Guest Columns
-
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్‌హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్‌కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్‌మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్‌లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్‌ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్‌కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్‌లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్‌కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్‌లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్‌కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్‌కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్‌కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్‌హౌజ్‌లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో) -
వెలుగు ప్రదాత: జాన్ క్రిస్టియన్ ఫ్రెడెరిక్ హయ్యర్
ఆడపిల్లలకు చదువెందుకని ప్రశ్నించే రోజుల్లో పట్టుబట్టి బాలికలకు చదువు చెప్పడానికి విద్యాలయాలు స్థాపించిన మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హయ్యర్ (1793–1873). ముఖ్యంగా తెలుగునేలపై వెలుగు నింపిన మానవతామూర్తి ఆయన. జర్మనీలోని హెల్మెస్టడ్ ప్రాంతంలో 1793 జూలై 10న జన్మించిన ఈయన అమెరికా వెళ్లి ఫిలడెల్ఫియాలో వేదాంత శాస్త్రం, యూని వర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి వైద్య విద్యలో ఎండీ పట్టా పొందాడు. మెడిసిన్ చదివే రోజుల్లోనే సంస్కృతం నేర్చుకున్నాడు. మిషనరీగా అభిషేకం పొంది దాదాపు 300 పైగా సండే స్కూల్స్ నెలకొ ల్పాడు. హయ్యర్ చురుకుదనాన్ని గమనించిన మెకానిక్స్ బర్గ్‌కు చెందిన ‘ది సెంట్రల్ మిషనరీ సొసైటీ’ వారు భారతదేశానికి మిషనరీగా ఆయన్ని ఎంపిక చేశారు. ఆ విధంగా హయ్యర్ 1842 జూలై 31న గుంటూరు వచ్చాడు. వచ్చిన వెంటనే తెలుగు నేర్చుకుని తొలి పాఠశా లను 1842 నవంబరులో ప్రారంభించాడు. అదీ కేవలం బాలికలకు మాత్రమే. నెల గడిచేసరికి ఎని మిది మంది ముస్లిం బాలికలకు పాఠశాల ప్రవేశం కల్పించాడు. అనంతరం అన్ని వర్గాల వారికి ఏడు పాఠశాలలు నెలకొల్పి బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. 1844 నాటికి మరో ఎనిమిది పాఠశాలలు ప్రారంభించారు.ఆ కాలంలో ప్రసూతి సమయంలో సరైన వైద్యం లభించక తల్లీ–పిల్లలు మరణించేవాళ్లే ఎక్కువ. అందుకే గుంటూరు కొత్తపేటలో 1843లో ఉచిత వైద్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటుచేశాడు. 1845 నాటికి రాజమండ్రి, భీమవరంలో పాఠశాలలను నెలకొల్పాడు. ఆ పరిసర ప్రాంతాల్లోనే వైద్య శాలలు ప్రారంభించాడు. హయ్యర్ ఒక ఆదర్శమూర్తిగా దర్శనమిస్తాడు. జీవిత భాగస్వామి ఎంపికలో ఇద్దరు పిల్లలున్న మేరీగాష్ అనే వితంతువును వివాహం చేసుకుని కొత్త జీవితం కల్పించాడు. తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించి తెలుగులోనూ కీర్తనలు రాశాడని అంటారు. తెలుగు వారికి సేవచేసి విద్య, వైద్యంతో ప్రజల గుండెల్లో నిలిచిన హయ్యర్ 1873లో 80 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలో మరణించాడు.– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, తెనాలి -
ఆ రోజు ఏం జరిగిందంటే...
కొన్ని నిర్ణయాలు చరిత్ర గతినే మారుస్తాయి. స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేర సైనిక చర్య జర పాలనే నిర్ణయం ఇందుకొక నిదర్శనం. 1984 జూన్‌లో పంజాబ్ స్వర్ణ దేవాలయంలో మకాం చేసుకున్న సిక్కు తీవ్రవాదులను బయటికి రప్పించడానికి మరో మార్గం లేక ప్రధాని ఇందిరాగాంధీ (67) భారత సైన్యాన్ని పంపాల్సి వచ్చింది. దీనికి దేశం పెద్ద మూల్యమే చెల్లించుకుంది. ఊహించని ఆ చర్యతో సిక్కు తీవ్రవాదం ఓ విధంగా సద్దుమణిగింది. కానీ, ఆ తర్వాత ఐరన్ లేడీగా పేరొందిన ఇందిరాజీ, జవసత్వాలు ఉడిగిన అబలగా ప్రవర్తించారని అంటారు. ప్రభుత్వ కార్యభారాలు చాల వరకు తగ్గించుకుని ఆమె, ప్రధాని నివాసం... 1, సఫ్దర్ జంగ్ రోడ్డుకే పరి మితం అయ్యారు. రాత్రి పూట ఆమెకు ఏవో పీడ కలలు కూడా వచ్చేవట. తన కుటుంబ సభ్యులను ఏవో శక్తులు కిడ్నాప్ చేస్తాయని తెలీని ఆందోళన ఆమెలో ఆవహించ సాగింది. వీలు దొరికితే సామాన్య మహిళలా, రాత్రి కొడుకు, కోడలు, మనవడు (రాహుల్), మనవరాలు (ప్రియాంక)తో కలిసి డిన్నర్ చేయటానికి ఉవ్విళ్ళూరేవారట. 12 ఏళ్ల ప్రియాంకతో, పెద్దయాక, తను వాడే పట్టుచీరలు ధరించి రాయ బరేలి, ఆమేథి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లా లని, నవ్వుతూ అనేదట (వింత కోరికలు!).‘ఆపరేషన్ బ్లూ స్టార్’కు నిరసనగా సిక్కు సమాజం కాంగ్రెస్ పార్టీకి, ఇందిరా ప్రభుత్వానికి దూరమయింది. ఇందిరా భక్తుడు, ప్రముఖ పాత్రి కేయుడు ఖుష్వంత్ సింగ్ రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి ప్రభుత్వం ఇచ్చిన పద్మ భూషణ్ అవార్డును వాపస్ చేశారు. అప్పటి పరిస్థితుల దరిమిలా ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలు ప్రధానిని కొంతకాలం సిక్కు యువతకు దూరంగా ఉండాలని తేల్చాయి. సెక్యులర్ దేశానికి ప్రధానిగా ఉండి అలా చేయడం బావోదని, తన నివాసంలో ఉన్న ఇద్దరు సిక్కు సెక్యూ రిటీ యువకులను మార్చనీయలేదు ఇందిర. 22 ఏళ్ల సెక్యూరిటీ కానిస్టేబుల్ సత్వంత్ సింగ్‌ను చూపిస్తూ ఒకసారి... ‘ఈ బహదూర్ నౌ జవాన్ పర్యవేక్షణలో నాకు ఏ ప్రాణహాని లేదని’ కూడా ధీమా వ్యక్తం చేశారు. ఆశ్చర్యం! వారంలోపే అదే యువకుని తుపాకి తూటాలకు ఆమె బలైపోయారు.1984 అక్టోబర్ 31 బుధ వారం ప్రొద్దుట రాహుల్, ప్రియాంకలను స్కూలుకెళ్ళే ముందు నానమ్మ ఇందిర, దగ్గరకి తీసుకుని గట్టిగా వాటేసుకుంది. ఏదో ఉద్వేగ పూరిత అనుభూతి ఆమెతో అలా చేయించింది. ఆ తర్వాత 9 గంటలకు, ముదురు ఆవరంగు కాటన్ శారీలో వడి వడిగా అడుగు లేస్తూ, ప్రక్కనే ఉన్న 1, అక్బరు రోడ్డులోని పార్టీ ఆఫీసు వైపు నడుస్తున్నా రామె. ఆమె వెంట పర్సనల్ స్టాఫ్ నారాయణ్ సింగ్ ఆమెకు ఎండ తగులకుండా గొడుగు పడుతూ పోతున్నాడు. అతని వెనకాలే ‘మేడం మేన్ ఫ్రైడే’గా పేరొందిన పీఏ... ఆర్కే థావన్ కూడా నడుస్తున్నాడు. బ్రిటన్ యాక్టర్ పీటర్ ఉస్తినోవ్, ఐరిష్ టీవీ యూనిట్‌తో ప్రధానిని ఇంటర్వ్యూ షూటింగ్ కోసం అక్కడ ఎదిరి చూస్తూ, రిస్ట్ వాచి చూసుకున్నాడు. సరిగ్గా 9.10 గంటలు. మేడం పది నిమిషాలు లేటు, ఎందుకో అని అనుకుంటుండగానే, అటు వైపు గన్ ఫైరింగ్ సౌండ్! ప్రధాని సెక్యూరిటీ స్టాఫ్ సబ్ ఇన్స్పెక్టర్ బియాంత్ సింగ్... వెళ్తున్న ప్రధానికి ఎదురెళ్లి శాల్యూట్ చేస్తూనే, సర్వీస్ రివాల్వర్ తీసి ఆమెను షూట్ చేశాడు. ఈ హఠాత్ పరిణామానికి జడుసుకుని నారాయణ్ సింగ్ గొడుగును గాలిలో వదలి ‘బచావ్’ అంటూ కేక లేశాడు. అంతలోనే, అటు సత్వంత్ సింగ్ స్టెర్లింగ్ సబ్ మెషిన్ గన్ నుండి 30 బుల్లెట్లు మేడం శరీరంలో కెళ్ళాయి. క్షణాల్లో రక్త ప్రవాహంతో నేల కొరిగింది ఇందిర. గత కొద్ది రోజులుగా పొంచి ఉన్న మృత్యువు హుటాహుటిన ఆమెను అలా తీసుకెళ్ళింది. రక్తం చుక్కల డైలాగ్...క్రితం రోజే (అక్టోబరు 30) సాయంత్రం, భువ నేశ్వర్ (ఒరిస్సా) అసెంబ్లీ ఆవ రణలో జరిగిన బహిరంగ సమా వేశంలో ఇందిరాజీ ప్రసంగిస్తూ, ‘... మై ఆజ్ యహన్ హూ. కల్ శాయద్ యహాన్ న రహూ. ముఝే చింతా నహి. జబ్ మై మరూంగీతో, మేరీ ఖూన్ కా ఏక్ ఏక్ బూంద్ భారత్ కో మజ్బూత్ కర్నేమే లగేగా’ (ఇవ్వాళ నేను ఇక్కడ ఉన్నాను. బహుశా రేపు ఇక్కడ లేకపోవచ్చు. నాకు బెంగ లేదు. నేను ఒకవేళ చనిపోతే, నా ప్రతీ రక్తం చుక్క దేశ పటిష్ఠతకు తోడ్పడుతుంది) అని అన్నారు. ఆవేశపూరితమైన ఈ రక్తం చుక్కల డైలాగు, ఆమెతో మృత్యు దేవతే పలికించిందని అప్పటి కాంగ్రెస్ నాయకులు చెప్పుకోసాగారు. ఇందిర హత్యానంతరం రాజధాని డిల్లీలో చెలరేగిన మత ఘర్షణల్లో 3 వేల మంది సిక్కులు చనిపోయారని ఖుష్వంత్ సింగ్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. జిల్లా గోవర్ధన్ (రషీద్ కిద్వాయి రాసిన ‘24, అక్బర్ రోడ్ ’ ఆధారం)వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై (రేపు ఇందిరా గాంధీ హత్యకు గురైన రోజు) -
సైనిక విమాన తయారీకి ఊపు
మూడేళ్ల క్రితం యూరప్ కంపెనీ ‘ఎయిర్‌బస్’తో 56 సి–295 రవాణా విమానాలను కొనడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 16 స్పెయిన్‌లో తయారవుతాయి, మిగతా 40 ఇండియాలో ‘టాటా’(టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. సైనిక రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం ఉపాధికి కూడా తోడ్పడుతుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద తొలి సి–295 విమానం 2026లో అందుబాటులోకి రానుంది. మొత్తం 40 విమానాలను 2031కల్లా అందించడం ద్వారా టీఏఎస్ఎల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.భారత వైమానిక దళానికి చెందిన పాత అవ్రో విమానాల స్థానంలో 56 సి–295 రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2021 సెప్టెంబర్ లో రూ. 21,935 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. ‘ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్’తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం, మొదటి 16 విమానాలను స్పెయిన్‌లోని సెవిల్లెలో దాని తుది అసెంబ్లింగ్ (విడిభాగాల కూర్పు) కేంద్రం నుంచి సరఫరా చేయాల్సి ఉంది. మిగతా 40 విమానాలను భారత్, స్పెయిన్ కుదుర్చుకున్న పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. భారత్‌లో రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. ప్రధాని మోదీ 2022 అక్టోబర్ 30న గుజరాత్‌లోని వడోదరలో టీఏఎస్ఎల్ చివరి దశ విడిభాగాల కూర్పు సదుపాయానికి శంకు స్థాపన చేశారు. అప్పటి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధురీకి 2023 సెప్టెంబర్ 13న స్పెయిన్‌లోని సెవిల్లెలో తొలి విమానాన్ని అందజేశారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ విమానం 2023 సెప్టెంబర్ 25న హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరింది. ‘రైనోస్’ అని కూడా పిలిచే ఐఏఎఫ్ 11 స్క్వాడ్రన్ ఇప్పటికే ఆరు సి–295 విమానాలను నడుపుతోంది.తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీసి–295 బహుళ ప్రాయోజక సైనిక రవాణా విమానంగా రుజువు చేసుకుంది. 9.5 టన్నుల పేలోడ్, 70 మంది ప్రయాణికులు లేదా 49 మంది పారాట్రూపర్లను తీసుకెళ్లగల సామర్థ్యంతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శక్తిని గణనీయంగా పెంచింది. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ నడిచే సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ వైమానిక దళాలు ఉప యోగిస్తున్నాయి. ఇంకా పలు సామర్థ్యాలు ఎయిర్‌బస్ సి–295 సొంతం. సైనిక రవాణా, ఆకాశమార్గంలో రవాణా, పారాట్రూపింగ్, వైద్య సహాయం కోసం తరలింపు, సముద్రప్రాంత గస్తీ, జలాంత ర్గాములను ఎదుర్కొనే యుద్ధ పరికరాలు, పర్యావరణ పర్యవేక్షణ, సరిహద్దు పహారా, వాటర్ బాంబర్, గాలి పరంగా ముందస్తు హెచ్చరి కలు వంటి విస్తృత శ్రేణి మిషన్ లలో ఇది సమర్థంగా పని చేస్తుంది.స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం. మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేసే తొలి సి–295 విమానం 2026 సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానుంది. చివరి విమానం 2031 ఆగస్టు నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ దేశంలో విమాన రంగ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇందులో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక ఎంఎస్ఎంఈలు విమానాల విడి భాగాలను అందిస్తాయి. ఇప్పటికే 33 ఎంఎస్ఎంఈలను ఎయిర్‌బస్ గుర్తించింది. హైదరాబాద్‌లోని టీఏఎస్ఎల్ ప్రధాన కేంద్రంలో విమా నాల విడిభాగాల తయారీ ప్రారంభమైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్ (బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను ఇప్పటికే విమానంలో అనుసంధానం చేశారు. అయితే, ఒప్పంద చర్చల తుది దశలో ఎక్కువ కాలం జాప్యం కావడంతో వీటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. పెరిగే ఉపాధి కల్పనతాజా ప్రయత్నం వైమానిక రంగంలో ఉపాధి కల్పనను పెంచు తుందని రక్షణ శాఖ చెబుతోంది. దేశంలో ఏరోస్పేస్, రక్షణ రంగంలో 42.5 లక్షలకు పైగా పనిగంటలతో ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు, 3,000కు పైగా పరోక్ష ఉద్యోగాలకు, అదనంగా 3,000 మధ్యతరహా నైపుణ్య ఉపాధి అవకా శాలకు వీలు కలుగుతుంది. ఇతర ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ దారుల (ఓఈఎం) నుంచి ఎయిర్‌బస్ తెప్పించే ఏరో ఇంజిన్, ఏవి యానిక్స్ మినహా అధిక శాతం నిర్మాణ భాగాలు భారత్‌లోనే తయారవుతాయి. ఒక విమానంలో ఉపయోగించే 14,000 విడి భాగాలలో 13,000 భాగాలు దేశంలోని ముడిసరుకుతోనే తయారవుతాయి. అయితే టీఏఎస్ఎల్ సకాలంలో 40 విమానాలను తయారు చేయడమే అసలైన పరీక్ష. ఇప్పటివరకు చాలా కార్యకలాపాలు ఎయిర్‌బస్ ద్వారా జరుగుతున్నాయి. టీఏఎస్ఎల్ కేవలం వాటిని అమలు చేస్తోంది. భారత వైమానిక రంగ సుస్థిర వృద్ధి కోసం స్థానిక ఉత్పత్తి, డీజీ ఏక్యూఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎష్యూరెన్స్) ద్వారా నాణ్యత నియంత్రణ, ‘సెమిలాక్’ ద్వారా భవిష్యత్తు ధ్రువీకరణ, దేశీయ తనిఖీ పరీక్షలు, మూల్యాంకనంపై దృష్టి సారించాలి.రక్షణ రంగం అంచెలంచెలుగా ఎదగడానికి గత పదేళ్లలో భారత ప్రభుత్వం చేసిన కృషి దోహదపడింది. రూ. 43,726 కోట్ల నుంచి రూ. 1,27,265 కోట్లకు పెరిగిన రక్షణ ఉత్పత్తుల్లో 21 శాతం వాటా ప్రైవేటు రంగానిదే. పదేళ్ల క్రితం రూ.1,000 కోట్ల లోపు ఉన్న రక్షణ ఎగుమ తులు గత ఏడాది రూ. 21,000 కోట్లకు పైగా పెరిగాయి. కొన్ని విధాన సంస్కరణలతో పాటు మూలధన పరికరాల కొనుగోలు కోసం డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్స్ – 2020లో స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐడీడీఎం) కేటగిరీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ గణాంకాలను సాధించడానికి దోహదపడింది. కొత్తగా కేటాయించిన రక్షణ బడ్జెట్లో 75 శాతాన్ని దేశీయ పరిశ్రమల ద్వారా కొనుగోళ్లకు కేటాయించారు. జాయింట్ యాక్షన్ (శ్రీజన్) పోర్టల్ ద్వారా స్వయం సమృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, సానుకూల స్వదేశీకరణ జాబితాలు (పీఐఎల్), ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ (ఐడీఈఎక్స్) ఏర్పాటు, 2024 సెప్టెంబర్ నాటికి రూ. 50,083 కోట్ల పెట్టుబడి అంచనాతో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు వంటి అనేక ఇతర చర్యలను ప్రభుత్వం తీసుకుంది. 2013 మేలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) జారీ చేసిన తరువాత ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చు కోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు ఆరేళ్ళు పట్టింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి, ఒప్పందం తదుపరి చర్చలకు ఇంకా చాలా చేయాల్సి ఉంది.దేశంలో సి –295 సైనిక రవాణా విమానాల ఉమ్మడి తయారీలో ఎయిర్‌బస్ – టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) భాగ స్వామ్యం ఇప్పటివరకు సవాళ్లను ఎదుర్కొంటున్న భారత వైమానిక రంగానికి ఆశ, ప్రేరణగా నిలుస్తోంది. అయితే సివిల్ సర్టిఫైడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉన్నందున ఈ ఎయిర్ క్రాఫ్ట్ వెర్షన్లను టీఏఎస్ఎల్ విస్తరిస్తుందో లేదో చూడాలి. ఈ భాగస్వామ్యం పూర్తి ప్రయోజనాలను పొందడానికి దేశంలో ఉత్పత్తి, భవిష్యత్తు ఎగుమ తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భరత సాధన దిశగా భవిష్యత్ ప్రయాణం క్లిష్టంగా అనిపించినప్పటికీ, ఎయిర్‌బస్, టీఏ ఎస్ఎల్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా అడుగులు ముందుకు పడ్డాయి. టీఏఎస్ఎల్ నిర్ణీత సమయానికి 40 విమానాలను తయారు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ తరహా భాగస్వామ్యాల విషయంలో ప్రభుత్వ రంగం ఐఏఎఫ్ అంచనాలను అందుకోలేదన్నది గత అనుభవాలు చెబుతున్న పాఠం. మరి ఈ ఒప్పందం సఫలమైతే దేశంలో ప్రైవేట్ రంగ భాగ స్వామ్యం మరింత ప్రబలమవుతుంది. వాటి సహకారం లేకుండా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కల నెరవేరదు.అనిల్ గోలానిఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్అడిషనల్ డైరెక్టర్ జనరల్ -
బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తారా?
