Editorial
-
నింద భోజనం
కొన్ని నైతిక బోధలు అన్నిచోట్లా కనబడతాయి. అబద్ధము ఆడరాదు. జీవహింస చేయరాదు... ఇలా! కానీ, వారణాసిలోని కబీర్ జన్మస్థలైన కబీర్ మఠ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే మొదటి నైతిక బోధ ‘నిందలు వేయరాదు’ అని! కబీర్ దాస్ తన ప్రబోధాలలో ఎక్కువగా అప్రమత్తం చేసింది నిందలు వేసే వారి గురించే!! ‘వేయిమంది పాపులను కలిసినా ఫరవాలేదు నిందలు వేసే ఒక్కణ్ణి తప్ప. నిందలు వేసే వాని శిరము వేయి పాపాల పుట్ట’ అన్నాడాయన. సిసలైన వేటగాడు ఉత్త చేతులతో ఇంటికొచ్చి నింద అడవి మీద వేయడు. ఆహార సేకరణ కాలంలో అనునిత్యం చెమటోడ్చి, రక్తం చిందించి ఆహారం సేకరించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి బలహీన పురుషుడు నోటికి నేర్చిన మాట నింద. వేటే దొరకలేదు... నది పొంగింది... తేనెటీగలు తరుముకున్నాయి... బాణం దిగినా సరే పారిపోయింది. తర్వాతి కాలంలో సకల చేతగానితనాలకీ, అగణిత అప్రయోకత్వాలకీ చవటలు వెతుక్కునే అన్ని నిందలకూ కనిపెట్టుకున్న అడ్రస్ ఒకటి ఉంది. దాని పేరు ఖర్మ. నింద ఖర్మ మీద వేస్తే ఆ తర్వాత మన దేశంలో వేరే ఏమీ చేయనక్కర్లేదు. ‘ఏం చేస్తామండీ ఖర్మ’ అని తడవకోసారి అంటూ ఉంటే చాలు. సాఫల్య కర్మల కోసం కాదా కర్మ?అప్రయోజకత్వం అక్కసుకు సింహద్వారం. వైఫల్యం అహంకారానికి గొడ్డుకారం. కళ్లెదుట కష్టపడి పని చేసేవాడు, భార్యాపిల్లలను చక్కగా చూసుకునేవాడు, డబ్బు జాగ్రత్త చేసుకునేవాడు, తెలివిగా మసలుకునేవాడు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు, వచ్చిన విద్యను అంటిపెట్టుకుని ఉండేవాడు, తెగించి కొత్తదారులు కనిపెట్టేవాడు... వీళ్లంతా ముందుకు వెళుతుంటే విజేతలై అధిగమిస్తుంటే ఇవన్నీ చేయలేని, చేయరాని, చేసేందుకు కనీసం ప్రయత్నించి చూడని ప్రతి గాడిదకూ చేతికి అందే మారణాయుధం నింద. గెలిచినవాడిని ఓడించేందుకు ధర్మబద్ధమైన ఏ ఆయుధమూ లేని పరాజితుడు అంతిమంగా ప్రయోగించే పాశుపతాస్త్రం నింద. ఇది టీకా లేని క్రిమి. నాల్కల ద్వారా వ్యాపించే మహమ్మారి.పాఠశాల విద్య తద్వారా తెలుగు భాష ముందుకు సాగడానికి చిన్నయ సూరి ఆవిష్కృతం చేసిన అతి ముఖ్యమైన కృషి ‘బాల వ్యాకరణం’ వేలాదిగా అమ్ముడుపోవడం మొదలుపెట్టాక ఆయన మీద పడ్డ నింద– అది కాపీ రచన అని... అది వేరెవరో పండితుడు రాశాడు అని. చిన్నయ సూరి ఈ గండం నుంచి గట్టెక్కడానికి గురు సమానులైనవారి వైపు ఆశగా చూస్తే వారూ చేసిన పని ‘అవును.. కాపీయే’ అని నిందించడం. ఐదారేళ్లు చిన్నయ సూరి నిందను మోశాక నింద ఓడిపోయింది. చిన్నయ సూరి మిగిలాడు. ఒక వేశ్య రచన చేయుటయా... ఆస్థానాలలో ఆడే దేవదాసి కవిత్వం చెప్పుటయా అని నాటి పెద్దలకు ముద్దు పళని మీద ఆగ్రహం వచ్చింది. ‘లోపల ఏముందో తర్వాత.. ముందు అశ్లీలం అని నింద వేయండి’ అన్నారు. ఆ నిందను జయించి తెలుగు సారస్వతంలో తన స్థానం దక్కించుకోవడానికి ‘రాధికా సాంత్వనం’ ఎంత సాంత్వనం కోల్పోయిందని?తప్పులు, పొరపాట్లు చేయడం మానవ సహజం. పురాణాలూ ఈ సందర్భాలను ఎత్తి చూపాయి. రాముణ్ణి మాయలేడి వెంట పంపి సీత తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ఆమెలో ఆందోళన జనించింది. ఆ ఆందోళన ఇంగితం కోల్పోయేలా చేసింది. ఎంతకూ రాని రాముని గురించి పరితపిస్తూ, రక్షణకు వెళ్లమని, ‘నా మీద కన్నేసి నువ్వు కదలడం లేదు కదూ’ అని లక్ష్మణుడి మీద నింద వేసే సరికి అతడు హతాశుడయ్యాడు. తర్వాతి కాలంలో ఈ సీతమ్మే ఘోర నిందను ఎదుర్కొంది. అగ్నిపునీతగా నిలిస్తే తప్ప నింద వదల్లేదు. సకల లీలా మాధవుండైన శ్రీకృష్ణుడు కూడా నిందచేసే లీలకు చకితుడయ్యి జాంబవంతుడితో యుద్ధానికి దిగాడు శమంతకమణి కోసం! ఆ మాటకొస్తే ఆడిన మాట తప్పాడన్న నింద వస్తుందన్న భయం లేకపోతే హరిశ్చంద్రుడు పడేవాడా అన్ని కష్టాలు? దేనికీ జడవనివాణ్ణి జడిసేలా చేయగలదు నింద.నిందలు ఎందుకు వేస్తారు అంటే అది చాలా సులభమైన పని కనుక అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. గుచ్చుకుంటున్న స్వీయ వైఫల్యాలకు కాసింత మలాము రాసుకోవడానికి ఎదుటివారికి మలం పూస్తారు ఇట్టివారు. అక్కసును, ద్వేషాన్నీ గెలుపుగా మార్చుకునేందుకు దేశాలపై, జాతులపై, మతాలపై, కులాలపై, వ్యక్తులపై, సార్థకులపై నిందలు వేస్తారు. నిందకు దండన అనుమతి ఉంది. చేతబడి చేస్తున్నారన్న నింద వేశాక ఊరంతా కలిసి వారిని చంపుతుంటారు. నింద బలిగోరుతుంది. విడిపోయి తమ దారి తాము చూసుకుందామనుకునే తోబుట్టువులు ఇవాళ సుపారీ ఇస్తున్నది నిందకే. నిందలు వేసేవారు పదేపదే నెగెటివ్ ఆలోచనల్లో చిక్కుకుని ఏమీ సాధించలేక చరిత్రహీనులుగా మిగులుతారనడానికి ఆధారాలున్నాయి. నేటి సోషల్ మీడియా అంతా నిందలు వేసే మందబుద్ధు లతో ఎంతగా నిండి ఉందంటే రోజూ వేల కొలది పోస్టుల పాపపుకూడు ఉడికి వడ్డనవుతున్నది. ఈ భోజనానికి ఎగబడుతున్న అమాయకులు ఎందరో. కవులు, రచయితలు ఎప్పుడైనా ఈ దారి తొక్కుతున్నారా ప్రయివేటు సంభాషణలను నిందలతో నింపుతున్నారా, చెక్ చేసుకోవాలి. మొదట నింద వేసినవారు సచ్ఛీలురు అయిపోవడం నింద సమకూర్చే అతి పెద్ద లాభం. అంత మాత్రం చేత నింద వేసిన వారు గెలిచినట్టు కాదు. మోసినవారు ఓడినట్టు కాదు. సదుద్దేశంతో సద్విమర్శ చేసేవారిని ఇంటిలో నాటే చెట్టంత దగ్గరగా ఉంచుకోమన్నాడు కబీర్ దాస్. సమాజం సద్విమర్శతో నిర్మితమవుతుంది. నిందతో కాదు. నింద నిందపడి పాడుగానూ! -
పరిపాలనకు ‘తిరు’క్షవరం
వారెవ్వా! ఎంతటి వంచనాశిల్ప చాతుర్యము. శకుని మామ అనేవాడు బతికే ఉంటే ఈ చతురత ముందు మోకరిల్లి పొర్లు దండాలు పెట్టి ఉండేవాడే! జగన్మోహన్రెడ్డి తిరుమల దర్శనా నికి వెళ్తే పెద్ద ఎత్తున అల్లరి జరగాలి. ఆయన మీద రాళ్లు రువ్వాలి. దాడులకు తెగబడాలి. అందుకు ఏర్పాట్లు కూడా జరి గాయి. వేలాదిమందిని సమీకరించి పెట్టుకున్నారు. వైసీపీ వాళ్లను గృహనిర్బంధం చేశారు. జగన్ యాత్రకు అనుమతి లేదని పేర్కొంటూ ఆ పార్టీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. అయినా కూడా జగన్మోహన్రెడ్డి వెళ్లి ఉంటే విధ్వంసానికి రంగం సిద్ధం. అందుకు నెపాన్ని కూడా ఆయన పైనే∙వేయడా నికి స్క్రిప్టు రెడీ.పరిస్థితిని గమనించి జగన్మోహన్రెడ్డి పర్యటన వాయిదా వేసుకున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ వెళ్లలేదనే ప్రచారం ప్రారంభం. ఈ ప్రచారానికి సాక్షాత్తూ ముఖ్య మంత్రే నాయకత్వం వహించారు. ఆయన ప్రెస్‌మీట్ నుంచి సందేశాన్ని అందుకున్న కూటమి నాయకులు పొట్టోడు, పొడు గోడు అనే తేడా లేకుండా డిక్లరేషన్ దండకాన్ని అందుకున్నారు. ఇదంతా వ్యూహం ప్రకారమే జరిగింది.తన వంద రోజుల పాలనా వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఓ అభూతకల్పన సృష్టించారు. నిజా నిజాలు నిలకడ మీద తేటతెల్లమవుతున్నాయి. దేవస్థానం మార్కెటింగ్ విభాగం వారి నాణ్యతా పరీక్షలను దాటుకొని ప్రసాదం తయారీ చెంతకు కల్తీ నెయ్యి వెళ్లే పరిస్థితే అక్కడున్న వ్యవస్థలో ఉండదు. అందువల్లనే కొన్ని డజన్ల పర్యాయాలు కల్తీ నెయ్యి ట్యాంకర్లు వెనక్కు మళ్లాయి. అట్లా వెనక్కు పంపిన ట్యాంకర్లలోని ఒక శాంపుల్నే గుజరాత్లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పంపించింది. మైసూర్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించే సంప్ర దాయానికి భిన్నంగా ఈసారి గుజరాత్‌కు పంపించారు.పంపించడానికి ఒకరోజు ముందు ఎన్డీడీబీ చైర్మన్, మాజీ చైర్మన్లతో టీటీడీ ఈవో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ భారత రాష్ట్ర పతి, ప్రధాని, చీఫ్ జస్టిస్‌లకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి గవర్నింగ్ బాడీ సభ్యుడు బద్రవాడ వేణుగోపాల్ లేఖలు రాశారు.మైసూర్ ల్యాబ్‌కు కూడా ఇదే కంటైనర్‌లోని శాంపుల్‌ను పంపించినట్టు విశ్వసనీయమైన సమాచారం ఉన్నది. అక్కడి నుంచి రిపోర్టు వచ్చిందా? లేదా? వస్తే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నది ఓ అంతుచిక్కని రహస్యం. వేణుగోపాల్ లేఖ మీద విచారణ జరిగితే చాలా అంశాలు బయటకు రావచ్చు.కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ దేశీయ గోసంపద వృద్ధి లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించింది. కానీ ఎన్డీడీబీ చైర్మన్, మాజీ చైర్మన్లు ఆ కార్యక్రమాలకు తూట్లు పొడుస్తూ సంకర జాతి జెర్సీ ఆవులను ప్రోత్సహించారని కూడా వేణుగోపాల్ ఆరోపించారు.తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ వారు సరఫరా చేసిన నెయ్యికి సంబంధించి ఈ వివాదమంతా జరుగుతున్నది. వారు ఆన్లైన్ టెండర్లో పాల్గొని కేజీ నెయ్యికి 319 రూపాయలు కోట్‌చేసి ఎల్–వన్‌గా వచ్చినందువల్ల ఆనవాయితీ ప్రకారం 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆ డెయిరీకి అప్పగించారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన జూన్ నెలలోనే వారు నెయ్యి సరఫరాను ప్రారంభించారు. ఈ నెయ్యి ధర మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంత తక్కువ ధరకు మంచి నెయ్యిని ఎట్లా సరఫరా చేస్తారన్నది ఆయన ప్రశ్న.డెయిరీ నిర్వాహకులు చెబుతున్న లెక్కల ప్రకారం ఆవు పాల సేకరణ ధర 35 రూపాయల లోపే వుంటే రూ.300లకు కిలో చొప్పున నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయడం అసాధ్య మేమీ కాదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆవు పాల సేకరణ ధర అంతకంటే తక్కువే ఉన్నది. కనుక ఏఆర్ డెయిరీ కోట్ చేసిన ధర అభ్యంతరకరమైనదేమీ కాదని డెయిరీ నిర్వాహకుల అభిప్రాయం. ఏఆర్ డెయిరీని ఆపేసిన తర్వాత పిలిచిన టెండ ర్లలో యూపీకి చెందిన ఆల్ఫా ఫుడ్స్ అనే డెయిరీ ఎల్–వన్‌గా నిలిచింది. వాళ్లు రూ. 475 కోట్ చేశారు. పద్ధతి ప్రకారం ఎల్–వన్‌గా ఉన్న ఆల్ఫా ఫుడ్స్ 65 శాతం సరఫరా కాంట్రా క్టును, ఎల్–టూగా ఉన్న నందినీ డెయిరీ వారు 35 శాతం సర ఫరా కాంట్రాక్టును దక్కించుకున్నారు.నందినీ డెయిరీ లోగోలోనే సంకర జాతి జెర్సీ ఆవు బొమ్మ ఉంటుందనీ, వాళ్లు సరఫరా చేసేది దేశీ ఆవు నెయ్యి కాదని స్వదేశీ గో ఉద్యమకారులు అభ్యంతరాలు చెబు తున్నారు. ఇది మరో చర్చనీయాంశం. ఇక ఎల్–వన్‌గా వున్న ఆల్ఫా ఫుడ్స్ డెయిరీ ప్లాంట్‌కు తిరుపతి సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇంత దూరాభారాన్ని మోస్తూ అక్కడినుంచి వాళ్లే సరఫరా చేస్తారా లేక అదే పేరుతో స్థానిక డెయిరీలు ఏవైనా ఆ పని చేస్తాయా, అనే చర్చ కూడా జరుగు తున్నది. ఆల్ఫా డెయిరీ అనేది అన్‌లిస్టెడ్ కంపెనీయే కనుక అదేమీ అసాధ్యమైన వ్యవహారం కాదు. ఇక్కడింకో విచిత్రమైన విషయం ఏమిటంటే నెయ్యి నాణ్యత మీద చంద్రబాబు ఆరోప ణలు చేసిన రోజున అంటే సెప్టెంబర్ 19న ఆయన కుటుంబ యాజమాన్యంలోని హెరిటేజ్ డెయిరీ షేర్ విలువ రూ. 565. సరిగ్గా వారం రోజుల్లో సెప్టెంబర్ 27 నాటికి అది రూ.635 దాటింది. మొత్తంగా చూస్తే వారం రోజుల్లో హెరిటేజ్ సంపద 600 కోట్లు పెరిగింది. ఇది యాదృచ్ఛికమేనా?ఇక డిక్లరేషన్ విషయానికొద్దాం. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన ఆధారాలు సుమారు 15 వందల ఏళ్ల క్రితం వరకూ చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. తిరు మలలో అన్యమతస్థులకు ప్రవేశం లేదనిగానీ, వారు డిక్లరేషన్ ఇస్తే తప్ప ప్రవేశించడానికి వీల్లేదని గానీ ఎన్నడూ లేదు. ఈ డిక్లరేషన్ వ్యవహారం 1987లోనే ప్రారంభమైంది. అన్యమత స్థులు శ్రీ వేంకటేశ్వరునిపై భక్తి విశ్వాసాలున్నాయని ప్రకటిస్తూ ఒక ఫామ్‌పై సంతకం చేసి వెళ్లవచ్చునని నిబంధనను తీసు కొచ్చారు. ఇదో అర్థం లేని నిబంధన. ఎవరైనా దేవుడిని ఎందుకు దర్శించుకుంటారు? ఆ దేవునిపై భక్తి విశ్వాసాలు ఉంటేనే కదా!తిరుమలేశుని దర్శనానికి రోజుకు సుమారు ఐదొందల నుంచి వెయ్యిమంది వరకు అన్యమతస్థులు వస్తుంటారని అంచనా. వారంతా అత్యంత భక్తి విశ్వాసాలతో తిరుమల దేవ స్థానం నిర్ణయించిన సంప్రదాయ డ్రెస్ కోడ్‌ను పాటిస్తూ దర్శనం చేసుకుంటారు. అంతే తప్ప రోజుకు ఒక్క డిక్లరేషన్ కూడా రాదు. డ్రెస్ కోడ్‌ను పాటించినంతవరకు దేవస్థానం సిబ్బంది కూడా ఎవరినీ డిక్లరేషన్ అడగదు.గత రెండు రోజులుగా బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి చేస్తున్న హడావిడి విచిత్రంగా ఉన్నది. స్వామివారి వెండి వాకిలి చెంతనున్న బీబీ నాంచారమ్మ మూర్తిని కూడా రోజుకోసారి డిక్లరేషన్ ఇవ్వాలని ఈ సరికొత్త హిందూ భక్తులు డిమాండ్ చేస్తారేమోనన్న అనుమానం కూడా వస్తు్తన్నది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు మాజీ ముఖ్యమంత్రి. ఆ హోదాలో ఐదేళ్ల పాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు కూడా ఆరేడుసార్లు స్వామి దర్శనం చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా దర్శించుకున్నారు. ఆయన చరిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించడానికి ముందూ, ముగించిన తర్వాత కూడా కాలినడకన వెళ్లి వేంకటనాథుని దర్శనం చేసుకున్నారు.ఇంతకంటే విశ్వాస ప్రకటన ఇంకేముంటుంది? కాగితం మీద రాసి సంతకం పెట్టి తీరాలనడం వితండవాదం కాక మరేమిటి? ఈ దేశంలో మరే ఆలయంలోనైనా, మసీదులోనైనా, చర్చిలోనైనా, గురుద్వారాలోనైనా ఇటువంటి పట్టింపులు న్నాయా? మతం పేరుతో చేసే ఈ రకమైన పిడివాదనలను నూటా ముప్పయ్యేళ్ల కిందనే స్వామి వివేకానందుడు ఈసడించుకున్నారు. మతం అనేది పుస్తకాల్లో, ఉపన్యాసాల్లో, సంస్థలు పెట్టుకొనే నిబంధనల్లో ఉండదు. అది ఆత్మకూ పరమాత్మకూ మధ్యన ఉండే సంబంధమని లండన్ (1895)లో వివేకానందుడు ప్రకటించారు. షికాగోలో జరిగిన విశ్వవ్యాప్త సర్వమత సమ్మేళనంలో హైందవ విశిష్టతను విజయ పతాకంగా ఎగరేసి ప్రశంసలందుకున్న వివేకానందుని కంటే గొప్ప హిందువులా ఈ నడమంత్రపు నామాలవారు?సహనం హిందూమతపు సహజ భూషణమని ఆయన ప్రకటించారు. సర్వమత సహనాన్ని పాటిస్తాం. అన్ని మతాలు సత్యమైనవనే నమ్ముతాం. ఎక్కడెక్కడో పుట్టిన నదులన్నీ సము ద్రంలో చేరినట్టే, అన్ని రకాల ఆరాధనా మార్గాలూ ఆ సర్వే శ్వరుడినే చేరుతాయి. ఇది హిందూమత సారమని వివేకానందుడు ప్రకటించారు. ఏది ఆ స్ఫూర్తి? అటువంటి సహనం నిన్న మొన్నటి వీరాలాపాల్లో కనిపించలేదే? కాషాయ వస్త్రాలు ధరించినవారు కూడా కళ్లెర్రజేసి పళ్లు కొరకడం సమంజసమేనా? హైందవాన్ని అర్థం చేసుకున్నవారేనా వీరు? లేక రాజకీయం కోసం, పబ్బం గడుపుకోవడం కోసం మతం రంగు పులుము కున్న పౌండ్రక వాసుదేవులా?బీజేపీ సంగతి జగమెరిగిన సత్యమే. ఆ పార్టీ మనుగడకు హిందూమత భావోద్వేగాలే ఆలంబన. ఆర్థిక వృద్ధి, పారిశ్రా మికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి కబుర్లన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దాని పలుకుబడికి ప్రమాదం ముంచుకొస్తున్నది. అందుకోసం కొత్త స్థావరాలు కావాలి. హిందూ ఎజెండా ఎత్తడానికి అవకాశం దొరికితే అది ఊరుకుంటుందా? ఆంధ్రలో వారి భాగస్వామి చంద్రబాబు ఆ ఎజెండా వారి మెడలో వేశారు. తిరుమలలో జగన్మోహన్రెడ్డిని అడ్డుకుంటామంటూ తెలంగాణ నుంచి కూడా ఆ పార్టీ అను యాయులు తరలివెళ్లారు.కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ ఈమధ్య కాషాయ పార్టీ కంటే ఘాటుగా హిందూ భావజాలాన్ని ప్రకటి స్తున్నారు. ఈ సందర్భాన్ని కూడా ఆయన బాగానే ఉపయోగించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కిందకు ఆలయాల పరిపాలనను తీసుకురావాలనే డిమాండ్ కూడా చేశారు. ఇది ఎప్పట్నుంచో ఆరెస్సెస్ పరివారం చేస్తున్న డిమాండే! ఆలయాల నియంత్రణ మొత్తం కేంద్రం కనుసన్నల్లోకి రావాలనేది వారి సంకల్పం. జమిలి ఎన్నికల ఉద్దేశం కూడా అదే! రాష్ట్రాల స్థాయిని తగ్గించి కేంద్రీకృత అధికారాన్ని పాదుకొల్పడం వారి ఎజెండా. అందుకోసం ఈ దేశంలోని బహుళత్వాన్నీ, భిన్నసంప్రదాయాలనూ కొనసాగించడానికి, గౌరవించడానికి వారు ఇష్టపడరు.ఇక చంద్రబాబు ప్రస్తుతం ఏడుకొండలవాడే దిక్కనే పరి స్థితుల్లో ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క అడుగూ ముందుకుపడలేదు. వార్షిక బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టలేని ఏకైక రాష్ట్ర పాలకుడుగా ఇప్పటికే అపఖ్యాతి పాల య్యారు. వరదల నియంత్రణ కోసం పాటించవలసిన కనీస పాలనా పద్ధతులను కూడా పాటించలేక విజయవాడ మునకకు కారణమయ్యారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణలను అటకెక్కించారు. గ్రామ స్వరా జ్యానికి తూట్లు పొడిచారు. నాలుగు నెలలు నిండకముందే జనంలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డూపై ఒక కల్పిత కథను సృష్టించారు. దాని చుట్టూనే రాజకీయాలు తిప్పి గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంచుకున్న మార్గం చాలా ప్రమాద కరమైనది. భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వంకర బుద్ధులు మారవా?
