్ని, ఎదుల్ని పశువుల జాబితాలో చేర్చారు. అయితే.. జబ్బు బారినపడిన పశువుల్ని, 13 ఏళ్ల వయసు పైబడిన గేదెలను(అదీ అధికారుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే) మాత్రమే వధించడానికి అనుమతి ఇస్తారు. వాటిని వధించేందుకు మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలించడం కూడా నేరంగా పరిగణిస్తారు. కాదని గోవ వధకు పూనుకుంటే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. అలాగే, రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఈ చట్టం అమల్లో ఉండగా.. కర్ణాటక ఆ జాబితాలో మూడో రాష్ట్రంగా చేరింది. ఇదీ చదవండి: అవసరమైతే మ్యాజిక్కులు చేసుకుని బతుకుతా! -
ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడమంటే..
బనశంకరి: కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఎన్నికకాగా 20వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. గతంలోనూ ఆయన ఐదేళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు ఐదేళ్లు అవధి ఆ పదవిలో ఉన్నది ముగ్గురు మాత్రమే. పలువురు ముఖ్యమంత్రులు అవధి పూర్తికాకముందే అధికారం కోల్పోయారు. మరికొందరు గడువు తీరకముందే ఎన్నికలు రావడంతో అవకాశం కోల్పోయారు. 2013 నుంచి 2018 వరకు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాటు పనిచేశారు. ఎస్.నిజలింగప్ప, దేవరాజ అరస్లు గతంలోనే పూర్తికాలం పదవిలో ఉండి సత్తా చాటుకున్నారు. తరువాత ఎంతోమంది సీఎంలు అయ్యారు కానీ సంక్షోభాలలో చిక్కుకుని, లేదా హైకమాండ్ చేత మధ్యలోనే పదవీచ్యుతులయ్యారు. మైసూరు సీఎం.. ఎస్.నిజలింగప్ప కర్ణాటక.. మైసూరు రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎస్.నిజలింగప్ప ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పాలించారు. 1956 నుంచి 1958 వరకు కాంగ్రేస్ ప్రభుత్వంలో రెండేళ్లు పాటు సీఎంగా పరిపాలన చేశారు. 1958లో బీడీ జత్తి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 14, 1962 నుంచి 20 జూన్ 1962 వరకు సీఎంగా ఎస్ఆర్ కంఠి ఎన్నికయ్యారు. జూన్ 21, 1962 నుంచి సీఎంగా ఎన్నికై న నిజలింగప్ప మే 29, 1968 వరకు ముఖ్యమంత్రిగా పూర్తికాలం పదవిలో ఉన్నారు. పథకాల్లో దేవరాజ్ అరస్ ముద్ర మైసూరు రాష్ట్రం కర్ణాటకగా మారిన తరువాత 1972 మార్చి 20 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవరాజ అరస్ ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. ఐదేళ్లపాటు ఆయన జనరంజక పాలన అందించారు. వెనుకబడిన వర్గాల బాగు కోసం అనేక పథకాలను అమలు చేశారు. 1978 ఫిబ్రవరి 28న మరోసారి ముఖ్యమంత్రి అయి 1980 జనవరి 7 వరకు పదవిలో కొనసాగారు. -
సిద్దరామయ్యకు షాక్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య షాక్ తగిలింది. ఒకవైపు ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవ్వగా.. మరోవైపు ఆయన పోటీచేసిన చాముండేశ్వరి నియోజకవర్గంలోనూ పరాభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్దరామయ్య బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రారంభ ట్రెండ్స్‌లో సీఎం సిద్దూ వెనుకబడ్డారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో ఆరంభం నుంచి సిద్దూకు