Tamil Nadu
-
ఉద్యోగుల కోసం వేదిక
● ఆవిష్కరించిన మంత్రి టీఆర్బీ రాజా సాక్షి, చైన్నె: తమిళనాడులో ఫ్రంట్ లైన్– ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కల్పన దిశగా ఒక వేదికగా మెనీజాబ్స్.కా మ్ ఏర్పాటైంది. శుక్రవారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ఈ వేదికను పరిశ్రమల మంత్రి టీఆర్బీ రా జా ఆవిష్కరించారు. భారతదేశపు అతిపెద్ద మ్యాట్రి మోనీ సర్వీస్ ప్రొవైడర్ సంస్థగా ఉన్న మ్యాట్రిమోనీ. కామ్ తమిళనాడులో ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారి కోసం ఈ వేదికను ఏర్పాటు చేసింది. మ్యాట్రిమోనీ.కామ్ గ్రూప్ సీఈఓ మురుగవేల్ జానకిరామన్ తో కలసి తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమలు, పెట్టుబ డుల ప్రోత్సాహం, వాణిజ్య శాఖల మంత్రి టీఆర్బీ రాజా ఈ యాప్ గురించి వివరించారు. తమిళనాడు లో తమిళం, ఆంగ్లంలో ఈ వేదిక అందుబాటులో ఉంటుందన్నారు. అనేక ఉద్యోగాల పోర్టల్‌ను ఇందులో రూపొందించినట్టు వివరించారు. అందరికీ ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తు చేస్తూ, ఈ యాప్ ఉపాధి రేటును పెంచడానికి దోహ దకరంగా ఉంటుందన్నారు. మురుగవేల్ మాట్లా డుతూ తమిళనాడులో జాబ్ మార్కెట్లో మెనీ జాబ్స్‌ను ప్రారంభించడం, ఈయాప్ తమి ళనాడులో ఫ్రంట్‌లైన్, ఎంట్రీ–లెవల్ ఉద్యోగ అవకాశాల కోసం రూపొందించినట్టు వివరించారు. మెనీ జాబ్స్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించిన ఆరు నెలల్లో ఒక మిలియన్ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్ణయించామన్నారు. -
విమానంలో సాంకేతిక లోపం
● చైన్నెలో ల్యాండింగ్ సేలం: చైన్నె నుంచి మలేషియాకు బయలుదేరి వెళ్లిన మలేషియా ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల విమానం సాంకేతిక లోపం తలెత్తడంతో మళ్లీ చైన్నెలో ల్యాండ్ అయ్యింది. చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్‌కు వెళ్లాల్సిన మలేషియన్ ఎయిర్‌లైన్స్ 134 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మొత్తం 146 మందితో గురువారం బయలుదేరింది. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడినట్టు పైలట్లు గుర్తించారు. వెంటనే ఆ విషయాన్ని చైన్నె విమానాశ్రయానికి సమాచారం ఇచ్చి, వారి సూచన మేరకు చైన్నెలో ల్యాండ్ చేశారు. అనంతరం గంటల పాటు ప్రయత్నించినా సాంకేతిక లోపం సరికాకపోవడంతో విమానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం అందులో వెళ్లాల్సిన ప్రయాణికులలో 80 మంది మాత్రం మరో విమానంలో గురువారం రాత్రి కౌలాలంపూర్‌కు పంపించారు. మిగిలిన ప్రయాణికులకు చైన్నెలోని పలు హోటళ్లలో బస కల్పించారు. ఈ క్రమంలో శుక్రవారం మళ్లీ మలేషియాకు వెళ్లే ఎయిర్‌లైన్స్ విమానంలో మిగిలిన 54 మంది ప్రయాణికులను పంపించారు. కాగా సాంకేతికలోపం సరైన సమయంలో గుర్తించడంతో అందులో ఉన్న 146 మంది అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు. ఏసీబీకి కోర్టు నోటీసులు సాక్షి, చైన్నె: మంత్రి పెరియస్వామి దాఖలు చేసిన పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని ఏసీబీకి ప్రత్యేక కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 2008లో డీఎంకే హయాంలో అప్పటి ఐపీఎస్ అధికారి జాఫర్ షేట్ సతీమణి పర్విన్తో పాటు పలువురికి తిరువాన్మియూరులో గృహ నిర్మాణ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లో గృహ నిర్మాణ శాఖకు మంత్రిగా ఐ.పెరియస్వామి ఉండే వారు. ఆ తదుపరి అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి స్థల కేటాయింపులో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఏసీబీని రంగంలోకి దించింది. పెరియ స్వామి, జాఫర్ షేట్, పర్విన్, మురుగయ్య, రాజమాణిక్యం, ఆర్.దుర్గాశంకర్లపై 2013లో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈకేసు నుంచి ఒక్క పెరియస్వామి మినహా తక్కిన వారందరిని విడుదల చేశారు. ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే కోర్టులో ఈ వ్యవహారం ఉంది. ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో పెరియస్వామి మంత్రిగా ఉన్నారు. ఈ స్థల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఉత్తర్వులను గుర్తుచేస్తూ తనపై దాఖలైన కేసును రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. వివరణ ఇవ్వాలని ఏసీబీకి కోర్టు నోటీసులను జారీ చేసింది. అధికార మార్పు తథ్యం ● కుష్బూ వ్యాఖ్య సాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాల వ్యూహాలతో తమిళనాడులో అధికార మార్పు తథ్యం అని బీజేపీ జాతీయ కమిటీ సభ్యురాలు, సినీ నటి కుష్బూ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఆమె మాట్లాడుతూ దేశాన్ని ఎవరు పాలిస్తే మంచిదో, ఎవరు మంచి చేస్తారా ప్రజలు చక్కగానే అవగాహన కలిగి ఉన్నారన్నారు. అందుకే ప్రధానిగా మోదీని ఎన్నుకుంటూ వస్తున్నారన్నారు. కేవలం గెలుపు లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరన్నారు. వారి ప్రయత్నాలు, నిర్ణయాలన్నీ దేశంలో సమస్యలు సృష్టించేందుకు కారణం అవుతున్నాయని ఆరోపించారు. మణిపూర్ వ్యవహారంలో పీఎంను విమర్శిస్తున్నారని, అయితే, ఇక్కడ సమస్యకు కారణంగా కాంగ్రెస్ హయాంలో పి.చిదంబరం తీసుకున్న నిర్ణయాలేనని పేర్కొంటూ, ఇదే విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు సైతం గుర్తు చేస్తున్నాయని విమర్శించారు. మణిపూర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. మహారాష్ట్ర, జార్కండ్ ఎన్నికలలో బీజేపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. 