Guest Columns
-
వీరు నేరస్థులా?
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని వ్యవస్థీకృత నేరస్థులుగా చిత్రించే ప్రయత్నాలు ప్రమాదకరం. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సెక్షన్లలో లేని శిక్షలను పేర్కొంటూ వచ్చిన ఒక వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చట్టాలకు వక్ర భాష్యం చెప్పే విధంగా ఉన్న అటువంటి వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అనిపిస్తోంది.సోషల్ మీడియా కార్యకర్తలు వ్యవస్థీకృత నేరస్థులని అందునా, ఒక పార్టీకి చెందిన వారి కోసం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ఏర్పాటయింది అనేటువంటి రీతిలో ఒక పత్రికలో వార్త చదివిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, సెక్షన్లలో లేని శిక్షలు, అన్వయం కానివారికి అన్వయిస్తారు. ‘ఖబడ్దార్’ అనే రీతిలో భూతద్దంలో చూపించి భయభ్రాంతులను చేసే విధంగా, చట్టాలకు వక్రభాష్యం చెప్పే విధంగా ఉన్న ఆ వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అని పించింది. అందుకే అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111లో ఏముంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నాను. కాగా, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, మరెవరైనా కావచ్చు పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని ఎడాపెడా కేసులు బనాయిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. భారత అత్యున్నత న్యాయస్థానం అనేక తీర్పుల్లో ఇదే సత్యాన్ని స్పష్టం చేసింది. అంతెందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయ స్థానం కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఒక హెచ్చరిక జారీ చేసింది. చట్టాలకు అతిశయోక్తులు జోడించి చెప్పటం, వక్ర భాష్యాలు చెప్పడం నేరం. చిన్న నేరాలకు సంబంధం లేని సెక్షన్లు పెట్టిన పోలీసు అధికా రులపై చర్యలు తీసు కున్న ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 విషయానికి వచ్చినట్లయితే ఈ సెక్షన్ కింద సోషల్ మీడియాలో ఏ విధమైన పోస్టులు చేసినా వాళ్లకు భారీ శిక్షలు తప్పవు అని అర్థం వచ్చే రీతిలో ప్రచురితమైన వార్తను చూసినప్పుడు అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ఏమిటనేది ఒకసారి పరిశీలిస్తే, ఆ వార్తలోని అర్ధ సత్యం అర్థం అవుతుంది. కిడ్నాప్, వ్యవస్థీకృత నేరాలు, వాహన దొంగతనం, దోపిడీ, భూ దోపిడీ, కాంట్రాక్ట్ హత్య, ఆర్థిక నేరం, సైబర్ నేరాలు, వ్యక్తుల అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలు లేదా అక్రమ వస్తువులు, అక్రమ సేవలు, వ్యభిచారం లేదా మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడటం సెక్షన్ 111 కిందికి వస్తాయి. సైబర్ నేరాలు అంటే... ఎవరైనా వ్యక్తులు గానీ, ఒక వ్యక్తి గానీ ఒక సమూహ గౌరవానికి, ఒక వ్యక్తి గౌరవానికీ భంగం కలిగించే విధంగా కానీ; శారీరకంగా, మానసికంగా బాధపెట్టే విధంగా కానీ ప్రవర్తిస్తే, అది ఐటీ చట్టం–2000 ప్రకారం సైబర్ క్రైమ్ కిందికి వస్తుంది. విస్తృత ప్రజా ప్రయోజనాలతో కానీ, విశ్వసనీయ సమాచారంతో కానీ ప్రచురించినా, ప్రసారం చేసినా అది ఐటీ చట్టం కింద నేరంగా పరిగణించటం సాధ్యం కాదు. ఇటువంటివే మరి కొన్ని మినహాయింపులు ఈ చట్టపరిధిలో ఉన్నాయి. సైబర్ క్రైమ్ అంటే ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా ఒక వ్యక్తి ఐడీని దొంగిలించటం లేదా అతని అకౌంట్ మొత్తం హ్యాక్ చేయడం, ఈ–మెయిల్ పాస్వర్డ్ దొంగిలించి తద్వారా తప్పుడు మెసేజ్‌లు బయటికి పంపడం, అశ్లీల చిత్రాలను, వీడియోలను సమాజంలోకి పంపడం; దేశ భద్రతకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా నేరా లకు పాల్పడటం వంటివన్నీ సైబర్ నేరాలుగా పరిగణి స్తారు. సమాజంలో జరుగుతున్న వ్యవహారాన్ని వార్తలుగా కానీ రాజకీయ పరమైన విమర్శలుగా కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటికి ఈ చట్టాలను ఆపాదించడం సరికాదు. ఇక వ్యవస్థీకృత నేరం అంటే, నేర కార్యకలా పాల్లో సిండికేట్ సభ్యునిగా లేదా ఉమ్మడిగా వ్యవహరించే ఏ వ్యక్తీ లేదా వ్యక్తుల సమూహం... హింసకు పాల్పడటం, బెదిరింపు, బలవంతం లేదా ఏదైనా ఇతర చట్టవిరు ద్ధమైన మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనంతో సహా ప్రత్యక్ష లేదా పరోక్ష భౌతిక ప్రయోజనాన్ని పొందడం వ్యవస్థీకృత నేరంగా పరిగణించబడుతుంది. మరి ఇవన్నీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఎలా వర్తింపచేస్తారో గౌరవ న్యాయ స్థానాలే నిర్ణయించాలి. ‘చట్టవిరుద్ధమైన కార్యకలాపాన్ని కొనసాగించడం’ అంటే చట్టప్రకారం నిషేధించబడిన పనులు చేయడం. ఇందుకు గాను మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తారు. ఏ వ్యక్తి అయినా ఒక్క రుగా లేదా ఉమ్మడిగా, వ్యవస్థీకృత నేర సిండికేట్ సభ్యు నిగా చేస్తే, అదీ పదేళ్ల వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జిషీట్లు దాఖలు అయితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇవి నేరాలకు అన్వయం కానీ రాజకీయ విమర్శలకు వర్తించవు.ఇక సోషల్ మీడియాకి సంబంధించిన శిక్షలు అంటూ కొన్ని సెక్షన్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సెక్షన్లు దేనికి అన్వయం అవుతాయో భారతీయ న్యాయ సంహిత ప్రకారం పరిశీలిద్దాం. ఐటీ యాక్ట్ 67 ప్రకారం... నేరాలకు పాల్పడిన వారికి అంటూ, వీరు దేశంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి ఈ సెక్షన్ కింద ఐదేళ్ల జైలు శిక్ష, 70 లక్షల జరిమానా ఉంటుంది అని రాశారు. అసలు వాస్తవం పరిశీలిస్తే, 67 ప్రకారం రాజకీయపరమైన విమర్శలు ఈ చట్ట పరిధిలోకి రావు. అశ్లీల దృశ్యాలు ప్రచు రించినా, ప్రసారం చేసినా ఈ చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా ఉంటుంది. వేరే వ్యక్తి పేర అకౌంట్ కానీ, ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా కానీ మోసం చేయడం, ఇన్‌కమ్‌టాక్స్ అకౌంట్స్ హ్యాక్ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సెక్షన్ 66డీ కిందకి వస్తుంది.ఈ నేరాలకు పాల్పడిన వారికి లక్ష జరిమానా, మూడు వేల జైలు. ఇక సెక్షన్ 356 ప్రకారం పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ప్రచురిస్తే లేదా ప్రసారం చేస్తే రెండేళ్ల జైలు, జరిమానా ఉంటుంది. అయితే పరువు ప్రతిష్ఠ కేసులకు సంబంధించి చాలా మినహాయింపులు ఉన్నాయి. ఇందులో కూడా విస్తృత ప్రజాప్రయోజనాలు ఉన్న, నమ్మ దగిన సమాచారం ఉన్నా, సత్యనిష్ఠకు సంబంధించి రుజువు చేయగలిగితే అది డిఫమేషన్ కిందికి రాదు.అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1 )ఏ అండగా నిలుస్తుంది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమాజంలో అశాంతి రేకెత్తించడం, మహిళల్ని కించపరచటం కచ్చితంగా నేరాలే! ఈ నేరాలకు ఎవరు పాల్పడినా వాళ్లను శిక్షించవలసిందే! ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవు కానీ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ప్రత్యేకంగా ఒక పార్టీకో, ఒక పార్టీలో సోషల్ మీడియా వారి కోసమో నిర్దేశించినట్టుగా వార్తలు రాయడం సత్యనిష్ఠకు వ్యతిరేకం, భంగకరం. చట్టం ముందు అందరూ సమానులే! చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వారు కచ్చితంగా శిక్షార్హులే! అంచేత చట్టాల ఉల్లంఘనకు పాల్పడే వారిని రాజకీయాలకు అతీ తంగా శిక్షించడానికి పూనుకున్నప్పుడు సమాజం హర్షిస్తుంది. కాదంటే న్యాయ పరిరక్షణలో చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది. వారు ఏ స్థాయిలో ఉన్నా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడక తప్పదు. పి. విజయ బాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకులు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రులు -
ఆ నినాదాల కథేమిటి?
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’, ‘అమెరికా ఫస్ట్’ అనే రెండు ఆకర్షణీయమైన నినాదాలను ట్రంప్ ఇచ్చారు గానీ,వాటిని నిర్వచించలేదు. ఎంత అస్పష్టంగా ఉన్నప్పటికీ అమెరికన్ సమాజంలోని కొన్ని తరగతులను ఈ నినాదాలు బలంగా ఆకర్షించాయి. ఈ విడతలో ట్రంప్ పాలన ఈ నినాదాలకు ఎంతవరకు అనుగుణంగా ఉండవచ్చునన్నది ప్రశ్న.అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్), ‘అమెరికా ఫస్ట్’ అనే రెండు ఆకర్షణీయమైన నినాదాలు అయితే ఇచ్చారు గానీ, వాటికి నిర్వచనం ఏమిటో చెప్పకపోవటం ఆసక్తికరమైన విషయం. తన 2016 ఎన్నికలలోనూ ఈ నినాదాలు ఇచ్చిన ఆయన అపుడు గెలిచి, తర్వాతసారి ఓడి, ఈసారి తిరిగి గెలిచారు. అయినప్పటికీ ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆ మాటలకు ఎప్పుడూ నిర్వచనాలు చెప్ప లేదు. తన సమర్థకులు, వ్యతిరేకులు, మీడియా, ఇతరులు అయినా అడిగినట్లు కనిపించదు. ఇది ఆశ్చర్యకరమైన స్థితి.పై రెండు నినాదాలు ట్రంప్ ఉబుసుపోకకు ఇచ్చినవి కావు.అందువల్లనే ఇన్నేళ్ళుగా వాటిని ఇస్తూనే ఉండటమేగాక, ‘మాగా’ను ఒక ఉద్యమంగా ప్రకటించారు. దీనిని బయటి ప్రపంచం అంతగా పట్టించుకోక సాధారణమైన ఎన్నికల నినాదాలుగా పరిగణించటం ఒకటైతే, అమెరికాలోని ట్రంప్ ప్రత్యర్థులు, అకడమీషియన్లలోని అధిక సంఖ్యాకులు, ప్రధాన మీడియా సైతం అదే వైఖరి తీసుకోవటం గమనించదగ్గది. అట్లాగని అందరూ వదలివేశారని కాదు. అమెరికన్ సమాజంలోని కొన్ని తరగతులను ఈ నినాదాలు, అవి ఎంత అస్పష్టంగా ఉన్నప్పటికీ, బలంగా ఆకర్షించటాన్ని గుర్తించిన కొద్ది మంది పరిశీలకులు మాత్రం దాని లోతుపాతులలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి అధ్యయనాలను గమనించినట్లయితే ఈ రెండు నినాదాలు ఏ పరిస్థితులలో ఎప్పుడు రూపు తీసుకున్నాయి? వాటి పరస్పర సంబంధం ఏమిటి? అవి ఏ తరగతులపై ఎందుకు ప్రభావాలు చూపుతున్నాయి? ఆ నినాదాల స్వభావం ఏమిటి? ట్రంప్ వంటి నాయకుల జయాపజయాలతో నిమిత్తం లేకుండా వారి వెంట బలంగా ఎందుకు నిలబడు తున్నారు? ‘మాగా’ను ట్రంప్ అసా ధారణమైన రీతిలో ఒక ఉద్యమమని ఎందుకు అంటు న్నారు? చివరిగా చూసినట్లయితే, ఈ ఉద్యమం అనేది అమెరికన్ సమాజంలో ఎందుకు ఇంకా విస్తరిస్తున్నది? అనే విషయాలు ఒక మేరకైనా అర్థమవుతాయి.ఆ పరిశీలకులు చెప్తున్నది ముందు యథాతథంగా చూసి, ఈ నినాదాల లక్ష్యాల సాధనకు ట్రంప్ తన మొదటి విడత పాలనలో చేసిందేమిటి? చేయలేక పోయిందేమిటి? చేసిన వాటి ఫలితాలేమిటి? ఈసారి చేయగలదేమిటి? అనే విషయాలు తర్వాత విచారిద్దాము. విశేషం ఏమంటే, ట్రంప్ రిపబ్లికన్ కాగా, తన ‘మాగా’ తరహా నినాదాన్ని అదే పార్టీకి చెందిన అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ (1981–89) మొదటిసారిగా 1980లోనే మరొక రూపంలో ఇచ్చారు. ఆయన నినాదం ‘లెట్ అజ్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’. ఈ నినాదంలో రీగన్ ఆలోచనలకు ట్రంప్ ఉద్దేశాలతో పోలిక లేదన్నది అట్లుంచితే, రీగన్ తర్వాత ఆ నినాదం వెనుకకు పోయింది. తర్వాత 22 సంవత్సరాలకు రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ 2012లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బరాక్ ఒబామా చేతిలో ఓడినప్పుడు, ట్రంప్ తన ‘మాగా’ నినాదం తయారు చేశారు. అంతేకాదు, ఉత్పత్తులకు కాపీరైట్ పద్ధతిలో దీనిని రిజిస్టర్ కూడా చేయించారు. మరొక మూడేళ్లకు 2015లో అధ్యక్ష పదవి పోటీకి నామినేషన్ వేసి, ‘మాగా’ నినాదాన్ని ప్రకటించటంతోపాటు, అది ఒక ‘ఉద్యమ’మని కూడా అన్నారు.‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు వెంటనే అమెరికన్ సమాజంలోని కొన్ని తరగతులను ఆకర్షించాయి. వారిలో శ్వేతజాతీయులైన కార్మికులు, మామూలు పనులు చేసుకునేవారు, గ్రామీణ–పట్టణ ప్రాంత పేదలు, కన్సర్వేటివ్‌లు, సాంప్రదాయిక క్రైస్తవులు, డెమోక్రటిక్ పార్టీ సంపన్నుల కోసం పనిచేస్తుందనీ అందువల్ల తాము నష్ట పోతున్నామనీ భావించేవారు, తమ నిరుద్యోగ సమస్యకు ఆ పార్టీ విధానాలే కారణమనేవారూ ఉన్నారు. ఆ చర్చలోనే భాగంగా విదేశీ యుల సక్రమ, అక్రమ వలసలు ముందుకొచ్చాయి. గమనించ దగినదేమంటే, 2012లో గానీ, 2015లో నామినేషన్ వేసిన సమ యానికిగానీ ట్రంప్ తన నినాదాలకు నిర్వచనం చెప్పలేదు. అయి నప్పటికీ వారంతా, ‘అనిర్వచనీయ అనుభూతి’ అన్న పద్ధతిలో ట్రంప్ నినాదాలలో తమ సమస్యలకు ‘అనిర్వచనీయ పరిష్కారం’ ఏదో చూసుకున్నారు. ట్రంప్ అన్నట్లు అదొక ఉద్యమంగా, లేక రహస్యోద్యమంగా వ్యాపించింది. దాని కదలి కలను డెమోక్రాట్లు, మీడియా, ఉదార వాదులు, అకడమిక్ పండి తులు ఎవరూ గమనించలేదు. తీరా 2016 ఎన్నికలో హిల్లరీ క్లింటన్ ఓడి ట్రంప్ గెలవటంతో వీరికి భూకంపం వచ్చినట్లయింది.ట్రంప్ స్వయంగా నిర్వచించకపోయినా, ఆయన నినాదాలలో తన సమర్థకులకు కని పించిందేమిటి? అవి అమెరికాలో మొదటి నుంచిగల నేటివ్ అమెరికన్లకు ఉపయోగ పడతాయి. అమెరికా ఒకప్పుడు గొప్ప దేశం కాగా తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోయింది. అందుకు కారణాలు విదేశీ ప్రభావాలు. ఆ ప్రభావాలు వలసలు, బహుళ సంస్కృతుల రూపంలో, అదే విధంగా ప్రపంచీకరణల ద్వారా కనిపిస్తూ స్థానిక జనాన్ని, సంస్కృతులను, ఆర్థిక పరిస్థితులను దెబ్బ తీస్తున్నాయి.అందువల్లనే ఉద్యోగ ఉపాధులు పోవటం, ధరలు పెరగటం వంటివి జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో విదేశీ ఆర్థిక ప్రభావాలను, వలసలను అరికట్టినట్లయితే, ‘అమెరికా ఫస్ట్’ నినాదం ప్రకారం తమకు రక్షణ లభిస్తుంది, తమ సంస్కృతి వర్ధిల్లుతుంది. ఈ తరగతుల ఈ విధమైన ఆలోచనల నుంచి వారికి ఈ నినాదాల ద్వారా, కొన్ని లక్షణాలు లేదా స్వభావం ఏర్పడ్డాయి. నాయకత్వం నుంచి నినాదాలకు స్పష్టమైన నిర్వచనాలు లేకపోవటం అందుకు దోహదం చేసింది. అట్లా కలిగిన లక్షణాలు తీవ్రమైన వైఖరి తీసుకోవటం, వలసలు వచ్చే వారిపై, ముస్లిం తదితర మైనారిటీలపై ఆగ్రహం, జాతివాదం, మహిళా వ్యతిరేకత, ఉదారవాద వ్యతిరేకత, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేదానిపట్ల వ్యతిరేకత, తీవ్రంగా వివాదా స్పదంగా మాట్లాడటం, చట్టాల ఉల్లంఘన, హింసకు వెనుకాడక పోవటం వంటివి వారిలో తలెత్తి నానాటికీ పెరుగుతూ పోయాయి.విశేషం ఏమంటే, ట్రంప్ స్వయంగా ఒక ధనిక కుటుంబం నుంచి వచ్చి తాను కూడా బిలియన్లకొద్దీ ధనం సంపాదించి కూడా తన భావజాలం ప్రభావంతో పై విధమైన తరగతులకు ప్రతినిధిగా మారారు. వారి ఆలోచనలూ, ఆకాంక్షలకు, తన ఆలో చనలకు తేడా లేనందున ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలకు ప్రత్యేకంగా నిర్వచనాలు చెప్పవలసిన అవసరమే రాలేదు. ఒకరినొకరు అప్రకటితమైన రీతిలో అర్థం చేసుకుని సహజ మిత్రులయ్యారు. గత పర్యాయం ట్రంప్ ప్రచారాంశాలు, మొదటి విడత పాలనలో తను తీసుకున్న కొన్ని చర్యలు వారి బంధాన్ని మరింత బలపరిచాయి. ఉదాహరణకు, ముస్లింల రాకను ‘పూర్తిగా’ నిషేధించగలనని 2015 నాటి ప్రచారంలోనే ప్రకటించిన ఆయన, అధ్యక్షుడైన తర్వాత పట్టుదలగా మూడుసార్లు ప్రయత్నించి కొన్ని అరబ్ దేశాల నుంచి వలసలను నిషేధించారు. అమెరికాకు, మెక్సికోకు మధ్య గోడ నిర్మాణం మొదలుపెట్టారు. వీసాలపై పరిమితులు విధించారు. యూరప్‌తో సహా పలు దేశాల దిగుమతులపై సుంకాలు పెంచారు. తమకు ఆర్థిక ప్రత్యర్థిగా మారిన చైనాపై ఆర్థిక యుద్ధం ప్రకటించారు. తమ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నదంటూ ఇండియాను నిందించారు. చైనా నుంచి అమెరికాకు తిరిగి రావాలంటూ అమెరికన్ కంపెనీలను బెదిరించారు. ఆ దేశం తమ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉద్యోగాలను ‘దొంగిలిస్తూ’ తమ యువకులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నదన్నారు.ఈ చర్యల వల్ల అమెరికాకు అంతిమంగా కలిగిన ప్రయోజనాలు స్వల్పమన్నది వేరే విషయం. కానీ, గమనించవలసింది దీనంతటిలోని అంతరార్థం. అది గమనించినందువల్లనే, నినాదాలకు నిర్వచనాలంటూ లేకున్నా ఆ తరగతులు ఇప్పటి ఎన్నికల వరకు ట్రంప్‌కు అండగా నిలిచాయి. చివరకు, పోయినసారి ట్రంప్ ఓడిపోయి కూడా అధికార బదిలీకి వెంటనే అంగీకరించని అసాధారణ స్థితి గానీ, ఆయన ప్రోత్సా హంతో అనుచరులు క్యాపిటల్ హిల్ వద్ద హింసకు పాల్పడటంగానీ, పైన పేర్కొన్న స్వభావాల నుంచి పుట్టుకొచ్చినవే.ట్రంప్ పాలన ఈ విడతలో ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలకు ఎంతవరకు అనుగుణంగా ఉండవచ్చునన్నది ప్రశ్న. గత పర్యాయపు పాలనానుభవాలు ఆయనకు ఉన్నాయి. అది గాక, ప్రపంచ పరిస్థితులు ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా అప్పటి కన్నా మారాయి.అందువల్ల, వాస్తవ పాలన ఏ విధంగా సాగేదీ వేచి చూడవలసిందే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!
