Nepal Earthquake 2015
-
Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!
ప్రపంచంలో 2023లో భారీ స్థాయిలో భూకంపాలు సంభవించాయి. వీటివల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ప్రపంచంలో వచ్చిన కొన్ని ప్రధాన భూకంపాల గురించి తెలుసుకుందాం..! ఫిబ్రవరి 6: టర్కీ-సిరియా భూకంపం ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. టర్కీ దక్షిణ, మధ్య ప్రాంతంలో భూమి రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో కంపించింది. సిరియాలో ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 7.8 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. భూమిలోపల 95 కిమీ లోపల భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఈ విపత్తులో అపార ఆస్తి నష్టం జరిగింది. ఈ భూకంపంలో 59,259 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 50,783 మంది కాగా.. సిరియాలో 8,476 మంది మృత్యువాతపడ్డారు. టర్కీ జనాభాలో 1.4 కోట్ల మంది ప్రభావితమయ్యారని అంచనా. సుమారు 1.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస అంచనా వేసింది. మార్చి 18: గుయాస్ భూకంపం, ఈక్వెడార్ దక్షిణ ఈక్వెడార్‌లో 2023 మార్చి 18న భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ఎల్ ఓరో, అజువే, గుయాస్ ప్రావిన్స్‌లలో భారీ నష్టాన్ని కలిగించింది. దాదాపు 446 మంది గాయపడ్డారు. 16 మంది మరణించారు. ఈక్వెడార్ జనాభాలో దాదాపు సగం మంది 8.41 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితులయ్యారు. దేశంలోని మొత్తం 24 ప్రావిన్సుల్లోని 13 ప్రావిన్సుల్లో భూమి కంపించింది. మార్చి 21: ఆఫ్ఘనిస్థాన్ భూకంపం 2023, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 1000 కిలోమీటర్ల వైశాల్యంలో భూమి కంపించింది. ఆప్ఘనిస్థాన్‌లోని 9 ప్రావిన్స్‌లలో ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితమయ్యారు. కనీసం 10 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. 665 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, క్వెట్టా, పెషావర్లలో ప్రకంపనలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో కారకోరం హైవే మూసుకుపోయింది. బునెర్ జిల్లాలో డజన్ల కొద్దీ ఇళ్లు కూలిపోయి 40 మంది గాయపడ్డారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా జమ్ము కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. సెప్టెంబరు 8: మొరాకో భూకంపం 2023 సెప్టెంబరు 8న మొరాకోలోని మరకేష్-సఫీ ప్రాంతంలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8-6.9 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 2,960 మంది ప్రాణాలు కోల్పోయారు. మరకేష్‌లోని చరిత్రాత్మక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. స్పెయిన్, పోర్చుగల్, అల్జీరియాలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. మొరాకో చరిత్రలో నమోదు చేయబడిన అత్యంత బలమైన భూకంపాల్లో ఇది ప్రధానమైంది. 1960 అగాదిర్ భూకంపం తర్వాత దేశంలో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. 2023లో టర్కీ-సిరియా భూకంపం తర్వాత ఇందులోనే అత్యంత ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. 1,00,000 మంది పిల్లలతో సహా మరకేష్, అట్లాస్ పర్వతాల పరిసర ప్రాంతాల్లో 2.8 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అక్టోబర్ 7: హెరాత్ భూకంపం, ఆఫ్ఘనిస్తాన్ 2023 అక్టోబర్ 7న పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. గంటల వ్యవధిలో వరుసగా నాలుగు సార్లు భూకంపం రావడం భారీ నష్టాన్ని కలిగించింది. మొదటి రెండు భూకంపాలు అక్టోబర్ 7న హెరాత్ నగరానికి సమీపంలో సంభవించాయి. అక్టోబర్ 11, 15 తేదీల్లో అదే ప్రాంతంలో మరో రెండు భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయి. ఈ భూకంపాల్లో 1,482 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,100 మందికి గాయాలయ్యాయి. 43,400 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1,14,000 మందికి మానవతా సహాయం అవసరమైందని అంచనా. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉండటంతో సరైన ఆస్పత్రి సౌకర్యాలు అందలేదు. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నవంబర్ 3: నేపాల్ భూకంపం 2023 నవంబర్ 3న నేపాల్ కర్నాలీ ప్రావిన్స్‌లోని జాజర్కోట్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించింది. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 375 మంది గాయపడ్డారు. పశ్చిమ నేపాల్, ఉత్తర భారతదేశం అంతటా భూప్రకంపనలు కనిపించాయి. 2015 నుంచి నేపాల్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే కావడం గమనార్హం. మరణాల్లో జాజర్కోట్ జిల్లాలో 101 మంది ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ రుకుమ్ జిల్లాలో 52 మంది మరణించారు. మరణించిన వారిలో 78 మంది పిల్లలు కూడా ఉన్నారు. నేపాల్‌లోని పదమూడు జిల్లాల్లో దాదాపు 62,039 ఇళ్లు ప్రభావితమయ్యాయి. వాటిలో 26,550 ఇళ్లు కుప్పకూలాయి. నవంబర్ 17: మిండనావో భూకంపం, ఫిలిప్పీన్స్ 2023 నవంబర్ 17న ఫిలిప్పీన్స్ మిండనావో ద్వీపంలోని సారంగని ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో 11 మంది మరణించారు. 730 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగున ఉన్న ఇండోనేషియాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. 644 ఇళ్లు కూలిపోగా.. 4,248 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదీ చదవండి: Year End 2023: అన్నీ మంచి శకునములే! -
అనువైన వాతావరణం కల్పించండి-నేపాల్
సార్క్ సమావేశాలు నిర్వహించేందుకు అనువైన వాతావరణం కల్పించమంటూ నేపాల్ కోరింది. భారత్ తో పాటు మరో మూడు సభ్య దేశాలు సార్క్ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో నేపాల్ ఈ ప్రకటన చేసింది. సరైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో జరిగే సార్క్ సమావేశాల్లో తాము పాల్గొనలేమంటూ భారత్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు నేపాల్ కు సమాచారం అందించాయి. దీంతో స్పందించిన నేపాల్.. సార్క్ సదస్సు సవ్యంగా జరిగేందుకు అనువైన వాతావరణం సృష్టించాలంటూ పాకిస్థాన్ కు పరోక్షంగా సూచించింది. త్వరలోనే సదస్సు ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. సార్క్ సదస్సుకు హాజరు కాలేమని భారత్ నిర్ణయం తీసుకోవడంతో నవంబర్ 9, 10, తేదీల్లో జరగాల్సిన సమావేశాలను వాయిదా వేయాలని, లేదంటే రద్దు చేయాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఇదే విషయాన్ని నేపాల్ కు కూడా తెలిపింది. దీనిపై స్పందించిన నేపాల్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను వెలువరించింది. ముందుగా అనుకున్నట్లుగానే సార్క్ సదస్సును నిర్వహించాలని, అందుకు సభ్యదేశాలన్నీ పాల్గొనే అనుకూల వాతావరణాన్ని కల్పించాలని కోరింది. సమావేశాలను రద్దు చేసే ఆలోచనను తాము తీవ్రంగా భావిస్తున్నామంటూ నేపాల్ విదేశాంగ శాఖ తన వెబ్ సైట్ లో తెలిపింది. 19వ సార్క్ సమావేశాల్లో సభ్యదేశాలన్నీ పాల్గొనేందుకు తగ్గ వాతావరణం కల్పిస్తారని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్ (సార్క్) ను 1985 లో స్థాపించగా అందులో ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు సభ్యులుగా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దేశం సమావేశాలకు హాజరు కావడం లేదని తెలిపినా నిబంధనల ప్రకారం సార్క్ సదస్సు వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. అటువంటిది నాలుగు దేశాలు సదస్సునుంచి వైదొలగే వాతావరణాన్ని సృష్టించడంపై పాకిస్థాన్ ను నేపాల్ నిందించింది. సెప్టెంబర్ 18న ఉరీలోని భారతీయ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడులు జరపగా 18 మంది సైనికులు మరణించిన అనంతరం పాకిస్థాన్ భారత్ మధ్య ఈ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి పాల్పడిన తీవ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన జైషే ఇ మొహమ్మద్ కు చెందిన వారుగా గుర్తించడంతో ఇరు దేశాలమధ్య అనుకూల వాతావరణం దెబ్బతింది. ఈ నేపథ్యంలో నేపాల్ పిలుపును పాక్ ఏ రకంగా స్వీకరిస్తుందో వేచిచూడాల్సిందే. -
నేపాల్ భూకంపానికి ఏడాది..
-
'ఆ భూకంపంతో నా జీవితం రంగులమయం'
కఠ్మాండు: ప్రళయం, విపత్తులాంటిది గుర్తొస్తే శరీరం భయంతో కంపిస్తుంది. అది ఎదుర్కొన్నవారికైతే ఓ క్షణం ఆ పాత జ్ఞాపకాలు ఊపిరిని ఓ ఆక్షణం ఆపేసి మళ్లీ వదిలిపెడుతుంటాయి. అందుకే వీలయినంత వరకు ఆక్షణాల గురించి ఆలోచించే సాహసం ఎవరూ చేయరు. కానీ, నేపాల్ ఓ పదహారేళ్ల బాలుడు మాత్రం అలాంటి ప్రళయాన్ని గుర్తు తెచ్చుకునేందుకు సంతోషపడుతున్నాడు. గత ఏడాది నేపాల్ ను నేలమట్టం చేసిన భూకంపం తన జీవితాన్ని మార్చేసిందని చెప్తున్నాడు. అప్పటి వరకు ఎవరూ పట్టించుకోని నీ జీవితం ఇప్పుడు కొత్త వెలుగురేఖలతో ప్రయాణిస్తుందని చెప్తున్నాడు. గత ఏడాది నేపాల్ లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, అమిర్ బోమ్ జాన్ అనే పదహారేళ్ల బాలుడు మాత్రం బతికి బయటపడ్డాడు. అత్యంత అరుదైన రోగంతో కేవలం తలకాయ మాత్రం పనిచేస్తూ మెడ నుంచి క్రింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయి ఉన్న ఇతడు ఓ ఎజెన్సీ గ్రామానికి చెందినవాడు. పేదరికం, నిరక్షరాస్యత, సౌకర్యాల లేమి కారణంగా అతడి తల్లిదండ్రులు ఎప్పుడో ఓ చీకటి గదిలో ఉంచేవారు. అయితే, భూకంపం వచ్చిన వీళ్ల ఊరంతా కూడా దాని బారిన పడి శిథిలాల కింద ఇరుక్కుపోయాడు. సహాయక చర్యల్లో అతడు సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో అతడిని కఠ్మాండ్లోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల స్కూల్లో చేర్చించారు. ఆ స్కూల్లో చేరిన తర్వాత అతడి గతమంతా మారిపోయింది. పైగా నోటితో బ్రష్ పట్టుకొని పెయింటింగ్ వేయడం నేర్చుకున్నాడు. అతడి టాలెంట్ ను గుర్తించిన కరుణ అనే స్వచ్ఛంద సంస్థ అతడికి ప్రోత్సాహన్నిస్తూ ఆ పెయింటింగ్స్ కూడా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం స్పెషల్ స్కూల్లోని ఉండి చదువుకుంటూ బొమ్మలు వేసి గడిపేస్తున్న అమిర్ మాట్లాడుతూ 'నాకు చేతి వ్రాత లేదు.. నోటి రాత రాస్తాను' అని జోక్ చేశాడు. రాయగలను, పాడగలను, బొమ్మలు వేయగలను అని చెప్పాడు. ఆ భూకంపం ఎంతో మందిని పొట్టనపెట్టుకొని ఉండొచ్చుకానీ.. నా జీవితాన్ని మాత్రం రంగుల మయం చేసి వెళ్లిందని అంటున్నాడు అమిర్. -
దళారుల గుప్పిట్లో నేపాల్ వలసదారులు
నేపాల్ భూకంపం ఇంకా అక్కడ ప్రజలను పీడకలలా వెంటాడుతూనే ఉంది. గత ఏడాది ఏప్రిల్ 25న సంభవించిన భూకంప ప్రకంపనలు వారిని వీడటం లేదు. ఈ ఘటనలో దాదాపు 9,000మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అయితే భూకంపంలో సర్వం కోల్పోయి...తినేందుకు తిండిలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్‌లోని పంజాబ్ కు వలస వచ్చినవారిని స్థానిక దళారులు బానిసలుగా మార్చి అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారు.ముఖ్యంగా పదేళ్లలోపు చిన్నారులను బ్రిటీష్ కుటుంబాలకు వీరిని బానిసలుగా విక్రయిస్తున్నారు. 'రండి..నేపాలీలు మంచి పనిమంతులు. చక్కని,రుచి కరమైన వంటలు తయారు చేస్తారు.ఇంటి పనులు నేపాలీలు చేసినంత చక్కగా మరెవ్వరూ చేయలేరు. వీరిని ఇంగ్లండ్‌లోని మీ ఇంటికి తీసుకువెళ్లండంటూ' దళారులు.. చిన్నారులను విక్రయానికి పెడుతున్నారు. ఓ బాలుడిని బ్రిటన్‌కు పంపేందుకు దళారులకు సుమారు రూ.5లక్షలు ముడుతుంది.కాగా కొనుగోలు చేసిన చిన్నారిని తీసుకెళ్లేందుకు మిగిలిన ఖర్చులన్నీ కొనుగోలుదారే భరించాల్సి ఉంటుంది. నేపాలీ వలసదారుల అక్రమ రవాణాపై హోం శాఖ కార్యదర్శి థెరిస్పా స్పందిస్తూ.. వలసదారుల అక్రమ రవాణాపై విచారణ జరపాల్సిందిగా జాతీయ నేర పరిశోధనా సంస్థను ఆదేశాలు ఇచ్చారు.పిల్లల సంరక్షణకు ప్రభుత్వం గత ఏడాది తీసుకువచ్చిన మోడరన్ స్లేవరీ యాక్ట్‌ను ఆయన ప్రస్తావిస్తూ ఈ చట్టం కింద నేరం రుజువైతే నిందితులకు జీవత ఖైదు పడుతుందన్నారు. -
ఇంకా 19 ఏళ్లేనా..?
నేపాల్ క్రికెట్ కెప్టెన్ వయస్సుపై వివాదం ఢాకా: అండర్-19 ప్రపంచకప్‌లో నేపాల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాజు రిజాల్ వాస్తవ వయస్సుపై ముంబై ఆట గాడు కౌస్తుబ్ పవార్ వివాదం లేపాడు. తామిద్దరం కలిసి అండర్-15లో ఆడామని గుర్తు చేశాడు. వాస్తవానికి అతను 24 లేదా 25 ఏళ్లు ఉంటాడని ఫేస్బుక్లో ఆరోపించాడు. ‘అండర్-15లో మేమిద్దరం కలిసి ముంబై జట్టు తరఫున ఆడాం. అప్పుడతను రాజు శర్మగా ఆడాడు. ఇప్పుడు అతను రాజు రిజాల్ పేరిట అండర్-19 నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. మాతో పాటు ఇతరుల వయ స్సు 24 లేదా 25గా ఉంటుంది’ అని కౌస్తుబ్ సంచలన ఆరోపణలు చేశాడు. -
మీరు అడ్డంగా మోసపోయారిలా?
