Sakshi Special
-
ఒకే సమయం నిద్రతో ఒత్తిడికి కళ్లెం
న్యూఢిల్లీ: నిద్ర. అలసిన శరీరాన్ని అమాంతం ఆక్రమించి మరోలోకానికి తీసుకెళ్లే అదృశ్యదేవత. అలాంటి నిద్రాదేవత ఆవాహన చిన్నారుల్లో రోజూ ఒకేసమయంలో జరిగితే ఒనగూరే ప్రయోజనాలు అంతాఇంతా కాదని తాజా పరిశోధనాలో వెల్లడైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలోని పరిశోధకులు ఈ మేరకు ఆరేళ్ల వయసు చిన్నారులపై ఒక విస్తృతస్థాయి, సుదీర్ఘ పరిశోధన చేశారు. పుట్టినప్పటి నుంచి రెండున్నరేళ్ల వయసు వచ్చే వరకు కొందరు చిన్నారులను వారి తల్లిదండ్రులు శ్రద్ధాసక్తులతో పెంచేలా ఆ పేరెంట్స్‌కు శిక్షణనిచ్చారు. చిన్నారి వేర్వేరు సందర్భాలకు తగ్గ భావోద్వేగాలు, శారీరక అవసరాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తీరుస్తూ వారి ఆలనాపాలనా బాధ్యతలను చక్కగా నెరవేర్చేలా చూశారు. మారాంచేసినపుడు గారాబం చేయకుండా పరిస్థితిని చక్కగా విడమరిచి చెప్పేలా తల్లిదండ్రులకు తగు తరీ్ఫదునిచ్చారు. అలసపోయి నిద్రలోకి జారుకునేటపుడు నిద్రకు అనువైన వాతావరణం ఉండేలా చూడడం, దీపాలన్నీ ఆర్పేసి చిన్నారులను వీపుపై తడుతూ బుజ్జిగించి పడుకోబెట్టడం వంటివి చేయాలని పరిశోధకులు సూచించారు. పరిశోధనలో ఏం తేలింది? ఇలా చేయడం వల్ల చిన్నారులు రోజూ ఒకే సమయానికి పడుకోగలిగారు. నిద్రసమయం కూడా దాదా పు వారి వయసుకు తగ్గట్లు ఉండేది. దీంతో చిన్నారులు తమ దైనందిన జీవితంలో చవిచూసిన భావోద్వేగాలను చక్కగా నియంత్రించుకోవడం పరిశోధకులు గమనించారు. ఒకే సమయంలో నిద్రపోవడం వల్ల గాఢ నిద్ర సాధ్యమైంది. ‘‘స్థిరమైన నిద్రాకాలం అనేది పిల్లల ఎదుగుదలకూ ఎంతో తోడ్పడింది. నిద్రసరిగా పట్టకపోవడం వంటి సమస్యలు వీరిలో తలెత్తలేదు’’అని పరిశోధకులు చెప్పారు. సంబంధిత వివరాలు డెవలప్మెంటల్ అండ్ బిహేవియర్ పిడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇతర చిన్నారుల్లో ఇబ్బందులు పరిశోధనకు ఎంచుకున్న పిల్లలతో పోలిస్తే అస్తమానం అస్తవ్యస్త్య సమయాల్లో నిద్రించే పిల్లల్లో భావోద్వేగాలపై నియంత్రణ చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో కీలక పరిశోధకుడు అద్వా డాడ్జీ చెప్పారు. ఈయన పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీలో బిహేవియర్ హెల్త్ విభాగంలో సేవలందిస్తున్నారు. పరిశోధకులు పిల్లలు రోజు ఏ సమయానికి నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రపోతున్నారు, గాఢనిద్ర వివరాలు తెల్సుకునేందుకు వాళ్ల మణికట్టుకు మానిటర్లను అమర్చారు. ఎలాంటి ప్రయోగాలు చేశారు? ఒకేసమయంలో నిద్రించే పిల్లలకు ఒక పెద్ద బొమ్మల సమూహం నుంచి ఒకేఒక్క బొమ్మను తీసుకుని ఆడుకోవాలని సూచించారు. ప్రతి బొమ్మను విడివిడిగా ఒక చిన్న పెట్టెలో తాళం వేసి దాచారు. ఆ పెట్టెల తాళంచెవులను ఇచ్చి తెరచి తీసి ఆడుకోవాలని సూచించారు. ఏ తాళంచెవికి ఏ పెట్టే తెరచుకుంటుందో కనిపెట్టేందుకు.. ఒకేసమయంలో నిద్రించే పిల్లలు మాత్రం శ్రద్ధగా ఒక్కో పెట్టెను తాళంచెవితో తెరచే ప్రయత్నంచేశారు. నిద్రానియమంలేని పిల్లలు మాత్రం ఒక్కో పెట్టెను తెరిచే ఓపికలేక ఆవేశంతో ఆ తాళం చెవులను విసిరిపారేశారు. మరో ప్రయోగంలో రెండు రకాల పిల్లలను ఒకచోటచేర్చి కలిసి ఆడుకోండని సూచించారు. ఈ సందర్భంలోనూ నిద్రనియంత్రణ ఉన్న పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆడుకునే ప్రయత్నంచేశారు. కొందరు పిల్లలను వారంలో ప్రతి రోజూ ఒక 20 నిమిషాలు ముందుగా లేదా 20 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోయేలా చేశారు. ఇంకొందరిని వారంరోజులపాటు ఏకంగా రెండు గంటలు ముందుగా లేదంటే ఆలస్యంగా నిద్రపోనిచ్చారు. 20 నిమిషాల తేడాతో నిద్రించిన పిల్లల్లో భావోద్వేగాల నియంత్రణ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. -
మహారాష్ట్ర ఎన్నికల్లో.. కుటుంబ కథాచిత్రం!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సకుటుంబ, సపరివార కథా చిత్రాన్ని తలపిస్తున్నాయి. ఠాక్రేల నుంచి పవార్ల దాకా అనేక కాకలు తీరిన రాజకీయ కుటుంబాల నుంచి బోలెడంత మంది ఎన్నికల బరిలో నిలిచారు. బాబాయ్, కొడుకులు, తండ్రీ కూతుళ్లు, మామ, అల్లుళ్లు, చివరకు భార్యాభర్తలు కూడా పోటీ పడుతున్నారు. కనీసం ఐదు అసెంబ్లీ స్థానాల్లో దగ్గరి బంధువులే అమీతుమీ తేల్చుకుంటున్నారు! పవార్ వర్సెస్ పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం పవార్ వర్సెస్ పవార్‌గా ఉంది. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ బరిలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తన పెదనాన్న, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌తో ఆయన పోటీ పడుతుండటం విశేషం. ఇక్కడ ఏకంగా ఏడుసార్లు నెగ్గిన చరిత్ర అజిత్‌ది. ఆయన తమ్ముడు శ్రీనివాస్ పవార్ కుమారుడు యుగేంద్ర. శరద్ పవార్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. బారామతిలో పవార్ వర్సెస్ పవార్ ఇది రెండోసారి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ భార్య సునేత్రను శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే ఓడించారు.భార్యాభర్తల సవాల్ ఛత్రపతి శంభాజీనగర్‌లోని కన్నడ్ అసెంబ్లీ స్థానం ఏకంగా భార్యాభర్తల నడుమ ఆసక్తికర పోరుకు వేదికైంది. శివసేన అభ్యర్థి సంజనా జాదవ్‌పై ఆమె భర్త హర్షవర్ధన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ రాజకీయ కుటుంబాల నుంచే వచ్చారు. హర్షవర్ధన్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దివంగత రైభాన్ జాదవ్ కుమారుడు. ఇక సంజన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే కుమా ర్తె. హర్షవర్ధన్ 2009లో రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) తరఫున కన్నడ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో శివసేన టికెట్‌పై మరోసారి విజయం సాధించారు. మరాఠా కోటా ఉద్యమంపై ప్రభుత్వం ఉదాసీనతను నిరసిస్తూ 2018లో రాజీనామా చేశారు. భార్యాభర్తలిద్దరూ 2019లో విడిపోయినా ఇంకా విడాకులు తీసుకోలేదు. ఇదే విషయాన్ని హర్షవర్ధన్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. సంజన మాత్రం తాను వివాహితురాలినేనని పేర్కొన్నారు. ఎందరో వారసులు... శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్రా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. బాంద్రా ఈస్ట్‌లో ఆదిత్య మేనమామ వరుణ్ సర్దేశాయ్ వాండ్రేతో దివంగత బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ (ఎన్సీపీ) తలపడుతున్నారు. ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ముంబైలోని మాహిం నుంచి పోటీ చేస్తున్నారు. ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ వాండ్రే, ఆయన సోదరుడు వినోద్ షెలార్; మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారులు అమిత్, ధీరజ్; శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ) మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ మేనల్లుడు ప్రజక్త్ తాన్పురే, ఎన్సీపీ సీనియర్ మంత్రి ఛగన్ భుజ్‌బల్, ఆయన సోదరుడి కుమారుడు సమీర్ తదితరులు కూడా అసెంబ్లీ బరిలో ఉన్నారు. మోహన్‌రావు హంబర్డే కాంగ్రెస్ నుంచి, ఆయన సోదరుడు సంతుక్రావ్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండటం విశేషం. గణేశ్ నాయక్ బీజేపీ తరఫున, ఆయన చిన్న కుమారుడు సందీప్ ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విజయ్‌కుమార్ గవిట్ కుటుంబం నుంచి ఏకంగా నలుగురు అసెంబ్లీ బరిలో ఉన్నారు. విజయ్‌కుమార్ బీజేపీ నుంచి, సోదరుడు రాజేంద్ర గవిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా మరో సోదరుడు భరత్, కుమార్తె హీనా ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు! బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే కుమారులు నితేశ్, నీలేశ్ కూడా అసెంబ్లీ బరిలో దిగారు.తండ్రీ కూతుళ్ల పోటీ గడ్చిరోలి జిల్లా అహేరి నియోజకవర్గం తండ్రీకూతుళ్ల పోటీకి వేదికగా నిలిచింది! ఎన్సీపీకి చెందిన మంత్రి ధర్మారావు బాబా ఆత్రంపై ఆయన కుమార్తె భాగ్యశ్రీ ఆత్రం హల్గేకర్ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి అంబరీశ్ రావు ఆత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. లోహా–కంధర్ నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ప్రతాప్‌రావ్ పాటిల్ చిక్లీకర్ తన బావమరిది శ్యాంసుందర్ షిండేతో తలపడుతున్నారు. షిండే గతంలో చిఖలీకర్ మద్దతుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడం విశేషం! సిం«ద్ఖేడ్ రాజా నియోజకవర్గంలో ఎన్సీపీ (ఎస్పీ)కి అభ్యర్థి రాజేంద్ర షింగ్నే తన మేనకోడలు గాయత్రి షింగ్నేపై పోటీ చేస్తున్నారు. ఆమె అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాసిక్‌లోని చాంద్వాడ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాహుల్ అహెర్ తన సోదరుడు కేదా అహెర్పై బరిలోకి దిగారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సన్‌రూఫ్.. సూపర్ క్రేజ్!
బీచ్ రోడ్డులోనో... ఫారెస్ట్ దారిలోనో కారులో అలా ఓ లాంగ్ డ్రైవ్కెళ్లాలని ఎవరికుండదు చెప్పండి? దీంతో పాటు కారులో సన్‌రూఫ్ కూడా ఉంటే... మజామజాగా ఉంటుంది కదూ! దేశంలో కారు ప్రియుల మది దోచేస్తున్న క్రేజీ ఫీచర్ ఇది. ఒకప్పుడు లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ అదిరిపోయే ఫీచర్ ఇప్పుడు చిన్న కార్లలోనూ వచ్చి చేరుతుండటం దానికున్న క్రేజ్‌కు నిదర్శనం!దేశీ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు సన్/మూన్ రూఫ్ మాంచి ట్రెండింగ్‌లో ఉంది. యువ కస్టమర్ల జోరుతో ఈ ఫీచర్ ‘టాప్’లేపుతోంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ఎస్‌యూవీలు, సెడాన్లతో పాటు హ్యాచ్బ్యాక్స్లోనూ దీన్ని చేర్చేందుకు సై అంటున్నాయి. డిమాండ్ ‘రూఫ్’ను తాకుతుండటంతో ప్రపంచస్థాయి తయారీ సంస్థలు దీన్ని సొమ్ము చేసుకోవడానికి తహతహలాడుతున్నాయి. మార్కెట్లో అధిక వాటా కోసం భారీ పెట్టుబడులతో ఉత్పత్తి పెంచే పనిలో ఉన్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన ఇనాల్ఫా రూఫ్ సిస్టమ్స్ దాని భాగస్వామ్య సంస్థ గాబ్రియెల్ ఇండియాతో కలిసి తయారీని పరుగులు పెట్టిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో సన్‌రూఫ్‌ల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది ఈ జాయింట్ వెంచర్ (ఐజీఎస్ఎస్) లక్ష్యం. ఈ ఏడాది ఆరంభంలో చెన్నైలో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఐజీఎస్ఎస్కు ఏటా 2 లక్షల సన్‌రూఫ్‌ల తయారీ సామర్థ్యం ఉంది. హ్యుందాయ్, కియా కంపెనీలకు ఇది సన్‌రూఫ్‌లను సరఫరా చేస్తోంది. ఇక జర్మనీకి చెందిన గ్లోబల్ సన్‌రూఫ్ తయారీ దిగ్గజం వెబాస్టో కూడా తయారీ గేరు మార్చింది. ప్రస్తుతం ఏటా 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుండగా... 2027 నాటికి రెట్టింపు స్థాయిలో 9.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తోంది. ట్రెండ్ రయ్ రయ్... దేశీ వాహన రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా కొంగొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. అత్యధికంగా కారు ప్రియులు కోరుకుంటున్న ఫీచర్లలో సన్‌రూఫ్ శరవేగంగా దూసుకుపోతోందని యూనో మిండా చైర్మన్, ఎండీ ఎన్కే మిండా చెబుతున్నారు. దేశంలోని దిగ్గజ వాహన విడిభాగాల సంస్థల్లో ఇది ఒకటి. సన్‌రూఫ్‌ల తయారీ కోసం తాజాగా జపాన్‌కు చెందిన ఐసిన్ కార్ప్‌తో సాంకేతిక లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోని టాప్–10 వాహన విడిభాగాల ఉత్పత్తి కంపెనీల్లో ఐసిన్ కార్ప్ కూడా ఒకటి. కాగా, యూనో మిండా 80,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో హరియాణాలో కొత్త ప్లాంట్ నెలకొల్పుతోంది. ‘ఈ మధ్య కాలంలో సన్‌రూఫ్‌ల వాడకం ఓ రేంజ్లో పెరుగుతోంది. గతంలో బడా ఎస్‌యూవీలు, లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ట్రెండ్ మరింత జోరందుకోనుంది. ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ (చిన్న కార్లు) కస్టమర్లు సైతం ఈ ఫీచర్ కోసం ఎగబడుతుండటమే దీనికి కారణం’ అని మిండా వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరే ఇక్కడా వినూత్న ఫీచర్లు, కస్టమైజేషన్లకు ప్రాధాన్యమిచ్చే ట్రెండ్ కనిపిస్తోందన్నారు.స్టేటస్ సింబల్... ఇప్పుడు కారే కాదు అందులోని ప్రీమియం ఫీచర్లు కూడా స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. ఇందులో సన్‌రూఫ్ కూడా ఒకటి. క్రూయిజ్ కంట్రోల్, కళ్లు చెదిరే డిస్ప్లేలు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ లాంటి ఫీచర్లకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. వీటి వాడకం అరుదుగానే ఉన్నప్పటికీ, భారతీయ రోడ్డు పరిస్థితులకు పెద్దగా ఉపయోగకరం కానప్పటికీ.. కస్టమర్లు మరిన్ని ప్రీమియం ఫీచర్లు కోరుకుంటుండటంతో కార్ల కంపెనీలు వాటిని తప్పనిసరిగా అందించాల్సిన పరిస్థితి నెలకొందని జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా పేర్కొన్నారు.ప్రతి నాలుగు కార్లలో ఒకటి... జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు కార్లలో ఒక కారుకు (27.5%) ఈ లగ్జరీ ఫీచర్ ఉంది. ఐదేళ్ల క్రితం 12.7%తో పోలిస్తే కస్టమర్లు దీనికి ఎలా ఫిదా అవుతున్నారనేది ఈ జోరు చాటిచెబుతోంది. కాగా వచ్చే ఐదేళ్లలో (2029 నాటికి) ఈ విభాగంలో 17.6 శాతం వార్షిక వృద్ధి (సీఏజీఆర్) నమోదవుతుందనేది వాహన పరిశ్రమ అంచనా. ముఖ్యంగా ఎస్‌యూవీల్లో సన్‌రూఫ్ ఫీచర్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ ఏడాది జనవరి–ఆగస్ట్ మధ్య ఏకంగా 44.7% వృద్ధి ఈ విభాగంలో నమోదైంది. మరోపక్క, భారతీయ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తయారీ సంస్థలు అధునాతన గ్లాస్ టెక్నాలజీతో సన్‌రూఫ్‌లను ప్రవేశపెడుతున్నాయి. వేడిని బాగా తట్టుకోవడం, యూవీ కిరణాల నుంచి రక్షణతో పాటు సన్‌రూఫ్‌లను ‘స్మార్ట్రూఫ్’లుగా మార్చేస్తున్నాయి. పానోరమిక్ సన్‌రూఫ్‌లు కారు లోపల మరింత విశాలమైన స్పేస్ ఫీలింగ్‌ను కూడా అందిస్తాయని భాటియా చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Sakshi Little Stars: తారే జమీన్ పర్
