Nagarkurnool District News
-
రసాభాసగా మున్సిపల్ సమావేశం
నాగర్‌కర్నూల్: అభివృద్ధి అంశాలను ఎజెండాలో చేర్చి వాటి గురించి చర్చించి ఆమోదించేందుకు నిర్వహించే నాగర్‌కర్నూల్ మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ కల్పన ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చించాల్సిన కౌన్సిలర్లు తమకు రావాల్సిన బిల్లుల గురించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. దీనితో మున్సిపల్ సమావేశం కాస్త గందరగోళంగా మారింది. మరో 20 రోజుల్లో మున్సిపల్ పాలకవర్గం ముగిసిపోతుండడంతో ప్రధానంగా బిల్లుల అంశంపైనే దృష్టిపెట్టారు. ఎజెండాలో 21 అంశాలను చేర్చి వాటిపై చర్చించి ఆమోదించాల్సి ఉండగా దాదాపు రెండు గంటలకు పైగా చర్చను పక్కదారి పట్టించారు. చివరకు రూ.2.70 కోట్ల నిధులతో వైకుంఠ రథం, రెండు ట్రాక్టర్లు, పది ఆటోల కొనుగోలు వంటి వాటిని టేబుల్ ఎజెండా కింద ప్రతిపాదనలు పెట్టి ఆమోదించారు. ఇక సిబ్బంది జీతాల విషయంలోనూ ఒక్కొక్కరికి ఒక్కోలా చెల్లిస్తున్నారని, గతంలో పెంచుతామని చెప్పినా ఇప్పటికీ వాటి ఊసే లేదని సమావేశం దృష్టికి తీసుకురావడంతో జీఓ ప్రకారం సిబ్బంది అందరికీ ఎంత జీతం రావాలో అంత వేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
డిండి నిర్వాసితులను ఆదుకుంటాం
చారకొండ: డిండి నార్లాపూర్ లిఫ్టు ఇరిగేషన్లో భూములు కోల్పోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మండలంలోని కమాల్‌పూర్ పంచాయతీ నూకలచింతవాడికతండాలో డీఎల్ఐ కాల్వ అలైన్‌మెంట్‌ను శుక్రవారం ఆయన పరిశీలించి స్థానిక రైతులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అలైన్‌మెంట్‌ను పరిశీలించడంతో తండా రైతులు తమ వ్యవసాయ భూములు కోల్పోతున్నామని తమను ఆదుకోవాలని వేడుకున్నారు. గత ప్రభుత్వం తండాలో డీఎల్ఐ లిఫ్టు ఇరిగేషన్లో 42 ఎకరాలు అలైన్మెంట్ చేసి, రైతులకు రూ.5.50 లక్షల నష్టపరిహారం అందించిందన్నారు. ఈ పరిహారంతో ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయామని, ప్రస్తుతం అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ విషయమై స్పందిస్తూ రైతులు నష్టపోకుండా వీలైనంత తక్కువ పొలాలు నిర్మాణంలో పోయేలా అలైన్మెంట్ మారుస్తామని, నష్టపోయిన రైతులకు మరింత ఎక్కువ నష్టపరిహారం అందేలా కృషిచేస్తానన్నారు. అక్కడి నుంచే ఎమ్మెల్యే ఇరిగేషన్ ఏఈ, డీఈలతో ఫోన్లో మాట్లాడి రైతులు నష్టపోకుండా అలైన్‌మెంట్‌ను మరోసారి చేపట్టాలని సూచించారు. అనంతరం తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ గన్యానాయక్ను ఎమ్మెల్యే పరామర్శించారు. అభివృద్ధి పనులకు భూమిపూజ ఎమ్మెల్యే వంశీకృష్ణ శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ డేరం రామశర్మతో కలిసి ఆలయ ప్రాంగణంలో సామూహిక మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, ఆర్ఐ భరత్, సింగిల్ విండో చైర్మన్ గుర్వయ్యగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వెంకట్‌గౌడ్, భీముడునాయక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాల్‌రాంగౌడ్, నాయకులు లక్ష్మణ్, శంకర్‌గౌడ్, జైపాల్, శ్రీపతిరావు, సహదేవ్, దశరథం, భీమదాస్ పాల్గొన్నారు. -
చిక్కులు తొలగేనా..!
