East Godavari District News
-
వంగలపూడి ఓపెన్ రీచ్ మూసివేత
సీతానగరం: ఇసుక విక్రయాల్లో అధిక ధర వసూళ్లు, నిర్వహణ సరిగా లేకపోవడంతో వంగలపూడి ఓపెన్ రీచ్ మూసివేసినట్టు జేసీ చినరాముడు తెలిపారు. బుధవారం ర్యాంపులో నెలకొన్న వివాదంతో ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి. టన్ను రూ.70.19 వసూళ్లు చేయాల్సి ఉండగా రూ.270 నుంచి రూ. 300 వరకు వసూలు చేయడంతో ర్యాంపు నిర్వాహకులు, లారీ యజమానుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. లారీలపై ఇసుక ఎగుమతులు నిలిపివేయాలని లారీలను అడ్డుగా పెట్టడంతో స్టాక్ పాయింట్ వద్ద ఇసుక ఎగుమతులు నిలిచాయి. ఈ సమాచారం అందుకున్న జేసీ చిన రాముడు ర్యాంపు వద్దకు చేరుకుని ఇరు వర్గాలతో చర్చించారు. అధిక రేట్లకు ఇసుక విక్రయిస్తున్నారని జేసీకి ఫిర్యాదు అందడంతో ఆయన తక్షణమే వంగలపూడి ఓపెన్ రీచ్ 1, 2 లను మూసివేయాలని ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన పాన్ ఇండియా ప్రాజెక్టుకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలో మరో ఏజెన్సీ గుర్తించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఇసుకను ట్రాక్టర్లు, ఎండ్ల బడ్లపై ఉచితంగా తీసుకువెళ్లవచ్చునని ఆయన తెలిపారు. స్టాక్ పాయింట్ వద్ద ఉన్న ఇసుకను లారీలపై ఎగుమతి చేస్తారని, ఆన్లైన్లో చెల్లించిన నగదు తిరిగి బుక్ చేసిన వారికి అందజేస్తారని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్.కృష్ణ నాయక్, తహసీల్దార్ ఎ.శ్రీనివాస్, ఇతర అధికారులు, బోట్స్‌మన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. అధిక ధరలకు ఇసుక విక్రయంపై జేసీ చినరాముడు ఆదేశం నిలచిన ఇసుక ఎగుమతులు -
స్థూల మూల వేతనం ఇవ్వరూ..
కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల వేడుకోలు రాజమహేంద్రవరం: తమను ఆదుకోవాలని కోరుతూ వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులు ఖాళీ ప్లేట్లతో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన నూరు శాతం జీతం జీఓ అమలు చేసి ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రానికి రీ ఒరియంటేషన్కు వచ్చిన ఉద్యోగులు భోజన విరామ సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జీవీవీ ప్రసాద్ మాట్లాడుతూ అర్హత ఉన్నా ఎందరో కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ కాలేకపోయారన్నారు. తమ బతుకులకు భరోసా లేక పోయినా కనీసం ఉన్నంతలో సంతృప్తికర నూరు శాతం వేతనం అందించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ జీఓ అమలుకు అవసరమైతే మూకుమ్మడిగా అమరావతికి వెళ్లాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. పదవీ విరమణ వయసు విషయంలోనూ తమకు తీరని అన్యాయం జరుగుతోందని, అందరికీ 62 ఏళ్లకు పదవీ విరమణ అయితే, తాము 60 ఏళ్లకే ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తోందన్నారు. తమకూ 62 ఏళ్ల రిటైర్మెంట్ అవకాశం ఇవ్వాలని కోరారు. -
29న లక్ష రుద్రాక్షార్చన
సీటీఆర్ఐ: గాడాల శ్రీ మహాలక్ష్మీ సమేత చిన్నవేంకటేశ్వరస్వామి పీఠంలోని శ్రీ చక్రవాహిని భద్రకాళి సమేత వీరేశ్వరస్వామికి కార్తిక మాస శివరాత్రి సందర్భంగా 29వ తేదీ తెల్లవారు జామున 4.30 గంటల నుంచి. ఏకముఖి నుంచి ద్వాదశముఖాలున్న 1,08,012 రుద్రాక్షలతో విశేష అర్చన నిర్వహించనున్నట్టు పీఠాధిపతి, గురుగోవింద, డాక్టర్ చిన్నవెంకన్నబాబు స్వామీజీ తెలిపారు. ఈ మేరకు బుధవారం దానవాయిపేటలో జరిగిన కార్యక్రమంలో పోస్టర్ని ప్రముఖ వెటర్నరి సర్జన్ డాక్టర్ అంచ రేవంత్‌తో కలిపి స్వామిజీ విడుదల చేశారు. స్వామీజీ మాట్లాడుతూ శివపంచాక్షరితో ముక్కంటిని అర్చించడం వల్ల కోటి జన్మల పాపం దగ్ధమవుతుందని అన్నారు. కార్యక్రమంలో మనగుడి–మనసేవ భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి జాతీయ చైర్ పర్సన్ ధరణీకోట దుర్గా వేంకట హేమవతి, ఉభయ రాష్ట్రాల చైర్మన్ మతల రమేష్, రాష్ట్ర చైర్మన్ అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్ఆర్ఎస్ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు
రాజమహేంద్రవరం రూరల్: పారదర్శక హాజరు పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ పేర్కొంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తీర్మానించింది. బుధవారం బొమ్మూరులోని ఏపీజీఈఏ కార్యాలయంలో అసోసియేషన్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎ.గిరిప్రసాద్‌వర్మ అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి సీహెచ్ఎస్ విల్సన్‌పాల్ మాట్లాడుతూ జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో బయోమెట్రిక్ ఎఫ్ఆర్ఎస్ పేరుతో జీతాలకు హాజరు ముడిపెట్టి కోత పెడుతున్నారన్నారు. ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో ఉన్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించకుండా జీతాలు కోత పెట్టడాన్ని వారు ఖండించారు. జిల్లా కోశాధికారి కాకర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబరు 14వ తేదీన జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు షరీఫ్, చాంబర్లీన్, దినేష్, రమేష్, కమల్‌సుందర్, డాక్టర్ శ్రీవల్లీ, పి.రవికుమార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ -
అధినేతతో భేటీ
కొవ్వూరు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ఇటీవల రాజకీయ పరిణామాలను, పార్టీ పరిస్థితిని వివరించినట్లు వెంకట్రావు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం మరింత సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారన్నారు. ఈ సందర్భంగా తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోశిబాబు వైఎస్సార్ సీపీలో చేరారు. కార్యక్రమంలో చాగల్లు ఎంపీపీ మట్టా వీరస్వామి, యాళ్ల బాబూరావు, పిట్టా శ్రీనివాసు, సిర్రా గంగారామ్, కోయ దుర్గారావు, గండి రాంబాబు, పలువురు నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు సిబ్బందికి శిక్షణలో కలెక్టర్ ప్రశాంతి సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో మార్గదర్శకాల, శిక్షణ సామగ్రిపై అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏఆర్వో, సహాయ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్ రోజు విధులపై ఇచ్చిన శిక్షణకు ముఖ్య అతిథులుగా కలెక్టర్ ప్రశాంతి, డీఆర్వో టి.సీతారామమూర్తి పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది విధులపై స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక సాగనుందని, ఫారం 16 ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. బ్యాలెట్ బాక్సు, బ్యాలెట్ పేపర్, పేపర్ సీల్, మెటల్ సీల్, రబ్బర్ స్టాంప్, ఫారం 14, 15, 16పై అవగాహన కల్పించినట్టు ఆమె తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు ఆర్డీవో ఆర్.కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పీఎఫ్ బకాయి వసూళ్లకు చర్యలు ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉద్యోగి భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో నవంబరు 2024 నుంచి జనవరి 2025 వరకు ప్రత్యేక వసూళ్లకు చర్యలు చేపట్టినట్టు ఈపీఎఫ్ఓ రికవరీ ఆఫీసర్ వైడీ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ పరిధిలోని సంస్థల నుంచి ఈపీఎఫ్ బకాయిల వసూళ్లు లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఆయా సంస్థలు స్వచ్ఛందంగా నిధులు చెల్లించేలా వారితో సంప్రదించడం జరుగుతుందన్నారు. పొగాకు సాగులో మల్చింగ్ దేవరపల్లి: కూలీల కొరత, కలుపు సమస్యతో ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులు కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు మల్చింగ్ షీట్ వినియోగించి పొగాకు నాట్లు వేస్తున్నారు. షీట్‌పై రంధ్రాలు పెట్టి వాటిలో మొక్క నాటుతున్నారు. దీనితో పాటు డ్రిప్ ఏర్పాటు చేసి నాట్లకు నీరు పెడుతున్నారు. ఈ విధానం వల్ల పొలంలో కలుపు రాదని, అలాగే నీరు సైతం వృథా కాదని రైతులు చెప్తున్నారు. ఎకరాకు రూ.12 వేలు మల్చింగ్ షీట్, రూ.10 వేలు డ్రిప్, కూలీలకు రూ. 3 వేలు ఖర్చు అవుతుందని రైతులు చెప్పారు. దీనివల్ల పొగాకు నాణ్యత బాగుంటుందని రైతులు తెలిపారు. ఎకరాకు అన్ని ఖర్చులు కలిపి సుమారు రూ.25 వేలు అవుతుందని రైతులు చెప్పారు. 90 శాతం సబ్సిడీపై ప్రభుత్వం రైతులకు డ్రిప్ సరఫరా చేస్తున్నట్టు రైతులు తెలిపారు. -