2026లో తమిళనాడులో జరిగే ఎన్నికలలో కూటమి విషయంగా అధిష్టానం పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా పన్నే వ్యూహాలతో తమిళనాడులో అధికార మార్పు తథ్యమని వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఇప్పుడే రాజకీయ పార్టీ ప్రకటించారని, డీఎంకేకు వ్యతిరేకంగా ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకుని ఉన్నట్టుందన్నారు. ఈ వ్యతిరేక వ్యూహాలు ఏమిటో విజయ్ను అడిగి తెలుసుకోవాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చైన్నెకి రామేశ్వరం జాలర్లు కొరుక్కుపేట: శ్రీలంక జైలులో బందీలుగా ఉన్న ఐదుగురు రామేశ్వరం జాలర్లు చైన్నెకు చేరుకున్నారు. తమిళనాడులోని రామేశ్వరం పుదుకోట్టైకి చెందిన జాలర్లు అక్టోబర్ 9న తెల్లవారుజామున సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లారు. శ్రీలంక నౌకాదళంకు చెందిన పెట్రోలింగ్ బోటు అక్కడికి వచ్చి తమిళనాడు మత్స్యకారులను పట్టుకుంది. బోటు, వలలను స్వాధీనం చేసుకుని శ్రీలంకకు తరలించారు. తర్వాత శ్రీలంక కోర్టులో హాజరుపరిచి, జైల్లో పెట్టారు. ముఖ్యమంత్రి స్టాలిన్, భారత విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపి మత్స్యకారులను, వారి పడవలను విడిపించేందుకు చర్య లు తీసుకోవాలని అత్యవసర లేఖ రాశారు. దీంతో శ్రీలంక జైలు నుంచి విడుదలైన పుదుకోట్టై, రామేశ్వరానికి చెందిన ఐదుగురు జాలర్లు విమానంలో చైన్నె చేరుకున్నారు. -
ఐఐటీలో దివ్యాంగులకు క్రీడలు
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసులో ఎన్సీఏహెచ్టీ అండ్ ఆర్2డీ2, ఆర్ఆర్డీలతో కలసి దివ్యాంగులకు తిరుమై స్పోర్ట్స్ క్రీడలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో దివ్యాంగులకు నిపుణులైన కోచ్‌లతో శిక్షణ ఇవ్వడానికి, అనుకూల పరికరాలను అన్వేషించడానికి, సమగ్ర వాతావరణంలో వారి నైపుణ్యాలను పెంచుకునేందుకు వీలుగా వేదికను రూపొందించారు. వికలాంగులకు అనుకూల క్రీడలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ప్రకటించారు. 24వ తేదీ వరకు జరిగే పోటీల్లో 100 మంది దివ్యాంగులు 8 రకాల గేమ్‌లలో పాల్గొననున్నారు. ఐఐటీ మద్రాస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం కో–ఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మనీష్ ఆనంద్, మేనేజింగ్ డైరెక్టర్ కౌశిక్ సమక్షంలో ఐఐటీ మద్రాస్ డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్.గుమ్మడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యనారాయణ ఎన్. గుమ్మడి మాట్లాడుతూ తిరమై స్పోర్ట్స్ 4 ఆల్ ఈవెంట్ వికలాంగులకు వేదికను అందించడానికి ప్రత్యేకమని వివరించారు. రాబోయే సంవత్సరాల్లో మరింత ఎక్కువ మంది ఇక్కడి పోటీలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైకల్యం ఉన్న వారికి సామర్థ్యాలను, క్రీడలలో భవిష్యత్తు అవకాశాల కోసం మంచి ప్రతిభను పెంపొందించడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ మనీష్ ఆనంద్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ ఆర్2డి2, ఏసీఏహెచ్టీ ద్వారా ఏర్పాటు చేశామని గుర్తు చేస్తూ, విభిన్న వైకల్యాలున్న వ్యక్తులను ఒకచోట చేర్చడం ద్వారా, ఇది శారీరక శ్రేయస్సు, సామాజిక ఏకీకరణను ప్రోత్సహిస్తుందన్నారు. ఇక్కడ వీల్ చైర్ బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్, రేసింగ్, టేబుల్ టెన్నిస్, త్రో ఈవెంట్స్–జావెలిన్, డిస్కస్, షాట్‌పుట్ పోటీలు జరగనున్నాయి. -
బంగారాలకు బ్రహ్మరథం
సాక్షి, చైన్నె: అమెరికా వేదికగా బంగారు పతకాలను కై వసం చేసుకున్న తమిళనాడుకు చెందిన క్యారమ్స్ క్రీడాకారిణులకు బ్రహ్మరథం పట్టే విధంగా విమానాశ్రయంలో ఆహ్వానం లభించింది. వీరిని డిప్యూటీ సీఎం, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ అభినందించారు. అమెరికాలో జరిగిన ప్రపంచ స్థాయి క్యారమ్స్ పోటీల్లో తమిళనాడు నుంచి ముగ్గురు క్రీడాకారిణులు వెళ్లి తమ సత్తాను చాటే విషయం తెలిసిందే. ఇందులో ఉత్తర చైన్నెలో న్యూ వాషర్మెన్ పేట షెరియన్ నగర్ రెండవ వీధికి చెందిన మెహబూబ్‌బాషా కుమార్తె కాశీమా ప్రపంచ చాంపియన్‌గా మూడు బంగారు పతకాలను దక్కించుకున్నారు. అలాగే, చైన్నె వ్యాసార్పాడికి చెందిన నాగజ్యోతి, మదురైకు చెందిన మిత్రా బంగారు పతకాలు సాధించారు. అమెరికా పయనానికి ఆర్థిక భారం అడ్డు వచ్చిన సమయంలో తమను రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించి ఆదుకోవడంతో ఈ ముగ్గురు బంగారు పతకాలతో చైన్నెకు తిరిగి వచ్చారు. కాలిఫోర్నియా నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి చైన్నెకి గురువారం రాత్రి చేరుకున్నారు. వీరికి క్రీడల శాఖ, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ వర్గాలు బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానాలు పలికారు. క్యారమ్స్ క్రీడాకారులు, సంఘాలు ప్రతినిధులు సైతం పుష్పగుచ్ఛాలు, పూలమాలలు, కిరీటాలను ధరింప చేసి ఆహ్వానించారు. ఈ ముగ్గురు క్రీడాకారిణులు తాము సాధించిన బంగారు పతకాలతో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, స్పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ సీఈఓ జె.మేఘనాథరెడ్డిని కలిశారు. ఈసందర్భంగా వారిని డిప్యూటీ సీఎం ఉదయనిధి అభినందించారు. తమను విదేశాలకు పంపించేందుకు తోడ్పాటు అందించినందుకు క్రీడాకారిణులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వాలీబాల్ వరల్డ్ బీచ్ ప్రో టూర్ చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని ఉత్తర నెమ్మేలిలో వాలీబాల్ వరల్డ్ బీచ్ ప్రో టూర్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. వాలీబాల్ వరల్డ్ బీచ్ ప్రో టూర్–2024 చైన్నె చాలెంజ్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఉదయనిధి మాట్లాడుతూ, సీఎం స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడులో క్రీడలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇప్పటివరకు జరిగిన పోటీలను గుర్తుచేస్తూ, తమిళనాడులో క్రీడా స్ఫూర్తిని వివరించారు. క్రీడలను ప్రోత్సహించడంలో ఉత్తమ రాష్ట్రం అవార్డును సైతం దక్కించుకున్నామని గుర్తు చేశారు. బెస్ట్ ప్రమోటర్ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డు కూడా తమిళనాడు సొంతం చేసుకుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పోటీల్లో భారత్ నుంచి రెండు మహిళా జట్లు పాల్గొంటుండడం, ఇందులో ముగ్గురు తమిళనాడు క్రీడాకారిణులు ఉండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే, మూడు పురుషుల జట్లు సైతం భారత్ తరఫున పాల్గొంటుండడం, ఇందులో నలుగురు తమిళనాడు క్రీడాకారులు ఉన్నారని వివరించారు. మంత్రులు అన్బరసన్, టీఆర్బీ రాజా, అధికారులు అతుల్య మిశ్రా, మేఘనాథరెడ్డి పాల్గొన్నారు. చైన్నెకి క్యారమ్స్ విజేతలు అభినందించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెంగల్పట్టు జిల్లా వేదికగా బీచ్ వాలీబాల్ -