ఏదో వంకన కులమతాల కుంపట్లు రాజేసే పనికి పాల్పడవద్దని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన హితవు కూడా ప్రభుత్వాల చెవికెక్కడంలేదు. ఇందుకు ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాల పోకడలు నిదర్శనం. కావడ్ యాత్ర సాగే పొడవునా ఆహారం, ఇతర తినుబండారాలు విక్రయించే వ్యాపారులు తమ పేర్లను తెలిపే బోర్డుల్ని ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం జారీ చేసిన హుకుంను మొన్న జూలైలో సుప్రీంకోర్టు నిలిపి వేయగా, దాన్ని వమ్ము చేస్తూ వేరే మార్గంలో అమలు చేయటానికి అక్కడి ప్రభుత్వం పూనుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. యూపీని చూసి మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు సైతం వాతలు పెట్టుకున్నాయి. అవి కూడా బీజేపీ ప్రభుత్వాలే. కానీ ఈ మాదిరి ధోరణులకు వ్యతిరేకమని చెప్పే కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సైతం ఈ ప్రయత్నమే చేయటం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఒక మంత్రి తెలిసీ తెలియక ఏదో అన్నారని కాంగ్రెస్ సంజాయిషీ చెబుతున్నా ఆత్మవిమర్శ చేసుకోవటం ఆ పార్టీ బాధ్యత. ఎవరూ కుల మతాలను ఎంచుకుని పుట్టరు. కానీ పుట్టకనుబట్టి వివక్ష ప్రదర్శించే దురాచారం మన దేశంలో రాజ్యాంగం నిషేధించినా కొనసాగుతూనేవుంది. దహనకాండకు దిగే వ్యక్తులను దుస్తుల్ని బట్టి పోల్చుకోవచ్చని అయిదేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ అన్నప్పుడు దుమారం రేగింది. అప్పటికి పౌరసత్వ సవరణ చట్టంపై కొనసాగుతున్న ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దుస్తులే కాదు... ఇంటిపేర్లూ, పేర్లూ, పేర్లచివరవుండే తోకలు, తినే తిండి కూడా సమ స్యాత్మకం కావటం వర్తమానంలో ఎక్కువైంది. దీన్నంతటినీ గమనించబట్టే యూపీ పోలీసుల ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఇలాంటి ఉత్తర్వులిచ్చే అధికారం పోలీసు విభాగానికిఉండదని చెబుతూనే తోపుడు బండ్లు, ధాబాలు, హోటళ్ల యజమానులు స్వచ్ఛందంగా తమ పేర్లు ప్రదర్శించదల్చుకుంటే అభ్యంతరంలేదని, అయితే బలవంతంగా ఆ పని చేయించరాదని సుప్రీంకోర్టు అప్పట్లో తెలిపింది. ఇప్పుడు ఏకంగా ఆహార భద్రత, ప్రమాణాల చట్టం సవరణ మాటున యూపీ సర్కారు దాన్ని అమలుచేయడానికి పూనుకుంటున్నది. ఆహారంలో కల్తీ జరగకుండా, అపరిశుభ్రత లేకుండా చూడటం తన ఉద్దేశమంటున్నది. హిమాచల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ సైతం ఆ బాణీనే వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల మతఘర్షణలు చెలరేగటం వెనక ఆహారపదార్థాల విక్రయానికి సంబంధించి బలమైన చట్టం లేకపోవటమే కారణమని ఆయనకు అనిపించిందట!యూపీఏకు ఆవును చేరిస్తే అది ఎన్డీయే అవుతుందని చాన్నాళ్లక్రితం ఎవరో చమత్కరించారు. తమ చాపకిందకు నీళ్లు రాబోతున్నాయని చివరాఖరులో అర్థమయ్యాక హిందూ ఓటు బ్యాంకును కాపాడుకోవటానికి ఆనాటి యూపీఏ సర్కారు వేసిన అనేక పిల్లిమొగ్గలు చూశాకే అలాంటి వ్యాఖ్యా నాలు వినబడ్డాయి. ఆ మన స్తత్వం పార్టీలో ఇంకా సజీవంగా ఉండటంవల్లే విక్రమాదిత్యసింగ్ ఇలా అన్నారా లేక సీఎం రేసులో భంగపడి కేబినెట్ పదవితో సరిపెట్టుకోవటం జీర్ణించుకోలేక వివాదా స్పదంగా మాట్లాడారా అన్నది ఆ పార్టీ తేల్చుకోవాలి. ఆహార విక్రయ దుకాణాల దగ్గర యజ మానుల పేర్లుండాలన్న అంశంలో కమిటీ వేశామని, ఇంతకుమించి ముందుకుపోలేదని కాంగ్రెస్ ప్రతినిధి ఇస్తున్న వివరణ సందేహాలను తగ్గించకపోగా పెంచింది. పార్టీకంటూ ఒక సిద్ధాంతం, విధానం ఉందా లేదా? యూపీ నిర్ణయాన్ని నిర్ణయాన్ని పార్టీ వ్యతిరేకించినప్పుడు వేరే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం సరిగ్గా అదే పనికి పూనుకోవటంలోని మతలబేమిటి? పేర్లు కాదు... వారి వారి గుర్తింపు కార్డులు ప్రదర్శించాలన్న ప్రతిపాదన వచ్చిందని మరో సంజాయిషీ. ఏమైతేనేం... మతంపేరిట విద్వేషాలు సృష్టించటమే అంతరార్థంగా కనబడుతోంది. దుకాణంలో విక్రయించే ఆహార పదార్థాలు పరిశుభ్రమైనవని, ప్రామాణికమైనవని విశ్వసిస్తేనే వాటిని జనం కొనుక్కుతింటారు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయటమే మన దేశంలో కనిపిస్తుంది. ఈ విషయంలో అవసరమైన చట్టాలున్నాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకునే విభాగాలు ఉంటున్నాయి. కానీ వాటిని పకడ్బందీగా అమలు చేయటానికి సిద్ధపడని ప్రభుత్వాలు ఆ వంకన విభజన రాజకీయాలకు తెరతీస్తున్నాయి. ప్రత్యర్థులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవికాని హామీలిచ్చి అధికారంలోకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అందరూ ఎంతో భక్తివిశ్వాసాలతో స్వీకరించే లడ్డూపై ఎలాంటి దుష్ప్రచారం చేసిందో దేశమంతా చూస్తూనే వుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ తెలివితక్కువ చర్యను స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనబడుతోంది. మనుషుల పేర్లనుబట్టి, వారి ఆహారపుటలవాట్లనుబట్టి వారి మతాలను తెలుసుకోవటం సులభ మవుతుందన్నది వాస్తవమే కావొచ్చు. కానీ వారు విక్రయించే పదార్థాలు సమస్తం కేవలం ఆ కారణంతో మంచివి, ప్రామాణికమైనవి లేదా అపరిశుభ్రమైనవి ఎలా అవుతాయో అనూహ్యం. విపరీత పోకడలున్నవారికి తప్ప ఇటువంటి ఆలోచనలు రావు. సొంతంగా ఎటూ ఉన్నతమైన ఆలోచనలు రావు. కనీసం రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే పాలించాల్సినవారు సర్వోన్నత న్యాయస్థానం హితవు చెప్పాకైనా మారాలికదా! వ్యక్తులుగా వక్రమార్గాలు వెదుక్కోవటం మానవ స్వభావమని సరిపెట్టుకోవచ్చు. రాజ్యం అటువంటి పనులకు పూనుకుంటే అంతిమంగా అరాచకానికి దారితీస్తుంది. కనుక మతిమాలిన చేష్టలను ఇకనైనా మానుకోవాలి. -
‘తక్షణ న్యాయం’ ప్రమాదకరం
సర్వోన్నత న్యాయస్థానంతో సహా దేశంలో వివిధ హైకోర్టులు అడపా దడపా అక్షింతలు వేస్తున్నా ఎన్కౌంటర్ల జాడ్యం పోయేలా లేదు. ఏ పార్టీ ఏలుబడి ఉందన్నదాంతో నిమిత్తం లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల తీరూ ఇదే. కనీసం స్క్రిప్టు మార్చడానికి కూడా పోలీసులు ప్రయత్నించరు. ముద్దాయిని/ముద్దాయిలను నేరస్థలానికి తీసుకెళ్లినప్పుడో, న్యాయస్థానంలో హాజరు పరచడానికి వెళ్తున్నప్పుడో హఠాత్తుగా తిరుగుబాటు చేసి పోలీసుల నుంచి తుపాకి గుంజుకుని కాల్చబోవటం, ఈలోగా పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడం వీటన్నిటి సారాంశం. పోలీసులకు స్వల్ప గాయాలు కావటం కూడా అన్నిచోట్లా డిటో. అక్షయ్ షిండే అనే నేరగాడిని మహారాష్ట్ర పోలీసులు హతమార్చిన తీరుపై బొంబాయి హైకోర్టు బుధవారం అనేక సందేహాలు వ్యక్తం చేసింది. వాహనంలో వెళ్తుండగా షిండే తిరగబడి పిస్తోల్ గుంజుకుని కాల్పులు జరిపే సమయంలో నలుగురు పోలీసులున్నా అతగాణ్ణి లొంగదీయలేకపోవటం ఏమిటని ప్రశ్నించింది. అసలు తుపాకులు, పిస్తోళ్లు ఉపయోగించటం తెలియని వ్యక్తి ఆయుధాన్ని అన్‌లాక్ చేసి కాల్పులు జరపటం ఎలా సాధ్యమని అడిగింది. ఈ ప్రశ్నలు సహేతుకమైనవి.బద్లాపూర్ స్కూల్ ఉదంతం ఘోరమైనది. గత నెల 13న ఒక పాఠశాలలోని మరుగుదొడ్డి వద్ద ఇద్దరు కిండర్‌గార్టెన్ పిల్లలపై నిందితుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ. ఘటనపై పిల్లల తల్లిదండ్రులకు తెలిసి ఫిర్యాదుచేస్తే ముద్దాయిని ఆగస్టు 17న అరెస్టు చేశారు. స్కూల్ యాజ మాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించాకగానీ ప్రిన్సిపాల్, సంస్థ చైర్మన్, కార్యదర్శిలపై పోక్సో కేసు పెట్టలేదు. ఆ స్కూల్ నిర్వహణ ఎంత ఘోరంగా ఉన్నదో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అసలు ఆడపిల్లలు ఉపయోగించే మరుగుదొడ్డి వద్ద మహిళను నియమించాలని కూడా వారికి తోచలేదు. వీటన్నిటినీ తనిఖీ చేయాల్సిన విద్యాశాఖ పట్టించుకోలేదు. ఇంతమంది నిర్లక్ష్యం ఫలితంగా ఇద్దరు చిన్నారులు బాధితులుగా మారాక మాత్రం కఠిన చర్య తీసుకున్నట్టు కనబడటం కోసం వక్రమార్గం అనుసరించారు. స్కూల్ నిర్వాహకులు బీజేపీకి కావలసినవారు గనుకే ఎన్కౌంటర్ నాటకం ఆడారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపణ. నిజానిజాల మాటెలా ఉన్నా ప్రభుత్వాధికారులు మెతగ్గా వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం. గత రెండు నెలల్లో మూడు ఎన్కౌంటర్లు జరిపి తమిళనాడు పోలీసులు ముగ్గురు నిందితులను హతమార్చారు. మావోయిస్టుల ప్రభావం అధికంగావున్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్లు జరగకపోతే వార్త. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఎన్కౌంటర్ల జోరు అధికమే. గత ఏడున్న రేళ్లలో యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 49 మందిని కాల్చిచంపారు. గత సోమవారమే మరొకరిని హతమార్చి అర్ధ సెంచరీ పూర్తి చేశారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఎన్కౌంటర్ మృతులంతా అమాయకులనీ, సచ్ఛీలురనీ ఎవరూ అనరు. ఎన్నో ఆరోపణలున్నవారే. కానీ నేర గాళ్లను శిక్షించటానికి ఒక విధానం ఏర్పర్చుకున్నప్పుడూ, దానికి అనుగుణంగా భిన్న వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడూ ఇష్టారాజ్యంగా కాల్చిచంపే అధికారం పోలీసులకెక్కడిది? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇలాంటి కేసులను విచారించినప్పుడల్లా న్యాయస్థానాలు నిశితంగా ప్రశ్నిస్తున్నాయి. కానీ ఎక్కడా ఇవి ఆగుతున్న దాఖలాలు లేవు. 2006లో ఇద్దరు నిందితులను నవీ ముంబైలో పట్టుకుని వారిలో ఒకరిని ఎన్కౌంటర్ చేసిన కేసులో 12 మంది పోలీసులకు కిందికోర్టు విధించిన యావజ్జీవ శిక్షను బొంబాయి హైకోర్టు ధ్రువీకరించటంతోపాటు కింది కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టిన ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’ ప్రదీప్ శర్మకు కూడా యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. న్యాయవాది అయిన ఎన్కౌంటర్ మృతుడి సోదరుడు అతను అరెస్టయ్యాక ఉన్నతాధికారులకూ, న్యాయస్థానానికీ టెలిగ్రామ్‌లు, ఫ్యాక్స్ మెసేజ్‌లు పంపటం, కాల్ రికార్డులు సేకరించటం పర్యవసానంగా ఇదంతా సాధ్యమైంది. కానీ ఎన్ని కేసుల్లో ఎందరు ఇలా చేయగలుగుతారు?ఎన్కౌంటర్లను వ్యతిరేకించే పౌరహక్కుల సంఘాల నేతలనూ, పౌర సమాజ కార్యకర్తలనూ నేరగాళ్లకు వత్తాసు పలుకుతున్నవారిగా ముద్రేయటం పాలకులకూ, పోలీసులకూ అలవాటు. కొన్ని సందర్భాల్లో ఎన్కౌంటర్లు సాగిస్తున్న పోలీసులను సమాజంలోని భిన్నవర్గాలవారు ప్రశంసించటం కూడా కనబడుతుంది. ‘తక్షణ న్యాయం’ కోరేవారికి ఇది సబబే అనిపించవచ్చు. కానీ ఈ క్రమంలో ప్రభుత్వాల బాధ్యతనూ, జవాబుదారీతనాన్నీ ఉపేక్షించటం లేదా? అసలు పోలీసు కాల్పుల్లో మరణించినవారే నిజమైన దోషులని ఏ ప్రాతిపదికన నమ్మాలి? ఈ ధోరణివల్ల అసలు దోషులు తప్పించుకునే ప్రమాదంతోపాటు మరిన్ని నేరాలు జరగటానికి ఆస్కారం ఉండదా? కోల్ కతాలోని పీజీ కర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఉదంతమే తీసుకుంటే సక్రమంగా దర్యాప్తు జరిగింది గనుకే మాఫియాల ఆధిపత్యం, వారి అండతో ఆసుపత్రి ఉన్నతాధి కారులు సాగిస్తున్న తప్పుడు పనులు బయటపడ్డాయి. నేరాలకు తావులేని వాతావరణం ఏర్పర్చటానికీ, వాటి నియంత్రణకు దోహదపడే చర్యలకూ బదులు నేరగాళ్లను హతమార్చే విధానం సమాజాన్ని బండబారుస్తుంది. అధికారులకు తాము ఏం చేసినా అడిగేవారు లేరన్న భరోసానిస్తుంది. కఠినమైన చట్టాలు, పకడ్బందీ దర్యాప్తు, న్యాయస్థానాల్లో చురుగ్గా విచారణ వంటివి మాత్రమే సమాజ భద్రతకు తోడ్పడతాయి. అది మరిచి ‘తక్షణ న్యాయం’ కోసం వెంపర్లాడటం సరికాదు. -
బాలలకు సుప్రీమ్ రక్షణ!
భారత సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. మద్రాస్ హైకోర్ట్ గతంలో చేసిన తప్పును సరిదిద్దింది. బాలలపై లైంగిక అకృత్య, అశ్లీల దృశ్యాల వీడియోలను డౌన్ లోడ్ చేసినా, కలిగివున్నా, చివరకు చూసినా, సదరు అంశాలపై నిర్ణీత అధికారులకు ఫిర్యాదు చేయకున్నా కూడా పోక్సో, ఐటీ చట్టాల కింద నేరమేనని కుండబద్దలు కొట్టింది. దాదాపు 200 పేజీల తాజా తీర్పుతో బాలలపై లైంగిక అత్యాచారాలను నిరోధించేలా ‘లైంగిక అకృత్యాల నుంచి బాలలకు రక్షణ’ (పోక్సో) చట్టానికి పదును పెట్టింది. పసిపాపల నుంచి ఎదిగిన మైనర్ల వరకు బాలలందరి పైనా దేశంలో అంతకంతకూ అఘాయిత్యాలు పెరుగుతున్న వేళ రానున్న రోజుల్లో ఈ తీర్పు బలమైన ప్రభావం చూపనుంది. ఇంటా బయటా ప్రతిచోటా కామాంధుల బెడద పెచ్చరిల్లిన సమయంలో ఈ సుప్రీమ్ తీర్పు భారతదేశంలోని బాలబాలికలకు భారీ ఊరట, బలమైన అండ. తాజా సుప్రీమ్ కోర్ట్ ఆదేశంతో చైల్డ్ పోర్నోగ్రఫీ సమాచారాన్ని ‘కలిగి ఉండడం’ అనే పదం తాలూకు నిర్వచన పరిధి పెరిగింది. అలాంటి దృశ్యాలను డౌన్లోడ్ చేయకున్నా, పరికరంలో పదిలపరుచుకోకపోయినా... కేవలం చూసినా సరే ఇప్పుడది పోక్సోలోని సెక్షన్ 15 కింద నేరమే అవుతుంది. ఇది కేవలం సాంకేతికపరమైన అంశం కానే కాదు... తీవ్రమైన నేరం. నిజానికి, చైల్డ్ పోర్న్ దృశ్యాల తయారీ, పంపిణీయే నేరమనీ, ఎలక్ట్రానిక్ పరికరాల్లో డౌన్లోడ్ చేసి ప్రైవేటుగా చూసినంత మాత్రాన అది నేరం కిందకు రాదనీ ఆ మధ్య మద్రాస్ హైకోర్ట్ తీర్పునిచ్చింది. మొబైల్లో డౌన్లోడ్ చేసి చూసిన ఓ చెన్నై కుర్రాడిపై నేర విచారణను జనవరి 11న రద్దు చేసింది. దీని వల్ల బాలల సంక్షేమంపై దుష్ప్రభావం పడుతుందని తప్పుబడుతూ వివిధ స్వచ్ఛంద సంస్థల సమాహారమైన ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ సుప్రీమ్ గడప తొక్కింది. సింగిల్ జడ్జి ఇచ్చిన సదరు తీర్పు ‘ఘోరమైనది’ అంటూ మార్చిలోనే సుప్రీమ్ తప్పుబట్టింది. మద్రాస్ హైకోర్ట్ తీర్పు ‘అసాధారణ∙తప్పు’ అని సుప్రీమ్ తన తాజా ఆదేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం.సుప్రీమ్ తన తాజా ఆదేశంతో ఆ పాత మద్రాస్ హైకోర్ట్ తీర్పును తోసిపుచ్చినట్టయింది. అదే సమయంలో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ అనే పదం నేరాన్ని తేలిక చేస్తున్నట్టు ఉందని భావించింది. ఆ పదాన్ని పరిహరించి, దాని బదులు ‘బాలలపై లైంగిక అకృత్యాలు, దాడుల సమాచారం’ (సీఎస్ఈ ఏఎమ్) అనే పదాన్ని సంబంధిత చట్టాలన్నిటిలో వాడేలా పార్లమెంట్ ఆర్డినెన్స్ తీసుకురావాలని అభ్యర్థించడం విశేషం. ఇకపై న్యాయస్థానాలన్నీ తమ ఆదేశాలు, తీర్పుల్లో ఈ పదాన్నే వాడాలని కూడా సుప్రీమ్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, మరో న్యాయమూర్తి జస్టిస్ పార్దీవాలాలతో కూడిన సుప్రీమ్ ధర్మాసనం ఇచ్చిన ఆదేశం, చేసిన అభ్యర్థన ఆలోచించదగినది, స్వాగతించవలసినది. గమనిస్తే, సమస్యంతా చట్టాలలోని అంశాలకు కొన్ని కోర్టులు సంకుచిత అంతరార్థాలు తీయడంతో వస్తోంది. మద్రాస్ హైకోర్ట్‌లోనూ జరిగింది అదే. తద్వారా బాలలపై సైబర్ నేరాలకు పాల్పడినవారిని శిక్షించడానికి ఉద్దేశించిన చట్టాల ప్రయోజనమే దెబ్బతింటోంది. అందుకే, ఈ విషయంలో కోర్టులు జాగరూకతతో ఉండాలని సుప్రీమ్ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. గణాంకాలు గమనిస్తే, దేశంలో బాలలపై అకృత్యాలు అంతకంతకూ అధికమవుతున్నాయి. ఒక్క 2022లోనే వాటి సంఖ్య 8.7 శాతం పెరిగింది. అలాంటి ఘటనలు 1.68 లక్షలకు చేరినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) మాట. పసివారిపై అఘాయిత్యాలు జరిగినప్పటికీ భయం, సమాజంలో పడే కళంకం, అవగాహన లేమితో ఇంకా అనేక కేసులు వెలుగులోకి రావట్లేదు. పైగా, ఇంట్లో అయినవాళ్ళు, బడిలో ఉద్యోగులు సైతం సాగిస్తున్న ఈ అమానుషాలు పిల్లల మనసులపై జీవితాంతం ప్రభావం చూపుతున్నాయి. పెరిగి పెద్దయినా సరే వారిని ఆ చేదు అనుభవాల నుంచి మానసికంగా బయట పడనీయకుండా చేస్తున్నాయి. వీటన్నిటినీ అరికట్టడానికే 2012లోనే పోక్సో లాంటి కఠినచట్టాలు వచ్చాయి. అయినా, బాలలపై అత్యాచారాలు ఆగక పోవడం విషాదం. సదరు కేసులు పెరుగుతున్నందున ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలంటూ అయిదేళ్ళ క్రితమే సుప్రీమ్ ఆదేశించింది. అయితే, రెగ్యులర్ కోర్ట్లకే జడ్జీలు కరవైన పరిస్థితుల్లో ఇక ఈ ఫాస్ట్ట్రాక్ల కథేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. దానికి తోడు చట్టంలోని కఠిన అంశాలకు ఒక్కో హైకోర్ట్ ఒక్కో రకం అర్థం చెబుతూ, వ్యాఖ్యానం చెప్పడం పెను సమస్యయి కూర్చుంది. తాజా తీర్పుతో ఆ పరిస్థితులు కొంతవరకు మారతాయని ఆశించాలి. చట్టాన్ని అతిక్రమిస్తున్న వారికి మేలుకొలుపు. అదే సమయంలో అది అందరికీ స్పష్టమైన సందేశం ఇస్తోంది. అదేమిటంటే – బాలల భద్రత అతి ముఖ్యమైనది! వారి భద్రత కోసమే కోర్టు చట్టానికి మరింత కఠినమైన, కట్టుదిట్టమైన వ్యాఖ్యానం అందించింది. ఇక యూ ట్యూబ్ – గూగుల్ లాంటి వేదికలు, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు, నిత్యం ఇంటర్నెట్ వాడేవారు అప్రమత్తంగా ఉండక తప్పదు. అలాంటి కంటెంట్‌ను తక్షణం తొలగించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడమే మార్గం. అదే సమయంలో విద్యాలయాల్లో లైంగిక విజ్ఞానాన్ని సమగ్రంగా బోధించి, పిల్లల్లో అవగాహన కల్పించాలంటూ ప్రభుత్వానికి సుప్రీమ్ చేసిన సూచన విలువైనది. బిడియపడకుండా తల్లితండ్రులు, గురువులు పిల్ల లకు విషయాలను వివరించడం మేలు. శారీరకంగా, సామా జికంగా, చట్టపరంగా అవగాహన పెరి గితే అకృత్యాల్ని అడ్డుకోవడం సులభమవుతుంది. ఇలాంటి కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న సంకేతం సుప్రీమ్ తాజా తీర్పు అందించడం అన్ని విధాలా ఆహ్వానించదగ్గ పరిణామం. -
ఇది స్వర్ణయుగం
ప్రతి రంగంలో కొన్ని చరిత్రాత్మక క్షణాలు ఉంటాయి. చదరంగంలో మన దేశానికిప్పుడు అలాంటి క్షణాలే. బుడాపెస్ట్‌లో ముగిసిన 45వ చెస్ ఒలింపియాడ్ భారతీయ చదరంగంలోనే కాదు... యావత్ భారత క్రీడారంగ చరిత్రలోనే చిరస్మరణీయం. మన ఆటగాళ్ళు తొలిసారిగా అటు ఓపెన్, ఇటు మహిళల కేటగిరీల్లో బంగారు పతకాలు సాధించి, దేశానికి మరువలేని కానుక ఇచ్చారు. చైనా, సోవియట్ రష్యా తర్వాత చెస్ ఒలింపియాడ్‌లో ఒకే ఏడాది ఇలా రెండు విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచిన మూడో దేశం మనదే. అలాగే, గుకేశ్, అర్జున్, దివ్య, వంతికల 4 వ్యక్తిగత స్వర్ణాలతో టోర్నీలో భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని చాటింది. విశ్వనాథన్ ఆనందన్ బాటలో నడిచిన ఆయన శిష్యబృందం దేశాన్ని సమున్నతంగా నిలిపింది. కేవలం పదేళ్ళ క్రితం ఆశ్చర్యకరంగా కాంస్యం గెలిచి ఒలింపియాడ్‌లో బోణీ కొట్టిన దేశం, గడచిన 2022లో రెండు విభాగాల్లోనూ కాంస్యాలకే పరిమితమైన దేశం ఇవాళ ఈ స్థాయికి ఎదగడం అసామాన్యం. ఒక్కమాటలో నిన్న మొన్నటి దాకా చెస్‌లో సాగిన యూరోపియన్ ప్రపంచ ఆధిపత్యానికి తెరపడింది. ఆటకు భవిష్యత్ చిరునామాగా భారత్ ఆవిర్భవించింది. చదరంగంలో అక్షరాలా మన స్వర్ణయుగం ఆరంభమైంది. ఒలింపిక్స్ పోటీల్లో స్థానం లేని చెస్‌కు సంబంధించినంత వరకు ఈ చెస్ ఒలింపియాడే... ఒలింపిక్స్. అలాంటి అత్యున్నత స్థాయి పోటీల్లో... 193 దేశాలకు చెందిన అంతర్జాతీయ జట్లు పాల్గొన్న ఓపెన్ విభాగంలో, 181 దేశాలు పోటీపడ్డ మహిళా విభాగంలో మన జట్లు స్వర్ణాలు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతి దేశం నుంచి అయిదుగురు అగ్రశ్రేణి క్రీడాకారుల జట్లు ఆ యా విభాగాల్లో పోటీ పడతాయి. అలాంటి చోట ఓపెన్ విభాగంలో తొమ్మిదో రౌండ్లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన ఆటను డ్రా చేయడం తప్ప, మొత్తం 11 రౌండ్లకు గాను 10 రౌండ్లు మన భారత జట్టు గెలిచింది. టైటిల్ విజేతగా నిలిచింది. అంతేకాక 21 పాయింట్ల రికార్డ్ స్కోర్ సాధించి, రెండోస్థానంలో నిలిచిన 17 పాయింట్ల అమెరికా కన్నా చాలా పైన మనం నిలవడం విశేషం. మహిళా విభాగంలోనూ మొత్తం 11 రౌండ్లలో, ఒక్క 8వ రౌండ్లో పోలండ్‌తోనే మన జట్టు ఓడింది. అమెరికాతో ఆటను డ్రా చేసి, మొత్తం 19 పాయింట్లు సాధించి, స్వర్ణం సాధించింది. కనివిని ఎరుగని ఈ జంట విజయాల కారణంగానే ఇవాళ మన క్రీడా ప్రపంచం సంబరాలు చేసుకుంటోంది.మొత్తం మీద భారతీయుల ఆటగా పేరొందిన చదరంగంలో ఇప్పుడు మళ్ళీ పుట్టినింటికి పూర్వ వైభవం వచ్చింది. ఈ ఒలింపియాడ్ విజయాలు దేశవ్యాప్తంగా మన యువతరంలో దాగిన చదరంగ ప్రతిభాపాటవాలకు అద్దం పడుతున్నాయి. గుకేశ్ దొమ్మరాజు లాంటి మన ఆటగాళ్ళు కొందరు వ్యక్తిగత స్వర్ణాలు సైతం సాధించడం అందుకు నిదర్శనం. ఒకప్పుడు విశ్వనాథన్ ఆనంద్ లాంటి కొందరి పేర్లే వినిపించిన దేశంలో ఇటీవల దాదాపు 85 మంది గ్రాండ్ మాస్టర్లు ఉద్భవించారు. వారిలో పలువురు 20వ పడిలో వారే. అయిదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియనైన మ్యాగ్నస్ కార్ల్సెన్ను పలుమార్లు ఓడించిన ప్రజ్ఞానంద లాంటి టీనేజ్ వండర్లు మనకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణిలో నిలిచిన అర్జున్ ఇరిగైసి, విదిత్ గుజరాతీ, హరికృష్ణ తదితరులు మన పురుషుల జట్టులో ఉన్నారు. అలాగే, అనుభవమున్న కోనేరు హంపి జట్టులో లేకున్నా, ఒకట్రెండు తడబాట్లు ఎదురైనా సరే పట్టువదలక పోరాడి, ఒలింపియాడ్ విజయం సాధించిన ఆడపిల్లల జట్టు ఈ రోజున మనకుంది. అంతకంతకూ పెరుగుతున్న మన బలానికీ, బలగానికీ అది గీటురాయి. పోగుబడ్డ ప్రతిభావంతులకు నిరంతర సాధన, నిరుపమానమైన టీమ్ స్పిరిట్ కూడా తోడై తాజా అందలాన్ని ఎక్కించాయి. అదే సమయంలో మన ప్రస్తుత విజయ పరంపరకు స్ఫూర్తి... ప్రజ్ఞానంద, గుకేశ్ లాంటి పలువురికి చేయూతనిచ్చిన దీప్తి... శిక్షణకు ఎంతో ఖర్చయ్యే ఈ ఆటలో వర్ధిష్ణువులెందరికో స్పాన్సర్‌షిప్‌లు దక్కేలా తోడ్పడ్డ తెర వెనుక దీప్తి... 15వ వరల్డ్ చెస్ ఛాంపియనైన విశ్వనాథన్ ఆనంద్ అని మర్చిపోలేం. ప్రతిభ గల పిల్లల్ని తీర్చిదిద్దడానికి వీలుగా ఒక వాతావరణాన్నీ, వ్యవస్థనూ కల్పించిన ఆలిండియా చెస్ ఫెడరేషన్ కృషినీ చెప్పుకొని తీరాలి. పెరిగిన సోషల్ మీడియా, హద్దులు లేని డిజిటల్ వ్యాప్తి సైతం మన యువతరాన్ని చెస్ వైపు ఆకర్షించిందీ నిజమే. భారతీయ స్ట్రీమింగ్ వేదికల్లో బాగా పాపులరైన చెస్‌బేస్ ఇండియాకు దాదాపు 19 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నారు. ఆ వేదిక వివిధ టోర్నీల నిర్వహణతో పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పలువురు ఆటగాళ్ళకు ఆర్థికంగా అండగా నిలవడం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడీ ఒలింపియాడ్ డబుల్ ధమాకా స్వర్ణాలు చెస్ ప్రాచుర్యంతో పాటు పిల్లల్లో ఆసక్తి పెంచడం ఖాయం. భారత చదరంగానికి ఇది శుభతరుణం. త్వరలో జరిగే వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రస్తుత చైనీస్ ఛాంపియన్‌తో 18 ఏళ్ళ మన గుకేశ్ పోరు కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఉన్నవారు కాక, కనీసం మరో అరడజను మంది ఒలింపియాడ్‌లో స్థానం కోసం పోటీపడుతున్న స్థాయికి చేరాం. అయితే, ఇది చాలదు. ఆడపిల్లల్లో మన చెస్ బలగం ఇంకా పెరగాల్సి ఉంది. ఇదే అదనుగా కేంద్రం, రాష్ట్రాలు మరింత ప్రోత్సాహం అందించాలి. పాఠశాలల స్థాయి నుంచే చెస్ పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచాలి. బడుల్లోనే కాక గ్రంథాలయాల్లో, స్థానిక పట్టణ కేంద్రాల్లోనూ చెస్‌కు వసతులు కల్పించాలి. అలాగే మన దేశంలోనూ అగ్రశ్రేణి టోర్నీలు జరిగేలా చూడాలి. చెన్నై ఇవాళ చదరంగ ప్రతిభకు కేంద్రంగా మారిందంటే తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన చేయూత కారణం. అందరికీ అది ఆదర్శప్రాయం. స్వర్ణయుగం సుదీర్ఘంగా కొనసాగాలంటే ఇలాంటి చర్యలే కీలకం. -
సంక్షోభ లంకపై నెలవంక!
