SPSR Nellore District Latest News
-
4 లక్షల మందికి ‘ఉచిత గ్యాస్’
నెల్లూరు (దర్గామిట్ట): జిల్లాలో అర్హులైన 4,06,522 మందికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ నవంబర్ 1 నుంచి ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ ఓ ఆనంద్ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో కలెక్టర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. లబ్ధిదారులకు ప్రతి నాలుగు నెలలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తుందన్నారు. నవంబర్ నుంచి మార్చిలోపు మొదటి సిలిండర్ పొందవచ్చునని, సిలిండర్ పొందిన 48 గంటల్లో లబ్ధిదారులకు సబ్సిడీ డీబీటీ ద్వారా ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేస్తుందన్నారు. నవంబర్ 1వ తేదీన ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో రెండోది, ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్యలో మూడో సిలిండర్ పొందవచ్చునన్నారు. జిల్లాలో దీపం పథకం కనెక్షన్లు 2,33,398, ఉజ్వల పథకం కనెక్షన్లు 24,318, సీఎస్ఆర్ కనెక్షన్లు 1,00,208 ఉండగా, మిగిలిన వారు తెల్లకార్డు కలిగి ఉన్నారని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఏ విధమైన దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ గ్యాస్ బుకింగ్ లాగా చేసుకోవాలన్నారు. క్రీయాశీలకంగా ఉన్న ఎల్పీజీ కనెక్షన్లు, ఆధార్ నంబర్ల అనుసంధానం, తెల్లరేషన్ కార్డు, ఇతర శాఖల డేటాబెస్తో సరిపోలిన ఎల్పీజీ కనెక్షన్ వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ వెంకటరమణ పాల్గొన్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ నవంబర్ నుంచి మార్చి మధ్యలో మొదటిది -
ఇసుక టెండర్ల ప్రక్రియకు హైకోర్టు బ్రేక్
● మధ్యంతర ఉత్తర్వులు జారీ నెల్లూరు (సెంట్రల్): ఇసుక టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలంటూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం దక్కించుకున్న టెండర్లు కాదని, మరొక సారి టెండర్లకు వెళ్లిన జిల్లా మైనింగ్ శాఖ తీరును హైకోర్టు తప్పు పట్టింది. వివరాల్లోకి వెళితే ఇటీవల జిల్లాలోని పల్లిపాడు, మినగల్లు, ఇరువూరు, పీకేపాడు ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్లకు ఇసుకను తరలించే విధంగా ఈ నెల 16వ తేదీ వరకు టెండర్లు ఆహ్వానించారు. అయితే టీడీపీకి చెందిన కొందరు ఇసుక తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో 69 శాతం లెస్తో టెండర్లు దాఖలు చేశారు. ఇలాంటి టెండర్లకు అనుమతి ఇస్తే అక్రమాలకు ఆమోదం తెలిపినట్లేనని కలెక్టర్ భావించి లాటరీ విధానంలో ఈ నెల 17వ తేదీన నలుగురిని ఎంపిక చేశారు. దీంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి రాలేదని మరుసటి రోజే టెండర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై టెండర్లు దక్కించుకున్న వాళ్లు కోర్టుకెళ్లారు. ఇదిలా ఉండగా మరొక సారి ఈ నెల 27వ తేదీన కొత్త టెండర్లను ఆహ్వానించారు. దీంతో గతంలో టెండర్ దక్కించుకున్న నాగేంద్ర ఇన్ఫ్రా హైకోర్టుకు వెళ్లింది. గతంలో టెండర్లు వేశారని, దాంట్లో తాము దక్కించుకున్నామని, కానీ వాటిని రద్దు చేయడం సరి కాదని, ప్రస్తుతం కొత్తగా వేసిన టెండర్లు రద్దు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో హైకోర్టు ఆ టెండర్ల ప్రక్రియను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై జిల్లా మైనింగ్ శాఖ అధికారిని సంప్రదించగా ఇంకా తమకు ఉత్తర్వులు అందలేదని తెలిపారు. ఉత్తర్వులు అందిన తరువాత జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇంటూరి కోటరీలో కొందరికే..
ఉలవపాడు : కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావు ఐదు నెలల్లోనే స్వపక్షంలో విపక్షమయ్యారు. సొంత పార్టీ నేతలే ఆయన తీరుపై బహిరంగంగా విమర్శలు చేసే పరిస్థితి నెలకొంది. పార్టీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం రెండు రోజుల క్రితం ఓ సందర్భంలో ఎమ్మెల్యే ఇంటూరి తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఇంటూరి గెలుపులో కీలకంగా పని చేసిన నేతల్లో శివరాం ఒకరు. ఎన్నికలు జరిగిన ఐదు నెలల్లోనే ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారిందంటూ శివరాం మాట్లాడారు. ఇంటూరిని గెలిపించి తప్పు చేశామని కార్యకర్తలు చాలా మంది బాధపడుతున్నారు. ఎన్నికల ముందు రాజేష్, జనార్దన్ టికెట్ కోసం ప్రయత్నించారు. వారి వెనుక కార్యకర్తలు ఉన్నారు. అదృష్టం బాగుండి ఇంటూరికి టికెట్ వచ్చిందన్నారు. దీంతో అందరూ కలిసి కట్టుగా పనిచేశారు. ఇప్పుడు వారిని దూరంగా పెట్టడం ఏమిటి, మళ్లీ గెలవాలి కదా? ఈ ఐదేళ్లు మాత్రమే కాదు కదా అంటూ శివరాం నేరుగా ప్రశ్నించడంతో టీడీపీ క్యాడర్ సైతం శివరాం వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. శివరాం మూడు దశాబ్దాలుగా పార్టీ నేతగా ఉన్నా.. ఏ నాడు కేడర్‌లో ఇంత అసంతృప్తి రాలేదని కార్యకర్తలు, నేతలు అంటున్నారు. ఒకసారి గెలవగానే ఇంత అహమా? ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహారిక తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి గెలవగానే ఇంత అహం పనికి రాదంటూ సొంత పార్టీ క్యాడరే మండి పడుతున్నారు. ఎన్నికల ముందు వరకు గ్రామ స్థాయి నాయకులను ‘అన్నా’ అంటూ సంబోధించిన ఇంటూరి ఇప్పుడు పేరు పెట్టి పిలవడం, తనను కూడా అందరూ ‘సార్’ అనే పిలవాలంటూ ‘అన్నా’ అని పిలవద్దని ముఖానే చెబుతున్నాడంట. కందుకూరు అభివృద్ధి మండలి ఏర్పాటుపై చర్చ కందుకూరు నియోజకవర్గంలో అభివృద్ధి మండలి ఏర్పాటు కావడంపై పార్టీలోనే కాకుండా ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే ప్రవర్తన సరిగా లేకపోవడం, కందుకూరులో జరుగుతున్న ఇసుక, గ్రావెల్, మద్యం వ్యాపారంలో దోపిడీలో బిజీబిజీగా ఉండి, అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో స్వపక్ష నేతలే మండలిని ఏర్పాటు చేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అభివృద్ధి మండలికి దివి శివరాంను అధ్యక్షుడిగా స్వపక్ష నేతలు ఎన్నుకోవడం చూస్తే.. ఇంటూరికి చెక్ పెట్టినట్లే అని టీడీపీలో ఉన్న కొందరు నాయకులు మాట్లాడుకోవడం గమనార్హం. ఈ అభివృద్ధి మండలిలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టులు, కుల సంఘాల నాయకులు, ఆమ్ ఆద్మీపార్టీ నాయకులు ఉండడం గమనార్హం. ప్రధానంగా రాళ్లపాడు నుంచి కలుషిత నీరు గ్రామాలకు వస్తుందని ఈ మండలి ప్రశ్నిస్తోంది. ఇది ఇంటూరికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే శివరాం బహిరంగ విమర్శలు కందుకూరు టీడీపీలో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ‘కందుకూరు అభివృద్ధి మండలి’ ఏర్పాటు చేసే స్థాయికి స్వపక్షంలోనే విపక్షం ఏర్పడింది. ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఈ మండలికి అధ్యక్షుడిగా వ్యవహరించే స్థాయికి ఆ పార్టీలో పోరు మొదలైంది. ఎన్నికల ముందు వరకు మూడు కుంపట్లుగా ఉన్న టీడీపీలో పార్టీ పెద్దల జోక్యంతో అందరూ ఒకతాటిపైకి చేరుకున్నారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే మళ్లీ యథా పరిస్థితి ఏర్పడింది. పార్టీ విజయానికి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే.. అధికారం వచ్చాక ఎమ్మెల్యే కోటరీలోనే కొందరికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగానే విమర్శలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించడంపై ఆగ్రహం కందుకూరు అభివృద్ధి మండలి ఏర్పాటుపై చర్చ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఇంటూరి గెలుపు కోసం పార్టీ క్యాడర్ మొత్తం కష్టపడితే.. అధికారం దక్కగానే అన్ని విధాలా తన కోటరీలోని కొందరికే ప్రాధాన్యత ఇవ్వడంపైనా పార్టీ క్యాడర్ మండిపడుతోంది. పార్టీలో అంతర్గత విభేదాలకు దారి తీసింది. కేవలం ధనార్జనే ధ్యేయంగా తన సొంత కోటరీతో మండల స్థాయిలో సామంత రాజులను నియమించుకుని పరిపాలన చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిని వదిలేసి, కేవలం ఇసుక, మద్యం దోపిడీకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కందుకూరు వైద్యశాలలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పక్కనే కనిగిరిలో ఉన్న వైద్యశాల చిన్నదైనా.. అక్కడ ఎమ్మెల్యే బాగా అభివృద్ధి చేసుకుంటున్నాడని ఆ వైద్యశాల అభివృద్ధిని, ఎమ్మెల్యే బాధ్యతను చూసి నేర్చుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే దివి శివరాం చురకలు అంటించడం కూడా ఇంటూరికి ఇరకాటంగా మారిందనే చెప్పొచ్చు. ఇంటూరి అనుచరులు కొందరు మాత్రమే దోపిడీ చేయడం, వారు మాత్రమే సంపాదించుకోవడం చూసిన మిగిలిన కార్యకర్తలకు ఈ పరిణామాలు మింగుడుపడడం లేదు. దీంతో బహిరంగంగానే విమర్శిస్తున్న శివరాంకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని దగ్గరకు రానివ్వడం లేదని, చులకనగా మాట్లాడుతున్నారని వాపోతున్నట్లు సమాచారం. రానున్న కాలంలో ఈ అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ ఉనికిని దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
చిన్నారి విక్రయంపై లోతుగా దర్యాప్తు
● సూత్రధారుల చరిత్రపై ఆరా కావలి: ఊయల్లోని చిన్నారి కిడ్నాప్ కేసు లో ప్రధాన సూత్రధారులైన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని అపహరించిన నిందితురాలు శెట్టిపల్లి స్వరూప తాను పెంచుకునేందుకే అని తొలుత చెప్పినప్పటికీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిని కిడ్నాప్ చేసి విక్రయించినట్లు, ఇందులో భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు తెలియడంతో పోలీసులు మరింత లోతుగా శోధిస్తున్నారు. పట్టణంలోని బాలకృష్ణారెడ్డినగర్‌కు చెందిన పెరణంపాటి అశోక్ నిందితురాలు స్వరూపతో పాటు కారులో పొన్నవోలు పోలీసులకు పట్టుబడ్డాడు. కారుడ్రైవర్ స్థానిక జనతాపేటకు చెందిన షేక్ నజీమ్ కావడంతో అతని కార్యకలాపాలపై పోలీసులు నిశితంగా విచారిస్తున్నారు. ఏఎస్‌పేట మండలం పొనుగోడుకు చెందిన గంగవరపు ఉపేంద్ర చిన్నారిని కొనుగో లు చేసేందుకు స్వరూపకు రూ. 1.10 లక్షలు ఇచ్చినట్లు తేలింది. స్వరూపపై గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకపోవడంతో ఈ వ్యవహారంలో ఆమె పాత్ర స్వల్పంగా భావిస్తున్నారు. ఈ ముగ్గురు వ్యవహారాలపై దర్యాప్తు చేస్తున్నారు. వీరు చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి విక్రయించే ముఠాగా ఏర్పడి ఇటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నా రా? అనే కోణంలో లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. వీరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరపర్చడంతో వీరి దర్యాప్తు కొలిక్కి వస్తే.. కోర్టు అనుమతితో తమ కస్టడీకి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నారని సమాచారం. -
ప్రజలందరికీ కాకాణి దీపావళి శుభాకాంక్షలు