అక్టోబరు 23 (బుధవారం)న సాక్షి దిన పత్రిక ఎడిట్ పేజీలో పాలస్తీనా సమస్యపై ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ రాసిన వ్యాసం వాస్తవాలకు భిన్నంగా ఇజ్రాయెల్‌కు వత్తాసు పలికేలా ఉంది. వ్యాసం మొత్తంగా చూసినప్పుడు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ కాండకు మద్దతిస్తున్నట్లే ఉంది. రాజ్య నైజాన్ని గురించి కానీ, దానికి ఆయుధాలు, డబ్బు ఇచ్చి ప్రోత్సహిస్తున్న అమెరికా, యూరప్ దేశాల పాత్ర గురించి కానీ ఎక్కడా ప్రస్తావించకుండా బాధితులనే దోషులుగా చిత్రించేందుకు వ్యాసకర్త యత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ వ్యవహారమంతా నాగరికతకు సంబంధించిన సమస్య అనడం అంతకన్నా శోచనీయం. ఆ వ్యాసంలో ఒక చోట ఆయన ‘ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ... ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కు అమలు లోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు’ అని పేర్కొన్నారు. దీని ద్వారా ఆయన ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? ఇజ్రాయెల్ ఒక లౌకిక ఘనమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్ప దలచుకున్నారా? అలా చెప్పడమంటే వాస్తవాన్ని చూడ నిరాకరించడమే అవుతుంది.ప్రముఖ యూదు చరిత్రకారుడు, యూరోపియన్ సెంటర్ ఫర్ పాలస్తీనా స్టడీస్ డైరెక్టర్ ఇలాన్ పాపే ఇటీ వల బ్రస్సెల్స్‌లో ‘అనడోలు’ అనే వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో... పశ్చిమ దేశాల మద్దతుతో పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్నది ముమ్మాటికీ జాతి నిర్మూలన కార్యక్ర మమేనని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ రాజకీయాలు సెటి ల్మెంట్ల నిర్మాణం నుంచి యూదు దురహంకారాన్ని రెచ్చగొట్టే దశకు వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఈ శక్తులే ఇప్పుడు అక్కడ ప్రభుత్వంలోనూ, పోలీస్ వ్యవస్థలోనూ తిష్ట వేసుక్కూర్చున్నాయి. ఈ నాయకత్వం వల్లే ఇజ్రాయెల్ దురాక్రమణదారుగా పాలస్తీనా అంతటా విస్తరిస్తోంది. నీరు, ఆహారం, మందులపై ఆంక్షలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. ఒక వైపు అమానుష చర్యలకు పాల్పడుతూ, మరోవైపు పాలస్తీనియన్లే ఈ ప్రాంతంలోని అన్ని సమస్యలకూ కారకులుగా, అనైతిక చర్యలకు పాల్పడే వారిగా చిత్రిస్తున్నారు. వీరిని అక్కడ నుంచి వెళ్లగొట్టడమే పరిష్కారమన్న ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అమెరికా, యూరప్‌లు చాలా కాలంగా ప్రచారంలో పెడుతూ వస్తున్నాయి. 76 ఏళ్ల తరువాత కూడా అదే పాచికను ప్రయోగిస్తే అది చెల్లుబాటు కాదు అని చరిత్ర కారుడు పాపే తేల్చి చెప్పాడు.రెండవ అంశం: ‘అక్టోబరు 7 నాటి మారణ కాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్‌కు మద్దతునిస్తూ ఈ యుద్ధంలోకి ప్రవేశించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి’ అని ప్రొఫెసర్ గారు సూత్రీకరించారు. అది వాస్తవమా? పాలస్తీనా, అలాగే యావత్ పశ్చిమా సియా ప్రాంతానికి పెనుముప్పుగా తయారైంది ఇజ్రా యెల్. పశ్చిమ దేశాలు తమ ఆధిపత్యానికి కాలం చెల్లుతుండడం, ఏక ధృవ ప్రపంచం నుంచి బహుళ ధృవ ప్రపంచం వైపు పరిణామాలు చోటుచేసుకుంటుండడంతో బెంబేలెత్తి వలస వాదాన్ని మళ్ళీ విస్తరించేందుకు పూనుకుంటున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇజ్రాయిల్ గాజాపై దాడిని... లెబ నాన్కు, అటు నుంచి ఇరాన్‌కు, తద్వారా యావత్ పశ్చి మాసియాకు విస్తరింపజేయాలనే పన్నాగాన్ని ఈ సంద ర్భంగా గుర్తించాలి.ఇందుకోసం ఇజ్రాయిల్‌కు అమెరికా వంటి దేశాలు పెద్ద యెత్తున ఆయుధాలు, డబ్బు అందజేస్తున్నాయి. మూడవ అంశం... 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయిల్ అంగీకరించి సంతకం చేయగా పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాన్ని తిరస్కరించాయనీ... 1948కు ముందున్న చోటికి తిరిగి వెళ్లాలని పాలస్తీనా డిమాండ్ చేస్తోందని’ ఐలయ్య తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇది వాస్తవాన్ని వక్రీకరించడమే. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్య వర్తిత్వంలో 1993లో ఓస్లో ఒప్పందం (నార్వే ఒప్పందంపై ఇజ్రాయిల్ ప్రధాని ఐజాక్ రాబిన్, పాలస్తీనా విమో చనా సంస్థ నేత యాసర్ అరాఫత్ సంతకాలు చేశారు. ఆ తరువాత ఆ ఒప్పందానికి ఇజ్రాయెలే తూట్లు పొడిచింది. నాల్గవ అంశం... హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్ హుడ్లు ప్రపంచం మొత్తానికి సమస్యలు సృష్టిస్తున్నాయి అని చెప్పడం కన్నా అన్యాయం ఏముంటుంది? అమెరికా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాల అండతో ఇజ్రాయెల్ యథేచ్ఛగా ఈ ప్రాంతంలో సాగిస్తున్న అణచివేత, దురాక్రమణకు వ్యతిరేకంగా, పాలస్తీనా స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటం లోంచి పుట్టుకొచ్చినవే హమాస్ వంటి సంస్థలు.అయిదవదీ, చివరిదీ నాగరికతకు సంబంధించిన అంశం: ఇజ్రాయెల్– పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య అని ప్రొఫెసర్ ఐలయ్య ముక్తాయింపు ఇచ్చారు. ఏది నాగరికతో ఏది అనాగరికతో ఆయన వివరించి ఉంటే బాగుండేది. ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాగతాలను కప్పి పుచ్చి ఆ దేశ నాగరికత, ప్రజాస్వామ్యం గురించి కీర్తించడాన్ని ఏమనాలి? ఇప్పుడు జరగాల్సింది యుద్ధ నేరాలకు పాల్పడిన నెతన్యాహునూ, ఆయనకు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలను బోనులో విలబెట్టడం. – కె. గడ్డెన్న ‘ సీనియర్ పాత్రికేయుడు -
సమతా పథంలో సాగాలంటే...
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అంబేడ్కర్ జపం చేస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్‌ను బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. వాటిని దళిత బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది. కానీ కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటుపడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి.భారతదేశంలో అనేక భావ విప్లవ ఉద్య మాలు, సామాజిక సాంస్కృతిక పరిణా మాలు ఆ యా కాలాల్లో వచ్చాయి. అవి రాజకీయ సిద్ధాంతాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా భారతదేశంలో 1927వ సంవత్సరం నుండి సామాజిక విప్లవోద్యమం ప్రారంభమైంది. బి.ఆర్. అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చెయ్యటంతోనే ఈ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. అంబేడ్కర్ పుట్టిన మహారాష్ట్రలో అడుగుపెట్టిన నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నైపాల్ ముంబయి నగరాన్ని చూస్తుంటే అంబేడ్కర్ నగరంగా కనిపిస్తుందని అన్నారు. ఎక్కడ చూసినా అంబేడ్కర్ విగ్రహాలు, అంబేడ్కర్ కాలేజీలు, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు, అంబేడ్కర్ చైత్యాలు, అంబేడ్కర్ గ్రంథాలయా లతో నిండివుందని నైపాల్ రాశారు. భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా– బెంVýæళూరు, చెన్నై, కలకత్తా అన్ని మహనగరాల్లోనూ అంబేడ్కర్ స్ఫూర్తే కనపడుతుంది. నిజానికి ఆర్ఎస్ఎస్కు, విశ్వహిందూ పరిషత్‌కు భావజాల పరంగా, సిద్ధాంతపరంగా ప్రత్యామ్నాయంగా రూపొందించిందే మన రాజ్యాంగం. భారత రాజ్యాంగం పూర్తిగా మనుస్మృతి భావజాలాన్ని నిరాకరించిన గ్రంథం. అంబేడ్కర్ రాజ్యాంగ ప్రతిని రాజ్యాంగ పరి షత్తులో ప్రవేశపెట్టిన నాటి నుండి ఆర్ఎస్ఎస్ నిరాకరిస్తూనే వచ్చింది. బీజేపీ ద్వారా సంపూర్ణ రాజ్యాధికారమే వస్తే రాజ్యాంగాన్నే మార్చా లనే దుర్వ్యూహం వాళ్ళ దగ్గర వుంది.అంబేడ్కర్ భారతదేశాన్ని సమసమాజ నిర్మాణంలోకి తీసుకు వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశారు. పెను వృక్షంలాంటి కాంగ్రెస్ బ్రాహ్మణవాదాన్ని ఎదిరించటానికి, అంతర్గతంగా కాంగ్రెస్‌లో దాగి వున్న హిందూ సాంప్రదాయవాదాన్ని ఎదిరించడానికి ఒక దశలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. తన ప్రజలు కూడా తనకు తోడురాని పరిస్థితుల్లోనూ నిక్కచ్చిగా నిలబడ్డారు. అంబేడ్కర్ దేశ వ్యాప్తంగా తన తాత్విక ముద్ర వేయగలగడానికి కారణం ఆయన బౌద్ధతాత్విక జీవన విధానమే. ఆయన రాజ్యాంగ రచనా రూప కల్పనలో అష్టాంగ మార్గాన్ని ఆదర్శ సూత్రాల్లోకి సమన్వయించ గలి గారు. సమదృష్టి, సత్సంకల్పము, సత్ వచనము, సత్ కర్మ, సత్ జీవనము, సత్ ప్రయత్నము, సత్ కృతి, సత్ సమాధి సూత్రాలను భారత రాజ్యాంగంలో చేర్చిన తరువాత దానికి సామాజిక, తాత్విక జీవన పరిమళం వచ్చింది. భారత రాజ్యాంగం ఒక గొప్ప సమతా మార్గ నిర్దేశంగా నిలబడింది. ఈనాడు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో బీజేపీ కొత్త ఎత్తు గడతో అంబేడ్కర్ జపం చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ దశాబ్దంలో అనేక మార్పులు వచ్చాయి. బీజేపీ దుర్వ్యూహాల గురించి దళితులు, బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫడ్నవీస్ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు మోకరిల్లు తున్న పోస్టర్లు మహారాష్ట్రలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగ రూపకల్పన పూర్తయిన సందర్భంగా, రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 25న అంబేడ్కర్ చేసిన రాజ్యాంగం తుది ప్రతి మీద ఆర్ఎస్ఎస్ దుమ్మెత్తి పోసింది. రాజ్యాంగంలో భారతీయత అనేది ఉదాహరణ ప్రాయంగా కూడా లేదని దెప్పి పొడిచింది.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయినా దళితులపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు బహి రంగంగా కొట్టడం, మరి కొన్నిసార్లు గుడిలోకి రానివ్వకపోవడం, చేసిన పనికి జీతం అడిగితే దాడులకు దిగడం, దొంగతనం చేశారన్న అరోపణలతో అకృత్యాలకు పాల్పడటం నిత్యకృత్యాలుగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. దళితులను అవమానించడం, సాంఘిక బహిష్కరణ కేసులు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం, దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి ప్రతిరోజూ 150కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎన్డీయే పాలనలో 2018 నుండి 2022 మధ్య దళితులపై లైంగికదాడులు 35 శాతం పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం 2018 నుంచి ప్రతి సంవ త్సరం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. దళితులపై నేరాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదయ్యాయి. 2021లో 50,900 కేసులు, 2022లో 57,582 కేసులు నమోదయ్యాయి. ఆ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో దళితులపై అఘాయిత్యాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2022లో అక్కడ 15 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఎనిమిదిన్నర వేలకు పైగా కేసులు నమో దైన రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. యోగీ ఆదిత్యనాథ్ ఇలాకాలోని భరూచ్ జిల్లా తాజ్పూర్ తెడియా గ్రామంలో ఇద్దరు కోళ్ల ఫారం యజమానులు దళిత బాలురు దొంగతనం చేశారన్న అనుమానంతో దాష్టీకానికి దిగారు. బాలురను కొట్టి, గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పులిమి గ్రామంలో ఊరేగించారు. ఐదు కిలోల గోధుమలు అపహరించారని ఆరోపిస్తూ 12–14 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలుర ముంజేతులపై ‘దొంగ’ అని రాసి గ్రామంలో ఊరేగించారు. దళితుల మానవ హక్కుల పోరాటం గురించి అంబేడ్కర్ ఎంతో అధ్యయనం చేశారు. మొదట డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నుకో బడిన అంబేడ్కర్ ఆ పిదప 1947 ఆగస్ట్ 29వ తేదీన రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, సర్ అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, కె.ఎం. మున్షీ, మహ్మద్ సాదుల్లా, ఎన్. మాధవ రావు, డి.పి. ఖైతాన్ యితర సభ్యులు కాగా, బి.ఎన్.రావు రాజ్యాంగ సలహాదారులు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను విమర్శించే అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచన సంఘా ధ్యక్షులుగా ఆహ్వానించారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఔదార్యంగా చెప్పబడినా అంబేడ్కర్ అసాధారణ ప్రతిభ, ఒక చారిత్రక అవసరంగా మాత్రమే పరిగణించబడుతుంది. అంబేడ్కర్ తనపై మోపబడిన ఈ భారాన్ని సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వర్తించడానికి కృషి చేశారు. అంబేడ్కర్ అమెరికాలో చదువుతున్న కాలంలో నీగ్రోల చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోలు తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళే క్రమంలో అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణం ద్వారా ఎలా స్వాతంత్య్రం పొందారో తెలుసుకున్నారు. నీగ్రోల విముక్తి పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన బుకర్ టి.వాషింగ్టన్ చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోల పోరాట చరిత్ర ద్వారా భారతదేశంలో దళితుల్ని ఎలా విముక్తి చేయాలో అర్థం చేసుకొన్నారు.అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. ఆయనకు కుల మత బేధాలు లేవు. ఆయన బౌద్ధ జీవన పథికుడు. ఆయన ఆర్థిక, వ్యాపార, రాజకీయ, పరిపాలన, ధర్మ శాస్త్రాల నిపుణుడు. మనుస్మృతిని, యాజ్ఞవల్క్య స్మృతిని, శారదా స్మృతిని అధ్యయనం చేసిన భారతీయుడు. అవి అధర్మశాస్త్రాలని తేల్చిన పరిశోధకుడు. చార్వాకాన్ని, బౌద్ధాన్ని, జైనాన్ని, సాంఖ్యాన్ని అవపో సన పట్టారు. జాన్ డ్యూయీ శిష్యునిగా ప్రజాస్వామ్య శాస్త్రాన్ని ప్రపంచానికి బోధించారు. ఆయన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరి షత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది కానీ అస్పృశ్యత నివారణకు, కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటు పడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
సామాన్యుల భాషలో... సన్నిహితమైన న్యాయం
మన దేశంలోని అన్ని హైకోర్టుల్లో అధికారికంగా వాడేది ఇంగ్లీషు భాష. కానీ కేసులో గెలిచినవాడు, ఓడిన సామాన్యుడు కూడా తమ గెలుపోటములకు కారణాలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే తీర్పుల్లోని కారణాలు అర్థమయ్యే భాషలో తెలియ జేసి, సామాన్యుడికి న్యాయ వ్యవస్థ చేరువ కావాలనే సదుద్దేశ్యంతో సుప్రీంకోర్టు, దేశంలోని అన్ని హైకోర్టులు వారి తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాము ఇంగ్లీషులో వెలువరించే ముఖ్యమైన తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించే ప్రక్రియను యుద్ధ ప్రాతి పదికన చేపట్టింది. తదనుగుణంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటోంది. అనువాదకుల కొరత మూలాన ప్రస్తుతానికి ముఖ్యమైన తీర్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అనువాదకుల సేవలు ఉచితంగా స్వీకరించటం లేదు. వారి సేవలకు గాను, హైకోర్టు ప్రతి పేజీకి మూడు వందల రూపాయలు చెల్లిస్తుంది. ఇంగ్లీషులో వెలువరించిన తీర్పుల కాపీలను వారి ఇంటి దగ్గరే అనువాదం చేసి, సహేతుకమైన సమయంలో అను వాదాన్ని హైకోర్టులోని సంబంధిత అధికారులకు స్వయంగా అందజేయడం లేదా ఆన్లైన్లో పంపించటం అనువాదకుల పని. ఈ కార్యక్రమ సక్రమ నిర్వహణ కోసం హైకోర్టు తన పరిపాలనా భవనంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో తెలుగు భాషపై పట్టున్న ఇద్దరు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్‌గా; ఒక విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జిని రిపోర్టర్‌గా నియామకం చేసింది. ఇంగ్లీషు నుండి తెలుగులోకి ప్రైవేటు అనువాదకులు తర్జుమా చేసిన∙ముఖ్యమైన తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి తీర్పుకు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జోడించి, వాటిని తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో నెల వారీగా పెట్టవలసిన బాధ్యత వీరికి అప్పగించింది. వెబ్‌సైట్‌ను 2024 ఆగస్టు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ముఖ్య మైన తీర్పుల తెలుగు ప్రతులను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం కల్పించారు. అనువాదకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోడానికి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. 25 తెలుగు అనువాదకులు, 10 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 5 తెలుగు టైపిస్ట్ పోస్టులను కూడా మంజూరు చేసింది. త్వరలో హైకోర్టు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోలేదు. తెలుగు అనువాదకులు దొరకటం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో కూడా ఈ కొరత ఉందని తెలుస్తోంది.మరో విషయమేమంటే ప్రతి పౌరుడికీ హైకోర్టు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన తెలుగు తీర్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఉందనే విషయం తెలియ జేయాలనే ఆశయంతో... జిల్లా న్యాయమూర్తులు, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు; సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారులు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతగా ప్రచారం కల్పించినా తెలుగులో తీర్పులు చదువుకోవాలనుకునే విషయం, అది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉందనే విషయం అంత సులువుగా సామాన్యుడికి తెలియక పోవచ్చు. అవగాహన కల్పించటానికి సకల ప్రయత్నాలు చేయటానికి న్యాయ వ్యవస్థ గట్టిగానే కృషి చేయాలి. దీనికి న్యాయవాదుల పాత్ర పరిమితమని అనుకోవద్దు. ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కక్షిదారులు తాము దాఖలు చేసిన కేసుల్లో న్యాయ మూర్తులు ఇంగ్లీషులో వెలువరించిన తీర్పులను తమ భాషలో చదివి అర్థం చేసుకొని సంతృప్తి పడాలనే దృక్పథం. అనువాదం అంటే ప్రస్తుత కాలంలో ఎవరికీ అర్థం కాని పూర్తి గ్రాంథిక భాషా ప్రయోగం చేయకుండా, వ్యవహారిక భాషను వాడాలనీ, అవసరమైతే దైనందిన ఇంగ్లీషు పదాలను అదే విధంగా వాడాలనీ హైకోర్టు సూచన చేసింది. టెక్నాలజీ అతి వేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో, ఇప్పటికే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లలో రికార్డ్ చేసిన సాక్ష్యాల నకళ్ళను అప్పటికప్పుడు ఇరు పక్షాలకు ఉచితంగా అందజేసే ఏర్పాటు ఉంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రీ జోక్యం లేకుండా, తీర్పు చెప్పిన రోజే తీర్పు ప్రతిని ఇరుపక్షాలకు కోర్టులోనే ఉచితంగా అందజేయాలి. దిగువ కోర్టుల్లో కూడా సివిల్, క్రిమినల్ తీర్పు అనే భేదం లేకుండా, ఇదే పద్ధతి పాటించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. అయితే నూటికి నూరు శాతం తీర్పుల తెలుగు అనువాదం సరైనది లేదా తప్పులు లేనిదని చెప్పలేం. ఈ తెలుగు తీర్పుల అనువాదం కేవలం చదువుకొని అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం. తెలుగు అనువాదం ఆధారంగా ఎవరు కూడా తప్పొప్పులు ఎంచి దానిపై అప్పీళ్ళు వేసే అవకాశం లేదు. ఇందు కోసం హైకోర్టు వెబ్సైట్లో డిస్ క్లెయిమర్ కూడా చొప్పించారు.తడకమళ్ళ మురళీధర్ వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జిమొబైల్: 98485 45970 -
ముఖాముఖి సంభాషణల్లో మేటి
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడమంటే పైపై ప్రశ్నలు అడగటం కాదు. లోతుగా, సునిశితంగా, ప్రేక్షకులకు మరింత సమాచారాన్ని, ఆ విషయం మీద మంచి అవగాహనను ఇచ్చేలా ఆ సంభాషణ జరగాలి. అలాంటి అర్థవంతమైన ఇంటర్వ్యూలకు పెట్టింది పేరు బీబీసీలో వచ్చే ‘హార్డ్‌టాక్’. 1997లో మొదలైన ఈ కార్యక్రమం ఆంగ్లంలో వార్తలు చూసేవారికి ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. అసలు బీబీసీ వరల్డ్ సర్వీస్‌ను ప్రేక్షకులు ఇష్టపడేదే ఈ ఇంటర్వ్యూ కోసం! నెల్సన్ మండేలా, మిఖాయిల్ గోర్బచేవ్, కోఫీ అన్నన్, బేనజీర్ భుట్టో, హ్యూగో చావెజ్ లాంటి ఎందరో భిన్న దేశాల నాయకులను ఇందులో ఇంటర్వ్యూ చేశారు. అయితే, పాతికేళ్లుగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఖర్చులు తగ్గించుకోవడానికి ఆపేస్తున్నారని తెలియడం నిరాశ కలిగిస్తోంది.‘హార్డ్‌టాక్’ పేరుతో బీబీసీలో ఓ కార్య క్రమం వస్తుంది. నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. ప్చ్... రానున్న మార్చి నుంచి ఈ కార్యక్రమం ఉండదు. ఈ వార్త నన్ను ఆశ్చర్యపరిచింది. కొంత నిస్పృహ కూడా ఆవరించింది. అసలా నిర్ణయమే మూర్ఖమైంది అనుకుంటున్నా. అయితే నిర్ణయం జరిగిపోయింది, ఇక చేసేందుకు ఏమీ లేదు.ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా బీబీసీ... హార్డ్ టాక్‌ను నిలిపేస్తోందని తెలిసింది. సుమారు 70 కోట్ల పౌండ్లు సంస్థకు ఆదా చేయాలన్నది ఆలోచన. అసలీ ప్రోగ్రామ్‌కు ఎంత ఖర్చు అవు తోందో నాకు స్పష్టంగా తెలియదు కానీ... 70 కోట్ల పౌండ్లలో చాలా చాలా తక్కువ భాగమని మాత్రం అనుకుంటున్నా. నా భయమల్లా ఇది ఏదో చేయబోయి, ఇంకేదో అయినట్లు అవుతుందేమో అని! ఈ నిర్ణయం తీసుకున్నందుకు భవిష్యత్తులో బీబీసీ కచ్చితంగా పశ్చాత్తాప పడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం... నా లాంటి ఫాలో యర్లు బాగా నిరుత్సాహపడతారు. ఎందుకంటే హార్డ్‌టాక్ కేవలం ఒక టాక్‌షో కాదు... బీబీసీలో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకోటి లేదు.అంతెందుకు చాలా ఛానెళ్లలోనూ లేదు. ఒక విషయం మీద సంపూర్ణ అవగాహన, విషయాన్ని పైస్థాయిలో చూడగలగడం, ఉద్వేగపూరిత లోతు ఉండే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో తప్ప కనబడవు.సరే... ఏంటి హార్డ్‌టాక్ ప్రత్యేకత? ముఖాముఖి ఇంటర్వ్యూలలో దీర్ఘకాలం నడుస్తున్న ప్రోగ్రామ్ ఇది. నిర్దిష్ట అంశంపై ప్రముఖుడు ఒకరు మాట్లాడటం ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ముఖాముఖి ఇంటర్వ్యూల్లో చాలా దూకుడుగా ఉంటుంది. చర్చకు ఉద్దేశించిన అంశం ముందు వెనుకల గురించి క్షుణ్ణంగా పరిశీలించి, అర్థం చేసు కున్న తరువాతే కార్యక్రమం జరుగుతుంది. ప్రోగ్రామ్ పూర్తయిన తరువాత మనకు విషయ పరిజ్ఞానం పెరుగుతుందనడం అతిశయోక్తి కాదు. ఉన్న అనుమానాలు తీరతాయి కూడా! ఏ న్యూస్ బులిటెన్ కూడా విడమరచి చెప్పలేని విధంగా హార్డ్టాక్లో విషయాలపై చర్చ జరుగు తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఛానల్లో అవశేషం కాదు... గుండెకాయ లాంటిది!కొంచెం వివరంగా ఆలోచిస్తే ఇంకో విషయం స్పష్టమవుతుంది. బీబీసీకి అసలు విషయం అర్థం కాలేదనాలి. సుదీర్ఘ ఇంటర్వ్యూలు... ప్రశ్నించేందుకు, వివరాలు తెలుసుకునేందుకు, మనం అనుకున్న విష యాలపై పట్టుబట్టేందుకు, విషయం లోతుల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇది చిన్న చిన్న ఇంటర్వ్యూల ద్వారా అసాధ్యం. హార్డ్‌టాక్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ సాధ్యం కాక పోవచ్చు. కానీ... చాలామంది ఇష్టపడే కార్యక్రమం.చాలా ఎక్కువగా పొగుడుతున్నానని అనుకుంటూ ఉంటే ఒక సారి ఆలోచించండి. బీబీసీలో హార్డ్‌టాక్ ప్రెజెంటర్లకే పేరు ప్రఖ్యా తులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? అప్పట్లో టిమ్ సెబాస్టియన్ చాలామంది అభిమానం, ఆరా«ధన పొందిన హార్డ్‌టాక్ ప్రెజెంటర్ (1997 నుంచి ఎనిమిదేళ్ల పాటు చేశారు)! ఈయనతో ఇంటర్వ్యూ అంటే... చాలామంది ఇబ్బంది పడేంత జనాదరణ సంపాదించు కున్నారు టిమ్. ఇంటర్వ్యూలు ఎదుర్కొన్న వారు టిమ్‌ను ఇష్టపడ లేదన్నది బహిరంగ రహస్యం.2005 నుంచి హార్డ్‌టాక్ కార్యక్రమాన్ని స్టీఫెన్ సాకర్ నిర్వ హిస్తున్నారు. ఈయన టిమ్ కంటే చాలా భిన్నం. కానీ ఆదరణ మాత్రం బాగా ఉంది. టిమ్ వైఖరి చాలా దూకుడుగా ఉండేది. అవ తలి వ్యక్తికి పదే పదే అడ్డు తగిలేవాడు. సూటి ప్రశ్నలు సంధించేవాడు. స్టీఫెన్ కొంచెం ఆలోచించి ప్రశ్నలు వేస్తాడు. కొన్నిసార్లు ప్రొఫెసర్ మాదిరిగా వ్యవహరిస్తాడు కూడా! టిమ్ విధ్వంసం లాంటి వాడైతే స్టీఫెన్ నెమ్మదిగా అవతలి వ్యక్తి మెదడును ఆక్రమించేసే టైపు. టిమ్, స్టీఫెన్ లు ఎవరైనా సరే... నిష్టూర సత్యాలతో అతిథిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడతారు. నా భయమల్లా బీబీసీ మరీ మొద్దుబారిపోతోందేమో అని! అత్యద్భుతమైన కార్యక్రమాలను అకస్మాత్తుగా నిలిపివేయడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ‘న్యూస్‌నైట్’ ఛానెల్ మొత్తానికి హైలైట్‌గా ఉండేది. రెండు మూడు కథనాలను మాత్రమే చర్చించేవారు కానీ... చాలా లోతుగా సాగేది. ఈ కార్యక్రమ ప్రెజెంటర్ జెరెమీ ప్యాక్స్మన్ మంచి జర్నలిస్టుగా ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో పేరొందారు. న్యూస్నైట్లో వచ్చిన మరో గొప్ప వార్తా కథనం ప్రిన్ ్స ఆండ్రూతో ఎమిలీ మైట్లిస్ నిర్వహించిన ఇంటర్వ్యూ. అన్నీ పోయాయి. ఇప్పుడు కార్యక్రమాలన్నీ న్యూస్ బులిటెన్ ను మరింత పొడిగించినట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ప్రతి వారం రాత్రి 10 గంటలకు తప్పకుండా చూడాలని అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు... చూడకపోయినా ఏం కాదులే అన్న స్థితికి వచ్చేశాం. చాలా మంది పరిస్థితి కూడా ఇదే! విచిత్రమైన విషయం ఏమిటంటే... బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ ‘వరల్డ్ సర్వీస్’ కోసం అదనపు నిధులు కావాలంటూ ఒక పక్క బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. హార్డ్‌టాక్ మూతపడుతోందన్న వార్తలు రాగానే స్టీఫెన్ చేసిన ఒక ట్వీట్ గుర్తుకొస్తోంది: ‘‘అద్భు తమైన ప్రొడ్యూసర్లు, పరిశోధకులు ఉన్న బృందాన్ని విడదీశారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ కార్యక్రమం అనేది ప్రజాస్వామిక భావప్రకటనకు ఎంత ముఖ్యమో టిమ్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.’’హార్డ్‌టాక్ ప్రభావశీలత, ఆ కార్యక్రమం ద్వారా వ్యక్తమయ్యే భావాలు ఎంత కీలకమైనవో టిమ్ డేవీకి తెలుసా? బీబీసీ వరల్డ్ కార్యక్రమం చూసేదే అందులోని హార్డ్‌టాక్ కోసమని ఆయన అర్థం చేసుకున్నారా? ‘హార్డ్‌టాక్’ను ఎత్తేయడం ఇప్పుడు దాన్ని చూడకుండా ఉండటానికి మరో అదనపు కారణం అవుతుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆదివాసీ కళకు ఆయువు పోసినవాడు!