‘మేం పాటలు పాడతాం. డైలాగ్స్ గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాం. పొడుపుకథలు వేస్తాం, ప్రశ్నలతో తికమక పెట్టేస్తాం. స్కూల్లో చదువుకుంటాం, సినిమాల్లో నటిస్తాం, డ్యాన్స్‌లే కాదు అల్లరి కూడా చేస్తాం ...’ అంటూ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం ‘సాక్షి’ మీడియా హౌస్ హైదరాబాద్ ఆఫీసులో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా పలువురు బాల తారలు తమ ఆనందాలను పంచుకున్నారు. స్కూల్ విద్యార్థులు అడిగిన పొడుపు కథలకు ఈ ‘లిటిల్ స్టార్స్’ ఆన్సర్ చేయడం, లిటిల్ స్టార్స్ కోరిన పాటలను స్కూల్ విద్యార్థులు పోటీ పడుతూ పాడటంతో కార్యక్రమం సందడిగా మారింది.స్కూల్లో రన్నింగ్, ఖోఖో, కబడ్డి, క్రికెట్, బాస్కెట్ బాల్... వంటి ఆటలన్నీ ఆడతాం అంటూ మొదలు పెట్టిన పిల్లలు కరెంట్ షాక్ ఎందుకు తగులుతుంది? బాల్ని కొడితే ముందుకు ఎలా వెళుతుంది? అంటూ సైన్స్ పాఠాలనూ వినిపించారు. లెక్కలు ఇష్టం అంటూనే డాక్టర్లం అవుతాం అనే భవిష్యత్తు ప్రణాళికలనూ చెప్పారు. సోషల్ మీడియాలో తమకున్న ఫాలోవర్స్ గురించి, చేస్తున్న రీల్స్ గురించి వివరించారు. ‘సాక్షి’ మీడియా హౌస్ వారం రోజుల పాటు జరిపిన ‘లిటిల్ స్టార్స్’ కార్యక్రమంలో భాగంగా కలిసిన చిన్నారులను గుర్తుకు తెచ్చుకొని, ‘మరో ప్రపంచం తెలుసుకున్నాం’ అంటూ తమ స్పందనను తెలియజేశారు బాల తారలు. టీవీ చానల్‌కి సంబంధించిన న్యూస్‌రూమ్, పీసీఆర్ వంటి వాటిని చూసి సంభ్రమాశ్చర్యాలను వెలిబుచ్చారు.మేమిద్దరం కవలలం. కలిసే చదువుకుంటాం. సినిమాల్లోనూ కలిసే వర్క్ చేస్తాం. మేం ఇద్దరం పెద్దయ్యాక సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. ఈ ్రపోగ్రామ్ ద్వారా మా ఇద్దరి ఆలోచనలను, మా ప్రతిభను షేర్ చేసుకునే అవకాశం లభించింది. ఇక్కడ న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఈ చిల్డ్రన్స్ డే మాకు వెరీ వెరీ స్పెషల్. – అర్జున్, అర్విన్నాకు నటుడిగా గుర్తింపు వచ్చిందంటే మా అమ్మే కారణం. ఇప్పటి వరకు పది సినిమాల్లో బాల నటుడిగా నటించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన తరువాత స్కూల్లో ఫ్రెండ్స్ నీ క్యారెక్టర్ సూపర్‌గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. రెండు మూడు పేజీల డైలాగ్‌లు కూడా ఒకేసారి చెప్పగలను. ఈ కార్యక్రమం ద్వారా నేను సినిమాల్లోని డైలాగ్స్ చెప్పే అవకాశం లభించింది. అలాగే, న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకున్నాను. ఈ పోగ్రామ్ మాకు పాఠంలా కొత్తదనాన్ని పరిచయం చేసింది. థాంక్యూ సాక్షి.– కె. హర్షచదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!ఏడేళ్ల వయసు నుంచి సినిమాలలో నటిస్తున్నాను. చదువు, సినిమాలతో పాటు బాస్కెట్ బాల్, క్రికెట్, డ్యాన్స్ కూడా చాలా ఇష్టం. స్కూల్, సినిమా షూటింగే కాదు ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ‘లిటిల్‌స్టార్స్’లో భాగంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలను కలిసినప్పుడు చాలా బాధపడ్డాను. తలస్సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలను చూసి, అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. అలాగే ఈ ఫైనల్ ఈవెంట్లో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని డైలాగ్ చెప్పినప్పుడు అందరూ గ్రేట్ అంటూ మెచ్చుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ ్రపోగ్రామ్ చాలా బాగుంది. అందరికీ థ్యాంక్స్. – మోక్షజ్ఞతలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను కలవడానికి ‘సాక్షి’ మీడియా ద్వారా వెళ్లాను. చిన్న చిన్న పిల్లలు ఆ వ్యాధితో బాధపడుతుండటం చూసి, చాలా బాధగా ఫీలయ్యాను. కాసేపు వాళ్ల బాధని మరచిపోయేలా చేయాలని వాళ్లు అడిగిన డైలాగ్స్ చెప్పాను. వాళ్లను ఎంకరేజ్ చేసేలా మాట్లాడాను. మామూలుగా నేను చదువుకుంటాను, సినిమాలు చేస్తుంటాను. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. అలాంటి నాకు ఇలాంటి పిల్లలతో కాసేపు టైమ్ స్పెండ్ చేయడం ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్లినట్లు అనిపించింది. ఇక ‘సాక్షి మీడియా’ హౌస్‌లో ఏర్పాటు చేసిన ‘‘లిటిల్‌స్టార్స్’లో నాతోటి యాక్టర్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. – అనన్య ఈగ3చేసే పనిపై ఇష్టం ఉంటుంది కాబట్టి చదువు–సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటాను. ఈ ్రపోగ్రామ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్పర్శ్’ హాస్పిస్ కేంద్రంలో సేవలు పొందుతున్న చిన్నారులను కలిశాం. వారి పరిస్థితి చూశాక చాలా బాధ అనిపించింది. వారి ముఖాల్లో నవ్వులు తెప్పించాలని డ్యాన్స్‌లు చేశాం, పాటలు పాడాం... ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిల్డ్రన్స్ డే మాకు సాక్షి ఇచ్చిన ఓ పెద్ద గిఫ్ట్. – సయ్యద్ ఫర్జానారైతు స్వరాజ్య వేదిక ద్వారా అక్కడి పిల్లలను కలిసినప్పుడు వాళ్లు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది. వాళ్ల నాన్న చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ బాగా చదువుకుని, అమ్మను బాగా చూసుకుంటాం అని వారు చెప్పినప్పుడు ‘గ్రేట్’ అనిపించింది. అలాగే కలెక్టర్ అవుతామని, డాక్టర్ అవుతామని వాళ్లు తమ భవిష్యత్తు గురించి, తమ ప్లాన్స్ గురించి చెప్పినప్పుడు వారి ధైర్యం చూసి భేష్ అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని చూశాం. – హనీషఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పిల్లలను చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. తర్వాత వాళ్లను హ్యాపీగా ఉంచాలనిపించింది. అందుకే మాటలు, పాటలతో వారితో కలిసిపోయాను. ఇంటికి వెళ్లాక మా నాన్నతో ఆ విషయాలన్నీ పంచుకున్నాను. ‘సాక్షి మీడియా’ వల్ల వాళ్లను కలిసి, నా వంతుగా కాసేపు వాళ్లని సంతోషపెట్టడానికి ట్రై చేశాను. ఈ చిల్డ్రన్స్ డే నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. – సాన్వికమూడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాను. నేను కోపం, బాధ, హ్యాపీ సీన్లలో బాగా నటిస్తాను అని చెబుతారు. ఏడుపు సీన్లలో గ్లిజరిన్ లేకుండా నటించడం చూసి, అందరూ మెచ్చుకున్నారు. టీవీలో అందరి ముందు నా టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశం లభించింది. ఇప్పుడు స్వయంగా టీవీ న్యూస్‌రూమ్, స్టూడియో... ఇవన్నీ చూడటం కొత్తగా అనిపించింది. – ఖుషీ రెడ్డిమూడేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు 25 యాడ్స్, 30 సినిమాల్లో నటించాను. హిందీ మూవీలో కూడా నటించాను. డ్యాన్స్, సంగీతం నేర్చుకుంటున్నాను. బాలరత్న అవార్డు కూడా వచ్చింది. ‘సాక్షి’ మీడియాతో కలిసి రైతు స్వరాజ్య వేదికకి వెళ్లి అక్కడి పిల్లలతో మాట్లాడటం బాగా అనిపించింది. ‘మా నాన్న లేరు’ అని వాళ్లు చెప్పినప్పుడు ఏడుపొచ్చింది. ఇక ఫైనల్ ఈవెంట్లో గోగో (బొమ్మ)తో మాటలు బాగా నచ్చాయి. ఎంత టైమ్ స్పెండ్ చేశామో తెలియనే లేదు. – శ్రేష్ట కోటకేంద్రీయ విద్యాలయాలో చదువుకుంటున్నాను. సినిమాల్లో నటిస్తున్నాను. తబలా వాయిస్తాను. డ్యాన్స్, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సీరియల్స్‌లో కూడా నటిస్తున్నాను. ‘బాలోత్సవం’లో నాకు వచ్చిన పాటలు పాడాను. అందరూ సూపర్ అని మెచ్చుకున్నారు. – శ్రేయాన్ కోటఈ కార్యక్రమం ద్వారా తలసేమియాతో బాధపడుతున్నవారిని కలిశాను. వారిని నవ్వించాను కూడా... పాటలు పాడాను, డ్యాన్సులు చేశాను. అలాగే బుధవారం జరిగిన వేడుకలో నాలా సినిమాల్లో నటిస్తున్న మిగతా అన్నయ్యలు, అక్కలను కలుసుకోవడం హ్యాపీగా అనిపించింది. మా ఇష్టాలు, చదువు, ఆటలు, పాటలు, డైలాగ్స్ మీ అందరికీ చెప్పడం.. అన్ని విషయాలను షేర్ చేసుకోవడం బాగుంది. గోగో (బొమ్మ)తో బాగా ఎంజాయ్ చేశాం. – తనస్విఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్లని చూడగానే ఫస్ట్ చాలా ఏడుపొచ్చింది. అయితే మేం వాళ్లని హ్యాపీ చేయడానికి వెళ్లాం కాబట్టి, వాళ్లతో జోక్‌గా మాట్లాడాను. వాళ్లు నవ్వడం హ్యాపీ అనిపించింది. అలాగే ‘సాక్షి’ టీవీకి వచ్చి, అందరితో మాకు క్లాసులు చెప్పినవి, మేం సినిమాల్లో చేసినవి షేర్ చేసుకోవడం హ్యాపీ. పెద్దయ్యాక మహేష్‌బాబులాగా పెద్ద హీరోని అవుతాను. ఇక్కడ గోగో (బొమ్మ)తో కలిసి చేసిన అల్లరి బాగుంది. అలాగే, మాకు అన్ని న్యూస్ రూమ్‌లు చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. – స్నితిక్చిన్ని మనసులు కదిలిన వేళ...పసి హృదయాలు కదిలిపోయాయి. చిన్న మనసులే అయినప్పటికీ తోటి చిన్నారులు పడుతున్న బాధ చూసి, చలించిపోయాయి. బాలల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ‘సాక్షి’ మీడియా హౌస్ జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కేన్సర్, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను, మృత్యువుతో పోరాడుతున్న పసిబాలలకు, తండ్రిని కోల్పోయిన వారిని, అనాథ బాలలను కలిశారు పలువురు బాల తారలు. కాసేపు ఆ చిన్నారులు తమ కష్టాన్ని మరచిపోయేలా చేసి, వారితో ఆడి పాడారు... నవ్వించారు. చివరగా ‘సాక్షి’ మీడియా హౌస్‌లో జరిగిన వేడుకలో స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ బాల తారలు సందడి చేశారు. ఈ ‘బాలల దినోత్సవం’ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.టీవీలో న్యూస్ చదువుతారు కదా.... ఆ రూమ్ ఎలా ఉంటుందో చూస్తారా? ఎడిటింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? అసలు టీవీ స్టూడియో ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అనడమే ఆలస్యం ‘ఓ’ అంటూ ఆసక్తి కనబరిచారు లిటిల్ స్టార్స్. ‘సాక్షి టీవీ’ న్యూస్ రూమ్, పీసీఆర్ (ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్) వంటివి చూసి, ఆశ్చర్యపోయారు. టీవీ స్టూడియోలో జరుగుతున్న పనులను నిశితంగా గమనించారు.ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి ఈ QRకోడ్‌ను స్కాన్ చెయ్యండి -
రక్తం తాగే గబ్బిలం..పరుగెడుతోంది మన కోసం..
గబ్బిలాలు అంటేనే కాస్త జలదరింపు.. అందులోనూ రక్తం తాగే గబ్బిలాలు ఇవి. వాటి పేరే ‘వాంపైర్ (రక్తపిశాచి) బ్యాట్స్’.. కానీ అవి మన కోసం పరుగెడుతున్నాయి.. పగలు, రాత్రి తేడా లేకుండా, అవసరమైనప్పుడల్లా ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతున్నాయి.. ఇదేంటి రక్తపిశాచి గబ్బిలమేంటి? మన కోసం ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడమేంటి? అని డౌట్ వస్తోందా.. ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం.. ఓ పరిశోధనలో భాగం.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..ఆహార అలవాటే కీలకం..సాధారణంగా జంతువులు, కీటకాలు వేటికైనా ప్రొటీన్లు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు (షుగర్స్) వంటి అన్ని పోషకాలు ఉండే ఆహారం కావాల్సిందే. లేకుంటే అవి ఆరోగ్యంగా ఉండవు. బతకవు కూడా. శరీరంలో వివిధ జీవక్రియలు సరిగా సాగాలంటే.. వేర్వేరు పోషకాలు తప్పనిసరికావడమే దీనికి కారణం. కానీ వాంపైర్ గబ్బిలాలు చాలా చిత్రం. అవి కేవలం జంతువుల రక్తం మాత్రమే తాగుతూ బతికేస్తుంటాయి. అలా ఎలా జీవించ గలుగుతున్నాయన్నది తేల్చేందుకు టొరొంటో స్కార్బోరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.ట్రెడ్‌మిల్‌పై పరుగుపెట్టించడం ఎందుకు? సాధారణంగా జంతువులు కదలడానికి, వేటాడటానికి, తినడానికి.. ఇలా అన్నింటికీ శక్తి అవసరం. చాలా వరకు కార్బోహైడ్రేట్లు (షుగర్స్), కొవ్వుల నుంచే అవి శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. శాఖాహార, మాంసాహార జంతువులకు అవి తినే ఆహారం నుంచి ఇవి అందుతాయి. కానీ రక్తంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అతి తక్కువ... ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలే ఎక్కువ. కేవలం వీటితోనే వాంపైర్ గబ్బిలాలు ఎలా శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇందుకోసం జంతువుల రక్తంలో.. కాస్త రసాయన మార్పులు చేసిన అమైనో యాసిడ్లు కలిపి గబ్బిలాలకు తాగించారు. తర్వాత వాటిని చిన్నపాటి ట్రెడ్‌మిల్‌పై నిమిషానికి 10, 20, 30 మీటర్ల వేగంతో పరుగులు పెట్టించారు. ఆ సమయంలో వాటి శరీరంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతోంది, ఏ ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు.. ఏరకంగా జీర్ణం అవుతున్నాయన్నది పరిశీలించారు.దీనివల్ల మనకేంటి లాభం? సాధారణంగా జంతువుల్లో వివిధ రకాల ప్రొటీన్లు, ఎంజైమ్‌లు ఉత్పత్తికావడానికి, అవయవాలు సరిగా పనిచేయడానికి అమైనో ఆమ్లాలు అవసరం. కానీ వాంపైర్ గబ్బిలాలు అమైనో ఆమ్లాలను నేరుగా శక్తి ఉత్పత్తి కోసం వాడుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వాటిని అత్యంత వేగంగా జీర్ణం చేసుకుంటున్నట్టు తేల్చారు. దీన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తే.. క్షీరదాలు భౌతికంగా ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా శరీరంలో, ఆహారంలో చేసుకునే మార్పులను గుర్తించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కెన్నెత్ వెల్చ్ తెలిపారు. మనలో జీర్ణ వ్యవస్థ లోపాలను సరిదిద్దడం, సమస్యలకు ఔషధాల రూపకల్పన, పోషకాహార లోపానికి చేపట్టాల్సిన చర్యలు వంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని వెల్లడించారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
కృత్రిమ గర్భాశయం!
