Anakapalle District News
-
వర్షాలు
మరో 2 రోజులువర్షపాతం వివరాలు మండలాల వారీగా.... మండలం మిల్లీ మీటర్లు రావికమతం 18.8 సబ్బవరం 12.8 పరవాడ 12.0 బుచ్చెయ్యపేట 10.9 కె.కోటపాడు 9.7 అనకాపల్లి 9.4 కశింకోట 9.1 మునగపాక 8.8 దేవరాపల్లి 7.7 చోడవరం 7.6 మాడుగుల 6.5 నర్సీపట్నం 6.3 రోలుగుంట 5.6 అచ్యుతాపురం 5.4 చీడికాడ 5.1 ఎస్.రాయవరం 2.0 మొత్తం 160.1 ● జిల్లా యంత్రాంగం అప్రమత్తం ● కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు తుమ్మపాల: జిల్లా వ్యాప్తంగా తుపాను వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షంతో రైతుల్లో గుబులు పట్టుకుంది. పలు గ్రామాల్లో వరికోత కోసి పొలాల్లోనే పనలుగా వదిలేయడంతో తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ జిల్లా యంత్రాంగం అన్ని శాఖల అధికారులకు పలు సూచనలు చేసింది. ప్రజలకు తక్షణ సహాయంగా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. తుఫాన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ నంబర్లు 08924–226599, 08924–222888 సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో వర్షపాతం జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి 160.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా అత్యధికంగా రావికమతం 15.8 కాగా, అత్యల్పంగా ఎస్.రాయవరం 2.0 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 6.7 మిల్లీ మీటర్లుగా వాతావరణ శాఖ లెక్కలు నమోదయ్యాయి. పెరుగుతున్న పెద్దేరు నీటిమట్టం మాడుగుల: మండలంలో పెద్దేరు జలాశయం నీటిమట్టం పెరుగుతోంది. అల్పపీడన ప్రభావంతో జలాశయం కేచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 50 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో ఒక గేట్ నుంచి దిగువకు 129 క్యూసెక్కులు వరద నీరు విడుదల చేస్తున్నారు. ఇంకా వర్షాలు అధికమైతే మిగిలిన రెండు గేట్లు ఎత్తి వరదనీరు విడుదల చేస్తామని జేఈ తెలిపారు. జలాశయం వద్ద గురువారం 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రిలో ప్రైవేట్ కుట్ర
తొలుత అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటు ప్రతిపాదన లేదు. నా కృషితో అప్పటి కేంద్ర మంత్రి ప్రోత్సాహంతో రూ.22.15 కోట్లు తీసుకొచ్చాం. అందులో 5 బెడ్ల సదుపాయంతో డయాలసిస్ బ్లాక్ ఏర్పాటు కూడా ఉంది. కూటమి ప్రభుత్వానికి కిడ్నీ రోగులకు మెరుగైన వైద్యం అందించాలనే ఆకాంక్ష ఉంటే ఆ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. కోట్ల ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేపడుతున్న దాన్ని మూలన పడేసి..ఇప్పుడు పీపీపీ పద్ధతిలో డయాలసిస్ కేంద్రంను ప్రైవేట్ వారికి అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. – డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, మాజీ ఎంపీ పీపీపీ విధానంలో డయాలసిస్ కేంద్రం ఇప్పటికే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో 170 మంది రోగులకు డయాలసిస్ సేవలు అందుతున్నాయి. ఇప్పుడు జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ వైద్యం అందుబాటులోకి రానుంది. పీపీపీ విధానంలో సేవలు అందుతాయి. దీనికోసం ఆస్పత్రిలో వార్డును కేటాయించాం. డయాలసిస్ చేయించుకునే రోగులకు అయ్యే ఖర్చును ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ సగం భరిస్తుంది. కేంద్రం ఏర్పాటు వేగవంతం చేసి నెలాఖరు నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశాలు వచ్చాయి. గతేడాది క్రిటికల్ కేర్ యూనిట్లో కూడా డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. అది నిర్మాణ దశలో ఉంది. – డాక్టర్ శ్రీనివాసరావు, డీసీహెచ్ఎస్ -
దారులన్నీ అమ్మ సన్నిధికే..
కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైన గురువారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఆలయ అర్చకులు, వేదపండితుల సమక్షంలో పసుపు, కుంకుమ, పాలు, సుగంధద్రవ్యాలు కలిపిన జలాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. మార్గశిరమాసం మూడో గురువారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాక రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే బారులుదీరారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాలు, నాదస్వరాలతో ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణం, వేద పారాయణాలు, శ్రీచక్రార్చన లక్ష్మీ హోమం నిర్వహించారు. పరిసర ప్రాంతాల ప్రజలు తీసుకొచ్చిన పసుపు కుంకుమ నీళ్లతో అమ్మవారికి జలాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున క్షీరాభిషేకం నిర్వహించి అమ్మవారికి పసుపు పూశారు. ప్రత్యేక పూజలు జరిపిన తర్వాత అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు. అర్ధరాత్రి 12.05 నుంచి 1.30 గంటల వరకు ఈ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం వెండి కవచాలు తొడిగారు. గురువారం మధ్యాహ్నం 11.30 నుంచి 12 గంటల వరకు అమ్మవారికి మహానివేదన(రాజభోగం), సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు పంచామృతాభిషేక సేవ, సహస్రనామార్చన చేశారు. మిగిలిన సమయాల్లో భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్యూల్లో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం మంచినీటి సౌకర్యం కల్పించింది. మధ్యాహ్నం 12 నుంచి వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఉచిత ప్రసాదం అందజేశాయి. పోలీసులకు ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకున్నప్పటికీ.. టూవే కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సింహాచలం, మధురవాడ నుంచి ఉచిత బస్ సర్వీసులు నడిపినట్టు ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. ఏఈవో కె.తిరుమలేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. వన్‌టౌన్ పోలీస్ సిబ్బంది బందోబస్తు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు కనకమహాలక్ష్మి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ జ్యోతిర్మయి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ విప్ పీజీవీఆర్ నాయుడు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, సుందరపు విజయ్‌కుమార్‌చే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేయించారు. కనకమహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు ఘనంగా మార్గశిర మూడో గురువారం పూజలు -
ఎన్నికలకు ఓటరు జాబితా కీలకం
తుమ్మపాల: ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా కీలకమని, దీని తయారీలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు, మైన్స్, జియాలజీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ఈఆర్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సంక్షిప్త సవరణ –2025 ప్రక్రియపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓటరు జాబితా సవరణ సక్రమంగా నిర్వహిస్తే, ఎన్నికల నాటికి శుద్ధమైన జాబితా తయారవుతుందన్నారు. ఎన్నికల సంవత్సరంలో తొలగింపులు చేయుటకు ఎన్నికల కమిషన్ నుంచి ఆంక్షలు ఉంటాయని, ప్రస్తుతం అటువంటివి ఉండవన్నారు. పెండింగు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు సరైన సమాచార మార్పిడి ఉండాలని, సమన్వయంతో వ్యవహరించాలన్నారు. పోలింగు బూత్ స్థాయిలోనే ప్రతి క్లెయింను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తే, తదుపరి స్థాయిలలో ఇబ్బందులు ఎదురు కావన్నారు. ఓటర్లు జాబితాలో చేర్పులు, తొలగింపులపై రాజకీయ పార్టీ ల ప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా పరిశోధించి జనాభా నిష్పత్తికి, ఓటరు నిష్పత్తికి భారీ వ్యత్యాసం వచ్చినట్లయితే క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు బాధ్యతగా వ్యవహరించాలని, అప్రమత్తంగా ఉండాలన్నారు. 24లోగా క్లెయింలు, అభ్యంతరాలు పరిష్కరిస్తాం జిల్లాలో చేపట్టిన ఓటరు జాబితా సవరణ వివరాలను కలెక్టర్ విజయ కృష్ణన్ వివరించారు. 2024 అక్టోబర్ 29న ప్రచురించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రకారం.. జిల్లాలో 6,27,566 మంది పురుషులు, 6,62,276 మంది సీ్త్రలు మొత్తం 12,89,870 మంది ఓటర్లు ఉన్నారన్నారు. నూరు శాతం ఫొటో గుర్తింపు కలదని, 99.99 శాతం ఓటర్లు ఓటరు కార్డు కలిగి ఉన్నారని తెలిపారు. ఈ నెల 24వ తేదీలోగా క్లెయింలు, అభ్యంతరాలు పరిష్కరిస్తామన్నారు. 2025 జనవరి 1వ తేదీకి ఓటరు జాబితా సిద్ధం చేసి ఎన్నికల కమిషన్ అనుమతితో అదే నెల 6న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. జిల్లాలో 18–19 ఏళ్ల యువతను ఓటరుగా చేర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. వీరు 67,050 మంది ఉండగా, 16,016 మందిని డ్రాఫ్ట్ పబ్లికేషను నాటికి ఓటరుగా చేర్చామన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్ ఆయిషా, వి.వి. రమణ, ఫారెస్ట్ సెటిల్మెంటు అధికారి సిహెచ్. గౌతమికుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.మనోరమ, గృహ నిర్మాణ శాఖ పీడీ వై.శ్రీనివాస్, ఎన్నికల సెక్షను సూపరింటెండెంటు ఎస్.వి.ఎస్. నాయుడు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బొలిశెట్టి శ్రీనివాసరావు, ఎం. జానకిరామరాజు, కొణతాల హరినాధ్‌బాబు, మలపురెడ్డి కోటేశ్వరరావు, గంటా శ్రీరామ్, పి.నాగేశ్వరరావు, బి.తులసిరాం పాల్గొన్నారు. పెండింగు దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి కలెక్టరేట్లో రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు ప్రవీణ్‌కుమార్ సమీక్ష -