సంక్షోభ గృహాలు
హైకోర్టు మార్గదర్శకాలు ఇలా.. సంక్షేమ వసతి గృహాల్లో ఉండాల్సిన వసతులపై ఇటీవల హైకోర్టు మార్గదర్శకాలు వెలువరించింది. వాటిని పరిశీలిస్తే.. ● వసతి గృహం భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్‌తో ప్రహారీ నిర్మించాలి. గేటు తప్పనిసరిగా ఉండాలి. ● విద్యార్థుల రాకపోకలు ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ● హాస్టల్ ప్రవేశ మార్గం, కామన్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ● మురగుదొడ్లు శుభ్రంగా ఉండాలి. నీటి సదుపాయం కల్పించాలి. ● హాస్టల్లో పనిచేసే సిబ్బందికి ప్రవర్తనా నియమావళి నిర్దేశించాలి. విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ● జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా హాస్టళ్లు ఉండాలి. ఇలా అనేక మార్గదర్శకాలు రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా ఒక్క వసతి గృహంలోనూ ఈ మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్న దాఖలాలు లేవు. సాక్షి, రాజమహేంద్రవరం: శిథిల భవనాలు.. అపరిశుభ్రతతో కూడిన మరుగుదొడ్లు.. చాలీచాలని గదులు.. దోమలతో సహజీవనం.. భోజనశాలలు లేని దుస్థితి.. మౌలిక వసతులు కరువు.. ఆపై కాస్మెటిక్ చార్జీల విడుదలతో జాప్యం.. ఇలా ఎన్నో సమస్యలు సంక్షేమ, వసతి గృహాల్లో రాజ్యమేలుతున్నాయి. పేద విద్యార్థుల సంక్షేమం, వసతితో కూడిన విద్య అందించేందుకు నెలకొల్పిన గృహాలు నిర్వహణ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. పర్యవేక్షణ కొరవడడంతో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టిక ఆహారం కరువైపోయింది. సీసీ కెమెరాలు, ప్రహరీ గోడలకు విద్యుత్ ఫెన్సింగ్ లేకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితులపై హైకోర్టు తీవ్ర ఆందోళన, తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన చెందింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై ఆ ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై సమగ్రంగా దృష్టి సారించాలని అభిప్రాయపడింది. విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా విద్య, వసతి పొందేలా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేసింది. జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ చేపట్టిన ప్రత్యేక పరిశీలనలో వసతి గృహాల్లో అనేక సమస్యలు తేటతెల్లమయ్యాయి. వాటి వివరాలు ఇలా.. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా 36 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా.. 2,600 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఆరు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. 24 బీసీ సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. 1,657 మంది విద్యార్థులు వీటిలో వసతి పొందుతున్నారు. ఒకటి గురుకుల పాఠశాల ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల, కేజీబీవీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. వసతి గృహాల నిర్వహణ, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించడంతో రోగాల బారిన పడిన సందర్భాలు లేకపోలేదు. కూటమి ప్రభుత్వం సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో నిర్వహణ బడ్జెట్‌ను విడదల చేయకపోవడంతో బ్లీచింగ్, ఇతర వస్తువుల కొనుగోలు చేసేందుకు ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు చేతి చమురు వదిలించుకుంటున్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మెటిక్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విద్యార్థులకు అత్యవసరమైన సబ్బులు, టూత్ పేస్టులు, కొబ్బరినూనె కొనుగోలు చేయడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. హాస్టళ్ల పరిశీలన ఇలా.. ● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరంలోని సమీకృత బాలుర వసతి గృహంలో 65 మంది విద్యార్థులున్నారు. ఈ వసతి గృహం కిటికీలకు తలుపులు లేవు. దోమ తెరలు సైతం లేవు. వెరసి విద్యార్థులపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ● కడియం బాలుర వసతి గృహంలో 27 మంది విద్యార్థులున్నారు. అవసరమైన మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న వాటికి సరైన నిర్వహణ లేక అపరిశుభ్రంగా ఉన్నాయి. అదనపు మరుగుదొడ్లకు ప్రతిపాదనలు పంపించినా అనుమతులు వచ్చిన దాఖలాలు లేవు. దోమల దండయాత్రలతో విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. ● నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో కానూరు ఎస్సీ బాలుర వసతి గృహంలో 80 మంది విద్యార్థులు ఉన్నారు. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గౌరీపట్నం బాలుర వసతి గృహంలో 22 మంది విద్యార్థులున్నారు. మరుగుదొడ్లకు తలుపులు లేవు. ప్రధాన ద్వారం వద్ద చెత్త వేయడంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. విద్యార్థులకు అవసరమైన నీటి వసతి లేదు. కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలికి వణకాల్సిన దుస్థితి తలెత్తుతోంది. భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ● జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం నగరంలో వసతి గృహాల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బాలుర సంక్షేమ వసతి గృహంలో 98 మంది విద్యార్థులున్నారు. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో చలికాలంలో స్నానాలు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ● గోపాలపురం బీసీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరింది. అదే భవనంలో 20 మంది విద్యార్థులు విద్య, వసతి పొందుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే భయమేస్తోందని వాపోతున్నారు. ఉదయం, సాయంత్రం జాతీయ రహదారిపై నడుస్తుంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన చెందుతున్నారు. భవనాన్ని మార్చి హైస్కూల్‌కు సమీపంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ● నిడదవోలు రూరల్ సమిశ్రగూడెం ఎస్సీ బాలికల వసతి గృహంలో 36 మంది విద్యార్థినులు ఉన్నారు. భవనం సుమారు 35 ఏళ్ల క్రితం నిర్మించారు. నూతన భవన నిర్మాణానికి మూడు కోట్లతో ప్రతిపాదనలు పంపారు. 2021లో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రూ.35 లక్షలు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. హాస్టల్లో కిటికీ మెష్‌లకు రంధ్రాలు పడ్డాయి. కొన్ని ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు పనిచేయడం లేదు. బాత్రూమ్ శిథిలావస్థకు చేరడంతో బాలికలు ఇబ్బంది పడుతున్నారు. ప్యూరిఫైడ్ వాటర్ సిస్టం పనిచేయడం లేదు. భోజనశాల శ్లాబ్ లీక్ కావడంతో నీరు చేరుతోంది. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో స్నానాలు చేసేందుకు అవస్థలు తప్పడం లేదు. వసతులు లేకపోవడంతో గతంలో 86 మంది ఉన్న విద్యార్థులు ప్రస్తుతం 36కు చేరారు. ● కొవ్వూరు మండలం సాంఘిక సంక్షేమ బాలురు వసతి గృహం, బీసీ సంక్షేమ బాలుర హాస్టల్, బీసీ బాలుర కళాశాల వసతి గృహాలతో పాటు వాడపల్లిలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల అద్దె భవనాల్లో అరకొర వసతులతో నడుస్తున్నాయి. కొవ్వూరులో ఎస్సీ, బీసీ హాస్టళ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో గత ఏడాది నుంచి అద్దె భవనాల్లో నడిపిస్తున్నారు. నెల రోజుల క్రితమే ఎస్సీ బాలుర వసతి గృహం అద్దె భవనంలోకి మారింది. అద్దె భవనాల్లో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో హాస్టల్లో 100 సామర్థ్యం ఉన్నప్పటికీ సౌకర్యాల లేమి, సొంత భవనాలు లేకపోవడం తదితర కారణాలతో సగం మంది కూడా చేరడం గగనంగా మారింది. అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఫ శిథిల భవనాల్లోనే హాస్టళ్లు ఫ అపరిశుభ్ర వాతావరణం, వసతుల కొరతతో విద్యార్థుల ఇబ్బందులు ఫ కానరాని సీసీ కెమెరాలు ఫ జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలు కరవు ఫ ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు -
తప్పిపోయిన మహిళ బంధువుల చెంతకు
అన్నవరం: బంధు మిత్రులతో కలసి తీర్థయాత్రలు చేస్తూ అన్నవరం రైల్వే స్టేషన్లో దిగి తప్పిపోయి రెండ్రోజులుగా ఇబ్బంది పడుతున్న ఖర్నూల్ జిల్లా రాయచూర్‌కు చెందిన గుర్రం లక్ష్మీదేవిని బంధువులకు అప్పగించినట్లు అన్నవరం రైల్వై స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రాయచూర్‌కు చెందిన గుర్రం లక్ష్మీదేవి తన బంధువులు, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తూ సోమవారం అన్నవరం రైల్వే స్టేషన్లో దిగిపోయింది. ఆమె తన బంధు మిత్రులను కలుసుకునేందుకు రెండ్రోజులుగా ప్రయత్నిస్తుంది. అయితే ఆమె బంధువులు సామర్లకోట, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ఆమె కోసం గాలిస్తున్నారు. కాగా, బుధవారం అన్నవరం రైల్వే స్టేషన్లో బంగారు ఆభరణాలు ధరించి లగేజీ బ్యాగ్‌తో తిరుగుతున్న ఆమెను రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు విచారించగా తన వివరాలు తెలిపింది. దీంతో తుని రైల్వే ఎస్ఐ జి.శ్రీనివాస్‌కు విషయం తెలియజేయగా ఆయన సూచనలు మేరకు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. బుధవారం బంధువులు అన్నవరం రైల్వే స్టేషన్‌కు రాగా గుర్రం లక్ష్మీదేవిని వారికి అప్పగించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
తప్పిపోయిన మహిళ బంధువుల చెంతకు
అన్నవరం: బంధు మిత్రులతో కలసి తీర్థయాత్రలు చేస్తూ అన్నవరం రైల్వే స్టేషన్లో దిగి తప్పిపోయి రెండ్రోజులుగా ఇబ్బంది పడుతున్న ఖర్నూల్ జిల్లా రాయచూర్‌కు చెందిన గుర్రం లక్ష్మీదేవిని బంధువులకు అప్పగించినట్లు అన్నవరం రైల్వై స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రాయచూర్‌కు చెందిన గుర్రం లక్ష్మీదేవి తన బంధువులు, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తూ సోమవారం అన్నవరం రైల్వే స్టేషన్లో దిగిపోయింది. ఆమె తన బంధు మిత్రులను కలుసుకునేందుకు రెండ్రోజులుగా ప్రయత్నిస్తుంది. అయితే ఆమె బంధువులు సామర్లకోట, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ఆమె కోసం గాలిస్తున్నారు. కాగా, బుధవారం అన్నవరం రైల్వే స్టేషన్లో బంగారు ఆభరణాలు ధరించి లగేజీ బ్యాగ్‌తో తిరుగుతున్న ఆమెను రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు విచారించగా తన వివరాలు తెలిపింది. దీంతో తుని రైల్వే ఎస్ఐ జి.శ్రీనివాస్‌కు విషయం తెలియజేయగా ఆయన సూచనలు మేరకు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. బుధవారం బంధువులు అన్నవరం రైల్వే స్టేషన్‌కు రాగా గుర్రం లక్ష్మీదేవిని వారికి అప్పగించినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
సుబ్బంపేటలో బాలిక మృతి
కొత్తపల్లి: వైద్యం వికటించి తమ కుమార్తె మృతి చెందినట్లు ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన మైలపల్లి మల్లేశ్వరి తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మైలపల్లి అక్షయ (16) తొమ్మిదో తరగతి చదువుతుంది. సోమవారం రాత్రి జ్వరంతో పాటు వాంతులు కావడంతో మంగళవారం ఉదయం ఉప్పాడలోని ఆర్ఎంపీ మామిడి సూరిబాబు వద్దకు తల్లి మల్లేశ్వరి తీసుకువెళ్లింది. అక్కడ ఆసుపత్రిలో అక్షయకు మూడు ఇంజక్షన్లు, సిలెన్లు, ఆక్సిజన్ పెట్టారు. తర్వాత మాత్రలు ఇచ్చి ఇంటికి తీసుకువెళ్లాని ఆర్ఎంపీ సూరిబాబు చెప్పారని బంధువులు అంటున్నారు. పాపకు బాగోలేదని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లండనే మాట చెప్పకుండా తీసుకువెళ్లమనడంతో ఇంటికి తీసుకొచ్చిన క్షణాల్లో అక్షయ స్పృహ కోల్పోవడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా ప్రాణాలు విడిచినట్లు మల్లేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై ఆర్ఎంపీ సూరిబాబును వివరణ కోరగా అక్షయ తన వద్దకు వచ్చేసరికే ఆరోగ్యం బాగోలేదని, ఆమెకు ఎటువంటి వైద్యం చేయలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లమని చెప్పానని అన్నారు. అయితే దీనిపై ఏవిధమైన సమాచారం లేదని ఎస్సై వెంకటేష్ తెలిపారు. -
నూతన పద్ధతులపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలి
ఆల్కాట్‌తోట (రాజహేంద్రవరం రూరల్): వాణిజ్య పంటల సాగులో జన్యుపరమైన నూతన పద్ధతులు, కొత్త రసాయనాలు, విలువ జోడింపుపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్ఐ) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ సూచించారు. బుధవారం స్థానిక సీటీఆర్ఐలోని సమావేశ మందిరంలో మూడో రోజు పరిశోధన కమిటీ సమావేశాలు ఆయన అధ్యక్షతన జరిగాయి. దీనికి డాక్టర్ ఎం.శేషుమాధవ్, బెంగళూరు ఐఐహెచ్ఆర్ ఫార్మర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సీకే నారాయణ, సీటీఆర్ఐ ఫార్మర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సీవీ నరసింహారావు, హైదరాబాద్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ బీబీ సుబ్బారెడ్డి, సీటీఆర్ఐ ఫార్మర్ డివిజన్ హెడ్ సి.చంద్రశేఖరరావు నిపుణులుగా వ్యవహరించారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు ఎల్కే ప్రసాద్, అనిందిత పాల్, కె.సుమన్ కళ్యాణి, ఎం.అనురాధ, నమితాదాస్ సాహా తమ పరిశోధనా ఫలితాలను వివరించారు. వాణిజ్య పంటల సాగులో కొత్త రసాయనాలు, విలువ జోడింపు పరిశోధనలపై చర్చించారు. ఆముధం నూనె నుంచి 2–ఆక్టనాల్ వెలికితీత, వర్జీనియా పొగాకులో పిలకలను అరికట్టడానికి కొత్త రసాయనాలు, అశ్వగంధలో బయో యాక్టివ్ కాంపౌండ్లు, పురుగు మందుల అవశేషాలను గుర్తించే విశేష పద్ధతులు వంటి పరిశోధనలపై పురోగతిని తెలిపారు. పసుపు, మిరపను ఉపయోగించి విలువ ఆధారిత ఉత్పత్తులు, వాటి ప్రయోజనాలు వివరించారు. అనంతరం సాంకేతిక సమావేశాలకు నిపుణులుగా హైదరాబాద్ ఐఐఆర్ ఫార్మర్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ఎం.సుజాత, సీటీఆర్ఐ ఫార్మర్ డైరెక్టర్ టీజీకే మూర్తి వ్యవహరించారు. సమావేశంలో శాస్త్రవేత్తలు కె.సరళ, సి.నంద, కె.గంగాధర్, పి.మణివేల్, జేజే రాజప్ప తమ పరిశోధనా ఫలితాలను తెలిపారు. వాణిజ్య పంటల్లో జన్యు మెరుగుదల, నూతన పద్ధతులు, వంగడాల్లో అధిక దిగుబడి, అధిక నాణ్యతను పెంపొందించడం, వ్యాధి నిరోధక వంగడాలపై జరుగుతున్న పరిశోధనల ఫలితాలను నిపుణులు చర్చించి సలహాలు, సూచనలను అందించారు. -
కెనరా బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం
భీమవరం: కెనరా బ్యాంక్ 119 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం భీమవరం కెనరా బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బీఎస్ అనంత పద్మారావు మాట్లాడుతూ బ్యాంక్‌ను అభివృద్ధి చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా భీమవరం, రాజమహేంద్రవరంలో రక్తదాన శిబిరాల నిర్వహణతో పాటు తణుకులోని వృద్ధాశ్రమానికి రూ.50 వేల విలువైన సామగ్రి అందించామన్నారు. అనంతరం పలువురు ఖాతాదారులను సత్కరించారు. జీఆర్టీ జ్యూయలర్స్ షోరూం ప్రారంభం రాజమహేంద్రవరం సిటీ: జీఆర్టీ జ్యూయలర్స్ 61వ షోరూమ్‌ను బుధవారం రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్లో ప్రారంభించారు. జీఆర్టీ 60 ఏళ్లుగా నాణ్యత, విశ్వాసం, బలమైన ఉనికితో వ్యాపారాన్ని సాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన బంగారం, డైమండ్, ప్లాటినం, వెండి, జాతి రత్నాల ఆభరణాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.50 తగ్గింపు, బంగారు ఆభరణాల వేస్టేజీపై 20 శాతం తగ్గింపు, డైమండ్ విలువపై క్యారెట్‌కు రూ.10 వేల తగ్గింపుతో అందిస్తున్నామన్నారు. కస్టమర్లు వెండి వస్తువులు పట్టీల మేకింగ్ చార్జీలపై 25 శాతం తగ్గింపు, అన్‌కట్ డైమండ్ విలువపై 10 శాతం తగ్గింపు అందిస్తున్నామని జీఆర్టీ జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. కార్యక్రమంలో జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. యువకుడిని గాయపరిచిన వ్యక్తిపై కేసు కొత్తపల్లి: యువకుడిని గాయపరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బుధవారం స్థానిక పోలీసులు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే.. అమీనాబాద్ గ్రామానికి చెందిన యువకుడు గంట శ్రీను ఆదివారం రాత్రి టిఫిన్ తెచ్చేందుకు సెంటర్లోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి శ్రీనును ఆపి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వైఎస్సార్ సీపీ టీషర్స్ వేసుకుంటున్నావని, గతంలోనే హెచ్చరించినా బుద్ధి రాలేదా అంటూ అన్నాడు. దీంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. శ్రీనును రాజు తలపై గాయపరచగా, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై బాధితుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. -
ఉరుకులు... పరుగులు
● రైల్వే స్టేషన్లో భీతావహం ● రైలు పట్టాలు తప్పిందని హడావుడి ● మాక్‌డ్రిల్‌తో అవగాహన కల్పించిన అధికారులు ● ఎలా రక్షించాలో చూపించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాజమహేంద్రవరం సిటీ: ఏం జరిగిందో తెలియదు.. అంతా హడావుడి.. ఒక్కసారిగా అధికారుల ఉరుకులు, పరుగులు.. ఈ పరిణామాలతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో భీతావహ పరిస్థితి.. స్టేషన్‌లోని కోల్ యార్డ్ వద్ద రైలు పట్టాలు తప్పిందని తెలియడం, ఒక్కసారిగా ఆ రైలులోని ప్రయాణికులు భయంతో కేకేలు వేయడం.. సంఘటనా స్థలానికి రైల్వే ఎన్డీఆర్ఎఫ్ బృందం, వైద్య అధికారులు, రెవెన్యూ, పోలీస్, తదితర శాఖల సిబ్బంది కంగారుగా వెళ్లడం.. రైలు బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు అత్యాధునిక కట్టర్లు ఉపయోగించి బోగీ కిటికీలను కట్ చేయడం.. అందులోంచి ప్రయాణికులను బయటకు లాగి, రోప్ ద్వారా సురక్షితంగా తీసుకురావడం చూసి స్టేషన్ వద్ద ప్రయాణికులు వామ్మో అనుకున్నారు. చివరికి ఇదంతా రైల్వే ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిర్వహించిన మాక్ డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత తక్కువ సమయంలో త్వరితగతిన రెస్క్యూ కార్యకలాపాలను ఏ విధంగా చేపట్టాలనే అంశాలపై రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్పీఏఆర్ఎంవీ సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ ఆద్యంతం కళ్లకట్టినట్టు అయ్యింది. విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఆపరేషన్స్) శ్రీనివాసరావు కొండ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రైల్వే స్టేషన్ కోల్ యార్డ్‌లో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, వివిధ శాఖల అధికారులతో కలసి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు కొండ మాట్లాడుతూ ప్రయాణాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. దీనిపై మెకానికల్, సేఫ్టీ, మెడికల్, ఎస్‌అండ్‌టీ విభాగాల్లోని సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నామన్నారు. ప్రమాద సమయంలో రెస్క్యూ కార్యకలాపాలను చేపట్టడానికి త్వరితగతిన స్పందించే విధంగా విజయవాడలోని ఎన్డీఆర్ఎఫ్, ఎస్పీఏఆర్ఎంవీ సిబ్బంది మాక్‌డ్రిల్‌ను సమర్థంగా నిర్వహించారన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాములు మాట్లాడుతూ రైలు ప్రమాదాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు అత్యవసరంగా చేపట్టాల్సిన చర్యలను మాక్‌డ్రిల్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించడం అభినందనీయమన్నారు. ప్రయాణికులకు రక్షించి సమీప ఆసుపత్రులకు ఎలా తరలిస్తారో చూపారన్నారు. మొత్తం 100 మంది రైల్వే సిబ్బంది రెస్క్యూ, పునరుద్ధరణ కార్యకలాపాల్లో పాల్గొని సమర్థంగా చర్యలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారి బి.ప్రశాంతకుమార్, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. -
వేట నిషేధ సాయం ఏమైంది!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రోజూ సాగరంలో సమరం.. వేటే వారి జీవనాధారం.. వలకు చిక్కిన చేపలే ఆ మత్స్యకారుల జీవన గమనానికి ఆధారం.. అలాంటి సముద్ర వేటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ఏప్రిల్ 14 నుంచి రెండు నెలల పాటు నిషేధిస్తుంటాయి. ఆ నిషేధ సమయం 61 రోజులూ సాపాటు లేక మత్స్యకార కుటుంబాలు నానా అవస్థలు పడుతుంటాయి. ఈ ఏడాది నిషేధ సమయం ముగిసి ఆరో నెల వచ్చేసింది. ఆ సమయంలో చేసిన అప్పులు తీర్చలేక అవే ఇప్పుడు గుదిబండగా మారాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ రోజు తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కాదని, సముద్ర వేటపై ఆధారపడిన మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 35 వేల కుటుంబాలకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసాకు కూటమి సర్కార్ మోకాలడ్డు పెట్టింది. అదే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఏటా వేట నిషేధ సమయం ముగియకుండానే పరిహారాన్ని అందజేసి మత్స్యకారులకు భరోసా కల్పించారు. గత ఐదేళ్లూ ఏటా మే లేదా జూన్ నెల దాటకుండానే వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేస్తూ వచ్చారు. మెకనైజ్డ్, మోటారు బోట్లపై సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన ప్రతి కుటుంబానికి 61 రోజుల వేట నిషేధ సమయంలో వేట నిషేధ భృతిగా రూ.10 వేల చొప్పున వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేసింది. అటువంటిది కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక సమస్యలు మొదలయ్యాయని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలైనా ఏ ఒక్క మత్స్యకారుడి ఖాతాల్లో వేట నిషేధ భృతి జమ కాలేదని వాపోతున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేట నిషేధ పరిహారం కుటుంబానికి కేవలం రూ.4 వేల చొప్పున అందజేసింది. ఇలా 2019 వరకూ 22,250 మందికి రూ 8.90 కోట్లు మాత్రమే పరిహారం ఇచ్చారు. చోద్యం చూస్తున్న ప్రభుత్వం కాకినాడ జిల్లాలో సుమారు 94 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తొండంగి, తుని రూరల్, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్, తాళ్లరేవు మండలాల పరిధిలో 1,95,184 మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. ఇందులో సముద్రంలో చేపల వేటపై ఆధారపడి 36,101 మంది ఉపాధి పొందుతున్నారు. క్రమం తప్పకుండా గడచిన ఐదేళ్లు ఏటా మత్స్యకార భరోసాగా రూ.24 కోట్ల నుంచి రూ.30 కోట్ల నిషేధ భృతిగా 25 వేల నుంచి 30 వేల మంది మత్స్యకార కుటుంబాలకు నేరుగా సీఎం జగన్ బటన్ నొక్కి వారి వ్యక్తిగత ఖాతాలకు జమచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేట నిషేధ భృతికి అర్హులను మత్స్యశాఖ గుర్తించి నెలలు గడుస్తోంది. గత మే నెలలోనే కాకినాడ జిల్లాలో 24,147 మత్స్యకార కుటుంబాలను భృతికి అర్హమైనవిగా ఎంపిక చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల్లో ఈ ఏడాది వేట నిషేధ భృతి కోసం 11,305 మందిని గుర్తించారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున అందించాలి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సుమారు 48 వేల కుటుంబాలకు వేట నిషేధ భృతి ఇవ్వాలి. ఇంకా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఎప్పుడిస్తారో తెలియక మత్స్యకారుల ఎదురుతెన్నులు నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం కాకినాడ జిల్లాలో.. తీర ప్రాంత మండలాలు : 5 మత్స్యకార గ్రామాలు: : 58 మైరెన్ ఫిషర్మెన్ : 2లక్షల మంది సముద్ర వేట ద్వారా జీవనోపాధి : 36,101 మంది మెకనైజ్డ్ బోట్లు : 467 మోటారు బోట్లు : 3779 సంప్రదాయ బోట్లు : 399 -