ఏపీ సెంట్రల్ డెస్క్: సాంకేతిక విజ్ఞానం కలబోతతో కృత్రిమ మేథస్సు (ఏఐ) ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది! సృష్టికి ప్రతిసృష్టి జరుగుతోంది. తాము కోరుకున్న లక్షణాలతో పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యేలా కృత్రిమ గర్భాశయం తొలిసారిగా ఆవిష్కృతమైంది. జర్మనీకి చెందిన శాస్త్రవేత్త హషీం అల్ ఘైలీ ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ గర్భాశయాన్ని సృష్టించారు.‘ఎక్టో లైఫ్’ అని అని వ్యవహరించే ఈ కృత్రిమ ల్యాబ్ ద్వారా ఏటా 30,000 మంది శిశువులకు పురుడు పోయవచ్చని చెబుతున్నారు. క్షీణిస్తున్న జన సంఖ్యతో సతమతమవుతున్న జపాన్, బల్గేరియా, దక్షిణ కొరియా లాంటి చాలా దేశాలకు ఎక్టో లైఫ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఈ దేశాల్లో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతుండగా జననాల రేటు చాలా తక్కువగా ఉంది. ‘క్యాన్సర్ తదితర ప్రాణాంతక జబ్బుల కారణంగా గర్భాశయాన్ని శస్త్ర చికిత్స ద్వారా తొలగించిన మహిళలకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. ‘ఎక్టో లైఫ్’ అందుబాటులోకి రావడం ద్వారా నెలలు నిండక ముందే శిశువుల జననం, సిజేరియన్ కష్టాలు లాంటివి ఇకపై గత అనుభవాలుగానే మిగలనున్నాయి’ అని హషీం పేర్కొన్నారు. ప్రసూతి మరణాలకు అడ్డుకట్ట ‘ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడు లక్షల మందికిపైగా మహిళలు ప్రసూతి సమస్యలతో మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎక్టో లైఫ్కృత్రిమ గర్భాశయంతో ఇలాంటి సమస్యలు, శస్త్ర చికిత్స ద్వారా కాన్పులకు తెర దించవచ్చు’అని హషీం తెలిపారు.‘ఏఐ’ పాత్ర ఏమిటంటే..?⇒ శాస్త్రవేత్తలు సృష్టించిన కృత్రిమ గర్భాశయాన్ని నిరంతరం కనిపెట్టుకుంటూ కంటికి రెప్పలా కాపాడేది ‘కృత్రిమ మేథస్సు’ పరిజ్ఞానమే. సరిగ్గా చెప్పాలంటే.. గర్భం దాల్చిన అమ్మ పాత్రను ‘ఏఐ’ పోషిస్తుంది. ⇒ కృత్రిమ గర్భాశయంలోకి పిండాన్ని ప్రవేశపెట్టటానికి ముందే మంచి లక్షణాలున్న జీన్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ⇒300 రకాల జీన్స్ నుంచి కళ్ల రంగు, జుత్తు, పొడవు, దేహ దారుఢ్యం, మేధోశక్తిని ల్యాబ్ ⇒ ‘ఎలైట్ ప్యాకేజీ’ ద్వారా ఎంపికకు వీలుంది. ⇒ ఆకర్షణీయమైన లక్షణాలను ఎంపిక చేసుకోవడంతోపాటు జన్యుపరమైన వ్యాధులను వారసత్వంగా మోసుకొచ్చే అవాంఛిత జీన్స్‌ను తొలగించుకోవడం ద్వారా బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేందుకు దోహదం చేస్తుంది. ⇒ ‘అంటువ్యాధులు (ఇన్ఫెక్షన్లు) సోకకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో పాపాయి పురుడు పోసుకునేలా ఎక్టో లైఫ్ భద్రంగా తనలో దాచుకుంటుంది. దీని ఉపరితలానికి సూక్ష్మ క్రిములు అంటుకోకుండా వీటి ప్యాడ్స్‌ను రూపొందించాం. ప్రతి పరికరంలోనూ ఏఐతో అనుసంధానించిన సెన్సార్లు ఉంటాయి. బిడ్డ శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పసిగడతాయి. పసిగుడ్డు గుండె కొట్టుకునే వేగం, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, శ్వాస తీసుకునే రేటు, ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయిలను ఎప్పటికప్పుడు విశ్లేíÙంచి సమాచారం అందిస్తుంటాయి. అంతేకాకుండా ఏఐ పరిజ్ఞానం బిడ్డ శారీరక లక్షణాలను కూడా గమనిస్తూ ఏవైనా జన్యుపరమైన రుగ్మతలను పసిగడితే వెంటనే తెలియచేస్తుంది’ అని హషీం చెప్పారు. -
ఔషధాల కొండ.. కందికొండ గుట్ట
కురవి: దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యం విరాజిల్లింది. ప్రకృతిలో లభించే వనమూలికలు, ఔషధమొక్కలతో పలు రకాల రోగాలను నయం చేసేవారు. ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం మనుగడలోకి వస్తోంది. వన మూలిక మొక్కలు ప్రకృతిలో ఎక్కువగా కొండలు, గుట్టల్లో లభిస్తాయి. అలాంటి ఔషధ మొక్కలకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గుట్ట నిలయంగా పేరుగాంచింది. మునులు తపస్సు చేసిన ప్రాంతం కందికొండపై ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొండపైకి నడక దారి, మార్గమధ్యలో గుహలు, పైన దేవాలయం, కోనేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రంలో పూర్వం కపిలవాయి మహాముని, స్కంద మహాముని వంటి వారు తపస్సులు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అయితే అప్పటి నుంచి ఈ కొండపై తపస్సుకు వినియోగించే మొక్కలతో పాటు, వైద్యం చేసేందుకు ఉపయోగపడే ఔషధ మొక్కలు కూడా పెంచినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొండ పరిసర ప్రాంతాలకు వెళ్లగానే ఏదో అనుభూతి, ప్రత్యేకమైన సువాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతారు. మూలికల సేకరణ.. గుట్టపై పెద్ద కందిచెట్టు ఉండేదని, అందుకే ఇది కందికల్ గుట్టగా చరిత్రలో లిఖించి ఉందని పూర్వికులు చెబుతుంటారు. కొండ అనేక వనమూలికలకు ప్రసిద్ధి అని, ఇక్కడికి సాధువులు, కోయ గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు వచ్చి వనమూలికలు, ఔషధ మొక్కలను తీసుకెళ్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికీ కొంత మంది కోయ జాతికి చెందిన గిరిజనులు వచ్చి మొక్కలను తీసుకెళ్తుంటారని చెబుతుంటారు.గుట్ట ఎక్కుతుంటే మధ్యలో భోగం గుడి ఎదురుగా రెండు కోనేర్లు ఉంటాయి. అందులో అనేక ఔషధమొక్కలు కనిపిస్తుంటాయి. గుడి ముందు మరో కోనేరు ఉంటుంది. ఈ కోనేటిలో స్నానాలు ఆచరించడం వల్ల రోగాలు నయమవుతాయని నమ్మకం. అయితే కార్తీక పౌర్ణమితోపాటు, ఇతర శుభ దినాల్లో మూలికలను సేకరిస్తే మంచి ఫలితం ఉంటుందని సాధువులు చెబుతారు. అందుకోసమే తెలంగాణ ప్రాంతంలోని జంగాలు ఈ ప్రాంతం నుంచి ఔషధ మొక్కలు, వన మూలికలు సేకరించి తయారు చేసిన ఆయుర్వేద మందులు చెన్నై, ముంబై, సింగపూర్, ఢిల్లీ వంటి ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు వెళ్లి వైద్యం చేసి వస్తారు.ఔషధ మొక్కల పేర్లు..గుట్టపై ఉన్న కోనేరులో నాలుగు రకాల మొక్కలు కనిపిస్తాయి. ఈరజడ, రక్తజడ, అంతర దామెర, మద్దెడ వీటిని గుట్ట ఎక్కిన భక్తులు తెంపుకుని తీసుకెళ్తుంటారు. ఈరజడ ఆకులను ఇంటికి తీసుకెళ్లి చిన్నారులకు ఊదు పడుతుంటారు. వీటికి తోడు రాజహంస, పరంహంస, పందిచెవ్వు చెట్టు, నల్ల ఉసిరి చెట్టు, అడవి నిమ్మ, బుర్రజమిడి, నల్లవాయిలి చెట్లు ఉన్నాయి. గుడి దగ్గర బండ పువ్వు లభిస్తుంది. అలాగే నాగసారం గడ్డ, నేల ఏను మొక్కల ఆకులను పశువులకు రోగాలు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. కొండ మామిడి చెట్టుతో కాళ్లు, చేతులు విరిగితే కట్టు కడుతుంటారు. పొందగరుగుడు చెక్క, నల్లెడ తీగలు, బురుదొండ, అడవిదొండ లాంటి మొక్కలు లభిస్తా యని గ్రామస్తులు తెలిపారు. గొర్రెలు, మేకల కు రోగాలు వస్తే న యం చేసేందుకు చే గొండ ఆకు, ఉప్పుచెక్క, ముచ్చతునక చెట్టు ఆకులను వాడుతుంటారని గొర్రెలు, మేకల పెంపకందారులు చెబుతున్నారు. అలాగే కలములక చెట్టు మనుషులకు దగ్గుదమ్ముకు, సోమిడిచెట్టు చెక్క, ఆకులు చిన్న పిల్లలకు జబ్బు చేస్తే వాడుతుంటారని చెబుతున్నారు.కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తారు కందికొండ గుట్టపై అనేక ఔషధ మొక్కలుంటాయి. మొక్కల కోసం ఏటా కోయ జాతి గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు, సాధువులు వస్తుంటారని గ్రామంలో చర్చించుకుంటారు. కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తే మంచిగా పని చేస్తాయని నమ్మిక. – బి.హేమలత, కందికొండ మాజీ సర్పంచ్ప్రతీ మొక్కలో ఔషధ గుణమే కొండపైన ఉన్న ప్రతీ మొక్కకు ప్రత్యేకత ఉంది. మనం రోజువారీగా చూసే మొక్కలతోపాటు, రకరకాల మొక్కలు దొరుకుతాయి. పెద్ద పెద్ద రోగాలను కూడా నయం చేసే మొక్కలు ఇక్కడ దొరుకుతాయట. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు గొర్రెల కాపరులను తీసుకెళ్లి మొక్కలు తెస్తారు. – మెట్టు ఉప్పల్లయ్య, కందికొండఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి మా ఊరు సరిహద్దులో కందికొండ గుట్ట ఉంటుంది. ఇక్కడ దొరికే ఔషధ మొక్కలు ఎక్కడ దొరకవు అంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గుట్టపై ఉన్న మందు మొక్కలను పరిరక్షించాలి. దీనిని రాబోయే తరాలకు, ఆయుర్వేదంలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి. – గాండ్ల సతీశ్, సూదనపల్లి -
Jharkhand Assembly Election 2024: ప్రాంతాల పోరులో... పైచేయి ఎవరిదో!
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అస్థిరతకు మారుపేరైన జార్ఖండ్ మరోసారి అసెంబ్లీ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. ప్రజాకర్షక పథకాల సాయంతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం సారథ్యంలోని ఇండియా కూటమి ఆశపడుతోంది. జనాభాలో మెజారిటీ అయిన గిరిజనులతో పాటు ముస్లిం మైనారిటీల్లో సీఎం హేమంత్ సోరెన్‌కు ఉన్న ఆదరణ గట్టెక్కిస్తుందని నమ్ముతోంది. ఎన్డీఏ సారథి బీజేపీ మాత్రం ఐదేళ్లనాడు చేజారిన అధికారాన్ని ఎలాగైనా ఒడిసిపట్టాలని ఉవి్వళ్లూరుతోంది.హేమంత్ తదితరుల అవినీతినే ప్రధానాస్త్రంగా చేసుకుంది. గత ఎన్నికల్లో ముఖం చాటేసిన గిరిజనులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. వలసలు తదితరాలను ప్రస్తావిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడింది. 81 అసెంబ్లీ స్థానాల్లో 43 సీట్లకు బుధవారం తొలి విడతలో పోలింగ్ జరగనుంది. మిగతా 38 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలెన్ని ఉన్నా జనాభాలో 35 శాతంగా ఉన్న గిరిజనులే మరోసారి ఫలితాన్ని నిర్దేశించనున్నారు.ప్రాంతాలవారీగా చూస్తే గిరిజనులు ఏకంగా 60 శాతముండే కొల్హన్, సంథాల్ పరగణాల్లో జేఎంఎంకు తిరుగులేని పట్టుంది. 25 అసెంబ్లీ స్థానాలున్న కీలకమైన నార్త్ చోటానాగపూర్తో పాటు ఎస్సీ ప్రాబల్య పాలము ప్రాంతంపై బీజేపీ ఆధిపత్యం సాగుతోంది. ఐదో ప్రాంతమైన సౌత్ చోటానాగపూర్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు కూటములు పోటాపోటీగా తలపడ్డాయి. సంథాల్ పరగణా అత్యంత వెనకబడ్డ జిల్లాలున్న ఈ ప్రాంతం ఇటు బిహార్, అటు పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులు పంచుకుంటుంది. ఇక్కడి 18 అసెంబ్లీ స్థానాల్లో ఏడు ఎస్టీ, ఒకటి ఎస్సీ రిజర్వుడు సీట్లు. ఎస్సీలు 8 శాతముంటే ఎస్టీలు 28, ముస్లింలు 23 శాతమున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి ఏకంగా 13 స్థానాలు గెలుచుకోగా బీజేపీకి 5 మాత్రమే దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో: 10 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిపత్యం సాగగా 8 బీజేపీని ఆదరించాయి. కొల్హాన్ ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులు పంచుకునే ఈ ప్రాంతంలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ఒక ఎస్సీ, 9 ఎస్టీ స్థానాలున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 42 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమే ఉంటారు. ముస్లింలు 6 శాతమున్నారు. ఈసారి అధికారం దక్కాలంటే నార్త్ చోటానాగ్‌పూర్‌లో ఆదరణను నిలబెట్టుకుంటూ సంతాల్, కొల్హాన్ ప్రాంతాల్లో పాగా వేయడం ఆ పారీ్టకి తప్పనిసరి. ఇందుకోసం ఇటీవలే జేఎంఎం నుంచి వచ్చిన మాజీ సీఎం చెంపయ్ సోరెన్‌పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అక్రమ వలసల అంశం ఈ ప్రాంతంలో తమకు బాగా కలిసొస్తుందని అంచనా వేస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి 13 స్థానాలు దక్కగా బీజేపీ పూర్తిగా చతికిలపడింది లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీకి ఆదరణ దక్కింది. పాలము ఇటు బిహార్, అటు ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దులున్న ప్రాంతం. 9 అసెంబ్లీ స్థానాల్లో రెండు ఎస్సీ, ఒక ఎస్టీ సీట్లున్నాయి. 25 శాతం ఎస్సీలుండటం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమికి ఐదు సీట్లు దక్కగా బీజేపీ మూడింటితో సరిపెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 8 అసెంబ్లీ సీట్ల పరిధిలో బీజేపీ ఆధిపత్యమే సాగింది. నార్త్ చోటానాగ్పూర్ 25 అసెంబ్లీ స్థానాలున్న అతి కీలక ప్రాంతం. బిహార్, పశ్చిమబెంగాల్‌తో సరిహద్దులున్నాయి. ఈ ప్రాంతంలో ఒక్క ఎస్టీ రిజర్వుడు స్థానం కూడా లేకపోవడం విశేషం. ఇక్కడ బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచి్చన వాళ్లు ఎక్కువ. 17 శాతం ఎస్సీలు, 16 శాతం ముస్లింలుంటే ఎస్టీలు కేవలం 9 శాతమే ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: బీజేపీ 10, ఇండియా కూటమి 11 సీట్లు గెలుచుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో: ఏకంగా 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీ హవాయే సాగింది. ఈ పరిణామం కమలనాథుల్లో హుషారు పెంచింది. సౌత్ చోటానాగ్పూర్ ఛత్తీస్‌గఢ్, ఒడిషాలతో సరిహద్దులున్న ఈ ప్రాంతం 15 అసెంబ్లీ స్థానాలకు నిలయం. 11 ఎస్టీ, ఒకే ఒక్క ఎస్సీ స్థానమున్నాయి. ఇక్కడ ఎస్టీలు ఏకంగా 51 శాతముంటారు. ముస్లింలు 11 శాతం కాగా ఎస్సీలు కేవలం 5 శాతమున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో: ఇండియా కూటమి 8, బీజేపీ ఐదు సీట్లు గెలుచుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో: బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఆ పార్టీ 4 అసెంబ్లీ స్థానాల పరిధిలోనే మెరుగైన ప్రదర్శన చేసింది. మిగతా 11 చోట్లా ఇండియా కూటమి హవాయే సాగింది.67 శాతం రెడ్ అలర్ట్ స్థానాలే! 174 మందిపై కేసులు 235 మంది కోటీశ్వరులుసాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో బుధవారం తొలి దశలో పోలింగ్ జరగనున్ను 43 అసెంబ్లీ స్థానాల్లో 29 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలున్నాయి! బరిలోని అభ్యర్థుల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులుంటే వాటిని రెడ్ అలర్ట్ స్థానాలుగా పరిగణిస్తారు. ఇక 174 (26%) మందిపై క్రిమినల్ కేసులున్నట్టు జార్ఖండ్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) వెల్లడించాయి.వీరిలో ఇందులో 127 (19%) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థుల్లో 20 మంది (56%), 17 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 11 మంది (65%), 23 మంది జేఎంఎం అభ్యర్థుల్లో 11 (48%) మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 11 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. అభ్యర్థుల్లో 235 మంది (34%) కోటీశ్వరులు. బీజేపీలో 30 మంది (83%), కాంగెస్‌లో 18 మంది (78%) కోటీశ్వరులున్నారు. -
చండీగఢ్ జనాభా కంటే ఎక్కువ.. రోడ్డు ప్రమాదాల్లో పదేళ్లలో 15 లక్షల మంది మృతి
మనదేశంలో రోడ్డు ప్రమాదాలు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. రహదారి దుర్ఘటనల్లో అసువులు బాసిన వారి సంఖ్య ఏటేటా భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత దశాబ్ద కాలంలో 15.3 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. భువనేశ్వర్ నగర జనాభాకు దాదాపు సమానం. దీన్నిబట్టి చూస్తే రోడ్డు ప్రమాదాలు మన దేశంలో ఎంత ఎక్కువ స్థాయిలో ప్రజలను బలిగొంటున్నాయో అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నిచర్యలు చేపడుతున్నా, అఖరికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు.50 లక్షల మంది క్షతగాత్రులు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. మనదేశంలో 10 వేల కిలోమీటర్లకు సగటు మరణాల సంఖ్య 250. చైనాలో పది వేల కిలోమీటర్లకు 117, అమెరికాలో 57, ఆస్ట్రేలియాలో 11 మరణాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలం (2014-23)లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లలో 15.3 లక్షల మంది దుర్మరణం పాలయ్యారు. అంతకుముందు దశాబ్దం (2004-13)లో 12.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2014-23 మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు 45.1 లక్షలు కాగా, 2004-13లో ఏకంగా 50.2 లక్షల మంది క్షతగాత్రులయ్యారు.రెండింతలైన వాహనాలుజనాభా, వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో పాటు రహదారులు విస్తరించడం కూడా ఎక్కువ మరణాలకు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రమాదాల నివారణకు సరైన చర్యలు చేపట్టలేదని వారు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2012లో రిజిస్టర్డ్ వాహనాలు 15.9 కోట్లు కాగా, 2024 నాటికి రెండింతలు పైగా పెరిగి 38.3 కోట్లకు చేరుకున్నాయి. 2012 నాటికి 48.6 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించివున్న రహదారులు.. 2019 నాటికి 63.3 లక్షల కిలోమీటర్లకు చేరాయి.యాక్సిడెంట్ కేసులపై శీతకన్నుఅయితే రోడ్డు ప్రమాదాలకు వాహనాలు, రహదారులు పెరగడం ఒక్కటే కారణం కాదని.. రహదారి భద్రత అనేది చాలా అంశాలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ విభాగాలు, వాహనదారులు, లాభాపేక్షలేని సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే కొంతవరకు ప్రమాదాలు నివారించొచ్చని అభిప్రాయపడుతున్నారు. యాక్సిడెంట్ కేసులను పోలీసులు సరిగా విచారణ జరపడం లేదని ఆరోపిస్తున్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినా కూడా పోలీసు ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని, అన్ని దర్యాప్తు సంస్థలు యాక్సిడెంట్ కేసుల విచారణకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఢిల్లీ మాజీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.ఘోర ప్రమాదం.. ట్రక్కు, ఇన్నోవా కారు ఢీ; ఆరుగురి మృతిహత్య కేసులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. రోడ్డు ప్రమాదాలు, మరణాల గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని ఐపీఎస్ మాజీ అధికారి, ఎంపీ టి కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. రహదారి భద్రతపై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టాలని భావిస్తున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. మనదేశంలో సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య.. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కంటే చాలా ఎక్కువని ఆయన తెలిపారు. -