నెల్లూరు (బారకాసు): చీకటిపై వెలుగు సాధించిన విజయంగా దీపావళి పర్వదినంను లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ ఆనంద్.. నెల్లూరు(దర్గామిట్ట): చీకట్లను తొలగించి వెలుగులు నింపే దీపా వళి విజయానికి ప్రతీక. జిల్లా ప్రజలందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని కలెక్టర్ ఆనంద్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ కృష్ణకాంత్.. నెల్లూరు(క్రైమ్): చీకట్ల ను పారద్రోలి అందరి జీవితాల్లో ఈ దీపా వళి పండగ మరిన్ని కాంతులు నింపాలని ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆకాంక్షించారు. బుధవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలని సూచించారు. స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితా సిద్ధం నెల్లూరు (టౌన్): నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ జాబితా జిల్లా విద్యాశాఖాధికారి వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలపై లిఖిత పూర్వకంగా ధ్రువపత్రాలతో వచ్చే నెల 1వ తేదీలోపు డీఈఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. -
జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్‌కుమార్ సస్పెన్షన్
నెల్లూరు సిటీ: నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్‌కుమార్‌ను కలెక్టర్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తూ ఆర్డీఓ అనూష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న ‘టపాసుల దుకాణాల కేటాయింపు రసాభాస’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆర్డీఓ అనూష స్పందించారు. ఈ పరిస్థితికి కారణమైన జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్‌కుమార్‌పై వస్తున్న ఆరోపణలను విచారించారు. ఈ క్రమంలో లాటరీ విధానంలో శ్రావణ్‌కుమార్ అవకతవకలకు పాల్పడ్డారని గుర్తించారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
నిఘా నేత్రంపై నిర్లక్ష్యం
నేరాల నియంత్రణ, నేరస్తుల జాడ పట్టించడంలో కీలకమైన నిఘా నేత్రంపై పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిఘాను అనుక్షణం పర్యవేక్షించేందుకు రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనం.. ఆతిథ్య మందిరంగా మిగిలిపోయింది. జిల్లా కేంద్రం నెల్లూరు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం కావలి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉండడం, వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబయిగా ప్రసిద్ధి గాంచింది. విద్యారంగంలో విశిష్ట స్థానం సంతరించుకుంది. ఎన్నో ప్రాధాన్యతలు గల పట్టణానికి దేశ నలుమూలల నుంచి ఎక్కడెక్కడి వారో వస్తూ పోతుంటారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన పట్టణంలో పోలీస్‌శాఖ నిఘా వ్యవస్థ లేకపోవడం నేరాలకు అడ్డాగా మారుతోంది. ప్రజల ఆస్తులకు భద్రత కొరవడుతోంది. కావలి: కావలి పట్టణంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు బస్టాండ్, రైల్వేస్టేషన్, శివారు ప్రాంతాలు, ఇతర కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు నెలల తరబడి పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాదిన్నర నుంచి జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలోనూ పోలీసు యంత్రాంగం నిఘా కెమెరాలపై దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉంది. పట్టణ ప్రధాన కూడళ్లు, ట్రంక్‌రోడ్డులో ఉన్న కెమెరాలు చూపుడుకే తప్ప ఎందుకూ పనికి రావడం లేదు. చివరకు వ్యాపార సంస్థలు, ఇళ్ల యజమానులు ఏర్పాటు చేసుకున్న లో రిజల్యూషన్ కెమెరాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రయోగాత్మక దశలోనే నిర్వీర్యం కావలి పట్టణంలో పోలీసులు పకడ్బందీగా భద్రత చర్యలు తీసుకోవడానికి కొంత మేరకు హంగులు సమకూర్చుకొన్నప్పటికీ, అవి అమలుకు నోచుకోలేదు. అన్నింటా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సంతరించుకొంటున్న ఈ ఆధునిక కాలంలో, పోలీసులు కూడా తమ విధులకు ఆధునికతను జత చేసుకొంటున్నాయి. అందులో భాగంగానే కావలి పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి పోలీసు అధికారులు చొరవ తీసుకొని, పట్టణంలోని ముఖ్యమైన కూడలిలో కనీసం వంద చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రయోగాత్మకంగా 14 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిలో రికార్డయ్యే వీడియో ఫుటేజీలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ విజయవంతం అయితే ఈ సీసీ కెమెరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా సీసీ కెమెరాల నుంచి వచ్చే వీడియో ఫుటేజీలను రోజులో 24 గంటలు పాటు పర్యవేక్షించడానికి, వీడియోలను భద్రపరచడానికి కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణాన్ని నిర్మించారు. పట్టణంలో ఆ శాఖకు చెందిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. నేరాలు జరిగినప్పుడు మాత్రం వ్యాపార సంస్థలకు చెందిన సముదాయాలు వద్ద ప్రైవేట్ సీసీ కెమెరాలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏడాది కాలంగా నేరాల క్లూస్ దొరకని వైనం కావలి పట్టణంలో పోలీసు వ్యవస్థ నామమాత్రంగా మారడం, నిఘా కెమెరాలు నిస్తేజం కావడంతో నేరస్తులు చెలరేగిపోతున్నారు. గతేడాది బృందావనం కాలనీలో సుమారు రూ.కోటి విలువైన చోరీ జరిగిన తర్వాత నుంచి వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు అరికట్టలేకపోతున్నారు. నేరాల ఛేదనలోనూ తీవ్రంగా విఫలమవుతున్నారు. బృందావనం కాలనీ ఘటనలో ఇప్పటి వరకూ కనీసం అనుమానితుల ఆచూకీ కూడా కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత వరుసగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి. ఇళ్లతో పాటు వ్యాపార సంస్థల్లోనూ దొంగతనాలు జరిగినా పోలీసులు ఒక్క ఘటనలో కూడా ఆధారాలు సేకరించలేకపోయారు. ఈ ఏడాది ముసునూరు సమీపంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చెడ్డీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడిన ఘటనలో దర్యాప్తు కూడా మూలన పడింది. వీటితో పాటు ద్విచక్ర వాహనాలకు సంబంధించిన చోరీలు పదుల సంఖ్యలో చోటు చేసుకున్నాయి. ఇటీవల ఓ బంగారు వ్యాపారికి సంబంధించిన కారు అద్దాలు పగులగొట్టి సుమారు రూ.10 లక్షలు చోరీ చేశారు. ఈ కేసులో కూడా ఇప్పటి వరకూ చిన్న క్లూ కూడా లభించలేదు. వీటిలో కనీసం పది శాతం దొంగతనాల్లో కూడా పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. అంతకు ముందు పట్టణంలో తీవ్ర సంచలనంగా మారిన గుర్తుతెలియని మహిళ హత్య కేసు ఇప్పటి వరకూ వీడలేదు. కావలి శివార్లలో మహిళను చంపి తగులబెట్టినా పోలీసులు కనీసం మృతురాలు ఎవరనేది కూడా గుర్తించలేకపోవడం గమనార్హం. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్న కొన్ని కూడా పనిచేయకపోవడంతో పదుల సంఖ్యలో కేసులకు సంబంధించి చిన్నపాటి ‘క్లూ’స్ దొరకలేదంటే పట్టణంలో నిఘా వ్యవస్థ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సీసీ కెమెరాల ఆవశ్యకతను చెప్పిన ‘చిన్నారి కిడ్నాప్’ ఈ నెల 28న కావలిలో సంచనలం సృష్టించిన చిన్నారి కిడ్నాప్ ఉదంతం పట్టణంలో సీసీ కెమెరాల ఆవశ్యకతను చాటి చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి సమీపంలో ఓ ఇంటి యజమాని ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరానే పోలీసుల దర్యాప్తునకు ఆధారంగా మారింది. పట్టణంలోని నిఘా కెమెరాలను పర్యవేక్షించేందుకు లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ పోలీసు అతిథి గృహంగా మారిపోయింది. శాంతిభద్రతల పరంగా సున్నితంగా, వస్త్ర వ్యాపారంలో రెండో ముంబయిగా ప్రసిద్ధి చెందిన కావలిలో నేర నియంత్రణలో కీలకమైన నిఘా కెమెరాలు పనిచేయకపోవడం, పోలీసు వ్యవస్థ నామమాత్రంగా ఉండడం పట్టణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. పట్టణంలో పనిచేయని సర్వైలెన్స్ సీసీ కెమెరాలు వరుస ఘటనల నేపథ్యంలోనూ స్పందించని పోలీసు యంత్రాంగం సీసీ కెమెరాల ఆవశ్యకతను స్పష్టం చేసిన చిన్నారి కిడ్నాప్ ఉదంతం -
పేకాట స్థావరంపై దాడి ●
● రూ.8 లక్షల నగదు స్వాధీనంఆత్మకూరు: అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామ శివార్లలోని మామిడి తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆత్మకూరు డీఎస్పీ కె.వేణుగోపాల్ ఆధ్వర్యంలో సీఐ జి.గంగాధర్, పలువురు ఎస్సైలు, సిబ్బంది కలిసి బుధవారం సాయంత్రం దాడి చేశారు. పోలీసులను చూసి కొందరు పారిపోగా 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.8,08,465 నగదు, మూడు కార్లు, 14 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 11 మందిని బద్వేల్, గోపవరం మండలాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. నలుగురు అనంతసాగరం మండలానికి చెందిన వారని డీఎస్పీ వివరించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. 15 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు ఎస్సై షేక్ జిలానీ, మర్రిపాడు ఎస్సై శ్రీనివాసులు, అనంతసాగరం ఎస్సై సూర్య ప్రకాష్ రెడ్డి, ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. -
కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ బెదిరింపులు
● పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు ఆత్మకూరు(చేజర్ల): మండలంలోని యనమదల గిరిజన కాలనీకి చెందిన ఓ మహిళపై స్థానిక టీడీపీ నాయకుడు ఇటీవల లైంగిక వేధింపులకు పాల్పడగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా గ్రామానికి చెందిన ఓ దినపత్రిక విలేకరి (సాక్షి కాదు) బుధవారం తన వద్దకు వచ్చి కేసు విత్‌డ్రా చేసుకోవాలని, లేకపోతే నీ అంతు చూస్తామని, గ్రామం నుంచి గెంటేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు బాధిత మహిళ చేజర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై లేకపోవడంతో స్టేషన్లో సిబ్బంది ఫిర్యాదును తీసుకుని గురువారం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. బాధిత మహిళను మళ్లీ వేధించడంపై జిల్లా గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. శుక్రవారం నిరసన తెలియజేయనున్నట్లు ఆ సంఘాల నాయకులు తెలిపారు. -
చిన్నారిని అపహరించి.. అమ్మేసి..
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీధర్ కావలి: పట్టణంలోని వెంగళరావునగర్ ప్రాంతంలో ఊయల్లో ఉన్న చిన్నారిని అపహరించిన కేసులో మహిళను, ఆమెకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ పి.శ్రీధర్ వెల్లడించారు. కావలిలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వెంగళరావునగర్‌కు చెందిన సూర్యనారాయణ, రాజేశ్వరి దంపతులకు 14 నెలల వయసున్న తేజ అనే కుమారుడు ఉన్నాడు. ఈనెల 28న మధ్యాహ్నం రాజేశ్వరి తేజను ఊయల్లో వేసి నిద్రపుచ్చి స్నానానికి వెళ్లింది. కాసేపటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. తేజ కనిపించలేదు. దీంతో వెంటనే కావలి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు స్పెషల్ బ్రాంచ్, నెల్లూరు రూరల్, కావలి డీఎస్పీల పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. చిన్నారిని అపహరించిన నిందితులను మంగళవారం రాత్రి కందుకూరు శివార్లలో పోలీసు బృందాలు పట్టుకున్నాయి. తేజను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను విచారించారు. శెట్టిపల్లి స్వరూపకు వింజమూరులో నివాసం ఉండే ఏఎస్‌పేట మండలం పొనుగోడు గ్రామానికి చెందిన ఉపేంద్రతో పరిచయముంది. అతడిఅన్నకు సంతానం లేదు. దీంతో పెంచుకోవడానికి పిల్లలు కావాలని స్వరూపను అడిగాడు. ఆమె డబ్బు కోసం తేజను కిడ్నాప్ చేసి ఉపేంద్రకు రూ.1,10,000కు అమ్మేసింది. నిందితులను అరెస్ట్ చేసి కారు, రూ.1,10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఏం చేయాలంటే..
