Guest Columns
-
కాల పరీక్షలో మన విదేశీ సంబంధాలు
దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్ నుండి వలస వెళ్తున్నవారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. అంతేకాదు, భారత్ అణు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అటువంటి దేశంతో భారత్ సంబంధాలు ఎందుకు క్షీణిస్తున్నట్లు? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ సిక్కు పౌరులను భారత్ హత్య చేయిస్తుందని ఆరోపించడం, దాదాపు అటువంటి ఆరోపణనే అమెరికా కూడా చేయడం వాతావరణాన్ని వేడెక్కించింది. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండవది... భారతదేశంపై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడదాకా వెళ్ళి ఆగుతుంది?గత దశాబ్దంలో ప్రపంచ వలస ప్రస్థానాలకు చెందిన ఒక ముఖ్యమైన కథ ఏమిటంటే... భారతీయ వలసలు గణనీయంగా పెరగడం. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, సింగపూర్ నుంచి దుబాయ్ వరకు, పోర్చుగల్ నుంచి ఇజ్రాయెల్ వరకు భారతీయుల వలసలు నానాటికీ పెరుగుతున్నాయి. 2014లో కెనడాలో కేవలం 38,364 మంది భారతీయులు శాశ్వత పౌరులుగా మారారు. 2022 నాటికి ఈ సంఖ్య ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో 1,18,095కి చేరుకుంది. దీనికి విరుద్ధంగా, 2022లో కేవలం 30 వేల మంది చైనీయులు మాత్రమే కెనడాకు తరలి వెళ్లారు. దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్ నుండి వలస వచ్చిన వారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. పైగా, భారతదేశ అణు సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అలాంటప్పుడు, రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి?భారతదేశం, ఆంగ్లోస్పియర్ (ఇంగ్లిష్ భాష, సంస్కృతి ప్రధానంగా ఉండే) దేశాల మధ్య సమస్య ఉందని స్పష్టమవుతోంది. విదే శాంగ విధానం, జాతీయ భద్రతతో స్వప్రయోజనాలు నెరవేర్చేందుకు దేశీయ రాజకీయ వ్యూహాలను ట్రూడో మిళితం చేశారని భారత అధి కారులు అభియోగాలు మోపారు. ట్రూడోకి కెనడియన్ సిక్కుల ఓటు అవసరం కాబట్టి వారి ఖలిస్తానీ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారు; ఆయన ప్రభుత్వం డ్రగ్ పంపిణీదారులు, భారత వ్యతిరేక ఉగ్రవాదు లకు ఆశ్రయం ఇస్తోందనీ వీరు ఆరోపించారు. దీనికి ప్రతిగా కెనడా పౌరులను హత్య చేయడానికి భారత ఇంటెలిజెన్స్ అధికారులు, దౌత్య వేత్తలు కుట్ర పన్నారని ట్రూడో ప్రభుత్వం ఆరోపించింది.మరోవైపు అమెరికా ఈ వివాదంలోకి అడుగుపెట్టి, కెనడియన్ సిక్కు హత్యను, అమెరికన్ సిక్కుపై ఇదే విధమైన ప్రయత్నానికి ముడి పెట్టింది. దీంతో దౌత్యపరమైన గందరగోళం ప్రారంభమైంది. త్వర లోనే ఇది పెద్ద గొడవగా మారి పరాకాష్ఠకు చేరింది. కెనడా, అమెరికా, బ్రిటన్లలో ఖలిస్తానీ అనుకూల క్రియాశీలత గురించి భారత్ ఫిర్యాదు... దేశీయ భద్రతా సమస్యలపై ఆధారపడింది. పాశ్చాత్య ప్రభుత్వాలు భారతదేశ ఆందోళనల పట్ల సున్నితంగా వ్యవహరించడం లేదన్న మోదీ ప్రభుత్వ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, దౌత్యవేత్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో సహా భారతీ యులకు వ్యతిరేకంగా కెనడా, అమెరికా చేసిన నేరారోపణలు తీవ్రమై నవి. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండోది... భారత్‌పై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుంది? రెండవ ప్రశ్న విషయానికి వస్తే, అమె రికా, కెనడా రెండూ పేర్లను కూడా పేర్కొన్నాయి. పైగా భారతీయు లపైనే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ఉంచాయి.మొదటి ప్రశ్న ముఖ్యమైనది. ఎందుకంటే కెనడా, అమెరికాలు భారతదేశంతో సహేతుకంగానే మంచి దౌత్య సంబంధాలను కలిగి ఉన్నాయి. పైగా చాలావరకు విచక్షణతో ఇవి విషయాలను నిర్వహించ గలవని ఆశించవచ్చు. మొదటి ప్రశ్నకు సంబంధించి కెనడియన్ సిక్కు ఓటర్లతో ఎన్నికల ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఆశతో ట్రూడో పక్షపాత రాజకీయాలు ఆడుతున్నారనేది భారత ప్రభుత్వ అధికారిక అభియోగం. ‘సరిహద్దు’ ఉగ్రవాద దాడులకు సంబంధించిన ఆరో పణలతో భారత రాజకీయ నాయకులు రాజకీయ పెట్టుబడి పెట్టారని పాకిస్తాన్ ఆరోపిస్తున్న రీతిని ఇది బాగా ధ్వనిస్తోంది. దేశీయ రాజకీ యాలతో జాతీయ భద్రతా సమస్యలను కలపడం రెండు మార్గాలనూ తొలగించివేస్తుంది. పైగా అటువంటి ఆరోపణలను మూడవ పక్షం వారు ఎలా చూస్తున్నారనే అంశంపై జాగ్రత్తగా ఉండాలి. బహుశా, ట్రూడో ప్రభుత్వాన్ని భారతదేశం విస్మరించే స్థాయిలో ఉందనే అభిప్రాయాన్ని కొందరు అర్థం చేసుకోవచ్చు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ప్రాథమిక ఆరోపణలు వచ్చినప్పుడు న్యూఢిల్లీలో ఇదే ప్రధానమైన అభిప్రాయంగా ఉండేది. తర్వాత, అమెరికా గడ్డపై కూడా, గురుపథ్వ సింగ్ పన్నూన్‌ను చంపడానికి భారత అధికారులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించడమే కాకుండా, చట్టపరమైన చర్యలను కూడా ప్రారంభించడం ద్వారా ముందడుగు వేసింది. ఇదంతా కేవలం స్నేహితుల మధ్య ఉన్న అపార్థం, అపమ్మకాల వ్యవహారమా? లేక దీంట్లో పెద్ద సమస్యలు ఇమిడి ఉన్నాయా? ఇంగ్లిష్ భాషాధిక్య దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, అమెరికా తమ ’ఫైవ్ ఐస్’ కూటమి ద్వారా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే, ట్రూడో ఎక్కువ ఓట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం ఏమంత విశ్వసనీయమైన ప్రతిస్పందనగా అనిపించదు. మరీ ముఖ్యంగా, పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలు తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని భారత ప్రభుత్వం ఎందుకు విశ్వసిస్తోందనే ప్రశ్నను అడిగి తీరాలి.ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ గత వారం తన విజయదశమి ప్రసంగంలో, పాశ్చాత్య ‘ఉదారవాద, ప్రజాస్వా మ్యాలు’ బంగ్లాదేశ్‌లో చేసినట్లుగా భారతదేశంలో ‘అరబ్ స్ప్రింగ్’ తరహా ‘వర్ణ విప్లవాలను’ ప్రదర్శించాలని యోచిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలతో సంబంధాలను వీక్షిస్తున్న ఈ విధానం భారతీయ విదేశీ, జాతీయ భద్రతా విధానాలకు సంబంధించి పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది.ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన పదవీ కాలంలో చేసిన అనేక ప్రసంగాలలో ‘భారతదేశం బాగుండాలని ప్రపంచం కోరుకుంటోంది, కానీ మన సవాళ్లు స్వదేశంలో ఉన్నాయి’ అని తరచుగా చెప్పే వారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఉదారవాద ప్రజాస్వామ్యాలు కలిసి జిహాదీ తీవ్రవాదం, నిరంకుశ చైనా పెరుగుదలపై భారతదేశంలాగే ఆందోళన చెందుతున్నాయనీ, అందువల్లే పాశ్చాత్య ఉదారవాద, ప్రజాస్వామ్య పాలనపై గురిపెట్టిన ఈ రెండు ప్రమాదాలకు వ్యతిరేకంగా భారతదేశం ఎదుగుదలకు అవి మద్దతునిచ్చాయన్న దృక్పథంపై ఈ అంచనా ఆధారపడి ఉంది.ఈ దృక్కోణం మారిందా? భారతదేశం ఇకపై ఆంగ్లోస్పియర్ను ‘మిత్రుడు’గా లేదా కనీసం దాని పురోగతిలో భాగస్వామిగా చూడ లేదా? చైనా, పాకిస్తాన్‌లు రెండింటినీ తన జాతీయ భద్రతకు ప్రమా దకారులుగా ప్రకటించిన భారత్ అదే సమయంలో పశ్చిమ ఉదార వాద ప్రజాస్వామ్యాలను దూరం చేసుకోగలదా? విదేశాంగ విధాన నిర్వాహకులు, జాతీయ భద్రతను నిర్వహించే వారి ఆలోచనల మధ్య తప్పు అమరిక ఏదైనా ఉందా? కెనడా ప్రధాని ట్రూడో ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తారు.కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణలో పెరుగుతున్న అమెరికా ప్రమేయం పెనుమంటగా మారడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థపై తక్షణ పర్యవసానాలను కలిగిస్తుంది. మొత్తంమీద ప్రపంచ పర్యావరణం నేడు భారత ఆర్థికవృద్ధికి, పెరుగుదలకి చాలా తక్కువ అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మోదీ ప్రభుత్వం, సంఘ్ పరివార్లు పశ్చిమ దేశాలపై, వాటి సంస్థలపై క్రమం తప్పకుండా విమర్శలు గుప్పించడం చూస్తే... పశ్చిమ దేశాలతో భారత్ సంబంధాలు పరీక్షకు గురవుతున్నట్లు, విశ్వాస సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తుంది. ట్రూడో వ్యవహారం కేవలం ఒక తీవ్రమైన అనారోగ్యపు లక్షణం కావచ్చు!సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మీడియా సలహాదారు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో...) -
ఇక సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం పోరాటం
ఊహించినట్లుగానే, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)–ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) కూటమి చక్కటి మెజారిటీతో నూతన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమ స్యాత్మకమైన పూర్వ రాష్ట్రం కోసం మనం ఏమి ఆశించగలం? మొదటి ప్రశ్న ఏమిటంటే, కొత్త ప్రభుత్వాన్ని సజావుగా పనిచేయడానికి అనుమతి స్తారా అనేది. లెఫ్టినెంట్ గవర్నర్ నిరంతరం ఎన్నికైన ప్రభుత్వానికి ఆటంకం కలిగించే విధంగా ఢిల్లీ తరహా పరిస్థితిని సృష్టిస్తారా అనే అనుమానం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ ప్రభుత్వ విషయంలో బహిరంగంగా చేసినట్లు కాకుండా, 2015–2018 మధ్య పీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు చేసినట్లుగా రహస్యంగానే వ్యవహరించే అవకాశం ఉందని నమ్ముతున్నాను. ఆ మూడేళ్ళలో వారు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తలపెట్టిన ప్రజల మధ్య వారధిని నిర్మించే ప్రయత్నాలను అడ్డుకున్నారు. పైగా విడిపోయిన వర్గాలను ప్రేరేపించడానికి పీడీపీ మంత్రులు, శాసనసభ్యులతో తమ కొత్త సంబంధాలను ఉపయోగించారు. వారు ఆ విధానాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తే, ఎన్సీ–ఐఎన్‌సీ కూటమి భాగస్వాములకు రెట్టింపు భారం ఉంటుంది. అదేమిటంటే ఎన్నికైన ప్రభుత్వంలా కొంత అధికారాన్ని నిలుపుకోవడం, వారి ఎమ్మెల్యేలను కలిపి ఉంచడం.కూటమికి ఈ రెండు పనులు సమాన ప్రాధాన్యం కలిగినవే. అయితే ఓటర్లు మొదటి కర్తవ్యం వైపే ఎక్కువగా చూస్తారు. ఇది నిజ సమయంలో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో విధాన రూపకల్పననూ, దాని అమలును చేపట్టడంతోనూ ముడిపడి ఉంటుంది. దాంతోపాటు అలా చేయడానికి అధికా రాన్ని పొందే పోరాటం కూడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిసేపటి ముందు ప్రకటించిన కొత్త పాలనా నియమాల ప్రకారం... భద్రత, ఆర్థిక వ్యవహారాలు, పోలీసు శాఖతోపాటు బ్యూరోక్రసీపై అన్ని కీలక అధికారాలు ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌కి దఖలుపడ్డాయి. కొత్త ప్రభుత్వ యంత్రాంగం మునిసిపాలిటీ స్థాయికి తగ్గింది. కొత్త ప్రభుత్వం... చిన్నదా పెద్దదా అనే అంశంతో నిమిత్తం లేకుండా ప్రతి అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంతో ఘర్షించవలసి ఉంటుంది.స్వతంత్ర మీడియా, భిన్నాభిప్రాయాలు లేదా నిరసన తెలిపే హక్కు వంటి ప్రాథమిక పౌర హక్కులను కాపాడాలని ఎన్నుకోబడిన ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రస్తుతం వాటికి అనుమతి లేదు. భద్రత అనేది ఘర్షణకు ప్రధాన మూలంగా ఉంటుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద వందలాది ఏకపక్ష కేసులు ఉన్నాయి. వాటికి తక్షణ పరిష్కారం అవసరం. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో ప్రజా భద్రతా చట్టాన్ని రద్దు చేస్తామని వాగ్దానం చేసింది. అయితే అలా చేయడానికి వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. సుప్రీం కోర్ట్ 2023 డిసెంబర్లో ఇచ్చిన తీర్పులో సిఫార్సు చేసిన విధంగా పూర్తి రాష్ట్ర హోదాను త్వరగా పున రుద్ధరించడం ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. ఆర్టికల్ 370 పిటిషన్లపై 2023 నాటి సుప్రీంకోర్టు విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన ప్రకటన ప్రకారం... మోదీ పరిపాలన పూర్తి పునరుద్ధరణ కంటే దశలవారీగా పునరుద్ధ రణ దిశగా ఆలోచిస్తోంది. దశల వారీ విధానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోని పక్షంలో, పూర్తి రాష్ట్ర హోదా కోసం ఉద్యమం అనేది ప్రతి చిన్న అధికారానికి సుదీర్ఘకాలంపాటు సాగే దశల వారీ పోరాటం కావచ్చు.చట్టపరంగా, దశలవారీగా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు వ్యతిరేకంగా చేస్తున్న వాదన బలంగా ఉంది. రాష్ట్ర హోదా పునరుద్ధరింపబడుతుందని చెప్పినందున రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి తగ్గించవచ్చా అనే దానిపై కోర్టు తీర్పు ఇవ్వలేదు. సొలిసిటర్ జనరల్ ప్రకటించిన దశల వారీగా పునరుద్ధరణను ఎందుకు సవాలు చేయలేదు అనేది ఎవరికి వారు అంచనా వేసుకోవలసిందే. కానీ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం స్థాయికి తగ్గించలేకపోతే, రాష్ట్ర హోదాను దశలవారీగా పునరుద్ధరించడం సాధ్యం కాదని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర హోదా కోసం ఇటీవల ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లో ఇది ఇప్పటికే లేవనెత్తక పోయి ఉంటే... ఇది రాజ్యాంగపరమైన సమస్య అవుతుంది.నిరుద్యోగం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే జమ్మూ కశ్మీర్లో చాలా ఎక్కువగా ఉంది. కొత్త భూసేకరణ నిబంధనల నుంచి స్థానిక కంపెనీలకు కాకుండా జాతీయ సంస్థ లకు మైనింగ్, వినియోగ వస్తువులు, పర్యాటక లైసెన్సుల మంజూరు వరకు గత ఐదేళ్లలో చేపట్టిన చాలా విధానాలను సమీక్షించి, అవసరమైన చోట వాటిని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది.కేంద్ర ప్రభుత్వ పెద్దలు, లెఫ్టినెంట్ గవర్నర్ తెలివైన వారైతే, కొత్త ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉండి, అది నాయకత్వం వహించడానికి అనుమతిస్తారు. అయితే, ఈ ప్రభుత్వం తాను నిర్వహించాల్సిన విధులను నెరవేర్చడంలో విఫలమైతే, తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లు బీజేపీనీ లేదా మరింత అనుకూలమైన ప్రాంతీయ వర్గాలనూ ఆశ్రయించవచ్చనే భావనతో ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకునే ప్రలోభం కూడా ఉండవచ్చు.మొత్తం మీద కొత్త ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రజలకూ రాబోయే రోజులు కీలకం కానున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లేదా ఢిల్లీలో తన తోటి గవర్నర్లు ఆడిన గేమ్‌లు... ఈ అస్థిరమైన సరిహద్దు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ అర్థం చేసుకుంటారని మనం ఆశించాలి. ఇక్కడ పాకిస్తాన్ ఆధారిత సాయుధ సమూహాలు ఏ చిన్న తప్పునుంచైనా ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తాయి. అది నిజంగానే జాతీయ ప్రయోజనాలకు భంగకరం.రాధా కుమార్ వ్యాసకర్త ‘ప్యారడైజ్ ఎట్ వార్: ఎ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్’ రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో...) -
పాలు స్వచ్ఛంగా ఉన్నాయా?
ఆధునిక జీవితంలో పాలు తాగడం మంచిదని అనేకులు భావిస్తారు. ఆ మేరకు నిత్యం పాల అవసరం పెరిగింది. పాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల పరిమాణం, వైవిధ్యం కూడా పెరిగింది. అందుకే కొందరికే పాలు అందుతున్నాయి. పాలు, మజ్జిగ విరివిగా దొరికే పల్లెలలో ఉదయం 8 దాటితే పాలు ఉండటం లేదు. మరోవైపు పాల ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నది. సహజ పశువుల మేత తగ్గుతున్నది. పశువులు మేసే గడ్డి మైదానాలు దాదాపు లేనట్లే! పశువులకు కావాల్సిన నీరు, నీడ సహజంగా దొరికే పరిస్థితులు లేవు. ఇంకొక వైపు పాల నాణ్యత మీద అనుమానాలు పెరుగుతున్నాయి. పాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి.పాల కథ –1 పశువులు స్వేచ్ఛగా తిరగగలిగే ప్రదేశాలు దాదాపుగా లేవు. చెట్లు, కమ్యునిటీ స్థలాలు తగ్గినాయి. గుట్టలు కూడా ప్రైవేటు పరం అవుతున్నాయి. దానివల్ల పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్నది. పశు పోషకుల సంఖ్య తగ్గుతున్నది. పాడి పశువులను పోషించే జ్ఞానం, నైపుణ్యం తగ్గుతున్నది. వరి, జొన్న, మక్క లాంటి పంటల నుండి వచ్చే మేత కూడా లేదు. చొప్ప, ఎండు గడ్డి వంటివి రైతులు పొలంలోనే కాలబెడుతున్నారు. పశు గ్రాసం ప్రత్యేకంగా పండించాల్సి వస్తున్నది. పశు పోషకులకు భూమి లేదు. ఉన్నా ఆ భూమి ఇతర ఉపయోగాలకు వాడటం వల్ల పశుగ్రాసం మీద శ్రద్ధ లేదు. వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు పశు వులను పోషించడం లేదు. ఆ యా పంటలకు రసాయనాలు పిచికారీ చేయడం వల్ల పశువులు తినలేవు. తిన్నా అనారోగ్యం పాలు కావచ్చు. చనిపోవచ్చు కూడా. జన్యుమార్పిడి బీటీ ప్రత్తి చేలలో తిరిగిన పశు వులు, గొర్రెలకు చర్మవ్యాధులు వచ్చినాయి. ఆకులు తిన్న గొర్రెలు చనిపోయినాయి. దరిమిలా, పాశ్చాత్య దేశాల మాదిరి ‘స్టాల్ అని మల్స్’ పరిస్థితికి చేరుకుంటున్నాము. పెద్ద డెయిరీలతో కాలుష్యంపాడి పశువులను ఒకే దగ్గర కట్టేసి, పాలు పిండి అమ్మే వ్యాపార వ్యవస్థను డెయిరీ అని పిలుస్తారు. చైనా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో డెయిరీగా పిలిచే పశు పాలు, మాంసం ఉత్పత్తి కేంద్రాలు చాల పెద్దవి. వాటిని ఫ్యాక్టరీ ఫామ్స్ అంటారు. ప్రపంచంలో అతి పెద్ద 10 ఫ్యాక్టరీ ఫామ్స్‌లో పై రెండు చైనాలో ఉన్నాయి. తరువాత 8 ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అతి పెద్ద చైనా ఫామ్‌లో లక్ష ఆవులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఒక ఫ్యాక్టరీ ఫామ్‌లో కేవలం యాభై మంది 55 వేల పశువులను నిర్వహిస్తారు. ఇటువంటి ఫ్యాక్టరీ డెయిరీలు ప్రపంచ పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించాయి. వీటి నుంచి వచ్చే రసాయన, కాలుష్య జలాల వలన నీటి వనరులు కలు షితం అవుతున్నాయి. క్రిమి–కలుపు సంహారకాలు, హార్మోన్లు,యాంటీ బయాటిక్స్, ఫాస్ఫేట్ అధికంగా ఉండే ఎరువులు, బ్యాక్టీ రియా–సోకిన ఎరువులు దీనికి కారణం.అమెరికాలో 2022 నాటికి పాతిక వేల డైరీ ఫామ్‌లు ఉన్నాయి. 10,000 మంది డెయిరీ రైతులు ఉన్నారు. 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమిలో పాడి రైతుల సంఖ్య 1.34 లక్షలు. ఇక్కడ అత్యధికంగా పాడి ఆవులను పోషించే దేశాలు జర్మనీ, ఫ్రాన్ ్స, నెద ర్లాండ్స్. భారతదేశంలో పది పశువులు లేదా అంతకంటే తక్కువ ఉన్న డెయిరీ ఫామ్‌లు 7.5 కోట్లు. భారత్‌లోనే చాలావరకు డెయిరీ ఫామ్‌లు చిన్న–స్థాయి, కుటుంబ యాజమాన్యంతో నడిచేవి.అంత పెద్ద డెయిరీ ఫామ్‌లు భారతదేశంలో లేకున్నా పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచం మొత్తంలో 24% వాటాను అందిస్తున్న ఈ ఉత్పత్తి దాదాపు 21 కోట్ల టన్నులు. అధిక పాల దిగుబడికి పేరుగాంచిన భారతదేశంలో బర్రెల జనాభా ఎక్కువ. అయినా పాడి పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. ప్రాథమిక పాడి రైతు లకు గిట్టుబాటు ధర రాని పరిస్థితులున్నాయి.పాలు ఇచ్చే పశువులు బర్రెలు, ఆవులు. ఇవి ఎక్కువగా భారత దేశంలో వాడతారు. పాలు ఇంకా వివిధ రకాలుగా తీసుకోవడం జరుగుతుంది. గాడిద పాలు, మేక పాలు శ్రేష్ఠమైనవి అని భావించే వారు ఉన్నారు. బెంగళూరులో ఒక కుటుంబం గాడిదతో పాటు ఇంటింటికి తిరుగుతూ లీటర్ రూ.500లకు అమ్ముతున్న వైనం చూశాం. మొక్కలు, పండ్ల నుంచి వచ్చే పాలు కూడా ఈ మధ్య ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా పండించే సోయా నుంచి తీసే పాలు అనేక ఆహార పదార్థాలలో వాడుతున్నారు. అయితే పశువుల నుంచి పాలను సేకరించడం హింసగా భావించే వారు ఉన్నారు. పశువుల పాలు పడనివారు మొక్కల పాలను ఆశ్ర యిస్తున్నారు. ఇటీవల మొక్కల నుంచి తీసుకునే పాల వ్యాపారం విపరీతంగా పెరిగింది. 2019లో మొక్కల పాల మార్కెట్ విలువ 12 బిలియన్ డాలర్లు దాటిందని అంచనా.పశువు ఒక యంత్రమా?తరతరాల నుంచి పాలు సేకరించి జీవించే యాదవులు, ఇంకా ఇతర వృత్తుల వారు ఉన్నారు. పశువులకు రోగాలు రాకుండా చూసుకునే జ్ఞానం, నైపుణ్యం వీరికి సంప్రదాయంగా ఉండింది. వీరు చేసే వ్యాపారంలో పాడి పశువులను ప్రేమగా చూసుకోవడం కీలకం.అందినంత పిండుకునే తత్వం లేదు. లేగ దూడను తల్లి నుంచి వేరు చేయరు. ఫలితంగా, పాలు నిత్యం ఒకే పరిమాణంలో ఉండేవి కావు. ఉండవు కూడా. పాలు ప్రకృతి ఉత్పత్తి. ఒక మర యంత్రం నుంచి వచ్చినట్లు రోజు ఒకే పరిమాణంలో రావాలని లేదు.పశువులకు ఇవ్వాల్సిన గ్రాసం, దాణా, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగాయి. రాను రాను ఒక కుటుంబం ఆధారపడే పాడి పశువుల జీవ నోపాధి సమస్యలలో పడింది. ప్రభుత్వాలు పాడి పశువుల కొనుగోలుకు కొన్ని పథకాలు పెట్టాయి తప్పితే, పశు గ్రాసం కొరకు కావాల్సిన భూమి, పశు వుల నివాసానికి భూమి వగైరా వాటి మీద దృష్టి లేదు.పాశ్చ్యాత్య దేశాలు పాడి పశువును ఒక యంత్రంగా మార్చాయి. పాల ఉత్పత్తి పెంచడానికి ‘హైబ్రిడ్’ అవును తెచ్చారు. అది సరి పోలేదని ఆవుల పొదుగును రెండింతలు, మూడింతలు పెంచారు. ఆ పొడుగులతో అవి నడవలేక యాతన పడుతున్నా పట్టించుకోలేదు. దాణాలో మార్పులతో పాల ఉత్పత్తి పెరుగుతుందని భావించి అందులో మార్పులు చేస్తూనే ఉన్నారు. గడ్డి తినే ఆవులకు లేగ దూడల మాంసం తినిపించినందుకు బ్రిటన్‌లో పూర్వం ‘మ్యాడ్ కౌ’ వ్యాధి వచ్చి అనేక ఆవులు చనిపోయినాయి. పశువుల శరీరాన్ని ఒక పరిశోధన కేంద్రంగా మార్చేశారు. అనుచిత ఆహారం ఇవ్వడం వల్ల పశువులకు వ్యాధులు వస్తున్నాయి. అపాన వాయువు ఎక్కువ అవుతున్నది. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తు న్నది అని చెప్పి, ఇప్పుడు పాడి పశువులలో ‘జన్యుమార్పిడి’ ప్రయ త్నాలు కూడా చేస్తున్నారు. ఈ రకమైన పరిశోధన మానవుల నైతిక తను ప్రశ్నిస్తున్నది. జన్యుమార్పిడి పాడి పశువుల ద్వారా ఔషధాలను ఉత్పత్తి చేయడం, పాల దిగుబడిని పెంచడం, వ్యాధులను నిరోధించాలని పరిశోధనలు చేస్తున్నారు. కొమ్ములు రాని జన్యు మార్పిడి పాడి పశువుల గురించిన పరిశోధన చేస్తున్నారు. కొమ్ములు ఉంటే ఇతర పశువులను, యజమానులను పొడుస్తున్నాయని ఈ రక మైన పరిశోధనలు చేస్తున్నారు. మేలు జాతి పశువుల కొరకు అవలంబిస్తున్న కృత్రిమ గర్భధారణ పద్ధతి కూడా ఫలించడం లేదు. ఫలించక పోగా, మేలు స్థానిక పశు జాతులను కలుషితం చేస్తున్నారు. పాల ద్వారా విషాలుపాడి పశువులు కాలుష్యపు నీళ్ళలో పెరిగిన గడ్డి మేస్తే, ఆ గడ్డి నుంచి కలుషితాలు వాటి శరీరంలోకి చేరి, పాల ద్వారా మనుష్యులకు చేరతాయి. కొన్ని రకాల గడ్డి భార లోహాలను నేల తీసుకుంటుంది. ఆ గడ్డి ద్వార సీసం, ఇంకా ఇతర ప్రమాదకర భార లోహాలు పాలు తాగే వారికి చేరుతున్నాయి. పాడి పశువులకు ఇచ్చే దాణా ద్వారా కూడా మనుషులు తమను తామే కలుషితం చేసుకుంటున్నారు. పడేసిన చికెన్ బిరియాని, బ్రెడ్డు ముక్కలు వగైరా బర్రెలకు, ఆవులకు పెడుతున్నారు. పాడి పశువులకు ఇచ్చే ఆహారాన్ని బట్టి పాలు ఉంటాయని పశువుల యజమానులకు తెలుసు. వినియోగదారులకు తెలియదు. తెలిసినా ఏమి చేయలేక మిన్నకుంటారు. సహజ గ్రాసం తినని పశువు పాలలో పోషకాలు ఉండే అవకాశం తక్కువ. పాలలో తగ్గిపోతున్న పోషకాల మీద మన దేశంలో పరిశోధనలు లేవు. చెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
World Food Day 2024 : ఆహార భద్రత ఏదీ?