వయనాడ్ బరిలో సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం) పోలింగ్ జరగనుంది. నిన్న(సోమవారం) వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు మూడు ప్రధాన రాజకీయ కూటములు రోడ్‌షోలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. 14 లక్షల మంది ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి 3.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మరో నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి కూడా విజయం సాధించడంతో.. నిబంధనల రిత్యా వయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం నుంచే ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపింది. రాహుల్ సోదరిని పోటీకి దింపడం ద్వారా యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు.. సీపీఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.2019 నుంచి 2024 వరకు వయనాడ్ ఎంపీగా రాహుల్ పదవీకాలం, వయనాడ్ ప్రజల్లో ఆయనకున్న ఆదరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు.. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారని ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రియాంకా గాంధీ గెలిస్తే.. ఆమె కూడా తన సోదరుడిలాగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోతారని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ విమర్శలకు చెక్ పెడుతూ ప్రియాంకా గాంధీ.. తను క్రమం తప్పకుండా వయనాడ్‌కు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల విధుల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సాయుధ పోలీసు బెటాలియన్‌కు చెందిన పలు కంపెనీల సిబ్బందితో భద్రత కల్పించినున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 24 గంటల కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.ప్రియాంకా గాంధీ నేపథ్యం..మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ. మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి.తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు.భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ నేపథ్యం..నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.సత్యన్ మొకేరి నేపథ్యం..సత్యన్ మొకేరి సీపీఐకి చెందిన ప్రముఖ నాయకుడు. కోజికోడ్ జిల్లాలోని నాదపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2014లో వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. మొకేరి 1987 నుంచి 2001 వరకు కేరళ శాసనసభలో నాదాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2015లో ఆయన సీపీఐ కేరళ రాష్ట్ర కమిటీకి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రైతు సంఘాలతో మొకేరికి మంచి అనుబంధం ఉంది. ఆయన సుదీర్ఘ అనుభవం, వ్యవసాయ సమస్యల పట్ల నిబద్ధత వయనాడ్ ఓటర్లకు ప్రతిధ్వనిస్తుందని ఎల్డీఎఫ్ భావిస్తోంది.:::సాక్షి వెబ్ డెస్క్ -
Sakshi Little Stars: ఆశీస్సులే ఆయువు
ఆశ తొణుకుతున్నప్పుడుఆశీస్సు దానిని నిలబెట్టవచ్చు. ఔషధం ఓడుతున్నప్పుడు ప్రార్థన దానిని గెలిపించవచ్చు. అశ్రువు ఉబుకు తున్నప్పుడు ఆర్ద్రత దానిని మందస్మితం చేయవచ్చు. డబ్బు ఖర్చు లేని అనంత దయ, సేవ, ఆర్ద్రత, సాంత్వన మన వద్ద ఉంటాయి. నిజ హృదయంతో వెచ్చిస్తే పని చేస్తాయి. ఈ పిల్లలకు అవన్నీ కావాలి. ఈ పిల్లలు చిరంజీవులై వెలగాలి. ‘సాక్షి’ మీడియా చైల్డ్ సెలబ్రిటీలతో తనదైన ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలలు ఒక పూట కువకువలాడారు. పకపక నవ్వారు.నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ నేపథ్యంలో ఎం.ఎన్.జె. కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది చిన్నారులను పలకరించే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ‘పొట్టేల్’. ‘సరిపోదా శనివారం’, ‘మన్మథుడు–2’ వంటి సినిమాల్లో నటించిన బాలతారలు ఖ్యాతి, సాన్విక, స్నితిక్, జాతీయ క్రీడాకారిణి కార్తీకలను తీసుకొచ్చి వారితో ముచ్చటించేలా చేసింది. చైల్డ్ సెలబ్రిటీలు వారి కోసం ఆటలు, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అలాగే తమ ఆరోగ్యస్థితిని చైల్డ్ సెలబ్రిటీలతో పంచుకున్నారు.నాకు ప్రస్తుతం బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన సెలబ్రిటీల కోసం పుష్ప సినిమా పాట పాడాను. నా కోసం సాన్విక కూడా పాట పాడింది. వారితో కలిసి మాట్లాడటం హ్యాపీగా ఉంది.– జశ్వంత్మేం సిద్దిపేట నుంచి వచ్చాం. హాస్పిటల్ అంటే నాకు భయం.. కానీ ఇక్కడ బాగానే ఉంది. సినిమాల్లో నటించే వారు మా కోసం రావడం సంతోషంగా ఉంది. నాకు కూడా సినిమాలంటే ఇష్టం. చివరగా శ్యాం సింగరాయ్ సినిమా చూశాను. త్వరగా నయమైతే స్కూల్‌కు వెళ్లాలనుంది. – రిషి ప్రియ, సిద్దిపేటచాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు చదువంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ నా ఫేవరెట్. సాన్విక అక్కతో ఆడుకున్నాను, లెక్కలు చెప్పాను. – ఓ చిన్నారి, జహీరాబాద్ బద్దీపూర్నాకు ఫుట్‌బాల్, దాగుడుమూతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవన్నీ ఆడుకోలేకపోతున్నాను. ఇలా బాధ పడుతున్న సమయంలో వీరంతా వచ్చి నాతో ఆడుకున్నారు. చాలా ముచ్చట్లు చె΄్పారు. నన్ను షూటింగ్‌కు తీసుకెళతానని కూడా చె΄్పారు. – చేతన్విభిన్న పేర్లతో పలు రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ అవన్నీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్, సాలిడ్ ట్యూమర్స్ అనే రెండు విభాగాల కిందకు వస్తాయి. చిన్నారుల్లో దీర్ఘకాలం పాటు హై ఫీవర్, చలి జ్వరం, బ్లీడింగ్, చిగుర్లలో రక్తస్రావం.. శరీరంలో, చాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయసుకు తగ్గట్టు బరువు పెరగక పోవడం లేదా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. సాలిడ్ ట్యూమర్స్‌లో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. చికిత్స పొందుతున్న చిన్నారులకు క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన అంతగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భయం ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా ప్లే స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులతో మమేకం చేస్తాం. – అనుదీప్, మెడికల్ ఆంకాలజిస్ట్అవగాహన వచ్చిందికేన్సర్ గురించి కొంచెం అవగాహన ఉంది. అందుకే గతంలోనే ఇలాంటి చిన్నారుల కోసం నేను రెండుసార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. కానీ ఇలాంటి ప్లేస్‌కు రావడం ఇదే మొదటి సారి. వీరి విల్ పవర్ చూశాక సమస్య ల నుంచి ఎలా రాణించాలో ఒక అవగాహన వచ్చింది. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులతో ఆడుకోవాలనుంది.– కార్తీక, నేషనల్ ప్లేయర్హెయిర్ డొనేట్ చేస్తానుఈ హాస్పిటల్లో చిన్నారులను చూశాకే కేన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసింది. వారిని చూస్తుంటే ఏడుపొచ్చేసింది. నేను కూడా గతంలో ఇలాంటి వారి కోసం హెయిర్ డొనేట్ చేశాను. మళ్లీ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. –ఖ్యాతి, సరిపోదా శనివారం ఫేమ్వీరిని చూశాక లోపల ఎంతో బాధ కలిగినప్పటికీ దానిని దాచి వీరందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడాను, నాటు నాటు డ్యాన్స్ చేశాను. – సాన్విక, సరిపోదా శనివారంవీరందరినీ ఇలా చూస్తుంటే భయమేసింది. అందరికీ నయం అయి త్వరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. అందరితో ఆడుకున్నాను, డ్యాన్సులు చేశాను. – స్నితిక్, పొట్టేల్ ఫేమ్భయం లేదు చికిత్సలు ఉన్నాయిఅనారోగ్యం అని తెలిశాక పరీక్షల నిర్థారణతో పాటు చికిత్సలో భాగంగా అన్ని సేవలు ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో ఉచితంగానే అందుతాయి. వ్యాధి దశను బట్టి చికిత్స కొనసాగుతుంది. ఈ చిన్నారులకు న్యూట్రిషన్ చాలా అవసరం. దీనికోసం కడల్స్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో మంచి న్యూట్రిషన్ అందిస్తున్నారు. చిన్నారుల వయస్సు, బరువును బట్టి ్రపొటీన్ ΄్యాకెట్స్, డ్రై ఫూట్స్ తదితరాలను అందిస్తున్నారు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న వారికి చుట్టుపక్కల విడిదికి కూడా సహాయం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తున్నప్పటికి అది 15 నుంచి 20 శాతం మాత్రమే. కేన్సర్లకు పలు రకాల కారణాలున్నాయి. కేన్సర్‌కు ఇతర దేశాల్లో అందిస్తున్న అధునాతన చికిత్సకు మనకు వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. మన దగ్గర కూడా లేటెస్ట్ ట్రయల్స్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి QR కోడ్‌ను స్కాన్ చెయ్యండి – డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
అడవిలో అమ్మప్రేమ!
పులి – ఆవు.. పాము – కాకి నీతి కథలుఅందరికీ తెలిసే ఉంటాయి. కథల సారాంశం ఏదైనా.. అందులో తల్లి ప్రేమ కనిపిస్తుంది. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా కమ్మనైన అమ్మతనం ఎంతో మధురం. తల్లి జంతువు ప్రేమ ముందు ఏ ప్రాణి అయినా, జీవి అయినా తలవంచక తప్పదు.తన కళ్లముందు తన బిడ్డకు కష్టం వస్తే తిరగబడి పోరాడుతుంది. ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తాయి. అతి చిన్న ప్రాణి అయిన గిజిగాడు మొదలు అతి క్రూరమైన జంతువులుగా చెప్పుకునే పులి, చిరుత, ఎలుగుబంటి వంటి జంతువుల వరకు వాటి పిల్లల లాలన చూస్తే ‘తల్లి ప్రేమ అడవంతా’ అని అనకమానరు.– ఆత్మకూరు రూరల్పశుపక్షాదుల్లో తల్లి ప్రేమను దగ్గరిగా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. కోతి, పిల్లులు తమ పిల్లల పెంపకం అందరికీ తెలిసే ఉంటుంది. మాతృప్రేమలో మాత్రం మర్కటాలు మనుషులకే పాఠాలు చెబుతాయి. ఇక పిల్లి నిండు గర్భంతో ఉన్నపుడే తను ప్రసవించే ప్రదేశాన్ని ఎంచుకుని ప్రసవానంతరం కొంత సమయ వ్యత్యాసంతో పిల్లలను కనీసం ఏడు చోట్లకు మార్చడం దాని విశిష్ట లక్షణం. కీటకాలు, పక్షులు, జంతువుల్లో తల్లి ప్రేమ నిశితంగా పరిశీలిస్తే ఔరా.. అనాల్సిందే.నల్లమల అడవుల్లో పెద్దపులులు ప్రధాన రక్షిత జీవి. అంతరించి పోయే దశకు చేరుకుంటున్న వాటి సంతతిని పెంచి పోషించడంలో ఆడ పులులు ఒక యుద్ధ్ధమే చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఈతలోనూ రెండు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిచ్చే ఆడపులి వాటిని పెంచడంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. పులి పిల్లలకు ప్రధాన ముప్పు మగపులుల నుంచే ఉంటుంది. సాధారణంగా పులి తన పిల్లలకు మూడేళ్ల వయçస్సు దాటేంత వరకు అవి స్వయంగా తమ ఆహారం సంపాదించుకునే నైపుణ్యం పొందే వరకు తిరిగి సమాగానికి సిద్ధపడదు. అందుకే మగ పులులు ఈ పిల్లలను అడ్డు తొలగిస్తే ఆడపులితో సమాగానికి సిద్ధ పడవచ్చనే ధోరణే పులి పిల్లలకు ప్రమాదం తెచ్చి పెడుతుంది.అందుకే తన సంతానం సమీపంలోకి మగపులి రాకుండా ఆడపులి తరిమి కొడుతుంది. పులిపిల్లలకు మరో ప్రమాదం నక్క, తోడేలు, కొండ్రాసిగాడుగా పిలువబడే దొమ్మలగొండి (హైనా)వంటి స్కావెంజర్ జంతువుల నుంచి కూడా పొంచి ఉంటుంది. తల్లి పులి ఆహారం కోసం వెళ్లినప్పుడు ఈ జంతువులు పులి పిల్లలకు హాని కలిగిస్తాయి. అందుకే తల్లి పులి తన పిల్లలను గుహల్లో, చెట్టు బొరియల్లో ఉంచి వాటి ఉనికి బయటకు తెలియనంతగా జాగ్రత్త పడుతుంది. ఆహార సేకరణ కోసం పెద్దగా పిల్లలను విడిచి దూరం వెళ్లదు. పిల్లలు కాస్త తిరుగాడే వయస్సు వచ్చినపుడు వాటిని వెంట పెట్టుకునే వేటకు ఉపక్రమిస్తుంది. అప్పుడు పులి పిల్లలు మొదట తల్లి చేసే వేట పద్ధతులను పరిశీలిస్తూ మెల్లమెల్లగా వేటాడేందుకు సిద్ధమవుతాయి.ఆహారం భద్రపరిచి.. కూనల కడుపు నింపిపిల్లి కుటుంబానికే చెందిన చిరుతపులి (లెప్పర్డ్) కూడా రెండు నుంచి మూడు పిల్లలను పెడుతుంది. ఇది కూడా పెద్దపులిలాగే పిల్లల కోసం అత్యంత అప్రమత్తంగా సంచరిస్తుంది. పిల్లి జాతిలో పిల్లి తరువాత చెట్టు ఎక్కగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక పులి చిరుత మాత్రమే.ఈ ప్రత్యేకతను తన పిల్లలకు ఆహారం దాచి పెట్టే విషయంలో ఉపయోగించుకుంటుంది. పిల్లలను భధ్రమైన చోట దాచి వేటకు వెళ్లి తాను చంపి తెచ్చిన వేట జంతువు కళేబరాన్ని పిల్లల ముందు ఆహారంగా వేస్తుంది. అవి తినగా మిగిలిన భాగాన్ని చెట్టు కొమ్మపై భద్రపరచి మరుసటి రోజు మళ్లీ ఆకలిగొన్న పిల్లలకు పెడుతుంది.అంతా.. ఏకాంతం..ఎత్తైన, ముదిరిన వృక్షాల కాండాలపై సహజంగా ఏర్పడ్డ తొర్రలను ఆడ హార్న్‌బిల్ గూడుగా ఎంపిక చేసుకుంటుంది. వయస్సు కొచ్చిన మగపక్షి తనతో జతగట్టేందుకు అంగీకరించిన ఆడపక్షితో కలసి ఇలాంటి తొర్రల్లో ప్రవేశిస్తు్తంది. ఆపై ఆడపక్షి తొర్ర ప్రవేశ మార్గాన్ని చెట్ల బెరళ్లు, కర్ర పుల్లలు, బంక మట్టితో కలిపి మూసివేస్తుంది. గాలి చొరబడేందుకు మాత్రం చిన్న రంధ్రాన్ని మాత్రం ఉంచుకుంటుంది. సమాగమనంతరం మగ పక్షి మూసిన ప్రవేశ మార్గాన్ని తిరిగి తెరుచుకుని బయటకు వస్తుంది.ఆడపక్షి మాత్రం గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసే వరకు గూటిలోనే జైలు జీవితం గడుపుతుంది. మూసివేయబడిన తొర్ర ప్రవేశ మార్గానికి ఏర్పరచిన చిన్నపాటి రంధ్రం ద్వారానే ఆడపక్షికి.. మగపక్షి ఆహారాన్ని అందిస్తుంది. అనంతరం ఆడపక్షి గూటి వెలుపలికి వచ్చి పిల్లలున్న గూటిని తిరిగి మూసి వేస్తుంది. ఆ తరువాత పక్షి దంపతులు కలసి పిల్లల పోషణ భారం వహిస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చి గాలిలో ఎగిరే వరకు ఈ తరహా రక్షణలోనే వాటి పోషణ సాగుతుంది.నీ ప్రేమ భల్లూకం గాను..వన్యప్రాణుల్లో తల్లులన్నింటిలోను ఎలుగుబంటి అమితమైన ప్రత్యేక శైలి కలిగినది. ఆడ ఎలుగు బంటి తన పిల్లలను వాటికి వేగంగా పరిగెత్తగల వయçస్సు వచ్చే వరకు తన మూపున మోసుకుని తిరుగుతూ ఉంటుంది. పుట్టలు తవ్వి చెదపురుగులను, చెట్టు ఎక్కి తేనె పట్టును తెచ్చి పిల్లలకు పెడుతూ ఎంతో ప్రేమ పూర్వకంగా పిల్లలను సాకుతుంది. పిల్లలున్న ఎలుగు బంటి మరింత క్రోధంతో సమీపంలోకి వచ్చే జంతువును, మనిషిని చీల్చి చెండాడుతుంది. ళీ నల్లమలలోని హనీబాడ్జర్ నేల బొరియలలో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తమ పిల్లలు ఇతర జంతువుల బారిన పడకుండా బొరియలో ప్రత్యేక గదులు తవ్వుకుని రక్షణ కల్పిస్తాయి. గిజిగాడు పక్షి అందమైన గూళ్లను అత్యంత భధ్రమైన ప్రదేశాలలో (చిటారు కొమ్మలకు నీటి తలం అంచున) కట్టి అందులో గుడ్లను పొదిగి పిల్లలకు నిరంతరం కీటకాలను, ధాన్యం గింజలను ఆహారంగా అందించి పెంచుతుంది.కందిరీగలు వివిధ కీటకాల లార్వాలను తీసుకు వచ్చి గూడులో ఉన్న పిల్లలకు ఆహారంగా పెడతాయి.తేనె టీగలు తెట్టెలో షడ్భుజాకారంలో ఉండే గదుల్లో ఉండే పిల్ల ఈగలకు అవి సేకరించిన మకరందాన్ని ఆహారంగా అందిస్తాయి.రేచుకుక్కలు (వైల్డ్ డాగ్స్) వేట జంతువులను చంపి మాంసాన్ని కడుపులో నిల్వ చేసుకుని తమ పిల్లల వద్దకు వెళ్లి వాటి ముందు మాంస కండలను కక్కి తినిపిస్తాయి. -