2015 సంవత్సరం వెళ్లిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘటనలు! భూకంపాలు, ప్రకృతి విలయాలు, ఉగ్రవాద బీభత్సాలు, దాడులు, సదస్సులు, సంబరాలు.. అన్నింటినీ తనతోపాటే కాలగర్భంలో కలిపేసుకొని.. ఇక చరిత్ర నిలిచిపోయేందుకు 2015 సిద్ధమవుతోంది. సహజంగానే 2015లో చాలా వీడియోలు, ఫొటోలు ఆన్లైన్లో వైరల్‌లా వ్యాపించాయి. కొన్ని ఉర్రూతలూగిస్తే.. మరికొన్ని హృదయాన్ని హత్తుకొని కంటతడి పెట్టించాయి. అయితే ఇలాంటివాటిలో కొన్ని ఫొటోలు, వీడియోలు మాత్రం నెటిజన్లను మోసం చేశాయి. పాతవో, ఎప్పటివో తెరపైకి వచ్చి.. ఇదే నిజమన్నంతగా భ్రమ కల్పించాయి. అలా నెటిజన్లను మోసపుచ్చి ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొట్టిన ఫొటోలు, వీడియోల ముచ్చట్లివి.. భూవిలయంలో 'బుజ్జీ వేదన'! అది నేపాల్ భూకంపం నేపథ్యం. 81 ఏళ్లలో కనీవినీ ఎరుగని తీవ్రతతో నమోదైన భూకంపంతో నేపాల్ ఛిన్నాభిన్నమైంది. ఆ సమయంలో భూకంపం వచ్చి భవనాలు వణుకుతుండటం, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నప్పుడు ఓ బుజ్జి అన్న తన చెల్లాయిని ఇలా ఒడిలో భద్రంగా దాచుకున్నాడంటూ ఈ ఫొటో వైరల్ అయింది. ఫేస్బుక్, ట్విట్టర్ వాసులను చలింపజేసింది. నిజానికి ఇది వియాత్నంలోని మారుమూల గ్రామానికి చెందిన చిన్నారుల ఫొటో. 2007లో ఫొటోగ్రాఫర్ నా సన్ గుయెన్ ఈ ఫొటో క్లిక్ మనిపించాడు. తాను తీసిన ఫొటోల్లో అత్యధికంగా షేర్ ఫొటో ఇదే కావొచ్చునని, కానీ వేరే కారణాలతో ఇది ప్రజలకు చేరిందని ఆయన వ్యాఖ్యానించారు. సిమ్మింగ్‌పూల్‌లో ప్రళయం! ఇది నేపాల్ భూకంపానికి సంబంధించిన వైరల్ అయిన వీడియో. భూకంపం సందర్భంగా కఠ్మాండులోని ఓ హోటల్లో ఉన్న స్విమ్మింగ్‌పూల్ ఇలా ఉప్పొంగి ప్రళయం సృష్టించందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. నిజానికి ఇది 2010 నాటి వీడియో. మెక్సికోలో భూకంపం సందర్భంగా ఓ స్మిమ్మింగ్పూల్లోని దృశ్యమిది. దీనిని కొందరు నెటిజన్లు గుర్తించి.. ఎక్కడ భూకంపం వచ్చినా ఈ వీడియోను వాడుకుంటారా? అని అడిగారు కూడా. అంతేకాదు ఈజిప్టులో విధ్వంసాలవి, ఇతరత్రా చాలా రకాల ఫొటోలు నేపాల్ భూకంపానివేనంటూ ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. ఓ శరణార్థి సెల్ఫీ.. ఓ బూటకం! ఓ శరణార్థి సెనెగాల్ నుంచి స్పెయిన్‌కు వలసవస్తూ.. ఓ సెల్ఫీ తీసుకొని దానిని ఇన్‌స్టాగ్రాంలో పెట్టాడు! అది వెంటనే సూపర్‌హిట్ అయింది. వేలమంది ఫాలోవర్లు, వందలసంఖ్యలో ఉత్సాహపరిచే కామెంట్లు. ఇంకేముంది ఆ శరణార్థి ఇంటర్నెట్లో ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయ్యాడు. తన కష్టాలు చిత్రవిచిత్రంగా చెప్తూ సానుభూతి సంపాదించుకునే ప్రయత్నం చేశాడు. తీరా చూస్తే అతడు శరణార్థి కాదని, డాకర్ ప్రాంతానికి చెందిన అబ్దౌద్ దివౌఫ్ అని తేలింది. ప్రజలను ఆకర్షించేందుకు అతను ఇలా బూటక ఫొటోలు పెట్టాడని తేలింది. శరణార్థా? ఐఎస్ ఫైటరా? శరణార్థుల వలస సమస్య యూరప్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో ఇంటర్నెట్లోకి ఎక్కిన ఈ ఫొటో హల్చల్ చేసింది. 'ఇతన్ని గుర్తుపట్టారా? గత ఏడాది ఇతనో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది.. ఆ ఫొటోలు కూడా ఫేస్బుక్లో పెట్టాడు. ఇప్పుడు శరణార్థిగా మారాడు' అంటూ ఈ ఫొటోకు వ్యాఖ్య జోడించి.. బాగా ప్రచారమైంది. అయితే ఫొటోలో ఉన్న అతను ఐఎస్ ఉగ్రవాది కాదు. లైత్ ఆల్ సలెది. అతను సిరియా లిబరేషన్ ఆర్మీ కమాండర్. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉదారవాద రెబెల్ ఆర్మీ ఇది. అతను 2015 ఆగస్టులో సిరియా నుంచి మెసిడొనియాకు వలస వెళ్లాడు. ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్ కచ్చేరి! పారిస్‌లో ఉగ్రవాదుల నరమేధం. బ్లాటక్లాన్ థియేటర్లో ముష్కరుల బీభత్సం.. ఉగ్రవాదులు బాటక్లాన్ థియేటర్లో అడుగుపెట్టడానికి కొద్దిముందు.. అందులో సంగీతానికి పరవశులవుతున్న శ్రోతల ఫొటో ఇదని ఆన్లైన్లో బాగా వైరల్ అయింది. ఇదీ పాత ఫొటోనే. డబ్లిన్‌లోని ఒలింపియా థియేటర్లో కచేరి సందర్భంలో తీసిన ఫొటో. కానీ ఈ ఫొటోనే కాదు చాలా తప్పుడు ఫొటోలు పారిస్ దాడులకు సంబంధించినవిగా ప్రచారమయ్యాయి. నిర్మానుష్య పారిస్ వీధులు! పారిస్‌లో ఉగ్రవాదుల దాడులు, ఆత్మహుతి దాడులు, పోలీసుల కాల్పలు నేపథ్యంలో ఆ నగరమిలా చిన్నచీమ కూడా కనిపించినంతా నిర్మానుష్యంగా మారిపోయిందంటూ ఈ ఫోటో షేర్ అయింది. ఇది సైలెంట్ వరల్డ్ సంస్థ పారిస్ నగరం ఇలా ఉంటే బావుంటుందని ఫొటోగ్రఫీ ట్రిక్కులతో ఈ చిత్రాన్ని రూపొందించింది. కానీ ఈ ఫొటో మరోలా ప్రచారమైంది. తప్పుడు సైన్.. పప్పులో కాలు! ఈ నెల లండన్‌లోని ట్యూబ్ స్టేషన్లో ఓ వ్యక్తి ముగ్గురిని పొడిచి గాయపర్చాడు. ఇది ఉగ్రవాద ఘటనగా భావించారు. దీనికి సంబంధించిన 'నువ్వు ముస్లింవి కాదు' అంటూ హాష్‌ట్యాగ్ ఆన్లైన్లో విపరీతంగా షేర్ అయింది. లండన్ మేయర్ అభ్యర్థి సాధిక్ ఖాన్ కూడా దీనిని షేర్ చేసుకున్నాడు. అయితే ఈ హాష్‌ట్యాగ్‌కు కారణమైన ఆన్లైన్ సైన్ (సంతకాల సేకరణ) నకిలీదని, దీనిని సైన్ జనరేటర్ యాప్ ద్వారా సృష్టించారని తర్వాత తేలింది. నీకూ సగం.. నాకూ సగం! భార్యాభర్తలు అంటే చెరిసగం. అందుకే శివపార్వతులను అర్ధనారీశ్వరుడు అంటాం. ఇంగ్లిష్‌లో బెటర్‌హాఫ్ జాతీయముంది. అదేవిధంగా ఓ జర్మన్ వ్యక్తి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న సంపదనంతా చెరిసగం పంచేశాడు. అలా ఈ కారును కూడా ఇలా సగంసగం పంచేసి.. తనవంతు సగాన్నిఅమ్మకానికి పెట్టిండహో అంటూ ఈ ఫొటో హల్చల్ చేసింది. ఈ ఫొటో నెటిజన్లనే కాదు మీడియాను కూడా పిచ్చోళ్లను చేసింది. ఈ కారును 'ఈబే'లో వేలానికి పెట్టింది నిజమే అయినా దాని వెనుక ఉన్న కట్టుకథ మాత్రం ప్రచారం కోసం తామే సృష్టించామంటూ జర్మన్ బార్ అసిసోయేసన్ తెలిపింది. -
నేపాల్ భూకంప బాధితుల కళ్ళలో... 'రోహాన్ కళ'
అతడిలో కేవలం కళాత్మక హృదయమే కాదు... చలించిపోయే మనస్తత్వం ఉన్నట్టు కూడ కనిపిస్తుంది. అందుకే వెళ్ళింది విహార యాత్రకైనా అక్కడి అందాలకు ముగ్ధుడయ్యాడు. తనకు కనిపించిన అద్భుత ప్రకృతి దృశ్యాలతో పాటు, అక్కడి కట్టడాల సౌందర్యాన్నీ.. కంటిపాపలో చిత్రాలుగా పొందుపరచుకున్నాడు. ఢిల్లీకి చెందిన ఆర్కిటెక్ట్ రోహాన్ పట్నాకర్... నేపాల్ సౌందర్యాన్ని చూసి సంవత్సరం కూడ కాలేదు. ఇంతలో వచ్చిన భూ కంపం ఆ ప్రాంతాన్ని అక్కడి జనాన్ని కకావికలం చేయడం తట్టుకోలేక పోయాడు. తన గుండెల్లో సాక్షాత్కరించిన సౌందర్యాన్నినేపాల్ లో తిరిగి సృష్టించేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. భూకంపంతో తునాతునకలైన అందమైన నేపాల్ చిత్ర పటాన్ని తిరిగి ఆవిష్కరించాలని రోహాన్ ఆత్రుత పడుతున్నాడు. తన ప్రతిభతో కుంచెకు రంగులద్ది.. నేపాల్ లోని అద్భుత కట్టడాలను చిత్రాలుగా తీర్చి దిద్దాడు. భూకంపానికి ముందున్న స్థితికి నేపాల్ ను తేవాలన్నదే ఆశయంగా వాటర్ కలర్స్ తో నేపాల్ లోని సౌందర్యాన్ని, చారిత్రక కట్టడాలను స్కెచ్ లు గా మలచి వాటితో వచ్చిన డబ్బును నేపాల్ రూరల్ ప్రాంతాన్ని తిరిగి నిర్మించేందుకు పాటు పడుతున్నాడు. ''మా కంపెనీ ప్రాజెక్టు పనిమీద నేను నేపాల్ వెళ్ళాను. ఆ పర్యటన నన్ను నేపాల్ లోని అందాలను తిలకించేందుకు అవకాశాన్నిచ్చింది. అలాగే అక్కడి నా కొలీగ్స్ ను కలిసేందుకు, వారి సంప్రదాయ వంటకాలను రుచి చూసేందుకు మంచి సందర్భమైంది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక నేను నా ప్రతి జ్ఞాపకాన్నీ నోట్ బుక్ లో డ్రాయింగ్స్ గానూ, అక్షరాలుగాను నింపేశాను.'' అంటాడు రోహాన్. ఏప్రిల్ 2015 లో వచ్చిన నేపాల్ భూకంపం రోహాన్ చూసిన ఎన్నో అందాలను తనలో కలిపేసుకుంది. కొందరు సహోద్యోగుల కుటుంబాలు.. ఇళ్ళతో సహా.. బంధువులనూ కోల్పోయారు. ఒకప్పుడు భూలోక సౌందర్యంగా తాను గుర్తించిన ఆ ప్రాంతం భూకంపంతో శిథిలంగా మారిపోయింది. భూకంపం విషయం తెలిసిన వెంటనే రోహాన్ నేపాల్ లోని తన స్నేహితులతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికప్పుడు ఎటువంటి సమాచారం తెలియలేదు. ''కొన్నాళ్ళ తర్వాత నా స్నేహితులు ఢిల్లీకి తిరిగి వచ్చారు. మేమంతా కలసి నేపాల్ లో భూకంప బాధిత ప్రాంత వాసులకు ఏదో ఒక సహాయం అందించాలని అనుకున్నాం. అందుకోసం విరాళాలను సేకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం. కొన్ని వారాల తర్వాత కఠ్మాండు లోని స్నేహితులతో కూడ మాట్లాడాం. అప్పటికే వారు అక్కడి భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో వారికి మరింత సహాయం అందించేందుకు మా ప్రయత్నాలు కొనసాగించాం'' అంటాడు రోహాన్. అయితే ఫండ్స్ ఎలా సేకరించాలన్న ఆలోచన మొదట్లో కాస్త ఆందోళనకు గురిచేసినా... రోహాన్ కు వెంటనే సమాధానం దొరికింది. తనకు ఇష్టమైన కళను విరాళాలు సేకరించేందుకు వినియోగించాలని నిశ్చయించుకున్నాడు. నేపాల్ లోని అద్భుతమైన చిత్రాలకు తన కుంచెతో ప్రాణం పోశాడు. అదే సమయంలో చెన్నై, హైదరాబాద్ లకు చెందిన రోహాన్ స్నేహితులు కూడ పుస్తకాల అట్టలపై డ్రాయింగ్స్ తో రోహాన్ కు సహకారం అందించారు. పోస్ట్ కార్డ్, నోట్ బుక్, ఎ3 సైజుల్లో వేసిన డ్రాయింగ్స్ ఫండ్ కోసం అమ్మకానికి పెట్టారు. 150 నోట్ బుక్స్, 30 ఆర్ట్ ప్రింట్లు, 100 పోస్ట్ కార్డ్ డ్రాయింగ్స్ అమ్మగా వచ్చిన సుమారు లక్ష రూపాయలను నేపాల్ పునర్నిర్మాణానికి అందించారు. రోహాన్ కఠ్మాడు ఆర్కిటెక్ట్ స్నేహితులు ఆ విరాళంతో భూకంపంతో శిథిలమైన పలు సిమెంట్, చెక్క నిర్మాణాల స్థానంలో వెదురుతో ఇళ్ళను నిర్మించి బాధితులకు సహాయ పడ్డారు. నాలుగు రకాల మోడల్ హోమ్స్ కట్టి... బాధితులకు అందించారు. తమలాగే మరెవరైనా నేపాల్ బాధితులకు సహాయం అందించేందుకు తోడ్పడాలని రోహాన్... అతిని మిత్రులు సూచిస్తున్నారు. -
భారత కీర్తిని చాటుతున్న మోదీ
ఒకప్పుడు ఆయన ఛాయ్‌వాలా. నేడు ప్రపంచ లోని పలువురు దేశాధినే తలు ఆయనతో మాట్లాడాలని తహతహలాడుతున్నారు. భారతశక్తిని కొత్త గా పరిచయం చేస్త్తున్న రెం డక్షరాలే-మోదీ. నరేంద్ర మోదీ ఏం చేశారు? ఆయన విదేశాంగ నీతి దేశాన్ని ఆసియా దేశాల్లో అగ్రస్థానంలో నిలిపింది. లుక్ ఈస్ట్ నీతితో దేశ సరిహద్దులను పటిష్టం చేయడం మీద పెట్టిన దృష్టి అద్వితీయం. నేపాల్ భూకంప బాధితుల పట్ల క్షణాల్లో స్పందించిన తీరు అభినందనీయం. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడూ మన ఇరుగుపొరు గులతోనే కాదు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, మాల్దీవులు లాంటి దూర దేశాలతోనూ సత్సంబం ధాలకు ప్రయత్నించలేదు. కానీ మోదీ ఆయా దేశాలకు స్నేహహస్తం ఇచ్చారు. ఒక పక్క చైనా మన సరిహద్ద్దు దేశాల్లో పాగా వేసి సవాలు విసురుతోంది. పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌లకు ఆర్థిక సాయాలంటూ, రోడ్లూ రైళ్లంటూ వారికి దగ్గరవుతూ భారత్‌ను దూరం చేస్తున్నది. చొచ్చుకువస్త్తున్న చైనాను నిలువరించగలిగే విదేశీ నీతిని యూపీఏ అమలు చేయలేకపోయింది. మూడుగంటల ప్రయాణమే అయినా శ్రీలంక వెళ్లడానికి కాంగ్రెస్ ప్రధానుల కు 30 ఏళ్లు పట్టింది. 8 గంటలు ప్రయా ణిస్తే చేరే ఆస్ట్రేలియా వెళ్లడానికి 42 ఏళ్లు, 50 నిమిషాలలో చేరుకునే నేపాల్‌ను సందర్శిం చడానికి 35 ఏళ్లు పట్టాయి. అమెరికాలోని మ్యాడీ సన్ స్క్వేర్‌లో మోదీ చేసిన ప్రసంగం 120 కోట్ల మంది భారతీయుల చెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉంది. యూఏఈ వెళ్లి అక్కడ ‘భారత మాతకు జై’ అంటూ నినదించాడు. మోదీ మసీదు చూసొచ్చిన వెంటనే ఆ దేశ ప్రధాని మందిరానికి స్థలం కేటా యించారు. భారత్‌లో నాలుగు లక్షల యాభై వేల బిలియన్ డాలర్ల పెట్ట్టుబడులు పెట్టేందుకు షేక్‌లు ముందుకు రావడం వెనుక మోదీ కృషి ఉంది. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఆయన ఎలా ఎదిగారు? చిరుప్రాయంలోనే రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్‌లో చేరడం, దేశానికి ఉపయోగపడే విధంగా జీవితా న్ని మలచుకోవడమే దీని వెనుక ఉన్న సూత్రం. దత్తత కాన్సెప్ట్‌తో ఆయా గ్రా మాల స్వావలంబనకు బాటలు పరిచా రు. స్వచ్ఛ భారత్ అంటూ గాంధీజీ కల లను సాకారం చేసేందుకు కృషి చేస్తు న్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ఘనంగా నిర్వహించేలా చేశారు. దేశంలో బ్యాంక్ ఖాతాలు లేని దాదాపు 50 కోట్ల మందికి జన్‌ధన్ యోజనతో ఖాతాలు తెరిపిం చారు. ప్రమాద బీమా, ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన పథకాలను రూ.2 కే అందించారు. ఏడాదికి రూ.330తో జీవిత బీమాతో కుటుంబా లను ఆర్థిక కష్టాల నుంచి విముక్తం చేయాలని సురక్ష యోజన తీసుకొచ్చారు. అసంఘటిత రంగంలోని కోట్లాది మంది శ్రమైకజీవులకు దన్నుగా రూ.12 తోనే అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తెచ్చారు. బాలికల చదువుకు బేటీ బచావో... బేటీ పడా వో పథకం కింద సుకన్యా సమృద్ధి యోజన పథ కాన్ని మోదీ ప్రవేశపెట్టారు. ఆడశిశువులను గర్భం లోనే చిదిమేసే విషసంస్కృతికి చరమగీతం పాడా లని ఒక యాచకుడిలా అభ్యర్థిస్తున్నానంటూ చెప్పిన మాట ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నది. పంటనష్టపోయిన రైతులకు ఇప్పుడిస్తున్న పరిహా రాన్ని 50 శాతం పెంచాలని ఎన్డీఏ నిర్ణయించింది. మోదీ బాధ్యతలు చేపట్టాక ప్రజాస్వామ్యబద్ధ రాజకీయాలు మొదలై నాయి. కాంగ్రెస్ పార్టీ ఏలికలు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులే. సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీల పరిస్థితి అంతే. ప్రాంతీయ పార్టీల న్నింటిని వారసులే శాసిస్తున్నారు. మోదీకి నా అనే వారెవరంటే సామాన్యులే. పరిశ్రమలు రావాలనీ, కుటుంబంలో ఒక్కరు సంపాదిస్తూ ఉంటే నలుగురు తినడం కాదనీ, అంతా దేశాభివృద్ధిలో భాగస్వాము లు కావాలనీ చెబుతూ సబ్ కే సాత్ సబ్ కా వికాస్ నినాదాన్ని ఎలుగెత్తారు. అందరి అభివృద్ధే దేశానికి శ్రీరామరక్ష అంటూ సాగుతున్న ప్రధానికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. - వ్యాసకర్త బీజేపీ ఏపీ సమన్వయకర్త పురిఘళ్ల రఘురాం raghuram.bjp@gmail.com -
కొండ చరియలు విరిగి పడి: 26 మంది మృతి
కాట్మాండ్: నేపాల్ కస్కి జిల్లాలో బుధవారం రాత్రి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 26 మంది మరణించారు. మరో 31 మంది గల్లంతయ్యారని మీడియా గురువారం వెల్లడించింది. జిల్లాలో 27 ఇళ్లు నేలమట్టం అయ్యాయని తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని... అలాగే గల్లంతైన వారి కోసం చర్యలు చేపట్టినట్లు నేపాల్ ఆర్మీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే కొండ చరియలు విరిగిపడిన కారణంగా వంతెనలు కూలిపోయాయని తెలిపారు. దాంతో సహాయక చర్యలకు కొంత మేర ఆటంకం ఏర్పడిందని నేపాల్ ఆర్మీ పేర్కొంది. -