గంజాయి నిర్మూలనకు గట్టి ‘సంకల్పం’
● డీఐజీ గోపీనాథ్ జెట్టిపట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గౌరవవందనం స్వీకరిస్తున్న డీఐజీ గోిపీనాథ్ జెట్టి అనకాపల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్‌జెట్టి గురువారం తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ విభాగాలను పరిశీలించి, మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృిష్టి సాధించడం జరుగుతుందన్నారు. ‘సంకల్పం’ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి లో ప్రజలకు గంజాయి, ఇతర మత్తు పదార్ధాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, మహిళల భద్రత, సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 2022, 2023, 2024 పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలు, చోరీలు, చీటింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐ టి.వి.విజయకుమార్, ఎస్ఐ వి.సత్యనారాయణ, డి.ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ యువతకు స్మార్ట్ మీటర్ టెక్నీషియన్ శిక్షణ ఎంవీపీకాలనీ (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ)యువతకు స్మార్ట్ మీటర్ టెక్నీషియన్లుగా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నేక్) సంస్థ ద్వారా ఎస్సీ యువతకు ఈ శిక్షణ అందించనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన యువత ఈ ఉచిత శిక్షణకు అర్హులని, శిక్షణ సమయంలో నెలకు రూ.7,500 స్టైఫండ్ కూడా అందజేస్తామన్నారు. త్వరలో శిక్షణ ప్రారంభ తేదీని ప్రకటిస్తామని, పూర్తి వివరాలకు 83090 03957 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
450 కేజీల గంజాయి పట్టివేత
● విలువ రూ.22 లక్షలు ● ఇద్దరు నిందితుల అరెస్ట్ ● నర్సీపట్నం డీఎస్పీ మోహన్ వెల్లడి గొలుగొండ: ఆంధ్రా–ఒడిశా బోర్డర్ నుంచి వ్యాన్‌లో తరలిస్తున్న 450 కేజీల గంజాయిని గొలుగొండ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డీఎస్పీ మోహన్ గొలుగొండలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి ప్రాంతంలో రాజేష్ శర్మ, కిల్లో మహదేవ్ అనే ఇద్దరు యువకులు వ్యాన్ పైభాగంపై మెర ఏర్పాటు చేసి 450 కేజీల గంజాయిని రంపుల, కృష్ణదేవిపేట మీదుగా గొలుగొండ నుంచి తరలిస్తున్నారు. ఈ సమయంలో కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీసులు గురువారం వాహన తనిఖీల్లో భాగంగా గొలుగొండలో ఆ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా గంజాయిని గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువు సుమారుగా రూ.22 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలింపునకు సహకరించిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న గొలుగొండ, కృష్ణదేవిపేట ఎస్ఐలు రామారావు, తారకేశ్వర్రావును డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సిబ్బంది కొరత ఉన్నా మెరుగైన సేవలు
● జిల్లా ట్రెజరీ అధికారి సుభాషిణికోటవురట్ల : సబ్ ట్రెజరీ కార్యాలయాలలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సర్దుబాటుతో ఇబ్బంది ఏర్పడకుండా కార్యాలయాలు నడుపుతున్నామని జిల్లా ట్రెజరీ అధికారి లక్ష్మీ సుభాషిణి తెలిపారు. స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. రికార్డులు పరిశీలించి సమస్యలపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం పెన్షనర్లు ఆమెను ఘనంగా సత్కరించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో 8 సబ్ ట్రెజరీ కార్యాలయాల ద్వారా సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. మూడు చోట్ల సొంత భవనాలు ఉన్నాయని, 2018లో కోటవురట్ల, నక్కపల్లి, నర్సీపట్నం, అనకాపల్లి ఈస్ట్ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరైనట్టు తెలిపారు. ఒక్కో భవనానికి రూ.75 లక్షలు మంజూరు కాగా కోటవురట్లలో భవన నిర్మాణం దాదాపు 60 శాతం, నర్సీపట్నంలో 50 శాతం పూర్తయినట్టు తెలిపారు. నక్కపల్లికి సంబంధించి సాంకేతిక సమస్యతో పనులు ప్రారంభం కాలేదన్నారు. ఇక్కడ భవనం మంజూరు కాగా స్ధలం పాయకరావుపేటలో చూపిస్తోందని, దాంతో మొదలు కాలేదన్నారు. అనకాపల్లి ఈస్ట్‌కు సంబంధించి రెవెన్యూ అధికారులు స్ధలం కేటాయించలేదని, దీనిపై జిల్లా కలెక్టర్‌కు స్థలం కేటాయించాలని దరఖాస్తు చేసినట్టు తెలిపారు. సబ్ ట్రెజరీ అధికారి రామారావు, సిబ్బంది, పెన్షనర్లు పాల్గొన్నారు. -
రైవాడ ప్రాజెక్టు చైర్మన్ ఎన్నిక రేపు
దేవరాపల్లి: సాగునీటి వినియోగదారుల సంఘాల (మైనర్, మీడియం) ఎన్నికలు ముగియడంతో రైవాడ ప్రాజెక్టు చైర్మన్ ఎన్నిక నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రాజెక్టు పరిధిలో దేవరాపల్లి, కె.కోటపాడు, చోడవరం మండలాల్లో 10 మీడియం ఇరిగేషన్ సంఘాలు ఉన్నాయి. చోడవరం మండల పరిధిలోని ఒక సంఘం ఎన్నిక జరగలేదు. మిగిలిన 9 మీడియం సంఘాల అధ్యక్షులు ప్రాజెక్టు చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టు చైర్మన్‌గా దేవరాపల్లి మండలం ఎం. అలమండకు చెందిన పోతల పాత్రునాయుడును, వైస్ చెర్మన్‌గా కె.కోటపాడు మండలం ఎ. కోడూరుకు చెందిన బొడ్డు ఉమాదేవిని ఎంపిక చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే గురువారం ప్రకటించారు. కాగా అధికారికంగా శనివారం ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇరిగేషన్ డీఈఈ జి. సత్యంనాయుడు తెలిపారు. -