1945లో ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) స్థాపన తేదీని గుర్తుచేసుకోవడానికి అక్టోబర్ 16న ప్రతి సంవత్సరం ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ జరుపుకొంటున్నాం. ఆకలి, ఆహార భద్రతకు సంబంధించిన ఇతర సంస్థలు... ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి వంటివి ఈ రోజును ఘనంగా జరుపుకుంటాయి.ఆకలిని ఎదుర్కోవడానికి, సంఘర్షణ ప్రాంతాలలోశాంతికి దోహదపడటానికి, యుద్ధం సంఘర్షణలకు ఆకలిని ఉపయోగించడాన్ని ఆపడంలో ప్రముఖ పాత్ర పోషించినందుకు ప్రపంచ ఆహార కార్యక్రమం 2020లో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. ‘ప్రపంచ ఆహార దినోత్సవం 2024’ యొక్క సారాంశం ‘మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ఆహార హక్కు’. 2022 నివేదిక ప్రకారం ఆహార భద్రత కలిగిన మొదటి ఐదు దేశాలు ఫిన్లాండ్, ఐర్లాండ్, నార్వే, ఫ్రాన్స్, నెదర్లాండ్‌లు. అత్యంత ఆహార అభద్రత ఉన్న దేశాలు యెమెన్, హైతీ, సిరియాలు. భారతదేశంలో ఆహార భద్రత ప్రధాన ఆందోళన కలిగిస్తోంది. 2022లో, ప్రపంచ ఆహార భద్రతా సూచిక పరంగా 113 ప్రధాన దేశాలలో భారత దేశానికి 68వ స్థానాన్ని ఇచ్చింది. 2024లో, ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ –2024) ప్రకారం 127 దేశాలలో భారతదేశం 27.3 స్కోరుతో 105వస్థానంలో ఉంది. దేశంలో 27 కోట్ల మందిఆకలితో ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ జనాభాలో అధిక భాగం వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, దేశంలో పెరుగుతున్న జనాభా కారణంగా అందరికీ ఆహారం లభించడం సవాలుగా ఉంది. కరవు, వరదల అస్థిర చక్రాలను దేశం అనుభవిస్తున్నందున, వాతావరణ మార్పుల కారణంగా భారతదేశం ఆహార భద్రత ముప్పులో ఉంది. దేశంలో సగటు కంటే కొంచెం ఎక్కువ వర్షపాతం మాత్రమే నమోదవుతున్నప్పటికీ, అవపాతం హెచ్చుతగ్గులు వివిధ ప్రాంతా లలో తీవ్రంగా మారుతూ పంటలను అస్థిరపరుస్తున్నాయి. ఆహార భద్రతను మెరుగుపరచడానికి... ఆహారాన్ని వృధా చేయడాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, న్యాయమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహించడం, వైవిధ్యంపై శ్రద్ధ చూపడం, దిగుబడి అంతరాన్ని తగ్గించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఆహార అభద్రతకు పరోక్ష కారణాలను పరిష్కరించడం వంటి మార్గాలు అవసరం.– డా. పి.ఎస్. చారి మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్, తిరుపతి -
‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే సమూలంగా మార్చివేసిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నిక కోసం ఎప్పుడో సన్నద్ధమైపోయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారానికి తెర పడ్డప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తూ రాజకీయ ప్రసంగం చేయడం ఇందుకు నిదర్శనం. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్‌లో ఇప్పుడిప్పుడే కద లిక ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ సన్నద్ధతపై ఆ పార్టీ విజయమొక్కటే ఆధారపడి లేదు. బీజేపీకి, దాని నేతృత్వంలోని ఎన్డీఏకు సవాల్ విసురుతున్న ‘ఇండియా’ విపక్ష కూటమి బలం పుంజుకోవడం కూడా కాంగ్రెస్ మంచి చెడుల పైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రవర్తన మీద!మహారాష్ట్ర, రెండు కూటములకూ ఎంతో కీలకమైన రాష్ట్రం. ప్రతి కూటమిలోనూ కనీసం మూడేసి ముఖ్య మైన భాగస్వామ్య పక్షాలున్నాయి. బీజేపీతో శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లు జట్టుకట్టి ఏర్పడ్డ ‘మహాయుతి’ కూటమి ఎన్డీఏ శిబిరంలో ఉంది.కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న శివసేన (ఉద్దవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్)ల ‘మహా వికాస్ ఆఘాడి’ (ఎమ్వీఏ) ఇండియా శిబిరంలో ఉంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర సంక్లిష్ట రాజకీయాల్లో కూటమి విజయాలన్నవి భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తుల సాఫల్యతను బట్టి ఉంటాయి. 2019 ఎన్నికల తర్వాత ఎన్నో రాజకీయ పరిణా మాలు వేగంగా మారుతూ వచ్చాయి. కలిసి ఎన్నికల్లో పోరిన బీజేపీ– శివసేన పార్టీలు గెలిచి కూడా సర్కారు ఏర్పరిచే సఖ్యత కుదరక విడిపోయాయి. ఎన్సీపీ–కాంగ్రెస్ జోడీతో చేతులు కలిపి శివసేన ‘ఎమ్వీఏ’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త పొత్తులతో ఏర్పడ్డ ఎమ్వీఏ ప్రభుత్వం కొంత కాలానికే కుప్ప కూలింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ‘చొరవ’ తీసుకొని, శివసేన చీలికవర్గం (తమదే అసలు శివసేన అంటారు) నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొంత కాలం తర్వాత, ఎన్సీపీ నుంచి చీలి వచ్చిన (వీరిది అదే రాగం) అజిత్ పవార్‌ను ఉపముఖ్యమంత్రిని చేసి, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ చీలికలు మహా రాష్ట్ర ప్రజలకు నచ్చినట్టు లేదు, అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాలక కూటమికి చుక్కెదురైంది. 48 లోక్‌సభ స్థానాలకుగాను మహాయుతికి 17 స్థానాలు దక్కితే, ఎమ్వీఏ 30 స్థానాల్లో నెగ్గి సత్తా చాటింది.ఇదివరకటిలా కాకుండా, రాహుల్‌గాంధీ రాజకీయంగా కొంత రాటుదేలుతున్నాడనే భావన ప్రజాక్షేత్రంలో వ్యక్తమౌతోంది. పొత్తుల్లో కొన్ని సార్లే కాంగ్రెస్ లాభపడ్డా, ఆ సానుకూల వాతావరణం వల్ల మిత్రులకు మేలు కలిగిన సందర్భాలే ఎక్కువ. 2004 తర్వాత మళ్లీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. పొత్తుల్లో పట్టువిడుపులు లేకుండా కాంగ్రెస్మొండికేసిన చోట, వారి వల్ల మిత్రులు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు బట్టి ఎక్కువ సీట్లు తీసుకొని, తక్కువ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కారణంగానే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కోల్పోయారనే భావన అత్య ధికుల్లో ఉంది. 243 స్థానాల్లో మ్యాజిక్ నంబర్ 122 అయితే ‘మహా ఘట్ బందన్’ 110 వద్ద ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 12 సీట్లు తగ్గాయి. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 19 చోట్ల మాత్రమే నెగ్గింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇటీవల ముగిసిన జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఒమర్ ఫరూక్ పరిస్థితి అట్లానే ఉండేది! 90 సీట్లకు, పొత్తుల్లో 51 చోట్ల పోటీ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ 42 చోట్ల నెగ్గితే, 32 స్థానాలు తీసుకొని (మరో 5 చోట్ల స్నేహపూర్వక పోటీలో ఉండి) 6 చోట్ల మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది. హరియాణాలో, ‘ఇండియా’ కూటమి పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పొత్తుల్లో పది స్థానాలు (90లో) ఇవ్వడానికి వెనుకాడిన కాంగ్రెస్, వారు దాదాపు అంతటా పోటీ చేయడానికి పురిగొల్పింది. సమాన ఓటు వాటా (సుమారు 40 శాతం) పొందిన బీజేపీ, కాంగ్రెస్ మధ్య సీట్ల తేడా 11 మాత్రమే! కానీ, ఆప్‌కు సుమారు 2 శాతం ఓటు వాటా లభించింది.క్షేత్రంలోని వాస్తవిక బలం తెలుసుకొని, పొత్తుల్లో కొంచెం తగ్గితే వచ్చే నష్టమేంటి? ఈ సంస్కృతి కాంగ్రెస్ మరచిపోతోంది. ఇటువంటి పరిస్థితే లోగడ తలెత్తినపుడు... సోనియాగాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెనుకంజకు సిద్ధపడింది. ‘బీజేపీని, దాని నేతృత్వపు ఎన్డీఏను గద్దె దించడానికి ప్రతి యుద్ధం ప్రకటించాలి. ప్రతి పోరూ సాగించాలి. ఏ త్యాగానికైనా సిద్ధ పడాలి’ అని బెంగళూర్ (2001)లో జరిగిన ప్లీనరీలో నిర్ణ యించారు. ఆ మేరకు రాజకీయ తీర్మానం ఆమోదించారు. 2002 మౌంట్ అబూలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య మంత్రుల కాంక్లేవ్‌లో, ఈ పంథాకు సోనియాగాంధీ మరింత స్పష్టత ఇచ్చారు. ‘ఛాందసవాదుల్ని గద్దె దించ డానికి లౌకిక శక్తుల్ని ఏకం చేయాలి... మన లక్ష్యం సొంతంగా ప్రభుత్వం ఏర్పరచడమే, కానీ, అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకూ మనం సంసిద్ధంగా ఉండాలి’ అని ఆమె ఉద్బోధించారు. నేను స్వయంగా విని, రిపోర్ట్ చేసిన, 1997 కలకత్తా ప్లీనరీలో సీతారాం కేసరి అధ్యక్షోపన్యాసం... ‘ఇది సంకీర్ణాల శకం అనుకోన వసరం లేదు. కాంగ్రెసే ఓ విజయవంతమైన సంకీర్ణం. మనకు ఏ పార్టీలతో పనిలేదు. సొంతంగా సర్కారు ఏర్ప రిచే సత్తా మనకుంది...’ అన్న ఆలోచనాసరళి దిశనే సోనియాగాంధీ పూర్తిగా మార్చేశారు. దీనికి, 1999 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కొత్త పాఠాలు నేర్చు కోవడమే కారణం. వివిధ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ‘కాంగ్రెస్ వ్యతిరేక ధోరణి’ తారస్థాయికి చేరి, అప్పుడు తేలిగ్గా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ‘పొత్తు లతో మాత్రమే కాంగ్రెస్ గెలువగలదు...’ అని ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ 2003 డిసెంబరులో ఇచ్చిన నివేదికతో సోనియా ఈ దిశలో మరింత క్రియా శీలమయ్యారు. 2004 ఎన్నికల్లో దాన్ని పక్కాగా అమలు పరచి, ఎన్నికలు గెలిచి, కాంగ్రెస్ నేతృత్వంలో విజయవంతంగా ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశారు. ‘త్యాగాలు’ అనే మాట ఊరకే రాలేదు. రాజీవ్‌గాంధీ హత్యలో డీఎమ్‌కేకు భాగముందని కాంగ్రెస్ స్వయంగా విమర్శించినా... తమిళనాడులో ఆ పార్టీతోనే పొత్తుపెట్టుకున్నారామె. ఆమె జాతీయతనే ప్రశ్నించి కాంగ్రెస్‌ను చీల్చిన శరద్‌పవార్ నేతృత్వపు ఎన్సీపీతో మహారాష్ట్రలో ఆమె పొత్తులకు సిద్ధమయ్యారు. సఖ్యతకు తలుపులు తెరచిన కమ్యూనిస్టులతో జతకట్టి యూపీఏను విజయతీరాలకు చేర్చారు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యమపార్టీ టీఆర్ఎస్తో చేతులు కలిపి గెలి చారు. ఈ పంథాయే ఇప్పుడు కాంగ్రెస్‌కు శరణ్యం.2029 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే రాజకీయ పునరేకీకరణలకు కాంగ్రెస్ వ్యూహరచన చేయొచ్చు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమా చల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు సరేసరి! మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,పంజాబ్, జార్ఖండ్, కేరళ వంటి రాష్ట్రాల్లో మరింత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ కూటములను బలోపేతం చేసుకోవచ్చు. ఇతర ‘ఇండియా’ పక్షాలు లేని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిషా వంటి రాష్ట్రాల్లో కొత్త మిత్రుల్ని వెతుక్కోవచ్చు. అయితే వారే పేర్కొన్నట్టు ‘త్యాగాల’కు సిద్ధమైతే తప్ప పొత్తు ధర్మం పొద్దు పొడ వదు, రాజకీయ ఫలం సిద్ధించదు!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,‘పీపుల్స్ పల్స్’ డైరెక్టర్ -
బలహీనులకు అణ్వస్త్రాలే బలమా?
