Editorial
-
కాంగ్రెస్‌కు ‘హరియాణా’ దరువు!
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో ఆ రాష్ట్రాల్లో పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒంటరిగా పోటీ చేసి నెగ్గేంత విశ్వాసం ఏ పార్టీకీ లేకపోవటంతో కూటములుగా కదులుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో సీట్ల సర్దుబాటు రెండురోజుల క్రితమే కుదరగా, విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో బుధవారం సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. అయినా అరడజను సీట్లకు సంబంధించి ఇంకా పంచాయతీ తెగలేదు. జార్ఖండ్‌లో సైతం బీజేపీ, జేఎంఎం శిబిరాల్లో సర్దుబాట్లు ఒక కొలిక్కివచ్చాయి. కేంద్రంలో అధికారం ఉంది గనుక బీజేపీకి పెద్దగా దిగులేమీ లేదు. సొంత పార్టీలో అధిష్టానం మాట చలామణి అవుతుంది. కూటమి పక్షాలు సైతం కాస్త అటూ ఇటూగా బీజేపీకి తలాడిస్తాయి. ఎటొచ్చీ సమస్యంతా కాంగ్రెస్‌కే. కొత్తగా ఎన్నికలొచ్చి పడినప్పుడల్లా పాత ఖాతాలు ముందేసుకుని ఇంటా బయటా కూడా ఒత్తిళ్లు తెచ్చేవారు ఎక్కువే. మొన్నటి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కబోర్లా పడ్డాక, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ... సొంత పార్టీలో సరే సరి... కూటముల్లో కూడా కాంగ్రెస్ అధి నేతల మాటకు విలువుండటం లేదు. అందుకు తాజా సర్దుబాట్లు, ఆ సందర్భంగా వచ్చిన విమర్శలు తార్కాణం. హరియాణాలోని 90 స్థానాల్లో బీజేపీ 48 గెల్చుకోగా అంతర్గత పోరుతో సతమతమైన కాంగ్రెస్ 37తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది మొదలు కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ మొదలు కొని యూపీ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మిత్రుల వరకూ అన్నిచోట్లా ఆ పార్టీ పనితీరుపై, దురహంకారంపై విమర్శలు వచ్చిపడ్డాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు మిత్రుల ముందుపెట్టగానే వారు అంతెత్తున విరుచుకు పడటంతో కాంగ్రెస్ అధినాయకత్వానికి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. హరియాణా ప్రభావం ఏ స్థాయిలో ఉందో మహారాష్ట్ర పంపకాలే రుజువుచేస్తాయి. అక్కడి 288 స్థానాల్లో ఎంవీఏ ప్రధాన పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), ఉద్ధవ్ నేతృత్వంలోని యూబీటీ శివసేనలు సమానంగా అంటే 85 సీట్ల చొప్పున పోటీచేయటానికి బుధవారం అంగీకారం కుదిరింది. కూటమిలోని సమాజ్‌వాదీ, ఆప్, సీపీఐ, సీపీఎం, ఇతరేతర పార్టీల కోసం 18 స్థానాలు విడిచి పెట్టగా, ముంబైలో 3, విదర్భలో 12 స్థానాలు అనిశ్చితిలో ఉన్నాయి. ఈ 15 తమకే ఇవ్వాలన్నది కాంగ్రెస్ డిమాండ్. పాతకాలంలో వేరు. కాంగ్రెస్ మెజారిటీ సీట్లలో పోటీచేసేది. ఎన్సీపీ, ఇతర మిత్ర పక్షాలూ సరిపెట్టుకునేవి. గత అసెంబ్లీ ఎన్నికల సంగతే చూస్తే అప్పట్లో కాంగ్రెస్ 145 చోట్ల పోటీచేసింది. యూపీఏ కూటమిలోని ఎన్సీపీ 123, ఇతరులు 17 తీసుకున్నారు. మరో మూడు ఇతరులకిచ్చారు. అప్పుడు శివసేన బీజేపీతో చెలిమి చేసి 124 తీసుకోగా, బీజేపీ 152 చోట్ల పోటీ చేసింది. ఇలా ప్రతిచోటా హరియాణా భంగపాటు కాంగ్రెస్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. అధినేతలు తమ వారికి హరియాణా సంగతి గుర్తుచేస్తుంటే... మిత్రులు సైతం కాంగ్రెస్‌కు ఆ బాణీయే వినిపించటం గమనించదగ్గది. తమకు అన్యాయం జరుగుతోందని అధిష్టానానికి మొరపెట్టుకున్న పార్టీ నేతల తరఫున పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మాట్లాడినా పెద్దగా ఫలించక పోవటంతో కూటమి నుంచి బయటకు రావాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందంటున్నారు. చివరకు పవార్ జోక్యం తర్వాతైనా ఉద్ధవ్ శివసేన ఆ 15 వదులుకోవటానికి సిద్ధపడటం లేదు. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి తిరుగుబాట్లు, కప్పదాట్లు సహజంగానే ఉంటాయి. కానీ బలంగా బేరసారా లాడే స్థితి కాంగ్రెస్‌కు లేదన్నది వాస్తవం.బీజేపీలో అసమ్మతి స్వరాలు అక్కడక్కడ వినిపిస్తున్నా అవి పట్టించుకోవాల్సినంతగా లేవని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయానికొచ్చేయటం గమనించదగ్గది. మిత్రుల అసంతృప్తిని సైతం అది బేఖాతరు చేస్తోంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడూ, అనుకోని విజయాలు సైతం చేజిక్కించు కుంటున్నప్పుడూ సహజంగానే ఎవరినీ లెక్కచేసే పరిస్థితి ఉండదు. పాలక మహాయుతిలో కుదిరిన ఒప్పందం ప్రకారం బీజేపీ 152–155 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించగా, షిండే శివసేనకు 78–80 మధ్య, అజిత్ పవార్ ఎన్సీపీకి 52–54 మధ్య ఇవ్వాలన్న అవగాహన కుదిరింది. ఇప్పటికే వంద స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీలో అసంతృప్తి లేకపోలేదు. అలాగే మిత్రులనుంచి కూడా సణుగుడు జాస్తిగానే ఉంది. అయినా అందరినీ దారికి తేవొచ్చన్న అభిప్రాయంతోనే బీజేపీ పెద్దలుండటం గమనించదగ్గది.ఇప్పటికే మూడో జాబితా కూడా విడుదల చేసి మొత్తం 41 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసు కున్న జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నుంచి కాంగ్రెస్‌కు 29కి మించి వచ్చేలా లేవు. 81 స్థానా లున్న జార్ఖండ్ రాష్ట్రంలో ఆర్జేడీ, వామపక్షాలకు 11 స్థానాలివ్వాలని నిర్ణయించారు. 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న ఉత ్తరప్రదేశ్లో కనీసం మూడైనా సాధించుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్‌నుంచి సానుకూల స్పందన రాకపోవటం కూడా హరి యాణా షాక్ ఫలితమే. అక్కడ రెండు స్థానాలివ్వాలని ఎస్పీ నిర్ణయించినా అసలు పోటీకి దిగరాదని కాంగ్రెస్ అనుకోవటం ఆ పార్టీ దయనీయ స్థితికి నిదర్శనం. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఏమిటో కాంగ్రెస్‌కు అడుగడుగునా అర్థమవుతోంది. అధికారంలో ఉన్నన్నాళ్లూ కన్నూ మిన్నూగానక వ్యవహరిస్తే ఏమవుతుందో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తనను తాను సరిదిద్దుకోలేని నిస్సహా యత ఆ పార్టీని ఆవరించటంవల్ల మరోసారి అదే భంగపాటు ఎదురైంది. అందుకు ఎవరిని నిందించగలరు? చేసుకున్నవారికి చేసుకున్నంత! -
ఈ భేటీ శుభ పరిణామం
అయిదేళ్ల తర్వాత నైరుతి రష్యాలోని కజన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య బుధవారం ద్వైపాక్షిక సమావేశం జరిగింది. బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ సందర్భంగా రెండు దేశాల అధినేతల మధ్యా చర్చలు జరగటం శుభపరిణామం. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాల గస్తీకి రెండురోజుల క్రితం అవగాహన కుదరటంతో అధినేతల భేటీ సాధ్యమైంది. ఈ విషయాన్ని మన విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం ప్రకటించటం... దానికి అనుగుణంగా చైనా వైపునుంచి కూడా ప్రకటన జారీకావటంతో వాతావరణం తేలికపడింది. అయితే గతాన్ని అంత తేలిగ్గా మరిచిపోరాదు. సరిగ్గా అయిదేళ్లనాడు ఇదే నెలలో తమిళనాడులోని మహా బలిపురం వేదికగా ఇరు దేశాధినేతలూ కలుసుకోగా ఆ తర్వాత ఏడాది తిరగకుండానే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించి చైనా తన నైజం చాటుకుంది. దాంతో ఇరు దేశాల సంబంధాలూ కనీవినీ ఎరుగనంతగా దెబ్బతిన్నాయి. నిజానికి అంతక్రితం 2018లో మోదీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంప్రదింపుల కోసం వూహాన్ తరలివెళ్లిన నాటికే డోక్లాంలో రెండు దేశాల సైనికుల మధ్యా 73 రోజులపాటు ఘర్షణ వాతావరణం కొనసాగింది. డోక్లాం చిన్న అపశ్రుతి మాత్రమేనని, అంతా చక్కబడిందని అనుకుని మహాబలిపురంలో జిన్‌పింగ్‌కు ఘనమైన ఆతిథ్యం అందించిన కొద్దికాలా నికే మళ్లీ సరిహద్దుల్లో సమస్యలు తలెత్తాయి. 2020 ఏప్రిల్‌లో చైనా సైనికులు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను అతిక్రమించి గాల్వాన్ లోయలో చొరబాట్లకు పాల్పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్, డెస్పాంగ్, హాట్‌స్ప్రింగ్స్ తదితరచోట్ల ఆక్రమణలకు దిగి అక్కడ మన సైనికులు గస్తీ తిరగడానికి వీల్లేదని పేచీకి దిగారు. కర్రలు, ఇనుపరాడ్లతో మన జవాన్లపై దాడికి దిగి 21 మంది ఉసురు తీశారు.అంతంతమాత్రంగా సాగుతూవచ్చిన సంబంధాలు కాస్తా ఆ తర్వాత పూర్తిగా పడకేశాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య సంప్రదింపులు జరుగుతున్నా, అడపా దడపా సేనల ఉపసంహరణ జరిగినా మునుపటి సాన్నిహిత్యం లేదు. రెండు దేశాల విదేశాంగ మంత్రులూ 2020 సెప్టెంబర్‌లో సమావేశమై ఉద్రిక్తతల ఉపశమనానికి పంచసూత్ర పథకం రూపొందించారు. రక్షణ మంత్రుల స్థాయిలో కూడా చర్చలు జరిగాక వివాదాస్పద ప్రాంతాల నుంచి సైన్యాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ సమస్యలు పూర్తిగా సమసిపోలేదు. 2022లో బాలిలో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు, నిరుడు జోహన్నెస్ బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్ అధినేతల సదస్సు సందర్భాల్లో మోదీ, జిన్‌పింగ్‌లు కలిసిన మాట వాస్తవం. అయితే అవి ముక్తసరి, మర్యాదపూర్వక భేటీలు మాత్రమే. ఆ తర్వాత ఎల్ఏసీలో పరిస్థి తులు స్వల్పంగా మెరుగుపడ్డాయి. అయినా మన హిమాచల్‌ప్రదేశ్ గ్రామాలకు చైనా తనవైన పేర్లు పెట్టడం, సరిహద్దుల్లో కొత్త గ్రామాలు సృష్టించటంవంటి గిల్లికజ్జాలకు మాత్రం కొదవలేదు. ఎల్ఓసీలో 45 ఏళ్లుగా ఇరు దేశాల సైనికులూ నిరంతరాయంగా గస్తీ కొనసాగిస్తున్న చోటులో చైనా దళాలు ఆక్రమణలకు దిగి ఇక్కడ గస్తీ కాయొద్దంటూ అభ్యంతరపెట్టడంతో 2020లో కొత్త వివాదం మొదలైంది. ఇలా మన జవాన్లు ఉండే చోటుకొచ్చి కవ్వింపులకు దిగి ఎదురుదాడి చేయ టమో, మానటమో మనవాళ్లే తేల్చుకోవాల్సిన స్థితి కల్పించటం చైనా మొదలెట్టిన కొత్త వ్యూహం. యధాతథ స్థితిని కాలరాసి ఆ ప్రాంతం ఎప్పటినుంచో తమదన్న తర్కానికి దిగటం చైనాకే చెల్లింది. 1962లో సైతం ఇలాంటి వైఖరితోనే మన దేశంపై దురాక్రమణకు తెగించింది. అంత వరకూ మన దేశం చైనాకు అన్నివిధాలా సహాయసహకారాలు అందజేసింది. చైనా ఆవిర్భావం తర్వాత దాన్ని గుర్తించటంలో మనం ముందున్నాం. ఆ తర్వాత ‘పంచశీల’ ఒప్పందం సైతం కుదిరింది. కానీ దానికి వెన్నుపోటు పొడిచింది చైనాయే.తాజాగా రెండు దేశాల మధ్యా సామరస్యత నెలకొనడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ చొరవ తీసుకున్నారన్న కథనం వినిపిస్తోంది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో రష్యా తన ప్రయోజనాలు కాపాడుకోవాలనుకోవ టంలో వింతేమీ లేదు. ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీయెత్తున ఆయుధ సామగ్రి అందిస్తున్న ఆ దేశాలు రష్యాను ఆర్థిక ఆంక్షలతో కూడా దిగ్బంధించి దెబ్బ తీయాలని చూశాయి. ఆ తరుణంలో భారత్, చైనాలు రష్యానుంచి ముడి చమురు కొనుగోలుచేసి ఆదుకున్నాయి. అందుకే కావొచ్చు... ఆ రెండు దేశాలమధ్యా సామరస్యత సాధించి పాశ్చాత్య ప్రపంచానికి పుతిన్ షాక్ ఇచ్చారు. ఇరుగుపొరుగు దేశాలన్నాక సమస్యలు సహజం. ఇచ్చిపుచ్చు కునే ధోరణితో వ్యవహరించాలని, సామరస్యంగా మెలగాలని ఇరుపక్షాలూ అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. అటు చైనాకు ఆర్థికరంగంలో సమస్యలు ముంచుకొస్తున్నాయి. అక్కడ హౌసింగ్ రంగం తీవ్రంగా దెబ్బతిని దాని ఆర్థిక వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసింది. రుణభారం తడిసి మోపెడైంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దాన్ని సక్రమంగా పరిష్కరించకపోతే చైనాయే కాదు... చైనాతోపాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. భారత, చైనాలు రెండూ జనాభాపరంగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. అతి పెద్ద మార్కెట్గల భారత్‌తో సంబంధాలు మెరుగుపడితే తన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవటానికి ఆ చర్య తోడ్పడుతుందన్న వివేకం చైనాకు ఉండాలి. అధినేతల మధ్య అవగాహన ఆచరణలో కనబడాలి. మాటకూ, చేతకూ పొంతన కుదరాలి. అప్పుడు మాత్రమే చెలిమి వర్ధిల్లుతుంది. -
అధిక జనాభా వరమా!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్‌కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్‌కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్ మాటల ఆంతర్యం అదే. మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. -
వట్టి బెదిరింపులేనా?
ఇది కనివిని ఎరుగని కథ. వారంరోజుల్లోనే మన విమానాలకు శతాధికంగా బాంబు బెదిరింపు కాల్స్... వివిధ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలను అర్ధంతరంగా దింపాల్సి రావడం, దారి మళ్ళించడం, చివరకు ఫైటర్ జెట్ల రక్షణ మధ్య తీసుకువెళ్ళాల్సి రావడం జరిగింది. ఈ–మెయిల్, సోషల్ మీడియా అజ్ఞాత పోస్టుల బెదిరింపులతో భారత వైమానిక రంగం ఉలిక్కిపడింది. ఏ బెదిరింపు వచ్చినా నిశితంగా పరీక్షించి, జాగ్రత్త చేపట్టాలన్నది నిబంధన కావడంతో విమానయాన పరిశ్రమపై తాజా బెదిరింపుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ సైతం ఎయిరిండియా విమానంపై దాడి చేస్తామనీ, నవంబర్ 1–19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించవద్దనీ హెచ్చరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పెరుగుతున్న భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బెదిరింపులకు పాల్పడినవారిపై తీవ్ర శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలనీ, దోషుల్ని విమానయానం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని భావిస్తున్నామనీ కేంద్ర మంత్రి మాట. భవిష్యత్తుకు పనికొచ్చే ఆ చర్యల మాటెలా ఉన్న వర్తమానంలో తక్షణ మార్గాంతరమేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.2014 – ’17 మధ్య అంతా కలిపి 120 బాంబు బెదిరింపులే రాగా, ఇప్పుడు ఒక్కవారంలోనే 100కు పైగా బెదిరింపులు రావడం గమనార్హం. విమానాల దారి మళ్ళింపు, తక్షణ ల్యాండింగ్ వల్ల అయ్యే ఇంధన వృథా ఖర్చు, వగైరాలతో ప్రతి బెదిరింపు కాల్ వల్ల ఎయిర్‌లైన్స్‌కు రూ. 3 కోట్ల పైగా నష్టమట! ప్రయాణికుల్లో భయాందోళనల్ని పెంచడంతో పాటు ప్రయాణంలో ఆలస్యంతో కీలకమైన పనులు దెబ్బతినడం లాంటివి సరేసరి. రద్దీ ఎక్కువగా ఉండే పండగ సీజన్ కావడంతో కష్టం, నష్టం ఎక్కువ. ఒక్క వారంలోనే వంద బెదిరింపులు వచ్చాయంటే భద్రతా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు ఒక మైనర్నీ, అతని తండ్రినీ మాత్రమే అరెస్ట్ చేసినట్టు వార్త. నింది తుల్ని వేగంగా కనిపెట్టి, కఠినచర్యలకు ఎందుకు దిగడం లేదు? అయితే ముష్కరులు, తీవ్రవాదులు వర్చ్యువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దాంతో, వారున్న లొకేషన్ కనిపెట్టలేని పరిస్థితి. ఈ సవాలును అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి. నిజానికి, విమాన సర్వీసులకే కాదు... కొద్ది నెలలుగా రైల్వేలకూ ఈ బెడద తప్పడం లేదు. రైల్వే ట్రాకుల మీద రాళ్ళు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ నింపిన సీసాల లాంటివి దుండగులు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య అనేక చోట్ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను లక్ష్యంగా చేసుకొని రాళ్ళు విసిరిన ఉదంతాలూ చూశాం. ఈ చర్యల వెనుక పెద్ద పన్నాగమే ఉందని విశ్లేషకుల మాట. దేశంలో విమానయాన రంగం వేగంగా దూసుకుపోతోంది. ఒక్క 2023లోనే 15.2 కోట్ల మంది దేశంలో విమానయానం చేశారు. అలాంటిది... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత వైమానిక రంగాన్నీ, రైల్వేలనూ గనక అప్రతిష్ఠ పాల్జేస్తే, ఆర్థిక నష్టంతో పాటు భూమి మీదైనా, ఆకాశంలోనైనా సురక్షితంగా ప్రయాణం చేయలేమనే భీతిని దేశ, విదేశీ ప్రయాణికుల్లో పెంచాలన్నది కుట్ర. భయం పెంచి, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి విద్రోహ చర్యలను తక్షణం అరికట్టాలి. చిత్రమేమిటంటే, ఐరోపా గగనతలంలోనూ భారత విమానయాన సంస్థలకు బెదిరింపులు వస్తున్నాయి. భారత ప్రభుత్వం, గూఢచర్య వ్యవస్థలు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే పెను ప్రమాదమే! భారత్‌కు తీరని నష్టం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొన్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామంటూ గత ఏడాది నవంబర్ లోనూ ఇలానే బెదిరింపులకు దిగాడు. అతను, అతని అనుచరుల ఆనుపానులు, దుశ్చర్యలు తెలిసినప్పటికీ అమెరికా గూఢచారి వ్యవస్థ ఎఫ్‌బీఐ లాంటివి కళ్ళు మూసుకొని, వారిని కాపాడుతూ వస్తుండడమే విషాదం. మరోపక్క దేశీయ విమానాల్లో సిక్కు ప్రయాణికులు కృపాణాలతో ప్రయాణించడాన్ని నిరోధించేందుకు సుప్రీమ్ కోర్టు సైతం నిరాకరించడంతో, పన్నూ లాంటి వారు దాన్ని అవకాశంగా తీసుకొంటే కష్టమే. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒకటికి రెండు తీవ్రవాద బృందా లను కలుపుకొనిపోతే పెను ప్రమాదమే. దాదాపు పాతికేళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11న తీవ్ర వాదులు విమానాల హైజాక్‌తో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల కూల్చి వేతతో సహా 3 వేల మంది మరణానికి కారణమైన ‘9/11’ ఘటనను విస్మరించలేం. ఈ పరిస్థితుల్లో ఈ ముష్కరమూకలకు పరోక్షంగా అండగా నిలుస్తున్న అమెరికా, కెనడాలకు పరిస్థితిని వివరించి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకొనే దిశగా భారత ప్రభుత్వం కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలి. మన ప్రయాణ వ్యవస్థలతో పాటు పౌరుల భద్రత అత్యంత ప్రధానమని తెలియజెప్పాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ, ఐరాస భద్రతా మండలినీ ఆశ్రయించాలి. అదే సమయంలో కొద్దివారాల పాటు టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ముష్క రులు ‘9/11’ ఘటనకు పాల్పడగలిగారని మర్చిపోరాదు. సాంకేతికంగా ముష్కర చేష్టలకు వీలు కల్పించే ట్రాన్సీవర్స్ లాంటి సాంకేతిక సామగ్రిని ఆన్లైన్లో అమ్మడాన్ని తక్షణం నిషేధించడం అవసరమని నిపుణుల సూచన. అన్నిటి కన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన మన విమాన, రైల్వే భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించి, సరికొత్త సవాళ్ళకు అనువుగా పటిష్ఠం చేయాలి. అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను (ఎస్ఓపీ) సిద్ధం చేయాలి. అదే సమయంలో అన్ని ఎయిర్‌లైన్స్, వివిధ దేశాల వైమానిక రంగాలు ఒక్కటై, సమాలోచనలు జరపాలి. పెరుగుతున్న ముప్పును పరస్పర సహకారం, సమన్వయంతో ఎలా ఎదుర్కోవాలో చూడాలి. -
మేధకు ‘కృత్రిమ’ గ్రహణం
మేధ మనిషికి ఒక వరం; అది ఒక్కోసారి గంద్రగోళంతో నిండడం ఒక శాపం. మేధ సవ్యంగా, స్పష్టంగా పనిచేసిప్పుడు మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు; అది అయోమయపు డొంకలా, బంకలా మారి వెర్రితలలు వేసినప్పుడు వాటిని తనే కూలదోసుకుని, తనూ పడిపోగలడు. కృత్రిమ మేధగా మనం అనువదించుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ మనిషి మేధ సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి. ఆ కృత్రిమ మేధ తన సృష్టికి మూలమైన మనిషిలోని సహజ మేధను హరించి, తనే అసలు మేధగా మారబోతోందా!? ప్రస్తుతం మానవాళి ముఖాన వేలాడే ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఇది.‘కృత్రిమ మేధ’ ఈరోజున సర్వత్రా చర్చనీయమవుతున్న సాంకేతికాద్భుతం. ఆశాభావాన్ని మించి అది ఆందోళనను రేపడం చూస్తున్నాం. ఇంకోవైపు, అది ఆవిష్కరించే ఫలితాలకు ఆశ్చర్య చకితులమూ అవుతున్నాం. సృష్టికి ప్రతిసృష్టి అనే పౌరాణిక ఊహకు అత్యధునాతన ఉదాహరణ ఇదే. ఇది కృత్రిమమైన కాలో, చెయ్యో అమర్చుకోవడం కాదు, ఏకంగా కృత్రిమ మేధనే తెచ్చి అతికించుకోవడం. మనిషి తన మేధతో చేసే పనులన్నీ కృత్రిమ మేధతో చేయిస్తున్నాడు. సాహిత్య రంగంలోనే చూడండి... ఓ నాలుగైదు వాక్యాల కవితనిచ్చి దానిని కథగా మార్చమని అడిగితే కృత్రిమ మేధ క్షణాలలో మార్చి చూపిస్తోంది. గహనమైన ఓ బృహద్గ్రంథం పేరు మాత్రం ఇచ్చి అందులోని సారాంశాన్ని నాలుగైదు పేరాలలో చెప్పమని అడిగితే చటుక్కున చెబుతోంది. అంతే అవలీలగా, అవ్యవధిగా ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా చేసి అందిస్తోంది. ఆకాశమే హద్దుగా ఏదైనా చేయగలుగుతోంది. అదింకా పూర్తిగా నిర్దుష్టతను, నిర్దిష్టతను తెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ, తెచ్చుకునే రోజూ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అదే జరిగి, మనిషి కృత్రిమ మేధకు పూర్తిగా దాసోహమై క్రమంగా తన సహజ మేధను కోల్పోయే పరిస్థితి వస్తుందా; కృత్రిమ మేధే సహజ మేధగా మారుతుందా? ఆసక్తి కన్నా ఎక్కువగా భయాన్ని రేపుతున్న ప్రశ్నలివి. కృత్రిమ మేధే సహజ మేధ కన్నా నాణ్యమైనదయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే, సహజ మేధలో ఉండే గంద్రగోళం అందులో ఉండదు. అది ఎల్లవేళలా సూటిగా, స్పష్టంగానే కాదు; సహజ మేధకు సాధ్యం కానంత సత్వరంగా పనిచేస్తుంది. సహజ మేధలా అది అలసిపోవడం,మందగించడం లాంటివి ఉండవు. మనిషి అటువంటి కృత్రిమ మేధపై మరీ ఎక్కువగా ఆధారపడితే ఏమవుతుంది? లక్షల సంవత్సరాల మానవ అస్తిత్వంలో నిరుపయోగాలుగా మిగిలిన అపెండిక్స్, తోకఎముక లాంటి తొమ్మిది శరీర భాగాల సరసనే అతని సహజ మేధ కూడా చేరుతుందా?! ఇది మరీ విపరీత ఊహ అనుకున్నా, సహజ మేధ పదును తగ్గే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. వివిధ సాంకేతిక సాధనాల వినియోగం దరిమిలా ఇతర శరీరభాగాల విషయంలో ఇప్పటికే మనకది అనుభవంలోకి వచ్చింది కూడా! ఇటీవలి మరో సాంకేతికాద్భుతమైన ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలనే చూడండి; సహజ మేధకు పనీ, పదునూ తగ్గుతున్న ఆనవాళ్ళు వాటిలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. నేటి శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలన్నీ యూరప్ వేదికగా మతనిర్బంధాల నుంచి సహజ మేధ బయటపడి సాంçస్కృతిక పునరుజ్జీవన రూపంలో సంపూర్ణ వికాసం చెందుతూ వచ్చిన ఫలితాలేనని మనకు తెలుసు. మన దగ్గర ఉపనిషత్తుల కాలం అలాంటి వికాసాన్ని చూసింది. ఏదైనా ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచీ కూలంకషంగా, సవిమర్శకంగా పరిశీలించడం, చర్చించడం, వ్యక్తీకరించడం అనే క్రమశిక్షణ అలా పాదుకుంటూ వచ్చింది. శ్రద్ధతోపాటు, తీరికా అందుకు అవకాశమిచ్చింది. పత్రికల వంటి ఆధునిక మాధ్యమాలలో స్థలకాల పరిమితులు ఆ క్రమశిక్షణను కొంత పలుచన చేసినా,గ్రంథముద్రణ ఆ లోటును చాలావరకూ పూరించగలిగింది. అదే సామాజిక మాధ్యమాలకు వస్తే, భావప్రకటన అనూహ్యమైన ప్రవాహవేగాన్ని తెచ్చుకోవడంతో ఆ క్రమశిక్షణ గణనీయంగా కొడి గట్టడం చూస్తున్నాం. వాటిలో అణువు నుంచి బ్రహ్మాండం వరకూ చర్చకు రాని అంశమే ఉండదు. కాకపోతే... లోతైన అధ్యయనమూ, అవగాహన, బహుముఖ పరిశీలనలకు బదులు రెండు, మూడు వాక్యాల అలవోక వ్యాఖ్యలకూ, పాక్షిక తీర్మానాలకూ, అపరిపక్వ నిర్ధారణలకూ అవి పరిమితమవు తున్నాయి. సహజ మేధలో తప్పిన ఆ క్రమశిక్షణను కృత్రిమమేధ అందిపుచ్చుకుంటున్నందుకు సంతోషించాలా, సహజ మేధ మొద్దుబారుతున్నందుకు విచారించాలా?! సామాజిక మాధ్యమాలు భావప్రకటనను అందరికీ అందుబాటులోకి తేవడం గొప్పే మేలే కానీ; సహజ మేధకు అది చేస్తున్న కీడు సంగతేమిటి? ఎలక్ట్రానిక్ మీడియా సహా అధునాతన మాధ్యమాలు ప్రజాస్వామికమైన చర్చనూ, అధ్యయనాన్నీ పలుచన చేస్తున్న తీరును నీల్ పోస్ట్‌మన్ అనే అమెరికన్ రచయిత ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే ఎత్తిచూపాడు. అబ్రహాం లింకన్ కాలం నుంచీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గంటల తరబడి ఎంత కూలంకషంగా వాగ్వాదాలు జరిగేవో; ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వాటి సమయం ఎలా హరించుకుపోయిందో ‘ఎమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్’ అనే పుస్తకంలో ఆయన వివరిస్తాడు. ఆయన ప్రభావం మరెందరి మీదో పడి ప్రచార మాధ్యమాలు సహా అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన దుష్ప్రభావాల వైపు చూపు మళ్లించింది. ఆ క్రమంలోనే క్రిస్ హెడ్జెస్ అనే అమెరికా రచయిత ‘ఎంపైర్ ఆఫ్ ఇల్యూజన్’ అనే పుస్తకం వెలువరించాడు. మనం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం తోసుకువచ్చిందా?! -
మా మకుటం... సత్యమేవ జయతే!