ఆదివాసీ ‘గుస్సాడి’ నృత్యాన్ని అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసిన కనకరాజు ‘అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం’ (అక్టోబర్ 25) నాడు తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహించి మొత్తం తెలంగాణ ఆదివాసీలకు గర్వకారణమైన ఆయన సేవలను ఒకసారి మననం చేసుకోవడం మన విధి. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్ల వాయి గ్రామానికి చెందిన కనకరాజు 1941లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు అంటే మక్కువ. ఆ క్రమంలోనే గుస్సాడి నృత్యకళపై అభిరుచిని పెంచుకున్నారు. పశువులను మేపడానికి అడవిలోకి పోయిన సందర్భంలో భుజం మీద కట్టెపుల్లను పెట్టుకొని టిక్కుటిక్కుమని శబ్దం చేసుకుంటూ తనే స్వతహాగా గుస్సాడి సాధన చేసేవారు. నిరక్షరాస్యుడైన కనకరాజు బతుకుదెరువు కోసం మార్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో దినసరి కూలీగా పనిచేస్తూనే... ఊరూరా తిరు గుతూ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. అంత రించిపోతున్న కళను బతికించారు. ఏటా దీపావళికి వారం రోజుల ముందు నుండే గోండు ప్రాంతా లలో దండారి పండుగ మొదలవుతుంది. ఈ పండుగ వారికి చాలా పవిత్రం. గ్రామదేవతల శుభప్రద ఆశీస్సులను ఇతర గ్రామస్థులకు అందించే ధన్యజీవులు గుస్సాడీలు. వారు పొలికేక పెట్టి నాట్యం ఆపిన అనంతరమే వచ్చినవారికి ఆహ్వానాలు, పలకరింపులు మొదలవుతాయి. గుస్సాడీల చేతులలోని రోకళ్లను శంభు మహా దేవుని త్రిశూలంగా భావించి అభిషేకం చేస్తారు. గుస్సాడీలను శివుని ప్రతిరూపాలుగా భావించి వారి వస్తువులు, సంగీత పరిక రాలను (ఎత్మసూర్ పెన్) పూజిస్తారు. అందరూ కలసి గుస్సాడి నృత్యం చేస్తారు. తరువాత అతిథులకు భోజనం వడ్డిస్తారు. దండారీలో గుస్సాడీలు, పోరిక్‌లు ప్రముఖ పాత్ర వహిస్తారు. నెత్తి మీద నెమలి ఈకలు, పెద్ద టోపీ లతో ముఖానికి, ఒంటికి రంగులతో మెడ నిండా పూసల దండలు, కాళ్లకు గజ్జెలు, చేతిలో గంగారాం సోటితో గంతులు వేసుకుంటూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కళ అంతరించి పోకూడదనే ఉద్దేశంతో అప్పటి ఐఏఎస్ అధికారి మడావి తుకారాం ప్రత్యేక చొరవ తీసుకుని కనకరాజును ప్రోత్సహించారు. దీంతో కనకరాజు శిక్షకుడిగా మారి 150 మందికి ఐదు రకాల దరువులతో కూడిన డప్పు సహాయంతో శిక్షణ ఇచ్చారు. 1976 నుండి వరుసగా ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవా లలో ప్రదర్శనలు ఇప్పించారు.1981లో ప్రధాని ఇందిరాగాంధీ ముందు గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు. 2014లో ఎర్ర కోటలో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ముందు ప్రదర్శించారు. కొన్ని సినిమాలలో కూడా ఈ కళను ప్రదర్శించారు. కనకరాజు గుస్సాడి నృత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2021లో కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ని ఇచ్చి గౌరవించింది. ఎనిమిది పదుల వయసు దాటినా, గుస్సాడిని బతికించడానికి మరో 30 మందికి శిక్షణనిచ్చారు. గుస్సాడి కళను వెలుగులోకి తెచ్చిన సామాన్యుడైన కనకరాజు ఈనాటి కళాభిమానులకు ఆదర్శప్రాయుడు. కనకరాజుకు నివాళిగా ఆయన శిష్యులు మరింతగా ఈ కళను ప్రపంచవ్యాప్తం చేస్తారని ఆశిద్దాం.– గుమ్మడి లక్ష్మినారాయణ,ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి, తెలంగాణ ‘ 94913 18409 -
ఎవరి అర్థాలు వాళ్లవి...
దసరా పండుగ నాడు ఢిల్లీ ‘భారత మండపం’లోని ‘గతిశక్తి అనుభూతి కేంద్ర’ను మోదీ హఠాత్తుగా సందర్శించారు. ఆ రోజు ‘ప్రధాన మంత్రి గతి శక్తి’ కేంద్రం మూడవ వార్షికోత్సవం వేళ అక్కడికి వెళ్లి తన ప్రాధాన్యాన్ని దేశానికి వెల్లడించారు. అయితే, ఇది అందరికీ ఒకేలా అర్థం కావాలనే షరతు ఏమీ లేదు. వీటి తాత్పర్యం చంద్ర బాబుకు ఒకలాగా, జగన్మోహన్ రెడ్డికి మరొక లాగా అర్థం కావొచ్చు. అందుకు వాళ్ళ వయస్సు, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన కాలం, వారి ప్రాపంచిక దృక్పథం, మరెన్నో కారణాలు కావొచ్చు. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఈ పదేళ్ళలో అదీ దేశానికి తూర్పున ఈ చివరన ఉన్నామేమో, ఇందులో ‘మనకు ఏముంది’ అని చూసినప్పుడు, మనం అర్థం చేసుకోవాల్సింది కొంచెం ఎక్కువే ఉంది.ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 15.39 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన 208 భారీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు ఉన్నాయి. దీని అమలుకు వేర్వేరు శాఖలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలతో సమన్వయం కోసం ఒక ‘నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూప్’ పనిచేస్తున్నది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ – ఇంటర్నల్ ట్రేడ్’ కార్యదర్శి అమర్ దీప్ సింగ్ భాటియా... ‘ఇందులో 101 జాతీయ రహదారులు, 73 రైల్వే ప్రాజెక్టులు, 12 పట్టణ అభివృద్ధి ప్రణాళికలు, 4 చమురు–గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి’ అంటున్నారు. ఈ నాలుగు రంగాలు కూడా ప్రాంతాల మధ్య దూరాలనుతగ్గించి వాటిని చేరువ చేస్తూ, విద్యుత్తు భద్రత, పట్టణీకరణ లకు దోహదం చేస్తాయి. ఇందులో కీలకమైన అంశం ‘పి.ఎం. గతిశక్తి’... ‘బ్రాడర్ విజన్’ పేరుతో దేశవ్యాప్తంగా 1600 రకాల ‘జియో స్పైటల్ డేటా’ను సేకరించి ఈ ‘నేషనల్ మాస్టర్ ప్లాన్’ ప్రాజెక్టు కోసం ఇక్కడ భద్రపరుస్తున్నారు. పక్కా ‘డేటా’తో అభివృద్ధి ప్రణాళికల తయారీకోసం వీటిని సేకరిస్తున్నారు. ఇందులో ‘నేచురల్ రిసోర్సెస్ డేటా’ సేకరణ ఒక అంశంగా ఉంది. ప్రాంతాల స్వరూపం తెలి యడం కోసం ‘ల్యాండ్ రికార్డ్ డేటా’ అవసరం. అలాగే సాగు కోసం భూగర్భ జలాల వినియోగం ఎంతో తెలియడానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చాలి. నిజానికి ఇవి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు లోకి తెచ్చిన వీటిని ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఏ స్థాయిలో అల్లరి చేసిందీ తెలిసిందే. ‘అభివృద్ధి’ గురించి ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడితే అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు మార్చి 2023లో విశాఖలో జరిగిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పింది ఏమిటో చూడాలి. ఇందులో కీలకం ఏమంటే, ఆయన దృష్టి ఆసాంతం ఢిల్లీ నుంచి కిందికి దక్షిణాదికి దిగే క్రమంలో ఢిల్లీ యంత్రాంగాన్ని నేరుగా తూర్పు తీరానికి చేర్చడంపై పెట్టారు. ‘ప్రస్తుతం ఢిల్లీ నుంచి బొంబాయి చేరి అక్కణ్ణించి నాగపూర్ వచ్చి అక్కణ్ణించి దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి రోడ్డు ప్రయాణంలో ఎదురవుతున్న కష్టాన్ని చెబుతూ... ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘నేషనల్ హైవేస్’ డిసెంబర్ 2024 నాటికి పూర్తి అవుతాయనీ, అవి పూర్తి అయితే వాటిలో ఒకటైన ‘రాయపూర్–విశాఖపట్టణం’ రోడ్డు ద్వారా ఖనిజ నిక్షేపాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు ఏపీ పోర్టులు అందుబాటులోకి వస్తాయనీ ఆయన అన్నారు. ప్రస్తుతం ఇక్కడ 2,014 కి.మీ. పొడవైన 70 రోడ్డు ప్రాజెక్టులు రూ. 33.540 కోట్ల వ్యయంతో నిర్మిస్తు న్నామన్నారు. ఇలా ఢిల్లీ నుంచే కాకుండా, సెంట్రల్ ఇండియా నుంచి దక్షిణాన మన సముద్ర తీరానికి రెండు మూడు మార్గాల్లో తేలిగ్గా చేరవచ్చన్నారు. సరే, ఇది విని ‘ఎందుకు?’ అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు నాలుగు నెలల తర్వాత కాకినాడలో దొరికింది. అక్టోబర్ 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు–వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్’ సదరన్ కేంపస్ ప్రారంభానికి హాజరై ఆంధ్ర సముద్ర తీరం డిల్లీకి ఎంత కీలకమో చెప్పకనే చెప్పారు. ఇక వెనకబడిన మెట్ట కరవు ప్రాంతాలను ‘ఓపెన్’ చేయడానికి నడికుడి– శ్రీకాళహస్తి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు పనులు పూర్తి చేశారు. రెండో దశలో దర్శి వరకు రైల్వే లైన్ మార్చి నాటికి పూర్తయింది. అద్దంకి రోడ్డు వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తనదైన సంక్షేమ ముద్రను ప్రతి రంగం మీద వేసింది. కుర్చీ ఎక్కిన ఆరు నెలల్లోనే వచ్చిన ‘కరోనా’ మహమ్మారిని నిలువరించడంలో దేశంలోనే ‘ఏపీ’ ముందు నిలిచింది. జగన్ ముందు చూపు అప్పట్లో అందరికీ అర్థం కాలేదు. కేంద్రం ‘గతిశక్తి సంఘటన్’ పేరుతో చేస్తున్న మౌలిక వసతుల కల్పన వల్ల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, జగన్ ప్రభుత్వం ప్రజల పాటవ నిర్మాణం (కెపా సిటీ బిల్డింగ్) పై దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, విద్య–వైద్యం ప్రాధాన్యత పెంచింది. కొత్త జిల్లాలతో ప్రభుత్వాన్ని, కొత్త మెడికల్ కాలేజీలతో వైద్యాన్ని కొత్త ప్రాంతాలకు చేర్చింది. నైపుణ్యాలు తప్పనిసరి అయ్యే సామాజిక వర్గాలు – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవిక కోసం ‘స్కిల్ డెవలప్మెంట్’పై దృష్టి పెట్టింది. అయినా ఎన్నికలప్పుడు ‘అభివృద్ధి ఏది?’ అనే విమర్శ చేయడం చాలా తేలిక. కానీ ‘అభివృద్ధి’ అంటే ‘మానవాభివృద్ధి’ అని అర్థమయ్యేట్టుగా చెప్పడం మరీ కష్టం. వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
బహుళ ధ్రువ ప్రపంచానికి దారి?
అక్టోబర్ 22–24 వరకు కజాన్(రష్యా)లో జరిగిన బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సమావేశం ఒక గొప్ప ఆరంభాన్ని వాగ్దానం చేసింది. బ్రిక్స్ దేశాలుతమ మధ్య ఆర్థిక వ్యవహారాలను తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవాలనీ, తమతో ఆర్థిక సంబంధాలు నెరపే ఇతర దేశాలతో సైతం ఇదే పద్ధతిలో వ్యవహరించేందుకు ప్రయత్నం జరగాలనీ ‘కజాన్ డిక్లరేషన్’ పేర్కొన్నది. ప్రపంచాన్ని శాసిస్తున్న డాలర్ వ్యవస్థను వీలైనంత బలహీన పరచటం వర్ధమాన దేశాలన్నిటికి కీలకంగా మారింది. అధికారం, అభివృద్ధి, విధాన పరమైన నిర్ణయాలకు కొత్త కేంద్రాలు ఉనికిలోకి వచ్చినందున, అవి సమానత్వంతో కూడిన న్యాయబద్ధమైన, బహుళ ధ్రువ ప్రపంచానికి దారులు వేయగలవన్న ఆశాభావం డిక్లరేషన్‌లో కనబడింది.కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు రెండు రోజుల ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన మాటలు సంచలనమయ్యాయి. బ్రిక్స్ దేశాల మధ్య వ్యాపారాలకు, ఇతర అవసరాలకు చెల్లింపులు ఇక మీదటఆ యా దేశాల సొంత కరెన్సీలలోనే ఉండగలవని అన్నారు. అప్పటికి అది ఇంకా బ్రిక్స్ తీసుకున్న తుది నిర్ణయమో,చేసిన ఉమ్మడి ప్రకటనో కాదు. అయితే, ఈ అంశంపై బ్రిక్స్ దేశాల మధ్య కొంతకాలంగాసంప్రదింపులు సాగుతున్నాయి. ఒక ఏకాభిప్రాయ ప్రకటన రాగల సూచనలు కూడా ఉన్నాయి. అందువల్లనే కూటమి దేశాలేవీ పుతిన్ ముందస్తు ప్రకటనకు అభ్యంతరపెట్టలేదు. అక్టోబర్ 23న విడుదలైన కజాన్ డిక్లరేషన్‌లోని 134 పేరాగ్రాఫ్‌ల సుదీర్ఘ సంయుక్త ప్రకటనను చదివినపుడు, అందులో అత్యధికం ఆర్థిక సంబంధమైన అంశాలే కనిపిస్తాయి. వాటిలో రెండు (63, 65) పుతిన్ పేర్కొన్న స్థానిక కరెన్సీ చెల్లింపులకు సంబంధించినవి.134 పేరాలలో రెండు మాత్రమే ఇవా? అందుకోసం ఇంత ఆట్ట హాస ప్రకటన అవసరమా? అనుకుంటే పొరపాటు. మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్న డాలర్ వ్యవస్థను మటుమాయం చేయటం సాధ్యం కాకపోయినా, వీలైనంత బలహీన పరచటం బ్రిక్స్‌తో సహా మొత్తం వర్ధమాన దేశాలన్నిటికి కీలకంగా మారింది. డాలర్ ఆధిపత్యాన్నిఎంత దెబ్బ తీయగలిగితే, ప్రపంచంపై అమెరికా రాజకీయ, సైనిక ప్రాబల్యాన్ని, భౌగోళిక చాణక్యాన్ని అంతగా ఎదుర్కొనగలరు.ఈ దేశాలకు ఇటువంటి అవకాశం లభించటం ప్రపంచ చరిత్ర లోనే ఇది మొదటిసారని చెప్పాలి. వలస పాలనలు 60–70 సంవ త్సరాల క్రితమే ముగిసి ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయసంస్థలు ఎన్ని ఏర్పడినా, ఒకటి రెండు అగ్ర దేశాలే ఏకధ్రువ,ద్విధ్రువ ప్రపంచాలను సాగించాయి. అంతర్జాతీయ చట్టాలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ రాగా, అమెరికన్ డాలర్, యూరోపియన్ దేశాల యూరో కరెన్సీలు అందుకు సాధనాలుగా మారాయి.1947 స్వాతంత్య్ర సమయంలో ఒక డాలర్‌కు ఒక రూపా యిగా ఉండిన భారత కరెన్సీ ఈ రోజున 84 రూపాయలకు పడి పోయిందంటే అందుకు ఇవన్నీ కారణాలే. ఆ విలువ సహజ క్రమంలో తగ్గటం ఒకటైతే, అమెరికన్లు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వారు ఒత్తిడి చేసి మరీ విలువను తగ్గింపజేసే సందర్భాలు వర్ధమాన దేశాలకు అనేకం. అంతర్జాతీయంగా ముడిసరకుల అమ్మకాలు, వాణిజ్య నిబంధనలు, డబ్ల్యూటీవో పనితీరు అన్నీ ధనిక దేశాలకు, డాలర్‌కు అనుకూలం. ఈ విధమైన అనేకానేక సమస్యలన్నింటికి సమాధానాలు కజాన్ డిక్లరేషన్‌లో పొందు పరచటం గమనార్హం. ఇటువంటి ఆలోచనలకు, మార్పులకు ఒక గొప్ప ఆరంభం బ్రిక్స్ దేశాలు తమ మధ్య ఆర్థిక వ్యవహారాలు తమ స్థానిక కరెన్సీలలో జరుపుకోవటం. తమతో ఆర్థిక సంబంధాలు నెరపే ఇతర దేశాలతో సైతం ఇదే పద్ధతిలో వ్యవహరించేందుకు ప్రయత్నం జరగాలని కూడా ఆ డిక్లరేషన్ పేర్కొన్నది. ఆ డాక్యుమెంట్ శీర్షికను గమనిస్తేనే బ్రిక్స్ లక్ష్యం, అంతరార్థం, భవిష్యత్తు గురించిన దార్శనికత అర్థమైపోతుంది: న్యాయబద్ధమైన విధంగా ప్రపంచాభివృద్ధి కోసం, భద్రత కోసం బహుళత్వాన్ని శక్తిమంతం చేయటం. ఈ మూడు క్లుప్తమైన మాటలను శోధిస్తూ పోతే అనేక విషయాలు అర్థమవుతాయి. వలసవాదం అంతమై, అంతర్జాతీయ సంస్థలు, నిబంధనలు ఎన్ని ఏర్పడినా పాశ్చాత్య రాజ్యాల ఏకధృవ ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోయిన తక్కిన ప్రపంచానికి ఇపుడు బ్రిక్స్ రూపంలో ఒక బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడగల అవకాశాలు చరిత్రలో మునుపెన్నడూ లేనివి. వాస్తవానికి బహుళ ధృవ ప్రపంచ సృష్టి అనే మాట కొంతకాలంగా వినవస్తున్నదే. కాలక్రమంలో ఇండియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు కొన్ని ఏషియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, అరబ్ దేశాలు కొంత అభివృద్ధి సాధించి మధ్యమస్థాయి దేశాలుగా పురోగమించినా, వాటికి కూడా వివిధ పరిస్థితులవల్ల స్థిరత్వం ఉండటం లేదు. బ్రిక్స్ ఏర్పడినాక ఇంతకు ముందు 15 శిఖరాగ్ర సమావేశాలు జరిగినా, వివిధ ఆర్థికపరమైన నిర్ణయాల మూలంగా కజాన్‌లో జరిగింది ఎంతో భిన్నమైనది!డిక్లరేషన్‌లోని 134 పేరాలను 4 ఉప శీర్షికల కింద విభజించగా, అందులో 3 ఆర్థిక సంబంధమైనవే కావటం గమనించదగ్గది. అవన్నీ ఇక్కడ రాయటం వీలుకాదు గానీ, వాటి సారాంశాన్ని చెప్పుకోవాలంటే ఈ విధంగా ఉంటుంది: గ్లోబల్ సౌత్ అనబడే వర్ధమాన దేశాల కోసం పని చేయటం. అధికారం, అభివృద్ధికి, విధానపరమైన నిర్ణయా లకు కొత్త కేంద్రాలు ఉనికిలోకి వచ్చినందున, అవి సమానత్వంతో కూడిన న్యాయబద్ధమైన, బహుళ ధ్రువ ప్రపంచానికి దారులు వేయ గలవు. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి, డబ్ల్యూటీవో వంటి సంస్థలను సంస్కరించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక అవకాశాలివ్వాలి. ముఖ్యంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబి యన్ ప్రాంతాలకు వాణిజ్యంపై ఏకపక్ష నియంత్రణలు, ఆంక్షలుఉండరాదు. అంతర్జాతీయ రుణాల చెల్లింపు పద్ధతిలో మార్పులు రావాలి. బ్రిక్స్ దేశాల మధ్య చెల్లింపులు స్థానిక కరెన్సీలలో జరగాలి. బ్రిక్స్ పే కార్డును వినియోగానికి తేవాలి. అయితే ఈ విషయమై ఇంకా చర్చలు అవసరం. అట్లాగే ఇది స్వచ్ఛందమే తప్ప, తప్పనిసరి కాదు. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వనరుల వితరణ; విద్యా, సాంకే తిక, ఆరోగ్య, పారిశ్రామిక రంగాలలో సహకారం పెరగాలి.కజాన్ డిక్లరేషన్ ఈ విధమైన స్వతంత్ర ప్రకటనలు చేస్తూనే, బ్రిక్స్ కూటమి పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకం కాదనీ, తమదొక స్వతంత్రమైన సంస్థ మాత్రమేననీ స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కొద్దికాలం క్రితం, ‘‘వారు (పాశ్చాత్య దేశాలు) ఒక క్లబ్ పెట్టుకున్నారు. మమ్ములను అందులోకి రానివ్వలేదు. కనుక మా క్లబ్బు మేము పెట్టుకున్నా’’మని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో బ్రిక్‌గా ఏర్పడిన ఈసంస్థ దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. వాటి ఉమ్మడి భూభాగం ప్రపంచంలో 33.9 శాతం, జనాభా 45.2 శాతం, పారిశ్రా మిక ఉత్పత్తి 39.3 శాతం, జీడీపీ 36.7 శాతం, ఎగుమతుల శాతం 24.5 శాతం కావటాన్ని బట్టి ప్రపంచంలో వాటి స్థానం ఎంతటిదో గ్రహించవచ్చు. ఈ అయిదు దేశాలు కాక ఇప్పుడు కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ చేరాయి. సౌదీ అరేబియా త్వరలో చేరనుంది. మరొక 30 చేరగోరుతున్నట్లు పుతిన్ ప్రకటించారు. బ్రిక్స్ విస్తరించేకొద్దీ పరిస్థితి గణనీయంగా మారుతుంది. ఈ సంస్థ దేశాల మధ్య ఏకాభిప్రాయంతో పరస్పర సహకారాలు తప్ప ఎవరి అంతర్గత వ్యవహారాలలోనూ జోక్యం చేసుకోవటం ఉండదని స్పష్టం చేయటం విశేషం. ఈ మాట, అటువంటి జోక్యాలు చేసుకునే పాశ్చాత్య దేశాలకు ఒక హెచ్చరిక అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.అదే సమయంలో కొన్ని రాజకీయ పరిస్థితులను బ్రిక్స్ ఉపేక్షించబోదని కూడా కజాన్ డిక్లరేషన్ వల్ల స్పష్టమవుతున్నది. గాజాపై ఇజ్రాయెల్ మారణకాండను, లెబనాన్‌పై దాడులను ఖండించారు. ఇరాన్‌పై దాడి ఆలోచనను విమర్శించారు. పాలస్తీనా స్వతంత్రతను బలపరిచారు. పశ్చిమాసియాలో అణ్వస్త్ర వ్యాప్తిని వ్యతిరేకించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వివాదాలు ఏర్పడినా చర్చల ద్వారా మాత్రమే పరిష్కారాలు చేసుకోవాలన్నారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కజాన్‌లో సమావేశం కానుండగా, సరిహద్దు సమస్యపై ఒక చిన్న ముందడుగు వేయటం ఈ తీర్మానానికి అద్దం పడుతున్నది. మోదీ ముందస్తుగా మాట్లాడుతూ, భారత్–చైనా సత్సంబంధాలు ప్రపంచ శాంతి సుస్థిరతలకు అవసరమన్నారు.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
మెస్సయ్య దాటిపోయాక...