ఎదురుగాలే వీచింది. ఇక్కడ ఆయనపై జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ మొదటిరౌండు నుంచి ఆధిక్యం కనబర్చారు. మొత్తానికి 25,861 ఓట్ల మెజారిటీతో సిద్దరామయ్యపై ఆయన గెలుపొందారు. అటు బాదామి నియోజకవర్గంలో సీఎం సిద్దరామయ్యపై బీజేపీ అభ్యర్థి శ్రీరాములు మొదట ఆధిక్యం కనబచ్చారు. అయితే, లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ.. సిద్దరామయ్య మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. ఈ నియోజకవర్గంలో శ్రీరాములు, సిద్దరామయ్య మధ్య హోరాహోరి నెలకొంది. బాదామిలో 160 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. సిద్దరామయ్య కొడుకు యతీంద్ర మాత్రం వరుణ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉండి.. విజయం దిశగా సాగుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
బీజేపీకి 60 నుంచి 65 సీట్లే
సాక్షి, బెంగళూరు: ఇలా పోలింగ్ ముగిసిందో లేదో.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల హడావుడి మొదలైపోయింది. దాదాపు ప్రధాన ఛానెళ్ల పోల్స్ అన్నీ హంగ్ ఏర్పడే అవకాశాలే ఉన్నాయని తేల్చి చెప్పేశాయి. అయితే ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్న ధీమాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యక్తం చేస్తున్నారు. ‘వచ్చే రెండు రోజులు ఎగ్జిట్ పోల్స్ వినోదాన్ని పంచబోతున్నాయి. నదిని ఈదలేనోడు లోతు లెక్కలు చూసుకుని మురిసిపోయాడంట. చివరకు తప్పుడు అంచనాతో నీటిలో మునిగిపోతాడు. కొందరికి(బీజేపీని ఉద్దేశించి) అలాంటి పరిస్థితే ఎదురుకాబోతోంది. కాబట్టి, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఎగ్జిట్ పోల్స్‌ను చూసి బాధపడాల్సిన పని లేదు. మీ వారాంతాన్ని హాయిగా ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఉండండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది’ అంటూ సిద్ధరామయ్య వరుస ట్వీట్లు చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప మానసికంగా కుంగిపోయి ఉన్నారని, అందుకే 17వ తేదీ ప్రమాణం చేస్తానని ఏదో మాట్లాడుతున్నారంటూ సిద్ధరామయ్య సెటైర్లు పేల్చారు. బీజేపీకి 60-65 సీట్ల కన్నా ఎక్కువ రాబోవని ఆయన జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే ప్రీపోల్స్ సర్వేల్లాగే ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ తప్పదనే సంకేతాలు అందుతుండగా, స్పష్టమైన గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ వేటికవే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. -
నరేంద్ర మోదీపై సిద్ధరామయ్య ప్రశంసలు
సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశంసలు గుప్పించారు. గ్రామాలు సుభిక్షంగా ఉండటానికి కారణం నరేంద్ర మోదీనే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సిద్ధరామయ్య ఏంటి? హఠాత్తుగా మోదీని పొగడటం ఏంటనుకుంటున్నారా?.. అసలు విషయం... మంగళవారం మళవల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నరేంద్ర స్వామి తరపున సిద్ధూ ప్రచారం చేస్తూ ‘గ్రామాలకు రోడ్లు, మంచి నీటి సౌకర్యం, స్కూళ్లు ఇలా అభివృద్ధి పనులకు కారణం నరేంద్ర మోదీనే’ అని పేర్కొన్నారు. వెంటనే