అండమాన్, నికోబార్ దీవులలో ‘అండమాన్, నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొ రేషన్’ (ఏఎన్ఐఐడీసీఓ) అనే పాక్షిక–ప్రభుత్వ ఏజెన్సీ ఉంది. ‘ఈ ప్రాంత సమతుల్య పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం సహజ వనరులను వాణిజ్యపరంగా ఉప యోగించుకోవడానికీ, అభివృద్ధి చేయడానికీ’ దీనిని కంపెనీల చట్టం కింద 1988లో స్థాపించారు. దాని ప్రధాన కార్యకలాపాలలో పెట్రోలియం ఉత్పత్తుల వర్తకంతో సహా, భారతదేశంలో తయారయ్యే విదేశీ మద్యం, పాలు, పర్యాటక రిసార్ట్‌ల నిర్వహణ; పర్యాటకం కోసం, మత్స్య సంపద కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివీ ఉన్నాయి. అంతవరకు పెద్దగా తెలియని ఈ సంస్థకు 2020 ఆగస్టులో రాత్రికి రాత్రే గ్రేట్ నికోబార్ ద్వీపంలో 72 వేల కోట్ల భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ఇందులో భారీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, విమానాశ్రయం, టౌన్షిప్ నిర్మాణంతో పాటు, 130 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ భూమిలో విస్తరించే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమై ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత, ఏఎన్ఐఐడీసీఓ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) నుండి రెండు కీలకమైన అనుమతులను పొందింది. మొదటిది, అక్టోబర్ 2022లో చోటు చేసుకుంది. మంత్రిత్వ శాఖకు చెందిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) అటవీ భూమిని ఇతర అవసరాలకోసం మళ్లించేందుకు అనుమతించింది. అత్యంత సహజమైన, జీవవైవిధ్యం కలిగిన ఉష్ణమండల అడవులలో 130 చదరపు కి.మీ. (ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కంటే పెద్దది) విస్తీర్ణం కల భూమి మళ్లింపుపై ఈ కమిటీ సంతకం చేసింది. దాదాపు ఒక నెల తర్వాత, నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) కీలకమైన పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు పది లక్షల చెట్లను నరికివేయనున్నారన్న విషయంపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనలో ప్రాజెక్ట్ డాక్యుమెంట్లలో దాదాపు 8.5 లక్షల నుండి 9.64 లక్షల వరకు చెట్లు నరికివేయడంపై ప్రాథమిక అంచనాలు మారాయి. వాతావరణ సంక్షోభం వేగవంతమైన ఈ యుగంలో బలి ఇవ్వాల్సిన చెట్ల సంఖ్యను చూసి చాలా మంది నివ్వెరపోయారు. ఒక జాతీయ పత్రికలో నివేదించి నట్లుగా, నిజానికి మనం కనీసం 30 లక్షల చెట్లను కోల్పో వలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఇది వాస్తవమైతే అందుబాటులో ఉన్న డేటాను బట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాజెక్ట్, అటవీ భూమి మళ్లింపు కోసం అనుమతి కోరినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ప్రతి పాదకుడు మంత్రిత్వ శాఖకు ఏ సమాచారాన్ని అందించారు? ద్వీపంలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ఈ ఏజెన్సీని కోరినప్పుడు, నరికివేయాల్సిన చెట్ల సంఖ్య ఎవరికీ తెలియదా? పాలు, ఆల్కహాల్, పెట్రోలియం అమ్మకంలో ప్రధాన వ్యాపార అనుభవం ఉన్న సంస్థను ఈ వ్యవహారంలో ఎవరైనా క్షమించవచ్చు. కానీ మంత్రిత్వ శాఖలోని శాస్త్రీయ, పర్యావరణ సంస్థల మాట ఏమిటి? పైగా పర్యావరణం, అటవీ అనుమతుల మాట ఏంటి?అన్ని వనరులూ, అధికారం తమ వద్దే ఉన్నందున, ఈఏసీ, ఎఫ్సీఏ సరైన ప్రశ్నలను ఎందుకు అడగలేదు? ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతిని మంజూరు చేసేటప్పుడు ఈఏసీ స్థానం కేసి అంతర్ దృష్టితో చూస్తే శాస్త్రీయ సామర్థ్యం, భాషలో నైపుణ్యం అనేవి ఈఏసీ నిర్దేశించిన ప్రమాణాల్లోనే కనిపిస్తాయి. ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి: ‘ఏ చెట్లూ ఒకేసారి నరికివేయబడవు. వార్షిక ప్రాతిపదికన పని పురోగతిని బట్టి దశలవారీగా ఈ పని జరుగుతుంది. అసాధారణంగా పొడవుగానూ, వయ స్సులో పెద్దగా ఉన్న అన్ని చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ ‘అసాధారణంగా పొడవైన చెట్టు’ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే? చెట్టు పాతదిగా పరిగణించ బడటానికి సరైన వయస్సును ఎలా నిర్ణయిస్తారు? ప్రారంభించడానికి, మీరు చెట్టు వయస్సును ఎలా అంచనా వేస్తారు? అలాగే ‘సాధ్యమైనంత వరకు’ వాటిని రక్షించడం అంటే అర్థం ఏమిటి? రెండవ ఉదాహరణ మరింత మెరుగైనది– ‘స్థానిక గుడ్లగూబల గూడు రంధ్రాలు ఉన్న చెట్లను ఎస్ఏసీఓఎన్ (సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్) సహాయంతో గుర్తించి జియో–ట్యాగ్ చేయాలి. అటువంటి చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ పక్షి ప్రవర్తన, రాత్రిపూట దాని అలవాట్లను పరిగణ నలోకి తీసుకుని, గుడ్లగూబను (ఏదైనా గుడ్లగూబ) చూడటం ఎంత కష్టమో తెలియనిది కాదు. నిజానికి, నికోబార్ వర్షాటవిలోని చెట్లు ఆకాశంలోకి 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించినట్లయితే, ఒక మిలియన్ చెట్లకు గూడు రంధ్రాలు వెతకడానికి మొత్తం 83,000 గంటల సమయం పడుతుంది. మన ఉత్తమ పక్షి వీక్షకు లలో 10 మంది ఏకకాలంలో రోజుకు 8 గంటలు సర్వే చేసినా, అది పూర్తి కావడానికి దాదాపు ఆరేళ్లు పడుతుంది.ఇప్పుడు ఈ ఆమోదిత షరతును మళ్లీ చదవండి. మీరు దీని గురించి ఏ భావాన్ని పొందగలరో చూడండి. ఈ చెట్లను లెక్కించడానికి, కత్తిరించడానికి రవాణా చేయ డానికి ఇప్పటికే ఏఎన్ఐఐడీసీఓ కాంట్రాక్టర్లను ఆహ్వానించింది. గొడ్డళ్లు చెట్లను నేలకూల్చుతుంటే వాటిని రక్షించడం మాని... భూమికి వంద అడుగుల ఎత్తులో ఉన్న గుడ్లగూబల గూడు రంధ్రాల కోసం మన ఎస్ఏసీఓఎన్ మిత్రులు వెతుకుతూ ఉండరని ఆశిద్దాం.-పంకజ్ సేఖసరియావ్యాసకర్త ఐఐటీ బాంబే అసోసియేట్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైవ్స్ సౌజన్యంతో) -
శరీర ధర్మం
మానవ ధర్మంగా తగినంత ప్రయత్నం చేయకుండా, ఫలాన్ని గురించి ఆలోచించడం వివేకంతో కూడుకున్న పని కాదు. మానకుండా మానవ ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే, ఆ ప్రయత్నానికి సరైన సమయంలో దైవం అందించే సహకారం తోడవుతుంది. ‘దేవుడిస్తాడులే!’ అనుకుంటూ ఏరోజు కారోజు, ఏవిధమైన ప్రయత్నమూ చేయ కుండా, ఇంట్లో కూర్చుంటే ఎవరికైనా సంపద ఎలా చేకూరుతుంది? పళ్ళెంలో వడ్డించివున్న పంచభక్ష్య పరమాణ్ణాలు, ఎవరికైనా గాని తింటేనే కదా కడుపులోకి వెళ్ళేది! తినే ప్రయత్నం కూడా చేయకపోతే కడుపెలా నిండుతుంది? ఆక లెలా తీరుతుంది? అందువల్ల సారాంశంగా తేలేది ఏమిటంటే మనిషి కోరకుండా దేవుడు ఇవ్వడం కూడా సంభవం కాదు. ఆకలితో ఉన్న బిడ్డడు, ఆ విషయాన్ని తల్లికి చెప్పి అడగనిదే అమ్మయినా పెట్టలేదు. ఇంట్లో అన్ని రకాల దినుసులు పుష్కలంగా ముందు నుండీ ఉంటాయి. కాని, వండి వార్చకుండా భోజనానికి వీలయ్యే పదార్థాలుగా అవి మార్పు చెందవు కదా! ఈ విషయాన్నే గట్టుప్రభువు తన ‘కుచేలోపా ఖ్యానం’ కావ్యం, ప్రథమాశ్వాసంలోని ఈ కింది పద్యం ద్వారా చెప్పాడు. కం. కావున మనుజుడు సేయక దేవుండీయంగ లేడు తెగి యేమియు నా నావిధ ధాన్యము లుండిన వావిరి వండకయె రిత్త వంటక మగునే. శ్రమించడం శరీర ధర్మం అని చెప్పడం పై పద్యంలోని మాటల ముఖ్యోద్దేశం. ఆ శరీర ధర్మాన్ని పాటించే వ్యక్తికే దైవ సహాయమైనా ,అంతకంటే ముందు ఆ కష్టాన్ని ప్రత్యక్షంగాతన కళ్ళతో చూసి స్పందించే తోటి మనిషి సహాయమైనా అందుతుంది తప్ప ఆ ఉత్తమ ధర్మాన్ని పాటించని వ్యక్తులకు కాదని తెలుసు కోవాలి.– భట్టు వెంకటరావు -
గ్రామీణ భారత వెన్ను విరుస్తారా?
భారతదేశ ఆర్థిక సంక్షోభానికి కారణం వ్యవసాయదారులపైన, వ్యవసాయ సంస్కృతి పైన చూపిన నిర్లక్ష్యం. దానికి విరుగుడుగా దేశంలో కోట్ల మందిగా ఉన్న గ్రామీణ కూలీలకు కనీస బతుకుదెరువు కల్పించడం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చింది. ఈ పథకం అమలు కావడం వల్ల పేదల కడుపులోకి నాలుగు మెతుకులు పోవడంతో పాటు ఆత్మ గౌరవం పెరిగింది. ఈ పథకం రూపకల్పనలో మానవతా స్ఫూర్తి ఉంది. కరుణాభావం ఉంది. రాజ్యాంగ అధ్యయనం ఉంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం బాధాకరమైన విషయం. సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారమే ఈ యుగ ధర్మం అని గుర్తించాలి.భారతదేశంలో ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక వర్గానికి, అందునా దళిత బహుజన వర్గాలకు ఆచారణాత్మక విరో ధాన్ని ప్రకటిస్తున్నాయి. దానికి రుజువు ఏమిటంటే, పేద ప్రజలకు మేలు కలిగించి వారి పొట్ట నింపుతూ వారికి గ్రామాల్లో నివసించే పరిస్థితిని కల్పించిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ పథకాన్ని(ఎంజీ–ఎన్ఆర్ఈజీఎస్) నీరు గార్చడం. ఇది పేద లను గ్రామాల నుంచి తరిమేసి, గ్రామాలను కార్పొరేట్లకు అప్పజెప్పే దుష్ట యత్నం. దేశంలో కోట్ల మందిగా వున్న గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ ఇవ్వడం కోసం స్వాతంత్య్రానంతరం వచ్చిన ఒకే ఒక్క పథకం – గ్రామీణ ఉపాధి హామీ. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి నాడు వామపక్షాల మద్దతు అనివార్యమైంది. దాంతో వామపక్షాలు డిమాండ్ చేసినట్టుగా గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధంగా అమలు చేయాల్సి వచ్చింది. 2005 ఆగస్ట్ 23న దేశ పార్లమెంట్ చారిత్రాత్మకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆమోదించింది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండమీదపల్లి గ్రామంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2006 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. ఈ పథకం అమలు కావడం వల్ల పేదల కడుపులోకి నాలుగు మెతుకులు పోవడంతో పాటు ఆత్మ గౌరవం పెరిగింది.నిజానికి మన్మోహన్ భారతదేశానికి ఉపకరించే అనేక ఉపయో గకరమైన పనులు నిర్వర్తించారు. ఉపాధి హామీ పథకం రూపకల్ప నలో ఆంధ్ర క్యాడర్‌కు సంబంధించి ఢిల్లీలో పనిచేసిన కొప్పుల రాజు ప్రభావం ఉంది. ఆయన మీద ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పోరా టాల ఫలితం ఉంది. ఈ పథకం రూపకల్పనలో మానవతా స్ఫూర్తి ఉంది. కరుణాభావం ఉంది. రాజ్యాంగపు అధ్యయనం ఉంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం బాధాకరమైన విషయం.అంతర్జాతీయస్థాయిలో మానవాభివృద్ధిని గణించినట్లు, భారత దేశంలో కూడా లెక్కించడానికి ప్రణాళికాసంఘం ఆధ్వర్యంలో ప్రయ త్నాలు జరిగాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మానవాభి వృద్ధిలో మెరుగైన పనితీరును ప్రదర్శించాయి. కానీ ఆర్థికాభివృద్ధికీ, మానవాభివృద్ధికీ మధ్య ఉండే ధనాత్మక సహసంబంధం మధ్యంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు అన్వయించడం లేదు. అయితే కేరళ రాష్ట్రం మానవాభివృద్ధిలోనూ, ఆర్థికాభివృద్ధిలోనూ సమాన మెరుగుదల కనబరుస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా మొదలైనవాటి పనితీరుతో కేరళ రెండింతల మెరుగుదల కన బరిచింది. పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా మొదలైన రాష్ట్రాలు చెప్పుకోతగ్గ పురోగతిని సాధించాయి. క్లుప్తంగా చెప్పాలంటే చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మానవాభివృద్ధిలో మంచి ఫలితాలను సాధించాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మానవాభివృద్ధిలో గణనీయమైన పురోగతి కనిపిస్తున్నప్పటికీ, వాటి మధ్య అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి భారతదేశ ఆర్థిక సంక్షోభానికి కారణం వ్యవసాయ దారులపైన, వ్యవసాయ సంస్కృతిపైన చూపిన నిర్లక్ష్యం. భారతదేశంలో కుల కార్పొరేట్ దోపిడీ వ్యవస్థ రూపొందడానికి కారణాలను అంబేడ్కర్ ఆనాడే పసిగట్టారు. పేద ప్రజలను కులం ద్వారా విభజించి వారికి రాజ్యాధికారం రాకుండా చేయడానికే ప్రయత్నాలు జరి గాయి. అంబేడ్కర్ 1942లోనే మహరాష్ట్ర ‘కొలాబా’ జిల్లాలో అణ గారిన వర్గాల సభలో మాట్లాడుతూ, అగ్రవర్ణ రాజకీయ పార్టీలు, ఆర్థిక పెత్తందారులు, భూస్వాములు కలిసి శ్రామిక వర్గాలను ఏకం కాకుండా చేసి రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారన్నారు. ‘‘అణగారిన వర్గాల వారి ఉద్యమం ఇతర శ్రామికజనంతో కలిసి ముందుకు సాగాలని నేను ఆత్రుత పడుతున్నాను. ఈ లక్ష్యాన్నిదృష్టిలో ఉంచుకునే, బ్రాహ్మణేతర వర్గానికి చెందిన శ్రమజీవులు తమ స్వేచ్ఛకోసం ఎప్పుడో ఒకప్పుడు మహత్తర పోరాటం చేస్తారన్న ఆశ తోనే గత పదేళ్ళుగా బ్రాహ్మణేతర పార్టీలో కొనసాగుతున్నారు. మా పార్టీకి తన అంతరాంతరాలలో ప్రజాస్వామ్య బీజాలు ఉన్నాయి. దుర దృష్టవశాత్తు ఈ పార్టీ నాయకులు తమ బాధ్యతలను గుర్తించకుండా ఒకవైపున ప్రభుత్వం, మరోవైపున కాంగ్రెస్ ప్రభావం వల్ల ఈ పార్టీ ఛిన్నాభిన్నం కావడానికి దోహదం చేశారు. ఇప్పటికైనా ఈ విషయంలో వారు ఏమైనా చేయగలిగితే నేను ఆహ్వానిస్తాను. బ్రాహ్మణే తరులైన శ్రమజీవులు మా పార్టీలో చేరాలని నేను పట్టబట్టడం లేదు. కావాలనుకుంటే వారు వేరే పార్టీ పెట్టుకోనివ్వండి. అయినా బ్రాహ్మ ణులకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా మనందరం కలిసి ఉమ్మడి పోరాటం చేయవచ్చు. అణగారిన వర్గాల వారు విడిగా ఒక రాజకీయ పార్టీ నడిపితే శ్రామికజన ప్రయోజనాలు దెబ్బతింటాయని కొందరు అంటున్నారు. దానివల్ల అలాంటిది ఏమీ జరగదు. అట్టడుగున ఉన్న మన పోరాటం నిజానికి ఇతర శ్రామిక వర్గాల వారి కష్టాలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. భవనంలోని అట్టడుగున ఉన్న పునాదిరాయి కదిలితే, పైన ఉన్నవి పట్టు సడలుతాయి. కేవలం సవర్ణ హిందు వులతో మాత్రమే కూడిన కార్మిక సంస్థ ఉంటే హిందువులకు మేలు కలుగుతుందని ఏమీ లేదు. ఒకవేళ ఆ కార్మిక సంస్థకు సరైన మార్గ దర్శనం లేకపోతే ఆ అణగారిన వర్గాల హిందువులకు మేలు కలుగు తుందని గ్యారెంటీ కూడా ఏమీ లేదు. పైగా హాని కూడా జరగొచ్చు. అనేక సందర్భాలలో జరిగినట్టు వారి హక్కులను కాలరాయడానికి ఉపయోగపడవచ్చు.’’ అంబేడ్కర్ ఆలోచనలు విశాలమైనవి. దీర్ఘ దర్శనంతో కూడు కున్నవి. ఇకపోతే ఉపాధి చట్టం కింద పని చేసిన కూలీలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ పని చేస్తే తప్ప పూట గడవని కూలీలకు ఆరేడు నెలలుగా బిల్లులు ఎందుకు బకాయి ఉంటున్నాయి? కూలీలకు సకాలంలో డబ్బులు అందకపోతే అనివార్యంగా ఈ పని నుండి తప్పు కొంటారు. పని దినాలు కల్పించాలనే డిమాండ్ చేయడం తగ్గిపోతుంది. తిరిగి మరలా గ్రామీణ వేతన దోపిడీకి గురికావలసి వస్తుంది. ఎన్నికల ముందు అనేక పథకాలు ప్రకటించి గద్దెనెక్కే పాలకులు చట్టబద్ధంగా అమలు చేయాల్సిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయకపోవడం వెనుక గ్రామీణ ప్రాంతాల నుండి పేదలను తరిమివేసే కుట్రలేదని భావించగలమా? ఈ కూలీలు ఇతర రాష్ట్రాల వ్యవసాయ పనులకు, మహా నగరాలకు పెద్ద ఎత్తున వలస వెళితే తప్ప అక్కడ చౌకగా శ్రమను అమ్ముకునే కార్మికులు దొరకరని సామా జిక విశ్లేషకులు చెబుతున్నారు.రాజ్యాంగం కార్మిక, శ్రామిక పక్షపాతంతో కూడుకుని ఉన్నదని పాలకులు గుర్తించలేకపోతున్నారు. పేద ప్రజలు తమ గ్రామంలో బతికితే ఆ గ్రామానికి వెలుగు, ఆ గ్రామానికి జీవం. ఈ పథకం వల్ల దళిత స్త్రీలు సూర్యోదయాన్నే కొంత కూలీని సంపాదించుకున్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ రోడ్ల పక్కన కాలువలు తీయబడ్డాయి. ఈ పథకం వల్ల గ్రామీణ స్కూళ్లు బలపడ్డాయి. పిల్లలను చదివించు కోగలిగారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో రాజ్యాంగ నిరాకరణ ఉంది. మానవతా స్ఫూర్తికి విరుద్ధమైన ఆచరణ ఉంది. సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారమే ఈ యుగ ధర్మం. అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం. బలమైన గ్రామీణ భారతదేశాన్ని నిర్మిద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులుమొబైల్: 98497 41695 -
ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు.. మూసీ సుందరీకరణ లక్ష్యం ఏమిటి?