క్లుప్తంగా
32 దుకాణాల కూల్చివేత తిరువళ్లూరు: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 32 దుకాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నీటి ఆధారిత ప్రాంతాల్లోని కట్టడాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమ కట్టడాలను గుర్తించి తొలగిస్తున్నారు. ఇటీవల తిరువేర్కాడు మున్సిపాలిటీలో 1,200 నివాసాలకు నోటీసులు జారీ చేసి కొన్నింటిని తొలగింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో కడంబత్తూరు యూనియన్ పేరంబాక్కంలో 32 అక్రమ కట్టడాలను అధికారులు గుర్తించారు. వీటిని కూల్చివేయడానికి అధికారులు 21 రోజులకు ముందుగానే నోటీసులు జారీ చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల బందోబస్తు నడుమ పేరంబాక్కంలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈసమయంలో బాధితులు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది. అయితే ఉద్రిక్తత పరి స్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. చేతులు మారిన రూ.40 లక్షలు కొరుక్కుపేట: ప్రభుత్వ భూముల అక్రమ వ్యవహారంలో రౌడీ సీసింగ్ రాజాకు రూ.40 లక్షలు ముట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. చిట్లపాక్కంలోని రౌడీ సీసింగ్ రాజా ఇటీవల బోలాస్ ఎన్కౌంటర్లో కాల్చి చంపబడ్డాడు. తాంబరం, దాని పరిసర ప్రాంతాలలో అక్రమాలకు, ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రౌడీ సీసింగ్ రాజా, అతని సహచరులు, బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఆయా స్థలాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో భూమికి సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. సైలెయూర్ సమీపంలోని ప్రభుత్వ అన్యాక్రాంతమైన భూమిగా పత్రాలను నకిలీ పత్రాలు తయారు చేసి మోసం చేయడంలో ఓ సంస్థకు సహకరించిన సీసింగ్ రాజాకు రూ.40 లక్షలు చేతులు మారినట్లు సంచలన సమాచారం. పోలీసుల విచారణలో సంచలన సమాచారం -
చోరీలో విజయం సాధించాలి
● దొంగకు అభినందన పోస్టర్ ● ఆలంగుడిలో కలకలం సేలం: పుదుకోట్టై జిల్లా ఆలంగుడి ప్రాంతంలో బీఎస్ఎన్ఎన్లకు చెందిన కేబుల్ వైర్లు చోరీకి గురవుతున్నాయి. ఆలంకుడి పోలీసులకు బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్టర్ సమాచారం ఫిర్యాదు చేశారు. ఈ స్థితిలో ఆలంకుడి ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్న దొంగను అభినందిస్తూ పోస్టర్ ఒకటి కలకలం రేపింది. అందులో ‘ఇంటర్నెట్ కేబుల్ దొంగా...ఆలంకుడికి చెందిన ప్రియమైన దొంగా’.. నువ్వు చేయబోయే 300వ చోరీ విజయవంతంగా జరగాలని, అదేవిధంగా 1000వ దొంగతనం చేసి ఆ రోజును వేడుకగా జరుపుకోవాలని అభినందిస్తున్నా అంటూ ఆ పోస్టర్లో ఉండడం కలకలం రేపింది. ఆ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ విషయమై ఆలంకుడి పోలీసులు బీఎస్ఎన్ఎల్ అధికారి శంకర సుబ్రమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన విచారణలో ఆలంగుడికి చెందిన ఆరోగ్య సుందర్ జయశీలన్ (36) అనే వ్యక్తి కేబుల్ వైర్లను చోరీ చేసినట్టు తెలిసింది. దీంతో అతన్ని అరెస్టు చేసి పోలీసు విచారణ జరుపుతున్నారు. కాగా, తమిళ హాస్య నటుడు వడివేలు దొంగగా నటించిన నగరం అనే సినిమాలో 100వ చోరీ విజయవంతం కావా లని అంటించిన పోస్టర్ ఆయన్ని పోలీసులు అరెస్టు చేసిన సంఘటనను పోలి ఉండడం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. -
మోసం చేసేందుకు యత్నం
కొరుక్కుపేట: అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ మామ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఆయన బంధువులకు చెప్పడంతో బయటపడ్డారు. చైన్నె కొట్టూరుపురంలోని వెల్దియన్ వీధిలో నివాసం ఉంటున్న ఆనంద్ (81). ఇతను వ్యాపార వేత్త. చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనందన్‌కు మామ. ఈనెల18న వాట్సాప్ నంబర్లో తనను సంప్రదించిన గుర్తు తెలియని వ్యక్తి తాను కర్ణాటక రాష్ట్ర పోలీసునని, మీ ఆధార్ నంబర్‌తో తీసుకున్న అద్దె కారు జనంలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురయ్యారని బెదిరించి, మీ అకౌంట్లో ఉన్న నగదును వెంటనే నాకు ట్రాన్స్ఫర్ చేయాలని బెదిరించాడు. దీంతో షాక్‌కు గురైన ఆనంద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
చదువుకు మించిన ఐశ్వర్యం లేదు
కొరుక్కుపేట: విద్యార్థులకు చదువుకు మించిన ఐశ్వర్యం లేదని, క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని తెలుగు తరుణి సంస్థ అధ్యక్షురాలు కె.రమణి సూచించారు. ఈమేరకు చైన్నె నుంగంబాక్కంలోని వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథులుగా కె.రమణి, టాబ్లెట్స్ ఇండియా డైరెక్టర్ సి.వి.సుబ్బారావు, ఆంధ్రా కళా స్రవంతి అధ్యక్షులు జేఎం.నాయుడు, చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ పావని పాల్గొన్నారు. ఈసందర్భంగా చిన్నారులు బాలల దినోత్సవ విశిష్టితను తెలియజేసే పలు ప్రదర్శనలతో, నాటికలతో, పాటలతో, సంభాషణలతో ఆకట్టుకున్నారు. అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆంధ్ర కళా స్రవంతి తరఫున విద్యార్థులు యూనిఫాం అందజేశారు. అలాగే ఒక్కో విద్యార్థికి రూ.100 చొప్పన జేఎం నాయుడు కానుకగా అందించారు. గత రెండేళ్లుగా విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న సీవీ సుబ్బారావుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు తరుణి తరఫున వైద్యశిబిరం నిర్వహించి విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. డాక్టర్ పావని వైద్య బృంద చిన్నారులకు ఉచిత దంతపరీక్షలు నిర్వహించారు. సెక్రటరీ దేవసేన, ట్రెజరర్ మాజేటి అపర్ణ, సభ్యులు శైలజ, నందిని, వసంతరాణి, విశాలాక్షి, మాలతీ, కరస్పాండెంట్ రామకృష్ణ, ఉపాధ్యక్షులు వీఎన్ హరినాథ్, విజయలక్ష్మి, కోశాధికారి రమణ పాల్గొన్నారు. -