నేపాల్ కోసం సాక్షి స్పెషల్ లైఫ్‌లైన్
-
సాయం కావాలి
-
నేపాల్‌కు వంద కోట్ల డాలర్ల ఆర్థిక సాయం
నేపాల్ పర్యటన సందర్భంగా ప్రకటించిన సుష్మా స్వరాజ్ కఠ్మాండూ: పెను భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ పునర్నిర్మాణానికి భారత ప్రభుత్వం వంద కోట్ల డాలర్ల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నేపాలీల కన్నీళ్లు తుడిచేందుకు నేపాల్ ప్రభుత్వానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేసింది. నేపాల్ రాజధాని కఠ్మాండూలో గురువారం జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నేపాల్స్ రీకన్స్ట్రక్షన్ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ మేరకు ప్రకటన చేశారు. నేపాల్ పునర్నిర్మాణానికి నిధులు రాబట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు భారత ప్రభుత్వం తరఫున సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. ఈ సదస్సులో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. వంద కోట్ల డాలర్లలో నాలుగో వంతు మొత్తాన్ని గ్రాంట్‌గా అందిస్తామన్నారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేలా వచ్చే ఐదేళ్లలో మరో వంద కోట్ల డాలర్లను అందజేయనున్నామని, దీంతో ఈ సాయం రెండు వందల కోట్ల డాలర్లకు చేరుతుందని చెప్పారు. ఈ మొత్తంలో 40 శాతాన్ని గ్రాంట్‌గా అందిచనున్నామని చెప్పారు. -
జూన్ 27న సినీ తారలతో టీ డిన్నర్
‘సాక్షి’ ఆధ్వర్యంలో చారిటీ కార్యక్రమం జూన్ 27న సినీ తారలతో టీ డిన్నర్ వచ్చే మొత్తాన్ని బాధితులకు అందజేయనున్న ‘నావా’ హైదరాబాద్: ఏప్రిల్ 25న నేపాల్‌లో వచ్చిన భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. రెండు నెలలు గడుస్తున్నా అక్కడి పరిస్థితుల్లో మార్పు రాలేదు. చిరు దేశం అంత పెద్ద భూకంపం ధాటికి అన్ని రకాలుగా చితికిపోయింది. అక్కడి ఇళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు శిథిలమయ్యాయి. నేపాల్ దేశానికి ముఖ్య ఆర్థిక వనరైన టూరిజం తగ్గిపోయింది. భూప్రకంపనలు ఇంకా కొనసాగుతుండడమే దీనికి ప్రధాన కారణం. జీవనాధారం లేక ప్రజా జీవితం అగమ్యగోచరంగా మారింది. ప్రకృతి ప్రకోపానికి గురయిన అక్కడి ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పొరుగు దేశపౌరులుగా నేపాల్ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యతను అందరం పంచుకుందాం. వీలైనంత సాయమందిద్దాం... సాక్షి మీడియా సామాజిక బాధ్యతతో బాధితులకు సహాయం అందించటానికి అవకాశం కల్పిస్తోంది. నేపాల్ భూకంప బాధితులకు విరాళాలు అందించేందుకు తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌తో కలసి ఒక చారిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. వివరాలివి: తాజ్ ఫలక్‌నుమాలో జూన్ 27న జరిగే ఈ కార్యక్రమంలో నటి రెజీనా సహా పలువురు సినీతారలతో కలసి టీ, డిన్నర్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి తగు మొత్తంతో కూడిన డోనర్ పాస్‌లు విక్రయిస్తారు. పాస్‌ల ద్వారా వచ్చే మొత్తాన్ని నేపాల్ బాధితులకు నేపాల్ ఆర్మీ వైవ్స్ అసోసియేషన్(నావా) వారు అందచేయనున్నారు. ఇతర వివరాలకు, డోనర్ పాస్‌ల కోసం 9989613749, 9000913320, 040-66298518 నంబర్లను సంప్రదించవచ్చు. చెక్ ద్వారా తమ విరాళాలను పంపాలనుకునే వారు... నేపాల్ ఆర్మీ వైవ్స్ అసోసియేషన్, ఫ్లాట్ నంబర్ 401, పీఎస్ఆర్ మెన్షన్, హోలీమేరీ బిజినెస్ సూల్ దగ్గర, లీలా నగర్, ధరమ్ కరమ్ రోడ్, అమీర్‌పేట్, హైదరాబాద్... అడ్రస్‌కి పంపించవచ్చు. -
కొండచరియలకు వైద్య దంపతులు బలి
కఠ్మాండు: నేపాల్‌లో ఇద్దరు భారతీయ వైద్య దంపతులు మృత్యువాత పడ్డారు. లుంబినీ జోన్ లో తాము వెళుతున్న కారుపై కొండచరియలు విరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం డాక్టర్ తరుణ్ దీప్ సింగ్(కంటి వైద్యుడు), అతడి భార్య యశోద కొచ్చర్ (గైనకాలజిస్ట్) బుతావల్ నుంచి పాల్పా వద్ద గల ఆస్పత్రికి వెళుతుండగా బైర్వాడా జిల్లాలోని సిద్ధబాబా ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యారు. ఒక్కసారిగా కుప్పపోసినట్లుగా బురద, రాళ్లు వారి కారుపై పడ్డాయి. దీంతో వారిని సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ వారు తీవ్ర గాయాలవల్ల చనిపోయారు. బుధవారం పలుమార్లు నేపాల్ లో భూమి కంపించడం వల్లే కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. -
ఆ భూకంపం ఎవరెస్టును జరిపేసింది
బీజింగ్: నేపాల్ వచ్చిన భూకంపం మాములు భూకంపం కాదని ఇప్పటికే అర్థమైనా అది ఎంత శక్తిమంతమైనదో ఈ విషయం తెలిస్తే ఇట్టే బోధపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును నేపాల్ భూకంపం ఏకంగా 1.2 సెంటీమీటర్లు జరిపినట్లు చైనాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. గత ఏప్రిల్ 28న నేపాల్ 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని కారణంగా దాదాపు పదివేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ భూకంపం సంభవించిన తర్వాత మౌంట్ ఎవరెస్టులో వచ్చిన మార్పులపై చైనాలోని జియోలాజికల్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఎవరెస్టు.. నైరుతి దిక్కుకు 1.2 సెంటీ మీటర్లు జరిగినట్లు తెలిసిందని పేర్కొంది. -
నేపాల్ బాధితులకు పీసీబీ ఉద్యోగుల విరాళం
సనత్‌నగర్ (హైదరాబాద్) : నేపాల్ భూకంప బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి( పీసీబీ) కార్యాలయ ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేసి తమ దాతృత్వాన్ని చాటారు. తమ వేతనాల నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా అందజేశారు. రూ.1,36,300లను చెక్ రూపంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి బీబీఎస్ ప్రసాద్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధికి మంగళవారం అందించారు. -
ఆదరించిన ఊరును ఆదుకున్న నేస్తం
♦ నేపాల్‌లోని ‘టెచో' గ్రామానికి హెచ్‌సీయూ విద్యార్థుల అండ ♦ తాత్కాలిక నివాసాల ఏర్పాటుకు సాయం నేపాల్ భూకంపం.. ప్రతి మనిషిని కదిలించిన, కలచివేసిన ఉపద్రవం. ఈ వైపరీత్యం తర్వాత ఆ దేశాన్ని చూసి ‘ఆయ్యో పాపం’ అనుకున్నవారు ఉన్నారు. ఆదుకునేందుకు ముందుకు వచ్చినవారూ ఉన్నారు. రెండేళ్ల క్రితం చదువులో భాగంగా నేపాల్ వెళ్లిన ఓ హైదరాబాద్ కుర్రాడు తనకు ఆశ్రయమిచ్చిన గ్రామానికి సాయం చేయడానికి ఉద్యమించాడు. స్నేహితుల సాయంతో విరాళాలు సేకరించి భూకంపంలో నేలమట్టమైన ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేశాడు. ఇందుకు తానే స్వయంగా అక్కడకు వెళ్లి ప్రతి రూపాయి బాధితులకు అందేలా చూశాడు. ఆ యువకుడి పేరు ‘సిపాయి సర్వేశ్వర్’. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ ఆంత్రోపాలజీ విద్యార్థి. ఇతడికి స్నేహితులు, వారి స్నేహితులు, ప్రొఫెసర్లు బాసటగా నిలిచారు. ఈ మహా యజ్ఞంలో మరో హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి, బీహార్ వాసి నీలేశ్, ఢిల్లీ జేఎన్‌యూ పీహెచ్డీ విద్యార్థి హైదరాబాద్ వాసి గరిమెళ్ల సురేశ్ పాలుపంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో నివాసాల కోసం.. ‘విరాళాల సేకరణ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ మాబ్ నిర్వహించాం. భోజ్‌పురి, ఫోక్ సాంగ్స్ పాడాం. నేపాల్ బాధితులకు చేయూతనిచ్చేందుకు హైదరాబాదీల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా మేం రూ. 5.50 లక్షలు సేకరించాం. (నేపాల్ కరెన్సీలో 8.80 లక్షలు) ఆ డబ్బుతో మే 23న హైదరాబాద్ బస్సులో నేపాల్‌లోని టెచో గ్రామానికి చేరుకున్నాం. అక్కడి హపఫుచ ఆర్గనైజేషన్‌తో కలిసి ఏం చేయాలనేదానిపై చర్చించాం. అక్కడి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌తో కలిసి సర్వే చేస్తే మొత్తం 2543 ఇళ్లు ఉన్న గ్రామంలో 550 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయం అందని 230 కుటుంబాలను గుర్తించాం. అక్కడివారికి తిండి, దుస్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒక్కో టెంట్ కింద రెండు, మూడు కుటుంబాలు ఉంటున్నాయి. వచ్చేది వానాకాలం.. బాధితులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు అవసరం. ఇతర సంస్థలు వెదురు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. బహిరంగ ప్రాంతాల మరమ్మతు కోసం రూ.90 వేలు మినహా మిగతా డబ్బుతో సీజీఐ షీట్స్ కొని తాత్కాలిక నివాసాల నిర్మాణ ం చేపట్టాం. ఇలా ఒక్కో ఇంటికి రూ. 3,434 ఖర్చు చేశాం’ అవి వివరించారు. మళ్లీ వెళ్తాం.. ‘నేపాల్‌లో చేయాల్సిన సహాయక కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. మేం రెండో విడత విరాళాలు సేకరించాలనుకుంటున్నాం. నేపాల్ నుంచి ‘సెవెన్ వండర్స్ బ్యాండ్’ను హైదరాబాద్‌కు రప్పిస్తున్నాం. వీరితో ఇక్కడ షోలు నిర్వహించి వచ్చిన డబ్బుతో అక్కడ సాయం చేస్తాం. నేపాల్ కల్చరల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అక్కడి నుంచి చెఫ్‌లను తీసుకొస్తున్నాం. వాటితో వచ్చిన డబ్బుతో టెచో గ్రామ రూపు రేఖలు మార్చుతాం’ అంటూ వివరించాడు సర్వేశ్. ఫేస్బుక్ సాయం.. ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేస్తున్న సర్వేశ్ ఫీల్డ్‌వర్క్‌లో భాగంగా 2013లో నేపాల్‌లోని లలిత్పూర్ జిల్లా ‘టెచో’ గ్రామానికి వెళ్లాడు. దాదాపు ఏడాదిన్నర పాటు అక్కడి ప్రజలతో మమేకమై వారి వారి జీవన విధానం, సమస్యలపై పరిశోధన చేశాడు. ఈ సమయంలో స్థానిక ‘హపఫుచ వలంటరీ యూత్ ఆర్గనైజేషన్’తో పరిచయం ఏర్పడింది. ఇటీవల నేపాల్‌లో భూకంపంలో ఈ గ్రామం కూడా దెబ్బతింది. ఇళ్లు, తిండి లేక ఈ గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో ఈగ్రామానికి చెందిన లెక్చరర్ మహేశ్ ‘మా గ్రామస్తులను ఆదుకోండి’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇది చదివి చలించిన సర్వేశ్ తాను ఫీల్డ్‌వర్క్ చేసిన ఆ గ్రామానికి చేయూతనివ్వాలనుకున్నాడు. విషయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాడు. విరాళాల సేకరణకు ఫేస్బుక్లో పేజీ క్రియేట్ చేశాడు. దాదాపు 700 మందికి పైగా సభ్యులుగా చేరి విరాళాల సేకరణలోనూ భాగమయ్యారు. ఫ్రెండ్స్, ఫ్రొఫెసర్లు.. ఇలా అందరూ తమకు తోచిన ఆర్థిక సాయం చేశారు. -
సేవకు సలామ్
మనిషికి ఎలాంటి శారీరక, మానసిక సమస్య ఎదురైనా తలచుకునేది దైవాన్ని.. కలుసుకునేది వైద్యుడిని. అలాంటి వైద్య వృత్తికే వన్నె తెచ్చారు సిటీకి చెందిన యువ డాక్టర్లు. నేపాల్ భూకంపంలో క్షతగాత్రులైనవారికి సేవలు అందించేందుకు ముందుకు రావాలని ‘క్యూరోఫి’ యాప్‌లో పోస్ట్ వచ్చింది. ఇది చూసిన సిటీకి చెందిన ‘ఆకృతి, విశిష్ట, యశ్వంత్’ స్పందించారు. కామినేని ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆకృతి, నిమ్స్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా సేవలందిస్తున్న విశిష్ట, శ్రీకాకుళం జీఎంఎస్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న యశ్వంత్ ఇక్కడి నుంచి పయనమయ్యారు. వీరికి భోపాల్ నుంచి ముగ్గురు డాక్టర్లు, ముంబై, ఢిల్లీ నుంచి ఒక్కో వైద్యుడు చేయందించారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపాల్ ప్రజలకు వైద్య సేవలు అందించారు. అక్కడ తాము ఎదుర్కొన్న అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు ఆకృతి, విశిష్ట, యశ్వంత్. ఆ వివరాలు వారి మాటల్లోనే.. - సాక్షి, సిటీబ్యూరో - నేపాల్ భూకంప ప్రాంతంలో వైద్యశిబిరాలు - ప్రాణాలను పణంగా పెట్టి సిటీ వైద్యుల సేవలు ఇలా మొదలైంది.. ‘మే 6న కాట్మాండ్‌కు బయలుదేరాం. ఏడున అక్కడ మెడికల్ క్యాంప్ పూర్తయింది. మరుసటి రోజు మధ్యాహ్నానికి సింధుపాల్ చౌక్ ప్రాంతానికి చేరుకున్నాం. నేపాల్‌లో ఎక్కడ భూకంపం వచ్చినా ఆది సింధుపాల్ చౌక్ నుంచి మొదలువుతుందని విన్నాం. అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. సమీప ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. రక్తపు మడుగుల్లో ఉన్నవారిని చూస్తే బాధేసింది. పోలీసులు, నేపాల్ ఆర్మీతో కలిసి క్షతగాత్రులకు వైద్యం అందించాం. అప్పటికే కొండచరియలు విరిగిపడటంతో మెడిసిన్ బ్యాగులను మోసుకుంటూ కొండలపైకి వెళ్లాం. 10,11 తేదీల్లో గ్రామాల్లో మెడికల్ క్యాంప్ చేశాం. ఆ తర్వాత లమసాంగ్ నుంచి 11.5 కిలోమీటర్ల దూరంలో ఉండే నేపాల్, చైనా బార్డర్‌కు బయలుదేరాం. ఈ సమయంలోనే మా కళ్ల ముందే మరోసారి భూకంపం వచ్చి కొండచరియలు విరిగిపడ్డాయి’ సమయం: మే 13 ఉదయం.. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య మరోసారి భూకంపం వస్తుందని ప్రకటించారు. ఆర్మీ అధికారులు వెంటనే కాట్మాండ్ బయలుదేరమన్నారు. లమ్సాంగ్ నుంచి కాట్మాండ్‌కు 2.30 గంటలు పడుతుంది. మధ్యలో అన్నీ కొండలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎలాగైతేనేం సాయంత్రానికి కాట్మాండ్ చేరుకున్నాం. మరుసటి రోజు అక్కడి పోలీసు అకాడమీలో వైద్య శిబిరం నిర్వహించాం. ఆ రోజు రాత్రికే మమ్మల్ని ఢిల్లీకి పంపించారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాం. సేవ ముందు మా ప్రాణ భయం మోకరిల్లింది’ అంటూ ముగించారు. క్షణక్షణం భయం భయం.. ‘జంబూ విలేజ్‌కు చేరుకోగానే కొండచరియ విరిగిపడటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం భూకంపం వచ్చింది. కొండలు పడిపోయాయి. చాలా మంది చనిపోయారు. జంబూ కొండ దిగువనున్న గంగా నది వద్ద రెండు గంటలు పాటు ఉన్నాం. అప్పటికే సాయంత్రమైంది. మేం వైద్యులమని తెలియగానే జంబూ గ్రామస్తులు సమూహంగా మా వద్దకు వచ్చారు. వారందరికి వైద్యం చేశాం. అప్పటికి ఆర్మీ రోడ్డును క్లియర్ చేసింది. జంబూలోని విరిగిపడిన పెద్ద కొండను పెకలించాలంటే బాంబు పెట్టాలి. అప్పటికే సమయం దాటిపోయింది. దీంతో రోడ్డుపై పడిన కొండ ఎక్కి, దూకాం. రోడ్డు ఇరువైపులా ఉన్న కొండలు ఏ సమయంలోనైనా పడిపోవచ్చనే సమాచారంతో సుమారు ఎనిమిది కిలోమీటర్లు పరుగుపెట్టాం. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అటువైపుగా వచ్చిన ఆర్మీ జీపు ఎక్కి లమసాంగ్‌కు వెళ్లాం. అప్పటికే మాకు కేటాయించిన గెస్ట్‌హౌస్ కకావికలమైంది. ఆ రోజు రాత్రంతా కొండ ఊగింది.. ఎవరికీ నిద్ర లేదు. ఇంత భయంలోనూ మా వైద్య సేవలు ఆపలేదు. మేం ఎక్కడ ఉంటే అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాం. -
భారత్, నేపాల్‌లో మళ్లీ భూకంపం!