దాదాపు రెండున్నరేళ్లక్రితం విదేశీ రుణాల చెల్లింపులు అసాధ్యమై దివాలా తీసింది మొదలు వరస సంక్షోభాలను చవిచూస్తున్న శ్రీలంకలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నూతన అధ్యక్షుడిగా సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించిన అనూర కుమార దిస్సనాయకే వర్తమాన సంక్షోభ పరంపర నుంచి దేశాన్ని గట్టెక్కిస్తారన్న ఆశలు జనంలో దండిగానే ఉన్నాయి. కనుకనే వారసులవైపే మొగ్గే అలవాటున్న ప్రజానీకం ఈసారి మార్క్సిస్టు అయిన దిస్సనాయకేను ఎంపిక చేసుకున్నారు. 2022లో నిత్యావసరాల కొరత, అధిక ధరలు, పన్నుల మోతతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిపై ఆగ్రహోదగ్రులైన ప్రజలు అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై దాడిచేయటం, నాటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన పరివారం దేశం విడిచి పరారుకావటం ప్రపంచాన్ని దిగ్భ్రమపరి చాయి. అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మూడేళ్లలోపే రాజపక్సకు ఈ దుర్గతి పట్టింది. అందుకే దిస్సనాయకే అత్యంత జాగరూకతతో పాలన సాగించి దేశాన్ని ఒడ్డున పడేయాల్సి వుంటుంది. గతంలో ఎంపీగా, మంత్రిగా పనిచేసి ఉండొచ్చుగానీ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న దేశానికి సారథ్యం స్వీకరించటం సామాన్యం కాదు. రనిల్ విక్రమసింఘే ప్రభుత్వం పెను ఆర్థిక విపత్తు నుంచి గట్టెక్కడానికి ఐఎంఎఫ్‌ను ఆశ్రయించినప్పుడు 290 కోట్ల డాలర్ల రుణం మంజూరుచేస్తూ కఠినమైన షరతులు పెట్టింది. పర్యవసానంగా పొదుపు చర్యల పేరుతో జీతాలు, పెన్షన్లు కోత పడ్డాయి. సంక్షేమ పథకాలు అటకెక్కాయి. ప్రజలు అర్ధాకలితో వెళ్లదీస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకుడిగా భావసారూప్య పార్టీలతో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పేరిట కూటమి ఏర్పరిచి ఘనవిజయం సాధించటం దిస్సనాయకే ఘనత. గత ఎన్నికల్లో కేవలం నాలుగు శాతం ఓట్లతో, పార్లమెంటులో మూడంటే మూడే స్థానాలు గెల్చుకున్న పార్టీ ఈ స్థాయిలో దూసుకురావటం అసాధారణం. కోతలను సరళం చేస్తామన్న ఎన్పీపీ హామీ వోటర్లను విశేషంగా ఆకట్టుకుంది. దానికి తోడు సంప్రదాయపక్షాలు, అవి ఇచ్చే అబద్ధపు హామీలతో జనం విసిగిపోయారు. అందుకే కావొచ్చు... ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని దిస్సనాయకే అన్నారు. 2022 నాటి ‘అరగల్య’ (పోరాటం) ఉద్యమంలో జనం సమీకృతులు కావటం వెనక వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తితో పాటు జేవీపీ తెర వెనక కృషి కూడా ఉంది. జనాగ్రహాన్ని నిర్మాణాత్మకంగా మలచటంలో, అరాచకం ప్రబలకుండా చూడటంలో ఆ పార్టీ విజయం సాధించింది. అందుకే ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాల వంటివి అక్కడ జరగలేదు. బంగ్లాలో ఇస్లామిక్ తీవ్రవాదుల ఆధిపత్యం పెరగటం, బురఖా ధరించని మహిళలను బహిరంగ ప్రదేశాల్లో కొట్టి హింసించటం పరిపాటైంది. అంతేగాదు... దేశావిర్భావానికి మూల కారణమైన భాష, ప్రాంతం వంటి అస్తిత్వ అంశాలు సైతం బుట్టదాఖలా అవుతున్నాయి. ఆ పరిస్థితి లంకలో తలెత్తకపోవటం, సంక్షోభంలో సైతం రనిల్ ప్రభుత్వం సజావుగా సాగటంలో జేవీపీ పాత్ర కాదనలేనిది.అయితే జేవీపీ చరిత్రలో నెత్తుటి అధ్యాయాలు తక్కువేం కాదు. దాదాపు అరవైయ్యేళ్ల క్రితం ఆవిర్భవించి 70, 80 దశకాల్లో దేశంలో హింసాకాండను ప్రేరేపించిన జేవీపీని తుడిచిపెట్టడానికి ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. మార్క్సిజాన్ని అనుసరిస్తున్నామని మావో, హోచి మిన్, చేగువేరా తమకు ఆదర్శమంటూనే సింహళ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి వేలాదిమంది లంక తమిళులను ఊచకోత కోయటం, వారికి అనుకూలంగా మాట్లాడే వందలాదిమందిని హత మార్చటం జేవీపీ చరిత్రలో మాయని మచ్చ. తమ వైఖరిని వ్యతిరేకించే పాత్రికేయులను సైతం ఆ పార్టీ కాల్చి చంపింది. ప్రేమదాస హయాంలో ఉత్తర తూర్పు ప్రాంతంలో తమిళ టైగర్లనూ, ఉత్తరాన జేవీపీ మిలిటెంట్లనూ ఆయన ప్రభుత్వం అణిచేసింది. పొలిట్ బ్యూరోలో ఒక సభ్యుడు మినహా జేవీపీ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసింది. అయితే కనుమరుగైందనుకున్న జేవీపీ క్రమేపీ మళ్లీ బలం పుంజుకున్నా ఎప్పటిలాగే దాన్ని అంతర్గత సంక్షోభాలు చుట్టుముట్టాయి. చివరకు పార్లమెంటరీ పంథాకు మెజారిటీ వర్గం మొగ్గుచూపి భారత–శ్రీలంక సైనిక ఒప్పందాన్ని వ్యతిరేకించిన చంద్రికా కుమారతుంగకు మద్దతునిచ్చింది. ఆమె ప్రభుత్వంలో భాగస్వామి అయింది.చుట్టూతా ఒక్కో దేశమే చైనా ప్రభావంలో పడి భారత వ్యతిరేక రాగం అందుకుంటున్న వర్త మానంలో దిస్సనాయకే గెలుపు మన ప్రభుత్వానికి ఒక రకంగా సమస్యాత్మకమే. మైనారిటీలుగా ఉన్న లంక తమిళులకు స్వయంపాలన ఇచ్చే 13వ రాజ్యాంగ సవరణను అమలు చేయాలని మన దేశం చాన్నాళ్లుగా కోరుతోంది. కానీ రాజపక్స దాన్ని బేఖాతరు చేశారు. దిస్సనాయకే వైఖరి సైతం అదే. అదానీల 450 మెగావాట్ల పవన విద్యుత్ కాంట్రాక్టును రద్దు చేస్తామని ఎన్నికల సభల్లో ఆయన చెప్పాడు. దానికితోడు భావజాలం రీత్యా చైనాకు సన్నిహితుడు. ఆ దేశం ఇచ్చిన అప్పులే దేశాన్ని సంక్షోభంలోకి నెట్టాయని దిస్సనాయకేకు తెలియంది కాదు. 2022 సంక్షోభం అనంతరం మన దేశం లంకకు 400 కోట్ల డాలర్ల అత్యవసర రుణం మంజూరు చేయటంతోపాటు ఐఎంఎఫ్ రుణం రావటంలో కీలకపాత్ర పోషించింది. పదునైన దౌత్యం పరమ శత్రువులను సైతం గెల్చుకోగలదు. మొదట్లో తీవ్ర స్థాయి భారత వ్యతిరేక వైఖరి తీసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమద్ మియిజూ ఇందుకు ఉదాహరణ. అందువల్ల అసాధ్యం కానిదేదీ లేదు. ఇంతవరకూ దిస్సనాయకే ఎత్తుగడలు గమనిస్తే ఆయన సవ్యంగా అడుగులు వేస్తారని అంచనా వేయొచ్చు. -
చర్చ కాదు, రచ్చ
మాట్లాడగలగడం, మేధ వికసించడం మానవ చరిత్రలో మహత్తర ఘట్టాలంటారు శాస్త్రవేత్తలు. అవి లేకపోతే మనిషి మనుగడా, ఆ మనుగడతో పెనవేసుకున్న ప్రపంచమూ ఇప్పటిలా ఉండేవే కావు. మేధ జ్ఞానాన్ని పెంపొందిస్తే, దానిని నలుగురికీ పంచేది మాటే. మాట నేర్చిన తొలిరోజుల్లో దాని ప్రభావానికి ఆశ్చర్య చకితుడైన మనిషి దానికి మహత్తును ఆపాదించి మంత్రంగా మార్చు కున్నాడు. నిత్య జీవనంలో దాని లౌకికమైన విలువనూ గుర్తించాడు. ఒంటరి మనిషిలో స్వగతంగా ఉన్న మాట, మరో మనిషి జత కాగానే సంభాషణ అయింది; మరికొందరు జత పడితే చర్చ అయింది; శ్రోతలు పెరిగిన కొద్దీ ప్రసంగమైంది. వీటిలో ప్రతి ఒక్కటీ జ్ఞానవ్యాప్తికి వాహిక అయింది. చర్చనే వాద, ప్రతివాదమనీ; సంవాదమనీ; ఆంగ్లంలో డిబేట్, డిస్కషన్ అనీ అంటున్నాం. చర్చలేని సందర్భం మానవ జీవితంలో ఉండనే ఉండదు. కుటుంబ స్థాయి నుంచి, దేశస్థాయి వరకూ నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. చర్చకు వస్తువు కాని విషయమూ ఉండదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే మానవ ప్రపంచం చర్చ చుట్టూ తిరుగుతుంది. దేనినైనా సరే చర్చించే అభ్యాసం మనకు కొత్తది కాదంటూ నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ‘ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’(సంవాద భారతీయుడు) అనే పుస్తకమే రాశాడు. రామాయణ, మహాభారతాల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో చర్చలూ, వాదప్రతివాదాలూ ఎలా సాగాయో ఎత్తిచూపాడు. హెచ్చు, తగ్గుల సమాజంలో కిందిమెట్టు మీద ఉన్న స్త్రీ, పురుషవర్గాల గొంతుకూ మన సంవాద సంప్రదాయం ఎంతోకొంత చోటిచ్చిందన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్ళు చర్చలోనే పాతుకున్నాయంటూ, ప్రత్యేకించి మన దేశంలోని రకరకాల అసమానతలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోడానికి మనదైన సంవాద సంప్రదాయం స్ఫూర్తినిస్తుందన్నాడు. రామాయణంలో రాముడికి పట్టాభిషేక నిర్ణయాన్ని దశరథుడు అందిరినీ సంప్రదించే తీసుకుంటాడు. జాబాలికి, రాముడికి జరిగిన సంవాదం మరో ఉదాహరణ. పరలోకం లేదనీ, పితృవాక్పాలన అర్థరహితమనీ, ప్రత్యక్షంగా కనిపించే రాజ్యాన్ని అనుభవించమనీ జాబాలి అన్నప్పుడు రాముడు అతని మాటలు ఖండిస్తూ, నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రజలు నన్నే ఆదర్శంగా తీసుకుని విచ్చలవిడిగా సంచరిస్తారంటాడు. విభీషణ శరణాగతి లాంటి ప్రతి సందర్భంలోనూ రాముడు సహచరులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు. మహాభారతంలో ధర్మరాజు తనను జూదంలో ఒడ్డి ఓడినప్పుడు; తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా అన్న చర్చను ద్రౌపది సభాముఖంగా లేవదీస్తుంది. ధర్మరాజు యుద్ధానికి విముఖుడైనప్పుడు యుద్ధపక్షాన వాదిస్తుంది. బృహదారణ్యకో పనిషత్తులో గార్గి అనే విదుషీమణి యాజ్ఞ్యవల్క్యునితో వాదోపవాదాలు జరిపి ఓటమిని హుందాగా ఒప్పుకుంటుంది. యాజ్ఞ్యవల్క్యునికి, అతని భార్య మైత్రేయికి జరిగిన సంవాదం గురించి కూడా ఉపనిషత్తు చెబుతుంది. ప్రత్యామ్నాయ చింతన నుంచి, ప్రతివాదం నుంచి, ప్రతిపక్షం నుంచే జైన, బౌద్ధ తాత్వికతలు అభివృద్ధి చెందాయి. అద్వైతవాది అయిన శంకరాచార్యుడు, కర్మవాది అయిన మండనమిశ్రునితోనూ, అతని భార్య ఉభయభారతితోనూ రోజుల తరబడి వాదోపవాదాలు జరిపి ఓడిస్తాడు. ఇప్పటిలా ప్రచురణ, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలు లేని కాలంలో సైతం మనిషి తనే సంచార మాధ్యమంగా మారి, దూరభారాలను జయించి పండిత పరిషత్తులను మెట్టాడు; వాద, ప్రతివాదాలలో ప్రకర్షను చాటి జ్ఞానవిజ్ఞాన వ్యాప్తికి వేగుచుక్క అయ్యాడు. అలాంటి ఒక పండిత స్పర్థలోనే శ్రీనాథ మహాకవి ‘‘పగుల గొట్టించి తుద్భటవివాద ప్రౌఢి గౌడడిండమభట్టు కంచుఢక్క’’ అని చెప్పుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ కాశీ, బెంగాల్‌లోని నవద్వీపం మొదలైనవి విద్వత్పరీక్షలకు పట్టుగొమ్మలుగా ప్రసిద్ధికెక్కాయి. అయల సోమయాజుల గణపతిశాస్త్రి అనే పండితుడు ఆంధ్రదేశం నుంచి నవద్వీపం వెళ్ళి అక్కడి విద్వజ్జనాన్ని మెప్పించి ‘కావ్యకంఠ’ బిరుదును అందుకొని వచ్చాడు. పురాతన నాగరికతలన్నీ సంవాద సంప్రదాయాన్ని పెంచి పోషించినవే. ప్రాచీన గ్రీకు తాత్వికుడు సోక్రటిస్ అభివృద్ధి చేసిన ప్రశ్నోత్తరాల సంవాద శైలి ‘సోక్రటిక్ డైలాగ్’ పేరిట ఒక వచనరచనా ప్రక్రియగా సారస్వతంలో భాగమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం దరిమిలా యూరప్‌లో ఆధునిక చర్చారూపాలు అభివృద్ధి చెంది, సంవాద సమాజాలు ఏర్పడి వైజ్ఞానిక వికాసాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. సంవాద ప్రక్రియ నిర్దిష్టమైన రూపురేఖలు తెచ్చుకుని పాఠశాల నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యలో భాగమైంది. అందులో పోటీపడే విద్యార్థుల తర్ఫీదుకు శిక్షకులు అవత రించారు. ఆల్ఫ్రెడ్ స్నైడర్, మాక్స్ వెల్ ష్రూనర్ అనే ఇద్దరు శిక్షకులు సంవాదకళను అనేక కోణాల నుంచి చర్చిస్తూ, నిర్వచిస్తూ ‘మెనీ సైడ్స్– డిబేట్ ఎక్రాస్ కరిక్యులమ్’ అనే పుస్తకం వెలువరించారు. ఈ మొత్తం నేపథ్యం నుంచి చూసినప్పుడు మన పరిస్థితే ఆశ్చర్యకరం. రాచరికపు రోజుల్లోనే మనం తీర్చిదిద్దుకున్న సంవాద సంప్రదాయం ప్రజాతంత్రంలో అక్కరకు రాకుండాపోయింది. ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో కీలక సంవాద కేంద్రాలైన శాసనసభలకు వేలసంఖ్యలో ప్రతినిధులను పంపుకున్నా, పంపుతున్నా సంవాద విధివిధానాల శిక్షణ అంచెలంచెల విద్యలో ఇప్పటికీ భాగం కాలేదు. ఎక్కడైనా పాఠ్యేతర అంశంగా కొన ఊపిరితో ఉన్నా కార్పొరేట్ చదువులు దానినీ పాడి ఎక్కించాయి. కొత్తగా సామాజిక మాధ్యమాల వెల్లువ సంవాదపు బరిలో ప్రతి ఒకరికీ అవకాశమిచ్చి మేలు చేసినా విధివిధానాల శిక్షణ లేక చర్చ రచ్చగా మారడం; ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు కావలసిన సంవాదం విషవాయువు కావడం చూస్తున్నాం! -
దైవంతో జూదమా?
శ్రీ వేంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా హిందూ భక్తులు ఆరాధిస్తారు. వారి దృష్టిలో తిరుమల క్షేత్రం సాక్షాత్తూ కలియుగ వైకుంఠమే. ‘‘భావింప సకల సంపదరూప మదివో... పావనములకెల్ల పావనమయము’’ అంటూ ఆ శ్రీహరివాసాన్నిఅన్నమయ్య కాలం నుంచీ భజిస్తూనే ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవునిగా కోట్లాదిమంది చేత నిత్య పూజలందుకునే వేంకటనాథుని ఆలయ ప్రసాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ప్రతి పక్షంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆలయ ప్రతిష్ఠను, ఔన్నత్యాన్ని ఆయన పణంగా పెట్టారు.కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగా విజయవాడ వరదల పాలు కావడం, ‘సూపర్ సిక్స్’ పేరుతో చేసిన ఎన్నికల బాసలను ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, కనీసం ఎప్పుడు చేస్తారనే షెడ్యూల్‌ను కూడా విడుదల చేయలేకపోవడం వంటి కారణాలు ఈ తాజా కుట్రకు నేపథ్యం. తమ కూటమి పరిపాలనకు వంద రోజులు పూర్తయిన సంద ర్భంగా ఏర్పాటు చేసుకున్న శాసనసభా పక్షాల ఉమ్మడి సమావేశంలో ఆ కుట్రను అమలు చేయడం ప్రారంభించారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో తయారైందని, ఇది వైసీపీ పాలనలో జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.రాజకీయాల్లో ఇక ఇంతకంటే దిగజారుడు సాధ్యం కాదనుకున్న ప్రతిసారీ చంద్రబాబు షాక్ ఇస్తూనే ఉంటారు. ఏడుకొండలవాడి పవిత్ర ప్రసాదంపై అనుమాన పంకిలం చల్లడానికి ఆయన ఏడు పాతాళ లోకాలను దాటి కిందకు దిగజారారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద కోట్ల పైచిలుకు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.లడ్డూ ప్రసాదం తయారీకి, అందులో వినియోగించే సరుకుల కొనుగోలుకు ఒక పటిష్ఠమైన వ్యవస్థ తిరుమలలో గత కొన్ని దశాబ్దాలుగా అమలవుతున్నది. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఈ వ్యవస్థలో మార్పు ఉండదు. తిరుమలలో గత వంద సంవత్సరాలుగా లడ్డూ ప్రసాదం అమల్లో ఉంది. మహంతుల అజమాయిషీలో నడిచే తిరుమల పాలనా వ్యవహారాలను తొంభయ్యేళ్ల కింద బ్రిటిష్ వాళ్లు స్వాధీనం చేసుకొని టీటీడీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తున్నది. అందుకు అనుగుణంగానే లడ్డూ ప్రసాదానికీ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి లడ్డూల తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుతూ వస్తున్నారు.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి లడ్డూలు తయారుచేసే పోటు సామర్థ్యం రోజుకు 45 వేలు మాత్రమే. పోటు సామర్థ్యాన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ ఆయన హయాంలో ఆధునిక వసతులను సమకూర్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పోటును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆగమ సలహా మండలి సంప్రదింపులతో విస్తరించారు. మూడున్నర లక్షల లడ్డూల తయారీ సామర్థ్యం ఇప్పు డున్నది. అవసరమైతే ఆరు లక్షల వరకు తయారు చేసుకోవ డానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు కూడా చేశారు.తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా తిరుమల పవిత్రతను కాపాడటానికి లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతను పెంచడం కోసం ల్యాబ్ వ్యవస్థను పటిష్ఠం చేయడం కూడా వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది. నవనీత సేవకోసం అవసరమైన స్వచ్ఛమైన వెన్నను తయారు చేయడానికి తిరుమలలోనే ఒక ప్రత్యేక గోశాల కూడా ఆయన హయాంలోనే ఏర్పాటయింది. ఏడుకొండలపై ఆధ్యాత్మిక శోభ వెల్లి విరియాలన్న సంకల్పంతో మఠాధిపతులతో కూడిన విద్వత్ సభ కూడా అప్పట్లో జరిగింది. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రయినప్పటికీ ఈ తరహా కార్యక్రమాలను అమలు చేసిన దాఖలాలు లేవు.ఇక చంద్రబాబు ఆరోపణలకు సంబంధించిన నెయ్యి కొనుగోలు వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ వ్యవహారం కొన్ని దశాబ్దాలుగా ఒకే పద్ధతిలో జరుగుతున్నది. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండేవారిలో కొందరితో కలిసి కొనుగోలుకు సంబంధించిన సబ్–కమిటీ ఉంటుంది. ఆరు నెలలకోసారి ఆన్లైన్లో టెండర్లు పిలిచి ఎల్–వన్‌గా నిలిచిన వారిని ఎంపిక చేస్తారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు ఉన్న ప్లాంట్‌ను పరిశీలించి, అందులో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను ఈ సబ్‌కమిటీ బేరీజు వేసుకుంటుంది. అనంతరం కాంట్రాక్టుకు సంబంధించిన అభ్యంతరాలు గానీ, సూచనలు గానీ వుంటే సబ్‌కమిటీ బోర్డుకు నివేదిస్తుంది.టెండర్ ఖరారు చేయడానికీ లేదా రద్దు చేయడానికీ కూడా సబ్ కమిటీకి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేబినేట్లో ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి, కేంద ప్రభుత్వానికి సన్నిహితుడైన వైద్యనాథన్ కృష్ణమూర్తి కూడా ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.నెయ్యి సరఫరా దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రతి ట్యాంక ర్తో పాటు నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని కూడా వెంట తెచ్చు కోవాలి. ఎన్ఏబీఎల్ గుర్తించిన ల్యాబుల్లో ఈ ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకోవచ్చు. ట్యాంకర్ తిరుపతికి చేరుకున్న అనంతరం అక్కడ వున్న మార్కెటింగ్ కార్యాలయంలో మూడు శాంపిళ్లను తీసి వేరువేరుగా పరిశీలిస్తారు. ఈ మూడు శాంపిళ్ల పరీక్షలోనూ నాణ్యత నిర్ధారణ అయితేనే ట్యాంకర్ తిరుమలకు చేరుకుంటుంది. లేకుంటే వచ్చిన దారిన వెనక్కు వెళ్తుంది. పరీక్షలో విఫలమై ట్యాంకర్లు వెనక్కు వెళ్లడం ఈ ఇరవై ఏళ్లలో వందలసార్లు జరిగినట్టు సమాచారం. అదేవిధంగా చంద్రబాబు ఆరోపించిన ఏఆర్ డెయిరీ వారి కంటెయినర్ కూడా వెనక్కు వెళ్లింది. అది కొండెక్కిందీ లేదు. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడిందీ లేదు. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు ఆరగించిందీ లేదు. తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థ కల్తీ సరుకులను ప్రసా దాల్లోకి అనుమతించదు.తిరస్కరించిన ఈ ట్యాంకర్‌లోని శాంపిల్‌ను తీసుకున్నది జూలై 12వ తేదీన! అప్పటికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆ శాంపిల్‌ను జూలై 17న గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్‌కు పంపించారు. 23న ఆ ల్యాబ్ రిపోర్టు పంపించింది. టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిట బుల్ ఫ్యాట్స్ కలిశాయని నివేదిక ఆధారంగా చెప్పారు. విశ్వస నీయ సమాచారం మేరకు ఎన్డీడీబీతో పాటే మైసూర్‌లోని మరో కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌కు కూడా ఈ శాంపిల్స్ పంపించారట. వారి రిపోర్టు గురించి మాత్రం ఎటువంటి సమాచా రాన్ని టీటీడీ ఇవ్వడం లేదు.ఈ వ్యవహారం పూర్తయి రెండు నెలలు గడిచాయి. కూటమి సర్కార్‌కు వందరోజులు నిండిన నేపథ్యంలో జరిగిన రాజకీయ సమావేశంలో చంద్రబాబు ఎన్డీడీబీ నివేదికను విడుదల చేశారు. జంతువుల ఫ్యాట్ కలిసిందనే ఆరోపణ అక్కడే చేశారు. టీటీడీ విడుదల చేయవలసిన నివేదికను పొలిటికల్ మీటింగ్‌లో విడుదల చేయడంపై పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. అంతకుముందు వెజిటబుల్ ఫ్యాట్స్ కల్తీ జరిగిందని చెప్పిన ఈఓ ఈ సమావేశం తర్వాత స్క్రిప్టు మార్చి చంద్రబాబు ప్రసంగాన్ని అనుసరించారు.స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే తిరుమల ప్రసాదానికి అపవిత్రతను ఆపాదిస్తూ మాట్లాడడంతో ఇది జాతీయ స్థాయిలో పెద్ద సమస్యగా మారిపోయింది. తిరుమలకు ఉన్న విశిష్టత అటువంటిది. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసి, తద్వారా రాష్ట్ర ఇమేజ్‌కు మసిపూసి చంద్రబాబు ఏం సాధించదలుచుకున్నారు? కల్తీ సరుకును కనిపెట్టి వెనక్కు తిప్పి పంపే వ్యవస్థాగత బలం టీటీడీకి ఉన్నది. పలు సంద ర్భాల్లో అలా జరిగింది. మొన్నటి కల్తీ సరుకు వచ్చింది టీడీపీ సర్కార్ జమానాలోనే. దాన్ని గుర్తించిన టీటీడీ వ్యవస్థ వెనక్కు పంపింది కూడా! మరి ఏ విధంగా ఈ వ్యవహారాన్ని జగన్ సర్కార్ మెడకు చుట్టాలని చంద్రబాబు భావించారు? తనకు అనుకూలంగా అరవై నాలుగు నోళ్లు లేస్తాయన్న ధీమాతోనే కదా అభాండాలు వేయడం!తమ జీవితాలను వరదల్లో ముంచేసినందుకు మూడు లక్షల కుటుంబాలు విజయవాడలో బాబు సర్కారు మీద భగ్గుమంటున్నాయి. సర్కార్ బడుల్లో వసతులపై కోత పెట్టడం, సీబీఎస్ఈ సిలబస్ రద్దు చేయడం, ఇంగ్లీష్ మీడి యాన్ని నిరుత్సాహపరచడంతో రెండున్నర లక్షల మంది విద్యార్థులు మళ్లీ ప్రైవేట్ బాట పట్టారు. కేంద్ర సర్కార్‌లో టీడీపీ భాగస్వామిగా ఉండి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ యత్నాలను అడ్డుకోవడం లేదని కార్మికులు మండి పడుతున్నారు.ఉద్యోగాల కల్పన ఊసేలేదు, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. వంచనకు గురయ్యామని మహిళలు మథనపడుతున్నారు. సర్కార్ మేనిఫెస్టోలపై సోషల్ మీడి యాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వీడియోల నిండా వెట కారం ప్రవహిస్తున్నది.వంద రోజుల్లోనే విశ్వరూపం దాల్చిన వ్యతిరేకతను దారి మళ్లించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండవచ్చు. కానీ ఆ దారి మళ్లింపు ఇలా ఉండకూడదు. నిస్సందేహంగా బాబు చేసింది మహాపచారం. ఆయన చేసిన పనివల్ల తిరుమల ప్రతిష్ఠకు జాతీయ స్థాయిలో భంగం వాటిల్లింది. కూటమి సర్కార్ అందజేసిన సమాచారాన్నే కళ్లకద్దుకొని జాతీయ మీడియా గుడ్డిగా వ్యవహరిస్తున్నది. ఈ మీడియా ప్రచారం వల్ల జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్ఠే దెబ్బతింటుందని చంద్రబాబు భావిస్తుండవచ్చు. కానీ చంద్రబాబు జమానాలోనే కల్తీ సరుకు వచ్చిన విషయం నేడు కాకపోతే రేపైనా జాతీయ మీడియాకు తెలుస్తుంది. అక్కడ అమలవుతున్న కట్టుదిట్టమైన వ్యవస్థపై అవగాహన కలుగుతుంది. కానీ, తిరుమల పవిత్రతకు చంద్రబాబు వల్ల తగిలిన గాయం ఎప్పుడు మానాలి? రాజకీయ జూదం కోసం పుణ్యక్షేత్రాలను పణంగా పెట్టేవారికి ఆ ఏడు కొండలవాడే బుద్ధి చెప్పాలి. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సహించరాని ఉన్మాదం