సెస్సు చెల్లిస్తేనే గ్రంథాలయాల అభివృద్ధి
● ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వెంకటరావు మాడుగుల రూరల్ : గ్రంథాలయాలకు చెల్లించాల్సిన గ్రంథాలయ సెస్సును పంచాయతీలు, జీవీఎంసీలు చెల్లించకపోవడం వల్ల గ్రంథాలయాలు అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని విశాఖ ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్.సిహెచ్. వెంకట్రావు అన్నారు. కె.జె.పురం శాఖా గ్రంథాలయాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా సాక్షితో ఆయన మాట్లాడారు. అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో వసూలైన కోట్లాది రుపాయల గ్రంథాలయ సెస్సు గ్రంథాలయ సంస్థకు చెల్లించలేదని, దీని వల్ల గ్రంథాలయాల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 64 గ్రంథాలయాలు వున్నాయని, వీటిలో రెగ్యులర్, అవుట్సోర్సింగ్ కలిపి 62 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, గ్రంథాలయాల్లో కొత్తగా పోస్టులు భర్తీ చేయలేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టులు భర్తీ చేస్తారన్నారు. గ్రంథాలయాలకు పోటీ పుస్తకాలు, నవలలు వంటి వాటి కొనుగోలుకు బడ్జెట్ విడుదల చేయలేదన్నారు. గ్రంథాలయంలో పాఠకుల ధరావత్తును సంఖ్య పెంచాలని గ్రంథాలయ అటెండర్ వి.శృతికి కార్యదర్శి వెంకట్రావు సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 65 బుక్ డిపో సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కె.జె.పురం గ్రంథాలయ అటెండర్ శృతి, సిబ్బంది పాతాళం అప్పలనర్సమ్మ, వంటర్లపాలెం బుక్ డిపో సెంటర్ సిబ్బంది దోని చిన అప్పారావు పాల్గొన్నారు. అంతకు ముందు వడ్దాది గ్రంథాలయం సందర్శించారు. -
నేడు, రేపు పెందుర్తిలో దూదేకుల జనగర్జన సభ
అనకాపల్లి: ఇండియన్ ముస్లిం మైనారిటీ రాష్ట్ర నూర్భాషా, దూదేకుల సంఘం ప్రతినిధుల ఫ్లీనరీ సమావేశం విశాఖ జిల్లా పెందుర్తిలో శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్నట్టు ప్రొగ్రాం సమన్వయకర్త, ఉత్తరాంధ్ర కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ మేరకు స్థానిక రింగ్‌రోడ్డు సంఘం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల జనాభా ఉండగా.. 45 లక్షల మంది ముస్లింలు ఉన్నట్లు తెలిపారు. ప్లీనరీ సమావేశాలకు ఉత్తరాంధ్ర నుంచి సుమారుగా 20 వేల మంది ముస్లింలు హాజరు కానున్నట్టు ఆయన తెలిపారు. దూదేకుల ముస్లింలు అట్టడుగు స్థాయిలో జీవిస్తున్నారని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. పెందుర్తిలో రూ.25 లక్షలతో నిర్మించిన దూదేకుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా భవనాన్ని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం ప్రారంభించనున్నారని తెలిపారు. కశింకోట ఆర్ఈసీఎస్ మాజీ ఎండీ, ఉత్తరాంధ్ర జిల్లాల సంఘం చీఫ్ అడ్వైజర్ దావుద్ ఆలీ మాట్లాడుతూ జిల్లాలో శ్మశాన వాటికలు, షాదీఖానా ఏర్పాటు చేయాలని కోరారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి పాలనలో ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మేలు చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని ఆయన కోరారు. సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ దూదేకుల ముస్లిం విద్యార్థులకు ఉన్నత చదువుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం నూర్భాషా/దూదేకుల జనగర్జన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కొండా సాహెబ్, జాబీ, షేక్అన్సరీ, షేక్ సముద్దీన్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షుల నియామకం
విశాఖ సిటీ: వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులను ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్టు కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. అనకాపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా లోచల సుజాత నియమితులయ్యారు. నర్సీపట్నానికి చెందిన కోరుప్రోలు ఫణిశాంతారావును వలంటీర్స్ వింగ్‌కు, ఎ.నాయుడుబాబును కల్చరల్ వింగ్‌కు, పిల్లా శ్రీనును పబ్లిసిటీ వింగ్‌కు అధ్యక్షులుగా నియమించారు. పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన తాజుద్దీన్ బాబా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా, సురకాసుల గోవింద్ గ్రీవెన్స్‌సెల్‌కు, కొమ్మన వెంకటేశ్వరరావు వీవర్స్ వింగ్‌కు అధ్యక్షులుగా నియమితులయ్యారు. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా యలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఉద్దండం త్రినాథరావును, ఎస్సీ సెల్‌కు పిల్లి అప్పారావు, పంచాయతీరాజ్ వింగ్‌కు బొడ్డపు అప్పన్న దొర, వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడిగా చోడిపల్లి అప్పారావులను నియమించారు. -
పాఠశాల స్థాయి నుంచే దివ్యాంగుల గుర్తింపు