మీరు గుడ్లురిమితే గుండెలు జారిపోవడానికి ఇక్కడ భీరువులెవరూ లేరు. మీరంతటి వీర వరేణ్యులు కూడా కారు! మీరు కళ్లెర్రజేస్తే కాలి బూడిదయ్యే కొంగలేమీ ఇక్కడ లేవు. తమరు తపోధనులైన కౌశికులు ఎంతమాత్రం కారు. మీ అధికారం సర్వంసహాధికారం కాదు. మీరు థామస్ హాబ్స్ ప్రతిపాదించిన ‘లెవయధాన్’ వంటివారు కారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన పరిమితులతో కూడిన అధికారం మాత్రమే మీ చేతిలో ఉన్నది. అదే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు మాకు అండగా ఉన్నవి. ఆ హక్కుల్ని రక్షించడానికి న్యాయస్థానాలు దన్నుగా ఉన్నవి.రెండు వారాల కిందనే సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందో ఒకసారి గమనించండి. అచ్చం మీ సర్కారుకు మల్లేనే యూపీలోని యోగీబాబా సర్కార్ కూడా ఓ జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించింది. కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యానమేమిటో మళ్లీ ఒకసారి పరిశీలించండి. ‘‘ప్రజల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రజాస్వామ్య దేశాలు గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని 19 (1) (ఏ) అధికరణం పాత్రికేయుల హక్కులకు రక్షణ కల్పి స్తున్నది. పాత్రికేయుడు రాసిన వార్తా కథనం విమర్శనాత్మకంగా ఉన్నదనే నెపంతో అతడిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు.’’సర్వోన్నత న్యాయస్థానం ఇంత స్పష్టంగా తేటతెల్లం చేసిన అంశంపై ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్నది. విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవకతవకలను ‘సాక్షి’ పత్రిక ఎత్తిచూపింది. బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్‌గా అది దాని విద్యుక్త ధర్మం. ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ఏలినవారి ఆగ్రహానికి గురైన కథనాన్ని ప్రచురించాము. దానికి కట్టుబడి ఉన్నాము. మీ ప్రభుత్వ అధి కార నివేదికల ఆధారంగానే మేమా కథనాన్ని రాశాము. మేము స్వయంగా వండి వార్చిన కథనం కాదు. వరద సహాయ కార్య క్రమాల సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం సందర్భంగా రెవెన్యూ శాఖ ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో పేర్కొన్న విషయాల్నే ‘సాక్షి’ ఉటంకించింది.కోటిమంది భోజనాల కోసం 368 కోట్లు ఖర్చు చేశామనీ, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు వగైరాలకు 23 కోట్లు ఖర్చయ్యాయనీ, వాటర్ బాటిల్స్‌కు 26 కోట్లు వెచ్చించామనీ, మొత్తం 534 కోట్లు పునరావాస సహాయ శిబిరం కోసం ఖర్చయినట్టు ఆ ప్రెజెంటేషన్‌లో ఉన్నది. ఈ లెక్కల్లోని అనౌచిత్యాన్ని ప్రజలు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఎం నేత బాబూ రావు ప్రజల సమక్షంలోనే ప్రభుత్వాన్ని నిలదీసిన వీడియో విస్తృతంగా సర్క్యులేషన్లో ఉన్నది. సరిగ్గా ఆ గణాంకాలనే పేర్కొంటూ, అవే ప్రశ్నల్ని ‘సాక్షి’ కూడా వేసింది.రెవెన్యూ శాఖ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు ఇవే అంకెల్ని చూసిన పెద్దలకు కోపం రాలేదు. జనంలో చర్చ జరుగు తున్నప్పుడు కూడా అంత కోపం రాలేదు. కానీ, ‘సాక్షి’లో కథనం రాగానే సుర్రున ప్రకోపించింది. ఆ కథనాన్ని ఖండ ఖండాలుగా ఖండించే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. ఆ కార్యనిర్వహణ వారి వశం కాలేదు. వెంటనే కూటమిలోని ఒకటో నెంబరు పత్రిక రంగంలోకి దిగింది. అబ్బెబ్బే... సహాయ పునరావాస కార్యక్రమాలకు 139 కోట్లు మాత్రమే ఖర్చయింది. 534 కోట్లు అనే మాట అబద్ధమని ఆ పత్రిక తేల్చేసింది. అదే నిజమైతే కేంద్ర పరిశీలక బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలో రిలీఫ్ క్యాంప్ ఖర్చు పేరుతో 534 కోట్లు ఎందుకు చూపెట్టారు? సదరు పత్రిక ఈ నివేదికను చూడలేదా? ప్రజల కళ్లకు గంతలు కట్టడ మనేది వారికి పెన్నుతో పెట్టిన విద్యగా చాలాసార్లు నిరూపణ అయింది.ఏ కొద్దిమందికో పులిహోర పొట్లాలు పంచి, కోటిమందికి పైగా పంచినట్టు లెక్క చూపడమేమిటి? ఆ పులిహోరకు ఒక్కో ప్లేటుకు 370 రూపాయల ఖర్చేమిటి? ఇటువంటి దగుల్బాజీ లెక్కలు చూసిన జనంలో ప్రభుత్వ ప్రతిష్ఠ బాగా పలుచబారింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక వరదను ప్రతిపక్షంపైకి మళ్లించాలనే ఉద్దేశంతోనే తిరుపతి లడ్డూ వివా దాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో అప్పుడే పొడసూపింది. కానీ, ఈ డైవర్షన్ స్కీమ్ ఫలితమివ్వకపోగా సర్కారుపైకే ఎదురు తిరిగింది.ఐదేళ్లు పరిపాలించడం కోసం గద్దెనెక్కిన ప్రభుత్వం ఐదు మాసాలు కూడా నిండకముందే ఒక ‘విఫల ప్రభుత్వం’గా ముద్ర వేయించుకోవడం ఒక అరుదైన సందర్భం. ఇటువంటి అప్రతిష్ఠను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. ఏ గడ్డి కరిచైనా అధికారంలోకి రావాలనే సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి అలవికాని హామీలను ఇచ్చిందనే అభిప్రాయం ఆ రోజుల్లోనే రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. అందువల్లనే మేనిఫెస్టో విడుదల రోజున బీజేపీ ప్రతినిధి దాని ప్రతిని పట్టుకోవడానికి నిరాకరించారనే వార్తలు వచ్చాయి. అటువంటి అంచనాలకు తగి నట్టుగానే ఈ నాలుగు నెలల పైచిలుకు కాలాన్ని కూటమి సర్కార్ నెట్టుకొచ్చింది.మేనిఫెస్టోలో హైలైట్‌గా వారు చెప్పుకున్న ‘సూపర్ సిక్స్’లో ఒక్క పథకం జోలికి ప్రభుత్వం వెళ్లలేకపోయింది. ఖజానాపై పెద్దగా భారం పడని ఉచిత గ్యాస్ సిలిండర్ల (ఏడాదికి మూడు) పంపిణీని ఈ దీపావళి నుంచి ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మిగిలిన ఐదు పథకాల అమలు సంగతి దేవుడెరుగు. ఫలానా రోజు నుంచి వాటిని ప్రారంభిస్తామనే ఒక కనీస షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.బుడమేరు వరదల సందర్భంగా ప్రభుత్వ నిష్క్రియా పరత్వం కొట్టొచ్చినట్టు కనబడింది. ముందుచూపు లేకపోవడం, వ్యూహరాహిత్యం వల్ల నలభై నిండు ప్రాణాలను బలి పెట్టవలసి వచ్చింది. మూడు లక్షలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు. తమ యావజ్జీవిత ఆర్జితాన్ని గంగపాలు చేసు కోవలసి వచ్చింది. వారి జీవిత చక్రాన్ని వెనక్కు తిప్పడం సాధ్యమయ్యే పనేనా? ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి విలువైన సామగ్రిని భద్రపరచుకునేందుకు దోహదపడి వుంటే ఇంత దుఃస్థితి ఏర్పడేది కాదు. అందుకే దీన్ని ‘విఫల ప్రభుత్వం’అంటున్నారు. రెగ్యులర్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేక ఇంత కాలం నెట్టుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏపీ కూటమి ప్రభుత్వమే! నాలుగున్నర నెలల కాలంలో 32 వేల కోట్లు అప్పు తెచ్చినందుకు, ప్రపంచ బ్యాంకు వాళ్లు నేడో రేపో విడుదల చేస్తారని చకోర పక్షుల్లా 15 వేల కోట్ల అప్పు కోసం ఎదురు చూస్తున్నందుకు ‘అప్పుల సర్కార్’ అని కూడా అనవచ్చు. ఇసుక రీచుల్లో, మద్యం షాపుల వేలాల్లో, ఉద్యోగుల బదిలీల్లో లంచాల దుర్గంధాన్ని వెదజల్లుతున్నందుకు ‘అవినీతి సర్కా ర్’గా పరిగణించాలి. తమ సంఖ్యా బలంపై ఆధారపడిన ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా, ఆ సర్కార్‌లో తమకూ భాగ మున్నా సొంత రాష్ట్రానికి కించిత్ మేలును కూడా చేసుకోలేక పోయినందుకు ‘అసమర్థ ప్రభుత్వం’గా భావించాలి.సాధారణంగా కొత్త ప్రభుత్వాలపై ఇంత త్వరగా జనంలో వ్యతిరేకత వ్యక్తం కాదు. ఏపీ పరిణామం మాత్రం అసాధా రణమైనదే. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగా కనిపి స్తున్నది. కొత్త సర్కార్ తన హామీలు అమలు చేయకపోగా, జగన్ సర్కార్ అందిస్తున్న పథకాలను చేజార్చుకొని మోస పోయామన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తున్నది. హామీలు, స్కీముల సంగతి పక్కనబెట్టినా సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు కూడా దిగజారాయి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను కొత్త ప్రభుత్వం గాలికొదిలేసింది. గ్రామీణ ఆరోగ్యం పడకేసింది. ప్రభుత్వ స్కూళ్ల నుంచి మళ్లీ ప్రైవేట్ బడులకు విద్యార్థుల వలస మొదలైంది. ఐదేళ్ల తర్వాత ఎరువుల కోసం, విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడవలసి రావడాన్ని చూస్తున్నాము. ఇటువంటి అనేక కారణాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి.క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలన్నీ బయటికొస్తే అసంతృప్తి మరింత పరివ్యాప్తమవుతుంది. అందుకే మాట వినని మీడియాను దండోపాయంతో దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుంది. ఆ ఉపాయంతోనే ‘సాక్షి’ మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో ఒక అక్రమ కేసును బనాయించారు. మీడియాలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉండటంలో తప్పులేదు. దాని మీద వివరణ ఇవ్వవచ్చు. దాన్ని ప్రచురించక పోతే అప్పుడు న్యాయస్థానానికి వెళ్లడం సదరు వ్యక్తులు లేదా వ్యవస్థలు చేయవలసిన పని. కానీ ఎకాయెకిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం భావ వ్యక్తీకరణ హక్కుపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రోజులు గడుస్తున్నకొద్దీ పరిణతి సాధించవలసిన ప్రజాస్వామ్యంలో ఇటువంటి దండనాథులు తలెత్తడం ఒక విషాదం.‘‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ,నీ అభిప్రాయం వెల్లడించే హక్కు కోసం నా ప్రాణాలైనా ఇస్తా’’ అనేది మూడు శతాబ్దాల కిందటి ఫ్రెంచ్ ప్రజాస్వామిక నినాదం. ఇంత చరిత్ర ఉన్నది కనుకనే ప్రజాస్వామిక ‘హక్కు’ను ఏ పాలకుడూ చిరకాలం అణచిపెట్టి ఉంచలేడు. ‘‘కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలపు విజయమొస్తే, విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా?’’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. ఏమీ కాదు! ఈ దాదాగిరి త్రుటికాలమే. అక్రమ కేసులకు భయ పడేది లేదు. ప్రజల పక్షాన నిలబడకుండా కాడి వదిలేసేదీ లేదు. నిశ్చయంగా, నిర్భయంగా జనం గుండె గొంతుకై ‘సాక్షి’ ప్రతిధ్వనిస్తుంది. ‘సాక్షి’ పత్రిక మీద కనిపించే మకుటమే ‘సత్యమేవ జయతే’!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పరువుచేటు పనులు!
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించే హత్యలూ, హత్యాయత్నాలూ ఒక్కోసారి ఉలిక్కిపడేలా చేస్తాయి. వాటి వెనక ప్రభుత్వాల ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు తలెత్తితే అవి మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. చాలా సందర్భాల్లో అవి దేశాలమధ్య చిచ్చు రేపుతాయి. ఇలాంటి ఆపరేషన్లను గుట్టుచప్పుడు కాకుండా చేయడంలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఆరితేరింది. చేతికి నెత్తురంటకుండా, సాక్ష్యాధారాలేమీ మిగలకుండా ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో ఆ సంస్థ తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి. అలాంటి ఉదంతంలో ఇప్పుడు మన దేశం పేరు వినబడటం ఆశ్చర్య కరమే. అమెరికాలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యాయత్నం కేసులో అమెరికాలో దాఖలైన తాజా నేరారోపణ పత్రం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి ఏడాదికాలంగా ఆ పంచాయతీ నడుస్తోంది. నేరుగా భారత్‌ను నిందించక పోయినా నిరుడు మే నెలలో దాఖలు చేసిన నేరారోపణ పత్రం తమ గడ్డపై తమ పౌరుడిని హత్య చేసేందుకు జరిగిన ప్రయత్నం వెనక ‘భారత ప్రభుత్వంలో పనిచేసే ఒక ఉద్యోగి ప్రమేయం ఉన్నద’ంటూ ఆరోపించింది. అప్పట్లో ఆ ఉద్యోగి పేరు వెల్లడించకుండా ‘సీసీ 1’గా మాత్రమే ప్రస్తావించింది. కానీ శుక్రవారం అమెరికా న్యాయశాఖ అతని పేరు వికాస్ యాదవ్ అనీ, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో ఇంతక్రితం పనిచేశాడనీ వెల్లడించింది. వికాస్ యాదవ్ ప్రస్తుతం భారత ప్రభుత్వ ఉద్యోగి కాదని నేరారోపణ పత్రం చెప్పటం... భారత ప్రభుత్వం ఈ కేసులో తమకు సహకరిస్తున్నదని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అనటం ఉన్నంతలో ఊరట. తమ దేశంలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నదని ఒకపక్క కెనడా ఆరోపిస్తున్న తరుణంలో అమెరికా సైతం ఇదే తరహా ఆరోపణ చేయటం గమనించదగ్గది. ఎన్నికల్లో సిక్కు ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రధాని ట్రూడో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసిన మన దేశానికి తాజా పరి ణామం ఇబ్బంది కలిగిస్తుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే గురుపత్వంత్ను హతమార్చ టానికి ఏమేం చేయాలో నిందితులు చర్చించుకున్న సందర్భంలోనే నిజ్జర్ హత్యను జయప్రదంగా పూర్తిచేయటం గురించిన ప్రస్తావన వచ్చింది. ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టే వారికి వేయి కళ్లుండాలి. తాము ఎవరిని సంప్రదిస్తున్నామోక్షుణ్ణంగా తెలిసివుండాలి. కానీ ఆ సమయంలో రా సీనియర్ అధికారిగా ఉన్న వికాస్ యాదవ్ మాదకద్రవ్య ముఠాలతో సంబంధాలుండే నిఖిల్ గుప్తాకు గురుపత్వంత్ను అంతంచేసే బాధ్యత అప్పగించటం, గుప్తా దాన్ని కాస్తా కిరాయి హంతకుడనుకున్న మరో వ్యక్తికి ఇవ్వటంతో కథ అడ్డం తిరిగింది. నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్లో దొరికిపోవటం, అతన్ని ఆ దేశం అమెరికాకు అప్పగించటం పర్యవసానంగా మొత్తం పథకం బట్టబయలైంది. కిరాయి హంతకుడనుకున్న వ్యక్తి కాస్తా అమెరికా మాదకద్రవ్య నిరోధక విభాగం ఏజెంటు. ఆ సంగతి తెలియక హత్య కోసం అతనితో లక్ష డాలర్లకు కాంట్రాక్టు కుదుర్చుకోవటం, అందులో 15 వేల డాలర్లు చెల్లించటం నిఖిల్ గుప్తాతోపాటు వికాస్ మెడకు చుట్టుకుంది. అది మన దేశ ప్రతిష్ఠకు కూడా మచ్చ తెచ్చింది. వికాస్ సాధారణ అధికారి కాదు. రా సంస్థకు ముందు ఆయన సీఆర్పీఎఫ్లో పనిచేశాడు. వికాస్‌ను సర్వీసునుంచి తొలగించి అతనికోసం గాలిస్తున్నామని మన ప్రభుత్వం ఇచ్చిన వివరణకు అమెరికా సంతృప్తి చెందింది. ‘రా’లో ఉన్నతాధికారులకు చెప్పకుండా వికాస్ యాదవ్ ఇలాంటి పెడధోరణులకు పాల్పడ్డాడని మన ప్రభుత్వం చెబుతోంది. విదేశాల్లో గూఢచర్యం ఆషామాషీ కాదు. అలాంటి పనిలో నిమగ్నమైవుండేవారు ఉన్నతాధి కారులకు తమ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు వర్తమానం అందిస్తే వేరే విషయం. చెప్పినా చెప్ప కున్నా అంతా సవ్యంగా జరిగితే రివార్డులు దక్కవచ్చేమో. కానీ వికటిస్తే ఆ అధికారితోపాటు దేశం పరువు కూడా పోతుంది. గురుపత్వంత్ ఖలిస్తాన్ వేర్పాటువాదే కావొచ్చు. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తే అయివుండొచ్చు. మన దేశంలో కేసులుంటే తమకు అప్పగించాలని అమె రికాను కోరాలి. ఆ దేశ పౌరుడిగా అక్కడే స్థిరపడిన వ్యక్తిపై అంతకుమించి ఏదో సాధించాలను కోవటం తెలివితక్కువతనం. అసలు ఒక వ్యక్తిని భౌతికంగా లేకుండా చేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందా? అతని సహచరులు భయకంపితులై ఉద్యమానికి దూరమవుతారా? ఏం సాధిద్దా మని వికాస్ ఇలాంటి పనికి సిద్ధపడ్డాడో తేల్చటం అవసరం. వికాస్ యాదవ్ విషయంలో ఇంత పట్టుదలగా పనిచేస్తున్న అమెరికా చరిత్ర కూడా తక్కువేమీ కాదు. 2003 నాటి రవీందర్ సింగ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ‘రా’లో సంయుక్త కార్య దర్శిగా ఉన్న రవీందర్ అమెరికా గూఢచార సంస్థ సీఐఏకు డబుల్ ఏజెంటుగా పనిచేసి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వగైరా దేశాల్లో రా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందజేశాడు. తనసంగతి బయటపడిందని గ్రహించగానే కుటుంబంతో సహా మాయమై అమెరికాలో తేలాడు. వారికి అక్కడ మారు పేర్లతో పాస్‌పోర్టులు కూడా మంజూరయ్యాయి. విచిత్రంగా మన దేశం అతన్ని అప్పగించాలని పట్టుబట్టలేదు. ఉద్యోగంనుంచి తొలగించి అధికార రహస్యాల చట్టం కింద కేసు పెట్టడంతో సరిపెట్టింది. 2016లో ఒక రోడ్డు ప్రమాదంలో రవీందర్ మరణించాడని అంటున్నా దాన్ని ధ్రువీకరించే సమాచారం మన ప్రభుత్వం దగ్గరలేదు. మొత్తానికి గూఢచర్యం వికటిస్తే ఏమవుతుందో వికాస్ యాదవ్ ఉదంతం తెలియజెబుతోంది. -
ప్రమాదకర ప్రతిపాదన
విజ్ఞత మరిచినచోట విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేమీ లేదు. కావడ్ యాత్ర సందర్భంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మొన్న జూలైలో ఇచ్చిన తీర్పు అర్థం కాకనో లేక దాన్ని ధిక్కరించే ఉద్దేశమో... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఆహారంలో లేదా పానీయాల్లో ఉమ్మివేయటం లేదా మానవ వ్యర్థాలతో దాన్ని కలుషితపరచటం పదేళ్ల శిక్షకు అర్హమయ్యే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించటం, విక్రయదారుల పూర్తి వివరాలు అందరికీ కనబడేలా చేయటం ఈ ఆర్డినెన్సుల ఉద్దేశం. ఇప్పుడున్న చట్టం ప్రకారం కల్తీ కారణంగా మరణం సంభవిస్తే బాధ్యులైనవారికి మూడేళ్ల కఠిన శిక్ష విధించవచ్చు. తినే ఆహారపదార్థం రుచిగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరు కుంటారు. అలాంటి ఆహారం దొరికేచోటకే వెళ్తారు. హోటళ్లు మొదలుకొని సైకిళ్లపై తిరుగుతూ అమ్ముకునే విక్రయదారుల వరకూ అందరూ కమ్మనైన ఆహారపదార్థాలు వడ్డించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరైనా లాభార్జనకు కక్కుర్తిపడి నాసిరకం పదార్థాలను అంటగడితే అలాంటివారి పనిబట్టడానికి రకరకాల చట్టాలున్నాయి. ఆహారకల్తీని అరికట్ట డానికీ, హానికరమైన, కాలంచెల్లిన పదార్థాల విక్రయాన్ని నిరోధించటానికీ హోటళ్లపై, ఇతర దుకాణాలపై విజిలెన్సు విభాగాలు దాడులు నిర్వహిస్తుంటాయి. కేసులు పెడతాయి. అయితే ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగటం లేదని, ప్రభుత్వాలు మొక్కుబడిగా ఈ పనిచేస్తుంటాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆహారం తిని అస్వస్థతకు గురయి పదుల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలైనప్పుడు ఆదరాబాదరాగా చర్యలు తీసుకోవటం కూడా కనబడుతుంటుంది. హఠాత్తుగా యూపీ సర్కారు ఈ చర్య తీసుకోవటం వెనక ఇలాంటి ఘటన ప్రభావం ఏమైనా ఉందా? పోనీ ఈ మాదిరి ఉదంతాల కారణంగా జనం తరచూ అస్వస్థులవుతున్న లేదా మరణిస్తున్న ఉదంతాలేమైనా గమనించారా? అసలు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకొచ్చాక ఎన్ని హోటళ్లపై, తినుబండారాల విక్రయ సంస్థలపై దాడులు నిర్వహించారు? అక్రమాలకు పాల్పడ్డారని తేలిన ఎంతమందిని శిక్షించారు? ఈ క్రమంలో ప్రస్తుత చట్టాలు నిరుపయోగంగా ఉన్నాయని భావిస్తే తగిన డేటాతో ఆ వివరాలు ప్రజల ముందు ఉంచొచ్చు. అప్పుడు ఒక సమగ్రమైన చట్టం అవసరమేనని అందరూ భావిస్తారు. కానీ యూపీలో జరుగుతున్నది అది కాదు. ఫలానా వర్గంవారు విక్రయించే పండ్లు లేదా ఇతర ఆహారపదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయని, వాటిని కలుషితం చేసి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. వాటి ఆధారంగా ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్టు కనబడుతోంది. దుశ్చర్యలకు పాల్పడేవారికి మతం, కులం ఉండవు. ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను వీడియో తీసి ఫలానా మతం వారంతా ఇలాగే చేస్తున్నారని వదంతులు వ్యాప్తిచేయటం విద్వేషాలు రెచ్చగొట్టడానికే తోడ్పడతాయి. ఇదే యూపీలోని ఘాజియాబాద్‌లో ఒక వ్యాపారి ఇంట్లో ఎనిమి దేళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న రీనా కుమార్ అనే యువతి రోటీల్లో మూత్రాన్ని కలుపుతోందని ఆరోపిస్తూ పోలీసులు బుధవారం ఆరెస్టు చేశారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ మధ్య తెలంగాణలో అధికారులు వరస దాడులు నిర్వహించినప్పుడు అనేక హోటళ్లు, తినుబండారాల దుకాణాలు పాచిపోయిన పదార్థాలను అమ్ముతున్నాయని తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిలో అన్ని మతాలకూ చెందినవారూ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరిగే కావడ్ యాత్ర సమయంలో ఆ మార్గంలోని దుకాణాల్లో విక్రయదారులు తమ పేర్లు, ఇతర వివరాలు కనబడే బోర్డులు ప్రదర్శించాలని పోలీసులు మొన్న జూలైలో నోటీసులిచ్చారు. కావడ్ యాత్రికులు ‘స్వచ్ఛమైన శాకాహారులు’ గనుక అపశ్రుతులు చోటుచేసుకోకుండా ఈ పని చేశామని సంజాయిషీ ఇచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దుకాణంలో నచ్చిన, నాణ్యమైన, రుచికరమైన ఆహారం దొరుకుతున్నదో లేదో వినియోగదారులు చూస్తారు తప్ప, వాటి విక్రయదారు ఎవరన్నది పట్టించుకోరు. అలా పట్టించుకోవాలని యూపీ ప్రభుత్వం తహతహలాడుతున్నదని తాజా నిర్వాకం గమనిస్తే అర్థమవుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని పరిరక్షించటమే ఆర్డినెన్సుల ఉద్దేశమన్న ప్రభుత్వ వాదన నమ్మదగ్గదిగా లేదు. ఆ పని విక్రయదారులది! వారిలో అక్రమార్కులుంటే చర్య తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. చెదురుమదురుగా జరిగిన ఉదంతాలను భూతద్దంలో చూపి జనాన్ని కలవరపెట్టడం సబబు కాదు.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనకున్న స్ఫూర్తి అర్థం చేసుకుంటే యూపీ ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్సుల ఆలోచన చేసేది కాదు. యూపీలో గోసంరక్షణ, లవ్ జీహాద్ తదితర ఆరోపణలతో గుంపు దాడులు, గృహదహనాలు, హత్యోదంతాల వంటివి జరిగాయి. నిందితుల ఇళ్లూ, దుకాణాలూ బుల్డోజర్లతో నేలమట్టం చేయటం కూడా రివాజుగా మారింది. ఎన్కౌంటర్లు సరేసరి. ఆర్డినెన్సుల ప్రతిపాదన ఆ క్రమంలో మరో చర్య కావొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి కరువైందని యువత... ధరలు ఆకాశాన్నంటాయని సామాన్యులు మొత్తుకుంటున్నారు. విద్య, వైద్య రంగాలు పడకేశాయని గగ్గోలు పెడుతున్నారు. వీటిపై సమర్థవంతంగా వ్యవహరించి ప్రజల విశ్వా సాన్ని పొందాల్సివుండగా, ప్రజల్లో పరస్పర అవిశ్వాసాన్ని కలిగించే ఇలాంటి పనులకు పూను కోవటం ఏం న్యాయం? అసలు నేరానికి తగ్గ శిక్ష ఉండాలన్న ఇంగితం కరువైతే ఎలా? ఆర్డినెన్సుల ప్రతిపాదనపై యూపీ సర్కారు పునరాలోచన చేయాలి. -
మరో మహా యుద్ధం!
మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత దేశంలో అత్యధికంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 13న, మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌కు నవంబర్ 13, 20లలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినా, సొంతకాళ్ళపై సర్కారు నడపలేని పరిస్థితి. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఇది కొంత ఊపు తెచ్చినా, తాజా హర్యానా ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కడంతో బ్రేకులు పడ్డాయి. ఇక, ఇప్పుడీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో ఎన్నికల గోదాలో ఈ ఏడాది ఆఖరి పంచ్ ఏ పార్టీది అవుతుందన్నది తేలనుంది. దేశానికి వాణిజ్య కూడలి లాంటి కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ సారథ్య మహాయుతి కూటమికీ, శివసేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) – జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ – శరద్‌పవార్) – కాంగ్రెస్‌ల మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమికీ మధ్య పోరు రసవత్తరమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలిచిన బీజేపీ – సేన కూటమి, 2024లో 17కే పరిమితమైంది. ఇంత దెబ్బ తగిలినా, కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి, సీఎం ఏక్నాథ్ శిండే రాష్ట్రంలో మళ్ళీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. అయితే, రెండేళ్ళలో రెండు పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజా భావన, అధికారపక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ప్రతిపక్షానికే అనుకూలిస్తాయని ఓ అంచనా. ఇక, స్థానిక పార్టీలైన శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలాక ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకొనేందుకు ఈ అసెంబ్లీ పోరు సిసలైన క్షేత్రస్థాయి పరీక్ష కానుంది. హర్యానాతో బీజేపీ పుంజుకుంటే, ప్రతిపక్ష కూటమిలో ఎక్కువ సీట్లు కోరి పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. మోదీ, అమిత్‌షాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యటిస్తున్న నేపథ్యంలో... విపక్ష కూటమి విభేదాలు మరిచి, సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చూపి, తమ వ్యూహానికి పదును పెట్టుకోకుంటే చిక్కులు తప్పవు. జార్ఖండ్ అసెంబ్లీకి జేఎంఎంతో కలసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇప్పటి దాకా చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. రెండు విడతల్లో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలు ఆసక్తికరమైనవి. వాజ్‌పేయి హయాంలో 2000లో రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జార్ఖండ్‌లో జేఎంఎం అయిదేళ్ళ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి. గతంలో ఆ పార్టీ అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినా, ప్రతిసారీ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును రాష్ట్రంలో కొనసాగించాలని ‘ఇండియా’ కూటమి ఉబలాటపడుతుంటే, హర్యానా ఫలితాల ఉత్సాహంతో ఈ గిరిజన రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాల ఆసరాగా అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ దక్షిణ బిహార్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ ఒకప్పుడు హేమంత్ తండ్రి, జేఎంఎం అధినేత శిబూ సోరెన్ ఉద్యమం చేసి, విజయం సాధించారు. ఆనాటి నుంచి గిరిజన ఓటర్లు ఆ పార్టీకి రాజకీయ అండ. హేమంత్, ఆయన కూటమి ఆ గిరిజన ఓటుబ్యాంకును నమ్ముకున్నారు. దానికి తోడు అక్రమ ఆస్తుల కేసులో హేమంత్ అరెస్ట్ వ్యవహారాన్ని చూపి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల ఆత్మగౌరవ అంశాన్ని లేవనెత్తాలని జేఎంఎం ప్రయత్నం. సంథాల్ పరగణా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి కాంగ్రెస్ సత్తా ఉపకరిస్తుందని ఆలోచన. ఇక, రాష్ట్రానికి తొలి సీఎం అయిన గిరిజనుడు బాబూలాల్ మరాండీ ప్రతిపక్ష నేతగా తమ వెంట ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2015 – 2020 మధ్య గిరిజనేతర నాయకత్వంతో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న కాషాయపార్టీ పాఠాలు నేర్చుకుంది. ఈసారి స్థానిక వర్గాలతో వ్యూహాత్మక సర్దు బాట్లకు దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో జట్టు కట్టి కుర్మీ ఓట్లపై కన్నేసింది. మాజీ సీఎం చంపాయ్ సోరెన్‌ను పార్టీలోకి తీసుకొని గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తోంది. వెరసి, జార్ఖండ్ ఎన్నికలు సైతం ఆసక్తికరంగా మారాయి. పార్టీల వ్యూహాలు అటుంచితే, ఈవీఎంలపై వివాదం, ఈసీ వ్యవహార శైలిపై అనుమానాలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 4 విడతల పోలింగ్‌కు సవాలక్ష కారణాలు చెప్పిన ఈసీ ఎక్కువ స్థానాలుండే అసెంబ్లీకి మాత్రం ఒకే విడత పోలింగ్ జరపడం విచిత్రమే. అలాగే, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించనున్నారని అస్సామ్ సీఎం హేమంత్ బిశ్వశర్మ ముందే ఎలా చెప్పగలిగారన్నదీ ప్రశ్నార్థకమే. ఇలాంటి వాటి వల్లే ఎన్నికల సంఘం స్వతంత్రత, పని తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పోలింగ్ శాతం నుంచి ఫలితాల ప్రకటనపైనా విమర్శలెదుర్కొంటున్న ఈసీ ఇకనైనా పారదర్శకత పెంచుకోవాలి. తన నిజాయతీని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం మిగులు తుంది. ఎందుకంటే, ఈ కీలక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... వచ్చే ఏడాదికి దిక్సూచి కానున్నాయి. వెంటనే వచ్చే ఢిల్లీ, ఆ పైన జరిగే బీహార్ ఎన్నికలకు భూమికను కూడా సిద్ధం చేస్తాయి. -
మన పాలిట మరో పాకిస్తాన్!
ఇరవై నాలుగు గంటల్లో అంతా మారిపోయింది. భారత, కెనడా దౌత్యసంబంధాలు అధఃపాతాళానికి చేరుకున్నాయి. ఏడాది పైగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఘర్షణాత్మక వైఖరి నెలకొని ఉన్నా, తాజా పరిణామాలతో అది పరాకాష్ఠకు చేరింది. అతివాద సిక్కుల నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అనుమానితుల జాబితాలో తమ దేశంలోని భారత దూతనూ, ఇతర దౌత్య వేత్తలనూ కెనడా చేర్చేసరికి సోమవారం సాయంత్రం కొత్త రచ్చ మొదలైంది. తీవ్రంగా పరిగణించిన భారత్ ఘాటుగా ప్రతిస్పందిస్తూ, కెనడా యాక్టింగ్ హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా సైతం ఆరుగురు భారతీయ దౌత్యవేత్తలతో ఇదే రకంగా వ్యవహరించింది. భారత్ ‘ప్రాథమికమైన తప్పు’ చేస్తోందనీ, ఢిల్లీ చర్యలు అంగీ కారయోగ్యం కాదనీ సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం ప్రకటించారు. వెరసి, వ్యవహారం చినికిచినికి గాలివాన నుంచి దౌత్యపరమైన తుపానైంది. రానున్న రోజుల్లో కెనడా ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఇరువైపులా మరిన్ని పర్యవసానాలు తప్పవని తేలిపోయింది.ప్రజాస్వామ్య దేశాలైన భారత, కెనడాల మధ్య ఎప్పటి నుంచో స్నేహసంబంధాలున్నాయి. ప్రజల మధ్య బలమైన బంధం అల్లుకొని ఉంది. కెనడాలో 18 లక్షలమంది భారతీయ సంతతి వారే. మరో 10 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారు. అలా కెనడా మొత్తం జనాభాలో 3 శాతం మంది భారతీయ మూలాల వారే! ఇక, దాదాపు 5 లక్షల మంది దాకా భారతీయ విద్యార్థులు ఆ దేశంలో చదువుతున్నారు. దానికి తోడు ఉభయ దేశాల మధ్య పటిష్ఠమైన వ్యాపారబంధం సరేసరి. దాదాపు 600కు పైగా కెనడా కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. మరో వెయ్యికి పైగా భారత విపణి లోని వ్యాపార అవకాశాలకు సంబంధించి చురుకుగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి మిత్రదేశాల నడుమ ఈ తరహా పరిస్థితినీ, దౌత్యయుద్ధ వాతావరణాన్నీ ఊహించలేం. తాజా పరిణామాల వల్ల రెండు దేశాల ప్రజలకూ, ప్రయోజనాలకూ దెబ్బ తగలడం ఖాయం. కెనడా గడ్డపై గత జూన్‌లో జరిగిన నిజ్జర్ హత్యపై విచారణలో భారత్ సహకరించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణ. సహకరించాలని కెనడా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానం. అయితే, ఆ హత్యలో భారత ప్రమేయం గురించి సాక్ష్యాధారాలేమీ లేకుండానే అన్నీ సమర్పించి నట్టు ఒట్టావా అబద్ధాలు ఆడుతూ, అసంబద్ధమైన ఆరోపణలు చేయడం పట్ల ఢిల్లీ తీవ్రంగా స్పందించింది. పైగా, తమ దేశంలోని కెనడా జాతీయులను లక్ష్యంగా చేసుకొని భారత్ కోవర్ట్ ఆపరే షన్లు చేస్తోందంటూ ట్రూడో ఎప్పటిలానే నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం ఏ రకంగా చూసినా సహించరానిది. భారత ప్రమేయం గురించి గత ఏడాది సెప్టెంబర్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో తొలి సారిగా ప్రకటన చేసినప్పటి నుంచి ట్రూడోది ఇదే వరస. ఒకవేళ ఆయన ఆరోపణల్లో ఏ కొంచె మైనా నిజం ఉందని అనుకున్నా... మిత్రదేశంతో గుట్టుగా సంప్రతించి, వ్యవహారం చక్కబెట్టుకోవా ల్సినది పోయి ఇలా వీధికెక్కి ప్రకటనలతో గోల చేస్తారా? ఇక్కడే ట్రూడో స్వార్థప్రయోజనాలు స్పష్టమవుతున్నాయి. భారత్ అన్వేషిస్తున్న తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాక, అవాంఛిత ఆరోపణలకు దిగుతూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నారని అర్థమవుతోంది. భారత్ వెలుపల సిక్కులు అత్యధికం ఉన్నది కెనడాలోనే! అందులోనూ వేర్పాటువాద ఖలిస్తా నీలూ ఎక్కువే. ఈ అంశంపై ఇందిరా గాంధీ కాలం నుంచి ఇండియా మొత్తుకుంటున్నా ఫలితం లేదు. 1985లో కనిష్క విమానం పేల్చివేతప్పుడు ప్రధానిగా ఉన్న ట్రూడో తండ్రి నుంచి ఇవాళ్టి దాకా అదే పరిస్థితి. సిక్కులను ఓటుబ్యాంకుగా చూస్తూ... వాక్ స్వాతంత్య్రపు హక్కు పేరిట ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీలను పెంచిపోషిస్తూ వచ్చింది. ఆ అండ చూసుకొని తీవ్రవాద బృందాలు రెచ్చి పోయి, కొంతకాలంగా అక్కడి భారతీయ దేవాలయాలపై దాడులు చేస్తూ వచ్చాయి. మాజీ ప్రధాని ఇందిర హత్యను సమర్థిస్తూ ఊరేగింపు జరిపాయి. చివరకు భారత వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలకు దిగడమే కాక భారతీయులనూ, భారతీయ సంతతి వారినీ ప్రాణాలు తీస్తామని బెదిరించే దశకు వచ్చాయి. కనీసం 9 ఖలిస్తానీ తీవ్రవాద బృందాలు కెనడాలో ఉన్నాయి. పాకిస్తానీ గూఢచర్యసంస్థ తరఫున పనిచేస్తున్నవారూ అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. నేరాలకు దిగుతున్న ఇలాంటి వారిని మన దేశానికి అప్పగించాలని పదే పదే కోరుతున్నా, ఆ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.ట్రూడో సారథ్యంలోని కెనడా, పొరుగున ఉన్న మన దాయాది దేశం తరహాలో ప్రవర్తిస్తూ వస్తోంది. కశ్మీర్‌ను రాజకీయంగా వాడుకుంటూ, అక్కడ నిప్పు రాజేసి తమ వాళ్ళ మెప్పు పొందా లని పాకిస్తాన్ చూస్తే... భారత వ్యతిరేక ఖలిస్తానీలపై ప్రేమ ఒలకబోస్తూ వచ్చే 2025లో జరిగే జన రల్ ఎలక్షన్స్‌లో లబ్ధి పొందాలని ట్రూడో ఎత్తుగడ. ప్రస్తుతం ఆయన సారథ్యంలోని సంకీర్ణ సర్కార్ సైతం ఖలిస్తానీ జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ చలవతోనే నడుస్తోంది. వెరసి, భారత్ పాలిట కెనడా అచ్చంగా మరో పాకిస్తాన్‌గా అవతరించింది. 2019 పుల్వామా దాడుల తర్వాత పాక్‌తో దౌత్య బంధాన్ని తగ్గించుకున్నట్టే... దౌత్యవేత్తల బహిష్కరణ పర్వంతో భారత్ ఇప్పుడు అధికారికంగా కెనడాను సైతం పాక్ సరసన చేర్చినట్లయింది. అసలిలాంటి పరిస్థితి వస్తుందని తెలిసీ, జాగ్రత్త పడకపోవడం మన దౌత్య వైఫల్యమే! అదే సమయంలో తాము పాలు పోసి పెరట్లో పెంచుతున్న పాములైన ఖలిస్తానీలు ఏదో ఒకరోజు తమనే కాటేస్తారని కెనడా గ్రహించాలి. దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చాలన్న కల సంగతేమో కానీ, అక్షరాలా తీవ్రవాదం, అప్పులు, గృహ వసతి సంక్షోభంతో కెనడాను మరో పాక్‌గా మార్చడంలో ట్రూడో సక్సెసయ్యారు. అదే విషాదం. -
దిగ్భ్రాంతికర హత్యాకాండ
మాజీ మంత్రి, మహారాష్ట్రలోని అధికార జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత బాబా సిద్దిఖీని ముంబయ్‌లో మాఫియా శైలిలో హత్య చేసిన తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ నటుడు సల్మాన్ ఖాన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తదుపరి లక్ష్యాలంటూ వినిపిస్తూ ఉండడం ఆందోళన రేపుతోంది. మరికొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై సందేహాలు కలిగిస్తోంది. సల్మాన్‌తో సన్నిహిత సంబంధాల రీత్యా సిద్దిఖీ లక్ష్యంగా మారారని కథనం. కుమారుడి నియోజకవర్గంలోని మురికివాడల పునరభివృద్ధి వ్యవహా రంలో కుంభకోణం ఆయన మెడకు చుట్టుకుందని మరో వాదన. ఇంకా అనేక రకాల కుట్ర కోణాలూ వినవస్తున్నాయి. సిద్దిఖీ దారుణ హత్యకు కారణాలు ఏమైనప్పటికీ, రానున్న ఎన్నికల్లో ఈ ఘటన తాలూకు రాజకీయ పర్యవసానాలు కచ్చితంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో అస్తుబిస్తుగా ఉన్న పాలక కూటమిని ఎన్నికల వేళ ఇది ఇరుకునపెట్టే అంశం కానుంది. విద్యార్థి నేత నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారిన లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నా, అనేక నెలలుగా ఈ హత్యకు పథకం వేసినట్లు కథనం. జైలులో ఉన్నా సెల్‌ఫోన్ సహా సమస్త సౌకర్యాలతో బిష్ణోయ్ లాంటి కొందరు ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తూ ఉండడం మన వ్యవస్థకు పట్టిన తెగులు.ముంబయ్‌లో రద్దీగా ఉండే బాంద్రా ప్రాంతంలో శనివారం, విజయదశమి నాటి రాత్రి సిద్దిఖీపై దాడి చేసిన ముగ్గురు దుండగులు ముందుగా ఆయన రక్షకుడిపై పెప్పర్‌స్ప్రే జల్లి, ఆపైన సూటిగా 6 బుల్లెట్లు కాల్పులు జరిపి ఊరేగింపులో కలిసిపోయారట. హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించి, దాదాపు రెండు గంటల పాటు వైద్యులు శ్రమించినా సిద్దిఖీ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ, కాల్పులు జరిపిన మూడో వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బిష్ణోయ్ పక్షాన ముగ్గురు సుపారీ ఇచ్చి పథక రచన చేయగా, మరో ముగ్గురు కాల్పులు జరిపారనీ, నిందితులు యూపీ, పంజాబ్, హర్యానా – ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి రెక్కీ జరిపినట్లూ, దొరకకుండా వాట్సప్, సిగ్నల్ యాప్‌ల ద్వారా కథ నడిపినట్లూ సమాచారం. సరిగ్గా వారం పైచిలుకు క్రితమే ముంబయ్‌లోని బైకులా ప్రాంతంలో మరో ఎన్సీపీ నేత కత్తిపోట్లకు గురయ్యారు. ఆ ఘటనను మర్చిపోకముందే ఇప్పుడీ దారుణహత్య జరగడం విషాదం. దాదాపు 48 ఏళ్ళ పాటు కాంగ్రెస్‌లో ఉండి, పాపులర్ రాజకీయ నేతగా ఎదిగిన చరిత్ర సిద్దిఖీది. ఏటేటా ఆయన ఆర్భాటంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు, వాటికి హాజరయ్యే నగర ప్రముఖులు, మరీ ముఖ్యంగా హిందీ సినీ అగ్ర తారలు జగత్ప్రసిద్ధం. అంత పేరు, పలుకుబడి, ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న బాబా సిద్దిఖీని స్వయంగా ఎమ్మెల్యే అయిన ఆయన కుమారుడు జీషన్ కార్యాలయం ఎదుటే హత్య చేయడం దిగ్భ్రాంతికరం. ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఇలా ఓ పాపులర్ నాయకుడు దారుణహత్యకు గురికావడం వ్యవస్థల వైఫల్యానికి ఉదాహరణ. అదీ పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉన్న దసరా ఉత్సవాల హంగామా సమయంలోనే జరగడం పరాకాష్ఠ. దేశ వాణిజ్య రాజధానిలో ఇలాంటి ఘటన జరిగిందంటే, పాలకులకు ఇది మరీ మాయని మచ్చ. గ్లామర్ నిండిన హిందీ చిత్రసీమ, ఖరీదైన ముంబయ్ రియల్ ఎస్టేట్, ఈ రెంటితోనూ ముడి పడ్డ మాఫియా ముఠా నేతల ముక్కోణపు వ్యవహారం ముంబయ్‌లో ఎప్పుడూ ఒక డెడ్లీ కాంబి నేషన్. కొన్ని నియోజకవర్గాలు అచ్చంగా మాఫియా నేతల కనుసన్నల్లోనే నడుస్తూ వచ్చాయి. 1980, ’90లలో ముంబయ్‌లో దావూద్ ఇబ్రహీమ్, ఛోటా రాజన్ లాంటి మాఫియా నేతల గ్యాంగ్ వార్ తెలిసినదే. గతంలో చాలా ఏళ్ళ క్రితం ప్రముఖ సినీ నిర్మాత, ఆడియో కంపెనీ అధినేత గుల్షన్ కుమార్ హత్య ఇలాగే జరిగిందీ ప్రజలకు గుర్తే. కానీ, ఇప్పుడు కటకటాల వెనుక ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ ఇలాంటి చర్యలకు దిగడమే దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రముఖులపై హింసాత్మక దాడులు, హత్యలు ఈ ఏడాది వరుసగా జరుగుతూ ఉండడం ఆందోళనకరమైనది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఫేస్బుక్ లైవ్‌లో ఉండగా శివసేన (యూబీటీ) నేత ఒకరు దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ ఘటనపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో లోపాలతో ఆగ్రహించిన హైకోర్ట్ చివరకు ఆ కేసును గత నెలలో సీబీఐకి బదలాయించాల్సి వచ్చింది. ఇవన్నీ పోలీసులకూ, పాలకపక్షానికీ చెంపపెట్టు. మహారాష్ట్రలో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి సర్కార్‌కు ఇప్పటికే బోలెడన్ని చిక్కులున్నాయి. అధికారం కోసం ఈ పార్టీలన్నీ అనైతిక కూటమి కట్టాయనే భావన ఉంది. కూటమి పాలనపై అసంతృప్తి సహా ఇంకా అనేకం ఉండనే ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ బలం పుంజుకుంటూ ఉండడంతో, ఎన్నికల వేళ... ముంబయ్‌లో టోల్‌ఫ్రీ ప్రయాణం సహా రకరకాల జిమ్మిక్కులకు సర్కారు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇలాంటప్పుడు సిద్దిఖీ హత్య జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు బాధ్యత వహించాల్సిన హోమ్ శాఖకు బీజేపీ నేత, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథి. అదీ కాషాయపార్టీకి ఇబ్బందికరమే. సిద్దిఖీ మీద గతంలో అనేక అవినీతి ఆరోపణలున్నా ఈ హత్య ఊహించనిది. ముంబయ్‌లో మళ్ళీ ఒకప్పటి గ్యాంగ్‌వార్ పరిస్థితులు రాకుండా ఉండాలంటే, సర్కారు ఉక్కుపాదం మోపాలి. అన్ని పక్షాలూ రాజకీయాల కన్నా రాష్ట్రంలో భయరహిత వాతావరణం నెలకొనేందుకు కృషి చేయాలి. గతంలో ఎంతో పేరున్న ముంబయ్ పోలీ సులు ఈ కేసును సవాలుగా తీసుకోవాలి. దోషులకు శిక్ష పడేలా చూడాలి. పోయిన ప్రతిష్ఠను తెచ్చు కోవాలి. చట్టం మీద ప్రజలకు మళ్ళీ నమ్మకం నెలకొనేలా చూడడం పాలకుల తక్షణ కర్తవ్యం. -
పొరలు ఒలిచే రచయిత