ముందు ఇరుగుపొరుగుతో... ఆ తర్వాత పశ్చిమాసియా దేశాలన్నిటితో ఉన్మాద యుద్ధానికి ఇజ్రా యెల్ సిద్ధపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలూ, దేశాలూ ఈ మాదిరిగా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతే ఇది కాస్తా ప్రపంచ యుద్ధంగా పరిణమించే అవకాశం లేకపోలేదని మంగళ, బుధవారాల్లో లెబనాన్, సిరియాల్లో చోటుచేసుకున్న పరిణామాలు తెలియజెబుతున్నాయి. వరసగా రెండురోజులపాటు పేజర్లనూ, వాకీటాకీలనూ, ఇళ్లల్లో వినియోగించే సౌరశక్తి ఉపకరణా లనూ పేల్చటం ద్వారా సాగించిన ఆ దాడుల్లో 37 మంది మరణించగా నాలుగు వేలమందికి పైగా గాయపడ్డారు.లెబనాన్‌లో హిజ్బొల్లా మిలిటెంట్లను అంతం చేయటానికే ఈ దాడులు చేసినట్టు కనబడుతున్నదని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు అర్ధసత్యం మాత్రమే. ప్రాణాలు కోల్పోయినవారిలో మిలిటెంట్లతోపాటు పసిపిల్లలూ, అమాయక పౌరులూ, ఆరోగ్యసేవా కార్య కర్తలూ ఉన్నారు. హిజ్బొల్లా మిలిటెంట్ సంస్థ మాత్రమే కాదు... అదొక రాజకీయ పక్షం, ధార్మికసంస్థ. కనుక ఆ పేజర్లు సామాన్య పౌరులకూ చేరివుండొచ్చు.గాజాలో దాదాపు ఏడాదిగా మారణ హోమం సాగుతోంది. దాన్ని ఆపటానికీ, శాంతియుత పరిష్కారం సాధించటానికీ ఎవరూ చిత్తశుద్ధితో కృషి చేయటం లేదు. మొన్న ఫిబ్రవరిలో అమెరికా వైమానిక దళ సీనియర్ ఎయిర్మాన్ ఆరోన్ బుష్నెల్ ఆత్మాహుతి చేసుకునేముందు ఫేస్బుక్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సందేశం ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. కళ్లెదుట మారణ హోమం సాగుతుంటే ప్రపంచం నిర్లిప్తంగా మిగిలిపోవటాన్ని... తన చేతులకూ నెత్తురంటడాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆ సందేశంలో ఆయన రాశాడు. అమెరికాకు చీమ కుట్టినట్టయినా లేదు. లెబనాన్, సిరియాల్లో జరిగిన దాడులపై ఒక మీడియా సమావేశంలో పదే పదే ప్రశ్నించినా వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ జవాబిచ్చేందుకు నిరాకరించటం దీన్నే ధ్రువపరుస్తోంది. ఉగ్రవాదానికి విచక్షణ ఉండదు. తన విధ్వంసకర చర్యలు ఎవరికి చేటు చేస్తాయన్న ఆలోచన ఉండదు. వ్యక్తులు ఇలాంటి ఉన్మాదానికి లోనయితే జరిగే నష్టంకన్నా రాజ్యాలు ఉగ్రవాదాన్నిఆశ్ర యిస్తే కలిగే నష్టం అనేక వందల రెట్లు ఎక్కువ. దీన్ని మొగ్గలోనే తుంచకపోతే అలాంటిధూర్త రాజ్యాలు వేరే దేశాలపై సైతం ఆ మాదిరిగానే దుందుడుకు చర్యలకు దిగి ప్రపంచాన్నిపాదాక్రాంతం చేసుకోవటానికి కూడా సిద్ధపడతాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లను అందరూ వ్యతిరేకించింది అందుకే. ఒక దేశాన్ని దురాక్రమించి, అక్కడి పౌరులకు కనీసం నిలువ నీడ కూడా లేకుండా చేస్తూ అందుకు ప్రతిఘటన ఉండకూడదనుకోవటం తెలివి తక్కువతనం. పాలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు పడి, చివరకు ఒప్పందం కుదరబోతున్న దశలో సైతం అడ్డం తిరిగి మొండికేసిన చరిత్ర ఇజ్రాయెల్‌ది. అంతేకాదు... ఇరుగుపొరుగు దేశాలతో తరచు గిల్లికజ్జాలకు దిగటంతోపాటు ఇథియోపియా, ఉగాండా, నైజర్, కెన్యావంటి సబ్ సహారా దేశాల, లాటిన్ అమె రికా దేశాల నియంతలకు ఆయుధాలిచ్చి అండదండలందించిన చరిత్ర ఇజ్రాయెల్‌ది. చూస్తూ ఉంటే మేస్తూ పోయినట్టు ప్రపంచం స్థాణువై మిగిలిపోతే ఈ అరాచకాలకు అంతంఉండదు. సమస్య ఉన్నదని గుర్తించటం దాని పరిష్కారానికి తొలి మెట్టు. కానీ ఇంతవరకూ అమెరికాగానీ, దానికి వంతపాడుతున్న యూరప్ దేశాలుగానీ అసలు పాలస్తీనా అనేది సమస్యే కానట్టు నటిస్తున్నాయి. తాజాగా జరిగిన పేలుళ్ల వెనకున్న కుట్రలో ఇప్పుడు అందరి అనుమానమూ పాశ్చాత్య ప్రపంచంపై పడింది. ముఖ్యంగా హంగెరీ, బల్గేరియా దేశాల సంస్థల పాత్ర గురించి అందరూ ఆరా తీస్తున్నారు. పేజర్లను తాము తయారుచేయటం లేదనీ, హంగెరీలోని బీఏసీ అనే సంస్థ తమ లోగోను వాడుకుని ఉత్పత్తి చేస్తోందనీ తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో అనే సంస్థ అంటున్నది. ఇందుకు తమకు పశ్చిమాసియా దేశంనుంచి నగదు ముడుతున్నదని సంస్థ వివరించింది. హంగెరీ మీడియా సంస్థ కథనం ఇంకా విచిత్రంగా ఉంది. అది చెప్తున్న ప్రకారం బీఏసీ కాదు, బల్గేరియాలోని నోర్టా గ్లోబల్ అనే సంస్థ ఈ పేజర్లను సరఫరా చేసిందట. బీఏసీకి ఉత్పాదక సామర్థ్యంలేదనీ, అది కేవలం ఒక ఏజెంటు మాత్రమే ఉండే కన్సెల్టింగ్ ఏజెన్సీ అనీ హంగెరీ ప్రభుత్వం చెబుతోంది. ఇక బల్గేరియా అయితే అసలు పేజర్ల ఉత్పాదక సంస్థ తమ గడ్డపైనే లేదంటున్నది. ప్రజల ప్రాణాలు తీసే దుష్ట చర్యకు పాల్పడి నేరం తాలూకు ఆనవాళ్లు మిగల్చకపోవటం, అది ఘనకార్యమన్నట్టుసంబరపడటం ఉగ్రవాద సంస్థల స్వభావం. దాన్నే ఇజ్రాయెల్ కూడా అనుకరిస్తూ పైచేయి సాధించానని భ్రమపడుతున్నట్టుంది. కానీ ఈ మాదిరి చర్యలు మరింత ప్రతీకార వాంఛను పెంచుతాయి తప్ప దాని స్థానాన్ని పదిలం చేయలేవు.ఇంతవరకూ పేలుళ్ల బాధ్యత తనదేనని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. తమ శత్రువు ఎక్కడున్నా వెదికి వెదికి పట్టుకుని మట్టుబెట్టడం, అందుబాటులో ఉన్న సాంకేతికతలను అందుకు వాడుకోవటం ఇజ్రాయెల్‌కు కొత్తగాదు. ఫోన్లలోకి, కంప్యూటర్లలోకి చొరబడి మాల్వేర్ను ప్రవేశ పెట్టడం, పౌరుల గోప్యతకు భంగం కలిగించటం, కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్లు పేలిపోయేలా చేయటం ఇజ్రాయెల్ సంస్థల నిర్వాకమే. మిత్రపక్షం కదా అని ధూర్త రాజ్యాన్ని ఉపేక్షిస్తే అదిప్రపంచ మనుగడకే ముప్పు కలిగిస్తుందని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఇజ్రాయెల్ చర్యలు సారాంశంలో అంతర్జాతీయ మానవహక్కుల చట్టాల ఉల్లంఘన. అందుకు పర్యవసానం లేకపోతే శతాబ్దాలుగా మానవాళి సాధించుకున్న నాగరిక విలువలకు అర్థం లేదు. -
ఒకే ఎన్నిక... అనేక కోణాలు!
కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం లాంఛనంగా ఆమోదం తెలపడంతో రథం కదిలింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా. దేశంలో లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల శాసనసభలకూ కలిపి ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఉద్దేశించిన ఈ సంక్లిష్ట ప్రతిపాదనపై మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు ఉన్నందున తాజా పరిణామాలతో మరోమారు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పైగా ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం.నిజానికి, ఏకకాలంలో ఎన్నికలనేవి కొత్త ఏమీ కావు. గతంలో ప్రత్యేకంగా నియమం, చట్టం లాంటివేమీ లేకున్నా, 1951 – 52లో మొదటి జనరల్ ఎలక్షన్స్ నాటి నుంచి మన దేశంలో లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు కలిసే జరుగుతుండేవి. అయితే, కాలవ్యవధి పూర్తి కాకుండానే రాష్ట్ర అసెంబ్లీలు రద్దవడం ఎప్పుడైతే మొదలైందో, అప్పుడు 1967 తర్వాత నుంచి కథ మారింది. ఏకకాల ఎన్నికల క్యాలెండర్ మారిపోయింది. పదేళ్ళ క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చే ముందే బీజేపీ తన మేనిఫెస్టోలో ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ను లక్ష్యంగా పేర్కొంది. అంతకు ముందు సన్నాయినొక్కులు నొక్కినా, బీజేపీ గద్దెనెక్కాక సహజంగానే భారత ఎన్నికల సంఘం ఈ ఆలోచనను సమర్థించింది. అలాగే, లా కమిషన్లు సైతం 1999లో, 2018లో ఈ ఏకకాలపు ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించాలన్నాయి. 2015 నాటి పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు పలు పార్టీలు ఈ ప్రతిపాదనకు మద్దతు నివ్వగా, కొన్ని పార్టీలు మాత్రం వ్యతిరేకించాయి. భిన్నాభిప్రాయాలున్న దీనిపై ఏకాభిప్రాయ సాధన అవసరమని మొదట్లో చెబుతూ వచ్చిన మోదీ సర్కార్, ఆ సంగతి పక్కనపెట్టి ఇటీవల తన అజెండాను ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం గమనార్హం. కోవింద్ కమిటీ వేయడం, ఆ కమిటీ ఈ ఏడాది మార్చిలో నివేదిక సమర్పించడం చకచకా జరిగాయి. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే రెండో దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు – ఇలా రెండు దశలుగా 2029 నుంచి ‘ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను అమలు చేయవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఇప్పుడు కమిటీ నివేదికను క్యాబినెట్ ఆమోదించి, పార్లమెంట్లో చట్టం చేయడానికి సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్రానికి రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్క. ఆ యా రాష్ట్రాల పరిమాణాన్ని బట్టి అసెంబ్లీ ఎన్నికలకు అయ్యే ఖర్చు వేరు. ఈ ప్రభుత్వ అధికారిక ఖర్చు కాక, వివిధ పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చు అనేక రెట్లు. ఏక కాలపు ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గుతాయనీ, తరచూ ఎన్నికలతో పాలన కుంటుపడుతున్నందున దాన్ని నివారించవచ్చనీ, ఒకేసారి ఎన్నికలతో ఓటింగ్ శాతం హెచ్చవుతుందనీ సమర్థకుల వాదన. అయితే, ఏకకాలపు ఎన్నికల కోసం పలు రాష్ట్ర అసెంబ్లీలను ముందుగానే రద్దు చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున ఒకేసారి ఎన్నికలు పెట్టినా... ఒకవేళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే, కేవలం మిగిలిన కాలవ్యవధికే ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఎన్ను కోవాలట. ఇలాంటి ప్రతిపాదనలు వట్టి అర్థరహితం. పైగా, ఇది మరింత ఖర్చుకు దారి తీయడమే కాక, అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. అలాగే ఏకకాలపు ఎన్నికల వల్ల స్థానిక, ప్రాంతీయ అంశాలు పక్కకుపోయి, జాతీయ అంశాలదే పైచేయి అవుతుందనీ, చివరకు స్థానిక, చిన్నపార్టీలు కనుమరుగై పోతాయనీ భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల ఏకకాలంలో హర్యానా, జమ్మూ– కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు చేయలేమని చేతులె త్తేసిన ఎన్నికల సంఘం రేపు దేశమంతటా ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలుగుతుంది? కొన్ని కోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు, వేల సంఖ్యలో భద్రతా సిబ్బందిని ఏకకాలంలో సమకూర్చుకోవడం సాధ్యమా? దానికయ్యే ఖర్చుతో పోలిస్తే, ‘ఒకే ఎన్నిక’ వల్ల ఆదా అయ్యేది ఏపాటి? అసలింతకీ కేంద్రంలోని కమలనాథులు ఇప్పుడీ పనిని ఎందుకు భుజాన వేసుకున్నట్టు? అధికార పక్షం సొంత మెజారిటీ ఉన్నప్పుడు ఇట్టే చేయగల పనిని మిత్రపక్షాలపై ఆధారపడిన ప్రభుత్వ హయాంలో తలకెత్తుకున్నదేమిటి? 2015 నాటి ఓ సర్వే ప్రకారం... ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 77 శాతం ఓటర్లు రెండింటా ఒకే పార్టీకి ఓటు వేస్తారట. అదే గనక ఆరు నెలల విరామం తర్వాత జరిగితే 61 శాతం మందే ఒకే పార్టీకి ఓటు వేస్తారట. దేశమంతటా ‘డబుల్ ఇంజన్ సర్కార్’కై తహతహలాడుతున్న బీజేపీ ఓటర్ల తాలూకు ఈ ఏకకాలపు ఎన్నికల మనస్తత్వం కలిసొస్తుందని భావిస్తూ ఉండవచ్చు. కానీ, వైవిధ్యానికి నెలవైన సమాఖ్య వ్యవస్థలో కృత్రిమంగా ఏకకేంద్రక స్వభావాన్ని జొప్పించడమే ఇదంతా అని విమర్శ. ఎవరి రాజకీయ, సైద్ధాంతిక వైఖరులు ఏమైనా అనేక అంశాలపై ప్రభావం చూపే ఈ ప్రతిపాదనకు తొందరపడితే సరిపోదు. కాగితంపై అందంగా కనిపించే ఆలోచనకు సైతం ఆచరణలో ఉండే ఇబ్బందులను గమనించాలి. వ్యతిరేకుల వాదన వినాలి. సహేతుకమైన వారి సందేహాల్ని తీర్చాలి. లేదంటే ప్రజాస్వామ్యానికే అర్థం లేదు. -
సరైన దిశలో తొలి అడుగు
కోర్టు నోరు విప్పిందంటే న్యాయం నిలబడుతుందని సామాన్యులకు ఆశ. దేశంలో చట్టాలను తుంగలో తొక్కుతున్న బుల్డోజర్ సంస్కృతిపై మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కాసింతైనా సంతోషం కలిగిస్తున్నది అందుకే. అనేక రాష్ట్రాలలో క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును ఎదుర్కొంటున్న నిందితులు, వారి కుటుంబ సభ్యుల ప్రైవేట్ గృహాలు, ఆస్తు లపై బుల్డోజర్లను నడిపిస్తూ... ‘దాన్ని ఘనకార్యంగా పేర్కొంటూ, సమర్థించుకుంటున్న’ వైఖరి పాలకుల సాక్షిగా పెచ్చుమీరుతోంది. ఈ పరిస్థితుల్లో తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 1 దాకా దేశవ్యాప్తంగా ఈ అడ్డగోలు కూల్చివేతలన్నిటికీ సుప్రీమ్ కోర్ట్ అడ్డుకట్ట వేయడం విశేషం. అదే సమ యంలో నీటి వసతులు, రైల్వే లైన్లకు అడ్డుగానూ, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ స్థలాల్లోనూ సాగిన దురా క్రమణలనూ, అనధికారిక నిర్మాణాలనూ కూల్చేందుకు అభ్యంతరం లేదని సుప్రీమ్ పేర్కొంది. అలాగే, కూల్చివేతలపై దేశవ్యాప్తంగా అమలయ్యేలా నిర్ణీత మార్గదర్శకాల్ని రూపొందించాలన్న కోర్ట్ ప్రతిపాదన హర్షణీయం. ఇన్నాళ్ళ తరువాత ఇప్పటికైనా ఇది సరైన దిశలో సరైన అడుగు.యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్‌లో 2017లో ఈ బుల్డోజర్ న్యాయానికి బీజం పడింది. ఆ తరువాత ఇది అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలకు పాకింది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఇప్పటికి 4.5 లక్షల దాకా గృహాలు ఇలా నేలమట్టమయ్యాయని అంచనా. ఇకపై చట్టవిరుద్ధంగా ఒక్క కూల్చివేత జరిగినా అది పూర్తిగా రాజ్యాంగ విధానానికే విరుద్ధమని కోర్ట్ పేర్కొనడం గమనార్హం. నిజానికి, గతంలోనూ కోర్టులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, వాటి ఆదేశాలను ధిక్కరిస్తూ అనేకచోట్ల కూల్చివేతలు యథేచ్ఛగా సాగాయి. అసలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితుల మీదకు బుల్డోజర్ను నడిపిస్తున్న తీరుపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తప్పు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, నోటీసులైనా ఇవ్వకుండా, నిర్ణీత ప్రక్రియ ఏదీ పాటించకుండా వారికి శిక్షగా బుల్డోజర్ను ఉపయోగించడమేమిటనే ధర్మబద్ధమైన ప్రశ్నలు వినిపిస్తూ వచ్చాయి. పైపెచ్చు, ముస్లిమ్‌ల ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు సాగించడమనేది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలనా విధానంగా తయారవడం ఆందోళన రేపింది. ఈ పరిస్థితుల్లో జస్టిస్ బి.ఆర్. గవాయ్, కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీమ్ కోర్ట్ డివిజన్ బెంచ్ ఈ పద్ధతిని తప్పుబట్టింది. ఒక కేసులో నిందితులైనంత మాత్రానో, లేదంటే దోషి అయినంత మాత్రానో వారి ఇంటిని కూల్చేయవచ్చా? అందుకు చట్టం అనుమతిస్తుందా? లేదు కదా! ఆ మాటే సుప్రీమ్ అంటోంది. పైగా ఇంట్లో ఎవరో ఒకరు నేరం చేస్తే, కూల్చివేతలతో ఆ కుటుంబం మొత్తానికీ శిక్ష విధించడం ఏ రకంగా సబబు? ప్రభుత్వ పాలన నిర్వహించే కార్యనిర్వాహక వ్యవస్థే జడ్జిగా మారి, శిక్షించవచ్చా? ఆక్రమణలనూ, అనధికారిక నిర్మాణాలనూ తొలగించేందుకు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక చట్టాలు అనుమతిస్తున్నాయి. కానీ, వాటిని ప్రతిపక్షాల పీక నొక్కేందుకూ, నిర్ణీత వర్గాలపై ప్రతీకారేచ్ఛకూ సాధనంగా మార్చుకోవడంతోనే అసలు సమస్య. గొంతు విప్పిన భార తీయ ముస్లిమ్‌లపై ఉద్దేశపూర్వకంగా సాగుతున్న దాడిలో భాగమే ఈ కూల్చివేతలని చివరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం పేర్కొనే పరిస్థితి వచ్చిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ బుల్డోజర్ న్యాయం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో సాగుతున్నా, అన్ని చోట్లా ఒక అంశం మాత్రం సర్వసాధారణం. అది ఏమిటంటే – గతంలో కోర్టులిచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా, నిర్ణీత ప్రక్రియ అంటూ లేకుండానే ఈ కూల్చివేతలు కొనసాగడం! దురాక్రమణ లకు వ్యతిరేకంగా ఉద్యమం అంటూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ లాంటి చోట్ల ఇటీవలి కూల్చివేతల్లోనూ చట్ట ఉల్లంఘన నిర్భీతిగా సాగింది. గుజరాత్, అస్సామ్, త్రిపురల్లో సైతం కూల్చివేతల పర్వానికి కట్టడి లేకుండా పోయింది. అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోందనే భావన కల్పిస్తూ, రాజకీయ లబ్ధి పొందడం అధికార పార్టీల వ్యూహం. దానిలోని మతపరమైన కోణాన్ని కప్పిపుచ్చడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. ఈ బుల్డోజర్సంస్కృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం జోక్యానికి ఇంతకాలం పట్టడం విచారకరమే. అయితే, ఇప్పుడిక పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘విశాఖ’ మార్గదర్శకాలు చేసినట్టుగానే దీనిపైనా అఖిల భారత స్థాయిలో కోర్టు మార్గదర్శకాలు ఇవ్వనుండడం ఒకింత ఊరట. అనధికారిక నిర్మాణాల గుర్తింపు, నోటీసులివ్వడం, వాదనలు వినడం, అనంతరం చట్టబద్ధంగా కూల్చివేతలు జరపడం... ఈ ప్రక్రియ అంతటికీ దేశవ్యాప్తంగా ఒకే విధమైన నియమావళి ఉండడం కచ్చితంగా మంచిదే. ఇటీవలి కూల్చివేతల డేటాను నిశితంగా సమీక్షిస్తే అనేక లోపాలు కనిపిస్తాయి. అందుకే, ఈ అంశంపై సంబంధిత వర్గాల నుంచి సూచనలు కోరుతున్న కోర్ట్ రేపు మార్గదర్శకాల రూపకల్పనలోనూ జాగ్రత్తగా వ్యవహరించడం కీలకం. మత ఘర్షణలు, ఆ వెంటనే సాగే కూల్చి వేతల మధ్య సంబంధాన్ని కప్పిపుచ్చేందుకు పాలకులు ఎత్తులు వేయడం తరచూ చూస్తున్నాం. ఆ పన్నాగాలు పారనివ్వకుండా మార్గదర్శకాల తయారీ అవసరం. అలాగే, ఎప్పుడో నోటీసులు ఇచ్చా మని మభ్యపెట్టేందుకు వెనకటి తేదీలతో కాగితాలు చూపించి, పాలనా యంత్రాంగం ఇష్టారీతిన సాగించే కూల్చివేతలకు చెక్ పెట్టాలి. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగే ఏ చర్యలనూ అనుమతించని రీతిలో నియమావళిని కట్టుదిట్టంగా రూపొందించాలి. ఆదేశాల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించి, కోర్టు ధిక్కారం కింద కఠిన చర్యలు చేపట్టాలి. ప్రజలెనుకున్న పాలకులు తామే జడ్జీలుగా, తామే శిక్షలు అమలు చేసేవారిగా ప్రవర్తిస్తే అది పౌరుల ప్రాథమికహక్కులకే భంగకరం. -
నిజమాడితే నేరమా!