పశ్చిమాసియా ప్రస్తుత పరిణామాల సందర్భంలో బలహీనమైన దేశాలకు అణ్వస్త్రాలే బలమా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. చైనా నుంచి అణ్వస్త్ర ప్రమాదం లేనట్లయితే భారతదేశం ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రాలు తయారు చేసుకునేదా? భారత్ నుంచి అదే ప్రమాదం లేనట్లయితే పాకిస్తాన్ తన అస్త్రాలు ఉత్పత్తి చేసుకునేదా? అమెరికా, రష్యాల అణు ప్రమాదం లేని పక్షంలో చైనా గానీ, అమెరికా ప్రమాదం లేని స్థితిలో సోవియెట్ యూనియన్ గానీ అణ్వాయుధాలు చేసేవా? వియత్నాం వద్ద అణ్వాయుధ శక్తి ఉండి ఉంటే, మొదట ఫ్రాన్స్, తర్వాత అమెరికా ఆ చిన్న దేశాన్ని ఏళ్ళ తరబడి ధ్వంసం చేసేందుకు సాహసించేవా? సూటిగా అడగాలంటే, పాలస్తీనాకు అణ్వస్త్ర శక్తి ఉండినట్లయితే ఇజ్రాయెల్ ఈ తరహా యుద్ధానికి పాల్పడి ఉండేదా?బలహీనమైన దేశాలకు బలవంతుల నుంచి ఆత్మరక్షణకు అంతిమంగా అణ్వస్త్రాలే శరణ్య మవుతాయా అన్నది ఆలోచించదగ్గ ప్రశ్న. మరీ ముఖ్యంగా తక్కిన ప్రపంచం, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ప్రేక్షక పాత్ర వహిస్తు న్నప్పుడు. బలహీనమైన దేశాలకు అణ్వస్త్రాలే బలమా, రక్షణా అని పశ్చిమాసియా ప్రస్తుత పరిణామాల సందర్భంలో చర్చించటానికి ముందు... ఇపుడు ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యాలు తమ అణ్వస్త్రాలను కవచంగా మార్చుకుని ఎంత భద్రతను అనుభవిస్తున్నాయో గమనించాలి. సూటిగా అడగాలంటే, పాలస్తీనాకు అణ్వస్త్ర శక్తి ఉండినట్లయితే ఇజ్రాయెల్ వంటి శక్తిమంతమైన దేశం గాజాలో గానీ, వెస్ట్ బ్యాంక్‌లో గానీ, తాజాగా లెబనాన్‌లో గానీ ఈ తరహా యుద్ధానికి పాల్పడి ఉండేదా? ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చి మొత్తం పశ్చిమాసియా స్థితి గతులనే మార్చి వేయగలమనే ఇటీవలి హెచ్చరికలను ఒకవేళ ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలు తయారు చేసుకుని ఉండినట్లయితే జారీ చేయగలిగేదా? ఈ ప్రశ్నలన్నింటి ఉద్దేశం ప్రపంచం అంతా అణ్వస్త్రాల మయం అయిపోవాలని సూచించటం కాదు. అవెంత వినాశనకరమైనవో అమెరికన్ల హిరోషిమా, నాగసాకి ప్రయోగాల అనుభవం తర్వాత ఎవరికీ చెప్పనక్కర లేదు. ఉద్దేశపూర్వకంగా కాకున్నా ప్రమాదవ శాత్తునో, ఏదైనా యాంత్రికపరమైన పొరపాటు వల్లనో ఏ అగ్రరాజ్య శిబిరం వైపు నుంచో అణు ప్రయోగం జరిగి మరుక్షణం ఎదుటి శిబిరం కూడా వాటిని ప్రయోగించటం జరిగితే పరిస్థితి ఏమిటని? అసలు అణ్వస్త్రాలు అన్నవే మొత్తం మానవాళికి ఒక భయంకర స్థితి అనటంలో ఎటువంటి సందేహాలు లేవు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి, అణ్వస్త్ర దేశాల వద్ద గల అణ్వాయుధాల పరిమితికి, కొత్తగా అణు పరీక్షలపై నియంత్రణకు, రోదసీలో అస్త్రాల మోహరింపుపై నిషేధానికి అనేక ఒప్పందాలు జరిగాయి. కానీ వాటన్నింటి ఉల్లంఘనలు జరుగు తున్నాయన్నది గమనించవలసిన విషయం.పాలస్తీనా వంటి ఒక అతి చిన్న దేశం వద్ద, ఇరాన్ వంటి ఒక మధ్యమ స్థాయి దేశం వద్ద అణ్వస్త్ర శక్తి ఉండి ఉంటే, పాలస్తీనా సమస్య 1948లోనే పరిష్కారమయ్యేదని కాదనగలమా? అందుకు ఇజ్రాయెల్‌తో పాటు అమెరికన్ శిబిరం అంగీకరించేవని చెప్పలేమా? ఈ పరిణామాల మధ్య మరొకవైపు ఏమవుతున్నదో గమనించండి. ఇరాన్ వద్ద అణ్వస్త్రాల ఉత్పత్తికి తగిన సామర్థ్యంతోపాటు, అవస రమైన సామగ్రి అంతా ఉన్నది. కానీ అణ్వస్త్రాలు ఇస్లాంకు విరుద్ధమైన వని అంటూ వాటి తయారీని ఇరాన్ అధిపతి అలీ ఖమేనీ బహిరంగంగా నిషేధించారు. శాంతియుత వినియోగానికి మాత్రమేనని చెబుతూ వారు ఆ శక్తిని అభివృద్ధి పరుస్తున్నారు. దానిని కూడా సహించని అమెరికా ఇరాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనేక తనిఖీలు జరిపింది. నెతన్యాహూ గత వారం ఒక రికార్డెడ్ వీడియో విడుదల చేశారు. అందులో రెండు గమనార్హమైన హెచ్చరికలున్నాయి. హమాస్, హిజ్బుల్లా తరహాలో ఇరాన్ నాయకత్వాన్ని కూడా అంతం చేసి ఇరాన్ ప్రజలను విముక్తం చేయగలమన్నది ఒకటి. మొత్తం పశ్చిమాసియాలో ఏ ప్రాంతం కూడా తమ శక్తికి అతీతమైనది కాదని, తాము క్రమంగా మొత్తంగానే ఆ ప్రాంతపు రూపును, స్థితిగతులను మార్చివేయనున్నా మనేది రెండోది.దీనంతటి మధ్య మరొక గమనించదగ్గ ఘటన చోటు చేసుకుంది. ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం 4.4 మాగ్ని ట్యూడ్తో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో ఆ ప్రాంతంలోని అరదాన్ పట్టణంతో పాటు టెహరాన్ నగరంలోని ఒక భాగంలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఇంతకూ అది నిజంగా భూకంపమా లేక భూగర్భ అణ్వస్త్ర ప్రయోగ ఫలితమా అన్న చర్చలు బయటి ప్రపంచంలో సాగుతున్నాయి. పాశ్చాత్య నిఘా సంస్థలు కూడా ఇంతవరకు నిర్ధారణగా ఏమీ చెప్పలేదు. సెమ్నాన్ ప్రాంతానికి సమీపంలోనే ఇరాన్ అణుశక్తి పరీక్షల ప్రధాన కేంద్రాలైన నాతాంజ్, ఫొర్దోవ్లు ఉండటం గమనించదగ్గది. ఒకవేళ రహస్యంగా అణ్వస్త్ర పరీక్షలు జరిగి ఉంటే భూప్రకంపనలు రావటం సహజం. భారత ప్రభుత్వం రాజ స్థాన్ ఎడారిలోని పొఖారణ్ వద్ద పరీక్షలు నిర్వహించినప్పుడు ఇదే జరిగింది. ఒకవేళ ఇరాన్ పరీక్షలు నిజమనుకుంటే, దేశాధిపతి తన నిషేధాన్ని సడలించి ఉంటారా అన్నది ఒక ప్రశ్న. ఇజ్రాయెల్ హెచ్చరి కలతో నాయకుల ప్రాణాలు, దేశ రక్షణ ప్రమాదంలో పడినపుడు, బయటకు చెప్పకుండా ఎందుకు సడలించరాదన్నది మరొక ప్రశ్న. మరొకవైపు, పోయిన ఆగస్టు చివరలో ఖమేనీ తమ ప్రధానికి ఒక ఆదేశాన్ని బహిరంగంగా ఇచ్చారు. ఒకవేళ తాము అణ్వస్త్రాలు ఉత్పత్తి చేయరాదంటే తమకు ఎటువంటి రక్షణలు కల్పించగలరో, పశ్చిమా సియాలోని వివిధ పరిస్థితుల గురించి ఏమి హామీలివ్వగలరో బైడెన్‌తో చర్చించాలని! అటువంటి చర్చలు ఇంతవరకేమీ జరగలేదు గానీ ఈ లోపల యుద్ధ రీత్యా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ పరిస్థితి దాదాపు చేయి దాటింది. వచ్చే నెల అమెరికా ఎన్నికలు న్నాయి. ఈ దశలో ఇక అటువంటి చర్చలకు అవకాశం లేదు. ఎన్ని కలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడే సరికి ఇక్కడ గాజా, లెబనాన్, ఇరాన్లలో ఏమైన జరగవచ్చు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఇరాన్ నాయకత్వం తమ అణు విధానాన్ని రహస్యంగా సడలించు కున్నదేమో తెలియదు.ఇంతకూ ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని ఇజ్రా యెల్ నిర్ణయించినా ఆ పని ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న కూడా ఒకటున్నది. ఆ కేంద్రాలు ఇరాన్ తూర్పు ప్రాంతంలో ఏదో ఒక చోట కాకుండా విస్తరించి ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి నాతాంజ్, ఫొర్దోవ్లు. వాటి పరిశోధనాగారాలు భూగర్భంలో చాలా లోతున దుర్భేద్యమైన రక్షణలో ఉన్నాయి. ఇవన్నీ ఇజ్రాయెల్ నుంచి వెయ్యి మైళ్ళకు పైగా దూరం. అంతవరకు వచ్చి దాడి చేయాలంటే సుమారు వంద యుద్ధ విమానాలు అవసరమని, అవి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను, యుద్ధ విమానాల ఎదురుదాడులను దాటుకుంటూ రావాలన్నది అమెరికాయే ఒకప్పుడు వేసిన అంచనా. ఇది ఒక సమస్య అయితే, ఎంతో లోతున గల అణు కేంద్రాలను దెబ్బతీసే శక్తి అమెరి కన్ బంకర్ బస్టర్లకు తప్ప ఇజ్రాయెల్‌కు లేదు. మరి అమెరికా ఆ సహాయం చేస్తుందా? దీనంతటిలో అనిశ్చితి ఉంది. ఒకవేల పరిస్థి తులు ఇరాన్ ఆశించినట్లుగానే లేనట్లయితే? అందుకే ఇరానియన్ రిపబ్లిక్ అధికారులు, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్లు ఇటీవల, పరిస్థి తులు ఈ విధంగానే కొనసాగితే తమ సైనిక రక్షణ విధానాన్ని మార్చు కొనక తప్పదని తరచూ ప్రకటిస్తున్నారు.ఇదంతా ఏమి చెప్తున్నది? మొదటి నుంచి కూడా బలవంతులదే రాజ్యం అన్నట్లు ఉన్న ప్రపంచ పరిస్థితులు ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, చర్చలు, ఒప్పందాల వంటివన్నీ బలవంతుల ఉల్లంఘనలకు గురవుతున్నాయి. ఆయుధ బలం, ధన బలం మాత్రమే రాజ్యమేలుతున్నాయి. న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, నీతి అవినీతుల ప్రసక్తే లేదు. అణ్వస్త్రాల మాట కూడా అందులో భాగమే. అంతెందుకు, జపాన్ వద్ద బాంబులు ఉండినట్ల యితే వారిపై మొదటి అణ్వస్త్ర ప్రయోగం జరిగేదా? ఇప్పుడు ఉత్తర కొరియా వద్ద అవి ఉన్నందుకే గదా అమెరికా వెనుకాడుతున్నది? ఉక్రెయిన్ యుద్ధంలో అణుప్రయోగ ప్రస్తావనలు ఎందుకు వస్తున్నాయి? ఇట్లా చెప్తూ పోవాలంటే రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో అనేక ఉదాహరణలున్నాయి. అందువల్లనే, బలహీన దేశాల రక్షణకు అణ్వస్త్రాలే బలమా అనే ప్రశ్న వస్తున్నది. అదెంత ప్రమాద కరమైనది, అవాంఛనీయమైనది అయినా. చర్చకోసం.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నానాటికీ నీరసిస్తున్న ఐక్యరాజ్యసమితి
ఇటీవల పరిణామాలను చూస్తే ఎవరికైనా ఐక్య రాజ్యసమితి ఉత్సవ విగ్రహంగా మారుతోందనే అభిప్రాయం కలుగక మానదు. యుద్ధ జ్వాలల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, శాంతి యుత ప్రపంచ స్థాపనకు మానవులలో ఉన్న అకుంఠిత ఆశయాలే ఐక్య రాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థ స్థాపనకు దారి తీశాయి.మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో ‘నానాజాతి సమితి’ని ఏర్పాటు చేసి ప్రపంచ శాంతిని పరిరక్షించే బాధ్యతను దానికి కట్ట బెట్టాయి పెద్ద రాజ్యాలు. ఈ సమితి ఎన్నో రకాల శాంతి మార్గాలను సూచిస్తూ అందులో ముఖ్య మైనదిగా... నిరాయుధీకరణంను సూచించింది. దానిని పెడచెవిన పెట్టిన ప్రపంచ దేశాలు ఆయు ధాలను సమీకరించుకొని ఆధిపత్య పోరు మొదలు పెట్టి, రెండవ ప్రపంచ యుద్ధం ముంగిట మాన వాళి మరోసారి నిలబడేలా చేశాయి.యుద్ధం ముగిసిన వెంటనే నానాజాతి వైఫల్యం వల్లనే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందని భావించి... దాని స్థానంలో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశాయి ప్రపంచ దేశాలు. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే... మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల ముందు ఆయా దేశాలు యుద్ధం రాబోతుందని గ్రహించి శాంతి సభలు నిర్వహించడం, చర్చలు జరపటం జరి పాయి. సంధులు చేసుకున్నాయి. అయినా ప్రపంచ యుద్ధాలు ఆగలేదు. ఇప్పుడు ఐరాసలో సభ్యులుగా 193 దేశాలు ఉన్నాయి. ఇందులో వీటో అధికారం ఉన్న 5 అగ్ర రాజ్యాలు ఉన్నాయి. 25 రకాలుగా పనిచేసే వివిధ రకాల సంస్థలు,అంతర్జాతీయ న్యాయస్థానం ఐరాస కింద పని చేస్తున్నాయి. అయినా కూడా రగిలిపోతున్న యుద్ధాలను ఆపలేకపోవడం బాధాకరం. అలా అని ఐరాస సాధించిన విజయాలు లేవని కాదు. రష్యా–ఇరాన్ , ఫ్రాన్స్– సిరియా– లెబనాన్, ఇండోనేషియా సమస్య, ఈజిప్ట్ అంశం, చెకోస్లావేకియా అంశం... ఇలా ఐరాస మధ్య వర్తిత్వంలో శాంతి ఒప్పందాల ద్వారా సమస్య లను పరిష్కరించుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వివిధ రకాల సాయం అందడానికీ ఐరాస ఎంతగానో కృషి చేస్తోంది.ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ఐక్యరాజ్య సమితి అగ్రరాజ్యాల జోలికి రానంతవరకే సంస్థకు గౌరవం దక్కుతోంది. ఆ మేరకే దానికి ఆర్థిక వనరులు అందుతున్నాయి. అంతర్జాతీయ శాంతికి అడ్డంకిగా మారిన అణ్వాయుధాల తయారీ, విని యోగానికి అగ్ర రాజ్యాలు స్వస్తి పలకవలసిందిగా యూఎన్ఓ విజ్ఞప్తి చేసినప్పటికీ అవి పెడచెవిన పెడుతున్నాయి. పైగా ప్రస్తుత తరుణంలో అగ్ర రాజ్యాల షాడో దేశాల మధ్య యుద్ధం మొదలై ఆయుధ గోడౌన్ల తలుపులు తెరుచుకుంటున్నాయి. అగ్ర రాజ్యాల ప్రోద్బలంతోనే ఇవి బరిలో దిగిన ప్పుడు ఇంకా ఐరాస మాట వినే పరిస్థితి లేదనిపించక మానదు.ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్‌ను తమ దేశంలోకి రాకుండా బహిష్కరిస్తున్నాం అంటున్న ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యమైన అమెరికా, బ్రిటన్లు మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. గాజాను పూర్తిగా నేల మట్టం చేసి, లెబనాన్‌ను పావు వంతు ఆక్రమించి, ఇరాన్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి సిద్ధం అవు తున్న ఇజ్రాయిల్‌ను అగ్రరాజ్యాలు నిలువరించ లేకపోతున్నాయి. ఓ పక్క ఇజ్రాయెల్‌పై దాడి చేస్తూనే అరబ్ దేశాలను ఏకం చేయడానికి ఇరాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే ఐరాస ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ విషయంలో కూడా అగ్రరాజ్యాలు గ్రూపులుగా సంఘటిత మవుతూ ఉంటే ఐరాస ఏమి చేయలేక చూస్తూ ఉండిపోతోంది. ఈ పరిస్థితులను చూస్తుంటే ఏ ఆశయాలతో అయితే ఐక్యరాజ్య సమితిని స్థాపించారో... వాటిని సాధించలేని స్థితికి ఐరాస చేరు కుందని చెప్పక తప్పదు.వి.వి. రమణ వ్యాసకర్త ఉపాధ్యాయులు ‘ 89198 62019 -
లౌకికవాదానికి గొడ్డలిపెట్టు రాజకీయం
భారతదేశంలో కుల రాజకీయాలు మరింత ఊపు అందుకుంటున్నాయి. హరియాణా, జమ్ము–కశ్మీర్ ఎన్నికల్లోని సామాజిక సమీకరణలను పరిశీలిస్తే – అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా చెప్పిన కులం పునాదుల మీదే ఎన్నికలు జరుగుతున్నాయని స్పష్టమవుతుంది. హరియాణాలో కాంగ్రెస్ కుల ఓట్లను సమీకరించింది. కాంగ్రెస్‌కు ప్రతిగా బీజేపీ కూడా ఎంబీసీ కులాలను సమీకరించడం మొదలుపెట్టింది. జాట్లంతా హస్తం పార్టీ వైపు ఉన్నారన్న ప్రచారం పూర్తిస్థాయిలో నిజం కాదు. అయినా జాట్లకు వ్యతిరేకంగా ఉన్న కులాల్లో అత్యధికులు తమ పార్టీ వైపు మొగ్గు చూపేలా కమలం పార్టీ చేసు కోగలిగింది. అయితే, బీసీల్లోని మతపరమైన నమ్మకాలను రాజకీయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఉందని మనం గమనించాలి.కాంగ్రెస్ మొదటి నుండీ ఆయా రాష్ట్రా లలో భూస్వామ్య కులాల మీద ఆధారపడి తన రాజకీయాలు నెరపుతున్నదని భాషా రాష్ట్రాల రూపకల్పన నాడే అంబేడ్కర్ స్పష్టం చేశారు. రామ్ మనోహర్ లోహియా తన ‘కులాల సమస్య’లో భారతదేశంలో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతుందనీ, జాతీయ స్థాయిలో వాళ్ళ పెత్తనాన్ని హిందూ బ్రాహ్మణ రాజకీయ వ్యవస్థ నడిపిస్తుందనీ అన్నారు. శూద్ర కులాలు వారికి సామంతులుగా ఆ యా రాష్ట్రాలను పాలించుకుంటున్నాయనీ, బ్రాహ్మణా ధిపత్యంలో ఏ దోపిడీ అయితే ఉందో శూద్ర భూస్వామ్య కులాల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాలలో కూడా అదే ఆధిపత్యం కొనసాగుతుందనీ చెప్పారు. ఇవాళ హరియాణాలో కాంగ్రెస్ కుల ఓట్లను సమీకరించింది. కాంగ్రెస్‌కు ప్రతిగా బీజేపీ ఎంబీసీ కులాలను సమీకరించడం మొదలు పెట్టింది. కాంగ్రెస్ తాము గెలుస్తున్నామనే భావనలో పూర్తి ఫలితాలు వచ్చాక చేసుకునే ఉత్సవాలను అత్యుత్సాహంతో ముందే చేసు కోవటం, జాట్ల వల్ల అణగదొక్కబడుతున్న బీసీ కులాలు సమీకృతమై బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ పునరాలోచించుకోవలసిన అవసరం వుంది. బీజేపీ తన హిందూవాద సిద్ధాంతాన్ని ఆచరించడంలో వెనుకంజ వేయడం లేదు. కానీ ప్రత్యర్థులు ఎన్నికల్లో ఏ కులాల్ని ఆశ్రయిస్తున్నారో చూసి వాటికి భిన్నమైన కులాల సమీకరణకు పూనుకుంటోంది. కాంగ్రెస్ ఉదార బ్రాహ్మణ వాదంలో బీజేపీని ఎదురించలేదు. ప్రత్యామ్నాయ రాజ కీయ వ్యవస్థా నిర్మాణంతోనే దానిని ఎదురించగలుగుతుంది.నిజానికి మండల్ కమిషన్ రిపోర్టును బీసీలకు అనుసరింపచేసే విషయంలోనే జనతా పార్టీ నుండి జనసంఘ్ బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా ముందుకు వచ్చింది. బిందేశ్వరి ప్రసాద్ మండల్ ఛైర్మన్‌గా, ఆర్.ఆర్.భోలే, దివాన్ మోహన్ లాల్, కె. సుబ్ర హ్మణ్యం, దీనబంధు సాహు సభ్యులుగా 1978 డిసెంబర్ 20న బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పార్లమెంటులో ప్రకటించారు. దీనబంధు సాహు ఆరోగ్య కారణాల రీత్యా 1979 నవంబర్ 5న తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఆర్.ఎల్.నాయక్‌ను నియమించడం జరిగింది.మండల్ కమిషన్ తన రిపోర్టును 1980 డిసెంబర్ 31న రాష్ట్రపతికి సమర్పించింది. ఓబీసీ సంక్షేమ పథకాలకు ప్రస్తుతం కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందటం లేదు; నిధుల కొరత కారణంగా మరిన్ని పథకాలు చేపట్టలేకపోతున్నామని పలు రాష్ట్రాలు మండల్ కమిషన్ దృష్టికి తెచ్చాయి; అందువల్ల ప్రత్యేకంగా బీసీల కోసం ఉద్దేశించిన పథకాలకు ఎస్సీ, ఎస్టీ పథకాల వలెనే కేంద్రం సహాయం అంద జేయాలని కమిషన్ సిఫారసు చేసింది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మండల్ సిఫారసులను పక్కకు పెట్టాయి. జనతాదళ్ అధికారంలోకి వచ్చాక మండల్ కమిషన్ సిఫా రసుల అమలు కోసం వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి కేంద్ర సంయుక్త కార్యదర్శి కృష్ణాసింగ్ 1990 ఆగస్ట్ 13న మెమొరాండం జారీ చేశారు.‘అనేక తారతమ్యాలు గల మన వంటి సమాజంలో, రాజ్యాంగంలో పొందు పరచిన విధంగా సామాజిక న్యాయ సాధన త్వరగా జరగటం తప్పనిసరి. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూ అప్పటి ప్రభుత్వం రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను నియమించింది. దానినే మండల్ కమిషన్ అని పిలుస్తున్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు కమిషన్ అభిప్రాయ పడిన విధంగా తగు ప్రయోజనాలను ప్రస్తుత సందర్భంలో ఏ విధంగా సమకూర్చాలన్న ప్రశ్నను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. ఆ ప్రకారం ఆ యా తరగతులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ సంస్థలలో ముందుగా కొన్ని అదనపు అవకాశాలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది’. భారత ప్రభుత్వ పరిధిలో గల సివిల్ ఉద్యో గాలు, సర్వీసులలో ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీలకు 27 శాతం ఖాళీలు రిజర్వ్ అవుతాయి; ఈ రిజర్వేషన్లు నేరుగా రిక్రూట్ చేసే ఖాళీలకు వర్తిస్తాయి; ఓపెన్ పోటీలో తమ ప్రతిభ ద్వారా ఎంపికయే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీ అభ్య ర్థులు 27 శాతం రిజర్వేషన్ కోటా కిందకు రారు’ అని అందులో పేర్కొన్నారు.మండల్ కమిషన్ రిపోర్టును అమలు జరుపుతామని కాంగ్రెస్ స్పష్టంగా చెప్పలేకపోతోంది. కులగణన వరకే కాంగ్రెస్ పరిమితం అయితే, ఆ రోజు తమ హక్కులను కాలరాయడానికే కొత్త పార్టీ పెట్టిన బీజేపీ వైపే బీసీలు మళ్ళీ వెళ్తారు. కానీ వారిలోని మతపరమైన నమ్మకాలను రాజకీయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఉందని మనం గమనించవలసిన అవసరం వుంది. బీజేపీ పాలనా పద్ధతిని బీసీలు గుర్తించలేకపోతున్నారు. ఈ విషయాన్ని తెలియ జెప్పటంలో కూడా కాంగ్రెస్, దళిత బహుజన పార్టీలు వెనుకబడి ఉన్నాయి.మండల్ కమిషన్ సిఫారసులను, వాటి అమలును వ్యతిరేకిస్తూ అనేక కేసులు దాఖలైనాయి. 1993లో సుప్రీంకోర్టు మండల్ ప్రతిపా దించిన బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ బీసీ కులాలను గుర్తించడానికి శాశ్వతంగా జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో కమిషన్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అప్పటికి పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి. అందువల్ల పి.వి. హయాంలో మండల్ కమిషన్ సిఫారసుల్లో ఒకటైన ఉద్యోగ రంగంలో 27 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాజకీయ, సామాజిక, పారిశ్రామిక తదితర సమస్త రంగాల్లో బీసీ రిజర్వేషన్లను అమలు జరపాల్సే ఉంది. హరియాణాలో జాట్లంతా హస్తం పార్టీ వైపు ఉన్నారన్న ప్రచారం పూర్తిస్థాయిలో నిజం కాదు. అయినా జాట్లకు వ్యతిరేకంగా ఉన్న కులాల్లో అత్యధికులు తమ పార్టీ వైపు మొగ్గు చూపేలా కమలం పార్టీ చేసుకోగలిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు హుడా, సెల్జా మధ్య విభేదాలు బహిరంగంగానే బయట పడటం, సెల్జాను పక్కన పెట్టడం కొన్ని తరగతుల ప్రతినిధులను దూరం చేశాయి. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ‘ఆప్’ ఒంటరిగా పోటీ చేయడం; స్థానికంగా ఉంటున్న జేజేపీ, దళితుల మద్దతున్న భీమ్ ఆర్మీ పార్టీతోనూ; ఐఎన్ఎల్డీ బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకోవడం కూడా ఓట్ల చీలికకు దారి తీసింది.నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న ఉచితాలు కూడా బడ్జెట్లకు అతీతంగా ఉంటున్నాయి. ప్రజలను సోమరులను చేసే పథకాల కంటే కూడా ప్రజలను ఉత్పత్తిలో భాగం చేసి శ్రమ ద్వారా ధనం సంపాదించే ప్రణాళికలు ముఖ్యం. మాయావతి ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ అభివృద్ధికి, దళిత బహుజనుల ఆర్థిక సామాజికాభివృద్ధికి, మైనారిటీ సంక్షేమానికి, లా అండ్ ఆర్డర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. నిజానికి కాన్షీరాం బీసీలను, దళితులను ఐక్యం చేసే రాజకీయ వ్యూహాలు రచించారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజనుల రాజ్యాధికరమే రావాల్సి ఉంది. ఇకపోతే జమ్ము కశ్మీర్లో ఇండియా కూటమి విజయపతాకం ఎగురవేయడం ఒక చారిత్రక అంశం. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిన దానికి ఫలితంగా ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారు. నిజానికి హిందూ రాజకీయాలు లౌకికవాదానికి గొడ్డలిపెట్టు. ఉత్పత్తిని, ఉపాధిని, శ్రమ సంస్కృతిని, మానవ జీవన వ్యవస్థల ప్రజ్వలనాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళే రాజకీయ ప్రణాళిక ఇప్పుడు అవసరం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