-
భారత్, నేపాల్‌లో మళ్లీ భూకంపం!
భూకంపం వరుసపెట్టి వణికిస్తోంది. నేపాల్‌లో శనివారం సాయంత్రం మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. నేపాల్ భూకంపం ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, సిలిగురిలో కూడా స్వల్ప స్థాయిలోప్రకంపనలు వచ్చాయి. దాంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్‌లో భూకంపం కారణంగా ఎంత నష్టం సంభవించిందన్న వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
8,460 కు చేరిన మృతుల సంఖ్య
కఠ్మాండు: నేపాల్ భూకంప మృతుల సంఖ్య 8,460 కు చేరింది. ఏప్రిల్ 25న సంభవించడంతో నేపాల్ చిన్నాభిన్నమైంది. 4,571 మంది గాయపడ్డారు. ఇప్పటివరకు 8,399 మృతదేహాలను సంబంధీకులకు అప్పగించినట్టు నేపాల్ హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. మే 12న మరోసారి భూమి కంపించింది. దీంతో మరో 117 మంది ప్రాణాలు కోల్పోగా, 1,700 మంది గాయపడ్డారు. వరుస భూవిలయాలతో నేపాల్ ప్రజలు వణికిపోతున్నారు. -
భూకంప బాధితులకు హన్సిక చేయూత
చెన్నై : నేపాల్‌లో భూకంపం విళయతాండవం సృష్టించిన విషయం తెలిసిందే. ఎనిమిదివేల మంది పైగా మృత్యువాత పడ్డారు. ఎందరో క్షతగాత్రులయ్యారు. మంగళవారం కూడా అక్కడ భూకంపం వచ్చి మరికొందరి ప్రాణాలను బలిగొంది. అలాగే నేపాల్ కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. అలాంటి నేపాల్ ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి పలు దేశాలు సాయం అందిస్తున్నాయి. చాలామంది వ్యక్తిగతంగాను ఆపన్న హస్తం అందిస్తున్నారు. అదే విధంగా నటి హన్సిక నేపాల్ భూకంప బాధితుల సహాయార్థం ఆరు లక్షలు అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తన సేవా నిరతిని నిరూపించుకున్నారు. ఆమె ఇప్పటికే తన పుట్టినరోజు కొక్కరి చొప్పున అనాథ బాలలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతను నిర్వహిస్తున్నారు. త్వరలో ముంబైలో వారికి ఒక చక్కని ఆశ్రమాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న హన్సిక సేవానిరతికి జోహార్లు. -
జనం భీతావహం
నేపాల్‌లో క్షణం క్షణం భయం భయం.. తాజా భూకంపంలో 79కి చేరిన మృతులు కఠ్మాండు: నేపాల్‌లో భూ ప్రకోపం కొనసాగుతూనే ఉంది. మంగళవారం నాటి భారీ భూకంపం అనంతరం తీవ్రస్థాయి భూప్రకంపనలు ఆ దేశాన్ని చిగురుటాకులా వణికిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ 33 ప్రకంపనలు సంభవిస్తే బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మరో 13 పైగా ప్రకంపనలు సంభవించాయి. భూకంప మృతుల సంఖ్య 79కి పెరిగింది. వరుస భూకంపాలతో ఇళ్లు పేకమేడల్లా కూలి పోతుండటం.. వందలాదిప్రాణాలు గాలిలో కలిసిపోతుండటంతో వేలాది మంది నేపాల్ ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని ఆరుబయటే ప్లాస్టిక్ టెంట్లలో జీవిస్తున్నారు. మూడు వారాల క్రితం సంభవించిన ఆ భూకంపం 8,000 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ విల యం నుంచి కోలుకునేందుకే అష్టకష్టాలు పడుతున్న నేపాల్‌ను మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతగా నమోదైన భూకంపం మరోసారి దెబ్బతీసింది. దేశంలోని 32 జిల్లాలు తాజా భూకంపం ప్రభావానికి గురయ్యాయని పోలీసులు తెలిపారు. కఠ్మాండుకు ఈశాన్యం గా పర్వతప్రాంతాల్లో ఉన్న మారుమూల జిల్లాలపై ఈ భూకంపం ప్రభావం ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో ఇళ్లు, భవనాలు కుప్పకూలగా.. కొండచరియలు విరిగిపడి పలు ప్రాంతాల్లో దారులు మూసుకుపోయాయి. అమెరికా సైనిక విమానం అదృశ్యం... నేపాల్‌లోని భూకంప బాధితులకు సహాయ సరకులు అందించేందుకు ప్రయాణిస్తున్న అమెరికా సైనిక విమానం జాడ తెలియకుండా పోయింది. ఇందులో ఆరుగురు అమెరికా మెరైన్లు, ఇద్దరు నేపాల్ సైనికులు ఉన్నారు. దీంతో ఈ హెలికాప్టర్, అందులోని సైనికులు కోసం భారీ ఎత్తున గాలింపు చేపట్టారు. కాగా, నేపాల్‌లో తాజా భూకంపం నేపధ్యంలో ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాలాతో భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. భారత్ నుంచి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 21కి పెరిగిన బిహార్ మృతులు పట్నా: మంగళవారం సంభవించిన తీవ్ర భూకంపం వల్ల బిహార్‌లో మృతుల సంఖ్య 21కి, క్షతగాత్రుల సంఖ్య 84కి పెరిగింది. భూకంప బాధితులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి వ్యాస్జీ తెలిపారు. భూకంపం ప్రభావం పట్నా, తూర్పు చంపారన్ జిల్లాలపై ఎక్కువగా ఉంది. రెండు జిల్లాల్లోనూ ముగ్గురు చొప్పున చనిపోయారు. మాధేపురా, పూర్ణియా, వైశాలి, శివాన్, దర్భంగా జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. సీతామార్హి, ఖగారియా, షేక్‌పురా జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతిచెందారు. -
హడలెత్తిస్తున్న 'ఆప్టర్ షాక్స్'
కఠ్మాండు: నేపాల్ ను భూప్రకంపనలు వణికిస్తూనే ఉన్నాయి. వరుస భూకంపాలతో అతలాకుతలమైన హిమాలయ దేశాన్ని పరాఘాతాలు(ఆప్టర్ షాక్స్) మరింత భయపెడుతున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ప్రాంతంలో 5 పరాఘాతాలు సంభవించాయి.వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది.మంగళవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 36 పరాఘాతాలు నమోదయ్యాయి. కఠ్మాండు కేంద్రంగా ఇవి సంభవించాయి. మరో భూకంపం వస్తుందన్న భయంతో ప్రజలు మంగళవారం రాత్రంతా ఆరుబయటే గడిపారు. ఈ ఉదయం వరకు ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు. పాఠశాలలు తెరుచుకోలేదు. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మార్కెట్లు, దుకాణాలు తెరుచుకోలేదు. పరాఘాతాలను స్వల్ప భూకంపాలుగా భావిస్తారు. భూకంపం సంభవించిన తర్వాత వచ్చే స్వల్ప ప్రకంపనలను పరాఘాతాలు అంటారు. -
నేపాల్ భూకంపంలో మరో 68 మంది మృతి
చౌతరా(కఠ్మాండు): నేపాల్ లో మంగళవారం సంభవించిన భూకంపం వల్ల ఢోలఖా జిల్లాలో సూమారు 65 మంది ప్రజలు మృతిచెందారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం ఉత్తర కఠ్మాండుకు చెందిన అధికారి ప్రేమ్ లాల్ లామిచేన్ వెల్లడించారు. నేపాల్ ప్రజలను భూకంపం భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉంది. ప్రజలు భూకంపం సంభవిస్తుందేమోనన్న భయంతో వేలాది మంది మంగళవారం రాత్రి ఇంటి బయటే బిక్కుబిక్కుమంటూ గడిపారు. 3 వారాలకు ముందు సంభవించిన భూవిలయంలో సూమారు 8 వేల మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3 గా నమోదైంది. కఠ్మాండు, మౌంట్ ఎవరెస్టు మధ్య ప్రాంతం కేంద్రంగా ఈ భూకంపం సంభవించింది. బాధితులకు సహాయం అందించే ప్రయత్నంలో అమెరికాకు చెందిన హెలికాఫ్టర్ ఆరు మెరైన్లతో పాటు ఇద్దరు నేపాలీ సైనికులతో సహా ఈశాన్య నేపాల్ ప్రాంతంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. -
హెలికాప్టర్ అదృశ్యం: 8 మంది గల్లంతు
వాషింగ్టన్: నేపాల్ భూకంప ప్రాంతంలో అమెరికాకు చెందిన మెరైన్ హెలికాప్టర్ అదృశ్యమైందని పెంటగాన్ అధికార ప్రతినిధి ఆర్మీ కల్నల్ స్టీవ్ వార్నీ బుధవారం వెల్లడించారు. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు మెరైన్ సిబ్బందితోపాటు ఇద్దరు నేపాలీ సైనికుల జాడ తెలియరాలేదని తెలిపారు. నేపాల్‌లోని భూకంప బాధితుల కోసం మంగళవారం ఆహార పదార్థాలను తరలిస్తున్న క్రమంలో అదృశ్యమైందని చెప్పారు. అయితే హెలికాప్టర్లో ఇంధనం చాలా తక్కువగా ఉందని యూఎస్ మిలటరీ అధికారులకు హెలికాప్టర్ పైలట్లు చెప్పారని ... ఆ కొన్ని నిమిషాలకే హెలికాప్టర్ ఆచూకీ తెలియకుండా పోయిందని స్టీవ్ వార్నీ వెల్లడించారు. హెలికాప్టర్ అదృశ్యమైన వార్త తెలియగానే ... రంగంలోకి దిగిన మెరైన్ సిబ్బంది సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదని చెప్పారు. చీకటి కావడంలో గాలింపు చర్యలు నిలిపివేశారని చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి హెలికాప్టర్ ఆచూకీ కనుగొనేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
మళ్లీ తెరుచుకున్న కఠ్మాండు ఎయిర్ పోర్ట్
కఠ్మాండు: నేపాల్ రాజధాని కఠ్మాండులోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంగళవారం మధ్యాహ్నం మళ్లీ తెరిచారు. 7.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఎయిర్ పోర్టును మూసివేశారు. భూప్రకంపనల ధాటికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) టవర్ ఊగడంతో అందులో ఉన్న వ్యక్తి హుటాహుటిన కిందకు దిగిపోయాడని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్య విమానాశ్రాయాన్ని మూసేశారు. ఎయిర్ పోర్టు తెరిచిన తర్వాత ఇక్కడి నుంచి రెండు విమానాలు వెళ్లాయని అధికారులు తెలిపారు. థాయ్ ఎయిర్ వేస్ విమానం బ్యాంకాక్ కు, ఇండిగో ఫ్లైట్ ఢిల్లీకి బయలుదేరాయని చెప్పారు. -
నేపాల్‌లో ఏడుగురు.. భారత్‌లో 12 మంది మృతి
మరోసారి వచ్చిన భారీ భూకంపం కారణంగా నేపాల్‌లో ఏడుగురు మరణించారు, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారతదేశంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లోని చౌతారా పట్టణంలో భూకంప ప్రభావానికి ఓ భవనం కుప్పకూలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కఠ్మాండు నగరంలో మరో ముగ్గురు మరణించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని పోలీసు అధికార ప్రతినిధి కమల్ సింగ్ బామ్ తెలిపారు. ఇంకా చాలా భవనాలు కుప్పకూలినట్లు సమాచారం అందుతోందని ఆయన చెప్పారు. ఇక మన దేశంలో.. బీహార్ రాజధాని పాట్నా నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో 10 మంది కార్మికులు మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా మరో ఇద్దరు మరణించినట్లు సమాచారం అందింది. దీంతో భారతదేశంలో భూకంప మృతుల సంఖ్య 12కు చేరుకుంది. -
ఉత్తరభారతంలో భూకంపం.. జనం పరుగులు
నేపాల్‌లో పుట్టిన భూకంపం మరోసారి ఉత్తర భారత దేశాన్ని కూడా చిగురుటాకులా వణికించింది. పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావాన్ని ప్రజలు స్పష్టంగా చూశారు. మూడో అంతస్థులో ఉండి పని చేసుకుంటున్న తాము ఉన్నట్టుండి అటూ ఇటూ ఊగిపోయామని, ఏం జరిగిందో అర్థమయ్యేలోపే భూకంపం అన్నారని దాంతో వెంటనే కిందకు పరుగులు తీశామని ఢిల్లీకి చెందిన ఓ గృహిణి తెలిపారు. తాను పాఠం చెబుతుండగా ఓ పిల్లాడు ఉన్నట్టుండి భూకంపం వచ్చిందన్నాడని, ముందు ఏదో జోక్ వేశాడనుకుంటే ఈలోపు బల్లలు కూడా ఊగడంతో వెంటనే అర్థం చేసుకుని అంతా బయటకు పరుగులు తీశామని ప్రైవేటు స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు చెప్పారు. ఢిల్లీలో భూకంపం కారణంగా మెట్రో రైలు సర్వీసులను కాసేపు నిలిపివేశారు. నోయిడాలోని పలు షాపింగ్ మాల్స్ నుంచి జనం బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి తీవ్రంగా ప్రకంపించిందని, అపార నష్టం సూచనలు ఉన్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది. నేపాల్‌లోని ఢోలాక-సింధుపల్చోక్ మధ్య భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదైంది. కఠ్మాండు నుంచి తూర్పుదిశగా ఉన్న భిర్కోట్ కేంద్రంగా భారీ భూకంపం వచ్చింది. హిమాలయ పరివాహక ప్రాంతమంతా ప్రకంపనలు వచ్చాయి. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ప్రభావం ఎక్కువగా ఉంది. భూ ప్రకంపనలతో కఠ్మాంటు ఎయిర్‌పోర్టు నుంచి జనం పరుగులు తీశారు. భూమి కంపించడం మొదలుపెట్టగానే పెద్దగా కేకలు వేస్తూ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పారిపోయారు. నేపాల్‌తో పాటు బంగ్లాదేశ్, చైనా, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో కూడా భూకంప ప్రభావం కనిపించింది. నేపాల్‌లో భూమికి 19 కిలోమీటరల్ లోపల భూమి కంపించినట్లు అమెరికా భూగర్భ శాఖ తెలిపింది. -
మాతృభూమి సేవకు మనీషా కోయిరాలా
భారీ భూకంపంతో కకావికలమైన తన మాతృదేశం నేపాల్‌లో మహిళలకు సేవలందించేందుకు బాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త మనీషా కోయిరాలా నడుం బిగించింది. ప్రస్తుతం గర్భవతులుగా ఉన్నవారితోపాటు భూకంపం ప్రభావంతో గర్భం కోల్పోయిన మహిళలు, ఇతర ఆరోగ్య కారణాలతో బాధపడుతున్న బాలికలకు అవసరమైన మేరకు సేవలందించేందుకు సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ ఎఫ్‌పీఏ) నేపాల్ విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలైన ఆమె.. కష్టకాలంలో మాతృదేశానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. భూకంపం ప్రభావంతో దాదాపు లక్ష మందికిపైగా గర్భాన్ని కోల్పోయారని, మరో 1.30 లక్షల మంది ప్రసవించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారందరికీ వైద్యసేవలు అందించేందుకు యూఎన్ ఏఫ్ పీఏ కృషి చేస్తున్నదని ఆ సంస్థ నేపాల్ ప్రతినిధి గ్యూలియా వెల్లెస్ చెప్పారు. యూఎన్ ఎఫ్‌పీఏ నేపాల్ విభాగం గుడ్‌విల్ అంబాసిడర్‌గా మనీషా కోయిరాలా పనితీరు అందరినీ మెప్పిస్తుందన్నారు. -
రూ.17 లక్షలు సేకరించిన 8 ఏళ్ల బాలుడు
వాషింగ్టన్: నేపాల్ భూకంప బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు 8 ఏళ్ల బాలుడు ముందుకు వచ్చాడు. భూవిలయ బాధితుల సహాయార్థం సుమారు రూ. 17 లక్షలు సేకరించాడు. అమెరికాలోని మేరీల్యాండ్ కు నీవ్ సరాఫ్ తాను దాచుకున్న డబ్బుతో పాటు ఇతరల నుంచి విరాళాలు సేకరించి ఈ మొత్తం పోగుచేశాడు. తన స్నేహితులు, వారి కుటుంబ సభ్యులను నుంచి విరాళాలు సేకరించాడు. భూవిలయంలో అతలాకుతలమైన నేపాల్ ను చూస్తుంటే తన మనసంతా దుఃఖంతో నిండిపోయిందని పేర్కొన్నాడు. సహాయ కార్యక్రమాలకు తాను దాచుకున్న డబ్బు ఇస్తున్నానని, మిగతా వారు సాయమందించాలని విజ్ఞప్తి చేశాడు. నీవ్ సరాఫ్ బృందం రూ. 17.45 లక్షలు పోగుచేయగా అందులో నీవ్ ఒక్కడే రూ.17 లక్షలు పోగు చేశాడు. నీవ్ సరాఫ్ తల్లిదండ్రులు నేపాల్ కు చెందిన వారు. -
నేపాల్ బాధితులకు కువైట్ వైఎస్సార్సీపీ సాయం
సాక్షి, హైదరాబాద్: కువైట్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభాగం ఆధ్వర్యంలో నేపాల్ భూకంప బాధితులకు ఒక మినీ లారీ ఆహార పదార్థాలు, వస్త్రాలను పంపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కువైట్‌లోని నేతలు, అభిమానులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుని తాము సేకరించిన ఈ సాయాన్ని స్థానిక నేపాల్ రాయబార కార్యాలయంలో అందజేశామని పార్టీ కువైట్ శాఖ కోఆర్డినేటర్ ఇలియాస్ బీహెచ్ హైదరాబాద్‌లో బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ సంయుక్త కోఆర్డినేటర్ ఎం.బాలిరెడ్డి, స్థానిక నేత ఎంవీ నరసారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. -
చిన్న గ్రామం.. వంద శవాలు
కఠ్మాండు: అదొక చిన్న గ్రామం. పర్వతారోహణకు అనుకూలంగా ఉండే గ్రామం. ట్రెక్కింగ్‌కు వచ్చేవాళ్లంతా అక్కడి నుంచే వెళుతుంటారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ గ్రామం కూడా గత నెలలో భయంకరమైన భూకంపానికి గురైంది. ఫలితంగా అక్కడ భారీ సంఖ్యలో మృతదేహాలు బయటపడ్డాయి. నేపాల్ పోలీసులు, కొందరు వాలంటీర్లు కలసి లాంగ్ తాంగ్ అనే గ్రామంలో శిధిలాలు తొలగించడం ప్రారంభించారు. భారీగా పేరుకుపోయిన రాళ్లురప్పలు, మంచుముద్దలు తొలగించి చూడగా చాలామంది పర్వతారోహకులు, గ్రామస్థులు ప్రాణాలుకోల్పోయి శిథిలాల కింద ఉండిపోయారు. వీరంతా వందమందికి పైగా ఉంటారని అధికారులు తెలిపారు. -
భూకంప బాధితులకు హాకీ ఇండియా సహాయం
న్యూఢిల్లీ: నేపాల్‌లో ఇటీవల సంభవించిన భూకంపంలో బాధితులను ఆదుకునేందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) ముందుకు వచ్చింది. రూ.10 లక్షల విరాళాన్ని ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్‌కు అందించింది. ‘మన పొరుగు దేశానికి ఇప్పుడు పూర్తి స్థాయిలో సహాయం అందాల్సి ఉంది. ఈ జాతీయ విపత్తు నుంచి వారు బయటపడేందుకు మేం శాయశక్తులా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. చిన్న మొత్తమైనా వారు తమ జీవితాలను తిరిగి ప్రారంభించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. నేపాల్‌కు ఆర్థిక సహాయం ప్రకటించిన క్రీడా సంఘాల్లో హెచ్ఐ మొదటిది కావడం విశేషం. -
చేసిన సాయం చాలు.. ఇక ఆపండి!