రాజకీయ రంగస్థలంపై మూసీ ప్రక్షాళన, పారదర్శకత లోపించి తీవ్ర వివాదాస్పద మవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్ల కూల్చివేతకు సంబంధించి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అగ్రహం ప్రకటించింది. ‘రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏమిటని, ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడుతారని, రాజకీయ భాష్యాలు చెప్పినట్లు చేస్తే జైళ్లకు పంపు తామ’ని హెచ్చరించింది. పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారనీ, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారనీ. ప్రభుత్వంపై, కమిషనర్ రంగనాథ్‌పై, అమీన్పూర్ తహసిల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ ఆక్రమణల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్.టి.ఎల్. నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్.టి.ఎల్ బయట ఇల్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించింది.‘అసలు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట జరుగుతున్న సుందరీకరణ లక్ష్యం ఏమిటి? మూసీ నదిని, ఆ నదిలో కలిసే వాగులను (గృహ, హోటల్, వ్యాపార, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, మురుగునీటిని) పూర్తి (ఐరోపా ప్రమాణాల) స్థాయిలో ప్రక్షాళన (శుద్ధి) చేసి స్వచ్ఛమైన జలాలు (నది)గా మార్చే లక్ష్యం ఏమైనా ఉందా? ప్రాజెక్టు పూర్తి అయితే, అంటే ఆ మురుగు నీటిని మూసీ నదిలో కలిసే నాటికి పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే ప్రక్రియ ఇందులో ఉందా? లేదా హైదరాబాద్ జంట నగరాలలోని మురుగు నీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదిలేసి ఆ మురుగు నీటి ప్రవాహంపైనే, సుందరీకరణ చేపడతారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. సమగ్రమైన ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్)ను ప్రజల ముందు ఉంచాలి. ప్రజల నివాసాలకు నష్టం కలిగే ఏ ప్రాజెక్టులో నైనా ముందు పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తయిన తరువాతనే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వారి నివాసాలను చివరలో ఖాళీ చేయించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. కానీ, అందుకు భిన్నంగా సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు జీవితమంతా కష్టించి నిర్మించుకున్న ఇండ్లను ప్రాజెక్టు ప్రారంభంలోనే ఎందుకు కూల్చుతున్నారు? ఇదేనా కేసీఆర్ విధానాలకు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యం?సామాన్య, మధ్యతరగతి వారికి ఒక ఇల్లు అనేది వారి మొత్తం జీవితపు కల. ఆ కల నిజం చేసుకోవడానికి జీవితంలో చాలా మూల్యం చెల్లిస్తారు. పట్టణంలో ఇల్లనే కల సాకారం కోసం సొంత ఊళ్ళలో ఉన్న పొలాలను, ఇతర ఆస్తులను అమ్ముతారు. అప్పులు తెస్తారు. అనేక కష్టాలతో వారి స్తోమతకు తగ్గ ఇల్లు నిర్మించుకుంటారు. ప్రాజెక్టు పేరుతో, పునరావాసం, ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ప్రభుత్వాల, పెద్దల రియల్ ఎస్టేట్ దందాతో 10, 20 గజాల నేలపై ఇల్లు కట్టుకోవడం సామాన్య మధ్య తరగతికి ఒక గగన కుసుమంగా మారింది. అందుకే వీరు మురికి వాడలకు, దుర్గంధ నదుల పరివాహ ప్రాంతాలకు తరలు తున్నారు. చౌకగా వస్తుందని దుర్గంధపూరిత నది అంచునే స్థలం కొని, భారీ డబ్బుతో క్రమబద్ధీకరణ చేసుకొని, ఇండ్లు నిర్మించుకున్నారు. కూల్చివేతల భయంతో గుండె పోటు చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. 8 నెలల నిండు గర్భిణీ అనే కనికరం లేకుండా ఆమె ఇల్లు కూల్చడం దుర్మార్గం. ఒక బాధిత కుటుంబం 25 ఏళ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటూ నలుగురు కొడు కులకు పెళ్లి చేసింది. నిర్వాసితులైన వీరందరికీ ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లభించింది. ఒక్క ఇంట్లో ఇన్ని కుటుంబాలు ఎలా నివసించాలని వేదనకు గురవుతున్నారు వారు. హైడ్రాతో ప్రభుత్వానికి వచ్చిన కీర్తి, మూసి పేదల ఇళ్ల కూల్చివేతతో పాతాళంలోకి పోయింది.జల వనరులను, ప్రభుత్వ స్థలాలను, పార్కులను రక్షించవలసిందే. కానీ వాటిని ఆక్రమించి భారీ ఆస్తులుగా చేసుకున్నది సామాన్య పౌరులు కాదు. అధికారంలో ఉన్న బడాబాబులు, పెద్దలే. మూసీ నదీ గర్భంలో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపినా, మరికొందరు ఇండ్లను వదిలిపెట్టడానికి ససేమిరా సిద్ధంగా లేరు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆశించిన స్థానిక ప్రజలు వాటిని తమకే కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. మూసి నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ సమీప ప్రజల మధ్య ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించి దాదాపు 15 వేల కుటుంబ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని 2022లోనే నిర్ణయించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంలో పది వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. ఆ నిర్వాసి తులందరికీ వారి నివాసానికి, ఉపాధికి అనువైన చోట అన్ని మౌలిక వసతులతో కూడిన పునరావాస సౌకర్యాలను ప్రభుత్వం నిర్వాసితులకు కల్పించాలి. దౌర్జన్యంతో కాకుండా నిర్వాసితులను అన్ని విధాల ఒప్పించి మెప్పించి పునరావస కాలనీకి తరలించాలి.చదవండి: రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చాలి!శుద్ధీకరణ అంటే, మురుగు నీటిలో ఉన్న అశుద్ధ మూలకాలను, కాలుష్యాన్ని తొలగించడం. శుద్ధి చేసిన తర్వాత ఆ నీరు త్రాగడానికి అనువైన విధంగా 100% సురక్షితంగా ఉండాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజె క్టులో నేటి ప్రభుత్వం ఆ నది మురుగు జలాలను అలా స్వచ్ఛమైన తాగునీరుగా మారుస్తుందా? దేశంలోని చాలా నగరాల్లో మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఎక్కడా మురుగు నీటిని స్వచ్ఛ జలాలుగా మార్చిన చరిత్ర నేటికీ లేనేలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో అంగీకరించారు. సీవరేస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ల ద్వారా మురుగునీటి శుద్ధీకరణ 30–35% కంటే మించదనీ, తెలంగాణలోలోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ పథకానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టనీ, మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అనీ రకరకాల పేర్లతో మంత్రులు, అధికారులే గందరగోళం చేస్తున్నారు. మూíసీ నదిని పూర్తి స్థాయిలో ఒక ఎకలాజికల్ ప్రాజెక్టు (ఒక స్వచ్ఛమైన నది)గా తీర్చి దిద్దాలనే లక్ష్యం ఏమైనా ప్రభుత్వానికి ఉందా?చదవండి: ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ఒక మేన్యువల్‌ను 1997లో ప్రకటించింది. ‘డిజైన్ మేన్యువల్ ఫర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఇన్ ఇండియా’ (దేశంలోని వ్యర్థాల స్థిరీకరణ చెరువుల కోసం డిజైన్ మాన్యువల్). ఇది ప్రకటించి 27 ఏళ్ల అయింది. దీని అర్థం ఏమిటంటే... మురుగు నీటిని శుద్ధి చేయలేమని చేతులెత్తేసి, ఆ నీటిని తాగునీరులో కలవకుండా మురుగునీటిని కుంటలుగా స్థిరపరుస్తామని చెప్పడం. కోటిమంది హైదరాబాద్ నగర వాసులు వాడిన మురికి నీరు, వ్యాపార సముదాయాల వ్యర్థాలు, పరిశ్ర మలు వెదజల్లే విష పదార్థాలు మూసీ ద్వారా కృష్ణా నదిలో యధేచ్ఛగా కలుస్తున్నాయి. ఆ కలుషిత నీటినే ప్రజలు జీవజలంగా సేవిస్తున్నారు. మురుగు నీటి శుద్ధీకరణ పథ కాలకు ఎంత అందమైన పేర్లు పెట్టినా శుద్ధీకరణ వట్టిదే నని 75 ఏళ్ల దేశ చరిత్ర రుజువు చేస్తోంది. ఇది కఠిన వాస్తవం. మరి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ లిమిటెడ్ ప్రక్షాళన ఏ రకమైనదో... డీపీఆర్‌ను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి.- నైనాల గోవర్ధన్ తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ -
రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చండి ప్లీజ్!
ప్రస్తుతం శాసనమండలి ఎన్నికలకు సంబంధించిన సందడి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నిక కోసం పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రభుత్వం ఈ నెల 6వ తేదిని ఆఖరు తేదీగా ప్రకటించింది. ఈ ఓటు హక్కు కోసం 2021లోపు డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులని ప్రకటించింది. ఆ యా పార్టీల అభ్యర్థులు, వ్యాపార సంస్థల నుండి పట్టభద్రులుగా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలనుకునే వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ సెల్ నెంబరు ద్వారా ఓటు నమోదు కోసం గ్రాడ్యుయేట్లను కోరుతున్నారు. అయితే పట్టభద్రులు తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి కావడంతో... చాలామంది రిజిస్ట్రేషన్‌కు వెళ్లడానికి బద్ధకిస్తున్నారు.వాస్తవానికి ఓటు హక్కును సులువుగా ఉపయోగించుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల అనేక మంది పట్టభద్రులు ప్రత్యేకంగా ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి ఓటు నమోదు చేసుకోడానికి సమయం వెచ్చించడం లేదు. పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఉంచిన వెబ్ సైట్లో డిగ్రీ ధ్రువపత్రం, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డు నంబర్లను నమోదు చేసినా... మళ్లీ గెజిటెడ్ స్థాయి అధికారి సంతకంతో ధ్రువీకరించిన పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలనే షరతు చికాకు కలిగిస్తోంది. అందుకే చాలామంది తమ ఓటును రిజిస్టర్ చేసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు.చదవండి: స్టూడెంట్ లీడర్ టు సీఎం.. రేవంత్ రెడ్డి రాజకీయ పొలిటికల్ జర్నీఒకవేళ ఇదే మంచి ఆలోచన అని ప్రభుత్వం భావించినప్పుడు ఆ యా మండల స్థాయిలోనే ఒకరిద్దరు గెజిటెడ్ స్థాయి అధికారులను ఉంచి, అక్కడే ఓటు హక్కును ప్రభుత్వమే నమోదు చేస్తే బాగుండేది. ఈ విషయాన్ని అటు ఎన్నికల కమిషన్, ఇటు ప్రభుత్వం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్ని షరతులు ఉన్నా... వాటిని అధిగమించి తమ ఓటును రిజిస్టర్ చేసుకోవాలి. మంచి ప్రతినిధిని ఎన్నుకుని గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయాలి.– సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
స్ఫూర్తిమంతమైన విజయపథంలో... సీఎం రేవంత్ రెడ్డి
ప్రత్యర్థులు ఎన్ని అవరోధాలు కల్పించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధించారు అనుమల రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంత స్తబ్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో రేవంత్ పాత్ర అంతా ఇంతా కాదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టాక దూకుడుగా ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరు సాగించారు. ఈ సమయంలో పార్టీలో సీనియర్లు, జూనియర్లనే భేదం లేకుండా అందరినీ కలుపుకు పోయారు. కేసీఆర్‌ను గద్దెదించుతానని శపథం చేసి నిజంగానే ఆయన్నిఇంటికి పంపారు. 2023, డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ పదవీ ప్రమాణం స్వీకారం చేసి ప్రజా పాలనను ప్రారంభించారు.రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా) వంగూర్ మండలం కొండారెడ్డి పల్లెలో జన్మించారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్ పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ అయ్యారు. 2006లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జెల్ జడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు.మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభ జన తర్వాత... అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రెండోసారి గెలిచారు. 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనా, మరుసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా అత్యుత్తమ పని తీరును కనబరిచారు. దీంతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు. ఈ నేపథ్యంలో 2021లో రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించింది.అన్నీతానై 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తిచూపారు. వారి అవినీతిని బయట పెట్టారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కింద వైద్య చికిత్సకు పది లక్షల వరకు సాయం పెంచారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. గత 11 నెలల్లో తెలంగాణలో మహిళలు 101 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ ట్రిప్స్ ఉపయోగించు కున్నారు. దీని వల్ల మహిళలకు 3,433 కోట్ల రూపా యలు ఆదా అయ్యాయి. రుణమాఫీని బీఆర్ఎస్ పదేళ్లలో సక్రమంగా అమలు చేయకుండా చేతులెత్తేసింది. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని కేవలం 8 నెలల్లోనే అమలు చేసింది కాంగ్రెస్. 22 లక్షల 22 వేల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. పేద లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్‌ను ఇస్తోంది.చదవండి: పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా?కేవలం 11 నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో వేల కొలది ఉద్యోగాలను భర్తీ చేశారు. మూసీ నది పునరుజ్జీవానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూని వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నారు. 11 నెలల కాలంలోనే బీఆర్ఎస్ పాలనలోని చీకట్లను రేవంత్ రెడ్డి పారదోలి తెలంగాణను అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చేస్తున్నారు. అటువంటి ప్రియ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు!- వెలిచాల రాజేందర్రావు (Velichala Rajender Rao)కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి(నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం) -
‘కొత్త’ ట్రంప్ ఎలా పాలిస్తారు?
ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో కొలువుదీరినప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారిపోయింది. అదే సమయంలో గతం హయాంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు, చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. కాబట్టి ట్రంప్ 2.0 పాలన, ట్రంప్ 1.0 పాలన కంటే భిన్నంగా ఉంటుందని ఆశించాలి. అయితే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉంటుందనైతే చెప్పవచ్చు. ట్రంప్ మునుపటి లాగే చైనాతో కఠినంగా ఉండవచ్చు, భారతదేశం పట్ల స్నేహపూర్వకంగా ఉండవచ్చు. కానీ అది ఆయన తక్షణ ప్రాధాన్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా మోదీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయడం మంచిది.అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు ఆకర్షించి నంత ఎక్కువగా మరే దేశ ఎన్నికా ప్రపంచ దృష్టిని ఆకర్షించలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన దేశంగా అమెరికా కొనసాగుతోంది. దీని అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద సాంకేతిక, శాస్త్రీయ కేంద్రం, అతిపెద్ద సాయుధ దళాలను అమెరికా అధ్యక్షుడు నడుపుతారు. అయినప్పటికీ దేశాధ్యక్షురాలిగా ఒక మహిళను ఎన్ను కునేందుకు అమెరికా ఇంకా సిద్ధంగా లేదు. డోనాల్డ్ ట్రంప్‌కు స్త్రీలను ద్వేషించే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్‌లను ఓడించగలిగారు. జాతి, వర్గ ఆధిపత్య రాజకీయాలలో, లింగానికి వెనుక సీటు దక్కింది. ఎన్నికల ఒపీనియన్ పోల్స్ మరోసారి తలకిందులైపోయాయి.కొత్త ముఖాల ప్రభుత్వంబెర్లిన్ నుండి టోక్యో వరకు, మాస్కో నుండి బీజింగ్ వరకు, టెల్ అవీవ్ నుండి తెహ్రాన్, నిజానికి, న్యూఢిల్లీ వరకు, ప్రతి ప్రభుత్వం ట్రంప్ ఎన్నుకునే జట్టును నిశితంగా గమనిస్తుంది. ఇది ట్రంప్ రెండవ టర్మ్ అయినప్పటికీ, గతంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు. చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. అధ్యక్షుడి చుట్టూ ఇప్పుడు కొత్త ముఖాలు ఉంటాయి. వైట్‌హౌస్‌లో ఆయన గతంలో కొలువు దీరినప్పటితో పోల్చితే ఇప్పటి పరిస్థితులు మారినందున ట్రంప్‌ను ప్రపంచం కొత్తగా అంచనా వేయడం జరుగుతుంది.స్వదేశంలో, ట్రంప్ మొదటి బాధ్యత స్థిరత్వాన్ని సాధించడం; పెద్దగా ప్రాధాన్యత లేని తన మద్దతుదారులకు, ముఖ్యంగా శ్రామిక వర్గానికి ఆశను కల్పించడం. అమెరికా ఆర్థిక వ్యవస్థ పెద్ద వృద్ధి లేక పోయినా స్థిరంగానే ముందుకు సాగుతోంది. వృద్ధి 2 శాతానికి పైగా ఉంది. అయినప్పటికీ, నిరుద్యోగం పెద్ద ఆందోళనగా ఉంది. ఒక వైపు తన సొంత తరగతి మిలియనీర్లు, బిలియనీర్ల దురాశనూ, మరో వైపు తక్కువ ఆదాయం కలిగిన, సామాజికంగా, ఆర్థికంగా అణగారిన తన మద్దతుదారుల అవసరాన్నీ ట్రంప్ ఎలా సమతుల్యం చేస్తారో చూడాలి.విదేశాలతో ఎలా వ్యవహరిస్తారు?విదేశాల్లో, ముఖ్యంగా యూరప్, పశ్చిమాసియాలో విభేదాలను పూర్తిగా పరిష్కరించడంలో ట్రంప్‌పై పెను భారం ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానంపై ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ నుండి బయట పడతానని ఆయన హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చేరుకోవాలని భావిస్తున్నారు. అదే సమయంలో చైనాతో కఠినంగా ఉండవచ్చు, అధిక సుంకాలను విధించవచ్చు. కానీ వైరు ధ్యాలతోనే స్నేహాన్ని కోరుకోవచ్చు. పశ్చిమాసియాలో, ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంటారనీ, బహుశా పాలన మార్పు కోసం ఒత్తిడి తెస్తారనీ భావిస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కూడా అదుపులో ఉంచవచ్చు.రాబోయే నాలుగేళ్లలో ’మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ వాగ్దానం చేసినందున, ఆయన ప్రతి ఒక్క చర్య కూడా అమెరికాకు, ప్రపంచానికి దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తుంది. ట్రంప్ మూడో సారీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా రాజ్యాంగంలో మార్పు కోసం ప్రయత్నిస్తారా అనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమైనప్పటికీ, వయస్సు, సమయం ఆయన పక్షాన లేనందున ట్రంప్ 2.0 పాలన ట్రంప్ 1.0 పాలన నుండి భిన్నంగా ఉంటుందని ఆశించాలి.అమెరికా ఎలా పరిపాలించబడుతుందనే దానిపై ట్రంప్ శాశ్వత ప్రభావాన్ని కలిగిస్తారు. కానీ అమెరికాకు ప్రపంచాన్ని రూపొందించే సామర్థ్యం పరిమితంగా ఉంది. అమెరికా తన మిత్రదేశాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ట్రంప్ అధ్యక్ష పదవిపై యూరప్, జపాన్ రెండూ ఆందోళనగా ఉన్నాయి. ట్రంప్ గత హయాంలో యూరప్‌లో ఏంజెలా మెర్కెల్, జపాన్ లో షింజో అబే ఉన్నారు. ప్రస్తుతం,ట్రంప్‌ను ఎదిరించే లేదా ఆయన్ని నిలువరించగల సామర్థ్యం ఉన్న యూరోపియన్ లేదా తూర్పు ఆసియా నాయకులు ఎవరూ లేరు. వారు బహుశా ట్రంప్‌కు అనుగుణంగా నడుచుకోవచ్చు.పుతిన్‌ను ఊపిరి పిల్చుకోనిస్తారా, జెలెన్స్కీని కాస్త తగ్గమని అడుగుతారా అనేది ట్రంప్, ఆయన సలహాదారులు... యూఎస్ ‘డీప్ స్టేట్’పై, మిలిటరీ–ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌పై, జో బైడెన్ రష్యా విధానం వెనుక ఉన్న ప్రభావశీల వ్యక్తులపై ఎంత నియంత్రణను కలిగి ఉంటారు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ, పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇద్దరూ కనీసం మొదట్లోనైనా ట్రంప్ యంత్రాంగంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని కోరుకుంటారు. విరోధాబాస ఏమిటంటే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉండవచ్చు.ఇండియాతో వైఖరి?అదృష్టవశాత్తూ, అధ్యక్షుడు ట్రంప్‌తో భారతదేశం మంచి సమీక రణాన్ని కలిగి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇద్దరూ ట్రంప్ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ ట్రంప్ 2.0 అన్ని సంభావ్యతలలోనూ,ట్రంప్ 1.0 లాగా ఉండదనే ఎరుకతో భారత నాయకత్వం ముందుకు సాగాలి. ట్రంప్ వాస్తవికతా విధానం, ‘అమెరికా ఫస్ట్’ విధానం... వాణిజ్యం, వలసలు, వాతావరణ మార్పు వంటి భారత్‌కు ఆసక్తి ఉన్న రంగాలపై సవాళ్లు విసురుతాయి. నేను ఉదారమైన అమెరికా వీసా విధానం పట్ల గొప్ప ఔత్సాహికుడిని కాదు. ఇది భారతదేశం నుండి ప్రతిభను హరించడానికి దోహదపడింది. అయితే ట్రంప్ పాత సలహా దారులలో కొందరు, ముఖ్యంగా అమెరికా మాజీ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్థైజర్ వంటి వ్యక్తులు తిరిగి కార్యాలయంలోకి వస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యం సవాలుగా మారవచ్చు.అమెరికా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం, సరఫరా గొలుసులతో అనుసంధానం కావడాన్ని భారతదేశం కొన సాగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని మోదీ ప్రభుత్వానికి సూచించడం మంచిది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కేసు ఇప్పటికే కోర్టులో ఉన్నందున అది వీడి పోకపోవచ్చు. దాని అలలు భారత తీరాలను తాకుతూనే ఉంటాయి. ట్రంప్ 1.0 సమయంలో షింజో అబే మొదట వైట్ హౌస్ తలుపులు తట్టారు, స్నేహపూర్వక హస్తాన్ని చాచారు, అహంభావిని పొగిడారు, భారత దేశానికి ప్రయోజనం కలిగించే క్వాడ్ వంటి ఆలోచనలను చేశారు. అబే రాజనీతిజ్ఞుడు, భారతదేశానికి స్నేహి తుడు. ఆయన వారసులు కేవలం రాజకీయ నాయకులు, పైగా భారత్‌కు అనుకూలమైనవారు కాదు. చదవండి: ముంచింది జో బైడెనే.. కమలా హారిస్ తీరుపైనా విమర్శలుట్రంప్ భారత్ పట్ల స్నేహ పూర్వకంగా ఉండవచ్చు, కానీ మన దేశానికి ఆయన తక్షణ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మోదీ వంటి మిత్రులు కాసేపు వేచివుండి, అమెరికా మిత్రదేశాలు, ముఖ్యంగా యూరోపి యన్లు వైట్‌హౌస్‌లో తమ ఆందోళనతో కూడిన సంభాషణలను ముగించేందుకు అనుమతించడం ఉత్తమం.