తగిన గుర్తింపునకు నోచని ప్రజ్ఞాశాలి
కొందరు నిజాయతీగా సమా జానికి పనికొచ్చే రచనలు చేస్తారు. అటువంటి అరుదైన, విలువైన రచయిత కొడవటి గంటి రోహిణీ ప్రసాద్. అరవై మూడవ యేట అనూహ్యంగా 2012 సెప్టెంబర్ 8న బొంబాయిలో కన్నుమూసి, తెలుగు జాతికి దిగ్భ్రాంతిని కలుగ జేసిన ఆయన కృషి చిరస్మరణీయం.బాల్యంలో తండ్రి కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.) కల్పించిన వాతావరణం వల్ల రోహిణీ ప్రసాద్ పుస్తకాల వైపు, హేతువాద దృక్పథం వైపు, శాస్త్రీయ అవగాహన వైపు ఆకర్షితులయ్యారు. కానీ, సంగీతం వైపు, నాట్యం వైపు, అనువాదాల వైపు ఆకర్షితులు కావడం ఆశ్చర్యంగా తోస్తుంది. విశాఖలో చదువుకునే రోజుల్లో రోహిణీ ప్రసాద్ కర్ణాటక సంగీత వాయిద్యం వీణ నేర్చుకోవాలి. కానీ, ఆయన హిందుస్తానీ సంగీత వాద్యం – సితార్ నేర్చుకున్నారు. తర్వాత ముంబ యిలో ఉన్నప్పుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ శిష్యరికం చేసి సితార్ వాదనంలో ప్రావీణ్యం గడించారు. ముంబయిలో అక్కడి తెలుగువారితో కలిసి కూచిపూడి, భరత నాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలు కలగలిపి ‘కృష్ణ పారిజాతం’ బ్యాలేకు రూపకల్పన చేశారు. ఈ అణు భౌతిక శాస్త్రవేత్త ముంబాయిలో సితార్ కచేరీలు చేయడం మామూలై పోయినా, 1990లలో అమె రికాలోని పలు నగరాలలో తన కళా ప్రదర్శనలు కొన సాగించడం, సితార్ వాద్య కళాకారుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారని తెలిసినప్పుడు ఆశ్చర్య పోతాం. అంతేకాదు, రాగాల గూర్చి, సంగీత వాద్య పరికరాల గూర్చి ఎన్నో విలువైన వ్యాసాలు రాశారని తెలిసినప్పుడు మనసు ఉప్పొంగిపోయినా, వెంటనే చివుక్కుమంటుంది. అయ్యో! ఈయనకు రావాల్సిన గుర్తింపు రాకపోయెనే అనీ! తనకు సన్నిహితంగా తెలిసిన హిందుస్తానీ, కర్ణా టక సంగీత సమ్రాట్టుల జీవిత విశేషాలన్నీ 2000– 2012 మధ్య కాలంలో ‘ఈమాట డాట్ కామ్’లో ఆయన భద్రపరిచారు. ప్రధానంగా జరిగిన లోపమే మంటే ఆయన పుస్తకాలు వెంట వెంట రాకపోవడం. గ్రంథాలు వెలువడడం, గ్రంథాలయాల్లో లభ్యం కావడం, వచ్చే తరాలకు అందుబాటులో ఉండటం అవసరం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉండి కూడా రోహిణీ ప్రసాద్ ఆలోచనలు తెలుగు జాతికి అందాల్సి నంతగా అందలేదు. బడే గులాం అలీఖాన్, అల్లా ఉద్దీన్ ఖాన్, అహ్మద్ జాన్ ధిరక్వా, ప్రభా ఆత్రే, ఉస్తాద్ అమీర్ ఖాన్, విలాయత్ ఖాన్, ఈమని శంకరశాస్త్రి, నౌషాద్, ఓపీ నయ్యర్, సీఆర్ సుబ్బురామన్, ఘంట సాల, బాల మురళీ కృష్ణ వంటి మహా సంగీత విద్వాంసుల శైలులపై, వారి జీవిత విశేషాలపై రాసిన వ్యాసాలు ఇప్పటికైనా పుస్తక రూపంలో రావాలి. ఆ రకంగా మరణాంతరమైనా రోహిణీ ప్రసాద్ కృషి వెలుగులోకి వస్తుంది.రోహిణీ ప్రసాద్, తన తండ్రి కొ.కు. లాగా సృజ నాత్మక సాహిత్యంలో కృషి చేయలేదు. కానీ వైజ్ఞానిక సారస్వతంలో చేసిన కృషి తక్కువది కాదు. అలాగే తన సోదరి ఆర్. శాంతసుందరి లాగా అనువాదాల వైపు కూడా ఆకర్షితులయ్యారు. 1947 నుండి ఏడేళ్లపాటుచందమామ పత్రికలో అచ్చయిన పిల్లల కథలను ఆయన ఇంగ్లిష్‌లోకి అనువదించారు. బాల సాహిత్యం విలువను, సాహిత్యం విలువను, అనువాదాల విలు వను, సంగీత కళారూపాల విలువను గ్రహించడంతో పాటు సమాజంలో వైజ్ఞానిక అవగాహన ఎంతో అవ సరం అన్నది గ్రహించారు. అందుకే మరణానంతరం తన శరీరం మట్టిపాలు కాకుండా వైద్య పరిశోధనలకు ఉపయోగపడాలి అను కున్నారు.మూఢ విశ్వాసాలను బలపరిచే వారిపై వ్యంగ్యా స్త్రాలు సంధిస్తూనే... జరుగుతున్న సంఘటనల వెనుక ఎటువంటి భౌతిక శక్తులు పని చేస్తాయో హేతువాదులు వివరించగలగాలని సూచించారు. పుట్టిన ప్రతి ప్రాణి కలకాలం జీవించడానికి ప్రకృతి సూత్రాలు ఒప్పు కోవని, అయితే పనికొచ్చే పదార్థం జన్యు పదార్థమే గనక, దాన్ని తరువాతి తరం కోసం వాడుకుంటూఉండొచ్చని అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తగా, సంగీత కారుడిగా, సైన్స్ రచయితగా ఒక క్రమపద్ధతిలో నిరంతరం కృషి చేస్తూ వచ్చిన రోహిణీ ప్రసాద్ ఒక విష యాన్ని గట్టిగా నమ్మారు. ‘నీ పనికి నువ్వొక రూప మివ్వు. ఆ పనే మళ్ళీ నీకో రూపమిస్తుంది’ అని! జీవి తాంతం ఆయన ఆచరించిన సూత్రం అదే!‘జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం’ తన పుస్తకంలో రోహిణీ ప్రసాద్ ఇలా అంటారు... ‘మతాలన్నీ ఎప్పుడు ఎలా తలెత్తాయో అర్థం చేసుకుంటే అవి ఈ రోజుల్లో ఎందుకు నిరుపయోగమో అర్థమవుతుంది. మతం అపెండిక్స్ అని ఎవరో అన్నారు. నిజమే మన శరీరంలో పెద్ద పేగుకు చివర ఉన్న అపెండిక్స్ ఒకప్పుడు పని కొచ్చేదట. ఈనాడు దానివల్ల ఉపయోగమేమీ లేక పోగా, అప్పుడప్పుడు అపెండిసైటిస్ వ్యాధి కలిగిస్తూ ఉంటుంది. దాన్ని తొలగించడమే మంచిది. మతమనేది కూడా అంతే.’ మతం పట్ల స్పష్టమైన వైఖరి తెలియ జేశారాయన. మనకిప్పుడు వైజ్ఞానిక స్పృహ, వివేచన, ఇంగిత జ్ఞానం కలిగించే రచనలు కావాలి. డాక్టర్ రోహిణీ ప్రసాద్ అలాంటి రచనలే చేశారు. మనకు గొప్ప శాస్త్రవేత్తలు, మేధావులూ ఉన్నారు. కానీ సామా న్యుడి కోసం సైన్స్ రాసే రచయితలు ఎక్కువగా లేరు. ఉన్నా... వారు సైన్స్ సమాచారం ఇవ్వగలుగుతున్నారే గానీ, సమాజానికి అన్వయిస్తూ రాయలేక పోతున్నారు. విలువల్ని ప్రతిష్ఠాపించే చేవగల ఈయన మరణం వల్ల, తెలుగు సమాజానికి పెద్ద విఘాతమే. రోహిణీ ప్రసాద్ ఆశించిన సమాజానికి రూపకల్పన చేయాలి.డా‘‘ దేవరాజు మహారాజు, వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్ -
సానుభూతి నుంచి ఛీత్కారం దాకా...
ఒకప్పుడు ఇజ్రాయెల్ అంటే ప్రపంచమంతటికీ ఎంతో ఇష్టం. అత్యద్భుతమైన నిఘా వ్యవస్థ, మాజీ ప్రధానులను సైతం జైలులో పెట్టగల న్యాయవ్యవస్థ, సరదాగా మాటలకు ఉపక్రమించే ప్రజల తీరు వంటి లక్షణాలన్నింటినీ మెచ్చుకునేవారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడికి గురైనప్పుడు కూడా ఇజ్రాయెల్ పట్ల ప్రపంచ సానుభూతి ఉండింది. ఎంతైనా ఉగ్రవాద బాధితురాలు అనుకున్నారు. అయితే ఆ జ్ఞాపకాలేవీ ఇప్పుడు లేవు. బదులుగా ఇజ్రాయెల్ చేపట్టిన మానవ హననమే అందరి కళ్లల్లో మెదులుతోంది. తమను హింసలకు గురిచేసిన హిట్లర్ మాదిరిగానే తామూ పాలస్తీనీయులను హింసలు పెడుతున్నామని అంగీకరించేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. కాకపోతే ఇదే అద్దంతో మరేదో చూపేందుకు ఇజ్రాయెల్ తాపత్రయ పడుతోంది. బ్రిటన్ మాజీ ప్రధాని హరాల్డ్ మెక్‌మిలన్‌కు రాజకీయాల్లో వారం రోజులంటే చాలా ఎక్కువ సమయం! ఇదే విధంగా హమాస్‌తో నడుస్తున్న యుద్ధం విషయంలో ఇజ్రాయెలీలు కూడా ఒక యుగమైందని అనుకుంటున్నారు. ఈ ఏడాది సమయంలో ఇజ్రాయెలీల ప్రపంచం మొత్తం తల్లకిందులైంది. తమ సంబంధాలన్నీ వాళ్లు కోల్పోయారు.గత ఏడాది అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ చేసింది అత్యంత భయంకరమైంది, ఆటవికమైంది. అది క్షమించరాని నేరం. సుమారు 1,200 మంది ఇజ్రాయెలీల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న హమాస్ ఆ రోజు ఇంకో 250 మందిని బందీలుగా చేసుకుంది. ఇజ్రాయెల్ మొత్తం ఈ ఘటనతో వణికిపోయింది. ఇజ్రాయెల్ పట్ల ఆ రోజు కొంతైనా సానుభూతి వ్యక్తమైంది. ఎంతైనా ఉగ్రవాద బాధితురాలు కదా అని అనుకున్నారు. కానీ, ప్రతీకారం పేరుతో ఏడాది కాలంలో ఇజ్రాయెల్ దమనకాండను పరిశీలిస్తే, హమాస్ అకృత్యాలు కూడా పేలవమై నవిగా అనిపించక మానవు. ఆడవాళ్లు, పిల్లలతోపాటు 42 వేల మంది పాలస్తీనియులు ఇప్పటిదాకా చనిపోయారు. ఇంకో లక్ష మంది గాయ పడ్డారు. గాజాలో 23 లక్షల మంది జనాభాకు నిలువ నీడ లేకుండా పోయింది. ఎటు చూసిన విధ్వంసపు ఆనవాళ్లే. అందుకేనేమో... ఏడాది క్రితం వరకూ ఇజ్రాయెల్‌పై ఉన్న సానుభూతి కాస్తా ధిక్కారంగానూ, ఛీత్కారంగానూ మారిపోయింది. అందరి దృష్టిలో ఇజ్రాయెల్ ఇప్పుడు దురాక్రమణదారుగా మారిపోయింది!హమాస్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కంకణం కట్టుకున్నారు. దశాబ్దాల పాలస్తీనా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడం ద్వారా తమకు మేలు జరుగుతుందని ఆశించారు. అయితే హమాస్ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటు కోవడమే కాకుండా, సైద్ధాంతికంగా మరింత బలం పుంజుకుందని చెప్పాలి.ఇంకో ముఖ్యమైన విషయం... నెతన్యాహూ గాజాపై చేస్తున్న యుద్ధం కాస్తా పాలస్తీనా అంశాన్ని అంతర్జాతీయ వేదిక పైకి చాలా బలంగా చేర్చింది. ఐక్యరాజ్య సమితిలోనూ పాలస్తీనాకు న్యాయం జరగాలన్న నినాదాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... అగ్రరాజ్యం అమెరికా విశ్వవిద్యాలయాల్లోనూ ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమాలు, ప్రదర్శనలు జరగడం గమనార్హం. నెతన్యాహూ ఈ పరిణామాలను బహుశా ఊహించి ఉండరు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం నడిచిన గత 365 రోజుల్లో ఇర్లాండ్, స్పెయిన్ , నార్వేలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి. సౌదీ అరేబియా ఇంకో అడుగు ముందుకేసి ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాల కోసం పాలస్తీనా సమస్య పరిష్కారాన్ని ఒక నిబంధనగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నోట పాలస్తీనా ఏర్పాటు మాట వస్తూనే ఉంది.పాలస్తీనా, ఇజ్రాయెల్ సమస్య పరిష్కారానికి ఇప్పుడు అందరూ సూచిస్తున్న మార్గం ఆ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా విడగొట్టడం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని అందరూ మరచిపోతున్నారు. ఎందుకంటే వెస్ట్‌బ్యాంక్‌లో సుమారు ఏడు లక్షల మంది ఇజ్రాయెలీ వలసదారులు ఉంటున్నారు. గాజాలో తను చెప్పినట్టు నడుచుకునే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు నెతన్యాహూ శతథా ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు పాల స్తీనా దేశం ఎక్కడ ఏర్పాటు అవుతుంది? ఏడాది క్రితం... కనీసం ఆరు నెలల క్రితం కూడా పాలస్తీనీ యులు దేశం మొత్తం తమదే అన్నట్టుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. యూదులకు ఇది అస్సలు అంగీకారం కాదు. కారణం ఒక్కటే. తాము యుగాలుగా ఆశిస్తున్న తమదైన మాతృదేశం తమకు లేకుండా పోతుందని!ఎంత విచిత్ర పరిస్థితి? పాలస్తీనాకు న్యాయం జరగాలని మొట్టమొదటిసారి ప్రపంచం మేల్కొన్న సమయంలో అసలు ఆ న్యాయం ఏమిటన్నది కూడా తెలియని పరిస్థితి. రాజకీయ ఆలోచన లకు అతీతంగా అంతా మారిపోయింది. మరో దృక్కోణం ఒకటి ఉంది. ఇది ఇజ్రాయెలీలకు అంతగా రుచించకపోవచ్చు. ఆశ్చర్యంగానూ అనిపించవచ్చు. ఏడాది క్రితం వరకూ తమ దేశం పట్ల ఇతరులకు ఉన్న దృక్పథం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే... ఆక్రమణదారుడైనప్పటికీ బాధితు డిగా తనను తాను చిత్రీకరించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది మరి!2023లో ప్రజాభిప్రాయం ఒకదాన్ని సేకరించే ముందు కాలంలో ఇజ్రాయెల్ అంటే ప్రపంచమంతటికీ ఎంతో ఇష్టం. అత్యద్భుతమైన నిఘా వ్యవస్థ, మాజీ ప్రధానులను సైతం జైలులో పెట్టగల న్యాయ వ్యవస్థ, సరదాగా మాటలకు ఉపక్రమించే ప్రజల తీరు వంటి లక్షణా లన్నింటినీ మెచ్చుకునేవారు. అయితే ఆ జ్ఞాపకాలేవీ ఇప్పుడు లేవు. బదులుగా ఇజ్రాయెల్ చేపట్టిన మానవ హననం మాత్రమే అందరి కళ్లల్లో మెదలుతోంది. ఒకప్పుడు అభినందించిన ప్రజలే ఇప్పుడు ఛీత్కరించే పరిస్థితి. ఇజ్రాయెలీలకు ఈ విషయాలు తెలియవా? రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల చేతిలో ఊచకోతకు గురైన వాళ్లే కదా! హిట్లర్ మాదిరిగానే తామూ పాలస్తీనీయులను నానా హింసలూ పెడు తున్నామన్న విషయాన్ని అంగీకరించేందుకు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. కానీ వాస్తవమైతే అదే! కాకపోతే ఇదే అద్దంతో మరేదో చూపేందుకు ఇజ్రాయెల్ తాపత్రాయపడుతోంది. హమాస్ నేత ఇస్మాయెల్ హనియే, హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లాల నాటకీయ హత్యలు ఇజ్రాయెలీల నిఘా వ్యవస్థ చురుకు దనానికి నిదర్శనంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. కానీ గత ఏడాది అక్టోబరులో నిఘా విభాగం వాళ్లు సిగ్గుతో తలదించుకున్నారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ చేసిన రక్తపు మరక అంత తొందరగా చెరిగిపోయేది కాదు. మరచిపోయేది, క్షమించదగ్గది కూడా కాదు. ఇజ్రాయెల్‌ను ఓ భిన్న దేశంగా చూపింది ఈ యుద్ధం. ఈ విషయాన్ని ఇజ్రాయెలీలు ఎంతవరకూ అంగీకరిస్తారన్నది చూడా ల్సిన విషయం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
విజయదశమి రోజున ప్రారంభమై.. విజయదశమి నాడే 100వ ఏట ప్రవేశం!
RSS: హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించటం ఆశయంగా డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ (డాక్టర్ జీ) 1925లో విజయ దశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ను నాగపూర్‌లో స్థాపించారు. ఆ సంస్థ ఈ విజయదశమి రోజున 100వ ఏట ప్రవేశిస్తోంది. ఎటువంటి సభ్యత్వ నమోదు, ఐడెంటిటీ కార్డులు వంటివి లేకుండా ఒక సంస్థను వందేళ్లు దిగ్విజయంగా నడపడం మాటలు కాదు. దాదాపు 80 లక్షల మంది స్వయం సేవకులు కలిగిన 45 లక్షల సంఘస్థాన్ శాఖలు నడుపుతూ ఎటువంటి అంతర్గత కలహాలకూ తావు లేకుండా కొనసాగుతోంది ఆరెస్సెస్.నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ హెడ్గే వార్ని 1921లో విదర్భలోని అకోలా జైలులో ఒక సంవత్సరం రోజులు నిర్బంధించారు. నాడు జైలులోని దేశభక్తుల మధ్య జరిగిన చర్చోపచర్చలలో డాక్టర్ హెడ్గేవార్ మదిలో పురుడు పోసుకున్నదే ఆరెస్సెస్. 1925 నుంచి 1940 వరకు డాక్టర్ హెడ్గేవార్, 1940 నుండి 1973 వరకు మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ), 1973 నుంచి 1993 వరకు మధుకర్ దత్తాత్రేయ దేవరస్లు సర్ సంఘ చాలకులుగా పనిచేసి ఆర్ఎస్ఎస్ను ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారతదేశం అంతటా విస్తరించడానికి తమ జీవితాలను ధారపోశారు. ఆరెస్సెస్ సంఘ శాఖలలో మొదటగా ధ్వజారోహణము, ఆసనములు, యోగ, క్రీడలు, ఆటలు, కర్రసాము, సమాజ హిత సూచనలు, భారతీయ చరిత్ర–సంస్కృతి–సంప్రదాయాలను తెలియజేసే ప్రసంగాలు, ఒకరితో ఒకరు సత్సంబంధాలు పెంచుకోవడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. చివరగా ప్రార్థన వంటి విషయాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.సమాజంలోని రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, న్యాయవాదులు, డాక్టర్లు, వెనుకబడిన, అణగారిన వర్గాలకు ప్రాతి నిధ్యం వహించే విధంగా భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక్ మహాసంఘ్, ఆరోగ్య భారతి, విద్యా భారతి, స్వదేశీ జాగరణ మంచ్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, సంస్కార భారతి, భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ సేవికా సమితి వంటి అనుబంధ సంస్థలను కలిపి ‘సంఘ్ పరివార్’గా భావిస్తారు. ఈ సంస్థలు అన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఆయా రంగాలలో అవి పని చేసుకుని పోతున్నప్పటికీ అవసరమైన సందర్భాలలో ఆర్ఎస్ ఎస్ నుంచి సలహాలు, సూచనలు ప్రేరణ అందుతాయి.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!1947– 48 మధ్య దేశ విభజన సమయంలో, 1962లో భారత్ – చైనా యుద్ధ సమయంలో, 1972లో భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో, భూకంపం, తుపానులు, కరోనా వంటి విపత్తులు, రైలు ప్రమాదాలు, కరవు కాట కాలు, కరోనా వంటి విపత్తుల సమయంలో ఆరెస్సెస్ చేపట్టిన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. భారత్ – చైనా యుద్ధ సమయంలో ఆరెస్సెస్ సేవలను గుర్తించిన నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ 1963లో రిపబ్లిక్ డే కవాతులో ఆరెస్సెస్‌ను పాల్గొనమని ఆహ్వానించడం గమనార్హం. దాదాపు 4 వేల మంది ఆరెస్సెస్ ప్రచారకులుగా (పూర్తి సమయ కార్యకర్తలుగా) కుటుంబ బంధాలకు దూరంగా దేశ, విదేశాల్లో పనిచేస్తూ తమ త్యాగ నిరతిని చాటుతున్నారు.– ఆచార్య వైవి రామిరెడ్డిశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి (నేడు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం) -
హైదరాబాద్‌కు ఆక్సిజన్ ఆగనున్నదా?