జిల్లాల వారీగా పెండింగ్ సమస్యలు ఇలా.. ‘భూభారతి’పై ఎన్నో ఆశలు ● ‘ధరణి’ సమస్యలకు పరిష్కారం చూపేనా.. ● పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలిగేనా.. ● ఉమ్మడి జిల్లాలో 25,218 సాదాబైనామా అర్జీల పెండింగ్ ● ఇతర సమస్యలపై సుమారు 9,263.. ● మార్గదర్శకాలపై రైతుల్లో ఆసక్తి జిల్లా సాదాబైనామా ఇతరత్రా దరఖాస్తులు దరఖాస్తులు మహబూబ్‌నగర్ 4,217 2,000 నాగర్‌కర్నూల్ 8,187 3,544 నారాయణపేట 2,102 1,113 జోగుళాంబ గద్వాల 6,412 1,236 వనపర్తి 4,300 1,370 -
సావిత్రిబాయి ఆశయ సాధనకు కృషి
నాగర్‌కర్నూల్: సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం శ్రమించిన సావిత్రిబాయి ఫూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన ఘనమైన నివాళి అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అధికారికంగా నిర్వహించిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్ర విద్యపై ప్రప్రథమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. కుల వ్యవస్థ, పితృస్వామ్యం, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి అందరికీ ఆదర్శం అన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పుణెలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారన్నారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సమష్టిగా పోరాటం చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ సావిత్రిబాయి ఆశయాల సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రీబాయి ఫూలే పునాది వేశారని, మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని ఆర్పించారని పేర్కొన్నారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. సావిత్రీబాయి ఆశయాల సాధనకు మహిళా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని, ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా వారిలో నైపుణ్యాల వృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు. డీఈఓ రమేష్‌కుమార్ మాట్లాడుతూ సీ్త్ర విద్యాభివృద్ధికి కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించామని చెప్పారు. అనంతరం పలువురు మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్, ఎమ్మెల్యే, డీఈఓలు శాలువాతో సత్కరించారు. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కీర్తన సావిత్రిబాయి పూలే వేషధారణతో ఆకట్టుకోగా కలెక్టర్, ఎమ్మెల్యే అభినందించారు. -
విరబూసిన మామిడి
మొదటి దశలో దెబ్బతిన్నా.. నిలిచిన రెండో దశ పూతలు ఆశాజనకంగా పూతలు ప్రతి ఏటా మామిడి పూతలు నవంబర్ నెల నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈసారి నవంబర్‌లో వచ్చిన మొదటి పూతలు వాతావరణ మార్పుల కారణంగా చాలా చోట్ల దెబ్బతిన్నాయి. డిసెంబర్ నెలలో వచ్చిన రెండో దశ పూతలు నిలిచాయి. కొన్ని చోట్ల ఇంకా మొగ్గ దశలోనే పూతలు ఉన్నాయి. అయితే గతంలో కంటే ఈసారి పూతలు సమృద్ధిగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. పూతలు నిలిస్తే మామిడి దిగుబడులు ఈ ఏడాది భారీగా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తేమ, చల్లటి గాలులతో.. మామిడి పంటకు ప్రధానంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి. చలికాలంలో తేమ, చల్లటి గాలులు అధికంగా ఉంటే పూతకు పురుగు ఆశించి నష్టం చేకూరుస్తుంది. ఇటీవల కాలంలో వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్య మార్పుల కారణంగా పూతలు కొన్నిచోట్ల మాడిపోయాయి. మిగిలిన పూతలకు చీడపీడలు ఆశిస్తున్నాయి. ప్రధానంగా తేనె మంచు పురుగు, పక్షి కన్ను తెగులు, ఆకుచుట్టు పురుగు, బూడిద తెగులు, నల్లి తామర, మసిరంగు తెగులు తోటలను ఆశిస్తున్నాయి. వీటి నివారణకు రైతులు రూ.వేలు వెచ్చించి రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. మామిడి దిగుబడిపై రైతులకు ఆశలు చిగురిస్తున్నప్పటికీ.. చీడపీడలు వారిని కలవరానికి గురిచేస్తున్నాయి. కొల్లాపూర్: జిల్లాలో ఈ ఏడాది మామిడి తోటలు రైతులను ఊరిస్తున్నాయి. మామిడి పూతలు విరగబూశాయి. మొదటి దశ పూతలు దెబ్బతిన్నప్పటికీ.. రెండో దశ పూతలు బాగా రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో తరుచుగా ఇబ్బందులు పెడుతున్న వాతావరణ మార్పులు తోటలపై మరోసారి ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు చీడపీడల బాధలు ప్రారంభమయ్యాయి. వీటి నివారణకు సస్యరక్షణ చర్యలే మార్గమని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. నియోజకవర్గం సాగు విస్తీర్ణం దిగుబడి అంచనా (ఎకరాల్లో) (మెట్రిక్ టన్నులు) కొల్లాపూర్ 25,237 1,00,946 కల్వకుర్తి 4,547 18,188 నాగర్‌కర్నూల్ 2,510 10,042 అచ్చంపేట 2,418 9,672 జిల్లాలో మామిడి సాగు వివరాలు ఇలా.. వాతావరణ మార్పులతో తప్పని చీడపీడల బెడద వాతావరణం అనుకూలిస్తేనే మంచి దిగుబడులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటున్న ఉద్యాన శాఖ అధికారులు జిల్లాలో 34,712 ఎకరాల్లో మామిడి తోటల సాగు -
సమష్టి కృషితోనే జిల్లా సమగ్రాభివృద్ధి