‘వాస్తవాలు మొండిఘటాలు. అవి ఓ పట్టాన లొంగవు. గణాంకాలు అలా కాదు... అవి ఎటువంచితే అటు వంగుతాయి’ అంటాడు విఖ్యాత రచయిత మార్క్ ట్వైన్. పాలకులు గణాంకాలను ఇష్టానుసారం మార్చితే... నిజాలకు మసిపూస్తే ప్రమాదం. అయితే ఏ దేశంలోనైనా జరిగేది అదే అంటారు నిరాశా వాదులు. ఆ మాటెలా వున్నా కేంద్ర ప్రభుత్వం ప్రణబ్ సేన్ ఆధ్వర్యంలోని గణాంకాల స్థాయీ సంఘాన్ని ఇటీవల రద్దు చేసిన తీరు వాంఛనీయం కాదు. ఎన్ని విమర్శలున్నా, లోపాలున్నా గణాంకాలు పాలనా నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వాలు ప్రకటించే ఏ పథకానికైనా, రూపొందించే ఏ విధానానికైనా గణాంకాలే ప్రాతిపదిక. వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించే సర్వేల ప్రక్రియ ఎలావుండాలో, పరిశోధనకు వేటిని పరిణనలోకి తీసుకోవాలో, దాని నమూనా ఏ విధంగా ఉండాలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేయటం గణాంకాల కమిటీ ప్రాథమిక విధి. దీంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలు గణాంకాల మంత్రిత్వ శాఖకు సమర్పించే సర్వే నివేదికల తీరుతెన్నులెలా వున్నాయో నిశితంగా పరిశీలించి, సందేహాలు నివృత్తి చేసుకుని ఆ ఫలితాలను ప్రకటించటం కూడా కమిటీ పనే. దేశంలోనే తొలిసారి 2019లో కేంద్రం 14 మందితో ఈ కమిటీని నియమించినప్పుడు అందరూసంతోషించారు. నిరుడు ఆ కమిటీ పరిధిని విస్తరించారు కూడా. కానీ దాన్ని కాస్తా మొన్నీమధ్య రద్దు చేశారు. జాతీయ నమూనా సర్వేలకు సంబంధించి ఇటీవల స్టీరింగ్ కమిటీ ఏర్పాటైనందున గణాంకాల కమిటీని రద్దు చేస్తున్నామని కమిటీ సభ్యులకు చెప్పారు. అసలు అప్పటికే ఆ పనిలో ఓ కమిటీ నిమగ్నమై ఉండగా కొత్త కమిటీ ఎందుకు ఏర్పాటైనట్టు? దాన్ని చూపించి పాతది రద్దు చేస్తున్నామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి? వీటికి జవాబిచ్చేవారు లేరు. ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయానికీ, వేసే ప్రతి అడుగుకూ గణాంకాలు ప్రాణం. ఏటా బడ్జెట్ ముందు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేనే తీసుకుంటే... దేశంలో ఆహారానికి జనం ఖర్చు చేస్తున్నదెంతో, అది పట్టణాల్లో ఎలావుందో గ్రామీణ ప్రాంతాల్లో ఎలా వుందో తెలుస్తుంది. నిరుద్యోగిత ఏ విధంగా వున్నదో, వ్యవసాయ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నవారి సంఖ్య ఎంతో వెల్లడవుతుంది. జనం విద్యకు ఖర్చు చేస్తున్నదెంత... ఆరోగ్యానికి ఖర్చవుతున్నదెంత అనే వివరాలు కూడా తెలు స్తాయి. ఇక పేదరిక నిర్మూలన పథకాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపాయో, వాటిని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఎటువంటి చర్యలు అవసరమో నిర్ణయించుకోవటా నికి గణాంకాలు తోడ్పడతాయి. అయితే ఈ గణాంకాల విశ్వసనీయత తేలాలంటే ఒక గీటురాయి అవసరం. జనాభా గణాంకాలే ఆ గీటురాయి. విషాదమేమంటే మూడేళ్ల క్రితం ప్రారంభం కావా ల్సిన జన గణన ఇంతవరకూ మన దేశంలో మొదలుకాలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పదేళ్లకోసారి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ గణన కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో సాగలేదు. వాస్తవానికి జనగణన నోటిఫికేషన్ పద్ధతిగా 2019 మార్చిలో విడుదలైంది. దాని ప్రకారం 2020 ఏప్రిల్–సెప్టెంబర్లమధ్య తొలి దశలో ఇళ్లు, కట్టడాలు, కుటుంబాలు వగైరాలకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి. 2021 ఫిబ్రవరిలో జనాభా గణన ఉండాలి. కానీ 2020 మార్చితో మొదలై ఆ ఏడాది నవంబర్ వరకూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో జనాభా గణన సాధ్యపడలేదు. ఆ తర్వాతైనా వెనువెంటనే ప్రారంభించాలని కేంద్రం అనుకోలేదు. అమెరికా, చైనాలతో సహా ప్రపంచంలో ఎన్నో దేశాలు కరోనా తీవ్రత తగ్గగానే చకచకా రంగంలోకి దిగి జనాభా గణనను జయప్రదంగా పూర్తిచేశాయి. కేవలం ఘర్షణ వాతావరణం నెలకొన్న లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే జన గణన జరగలేదు. మన దగ్గర ఎందుకు కాలేదో సంజా యిషీ ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్ధపడలేదు.భిన్న మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉండే సంస్థలూ, ఇతరత్రా స్వచ్ఛంద సంస్థలూ క్రమం తప్పకుండా సర్వేలు చేస్తున్నాయి. కానీ వాటిని దేంతో సరిపోల్చుకోవాలి? ఏ ప్రాతిపదికన వాటిని విశ్వసించాలి? తాజా జన గణన లేదు కాబట్టి 2011 నాటి జనాభా లెక్కలే వీటన్నిటికీ గీటురాయిగా వినియోగిస్తున్నారు. కానీ ఇందువల్ల వాస్తవ చిత్రం ఆవిష్కరణ కాదు. ఉదాహరణకు 2011 జనగణన ప్రాతిపదికగా మన జనాభా 120 కోట్లని తేలింది. తాజాగా అది 140 కోట్లకు చేరుకుందని చెబుతున్నారు. కానీ పాత లెక్కన పేదరికాన్నీ, ఇతర స్థితిగతులనూ గణిస్తున్నందువల్ల 12 కోట్లమంది నిరుపేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సదుపాయం వర్తించటం లేదని అంటున్నారు. తమ రాష్ట్ర జనాభా పెరిగినందువల్ల అదనపు కోటా కావాలని ఏ ప్రభుత్వమైనా ఏ ప్రాతి పదికన అడగాలి? అందుకు కేంద్రం ఎలా అంగీకరించాలి? అప్పుడప్పుడు వెలువడే ప్రపంచసంస్థల సర్వేలు పేదరికాన్నీ, నిరుద్యోగితనూ, ఇతరత్రా అంశాలనూ చూపుతూ మన దేశం వెనక బడి వుందని చెబుతుంటే కేంద్రం నిష్టూరమాడుతోంది. అక్కడివరకూ ఎందుకు... మన సర్వేల రూపకల్పన, అవి వెల్లడించే ఫలితాలు దేశంలో పేదరికం పెరిగినట్టు, అభివృద్ధి జరగనట్టు అభి ప్రాయం కలగజేస్తున్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు శామికా రవి ఆ మధ్య విమ ర్శించారు. ఈ విషయంలో ఆమెతో ప్రణబ్ సేన్‌కు వాగ్వాదం కూడా జరిగింది. బహుశా గణాంకాల కమిటీ రద్దు వెనకున్న అసలు కారణం అదేనా? ఇద్దరి వైఖరుల్లోనూ వ్యత్యాసానికి మూలం జన గణన జరపక పోవటంలో ఉంది. ఆ పనిచేయకుండా గణాంకాల కమిటీనే రద్దు పర్చటం ఉన్నదు న్నట్టు చూపుతున్నదని అలిగి అద్దాన్ని బద్దలుకొట్టడమే అవుతుంది. -
రాజీనామా వ్యూహం
రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు కీలకం. అందులోనూ ప్రత్యర్థి ఊహించని రీతిలో ఎత్తుగడలు వేయడం మరీ అవసరం. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రథసారథి అరవింద్ కేజ్రీవాల్ ఆ సంగతి ఒంట బట్టించుకున్నారు. ఇమేజ్ పడిపోతోందనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ప్రకటన, వినూత్న నిర్ణయంతో మళ్ళీ పుంజుకొనే ఆయన ఈసారీ అదే పద్ధతిని అనుసరించారు. మద్యం పాలసీ కేసు వ్యవహారంలో ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీఎం పదవి నుంచి వైదొలగాల్సిందిగా బీజేపీ కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నా కిమ్మనాస్తిగా ఉన్న కేజ్రీవాల్ ఇప్పుడే ఎందుకీ నిర్ణయం తీసుకున్నారన్నది ఆసక్తి రేపుతోంది. సీనియర్ మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ మొదలు కేజ్రీవాల్ సతీమణి సునీత దాకా స్వల్పకాలిక కొత్త సీఎం ఎవరవుతారనే చర్చ జరుగుతోంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం సమావేశమై చర్చించగా, మంగళవారం ఉదయం కొత్తనేత ఎంపికకై శాసనసభా పక్ష సమావేశం, సాయంత్రం రాజీనామా లేఖ ఇచ్చేందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌తో కేజ్రీవాల్ భేటీ జరగనుండేసరికి ఢిల్లీ రాజకీయం వేడెక్కింది.అసెంబ్లీని అసలు రద్దు చేయాలనే ఆలోచన కూడా ఉన్నా, కొన్నేళ్ళ క్రితం ఆప్ అసెంబ్లీని రద్దు చేసి, తక్షణ ఎన్నికలకు సిఫార్సు చేసినప్పుడు చెవికెక్కించుకోకుండా కేంద్రం తరువాతెప్పుడో తాపీగా ఎన్నికలు పెట్టింది. ఈసారి కూడా ఆ ప్రమాదం ఉన్నందున కేజ్రీవాల్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తీర్పుతో నిజాయతీ నిరూపించుకొని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చొంటానంటూ కేజ్రీవాల్ ఆదివారం చేసిన భీషణ ప్రతిజ్ఞ వెనుక బయటకు చెప్పని కారణాలు అనేకం.సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా ఆప్ నేతలు పలువురు ఇప్పటికే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. అందుకే... 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ప్రభవించిన పార్టీ తమపై వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు ఎన్నికల మార్గం ఎంచుకుంటోంది. అగ్నిపరీక్షకు సిద్ధం అనడం తెలివైన ఎత్తుగడే. రాజీనామా నిర్ణయం రాజకీయ సిక్సర్ అని కొందరు విశ్లేషకులు అంటున్నది అందుకే. అవినీతి మచ్చను తుడుచుకోవడం దగ్గర నుంచి పెరుగుతున్న అధికారపక్ష వ్యతిరేకతను తగ్గించుకోవడం వరకు అనేక విధాలుగా ఈ నిర్ణయం కేజ్రీవాల్‌కు ఉపకరించవచ్చు. ప్రతిపక్ష శిబిరం వల్ల పెరిగిన బీజేపీ వ్యతిరేకత నుంచి లబ్ధి పొందనూవచ్చు. నిర్ణీత కాలవ్యవధి ప్రకారం చూసినా వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది గనక అయిదు నెలల ముందు రాజీనామా వల్ల కేజ్రీవాల్ వస్తే లాభమే తప్ప, పోయేదేమీ లేదు. తాజాగా బెయిలిస్తూ, సీఎం ఆఫీసుకు వెళ్ళరాదు, అధికారిక ఫైళ్ళపై సంతకాలు చేయరాదు, కేసుపై బహిరంగ ప్రకటనలు చేయరాదంటూ సుప్రీమ్ కోర్ట్ పెట్టిన కఠిన నిబంధనల రీత్యా కేజ్రీవాల్ ఎలాగూ సీఎంగా వ్యవహరించలేరు. కాబట్టి, పదవికి రాజీనామా చేస్తూ, మహారాష్ట్రతో పాటు నవంబర్లోనే ముందస్తు ఎన్నికలు జరపాలంటూ ఆయన పోరుబాట పట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘ప్రతీకార రాజకీయాలు’ చేస్తోందని ఆరోపిస్తూ, బాధితుడిగా తనను తాను చూపించుకోవ డానికి కూడా ఆయనకు ఇదే సరైన సమయం. ఎలాగూ ఎన్నికలు జరిగేంత వరకు ఈ కొద్ది కాలం వేరెవరో సీఎంగా ఉన్నా, చక్రం తిప్పేది కేజ్రీవాలే! కనుక బాధ లేదు. అదీ కాక, మధ్యలో కేంద్ర పాలన ఉన్న ఒక్క ఏడాది మినహా 2013 డిసెంబర్ నుంచి ఢిల్లీని ఏలుతున్నందున ఓటర్లలో వ్యతిరే కత పేరుకుంది. దాని నుంచి తప్పించుకోవడానికీ, క్షేత్రస్థాయిలో జనంతో మమేకమై ముచ్చటగా మూడోసారి పార్టీ విజయావకాశాల్ని మెరుగుపరచడానికీ ఈ రాజీనామా డ్రామా అక్కరకొస్తుంది.అయితే, ఇందులో కొన్ని రిస్కులూ లేకపోలేదు. గడచిన 20 నెలల పైచిలుకు కాలంలో ప్రధాన ఆప్ నేతలు పలువురు ఏదో ఒక అంశంలో జైలుకెళ్ళారు. మద్యం కుంభకోణం వ్యవహారం, కేంద్రం వర్సెస్ ఢిల్లీ సర్కార్ల గొడవ మధ్య పాలన పడకేసింది. ఢిల్లీలో ప్రాథమిక పౌర వసతులు కుప్పకూలాయి. ఆ మధ్య అన్యాయంగా ముంచెత్తిన వాన నీళ్ళలో చిక్కుకొని ఐఏఎస్ శిక్షణార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అందుకు ఓ మచ్చుతునక. బడి చదువులు, ఆరోగ్య వసతులు సమూలంగా మార్చేస్తామంటూ ఆప్ అధికారంలోకి వచ్చినా, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో పరిస్థితి తద్విరుద్ధంగా ఉంది. వీటన్నిటి నుంచి జనం దృష్టి మరల్చడం అంత సులభమేమీ కాదు. అసెంబ్లీ రద్దు చేయకుండా నవంబర్‌లో ఎన్నికలనేవి మాటల్లోనే తప్ప చేతల్లో సాధ్యం కాదు. రద్దు చేసి అడిగినా, నవంబర్లోనే ఎన్నికలు పెట్టడం తప్పనిసరి కాదు. ఒకవేళ నవంబర్లోనే ఎన్నికలొస్తే ఆప్‌కు సమయం సరిపోతుందా అన్నదీ ప్రశ్నార్థకమే. ఎన్నికలు జాప్యమైతే అనేక ఇతర రాష్ట్రాల్లోని పార్టీలలో లాగే కొత్త సీఎంతో ఆప్‌లో అసమ్మతి పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. ఆప్ ఇప్పుడు కీలకమైన కూడలిలో ఉంది. ఢిల్లీ, ఆ తర్వాత పంజాబ్‌లలో సత్తా చాటినా, ఇతర రాష్ట్రాలకు విస్తరించడంలో విఫలమైంది. ఇప్పుడు ఢిల్లీలోనే అగ్నిపరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పటికే విలాసవంతమైన సీఎం అధికారిక నివాసం, అమలు కాని పథకాలతో జనంలో పలచనైన కేజ్రీవాల్ ప్రతిష్ఠను కూడగట్టుకోవడం కష్టమే. పైగా కేంద్ర, రాష్ట్ర సర్కార్ల మధ్య పెనుగులాటలో ప్రజలు బాధితులవుతున్నారు. కుంటుబడ్డ పాలనతో కష్టాలు చవిచూస్తున్నారు. కేజ్రీవాల్ అవినీతి పరుడా, కాదా అన్నది తేల్చాల్సింది కోర్టు కాగా ప్రజాకోర్టులో నిజాయతీ సర్టిఫికెట్ తెచ్చుకుంటానని ఆయన చెప్పడం నాటకీయంగా బాగుంటుందే కానీ, నికరంగా ప్రజలకు ఒరిగేది శూన్యం. మరి ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మార్చుకుంటారని పేరున్న కేజ్రీవాల్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో? -
ప్రపంచ వచనాలు
‘పాప పుణ్యాలనేటటువంటివి/ మీ చేతుల్లో ఉన్నవి/ అయ్యా అంటే స్వర్గం/ ఒరే అంటే నరకం/ కూడల సంగమదేవా!’ ఇది బసవన్న చెప్పిన ఎన్నో వచనాల్లో ఒకటి. కన్నడిగుల విశిష్ట సారస్వతం వారి ‘వచనాలు’. కన్నడ ఉపనిషత్తులుగా ఇవి కీర్తినొందాయి. వీరశైవ భావధార ఉద్ధృతంగా ప్రవ హించిన పన్నెండో శతాబ్దంలో ఇవి వెలువడ్డాయి. ఈ వచనకారులు ఒక్కరు కాదు, లెక్కకు మిక్కిలి. ‘పారేనదికి/ ఒళ్లంతా కాళ్లు/ మండే నిప్పుకి/ ఒళ్లంతా నోళ్లు/ వీచే గాలికి/ ఒళ్లంతా చేతులు/ గుహేశ్వరా/ నీ వాళ్లకి/ ప్రతి అంగం లింగమే’ అన్నాడు అల్లమ ప్రభు. ఛందస్సును అనుసరించకుండా, పాండిత్య ప్రకర్ష లేకుండా, సరళంగా, భావ ప్రధానంగా రాసిన ఈ వచనాలు అందులోని పదాల తూగు వల్ల ఒక లయను కలిగివుంటాయి. కొంతమంది శాస్త్రీయ సంగీత గాయకులు వీటిని ఆలపించడం కద్దు. మానవత్వాన్నీ, కాయక ధర్మాన్నీ ఈ వచనాలు చాటిచెప్పాయి. కులాల మధ్య, స్త్రీ పురుషుల మధ్య తేడాలను నిరసించాయి. జంగముడు ఏ కులానికి, ఏ వృత్తికి చెందినవాడైనప్పటికీ శివునిలా పూజనీయుడే; సహపంక్తి భోజనాదులకు అర్హుడే. ఈ విశాల దృక్పథంతో చెప్పి నందువల్లే వచనాలు భక్తేతరుల ఆదరణనూ చూరగొన్నాయి. వీరశైవ భక్తులను ‘శరణులు’ అన్నారు కాబట్టి, వాళ్లు రాసింది ‘శరణ సాహిత్యం’ అయ్యింది. ఈ సాహిత్యాన్ని మరింతగా ప్రపంచానికి చేరువ చేసే ప్రయత్నాలను బెంగళూరులోని ‘బసవ సమితి’ చేస్తోంది. 173 మంది వచనకారుల ఎంపిక చేసిన 2,500 వచనాలను వివిధ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో భిన్న భాషల్లోకి అనువదింప జేస్తోంది. ఇప్పటికే అరబ్బీ, పర్షియన్ లాంటి సుమారు 30 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైన వీటిని 2025 జనవరి కల్లా స్పానిష్, జర్మన్, జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, నేపాలీల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. పన్నెండో శతాబ్దంలో కళ్యాణకటకము నేలిన బిజ్జలుని కొలువులో బసవేశ్వరుడు మంత్రిగా పనిచేశాడు. వీరశైవ మతానికి ఎనలేని ప్రాబల్యాన్ని కల్పించాడు. బసవడు ఎంతటి కవియో అంతటి తాత్వికుడు. ‘ఉన్నవాళ్లు/ గుళ్లు గోపురాలు కట్టిస్తారు/ లేనివాణ్ణి/ నేనేమి చెయ్యాలి?/ నా కాళ్ళే స్తంభాలు/ కాయమే కోవెల/ శిరసే బంగారు శిఖరం/ కూడల సంగమదేవా! విను/ చెడితే స్థావరం చెడుతుంది గాని/ జంగమం చెక్కుచెదరదు’ అన్నాడు. బసవన్న స్థాపించిన ఆధ్యాత్మిక సంఘం ‘అనుభవ మంటపం’. దానికి వేదిక ఆయన ఇల్లే. దీనికి అధ్యక్షుడు అల్లమ ప్రభు. అధ్యక్ష సింహాసనం పేరు శూన్య సింహాసనం. అనుభవ మంటపం అనే ఆలోచనే మేధా మథనానికీ, ప్రజాస్వామిక భావమార్పిడికీ ఉత్తేజాన్ని ఇచ్చేది. ఇందులో సుమారు 300 మంది శరణులు పాల్గొనేవారు. వాళ్లలో ‘వీరరాగిణి’ అక్క మహాదేవి సహా 36 మంది స్త్రీలు ఉండటం విశేషం. వీరిలో రకరకాల వృత్తులవాళ్లు ఉన్నారు. ‘కట్టెలమ్ముకొనే మోళిగెయ మారయ్య, చెప్పులు కుట్టే మాదార చెన్నయ్య, తోళ్లు పదునుపెట్టే దోహర కక్కయ్య, బట్టలుతికే మడివాల మాచయ్య, వెదురు బుట్టలల్లే మేదర కేతయ్య, పడవ నడిపే అంబిగర చౌడయ్య...’ వీళ్లు ‘రామనాథా’, ‘సకలేశ్వరదేవా’, ‘అమరగుండ మల్లికార్జునా’, ‘సిద్ధ మల్లికార్జునా’ అంటూ తమ ఇష్టదైవాలను మకుటంగా చేర్చుకొని తమ వచనాలను చెప్పారు. ‘పిడకలు ఏరటంలోనే/ అయిపోతోంది బ్రతుకంతా/ ఇక నేను/ అన్నం వండేదెప్పుడు,/ తినేదెప్పుడు? కూడల సంగమదేవా’ అన్నాడు బసవన్న. ‘సువిశాలమైన కన్నడ సాహిత్య క్షేత్రంలో విహరిస్తుంటే వచనాల దగ్గరకు వచ్చేసరికి మనం ఒక తపోవనంలో అడుగు పెట్టినట్లుగా అనిపిస్తుంది. అక్కడ మనకు తారసపడేవారందరూ రుషులూ, సాధువులే! కల్మషంతో నిండిన మనుషుల అంతరంగాలు శుభ్రపడటానికి వారి బోధలు చాలు అనిపిస్తుంది’ అంటారు ఈ వచనాల్లో కొన్నింటిని ‘మాటన్నది జ్యోతిర్లింగం’గా పాతికేళ్ల క్రితమే తెలుగులోకి అనువదించిన దీవి సుబ్బారావు.తెలుగులో మొట్టమొదట మల్లికార్జున పండితుడు ‘శివతత్వ సారం’లో బసవన్నను స్తుతించాడు. పాల్కురికి సోమనాథుడు ద్విపదల్లో బసవ పురాణము రచించి వీరశైవాన్ని ప్రచారం చేశాడు. ఒక తెలుగు కవి తొలిసారిగా రాసిన స్వతంత్ర పురాణం ఇది. శివభక్తులకు శ్రీశైలం మహోజ్జ్జ్వల సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. బసవన్నకు ముందువాడని చెప్పే దేవర దాసిమయ్య శ్రీశైలం వచ్చి ఆగమాలు, పురాణాలు చదువుకొన్నాడు. అల్లమ ప్రభు శ్రీశైలంలో సమాధి నొందాడు. అక్క మహాదేవి శ్రీశైల కదళీవనంలో కాలం గడిపింది. ‘కొండల్లో కాక కంచెల్లో ఆడుతుందా నెమలి? /కొలనుల్లో కాక కాలువల్లో ఈదుతుందా హంస/ ...చెన్నమల్లికార్జునుడు కాక అన్యుల్ని తలుస్తుందా నా మనస్సు?’ అంటూ తన జీవితాన్ని ఆ చెన్నమల్లికార్జునుడికే అర్పించుకుంది. ‘మిణుగురులు ఎగిరితే/ నా ఆకలిదప్పులు అణగారినాయనుకొంటా/ మబ్బులు కరిగితే/ నా స్నానం కొరకు పంపిన జలమనుకొంటా/ కొండరాయి జారిపడితే/ నా తల్లో తురిమిన పూవనుకొంటా/ నా కంఠం తెగితే/ చెన్నమల్లికార్జునా!/ అది నీకర్పితమనుకొంటా’ అని పాడుకుంది. ఆమె తపస్సు చేసిందని చెప్పే ‘అక్క మహాదేవి గుహలు’ ఏ శ్రీశైల యాత్రికుడికైనా దర్శనీయ స్థలం.‘ఆవగింజంత సుఖానికి/ సాగరమంత సంకటం/ తన్నే కోల్పోయి/ నిధిని సాధించానంటే/ అందమేముంది?/ గుహేశ్వరా’ అన్నాడు అల్లమ ప్రభు. భక్తి పరవశంలో రాసినవైనప్పటికీ, అంతకుమించిన తాత్విక చింతననూ, మానవ స్వభావాన్నీ ఈ వచనాలు ఆవిష్కరించాయి. అంతేనా? ప్రతి భాషా మేలిమి సాహిత్యాన్నీ అలా పూనిక వహించి ఎల్లలు దాటించాలన్న ప్రేరణను కూడా ఇస్తున్నాయి. -
ఎవరికోసం ఈ కృత్రిమ విపత్తు?