బంగారం షాపు గుమస్తా చేతివాటం
నిడదవోలు: గోల్డ్ టెస్టింగ్ షాపులో ఏడాదిన్నరగా నమ్మకంగా పని చేస్తున్న ఓ గుమస్తా చేతివాటం ప్రదర్శించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. నిడదవోలులో సీఐ పీవీజీ తిలక్ బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర రాజ్యవేడి గ్రామానికి చెందిన బంగారు వ్యాపారులు ప్రశాంత్, నేతాజీలు 20 ఏళ్ల కిందట ఆంధ్రాకు వచ్చారు. ఇందులో వ్యాపారి ప్రశాంత్ రాజమహేంద్రవరంలో డీకే గోల్డ్ టెస్టింగ్ షాపు, మరో వ్యాపారి నేతాజీ తాడేపల్లిగూడెంలో జేపీ గోల్డ్ టెస్టింగ్ షాపులు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలో డీకే గోల్డ్ టెస్టింగ్ బంగారు షాపులో అమర్ గుమస్తా ఏడాదిన్నరగా పని చేస్తున్నాడు. అయితే తాడేపల్లిగూడెం షాప్‌లో పనిచేస్తున్న సాగర్ అనే వ్యక్తి పనిచేయడం మానేయడంతో 15 రోజుల కిందట గుమస్తా అమర్‌ను తాడేపల్లిగూడెం షాపునకు పనికి పంపించారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన అమర్‌కు దురాశ కలిగింది. బంగారాన్ని కాజేసి ఎవరికి చెప్పకుండా మహారాష్ట్ర వెళ్లిపోయి తనకు ఉన్న అప్పులు తీర్చి జీవిద్దామని పధకం వేశాడు. తాడేపల్లిగూడెం షాపు యజమాని నేతాజీ ఈ నెల 13న రాత్రి రాజమహేంద్రవరం షాపునకు తీసుకు వెళ్లాలని సుమారు 289.340 గ్రాముల గోల్డ్ కచ్చా ముక్కలు, రూ. 6.30 లక్షల నగదును అమర్‌కు ఇచ్చాడు. వాటిని తీసుకుని ఈనెల 14న అతను మోటార్ సైకిల్‌పై బయలు దేరాడు. అమర్ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం నిడదవోలు పట్టణంలోని ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం వద్ద రోడ్డు పక్కన తుప్పల్లో బంగారం, నగదును దాచాడు. తర్వాత తాడేపల్లిగూడెం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న తనను గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు అడ్డగించి కత్తి చూపించి బెదిరించి బంగారం, నగదు దోపిడీ చేశారని గుమప్తా అమర్ కట్టుకథ అల్లాడు. ఈ ఘటనపై తాడేపల్లిగూడెం షాపు యజమాని నేతాజీ నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. చివరకు బుధవారం అమర్‌ను అరెస్టు చేసి, మొత్తం సొత్తు రికవరీ చేశారు. పట్టణ ఎస్సై శోభన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న అక్రమ అరెస్టులు
తుని/తుని రూరల్: ప్రభుత్వ విధి విధానాలకు, టీడీపీ, జనసేన, బీజేపీలకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీకి లబ్ధి చేకూర్చేందుకు నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి ప్రేరేపించేలా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన 17 మందిని అరెస్టు చేసినట్టు రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు తెలిపారు. తుని రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం పట్టణ సీఐ గీతారామకృష్ణ, రూరల్ ఎస్సై బి.కృష్ణామాచారితో కలసి రూరల్ సీఐ విలేకరులతో మాట్లాడారు. అరైస్టెన వారిలో తుని పట్టణ, తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు సమాచారాన్ని బదిలీ చేసినా శిక్షార్హులన్నారు. రెండుసార్లు కేసులు నమోదైన తర్వాత ఇటువంటి తప్పిదానికి మూడోసారి (ఆర్గనైజ్డ్ క్రైం) పాల్పడితే నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో ఐదు నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందన్నారు. కక్ష సాధింపులు లేవని, ఏ పార్టీవారు ఆధారాలు ఇచ్చినా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అరైస్టెన వారు వైఎస్సార్ సీపీ యువజన విభాగం తుని నియోజకవర్గ అధ్యక్షుడు, తుని కౌన్సిల్లో కో–ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలు, 14వ వార్డు కౌన్సిలర్, పట్టణ యూత్ కన్వీనర్ షేక్ ఖ్వాజా మోహిద్దీన్, తొండంగి మండలం వైస్ ఎంపీపీ నాగం గంగాధరరావు, వైఎస్సార్ సీపీ కోటనందూరు మండల కన్వీనర్ చింతకాయల సన్యాసి రాజా విశ్వనాథ్ (చినబాబు), వెలుగొండి జార్జి కిరణ్ (జార్జిరెడ్డి), ఇసరపు సాయి, మొగసాల నాగ రామశ్రీను, దిబ్బ శ్రీను, పెంటకోట వెంకట రామలింగ సురేష్, కోరుమల్లి లలిత, అడపా సురేష్, గణేసుల వీర వెంకటరమణ (వీరబాబు), బంగారు బ్రహ్మనాయుడు, యలమంచిలి మణికంఠ, కాకినాడ గణేష్ (నాని), చింతంనీడి గణేష్, కుర్మయ్యగారి హనుమంత్ రెడ్డి (అన్నమయ్య జిల్లా) అరెస్టయ్యారు. 15 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చామని, ఏలూరి బాలు, షేక్ ఖ్వాజాలను కోర్టులో హాజరుపర్చామన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల అరెస్టు 17 మందిలో వైస్ ఎంపీపీ, ఇద్దరు కౌన్సిలర్లు -
రత్నగిరి ఘాట్‌రోడ్డులో అగ్నిప్రమాదం
అన్నవరం: సత్యదేవుని దర్శనానికి మంగళవారం తాడేపల్లిగూడెం నుంచి కారులో వచ్చిన భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం సంభవించి కారు బోనెట్ నుంచి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన భక్తులు వెంటనే బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఏలూరు జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మంగళవారం సత్యదేవుని దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఘాట్‌రోడ్ రెండో మలుపులో కారు ఇంజిన్ నుంచి పొగ రావడాన్ని గమనించి పక్కకి ఆపి అందరూ దిగిపోయారు. కారు లోపలకు మంటలు వ్యాపించడంతో స్టీరింగ్ వద్ద ముందు భాగం కాలిపోయింది. వెంటనే తమ వద్ద నున్న వాటర్ బాటిళ్లలోని నీళ్లతో మంటలు అదుపుచేశారు. తరువాత వేరే కారులో తమ స్వస్థలానికి చేరుకున్నారు. ఎవరికీ ఏ అపాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారులో వ్యాపించిన మంటలు వెంటనే దిగి తప్పించుకున్న భక్తులు -
పిండినల్లి వల్లే పంటకు నష్టం
ప్రిన్సిపల్ సైంటిస్ట్ సుధారాణి పిఠాపురం: పిండినల్లి ఆశించడం వల్లే పత్తి పంటకు నష్టం వాటిల్లుతోందని, రైతులు జాగ్రత్తలు పాటించి నష్టాలు నివారించుకోవచ్చని ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎస్.సుధారాణి సూచించారు. మంగళవారం గొల్లప్రోలు మండలం దుర్గాడ రైతు సేవ కేంద్రంలో పెద్దాపురం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శర్మ, పిఠాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు పి.స్వాతి తదితరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పలు సూచనలు ఇచ్చారు. దుర్గాడలో వేసిన పత్తి పంటకు పిండి నల్లి ఆశించిందని, దీని నివారణకు ఎసిఫేట్ రెండు గ్రాములు ఒక లీటరు నీటిలో గాని, ట్రోఫీకోనజోల్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని సర్ఫ్ గాని టీ పాలు గాని స్ప్రేయర్ కి 50 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పంట నుంచి తీసిన పత్తిని దుకాణదారులు రూ.50 నుంచి రూ.55కు మాత్రమే కొంటున్నందున నష్టపోతున్నారని, వ్యవసాయ మార్కెట్ కమిటీ పిఠాపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో రూ.71 నుంచి రూ.75 వరకు విక్రయించవచ్చునని, దీనిపై రైతులు అవగాహన పెంచుకోవాలని వారు వివరించారు. పెద్దాపురం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శర్మ మాట్లాడుతూ మినుములు, నువ్వు పంటపై చేయవలసిన సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, రైతులు, ఎంఏఓ కేవీవీ సత్యనారాయణ, రైతు సేవా కేంద్రం సిబ్బంది కె.పద్మిని, ఎస్.దుర్గా దేవి తదితరులు పాల్గొన్నారు. -