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది గెలుచుకోవడం ద్వారా ఆ గౌరవం పొందిన తొలి ఆసియా రచయిత్రిగా నిలిచింది దక్షిణ కొరియాకు చెందిన హాన్ కాంగ్ (సరైన ఉచ్చారణ: హన్ గాన్ ). ప్రతి ఏడాదీ జరిగినట్టుగానే ఈసారీ అందరి అంచనాలు తలకిందులైనాయి. చైనా రచయిత్రి కాన్ షుయె, ఆస్ట్రేలియా రచయిత జెరాల్డ్ మర్నేన్, జపాన్ రచయిత హరూకి మురకామి నుంచి భారత మూలాలున్న సల్మాన్ రష్దీ వరకు ఎవరిని వరించొచ్చనే విషయంలో బెట్టింగ్స్ నడిచాయి. కానీ ‘చారిత్రక విషాదాలను ప్రతిఘటించే, మానవ దుర్బలత్వాన్ని ఎత్తి చూపే తీక్షణమైన కవితాత్మక వచనానికి’గానూ హాన్ కాంగ్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించింది స్వీడిష్ అకాడెమీ. 2016లో తన కొరియన్ ఆంగ్లానువాద నవల ‘ద వెజిటేరియన్ ’కు ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రెజ్’ గెలుచుకున్న హాన్ కాంగ్ ఆ పురస్కారం పొందిన తొలి కొరియన్ రచయిత కూడా కావడం విశేషం.దక్షిణ కొరియా ప్రసిద్ధ రచయిత హాన్ సుయెంగ్–వొన్ కూతురిగా 1970లో జన్మించిన హాన్ కాంగ్ సాహిత్య ప్రయాణం– మనుషుల్ని మనుషులే పీక్కు తినే ఈ సమాజంలో దానికి విరుగుడు ఏమిటనే శోధనతో మొదలైంది. ‘మనుషులు మొక్కలు కావాల్సిందని నా నమ్మకం’ అంటాడు 28 ఏళ్లకే క్షయ వ్యాధితో మరణించినప్పటికీ కొరియన్ సాహిత్య రంగం మీద ప్రబలమైన ముద్రవేసిన యీ సంగ్. అదొక నిరసన! ప్రస్తుతం సుమారు ఐదు కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా చరిత్రలో మాయని మచ్చలైన జపాన్ దురాక్రమణ (1910–45), కొరియన్ యుద్ధం(1950–53) తర్వాత, అలాంటిదే– సైనిక పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన విద్యార్థుల తిరుగుబాటు (1980)ను అణచివేసే క్రమంలో జరిగిన ‘మే 18’ ఘటన. కాంగ్‌కు తొమ్మిదేళ్లున్నప్పడు ఆమె జన్మించిన గ్వాంగ్జు పట్టణం నుంచి వాళ్ల కుటుంబం సియోల్‌కు వెళ్లిపోయింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత అక్కడ వేలాది విద్యార్థులు, పౌరులు చనిపోయారు. తనకు ప్రత్యక్షంగా అనుభవం లేని ఈ ఘోరాలను పెద్దయ్యాక తెలుసుకునే క్రమంలో అంతులేని పశ్చాత్తాపానికి గురైంది కాంగ్. వాళ్ల కుటుంబం బతికుండటానికీ, ఇంకో కుటుంబం లేకుండాపోవడానికీ కారణమే లేదు. ఒక చిన్న నిర్ణయం వాళ్ల గతిని మార్చింది. గ్వాంగ్జు, ఆష్విట్స్, బోస్నియా– ప్రపంచమంతటా ఇదే హింస. అయితే, గాయాల పాలైనవారికి రక్తం ఇవ్వడం కోసం తమ భద్రతకు కూడా వెరవకుండా వేలాది మంది ఆసుపత్రుల ముందు వరుసలు కట్టిన ఫొటోలు కాంగ్లో ఉద్వేగాన్ని పుట్టించాయి. వర్తమానం గతాన్ని కాపాడుతుందా? బతికున్నవాళ్లు పోయినవాళ్లను కాపాడగలరా? ‘దొరక్కపోయినా జవాబుల కోసం రచయితలు వెతకడం మానరు’. ఎంతటి క్రౌర్యానికైనా మనిషి వెనుదీయడు; అదే సమయంలో, ‘రైల్వే ట్రాక్ మీద పడిపోయిన పసికందును కాపాడటానికి తన ప్రాణాలను సైతం లెక్కించడు’. మనిషిలోని ఈ రెండు ముఖాల ప్రహేళికను చిత్రిస్తూ ‘హ్యూమన్ యాక్ట్స్’ నవల రాసింది కాంగ్. రచనల్లో రాజకీయ ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా– మనిషిలోని అంతులేని క్రూరత్వాన్నీ, దాని మరుగునే ఉన్న మృదుత్వాన్నీ తవ్వి తీసింది.పుట్టిన రెండు గంటలకే చనిపోయి తన తల్లిదండ్రులు ఎన్నటికీ బయటపడలేని దుఃఖానికి కారణమైన తను ఎన్నడూ చూడని తన ‘అక్క’ హాన్ కాంగ్‌కు ఓ పుండులా మిగిలిపోయింది. ‘గాయం అనేది మాన్చుకోవాల్సిందో, బయటపడాల్సిందో కాదు; దాన్ని ఆలింగనం చేసుకోవాలి’ అంటుందామె. కాలం వల్ల, మరణం వల్ల, ఇతర విషాదాల వల్ల మనుషులు ఇతరులతో సంభాషించే శక్తిని కోల్పోతారు. అంధత్వం వల్ల రాయగలిగే, చదవగలిగే సామర్థ్యాన్ని కోల్పోయిన ఒక ప్రాచీన–గ్రీçకు బోధకుడు, తీవ్ర కుటుంబ విషాదాల వల్ల నోరు లేకుండాపోయిన ఆయన విద్యార్థిని పరస్పరం సమాచారాన్ని పంచుకోవడానికి చేరుకునే గౌరవపూరిత సామీప్యతను చిత్రించడానికి ‘గ్రీక్ లెసన్ ్స’ నవల రాసింది కాంగ్. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన ‘నిరంతర మృదు స్పర్శ’ను నొక్కి చెప్పింది. తద్వారా భాషా సూక్ష్మతనూ, గెలుచుకోగలిగే జీవన సౌందర్యాన్నీ పట్టిచూపింది.హాన్ కాంగ్ ఎంత వేగంగా టైప్ చేయగలదంటే, ‘నమ్మండి నమ్మకపోండి’ లాంటి టీవీ షోలో పాల్గొనమని ఆమె మిత్రులు నవ్వుతూ అనేంతగా! ఆమె రచనల్లోని ధారకు సరితూగేట్టుగా టైప్ చేసే క్రమంలో పుట్టిన నొప్పులకు కొన్నాళ్లు వేళ్లు కదపలేని పరిస్థితి వచ్చింది. మణికట్టు నొప్పి వల్ల పెన్నుతోనూ రాయలేదు. కొంతకాలం పెన్నును తిరగేసి పట్టుకుని ఒక్కో అక్షరాన్ని నొక్కుతూ టైప్ చేసేది. కవయిత్రిగా మొదలైన కాంగ్‌కు సంగీతమూ తెలుసు. పాటలు రాసి, తానే స్వరపరిచి, ముందు వద్దనుకున్నా ఆ తర్వాత ఆ మొత్తం పాడి ఒక పది పాటల సీడీ విడుదల చేసింది. ఆమె రచనల్లోనూ ఈ సంగీతం మిళితమై ఉంటుంది. 1993లో మొదలైన కాంగ్ మూడు దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో నవలలు, నవలికలు, కథలు, కవితలు, వ్యాసాలు రాసింది. ఎన్నో పురస్కారాలను అందుకుంది. తరచూ వేధించే తీవ్రమైన తలనొప్పులు తనను అణకువగా ఉంచడంలో సాయపడుతున్నాయంటుంది. ఆమెకు ఒక కొడుకు. నోబెల్ వార్త తెలిసినప్పుడు అతడితో కలిసి కాఫీ తాగుతోందట. 2114 సంవత్సరంలో ప్రచురించనున్న ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ కోసం ‘డియర్ సన్, మై బిలవ్డ్’ సమర్పించిందామె. అందులో ఏం రాసివుంటుంది? మనిషి హింసను ఎదుర్కొనే సున్నిత ప్రతీకారం మరింత మానవీయతను చూపడమేనని మరోసారి నొక్కి చెప్పివుంటుందా! -
వినబడలేదా ప్రమాద ఘంటిక?
భారతదేశంలో తొలితరం సెఫాలజిస్టుల్లో అగ్రగణ్యుడు ప్రణయ్‌రాయ్. తొలి 24 గంటల జాతీయ ఛానల్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపకుడు కూడా ఆయనే! ఇప్పుడా ఛానల్ ఆయన చేతిలో లేదు. నరేంద్ర మోదీ జిగ్రీ దోస్త్ ఆధీనంలో ఉన్నది.ఎందుకలా జరిగిందో విజ్ఞులైన దేశవాసులందరికీ తెలుసు. సొంత ఛానల్ లేదు కనుక ఓ వెబ్ ఛానల్ కోసం మొన్నటి హరి యాణా, జమ్ము–కశ్మీర్ ఫలితాలను ఆయన విశ్లేషించారు.హరియాణాలో విజేతగా అవతరించిన బీజేపీకి కాంగ్రెస్ కంటే కేవలం పాయింట్ ఆరు శాతం (0.6) ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. కానీ సీట్లు మాత్రం 30 శాతం ఎక్కు వొచ్చాయి. ఇది తన సెఫాలజిస్టు అనుభవంలో ఒక అసా ధారణ విషయంగా ఆయన ప్రకటించారు. అయితే ఈ ఫలి తాన్ని సాధారణ మెజారిటీ ఎన్నికల విధానానికి (first-past-the-post system) ఆయన ఆపాదించారు. ఉత్తర అమె రికా, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాల్లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ విధానం అమల్లో ఉన్నది. ఈ అంశం ఇక్కడ చర్చనీయాంశం కాదు. ప్రణయ్‌రాయ్ వ్యాఖ్యానంలో నర్మ గర్భత ఏమైనా ఉన్నదా అనేదే ఆసక్తికరమైన మీమాంస.సెంట్రల్ హరియాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఐదు శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు మాత్రం చెరో ఇరవై చొప్పున వచ్చాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో బీజేపీకి కాంగ్రెస్ కంటే ఐదు శాతం ఓట్ల ఆధిక్యత లభించింది. ఆ తేడాతో వారు 28 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే మొన్నటి లోక్‌సభ ఎన్నికల నాటికి హరియాణాలో బీజేపీకే రమారమి 12 శాతం ఓట్లు తగ్గాయి. ఆ ఎన్నికల తర్వాత కూడా ఈ డౌన్ ట్రెండ్ కొన సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ (2024) ఎన్నికల కంటే మరో 6.2 శాతం ఓట్లను బీజేపీ కోల్పోయింది. ఈ రకమైన గాలి వీస్తున్నప్పుడు అది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం అసాధ్యం. పైగా హరియాణా వంటి భౌగోళికంగా చిన్న రాష్ట్రాల్లో అది అసంభవం.కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లలో మంచి మెజారిటీలు వచ్చాయి. దాదాపు డజన్ సీట్లలో బీజేపీకి అతి స్వల్ప మెజా రిటీలు వచ్చాయి. ఫిరోజ్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధికంగా 98 వేల మెజారిటీ వస్తే అత్యల్పంగా కేవలం 32 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతుర్భుజ్ గెలిచాడు. ఈ గణాంకాలు ఏరకమైన ట్రెండ్‌ను సూచిస్తున్నాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. నూటికి నూరు శాతం ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపునే సూచించాయి. వాటి అంచ నాల సగటు ప్రకారం కాంగ్రెస్ 55 చోట్ల, బీజేపీ 27 చోట్ల గెలవాలి. ఈ అంచనాలు తప్పడం వెనుక ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈవీఎమ్‌లను హ్యాక్ చేయడమనే ఆరోపణ కొత్తదేమీ కాదు. 2019లో తొలిదశ పోలింగ్ ముగిసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ఆరోపణ చేశారు. ఢిల్లీలో ప్రతిపక్ష నాయకులతో కలిసి మీడియాను అడ్రస్ చేస్తూ ఈవీఎమ్‌లను హ్యాక్ చేయడం సాధ్యమైన పనేనని ఆయన వెల్లడించారు. ఎలా చేయవచ్చో మీడియాకు వివరిస్తూఆయన అనుచరుడు వేమూరి హరిప్రసాద్ మరో సందర్భంలో ఒక ఈవీఎమ్ను ప్రదర్శించి చూపెట్టారు. హరిప్రసాద్ ఈవీఎమ్ను ఎత్తుకొచ్చాడని ఆయనపై కేసు కూడా నమోదైంది. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి మన ఈవీఎమ్‌ల హ్యాకింగ్‌లో రష్యన్ హ్యాకర్ల పాత్ర ఉన్నదని కూడా సెలవిచ్చారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో సుశీల్‌కుమార్ షిండే, శరద్ పవార్ల సమక్షంలోనే ఆయన ఈ ఆరోపణ చేశారు.ఈవీఎమ్‌ల హ్యాకింగ్ ఎలా చేయవచ్చో ఆయనకు ఐదేళ్ల కిందటే తెలుసనుకోవాలి. అంతేకాదు, ఈ హ్యాకింగ్ చేసి పెట్టే కిరాయి మనుషులెవరో, వారు ఏ దేశాల్లో ఉంటారో కూడా ఆయనకు అప్పటికే తెలుసు. హరియాణాలో అటూ ఇటుగా పదిహేను నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది. ఈమేరకు ఆ పార్టీ ప్రతినిధి బృందం గురువారం నాడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసింది. ఈ తతంగంపై సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది.పలు పోలింగ్ కేంద్రాల్లో తాము ఎంత విజ్ఞప్తి చేసినా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఎన్నికల సంఘానికి మొత్తం 20 ఫిర్యాదులను ఆ పార్టీబృందం అందజేసింది. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించినప్పుడు 65 చోట్ల ఆధిక్యతలో ఉన్న పార్టీ ఈవీఎమ్‌ల లెక్కింపులో 37 స్థానా లకు ఎలా పడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా ప్రశ్నించారు. పోలింగ్ ముగిసినా కూడా ఈవీఎమ్‌ల బ్యాటరీలు కొన్నిచోట్ల 99 శాతం ఛార్జింగ్‌తో ఉన్నా యని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. ఈవీఎమ్‌లు 90 శాతానికి పైగా బ్యాటరీ ఛార్జింగ్‌తో ఉన్న ప్రతిచోటా బీజేపీ గెలిచిందనీ, 60 నుంచి 70 శాతానికి ఛార్జింగ్ పడిపోయిన ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచిందని ఆ పార్టీ ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఆధారాలతోనే ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎమ్‌ల హ్యాకింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.హరియాణా ఎన్నికల తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి జ్ఞానో దయం కలిగినట్టున్నది. కానీ ఏప్రిల్, మే మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలే పెద్ద ప్రహసనంలా జరిగాయని కొన్ని స్వతంత్ర సంస్థలు నెత్తీనోరూ బాదుకొని గత మూడు నెలలుగా ఘోషిస్తున్నా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కిమ్మ న్నాస్తిగా మిన్నకుండిపోయింది. స్వచ్ఛంద సంస్థలైన ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ), ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) వంటి సంస్థలు ఎన్నికల ఫార్సును విడమర్చి చెప్పాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియో జకవర్గాలపై సమగ్ర పరిశీలన చేసిన వీఎఫ్‌డీ 200కు పైగా పేజీలతో ఒక రిపోర్టును విడుదల చేసింది. ఈ ఎన్నికల తతంగంపై ఒక షాకింగ్ పరిశీలనను అది దేశం ముందుకుతెచ్చింది.ఎప్పుడు ఎన్నికలు జరిగినా సాయంత్రం 5 గంటలకో, 6 గంటలకో పోలింగ్ సమయం ముగియగానే పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. తర్వాత పూర్తి వివరాలను క్రోడీకరించి రాత్రి 8 లేదా 9 గంటలకల్లా తుది గణాంకాలను విడుదల చేస్తుంది. పోలింగ్ శాతంపై ఇదే ఫైనల్! అరుదుగా మాత్రం మరుసటిరోజున సవరించిన శాతాన్ని ప్రకటిస్తుంది. ఈ సవరణ గతంలో ఎన్నడూ కూడా ఒక శాతం ఓట్ల పెరుగుదల లేదా తరుగుదలను దాటలేదని వీఎఫ్‌డీ ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ఎన్నికల శాతంపై వెలువడిన తుది ప్రకటనలను సవరిస్తూ వారం రోజుల తర్వాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతాలను విడుదలచేసింది. ఈ సవరణకు ఇంత సమయం తీసుకోవడమే అసా ధారణ విషయమైతే, పెరిగినట్లు చెప్పిన పోలింగ్ శాతాలు మరింత అసాధారణం.ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకు పెరిగినట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే ఈ పెరిగిన ఓట్లు 12.54 శాతం. ఒడిషాలో 12.48 శాతం. ఆంధ్ర ప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన రాత్రి చేసిన తుది ప్రకటన ప్రకారం 68 శాతం ఓట్లు పోలయ్యాయి. వారం రోజుల తర్వాత దాన్ని 81 శాతంగా ఈసీ ప్రకటించింది. ఈ భూప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? జరగదు కనుకనే ఈ ‘పెరిగిన’ ఓట్లను డంపింగ్ ఓట్లుగా వీఎఫ్‌డీ అభివర్ణించింది. డంపింగ్ ఓట్లు లేనట్లయితే అధికార ఎన్డీఏ కూటమి 79 లోక్‌సభ సీట్లను కోల్పోయి ఉండేదని లెక్క కట్టింది. దేశ వ్యాప్తంగా ఈ డంపింగ్ ఓట్లు 4 కోట్ల 65 లక్షలయితే ఒక్కఆంధ్రప్రదేశ్లోనే అవి 49 లక్షల పైచిలుకున్నట్టు వీఎఫ్‌డీ తేల్చింది.ఈవీఎమ్‌లను హ్యాకింగ్ చేయడం, లేదా ట్యాంపరింగ్ చేయడం ఎలానో బాగా తెలిసిన వ్యక్తి, ఆ పనులు చేసే నిపుణులు ఏయే దేశాల్లో ఉంటారో ఆనుపానులు తెలిసిన వ్యక్తి ఏపీలో కూటమి నేతగా ఉన్నందువల్ల మిగతా రాష్ట్రాలకు భిన్నంగా విస్తృత స్థాయిలో ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ జరిగి ఉండొచ్చని ఒక అభిప్రాయం. వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్యాంపరింగ్ జరిగినట్లయితే పెద్దగా అనుమానాలు రాకుండానే బయటపడిపోవచ్చు. మొదటి మూడు దశల పోలింగ్‌లో ఈ మార్గాన్నే అనుసరించినట్టు వీఎఫ్‌డీ నివేదిక ద్వారా అర్థమవుతున్నది. కానీ, ఆ తర్వాత టార్గెట్‌పై అనుమానం రావడంతో నాలుగో దశలో ఉన్న ఏపీలో ‘నిపుణుడైన’చంద్రబాబు సహకారంతో ఏపీతోపాటు ఒడిషాలో కూడా ఈవీఎమ్‌ల ఆపరేషన్‌ను విస్తృతంగా చేసి ఉండవచ్చు.ఇందుకు పూర్వరంగంలో కూటమి నేతల కోరిక మేరకు అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చేసి ఎన్నికల సంఘం సహకరించింది.వీఎఫ్‌డీ నివేదిక ఆధారంగా ఏడీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి అనేక కీలక ప్రశ్నలను సంధించింది. ఈ సంస్థల సందేహాలకు ఇప్పటివరకూ స్పందించకుండా ఉండిపోవడం ఒక రాజ్యాంగబద్ధ సంస్థకు గౌరవప్రదమేనా? ఈవిధంగా ఎన్నికలసంఘాన్ని దొడ్లో కట్టేసుకొని వోటింగ్ యంత్రాలతో మాయా జూదం గెలవడానికి అలవాటు పడితే ఇక ముందు అధికార పార్టీ ఓడిపోవడం జరిగే పనేనా? ఈ ధోరణి నియంతృత్వానికి దారి తీయదా? ...అటువంటి నిరంకుశ అధికారులనే బీజేపీ అధినాయత్వం కోరుకుంటుండవచ్చు. దాని రహస్య ఎజెండాను అమలు చేయడానికి ఇప్పుడున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దాన్ని ప్రసాదించిన భారత రాజ్యాంగం అడ్డంకిగా ఉన్న సంగతి జగద్విదితం. వీటిని మార్చడానికి ఇప్పు డున్న బలం సరిపోదు. అందుకే జమిలి ఎన్నికల నినాదాన్ని బలంగా ముందుకు తోస్తున్నారు.ఇంకో ఏడాదిన్నరలోగా నియోజకవర్గాల పునర్విభజనను ముగించి రెండేళ్లలోగా జమిలి ఎన్నికలు జరపాలనే ఆలోచన ఢిల్లీ అధికార వర్గాల్లో ఉన్నట్టు సమాచారం. ఇతర పార్టీల సహకారానికి సామ దాన భేద దండోపాయ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈవీఎమ్‌ల సహకారంతో ఒక్క సారి జమిలి ఎన్నికల్లో గట్టెక్కితే అది చాలు. భవిష్యత్తు అధ్యక్ష తరహా పాలనకు అదే తొలిమెట్టని అధికార పరివారం ఆలోచన. ఇక దాని వెన్నంటే ఆ పరివారం రహస్య ఎజెండా ముందుకు వస్తుంది. అప్పుడిక మనం ఏం తినాలి? ఏం చదవాలి? ఏం రాయాలి? ఏం ఆలోచించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? వగైరా దైనందిన జీవితాన్ని గైడ్ చేయడం కోసం వీధివీధిన మోరల్ పోలీసింగ్‌ను ఎదుర్కోవలసి రావచ్చు.తొంభయ్యేళ్ల పోరాట ఫలితం మన స్వాతంత్య్రం. లక్షలాదిమంది త్యాగధనుల బలిదానం మన స్వాతంత్య్రం. అటువంటి స్వాతంత్య్రం ఈ దేశంలో పుట్టబోయే ప్రతి బిడ్డనూ సాధికార శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన తొలి తరం జాతీయ నేతలు ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించారు. స్వాతంత్య్ర పోరాట వారసత్వం లేని శక్తులు ఇప్పుడు మత విద్వేషాలతో, మాయోపాయాలతో ఆ ప్రజా స్వామ్య వ్యవస్థను కబళించాలని చూస్తే మిన్నకుండటం ఆత్మహత్యా సదృశం.ఏమాత్రం పారదర్శకత లేని, ఎంతమాత్రం జవాబు దారీతనం లేని ‘ఈవీఎమ్ ఎలక్షన్’ స్థానంలో ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం చూరగొన్న ‘బ్యాలెట్ పద్ధతి’ని మళ్లీ తెచ్చుకోవడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం. అభివృద్ధిచెందిన అన్ని దేశాల్లో, జనాభా సంపూర్ణంగా విద్యావంతులైన ప్రతి దేశంలోనూ బ్యాలెట్ పత్రాల ఓటింగ్ పద్ధతి మాత్రమే అమలులో ఉన్నది. ప్రస్తుతం భారత్‌తోపాటు వెనిజులా, ఫిలిప్పీన్స్, శ్రీలంక వగైరా నాలుగైదు దేశాల్లోనే సంపూర్ణంగా ఈవీఎమ్‌లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్, మెక్సికో, పాకి స్తాన్ వంటి దేశాల్లో పాక్షికంగా ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కలిపినా ఇరవై కంటే ఎక్కువ దేశాలు లేవు. జర్మనీలో ఈవీఎమ్‌ల వినియోగాన్ని ఆ దేశ న్యాయస్థానం రద్దు చేసింది. ఈ విధానంలో పారదర్శకత లేదని కోర్టు అభిప్రాయపడింది. నెదర్లాండ్స్, ఐర్లండ్, కెనడా వగైరా దేశాలు కొంతకాలం ఈవీఎమ్‌లను ఉపయోగించిన తర్వాత ఇందులో విశ్వస నీయత లేదనే నిర్ధారణకు వచ్చి రద్దు చేసుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో పయనించవలసిన అవసరం సెక్యులర్, సోష లిస్టు భారత రిపబ్లిక్కు ఉన్నది. లేకపోతే ఈవీఎమ్‌ల బాట లోనే పయనిస్తే మనకు తెలియని మరో భారత్‌లో మనం ప్రవేశించవలసి రావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అక్షరాలా భారత రత్నమే!