ప్రజల్లో కొందరు గట్టిగా అరవగా.. స్టేజీపైనే ఉన్న నరేంద్ర స్వామి ఆయన్ని అప్రమత్తం చేశారు. ఆ వెంటనే సిద్ధరామయ్య తన పొరపాటును సవరించుకుంటూ.. ‘నరేంద్ర అనేది చాలా ముఖ్యమైన పదం. స్వామీ ఇక్కడ ఉన్నారు. మోదీ గుజరాత్లో ఉంటారు. నరేంద్ర మోదీ కల్పితం, నరేంద్ర స్వామి సత్యం’ అంటూ తన ప్రసంగం కొనసాగించారు. రెండోసారి కూడా... ఆ తర్వాత కొద్దినిమిషాలకే సిద్ధరామయ్య మరోసారి నోరు జారారు. ఈసారి ఏకంగా నరేంద్ర మోదీకి ఓట్లేయ్యండని ప్రజలను కోరారు. ‘నరేంద్ర మోదీకి మీరు వేసే ప్రతీ ఓటు. నాకు వేసినట్లే. ఆయన్ని ఆఖండ మెజార్టీతో గెలిపించండి’ అని వ్యాఖ్యానించారు. ఈసారి కార్యకర్తలు గోల చేయటంతో సిద్ధరామయ్య సారీ చెప్పి ప్రసంగం కొనసాగించారు. ఇలా నిమిషాల వ్యవధిలో ఆయన చేసిన తప్పిదం తాలూకు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘సిద్ధరామయ్య మైండ్‌లో మోదీ ఎంత బలంగా నాటుకు పోయాడో ఇదే నిదర్శనం’ అంటూ కొందరు, ‘బీజేపీ-కాంగ్రెస్ నేతలు దొందూ దొందే’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. గతంలో అమిత్ షా కూడా మీడియా సమావేశంలో యెడ్యూరప్ప ప్రభుత్వం అవినీతిమయం అని వ్యాఖ్యానించగా.. పక్కనే కూర్చున్న యెడ్డీ నివ్వెరపోయారు. ఆ తప్పిదాన్ని కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ట్రోల్ చేసింది. సొంత పార్టీని ఇరుకున పెట్టిన వైనం -
సిద్దరామయ్యను నేను ఓడిస్తా..
సాక్షి, బెంగళూరు : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఓడించేందుకే బాదామి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నానని బీజేపీ నేత బళ్లారి శ్రీరాములు తెలిపారు. ఓటమి భయంతోనే సిద్ధరామయ్య రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఒక రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. ఓటమి భయంతోనే 21 నెలల తర్వాత సోనియాగాంధీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారని అన్నారు. బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని తెలుగు ప్రజలు విజ్ఞులని, స్థానిక సమస్యల పరిష్కారానికే తెలుగు ఓటర్లు ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. బీజేపీపై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను విభజించే కుట్రలో భాగంగానే లింగాయత్‌లకు మత మైనారిటీ హోదా అంటూ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందని శ్రీరాములు విమర్శించారు. -
అతను బతికే ఉన్నాడు
బెంగళూరు: కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య హయాంలో ‘జిహాదీ’ల చేతిలో మరణించారని పేర్కొంటూ హిందూత్వ వాదుల పేరుతో కర్ణాటక బీజేపీ కార్యదర్శి శోభా కరంద్లాజే ఇటీవల ఒక జాబితా విడుదల చేశారు. 23 మందితో కూడిన ఆ జాబితాలోని ఉన్న మొదటి వ్యక్తి బతికే ఉన్న విషయం బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2015 సెప్టెంబర్ 20న అశోక్ పూజారి ‘జిహాదీ’ల చేతిలో మరణించినట్లు కరంద్లాజే పేర్కొనగా.. అతను ఉడుపి సమీపంలోని మూదాబిద్రిలో బతికే ఉన్నట్లు ఓ మీడియా సంస్థ పరిశోధనలో తేలింది. అయితే తనపై దాడి నిజమేనని, చనిపోలేదని అశోక్ పూజారి వెల్లడించాడు. -
కర్ణాటక ప్రచార హోరులో పేలుతున్న మాటల తూటాలు!