● లైసెన్స్ షాపుల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. ● అగరబత్తి సహాయంతో పెద్దల పర్యవేక్షణలో పిల్లలు టపాసులు కాల్చాలి. ● అందుబాటులో నీటిని నిల్వ ఉంచుకోవాలి. ● ఇరుకై న ప్రదేశాలు, వాహన రద్దీ ఎక్కువగా ఉండే చోట కాల్చకూడదు. ● ఇంటి బయట, మైదానాల్లో మాత్రమే కాల్చాలి. ● కాటన్ దుస్తులు, పొడుగు చేతుల వస్త్రాలను మాత్రమే ధరించాలి. బూట్లు ధరించాలి. కళ్లజోడు పెట్టుకోవాలి. ● తారాజువ్వలను సీసాల్లో పెట్టి నిటారుగా ఉండేలా సరిచూసుకుని కాల్చాలి. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా అవి ఇళ్లలోకి దూసుకుపోయే ప్రమాదముంది. ● గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు, గడ్డివాములు, పూరిగుడిసెలు ఉండే ప్రదేశాల్లో చిచ్చుబుడ్లు, రాకెట్లు, తారాజువ్వలు వంటివి కాల్చరాదు. ● సగం కాలిన టపాకాయలను చేతులతో పట్టుకోవడం తగదు. బాణసంచా పూర్తిగా కాలలేదనుకుంటే పొరపాటే. అకస్మాత్తుగా పేలి గాయపడే పరిస్థితి వస్తుంది. ● బాణసంచా కాల్చే సమయంలో వెలువడే వాయువులను పీల్చడం హానికరం. గంధం, జింక్, మెగ్నీషియం, నైట్రేట్ వంటి పదార్థాలతో తయారైన టపాకాయలతో వచ్చే వాయువు పీల్చ డంతో ఊపిరితిత్తులు దెబ్బతినడం, శ్వాసకోశ, ఆస్తమా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ● వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, గర్భిణులు, రెండేళ్లలోపు చిన్నారులకు దూరంగా టపాకాయలను కాల్చడం మంచిది. -
కసుమూరులో బెల్టు దుకాణం మూత
వెంకటాచలం: మండలంలోని కసుమూరు గ్రామంలో మస్తాన్‌వలీ దర్గా సమీపంలో ఉన్న బెల్టు దుకాణాన్ని ఎకై ్స జ్ అధికారులు బుధవారం మూసి వేయించారు. కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘కసుమూరులో బెల్టు దుకాణం’ అనే శీర్షికన బుధవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఎక్సైజ్ సీఐ పి.ప్రసన్నలక్ష్మి తన సిబ్బందితో అక్కడికి వెళ్లి బెల్టు దుకాణాన్ని మూసి వేయించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పైపుల తయారీ ఫ్యాక్టరీలో చోరీ● రూ.30 లక్షల విలువైన పరికరాల మాయం వెంకటాచలం: మండలంలోని సర్వేపల్లి వద్దనున్న యూపీఐ పాలిమర్స్ పైపుల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రూ.30 లక్షల విలువ చేసే పరికరాలను అపహరించారు. దుండగులు ముఖాలకు గుడ్డలు కట్టుకుని ఫ్యాక్టరీలోకి ప్రవేశించి విలువైన వస్తువులను చోరీ చేశారు. ఇదంతా సీసీ కెమెరాల్లో నమోదై ఉంది. ఫ్యాక్టరీ యాజమాన్యం బుధవారం వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే ఫ్యాక్టరీలో రెండుసార్లు చోరీ జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరిగిన చోరీ వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అగ్నిమాపక కేంద్రాల ఫోన్ నంబర్లు
బాణసంచా కాల్చే సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు సమాచారం అందించాలని అగ్నిమాపక శాఖ అధికారులు కోరారు. 101తోపాటుగా కింద సూచించిన నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చు. ఫైర్ స్టేషన్ ల్యాండ్‌లైన్ నంబర్ మొబైల్ నంబర్ నెల్లూరు 0861 – 2331051 99637 34284 కావలి 08626 – 243101 99637 34286 ఆత్మకూరు 08627 – 212282 99637 34394 పొదలకూరు 08621 – 225202 99637 34828 రాపూరు 08621 – 226145 99637 35094 ఉదయగిరి 08620 – 293221 99637 35314 వింజమూరు –– 99637 35446 మర్రిపాడు –– 99637 44817 కందుకూరు 08598 – 223399 99637 33252 -
నిర్లక్ష్యం వద్దు.. జాగ్రత్తలు తప్పనిసరి
నెల్లూరు(క్రైమ్): దీపావళి అంటే ప్రతి ఒక్కరికీ ఆనందం. కులమతాలకు అతీతంగా అందరూ పండగ చేసుకుంటారు. ఇంటిల్లిపాది ఉత్సాహంగా మతాబులు కాలుస్తూ సంతోషంగా గడుపుతారు. కాకరొత్తులు, చిచ్చుబుడ్ల వెలుగులు, టపాకాయల మోతలతో ఆ రోజంతా హోరెత్తుంది. రంగురంగుల వెలుగుల్లో ఏ మాత్రం అజాగ్రత్త, ఏమరపాటుగా ఉన్నా చాలా ప్రమాదం. ఆనందం కాస్తా అంధకారంగా మారుతుంది. నష్టం జరిగిన తర్వాత బాధపడడం కంటే చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పండగను సంతోషంగా జరుపుకోవచ్చు. ప్రథమ చికిత్స ఇలా.. బాణసంచా కాల్చే సమయంలో గాయాలైతే కనీసం పది నిమిషాలపాటు చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా కాలిన ప్రాంతంలో ఉష్ణోగ్రత, నొప్పి తగ్గుతుంది. శీతలీకరణ అనంతరం ఇన్ఫెక్షన్ రాకుండా శుభ్రమైన క్లాత్ లేదా ప్లాస్టిక్ ర్యాప్‌తో కాలిన ప్రదేశాన్ని కవర్ చేయాలి. గాయం తీవ్రత అధికంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీపావళి సంబరాలకు వేళాయె అప్రమత్తత ఎంతో అవసరం లేకుంటే ఎన్నో ఇబ్బందులు -
యజమానిపై కక్ష పెంచుకుని..