ఆస్పత్రి ప్రారంభోత్సవానికి పెద్దాయన వచ్చాడు. ఆయన రాకముందే రంగస్థలాన్ని చాలా శ్రద్ధగా సిద్ధం చేశారు. ఎంతగానంటే రెండు గంటల ముందు నుంచే ఫొటోగ్రా ఫర్లు మండుటెండలో ఎదురు చూసేట్లు. తీరా ఆయనొచ్చాక ఎడమ వైపు ఫొటోగ్రాఫర్ల బృందాన్ని చూసి చీదరించుకున్నాడు. ఎందుకంటే అక్కడనుంచి ఫొటోలు తీస్తే ఆయన ముఖం కనపడదు. నీడలు మాత్రమే వస్తాయి. ఆగమేఘాల మీద అది కూడా సరి చేశారు. అపుడు తీరిగ్గా ‘ప్రాచీన భాష లిపిలో, లోహపు కడ్డీకి చుట్టుకున్న పాములాగా కనిపించే మతచిహ్నం’ ఉన్న శిలాఫలకానికి మొక్కి, లేచి నిలబడి హటాత్తుగా చెట్టు కూలినట్లు నేల మీద పడిపోయాడు. ఆ పడిపోవడం ఉద్దేశపూర్వకంగా చేశాడేమో అన్నట్లు చేతులు రెండూ రెండు వైపులా కచ్చితంగా పెట్టినట్లు పడి పోయాయి. ఆయన ఆస్పత్రికి ప్రణామం చేస్తున్నాడేమో, కొత్త తంతు రిహార్సల్ ఏమో అనుకున్నారు. కానీ పెద్దా యన చచ్చిపోయాడు. మెస్సయ్య దాటిపోయాడు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన పెద్దాయన అంతమై పోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది?2023లో ఆకార్ పటేల్ ఇంగ్లిష్‌లో ‘ఆఫ్టర్ మెస్సయ్య’ (after messiah) నవల రాశారు. దాన్ని తెలుగులోకి ‘నియంత అంతం’ పేరుతో ఎన్. వేణుగోపాల్ అనువాదం చేస్తే ‘మలుపు’సంస్థ ప్రచురించింది. ఈ నవల అంతా కల్పనే. కానీ వాస్తవ భ్రాంతిని కలిగించే కల్పన. ‘జరుగుతున్నది ఇదే కదా!’ అని విస్తుపరిచే సంభావ్యత ఉన్న కల్పన. నియంత పాలించే కాలంలో ఆయన వైభవ కాంతి ముందు మిగతా లోకమంతా మసకలు కమ్ముతుంది. దేశభక్తి, మత రాజకీయాలు వినా ప్రజలకి గత్యంతరం ఉండదు. అభివృద్ధికి నిర్వచనాలు మారిపోతాయి. ప్రభుత్వాలను, వ్యవస్థలను, ప్రజలను తోలుబొమ్మలు చేసి ఆడించిన సూత్రగాడి తాళ్ళు పుటుక్కున తెగి దేశమంతా సంక్షోభపు చీకట్లలో మునిగి నపుడు, ‘ఆయన తర్వాత ఎవరు?’ అన్న ప్రశ్న పుట్టిన చోట కొత్త రాజకీయాలు మొదలవుతాయి.రాజకీయ పార్టీలలో నియంతృత్వ ధోరణుల వల్ల నాయకుల మరణం తర్వాత ప్రత్యామ్నాయం అంత తొందరగా తేలదు. దానికోసం కుమ్ములాటలు దేశానికి కొత్త కాదు. నియంతకి కుడిభుజంగా ఉండే జయేష్ భాయి, మత రాజకీయాల ద్వారా నూతనశక్తిగా ఎదిగే స్వామీజీల మధ్య పదవి కోసం జరిగే పోరు భారత రాజకీయ చరిత్ర పొడుగూతా జరిగిన అక్రమాలను స్ఫురింపజేస్తుంది. రిసార్టు డ్రామాలూ, కార్పొరేట్లతో లావాదేవీలూ, తమ ప్రయోజనాలకి అనుగుణమైన వాస్తవాలను నిర్మించే మీడియాల ‘పెనవేత రాజకీయాలూ’ అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేసి చట్టాన్నీ, న్యాయాన్నీ తమకి అను గుణంగా ఎలా మలుచుకుంటాయో చదివినపుడు దేశపౌరులుగా అభద్ర తకి లోనవుతాము. రాజ్యం ఎపుడూ తన మీద ఎవరో దాడి చేయ బోతున్నారనీ, తను బలహీనమైనదనీ ఊహించుకుంటుంది. అందుకోసం తన సమస్త శక్తులతో ఆ దాడిని ముందుగానే నిర్మూలించాలని అనుకుంటుంది. స్వతహాగా క్రూరమైన బలం ఉండడం వల్ల రాజ్యస్వభావం హింసతో కూడినదనీ, ప్రభుత్వాల హృదయమూ, ఆత్మా హింసేననీ నవల మొత్తం చెబుతుంది. అంతేకాదు ‘రాజ్యం అనేది ఒక హింసాత్మక రాజకీయ జంతువు’. ఈ జంతువుని చెడ్డవారు అధిరోహించినా అది హింసే. మంచివారు అధిరోహించినా హింసేనని తెలిసినపుడు కొంత వెలుగు మన ఆలోచనల మీద ప్రసరించి ఎరుక, దిగులూ కలుగుతాయి.ఆదివాసుల హక్కుల కోసం పనిచేసే మీరా – పార్టీలో ఒక సీనియర్ నాయకుని కూతురు. అనివార్య పరిస్థితుల్లో ఆపద్ధర్మ ప్రధాని అవుతుంది. పీడిత ప్రజలకోసం పనిచేసే మంచి వ్యక్తి ప్రధాని అయినా రాజ్యస్వభావం మారదు. ఆదివాసీ హక్కులను పరిరక్షించే ఒక చిన్న చట్టం అమలు లోకి తేవడానికి మీరా, అనేక అడ్డంకులను ఎదుర్కుని, తన విలువలను పణంగా పెట్టాల్సి వచ్చినపుడు అంబేడ్కర్ గుర్తుకు వస్తారు. రాజ్యాంగం... హింస నుంచి పీడితులకు రక్షణ కల్పిస్తుందని నమ్మి, ఆ సాధనలోనూ, హిందూ కోడ్ బిల్లుని ఆమోదింపజేసే సందర్భంలోనూ అంబేడ్కర్ రాజ్యం పెట్టిన ఒత్తిడికీ, హింసకూ లోనయ్యి కూడా ఎంత గట్టిగా నిలబడ్డారో, దానికోసం ఎంత త్యాగం చేశారో, ఎంత రాజీపడ్డారో చరిత్ర చెబుతుంది.ఆ ఒక్క చట్టం కోసం ప్రత్యర్థి ముఠాలకి మీరా ప్రయోజనాలు సమకూర్చాల్సి వస్తుంది. ఆదివాసీల మేలు కోసం చట్టం చేయడానికి మీరా రాజ్య హింసకు లోబడి పని చేసిందని తెలుసు కున్న ఆదివాసీ ప్రతినిధి బృందంవారు ఆమె ప్రతిపాదనలను తిరస్కరిస్తూ ఒక మాట అంటారు. ‘పీడనకు గురయ్యాము కనుక పీడనను తిరస్కరించడం కాదు, అసలు పీడన అనేదే చెడ్డది కనుక దాన్ని మొత్తంగా తిరస్కరించాలని, ఒక పీడనను తొలగించడం కోసం మరో చోట మరో సమూహాన్ని పీడనకు గురి చేయడం భావ్యం కాదని’ చెబుతారు. చివరికి పదవి నుంచి దిగిపోయి ఆదివాసీ పోరాటాలలో భాగం కావాలని కోరుకుంటుంది మీరా.చదవండి: ప్రధాని మోదీ పేరిట గణాంక విన్యాసం.. అసలు కథ ఇదే!ఉనికిలో ఉన్న రాజ్య వ్యవస్థే హింసాత్మకం అయినపుడు, ఎంత మంచి వ్యక్తీ దాన్ని మార్చలేనపుడు, మరి ఎటువంటి పరిపాలనా ప్రత్యామ్నాయాన్ని ఈ నవల సూచించింది! బహుశా ఈ చర్చ పాఠకులలో జరగాలని రచయిత కోరుకుని ఉండొచ్చు. లేదా మీరా ఎంచుకున్న మార్గాన్ని మనకు సూచనప్రాయంగా అందించి ఉండొచ్చు. ‘ఏ రాయి అయి తేనేమి’ అన్న నిర్లిప్తత పెరిగిపోయిన వర్తమానంలో భిన్న రాజకీయ శ్రేణుల మధ్య ప్రత్యామ్నాయ రాజకీయాల మీద చర్చ జరగాలి. ‘గమ్యమే మార్గాన్ని సమర్థిస్తుంది’ అన్న సూత్రాన్ని డీ కోడ్ చేయాలి.- కె.ఎన్. మల్లీశ్వరి‘ప్రరవే’ ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
తేడా స్పష్టంగా కనబడుతోంది కానీ...
‘తేడా సుస్పష్టం’ అంటూ మన ప్రధాని మోదీ పేరిట సోషల్ మీడియాలో ఒక గణాంక విన్యాసం జరుగుతోంది. దాని ప్రకారంగా మోదీ ‘విజయాలు’ అనే శీర్షిక కింద 2014 నాటికీ, అంటే మోదీ అధికారం చేపట్టిన నాటికీ, నేటికీ (2024) ఈ పదేళ్లలో దేశం ఎంతగా ‘పురోగమించిందో’ చెబుతూ కొన్ని గణాంకాలను విడుదల చేశారు. ఇక్కడి ప్రశ్న ఈ గణాంకాల వాస్తవికత గురించినది కాదు. కొన్ని విషయాలలో సందేహాలూ, అవాస్తవాలూ ఉన్నా వాటిల్లోని సింహభాగం నిజమే కావచ్చు. కాకుంటే ప్రశ్నల్లా 2014–2024 నడుమ కాలంలోని ఈ సోకాల్డ్ విజయాలలో మోదీ గారి పాలన ప్రభావం ఎంత? మోదీ ప్రధానిగా ఉన్నా లేకున్నా వీటిలోని కొన్ని వాటికవే జరిగి ఉండేవి కావా?ప్రధానిగా నరేంద్ర మోదీ పదేళ్ల పాలన ‘విజయ గాథ’ అంటూ ప్రచారం చేస్తున్న వాటిల్లో ఒక్కో గణాంకాన్ని పరిశీలిద్దాం. మొదటగా ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ (జీడీపీ) చూద్దాం. భారత జీడీపీ 2014 నాటికి 1.8 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. అది 2024 నాటికి 3.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. అది నిజమే. రెట్టింపయ్యింది. ఇక్కడ గమనించ వలసింది, భారత జీడీపీ 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని చేరేందుకు 1947 నుంచీ 2010 వరకూ అంటే, 63 సంవత్సరాలు పట్టింది. అక్కడి నుంచి 2 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవడం కేవలం ఏడేళ్లు,అంటే 2017 నాటికి జరిగింది. ఆ స్థితి నుంచి 2020 నాటికి ఈ గణాంకం 3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. అంటే, కేవలం 2017–20 మధ్యన మూడేళ్లలో మరో లక్ష కోట్ల డాలర్ల మేర దేశ జీడీపీకి జతకూడింది. ఇటువంటి పరిణామం, అన్ని రంగాలలోనూ జరిగేదే. ఉదా హరణకు, సాంకేతిక పురోగతినే తీసుకుంటే 300 ఏళ్ల క్రితం ఆవిరి యంత్రాన్ని కనుగొన్నారు. తరువాతి 100 సంవత్సరాల కాలంలో మరింత సాంకేతిక పురోగతి జరిగింది. ఈ మొత్తం కాలంతో సరితూగగల సాంకేతిక పురోగమనం, ఆ తరువాతి 50 ఏళ్ల కాలంలోనే జరిగింది. దీనంతటినీ తలదన్ని తరువాతి 2–3 దశాబ్దాల కాలంలోనే, పెద్ద గంతులలో సాంకేతిక పరిజ్ఞానం పురోగమించింది. ప్రస్తుతం చూసుకుంటే ప్రతి 5 సంవత్సరాలు లేకుంటే అంతకంటే తక్కువ కాలంలో కూడా సాంకేతిక రంగంలో ఊహించనలవి కాని మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి, ఒక వస్తువు లేదా అంశం దాని ఆరంభ స్థానం నుంచి దూరంగా వెడుతున్న కొద్దీ దాని ప్రయాణ వేగం మరింతగా పుంజుకుంటుందన్నది సహజ సూత్రం. అదే సహజ సూత్రం ప్రకారంగా మన ఆర్థిక వ్యవస్థ కూడా ఎదిగిందన్నది పై గణాంకాలను చూస్తే అర్థం అవుతుంది. కాబట్టి, ఇదంతా అత్యంత సాధారణ పరిణామ క్రమం. దీనిలో మోదీ జోడించిన అదనపు శక్తి యుక్తులూ ఏమీ లేవన్నది నిజం! మించి, స్వయంగా మోదీ గారి వాగ్దానాల ప్రకారంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవలసివుంది. ఇప్పటికే 2024 అక్టోబర్ మాసంలో వున్నాం. అంటే, మరో 6 నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయిపోతుంది. ఈలోగా, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక స్థాయిని చేరుకోగలమా? లేదనేదే జవాబు. మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకారమే, భారత్ 2027–28 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించగలదు. అదీ కథ! నిజానికి దేశ ఆర్థిక పురోగతికి మోదీ విధానాలైన పెద్ద నోట్ల రద్దు, అవకతవక జీఎస్టీ వినాశకరంగా పరిణమించాయి. ఈ అవాంతరాలు లేకుంటే సాధారణ స్థితిలోనే మన జీడీపీ బహుశా 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయిని చేరి ఉండేది!గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటి కన్నుఆ ప్రచారం ప్రకారం, రెండవ గణాంకం ప్రపంచంలో భారత దేశ ర్యాంకు గురించినది. 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో వున్న మన ర్యాంకు (జీడీపీ పరంగా) ప్రస్తుతం 5వ స్థానానికి చేరింది. దీనిలోనూ, అనేక తిరకాసులు ఉన్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం ప్రపంచంలోని ధనిక దేశాల అన్నింటి స్థితిగతులూ దిగజారి పోతున్నాయి. ఫలితంగా, వాటి జీడీపీలు దిగజారుతున్నాయి. కాగా, ఈ ఆర్థిక సంక్షోభం భారత్‌ను అంతగా ప్రభావితం చేయలేదు. దేశంలోని జాతీయ బ్యాంకులు రుణాల మంజూరులో, పాశ్చాత్య దేశాల బ్యాంకుల్లా దురాశకు పోకుండా హేతుబద్ధంగా, క్రమబద్ధంగా వ్యవ హరించడం దీనికి ఒక ప్రధాన కారణం. అప్పటికే దేశంలో అమలులో వున్న జాతీయ ఉపాధి హామీ పథకం ప్రజల కొనుగోలు శక్తిని కాపాడింది. మరి ఈ స్థితిలో జీడీపీ పరంగా మనం వున్న చోటునే మిగిలిపోయినా, లేకుంటే సాధారణ సరళ రేఖలో సాదాగానే ముందుకు పురోగమించినా ఇతర దేశాలతో పోలిస్తే మన ర్యాంకు మెరుగుపడి తీరుతుంది. ఇటువంటి స్థితి గురించే, రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ‘(మన దేశ ఆర్థిక స్థితి) గుడ్డి వాళ్ళ రాజ్యంలో, ఒంటి కన్ను రాజును పోలి వుంది’ అని వ్యాఖ్యానించారు.ఇక మూడవ గణాంకం, ఎగుమతులకు సంబంధించినది. దీని ప్రకారంగా 2014లో 200 బిలియన్ డాలర్లుగా ఉన్న మన ఎగుమతులు 2024 నాటికి 700 బిలియన్ డాలర్లను దాటాయి. ఇది నిజం. కానీ, పూర్తి నిజం కాదు. వాస్తవంలో, నేడు మన ఎగుమతుల పెరుగుదల వేగం దిగజారుతోంది. అనేక మాసాల పాటు, ఎగు మతుల గణాంకాలు పతనాన్ని సూచించాయి. తగిన స్థాయిలో ఎగుమతులు లేక దేశంలోని వస్త్రాలు, బంగారు ఆభరణాలు వంటి ప్రధాన ఉపాధి కల్పనా రంగాలలో ఉద్యోగాలు పోతున్నాయి. పారి శ్రామిక ఉత్పత్తి రంగాలకు ప్రోత్సాహం పేరిట 14 రంగాలకు అందిస్తోన్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు కేవలం 2–3 రంగాల లోనే విజయవంతం అవుతున్నాయి. నిజానికి, ఒక దేశం తాలూకు వాణిజ్య సమతుల్యత లేదా లోటు అనేది అటు ఎగుమతులు, ఇటు దిగుమతులు రెండింటికీ సంబంధించిన అంశం. ఎగుమతి, దిగుమ తుల మధ్య సమతుల్యత లేకుంటే, అంటే, మన ఎగుమతుల కంటే, దిగుమతుల స్థాయే అధికంగా ఉంటే, అది వాణిజ్య లోటుకు దారి తీస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితి అదే. ఇక తరువాతి గణాంకం, దేశంలోని మెట్రో నగరాల గురించినది. 2014 లోని 5 మెట్రో నగరాల నుంచి నేడు మనం 20 మెట్రో నగరాల స్థాయికి ఎదిగామంటూ ఈ ప్రచారపత్రం చెబుతోంది. ఈ అంశంలో కూడా గమనించవలసింది, ప్రపంచ వ్యాప్తంగా నగరీకరణ నేడు వేగం పుంజుకుందనేది. మన దేశంలో 2023 నాటికి నగర జనాభా కేవలం 36.36% గానే ఉంది. ప్రపంచ స్థాయిలో చూస్తే 56% జనాభా నగర ప్రాంతాలలో ఉంది. బీజేపీ పాలనలో నగర ప్రాంత జనాభా పెరుగు దల వేగం బహుశా అధికంగా ఉంటే ఉండి ఉండవచ్చు. కానీ, ఈ పెరుగుదల వెనుక గ్రామీణ ప్రాంతాలనూ, రైతాంగాన్నీ నిర్లక్ష్యం చేయడం వంటి ప్రతికూల ధోరణులు కూడా దాగి ఉన్నాయి. గణాంకాల గారడీఇక తరువాతి గణాంకం, వివాదాస్పదమైన 2014లో కేవలం 40%గానే ఉన్న దేశంలోని విద్యుత్ ఉన్న గ్రామాల సంఖ్య 2024లో 95 శాతానికి పెరిగిందన్నది. దీనికి సంబంధించి ఒకే అంశాన్ని ప్రస్తావించదలిచాను. ద్రౌపదీ ముర్ము గ్రామానికి కూడా 2022లో ఆమె రాష్ట్ర పతి అయ్యేనాటికి సరైన విద్యుత్ వసతి లేదు. తరువాతి కీలక గణాంకం హైవేలకు సంబంధించినది. దీని ప్రకారంగా 2014లో 25,700 కిలోమీటర్ల పొడవున్న జాతీయ హైవేలు 2024 నాటికి 53,700 కిలో మీటర్లకు పెరిగాయి. మోదీ మంత్రివర్గంలో తన వంతు పాత్రను సాధ్యమైనంత సమర్థవంతంగా నిర్వహించిన, రోడ్లు రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ సమర్థతను అంతగా శంకించలేను.మరో గణాంకం యూనికార్న్‌లకు సంబంధించినది. అంటే, వంద కోట్ల డాలర్ల స్థాయిని చేరుకున్న అంకుర సంస్థల గురించినది. దేశంలో 2014లో ఒకే ఒక్క యూనికార్న్ ఉంటే, అది 2024 నాటికి 114కు పెరిగింది. మంచిదే. కానీ, దేశంలోని వేలాది స్టార్టప్‌లలో ఈ విజయవంతమైన యూనికార్న్‌లు కొద్దిపాటివే. నిజానికి పెద్ద సంఖ్యలో అంకుర సంస్థలు విఫలం అవుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం, దేశంలోని అంకుర సంస్థలలో 90% మేర మొదటి ఐదేళ్ల కాలంలోనే మూతపడిపోతున్నాయి. స్థూలంగా మోదీ విజయగాథ ప్రచారం గురించి చెప్పాలంటే, ‘తేడా స్పష్టంగా’ కనబడుతూనే ఉంది. ఆ తేడా కనికట్టులో ఉంది. గణాంకాల గారడీలో ఉంది.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
ఓస్లో ఒప్పందం – వాస్తవాలు
ఇజ్రాయెల్, పాలస్తీనాలు ‘రెండు దేశాలుగా బతకడమే దారి’ అనే శీర్షికతో వ్యాసం రాసిన (అక్టోబర్ 23న) ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ కొన్ని వాస్తవాలను విస్మరించారు లేదా తప్పుగా పేర్కొన్నారు. రెండు స్వతంత్ర దేశాలను ప్రతిపాదించిన 1993 నాటి నార్వే (ఓస్లో) ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి సంతకం చేయగా అందుకు హమాస్, ఇరాన్ నిరాకరిస్తున్నాయన్నారు. ఆ ఒప్పందం పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ) అధ్యక్షునిగా యాసిర్ అరాఫాత్కు, ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్‌కు మధ్య జరిగింది.తర్వాత అరాఫాత్ 2004లో మరణించే వరకు 11 ఏళ్లపాటు అది అమలు కాకపోవటానికి కారణం ఎవరు? ఓస్లో ఒప్పందం ప్రకారం ఇరుపక్షాలూ మొదటిసారిగా పరస్పరం గుర్తించుకున్నాయి. కానీ అది ఆ కాలంలో గానీ, ఈరోజుకు గానీ అమలు కాకపోవటానికి బాధ్యత పూర్తిగా ఇజ్రాయెల్దేనని... స్వయంగా ఆ చర్చలకు సాక్షి అయిన ఆరన్ డేవిడ్ మిల్లర్ అనే అమెరికాకు చెందిన అగ్రస్థాయి నిపుణుడు, అమెరికా నుంచే వెలువడే ‘ఫారిన్ పాలసీ’ అనే సుప్రసిద్ధ జర్నల్‌లో ఇటీవలే రాశాడు. అంతేకాదు, ఆ ఒప్పందంలో అసలు ‘పాలస్తీనా దేశం’ అన్న మాటే లేదని వెల్లడిస్తూ, 1993 నుంచి ఆ మాత్రపు ఒప్పందాన్ని అయినా ఇజ్రాయెల్ ఎట్లా ఉల్లంఘిస్తూ వస్తున్నదో వర్ణించి చెప్పాడు.వ్యాస రచయిత ప్రస్తావించిన వాటిలో మరొకటి మాత్రం చూద్దాము. అరాఫాత్ మరణం తర్వాత పీఎల్ఓ లేదా ఫతా పార్టీ నాయకత్వం పాలస్తీనా అథారిటీ (పీఏ) పేరిట పాలిస్తూ పూర్తి నిష్క్రియాపరంగా, అవినీతిమయంగా మారినందు వల్లనే, అంత వరకు కేవలం నామమాత్రంగా ఉండిన హమాస్, బాగా బలం పుంజుకుని 2006 నాటి ఎన్నికలలో గెలిచి 2007లో అధికారా నికి వచ్చింది. ఆ పరిణామం ప్రజాస్వామిక ఎన్నికలలో జరిగిందే తప్ప బలప్రయోగంతో కాదు. ఇక ఇజ్రాయెల్ 1947 నుంచి మొదలు కొని ఈ 77 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయ స్థానంతో పాటు అనేకానేక ఇతర ప్రపంచ సంస్థలను, ప్రపంచాభిప్రాయాన్ని ధిక్కరిస్తూ ఈరోజున గాజాలో, వెస్ట్ బ్యాంక్‌లో ఏ వ్యూహాన్ని అమలు చేసి అసలు పాలస్తీనా అన్నదే లేకుండా చేయ జూస్తున్నదో కనిపిస్తున్నదే.– టంకశాల అశోక్సీనియర్ సంపాదకుడు, హైదరాబాద్ -
ముస్లిం ఓట్ల చుట్టూ ముగ్గుపోత!