108 కిలోల విబూదితో శివయ్యకు అభిషేకం
గండేపల్లి: మండలంలోని ఉప్పలపాడులో ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం 108 కిలోల విబూదితో స్వామి వారిని అభిషేకించారు. ఆలయ పురోహితులు చంద్రమౌళి సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. శతాధిక వృద్ధుడి మృతి జగ్గంపేట: స్వాతంత్య్రోద్యమం నుంచి కూడా రాజకీయాలలో తిరుగుతూ ప్రముఖ నేతల వెంట నడిచిన శతాధిక వృద్ధుడు బూరా చిన అప్పారావు సోమవారం రాత్రి మృతి చెందారు. జగ్గంపేట అంబేద్కర్ నగర్‌కు చెందిన అప్పారావు 1907లో జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రసుత్తం అప్పారావుకు 116 సంవత్సరాలు అని కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో కూతురు బి.సరోజిని వద్ద ఇంటి వద్ద ఉంటున్నారని వారు తెలిపారు. ఆయన మృతికి స్థానిక నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు. 25 వరకూ దూర విద్య అడ్మిషన్లునల్లజర్ల: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈనెల 25 వరకూ టెన్త్, ఇంటర్లకు తత్కాల్ అడ్మిషన్లు చేసుకోవచ్చని దూబచర్ల స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్ అంబటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయాన్ని ఆసక్తిగల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్ పరీక్షల ఫీజుకు రేపే తుది గడువు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు ఈ నెల 21వ తేదీలోగా ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు ఆర్ఐవో ఎన్‌ఎస్‌ఎల్‌వీ నరసింహం మంగళవారం తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో జనరల్, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు ఆ గడువులోగా చెల్లించాలన్నారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో 22 నుంచి డిసెంబర్ ఐదో తేదీలోగా చెల్లించవచ్చన్నారు. -
వచ్చేనెల 8 నుంచి దివ్యాంగుల క్రికెట్ టోర్నీ
సీటీఆర్ఐ: దివ్యాంగుల క్రికెట్ టోర్నీ వచ్చేనెల 8వ తేదీ నుంచి విశాఖలో నిర్వహిస్తున్నట్టు అఖిల భారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్ అన్నారు. రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ డెవలప్మెంట్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి పల్నాటి బలరామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ వద్ద ఈ టోర్నీ సన్నాహక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోసికుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 8 నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని గాజువాక జింక్ గ్రౌండ్లో పది జిల్లాల దివ్యాంగుల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 98858 64940, 92473 86666 ఫోన్ నెంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 22వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు లాలాచెరువు మైదానంలో ఎంపికలు ఉంటాయన్నారు. బలరామకృష్ణ మాట్లాడుతూ ఈ సదవకాశాన్ని దివ్యాంగులంతా ఉపయోగించు కోవాలని, బుధ, గురు వారాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రపంచ స్థాయి పరిశోధనలు అవసరం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వాణిజ్య పంటల పరిశోధనా కేంద్రంగా సీటీఆర్ఐ రూపాంతరం చెందుతున్న తరుణంలో పరిశోధన కమిటీ సమావేశాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయని, వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. మంగళవారం రెండో రోజు మూడు, నాలుగో సాంకేతిక సమావేశానికి ఆయనతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ డీన్ డాక్టర్ జె.కృష్ణప్రసాద్, సీటీఆర్ఐ పూర్వ డివిజన్ హెడ్ డాక్టర్ యు. శ్రీధర్, ఇన్నోవేషన్ హబ్, ఇక్రిసాట్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. శ్రీకాంత్ నిపుణులుగా వ్యవహరించారు. పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాలను వివరించారు. విశాఖపట్నం గాజువాకలోని జింక్ మైదానంలో నిర్వహణ అఖిల భారత దివ్యాంగుల హక్కుల జాతీయ కార్యదర్శి పోసికుమార్ విజయవంతం చేయాలని జిల్లా కెప్టెన్ బలరామకృష్ణ పిలుపు -
లారీని ఢీకొని భర్త మృతి : భార్యకు గాయాలు
గండేపల్లి: జాతీయ రహదారి పక్కన నిర్లక్ష్యంగా నిలిపిన లారీని ఢీకొని టూ వీలర్‌పై వెళ్తున్న దంపతుల్లో భర్త మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై యూవీ శివనాగబాబు తెలిపిన వివరాల మేరకు కిర్లంపూడి మండలం సోమవరం గ్రామానికి చెందిన చల్ల వెంకటరమణ, భార్య లక్ష్మి మోటార్ సైకిల్‌పై రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తున్నారు. మండలంలోని మురారి శివారు దాబా వద్దకు వచ్చే సరికి రోడ్డు పక్కన నిలిపిన లారీని వెనక నుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమైన వెంకటరమణ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి : ఇద్దరికి గాయాలు ముమ్మిడివరం: మండలం నడిమిలంక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గొల్లల మామిడాడకు చెందిన కోత మెషీన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న యు. అనుకుమార్, యు.అభిషేక్, ఎ.సురేష్ మచిలీపట్నం నుంచి మంగళవారం తెల్లవారుజామున గొల్లలమామిడాడ వెళ్తుండగా మోటార్ సైకిల్ అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనుకుమార్ (23) అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అభిషేక్, సురేష్ ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ జి.జ్వాలాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుక్కల దాడితో లేగదూడ మృతి సామర్లకోట: కుక్కల దాడితో ఒక లేగదూడ మృతి చెందింది. స్థానిక లారీ యూనియన్ కార్యాలయం వద్ద పశువుల మకాంలో ఉన్న సుమారు ఆరు రోజుల లేగదూడపై సోమవారం రాత్రి సుమారు పది కుక్కల వరకు దాడి చేశాయని రైతు పుట్టా వీర్రాజు తెలిపాడు. తాను కర్రతో ఎంత బెదిరించినా వదలకుండా లేగదూడను తీవ్రంగా గాయపరచడంతో అది మృతి చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు నెల రోజల క్రితం 8 రోజుల లేగదూడపై దాడి చేసి చంపేశాయని, కుక్కలు గుంపులు, గుంపులుగా రావడంతో జనం రోడ్లపై ఒంటిరిగా రాత్రి సమయంలో తిరగడానికి బయపడుతున్నారన్నారు. రెండు రోజుల క్రితం విధులకు వెళ్తున్న దేవదాయశాఖ ఉద్యోగి కుక్కకాటుకు గురయ్యారు. -