నాగర్‌కర్నూల్: అన్నిశాఖల అధికారులందరూ కలిసికట్టుగా పనిచేస్తూ.. జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులందరూ నూతనోత్సాహంతో పనిచేసి, అర్హులకు సంక్షేమ పథకాల అమలులో జిల్లాను ముందు వరుసలో నిలపాలని కోరారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని కాంక్షించారు. యువత సన్మార్గంలో పయనిస్తూ.. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా అధికారులు చిన్న ఓబులేషు, రాంలాల్, స్వరాజ్యలక్ష్మి, రామ్మోహన్రావు, ఖాజా అప్సర్అలీ, శ్రవణ్‌కుమార్, రమాదేవి, శ్రీనివాసారెడ్డి, సీతారాం నాయక్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు, వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు. -
‘నకిలీ’లపై విచారణ
సాక్షి, నాగర్‌కర్నూల్/మన్ననూర్: జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందినట్లు వస్తున్న ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. బోగస్ ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్, నకిలీ స్థానికత సర్టిఫికెట్లు చూపించి కొందరు వ్యక్తులు అటవీశాఖ, పోలీస్‌శాఖ, ఏఈఈ, డీఎస్సీ ఉద్యోగాల్లో చేరినట్టు వచ్చిన ఫిర్యాదులపై గత డిసెంబర్ 23న ‘అక్రమంగా ఉద్యోగాలు’ శీర్షికన ‘సాక్షి’ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు గురువారం అధికారులు విచారణ చేపట్టారు. మన్ననూర్లోని ఐటీడీఏ కార్యాలయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల సర్టిఫికెట్లను రాష్ట్ర గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధికారిణి నీల నేతృత్వంలో ఐటీడీఏ ఇన్చార్జి పీఓ రోహిత్‌రెడ్డి, ఆర్డీఓ మాధవి, డీటీడీఓ ఫిరంగి, పదర తహసీల్దార్ సురేష్ బాబు, ఐటీడీఏ ఏఓ జాఫర్ హుస్సేన్‌తో కూడిన అధికారుల బృందం పునఃపరిశీలించింది. నకిలీ ఏజెన్సీ ధ్రువపత్రాలు పొందుపరిచి అటవీశాఖలో ముగ్గురు, పోలీస్ శాఖలో ఒకరు, విద్యాశాఖలో మరొకరితో కలిపి మొత్తం 10 మంది వరకు అక్రమంగా ఉద్యోగాలు పొందినట్లు గుర్తించి.. ఏటీడీఏ పీఓ చాంబర్లో ఒక్కొక్కరిని వేర్వేరుగా విచారించారు. ఉద్యోగం పొందిన సమయంలో సమర్పించిన ధ్రువపత్రాలు నిజమైనవేనా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, విచారణ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న మీడియాను అనుమతించలేదు. విచారణ పకడ్బందీగా కొనసాగుతోందని.. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐటీడీఏ ఇన్చార్జి పీఓ రోహిత్‌రెడ్డి తెలిపారు. -
15 నుంచి ఉమామహేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
అచ్చంపేట రూరల్/అమ్రాబాద్: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో ఈ నెల 15నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయ పాలక మండలితో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ● అమ్రాబాద్ మండలంలోని తెలుగుపల్లి ఆంజనేయస్వామి ఆలయంతో పాటు అటవీ ప్రాంతంలోని అంతర్గంగ శివాలయాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో పురాతన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం నల్లమలను సందర్శించి పర్యాటకానికి అనువైన ప్రాంతాలను పరిశీలించినట్లు చెప్పారు. అంతేకాకుండా రూ. 7,700 కోట్లతో మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు హైవేతో పాటు ఎలివేటెడ్ కారిడార్ మంజూరైందని అన్నారు. ముఖ్యంగా మద్దిమడుగు సమీపంలోని కృష్ణానదిపై వంతెన నిర్మాణం, రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ భీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు కట్ట శేఖర్‌రెడ్డి, పవన్, వినోద్, అర్చకుడు వీరయ్యశాస్త్రి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరినారాయణగౌడ్, వెంకటయ్య, ముక్రాంఖాన్, మనోహర్, వెంకటయ్య, శ్రీశైలం పాల్గొన్నారు. -
ఔట్‌సోర్సింగ్‌లో అక్రమాలు..!
‘జిల్లాలో ఔట్సోర్సింగ్ నియామకాలకు సంబంధించిన ఓ ఏజెన్సీ తమ పరిధిలోని ఉద్యోగులకు కొన్ని నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదు. ఫలితంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన బకాయిలు, జీతాలు సక్రమంగా అందడం లేదు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో సదరు ఏజెన్సీని నియామకాల ప్రక్రియ నుంచి తప్పించారు. జిల్లాలో ఇలాంటి ఏజెన్సీల ఆగడాలు శృతిమించుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.’ – సాక్షి, నాగర్కర్నూల్జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగుల నియామకంలో కీలకంగా వ్యవహరించే ఏజెన్సీల్లో కొన్ని అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సక్రమంగా ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఔట్సోర్సింగ్ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా.. కొన్నిసార్లు నోటిఫికేషన్ ఇవ్వకుండానే తమ ఇష్టానుసారంగా నియామకాలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఉద్యోగుల జీతంలోనూ కోత..