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
వేలూరు: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. వేలూరు కలెక్టరేట్లో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జిల్లాలోని రైతు నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ వర్షాలకు వరి, అరటి పంటతోపాటు కొబ్బరిచెట్లు పూర్తిగా నీట మునిగి దెబ్బతిన్నాయన్నారు. వీటికి ప్రభుత్వం సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలన్నారు. అదేవిధంగా ఉపాధి కూలీలను వ్యవసాయ పనుల్లో నిమగ్నం చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. డిసెంబర్ 10, 11వ తేదీల్లో రైతులకు ఆత్మపథకం కింద శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు వివిధ సంక్షేమ పథకాలను అందజేశారు. డీఆర్‌ఒ మాలతి, కో–ఆపరేటివ్ జాయింట్ డైరెక్టర్ తిరుగున అయ్యప్పదురై, సెంట్రల్ బ్యాంకు జాయింట్ డైరెక్టర్ రామదాస్, సబ్ కలెక్టర్ బాలసుబ్రమణియన్, వ్యవసాయ శాఖ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. -
జాలరి మృతి
అన్నానగర్: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలరి మృతిచెందిన ఘటన మత్స్యకారులను కలచివేసింది. నాగపట్నం జిల్లా అక్కరాయపేటకు చెందిన అళగిరిసామి. ఇతనికి సొంతమైన పడవలో గత 18న అక్కరాయపేట టాటానగర్‌కు చెందిన బాలాజి (41) సహా 10 మంది చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వారు సముద్రం మధ్యలో చేపల వేటలో నిమగ్నమై ఉన్నారు. ఈక్రమంలో గురువారం అర్ధరాత్రి, 20 మంది జాలర్లు కొడియాకరై సమీపంలో చేపలు పడుతుండగా ఒక్కసారిగా బాలాజి పడవలో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే తోటి మత్స్యకారులు లేపేందుకు ప్రయత్నించారు. కానీ అతను స్పృహలో నుంచి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు చేరుకున్నారు. బాలాజీని నాగై ఒరత్తూరు వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. -
సీవీ రామన్ పరిశోధనలు స్ఫూర్తిదాయకం
తిరువళ్లూరు: సర్ సీవీ రామన్ పరిశోధనలు భావితరాల శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమని విప్రో రీజినల్ హెడ్ ఆనందకృష్ణన్ దేవరాజ్ అన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ సీవీరామన్ జయంతిని పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లా అరణ్వాయల్కుప్పంలోని ప్రత్యూష ఇంజినీరింగ్ కళాశాలలో నేషనల్ సైన్స్ ఫెయిర్ ప్రయోగ–2024 పేరిట ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఈ ఫెయిర్‌కు వివిధ జిల్లాల నుంచి 2,500 మంది విద్యార్థులు పాల్గొని సృజనాత్మకతతో కూడిన నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి కళాశాల అధ్యక్షుడు రాజారావ్, ప్రిన్సిపల్ ఆర్ఎస్ కుమార్ హాజరయ్యారు. కళాశాల సీఈఓ ప్రత్యూష, వైస్‌చైర్మన్ చరణ్‌తేజ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యఅతిథిగా విప్రో రీజినల్ హెడ్ ఆనందకృష్ణన్ దేవరాజ్ హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శనలో వుంచిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం రంగాలకు చెందిన 300 ప్రాజెక్టుల ప్రయోగాల నమూనాలను పరిశీలించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పరిశోధనలకు సర్టిఫికెట్‌తోపాటు రూ.50వేల విలువ చేసే బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
తిరువొత్తియూరు: పుళల్ సమీపం, అమ్మన్ ఆలయంలో నగలు చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పుళల్ బుద్ధగరము విగ్నేశ్వరనగర్లో అంకాల పరమేశ్వరి అమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయ ధర్మకర్త బుద్ధగరముకు చెందిన ప్రకాష్ (42). ఇతను గత 16వ తేదీ ఆలయ పూజలు తర్వాత తాళం వేసుకుని ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఆలయానికి వెళ్లి చూడగా తలుపులు పగలగొట్టబడి ఉన్నాయి. అమ్మన్ విగ్రహంపై ఉన్న 4 సవర్ల తాళి చైన్ అదృశ్యమైనట్టు గుర్తించారు. దిగ్భ్రాంతి చెందిన ప్రకాష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి చోరీకి సంబంధించి మధురవాయల్ చెందిన సెల్వన్ (35), మడిపాక్కంకు చెందిన మురుగన్ (38)లను అరెస్టు చేశారు. పట్టుబడిన ఇద్దరు చైన్నె పరిసర ప్రాంతంలో పలుచోట్ల చోరీ, దారి దోపిడీ చేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. -
సమస్య పరిష్కరిద్దాం
దర్శక, రచయితల తమిళసినిమా: నటుడు ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జాలియో జింఖానా. నటి మడోనా సెబాస్టియన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ట్రాన్సిండియా మీడియా పతాకంపై రాజన్, నీలా కలిసి నిర్మించారు. శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి అభిరామి, యోగి బాబు, రోబో శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గణేశ్ చంద్ర ఛాయాగ్రహణం, అశ్విన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత రాజన్ మాట్లాడుతూ తాను నిర్మించిన నాలుగో చిత్రం జాలియో జింఖానా అని చెప్పారు. ఈ మల్టీ స్టారర్ కథా చిత్రం జనరంజకంగా ఉంటుందని తెలిపారు. దర్శకుడు శక్తి చిదంబరం మాట్లాడుతూ ఇది డెడ్ బాడీ చుట్టూ తిరిగే కథా చిత్రమన్నారు. డెడ్ బాడీగా ప్రభుదేవా నటించడానికి అంగీకరించడం తనకే ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆయన చుట్టూ నాలుగు కథానాయికలు ఉంటారన్నారు. వారు చేసే కామెడీ హంగామాను భరిస్తూ ప్రభుదేవా నటించారన్నారు. దీనికి స్క్రీన్‌ప్లే రాయడం అంత సులభం కాదన్నారు. చిత్రం చాలా బాగా వచ్చిందని తెలిపారు. నటుడు ప్రభుదేవా మాట్లాడుతూ ఈ కథను నిర్మించడానికి నిర్మాతకు ధైర్యం కావాలన్నారు. అందుకు నిర్మాత రాజన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. దర్శకుడు శక్తి చిదంబరం తన మిత్రుడనీ, ఇంత మంచి పాత్రలో నటించే అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు అన్నారు. సాంకేతికవర్గం అంతా బాగా పని చేశారన్నారు. దర్శకుడు శక్తి చిదంబరం, గీత రచయితల మధ్య సమస్య గురించి తనకు ఇప్పుడే తెలిసిందని, దాన్ని పరిష్కరిద్దామని ప్రభుదేవా పేర్కొన్నారు. -