దేవుడు తనను కాపాడాడు కాబట్టే వైట్‌హౌస్‌కు తిరిగి వస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొన్నారు. తమను తాము ‘దేవుడు, విధిచే ఎన్ను కోబడిన’ వారిగా భావించే రాజకీయ నాయకులు తరచుగా మంచి కంటే ఎక్కువ హాని చేస్తారు. అలాంటివారితో ఉన్న స్నేహాన్ని ప్రద ర్శించుకోవడం కంటే, ముందు వాళ్లను తమ పనిలో తలమునకలు కానివ్వడం మంచిది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వైద్యశాస్త్ర విభాగానికి సంబంధించి ఇటీవలి కాలం (2017)లో... హైకోర్టు క్రిమినల్ అప్పీల్ నం. 326లో వెల్లడించిన ఆదేశాలను అనుసరించి, ఒక సమూల ప్రక్షాళనకై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో శవపరీక్షల నిర్వహణలో పాటించాల్సిన శాస్త్రబద్ధమైన ప్రమాణాలు, తదనంతరం తయారు చేసే నివేదికల నిబద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక సమాజంలో ప్రజల అసహజ మరణాలకు గల కారణాలను తెలుసుకోవడం, దోషులను శిక్షించడం, నేరాలను నివారించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ ప్రక్రియలో పోలీసులు, కోర్టు లతో పాటు ఫోరెన్సిక్ వైద్యుల పాత్ర చెప్పుకోదగ్గది.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వైద్యుల నియామకాలు జరిగిన పుణ్యమా అని చాలాచోట్ల ఫోరె న్సిక్ వైద్యులు అందుబాటులో ఉండడంచేత శవపరీక్షలు నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. అయితే హైకోర్టు ఆశించిన విధంగా న్యాయ వైద్య శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడానికి నియమ నిబంధనావళి రూపొందించడం ఈ విశేషజ్ఞుల కమిటీకి పెద్ద కష్టమైన పని కాకపోయినప్పటికీ... దానిని ఆచరణలో పెట్టాలంటే మన శవాగారాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాల చోట్ల శవాలను భద్రపరిచే శీతల వ్యవస్థ (కోల్డ్ స్టోరేజ్) అవసరాలకు సరిపోయేలా లేదు.మన మార్చురీలలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ.. ముఖ్యంగా ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వుంది. శవపరీక్షలు చేయడానికి కావల్సిన ఆధునిక పనిముట్లు చాలాచోట్ల అందుబాటులో లేవు. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ రంపాలతో పుర్రెలను తొలచి మెదడును పరీక్షిస్తుంటే, మనం మాత్రం పాత పద్ధతిలో ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం. కొన్ని అసహజ మరణాలను పరిశోధించడానికి బాడీ శాంపుల్స్‌ను దూరంగా ఉన్న ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది, అప్పటివరకు ఆ నమూనాలను పరిరక్షించడానికి డీప్ ఫ్రీజర్లు, అవి చెడిపోకుండా ఉండడానికి ప్రత్యేక సంరక్షక ద్రవ్యాలు అవసరం అవుతాయి. ఈ ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పన పని నాణ్యతను పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.చదవండి: నిజంగా పవన్ కల్యాణ్‌కు ఆ ధైర్యం ఉందా?ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ వైద్య శాస్త్ర ప్రయోగశాలలు (ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీస్) అనేక విష పదార్థాల కారణంగా మరణించినవారి శవపరీక్షలలో పరిమాణాత్మక ఫలితాలను అందించ లేకపోతున్నాయి. అనేక విషాలను గుణాత్మకంగా గుర్తించడంలో పేలవంగా ఉన్నాయి. కాలం చెల్లిన విశ్లేష ణాత్మక విషశాస్త్ర పద్ధతులు (ఎనటికల్ టాక్సికాలజీ) ఉపయోగించడమే దీనికి గల ముఖ్య కారణం. ఎఫ్ఎస్ఎల్లు న్యాయ వైద్య విభాగం మధ్య సరిగ్గా సమన్వయం లేక పోవడం కొన్ని కేసుల న్యాయ విచారణ విఫలమయ్యేందుకు కూడా కారణ మవుతోంది.మొత్తంగా న్యాయ వైద్యశాస్త్ర విభాగం బాగుపడాలంటే... మన మార్చురీలలో, న్యాయ వైద్య ప్రయోగశాలల్లో, పోలీస్ వ్యవస్థలో, అలాగే సంబంధిత వ్యక్తులకు వృత్తి పట్ల అంకిత భావంలో పెను మార్పులు అవసరం.– కట్టంరెడ్డి అనంత రూపేష్ రెడ్డిసహాయ ఆచార్యులు, న్యాయ వైద్య శాస్త్రం– విష విజ్ఞాన శాస్త్రం, ఆంధ్ర వైద్య కళాశాల -
వ్యవసాయ రంగమే ఉపాధికి ఊతం
నగర ప్రాంతాలకు తరలి వస్తోన్న లక్షలాదిమంది ప్రధానంగా ఉపాధిని పొందుతోంది, నిర్మాణ రంగంలోనే. సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవారంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు? నేటి ప్రపంచ పరిస్థితులలో సరుకు ఉత్పత్తి రంగం గానీ, సేవా రంగం గానీ కోట్లాది మంది నిరుద్యోగులకు బతుకుతెరువును చూపగల స్థితి లేదు. మిగిలిందల్లా, వ్యవసాయ రంగమే. వ్యవసాయం లాభసాటిగా ఉంటే గ్రామీణులు నగరాలకు రారు. అప్పుడు కారుచవకగా కార్పొరేట్లకు కార్మికులు దొరకరు. అందుకే వ్యవసాయం లాభసాటిగా లేకుండా ‘జాగ్రత్తపడటమే’ ఇప్పటి విధానం.దేశంలోని సుమారు 65% జనాభా 35 ఏళ్ల లోపువారు. వీరికి నిరుద్యోగం, చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం ప్రధాన సమస్యలు. కోవిడ్ అనంతరం సమస్య మరింత జఠిలం అయ్యింది. 2016లో మోదీ తెచ్చిపెట్టిన పెద్ద నోట్ల రద్దు, 2017లో హడావుడిగా ఆరంభమైన జీఎస్టీ వంటివి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసి నిరుద్యోగ సమస్యను మరింత పెంచాయి.దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం ఆసరాగా 2014లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇదే నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం సరుకు ఉత్పత్తి రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ఉపాధి కల్పనా రంగంగా... దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25% స్థాయికి చేర్చే పేరిట ‘మేకిన్ ఇండియా’ కార్య క్రమాన్ని ఆరంభించింది. దశాబ్ద కాలం తర్వాత, వెనక్కిచూసుకుంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 15– 17 శాతం మధ్య ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోయింది. 2020లో ఆరంభమైన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల’ పథకం కూడా సాధించింది నామ మాత్రమే.మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశాలు లేవంటూ అప్పట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురావ్‌ు రాజన్ చెప్పారు. చైనా ప్రపంచం యావత్తుకూ సరిపోయే స్థాయిలో, చవకగా సరుకులను ఉత్పత్తి చేస్తోంది గనుక ప్రపంచానికి మరో చైనా అవసరం లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈ రచయిత కూడా 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం, అంతర్జాతీయంగా డిమాండ్ పతనం వంటి వివిధ కారణాలను పేర్కొంటూ మేకిన్ ఇండియా, దేశ సమస్య లకు పరిష్కారం కాదంటూ ఒక వ్యాసం రాసివున్నారు.దేశంలో నిరుద్యోగం పరిష్కారానికీ, వృద్ధి రేటు పెంపుదలకూ దారి ఏమిటనే చర్చ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే, ఈ మధ్య రఘురావ్‌ు రాజన్ ‘బ్రేకింగ్ ద మౌల్డ్: రీ ఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ పేరిట రోహిత్ లాంబా అనే పెన్సి ల్వేనియా విశ్వవిద్యాలయ ఆచార్యునితో కలిసి ఒక పుస్తకం రాశారు. దీనిలో భాగంగా మేకిన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానాలు ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈ సరుకు ఉత్పత్తి రంగంపై దృష్టిని కాస్తంత తగ్గించు కొని, భారతదేశం ఇప్పటికే ‘బలంగా’ వున్న సేవా రంగంపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా మెరుగైన ఉపాధి కల్పన, వృద్ధి రేటులను సాధించవచ్చనేది వారి వాదన. దీని కోసమై యువజనుల నిపుణతల స్థాయిని పెంచి వారిని సేవా రంగ ఉపాధికి సిద్ధం చేయాలన్నారు.రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా, జపాన్... అలాగే చైనా వంటి దేశాలు అనుసరించిన ఆర్థిక వృద్ధి నమూనా అయిన మొదటగా వ్యవసాయ రంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం దిశగా సాగడం... అనంతరం మాత్రమే సేవా రంగం వృద్ధి దిశగా పయనించడం అనివార్యం కాదని రాజన్ వాదిస్తున్నారు. అనేక ధనిక దేశాలలో ఇప్పటికే సేవా రంగం వాటా జీడీపీలో 70% మేర ఉందనీ, ఈ రంగంలో జీడీపీ వాటా సుమారు 60% పైన వున్న భారత్ కూడా పాత నమూనాని పక్కన పెట్టి మరింతగా సేవా రంగంలోకి వెళ్ళాలనేది రాజన్ తర్కం. సేవా రంగం వృద్ధి చెందాలంటే యువజనుల విద్యా నిపుణతల స్థాయి సరుకు ఉత్పత్తి రంగంలో కంటే అధికంగా ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సేవా రంగం తాలూకు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించగలగడంలో ఎదుర్కొంటున్న సాఫ్ట్ స్కిల్స్ లోటును చూస్తున్నాం. సేవా రంగంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అవసరం తెలిసిందే. దేశంలోని ఎంతమంది యువజనులకు ఈ రంగంలో ప్రవేశించగల స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉంది? దేశంలోని మొత్తం కార్మికులలో 70% మంది మాత్రమే అక్షరాస్యులు. వీరిలో కూడా 25% మంది ప్రాథమిక స్థాయి విద్యలోపే పాఠశాల చదువు మానివేసిన వారు. దేశంలోని 20% సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు తగిన శిక్షణను ఇచ్చుకునే ఏర్పాట్లను కలిగి వున్నాయి (ప్రపంచ బ్యాంకు పరిశోధన). ఈ స్థితిలో, గ్రామీణ యువజనులను సేవా రంగం దిశగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళగలమా? నేడు సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి కోసం రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవా రంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు?దీనికి కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్’ (మన అస్తిత్వమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది) అనే కార్ల్ మార్క్ ్స ఉద్బోధన. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలో 2003 నుంచి 2007 వరకూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన రాజన్ కూడా దాటుకుని రాలేని నిజం. ఆయన అస్తిత్వం తాలూకు పరిమి తులే, ఆయనను వాస్తవాన్ని చూడనివ్వడం లేదు. నేటి ప్రపంచ పరిస్థితులలో అటు సరుకు ఉత్పత్తి రంగం గానీ, ఇటు సేవా రంగం గానీ, కోట్లాది మంది నిరుద్యోగ యువతకు బతుకుదెరువును చూప గల స్థితి లేదు. మిగిలిందల్లా, మన వ్యవసాయ రంగమే. ఈ రంగంలో ఇప్పటికే, అవసరాన్ని మించి మానవ వనరులు చిక్కుకు పోయి ఉన్నాయన్నది నిజం. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ‘సంస్కరణల’ యుగంలో వ్యవసాయ రంగంపై చిన్న చూపు పెరిగింది. గ్రామీణ వ్యవసాయ రంగం, నగర ప్రాంత పారిశ్రామిక రంగాల మధ్యన ఉన్న సమీకరణం గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ రంగ సరుకులను కారు చవుకగా, నగర ప్రాంతాలలో అందుబాటులో ఉంచడమనేది పారిశ్రామిక కార్పొరేట్ వర్గాల అవసరం. గ్రామీణ రైతాంగానికి లాభసాటి ధరలను కల్పిస్తే ఆ సరుకుల ధరలు, నగర ప్రాంత మార్కెట్లలో అధికంగా ఉంటాయి. నగర ప్రాంత కార్మికులు, ఉద్యోగులకు అవి ఖరీదైనవి అవుతాయి. అప్పుడు వేతనాల పెంపుదల కోసం యజమానులపై ఒత్తిడి తెస్తారు. ఇది పారిశ్రామిక అశాంతిగా మారవచ్చు. ఒక మోస్తరు వేతనాలతోనే పని చేయించుకోగలగాలంటే రైతాంగ ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉండేలా జాగ్రత్తపడడం కార్పొరేట్లకు అవసరం. గ్రామీణ రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉంటే వారు నగరాలకు రారు. అప్పుడు నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గుతుంది. కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. దీని వలన, పారిశ్రామికవేత్తలు అధిక వేతనాలను చెల్లించి పనిలో పెట్టుకోవలసి వస్తుంది. దీనికి కూడా పరిష్కారమే గ్రామీణ వ్యవసాయం లాభ సాటిగా లేకుండా ‘జాగ్రత్తపడడం’. ఈ కథలో సూత్రధారులు ప్రపంచీకరణ వంటి నయా ఉదారవాద విధానాaలను మన మీద రుద్దుతోన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధులు. ఆ ఆలోచనా విధానం తాలూకు ప్రతినిధిగా రఘురావ్‌ు రాజన్ వ్యవసాయం ఊసు ఎత్తలేరు. దాన్ని దేశానికీ, ఉపాధి కల్పనకూ దారిగా చూపలేరు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటే అది అతని కొనుగోలు శక్తిని పెంచి తద్వారా నగర ప్రాంత పారిశ్రామిక సరుకులకు డిమాండ్‌ను కల్పిస్తుంది. దేశ జనాభాలోని 55% పైన ఉన్న రైతాంగం బాగుంటే, విదేశాలలోని డిమాండ్, కొనుగోలు శక్తి, ఎగుమతులతో నిమిత్తం లేకుండా దేశంలోనే డిమాండ్‌ను సృష్టించవచ్చు. ఈ పరిష్కారాన్ని చెప్పలేని మేధా దుర్బలత్వంతో రఘురావ్‌ు రాజన్ వంటివారు మిగిలిపోతున్నారు. డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా?
తిక్కలోళ్లు తీర్ధానికి వెళితే.. ఎక్కా, దిగా సరిపోయిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు చేస్తున్న పనులు, అంటున్న మాటలు గమనిస్తుంటే ఈ సామెత గుర్తుకు వస్తుంది. తోచి, తోయనమ్మ తోడికొడలు పుట్టింటికి వెళ్లినట్లుగా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీలో సమస్యలు ఏవీ లేనట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు చెందిన సరస్వతి పవర్ కంపెనీకి చెందిన ప్రైవేటు భూములలోకి వెళ్లి గొడవ చేసి వచ్చారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని ప్రజలు బూతులు తిడుతున్నారని చెప్పడం ద్వారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పరువు తీశారు. దీనిపై చంద్రబాబులో అసంతృప్తి ఉన్నా, పవన్ కళ్యాణ్‌ను ఏమీ నేరుగా అనలేకపోయారు. అయినా ఆయన అసహనం ఏదో రకంగా పవన్‌కు తెలిసి ఉంటుంది. దాంతో పవన్ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు సడన్‌గా పల్నాడులోని సరస్వతి పవర్‌కు చెందిన భూలముల సందర్శనకు వెళ్లి ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. లేదంటే.. డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ఇద్దరు కలిసి ఈ యాక్టివిటి సృష్టించారని కొందరు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు తనదైన స్టైల్లో ఎమ్.ఆర్.పి.ఎస్ నేత మంద కృష్ణతో పవన్ కల్యాణ్‌కు వార్నింగ్ మెస్సేజ్ ఇప్పించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబును కలిశాకే మందకృష్ణ ఈ అంశం గురించి మాట్లాడారు. మామూలుగా అయితే ఇలా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా, ప్రత్యేకించి తనకు డామేజీ అయ్యేలా ఏ టీడీపీ మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా మాట్లాడితే. వెంటనే టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిలో ఒక లీక్ వచ్చేది. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, చర్య తీసుకుంటామని హెచ్చరించారని ప్రచారం జరిగేది. కానీ పవన్ అంతగా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించినా చంద్రబాబు స్పందించలేకపోయారు. హోం మంత్రి అనిత నిస్సహాయంగా మిగిలిపోయారు. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై ఏదో తేడా వస్తే.. చంద్రబాబు పోన్ చేసి క్లాస్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ పవన్ విషయంలో అలా చేయడానికి చంద్రబాబు సాహసించలేకపోయారు. అయినా.. పరోక్షంగా మంద కృష్ణతో క్లాస్ పీకించారు. పవన్ కల్యాణ్, ప్రైవేటు సంస్థ భూములలోకి వెళ్లడం ఏ రకమైన అధికారమో తెలియదు. నిజంగా ఆ భూముల విషయంలో ఏదైనా తేడా ఉండి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఊరికే వదిలేసేదా? ఆ సంస్థకు నీరు ఇవ్వడం కూడా తప్పే అన్నట్లు పవన్ ప్రసంగించారు. వెయ్యి ఎకరాలలో ఇరవైనాలుగు ఎకరాలు ఏదో తేడా ఉందని ఈయన కనిపెట్టారు. అధికారులు అంతకుముందు పరిశీలనకు వచ్చి అక్కడ ప్రభుత్వ భూమి లేదని చెబితే.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఈయన వచ్చి 24 ఎకరాల అస్సైన్డ్ భూమి, కుంటలు, చెరువులు ఉన్నాయని చెప్పారు. కేవలం స్థానికులను రెచ్చగొట్టి, అక్కడ పరిశ్రమ రాకుండా చేయాలన్న దురుద్దేశంతో పవన్ వెళ్లినట్లు ఉంది తప్ప, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా చేసినట్లు కనిపించదు. అంటే ఇంకెవరైనా పరిశ్రమలు పెడితే ఫర్వాలేదా? జగన్ మాత్రం పెట్టకూడదా?. ఇక్కడకు సమీపంలోనే ప్రభుత్వం అదానీ, మహా సంస్థలకు భూములు కేటాయించింది. అక్కడకు ఈయన వెళ్లలేదు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉంటే పరిశ్రమలు కొత్తగా పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? నాకు తెలిసి ఒక ప్రైవేటు కంపెనీ భూమిలోకి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వెళ్లి ఇలా అరాచకం చేయడం ఇదే మొదటిసారి కావచ్చు.ఒకవైపు లోకేష్ రెడ్ బుక్ అంటూ కొత్త పారిశ్రామికవేత్తలకు భయానక వాతావరణం సృష్టిస్తుంటే, పవన్ తాను వెనుకబడిపోతానేమో అన్నట్లుగా స్వయంగా రంగంలో దిగి పారిశ్రామిక వాతావరణాన్ని చెడగొట్టే పనిలో ఉన్నారు. ఏపిలో జరుగుతున్న ఘాతుకాలు, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడంపైనే కాదు.. ఇలా పవన్ అడ్డగోలుగా ప్రవర్తిస్తే కూడా జనం తిడతారన్న సంగతి గుర్తుంచుకోవాలి. పర్యావరణ మంత్రిని అని చెబుతూ ఖాళీగా ఉన్న భూమలులోకి వెళ్లిన పవన్‌కు కర్నూలు జిల్లా దేవనకొండ వద్ద వేలాది మంది ప్రజలు యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన కనిపించడం లేదు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాల పంట భూమిని బీడుగా మార్చినా,అక్కడ పర్యవరణానికి ఇబ్బంది లేదని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది. వందల ఎకరాల అస్సైన్డ్ భూమిని టీడీపీ పెద్దలు కొట్టేసినా, అక్కడ పవన్‌కు సంతోషంగానే ఉందని అనుకోవాలా? కృష్ణా నది ఒడ్డున అక్రమ భవనాలు ఉన్నాయి కదా! వాటిలో ఒకదానిలో ముఖ్యమంత్రి కూడా ఉంటున్నారు కదా! వాటిని ఖాళీ చేయించి పర్యావరణాన్ని కాపాడానని పవన్ చెప్పగలిగితే అంతా శభాష్ అంటారు. నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా?.హోం మంత్రి అనిత ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి. ప్రతిపక్షం వారు విమర్శలు చేశారంటే అదొక పద్దతి. కాని ఉప ముఖ్యమంత్రి హోదా లో ఉండి అనితను అవమానించిన తీరు బాగోలేదు. నిజానికి ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనకు ప్రత్యేకంగా కొమ్ములేమీ ఉండవు. ఆయన కూడా మంత్రులతో సమానమే. తనకు తాను హోం శాఖ ను తీసుకునే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి పరిధిలో ఉండే అధికారమది. ఆ విషయం పవన్ కు తెలియదేమో! కాకపోతే భాగస్వామి పార్టీగా తనకు హోం శాఖ కావాలని అడిగి తీసుకోవచ్చు. అంతేకాదు.హోం శాఖ ఒక్కటే చేతిలో ఉంటే అన్ని పవర్లు ఉండవు. లా అండ్ ఆర్డర్ అనేది ప్రత్యేక విభాగం. అది ఎప్పుడూ ముఖ్యమంత్రే ఉంచుకుంటారు.శాంతి భద్రతలు విఫలమైతే అందుకు ప్రధానంగా ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రులంతా బాధ్యత వహించాలి. ఒక పక్క రెడ్ బుక్ అమలు చేయాలని ,టీడీపీ వారు అరాచకాలు చేసినా చర్య తీసుకోరాదని పోలీసులపై ఒత్తిడి తెచ్చేది వారే. ఇంకో పక్క లా అండ్ఆర్డర్ విఫలం అయిందని చెప్పేది వారే. ఇదంతా నాటకీయంగా ఉంది తప్ప ఇంకొకటి కాదు. కేవలం అనితనే బాధ్యురాలిని చేయకుండా చంద్రబాబు ను కూడా తప్పు పట్టి ఉంటే అప్పుడు పవన్ కల్యాణ్ చిత్తశుద్దితో ఉన్నారని అనుకోవచ్చు. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగితే ఎవరో పోలీసు అధికారి చర్య తీసుకోవడం లేదట. దానికి కులం అడ్డం వస్తోందని చెప్పారట. అది నిజమే అయితే వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేయాలి కదా? ఒకరకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నదో ఈ ఉదాహరణ తెలియచేస్తుంది.పవన్ కల్యాణ్ తెలిసి చెప్పారో,లేక తెలియకుండా చెప్పారో కాని ఒక్క నిజం మాత్రం వెల్లడించారు.అదేమిటంటే కూటమి ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని. వంద అబద్దాలను కవర్ చేసుకోవడానికి పవన్ ఈ ఒక్క నిజం చెప్పారా!అన్న సందేహం కలుగుతుంది.ఇంకో మాట కూడా అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో తన ప్రాధాన్యతతగ్గుతోందని, ఆ నేపధ్యంలో ఆయన చంద్రబాబును బెదిరించడానికి ఈ రకంగా మాట్లాడి ఉండవచ్చని అంటున్నారు. కాని వవన్ వ్యాఖ్యలతో పరువు పోయిందన్న భావంతో ఉన్న చంద్రబాబు కు కోపం వచ్చిన సంగతి గమనించి,వెంటనే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి పల్నాడు టూర్ పెట్టుకుని ఇష్యూని డైవర్ట్ చేసే యత్నం చేసి ఉండవచ్చు. కేవలం ఏపీలో జరుగుతున్న నేరాలు-ఘోరాల గురించే కాదు.ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నందుకు కూడా జనం తిడుతున్నారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి పవన్ యత్నించారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు పదిహేనువేలు, మహిళా శక్తి కింద ప్రతిఇ స్త్రీకి నెలకు 1500 రూపాయలు ఇస్తామని,నిరుద్యోగ భృతి 1500 ఇస్తామని ..ఇలా అనేక హామీలు ఇచ్చారు కదా..విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పారు కదా..కానీ ఇప్పుడు దారుణంగా పెంచుతున్నారే. అగ్గిపెట్టెలు,కొవ్వొత్తులకే 23 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వంగా ఇది రికార్డు పొందింది కదా! తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిన నెయ్యి వాడారని తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దేవుడికే అపచారం చేశారే! వీటన్నిటిపైన జనం మండిపడుతున్నారు.గతంలో చంద్రబాబు పాలన ఇంత అధ్వాన్నంగా లేదని, ఇప్పుడే మరీ దరిద్రంగా తయారైందని సామాన్యులు వ్యాఖ్యానిస్తున్నారు.వీటితో తనకు సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడినా జనం నమ్మరు.ఒక రోజేమో చంద్రబాబు అనుభవం, పాలన అధ్బుతం అని ,మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసి, ఇంకో రోజు తమ పాలన తీరుపై జనం బూతులు తిడుతున్నారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కాబట్టి తింగరోళ్లు తీర్ధానికి వెళితే ఎక్కా,దిగా సరిపోయిందన్న సామెత చెప్పవలసి వచ్చింది.::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
భారతీయ అమెరికన్ ఓటర్లు ఎటువైపు?