వారం రోజుల్లో పోలింగ్ జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార యుద్ధంలో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతల మధ్య మాటలు పదునెక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ పక్షాన ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జేడీఎస్ నేత కుమారస్వామిల మాటలు ఈ ప్రచార పోరులో తూటాల్లా పేలుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పాత రాజకీయ మర్యాదలు, సంప్రదాయాలకు అతీతంగా అసంబద్ధ రీతిలో వారి వ్యాఖ్యలు వేడిపుట్టిస్తున్నాయి. ఇటీవల ఓ ఎన్నికల ర్యాలీలో వందేమాతరం గీతాన్ని అగౌరవపరిచే విధంగా రాహుల్ ప్రవర్తించారని మోదీ గురువారం విమర్శించారు. దీనికి రాహుల్,‘‘మోదీజీకి భయం పుట్టినప్పుడల్లా వ్యక్తిగత దూషణలకు పాల్పడతారు. ఆయన అందరికీ ప్రధాని కాబట్టి నేను ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయను. ఆయనకూ, నాకూ మధ్య ఉన్న తేడా ఇదే,’’ అని రాహుల్అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలకు మారుపేరు. కొందరు నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు దక్కుతాయి,’’ అని యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. ఆయనకు సిద్దరామయ్య దీటైన జవాబు ఇస్తూ, ‘‘యడ్యూరప్ప కొడుకు రాఘవేంద్ర గతంలో పార్లమెంటు, అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాఘవేంద్ర ఎవరి కుమారుడు? అతను యడ్యూరప్ప కొడుకు కాదా?’’అంటూ మండిపడ్డారు. ఇదే విషయంపై ప్రధాని మోదీ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ, ‘‘ కాంగ్రెస్ కార్యకర్తలు చెమటలు కక్కుతూ ప్రచారం చేస్తుంటే, ముఖ్యమంత్రి 2+1 సూత్రం అనుసరిస్తూ, తాను రెండు సీట్ల నుంచి పోటీచేస్తూ, మరో సీటులో కొడుకును నిలబెట్టారు. మంత్రులు 1+1 సూత్రంతో కొడుకుల లేదా కూతుళ్లతో కలిసి పోటీచేస్తున్నారు,’’ అనగానేసిద్దరామయ్య వెంటనే, ‘‘బళ్లారి రెడ్డి సోదరులపై సీబీఐ కేసుల మూత గురించి మాట్లాడకుండా ఎన్నికల్లో గెలుపునకు 2+1 సూత్రం గురించి చెప్పారు. ఇద్దరు రెడ్లు+ఒక యడ్డీ ఫార్ములా అమలు చేస్తున్నారు,’’ అంటూ గాలి జనార్దన్ రెడ్డి అన్నదమ్ములు సోమశేఖర్, కరుణాకర్ రెండు సీట్ల నుంచి అసెంబ్లీకి బీజేపీ టికెట్ పై పోటీచేయడం గురించి ఎద్దేవా చేశారు. ఎవరి మధ్య రహస్య ఒప్పదం? జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఓ ప్రైవేటు విమానంలో అమిత్ షాతో కలిసి చేసిన ప్రయాణానికి సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, తగిన సమయంలో ఫోటోలు విడుదల చేస్తానని సిద్ధూ ఇటీవల ప్రకటించారు. దీనిపై వెంటనే స్పందించిన కుమారస్వామి, ‘‘వరుణలో సీఎం కొడుకు యతీంద్ర పోటీచేస్తున్నారు. ఇక్కడ బీజేపీతో కాంగ్రెస్‌కు రహస్య ఒప్పందం ఉన్న కారణంగానే మొదట అక్కడ కాషాయపక్ష అభ్యర్థిగా ప్రకటించిన యడ్యూరప్ప కొడుకు రాఘవేంద్రను నిలబెట్టలేదు. సీఎంవి ఆధారరహిత, బాధ్యతలేని ప్రకటనలు. ఈ మాటల వల్ల ఆయన తాగుబోతులా మాట్లాడుతున్నారని జనం అనుకుంటారు,’’ అని జవాబిచ్చారు. ‘‘కర్ణాటక అందరికీ శాంతివనంలా ఉండాలన్న ప్రసిద్ధ కన్నడ కవి కువెంపు మాటలు సిద్ధూ చదివి ఉంటే లింగాయతులకు మైనారిటీ మత హోదా ఇవ్వాలని సిఫార్సు