నిదానంగా కదులుతూ... ముక్కుసూటిగా మాట్లాడుతూ... విలువలను ఎత్తిపడుతూ కూడా అన్యులకు అసాధ్యమైన సమున్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆరు దశాబ్దాల తన ఆచరణతో దేశానికి చాటిచెప్పిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన అక్షరాలా రత్నం. సార్థక నామధేయుడు. చెదరని వినమ్రత, సడలని దృఢ సంకల్పం, లక్ష్యసాధనకు ఎంత దూరమైనా వెళ్లే లక్షణం... విశాల టాటా సామ్రాజ్యంలో ఆయనను విలక్షణ వ్యక్తిగా నిల బెట్టాయి. కనుకనే మూడు దశాబ్దాల పాటు ఆ సామ్రాజ్యానికి ఆయన అక్షరాలా చక్రవర్తిగానే వ్యవహరించారు. నిజమే... ఆయన 1962లో సాధారణ ఉద్యోగిగా చేరిననాటికే దేశంలో అదొక అత్యున్నత శ్రేణి సంస్థ కావొచ్చుగాక. పైగా సంస్థ సారథులకు ఆయన అతి దగ్గరివాడు, బంధు వర్గంలో ఒకడు కూడా! కానీ ఆయన ఎదుగుదలకు తోడ్పడినవి అవి కాదు. ఆయన అంకితభావం, దీక్షాదక్షతలు, నిరంతర తపన ఆయనను అంచెలంచెలుగా పైపైకి చేర్చాయి. పేరుకు ఒక సంఘటిత సంస్థే అయినా, అప్పటికే లక్షలమంది సిబ్బందికి చల్లని నీడనిచ్చే కల్పవృక్షంగా పేరుతెచ్చుకున్నా... టాటాల సామ్రాజ్యం విభిన్న సంస్థల సమాహారం మాత్రమే! అందులో సమష్టితత్వం, దిశ, దశా నిర్దేశించే ఉమ్మడి తాత్విక భూమిక శూన్యం. జమ్షెడ్జీ టాటా, జేఆర్డీ టాటా వంటివారు నేతృత్వం వహించిన ఆ సంస్థలో నాయకత్వ స్థానం దక్కాలంటే అడుగడుగునా అవరోధాలు తప్పలేదు. నెత్తురు చిందకపోవచ్చు... గాయాల జాడ లేకపోవచ్చు, కానీ రోమన్ సామ్రాజ్యకాలం నాటి కలోసియంలను తలపించే బోర్డు రూంలో తన ఆలోచనలనూ, తన భావనలనూ బలంగా వినిపించి ప్రత్యర్థుల వాదనలను పూర్వపక్షం చేయటం మాటలు కాదు. తన ప్రతి పలుకూ, ప్రతి వివరణా నిశితంగా గమనించే, ప్రశ్నించే ఆ బోర్డు రూంలో గెలవటం సాధారణం కానే కాదు. కానీ రతన్ అవన్నీ అవలీలగా చేయగలిగారు. నిష్క్రమిస్తున్న చైర్మన్జేఆర్డీ టాటా ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నా అప్పటికే భిన్న సంస్థలకు సారథులైనవారు సామాన్యులు కాదు. అప్పటికింకా టిస్కోగానే ఉన్న టాటా స్టీల్‌కు రూసీ మోదీ సారథి. పారిశ్రామిక రంగంలో ఆయన మోత మోగిస్తున్నాడు. జమ్షెడ్ఫూర్లో కొలువుదీరిన ఆ సంస్థకాయన మకుటంలేని మహారాజు. అజిత్ కేర్కర్ ఇండియన్ హోటల్స్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. దర్బారీ సేల్ టాటా కెమికల్స్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వీళ్లెవరూ రతన్ టాటాను సీరియస్‌గా తీసుకోలేదు. అతన్ని అవలీలగా అధిగమించవచ్చనుకున్నారు. రతన్ తన పేరులో చివరున్నరెండక్షరాల పుణ్యమా అని ఇంత దూరం వచ్చాడు తప్ప ‘సరుకు’ లేదనుకున్నారు. ఆయన రాకపై ఆలోచించటం సమయాన్ని వృథా చేసుకోవడమే అనుకున్నారు. కానీ రతన్ పరిశీలనాశక్తి అమోఘ మైనది, అనితర సాధ్యమైనది. ఈ మహాసామ్రాజ్యంలో ఏం జరుగుతున్నదో, లోపాలేమిటో అచిర కాలంలోనే పసిగట్టాడు. తళుకుబెళుకులకు తక్కువేం లేదు. మదుపుపరులకు ఎప్పటికప్పుడు లాభాల పంటా పండుతోంది. కానీ అట్టడుగున అవాంఛనీయమైన పోకడలు కనబడుతున్నాయి. వాటిని చక్కదిద్దితేసంస్థను మరిన్ని రెట్లు పెంచి ఘనతరమైనదిగా తీర్చిదిద్దటం అసాధ్యమేమీ కాదని ఆయన నిర్ణయించుకున్నాడు. 1991 నాటికే దేశంలో అడుగుపెట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పాత పద్ధతిలోనే టిస్కోను కొనసాగిస్తే త్వరలోనే అది గ్రూపు చేజారటం ఖాయమన్న నిర్ణయానికొచ్చాడు.జేఆర్డీ మంచితనమో, గమనించలేని తత్వమో గానీ... టాటా స్టీల్‌లో అప్పటికి టాటాలకున్న ప్రమోటర్ వాటా కేవలం అయిదు శాతం మాత్రమే. ఇదే కొనసాగితే ఏదోనాటికి అది ఎవరి చేతుల్లోకైనా పోవచ్చని రతన్ గ్రహించారు. అదొక్కటే కాదు... గ్రూపు సంస్థల్లో ఏ ఒక్కటీ చేజారకుండా ప్రమోటర్ వాటాను గణనీయంగా పెంచారు. సొంత సంస్థలను పదిలపరచుకోవటమే కాదు, ఖండాంతర ఆంగ్లో–డచ్ స్టీల్ సంస్థ కోరస్‌ను వశపరుచుకున్నారు. ఒకప్పుడు తనకు అవరోధంగా నిలిచిన అమెరికన్ దిగ్గజ సంస్థ ఫోర్డ్ నుంచి జాగ్వార్ ల్యాండ్రోవర్ను టాటాల తీరానికి చేర్చారు.వర్తమానంలో పారిశ్రామికవేత్తల ఎదుగుదల ఎలా సాధ్యమవుతున్నదో బాహాటంగానే కనబడుతోంది. కానీ రతన్ టాటా ఇందుకు భిన్నం. టాటా సంస్థలపై మచ్చపడకుండా, వక్రమార్గాల జోలికిపోకుండా నిదానంగా తన ప్రస్థానం సాగించారు. ఆయన పట్టిందల్లా బంగారమేనని చెప్పడానికి లేదు. కోరస్ టేకోవర్ అయినా, నానో కారు ఉత్పత్తి ఉబలాటమైనా, టాటా గ్రూప్ సంస్థల చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ ఆగమన, నిష్క్రమణల్లో అయినా రతన్ వైఫల్యాలు స్పష్టంగా కనబడతాయి. అందుకాయన విమర్శలను ఎదుర్కొనక తప్పలేదు. అలాగే టాటా స్టీల్‌ను దాదాపు 1,200 కోట్ల డాలర్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దినప్పుడూ, దేశీయ విద్యుత్ ఆధారిత వాహన రంగంలో టాటా మోటార్స్‌ను మార్కెట్ లీడర్‌గా ముందుకు ఉరికించినప్పుడూ ఆయన గర్వం తలకెక్కించుకోలేదు. ఇవాళ్టి రోజున బహుళజాతి సంస్థల సమాహారంగా ఖండాంతరాల్లో వెలుగు లీనుతున్న టాటా గ్రూప్ నిరుటి రెవెన్యూ 16,500 కోట్ల డాలర్లు. ఆయన వ్యక్తిగత ఆదాయమే కొన్ని వందల కోట్లు. అయినా చివరి వరకూ అతి సాధారణ జీవితం గడిపి, అసహాయులకు అండదండలందించి జీవితాన్ని ధన్యం చేసుకున్న రతన్‌కు కొందరు కోరుకుంటున్నట్టు ‘భారతరత్న’ ప్రకటిస్తే అది ఆ అత్యున్నత పురస్కారానికి మరింత వన్నె తెస్తుంది. ఆ మహామనీషికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తున్నది. -
సరికొత్త అధ్యాయమయ్యేనా?!
అక్టోబర్ 8 నాటి ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికీ, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికీ సమాన స్కోర్లు అందించాయి. హర్యానాలో బీజేపీ, జమ్ము–కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) – కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో లెక్క సమం అయింది. అయితే, ఈ ఫలితాల అసలు ప్రభావం ఈ అంకెల లెక్కకు మించినది. అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ... హర్యానాలో వరుసగా మూడోసారి విజయంతో బీజేపీ రికార్డ్ సృష్టించడం ఒక ఎత్తయితే, జమ్ము–కశ్మీ ర్లో దాదాపు ఆరేళ్ళ పైచిలుకు తర్వాత మళ్ళీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కొలువు తీరనుండడం మరో ఎత్తు. కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అనేక కారణాల రీత్యా అత్యంత కీలకమైనవి. వాటి ప్రకంపనలు, ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రాధాన్యమిచ్చి, శాసనవ్యవస్థ అధికారానికి రెక్కలు కత్తిరించిన పరిస్థితుల్లో కశ్మీర్లో ప్రభుత్వాన్ని నడపడం కత్తి మీద సాము కానుంది. అదే సమయంలో రాష్ట్రహోదాను పునరుద్ధరించాలన్న ప్రజాకాంక్ష అక్కడి ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలించడంతో ఎన్సీ కూటమి ఆ దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర హోదాపై ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కేంద్ర పెద్దలు, బీజేపీ అధినాయకులు నిలబెట్టుకుంటారా, లేక తమ పార్టీ అధికారంలోకి రాలేదు గనక ‘అంతా తూbŒ ’ అనేస్తారా అన్నది చర్చనీయాంశమైంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాష్ట్రాన్ని జమ్ము – కశ్మీర్, లద్దాఖ్ అంటూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొట్టతొలి ఎన్నికలు ఇవే. ఆసక్తిగా చూస్తుండగా, పోటాపోటీగా, అదే సమయంలో శాంతియుతంగా ఈ ఎన్నికలు సాగడం విశేషం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల కన్నా 5 శాతం పైచిలుకు ఎక్కువగా, పెద్దయెత్తున 63.9 శాతం వరకు ఓటింగ్ జరగడం గమనార్హం. అంటే, ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు ప్రజల మొగ్గు సుస్పష్టం. జనమిచ్చిన మెజారిటీతో కశ్మీర్లో ఇక ఎన్సీ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీ పక్షాన ఒమర్ అబ్దుల్లా సీఎం కానున్నారు. ఇలా కశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం తిరిగి రావడం ఒక శుభసూచన. ఎన్నికైన సర్కారుండడంతో స్థానిక ప్రజలు తమ కష్టనష్టాల పరిష్కారానికై ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించే వీలు చిక్కింది. అతివాద బీజేపీని ద్వితీయ స్థానానికే పరిమితం చేసి, మితవాద దృక్పథమున్న ఎన్సీకి పట్టం కట్టడం ద్వారా ప్రజాపాలనకై తాము తహతహలాడుతున్నట్టు కశ్మీరీలు చెప్పకనే చెప్పారు. ఒమర్ తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ – కాంగ్రెస్ కూటమి కశ్మీర్ లోయ వరకు మొత్తం 47 సీట్లలో 42 స్థానాలను గెలవడం విశేషం. ముస్లిమ్ జనాభా అధికంగా ఉండే లోయలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల స్థానిక ప్రజల వ్యతిరేకతకు అది అద్దం పడుతోంది. ఇక లోయలో ఖాతా తెరవలేకపోయినా, హిందువులు ఎక్కువైన జమ్ములో మాత్రం పోటీ చేసిన 43 సీట్లలో 29 గెలిచి, బీజేపీ తన బలం నిరూపించుకుంది. కాంగ్రెస్ మొత్తం 6 సీట్లలో విజయంతో మూడో స్థానంలో నిలిచింది. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ 3 సీట్లు, ‘ఇంజనీర్’ రషీద్ సారథ్యంలోని వేర్పాటువాద అవామీ ఇత్తెహాద్ పార్టీ ఒక సీటే గెలిచి, బరిలో చతికిలబడ్డాయి. ఒకప్పుడు ఉమ్మడి కశ్మీర్‌కు సీఎంగా పనిచేసిన ఒమర్ ఇప్పుడు లద్దాఖ్‌ను విడగొట్టిన తర్వాత ఏర్పడ్డ విభజిత కశ్మీర్‌కు తొలి సీఎం. కానీ, ప్రభుత్వాన్ని నడపడం సులభం కాదు. సవాళ్ళు తప్పవు. ఆ మాట అంగీకరిస్తూనే, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుంటామనీ, అదే సమయంలో రద్దయిన ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూనే ఉంటామనీ ఒమర్ స్పష్టం చేశారు. అది ఆయన అనివార్యత, లోయ ప్రజల ఆకాంక్ష. అయితే అంతకన్నా ముఖ్యం... జనం వర్గాలుగా చీలి, ఓటేసిన నేపథ్యంలో జమ్మూను వేరుగా చూడకుండా కలుపుకొని పోతూ, అక్కడి ప్రజాప్రతినిధులకు క్యాబినెట్లో పెద్దపీట వేయడం! ఆ సంగతి ఒమర్‌కూ తెలుసు. జమ్ముతో పోలిస్తే కశ్మీర్ లోయలోనే ఎక్కువ స్థానాలొచ్చినా రెండు ప్రాంతాలూ తమకు సమానమే ననీ, అందరి ప్రభుత్వంగా ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగిస్తామనీ ఆయన ప్రకటించారు.ఆర్టికల్ 370 పాత చరిత్ర, తప్పొప్పుల మాట అటుంచితే, అంత కన్నా ముఖ్యమైనది జమ్ము – కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం! ఎందుకంటే, కేంద్రపాలిత ప్రాంతమయ్యే సరికి 370 రద్దుకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నన్ని అధికారాలు ఉండవు. చివరకు పోలీసులు సైతం కేంద్రం కనుసన్నల్లోనే ఉంటారు. ఎన్నికలు పూర్తయి, ప్రజాప్రభుత్వం వచ్చింది గనక, తక్షణమే రాష్ట్రహోదా దిశగా అడుగులేయాలి. గత డిసెంబర్లో సుప్రీమ్‌కోర్ట్ సైతం సత్వరమే పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని చెప్పిందన్నది గమనార్హం. అన్ని రాజకీయ పక్షాలూ కోరు తున్నట్టు ఆ విషయంలో కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాలి. కశ్మీర్లో సైతం అన్ని రాష్ట్ర ప్రభు త్వాల తరహాలోనే కొత్త సర్కార్ పని చేసే వీలు కల్పించాలి. కశ్మీర్‌కి ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక చరిత్ర ఉన్న మాట నిజమే కానీ, దాన్ని గుర్తిస్తూనే ఆ ప్రాంతం మిగతా దేశంతో కలసి అడుగులు వేసేలా కృషి సాగాలి. యువతరంలో నిరుద్యోగం దేశంలోనే అధికంగా ఉన్న ఆ ప్రాంత సామాజిక, ఆర్థిక పురోగతి అందుకు కీలకం. అలాగే గత అయిదేళ్ళలో స్థానిక ఆకాంక్షలకు భిన్నంగా తీసుకున్న మైనింగ్, భూసేకరణ లాంటి విధానాల పునఃసమీక్ష అవసరం. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం సహకరిస్తేనే అది సాధ్యం. లేదంటే, ఢిల్లీలో ఆప్ సర్కార్ తరహా కథే కశ్మీర్లో పునరావృతమవుతుంది. ఎన్నికలు జరిపి కూడా ప్రజాతీర్పును తోసిపుచ్చినట్టే అవుతుంది. పైగా, సరిహద్దులో శత్రు వులు పొంచి ఉండే సున్నితమైన ప్రాంతంలో అలాంటి రాజకీయ క్రీడలు ప్రమాదకరం. -
అనుకున్నదొకటి... అయ్యిందొకటి!
నాలుగు రోజుల క్రితం ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వచ్చాయి. మంగళవారం కౌంటింగ్ మొదల య్యాక ఉదయం 9 గంటల వేళ తొలి ఫలితాల సరళీ వచ్చింది. కానీ, ఆశ్చర్యకరంగా అంతా మారి పోయింది. హర్యానా, జమ్ము–కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు, ఆశాభావాలు తలకిందుల య్యాయి. పోటాపోటీతో హంగ్ అవుతుందని బీజేపీ ఆశపడ్డ జమ్ము – కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి గెలిచింది. హర్యానాలో కాంగ్రెస్‌దే విజయం అని ఎగ్జిట్‌పోల్స్ కోడై కూసినచోట అవన్నీ తోసిరాజని విజయంతో బీజేపీ అబ్బురపరిచింది. 1966 హర్యానా ఏర్పాటయ్యాక ఇప్పటి దాకా ఏ పార్టీ సాధించని హ్యాట్రిక్‌తో రికార్డ్ సృష్టించింది. పార్టీల నుంచి ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకుల దాకా ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాలు పాఠాలు నేర్పడం గమనార్హం. ఏ ఎన్నికా చిన్నది కాదనీ, ప్రతిదీ కీలకమేననీ, అతి విశ్వాసం పనికిరాదనీ మరోసారి ఈ ఫలితాలు తేల్చాయి. దశాబ్దం తర్వాత, అదీ 2019 ఆగస్ట్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశాక, జమ్ము–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక... తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పు ఆసక్తికరమే. కొన్నేళ్ళుగా ‘నయా కశ్మీర్’గా ఎంతో చేశామని చెప్పుకున్నప్పటికీ, జమ్మూను దాటి కశ్మీర్ లోయలో బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. దోడా స్థానం గెలిచి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కశ్మీర్లో ఖాతా తెరవడం విశేషం. మరోపక్క హర్యానాలో ‘తిమ్మిని బమ్మిని చేసి బీజేపీ తెచ్చుకున్న గెలుపు’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్ ఫలితాల సరళిని చూపిన తీరు, ఈవీఎంల బ్యాటరీల శాతమూ అనుమానాస్పదమన్నది ఆ పార్టీ ఆక్షేపణ, ఆరోపణ. ఆ మధ్య లోక్ సభ ఎన్నికల్లో లానే ఇప్పుడూ ఈసీ ఆ ఆరోపణల్ని బాధ్యతారహితమంటూ కొట్టిపారేసింది. ఆరోపణల్ని పక్కనబెట్టి అసలు జరిగింది ఇప్పటికైనా పరిశీలించుకోవడం అన్ని వర్గాలకూ కీలకం. కశ్మీర్ సంగతి అటుంచి, హర్యానానే తీసుకుంటే... ‘జవాన్... కిసాన్... పహిల్వాన్’ నినాదంతో ముందుకెళ్ళిన కాంగ్రెస్ హర్యానాలో ఆ అంశాలు బీజేపీని మట్టికరిపిస్తాయని భావిస్తూ వచ్చింది. కానీ, జరిగింది వేరు. పదేళ్ళుగా హర్యానాను పాలిస్తున్న బీజేపీ పట్ల అధికారపక్ష వ్యతిరేకత ఒకటికి రెండింతలు ఉన్నప్పటికీ దాని నుంచి ఎందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ లబ్ధి పొందలేకపోయింది. అందుకు కారణాలను ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. సమైక్య ప్రతిపక్షంగా బీజేపీకి అడ్డుకట్ట వేయాల్సింది పోయి, కాంగ్రెస్ తన బలాన్ని అతిగా అంచనా వేసుకొని భంగపడింది. ఆప్‌కి హర్యా నాలో చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు ఉందని తెలిసినా, సీట్ల సర్దుబాటు, పొత్తు విషయంలో కాంగ్రెస్ మొండిపట్టుతో పోవడం గట్టి దెబ్బ తీసింది. ఆప్ సీట్ల డిమాండ్ 20 దగ్గర మొదలై, 10 దగ్గరకు వచ్చి ఆగి, చివరకు 5 స్థానాల దగ్గరకు వచ్చి ఆగినా, పొత్తు పొడవనే లేదు. తప్పక గెలిచే 3 సీట్లిచ్చినా చాలు... ‘ఆప్’ ఓకే అంటుందని తెలిసినా, ఆఖరికి రాహుల్ సైతం పొత్తుకే మొగ్గు చూపినా, కాంగ్రెస్ దూతలు పడనివ్వలేదు. చివరకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అధిష్ఠానం జోక్యం చేసుకొని పరాజయానికి బాధ్యులెవరో చూడాలంటూ కుమారి సెల్జా గొంతు విప్పారు. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌లో వర్గవిభేదాలకు కొదవ లేదని అర్థమవుతోంది. సీట్ల పంపిణీ వేళ భూపీందర్ సింగ్ హూడా తన వర్గం వారికే ఎక్కువ సీట్లివ్వడం ఇతర సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. ఆ అంతర్గత కుమ్ములాటలు ఆఖరికి మొత్తంగా రాష్ట్రంలో పరాజయానికీ దారి తీశాయన్నది ప్రాథమిక విశ్లేషణ. కాంగ్రెస్ ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా జాతీయ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. స్థానిక అంశాలతో పాటు సూక్ష్మపరిశీలనతో ఎన్నికల మేనేజ్మెంట్పై శ్రద్ధ పెట్టడం, సీఎంనూ, కొన్నిచోట్ల అభ్యర్థులనూ మార్చడం కమలనాధులకు కలిసొచ్చింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కనిపించని ఆర్ఎస్ఎస్ ఈసారి ప్రభావం చూపింది. అలాగే, ప్రధాని మోదీ సభలు, మాటలు నాన్ – జాట్ వర్గాలను ఆకర్షించాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పూర్తిగా జాట్లు – దళితుల ఓట్బ్యాంక్పైనే అతిగా ఆధారపడి, జాట్లు మినహా మిగతా వర్గాలు, ఓబీసీలు కాషాయఛత్రం కింద ఏకమవుతున్న సంగతి కనిపెట్టలేకపోవడం ఘోర తప్పిదమైంది. కాంగ్రెస్ పక్షాన సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై నెలకొన్న గందరగోళం, గతంలో సాగిన హుడా హయాం పట్ల అసంతృప్తి, ఆయనే మళ్ళీ సీఎం కావచ్చనే అభిప్రాయం ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గకుండా ఆపింది. మొత్తంగా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 1 శాతం కన్నా తక్కువే. అయితే, సీట్ల పరంగా బీజేపీ గణనీయ విజయం సొంతం చేసుకోవడం క్షేత్రస్థాయి వ్యూహ∙ఫలితం. ఎగ్జిట్ పోల్స్‌లో ఓట్ల శాతం అంచనా కాస్త అటూ ఇటూగా అంతేవున్నా, వచ్చే సీట్ల సంఖ్యపై అతిగా జోస్యం చెప్పడం ఎదురుతన్నింది. వెరసి, ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వాన్ని అనుమానంలోకీ, నిర్వాహకుల్ని ఆత్మపరిశీలనలోకీ నెట్టాయి. ఆప్, కాంగ్రెస్ గనక కలసి పోటీ చేసివుంటే, ఆ రాష్ట్ర ఫలితాలు కచ్చితంగా మరోలా ఉండేవని ఓట్ షేర్ శాతాన్ని బట్టి విశ్లేషణ. కశ్మీర్లో వాస్తవం గుర్తించి, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ పని హర్యానాలో చేయకపోవడమే విడ్డూరం. ఇప్పుడిక రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలపైకి ఫోకస్ మారనుంది. ఇప్పటికే హర్యానా ఫలితానికి కాంగ్రెస్‌ను ఆప్ తప్పుబట్టడం మొదలుపెట్టింది. మరి, ఫిబ్రవరిలోగా జరగనున్న ఢిల్లీ ఎన్నికలకైనా ఈ పార్టీలు జత కడతాయో, లేదో చూడాలి. ఏమైనా, తప్పక గెలుస్తారనుకున్న ఎన్నికల్లో సైతం ఆఖరి క్షణంలో కోరి చేతులారా ఓటమి కొని తెచ్చుకోవడం కాంగేయులకు పరిపాటి అయింది. క్షేత్రస్థాయి లోపాల్ని సరిదిద్దక, పోటీకి ముందే గెలుపు ధీమాతో అతిగా వ్యవహరిస్తే ఎవరికైనా ఎదురుదెబ్బలు ఖాయమని గుర్తిస్తే మంచిది. -
ఆకాశంలో సగానికి అన్యాయమా!