-
చేసిన సాయం చాలు.. ఇక ఆపండి!
కఠ్మాండు: పెను భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ దేశం అంతర్జాతీయంగా చిన్న చూపును ఎదుర్కొంటుందా?, భూకంప సహాయక చర్యల్లో భారీ స్థాయిలో దేశాలు పాల్గొనడం నేపాల్ ప్రతిష్టకు భంగం వాటిల్లేదిగా ఉందా? అంటే అవునక తప్పదు. నేపాల్ సహాయక చర్యలను విరమించి వెనక్కివెళ్లిపోవాలనే అక్కడి ప్రభుత్వం తాజాగా చేసిన విజ్ఞప్తి అందుకు మరింత బలం చేకూరుస్తోంది. నేపాల్ లో భూకంపం సంభవించిన అనంతరం మొత్తంగా 34 దేశాలు రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాయి. అయితే ఎనిమిది రోజుల సహాయక చర్యల అనంతరం నేపాల్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నేపాల్ భూకంప సహాయక చర్యల్లో పాల్గొంటున్న భారత్ తో సహా 34 దేశాలను వెనక్కి వెళ్లిపోవాలంటూ నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. తమ ఆర్మీయే సహాయక చర్యల్లో పాల్గొంటుందని ఈ మేరకు సూచించింది. ఇక చేసిన సాయం చాలు.. ఆపండి అంటూ నేపాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అక్కడ సహాయక చర్యల్లో ఉన్న పలు దేశాల తిరిగి వెనక్కి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.ఇదిలా ఉండగా భారత్ ను వెనక్కి వెళ్లిపోవాలంటూ వచ్చిన వార్తలను ఢిల్లీలో ఉన్న నేపాల్ రాయబారి ఖండించారు. మిగతా దేశాల పని ముగియడంతో వాటిని మాత్రమే వెనక్కి పోవాలని నేపాల్ ప్రభుత్వం తెలిపిందని.. భారత్ మాత్రం యథావిధిగా సహాయక చర్యల్లో పాల్గొంటుదని తెలిపారు. నేపాల్ లో సంభవించిన భూకంపంతో ఎవరెస్ట్ పర్వతం పై నుంచి భారీగా మంచు చరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పై సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. భూకంపంతో మృత్యువాత పడిన వారి సంఖ్య ఏడు వేలకు పైగా చేరగా, ఎవరెస్ట్ పర్వతారోహకులు 22 మంది గల్లంతయ్యారు. అయితే ఎవరెస్ట్ పర్వతారోహకుడు అర్జున్ భాజ్ పాయ్ తో సహా 12 మందిని నేపాల్ ప్రభుత్వం రక్షించింది. -
‘నేపాల్’ కోసం కాంగ్రెస్ విరాళాల సేకరణ
- రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ముఖ్య నాయకులు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒక నెల జీతం విరాళం - వెల్లడించిన ఎమ్మార్సీసీ అధ్యక్షుడు సంజయ్ ముంబై: నేపాల్ భూకంప బాధితుల సహాయార్థం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విరాళాలు సేకరణ మొదలుపెట్టారు. రాష్ట్రంలోని 20 నగరాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. లోఖండ్వాలా, కాందివలిలో విరాళాల సేకరణను ముంబై రీజనల్ కాంగ్రెస్ కమిటీ(ఎమ్మార్సీసీ) అధ్యక్షుడు సంజయ్ నిరుపం నిర్వహించారు. ములుండ్, ఘాట్కోపర్, మలాబార్ హిల్, జుహు, దక్షిణ మధ్య ముంబైలో విరాళాల సేకరణకు మంచి స్పందన వచ్చినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌నేతలు, కార్యకర్తలు కూడా తమ పరిధిలో విరాళాలు సేకరిస్తున ్నట్లు ఆయన పేర్కొన్నారు. ముంబైలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల పెన్షన్‌ను విరాళంగా ప్రకటిస్తారని, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఒక నెల జీతాన్ని ఇస్తారని ఆయన తెలిపారు. నేపాల్ బాధితులకు ఎమ్మార్సీసీ సభ్యులు ఒక్కొక్కరు రూ. పదివేలు విరాళంగా ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇంకా ఎంతో మంది దుస్తులు దానం చేసేందుకు ముందుకు వస్తున్నారని, అయితే డబ్బు సేకరించే పనిలో ప్రస్తుతం నిమగ్నం అయినట్లు ఆయన చెప్పారు. ‘మాకు అందిన సమాచారం ప్రకారం నేపాల్ బాధితులకు దుప్పట్లు, మందుల అవసరం ఎక్కువగా ఉంది. మేం వాటినే సరఫరా చేయాలనుకుంటున్నాం. సహాయాన్ని ఎలా పంపించాలనే విషయంపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)తో చర్చిస్తాం’ అని ఆయన చెప్పారు. -
7,040 మృతదేహాల వెలికితీత
కఠ్మాండు: నేపాల్ భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అధికారికంగా 7,040కు చేరింది. గాయపడిన వారు 14,123 మందికి పెరిగారు. నేపాల్‌లో గత ఏప్రిల్ 25న భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రాణాలు కోల్పోయిన వారు దాదాపు 15 వేలు దాటే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు కూడా ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే, శిథిలాలను తొలగించగా ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాలు మాత్రం 7,040. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా వేల సంఖ్యలో మృతదేహాలు బయల్పడే అవకాశం ఉంది. ఈ భూకంపం కారణంగా దాదాపు ఆరు లక్షల మంది కఠ్మాండు విడిచి వెళ్లారు. ధ్వంసం కాని తమ నివాసాలకు వెళ్లేందుకు కూడా వారు భయపడుతున్నారు. ప్రస్తుతానికి కటిక చలిలో మైదాన ప్రాంతాలు, రోడ్లపైనే వారి జీవనం వెళ్లబుచ్చుకుంటున్నారు. -
ఆక్షణాలు భయానకం
- నేపాల్ భూకంప మృత్యుంజయులు రమణ కుటుంబ సభ్యులు - 2రోజులు తిండి, నీళ్లు లేకుండా నరకం - మీడియాతో అనుభవాలు పంచుకున్న రమణ ఆక్షణాలు జీవితంలో మరువలేం...కళ్లముందే పెద్ద భవంతులు కుప్పకూలుతున్నాయి...భారీ వృక్షాలు నేలకొరుగుతున్నాయి... చూస్తుండగానే ఇరుగుపొరుగు జనం ప్రాణాలు కోల్పోతున్నారు...అని నేపాల్ భూకంపంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ మదనపల్లె వాసి రమణ తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. మదనపల్లె: నేపాల్‌లో భూకంప ప్రళయం నుంచి సురక్షితంగా బయటపడిన రమణ సొంత ఊరు మదనపల్లెకు చేరుకున్నారు. శనివారం స్థానిక జ్ఞానోదయ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో మున్సిపల్ వైస్ ైచె ర్మన్ భవానీప్రసాద్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. తొలుత రమణకు భవానీ ప్రసాద్ స్వీటు తినిపించారు. అనంతరం రమణ తన అనుభవాలను వివరించారు. ఆయన మాటల్లోనే ‘ నేను 3 సంవత్సరాలుగా నేపాల్ కాఠ్మాండులోని కేంద్రీయ విద్యాలయ ఎంబసీలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. కుటుంబంతో సహా అదే ప్రాంతంలో ఉంటున్నాను. భార్య అనసూయ గృహిణిగా ఉండగా, కుమారుడు ఉదయ్‌కిరణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం, కుమార్తె జాహ్నవి పదో తరగతి చదువుతోంది. ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు భూకంపం రావడంతో కుటుంబం మొత్తం భయభ్రాంతులకు గురై ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నాం. మాతోపాటు ఇరుగుపొరుగు వారంతా దాదాపు 200 మంది ఆ ప్రాంతంలోని ఒక మైదానంలో 2 రోజుల పాటు తిండి, నీళ్లు లేకుండా నరకం చవిచూశాం. మాకు అండగా ఒక రెస్క్యూ టీమ్ ఉండడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడగలిగాం. మదనపల్లె నుంచి మా తల్లిదండ్రులు పలుమార్లు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కొంటూనే ఉన్నారు. మేము క్షేమంగా ఉన్నామని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మందిని రెస్క్యూ టీమ్ ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌కు ప్రత్యేక విమానంలో పంపించింది. అనంతరం అక్కడి నుంచి మదనపల్లెకు చేరుకున్నాం. మదనపల్లెలోని ప్రశాంత్‌నగర్‌లో మా తల్లిదండ్రులు ఉన్నారు. విధి నిర్వహణ దృష్ట్యా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా మరో వారం రోజుల్లో తిరిగి నేపాల్ వెళ్లనున్నాం. -
మీ ఇల్లు భద్రమేనా..!
ఇంటి రుణానికే కాదు... ఇంటికీ బీమా పలు రైడర్లను కలిపి మరీ అందిస్తున్న సంస్థలు.. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణకు తప్పనిసరి నేపాల్ భూకంప దృశ్యాలు ఇంకా మన కళ్ళముందు కదలాడుతూనే ఉన్నాయి. చారిత్రక, ఆధ్యాత్మిక కట్టడాలతో పాటు లక్షల మందికి చెందిన ఇళ్లు కూలిపోయాయి. పలు నివాసాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. జీవితకాలం కష్టపడి సంపాదించిన ఆస్తిని ఇలా ప్రకృతి వైపరీత్యాలు ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవడమేనా? వీటి వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునే అవకాశం లేదా? ఈ ప్రశ్నలకు పరిష్కారమల్లా బీమానే. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వల్ల జరిగే ఆర్థిక నష్టాన్ని ‘హోమ్ ఇన్సూరెన్స్’ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న హోమ్ ఇన్సూరెన్స్‌పై ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం.. ‘హోమ్ ఇన్సూరెన్స్’ ఇపుడిపుడే దేశంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. సొంతంగా ఇంటిని నిర్మించుకుంటున్న వారు కేవలం గృహరుణ చెల్లింపులకే కాకుండా ఇంటి మొత్తానికి బీమా రక్షణ తీసుకుంటున్నారు. ఈ రెండింటి మధ్యా తేడా ఏంటంటే... గృహరుణ చెల్లింపులకు మాత్రమే బీమా తీసుకున్న పక్షంలో గృహ రుణం తీసుకున్న వ్యక్తికి అనుకోని సంఘటన ఏదైనా జరిగి మరణిస్తే ఇక చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తాన్ని బీమా కంపెనీ ఒకేసారి బ్యాంకులకు చెల్లించేస్తుంది. అలా కాకుండా ఇంటి మొత్తానికి బీమా తీసుకుంటే ఆ కలల సౌధానికి ఎటువంటి నష్టం జరిగినా దాన్ని భర్తీ చేసుకునే వీలుంటుంది. బీమా వ్యవహారిక భాషలో హోమ్ ఇన్సూరెన్స్‌ను రెండు రకాలుగా చెబుతారు. ఒకటి బిల్డింగ్ ఇన్సూరెన్స్. మరొకటి కంటెంట్ ఇన్సూరెన్స్. బిల్డింగ్ ఇన్సూరెన్స్‌లో ప్రధానంగా ఇంటి స్ట్రక్చర్‌కు బీమా రక్షణ ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో ఇంటి నిర్మాణం దెబ్బతింటే దానిని తిరిగి నిర్మించడానికి అయ్యే వ్యయం లేదా కూల్చి పూర్తిగా కొత్తది కట్టుకోవాలంటే దానికి అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. ఉదాహరణకు భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇంటి నిర్మాణానికి ఏదైనా నష్టం వాటిల్లితే దాన్ని బీమా కంపెని తిరిగి చెల్లిస్తుంది. ఇక కంటెంట్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇది ఇంటిలోని విలువైన వస్తువులకు బీమా రక్షణ కల్పిస్తుంది. మరీ ఖరీదేం కాదు.. ప్రీమియం ఎంత అనేది మీరు నివసించే ప్రాంతం, ఇంటికి భద్రతకు తీసుకున్న చర్యలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా ఇంటి ప్రీమియం విలువలో సీస్మిక్ జోన్.. అంటే భూకంపం రావడానికి ఉండే అవకాశాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్ సీస్మిక్ జోన్3లోకి వస్తుంది. అంటే భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉంటుంది. అదే విశాఖపట్నం వచ్చేసరికి భూకంప అవకాశాలు చాలా తక్కువ. దీని ప్రకారం విశాఖపట్నం కంటే హైదరాబాద్ ఇంటికి ప్రీమియం అధికం ఉంటుంది. కాని హైదరాబాద్‌కు సునామీ ముప్పు లేదు. అదే విశాఖపట్నంకు సునామీ తీవ్రత హెచ్చుగా ఉంటుంది. ఇలా ప్రీమియం లెక్కించేటప్పుడు అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఇవే కాకుండా మీరు తీసుకునే భద్రతా చర్యలు కూడా ప్రీమియంపై ప్రభావం చూపుతాయి. అత్యాధునికమైన లాకర్స్, దొంగతనం జరిగేటప్పుడు, అగ్నిప్రమాదం జరిగేటప్పుడు హెచ్చరించే అలారం వంటివి ఏర్పాటు చేసుకుంటే ప్రీమియం ధరలు తగ్గుతాయి. సాధారణంగా భూకంపం, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు రావడానికి అధిక అవకాశం ఉన్న వాటికి ప్రతీ రూ.1,000లకు రూపాయి ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. మిగిలిన వాటికి 70పైసలు వరకు ఉంటుంది. అదే కంటెంట్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే వస్తువుల విలువను విడివిడిగా లెక్కించి దాని ఆధారంగా బీమా రక్షణ విలువను లెక్కిస్తారు. రైడర్లు ఉన్నాయి.. ఇప్పుడు అన్ని పాలసీలకు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందే రైడర్లను అందిస్తున్నారు. అలాగే హోమ్ ఇన్సూరెన్స్‌లో ఉగ్రవాదుల దాడి, పర్సనల్ యాక్సిడెంట్, సొంతింటి నిర్మా ణం పూర్తి అయ్యే వరకు నివాసము ఉండటానికి అద్దె చెల్లించే విధంగా పలు రైడర్లు అందుబాటులో ఉన్నాయి. అన్నీ డాక్యుమెంట్‌లోనే... పాలసీ డాక్యుమెంట్లో వేటికి బీమా రక్షణ కల్పిస్తారు, వేటికి ఉండదో వివరంగా ఉంటాయి. పాలసీ తీసుకునే ముందు వీటిని ఒకసారి పరిశీలించడం తప్పనిసరి. ఇంటిలో ఉండే నగదు, విలువైన కాగితాలు, బాండ్లు వంటి వాటికి బీమా రక్షణ ఉండదు. వీటిని ఇంటిలోని వారే దొంగలించి పోయినట్లు తప్పుడు క్లెయిమ్‌లకు దరఖాస్తు చేసే అవకాశం ఉండటమే దీనికి కారణం. ఇంటిలోని వస్తువులకు బీమా రక్షణ కల్పించేటప్పుడు ఆ ఇంటికి ఉండే భద్రత వంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే 50 ఏళ్ళు దాటిన ఇంటికి, పదేళ్ళు దాటిన ఎలక్ట్రానిక్ వస్తువులకు బీమా రక్షణను ఇవ్వడానికి కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. ఇంటిలో బంగార వస్తువుల విషయానికి వస్తే.. కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా వీటికి కూడా బీమా రక్షణను పొందవచ్చు. కానీ ఈ ప్రీమియం ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. దాదాపు అన్ని నాన్‌లైఫ్ (సాధారణ) బీమా కంపెనీలు హోమ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాయి. అద్దె ఇంట్లో ఉంటున్న వారు కేవలం కంటెంట్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ప్రభుత్వ రంగ కంపెనీలు న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్, నేషనల్, యునెటైడ్ ఇండియా కంపెనీలతోపాటు ఇఫ్కో టోక్యో, ఐసీసీఐ లాంబార్డ్, టాటాఏఐజీ, బజాజ్ అలయంజ్ వంటి కంపెనీలు దీన్ని అందిస్తున్నాయి. ఇంటి విలువను ఎలా లెక్కిస్తారు? ఇంటి విలువను లెక్కించడంలో స్థలం విలువను పరిగణనలోకి తీసుకోరు. అలాగే బహిరంగ మార్కెట్లో ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు లేదా ఇప్పుడున్న ఇంటిని కూల్చి తిరిగి నిర్మించాలంటే ఎంత వ్యయం అవుతుందన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మీ ఇంటిని 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో(బిల్డప్ ఏరియా) నిర్మించారనుకుందాం. ఇంటి నిర్మాణానికి చదరపు అడుగుకి రూ.1200లు అయితే అప్పుడు మీ ఇంటి విలువ రూ. 12,00,000 అవుతుంది. అంటే గరిష్టంగా రూ.12 లక్షల వరకు బీమా రక్షణ కల్పిస్తాయి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
బిగ్ బీ అమితాబ్‌కు కోపం వచ్చిన వేళ!