● డీఈవో గిడ్డి అప్పారావునాయుడు అనకాపల్లి: దివ్యాంగ పిల్లల గుర్తింపు ప్రక్రియ ప్రాథమిక స్థాయిలోనే జరగాలని డీఈవో గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. స్థానిక వేల్పులవీధి టౌన్ గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో విద్యా శాఖ సమగ్ర శిక్ష, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఆధ్వర్యంలో ఒక రోజు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం జిల్లా డైరెక్టర్ జగదీష్ మాట్లాడుతూ దివ్యాంగులకు అవసరమైన అన్ని రకాల ఉపకరణాలు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షణ రాష్ట్ర స్థాయి అబ్జర్వర్ అమ్మినాయుడు, సీడీపీవో పి.ప్రభావతి, సమగ్ర శిక్షణ సెక్టార్ అధికారులు పాల్గొన్నారు. -
కిర్రాక్ ఫీచర్లతో వీవో ఎక్స్200 సిరీస్
డాబాగార్డెన్స్(విశాఖ): ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెల్పాయింట్ ఇండియా వీవో ఎక్స్ 200 సిరీస్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించింది. డాబా గార్డెన్స్‌లోని సెల్పాయింట్ స్టోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మోహన్‌ప్రసాద్ పాండే ఆధ్వర్యంలో ఎమ్మె ల్యేలు పీజీవీఆర్ నాయుడు(గణబాబు), వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ మొబైల్ ఫోన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఏ కంపెనీ కొత్త మొబైల్ ఫోన్లను విడుదల చేసినా అవి ముందుగా సెల్పాయింట్లోనే అందుబాటులోకి వస్తాయన్నారు. వంశీకృష్ణ మాట్లాడుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సెల్పాయింట్ అధినేతను ఆయన అభినందించారు. చైర్మన్ మోహన్‌ప్రసాద్ పాండే మాట్లాడుతూ విశాఖపట్నంలో తొలిసారిగా డైమండ్ పార్క్ వద్ద సెల్‌పాయింట్‌ను ప్రారంభించామని, ప్రస్తుతం విశాఖలో 29, రాష్ట్ర వ్యాప్తంగా 82 స్టోర్లకు విస్తరించడం సంతోషంగా ఉందన్నారు. వీవో ఎక్స్200 సిరీస్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయన్నారు. ఈ సిరీస్ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై ఉచితంగా హ్యాపీ పోలా 100 వాట్స్ సౌండ్‌బార్, వీవో బడ్స్ టీడబ్ల్యూఎస్ 3ఈ ఏఎన్సీ అందిస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని ఉత్పత్తులపై రూ.20 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. భాగస్వామ్య బ్యాంకుల ద్వారా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్, శాంసంగ్, ఎంఐ, ఎల్జీ, సోనీ, హైయర్, ఏసర్ వంటి టాప్ బ్రాండ్లపై 50 శాతం వరకు డిస్కౌంట్, యాక్సరీస్పై 60 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సెల్పాయింట్ ప్రతినిధి బాలాజీ పాండే, వీవో సంస్థ ప్రతినిధి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటుకు నైవేద్యం
ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్‌తో సహా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి రూ.22.15 కోట్లు మంజూరు.. జూన్ నెలలో ఎన్నికల ప్రక్రియ ముగిసేనాటికి 90 శాతం వరకు పనులు పూర్తి.. ఇది నిన్నటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం.. డయాలసిస్ సెంటర్‌ను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయనున్నందున రోగులపై భారం.. ఇది నేటి దుస్థితి. కూటమి ప్రభుత్వం జిల్లా ప్రజలకు ఇచ్చిన కానుక ఇది. ప్రభుత్వ వైద్యం.. మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతి కృషితో రూ.22.15 కోట్ల కేంద్ర నిధులు మంజూరు క్రిటికల్ కేర్ బ్లాక్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనగత ప్రభుత్వ హయాంలో దాదాపు 90 శాతం పనులు పూర్తి కూటమి సర్కారు నిర్లక్ష్యంతో ఈనాటికీ ఎక్కడి పనులు అక్కడే డయాలసిస్ యూనిట్‌ను పీపీపీ పద్ధతిలో నెలకొల్పేందుకు కుట్ర అనకాపల్లి సమీప ప్రాంత కిడ్నీ రోగులపై భారంసాక్షి, అనకాపల్లి: రోడ్డు ప్రమాదాల్లో గాయపడి విషమ పరిస్థితుల్లో ఉన్న క్షతగాత్రులకు మెరుగైన తక్షణ వైద్య సేవలను అందించాలని వైద్యురాలైన అనకాపల్లి మాజీ ఎంపీ బి.వి.సత్యవతి ఆశించారు. జిల్లా ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం–ఏబీహెచ్ఐఎం)కింద రూ.రూ.22.15 కోట్ల కేంద్ర నిధులను రాబట్టారు. జిల్లాలో డయాలసిస్ కేంద్రం ఒక్క నర్సీపట్నంలోనే ఉన్నందున అనకాపల్లి పరిసర ప్రాంత రోగుల కోసం ఈ నిధులతోనే ఎన్టీఆర్ ఆస్పత్రిలో నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ ఎల్ మాండవియా వర్చువల్ విధానంలో ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదురుగా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఇది పూర్తయితే కార్పొరేట్ ఆస్పత్రులకు మించి పేద వాడికి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించవచ్చు. మే, జూన్ నాటికి పనులు 90 శాతం పూర్తయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండుంటే డిసెంబరు నెలాఖరుకు ప్రారంభోత్సవం కూడా జరిగేది. కూటమి సర్కారు వచ్చి పరిస్థితిని తారుమారు చేసింది. ఆశలు ఆవిరి తుది దశకు చేరిన క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులను కొత్త ప్రభుత్వం నిలిపివేసింది. పీపీపీ పద్ధతిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు డయాలసిస్ సేవలను అందించేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఒక ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీఆర్ ఆస్పత్రి వైద్య సిబ్బందితో సంబంధం లేకుండా ఆ సంస్థే ప్రైవేట్ ఉద్యోగులను ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరి నుంచి దాదాపుగా రూ.1000 నుంచి 1500 వరకూ కనీస చార్జీలు వసూలు చేసి రోగులకు డయాలసిస్ వైద్యం అందిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. క్రిటికల్ కేర్ బ్లాక్ పూర్తయితే అందే సౌకర్యాలివి.. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలందించాలనే ముందుచూపుతో డాక్టర్ బి.వి.సత్యవతి కృషితో క్రిటికల్ కేర్ బ్లాక్ తీసుకురావాలని ఆశించారు. ఇందులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్ యూనిట్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో డయాలసిస్ బ్లాక్ నిర్మాణం దాదాపు పూర్తయింది. డాక్టర్స్ డైనింగ్ హాల్స్ (మేల్, ఫిమేల్), ఎంసీహెచ్ (2 బెడ్స్), ఎల్డీఆర్, ఆల్ట్రా సౌండ్ రూమ్, ప్లాస్టర్ రూమ్, పీఎంసీ ల్యాబ్, ఎలక్ట్రికల్ రూమ్, డ్యూటీ డాక్టర్ ఎగ్జామినేషన్ రూమ్, ఎమర్జెన్సీ వార్డు, నర్సెస్ రూమ్, ఇంజక్షన్ డ్రెస్సింగ్ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నది ఆనాటి ప్లాన్. ఫస్ట్ ఫ్లోర్లో ఐఎస్ఓ రూమ్, డైనింగ్ హాల్స్, ఐఎస్ఓ వార్డు, అత్యాధునిక ఐసీయూ, స్టాఫ్ రూమ్ కోసం కేటాయించారు. సెకండ్ ఫ్లోర్‌ను హెచ్‌డీయూ, అనస్తీషియా రూమ్, ఐసీయూ, ఓపీ కోసం కేటాయించారు. -
నేడు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
● వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా రేపు సేవా కార్యక్రమాలు ● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ మునగపాక: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలతో పాటు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. స్థానిక బొడ్డేడ క్యాంపు కార్యాలయంలో గురువారం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ గతంలో మెరుగైన పాలన అందించారన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం కేక్ కటింగ్ జరుగుతుందన్నారు. అనంతరం పీహెచ్సీ ఆవరణలో రొట్టెలు, పండ్లు పంపిణీ చేస్తామన్నారు. అదే రోజు అచ్యుతాపురం మండలం కొండకర్ల ఇచ్చా ఫౌండేషన్‌లోని దివ్యాంగ పిల్లలకు మధ్యాహ్నం భోజన వసతి కల్పించామన్నారు. శుక్రవారం మునగపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
సుపరిపాలన లక్ష్యంగా ‘ప్రశాసన్ గావ్‌కి ఒరే‘ ఉత్సవాలు
తుమ్మపాల: ప్రజలకు ప్రభుత్వపరంగా మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ‘ప్రశాసన్ గావ్ కి ఒరే’సుపరిపాలనపై కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధ్వర్యంలో గురువారం వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వర్చువల్‌గా జరిగిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా నుంచి ఆమెతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధత కలిగిన పనితీరు చూపడం ముఖ్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం, పౌరులకు మెరుగైన సుపరిపాలన అందించే క్రమంలో 2019–24 కాలంలో ‘ప్రశాసన్ గావ్ కి ఒరే’కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజా సమస్యలు పరిష్కార వేదికను ప్రతి సోమవారం నిర్వహిస్తూ, జవాబుదారీతనం ఉండేలా సుపరిపాలన అందిస్తుందన్నారు. గురువారం నుంచి ఈ నెల 24 వరకూ ప్రశాసన్ గావ్ కి ఒరే క్యాంపెయిన్, గుడ్ గవర్నెన్స్ వీక్ నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు సుపరిపాలన నమూనాను ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించాలని ఆమె కోరారు. -
అపరాల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రావు నాతవరం : అపరాలు సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక అదాయం పొందవచ్చునని జిల్లా వ్యవసాయ అధికారి బి. మోహన్‌రావు అన్నారు. మండలంలో మర్రిపాలెం గ్రామంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం అనంతరం అపరాల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా వాతావరణ పరిస్థితులు రిత్యా వాతావరణ కేంద్రం హెచ్చరిక మేరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున రెండు రోజుల పాటు వరి చేను కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. అనంతరం మాట్లాడుతూ విత్తన శుద్ధి పంట మార్పిడి సస్య రక్షణ చర్యలు ఎప్పటికప్పుడు చేపడితే రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. కాలాను గుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు వ్యవసాయ సాగు విధానంలో మార్పు రావాలన్నారు. వరి పంట కంటే అఽధికంగా అపరాలు సాగు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సాగు చేస్తే రైతులు ఉహించిన అదాయం పొందవచ్చున్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి దమయంతి, జిల్లా వనరుల కేంద్రం అఽధికారి విజేత, పాయకరావుపేట వ్యవసాయ శాఖ ఏడీ ఉమా ప్రసాద్, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో
● ఓ మహిళ దుర్మరణం.. పలువురికి గాయాలుమాకవరపాలెం: ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టిన ప్రమాదంలో ఒ మహిళ దుర్మరణం చెందింది. కశింకోట మండలం భీమవరం సమీపంలో ఉన్న బీర్లు కంపెనీలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలు పనిచేస్తున్నారు. భీమభోయినపాలెం శివారు చింతలూరుకు చెందిన మహిళలు నిత్యం ఆటోలో కంపెనీకి వెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం పనులు ముగించుకుని వస్తుండగా శెట్టిపాలెం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రెడ్డి సత్యవతి(40) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరి కొందరు మహిళలకు గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ దామోదర్‌నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త లారీ డ్రైవర్ కాగా.. ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కంపెనీ సెక్రటరీ కోర్సు ఉపాధికి సోపానం