World Architecture Festival 2024: స్కూలు భవనం.. బహు బాగుంది
గది అంతటా సూర్యకాంతి ప్రసరించేలా రంపం పళ్లను ఆకారంలో రూఫ్.. ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడే ఆవరణలు.. పెద్ద బాస్కెట్‌బాల్ కోర్టు.. అందమైన కమ్యూనిటీ గార్డెన్.. ఓపెన్ ఎయిర్ టెర్రస్.. లోపలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగకుండా చుట్టూ వంపులు తిరిగిన మెటల్ స్క్రీన్స్.. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు. ఇదేదో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన కాదు! ఓ స్కూల్ భవన విశేషాలివి. దాంతో ఆకాశహర్మ్యాలను, మ్యూజియాలను, అందమైన విమానాశ్రయాలను కూడా తలదన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ భవనంగా ఎంపికైంది. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ (డబ్ల్యూఏఎఫ్)లో ఈ ఘనత సాధించింది. దీని పేరు డార్లింగ్టన్ పబ్లిక్ స్కూల్. సిడ్నీలోని చిపండేల్లో ఉంది. సాంస్కృతిక పరిరక్షణ దక్షిణ సిడ్నీ ప్రాంతంలో ఉన్న ఈ స్కూలు నిజానికి ఆ్రస్టేలియా మూలవాసులతో బలమైన సంబంధాలున్న కమ్యూనిటీ పాఠశాల. 1970 నాటి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తది నిర్మించాలనుకున్నారు. ఎఫ్‌జెడ్‌సీ స్టూడియో ఆ బాధ్యతలు తీసుకుంది. మూలవాసులతో బంధాన్ని ప్రతిబింబించేలా పాఠశాల హాల్, ఎంట్రన్స్ రిసెప్షన్, తరగతి గదుల్లో స్వదేశీ కళను చిత్రీకరించి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించారు. పాత పాఠశాల గోడలపై ఉన్న ఆదిమ కుడ్యచిత్రాలను కొత్త భవనంలో పుననర్న్మించారు. ఆ స్ఫూర్తితోపాటు కొత్త, సమకాలీన అభ్యాస వాతావరణాన్ని సృష్టించారు. ప్రీసూ్కల్, కిండర్ గార్టెన్, ప్రైమరీ స్కూల్‌తో 500 మందికి పైగా విద్యార్థుల సామర్థ్యం ఈ కొత్త క్యాంపస్ సొంతం.ఆరోగ్యం, ఆహ్లాదం ప్రాధమిక పాఠశాల భవనంలో కాంతికోసం ప్రత్యేకంగా విద్యుత్ అక్కరలేదు. ప్రత్యేకమైన టెర్రస్ ప్రతి గదికీ సూర్యకాంతిని ప్రసరింపజేస్తుంది. అది బాగా వేడిగా కూడా ఉండదు. మృదువైన కాంతి స్థానిక కాసురినా చెట్ల ఆకుల మధ్య నుంచి జాలువారుతున్నట్లుగా ఉంటుంది. ఈ సహజకాంతి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాఠశాల భవనానికి అనుసంధానించి ఉన్న కమ్యూనిటీ హాల్, లైబ్రరీ విద్యార్థులను సమాజంలో భాగం చేస్తున్నాయి.175 మంది మనసు గెలుచుకుని.. క్రీడలు, రవాణా, ఆరోగ్యం, గృహనిర్మాణం వంటి 18 కేటగిరీల్లో డబ్ల్యూఏఎఫ్ అవార్డులు ఇస్తుంది. 175 మంది ఫెస్టివల్ డెలిగేట్ల ప్యానెల్ అన్ని కేటగిరీలకు చెందిన విజేతల నుంచి ‘వరల్డ్ బిల్డింగ్ ఆఫ్ ది ఇయర్’ ను ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది నేషనల్ స్టార్ అబ్జర్వేటరీ ఆఫ్ సైప్రస్, పోలండ్‌లోని ప్రఖ్యాత బస్ స్టేషన్, టర్కీలోని సోలార్ పవర్ ప్లాంట్ వంటి 220 ప్రాజెక్టులు అవార్డు కోసం పోటీపడ్డాయి. వాటన్నింటినీ తలదన్ని ఒక చిన్న పాఠశాల నెగ్గుకురావడం అసాధారణమని ఎఫ్జేసీ స్టూడియో అసోసియేట్ అలెస్సాండ్రో రోసీ అన్నారు. భవనంలో సమయాన్ని గడిపే పిల్లలే నిజమైన విజేతలని అభిప్రాయపడ్డారు. గతేడాది కూడా చైనాలోని ఓ బోర్డింగ్ స్కూల్ ఈ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇన్‌స్టాలో ఇక వయసు దాచలేరు
టీనేజీ యూజర్లు అసభ్య, అనవసర కంటెంట్ బారిన పడకుండా, వాటిని చూడకుండా కట్టడిచేసేందుకు, వారి మానసిక ఆరోగ్యం బాగుకోసం సామాజికమాధ్యమం ఇన్‌స్టా గ్రామ్ నడుం బిగించింది. ఇందుకోసం ఆయా టీనేజర్ల వయసును కనిపెట్టే పనిలో పడింది. తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారంతో లాగిన్ అయినాసరే ఇన్‌స్టా గ్రామ్ యాప్‌ను వాడుతున్నాసరే దానిని కనిపెట్టి అడ్డుకునేందుకు కృత్రిమ మేథ సాయం తీసుకుంటామని దాని మాతృసంస్థ ‘మెటా’వెల్లడించింది.ఎలా కనిపెడతారు? అడల్ట్ క్లాసిఫయర్ పేరిట కొత్త ఏఐ టూల్‌ను మెటా వినియోగించనుంది. దీంతో యూజర్ల వయసును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించుకోవచ్చు. ఆన్లైన్లో ఎలాంటి కంటెంట్‌ను యూజర్ వీక్షిస్తున్నాడు?, ఆ యూజర్ ప్రొఫైల్‌లో పొందుపరిచిన వివరాలతో వయసుపై తొలుత ప్రాథమిక అంచనాకొస్తారు. తర్వాత ఈ యూజర్‌ను ఏఏ వయసు వాళ్లు ఫాలో అవుతున్నారు?, ఈ యూజర్‌తో ఎలాంటి కంటెంట్‌ను పంచుకుంటున్నారు?, ఎలాంటి అంశాలపై ఛాటింగ్ చేస్తున్నారు? ఏం ఛాటింగ్ చేస్తున్నారు? వంటి విషయాలను వడబోయనున్నారు. ఫ్రెండ్స్ నుంచి ఈ యూజర్లకు ఎలాంటి బర్త్‌డే పోస్ట్‌లు వస్తున్నాయి వంటివి జల్లెడపట్టి యూజర్ వయసును నిర్ధారిస్తారు. ఆ యూజర్ 18 ఏళ్ల లోపు వయసున్న టీనేజర్‌గా తేలితే ఆ అకౌంట్‌ను వెంటనే టీన్ అకౌంట్‌గా మారుస్తారు. ఈ అకౌంట్ల వ్యక్తిగత గోప్యత సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా మారిపోతాయి. ఈ యూజర్లకు ఏ వయసు వారు మెసేజ్ పంపొచ్చు? అనేది ఏఐ టూల్ నిర్ణయిస్తుంది. ఈ టీనేజర్లు ఎలాంటి కంటెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు అనే దానిపై కృత్రిమ మేథ టూల్దే తుది నిర్ణయం. ప్రస్తుతం చాలా మంది టీనేజర్లు లైంగికసంబంధ కంటెంట్‌ను వీక్షించేందుకు, తల్లిదండ్రులకు తెలీకుండా చూసేందుకు తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారం ఇచ్చి లాగిన్ అవుతున్నారు. వీటికి త్వరలో అడ్డుకట్ట పడనుంది.వచ్చే ఏడాది షురూ అడల్ట్ క్లాసిఫయర్ను వచ్చే ఏడాది నుంచి అమలుచేసే వీలుంది. 18 ఏళ్లలోపు టీనేజర్ల ఖాతాలను టీన్ అకౌంట్లుగా మారుస్తాయి. అయితే త్వరలో 18 ఏళ్లు నిండబోయే 17, 16 ఏళ్ల వయసు వారికి కొంత వెసులుబాటు కల్పించే వీలుంది. అంటే నియంత్రణ సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. అయితే ఇది కూడా కాస్తంత కష్టంగా మార్చొచ్చు. సామాజికమాధ్యమ వేదికపై హానికర అంశాలను పిల్లలు చూసి వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో మెటా ఈ దిశగా యాప్‌లో మార్పులు చేస్తోంది. టీనేజీ అమ్మాయిలపై ఇన్‌స్టా గ్రామ్ పెను దుష్ప్రభావాలు చూపుతోందని ప్రజావేగు ఫ్రాన్సెస్ హాగెన్ సంబంధిత అంతర్గత పత్రాలను బహిర్గతం చేయడంతో ఇన్‌స్టా గ్రామ్ నిర్లక్ష్య ధోరణిపై సర్వత్రా విమర్శలు అధికమయ్యాయి. కొత్త టూల్ కారణంగా టీనేజీ యూజర్ల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చేమోగానీ సమస్యకు పూర్తి పరిష్కారం లభించకపోవచ్చని స్వయంగా మెటానే భావిస్తోంది. ఎవరైనా యూజర్ తాను టీనేజర్‌ను కాదు అని చెప్పి టీన్అకౌంట్ను మార్చాలనుకుంటే ఆ మేరకు లైవ్‌లో నిరూపించుకునేలా కొత్త నిబంధన తేవాలని చూస్తున్నారు. బయటి సంస్థకు ఈ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. సంబంధిత యూజర్ వీడియో సెల్ఫీ లైవ్‌లో తీసి పంపితే ఈ బయటి సంస్థ వీడియోను సరిచూసి అకౌంట్ స్టేటస్‌పై తుది నిర్ణయం తీసుకుంటుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మతి మరవండి.. మంచిదే!
రోడ్డుపై వెళ్తుంటే ఎవరో పలకరించారు.. ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నా వారెవరో వెంటనే గుర్తుకు రాదు.. ఏదో కొనుక్కొద్దామని దుకాణానికి వెళ్లారు.. వెళ్లాక అదేమిటో గుర్తుకు రాక కాసేపు తలగోక్కుంటారు.. వామ్మో మతిమరపు వచ్చేస్తోందని ఆందోళనపడుతుంటారు. కానీ ఏదో డిటర్జెంట్ ప్రకటనలో మరక మంచిదే అన్నట్టుగా.. ‘మరపు మంచిదే’నని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మతి మరవకుంటే మనిషి మనుగడ ఆగిపో యినట్టేనని తేల్చి చెప్తున్నారు. మరి మతిమరపు ఎందుకు మంచిదో మర్చిపోకుండా తెలుసుకుందామా..జ్ఞాపకం.. మరపు.. ఎలా జరిగేది?మెదడులోని న్యూరాన్ కణాల మధ్య ఏర్పడే బంధాలు (సినాప్సెస్) ఎంత బలంగా ఉంటే.. అక్కడ నిక్షిప్తమైన జ్ఞాపకం అంతగా మనలో నాటుకుపోయి ఉంటుంది. ఏదైనా పనిని ప్రత్యేక శ్రద్ధతో, ఏకాగ్రతతో, ఇష్టంతో చేసినప్పుడు.. ఒకే పనిని తరచూ చేస్తూ ఉన్నప్పుడు.. ఆ అంశానికి సంబంధించిన సినాప్సెస్ అంత బలంగా ఏర్పడి, జ్ఞాపకం (మెమరీ)గా మారుతాయి. ఆ పని లేదా అంశానికి సంబంధించి ప్రతిసారీ ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా.. ఆటోమేటిక్ మెమరీగా నిక్షిప్తం అవుతాయి. అదే మనం దేనిౖపె అయినా సరిగా దృష్టిపెట్టనప్పుడు సినాప్సెస్ బలహీనంగా ఉండి.. ఆ అంశం సరిగా రిజిస్టర్ కాదు. ఇలాంటి వాటిని మెదడు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ‘క్లీన్’ చేస్తూ ఉంటుంది. అదే మతిమరపు. మనుషుల్లో వయసు పెరిగినకొద్దీ.. మెదడుకు ఏకాగ్రత, ఫోకస్ చేసే శక్తి వంటివి తగ్గిపోతాయి. దీనికి ఇతర కారణాలూ తోడై అల్జీమర్స్ వంటి సమస్యలు వస్తుంటాయి.కొత్త ‘దారి’ కోసం.. పాత దాన్ని మరుగుపరుస్తూ..రోజువారీ జీవితంలో కొత్త అంశాలను నేర్చుకోవడానికి, జ్ఞాపకాలను అప్డేట్ చేసుకోవడానికి మతిమరపు తప్పనిసరి అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మనిషి పరిణామక్రమానికి, మనుగడకు ఇదీ కీలకమని తేల్చి చెప్తున్నారు. ఉదాహరణకు కొన్నేళ్లుగా రోజూ ఒకేదారిలో ఆఫీసుకు వెళుతూ ఉంటారు. ఆ మార్గం, మధ్యలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు.. ఇలా అన్ని అంశాలు బలంగా రిజిస్టరై.. ఆటోమేటిక్ మెమరీగా మారుతాయి. కానీ ఉన్నట్టుండి ఒకరోజు ఆ రోడ్డు మూసేయడంతో.. కొన్నిరోజులు పూర్తిగా కొత్త దారిలో ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మెదడులోని ఆ రోడ్డు మెమరీలో మార్పులు జరుగుతాయి. మనం వెళ్లే కొత్త దారిలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు వంటివి బలంగా రిజిస్టర్ అవడం మొదలవుతుంది. ఇందుకోసం మన మెదడు మొదటి రోడ్డుకు సంబంధించిన సినాప్సెస్‌ను బలహీనం చేస్తుంది. అంటే పాత డేటాను కొంతమేర మరుగుపరుస్తూ.. కొత్త అంశానికి అప్డేట్ అవుతుంది. ఇలా చేయకపోతే జ్ఞాపకాలు చిక్కుముడి పడి (మెమరీ క్లట్టర్) సమస్యాత్మకంగా మారుతాయి. ప్రతిష్టాత్మక నోబెల్‌ను గెలుచుకున్న శాస్త్రవేత్త ఎరిక్ కండెల్ తన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు. మరిచిపోకుంటే.. మనుగడకే ముప్పుమరుపు లేకుంటే ఎంత ప్రమాదమనే దానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఉదాహరణలు చూపుతున్నారు. ఉదాహరణకు ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)’.. అంటే ఏదైనా ప్రమాదానికి, భయోత్పాత ఘటనకు లోనైనప్పుడు ఆ జ్ఞాపకాలు లోతుగా నిక్షిప్తమైపోయి, నిత్యం వెంటాడుతూ ఉండే పరిస్థితి. ప్రమాదాలకో, దారుణ ఘటనలకో గురైనవారు.. తరచూ అవి తమ కళ్ల ముందే మళ్లీ, మళ్లీ జరుగుతున్నట్టుగా భ్రాంతి చెందుతూ బాధపడుతుంటారు. డిప్రెషన్లోకి వెళ్లిపోతారు.సాధారణ జీవితం గడపలేరు. ఇక పరిణామక్రమానికీ.. మతిమరపు, జ్ఞాపకాల అప్డేషన్కు లింకు ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకప్పుడు మనుషులు గుహల్లో ఉంటూ, వేటాడే బతికేవారు.. నీటికోసం సమీపంలోని కొలను దగ్గరికి వెళ్లేవారు. ఓసారి అలా వెళ్లినప్పుడు.. విషపూరిత పాములు, క్రూర జంతువులు కనిపిస్తే.. ఆ ప్రాంతం ప్రమాదకరమని మెదడులో జ్ఞాపకం అప్డేట్ అవుతుంది. ఈసారి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండటంగానీ, మరో కొలనును వెతుక్కోవడంగానీ చేసేలా ప్రేరేపిస్తుంది. ఈ లక్షణం కూడా మానవ పరిణామానికి తోడ్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మరపు శాశ్వతం కాదు.. మళ్లీ రావొచ్చు..ఒకసారి ఆటోమేటిక్/దీర్ఘకాలిక మెమరీగా నిక్షిప్తౖమెన జ్ఞాపకాలు.. అంత త్వరగా వీడిపోవని, అవి మరుగునపడతాయని.. సరైన ప్రేరణ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చని అమెరికన్ సైకాలజిస్టులు రోజర్ బ్రౌన్, డేవిడ్ మెక్నీల్ 1960వ దశకంలోనే ప్రతిపాదించారు. ఇటీవల చేసిన ప్రయో గాల్లో కొందరు శాస్త్రవేత్తలు దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఉదాహÆý‡ణకు మొదట చెప్పుకొన్నట్టు రోడ్డుపై వెళ్తుండగా కనబడిన వ్యక్తి పేరు వెంటనే గుర్తుకురాదు. కానీ ఆ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో గుర్తుంటుంది. ‘అరె నాలుకపైనే ఉంది, బయటికి రావట్లేదు’ అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తి ఊరి పేరో, బంధుత్వమో, మరొకటో ప్రస్తావించగానే.. పేరు ఠక్కున గుర్తొస్తుంది. అంటే తగిన ప్రేరణతో జ్ఞాపకం వచ్చేస్తుందన్న మాట.ఎలా చూసినా.. మరీ మర్చిపోయేంత కాకుండా.. కాస్త మరపు మంచిదే. -
Jharkhand Assembly Elections 2024: ఆదివాసీ సీట్లే కీలకం!
ఎన్డీఏ, ఇండియా కూటముల అమీతుమీకి జార్ఖండ్‌లో సర్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల పోరులో భాగంగా 13వ తేదీన తొలి దశలో 43 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మిగతా 38 సీట్లకు నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్ జరగనుంది. 23న రెండు రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి వెల్లడవుతాయి. జార్ఖండ్‌లో సంఖ్యాధికులైన ఆదివాసీలే ఈసారి కూడా పార్టీ ల గెలుపోటములను నిర్ణయించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో 28 ఎస్టీ రిజర్వుడు సీట్లే కావడం విశేషం. వాటితో పాటు పలు ఇతర అసెంబ్లీ స్థానాల్లోనూ వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. దాంతో ఆదివాసీలను ప్రసన్నం చేసుకోవడానికి అధికార ఇండియా కూటమి, విపక్ష ఎన్డీఏ సంకీర్ణ సారథి బీజేపీ పోటీ పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 28 ఎస్టీ స్థానాలకు గాను ఇండియా కూటమి సారథి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఏకంగా 19 సీట్లలో పాగా వేయడం విశేషం. మొత్తమ్మీద 26 ఎస్టీ స్థానాలూ ఇండియా కూటమి ఖాతాలోకే వెళ్లాయి. బీజేపీకి కేవలం రెండే ఎస్టీ స్థానాలు దక్కాయి. అందుకే ఈసారి ఆదివాసీ స్థానాల్లో పాగా వేయడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలుకుని బీజేపీ అగ్ర నేతలంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారులకు జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఆదివాసీ హోదా కల్పిస్తూ వారి పొట్ట కొడుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. సీఎం హేమంత్ సోరెన్ అవినీతిలో పీకల్లోతున మునిగిపోయారంటూ ఊదరగొడుతున్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమి తరఫున హేమంత్‌కు దన్నుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ ప్రచార రంగంలో ఉన్నారు. ప్రియాంక కూడా ఒకట్రెండుసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి ఇండియా కూటమిలో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, వామపక్షాలు 3 చోట్ల పోటీలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం), జేడీ(యూ) కలసి పోటీ చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాలు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్‌కు 16 దక్కాయి. జేవీఎంకు 3, ఏజేఎస్యూకు 2 సీట్లొచ్చాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బంధువులు, వారసుల జోరు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారసుల హడావుడి మామూలుగా లేదు. ఈసారి ఏకంగా 25కు పైగా స్థానాల్లో నేతల బంధుమిత్రులు బరిలో ఉన్నారు. జేఎంఎంను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్ కుమారుడు బాబూలాల్ సోరెన్, మరో మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా సాహు, ఇంకో మాజీ సీఎం అర్జున్ ముండా భార్య మీరా, మరో మాజీ సీఎం మధు కోడా భార్య గీత తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. జేఎంఎం నుంచి సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన ఈసారి ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ఆయన సోదరుడు బసంత్ సోరెన్, వదిన సీతా సోరెన్ కూడా పోటీలో ఉన్నారు. జేఎంఎం నుంచి 15 మంది దాకా నేతల వారసులు రంగంలో దిగారు. వలసదారులే ప్రధానాంశం! నిరుద్యోగం, ధరల పెరుగుదల, సాగు సంక్షోభం, గ్రామీణుల్లో నిరా శా నిస్పృహలు తదితర సమస్యలె న్నో జార్ఖండ్‌ను పట్టి పీడిస్తున్నాయి. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా వలసల అంశాన్ని తలకెత్తుకుంది. వలసదారుల సంక్షోభాన్ని ప్రధాన ఎన్ని కల అంశంగా మార్చేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. జా ర్ఖండ్ జనాభాలో ఏకంగా 35 శాతం మంది వలసదారులే కావడం విశేషం. బంగ్లాదేశ్ నుంచి వచి్చపడుతున్న వలసలు ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని బీజేపీ నేతలంతా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐపీవో లో 'లక్కు' కుదురాలంటే..
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో).. ఎక్స్ లేదా వై లేదా జెడ్.. ఇన్వెస్టర్ల నుంచి పదులు, వందల రెట్ల అధిక స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు దీటుగా రిటైలర్లూ దూకుడుగా ఐపీవోల్లో బిడ్ వేస్తున్నారు. చాలా ఇష్యూలు లిస్టింగ్‌లో లాభాలు కురిపిస్తుండడంతో ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారిపోయింది. ఇది ఏ స్థాయిలో అంటే బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై లిస్ట్ అయ్యే చిన్న కంపెనీల ఐపీవోలకూ ఎన్నో రెట్ల అధిక బిడ్లు దాఖలవుతున్నాయి. దీంతో ఐపీవో ఆకర్షణీయ మార్కెట్‌గా మారిపోయింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఐపీవో పోస్ట్‌లకు మంచి ఫాలోయింగ్ ఉంటోంది. స్పందన పెరిగిపోవడం వల్ల చివరికి కొద్ది మందినే షేర్లు వరిస్తున్నాయి. కానీ, కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా డిమాండ్ ఉన్న ఐపీవోలో అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవచ్చు. ఇందుకు ఏమి చేయాలన్నది చూద్దాం. ఒకటికి మించిన దరఖాస్తులు ఐపీవోలో షేర్ల అలాట్మెంట్ అవకాశాలను పెంచుకోవాలంటే, ఒకటికి మించిన పాన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవడం తెలివైన ఆప్షన్. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు సమరి్పస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్‌పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తమ తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమరి్పంచడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచి్చతంగా మెరుగుపడతాయి. కొందరు స్నేహితుల సాయంతోనూ ఒకటికి మించిన దరఖాస్తులు సమరి్పస్తుంటారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో కనీసం ఒక లాట్‌కు బిడ్ వేయాలి. ఒకటికి మించిన లాట్లతో బిడ్లు సమర్పించినప్పటికీ స్పందన అధికంగా ఉంటే, చివరికి ఒక్కటే లాట్ (కనీస షేర్లు) వస్తుంది. ఉదాహరణకు ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో ఒక లాట్ పరిమాణం 214 షేర్లు. విలువ రూ.14,980. ఒక ఇన్వెస్టర్ రూ.74,900తో ఐదు లాట్లకు బిడ్ వేసినా కానీ, ఒక్కటే లాట్ అలాట్ అయి ఉండేది. ఎందుకంటే ఇష్యూ పరిమాణంతో పోలి్చతే 60 రెట్లు అధిక బిడ్లు దాఖలు కావడం గమనార్హం. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో ఒకటికి మించిన బిడ్లు సమరి్పంచడం వల్ల కొన్ని సందర్భాల్లో అదృష్టం కొద్దీ ఒకటికి మించిన దరఖాస్తులకు కేటాయింపులు రావచ్చు. జాక్పాట్డిమాండ్ ఉన్న కంపెనీ షేర్లను సొంతం చేసుకునేందుకు పదుల సంఖ్యలో ఖాతాల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునే వారూ ఉన్నారు. దీన్నొక ఆదాయ మార్గంగా మలుచుకుని కృషి చేస్తున్నవారు కూడా కనిపిస్తుంటారు. చెన్నైకి చెందిన ఆదేష్ (30) ఇటీవలి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో జాక్‌పాట్ కొట్టేశాడు. వేర్వేరు పేర్లతో ఉన్న 18 డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్‌హోల్డర్ కేటగిరీ కింద బిడ్లు సమర్పించాడు. అదృష్టం తలుపుతట్టడంతో 14 డీమ్యాట్ ఖాతాలకూ వాటాదారుల కోట కింద కేటాయింపు లభించింది. అలాగే, హెచ్ఎన్ఐ కోటా కింద కూడా దరఖాస్తు చేశాడు. మొత్తం 39 లాట్లు దక్కాయి. అంటే మొత్తం 8,346 షేర్లు అతడిని వరించాయి. ఇష్యూ ధరతో పోలి్చతే లిస్టింగ్ రోజున బజాజ్ ఫైనాన్స్ ఒక దశలో 136 శాతం వరకు ర్యాలీ చేయడం గమనించొచ్చు. వాటాదారుల కోటా.. ఐపీవోకు వస్తున్న కంపెనీ మాతృసంస్థ (పేరెంట్) అప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే, వాటాదారుల కోటాను ఉపయోగించుకోవచ్చు. ఇటీవలే ముగిసిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వాటాదారులకు 7.62 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫైనాన్స్ సబ్సిడరీ. అలాగే, బజాజ్ ఫైనాన్స్ అన్నది బజాజ్ ఫిన్సర్వ్ సబ్సిడరీ. దీంతో రెండు కంపెనీల వాటాదారులకూ షేర్‌హోల్డర్స్ కోటా లభించింది. ఐపీవోకు వస్తున్నది కొత్త కంపెనీ అయితే ఇందుకు అవకాశం ఉండదు. లిస్టెడ్ కంపెనీల సబ్సిడరీలు ఐపీవోలకు వస్తుంటే, ముందుగానే ఆయా లిస్టెడ్ సంస్థలకు సంబంధించి ఒక్క షేరు అయినా డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఐపీవోకి సెబీ నుంచి అనుమతి రావడానికి ముందే ఈ పనిచేయాలి.బిడ్స్ ఇలా...త్వరలో ఐపీవోకు రానున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ల కంపెనీ ఏథర్ ఎనర్జీ సైతం లిస్టెడ్ సంస్థ హీరో మోటోకార్ప్ వాటాదారులకు కోటా రిజర్వ్ చేసింది. ఏథర్ ఎనర్జీలో హీరో మోటోకార్ప్‌కు 35 శాతానికి పైగా వాటా ఉండడం ఇందుకు కారణం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో దరఖాస్తు పెట్టుకున్న వారు.. విడిగా వాటాదారుల కోటాలోనూ గరిష్టంగా రూ.2 లక్షల విలువకు బిడ్ సమరి్పంచొచ్చు. రూ.2 లక్షలకు మించి నాన్ ఇనిస్టిట్యూషనల్ కోటాలోనూ పాల్గొనొచ్చు. ఎల్ఐసీ ఐపీవో సమయంలో పాలసీదారుల కోసం విడిగా షేర్లను రిజర్వ్ చేయడం గుర్తుండే ఉంటుంది. రుణం తీసుకుని మరీ..వ్యాపారం నిర్వహించే హర్ష (25) ఐదు వ్యక్తిగత డీమ్యాట్ ఖాతాలు, ఒక హెచ్‌యూఎఫ్ డీమ్యాట్ ఖాతా ద్వారా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవోలో పాల్గొన్నాడు. అప్పటికే తనకున్న ఈక్విటీ షేర్లను తనఖాపెట్టి ఎన్బీఎఫ్సీ నుంచి రూ.కోటి రుణం తీసుకుని మరీ హెచ్ఎన్ఐ విభాగంలో బిడ్ వేశాడు. మొత్తం మీద 19 లాట్లు దక్కించుకున్నాడు. వాటాదారుల కోటాలో..ఐటీ ఉద్యోగి అయిన ధీరజ్ మెహ్రా (43) ముందుగానే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కొని పెట్టుకున్నాడు. షేర్ హోల్డర్స్ కోటా కింద బిడ్లు వేశాడు. మొత్తం 11 డీమ్యాట్ ఖాతాలను ఉపయోగించుకున్నాడు. 6 లాట్ల షేర్లు అలాట్ అయ్యాయి. తిరస్కరణకు దూరంగా..కొన్ని తప్పుల కారణంగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. ఒకటే పాన్ ఆధారంగా వేర్వేరు ఖాతాల నుంచి బిడ్లు వేయడం ఇందులో ఒకటి. బిడ్ వేయడానికి ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలోని పేరు, డీమ్యాట్ ఖాతాలోని పేరు ఒకే విధంగా ఉండాలి. ఏదైనా ఐపీవో ఇష్యూ విజయవంతం కావాలంటే కనీసం 90% మేర సబ్‌్రస్కిప్షన్ రావాల్సి ఉంటుంది. కసరత్తు అవసరం.. లిస్టింగ్ రోజే లాభాలు తీసుకుందామనే ధోరణితో ఐపీవోల్లో పాల్గొనడం అన్ని సందర్భాల్లో ఫలితమివ్వదు. పైగా ఈ విధానంలో రిస్క్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. జారీ ధర కంటే తక్కువకు లిస్ట్ అయ్యేవీ ఉంటాయి. అలాంటి సందర్భంలో నష్టానికి విక్రయించకుండా దీర్ఘకాలం పాటు కొనసాగించగలరా? అని ప్రశి్నంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం లిస్టింగ్ లాభం కోసం దరఖాస్తుచేసుకుంటే.. లిస్టింగ్ నాడు నష్టం వచి్చనా విక్రయించాల్సిందే. దీర్ఘకాల దృష్టితో దర ఖాస్తు చేసుకుంటే, మెరుగైన ఫలితాలు చూడొచ్చు. లిస్టింగ్ ఆశావహంగా లేకపోయినా, కంపెనీ వ్యాపార అవకాశాల దృష్ట్యా పెట్టుబడి కొనసాగించొచ్చు. ఇటీవలి ఐపీవోల్లో చాలా వరకు అధిక వేల్యుయేషన్పైనే నిధులు సమీకరిస్తున్నాయి. అలాంటి కొన్ని లిస్టింగ్ తర్వాత ర్యాలీ చేస్తున్నాయి. ఐపీవో ముగిసి లిస్టింగ్ నాటికి మార్కెట్ దిద్దుబాటులోకి వెళితే.. అధిక వ్యా ల్యూషన్పై వచ్చిన కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో నష్టాలను మిగల్చవచ్చు.ఎస్ఎంఈ ఐపీవోలు మెయిన్‌బోర్డ్ ఐపీవోల్లో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (రూ.15,000)కు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే ఎస్ఎంఈ ఐపీవో అయితే కనీస లాట్ విలువ రూ.లక్ష, అంతకు మించి ఉంటుంది. కనుక చిన్న ఇన్వెస్టర్లు అందరూ వీటిలో పాలు పంచుకోలేరు. బీఎస్ఈ ఎస్ఎంఈ, ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ కంపెనీలు లిస్ట్ అవుతాయి. ఆరంభ స్థాయిలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు సులభంగా ప్రజల నుంచి నిధులు సమీకరించి, లిస్ట్ అయ్యేందుకు ఈ వేదికలు వీలు కల్పిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఎస్ఎంఈ ఐపీవోలకు సైతం అనూహ్య స్పందన వస్తోంది. దీనికి కారణం గత రెండేళ్లుగా ఎస్ఎంఈ సూచీ ఏటా 39 శాతం మేర రాబడి ఇస్తోంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 రాబడి 15 శాతం (సీఏజీఆర్) కాగా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ రాబడి 37 శాతం చొప్పునే ఉంది. లాట్ పరిమాణం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ లిక్విడిటీ (వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు లిస్టింగ్ లాభాల ధోరణితో కాకుండా, దీర్ఘకాల దృక్పథంతో ఎస్ఎంఈ ఐపీవోల్లో పాల్గొనడం మంచిది.జాగ్రత్త అవసరం..ఇక ఎస్ఎంఈ ఐపీవోల్లో మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ఆరంభ స్థాయి, చిన్న కంపెనీలు కావడంతో వ్యాపారంలో అన్నీ రాణిస్తాయని చెప్పలే. పైగా ప్రమోటర్ల సమర్థత గురించి తెలుసుకోవడానికి సరిపడా సమాచారం లభించదు. ఎస్ఎంఈ విభాగంలో నాణ్యమైన, పేరున్న కంపెనీల ఐపీవోలకే పరిమితం కావడం ద్వారా రిస్‌్కను తగ్గించుకోవచ్చు. ఎస్ఎంఈ ఐపీవోల పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవాలని సెబీ ఇప్పటికే ఇన్వెస్టర్లకు సూచించింది. ట్రాఫిక్సాల్ ఐటీఎస్ టెక్నాలజీస్ అనే ఎస్ఎంఈ రూ.45 కోట్లతో ఐపీవో ఇష్యూ చేపట్టగా 345 రెట్ల స్పందన వచ్చింది, అయితే ఈ సంస్థ వెల్లడించిన సమాచారంలో లోపాలపై ఓ ఇన్వెస్టర్ చేసిన ఫిర్యాదు మేరకు, సెబీ జోక్యం చేసుకుని లిస్టింగ్‌ను నిలిపివేయించింది. సదరు కంపెనీ ఐపీవో పత్రాలపై సెబీ దర్యాప్తు చేస్తోంది. మెయిన్‌బోర్డ్ ఐపీవోకు సెబీ అనుమతి మంజూరు చేస్తుంది. ఎస్ఎంఈలకు అయితే బీఎస్ఈ లేదా ఎన్ఎస్ఈ ఆమోదం ఉంటే సరిపోతుంది. రుణంతో దరఖాస్తు... పేరున్న, వృద్ధికి పుష్కల అవకాశాలున్న కంపెనీ ఐపీవోకు వచ్చింది. దరఖాస్తుకు సరిపడా నిధుల్లేవు. అప్పుడు ఐపీవో ఫండింగ్ (రుణం రూపంలో నిధులు సమకూర్చుకోవడం) ఉపయోగపడుతుంది. కేవలం ఒక లాట్‌కు పరిమితం కాకుండా, పెద్ద మొత్తంలో దరఖాస్తు చేసుకునేందుకు ఐపీవో ఫండింగ్ సాయపడుతుంది. ఒక్కో పాన్‌పై గరిష్టంగా రూ.కోటి వరకు ఫండింగ్ తీసుకోవచ్చు. కొన్ని సంస్థలు కనీసం రూ.25 లక్షల పరిమితిని అమలు చేస్తున్నాయి. సాధారణంగా రూ.10లక్షలకు మించిన కేటగిరీలో పాల్గొనే హెచ్ఎన్ఐలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటుంటారు. రుణ కాలవ్యవధి 6 రోజులుగా ఉంటుంది. 20–30 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఫండింగ్ కోసం రుణం ఇచ్చే సంస్థ వద్ద ఖాతా తెరవాలి. అలాగే ఆ సంస్థతో భాగస్వామ్యం కలిగిన బ్రోకరేజీ వద్ద డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. తనవంతు మార్జిన్‌ను ఇన్వెస్టర్ సమకూర్చుకోవాలి. అప్పుడు మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ ఖాతాకు ఎన్బీఎఫ్సీ బదిలీ చేస్తుంది. ఒప్పందం ప్రకారం కేటాయించిన షేర్లపై ఎన్బీఎఫ్సీకి నియంత్రణ ఉంటుంది. లిస్టింగ్ రోజే విక్రయించాల్సి ఉంటుంది. కేటాయించిన ధర కంటే తక్కువకు లిస్ట్ అయితే, మిగిలిన మేర ఇన్వెస్టర్ చెల్లించాలి. లాభం వస్తే, ఎన్బీఎఫ్సీ వడ్డీ, ఇతర చార్జీలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్టర్ వెనక్కి తీసుకోవచ్చు.నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం (ఎన్ఐఐ) అధిక నెట్‌వర్త్ కలిగిన ఇన్వెస్టర్లు ఈ విభాగంలోనే బిడ్లు వేస్తుంటారు. ఇందులో రూ.2–10 లక్షల బిడ్లను స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీగా, రూ.10 లక్షలకు మించి బిగ్ హెచ్ఎన్ఐ విభాగంగా పరిగణిస్తుంటారు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ.2–10 లక్షల విభాగంలో విలువ ప్రకారం చూస్తే 32 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. రూ.10 లక్షలకు పైన కేటగిరీలో 50 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. బిడ్ల విలువతో సంబంధం లేకుండా ప్రతి దరఖాస్తును సమానంగా పరిగణించి, అధిక సబ్ర్స్కిప్షన్ వచి్చనప్పుడు లాటరీ ఆధారంగా కేటాయింపులు చేస్తారు. ఇనిస్టిట్యూషన్స్ మినహా వ్యక్తులు ఎవరైనా ఈ విభాగంలో బిడ్లు వేసుకోవచ్చు. తద్వారా కేటాయింపుల అవకాశాలను పెంచుకోవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం స్మాల్ హెచ్ఎన్ఐ విభాగంలో 3.6 శాతం, బిగ్ హెచ్ఎన్ఐ విభాగంలో 12 శాతం మేర షేర్లను పొందే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎన్ని రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయనే దానికంటే మొత్తం దరఖాస్తులు ఎన్ననేది చూడడం ద్వారా కేటాయింపు అవకాశాలను తెలుసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Sakshi Little Stars: ఇదీ రక్త బంధమే!