● కారు, బస్సును తగులబెట్టిన మాజీ డ్రైవర్ నెల్లూరు(క్రైమ్): యజమానికి చెందిన కారు, బస్సును ఓ వ్యక్తి తగులబెట్టిన ఘటన బుధవారం రాత్రి నెల్లూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం రైల్వేగేట్ సమీపంలో నివాసముంటున్న వై.శ్రీనివాసులురెడ్డి కామాక్షి ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద వెంకటేశ్వరపురానికి చెందిన గౌస్‌బాషా డ్రైవర్‌గా చేరాడు. ఈ ఏడాది మొదట్లో గౌస్ నడుపుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. దీనికి అతని నిర్లక్ష్యమే కారణమని భావించిన శ్రీనివాసులురెడ్డి పని నుంచి తొలగించాడు. తనను పనిలో పెట్టుకోవాలని పలుమార్లు గౌస్ అడిగినా యజమాని ఒప్పుకోలేదు. దీంతో గౌస్ జూన్‌లో శ్రీనివాసులురెడ్డి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయగా వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు కోర్టులో తప్పు ఒప్పుకొని జరిమానా కట్టి కేసు నుంచి బయటపడ్డాడు. అప్పటి నుంచి యజమానిపై కక్ష పెంచుకున్నాడు. రెండు రోజుల క్రితం శ్రీనివాసులురెడ్డి పనిమీద బెంగళూరు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న గౌస్ బుధవారం అతని ఇంటికెళ్లాడు. అక్కడ నక్కి చూస్తుండగా శ్రీనివాసులురెడ్డి భార్య బయటకు వచ్చి ప్రశ్నించగా పనిలో చేరేందుకు వచ్చానని చెప్పి వెళ్లిపోయాడు. సాయంత్రం శ్రీనివాసులురెడ్డి కుటుంబసభ్యులు ఫంక్షన్‌కు వెళ్లారు. ఎవరూ లేరని నిర్ధారించుకున్న గౌస్‌బాషా ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారుకు నిప్పంటించి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. అనంతరం సింహపురి హోటల్ సమీపంలో శ్రీనివాసులురెడ్డికి సంబంధించిన బస్సుకు గౌస్ నిప్పంటించి పరారయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. వేదాయపాళెం, సంతపేట పోలీసులు సంయుక్తంగా కేసు దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
నిబంధనలు ఉల్లంఘించి బాణసంచా విక్రయం
నెల్లూరు(క్రైమ్): అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఓ లీడింగ్ ఫైర్‌మెన్ బాణసంచా దుకాణంలో స్వయంగా విక్రయాలు సాగించడం చర్చనీయాంశంగా మారింది. ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది లైసెన్స్‌లు పొందడం, విక్రయాలు సాగించడం నిబంధనలకు విరుద్ధం. అయితే జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఓ లీడింగ్ ఫైర్‌మెన్ బుధవారం రాత్రి వీఆర్సీ గ్రౌండ్లో బాణసంచా దుకాణంలో స్వయంగా విక్రయాలు చేశారు. దీనిపై జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిని వివరణ కోరగా సిబ్బంది బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయరాదని, విక్రయాలు సాగించరాదని తెలిపారు. అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ప్రభుత్వం మాదే.. మట్టి తవ్వేస్తాం
వెంకటాచలం: మండలంలోని బురాన్‌పూర్ చెరువులో మూడు రోజుల నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి అనుకుని ఉన్న చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు చేస్తుండడంతో భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. వాటిల్లో గేదెలు, మనుషులు పడి మృత్యువాత పడే ప్రమాదం ఉందని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అధికార పార్టీకి చెందిన వారు దౌర్జన్యానికి దిగుతున్నారు. చెరువులో అక్రమ తవ్వకాలపై వీఆర్వో, ఇరిగేషన్ అఽధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు. నెల్లూరు నగరానికి దగ్గరగా ఈ చెరువు ఉంది. ఒక్కో ట్రాక్టర్‌ను రూ.2,000 లెక్కన అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. -
పోలీసుల త్యాగాలను స్మరించుకుందాం
● ఏఎస్పీ సీహెచ్ సౌజన్య నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్హాల్లో వివిధ కాలేజీల విద్యార్థులకు పోలీసుల త్యాగాలపై మంగళవారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎందరో ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తున్నారన్నారు. సమసమాజం, ప్రజా రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారి త్యాగాలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. యువత పోలీసు శాఖ వైపు ఆసక్తి చూపాలన్నారు. గంజాయికి దూరంగా ఉండాలన్నారు. అనంతరం పలువురు వక్తులు మాట్లాడుతూ యువత ప్రేమ పేరిట మోసపోవద్దని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ నరసింహారెడ్డి, నగర, ఏఆర్, డీటీసీ డీఎస్పీలు డి.శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు, గిరిధర్, డీటీసీ, ఎస్బీ – 2 ఇన్స్పెక్టర్లు మిద్దె నాగేశ్వరమ్మ, బి.శ్రీనివాసరెడ్డి, వెల్ఫేర్, హెచ్‌జీ ఆర్ఐలు రాజారావు, థామస్‌రెడ్డి పాల్గొన్నారు. -
కసుమూరులో బెల్టు దుకాణం
● విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు వెంకటాచలం: అధికార పార్టీ అండ చూసుకుని కొందరు రెచ్చిపోతున్నారు. వేలాది మంది భక్తులు వచ్చే ప్రాంతాల్లో బెల్టు దుకాణాలను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. వెంకటాచలం మండలంలోని కసుమూరు గ్రామంలో ఉన్న మస్తాన్‌వలీ దర్గా దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కూటమి ప్రభుత్వంలో కసుమూరులో మద్యం ఏరులై పారుతోంది. ఇక్కడ మద్యం షాపు ఉంది. ఇది ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటోంది. దీనికి సమీపంలోనే ఒకటి, ఊర్లోనే మరొక బెల్టు దుకాణాలను పెట్టారు. సమయంతో పని లేకుండా ఇక్కడ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా కసుమూరులో బెల్టు దుకాణాలు పెట్టి విచ్చలవిడిగా అమ్మకాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున మద్యం తాగిన వారు దర్గా వద్దకు వచ్చి భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కసుమూరులో బెల్టు దుకాణాలు లేకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పశుగణనకు శ్రీకారం