చేసేవారు కాదు,’’ అని అమిత్‌షా వ్యాఖ్యానించగా, ‘‘కువెంపు రాసిన ఈ కన్నడ రాష్ట్ర గీతంలోని రెండో వాక్యంలోహిందువులు, మస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, జైనులకు అంటే అన్ని మతాలకు ఉద్యానవనంలా ఉండాలని చెప్పారు. అమిత్‌షా ఇది కూడా చదవాల్సింది,’’అని సీఎం గట్టిగా జవాబిచ్చారు. అమిత్ షా జైనా? హిందువా? ‘‘సిద్దరామయ్య హిందువులను సైతం చీల్చడానికి ప్రయత్నిస్తున్న విషయం రాహుల్‌గాంధీ గమనించాలి. సీఎంకు ‘అహిందా’(కన్నడంలో దళిత, బీసీ, మైనారిటీ వర్గాల నేత అనడానికి సంక్షిప్త రూపం) నేత అనే పేరుంది. వాస్తవానికి ఆయన అహిందా నేత కాదు అహిందువు.’’ అన్న అమిత్ షా వ్యాఖ్యపై స్పందించిన సిద్ధూ, అమిత్ షా జైన మతస్తుడని, తాను హిందువో కాదో ఆయనే వివరణ ఇచ్చుకోవాలని సవాల్‌చేశారు. వెంటనే, తాను జైనుడిని కాదనీ, హిందూ వైష్ణవుడినని షా జవాబిచ్చారు. ప్రధాని మోదీ అవినీతి గురించి మాట్లాడడాన్ని సిద్ధూ ఆహ్వానిస్తూ, ‘‘ఈ విషయంపై మాట్లాడడం మంచిదే. ముందు మీ మాటలను ఆచరణలో చూపించండి. మీరు ముందు లోక్‌పాల్ నియమించండి, జడ్జీ లోయా మృతిపై దర్యాప్తు జరిపించండి, అమిత్ షా కొడుకు జై షా శరవేగంతో పెంచుకున్న సంపదకు కారణాలు విచారించండి, మచ్చలేని నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించండి,’’అని సవాలు విసిరారు. దీనికి యడ్యూరప్ప జవాబిస్తూ, ‘‘మిస్టర్ టెన్ పర్సెంట్, మనం దిల్లీవైపు వేలు చూపే ముందు మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. రాష్ట్రంలో మీరు లోకాయుక్త అధికారాల్నింటికీ కత్తెరేసి శక్తిహీనుడిని చేయలేదా?’’అని ప్రశ్నించారు. ‘‘ మేం 22.5 లక్షల మందికి చేసిన రుణ మాఫీని కేంద్ర మంత్రులు చులకనచేసి మాట్లాడుతున్నారు. రైతు రుణాల మాఫీకి తన దగ్గర అచ్చు యంత్రం లేదని యడ్డీ అంటున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కార్పొరేట్కంపెనీలకు రూ. 2.7 లక్షల కోట్ల రుణాలు మాఫీచేశాయి. కోట్లాది మంది రైతులను విస్మరించి మోదీ కొందరు పారిశ్రామికవేత్తలకు ఎందుకు మేలు చేస్తున్నారు?’’ అని సిద్దరామయ్య విరుచుకుపడ్డారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
రెండు చోట్లా సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సీఎం సిద్దరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గంతోపాటు బాగల్కోట్ జిల్లాలోని బాదామీ స్థానంలో సిద్దరామయ్యతో పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. బాదామీ స్థానానికి ఇప్పటికే తమ అభ్యర్థిగా దేవరాజ్ పాటిల్ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. సిద్దరామయ్యకు రెండో సీటు కేటాయించాలా వద్దా అనే దానిపై స్పష్టత లేకపోవడంతో దేవరాజ్‌కు ఇప్పటివరకు బీ–ఫామ్ ఇవ్వలేదు. బాదామీ నుంచీ సిద్దరామయ్య పోటీకి అధిష్టానం పచ్చజెండా ఊపడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారని సీఎం కార్యాలయం వెల్లడించింది. చాముండేశ్వరి స్థానానికి సిద్దు ఇప్పటికే నామినేషన్ వేయడం విదితమే. కర్ణాటకలో పెద్ద నోట్ల వరద న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నగదు కొరత పట్టిపీడిస్తుంటే.. కర్ణాటకలో మాత్రం నోట్ల వరద పారుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఏటీఎంలు క్యాష్ లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక ఇందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. ఇటీవల ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆ రాష్ట్రంలో పలు చోట్ల సోదాలు చేపట్టగా రూ.4.13 కోట్ల నగదు పట్టుబడింది. ఇందులో 97 శాతం రూ.2000, రూ.500 నోట్లే ఉన్నాయి. ఈ మేరకు ఐటీ అధికారులు వెల్లడించారు. ‘ఇటీవల కర్ణాటకలో చేపట్టిన సోదాల్లో రూ.4.13 కోట్ల నగదు, రూ.1.32 కోట్ల విలువైన 4.52 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ నగదు మొత్తంలో రూ.2000, రూ.500 నోట్లే రూ.4.03 కోట్లు ఉన్నాయి’ అని ఐటీశాఖ తెలిపింది. మార్చి 27న కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన సోదాల్లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. -
చాముండేశ్వరిలో చావోరేవో..
చాముండి అమ్మవారి పాదాల సాక్షిగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య చావో రేవో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. జేడీఎస్‌కు బాగా పట్టున్న మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఓడిపోతారంటూ అంతర్గత సర్వేలు హెచ్చరించినా, కుల సమీకరణాలు అనుకూలంగా లేవని తేటతెల్లమైనా, సీఎంను ఓడించడానికి జేడీఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని ప్రచారం జరుగుతున్నా సరే సిద్దరామయ్య వెనక్కు తగ్గలేదు. తన కుమారుడి భవిష్యత్ కోసం రాజకీయ జూదంలో పావులు కదపడం మొదలు పెట్టారు. దీంతో కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టీ చాముండేశ్వరి నియోజకవర్గం మీదే పడింది.దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మైసూరు చాముండేశ్వరి అమ్మవారు కొలువైన ఈ నియోజకవర్గంలో సంకుల సమరానికి తెరలేచింది. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చాముండేశ్వరిలో పన్నెండేళ్ల తర్వాత మళ్లీ సిద్దరామయ్య డూ ఆర్ డై పోరుకి సిద్ధమయ్యారు. తనకు ఎంతో సురక్షితమైన వరుణ నియోజకవర్గాన్ని కుమారుడు యతీంద్ర కోసం త్యాగం చేసిన సిద్దరామయ్య ఓ రకంగా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారనే చెప్పాలి. చాముండేశ్వరి నియోజకవర్గంలో తొలినుంచీ జేడీఎస్ ప్రాబల్యం ఎక్కువ. ఇక బీజేపీ ఉనికి ఈ ప్రాంతంలో నామమాత్రమే. దీంతో ఈ నియోజకవర్గంలో సిద్దరామయ్య, జేడీఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ మధ్య మాత్రమే పోరు నెలకొంది. వాస్తవానికి చాముండేశ్వరి నియోజకవర్గం సిద్దరామయ్యకు కొత్త కాదు. ఇప్పటివరకు ఆయన అయిదుసార్లు ఈ నియోజకవర్గం నుంచే గెలిచి మరో రెండుసార్లు ఓడిపోయారు. ఆయన జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాక 2006లో ఎన్నికల్లో మాత్రం కేవలం 257 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2008లో వరుణ నియోజకవర్గానికి మారిపోయారు. కులసమీకరణాలే ప్రధానం ఈ నియోజకవర్గంలో కులసమీకరణాలే అత్యంత ప్రధానం. వొక్కలిగలు, ఓబీసీ ఓటర్లు ఎక్కువ. మొత్తం ఓటర్లలో 60 శాతం వొక్కలిగలే. జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ వొక్కలిగకు చెందినవారే కావడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చే అంశం. ఇక సిద్దరామయ్య సామాజిక వర్గమైన కురు» ప్రాబల్యం ఒకప్పుడు బాగా ఉండేది. 