దామగుండం... గత పక్షం రోజులుగా తెలంగాణలో ఈ పేరు కలకలం రేపుతోంది. విశ్వనగరం హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రక్షిత అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత నావికాదళానికిసంబంధించి ‘లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్’ను నిర్మించడానికి 2900 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ అటవీభూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఇప్పుడు ఈ రాడార్ కేంద్రం నిర్మాణానికి 12 లక్షల అద్భుతమైన వృక్షాలను నేలమట్టం చేయబోతున్నారు.2007లోనే రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం భారత నావికా దళం అధికారులు వచ్చి సర్వే చేసుకొని వెళ్లారు. అయితే అటవీ భూముల బదలాయింపులకు కావలసిన గ్రామ సభలు, పంచా యతీ తీర్మానాలు వంటి ప్రక్రియలన్నీ గత పదేళ్ల ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని అంటు న్నారు. అయితే పర్యావరణ ప్రేమి కులు వేసిన ప్రజావాజ్యాలతో కోర్టులో స్టే ఉండడంతో భూమి బదలాయింపు మాత్రం జరగలేదు. కాగా గత జన వరి 24న రాష్ట్ర ప్రభుత్వం, నావికా దళానికి భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఈ విషయాన్ని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు వెలుగులోకి తేవడంతో మళ్లీ ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవాదులు సంఘ టితం అవుతున్నారు. దామగుండం సముద్ర తీరప్రాంతానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. కాగా ఇంతకంటే దగ్గర, ఇంతకంటే మెరుగైన ప్రాంతాలు సముద్ర తీరప్రాంతానికి దగ్గరగా దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే వికారాబాద్ జిల్లాలో ఎన్నో ఎకరాల ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిని పరిశీలించకుండా ఈ పచ్చని అటవీభూమిని నావికా దళానికి అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.అటవీప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న 20 గ్రామాలు, దాదాపు 60 వేల మంది ప్రజలు అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడుతున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు నేల కూలుతున్నాయి. వీటితో పాటు ఎంతో అరుదైన చుక్కల జింకలు, తోడేళ్లు, ఆసియాలోనే అతిపెద్ద జింక అయిన నీల్ గాయ్, అడవిపందులు, పెద్ద కొమ్ముల సాంబార్ జింకలు, చింకారా జాతిజింకల వంటి జంతువులతో పాటు వేల రకాల పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి. దీనితో పాటు ఈ రాడార్ స్టేషన్ వలన వెలువడే రేడియేషన్ ప్రభావంతో చుట్టుప్రక్కల ప్రజలకు కంటి చూపు సమస్యలు, సొమాటిక్ లక్షణాలు, ఆందోళన, నిద్ర లేమి, మానసిక రుగ్మతలు, సంతానలేమి, వంధత్వం, చర్మ సమస్యలు, అవయవాల పనితీరుపై ప్రభావం, ఎలక్ట్రికల్ షాక్ వంటి సమ స్యలు పొంచివున్నాయి. దామగుండం అడవిని ఆనుకునే ఉన్న వికారాబాద్ అనంతగిరి అడవులే మూసీ నదికి జన్మస్థలం. ఈ నది ఇక్కడి నుంచే మొదలై విశ్వనగరం హైదరాబాద్ మీదుగా దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించి, నల్లగొండ జిల్లా వజీరాబాద్ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం వల్ల మూసీ నదీ పరివాహక ప్రాంతానికి, ఆ నదితో పాటు పుట్టిన ఈసా, కాగ్నా నదుల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది.ఈ దామగుండం అటవీప్రాంతం విశ్వనగరం హైదరాబాద్‌కు కేవలం 75 కిలోమీటర్ల దూరంలోఉంది. రాజధాని నగరానికి ప్రధాన ఆక్సిజన్ వనరులు కూడా ఇక్కడ విస్తరించి ఉన్న అడవులే. ఇప్పుడు 2,900 ఎకరాలలో పచ్చదనం కోల్పోవడం అంటే విశ్వనగరానికి ఆక్సిజన్ సిలిండర్ తీసివేస్తున్నట్లే! ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో సమగ్ర పరి జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలను, ఆ యా పంచాయతీ పెద్దలను గ్రామ సభలు, తీర్మా నాల పేరుతో తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మోసం చేస్తుంటే వారు ఎవరికి చెప్పుకోగలరు? ఇప్పుడీ దామగుండం పరిరక్షణ పర్యావరణ బాధ్యత స్థానిక ప్రజలే తేల్చుకోవాలి. వారికి సరియైన దిశానిర్దేశం చేయా ల్సిన బాధ్యత పర్యావరణ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులపై ఎంతైనా ఉంది.– మోతె రవికాంత్ ‘ సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ అధ్యక్షులు -
ఇది పరిష్కరించుకోదగిన మిత్రవైరుద్ధ్యం!
భారతదేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల సమాజం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోంది. ప్రతి విషయంలోనూ కులం ప్రధానపాత్ర వహిస్తోంది. కులనిర్మూలన జరగక పోగా కులం వేళ్ళు మరింత బలంగా లోలోతుల్లోకి వెళ్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కుల నిర్మూలనైనా జరగాలి లేదా సంపద, అధికారాల్లో ఎవరి వాటా వారికైనా దక్కాలి. ఇవేవీ జరుగకపోగా వేలసంఖ్యలో విభజింపబడిన పాలిత కులాల మధ్య చెప్పలేనన్ని వైరుద్ధ్యాలు! తమకు దక్కాల్సిన వాటా కోసం ఉమ్మడి పోరాటాలు చేయకుండా తమలో తామే తన్నుకోవడం కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్య వైరుద్ధ్యాలే కనిపిస్తున్నాయి. నిజానికివన్నీ మిత్ర వైరుద్ధ్యాలే తప్ప శత్రు వైరుద్ధ్యాలు కావు. వీటిని పరిష్కరించుకోకుండా దశాబ్దాలుగా తగవులాడుకుంటూనే ఉన్నారు.ఎస్సీల్లోని మాల–మాదిగలు, వారి ఉపకులాల మధ్య ఉండాల్సింది మిత్రవైరుద్ధ్యం కాగా అది శత్రువైరుద్ధ్యంగా కొనసాగుతుండడం బాధాకరం. ఇరువురికీ ఆరాధ్యుడు అంబేడ్కర్. ఆయన స్ఫూర్తితో దళిత జాతి విముక్తికై ఉమ్మడి పోరాటాలు చేయకుండా దశాబ్దాలుగా పాత వైరుద్ధ్యాలను మరింత విస్తృతం చేసి దళిత రాజ్యాధికార భావనకు మరింతదూరం జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘దళిత మహాసభ’ దళితులపై జరిగిన పాశవిక దాడులను సమర్థంగా ఎదుర్కొంది. ఎండగట్టింది. దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది. అంబేడ్కర్ స్ఫూర్తితో, ఇంగ్లీషు చదువులతో, క్రైస్తవ చైతన్యంతో ఆంధ్ర మాలలు కొంతవరకైనా పాలక స్థాయికెదిగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. రాజకీయ పదవులూ గెలుచుకున్నారు. అలాగే మూడు దశాబ్దాల క్రితం మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ‘మాదిగ దండోరా’ ఉద్యమం చరిత్రాత్మకమైనది. అది మాదిగల్లో ఆత్మగౌరవాన్ని, పోరాట పటిమను, అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకునేలా చేసింది. అది కేవలం వర్గీకరణ ఉద్యమంగానే ఉండిపోకుండా వికలాంగుల పెన్షన్, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. కొందరు ఆధిపత్య కులాల వారు తమ పేరు చివర తమ కులాలను తెలియచేసే విశేషాలను పెట్టుకున్నట్లే.. మాదిగలు కూడా తమ పేరు చివర ‘మాదిగ’ పదాన్ని చేర్చుకోవాలని మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు ఆ కులంలో ఆత్మగౌరవాన్ని ప్రోది చేసింది. ఒక్క దళిత కులాల్లోనే కాదు పీడిత కులాలందరికీ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందీ దండోరా ఉద్యమం. అయితే దండోరా ప్రధాన లక్ష్యం రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ సాధించడం.కానీ వర్గీకరణ విషయంలో మాల, మాదిగల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దేశం మొత్తంగా కొన్నిచోట్ల మాలలు, మరికొన్ని చోట్ల మాది గలు రిజర్వేషన్లలో భాగాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నారన్నది వాస్తవం. వర్గీకరణ చేస్తే మాల, మాదిగ ఉపకులాలన్నీ రిజర్వేషన్ సౌకర్యాన్ని సమానంగా అనుభవించి అన్ని ఉపకులాలు పైకొస్తాయన్నది వర్గీకరణ కావాలనే వారి వాదం. వర్గీకరణ వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని వర్గీకరణను వ్యతిరేకించే వారి వాదన. ఎక్కడ మాలల్లో గానీ, మాదిగల్లో కానీ చైతన్యం ఎక్కువగా ఉంటే అక్కడ ఆయా కులాలవారు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎక్కువ ఉపయోగించుకున్నారన్నది వాస్తవం.వర్గీకరణ కావాలనడంలో ఎవరి వాటా వారికి చెందాలన్న ప్రజాస్వామిక సూత్రముంది. ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణను ఒకసారి చేసినా కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల దాని అమలు నిలిపివేయబడింది. అప్పట్నుంచి వైరుద్ధ్యాలు మరీ ఎక్కువయ్యాయి. వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని పాలకపార్టీలు ఓట్లు రాజకీయాలాడటం మొదలు పెట్టాయి. దళితుల ఓట్లు కోసం వర్గీకరణను సమర్థించడం, వ్యతిరేకించడం రాజకీయ పార్టీలకు ఓ ఆటగా మారింది.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!ఈ మధ్యనే సుప్రీంకోర్టు వర్గీకరణ చేయడం సరైన దేనని తీర్పునిచ్చింది. అందులో మెలిక పెట్టింది. క్రీమీలేయర్ పాటించాలని. తరతరాలుగా రాజకీయ, సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగపరమైన అధికారాలు అనుభవిస్తున్న వారికి లేని క్రీమీలేయర్ దళితుల వర్గీకరణకు కావాలనడం ధర్మ సమ్మతమేనా? కొందరు దళితనేతలు క్రీమీలేయర్ వద్దంటే మరికొందరు వర్గీకరణే వద్దంటున్నారు. మాయావతి లాంటి నాయకురాలు కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ఇలాంటి సందర్భాల్లో వర్గీకరణ అమలవుతుందా అనే అనుమానం రావడం సహజమే. అమలు కాకుండా ఉండటానికి వర్గీకరణ వ్యతిరేకులు, అమలు చేయడానికి వర్గీకరణ అనుకూలురు ఇంకా ఎన్నేండ్లు పోరాటాలు చేస్తూ తమ ఉమ్మడి లక్ష్యాన్ని మరిచిపోతారు?దళిత సోదర సోదరీమణులు తమ మధ్యనున్న వైరుధ్యాలను మిత్ర వైరుద్ధ్యాలుగా భావించి చర్చలతో వర్గీకరణ సమస్య విషయంలో ఏకీభావానికి వచ్చి దళిత రాజ్యాధికార భావనను సాకారం చేసే దిశగా పయనం కొనసాగిస్తే మంచిది. తమ అంతిమ లక్ష్యం దళిత సాధికారత, రాజ్యాధికారం అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఇరువైపుల వారికీ వర్గీకరణ సమస్య అతి చిన్నదిగా కనబడుతుంది.- డాక్టర్ కాలువ మల్లయ్యప్రముఖ కథా రచయిత -
కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు
ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. కోవిడ్ అనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. వ్యాపారస్తులకు, పెట్టుబడి దారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందువల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యోగావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోంది. గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం 60 శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ 6 శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న శ్రీలంకకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. మార్క్సిస్ట్–లెనినిస్ట్ భావజాలంతో నడిచే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు గల జనతా విముక్తి పెరుమున పార్టీ నుండి ఎన్నికయిన అనుర పట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలోపెడతారు, పొరు గున ఉన్న భారత్‌తో ఎలాంటి సంబంధాలు నెరుపుతారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు వెలువరించిన కొన్ని అంచనాల ప్రకారం ఈ సంవత్సరంతో పాటు వచ్చే 2025 సంవత్సరంలో కూడా శ్రీలంక 2.4 శాతానికి కొంచెం అటు ఇటుగా వృద్ధి రేటు నమోదు చేయబోతోంది. గత కొన్ని సంవత్సరాల నుండి తిరోగమన స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి పథం అందుకోవడం కొంత సంతోషకరమైన విషయమే. అయినప్పటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరోవైపు అనుర కుమారముందున్న ముఖ్యమైన సవాళ్లు. కోవిడ్ తదనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. ఎక్కువగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు మూతపడడం వల్ల మహిళల్లో నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థలు సుమారు 75 శాతం భాగం కలిగి ఉండడమే కాకుండా సుమారు 45 శాతం ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. వీటిలో చాలావరకు ఎగుమతులు, దిగుమ తులపైన ఆధారపడిన సంస్థలు. అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, సరఫరాల్లో అంతరాయాలు తదితర కారణాల వల్ల పెరిగిన నిర్వ హణ, ఉత్పత్తి ఖర్చుల వల్ల, వస్తువుల ధరలు పెరగడం వల్ల, తగ్గిన డిమాండ్ తదితర కారణాల వల్ల ఇవి మూతపడ్డాయి. గత రెండుసంవత్సరాల కాలంలో రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నిరుద్యోగిత శాతం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం అంతానికి 4.5 శాతం వరకు తగ్గించగలిగినప్పటికీ పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు పెరగక ప్రజలు ఇబ్బందు లకు గురవుతున్నారు.2022 జూలైలో రాజపక్సే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విదేశీ మారకద్రవ్యం నిల్వలు అత్యంత కనిష్ఠ స్థాయిలో అంటే 1.8 బిలియన్ డాలర్లు ఉండి నిత్యావసర వస్తువుల దిగుమతులకు ఇబ్బందిగా మారిన పరిస్థితులు ధరల పెరుగుదలకు దారి తీశాయి. తత్ఫ లితంగా ప్రజల అసంతృప్తికి, తిరుగుబాటుకు కారణ మయ్యాయి. ఆ నిల్వలు తర్వాత ఏర్పడిన రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా జూలై 2024 నాటికి 5.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో విదేశీ అప్పులు కూడా శ్రీలంక ఆర్థిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 34.8 బిలియన్ డాలర్ల నుండి 37.40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అవి ప్రస్తుత ధరల ప్రకారం 2022 జూన్‌లో 51.2 బిలియన్ డాలర్లు ఉంటే... ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసేనాటికి 55.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విక్రమసింఘే ప్రభుత్వం తన సన్నిహిత దేశాలయిన చైనా, భారత్, జపాన్‌లతో జరిపిన చర్చల ఫలితంగా... సుమారు 10 బిలియన్ డాలర్ల వరకు తిరిగి చెల్లించే కాలపరి«ధులు, వడ్డీ రేట్లు తగ్గించడంవంటి వెసులుబాట్లు లభించాయి. ఇందువల్ల ఐఎంఎఫ్ నుండి ఉద్దీపన ప్యాకేజీలు లభించడానికీ, అనేక మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయడానికి వెసులుబాటు లభించినట్లయింది. ఈ చర్యలు 2023 డిసెంబర్ నాటికి సుమారు 237 మిలియన్ డాలర్ల మిగులు బడ్జెట్‌కు దారితీశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు కూడా పెరిగి 2024 మార్చి నాటికి 96.3 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగి 44.9 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇవన్నీ కూడా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పడింది అనడానికి సంకేతాలే.గత రెండు సంవత్సరాలలో ద్రవ్యోల్బణం 60 శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆరు శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారా లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా, అప్పులు పెరిగిన నేపథ్యంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత ఉన్న సమయంలో ఈ ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దానివల్లే ఇప్పటికి ఆహారవస్తువుల, పెట్రోల్, డీజిల్, మందుల ధరలు ఇంకా దిగి రాలేదు. వీటివల్ల సామాన్య ప్రజల జీవన వ్యయంపై ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉంది. అనుర కుమార దిస్సనాయకే అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మూడు రోజులకు అంటే 26 సెప్టెంబర్ నాడు జరిగిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక సమావేశంలో డిపాజిట్లపై, రుణాలపై వరుసగా ప్రస్తుతం ఉన్న 8.25, 9.25 శాతం వడ్డీ రేట్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ వడ్డీ రేట్లు బ్యాంకుల్లో పొదుపుచేసే వారిని ప్రోత్సహించడానికీ, రుణాలు తీసుకోవాలనుకునే వారిని నిరుత్సాహపరచడానికీ, ద్రవ్యోల్బణం స్థిరీకరించడానికి ఉప యోగపడ్డాయి. అయితే అదే సమయంలో వ్యాపారస్తులకు, పెట్టు బడిదారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతి కూల పరిస్థితులను కల్పించి, ఉత్పత్తి వ్యయాలు, ధరలు పెరిగేలా చేసి వినియోగదారులను దూరం చేస్తాయి. వీటి వల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యో గావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. మరోవైపు బ్యాంకుల లాభాల్లో మార్జిన్ తక్కువగా ఉండడం వలన అవి ఇచ్చే రుణాలు తగ్గిపోతాయి. ఇన్ని ప్రతికూలతలు ఎదుర్కోవడం అనుర కుమార దిస్సనాయకే అయన ప్రభుత్వానికి పెద్ద సవాలు.అనుర దిస్సనాయకే పార్టీ గతంలో భారత్ పట్ల వ్యతిరేక భావనతో రగిలిపోయినప్పటికీ, కొత్త ప్రభుత్వం అదే ధోరణి ఇంకా కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చు. భారత్ ఇప్పటికే శ్రీలంకను అనేక సందర్భాల్లో ఆదుకుంది. గత రెండు సంవత్సరాల్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది. ఇది ఐఎంఎఫ్, చైనా అందించిన సహాయం కన్నా అధికం. వాణిజ్య సంబంధాలు పెంపొందించుకు నేందుకు రెండు దేశాలు ‘భారత – శ్రీలంక స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం’ చేసుకొన్నాయి. గత రెండు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య 4 నుండి 6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతున్నప్పటికీ ఇందులో అధిక భాగం భారత్ శ్రీలంకకు చేస్తున్న ఎగుమతులు ఎక్కువ. భారత్‌తో ఉన్న సన్నిహిత, నిర్మాణాత్మక సంబంధాల రీత్యా కొత్త ప్రభుత్వానికి భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం అనివార్యమవుతుంది.అనుర దిస్సనాయకే నాయకత్వంలో శ్రీలంక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్న తరుణంలో, ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటు చర్యలు కొనసాగించడం ఒకవైపు; విదేశాలతో మంచి సంబంధాలు కొన సాగించడం మరోవైపు అత్యంత అవసరం. ఎన్నికల సమయంలో ఐఎంఎఫ్‌తో 2.9 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ పైన చర్చలు తిరిగి ప్రారంభిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, అది అంత సులభం కాదు. భారత్ ఆ దేశానికి ఇచ్చిన ఆర్థిక సహాయం, వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, రాజకీయంగానే కాకుండా ఆర్థిక వ్యవస్థలు గాడినపెట్టడం పైన కూడా ప్రభావం చూపిస్తాయి.- వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్‌యూ ‘ 79089 33741- డా‘‘ గద్దె ఓంప్రసాద్ -
అభద్రతను పెంచుతున్న యుద్ధం
హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాలను నిరోధించ వలసిన ఐక్యరాజ్య సమితి లాంటివి నిర్వీర్యమైపోతున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐరాస సిబ్బందికే రక్షణ లేని పరిస్థితి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెతన్యాహూకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలు ఆంక్షల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వైరి పక్షాలను చర్చల వేదికపైకి తేగలిగిన మధ్యవర్తులు కానరాని పరిస్థితి! ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన శత్రువులపై దాడిచేసే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ... దాని పౌరులు రోజు రోజుకూ అభద్రతాభావంలో కూరుకుపోతుండటం గమనార్హం.ఒక సంవత్సరం క్రితం, అక్టోబర్ 7న జరిగిన ఘటన ఉక్రెయిన్‌లో యుద్ధం నుండి ప్రపంచం దృష్టిని మళ్లించింది. నేడు, హమాస్ తీవ్రవాద దాడిపట్ల ఇజ్రాయెల్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా మారిపోయింది. దీనితో పోలిస్తే మిగతా వన్నీ అప్రధానంగానే ఉన్నాయి. దాదాపు 45,000 మంది, వీరిలో ఎక్కువగా పౌరులు మరణించారు. కనుచూపు మేర కాల్పుల విరమణ లేదు. పైగా వేగంగా పెరుగుతున్న సంఘర్షణ కారణంగా, పశ్చిమాసి యాను యుద్ధం చుట్టుముట్టే అవకాశం ఒక ప్రమాదకరమైన వాస్తవంగానే కనబడుతోంది. కొంత వరకు ఉక్రెయిన్ యుద్ధం, ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం... ప్రాంతీయ యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించే లేదా వాటికి ముగింపు పలికే సామర్థ్యం గల మధ్యవర్తులు కనిపించని ప్రపంచంలో మనం ఈ రోజు ఉన్నామనే వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి.ఇజ్రాయెల్, ఇరాన్ లేదా అమెరికాను చేరుకోగల ఉపయోగ కరమైన పరోక్ష మార్గాలు కానీ లేదా వారిని సంధానించేవారు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. సైద్ధాంతికంగా చెప్పాలంటే, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే లేదా పొడిగించే స్థితిలో అమెరికా ఉండవచ్చు, కానీ పశ్చిమాసియా విషయానికి వస్తే దాని నిస్సహాయత ఆశ్చర్యక రంగా ఉంది. ఈ ప్రాంతంలో పరిష్కారం కోసం ప్రపంచం వాషింగ్టన్ వైపు చూస్తూనే ఉంది, కానీ దాని స్వీయ అధ్యక్ష ఎన్నికల కారణంగా, అమెరికన్ బాడీ పాలిటిక్స్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం చూపే ప్రభావం కారణంగా అమెరికాకు పరిష్కారం సాధ్యం కావడం లేదు.మరోవైపున అగ్రరాజ్య స్థాయి కోసం ఎదురుచూస్తున్న చైనా మౌనం కూడా ఆసక్తి గొల్పుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా ఉండగా, ఎర్ర సముద్రం సంక్షోభం సమయంలో అది నిష్క్రియాపరత్వంతో వేచి ఉంటోంది. పైగా ఇతర చోట్ల ప్రపంచ సంక్షోభాలను తగ్గించే విషయంలో చైనా పాత్ర తక్కువే అని చెప్పాలి. ఇక పశ్చిమాసియా సంక్షోభంపై మధ్యవర్తిత్వం వహించడంలో చైనా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. భారతదేశం ఇప్పటికీ అలాంటి కర్తవ్యా లను చేపట్టేంత శక్తిమంతమైన దేశంగా తనను తాను భావించడం లేదు. రెండో ప్రపంచ యుద్ధానంతర సంస్థలు ప్రపంచ స్థాయిలో నిర్మాణాత్మక అసమానతలను కొనసాగించినప్పటికీ, సంస్థలు,నిబంధనలు లేని ప్రస్తుత ప్రపంచం అధ్వానంగానే ఉంటుంది.ఐక్యరాజ్యసమితిని పరిశీలిస్తే... అది రోగలక్షణంతో అసమర్థ మంతంగానూ, నిస్సహాయంగానూ మారిపోయినట్లుంది. అందుకే యుద్ధంలో పాల్గొంటున్న పక్షాలు... ఐరాస సిబ్బంది ఉన్న ప్రాంతా లలో కూడా బాంబు దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పోరాడుతున్న పక్షాలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ఇటీవల ధిక్కరించినట్లుగానే, మీడియా కూడా దాన్ని సీరియస్‌గా పరిగణించడం లేదు.అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) ఉదంతాన్ని తీసుకోండి. ఇది ఇజ్రాయెల్ ఆగ్రహ జ్వాలలకు గురవుతూ ఉండడం మాత్రమే కాకుండా... అమెరికా, ఐరోపాలోని ఇజ్రాయెల్ సన్నిహిత మిత్రుల అగ్రహాన్ని కూడా చవిచూస్తూ ఉంది. హాస్యాస్పదంగా, రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలనే విషయంపై ఆసక్తిగా ఉన్న దేశాలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అదే విధంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు మాత్రం ఐసీసీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. రెండు యుద్ధాలూ నైతిక పరిగణనలు వాడుకలో లేని ప్రపంచం వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇంకా, నైతిక రాజకీయం రోజువారీ ప్రభుత్వ ఆచరణలో చెడుకు చెందిన సామాన్యతను కొలిచేందుకు ఒక కొలమానాన్ని అందిస్తుంది. దేశీయ రాజకీయాలు లేదా అంతర్జాతీయ సంబంధాలలో, నైతిక ప్రమాణాలు లేనిదాని కంటే నైతిక ద్వంద్వ ప్రమాణాలు ఉత్తమం. ఆచరణలో లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, కొలత కోసం మనకు ఒక టేప్ అవసరం. ఈ యుద్ధంలో చెడుకు సంబంధించిన సామాన్యత విషయంలో అత్యంత కలతపెట్టే ఉదా హరణ ఏదంటే హమాస్ టెర్రరిస్టులను గాజా ప్రజలతో సమానం చేయడం– అలాంటి చట్రాలను మనం మౌనంగా ఆమోదించడం!ఏ రకంగా చూసినప్పటికీ ఇజ్రాయెల్ మరింత ఒంటరిగా, అభద్రతతో ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులు, దాని అసమాన ప్రతీకార చర్యలు జరిగి ఒక సంవత్సరమైంది. కానీ ఇజ్రాయెల్ అనుభూతి చెందుతున్న శాశ్వతమైన అభద్రతా భావం ఇప్పుడు పెరుగుతున్న ఒంటరితనంతో పాటు మరింత తీవ్రమైంది.ఇజ్రాయెల్‌కు తన శత్రువులను మరింత ఎక్కువ శక్తితో కొట్టే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సంపూర్ణ దుర్బ లత్వం కూడా స్పష్టంగా ఉంది. ఇరాన్ దాని ప్రాక్సీ గ్రూపులుగా గాజా, ఇరాక్, లెబనాన్, సిరియా గురించి ఇజ్రాయెలీలు పిలుస్తున్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనేది ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు మరింత సురక్షితంగా ఉన్నారా అనేది సందేహమే. ఒక దేశం ఎంత శక్తిమంతమైన దేశమైన ప్పటికీ, నిశ్చయాత్మకమైన, సైద్ధాంతికంగా ప్రేరేపితులైన విరోధుల నుండి తనను తాను రక్షించుకోలేకపోతుంది, ప్రత్యేకించి దాని సొంత చర్యలు విరోధుల లక్ష్యాన్ని మరింతగా నిలబెడుతున్నప్పుడు అది అసలు సిద్ధించదు.నేడు ఇజ్రాయెల్ మరింత అభద్రతాభావంతో ఉండటమే కాకుండా ప్రపంచం సానుభూతిని కూడా కోల్పోతోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మితిమీరిన చర్యలకూ, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినందుకూ, ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లోని వారిచే వివిధ అంత ర్జాతీయ ఫోరమ్‌లలో సాధారణంగా ఆక్షేపించబడుతూ, విమర్శల పాలవుతోంది. గ్లోబల్ సౌత్ మద్దతుపై ఇజ్రాయెల్‌కు పెద్దగా పట్టింపు లేకపోయినా, ఇజ్రాయెల్ వైపు నిలిచిన యూరోపియన్, ఉత్తర అమె రికా మద్దతుదారులు కనీసం భౌగోళిక రాజకీయ కారణాల వల్ల దక్షి ణాదిని విస్మరించడం కష్టం. అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్ కోసం బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో అమెరికా యువతరంలో ఇజ్రాయెల్‌కి చెందిన సమస్యపై, విభేదాలు పెరుగుతున్నాయి.మొత్తం మీద చూస్తే అబ్రహం ఒప్పందాలు ప్రమాదకరమైన స్థితిలో ఊగిసలాడుతున్నాయి, వీధుల్లో జనాదరణ పొందిన మనో భావాల ద్వారా నడపబడుతున్న యుద్ధ స్వభావం పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా, గల్ఫ్ దేశాలు, ప్రత్యేకించి, పాలస్తీనా ఉచ్చులోంచి బయటపడాలని కోరుకున్నప్ప టికీ అవి బలవంతంగా తిరిగి యుద్ధబాటలోకి వెళ్లవచ్చు కూడా.ఇజ్రాయెల్ ప్రభుత్వానికీ, ప్రజలకూ దీని అర్థం ఏమిటంటే పెరుగుతున్న అభద్రత, ప్రపంచ సానుభూతిని కోల్పోవడంతో పాటు కనికరం లేని విలన్లుగా ముద్ర వేయబడటమే. ఈ యుద్ధం నెతన్యా హుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలను కప్పిపుచ్చడమే కాకుండా ఇజ్రాయెల్ ఉదారవాద, ప్రజాస్వామ్య విలువలను అణిచివేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు తమను తాము ప్రజలుగా ఊహించుకునే భవిష్యత్తు ఇదేనా? గాజా ప్రజలకు ఇజ్రాయెలీలు ఏమి చేస్తున్నారో అది ఇజ్రాయెల్ ప్రజలుగా వారిపై కూడా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంలోని మనకు, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ’శ్వేత జాతీ యులు శ్వేతజాతీయులను చంపేస్తున్నారు’ అనేటటువంటి కేవల యూరోప్ సమస్యగా మాత్రమే విస్మరించడం సులభం. కానీ పశ్చి మాసియాలో యుద్ధం ప్రాథమికంగా భిన్నమైనది – అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఊహించని మార్గాల్లో మనపై ప్రభావం చూపుతుంది.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో భారత విదేశీ విధాన బోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో...) -
చేగువేరా టు సనాతని హిందూ!