నెల్లూరు(సెంట్రల్): పశువుల లెక్క ఇకపై పక్కాగా ఉండనుంది. పశుసంవర్థక శాఖ జాతీయ పశుగణన కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ వ్యాప్తంగా ప్రతీ ఇంట్లో ఎన్ని పశువులు ఉన్నాయో లెక్కించేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ప్రక్రియ గతంలో 2018లో ప్రారంభమై 2019లో ముగిసింది. మళ్లీ ఈ ఏడాది పశుగణన మొదలైంది. జిల్లాలో మొదలైంది 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం ఈనెల 25వ తేదీ నుంచి జిల్లాలో మొదలైంది. దీనిని 2025 ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేసేలా పశుసంవర్థక శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. జీవాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా పశుసంపద ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు, గుడ్లు, మాంసం తదితర స్థూల ఉత్పత్తిని లెక్కించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. పశుగణన ద్వారా పాడి రైతులకు సంబంధించి అవసరమైన పథకాలపై ప్రణాళికను రూపొందించుకోవచ్చు. ప్రస్తుత లెక్కల ప్రకారం జిల్లాలో ప్రస్తుతం అనేక రకాల మూగజీవాలున్నాయి. ఆవులు, గేదెలు, మేకలు, పందులు, కుక్కలు, కోళ్లు, ఇతర పక్షులను లెక్కిస్తారు. కాగా ఆవులు 57 వేలు, గేదెలు తదితరాలు 6.57 లక్షలు, గొర్రెలు 10.20 లక్షలు, మేకలు 3.6 లక్షలు, కుక్కలు 30 వేలు, వివిధ రకాలకు చెందిన మరికొన్ని కలిపి 21.24 లక్షలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా కోళ్లు, బాతులు, ఇతర పక్షులు 15.88 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. 416 మంది పశుగణనకు సంబంధించి ప్రతి గ్రామంలో ఎక్కడా పొరపాటు లేకుండా లెక్కించేందుకు పశువైద్యాధికారులు 70 మంది సూపర్వైజర్లను నియమించారు. వీరి ద్వారా 346 మంది పశుసంవర్థక శాఖ పారా సిబ్బందిని ఎంపిక చేశారు. గ్రామాల్లో ప్రతి రెండు వేల కుటుంబాలకు ఒక ఎన్యుమరేటరు, పట్టణ ప్రాంతాల్లో మూడు వేల కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్‌ను ఏర్పాటు చేశారు. పశుగణన కోసం ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. యజమాని వివరాలతోపాటు భూమి, పశువుల వివరాలు, చూడి, పాడి పశువులు, జెర్సీ, ఇతర ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కోళ్లు తదితర మూగజీవాల వివరాలను సేకరిస్తారు. ఆ వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా అప్లోడ్ చేస్తారు. సంకర జాతి, దేశీయ జాతి పశుసంపదను వేర్వేరుగా లెక్కిస్తారు. ప్రతి అంశానికి ఒక విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ఈ లెక్కలు ఎందుకంటే.. 16 రకాల మూగజీవాలను పశుగణనలో ప్రధానంగా తీసుకుంటారు. వీటి ద్వారా పాడిరైతులతోపాటు, జిల్లాలో ఏ విధంగా పాడిపరిశ్రమ ఉంది? దీని వల్ల జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పాడి ఉత్పత్తులు ఎంత మేర వెళ్తున్నాయి?, ఎంతమంది పాడి రైతులు జీవనం సాగిస్తున్నారు. అదే విధంగా కోళ్లు, బాతులు ఇతర వాటి వల్ల ఎటువంటి ఉపయోగం జరుగుతోంది?, కోడిగుడ్లు ఎంత మేర ఉత్పత్తి అవుతున్నాయి?, కోళ్లకు ఎటువంటి టీకాలు వేయాలి?, ఇతర అనారోగ్య కారణాలు వస్తే ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి?, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? తదితర వివరాలు నమోదు తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు.మూగజీవాల వివరాల కోసం.. మూగజీవాల లెక్కింపు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. గతంలో ఎంత మేర ఉన్నాయి?, ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి?, వీటితోపాటు గతంలో కంటే పాడి పరిశ్రమ ఎక్కువగానే ఉందా.. తగ్గిందా? అనే వివరాలతోపాటు, కోళ్ల ఉత్పత్తి ఎలా ఉంది? అనే వివరాలు తెలుసుకుంటాం. ఈ నమోదు ఎంతగానో ఉపయోగపడుతుంది. – డాక్టర్ మంజునాథ్, జిల్లా నోడల్ అధికారి, పశుసంవర్థక శాఖ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లెక్కింపు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ నిర్వహించనున్న అధికారులు ప్రస్తుతం 37 లక్షల మూగజీవాలున్నట్లు గుర్తింపు -
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
● జాయింట్ కలెక్టర్ కార్తీక్ నెల్లూరు(దర్గామిట్ట): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంగళవారం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సర్వేయర్లతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామసభలను పూర్తి చేయాలన్నారు. రీసర్వేకు సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని, మండల సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలన్నారు. రోజూ రెవెన్యూ డివిజనల్ అధికారులు మండల స్థాయిలో పెండింగ్ అంశాలపై సమీక్ష చేయాలన్నారు. అలాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. రెవెన్యూ అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా సర్వే అధికారి వై.నాగశేఖర్, ఆత్మకూరు ఆర్డీఓ పావని, నెల్లూరు ఆర్డీఓ అనూష తదితరులు పాల్గొన్నారు. -
పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారు.. పట్టుకోండి