జిల్లాలో మొత్తం 26 లైసెన్స్డ్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు 15 వరకు ఏజెన్సీలకు ప్రభుత్వం ఔట్సోర్సింగ్ నియామక ప్రక్రియ బాధ్యతలను అప్పగించింది. ప్రధానంగా అటవీ, ఆరోగ్యశాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ తదితర శాఖల్లో సుమారు 550 వరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ ఆయా ఏజెన్సీలు నిబంధనల ప్రకారం ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు చేయడం లేదు. అలాగే ఉద్యోగుల జీతంలోనూ కోత పెడుతూ.. అందినకాడికి దండుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.కొరవడిన సమన్వయం..ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులను కార్మిక శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే వీరికి జీతభత్యాల చెల్లింపులను ఆయా శాఖల విభాగాధిపతులు, డీడీఓలు తనిఖీ చేసి, మంజూరు చేయాల్సి ఉంది. ఏజెన్సీల గుర్తింపు, నియామకాల ప్రక్రియ, ఏజెన్సీలకు కేటాయింపు తదితర బాధ్యతలను ఎంప్లాయింట్ అధికారులు నిర్వర్తిస్తారు. అయితే ఏజెన్సీల నిర్వహణలో ఆయా శాఖల మధ్య సమన్వయలోపం కన్పిస్తోంది. బాధితులు తమ సమస్యల కోసం ఆయా శాఖల అధికారులకు నివేదిస్తే.. తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు. జిల్లాలోని ఔట్సోర్సింగ్ నియామకాల ప్రక్రియ, ఏజెన్సీలపై ఉన్నతాధికారులు దృష్టిసారించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.అధికారులతో కుమ్మకై వసూళ్లు..నిరుద్యోగుల ఆశలను అవకాశంగా చేసుకొని కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు అక్రమ దందాలకు పాల్పడుతున్నాయి. పలు ప్రభుత్వ శాఖల్లో ఏర్పడిన ఖాళీల్లో ప్రభుత్వం నేరుగా నియామకాలు చేపట్టకుండా, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల తరఫున తాత్కాలిక ప్రతిపాదికన ఉద్యోగులను నియమించుకుంటోంది. అయితే ఇదే అదనుగా కొన్ని ఏజెన్సీలు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో శాఖను బట్టి నిరుద్యోగి నుంచి రూ. 20వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తూ దందాను సాగిస్తున్నాయి. వీటిలో సంబంధిత శాఖల అధికారులను సైతం ఏజెన్సీల నిర్వాహకులు ‘మేనేజ్’ చేసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.●నిబంధనల ప్రకారం చేస్తున్నాం..జిల్లాలో నిబంధనల మేరకు ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు నియామక ప్రక్రియను అప్పగించాం. పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపు విషయంలో ఆయా శాఖల డీడీఓలదే బాధ్యత. నిబంధనలు పాటించి ఏజెన్సీలపై ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం.– రాఘవేందర్,జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి -
‘సదరం’ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోండి
నాగర్‌కర్నూల్‌రూరల్: సదరం సర్టిఫికెట్ల రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శారీరక దివ్యాంగులకు ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వినికిడి లోపం ఉన్న వారికి 20న, కంటిలోపం గల దివ్యాంగులకు 9నుంచి 27వ తేదీ వరకు, మానసిక దివ్యాంగులకు 8 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించి.. అర్హులైన వారికి సదరం సర్టిఫికెట్లు రెన్యువల్ చేస్తారని తెలిపారు. మీసేవ కేంద్రాల్లో శుక్రవారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ భద్రత కల్పించండి కందనూలు: జిల్లా కేంద్రంలో సమగ్రశిక్ష ఉద్యోగులు గురువారం మహా ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కోసం 24 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు విష్ణు, శివలింగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హామీలను అమలుపర్చాలి నాగర్‌కర్నూల్‌రూరల్: సివిల్ సప్లై హమాలీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపర్చాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లై స్టాక్ పాయింట్ వద్ద హమాలీల నిరవధిక సమ్మెను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు చెల్లించే ఎగుమతి, దిగుమతి రేట్ల ఒప్పందం డిసెంబర్ 2023తో ముగిసిందన్నారు. రేట్ల పెంపుకై కార్మిక సంఘాల సమక్షంలో అధికారులు గతేడాది అక్టోబర్ 3న చర్చలు జరిపినట్లు చెప్పారు. రూ. 26 ఉన్న రేటును రూ. 29 వరకు అదనంగా పెంచారని.. ఆ రేట్లను 2024 జనవరి నుంచి అమలు చేస్తామని.. ఏరియర్స్‌తో సహా చెల్లిస్తామని.. మహిళా స్వీపర్లకు గోదాముల సామర్థ్యం మేరకు ప్రస్తుతం ఉన్న వేతనంపై రూ. వెయ్యి అదనంగా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు హామీల అమలుకు తక్షణమే జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీలు పాల్గొన్నారు. -
మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు
‘ఇందిరా మహిళాశక్తి’లో ఉపాధి అవకాశాలు అచ్చంపేట: మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా 17 రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ప్రభుత్వ స్థలాల్లో మహిళాసంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 వేల ప్లాంట్లను కేటాయించనుండగా.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 350 యూనిట్ల వరకు వచ్చే అవకాశం ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వమే భూమిని సమకూర్చి రుణ సదుపాయం కల్పించనుంది. స్వయం సహాయక సంఘాలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుంటే జిల్లావ్యాప్తంగా సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఆశించిన మేరకు ప్రభుత్వ భూములు జిల్లాలో ఉన్నాయి. మహిళా సంఘాలకు భూములను తక్కువ లీజుకు కేటాయించే అవకాశముంది. ఒక్క మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 4 ఎకరాల స్థలం అవసరం. ఒక్కో ప్లాంట్ రూ.3 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో 10 శాతం మహిళా సంఘాలు చెల్లిస్తే 90 శాతం బ్యాంక్ రుణం ఇప్పించనున్నారు. స్థలాల ఎంపిక కోసం ప్రతిపాదనలు ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి డీఆర్డీఓ కార్యాలయాల నుంచి తహసీల్దార్లకు ప్రభుత్వ స్థలాల ఎంపిక కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్లకు ఐదు మండలాల్లో స్థలాల ఎంపిక పూర్తి చేశారు. 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు 2 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే స్థలాలను ఎంపిక చేయాలని నిబంధన పెట్టారు. ఆయా మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణపై త్వరలో శిక్షణ ఇప్పించనున్నారు. ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం పొదుపు సంఘాల మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళా శక్తి పేరుతో మహిళల వ్యాపారాల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టింది. ఈమేరకు ఇప్పటికే ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు అన్ని జిల్లాలకు లక్ష్యాలను నిర్దేశించిగా వాటిపై ఆసక్తి ఉన్న మహిళల వివరాలు సేకరించి అందులో ప్రోత్సాహం కల్పిస్తోంది. శిక్షణ ఇప్పిస్తాం నాగర్‌కర్నూల్ జిల్లాలో రెవెన్యూ అధికారుల సహకారంతో 5గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల ఎంపిక చేశాం. ఆయా గ్రామాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పిస్తాం. మరికొన్ని చోట్ల స్థలాలు లభిస్తే సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రణాళికలు పంపనున్నాం. – ఓబులేష్, డీఆర్డీఓ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 350 యూనిట్లు 10 శాతం సభ్యుల వాటా.. మిగతాది బ్యాంక్ రుణం ఒక్కో యూనిట్ రూ.3.13 సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్‌కు రూ.3.13 చొప్పున ధర డిస్కమ్‌ల(విద్యుత్ ఉత్పత్తి సంస్థల)తో ప్రభుత్వమే కొనుగోలు చేయిస్తుంది. దీంతో మహిళా సంఘాలకు ఏడాదికి సుమారుగా రూ.30లక్షల ఆదాయం వస్తుందని అంచనా. -
ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన
అచ్చంపేట రూరల్: పట్టణంలోని సర్వేనంబర్ 293లో గల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దేశ్యానాయక్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కార్యాలయంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ గైరాను భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని వివరించారు. ఆ భూమిని ప్లాట్లుగా మార్చారని తెలిపారు. రూ. 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వము వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు. పేదలకు భూమి పంచే వరకు సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అలాగే పట్టణంలోని వలపట్ల కాలనీకి చెందిన ఎంబీ జాయిన చర్చికి ఆ స్థలం కేటాయించాలని విన్నవించారు. కార్యక్రమంలో మల్లేష్, శంకర్‌నాయక్, నాగరాజు, నిర్మల, రాములు, ప్రభాకర్, జాన్‌రాజు, సీమోను, అనీల్, స్వామి, సుధాకర్ పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
కందనూలు/వెల్దండ: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డీఈఓ ఎ.రమేష్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాలలో వంటగది, డార్మెంటరీ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అదే విధంగా వెల్దండలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, మోడల్ స్కూల్, బాలికల ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ సూచించారు. అక్కడి నుంచి కేజీబీవీ, బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించి.. వంట సామగ్రి, కూరగాయలు, స్టోర్ గదులను పరిశీలించారు. పదోతరగతి విద్యార్థులకు ప్రణాళికా బద్ధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. ఇన్చార్జి ఎంఈఓ చంద్రుడు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీధర్, హెచ్ఎం సుగుణ ఉన్నారు. ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు చెల్లించండి.. తెలంగాణ ఓపెన్ స్కూల్ (టాస్)లో చదువుతున్న విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 9నుంచి 22వ తేదీలోగా పరీక్షల ఫీజు చెల్లించాలని డీఈఓ రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ. 25తో 29వ తేదీ వరకు, రూ. 50 రుసుముతో ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 నుంచి హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివకుమార్‌ను సంప్రదించాలని సూచించారు. -
తాగేశారు.. చిక్కారు..
కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షలు నిర్వహించి.. మోతాదుకు మించి మద్యం సేవించిన వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మందు తాగి వాహనాలు నడిపిన 207 మందిని అదుపులోకి తీసుకున్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 93 మంది పోలీసులకు చిక్కారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో చేసిన తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులు 27, టూటౌన్ 8 మంది, జడ్చర్లలో 10, కోయిలకొండ 3, హన్వాడ 3, రాజాపూర్ 8, బాలానగర్ 12, మిడ్జిల్ 3, భూత్పూర్ 4, అడ్డాకుల 6, దేవరకద్ర 3, మహబూబ్‌నగర్ రూరల్, వన్‌టౌన్, మూసాపేట, నవాబ్‌పేట, మహమ్మదాబాద్, చిన్నచింతకుంట స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 14, వనపర్తి టౌన్ 11, కొత్తకోట 7, వనపర్తి రూరల్ 5, గోపాల్పేట 4, పెద్దమందడి 4, ఆత్మకూర్ 3, అమరచింత 3, రేవల్లి 2, పాన్‌గల్, ఖిల్లాఘనపురంలో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో నారాయణపేటలో 6, దామరగిద్ద 2, ధన్వాడ 2, నర్వ 2, మక్తల్ 4, కృష్ణ 3, మాగనూర్, మరికల్, మద్దూరులో ఒక్కో కేసు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో నాగర్‌కర్నూల్ స్టేషన్ పరిధిలో 3, చారకొండలో 2, వెల్దండలో ఒకటి చెప్పున, జోగుళాంబ గద్వాల జిల్లాలో గద్వాల పట్టణం 7, ఉండవెల్లి 8, ఇటిక్యాల 3, కొదండాపురం 2,శాంతినగర్ 6, అయిజ 3, అలంపూర్, రాజోళిలో ఒకటి చొప్పున డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, చారకొండ మండలంలో 2, వెల్దండ మండలంలో ఒకరు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. -
హమాలీల రేట్ల ఒప్పందాన్ని అమలుపర్చాలి
నాగర్‌కర్నూల్‌రూరల్: సివిల్ సప్లై హమాలీల రేట్ల ఒప్పందాన్ని అధికారులు అమలుపర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగుమతి, దిగుమతి రేట్ల ఒప్పందం ప్రకారం హమాలీలకు చెల్లింపులు చేయాలని కోరుతూ ఇప్పటికే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతిపత్రం అందించినట్లు చెప్పారు. అక్టోబర్‌లో ఆ ఒప్పందాన్ని అమలు చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. పౌరసరఫరాల సంస్థ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలుపర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు వర్ధం పర్వతాలు, హమాలీ సంఘం నాయకులు గోపాల్, రవి, చంద్రయ్య, వెంకటయ్య, సుందరయ్య, కృష్ణయ్య ఉన్నారు. -
రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తాం
అలంపూర్: డీసీసీబీ బ్యాంక్ ద్వారా రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తామని ఆ బ్యాంక్ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అలంపూర్ పీఏసీఎస్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో డీసీసీబీ బ్యాంక్‌ల ద్వారా ఈ ఏడాది రూ.1550 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. ఐదెకరాల పొలం ఉన్న రైతులకు కర్షకమిత్ర ద్వారా రూ.10 లక్షలు, మార్టిగేజ్ లేకుండా రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతు లకు ఇంటి నిర్మాణం కోసం రూ.25 లక్షలు, గ్రామా ల పరిధిలో ఉన్న రైతులకు ఇంటి కోసం రూ.15 లక్షల వరకు రుణాలు ఇస్తుందన్నారు. దేశంలో ఎక్కడైనా చదువుకోవడానికి రైతు బిడ్డలకు రూ.10 లక్ష లు, ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తే రూ.35 లక్షల వరకు రుణ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. రైతులకు బంగారంపై 15 నిమిషాల్లో రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న రూ.2 లక్ష ల రుణ మాఫీలో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.29 కోట్లు వచ్చినట్లు తెలిపారు. కాగా, మూడు సొసైటీలు కలిపి రూ. 50కోట్ల లావాదేవీలు పూర్త యిన సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. -
ఆలయాల్లో భక్తుల సందడి
ఉమామహేశ్వరుడి దర్శనానికి బారులుదీరిన భక్తులు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపించాయి. వేకువజామునే మహిళలు ఇంటి ముంగిట కలాపి చల్లి వివిధ ఆకృతుల్లో రంగవల్లులను తీర్చిదిద్దారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రసిద్ధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూకట్టారు. బిజినేపల్లి మండలంలోని వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడిపారు. భక్తులు పెద్దఎత్తున ఆలయాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మరికొందరు న్యూ ఇయర్ కేక్‌లు కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుసుకున్నారు. – సాక్షి నెట్వర్క్ -
ఆపరేషన్ స్మైల్
బాలకార్మికుల ఆపన్నహస్తం●పాఠశాలల్లో చేర్పిస్తున్నాం.. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించిన బాలకార్మికులను సమీపంలోని పాఠశాలల్లో చేర్పిస్తున్నాం. అంతే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. 18 ఏళ్లలోపు పిల్లలతో పనులు చేయించడం నేరం. పాఠశాలల్లో చేర్పించి, వదిలేయకుండా మూడు నెలలపాటు పర్యవేక్షణ చేస్తాం. జనవరి 1 నుంచి నెలరోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. – శ్రీశైలం, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నాగర్‌కర్నూల్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం సత్ఫలితాన్నిస్తోంది. ఎంతో మంది బాలకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వివిధ కారణాలతో చదువుకోకుండా హోటళ్లు, కిరాణా షాపులు, ఇటుక బట్టీలు, బట్టల దుకాణాలు, బైక్ మెకానిక్‌ల వద్ద పనులు చేస్తూ బాలకార్మికులుగా మారిన పిల్లలకు వెట్టి నుంచి విముక్తి కల్పించేందుకు గాను ప్రభుత్వం 2014 నుంచి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం చేపట్టింది. మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీస్, కార్మిక శాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జనవరి, జూలై నెలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి.. 18 ఏళ్లలోపు బాలకార్మికులను గుర్తిస్తున్నారు. బాలల పరిస్థితుల మేరకు సమీపంలోని పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత 2018 జనవరి నుంచి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం కొనసాగుతోంది. 2020 జూలై, 2021 జూలై నెలల్లో కరోనా ప్రభావం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా మొత్తం 450 మంది బాలకార్మికులను గుర్తించి, వివిధ పాఠశాలల్లో చేర్పించారు. ఈ ఏడాది బుధవారం నుంచి మరో విడత ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీ వరకు ఆయా శాఖల అధికారులు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి, బాలకార్మికులను గుర్తించనున్నారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై లేబర్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేయనున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల పిల్లలు పనుల్లో ఉంటే.. వారికి ఇక్కడే చదువులు చెప్పిండం లేదా వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించి, వారి రాష్ట్రంలో చదువుకునే అవకాశం కల్పిస్తారు. గుర్తించిన బాలకార్మికులను పాఠశాలల్లో చేర్పించిన తర్వాత వారిని అలాగే వదిలేయకుండా, వారి తల్లిదండ్రులతో బడులకు పంపేందుకు అంగీకార పత్రాలు కూడా రాయించుకుంటున్నారు. అదే విధంగా బాలల తల్లిదండ్రులకు బాలల హక్కులపై అవగాహన కల్పించి వారిని చదివించే విధంగా సూచనలు చేస్తున్నారు. 2018 నుంచి గుర్తించిన బాలకార్మికుల వివరాలు ఇలా.. సంవత్సరం నెల గుర్తించిన బాలకార్మికులు 2018 జనవరి 23 2018 జూలై 76 2019 జనవరి 29 2019 జూలై 46 2020 జనవరి 104 2021 జనవరి 48 2022 జనవరి 34 2022 జూలై 23 2023 జనవరి 16 2023 జూలై 18 2024 జనవరి 10 2024 జూలై 23 మొత్తం 450 వెట్టి చాకిరీ నుంచి విముక్తి ప్రతి ఏటా జనవరి, జూలైలో అధికారుల విస్తృత తనిఖీలు 2018 నుంచి ఇప్పటి వరకు 450 మంది బాలల గుర్తింపు జిల్లాలో 13వ విడత ప్రారంభం ఇప్పటి వరకు 450 మందికి విముక్తి.. -
సర్వే @ 75%
ఇప్పటి వరకు జరిగిన సర్వే వివరాలు ఇలా.. మున్సిపాలిటీల వారీగా.. మున్సిపాలిటీ దరఖాస్తులు పూర్తి అయినవి అచ్చంపేట 4,450 3,959 కల్వకుర్తి 5,205 4,522 కొల్లాపూర్ 5,757 4,760 నాగర్‌కర్నూల్ 6,940 6,284 కల్వకుర్తిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 75 శాతం మాత్రమే సర్వే పూర్తయింది. గత డిసెంబర్ 5న ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే 7వ తేదీ నుంచి సర్వే చేపట్టాల్సి ఉండగా.. కొంత ఆలస్యంగా 12వ తేదీ నుంచి సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే సర్వేయర్లకు క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం.. దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో సర్వే నత్తనడకన కొనసాగుతోంది. సర్వేకు సాంకేతిక సమస్యలు.. ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ డౌన్, సిగ్నల్ సమస్య ఇబ్బందిగా మారింది. జిల్లావ్యాప్తంగా 2,33,124 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు 1,76,497 ఇళ్ల సర్వే పూర్తయ్యింది. రోజు ఒక్కో అధికారి 50 దరఖాస్తులను పరిశీలించి, మొబైల్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉండగా.. కేవలం 20 నుంచి 30 దరఖాస్తులను మాత్రమే అతి కష్టం మీద పూర్తి చేస్తున్నారు. కనిపించని ఆసక్తి.. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై దరఖాస్తుదారులు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన వివరాలపై దరఖాస్తుదారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఆలస్యం అవుతుంది. గ్రామాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతుండడంతో అందరూ పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇళ్లకు తాళాలు వేస్తుండటంతో అధికారులు సర్వే చేయకుండానే తిరిగి వస్తున్నారు. వందశాతం గగనమే.. ఇందిరమ్మ ఇళ్ల సర్వే గడువులోగా పూర్తి కావడం గగనమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుధవారం నాటికి 75.71 శాతం సర్వే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. అయితే మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో వంద శాతం సర్వే పూర్తి కావడం కష్టసాధ్యమని చెప్పవచ్చు. నేటితో ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే జిల్లాలో 2.33 లక్షల దరఖాస్తులు ఇప్పటి వరకు 1.76 లక్షల ఇళ్ల సర్వే పూర్తి మండలాల వారీగా.. అచ్చంపేట 13,218 10,088 అమ్రాబాద్ 9,680 7,563 బల్మూర్ 11,212 8,969 బిజినేపల్లి 17,847 12,517 చారకొండ 7,284 6,303 కల్వకుర్తి 1,079 8,752 కోడేరు 12,337 8,369 కొల్లాపూర్ 10,247 6,997 లింగాల 10,412 7,383 నాగర్‌కర్నూల్ 10,181 7,799 పదర 6,454 3,929 పెద్దకొత్తపల్లి 16,393 9,224 పెంట్లవెల్లి 6,386 4,663 తాడూరు 8,228 6,585 తెలకపల్లి 13,037 8,938 తిమ్మాజిపేట 10,299 8,935 ఉప్పునుంతల 9,559 8,406 ఊర్కొండ 6,297 4,520 వంగూరు 10,426 7,895 వెల్దండ 11,196 9,137 మొత్తం 2,33,124 1,76,497 ఆప్‌లైన్‌లో వివరాల నమోదు.. మొబైల్ యాప్‌లో వివరాల నమోదుకు సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ప్రభుత్వం ఆప్లైన్కు అవకాశం ఇచ్చింది. సాధ్యమైనంత వరకు సర్వేను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా గృహనిర్మాణ శాఖకు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్ర భుత్వం సంగప్పను నియమించింది. సర్వే వి వరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. ప్రజాపాలనలో దరఖాస్తు చేసు కోని వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసు కోవచ్చు. – రాజవర్దన్‌రెడ్డి, గృహ నిర్మాణశాఖ ఏఈ -
ఎస్సీల స్థితిగతులపై అధ్యయనం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఎస్సీల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర ఎస్సీ కులాల ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ అన్నారు. మంగళవారం కమిషన్ చైర్మన్ మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై అధ్యయనం నిమిత్తం ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులాలు, సంఘాలు, నాయకులతో బహిరంగ విచారణ నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీల అభ్యున్నతి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని స్వయంగా వినతులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బహిరంగ విచారణలో స్వీకరించిన దరఖాస్తులు, అభిప్రాయాలు, ఉద్యోగ, విద్య, రాజకీయ, ఆర్థిక రంగంలో ఎస్సీ కులాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్న అంశాలు, స్థితిగతులపై క్షుణ్ణంగా పరిశీలన, అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. దరఖాస్తు సమర్పించే వారందరూ వ్యక్తిగతంగా గాని, సంఘాలు గాని ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా తమ వినతులు సమర్పించాలని కోరారు. కోర్టు జడ్జిమెంట్ పరిగణలోకి తీసుకొని వీటన్నింటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. ఇది వరకు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లో బహిరంగ విచారణ పూర్తయ్యిందని, జిల్లాల సందర్శన సందర్భంగా దరఖాస్తు సమర్పించలేకపోయిన వారు హైదరాబాద్‌లో నేరుగా కమిషన్‌కు అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు. సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం రాష్ట్ర ఎస్సీ కులాల ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ 160 దరఖాస్తుల స్వీకరణ కాగా షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై నిర్వహించిన బహిరంగ విచారణలో 160 మంది వ్యక్తిగతంగా, కుల సంఘాల పరంగా దరఖాస్తులు అందించారు. అంతకు ముందు మహబూబ్‌నగర్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో కలెక్టర్ విజయేందిర కమిషన్ చైర్మన్‌కు స్వాగతం పలికారు. కమిషన్ విచారణ అనంతరం మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని 11 వార్డు పాత పాలమూరు ఎస్సీ వాడలో పర్యటించారు. వీధుల్లో తిరుగుతూ.. స్థానికులతో మాట్లాడి.. వారి స్థితిగతులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సుదర్శన్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ శ్రీధర్, రాష్ట్ర కార్యాలయ సూపరింటెండెంట్ సజ్జన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై దృష్టి..