రెండు బలమైన కూటములు తలపడుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పోటీ సూచనలే కనిపిస్తున్నాయి. మిత్ర విభేదాలు, పార్టీ చీలికలు, కొత్త కలయికలు, మారే సమీకరణాలు, ఒకరిపై ఒకరి పోటీ ప్రభుత్వాల ఏర్పాటు... వెరసి గడచిన అయిదేళ్లలో మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి రాజ్యమేలింది. గట్టి సంఖ్యాబలంతో ఈసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదల అటు ‘మహాయుతి’, ఇటు ‘మహా వికాస్ అఘాడీ’ (ఎమ్వీఏ) కూటముల్లో స్పష్టంగా కనిపి స్తోంది. అందుకే, ఎవరూ ఏ అవకాశాన్నీ వదలకూడదనే తలంపుతో పావులు కదుపుతున్నారు. ప్రధాన స్రవంతి ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌కు తోడు ప్రాంతీయంగా ప్రాబల్యమున్న శివసేన, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లూ ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. రెండు కూటముల్లో క్రియాశీలక పాత్ర పోషించే శివసేన, ఎన్సీపీలు ఈసారి ప్రత్యేకంగా నాలుగు పార్టీలుగా తలపడుతున్నాయి. 2022–23లో చోటుచేసు కున్న ‘పవర్ పాలిట్రిక్స్’లో ఒక్కో పార్టీ రెండుగా చీలిన విషయం తెలిసిందే! ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని శివసేన బీజేపీతో చేతులు కలిపి ‘మహాయుతి’లో భాగమైతే, ఉద్ధవ్ థాక్రే నాయకత్వం వహిస్తున్న శివసేన కాంగ్రెస్‌తో కూడి ‘మహా వికాస్ అఘాడీ’ భాగస్వామి అయింది. అలాగే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ మహాయుతిలో ఉంటే, శరద్‌పవార్ నేతృత్వపు ఎన్సీపీ... ఎమ్‌వీఏలో భాగంగా ఉంది. ఇప్పుడీ రెండు కూటములూ, రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లపై దృష్టి కేంద్రీకరించాయి. వాటి చుట్టూ ముగ్గుపోసి వ్యూహాలు అల్లుతున్నాయి. మైనా రిటీలుగా ఉండి కూడా మెజారిటీ వారిని ఓడించడమనే ఎత్తుగడతో ముస్లింలు ‘వోట్ జిహాద్’కు పాల్పడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. అవన్నీ తప్పుడు లెక్కలనీ, ముస్లింల ఉనికిని, త్యాగాలను కించపరిచేలా మాట్లాడుతున్న బీజేపీ నాయకత్వం, వారికి క్షమాపణలు చెప్పి ఎన్నికల బరిలో దిగాలనీ ప్రత్యర్థులు అంటున్నారు.‘తాము బహుళ సంఖ్యాకులుగా ఉన్న ఒక నియో జకవర్గంలో ముస్లిం మైనారిటీలు మూకుమ్మడిగా బీజేపీ ప్రత్యర్థులకు ఓటువేసి మెజారిటీ వర్గమైన హిందువులను ఓడిస్తున్నారు’ అన్నది బీజేపీ నాయకుల వాదన. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ధూలే’ స్థానం పరిధి అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి బీజేపీ అభ్యర్థికి 1.9 లక్షల ఓట్ల ఆధిక్యత లభించినా, ముస్లిం ఆధిక్యత ఉన్న ఒక్క ‘మాలెగావ్ సెంటర్’ అసెంబ్లీ స్థానంలో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి లభించిన ఏకపక్ష ఆధిక్యత వల్ల బీజేపీ అభ్యర్థి నాలుగువేల ఓట్లతో ఓడిపోయినట్టు, ఉదాహరణతో పీపీపీ ప్రదర్శన ఇచ్చి ప్రచారం చేశారు. ఇదే కారణంగా మహాయుతి కూటమి 14 స్థానాలు కోల్పోయిందన్నది వారి వాదన.హిందువులు జాగృతం కావాలని బహిరంగంగానే చెప్తు న్నారు. కానీ ఎమ్వీఏ కూటమి నాయకులు దీన్ని ఖండి స్తున్నారు. అదంతా బీజేపీ చేస్తున్న ఓ ‘సానుకూల అన్వయ వాదన’ తప్ప వాస్తవాలు వేరంటున్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న 38 అసెంబ్లీ స్థానాల్లో, 2019తో పోల్చి చూస్తే 20 (సగానికి ఎక్కువ) స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు 2024 ఎన్నికల్లో తమ ఓటు శాతాన్ని పెంచుకున్నట్టు జాబితా వెల్లడించారు. కిందటిసారి అసెంబ్లీకి ఎన్నికైన పదిమంది ముస్లింలలో 8 మంది ఆ స్థానాల నుంచే వచ్చారు. ప్రస్తుత సభలోని మొత్తం పదిమంది ముస్లిం ఎమ్మెల్యేలలో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల నుంచి ఇద్దరేసి ఉండగా మజ్లిస్, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉండటాన్ని గుర్తుచేస్తున్నారు. అధిక ముస్లిం జనాభా స్థానాలు కూడా ఏకపక్షంగా ఏం లేవనీ, ఆ 38లో కాంగ్రెస్ 11, బీజేపీ 11, అవిభక్త శివసేన 9, అవిభక్త ఎన్సీపీ 3, మజ్లిస్ 2, ఎస్పీ 2 స్థానాలు గత అసెంబ్లీ ఎన్ని కల్లో గెలుచుకున్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ (ఎఐఎంఐఎం) మహారాష్ట్ర ఎన్నికల్లో దశాబ్ద కాలంగా పాత్ర పోషిస్తోంది. 2014 ఎన్నికల్లో రంగ ప్రవేశం చేసి, ఔరంగాబాద్ సెంట్రల్, బైసుల్లా–2 అసెంబ్లీ స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది. ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని ‘వంచిత్ బహుజన్ అఘాడీ’ (వీబీయే)తో అప్పుడు ఏర్పడ్డ పొత్తు, 2019 ఎన్నికలప్పుడు సీట్ల పంచాయితీలో వికటించి ఆ రెండు స్థానాలు నిలబెట్టుకో లేకపోయింది. కానీ మాలెగావ్ సెంట్రల్, ధూలే –2 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానం (ఔరంగాబాద్ సెంట్రల్) గెలిచి మజ్లిస్ మరోమారు వార్తలకెక్కింది. మరో నాలుగు చోట్ల రెండో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం, అక్కడి గెలుపు మార్జిన్ కంటే అధికం. 2014 లో 22 చోట్ల పోటీ చేసి 0.9 శాతం ఓట్లు సాధిస్తే, 2019లో 44 చోట్ల పోటీచేసి 1.34 శాతం ఓటువాటా పొందింది. పరిమిత ప్రభావమే అయినా... తక్కువ ఓటు వ్యత్యాసాలతో గెలుపోటములు నిర్ణయమయ్యే తీవ్ర పోటీలో మజ్లిస్ అభ్య ర్థులు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశాలు న్నాయి. ముస్లిం ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకి సహకరించేందుకే పోటీ చేస్తోందనే ఆరోపణలు బీజేపీ వ్యతిరేకపార్టీల నుంచి మజ్లిస్ ఎదుర్కోవాల్సి వస్తోంది. గణాంకాలు మాత్రం ఆ వాదనను ధృవపరచడం లేదు. ఉదాహరణకు విజేతల మార్జిన్ కన్నా మజ్లిస్ ఎక్కువ ఓట్లు పొందిన 13 నియో జకవర్గాల్లో, 7 చోట్ల బీజేపీ దాని భాగస్వాములు గెలిస్తే... 6 చోట్ల కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి నెగ్గింది. ‘హరియాణా, జమ్మూ–కశ్మీర్లో మేం పోటీ చేయలేదు కదా, ముస్లిం ఓట్లు చీల్చలేదు కదా, మరి కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు?’ అన్న అసద్ ప్రశ్న హేతుబద్ధమే అంటారు పరిశీలకులు. 5 చోట్ల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన మజ్లిస్ ఈసారి కూడా ఎక్కువ స్థానాల్లో పోటీచేసే అవకాశాలున్నాయి. పొత్తులకు కలిసి రావాలంటే 28 స్థానాలు ఇవ్వాలన్న ఆ పార్టీ ప్రతి పాదనకు ఎమ్వీఏ అంగీకరించక పోవడం వల్ల ఇంకా పొత్తు కుదరలేదు. పొత్తు లేకుంటేనే బెటర్ అని ఎమ్వీఏ భావిస్తున్నట్టుంది.పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో ముస్లిం ఓటింగ్ సరళి తమ అభ్యర్థుల గెలుపోటముల్ని కచ్చితంగా ప్రభావితం చేస్తుందనేది ప్రధాన పార్టీల ఆలోచన. బీజేపీ పక్షాలు ఆందోళన చెందితే, వ్యతిరేక పక్షాలు కొంత ఆశా వహంగా ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 శాతం కన్నా తక్కువ ఓట్ల తేడాతో 27 చోట్ల, 2–3 శాతాల మధ్య ఓట్ల వ్యత్యాసంతో 14 చోట్ల, 3–4 శాతాల మధ్య ఓట్ల తేడాతో 11 చోట్ల, 4–5 శాతాల ఓట్ల మధ్య తేడాతో 19 చోట్ల అభ్యర్థులు గెలుపొందారు. అంటే 5 శాతం లోప ఓట్ల వ్యత్యాసంతో మొత్తం 71 మంది అభ్యర్థులు గెలుపొందారన్నమాట. ఇలా తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన వారిలో బీజేపీ (29), కాంగ్రెస్ (12), శివసేన (5)తో పాటు ఇండిపెండెంట్లూ (5) ఉన్నారు. ఇక ముస్లిం జనాభా 15 శాతానికి మించి ఉన్నవి 51 నిజయోజక వర్గాలు కాగా 10–15 శాతాల మధ్య ముస్లిం జనాభా ఉన్న నియోజక వర్గాలు 54 ఉన్నాయి. 5–10 శాతాల మధ్య జనాభా ఉన్నవి 91, ఐదు కన్నా తక్కువ ముస్లిం జనాభా ఉన్నవి 92 నియో జకవర్గాలు ఉన్నాయి. బీజేపీ, వారి మిత్రపక్ష అభ్యర్థులను ఎక్కడెక్కడ ఎవరు ఓడించగలుగుతారో... ఆ నమ్మకాన్ని బట్టే ముస్లిం ఓటర్లు అటువైపు మొగ్గవచ్చనే అభిప్రాయం ఉంది. ఏ అంశం ఏ మేరకు అభ్యర్థుల జాతకాలను మారు స్తుందో నవంబరు 23 వరకు వేచి చూడాల్సిందే!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్థ డైరెక్టర్ -
నోబెల్ అవార్డులు చెప్పే పాఠాలు
ఈ ఏడాది భౌతిక, రసాయనశాస్త్ర నోబెల్ అవార్డులను పరిశీలించారా? ఈ రెండింటితోనూ రేపటితరం టెక్నాలజీగా చెప్పుకొంటున్న కృత్రిమ మేధకు సంబంధం ఉంది. కృత్రిమ మేధ పునాదులు దశాబ్దాల నాటి ఆవిష్కరణల్లో ఉన్నాయని ఈ పురస్కారాలు చాటుతున్నాయి. మౌలికాంశాలపై పరిశోధ నలు ఎంత ముఖ్యమో కూడా ఇవి మరోసారి స్పష్టం చేస్తున్నాయి. మానవ విజ్ఞానం విస్తరించేందుకూ ఇవి ఎంతగానో అవసరం. మౌలికాంశాల పరి శోధనలకు ప్రత్యామ్నాయం లేదు. భారతీయులెవరికీ నోబెల్ అవార్డులు దక్కడం లేదంటే... అందుకు కారణం అదే. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఇదో దీర్ఘకాలిక కార్యక్రమం అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డులు పొందిన జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హంటన్ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను, టూల్సును మెషీన్ లెర్నింగ్ కోసం ఉపయోగించారు. అణువు తిరిగే పద్ధతి సాయంతో హాప్ఫీల్డ్ సమా చారాన్ని నిల్వ చేసుకునే, పునర్మించే నిర్మాణం రూపొందించారు.హంటన్ సమాచార ధర్మాలను స్వతంత్రంగా గుర్తించగల పద్ధతిని ఆవిష్కరించారు. ప్రస్తుతం విస్తృత వినియోగంలో ఉన్న న్యూరల్ నెట్ వర్క్‌కు పునాదులు ఇవే. కాలక్రమంలో ఈ ఆవిష్కరణలు కంప్యూటర్లు కాస్తా మానవుల జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తులను అనుకరించేంత శక్తి మంతమయ్యాయి.ఇప్పుడు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు సంగతి చూద్దాం. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ బేకర్, గూగుల్ డీప్‌మైండ్‌లో పని చేస్తున్న డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం.బంపర్లకు ఈ పురస్కారం దక్కింది. ప్రొటీన్ డిజైన్‌ను కంప్యూటర్ల సాయంతో అంచనా వేసేందుకు బేకర్ ఒక పద్ధతిని ఆవిష్కరిస్తే, డీప్‌మైండ్ శాస్త్ర వేత్తలు ప్రొటీన్ల నిర్మాణాన్ని ముందస్తు అంచనా వేయగలిగారు. మన శరీరంలోని కణాలు, జీవక్రియలన్నింటికీ ప్రొటీన్లే కీలకం. అవి అతి సంక్లిష్టమైన పద్ధతుల్లో ముడుచుకుని ఉంటాయి. ఈ ముడతల్లోని తేడాలు, మార్పులు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అణు నిర్మాణం, పరిసరాల్లోని నీటి పరమాణువులు ప్రొటీన్ ముడతలను నిర్ణయిస్తాయి. ఒకే ఒక్క ప్రొటీన్ లెక్కలేనన్ని ఆకారాల్లో ఉండవచ్చు. కొత్త ప్రొటీన్లను డిజైన్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్ నియ మాలను బేకర్ అభివృద్ధి చేశారు. దీనివల్ల కొత్త చికిత్సలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇక గూగుల్ డీప్‌మైండ్ శాస్త్రవేత్తలు ఆల్ఫా–ఫోల్డ్ పేరుతో తయారు చేసిన సాఫ్ట్వేర్ అమైనో ఆమ్ల క్రమాన్ని బట్టి ప్రొటీన్ త్రీడీ నిర్మాణాన్ని ముందుగానే అంచనా కడుతుంది. పథ నిర్దేశకులకే నోబెల్...మౌలికాంశాలపై పరిశోధనలు ఎంత ముఖ్యమో ఈ అవార్డులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. సీవీ రామన్ తరువాత భారతీయు లెవరికీ నోబెల్ అవార్డు దక్కలేదంటే... కారణం ఇదే. హరగోబింద్ ఖొరానా, ఎస్.చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్ వంటి వారు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మౌలిక అంశాలపైనే పరిశోధనలు చేసి నోబెల్ అవార్డులు సాధించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నోబెల్ అవార్డులు సాధారణంగా సాంకేతిక, శాస్త్ర రంగాల్లో కొత్త మార్గాలను ఆవిష్కరించిన వారికే ఇస్తూంటారు. హాప్ఫీల్డ్ విషయాన్నే తీసుకుందాం. తొంభై ఒక్క సంవత్సరాల వయసున్న ఈయన ‘హాప్ ఫీల్డ్ నెట్వర్క్’ అని పిలుస్తున్న ఆవిష్కరణ కోసం 1980 నుంచే కృషి చేస్తున్నారు. హంటన్ ఆవిష్కరించిన ‘బోల్æ్ట›్జమన్ మెషీన్’ పద్ధతి కూడా దశాబ్దాల కృషి ఫలితమే. ఎంతో కాలం తరువాత 2010లో ఈ ఆవిష్కరణలు మెషీన్ లెర్నింగ్ రంగాన్ని సమూలంగా మార్చేశాయి. చాట్‌జీపీటీ వంటి వినియోగదారు ఉత్పత్తికి వీరి పరిశోధనలే మూలం. ఇదే విధంగా రసాయన శాస్త్రంలో బేకర్ ప్రొటీన్ నిర్మాణా లపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. 1998లో ఆయన తన తొలి ఆవిష్కరణ ‘రొసెట్టా’ను సిద్ధం చేశారు. ఇలాంటి ఆవిష్కరణల్లో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కృత్రిమ మేధ, డిజిటల్ కంప్యూటర్లకు సంబంధించి శాస్త్రవేత్తల్లో ప్రాథమికంగా ఒక ఆలోచన మొదలైన 1950లలోనే గణాంక శాస్త్రవేత్తగా మారిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ ఒక భావనను ప్రతిపాదించారు. ‘మహాలనోబిస్ డిస్టెన్స్’ అని పిలిచే ఈ భావన వేర్వేరు డేటా పాయింట్లలోని తేడాలను లెక్కిస్తుంది. అనంతరం ఈ మహాలనోబిస్ డిస్టెన్స్‌ను కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తృతంగా వినియోగించారు. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) వ్యవస్థాపకుడు కూడా మహాలనోబిసే. సైబర్నెటిక్స్ ప్రాము ఖ్యతను అప్పట్లోనే గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా 1955లోనే నార్బెర్ట్ వీనర్ వంటి వారిని ఐఎస్ఐ విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించారు. ద్విజేశ్ దత్తా మజుందార్ వంటి వారిని ఫజీ లాజిక్, న్యూరల్ నెట్వర్క్ వంటి రంగాల్లో పరిశోధనలకు వీనర్ పురిగొల్పారు.ప్రొఫెసర్ రాజ్ రెడ్డి భాగస్వామ్యం...1966లో అమెరికాలో డాక్టోరల్ విద్యార్థిగా ఉన్న రాజ్ రెడ్డి... మాటలను గుర్తించేందుకు ‘హియర్సే–1’ వంటి వ్యవస్థలను అభివృద్ధి చేశారు. మనుషుల్లానే కంప్యూటర్లు కూడా విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా, మనిషి మాటలను గుర్తించి అర్థం చేసుకోగల సామ ర్థ్యాన్ని కల్పించారు. ప్రస్తుతం కంప్యూటర్లు, రోబోలు మాటలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నది రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన ‘హియర్సే –2’, హార్పీ, డ్రాగన్ వంటి సిస్టమ్సే. ‘బ్లాక్‌బోర్డ్ మోడల్’ పేరుతో రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్... కృత్రిమ మేధ వేర్వేరు మార్గాల నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయపరచుకునేందుకు కీలకంగా మారింది. ఈ ఆవిష్కరణకు గాను 1994లో ప్రొఫెసర్ రాజ్ రెడ్డికి కంప్యూటర్ సైన్సులో నోబెల్ అవార్డుగా పరిగణించే ‘టూరింగ్ అవార్డు’ దక్కింది. నోబెల్ అవార్డులు కృత్రిమ మేధ రంగంలో కీలక ఆవిష్కరణలకు దక్కడం బాగానే ఉంది. అయితే ఈ టెక్నాలజీతో వచ్చే ప్రమాదాలను కూడా ఈ ఏడాది నోబెల్ గ్రహీతలు గుర్తించారు. ఏఐ ఛాట్బోట్లు భయం పుట్టించేవే అని గూగుల్ కృత్రిమ మేధ విభాగపు అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత హింటన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కృత్రిమ మేధ విస్తృత వాడకం వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, ఏఐ కారణంగా పెరిగిపోయే ఉత్పాదకత, సంపద ధనికులకు మాత్రమే సాయపడుతుందనీ అంచనా కట్టారు. కృత్రిమ మేధ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చిన్నా చితకా ఉద్యోగాలు అనేకం లేకుండా పోతాయని హెచ్చరించారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు సార్వత్రిక సామాన్య వేతనం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని హింటన్ సూచించారు. భారతీయులకు నోబెల్ అవార్డు దక్కక పోవడం గురించి కూడా మాట్లాడుకుందాం. పరిశోధనలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఒకదాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే ఇందుకు నిధులు ఎలా సమకూరుస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలని కృత నిశ్చయంతో ఉంటే, యూనివర్సిటీల్లో మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. అలాగే అన్ని రకాల మద్దతు అందివ్వాలి. ఇదో దీర్ఘ కాలిక కార్యక్రమం అన్నది గుర్తు పెట్టుకోవాలి. అప్లైడ్ రీసెర్చ్, టెక్నా లజీ డెవలప్మెంట్లపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా తక్షణ సామాజిక, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే నిధుల కేటాయింపు విషయంలో మౌలికాంశాలపై పరిశోధనలతోపాటు అప్లైడ్ రీసెర్చ్, టెక్నాలజీలు రెండింటికీ మధ్య ఒక సమతూకం సాధించాలి. ప్రైవేటు రంగం కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతల నుంచి స్ఫూర్తి పొందాలి. రసాయన శాస్త్ర నోబెల్ అవార్డులో సగం గూగుల్ శాస్త్రవేత్తలకు దక్కిన విషయం గమనార్హం. మౌలికాంశాలపై పరిశోధనలకు ఆ ప్రైవేట్ కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఇందుకు కారణం. నోబెల్ స్థాయి అవార్డు రావాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెట్టుబడులు సమకూరుస్తుండటమే మార్గం.దినేశ్ సి.శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
న్యాయ వ్యవస్థపై ఏఐ ప్రభావం
కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం అన్ని రంగాలపైనా విశేషంగా పడుతోంది. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థనూ అది ప్రభావితం చేస్తోంది. ఏఐతో న్యాయమూర్తుల పని సులువవుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు సాధ్యమైనంత త్వరగా ఏఐ వినియోగంలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. న్యాయ శాస్త్రంలోని అనేక అంశాలు చిటికెలో ఏఐ ద్వారా అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల న్యాయ వ్యవస్థలో ఉన్నవారి పని భారం తగ్గుతుంది. మొత్తం మీద ఏఐ వల్ల న్యాయవ్యవస్థ ఎలా లాభం పొందుతుందో ఇక్కడ చూద్దాం:ఏఐ కేసు డేటాను విశ్లేషించడానికీ, ఫలితా లను అంచనా వేయడానికీ, నమూనాలను గుర్తించడానికీ సాయపడుతుంది. న్యాయ మూర్తులు అదనపు సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఏఐ ఆధారిత సాధనాలు న్యాయవాదులు, న్యాయమూర్తులకు సంబంధిత చట్టాల పూర్వాపరాలు, కేస్ స్టడీస్, పరిశోధనలో సమయం ఆదా చేయడంలో సహాయ పడతాయి. ఏఐ ఆధారిత చాట్ బాట్లు వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్‌లో సహాయ పడతాయి. షెడ్యూల్ చేయడం, రిమైండర్లు, ప్రాథమిక విచారణల వంటి పనులలో సహాయ పడతాయి. ఏఐ ఆధా రిత న్యాయ సహాయం, మద్దతును అందించడం ద్వారా... ముఖ్యంగా అట్టడుగు వర్గాలు న్యాయం పొందడంలో అంతరాన్ని తగ్గించవచ్చు. ఏఐ రొటీన్ టాస్క్‌ను ఆటోమేట్ చేయగలదు. న్యాయ మూర్తులు, న్యాయస్థాన సిబ్బందిని మరింత సంక్లిష్టమైన, అధిక విలువైన పనులపై దృష్టి పెట్టేలా చేస్తుంది. న్యాయ ప్రక్రియలను మెరుగు పరచడానికి, జాప్యాలను తగ్గించడానికి, న్యాయ వ్యవస్థకు గల మొత్తం సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.ఏజీఐ... అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలి జెన్స్ (కృత్రిమ సాధారణ బుద్ధి) ఒక భావితర హిత ఏఐ వ్యవస్థను సూచిస్తుంది. ఇది మనుషుల మేధస్సుకు సమానంగా విభిన్న పనులను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం జ్ఞానాన్ని అనేక విభాగాల్లో ఉపయోగించే సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు: కారణాలు చెప్పడం, సమస్యలను పరిష్కరించడం; అనుభవం నుంచి నేర్చుకోవడం; సహజ భాషను అర్థం చేసుకోవడం, వివిధ రంగాల్లో జ్ఞానాన్ని ఉపయోగించడం వంటి పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.ఏఐ పరిశోధనలో ఏజీఐని పవిత్ర కాంక్షగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అపారమైన అవకా శాలను తెచ్చిపెడుతుంది. అయితే ఏజీఐ ఇంకా పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉంది. ఏఐ సాధానాలతో సమర్థవంతంగా పని చేయడానికి వ్యూహం, న్యాయవాదులకు, కక్షి దారులకు కౌన్సెలింగ్ వంటి అధిక విలువ గల పనులపై దృష్టి పెట్టడానికి, న్యాయవాదులు కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. న్యాయ వాద వృత్తిలో జూనియర్లు, లేదా పారాలీగల్స్ వంటి నిర్దిష్ట పాత్రలను ఏఐ స్థానభ్రంశం చేయ గలదు. సబ్స్క్రిప్షన్ ఆధారిత చట్టపరమైన సేవలు, ఏఐ ఆధారిత లీగల్ కన్సల్టింగ్ వంటి కొత్త వ్యాపార నమూనాలను ఏఐ ప్రారంభించగలదు.చట్టపరమైన ఆచరణలో ఏఐ ఉపయోగం, నిర్ణయాధికారం పారదర్శకంగా, జవాబుదారీ తనంగా ఉండేలా చూసుకోవడం వంటి నియంత్రణ సమస్యలను లేవనెత్తవచ్చు. న్యాయవాదులు ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చు. దీని వల్ల అవ సరమైన నైపుణ్యాలను, నిర్ణయాన్ని (తీర్పును) కోల్పోయే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత చట్ట పరమైన సాధనాలు డేటా చౌర్యం, ఉల్లంఘనల వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.న్యాయవాదులు ఏఐని ఉపయోగించడంలో నైతికపరమైన చిక్కులను పరిగణనలోకి తీసు కోవాలి. ఏఐ తీసుకునే నిర్ణయం న్యాయంగా, నిష్పక్ష పాతంగా ఉండేలా చూసుకోవాలి. నైపుణ్యా లను సాధ్యమైనంత త్వరగా పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏఐ నుంచి ఎదురయ్యే సవా ళ్లను దీటుగా ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా విజ యవంతంగా ముందుకు వెళ్లవచ్చు. అయితే ఈ వ్యస్థపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి.– ఆగూరు ఉమామహేశ్వరరావు సీనియర్ న్యాయవాది -
రెండు దేశాలుగా బతకడమే దారి
హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసియాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. యుద్ధం వల్ల దయనీయంగా మారిన పాలస్తీనా ప్రజానీకం పట్ల సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? అది రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు.పాలస్తీనాలోని గాజా విముక్తి దళం అని పిలవబడే హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఏడాదికి పైగా సాగుతోంది. ఒక వేడుకలో పాల్గొన్న 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ దళాలు దారుణంగా వధించడంతో ఇది ప్రారంభమైంది. 2023 అక్టోబర్ 7న జరిగిన ఆ అనాగరిక దాడిలో ఇజ్రాయెల్ పిల్లలు, మహిళలు, పురుషులు దారుణంగా చంపబడ్డారు. ఏ నిర్వచనం ప్రకార మైనా, ఇది ఉగ్ర వాద దాడి. ప్రతీకారంగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌పై భారీ యుద్ధాన్ని ప్రారంభించింది. పాలస్తీనాలో పిల్లలు, మహిళలు సహా వేలాదిమంది చనిపోయారు. వెస్ట్‌బ్యాంక్ దాదాపు శిథిలావస్థకు చేరుకుంది.2023 అక్టోబర్ 7 నాటి మారణకాండను ఖండించకుండా ఇరాన్, లెబనాన్ కూడా హమాస్‌కు మద్దతుగా ఈ యుద్ధంలోకి ప్రవే శించాయి. ఆ విధంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక రకమైన అక్ష శక్తిగా మారాయి. కానీ అవి ఇజ్రాయెల్ బలంతో సరిపోలగలవా? ఇజ్రా యెల్ తన అత్యంత అధునాతన సాంకేతికత, యుద్ధ వ్యూహంతో హమాస్ ఆయుధ శక్తిని, ప్రధాన నాయకత్వాన్ని నాశనం చేసింది.దక్షిణ గాజాలోని రఫా లక్ష్యంగా సాగించిన గ్రౌండ్ ఆపరేషన్ లో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) అక్టోబర్ 17న ప్రకటించింది. సిన్వార్ హత్య హమాస్‌కు చావుదెబ్బ. ఇరాన్, లెబనాన్ ఈ యుద్ధంలో తమ పౌర, సైనిక సిబ్బందిని పణంగా పెట్టడానికి సాహసించక పోవచ్చు.రెండు దేశాల పరిష్కారంసమస్యకు పరిష్కారం రెండు దేశాల సూత్రంలో ఉందనీ, ఆ సూత్రాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉందనీ మనందరికీ తెలుసు. ఇజ్రా యెల్ ఆ సూత్రాన్ని అంగీకరించింది. కానీ హమాస్, ఇరాన్ వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ 1948లో ఆధునిక దేశంగా ఆవిర్భవించినప్పటికీ, తన ప్రజల సుదీర్ఘ ప్రవాస జీవితం తర్వాత, ఎడారి భూమిలో ఆధునిక ప్రజాస్వామ్య, వ్యవసాయ, పారిశ్రామిక దేశంగా తనను తాను నిర్మించుకుంది. కానీ పాలస్తీనా పాలకులు వ్యక్తి స్వేచ్ఛ, ఓటు హక్కులు అమలులోకి వచ్చే ప్రజాస్వామ్యాన్ని సాధ్యమైన వ్యవస్థగా ఎన్నడూ అంగీకరించలేదు. ఇతర ముస్లిం మత నిరంకుశ దేశాల కంటే అధ్వానంగా, పాలస్తీనా, ఇరాన్, ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలు ఉగ్రవాద కేంద్రాలుగా మారాయి.ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తిగత హక్కుల క్రమబద్ధమైన ప్రక్రియను అంగీకరించే ఏ దేశమూ ఆధునిక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో స్వీయ విధ్వంస స్థితిని సృష్టించదు. హమాస్, హిజ్బుల్లా, ముస్లిం బ్రదర్హుడ్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచం మొత్తానికి సమస్యలను సృష్టించాయి.ఇవి ప్రజల ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టవు. ప్రజలు శాంతియుతంగా వ్యవసాయ లేదా పారిశ్రామిక పనిలో పాల్గొనడానికి అనుమతించవు. స్త్రీ వ్యతిరేక ఆధ్యాత్మిక సైద్ధాంతిక చర్చలకు పూనుకుంటాయి. తాలిబన్ రూపంలో ఇలాంటి బలగం కారణంగా అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోందో మనకు తెలుసు.75 సంవత్సరాల తర్వాత కూడా ఒక దేశంగా ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి ఇరాన్, పాలస్తీనా నిరాకరిస్తున్నాయి. ఇది పశ్చిమాసి యాకే కాదు, ప్రపంచానికి కూడా సమస్య. 1948కి ముందు దాని ప్రజలు పదేపదే దేశభ్రష్టులైనప్పటికీ, ఇజ్రాయెల్ ఉనికిని తిరస్కరించడాన్ని చరిత్ర అంగీకరించదు.సామాజిక–ఆర్థిక పరిస్థితులు2019లో నేను ఇజ్రాయెల్, పాలస్తీనాలో విస్తృతంగా పర్యటించి రెండు దేశాల సామాజిక–ఆర్థిక పరిస్థితులను గమనించాను. ఇజ్రా యెల్ వైభవాన్ని, గొప్ప పచ్చని ఉత్పత్తి క్షేత్రాలలో సర్వత్రా చూడ వచ్చు. వారు ఎడారులను ఉత్పాదక భూములుగా మార్చారు. పేదరి కంతో కొట్టుమిట్టాడుతున్న పాలస్తీనా ప్రజలు, అక్కడి ఏ శ్రామిక ప్రజానీకం... పురుషులు, మహిళలు కూడా ఎడారిలోని పాక్షిక సాగు పొలాల్లో కనిపించరు. వారి వ్యవసాయ భూములలో ఒక్క స్త్రీని కూడా మనం చూడలేము. ఇజ్రాయెల్ స్త్రీలు భారతీయ శూద్ర, దళిత స్త్రీల లాగే నిత్యం పని చేస్తూనే ఉంటారు.యూదుల కష్టపడి పనిచేసే సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం వారికి సహాయపడ్డాయి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సహాయం ఉన్నప్ప టికీ, అర్థవంతమైన విద్యాసంస్థలను అభివృద్ధి చేయకుండా పాలస్తీనా పేద దేశంగా మిగిలిపోయింది. వారి ఏకైక ఆశ మతం. ఉత్పత్తి లేకుండా మతం వారికి సహాయం చేస్తుందా?ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థ సెక్యులరిజం సూత్రాలపై ఆధార పడి నడుస్తుంది. కానీ, పాలస్తీనా, ఇరాన్, లెబనాన్, ఈజిప్టులలో ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయా? అవి మత నియంతృత్వాలని మనకు తెలుసు.కొత్త ఒప్పందాలు అవసరమా?1993 నార్వే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించి, సంతకం చేసింది. ఇది రెండు దేశాల సూత్రాన్ని నిర్దేశించింది. దీని ప్రకారం ఇజ్రాయెల్, పాలస్తీనా ఒకరినొకరు గుర్తించుకోవాలి. రెండవది 1994 నాటి అబ్రహాం ఒప్పందం. ఇది అబ్రహామిక్ సంస్కృతికి చెందిన పిల్లలుగా యూదులు, ముస్లింల ఉమ్మడి చారిత్రక వారసత్వంతో రెండు దేశాల సహజీవనం గురించి మాట్లాడుతుంది. పాలస్తీనా, ఇరాన్ ఆ ఒప్పందాలను తిరస్క రించాయి.పాలస్తీనా సాధారణ ప్రజానీకం పట్ల, ప్రత్యేకించి పిల్లలు, మహిళలు, శరణార్థుల దుఃస్థితి పట్ల మనమందరం సానుభూతి చూపుతాము. అయితే పరిష్కారం ఏమిటి? పాలస్తీనా, ఇజ్రాయెల్ ఆ రెండు ఒప్పందాలను గౌరవించాలా లేక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలా? పాలస్తీనా దైవపాలనా సూత్రాల ఆధారంగా పనిచేస్తోంది. ఇజ్రాయెల్‌కు ప్రజాస్వామ్యం పట్ల ఉన్నంత గౌరవం పాలస్తీనా నాయకులకు లేదు. నా ఉద్దేశంలో వారు ఆ చిన్న భూమిలో రెండు చిన్న దేశాలుగా జీవించాలి. వేరే అవకాశమే లేదు.ఉభయ దేశాలలోని, ముఖ్యంగా పాలస్తీనాలోని కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల సానుభూతి చూపుతున్న ప్రపంచ మేధావులు ముస్లిం ప్రపంచంలో సంస్కరణల గురించి మాట్లాడుతూనే ఉండాలి. ముస్లిం దేశాలు సరైన ఎన్నికల ఆధారిత ప్రజాస్వామ్యాల వైపు వెళ్లాలి. మత నిరంకుశ రాజ్యాలలో ఉండకూడదు. యూదులు ఆ భూమిని విడిచి పెట్టి, 1948కి ముందున్న చోటికి తిరిగి వెళ్లాలంటున్న పాలస్తీనా, ముఖ్యంగా హమాస్, ఇరాన్ డిమాండ్‌ను వారు అంగీకరిస్తున్నట్ల యితే, అలాంటి మేధో అజ్ఞానం మానవ విలువలకు మరింత వినాశ నాన్ని తెస్తుంది.పాలస్తీనియన్లను ఆ భూభాగం నుండి బయటకు వెళ్ళమని ఇజ్రాయెలీలు కోరినట్లయితే వారికి కూడా అదే విషయం వర్తిస్తుంది. ఇలాంటి ఘోరమైన సమస్యలన్నింటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే రెండు దేశాల పౌరుల్లోనే పరిష్కారాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఇజ్రాయెల్ నుండి వారి సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలను వింటున్నాము. యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రా యెల్ పౌరులు ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి దించేయవచ్చు. యాహ్యా సిన్వార్ బతికి ఉంటే పాలస్తీ నియన్లు అలా చేసి ఉండేవారా?ఉక్రెయిన్, రష్యా సమస్యలా కాకుండా ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య నాగరికతా సమస్య. కాబట్టి మనమందరం ముస్లిం దేశాలు మొత్తంగా ప్రజాస్వామ్యం వైపు మారడం గురించి ఆలోచించాలి. పాలస్తీనా తన సొంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హమాస్ పట్టు నుండి బయటపడాలి. రెండు దేశాల పరిష్కారాన్ని అంగీకరిస్తూ, ప్రపంచానికీ, దాని సొంత ప్రజలకూ మేలు చేయాలి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కస్టడీ కాలం పెంచడం సబబేనా?
కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాలలో తెచ్చిన మార్పులు మంచివేనా? కొత్త చట్టాల వల్ల సమస్యలు తీరు తాయా? అనే ప్రశ్నలు న్యాయనిపుణులనే కాదు, సాధారణ పౌరులనూ వేధి స్తున్నాయి. అందుకే ఈ విషయాలపై లోతుగా పరిశోధించవలసిన అవసరం ఉంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ ఎస్ఎస్)లోని సెక్షన్ 187 కింద నిందితుల కస్టడీ కాలాన్ని పాత చట్టం అనుమతిస్తున్న దానికన్నా కొన్ని రెట్లు పెంచుతారు. అంటే నిందితులు ఎక్కువ కాలం కస్టడీలో ఉండాలి అని దర్యాప్తు అధికారి భావిస్తే కస్టడీ కాలం పెరుగుతుందని దీనర్థం. అంటే పోలీసులు నిందితుడి జీవితాన్ని సాధ్యమైనంత వరకు లాకప్‌కు పరిమితం చేయాలనుకుంటే చేయ వచ్చన్నమాట. మరో సమస్య ఏమంటే ఎక్కువ కాలం పోలీసు కస్టడీ తర్వాత... కోర్టు కస్టడీ మొద లవుతుంది. కోర్టు కస్టడీ అంటే పోలీసు కస్టడీ కన్నా గొప్పది, సహించగలిగినది అనుకోవలసిన పనిలేదు. లాకప్‌లో ఉంటే పోలీసులు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఆ తరువాత జైలు కస్టడీ ప్రారంభమయితే పోలీసు అధికారుల బదులు, జైలు అధికా రులు పెట్టే బాధలు కొనసాగుతాయి. దర్యాప్తు కోసం మొదట ఒక రోజన్నా పోలీసు కస్టడీలో ఉండి తీరాల్సిందే. అయితే కచ్చితంగా దర్యాప్తు 24 గంటల్లో పూర్తవ్వదు. లెక్కబెట్టి 24 గంటలు కాగానే ఇంటికి పంపిస్తారని దీనర్థం కాదు. అబద్ధపు ఆరోపణలను భరిస్తూ, అక్రమ నిర్బంధాన్ని అనుభవిస్తూ చట్ట వ్యతిరేకంగా పోలీస్‌లు అను కున్నంత కాలం లాకప్‌లో ఉండవల్సిందే. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం దర్యాప్తు సమయం లేక లాకప్‌లో ఉండే సమయం 40 రోజులు లేదా 60 రోజులకు పెరుగుతూ ఉంటుంది. అది గొప్ప సంస్క రణ అంటే... ఆలోచించాల్సిందే! చట్టం ప్రకారం 40 లేదా 60 రోజుల లాకప్ కస్టడీ తరువాత మరింత చట్ట వ్యతిరేక (అక్రమ) నిర్బంధం మొదలవుతుందన్న మాట. ఈ సంస్కరణ వల్ల పోలీసు అధికా రాలు విస్తారంగా పెరిగిపోయాయి. దీంతో అధికా రుల మధ్య నిందితుడు దిక్కులేని పక్షి అవుతాడు. దాని పర్యవసానం ఏమిటంటే మేజిస్ట్రేట్‌కి బెయిల్ ఇచ్చే అధికారం తగ్గిపోయింది. పోలీసులు నింది తుణ్ణి వదిలిపెట్టడం అనేది అతడి అదృష్టం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చట్టం ప్రకారం కస్టడీకి ఎంతో కొంత పరిమితి ఉంటుంది. కాని, పోలీసుల అక్రమ కస్టడీలపై ఏ పరిమితీ ఉండదు. నిందితుల అదృష్టం, దేవుడి దయ! 15 రోజుల కస్టడీ మంచిదా కాదా అని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చర్చించింది. ఎట్టి పరిస్థితిలో 15 రోజులు కస్టడీ (లాకప్ లేదా జైల్ నిర్బంధం) దాట డానికి వీల్లేదని అనుపమ్ కులకర్ణీ వర్సెస్ సీబీఐ కేసుకు సంబంధించిన తీర్పులో అత్యున్నత న్యాయ స్థానం పేర్కొంది. ఇప్పుడు పార్లమెంట్‌లోని ఉభయ సభలు తెచ్చిన కొత్త నేర చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ తీర్పు ఇక ఎంతమాత్రం చెల్లనే రదు. ఇదన్నమాట సంస్కరణంటే. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులను ఎవ్వరూ చదవరు, అర్థం చేసుకోరు. పార్లమెంట్ సభ్యులు ఆ యా పార్టీల విప్ల ఆధారంగా చట్టసభల్లో ఓటింగ్‌లో పాల్గొని ఓటేస్తారు. ఇలా క్రిమినల్ చట్టాలు చేసుకుంటూ పోతే మరి పౌర హక్కుల మాటేమిటి? రాజ్యాంగానికి ఉన్న విలువెంత?బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 కింద అంత తీవ్రం కాని నేరాల పరిశోధనలో 40 రోజుల కస్టడీ సమయం ఉంటుంది. తీవ్రమైన నేరాల పరిశోధనకు 60 రోజుల సమయాన్ని ఇస్తున్నారు. 10 సంవత్స రాల జైలు శిక్ష విధించదగిన కేసులలో 40 రోజుల దర్యాప్తుకు అవకాశం ఇస్తారు. ఇంత కన్న తక్కువ శిక్షలు విధించే నేరాలకు ఇంతకు ముందు 15 రోజుల కస్టడీ ఉండేది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 167 కింద మొదటి కస్టడీ కాలం 15 రోజులతో మొదలయ్యేది. ప్రజాహిత స్నేహపూరిత సంస్కరణలంటే ఇవేనా? ఈ ప్రభుత్వం ప్రజల ప్రేమాభిమానాలను కోరుకునేదే అయితే... జనం లాకప్పులు, కోర్టు కస్టడీ కాలాన్ని పెంచడం ఎందుకు? ఇందులో సంస్కరణ ఏముంది? వికాస్ మిశ్రా వర్సెస్ సీబీఐ కేసులో అధికారులు లాకప్ లేదా కస్టడీ నిర్బంధ సమయం పెంచాలని కోరారు. లంచం ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ కస్టడీ పొడిగింపును కోరింది సీబీఐ. అప్పడికి ఏడురోజుల కస్టడీ పూర్తయింది. నిందితులు హాస్పిటల్‌కు రావలసి వచ్చింది. ఆ తరువాత బెయి ల్‌పై విడుదల చేశారు. సెంతల్ బాలాజీ కేసులో 15 రోజుల కస్టడీని విడి విడి భాగాలుగా మార్చుకోవచ్చు అని సుప్రీంకోర్టు వివరించింది. అప్పుడు ఈ లిటిగేషన్లు కొన సాగుతూ సుప్రీం కోర్టుదాకా పోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 40 నుంచి 60 రోజులు ఇచ్చే కస్టడీని మరింత దారుణంగా వాడుకుంటారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల సుప్రీం కోర్టుదాకా లిటిగేషన్ నడుపుతూ ఉంటే 15, 40, 60 రోజులకు కస్టడీ పెంచుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఇదే రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రశ్నించాల్సి ఉంది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ గండి?