2004లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో కురుబ జనాభా ఉన్న చాలా ప్రాంతాలు వరుణ నియోజకవర్గంలో కలిసిపోయాయి. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ జేడీఎస్‌కు మద్దతునిస్తూ ఉండడంతో ముస్లిం ఓటర్లు కూడా జేడీఎస్ వెంట నడిచే అవకాశాలు న్నాయి. మరోవైపు దశాబ్దకాలంగా సిద్దరామయ్య ఈ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో జేడీఎస్ దానిని తనకు అనుకూల అస్త్రంగా మార్చుకుంది. అయితే సిద్దరామయ్య తనకున్న వ్యక్తిగత చరిష్మా, తాను చేసిన అభివృద్ధే గెలిపి స్తాయన్న ధీమాతో ఉన్నారు. అలాగే తనకు ఇవే ఆఖరి ఎన్నికలనీ, రాజకీయంగా తొలి చాన్స్ ఇచ్చిన ప్రజలు, చివరి అవకాశాన్నీ ఇవ్వాలంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. బాదామీలో పోటీచేయాలని అడుగుతున్నారు బాగల్కోట్ జిల్లాలోని బాదామీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాల్సిందిగా ఉత్తర కర్ణాటక నాయకులు ఇప్పటికీ తనను కోరుతున్నారంటూ సిద్దరామయ్య కొత్త ఊహాగానాలకు తెరలేపారు. చాముండేశ్వరితోపాటు బాదామీ నుంచి కూడా పోటీ చేయాలని తొలుత సిద్దరామయ్య భావించినప్పటికీ మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ వంటి నేతలు మోకాలడ్డారు. ఆ స్థానం నుంచి పోటీకి దేవరాజ్ పాటిల్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించినా ఆయనకు ఇంకా బీ–ఫామ్ అందజేయలేదు. బాదామీలో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే చిమ్మనకట్టి కూడా దేవరాజ్ పాటిల్‌కు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో గెలవడమే తమకు ప్రధానమనీ, ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని గెలిచిన తర్వాతే నిర్ణయిస్తామని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు జి.పరమేశ్వర స్పష్టం చేశారు. జేడీఎస్ దూకుడు చాముండేశ్వరిలో సిద్దరామయ్యను ఎలాగైనా ఓడించాలని, నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని తహతహలాడుతున్న జేడీఎస్ పకడ్బందీ వ్యూహాలే రచిస్తోంది. సిద్దరామయ్యను ఓడించడమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఆ పార్టీ నేతలు వీరశైవ మఠాలు, దళిత కాలనీల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ కుమారుడు హరీశ్ గౌడ తండ్రి గెలుపు కోసం ఏడాది క్రితమే ప్రయత్నాలు మొదలు పెట్టారు. చాముండి నియోజకవర్గంలో పల్లెపల్లెకూ తిరుగుతున్నారు. ప్రతి పల్లెతోనూ వ్యక్తిగతంగా అనుబంధాన్ని పెంచుకున్నారు. ఇవన్నీ జేడీ(ఎస్)కు కలిసొచ్చే అంశాలనే భావన వ్యక్తమవుతోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాంగ్రెస్‌వి ఓటు బ్యాంక్ రాజకీయాలు