మన సంస్కృతి, సంప్రదాయలు, కుటుంబ విలువల్లో ‘రక్త సంబంధం’ అనే మాట పవిత్రమైనది. సానుకూల శక్తికి నిలువెత్తు అద్దంలాంటిది. సానుకూల శక్తి అనుకున్నది ప్రతికూల శక్తిగా మారితే? వరం అనుకున్నది శాపం అయితే? అది అనుభవిస్తే కాని తెలియని బాధ.చిన్నారుల ఆనందప్రపంచాన్ని జన్యు సంబంధిత వ్యాధి తలసేమియా దూరం చేస్తుంది. ఎప్పుడూ ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తుంది. ‘అందరిలా నేనెందుకు ఉండకలేకపోతున్నాను’ అనే ఆవేదనను వారిలో కలిగిస్తుంది. ‘లేదు... మీరు అందరిలాగే ఉండాలి. నవ్వాలి. ఆడాలి. ఇంద్రధనుస్సుల పల్లకీలో ఊరేగాలి’ అంటూ నడుం కట్టారు చైల్ట్ ఆర్టిస్ట్‌లు.నవంబర్ 14 బాలల దినోత్సవం నేపథ్యంలో... తలసేమియా బారిన పడిన చిన్నారులకు ప్రతి నెల ఉచితంగా రక్తం ఎక్కిస్తూ (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్), మందులు అందిస్తూ విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్‌లోని ‘తలసేమియా సికిల్ సెల్ సొసైటీ’కి బాలతారలను తీçసుకువెళ్లింది సాక్షి. సలార్, పుష్ప–2లో నటించిన మోక్షజ్ఞ, పొట్టేల్ సినిమాలో నటించిన తనస్వీ, సరిపోదా శనివారంలో నటించిన అనన్యలు తలసేమియా బారిన పడిన చిన్నారులను ఆత్మీయంగా పలకరించడమే కాదు వారిని నవ్వించారు. తమ డ్యాన్స్‌లతో హుషారెత్తించారు. వారిలో ఆత్మస్థైర్యం నింపారు...వారసత్వంగా సంక్రమించే రక్త సంబంధ వ్యాధి (జెనెటికల్ బ్లడ్ డిజార్డర్) తలసేమియా. నివారణ మార్గాలున్నా అవగాహన లేమితో ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులు వేల సంఖ్యలో ఉన్నారు. వారు ప్రతీ రెండు, మూడు వారాలకు ఒకసారి తప్పనిసరిగా వారు రక్తం ఎక్కించుకోవాలి. ఇది అత్యంత ఖరీదైనది. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ‘తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ’ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. ఇక్కడకి వచ్చిన చైల్డ్ ఆర్టిస్టులు తమలాంటి పసిహృదయాలకు ఎందుకు ఇంతటి కష్టం వచ్చిందని విలవిలలాడిపోయారు. లోపలి నుంచి తన్నుకొస్తున్న బాధను దిగమింగుకొని వారికి సంతోషాలను పంచే ప్రయత్నం చేశారు. వారి ఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందుల గురించి ఆరా తీశారు. ‘మీకు మేమున్నాం. మీ సమస్యలపై మా సినిమాల ద్వారా అవగాహన కల్పిస్తాం’ అన్నారు. తల్లడిల్లిపోయే తల్లులు ఎందరో...తన బిడ్డ కోసం ప్రతి నెలా ఖమ్మం నుంచి నుంచి హైదరాబాద్‌కు వస్తుంది ఒక తల్లి. ఆమె ఇద్దరు బిడ్డలకూ తలసేమియా సంక్రమించింది. పెద్దపాప బోన్ మ్యారో చికిత్స విఫలమై చనిపోయింది. చిన్నపాపను కాపాడుకోవాలనే ధృఢసంకల్పం ఆ తల్లిలో కనిపిస్తోంది. ‘ఈ వేదిక నాకు దేవాలయంతో సమానం’ అంటుంది. తన చెల్లి కోసం ప్రతీ నెల కడప జిల్లా నుంచి ఇక్కడికి వస్తుంది అర్ఫాన్. ఇలాంటి తల్లులు ఎంతో మంది తలసేమియా సికిల్ సెల్ సొసైటీలో కనిపిస్తారు. వారి కన్నీళ్లతో మన మనసు తడిసిపోతుంది.డాక్టర్ కావాలని ఉంది...‘‘నేను ఏడో క్లాస్ చదువుతున్నాను. మూడు నెలల నుంచి రక్తం అందిస్తున్నారు. ఈ అవస్థలు చూస్తుంటే..భవిష్యత్‌లో నేను డాక్టర్ అయిపోయి, నాలాంటి పిల్లలకు మంచి వైద్యం అందించాలని ఉంది. గేమ్స్ కూడా బాగా ఆడతాను’ అంటుంది ఖమ్మంకు చెందిన దీపిక.మా గురించి ఆలోచించండి...‘‘నేను ఆరేళ్ల నుంచి ఈ సేవలు పొందుతున్నాను. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాను. మా భోజనం అందరిలానే ఉంటుంది, కానీ పండ్లు తక్కువగా తినాలి. శరీరంలో రక్తం తగ్గినప్పుడు నీరసంగా ఉంటుంది. జ్వరం వస్తుంది. ఒక్కోసారి లేవలేనంతగా కాళ్ల నొప్పులు వస్తాయి. రక్తం తీసుకున్న తరువాత బాగానే ఉంటాం. దయచేసి మా గురించి ఆలోచించండి. మాకు రక్తం అందుబాటులో ఉండాలి. రక్తదాతలు సహకరిస్తేనే మాకు సరిపడా రక్త నిల్వలు ఉంటాయి. ఈ విషయంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమం సాక్షి నిర్వహిస్తున్నందుకు మనసారా కృతఙ్ఞతలు’’ అంటుంది గౌసియా.భయపడితే బతకలేము...నాకు 6 నెలల వయసులోనే తలసేమియా ఉందని గుర్తించారు. గత 21 ఏళ్లుగా ప్రతీ 15, 20 రోజులకు ఒకసారి ఇక్కడ రక్తం ఎక్కించుకుంటున్నాను. మాకు ఐరెన్ లెవల్స్ పెరగకుండా ట్యాబ్లెట్లు ఇస్తారు. దీని గురించి ఆలోచిస్తూ బాధ పడితే జీవితాన్ని ముందుకు సాగించలేను. అందుకే ధైర్యంగా ఉంటాను. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాను. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. కొన్ని డ్యాన్స్ పోటీల్లో కూడా పాల్గొన్నాను. మాకు ఈ సెంటర్ అండగా ఉంటోంది. – మెహవీన్ ఫాతిమానేను యూకేజీ చదువుతున్నాను. వారం వారం నాన్న రక్తం కోసం ఇక్కడికి తీసుకువస్తాడు. మొదట్లో చాలా భయమేసేది. ఇప్పుడు భయం లేదు. – నిహారికప్రతి 3 వారాలకు రక్తం ఎక్కించుకోవడం అలవాటైంది. భయం లేదు. 7వ తరగతి చదువుతున్నాను. డ్యాన్సింగ్, సింగింగ్ అంటే చాలా ఇష్టం. నా వ్యాధి గురించి స్కూల్లో టీచర్లకు కూడా తెలుసు. చాలా విషయాల్లో సహాయం చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఇక్కడి వచ్చినప్పుడల్లా ఎందుకొచ్చానని బాధగా అనిపిస్తూనే ఉంటుంది. – సంకీర్తన, కరీంనగర్రక్తదాతలు ముందుకు రావాలి...తలసేమియాతో నాకు బాబు పుట్టాడు. ఆ సమయంలో దక్షిణాదిలో డాక్టర్లకు కూడా ఈ వ్యాధిపైన అంతగా అవగాహన లేదు. దేశంలోని ఎన్నో హాస్పిటల్లు, మెడికల్ కాలేజీలు తిరిగి దీని గురించి తెలుసుకుని మళ్లీ నగరంలోని డాక్టర్లకు అవగాహాన కల్పించి బాబుకు చికిత్ప అందించాను. నాలాంటి మరో 20 కుటుంబాల వారు కలిసి 1998లో డా. ఏఎన్ కృష్ణకుమారి సహాయంతో ఈ సెంటర్‌ను స్థాపించాం. మా ప్రయత్నంలో ఎందరో సామాజికవేత్తలు, డాక్టర్లు సహకారం అందించారు. విరాళంగా అందించిన స్థలంలో దాతల సహాయంతోనే ఈ సెంటర్‌ను నిర్మించాం. ఇప్పటికి 4199 మంది చికిత్న పొందుతున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల యూనిట్ల రక్తం అందించాం. ఇంతమందికి సేవలందిస్తున్న ప్రపంచంలో అతి పెద్ద సంస్థ మాదే అని చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రస్తుతం నా బాబు లేడు. కానీ నాకు 4199 మంది పిల్లలున్నారు. వీరికి మా సేవలు ఇలానే అందాలంటే రక్తదాతల అవసరం ఎంతో ఉంది. స్వచ్ఛందంగా రక్తదాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. – రత్నావళి, ఫౌండర్, తలసేమియా సికిల్ సెల్ సొసైటీఏడుపొచ్చింది...ఇక్కడి రాగానే ఏడుపొచ్చేసింది. నాలాంటి చిన్నారులే సెలైన్లు పెట్టుకుని రక్తం ఎక్కించు కుంటుంటే బాధగా అనిపించింది. వారికి సంతోషాలను పంచాలని, వారితో ఆడుకున్నాను. నా పొట్టేల్ సినిమాలోని ‘చీమ కాటుకే ఓర్చుకోలేవు ఈ నొప్పి ఎలా భరిస్తావ్’ అనే డైలాగ్ చెప్పాను. వర్షిత నాతో చాలా బాగా ఆడుకుంది, జానీ జానీ రైమ్స్ చెప్పింది. వీరందరినీ దేవుడు మంచిగా చూసుకోవాలి. – తనస్వీ, చైల్డ్ ఆర్టిస్ట్పెద్దయ్యాక సహాయం చేస్తాను...తలసేమియా పిల్లలతో సరదాగా ఆడుకుని ధైర్యం నింపాలని వచ్చాను. ఛత్రపతి డైలాగ్ చెబితే అందరూ చప్పట్లు కొట్టారు. ఇక్కడి అబ్దుల్ నన్ను టీవీలో చూశానని చెప్పాడు. ముఖేష్ నాకు ఫ్రెండ్ అయ్యాడు. తను డాక్టర్ అవుతాడంట. వీరి కోసం నేను డ్యాన్సులు కూడా చేశాను. నేను పెద్దయ్యాక ఇలాంటి వారికి సహాయం చేస్తాను. – మోక్షఙ్ఞ, చైల్డ్ ఆర్టిస్ట్ప్రభుత్వం ఆదుకోవాలి...ఇది జెనెటిక్ డిసీజ్ అయినప్పటికీ నివారించగలిగేదే. ఈ వ్యాధుల్లో నివారించగలిగే అవకాశముండటం చాలా అరుదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎంతో ఖరీదైన ప్రక్రియ. ఈ విషయంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయసహకారాలు అందించాలి. – సుమాంజలి, సెక్రటరీ– సీఈఓఈ టెస్ట్ తప్పనిసరి చేయాలి...మేము ఆశ వర్కర్లు, పీహెచ్‌సీలతో కలిసి గర్భిణీ స్త్రీలకు హెచ్‌బీఏ2 టెస్ట్ చేయిస్తున్నాం. ఇప్పటి వరకు 30 వేల మందికి ఈ టెస్టులు చేయించాం. ప్రభుత్వం తరపున ఈ టెస్ట్‌లు అందరికీ తప్పనిసరి చేయాలి. – చంద్రకాంత్ అగర్వాల్, ప్రెసిడెంట్సినిమా ద్వారా అవగాహన కలిగిస్తాను...ఈ పిల్లలను చూడగానే కన్నీళ్లు ఆగలేదు. వీరికి ఏదైనా సహాయం చేయాలని «గట్టిగా అనుకుంటున్నాను. అందరు పిల్లలతో మాట్లాడాను. సరిపోదా శనివారం.. డైలాగ్ చెప్పాను. నా షూటింగ్స్ గురించి వారు అడిగారు. నాకు రక్తం అంటేనే భయం..అలాంటిది వీరు ప్రతీ నెలా ఎక్కించుకుంటుంటే ఊహించడానికే కష్టంగా ఉంది. నా సినిమాల్లో ఈ వ్యాధి గురించే అవగాహన కల్పించే క్యారెక్టర్ చేసే ప్రయత్నం చేస్తాను.– అనన్య, చైల్డ్ ఆర్టిస్ట్ తలసేమియా నివారణకు... హెచ్‌బీఏ–2 అనే పరీక్షను మహిళకు పెళ్లి తర్వాత, గర్భధారణకు ముందు చేయిస్తే తలసేమియాను తేలిగ్గా నివారించవచ్చు.గమనిక: ఈ రోజు రావలసిన ‘సన్నిధి’ పేజీకి బదులుగా బాలల దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ నిర్వహిస్తున్న ‘లిటిల్ స్టార్స్’ పేజీ ఇస్తున్నాం.– డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనీల్ మోర్ల -
ట్రంప్ మార్కు కనిపించేనా!
దూకుడుకు, ఆశ్చర్యకర నిర్ణయాలకు పెట్టింది పేరైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠమెక్కనున్నారు. ఈ పరిణామం అమెరికా మిత్ర దేశాల్లో భయాందోళనలకు, శత్రు రాజ్యాల్లో హర్షాతిరేకాలకు కారణమవుతోంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’అన్నదే మూల సిద్ధాంతంగా సాగుతానని తేల్చి చెప్పిన ఆయన అదే ప్రాతిపదికన విదేశాంగ విధానాన్ని పునర్నర్మీస్తారా? అదే జరిగితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం. గాజాపై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తికరం. ఉక్రెయిన్ యుద్ధం నాటో పుట్టి ముంచేనా? రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించగలనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే చెప్పారు. అదెలా అని మీడియా పదేపదే ప్రశ్నిస్తే ఒక ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ సరిపెట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను కొనసాగించాలని, రష్యాతో ఆ దేశం శాంతి చర్చలు జరిపేలా చూస్తూనే షరతులు విధించాలని ట్రంప్ మాజీ జాతీయ భద్రతాధిపతులు ఇటీవల సూచించారు. నాటోలో ఉక్రెయిన్ ప్రవేశాన్ని వీలైనంత ఆలస్యం చేయడం ద్వారా రష్యాను తృప్తి పరచాలని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకడం, అమెరికా వనరుల వృథాను అరికట్టడమే తన ప్రాథమ్యమని స్పష్టంగా చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్లకు పైగా ఉక్రెయిన్‌కు బైడెన్ సర్కారు అందిస్తూ వచ్చిన భారీ ఆర్థిక, ఆయుధ సాయాలకు భారీగా కోత పడవచ్చని భావిస్తున్నారు. అంతేగాక యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేలా రష్యా, ఉక్రెయిన్ రెండింటిపైనా ట్రంప్ ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. స్వదేశంలో ఇమేజీ కోసం కనీసం తక్షణ కాల్పుల విరమణకైనా ఒప్పంచేందుకు ఆయన శాయశక్తులా ప్రయతి్నంచవచ్చు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా డిమాండ్‌కు ట్రంప్ అంగీకరించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇది నాటోలోని యూరప్ సభ్య దేశాలకు రుచించని పరిణామమే. కానీ నాటో కూటమి పట్ల ట్రంప్ తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా వాటి అభ్యంతరాలను ఆయన పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇది అంతిమంగా నాటో భవితవ్యంపైనే తీవ్ర ప్రభావం చూపవచ్చు. నాటో కూటమి రక్షణ వ్యయం తీరుతెన్నుల్లో భారీ మార్పులకు కూడా ట్రంప్ శ్రీకారం చుట్టవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొరుకుడు పడని పశ్చిమాసియా గాజా యుద్ధం, ఇరాన్‌తో ఇజ్రాయెల్ ఘర్షణ, దానిపై హమాస్‌తో పాటు హెజ్»ొల్లా దాడులతో అగి్నగుండంగా మారిన పశ్చిమాసియాలో కూడా శాంతి స్థాపిస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. తాను అధికారంలో ఉంటే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగేదే కాదని చెప్పుకున్నారు. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు, ఆ దేశంతో అణు ఒప్పందం రద్దు వంటి చర్యలకు ఆయన దిగవచ్చంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ ఇరాన్‌పై ప్రతీకారం, హమాస్, హెజ్»ొల్లా తదితర ఉగ్ర సంస్థల నిర్మూలన విషయంలో నెతన్యాహు మొండిగా ఉన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు రక్షణ మంత్రినే ఇంటికి పంపించారు. కనుక ట్రంప్ ప్రయత్నాలకు నెతన్యాహు ఏ మేరకు సహకరిస్తారన్నది సందేహమే. నిజానికి ట్రంప్ విధానాలే పశ్చిమాసియాలో అస్థిరతకు దారి తీశాయన్నది ఆయన విమర్శకుల వాదన. వాటివల్ల పాలస్తీనియన్లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారంటారు. ఇజ్రాయెల్‌తో పాటు పలు అరబ్, ముస్లిం దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరిచేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు పాలస్తీనాను పూర్తిగా ఏకాకిని చేశాయి. ఇన్ని సంక్లిష్టతల నడుమ గాజా కల్లోలానికి ట్రంప్ చెప్పినట్టుగా తెర దించగలరా అన్నది వేచి చూడాల్సిన విషయమే. చైనా వ్యూహంలోనూ మార్పులు! అమెరికా విదేశాంగ విధానంలో చైనా పట్ల వైఖరి అత్యంత వ్యూహాత్మకమైనది. ఇది ప్రపంచ భద్రత, వాణిజ్యంపైనే ప్రభావం చూపుతుంది. ట్రంప్ అధికారంలో ఉండగా చైనాను ‘వ్యూహాత్మక పోటీదారు’గా పేర్కొన్నారు. పలు చైనా దిగుమతులపై సుంకాలు విధించారు. దాంతో చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధించింది. ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగానే కోవిడ్ వచ్చి పడింది. దాన్ని ‘చైనీస్ వైరస్’గా ట్రంప్ ముద్ర వేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. అనంతరం బైడెన్ సర్కారు కూడా చైనాపై ట్రంప్ సుంకాలను కొనసాగించింది. అమెరికాలో నిరుద్యోగం తదిరాలకు చైనా దిగుమతులను కూడా కారణంగా ట్రంప్ ప్రచారం పొడవునా ఆక్షేపించన నేపథ్యంలో వాటిపై సుంకాలను మరింత పెంచవచ్చు. అలాగే చైనా కట్టడే లక్ష్యంగా సైనికంగా, వ్యూహాత్మకంగా అమెరికా అనుసరిస్తున్న ఆసియా విధానంలోనూ మార్పుచేర్పులకు ట్రంప్ తెర తీసే అవకాశముంది. చైనా కట్టడికి దాని పొరుగు దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని కొనసాగించాలన్న బైడెన్ ప్రభుత్వ విధానానికి ఆయన తెర దించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత్‌కు ఇబ్బందికర పరిణామమే. తైవాన్‌పై చైనా దాష్టీకాన్ని అడ్డుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని కూడా ట్రంప్ పదేపదే చెప్పారు. కనుక తైవాన్‌కు అమెరికా సైనిక సాయాన్ని కూడా నిలిపేయవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Elections Results 2024: ఆ నాలుగు వద్దు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రధానంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులైన మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. గర్భస్రావ హక్కులకు వ్యతిరేకి అయిన ట్రంప్ రాక పట్ల ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పురుషుల ఓట్లతోనే ఆయన గెలిచారని వారు భావిస్తున్నారు. ట్రంప్‌కు ఓటేసి గెలిపించినందుకు ప్రతీకారంగా పురుషులను పూర్తిగా దూరం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు! ఈ దిశగా దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ‘4బీ’ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఆ మగవాళ్లను దూరంగా పెడతాం. వారితో శృంగారం, పెళ్లి, పిల్లలను కనడం వంటి సంబంధాలేవీ పెట్టుకోబోం’’అని కరాఖండిగా చెబుతుండటం విశేషం! దక్షిణ కొరియాలో పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం ఇప్పుడు అమెరికాలో ఊపందుకుంటోంది. ట్రంప్ విజయం తర్వాత బాగా ట్రెండింగ్‌గా మారింది. ట్రంప్ మహిళల వ్యతిరేకి అని, స్త్రీవాదమంటే ఆయనకు పడదని డెమొక్రటిక్ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. గర్భస్రావ హక్కులకు మద్దతుగా నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయంపై మహిళలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ విజయంతో ఆవేదనకు గురై వారు కన్నీరుపెట్టారు. తమ బాధను సోషల్ మీడియాలో పంచుకోవడంతోపాటు 4బీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం పొడవునా మహిళల హక్కులపై ట్రంప్, హారిస్ మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం సాగింది. 