నెల్లూరు(క్రైమ్): రెండు లారీల్లో పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఫోన్ కాల్‌తో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో అవి ఉప్పుడు బియ్యం అని తేలింది. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు, సూళ్లూరుపేట నుంచి రెండు లారీల్లో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం కావలి వైపు తరలిస్తున్నారని మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రాజేంద్రకుమార్‌కు ఓ వ్యక్తి ఫోన్లో సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాలతో అప్రమత్తమైన సిబ్బంది ఎన్టీఆర్ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. తమిళనాడు నుంచి విజయవాడ వెళ్తున్న రెండు ట్రాన్స్‌పోర్టు లారీల్లో సుమారు 40 బియ్యం బస్తాలను (25 కేజీలు) గుర్తించారు. వాటిని పరిశీలించగా అవి ఉప్పుడు బియ్యం అని తేలింది. అయితే దానికి బిల్లులు లేకపోవడంతో జీఎస్టీ, పెనాల్టీ విధించారు. ఈ తనిఖీల్లో డీసీటీఓ విష్ణురావు, ఏఓ వేణుపాల్, ఎఫ్ఆర్ఓ గోపాలకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ బాబ్జీ, కానిస్టేబుల్ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ ఎస్పీకి ఫోన్ తనిఖీల్లో ఉప్పుడు బియ్యం అని తేలిన వైనం -
కండలేరులో 43.086 టీఎంసీల నీరు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 43.086 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 9,700 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. సత్యసాయిగంగ కాలువకు 1,400, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 10, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాపూరులో రక్తదాన శిబిరంరాపూరు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రాపూరు ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎస్సై వెంకటరాజేష్ మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో ఎంతో సేవ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎస్సై వెంకటేశ్వరావు, వైద్యులు రేష్మ, హరీష్, సరస్వతి, రక్తదాతలు పాల్గొన్నారు. -
స్టాంప్‌ల పంపిణీ
నెల్లూరు సిటీ: జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మంగళవారం నాన్ జ్యుడీ షియల్ స్టాంప్స్‌ను పంపిణీ చేశారు. రూ.100, రూ.50 స్టాంప్‌లు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 15 కార్యాలయాలకు అవసరమైన మేర స్టాంప్స్ అందజేశారు. స్టోన్‌హౌస్‌పేటకు రూ.9 వేలు, కందుకూరుకు రూ.5 వేలు, కోవూరుకు రూ.4 వేలు, ముత్తుకూరుకు రూ.4 వేలు, పొదలకూరుకు రూ.4 వేలు, రాపూరుకు రూ.2 వేలు, ఉదయగిరికి రూ.2 వేలు, వింజమూరుకు రూ.3 వేలు, కావలికి రూ.8 వేలు, అల్లూరుకు రూ.2 వేలు, ఆత్మకూరుకు రూ.4 వేలు, బుచ్చిరెడ్డిపాళేనికి రూ.5 వేలు, ఇందుకూరుపేటకు రూ.4 వేలు విలువ చేసే స్టాంప్‌లు పంపిణీ చేశారు. బుజబుజనెల్లూరు కార్యాలయంలో ఇప్పటికే సరిపడా ఉన్నాయి. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతిఆత్మకూరు: ట్రాక్టర్ కింద పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆత్మకూరు మండలం పడకండ్ల గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామంలోని ఎస్సీకాలనీకి చెందిన నిక్కం కార్తీక్ (30) అనే వ్యక్తి గ్రామానికి చెందిన రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మరో రైతుకు చెందిన పొలంలో దుక్కి దున్నుతుండగా ట్రాక్టర్ టైరు రాయిపైకి ఎక్కింది. దీంతో డ్రైవింగ్ సీటులో ఉన్న కార్తీక్ జారి కింద పడ్డాడు. టైరు అతడిపైకి ఎక్కింది. దీంతో అక్కడికక్కడే అతను మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పొలం వద్దకు వచ్చి కన్నీరుమున్నీరుగా రోదించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్కే జిలానీ తెలిపారు.కామాక్షితాయి హుండీ కానుకల లెక్కింపుబుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ రూ.29,97,7,788ల నగదు వచ్చిందన్నారు. బంగారం 88 గ్రాములు, వెండి 128 గ్రాములు, 11 యూఎస్ డాలర్లను భక్తులు అందించారని వివరించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారి కోవూరు జనార్దనరెడ్డి, బ్యాంక్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలునెల్లూరు(పొగతోట): ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి అన్నారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ షాపుల ద్వారా బియ్యంతోపాటు చక్కెర, మూడు కేజీల జొన్నలు, రూ.67లకు కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని చెప్పారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ జరుగుతుందన్నారు. ప్రత్యేక కౌంటర్లు పెట్టి పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ తక్కువ ధరకే అందించేలా చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ నరసింహారావు పాల్గొన్నారు. -
అనధికార దుకాణాలే అధికం
జిల్లాలో ఈ ఏడాది దాదాపు 350కు పైగా అధికారికంగా దుకాణాలు కేటాయిస్తే.. అనధికారికంగా రెట్టింపు స్థాయిలో ఏర్పాటు చేసినట్లు అగ్నిమాపశాఖాధికారులే చెబుతున్నారు. ఒక్క నెల్లూరు నగరంలో ఆర్ఎస్ఆర్ గ్రౌండ్స్‌లో 28, వీఆర్సీ గ్రౌండ్స్‌లో 46, వైఎంసీ గ్రౌండ్స్‌లో 19, ఎస్వీజీఎస్ కళాశాల గ్రౌండ్స్‌లో 20, సర్వోదయ గ్రౌండ్స్‌లో 10 మొత్తం 123 దుకాణాలకు సంబంధించి సోమవారం సాయంత్రం లాటరీ విధానంలో లైసెన్స్‌దారులకు కేటాయించారు. అయితే అధికారుల అనుమతులు లేకుండా నగరంలోని మైపాడుగేటు, నవాబుపేట, మినీబైపాస్‌రోడ్డు, చిల్డ్రన్స్‌పార్క్, పొదలకూరురోడ్డు, వేదాయపాళెం తదితర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా బాణసంచా దుకాణాలు ఇళ్ల మధ్య టీడీపీ నేతల అండదండలతో ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దుకాణానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష చెల్లిస్తే ఎక్కడైనా దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తున్నారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.