ముంబై: మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నేపాల్‌కు అండగా ఉండాలని సోషల్ మీడియా వెబ్‌సైట్స్ ట్విట్టర్, ఫేస్బుక్, బ్లాగ్‌లలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పొరుగుదేశం వారమైన మనం నేపాల్ భూకంప బాధితులకు సహాయం చేయాలని ఆయన కోరారు. అయితే అమితాబ్ విజ్ఞప్తిపై కొందరు సెటైర్లు విసిరారు. ఏదో అజెండా కోసం అమితాబ్ ఇలా చేస్తున్నారని కొందరు నెటిజన్లు విమర్శించారు. నెటిజెన్ల కామెంట్స్‌కు బిగ్ బీ అమితాబ్‌కు కోపం వచ్చింది. వారిపై మండిపడ్డారు. ప్రచారం కోసం ఇలా చేయలేదని వివరించారు. అటువంటి వ్యాఖ్యలు చేసినవారు తమ వైఖరి సరిచేసుకోవాలని అమితాబ్ హితవు పలికారు. -
ఆ 50 మందిలో 38 మంది భారతీయులే!
కఠ్మాండు: గతవారం నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో ఈరోజు వరకు తెలిసిన సమాచారం ప్రకారం మొత్తం 50 మంది విదేశీయులు మృతి చెందారు. 46 మంది విదేశీయులు గాయపడ్డారు. చనిపోయినవారిలో 38 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ హొం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయులు మరో పది మంది గాయపడ్డారు. మొత్తం ఆరు వేల ఆరు వందల మంది మృతి చెందగా, 16వేల 500 మంది గాయపడినట్లు పేర్కొంది. చైనాకు చెందిన ముగ్గురు, ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు, అమెరికాకు చెందిన ముగ్గురు, జపాన్, ఆస్ల్రేలియా, ఇస్తోనియా, స్పెయిన్ దేశాలకు చెందిన ఒక్కొక్కరు మృతి చెందినట్లు హొం శాఖ వివరించింది. గాయపడిన భారతీయులను టీచింగ్ హాస్పటల్, పటాన్ హాస్పటల్లో చేర్చినట్లు తెలిపింది. -
ఎవరెస్ట్‌పై శవాల గుట్టలు
-
ఫేస్బుక్ కలిపింది వారందరినీ!
నేపాల్ భూకంపం బారిన పడిన దాదాపు 70 లక్షల మంది తమ స్నేహితులు, కుటుంబసభ్యులను కలిసేందుకు ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతేకాదు.. బాధితులను ఆదుకునేందుకు రెండు రోజుల్లో దాదాపు రూ. 64 కోట్ల విరాళాలను కూడా ఫేస్బుక్ సేకరించింది. తాము 'సేఫ్టీచెక్' అనే ఆప్షన్‌ను యాక్టివేట్ చేశామని, దాంతో దాదాపు 70 లక్షల మంది సురక్షితంగా ఉన్నట్లు అందులో మార్క్ అయిందని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ చెప్పారు. ఆ విషయాన్ని వాళ్లు దాదాపు 15 కోట్ల మంది స్నేహితులకు, బంధువులకు తెలియజేశారని కూడా వివరించారు. దానివల్ల సహాయ కార్యక్రమాలు చేపట్టడం కూడా సులువైంది. నేపాల్ బాధితులను ఆదుకోడానికి విరాళాలు ఇవ్వాలని ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వగా, రెండు రోజుల్లో దాదాపు రూ. 64 కోట్ల వరకు వసూలయ్యాయి. ఫేస్బుక్ యాజమాన్యం దానికి అదనంగా మరో రూ. 13 కోట్లు విరాళం ఇవ్వనుంది. వాట్సప్ ద్వారా కూడా ఆ ప్రాంతంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుంటూ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. ఇప్పటివరకు నేపాల్ భూకంప విలయంలో సుమారు 6 వేల మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది సుమారు 10 వేల వరకు కూడా చేరొచ్చని అంచనా. -
జెన్ కో విద్యుత్ ఉత్పత్తిపై నేపాల్ భూకంప ప్రభావం
ముత్తుకూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్కో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండో యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. నేపాల్‌ను కుదిపివేసిన భూకంపం ప్రభావం జెన్కో విద్యుత్ ఉత్పత్తిపై పడింది. ఈ కేంద్రానికి అవసరమైన నీరు సముద్రం నుంచి పైపుల ద్వారా సరఫరా చేసుకుంటారు. భూకంప ప్రకంపనల కారణంగా సముద్ర జలాలు కలుషితం కావడంతో మూడు రోజుల క్రితం సరఫరా నిలిపివేసినట్లు ప్రాజెక్టు వర్గాలు తెలిపాయి. సముద్ర జలాలు పూర్వ స్థితికి చేరుకోగానే రెండు, మూడు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి. -
200 అడుగుల ఎత్తునుంచి పడినా..
ఆమె పేరు రమీలా శ్రేష్ఠ (17). స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. కాసేపటి తర్వాత తన బోయ్ ఫ్రెండు సంజీబ్ (17)ను కలిసింది. ఇద్దరూ కలిసి నేపాల్‌లో చారిత్రాత్మకమైన ధరహరా టవర్ వద్దకు వెళ్లారు. వాళ్ల ప్రేమ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. ఆ రోజంతా వాళ్లిద్దరూ కలిసి అక్కడ గడపాలని అనుకున్నారు. ఎనిమిదో అంతస్థులో ఉన్న బాల్కనీ వద్దకు వాళ్లు వెళ్లేసరికి ఆ టవర్ కొద్దిగా ఊగుతున్నట్లు అనిపించింది. కాసేపటికల్లా అక్కడున్నవాళ్లంతా భయంతో కేకలు పెట్టడం మొదలైంది. ప్రేమికులిద్దరూ స్పృహతప్పి 200 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయారు. రమీలా, సంజీబ్లను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వాళ్ల తలకు, వెన్నెముకకు కూడా దెబ్బలు తగిలాయని, దాంతో వాళ్లు మరికొంత కాలం ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్పారు. అయితే.. వాళ్ల ప్రేమ వ్యవహారం మాత్రం ఇద్దరి ఇళ్లలోనూ తెలిసిపోయింది. ఈ విషయాన్ని వాళ్లకు డాక్టర్ సంతోష్ పాండే చెప్పారు. 200 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయినా కూడా ప్రేమజంట ఇద్దరూ ప్రాణాలు నిలుపుకొన్నారు. తమ ప్రేమను కూడా నిలబెట్టుకున్నారు. -
ఐదు రోజులుగా కొన ఊపిరితో శిథిలాల కింద..
కఠ్మాండు: నేపాల్‌లో సహాయక చర్యలకోసం తీవ్రంగా శ్రమిస్తోన్న సైనికుల ముఖాల్లో చిరునవ్వులు పూస్తున్నాయి. వారు మరింత వేగంగా పనిచేయాలన్న ఆలోచనలు వేగం పుంజుకుంటున్నాయి. అందుకు ప్రధాన కారణం.. మృత్యుదిబ్బలా మారిన కఠ్మాండులో శిథిలాల కింద నుంచి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నవారు కొద్ది కొద్దిగా బయటపడుతున్నారు. శరవేగంగా శిథిలాలు తొలగిస్తున్న గాంగ్బూ అనే గ్రామంలో దేవీ ఖాడ్కా (24) అనే మహిళ ప్రాణాలతో బయటపడింది. భూకంపం ధాటికి కుప్పకూలిన జనసేవా అనే అతిథి గృహ శిథిలాల కింద ఆమె పడిపోయింది. అయితే నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇజ్రాయెల్ సైన్యం కలసి అక్కడ శిథిలాలను తొలగించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆమెకు గాయాలు కూడా అయ్యాయి. గత ఏప్రిల్ 25న నేపాల్‌లో రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో భూకంపం సంభవించి 5,000మంది చనిపోగా.. 12,000మందికి పైగా గాయాలయ్యాయి. -
'ప్రాణాలనేవి ఎక్కడున్నాపోతాయి'
-
'ప్రాణాలనేవి ఎక్కడున్నా పోతాయి'
న్యూఢిల్లీ: భూకంప విధ్వంసం కళ్లారా చూసినప్పటికీ ఎవరెస్ట్ ఎక్కాలని ఆశ ఇంకా ఉందని హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ తెలిపారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లి భూకంపంలో చిక్కున్న నీలిమా బృందం శుక్రవారం న్యూఢిల్లీ చేరుకుంది. నీలిమ సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. భూకంపం వచ్చినప్పుడు ఎవరెస్ట్‌పై 4700 అడుగుల ఎత్తులో ఉన్నామని వెల్లడించింది. అయితే భూకంపం వల్ల తాము చేరుకోవాల్సిన బేస్ క్యాంప్ ధ్వంసమైందని పేర్కొంది. పెద్ద ఎత్తున మంచు చరియలు విరిగిపడ్డాయని చెప్పారు. అదృష్టం కొద్ది మే బేస్ క్యాంపునకు కొద్ది దూరంలో ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డామన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎవరెస్ట్ నుంచి కిందకి దిగామని చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న ఎయిర్‌ఫోర్స్ వారు తమ బృందాన్ని కాఠ్మండ్ చేర్చారని ఆమె వివరించారు. ప్రాణాలు అనేవి ఎక్కడున్న పోతాయని... అయితే తన సాహస యాత్రను కొనసాగించి...ఈ సారి ఎవరెస్ట్ ఎక్కి తీరుతానని నీలిమ స్పష్టం చేశారు. ఈనెల 18 వ తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ.. మరికొన్ని గంటల్లో ఎవరెస్ట్‌పైనున్న టింగ్‌బోచి అనే బేస్‌క్యాంప్‌నకు చేరుకుంటారనగా... భూకంపం సంభవించడంతో బేస్ క్యాంప్ వద్ద చిక్కుకున్న సంగతి తెలిసిందే. -
మృత్యుంజయుడు
నేపాల్‌ను కుదిపేసి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న శనివారం నాటి భూకంప విలయం నుంచి క్షేమంగా బయటపడిన బుడతడు వీడు. సోనిత్ అవల్ అనే ఈ నాలుగు నెలల పిల్లాడిని భక్తాపూర్‌లోని ఓ ఇంటి శకలాలను తొలగించి ఆదివారం వెలికితీశారు. 20 గంటలపాటు శిథిలాల కింద ఉన్నా కూడా.. బాలుడు సురక్షితంగా బయటపడటంతో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని గురువారం విడుదల చేశారు. -
దేవుడిపైనే భారం వేశాం
- కళ్ల ముందే అంతా కకావికలం - స్వల్పగాయాలతో బయటపడ్డాం - నాలుగు రోజులు నరకం చూశాం - లింగాపూర్ చేరిన నేపాల్ భూకంపం బాధిత కుటుంబం గాయాలతో ఇల్లు చేరిన కల్యాణం మలయ్య బతుకుతామని అనుకోలేదు నా కుమారులు, కోడళ్లు పదేళ్లుగా నేపాల్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటుండ్రు. నెల రోజుల క్రితం పశుపతినాథ్ ఆలయం యాత్ర కోసం నేపాల్‌లో ఉంటున్న నా కొడుకుల వద్దకు వెళ్లిన. ఈ నెల 25న ఇంటినుంచి బీడి కోసం దుకాణం వెళ్లిన. తిరిగి వస్తుండగా ఒక్కసారిగా భూకంపం వచ్చింది. రెండుసార్లు కింద పడ్డాను. పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలి నాపై పడింది. కుడి కాలు, చేయి విరిగినయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భూకంపం వచ్చిందని తెలిసి గుండె ఆగినంత పనయింది. దేవునిపై భారం వేసి బతికి బయటపడ్డాం. - బిక్కుబిక్కుమంటూ గడిపాం - స్వగ్రామానికి చేరుకున్న భూకంప బాధితులు మానకొండూర్ : నేపాల్ రాజధ ాని కాఠ్మాండులో 25న భూకంపంలో చిక్కుకున్నప్పుడు దేవుడిపైనే భారంవేసి బిక్కుబిక్కుమంటూ గడిపామని మానకొండూర్ మండలం లింగాపూర్‌కు చెందిన బాధితులు తెలిపారు. ఈ గ్రామం నుంచి వెళ్లిన వారిలో భూకంపం ప్రభావంతో 62 మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడి బుధవారం స్వగ్రామం చేరిన వీరు ఆనాటి భయంకర పరిస్థితులను ‘సాక్షి’తో పంచుకున్నారు. లింగాపూర్‌కు చెందిన పలువురు బుడిగజంగాల వారు బతుకుదెరువు కోసం నేపాల్‌లోని సీనమంగల, కాఠ్మాండు, పురాణబాసి, బీంసింగ్‌కోలా తదితర పట్టణాల్లో జ్యోతిష్యం, ఉంగరాలు అమ్ముతూ కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. భూకంపం సంభవించి మోటం విజయ్, కిన్నెర లక్ష్మి, మోటం సంపత్, మోటం సురేశ్, ఓర రాజేశ్‌తోపాటు మరో 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి బయటపడి బిక్కుబిక్కుమంటూ నాలుగు రోజులపాటు గడిపిన వీరు ఎలాగోలా బయటపడి స్వగ్రామాలకు బుధవారం చేరుకున్నారు. కొందరు దేవుడిపై భారం వేసి అక్కడే ఉండి పోగా, మరికొందరు రైలు ద్వారా గురువారం చేరుకోనున్నారని బాధితుడు మల్లయ్య తెలిపాడు. ఇదే గ్రామానికి చెందిన కల్యాణం మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కుడి కాలు, కుడి చేయి విరిగింది. మల్లయ్య కుమారుడు శ్రీనివాస్, కోడలు లక్ష్మి, శ్రీనివాస్ కుమారుడు మహేశ్, కూతురు అనూష, శ్రీనివాస్ అన్న కుమారుడు వెంకటేశ్ మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో కఠ్మాండు నుంచి ఢిల్లీకి చేరుకుని, అక్కడినుంచి విమానంలో మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బస్సులో కరీంనగర్‌కు చేరుకుని బుధవారం ఉదయం స్వగ్రామానికి వచ్చారు. నేపాల్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆనందం నింపింది. -
పాపఫలమే భూకంపమన్న మన గాంధీ
న్యూఢిల్లీ: భీకర భూకంపంతో కుప్పకూలిన కఠ్మాండులో సరైన సహాయక చర్యలు అందక అక్కడి ప్రజలు అలమటిస్తుంటే భారత్‌లో మాత్రం భూకంపానికి మత విశ్వాసాలకు ముడిపెడుతూ మత ఛాందసవాదులు పెను భూకంపాన్ని సృష్టిస్తున్నారు. రాహుల్ గాంధీ కేదార్నాథ్ సందర్శించడం వల్లనే భూకంపం వచ్చిందని విశ్వహిందూ పరిషద్ కార్యకర్త సాధ్వీ ప్రచీ ఆరోపించగా, బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ మరో అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ ‘మాంసం’తినడం వల్లనే భూకంపం వచ్చిందని తీర్మానించారు. ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం నేపాల్ అని, క్రైస్తవ మిషనరీలను ఆ భూభాగంతో పెరిగిపోతుండడం వల్లనే భూకంపం వచ్చిందని ‘ఇండియా ఫ్యాక్ట్స్’ చీఫ్ ఎడిటర్ సందీప్ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టే ఇలాంటి రాజకీయాలు భారత్‌కు ఇప్పుడే కొత్త కాదు. ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్నవే. 1934లో పెను భూకంపం నేపాల్‌తోపాటు బీహార్‌ను తీవ్రంగా దెబ్బతీసినప్పుడు సాక్షాత్తు మన జాతిపిత మహాత్మ గాంధీయే ఇలాంటి రాజకీయాలకు తెరతీశారు. హరిజనులను అంటరానివారిగా చూస్తూ పాపం మూటకట్టుకున్నందుకే ఆ భగవంతుడు బీహార్‌కు ఈ విధంగా శిక్ష విధించారని ఆ భూకంపంపై ఆయన ఆనాడు వ్యాఖ్యలు చేశారు. గాంధీకి ‘మహాత్మా’అని బిరుదును తగిలించిన గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూరే ఆయన వ్యాఖ్యలతో విభేదించారు. అప్పుడు వారిద్దరి మధ్య కొనసాగిన ఉత్తరప్రత్యుత్తరాలు బహిరంగ చర్చకు దారి తీశాయి. గాంధీ వ్యాఖ్యలు ఖండిస్తూ టాగూర్ రాసిన లేఖను గాంధీ సంపాదకత్వంలో వెలువడుతున్న ‘హరిజన్’ పత్రికలో ప్రచురించాలని కూడా టాగూర్ కోరారు. ఆయన కోరిక మేరకు గాంధీజీ ‘హరిజన్’ పత్రికలో ఆ లేఖను ప్రచురించారు. ‘ నైతిక విలువలకు, భూకంపాలకు ముడిపెడుతున్న మీ అహేతుక వ్యాఖ్యలను చూసి దిగ్భ్రాంతి చెందాను. ఇవి ప్రజల్లో మూఢ విశ్వాసాలను మరింత పెంచేందుకు దోహదపడతాయి’ అని టాగూర్ ఆ లేఖలో వ్యాఖ్యానించారు. ఆ లేఖకు గాంధీ సమాధానమిస్తూ ‘నేను భగవంతుడి విశ్వసిస్తా. అలా అని ఆయనెక్కడున్నాడో నిరూపించమంటే నిరూపించలేదు. భూకంపాలకు శాస్రవిజ్ఞాన కారణాలేమిటో కూడా నాకు తెలియవు. బీహార్ ప్రజలు, హరిజనులను అంటరానివారుగా చూసినందుకే ఆ భగవంతుడు వారికా శిక్ష విధించారన్నది నా విశ్వాసం’ గాంధీజీ వ్యాఖ్యానించారు. గాంధీజీ నాడు అర్థంలేని వ్యాఖ్యలు చేసినా వాటి వెనుకనున్న ఆయన సదుద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ నేడు శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అహేతుక ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్న మత ఛాందసవాదుల ఉద్దేశాలనే లోతుగా తరచి చూడాల్సిన అవసరం ఉంది. -
మాంసాహారం పంపించిన వివాదంలో పాక్
కఠ్మాండు: సాయం చేసే విషయంలోనూ పాకిస్థాన్ వివాదంలోకి ఎక్కింది. అసలే భారీ భూకంపం సంభవించి పుట్టెడు దుఃఖంలో ఉన్న నేపాల్ ఉండగా అత్యధికంగా హిందువుల జనాభా ఉన్న ఆ దేశానికి పాక్ సాయంపేరిట భారీ మొత్తంలో మసాల దట్టించిన మాంసాహారాన్ని పంపించి వార్తల్లో నిలిచింది. దీనిపై చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు ది డెయిలీ మెయిల్ వెల్లడించింది. హిందువుల జనాభా ఎక్కువగా ఉన్న నేపాల్‌లో గోవులను పవిత్రమైనవిగా భావిస్తారు. గోవధను కొన్ని మత సంఘాలు ఒప్పుకోవు కూడా. రిపబ్లిక్ రాజ్యంగా అవతరించే వరకు కూడా ప్రపంచంలో ఏకైక హిందు దేశం కూడా అదే. అలాంటిది ప్రస్తుతం పాక్ చేసిన ఈ చర్య కారణంగాసార్క్ దేశాలమధ్య ఓ చర్చకు తావిచ్చి వివాదం నెలకొనే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వైద్య సేవలు అందించేందుకు వెళ్లి ప్రస్తుతం బిర్ అనే ఆస్పత్రిలో నేపాల్ వారికి చికిత్స చేస్తున్న భారతీయ వైద్యులు ఈ విషయంపై మాట్లాడుతూ మంగళవారం పాక్ పంపించిన ఆహార పదార్థాల్లో బీఫ్ మసాల ప్యాకెట్లు ఉన్నాయని చెప్పారు. వాటిని తాము ముట్టుకోలేదని, ప్రారంభంలో అది తెలియని స్థానికులు తీసుకున్నా తర్వాత తెలుసుకొని పక్కన పడేశారని చెప్పారు. కాగా, ఈ విషయాన్ని ఇప్పుడప్పుడే అంతగా చర్చించకపోయినప్పటికీ తర్వాత జరిగే ద్వైపాక్షిక చర్చల సమయంలో నేపాల్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
బైక్ ఆసరాతో బతికి.. ఐదు రోజుల తర్వాత బయటకు
కఠ్మాండు: పెను భూకంపం తాకిడికి దెబ్బతిన్న నేపాల్ శిథిలాల నుంచి చనిపోయిన వారి మృతదేహాలే కాదు.. కొన ఊపిరితో ఉన్నవారు కూడా బయటపడుతున్నారు. దాదాపు ఐదు రోజులు గడిచిన తర్వాత భారీ శిథిలాల కిందనుంచి గురువారం ఓ పద్దెనిమిదేళ్ల యువకుడిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. పెంబా తమాంగ్ అనే యువకుడు భూకంపం వచ్చిన సమయంలో కూలిపోయిన తొమ్మిది అంతస్థుల భవనం కింద పడిపోయాడు. భవనం కూలిన సమయంలో ఓ బైక్‌ను ఆసరాగా చేసుకొని దానికింద ఐదురోజులుగా ప్రాణాలు నిలుపుకున్నాడు. రోజువారిగా సహాయక చర్యలు చేపడుతున్నసిబ్బందికి దాహం దాహం అంటూ అతడి కేకలు వినిపించడంతో దాదాపు ఐదుగంటలపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అతడికి అక్కడక్కడా గాయాలయ్యాయి. -
డర్టీ సెల్ఫీ..