భోపాల్ దుర్ఘటనకు ఇప్పుడు సరిగ్గా నలభయ్యేళ్ల వయసు. భారత చరిత్రలోని విషాద ఉదంతాల్లో అదొకటి. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు బలిగొన్నందుకు గాను కంపెనీ యాజమాన్యంపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదైంది. తమ నిర్లక్ష్యం కారణంగా లేదా చర్యల కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిసి కూడా ముందుకు వెళ్లడాన్ని నేర శిక్షాస్మృతి 'culpable homicide'గా పరిగణిస్తుంది. ఐపీసీ స్థానంలో ‘భారత న్యాయ సంహిత’ (బీఎన్ఎస్) అమల్లోకి వచ్చిన తర్వాత, తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రాణనష్టం సెక్షన్ 106 కిందకు వస్తుందని చెబు తున్నారు. కారకులకు పదేళ్లు జైలు, జరిమానా కూడా ఉండ వచ్చు.ప్రతి పౌరుడికీ జీవించే హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం ఈ హక్కును ప్రాథమిక హక్కుగా (Article 21, Right to life) గుర్తించింది. దీన్ని ఉల్లంఘించే అధికారం ఏ వ్యక్తికి గానీ, వ్యవస్థకు గానీ, ప్రభుత్వానికి గానీ లేదు. నిర్లక్ష్యం వల్లనో, ఉద్దేశ పూర్వకంగానో పౌరుల ప్రాణాలను బలిగొనే ప్రభుత్వాలు అధికారంలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం. రెండు వారాల కింద విజయవాడ నగరం ఎదుర్కొన్న ఆకస్మిక వరదల కారణంగా డజన్లకొద్దీ ప్రాణాలు పోయాయి. మూడు లక్షల కుటుంబాలు తమ సమస్తాన్నీ కోల్పోయాయి. పదేళ్ల కష్టార్జితాన్ని కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలామని ఆ కుటుంబాలు రోదిస్తున్నాయి.విజయవాడ ఆకస్మిక వరదలను ‘ప్రకృతి విపత్తు’ కోటాలో వేసేయలేము. వీటిని నివారించడానికి ఉన్న అవకాశాలను బాధ్యులైన వారు వినియోగించలేదు. బహుశా అందువల్లనే ఈ వరదలను ‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’గా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అభివర్ణించారు. కచ్చితంగా ఈ విషాదం మానవ కల్పితమే! ఈ మానవ కల్పిత విషాదం వెనుక ప్రభుత్వ నిర్లక్షం ఉన్నది. పరిపాలనా వైఫల్యం ఉన్నది. పాలకుల దురుద్దేశం కూడా దాగున్నది. జరిగిన పరిణామాలను క్రమానుగతంగా పరిశీలిస్తే ఈ సంగతి ఎవరికైనా తేటతెల్లమవుతుంది.ఆగస్టు 28వ తేదీ బుధవారం నాడు భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) వారు ఒక నివేదికను విడుదల చేశారు. బంగా ళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర, ఒడిషాలపై ప్రభావం చూపబోతున్నదనే అంశం కూడా ఈ నివేదికలో ఉన్నది. వాతావరణ నివేదికల్లో తుపాను సంబంధిత హెచ్చరికలు వెలువడగానే తీరప్రాంత రాష్ట్రాలు తక్షణం స్పందించి సమీక్ష జరపడం రివాజు. పైగా గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ తుపాను హెచ్చరికలపై స్పందన వేగంగా ఉండాలి. కానీ ప్రభుత్వ పెద్దలు గానీ, అధికార యంత్రాంగం గానీ ఈ హెచ్చరికను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.ఆ మరుసటిరోజు ఆగస్టు 29న ఐఎమ్‌డీ రెండో నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు గురువారం రాత్రి నుంచి శనివారం వరకు పడతాయని నివేదిక హెచ్చరించింది. ఐఎమ్డీతోపాటు ‘ఆంధ్ర ప్రదేశ్ వెదర్‌మ్యాన్’, ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ కూడా ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. వాతావరణ శాస్త్రవేత్తలైన ఈ యువకులు ‘వెదర్‌మ్యాన్’ పేరుతో అత్యంత కచ్చితత్వంతో కూడిన హెచ్చరికలు జారీచేస్తూ ఇటీవలి కాలంలో సంచలనం సృష్టిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్’ సాయి ప్రణీత్ 29న డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేస్తూ నివేదికను విడుదల చేశారు. విజయనగరం నుంచి పల్నాడు జిల్లా వరకు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, ముఖ్యంగా శనివారం నాడు అతి భారీ వర్షా లుంటాయి కనుక పాఠశాలలకు ముందుగానే సెలవు ప్రకటించాలని పవన్ కల్యాణ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.వరుస హెచ్చరికలున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెడచెవిన పెట్టారు. అధికార యంత్రాంగం చేష్టలుడిగి కూర్చున్నది. రాజకీయ – అధికార ముఖ్యులందరూ వీకెండ్ మూడ్‌లోకి, చలో హైదరాబాద్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. రిజర్వాయర్లలో ‘ఫ్లడ్ కుషన్’ మెయింటెయిన్ చేయలేదని జగన్మోహన్రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నట్టు నదుల్లో వరద నియంత్రణ చర్యలను యంత్రాంగం గాలికి వదిలేసింది. భారీ వర్ష సూచనలున్నప్పుడు నిండుగా ఉన్న రిజర్వాయర్ల నీటిని కొంత మేరకు దిగువకు విడుదల చేసి వచ్చే వరద ప్రవాహానికి కొంత కుషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ ప్రోటోకాల్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయి వరద చేరి పరిస్థితిని సంక్లిష్టం చేసింది. దీని ప్రభావం బుడమేరు మీద, రాజ ధాని ప్రాంతం మీద కూడా పడింది.బుడమేరు అనే వాగుకు ఎప్పటినుంచో ‘బెజవాడ దుఃఖ దాయని’ అనే పేరున్నది. విజయవాడకు ఉత్తర దిక్కున ఉన్న ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి ఈ వాగు దక్షిణా భిముఖంగా ప్రవహించి, నగరానికి వాయవ్య దిక్కున ఉన్న వెలగలేరు అనేచోట తూర్పు వైపు తిరిగి, పలు వంపులు తిరు గుతూ నగరం మీదుగా కొల్లేరు దాకా పారుతుంది. విజయ వాడకు వరద ముప్పును నియంత్రించడం కోసం వెలగలేరు మలుపు దగ్గర బుడమేరుపై గేట్లు బిగించారు. వరద ప్రవాహాన్ని దక్షిణం వైపు మళ్లిస్తూ ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలోకి పారేలా ‘బుడమేరు డైవర్షన్ కెనాల్’ (బీడీసీ) ఏర్పాటు చేశారు. దిగువన ఇబ్రహీంపట్నం దగ్గరున్న విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కోసం ఏర్పాటైన కూలింగ్ కెనాల్‌తోనే ఈ బీడీసీని అనుసంధానించారు. పోలవరం కుడికాల్వను కూడా వెలగలేరు వద్ద బీడీసీతో కలిపేశారు. ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసె క్కులని చెబుతారు. కానీ అంతకుముందే అక్కడ వీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌పై చంద్రబాబు ఓ యెల్లో మీడియా ప్రముఖునికి ఇచ్చిన పవర్ ప్లాంట్ కారణంగా ఐదు వేల క్యూసెక్కులకు మించి అక్కడ ప్రవహించే అవకాశం లేదని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. బుడమేరు వరదెత్తిన రోజుల్లో గరిష్ఠ స్థాయిలో ఆ ప్రవాహాన్ని బీడీసీలోకి మళ్లిస్తే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుంది. ఆ గరిష్ఠ స్థాయి మళ్లింపునకు అడ్డుగా ఉన్న పవర్ ప్లాంట్‌ను తొలగించడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా కోర్టు›స్టేల వల్ల సాధ్యం కాలేదు.ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులో 45 వేల క్యూసెక్కుల వరద రాబోతున్నదని శనివారం మధ్యా హ్నానికి ముందే స్థానిక ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. బుడ మేరు రెగ్యులేటర్ డీఈ మాధవనాయక్ ‘సాక్షి’ టీవీతో ఆన్ రికార్డు ఈ విషయాన్ని నిర్ధారించారు. బీడీఎస్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులే కనుక అనివార్యంగా బుడమేరు గేట్లను శని వారం సాయంత్రానికల్లా ఎత్తవలసి ఉంటుందని కూడా వారు ఉన్నతాధికారులకు చేరవేశారు. ‘పైస్థాయి’ వారు వెంటనేస్పందించి గేట్లు ఎత్తడంపై నిర్ణయం తీసుకొని ఉంటే విజయ వాడలోని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను తరలించడానికి సరిపోయే సమయం ఉండేది. రాబోతున్న వరదను గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం ఉండేది. ప్రొటో కాల్ ప్రకారం గేట్లు ఎత్తడానికి పన్నెండు గంటల ముందు ప్రజ లను అప్రమత్తం చేయాలి. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ఇవన్నీ జరగాలంటే వాతావరణ హెచ్చరికలు వెలువడి నప్పుడే ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ పెద్దలు సమీక్షా సమావేశం జరిపి నిర్ణయాలు తీసు కోవాలి. అది జరగలేదు. తీరా కృష్ణానదిలో వరద పెరిగి చంద్ర బాబు కరకట్ట నివాసంలోకి కూడా నీళ్లు రావడంతో ఆయన కలెక్టరేట్‌లోకి తన బసను మార్చుకున్నారు. అప్పటికే బుడమేరు పరిస్థితి భయానకంగా ఉన్నట్లు సమాచారం ఉన్నది. ఆ సమ యంలో తీరిగ్గా మూడు శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బుడమేరు గేట్లపై ఏం నిర్ణయం తీసు కున్నారో ఎవరికీ తెలియదు. ఎటువంటి ప్రకటనా వెలువడ లేదు. పునరావాస శిబిరాలు ఏర్పాటు కాలేదు. ప్రజలకు హెచ్చరి కలు జారీ కాలేదు. వారిని తరలించే ప్రయత్నాలూ జరగలేదు.మూడు లక్షలమందిని వరద ముంచేసిన తర్వాత వారం రోజులకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఒక భయంకరమైన విషయాన్ని బయటపెట్టారు. ఒక రోజు ముందుగానే వరద సంగతి తమకు తెలుసనీ, కానీ రెండు లక్షల కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి తరలించడం సాధ్యమయ్యే పని కాదు కనుక ప్రజలను హెచ్చరించలేదని చెప్పారు. ఇంత కంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంత కన్నా బాధ్యతా రాహిత్యం ఉంటుందా? ఇదే కదా నేరపూరిత నిర్లక్ష్యం! ఇదే కదా ఉద్దేశపూర్వకంగా ప్రజల ప్రాణాలను బలి పెట్టడం! ఇది కేవలం ఆ ఉన్నతాధికారి నిర్ణయం మాత్రమే అను కోలేము కదా! అత్యున్నత స్థాయి నిర్ణయాన్నే ఆయన వెల్లడించి ఉంటారు కదా!హెచ్చరికలు లేకుండా, ఏర్పాట్లు లేకుండా బుడమేరు గేట్లెత్తి లక్షలాదిమందిని వరదపాలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రేరేపించిన పరిస్థితులేమిటి? శనివారం మధ్యా హ్నానికే ప్రకాశం బ్యారేజీలోకి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుకున్నది. కరకట్ట మొదటి అంతస్తుల్లోకి ప్రవేశించింది. బ్యారేజీ దగ్గర కృష్ణానది బెడ్ లెవెల్ సముద్ర మట్టానికి 11.24 మీటర్లు. రాజధాని ప్రాంతం గుండా పారే కొండవీటి వాగు ఉండవల్లి దగ్గరున్న కృష్ణానది తూము ద్వారా నదిలో కలుస్తుంది. అక్కడ దాని బెడ్ లెవెల్ 11 మీటర్లు. ఐదారు లక్షల క్యూసెక్కుల ప్రవాహం గనుక బ్యారేజీ దగ్గర ఉన్నట్లయితే కొండవీడు వాగు కృష్ణలో కలవడానికి బదులు కృష్ణ నీళ్లు వాగు లోకి ఎగదన్నుతాయి. కొండవీడు వాగు మోసుకొచ్చే వరదను రాజధాని ప్రాంతంలో నియంత్రించడం కోసం ఒక లిఫ్టును ఏర్పాటు చేశారు. దాని సామర్థ్యం ఐదువేల క్యూసెక్కులు మాత్రమే. కృష్ణాలో ప్రవాహం పెరిగి వాగులోకి ఎగదన్నడం ఎక్కువైతే అమరావతి డ్రీమ్ ప్రాజెక్టుకు కోలుకోలేని డ్యామేజ్ అవుతుంది. బ్యారేజీలో కొంచెం ఎగువన నదికి మరోవైపున బుడమేరు డైవర్షన్ కెనాల్ కృష్ణానదిలో కలుస్తున్నది. ఈ బుడ మేరు నీళ్లనే కృష్ణలో కలిపి కృష్ణా–గోదావరి నదుల అనుసంధా నాన్ని పూర్తి చేశానని గతంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. దీనికే ఆయన ‘పవిత్ర సంగమం’ అనే నామకరణం చేశారు.ఇక్కడ కృష్ణానది, బుడమేరు కాలువల బెడ్‌లెవెల్ సమానంగా ఉంటుంది. ఫలితంగా కృష్ణా ప్రవాహం వేగంగా కాల్వ లోకి ఎగదన్నడం మొదలైంది. మరోపక్క బుడమేరు గేట్లు మూసి ఉన్నందువలన వరద మొత్తం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణ వైపు పరుగెత్తుతున్నది. పవర్ ప్లాంట్ కారణంగా ఇరుకైన కాలువ తట్టుకోలేక గట్టుకు గండ్లు పడి కృష్ణా జలాలు పడమటి దిక్కు నుంచి విజయవాడ వైపు మళ్లాయి. శనివారం రాత్రి పడిన ఈ గండ్లనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూడ్చలేకపోయిందని అధికార పార్టీ ప్రచారంలో పెట్టింది. గేట్లు ఎత్తితే బుడమేరు వరద ఎదురు రాకుండా కృష్ణా వరద స్వేచ్ఛగా ఎగదన్నడం వలన బ్యారేజీ నీటిమట్టం ప్రమాదకరంగా పెరగకుండా నియంత్రించవచ్చనే ఆలోచన కూడా కారణం కావచ్చు. రాత్రి పూట చెప్పాపెట్టకుండా గేట్లు ఎత్తేశారు. బుడమేరు వరద బెజవాడపై ఉత్తరం దిక్కు నుంచి విరుచుకుపడింది.శనివారం మధ్యాహ్నానికే నిర్ణయం తీసుకొని, చాటింపు వేయించి ప్రజలను తరలించి ఉన్నట్లయితే పెను ఉత్పాతం నివారించడం సాధ్యమయ్యేది. కానీ ఈ ఏర్పాట్లు చేయడానికి యంత్రాంగం సన్నద్ధంగా లేదు. నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా కిమ్మనాస్తిగా స్తంభించిపోయింది. పెద్దల ఆయువుపట్టుకే దెబ్బ తగలబోతోందన్న ఆలోచన రాగానే విజయవాడను బలిపెట్టడా నికి సిద్ధమైనట్టుగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి.ప్రభుత్వ ఘోరవైఫల్యం, దూరదృష్టి లేకపోవడం, పాలనా యంత్రాంగ నిస్తేజం, ఆపైన పెద్దల సొంత ప్రయోజనాలు... వెరసి విజయవాడ వీధుల్లో కన్నీటి కెరటాలు ఎగసిపడ్డాయి. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారం రోజుల పాటు ప్రభుత్వ పెద్దలు పడినపాట్లు అన్నీ ఇన్నీ కావు. విష్ణుమూర్తి అవతారాల మాదిరిగా కొన్నిసార్లు పడవల మీద, కొన్నిసార్లు బుల్డోజర్లపై, మరికొన్ని సార్లు కాలినడకన ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి ప్రజ లకు అభివాదాలు చేస్తూ కనిపించారు. వర్షంలోనే గండ్లు పూడ్చుతూ కనిపించే మంత్రుల ఫొటోలు, వీడియోలు దర్శన మిచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన ఫోటోల్లో, డ్రోన్ల ద్వారా ఇంటింటికి ఆహారం సరఫరా దృశ్యాలు ప్రచారంలోకి వచ్చాయి.ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కనిపించి నట్టుగా వైఫల్యాల సుడిలో కొట్టుమిట్టాడుతున్న సర్కార్‌కు ప్రకాశం బ్యారేజీ దగ్గరకు కొట్టుకొచ్చిన బోట్లు కనిపించాయి. ఈ బోట్లను వైసీపీ వాళ్లే ప్రయోగించారనీ, ఈ బోట్ల కారణంగానే బెజవాడ మునిగిందనే డైవర్షన్ స్కీమును ముందుకు తెచ్చారు. బురదను కడుక్కోవాలి కనుక అవతలి పక్షం వారు కూడా బోట్లు టీడీపీ వారివేననే సాక్ష్యాలను ముందుకు తెచ్చారు. ఈ బోట్ల కాట్లాట నడుమ అసలైన కారణాలను మరుగున పడేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. వారి లక్ష్యం ఏదైనా కావచ్చు, ప్రజల ప్రాణాలను బలిగొనే నేరపూరిత నిర్లక్ష్యాలను ఉపేక్షించడం ప్రజాస్వామ్యానికి హితం కాదు. ప్రభుత్వాల చేతగానితనాన్ని సహించడం కూడా క్షేమం కాదు. జరిగిన విధ్వంసంపై కేసులు నమోదు కావాలి. ఈ విషాదానికి కేవలం నిర్లక్ష్యం, చేతగాని తనాలే కారణాలా? మరేదైనా లోతైన కారణం ఉన్నదా అనే కోణంలో విచారణ జరగాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇలా చేయటం సబబేనా!
లేవనెత్తిన సమస్యల తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించుకోవటానికి పట్టువిడుపులు ప్రదర్శించటం, గరిష్ఠంగా సాధించుకోవటం ఏ ఉద్యమానికైనా ఉండాల్సిన మౌలిక లక్షణాలు. పశ్చిమబెంగాల్లో జూనియర్ డాక్టర్లు నెల రోజులకుపైగా సాగిస్తున్న ఉద్యమం ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తించాల్సి వుంది. ఆర్జీ కర్ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో తమ సహచర వైద్యురాలు 36 గంటలు నిర్విరామంగా రోగులకు సేవలందించి సేదతీరిన నిశిరాత్రిలో దుండగులు ఆమెపై అత్యాచారం జరిపి పొట్టనబెట్టుకున్న వైనం వెల్లడయ్యాక జూనియర్ డాక్టర్ల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఆ ఉద్యమాన్ని తుంచేయడానికి, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి గూండాలను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించిన తీరు వారిని మరింత రెచ్చగొట్టింది. ఉన్నతాదర్శాలతో ఈరంగంలో అడుగుపెట్టిన యువ వైద్యులను పాలనా నిర్వాహకులు వేధించుకు తినటం, మాఫియా లుగా మారటం, పాలకులు పట్టనట్టు వ్యవహరించటం వాస్తవం. తూట్లు పూడుస్తున్నట్టు కనబడు తూనే తూములు తెరిచిన చందంగా పాలకులు వ్యవహరించిన తీరు దాచేస్తే దాగని సత్యం. జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు ఎటువంటివో, అవి ఎంత ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయో ఇవాళ దేశమంతా తెలిసింది. కొంత హెచ్చుతగ్గులతో ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి దయనీయ స్థితిలోనే జూనియర్ డాక్టర్లు తమ వృత్తిని కొనసాగించాల్సి వస్తున్నదని కూడా అందరూ గ్రహించారు. ప్రజావైద్యరంగంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవ్యవస్థ దళారీలనూ పెత్తందార్లనూ సృష్టించిందని, ఆ రంగాన్ని రోగగ్రస్తం చేసిందని జనంగుర్తించారు. దేన్నయినా రాజకీయ కోణంలోనే చూడటం అలవాటైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీన్నుంచి కూడా అవలీలగా బయటపడగలమని తొలుత భావించారు. పైపై చర్యలతో ఉద్యమాన్ని సద్దుమణగనీయొచ్చని ఆశించారు. పరిస్థితి చేయి దాటుతున్నదనిఆలస్యంగా గ్రహించారు. గురువారం ఉద్యమకారులతో చర్చించడానికి రాష్ట్ర సెక్రటేరియట్లోరెండు గంటలకు పైగా వేచిచూసి, వారు వచ్చే అవకాశం లేదని గ్రహించాక రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలకోసం రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని కూడా ప్రకటించారు. మొదట్లో సమస్య పరిష్కారానికి సిద్ధపడని ఆమె వైఖరివల్లనే సమస్య జటిలంగా మారిందన్నది వాస్తవం. వైద్య సాయం అందక, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేకపలువురు మరణించారు. ఈ పాపం నుంచి ఆమె తప్పించుకోలేరు. తన స్వభావానికి భిన్నంగా ఉద్యమం విరమించుకోవాలని ముకుళిత హస్తాలతో ఉద్యమకారులను వేడుకోవటం, వారితో చర్చించటానికి సుదీర్ఘ సమయం వేచిచూడటం ఇది గ్రహించబట్టే. చేతులు కాలాక ఆకులు పట్టు కోవటం లాంటిదే ఇది. అయితే ఉద్యమకారులుగా పట్టువిడుపులు ప్రదర్శించాలని జూనియర్ డాక్టర్లు కూడా గుర్తించాలి. ఉద్యమం విరమించి విధులకు హాజరు కావాలని ఇప్పటికి మూడుసార్లు సర్వోన్నత న్యాయస్థానం కోరింది. అలా చేరితే ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండబోవని మొన్న పదో తేదీన వారికి చెప్పింది కూడా. జరిగిన దుస్సంఘటనపై దర్యాప్తు జరపాలని, పని పరిస్థితులు మెరుగు పర్చాలని, జూనియర్ డాక్టర్లకు భద్రత కల్పించాలని, పని గంటల భారాన్ని తగ్గించాలని మొదట్లో కోరారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపాల్‌ను, మరికొందరిని తొలగించారు. పలువురిని అరెస్టు చేశారు. జూనియర్ డాక్టర్లు లేవ నెత్తిన మౌలిక సదుపాయాల కల్పనకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఉద్యమకారుల డిమాండ్లు పెరుగుతూ పోతున్నాయి. వైద్యరంగ ప్రక్షాళన కోసం వైద్య విద్యా డైరెక్టర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, నగర పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని తాజాగా వారు కోరుతున్నారు. అంతే కాదు... తమతో మమత జరపదల్చుకున్న చర్చలను చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలనిడిమాండ్ చేశారు. అందుకు ఒప్పలేదన్న కారణంతో గురువారం చర్చలను బహిష్కరించారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే తన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు చర్చలు ప్రజలందరూ చూసేలా జరగటంలో తప్పేముందన్నది వారి ప్రశ్న. వినటానికి సబబే అనిపించవచ్చు. కానీ మమత అంటున్నట్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగుతోంది. దానిపై బహిరంగ చర్చ మంచిదేనా? దుండగుల దాడిలో బలైపోయిన యువ వైద్యురాలి కుటుంబసభ్యుల గోప్యత ఏం కావాలి? ఉద్యమకారులు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశారు. కానీ ఇప్పటికే తీసుకున్న చర్యలకు మించి వారేం ఆశిస్తున్నారనుకోవాలి?నిరుపేద వర్గాలకు చెందిన వృద్ధులు, గర్భిణులు, దీర్ఘవ్యాధులతో బాధపడేవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు లభించక తల్లడిల్లుతున్నారు. దాదాపు 25 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి.8,000 మంది జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా వైద్య సేవలు అందించలేమని సర్కారీ ఆస్పత్రులు చేతులెత్తేయటం వల్ల అంతంతమాత్రంగా బతుకీడుస్తున్నవారు సైతం రోగాలబారిన పడిన తమ ఆప్తుల్ని రక్షించుకోవటానికి అప్పులుచేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అందుకే జూనియర్ డాక్టర్లు తమ బాధ్యత గుర్తెరగాలి. పాలకులపై తమకున్న ఆగ్రహం దారితప్పి సామాన్యులను కాటేస్తున్న వైనాన్ని గమనించాలి. తమ డిమాండ్లకు సమాజం నుంచి సానుకూలత, సానుభూతి వ్యక్తమవుతున్న తరుణంలోనే విధుల్లో చేరాలి. తెగేదాకా లాగటం మంచిది కాదని తెలుసుకోవాలి. -
ఈ బద్ధకం వదిలేద్దాం!
ఆరోగ్యమే మహాభాగ్యమంటాం. ఆరోగ్యంగా ఉండేందుకు కనీసపాటి శ్రమైనా చేస్తున్నామా? శారీరక శ్రమ, క్రమం తప్పని కదలికల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా, భారతీయులు బద్ధకపు జీవనశైలినే అనుసరిస్తున్నారట. క్రియాశీలక జీవనవిధానానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు పేర్కొంది. కానీ, మన దేశం నుంచి 20 కోట్ల మంది (15.5 కోట్ల మంది వయోజనులు, 4.5 కోట్ల మంది కౌమార వయస్కులు) వాటిని పాటించడంలో విఫలమవుతున్నారు. డాల్బెర్గ్ వారి ‘స్టేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’ (సాపా) నివేదిక తాజాగా ఈ సంగతి వెల్లడించింది. ఈ నివేదిక ఆందోళన కలిగించడమే కాక, ఆటలు, వ్యాయామం విషయంలో భారతీయులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి, ఇలాంటి జాతీయ స్థాయి సర్వే జరగడం ఇదే తొలిసారి. మేధావుల బృందమైన ‘డాల్ బెర్గ్ అడ్వైజర్స్’, స్వచ్ఛంద సంస్థ ‘స్పోర్ట్స్ అండ్ సొసైటీ యాక్సలరేటర్’ సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనం అనేక ఆందోళనకరమైన ధోరణులను వెల్లడించింది. మన దేశంలో వయోజనుల్లోని కాస్తంత పెద్దవారిలో 48 శాతం మంది ఆటల లాంటి శారీరక శ్రమ చేసేందుకు తమ వయసు మీద పడింది అనేస్తున్నారట. ఇంకా చిత్రం ఆటలు ఆడపిల్లలకు సురక్షితం కాదన్న అభిప్రాయంలో 45 శాతం మంది ఉన్నారట. అలాగే, శారీరక శ్రమ చేయడం ఋతుస్రావ మహిళలకు నష్టదాయకమనీ, ఒంటికి దెబ్బలు తగిలితే వివాహ అవకాశాలు దెబ్బ తింటాయనీ, భౌతిక శ్రమ వల్ల పెళ్ళయిన అమ్మాయిలకు గర్భస్రావం అవుతుందనీ... ఇలా రకరకాల దురభిప్రాయాలు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో... అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో శారీరక శ్రమ బాగా తక్కువవడం గమనార్హం. దీనికి కారణాలు లేకపోలేదు. శారీరక శ్రమ చేసేందుకు అనుకూలంగా ఉద్యానాలు, మైదానాల లాంటి బహిరంగ ప్రదేశాలు పట్టణాల్లో కరవై పోయాయి.అందువల్ల గ్రామాలతో పోల్చి చూసినప్పుడు పట్టణాల్లో శారీరక శ్రమ రాహిత్యం రెట్టింపు ఉంటోంది. నగర జనాభా మరీ అతి సున్నితంగా తయారైంది. ఇక, మన భారతీయ మహిళల్లో... నూటికి 75 మందికి రకరకాల ఇంటిపనుల్లోనే సమయమంతా గడిచిపోతుంది. ఫలితంగా వారికి వ్యాయామం చేసేందుకు తీరిక దొరకని పరిస్థితి. ఈ కారణాలన్నీ కలిసి కొంప ముంచుతున్నాయి. జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నాయి. చాలామంది రోజూ నడుస్తున్నామంటారు. నడక వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కానీ, ఆరోగ్యవంతమైన శరీరానికి అదొక్కటే సరిపోదని నిపుణుల ఉవాచ. తాజా సర్వే ఒక్కటే కాదు... ప్రతిష్ఠాత్మక ‘లాన్సెట్’ పత్రికలో ఇటీవలే ప్రచురితమైన మరో అధ్యయనం సైతం భారతీయ వయోజనుల్లో నూటికి 50 మంది శారీరకంగా తగినంత శ్రమ చేయట్లేదని పేర్కొంది. అంతంత మాత్రపు శారీరక శ్రమతోనే వయోజనులు సరిపెట్టుకొంటున్న ధోరణి ఉన్నతాదాయాలుండే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తోంది. ఆ తరువాత రెండోస్థానంలో దక్షిణాసియా ప్రాంతం నిలిచింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చెబుతున్న మాట. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే... మన దేశంలోని వయోజనుల (కనీసం 18 ఏళ్ళు, ఆపైన ఉన్నవారి)లో పెద్దగా శారీరక శ్రమ చేయని సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2000 నాటికి అలాంటివారు 22 శాతం పైచిలుకు ఉంటే, 2010 నాటికి వారు 34 శాతం దాకా పెరిగారు. 2022 నాటికి 50 శాతం దాకా చేరారు. ఇలాగే కొనసాగితే... 2030 నాటికల్లా ఇలాంటివాళ్ళు ఏకంగా 60 శాతానికి చేరతారని అంచనా. ఇది శారీరక, మానసిక ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగానూ ప్రమాదఘంటికే!రోజూ బద్ధకంగా, శారీరక శ్రమ లేకుండా గడిపేస్తుంటే... మధుమేహం, గుండెజబ్బు వచ్చే ముప్పుంది. నిజానికి, ఎంతసేపూ కదలకుండా కూర్చొనే జీవనశైలి, శారీరక శ్రమ అంతకంతకూ తగ్గిపోవడం వల్ల ప్రపంచమంతటా ఈ జబ్బుల బారినపడుతున్నవారు పెరుగుతున్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పడుతోందని డబ్ల్యూహెచ్ఓ మాట. అంతేకాదు... ఈ బద్ధకపు జీవన విధానం వల్ల మన దేశంలో దాదాపు 25.4 కోట్లమందికి పైగా స్థూలకాయంతో, 18.5 కోట్ల మంది దాకా ‘చెడు కొలెస్ట్రాల్’తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఆరోగ్యానికే కాదు... దేశ ఆర్థిక బలిమికీ శారీరకంగా చురుకుదనం అత్యంత కీలకం. మన దేశ జనాభా మొత్తం శ్రమకు నడుంబిగిస్తే, 2047 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి రూ. 15 ట్రిలియన్లు దాటిపోతుందని అంచనా. స్థూలకాయం, లాంటి జబ్బులు తగ్గడమే కాదు, వాటి కోసం ఖర్చు చేస్తున్న రూ. 30 ట్రిలియన్లు ఆదా అవుతాయి. లెక్కతీస్తే, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది తగిన శారీరక శ్రమ చేయక చెరుపు చేస్తున్నారు, చేసుకుంటున్నారు. ఇక, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల్ని బట్టి చూసినా శారీరక శ్రమరాహిత్యం అత్యధికంగా ఉన్న 195 దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచిందని ‘లాన్సెట్’ అధ్యయనం. రోజువారీ వ్యాయామంతో సమయం వృథా అనీ, ర్యాంకుల చదువులతోనే జీవితంలో పైకి వస్తామనీ, ఆటలు అందుకు ఆటంకమనీ భావించే తల్లితండ్రుల ఆలోచనా ధోరణి ఇకనైనా మారాల్సి ఉంది. మనమైనా, మన దేశమైనా పైకి రావాలంటే... మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యమే కీలకం. ప్రభుత్వాలు అది గుర్తించి ఆటలతో మేళవించిన విద్యా ప్రణాళికను తప్పనిసరి చేయాలి. పౌరుల కోసం వ్యాయామ కేంద్రాల వసతులూ పెంచాలి. ఎందుకంటే, జీవన సౌంద ర్యమే కాదు... జగమంతటినీ లక్ష్మీనివాసంగా మార్చే మహత్తూ శ్రమశక్తిదే మరి! -