మాట్లాడుతున్న మనోజ్ చోడవరం రూరల్ : కామర్స్ విద్యార్థులకు కంపెనీ సెక్రటరీ కోర్సు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలకు సోపానం లాగా ఉపకరిస్తుందని విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ చైర్మన్ మనోజ్ తెలిపారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కంపెనీ సెక్రటరీ ఉద్యోగ, అవకాశాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. కంపెనీ సెక్రటరీ ఉద్యోగంలో లభించే సౌకర్యాలు, ఇతర సదుపాయాలను గురించి మనోజ్ వివరించారు. ఈ కోర్సులో ఒకటి, రెండు, మూడు దశలలో ఉండే ఉద్యోగ అవకాశాల పట్ల సంపూర్ణ అవగాహన కల్పించారు. సదస్సులో పాల్గొన్న ప్రిన్సిపాల్ పి.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కామర్స్ కోర్సు చదివిన విద్యార్థులకు పట్టణాల్లో ఉద్యోగ అవకాశాల్లో మంచి డిమాండ్, ఇలాంటి అదనపు కోర్సులను నేర్చుకుంటే త్వరగా ఉద్యోగాల్లో కుదరుకునే అవకాశాలు ఎక్కువవుతాయన్నారు. కామర్స్ డిపార్ట్మెంట్ హెడ్ వి.అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో కళాశాలలోని కామర్స్ విద్యార్థులకు ఇతర విద్యార్థుల కంటే మెరుగైన అవకాశాలు వస్తున్న సంగతి గుర్తు చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ గణేష్, వినోద్‌లు కంపెనీ సెక్రటరీ కోర్సు పట్ల విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించారు. కామర్స్ డిపార్ట్మెంట్ లెక్చరర్ బి.పిచ్చమ్మ, గెస్ట్ లెక్చరర్ శ్రీనివాసరావు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. -
పథకాల అమల్లో సమష్టి కృషి
మహారాణిపేట(విశాఖ): ప్రభుత్వ పథకాల అమలులో శతశాతం చురుకై న పాత్ర పోషించాలని, ఇంటి పన్నులు వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విస్తరణ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ కుటుంబమంతా టీం వర్కుగా పనిచేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, డుమా పీడీ పూర్ణిమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి పి.శ్రీనివాసరావు, డీపీఆర్సీ ప్రిన్సిపాల్ ఇ.నాగలక్ష్మి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, విస్తరణ అధికారులు (పీఆర్అండ్ఆర్డీ), అనకాపల్లి, జిల్లా మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు. -
ఇసుక దందా!
వైలోవలో నేవీ ప్రహరీ వద్ద కుప్పలుగా పోసిన తడి ఇసుక రాంబిల్లి(యలమంచిలి) కూటమి ప్రభుత్వ పెద్దల అండదండలతో రాంబిల్లి మండలంలో కొందరు నాయకులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ పేట్రేగిపోతున్నారు. వైలోవ గ్రామం శారదానదిలో నుంచి తడి ఇసుకను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు గానీ, పోలీసులు గానీ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇక్కడ శారదానదిలో నాణ్యమైన ఇసుక లభిస్తుంది. దీంతో ఇక్కడి ఇసుకకు డిమాండ్ ఎక్కువ. దీన్ని ఆసరాగా చేసుకున్న ఇసుక వ్యాపారులు ధనార్జన ధ్యేయంగా గ్రామంలో సిండికేట్‌గా ఏర్పడ్డారు. విషయం బయటకు పొక్కకుండా మాముళ్లు తీసుకొని ఇసుక దందాను దగ్గరుండి జరిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత కొద్ది నెలలుగా ఇక్కడ శారదానదిలోకి రాత్రులు, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లను తీసుకెళ్లి తడి ఇసుకను తవ్వి తీసుకొస్తున్నారు. ఆ ఇసుకను నది పక్కన నేవీ ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కుప్పలుగా నిల్వ చేస్తున్నారు. అనంతరం రాత్రి వేళ లారీలు, ట్రాక్టర్లతో నాయకులు గుట్టుచప్పుడు కాకుండా సుదూర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఈ తంతుపై గ్రామానికి చెందిన కొందరు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండాపోయింది. గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు శారదానదిలో ఇసుక తవ్వకాల వల్వ వై.లోవ, పెదకలవలాపల్లి గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. ఇసుక ట్రాక్టర్లు రాత్రులు, పగలు తేడా లేకుండా వైలోవ, పెదకలవలాపల్లి గ్రామాల మీదుగా రాకపోకలు సాగించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శారదానదిలో ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరగడం వల్ల తుపానులు, వరదలు వచ్చినప్పుడు సముద్రంలో పోటు కారణంగా ఉప్పుటేరులో నీరు ప్రవాహం పెరిగి గ్రామాలు, పంట పొలాలు మునిగిపోయే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి తవ్వకాలు శారదానదిలో దిగి తడి ఇసుకను తీసే సమయంలో కొందరు కార్మికులు ప్రాణాలకు తెగించి ఇసుకను తవ్వుతున్నారు. ఇసుకను తవ్వే క్రమంలో నదిలో కార్మికులు మునిగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక డిమాండ్‌ను బట్టి రూ.3 వేలు నుంచి రూ.6 వేలు వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. టన్నుల కొద్దీ ఇసుకను ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపారులు తరలించి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటికై నా ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేసి అధికారులు చర్యలు తీసుకోవాలని వైలోవ, పెదకలవలాపల్లి పరివాహక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. స్టాక్ పాయింట్‌గా నేవల్‌బేస్ ప్రహరీ వైలోవ గ్రామంలో ఉన్న శారదానదిలో ఇసుక తరలించడానికి ఇసుక వ్యాపారులు ఏకంగా నేవల్‌బేస్ ప్రహరీ లోపల స్టాక్ పాయింట్‌గా ఏర్పాటు చేసుకున్నారు. నేవల్ బేస్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా శారదానదిని ఆనుకొని కొండల చుట్టూ ఇక్కడ కొన్నేళ్లుగా నేవీ రక్షణ గోడ నిర్మాణం జరుగుతుంది. శారదానదిలో ఇసుక తవ్వకాల వల్ల లీ రక్షణ గోడ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. అయినా సంబంధిత నేవల్ బేస్ ప్రాజెక్ట్ అధికారులు కూడా పట్టించుకోకపోవడం శోచనీయం. నేవల్ ప్రహరీ పక్కన యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతుండడం.. వాహనాలు రాకపోకలు సాగించడం నిత్యకృత్యంగా మారింది. -