అక్టోబర్ 22 నుండి 24 వరకు మూడు రోజులపాటు రష్యాలోని కజాన్ పట్టణంలో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో మొదలైన ఈ కూటమిలో అనేక దేశాలు చేరడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. మున్ముందు 130 దేశాలు చేరే అవకాశం ఉందని అంచనా. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది. బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. డాలర్‌కూ, బంగారానికీ సంబంధాన్ని తొలగించిన అమెరికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది.2024 సంవత్సర బ్రిక్స్ శిఖరాగ్ర సమావే శాలకు రష్యా అధ్యక్షత వహిస్తోంది. వివిధ దేశాల అత్యున్నత నాయకులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. బ్రిక్స్ విస్తరణ తర్వాత జరుగుతున్న కీలకమైన సమావేశం కాబట్టి, బ్రిక్స్‌లో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు, బ్రిక్స్ విస్తరణ కోసం యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడం మీద చర్చ ప్రధానంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థ స్థాపనను ప్రోత్సహించడం, శీతోష్ణస్థితి మార్పులను ఎదుర్కోవడం, ఇంధన సహకారాన్ని పెంపొందించడం, సప్లై చైన్‌ను రక్షించడం, దేశాల మధ్య శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉంటాయని ఒక కీలక చైనా పరిశోధకుడు వెల్లడించారు.ఎందుకీ ప్రత్యామ్నాయ వ్యవస్థ?అమెరికా డాలర్ ఆధిపత్యం కింద ప్రపంచం ఎనిమిది దశా బ్దాలుగా నలిగిపోతోంది. 1944లో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉని కిలోకి వచ్చిన ఈ వ్యవస్థపై పశ్చిమ దేశాలు కూడా ప్రబలమైన శక్తి కలిగి ఉన్నాయి. అమెరికా ఆధిపత్యంతో పాటు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచం బీటలు బారింది. ప్రపంచీకరణను చైనా చక్కగా వినియోగించుకుని అమెరికా, పశ్చిమ దేశాలను వెనక్కు కొట్టింది. అమెరికా స్వదేశీ విదేశీ అప్పు, ప్రమాదకరంగా 50 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరో వైపున చైనా ప్రపంచ రెండవ ఆర్థిక శక్తిగా ఎదిగి, శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతాలను నెలకొల్పుతోంది.ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల విశ్లేషణ ప్రకారం, బైడెన్ పదవీ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 15% కంటే తక్కువకి పడిపోయింది. 1999లో 21% కంటే ఎక్కువగా ఉన్నది, స్థిరమైన క్షీణత చూసింది. చైనా 18.76%తో పెద్ద వాటాను కలిగి ఉంది. దశాబ్దాల క్రితపు అమెరికా ఆధిపత్య ప్రపంచ క్రమం, నేటి వాస్తవాలకు తగ్గట్టుగా లేదు. సంపన్న దేశాలు, పేద దేశాలను అన్ని విధాలా అణిచివేస్తున్నాయి. ఈ కాలంలో అమెరికా 210 యుద్ధాలు చేసింది. 180 యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొంది. ప్రపంచ ప్రజలకు అమెరికా ఆధిపత్య కూటమిపై నమ్మకం పోయింది. అందుకే, ప్రపంచ ప్రజలందరి ప్రయోజనాలకు, సమానత్వానికి ఉపయోగపడేలా, ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, న్యాయమైన బహుళ ధ్రువ ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నెలకొల్పాల్సిన, నేటి అసమాన ప్రపంచ క్రమాన్ని సమగ్రంగా సంస్కరించవలసిన అగత్యం ఏర్పడింది. బ్రిక్స్ తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో మొదలై(బ్రిక్), తర్వాత సౌత్ ఆఫ్రికాను కలుపుకొంది. అటుపై ఈజిప్ట్, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను భాగస్వామ్యం చేసుకుంది. ఇంకా అనేక దేశాలు చేరే అవకాశం ఉంది. 23 దేశాలు అధికారికంగా దరఖాస్తు పెట్టుకున్నాయి. కరేబియన్ దేశా లలో భాగమైన క్యూబా విదేశాంగ మంత్రి తాము కూడా బ్రిక్స్‌లో భాగం అవుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లేఖ రాశారు. శ్రీలంక విదేశాంగ మంత్రి పాల్గొంటారని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు. ఒక విశ్లేషణ ప్రకారం, బ్రిక్స్‌లో 130 దేశాలు చేరే అవకాశం ఉంది. ఊపందుకున్న డీ–డాలరైజేషన్బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. ఈ ధోరణి వేగంగా పెరుగుతూ, ఆధిపత్య దేశాల ఆంక్షలకు, భూ భౌగోళిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక మంత్రి జాతీయ కరెన్సీలు, రష్యా రూబుల్‌ను బ్రిక్స్‌లో ఉపయోగిస్తు న్నామన్నారు. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటం తగ్గించే క్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది.బ్రిక్స్ తర్వాత, మరో కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్’ (సీఐఎస్) కూడా డీ–డాలరైజేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మాల్దోవా, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి తమ జాతీయ కరెన్సీలతో 85% సరిహద్దు లావాదేవీలను జరిపింది. వాణిజ్యంలో అమెరికా డాలర్‌ను ఉపయోగించడం నిలిపివేసింది. సీఐఎస్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం స్థానిక కరెన్సీలలో జరగడంతో, డాలర్ ఉపయోగం 85% తగ్గిపోయిందని బ్రిక్స్, సీఐఎస్ రూపకర్తల్లో కీలకమైన రష్యా ప్రకటించింది. శాశ్వతంగా అమెరికా డాలర్ పైన ఆధారపడటం తగ్గిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా చైనాల మధ్య గత ఏడాది జరిగిన 200 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో డాలర్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి, యువాన్ రూబుల్‌లలో కొనసాగించాయి.ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు చెందిన 300 బిలియన్ డాలర్లకు పైగా కరెన్సీని అమెరికా ప్రపంచ బ్యాంకింగ్ నెట్వర్క్ ‘షిఫ్ట్’ స్తంభింపజేసింది. ఇరాన్, వెనిజువేలా, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్ లాంటి అనేక దేశాల డాలర్ల డబ్బును అమెరికా భారీగా స్తంభింపజేసింది. ఇది వేగంగా డీ–డాలరైజేషన్‌కు దోహదం చేసింది. డాలర్ నుంచి గ్లోబల్ సౌత్ దూరంగా వెళ్ళింది. ఈ దేశాల మధ్య స్థానిక కరెన్సీ మార్పిడి బాగా పెరిగింది. రూబుల్‌ను ‘రబుల్’ (నిర్వీర్యం) చేస్తామంటూ రష్యాపై బైడెన్ విధించిన ఆంక్షలు బెడిసి కొట్టాయి. అమెరికా 1971లో నిక్సన్ కాలంలో డాలర్‌కూ బంగారానికీ మధ్య సంబంధాన్ని తొలగించింది. వాస్తవ ఉత్పత్తితో సంబంధం లేకుండా‘డాలర్ కరెన్సీ’ని పిచ్చి కాగితాల వలె ముద్రించింది. అమె రికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ‘అట్లాంటిక్ కౌన్సిల్’ ‘డాలర్ డామినెన్స్’ మీటర్ ప్రకారం, అమెరికా డాలర్ నిలువలలో బ్రిక్స్ దేశాల వాటా గణనీయంగా తగ్గి పోయింది. ‘స్విఫ్ట్’ (ప్రపంచవ్యాప్త అంతర్‌బ్యాంకుల ఆర్థిక టెలీ కమ్యూనికేషన్స్ వ్యవస్థ)కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ చెల్లింపుల వ్యవస్థ కట్టుదిట్టంగా రూపొందింది. బ్రిక్స్ చైనా కేంద్రంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ‘సీబీడీసీ’ ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్ కరెన్సీతో ఇప్పటికే 60 దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో రిహార్సల్స్ జరిగాయనీ, మరిన్ని దేశాల మధ్య జరుగుతున్నాయనీ వివిధ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ఇండియా దారి?ఇజ్రాయిల్– పాలస్తీనా–హెజ్‌బొల్లా్ల(లెబనాన్) యుద్ధం వల్ల ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు చైనాకు తరలిపోవడం, విదేశీ బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడం వంటి కారణాలతో రూపాయి భారీగా పతనమైంది. రూపాయి మారకపు విలువ చరిత్రలో మొట్టమొదటిసారి అమెరికా డాలర్‌తో అత్యంత దిగువ స్థాయికి అంటే 84.08 రూపాయలకు పడి పోయింది. మంద గమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు చైనా ప్రకటించిన ద్రవ్య ఆర్థిక చర్యల తర్వాత విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారులు ‘ఇండియా స్టాక్స్ విక్రయించండి, చైనా స్టాక్స్ కొనండి’ అనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. చైనా స్టాక్‌లు చౌకగా ఉండటం వల్ల ఇండియా డబ్బంతా చైనాకు తరలిపోతోంది.ప్రపంచ కరెన్సీగా ఉన్న డాలర్ అమెరికా ప్రయోజనాలకూ, ఇతర దేశాలపై భారీ ఆంక్షలుకూ పనికివచ్చింది తప్ప, మరే సమానత్వ ప్రయోజనమూ డాలర్లో లేదు. కాబట్టి బ్రిక్స్ కూటమితో కలిసి, అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయ విధానాలను, కరెన్సీని ఆవిష్కరించడం తప్ప, భారత్ బాగుకు మరో దారి లేదు.నైనాల గోవర్ధన్ వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్మొబైల్: 97013 81799 -
భారత రత్న ఇవ్వాల్సిన మనిషి
ఇటీవల మరణించిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడు. ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్పథమున్న పారిశ్రామివేత్త మాత్రమే కాదు... మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. రతన్ టాటాను చాలామంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. మరణానంతరమైనా ఆయనకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పుర స్కారం దక్కి ఉంటే బాగుండేది. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే, అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడే. అయితే బతికున్న రోజుల్లోనే అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇటీవలే రతన్ టాటా మరణించిన నేపథ్యంలో మరణానంతరం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇస్తారా?మరణానంతరమైనా సరే... రతన్ టాటాకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలి అనేందుకు బోలెడు కారణాలు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి, ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్ప థమున్న పారిశ్రామివేత్త కూడా. మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. అయితే ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్లు చాలామందే ఉన్నారు. టాటాను వీరందరి నుంచి వేరు చేసే లక్షణం ఏదైనా ఉందీ అంటే... అది ఆయన అందరి నుండి పొందిన గౌరవం, మర్యాద, మన్ననలు. రతన్ టాటాను చాలా మంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఒకరకంగా చెప్పాలంటే పూజించారు అనాలి! ఇలాంటి వాళ్లు కొందరే కొందరు ఉంటారు. వారిలో రతన్ టాటా ఒకరు!రెండో విషయం... మనం ఆదర్శంగా భావించే వ్యక్తికి లభించే గుర్తింపు కూడా ఆ స్థాయిలోనే ఉండాలని ఆశిస్తాం. ఎందుకంటే వీళ్లు కేవలం సాధకులు మాత్రమే కాదు... చాలా ప్రత్యేకమైన వాళ్లు. అందుకే దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అలాంటి వారికి దక్కడం ఎంతైనా ఆహ్వానించదగ్గ విషయం.దేశంలో ఇప్పటివరకూ 53 మందికి భారత రత్న పురస్కారం లభించింది. టాటా వీరందరిలోనూ ఉన్నతుడిగానే నిలుస్తారు. బి.సి. రాయ్, పి.డి. టండన్ , కె. కామరాజ్, వి.వి. గిరి, ఎం.జి. రామచంద్రన్ , రాజీవ్ గాంధీ, అరుణా అసఫ్ అలీ, గుల్జారీలాల్ నందా, గోపీనాథ్ బోర్డోలోయి, కర్పూరీ ఠాకూర్, చౌధురీ చరణ్‌సింగ్... లాంటి రాజకీయ నాయకుల విషయంలో అది నిజం కాదా?ఇంకోలా చెబుతాను. మదర్ థెరీసా, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, అమర్త్య సేన్ , పండిట్ రవిశంకర్, లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్ , భీమ్సేన్ జోషీ, సచిన్ టెండూల్కర్... అందరూ భారత రత్నకు అర్హుల నుకుంటే, రతన్ టాటాకు ఎలా కాదనగలం?వాస్తవం ఏమిటంటే... ఈ అవార్డు ఇచ్చేది రాజకీయ నాయకులు. వాళ్లు ఎక్కువగా రాజకీయ నాయకులకే ఇస్తూంటారు. ఇప్పటివరకూ అందుకున్న 53 మందిలో 18 మంది మాత్రమే ఇతర రంగాల్లో అత్యు న్నత ప్రతిభను కనబరిచినవారు. 1954 నుంచి తొలిసారిగా భారత రత్న పురస్కారం ప్రదానం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒకే ఒక్క పారిశ్రామిక వేత్త, అత్యంత అర్హుడైన జేఆర్డీ టాటాకు మాత్రమే ఆ అవార్డు దక్కింది. అంతే!వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పురస్కారం దక్కి ఉంటే బాగుండేదని నేను అనుకుంటూంటాను. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్, అమితాబ్ బచ్చన్ , ఫీల్డ్ మార్షల్ మానెక్‌శా, సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వాళ్లు ఒక్కొక్కరూ తమ వైయక్తిక ప్రతిభతో ఆ యా రంగాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్న వారే. ప్రపంచం వీరి ప్రతిభను గుర్తించింది, కీర్తించింది. దురదృష్టవశాత్తూ మనం ఆ పని చేయలేకపోయాం.ఇప్పటికీ సమయం మించిపోలేదు. రతన్ టాటాకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. బి.ఆర్.అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, అబుల్ కలావ్‌ు ఆజాద్, మదన్ మోహన్ మాలవీయా వంటి వారికి మరణానంతరం దశాబ్దాల తరువాత భారత రత్న ఇవ్వగలిగినప్పుడు... 2008లో మరణించిన ఫీల్డ్ మార్షల్ మానెక్శాకు, 2021లోనే కన్ను మూసిన దిలీప్‌కుమార్‌తోపాటు మనతోనే ఉన్న అమితాబ్ బచ్చన్,సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వారిని భారత రత్నతో సత్కరించడం సాధ్యమే! అయితే ఇక్కడ మనం ఇంకో నిష్ఠుర సత్యాన్ని అర్థం చేసు కోవాలి. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేర్లు అవసరం లేదు. వారి భేషజాలను దెబ్బతీయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. కానీ, వారందరూ రాజకీయ నేతలే. జవహర్లాల్ నెహ్రూతో మొదలుపెట్టి... నరేంద్ర మోదీ వరకూ అన్ని ప్రభుత్వాలూ ఈ పని చేశాయి.విషాదం ఏమిటంటే... మనం తరచూ కొంతమంది అనర్హులకు భారత రత్న ఇచ్చాం. ఇంకోలా చెప్పాలంటే అర్హులకు నిరాకరించాం. ఎలాగైతేనేం, ఆ అవార్డు గౌరవమైతే మసకబారింది. అర్హులకు ఇవ్వలేదు, అనర్హులకు ఇచ్చారన్న వాదాన్ని కాసేపు పక్కనపెట్టి... జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం ఇదే. దేశమాత అసలు ఆణిముత్యాలను ప్రజలెప్పుడూ గుర్తుంచుకుంటారు. సందేహం ఏమీ లేదు. రతన్ టాటా అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది సామాన్యులు ఈ విషయాన్ని మరోసారి నిర్ధ్ధరించారు. వార్తాపత్రికల్లో పేజీలకు పేజీ కథనాలు, టెలివిజన్ ఛానళ్లలో గంటల లైవ్ కవరేజీలన్నీ రతన్ టాటాపై ఈ దేశ ప్రజలకు ఉన్న అభిమానాన్ని చాటేవే! ఎవరూ కాదనలేని సత్యమిది. అలాగని రాజ్యం ఆయనను గుర్తించదంటే మాత్రం సరికాదు. నన్నడిగితే అలా చేయడం క్షమించలేనిది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజలు – పోలీసుల బంధం బలపడాలి
1959 అక్టోబర్ 21వ తేదీన భారత–చైనా సరిహద్దులోని ఆక్సాయిచిన్ ప్రాంతంలో పదిమంది కేంద్ర పోలీసు రిజర్వు దళానికి చెందిన జవానులు విధినిర్వహణలో వీర మరణం పొందారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం పోలీసులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్ట మొదటి సంఘటన అది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ’పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని’ పాటిస్తున్నాం.ఈనాడు అనేక కారణాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది. సమ్మెలు, ఆందోళనలు, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం, మత సంఘర్షణలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి. ప్రభుత్వం తరఫున శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన గురుతరమైన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. బలవంతుల నుండి బలహీనులకు పోలీసులు రక్షణ కల్పించాలి. ప్రజల ధన మాన ప్రాణాలను పరిరక్షించాలి. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో శాంతి భద్రతలకు అవసరమైన చర్యలు గైకొనేట ప్పుడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా వ్యవహరించాలి. మిగతా ప్రభుత్వ శాఖలకూ పోలీసు శాఖకూ మధ్య పనితీరులో చాలా భేదం ఉంది. పోలీసులు అవసరమైతే అవిశ్రాంతంగా శాంతి భద్రతల కోసం 24 గంటలూ పనిచేయాలి. పండుగలు వచ్చినప్పుడు అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కానీ, పోలీసులు చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులతో గడపలేని పరిస్థితి! సమయానికి ఆహారం, నిద్ర లేని కారణంగా వారి ఆరోగ్యంపై దాని దుష్ప్రభావం పడుతుంది.1861 కంటే ముందు మన దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం లేదు. సైనికులే శాంతి భద్రతలను పరిరక్షించేవారు. సిపాయిల తిరుగు బాటు అనంతరం 1861 పోలీసు యాక్టు ప్రకారం శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు విభాగాన్ని ఆంగ్లేయ పాలకులు ఏర్పాటు చేశారు. 1902లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. ఆంగ్లేయ పాలకులు స్వతంత్ర సము పార్జన కోసం పోరాడుతున్న భారతీయులను అణచి వేయడం కోసం, భారతీయుల హక్కులను హరించడం కోసం పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రా నంతరం శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ జాబి తాలో చేర్చడం వలన పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది. పోలీసుల పనితీరుపై ఈ నాటికీ ప్రజలకు సదభి ప్రాయం లేదు. పోలీసులకు కూడా తాము ప్రజల కోసం నిరంతరం కష్టపడినా ప్రజల నుండి రావలసిన సహకారం, ఆదరణ లభించడం లేదన్న అభిప్రాయముంది. పోలీసు ప్రజాసంబంధాలు బాగుపడాలంటే ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు సరియైన సమయంలో సరియైన రీతిలో స్పందించాలి. కొన్ని సందర్భాలలో ఫిర్యాదు దారులు చేసిన ఫిర్యాదుల పరిష్కారం పోలీసుల పరిధిలో ఉండక పోవచ్చు. అటువంటప్పుడు వారు ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో వివరించాలి. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించాలి. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా 2006 సెప్టెంబర్ 22న సుప్రీం కోర్టు పోలీసుల పనితీరుకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించింది. అందులో ముఖ్యమైనవి: 1) కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రస్థాయి భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. భద్రతా మండలి శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను సమీక్షించి అవసరమైన చర్యలు గైకొనాలి. 2) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలీసు వ్యవస్థాపక బోర్డును ఏర్పాటు చేయాలి. 3) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర/జిల్లా స్థాయిలో పోలీసు ఫిర్యాదుల అథారిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల అథారిటీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఆ పై స్థాయి అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలి. 4) డీజీపీ నియామకం కోసం ముగ్గురు సీని యర్ ఐపీఎస్ అధికారులతో కేంద్ర ప్రభుత్వం ఒక జాబి తాను రూపొందించాలి. అందులో నుండి ఒకరిని వారి యోగ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించాలి. ఈ రకంగా నియమించబడ్డ వారు వారి పదవీ విరమణతో సంబంధం లేకుండా రెండు సంవత్సరాలు ఆ పద విలో కొనసాగాలి. 5) పోలీసు వ్యవస్థలో కార్యాచరణ విధులు నిర్వహించే ఐజీపీ, డీఐజీ, ఎస్పీల పదవీ కాలం కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి. 6) పోలీసు శాఖలో శాంతి భద్రతల విధులను, విచారణ (ఇన్వెస్టిగేషన్) విధులను వేరు చేయాలి. పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేయాలంటే ఈ మార్గదర్శకాలను అమలుచేయాలి. – డా. పి. మోహన్‌రావు విశ్రాంత ప్రొఫెసర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ హైదరాబాద్(రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం) -
అధికార కేంద్రీకరణకు మార్గంగా.. జమిలి ఎన్నికలు
‘ఒకే దేశం – ఒకే సంస్కృతి – ఒకే పన్ను’ అంటూ నిరంతరం ప్రచారం చేసే అధికార బీజేపీ ఇప్పుడు ‘జమిలి ఎన్నికల’కు సన్నద్ధమవు తోంది. కేంద్ర మంత్రి వర్గం ఇటీవల జమిలి ఎన్నికలకు ఆమోదాన్ని తెలిపింది. దేశంలో సవివరమైన చర్చ జరగకుండానే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ చేసిన సూచనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికలను పూర్తిగా సమర్థించేవారే కమిటీలో ఉన్నప్పుడు అది నిపుణుల కమిటీ ఎలా అవుతుంది? జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యంకాదనీ, ఇది అధికార కేంద్రీ కరణకు మార్గాన్ని సుగమం చేయడమేననీ, మన దేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ మౌలిక సూత్రా లపైన దాడి చేయడమేననీ ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.దేశంలో తరచూ ఏదో ఒక ఎన్నిక జరుగు తున్నందు వల్ల అభివృద్ధికి ఆటంకమేర్పడుతుందనేది ఒక అభిప్రాయం. ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందనీ, దీనికి మన జీడీపీ గణాంకాలే రుజువనీ ప్రభుత్వ పెద్దలు చెబు తున్నారు. మరి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నిజంగా సరైనవనుకుంటే అభివృద్ధికి తరుచూ జరిగే ఎన్నికలు ఎలా ఆటంకమవుతాయి? దేశం ముందున్న మౌలిక సవాళ్ళ నుండి జనం దృష్టిని ప్రక్కదారి పట్టించేందుకే జమిలి ఎన్నికలను ప్రస్తావిస్తున్నారనేది ఒక విమర్శ. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చనేది సమర్థకుల మరో వాదన. ఈ వాదనను సరిగ్గా విశ్లేషిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2023–24 సంవత్సరానికి ఎన్నికల కోసం కేంద్రం కేటాయించింది కేవలం రూ. 466 కోట్లు మాత్రమే. పైగా అది ఎన్నికల సంవత్సరం కాబట్టి. అదే 2022–23 సంవత్సరానికి కేటాయించినది రూ. 320 కోట్లు మాత్రమే. రాష్ట్రాలు కూడా ఎన్నికల ఖర్చును భరిస్తాయి. లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్న కేంద్రానికి ఈ ఎన్నికల ఖర్చు నిజంగా పట్టించుకోవలసినది కాదు. నిజానికి జమిలి ఎన్నికలు జరిపితేనే ఖర్చు పెరుగుతుంది. ఈ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో ఈవీఎమ్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని, రక్షణసిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి.ఎన్నికలు తరచూ జరగడం వల్ల ఇప్పటి వరకూ విధానపర నిర్ణయాలు చేయడంలో ఏనాడూ ఆటంకమేర్పడలేదు. ప్రజల ప్రయోజనాలకు, వారి స్వేచ్ఛకు జమిలి ఎన్నికలు విఘాతమే. ప్రభుత్వాల దూకుడుకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కళ్ళెం వేసేది ప్రజలు మాత్రమే. జమిలి ఎన్నికల వల్ల పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. పార్లమెంట్ లేదా అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధి వెంటనే మరణిస్తే ఏం చేస్తారు? అధికార పార్టీ మధ్యలో మెజారిటీ కోల్పోయి ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయమేమిటి? అటువంటి ప్రత్యామ్నాయం ప్రజాస్వామ్యయుతం అవుతుందా?చదవండి: ‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా?అందుకే జమిలి ఎన్నికలకు బదులు, ఎన్నికల సంస్కరణలను తక్షణమే చేపట్టి దామాషా ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టాలి. పార్టీల మ్యానిఫెస్టోలను, వారి విధానాలను సమగ్రంగా విశ్లేషించుకుని రాజకీయ పార్టీలకు ప్రజలు ఓటు వేయడం న్యాయసమ్మతమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య ప్రక్రియ. ప్రస్తుత పద్ధతిలో రాజకీయ పార్టీలకు లభించిన ఓట్ల శాతం, ఆయా పార్టీలు గెలిచిన సీట్లకు ఉన్న తేడా అసంబద్ధంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రక్రియను అమలు చేసే ఆలోచనను విరమించి ప్రజాస్వామ్య పటిష్ఠతకు, పరిరక్షణకు అవసరమైన అన్ని మార్పులను మన రాజకీయ వ్యవస్థ చేపట్టాలి. అధికార బీజేపీ దీనికి ముందుగా చొరవ చూపాలి.- వి.వి.కె. సురేష్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం డివిజన్ డివిజనల్ సంయుక్త కార్యదర్శి -
పత్రికల హక్కులేమిటో తెలుసా?