దేశం మొత్తాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఉదంతం తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ వైవాహిక బంధంలో జరిగే అత్యాచారం (మారిటల్ రేప్) గురించి ప్రస్తావించి దాన్ని నేరంగా గుర్తించాలని సిఫార్సు చేసినప్పుడు ‘మర్యాదస్తులు’ నొచ్చుకున్నారు. ఆ చర్య వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేయదా... వారి పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చదా అని చాలామంది ప్రశ్నించారు. ఈ అంశంపై అంతకు చాన్నాళ్ల ముందే వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ మళ్లీ దాన్ని ఎజెండాలో తెచ్చింది. దాంపత్య జీవితంలో ఉండే లైంగిక సంబంధం పరస్పర అన్యోన్యత ఆధారంగా ఏర్పడుతుందనీ, దాన్ని కేవలం ‘సమ్మతి’ అనే పదంలో కుదించటం అసాధ్యమనీ అఫిడవిట్ అంటున్నది. గతంలోని భారత శిక్షాస్మృతి (ఐపీసీ) అయినా, దాని స్థానంలో అమల్లోకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) అయినా దాంపత్య జీవితంలో జరిగే అత్యాచారానికి మినహాయింపునిచ్చాయి. అత్యాచారానికి ఎలాంటి శిక్ష విధించాలో ఐపీసీ సెక్షన్ 375 నిర్దేశిస్తూ ఈ నేరానికి పాల్పడే భర్తకు మినహాయింపునిచ్చింది. బీఎన్ఎస్ఎస్లో ఈ సెక్షన్ 63గా మారింది. మినహాయింపు కూడా యధాతథంగా కొనసాగింది. భార్య వయస్సు 18 యేళ్లు దాటిన పక్షంలో భర్త జరిపే అత్యాచారానికి మినహాయింపు ఉంటుందని చట్టం చెబుతోంది. ఈ మినహాయింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తే మొత్తం వివాహ వ్యవస్థపైనే అది తీవ్ర ప్రభావం చూపగలదని కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ హెచ్చరిస్తోంది. చట్టంలో ఉన్న మినహాయింపు అత్యాచారం చేయటానికి భర్తకిచ్చే లైసెన్సు కాదంటూనే ఆ అంశాన్ని చట్టంవైపుగా కాక సామాజిక కోణం నుంచి చూడాలని అభిప్రాయపడింది. సంబంధిత పక్షాలన్నిటితో, రాష్ట్రాలతో చర్చించాక చట్టసభ తీసుకోవాల్సిన నిర్ణయం గనుక న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని తెలిపింది. భార్య సమ్మతికి రక్షణ కల్పించేందుకు ఇప్పుడున్న చట్టాల్లో ఏర్పాట్లున్నాయనీ, గృహ హింస చట్టంవంటివి రక్షణగా నిలుస్తాయనీ చెప్పింది. నేరం ఒకటే అయినప్పుడు దాన్ని వేర్వేరు చోట్ల వేర్వేరు రకాలుగా ఎలా పరిగణిస్తారు? హత్య జరిగితే అది చోటుచేసుకున్న ప్రాంతాన్ని బట్టి దాన్ని హత్యాయత్నంగా అనుకోగలమా? పరిచితుడో, అపరిచితుడో మహిళపై అత్యాచారం చేస్తే దానికి శిక్ష ఉన్నప్పుడు... భర్త అదే పనిచేసినప్పుడు మినహాయింపు ఇవ్వటం ఏ రకంగా న్యాయం? 2022లో ఢిల్లీ హైకోర్టులో మారిటల్ రేప్‌పై పిటిషన్ దాఖలైనప్పుడు ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో ఒకరు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలని అభిప్రాయపడితే, అది సరికాదని మరో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అనంతరం కర్ణాటక, గుజరాత్ హైకోర్టులు రెండూ మారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాల్సిందేనని తీర్పులు వెలువరించాయి. మన పౌరులైనా, విదేశీ పౌరులైనా చట్టం ముందు అందరూ సమానులనీ, అందరికీ సమానమైన రక్షణ లభిస్తుందనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చెబుతోంది. భర్త చేసే అత్యాచారం నేరంగా పరిగణించకూడదని మినహాయింపునివ్వటం వివాహ బంధంలోని మహిళకు ఈ అధికరణ వర్తించబోదని చెప్పటం కాదా? కానీ కేంద్రం అలా అనుకోవటం లేదు. ఇది పెళ్లయితే స్త్రీ తన హక్కును కోల్పోతుందని పరోక్షంగా చెప్పటం కాదా? మన దేశంలో వివాహ వ్యవస్థను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారన్న అఫిడవిట్ అభిప్రాయంతో విభేదించనవసరం లేదు. అలాగే వివాహ వ్యవస్థకుండే బహుముఖ పార్శా్వల్లో భార్యాభర్తల లైంగిక సంబంధం ఒకటి మాత్రమేనని చేసిన వాదననూ తప్పుబట్టనవసరం లేదు. కానీ సామాజిక విశ్వాసాలకూ, రాజ్యాంగ విలువలకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడినప్పుడు ఒక గణతంత్ర రాజ్యం రాజ్యాంగ విలువలకు మాత్రమే ప్రాధా న్యమివ్వాలి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు అన్ని సమాజాల్లోనూ భిన్న ఆధిపత్య ధోరణులు అల్లుకుపోయి వుంటాయి. పితృస్వామిక సమాజాల్లో స్త్రీలపై ఆధిపత్యం సాధించటానికి పురుషుడి చేతిలో అత్యాచారం ఒక ఆయుధం. దీన్ని చాలా ముందుగా గుర్తించబట్టే సోవియెట్ యూనియన్ 1926లో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత 1950లో జెకోస్లోవేకియా, 1969లో పోలెండ్ ఈ మాదిరి చట్టాలు చేశాయి. ఇవన్నీ అప్పటికి సోషలిస్టు రాజ్యాలు. ప్రస్తుతం దాదాపు 150 దేశాలు మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణిస్తున్నాయి. భార్య లైంగిక స్వయంప్రతిపత్తిని భర్త అయినా సరే దెబ్బతీయరాదనీ, అది నేరపూరిత చర్య అవుతుందనీ ఈ చట్టాలు భావిస్తున్నాయి. సకల ప్రజాస్వామ్య దేశాలకూ భారత్ తల్లిలాంటిదని చెప్పుకుంటున్న మనం మాత్రం మారిటల్ రేప్ విషయంలో ఇంకా తడబాటు ప్రదర్శించటం సబబేనా?దాంపత్య జీవనంలో భర్తలు సాగించే హింసను మన దగ్గర మహిళలు మౌనంగా భరిస్తున్నారు. భరించ శక్యం కాని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బయటికొస్తున్నారు. భర్త లైంగిక నేరానికి పాల్పడుతున్నాడని వారిలో అతి కొద్దిమంది మాత్రమే వెల్లడిస్తున్నారు. స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ డేటా ప్రకారం ముంబైలోని ధారవిలో ఈ సంస్థ ముందు 3,878 ఫిర్యాదులు దాఖలుకాగా అందులో 52.11 శాతం లైంగిక హింసకు సంబంధించినవే. 19.33 శాతంమంది తమ భర్త తమపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపారని ఆ సంస్థ అంటున్నది. భార్య అభీష్టాన్ని బేఖాతరు చేయటం నేరమన్న స్పృహ పురుషుడిలో కలగాలంటే మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించటం ఒక్కటే మార్గం. ఇందుకు భిన్నంగా ఆలోచించటం జనాభాలో సగానికి అన్యాయం చేయటమే. -
యెల్లో జ్యోతి... ఇదేం పైత్యం?
చంద్రబాబు భజన చేస్తూ... వార్తలను, వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరోసారి తనవంకర బుద్ధిని బయటపెట్టుకుంది. టీడీపీ సేవలో తరిస్తూ సాక్షి మీడియాపై పడి ఏడ్చే ఆ పత్రిక, టీవీ యాజమాన్యం డిజిటల్ మీడియాపై కనీస అవగాహన లేకుండా ‘సాక్షి’కి వ్యతిరేకంగా వార్తలను వండి వార్చుతోంది. వ్యూస్‌ను, ట్రాఫిక్‌ను పెంచుకొనేందుకు ‘సాక్షి’ కుట్ర పన్నిందనీ... సాక్షి వెబ్సైట్ వార్తల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్‌లైన్ వాడుతున్నారనీ ఎల్లో పత్రికలో తప్పుడు వార్తను ప్రచురించడమే కాకుండా... రెండు రోజులపాటు ఏబీఎన్ చానల్లో అర్థంపర్థం లేని చర్చలను నడిపించింది. డిజిటల్ జర్నలి జంలో ట్యాగ్ లైన్స్ ఎందుకు వాడతారు? ఏ సందర్భంలో ఎలాంటి ట్యాగ్ లైన్స్ వాడతారు? అసలు గూగుల్ ఎనలటిక్స్, వెబ్సైట్ మెట్రిక్స్ ఎలా పనిచేస్తాయన్న పరిజ్ఞానం లేకుండా ‘సాక్షి’పై విషం చిమ్మే ప్రయత్నం మొదలుపెట్టింది.ఎవరైనా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే వాళ్లకు సాక్షి వార్తలు కనిపించేలా సాక్షి డాట్ కామ్‌లో ఏర్పాటు చేసుకున్నారంటూ బుర్ర తక్కువ వాదనను తెరపైకి తెచ్చింది ఎల్లో మీడియా. ఇలా చేయడం ద్వారా ఏబీఎన్ ట్రాఫిక్ మొత్తం ‘సాక్షి’కి వచ్చేస్తుందట. ఇంతకంటే అవగాహనా రాహిత్యం ఇంకేమైనా ఉంటుందా? వినేవాళ్లు ఉంటే పచ్చ పత్రికలు, చానళ్లు ఏదైనా చెబుతాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. వాస్తవానికి సాక్షి డాట్ కామ్ వెబ్ ట్రాఫిక్ ఎప్పుడూ ఆంధ్రజ్యోతికి అందనంత ఎత్తులో ఉంటుంది. ప్రజల ముందు వార్తలతోపాటు వాస్తవాలను మాత్రమే అందించే సాక్షి డాట్ కామ్‌కు ఉన్న ఆదరణ ఆంధ్రజ్యోతికి ఎప్పుడూ లేదు. వెబ్సైట్ ఎనలటిక్స్‌ను బేరీజు వేసుకుంటే ఆ అంకెలే చెబుతాయి సాక్షి స్థాయి ఏమిటో. అలాంటిది పచ్చ పత్రిక నుంచి వెబ్ ట్రాఫిక్‌ను డైవర్ట్ చేసుకొనేందుకు కుట్రలు చేయాల్సిన ఖర్మ సాక్షి మీడియాకు లేనేలేదు. అసలు టెక్నికల్‌గా, లాజికల్‌గా చూసుకున్నా అలా జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు. సాధారణంగా ఏదైనా న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేయాల్సి వస్తే ఆ వార్తకు సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థల పేర్లను ట్యాగ్ లైన్స్‌గా జత చేస్తారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసే రాజకీయ విష ప్రచారానికి కౌంటర్‌గా సాక్షి డాట్ కామ్‌లో ఏదైనా వార్తను ప్రచురిస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్‌ను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం అనైతికం, కుట్ర అని ఏబీఎన్ ఆంధ్ర జ్యోతికి అనిపిస్తే... డిజిటల్ మీడియా గురించి వాళ్లకు ఓనమాలు కూడా తెలియవనే అనుకోవాలి. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు, సంస్థలకు చెందిన పేర్లు, ట్యాగ్‌లను సహజంగా ఉప యోగించదు అన్నది నిజమేగానీ... ఆ పత్రికా సంస్థకు సంబంధించిన వార్తను ప్రజలకు చేర్చాలనుకున్నప్పుడు ఆ పేర్లు లేకుండా... వాటిని ట్యాగ్ లైన్స్‌లో పెట్టకుండా ఎలా పబ్లిష్ చేస్తారో ఏబీఎన్ మేధావులకే తెలియాలి.ఏ మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తు న్నాయో పాఠకులకు, వీక్షకులకు తెలియనిది కాదు. ఎల్లో మీడియా చేస్తున్న రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ప్రజల ముందుంచుతోంది. అందులో భాగంగా ఏబీఎన్ మాత్రమే కాదు... ఏ ఇతర మీడియా సంస్థ అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినా వాటిని ఖండిస్తూ పాఠకులకు, వీక్షకులకు నిజం చెప్పడంలో ‘సాక్షి’ ముందుంటుంది. ప్రజల్లో విశ్వసనీయత ఉంది కాబట్టే ఆంధ్ర జ్యోతి కంటే సాక్షి డాట్ కామ్ డిజిటల్ రేటింగ్స్‌లో ముందుంది. కేవలం సాక్షి మీడియాపై బురద జల్లడమే పనిగా పెట్టుకొని ఆంధ్ర జ్యోతి చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ విశ్వసించరు.– వర్ధెల్లి మురళి ఎడిటర్, సాక్షి -
ప్రాణులు నేర్పే పాఠాలు
ప్రపంచమంతా పచ్చగా ఉందని, తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని అనుకుంటే పొరపాటే! రంగు రంగుల లోకంలోనే రకరకాల రాకాసి జంతు ప్రవృత్తులు ఉంటాయి. జంతుతతి నుంచి మనిషి వేరుపడి సహస్రాబ్దాలు గడచిపోయాయి. అయినా, మనుషుల్లోని జంతుప్రవృత్తి పూర్తిగా తొలగిపోలేదు. కొన్ని సందర్భాల్లో జంతువుల కంటే క్రూరంగా, దారుణంగా ప్రవర్తించే మనుషుల ఉదంతాలు వార్తలకెక్కుతుండటం మనకు తెలియనిదేమీ కాదు. ఆకుపచ్చని పచ్చికబయళ్లలో సుతిమెత్తని పచ్చిక మాత్రమే కాదు, విషపూరితమైన పసరిక పాములు కూడా ఉంటాయి. దట్టమైన అడవుల్లో పచ్చని చెట్లూ చేమలు, రంగు రంగుల పువ్వులూ పిట్టలూ పిచుకలూ, జంతువులూ మాత్రమే కాదు, ఏమరుపాటుగా దొరికితే మనుషులను పలారం చేసే క్రూరమృగాలు ఉంటాయి. కసిగా కాటు వేసే కాలసర్పాలు ఉంటాయి. కీకారణ్యాల్లో పొంచి ఉండే ప్రమాదాలన్నీ జనారణ్యంలోనూ ఉంటాయి. జనారణ్యంలో అడుగడుగునా తారసపడే చాలా మంది మనుషుల్లో జంతులక్షణాలు కనిపిస్తాయి. మనుషుల్లోని మేకపోతు గాంభీర్యాలు, గోడమీది పిల్లి వాలకాలు, గుంటనక్క తెలివితేటలు అపరిచితమైనవేమీ కాదు. మనుషుల్లోని జంతులక్షణాలను గుర్తించడం వల్లనే విష్ణుశర్మ ‘పంచతంత్రం’ రాశాడు. జంతు పాత్రల ద్వారా మనుషుల స్వభావాలను తేటతెల్లం చేస్తూ కథలు చెప్పాడు. ‘పంచతంత్రం’ కథలు చిన్నపిల్లలకు కూడా తేలికగా అర్థమవుతాయి. ఆ తర్వాత చాలాకాలానికి జార్జ్ ఆర్వెల్ ‘యానిమల్ ఫామ్’ రాశాడు. ఇది కూడా దాదాపు ‘పంచతంత్రం’లాంటి ప్రయోగమే! ‘పంచతంత్రం’ నాటికి, ‘యానిమల్ ఫామ్’ నాటికి సమాజం చాలా మారింది. ‘యానిమల్ ఫామ్’లో దోపిడీ సమాజంలో నలిగిపోతున్న మనుషుల పరిస్థితిని, శ్రమదోపిడీలో నలిగిపోయేవారి స్వేచ్ఛాభిలాషను, వారి స్వేచ్ఛకు తూట్లు పొడిచే శక్తుల కుతంత్రాలను జంతుపాత్రల ద్వారా ఆర్వెల్ చెప్పాడు. జంతువులను పాత్రలుగా చేసుకుని కథలు చెప్పడం ‘పంచతంత్రం’తోనే మొదలు కాలేదు.‘పంచతంత్రం’ దాదాపుగా క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటిది. అంతకు దాదాపు వెయ్యేళ్ల ముందే– క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దికి చెందిన గ్రీకు బానిస ఈసప్ ఇలాంటి కథలనే ఎన్నో చెప్పాడు. ప్రాచీన రోమన్ సాహిత్యంలోని ‘ఫెడ్రస్ కథలు’, గ్రీకు సాహిత్యంలోని బాబ్రియస్ కథలు ఇలాంటివే!ఫ్రెంచ్ సాహిత్యంలోని ‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ కూడా ఇలాంటివే!‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ రచయిత జీన్ డి లా ఫోంటేన్ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల్లో ప్రచారంలో ఉన్న జంతువుల పాత్రలు ప్రధానంగా ఉన్న కథలను సేకరించి, పదిహేడో శతాబ్దిలో ఈ కథల పుస్తకాలను పన్నెండు భాగాలుగా వెలువరించాడు. జంతువులను ప్రధాన పాత్రలుగా చేసుకున్న ఈసప్ కథలు, పంచతంత్ర కథలు అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం పొందాయి. ఇవి ఈనాటికీ తాజాగానే ఉన్నాయి. ఇప్పటి సమాజంలో సంచ రిస్తున్న మనుషుల స్వభావాలు పంచతంత్ర కథల్లోనూ, ఈసప్ కథల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మనుషుల స్వభావాలను జంతువులకు ఆపాదించి చెప్పడం సమస్త భాషల సాహిత్యంలోనూ ఒక పురాతన కళాత్మక పద్ధతి. ఓపిక ఉన్న రచయితలు కథలు చెప్పారు. అనుభవం ఉన్నవాళ్లు సామెతలను సృష్టించారు. మన పురాణాల్లోనూ జంతువులు, పక్షులు పాత్రలుగా ఉన్న పిట్ట కథలు కనిపిస్తాయి. బైబిల్లోనూ జంతువుల గురించిన సామెతలు ఉన్నాయి. ‘సోమరీ! చీమల యొద్దకు వెళ్లుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును’– ఇది బైబిల్ సామెతల గ్రంథంలోనిది. చీమను చూసి కష్టపడటం నేర్చుకోవాలని సోమరులకు చేసే హెచ్చరిక ఇది.ప్రాచీన సాహిత్యంలో జంతుపాత్రలు ఉన్న కథలు, జంతువులపై ప్రాచుర్యంలో ఉన్న సామెతలు మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ప్రవర్తన లోపాలను ఎత్తిచూపి, సుతిమెత్తని హెచ్చరికలు చేస్తాయి. వీటిని పూర్తిగా ఆకళింపు చేసుకుంటే చాలు, మనుషులు మనుషుల్లా తయారవడం కష్టమేమీ కాదు. వీటిని పిట్ట కథల్లా కొట్టిపారేసే అతితెలివిపరులు జంతువుల కంటే హీనంగా మిగులుతారు. కానికాలం దాపురించినప్పుడు దిక్కుతోచని గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుని, నానా అవస్థలు పడతారు.మహాభారతంలోని ‘కాకి హంస’ల కథ ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రాజ్యంలో ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలేది. వర్తకుడి పిల్లలు దానికి తమ ఎంగిళ్లు పెట్టేవారు. ఎంగిళ్లు తిన్న కాకి వారికి బాగా మాలిమి అయింది. ఎంగిళ్లు తిని తెగబలిసిన కాకి ఒకనాడు ఏకంగా హంసలతో పందేనికి తెగబడి, భంగపడింది.ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు. కర్ణుడికి కథలోని నీతి తలకెక్కలేదు. ఫలితం ఏమైందో మనకు తెలిసిందే! కొందరు ఇప్పటికీ ఎంగిళ్లు తిని బలిసిన కాకుల్లాగే ఎగిరెగిరి పడుతుంటారు. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లు రాజకీయ రంగంలోను, సాహితీ సాంస్కృతిక రంగాల్లోను, వివిధ రకాల వృత్తి ఉద్యోగాల్లోనూ ఉంటారు. ఎవరో పెట్టే ఎంగిలి మెతుకులు తిని బలిసి, విర్రవీగినంత కాలం కాకికి తన బలహీనత ఏమిటో ఎరుక పడనట్లే, ఇలాంటి స్వభావం ఉన్నవారికి ఎప్పటికీ ఈ కథల్లోని మర్మం అవగతం కాదు. మానవ సమాజంలో బతుకుతున్నా, వారు ఎప్పటికీ సంపూర్ణ మానవులు కాలేరు. -
ఎవరికోసం ఈ అవతారం?