Haryana: ఆసక్తికరమైన పోరు
జమ్మూ– కశ్మీర్లో తొలి విడత పోలింగ్‌కు మరొక్క వారమే మిగిలింది. హర్యానాలో నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో ముగియనుంది. ఈ పరిస్థితుల్లో కశ్మీర్లో ప్రచారం ఊపందుకుంటుంటే, హర్యానాలో అభ్యర్థుల ఖరారు తుది అంకానికి చేరింది. కశ్మీర్‌ను అటుంచితే... కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య సీట్ల సర్దుబాటు విఫలమవడంతో హర్యానా ఆసక్తి రేపుతోంది. బహుముఖ పోటీ అనివార్యమయ్యేసరికి పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఆప్ ఒంటరి పోరుకు దిగడమే కాక, మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కలాయత్ లాంటి చోట్ల గెలిచిన ఊపుతో, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపి, పట్టణ ప్రాంతాలకే కాక మిగతా చోట్లకూ తన ఉనికిని విస్తరించు కోవాలని సాహసిస్తోంది. వీధికెక్కి పోరాడినా, లైంగిక వేధింపుల సమస్యను పరిష్కరించని కేంద్ర సర్కార్ వైఖరితో విసిగిన రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజ్రంగ్ పూనియాలు కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయం మరింత వేడెక్కింది. మహిళా రెజ్లర్లపై జనంలో సానుభూతి, పాలకుల నిర్లక్ష్యంతో రైతుల ఆగ్రహం, జాట్లు సహా వివిధ వర్గాల్లో అసంతృప్తి మధ్య అధికార బీజేపీ ఎదురీదుతోంది.మొత్తం 90 స్థానాలకు గాను కాషాయపార్టీ ఇప్పటికే 87 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగతా 3 స్థానాలను హర్యానా లోక్‌హిత్ పార్టీ (హెచ్ఎల్పీ) లాంటి చిరు మిత్రపక్షాల కోసం అట్టి పెట్టింది. అభ్యర్థుల ప్రకటనపై పార్టీలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటనతోనే అసంతృప్తి జ్వాలలు రగిలినా, రెండో విడత జాబితా కూడా ప్రకటించేసరికి అది మరింత పైకి ఎగసింది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ, మాజీ మంత్రులకూ టికెట్లు నిరాకరించేసరికి సమస్య పెద్దదైంది. పార్టీ రాష్ట్ర శాఖ ఆఫీస్ బేరర్ల మొదలు పలువురు సీనియర్ నాయకులు రాజీనామా చేయడం గమనార్హం. బీజేపీ హర్యానా శాఖ వైస్ ప్రెసిడెంటైన మాజీ డిప్యూటీ స్పీకర్, అలాగే రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, కొందరు మంత్రులు, మాజీ మంత్రులు సైతం అసెంబ్లీ టికెట్ దక్కలేదని కినుక వహించి, పార్టీని వీడారంటే పరిస్థితిని అర్థం చేసు కోవచ్చు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అసలైన కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేసి, పనిచేయనివారికీ, అసలు ఆ నియోజకవర్గ పౌరులే కానివారికీ సీట్లు కేటాయిస్తోందని సొంత పార్టీ వారే ఆరోపిస్తున్నారు. నిజానికి ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) చెందిన నయబ్ సైనీని కొంతకాలం క్రితం సీఎంను చేశాక హర్యానాలో పార్టీ గ్రాఫ్ కొంత పెరిగింది. ఇప్పుడూ సైనీనే సీఎం అభ్యర్థిగా చూపుతూ బీజేపీ ఎన్నికలకు వెళుతోంది. అయితే, ఆచరణలో మాత్రం ఆయన ప్రమేయం పెద్దగా లేకుండానే బీజేపీ టికెట్ల కేటాయింపు ప్రక్రియ జరిగిపోయిందని చెబుతున్నారు. ఏళ్ళ తరబడిగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని కొత్తవారికీ, ఇతర పార్టీల నుంచి ఫిరాయించి వచ్చిన వారికీ బీజేపీ పట్టం కట్టడం సైతం రేపు ఎన్నికల్లో పార్టీని కొంత దెబ్బ తీయవచ్చు. దానికి తోడు పార్టీలో అంతర్గత విభేదాలు, ఆశావహ సీఎం అభ్యర్థుల తాకిడి ఉండనే ఉన్నాయి. పదేళ్ళుగా అధికారంలో కొనసాగాక బీజేపీకి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం చిత్రమే. ఈసారి ఎన్నికల్లోనూ గెలిచి, వరు సగా మూడోసారి గద్దెనెక్కాలని చూస్తున్న కాషాయపార్టీకి ఇప్పుడది సులభం కాకపోవచ్చు. కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తోంది. పైగా ఎన్నికలంటే ఎక్కడైనా అధికార పక్షం పట్ల వ్యతిరేకత సహజం. బీజేపీలోని వర్గవిభేదాలు, రైతులు – జాట్ల లాంటి వర్గాలతో సహా గ్రామీణ ప్రాంతాల్లో దాని పట్ల అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలసి అక్టోబర్ 8న పోలింగ్‌లో విపక్షానికి అనుకూలించవచ్చు.లోక్‌సభ ఎన్నికల ఫలితాల సరళి, ప్రాథమిక ఒపీనియన్ పోల్స్‌ను బట్టి చూస్తే, కాంగ్రెస్‌కు కొంత అనుకూలత కనిపిస్తోంది. కానీ, అంతర్గత విభేదాలు ఆ పార్టీనీ పీడిస్తున్నాయి. స్వతంత్రు లుగా బరిలోకి దిగే అసమ్మతులతో అన్ని పార్టీలకూ చిక్కే. మరోపక్క ఎన్నికలిప్పుడు బీజేపీ,కాంగ్రెస్, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ కావడంతో అధికారపక్ష వ్యతిరేక ఓటు ఏ మేరకు చీలుతుంది, అది బీజేపీకి ఎంత మేర లాభిస్తుంది అన్నది ఆసక్తికరం. గతంలోకి వెళితే –∙2019 ఎన్నికల్లో హర్యా నాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అంతకు పదేళ్ళ ముందూ అలాగే జరిగింది. అలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీల వారు, స్వతంత్రులు కీలకమవుతారు. ఈ ‘ఇతరులు’ పాతికేళ్ళ క్రితం 30 శాతం ఓట్లు సాధిస్తే, క్రితంసారి అది 18 శాతానికి పడిపోయింది. అయితేనేం, ప్రతిసారీ వారు 8 నుంచి 16 సీట్ల మధ్య గెలుస్తున్నారని మర్చిపోలేం. 2009లో కాంగ్రెస్ స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతోనే గద్దెనెక్కింది. 2019లో బీజేపీ సైతం జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో ఎన్నికల అనంతర పొత్తుతోనే అధికారం చేపట్టింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇతరుల’కు 8 శాతం ఓట్లే వచ్చినా, స్థానిక అంశాలు ప్రధానమయ్యే అసెంబ్లీ ఎన్నికల్లో వారి పాత్ర గణనీయమవుతుంది. కాకపోతే, స్థానికమైన జేజేపీ గ్రామీణ ప్రాంతాల్లోని తన పట్టును నిలుపుకోలేకపోతోందనీ, సాంప్ర దాయిక రైతు ఓటర్లున్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) బలం ప్రస్తుతం కొద్ది స్థానాలకే పరిమితమనీ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో పెరుగుతున్న నిరుద్యోగం, లోపించిన పారిశ్రామికీకరణ, వివాదాస్పద అగ్నిపథ్ పథకం లాంటి అంశాలు బీజేపీని వెనక్కి లాగుతున్నాయి. హర్యానా జనాభా 20 శాతం దళితులే. తాజా లోక్‌సభ ఎన్నికల్లో వారిలో 68 శాతం మంది, అలాగే సగానికి పైగా ఓబీసీలు ‘ఇండియా’ కూటమికి మద్దతునిచ్చినట్టు విశ్లేషణ. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగి, జాట్లు సహా ఇతర చిరకాల సమర్థక వర్గాల నుంచి విపక్షానికే మద్దతుంటే... అధికార పక్షా నికి చిక్కులు తప్పకపోవచ్చు. నిరుడు కర్ణాటక లానే ఇప్పుడు హర్యానాలో బీజేపీకి శృంగభంగం జరగవచ్చు. అక్టోబర్ 5న జరగనున్న ఎన్నికలు బీజేపీ ప్రతిష్ఠకు పెనుసవాలుగా మారింది అందుకే! -
ప్రజాభీష్టానికి పాతర
వేసవి ఒలింపిక్స్, పారాలింపిక్స్ – రెండూ పూర్తవడంతో ఫ్రాన్స్‌లో ఆటల వేడి ముగిసిందేమో కానీ, రాజకీయ క్రీడ మాత్రం బాగా వేడెక్కింది. కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ పార్టీ నేత మిషెల్ బార్నియెర్ను దేశ ప్రధానిగా నియమిస్తున్నట్టు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ గడచిన గురువారం చేసిన ప్రకటనతో రచ్చ రేగుతోంది. కొద్ది నెలల క్రితం జూన్ 9న పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసి, ఆకస్మిక ఎన్నికలు ప్రకటించి, దేశాన్ని రాజకీయ ప్రతిష్టంభనకు గురి చేసిన మెక్రాన్ తీరా ఎన్నికల ఫలితాలొచ్చిన 60 రోజుల తర్వాత తాపీగా ప్రజాతీర్పుకు భిన్నంగా నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ వ్యక్తిని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన దేశంలో జరిగిన ఈ అపహాస్యమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆగ్రహించిన వేలాది జనం వీధుల్లోకి వచ్చి, ప్రదర్శనలకు దిగింది అందుకే. కొత్త ప్రధాని సారథ్యంలో సరికొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది కానీ, రాజకీయ సంక్షోభం అంచున ఉన్న దేశానికి సారథ్యం వహించడం అగ్నిపరీక్షే. వెరసి ఫ్రాన్స్‌లో అనిశ్చితి తొలగకపోగా, మరింత పెరగనుండడమే వైచిత్రి. నిజానికి, ఫ్రాన్స్‌లో జూలైలో రెండో విడత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తీవ్ర మితవాద పక్షమైన ‘నేషనల్ ర్యాలీ’నీ, అలాగే మెక్రాన్‌కు చెందిన ‘రినైజెన్స్ బ్లాక్’నూ వెనక్కి నెట్టారు. వామపక్ష కూటమి ‘న్యూ పాపులర్ ఫ్రంట్’ (ఎన్‌ఎఫ్‌పీ)కి అధిక మద్దతు ప్రకటించారు. అయితే, ఎన్ఎఫ్పీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఇన్నాళ్ళుగా కొత్త ప్రభుత్వమేదీ లేకుండానే మెక్రాన్ కథ నడిపారు. పైగా, అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాన్ని వాడి, వామపక్ష కూటమి ప్రతిపాదించిన అభ్యర్థు లెవరినీ ప్రధానిగా అంగీకరించలేదు. చివరకు ఎన్నికల్లోని ప్రజా తీర్పును అగౌరవిస్తూ, నాలుగో స్థానంలోని పార్టీ తాలూకు వ్యక్తిని ప్రధానిగా దేశాధ్యక్షుడు ఎంపిక చేయడం ఓటర్లకు, అందునా యువతరానికి అమితమైన ఆగ్రహం కలిగించింది. దాని పర్యవసానమే – వేలాదిగా జనం వీధు ల్లోకి రావడం! ఒక రకంగా ఈ ప్రధానమంత్రి ఎంపిక ‘ఎన్నికల చోరీ’ అని పేర్కొంటూ, ఏకంగా దేశాధ్యక్షుడు మెక్రాన్కే ఉద్వాసన పలకాలంటూ వాదించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ఉన్నంతలో అధిక స్థానాలున్న కూటమికే పగ్గాలు అప్పగించడం విహితమని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వ సిద్ధాంతాలను ప్రవచించిన ఘన ప్రజాస్వామ్యం నుంచి ఎవరైనా ఆశిస్తారు. కానీ, 2017 నుంచి విభజన రాజకీయాలు చేస్తున్న ప్రెసి డెంట్ మెక్రాన్ ఎన్నికలలో తన పార్టీ కింద పడ్డా తనదే పైచేయిగా వ్యవహరించారు. వరుసగా చేస్తూ వస్తున్న తప్పుల్ని కొనసాగిస్తూ ఇష్టారీతిన వ్యవహరించారు. ఆ మాటకొస్తే, రాజకీయాల పట్ల నమ్మకం క్షీణింపజేసే ఇలాంటి చర్యల వల్లనే ఫ్రాన్స్ సహా యూరప్ అంతటా తీవ్ర మితవాదం పైకి ఎగసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఆధిక్యం కనబరిచినవారికి కనీసం ఏకాభిప్రాయ సాధనకైనా అవకాశమివ్వకుండా అధ్యక్షుడు తన పదవీకాలపు లెక్కలతో తోచిన ఎంపికలు చేయడం అవివేకం. తీవ్ర మితవాదానికీ, దాని జాత్యహంకార, విదేశీయతా విముఖ సిద్ధాంతానికీ పట్టం కట్టరాదన్న ప్రజాభీష్టానికి వ్యతిరేకం. ఈ కొత్త సర్కార్ కింగ్ మేకర్లయిన తీవ్ర మితవాదుల మద్దతుపై ఆధార పడక తప్పని స్థితి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అధ్యక్షుడు దేశాన్ని మళ్ళీ చిక్కుల్లోకి నెట్టారు. అలాగని ప్రధానిగా ఎంపికైన 73 ఏళ్ళ బార్నియెర్ మరీ అనామకుడేమీ కాదు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ పక్షాన గతంలో సంప్రతింపులకు సారథ్యం చేసిన వ్యక్తి. ఏకాభిప్రాయ సాధనలో ప్రసిద్ధుడు. రాజకీయ – సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోగలి గినవాడు. ముగ్గురు దేశాధ్యక్షుల హయాంలో మంత్రిగా చేసిన ఆయనది యూరోపియన్ అనుకూల వైఖరి. అది వామపక్షాలకు నచ్చవచ్చు. ఇక, వలసల నియంత్రణకు మరింత కఠినమైన నిబంధనలు ఉండాలన్న వాదననే బార్నియెర్ సమర్థిస్తున్నారు. అది కన్జర్వేటివ్‌లకు నచ్చే అంశం. ప్రభుత్వ భవితవ్యంపై అనిశ్చితి నెలకొనడంతో... ప్రధానిగా ఇలాంటి వ్యక్తే సరైనవాడని మెక్రాన్ ఎంచు కున్నారట. కానీ, ఫ్రెంచ్ సమాజం నుంచి ఆమోదం లభించడం, రాజకీయంగా విజయం సాధించడం మెక్రాన్, బార్నియెర్లు ఇద్దరికీ అంత సులభమేమీ కాదు. సుదీర్ఘంగా శ్రమించక తప్పదు. యూకేతో బ్రెగ్జిట్ ఒప్పందం వేళ చేసినట్టే... ఇప్పుడూ ఏదో ఒక రాజీ మార్గంలో, అందరి మధ్య సహకారం సాగేలా కొత్త ప్రధాని చేయగలుగుతారా అన్నది ఆసక్తికరమైన అంశం. వచ్చే 7 నుంచి 12 ఏళ్ళ లోగా ఫ్రాన్స్ తన ప్రభుత్వ లోటును 10 వేల కోట్లు యూరోల పైగా తగ్గించనట్లయితే, ఇటలీ లాగానే ఫ్రాన్స్ సైతం అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 1లోగా కొత్త ప్రధాని, ఆర్థిక మంత్రితో కలసి 2025 బడ్జెట్ ముసాయిదాతో బిల్లుకు రూపకల్పన చేయాల్సి ఉంది. అది అతి కీలకమైన మొదటి అడుగు. అదే సమయంలో దేశాన్ని ఒక్క తాటి మీదకు తీసుకురావడానికే తాను పగ్గాలు చేపట్టినట్టు ఫ్రెంచ్ ప్రజానీకానికి ఆయన నచ్చజెప్పగలగాలి. ఏమైనా, ప్రజలు, పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర స్థాయి విభేదాలతో ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది. అది ఈ ఘన ప్రజాస్వామ్యా నికి పెను ముప్పు. ఆ ప్రమాదాన్ని తప్పించడంతో పాటు ఇంకా అనేక సమస్యలను కొత్త ప్రధాని నేతృత్వంలోని ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ఇప్పటికే పాలన పూర్తిగా అటకెక్కిన ఫ్రాన్స్‌ను ఆ దేశపు అతి పెద్ద వయసు ప్రధాని, అధ్యక్షుడు కలసి ఎలా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి. -
దివ్యమైన రికార్డు
పది రోజుల క్రీడా సంరంభానికి తెర పడింది. ప్యారిస్‌లో వేసవి ఒలింపిక్స్ ముగిసిన వెంటనే కొద్ది రోజులకే ఆరంభమైన పారాలింపిక్స్ ఆదివారం పూర్తయ్యేసరికి భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. కనివిని ఎరుగని రీతిలో 29 పతకాలు (7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు) సాధించి సత్తా చాటింది. వెంట్రుక వాసిలో తప్పిపోయిన పతకాలను కూడా సాధించి ఉంటే, ఈ స్కోర్ 30 దాటిపోయేది. సాధారణ ఒలింపిక్స్‌లో ఇప్పటికీ రెండంకెల స్కోరును సాధించలేకపోయిన మన దేశం, దివ్యాంగులైన క్రీడాకారులతో సాగే పారాలింపిక్స్‌లో మాత్రం వరుసగా రెండుసార్లు ఆ ఘనత సాధించడం విశేషం. త్రుటిలో తప్పిన పతకాలతో ఈ ఏటి ప్యారిస్ సాధారణ ఒలింపిక్స్ మిశ్రమ ఫలితాలు అందిస్తే, ఈ పారాలింపిక్స్ మాత్రం మరిన్ని పతకాలతో ఉత్సాహం పెంచాయి. పైగా, ఆ ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ క్రీడా మహోత్సవంలో అయిదు రెట్లు ఎక్కువ పతకాలు సాధించడం గమనార్హం. మొత్తం 549 పతకాలకు జరిగే ఈ పోటీల్లో 23 క్రీడాంశాలకు గాను 12 అంశాల్లోనే పాల్గొన్న మన బృందం ఈసారి పతకాల పట్టికలో టాప్ 20లో నిలవడం చిరస్మరణీయం.మూడేళ్ళ క్రితం 2021 టోక్యో పారాలింపిక్స్‌లో మనం 19 పతకాలు గెలిచి చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు అంతకన్నా మరో 10 ఎక్కువ సాధించి, సంచలనం రేపాం. నిజానికి, 1972లో మురళీకాంత్ పేట్కర్ భారత్ పక్షాన తొట్టతొలి పారాలింపిక్ పతక విజేత. 1984లో మాలతీ కృష్ణమూర్తి హొల్లా భారత్ పక్షాన తొలి మహిళా పారాలింపియన్. అయితే, 2016 వరకు మన మహిళలెవ్వరూ పతకాలు సాధించలేదు. అప్పటి నుంచి పారాలింపిక్స్‌లో భారత్ పక్షాన కేవలం ముగ్గురంటే ముగ్గురు మహిళలే (దీపా మాలిక్ – 2016లో రజతం, అవనీ లేఖరా – 2020లో స్వర్ణం – కాంస్యం, భావినా పటేల్ – 2020లో రజతం) విజేతలుగా నిలిచారు. అలాంటిది ఈసారి భారత్ పక్షాన పతకాలు సాధించినవారిలో 10 మంది మహిళలే. తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో స్వర్ణంతో ఇప్పటికి 2 పారాలింపిక్ స్వర్ణాలు గెలిచిన అవని మినహా మిగతా తొమ్మిది మందీ సరికొత్త విజేతలే. మన మహిళా అథ్లెట్లకు పారాలింపిక్స్‌లో ఇది అసాధారణ విజయం. ఎవరికి వారు ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ, అంచనాల ఒత్తిడిని తట్టుకొని ఈ ఘనత సాధించారు. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్ఫూర్తిగాథ. ముఖ్యంగా తెలుగు బిడ్డ దీప్తి జీవాంజి లాంటివారి కథ మనసుకు హత్తుకుంటుంది. దివ్యాంగురాలైన ఆమె ఆటల్లో పైకి వచ్చి, పతకాల కల నెరవేర్చేందుకు తల్లితండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆఖరికి వరంగల్‌లోని తమ భూమి కూడా అమ్మేశారు. దీప్తి తాజా పారాలింపిక్స్‌లోనూ పతకం సాధించడమే కాక, తనను వదిలేయకుండా ఇంత పైకి తీసుకొచ్చిన కన్నవారి కోసం అదే స్థలాన్ని తిరిగి కొని బహూకరించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే మానవీయ గాథ. ఇలాంటి కథలు ఇంకా అనేకం. ఇక, పేరున్న క్రీడా తారలైన జావలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్, హైజంపర్ మారియప్పన్ తంగవేలు లాంటి వారే కాక అంతగా ప్రసిద్ధులు కాని అథ్లెట్లు సైతం ఈసారి పతకాల విజేతలుగా నిలవడం విశేషం. పతకాలు సాధించడమే కాక, పలువురు భారతీయ అథ్లెట్లు సరికొత్త మైలురాళ్ళను చేరుకొని, చరిత్ర సృష్టించడం గమనార్హం. క్రీడాసంఘాలను రాజకీయ పునారావాస కేంద్రాలుగా మార్చి, వాటిని అవినీతి, ఆశ్రిత పక్షపాతాలకు నెలవుగా మారిస్తే జరిగే అనర్థాలు అనేక చోట్ల చూస్తూనే ఉన్నాం. రెజ్లింగ్ సంఘం లాంటి చోట్ల గత రెండేళ్ళలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. అలాంటివాటి వల్ల ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ వేదికలపై పతకాలు పోగొట్టుకున్నాం. పారాలింపిక్స్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చూపగలిగామంటే ఆ జాడ్యాలు ఇక్కడ దాకా పాకలేదని సంతోషించాలి. కేంద్రం, కార్పొరేట్ సంస్థలు అందించిన తోడ్పాటు ఈ దివ్యాంగ క్రీడాకారులకు ఊతమైందని విశ్లేషకుల మాట. గడచిన టోక్యో గేమ్స్‌కు రూ. 26 కోట్లు, 45 మంది కోచ్‌లతో సన్నాహాలు సాగించిన ప్రభుత్వం ఈసారి రూ. 74 కోట్లు ఖర్చు చేసి, 77 మంది కోచ్‌లతో తీర్చిదిద్దడం ఫలితాలిచ్చింది. వివిధ దేశాల నుంచి దాదాపు 4400 మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా సమరంలో మన దేశం నుంచి ఎన్నడూ లేనంతగా ఈసారి 84 మంది పాల్గొన్నారు. ఈ ప్రపంచ పోటీలకు దాదాపు 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం, రోజూ ఈ జీవన విజేతల విన్యాసాలు చూసేందుకు స్టేడియమ్ నిండుగా జనం తరలిరావడం చెప్పుకోదగ్గ విషయం. మరి, చెదరని పోరాటపటిమతో శారీరక, సామాజిక అవరోధాలన్నిటినీ అధిగమిస్తున్న దివ్యాంగులకు మన దేశంలో పాలకులు చేయవలసినంత చేస్తున్నారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ‘దివ్యాంగుల హక్కుల చట్టం– 2016’ లాంటివి ఉన్నా, ఇవాళ్టికీ మనదేశంలో మహానగరాల్లో సైతం పాఠశాలల్లో, ప్రయాణ సాధనాల్లో, కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వారికి కావాల్సిన కనీస వసతులు మృగ్యం. అయిదేళ్ళలో ఆ పని చేయాలని చట్టపరమైన సంకల్పం చెప్పుకున్నా, ఆచరణలో జరిగింది అతి తక్కువన్నది నిష్ఠురసత్యం. చివరకు చట్టం కింద చేపట్టాల్సిన పథకాలకూ కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు పెట్టడం విషాదం. ఈ పరిస్థితి మారాలి. సమాజంలోనూ, సర్కార్పరంగానూ ఆలోచన తీరూ మారాలి. ఆ రకమైన ప్రోత్సాహంతో దివ్యాంగులు మరింత పురోగమించ గలరు. తాజా విజయాల రీత్యా మనవాళ్ళకు మరింత అండగా నిలిస్తే, విశ్వవేదికపై వారు భారత ఖ్యాతిని ఇనుమడింపజేయగలరు. అలా చూసినప్పుడు ప్యారిస్ పారాలింపిక్స్ విజయాలు ఆరంభం మాత్రమే. వచ్చే 2028 నాటి లాస్ ఏంజెల్స్ గేమ్స్‌కు అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, పారా అథ్లెట్స్ ప్రతిభ తోడై ఇదే దూకుడు కొనసాగిస్తే అద్భుతాలూ జరుగుతాయి. -
జగమంతా దగా చేసినా
పెద్దగా ఏమీ మార్పు ఉండదు. తెల్లవారి టీకొట్టు దగ్గర పెద్దమనిషి ఎప్పటిలాగే న్యూస్‌పేపర్‌ని మడతపెట్టి చదువుతుంటాడు. పిల్లల్ని తీసుకెళ్లే స్కూల్‌బస్ వారిని గోలగోలగా మోసుకెళుతూ ఉంటుంది. సూర్యుడు ప్రసరింప చేస్తున్న ఎండ జామచెట్టుపై పడి కింద నీడను పరుస్తూ ఉంటుంది. చెరువులో నీళ్లు అదే నిమ్మళంతో ఉంటాయి. లీవులున్నా పెట్టలేని ఉద్యోగాల హాజరీకి అందరూ తయారవుతూ ఉంటారు. వారికై వంటగదుల్లో సాగే ఇల్లాళ్ల హడావిడి ఏమీ మారదు. ఢిల్లీలో తెల్లవారుతుంది. ముంబైలో తెల్లవారుతుంది. పాలకులు పట్టు పరుపుల మీద నుంచి లేచి పనుల్లో పడతారు. సకల మానవ జీవన వ్యాపారాలకు చీమైనా కుట్టదు. కబురు తెలిసిన కొందరు ఆత్మీయులు కూడా ‘తొందరగా టిఫెను పెట్టు. తినేసి వెళతాను’ అనే బయలుదేరుతారు. మీరు ఆత్మహత్య చేసుకుని మరణించారు. అది మీకూ మీ ఇంటికీ. మిగిలిన లోకానికి ఏంటట?ఆత్మహత్య చేసుకుని మరణించిన రైతుకు ఏ శిక్షా విధించలేక ‘పోయి నీ కుటుంబం ఎలా ఉందో చూసిరా’ అని పంపిస్తాడు దేవుడు– అదే శిక్షగా. చేసిన అప్పుకు ఎడ్లు జమ అయితే పొలంలో భార్యే ఎద్దులా కష్టపడుతూ ఉంటుంది. బడికెళ్లాల్సిన కూతురు తల్లికి సాయం చేస్తూ ‘మా... అందుకే నిన్ను నాన్న తిడతాండె. చూడు... పడిన చోట నాలుగైదు ఇత్తనాలు పడినాయి. లేనిచోట్ల లేనే లేవు. ఇట్లేనా ఇత్తనమేసేది’ అని తండ్రిని తలుచుకుంటూ ఆరిందాలా గద్దిస్తూ ఉంటుంది. భర్త గుర్తొచ్చిన తల్లి బొరుమని పొలంలో కూలబడుతుంది. గాలిరూపంలో ఉన్న రైతు అది చూసి ఎంత లబలబలాడినా ఏమొస్తుంది– ప్రాణమే వదులుకొని వచ్చేసినాక. బండి నారాయణ స్వామి కథ ‘రంకె’ ఇది.మొన్న హైదరాబాద్‌లో ఒక తండ్రి– చిన్న టీకొట్టు నడుపుకునే తండ్రి– స్కూలుకెళ్లకుండా హఠం చేస్తున్న పిల్లల్ని కొట్టి, ఎందుకు కొట్టానా అని తీవ్రమైన కలతతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడా పిల్లలకు స్కూలుకు వెళ్లమని చెప్పే తండ్రి లేడు. స్కూల్ ఫీజు కట్టే తండ్రి లేడు. ఏ రాత్రో కొట్టు కట్టేసి ఇల్లు చేరి నిద్రపోతున్న పిల్లల్ని చూసి భార్యతో ‘నిద్రపోయారా పిల్లలూ’ అనడుగుతూ ప్రేమగా వారి తలను నిమిరే తండ్రి లేడు. ఖాళీ టీకొట్టు ఉంది. దాని ముందు ట్రాఫిక్‌కు ఏమెరగనట్టుగా ఉంది. ఇరుగు పొరుగు షాపులలో బేరాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. అతడు లేడు. అతనికీ– ఇంటికీ.మృత్యువుకు మోహగుణం ఉంటుంది. ‘నా పరిష్వంగంలోకిరా విముక్తి సుఖం ఇస్తాను’ అని పిలుస్తూ ఉంటుంది. అందుకోసం అది సముద్రంలోని నీలి కెరటాలకు మరింత నీలిమ ఇస్తుంది. నది ప్రవాహానికి మరింత చిక్కదనం ఇస్తుంది. దూకే వరకు బావినీళ్లను మెరుపు అద్దంలా మారుస్తుంది. పురుగుల మందుకు ఎంత రుచి ఇస్తుందో. ధగధగమని మండే మంటకు మంచుకంటే చల్లనైన గుణం ఉంటుందనే ప్రలోభం కలిగిస్తుంది. ఒక్క మృత్యువు. వేయి ఆకర్షణలు. కాని జీవితానికి వేయిన్నొక్కటి. ఆ ఒక్కటికై బతకాలి.‘మృత్యువా... నీవొక అందమైన కవితా పంక్తివి. నిను కలుస్తాననే వాగ్దానాన్ని మరువను’ అంటాడు ‘ఆనంద్’ సినిమాలో రాజేష్ ఖన్నా. జీవితం అంటే ఏమిటి? చనిపోవడానికి ముందు దొరికే కాసింత సమయం. కేన్సర్ డయాగ్నసిస్ అయ్యి రెండు మూడు నెలల్లో పోతానని తెలిశాక ఆనంద్ ప్రతి నిమిషం జీవించడానికి ఉబలాటపడతాడు. తెలిసినవారినీ తెలియనివారినీ తన అభిమానంలో ముంచెత్తుతాడు. బతికేది కాసిన్ని రోజులే అయినా గాఢంగా ఎన్నటికీ మరువనంతగా ముద్రలేసి వెళతాడు. చావు ఎప్పుడో తెలిసిన అతడే, జబ్బు మనిషి అతడే అలా బతికితే ఇవాళ్టికి అంతా బాగున్న మనం ఎలా బతకాలి?అవునండీ. భార్యాభర్తల మధ్య కీచులాటలు వస్తాయి. డబ్బుల కటాకటీ ఉంటుంది. బాస్ నరకం చూపుతుంటాడు. స్నేహితులు ద్రోహం చేస్తారు. బంధువులు వంచిస్తారు. సొంత తోబుట్టువులు ఊహించని నొప్పి కలిగిస్తారు. అనారోగ్యాలు ఉంటాయి. పంటల్లో నష్టం వస్తుంది. అయితే? చనిపోవడమేనా? ఇవాళ్టిని ఇవాళ్టితో ముగించడమేనా? ఎవరు ఇచ్చారు ఈ హక్కు? ఎవరి ఆమోదంతో తీసుకున్నారు ఈ నిర్ణయం? ‘ఆత్మహత్య మహాపాతకం’ అంది హిందూ ధర్మం. ‘ఏ ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నాడో అదే ఆయుధంతో పైన దండింపబడతాడు’ అంది ఇస్లాం ధర్మం. బతికి ఉండగా బతకడానికి చేసిన అన్ని తప్పొప్పులకైనా కన్సిడరేషన్ ఉందిగాని ఆత్మహత్య చేసుకుంటే నేరుగా నరకానికే. చచ్చాక సుఖపడదామనుకునే వారికి పైన ఎన్ని చచ్చే చావులు ఉన్నాయో ఏం తెలుసు? దాని బదులు బతకొచ్చుగా హాయిగా? ఏమిటి... పరువు పోయిందా... చచ్చిపోతారా? మన పరువును ఎంచేంత పరువు ఈ సమాజానికి ఉందంటారా ఇప్పుడు?‘మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’ అన్నాడు సిరివెన్నెల. సెప్టెంబర్ 10– ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. అసలు ఈ పేరే సరి కాదు. దీనిని ‘ప్రపంచ జీవన కాంక్షా దినోత్సవం’ అని మార్చాలి. జీవనకాంక్ష... ఇదే కావాల్సింది. ఎవరూ కష్టాలకు మినహాయింపు కాదు. ఎవరినీ సవాళ్లు ఒదిలిపెట్టవు. ఉక్కిరిబిక్కిరి అయ్యే క్షణాల వాయిదాలవారీ పంపకమే జీవితం. ఇది అందరికీ తెలుసు. అందుకే అర్ధంతరంగా మరణించిన వారికి గౌరవం లేదు. ‘ఏం.. మేం బతకట్లేదా.. చచ్చేం సాధించాలి గనక’ అనుకుంటారు. అందుకే ఓడినా సరే బతికి తీరాలి. సినారె అంటాడు– ‘జగమంతా దగా చేసినా చివురంత ఆశను చూడు... గోరంత దీపం కొండంత వెలుగు... చివురంత ఆశ జగమంత వెలుగు’. ఏం మహాశయా... బతికేద్దామా? బతుకుదాం లేద్దూ! -
బుల్డోజర్ సంస్కృతికి కళ్లెం!