అడవిలో చిక్కుకున్న భక్తులు
● రక్షించిన విపత్తుల బృందం సేలం: శబరిమలకు వెళ్లే మార్గంలో గురువారం రాత్రి చైన్నెకి చెందిన ముగ్గురు భక్తులు దట్టమైన అటవీప్రాంతంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న విపత్తుల బృందం, పోలీసులు, అటవీశాఖ అధికారులు వారిని రక్షించి ఆలయానికి తీసుకొచ్చారు. శబరిమల దర్శనం కోసం పుల్మేడు అడవి మార్గంగా అనేక మంది భక్తులు వెళుతుంటారు. ఇడిక్కి జిల్లా వండిపెరియార్ నుంచి 10 కిలోమీటర్లకు పైగా అటవీమార్గంగా శబరిమలకు నడిచి వెళ్లాల్సి ఉంది. ఈ మార్గంలో భక్తుల సహకారం కోసం అక్కడక్కడ సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ స్థితిలో గురువారం చైన్నెకి చెందిన లక్ష్మణన్ (40), కోటీశ్వరన్ (40), వరుణ్ (20) పుల్మేడు మార్గంగా ఆలయానికి వెళుతున్నారు. అప్పుడు లక్ష్మణన్, కోటీశ్వరన్, వరుణ్ అనారోగ్యం కారణంగా వెనుకపడిపోయారు. తర్వాత వారు దారి తెలియక అడవిలోకి వెళ్లిపోయారు. ముందు వెళ్లిన వారు చాలా సేపటి వరకు ముగ్గురు రాకపోవడంతో అనుమానించి పోలీసులకు సమాచారం ఇంచ్చారు. దీంతో పోలీసులు, విపత్తుల బృందం, అటవి శాఖ అధికారులు, కలిసి ఆ ప్రాంతంలో దట్టమైన అడవిలో గాలించి ముగ్గురిని రక్షించి సన్నిధానానికి తీసుకెళ్లారు. అనంతరం వారికి అక్కడ చికిత్స అందించి, వారిని దర్శనానికి పంపించారు. తర్వాత వారు శుక్రవారం చైన్నెకి చేరుకున్నారు. -
అన్నాడీఎంకే నేతల బాహాబాహి
● సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ ● నేతల ముందే నిర్వాహకుల రగడ సేలం: అన్నాడీఎంకే బలోపేతం కోసం నెల్లై, కుంభకోణంలలో శుక్రవారం ఏర్పాటు చేసిన చర్చా స మావేశాల్లో నిర్వాహకులు బాహాబాహీకి దిగిన ఘ టన సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. తిరునెల్వేలిలో రగడ 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల వారీగా సీనియర్ నేతల నేతృత్వంలో అన్నాడీఎంకే తరఫున చర్చా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లై జిల్లా అన్నాడీఎంకే సమావేశం ఉడయార్పట్టిలో ఉన్న మండపంలో మాజీ మంత్రి ఎస్.పి.వేలుమణి, వరగూర్ అరుణాచలం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రచార కార్యదర్శి పాపులర్ ముత్తయ్య ప్రసంగిస్తూ గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ అయినప్పటికీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకు ఎక్కడికి వెళుతుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. తిరునెల్వేలి, పాళయంకోట నియోజకవర్గాలలో నామ్ తమిళర్ పార్టీ కంటే తక్కువ ఓట్లే వచ్చాయని తెలిపారు. ప్రచార పనులు సరిగ్గా చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఓటర్ల శిబిరం జరిపినప్పుడు జిల్లా కార్యదర్శి తంజై గణేష్ రాజా ఊర్లో లేరని, ఒక వార్డు కార్యదర్శిని కూడా చూడడం వీలుపడలేదని జిల్లా కార్యదర్శిని విమర్శించే విధంగా ప్రసంగించారు. దీంతో ఆగ్రహించిన జిల్లా కార్యదర్శి తంజై గణేషరాజా నేరుగా స్టేజ్‌పై ఉన్న పాపులర్ ముత్తయ్య వద్ద వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఒక కార్యకర్త స్టేజ్‌పైకి ఎక్కగా అతడిని నేత కిందకు తోసివేయడంతో గొడవ పెరిగింది. వాగ్వాదం కాస్తా బాహాబాహికి దారితీసింది. నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన ఘటన సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. సుమారు పది నిమిషాల తర్వాత స్టేజ్‌పై ఉన్న ఎస్.పి.వేలుమణి మైక్‌లో అందరినీ మందలించి, సముదాయించారు. వివాదానికి కారణమైన ఇద్దరిని మాత్రం బయటకు పంపించి మళ్లీ సమావేశాన్ని సజావుగా నిర్వహించి పూర్తి చేశారు. కుంభకోణంలో వాగ్వాదం తంజావూరు జిల్లా కుంభకోణం సెక్కాంకన్ని సాలైలో ఉన్న మండపంలో తంజావూరు తూర్పు జిల్లా అన్నాడీఎంకే తరఫున చర్చా సమావేశం శుక్రవారం జరిగింది. జిల్లా కార్యదర్శి భారతి మోహన్ అధ్యక్షతన తరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్, తంగమణి, ఆర్.కామరాజ్, కొరడా మనోహరన్లతోపాటు 500 మందికి పైగా నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగర, వార్డు మాజీ కౌన్సిలర్ అంబికాపతి లేచి నిలబడి స్టేజ్‌పై అధ్యక్షులు మాత్రమే కాకుండా నిర్వాహకులు కూడా ప్రసంగించడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతుగా పలువురు నినాదాలు చేయడంతో అక్కడ కలకలం రేగింది. ఆ సమయంలో అంబికాపతి స్టేజ్ పైకి ఎక్కడానికి ప్రయత్నించగా, అక్కడ ఉన్న ఒక నేత అతడిని కిందికి తోయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడి, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం దిండుగల్ శ్రీనివాసన్ జోక్యం చేసుకుని సర్ది చెప్పి తర్వాత సమావేశాన్ని నిర్వహించారు. -
నటి సీత ఇంట్లో నగల చోరీ
తిరువొత్తియూరు: ప్రముఖ సినీ నటి సీత ఇంటిలో నగలు చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రముఖ తమిళ సినీ నటి సీత సాలిగ్రామం పుష్ప కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈమె తమ్ముని భార్య కల్పన ఇంటిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి గత 31వ తేదీన వెళ్లి వచ్చారు అనంతరం తన వద్ద ఉన్న 42 సవర్లు నగలను తీసి హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని నిద్రపోయారు. ఉదయం లేచి చూసిన సమయంలో తన హ్యాండ్‌బ్యాగ్‌లోని నగలు కనబడలేదు. దీంతో నగలను కనిపెట్టి ఇవ్వాలని విరుగంపాక్కం పోలీసులకు సీత ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి ఘటన జరిగిన రోజు ప్రాంతంలోని నిఘా కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అలాగే నటి సీత ఇంట్లో పనిచేస్తున్న మహిళ వద్ద తీవ్రంగా విచారణ చేస్తున్నారు. -
గ్రీన్‌ఫీల్డ్ హార్బర్‌కు ఓకే!