భారతీయ జనతా పార్టీ వారు ఉత్తర భారతదేశాన్ని తమ కంచుకోటగా భావించుకుంటారు. ఆ కోట బీటలు వారుతున్న ఆనవాళ్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రాజకీయంగా నష్టం జరిగితే దానిని పూడ్చుకోవడానికి కొత్త ప్రాంతాలకు విస్తరించాలి. ఇది కాషాయ దళానికి తక్షణ కర్తవ్యం. ఉత్తరాదిన బలపడటం కోసం మూడు దశాబ్దాల కిందనే మతాన్ని రాజకీయాల్లోకి లాగిన ఘనత ఆ పార్టీదే! అదే వ్యూహంతో దక్షిణాది విస్తరణకు కమల దళం అడుగులు వేస్తున్నది. కర్ణాటక, తెలంగాణాల్లో దాని ఎత్తుగడలు ఒకమేరకు ఫలించాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత కేరళలో ఆ పార్టీ వోటు బ్యాంకు చెప్పుకోదగినంత పెరిగింది. ఆంధ్ర, తమిళనాడు మాత్రమే ఇంకా కొరకరాని కొయ్యలుగా మిగిలాయి.ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు కమల దళాలను కూరలో కరివేపాకులా చంద్రబాబు వాడేసుకుంటున్నారని బీజేపీలో చాలామంది బాధపడుతుంటారు. చంద్రబాబుకు ఆయన మామగారైన ఎన్టీరామారావు ‘జామాతా దశమగ్రహం’ అనే పేరును ఖాయం చేశారు. ఈ దశమ గ్రహానికి ఉపగ్రహం మాదిరిగా పరిభ్రమిస్తున్న కారణంగా స్వయం ప్రకాశితం కాలేక పోతున్నామని ‘ఒరిజినల్ పరివార్’ (ఓపీ బ్యాచ్) చింతాక్రాంత మవుతున్నది. వ్యక్తిగత పొరపొచ్చాల వల్ల మధ్యలో రెండు పార్టీలు దూరమైన ఓ రెండేళ్లు తప్పితే రాష్ట్ర బీజేపీలో ఎప్పుడూ ‘యెల్లో పరివార్’ (వైపీ బ్యాచ్)దే పైచేయి.ఇటీవల చంద్రబాబు సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరుని ప్రసా దాన్నే రాజకీయాల్లోకి లాగడం, ఫలితంగా ఆయనపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిన సంగతులే. తెలుగు దేశం పార్టీ నాయకులెవరూ సుప్రీం వ్యాఖ్యలపై స్పందించలేదుకానీ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వైపీ బ్యాచ్ నాయకురాలు మాత్రం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. న్యాయ మూర్తుల కామెంట్లనే ఆమె తప్పుపట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన సంద ర్భాన్నీ, సన్నివేశాన్నీ కూడా గమనించాలి.కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచినా ఒక్క హామీని పట్టాలెక్కించకపోవడం... వరద నివారణ చర్యల్లో వైఫల్యం... వరద బాధితుల సహాయ చర్యల్లో చేతులెత్తేసిన సందర్భం. మూడు కూటమి పార్టీలు ముచ్చటగా జరుపుకున్న శతదినోత్సవ వేడుక ఆ సన్నివేశం. కనుక తిరుమలేశుడి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాగాలనుకోవడం కూటమి ఉమ్మడి వ్యూహంగానే భావించవలసి ఉంటుంది. ఆ వ్యూహం గొంతు కలో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఉండటంతో వైపీ బ్యాచ్ బీజేపీకి బీపీ పెరిగిపోయింది.చంద్రబాబుపైనే పూర్తిగా ఆధారపడటం, ఆయన పల్లకీని నిరంతరం మోయడం పట్ల బీజేపీలో భిన్నాభిప్రాయాలు న్నాయి. రాష్ట్ర బీజేపీలో చంద్రబాబు స్వయంగా ప్రవేశపెట్టిన వైపీ బ్యాచ్ (యెల్లో పరివార్)కు యథాతథ స్థితి పట్ల అభ్యంత రాలేమీ లేవు. ఒరిజినల్ పరివార్ (ఓపీ బ్యాచ్) మాత్రం పార్టీ సొంతంగా ఇంకొంత బలం పుంజుకుంటేనే చంద్రబాబు దగ్గర కూడా గౌరవం లభిస్తుందనీ, లేకుంటే ఉపగ్రహం మాదిరిగానే మిగిలిపోతామనీ హైకమాండ్ దగ్గర వాదిస్తున్నది. తెలుగుదేశం పార్టీతో పొత్తును కొనసాగించినా సొంత బలం పెంచుకొని ఎక్కువ స్థానాలను దక్కించుకోవలసిన అవసరం జాతీయ నాయకత్వానికి కూడా ఉన్నది. సొంత బలం పెంచుకోవడానికి వారి దగ్గరున్న ప్రణాళిక పాత మంత్రమే! మత విశ్వాసాలను ఆలంబన చేసుకోవాలి.వైపీ బ్యాచ్ నాయకత్వం కింద ఉన్న రాష్ట్ర బీజేపీతో ఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని హైకమాండ్ అభిప్రాయపడి ఉండవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు కలిగిన వాడు, దాదాపు 13 శాతం జనాభా ఉన్న సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, సినిమాల్లో మాదిరిగా వేషాల్నీ, సంభాషణల్నీ అవలీలగా మార్చగలిగినవాడు వారి దృష్టిలో పడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలాకాలంగా బీజేపీ అధిష్ఠానానికి విధేయుడిగా ఉంటున్నారు. ఇంక కావలసిందేముంది? వీరవైష్ణవావతారం సిద్ధమైంది. శ్రీమహావిష్ణువు అవతారాలన్నీ ధర్మ సంస్థాపనార్థం సంభవించి కర్తవ్యం పూర్తికాగానే ఆయనలోనే ఐక్యమైపోయాయని చదువుకున్నాము. కానీ కమలం పార్టీ సృజించిన ఈ కొత్త వీరవైష్ణవమూర్తి వచ్చే ఎన్నికల కర్తవ్యానికి ముందుగానే అదే పార్టీలో విలీనమయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. సినీనటుడు కావడం వల్ల పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోనూ ఆయన సేవలు వాడుకోవాలని బీజేపీ పెద్దల ఆలో చన. తమిళనాడులో అన్నామలై పాదయాత్ర చేసి పార్టీకి కొంత ఊపు తెచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితం కలుగలేదు. బీజేపీ సొంతంగా ఏపీలో బలపడటం సహజంగానే చంద్రబాబుకు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఆయనక్కూడా మరో దారి లేదు. వంద రోజుల్లోనే ప్రభుత్వ ప్రతిష్ఠ కనీవినీ ఎరుగని రీతిలో దిగ జారింది. ఈ మాట ప్రతిపక్షం వాళ్లు చెప్పడం కాదు. తెలుగు దేశం పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారు, సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ కోసం ఎన్నికల యుద్ధం చేసినవారు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారు చేస్తున్న ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి.ఇకముందు తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ దిగ జారుడే తప్ప మెరుగయ్యే అవకాశం లేదు. ఉద్యోగుల బదిలీల్లో, ఇసుక దోపిడీలో, లిక్కర్ దుకాణాల పేరుతో పిండుకుంటున్న లంచాల ఫలితంగా ఇప్పటికే పార్టీ జెండా అవినీతి కంపు కొడు తున్నది. ఒక్క వాగ్దానం అమలు కాలేదు. ఈ రకమైన ట్రాక్ రికార్డుతో వారు జనం ముందుకు వెళ్లగలిగే పరిస్థితి రానున్న రోజుల్లో సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు మత విశ్వా సాలు రెచ్చగొట్టే పార్టీ వెంట నడవడం గుడ్డిలో మెల్ల కదా!పవన్ కల్యాణ్ ధరించిన కొత్త అవతారాన్ని చంద్రబాబే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాడనుకోవాలి. కాకపోతే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రతిష్ఠను పణంగా పెట్టి ఆయన ఆ టెంకా యను కొట్టారు. కూటమి సమావేశంలో చంద్రబాబు కల్తీ వ్యాఖ్యలు చేసిన మూడోరోజే పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష – కాషాయ వస్త్రధారణ ప్రారంభమైంది. స్క్రిప్టు చేతిలో సిద్ధంగా ఉంటే సినిమా చకచకా తీసేయవచ్చని ప్రసిద్ధ దర్శకులు చెప్పే మాట ఇక్కడ కూడా రుజువైంది.ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని ఆయన విరమించారు. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ‘సనాతన ధర్మం’ అనే మాటను హిందూ మతానికి పర్యాయపదంగానే ఆయన వాడారు. ‘నేను ముమ్మాటికీ సనాతన హిందువునే. నా ప్రాణాన్ని అడ్డుపెట్టయినా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. దానికోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాన్నే కాదు... నా ప్రాణాల్ని కోల్పోవడానికి సిద్ధమ’ని గంభీరంగా ప్రకటించారు. గతంలో సనాతన ధర్మాన్ని విమర్శించిన ఉదయనిధి స్టాలిన్‌పై పేరు చెప్పకుండా నిప్పులు చెరిగారు.పవన్ కల్యాణ్ తన ప్రాణాలు బలిపెట్టడానికి కూడా సిద్ధపడిన ‘సనాతన ధర్మం’ అంటే ఏమిటన్న ప్రశ్న సాధారణ ప్రజల మెదళ్లను ఇప్పుడు తొలుస్తున్నది. ఆయన ఉపన్యాసమంతా గమనిస్తే హిందూ మతావలంబనే సనాతన ధర్మాన్ని పాటించడం అని భావిస్తున్నట్టుగా ఉన్నది. భారతీయ తాత్విక ధారలో ఎక్కడ కూడా ఇటువంటి ప్రస్తావన లేదని పలువురు పండితుల అభిప్రాయం. అపౌరుషేయాలుగా, సకల శాస్త్రాలకు మాతృశాస్త్రంగా భారతీయులు పరిగణించే వేదాల్లో సనాతన ధర్మం అనే మాటను ఎక్కడా వాడలేదని చెబుతారు. బౌద్ధ సాహిత్యంలో ఏది సత్యమో అది సనాతనం... అంటే శాశ్వతమైనదనే ప్రస్తావన ఉన్నదట! అంటే ఉషస్సు సత్యం. సూర్యుడు సత్యం. చంద్రుడు సత్యం, గ్రహగతులు సత్యం కనుక అవి సనాతనం, అంటే శాశ్వతమని అర్థం.అట్లాగే సత్య వాక్కు కూడా! వర్ణాశ్రమ ధర్మం పేరుతో మానవ అసమానతలకు పెద్దపీట వేసి, స్త్రీ స్వాతంత్య్రాన్ని నిరాకరించిన మనుస్మృతిలో కూడా సత్యవాక్పాలనే సనాతన ధర్మమనే ప్రస్తావన ఉన్నది. మహాభారత యుద్ధానంతరం అంపశయ్య మీదున్న భీష్మాచార్యుని దగ్గర రాజధర్మాన్ని తెలుసు కోగోరిన పాండవులు ఆయన చెంతకు వచ్చారట! పరిపాలకులు ప్రజా సంక్షేమాన్ని కనిపెట్టి ఉండటం సనాతనమని భీష్ముడు వారికి ఉపదేశించాడట! వ్యాస భారతంలో ఈ ప్రస్తావన ఉన్న దని ఇటీవల ‘ఫ్రంట్‌లైన్’ ప్రచురించిన ఓ వ్యాసంలో రచయిత ఉటంకించారు.సత్యం సనాతనం, అంటే శాశ్వతం. ధర్మం యుగాన్ని బట్టి, కాలాన్ని బట్టి సామాజిక కట్టుబాటు కోసం ఏర్పడిన నియమావళి. ఈ ప్రజాస్వామిక యుగంలో ధర్మం అనేది రాజ్యాంగబద్ధమైంది. మన రాజ్యాంగం మత ప్రసక్తి లేని లౌకికత్వానికి కట్టుబడింది. అట్లాగే ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా ప్రకటించింది. పౌరుల హక్కులకు పట్టం కట్టింది. ఇప్పుడు ఈ సనాతన ధర్మం రాజ్యాంగ ధర్మానికి భిన్నమైనదా? ఎందు కంటే, సనాతన ధర్మంపై న్యాయస్థానాలు చిన్నచూపు చూస్తున్నాయని కూడా తిరుపతి సభలో పవన్ కల్యాణ్ అభియోగాన్ని మోపారు. పైగా అన్యమతాలకు కొమ్ము కాస్తున్నాయని కూడా న్యాయస్థానాలపై ఆయన విమర్శలు చేశారు.భారత రాజ్యాంగాన్ని నిర్వచించడం, దాని ఆదర్శాలను నిలబెట్టడం రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన న్యాయస్థానాల విధి. అటువంటి న్యాయస్థానాలకు స్వమతం ఏమిటి? అన్యమతం ఏమిటి? ఇదేమి అభియోగం? రాజ్యాంగాన్ని పక్కనపెట్టి సనా తన ధర్మాన్ని క్రోడీకరిద్దామా! ఇప్పుడు బీఫ్ తిన్నారనే అభియోగాలతో వీరహిందువులంతా కొందరిని వెంటాడి వేటాడి వధిస్తున్నారు. ఇది సనాతనమా? వేదకాలంలోని ముని వాటికల్లో పశుమాంస భక్షణ ఆమోదయోగ్యమే కదా!రుగ్వేద కాలంలో వసుక్ర రుషి దేవేంద్రుడిని ఇలా ప్రార్థించాడట! ‘‘ఓ ఇంద్రుడా! నీ కొరకు రుత్వికులు వేగంగా మత్తెక్కించే సోమాన్ని సిద్ధం చేస్తున్నారు. నీవు సోమాన్ని తాగు తున్నావు. వారు నీ కొరకు వృషభాన్ని వండుతున్నారు. నీవు ఆహారాన్ని తింటున్నావు’’ – ఈ రుగ్వేద శ్లోకాన్ని మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఉటంకించారు. కనుక ఆచార వ్యవహారాలు, ఆహారపు అల వాట్లు వగైరా ధర్మాధర్మ విచికిత్సలన్నీ కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి. ఈ కాలానికి రాజ్యాంగమే భారతీయ ధర్మశాస్త్రం. సత్యం ఒక్కటే శాశ్వతం. ప్రజా సంక్షేమం కూడా సనాతనమని మహాభారతం చెబుతున్నది. మన రాజ్యాంగం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. హిందూ ధర్మ రక్షణే సనా తన ధర్మ రక్షణగా భావిస్తే అందుకోసం చాలామంది స్వాము లున్నారు. శంకర పీఠాలతో సహా బోలెడన్ని పీఠాలున్నాయి. అదనంగా రాజకీయ పీఠాధిపతులెందుకు? ప్రజల్లో తమ హక్కుల పట్ల చైతన్యం పెరిగిన ప్రతిసారీ, సమాన అవకాశాల కోసం ముందుకొస్తున్న ప్రతి సందర్భంలో పెత్తందారీ ప్రవక్తలు వారి స్వార్థచింతనకు మత విశ్వాసాల ముసుగు తొడిగి ముందుకు తోస్తున్నారు. ప్రజా చైతన్యాన్ని పక్కదారి పట్టిస్తు న్నారు. ప్రజలారా... తస్మాత్ జాగ్రత్త!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జైళ్లా... కులతత్వ కూపాలా!
కులతత్వం బందీఖానాలో మగ్గుతున్న మన జైళ్లకు ఎట్టకేలకు ‘విముక్తి’ లభించినట్టే! రాజ్యాంగం అమల్లోకొచ్చి 74 యేళ్లవుతున్నా మనుస్మృతిని మించి ఆలోచించని మన కారాగారాల దివాంధ త్వాన్ని ఎండగడుతూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. ఖైదీల పుట్టుక ఆధారంగా వారిపై వివక్ష ప్రదర్శించటం, పనులు అప్పజెప్పటం రాజ్యాంగ విరుద్ధమనీ, ఈ దురాచా రాన్ని మూడు నెలల్లో కట్టిపెట్టి ఆ సంగతి తెలియజేస్తూ నివేదికలు దాఖలు చేయాలనీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాష్ట్రాలనూ, కేంద్ర పాలిత ప్రాంతాలనూ ఆదేశించటం హర్షించదగ్గ పరిణామం. జైళ్లు సంస్కరణాలయాలంటారు. నేరాలకు పాల్పడుతూ సమాజానికి తలనొప్పిగా మారిన వ్యక్తులను సంస్కరించటం ధ్యేయంగా కారాగారాలు ఏర్పడ్డాయి. కానీ అక్కడా బయటి సమాజంలాగే కులం కుళ్లు నిండివుందనీ, దాని ఆధారంగా భయంకరమైన వివక్ష కొనసాగుతున్నదనీ... రాజ్యాంగ అధికరణలను ఉల్లంఘిస్తూ జైళ్లలో అంట రానితనం, వెట్టిచాకిరీ రాజ్యమేలుతున్నాయనీ ఆంగ్ల వెబ్సైట్ ‘ది వైర్’లో పనిచేస్తున్న పాత్రికేయు రాలు సుకన్యా శాంత నాలుగేళ్ల క్రితం పరిశోధనాత్మక కథనం రాశారు. దాని ఆధారంగా నిరుడు సుప్రీంకోర్టులో ఆమె ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ పర్యవసానంగానే తాజా తీర్పు వెలువడింది. వలస పాలకుల హయాంలో ఎప్పుడో 1894లో రూపొందిన కారా గారాల చట్టం ఆధారంగా తయారైన మాన్యువల్‌లోని అంశాలే అన్ని జైళ్లలో అమలవుతున్నాయి. వాటిని పాలకులెవరూ పట్టించుకోలేదని కాదు. 2016లో కేంద్రం నమూనా మాన్యువల్‌ను తీసు కొచ్చింది. నిరుడు నమూనా జైళ్ల చట్టం కూడా రూపొందింది. కానీ జైళ్లు, మాన్యువల్స్ ఏమాత్రం మారలేదు. కానీ అడిగేదెవరు?నిర్బంధానికీ పుట్టకకూ, నిర్బంధానికీ నిరక్షరాస్యతకూ, నిర్బంధానికీ నిస్సహాయతకూ మధ్య అవినాభావ సంబంధం ఉన్నదని మన దేశంలో పదే పదే రుజువవుతోంది. జైలు శిక్షలు అనుభవిస్తు న్నవారు మాత్రమే కాదు, విచారణలో ఉన్న ఖైదీల్లో సైతం అత్యధికులు నిరుపేదలూ, నిరక్ష రాస్యులూ, అట్టడుగు కులాలవారూ, ఆదివాసీలూ ఉండటం యాదృచ్ఛికం కాదు. ఈ వర్గాలవారు దాదాపు 65 శాతం వరకూ ఉంటారు. ప్రపంచ దేశాల్లో ఈ వర్గాల సగటు 32 శాతానికి మించదని అనేక నివేదికలు చెబుతున్నాయి. యూపీఏ ఏలుబడిలో చేయని నేరానికి అరెస్టయి తొమ్మిదేళ్లపాటు ఢిల్లీ, మహారాష్ట్ర జైళ్లలో మగ్గిన పౌరహక్కుల నాయకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇటీవల నిర్దోషిగా విడుదలయ్యాక మీడియా సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించింది జైళ్లలోని కుల వివక్ష గురించే. జైళ్లలో కుల వ్యవస్థ అమలవుతోందనీ, ఖైదీలకు కులాన్నిబట్టి పనులు ఇవ్వాలని మాన్యువల్‌లో సైతం ఉన్నదనీ ఆయన చెప్పినప్పుడు అందరూ నివ్వెరపోయారు. స్వాతంత్య్రం వచ్చి 77 యేళ్లవుతున్నా ఈ దురాచారాలు అమలవుతున్నాయంటే బయటి సమాజంలో ఉండేవారు నమ్మలేరు. ఇవే దురాచారాలు సాధారణ పౌరులు పాటిస్తే వాటి పర్యవ సానాలు తీవ్రంగా ఉంటాయి. కఠిన శిక్షలు పడతాయి. కానీ ఎంతో నాగరికంగా కనబడే రాజ్యమే కారాగారాల్లో ఈ దారుణాలు అమలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకు దారి దోపిడీలు, ఇతరేతర నేరాలు చేస్తున్నవారు ఫలానా జాతులవారు గనుక వారిపై ‘నేరస్త జాతులు’ అనే ముద్రవేశారు వలసపాలకులు. రాజ్యాంగం అమల్లోకొచ్చాక అలాంటి దురాచారం రద్దయింది. కానీ ఇప్పటికీ జైళ్లలో సంచార, నేరస్త జాతులకు చెందినవారిగా కొందరిని వర్గీకరించి వారిని విడిగా ఉంచుతున్నారనీ, వారితో అమానవీయమైన పనులు చేయిస్తున్నారనీ సుప్రీంకోర్టు నిర్ధారించింది. అలాగే జైలు రిజిస్టర్లో కులం గురించిన కాలమ్ ఉండటం, ఖైదీలను కులాలవారీగా విభజించటం, అట్టడుగు కులాలవారితో మరుగుదొడ్లు శుభ్రం చేయించటం, ఇతర పారిశుద్ధ్య పనులు అప్పగించటం యధేచ్ఛగా కొనసాగుతున్నదని ధర్మాసనం గుర్తించింది. పుట్టుక ఆధారంగా వివక్ష ప్రదర్శించరాదని రాజ్యాంగంలోని 15(1) అధికరణ చెబుతోంది. 17వ అధికరణ అంటరానితనం నేరమంటున్నది. వెట్టి చాకిరీ చేయించరాదని 23వ అధికరణ అంటున్నది. ఇంకా 14వ అధికరణ పౌరులందరినీ సమానంగా చూడాలని, 21వ అధికరణ జీవించే, స్వేచ్ఛగా మసలే హక్కు కల్పించాలని నిర్దేశిస్తోంది. ఇవన్నీ ప్రాథమిక హక్కులు. ఈ హక్కులను రాజ్యమే ఉల్లంఘించటం ఎంత అపచారం! మహారాష్ట్ర మాన్యువల్ ‘నేరస్త మహిళలు, వ్యభిచార మహిళలు, తార్పుడుగత్తెలు, యువ మహిళా ఖైదీలు’ అంటూ విభజించిందట.‘సాధారణ జైలుశిక్ష పడిన ఖైదీలు కిందికులాల వారైతే తప్ప తక్కువ స్థాయి పనులు అప్పగించరాదని ఉత్తరప్రదేశ్ మాన్యువల్ చెప్తోంది. ఫలానా కులస్తు లను మాత్రమే పారిశుద్ధ్య పనికి వినియోగించాలనీ, కిందిస్థాయి కులాలవారు వండిన ఆహారాన్ని ఆధిపత్య కులాల ఖైదీలు నిరాకరించవచ్చనీ మరో మాన్యువల్ ప్రవచిస్తోంది. వివక్ష వెనక కుల,మత విశ్వాసాలుంటే పట్టించుకోరాదని బెంగాల్ మాన్యువల్ సుద్దులు చెబుతోంది. ఇవన్నీ చూస్తే జైళ్లలో మనకు తెలియని, మన రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే మరో సమాంతర వ్యవస్థ అమల వుతున్నదని అర్థమవుతుంది. ఒక సమాజ నాగరికత స్థాయిని అక్కడి జైలుని చూసి చెప్పవచ్చని విఖ్యాత రచయిత దాస్తోవిస్కీ అన్నాడు. ఇన్ని దశాబ్దాలుగా మన మధ్యే కొనసాగుతూ వచ్చిన ఈ అధమస్థాయి వ్యవస్థ మూడు నెలల్లోపు కాదు, తక్షణం రద్దు కావాలని మానవీయతగల ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. -
వాయు కాలుష్యంపై మొద్దునిద్ర
దేశ రాజధానిలో 60 శాతం అధికంగా కుంభవృష్టి కురిపించి, వారంరోజులు ఆలస్యంగా నైరుతీ రుతుపవనాలు నిష్క్రమించాయో లేదో అక్కడి వాయు కాలుష్యంపై యథాప్రకారం చర్చ మొదలైంది. వాయు నాణ్యత మెరుగుదలకు తీసుకున్న చర్యలేమిటని గురువారం సర్వోన్నత న్యాయస్థానం హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలను నిలదీసింది. వాయు కాలుష్యం ఉగ్రరూపం దాలుస్తోందని, రైతులు పంట వ్యర్థాలు తగులబెట్టకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. గోధుమ పంట చేతికొచ్చాక వ్యర్థాలను తొలగించటం ఖర్చుతో కూడుకున్నదన్న కారణంతో రైతులు అక్కడే తగలబెడతారు. ఆ మంటలకు పంటభూమిలోని పోషకాలు, పంటలు ఏపుగా పెరగడానికి తోడ్పడే సూక్ష్మజీవులు నశిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వ్యర్థాలను సేకరించి ఇతరేతర పదార్థాలతో మిశ్రమం చేసి సేంద్రియ ఎరువుగా మార్చవచ్చని సూచిస్తున్నారు. కానీ దీన్ని రైతులకు చేరేయ టంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రైతులకయ్యే వ్యయాన్ని భరిస్తే ఈ సమస్య చాలావరకూ తగ్గుతుందని గతంలో సుప్రీంకోర్టు ఢిల్లీ, పంజాబ్, హరియాణాలకు సలహా ఇచ్చింది. కానీ పట్టించుకున్నవారేరి? దానిసంగతలావుంచి సుప్రీం సూచనతో ఏర్పాటైన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) సమావేశాలే సక్రమంగా జరగటం లేదు. ఆగస్టు నెలాఖరున జరిగిన కమిషన్ సమావేశానికి 11 మంది సభ్యుల్లో అయిదుగురే హాజరయ్యారంటే...అందులో పంట వ్యర్థాల విషయంపై చర్చించనేలేదంటే కమిషన్ తీరుతెన్నులెలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో సాధారణంగా అక్టోబర్ మధ్యనుంచి వాయు కాలుష్యం పెరగటం మొదలై నవంబర్ నాటికి ఉగ్రరూపం దాలుస్తుంది. పర్యవసానంగా నగర జీవితం అస్తవ్యస్తమవుతుంది. పాఠశాలల పనివేళలు మార్చటం, ప్రభాతవేళ ఆరుబయట వ్యాయామాలు చేయొద్దని పౌరులకు సూచించటం వంటివి మొదలవుతాయి. వాయు కాలుష్యానికి మూలం ఎక్కడుందో గుర్తించటానికే దీర్ఘకాలం పట్టగా, అనంతర చర్యలైనా చురుగ్గా ముందుకు కదలటం లేదు. కాలుష్యంలో 70 శాతం వాటా వాహనాలదేనని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చి కూడా చాన్నాళ్లయింది. ఆ తర్వాతి స్థానం పరిశ్రమలదేనని కూడా ఆ నివేదిక చెప్పింది. కానీ ఆ దిశగా పెద్దగా అడుగులు పడలేదు. మన దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ శక్తిమంతమైనది. దాదాపు అయిదు లక్షల కోట్ల టర్నోవర్ గల ఆ పరిశ్రమ రెండున్నర కోట్లమందికి ఉపాధి కల్పిస్తోంది.అందువల్ల వాటి జోలికి పోయేందుకు ప్రభుత్వాలు సిద్ధపడవు సరికదా... వాహనాల అమ్మకాలు పెరగటానికి, ఆ పరిశ్రమల లాభార్జనకూ భిన్నరూపాల్లో తోడ్పాటునందిస్తాయి. మార్కెట్లోకొచ్చే వాహనాలు కాలుష్య కారకాలుగా ఉంటున్నాయని తేలినా నిర్లిప్తంగా ఉండిపోయిన సందర్భాలు గతంలో కోకొల్లలు. 2005 నుంచి అందుబాటులోకొచ్చిన బీఎస్ 3 (భారత్ స్టేజ్ 3) ప్రమాణాలున్న వాహనాలు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఆరోపణలొచ్చినా చర్య తీసుకునేందుకు ఏ వ్యవస్థా సిద్ధపడలేదు. ఆ ప్రమాణాలతో విడుదలైన ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతోపాటు కార్లు, భారీ కమర్షియల్ వాహనాలపై చర్యలు తీసుకోలేదు. చివరకు సుప్రీంకోర్టే బీఎస్ 3 ప్రమాణాలున్న వాహనాల విక్రయాన్ని 2017లో నిషేధించింది. వీటి సంగతలావుంచి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచటానికి అవసరమైన పథకాల రూపకల్పన సక్రమంగా ఉండదు. త్వరితగతిన పనులు పూర్తిచేసుకోవాలంటే సొంత వాహనాలే దిక్కన్న అభిప్రాయం పౌరుల్లో స్థిరపడిపోయింది. దీనికి తోడు ప్రజా రవాణా కోసం ఇప్పటికీ చాలా రాష్ట్రాలు డీజిల్ బస్సులే వాడుతున్నాయి. విద్యుత్, సీఎన్జీ వాహనాల వినియోగం మొదలైనా వాటి సంఖ్య స్వల్పం. ఢిల్లీ మెట్రో నిడివి ప్రస్తుతం దాదాపు 400 కిలోమీటర్ల మేర ఉంది. దాన్నింకా పెంచటానికి కృషిచేస్తున్నారు. ఈ సర్వీసును బస్సులతో అనుసంధానించి మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా వెళ్లగలిగే సదుపాయం కల్పిస్తే సొంత వాహనాల వినియోగం తగ్గుతుంది. ఇక ఏదైనా అనుకోనిది జరిగితే తప్ప పరిశ్రమలపై సాధారణంగా ప్రభుత్వాలు చర్యలకు సిద్ధపడవు. నిర్దిష్ట కాల వ్యవధిలో నిర్వహించే తనిఖీలు చాలా సందర్భాల్లో లాంఛనప్రాయమవుతాయి. జరిమానాల వంటివి విధించినా అవి నామ మాత్రంగానే ఉంటున్నాయి. ఉపాధి కల్పనకూ, సంపద వృద్ధి కావటానికీ పరిశ్రమలు అవసరమే. కానీ ప్రజారోగ్యంతో ఆటలాడుకునేవారినీ, చట్టాలను ఉల్లంఘించేవారినీ దండించాల్సిందే. వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. రుతుపవనాలు నిష్క్రమించి శీతాకాలం ఇంకా ప్రవేశించని అక్టోబర్ నెల ఒకప్పుడు ఢిల్లీలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని న్యాయమూర్తులు అన్న మాటల్లో వాస్తవం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఉండే ఆ వాతావరణం ఇప్పుడు ఎందుకు మాయమైంది? కారకులెవరు? చిత్తశుద్ధితో ఆలోచించాలి. కాలుష్యంలో తమ బాధ్యత లేదని, పొరుగు రాష్ట్రమే ఈ సమస్యకు కారణమని పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లు పరస్పరారోపణలు చేసుకోవటం రివాజుగా మారింది. అటు కేంద్రం సైతం మొత్తం భారాన్ని రాష్ట్రాలపై వేసి తప్పుకుంటోంది. ఏతావాతా సమస్య యథాత థంగా మిగిలిపోతున్నది. ఈ వైఖరి సరికాదు. ఇటీవల వెలువడిన లాన్సెట్ నివేదిక వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో ఏటా 12,000మంది మరణిస్తున్నారని తేల్చింది. అందుకే అందరూ మేల్కొ నాల్సిన సమయమిది. ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా కార్యాచరణకు దిగి తమవంతు బాధ్యత నెరవేర్చటంతోపాటు కాలుష్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి. -