4బీ ఉద్యమం దానికి కొనసాగింపని చెబుతున్నారు. ఇది మహిళల విముక్తి పోరాటమంటూ పోస్టు పెడు తున్నారు. ‘‘తరాలుగా సాగుతున్న పురుషాధిక్యత, అణచివేతపై ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాం’’ అంటున్నారు. 4బీ పోరాటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీని గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. పోస్టులు, లైక్‌లు, షేరింగ్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రాడికల్ ఫెమినిస్ట్ ఉద్యమం నానాటికీ బలం పుంజుకోంటుంది. ఏమిటీ 4బీ ఉద్యమం?ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీ టూ’ఉద్యమం తర్వాత అదే తరహాలో దక్షిణ కొరియాలో 2018లో 4బీ ఉద్యమం మొదలైంది. ఓ మహిళ తన ఆర్ట్ క్లాస్‌లో భాగంగా నగ్నంగా ఉన్న పురుషున్ని ఫొటో తీసినందుకు అధికారులు ఆమెను అరెస్టు చేశారు. దీనిపై మహిళల ఆగ్రహావేశాలు 4బీ ఉద్యమానికి దారితీశాయి. బీ అంటే కొరియా భాషలో సంక్షిప్తంగా నో (వద్దని) చెప్పడం. పురుషులతో డేటింగ్, పెళ్లి, శృంగారం, పిల్లలను కనడం. ప్రధానంగా ఈ నాలుగింటికి నో చెప్పడమే 4బీ ఉద్యమం. దీన్ని అణచివేసేందుకు కొరియా ప్రభుత్వం ప్రయతి్నంచింది. స్త్రీ పురుషుల ఆరోగ్యకరమైన సంబంధాలను ఇలాంటి ఉద్యమాలు దెబ్బతీస్తాయని అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ 2021లో చెప్పారు. ఇప్పుడక్కడ 4బీ గొడవ కాస్త సద్దుమణిగినప్పటికీ ప్రజలపై దాని ప్రభావం ఇంకా బలంగానే ఉంది. దాంతో కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు బాగా తగ్గిపోయింది. 4బీ ఉద్యమమే దీనికి ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభిప్రాయపడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ ఎన్నికపై సైన్యంలో రుసరుసలు!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో అమెరికా రక్షణ శాఖలో కొత్త పరిణామాలు సంభవించబోతున్నాయి. విదేశాల నుంచి సామూహిక వలసలను కఠినంగా అణచివేస్తానని, అక్రమ వలసదార్లపై కచ్చితంగా చర్యలుంటాయని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వలసలను కట్టడి చేయడానికి సైనిక దళాల సేవలు వాడుకుంటామని చెప్పారు. దేశంలో తన వ్యతిరేక గళాలపైనా ఆయన విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యర్థులకు వేధింపులు తప్పవన్న ప్రచారం సాగుతోంది. దేశంలో చట్టాల పటిష్ట అమలుకు యాక్టివ్–డ్యూటీ దళాలను రంగంలోకి దించుతానని ట్రంప్ చెప్పారు. సైన్యంలో తిష్టవేసిన అవినీతిపరులను ఏరిపారేస్తానని ప్రకటించారు. తన ప్రభుత్వంలో విధే యులకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. సొ ంత ఇంటి(స్వదేశం) లోని శత్రువులపైకి సైన్యాన్ని పంపిస్తానని చెప్పారు. మరోవైపు తన అవసరాల కోసం సైన్యాన్ని వాడుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడే. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు ఆయన దుందుడుకు చర్యలను సైనికాధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా వారితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు సైనిక జనరల్స్ బలహీనులు, అసమర్థులు అని ట్రంప్ విమర్శించారు. ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన తీరుపై అమెరికా సైన్యంలో చర్చ మొదలైంది. ఒకవేళ ట్రంప్ వివాదాస్పద ఆదేశాలు ఇస్తే ఏం చేయాలి? ఎలా ప్రతిస్పందించాలన్న దానిపై ఇటీవల పెంటగాన్ అధికారులు సమావేశమైన చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ భేటీ అనధికారికంగానే జరిగింది. ట్రంప్ ఆదేశాలు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంటే సున్నితంగా తిరస్కరించడమే మేలని కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. ట్రంప్ మళ్లీ ఎన్నిక కావడం సైన్యంలో చాలామందికి ఇష్టం లేనట్లు తెలుస్తోంది. చట్టానికే విధేయులం.. అమెరికా అధ్యక్షుడంటే సమస్త సైనిక దళాలకు సుప్రీం కమాండర్. ఆయన ఆదేశాలను అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ, ట్రంప్‌పై సైన్యంలో స్పష్టమైన విముఖత కనిపిస్తోంది. ట్రంప్ వర్సెస్ అమెరికా మిలటరీ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ట్రంప్‌తో సైన్యానికి ఉన్న గత అనుభవాలే ఇందుకు కారణం. ఆయన మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రక్షణశాఖను ప్రక్షాళన చేస్తారని అంచనా వేస్తున్నారు. తన విధేయులకు పెద్దపీట వేయడంతోపాటు తనను వ్యతిరేకించేవారిని లూప్లైన్లోకి పంపిస్తారని చెబుతున్నారు. అన్ని రకాల ప్రతికూల పరిణామాలకు సిద్ధమవుతున్నామని ట్రంప్ వ్యతిరేక అధికారులు కొందరు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి హోదాలో ఆయన చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇస్తే వ్యతిరేకిస్తామని, ఎదురు తిరుగుతామని కొందరు పేర్కొంటున్నారు. తాము కేవలం చట్టానికి మాత్రమే విధేయులమని, ట్రంప్‌నకు గానీ, ఆయన ఇచ్చే చట్టవిరుద్ధ ఆదేశాలకు గానీ కాదని ఓ అధికారి స్పష్టంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పసితనంలో చక్కెరకు చెక్ పెడితే.. చక్కని ఆరోగ్యంq
మధుమేహం, రక్తపోటు రెండు జంట జబ్బులు ప్రస్తుతం మానవాళిని పట్టి పీడిస్తున్నాయి. వీటి బారినపడకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిరుప్రాయం నుంచి తినే ఆహారం పట్ల నియంత్రణ ఉంటే పెద్దయ్యాక వ్యాధుల ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తొలి వెయ్యి రోజులు చిన్నారులకు అందించే ఆహారంలో చక్కెరను నియంత్రిస్తే పెద్దయ్యాక 35 శాతం టైప్–2 డయాబెటిస్, 25 శాతం రక్తపోటు ముప్పు తగ్గుతుందని అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి జన్మనిచ్చాక, ఆ శిశువుకు రెండేళ్లు వచ్చే వరకు... అంటే వెయ్యి రోజుల పాటు చక్కెర తీసుకోవడాన్ని తగ్గిస్తే పెద్దయ్యాక రక్తపోటు, మధుమేహం ముప్పు గణనీయంగా తగ్గించవచ్చని నిర్ధారించారు. యూకే బయో బ్యాంక్‌లోని 1951 నుంచి 1956 మధ్య జన్మించిన 60 వేల మంది చిన్నారుల ఆరోగ్య వివరాలపై జరిపిన అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. రేషన్‌లో చక్కెర తీసుకున్న వారు, తీసుకోని వారు ఇలా రెండు వర్గాలుగా చిన్నారులను విభజించి అధ్యయనం నిర్వహించారు. ఈ నేపథ్యంలో చక్కెర తీసుకున్న వారితో పోలిస్తే తీసుకోని వారు యుక్త వయస్సులో దీర్ఘకాలిక జబ్బుల బారినపడే ప్రమాదం తక్కువగా ఉన్నట్టు తేలింది. – సాక్షి, అమరావతి -
డీఏపీకి ‘గాజా’ దెబ్బ
ఎక్కడో జరిగిన చర్య ఇంకెక్కడో ప్రతి చర్యకు కారణమవుతుందంటారు. హరియాణా రైతుల విషయంలో అది నిజమవుతోంది. ఏడాదిగా సాగుతున్న గాజా సంక్షోభం భారత్‌లో డీఏపీ కొరతకు దారి తీస్తోంది. హరియాణా రైతులు రోడ్డెక్కేందుకు కారణంగా మారుతోంది. హరియాణాలోని సిర్కా ప్రాంతంలో రైతులు వారం రోజులుగా రోడ్డెక్కుతున్నారు. రబీ సీజన్ వేళ తమకు సరిపడా డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్ఫేట్) ఎరువు సరఫరా చేయాలంటూ ఆందోళనకు దిగితున్నారు. పలు ఇతర జిల్లాల్లో కూడా రైతులు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద కొద్ది రోజులుగా బారులు తీరుతున్నారు. కొరత నేపథ్యంలో డీఏపీ మున్ముందు దొరుకుతుందో లేదోనని ఎగబడ్డారు. దాంతో పోలీసులు లాఠీచార్జీ చేసేదాకా వెళ్లింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఆవాలు, గోధుమ పంటల దిగుబడి బాగా రావాలంటే డీఏపీ తప్పనిసరి. ఆ మూడు రాష్ట్రాల్లో పంటలకు డీఏపీని విరివిగా వాడుతారు. పంటల నత్రజని, సల్ఫర్ అవసరాలను డీఏపీ బాగా తీరుస్తుంది. ఆ రాష్ట్రాల రైతులను డీఏపీ కొరత ఇప్పుడు తీవ్రంగా వేధిస్తోంది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధంతో ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు డీఏపీ సరఫరాలో ఆలస్యానికి ప్రధాన కారణంగా మారాయి. గాజాలో ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధం దెబ్బకు ప్రపంచ సరకు రవాణా గొలుసు అక్కడక్కడా తెగింది. దాంతో ఎరువుల దిగుమతిపై ఆధారపడిన భారత్ వంటి దేశాలకు కష్టాలు పెరిగాయి. ఏటా 100 లక్షల టన్నులు భారత్ ఏటా 100 లక్షల టన్నుల డీఏపీని వినియోగిస్తోంది. వీటిలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణాలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, కర్నాటకల్లోనూ డీఏపీ వాడకం ఎక్కువే. డీఏపీ లోటు ప్రస్తుతం ఏకంగా 2.4 లక్షల మెట్రిక్ టన్నులను దాటింది. దాంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డీఏపీ కష్టాలు మరింత పెరిగాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో విస్తరించి ఇరాన్, లెబనాన్, హెజ్»ొల్లా, హూతీలు ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఎర్రసముద్రంలో ఉద్రిక్తత పెరిగి అతి కీలకమైన ఆ అంతర్జాతీయ సముద్ర మార్గం గుండా సరకు రాకపోకలు బాగా తగ్గాయి. సరఫరాలపై హౌతీల దెబ్బ! సరకు రవాణా విషయంలో ఎర్రసముద్రం చాలా కీలకం. మద్యధరా సముద్రాన్ని సూయాజ్ కాల్వ ద్వారా హిందూ మహాసముద్రంతో కలిపేది అదే. అలాంటి ఎర్ర సముద్రంపై యెమెన్‌లోని హౌతీలు పట్టుసాధించారు. నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారారు. వాటిపై తరచూ దాడులకు తెగబడుతుండటంతో ఎర్రసముద్రం మీదుగా సరకు రవాణా బాగా తగ్గిపోయింది. దగ్గరి దారి అయిన సూయాజ్ ద్వారా రావాల్సిన సరకు ఆఫ్రికా ఖండాన్నంతా చుడుతూ కేప్ ఆఫ్ గుడ్‌హోప్ మీదుగా తిరిగి రావాల్సి వస్తోంది. అలా ఒక్కో నౌక అదనంగా ఏకంగా 6,500 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా సరకు డెలివరీ చాలా ఆలస్యమవుతోంది. కేంద్రం దీన్ని ముందుగానే ఊహించింది. సెప్టెంబర్–నవంబర్ సీజన్లో ఎక్కువ ఎరువును అందుబాటు ఉంచాలని భావించినా ఆ స్థాయిలో సరకు దిగుమతి కాలేదు. దాంతో డీఏపీ కొరత అధికమైంది. భారత్ 2019–20లో 48.7 లక్షలు, 2023–24లో 55.67 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీని దిగుమతి చేసుకుంది. ప్రత్యామ్నాయంగా ఎన్పీకే డీఏపీకి బదులు నైట్రోజన్, పాస్ఫరస్, పొటా షియం (ఎన్పీకే) ఎరువును వాడాలని రైతులకు కేంద్రం సూచిస్తోంది. హరియాణాకు 60,000 మెట్రిక్ టన్నుల ఎన్పీకే కేటాయించామని, అందులో 29,000 టన్నులు రైతులకు అందిందని చెబుతోంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడే డీఏపీ కొరత తప్పదన్న భయాందోళనలు తలెత్తాయి. గాజా సంక్షోభం పుణ్య మా అని అవి తీవ్రతరమవుతున్నాయి.ధరాభారం కూడా... అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్‌లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్‌కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్ సింగ్ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం.ధరాభారం కూడా... అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్‌లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్‌కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్ సింగ్ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం. -
వీల్‌చెయిర్ మోటార్బైక్గా మారిపోతే..!
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్... ఎలా పిలిచినా అంగవైకల్యం అనేది జీవితంలో ఎంతో పెద్ద లోటు. శరీరంలో ఏ అవయవం లేకపోయినా కష్టమే. వైకల్యాన్ని జయించేందుకు ఎంతో మనోస్థయిర్యం అవసరం. వికలాంగుల కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో మద్రాస్ ఐఐటీ పూర్వ విద్యార్థులు చేసిన ఈ ప్రయోగం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. వికలాంగుల వీల్ చెయిర్‌ను మోటార్బైక్గా మార్చే ఈ టెక్నాలజీ ఓ కొత్త స్టార్టప్‌గా మారిపోయింది. ఇప్పటి వరకు 5,200 బైకులు కొనుగోలు చేశారని సమాచారం.‘నియోమోషన్’ మోటర్బైక్కొద్ది రోజుల క్రితం జొమాటో డెలివరీ పార్ట్నర్ సయ్యద్ షహజాద్ అలీ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మోటార్బైక్గా మారిపోయిన ఓ వీల్‌చెయిర్‌లో అలీ దిలాసాగా కూర్చుని ఉన్నాడు. ‘‘వైకల్యమనేదే లేదు.. మనం చేయాలనుకుంటే ఏదీ అసాధ్యం కాదు. అయితే మనం అంకితభావంతో కృషిచేయాలంతే’’ అని అలీ అంటున్నాడు. ఈ కొత్త వీల్చెయిర్బైక్ కి ఆయన ‘నియోమోషన్’ అని పేరుపెట్టాడు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సృజనాత్మకతకు ఇది నిదర్శనమి అలీ చెప్పాడు. ఈ వినూత్న సృష్టి.. వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అంటున్నాడు.వైకల్యం ఓ పెద్ద సవాలు.. ఈ వాహనాన్ని తయారుచేసిన ఫౌండర్లలో ఒకరైన సిద్ధార్ధ్ డాగా మాట్లాడుతూ ‘‘నియోమోషన్ వికలాంగుల జీవితాలను సమూలంగా మార్చివేయబోతోంది’’ అన్నారు. నియోమోషన్ ప్రయాణం ఐఐటీ మద్రాస్‌లో ప్రారంభమైంది. ఫైనల్ ఇయర్లో ఉండగా డాగా, ఇంకా ఆయన స్నేహితులను వారి ప్రొఫెసర్ డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ చాలా ప్రభావితం చేశారు. డాక్టర్ సుజాతా శ్రీనివాసన్ టిటికె సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ రీసెర్చ్ అండ్ డివైస్ డెవలప్మెంట్ విభాగం చూసేవారు. వైకల్యాన్ని అధిగమించే పరికరాలపై వారు చాలా పరిశోధనలు చేసేవారు. ముందు డాగా మిత్రబృందానికి అప్పగించిన పనేమిటంటే... స్విమ్మింగ్‌పూల్‌లో వికలాంగులు సురక్షితంగా దిగడం, బైటకు రావడం, వ్యాయామంగా ఈతను ఉపయోగించుకోవడం ఎలా అనే అంశాలను పరిశీలించమన్నారు. వికలాంగులు ఎదుర్కొనే అనేక సవాళ్లను ఇది వారి కళ్లకు కట్టింది.సౌకర్యవంతంగా.. దృఢంగా..ఆ అనుభవం నుంచే ఈ నియోమోషన్ (వీల్‌చెయిర్ వాహనం) ఐడియా వారికి వచ్చింది. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ డిజైన్. మార్కెట్లో దొరికే వీల్చెయిర్లు అన్నీ ఒకే డిజైన్‌లో ఉంటాయి. వైకల్యం ఉన్నవారికి అందరికీ ఒకే రకమైన వీల్‌చెయిర్ పనిచేయదు. కానీ ఈ నియోమోషన్ వీల్‌చెయిర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా దృఢంగా కూడా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చున్నా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.గంటకు 50 కి.మీ ప్రయాణంనియోమోషన్ నిజానికి నియోఫ్లై అనే వీల్ చెయిర్, నియోబోల్ట్ అనే మోటార్బైక్గా ఉపయోగపడే పరికరం రెండింటి సమ్మేళనం. నియోబోల్ట్ అనేది లిథియం–అయాన్ బ్యాటరీతో నడిచే విద్యుత్ పరికరం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలాగే 50 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్ కూడా ఉంది.నాణ్యత ఎక్కువ..ధర తక్కువ..అయితే ఎన్ని సౌకర్యాలు, సౌలభ్యాలు ఉన్నా వికలాంగులకు అందుబాటు ధరలో ఉంటేనే ఉపయోగం. ఎక్కువమంది ఉపయోగించుకోగలుగుతారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకునే సాధ్యమైనంత తక్కువ ధరకు లభించేలా.. అదే సమయంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నియోమోషన్ను తయారు చేసినట్టు డాగా వివరించారు. ప్రస్తుతం నియోమోషన్ రూ.1,10,000కు లభిస్తోంది. అంతర్జాతీయంగా ఇలాంటి పరికరాలతో పోలిస్తే ఇందులో సౌకర్యాలు ఎక్కువ అని, ధర చాలా తక్కువని డాగా వివరించారు. -
అమెరికా పోలీసుల కోతుల వేట
పోలీసులేంటి? కోతులను వెదకడమేంటని? ఆశ్చర్యపోకండి. అవి మామూలు కోతులు కాదు. పరిశోధన కేంద్రం నుంచి తప్పించుకున్నవి. సౌత్ కరోలినాలోని ఎమసీ పట్టణంలో ఓ రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ ఆల్ఫా జెనెసిస్ ఉంది. ఇక్కడ వైద్య పరీక్షలు, పరిశోధనల కోసం కోతులను పెంచుతుంటారు. ప్రస్తుతం సంస్థలో 50 కోతులున్నాయి. అయితే బుధవారం దేశమంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. కోతులు మాత్రం తప్పించుకున్నాయి. బయటి ఎన్‌క్లోజర్ తలుపులు తెరిచి ఉండటంతో 43 కోతులు బయటికి పారిపోయాయని అధికారులు వెల్లడించారు. తప్పించుకున్నాయని, ప్రజలంతా తమ ఇళ్ల తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసివేయాలని, ఎక్కడైనా కోతులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. తప్పించుకున్నవి 3.2 కిలోల బరువున్న ఆడ కోతులని పోలీసులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అయితే వర్షం పడుతుండటంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది. కోతులు ఫెసిలిటీలో ఆపిల్స్ వంటి ఆహారాన్ని తిని పెరిగాయని, అడవిలో ఆకులు, అలములు తప్ప ఏమీ దొరకవు కాబట్టి అవి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆల్ఫా జెనెసిస్ సీఈఓ గ్రెగ్ వెస్టర్‌గార్డ్ చెబుతున్నారు. ఈ కేంద్రం నుంచి కోతులు తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో 19 కోతులు తప్పించుకుని ఆరు గంటల తర్వాత తిరిగొచ్చాయి. రెండేళ్ల కిందట 26 కోతులు తప్పించుకున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్