సాక్షి, చైన్నె: కడలూరులోని పురాతన హార్బర్‌ను గ్రీన్‌ఫీల్డ్ హార్బర్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.2వేల కోట్లతో 1,200 ఎకరాలలో గ్రీన్ ఫీల్డ్ హార్బర్ రూపకల్పనకు నిర్ణయించారు. తమిళాడులోని సముద్ర తీరంలో ఉన్న ప్రాంతం కడలూరు. ఇది పురాతన నగరం. రెండు వందల సంవత్సరాల క్రితం ఆంగ్లేయులకు వ్యాపారరీత్యా ఈ నగరం ప్రధానమార్గంగా ఉండేది. ఆంగ్లేయుల హయాంలో ఇక్కడ హార్బర్ కూడా నిర్మించారు. ఇక్కడి నుంచి అప్పట్లోనే రైలు మార్గాన్ని సైతం పలు నగరాలను అనుసంధానించే విధంగా తీర్చిదిద్దారు. ఆంగ్లేయుల హయాంలో ఇక్కడకు నౌకల రవాణా జరిగేది. కాలక్రమేనా ఈ హార్బర్, రైలు మార్గాలన్నీ శిథిలావస్తకు చేరాయి. ఇక్కడి నుంచి దేశంలోని పలు నగరాలకు ప్రస్తుతం కేవలం చేపల ఎగుమతి మాత్రమే జరుగుతోంది. తమిళనాడులో చైన్నె తర్వాత తూత్తుకుడి నుంచి సరుకుల రవాణా ఎగుమతులు పెరిగాయి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న కడలూరును గ్రీన్‌ఫీల్డ్ హార్బర్‌గా అభివృద్ధి పరిచి సముద్ర వర్తకం విస్తృతానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ 2018లో సాగర్ మాల పథకం ద్వారా రూ.135 కోట్లను కేటాయించి ఈ హార్బర్‌ను సీపోర్టుగా తీర్చిదిద్దారు. ముఖద్వారాన్ని మరింత లోతుగా చేసి సరుకుల ఎగుమతికి, దిగుమతికి దోహదపడే విధంగా నౌకల రాకపోకలకు చర్యలు తీసుకున్నారు. ఇక్కడ 1,700 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో చిన్న పాటి సరుకుల నౌకలు ఆగేవిధంగా ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితులలో తమిళనాడులోని చైన్నె, తూత్తుకుడి తర్వాత కడలూరును మరింత ప్రగతి పథకంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏడాదికి పది మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకుల ఎగుమతికి తగ్గ కార్యాచరణ చేసింది. సీపోర్టును రూ.2 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హార్బర్‌గా మార్చేందుకు సిద్ధమయ్యారు. 1,200 ఎకరాలలో పనులకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు సిద్ధం చేశారు. త్వరలో పనులకు సీఎం ఎంకే స్టాలిన్ శంకుస్థాపన చేయనున్నారు. కడలూరు హార్బర్ కడలూరులో రూ.2 వేల కోట్లతో పనులు 1,200 ఎకరాల ఎంపిక -
డెంటల్ విద్యార్థి ఆత్మహత్య
అన్నానగర్: తిరుక్కళికుండ్రం సమీపంలో తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్లో ఉంటున్న దంత వైద్య విద్యార్థి శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తిరునెల్వేలి జిల్లా కల్లికులం ప్రాంతానికి చెందిన సహయ రోజాస్ నివిన్(23) తిరుక్కళికుండ్రం పక్కనే ఉన్న తండరై గ్రామంలోని ఓ ప్రైవేట్ డెంటల్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ హాస్టల్లో ఉండేవాడు. గురువారం ఉదయం ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లి సాయంత్రం హాస్టల్‌కు వచ్చాడు. అనంతరం తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అందరూ హ్యాపీగా ఆడుకుని హాస్టల్‌కి తిరిగొచ్చారు. తర్వాత అందరూ డిన్నర్ చేసి పడుకున్నారు. రోజాస్ నివిన్ శుక్రవారం వేకువజామున ఒక్కసారిగా బెడ్ పైనుంచి లేచి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటికి గాఢనిద్రలో ఉన్న తోటి విద్యార్థికి మెలకువ వచ్చింది. రోజాస్ నివిన్ ఉరివేసుకుని ఉండడం చూసి కేకలు వేశాడు. మిగతా విద్యార్థులు కూడా షాక్‌తో లేచారు. వెంటనే సహయ రోజాస్ నివిన్ను రక్షించి చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న తిరుక్కళికుండ్రం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి సహయ రోజాస్ నివిన్ తన స్నేహితులతో గొడవ పడి ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్ సేలం: జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితో ఓ ఉపాధ్యాయుడు తన కాళ్లు పట్టించుకున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యి కలకలం రేపింది. సేలం జిల్లా ఆత్తూరు సమీపంలో ఉన్న తలైవాసల్ తాలూకా పరిధిలోని కిలక్కు రాజపాళయం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది. ఇందులో అదే ప్రాంతానికి చెందిన, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 90 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆరుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలలో పని చేస్తున్న కామక్కపాలయం గ్రామానికి చెందిన గణితం ఉపాధ్యాయుడు జయప్రకాష్ మద్యం మత్తులో పాఠశాలకు వచ్చాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా తరగతి గదిలోనే నిద్రిస్తున్నట్టు పలు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ స్థితిలో ఉపాధ్యాయుడు జయప్రకాష్ కుర్చీలో కూర్చుని ఓ విద్యార్థితోకాళ్లు పట్టించుకున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. దీంతో సేలం జిల్లా విద్యాధికారి కబీర్, గణితం ఉపాధ్యాయుడు జయప్రకాష్‌ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
వేలూరు: దేశ వ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలని చైన్నె హైకోర్టు మాజీ న్యాయమూర్తి కృపాకరన్ తెలిపారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీలో సీనియర్ న్యాయవాది వీసీ రాజగోపాలచారి వర్ధంతి కార్యక్రమాన్ని వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్బంగా పాల్గొన్న ప్రతినిధులు వీసీఆర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించి ప్రసంగించారు. మాజీ న్యాయమూర్తి కృపాకరన్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా చాలా కోర్టుల్లో మౌలిక వసతులు లేవని, చాంబర్లు లేవన్నారు. కోర్టుకు వచ్చే ప్రజలకకు విశ్రాంతి గదులు లేవన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పద్ధతి మారాలన్నారు. వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ మాట్లాడుతూ వీసీ రాజగోపాలాచారి వద్దకు వచ్చే కేసులను ఎటువంటి రుసుము తీసుకోకుండా వాదించి విజయం సాధించే వారన్నారు. ఎటువంటి తప్పుడు కేసుల్లోనూ హాజరు కాకుండా న్యాయమైన కేసులు విజయం సాధించేందుకు పట్టుదలతో ప్రయత్నం చేశారన్నారు. సుప్రీం కోర్టులోని కేసుల కోసం అధిక ఫీజులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, పేద ప్రజల కేసుల పరిష్కారం కోసం ప్రభుత్వం, న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘాలు సంయుక్తంగా కలిసి కొత్త పద్ధతిని తీసుకు రావాలన్నారు. వీసీ రాజగోపాలాచారి వద్ద తాను న్యాయవాదిగా పనిచేసినందుకు గర్విస్తున్నాన్నారు. అందుకోసమే ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా న్యాయ వ్యవస్థ ముఖ్యమైనదని అయితే కేసులను త్వరగా పరిష్కరించడం లేదన్నారు. వీటి ఫలితంగా 2018వ సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2.9 కోట్ల నుంచి 5.10 కోట్లకు పెరిగాయన్నారు. అందులో 1.80 లక్షల కేసులు గత 30 సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. 70 సంవత్సరాల పైబడిన తొమ్మిది కేసులు, 72 సంవత్సరాల పైబడిన 3 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. గ్లోబల్ అడ్మినిస్టేషన్ ఆఫ్ జస్టిస్ ఇండెక్స్‌లో 142 దేశాల్లో భారత్ 111వ స్థానంలో ఉందన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు మరో 324 సంవత్సరాలు పట్టవచ్చునని తెలిపారు. జైలులో 76 శాతం ఖైదీలు రిమాండ్‌లోనే ఉన్నారన్నారు. వీఐటీ ఉపాధ్యక్షురాలు కాదంబరి విశ్వనాథన్, సీనియర్ న్యాయవాది విజయరాఘవులు, వీసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