ఔషధం చేదుగా ఉంటుంది. కానీ ఆరోగ్యం కోసం తీసుకోక తప్పదు. నిజం కూడా చేదుగా ఉంటుంది. కానీ సమాజ ఆరోగ్యం కోసం భరించక తప్పదు. నిజంలో ఉన్న చేదును విస్మరించి, ఆ నిజం చెప్పడమే తప్పంటే? నిజం చెప్పేవాళ్ల మీద పగబడితే? నిజాలు వినడం చాలామందికి అసౌకర్యం కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా పాలకులకు, అధికార పీఠాల్లో ఉన్నవాళ్లకు, నిజాలు బయటికి రావొద్దనుకునేవాళ్లకు. కానీ నిజాలు చెప్పడం పత్రికల ముఖ్య కర్తవ్యమనీ, నిజాల మీద మాత్రమే సమాజం పురోగమిస్తుందనీ చాలాసార్లు మరిచిపోతుంటారు. కేసులు వేస్తామని బెదిరిస్తుంటారు. కానీ పత్రికలకు ప్రచురించే హక్కు, సమాచారాన్ని పొందే హక్కు, ప్రకటన హక్కు, అసమ్మతి తెలిపే హక్కు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.భారతదేశంలో పత్రికా హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్య్రం నుండి ఉద్భవించాయి. మే 3 లేదా ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’... పత్రికల స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు గుర్తు చేస్తుంది.సాంకేతిక విప్లవపు పురోగతి రాతపూర్వక, మౌఖిక, దృశ్య మాధ్య మాల ద్వారా లక్షలాది మందికి సమాచార వ్యాప్తిని సులభతరంచేసింది. ఇది ఒక వ్యక్తి పరువునష్టం ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక వ్యక్తి ప్రతిష్ఠకు హాని కలిగించే విధంగా మాట్లాడటం లేదా రాయడం పరువు నష్టం. భారతీయ శిక్షాస్మృతి, 1860 లోని సెక్షన్ 499 ప్రకారం అది నేరం.ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగించడం; టెక్స్›్ట, ఇమేజ్, కార్టూన్లు, క్యారికేచర్లు లేదా దిష్టిబొమ్మల ద్వారా వారిని ద్వేషించడం లేదా అవమానించడం చట్ట విరుద్ధం. సాధారణంగా వ్యక్తులను విమర్శించినందుకు వార్తాపత్రికలు, పత్రికా సభ్యు లపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. విమర్శ సదుద్దేశంతో చేసినా, తీవ్రమైన ప్రజాప్రయోజనాలకు సంబంధించినదైనా అది పరువునష్టం దావా కాదు. భావ ప్రకటనా స్వేచ్ఛపత్రికలు, మీడియాకు ఒకే హక్కులు ఉన్నాయి. సమాచారాన్ని రాయడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి మరియు ప్రసారం చేయడానికి ఏ వ్యక్తి కంటే ఎక్కువ లేదా తక్కువ కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి పత్రికలకు ఈ హక్కు లభించింది. ఈ స్వేచ్ఛలో నోటి మాట, రాత, ముద్రణ, చిత్రాలు లేదా మరేదైనా మార్గం ద్వారా వ్యక్తీకరించే హక్కు ఉంటుంది. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్, హుందాతనం, నైతికత, లేదా కోర్టు ధిక్కారానికి సంబంధించి సహేతుకమైన ఆంక్షలను కలిగి ఉన్న ఆర్టికల్ 19(2) కింద రాజ్యాంగం ప్రకారం ఈ హక్కుపై విధించగల పరిమితులు మాత్రమే ఉన్నాయి.‘రోమేశ్ థాపర్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం’ (1950) సహా అనేక కేసుల్లోని తీర్పులు ప్రచురణ స్వేచ్ఛ ఎంత అవసరమో, చలామణి స్వేచ్ఛ కూడా అంతే అవసరమని అభిప్రాయపడ్డాయి. ‘బెన్నెట్ కోల్మన్ అండ్ కో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1972) కేసులో వార్తాపత్రికలు, వాటి పేజీలు, వాటి సర్క్యులేషన్ నిర్ణయాధికారాన్ని వాటికే వదిలేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదే సూత్రాన్ని ‘సకాల్ పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1962) కేసులోనూ సమర్థించింది. రాజ్యాంగం ప్రసాదించిన వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛను నేరుగా ఉల్లంఘించే చట్టాలను రాష్ట్రాలు చేయలేవని పేర్కొంది. పత్రికల చలామణి హక్కులో చలామణి పరిమాణాన్ని నిర్ణయించే స్వేచ్ఛ కూడా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో రాష్ట్ర భద్రత, ప్రజాభద్రత తదితర అంశాల్లో ఇచ్చిన సహేతుకమైన ఆంక్షలకు విరుద్ధంగా ఉంటేనే ఈ హక్కును పరిమితం చేయవచ్చు.అసమ్మతి హక్కురాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)... వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కుతో పాటు ప్రజాదరణ లేని లేదా అసాధారణ అభిప్రాయాలను కలిగి ఉండే హక్కును కూడా కవర్ చేస్తుంది. ఇటువంటి విమర్శలను తగ్గించడానికి సాధారణంగా ఉప యోగించే చట్టాన్ని భారత శిక్షాస్మృతి, 1860లోని సెక్షన్ 124–ఎ ప్రకారం రాజద్రోహ చట్టం అంటారు. సాధారణంగా పత్రికలపై రాజద్రోహ చట్టాన్ని ఉపయోగించి ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినప్పటికీ, ప్రభుత్వ చర్యలపై లేదా దానిసంస్థలపై బలమైన పదజాలంతో వ్యాఖ్యానించడం ప్రభుత్వ నమ్మక ద్రోహంతో సమానం కాదని న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. ఒక వ్యక్తి వాడిన పదాలు ప్రభుత్వం పట్ల శత్రుత్వానికి, నమ్మకద్రోహానికి, ప్రజా అశాంతికి లేదా హింసకు ఉపయోగించడానికి దారితీయ నంత కాలం, అది రాజద్రోహ చర్య కాదు.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో సమాచారాన్ని వ్యక్తీకరించే, ప్రచురించే, ప్రచారం చేసే హక్కు మాత్రమే కాదు, సమా చారాన్ని స్వీకరించే హక్కు కూడా ఉంటుంది. సమాచార హక్కు చట్టం, 2005 ద్వారా పత్రికలతో సహా భారతీయ పౌరులకు ప్రజా సంస్థల నుండి సమాచారాన్ని అడిగే హక్కు ఉంది. పత్రికలతో సహా ఏ పౌరుడైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ బడ్జెట్ల వివరాలు, అమలు స్థితి, ఏదైనా ప్రభుత్వ సంస్థకు చేసిన ఫిర్యాదు / దరఖాస్తు స్థితి వంటి సమాచారాన్ని పొందవచ్చు. ఇటువంటి దర ఖాస్తును సాధారణంగా ఆర్టీఐ లేదా ఆర్టీఐ దరఖాస్తుగా సూచిస్తారు. ఎన్నికల అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకునే ఓటర్ల హక్కు, క్రికెట్ చూసే క్రీడాభిమానుల హక్కు, ప్రాణాలను కాపాడే మాదకద్రవ్యాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందే హక్కు తదితర అంశాలపై సుప్రీంకోర్టు వివిధ కేసుల ద్వారా చర్చించింది.ఇంటర్వ్యూలు నిర్వహించే హక్కు పత్రికల పరిమిత హక్కు. ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తి నుండి ఇష్టపూర్వక సమ్మతి ఉంటేనే దీనిని ఉపయోగించవచ్చు. దోషులను లేదా విచారణ ఖైదీలను ఇంటర్వ్యూ చేసే మీడియా హక్కును పరిశీలించిన అనేక కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ‘ప్రభాదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1982) కేసులో, పత్రికలకు సంపూర్ణమైన లేదా అపరిమితమైన సమాచార హక్కు లేదనీ, ఖైదీలు సమ్మతి తెలిపితేనే ఇంటర్వ్యూ నిర్వహించవచ్చనీ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘స్టేట్ వర్సెస్ చారులతా జోషి’ (1999) కేసులో సుప్రీంకోర్టు తీహార్ జైలులో బబ్లూ శ్రీవాస్తవను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే అండర్ ట్రయల్ ఖైదీ ఇంటర్వ్యూ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తేనే ఇంటర్వ్యూ చేయవచ్చు, ఫోటో తీయవచ్చు అని పేర్కొంది.కోర్టు ప్రొసీడింగ్స్ రిపోర్ట్ చేసే హక్కుపాత్రికేయులు కోర్టులో విచారణకు హాజరయ్యే హక్కును కలిగి ఉంటారు. న్యాయస్థానంలో చూసిన, విన్న ప్రొసీడింగ్స్‌ను ప్రచురించే హక్కును కలిగి ఉంటారు. అయితే న్యాయప్రయోజనాల దృష్ట్యా విచారణల ప్రచారాన్ని పరిమితం చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. సుప్రీంకోర్టు ‘నరేష్ శ్రీధర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ (1967) కేసులో దీనిని మరింత స్పష్టం చేసింది. ‘సహారా రియల్ ఎస్టేట్ వర్సెస్ సెబీ’ (2012) కేసులో న్యాయ ప్రయోజనాల దృష్ట్యా పత్రికలు ప్రచురించే కథనాలను పరిమిత కాలానికి వాయిదా వేసే అధికారం న్యాయస్థానాలకు ఉందని పేర్కొంది. ప్రచురణలో దురు ద్దేశం లేనంత కాలం పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల శాసన కార్య కలాపాలను నివేదించే హక్కు కూడా పత్రికలకు ఉంది. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ (ప్రచురణ పరిరక్షణ) చట్టం 1977లోనూ ఈ హక్కుంది.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో ప్రకటనలు చేసే హక్కు లేదా వాణిజ్య వాక్ హక్కు కూడా ఉన్నాయి. ‘టాటా ప్రెస్ లిమిటెడ్ వర్సెస్ ఎంటీఎన్ఎల్’ (1995) కేసు విషయంలో ఈ హక్కును సమర్థించారు. ‘హిందుస్థాన్ టైమ్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ’(2003) కేసులో ఆదాయాన్ని సృష్టించడంలో ప్రకటనలు పోషించే ముఖ్యమైన పాత్ర, అవి చలామణిపై ప్రత్యక్ష ప్రభావాన్ని ఎలా చూపుతాయో సుప్రీంకోర్టు చర్చించింది. తద్వారా వార్తాపత్రిక లలో ప్రకటనల హక్కును పునరుద్ఘాటించింది. ప్రకటనలను కుదించడం భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమేననీ, ఇది వార్తాపత్రి కల సర్క్యులేషన్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందనీ ‘సకాల్ పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో (1962) అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- పి. విజయబాబు -
పాలు అందరికీ అందుతున్నాయా?
అధికారిక డేటా ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2021–22లో 221 మిలియన్ టన్నులు. భారతదేశపు పాల ఉత్పత్తి మెజా రిటీ బర్రెల నుండి లభిస్తుండగా, ఆవు పాల వాటా పెరుగుతోంది. 2021 నాటికి ఆవు పాల వాటా 48.2%. 2019లో విడుదల చేసిన 20వ పశుగణన ప్రకారం, ఆవులు బర్రెలు, పాలు ఇచ్చేవి వట్టి పోయినవి కలిపి, దేశంలో మొత్తం పాడి పశువులు 12.57 కోట్లు. మునుపటి గణనమీద ఇది 6% పెరుగు దల. పాలు ఇచ్చే పశువుల సంఖ్య వేరుగా లేదు. వట్టి పోయిన పశువుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? పశువుల సంఖ్యలో పెరుగుదల ఎట్లా సాధ్యం? ప్రభుత్వం ఇస్తున్న లెక్కలకూ, క్షేత్ర పరిస్థితికీ మధ్య తేడా ఉన్నది. పలుచనవుతున్న పాలుదేశంలోని 110 బిలియన్ డాలర్ల పాడి పరిశ్రమలో డెయిరీ సహకార సంఘాలు, ప్రైవేట్ సంస్థలు, ‘అమూల్’, ‘మదర్ డెయిరీ’ వంటి ప్రభుత్వ సంస్థలతో కూడిన సంఘటిత రంగం వాటా కేవలం 30 బిలియన్ డాలర్లు. ఇది 30 శాతం కంటే తక్కువ. భారతదేశంలోని పాల ఉత్పత్తిలో సగానికి పైగా ప్రాసెస్ అవుతున్నది. అంటే నెయ్యి వగైరా వాటికి లేదా ఇతర ఉత్పత్తులలో ఒక ముడి పదార్థంగా వాడతారు. మిగిలిన 48% పాలుగా అమ్ముతున్నారు. నిత్యం పాలు వాడే హోటళ్ళు, స్వీట్ దుకాణాలలో పన్నీర్ కొరకు కూడా డిమాండ్ పెరుగుతోంది. పెద్ద హోటళ్ళు వాళ్ళకు అవసరమైన పాలను అధిక ధరకు కొని, వినియోగ దారుల నుంచి వసూలు చేయగలవు. దరిమిలా చిన్న హోటళ్ళు, చాయ్ దుకాణాలకు అంతగా పాలు దొరక కపోవచ్చు. లేదా ఆ ధర వాళ్ళు పెట్టలేరు. ముడి పాల కొరకు ఉన్న ఇటువంటి పోటీ గురించి, అంతర్గత డిమాండ్ గురించి, ఆ యా వినియోగ వర్గాలు చెల్లిస్తున్న ధరల గురించి విశ్లేషణలు లేవు. పోటీ పడలేని వ్యక్తులు, రంగాలు అసంఘటిత రంగంలోనే ఎక్కువ. పర్యవసానంగా, చాయ్ దుకాణాల చాయ్‌లో పాల ‘శాతం’ తగ్గుతున్నది. కొన్ని ఉత్పత్తులలో పాలు పలుచన అవుతున్నాయి.చిన్న పిల్లల ఎదుగుదలకు ముడి పాలు అవస రమని వైద్యులు, పోషకాహార నిపుణులు నిత్యం వల్లెవేస్తున్న తరుణంలో ‘అందరికీ పాలు’ దొరకక పోవడం అన్యాయమే. పేద వాడికి పాలు అందక పోవడం మన ఆహార వ్యవస్థలో ఉన్న తీవ్ర లోపం. ఈ లోపాన్ని సరిదిద్దే ప్రభుత్వ చర్యలు కావాలి. ఒక ఊర్లో ఉత్పత్తి అవుతున్న పాలు, ఇతర ఉత్పత్తులు అక్కడే, లేదా ఆ ప్రాంతంలోనే వినియోగం అయ్యే పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి.దిగుమతులతో దెబ్బతినే జీవనోపాధిఅమెరికా సహా వివిధ దేశాల నుంచి ఏటా రూ. 200–300 కోట్ల విలువైన పాల ఉత్పత్తులను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. 2020లో భారత ప్రభుత్వం 10,000 టన్నుల స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. 2023 జన వరిలో, దేశంలోకి పాలు, క్రీమ్ దిగుమతులు మునుపటి సంవత్సరం కంటే వెయ్యి శాతం పైగా పెరిగి 4.87 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ వంటి దేశాల నుండి వచ్చాయి.పాల ఉత్పత్తుల దిగుమతులను సరళీకృతం చేయా లని భారత్ మీద ఐరోపా కమ్యూనిటీ, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి ఒత్తిడి ఉన్నది. డెయిరీ ఉత్పత్తుల దిగుమతుల మీద సుంకాలు తగ్గించాలని వాణిజ్య ఒప్పందాలలో భాగంగా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో భారతదేశం నుండి డెయిరీ దిగుమతులకు నిబంధనలు పెట్టి రష్యా, యూరప్, మెక్సికో, చైనా అనుమతించడం లేదు. డెయిరీ దిగుమతులపై 60–70% సుంకం విధిస్తున్న అమెరికా, భారతదేశం విధించే 30–60% సుంకాలను తగ్గించాలని కోరుతున్నది. ఇంకొక వైపు అమెరికా తన డెయిరీ రంగానికి సంవత్సరానికి 28 బిలియన్ డాలర్ల సబ్సి డీలను ఇస్తుంది. పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే లక్షలాది మంది భారత చిన్న, సూక్ష్మ పాడి రైతుల జీవనోపాధి ఆగమైపోతుంది అనే ఆందోళన నెలకొంది.విధానాలు అనుకూలమేనా?ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 22%. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇది 5%. దాదాపు 7 కోట్ల మంది పాడి రైతులు ఉన్నారు. పాడి పరిశ్రమ జీవనోపాధులను, వాతావరణ మార్పులను, కులం, మతాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. వినియోగదారులు వివిధ రకాలగా పాలకు ధర చెల్లిస్తున్నారు. పంటల మాదిరే పాడి రైతుకు ఆ వినియోగం నుంచి వస్తున్న డబ్బులో ఎంత శాతం చేరుతున్నది అనే ప్రశ్న ఉన్నది. బర్రె మీద, ఆవుల మీద పెట్టాల్సిన ఖర్చుకు తగినట్టు ముడి పాలకు ధర లేదనీ, ఇంకా ఆదాయం సంగతి దేవుడెరుగు అనీ పాడి రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు అనేకం ఉన్నాయి. అందులో అనేకం చిన్న పాడి రైతులు అందుకోలేరు. భారత పాడిపరిశ్రమలో సరళీకృత విధానం చిన్న రైతులకు ముప్పు కలిగిస్తుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. పాడి రైతులకు భూమి దొరికే అవకాశం తగ్గిపోతున్నది. పట్టణాలలో, పట్టణ శివార్లలో భూమి ధరలకు రియల్ ఎస్టేట్ వలన రెక్కలు రావడం వల్ల చిన్న పాడి రైతు మనగలిగే పరి స్థితులు లేవు.సగటు రైతు ఆదాయం రూ. 7,000 అని ప్రభుత్వం అంటున్నది. పశుపోషణ ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. దేశంలోని రైతులు తమ మొత్తం పశుపోషణ ఆదాయంలో దాదాపు 67% పాడి ద్వారా సంపా దిస్తున్నారు. ఇంకా అనేక రకాల ఉపయోగం పాడి పశువులతో ఉంది. పర్యావరణం వినాశనం అవుతున్న తరుణంలో పశువుల వైవిధ్యం, ఆహారం, సుస్థిర జీవనం మీద దృష్టి పెట్టడం ముఖ్యం. పుడమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పశు పోషణ ఇంకా సమస్యాత్మకంగా మారుతున్నది. హైబ్రిడ్ జాతులతో, పాశ్చాత్య పశు పోషణ పద్ధతుల వల్ల కాలుష్యం పెరుగుతున్నది. అనారోగ్య పశువుల సంఖ్య పెరుగు తున్నది. శుభ్రత పాటించని ఆధునిక డెయిరీల వల్ల పశువుల వ్యాధులు మానవులకు సంక్రమిస్తున్నాయి. పశువులకు సరైన ఆహారం, జీవనం లేని కారణంగా వాటి పాలలో కూడా పోషకాలు ఉండటం లేదు. విషాలు, రసాయనాలు, యాంటీ బయాటిక్స్ వాటికి ఇవ్వడం వలన, వాటి పాల ద్వారా అవి మనుషులకు చేరుతున్నాయి.పశుపోషణలో సంప్రదాయ విజ్ఞానం, నైపుణ్యానికి చాలా విలువ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాడి పశువులను ప్రకృతి వనరుగా పరిగణించాలి. ఈ సూత్రం ఆధారంగా విధానం తీసుకురావాలి. పథకాలు వాటి సుస్థిరతకు, విస్తృతికి ఉపయోగపడే విధంగా రూప కల్పన చెయ్యాలి. స్థానిక పాడి రైతులను స్థానిక మార్కె ట్లతో అనుసంధానం చెయ్యాలి. పాలు, పాల ఉత్పత్తులు గ్రామాలలో ప్రథమంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. పాడి రైతులకు ప్రతి ఏటా చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను ప్రకటించి, అమలు చెయ్యాలి. పాల సహకార సంఘాల సంఖ్యను పెంచాలి. కేంద్రీకృత పాల మార్కెటింగ్ వ్యవస్థకు ఇచ్చే సబ్సిడీలు స్థానిక సహకార సంస్థలకు ఇవ్వాలి. భూమి వినియోగ విధానం రూపొందించి అందులో గడ్డి మైదానాలకు స్థానం కల్పించాలి. పశుగ్రాసానికి, దాణాకు సంబంధించి శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవాలి. పాడి రైతులకు భూమి ఇవ్వాలి. లేదా భూమి ఉన్న రైతుకు పాడి పశువులను అందజెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డివ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు