Opinion
-
కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు
ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక నూతన అధ్యక్షునిగా ఎన్నికైన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. కోవిడ్ అనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. వ్యాపారస్తులకు, పెట్టుబడి దారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందువల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యోగావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతోంది. గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం 60 శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ 6 శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న శ్రీలంకకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన అనుర కుమార దిస్సనాయకే ముందు అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. మార్క్సిస్ట్–లెనినిస్ట్ భావజాలంతో నడిచే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు గల జనతా విముక్తి పెరుమున పార్టీ నుండి ఎన్నికయిన అనుర పట్ల కొన్ని సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలోపెడతారు, పొరు గున ఉన్న భారత్‌తో ఎలాంటి సంబంధాలు నెరుపుతారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు వెలువరించిన కొన్ని అంచనాల ప్రకారం ఈ సంవత్సరంతో పాటు వచ్చే 2025 సంవత్సరంలో కూడా శ్రీలంక 2.4 శాతానికి కొంచెం అటు ఇటుగా వృద్ధి రేటు నమోదు చేయబోతోంది. గత కొన్ని సంవత్సరాల నుండి తిరోగమన స్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి పథం అందుకోవడం కొంత సంతోషకరమైన విషయమే. అయినప్పటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒకవైపు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరోవైపు అనుర కుమారముందున్న ముఖ్యమైన సవాళ్లు. కోవిడ్ తదనంతర పరిణామాల వల్ల ఇప్పటికే మొత్తం జనాభాలో సుమారు 27 శాతం దారిద్య్ర రేఖకు దిగువకు జారిపోయారు. ఎక్కువగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు మూతపడడం వల్ల మహిళల్లో నిరుద్యోగిత విపరీతంగా పెరిగిపోయింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థలు సుమారు 75 శాతం భాగం కలిగి ఉండడమే కాకుండా సుమారు 45 శాతం ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. వీటిలో చాలావరకు ఎగుమతులు, దిగుమ తులపైన ఆధారపడిన సంస్థలు. అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, సరఫరాల్లో అంతరాయాలు తదితర కారణాల వల్ల పెరిగిన నిర్వ హణ, ఉత్పత్తి ఖర్చుల వల్ల, వస్తువుల ధరలు పెరగడం వల్ల, తగ్గిన డిమాండ్ తదితర కారణాల వల్ల ఇవి మూతపడ్డాయి. గత రెండుసంవత్సరాల కాలంలో రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల నిరుద్యోగిత శాతం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం అంతానికి 4.5 శాతం వరకు తగ్గించగలిగినప్పటికీ పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు పెరగక ప్రజలు ఇబ్బందు లకు గురవుతున్నారు.2022 జూలైలో రాజపక్సే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విదేశీ మారకద్రవ్యం నిల్వలు అత్యంత కనిష్ఠ స్థాయిలో అంటే 1.8 బిలియన్ డాలర్లు ఉండి నిత్యావసర వస్తువుల దిగుమతులకు ఇబ్బందిగా మారిన పరిస్థితులు ధరల పెరుగుదలకు దారి తీశాయి. తత్ఫ లితంగా ప్రజల అసంతృప్తికి, తిరుగుబాటుకు కారణ మయ్యాయి. ఆ నిల్వలు తర్వాత ఏర్పడిన రణిల్ విక్రమసింఘే ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా జూలై 2024 నాటికి 5.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో విదేశీ అప్పులు కూడా శ్రీలంక ఆర్థిక మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 34.8 బిలియన్ డాలర్ల నుండి 37.40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అవి ప్రస్తుత ధరల ప్రకారం 2022 జూన్‌లో 51.2 బిలియన్ డాలర్లు ఉంటే... ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసేనాటికి 55.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విక్రమసింఘే ప్రభుత్వం తన సన్నిహిత దేశాలయిన చైనా, భారత్, జపాన్‌లతో జరిపిన చర్చల ఫలితంగా... సుమారు 10 బిలియన్ డాలర్ల వరకు తిరిగి చెల్లించే కాలపరి«ధులు, వడ్డీ రేట్లు తగ్గించడంవంటి వెసులుబాట్లు లభించాయి. ఇందువల్ల ఐఎంఎఫ్ నుండి ఉద్దీపన ప్యాకేజీలు లభించడానికీ, అనేక మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయడానికి వెసులుబాటు లభించినట్లయింది. ఈ చర్యలు 2023 డిసెంబర్ నాటికి సుమారు 237 మిలియన్ డాలర్ల మిగులు బడ్జెట్‌కు దారితీశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు కూడా పెరిగి 2024 మార్చి నాటికి 96.3 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగి 44.9 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇవన్నీ కూడా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పడింది అనడానికి సంకేతాలే.గత రెండు సంవత్సరాలలో ద్రవ్యోల్బణం 60 శాతం నుండి ఆరు శాతానికి తగ్గించగలిగినప్పటికీ, సున్నితంగా ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆరు శాతం ద్రవ్యోల్బణం కూడా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడం, స్థిరీకరించడం, గాడినపెట్టడం లాంటి వ్యవహారా లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా, అప్పులు పెరిగిన నేపథ్యంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత ఉన్న సమయంలో ఈ ద్రవ్యోల్బణం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దానివల్లే ఇప్పటికి ఆహారవస్తువుల, పెట్రోల్, డీజిల్, మందుల ధరలు ఇంకా దిగి రాలేదు. వీటివల్ల సామాన్య ప్రజల జీవన వ్యయంపై ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉంది. అనుర కుమార దిస్సనాయకే అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన మూడు రోజులకు అంటే 26 సెప్టెంబర్ నాడు జరిగిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక సమావేశంలో డిపాజిట్లపై, రుణాలపై వరుసగా ప్రస్తుతం ఉన్న 8.25, 9.25 శాతం వడ్డీ రేట్లను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ వడ్డీ రేట్లు బ్యాంకుల్లో పొదుపుచేసే వారిని ప్రోత్సహించడానికీ, రుణాలు తీసుకోవాలనుకునే వారిని నిరుత్సాహపరచడానికీ, ద్రవ్యోల్బణం స్థిరీకరించడానికి ఉప యోగపడ్డాయి. అయితే అదే సమయంలో వ్యాపారస్తులకు, పెట్టు బడిదారులకు, ఉత్పత్తిదారులకు అధిక వడ్డీ రేట్ల మూలంగా ప్రతి కూల పరిస్థితులను కల్పించి, ఉత్పత్తి వ్యయాలు, ధరలు పెరిగేలా చేసి వినియోగదారులను దూరం చేస్తాయి. వీటి వల్ల ఉత్పత్తి తగ్గి, ఉద్యో గావకాశాలపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. మరోవైపు బ్యాంకుల లాభాల్లో మార్జిన్ తక్కువగా ఉండడం వలన అవి ఇచ్చే రుణాలు తగ్గిపోతాయి. ఇన్ని ప్రతికూలతలు ఎదుర్కోవడం అనుర కుమార దిస్సనాయకే అయన ప్రభుత్వానికి పెద్ద సవాలు.అనుర దిస్సనాయకే పార్టీ గతంలో భారత్ పట్ల వ్యతిరేక భావనతో రగిలిపోయినప్పటికీ, కొత్త ప్రభుత్వం అదే ధోరణి ఇంకా కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చు. భారత్ ఇప్పటికే శ్రీలంకను అనేక సందర్భాల్లో ఆదుకుంది. గత రెండు సంవత్సరాల్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది. ఇది ఐఎంఎఫ్, చైనా అందించిన సహాయం కన్నా అధికం. వాణిజ్య సంబంధాలు పెంపొందించుకు నేందుకు రెండు దేశాలు ‘భారత – శ్రీలంక స్వేచ్ఛా వాణిజ్యఒప్పందం’ చేసుకొన్నాయి. గత రెండు సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య 4 నుండి 6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతున్నప్పటికీ ఇందులో అధిక భాగం భారత్ శ్రీలంకకు చేస్తున్న ఎగుమతులు ఎక్కువ. భారత్‌తో ఉన్న సన్నిహిత, నిర్మాణాత్మక సంబంధాల రీత్యా కొత్త ప్రభుత్వానికి భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం అనివార్యమవుతుంది.అనుర దిస్సనాయకే నాయకత్వంలో శ్రీలంక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్న తరుణంలో, ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటు చర్యలు కొనసాగించడం ఒకవైపు; విదేశాలతో మంచి సంబంధాలు కొన సాగించడం మరోవైపు అత్యంత అవసరం. ఎన్నికల సమయంలో ఐఎంఎఫ్‌తో 2.9 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ పైన చర్చలు తిరిగి ప్రారంభిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, అది అంత సులభం కాదు. భారత్ ఆ దేశానికి ఇచ్చిన ఆర్థిక సహాయం, వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కొత్త ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, రాజకీయంగానే కాకుండా ఆర్థిక వ్యవస్థలు గాడినపెట్టడం పైన కూడా ప్రభావం చూపిస్తాయి.- వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్‌యూ ‘ 79089 33741- డా‘‘ గద్దె ఓంప్రసాద్ -
అభద్రతను పెంచుతున్న యుద్ధం
హమాస్–ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాలను నిరోధించ వలసిన ఐక్యరాజ్య సమితి లాంటివి నిర్వీర్యమైపోతున్నాయి. ముఖ్యంగా గాజా యుద్ధంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఐరాస సిబ్బందికే రక్షణ లేని పరిస్థితి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెతన్యాహూకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలు ఆంక్షల విధింపు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. వైరి పక్షాలను చర్చల వేదికపైకి తేగలిగిన మధ్యవర్తులు కానరాని పరిస్థితి! ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు తన శత్రువులపై దాడిచేసే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ... దాని పౌరులు రోజు రోజుకూ అభద్రతాభావంలో కూరుకుపోతుండటం గమనార్హం.ఒక సంవత్సరం క్రితం, అక్టోబర్ 7న జరిగిన ఘటన ఉక్రెయిన్‌లో యుద్ధం నుండి ప్రపంచం దృష్టిని మళ్లించింది. నేడు, హమాస్ తీవ్రవాద దాడిపట్ల ఇజ్రాయెల్ ప్రతిస్పందన చాలా తీవ్రంగా మారిపోయింది. దీనితో పోలిస్తే మిగతా వన్నీ అప్రధానంగానే ఉన్నాయి. దాదాపు 45,000 మంది, వీరిలో ఎక్కువగా పౌరులు మరణించారు. కనుచూపు మేర కాల్పుల విరమణ లేదు. పైగా వేగంగా పెరుగుతున్న సంఘర్షణ కారణంగా, పశ్చిమాసి యాను యుద్ధం చుట్టుముట్టే అవకాశం ఒక ప్రమాదకరమైన వాస్తవంగానే కనబడుతోంది. కొంత వరకు ఉక్రెయిన్ యుద్ధం, ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం... ప్రాంతీయ యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించే లేదా వాటికి ముగింపు పలికే సామర్థ్యం గల మధ్యవర్తులు కనిపించని ప్రపంచంలో మనం ఈ రోజు ఉన్నామనే వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి.ఇజ్రాయెల్, ఇరాన్ లేదా అమెరికాను చేరుకోగల ఉపయోగ కరమైన పరోక్ష మార్గాలు కానీ లేదా వారిని సంధానించేవారు కానీ ఇప్పుడు ఎవరూ లేరు. సైద్ధాంతికంగా చెప్పాలంటే, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించే లేదా పొడిగించే స్థితిలో అమెరికా ఉండవచ్చు, కానీ పశ్చిమాసియా విషయానికి వస్తే దాని నిస్సహాయత ఆశ్చర్యక రంగా ఉంది. ఈ ప్రాంతంలో పరిష్కారం కోసం ప్రపంచం వాషింగ్టన్ వైపు చూస్తూనే ఉంది, కానీ దాని స్వీయ అధ్యక్ష ఎన్నికల కారణంగా, అమెరికన్ బాడీ పాలిటిక్స్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం చూపే ప్రభావం కారణంగా అమెరికాకు పరిష్కారం సాధ్యం కావడం లేదు.మరోవైపున అగ్రరాజ్య స్థాయి కోసం ఎదురుచూస్తున్న చైనా మౌనం కూడా ఆసక్తి గొల్పుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా ఉండగా, ఎర్ర సముద్రం సంక్షోభం సమయంలో అది నిష్క్రియాపరత్వంతో వేచి ఉంటోంది. పైగా ఇతర చోట్ల ప్రపంచ సంక్షోభాలను తగ్గించే విషయంలో చైనా పాత్ర తక్కువే అని చెప్పాలి. ఇక పశ్చిమాసియా సంక్షోభంపై మధ్యవర్తిత్వం వహించడంలో చైనా ఏమాత్రం ఆసక్తి చూపలేదు. భారతదేశం ఇప్పటికీ అలాంటి కర్తవ్యా లను చేపట్టేంత శక్తిమంతమైన దేశంగా తనను తాను భావించడం లేదు. రెండో ప్రపంచ యుద్ధానంతర సంస్థలు ప్రపంచ స్థాయిలో నిర్మాణాత్మక అసమానతలను కొనసాగించినప్పటికీ, సంస్థలు,నిబంధనలు లేని ప్రస్తుత ప్రపంచం అధ్వానంగానే ఉంటుంది.ఐక్యరాజ్యసమితిని పరిశీలిస్తే... అది రోగలక్షణంతో అసమర్థ మంతంగానూ, నిస్సహాయంగానూ మారిపోయినట్లుంది. అందుకే యుద్ధంలో పాల్గొంటున్న పక్షాలు... ఐరాస సిబ్బంది ఉన్న ప్రాంతా లలో కూడా బాంబు దాడి చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. పోరాడుతున్న పక్షాలకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చేసిన విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ఇటీవల ధిక్కరించినట్లుగానే, మీడియా కూడా దాన్ని సీరియస్‌గా పరిగణించడం లేదు.అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) ఉదంతాన్ని తీసుకోండి. ఇది ఇజ్రాయెల్ ఆగ్రహ జ్వాలలకు గురవుతూ ఉండడం మాత్రమే కాకుండా... అమెరికా, ఐరోపాలోని ఇజ్రాయెల్ సన్నిహిత మిత్రుల అగ్రహాన్ని కూడా చవిచూస్తూ ఉంది. హాస్యాస్పదంగా, రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలనే విషయంపై ఆసక్తిగా ఉన్న దేశాలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అదే విధంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసినందుకు మాత్రం ఐసీసీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. రెండు యుద్ధాలూ నైతిక పరిగణనలు వాడుకలో లేని ప్రపంచం వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి. ఇంకా, నైతిక రాజకీయం రోజువారీ ప్రభుత్వ ఆచరణలో చెడుకు చెందిన సామాన్యతను కొలిచేందుకు ఒక కొలమానాన్ని అందిస్తుంది. దేశీయ రాజకీయాలు లేదా అంతర్జాతీయ సంబంధాలలో, నైతిక ప్రమాణాలు లేనిదాని కంటే నైతిక ద్వంద్వ ప్రమాణాలు ఉత్తమం. ఆచరణలో లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, కొలత కోసం మనకు ఒక టేప్ అవసరం. ఈ యుద్ధంలో చెడుకు సంబంధించిన సామాన్యత విషయంలో అత్యంత కలతపెట్టే ఉదా హరణ ఏదంటే హమాస్ టెర్రరిస్టులను గాజా ప్రజలతో సమానం చేయడం– అలాంటి చట్రాలను మనం మౌనంగా ఆమోదించడం!ఏ రకంగా చూసినప్పటికీ ఇజ్రాయెల్ మరింత ఒంటరిగా, అభద్రతతో ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడులు, దాని అసమాన ప్రతీకార చర్యలు జరిగి ఒక సంవత్సరమైంది. కానీ ఇజ్రాయెల్ అనుభూతి చెందుతున్న శాశ్వతమైన అభద్రతా భావం ఇప్పుడు పెరుగుతున్న ఒంటరితనంతో పాటు మరింత తీవ్రమైంది.ఇజ్రాయెల్‌కు తన శత్రువులను మరింత ఎక్కువ శక్తితో కొట్టే సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలో సంపూర్ణ దుర్బ లత్వం కూడా స్పష్టంగా ఉంది. ఇరాన్ దాని ప్రాక్సీ గ్రూపులుగా గాజా, ఇరాక్, లెబనాన్, సిరియా గురించి ఇజ్రాయెలీలు పిలుస్తున్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనేది ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ పౌరులు కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు మరింత సురక్షితంగా ఉన్నారా అనేది సందేహమే. ఒక దేశం ఎంత శక్తిమంతమైన దేశమైన ప్పటికీ, నిశ్చయాత్మకమైన, సైద్ధాంతికంగా ప్రేరేపితులైన విరోధుల నుండి తనను తాను రక్షించుకోలేకపోతుంది, ప్రత్యేకించి దాని సొంత చర్యలు విరోధుల లక్ష్యాన్ని మరింతగా నిలబెడుతున్నప్పుడు అది అసలు సిద్ధించదు.నేడు ఇజ్రాయెల్ మరింత అభద్రతాభావంతో ఉండటమే కాకుండా ప్రపంచం సానుభూతిని కూడా కోల్పోతోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు దాని మితిమీరిన చర్యలకూ, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినందుకూ, ప్రత్యేకించి గ్లోబల్ సౌత్‌లోని వారిచే వివిధ అంత ర్జాతీయ ఫోరమ్‌లలో సాధారణంగా ఆక్షేపించబడుతూ, విమర్శల పాలవుతోంది. గ్లోబల్ సౌత్ మద్దతుపై ఇజ్రాయెల్‌కు పెద్దగా పట్టింపు లేకపోయినా, ఇజ్రాయెల్ వైపు నిలిచిన యూరోపియన్, ఉత్తర అమె రికా మద్దతుదారులు కనీసం భౌగోళిక రాజకీయ కారణాల వల్ల దక్షి ణాదిని విస్మరించడం కష్టం. అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్ కోసం బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో అమెరికా యువతరంలో ఇజ్రాయెల్‌కి చెందిన సమస్యపై, విభేదాలు పెరుగుతున్నాయి.మొత్తం మీద చూస్తే అబ్రహం ఒప్పందాలు ప్రమాదకరమైన స్థితిలో ఊగిసలాడుతున్నాయి, వీధుల్లో జనాదరణ పొందిన మనో భావాల ద్వారా నడపబడుతున్న యుద్ధ స్వభావం పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంది. ఫలితంగా, గల్ఫ్ దేశాలు, ప్రత్యేకించి, పాలస్తీనా ఉచ్చులోంచి బయటపడాలని కోరుకున్నప్ప టికీ అవి బలవంతంగా తిరిగి యుద్ధబాటలోకి వెళ్లవచ్చు కూడా.ఇజ్రాయెల్ ప్రభుత్వానికీ, ప్రజలకూ దీని అర్థం ఏమిటంటే పెరుగుతున్న అభద్రత, ప్రపంచ సానుభూతిని కోల్పోవడంతో పాటు కనికరం లేని విలన్లుగా ముద్ర వేయబడటమే. ఈ యుద్ధం నెతన్యా హుకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలను కప్పిపుచ్చడమే కాకుండా ఇజ్రాయెల్ ఉదారవాద, ప్రజాస్వామ్య విలువలను అణిచివేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు తమను తాము ప్రజలుగా ఊహించుకునే భవిష్యత్తు ఇదేనా? గాజా ప్రజలకు ఇజ్రాయెలీలు ఏమి చేస్తున్నారో అది ఇజ్రాయెల్ ప్రజలుగా వారిపై కూడా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంలోని మనకు, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ’శ్వేత జాతీ యులు శ్వేతజాతీయులను చంపేస్తున్నారు’ అనేటటువంటి కేవల యూరోప్ సమస్యగా మాత్రమే విస్మరించడం సులభం. కానీ పశ్చి మాసియాలో యుద్ధం ప్రాథమికంగా భిన్నమైనది – అది ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఊహించని మార్గాల్లో మనపై ప్రభావం చూపుతుంది.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో భారత విదేశీ విధాన బోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో...) -
చేగువేరా టు సనాతని హిందూ!
‘‘సముద్రం ఒకడి కాళ్ళ ముందు కూర్చొని మొరగదు/ తుఫాన్ గొంతు ‘చిత్తం’ అనడం ఎరగదు/ పర్వతం ఎవ్వరికీ వంగి సలాం చెయ్యదు.’ పదేళ్ళ కిందట జనసేన పార్టీ విశాఖ సభలో పవన్ కల్యాణ్ తనని తాను వేలితో చూపించుకుంటూ సము ద్రంగా, తుఫాన్‌గా, పర్వతంగా అభివర్ణించుకుంటూ చెప్పిన మాటలివి. ‘చుట్టూ గాఢాంధకారం, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు’ వంటి స్థితిలో ప్రజలున్నారని, వారి ఆశలు నిలబెట్టి, వారి జీవితాల్లో వెలుగు పంచి అపర చేగువేరాగా అవతరించాలన్న పవన్ ఉద్దేశాలు జగమెరిగిన వారికి అమాయకంగా కనిపించినా ఎంతోమంది యువత అతన్ని నమ్మారు. పవన్ ఒంటిమీద పిచ్చుక వాలినా జనసేన కార్యకర్తలు బ్రహ్మాస్త్రాలు సంధించారు. సినీహీరోగా తనకున్న ఇమేజ్‌ని గుడ్ విల్‌గా పెడితే చాలదని, అంతకి మించి ఏదో చేయాలన్న తపనని వ్యక్తం చేయడానికి ఆయన పలుమార్లు ప్రగతిశీల సాహిత్యాన్ని తన ప్రచారానికి వాడుకున్నారు. ఏ ప్రాంతానికి ప్రచారానికి వెళితే అక్కడి స్థానిక రచయితలను గుర్తించి వారి రచనల్లోని ప్రజా సమస్యలను ప్రస్తావించేవారు. గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీశ్రీ కవితలు తరుచుగా చదివేవారు. ఆయా సాహిత్య అంశాలలోని అభ్యుదయం, ప్రజాపక్షపాతం, నిర్భీతి వంటివి పవన్ వ్యక్తిత్వ సుగుణాలని జనం నమ్మేలా బట్వాడా అయ్యాయి కూడా. తద్వారా మిగతా రాజకీయ నాయకులకి భిన్నమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. విప్లవకారులుగా చలామణీ అవ్వడానికి మొహం చెల్లని రాజకీయాల్లో అట్టడుగు ప్రజల కష్టాలు తీర్చగల రాబిన్ హుడ్‌నని ఆయన నమ్మే ఉండాలి. లేకపోతే అంత సులువుగా ‘జై భీమ్’ అని, అంతే సులువుగా ‘గో మాంసం, బీఫ్ తినడం తప్పయితే, అవి తినే ముందుకు వెళ్తాన’ని ఎలా అనగలరు! ఇఫ్తార్‌లో కూర్చుని గడ్డం పెంచుకుని, టోపీ పెట్టుకుని మీలో ఒకడిని అనడం, గోధ్రా, గుజరాత్ అల్లర్ల గురించి ప్రశ్నించడం, తన నాయనమ్మ దీపారాధన చేస్తే దాంతో వాళ్ళ నాన్న సిగరెట్ ముట్టించుకుని, దేవుడూ దయ్యమూ లేవు’ అనేవాడని గుర్తు చేసుకోవడం, మతపరమైన గొడవలు పెడుతున్నది ముఖ్యంగా హిందూ నాయకులని గట్టిగా చెప్పడం ద్వారా పవన్ కొన్నివర్గాల నుంచి మైలేజ్ పొందారు. ఇక ఇపుడు తరం మారకుండానే స్వరం మార్చారు పవన్ కల్యాణ్. అధికారంలోకి రాగానే వేషభాషలు మారాయి. ఇపుడు తనని తాను ‘సనాతని హిందు’గా ప్రకటించుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తానని అంటూ అన్ని మతాలకీ ఒకటే న్యాయం అని ద్వంద్వానికి గురయ్యారు. అంబేడ్కర్‌ని బాగా చదివి ఆయన భావజాలాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నానని పవన్ కొన్నిసార్లు అన్నారు. అన్ని కులాలకి ఒకటే న్యాయం అని అంబే డ్కర్, ఇతర రాజ్యాంగ రూపకర్తలు అనుకోలేదు కనుక అణచివేతకి గురయ్యి శతాబ్దాలుగా ఎదుగుదల లేని కులాలకి రిజర్వేషన్లు ఇచ్చారు. అన్ని కులాలూ ఒకటి కానట్లే అన్ని మతాలు కూడా ఒకటి కావు. ఎక్కడైనా మెజారిటీ మతాలు, మైనారిటీల హక్కులకి భంగం కలిగించే సందర్భాలు ఉంటాయి కనుక సెక్యులరిస్టులు మైనారిటీ మతాల హక్కులకి అండగా నిలబడతారు. దానర్థం పవన్ విరుచుకు పడినట్లు వారు ఆ యా మతాలకి భయపడతారని, వలపక్షం చూపుతారని కాదు. తిరుపతి సభలో వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. దాని సారాంశం ఏమిటో ప్రజలమైన మాకు సరిగ్గా అర్థం కావడం లేదు. డిప్యూటీ సీఎంగా లడ్డు నాణ్యత మీద రోజుల తరబడి పోరాడటం ముఖ్యమా లేక కనీస అవసరాలు తీరని పేద ప్రజకోసం ఏవైనా చేయడం ముఖ్యమా అని అడగము, మెల్లిగా తెలుగుదేశాన్ని పక్కకి జరిపి జనసేన, బీజేపీతో ఎటువంటి రాజకీయం చేయబోతోంది అని కూడా అడగము, సరేనా! కానీ జస్ట్ ఆస్కింగ్! సనాతన ధర్మం అంటే ఏమిటి? బోర్డులు గట్రా ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో మీరు చేయబోతున్న పోరాటపు ఆనుపానులు మాకు కాస్త ముందుగానే చెప్పగలరా? వర్ణవ్యవస్థ ఇందులో భాగమా, మనుధర్మ శాస్త్రం ఏమైనా పరిపాలనకి దిక్సూచి కానుందా? స్త్రీలను ఇంట్లో కూచోమంటారా, శూద్రులు సేవకులుగా, శ్రామిక కులాలను అంట రానివారిగా నిశ్చయం చేయబోతున్నారా? ‘మతి ఎంతో గతి అంతే’ అన్నది మీకు ఇష్టమైన కొటేషన్. ఇపుడు సనాతన హిందూగా మీ ‘మతి’ ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన మా ‘గతి’ని ఎలా మార్చబోతోందో తెలుసుకోవాలని జస్ట్ ఆస్కింగ్. పవన్ కల్యాణ్ గారూ! ప్రసాదాలు, ప్రమాణాలు సంబంధిత శాఖలకి వదిలిపెట్టి పదేళ్ళ పైబడిన మీ రాజకీయ ప్రయాణాన్ని సమీక్ష చేసుకోండి. మారిన వేషభాషలకి, మీరేంటో గర్జించి ఇచ్చిన ప్రకటనకి మీరే జవాబుదారీ. నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మీరు సాధారణ పౌరుడు కాదు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మీరు సెక్యులరిస్ట్‌గా వినపడటమే కాదు కనపడటం కూడా ప్రజాస్వామిక అవసరం. ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతున్న లక్షలాది యువత కోసం నిజాయితీ మాత్రమే మీ ప్రమాణం అయితే మంచిది. మీరు ధైర్యం విసిరిన రాకెట్టో, చేగువేరా బుల్లెట్టో సనాతని హిందూనో, బీజేపీ ప్రేరిత కాబోయే ముఖ్య మంత్రో, మరొకటో ఇంకొకటో– నాలుగు రోజులైనా కాస్త ఒకచోట ఆగండి. మీరేంటో అర్థంకాక ప్రజలు అయోమయంలో ఉన్నారు. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ‘ప్రరవే’ ఏపీ కార్యదర్శి -
మానసిక ఆరోగ్యంతోనే అభివృద్ధి
మానవ సమాజంలో పని అనేది ఒక అంత ర్భాగం. మానవుడు ఆహా రం కోసం చేసే వెదుకు లాట/ వేట మొట్టమొదటి పనిగా చెప్తారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం పని గంటలు, పని ‘సంస్కృతి’లో అనేక మార్పులు తీసుకువచ్చింది. పరిశ్రమలు, కార్మికులు కలసి ఒక సంస్థాగత వ్యవస్థగా ఏర్ప డ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ ప్రవేశంతో కొత్తకొత్త ఉద్యోగాల రూపకల్పన జరగడం ప్రారంభమయింది. యాంత్రికీకరణ, కృత్రిమ మేధ అభివృద్ధితో ఇది మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా తొంభైవేల నుండి ఒక లక్ష గంటల పాటు పని ప్రదేశంలోఉంటాడని అంచనా. అంటే యుక్త వయసు నుండి రిటైరయ్యే వరకు ఉన్న జీవిత కాలంలో ఇది సుమారు మూడు వంతుల సమయం. ఒక ఉద్యోగస్థుడు తన సహ చరులతో ఇంతకాలం గడపడం వలన వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకుంటాడు. ఈ బంధాలు, పనిచేసే వాతావరణం, యాజమాన్యంతో ఉండే సంబంధం... ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు ప్రభావితం చేస్తాయి. కనుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ‘పని చేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటోంది. పని ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజ మైన విషయం. అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నట్లు తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు చికిత్స అవసరం అయిన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా బాధపడే వారిలో కేవలం నలభై శాతం మంది మాత్రమే సరైన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే ఇది ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఇది మిగిలిన ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఉద్యోగితో పాటుగా యాజమాన్యాలు / సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసు కోవలసిన అవసరం ఉంది. సరైన సమయపాలన పాటించడం, ఒత్తిడికి గురైనపుడు సహచరుల, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సహాయం పొందడం; పనికి, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకొని కొంత సమయం తనకోసం మాత్రమే కేటాయించుకోవడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పనిలో అప్పుడప్పుడు కొంత విరామం తీసుకోవడం లాంటివి చేయడం ద్వారా ఉద్యోగి ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు. విభిన్న షిఫ్ట్ సిస్టవ్ులో పనిచేసే దంపతులు కలిసి ఉండే సమయం తక్కువ అవడంవల్ల కలిసి క్వాలిటీ టైవ్‌ు గడిపే అవకాశాలు సన్నగిల్లి వీరి మధ్య కొన్ని మనస్పర్థలు, అనుమా నాలు తలెత్తే అవకాశముంది. సమర్థంగా పనిచేసే వారిని యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రోత్సహించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వీరిలో మానసిక స్థైర్యం పెంపొందుతుంది. మహిళా ఉద్యోగులు, ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ; మరోవైపు ఉద్యోగ బాధ్యతల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాంటి వారి ఎడల సంస్థలు కొన్ని వెసులుబాట్లు ఇస్తే, వీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండగలరు. కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోవ్‌ు’ను ప్రోత్సహించడం వలన ఉద్యో గుల్లో ఉత్పాదకత పెరిగినట్లు గణాంకాలు చెబు తున్నాయి. ప్రతి సంస్థ అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా క్లినికల్ సైకాలజిస్టుల సేవలు తమ ఉద్యోగులకు కల్పించాలి. యోగా, ధ్యానం, ఒత్తిడి గురించి వర్క్‌షాప్స్ వంటి కార్యక్రమాలు తరచుగా తమ సంస్థల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి. ఒక క్రమ పద్ధతిలో నైపుణ్య పరీక్షలు జరిపి అర్హులైన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్న తులు, ఇతర వసతులు కల్పించడం ద్వారా ఉద్యోగస్థుల్లో సంతృప్తి శాతాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగస్థులు తమ పనిపట్ల తృప్తితో ఉంటారో వారు మరింత పాజిటివ్ ధృక్పథంతో, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తారు. వారు మిగిలిన వారికి ఒక మంచి ఉదాహరణగా నిలిచి, ఒక చక్కని పని సంస్కృతి అనేది సంస్థలో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ఉద్యోగుల, కార్మికుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలోగాని,వృత్తిలో గాని విజయం సాధించాలంటే మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యమని అందరూ గుర్తించాలి. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యనిపుణులు(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
ప్రపంచ విప్లవ జ్వాల
ప్రజల కోసం సర్వస్వం త్యజించిన విప్లవ నేత చే గువేరా! ఆయన అసలు పేరు ఎర్నెస్టో గెవారా! ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు. అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్‌పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు. 1954లో గౌటెమాలలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలి పోయింది. అక్కడి నుంచి మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని విప్లవ దృక్పథం మరింత బలపడింది. మెక్సికోలో ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం (1956–1959)లో చే గువేరా ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్‌గా, మిలిటరీ కమాండర్‌గా అంకిత భావంతో సేవలందించాడు. పోరాటం విజయవంతమైన తరువాత, కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభు త్వాధికారాన్ని చేపట్టాడు. ఆ ప్రభుత్వంలో చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా పనిచేశాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే 1959 జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు. తన రచనలలో వర్ధమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు! పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టి ఆయన 1965లో క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని, పలుకుబడిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు. కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. 1966 చివరిలో మళ్ళీ దక్షిణ అమెరికాకు వచ్చాడు! బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు! ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యానికి చిక్కాడు! 1967 అక్టోబర్ 9న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో ఆ సైన్యం ఆయన్ని చంపివేసింది. అలా ఓ ప్రపంచ విప్లవ జ్వాల ఆరిపోయింది!– ఎమ్డీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్(నేడు చే గువేరా వర్ధంతి) -
అధిక నిధులతోనే రైతుకు మేలు
దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నష్టాలు! 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే. ఇప్పటికీ వ్యవసాయ రంగ వృద్ధి కేవలం 1.4 శాతం మాత్రమే. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం. అసమానతలను పెంచిపోషిస్తున్న ఆర్థిక సిద్ధాంతాలను ఇంకా పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. అత్యధిక జనాభా వ్యవసాయంలో ఉన్న దేశంలో దానికి అనులోమంగానే బడ్జెట్లో స్థిరంగా కొన్నేళ్లు కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలి.అది 1996వ సంవత్సరం. ఎన్నికల ఫలితాలు వెలువడి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఒకటీ రెండు రోజుల తర్వాత, న్యూఢిల్లీలో కొంతమంది ఆర్థికవేత్తలతో ఆంతరంగిక సమా వేశం జరిగింది. ప్రధానమంత్రిగా ఎన్నికైన వాజ్‌పేయి రాకపోవడంతో, మరో రాజకీయ ప్రముఖుడు మురళీ మనోహర్ జోషి ఆ సమా వేశానికి అధ్యక్షత వహించారు.ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోకుండా ఉండాలంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక విధానాలను తీసుకురావాలో సూచించాలని ఆ సమావేశంలో ఆర్థికవేత్తలను కోరారు. హాజరైన చాలామంది ద్రవ్య లోటును నిశితంగా పరిశీలించాలనీ, కరెంట్ ఖాతా లోటును తగ్గించే మార్గాలను కనుగొనాలనీ అభిప్రాయం వెలిబుచ్చారు. కీలకమైనవిగా గుర్తించిన సమస్యలపై చాలా చర్చ జరిగింది. ఉపాధిని సృష్టించడం, తయారీని పెంచడం, ఎగుమతుల ఆర్థిక వ్యవస్థను నిర్మించడం వంటి ఇతర ముఖ్యమైన సమస్యలపై కూడా చర్చ జరిగింది.విధానపరమైన ప్రాధాన్యం దేనిపై ఉండాలో సూచించమని నన్ను అడిగినప్పుడు, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 60 శాతం జనాభాకు బడ్జెట్లో 60 శాతం మేరకు అందించాలని నేను సమాధాన మిచ్చాను. అక్కడ ఉన్న నా సహచరుల్లో చాలామంది నాతో ఏకీభవించలేదు. వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయిస్తే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని కొందరు హెచ్చరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయ రంగాలకు భారీ కేటాయింపులు జరపాలనీ, దాన్నే అధిక ఆర్థిక వృద్ధికి దారితీసే కచ్చితమైన మార్గంగా తీసుకోవాలనీ వారు నొక్కి చెప్పారు. అయితే కొత్త నమూనాకూ, ఆర్థిక చింతనకూ ఇదే సమయమనీ, వ్యవసాయానికి తగిన బడ్జెట్ కేటాయింపు చేయకపోతే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందదనీ నేనూ నొక్కిచెప్పాను. నా సలహా ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల ఆలోచనతో పొసగదని నాకు తెలుసు. కానీ, ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం వ్యవసాయంలో, గ్రామీణాభివృద్ధిలో తగినంత పెట్టుబడి పెట్టడమేనని నా అవగాహన. మా అభిప్రాయాలను ప్రధానికి తెలియ జేస్తానని జోషి చెప్పడంతో సమావేశం ముగిసింది.కొన్ని రోజుల తర్వాత, కొత్త ప్రభుత్వం వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయించాలనే ఉద్దేశాన్ని ప్రకటించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వ్యవసాయంలో చాలా వనరులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం గురించి మీడియాలో కోలాహలం చెలరేగింది. చాలామంది నిపుణులు దీనివల్ల ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తుందని అన్నారు. నా వాదన ఏమిటంటే, భారతదేశం అధిక వృద్ధి పథం వైపు సాగుతున్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తన జనాభాలో మూడింట రెండు వంతుల మందిని వెనుకే విడిచిపెట్టడం సాధ్యం కాదు.ఇది సాధ్యం చేయాలంటే, రాజకీయ తత్వవేత్త జాన్ రాల్ సూచించిన న్యాయసూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలంటే, మన విధాన ప్రయత్నం భిన్నంగా ఉండాలి. మానవ మూలధన పెట్టు బడికి, వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి, ఆరోగ్యం, విద్యారంగా లతో సహా గ్రామీణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి తగిన ఆర్థిక వనరులను కల్పించాలి. ఈ క్రమంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక చింతనలో, విధానాల్లో కీలక మార్పు తేవడం వల్లనే, ప్రధానమంత్రి ఇప్పుడు చెబుతున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ను నిజం చేయ వచ్చు. అయితే, వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులు మాత్రమే కొన సాగింది. దాంతో మార్పునకు బలమైన పునాది వేయగలిగే ఆశ కూడా ఉనికిలో లేకుండా పోయింది.నేను దీన్ని ఎందుకు పంచుకుంటున్నానంటే, మొత్తం బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు మరింత తగ్గాయి. లక్షలాదిమంది జీవనోపాధికి వ్యవసాయం బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో ఇది ఆందోళనకరం. బడ్జెట్లో వ్యవసాయం వాటా 2019–20లో అప్పటికే కనిష్ఠంగా ఉన్న 5.44 శాతం నుంచి, 2024–25లో 3.15 శాతానికి పడి పోయింది. వనరుల కేటాయింపులపై ఆధిపత్యం చలాయించేది రాజకీయ ఆర్థిక కారకాలు (బడా వ్యాపారులచే ఎక్కువగా ప్రభా వితమవుతాయి) అని గ్రహించినప్పుడు, తప్పు మార్గాలేమిటో స్పష్టంగా కనిపిస్తాయి. జనాభాలో 42.3 శాతం మంది ఇప్పటికీ వ్యవసాయంలో నిమగ్నమై ఉండగా, దాని వృద్ధి కేవలం 1.4 శాతంగా ఉంటోందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా దారుణంగా, సగటు వ్యవసాయ ఆదాయాలు బాగా క్షీణించాయి. వాస్తవ గ్రామీణ వేతనాలు దశాబ్ద కాలంగా స్తబ్దుగా కొనసాగుతున్నాయి. నేను తరచుగా చెప్పినట్లు, వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం.దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి భారతీయ రైతులు ఇంత దారుణంగా ఎలా నష్టపోతున్నారని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ‘ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ – డెవలప్మెంట్’ (ఓఈసీడీ) చేసిన ఇటీవలి అధ్యయనం పనికొస్తుంది. భారతీయ వ్యవసాయం అట్టడుగున ఉండటమే కాక, 2022లో 20.18 శాతం ప్రతికూల స్థూల వ్యవసాయ జమను (మైనస్) అందుకుంది. అయితే, 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఈ వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే.జనాభాలో దాని వాటాకు అనులోమానుపాతంలో కొన్ని సంవత్సరాలపాటు వ్యవసాయానికి సరైన వనరులను అందించినట్ల యితే, అది అద్భుతమైన ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటుంది. వనరుల కేటాయింపులు తగ్గుముఖం పట్టిన తర్వాత, వ్యవసాయ రంగంలో అద్భుతం జరుగుతుందని ఆశించడం వ్యర్థం. 1996లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో 60 శాతం వాటాను అందించడానికి అంగీకరించి ఉంటే, నేటివరకు అది కొనసాగి ఉంటే, భారతదేశ గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారి పోయి ఉండేది.ఇప్పుడు కూడా, వ్యవసాయంలో జనాభా 42.3 శాతంగా ఉన్నందున, రూ.48 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలని చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పేదలు, మహిళలు, యువత, అన్న దాత అనే నాలుగు కొత్త ‘కులాలను’ చేరుకోవడానికి బహుశా ఇది ఉత్తమ మార్గం. వాస్తవానికి, వ్యవసాయం అన్ని రకాల కుల రూపాలకు జీవనోపాధిని అందిస్తుంది. వ్యవసాయంలో తగిన వనరులను ఉంచడం, పనితీరును మెరుగుపర్చడం వల్ల స్థిరమైన జీవనోపాధిని నిర్మించడమే కాకుండా వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించే ఆకాంక్ష లను కూడా ప్రోత్సహిస్తుంది. వ్యవసాయంలో తగిన పెట్టుబడులను కల్పిస్తే అవి ప్రపంచంలోని 75 శాతం మంది పేదల పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ప్రపంచ బ్యాంకు కూడా ఎక్కడో అంగీకరించింది.ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది, దిగువన ఉన్న 95 శాతం కంటే ఎక్కువ సంపదను కూడబెట్టుకున్న తరుణంలో... అసమానతలను మరింత పెంచిన ఆర్థిక సిద్ధాంతాలను పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. కాబట్టి భారతదేశం, దాని సొంత గాథను లిఖించవలసిన అవసరం ఉంది. ఇదంతా వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం ద్వారా ప్రారంభమవుతుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
కోవిడ్‌ను మించే భూతం... భూతాపం
రెండేళ్ల పాటు కరోనా వైరస్ ప్రపంచ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసింది. కోవిడ్ కల్లోలం సృష్టించిన నష్టం ఈ శతాబ్దంలోనే కాక, మానవ చరిత్ర లోనే ఓ పెనువిషాదం. ఆ పీడకల నుంచి తేరుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేస్తున్న ప్రపంచానికి మరో పెద్ద సవాలు... ‘గ్లోబల్ వార్మింగ్’. ఫలితంగా తీవ్రమైన ఎండలు, అంతలోనే వరదలు... మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. వాతా వరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతి యేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి.భూతాపం వల్ల సప్త సముద్రాలు వేడెక్కి పోతున్నాయి. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. 1950 నాటికి హిమాలయాలపై ఘనీభవించిన మంచు నేటికి చాలావరకు కనుమరుగైంది. అంటార్కిటికా సముద్రంలోని మంచు పరిణామం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భారత్‌తో సహా అనేక దేశాలలో శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోంది. మరికొన్ని చోట్ల సముద్ర మట్టాలు పెరిగి సముద్రాలు ముందుకు చొచ్చుకొచ్చి అనేక ద్వీపాలను కబళించి వేస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల మన దేశంలో అధికంగా నష్టపోతున్న రంగాలలో వ్యవసాయం, ఆరోగ్యం ముఖ్యమైనవి. ఒకవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని రంగాలు అభివృద్ధిలో అనూహ్యంగా ముందంజ వేస్తుండగా... మరో వైపు నిలకడైన వాతావరణ పరిస్థితులు లేక వ్యవసాయం, తదితర ఉత్పత్తి రంగాలలో భారీ క్షీణత కనిపిస్తోంది. ఈ వైరుధ్యం ప్రజల మధ్య అనేక అసమానతలకు దారితీస్తోంది. భారీ వర్షాలు, వరదలతో పేదల ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేదల జీవితాలు గాల్లో దీపంలా మారాయి. నివాసం ఉన్న చోట బతికే పరిస్థితి లేకపోవడం వల్ల మనుషులు వలసలు పోవాల్సిన దుఃస్థితి అనేక దేశాలలో నెలకొంది. మరోవైపు ఉష్ణోగ్రత పెరుగుదల, భారీ వర్షాల వల్ల అపసవ్య దిశలో సముద్రపు నీరు పొంగి పంట పొలాల్లోకి, నదీసంగమాల వద్ద నదుల్లోకి ప్రవహి స్తోంది. వాతావణ మార్పుల వల్ల జీవ వైవిధ్యం పూర్తిగా గాడి తప్పింది. మారిన వాతావరణ పరిస్థితులకు అలవాటు పడలేక మనుషు లతోపాటు మొక్కలు, జంతుజాలానికి తీవ్రమైన హాని కలుగుతోంది. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం తాజా నివేదిక ప్రకారం, సుమారు 10 లక్షల వృక్ష, జంతుజాతులు అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. గత 400 ఏళ్లల్లో 680 వెన్నెముక గలిగిన జాతులు నశించగా, కేవలం గత 2 దశాబ్దాలలోనే అంతకు రెట్టింపు జాతులు నశించాయి. కాలుష్యం, భూవినియోగంలో మార్పులు, వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య తేడాలు ఇందుకు కారణంగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. భూతాపం, కాలుష్యం కారణంగా మనుషులలో వయస్సుతో సంబంధం లేకుండా అనేక రుగ్మతలు కనపడుతున్నాయి. కేవలం శ్వాస కోశ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులతోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా 87 లక్షల ప్రజలు చనిపోతున్నారు. కాలుష్యం వల్ల అప్పుడే పుట్టిన పసికందులకు కూడా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ఒకప్పుడు అగ్ని పర్వతాలు బద్దలు కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం వచ్చాక... బొగ్గు, చమురు, గ్యాస్ వంటి శిలాజల ఇంధనాలను మండించడం ఎక్కువయ్యాక వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, ఇంకా గ్రీన్ హౌజ్ వాయువుల కారణంగా కేవలం 150 సంవత్సరాలలో 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర భూతాపం పెరిగింది. సహజ వాయువు వెలికితీత, దాని వాడకం వల్ల బయటపడే మీథేన్ కారణంగా మరో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడిమి పెరిగే అవకాశం ఏర్పడింది.పెరిగే భూతాపం వ్యవసాయ రంగానికి ప్రథమ శత్రువు. అధిక వర్షాలు, వరదల వల్ల చేతికొచ్చిన పంటల్లో ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆహార భద్రతకు అన్ని చోట్లా ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా, వ్యవసాయరంగంపై ఆధారపడిన రైతాంగం, అనుబంధ రంగాల కార్మికులకు ఆదాయాలు పడిపోయాయి. ఇప్పటికీ 60% ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని రక్షించు కోవాలంటే, అత్యవసర పర్యావరణ కార్యచరణతో ముందుకు సాగ వలసిందే! రుతుపవనాల గమనం, వాతావరణ వైవిధ్యం ఆధారంగా దేశాన్ని 7 జోన్లుగా వర్గీకరించుకొని అందుకు అనుగుణంగా పంటల సాగును నిర్వహిస్తూ వస్తున్న మన దేశంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. పంటలు పుష్పించే కాలంలో విపరీతమైన ఎండలు కాయడం వల్ల విత్తనాలు బలహీనపడుతున్నాయి. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపు తున్నది. ఒక అంచనా ప్రకారం వాతావరణ మార్పుల వల్ల ఒక్క భారతదేశంలోనే వ్యవసాయ దిగుబడుల్లో ప్రతియేటా రమారమి 30% క్షీణత నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యం, గోధుమ, పప్పుధాన్యాల్లో ఉండే ప్రొటీన్లు నశిస్తున్నాయి. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల్లో పోషకాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి పశువులకు అవసరమైన గ్రాసం అందడం లేదు. దాంతో, పశువుల ఎదుగుదల తగ్గి మాంసం ఉత్పత్తి పడిపోతోంది. పశువుల పునరుత్పత్తిపై ప్రతి కూల ప్రభావం చూపడమేకాక పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. అధిక వర్షాలు, వరదల వల్ల కోళ్లు, గొర్రెలు, ఇతర పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ యేడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో రెండు పర్యాయాలు కురిసిన భారీ వర్షాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. అధిక వర్షాలు, వరదల వల్ల పంట నష్టాలు జరుగు తున్నప్పుడు రైతాంగానికి ప్రభుత్వపరంగా అందుతున్న సాయం అరకొరగానే ఉంటోంది. వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేయలేని నేపథ్యంలో... పంటవేసి నష్టపోయే కంటే, పంట వేయకపోతేనే తక్కువ నష్టం అనే భావన చాలా ప్రాంతాల్లోని రైతాంగంలో బలంగా నాటుకుపోయింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలీడే పాటిస్తున్నారు. ఇందువల్ల దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. భూతాపం తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే అనేక సదస్సులు నిర్వహించాయి, డిక్లరేషన్లపై సంతకాలు చేసి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రియో ఒప్పందం, కోపెన్హెగన్ సదస్సు, క్యోటో ఒప్పందం, కాప్ 21 పారిస్ ఒప్పందం... ఇలా అనేక విస్తృత వేదికలపై ప్రపంచ దేశాలు భూతాపం తగ్గించడానికి చేసిన ఉమ్మడి ప్రమాణాలు కాగితాలకే పరిమితం కావడం వల్ల ప్రపంచం ప్రమాదంలో పడింది.అయితే, కొన్ని దేశాలు మాత్రం క్లీన్ ఎనర్జీ (స్వచ్ఛమైన ఇంధనం) వాడకం దిశగా ముందుకు సాగడం కొంతలో కొంత ఊరట. శిలాజ ఇంధనాల వాడకాన్ని పక్కనపెట్టి, సున్నా కాలుష్యం వెదజల్లే (నెట్ జీరో ఎమిషన్) టెక్నాలజీల వైపు పరుగులుపెడుతున్నాయి. ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వినియోగాన్ని పెంచడం; మొక్కజొన్న, మరికొన్ని రకాల ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని తయారీ చేయడం; గాలి మరలు, సోలార్ ప్యానళ్ల నుంచి విద్యుత్ తయారు చేయడం మొదలైన కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నాయి. కొన్ని దేశాలు బయోఎనర్జీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ కాలుష్యాన్ని తగ్గిస్తు న్నాయి. భారత్‌లో కూడా ఎలక్ట్రిక్, బ్యాటరీ వాహనాల వాడకం మొద లైనప్పటికీ వాటి సంఖ్య స్వల్పం. అలాగే, సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రకటించింది. వాతావరణం మార్పులతో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని స్థిరత్వం వైపు ముందుకు సాగాలంటే... అందుకు అనుగుణమైన విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే విధంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. పౌర సమాజంలో చైతన్యాన్ని పెంచాలి. ముఖ్యంగా, ఈ అంశంపై వివిధ రాజకీయ పక్షాలలో ఏకాభిప్రాయం, మద్దతు అవసరం. అంతిమంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లయితేనే ఫలితాలు అందుతాయి. లేకుంటే... కరోనాను మించిన భూతం అయిన భూతాపం వల్ల మరిన్ని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
పవన్‌కు ఇది తగునా?
పవన్ కల్యాణ్‌కు ‘మెకాలే’ తెలుసు. పద్దెనిమిదవ శతా బ్దంలో మెకాలే ఏమి చెప్పాడో కూడా తనకి తెలుసు. ఇన్ని తెలిసిన పవన్ కల్యాణ్‌కు ఇరవయ్యొకటో శతాబ్దంలో తాను ఏమి చెప్ప కూడదో తెలియకపోవడం మాత్రం విచారకరం!నిజానికి పవన్‌కి తెలుసో లేదో గానీ, లేదా అతను ఏ అర్థంలో వాడాడో గానీ – ‘సాంస్కృతిక సామ్రాజ్య వాదం’ అనే పద ప్రయోగం మెకాలే నాటికి లేదు. 1960ల నాటిది. హెర్బర్ట్ షిల్లెర్ దాన్ని (మొదటిగా కాకపోయినా) వివరించాడు.ఒకవేళ విదేశీ పాలకులు తమ పరిపాలనను స్థిరపరచుకోడానికి తమ భాషను, ఆచారాల్ని, సంప్ర దాయాల్ని తెచ్చి బలవంతంగా మన మీద రుద్దే ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాడు అనుకున్నా అది పూర్తిగా మెకాలేకి వర్తించక పోవచ్చు. సరే మన చర్చ మెకాలేది కాదు. వదిలేద్దాం. మెకాలేది గతం. పవన్‌ది వర్తమానం. అతనొక బ్రిటిష్ హిస్టోరియన్. బ్రిటిష్ భాష, బ్రిటిష్ సంస్కృతి, శిక్షా స్మృతి – ఇంకా అనేక బ్రిటిష్ పరంపరల బానిస మెకాలే. బ్రిటిష్ ఉద్యోగి. బ్రిటిష్ పౌరుడు మెకాలే. కాబట్టి ఆ యూరోపియన్ సంస్కృతి గొప్పదనాన్ని మన మీద రుద్దాలని చూశాడనుకుందాము. పవన్ చెప్పినట్లు అతనిది ‘సాంస్కృతిక సామ్రాజ్యవాదమే’ అనుకొందాము. మరి ఇప్పుడు పవన్ మాట్లాడుతున్నది ఏమిటి? దీన్ని ఏమంటారు?అన్ని మతాల, అన్ని కులాల ఓట్లతో గెలిచి,అందరి ప్రతినిధిగా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసి, ఇప్పుడు ‘వారాహి’ సభలో ‘సనాతన ధర్మాన్ని కాపాడతానని, నేను ముమ్మాటికీ హిందువునేనని, దాని కోసం ప్రాణాలైనా అర్పిస్తానని’ చెప్పడం చూస్తుంటే పవన్ ఒక ‘హిందూ సాంస్కృతిక సామ్రాజ్యవాది’గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ‘అల్లాను, మహమ్మద్ ప్రవక్తను, క్రీస్తును విమర్శిస్తే ఒప్పుకుంటారా’ అంటూ ఒక హిందూ ఉగ్రవాదిగా కూడా మాట్లాడుతున్నారు. గెలవకముందు ‘నాకు కులం లేదు, మతం లేదు; నేను దేశాన్నీ, జాతినీ ప్రేమిస్తాను’ అని చెప్పి, గెలిచాక ‘నేను హిందువుని, సనాతన ధర్మాన్ని ఆరాధి స్తాను’ అని చెప్పడం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణిని బయట పెడుతుంది.‘నేను హిందువు’ని అని స్కూల్ సర్టిఫికెట్లో చెప్పినట్లుగా, ‘వారాహి సభ’లో కూడా చెప్పడమేనా? చేగువేరా, భగత్ సింగ్ పుస్తకాలు చదివి నేర్చుకున్నది ఇదేనా? మనం ఏదైనా చెబితే ఒక వంద మంది వింటారు. కానీ అదే పవన్ చెబితే లక్ష మంది వింటారు. అలాంటి పాపులారిటీ వున్న పవన్ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవచ్చునా? విశ్వనాథ సత్యనారాయణకు రామాయణం అనేది ఒక ‘కల్పవృక్షం’గా కనిపించింది. అదే రామా యణం రంగనాయకమ్మకు ‘విషవృక్షం’గా అనిపించింది. అయ్యప్పను గద్దర్ విమర్శించాడు. అయ్యప్ప పుట్టుక మీద, అతని భక్తుల దీక్ష మీద గద్దర్‌కి వున్న విమర్శ అది.సనాతన ధర్మం మీద, రాముని మీద ఈ రోజున పవన్ కల్యాణ్ చాలా ప్రేమను కురిపిస్తున్నాడు. అది అతని హక్కు. తమిళులకు ఏ రోజునా రాముడి మీద గౌరవం లేదు. సనాతన ధర్మం మీద ప్రేమ అంత కన్నా లేదు. అలా లేకపోవడానికి వారి కారణాలు వాళ్లకి ఉన్నాయి. ద్రవిడ సంస్కృతిలో రావణాసురు డికి వున్న చోటు రాముడికి లేదు. ఆ కోణంలో సనా తన ధర్మం అనేది ఉదయనిధి స్టాలిన్‌కి ఒక వైరస్ లాగా అనిపించి వుండవచ్చు.హిందూ దేవుళ్ళ మీద ఎలాగైతే విమర్శలు ఉన్నాయో, అలాగే క్రీస్తుని, అల్లాని, మహమ్మద్ ప్రవక్తని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. బైబిల్, ఖురాన్‌ల మీద రాసిన విమర్శలూ ఉన్నాయి. ఇదంతా ఏమీ చూడని పవన్ కల్యాణ్ అందర్నీ పట్టుకొని ‘సూడో సెక్యులరిస్టులు’ అని అంటున్నాడు.‘సనాతన ధర్మంలో అంటరానితనం వుంది.లింగ వివక్ష వుంది. అన్యాయం వుంది. అధర్మం వుంది’ అనుకున్న వాళ్ళు హిందూ మతం నుంచి వెళ్లిపోయారు. వేరే మతాల్లో చేరిపోయారు. దానికి కొన్ని వందల ఏళ్ళ చారిత్రక సందర్భం ఉంది. పవన్ ఇలా మాట్లాడటం వెనుక కూడా ఒక చారిత్రక సందర్భం ఉంది. జగన్‌ని ఒక సీటుకు పరి మితం చేయాలనుకోవడం ఆ సందర్భం కావచ్చు. లేదా తాను సీఎం కావడం భవిష్యత్తు సందర్భం కావచ్చు.జీవ శాస్త్రం ప్రకారం మనందరికీ ప్రాణం ఒక్కటే ఉంటుంది. ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి చాలా అవసరాలూ, సందర్భాలూ ఉంటాయి. ప్రాణం పోవ డానికి, లేదా ఇచ్చేయడానికి మాత్రం ఒకే సందర్భం ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్‌కు మాత్రం చాలా ప్రాణాలు ఉంటాయి. అవి ఇచ్చేయడానికి కూడా చాలా సందర్భాలు ఉంటాయి.దేశం కోసం ఒకసారి ఇచ్చేస్తారు. భారత జాతి కోసం ఇంకోసారి ఇచ్చేస్తారు. చేగువేరా కోసం, భగత్ సింగ్ కోసం లేదా వారి ఆదర్శాల కోసం మరొకసారి ఇచ్చేస్తారు. జగన్‌ని ఓడించడానికో, లేదా కూటమిని గెలిపించడానికో కూడా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు చివరగా సనాతన ధర్మాన్ని గెలిపించడానికి ఒక హిందువుగా ప్రాణాల్ని ఇచ్చేస్తానని చెబుతున్నారు.పవన్ కల్యాణ్‌ను ఒక హిందువుగా ఎంచి ఎవ్వరూ ఓట్లు వేయలేదు. సినిమా నటుడిగా, కాపు కులానికి చెందిన వాడిగా, కూటమిలో భాగస్థునిగా గెలిపించుకున్నారు. ఆ గెలిపించుకున్న వారంతా పవన్ గురించి ఇప్పుడు ఏమనుకోవాలి? తమను తాము హిందువుగా అనుకోని సమూహాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. వారంతా ఇప్పుడు పవన్ గురించి ఏమనుకోవాలి?‘పవనిజం’ అంటే ఇదేనా? అలాంటప్పుడు దీన్ని ‘హిందూయిజం’ అని కదా అనాలి? దక్షిణ భారత మద్దతు కోసం ఉత్తర భారతాన్ని విమర్శించడం,ఆంధ్రా వారి మద్దతు కోసం తెలంగాణాను విమర్శించడం, తెలంగాణా వారి మద్దతు కోసం తెలంగాణను కీర్తించడం, ఇప్పుడు మళ్ళీ ఆర్యుల్ని కీర్తించడం కోసం ద్రావిడుల్ని విమర్శించడం! ఇలాంటి అవకాశ వాద రాజకీయాల ద్వారా పవన్ సాధించగలిగింది ఏముంటుంది?పవన్‌లో ఇప్పుడు చేగువేరా లేడు. భగత్ సింగ్ లేడు. థెరిస్సా లేరు. గద్దర్ కూడా లేడు (వీళ్లంతా నిజంగా ఉన్నారని కాదు). మోడీ మాత్రమే ఉన్నాడు!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్తమొబైల్: 98494 49012 -
వివేచన హక్కుపై నిషేధమా?
మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అదే సమయంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... అది మనల్ని మనిషిగా తక్కువ చేసేస్తుంది. ప్రభుత్వం నిజాయితీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే సృజనాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికి అవకాశాలు న్నాయి. కానీ దండనలతో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది.అప్పుడు నాకు 16 ఏళ్లు ఉంటాయి. కానీ, నిన్ననే జరిగినంతగా ఆ సంగతి గుర్తుండి పోయింది. వీకెండ్ కోసం స్టోవ్ (యూఎస్‌లోని వమాంట్ రాష్ట్రంలో ఒక పట్టణం) నుండి వచ్చాను నేను. అందరం కలిసి టీవీ చూస్తున్నాం. కిరణ్ సిగరెట్ తాగుతూ ఉంది. ‘క్యారీ ఆన్’ (ప్రసిద్ధ బ్రిటిష్ కామెడీ సీరీస్)లోని ఒక చిత్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు సగం వరకూ రాగానే, మధ్యలో ఒక వాణిజ్య ప్రకటన మా దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు బ్రిటిష్ పోలీసు అధికారులు రోడ్డు పక్కన ఉన్న ఒక కేఫ్‌ను దాటి నడుచుకుంటూ వెళుతుండగా, వారి చూపు ఒక అందమైన యువతిపైన పడుతుంది. ఎడమ చేతిలో పొడవాటి సిగరెట్‌తో ఉన్న ఆమె కొద్ది కొద్దిగా కాఫీని సిప్ చేస్తుంటుంది. ‘‘ఆమెను చూడు’’ అని మొదటి పోలీస్ ఆఫీసర్ గుసగుసగా అంటాడు. ‘‘సిగరెట్ తాగుతోంది కదా?’’ అని రెండో ఆఫీసర్. ‘‘ఆమె కాళ్లు నాకు నచ్చాయి.’’‘‘అవి, కాలుతున్న ఆమె సిగరెట్ పొడవంత ఉన్నాయి.’’‘‘ఆ పెదవులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది నాకు.’’‘‘కంపు కట్టే యాష్‌ట్రేని ముద్దు పెట్టుకున్నట్లా?’’ఆ డైలాగ్ తర్వాత ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ముందుకు సాగిపోతారు. ఆ అందమైన యువతి స్క్రీన్ వైపు చూసి నవ్వుతుంది. విడివడిన ఆమె పెదవుల మధ్య పలువరుస నికోటిన్ మరకలతో పొగచూరి, గోధుమ వర్ణంలో ఉంటుంది! ‘యాక్’ అని అసంకల్పితంగా అరిచేశాను నేను. నా వెన్నులో వణుకు పుట్టింది. కిరణ్ అయితే తను తాగుతూ ఉన్న సిగరెట్‌ను అప్పటికప్పుడు విసిరి పారేసింది. ఆ వీకెండ్లో ఆమె మళ్లీ సిగరెట్ తాగినట్లు నాకు గుర్తు లేదు.ఆ వాణిజ్య ప్రకటనకు రూపకర్తలు ఎవరో నాకు తెలియదు. ప్రభుత్వమే చెప్పి చేయించిందో, లేదా ఏదైనా ప్రైవేటు ట్రస్టుఅందుకు నిధులు సమకూర్చిందో కానీ అది మాత్రం చాలా ప్రభావ వంతంగా ఉంది. మన ప్రభుత్వం నిజాయతీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే ఆ ప్రకటనలో ఉన్నట్లే సృజ నాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికైతే అవకాశాలున్నాయి. కానీ దండనలతో వారిలో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. అందుకే ధూమపానాన్ని నిషేధించాలన్న నిర్ణ యాలు ఘోరమైన తప్పిదాలుగా మిగులుతున్నాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది. మన ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదనే ఆశిస్తున్నాను. మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అది మన వ్యక్తిత్వాన్ని కూడా నిర్వచిస్తుంది. అదే సమ యంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... మానవత లోని అత్యవసరతల్ని నిరాకరిస్తుంది. అది మనల్ని తక్కువ చేసేస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం లేని పిల్లల్ని చూసి నట్లుగా మనల్ని చూస్తుంది. నిర్ణయించుకునే హక్కు నుండి మనం అవిభాజ్యంగా ఉండటం అన్న భావనతో ఇతరులు ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ ఒకే ఒక్క కార ణమే ఆ హక్కును నిలబెడుతుంది. మీకు భిన్నంగా ఉండటమనే నా హక్కులోనే నా వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. అంతేకాదు, నాలోని ఆ భిన్న త్వం మీకు నచ్చకపోయినా మీరు గౌరవించాలనే నేను కోరుకుంటాను. పొగ తాగే విషయం కూడా ఇంతే. పొగ తాగకుండా ఉండేందుకు వెయ్యి మంచి కారణాలు ఉంటాయి. పొగ మాన్పించేందుకు నన్ను ఒప్పించటానికి పది లక్షల సానుకూల వాదనలు ఉంటాయి. కానీ అప్పటికి కూడా నేను పొగ తాగుతున్నానంటే మీరు నా మీద నిషేధం విధించకూడదు. నా ఇష్టాన్ని అడ్డుకోకూడదు. మీరిలా నా మంచి కోసమే చేస్తున్నారన్న మీ వాదన విచిత్రమై నది, నమ్మశక్యం కానిది. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అన్న దానిని నేను కాదనలేదు. నేనే కాదు, నాకు తెలిసిన ధూమమాన ప్రియులు ఎవరూ కూడా కాదనలేరు. అతిగా తినటం, మితిమీరిన వ్యాయామం, కళ్లకు ఒత్తిడి కలిగించుకోవటం, విపరీతంగా కోక్‌లు తాగటం... ఇవన్నీ కూడా హానికరం కాదని ఎవరూ అనరు. అయినప్ప టికీ వీటిల్లో దేనినైనా నేను ఇష్టపడితే కనుక, అప్పుడు కూడా నేను మాత్రమే సలహాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే విషయాన్ని నిర్ణయించుకోవాలి. దాని వల్ల నేను ఇబ్బంది పడితే అలాగే కానివ్వండి. ఎందుకంటే నిర్ణయించుకునే హక్కులోనే ఆ నిర్ణయం వల్ల బాధ పడే హక్కు కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలి? సమాధానం చాలా సరళమైనది, సూటిౖయెనది. నిషేధం విధించటం కాకుండా ఎవరికి వారు సిగరెట్‌కు దూరమయ్యేలా ప్రభావం చూపే చర్యలు తీసు కోవాలి. సిగరెట్ ప్యాకెట్ల మీద అతి పెద్ద, అత్యంత భయానకమైన ఆరోగ్య హెచ్చరికలను చేయవచ్చు. పన్నులను తరచుగా పెంచుతూ ఉండొచ్చు. (దీని వల్ల ఒక దశ తర్వాత ప్రభుత్వానికి రాబడి తగ్గవచ్చు లేదా ప్రతికూల ఉత్పాదకత సంభవించవచ్చు). ధూమపానానికి వ్యతి రేకంగా విస్తృత ప్రచారాన్ని చేపట్టేందుకు నిధులను అందజేయవచ్చు. ఈ మూడింటినీ నేను సమర్థిస్తాను. అంతేతప్ప ఎప్పుడూ కూడా ధూమపాన నిషేధానికి ప్రయత్నించకూడదు. వ్యక్తులు, సమూహాలు తాము కోరుకున్నప్పుడే తమకై తాము ఆ పనికి సంకల్పించటం జరుగుతుంది. వారి కోసం ప్రభుత్వమే ఆ పని చెయ్యకూడదు. మరింత స్పష్టంగా చెబుతాను. మంచి ప్రభుత్వాలు – పెద్దలు పిల్లల్లో పరిణతి తెచ్చే విధంగా – తమకు తాముగా నిర్ణయించుకునే అవకాశాన్ని, అవకాశంతో పాటుగా వచ్చే బాధ్యతను స్వీకరించే సమర్థతను తమ పౌరులకు అందిస్తాయి. ఆ విధంగా దేశం తన కాళ్ల మీద ఎలా నిలబడాలో నేర్చుకుంటుంది. ఇందుకు భిన్నంగా చెడు ప్రభుత్వాలు పెద్దల్ని కూడా పిల్లలుగా పరిగణిస్తూ వారికున్న నిర్ణయ అధికారాన్ని లాగేసుకుని తమ సొంత నిర్ణయాలను వారిపై అమలు చేస్తాయి. అలా దేశాలు కూలిపోవటం మొదలవుతుంది. అన్నట్లు, నేను పొగ తాగటం మానేసి చాలాకాలమే అయ్యింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మానవ తాత్వికతకు దర్పణం
బాలగోపాల్ 2009 అక్టోబర్ 8న మరణించి ఇప్పటికి పదిహేనేళ్లు గడుస్తున్నా ఆయన ప్రాసంగికత కాలగమనాన్ని తట్టుకొని స్థిరంగా నిలబడే ఉన్నది. మనిషి ఉనికి, తాత్విక అర్థం, స్థూలంగా మానవ జీవితపు అంతరార్థం ఆయన వివరించినంత లోతుగా తెలుగునాట మరొకరు విశదీ కరించలేదన్నది అతిశయోక్తి కాదు. అంతరాలు నిండిన, అసమానతలతో కూడుకున్న సమాజం మనుషులకు వైకల్యంతో కూడిన ప్రాపంచిక దృక్పథాన్ని మాత్రమే అందించగలదనీ... సమానత్వ ప్రాతిపదికన, మనుషులను మనుషులుగా చూడగలిగే మానవీయ దృక్కోణాన్ని సంకల్పపూర్వకంగా అలవర్చుకోవా ల్సిందనీ బాలగోపాల్ నొక్కి వక్కాణించాడు. వైయక్తిక సంకల్పమే కాదు, సామాజిక ఆచరణ కూడా అంతే అవసరం అన్నాడు. ఈ సమానత్వ ప్రాపంచిక దృక్కోణాన్ని, మానవ ఆచరణను... సామాజిక నీతి నియమాలు, నిబంధనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో కూడా తన రచనల ద్వారా వివరించాడు. ఒక్క మానవ తాత్వికతను మాత్రమే కాదు, దాని సామాజిక చలన సూత్రాలను, సామాజిక ఉద్యమాలలో దాని మూలాలను విశ్లేషించి విడదీయరాని సంబంధాన్ని నెలకొల్పిన ఉద్యమకారుడు కూడా ఆయనే. తన జీవితాన్ని ఈ సామాజిక తాత్విక దృక్పథానికి ఒక తిరుగులేని ప్రయోగశాలగా మార్చిన అరుదైన వ్యక్తి. సంక్లిష్టమైన భారత సామాజిక జీవితంలో అస మానతలు భిన్న పాయలుగా మన జీవితంలో పెన వేసుకు పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ అసమానతలను రూపు మాపటానికి చైతన్యపూరితంగా మనం చేయవలసిన కృషిని తను జీవించి ఉన్నంతకాలం మనకు తన జీవిత ఆచరణ ద్వారా మార్గదర్శనం చేశాడు. 2024 ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణ తీర్పులో సైతం ఆయన వాదనలను ఉటంకించటం దీనికి ఒకానొక ఉదాహరణ మాత్రమే. దళితులలో దళితులు అన్న పదం వాడగలిగిన ఏకైక వ్యక్తి ఆయన. వివక్ష ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్న తన సూక్ష్మ పరిశీలన ద్వారా దానిని పసి గట్టి ఆ వివక్ష తాత్విక మూలాల్ని సమాజానికి విశద పరిచిన వ్యక్తి బాలగోపాల్. వివక్ష అసలు అర్థం అసమానతేననీ, అది అసమానతను అనుభవిస్తున్న వర్గాల్లో సైతం ఆచరణలో ఉండగలదనీ, అక్కడ కూడా మనం సమానత్వ ప్రాతిపదికనే ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందనీ ఎలుగెత్తినవాడు ఆయన.పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దారుణ మారణకాండను చూసినప్పుడు ఇంత అమానవీయమైన హింసకాండకు కారణాలను ఆయన మనకు ఒక కొత్త కోణంలో, మానవీయ కోణంలో ఆవిష్కరించేవాడు అని మనం గుర్తు తెచ్చుకోకుండా ఉండలేము. తొలి రోజుల్లో వర్గ సిద్ధాంతపు ఆలోచనా ధోరణికి కొంత ప్రభావితమైనా మానవత్వపు విస్తృత పరిధి ఒక సిద్ధాంత చట్రంలో ఇమిడేది కాదనీ, మానవత్వానికి నిర్వచనం మానవత్వంతో మాత్రమే ఇవ్వగలమనీ తన కార్యాచరణ ద్వారా గ్రహించిన ఆయన చివరికంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మాన వతను మానవీయ దృక్కోణంలోనే విస్తరించాడు. ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు, దానికి తిరుగుబాటుగా వచ్చే ప్రతిహింస సైతం మానవ త్వానికి జవాబు దారీగా ఉండాలనీ, అలా కాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అను కరణ మాత్రమే కాగలవనీ వివరించాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు... సామాజిక ధోరణులలో, సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు ఉండగలవనీ... ప్రజా జీవితంలో సైతం అసమానతలతో కూడిన సమాజాన్ని కొనసాగించడానికి అవసరమైన అధిప త్యాలు ఉండగలవనీ వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయటం హక్కుల ఉద్యమపు బాధ్యత అని తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతా కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసిన వ్యక్తి బాలగోపాల్. ఆయన ఈరోజు లేకపోవచ్చు కానీ ఆయన తాత్విక దృక్పథం ఆయన రచనల ద్వారా అందుబాటులోనే ఉన్నది. తెలుగు సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ సమస్యలకు ఆయన రచనలలో పరిష్కారాలు లభించ గలవు. అధికారాన్ని సందేహించనివారు హక్కుల కార్యకర్తలు కాజాలరు అన్న మాట ఆయనలోని నిండైన మానవత్వాన్ని ఆవిష్కరిస్తుంది. మానవీయ సమాజం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం కృషి చేయడమే ఆయన జీవితాచరణ ద్వారా నిర్దేశించిన ఏకైక కర్తవ్యం.– టి.హరికృష్ణ, మానవ హక్కుల వేదిక (నేడు హైదరాబాద్‌లో బాలగోపాల్ 15వ సంస్మరణ సదస్సు) -
ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?
ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రాధాన్యతను గుర్తిస్తోంది. యూరోపియన్ యూనియన్ ఇకనుంచీ జర్మన్‌కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి. కానీ భారతదేశం మాత్రం కాలాన్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిష్ భాషను వలసవాదంతో ముడిపెట్టడం విధానపరమైన తప్పిదం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసేందుకు నడుం బిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఆంధ్ర మోడల్ విద్యా ప్రయోగం దుష్ట రాజకీయ శక్తుల కుట్రవల్ల ఆగిపోకూడదు.యావత్ ప్రపంచం ఇంగ్లిష్‌ను పాఠశాల స్థాయి బోధనా భాషగా స్వీకరిస్తున్న సమ యంలో, భారతదేశం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇంగ్లిష్ విద్యకంటే వెనుకటి రోజులకు కాలాన్ని తిప్పుతోంది. ఇంగ్లిష్ భాషను వలస వాదంతో ముడిపెట్టడం ఒక ప్రధాన విధానపరమైన తప్పిదం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంగ్లిష్ ఒక వలస భాష అనే సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా తీసుకొస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మాధ్యమ విద్యపై జరిగిన మొట్టమొదటి అతి పెద్ద ప్రయోగాన్ని వెనక్కి తిప్పేశాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సీబీఎస్ఈ సిలబస్‌ను ఉపసంహరించుకుంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లులకు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయల ఆర్థిక సహా యాన్ని నిశ్శబ్దంగా నిలిపివేశారు. సహజంగానే, కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. అవి ప్రైవేట్ రంగ ఇంగ్లిష్ మాధ్యమ విద్యకు గట్టిగా మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ రంగంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసి మళ్లీ తెలుగు మీడియం వైపు మళ్లించేందుకు అన్ని విధాలా నడుం బిగిస్తా మన్న స్పష్టమైన సంకేతంతో, ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, కాలేజీల యజమాని నారాయణను మళ్లీ మంత్రిని చేశారు చంద్ర బాబు. ఈ దిశ స్పష్టంగా ఉంది.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యను అనుమతించొద్దనే విషయంలో స్పష్టంగా ఉంది. ఎన్డీయేలోని ప్రధాన నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరూ ఈ విషయమై ఒకే మాట మీద ఉన్నారు. నితీష్ కుమార్ అయితే తన సమావేశాల్లో పార్టీ నాయ కుడైనా, అధికారి అయినా ఇంగ్లిష్‌లో మాట్లాడినా ఇష్టపడరు.సుప్రీంకోర్టులోనూ, ప్రతి హైకోర్టులోనూ అన్ని వ్యవహారాలుఆంగ్లంలో ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(1)(ఎ) పేర్కొన్నప్పటికీ, ప్రాంతీయ భాషను ఉపయోగించాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులను కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ రకమైన విద్యా విధానం పట్ల ఆంధ్రప్రదేశ్‌లో లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న యువత ప్రైవేట్ ఇంగ్లిషు మీడియంలో చదువుకున్న యువతతో పోటీపడే అవకాశం లేదని ఇది చూపుతోంది. అందరూ మాట్లాడిన ‘ఆంధ్రా మోడల్’ సృష్టించిన ఆశ నిరాశగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా విస్తరణకు భారత కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు కూడా అడ్డంకిగా మారాయి.దేశంలో ఇంగ్లిష్ విద్య 1817లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఆ భాష ప్రవేశించిన 207వ సంవత్సరం. అక్టోబర్ 5న భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం అనే విషయం తెలిసిందే.భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక్కో భాషా దినోత్సవ వేడుకలు జరుగు తాయి. కానీ ఇంగ్లిష్‌ను ప్రపంచ, భారతీయ అవకాశాల భాషగా నేర్చుకుని, దాని నుండి ప్రయోజనం పొందినవారు... అధికారం,సంపద, ప్రపంచ చలనశీలత భాషగా దాన్ని ఉపయోగి స్తున్నప్పటికీ ఒక భాషగా ఆంగ్ల దినోత్సవాన్ని జరుపుకోరు. పైగా బహిరంగ వేదికల నుండి దాన్ని వలస భాషగా ఖండిస్తూనే ఉంటారు.ఇంగ్లిషు భాష నుండి అత్యధికంగా ప్రయోజనం పొందిన వ్యక్తులు అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియాలు, కాయ స్థులు, ఖత్రీలు. చారిత్రకంగా భారతీయ పాలక కులమైన క్షత్రియులు ఈ భాష శక్తిని ఇటీవలే గ్రహించారు. వారి పిల్లలను ఇంగ్లిష్ మాధ్య మంలో చదివిస్తున్నారు.ఆంగ్లం వల్లే ప్రపంచ స్థాయికమలా హ్యారిస్ భారతీయ సంతతికి చెందిన బ్రాహ్మణ మహిళ. 245 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్న అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా అవతరించే అవకాశం ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ఏ శ్వేతజాతీయురాలూ అధ్యక్షురాలు లేదా ఉపాధ్యక్షురాలు కాలేదు. కమల ఇప్పటికే అమెరికా తొలి ఉపాద్యక్షురాలు అయ్యారు. వలసరాజ్యాల కాలంలో ఇంగ్లిష్ భారత దేశానికి రాకపోతే, ప్రపంచ భాషగా ఇంగ్లిష్ లేకుండా ఉంటే ఇది సాధ్యమయ్యేదా? తమిళ బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అయిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ఇంగ్లిష్ చదవకుండా ఉండి ఉంటే అమెరికా వెళ్లి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని తన ఇద్దరు కూతుళ్లు కమల, మాయలను చదివించి ఉండేవారా? ఒక సాధారణ మధ్యతరగతి ఒంటరి తల్లి కుటుంబం నుండి వచ్చిన కమల ఇంగ్లిష్ భాష లేకుండా, తన స్థాయికి తగ్గ లాయర్‌గా ఎదిగి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి ఉపాధ్యక్షురాలిగా ఎదిగి, ఇప్పుడు అత్యంత సంపన్నుడైన శ్వేతజాతి అమెరికన్ డోనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష రేసులో సవాలు చేసే అవకాశాన్ని పొందగలదని మనం ఊహించగలమా? పశ్చిమ భారతదేశానికి చెందిన ఖత్రీ కుటుంబానికి చెందిన రిషి సునాక్ తల్లిదండ్రులు ఇంగ్లిష్ భాషలో విద్య నేర్వకపోయి ఉంటే, రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించినబ్రిటన్కు ఆయన ప్రధాన మంత్రి కావడం మనం ఊహించగలమా? భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి అగ్రవర్ణాల ఇళ్లలోనిసాంస్కృతిక వాతావరణాన్ని ఇంగ్లిష్ మార్చింది. కానీ ఆ భాష పరిధిని, శక్తిని ఉపయోగించి అనేక విధాలుగా ప్రయోజనం పొందిన అదే వ్యక్తులకు ఇప్పుడు రైతులు, కార్మికుల పిల్లలు ఆ భాష నేర్చు కోవడం ఇష్టం లేదు. ఇది వైరుధ్యం కాదా?యూరప్ కూడా ఆంగ్లం దిశగా...యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం ఇకనుంచీ జర్మన్ కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు తమ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి.ఫ్రా¯Œ ్స, జపాన్, చైనా, రెండు కొరియన్ దేశాలు ఒకే జాతీయ భాషతో వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి నుండీ తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని బోధించడం ప్రారంభించాయి. ప్రపంచీకరణ చెందిన ప్రపంచంలో భాషతో ముడిపడి ఉన్న జాతీయవాదం తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర సందర్భంలో బ్రిటిషేతర దేశాలన్నీ తీవ్రమైన భాషాపరమైన మనోభావాలను కలిగి ఉండేవి. కానీ ప్రతి ఐరోపా దేశం కూడా ఇప్పుడు ఆర్థికాభివృద్ధికి ఇంగ్లిష్ తప్పనిసరి అని గ్రహించింది. మునుపటి ఫ్రెంచ్, స్పానిష్ కాలనీలు కూడా నెమ్మదిగా తమ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు మారుతున్నాయి.భావోద్రేక భరితమైన మాతృభాష సిద్ధాంతంతో భారతదేశం అనేక చిన్న భాషలు మాట్లాడే జాతులుగా విభజించబడింది. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమదైన చిన్న భాషా ప్రపంచంలో ఇరుక్కుపోయారు. ఈ రకమైన భాషాపరమైన నిర్బంధం వారిని సరైన పౌరసత్వ పాత్రలోకి ఎదగనివ్వదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినటువంటి విద్యా ప్రయోగానికి దుష్ట రాజకీయ శక్తుల కుట్రతో చావుదెబ్బ తగలకూడదు.- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (నేడు ఇండియన్ ఇంగ్లిష్ డే)- -
పశ్చిమాసియా చిచ్చుకు బాధ్యులెవరు?
లెబనాన్‌పై దాడి, హెజ్బొల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై వందలాది మిసైళ్లతో ఇరాన్ విరుచుకు పడింది. వాటిలో అనేకాన్ని ఇజ్రాయెల్ కూల్చివేయగలిగిందిగానీ వాళ్ల నగరాలు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఇదే కొనసాగితే దారుణ విధ్వంసం తప్పదు. ఇప్పటికైనా దౌత్య యత్నాలు సాగుతాయా అన్నది ప్రశ్న. యూదులకు ఒక దేశం ఉండాలన్న సూత్రంతో పాలస్తీనాను రెండుగా విభజించటం ఒక చారిత్రక విషాదమనుకుని అంగీకరించినా, కనీసం రెండు స్వతంత్ర దేశాల సూత్రానికి ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కట్టుబడి ఉంటే సమస్య కాలక్రమంలో సమసిపోయేది. అట్లా జరగకపోవటం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది.ఇరాన్ ఈ నెల ఒకటవ తేదీ రాత్రి ఇజ్రాయెల్‌పై వందలాది మిసైళ్లతో దాడి చేసింది. అవి అగ్ని బాణాల వలె ఇజ్రాయెల్ పైకి దూసుకుపోయి కురుస్తుండటం ఆ రోజు రాత్రి ఆకాశంలో కనిపించి ప్రపంచమంతా ఊపిరి బిగ బట్టింది. ఇక రానున్న రోజులలో ఏమి కావచ్చునన్నది అందరి ఆందో ళన, భయం. ఇందుకు దోహదం చేసిన పరిణామాలు గత కొద్ది రోజు లలో చోటు చేసుకున్నాయి. హెజ్బొల్లా అధినేత సయ్యద్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హత్య చేసింది. లెబనాన్‌పై దాడులు ప్రారంభించింది. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ యుద్ధ నౌకలు మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించి ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మంగళవారం నాడు ఒక వీడియో విడుదల చేస్తూ నేరుగా ఇరాన్‌ను ఉద్దేశించి రెండు కీలకమైన మాటలు అన్నారు. మొత్తం పశ్చిమాసియాలో ఏ ప్రాంతం కూడా తమ బలానికి అతీతమై నది కాదన్నది మొదటిది. ఇరానియన్ నాయకుల వల్లనే అక్కడి ప్రజలు పేదరికానికి, ఇతర సమస్యలకు గురవుతున్నారనీ, వారు లేకుంటే ఇరాన్ బాగా అభివృద్ధి చెందుతుందనీ, వారికి తమ నాయ కుల సమస్య త్వరలో తీరిపోతుందన్నదీ రెండవది. హెజ్బొల్లా అధినేత హత్య నేపథ్యంలో ఇటువంటి హెచ్చరికలతో ఇరాన్ అగ్ర నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని వెంటనే తాము సురక్షితమనుకునే రహస్య స్థావరానికి తరలించారు.త్వరత్వరగా చోటు చేసుకున్న ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి జరిపింది. ఇరాన్ వందలాది మిసైళ్లలో అనేకాన్ని ఇజ్రాయెల్‌తో అమెరికా నౌకా దళాలు కూల్చివేశాయి గానీ, మరెన్నో ఇజ్రాయెలీ నగరాలను, సైనిక స్థావరా లను ధ్వంసం చేశాయి కూడా. ఇది ఇంతటితో ఆగుతుందా, లేక యుద్ధం పెచ్చరిల్లుతుందా అనే ప్రశ్నకు సమాధానం ప్రధానంగా ఇజ్రాయెల్ చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ మాత్రం మంగళవారం రాత్రే ఒక ప్రకటన చేస్తూ, తమవైపు చర్యలు ప్రస్తుతానికి ఇంతటితో ఆపుతున్నామనీ, ఇజ్రాయెల్ వైఖరిని బట్టి తదుపరి చర్యలుంటాయనీ అన్నారు. మరొకవైపు ఇజ్రా యెల్ ప్రధాని, సైన్యాధిపతి తాము ప్రతీకారం తీర్చుకొనగల మన్నారు. లోగడ హమాస్ నాయకుడు ఇస్మాయెల్ హానియేను తమ దేశంలోనే హత్య చేసినందుకు, అదే విధంగా తమ అగ్రశ్రేణి సైనిక బ్రిగేడియర్ జనరల్ అబ్బాస్ నిల్ఫరోషాన్ను హత్య చేసినందుకు ప్రతీకారంగా కూడా ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్లతో దాడి జరిపి, అది తమ హెచ్చరిక అని ప్రకటించింది. అపుడు కూడా ఇజ్రాయెల్ ప్రతీ కార ప్రకటనలు చేసింది. కానీ బయటి రాజ్యాలు ఇజ్రాయెల్ వైపు కొన్ని, ఇరాన్ వైపు కొన్ని దౌత్య యత్నాలు చేయటంతో అది అంత టితో నిలిచిపోయింది. ఇపుడు తిరిగి అటువంటి స్థితే తలెత్తుతున్నది. అయితే ఈసారి కూడా దౌత్య యత్నాలు సాగుతాయా లేక పరిస్థితి విషమిస్తుందా అన్నది ప్రశ్న. గతానికి, ఇప్పటికి కొన్ని తేడాలు ఉన్నా యన్నది గమనించవలసిన విషయం. పోయినసారివలె గాక ఇపుడు లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. ఇరాన్ అధినేతలను హత్య చేయగలమనే నర్మగర్భమైన హెచ్చరికలు చేసింది. పశ్చిమ దేశాల నౌకా బలాలు మధ్యధరాలో ప్రవేశించటమేగాక, ఇరాన్ మిసైళ్లను ఎదుర్కొనే రూపంలో ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొ న్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతును మరొకమారు ప్రకటించారు. ఇవీ తేడాలు. కనుక, రానున్న రోజులలో ఏమైనా జరగవచ్చు. లేదా జరగక పోవచ్చు. అన్ని వివాదాలకు, ఘర్షణలకు, యుద్ధాలకు కారణమైన పాలస్తీనా సమస్య పరిష్కారం కానిదే ఏదీ ఆగబోదన్నది మౌలిక విషయం. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయా లున్నాయి. మొదటిది–గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం. హమాస్ దళాలు గత అక్టోబర్‌లో తమ భూభాగంపై దాడి జరిపి సుమారు 1,200 మంది పౌరులను హత్య చేశారన్న దాన్ని సాకుగా చేసుకుని ఇప్పటికే ఇజ్రాయెల్ 42,000 మంది పాలస్తీనియన్లను గాజాలో చంపివేసింది. గాజాకు సంబంధించి మరొక స్థాయిలో ఇజ్రాయెల్ చెప్తున్నది, అక్కడ తమ సైనిక నియంత్రణ ఇక శాశ్వతంగా ఉంటుంది. పాలస్తీనియన్లే పాలించినా పర్యవేక్షణ తమదవుతుంది. ఐక్యరాజ్య సమితి సైతం వ్యతిరేకిస్తున్నా, అసలు వెస్ట్ బ్యాంక్ మొత్తంగా ఇజ్రాయెల్‌లో భాగమే, తమదే అనటం రెండవది! పాలస్తీనియన్లకు మద్దతుగా హెజ్బొల్లాతో పాటు, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ తదితర దేశాల మిలిటెంట్లు ఎన్ని నష్టాలనైనా ఎదుర్కొంటూ నిలవడమన్నది మూడవ ముఖ్యమైన విషయం. లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నాల్గవ ముఖ్య విషయం. ఇక చివరిది ఇరాన్. వారి సైనిక బలం సంఖ్య రీత్యా ఇజ్రాయెల్‌ను మించినదే అయినా, వైమానిక బలం, సాంకేతిక శక్తి అందుకు సాటిరావు. పైగా, ఉక్రెయిన్‌లో వలెనే ఇక్కడ కూడా మొత్తం అమెరికా కూటమి తమ ఆయుధ శక్తి, ధన బలంతో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. రెండు దేశాల మధ్య భూతల యుద్ధం జరిగితే ఇరాన్‌ది పైచేయి కావచ్చునేమోగానీ, మధ్యలో సిరియా, జోర్డాన్, ఇరాక్ భూభాగాలు ఉన్నందున అది వీలయ్యేది కాదు. అందువల్ల క్షిపణులు, యుద్ధ విమానాలపై ఆధారపడాలి.అంతమాత్రాన ఇజ్రాయెల్ గెలిచి తీరుతుందని కాదు. ఫలితం ఎట్లున్నా... ఇరాన్‌తో పాటు పాలస్తీనియన్లు, హెజ్బొల్లా, హౌతీలు, లెబనాన్‌తో పాటు ఇరాకీ మిలిటెంట్లు ఒకేసారి విరుచుకుపడితే ఇజ్రా యెల్‌కు తీవ్ర నష్టాలు తప్పవు. పైగా, ఇజ్రాయెల్‌కు, అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధాలు జరిగినప్పుడల్లా ప్రపంచమంతటి నుంచి ముస్లిం యువకులు వేలాదిగా వెళ్లి పాల్గొనటాన్ని చూశాము. దీనంతటి పర్యవసానం యుద్ధం పూర్తి స్థాయికి పరిణమించటం.అట్లా జరగకుండా ఉండాలంటే ఏకైక మార్గం దౌత్య యత్నాలు! అయితే, అమెరికా కూటమి బాహాటంగా ఇజ్రాయెల్‌తో నిలవటం, గాజా యుద్ధాన్ని ఆపించక పోవటమేగాక ఐక్యరాజ్యసమితిని, ప్రపంచాభిప్రాయాన్ని తోసిరాజంటోంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌తో ముడిపడి వారి సామ్రాజ్యవాద ప్రయోజనాలు అటువంటివి. సుమారు 120 సంవత్సరాల క్రితం మొదలై, 80 ఏళ్ల నుంచి క్రమంగా జటిలంగా మారుతూ, మరొక 20 ఏళ్లకు కొరకరానికొయ్య అయిపోయిన ఈ సమస్యకు మొట్టమొదటి నుంచి కూడా ఏకైక కారణం వారి ప్రయోజనాలే. 1948కి ముందు అసలు లేనే లేని ఇజ్రాయెల్ సృష్టిని, యూదులకు ఒక దేశం ఉండాలన్న సూత్రంతో ఆమోదించి పాలస్తీనాను రెండుగా విభజించటం ఒక చారిత్రక విషాద మనుకుని అంగీకరించినా, కనీసం రెండు స్వతంత్ర దేశాల సూత్రానికి ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కట్టుబడి ఉంటే సమస్య కాలక్రమంలో సమసిపోయేది.అట్లా జరగకపోవటం వల్లనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. పశ్చిమం చిచ్చును సృష్టించింది. దీన్ని ఇన్ని దశాబ్దాలుగా సాగిస్తున్నది వారు మాత్రమేనని మరొకసారి చెప్పనక్కర లేదు. ముఖ్యంగా గాజా మారణహోమం నుంచి మొదలుకొని జరుగుతున్నదేమిటో ఇజ్రా యెల్, అమెరికాలు గుర్తించక తప్పదు. వారు తమ ఆయుధ బలంతో పైచేయి సాధిస్తుండవచ్చుగాక. కానీ, ప్రపంచం దృష్టిలోనే గాక అంత ర్జాతీయ సంస్థల ఎదుట గతంలో ఎన్నడూ లేనంతగా ఏకాకు లయ్యారు. వియత్నాం యుద్ధం తర్వాత అంతటి వ్యతిరేకతను, ఏహ్యతను తిరిగి 50 ఏళ్ల తర్వాత చూస్తున్నాము. అపుడు జరిగిన అమెరికా క్యాంపస్ ప్రదర్శనలు మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. దీనంతటి నుంచి ఇజ్రాయెల్, అమెరికాలు పాఠాలు నేర్చుకుంటే వారికే మంచిది. చరిత్రలో అనేక సామ్రాజ్యాలు బలంతో విర్రవీగి నేల కూలాయి. అమెరికా సైతం నెమ్మదిగా అదే దిశలో పయనిస్తున్నదని పలువురు పాశ్చాత్య మేధావులే హెచ్చరిస్తున్నారు కూడా!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మన పునాది లౌకికం
భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎవరికైనా తమ మతాన్ని అనుసరించే, మార్చుకునే హక్కు ఉంది. నిజానికి హిందూ మతంలో ఉన్న అనేక నియమాల వల్ల, దేవాలయాలకు శూద్రులను కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వల్ల క్రైస్తవ మతం బాగా పెరిగింది. తర్వాత వీరశైవం, వీరవైష్ణవ ఉద్యమాలు శూద్రులను, అతిశూద్రులను దగ్గరకు తీశాయి. ప్రజలను పాలించేవారికి అన్ని మతాలవారు ఓట్లు వేస్తారు. ‘నేను సనాతన ధర్మానికి బద్ధుడిని’ అనేవాళ్లు పాలక వర్గంగా అందరి హక్కులను కాపాడే బాధ్యత నుండి పాక్షికమైన వాదనలకు దిగుతున్నారని అర్థం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా రాజకీయ పరివ్యాప్తి చెందాలి గానీ మతాంశాల ద్వారా కాదని మన నాయకులు గ్రహించాలి.భారతదేశ చరిత్ర, సంస్కృతి, నాగరికత అతి ప్రాచీనమైనవి. మెసçపటోమియా నాగరి కతతో, గ్రీకు ఫిలాసఫీతో పోల్చదగిన స్థాయిలో భారతదేశ చరిత్ర, నాగరికతలు ఉన్నాయి. అందుకనే ప్రపంచ దేశాల చరిత్ర కారులు, పురాతత్వవేత్తలు, భాషాతత్వవేత్తలు ఇంకా ఈ మూలాల్లోకి వెళ్ళి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. భారతీయ గతంలోకి దర్యాప్తు తూర్పు భాషలు నేర్చిన ఇండా లజిస్టులతో ప్రారంభమైంది. ముఖ్యంగా భారతీయ చరిత్ర, మరీ ముఖ్యంగా భారతీయ భాషలను తమ అధ్యయనంగా ఎంచుకున్న ఐరోపా పండితులతో ఇది మొదలైంది. వివిధ పాలనాపరమైన హోదా లలో ఈస్టిండియా కంపెనీ నియమించిన విలియం జోన్స్, కోల్ బ్రూక్, హెచ్.హెచ్.విల్సన్ వంటివాళ్లు ఇండాలజిస్టులలో కనిపిస్తారు. వారంతా ఐరోపా ప్రాచీన సంప్రదాయంలో శిక్షణ పొందినవారు. ప్రాచీన భాషల పట్ల ఆసక్తి పెంచుకుని, కొత్త రంగంలో నైపుణ్యం సాధించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. పాలనా వేత్తలుగా వారికి సంప్రదాయ భారతీయ చట్టం, రాజకీ యాలు, సమాజం, మతం పట్ల ప్రత్యేక జ్ఞానం కలిగి ఉండాలి. ఇదే వారిని సంస్కృతం, పర్షియన్ సాహిత్యం వైపు నడిపించింది. ఈ విషయా లను ప్రసిద్ధ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ తన ‘ఐడియాలజీ అండ్ ది ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ ఎర్లీ హిస్టరీ’ అనే గ్రంథంలో చెప్పారు. భారతదేశంలోని మానవజాతుల పరిణామాలను పరిశీలించి నట్లయితే, మానవజాతి పరిణామానికి సంబంధించిన ప్రాచీన పరిణామ దశలన్నీ దళితుల్లో కనిపిస్తున్నాయి. మోర్గాన్ చెప్పినట్లు మానవజాతి పరిణామంలో జీవనోపాధి, ఆహారం, పాలనాంగం, ప్రభుత్వం, భాష, కుటుంబం, మతం, గృహæనిర్మాణం, సంపద కీలక పాత్ర వహిస్తాయి. ఈ దశలన్నీ ఇప్పటికీ దళితుల జీవన విధానంలో కనిపించడం వలన, భారతదేశంలో మానవజాతి పరిణామ లక్షణాలన్నీ దళిత జాతుల్లో ఉండటం వలన బి.ఆర్. అంబేడ్కర్ నిర్వచించినట్లు వీరు ఆది భారతీయులనేది నిర్ధారణ అవుతుంది. డేనిష్ పురాతన శాస్త్రవేత్తలు నిర్వచించినట్లు శిల, కాంస్య, ఇనుప యుగలక్షణాలు కూడా భారత సమాజంలోని ఆదిమ జాతుల్లో ఉన్నాయి. నిజానికి భారతదేశంలో సింధునది వారసులు దళితులు. ఆ తర్వాత వచ్చిన ఆర్యులు వీరిని ప్రాచీనులు అని వాడారు. వారికి ఆ తర్వాత వచ్చినవారు అర్వాచీనులు అవుతారు. ఏది సనాతనం? ఏది అధునాతనం? అనే దగ్గర ఋగ్వేద ఆర్యులే ఋగ్వేదాన్ని సనాతనం అయిందనీ, అధర్వణ వేదాన్ని అధునాతనమైనదనీ ప్రస్తావించారు. పూర్వం కంటే ఉత్తర బలీయమైనదనేది శాస్త్రం. అందుకే ఋగ్వేదం, యుజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం... ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ముందుదాని కంటే తర్వాత దానిలో ఇంకా విస్తృతి ఉంది అని చెప్పబడింది. మొట్టమొదటి ఇటుకల చైత్యగృహం, అశోకుని కాలం నాటిది, రాజస్థాన్‌లో బైరాuŠ‡ దగ్గర బయల్పడింది. ఇటుకల చైత్యగృహాలు ఆంధ్రదేశంలో పలుచోట్ల బయల్పడినాయి. కానీ వాస్తు వైశిష్ట్యం ఉన్న కళాఖండాలుగా ప్రసిద్ధి చెందినవి గుహాలయాలే. వీనిలో చాలా భాగం మహారాష్ట్రలోనే ఉన్నాయి. బుద్ధగయ చెంత బరాబర్ కొండల్లో అశోకుడు తొలిపించిన సుదామ– లోమశ ఋషి గుహలే మన దేశంలో మొదటి గుహలు. అదే కాలానికి చెందినవి గుంటుపల్లి గుహాల యాలు. క్రమంగా గుహాలయ వాస్తు భాజా, బేడ్సే, జున్నార్, విఠల్కేరా, కన్హేరీ, కార్లాలలో వికసించి అజంతా – ఎల్లోరాలలో పరిణతి పొందింది. గుహాలయాలన్నింటిలో తలమానికం వంటిది కార్లా చైత్యాలయం.ఆంధ్రుల చరిత్ర సంస్కృతి రచించిన బి.ఎస్.ఎల్. హనుమంత రావు గారు ఆంధ్రులు బౌద్ధ సంస్కృతి వికాసితులు అని చెప్పారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీనంగా బౌద్ధం విస్తరిల్లిందని విశ్లేషించారు. బౌద్ధ దర్శన ప్రభావం సుమారు ఆరు శతాబ్దాల కాలం దేశ ప్రజలపై, ప్రభుత్వాలపై స్పష్టంగా కన్పిస్తుంది. ఇంచుమించు భారతదేశాన్ని సమైక్యం చేసి తన ప్రభుత్వానికి ధర్మాన్ని గీటురాయిగా చేసిన అశోక మౌర్యుడు దండ సమత, వ్యవహార సమత నెలకొల్పాడు. దీన్ని బట్టి చూస్తే శిక్షాస్మృతి విషయంలో అందరూ సమానులేననే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అతని శాసనాలు చాటుతున్నాయి.ఆర్య ఋషులు ఈ దేశంలోకి పశుపాలకులుగా ప్రవేశించారు. గోపాలకులు (గోవులను పాలించే వారు), గవేషణ (గోవులను వెదకడం), గోపతి (గోవుల కధిపతి), గోమేధం (గోవులతో చేయు యజ్ఞం), గోఘ్నుడు (అతి«థిగా వచ్చి గోవులను చంపించువాడు), గోత్రం (గోశాల) అని వారిని వెన్నాడుతూ వచ్చిన ఈ విశేషణాలే వారి వృత్తిని ప్రకటిస్తున్నాయి అని రాహుల్ సాంకృత్యాయన్ చెప్పారు. ఆర్యులు గోపాలకులనీ, బౌద్ధం ప్రభావానికి గురయ్యేవరకూ వారు గోవును యజ్ఞయాగాల్లో బలి ఇచ్చారనీ చెప్పబడింది. తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పిన కామేష్టి యజ్ఞాలలో గోవృష భాలను బలి ఇవ్వటమే కాకుండా, ఎలాంటి వాటిని బలి యివ్వాలో కూడా ఉంది. విష్ణువుకి పొట్టి వృషభాన్ని, ఇంద్రుడికి వాలిన కొమ్ములు, ఎర్రని రంగు నుదురుగల వాటినీ, శని దేవుడికి నల్ల ఆవును, రుద్రుడికి ఎర్రగోవుని – ఆ రకంగా బలి ఇవ్వాలని నిర్దేశింపబడింది. అందులోనే ‘పంచశరదీయ’ సేవ అనే మరో రకమైన బలిని గూర్చి కూడా ప్రస్తావించబడింది. అందులో ముఖ్యాంశం ఏమంటే – ఐదేళ్ల వయసున్న 17 పొట్టి గిత్తల్నీ, అదే సంఖ్యలో మూడేళ్ళు నిండని పొట్టి లేగల్నీ బలి ఇవ్వాలని చెప్పబడింది.నిజానికి అమరావతి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం.అందుండి బౌద్ధం గురించి మాట్లాడటం ఆంధ్రుల చారిత్రక కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అమరావతిని ఆంధ్రుల రాజధానిగా శ్రీకృష్ణ కమిటీకి ప్రతిపాదించిన దానిలో అర్థం అదే. ఆంధ్రులు వైదికేతర మతాలను, ధర్మాలను అన్నింటినీ ఆహ్వానించారు.ముఖ్యంగా బౌద్ధాన్ని, జైనాన్ని, ఇస్లాంను, క్రైస్తవాన్ని, ఇంకా అనేక మతాలను, ధర్మాలను ఆహ్వానించారు. ఆంధ్రదేశంలో శిల్పరూపం క్రీ.పూ. 2వ శతాబ్దికి ముందు లేదు. క్రీ.పూ. 2వ శతాబ్దానికి ముందు నిరాకార తత్వాలే ఉన్నాయి. ఆ తర్వాత శిల్పరూపాలు వచ్చినాక కూడా ఒకరి నొకరు గౌరవించుకోవడమే ఎక్కువ కాలం ఉంది.అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో మతం మార్చుకునే హక్కు పొందు పరిచాడు. నిజానికి హిందూ మతంలో ఉన్న అనేక నియమాల వల్ల, దేవాలయాలకు శూద్రులను కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వల్ల క్రైస్తవ మతం బాగా పెరిగింది. తర్వాత వీరశైవం, వీరవైష్ణవ ఉద్య మాలు శూద్రు లను, అతిశూద్రులను దగ్గరకు తీశాయి. ప్రజలను పాలించే వారికి అన్ని మతాలవారు ఓట్లు వేస్తారు. ‘నేను సనాతన ధర్మానికి బద్ధుడిని’ అనేవాళ్లు పాలక వర్గంగా అందరి హక్కులను కాపాడే బాధ్యత నుండి పాక్షికమైన వాదనలకు దిగుతున్నారని మనకు అర్థం అవుతుంది. అందుకే భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య దేశంగా చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం ద్వారా రాజకీయ పరివ్యాప్తి చెందాలి గానీ మతాంశాల ద్వారా కాదు అని రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలోని 25, 26, 27, 28వ అధికరణా లను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ ‘విముక్తి అంటే ఏమిటి?’ అని చెప్తూ, 1835 అక్టోబర్ 13న చేసిన ప్రకటనలో మతం మారే హక్కు అందరికీ ఉందన్నారు. నిజానికి ఆంధ్ర దేశం భౌతికవాద తత్వాలతో ప్రభావితమైన దేశం. నార్ల వేంకటేశ్వరరావు, గుర్రం జాషువా, మహాకవి వేమన హేతు వాదాన్ని బోధించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తూ మాన వతా వాదాన్ని ప్రజ్వలింపజేసే కర్తవ్యంలో భాగస్వాములం అవుదాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు
టాటా సన్స్ కంపెనీ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆగస్టు 16న కలిశారు. అదే రోజు – ‘టాస్క్ ఫోర్స్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047’ కో– చైర్మన్ చంద్రశేఖర్ అని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ముఖ్య మంత్రి దీనికి చైర్మన్. ‘రాబోయే ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబోతున్నది. ఇందులో అగ్రశ్రేణి ఇండస్ట్రీ ‘లీడర్లు’, నిపుణులు ఉంటారు’ అని పత్రికల్లో వార్తలొచ్చాయి. ఇది విన్నాక,ముందుగా ఈ విషయం చెప్పాలి అనిపించింది. ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ కంపెనీ ‘అమెజాన్’ తన రిక్రూట్మెంట్ విభాగంలో ఇకముందు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏ.ఐ.) వాడ వద్దని నిర్ణయం తీసుకుంది. ‘రిక్రూట్మెంట్’ కోసం దరఖా స్తులు ‘స్క్రూటినీ’ చేసేటప్పుడు, ‘జెండర్’ అని ఉండేచోట– ‘ఆడ’ అని ఉంటే, ‘ఏఐ’ వాటిని తిరస్కరిస్తున్నది. అది గమ నించాక, కంపెనీ దాని వాడడం వెంటనే ఆపేసింది. అటువంటి కంపెనీలే అంత బాధ్యతగా ఉంటున్నప్పుడు, ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రభుత్వాలు యువతరం జీవితా లను ప్రభావితం చేసే ఉపాధి అంశాల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలనేది అవి గ్రహించాలి. టీడీపీ ప్రభుత్వం 2015లో ఇలాగే– ‘స్ట్రాటజిక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్సా్ఫర్మింగ్ – ఏపీ’ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసినట్లుగా వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత, దానికి కొనసాగింపు కనిపించలేదు. ‘ఫేస్ బుక్’, ‘గూగుల్’ వంటి సామాజిక మాధ్యమాల బహుళ జాతీయ కంపెనీలు కొత్తగా అమరావతికి వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ ‘ఏఐ’ యూనివర్సిటీ వస్తుంది అని ఆ శాఖ మంత్రి అంటున్నారు. గతంలో ‘గేమ్స్ సిటీ’ అన్నారు. అయితే ఈ దిశలో ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన కసరత్తు ఇప్పటికే మొదలైతే, అది మంచిదే. అలాగే, వాటితోపాటు ఎన్నికల ముందు కూటమి వెల్లడించిన– ‘స్కిల్ సెన్సెస్’ వెంటనే పూర్తికావాలి. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు తమ వద్ద లేవనుకున్నప్పుడు ఇదొక పద్ధతి. అలా కాకుండా తాము చేసింది ఏదైనా అది ఆ ప్రాంతానికీ, ప్రజలకూ కూడా శాశ్వత ప్రయోజనం కలగాలి. తామే అందుకు ప్రత్యామ్నాయాలు వెతకాలని ప్రభుత్వం అను కొన్నప్పుడు అది మరోలా ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి 2008లో ప్రారంభించిన ‘సెజ్’లో ఇప్పుడు ‘శ్రీసిటీ’గా అందరికీ తెలిసిన–‘సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ’ (టౌన్ షిప్) ఉంది. అదిప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. రాష్ట్రానికి ఏ ప్రపంచ దిగ్గజ కంపెనీ వచ్చినా వాళ్లకు ప్రభుత్వాలు ఇప్పుడు చూపించేది– ‘శ్రీసిటీ’. సీఎమ్‌గా వైఎస్ మొత్తం 22 ‘సెజ్’లకు కేంద్రం నుంచి అనుమతి తెచ్చారు. నాన్న కృషికి కొనసాగింపు అన్నట్టుగా జగన్ ప్రభుత్వంలో రాయలసీమ ఖనిజ నిక్షేపాల విలువ పెంచడానికి కడప జిల్లా కొప్పర్తి వద్ద ‘మెగా ఇండస్ట్రియల్ హబ్’ కోసం 2020లో 3,155 ఎకరాలను కేటాయించారు. ఇది కర్నూల్ – రాణిపేట నేషనల్ హైవేకి, రైల్వే లైన్, కడప ఎయిర్ పోర్ట్‌కు సమీపాన ఉండడమే కాకుండా... రేణిగుంట అంతర్జాతీయ విమానా శ్రయానికి 145 కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తున్న వసతులతో రూ. 25,000 కోట్ల మేర పెట్టు బడులు వస్తాయనీ, 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందనీ 2020 డిసెంబర్ నాటి ప్రభుత్వ అంచనా. కనీసం శ్రీసిటీ, కొప్పర్తి వంటి పారిశ్రామిక కూడళ్ళ వద్ద, అలాగే కొత్త జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పడే మార్కెట్ డిమాండ్ దృష్ట్యా సూక్ష్మ స్థాయిలో ‘సర్వీస్ సెక్టార్’లో ‘ఐటీఐ’, ‘పాలి టెక్నిక్’ స్థాయిలో ‘కరిక్యులం’ సమీక్ష అనేది ముందు... ‘స్కిల్ సెన్సెస్’ పూర్తి అయితే అప్పుడు వాటిని సరిచేసుకోవచ్చు. దానివల్ల ‘స్టార్ట్ అప్’లకు ‘ఎంఎస్ఎంఈ’లకు అవసరమైన కొత్త ‘మ్యాన్ పవర్’ దొరుకుతుంది. కానీ ఇవన్నీ ‘పెండింగ్’లో ఉంచి, అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున –‘అంకుర యాత్ర’ పేరుతో భారీ బస్ ర్యాలీ అమరావతి నుంచి శ్రీసిటీ వరకు ప్రభుత్వం ‘ప్లాన్’ చేసింది. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘ఎన్నారై’లు మన ‘స్టార్ట్ అప్’లను ప్రోత్సహించడానికి ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు. అదలా ఉంటే, కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ‘విజన్ డాక్యుమెంట్లు’ తయారుచేస్తారని వార్తలు వస్తున్నాయి. పరిపాలనలో ఇంత అనుభవం ఉన్న పార్టీ ప్రభుత్వానికి మళ్ళీ ఇటువంటి కసరత్తు అవసరమా? మరి ఏ ‘విజన్’ అనకుండానే గత ప్రభుత్వం ఉద్యానవనం, పరిశ్రమలు రెండింటినీ కలుపుతూ కొత్తగా ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖను ప్రారంభించింది. దాంతో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మొదటిసారి ఆ శాఖకు మంత్రిని నియమించింది. ఈ శాఖ ఏర్పాటుతో రైతులకు సంప్రదాయ పంటల సాగు కంటే ఉద్యా నవన ఉత్పత్తులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఇలా గత ప్రభుత్వం చూపించిన బాటలో కూటమి ప్రభుత్వం కొన సాగుతూ మైక్రో ఇరిగేషన్‌తో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2029 నాటికి రెట్టింపు చేస్తాం అంటున్నారు. కేంద్ర–రాష్ట్రాలు కలిసి ప్రస్తుతం ఇస్తున్న 55% సబ్సిడీని ఇక ముందు 90% శాతానికి పెంచాలని నిర్ణయించారు. వాస్తవానికి అభివృద్ధి ప్రణాళికల అమలు పలు దొంత ర్లుగా ఉంటుంది. అదలా ఉన్నప్పుడే, సూక్ష్మ స్థాయి వరకు ఇంకి కొన్ని తరాలు పాటు ఆ మేలు చివరి ‘మైలు’ వరకు చేరు తుంది. ఇంతకూ ‘విజన్’ అంటే ఏమిటి? ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ తాడేపల్లిగూడెం వద్ద హార్టీకల్చర్ యూనివర్సిటీ పెడితే, విభజిత ఏపీలో జగన్ ‘ఫుడ్ ఇండస్ట్రీ శాఖ పెట్టడం! ఫలితంగా ఈ ప్రభుత్వంలో దానికి కొత్తగా ఒక మంత్రి వచ్చి, పంట విస్తీర్ణం రెట్టింపు లక్ష్యంగా ప్రకటించడం. దానివల్ల ప్రయోజనాల వ్యాప్తి 26 జిల్లాలకు ఉంటుంది. అది మట్టిలో చేసే సాగుబడి నుంచి, ఆ ఉత్ప్పత్తులను ‘ఆన్ లైన్’లో మార్కె టింగ్ చేస్తూ ‘డెస్క్’ వద్దకు చేరింది! ప్రతి దశలోనూ ఇందులో యువత ప్రయోజనాలు పొందుతుంది. నిజానికి ఇది ‘ప్రాంతము– ప్రజలు’ కేంద్రిత అభివృద్ధి నమూనా.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
రైతుల ఆదాయం పెంచే ‘మౌలిక నిధి’
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రైతుల పట్ల గల అమిత శ్రద్ధ, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాపత్రయం ఆయన రైతుల కోసం తీసుకున్న నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అన్నదాతల జీవితాలను మార్చడమే ప్రధాని మొదటి, అత్యంత ప్రాధాన్య లక్ష్యం. అందుకే ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో వ్యవసాయం, రైతులకు అధిక ప్రాధాన్యం కొనసాగించారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘వ్యావసాయిక మౌలిక సదుపాయాల నిధి’ (ఏఐఎఫ్), ‘పీఎం ఆశా’ వంటి పథకాలలో ఈ నిబద్ధత స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఏఐఎఫ్ రూపంలో సుస్థిర పరిష్కారాన్ని అందించడం ద్వారా రైతుల సాధికారతకు ప్రభుత్వం గణనీయమైన సహకారం అందిస్తోంది.దేశంలో పంట కోత అనంతర నష్టాలు ఒక పెద్ద సవాలు. ఇది వ్యవసాయ రంగ ఉత్పత్తిని ప్రభావితం చేస్తోంది. లక్షలాది రైతుల శ్రమను నీరుగారుస్తోంది. తాజా అంచనాల ప్రకారం, దేశంలో ప్రతి ఏటా మొత్తం ఆహార ఉత్పత్తిలో 16–18% ఈ విధంగా నష్టపోతున్నాం. పంట కోత, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ వంటి వివిధ సందర్భాల్లో ఈ తరహా నష్టాలను చూస్తున్నాం. సరైన నిల్వ, శీతలీకరణ సదుపాయాలు లేకపోవడం, తగిన శుద్ధి యూనిట్ల కొరత, సమర్థమైన రవాణా సదుపాయాలు లేని కారణంగా ఈ భారీ నష్టాలు ఎదురవుతున్నాయి. ఇది మొత్తం ఆహార భద్రతపై దుష్ప్రభావం చూపిస్తోంది.నిల్వ సదుపాయాలు పెరిగాయిమోదీ సమర్థ నాయకత్వంలో శాస్త్రజ్ఞుల పరిశోధనలను ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా 2020 జూలైలో ‘ఏఐఎఫ్’ను ప్రధాని ప్రారంభించారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట తరువాతి నిర్వహణ సమస్యలను పరిష్కరించడం, తద్వారా ఆహార నష్టాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. కొత్త ప్రాజెక్టులు, కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవాలి. ఏఐఎఫ్ కింద బ్యాంకులు 9 శాతం వడ్డీ పరిమితితో ఏడాదికి 3 శాతం వడ్డీ రాయితీ రుణాలు, ‘సీజీటీఎంఎస్ఈ’ (క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్) కింద ఆర్థిక సంస్థలు రూ. 2 కోట్ల వరకు రుణాలు అందిస్తాయి. ఈ పథకంలో భాగంగా గత ఆగస్టు వరకు మంజూరు చేసిన మొత్తం రూ. 47,500 కోట్లు దాటింది. ఇందులో రూ. 30 వేల కోట్లకు పైగా ఇప్పటికే వివిధ ప్రాజెక్టులకు కేటాయించారు. మంజూరైన ప్రాజెక్టుల్లో 54 శాతం... రైతులు, సహకార సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘా లకు అనుసంధానం కావడం విశేషం. ఇది పొలాల వద్దే మౌలిక సదుపాయాలను అందించడంలో రైతుల బలమైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.పంట నష్టాల నుంచి రైతులను కాపాడటానికి నిల్వ (డ్రై, కోల్డ్ స్టోరేజీలు), రవాణా మొదలైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాని ప్రాధాన్యమిస్తున్నారు. డ్రై స్టోరేజ్ పరంగా చూస్తే, దేశంలో 1,740 లక్షల మెట్రిక్ టన్నుల పంటను నిల్వ చేసే సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 44% కొరత ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఉద్యాన ఉత్పత్తుల కోసం, దేశంలో సుమారు 441.9 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజీ అందుబాటులో ఉంది. ఈ సామర్థ్యం దేశంలోని పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 15.72% మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఏఐఎఫ్ వల్ల సుమారు 500 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్య అంతరాన్ని తగ్గించడానికి వీలైంది. దీనివల్ల పంట కోత అనంతర నష్టం రూ. 5,700 కోట్లు ఆదా అవుతుంది. సరైన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను అభివృద్ధి చేయడం వల్ల ఉద్యాన ఉత్పత్తుల నష్టం 10% తగ్గింది. పాతిక లక్షల మందికి ఉపాధివ్యవసాయ మౌలిక సదుపాయాల వృద్ధి, అభివృద్ధికి ఏఐఎఫ్ కొత్త ఉత్తేజాన్ని అందిస్తోంది. గత ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 74,695 వ్యవసాయ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఏఐఎఫ్ కింద ఆమోదం లభించింది. వీటిలో 18,508 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 16,238 ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్లు, 13,702 గోదాములు, 3,095 సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, 1,901 కోల్డ్ స్టోర్స్, కోల్డ్ చైన్లు, 21,251 ఇతర రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు 2015 నుంచి వ్యవసాయ రంగంలో రూ. 78,702 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇది ఈ రంగంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ప్రభుత్వ చర్యల వల్ల యువత కూడా వ్యవసాయం వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో సుమారు 50,000 కొత్త వ్యవసాయ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇది రైతుల స్వావలంబనకు దారి తీస్తోంది. వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఈ ప్రయత్నాలు 8 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించదానికి దోహదపడ్డాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 25 లక్షల ఉద్యోగాల సృష్టికి దారితీస్తుంది. పొలాల్లో అధునాతన మౌలిక సదుపాయాల కల్పన వల్ల రైతులు తమ పంటలను నేరుగా ఎక్కువమందికి అమ్ముకోవడానికి వీలు కలిగింది. ఆధునిక ప్యాకేజింగ్, స్టోరేజీ వ్యవస్థల కారణంగా రైతులు మార్కెట్లలో తమ ఉత్పత్తులను మరింత సమర్థంగా అమ్ముకోగలుగుతారు. ఫలితంగా మంచి ధర దక్కుతుంది. ఈ యత్నాలు రైతుకు సగటున 11–14% అధిక ధరలను పొందడానికి వీలు కల్పిస్తున్నాయి.పూచీకత్తు భరోసా, వడ్డీ రాయితీ ద్వారా రుణ సంస్థలు తక్కువ రిస్క్‌తో రుణాలు ఇచ్చి, తద్వారా తమ వినియోగదారులకు సాయ పడతాయి. నాబార్డ్ రీఫైనాన్ ్స సదుపాయంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని భాగస్వామ్యం చేయడం వల్ల ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాల(పీఏసీఎస్) వడ్డీ రేటును ఒక శాతానికి తగ్గించడం గమనార్హం. దీంతో ఇలాంటి పీఏసీఎస్‌లతో సంబంధం ఉన్న వేలాది మంది రైతులకు గణనీయమైన ప్రయోజనాలు చేకూ రాయి. ఏఐఎఫ్ కింద 9,573 పీఏసీఎస్ ప్రాజెక్టులకు నాబార్డ్ ఇప్పటి వరకు రూ. 2,970 కోట్ల రుణం మంజూరు చేసింది.ఆరు సూత్రాల వ్యూహంవ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిని పెంచడం, వ్యవ సాయ వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తికి గిట్టుబాటు ధరలు కల్పించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తగిన ఉపశమనం కల్పించడం, వ్యవసాయం, ప్రకృతి సేద్యాన్ని వైవిధ్యపరచడం వంటి ఆరు సూత్రాల వ్యూహంతో ముందుకు వచ్చాం. హైడ్రోపోనిక్ వ్యవ సాయం, పుట్టగొడుగుల పెంపకం, వెర్టికల్ ఫామింగ్, ఏరోపోనిక్ వ్యవసాయం, పాలీహౌస్, గ్రీన్ హౌస్ వంటి ప్రాజెక్టులను రైతు సమూహాలు, సంఘాలకు మాత్రమే కేటాయించారు. వాటి పరిధిని విస్తరించడం ద్వారా వ్యక్తిగత లబ్ధిదారులు ఇప్పుడు ఈ ప్రాజె క్టులను చేపట్టడానికి ఏఐఎఫ్ కింద అనుమతులు పొందడానికి అర్హులయ్యారు. దీనికి అదనంగా, ‘పీఎం–కుసుమ్’ యోజనలోని ‘కాంపోనెంట్ ఎ’... బంజరు, బీడు, సాగు, పచ్చిక బయలు లేదా చిత్తడి భూములలో రెండు మెగావాట్ల వరకు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. దీనిని సులభంగా ఎఐఎఫ్ పథకంతో అనుసంధానించవచ్చు. ఈ వ్యూహాత్మక సమ్మేళనం రైతులకు వ్యక్తిగ తంగా సహాయపడుతుంది. రైతు సమూహాలను సాధికారం చేస్తుంది. ‘అన్నదాత’ నుండి ‘ఉర్జాదాతా’ (ఇంధన ప్రదాత) వరకు వారి పాత్రను పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విశ్వసనీయమైన ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. విస్తృత స్థాయిలో మెరుగు పడిన సమాచార వ్యవస్థ, సమష్టి కృషితో రైతు సంక్షేమంలో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. ‘వికసిత భారత్’లో భాగంగా అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగ కలలను సాకారం చేయడంలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది.శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాసకర్త కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం; గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి; మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి -
అది ముమ్మాటికీ చెంప దెబ్బే!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత దేశ ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరు పతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ధర్మం నాలుగు పాదాల నడుస్తు న్నదని చెప్పడానికి నిదర్శ నంగా నిలిచాయి. సుప్రీం వ్యాఖ్యలు ముమ్మాటికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటివే. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలంటే కుదరదని సుప్రీం వ్యాఖ్యలు రుజువు చేశాయి. ఇక ప్రాయశ్చిత్త దీక్ష నాటకాలు అన్నీ వట్టివేనని కుండబద్దలు కొట్టినట్లయింది. కల్తీ నెయ్యి జరిగినట్లు సాక్ష్యాలు లేవన్న సుప్రీం... సిట్ విచారణ ఎందుకంటూ నిలదీసింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై వేసిన నిందారోపణలన్నీ అసత్యాలని ప్రజలకు అర్థమైంది. ఒక వ్యక్తిని రాజకీయంగా హత్య చేసేందుకు పరమ పవిత్రమైన ఏడు కొండల వాడిని వాడుకున్న నీచ రాజకీయం ‘చంద్రబాబు అండ్ కో’దని అందరికీ అర్థమైంది.సెప్టెంబరు 18న ఏపీ సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు రోజుకో మలుపు తిరుగుతూ వస్తున్నాయి. నిజంగా జంతువుల కొవ్వు కలిపి ఉంటే∙ప్రసాదం నిల్వ ఉండదనీ, వెంటనే పాడైపోవడం, వాసన రావడం... ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు పదే పదే చెబుతూ వచ్చారు. అదీకాకుండా అసలు ఈ తతంగమంతా చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టాకే జరిగింది. దానిని వదిలేసి అదేదో జగన్ హయాంలో జరిగిందంటూ మసిపూసి మారేడుకాయను చేసే ప్రక్రియను తలకెత్తుకున్న చంద్రబాబు తలదించుకొనేలా సుప్రీం వ్యాఖ్యలు చేసింది. అసలు కల్తీ జరిగింది అనడానికి ఆధారా లెక్కడున్నాయంటూ ప్రశ్నించింది. ఇప్పుడు దీనికి చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి.ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రపంచ దేశాల్లో భక్తులు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంపైన, ఆల య ప్రతిష్ఠపైన, లడ్డూ ప్రసాదం చరిత్రపైన మాయని మచ్చ వేయగలిగారు. ఆయన వ్యాఖ్యలు నిజమా, కాదా అని తెలుసుకోకుండా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో హడావిడి చేశారు. జనాన్ని నమ్మించేందుకు దుర్గమ్మ గుడికి వెళ్లి మెట్లపూజ చేశారు. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో బలైపోయారు. వాస్తవానికి జనసేనాని ఈ వ్యాఖ్యలు చేయలేదు. చేసింది చంద్రబాబు. కానీ, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించ డానికి కారకులైంది పవన్. ఇప్పుడు పవన్ ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఏం చేయా లన్నదానిపై మల్లగుల్లాలు పడాల్సిన దుఃస్థితి నెలకొంది. ఇప్పటికైనా పవన్ తొందరపడకుండా నింపాదిగా రాజకీయాలు చేస్తేనే చంద్రబాబు వ్యూహాల నుండి తప్పించుకుని తనదైన శైలిలో తన అభిమానుల మనసులో ముద్ర వేసుకో గలుగుతారు. ఇక బీజేపీ పెద్దలు అచ్చంగా చంద్ర బాబు మౌత్ పీస్‌లుగా మారినట్లు కనిపించింది.ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంపై స్పందించిన తీరు ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందంటూ చెబుతూనే, లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందంటూ వ్యాఖ్యానించారు. దీనికి ఆ పార్టీ నేతలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవడం అనేది ఏ విధంగానూ జరిగే అవకాశం లేదు. పాలకులు ఎవరున్నా అంతటి నీచ పరిస్థితికి దిగజారే అవకాశాలు ఉండవు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన దాఖలాలు ఉన్నాయి కదా! కేవలం 2014–19 మధ్యే ఆయన హయాంలో 14 సార్లు వెనక్కు పంపారు కదా! అంతమాత్రం చేత చంద్రబాబు హయాంలో జంతు కొవ్వు కలిపిన లడ్డూలు తయారైనట్లు భావించాలా? ఇది ఏమాత్రం సహేతుకం?ముస్లింలకు 4 శాతం ఉన్న రిజర్వేషన్లు రద్దుచేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకుకు పూర్తిగా దూరమైనట్లు చంద్రబాబు గ్రహించి ఈ కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంది. దీనివల్ల హిందువుల ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవచ్చని ఆయన భావించి ఉంటారని అనుకోవాల్సి వస్తోంది. లేకపోతే ఆ నివేదికను ఒక రాజకీయ వేదిక మీద ఎందుకు చంద్రబాబు చదువుతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.తమ ఇలవేల్పు అయిన వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది అంటే ఎవరికైనా ఇట్టే ఆగ్రహావేశాలు వస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ, జగన్ ప్రధానికి లేఖ రాయడం, సీజేఐకి కూడా రాస్తానని చెప్పడం, నేషనల్ మీడియాకు వాస్తవాలు వివరించడం, సుబ్బారెడ్డి లాంటి వారు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం, కరుణాకర్ రెడ్డి లాంటి వారు ప్రమాణాలు చేయడం ఇలా అనేకానేక కార్య క్రమాల నేపథ్యంలో సామాన్య మానవుల్లో ఆలో చన రేకెత్తింది. కల్తీ జరిగిందని తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. ఏది ఏమైనప్పటికీ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు సామన్య జనాల్లో పెద్ద ఎత్తున చర్చ నీయాంశంగా మారాయి. నిజానిజాలు నిగ్గు తేల్చేలా సీబీఐతో విచారణ చేయించాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే ప్రజలు స్వాగతిస్తారు. దేశ ప్రధాని కూడా ఈ అంశం మీద నోరు విప్పాలి. ప్రజల్లో దెబ్బతిన్న మనోభావాలను తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలి.పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త ఏపీ అధ్యక్షులు,వైయస్సార్ టీయూసీ -
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రహేళిక
డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలు, వ్యక్తిత్వం, విధానాలు, వీటన్నిటితో కూడిన గందర గోళం పట్ల అమెరికన్లు ఎలా స్పందిస్తారు అనేది 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అతి పెద్ద చిక్కుప్రశ్న. ట్రంప్ పతనం నుంచి ఉత్థానం చెందారు. అలాగని ఆయన ప్రజాదరణకు తీవ్రమైన పరిమి తులున్నాయి. ప్రధానంగా 4 అంశాల్లో ట్రంప్ వైఖరిని పరిశీలించాలి.1. ట్రంప్ నిలకడతనం: కొద్ది నెలల కాలంలోనే ఆయన రెండుసార్లు మరణానికి చేరువగా వెళ్లివచ్చారు. ప్రజారంగంలో బలంగా ఉండటానికి అవసరమైన స్పష్టమైన భౌతిక ధైర్యం ఆయనకు ఉంది. 2015లో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి నప్పటినుంచీ రాజకీయ ప్రత్యర్థులు, అమెరికా రాజకీయ పండి తులు కనీసం ఎనిమిది సార్లు ట్రంప్ రాజకీయ సంస్మరణను ఖాయం చేసేశారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ 2016లో గెలు స్తారని ఎవరూ అనుకోలేదు. హిల్లరీ క్లింటన్‌ను అధ్యక్ష రేసులో ఓడించగలరని అసలు అనుకోలేదు. ఆయన అభ్యర్థిత్వానికి రష్యా మద్దతు విషయంలో సాగిన దర్యాప్తు నుండి బయట పడతారనీ ఎవరూ అనుకోలేదు. కోవిడ్ మహమ్మారిపై ఆయన అశాస్త్రీయ నిర్వహణను అమెరికన్లు క్షమిస్తారని కొద్దిమందే భావించారు.2020 ఎన్నికల ఫలితాల చట్టబద్ధతను అంగీకరించడానికి నిరాకరించిన తర్వాత, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్‌పై దాడికి ఒక గుంపును పంపిన తర్వాత కూడా ట్రంప్ ఆధిపత్యం చలాయించే ఆటగాడిగా ఉంటారని ఎవరూ భావించలేదు. రిపబ్లికన్లు సెనే ట్ను కోల్పోయిన తర్వాత, 2022 మధ్యంతర ఎన్నికలలో హౌస్‌ను గెలవ లేకపోయిన తర్వాత అందరూ ట్రంప్ పనయిపోయిందని వ్యాఖ్యా నించారు. పైగా ఆయన నేరారోపణ కేసుల నుండి బయట పడతారని ఎవరూ నమ్మలేదు. కానీ ట్రంప్ ప్రతిసారీ విమర్శకుల అంచనాలను తారుమారు చేశారు. మరింత ప్రజాదరణ పొందారు. రిపబ్లికన్ పార్టీని నియంత్రిస్తున్నారు. 2. ట్రంప్ ప్రజాదరణకు పరిమితులు: 2016 నవంబర్‌లో ఆయన అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత, ఆయన నాయకత్వంలో పాల్గొన్న అన్ని ఎన్నికలనూ రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రిపబ్లికన్లు హౌజ్‌ను కోల్పోయిన 2018 మధ్యంతర ఎన్నికలు ఇందులో ఉన్నాయి. 2021 జనవరిలో జార్జియా సెనేట్ ఎన్నికల్లో ఓటమి కూడా ఇందులో భాగం. అంతెందుకు, ట్రంప్ స్వయంగా ఓడిపోయిన 2020 అధ్యక్ష ఎన్నికలు కూడా దీంట్లో ఉన్నాయి. ఆయన ఆధ్వర్యంలో రిపబ్లికన్ పార్టీ స్థిరంగా ఓడిపోయింది. విస్తృతమైన ఓటర్లలో దాని ఆకర్షణ తగ్గింది.3. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో జాత్యహంకారం: ‘మేక్ అమె రికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ చేసే ప్రచారం ‘మేక్ అమెరికా వైట్ ఎగైన్’ అని స్పష్టమైపోయింది. ఆయన వ్యాఖ్యానాలు పక్షపాతాన్ని, ద్వేషాన్ని, భయాన్ని కలిగించేలా ఉన్నాయి. ఒహయో పట్టణంలోని అక్రమ హైతియన్ వలసదారులు పెంపుడు జంతువులను తింటు న్నారని ట్రంప్, జేడీ వాన్ ్స (రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి) నిరా ధారమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి పట్టణంలోని వలసదారులు ఎవరూ చట్టవిరుద్ధంగా ఉండటం లేదు. వాళ్లెవరూ పెంపుడు జంతువులను తినడమూ లేదు. ఇక ట్రంప్ గట్టి మద్దతుదారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లారా లూమర్ 9/11 స్మారక స్థూపం వద్దకు ట్రంప్‌తో పాటు విమానంలో వెళ్లి, డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారతీయ మూలాలపై జాత్యహంకార దాడిని ప్రారంభించారు. ట్రంప్ స్వయంగా హారిస్‌పై జాత్య హంకార వ్యాఖ్యలను ప్రయోగించారు. ట్రంప్ గెలుపును వేడుకగా జరుపుకొనే భారత మితవాద శక్తులు దీనిని గుర్తుంచుకోవాలి.4. ట్రంప్ విదేశాంగ విధానం: డెమొక్రాట్లు, పాత రిపబ్లికన్లకంటే కూడా సంకుచిత భావన కలిగిన అమెరికా గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. నిజానికి, ట్రంప్ తన మొదటి హయాంలో ‘అబ్రహం ఒప్పందాల’కు మధ్యవర్తిత్వం వహించారు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా వైఖరిని పెంచారు. ఇరాన్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలను ఆమోదించారు. ఉత్తర కొరియాతో చర్చలు జరిపారు. ఇవన్నీ ఆయన ప్రపంచవ్యాప్త వ్యవహారాలు జరపగలరని సూచించాయి. కానీ అంతర్జాతీయ వ్యవస్థలో ప్రబలమైన ప్లేయ ర్గా ఉన్న అమెరికా ఆర్థిక, సైనిక బాధ్యతలను ట్రంప్ అసహ్యించుకుంటారు. దానితో వచ్చే ప్రయోజనాలను ఆయన చూడలేరు లేదా ఈ ప్రయోజనాలు లేవని నటిస్తారు. ప్రపంచీకరణ వల్ల, ప్రపంచంలో అమెరికా పాత్ర వల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పో యారనీ, అసమానతలు పెరిగాయనీ వాదిస్తారు.ట్రంప్‌కు జనాదరణ ఉందనేది నిజం. అదే సమయంలో ఆయన ఆధిపత్యం కొనసాగడం లేదన్నదీ నిజమే. ఎన్నికల ఫలితా లను కచ్చితంగా అంచనా వేయడం ఎందుకు కష్టమో దీన్నిబట్టి అర్థమవుతోంది. గుర్తింపు ఆధారిత రాజకీయాలను ఆయన మిత వాదం నుండి స్వీకరించారు. పాత వామపక్షీయుల ఉదారవాద ఆర్థిక శాస్త్రం, విదేశాంగ విధాన విమర్శలనూ స్వీకరించారు.ట్రంప్‌ను సైద్ధాంతికంగా ఒక వర్గంలోకి చేర్చడం ఎందుకు కష్టమో ఇది వివరిస్తుంది. అమెరికన్లు ఆయన వ్యక్తిత్వాన్ని, విధాన మిశ్ర మాన్ని, దానితో వచ్చే గందరగోళాన్ని ఇష్టపడతారా లేదా అనేది 2024 ఎన్నికలకు సంబంధించిన ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది.ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సనాతనానికి చీడ పురుగులు
‘‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు/ మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు / జనులంతా ఒక కుటుంబం – జగమంతా ఒక నిలయం’’– జాషువాఈ మాటలు ఎంత సందర్భోచితంగా ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ రంగాన్ని చూస్తే అర్థమవుతుంది. నిజమైన మతవాదులైతే వారితో ఇబ్బంది లేదు. అది వారి ప్రగాఢ నమ్మకంగా భావించవచ్చు. కానీ కుహనా మతవాదులు వేషాలు వేసుకుని, అవకాశవాద రాజకీయాల కోసం మతాన్ని, కులాన్ని వాడుకోవటం వల్లనే అసలు ఇబ్బంది వస్తున్నది.వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సనాతన మతవాదుల అవతారం ఎత్తారు. హిందూ మతానికి వీళ్లే అసలైన వారసులన్నట్లుగా ఉపన్యాసాలిస్తున్నారు. ఇక పచ్చ మీడియా రచ్చ సరేసరి.‘అసలే అనలుడు. అతనికి సైదోడు అనిలుడు’ అని ఒక మహాకవి చెప్పినట్లు, చంద్రబాబు అబద్ధా లకు తింగరి పవన్ కల్యాణ్ దొరికాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా చెప్పిన డైలాగ్‌నే చెబుతూ, మెట్లను కడుగుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.అసలు ఇప్పుడు అర్జంట్‌గా హిందూమతాన్ని ఈ గురుశిష్యులు అంతగా తలకెత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సామాన్యుడి ప్రశ్న.అందులో ఒకరికి దేవుడన్నా, మతమన్నా ఏ సెంటి మెంట్లూ లేవు. బూట్లతో పూజలు చేస్తాడు, దేవాలయాలు పడగొడతాడు, ఆలయాల్లో క్షుద్ర పూజలు భార్య చేస్తే ఊరుకుంటాడు. ఇక రెండవ వారు చెప్పులు ధరించే స్వామి దీక్షలు నిర్వహి స్తాడు. తలక్రిందులుగా తపస్సు చేసినా వీళ్ళను నమ్మే జనాలున్నారా?అసలెందుకు హఠాత్తుగా ఈ రచ్చ లేవ దీశారు? ఢిల్లీ పెద్దలేమయినా హరియాణా, మహా రాష్ట్ర ఎన్నికల కోసం వీళ్ళిద్దరినీ సెంటిమెంట్ రోల్స్ చెయ్యమన్నారా? లేక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, విజయవాడ వరద బాధితులకు సమాధానం చెప్పలేక, ప్రజల వద్దకు 100 రోజుల మంచి పాలన అంటూ పోవాలనుకున్నా జనా లెక్కడ తిరగబడి ‘సూపర్ సిక్స్’లు అడుగుతారో అనే భయం చేతనా? ప్రజలు ఆలోచించే లోపలే పచ్చ మీడియా మూకుమ్మడిగా జనాలకు అర్థంకాని భాషలో వ్యాఖ్యానాలు చేయిస్తూ చివరకు హిందూ ధర్మం జగన్ గారి వల్లనే నాశనమైందని తేలుస్తుంది.సెంటిమెంట్ బాగా పండాలంటే కలియుగ దైవం, ఆయన ప్రసాదం వీరికి అక్కరకొచ్చాయి. జగన్ గారి పాలనలో లడ్డూ ప్రసాదంలో జంతు వుల కొవ్వులు కలిశా యని చెప్పాలనుకున్నారు. కానీ వాటికి ఆధారాలు దొరక్క చివరకు వీళ్ళ ప్రభుత్వం మెడకు చుట్టు కోవటంతో దానిని ఎలా మలపాలో అర్థం కాక ‘యూటర్న్’ బాబు... 20 సార్లు తిరుమలకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రిగారి డిక్లరేషన్ పేరుతో దానిని డైవర్ట్ చేయటానికి ప్రయత్నించారు. ‘నాతిని చెయ్యబోతే కోతిగా తయారయ్యిందన్న’ సామె తగా చివరకు సనాతన ధర్మానికే కళంకాన్ని తెచ్చే విధంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం స్వామివారి ప్రసాదాన్నే కళంకితంగా మార్చింది. ఈ చర్యలు క్షమార్హం కాదు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తారని ప్రకటించటంతో ఖంగుతిన్న చంద్రబాబు... పార్టీల మాటున గూండాలను తిరుపతికి తరలించారు. వారిలో కొంతమంది బహిరంగంగానే ‘జగన్ మోహన్‌రెడ్డి తిరుపతి వస్తే చంపేస్తాం’ అంటూ చెప్పారు. అంటే ఆయనను చంపాలనేదే కదా వీళ్ళ కుట్ర! వాళ్ళే నిందలేస్తారు. వాళ్ళే నిందిస్తారు.ఎంత నిస్సిగ్గుగా ఆయన మతాన్ని తెర మీదకు తెచ్చి డిక్లరేషన్ బోర్డు పెట్టారు! అందుకు జగన్మోహన్ రెడ్డిగారు ప్రెస్ మీట్లో చాలా చక్కటి సంస్కారవంతమైన సమా ధానం చెప్పారు. అసలైన హిందూ ధర్మతత్వం ఆయన మాటల్లో వినిపించింది. హిందూ ధర్మాన్ని సుప్రతిష్ఠం చేసిన ఉపనిషత్తులు ఏం చెప్పాయో మత ఛాందసులు కూడా తెలుసుకోవాలి.‘‘యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్వి జానతః / తత్ర కో మోహః కశ్శోకః ఏకత్వ మను పశ్యతః’’(ఈశావాస్యోపనిషత్తు)ఎవరయితే సమస్త జీవుల ఆత్మలను తన ఆత్మగా భావించి గౌరవిస్తాడో అతడు శోకమోహ ములను దాటి ఒకే ఆనంద స్థితిని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మం చెప్పేమాట. అలాగే హిందు వులందరూ పరమ ప్రామాణికంగా భావించే భగ వద్గీతలో కూడా ఆ కృష్ణ పరమాత్మ –యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజా మ్యహం! / మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః‘‘ఏ రూపంలో ఆరాధిస్తారో ఆ రూపంలో నేనే ఉంటాను అన్నాడు. అంటే అన్ని మతాలను, దేవుళ్ళను గౌరవించాలనే కదా మన హిందూ ధర్మం చెబుతున్నది. మరి ఈ మతానికి ఈ చాదస్తపు రంగులు పూసి ఎందుకిలా ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు? ఇప్పటికయినా ఢిల్లీ బీజేపీ పెద్దలు తమ కూటమి ఆంధ్రలో చేస్తున్న కోతి చేష్టలను ఆపించ కపోతే అది తమకే నష్టం అని గమనించాలి. ప్రజల్ని అంత తక్కువగా అంచనా వెయ్యొద్దు.‘‘నీకు మతం కావాలా లేక అన్నం కావాలా?’ అని అడిగితే ముందు అన్నమే ఇవ్వమంటాను. ఆకలితో బాధపడేవాళ్ళ కడుపు నింపి తర్వాత బోధలు చెయ్యి’’ అంటారు స్వామి వివేకానంద.ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పాలకులకు జగన్ మోహన్ రెడ్డి చెప్పేది అదే. ముందు పేదవాళ్ళను ఆదుకోండి, మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీ నీచ రాజకీయానికి పవిత్ర ప్రసాదాన్ని బలి చేయకండి.నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త వైసీపీ నాయకురాలు -
సమాఖ్యకు ‘జమిలి’ సవాళ్లు!
జమిలి ఎన్నికల వల్ల దేశానికీ, ప్రజాస్వామ్యానికీ ఎంతవరకు ఉపయుక్తం అనే దానిపై చర్చ జరుగుతోంది. లోక్‌సభ నుంచి అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు అనుకూలంగా ఎన్ని వాదనలున్నాయో, వ్యతిరేకంగా అన్ని వాదనలున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికల ఖర్చు కంటే తక్కువగా ఉంటుంది. కానీ అలా పొదుపు చేసే మొత్తం భారత్ లాంటి పెద్ద దేశానికి ఒక లెక్కలోకే వస్తుందా? అలాంటి ఎన్నికల వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించదా? బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు.నాకు తెలిసిన చాలామంది లాగే మీరు కూడా ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ను అర్థం చేసుకోవటానికి తన్నుకులాడుతుంటే కనుక మీకు సహాయం చేయటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే భావనను ప్రతిపాదించినవారు, దానిని వ్యతిరేకిస్తున్నవారు తమ అనుకూల, ప్రతికూల వాదనలతో మనల్ని ముంచెత్తారు. కానీ లాభ నష్టాల నడుమ దీనిపై మనమెలా ఒక తీర్పుకు రాగలం? ఈ వాదోపవాదాలన్నీ సముచితమైనవేనా? లేదా కొన్ని మాత్రమే మిగతా వాటి కంటే ప్రాముఖ్యమైనవా? ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే ఈ భావనకు మద్దతు లభించటానికి గల కారణాలతో విషయాన్ని ప్రారంభిద్దాం. మొదటిది – డబ్బు ఖర్చు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికలకు అయ్యే ఖర్చు కంటే తక్కువగా ఉంటుందనటంలో సందేహం లేదు. అయితే అలా పొదుపు చేసే మొత్తం ఏడాదికి రూ. 5000 కోట్ల కన్నా తక్కువేనన్నది శశి థరూర్, ప్రవీణ్ చక్రవర్తిల వాదన. ఇండియా వంటి భారీ ఆర్థిక వ్యవస్థకు ఇదేమంత తేడా చూపే మొత్తం అవుతుందని?రెండవ కారణం – ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆంక్షలు పరిమిత కాలానికి మాత్రమే వర్తింపులో ఉంటాయి కనుక రాజకీయ నాయకులు తమను తాము పాలనా వ్యవహారాలలో నిమగ్నం చేసు కోవచ్చు. అయితే ప్రవర్తనా నియమావళి అన్నది జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే అమలులో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అదొక పెద్ద విషయమే అవదు. మళ్లీ ప్రశ్న, ఇదేమంత ముఖ్యమైన కారణం అవుతుందని?నిజమేమిటంటే, పై రెండూ కూడా చెప్పుకోదగిన కారణాలు కావు. ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన వ్యక్తీకరణ... ఎన్నికలు. వాటి నిర్వహణకు అయ్యే వ్యయాన్ని బట్టి, లేదా అవి సజావుగా జరిగేందుకు అవసరమైన నియమావళిని బట్టి ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని లాభనష్టాలను చర్చించకూడదు. ఇప్పుడు మనం వ్యతిరేక వాదనల్లోకి వద్దాం. మొదటిది – ఇది మన దేశ విలక్షణతకు విరుద్ధం అవుతుందా? మనది ఒకే దేశం–ఒకే మతం కాదు. ఒకే దేశం–ఒకే భాష కాదు. ఒకే దేశం–ఒకే సంస్కృతి కాదు. ఒకే దేశం–ఒకే విధమైన మరేదీ కాదు. మన వ్యత్యాసాలనే మన సంపదలుగా మలుచుకున్న రాష్ట్రాల సమాఖ్య మన దేశం. ఆ వ్యత్యాసాలు, సంపదలే మనల్ని ప్రత్యేకంగా ఉంచుతాయి. మనకు ప్రాముఖ్యం కల్పిస్తాయి. మరి ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ప్రత్యేకతలు, ప్రాముఖ్యాల నుంచి మన దేశాన్ని దూరం చేయదా? దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. రెండవది – ఒకే దేశం–ఒకే ఎన్నిక వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించే ప్రమాదంఉంటుందా? అలా జరిగితే – జరుగుతుందనే నా అనుమానం – అది దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఏకీకృత వ్యవస్థగా మార్చే ధోరణి కలిగి ఉండదా? వెంటనే కాకపోయినా, కాలక్రమేణా అలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల చిన్న రాష్ట్రాల ప్రాంతీయ ఆందోళనలు కేంద్రస్థాయి జాతీయ డిమాండ్లలో కొట్టుకుని పోతాయి. గోవా, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్, పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల నిరసన గళాలు ఢిల్లీ రణగొణ ధ్వనుల్లో తేలిపోతాయి. మూడవది – పార్లమెంటరీ ఎన్నికలు క్రమంగా అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారినప్పుడు ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ధోరణిని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం లేదా? అదే జరిగితే, అది మన బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇది అర్థవంతమైన భయమే అయితే దీనిని తేలిగ్గా తీసుకోవలసిన అవసరం లేదు. ఇదంతా కూడా మన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘనకు గురి చేయగలిగినదే. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని పర్యవసానాలపై ఆధారపడి ఉంది. అయితే మరొక విషయం కూడా ఉంది. మనం మన ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతంగా, వేళ్లూను కునేలా చేసుకోవలసిన అవసరం అది. నిజానికి 50 ఏళ్ల క్రితమే అటల్ బిహారి వాజ్‌పేయి ‘రైట్ టు రీకాల్’ (పదవుల్లో ఉన్నవారిని తొలగించే హక్కు)ను కోరు కున్నారు. దానికి పూర్తి భిన్నమైనది ఈ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’. ఓటు వేసే అవకాశాన్ని పరిమితం చేయటం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇది కురచబారుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే, వెళ్లవలసిన మార్గాన్ని వెనక్కి తిప్పుతుంది.ఇంకొక సమస్య ఉంది. వాస్తవంలో ఎదురుకాగల సమస్య అది. ఒకవేళ ప్రభుత్వం ఐదేళ్ల కాల పరిమితి కంటే ముందు గానే తన మెజారిటీని కోల్పోతే ఏం జరుగుతుంది? మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచిస్తోంది. కానీ అది ఐదేళ్ల కాలానికి ఓటరు ఇచ్చిన తీర్పును పలుచబార్చదా? కొన్నిసార్లు వాళ్లు ఐదేళ్ల ప్రభుత్వానికి ఓటు వేస్తారు. మరికొన్ని సార్లు ఒకటీ లేదా రెండేళ్ల ప్రభుత్వానికి ఓటేస్తారు. ఈ విధంగా మనం ఓటు విలువను యథేచ్ఛగా తగ్గించటం లేదా?ఉప ఎన్నిక అవసరమైన ప్రతిసారీ నిస్సందేహంగా ఇలాగే జరుగుతుంది కానీ... వ్యక్తికి ఓటేయటానికి, మొత్తం అసెంబ్లీకో, పార్లమెంటుకో ఓటేయటానికి తేడా లేదా? ఆలోచించదగిన ప్రశ్నే ఇది. నిజానికి, మధ్యంతర ఎన్నికలకు కారణమయ్యేవి ఏవీ లేకుండా పోవు. ఇంకా అనేక కారణాల వల్ల కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఈ విధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు వీలుగా తక్కువ కాల పరిమితిని కలిగి ఉంటాయి. ఈ కోణంలోంచి చూస్తే ‘ఒకే దేశం–ఒకే’ ఎన్నిక వల్ల ఏం తేడా కనిపిస్తున్నట్లు? చెప్పాలంటే మనం మరిన్ని ఎన్నికలకు వెళ్లటం అవుతుంది తప్ప, తక్కువ ఎన్నికలకేం కాదు. కనుక, అంతిమంగా నేను చెబుతున్నదేమిటి? అది మీతో చెప్ప టానికి సంకోచిస్తున్నాను. ఏమైనా, నా అభ్యంతరాలన్నీ ఇక్కడ స్పష్టంగానే వ్యక్తం అయ్యాయి. మీరు నా మార్గదర్శకత్వాన్ని కోరుకుంటే కనుక అందుకు చాలినంతగానే రాసేశాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
తొలి కులరహిత ద్రవిడోద్యమ మార్గదర్శి
దక్షిణ భారతదేశంలో కులాన్ని ప్రశ్నిస్తూ తొలిసారి గొంతెత్తిన కార్యకర్త అయోతీ థాస్. ఆది ద్రావిడ నేపథ్యం నుండి వచ్చిన ఆయన రాజకీయం, సాహిత్యం, మతం వంటి అనేక రంగాలలో అవిరళకృషి చేసినవారు. తమిళ పండితుడు.వృత్తి రీత్యా సిద్ధ వైద్యుడు. పందొమ్మిదవ శతాబ్దం చివరలో ఆది ద్రావిడ ప్రజల అభ్యున్నతి కోసం నడుం బిగించి 1891లో ‘కుల రహిత ద్రవిడ మహాసభ’ను స్థాపించారు. ఈ విషయంలో రెట్టమాలై శ్రీనివాసన్ అనే మరో సంఘ సంస్కర్త ఈయనకు సహకరించారు. బౌద్ధం స్వీకరించిన అయోతీ థాస్, పరయల (మాలల) అసలు మతం బౌద్ధమని తేల్చారు. అంద రినీ అందులోకి మారమని సూచించారు. కులరహిత సమాజం బౌద్ధం ద్వారానే సాధ్యమని ఉద్బోధించారు.1861–91 మధ్య కాలంలో క్రైస్తవులు, ముస్లింలు మినహా మిగిలిన వారందరినీ బలవంతంగా హిందువులుగానే పరిగణించేవారు. అయితే అయోతీ థాస్ ‘హిందూ’ అనే గుర్తింపును నిరాకరించారు. కారణమేమంటే హిందూను గుర్తిస్తే అందులో ఉన్న కుల నిర్మాణాన్ని, నిచ్చెన మెట్ల కుల సంస్కృతిని, అసమా నతలను స్వీకరించాలి. అందుకని ఆయన దాన్ని తిరస్కరించడంతో పాటు, తన అనుయాయులందరినీ తిరస్కరించమని సూచించారు. ఆయన రాజకీయంగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. తను స్థాపించిన ‘కుల రహిత ద్రవిడ మహా సభ’ పక్షాన 10 డిమాండ్లతో ఒక వినతి పత్రం తయారు చేసి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి పంపారు. వారు వాటిని తమ 12వ సమావేశంలో చర్చించారు కూడా! అయితే, అందులో ఒక్క డిమాండుకు కూడా సుముఖత వ్యక్తపరచలేదు. ఆ డిమాండ్లలో ఉచిత విద్య, బంజరు భూముల కేటాయింపు, పరయల ఆలయ ప్రవేశం వంటివి ఉన్నాయి. ఆలయ ప్రవేశం ఇక్కడ భక్తికి సంబంధించిన విషయం కాదు. మనుషులుగా సమాన హోదా, సమాన హక్కుకు సంబంధించిన విషయం. కాంగ్రెస్ పార్టీతో పని కాలేదని అయోతీ థాస్ తన ప్రయత్నం మానుకోలేదు. ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్‌కు పోటీగా 1884లో స్థాపితమైన ‘మద్రాస్ మహాజన సభ’కు కూడా అవే పది డిమాండ్ల వినతి పత్రం పంపించారు. కానీ, అక్కడా చుక్కెదురైంది. నిర్వాహక సభ్యులు ఆయనను ఘోరంగా అవమానించారు.జరిగిన అవమానంతో అయోతీ థాస్ తీవ్రమైన మనో వేదనకు గురయ్యారు. తాము హిందువులమే అయితే జాతి విచ క్షణ ఎందుకూ? కుల దూషణలెందుకూ? దేవుడు అందరి వాడైన ప్పుడు ఆలయ ప్రవేశం తమకెందుకు ఉండదూ? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆయన వాటికి సమాధానాలు కను గొనే ప్రయత్నంలో వేదాలు, బ్రాహ్మణత్వం, ఆచారాలు వంటి వాటి గూర్చి అధ్యయనం ప్రారంభించారు.1870 దశకంలో తన పాతికేళ్ళ ప్రాయంలో తమిళనాడు నీల గిరి ప్రాంతంలోని తోడర్–కొండ జాతులను సమైక్యపరిచి 1875లో ‘అద్వైతానంద సభ’కు రూపకల్పన చేశారు. అప్పుడే రెవరెండ్ జాన్ రతినమ్తో పరిచయం ఏర్పడింది. ఈయన మద్రాసులో ఆది ద్రావిడుల కోసం వెస్లియన్ మిషన్ పాఠశాల నిర్వహిస్తున్నాడు. ఆయన పరిచయంతో అయోతీ థాస్‌కు కొత్త ఉత్సాహం లభించింది. దాంతో 1885లో ‘ద్రవిడ పాండ్యన్’ అనే వార్తా పత్రికను ప్రారంభించారు. 1886లో ‘ఆది ద్రావిడులు హిందువులు కారు’ అని భారతదేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మ కమైన ప్రకటన చేశారు.1891లో ద్రవిడ మహాసభను స్థాపించి, ఆది ద్రావిడులకు ఒక పిలుపునిచ్చారు. వారంతా తమను తాము హిందువులుగా కాక, ‘కుల రహిత తమిళులు’గా ప్రకటించుకోవాలని కోరారు. ఆ రోజుల్లో అదొక సాహసోపేతమైన చర్య. ఒకసారి అయోతీ థాస్ తన అనుచరులతో థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడ యిన కల్నల్ హెచ్.ఎస్. ఆల్కాట్‌ను కలుసుకున్నారు. బౌద్ధం స్వీకరించాలన్న తన కోర్కెను ఆయనకు తెలియజేశారు. ఆయన అయోతీ థాస్ శ్రీలంకకు వెళ్లే ఏర్పాటు చేశాడు. శ్రీలంకలో అయోతీ థాస్ సింహళ బౌద్ధ భిక్షువు సుమంగళ నాయక్ నుండి ధమ్మదీక్ష స్వీకరించారు. చెన్నై తిరిగి వచ్చాక 1889లో ‘శాక్య బౌద్ధ సంఘాన్ని’ స్థాపించి, దాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేశారు. ఈయన అప్పుడు ఏర్పాటు చేసిన శాక్య బౌద్ధ సొసైటీయే కాల క్రమంలో ఇండియన్ బుద్ధిస్ట్ అసోసియేషన్‌గా మారిపోయింది. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా నిలిచిన ఆయన, రచయితగా చేసిన కృషి కూడా తక్కువది కాదు. అంబికయ్యన్ కథ, ఇంద్ర జాతి చరిత్ర, ఇంద్ర దేశ బౌద్ధ పండుగలు, తిరువళ్ళువర్ చరిత్ర వంటి డజనకు పైగా గ్రంథాలు రాశారు.‘అయోతీ థాస్’గా ప్రసిద్ధుడైన ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాత్తవరాయన్. అయోతీ థాస్ అనేది ఆయనకు ఆయనే పెట్టుకున్న పేరు. బాల్యంలో ఈయన అయోధ్య దాసర్ పండిట్ అనే ఉపాధ్యాయుడి వద్ద చదువు నేర్చుకున్నారు.తమిళం, ఇంగ్లిష్, పాళీ భాషలు, తత్వశాస్త్రం, సిద్ధ వైద్యం... ఇలా అనేక విషయాలు నేర్చుకున్నారు. అందువల్ల గురువుగారి పట్ల ఏర్పడ్డ గౌరవ భావంతో తన పేరు కూడా అయోధ్య దాసర్‌గా చెప్పుకునేవాడు. ఆ పేరే స్థిరపడి అయోతీ థాస్‌గా మారింది. తమిళ పలుకుబడి థాస్ అంటే తెలుగులో దాసుడు అనే అర్థం.వీరిది విద్యావంతుల కుటుంబం. ఈయన తండ్రి కాంత ప్పన్, ఫ్రాన్సిస్ వైటీ ఎల్లిస్ అనే బ్రిటిష్ అధికారి దగ్గర పని చేసేవాడు. తన కుటుంబం తరతరాలుగా భద్రపరచుకుంటూ వచ్చిన తాళపత్ర గంథాలు తిరుక్కురళ్, నాలడియార్లను ఫ్రాన్సిస్ ఎల్లిస్‌కు అందించాడు కాంతప్పన్. ఆయన వాటి విలువను గ్రహించి, ఇంగ్లిష్‌లోకి అనువదించాడు. తర్వాత పుస్తకాలుగా ముద్రించి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ రకంగా తమిళుల సాంస్కృతిక సంపదైన తిరుక్కురళ్ వెలుగులోకి వచ్చింది. అయోతీ థాస్ 1845 మే 20న మద్రాసులోని రాయ పేటలో జన్మించారు. మళ్ళీ అదే మే నెల 5వ తేదీన 1914లో 69వ యేట కన్నుమూశారు. ఒక రకంగా పెరియార్, ద్రవిడర్ కళగమ్, బి.ఆర్. అంబేడ్కర్లకు ఈయనే స్ఫూర్తిప్రదాత! డా‘‘ దేవరాజు మహారాజు – వ్యాసకర్త సాహితీవేత్త, విశ్రాంత ప్రొఫెసర్(మెల్బోర్న్ నుంచి) -
చరిత్రను చెరగనివ్వని ద్వీపాలు!
అండమాన్, నికోబార్ ద్వీపవాసులు ‘పునరుద్ధరణ’ను ఆశ్రయించకుండా, చరిత్రను తిరగ రాసుకోవాలని ఉరకలెత్తకుండా తమ గాయపడిన గతాన్నే వాస్తవ వర్తమానంగానూ స్వీకరించారు. స్వాతంత్య్రానంతరం సెల్యులార్ జైలుకు చెందిన రెండు రెక్కలు కూల్చివేతకు గురైనప్పుడు, స్వాతంత్య్ర సమర యోధులు తమ పోరాట ఫలితాలకు ప్రతీకాత్మకమైన ఆ ప్రదేశానికి మరమ్మతులు చేసే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకించారు.ఎందుకంటే చరిత్రలో రెక్కల కూల్చివేతా ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుందని వారు విశ్వసించారు. ఆ విశ్వాసమే... దేశంలో అందరినీ కలుపుకొని ఉన్న సమాజాల్లో తమది కూడా ఒకటిగా ఉండేలా చేసింది. కానీ, మితిమీరిన జాతీయవాదంతో ఇప్పుడు అభివృద్ధి కన్నా పేర్ల మార్పుపై దృష్టి పెట్టడం విషాదం.దేశభక్తి గురించి లేదా ‘భిన్నత్వంలోఏకత్వం’ అనే రాజ్యాంగ భావన గురించి దేశం మొత్తంలో ఎలాంటి పాఠాలూ, ప్రబోధాలూ అవసరం లేని ప్రదేశం ఏదైనా ఉందీ అంటే అవి... అండమాన్, నికోబార్ దీవులే. ఆ దీవుల జనాభాలో ఎక్కువ భాగం (సుమారు ఐదు లక్షల మంది) బ్రిటిష్ వారు ఖైదు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వం కలిగి ఉన్నవారే. ఆ తర్వాతి స్థానంలో ఈ ప్రాంతంలో స్థిరపడిన వారు, నెగ్రిటో జరావాస్, ఒంగెస్, గ్రేట్ అండమానీస్, సెంటినెలీస్ (బయటి ప్రపంచంతో సంబంధం లేని చివరి రక్షిత తెగ) లేదాషాంపెన్, నికోబారీస్ వంటి మంగోలాయిడ్ తెగలకు చెందిన స్థానిక తెగల సభ్యులు ఉన్నారు.‘భారతదేశ భావన’కు ఆధారభూతమైన ఈ సుదూర కేంద్రం నేడు భారతదేశంలోని అనేక వైవిధ్యాల అధివాస్తవిక సమ్మేళనం. స్వాతంత్య్ర పోరాటం, ‘కాలా పానీ’ అపఖ్యాతి (కఠిన శిక్షల విధింపు, సెల్యులార్ జైలు మొదలైనవి) బెంగాల్, పంజాబ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ నుండి ఖైదీలను ఎక్కువగా ఇక్కడికి రప్పించాయి. వారిలో చాలామంది జాతీయ నిర్మాణంలో గుర్తింపునకు, ప్రశంసలకు నోచు కోకుండా మిగిలిపోయారు. వారి గర్వించదగిన వారసుల కోసం మతాలు, ప్రాంతాలు, జాతులకు అతీతంగా విచిత్రమైన ‘హిందూ స్థానీ’ మాండలికాన్ని ఉపయోగించడం ద్వారా మత సామరస్య భావం నెలకొల్పే ప్రయత్నాలు జరిగాయి. బెంగాలీలు, తమిళులు, పూర్వాంచలీలు, పంజాబీలు... భారత ప్రధాన భూభాగాన్ని కబళి స్తున్న విషపూరితమైన విభజన, రాజకీయ ‘విభజన’ విధానాలచెంప చెళ్లుమనిపిస్తూ ఇక్కడ తమ బతుకు తాము జీవిస్తున్నారు. దూరంగా (చెన్నై లేదా కోల్‌కతా నుండి 1,200 కి.మీ), ప్రధాన భూభాగంలో సాగుతున్న ‘దారుణమైన’ రాజకీయాలు అంటకుండా ఉండటం అనేది ఈ దీవులు ఆదర్శవంతమైన ‘మినీ–ఇండియా’ను తలపించేందుకు దోహదపడింది. నిజానికి ‘మేము–వారు’ అనే ఆధిపత్య ధోరణి మతాలు లేదా జాతుల మధ్య కాదు... సామూహిక ‘ద్వీపవాసులు వర్సెస్ ప్రధాన భూభాగవాసుల మధ్య కనిపిస్తుంటుంది. ఇక్కడ ప్రధాన భూభాగ స్థులను దోపిడీదారులుగా చూస్తారు. ప్రధాన భూభాగంలోని సాధా రణ అవగాహన కంటే ద్వీపాలలో చరిత్రపై అభిప్రాయాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఉదాహరణకు జపనీయులతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాగించిన మూడేళ్ల పొత్తు గురించి ఇక్కడ మిశ్రమ భావాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ మూడు సంవత్సరాలు బ్రిటిష్ వారిని మించిన క్రూరత్వంతో ఇక్కడ ముడిపడి ఉన్నాయి.ఈ శాంతియుత ద్వీపవాసులు పునరుద్ధరణ వాదాన్ని ఆశ్రయించలేదు. లేదా చరిత్రను తిరగరాయలేదు. సంక్లిష్టమైన, గాయపడిన చరిత్రనే తమ వాస్తవ గుర్తింపుగా స్వీకరించారు. స్వాతంత్య్రానంతరం సెల్యులార్ జైలుకు చెందిన రెండు రెక్కలు కూల్చివేతకు గురైనప్పుడు, చాలా మంది స్వాతంత్య్ర సమర యోధులు తమ బాధను సూచించే ప్రదేశానికి మరమ్మతులు చేసే ప్రయత్నాలను వ్యతిరేకించారు. ఎందు కంటే ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని కూడా సూచిస్తుందని వారు విశ్వసించారు. ఆ విశ్వాసమే దేశంలో అందరినీ కలుపుకొని ఉన్న సమాజాలలో వారు ఒకటిగా ఉండేలా చూసింది.2006లో ఆ ప్రాంతానికి ఒక అడ్మినిస్ట్రేటర్‌గా, గవర్నర్‌గా నియ మితుడనయ్యాను. 2004 డిసెంబర్ నాటి ఘోరమైన సునామీ కార ణంగా నష్టపోయిన ద్వీపాలలో ఉపశమనం, పునరావాసం నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం నాకు అప్పగించింది. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన సామాజిక ఆర్థిక విధ్వంసాల నుండి మనం కోలుకున్న ప్పుడు, సమాజం కలిసి ఉండే విధానం వల్ల నేనెంతో ఉపకారంపొందాను. ఒక మాజీ పోరాట యోధుడిగా, నేను సామాజిక అనుకూ లత, శాశ్వతమైన దేశభక్తి, ఇంకా లేహ్ ప్రాంతంలోని సుదూర సరి హద్దు ప్రాంతాలు, కశ్మీర్ ఎతై ్తన ప్రాంతాలు లేదా లోతట్టు ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేకమైన ఒక పెద్ద జాతీయ ప్రయోజనాన్ని చూశాను. తక్కిన ‘భారతదేశం’లో ఇది కనిపించలేదు. చాలా సాధించినా, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ ద్వీపాల వ్యూహాత్మక స్థానం (మలక్కా జలసంధి వద్ద చైనీస్ ‘చౌక్ పాయింట్’ మినహా) – అలాగే హానికి లేదా దాడికి గురయ్యే గిరిజనులకురక్షణగా ఉన్న భౌగోళిక స్థితి, వీటితో పాటుగా... సహజమైన గ్రీన్ కవర్ అభివృద్ధి కోసం గోవా, కేరళ మార్గాల్లో సాంప్రదాయికతకు తలుపులు ‘తెరవడం’పై కొన్ని పరిమితులు అవసరం. ప్రైవేట్ అభివృద్ధి లేనప్పుడు ప్రభుత్వ మద్దతు చాలా అవసరం. మౌలిక సదుపా యాలు, పౌర సౌకర్యాలు, ఉపాధి అవకాశాల కొరత కూడా ఒక సవాలు. అయినప్పటికీ ఈ భారతదేశ ‘షైనింగ్ ఔట్ పోస్ట్’ దాని ప్రత్యేక మార్గాలకు, చరిత్రకు కట్టుబడి ఉంది.ప్రధాన భూభాగపు గాలులు, స్వచ్ఛమైన సహజ ద్వీపాలకు చేరు కోవడానికి ఎంతో కాలం పట్టదు. జాతీయవాదాన్ని ప్రోత్సహించ డానికి ప్రముఖ స్థలాల పేర్లను మార్చడం అటువంటి దిగ్విషయా లలో ఒకటి. హ్యావ్లాక్, నీల్, రాస్ దీవులకు వరుసగా స్వరాజ్ ద్వీప్, షహీద్ ద్వీప్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని పేరు పెట్టారు. ద్వీపాలు టూరిజంపై ఎక్కువగా ఆధారపడటం, పర్యాటక ‘బ్రాండ్’ లను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పేర్లను మార్చటం తగదని మార్కెటింగ్ జ్ఞానం సలహా ఇస్తుంది. అన్నింటికంటే, వాడుకకు చెందిన స్థిరత్వం, నామకరణపు క్లుప్తత, దీర్ఘకాల గుర్తింపును నిర్మించడం అనేది సాధారణ భావన. అయినప్పటికీ, స్థానికులు కోరుకున్నందున పేర్లు మార్చడం జరగలేదు, కానీ మితి మీరిన జాతీయవాదం ఫార్ములా కారణంగా వీటి పేర్లు మార్చారు. ఈ పేరు మార్పు వెనుక చోదకశక్తిగా ఉన్నవారు నేతాజీ మనవడుచంద్ర కుమార్ బోస్. అయితే దిగ్గజ స్వాతంత్య్ర యోధుడి భావ జాలాన్ని ప్రచారం చేయడానికి బీజేపీ నుండి తనకు మద్దతు లభించ లేదంటూ తర్వాత ఆయన పాలకవ్యవస్థ నుండి వైదొలిగారు.తరువాత, జనావాసాలు లేని 21 ద్వీపాలకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు మార్చారు. భారతదేశపు అర్హులైన వారసులకు నివాళి గనక, ఆచరణాత్మక చిక్కులు కూడా లేవు గనక ఈ పేర్ల మార్పును అంగీకరించడం జరిగింది. ప్రభుత్వ పెట్టుబడులు, ఇంకా చాలా అంశాలు అస్పష్టంగానే ఉన్నాయి. ఈ క్రమంలో అండమాన్, నికోబార్ దీవులకు సరికొత్త జాతీయవాద ఔన్నత్య ‘వైభవం’ సంప్రా ప్తించింది. రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు ఇటీవల ‘శ్రీ విజయపురం’ అని పేరు పెట్టారు. ఇది ‘వలసవాద ముద్రల నుండి దేశాన్ని విముక్తి చేయ డానికి’ జరిగిందంటున్నారు. ఆర్చిబాల్డ్ బ్లెయిర్ (ఈయన పేరునే పోర్ట్ బ్లెయిర్‌కు పెట్టారు) బొంబాయి మెరై¯Œ లో సాపేక్షంగా అసంగ తమైన నావికా సర్వేయర్ అని పట్టించుకోలేదు, ఎందుకంటే సోషల్ మీడియా అతని గురించి తీవ్రమైన దూషణలతో నిండిపోయింది. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చడం గురించి కొంతమంది ద్వీప వాసులకు చేసిన కాల్స్ ఉదాసీనత, ఉద్రేకాలతో మిశ్రమ స్పందనను రేకెత్తించాయి. ద్వీపవాసులకు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టకుండా, ఇలాంటి కసరత్తులు ఇంతకు ముందు చాలాసార్లు జరిగాయి. ఇది తప్పు కాదు కానీ ప్రత్యేకించి దేశంలోని మిగిలిన ప్రజలకు గౌరవప్రదమైన దేశభక్తి (అత్యంత తీవ్రమైన జాతీయవాదం కాదు), కలుపుగోలుతనం, లౌకికవాదం గురించి ఒకటి లేదా రెండు విష యాలు చెప్పVýæలవారికి ఇది ఉన్మాద రాజకీయాల పునరావృతమే. పేర్లు మార్పు సరే... అర్థవంతమైన అభివృద్ధి మాటేమిటి? అది జరిగే సూచనలు కనిపించటం లేదు. - వ్యాసకర్త రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్- భోపిందర్ సింగ్ -
వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి!