ఈ మధ్యకాలంలో మనుషులు సరిగా కనిపించకపోయినా..వారిచేతిలో స్మార్ట్ ఫోన్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కూడా వారి తలకంటే ఎత్తుగా.. అద్దంలో చూసుకుంటున్నట్లుగా.. దానికి ముద్దుగా వారు పెట్టుకున్న పేరు సెల్ఫీ. గతంలో అవతలి వ్యక్తికి నష్టం జరిగాక మాత్రమే ఎదుటవారి స్వార్థం తెలిసేది. కానీ, ఇప్పుడు మాత్రం నష్టం జరుగుతుండగానే తెలుస్తోంది. అది కూడా ఎంతటి భయంకరమైన స్వార్థమో చెప్పేందుకు తాజా సెల్ఫీలే ఉదాహరణ. మానవత్వం పనిచేయాల్సిన చోట కూడా వెర్రి వేశాలు, తిక్క చేష్టలు, ఆలోచన లేని పనులు ఈ సెల్ఫీల ద్వారా ఆవిష్కృతమవుతున్నాయి. అది ఎంతగా అంటే కళ్లేదుటే ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు. అక్కడా ఇక్కడా ఎక్కడా అనే సందర్భమే లేకుండా కొన ఊపిరితో కొట్టుకునేవారి నుంచి చచ్చిన శవాన్ని సైతం వదిలిపెట్టడం లేదు. ఎదుటవారిని బాధను, నిస్సహయతను వినోద వస్తువులుగా.. ఫొటోలకు పనికొచ్చే పనిముట్లుగా భావించి సెల్ఫీలంటూ ఫొటోలు తీస్తున్నారే తప్ప మానవత్వాన్ని మాత్రం ప్రదర్శించలేదు. నేపాల్‌ను భూప్రళయం అతలాకుతలం చేసి శవాల దిబ్బగా మారిస్తే...మరికొందరు మహరాజులు మాత్రం...నవ్విపోదురు నాకేంటి అన్నట్లు విషాదానికి చిహ్నంగా మిగిలిన చారిత్రక శిథిలాల దగ్గర పళ్లికిలిస్తూ ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌ల్లో పోస్ట్ చేయటం చూస్తుంటే మనం ఎటు పోతున్నామనే అనుమానం వస్తోంది. తాజాగా నేపాల్ భూకంప సమయంలో కూడా ఇలాంటి దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఇటువంటి సంఘటనలు చూస్తుంటే మనం ఎటువైపు వెళ్తున్నామా అనే అనుమానం వస్తోంది. సెల్ఫీలు..'సెల్ఫీ'ష్కు నిదర్శనంగా మారిందా అని ప్రశ్నించుకోక తప్పదు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే... చుట్ట వెలిగించుకోవటానికి నిప్పు అడిగాడట ఇంకొకడు అన్న సామెతలాగా.. ఓవైపు ప్రాణాలు పోతున్నా...కాపాడాలనే స్పృహ లేనంతగా సెల్ఫీ పిచ్చి ముదిరిపోయింది. మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడు మనిషన్నవాడు అన్నట్లు... మనిషి నైతిక విలువలకు తిలోదకాలిస్తూ..ఆపదలో ఉండేవారికి కాపాడాలనే ఇంగిత జ్ఞానాన్ని కూడా మరిచిపోతున్నారు. సెల్ఫీకి ఉపయోగించే సమయాన్ని నా కోసం కాకుండా మన కోసం అనేదానికి వినియోగిస్తే.. వచ్చే ఆత్మ తృప్తి ఎంత డబ్బుపెట్టి కొన్నా రాదనేది సత్యం. ఆస్తులు రాసివ్వడమే.. అవసరానికి అప్పు ఇవ్వటమో కాదు...జస్ట్ రోడ్డు దాటలేని వారికి చేయిచ్చి...వారిని రోడ్డు దాటించి చూడంది. అప్పుడు మనకు కలిసే సంతృప్తి దేనితోనూ కొలవలేము. సెల్ఫీ అంటే నిన్ను నీవు తీసుకోవటం కాదు. నిన్ను కాకుండా నీ మనసును టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. అలా కాకుంటే చివరికి మిగిలేది డర్టీ సెల్ఫీనే. (వెబ్ సైట్ ప్రత్యేకం) -
ఎటకారం సినిమా విజయ్ కి అంకితం
గుంటూరు : నేపాల్ భూకంప దుర్ఘటనలో మృతి చెందిన ఎటకారం సినిమా నటుడు విజయ్ సింగ్ అంత్యక్రియలు గురువారం బాపట్లలో జరిగాయి. అంతకు ముందు విజయ్ సింగ్ భౌతికకాయానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి నివాళులు అర్పించారు. అలాగే ఎటకారం చిత్ర యూనిట్ కూడా విజయ్‌కు ఘనంగా అంజలి ఘటించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కిషన్ మాట్లాడుతూ ఎటకారం సినిమాను విజయ్ సింగ్‌కు అంకితమిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు వచ్చే లాభంలో కొంత మొత్తాన్ని విజయ్ సింగ్ కుటుంబానికి ఇస్తామని ఆయన తెలిపారు. -
రాజధాని వీధుల్లో ఆ విద్యార్థులు
న్యూఢిల్లీ: వారంతా నేపాల్ విద్యార్థులు. హాయిగా చదువుకుని సాయం కాలంలో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేవారు. కానీ. ఇప్పుడు మాత్రం భారత రాజధాని వీధుల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకని అనుకుంటున్నారా.. భారీ భూకంపం పంజా విసరడంతో సర్వం కోల్పోయి విలవిళ్లాడుతున్న తమవారికి సాయం చేసేందుకు. ఉదయం చదువుకుని సాయంత్రం పూట దాతృత్వ విరాళాలు సేకరించేందుకు ఢిల్లీ నగర వీధులను చుట్టేస్తున్నారు. గత శనివారం భారీ భూకంపం సంభవించి నేపాల్ భారీ స్థాయిలో నష్టాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. దాని దెబ్బకి అక్కడి ప్రజల గూడు చెదిరి గుండెపగిలి చివరికి కూడు కూడా కరువైంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు సాయం చేస్తున్నట్లుగానే తమవారిని ఆదుకునేందుకు తమ వంతుగా ఢిల్లీలోని ఓ కాలేజీలో చార్టెడ్ అకౌంటెంట్ విద్యను అభ్యసిస్తున్న ప్రజ్వల్ బాస్నెట్ అనే విద్యార్ధి మరో ఆరుగురి సాయంతో ఓ గ్రూపుగా ఏర్పడి మొత్తం 500 మంది విద్యార్థులను స్వచ్ఛందంగా చేర్చుకొని విరాళాలు నగదు రూపంలో వస్తువుల రూపంలో, ఆహార పదార్థాల రూపంలో సేకరిస్తున్నారు. ఇప్పటికే మొదటి దఫా సాయాన్ని అందించారు కూడా. -
500 ఏళ్ల చారిత్ర - కఠ్మాండు పేరు ఏర్పడిన కట్టడం
కఠ్మాండు: భూకంపం ధాటికి ప్రఖ్యాత 'కష్టమండప' దేవాలయం నేలమట్టమైంది. దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక నిర్మాణం పేరుపైనే నేపాల్ రాజధానికి కఠ్మాండు అనే పేరు వచ్చింది. భూకంపం వచ్చినరోజే దర్బారా స్వ్కేర్ దగ్గరలో ఉన్న ఆ గుడి ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దాంతో దేవాలయ శిధిలాల కిందపడి రక్తదాతలు, నర్సులు దుర్మరణం చెందారు. గతంలో భూకంపాన్ని తట్టుకున్న చరిత్ర దీనికి ఉంది. దాంతో పలువురు ఈ నిర్మాణంలోనికి పరిగెత్తుకువచ్చారు. భూకం తీవ్రతకు ఆలయం కూలిపోయింది. వారంతా శిధిలాల కింద ప్రాణాలు కోల్పోయారు. -
నేపాల్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్టర్!
-
శివాగ్రహమా?
-
జోలె పట్టిన హీరోలు.. హీరోయిన్లు
రణ్‌బీర్ కపూర్, కరణ్ జోహార్, అనుష్కాశర్మ, ప్రీతిజింటా.. వీళ్లందరిలో ఎవరికీ డబ్బుకు కొదవలేదు. అయినా అంతా కలిసి జోలె పట్టి భిక్షాటనకు బయల్దేరారు. ఇదేదో సినిమా షూటింగ్ అనుకుంటున్నారా.. కాదు. నేపాల్ బాధితులను ఆదుకోడానికి విరాళాలు సేకరించేందుకు కేర్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి స్టార్ ఇండియా సంస్థ చేపట్టిన కార్యక్రమానికి వీళ్లంతా తమవంతు సాయం అందిస్తున్నారు. 'పొరుగువారికి పొరుగువాళ్లే సాయం చేయగలరు' అనే నినాదంతో దేశవ్యాప్తంగా వీళ్లంతా కలిసి ఓ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు నేరుగా ఆన్లైన్లో విరాళాలు ఇవ్వచ్చు లేదా చెకకులు, డీడీలను కూడా పంపొచ్చు. భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ మైత్రి'తో పాటే ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. -
ఈసీఆర్ ఔదర్యం
పాట్నా: నేపాల్ నుంచి వచ్చే భూకంప బాధితులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు తూర్పు సెంట్రల్ రైల్వే(ఈసీఆర్) ఔదర్యం చూపింది. బాధితుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయకుండా ఉచితంగా తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం జీరో వేల్యూ టిక్కెట్లు అందుబాటులోకి తెచ్చినట్టు ఈసీఆర్ జనరల్ మేనేజర్ ఏకే మిట్టల్ తెలిపారు. 7 వేల మంది బాధితుల కోసం ఈ టిక్కెట్లు ప్రవేశపెట్టామని చెప్పారు. నేపాల్ నుంచి వచ్చే భూకంప బాధితుల కోసం సరిహద్దులోని రాజ్సాల్, జయనగర్, సీతామార్చి రైల్వేస్టేషన్లలో ఈ టిక్కట్లు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. బాధితులు జీరో వేల్యూ టిక్కెట్లతో ఉచితంగా రైల్లో ప్రయాణించవచ్చని వివరించారు. -
భూకంపం నుంచి బయటపడ్డ హీరోయిన్
కాఠ్మండు: నేపాల్ సంభవించిన భారీ భూకంపం నుంచి సినీ నటి కవితా శ్రీనివాసన్ తృటిలో తప్పించుకున్నారు. భూకంపం వచ్చిన రోజు (శనివారం) కవిత కాఠ్మండులో ఉన్నారు. 'మేం మూడో ఫ్లోర్లో ఉన్నాం. భూప్రకంపనల ధాటికి గదిలో అటూఇటూ ఊగిపోయాం. క్షేమంగా బయటపడతామని ఊహించలేదు. రాత్రంతా విద్యుత్, నీరు, ఫోన్ లేకుండా గడిపాం. మేం ప్రాణాలతోనే ఉన్నాం. కష్టకాలంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు' అని కవిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాళీచరణ్ అనే తెలుగు సినిమాలో కవిత నటించారు. 2013లో ఈ సినిమా విడుదలైంది. మరో తమిళ చిత్రంలో కూడా నటించారు. అనంతరం వివాహం చేసుకున్న కవిత కొన్ని నెలల క్రితం నేపాల్ వెళ్లింది. కాఠ్మండులో నివసిస్తున్న కవిత.. పెను విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన తర్వాత తాను క్షేమంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో బంధువులు, స్నేహితులకు తెలియజేశారు. -
'సినిమా కలెక్షన్లు ఇస్తామనలేదు'
ముంబై: నేపాల్ బాధితుల కోసం 'గబ్బర్' సినిమా మొదటి రోజు కలెక్షన్లు విరాళంగా ఇవ్వనున్నట్టు వచ్చిన వదంతులను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తోసిపుచ్చాడు. దీని గురించి తాను ఎటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశాడు. ఇలాంటి నిర్ణయాలు నిర్మాత తీసుకోవాల్సి ఉంటుందని, ఈ సినిమాకు తాను నిర్మాతను కాదని అన్నాడు. తాను సహాయం చేయాలనుకుంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడబోనని ట్విటర్ లో పేర్కొన్నాడు. నేపాల్ భూకంప బాధితులకు సహాయం చేయాలనుకునే వారికోసం ఏర్పాటు చేసిన ఫేస్ బుక్ లింకును తన ట్విటర్ లో పెట్టాడు. అక్షయ్ కుమార్, శృతిహాసన్ జంటగా నటించిన 'గబ్బర్' సినిమా మే 1న విడుదల కానుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంజయ్ లీలా బన్సాలీ, వయకోమ్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. 2002లో తమిళంలో వచ్చిన 'రమణ' సినిమాకు ఇది రీమేక్. Heard a rumour that I am donating #GabbarIsBack's 1st day collections to the #NepalEarthquake victims. (cont) http://t.co/NMjqMOcJlw — Akshay Kumar (@akshaykumar) April 28, 2015 -
కొండచరియల రూపంలో పొంచి ఉన్న ముప్పు!