నవంబర్ 5వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలు స్తారనే ఉత్కంఠతో ప్రపంచ రాజకీయ విశ్లేషకులు తర్జన భర్జనలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు. భారతీయ అమెరికన్ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారనే విషయంపైననే జయాపజయాలు ఉంటాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవంగా ఎన్నికల సర్వేలన్నీ కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నట్లు అక్టోబర్ చివరి వరకు తెలియ జేశాయి. విశ్లేష ణాత్మకంగా చూస్తే– ఓటు హక్కును వినియోగించుకోవడంలో రిపబ్లికన్ ఓటర్లు ముందు ఉంటా రని, డెమోక్రాటిక్ పార్టీ ఓటర్లు వెనుకంచెలో ఉంటారని ఒక అపవాదు ఉంది. ఈ అపవాదు నిజమైతే, ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు సులభమే.అరబ్ అమెరికన్ ఓటర్లు సహజంగా డెమో క్రటిక్ పార్టీ వైపు ఉంటారు. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, పాలస్తీ నాలో జరుగుతున్న ముస్లింల నరమేధాన్ని డెమోక్రాట్లు ఆపలేకపోయారనీ, పైగా దీనికి కారణమైన ఇజ్రా యెల్‌ను బహిరంగంగా బైడెన్ ప్రభుత్వం సమర్థించిందనీ, ఆర్థిక సైనిక సహకారం అందించిందనీ, అరబ్ అమెరికన్ ఓటర్లు ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము డెమోక్రాట్లను నమ్ముకున్నందుకు నట్టేట మునిగి పోయామని అరబ్ అమెరికన్ హక్కుల లీగ్ చైర్మన్ నహబ్ అయద్ పత్రికల ముందు వాపోవడం ఇక్కడ గమనార్హం. డెమో క్రటిక్ పార్టీ తరపున ఎన్నికైన కొందరు ముస్లిం మేయర్లు ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం కూడా ఇక్కడ గమనార్హం. పైగా కమలా హ్యారిస్ భారతీయ (హిందూ) మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆమెకు ముస్లింలు ఓట్లు వేయరాదని కొన్ని ముస్లిం మతోన్మాద సంస్థలు పిలుపునివ్వడం డెమోక్రాట్లకు కొంత నష్టమే. వాస్తవంగా కమలా హ్యారిస్‌కు, ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌కు భారతీయ ఆధ్యాత్మిక విషయాలపై, భారతీయ సంస్కృతిపై, భారతీయ మేథో సంపత్తిపై సదభి ప్రాయం లేదంటారు. ఈ విషయం భారతీయ అమెరికన్ ఓటర్లకు బాగా తెలుసు. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిపిన అమానుష దాడులను బహిరంగంగా ఖండించడం, భారతీ యులు తనకు అత్యంత ప్రియ మిత్రులని గతంలో అనేకమార్లు ఆయన ప్రకటించడం, అమె రికాలోని హిందూ ఓటర్ల మనోభావాలను ప్రభా వితం చేస్తుందని చెప్పవచ్చు. అక్రమ వలసలను కట్టడి చేసి, అమెరికా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కమలా హ్యారిస్ కంటే ట్రంప్ ముందు ఉంటాడని మెజారిటీ అమెరికన్ల అభిప్రాయం. ఇదే సందర్భంలో హెచ్ వన్ వీసాల విడుదలలో నియమాలు కఠినతరం చేస్తే, కొంత మంది భారతీయులు ఇబ్బంది పడతారనీ, ఈ విషయంలో కమలా హ్యారిస్ ఆలోచన ధోరణి తమకు ప్రయోజనకరంగా ఉంటుందని కొంతమంది భారతీయ అమెరికన్ ఓటర్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఓటర్లను గోడమీద పిల్లులు అని అంటారు. చివరి నిమిషంలో వీరి ఆలోచన మారితే జయాపజ యాలు తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంది.ఇక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య ఉష తెలుగింటి ఆడపడుచు కావడం, అమెరికాలోని ముఖ్యమైన అధికా రులతో ఆమె సత్సంబంధాలు కలిగి ఉండడం, భారతీయ అమెరికన్ ఓటర్లతో ఆమె అనేక సమా వేశాలు నిర్వహించడం, ట్రంప్ విజయానికి కొంత కలిసి వచ్చే విషయమే. ఇక ఆఫ్రికన్ యూరోపి యన్ ఓటర్లు ఇరుపార్టీలకూ సమంగా ఉన్నట్లు రిపోర్టులు తెలియజేస్తున్నాయి.ఉల్లి బాలరంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?
‘సామాజిక స్పృహ టు రాజ్యాధికారం, వయా సినిమా.’ తమిళనాట ఏడున్నర దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న రాజకీయ ఫార్ములా! సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని యత్నించి వెనకడుగు వేసిన చోట, సినీ తుఫాన్ విజయ్‌కాంత్ రాజకీయంగా మెరుపు మెరిసి కనుమరుగైన చోట, మరో దిగ్గజ నటుడు కమల్‌హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్న చోట... ఇంకో నటుడు ‘దళపతి’ విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ‘‘మారా ల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటేనా? రాజకీయాలు కూడా మారాలి’’ అన్న ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తాయి. రజనీకాంత్ తర్వాతి తరంలో అత్యధిక అభిమాన గణం ఉన్న నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ ఆగమనం తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తుందా?తమిళ నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పేరిట కొత్త పార్టీని ప్రకటించి, అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి, ఓ జయ లలిత... సినీరంగ నేపథ్యంతో రాజకీయాలకు వచ్చి, తమదైన ముద్ర వేయడమే కాకుండా తమిళనాడు సామాజికార్థిక, రాజకీయ స్థితి గతుల్నే మార్చిన చరిత్ర కొనసాగింపే తాజా పరిణామం. తీవ్రమైన భావోద్వేగాలకు నెలవైన తమిళ నేలలో ‘దళపతి’ ప్రభావమెంత? ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి. అసెంబ్లీలో ప్రత్యర్థి సభ్యులు భౌతికదాడికి పాల్పడి అవమానించినపుడు, ‘ఒక్క డీఎంకే సభ్యుడు కూడా లేని సభకే మళ్లీ వస్తా’నని దివంగత ముఖ్యమంత్రి జయలలిత శపథం చేస్తే, అటువంటి సభనే ఏర్పరచిన తమిళ తీర్పు ఒక భావోద్వేగ చరిత్ర! ఆత్మ గౌరవ ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీని కలిపి 1944లో రామస్వామి పెరియార్ ‘ద్రావిడర్ కజగం’ (డీకే) ఏర్పాటు చేశారు. అర్ధ శతాబ్ధానికి పైగా తమిళనాడును పాలిస్తున్న ద్రవిడ కజగం పార్టీలన్నీ ఈ డీకే నుంచి పుట్టినవే! పెరియార్‌తో విబేధాలు రావడంతో డీకే నుంచి బయటకొచ్చిన అన్నాదురై... 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్థాపించారు. ద్రవిడ సిద్ధాంతాల ప్రకారం బ్రాహ్మణులు,కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది ఆర్యుల పార్టీల పెత్తనం చెల్లదు. అన్నాదురై తర్వాత డీఎంకేలో ఉంటూ ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రచయిత కరుణానిధి 1969లో ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి తన గురువు అన్నాదురై సిద్ధాంతాలకు విరు ద్ధంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ... నటుడు ఎంజీ రామచంద్రన్ డీఎంకే నుంచి బయటకు వచ్చి 1972లో అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో నటునిగా తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన ఎంజీఆర్, 1977లో అన్నాడీఎంకేని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత కొనసాగించారు. డీఎంకే, అన్నా డీఎంకేలు కేంద్ర ప్రభుత్వాలకు అవసరమైనపుడు ఆ మేరకు మద్దతునిచ్చినా... తమిళనాడులో ఆ యా జాతీయ పార్టీలు బలపడ కుండా అవి నివారించగలిగాయి. దీంతో 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలు డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా నడుస్తున్నాయి. ఎంజీఆర్ స్ఫూర్తితో చాలామంది నటులు రాజకీయ ప్రవేశం చేశారు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ మినహా ఎవరూ అంతటి విజయం సాధించలేకపోయారు. ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి ముందు నటించిన సినిమాలను తన రాజకీయ ఆశయాలను ప్రచారం చేయడానికి వాడుకున్నారు. ఇటీవల విజయ్ సినిమాల్లో కూడా ఇదే తంతు కనిపించింది. 2018లో విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో... హీరో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి షాక్ తిని, రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఈ సినిమాలోనే, ఆ సమయంలో అధి కారంలో ఉన్న అన్నాడీఎంకేను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. కానీ, మొదటి బహిరంగ సభలో విజయ్ అన్నాడీఎంకేను ఒక్కమాటా అనలేదు! ఇటీవల విడుదలైన పలు చిత్రాల్లో పరోక్షంగా పంచ్ డైలాగ్స్‌తో డీఎంకేను విమర్శించారు. పెరియార్, అన్నా పేర్లను స్మరిస్తూ ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని విమర్శిస్తూ, ఆ పార్టీయే మన శత్రువని విజయ్ ప్రకటించారు. హేతువాది పెరియారే తన పార్టీకి విధాన మార్గదర్శి, కానీ పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే తాము అంగీకరించమని చెప్పారు. ఈ విషయంలో ‘ఒకటే వంశం – ఒకటే దేవుడు’ అన్న ‘అన్నా’ సూత్రాన్ని పాటిస్తామన్నారు. విధానపరంగా తమ సిద్ధాంతంలో ద్రవిడ, తమిళ జాతీయవాదం మధ్య విభజన లేదని వ్యాఖ్యానిస్తూ, ఆ రెండూ తనకు రెండు కళ్ళు అని చెప్పారు. పరస్పర విరుద్ధాంశాలపై అభిప్రాయానికి పొంతన లేకపోవడంతో విజయ్ సిద్ధాంతాల్లో స్పష్టత కొరవడినట్టు కనిపిస్తోంది. పార్టీల పేర్లను ప్రస్తావించకుండా, మతోన్మాద బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థిగా చెప్పినప్పటికీ, డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడి నంతగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం పలు ఊహాగానా లకు ఆస్కారం కల్పిస్తోంది. కుల గణన నిర్వహించాలనీ, విద్య ఉద్యో గాల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలనీ చెప్పిన విజయ్, మైనారిటీల గురించి, వారి భద్రత గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడమే ఆయనలోని ద్వైదీభావనకు నిదర్శనం! పలు తమిళ ఫ్యాన్ పేజీల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌తో విజయ్‌కు పోలికలు తేవడం చూడొచ్చు. వీరిరువురు ఒకరి సినిమాలు ఇంకొకరు రీమేకులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా ఇలాంటి రీమేక్ జరుగుతుందనే చర్చను అభిమానులు తెరపైకి తెస్తున్నారు. విజయ్, పవన్ మధ్య సామ్యాలు ఉన్నన్ని వైరుధ్యాలు కూడా ఉన్నాయి. పైగా, తెలుగు, తమిళ రాజకీయాలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని గమనించాలి. ఏపీలో జనసేన అధికార భాగస్వామ్య పక్షమైన ప్పటికీ, వాస్తవానికి ఆ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలపడలేదు. ఎన్నికల ఫలితాల్లో నూరు శాతం సక్సెస్ రేట్ సాధించినప్పటికీ, పకడ్బందీ పార్టీ వ్యవస్థ ఏర్పడలేదు. రాజకీయ సిద్ధాంత విధానా ల్లోనూ స్పష్టత లేదు. విజయ్ టీవీకేకూ ఇదే వర్తిస్తుంది. ఎంజీఆర్ పార్టీ పెట్టడానికీ, ఇతర నటులు పార్టీ పెట్టడానికీ తేడా ఉంది. ఎంజీఆర్ డీఎంకేను విడిచిపెట్టినప్పుడు, ఆయన అప్పటికే పార్టీలో నంబర్ త్రీగా ఉన్నారు. పదేళ్లు శాసనసభ అనుభవం గడించి ఉన్నారు. డీఎంకే కోశాధికారిగా పనిచేశారు. తమిళనాడులో కొత్త పార్టీలు పెట్టడానికి ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటుందనే వాదన ఉంది. ఎంజీఆర్ వెనుక ఇందిరాగాంధీ ఉన్నారు. కొంతమేరకు విజయం సాధించగలిగిన నటుడు విజయకాంత్ వెనక పన్రుటి ఎస్. రామచంద్రన్ వంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఉన్నారు. మరి, విజయ్ వెనుక కూడా ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానా లున్నాయి. ‘‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాకే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. భావసారూప్య పార్టీలతో పొత్తులకు, కూటమి ఏర్పాట్లకూ సిద్ధమే. మాతో పొత్తు పెట్టుకున్న వారినే అధికారంలో భాగస్వాము లను చేస్తాం’’ అని విజయ్ చెప్పారు. కానీ, సోషల్ మీడియాను దాటి క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే మెజారిటీ సులభంగా కనిపించదు. మరోవైపు, అన్నాడీఎంకే ముందు పరోక్షంగా పొత్తు సంకేతాలు ఉంచి నట్లయ్యింది. ఒకవేళ ఆయన అన్నాడీఎంకేతో కలిసి నడిస్తే కూటమిగా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2021లో అధికార డీఎంకే 37.7 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే 33.29 శాతం ఓట్లు సాధించింది. విజయ్ పార్టీ వచ్చే రెండేళ్లు క్షేత్రస్థాయిలో ఉంటే 7 శాతం వరకు ఓట్లు సాధించవచ్చు. అంటే, విజయ్ అన్నా డీఎంకేతో కలిస్తే, డీఎంకేకు నష్టం కలుగుతుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, డీఎంకేకు లబ్ధి చేకూరుతుంది. అందుకే ఉభయ ద్రవిడ పార్టీలు విజయ్ అడుగులనూ, ఆయనకు లభించే ప్రజాదరణనూ జాగ్రత్తగా గమనిస్తున్నాయి.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
అక్షరానికి సంకెళ్లు నిలవగలవా?
నిజాలు చెప్పినందుకు కలాలకు సంకెళ్లు వేస్తామంటే, ఆ కలాలు వెన్ను చూపుతాయా? మరింత పదునెక్కి మును ముందుకు సాగుతూ అక్ష రాస్త్రాలని ‘నారాచాలు’గా సంధిస్తాయా? ప్రజాస్వామ్య దేశాల్లో పత్రికల గొంతు నొక్కేయాలని యత్నించిన నియంతలు చరిత్రలో ఎలా మిగిలిపోయారో తెలియంది ఏముంది? భారత రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛకు ఇచ్చిన హక్కులేమిటో, కోర్టులు ఎన్నిసార్లు తమ తీర్పుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయో తెలుసుకుంటే పత్రికల గొంతు నొక్కేయాలని ఎవరూ ప్రయ త్నించరు. ఒకవేళ అధికార గర్వంతో అలా చేసినా చివ రికి చరిత్రలో అప్రజాస్వామిక వాదులుగా వారే మిగిలి పోతారు. కేసులు మాత్రం కొట్టి వేయబడతాయి.పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని లక్నోకి చెందిన కేసులో సుప్రీంకోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపర మైన హక్కుల గురించి ఈ రాజకీయ నాయకులు స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేయరు. గడిచిన మే నెలలో ‘న్యూస్ క్లిక్’ ఎడిటర్ ప్రబీర్æ అరెస్టుని సుప్రీంకోర్టు ఖండిస్తూ అతనిపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవనీ, వాటికి హేతుబద్ధత లేదనీ వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలపై విశ్లేషణ చేయకుండా అరెస్టు చేయటం సరికాదని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ‘మోహిత్ అండ్ శ్యామ్ చందక్’ కేసులో ఆదేశించింది. జర్నలిస్టు అభిజిత్ అర్జున్ అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ... అసలు ఈ అరెస్ట్‌కి ఎందుకు పాల్పడవలసి వచ్చిందో ఎంక్వయిరీ చేయాలని ముంబై పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు ఇచ్చింది ధర్మాసనం. డిప్యూటీ కమిషనర్ హోదా కలి గిన అధికారులతో విచారణ జరిపించి ఎనిమిది వారాల్లోగా ధర్మాసనానికి నివేదించాలని ఆదేశించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసుల్ని ఉదాహరించవచ్చు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ప్రభుత్వాలు తమ కున్న తాత్కాలిక అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమకు నచ్చని వార్తలు ప్రచురించే జర్నలిస్టులను, ప్రసారం చేసే జర్నలిస్టులనూ అరెస్టు చేయమని ఆదేశాలు ఇవ్వ డంతో పోలీసులు తప్పనిసరిగా వారి ఆదేశాలు పాటించవలసి వస్తోంది. అయితే ఈ అక్రమ అరెస్టుల పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించడంతో భవిష్యత్తులో ఏ పోలీసులైతే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారో వాళ్ళు న్యాయస్థానం ముందు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అది అలా ఉంటే, తమ అధికారానికి ఎదురు లేదని వ్యవహరించే పాలకులు సైతం జర్నలిస్టుల మీద దాస్టీకానికి పూనుకుంటే... వారు సైతం అందుకు భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఈ దేశంలో జర్నలిస్టులకు.... రాజకీయ నాయకులకు ఉన్న సౌఖ్యం, వసతులు, ఆర్థిక పరిపుష్టి లేకపోవచ్చు; కానీ వారిని మించిన బలమైన శక్తులు జర్నలిస్టులే అనే వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదు. నాయకుల అధికారం తాత్కాలికం. కానీ వృత్తి జర్నలిస్టులు ఒకసారి జర్నలిజంలోకి ప్రవేశించిన తర్వాత ఎలాంటి ఒడిదు డుకులు ఎదురైనా, ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా , ఎలాంటి కష్టాలకు గురి కావలసి వచ్చినా, ఎలాంటి నష్టాలకు ఎర కావాల్సి వచ్చినా ప్రస్థానాన్ని కొనసాగిస్తారు. మాస్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో సాంకే తిక విప్లవం వచ్చిన తర్వాత... రాతపూర్వక, మౌఖిక, దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా కోట్లాది మందికి సమాచార వ్యాప్తి సులభతరమైంది. ఫలితంగా పార దర్శకత లేని ప్రభుత్వాలకూ, నిజాయితీ లోపించిన వ్యక్తులకూ ఇబ్బందిగా మారింది. దాంతో మీడియాపై దాడికి చట్టాలను ఆయుధాలుగా మార్చుకున్నారు వీరు. అందులో ప్రధానమైనది ‘పరువునష్టం చట్టం.’ ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ఠకు హాని కలిగించే విధంగా మాట్లాడటం లేదా రాయడం పరువు నష్టం కిందికి వస్తుంది. భారతీయ శిక్షాస్మృతి, 1860 లోని సెక్షన్ 499 ప్రకారం ఇది నేరం. ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగించడం, టెక్ట్స్, ఇమేజ్, కార్టూన్లు, క్యారి కేచర్లు ద్వారా వారిని ద్వేషించడం లేదా అవమానించడం చట్ట విరుద్ధం. దీని ఆసరాతో తమకు అనుకూ లంగా వార్తలు లేకపోతే, పరువునష్టం దావా వేయ డానికి తయారవుతారు.వీళ్ళకు అర్థం కాని విషయం ఏమిటంటే... విమర్శ సదుద్దేశంతో చేసినా, విస్తృత ప్రజాప్రయోజ నాలకు సంబంధించినదైనా అది పరువునష్టం దావా కిందికి రాదు. మీడియాకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బలంగా ఉన్నాయి. వీటిని ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ హరించలేవని కోర్టు తీర్పులు అనేకం వున్నాయి. తాత్కాలిక అధికార గర్వంతో మీడియా మీద వీరు పెట్టే కేసులు కొంత కాలానికి కొట్టి వేయబడతాయి. సమాచారాన్ని రాయడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి పత్రికలు, మీడియాకు కొన్ని హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి పత్రికలకు ఈ హక్కు లభించింది.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో నోటి మాట, రాత, ముద్రణ, చిత్రాలు లేదా మరేదైనా మార్గం ద్వారా వ్యక్తీకరించే హక్కు ఉంటుంది. ఇందులో కమ్యూనికేషన్ స్వేచ్ఛ, ఒకరి అభిప్రాయాన్ని ప్రచారం చేసే లేదా ప్రచురించే హక్కు ఉన్నాయి.జైల్లో ఉన్న ఖైదీలను కూడా ఇంటర్వ్యూ చేసే హక్కు జర్నలిస్టులకు ఉంది. ‘ప్రభాదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1982) కేసులో జైలులో ఖైదీలను ఇంటర్వ్యూ చేయడానికి పత్రికలు ప్రయత్నించాయి. చారులతా జోషి (1999) కేసులో సుప్రీంకోర్టు తీహార్ జైలులో బబ్లూ శ్రీవాస్తవను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా అండర్ ట్రయల్ ఖైదీ ఇంటర్వ్యూ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తేనే ఇంటర్వ్యూ చేయవచ్చు లేదా ఫోటో తీయవచ్చు అని పేర్కొంది.ఇన్ని హక్కులు ఉన్న జర్నలిస్ట్‌లను కేవలం చిన్న ఉద్యోగస్తులు అనుకోవడం పొరపాటు. వాళ్లు ప్రజా స్వామ్య సౌధానికి వాచ్ డాగ్స్ అని గమనించాలి. ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించేవారు చట్టాలకు లోబడి నడుచుకోవాలే కాని మనకు ఎదురేముంది? అనుకుంటే ఇటు ప్రజా కోర్ట్, అటు జ్యూడిషియల్ కోర్టులు చూస్తూ ఊరుకోవు. ప్రపంచంలో హిట్లర్ లాంటి నియంతలు కూడా ‘నేను 1000 ఫిరంగులకి భయపడను కానీ ఒక కలానికి భయపడతాను’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.పి. విజయబాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రుడు -
చేతులు కాలినా విధానాలు మారవా?