దొడ్డబళ్లాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఏనాడూ గౌరవించని కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఆయన ఫొటో చూపించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ముఖ్య మంత్రి బీఎస్ యడ్యూరప్ప విమర్శించారు. పట్టణంలోని భగత్‌సింగ్ క్రీడా మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకపోగా ఎన్నికల్లో ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. తాను 50 మంది పౌర కార్మికులను ఇంటికి పిలిచి సన్మానించానన్నారు. దేశానికి రైతు, చేనేత కార్మికుడు రెండు కళ్లలాంటివారన్నారు. సీఎం సిద్ధరామయయ్యకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇండియా టుడే ఎన్నికల సర్వే ఫలితాలను పట్టించుకోనవసరం లేదని అన్నారు. మొళకాల్మూరు బీజేపీ అభ్యర్థి శ్రీరాములు మాట్లాడుతూ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయితే చేనేత కార్మికుల అన్ని రుణాలనూ మాఫీ చేస్తారన్నారు. ఇదే సందర్భం గా చలనచిత్ర నిర్మాత, జేడీఎస్ సీనియర్ నాయకుడు సారథి సత్యప్రకాశ్ వందలాదిమంది మద్దతుదారులతో కలిసి యడ్యూరప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ పుట్టస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఆ సర్వేలో నిజం లేదు
సాక్షి, బళ్లారి: ఓటమి భయంతోనే సీఎం సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని, ఐదు సంవత్సరాలు సీఎంగా పని చేసిన వ్యక్తిగా ఆయనే గెలవలేని పరిస్థితి ఉంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చని బీజేపీ శాసనసభా పక్ష నేత, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విమర్శించారు. ఆయన శనివారం హుబ్లీలో విలేకరులతో మాట్లాడారు. ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో పస లేదు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు పేర్కొనడంలో నిజం లేదు అని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సర్వేలు అబద్ధమని తేలిపోయినట్లు చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ స్వతంత్రంగా అధికారంలోకి వస్తారని సర్వేలు చెప్పలేదని, అదే మాదిరిగా ఈసారి కూడా యడ్యూరప్ప కర్ణాటకలో సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలు అనంతరం సిద్దూ ఇంటికే పరిమితం అవుతారని, కాంగ్రెస్ ఎన్ని సర్వశక్తులు ఒడ్డినా తాము ఒంటరిగా 150 సీట్లతో గద్దెనెక్కుతామని జోస్యం చెప్పారు. శ్రీరాములే పోటీ చేసి గెలుస్తారు మొళకాల్మూరు ఎమ్మెల్యేగా తిప్పేస్వామి గెలుపొందారంటే అది శ్రీరాములు ఆశీస్సులే, గత శాసనసభ ఎన్నికల్లో బీఎస్‌ఆర్‌సీపీ తరుపున తిప్పేస్వామికి శ్రీరాములు టికెట్ ఇవ్వడంతో పాటు గెలుపునకు కృషి చేయడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారన్నది మరువకూడదని శెట్టర్ హితవు పలికారు. శ్రీరాములుపై తిప్పేస్వామి తిరుగుబాటు చేయించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించి వ్యవహరించారని, ఎట్టి పరిస్థితుల్లోను మొళకాల్మూరు నుంచి శ్రీరాములే పోటీ చేస్తారని, ఆయనే భారీ మెజార్టీతో గెలుపొందుతారన్నారు. తిప్పేస్వామి రాజకీయ సమీకరణలు నిజం కావన్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటమో లేదా మరేదైనా నిర్ణయం తీసుకోవడంలో తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే అనవసర గొడవలకు దిగితే జనమే బుద్ధి చెబుతారన్నారు. శ్రీరాములుకు మొళకాల్మూరులో గెలిచే శక్తి ఉందన్నారు. ఆయన అక్కడే కాకుండా రాష్ట్రంగా పలు జిల్లాల్లో ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తారని చెప్పారు.