వాషింగ్టన్: నేపాల్‌కు కొండచరియల రూపంలో ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నెల 25, 26 తేదీలలో నేపాల్‌లో అనేకసార్లు భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. శక్తివంతమైన ఈ భూకంపం ధాటికి పర్వతాలన్నీ కదిలిపోయాయి. వచ్చే వర్షాకాలంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. -
'మూత్రం తాగి ప్రాణాలు నిలుపుకున్నా'
కఠ్మాండు: భూవిలయంతో అతలాకుతలం నేపాల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని సహాయక బృందాలు కాపాడాయి. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి కఠ్మాండులో శిథిలాల నుంచి బయటపడిన రిషి ఖనాల్ అనే బాధితుడు చెప్పిన విషయాలు దిగ్బ్రాంతి కలిగించాయి. శిథిలాల కింద చిక్కుకున్న తాను ప్రాణాలు నిలుపుకునేందుకు మూత్రం తాగానని వెల్లడించాడు. శవాల మధ్య బిక్కుబిక్కు మంటూ గడిపానని తెలిపాడు. మృతదేహాల నుంచి వస్తున్న దుర్గంధాన్ని భరిస్తూ సహాయం కోసం ఎదురు చూశానని చెప్పాడు. ఫ్రెంచ్ దేశానికి చెందిన సహాయక బృందం అతడిని గుర్తించి కాపాడింది. శిథిలాల నుంచి బయటపడిన రిషి ఖనాల్ పెదవులు పగిలిపోయి, గోళ్లు పాలిపోయి దీనంగా కనిపించాడు. కఠ్మాండు లో కూలిపోయిన ఓ హోటల్ కింద అతడు దాదాపు 82 గంటల పాటు చిక్కుకున్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
హైదరాబాద్ కు నటుడు విజయ్ మృతదేహం
హైదరాబాద్ : నేపాల్ భూకంపంలో దుర్మరణం చెందిన 'ఎటకారం' నటుడు (25) విజయ్ మృతదేహం బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అనంతరం మృతదేహాన్ని విజయ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని బాపట్లకు తరిలిస్తారు. కాగా ఎటకారం చిత్రం షూటింగ్ ముగించుకుని వీరు తిరిగి వస్తుండగా భూకంపం వచ్చింది. దాంతో వీరు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టడంతో విజయ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిత్యపూజ కంబైన్స్ పతాకంపై వీరేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎటకారం' చిత్రానికి సంబంధించి పాటల షూటింగ్ కోసం గతవారం నేపాల్ వెళ్లిన యూనిట్ సభ్యులు అక్కడ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కాగా విజయ్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప తెలిపారు. ఇప్పటివరకు నేపాల్ నుంచి 93 మందిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. -
నేపాల్‌కు తెలుగు హీరో సహాయం
చెన్నై: నేపాల్‌కు తనవంతు సహాయం అందించేందుకు ప్రముఖ సినీ నటుడు, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ముందుకొచ్చారు. ఆయన అపోలో ఆస్పత్రి సహాయంతో నేపాల్‌కు సాయమందించనున్నారు. నేపాల్ కు సహాయం అందించేందుకు ముందుకొచ్చిన తెలుగు హీరోల్లో రామ్ చరణ్ మొదటివారు. 'ఆపోలో ఆస్పత్రి సహాయంతో సినీనటుడు రామ్ చరణ్ తేజ నేపాల్ భూకంప బాధితులకు ఓఆర్ఎస్, గ్లూకోజ్ ప్యాకెట్లు, దగ్గు టానిక్‌లు పంపించనున్నారు' అని ఆయన మీడియా కార్యదర్శి తెలిపారు. కాగా, రామ్ చరణ్‌తోపాటు ఆయన తండ్రి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు కూడా నేపాల్ సహాయం అందించేందుకు జతకట్టనుందని సమాచారం. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రం షూటింగ్‌తో రామ్ చరణ్ తీరిక లేకుండా ఉన్నారు. -
నేపాల్‌కు గూర్ఖా సైన్యం కూడా..
న్యూఢిల్లీ: భూకంపం బారిన పడిన నేపాల్‌కు సహాయక చర్యలు అందించడంలో భారత్ శరవేగంగా కదులుతోంది. ఇప్పటికే తన సైన్యాన్ని నేపాల్‌లో సహాయక చర్యలకోసం పంపించిన భారత్ గూర్ఖా సైనికులను కూడా పంపించింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రకటించింది. ఈ నెల 25న రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో భూకంపం సంభవించి నేపాల్ పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ దేశానికి సహాయక చర్యలు అందించడంలో మిగతా దేశాల కన్నా భారతే ముందుంది. యుద్ధ సమయంలో ధైర్య సాహసాలతో ముందుకు వెళ్లడం గూర్ఖా సైన్యం ప్రత్యేకత. నేపాల్ సంతతికి చెందిన వీరు భారత్ పౌరసత్వాన్ని పొందడం ద్వారా భారత సైన్యంలో చేరతారు. క్లిష్ట సమయాల్లో చాలా చురుకుగా సేవలు అందిస్తారు. -
ఇది నాకు పునర్జన్మ : సందీప్‌రెడ్డి
శాతవాహన యూనివర్సిటీ : నేపాల్‌ను భయబ్రాంతులకు గురిచేసిన భూకంప ప్రదేశం నుంచి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి సురక్షితంగా తల్లిదండ్రుల ఒడిచేరారు. కళ్లెదుటే భవనాలు ఊగిపోతుంటే.. తమకెక్కడ ముప్పు వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని మంగళవారం మీడియూ ఎదుట వెల్లడించారు. వివరాలు ఇవీ.. కరీంనగర్ నగరానికి చెందిన కె.సందీప్‌రెడ్డి కఠ్మాండు సమీపంలో బరత్పూర్, చింతవాన్లో కాలేజ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. శనివారం ఒక్కసారిగి భూకంపం రావడంతో హడలిపోయాడు. ఆరోజు సెలవు దినం కావడంతో కళాశాలలో ఎవరూ లేరు. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు భూకంప ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో అందరూ అప్రమత్తమయ్యూరు. మెడికల్ కళాశాలలోని వ్యాధిగ్రస్తులు, విద్యార్థులను యూజమాన్యం డేరాల్లోకి తరలించింది. ముందస్తు హెచ్చరికలతోనే వారు ప్రాణాలతో గట్టెక్కారు. అధికారులు కేటాయించిన వాహనాల సాయంతో ఆదివారం గోరఖ్‌పూర్ చేరుకున్నారు. సోమవారం న్యూఢిల్లీ చేరిన వారిని ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ తరలించారు. అందులోని సందీప్‌రెడ్డి మంగళవారం కరీంనగర్ చేరి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి ఇరవై ఐదుగురు అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇండియన్ ఎంబసీతోపాటు, కళాశాల యాజమాన్యంతో ప్రతీరెండుగంటలకోఆరి మాట్లాడారు. దీంతో బాధితులను తక్షణమే సొంతప్రాంతాలకు తరలించారు. కాగా, తామున్న ప్రదేశంలో ప్రాణనష్టం జరగకపోయినా కళ్లెదుటే భవనాలు పగుళ్లు చూపడం, గాలికి చెట్టు ఊగినట్లు భవనాలు ఊగిపోవడం చూస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని సందీప్‌రెడ్డి తన అనుభూతి వెల్లడించారు. భూకంపం ప్రభావం నుంచి తప్పించుకోవడం తనకు పునర్జన్మనిచ్చినట్లయిందని ఆనందం వ్యక్తం చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక వైద్యవిద్య చదివేందుకు అక్కడకు వెళ్తానని ఆయన చెప్పారు. -
నేపాల్‌లో బిక్కుబిక్కుమంటున్న ’ఎటకారం’ టీం
-
భూకంపం ముందు...భూకంపం తర్వాత
-
నేపాల్ ప్రాణనష్టం 10 వేలు!
భూకంప మృతులపై ప్రధాని కొయిరాలా అంచనా దేశ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ సాయం కోసం విజ్ఞప్తి సహాయ చర్యలు అత్యుత్తమంగా లేవని అసంతృప్తి కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్ భూవిలయంలో మృతుల సంఖ్య 10 వేల వరకు ఉండొచ్చని ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాలా వెల్లడించారు. నేపాల్‌లోని భారత్, చైనా, అమెరికా రాయబారులతో మంగళవారం సమావేశమైన కొయిరాలా.. శనివారం నాటి భూకంపంలో ఇప్పటివరకు దాదాపు 4,400 మంది చనిపోయారని, ఇంకా వేలాది మంది జాడ తెలియడం లేదని, తీవ్రంగా గాయపడిన వారు కూడా వందల్లోనే ఉన్నారని వివరించారు. వీటితో పాటు మంచు చరియల కింద కూరుకుపోయిన చిన్న చిన్న జనావాసాల్లోని మృతుల వివరాలన్నీ వెల్లడైతే.. మొత్తం మృతుల సంఖ్య 10 వేలకు చేరుతుందని భావిస్తున్నామన్నారు. సహాయ చర్యల కోసం తక్షణ సాయంతో పాటు, దేశ పునర్నిర్మాణం కోసం విస్తృత స్థాయిలో అంతర్జాతీయ సహకారం అవసరమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ మైత్రి’ పేరుతో భారత్ అందిస్తున్న సాయం వివరాలను కొయిరాలాకు భారత రాయబారి రంజిత్ రాయ్ తెలిపారు. సంక్షోభ సమయంలో నేపాల్‌కు అండగా నిలిచిన భారత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచ స్థాయి నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని అమెరికా కొనియాడగా, భారత్ అందిస్తున్న సాయంపై నేపాల్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. కఠ్మాండులో ప్రజలు భారత్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు, నేపాల్ మరో పొరుగుదేశం చైనా కూడా సహాయ, రక్షక చర్యల్లో చురుగ్గా పాలుపంచుకుంటోంది. రక్షక సిబ్బందిని, సహాయ సామగ్రిని పెద్ద ఎత్తున నేపాల్‌కు పంపించింది. నేపాల్ సంక్షోభంపై చర్చించేందుకు కొయిరాలా మంగళవారం అఖిల పక్ష నేతలతో సమావేశమయ్యారు. సాధ్యమైనంత వరకు అవసరమైన వారికి ఆహారం, తాగునీరు, ఔషధాలు, దుప్పట్లు మొదలైన నిత్యావసరాలను పంపిస్తున్నప్పటికీ.. బాధితులందరినీ ఆదుకునే స్థాయిలో సహాయ సామగ్రి, సిబ్బంది ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదని వారికి వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని బాధితులకు సాయం అందడం లేదన్నారు. భూకంప అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా నేపాల్‌లోని 9 జిల్లాలను నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భూకంప బాధితుల సహాయార్థం భారత జాతీయ విపత్తు స్పందన దళానికి(ఎన్డీఆర్ఎఫ్) చెందిన మరో ఆరు బృందాలను మంగళవారం భారత్ నేపాల్‌కు పంపించింది. ఇప్పటికే పది బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఒక్కో బృందంలో సుమారు 45 మంది ఉంటారు. ఇప్పటివరకు ఈ బృందాలు శిథిలాల నుంచి 11 మందిని రక్షించాయి. 73 మృతదేహాలను వెలికితీశాయి. ఏ ప్రాంతాలకు సహాయ బృందాలను పంపాలనే విషయాన్ని నిర్ధారించేందుకు భారత్ నుంచి వెళ్లిన మానవరహిత విమానాన్ని వినియోగిస్తున్నారు. భూకంప కేంద్రమైన గోర్ఖా జిల్లాలో భారత సైనికులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. భారత్‌లో మృతులు 75 భారత్‌లో భూకంప మృతుల సంఖ్య 75కి చేరింది. వారిలో 58 మంది ఒక్క బిహార్‌లోనే మృత్యువాత పడ్డారని, బిహార్, పశ్చిమబెంగాల్, యూపీ, రాజస్థాన్, సిక్కింలలో దాదాపు 450 మంది గాయపడ్డారని కేంద్రం తెలిపింది. భారత్‌లో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్ట వివరాలను అంచనా , సహాయ చర్యల పర్యవేక్షణకు నలుగురు కేంద్రమంత్రులను ప్రధాని నియోగించారు. సాయం సరిపోవడం లేదు కఠ్మాండు నుంచి సాక్షి ప్రతినిధి ఇస్మాయిల్: వివిధ దేశాల నుంచి వచ్చిన సహాయ సిబ్బంది రాత్రింబవళ్లు సహాయ చర్యల్లో నిమగ్నమవుతున్నప్పటికీ.. ఇంకా సాయం అందని బాధితులు వేలల్లో ఉన్నారు. అంతర్జాతీయ సహాయక సిబ్బంది సేవలు నేపాల్ పల్లెలకు చేరడం లేదు. భూకంపం వచ్చిన శనివారం నుంచి ఇప్పటివరకు 5 వేల మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాదిగా బాధితులు ఆహారం, తాగునీరు, ఔషధాలు.. తదితర నిత్యావసరాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. భూకంప ప్రభావం 80 లక్షల మందిపై పడిందని, 14 లక్షల మందికి ఆహారం తదితర నిత్యావసరాలు అందడం లేదని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.మంగళవారం మధ్యాహ్నం వరకూ చురుగ్గా సాగిన సహాయ కార్యక్రమాలు వర్షం పడటంతో కొద్దిసేపు నిలిచిపోయాయి. రెండు రోజుల నుంచి గుడారాల్లో ఉన్న వారికి వర్షం మరింత ఇబ్బందిగా మారింది. అయితే భారత్ నుంచి పెద్ద ఎత్తున టెంట్లు, సహాయ సామగ్రి చేరటంతో కొంత ఊరట లభించింది. పశుపతినాథ్ఆ లయం దగ్గర ఒకే చోట 200 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపారు. పోఖ్రాకు వెళ్లే దారిలో సాక్షి బృందం పర్యటించిన 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా జనావాసం ఆనవాలు కూడా లేకుండా పోయింది. -
నేపాల్ బాధితులకు ఏడాది వేతనం
బెంగళూరు: శాసనమండలి సభ్యుడిగా తన ఏడాది వేతనాన్ని నేపాల్ భూకంప బాధితులకు అందజేయనున్నట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మంత్రిమండలి పునఃరచనతో పాటు విస్తరణ కూడా ఉంటుందని తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తాను చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చేనెల 13కు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు తెలియజెప్పడానికి ఉత్తర కర్ణాటక భాగంలో ృహత్ సమావేశం జరిపే ఆలోచన ఉందని తెలిపారు. -
నేపాల్ భూవిలయ దృశ్యాలు
-
నేపాల్ భూకంప మృతుల సంఖ్య 10వేలు!
కఠ్మాండు: నేపాల్ లో భూంకప మృతుల సంఖ్య దాదాపు 10 వేలకు చేరే అవకాశం ఉందని నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతుల సంఖ్య పదివేలకు చేరొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యల్ని చేపట్టామని, ప్రజల సంరక్షణ కోసం తాము చేయాల్సిందంతా చేస్తున్నామని, దీనినుంచి బయటపడేందుకు తమ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందన్నారు. దాదాపు 7వేల మందికి పైగా గాయపడ్డారని, వారికి వైద్యసేవలు అందించడం పెద్ద సవాల్‌గా మారిందన్నారు. ఇప్పటికి వరకు 5 వేలకుపైగా మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. దీన్ని 1943 భూకంపం సృష్టించిన విలయం కంటే కూడా ఘోరమైందిగా ప్రకటించాయి. కాగా వరుస ప్రకంపనలతో నేపాల్ అతలాకుతలమైందనీ, భూకంపం సంభవించిన ప్రాంతాలలో ప్రజలు నిత్యావసర వస్తువులు దొరకక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విపత్తును ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉందన్నారు. ఆరు బయటే నిద్రిస్తున్న ప్రజలకు అందించేందుకు మందులు, టెంట్ల అవసరం చాలా ఉందని, ఈ నేపథ్యంలో మరింత విదేశీ సహాయాన్ని మరింత కావాలని విజ్ఞప్తి చేశారు. -
నేపాలీ మహిళ ప్రాణాలు కాపాడిన భారతీయులు
కఠ్మాండు: భూకంప శిథిలాల కింద చిక్కుకున్న ఓ నేపాలీ మహిళకు భారతీయులు ఊపిరి పోశారు. రెండు రోజు పాటు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడిన నేపాలీ మహిళను భారతీయులతో కూడిన సహాయక బృందం కాపాడింది. కఠ్మాండులోని మహరాజ్ గంజ్ ప్రాంతంలోని బసుంధరలో ఐదు అంతస్థుల భవనం కూలిపోవడంతో సునీత సితాలా అనే మహిళ శిథిలాల కింద చిక్కుకుపోయింది. ఆమె భర్త, పిల్లలు ఆరు బయటే ఉండడంతో వారు ప్రాణాలు దక్కించుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న సునీతను రెండు రోజుల తర్వాత భారతీయుల బృందం రక్షించింది. మరో లోకంలోకి వచ్చినట్టుగా ఉందని శిథిలాల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె వ్యాఖ్యానించింది. తాను ఇంట్లో గిన్నెలు తోముతుండగా ఒక్కసారిగా కుదేలయిందని, దీంతో తప్పించుకోవడానికి వీల్లేకపోయిందని తెలిపింది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పాఠశాలలో పునరావాసం పొందుతోంది. -
కాబోయే తల్లులకు కష్టాలు మిగిల్చిన విలయం
కఠ్మాండు: నేపాల్ ను ఛిన్నాభిన్నం చేసిన భూకంపంతో కాబోయే తల్లులు అష్టకష్టాలు పడ్డారు. భూకంపం సృష్టించిన విలయంతో దాదాపు 50 వేల మంది గర్భిణులు, బాలికలు బాధలు పడ్డారని ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్(యూఎన్ఎఫ్ పీఏ) తెలిపింది. భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో సుమారు 50 వేల మంది గర్భిణీలు, బాలికలు ఉన్నారని వెల్లడించింది. ప్రసవ సంబంధ వైద్య సేవలు అందక గర్భిణులు అవస్థ పడుతున్నారని తెలిపింది. సుఖ ప్రసవానికి అనువైన పరిస్థితులు లేక కాబోయే తల్లులు కాటికి చేరుతున్నారని వాపోయింది. ప్రకృతి విపత్తులోనూ మహిళలు, బాలికల పట్ల వివక్ష కొనసాగుతుండడం పట్ల యూఎన్ఎఫ్ పీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రకృతి ఉత్పతాలు సంభవించినప్పడు గర్భిణులు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారన్న చేదు వాస్తవాన్ని వెల్లడించింది. ఆపత్కాలంలో మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కోరింది. -
నేను క్షేమంగానే ఉన్నా: నీలిమ
హైదరాబాద్: నేపాల్ లో చిక్కుకున్న హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ సురక్షితంగా ఉంది. తాను క్షేమంగా ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి కిందకు దిగుతున్నట్టు తమ కుమార్తె ఫోన్ లో చెప్పిందని నీలిమ కుటుంబ సభ్యులు తెలిపారు. మరో రెండు రోజుల్లో నీలిమ బృందం రాష్ట్రానికి తిరిగి రావొచ్చని వెల్లడించారు. ఈనెల 18 వ తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ.. భూకంపం రావడంతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద చిక్కుకుపోయింది. మరికొన్ని గంటల్లో ఎవరెస్ట్‌పైనున్న టింగ్‌బోచి అనే బేస్‌క్యాంప్‌నకు చేరుకుంటారనగా... భూకంపం సంభవించడంతో నీలిమ బృందం ఆచూకీ గల్లంతయ్యింది. ఈ బృందంలో వివిధ దేశాలకు చెందిన మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కొందరు అమెరికాకు చెందినవారు. నీలిమ క్షేమంగా ఉందన్న తెలియడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.