సైలర్ బలవన్మరణం
అల్లిపురం: సైలర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీఐ బి.తిరుమలరావు తెలిపిన వివరాలివీ.. తూర్పు నావికాదళంలో తమిళనాడుకు చెందిన రంజిత్ (23) సైలర్‌గా విధులు నిర్వర్తిసున్నాడు. ఈ నెల 14వ తేదీ నుంచి సెలవులో ఉన్న అతను చావులమదుం వద్ద గల పవనపుత్ర లాడ్జిలో దిగాడు. గురువారం సాయంత్రం వరకు రంజిత్ లాడ్జి నుంచి బయటకు రాకపోవడంతో.. సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందజేసింది. పోలీసులు లాడ్జికి చేరుకుని గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. వీలుకాక పోవడంతో బాల్కనీ కిటికీలో నుంచి చూడగా గదిలో ఫ్యాన్‌కు ఆయన ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో గది తలుపులు పగలగొట్టి..లోపలికి ప్రవేశించారు. మృతదేహాన్ని దించి కేజీహెచ్ మార్చురీకి తరలించారు. అతని వద్ద గల ఆధారాలతో నేవల్ అధికారులు, అతని తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సకుటుంబ సపరివారం.. గిన్నిస్ పురస్కారం
● ఆ కుటుంబంలో అందరూ రికార్డు వీరులే..గిన్నిస్ సర్టిఫికెట్లతో విజయ్ కుటుంబం సాక్షి, అనకాపల్లి: రికార్డు నెలకొల్పాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి.. అందులోనూ గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలంటే ఎన్ని కోట్లమందిని దాటి రావాలి..! అంతటి అరుదైన ఘనతను నూటికో కోటికో ఒక్కరు సాధిస్తారు. కానీ అనకాపల్లికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు ఆ రికార్డును సాధించి, సరికొత్త రికార్డు సృష్టించారు. అనకాపల్లి గవరపాలేనికి చెందిన కొణతాల విజయ్ 2012లో చైనాలో స్థిరపడ్డారు. ఆయన, ఆయన సతీమణి జ్యోతి గతంలో యోగాలో గిన్నిస్ రికార్డు సాధించారు. ఇప్పుడు తాజాగా వారి పిల్లలిద్దరూ తల్లిదండ్రుల బాటలో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ●కొణతాల విజయ్, జ్యోతి దంపతుల కుమార్తె జస్మిత వయస్సు 14 ఏళ్లు. ఒంటి కాలుతో ఒక నిమిషంలో 168సార్లు స్కిప్పింగ్ చేసి గిన్నిస్ రికార్డు సాధించింది. ●వారి కుమారుడు శంకర్ వయస్సు ఐదేళ్లు. ఒక నిమిషంలో 129 సార్లు స్కిపింగ్స్ (ఒలింపిక్ ట్రంప్లిన్స్) చేసి రికార్డు సాధించాడు. 2019లో జపనీస్ కుర్రాడు సాధించిన రికార్డును శంకర్ అధిగమించాడు. -
రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి
అనకాపల్లి: జిల్లాలో రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు వారికి కౌన్సెలింగ్ నిర్వహించి నేరాల సంఖ్య తగ్గేలా చూడాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్ల నడవడికపై దృష్టి పెట్టాలని, నేర ప్రవృత్తికి దూరంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, పోలీస్ శాఖపై సమ్మకం పెంపొందించేలా సేవలు అందించాలన్నారు. మిస్సింగ్ కేసుల ఛేదన, రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, చోరీలు, మత్తు పదార్ధాల నివారణపై సిబ్బంది దృష్టి సారించాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ పిటిషన్లను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, నేషనల్ హైవే, ఇతర రహదారి మార్గాల్లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ, ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎక్కువ నమోదు చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాల వద్ద తప్పక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని, రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన 30మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్‌రావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, కె.వి.సత్యనారాయణ, జి.ఆర్.ఆర్.మోహన్, బి.అప్పారావు, ఇ.శ్రీనివాసులు, పి.నాగేశ్వరరావు, సీఐలు లక్ష్మణమూర్తి, అల్లు స్వామినాయుడు, టి.వి.విజయకుమార్, అశోక్‌కుమార్, టి.లక్ష్మి, గఫూర్, టి.కల్యాణి, ఎస్ఐలు పాల్గొన్నారు. కౌన్సెలింగ్ ద్వారా పరివర్తనకు కృషి నేర ప్రవృత్తికి దూరంగా ఉండేలా చర్యలు నెలవారీ నేర సమీక్షలో ఎస్పీ తుహిన్ సిన్హా -
28 నుంచి 31 వరకు గ్రామీణ బ్యాంక్ సేవలు నిలుపుదల
అనకాపల్లి: ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవలను ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్టు బ్యాంకు రీజనల్ మేనేజర్ ఎస్.సతీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ ప్రధాన కార్యాలయం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉందని, ఆర్బీఐ ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకూ బ్యాంక్ సేవలు, ఏటీఎం, ఆన్లైన్ నగదు లావాదేవీలతోపాటు ఇతర సేవలు నిలుపుదల చేస్తున్నామని ఆయన చెప్పారు. జనవరి 1వ తేదీ నుంచి బ్యాంక్ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.