ప్రమాదంలో ప్రపంచం
వరస సంక్షోభాలతో నిరంతరం నెత్తురోడే పశ్చిమాసియా అందరూ చూస్తుండగానే పూర్తి స్థాయి యుద్ధంలోకి జారుకున్నట్టు కనబడుతోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, మరో ప్రధాన నగరం జెరూసలేంలపై మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటం, ఆ వెంటనే హెజ్బొల్లా మిలిటెంట్లు టెల్‌అవీవ్‌లోని మొసాద్ ప్రధాన కార్యాలయంపై క్షిపణులతో దాడిచేయటం...ఇజ్రాయెల్‌కు దన్నుగా తాము సైతం రంగంలోకి దిగుతామని అమెరికా హెచ్చరించటం పరిస్థితులు వికటిస్తున్నాయన్న సంకేతాలిస్తున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్ నేరుగా తలపడటం ఇక లాంఛనం. ఒకపక్క తన కవ్వింపు చర్యలే ఇరాన్‌ను ప్రతీకారదాడికి పురిగొల్పాయని బట్టబయలైనా ఇరాన్ దాడిని వ్యతిరేకించలేదన్న కారణంతో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ను ‘అవాంఛిత వ్యక్తి’గా ప్రకటించి, తమ దేశంలో అడుగుపెట్టనీయబోమని నిషేధం విధించటం ఇజ్రాయెల్ తెంపరితనానికి నిదర్శనం. శరపరంపరగా వచ్చిపడుతున్న క్షిపణులను పూర్తిగా నిరోధించటం ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకునే రక్షణ ఛత్రం ఐరన్ డోమ్ వల్ల కూడా కాలేదంటే ఇరాన్ దాడి తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రాణనష్టం పెద్దగా లేకపోయినా భారీ భవనాలు నేలమట్టం కావటం, పౌరులు కకావికలై పరుగులు తీయటం, ప్రభుత్వాదేశాలతో పది లక్షలమంది ప్రజలు బంకర్లలో తలదాచుకోవటం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారి. గాజాలో తన లక్ష్యం పూర్తిచేయగలిగానని భావిస్తున్న ఇజ్రాయెల్... రెండురోజుల క్రితం లెబనాన్‌పై పంజా విసరడం ప్రారంభించింది. హెజ్బొల్లా నేత నస్రల్లాను హతమార్చింది. ఆ సమయానికి ఆయనతో పాటున్న తమ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరుషాన్ సైతం ప్రాణాలు కోల్పోవటం ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అది తాజా దాడికి దిగింది. నిజానికి ఇరాన్‌ను ఏనాడూ ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉండనీయలేదు. అది అణ్వాయుధ దేశంగా మారవచ్చునన్న భీతితో గూఢచర్యం సాగిస్తూ పేరెన్నికగన్న శాస్త్రవేత్తలను... ప్రభుత్వంలో, సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని హతమార్చటం ఇజ్రాయెల్ ఒక విధానంగా పెట్టుకుంది. మొన్న ఏప్రిల్‌లో సిరియాలోని డమాస్కస్‌లో ఇజ్రాయెల్ సాగించిన దాడిలో ఇరాన్‌కు చెందిన సైనిక నిపుణుడు, దౌత్యవేత్త మరణించారు. జూలైలో హెజ్బొల్లా నాయకుడు ఇస్మాయెల్ హనియేను ఇరాన్లో ఉండగా ఇజ్రాయెల్ హతమార్చింది. ఇలాంటి ఉదంతాలు జరిగిన ప్రతిసారీ డ్రోన్లతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినా వాటివల్ల ఏనాడూ ఇజ్రాయెల్ పెద్దగా నష్టపోలేదు. ఇరాన్ దాడి అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధర భగ్గున మండిన తీరు సమీప భవిష్యత్తులో ముంచుకురాబోతున్న ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోంది. ఇజ్రా యెల్ దాదాపు ఏడాదికాలంగా అన్ని రకాల వినతులనూ బేఖాతరు చేసి గాజా, వెస్ట్‌బ్యాంక్‌లలో సాగిస్తున్న నరమేధం తొలుత పశ్చిమాసియానూ, ఆ తర్వాత ప్రపంచాన్నీ యుద్ధం అంచుల్లోకి నెడుతున్నదని విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. నిరుడు అక్టోబర్ మొదటివారంలో ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 1,200 మంది పౌరులను హతమార్చి, మరో 695 మందిని అపహరించుకుపోవటం ద్వారా హమాస్ దుస్సాహసానికి పాల్పడింది. ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటించిన దేశాలు సైతం అనంతర ఇజ్రాయెల్ దాడులను అంగీకరించలేదు. ఐక్యరాజ్య సమితి ఖండించింది. అమెరికా కూడా గాజా నరమేధం విరమించుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరిన మాట వాస్తవం. అలాగని అది ఏనాడూ ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా ఆపలేదు. ఫలితంగా ఇంతవరకూ దాదాపు 45,000 మంది గాజా పౌరులు మరణించారని అంటున్నారు. ఒకసారంటూ యుద్ధం మొదలైతే దాని గమనం, ముగింపు ఎవరి చేతుల్లోనూ ఉండవు. దాని తోవ అది వెదుక్కుంటుంది. రెండో ప్రపంచ యుద్ధ పర్యవసానాలు చూశాక మళ్లీ ఆ ఉత్పాతం జరగనీయరాదని ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. ఎందుకంటే ఆ యుద్ధంలో అయిదున్నర కోట్ల మంది సాధారణ పౌరులు, మరో రెండున్నరకోట్లమంది సైనికులు మరణించారు. కోట్లాదిమంది క్షతగాత్రులయ్యారు. ఒక్క సోవియెట్ యూనియన్లోనే దాదాపు రెండున్నర కోట్లమంది మరణించారు. మరో 90 లక్షలమంది వరకూ వ్యాధుల బారినపడ్డారు. కానీ విస్తరణ కాంక్షతో తహతహ లాడే అగ్రరాజ్యాలు తమ ౖ¯ð జం వదులుకోలేదు. ఆ వెనువెంటనే తమకు అలవాటైన యుద్ధ క్రీడ ప్రారంభించాయి. వర్తమాన పరిణామాలు దాని పర్యవసానమే. న్యూయార్క్ టైమ్స్ పరిశోధక పాత్రికేయురాలు అనీ జాకబ్సన్ యుద్ధం వల్ల మానవాళికి కలగబోయే హాని గురించి చెప్పిన అంశాలైనా అగ్రరాజ్యాల కళ్లు తెరిపించాలి. అణ్వాయుధ యుద్ధం కేవలం 72 నిమిషాల్లో భూగోళంపై 60 శాతం జనాభాను తుడిచిపెడుతుందని హెచ్చరించారామె. ఇజ్రాయెల్‌కు అమెరికా అండదండలున్నట్టే ఇరాన్‌కు రష్యా, చైనాల ఆశీస్సులున్నాయి. దానికి హమాస్, హిజ్బొల్లా గ్రూపులు, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిటెంటు సంస్థలూ మరింత దగ్గరవుతాయి. ఇజ్రాయెల్‌తో సాన్నిహిత్యం నెరపుతున్న ఈజిప్టు, జోర్డాన్లకూ, ఆ తోవనే వెళ్తున్న సౌదీ అరేబియాకూ సంకటస్థితి ఏర్పడుతుంది. ఈ వైరిపక్షాలన్నీ కొంత హెచ్చు తగ్గులతో ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల మారణాయుధాలతో సంసిద్ధంగా ఉన్నాయి. అందుకే పాలస్తీనా ఆవిర్భావానికి సహకరించటం, దుందుడుకు విధానాలకు స్వస్తిపలకడం వంటి చర్యలే పశ్చిమాసియాకూ... మొత్తం ప్రపంచానికీ ప్రశాంతతనిస్తాయని ఇజ్రాయెల్ గుర్తించాలి. అమెరికా వివేకంతో మెలిగి సామరస్య ధోరణులకు తోడ్పాటునందించాలి. -
ప్రాణాలతో చెలగాటమా?
దేశంలోని అత్యున్నత కేంద్రీయ ఔషధ నియంత్రణ అధారిటీ తన తాజా నివేదికలో వెల్లడించిన అంశాలు సంచలనం రేపుతున్నాయి. మనం తరచూ వాడే మందుల్లో 50కి పైగా ఔషధాల నమూనాలు ‘నిర్ణీత నాణ్యతాప్రమాణాలకు తగినట్టు లేనివి’(ఎన్ఎస్క్యూ) అంటూ నివేదిక వెల్లడించింది. జ్వరం, కడుపులో పూత లాంటి వాటికి వాడే ప్యారాసెటమాల్, పాన్–డి మందులతో సహా విటమిన్ సప్లిమెంట్లు, షుగర్ వ్యాధి మాత్రలు, యాంటీ బయాటిక్స్ సైతం ఆ జాబితాలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నాసిరకం మందులను ఉత్పత్తి చేసినవాటిలో కొన్ని పేరున్న సంస్థల పేర్లూ ఉండేసరికి ఆందోళన రెట్టింపవుతోంది. అమాయక ప్రజల ఆరోగ్యభద్రతకై అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. అదే సమయంలో ఔషధాల తయారీకి ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీ యంగా ఔషధాల ఎగుమతిలో అగ్రగామిగా, ‘ప్రపంచానికే మందుల అంగడి’గా భారతదేశానికి గుర్తింపున్న నేపథ్యంలో నాణ్యతపై మనం మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని అర్థమవుతోంది. గత ఏడాదీ 51 ఔషధాలు నాణ్యతా పరీక్షలో విఫలమయ్యాయి. ప్రభుత్వ ఔషధ విభాగం నిరుడు 1,306 నమూనాలను పరీక్షించినప్పుడు, అది బయటపడింది. నిజానికి, భారతదేశంలో ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల నాణ్యత అంశం ‘1940 నాటి ఔషధ, సౌందర్య ఉత్పత్తుల చట్టం’ కిందకు వస్తుంది. ఆ చట్టం ప్రకారమే వీటి పర్యవేక్షణ, నియంత్రణ సాగుతుంది. ఔషధ నియంత్రణ అధికారులు క్రమం తప్పకుండా మార్కెట్ నుంచి ఔషధ నమూనాలను సేకరించి, పరీక్షలు చేస్తుంటారు. చట్టప్రకారం నిర్దేశించిన ప్రమాణాలను పాటించని ఉత్పత్తుల గురించి ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తారు. కేంద్రీయ ఔషధ నాణ్యతా నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) సర్వసాధారణంగా ఇలా పరీక్షలు జరపడం, వాటి ఫలితాలనూ – ఆ పరీక్షల్లో తప్పిన మందుల జాబితానూ ఎప్పటి కప్పుడు వెల్లడించడం కచ్చితంగా మంచిదే. అన్ని వర్గాలూ అప్రమత్తమయ్యే వీలు చిక్కుతుంది. అయితే, సామాన్య జనం నిత్యం వాడే యాంటీ బయాటిక్స్, షుగర్, బీపీల మందులు కూడా నిర్ణీత నాణ్యతా ప్రమాణాల్లో విఫలమవుతున్నట్టు ఇటీవలి నివేదికల్లో వెల్లడవడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రమాణాలు పాటించని జాబితాలోని మందులు ఎక్కువవుతూ ఉండడం గమనార్హం. తాజాగా ఈ ఆగస్టులో చేసిన పరీక్షల్లో కొన్ని రకాల సీ విటమిన్, బీ కాంప్లెక్స్ మందులూ నాసి రకమేనని తేలింది. భారతీయ ఔషధ ప్రబంధం నిర్దేశాలకు అనుగుణంగా కొన్ని మందులు ‘విలీన పరీక్ష’లో, మరికొన్ని ‘నీటి పరీక్ష’లో విఫలమైనట్టు అధికారిక కథనం. నాణ్యత మాట అటుంచితే, కొన్ని బ్యాచ్‌ల ఔషధాలు అచ్చంగా నకిలీవట! ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమే కాక, విశ్వ వేదికపై ఔషధ సరఫరాదారుగా భారతదేశ పేరుప్రతిష్ఠలకు భంగకరం కూడా! సహజంగానే పలు మందుల కంపెనీలు తాము తయారు చేస్తున్నవి అన్ని రకాలుగా నాణ్యమైనవేనంటూ ప్రతిస్పందిస్తున్నాయి. నాణ్యత లేకపోవడానికీ – నకిలీ మందులకూ చాలా తేడా ఉందనీ, దాన్ని స్పష్టంగా గుర్తించాలనీ పేర్కొంటున్నాయి. అది నిజమే కానీ, అసలు అనుమానాలే రాని రీతిలో, లోపరహితంగా మందుల తయారీ బాధ్యత ఆ రంగంలో ఉన్న తమదేనని ఆ సంస్థలు మరువరాదు. ఆ మాటకొస్తే, ఈ రంగానికి ఉన్న ప్రతిష్ఠను కాపాడేందుకు ముందుగా అవే చొరవ తీసుకోవాలి. ఔషధ రంగం మన దేశానికి అత్యంత కీలకమైనది. దేశంలో కనీసం 10 వేల దాకా ఔషధ తయారీ యూనిట్లున్నాయి. దాదాపు 200కు పైగా దేశాలకు భారత్ నుంచి మందులు సరఫరా అవుతుంటాయి. మన ఔషధ విపణి పరిమాణం దాదాపు 5 వేల కోట్ల డాలర్లు. పైగా సరసమైన ధరలకే మందులు అందిస్తున్న పేరున్న మన మార్కెట్ ప్రస్తుతం రెండంకెల వృద్ధి రేటుతో పురోగమిస్తోంది. కోవిడ్ సమయంలోనే కాక, విడిగానూ అనేక రోగాలకు టీకాలు అందించడంలో భారత్ అగ్రశ్రేణిలో నిలిచిందని పాలకులు పదే పదే చెప్పుకొస్తుంటారు. అలాంటప్పుడు మన దగ్గర తయారయ్యే ఔషధాల నాణ్యతపై మరింత అప్రమత్తత తప్పనిసరి కదా! దురదృష్టవశాత్తూ, అందులోనే మనం వెనుకబడుతున్నాం. గ్యాంబియా, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాల్లో సంభవించిన బాలల మరణాలకు భారతీయ తయారీ ఔషధాలే కారణమంటూ ఆ మధ్య అంతర్జాతీయ వివాదాలు తలెత్తిన సంగతి విస్మరించలేం. అంటే బయటపడ్డ కొన్ని మందుల విషయంలోనే కాదు... మొత్తంగా ఔషధతయారీ, నాణ్యత, నియంత్రణ వ్యవస్థపై లోతుగా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎగుమతి మాట దేవుడెరుగు... ముందుగా ప్రభుత్వాలకైనా, ఔషధ తయారీ సంస్థలకైనా ప్రజారోగ్య భద్రత ముఖ్యం కావాలి. అందులో ఎవరు రాజీపడినా అమాయకుల ప్రాణాలతో చెలగా టమే. అది సహించరానిది, భరించ లేనిది. అందువల్ల నాసిరకమనీ, నకిలీవనీ తెలిసిన మందులను మార్కెట్ నుంచి వెంటనే వెనక్కి రప్పించాలి. అందుకు చట్టం, తగిన విధివిధానాలు లేకపోలేదు. కానీ, వాటిని ఏ మేరకు అమలు చేస్తున్నారన్నది చెప్పలేని పరిస్థితి. అది మారాలి. అలాగే, నాణ్యతా పరీక్షల్లో లోటుపాట్లు లేకుండా చూడడం కీలకం. పరీక్షల కోసం నమూనాలను ఎప్పుడు తీసుకు న్నదీ, ఎన్ని తీసుకున్నదీ ప్రకటించడం వల్ల మరింత పారదర్శకత నెలకొంటుంది. కొత్త అనుమానా లకు ఆస్కారమివ్వకుండా పోతుంది. విదేశాల్లోనే కాక, ప్రస్తుతం స్వదేశంలోనూ ఔషధాలపై సందే హాలు ముసురుకుంటున్న వేళ ప్రపంచస్థాయి ప్రమాణాలు అందుకొనేలా మన మందుల తయారీ సాగాలి. అవసరమైతే అందుకు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలతో కలసి అడుగులు వేయాలి. ఇంటా బయటా మన ఔషధాలు ఆరోగ్యభద్రతకు చిరునామా కావాలే తప్ప రోగుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ఎందుకంటే, మందుల విలువ కన్నా మనుషుల ప్రాణాల విలువ ఎక్కువ! -
ప్రమాదకర యుద్ధక్రీడ
ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడితో ఏడాది క్రితం అక్టోబర్ 7న పశ్చిమాసియాలో చెలరేగిన హింసాత్మక సంఘర్షణ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. ముస్లిమ్‌లలోని షియా వర్గానికి చెందిన తీవ్రవాద హెజ్బొల్లా బృందానికి 32 ఏళ్ళుగా సారథ్యం వహిస్తున్న అధినేత హసన్ నస్రల్లాను భీకర గగనతల దాడుల ద్వారా ఇజ్రాయెల్ మట్టుబెట్టిన తీరు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. లెబనాన్‌లోని ఇటీవలి పేజర్లు, వాకీటాకీల పేలుళ్ళ ఉదంతం మరువక ముందే ఇజ్రాయెల్ మరోసారి తన గూఢచర్య, సైనిక సత్తా చాటిన వైనం ముక్కున వేలేసుకొనేలా చేసింది. లెబనాన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా, ఫ్రాన్స్‌లు గురువారం పిలుపునిచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దాన్ని సమర్థిస్తున్నారనే అందరూ భావించారు. ఒక్క రోజు గడిచిందో లేదో... ఒకపక్క న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశం సాగుతుండగానే, మరోపక్క నెతన్యాహూ మాత్రం బీరుట్‌పై వైమానిక దాడికీ, హెజ్బొల్లా అధినేతను మట్టుబెట్టడానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఐరాసలో ఎన్ని తీర్మానాలు చేసినా ఘర్షణను కొనసాగించాలనే ఇజ్రాయెల్ మంకుపట్టుతో ముందుకు పోతున్నట్టు తేటతెల్లమైంది. చిత్రమేమిటంటే, లెబనాన్‌లో కాల్పుల విరమణను బయట తోసిపుచ్చిన నెతన్యాహూ ప్రైవేటుగా మాత్రం అందుకు అంగీకరించారు. అమెరికా, ఫ్రాన్స్ అధికారులు సైతం చెప్పినమాట అదే. తీరా దాడులు మాత్రం నెతన్యాహూ కొనసాగించారు. కొన్ని నెలలుగా ఆయన తీరు అంతే. అమెరికాకు నచ్చే మాటలు పైకి చెబుతారు. కానీ, చివరకు మాత్రం తాను ఏదనుకుంటే అదే చేస్తున్నారు. అమెరికా సైతం పైకి శాంతి వచనాలు చెబుతున్నా, ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా ఆపలేదు. ఆ ఆయుధాలను వాడుకుంటూ ఇజ్రాయెల్ పేట్రేగిపోతుంటే ఆపుతున్నదీ లేదు. ఇప్పటికే కొన్ని వేల మంది గాజాలో ప్రాణాలు కోల్పోయారు. గత వారంలో లెబనాన్‌లోనూ వెయ్యిమంది మరణించారు. అక్కడి జనాభాలో దాదాపు అయిదోవంతు మంది నిర్వాసితులయ్యారు. భవనాలపై బాంబు దాడులకు జడిసి, ప్రజలు వీధుల్లో నిద్రిస్తున్న పరిస్థితి. గగనతలం నుంచి బాంబులు ఆగలేదు. భూమార్గంలోనూ ముప్పు తప్పదన్న భయం తప్పడం లేదు. మరోపక్క ఇజ్రాయెల్ చేపట్టిన పని ఇంకా పూర్తి కాలేదని ఆ దేశ ప్రధాని ప్రకటించడంతో ఈ తలనొప్పి తగ్గేలా లేదు.అలాగని హెజ్బొల్లా అధినేత మరణానికి యావత్ లెబనాన్ బాధపడుతోందని అనలేం. తీవ్ర హింసకు పాల్పడి, ఎందరి మరణానికో కారణమైన నస్రల్లా పట్ల లెబనాన్, ఇజ్రాయెల్, సిరియా సహా పలు ప్రాంతాల్లో ప్రజానీకానికి పెద్దగా ప్రేమ ఏమీ లేదు. అరబ్ ప్రపంచంతో పాటు సాక్షాత్తూ లెబనాన్‌లో సైతం ఆయన మరణానికి సోషల్ మీడియాలో పెద్దయెత్తున ఆనందం వ్యక్తం కావడం గమనార్హం. సిరియన్ నియంత బషర్ అల్–అసద్‌తో చేతులు కలిపి తమ వద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని హెజ్బొల్లా అణిచివేయడంతో వారిలో ఆగ్రహం నెలకొంది. అందుకే ఈ రకమైన భావన వ్యక్తమైంది. లెబనీస్ ప్రభుత్వం ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, తద్వారా లెబనీస్ సైన్యం హెజ్బొల్లా చేతుల్లోని దక్షిణ లెబనాన్‌పై నియంత్రణ సాధించి, సరిహద్దు వెంట శాంతి నెలకొల్పాల నేది వారి అభ్యర్థన. నిజానికి, ఇజ్రాయెల్‌తో యుద్ధం తాము కోరుకోకపోయినా, ఇరాన్ ఆదేశాలతో లెబనీస్‌ను నస్రల్లా దీనిలోకి లాగారని వారి వాదన. ఇలాగే సాగితే గాజా భూఖండం లాగా బీరుట్ సైతం ధ్వంసమవుతుందనీ, అంతర్యుద్ధం మళ్ళీ వస్తుందనీ లెబనీయుల భయం. ముందు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు సాధారణస్థితికి రావడం ముఖ్యం. అందుకు సౌదీలూ సిద్ధమే! కాకపోతే, రెండు దేశాల ఏర్పాటనే పరిష్కార సూత్రంతో పశ్చిమ తీరం లోని పాలెస్తీనా అథారిటీతో చర్చలు జరిపేందుకు ఇజ్రాయెల్ ముందుకు రావాలన్నది వారి షరతు. వ్యవహారం అక్కడే పీటముడి పడింది. ఇరాన్‌కు నెతన్యాహూ హెచ్చరిక, హెజ్బొల్లా నేత హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రతిజ్ఞ, ఇరాన్ అండతో పెచ్చరిల్లుతున్న ఇతర వర్గాల వ్యవహారం... అంతా చూస్తుంటే ఇక ఇది అంతులేని కథే! నిజానికి, లెబనాన్, గాజాల్లోని తీవ్రవాద వర్గాలను హతమార్చాలనే ఇజ్రాయెల్ సైనిక విధానం వల్ల తాత్కా లిక లాభాలే తప్ప, శాశ్వత ప్రయోజనం ఉండదు. ఆ మధ్య సాక్షాత్తూ ఇరాన్ రాజధాని టెహరాన్‌లో హమాస్ నేత ఇస్మాయిల్ హనీయే, ఇప్పుడు బీరుట్లో హెజ్బొల్లా అధినేత, వెంటనే అదే గ్రూపులోని మరో కీలక నేత నబిల్ కౌక్... ఇలా పలువురిని ఇజ్రాయెల్ చంపేసింది. కానీ ఇలాంటి సంస్థల్లో ఒకరు పోతే మరొకరొస్తారు. పైగా ఇజ్రాయెల్ దూకుడు వల్ల ఇరాన్‌లోని కొత్త సంస్కరణవాద సర్కారూ చేసేదేమీ లేక, తీవ్రంగా ప్రతిస్పందించక తప్పదు. అప్పుడు ముడి మరింత బిగుస్తుంది. అగ్రదేశాల స్వార్థం, ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన అంతర్జాతీయ సంస్థల సంపూర్ణ వైఫల్యం ఈ దీర్ఘకాలిక సమస్యకూ, ఏడాదిగా ఆగని మారణహోమానికీ కారణం. పాలెస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు వచ్చే ఏడాదిలోగా ముగింపు పలకాలని ఐరాస తీర్మానించిన కొద్దిరోజులకే ఇలా జరిగిందంటే ఏమనాలి! ఐరాసకు కోరలు లేని పరిస్థితుల్లో... ప్రపంచానికి సరికొత్త శాంతిసాధన వ్యవస్థ అవసరం కనిపిస్తోంది. నెతన్యాహూ ఇలాగే తన దూకుడు కొనసాగిస్తే, పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారుతుంది. లెబనాన్‌లో సైతం మరో గాజాను ఇజ్రాయెల్ సృష్టించక ముందే ప్రపంచ దేశాలు కళ్ళు తెరవాలి. నిర్బంధంగానైనా కాల్పుల విరమణను సాధించాలి. లేదంటే, పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు మరింత విస్తరిస్తాయి. ప్రపంచాన్ని చీకటితో కమ్మేస్తాయి.