ప్రజల్లో అవగాహన పెంచాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ‘శాంతి కోసం ఒక ప్రదేశం’ అనే సందేశాత్మక నినాదంతో 2024 మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాల చేపడతామని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా నీరు, పారిశుధ్య కమిటీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య విభాగం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామీణ, పట్టణ ప్రాంతాలో పారిశుధ్య నిర్వహణ వ్యవస్థను మెరుగు పరుచుకోవాలన్నారు. డీఆర్డీఏ ద్వారా మహిళల, ప్రజల భాగస్వామ్యం చేసి మరుగుదొడ్ల వినియోగం పెంచాలన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ సామర్థ్యం పెంచడం ద్వారా గ్రామ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేయాలన్నారు. పాఠశాల, అంగన్వాడీలు, ప్రభుత్వ ఆసుపత్రిల స్థాయిలో టాయిలెట్ నిర్వహణలో పోటీలు నిర్వహించాలన్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి 10 వేల రూపాయల నగదు పురస్కారం అందించాలని సూచించారు. జిల్లాలో చురుకై న పాత్ర పోషిస్తున్న ఆరుగురు పారిశుధ్య కార్మికులను కలెక్టర్ సత్కరించారు. గంజే వీరమ్మ, నల్లేపు సింహాచలం, పేరంపాలి వీరాస్వామి, ఏ బేబి, మేరీ, విజయలను జిల్లాలోని అన్ని విభాగాల్లో పారిశుద్య కార్మికుల సేవలకు గుర్తింపుగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రశాంతి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో పారిశుధ్య కార్మికులకు సన్మానం -
నేత్రపర్వంగా భీమేశ్వరుని జల విహారం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రంలోని బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి తెప్పోత్సవం మంగళవారం రాత్రి నేత్ర పర్వంగా జరిగింది. కార్తిక మాసంలో స్వామి వారి జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకొని ప్రతీ ఏడాది ఆలయ కోనేరులో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రాత్రి స్వామి,అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను బ్యాండ్ మేళాలు వేద మంత్రాల మధ్య ఆలయ కోనేరు వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకొని వచ్చారు. పూలతో అలంకరణ చేసిన వేదికపై స్వామివారి అమ్మవారి విగ్రహాలను ఉంచి ఆలయ పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పారిశ్రామిక వేత్త వీరేంద్ర, నిమ్మకాయల రంగనాథ్, ఈఓ భళ్ల నీలకంఠం దంపతులు వేదికపై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పండితులు పూజలు చేసి వేదికపై ఆశీనులైన వారికి ఆశీర్వచనాలు అందజేశారు. బాణసంచా కాల్పుల మధ్య స్వామి,అమ్మవార్లను ఆలయ కోనేరులో విద్యుత్తు దీపాలంకరణతో ఏర్పాటు చేసిన హంస వాహనంపై ఉంచి వేదపండితుల ఆధ్వర్యంలో తెప్సోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మూడు పర్యాయాలు కోనేరులో స్వామివారి జలవిహారం అత్యంత అద్భుతంగా జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు, ఉత్సవాల ప్రత్యేకాధికారి కేవీ సూర్యనారాయణ, భక్త సంఘం నాయకులు బిక్కిన సాయి, ఆర్వీ సుబ్బరాజు భక్తులకు సేవలందించారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
బారులు తీరిన లారీలు
సీతానగరం: మండల కేంద్రమైన సీతానగరం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుక లారీలు నిలిచాయి. మంగళవారం ఉదయం సీతానగరం పెట్రోల్ బంక్ నుంచి ముగ్గళ్ళ వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లారీలు ఇసుక కోసం నిలిచిపోయాయి. మూడు రోజులుగా వంగలపూడి ఓపెన్ రీచ్‌లో ట్రాక్టర్ డ్రైవర్లకు, ర్యాంపు నిర్వాహకులకు రవాణా చార్జీలపై తలెత్తిన వివాదంతో గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో అధిక సంఖ్యలో లారీలు ర్యాంపు వద్దకు చేరుకుని ఇసుక కోసం మూడు రోజులుగా నిలిచిపోయాయి. జాయింట్ కలెక్టర్ చినరాముడు సూచనలతో సోమవారం సాయంత్రానికి సమస్య పరిష్కారం అయింది. మంగళవారం ఉదయం నుంచి గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ట్రాక్టర్లతో స్టాక్ పాయింట్ వద్ద ఇసుకను డంపింగ్ చేశారు. పొక్లెయిన్‌తో లారీలపై ఇసుక ఎగుమతి చేశారు. అయితే ఉదయం నుంచి సీతానగరం నుంచి ముగ్గళ్ళ వరకు వంగలపూడి రీచ్ వద్దకు వెళ్లడానికి లారీలు పెద్దసంఖ్యలో రావడంతో మూడు కిలోమీటర్లు పొడవునా నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్‌లు, ఆటోలు, కార్లు వెళ్లడానికి ఇబ్బంది ఏర్పడిండి. లారీల పక్కన ఉన్న రోడ్డు నుంచి వాహన రాకపోకలు జరపడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై అధికారులు దృష్టి సారించి, గ్రామాల్లో ఎక్కడబడితే అక్కడ లారీలు నిలుపకుండా ర్యాంపుల వద్ద నిలుపుకునేలా నిర్వాహకులు సౌకర్యం కల్పించాలని జనం కోరుతున్నారు. మూడు కిలోమీటర్ల పొడవునా నిలిచిన వైనం -
తెల్ల బంగారానికి నల్లరోజులు
అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం పత్తి పంటకు నష్టం కలిగించే తెగుళ్లు ఉన్నట్టుగా భావిస్తున్నాం. అయితే నష్టం దేనివల్ల జరుగుతోంది, ఎలా జరుగుతోందనే విషయాలు నిర్ధారించడానికి శాస్త్రవేత్తలను పిలిచాం. వారు వచ్చి పంటలు పరిశీలించి నిర్ధారిస్తారు. ఈలోపు రైతులు తొందరపడి పంటను నరికేసుకోవద్దు. కొందరు రైతులు తొందరపడుతున్నారు. నష్టం జరిగినప్పుడు వివరాలు తెలుసుకోకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పటి నుంచీ జాగ్రత్తలు పాటించడం వల్ల కొంతవరకూ నష్టం నివారించుకోవచ్చు. అందుకే ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించడానికి ఏరువాక శాస్త్రవేత్తల ద్వారా సదస్సుల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రస్తుతం నష్టం వాటిల్లుతున్న పంటకు వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. – స్వాతి, అసిస్టెంట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ, పిఠాపురం పిఠాపురం: ఇటీవల వచ్చిన వరదల నుంచి తేరుకుంటున్న పత్తి రైతును తెగుళ్లు, నాసిరకం విత్తనాలు నట్టేట ముంచాయి. పండిన పంట పనికి రాకుండా పోతూండటంతో చేసేదేమీ లేక ఆరుగాలం పండించిన పంటను రైతులు తమ చేతులతో తామే నరికేస్తున్నారు. కాయ కాసినా పత్తి వచ్చే సమయానికి అది పగలకపోవడంతో దిగుబడి లేక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాంగ్ఫుల్ కాటన్, మీడియం స్టేఫుల్ కాటన్, పొట్టి స్టేఫుల్ కాటన్ అనే మూడు పత్తి రకాలను ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో సుమారు 400 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా 200 ఎకరాల్లో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతు చిక్కని తెగుళ్లు, నాసిరకం విత్తనాల వల్లే ఇలా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అధికారుల ద్వారా వచ్చిన విత్తనాల్లో నాసిరకం ఉండవచ్చని రైతులు అంటున్నారు. అయితే, వారి ఆరోపణలను అధికారులు కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి జిల్లాలో పత్తి పంటకు ప్రమాదం పొంచి ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలి డబ్బు కూడా రాని దుస్థితి జిల్లాలోని గొల్లప్రోలు, జగ్గంపేట, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రంగంపేట తదితర మండలాల్లో సుమారు 11,850 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. పత్తి పంటకు సాధారణంగా కాయ తొలుచు పురుగు సోకడం, దాని నివారణకు మందులు పిచికారీ చేయడం జరిగేది. కొన్నేళ్ల క్రితం వరకూ గులాబీ రంగు కాయ తొలుచు పురుగు (పింక్‌బాల్ వార్మ్) పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగించేది. వివిధ రకాల మందులు పిచికారీ చేయడం ద్వారా దీనిని పూర్తిగా నివారించగలిగారు. అప్పటి నుంచీ దాని ప్రభావం తగ్గి రైతులకు దిగుబడి ఆశాజనకంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లాలో గొల్లప్రోలు మండలంలో పత్తి పంట కాయ కాసినా అది పగిలి పత్తి రావాల్సి ఉండగా అలా జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి కోసే కూలీకి రోజుకు రూ.500 ఇవ్వాల్సి ఉండగా ఒక్కో కూలీ రోజుకు 10 నుంచి 20 కేజీల వరకూ పత్తి కోస్తూంటారు. కానీ ప్రస్తుతం కాయ పగిలి పత్తి రాకపోగా కోసేటప్పుడు కాయ నుంచి పత్తితో పాటు కాయ కూడా వస్తూండటం, పత్తి తక్కువగా రావడంతో ఒక్కో కూలీ రోజుకు రెండు కేజీలు కూడా కోయలేకపోతున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో రూ.500 కూలీకి ఖర్చు చేస్తే రూ.110 విలువైన పత్తి మాత్రమే వస్తోందని, దీంతో కోయడం ఆపేసి పత్తి పంటను నరికేస్తున్నామని రైతులు చెబుతున్నారు. భారీ నష్టమే ఎకరానికి రూ.40 వేలు పెట్టుబడి పెట్టగా రూ.30 వేలు కౌలు ఇస్తున్నామని, ఇతర ఖర్చులు కలిపి ఎకరానికి రూ.80 వేల వరకూ పెట్టుబడి అవుతోందని, ప్రస్తుతం రూ.8 వేలు కూడా రాని పరిస్థితి ఎదురైందని రైతులు వాపోతున్నారు. ఒక్క గొల్లప్రోలు మండలంలోనే సుమారు 200 ఎకరాల వరకూ పత్తి పంట నష్టాల పాలవ్వడంతో రూ.1.60 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పంట నరికించేస్తున్నాను నేను ఒక ఎకరంలో పత్తి సాగు చేశాను. విత్తనాలు వేసే నాటి నుంచి చాలా జాగ్రత్తలు పాటించాను. కానీ పంట చేతికి వచ్చే సమయానికి అంతా మాయగా మారిపోయింది. పత్తి చేనులో కాయలు కనిపిస్తున్నాయి. కాని అవి పగలడం లేదు. పత్తి రావడం లేదు. ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు. విత్తనాల్లో తేడాలనుకుంటున్నాం. దీనికి తోడు పంటపై తెగుళ్లు ప్రభావం చూపించి ఉండవచ్చు. ఎకరానికి రూ.80 వేల పెట్టుబడి పోయింది. చేసేదేమీ లేక ఉన్న పంటను కూలీలను పెట్టి నరికించాల్సి వచ్చింది. విత్తనాలపై అధికారులు విచారణ చేయాలి. తెగుళ్లను నిర్ధారించాలి. ఏం చేసినా ఈ పంట మాకు లేనట్టే. ప్రభుత్వం ఆదుకోవాలి. – వెలుగుల సత్యనారాయణ, పత్తి రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి నేను రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. పత్తి కాయలు పేలకపోవడంతో పంటను నరికేస్తున్నా. ఈ పంట పోయినట్టే. రెండో పంట కోసం భూమిని సిద్ధం చేసుకోడానికి ఉన్న పత్తి పంటను నరికేస్తున్నాం. పెట్టుబడి రాకపోగా పంటను నరికించేందుకు తిరిగి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. చేసేదేమీ లేక పండించిన పంటను మా చేతులతో మేమే నరుక్కుంటున్నాం. ఇకపై పత్తి సాగు చేయాలంటే భయం వేస్తోంది. మాకు జరిగిన నష్టంపై అధికారులు విచారణ జరపాలి. కారణం ఏమిటో తెలుసుకోవాలి. మాకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి. – మేడిబోయిన శివ, పత్తి రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం జిల్లాలో పరిస్థితి ఇలా.. సాగు 11,850 ఎకరాల్లో రైతులు 8,890 మంది ఏటా దిగుబడి 2,13,300 క్వింటాళ్లు రైతుకు వి‘పత్తి’ పత్తి పంటను తెగనరుకుతున్న వైనం దిగుబడి దెబ్బతీస్తున్న తెగుళ్లు కాయ పగలక పత్తి రాని పరిస్థితి రైతును నట్టేట ముంచిన నాసిరకం విత్తనాలు -
దగా డీఎస్సీ
సాక్షి, రాజమహేంద్రవరం: మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది. అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి నేతలు గద్దెనెక్కాక మాట మార్చడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా.. డీఎస్సీ నోటిఫికేషన్‌పై నేటికీ స్పష్టత ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ఇటీవల శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు డీఎస్సీ నిర్వహిస్తారా..? లేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నోటిఫికేషన్ మాటేంటో? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తొలి సంతకం ఆ ఫైల్‌పై పెడతానన్నారు. ‘ఏరుదాటాక తెప్ప తగలేసిన’ చందంగా ఇప్పుడు ఆ హామీని అటకెక్కించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులను మోసం చేశారు. అదిగో ఇదిగో అంటూ దాటవేత ధోరణి అవలంబిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో న్యాయపరమైన వివాదాలు పరిష్కరించిన అనంతరం డీఎస్సీ ప్రకటన ఉంటుందని చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు నింపుతున్నాయి. అసలు డీఎస్సీ నిర్వహించే ఉద్దేశం ఉందా..? లేదా..? అని ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థుల నిరీక్షణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమను ఉపాధ్యాయు ఉద్యోగాలు వరిస్తాయని భావించిన డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు శిక్షణకు సమాయత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేలకు పైగా అభ్యర్థులు వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందుతున్నారు. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ మరోవైపు కోచింగ్ తీసుకుంటున్నారు. కుటుంబాలను సైతం వదులుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తర్ఫీదు పొందుతున్నారు. ఎలాగోలా డీఎస్సీలో ప్రతిభ చూపి ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని భావించి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాదిగా రూ.వేలకు వేలు కోచింగ్ ఫీజులు చెల్లించి మరీ శిక్షణ పొందుతున్నామని, స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు టెట్ నిర్వహించింది. ఇటీవలే ఫలితాలు సైతం వెలువడ్డాయి. టెట్ ప్రక్రియ సైతం పూర్తవడంతో ఇక డీఎస్సీ నిర్వహణకు మార్గం సుగమమైందన్న భావన అభ్యర్థుల్లో నెలకొంది. అయినా వారి ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. జిల్లాలో ఇలా.. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 19 మండలాల పరిధిలో సుమారు 1,008 ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 650లకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు గతంలో అధికారులు లెక్కలు తీశారు. అయితే 2025 డిసెంబర్ వరకు ఏర్పడే ఖాళీలను అనుసరించి డీఎస్సీ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రక్రియతో మరో 200 పోస్టుల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. సర్దుబాటులోనూ గందరగోళం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక డీఎస్సీ నిర్వహించాల్సిన సమయం ఆసన్న కావడంతో ఎలాగోలా మెగా డీఎస్సీని కాలయాపన చేసేందుకు ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సర్దుబాటుకు ఉన్న అర్థాన్నే మార్చేశారని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వర్క్ అడ్జెస్ట్మెంట్ (సర్దుబాటు) అంటే ఒకటి లేదా రెండు నెలల పాటు మిగులు టీచర్లను అవసరమైన చోట తాత్కాలికంగా వినియోగించుకోవడం. టీడీపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపించింది. సర్దుబాటులో భాగంగా ఉపాధ్యాయులు బదిలీ అయిన స్థానంలో ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకూ (వచ్చే ఏడాది ఏప్రిల్ 23) అదే స్థానంలో కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాల విభజన జరిగింది. అందుకు అనుగుణంగా చేపట్టకుండా ఉమ్మడి జిల్లా కేంద్రంగా ప్రక్రియ సాగనుండటం ఉపాధ్యాయులకు మింగుడు పడని అంశంగా మారింది. ఈ విషయమై ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రద్దు కాని జీవో ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించిన జీవో 117న తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అదే జీఓ ప్రకారం ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నోటిఫికేషన్ వెంటనే వెలువరించాలి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లలో ఉంటూ శిక్షణ పొందుతున్నారు. రూ.వేలు వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. –డాక్టర్ ఎంవీవీ బ్రహ్మానందరెడ్డి, ఏపీటీపీఐఈఏ, రాష్ట్ర అధ్యక్షుడు మెగా డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం రోజుకో ప్రకటన నిరుద్యోగులతో కూటమి సర్కారు ఆటలు ఎన్నికల సమయంలో ఊరించి.. ఉసూరుమనిపించి.. తాజాగా మంత్రి లోకేష్ ప్రకటనతో మరింత ఆందోళన అసలు డీఎస్సీ నిర్వహిస్తారా? లేదా? అన్న సందేహాలు జిల్లా వ్యాప్తంగా 650కు పైగా టీచర్ పోస్టుల ఖాళీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థుల ఎదురుచూపులు