ప్రభుత్వ పథకాలను అర్హులకు ఎలాంటి అవి నీతికి, వివక్షకు తావులేకుండా చేరేలా చూడటానికి వైఎస్ జగన్ తన పాలనా కాలంలో తీసుకువచ్చిన సమున్నత వ్యవస్థ వలంటీర్ల వ్యవస్థ. దాదాపు రెండున్నర లక్షల మంది యువతీ యువకులు నెలకు కేవలం ఐదువేల రూపాయలు చొప్పున పొందుతూ ప్రభుత్వానికీ–ప్రజలకూ మధ్య వారధిగా నిలిచారు. పదకొండు వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాల నుండి ఆయా గ్రామాల– వార్డుల లోని ఇళ్ళ ముంగిటకు ప్రభుత్వ సేవలను చేర్చే వ్యవస్థ ఇది. ముఖ్యంగా నిరుపేదల, వృద్ధుల, దివ్యాంగుల, దీర్ఘరోగ పీడితుల మన్ననలను చూరగొని ఇతర రాష్ట్రాలకు సయితం స్ఫూర్తిగా నిలిచింది. కరోనా లాంటి విపత్కర సమయంలో విశిష్ట సేవలు అందించింది. అటువంటి ఉదాత్త వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గత ఐదేళ్ళలో ఎంతో బురద చల్లారు, దుష్ప్రచారం చేశారు. గోనె సంచులు మోసే ఉద్యోగమా అని ఈసడించి అవమానించారు. పవన్ కల్యాణ్ అయితే, మరింత హీనంగా దిగజారి వలంటీర్లు తాము సేకరించిన డేటా ద్వారా 30 వేల ఎమంది మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేయించారని పెద్ద అభాండమే వేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, తన ఆరోపణలపై ఎందుకు విచారణ జరిపించలేదో మరి!తీరా ఎన్నికలు సమీపించేసరికి బాబు వలంటీర్లను చంకకెత్తుకొని ‘మీకు పదివేలు ఇస్తా, మీ నైపుణ్యాలను పెంచుతా, సంపన్నులను చేస్తా’ అని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు గెలిచి ప్రభుత్వం ఏర్పరిచాక వారి సేవలను కొనసాగించకుండా, పరోక్షంగా రద్దు చేసినట్లే ప్రవర్తిస్తున్నారు. సచివాలయ సిబ్బందినే ఇంటింటికి పంపి మొదటి నెలలో వలంటీర్లు లేకుండానే పెన్షన్లను డోర్ డెలివరీ చేశామని గొప్ప చెప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటినా, తమ వ్యవస్థను కొనసాగించకపోవడంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న వలంటీర్లు ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే బాబు నిర్వాకం వల్ల బెజవాడ బుడమేరు వరదలో ముని గితే, గతిలేని పరిస్థితుల్లో వలంటీర్లను పిలిచి వారి సేవలను ఉపయోగించుకున్నారు. విలయం తగ్గాక వలంటీర్లను పట్టించుకోవడం మానేశారు.కూటమి హామీ ఇచ్చిన సూపర్–6లో ఏడాదికి నాలుగు లక్షలు చొప్పున 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామనే హామీ అమలు ప్రారంభం కాకపోగా, ఉన్న రెండున్నర లక్షల వలంటీర్లతో సహా మరెన్నో వేలమంది ఉపాధికి ఎసరు పెట్టారు. ఎంతో సదుద్దేశంతో జగన్ ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థను మంచి బుద్ధితో కొనసాగించాల్సింది పోయి జగన్ మీది ద్వేషం, పగ, కక్షలతో ఆ వ్యవస్థను నిర్మూలించడానికే దురాలో చనలు చేస్తున్నారు. ఇది తగదు. పాలక–ప్రతిపక్ష పార్టీల మధ్య విధానాల పరంగా, రాజకీయంగా విభేదాలు ఉండవచ్చుగాక... కానీ ఒక ఆదర్శ వ్యవస్థను అంతం చేయబూనటం మున్ముందు పాలక కూటమికి పతనహేతువు కాగలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.వలంటీర్లు అంటే ఎవరనుకుంటున్నారు? వాళ్ళు మన సామాజిక స్వర్ణయుగపు చందమామ కథల రోజుల నాటి ‘పరోపకారి పాపన్నలు!’ 50 ఇళ్ళకు ఒకరు చొప్పున పిలిస్తే పలికే ఆపద్బాంధవులు! ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులకు సత్వరం అందించే దూతలు! పేదల ఆశీర్వచనాలు అందుకుంటూ తృప్తిపడే అల్ప సంతోషులు!1969 మహాత్మాగాంధీ శత జయంతి సందర్భంగా దేశంలోని అన్ని కళాశాలల విద్యార్థులలో స్వచ్ఛంద సేవానిరతిని పెంపొందించేందుకు జాతీయ సేవా పథకం ప్రవేశపెట్టారు. ఒక విధంగా దానికి కొనసాగింపుగా మన రాష్ట్రంలో వచ్చిన వ్యవస్థ ఈ వలంటీర్ వ్యవస్థ అని చెప్పవచ్చు. లక్ష లాదిగా వున్న ఈ వలంటీర్లకు ప్రభుత్వం న్యాయం చేకూర్చాలి.ఈదర గోపీచంద్ వ్యాసకర్త ‘గాంధీ స్మారక సమితి’ వ్యవస్థాపకులు ‘ 94403 45494 -
కొత్త బయోటెక్ సీసాలో పాత సారా
వాతావరణ మార్పులు; ఘన, ద్రవ వ్యర్థాల సమర్థ నిర్వహణ; వ్యవసాయ ఉత్పాదకతల పెంపు, మెరుగైన ఇంధన వ్యవస్థ, ఆరోగ్య సౌకర్యాలు... బయోటెక్నాలజీ సమర్థ వినియోగంతో భారత్ అధిగమించగల సవాళ్లల్లో ఇవి కొన్ని మాత్రమే. బోలెడన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకూ బయో టెక్నాలజీ ఎంతో సాయం చేయగలదు. ఇదే విషయాన్ని గత నెల 31న విడుదల చేసిన ‘బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్ మెంట్, ఎంప్లాయ్మెంట్ (బయో ఈ3)’ విధానం ద్వారా కేంద్రం కూడా లక్షించింది. ఈ విధానంలోని అతిపెద్ద లోపం ఏమిటంటే... ఇవన్నీ ఎప్పటిలోగా సాధిస్తామన్నది స్పష్టం చేయకపోవడం. ఎందుకంటే ఇవన్నీ 2021లో ‘నేషనల్ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం’ పేరుతో విడుదల చేసిన పత్రంలో ఉన్నవే!‘బయో ఈ3’ విధానం ప్రధాన లక్ష్యం– వైవిధ్యభరితమైన కార్యకలాపాల ద్వారా పర్యావరణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిరక్షిస్తూనే, సుస్థిరా భివృద్ధి వంటి అంతర్జాతీయ సమస్యలను దీటుగా ఎదుర్కొనేందుకు బయో మాన్యుఫాక్చరింగ్ పరిష్కారాలు వెతకడం! సృజనాత్మక ఆలోచనలను టెక్నాలజీలుగా వేగంగా పరివర్తించాలని కూడా సంకల్పం చెప్పుకొన్నారు. ఇప్పటివరకూ వేర్వేరుగా జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ బయోమాన్యుఫాక్చరింగ్ అనే ఒక ఛత్రం కిందకు తీసుకు రావాలనీ, సుస్థిరమైన అభివృద్ధి పథాన్ని నిర్మించాలనీ కూడా విధాన పత్రంలో పేర్కొన్నారు. ఈ విధానాన్ని ప్రతిపాదించే క్రమంలో కేంద్ర ‘బయోటెక్నాలజీ విభాగం’ (డీబీటీ) కార్యదర్శి రాజేశ్ గోఖలే జీవశాస్త్ర పారిశ్రామికీ కరణకు నాంది పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ విధానంలోని వాపును కాస్తా పక్కకు పెడితే – బయోటెక్నాలజీ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ , కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఇందుకు వాడటం కీలకాంశా లుగా తోస్తాయి. ఇదే వాస్తవమని అనుకుంటే ఇందులో కొత్తదనమేమీ లేదు. ఎందుకంటే 2021లో ఇదే డీబీటీ ‘నేషనల్ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం (2021–25)’ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. అందులోనూ కచ్చితంగా ఇవే విషయాలను ప్రస్తావించారు. కాకపోతే అప్పుడు ఆర్థికాంశాలు, కాలక్రమం, లక్ష్య సాధనకు మార్గాల వంటివి స్పష్టంగా నిర్వచించారు. బయోటెక్నాలజీ ఆధారంగా విజ్ఞాన, సృజనాత్మకతలతో నడిచే ఓ జీవార్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నది 2021లో డీబీటీ పెట్టుకున్న లక్ష్యం. 2025 నాటికల్లా భారత్‌ను అంతర్జాతీయ బయో మాన్యు ఫాక్చరింగ్ హబ్‌గా రూపుదిద్దాలని అనుకున్నారు. బయో ఫౌండ్రీల వంటి వాటికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం, నైపుణ్యం కలిగిన సిబ్బంది, కార్మికులను తయారు చేయడం, అందరికీ అందు బాటులో ఉండే వస్తువులను తయారు చేయగల పరిశ్రమలకు ప్రోత్సా హకాలు అందించడం ద్వారా లక్ష్యాన్ని సాధించాలని అప్పట్లో తీర్మానించారు. వాతావరణ మార్పులు, ఆహార భద్రత, పర్యావరణ అను కూల ఇంధనాలు, వ్యర్థాల సమర్థ నిర్వహణ వంటివి 2021లో గుర్తించిన ప్రాధాన్యతాంశాలు. తాజా జాబితాలోనూ ఇవే అంశాలను పునరుద్ఘాటించారు. కానీ డీబీటీ తెలివిగా పాత విధానం, వ్యూహాలను అస్సలు ప్రస్తావించకపోవడం గమనార్హం. అప్పడు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోయారన్న ప్రశ్న నుంచి తప్పించు కునేందుకు అన్నమాట! 2021 విధానానికి అనుగుణంగా తీసుకున్న చర్య ఏదైనా ఉందీ అంటే... అది తాజా బడ్జెట్లో బయో ఫౌండ్రీల ప్రోత్సాహానికి ఒక పథకాన్ని ప్రకటించడం మాత్రమే. బయోటెక్నాలజీ ఏయే రంగాల్లో ఉపయోగపడగలదో చెప్పాల్సిన పని లేదు. టీకాల తయారీ మొదలుకొని కొత్త రకాల వంగడాల సృష్టి వరకూ చాలా విధాలుగా సహాయకారి కాగలదని గత నాలుగు దశా బ్దాల్లో నిరూపణ అయ్యింది. దేశ విధాన రూపకర్తలు దీని సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించారు. 1986 లోనే బయోటెక్నాలజీ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఇది దేశవ్యాప్తంగా పరిశోధన, విద్య అవకాశాలను పెంచడం వల్ల ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో కీలక స్థానానికి చేరుకోగలిగింది. అయితే బయోటెక్నాలజీ ఆధారిత పరిశ్రమ వృద్ధి కొంచెం నెమ్మదిగానే జరిగిందని చెప్పాలి. వెంచర్ క్యాపిటలిస్టుల లేమి, తగిన వాతావరణం లేకపోవడం ఇందుకు కారణాలు. అయినప్పటికీ పరి శ్రమ అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తులేవీ డీబీటీ కార్యక్రమాల కారణంగా వచ్చినవి కాకపోవడం గమనార్హం. భారతీయ బయోటెక్ పరిశ్రమకు ఇష్టమైన ప్రతినిధిగా చూపే ‘బయోకాన్’... డీబీటీ ఏర్పాటు కంటే మునుపటిది. శాంత బయోటెక్, భారత్ బయోటెక్ వంటి కంపెనీలు కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు వంటి ఇంకో ప్రభుత్వ విభాగపు రిస్క్ ఫైనాన్సింగ్ ద్వారా ఏర్పాటు చేసినవే. 2000లలో కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బయో టెక్నాలజీ రంగం కోసం ప్రత్యేక విధానాలను ప్రకటించడమే కాకుండా పరిశ్రమలకు ప్రోత్సాహకాలూ అందించాయి. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌ల విజయం ఈ విధానాల ఫలమే. 2012లో మాత్రమే డీబీటీ పారిశ్రామిక ప్రోత్సాహం కోసం ప్రత్యేక వాణిజ్య విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీన్నే ‘ద బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్’... క్లుప్తంగా బైరాక్ అని పిలుస్తారు. ప్రభుత్వం గతానుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, మన సామర్థ్యాల ఆధారంగా బయోటెక్నాలజీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించాల్సి ఉంటుంది. కానీ తాజా విధానంలో జీనోమ్ వ్యాలీ, ఐకేపీ నాలెడ్జ్ పార్క్ వంటి విజయవంతమైన నమూనాల ప్రస్తావనే లేదు. కాకపోతే ఇదే భావనను ‘మూలాంకుర్ బయో ఎనేబ్లర్ హబ్’ అన్న కొత్త పేరుతో అందించింది. విధాన పత్రం ప్రకారం ఈ హబ్స్ ఆవిష్కరణలు, ట్రాన్స్లేషనల్ రీసెర్చ్‌లను సమన్వయ పరుస్తాయి. పైలట్ స్కేల్, వాణిజ్య పూర్వ పరిశోధనలకు సహకారం అందిస్తాయి. ఇప్పటికే దేశంలో ఉన్న టెక్నాలజీ క్లస్టర్లు చేస్తున్నది కూడా ఇదే. కేంద్రం సర్వరోగ నివారిణిగా ప్రచారం చేస్తున్న ఈ కొత్త విధానం నియంత్రణ వంటి అంశాలను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మౌలిక పరిశోధనలకు తగినన్ని ప్రభుత్వ నిధులను అందుబాటులో ఉంచడం, సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరుల అభివృద్ధి విషయాల్లోనూ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నదీ విస్మరించింది. బయో మాన్యుఫాక్చరింగ్‌కు నియంత్రణ వ్యవస్థ కీలకం. ఎందుకంటే జన్యు మార్పిడి చేసిన సూక్ష్మజీవులు, ఇతర జీవజాలాన్ని వాడతారు కాబట్టి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన నిబంధనలు చెల్లాచెదురుగా ఉండటమే కాదు, పారదర్శకంగానూ లేవు. ఓ భారీ బయోటెక్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు అంతకంటే ముందే స్వతంత్ర, చురుకైన చట్టపరమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఐటీ విప్లవం మాదిరిగానే బయోటెక్నాలజీ ఆధారంగా సరికొత్త పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొస్తామని డీబీటీ కార్యదర్శి వ్యాఖ్యానించారు. సమాచార రంగంలో వచ్చిన మార్పులే ఐటీ విప్లవానికి నాంది అనీ, ఏదో విధానాన్ని రూపొందించి విడుదల చేయడం వల్ల మాత్రమే ఇది రాలేదనీ ఆయన గుర్తించాలి. డిజిటల్ టెలిఫోన్ ఎక్స్చేజ్ను సొంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గట్టిగా సంకల్పించడం, పెట్టుబడులు పెట్టడం, డెడ్లైన్లను విధించడం వల్లనే దేశంలో ఈ రోజు ఐటీ రంగం ఈ స్థాయిలో ఉంది. అలాగే ప్రభుత్వం స్వయంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఈ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేయడం కాకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించడం కీలకం.విధానాలు అనేవి బాధ్యతాయుతమైన పాలనకు మార్గదర్శక పత్రాల్లా ఉండాలి. ఉన్నతాశయాలు, దార్శనికతతో ఉండటం తప్పు కాదు. కానీ, లక్ష్యాలేమిటి? వాటి సాధనకు ఉన్న కాలపరిమితి, సవా ళ్లపై అవగాహన అవసరం. కాలపరీక్షకు తట్టుకున్న పాత విధానాన్ని కాకుండా కొత్త మార్గాన్ని అనుసరించాలని డీబీటీ ప్రయత్నించింది. శాస్త్రీయ విభాగం అయినందుకైనా తార్కికమైన, ఆధారాల కేంద్రిత విధానాన్ని రూపొందించి ఉంటే బాగుండేది. ‘ఆర్థిక వ్యవస్థ’, ‘ఉపాధి కల్పన’ రెండూ శీర్షికలోనే ఉన్నా ఈ విధానం ప్రాథమ్యాలు అస్పష్టం, సందేహాస్పదం. వాక్చాతుర్యం తప్ప ఏమీలేదు.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అర్హతకు తగిన ఉపాధి లేకపోతే...
నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి అల్ప ఉద్యోగిత. అర్హత, నైçపుణ్యాలకు తగిన ఉద్యోగానికి బదులు... తక్కువ స్థాయి ఉద్యోగం లభించే స్థితినే అల్ప ఉద్యోగిత అంటారు. ఇది ఆర్థిక వ్యవస్థలో ఉపాధి, శ్రామిక శక్తుల వినియోగానికి కొలమానం. అల్ప ఉద్యోగితకు అనేక కారణాలు ఉన్నాయి. పరిశ్రమల డిమాండ్‌లో మార్పుల కార ణంగా పాత నైపుణ్యాలు కలిగిన కార్మికులకు ఉపాధి దొరకదు. భౌగోళిక అసమానతలు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తాయి. లింగ, జాతి లేదా వయస్సు ఆధారంగా చూపే పక్షపాతం వ్యక్తులు తగిన ఉపాధిని పొందకుండా అడ్డుకుంటుంది. కొన్ని రంగాలలో అధిక పోటీ కారణంగా అర్హత కలిగిన అభ్యర్థులు తమ నైపుణ్యానికి సరి పోయే ఉద్యోగాలను పొందడం కష్టమవుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త రంగంలోకి మారి తగిన ఉద్యోగాలు సంపాదించాలన్నా... ఆ రంగా నికి అవసరమైన నైపుణ్యాల కొరత కారణంగా ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది. అల్ప ఉద్యోగిత వ్యక్తిగతంగానూ, సామాజిక పరంగానూ నష్టదాయకం. వ్యక్తులు తరచుగా ప్రాథమిక అవసరాలు తీరడానికి కూడా ఖర్చు చేయలేరు. అందువల్ల అప్పుల పాలవుతారు. ఆర్థిక అభద్రతకూ గురవుతారు. అల్ప ఉద్యోగిత ఎక్కు కాలం కొనసాగడం వల్ల వ్యక్తుల నైపుణ్యాలు క్షీణిస్తాయి. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై ఎక్కువ ఆధారపడటానికి అల్ప ఉద్యోగిత దారి తీస్తుంది. ప్రజా వనరులపై భారం పడుతుంది. ఈ స్థితి ఆర్థిక అసమానతలను పెంచుతుంది. వ్యక్తుల నైపుణ్యాలు పూర్తిగా వినియోగించుకోలేని కారణంగా ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పాదకత క్షీణించవచ్చు. అల్ప ఉపాధి వల్ల తక్కువ ఆదాయం వస్తుంది కనుక వస్తు వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిరుద్యోగం లాగానే అల్ప ఉద్యోగిత కూడా ప్రపంచ దేశాల సమస్య. దేశాలు, ప్రాంతాలను బట్టి దీని తీవ్రత మారుతూ ఉంటుంది.ముఖ్యంగా స్పెయిన్, గ్రీస్, ఇటలీ దేశాలలో చాలా మంది నైపుణ్యం కలిగిన కార్మికులు తక్కువ జీతాలు పొందుతున్నారు లేదా పార్ట్‌టైమ్ ఉద్యో గాలు చేస్తున్నారు.కొన్ని అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అల్ప ఉద్యోగిత 15–20 శాతం ఉన్నట్లు తేలింది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటాను బట్టి... కేరళలో 10–15%, తమిళ నాడులో దాదాపు 10–20%, గుజరాత్, మహా రాష్ట్రల్లో 10–15% వరకు అల్ప ఉద్యోగిత ఉందని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయం ఎక్కువగా ఉండి ఉద్యోగాల కల్పన పరిమితంగా ఉన్నందున 20–30% అల్ప ఉద్యోగిత ఉంది. బిహార్‌లో వ్యవ సాయంపై ఆధారపడి ఉండటం, తక్కువ పారిశ్రా మిక వృద్ధి జరగడం వల్ల అక్కడ, బహుశా 30% కంటే ఎక్కువ అల్ప ఉద్యోగిత ఉంది. అనేక దేశాలు అల్ప ఉద్యోగితను తగ్గించే లక్ష్యంతో కొన్ని విధానాలను అమలు చేశాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాల కోసం కార్మికులు సన్నద్ధమయ్యారని నిర్ధారించుకోవడానికి వృత్తి శిక్షణ–నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడిని ప్రోత్సహించడం అందులో ఒకటి. ఉద్యోగ భద్రతను పెంచే విధానాలు చేపట్టడం, పని పరిస్థితులను మెరుగు పరచడం, న్యాయమైన వేతనాలను ప్రోత్సహించడం; గ్రాంట్లు, రుణాలు, శిక్షణ ద్వారా చిన్న వ్యాపార అభివృద్ధిని ప్రోత్సహించడం; పార్ట్ టైమ్ లేదా గిగ్ వర్క్‌కు మద్దతు ఇచ్చే విధానాలు రూపొందించడం వంటి విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అల్ప ఉద్యోగితను పరిష్కరించడానికి తరచుగా నైపుణ్యాల శిక్షణ, ఆర్థిక మద్దతు, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించే బహు ముఖ విధానం అవసరం. ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకుంటే కొంత పరిష్కారం లభిస్తుంది.డా‘‘ పి.ఎస్. చారి వ్యాసకర్త బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ మొబైల్: 83090 82823 -
రాజకీయాల్లోకి మతాన్ని లాగడమా?
రాజకీయ నాయకులు సుద్దపూసలు కారు. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు చేయగలిగినన్ని పాపాలు చేశాడు. కానీ, తిరుమల తిరుపతి దేవస్థానపు ‘లడ్డూ’ ప్రసాదం కేంద్రంగా ఆడుతున్న నాటకం మాత్రం ఆయన ప్రజా జీవితంలో అత్యంత నికృష్టమైన చేష్ట. దైవ దూషణ, నిరాధార ఆరోపణలతో కూడి ఉందీ రాజకీయం. ఒక వర్గంలో విపరీతమైన ద్వేషం, ఉన్మాదాన్ని రేకెత్తించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయ త్నమిది. దేవుడి పేరుతో జరుగుతున్న ఆటవిక రాజకీయం. చంద్ర బాబు గురించి తెలిసిన వాళ్లు కూడా ఊహించని విధంగా ఆయన దక్షిణాదిలో మతోన్మాదాన్ని వేగంగా వ్యాపింపజేసేందుకు కంకణం కట్టుకున్నాడని అనిపిస్తోంది. లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణలు ఏవీ నిలిచేవి కావు. ఎందుకంటే అన్నీ పరస్పర విరుద్ధమైనవి. ‘ద ప్రింట్’కు చెందిన నిచ్చెనమెట్ల ప్రసాద్ సెప్టెంబరు 21న రాసిన కథనం ప్రకారం... కల్తీ జరిగిందని భావిస్తున్న నెయ్యి దేవస్థానానికి జూలై 6 నుంచి 12 తేదీల మధ్య వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా గద్దెనెక్కిన తరువాత! దేవస్థానం వ్యవహారాల్లో అత్యంత శక్తిమంతుడైన ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామల రావును నియమించింది కూడా చంద్రబాబే. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని అనుమానిస్తున్న నెయ్యిని వాడనే లేదని ఆయన విస్పష్టంగా ప్రకటించాడు.వాస్తవానికి జరిగిందేమిటంటే... నాణ్యత పరీక్షల్లో విఫలమైన కారణంగా కల్తీ జరిగిందని అనుమానించిన నెయ్యి ట్యాంకర్లను సరఫరాదారుకు తిప్పి పంపారు. ఈ ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలను తనిఖీల కోసం ప్రత్యేకమైన పరిశోధన సంస్థలకు పంపారు. ఈ సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే బాబు కుమారుడు లోకేశ్ కూడా ‘‘జగన్ ప్రభుత్వం తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడింది. జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ విషయమై సిగ్గుపడాలి. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లను గౌరవించలేకపోయారు’’ అని మాట్లాడాడు.జరిగిన పరిణామాలు, అందుబాటులో ఉన్న అరకొర సాక్ష్యాలను బట్టి చూస్తే అత్యంత మూర్ఖులు మాత్రమే ఈ రకమైన పైత్యాన్ని నమ్ముతారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహజంగానే ఈ ఉచ్చులో పడిపోయాడు. వాస్తవాలను పరిశీలించాలన్న ఆలోచన కూడా లేకుండా లడ్డూ ప్రసాదం ‘అపవిత్రమై’పోయిందన్నాడు. ఈవో శ్యామలరావు స్వయంగా అలాంటిదేమీ జరగలేదని ప్రకటించిన విషయాన్నీ పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ వైఖరి ఎంత విచిత్రంగా ఉంటుందంటే... దేశంలోని మత మైనారిటీల రక్షణకు రాకుండా, వారినే అంతమొందిస్తామన్న ఖలిస్తానీ తీవ్రవాదులకు మద్దతుగా మాట్లాడేంత! దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతపై క్రిస్టియన్ అన్న ఒక్క కారణంగా జరుగుతున్న దుష్ప్రచారానికి పవిత్రత కల్పిస్తూగానీ మెజారిటీ వర్గాలకు భరోసా ఇవ్వలేక పోయేంత!వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం చేసుకున్న అదృష్టం ఏమిటంటే... జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లాంటివాడు కాకపోవడం! వారసుడే అయినప్పటికీ, అట్టడుగు నుంచి అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం షేక్స్పియర్, మారియో పూజో(‘ద గాడ్ ఫాదర్’ రచయిత) ఉమ్మడిగా రాసినట్టుండే కథనానికి ఏమాత్రం తీసిపోనిది. భారతీయ రాజకీయ యవనికపై అకస్మాత్తుగా కనుమరుగైన నేతలు ఎందరో ఉన్నారు. కానీ అత్యంత ప్రభావశీలమైన నిష్క్రమణల్లో వై.ఎస్. రాజశేఖర రెడ్డిది ఒకటి. 2009 సెప్టెంబరు 2న జరిగిన ఆ హెలికాప్టర్ ప్రమాదం నుంచి ఆయన బతికి బయటపడి ఉంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా మారిన ఆంధ్రప్రదేశ్ అసలు విభజితమై ఉండేది కాదు. నియంతల్లా పేరుపడ్డ మోదీ, అమిత్ షా సైతం సిగ్గుపడే స్థాయిలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ ఒక్క నిరంకుశ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ తుడిచి పెట్టుకుపోయింది. ఈ సమయంలోనే మోదీ కూడా గుజరాత్‌ను వీడి జాతీయ రాజ కీయాల్లో చక్రం తిప్పడం మొదలుపెట్టిన విషయం గమనార్హం.ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాల తరువాత కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కేలా చేసిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసుడైన జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ ముప్పు తిప్పలు పెట్టింది. జగన్ మోహన్‌రెడ్డిని పార్టీలోనే పరాయివాణ్ణి చేశారు. ఆంక్షలు పెట్టారు. కేసుల పేరుతో హింసకు గురిచేశారు. జగన్ పోరాడింది ఆషామాషీ వ్యక్తులతో కాదు. దేశంలోనే అత్యంత శక్తిమంతులైన రాజకీయ నేతలతో.ఢిల్లీలో గాంధీలు... హైదరాబాద్‌లోని వారి చంచాలు ఒక పక్క,ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఇంకోపక్క. వైఎస్ దాతృత్వంతో లబ్ధి పొందిన వాళ్ల కేసుల కారణంగానే జైల్లో మగ్గిన జగన్‌కు ఇక భవిష్యత్తు లేదని చాలామంది అనుకున్నారు. అయితే జగన్ ఈ విషయాలపై ఫిర్యాదు చేయలేదు. తనకు అన్యాయం జరిగిపోయిందని ఏడవలేదు. పోరాడాడు. సొంతంగా పార్టీ స్థాపించాడు. అత్యంత దుర్భరమైన, వేల కిలోమీటర్ల పొడవునా జన సామాన్యులతో కలిసిపోతూ పాదయాత్ర నిర్వహించాడు.పార్టీ స్థాపించిన ఎనిమిదేళ్లకు వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఏ రకంగా చూసినా ఇది అసాధారణ విజయమనే చెప్పాలి. వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అన్ని మతాలు, కులాల వాళ్లూ ఇష్టపడ్డారు. క్రిస్టియన్ కాబట్టి నేతగా అంగీకరించమని ఎవరూ అనుకోలేదు. రాజశేఖర రెడ్డి కూడా కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోయేవాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రతిసారీ తిరుపతిని సందర్శించడం రాజశేఖర రెడ్డి పాటించిన పద్ధతుల్లో ఒకటి. వాళ్లు రహస్య క్రైస్తవులని అంటున్న హిందువుల మెప్పు కోసం నేను ఈ మాటలు అనడం లేదు. మత విశ్వాసాల విషయంలో రాజశేఖర రెడ్డి వైఖరి అన్నింటినీ సమాదరించే లక్షణం ఉండటం వల్ల అంటున్నా. ఆయనది అసలైన భారతీయుడి మనస్తత్వం.జగన్‌ను ప్రత్యర్థిగా చేసుకుని ఆయన్ని హిందూ వ్యతిరేకిగా ముద్రించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు గర్హనీయం, హేయం, అత్యంత ప్రమాదకరం, నిర్లక్ష్యపూరితం. ఈ విషయంలో చంద్రబాబు అండ్ కో రోజు రోజుకూ అత్యంత నీచమైన రాజకీయాలకు పాల్పడుతోంది. హిందూ ధర్మ పరిరక్షకుడి స్థాయిలో తానూ గుర్తుండిపోవాలని చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత అథమ స్థాయికి చేరిందంటే... టీటీడీ బోర్డు ఛైర్మన్ భార్య తన చేతిలో బైబిల్ పట్టుకుని తిరుగుతోందని ఆరోపించేంత వరకు!రాజకీయాల్లోకి మతాన్ని లాగడం ద్వారా చంద్రబాబు ఘోరమైన తప్పు చేస్తున్నాడు. దీనిపై ఆగ్రహ జ్వాలలు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ ప్రజానీకం ఇదంతా నాటకమని నమ్ముతూంటే, మిగిలిన వారిని రెచ్చగొట్టేందుకు పవన్ కల్యాణ్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌లో గట్టి మద్దతే ఉంది. మతతత్వ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా నడిచేవీ కావు. అధికారం ఎప్పుడూ ఓకే పార్టీ, నేతతో ఉండేదీ కాదు.విభజించి పాలించు అన్నది తాత్కాలికంగా కొన్ని లాభాలు ఇవ్వ వచ్చునేమో కానీ... ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి మార్గంలో పెట్టాలని ఆశిస్తున్న చంద్రబాబుకు దీర్ఘకాలంలో ఇది చెరగని మరకగానే మిగిలిపోతుంది.కపిల్ కొమిరెడ్డి వ్యాసకర్త ‘మాలెవొలెంట్ రిపబ్లిక్: ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ ద న్యూ ఇండియా’ పుస్తక రచయిత (‘ద ప్రింట్’ సౌజన్యంతో)