పంజాబ్ రైతులు పత్తిలో భయంకరమైన బోల్వార్మ్ తెగుళ్ళను ఎదుర్కోవడానికి ఏళ్లుగా వాడిన బీటీ–1, బీటీ– 2 రెండూ విఫలమైనాయి. చేతులు కాలిన తర్వాత కూడా విధాన నిర్ణేతలు ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. హెర్బిసైడ్(కలుపు నివారిణి గ్లైఫోసేట్)ను తట్టుకోగల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి (హెచ్‌టీబీటీ)ని అనుమతించే ప్రయత్నం కలవరపెడుతోంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలుకొట్టే విషయం ఏమిటంటే, పత్తి దిగుబడిలో భారత్ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవానికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు. జీఎం మొక్కజొన్న, జీఎం సోయా, జీఎం అల్ఫాల్ఫా పైలట్ ప్రాజెక్ట్‌లకు అమెరికా ప్రయత్నిస్తోంది. నెమ్మదిగా ఇవి జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి.ఏదో తప్పు జరుగుతోంది. 2070 నాటికి భారతదేశం నికర–జీరో ఉద్గారాలకు కట్టు బడి ఉన్న సమయంలో, మన విధాన ప్రతిస్పందన కూడా అలాగేఉండాలి. రసాయన రహిత వ్యవసాయ పద్ధతుల కోసం మార్గదర్శకా లను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. కానీ హానికరమైన కలుపు నివారిణి గ్లైఫోసేట్ (గడ్డిమందు)ను పత్తి సాగులోకి విస్తృతంగా అను మతించడానికి వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు పరిశ్రమల శ్రేణులతో జతకట్టడం కలవర పెడుతోంది.ఇది ఇక్కడితోనే ఆగదు. హెర్బిసైడ్(కలుపు నివారిణి)ని తట్టుకో గల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి(హెచ్‌టీబీటీ)ని ఆమోదించడంలోని చిక్కులను కూడా ప్రత్యేక కమిటీ పరిశీలిస్తోందని నివేది కలు చెబుతున్నాయి. భారతదేశంలో వాణిజ్య సాగు కోసం ఆమోదించిన ఏకైక జన్యుమార్పిడి పంట అయిన బీటీ పత్తి విస్తీర్ణం పంజాబ్, హరియాణా, రాజస్థాన్ లలో కుప్పకూలిన సమయంలో ఇది వస్తోంది. సాగులో 46 శాతం క్షీణత, వాయవ్య ప్రాంతాల్లో పత్తి దెబ్బతినడం మన కళ్లు తెరిపించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా, అదే పరిష్కారంగా ముందుకు సాగడం కలవరపెడుతోంది (ఇప్పుడు కలుపు సంహారిణిని తట్టుకునే అదనపు జన్యువుతో).గతంలోనూ ఇలాగే చెప్పారు!రైతులపై, పర్యావరణంపై బీటీ పత్తిపంట కలిగించిన విధ్వంసం నుండి ఏదైనా పాఠాలు నేర్చుకుంటే తక్షణ దిద్దుబాటు జరగాలి. కానీ పరిశ్రమ లాబీ ఎంత బలమైనదంటే, మన విధాన రూపకర్తలు వాళ్ల ఒత్తిడికి ప్రతిస్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. బీటీ పత్తి సాగు విస్తీర్ణం కనిష్ఠ స్థాయికి పడిపోయిన పంజాబ్ నుండే ఇది మొదలైంది. బీటీ–3 విత్తనాలను కేంద్రం అందుబాటులోకి తేవాలని ఆ రాష్ట్రం డిమాండ్ చేసింది. పంజాబ్ రైతులు భయంకరమైన బోల్వార్మ్ తెగుళ్ళను ఎదు ర్కోవడానికి సంవత్సరాలుగా వాడిన బీటీ పత్తి రకాలైన బీటీ–1, బీటీ– 2 (బోల్‌గార్డ్ అని పిలుస్తారు) రెండూ విఫలమై దెబ్బతిన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వినాశకరమైన తెల్లదోమ దాడి అనేకమంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. ఈ నేపథ్యంలో పంజాబ్ రెండింతలు జాగ్రత్తగా ఉంటుందని నేను అనుకున్నాను. చేతులు కాలి పోయిన తర్వాత కూడా పంజాబ్ ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు సరేసరి.మరింత ముందుకు వెళ్ళేముందు, హెర్బిసైడ్లను తట్టుకునే జన్యు మార్పిడి పత్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సులువుగా చెప్పాలంటే, హెర్బిసైడ్ని తట్టుకోవడం కోసం ఒక అద నపు జన్యువును పత్తి రకంలో చొప్పిస్తారు. ఇక్కడ గ్లైఫోసేట్ అని భావించాలి. ఇంతకుముందు మోన్ శాంటోను కొనుగోలు చేసిన బేయర్ కంపెనీ వెబ్సైట్లో, బోల్‌గార్డ్–3 (రైతులు దీనిని బీటీ–3 అని పిలుస్తున్నారు) ‘మూడు ప్రోటీన్ లతో మీ పత్తి మొక్కలను బోల్వార్మ్ నుండి, ఇతర తెగుళ్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. పురుగు నియంత్రణను తక్కువ పిచికారీలతో అరికట్ట వచ్చనీ, పత్తికి అన్ని సీజన్లలోనూ తక్కువ నష్టం కలిగిస్తుందనీ చెప్పారు.జన్యుమార్పిడి పత్తికి చెందిన మునుపటి రెండు జాతుల పనితీరుపై కూడా ఇలాగే అతిశయించి చెప్పారు. వాస్తవ సత్యాలను మాత్రం చాలా సౌకర్యవంతంగా ఫుట్నోట్లలో పెట్టేశారు. ‘నేచర్ ప్లాంట్స్ జర్నల్’ 2020 మార్చిలో ప్రచురించిన ఒక పత్రంలో, నాగ్ పూర్లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ కె.ఆర్. క్రాంతి, ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త, వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన గ్లెన్ డేవిస్ స్టోన్ ఇద్దరూ భారతదేశంలో బీటీ పత్తి దీర్ఘకాలిక ప్రభావాన్ని పరిశీలించారు. వారి అంతిమ నిర్ధారణ ఏమిటంటే, దిగుబడి విషయంలో జన్యుమార్పిడి పత్తి పేలవంగా పనిచేసింది. పురుగుమందుల వాడకం తగ్గిన ప్రారంభ దశ తర్వాత, రసాయనాల వినియోగం వాస్తవానికి పెరిగింది. బీటీ పత్తిని విడుదల చేసిన తర్వాత భారతదేశం చూసిన ఉత్పత్తి పెరుగుదల వాస్తవానికి ఎరు వులు, నీటిపారుదల వంటి ప్రధాన ఇన్ పుట్ల పెరుగుదల కారణంగా జరిగిందే.పురుగుమందుల వాడకం విషయానికొస్తే, 2002–2013 మధ్య పత్తిపై పురుగుమందుల వాడకం 93 శాతం పెరిగింది. ఎరువుల విని యోగం 2004–2016 మధ్య 58 శాతం పెరిగింది. జన్యుమార్పిడి పత్తి సాగును చేపట్టిన 24 సంవత్సరాల తర్వాత భారత్, దిగుబడి పని తీరుకు సంబంధించి 70 దేశాలలో 36వ స్థానంలో ఉంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలు కొట్టే విషయం ఏమిటంటే, భారత్ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవా నికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు.పత్తి సాగును మార్చడానికి విధాన నిర్ణేతలకు ఇది గుణపాఠం కాదా? ఆ విషయానికి వస్తే, ఇప్పటికే సాగులో ఉన్న రకాలతో పోలిస్తే తక్కువ దిగుబడిని ఇస్తున్నప్పటికీ జీఎం ఆవాలు అధిక దిగుబడిని ఇస్తున్నాయంటున్న వాదనలను కూడా వారు చూడకూడదా? తద్వారా, దీర్ఘకాలిక ఆరోగ్యం, పర్యావరణ ప్రభావాలను (పంటల ఉత్పాదకతలో ఎలాంటి తగ్గుదల లేకుండా) పట్టించుకుంటూ, వాతా వరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులకు మారడం వైపు దృష్టి కేంద్రీకరించవద్దా?బీటీ పత్తితో దుర్భరమైన అనుభవం వ్యవసాయ రోడ్‌మ్యాప్‌ను మళ్లీ గీయవలసిన అవసరాన్ని చూపుతుంది. స్థిరమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల అగ్రిబిజినెస్ దిగ్గజం బేయర్‌తో పరిశోధనా సహకారం నెలకొల్పుకున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐకార్) వాస్తవాలను చూడటానికి నిరాకరించింది.జంట వ్యూహంఅభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి జీఎం పంటలను నెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో మెక్సికో ప్రతిఘటించిన తర్వాత నెమ్మదిగా పెద్ద మార్కెట్ అయిన భారత్ వైపు దృష్టి పెట్టింది. ఆహార భద్రతను పెంపొందించడానికి అమెరికా జన్యుమార్పిడి పంటల దిగుబడిపై దృష్టి సారించింది (వాణిజ్యపరంగా ప్రవేశపెట్టిన జన్యుమార్పిడి పంటల నుండి దిగుబడి పెరిగినట్లు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఆధారాలు లేవు). ఇథనాల్ ఉత్పత్తిలో వాడేందుకు జీఎం మొక్కజొన్న, ఇంకా జీఎం సోయా, ఎండుగడ్డి పశుగ్రాసం కోసం జీఎం అల్ఫాల్ఫా లాంటి కొన్ని పైలట్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడా నికి కూడా ప్రయత్నిస్తోంది. జీఎం అల్ఫాల్ఫా లాంటిది వెంటనే ఆహార గొలుసులోకి వెళ్లదు కాబట్టి ప్రజల ఆమోదం పొందుతుంది. జన్యుమార్పిడి మొక్కల లోకి చొచ్చుకుపోవడానికి కూడా కొన్ని ప్రయ త్నాలు జరుగుతున్నాయి. నెమ్మదిగా ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి. అయితే వీటిని విమర్శించేవారి వాదనలను కొట్టిపారేసేందుకూ, జీఎం పంటలు, రసాయనాల ప్రమాదాలను తక్కువచేసి చూపేందుకూ పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ మీడియా కలెక్టివ్ పరిశోధన చెబుతోంది. ఆఖరికి సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాల సంభావ్యతను తగ్గించేందుకు కూడా దీన్ని పొడిగి స్తున్నారు. ఉదాహరణకు హార్వర్డ్ పబ్లిక్ హెల్త్ స్కూల్లోని ఒక ప్రొఫె సర్‌కు చక్కెర పరిశ్రమ భారీ సొమ్మిచ్చి, సుక్రోజుకూ, గుండె వ్యాధికీ సంబంధం లేదని చెప్పించినట్టు! వంగడానికి సిద్ధంగా ఉండే అధికార వ్యవస్థ(శాస్త్రీయ సంస్థలతో సహా) ద్వారా జీఎం పంటలను చొప్పించడం, విమర్శకులను తీవ్రంగా ఎదుర్కోవడం అనే జంట వ్యూహం రాబోయే రోజుల్లో మరింత పదునెక్కనుంది. జాగ్రత్త!దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
పాశ్చాత్య ఆధిపత్యం ముగిసేనా?
మొత్తం ప్రపంచపు ఆర్థిక నియంత్రణలు తమ అధీనంలో ఉన్నందున ‘బ్రిక్స్’ కూటమి చేయగలిగిందేమీ లేదన్నది గతంలో పాశ్చాత్య దేశాల ధీమా. కజాన్(రష్యా) కన్నా ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు జరిగినా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అందుకే పట్టించుకోలేదు. కానీ బ్రిక్స్ దేశాలు తమ మధ్య చెల్లింపులను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తాము వాణిజ్యం జరిపే ఇతర దేశాలతోనూ ఆ విధమైన చెల్లింపుల కోసం ప్రయత్నించాలనీ నిర్ణయించటం పాశ్చాత్య దేశాల్లో కలవరం పుట్టిస్తోంది. అదే సమయంలో ఇండియా భాగస్వామిగా గల బ్రిక్స్ డిక్లరేషన్‌లోని అంశాలు వర్ధమాన దేశాల్లో కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. బహుళ ధ్రువ ప్రపంచమనీ, పాశ్చాత్య ఆధిపత్యం ముగియటానికి ఆరంభమనీ చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.బ్రిక్స్ కూటమి కజాన్ డిక్లరేషన్ అక్టోబర్ 23న విడుదలైన తర్వాతి పరిణామాలను గమనించినపుడు ప్రధానంగా కనిపిస్తున్నవి రెండున్నాయి. ఒకటి – వర్ధమాన దేశాలన్నిటా ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం కావటం. రెండు – పాశ్యాత్య ప్రపంచంలో కలవరపాటు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పశ్చిమాసియా, మధ్య ఆసియా, కరీబియన్లతో పాటు యూరప్‌లోని సాధారణ స్థాయి ప్రభుత్వాధినేతలు, ఇతర నాయకులు, మేధావులు, యాక్టివిస్టుల అందరి ఆలోచనలూ ఒకే విధంగా ఉన్నాయి. బ్రిక్స్ డిక్లరేషన్‌లోని అంశాలు, ప్రకటించిన కార్యక్రమం అందరికీ తమ భవిష్యత్తు పట్ల కొత్త ఆశలు కల్పించటమే అందుకు కారణం. దానితో ఉన్నట్టుండి అందరూ బహుళ ధ్రువ ప్రపంచమని, పాశ్చాత్య ఆధిపత్యం ముగియటానికి ఆరంభమని మాట్లాడుతున్నారు.మరొక వైపు పాశ్చాత్య ప్రపంచ స్పందనలను గమనించండి. మొదట బ్రిక్‌గా ఉండిన కూటమి ఆ తర్వాత బ్రిక్స్‌గా మారి కజాన్ కన్నా ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించింది. కానీ ఆ కూటమిని అంత సుదీర్ఘ కాలంలో కూడా పాశ్చాత్య దేశాలు గానీ, వారి ఆధిపత్యాన నడిచే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు గానీ, అక్కడి నిపుణులు, మేధావులు గానీ లెక్క చేయలేదు. కజాన్ సమావేశం కన్నా ముందువరకు అందులో ఇండియా, చైనా (ఆసియా నుంచి), రష్యా (యూరప్ నుంచి), దక్షిణాఫ్రికా (ఆఫ్రికా నుంచి), బ్రెజిల్ (దక్షిణ అమెరికా నుంచి) ఉండేవి. అయిదు కూడా భౌగోళిక వైశాల్యం, జనాభా, ఆర్థికశక్తి, సైనిక బలం రీత్యా ప్రముఖమైనవే. వాటి ఉమ్మడి బలాలు మొత్తం యూరప్ కన్నా, కొన్ని విషయాలలో యూరప్‌తో పాటు అమెరికాను కలిపినా ఎక్కువే. అయినప్పటికీ పాశ్చాత్య కూటమికి తక్కిన ప్రపంచం పట్ల మొదటి నుంచి గల చులకన భావంతో వారటువంటి వైఖరి తీసుకుంటూ వచ్చారు.ఈ దృష్టికి మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఇతర దేశాలు ఏమి మాట్లాడి, ఏమి చేసినా, మొత్తం ప్రపంచపు ఆర్థిక, ద్రవ్య నియంత్రణలు తమ అధీనంలో ఉన్నందున బ్రిక్స్ చేయగలిగిందేమీ లేదన్నది వారి ధీమా. ఇందుకు ఒక కీలకం అమెరికన్ డాలర్; అంతే కీలకమైనవి ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్’ (బిఐఎస్), ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్; అదేవిధంగా, బ్రిక్స్‌తో సహా అత్యధిక దేశాల నగదు నిల్వలు పాశ్చాత్య కరెన్సీలలో ఉండటం, వారి అస్తులు కూడా అనేకం పాశ్చాత్య దేశాలలో ఉండటం; అన్నిదేశాల ఎగుమతి దిగుమతులు, పరస్పర చెల్లింపులు డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో కరెన్సీల ద్వారా జరగటం. ఈ ఆర్థిక ప్రాబల్యాలు పాశ్చాత్యులకు రాజకీయ, సైనిక ప్రాబల్యాలను కూడా సహజంగానే తెచ్చిపెడుతున్నాయి.ఈ వలయంలో చిక్కుకున్న బ్రిక్స్గానీ, మరొకటిగానీ చేయగలిగిందేమిటి? అందువల్లనే 2006 నుంచి 2024 కజాన్ డిక్లరేషన్ సమయం వరకు అమెరికా, యూరప్ బ్రిక్స్‌ను పట్టించుకోలేదు. అటువంటిది ఈ డిక్లరేషన్‌తో మొదటిసారి ప్రకంపనలు మొదలయ్యాయి. అందుకు కారణం బ్రిక్స్ దేశాలు తమ మధ్య చెల్లింపులను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తాము వాణిజ్యం జరిపే ఇతర దేశాలతోనూ ఆ విధమైన చెల్లింపుల కోసం ప్రయత్నించాలనీ నిర్ణయించటం. ఇది వాస్తవ రూపంలో జరిగేందుకు మరికొన్ని సంప్రదింపులు అవసరమైనా, ఆ నిర్ణయం సూత్రరీత్యా జరగటమే పాశ్యాత్య కరెన్సీలకు పొంచి ఉన్న ఒక పెద్ద ప్రమాదం. ఈ చెల్లింపులు ఇప్పటికే కొన్ని దేశాల మధ్య మొదలయ్యాయి కూడా! బ్రిక్స్ దేశాల డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి ఇప్పటికే ఏర్పడి పనిచేస్తున్నది. భవిష్యత్తులో బ్రిక్స్ సొంత కరెన్సీ ఆలోచన కూడా ఉంది. ఈ నిర్ణయాలపై కజాన్ అనంతరం పాశ్చాత్య దేశాలు అధికారిక ప్రకటనలైతే ఇంకా చేయలేదు. కానీ, అంతర్జాతీయ సెటిల్మెంట్స్ అన్నిటికీ నాడీ కేంద్రం వంటి బిఐఎస్ అధికారుల స్పందనను గమనిస్తే రహస్యం తెలిసిపోతుంది. ఆ చెల్లింపులు ఇప్పటి వలె డాలర్ల రూపంలో గాక బ్రిక్స్ నిర్ణయించినట్లు స్థానిక కరెన్సీలలో జరగటం అంతటా మొదలైతే అది ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకే ముప్పు కాగలదని నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేశారు వారు. దాని అర్థాన్ని సాధారణ భాషలో చెప్పాలంటే, డాలర్ ప్రపంచం తలకిందులవుతుందన్నమాట! చమురును భారీగా ఉత్పత్తి చేసే నైజీరియా ఇక నుంచి డాలర్‌కు బదులు తమ కరెన్సీ నైరాలో విక్రయించాలని ఈ వ్యాసం రాసే సమయానికి నిర్ణయించటం విశేషం.మనం చేసే పనిలోని మంచిచెడులను గ్రహించాలంటే మన ప్రత్యర్థి స్పందనలను గమనించాలంటారు. కజాన్ డిక్లరేషన్‌లోని 134 పేరాగ్రాఫ్‌లు యథాతథంగానే వర్ధమాన దేశాలన్నిటా తక్షణ ఉత్సాహాలకు, ఆశాభావాలకు కారణమయ్యాయి. పైన పేర్కొన్న బిఐఎస్ అధికారుల వ్యాఖ్యలు, కొందరు పాశ్చాత్య మేధావుల వ్యాఖ్యలను బట్టి, ఈ డిక్లరేషన్‌లోని ఆర్థికపరమైన ఆలోచనలు ఏ విధంగా వర్ధమాన దేశాలను పాశ్చాత్యుల కబంధ హస్తాల నుంచి విముక్తం చేయగల అవకాశం ఉందో వారికి బాగా అర్థమవుతున్నది. డాలర్ శక్తి, ఆర్థిక లావాదేవీల నియంత్రణ, వర్ధమాన దేశాల ముడి సరుకుల ధరల తగ్గింపు, అక్కడి మార్కెట్లలో తమ ఉత్పత్తుల ధరల పెంపు, ఆ యా దేశాల కరెన్సీ విలువల కుదింపు, తమ మాట వినని వారిపై ఆంక్షలు, తమ బ్యాంక్‌లలోని ఆ యా దేశాల నిధుల స్తంభన వంటివన్నీ పాశ్చాత్య దేశాలకు ఒక క్రీడగా మారి యథేచ్ఛగా సాగుతూ వస్తున్నాయి. ఇపుడిక క్రమంగా వీటన్నిటికి బ్రేకులు పడగలవన్నది వర్ధమాన దేశాలకు ఒక కొత్త ఆశాభావం అవుతుండగా, పాశ్చాత్య రాజ్యాలకు అదే గుబులు పుట్టిస్తున్నది. అందుకే, సౌదీ అరేబియా తన చమురును చైనాకు యువాన్‌లో కాక డాలర్లలో విక్రయించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నట్టు తాజావార్తలు చెప్తున్నాయి.కజాన్ డిక్లరేషన్‌లో ఐక్యరాజ్య సమితి తదితర అంతర్జాతీయ సంస్థలు, సంబంధాలతో నిమిత్తం గల పేరాగ్రాఫ్‌లు, వర్ధమాన దేశాల మధ్య వివిధ సహకారాలు, ఇతర సంస్కరణల గురించిన ప్రస్తావనలు కూడా వర్ధమాన దేశాలంతటా సానుకూల స్పందనలకు కారణమవుతున్నట్లు ఈ వారం రోజుల కథనాలు చెప్తున్నాయి. సాధారణంగా పాశ్చాత్య దేశాలకు అణగిమణగి ఉంటాయనే భావన గల పలు దేశాలు సైతం నెమ్మదిగా ధిక్కార స్వరంతో మాట్లాడుతూ బ్రిక్స్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నాయి. కూటమిలో ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా జరగాలనే అవగాహన ఉన్నందున, సభ్యదేశాల సంఖ్య వేగంగా పెరిగితే అందుకు చిక్కులు రాకుండా ఉండేందుకు కొత్తవారిని ఆచితూచి తీసుకోనున్నారు. కజాన్ దరిమిలా ప్రపంచంలో ఎన్నడూ లేని కొత్త మార్పునకు ఆరంభం జరుగుతున్నదని పలువురు పాశ్చాత్య మేధావులు సైతం భావిస్తున్నారు. ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు, కజాన్ డిక్లరేషన్ అమలులో తగినన్ని సాధక బాధకాలున్నందున జాగ్రత్తగా ముందడుగులు వేయవలసి ఉంటుందనే గుర్తింపు బ్రిక్స్‌లోనూ ఉంది.పోతే, అమెరికాతో ఎంత సాన్నిహిత్యం ఉన్నా భారతదేశం 2006 లోనే బ్రిక్స్‌లో చేరి, ఈ కజాన్ డిక్లరేషన్‌లోనూ సాహసవంతమైన విధంగా భాగస్వామి కావటం గమనించదగ్గది. ఏ అవసరాల కోసం అమెరికాకు సన్నిహితంగా ఉన్నా, తన మౌలికమైన, దీర్ఘకాలికమైన ప్రయోజనాల కోసం తక్కిన వర్ధమాన దేశాలతో కలిసి నడవటమే సరైనదన్న గుర్తింపు ఉండటమే అందుకు కారణమనాలి, ముఖ్యంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తరచుగా తన ఇంటర్వ్యూలు, ప్రసంగాలలో చెప్తున్న మాటలు వినేవారికి ఇది స్పష్టమవుతున్నది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సల్మాన్ ఖాన్ (బాలీవుడ్ స్టార్)రాయని డైరీ