చెంగల్పట్టుకు ప్రత్యేక బస్సులు కొరుక్కుపేట: ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు చెంగల్పట్టుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు రవాణా శాఖ వెల్లడించింది. నిర్వహ ణ పనుల కారణంగా చైన్నె బీచ్–చెంగల్పట్టు మార్గంలో 28 ఎలక్ట్రిక్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. రైళ్ల రద్దు ప్రభావం చూపకుండా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో రీషెడ్యూల్ చేసి నడుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ రవాణా సంస్థ అదనపు ప్రత్యేక బస్సులను నడుపతుందని తాంబరం – చెంగల్పట్టు మధ్య ప్రత్యేక బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే కిలాంబాక్కం బస్స్టేషన్న్కు సాధారణ బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులు డిమాండ్‌ను తెలుసుకుని బస్సులను పెంచుతామని అధికారులు తెలిపారు. లిఫ్ట్ వాహనం కిందపడి కార్మికుడి మృతి అన్నానగర్: పుళల్ బాలాజీ నగర్ సమీపంలో ప్రైవేటు బెల్ట్ కంపెనీలో ఫోర్క్ లిఫ్ట్ వాహనం కూలిపోవడంతో కార్మికుడు మృతి చెందాడు. పుళల్ బాలాజీ నగర్ ఐపీసీ కన్వేయర్ బెల్ట్ కంపెనీ ఉంది. దీనిని మన్నడికి చెందిన అలీ అస్తర్(50) నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థలో పది మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో వ్యాసర్పాడి కళ్యాణపురం మొదటి కూడలికి చెందిన వెంకట చలపతి కుమారుడు రూబన్(27) టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతను గురువారం బెల్ట్ లోడ్ మోయడానికి ఫోర్క్ లిఫ్ట్ నడుపుతుండగా అది అనూహ్యంగా నేలపై పడింది. దీంతో వాహనం పైనుంచి కిందపడ్డాడు. రూబెన్ అదే వాహనం కింద ఇరుక్కుని రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా తోటి కార్మికులు వెంటనే రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పైలట్ లేక చైన్నె–సింగపూర్ విమానం ఆలస్యం సేలం: పైలట్ లేక చైన్నె నుంచి సింగపూర్‌కు వెళ్లే విమానం 11 గంటలు ఆలస్యంగా నడిచింది. శుక్రవారం వేకువజామున 2.50 గంటలకు చైన్నె నుంచి సింగపూర్ వెళ్లే విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇందులో ప్రయాణించేందుకు 152 మంది సిద్ధమయ్యారు. ఈ స్థితిలో సింగపూర్‌కు వెళ్లాల్సిన విమానం 11 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.55 గంటలకు బయలుదేరుతుందని ప్రకటించారు. చైన్నె–సింగపూర్ విమానాన్ని నడపడానికి పైలట్ లేకపోవడం వల్లనే విమానం ఆలస్యమైందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. సింగపూర్ నుంచి చైన్నె వచ్చిన పైలట్ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లడంతో చైన్నె నుంచి సింగపూర్‌కు వెళ్లాల్సిన విమానాన్ని శుక్రవారం మధ్యాహ్నం 1.55 గంటలకు నడిపారు. దీంతో అందులో ప్రయాణించాల్సిన ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడ్డారు. కారు బోల్తా పడి బాలుడి మృతి సేలం: కారు బోల్తాపడి ఓ బాలుడు మృతిచెందాడు. సేలం జిల్లా ఓమలూర్‌కు చెందిన మంజునాథన్ (32). ఈయన బెంగళూరులోని ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఇతను, కుమారుడు సిద్ధార్థ్ (8), స్నేహితులు శివకుమార్, భువనేశ్వరన్, కార్తీక్‌లతో శబరిమలైకు స్వామి దర్శనానికి కారులో వెళ్లారు. శబరిమలైలో అయ్యప్ప స్వామి దర్శనం ముగించుకుని గురువారం రాత్రి అదే కారులో సొంత ఊరికి బయలుదేరారు. కంబం మార్గంలో అర్ధరాత్రి వెళుతుండగా అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సిద్ధార్థ్ సంఘటన స్థలంలోనే తండ్రి కళ్లెదుటే దుర్మరణం చెందాడు. మిగిలిన అందరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వీరిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుంటలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి తిరుత్తణి: కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుత్తణిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. తిరుత్తణి శివారులోని కన్నికాపురం గ్రామానికి చెందిన మురుగేశన్, అతని తమ్ముడు ఆర్ముగం. అన్నదమ్ములు ఇద్దరూ కూలీ కార్మికులు. ఇందులో మురుగేశన్ కుమారుడు గిరినాథ్(10), ఆర్ముగం కుమారుడు ప్రవీణ్(10) ఇద్దరు తిరుత్తణిలో ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నారు. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన చిన్నారులు సమీపంలోని రాతి కుంటలో కాళ్లు, చేతులు కడిగేందుకు వెళ్లారు. అకస్మాతుగా కుంటలో పడి మునిగిపోయారు. అక్కడున్న వారు చిన్నారులను కాపాడే ప్రయత్నం చేశారు. కుంటలో మునిగిపోయిన చిన్నారులను వెలికితీసి తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారులు కుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీధి కుక్కుల వీరంగం ● ఐదుగురికి గాయాలు వేలూరు: వేలూరు జిల్లా పేర్నాంబట్ మున్సిపాలిటీలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. కుక్కల దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేర్నాంబట్ మున్సిపాలిటీలోని 20 వార్డు బంగ్లామేడు ప్రాంతంలో దస్దగిరి అహ్మద్, సౌహక్ రోడ్డుకు చెందిన సంపత్తో పాటు మరో ముగ్గురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఐదుగురు పేర్నాంబట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రైలు ఆగకపోవడంతో వాగ్వాదం
తిరువళ్లూరు: అరక్కోణం నుంచి చైన్నె వైపు బయల్దేరిన రైలు రెండు రైల్వే స్టేషన్లలో ఆగకుండా రావడంతో తిరువేలాంగాడు వద్ద దిగిన ప్రయాణికులు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అరక్కోణం నుంచి చైన్నె వైపు లోకల్ రైలు శుక్రవారం ఉదయం 6.40 గంటలకు బయల్దేరింది. రైలులో విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రయాణిస్తున్నారు. ఈ రైలు అరక్కోణం నుంచి బయల్దేరి అన్ని రైల్వేస్టేషన్లలో ఆగి వెళ్లాల్సి ఉంది. అయితే పులియమంగళం, మోసూరు తదితర స్టేషన్లలో ఆగకుండా వేగంగా పరుగులు తీసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురై కేకలు వేయడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోగా తిరువేళాంగాడులో రైలు ఆగింది. దీంతో పులియమంగళం, మోసూరులో దిగాల్సిన ప్రయాణికులు తిరువేళాంగాడులో దిగి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. పులియమంగళం, మోసూరులో ట్రైన్ ఎందుకు ఆగలేదో చెప్పాలంటూ నిలదీశారు. ఇందుకు డ్రైవర్ సమాధానమిస్తూ తాను కొత్త అని, తప్పు జరిగిందని ప్రయాణికులకు నచ్చజెప్పారు. దీంతో పది నిమిషాలు ట్రైన్ ఆలస్యంగా రాకపోకలు సాగించింది. తిరువేళాంగాడులో దిగిన ప్రయాణికులు పులియంమంగళం, మోసూరుకు మరో ట్రైన్లో బయల్దేరి వెళ్లారు. -
బ్యాంకు దోపిడీకి యత్నం