●పేరెంట్స్‌తో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తా.. ప్రతిక్షణం ప్రశాంతంగా ఉంటూ ఆనందంగా గడపాలి. చదువుపై ఫోకస్ పెట్టి ఒత్తిడికి గురికాకుండా కోర్స్ పూర్తిచేస్తాను. కొత్త ఏడాదిలో వీలైనప్పుడల్లా మా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తాను. – కేయశ్రీ, హైదరాబాద్ పొద్దునే నిద్రలేవాలి.. కొత్త ఏడాది నుంచి రోజూ పొద్దునే 5 గంటలకల్లా నిద్రలేచి చదువు కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నా. ఇందుకోసం త్వరగా పడుకోవడం, నిద్ర కోసం తగినంతం సమయం కేటాయించేలా చూసుకుంటా. అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యమిచ్చేలా సమయాన్ని మార్చుకుంటా. – మౌనిక, హైదరాబాద్ ఆనందంగా ఉండాలి.. కొత్త సంవత్సరంలో నా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా కలసిమెలసి ఉండాలని, ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిస్తాను. మెడిసిన్ పూర్తిచేసేందుకు, సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు సమయపాలన పాటిస్తాను. ఏ రోజు పనులను అదే రోజు పూర్తిచేసేలా చూస్తాను. – పూజ, సంగారెడ్డి చిన్నప్పటి నుంచి బుక్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఇప్పటి నుంచి వైద్య వృత్తికి అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై దృష్టిపెడతాను. ఎక్స్పర్మెంట్స్ పట్ల ఆసక్తి చూపిస్తాను. క్షేత్రస్థాయిలో, నిజ జీవితంలో వైద్యులకు అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. – అభిషయ్, హైదరాబాద్ -
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
నాగర్‌కర్నూల్: నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు అన్నిరంగాల్లో రాణించి సుఖసంతోషాలతో విలసిల్లాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకాంక్షించారు. మంగళవారం ఆయన చాంబర్లో మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరం–2025లో ప్రజలు కొత్త ఆలోచనలు, సరికొత్త నిర్ణయాలు, ఆశలు, ఆశయాలతో ముందుకెళ్లాలని కోరారు. కొత్త సంవత్సరం జిల్లా ప్రజలు అందరికీ సంతోషం ఇవ్వాలని, అందరి కలలు నెరవేరాలని, ప్రతిరోజును ఆస్వాదిస్తూ ఉండాలని అభిలాషించారు. గతేడాది కంటే ఈసారి మరిన్ని ఉన్నత ఆశయాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతిఒక్కరూ కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. హాస్టల్ వార్డెన్ సస్పెండ్ నాగర్‌కర్నూల్: జిల్లాకేంద్రంలోని ఎస్సీ–ఎ హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్ పరిసరాల్లో మద్యం తాగి.. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని గత నెలలో పలు విద్యార్థి సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. దాదాపు నెల రోజులపాటు ఉన్నతాధికారులు విద్యార్థులను విచారించి రిపోర్ట్‌ను కలెక్టర్‌కు అందజేశారు. అధికారులు ఇచ్చిన విచారణ అంశాల ఆధారంగా వార్డెన్ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి నాగర్‌కర్నూల్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో వంట గది, వండిన అన్నం, కూరగాయలు, నిల్వ ఉన్న బియ్యం, ఇతర వంట సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో 40 శాతం డైట్ చార్జీలు పెంచినందున పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట డీఈఓ రమేష్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, గురుకుల పాఠశాలల అధికారులు పాల్గొన్నారు. -
వినూతనంగా ముందుకు..
సాక్షి, నాగర్‌కర్నూల్: కొత్త సంవత్సరంలో వినూత్న మార్పులు తీసుకురావాలని భావిస్తున్నాం. ప్రధానంగా వృత్తి జీవితానికి మరింత ఉపయుక్తంగా ఉండేలా ప్రాక్టికల్ జ్ఞానాన్ని పెంచుకుంటాం. సెల్‌ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకుంటాం. పూర్తిగా చదువు, విజ్ఞానంపై దృష్టిపెడతాం. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించడంతోపాటు తల్లిదండ్రులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తాం.’ ఇది నూతన సంవత్సరం సంవత్సరం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు తీసుకున్న నిర్ణయాలు. 2025 కొత్త ఏడాదిలో తీసుకోనున్న నిర్ణయాలపై మెడికల్ కళాశాల విద్యార్థులతో ‘సాక్షి’ టాక్‌షో నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు మెడికోలు వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. మార్పుల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటాం ● సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం ● వృత్తి జీవితానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా దృష్టి ● ఆరోగ్యం మెరుగు, తల్లిదండ్రులతో గడిపేందుకు ప్రాధాన్యం ● ‘సాక్షి’ డిబేట్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల మనోగతం -
కొంగొత్త ఆశలతో..
కాలచక్రం గిర్రున తిరిగింది.. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఎన్నో అనుభూతులను మిగిల్చి.. మరెన్నో ఉన్నత లక్ష్యాలను ముందుంచి.. 2024 చల్లగా కాలగర్భంలో కలిసిపోయింది. నేస్తమా నేనున్నా అంటూ కొత్త సంవత్సరం–2025.. కొంగొత్త ఆశయాలతో మనిషి జీవన చక్రంలోకి ప్రవేశించింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు కాగానే ప్రతిఒక్కరూ కేరింతలు కొడుతూ.. కేకులు కట్ చేసి.. నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. – సాక్షి నెట్వర్క్ -
డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ ఫోకస్
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీస్‌శాఖ బందోబస్తు సాక్షి, నాగర్‌కర్నూల్: ‘నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీస్‌శాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తోంది. డ్రంకెన్ డ్రైవ్‌పై ఫోకస్ పెట్టి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నాం. ప్రతి ఏడాది డిసెంబర్ 31, న్యూ ఇయర్ వస్తుంది. ఇదే మొదటిది, చివరిది కాదు. యువత మద్యం తాగి వాహనాలు నడపవద్దు. సురక్షితంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి.’ అని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై సోమవారం ‘సాక్షి’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈసారి న్యూఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగరాదు.. జిల్లావ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, రోడ్లపైకి వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు. పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడైనా తాగి న్యూసెన్స్‌కు పాల్పడినట్లు సమాచారం అందిన క్షణాల్లో పోలీసులు స్పందిస్తారు. ఘటనా స్థలానికి కేవలం నిమిషాల్లోపు చేరుకుంటారు. డిసెంబర్ 31 నుంచి ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రజలు ఆనందంగా వేడుకలు నిర్వహించుకోవాలి. ఎంజాయ్ పేరిట ఆగం కావద్దు.. డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలు ప్రతిసారి వచ్చేవే. ఎంజాయ్ పేరిట ఆగం కావద్దు. యువత ఎంజాయ్ పేరుతో మద్యం తాగి రోడ్లపైకి రావద్దు. అన్నింటికన్నా కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలి. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఙప్తి చేస్తున్నాను. ● జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో విస్తృత తనిఖీలు ● ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహిద్దాం ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్