గత కొన్నేళ్లుగా బుల్డోజర్లతో చెలరేగుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టడం ఆçహ్వానించదగ్గ పరిణామం. ఈ చీడను వదల్చడానికి ఏం చేయాలో ప్రతిపాదనలివ్వాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించటంతోపాటు వాటి ఆధారంగా దేశవ్యాప్తంగా అమల య్యేలా ప్రామాణిక మార్గదర్శకాలను రూపొందిస్తామని కూడా తెలిపింది. ఎక్కడైనా అడ్డదారులు పనికిరావు. పైగా చట్టబద్ధ పాలనకు ఆ ధోరణులు చేటు తెస్తాయి. కంచే చేను మేసినట్టు పాలకులే తోడేళ్లయితే ఇక సాధారణ పౌరులకు రక్షణ ఎక్కడుంటుంది? దేశంలో ఈ విష సంస్కృతికి బీజం వేసినవారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన్ను చూసి మొదట మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఆనక రాజస్థాన్‌లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఆనాటి శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం చెలరేగి అనుమానితులుగా నిందితులుగా ఉన్నవారి ఇళ్లు, దుకాణాలు నేలమట్టం చేశాయి. హైదరాబాద్‌లో నీటి వనరులకు సమీపంలో, డ్రెయినేజిలకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను కూల్చేయటానికి ‘హైడ్రా’ ఏర్పాటైంది. తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాల్లో కూడా అధికారులు కూల్చివేతలు సాగించారు.తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేశారన్న ఫిర్యాదులొచ్చాయి. ఈవీఎం సర్కారుగా అందరితో ఛీకొట్టించు కుంటున్న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే ప్రభుత్వం అధికారం వచ్చిరాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చేయాలని చూసింది. హత్యలు, హత్యాయత్నాలు సరేసరి. తమకు ఓటేయ లేదన్న కక్షతో పేదజనం ఇళ్లపై బుల్డోజర్లు నడిపింది. ఈ దుశ్చర్యలో ఒక మాజీ సైనికుడి ఇల్లు సైతం నేలకూలింది. ఏ చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు ఈ హేయమైన పనులకు పాల్పడు తున్నాయి? హత్యలతోనూ, బుల్డోజర్లతోనూ ప్రజానీకంలో భయోత్పాతం సృష్టించి ఎల్లకాలమూ అధికారంలో కొనసాగవచ్చని పాలకులు భావిస్తున్నట్టు కనబడుతోంది.దీన్ని సాగనీయకూడదు. బుల్డోజర్ మార్క్ అకృత్యాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంత ఆగ్రహం వ్యక్తం చేసిందంటే... ‘నిందితులు, అనుమానితులని ముద్రపడిన వారి విషయంలో మాత్రమే కాదు. ఆఖరికి నేరస్తులుగా నిర్ధారణ అయి శిక్షపడినవారి విషయంలో సైతం చట్ట నిబంధనల ప్రకారమే వ్యవహరించి తీరాలి’ అని నిర్దేశించింది. చట్టబద్ధ పాలన ఎంతటి గురుతర బాధ్యతో చెప్పడానికి ఇది చాలదా? గోవధ కేసులో నిందితుడనో, అనుమానితుడనో భావించిన వ్యక్తిపై కక్ష తీర్చుకోవటానికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటిచోట్ల ఇళ్లు, దుకాణాలూ నేలమట్టం చేసిన సందర్భాలు అనేకానేకం. ఈ పని చేశాక ఆ ఇల్లు లేదా దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిందనో, అక్రమంగా ఆక్రమించుకుని కట్టారనో, ఎప్పుడో నోటీసులు జారీచేశామనో అధికారులు సాకులు చెబుతున్నారు. అధికారుల్లో కొందరు ప్రబుద్ధులు ఏదో ఘనకార్యం చేశామన్నట్టు విందులు కూడా చేసుకుంటు న్నారు. బాధితులు అవతలి మతస్తులైనప్పుడు కొందరు బాగా అయిందనుకుంటున్నారు. ఇది ప్రమాదకరమైన పోకడ. సమాజంలో ప్రతీకారేచ్ఛను పెంచి పోషించే దుశ్చర్య. ఇప్పుడున్న నాగరిక సమాజం ఎన్నో దశలను దాటుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యవస్థను ఏర్పర్చుకుంది.తప్పుడు వాగ్దానాలతోనో, కండబలంతోనో, ఈవీఎంలను ఏమార్చటం ద్వారానో అధికారాన్ని కైవసం చేసుకుని కేవలం అయిదేళ్లపాటు అధికారంలో ఉండటానికి వచ్చిన రాజకీయపక్షాలు ఎన్నో అగడ్తలను దాటుకుని వచ్చిన ఒక ప్రజాస్వామిక అమరికను ధ్వంసం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనీయ కూడదు. నిజానికి ఈ విషయంలో ఎంతో ఆలస్యం జరిగింది. ఎవరో న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలని, పిటిషన్ దాఖలయ్యాక నోటీసులు జారీచేసి చర్యలకు ఉపక్రమించవచ్చని అనుకోవటంవల్ల ఇలాంటి దుశ్చర్యలూ, వాటి దుష్పరిణామాలు సాగి పోతున్నాయి. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయి. న్యాయస్థానాలు మీడియా కథనాలనే పిటిషన్లుగా స్వీకరించి ప్రభుత్వాలను దారికి తెచ్చినసందర్భాలున్నాయి. ఆ క్రియాశీలత మళ్లీ అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటేఅందరూ న్యాయస్థానాలను ఆశ్రయించలేరు. వారికి ఆ స్థోమత ఉండకపోవచ్చు. కనుకనే న్యాయస్థానాలు తమంత తాము పట్టించుకోక తప్పదు. ప్రామాణికమైన మార్గదర్శకాలురూపొందించాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం హర్షించదగ్గదే. కానీ చర్మం మందం ప్రభుత్వాలు వీటికి తలొగ్గుతాయా? ఆమధ్య ఢిల్లీ హైకోర్టు అక్కడి అధికారులకు చేసిన సూచనలు ఈ సందర్భంగా గమనించదగ్గవి.వేకువజామునగానీ, సాయంసంధ్యా సమయం ముగిశాకగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్డోజర్లు ప్రయోగించరాదని తెలిపింది. ముందుగా తగిన నోటీసులిచ్చి ప్రత్యామ్నాయ ఆవాసం చూపించేవరకూ అసలు కూల్చివేతలుండకూడదని చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా అధికారులు దారికొచ్చిన దాఖలాలు లేవు. అందువల్లే మార్గదర్శకాలు రూపొందించేటపుడు కేవలం ఎలాంటి నిబంధనలు పాటించాలో చెప్పడం మాత్రమేకాక అసలు కూల గొట్టాల్సినంత ఆవశ్యకత ఎందుకేర్పడిందో నమోదుచేసే ఏర్పాటుండాలి. అధికారులకు జవాబు దారీతనాన్ని నిర్ణయించాలి. ప్రక్రియ సరిగా పాటించని సందర్భాల్లో కోర్టు ధిక్కార నేరంకింద కఠిన చర్యలుంటాయని చెప్పాలి. రాజకీయ కక్షతో, దురుద్దేశాలతో విధ్వంసానికి పూనుకున్న ఉదంతాల్లో వెంటవెంటనే చర్యలుండేలా చూడాలి. అన్నిటికన్నా ముఖ్యం– సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, సూచనల స్ఫూర్తి కింది కోర్టులకు సైతం అందాలి. అలా అయినప్పుడే చట్టబద్ధ పాలనకు మార్గం ఏర్పడుతుంది. -
ఏది ధర్మం? దేనికి రక్షణ?
చట్టం విరుద్ధం కానంత వరకు ఎవరేమి చేయాలో, ఎవరేం తినాలో చెప్పడానికి వేరొకరికి ఏమి హక్కు ఉంటుంది? కొద్దిరోజుల వ్యవధిలో హర్యానాలో వరసగా జరిగిన రెండు విచక్షణా రహిత హత్యలు ఆ మౌలిక ప్రశ్ననే మరోమారు ముందుకు తెచ్చాయి. ధర్మం పేరిట విద్వేషాన్ని నింపుకొని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటున్న స్వయం ప్రకటిత గోరక్షకులతో దేశానికున్న ముప్పును గుర్తుచేశాయి. పన్నెండో తరగతి చదువుతున్న 19 ఏళ్ళ టీనేజ్ కుర్రాడు ఆర్యన్ మిశ్రా హర్యానాలోని ఆగస్ట్ 24న మిత్రులతో కలసి కారులో వస్తుండగా, గోమాంసం రవాణా చేస్తున్నాడనే అనుమానంతో సాయుధ మూకలు 50 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేసి మరీ, ఫరీదాబాద్ వద్ద అతణ్ణి కాల్చి చంపిన ఘటన అమానుషం. అలాగే, గొడ్డుమాంసం తింటున్నాడనే అనుమానంతో ఆగస్ట్ 27న చర్ఖీ దాద్రీ వద్ద 26 ఏళ్ళ వలస కార్మికుడు సబీర్ మాలిక్‌ను కొందరు సోకాల్డ్ ధర్మపరిరక్షకులు కొట్టి చంపిన తీరు నిర్ఘాంతపరుస్తోంది. సాక్షాత్తూ హర్యానా సీఎం సైతం ‘సెంటిమెంట్లు దెబ్బతింటే, ఎవరినైనా ఎలా ఆపగల’మంటూ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం దీనికి పరాకాష్ఠ. ఇలాంటి పాలక వర్గాల భావజాలం కారణంగానే దాదాపు దశాబ్ద కాలంగా దేశంలో గోరక్షణ పేరిట హింస సాధారణమైపోయింది. సోమవారం మహారాష్ట్రలో ఓ రైలులో పశుమాంసం తీసుకెళు తున్న ఓ వృద్ధుడిపై మూకదాడి అందుకు మచ్చుతునక. అయితే, తాజా దాడులు మైనారిటీలపై హింస పెచ్చరిల్లుతున్న వైనాన్ని పట్టిచూపడమే కాక, ఈ మతపరమైన అసహనంపై విస్తృత చర్చను లేవనెత్తాయి. ఫరీదాబాద్ ఘటనలో చనిపోయింది అమాయక హిందువంటూ రచ్చ చేస్తున్న వాళ్ళు ఆ పోయిన ప్రాణాలు ముస్లిమ్వైనా ఇలాగే స్పందిస్తారా అన్నది ధర్మసందేహం. అప్పుడే ఇలా స్పందించి ఉంటే, దేశంలో అసలు గోరక్షణ పేరిట పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కావేమో! ప్రధాని మోదీ సైతం పశువుల వ్యాపారులపై, పశు మాంసం తినేవారిపై దాడులను గతంలో ఖండించక పోలేదు. కానీ, నోరొకటి మాట్లాడుతుంటే నొసలొకటి చెబుతున్నట్టుగా... అధికార బీజేపీ ఊదరగొ డుతున్న హిందూ జాతీయవాదం గోరక్షణ పేరిట దాడుల్ని పెంచిపోషించిందన్నది నిష్ఠురసత్యం. ఆర్యన్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తే సరికి, ప్రభుత్వం సైతం దిద్దుబాటు చర్యలకు దిగకతప్పలేదు. ఛాందసవాద గోరక్షకుల జాబితా సిద్ధం చేస్తున్నట్టు పోలీసులు గురువారం ప్రకటించారు. గతంలోకి వెళితే, 2012– 2018 మధ్య కాలంలో గోరక్షణ పేరిట దేశవ్యాప్తంగా 120 దాకా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఆ హింసలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా అత్యధిక ఘటనలు ఉత్తర ప్రదేశ్‌లోనే జరగడం గమనార్హం. గడచిన ఏడెనిమిదేళ్ళుగా ఉత్తర ప్రదేశ్‌లోనే కాక హర్యానా, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో గోసంర క్షకుల పేరిట హింస పెచ్చరిల్లుతూ వస్తోంది. ఈ ‘గోరక్షక ముఠాల’ దాడులు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీస్తున్నాయి. నిజానికి, 19వ శతాబ్దం ద్వితీయార్ధం నుంచే మన దేశంలో గోహత్యపై చర్చ, అడపాదడపా హింస సాగుతూనే వచ్చాయి. ‘హిందువేతరులపై హిందూ ధర్మాన్ని రుద్ద కూడద’ని దేశ విభజన సందర్భంగా సాక్షాత్తూ గాంధీ సైతం నొక్కిచెప్పాల్సి వచ్చింది. భారతదేశం లౌకికవాద గణతంత్ర రాజ్యమనే స్ఫూర్తిని నిలబెట్టడం కోసం రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం సైతం గోరక్షణను తమ డ్రాఫ్టులో చేర్చలేదు. గోరక్షణను ప్రాథ మిక హక్కుగా చేర్చాలన్న వాదనను తోసిపుచ్చి, దాన్ని ఆదేశిక సూత్రాల్లోనే చేర్చారని చరిత్ర. భారత ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించిన మన పెద్దలు వివేకంతో వ్యవహరించి, మెజారిటీ ప్రజల ఒత్తిడికి తలొగ్గలేదు. భావోద్వేగభరిత ధార్మిక అంశాల కన్నా దేశంలోని లౌకికవాద చట్టాన్ని సమున్నతమని చేతలతో చాటారు. హిందూ ధర్మంలో గోవును పవిత్రమైనదిగా పూజిస్తాం. తప్పు లేదు. మరి, అదే ధర్మం మనిషిలో దేవుణ్ణి చూడమన్న మాటను గౌరవించవద్దా? దాదాపు 24 రాష్ట్రాల్లో గోవుల అక్రమ అమ్మకం, వధను నిషేధిస్తూ రకరకాల నియంత్రణలున్నాయి. కానీ, వీటిని అడ్డం పెట్టుకొని కొన్ని అతివాద బృందాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, హత్యలకు పాల్పడడం, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి, విద్వేషాలు పెంచడం సహిద్దామా? భరిద్దామా? ఈ రకమైన హిందూ జాతీయవాదంతో దేశం ఎటు పోతుంది? దేశంలోని 20 కోట్ల పైగా ముస్లిమ్‌లను వేరుగా చూస్తూ, ఈ సమాజంలో తాము మరింత మైనారిటీలుగా మిగిలిపోయామనే భావన కల్పించడం సామాజిక సమైక్యతను దెబ్బతీయదా? అది పొరుగున పొంచిన శత్రువులకు ఊతం కాదా?సంఘమంటేనే విభిన్న వర్గాలు, భావాలు, సంస్కృతులు, అలవాట్ల సమ్మేళనమనే ప్రాథమిక అంశాన్ని అందరూ గుర్తెరిగేలా చేయాలి. వైమనస్యాలు పెంచి సామరస్యాన్ని దెబ్బతీస్తే మొదటికే మోసం. అందులోనూ మూగజీవాల్ని అడ్డం పెట్టుకొని ప్రదర్శిస్తున్న మతోన్మాదం రాజకీయ ప్రేరేపి తమైనది కావడం పెను ప్రమాదఘంటిక. రాజ్యాంగ నైతికతకే విఘాతం కలిగిస్తున్న ఈ చర్యలతో చివరకు సత్ పౌరులనూ, అమాయకులనూ హింసించడం మరింత విషాదం. సుప్రీమ్ కోర్ట్ సైతం ఈ రకమైన హింసను సహించరాదని పదే పదే ఆదేశించినా, పాలకవర్గ రాజకీయాలకు ఆశ్రితులైన దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు. స్థానిక నేతలుగా ఎదిగి, చట్టసభల్లో స్థానం సంపాదించు కొని, ప్రజాస్వామ్య విలువల్ని పరిహాసప్రాయం చేస్తున్నారు. పశువుల్ని కాపాడే మిషతో మనిషే మృగంగా మారుతున్న ఈ ధోరణికి ఇకనైనా పాలకులు అడ్డుకట్ట వేయాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకై దీన్ని ఇలాగే వదిలిస్తే ఆఖరికి ఆవుల రక్షణ పేరిట ఆటవిక రాజ్యం నెలకొంటుంది. -
చట్టాలు చేస్తే చాలా?
దేశాన్ని కదిలించిన ‘అభయ’ ఉదంతం దెబ్బతో బెంగాల్ కొత్త కఠిన చట్టంతో ముందుకొచ్చింది. అత్యాచార దోషులకు ఏకంగా మరణశిక్ష వేయాలంటూ మమతా బెనర్జీ సర్కార్ అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత’ను తీసుకొచ్చింది. కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ మహిళా డాక్టర్ ఒకరిని గత నెలలో దారుణంగా రేప్ చేసి, చంపేసిన ఘటనతో రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమైన బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది. దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వరమే న్యాయాన్ని అందించి, దోషులకు కఠిన శిక్షలు విధించడానికే ఈ కొత్త బిల్లు తెచ్చామని సర్కార్ చెబుతోంది. బాధిత మహిళల బిల్లు గనక ప్రతిపక్షాలన్నీ కాదనే ధైర్యం చేయలేక తలూపుతూనే, మమత రాజీనామా డిమాండ్‌ను విడవకుండా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందితే కానీ బిల్లు చట్టం కాదు గనక, బాధ్యత కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయంగా మార్కులు సంపాదించే పనిలో మమత ముందడుగు వేస్తున్నారు. అత్యాచారాలు, లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పించే విధంగా చేపట్టిన ‘అపరాజిత మహిళా, శిశు రక్షణ బిల్లు–2024’లో మమత సర్కార్ పలు కొత్త అంశాలను పొందుపరిచింది. 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసేందుకు వీలుగా అపరాజిత టాస్క్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక పోలీసు బలగాన్ని ఏర్పాటు చేస్తుందీ బిల్లు. కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త న్యాయచట్టాలు భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), అలాగే పోక్సో చట్టంలోని అంశాలను మించినవి కొన్ని ‘అపరాజిత’లో ఉన్నాయి. పోక్సో కింద 3 నుంచి 5 ఏళ్ళ జైలుశిక్ష, జరిమానా విధించేందుకే వీలుండగా, ఈ సరికొత్త బెంగాల్ అత్యాచార నిరోధక బిల్లు కింద 7 నుంచి పదేళ్ళ శిక్ష తప్పదు. పోక్సో కింద బాధిత చిన్నారి సాక్ష్యాన్ని 30 రోజులలోగా రికార్డ్ చేసి, ఏడాది లోగా విచారణ పూర్తి చేయవచ్చు. అపరాజిత మాత్రం వారం రోజుల్లోనే సాక్ష్యం రికార్డు చేయడం, నెల రోజుల్లో ప్రత్యేక కోర్ట్ విచారణ పూర్తి తప్పనిసరి చేసింది. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ బిల్లు ఉపయుక్తమే. అలాగే, అత్యాచార దోషులకు పెరోల్ సైతం లేని యావజ్జీవ కారాగారవాస శిక్ష తప్పదు. రేప్, లేదా గ్యాంగ్‌రేప్ ద్వారా బాధితుల మరణానికో, జీవచ్ఛవంగా మారడానికో కారణమైన దోషులకు ఉరిశిక్ష విధింపు కూడా కోపోద్రిక్త ప్రజానీకానికి కొంత ఊరట. అలా బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్లకు మించి కఠినంగా ఈ కొత్త బిల్లును తీర్చిదిద్దడం నేరగాళ్ళకు సింహస్వప్నమే. అందుకే, అపరాజిత బిల్లును కనీవినీ ఎరుగని ప్రయత్నంగా పేర్కొంటూ, ‘‘దేశానికి మార్గదర్శి బెంగాల్’’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతోంది. మహిళలపై నేరాలను ఏ మాత్రం సహించని వ్యక్తిగా, నాయకురాలిగా దీదీని చూపించే ప్రయత్నమూ జరుగుతోంది. కానీ, అదే సమయంలో దిగజారు తున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే ఆమె ఈ బిల్లు తెచ్చారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అభిప్రా యాలు, అనివార్యతలు ఏమైనా... స్త్రీలు, పిల్లల రక్షణకంటూ చేసే ఏ సర్కారీ కొత్త ప్రయత్నాన్ని తీసిపారేయాల్సిన పని లేదు. ప్రతి చర్యనూ స్వాగతించాల్సిందే. నిజానికి, మహిళల రక్షణ నిమిత్తం 2019లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రాత్మకమైన ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. 2020లో మహారాష్ట్ర సైతం అత్యాచార బాధిత స్త్రీల పక్షాన నిలుస్తూ, దోషులకు కఠినశిక్షలతో ‘శక్తి’ బిల్లు పాస్ చేసింది. శాంతిభద్రతలే కాదు... సాధారణ ప్రజాపరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే గనక స్థానికంగా ఇలాంటి కట్టుదిట్టమైన శాసన నిర్మాణాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ చట్టాలన్నీ గవర్నర్ వద్దో, లేదంటే ఆపైన రాష్ట్రపతి వద్దో ఆఖరి ఆమోదముద్ర కోసం నేటికీ ఎదురుచూస్తూనే ఉండడం విషాదం. తాజా అపరాజితకూ ఆ గతి తప్పకపోవచ్చు. రాష్ట్రస్థాయిలో చేస్తున్న ఈ తరహా చట్టాలకు ఆమోదం తెలపడానికి ఢిల్లీ గద్దె మీది పెద్దలకు అభ్యంతరం ఎందుకో అర్థం కాదు. మహిళా పరిరక్షకులమనే ఘనత తమకే దక్కాలన్న రాజకీయాలే తప్ప, ఇతరేతర కారణాలూ కనబడడం లేదు. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లు సైతం తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వీధికెక్కి పోరాడినా, చీమ కుట్టినట్టయినా లేని పాలకుల నుంచి ఇంకేం ఆశించగలం? ఆ మాటకొస్తే స్త్రీలకు అండగా తామున్నామని ఢిల్లీ పెద్దలు ఆచరణలో నమ్మకం కలిగించలేకపోవడం కూడా రాష్ట్రాల్లో కొత్త చట్టాలకు కారణమని విస్మరించలేం. కఠిన చట్టాలు చేయడం మంచిదే కానీ, కేవలం చట్టాల రూపకల్పనతో లక్ష్యం నెరవేరుతుందా అన్నది బేతాళప్రశ్న. కొన్ని లోటుపాట్లున్నా పాత చట్టాల మొదలు పుష్కరకాలం క్రితపు ‘నిర్భయ’ చట్టం దాకా మన దగ్గర చట్టాలకు కొదవ లేదు. అమలులో చిత్తశుద్ధి లోపమే సమస్య. అపరిచితు లొచ్చి అత్యాచారం జరిపేలా అభద్ర వాతావరణం, అసమర్థ గస్తీ, అధ్వాన్న దర్యాప్తు నెలకొన్నాయంటే ఆ తప్పు పాలకులదేగా! అదే సమయంలో సామాజికంగా, సాంస్కృతికంగా మనుషుల మానసిక కాలుష్యానికి కారణమై, నేరాలకు ప్రేరేపిస్తున్న అంశాలను అరికట్టేందుకు నిజాయతీగా మనందరం చేస్తున్నదేమిటో ఆలోచించుకోవాలి. ఆత్మపరిశీలనా చేసుకోవాలి. ప్రతిపక్ష పాలిత కోల్ కతాలో ‘అభయ’ జరిగిందని బీజేపీ, అధికార బీజేపీ పాలిత హాథ్రస్, ఉన్నావ్‌లలో జరిగిందేమిటని విపక్షాలు పరస్పర దూషణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాజకీయంగా పైచేయికై పోరాడే కన్నా సురక్షితమైన పాఠశాలలు, పనిప్రదేశాలు, సత్వరం స్పందించే రక్షక వ్యవస్థ లాంటి ప్రాథమిక అంశాలపై దృష్టి పెడితే అందరికీ మంచిది. అది లేకపోవడమే అసలు సమస్య.