అన్నానగర్: రెడ్‌హిల్స్ బైపాస్ రోడ్డులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది. గురువారం సాయంత్రం పని ముగించుకున్న ఉద్యోగులు యథావిధిగా బ్యాంకుకు తాళం వేశారు. ఈ బ్యాంకులో సెక్యూరిటీ గార్డు లేడు. ఈ క్రమంలో ఓ యువకుడు అర్ధరాత్రి కిటికీ పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నగలు–మనీ లాకర్ ప్రాంతానికి వెళ్లగా, అలారం మోగింది. దీంతో షాక్‌కు గురైన దొంగ బ్యాంకు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే బయటకు రాలేక బ్యాంకులో చిక్కుకుపోయాడు. ఇంతలో బ్యాంకులో అలారం మోగింది. షాక్ తిన్న ఇరుగుపొరుగు వారు రెడ్‌హిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన విచారణ చేపట్టారు. అప్పుడు దొంగ బ్యాంకులో చిక్కుకున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగులను పిలిపించి పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ గదిలో దాక్కున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వీరాపురం ప్రాంతానికి చెందిన సురేష్(49) అని తేలింది. యాక్సా బ్లేడుతో కిటికీ కడ్డీలు కోసి బ్యాంకులోకి దూకాడు. అయితే అలారం మోగడంతో బ్యాంకు నుంచి దూకలేక చిక్కుకుపోయినట్లు తెలిసింది. బ్యాంకు దోపిడీ యత్నంలో సురేష్ ఒక్కడికే సంబంధం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి అతనితోపాటు ఎవరైనా సహచరులు వచ్చి ఉండవచ్చని, అలారం మోగడంతో పారిపోయి ఉండవచ్చనే కోణంలో అతనితో విచారణ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి బ్యాంకు, సమీపంలోని నిఘా కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన రెడ్‌హిల్స్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
తిరువొత్తియూరు: మెథా బెటమైన్ విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె చూళైమేడు పెరియర్ పాలెం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒకరిని పోలీసులు పట్టుకుని విచారణ చేశారు. ఐటీ విభాగంలో పనిచేస్తున్న అతను అతను బెంగళూరు నుంచి మెథాబెటమైన్ మత్తు పదార్థాలు తీసుకువచ్చి చైన్నె అమైందకరై, చూలైమేడు ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆరంబాకం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి మెథాబెటమిన్ విక్రయిస్తున్న అభిత్రాజ్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 4 గ్రాముల మెథాబెటమైన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. ప్రభుత్వ కొలను ఆక్రమణ ● బీజేపీ నాయకుడిపై ప్రజల ఫిర్యాదు తిరువొత్తియూరు: షోలింగనల్లూరులో ప్రభుత్వానికి చెందిన కొలనును ఆక్రమించిన బీజేపీ ప్రముఖుడిపై ప్రజలు ఫిర్యాదు చేశారు. చైన్నె కార్పొరేషన్ 15వ మండలం 198వ వార్డుకు సంబంధించిన కారపాకం ప్రాంతంలో పెద్ద కొలను ఉంది వర్షాకాలంలో ఇక్కడ నీరు నిల్వ ఉంటుంది. ఈ కొలను నీరు స్థానిక ప్రజలకు ఆధారంగా ఉంది. ఈ క్రమంలో 198వ వార్డు కౌన్సిలర్, బీజేపీ ప్రముఖుడు ఆలయ అభివృద్ధి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుందరం ఈ కొలనును ఆక్రమించినట్లు తెలిసింది. దీనిపై స్థానిక ప్రజలు గురువారం షోలింగనల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మంత్రి పెరియకరుప్పన్‌కు ఊరట సాక్షి, చైన్నె: సహకార మంత్రి పెరియకరుప్పన్‌కు ఎన్నికల కేసు నుంచి ఊరట కలిగింది. ఆయనపై దాఖలైన కేసును హైకోర్టు రద్దు చేసింది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో శివగంగై జిల్లా తిరుపత్తూరు నుంచి డీఎంకే అభ్యర్థిగా కేఆర్ పెరియకరుప్పన్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో మంగళం గ్రామంలో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పెద్ద గొడవే జరిగింది. ఎన్నికల అధికారులు పెరియకరుప్పన్తో పాటుగా 8 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు శివగంగై కోర్టులో విచారణలో ఉంది. ప్రస్తుతం పెరియకరుప్పన్ సహకార మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల గొడవతో తనకు సంబంధం లేదని, ఆ సమయంలో తాను మరో ఊరిలో ప్రచారంలో ఉన్నట్టు, ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. వాదనల అనంతరం ఈ కేసును రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల కేసు నుంచి మంత్రి పెరియకరుప్పన్‌కు ఊరట కలిగినట్టైంది. -
రూ.500 నోటు ఎరగా చూపి రూ.3 లక్షలు చోరీ
తిరువొత్తియూరు: తాంబరం ప్రాంతానికి చెందిన సుబిత(46) తన అక్క కుమారుడి ఆపరేషన్ కోసం రూ.3 లక్షలు అవసరం కావడంతో ఓ బ్యాంకులో గురువారం డబ్బులు డ్రా చేసి తీసుకున్నారు. తరువాత సోదరుడు లూర్దురాజ్(50)తో కలిసి ఆటోలో తాంబరం నుంచి అమైందకరై వెళ్లారు. సుబిత ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రెస్టారెంట్లో భోజనం తీసుకోవాలని వెళ్లారు. లూర్దురాజ్ ఆటోలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఆటో వెనుక 500 రూపాయల నోటు పడి ఉంది, అది నీదేనా అని అడిగారు. దీంతో లుర్దురాజ్ ఆతృతగా ఆటో దిగి డబ్బులు తీసుకున్నాడు. తిరిగి ఆటో వద్దకు వచ్చిన తర్వాత డబ్బుల బ్యాగ్ కనిపించకపోవడంతో దిగ్భ్రాంతి చెందాడు. తన దృష్టి మరల్చి రూ.3 లక్షల చోరీ చేసినట్టు గ్రహించాడు. రెస్టారెంట్లో భోజనం తీసుకుని సుబిత ఆటో వద్దకు వచ్చింది. లూర్దురాజ్ నగదు చోరీ అయిందని ఏడ్చాడు. సుబితా విచారణ చేయగా రూ.500 ఎర చూపి రూ.3 లక్షలు చోరీ చేశారని గ్రహించారు. దీనిపై సుబిత అమైందకరై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాంబరంలోని బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తూ వచ్చి నగదు చోరీ చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంతానం లేదని దంపతుల ఆత్మహత్య
● మదురై, తిరుమంగళం సమీపంలో దారుణం సేలం: పిల్లలు లేరని మదురై జిల్లా తిరుమంగళం సమీపంలో భార్యాభర్త విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలో ఉన్న ఎ.తొట్టియపట్టి గ్రామానికి చెందిన నిత్యానందం(65), అతని భార్య ఆవుడయమ్మాల్(56). నిత్యానందం మాజీ కో–ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా, డీఎంకే శాఖా కార్యదర్శిగా ఉన్నారు. కొన్నేళ్లుగా వీరికి పిల్లలు లేరు. ఈ స్థితిలో గురువారం రాత్రి ఇంటి ముందు ఆవుడయమ్మాల్, నిత్యానందం ప్పటి లాగే ఇరుగు పొరుగు వారితో సహజంగా మాట్లాడారు. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన పాల వ్యాపారి ఎంత సేపు పిలిచినా చప్పుడు కాకపోవడంతో సందేహించి లోపలికి వెళ్లి చూశారు. గదిలో నిత్యానందం, ఆవుడయమ్మాల్ స్పృహ తప్పిన స్థితిలో పడి కనిపించారు. వారి సమీపంలో పురుగుల మందు బాటిల్ కనిపించింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని పరీక్షించగా అప్పటికే నిత్యానందం మృతి చెందినట్టు తెలిసింది. ప్రాణాలతో ఉన్న ఆవుడయమ్మాల్ను హుటాహుటిన తిరుమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి వెళ్లిన కొంత సేపటికి ఆవుడయమ్మాల్ ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న తిరుమంగళం పోలీసులు వారి మృతదేహాలను శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు జరిపిన విచారణలో పిల్లలు లేకపోవడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.