‘‘సముద్రం ఒకడి కాళ్ళ ముందు కూర్చొని మొరగదు/ తుఫాన్ గొంతు ‘చిత్తం’ అనడం ఎరగదు/ పర్వతం ఎవ్వరికీ వంగి సలాం చెయ్యదు.’ పదేళ్ళ కిందట జనసేన పార్టీ విశాఖ సభలో పవన్ కల్యాణ్ తనని తాను వేలితో చూపించుకుంటూ సము ద్రంగా, తుఫాన్‌గా, పర్వతంగా అభివర్ణించుకుంటూ చెప్పిన మాటలివి. ‘చుట్టూ గాఢాంధకారం, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు’ వంటి స్థితిలో ప్రజలున్నారని, వారి ఆశలు నిలబెట్టి, వారి జీవితాల్లో వెలుగు పంచి అపర చేగువేరాగా అవతరించాలన్న పవన్ ఉద్దేశాలు జగమెరిగిన వారికి అమాయకంగా కనిపించినా ఎంతోమంది యువత అతన్ని నమ్మారు. పవన్ ఒంటిమీద పిచ్చుక వాలినా జనసేన కార్యకర్తలు బ్రహ్మాస్త్రాలు సంధించారు. సినీహీరోగా తనకున్న ఇమేజ్‌ని గుడ్ విల్‌గా పెడితే చాలదని, అంతకి మించి ఏదో చేయాలన్న తపనని వ్యక్తం చేయడానికి ఆయన పలుమార్లు ప్రగతిశీల సాహిత్యాన్ని తన ప్రచారానికి వాడుకున్నారు. ఏ ప్రాంతానికి ప్రచారానికి వెళితే అక్కడి స్థానిక రచయితలను గుర్తించి వారి రచనల్లోని ప్రజా సమస్యలను ప్రస్తావించేవారు. గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీశ్రీ కవితలు తరుచుగా చదివేవారు. ఆయా సాహిత్య అంశాలలోని అభ్యుదయం, ప్రజాపక్షపాతం, నిర్భీతి వంటివి పవన్ వ్యక్తిత్వ సుగుణాలని జనం నమ్మేలా బట్వాడా అయ్యాయి కూడా. తద్వారా మిగతా రాజకీయ నాయకులకి భిన్నమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. విప్లవకారులుగా చలామణీ అవ్వడానికి మొహం చెల్లని రాజకీయాల్లో అట్టడుగు ప్రజల కష్టాలు తీర్చగల రాబిన్ హుడ్‌నని ఆయన నమ్మే ఉండాలి. లేకపోతే అంత సులువుగా ‘జై భీమ్’ అని, అంతే సులువుగా ‘గో మాంసం, బీఫ్ తినడం తప్పయితే, అవి తినే ముందుకు వెళ్తాన’ని ఎలా అనగలరు! ఇఫ్తార్‌లో కూర్చుని గడ్డం పెంచుకుని, టోపీ పెట్టుకుని మీలో ఒకడిని అనడం, గోధ్రా, గుజరాత్ అల్లర్ల గురించి ప్రశ్నించడం, తన నాయనమ్మ దీపారాధన చేస్తే దాంతో వాళ్ళ నాన్న సిగరెట్ ముట్టించుకుని, దేవుడూ దయ్యమూ లేవు’ అనేవాడని గుర్తు చేసుకోవడం, మతపరమైన గొడవలు పెడుతున్నది ముఖ్యంగా హిందూ నాయకులని గట్టిగా చెప్పడం ద్వారా పవన్ కొన్నివర్గాల నుంచి మైలేజ్ పొందారు. ఇక ఇపుడు తరం మారకుండానే స్వరం మార్చారు పవన్ కల్యాణ్. అధికారంలోకి రాగానే వేషభాషలు మారాయి. ఇపుడు తనని తాను ‘సనాతని హిందు’గా ప్రకటించుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తానని అంటూ అన్ని మతాలకీ ఒకటే న్యాయం అని ద్వంద్వానికి గురయ్యారు. అంబేడ్కర్‌ని బాగా చదివి ఆయన భావజాలాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నానని పవన్ కొన్నిసార్లు అన్నారు. అన్ని కులాలకి ఒకటే న్యాయం అని అంబే డ్కర్, ఇతర రాజ్యాంగ రూపకర్తలు అనుకోలేదు కనుక అణచివేతకి గురయ్యి శతాబ్దాలుగా ఎదుగుదల లేని కులాలకి రిజర్వేషన్లు ఇచ్చారు. అన్ని కులాలూ ఒకటి కానట్లే అన్ని మతాలు కూడా ఒకటి కావు. ఎక్కడైనా మెజారిటీ మతాలు, మైనారిటీల హక్కులకి భంగం కలిగించే సందర్భాలు ఉంటాయి కనుక సెక్యులరిస్టులు మైనారిటీ మతాల హక్కులకి అండగా నిలబడతారు. దానర్థం పవన్ విరుచుకు పడినట్లు వారు ఆ యా మతాలకి భయపడతారని, వలపక్షం చూపుతారని కాదు. తిరుపతి సభలో వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. దాని సారాంశం ఏమిటో ప్రజలమైన మాకు సరిగ్గా అర్థం కావడం లేదు. డిప్యూటీ సీఎంగా లడ్డు నాణ్యత మీద రోజుల తరబడి పోరాడటం ముఖ్యమా లేక కనీస అవసరాలు తీరని పేద ప్రజకోసం ఏవైనా చేయడం ముఖ్యమా అని అడగము, మెల్లిగా తెలుగుదేశాన్ని పక్కకి జరిపి జనసేన, బీజేపీతో ఎటువంటి రాజకీయం చేయబోతోంది అని కూడా అడగము, సరేనా! కానీ జస్ట్ ఆస్కింగ్! సనాతన ధర్మం అంటే ఏమిటి? బోర్డులు గట్రా ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో మీరు చేయబోతున్న పోరాటపు ఆనుపానులు మాకు కాస్త ముందుగానే చెప్పగలరా? వర్ణవ్యవస్థ ఇందులో భాగమా, మనుధర్మ శాస్త్రం ఏమైనా పరిపాలనకి దిక్సూచి కానుందా? స్త్రీలను ఇంట్లో కూచోమంటారా, శూద్రులు సేవకులుగా, శ్రామిక కులాలను అంట రానివారిగా నిశ్చయం చేయబోతున్నారా? ‘మతి ఎంతో గతి అంతే’ అన్నది మీకు ఇష్టమైన కొటేషన్. ఇపుడు సనాతన హిందూగా మీ ‘మతి’ ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన మా ‘గతి’ని ఎలా మార్చబోతోందో తెలుసుకోవాలని జస్ట్ ఆస్కింగ్. పవన్ కల్యాణ్ గారూ! ప్రసాదాలు, ప్రమాణాలు సంబంధిత శాఖలకి వదిలిపెట్టి పదేళ్ళ పైబడిన మీ రాజకీయ ప్రయాణాన్ని సమీక్ష చేసుకోండి. మారిన వేషభాషలకి, మీరేంటో గర్జించి ఇచ్చిన ప్రకటనకి మీరే జవాబుదారీ. నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మీరు సాధారణ పౌరుడు కాదు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మీరు సెక్యులరిస్ట్‌గా వినపడటమే కాదు కనపడటం కూడా ప్రజాస్వామిక అవసరం. ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతున్న లక్షలాది యువత కోసం నిజాయితీ మాత్రమే మీ ప్రమాణం అయితే మంచిది. మీరు ధైర్యం విసిరిన రాకెట్టో, చేగువేరా బుల్లెట్టో సనాతని హిందూనో, బీజేపీ ప్రేరిత కాబోయే ముఖ్య మంత్రో, మరొకటో ఇంకొకటో– నాలుగు రోజులైనా కాస్త ఒకచోట ఆగండి. మీరేంటో అర్థంకాక ప్రజలు అయోమయంలో ఉన్నారు. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ‘ప్రరవే’ ఏపీ కార్యదర్శి -
మానసిక ఆరోగ్యంతోనే అభివృద్ధి
మానవ సమాజంలో పని అనేది ఒక అంత ర్భాగం. మానవుడు ఆహా రం కోసం చేసే వెదుకు లాట/ వేట మొట్టమొదటి పనిగా చెప్తారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం పని గంటలు, పని ‘సంస్కృతి’లో అనేక మార్పులు తీసుకువచ్చింది. పరిశ్రమలు, కార్మికులు కలసి ఒక సంస్థాగత వ్యవస్థగా ఏర్ప డ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ ప్రవేశంతో కొత్తకొత్త ఉద్యోగాల రూపకల్పన జరగడం ప్రారంభమయింది. యాంత్రికీకరణ, కృత్రిమ మేధ అభివృద్ధితో ఇది మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా తొంభైవేల నుండి ఒక లక్ష గంటల పాటు పని ప్రదేశంలోఉంటాడని అంచనా. అంటే యుక్త వయసు నుండి రిటైరయ్యే వరకు ఉన్న జీవిత కాలంలో ఇది సుమారు మూడు వంతుల సమయం. ఒక ఉద్యోగస్థుడు తన సహ చరులతో ఇంతకాలం గడపడం వలన వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకుంటాడు. ఈ బంధాలు, పనిచేసే వాతావరణం, యాజమాన్యంతో ఉండే సంబంధం... ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు ప్రభావితం చేస్తాయి. కనుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ‘పని చేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటోంది. పని ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజ మైన విషయం. అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నట్లు తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు చికిత్స అవసరం అయిన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా బాధపడే వారిలో కేవలం నలభై శాతం మంది మాత్రమే సరైన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే ఇది ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఇది మిగిలిన ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఉద్యోగితో పాటుగా యాజమాన్యాలు / సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసు కోవలసిన అవసరం ఉంది. సరైన సమయపాలన పాటించడం, ఒత్తిడికి గురైనపుడు సహచరుల, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సహాయం పొందడం; పనికి, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకొని కొంత సమయం తనకోసం మాత్రమే కేటాయించుకోవడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పనిలో అప్పుడప్పుడు కొంత విరామం తీసుకోవడం లాంటివి చేయడం ద్వారా ఉద్యోగి ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు. విభిన్న షిఫ్ట్ సిస్టవ్ులో పనిచేసే దంపతులు కలిసి ఉండే సమయం తక్కువ అవడంవల్ల కలిసి క్వాలిటీ టైవ్‌ు గడిపే అవకాశాలు సన్నగిల్లి వీరి మధ్య కొన్ని మనస్పర్థలు, అనుమా నాలు తలెత్తే అవకాశముంది. సమర్థంగా పనిచేసే వారిని యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రోత్సహించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వీరిలో మానసిక స్థైర్యం పెంపొందుతుంది. మహిళా ఉద్యోగులు, ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ; మరోవైపు ఉద్యోగ బాధ్యతల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాంటి వారి ఎడల సంస్థలు కొన్ని వెసులుబాట్లు ఇస్తే, వీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండగలరు. కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోవ్‌ు’ను ప్రోత్సహించడం వలన ఉద్యో గుల్లో ఉత్పాదకత పెరిగినట్లు గణాంకాలు చెబు తున్నాయి. ప్రతి సంస్థ అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా క్లినికల్ సైకాలజిస్టుల సేవలు తమ ఉద్యోగులకు కల్పించాలి. యోగా, ధ్యానం, ఒత్తిడి గురించి వర్క్‌షాప్స్ వంటి కార్యక్రమాలు తరచుగా తమ సంస్థల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి. ఒక క్రమ పద్ధతిలో నైపుణ్య పరీక్షలు జరిపి అర్హులైన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్న తులు, ఇతర వసతులు కల్పించడం ద్వారా ఉద్యోగస్థుల్లో సంతృప్తి శాతాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగస్థులు తమ పనిపట్ల తృప్తితో ఉంటారో వారు మరింత పాజిటివ్ ధృక్పథంతో, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తారు. వారు మిగిలిన వారికి ఒక మంచి ఉదాహరణగా నిలిచి, ఒక చక్కని పని సంస్కృతి అనేది సంస్థలో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ఉద్యోగుల, కార్మికుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలోగాని,వృత్తిలో గాని విజయం సాధించాలంటే మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యమని అందరూ గుర్తించాలి. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యనిపుణులు(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
ప్రపంచ విప్లవ జ్వాల
ప్రజల కోసం సర్వస్వం త్యజించిన విప్లవ నేత చే గువేరా! ఆయన అసలు పేరు ఎర్నెస్టో గెవారా! ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు. అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు. 1954లో గౌటెమాలలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలి పోయింది. అక్కడి నుంచి మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని విప్లవ దృక్పథం మరింత బలపడింది. మెక్సికోలో ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం (1956–1959)లో చే గువేరా ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్‌గా, మిలిటరీ కమాండర్‌గా అంకిత భావంతో సేవలందించాడు. పోరాటం విజయవంతమైన తరువాత, కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభు త్వాధికారాన్ని చేపట్టాడు. ఆ ప్రభుత్వంలో చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా పనిచేశాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు. తన రచనలలో వర్ధమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు! పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టి ఆయన 1965లో క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని, పలుకుబడిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 1966 చివరిలో మళ్ళీ దక్షిణ అమెరికాకు వచ్చాడు! బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు! ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యానికి చిక్కాడు! 1967 అక్టోబర్ 9న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో ఆ సైన్యం ఆయన్ని చంపివేసింది. అలా ఓ ప్రపంచ విప్లవ జ్వాల ఆరిపోయింది!– ఎమ్డీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్(నేడు చే గువేరా వర్ధంతి) -
అధిక నిధులతోనే రైతుకు మేలు
దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నష్టాలు! 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే. ఇప్పటికీ వ్యవసాయ రంగ వృద్ధి కేవలం 1.4 శాతం మాత్రమే. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం. అసమానతలను పెంచిపోషిస్తున్న ఆర్థిక సిద్ధాంతాలను ఇంకా పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. అత్యధిక జనాభా వ్యవసాయంలో ఉన్న దేశంలో దానికి అనులోమంగానే బడ్జెట్లో స్థిరంగా కొన్నేళ్లు కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలి.అది 1996వ సంవత్సరం. ఎన్నికల ఫలితాలు వెలువడి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఒకటీ రెండు రోజుల తర్వాత, న్యూఢిల్లీలో కొంతమంది ఆర్థికవేత్తలతో ఆంతరంగిక సమా వేశం జరిగింది. ప్రధానమంత్రిగా ఎన్నికైన వాజ్‌పేయి రాకపోవడంతో, మరో రాజకీయ ప్రముఖుడు మురళీ మనోహర్ జోషి ఆ సమా వేశానికి అధ్యక్షత వహించారు.ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోకుండా ఉండాలంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక విధానాలను తీసుకురావాలో సూచించాలని ఆ సమావేశంలో ఆర్థికవేత్తలను కోరారు. హాజరైన చాలామంది ద్రవ్య లోటును నిశితంగా పరిశీలించాలనీ, కరెంట్ ఖాతా లోటును తగ్గించే మార్గాలను కనుగొనాలనీ అభిప్రాయం వెలిబుచ్చారు. కీలకమైనవిగా గుర్తించిన సమస్యలపై చాలా చర్చ జరిగింది. ఉపాధిని సృష్టించడం, తయారీని పెంచడం, ఎగుమతుల ఆర్థిక వ్యవస్థను నిర్మించడం వంటి ఇతర ముఖ్యమైన సమస్యలపై కూడా చర్చ జరిగింది.విధానపరమైన ప్రాధాన్యం దేనిపై ఉండాలో సూచించమని నన్ను అడిగినప్పుడు, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 60 శాతం జనాభాకు బడ్జెట్లో 60 శాతం మేరకు అందించాలని నేను సమాధాన మిచ్చాను. అక్కడ ఉన్న నా సహచరుల్లో చాలామంది నాతో ఏకీభవించలేదు. వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయిస్తే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని కొందరు హెచ్చరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయ రంగాలకు భారీ కేటాయింపులు జరపాలనీ, దాన్నే అధిక ఆర్థిక వృద్ధికి దారితీసే కచ్చితమైన మార్గంగా తీసుకోవాలనీ వారు నొక్కి చెప్పారు. అయితే కొత్త నమూనాకూ, ఆర్థిక చింతనకూ ఇదే సమయమనీ, వ్యవసాయానికి తగిన బడ్జెట్ కేటాయింపు చేయకపోతే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందదనీ నేనూ నొక్కిచెప్పాను. నా సలహా ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల ఆలోచనతో పొసగదని నాకు తెలుసు. కానీ, ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం వ్యవసాయంలో, గ్రామీణాభివృద్ధిలో తగినంత పెట్టుబడి పెట్టడమేనని నా అవగాహన. మా అభిప్రాయాలను ప్రధానికి తెలియ జేస్తానని జోషి చెప్పడంతో సమావేశం ముగిసింది.కొన్ని రోజుల తర్వాత, కొత్త ప్రభుత్వం వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయించాలనే ఉద్దేశాన్ని ప్రకటించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వ్యవసాయంలో చాలా వనరులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం గురించి మీడియాలో కోలాహలం చెలరేగింది. చాలామంది నిపుణులు దీనివల్ల ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తుందని అన్నారు. నా వాదన ఏమిటంటే, భారతదేశం అధిక వృద్ధి పథం వైపు సాగుతున్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తన జనాభాలో మూడింట రెండు వంతుల మందిని వెనుకే విడిచిపెట్టడం సాధ్యం కాదు.ఇది సాధ్యం చేయాలంటే, రాజకీయ తత్వవేత్త జాన్ రాల్ సూచించిన న్యాయసూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలంటే, మన విధాన ప్రయత్నం భిన్నంగా ఉండాలి. మానవ మూలధన పెట్టు బడికి, వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి, ఆరోగ్యం, విద్యారంగా లతో సహా గ్రామీణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి తగిన ఆర్థిక వనరులను కల్పించాలి. ఈ క్రమంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక చింతనలో, విధానాల్లో కీలక మార్పు తేవడం వల్లనే, ప్రధానమంత్రి ఇప్పుడు చెబుతున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ను నిజం చేయ వచ్చు. అయితే, వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులు మాత్రమే కొన సాగింది. దాంతో మార్పునకు బలమైన పునాది వేయగలిగే ఆశ కూడా ఉనికిలో లేకుండా పోయింది.నేను దీన్ని ఎందుకు పంచుకుంటున్నానంటే, మొత్తం బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు మరింత తగ్గాయి. లక్షలాదిమంది జీవనోపాధికి వ్యవసాయం బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో ఇది ఆందోళనకరం. బడ్జెట్లో వ్యవసాయం వాటా 2019–20లో అప్పటికే కనిష్ఠంగా ఉన్న 5.44 శాతం నుంచి, 2024–25లో 3.15 శాతానికి పడి పోయింది. వనరుల కేటాయింపులపై ఆధిపత్యం చలాయించేది రాజకీయ ఆర్థిక కారకాలు (బడా వ్యాపారులచే ఎక్కువగా ప్రభా వితమవుతాయి) అని గ్రహించినప్పుడు, తప్పు మార్గాలేమిటో స్పష్టంగా కనిపిస్తాయి. జనాభాలో 42.3 శాతం మంది ఇప్పటికీ వ్యవసాయంలో నిమగ్నమై ఉండగా, దాని వృద్ధి కేవలం 1.4 శాతంగా ఉంటోందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా దారుణంగా, సగటు వ్యవసాయ ఆదాయాలు బాగా క్షీణించాయి. వాస్తవ గ్రామీణ వేతనాలు దశాబ్ద కాలంగా స్తబ్దుగా కొనసాగుతున్నాయి. నేను తరచుగా చెప్పినట్లు, వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం.దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి భారతీయ రైతులు ఇంత దారుణంగా ఎలా నష్టపోతున్నారని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ‘ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ – డెవలప్మెంట్’ (ఓఈసీడీ) చేసిన ఇటీవలి అధ్యయనం పనికొస్తుంది. భారతీయ వ్యవసాయం అట్టడుగున ఉండటమే కాక, 2022లో 20.18 శాతం ప్రతికూల స్థూల వ్యవసాయ జమను (మైనస్) అందుకుంది. అయితే, 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఈ వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే.జనాభాలో దాని వాటాకు అనులోమానుపాతంలో కొన్ని సంవత్సరాలపాటు వ్యవసాయానికి సరైన వనరులను అందించినట్ల యితే, అది అద్భుతమైన ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటుంది. వనరుల కేటాయింపులు తగ్గుముఖం పట్టిన తర్వాత, వ్యవసాయ రంగంలో అద్భుతం జరుగుతుందని ఆశించడం వ్యర్థం. 1996లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో 60 శాతం వాటాను అందించడానికి అంగీకరించి ఉంటే, నేటివరకు అది కొనసాగి ఉంటే, భారతదేశ గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారి పోయి ఉండేది.ఇప్పుడు కూడా, వ్యవసాయంలో జనాభా 42.3 శాతంగా ఉన్నందున, రూ.48 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలని చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పేదలు, మహిళలు, యువత, అన్న దాత అనే నాలుగు కొత్త ‘కులాలను’ చేరుకోవడానికి బహుశా ఇది ఉత్తమ మార్గం. వాస్తవానికి, వ్యవసాయం అన్ని రకాల కుల రూపాలకు జీవనోపాధిని అందిస్తుంది. వ్యవసాయంలో తగిన వనరులను ఉంచడం, పనితీరును మెరుగుపర్చడం వల్ల స్థిరమైన జీవనోపాధిని నిర్మించడమే కాకుండా వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించే ఆకాంక్ష లను కూడా ప్రోత్సహిస్తుంది. వ్యవసాయంలో తగిన పెట్టుబడులను కల్పిస్తే అవి ప్రపంచంలోని 75 శాతం మంది పేదల పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ప్రపంచ బ్యాంకు కూడా ఎక్కడో అంగీకరించింది.ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది, దిగువన ఉన్న 95 శాతం కంటే ఎక్కువ సంపదను కూడబెట్టుకున్న తరుణంలో... అసమానతలను మరింత పెంచిన ఆర్థిక సిద్ధాంతాలను పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. కాబట్టి భారతదేశం, దాని సొంత గాథను లిఖించవలసిన అవసరం ఉంది. ఇదంతా వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం ద్వారా ప్రారంభమవుతుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
కోవిడ్‌ను మించే భూతం... భూతాపం
రెండేళ్ల పాటు కరోనా వైరస్ ప్రపంచ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసింది. కోవిడ్ కల్లోలం సృష్టించిన నష్టం ఈ శతాబ్దంలోనే కాక, మానవ చరిత్ర లోనే ఓ పెనువిషాదం. ఆ పీడకల నుంచి తేరుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తున్న ప్రపంచానికి మరో పెద్ద సవాలు... ‘గ్లోబల్ వార్మింగ్’. ఫలితంగా తీవ్రమైన ఎండలు, అంతలోనే వరదలు... మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. వాతా వరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతి యేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి.భూతాపం వల్ల సప్త సముద్రాలు వేడెక్కి పోతున్నాయి. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. 1950 నాటికి హిమాలయాలపై ఘనీభవించిన మంచు నేటికి చాలావరకు కనుమరుగైంది. అంటార్కిటికా సముద్రంలోని మంచు పరిణామం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భారత్‌తో సహా అనేక దేశాలలో శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోంది. మరికొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరిగి సముద్రాలు ముందుకు చొచ్చుకొచ్చి అనేక ద్వీపాలను కబళించి వేస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల మన దేశంలో అధికంగా నష్టపోతున్న రంగాలలో వ్యవసాయం, ఆరోగ్యం ముఖ్యమైనవి. ఒకవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని రంగాలు అభివృద్ధిలో అనూహ్యంగా ముందంజ వేస్తుండగా... మరో వైపు నిలకడైన వాతావరణ పరిస్థితులు లేక వ్యవసాయం, తదితర ఉత్పత్తి రంగాలలో భారీ క్షీణత కనిపిస్తోంది. ఈ వైరుధ్యం ప్రజల మధ్య అనేక అసమానతలకు దారితీస్తోంది. భారీ వర్షాలు, వరదలతో పేదల ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదల జీవితాలు గాల్లో దీపంలా మారాయి. నివాసం ఉన్న చోట బతికే పరిస్థితి లేకపోవడం వల్ల మనుషులు వలసలు పోవాల్సిన దుఃస్థితి అనేక దేశాలలో నెలకొంది. మరోవైపు ఉష్ణోగ్రత పెరుగుదల, భారీ వర్షాల వల్ల అపసవ్య దిశలో సముద్రపు నీరు పొంగి పంట పొలాల్లోకి, నదీసంగమాల వద్ద నదుల్లోకి ప్రవహి స్తోంది. వాతావణ మార్పుల వల్ల జీవ వైవిధ్యం పూర్తిగా గాడి తప్పింది. మారిన వాతావరణ పరిస్థితులకు అలవాటు పడలేక మనుషు లతోపాటు మొక్కలు, జంతుజాలానికి తీవ్రమైన హాని కలుగుతోంది. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం తాజా నివేదిక ప్రకారం, సుమారు 10 లక్షల వృక్ష, జంతుజాతులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. గత 400 ఏళ్లల్లో 680 వెన్నెముక గలిగిన జాతులు నశించగా, కేవలం గత 2 దశాబ్దాలలోనే అంతకు రెట్టింపు జాతులు నశించాయి. కాలుష్యం, భూవినియోగంలో మార్పులు, వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య తేడాలు ఇందుకు కారణంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. భూతాపం, కాలుష్యం కారణంగా మనుషులలో వయస్సుతో సంబంధం లేకుండా అనేక రుగ్మతలు కనపడుతున్నాయి. కేవలం శ్వాస కోశ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 87 లక్షల ప్రజలు చనిపోతున్నారు. కాలుష్యం వల్ల అప్పుడే పుట్టిన పసికందులకు కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ఒకప్పుడు అగ్ని పర్వతాలు బద్దలు కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చాక... బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజల ఇంధనాలను మండించడం ఎక్కువయ్యాక వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఇంకా గ్రీన్ హౌజ్ వాయువుల కారణంగా కేవలం 150 సంవత్సరాలలో 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర భూతాపం పెరిగింది. సహజ వాయువు వెలికితీత, దాని వాడకం వల్ల బయటపడే మీథేన్ కారణంగా మరో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడిమి పెరిగే అవకాశం ఏర్పడింది.పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. అధిక వర్షాలు, వరదల వల్ల చేతికొచ్చిన పంటల్లో ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆహార భద్రతకు అన్ని చోట్లా ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా, వ్యవసాయరంగంపై ఆధారపడిన రైతాంగం, అనుబంధ రంగాల కార్మికులకు ఆదాయాలు పడిపోయాయి. ఇప్పటికీ 60% ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని రక్షించు కోవాలంటే, అత్యవసర పర్యావరణ కార్యచరణతో ముందుకు సాగ వలసిందే! రుతుపవనాల గమనం, వాతావరణ వైవిధ్యం ఆధారంగా దేశాన్ని 7 జోన్లుగా వర్గీకరించుకొని అందుకు అనుగుణంగా పంటల సాగును నిర్వహిస్తూ వస్తున్న మన దేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. పంటలు పుష్పించే కాలంలో విపరీతమైన ఎండలు కాయడం వల్ల విత్తనాలు బలహీనపడుతున్నాయి. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపు తున్నది. ఒక అంచనా ప్రకారం వాతావరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతియేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యం, గోధుమ, పప్పుధాన్యాల్లో ఉండే ప్రొటీన్లు నశిస్తున్నాయి. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో పోషకాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి పశువులకు అవసరమైన గ్రాసం అందడం లేదు. దాంతో, పశువుల ఎదుగుదల తగ్గి మాంసం ఉత్పత్తి పడిపోతోంది. పశువుల పునరుత్పత్తిపై ప్రతి కూల ప్రభావం చూపడమేకాక పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. అధిక వర్షాలు, వరదల వల్ల కోళ్లు, గొర్రెలు, ఇతర పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ యేడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు పర్యాయాలు కురిసిన భారీ వర్షాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. అధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టాలు జరుగు తున్నప్పుడు రైతాంగానికి ప్రభుత్వపరంగా అందుతున్న సాయం అరకొరగానే ఉంటోంది. వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేయలేని నేపథ్యంలో... పంటవేసి నష్టపోయే కంటే, పంట వేయకపోతేనే తక్కువ నష్టం అనే భావన చాలా ప్రాంతాల్లోని రైతాంగంలో బలంగా నాటుకుపోయింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలీడే పాటిస్తున్నారు. ఇందువల్ల దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. భూతాపం తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే అనేక సదస్సులు నిర్వహించాయి, డిక్లరేషన్లపై సంతకాలు చేసి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రియో ఒప్పందం, కోపెన్హెగన్ సదస్సు, క్యోటో ఒప్పందం, కాప్ 21 పారిస్ ఒప్పందం... ఇలా అనేక విస్తృత వేదికలపై ప్రపంచ దేశాలు భూతాపం తగ్గించడానికి చేసిన ఉమ్మడి ప్రమాణాలు కాగితాలకే పరిమితం కావడం వల్ల ప్రపంచం ప్రమాదంలో పడింది.అయితే, కొన్ని దేశాలు మాత్రం క్లీన్ ఎనర్జీ (స్వచ్ఛమైన ఇంధనం) వాడకం దిశగా ముందుకు సాగడం కొంతలో కొంత ఊరట. శిలాజ ఇంధనాల వాడకాన్ని పక్కనపెట్టి, సున్నా కాలుష్యం వెదజల్లే (నెట్ జీరో ఎమిషన్) టెక్నాలజీల వైపు పరుగులుపెడుతున్నాయి. ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వినియోగాన్ని పెంచడం; మొక్కజొన్న, మరికొన్ని రకాల ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని తయారీ చేయడం; గాలి మరలు, సోలార్ ప్యానళ్ల నుంచి విద్యుత్ తయారు చేయడం మొదలైన కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నాయి. కొన్ని దేశాలు బయోఎనర్జీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని తగ్గిస్తు న్నాయి. భారత్‌లో కూడా ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వాడకం మొద లైనప్పటికీ వాటి సంఖ్య స్వల్పం. అలాగే, సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించింది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే విధంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. పౌర సమాజంలో చైతన్యాన్ని పెంచాలి. ముఖ్యంగా, ఈ అంశంపై వివిధ రాజకీయ పక్షాలలో ఏకాభిప్రాయం, మద్దతు అవసరం. అంతిమంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లయితేనే ఫలితాలు అందుతాయి. లేకుంటే... కరోనాను మించిన భూతం అయిన భూతాపం వల్ల మరిన్ని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
పవన్‌కు ఇది తగునా?
పవన్ కల్యాణ్‌కు ‘మెకాలే’ తెలుసు. పద్దెనిమిదవ శతా బ్దంలో మెకాలే ఏమి చెప్పాడో కూడా తనకి తెలుసు. ఇన్ని తెలిసిన పవన్ కల్యాణ్‌కు ఇరవయ్యొకటో శతాబ్దంలో తాను ఏమి చెప్ప కూడదో తెలియకపోవడం మాత్రం విచారకరం!నిజానికి పవన్‌కి తెలుసో లేదో గానీ, లేదా అతను ఏ అర్థంలో వాడాడో గానీ – ‘సాంస్కృతిక సామ్రాజ్య వాదం’ అనే పద ప్రయోగం మెకాలే నాటికి లేదు. 1960ల నాటిది. హెర్బర్ట్ షిల్లెర్ దాన్ని (మొదటిగా కాకపోయినా) వివరించాడు.ఒకవేళ విదేశీ పాలకులు తమ పరిపాలనను స్థిరపరచుకోడానికి తమ భాషను, ఆచారాల్ని, సంప్ర దాయాల్ని తెచ్చి బలవంతంగా మన మీద రుద్దే ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాడు అనుకున్నా అది పూర్తిగా మెకాలేకి వర్తించక పోవచ్చు. సరే మన చర్చ మెకాలేది కాదు. వదిలేద్దాం. మెకాలేది గతం. పవన్‌ది వర్తమానం. అతనొక బ్రిటిష్ హిస్టోరియన్. బ్రిటిష్ భాష, బ్రిటిష్ సంస్కృతి, శిక్షా స్మృతి – ఇంకా అనేక బ్రిటిష్ పరంపరల బానిస మెకాలే. బ్రిటిష్ ఉద్యోగి. బ్రిటిష్ పౌరుడు మెకాలే. కాబట్టి ఆ యూరోపియన్ సంస్కృతి గొప్పదనాన్ని మన మీద రుద్దాలని చూశాడనుకుందాము. పవన్ చెప్పినట్లు అతనిది ‘సాంస్కృతిక సామ్రాజ్యవాదమే’ అనుకొందాము. మరి ఇప్పుడు పవన్ మాట్లాడుతున్నది ఏమిటి? దీన్ని ఏమంటారు?అన్ని మతాల, అన్ని కులాల ఓట్లతో గెలిచి,అందరి ప్రతినిధిగా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసి, ఇప్పుడు ‘వారాహి’ సభలో ‘సనాతన ధర్మాన్ని కాపాడతానని, నేను ముమ్మాటికీ హిందువునేనని, దాని కోసం ప్రాణాలైనా అర్పిస్తానని’ చెప్పడం చూస్తుంటే పవన్ ఒక ‘హిందూ సాంస్కృతిక సామ్రాజ్యవాది’గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ‘అల్లాను, మహమ్మద్ ప్రవక్తను, క్రీస్తును విమర్శిస్తే ఒప్పుకుంటారా’ అంటూ ఒక హిందూ ఉగ్రవాదిగా కూడా మాట్లాడుతున్నారు. గెలవకముందు ‘నాకు కులం లేదు, మతం లేదు; నేను దేశాన్నీ, జాతినీ ప్రేమిస్తాను’ అని చెప్పి, గెలిచాక ‘నేను హిందువుని, సనాతన ధర్మాన్ని ఆరాధి స్తాను’ అని చెప్పడం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణిని బయట పెడుతుంది.‘నేను హిందువు’ని అని స్కూల్ సర్టిఫికెట్లో చెప్పినట్లుగా, ‘వారాహి సభ’లో కూడా చెప్పడమేనా? చేగువేరా, భగత్ సింగ్ పుస్తకాలు చదివి నేర్చుకున్నది ఇదేనా? మనం ఏదైనా చెబితే ఒక వంద మంది వింటారు. కానీ అదే పవన్ చెబితే లక్ష మంది వింటారు. అలాంటి పాపులారిటీ వున్న పవన్ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవచ్చునా? విశ్వనాథ సత్యనారాయణకు రామాయణం అనేది ఒక ‘కల్పవృక్షం’గా కనిపించింది. అదే రామా యణం రంగనాయకమ్మకు ‘విషవృక్షం’గా అనిపించింది. అయ్యప్పను గద్దర్ విమర్శించాడు. అయ్యప్ప పుట్టుక మీద, అతని భక్తుల దీక్ష మీద గద్దర్‌కి వున్న విమర్శ అది.సనాతన ధర్మం మీద, రాముని మీద ఈ రోజున పవన్ కల్యాణ్ చాలా ప్రేమను కురిపిస్తున్నాడు. అది అతని హక్కు. తమిళులకు ఏ రోజునా రాముడి మీద గౌరవం లేదు. సనాతన ధర్మం మీద ప్రేమ అంత కన్నా లేదు. అలా లేకపోవడానికి వారి కారణాలు వాళ్లకి ఉన్నాయి. ద్రవిడ సంస్కృతిలో రావణాసురు డికి వున్న చోటు రాముడికి లేదు. ఆ కోణంలో సనా తన ధర్మం అనేది ఉదయనిధి స్టాలిన్‌కి ఒక వైరస్ లాగా అనిపించి వుండవచ్చు.హిందూ దేవుళ్ళ మీద ఎలాగైతే విమర్శలు ఉన్నాయో, అలాగే క్రీస్తుని, అల్లాని, మహమ్మద్ ప్రవక్తని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. బైబిల్, ఖురాన్‌ల మీద రాసిన విమర్శలూ ఉన్నాయి. ఇదంతా ఏమీ చూడని పవన్ కల్యాణ్ అందర్నీ పట్టుకొని ‘సూడో సెక్యులరిస్టులు’ అని అంటున్నాడు.‘సనాతన ధర్మంలో అంటరానితనం వుంది.లింగ వివక్ష వుంది. అన్యాయం వుంది. అధర్మం వుంది’ అనుకున్న వాళ్ళు హిందూ మతం నుంచి వెళ్లిపోయారు. వేరే మతాల్లో చేరిపోయారు. దానికి కొన్ని వందల ఏళ్ళ చారిత్రక సందర్భం ఉంది. పవన్ ఇలా మాట్లాడటం వెనుక కూడా ఒక చారిత్రక సందర్భం ఉంది. జగన్‌ని ఒక సీటుకు పరి మితం చేయాలనుకోవడం ఆ సందర్భం కావచ్చు. లేదా తాను సీఎం కావడం భవిష్యత్తు సందర్భం కావచ్చు.జీవ శాస్త్రం ప్రకారం మనందరికీ ప్రాణం ఒక్కటే ఉంటుంది. ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి చాలా అవసరాలూ, సందర్భాలూ ఉంటాయి. ప్రాణం పోవ డానికి, లేదా ఇచ్చేయడానికి మాత్రం ఒకే సందర్భం ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్‌కు మాత్రం చాలా ప్రాణాలు ఉంటాయి. అవి ఇచ్చేయడానికి కూడా చాలా సందర్భాలు ఉంటాయి.దేశం కోసం ఒకసారి ఇచ్చేస్తారు. భారత జాతి కోసం ఇంకోసారి ఇచ్చేస్తారు. చేగువేరా కోసం, భగత్ సింగ్ కోసం లేదా వారి ఆదర్శాల కోసం మరొకసారి ఇచ్చేస్తారు. జగన్‌ని ఓడించడానికో, లేదా కూటమిని గెలిపించడానికో కూడా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు చివరగా సనాతన ధర్మాన్ని గెలిపించడానికి ఒక హిందువుగా ప్రాణాల్ని ఇచ్చేస్తానని చెబుతున్నారు.పవన్ కల్యాణ్‌ను ఒక హిందువుగా ఎంచి ఎవ్వరూ ఓట్లు వేయలేదు. సినిమా నటుడిగా, కాపు కులానికి చెందిన వాడిగా, కూటమిలో భాగస్థునిగా గెలిపించుకున్నారు. ఆ గెలిపించుకున్న వారంతా పవన్ గురించి ఇప్పుడు ఏమనుకోవాలి? తమను తాము హిందువుగా అనుకోని సమూహాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. వారంతా ఇప్పుడు పవన్ గురించి ఏమనుకోవాలి?‘పవనిజం’ అంటే ఇదేనా? అలాంటప్పుడు దీన్ని ‘హిందూయిజం’ అని కదా అనాలి? దక్షిణ భారత మద్దతు కోసం ఉత్తర భారతాన్ని విమర్శించడం,ఆంధ్రా వారి మద్దతు కోసం తెలంగాణాను విమర్శించడం, తెలంగాణా వారి మద్దతు కోసం తెలంగాణను కీర్తించడం, ఇప్పుడు మళ్ళీ ఆర్యుల్ని కీర్తించడం కోసం ద్రావిడుల్ని విమర్శించడం! ఇలాంటి అవకాశ వాద రాజకీయాల ద్వారా పవన్ సాధించగలిగింది ఏముంటుంది?పవన్‌లో ఇప్పుడు చేగువేరా లేడు. భగత్ సింగ్ లేడు. థెరిస్సా లేరు. గద్దర్ కూడా లేడు (వీళ్లంతా నిజంగా ఉన్నారని కాదు). మోడీ మాత్రమే ఉన్నాడు!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్తమొబైల్: 98494 49012 -
వివేచన హక్కుపై నిషేధమా?
మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అదే సమయంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... అది మనల్ని మనిషిగా తక్కువ చేసేస్తుంది. ప్రభుత్వం నిజాయితీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే సృజనాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికి అవకాశాలు న్నాయి. కానీ దండనలతో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది.అప్పుడు నాకు 16 ఏళ్లు ఉంటాయి. కానీ, నిన్ననే జరిగినంతగా ఆ సంగతి గుర్తుండి పోయింది. వీకెండ్ కోసం స్టోవ్ (యూఎస్‌లోని వమాంట్ రాష్ట్రంలో ఒక పట్టణం) నుండి వచ్చాను నేను. అందరం కలిసి టీవీ చూస్తున్నాం. కిరణ్ సిగరెట్ తాగుతూ ఉంది. ‘క్యారీ ఆన్’ (ప్రసిద్ధ బ్రిటిష్ కామెడీ సీరీస్)లోని ఒక చిత్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు సగం వరకూ రాగానే, మధ్యలో ఒక వాణిజ్య ప్రకటన మా దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు బ్రిటిష్ పోలీసు అధికారులు రోడ్డు పక్కన ఉన్న ఒక కేఫ్‌ను దాటి నడుచుకుంటూ వెళుతుండగా, వారి చూపు ఒక అందమైన యువతిపైన పడుతుంది. ఎడమ చేతిలో పొడవాటి సిగరెట్‌తో ఉన్న ఆమె కొద్ది కొద్దిగా కాఫీని సిప్ చేస్తుంటుంది. ‘‘ఆమెను చూడు’’ అని మొదటి పోలీస్ ఆఫీసర్ గుసగుసగా అంటాడు. ‘‘సిగరెట్ తాగుతోంది కదా?’’ అని రెండో ఆఫీసర్. ‘‘ఆమె కాళ్లు నాకు నచ్చాయి.’’‘‘అవి, కాలుతున్న ఆమె సిగరెట్ పొడవంత ఉన్నాయి.’’‘‘ఆ పెదవులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది నాకు.’’‘‘కంపు కట్టే యాష్‌ట్రేని ముద్దు పెట్టుకున్నట్లా?’’ఆ డైలాగ్ తర్వాత ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ముందుకు సాగిపోతారు. ఆ అందమైన యువతి స్క్రీన్ వైపు చూసి నవ్వుతుంది. విడివడిన ఆమె పెదవుల మధ్య పలువరుస నికోటిన్ మరకలతో పొగచూరి, గోధుమ వర్ణంలో ఉంటుంది! ‘యాక్’ అని అసంకల్పితంగా అరిచేశాను నేను. నా వెన్నులో వణుకు పుట్టింది. కిరణ్ అయితే తను తాగుతూ ఉన్న సిగరెట్‌ను అప్పటికప్పుడు విసిరి పారేసింది. ఆ వీకెండ్లో ఆమె మళ్లీ సిగరెట్ తాగినట్లు నాకు గుర్తు లేదు.ఆ వాణిజ్య ప్రకటనకు రూపకర్తలు ఎవరో నాకు తెలియదు. ప్రభుత్వమే చెప్పి చేయించిందో, లేదా ఏదైనా ప్రైవేటు ట్రస్టుఅందుకు నిధులు సమకూర్చిందో కానీ అది మాత్రం చాలా ప్రభావ వంతంగా ఉంది. మన ప్రభుత్వం నిజాయతీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే ఆ ప్రకటనలో ఉన్నట్లే సృజ నాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికైతే అవకాశాలున్నాయి. కానీ దండనలతో వారిలో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. అందుకే ధూమపానాన్ని నిషేధించాలన్న నిర్ణ యాలు ఘోరమైన తప్పిదాలుగా మిగులుతున్నాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది. మన ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదనే ఆశిస్తున్నాను. మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అది మన వ్యక్తిత్వాన్ని కూడా నిర్వచిస్తుంది. అదే సమ యంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... మానవత లోని అత్యవసరతల్ని నిరాకరిస్తుంది. అది మనల్ని తక్కువ చేసేస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం లేని పిల్లల్ని చూసి నట్లుగా మనల్ని చూస్తుంది. నిర్ణయించుకునే హక్కు నుండి మనం అవిభాజ్యంగా ఉండటం అన్న భావనతో ఇతరులు ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ ఒకే ఒక్క కార ణమే ఆ హక్కును నిలబెడుతుంది. మీకు భిన్నంగా ఉండటమనే నా హక్కులోనే నా వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. అంతేకాదు, నాలోని ఆ భిన్న త్వం మీకు నచ్చకపోయినా మీరు గౌరవించాలనే నేను కోరుకుంటాను. పొగ తాగే విషయం కూడా ఇంతే. పొగ తాగకుండా ఉండేందుకు వెయ్యి మంచి కారణాలు ఉంటాయి. పొగ మాన్పించేందుకు నన్ను ఒప్పించటానికి పది లక్షల సానుకూల వాదనలు ఉంటాయి. కానీ అప్పటికి కూడా నేను పొగ తాగుతున్నానంటే మీరు నా మీద నిషేధం విధించకూడదు. నా ఇష్టాన్ని అడ్డుకోకూడదు. మీరిలా నా మంచి కోసమే చేస్తున్నారన్న మీ వాదన విచిత్రమై నది, నమ్మశక్యం కానిది. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అన్న దానిని నేను కాదనలేదు. నేనే కాదు, నాకు తెలిసిన ధూమమాన ప్రియులు ఎవరూ కూడా కాదనలేరు. అతిగా తినటం, మితిమీరిన వ్యాయామం, కళ్లకు ఒత్తిడి కలిగించుకోవటం, విపరీతంగా కోక్‌లు తాగటం... ఇవన్నీ కూడా హానికరం కాదని ఎవరూ అనరు. అయినప్ప టికీ వీటిల్లో దేనినైనా నేను ఇష్టపడితే కనుక, అప్పుడు కూడా నేను మాత్రమే సలహాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే విషయాన్ని నిర్ణయించుకోవాలి. దాని వల్ల నేను ఇబ్బంది పడితే అలాగే కానివ్వండి. ఎందుకంటే నిర్ణయించుకునే హక్కులోనే ఆ నిర్ణయం వల్ల బాధ పడే హక్కు కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలి? సమాధానం చాలా సరళమైనది, సూటిౖయెనది. నిషేధం విధించటం కాకుండా ఎవరికి వారు సిగరెట్‌కు దూరమయ్యేలా ప్రభావం చూపే చర్యలు తీసు కోవాలి. సిగరెట్ ప్యాకెట్ల మీద అతి పెద్ద, అత్యంత భయానకమైన ఆరోగ్య హెచ్చరికలను చేయవచ్చు. పన్నులను తరచుగా పెంచుతూ ఉండొచ్చు. (దీని వల్ల ఒక దశ తర్వాత ప్రభుత్వానికి రాబడి తగ్గవచ్చు లేదా ప్రతికూల ఉత్పాదకత సంభవించవచ్చు). ధూమపానానికి వ్యతి రేకంగా విస్తృత ప్రచారాన్ని చేపట్టేందుకు నిధులను అందజేయవచ్చు. ఈ మూడింటినీ నేను సమర్థిస్తాను. అంతేతప్ప ఎప్పుడూ కూడా ధూమపాన నిషేధానికి ప్రయత్నించకూడదు. వ్యక్తులు, సమూహాలు తాము కోరుకున్నప్పుడే తమకై తాము ఆ పనికి సంకల్పించటం జరుగుతుంది. వారి కోసం ప్రభుత్వమే ఆ పని చెయ్యకూడదు. మరింత స్పష్టంగా చెబుతాను. మంచి ప్రభుత్వాలు – పెద్దలు పిల్లల్లో పరిణతి తెచ్చే విధంగా – తమకు తాముగా నిర్ణయించుకునే అవకాశాన్ని, అవకాశంతో పాటుగా వచ్చే బాధ్యతను స్వీకరించే సమర్థతను తమ పౌరులకు అందిస్తాయి. ఆ విధంగా దేశం తన కాళ్ల మీద ఎలా నిలబడాలో నేర్చుకుంటుంది. ఇందుకు భిన్నంగా చెడు ప్రభుత్వాలు పెద్దల్ని కూడా పిల్లలుగా పరిగణిస్తూ వారికున్న నిర్ణయ అధికారాన్ని లాగేసుకుని తమ సొంత నిర్ణయాలను వారిపై అమలు చేస్తాయి. అలా దేశాలు కూలిపోవటం మొదలవుతుంది. అన్నట్లు, నేను పొగ తాగటం మానేసి చాలాకాలమే అయ్యింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మానవ తాత్వికతకు దర్పణం
బాలగోపాల్ 2009 అక్టోబర్ 8న మరణించి ఇప్పటికి పదిహేనేళ్లు గడుస్తున్నా ఆయన ప్రాసంగికత కాలగమనాన్ని తట్టుకొని స్థిరంగా నిలబడే ఉన్నది. మనిషి ఉనికి, తాత్విక అర్థం, స్థూలంగా మానవ జీవితపు అంతరార్థం ఆయన వివరించినంత లోతుగా తెలుగునాట మరొకరు విశదీ కరించలేదన్నది అతిశయోక్తి కాదు. అంతరాలు నిండిన, అసమానతలతో కూడుకున్న సమాజం మనుషులకు వైకల్యంతో కూడిన ప్రాపంచిక దృక్పథాన్ని మాత్రమే అందించగలదనీ... సమానత్వ ప్రాతిపదికన, మనుషులను మనుషులుగా చూడగలిగే మానవీయ దృక్కోణాన్ని సంకల్పపూర్వకంగా అలవర్చుకోవా ల్సిందనీ బాలగోపాల్ నొక్కి వక్కాణించాడు. వైయక్తిక సంకల్పమే కాదు, సామాజిక ఆచరణ కూడా అంతే అవసరం అన్నాడు. ఈ సమానత్వ ప్రాపంచిక దృక్కోణాన్ని, మానవ ఆచరణను... సామాజిక నీతి నియమాలు, నిబంధనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో కూడా తన రచనల ద్వారా వివరించాడు. ఒక్క మానవ తాత్వికతను మాత్రమే కాదు, దాని సామాజిక చలన సూత్రాలను, సామాజిక ఉద్యమాలలో దాని మూలాలను విశ్లేషించి విడదీయరాని సంబంధాన్ని నెలకొల్పిన ఉద్యమకారుడు కూడా ఆయనే. తన జీవితాన్ని ఈ సామాజిక తాత్విక దృక్పథానికి ఒక తిరుగులేని ప్రయోగశాలగా మార్చిన అరుదైన వ్యక్తి. సంక్లిష్టమైన భారత సామాజిక జీవితంలో అస మానతలు భిన్న పాయలుగా మన జీవితంలో పెన వేసుకు పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ అసమానతలను రూపు మాపటానికి చైతన్యపూరితంగా మనం చేయవలసిన కృషిని తను జీవించి ఉన్నంతకాలం మనకు తన జీవిత ఆచరణ ద్వారా మార్గదర్శనం చేశాడు. 2024 ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణ తీర్పులో సైతం ఆయన వాదనలను ఉటంకించటం దీనికి ఒకానొక ఉదాహరణ మాత్రమే. దళితులలో దళితులు అన్న పదం వాడగలిగిన ఏకైక వ్యక్తి ఆయన. వివక్ష ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్న తన సూక్ష్మ పరిశీలన ద్వారా దానిని పసి గట్టి ఆ వివక్ష తాత్విక మూలాల్ని సమాజానికి విశద పరిచిన వ్యక్తి బాలగోపాల్. వివక్ష అసలు అర్థం అసమానతేననీ, అది అసమానతను అనుభవిస్తున్న వర్గాల్లో సైతం ఆచరణలో ఉండగలదనీ, అక్కడ కూడా మనం సమానత్వ ప్రాతిపదికనే ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందనీ ఎలుగెత్తినవాడు ఆయన.పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దారుణ మారణకాండను చూసినప్పుడు ఇంత అమానవీయమైన హింసకాండకు కారణాలను ఆయన మనకు ఒక కొత్త కోణంలో, మానవీయ కోణంలో ఆవిష్కరించేవాడు అని మనం గుర్తు తెచ్చుకోకుండా ఉండలేము. తొలి రోజుల్లో వర్గ సిద్ధాంతపు ఆలోచనా ధోరణికి కొంత ప్రభావితమైనా మానవత్వపు విస్తృత పరిధి ఒక సిద్ధాంత చట్రంలో ఇమిడేది కాదనీ, మానవత్వానికి నిర్వచనం మానవత్వంతో మాత్రమే ఇవ్వగలమనీ తన కార్యాచరణ ద్వారా గ్రహించిన ఆయన చివరికంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మాన వతను మానవీయ దృక్కోణంలోనే విస్తరించాడు. ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు, దానికి తిరుగుబాటుగా వచ్చే ప్రతిహింస సైతం మానవ త్వానికి జవాబు దారీగా ఉండాలనీ, అలా కాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అను కరణ మాత్రమే కాగలవనీ వివరించాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు... సామాజిక ధోరణులలో, సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు ఉండగలవనీ... ప్రజా జీవితంలో సైతం అసమానతలతో కూడిన సమాజాన్ని కొనసాగించడానికి అవసరమైన అధిప త్యాలు ఉండగలవనీ వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయటం హక్కుల ఉద్యమపు బాధ్యత అని తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతా కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసిన వ్యక్తి బాలగోపాల్. ఆయన ఈరోజు లేకపోవచ్చు కానీ ఆయన తాత్విక దృక్పథం ఆయన రచనల ద్వారా అందుబాటులోనే ఉన్నది. తెలుగు సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ సమస్యలకు ఆయన రచనలలో పరిష్కారాలు లభించ గలవు. అధికారాన్ని సందేహించనివారు హక్కుల కార్యకర్తలు కాజాలరు అన్న మాట ఆయనలోని నిండైన మానవత్వాన్ని ఆవిష్కరిస్తుంది. మానవీయ సమాజం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం కృషి చేయడమే ఆయన జీవితాచరణ ద్వారా నిర్దేశించిన ఏకైక కర్తవ్యం.– టి.హరికృష్ణ, మానవ హక్కుల వేదిక (నేడు హైదరాబాద్‌లో బాలగోపాల్ 15వ సంస్మరణ సదస్సు) -
విద్యారంగ మార్పుల గమ్యం ఎటువైపు?
అందరికీ విద్య లేకుండా ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదన్నాడు భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్. నేటి బాలలే రేపటి పౌరులు అన్నాడు తొలి ప్రధాని నెహ్రూ. కానీ దేశంలో ఇప్పటికీ అక్షరాస్యత రేటు 77% దాటలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే అక్షరాస్యత రేటు 66% కూడా లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. తమ మేనిఫెస్టోలో విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయి స్తామని చెప్పి 7.3% మాత్రమే కేటాయించింది కాంగ్రెస్. పక్కన ఉన్న తమిళనాడులో 13.4%,ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యకు 12.6% నిధులు కేటాయించారు.పాఠశాల విద్యను తీసుకుంటే పాఠశాలల మూసివేతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 2022 –23 సంవత్సరంలో దాదాపు 8,500 పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్నారు. 1,864 స్కూళ్లలో విద్యార్థులే లేరు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ పాఠశాలల దగ్గరలోనే విద్యా శాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇవ్వడం. చట్ట ప్రకారం ప్రభుత్వ పాఠశాలకు కనీసం ఒక్క కిలోమీటర్ దూరం ఉంటే తప్ప అనుమతులు ఇవ్వకూడదు. విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరొక ప్రధానమైన కారణం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడం. ఇంకా బతుకుదెరువు కోసం గ్రామాల నుండి పట్టణాలకు వలసలు, జనాభా తగ్గుదల మొదలైన అంశాలు విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలు కావచ్చు. ఇంకా ఈ విషయంపై లోతైన అధ్యయనం చేసి కారణాలను కనుక్కోకుండా, ఆ కారణాలను నిర్మూలించకుండా, తక్కువ విద్యార్థులు ఉన్నారని అక్కడ ఉన్న టీచర్లను వేరే స్కూళ్లకు పంపించడం, విద్యార్థులే లేరని పాఠశాలలను మూసివేయడం మూర్ఖత్వం.పాఠశాలల్లో ఒక ప్రణాళిక ప్రకారం బోధన జరుగుతుందా లేదా చూసుకోవాలంటే విద్యాశాఖ అధికారులు ఉండాలి. అటువంటి అధికారుల పోస్టులు దాదాపు అన్నీ ఖాళీగా ఉన్నాయి. దిగ జారుతున్న ఈ పరిస్థితులను చక్కబెట్టి సుమారు 30 వేల పాఠశాలలను అభివృద్ధి చేసే బదులు, నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపి స్తామని అంటున్నారు. కామన్ స్కూల్‌కు భిన్నంగా ఇప్పటికే రకరకాల అంతరాలతో భ్రష్టు పడుతున్న పాఠశాల విద్యకు ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకొక అంతరాల దొంతర తయారు కాబోతున్నది.అలాగే ఉన్నత విద్యలో ప్రభుత్వ రంగంలో ఉన్న 17 స్టేట్ యూనివర్సిటీలను సమగ్రంగా అభి వృద్ధి చేసే బదులు భూకబ్జాదారులకు, విద్యా వ్యాపారులకు, కంపెనీలకు ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో 50 ఎకరాల భూమిలో ఒక ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో 2 వేలకు పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ యూనివర్సిటీలలో బోధనేతర సిబ్బంది ఖాళీలు తీసుకుంటే అవి వేల సంఖ్యలో ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీలలోని పోస్టులను భర్తీ చేయలేదు.ప్రస్తుతమున్న యూనివర్సిటీలను, ఇంజనీరింగ్ కళాశాలలను, పాలిటెక్నిక్ కళాశాలలను, ఐటీఐలను సమగ్రంగా అభివృద్ధి చేసి నైపుణ్యాలను నేర్పవచ్చు. అలా చేయకుండా కొత్తగా స్కిల్ యూనివర్సిటీని స్థాపించడం ఎవరికోసమనే ప్రశ్న తలెత్తక మానదు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో భాగంగా 19 పేరెన్నిక గల విదేశీ కంపెనీలు హైద రాబాదుకు రాబోతున్నాయని తెలుస్తున్నది. ఇక్కడ 2 వేల మందికి నైపుణ్యాలను నేర్పిస్తామని అంటున్నారు. ఈ విదేశీ కంపెనీలకు నైపుణ్యం కలిగిన తక్కువ జీతానికి పనిచేసే, బానిస మనస్తత్వం కలిగిన కార్మికులను తయారుచేయడానికి వస్తుందా ఈ స్కిల్ యూనివర్సిటీ అనే అనుమానం కలుగు తుంది. ఇక్కడ ఫ్యాకల్టీని నియమించడంలో, విద్యార్థులకు అడ్మిషన్ కల్పించడంలో రిజర్వేషన్ల పద్ధతి పాటిస్తారా? ఫీజులు ఎంత ఉంటాయి అన్న వివరాలు ఇంకా అధికారికంగా తెలియవలసి ఉంది. చదవండి: సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు పాఠశాల స్థాయి నుండి అన్ని వసతులతో కూడిన వ్యాయామ విద్య లేకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం అర్థరహితం. వేలాది ప్రభుత్వ పాఠశాలలకు ఆట స్థలాలు లేవు. క్రీడా పరికరాలు లేవు. అన్ని పాఠశాలలో పీఈటీ / పీడీ పోస్టులు మంజూరు చేయబడలేదు. పట్టణాలలో మెజారిటీ ప్రైవేటు పాఠశాలలకు ఆట స్థలాలే లేవు. అటువంటి పరిస్థితులలో స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపిస్తామనడం పునాది లేకుండా భవనం నిర్మించడమే. మొత్తానికి గత తొమ్మిది నెలల్లో తెలంగాణ విద్యారంగంలో వచ్చిన మార్పుల గురించి సమాజంలో లోతైన చర్చ జరగవలసి ఉన్నది.-ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యులు -
లంక కామ్రేడ్ల నుంచి స్ఫూర్తి పొందాలి!
భారత్ పొరుగు దేశమైన శ్రీలంకలో మార్క్సిస్టు నాయకులైన అనూర కుమార దిస్సనాయకే దేశ అధ్యక్షుడుగానూ, హరిణి అమరసూర్య ప్రధానమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆసియా రాజకీయాల్లో పెను ఆసక్తికర, ఆహ్వానించదగిన పరిణామాలకు ఆస్కారం ఏర్పడింది. భారత దేశంలోని ఎన్డీయే– ఆరెస్సెస్ వినాశకర కూటమి ప్రభుత్వం శ్రీలంకలోని మితవాద పక్ష పాలకులతో ‘జోడీ’ కట్టి చిరకాలంగా వర్ధిల్లుతున్న భారత్–శ్రీలంక స్నేహ పూర్వక సంబంధాలలో ‘చిచ్చు’ పెట్టింది. ఈ విషమ పరిణామానికి సకాలంలో విరుగుడుగా వచ్చిందే సింహళంలో వామపక్ష పరిపాలన.శ్రీలంక సమగ్రాభివృద్ధిని కాంక్షించి, పాక్షిక ధోరణుల్లో గాక శ్రీలంక ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని చేపట్టారు మార్క్సిస్టు నాయకులు. అలాంటి పరిణామాన్నే భారతదేశంలోనూ ఆవిష్కరించగల అవకాశం ఉన్నా... చీలికలు పీలికలుగా ఉన్న వామపక్షాలు ఒకే తాటిపైకి రాలేకపోతున్నాయి. నాయకులు తమ పదవులను త్యజించి విస్తృత ప్రాతిపదికన ఒకే ఒక పార్టీగా ఆవిర్భవించడానికి కృషి చేయడంలేదు. ఎన్టీయే కూటమి దుష్ట ఇజ్రాయెల్‌తో కలిసి దేశంలోని ప్రగతివాద శక్తులపై నిఘాపెట్టి నానా ఇబ్బంది పెట్టిన చరిత్ర తెలియంది కాదు. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశంలోని వామ పక్షాలన్నీ ‘చిల్లర తగాదాలు’ మానుకుని ఐక్య వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఇందుకు శ్రీలంక చూపిన ‘ఐక్య ఉద్యమ స్ఫూర్తి’ని భారత వామపక్షాలన్నీ తక్షణం పొందాల్సిన అవసరం ఉంది.ఇదే సందర్భంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశంలో ఆచరణలో నిజమైన ఫెడరల్ వ్యవస్థను పాదుకొల్పడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమతులమైన అధికారాల పంపిణీ నొక్కి వక్కాణించారు. ఫెడరల్ వ్యవస్థ సూత్రాల ప్రకారం, కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలనుంచి వసూలు చేస్తున్న సెస్‌లు, ఇతర పన్నులను అదే దామాషా ప్రకారం రాష్ట్రాలకు పంచి తీరాల్సిందేనని భట్టి కోరారు. దీన్నిబట్టి చూస్తే, ఇరుగు–పొరుగైన శ్రీలంకలో అంతటి భారీ స్థాయిలో వామపక్ష నేతల ఆధ్వ ర్యంలో క్రమానుగతంగా సాగక తప్పని పరిస్థితులు ఎందుకు వచ్చాయో భారత వామపక్షాల నేతలు కేవలం గుర్తించడమేగాదు, ఆచరణలో దేశంలో ఐక్య ఉద్యమ నిర్మాణానికి పునాదుల్ని పటిష్టం చేసుకొనక తప్పదు. ఇటాలియన్ మాఫియా నుంచి, ఇజ్రాయెల్ గూఢచారుల నుంచి భారతదేశ తక్షణ రక్షణకు దేశంలోని వామపక్షాలన్నీ సిద్ధం కావాలి. నిరుపేదలైన షెడ్యూల్డ్ తరగతులకు చెందిన అట్టడుగు వర్గాల ప్రజలపైనే 13 రాష్ట్రాలలో దారుణమైన అత్యాచారాలు నమోదయ్యా యని తాజా నివేదికలు సాధికారికంగా ప్రకటించాయి. వీటన్నింటికి ముగింపు ఎప్పుడు? ఫెడరల్ వ్యవస్థ పునరుద్ధరణ ద్వారానేనని ఆ నివేదికలు తెలియజేస్తున్నాయి.చదవండి: ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?ఎన్డీయే – ఆరెస్సెస్ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ దశలో, ముఖ్యంగా చైతన్యశీలి అయిన ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి 2025 నాటికి గానీ పదవీ విరమణ చేసే అవకాశం లేదు కాబట్టి, ఆ లోగా ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రధాని’ అన్న నినాదంతో ప్రస్తుత కేంద్ర పాలకులు ఏ అఘాయిత్యం చేసే అవకాశం లేదు. ఈలోపు దేశీయ వామపక్షాలు, సంబంధిత వర్గాలన్నీ ఒక్క తాటిపై కదిలి రాగల కార్యాచరణ వ్యూహానికి శ్రీకారం చుట్టాలి.శ్రీలంకలో కమ్యూనిస్టు – మార్క్సిస్టుల అను భవం సుదీర్ఘ కాలంలో నేటి అమూల్యమైన దీర్ఘకాలిక ఫలితాన్ని శ్రీలంక ప్రజలకు ప్రసాదించగల్గింది. లంక పరిణామం ఆసియాలోని చుట్టు పట్ల దేశాల ప్రజాబాహుళ్యానికి సహితం ఆదర్శంగా పరిణమించింది. భారత వామపక్షాలు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఏకం కావాలి. శ్రీలంక వామపక్షాలు సాధించి ఆదర్శనీయమైన విజయం నుంచి భారత ప్రజల భవిష్యత్తుకు అనువైన ఉమ్మడి వ్యూహ రచనకు నడుం బిగించాలి. ఇందుకు మొదటి షరతుగా నాయకత్వం రూపకల్పనకు అవసరమైన వ్యూహాన్ని సమష్టిగా రూపొందించుకోవాలి. ఇది తప్ప మరో మార్గం లేదు. ఈ సందర్భంగా శ్రీలంకలో భారత మాజీ హైకమిషనర్‌గా పనిచేసిన గోపాలకృష్ణ గాంధీ శ్రీలంక పరిణామాల్ని సమీక్షిస్తూ... విప్లవాత్మక భావాలు మార్చుకోకుండానే ప్రజాస్వామిక ధోరణులు కూడా బలపడటానికి అనువుగా రాజకీయ పక్షాల సిద్ధాంత ధోరణులు కూడా ఉండాలనీ, ఈ ధోరణుల్ని శ్రీలంక వామపక్షాలు పెంచుకుంటూ మార్పునకు అనుగుణమైన వ్యూహరచనను ఆశ్రయించాయనీ అన్నారు. భారత్–శ్రీలంక సంబంధాలలో కూడా పెను మార్పులకు అవకాశం ఉందని గోఖలే ఆశాభావం వెలిబుచ్చారు.- ఏబీకే ప్రసాద్సీనియర్ సందకులు abkprasad2006@yahoo.co.in