తప్పులు మానవ సహజం అయినప్పుడు శిక్షలు అమానుషంగా ఎందుకు ఉండాలి?! చట్టాల గురించి, బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ గురించీ కాదు నా ఆలోచన. శిక్షను విధిస్తు న్నట్లు తెలియపరచకుండానే మూతి బిగింపుల మౌనంతో యావజ్జీవ దూరాన్ని పాటిస్తుండే సొంత మనుషుల గురించి, ‘నా’ అనుకున్నా, నా వాళ్లు కాకుండా పోయిన వాళ్ల గురించి. చట్టం విధించే శిక్ష నిర్దాక్షిణ్యమైనదిగా కనిపించవచ్చు. కానీ, ఏ రూల్ బుక్కూ లేకుండా మనిషికి మనిషి విధించే శిక్ష అన్యాయమైనది. న్యాయం లేకపోవటం కన్నా దయ లేకపోవటం ఏమంత చెడ్డ విషయం?!శిక్షల విధింపులో చట్టానికి ఒక చక్కదనం ఉంటుంది. ఒక సక్రమం ఉంటుంది. చింపిరి జుట్టుకు దువ్వెన, దారిలో పెట్టే దండన... చట్టం.కారును ఢీకొట్టించు. జింకను వేటాడు. ఆయుధాలు కలిగి ఉండు. 26/11 పై కామెంట్లు చెయ్యి. యాకూబ్ మెమన్ మీద ట్వీట్లు పెట్టు. దరిద్రం నీ నెత్తి మీద ఉండి ఆఖరికి ఐశ్వర్యారాయ్ పైన కూడా చెయ్యి చేస్కో. నువ్వెన్ని చేసినా... చట్టం వెంటనే నిన్ను దూలానికి వేలాడదీయదు. శూలాలతో పొడిపించదు. మొదట విచారణ జరుపుతుంది. వాదనలు వింటుంది. వాయిదాలు వేస్తుంది. తీర్పును రిజర్వు చేస్తుంది. ఆ తర్వాతే నువ్వు దోషివో, నిర్దోషివో తేలుస్తుంది. దోషివైతే జైలుకు పంపుతుంది. కావాలంటే బెయిలిస్తుంది.మనుషులు విధించే శిక్షలో ఇవేవీ ఉండవు. దువ్వెనా, దండనా అసలే ఉండవు. దూరంగా జరిగిపోతారంతే. ‘‘ఎలా ఉన్నావ్?’’ అని అడిగేందుకైనా దగ్గరకు రారు. ‘‘భద్రంగా ఉండు..’’ అని చెప్పేందుకైనా దూరాన్ని తగ్గించుకోరు. ఎంత అమానుషం!!‘‘నువ్వు పెంచుకున్న దూరమే ఇది సల్మాన్..’’ ఎంత తేలిగ్గా అనేస్తారు!బంధాలను కదా నేను పెంచుకున్నాను. దూరాలనా?! స్నేహబంధం, ప్రేమబంధం, జీవితబంధం... అన్ని బంధాలనూ తెంచుకుని వెళ్లింది ఎవరు?!‘‘కానీ సల్మాన్, నువ్వొట్టి పొసెసివ్. గట్టిగా పట్టేసుకుంటావ్. ఎటూ కదలనివ్వవు. ఎటూ చూడనివ్వవు. ఏదీ మాట్లాడనివ్వవు. ఏమీ చెప్పనివ్వవు. దాన్నేమంటారు మరి? దూరం పెరగటమే కదా! నువ్వు పెంచుకున్న దూరం..’’ అంటారు!కేరింగ్‌ను పొసెసివ్ అని ఎందుకు అనుకుంటారు వీళ్లంతా?! కేరింగ్ అవసరం లేదని చెయ్యి విడిపించుకున్నప్పుడు దూరం పెరిగితే అది చెయ్యి వదిలిన వాళ్లు పెంచుకున్న దూరం అవుతుందా?!రోజుకొకరు ఫోన్ చేసి, ‘‘సల్మాన్ నిన్ను చంపేస్తాం’’ అని బెదిరిస్తున్నారు. వాళ్లు నయం కదా... ‘‘సల్మాన్ బాగున్నావా?’’ అని పరామర్శగా ఒక్క కాల్ అయినా చేయకుండా జూహూలో, బాంద్రాలో ఏళ్లకు ఏళ్లు నాకు ‘దగ్గరగా’ ఉంటున్న వారి కంటే!బయట క్రాకర్స్ పేలుతున్నాయి. గన్ పేలి నప్పుడు వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సైలెన్సర్ బిగిస్తే అసలు శబ్దమే ఉండదు.నవ్వొచ్చింది నాకు. నా చుట్టూ ఉన్న వాళ్లంతా మౌనాన్ని బిగించుకున్న తుపాకుల్లా అయిపోయారా! సైలెన్సర్ ఉన్న బులెట్ మౌనంగా ఒకసారే దిగిపోతుంది. మౌనం అదేపనిగా బులెట్లను దింపుతూ ఉంటుంది.లేచి బాల్కనీ లోకి వచ్చాను. ఒక్కక్షణం నాకు గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్నానో, పాన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఉన్నానో అర్థం కాలేదు. ఎక్కడుంటే ఏమిటి, పక్కన మనిషే లేనప్పుడు? పలకరింపు కూడా కరువైనప్పుడు!కళ్లెదురుగా ఆకాశం వెలిగి ఆరిపోతూ, వెలిగి ఆరిపోతూ ఉంది. ఎగసిన కాంతి పూలు ఫెటేల్మని విచ్చుకుని, చప్పున అంతెత్తు నుంచి చీకట్లోకి జారిపోతున్నాయి.ఏనాడో జీవితంలోంచి వెళ్లిపోయినవారు ఇప్పుడు ఒక్కొక్కరూ గుర్తుకు వస్తున్నారంటే.. కష్టంలో ఉన్నామనా? కష్టాన్ని తట్టుకుని ఉన్నామనా?-మాధవ్ శింగరాజు -
చరిత్రలో సువర్ణాధ్యాయం
రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మధ్యఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిదని అంటారు విలియం డార్లింపిల్. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 12, 13 శతాబ్దాల కాలం ఇండియాలో సువర్ణాధ్యాయం అని చెబుతారు తన తాజా పుస్తకంలో. భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం గురించి రాశారు. ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందన్న విమర్శలను డార్లింపిల్ కొట్టేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం’’ అంటారు.విలియం డార్లింపిల్ తాజా పుస్తకం భారతీయ చదువరులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాను. ఎందుకంటే... మనలాంటి వాళ్లు చాలాకాలంగా నమ్ముతున్న విషయాన్ని ఆయన మరోసారి రూఢి చేశారు. అయితే అదేమిటన్నది ఆయన మాటల్లో వినడమే మేలు. డార్లింపిల్ రాసిన పుస్తకం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12 – 13 శతాబ్దాల మధ్య కాలం నాటి పరిణామాలకు సంబంధించినది. ఈ కాలానికి సంబంధించి ఆయన ఏమంటారంటే... ‘‘రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మ««ధ్య ఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిది’’ అని!ప్రాచీన భారతదేశం ప్రపంచంలో తీసుకొచ్చిన మార్పుల గురించి డార్లింపిల్ ‘ద గోల్డెన్ రోడ్: హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్’’ పేరుతో రాసిన పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. భారతీయల చెవులకు ఇంపైన ఇంకో మాట కూడా ఇందులో ఉంది. ఇది చైనాతో భారత్ పోలికకు సంబంధించినది. చైనా తనను తాను ఈ ప్రపంచానికి కేంద్రంగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు ప్రత్యక్ష వ్యాపారం ఉన్న ఆనవాళ్లేమీ లేవంటారు ఆయన. ఆ కాలంలో ‘‘ఒకరి గురించి మరొకరికి చూచాయగా మాత్రమే తెలుసు’’ అని ఆయన యూరప్, చైనాల గురించి నాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్, రోమన్ సామ్రాజ్యాల మధ్య వాణిజ్య విస్తృతి చాలా ఎక్కువ. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వసూలు చేసే సుంకం రోమన్ సామ్రాజ్య ఖజానాలో మూడో వంతు వరకూ ఉండేది. ఇంకో రుజువు ఏమిటంటే... భారతీయ సంగ్రహాలయాల్లో రోమ్ సరిహద్దుల్లోని దేశాల్లోనూ లేనన్ని రోమన్ నాణేలు ఉండటం. ఇది భారత్– చైనాల మధ్య శత్రుత్వాన్ని కొత్త రూపంలో రాజేసినట్టుగా లేదూ?ఇవన్నీ డార్లింపిల్ పుస్తకంలో మూడు రకాల కథనాల్లో కనిపిస్తాయి. చైనా, మధ్యాసియాలకు ఆపై సైబీరియా, మంగోలియాల వరకూ విస్తరించిన బౌద్ధం తాలూకూ కథనం ఒకటైతే... భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం రెండో కథనం. హిందూయిజ, సంస్కృతాలు దక్షిణాసియాలో కంబోడియా, లావోస్, జావాల వరకూ వ్యాపించిన కథనం చివరిది. బాగ్ధాద్ మంత్రుల మొదలుకొని ఇటలీ గణిత శాస్త్రవేత్తల వరకూ రకరకాల పాత్రల ద్వారా ఈ కథనాలు నడుస్తాయి. టొలెడో మతాధికారి, చైనాలోని ఏకైక మహిళ సామ్రాజ్ఞి, కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్, జావాలోని బోరోబుడుర్, బిహార్‌లోని నలందాల వెనుక దాగి ఉన్న ఎన్నో కథలను వివరిస్తుందీ పుస్తకం. టొలెడో మతాధికారి 1068లో ప్రపంచంలోని మే«ధా చరిత్ర గురించి రాస్తూ... అది భారత కాలమని వర్ణించాడు. ‘విలియం ద కాంకరర్’ తొలిసారిగా బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టిన ఈ కాలంలోనే రాసిన ఈ చరిత్రలో భారత్ తన వరాలకు పేరొందిందని రాశాడు. ‘‘శతాబ్దాలుగా విజ్ఞానానికి సంబంధించిన అన్ని శాఖల్లో భారతీయుల సామర్థ్యాన్ని రాజులు అందరూ గుర్తించారు. జ్ఞానవంతులు వాళ్లు. జ్యామితి, అంక గణితాల్లో ఎంతో పురోగతి సాధించారు. వైద్యం విషయంలో మానవులందరి కంటే ముందున్నారు’’ అని కీర్తించాడు. ఈ పుస్తకం ద్వారా నాకు మూడు విషయాలు స్పష్టమయ్యాయి. పుస్తక శీర్షికలోని బంగారు దారి నేల మార్గం కాదు. సముద్రాల పైది. శక్తిమంతమైన వానాకాలపు గాలులు భారతీయ వర్తకులను పశ్చిమాన అరేబియాకు, తూర్పున సుమత్రా, జావా వరకు చేరేలా చేశాయి.దక్షిణాసియాకు హిందూయిజం, సంస్కృత సంబంధిత సంస్కృతి విస్తరించేందుకు యుద్ధాలు కారణం కాదు. ఇందులో బ్రాహ్మణ మిషనరీలు ముందుంటే... తరువాతి కాలంలో వ్యాపారులు వ్యాప్తి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... భారత్‌లోని అన్యాయ కుల వ్యవస్థ ఇక్కడకు విస్తరించకపోవడం. దురదృష్టం కొద్దీ డార్లింపిల్ ఈ విషయంపై ఎక్కువగా వివరించలేదు.అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం, ఇది మనం ఆశించేది అయినప్పటికీ చారిత్రక వాస్తవం కాకపోవచ్చు... సోర్బోన్ , ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్నీ నలందా విశ్వవిద్యాలయ స్ఫూర్తితో ఏర్పాటు చేశారని అనిపిస్తుంది. చివరగా... ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందని కొంతమంది విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. డార్లింపిల్ రెండింటికీ సంబంధమే లేదని స్పష్టం చేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం, అసంగతం.’’ ఆయన పుస్తకంలో చెప్పే ఇంకా ఆసక్తికరమైన సంగతులు చాలానే ఉన్నాయి. వాటిని మీ కోసమే వదిలేస్తాను.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
యుద్ధం మిగిల్చేది పరాజయాన్నే!
ఆధునిక ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు, అంతర్యుద్ధాల వల్ల మానవాళి మాటలకు అందని నష్టాలను చవిచూసింది. అయినా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా తరచూ యుద్ధాల ద్వారానే పలు దేశాలు సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్‌లకు విస్తరించిన ఇజ్రాయెల్ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్‌లో, ఇటు గాజాలో పసిపిల్లలతో సహా వేలాదిమంది అమాయకులు ఈ రెండు యుద్ధాల వల్ల బలైపోయారు.ఏ యుద్ధంలోనైనా పరాజితులే ఉంటారు తప్ప విజేతలు ఉండరని చెప్పారు ‘యుద్ధము–శాంతి (వార్ అండ్ పీస్)’ అనే తన అద్భుత నవల ద్వారా రష్యన్ మహా రచయిత లియో టాల్‌స్టాయ్. సరిహద్దులు లేని పరస్పర ప్రేమ ఒక్కటే విశ్వశాంతికి మార్గం వేస్తుందని రెండు శతాబ్దాల ముందే చెప్పారాయన.1910లో టాల్‌స్టాయ్ మరణించిన 4 ఏళ్ల తర్వాత 1914 నుంచి 1917 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 3 ఏళ్లపాటు జరిగిన ఈ యుద్ధంలో 85 లక్షల మంది సైనికులు, 1 కోటి 30 లక్షల మంది పౌరులు మరణించారు. ఆ యుద్ధంలో అంగవైకల్యం పొందిన వారి సంఖ్యకు లెక్కేలేదు. ఆ తర్వాత, 1939–45 మధ్య 6 ఏళ్ల పాటు సాగిన రెండో ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మంది ఆశువులు బాశారు. కోట్లాది మంది క్షతగాత్రులయ్యారు. హిరోషిమా, నాగసాకీలపై అమెరికా వేసిన అణుబాంబులు ఆ నగరాలను మరుభూమిగా మార్చాయి.1947 తర్వాత... జరిగిన ఆర్థిక పునర్నిర్మాణం కారణంగా ప్రబల ఆర్థిక, సైనిక శక్తులుగా అవతరించిన అమెరికా, సోవియట్ రష్యాల మధ్య సాగిన ఆధిపత్యపోరు క్రమంగా ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఆ అగ్రరాజ్యాల సహాయ సహకారాల మీద ఆధార పడటం వల్ల అనివార్యంగా అవి ఏదో ఒక శిబిరంలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా ఆ యా దేశాలు సైతం ఆ ప్రచ్ఛన్నయుద్ధంలో భాగస్వాములై నష్టపోయాయి. 1989లో సోవియట్ యూనియన్ పతనమయ్యేంతవరకు ఆ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. అంతకుముందే ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య ఘర్షణలు మొదలై పశ్చిమాసియాలో అశాంతి నెలకొంది. తదుపరి ఇరాన్–ఇరాక్‌ల మధ్య కీచులాటలు కొనసాగాయి. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం, 1972లో ఇండియా–పాక్‌ల మధ్య యుద్ధం, తిరిగి 1999లో ఈ రెండు దేశాల నడుమ కార్గిల్ యుద్ధం, దక్షిణాఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల మధ్య అంతర్యుద్ధం... ఇలా చెప్పుకుంటూపోతే అనేక యుద్ధాలు ప్రపంచాన్ని అస్థిరపరిచాయి. ఈ నేపథ్యంలోనే గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్–రష్యా (యురేషియా) యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్ (పశ్చిమాసియా) యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్‌లకు విస్తరించిన ఇజ్రాయెల్ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్‌లో, ఇటు గాజాలో పసిపిల్లలతోసహా వేలాదిమంది అమాయకులు బలైపోయారు. రెండు ప్రధాన యుద్ధాలలో అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నా... ఎవ్వరూ తగ్గడం లేదు. ఈ యుద్ధాలను ఆపడానికి ఐక్యరాజ్య సమితి చేసిన అరకొర యత్నాలు ఏమాత్రం ఫలితాలివ్వలేదు. పైగా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తమ దేశంలో పర్యటించరాదని ఇజ్రాయెల్ హుకుం జారీ చేసింది. హెజ్బొల్లా, ఇరాన్, హౌతీల దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించలేదన్నది ఇజ్రాయెల్ ఆరోపణ. గతంలో యుద్ధాలకు దిగే దేశాలపై దౌత్యపరమైన ఆంక్షలు విధించేవారు. కానీ, ఇప్పుడు ఆ దశ దాటి పోయింది. మధ్యవర్తిత్వం వహించాల్సిన వారు కూడా ఏదో ఒక కూటమికి వంత పాడటంతో... కనుచూపు మేరలో ఈ యుద్ధాలకు ముగింపు కార్డుపడే పరిస్థితి కనపడటం లేదు. ప్రపంచ దేశాలకు అత్యధిక స్థాయిలో చమురు సరఫరా చేసే గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, కువైట్ దేశాలు మాత్రం తాము అటు ఇజ్రాయెల్‌కు గానీ, ఇటు ఇరాన్‌కు గానీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటామని ప్రకటించడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశమే.పశ్చిమాసియాలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న యుద్ధం వల్ల భారత్‌కు ఆర్థికంగా అపార నష్టం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. పశ్చిమాసియా పరిణామాలు భారత్ స్టాక్ మార్కెట్లను ఇప్పటికే ఒడిదుడుకులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే భారత ఇంధన అవసరాలు దాదాపు 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ప్రధానంగా ఇరాన్ కనుక తన హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసినట్లయితే ఈ మార్గం ద్వారా చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకొంటున్న భారత్ ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఎంచుకోవాలి. అలాగే, సూయిజ్ కాలువ ద్వారా రవాణాను అనుమతించనట్లయితే... చుట్టూ తిరిగి దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా చమురును రవాణా చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల దూరం పెరిగి రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఇప్పటికే యెమన్ కేంద్రంగా పనిచేసే హౌతీలు హమాస్‌కు మద్దతుగా సూయిజ్ కాలువ ద్వారా రవాణా అవుతున్న నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇది భారత్‌కు ఊహించలేని నష్టాన్ని కలిగిస్తోంది. ఇక, దేశంలో ముడి చమురు ధరలు పెరిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవడం ఖాయం. 2014–15 లో బ్యారెల్ ముడిచమురు ధర అత్యధికంగా 140 డాలర్లకు చేరినపుడు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లకు లోనయింది. ప్రçస్తుతం బ్యారెల్ ముడిచమురు 85–90 డాలర్ల మధ్యనే ఉండటం వల్ల... భారత్ స్థిమితంగానే ఉంది. కానీ, మధ్య ప్రాచ్యంలో యుద్ధం కనుక మరింత ముదిరితే జరిగే పరిణామాలు చేదుగానే ఉంటాయి. పొద్దు తిరుగుడు నూనె, పామాయిల్ నూనెలను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచీకరణ వేగం పుంజుకొన్న తర్వాత ప్రతి దేశంలో ఆర్థిక పరిస్థితులు బాహ్య పరిణామాలపై ఆధారపడ్డాయి. అందుకు భారత్ మినహాయింపు కాదు. ఒకప్పుడు ‘రష్యా’తో దౌత్యపరంగా సఖ్యత సాగించిన భారత్... తదనంతర పరిణామాలతో అమెరికాకు సైతం దగ్గరయింది. అమెరికా–చైనాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా అమెరికాకు మరింత చేరువయింది. రష్యా, అమెరికా... ఈ రెండు అగ్రరాజ్యాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం భారత్‌కు మేలు చేసేదే. అయితే, భారత్ తన దౌత్యనీతిలో ఎల్లప్పుడూ తటస్థంగానే కొనసాగుతోంది.యుద్ధాలతో ఏ సమస్యనూ పరిష్కరించలేమని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తన రష్యా పర్యటనలో అధ్యక్షుడు పుతిన్‌కు స్పష్టం చేయడం ద్వారా భారత్ తన విదేశాంగ విధానాన్ని చాటి చెప్పారు. ముడిచమురుతో సహా పలు వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్నప్పటికీ... ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ మద్దతు తెలపలేదు. పైగా, ఉక్రెయిన్‌కు నైతిక మద్దతు ప్రకటించింది. విస్తరణ వాదాన్ని సహించబోమని ఒక్క రష్యాకే కాదు.. అరుణాల్ప్రదేశ్ను ఆక్రమించాలని చూస్తున్న చైనాకు కూడా భారత్ పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది.నిజానికి, అటు యురేషియాలో, ఇటు పశిమాసియాలో జరుగుతున్న యుద్ధాలను నిలిపివేయడానికి గల మార్గాలను భారత్ తీవ్రంగా అన్వేషిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అత్యధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి రేటును నమోదు చేస్తున్న భారత్‌కు ఈ అంతర్జాతీయ పరిణామాలు మింగుడు పడనివే. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో పశ్చియాసియాలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తనవంతు కృషి చేయడం మినహా భారత్ చేయగలిగింది ఏమీలేదు. లియో టాల్‌స్టాయ్ చెప్పినట్లు పరాజితులుగా మిగిలిపోతారా లేక యుద్ధవిరమణ చేసి విజేతలుగా అవతరిస్తారా అన్నది యుద్ధాల్లో మునిగి ఉన్న దేశాలు, వాటికి మద్దతు ఇస్తున్న దేశాల వైఖరి మీద ఆధారపడి ఉంది. -డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
Telangana: పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా?
అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రూ.2 వేలు నెలవారీ పింఛన్ తీసుకుంటున్న వారందరికీ రూ.4 వేలు ఇస్తామనీ, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామనీ హామీ ఇచ్చారు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా పెన్షన్ పెంచి ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా పెంచలేదు. వృద్ధులు, ఒంటరివాళ్లు, వికలాంగులు పలు కారణాలతో సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఫించన్ వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా జీవితం గడుపగలుగుతారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి హామీ ఇచ్చినట్టు పింఛన్ డబ్బులు పెంచితే వాళ్లు నిశ్చింతగా బతుకుతారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయం.మాయమాటల కాంగ్రెస్ ప్రభుత్వం మాటతప్పి మరోమారు ప్రజలను మోసపుచ్చింది. కాంగ్రెస్ పాలనలో మాటలకూ, చేతలకూ పొంతన ఉండదని ఇంకోమారు రుజువయింది. ‘‘వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు అందరికీ పెన్షన్... నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన్రు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా పెన్షన్ పెంచి ఇస్తాం...’’ అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 జూలై నెలలో స్వయంగా పలికిన పలుకులివి! ఈయనే ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... ‘‘ఒక్క నెల ఆగితే పెన్షన్ డబుల్ అయితది. డిసెంబర్ తొమ్మిదినాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ఖాతాలో రూ.4 వేలు పడుతాయి’’ అని కోతలు కోశారు. అయితే, అధికారంలోకి వచ్చి 10 నెలలైనా కాంగ్రెస్ బడా నేతలు ఇచ్చిన హామీలు ఆచరణలోకి రాలేదు.అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 42 పేజీల మేనిఫెస్టోలోని చాప్టర్–2లో పేర్కొన్న ఆరో గ్యారెంటీలో ఏం చెప్పారు? ఇంతకుముందు రూ.2 వేలు నెలవారీ పింఛన్ తీసుకుంటున్న వారందరికీ తాము అధికారంలోకి వచ్చాక చేయూత కింద రూ.4 వేలు ఇస్తామనీ, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామనీ రాతపూర్వకంగా చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా... పెంచలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ లబ్ధిదారులకు ద్రోహం చేస్తున్నారు. పింఛను పెంపు లెక్కను పరిగణనలోకి తీసుకుంటే 10 నెలలుగా ప్రతి అవ్వ, తాతకు, దివ్యాంగుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 వేల రూపాయిలు బాకీ పడిందని చెప్పవచ్చు. ఉలుకూ లేదు పలుకూ లేదురాష్ట్రంలో ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారితో పాటు అదనపు వ్యక్తి ఉంటే, ఇంట్లో ఇద్దరు వృద్ధులకూ పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు చెప్పారు. దీంతో పది లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతారనీ, ఈ లెక్కన దాదాపు 55 లక్షల మందికి కాంగ్రెస్ పెన్షన్ అందిస్తుందనీ గొప్పలు చెప్పారు. ఇప్పుడు దీని గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. రెండు మూడు రోజుల్లో ఆసరా పింఛన్ దారులకు తీపి కబురు అందిస్తాననీ, ఆ బాధ్యత తనదేననీ ఈ ఏడాది జూన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పి నెలలు గడుస్తున్నా ఇప్పుడు దీనిపై నోరు మెదపడం లేదు! ఇక, ఇతర మంత్రుల సంగతి సరేసరి... ఉలుకూ, పలుకూ లేదు!వృద్ధులు, ఒంటరివాళ్లు, వికలాంగులు పలు కారణాలతో సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ప్రభుత్వం అందించే పింఛన్ వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా బతుకుతూ తృప్తిగా ఉంటారు. ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లతో లబ్ధిదారులు గౌరవంగా జీవించడమే కాకుండా కష్టమైన పనులు చేయాల్సిన అవసరం లేకుండా జీవితం గడుపగలుగుతారు. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం వారికి హామీ ఇచ్చినట్టు పింఛన్ డబ్బులు పెంచితే వాళ్లు నిశ్చింతగా బతుకుతారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయం.మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రూ.200 పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకొంది. 2014 ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్... ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్లను రూ.200 నుంచి రూ. 1,000, దివ్యాంగులకు రూ.500 నుంచి 1,500 రూపాయలకు పెంచారు. 2018 ఎన్నికల సమయంలో మరోసారి పింఛన్లు పెంచుతామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే వృద్ధులు, వితంతువులు, ఇతర కార్మికుల పింఛన్లను రూ.1,000 నుంచి రూ. 2,016, దివ్యాంగులకు రూ.1,500 నుంచి 3,016 రూపాయలకు పెంచింది. మారుతున్న కాలమాన పరిస్థితులు, వయసుతో వచ్చే వివిధ ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని 2020 మార్చిలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ అర్హత వయసును 65 ఏళ్ళ నుండి 57 ఏళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించడంతో వృద్ధాప్య కేటగిరిలో అదనంగా సుమారు 8 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీంతో పాటు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి మరో లక్ష మందిని ఆసరాకు జోడించింది. దీంతో పథకంలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 45 లక్షలు దాటింది. అయితే కాలక్రమేణ పింఛన్ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా కొత్తవారికి పింఛన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం చొరవ తీసుకోలేదు. సమయానికి సదర్ క్యాంపులు నిర్వహించకపోవడం వల్ల కొత్తగా దివ్యాంగులుగా మారిన వారు చేయూత పథకంలో చేరడం కష్టంగా మారింది. ఇవన్నీ గడిచిన పది నెలల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనతలుగా చెప్పుకోవచ్చు.మంచిర్యాలలో 2023 జూన్ 9న జరిగిన సభలో దివ్యాంగుల పింఛన్‌ను రూ.3,016 నుంచి రూ.4,106కు పెంచుతున్నట్టు కేసీఆర్ ప్రకటించిన తర్వాతి నెల నుండే అవి అమలులోకి వచ్చాయి. ఇది బీఆర్ఎస్ విశ్వసనీయత! దేశంలోనే బీడీ కార్మికులకు సైతం ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది బీఆర్ఎస్కు పేదల పట్ల ఉన్న నిబద్ధత! కేవలం వృద్ధులే కాకుండా చేనేత కార్మికులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, వికలాంగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇలా అందరికీ కేసీఆర్ ‘ఆసరా’గా నిలిచిన సంగతిని కాంగ్రెస్ కప్పిపెట్టవచ్చుగానీ, బీఆర్ఎస్ తీసుకొచ్చిన మార్పు లబ్ధిదారుల మనసుల్లో ఇప్పటికీ ఉంది, ఎన్నటికీ చెరిగిపోదు. బాకీ చెల్లించాలిఆసరా పింఛన్ పేరును చేయూత పింఛన్‌గా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తను ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినట్టు పింఛన్ పెంచి ఇవ్వడం లేదు. అసలు సంగతి ఇలా ఉంటే, కొసరుగా... కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో చేయూత పింఛన్ దారులకు రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కూడా అందిస్తామనీ, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. కానీ, ఏ హామీనీ నెరవేర్చకుండా, అభాగ్యుల పింఛన్ డబ్బులను దారి మళ్లించి, వారిని రేవంత్ రెడ్డి నట్టేట ముంచారు. ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలను, సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయాలి. లేదంటే, అది తీవ్ర అసమానతలకు దారి తీస్తుంది. కాబట్టి, హామీ ఇచ్చినట్టు దివ్యాంగుల పెన్షన్ వెంటనే రూ.4,016 నుంచి రూ. 6 వేలకు పెంచాలి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులకు రూ. 2,016 నుంచి రూ. 4 వేలకు పెంచాలి. పింఛన్ డబ్బులను ప్రతి నెలా 5వ తేదీలోపే ఇవ్వాలి. పది నెలలుగా బాకీ పడ్డ పింఛన్ పైసలన్నీ వెంటనే చెల్లించాలి. ఈ డిమాండ్లు సాధించేవరకు లబ్ధిదారుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంది.-వ్యాసకర్త మాజీ మంత్రి, ఎమ్మెల్యే-టి.హరీశ్ రావు -
‘అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన చంద్రబాబు.. అది ఈ శతాబ్ది అబద్ధం’
చంద్రబాబు నాయుడు ఇటీవల టీడీపీ సభ్యత్వం తీసుకుంటూ ‘అందరి మూలాలూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయ’ని చెప్పడం ఈ శతాబ్ది అబద్ధం. ‘అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన ఇతనికి అబద్ధం చెప్పకపోతే తల వేయి ముక్క లవుతుందని ముని శాపం’ ఉందని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పేవారు. అది నిజమేనని బాబు ప్రతి రోజూ రుజువు చేసుకుంటూనే ఉన్నారు. ఈయన మూలాలే కాంగ్రెస్‌వి అయితే, అందరి మూలాలూ తెలుగుదేశానివి ఎలా అయ్యాయి?ప్రజా ప్రయోజనాలు, వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి... ఈయనా, ఈయన వందిమాగధులూ తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాదును తానే నిర్మించానని గొప్పలు చెప్పుకొంటూ ఉంటారు బాబు. అటువంటప్పుడు ఆయన పార్టీ తెలంగాణలో ఎందుకు నామరూపాలు లేకుండా పోయింది? రెండు తెలుగు రాష్ట్రా లలోనే లేని తెలుగుదేశం పార్టీని... జాతీయపార్టీ అని ఎలా అనగలుగుతున్నారో అర్థం కాదు.కార్యకర్తల కోసమే పుట్టిన పార్టీగా టీడీపీ అధినాథుడు తన పార్టీ గురించి చెప్పుకొంటారు. మరి 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడికి పోయారు? పోటీ చేయడానికి కూడా ఎందుకు సాహసించలేక పారిపోయారు? లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకోవడమే బాబు గొప్పతనం. అధికారాన్ని కట్ట బెట్టిన ఇటీవలి ఎన్నికల్లో పాత్ర పోషించింది కార్యకర్తలా, ఈవీఎంలా అనేది ప్రపంచానికి తెలిసిపోయింది. ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానాలి. కాంగ్రెస్ నుంచి వచ్చి, ఎన్టీ రామారావు నుంచి టీడీపీని లాగేసుకుని, ఎన్టీఆర్ మూలాలను పార్టీలో లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబని ఎవరికి తెలియదు? సమస్యలను పక్కదారి పట్టించే నేర్పరితనాన్ని పక్కన పెట్టి, ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి. వైఎస్సార్ సీపీ పాలనకు అలవాటుపడ్డ జనం టీడీపీ పాలన పట్ల ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్నారు. లేనిపోని అబద్ధపు ప్రచారం మాని ప్రజలను పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.– కె.వి. రమణ ‘ వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
Diwali 2024 పలు కారణాల పండగ
ఎంతో విస్తృతీ, వైవిధ్యం గల భారతదేశంలో, భిన్నత్వంలో అంతర్లీనంగా ఉండే ఏకత్వానికి దీపావళి పండగ ఒక ప్రతీక. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండగ జరుపుకుంటారు. కానీ ఈ పండగ ప్రాశస్త్యానికీ, ప్రాముఖ్యతకూ వెనక కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.దక్షిణ భారతంలో నరకాసుర వధ కథ ప్రసిద్ధం. సత్యభామా సహితుడై, శ్రీకృష్ణుడు ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకుడిని సంహరించాడు. కనుక అది నరక చతుర్దశి. ఆ మరునాటి విజయోత్సవ దినం దీపావళి. కానీ ఉత్తర భారతంలో ఈ కథ తెలిసిన వారే అరుదు. ఉత్తర భారతంలో, రావణ సంహారం జరిపి రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ దినంగా దీపావళి అమావాస్యకు గుర్తింపు. అందుకే ఆరోజు మహోత్సవం. అంతటి మహోత్సవం గనక చిన్న దీపావళి (చతుర్దశి), పెద్ద దీపావళి అని రెండు రోజులు జరుగుతుంది. తూర్పున వంగ దేశంలో దీపావళి అమావాస్య... కాళీ పూజ పర్వదినం. పశ్చిమాన గుజరాత్ వాసులకు దీపావళి అమావాస్య సంవత్సరాంతం. అమావాస్య ముగుస్తూనే నూతన సంవత్సరాది. రాజస్థాన్‌లో చాలా ప్రాంతాలలో దీపావళి అమావాస్య నాడే ఉగాది. ఆరోజు వైభవంగా లక్ష్మీ పూజ చేసి, కొత్త పద్దు పుస్తకాలకు శ్రీకారం చుట్టడం భాగ్యప్రదమని అక్కడి వ్యాపారస్థులు భావిస్తారు.జైనులకు దీపావళి అయిదు రోజుల పండగ. జైన ప్రవక్త మహావీరుడు, నేటికి సరిగ్గా 2,550 సంవత్సరాల క్రితం, దీపావళి అమావాస్యనాడు మోక్ష ప్రాప్తి (నిర్వాణం) పొందాడు. అమావాస్య ముందు త్రయోదశి నాడు ఆయన తన శిష్యులకు ఆఖరి బోధనలు ఆరంభించాడు. ఆ త్రయోదశి ‘ధన్య త్రయోదశి’ (ధన్–తేరస్). ఆ రోజు వాళ్ళు ధ్యానాది సాధనలలో గడిపే పవిత్ర దినం. కాలగతిలో ‘ధన్–తేరస్’ను ధన త్రయోదశిగా జరుపుకొనే ఆనవాయితీ అనేక ప్రాంతాలలో ఆరంభమైంది.అమావాస్య నాడు మహావీరుడనే మహత్తరమైన ‘జ్ఞాన జ్యోతి’ అంతర్ధానమవటం వల్ల కలిగిన అంధకారాన్ని ఆయన శిష్యగణం దివ్వెల వరసలు (దీప– ఆవళులు) వెలిగించి తొలగించటానికి చేసే ప్రయత్నంగా ఈ దీపావళులకు చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వర్ధమానుడు దూరమవడంతో, దుఃఖ సాగరంలో మునిగి, చేష్టలుడిగిన నంది వర్ధనుడనే రాజును, శుక్ల విదియనాడు, ఆయన సోదరి సుదర్శన తన ఇంటికి ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి, వైరాగ్య బోధన చేసి ఊరడించిన సందర్భం ‘భాయి–దూజ్’.దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు! – ఎం. మారుతి శాస్త్రి -
హరిత దీపావళి జరుపుకొందాం!
భూమిపై సమస్త జీవరాశి బ్రతకడానికి కీలక పాత్ర పోషిస్తున్న గాలి నేడు కలుషితమై జీవ జాతి మనుగడకు పెను శాపంగా మారుతోంది. మన ఆర్థిక, సామాజిక జీవితంపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా పరిశ్ర మలు, మోటార్ వాహనాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అగ్నిపర్వతాలు పేలడం, గనుల తవ్వకం, పంట అవశేషాలు కాల్చడం, అడవులు నరకడం, పండగలు–శుభకార్యాల్లో బాణా సంచా కాల్చడం లాంటి కారణాల వలన వాయు కాలుష్యం పెరిగిపోతోంది. కలుషిత గాలిలోని సూక్ష్మాతి సూక్ష్మ రేణువులు మానవ,జంతు ఊపిరితిత్తుల వడపోత కేంద్రాలను దాటుకొని నేరుగా రక్తంలో చేరి రకరకాల వ్యాధులకు కారణమవు తున్నాయి. గాలి కాలుష్యం వల్ల ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాస కోశ సంబంధమైన వ్యాధులు, గుండె జబ్బులు సంభవిస్తాయి. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు, గర్భస్థ శిశువులపై ప్రభావం చూపిస్తూ ‘నిశ్శబ్ద హంతకుడి‘గా వాయు కాలుష్యం వ్యవహరిస్తోంది.భారత్‌లోని చిన్నారుల మరణాల విషయంలో పోషకాహార లోపం తర్వాత వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉందని ‘లాన్సర్’ జర్నల్ పేర్కొంది. ప్రపంచ వాయు నాణ్యత నివే దిక–2023 ప్రకారం వాయు కాలుష్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత మూడో స్థానంలో భారత్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ ఢిల్లీ కాలుష్య రాజధానుల్లో మొదటి స్థానంలో ఉంది. గడిచిన దశాబ్ద కాలం నుంచి మనదేశంలో పంట అవశేషాలు, బాణసంచా లాంటి కాలుష్య కారకాలు వాయు కాలుష్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ‘గాలి నాణ్యత, వాతావరణ సూచన మరియు పరిశోధన వ్యవస్థ’ (ఎస్ఏ ఎఫ్ఏఆర్) అధ్య యనం ప్రకారం... శీతాకాలంలో ముఖ్యంగా దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చడం వలన దీపావళి మరుసటి నాడు ఢిల్లీలో గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థితిలోకి వెళుతోంది. గాలి నాణ్యత సూచీ 0 నుండి 100 వరకు ఉంటేనే అది ఆరోగ్యకరమైన గాలిగా పరిగణిస్తారు. కానీ శీతాకాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత సూచి రోజురోజుకూ దిగజారుతుంది. దీపావళి తర్వాత సాధారణ పరిస్థితి రావడా నికి ఢిల్లీలో 25 రోజులు, హైదరాబా దులో 16 రోజుల సమయం పడుతుందని సర్వేలు చెబుతున్నాయి. దీనికి కారణం విపరీతమైన టపా సులు పేల్చ డమే. పండగలు, ఉత్సవాల్లో పర్యావరణ హిత బాణా సంచాను మాత్రమే వాడాలి. రసాయనాలతో తయారు చేసిన టపాసుల స్థానంలో పర్యావరణహిత బాణసంచాను వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీపావళి పండుగ రోజున సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలనే నిబంధన ప్రతి ఒక్కరూ పాటించాలి. హరిత దీపావళి అందరి జీవితాల్లో వెలుగు నింపాలి.– సంపతి రమేష్ మహారాజ్ ‘ ఉపాధ్యాయుడు -
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్‌హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్‌కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్‌మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్‌ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్‌కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్‌లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్‌కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్‌లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్‌కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్‌కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్‌కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్‌హౌజ్‌లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో)