Narayanpet
-
ప్రక్షాళన దిశగా..
పీయూ అడ్మినిస్ట్రేషన్లోమొదలైన మార్పులు ● ఆ విభాగంలో కొన్నేళ్లుగాపాతుకుపోయిన సిబ్బంది ● గత వీసీ హయాంలో జరిగిన అక్రమాలకు దన్నుగా నిలిచారని ఆరోపణలు ● ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న వారిని తప్పించాలని విద్యార్థి సంఘాల డిమాండ్ ● కిందిస్థాయి సిబ్బందిని మార్పుచేయనున్నట్లు గుసగుసలు పీయూ ముఖద్వారం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కొత్త వైస్ చాన్స్‌లర్‌గా జీఎన్ శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం ఐక్యూఏసీ (ఇంటర్నల్ క్యాలిటీ అసెస్మెంట్) డైరెక్టర్‌గా నూర్జహాన్ను నియమించారు. అలాగే అడ్మినిస్ట్రేషన్‌లో కీలక పోస్టు అయిన రిజిస్ట్రార్‌ను నూతనంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చెన్నప్పను నియమించారు. ఈ మేరకు గురువారం బాధ్యతలు చేపట్టిన ఆయనకు పీయూ వీసీతో పాటు ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చాలాకాలంగా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పాతుకుపోయిన పలువురు సిబ్బందిని కూడా మార్పులు చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఎప్పటి నుంచో విద్యార్థి సంఘాల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ ఇదే. పెద్దఎత్తున అక్రమాలు.. గత వీసీ హయాంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కొత్త వీసీతో సహా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు కూడా ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ విషయా న్ని అటు ప్రభుత్వం, ఇటు కొత్త వైస్‌చాన్స్‌లర్ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు అప్ప ట్లో జరిగిన పలు అక్రమాల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది పాత్ర ఉన్న ట్లు తెలుస్తుంది. వీరి వ్యవహారం కూడా అధికారుల దృష్టికి రావడంతో వీరిని కూడా మార్పు చేసే అవకాశం ఉన్నట్లు యూనివర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సమూల మార్పులు, పారదర్శక పాలన ఉండాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన వీసీల సమావేశంలో సూచించారు. ఇందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులకు వీసీ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. వివాదాస్పద తీరు.. కొంతకాలంగా అడ్మినిస్ట్రేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. గతంలో జరిగిన పలు అవకతవకలకు సిబ్బంది కూడా సహకరించినట్లు తెలుస్తుంది. పాత వీసీ మే నెలలో పదవీ విరమణ చేసిన తర్వాత ఐఏఎస్ అధికారి ఇన్చార్జిగా వ్యవహరించారు. ఈ క్రమంలో చిన్నపాటి అవసరాల కోసం పెద్దమొత్తంలో బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేసినట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఈ విషయం అప్పట్లో ఉన్న అధికారులకు తెలిసినా ఏమీ అనలేదని తెలుస్తుంది. పలువురు కాంట్రాక్టర్లు, అప్లియేటెడ్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించి బిల్లులు, ఫైల్స్‌పై పని జరగాలంటే పలువురి సిబ్బంది చేయి తడపాలన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న వీరి తీరు యూనివర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
నారాయణపేట రూరల్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బాలసదనం చిన్నారులకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో బుధవారం క్రీడాపోటీలను నిర్వహించారు. మ్యూజిక్ చైర్, లూడో, స్నేక్ అండ్ ల్యాడర్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్‌తో పాటు ఖోఖో, కబడ్డీ అవుట్ డోర్ గేమ్స్ పోటాపోటీగా ఆడారు. అదేవిధంగా చిత్రలేఖనం, పాటలు, నృత్య పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. విజేతలకు లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట టౌన్ సౌజన్యంతో గురువారం బహుమతులు అందించనున్నారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్‌గౌతమ్, డీఎస్పీ లింగయ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్ శ్యామల, డీడబ్ల్యూఓ జయ హాజరుకానున్నారు. చిన్నారులతో కొంత సమయం గడిపి ఉత్సాహపరచనున్నారు. కార్యక్రమంలో బాలసదనం ఇన్చార్జ్ నిహారిక, సిబ్బంది పుష్ప, శంకరమ్మ పాల్గొన్నారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో చిన్నారులకుక్రీడా పోటీలు -
లగచర్ల ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యమే..
దామరగిద్ద: కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటన పూర్తిగా పోలీసులు, ఇంటెలిజెన్స్ యంత్రాంగం వైఫల్యమేనని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావ్ నామాజీ ఆరోపించారు. బుధవారం లగచర్ల రైతులకు న్యాయం చేయాలని సంఘీబావంగా వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకొని దామరగిద్ద స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్టులు చేయడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనమన్నారు. లగచర్ల ఘటన పూర్తిగా చట్టవిరుద్దమన్నారు. బీజేపీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని అధికార యంత్రాంగం రైతులతో చర్చలు జరపకుండా ల్యాండ్ అక్విజేషన్‌కు పాల్పడిందన్నారు. ఎదురు తిరిగిన రైతులతో పాటు సంబంధంలేని వ్యక్తుల పై కేసులు పెట్టడం సరికాదన్నారు. భూ సేకరణకు రైతులు వ్యతిరేకిస్తున్న విషయం ఇంటెలిజెన్స్‌కు తెలియదా అని ప్రశ్నించారు. తండా వాసులను అమానుషంగా అరెస్ట్ చేయడం, ఇంటర్నెట్, విద్యుత్ సేవలను నిలిపివేసి ప్రజలకు సమాచార సంబంధాలను లేకుండా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం న్యాయవిచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి వెంకటయ్య, బీజేపీ మున్సిఫల్ ప్లోర్ లీడర్ సత్యరఘుపాల్, జిల్లా కార్యదర్శి గోపాల్రావ్, మండల పార్టీ అద్యక్షుడు సత్యనారాయణ, మైనార్టీ మోర్చ నాయకుడు నభీ, యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్ పాల్గొన్నారు. ఎక్కడికక్కడే నాయకుల అరెస్ట్ నారాయణపేట: వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామాన్ని సందర్శించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. నాగురావు నామాజీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సత్యరాఘుపాల్, గోపాల్ రావు,వెంకటయ్యను దామరిగిడ్డలో అరెస్ట్ చేశారు. అలాగే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, ఓబీసీ మో ర్చా రాష్ట్ర నాయకుడు కే.శ్రీనివాసులు ఇతర నాయకులను కోటకొండలోని అధ్యక్షుడి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. -
అరెస్టు అప్రజాస్వామికం
నారాయణపేట: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం, అనైతికమని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మా పేరుతో రైతుల నుంచి భూములు లాక్కోవాలని చూస్తున్న ప్రభుత్వం అసలు అక్కడ నిజంగా ఫార్మా కంపెనీ పెడుతుందా.. లేక ఎవరి లబ్ధి కోసం ఇవన్నీ చేస్తున్నారు అనే అనుమానాలను ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి ముందు నుంచి ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళనలకు దిగారని, ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యేగా పట్నం నరేందర్‌రెడ్డి వారికి మద్దతుగా ఉన్నారని తెలిపారు. ఆయనకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజాగా అధికారులపై జరిగిన దాడి ఘటనలో ఈయనను ఇరికించి వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలవకూడదనే ఉద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఉందని తెలిపారు. మెరుగైన సేవలు అందించాలి నారాయణపేట: మీ సేవ కేంద్రాల ద్వారా రాబోయే నూతన సర్వీసులపై నిర్వాహకులు అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్ మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిధిలోని అన్ని మీ సేవా కేంద్రాల ఆపరేటర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని, ప్రతి కేంద్రం ఆన్ని సర్వీసెస్ ద్వారా ప్రజలకి అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సేవలకు రుసుం తీసుకోవాలని, అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎం రామ్మోహన్, జిల్లాలోని అన్ని మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు పాల్గొన్నారు. వడ్లు క్వింటా రూ.3,223 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వడ్లు (హంస) క్వింటా గరిష్టంగా రూ.3,223, కనిష్టంగా రూ.1,955 ధర పలికింది. అదేవిధంగా వడ్లు (సోనా) గరిష్టంగా రూ.2,462, కనిష్టంగా రూ.1,821 ధర పలికాయి. తగ్గిన ఉల్లి ధర దేవరకద్ర: స్థానికమార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు గత వారంతో పోల్చుకుంటే కొంత వరకు తగ్గాయి. ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభం కాగా.. గరిష్ట ధర రూ.2,760గా పలికింది. కనిష్టంగా రూ.1700గా నమోదైంది. గత వారం గరిష్ట ధర రూ.3,600 ఉండగా.. ఈ వారం రూ.840లు తగ్గింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు రెండు వందల బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేశారు. ఇక మార్కెట్ యార్డు అంతా ధాన్యం రాసులతో నిండి పోయింది. ఆర్ఎన్ఆర్ సోనామసూరి ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,459, కనిష్టంగా రూ.1,901 లభించాయి. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.1,901, ఆముదాలు గరిష్ట ధర రూ.5789గా నమోదయ్యాయి. -
ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి
మద్దూరు: కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులు, గోదాములకు తరలించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను అదేశించారు. బుధవారం మండలంలోని పల్లెగడ్డతండా, దోరేపల్లి తండాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఎన్ని క్వింటాళ్ల ధాన్యం సేకరించారని నిర్వాహకులను, సరాసరి ఎంత దిగుబడి వచ్చిందని రైతులను ఆరా తీశారు. కేంద్రాలకు అవసరమైన కాంటాలు, టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. మండలంలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు మంజూరు చేశారు, ఇప్పటి వరకు ఎన్ని ప్రారంభించారని అధికారులను అడగగా 18 కేంద్రాలు మంజూరయ్యాయని. ఇప్పటి వరకు 15 ప్రారంభించామని, మిగిలిన 3 కేంద్రాలను త్వరలో ప్రారంభింస్తామని సమాధానమిచ్చారు. ఐకేపీ, సివిల్సప్లై, మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం మద్దూరులో ఇంటింటి సర్వేను పరిశీలించి ఏమైన సమస్యలున్నాయా అని సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 138మంది ఎన్యుమరేటర్ల ద్వార ఉమ్మడి మద్దూరు మండలంలో సర్వే చేస్తున్నట్లు ఎంపీడీఓ నర్సింహరెడ్డి కలెక్టర్‌కు వివరించారు. డీఎం దేవదాస్, ఏఓ రామకృష్ణ, ఎంపీఓ రామన్న పాల్గొన్నారు. గ్రూప్–3 పరీక్షలకుపకడ్బందీ ఏర్పాట్లు నారాయణపేట: గ్రూప్–3 పరీక్షలు జిల్లాలో 4200 మంది రాయనున్నారని, ఈమేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ వివరించారు. బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా స్ట్రాంగ్‌రూం ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆదేశించారు. పరీక్షకు ఒకరోజు ముందు పరీక్ష కేంద్రంలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 13 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షహాలులోకి అనుమతించబడదని, హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఖచ్చితంగా తీసుకు రావాలన్నారు. ఆర్డీఓ రామచందర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కడుపులో మంట వస్తోంది..
మా గ్రామానికి ఇథనాల్ కంపెనీ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరు నెలల నుంచి కంపెనీ నుంచి దుర్వాసనతో కూడిన గాలి వస్తోంది. నాతో పాటు గ్రామంలో చాలా మందికి కడుపులో మంటగా ఉంటోంది. దీంతో వైద్యుడిని సంప్రదిస్తే విష వాయువులను పీల్చడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పారు. ఈ విషయంపై గ్రామస్తులు అందరం ఏకమై కంపెనీని రద్దు చేయాలని తహసీల్దార్‌ను కలిసి విన్నవించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చాం. ఇంత వరకు ఫలితం రాలేదు. కంపెనీని ఎత్తివేసి మా ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. – ఆంజనేయులు, ఫర్ధీపూర్, చిన్నచింతకుంట మా బతుకులు ప్రశ్నార్థకంగా మారుతాయి.. మా గ్రామం గుండా తుంగభద్ర నది పారుతోంది. పొలాలకు నీరు పెట్టుకునే అవకాశం ఉండటంతో పచ్చని పైర్లు పండుతాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే ఊర్లో ఉన్న పొలాలకు నీరు లేక, ఉన్న నీరు కలుషితమై వ్యవసాయంతో పాటు మా బతుకులు ప్రశ్నార్థకంగా మారుతాయి. ఇలాంటి ఫ్యాక్టరీలు ఉన్న చోట ప్రజలు పడే ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. అందుకే గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దాని నిర్మాణం జరగనివ్వం. – రాజేంద్రప్రసాద్, రైతు, పెద్ద ధన్వాడ, రాజోళి పునఃసమీక్షించాలి ఇథనాల్ కంపెనీ వల్ల చాలా నష్టం. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవడానికి అనుమతిస్తారా? పర్మిషన్లు ఇచ్చి ప్రజల్ని బందీలుగా చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇథనాల్ కంపెనీల విషయమై పునఃసమీక్షించాలి. పూర్తిగా రద్దు చేయాలి. లేకపోతే పోరాటం తప్పదు. – బి.కృష్ణ, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి, గుడెబల్లూర్● -
అలరించిన సదర్ ఉత్సవాలు
కోస్గి: మండల కేంద్రంలో బుధవారం రాత్రి యాదవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలు అలరించాయి. పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం దగ్గర దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం డోలు వాయిద్యాల మధ్య స్థానిక శివాజీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సదర్ ఉత్సవాలకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు యాదవ సంఘ ప్రతినిధులు సదర్ ఆవశ్యకతను వివరించారు. కళాకారుల ఆటపాటలు ఎంతగానో ఆకర్షించాయి.కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం గౌరవ అధ్యక్షుడు పీరంపల్లి శ్రీనివాస్, అధ్యక్షుడు గొల్ల నర్సిములు, నాయకులు బస్వరాజ్ యాదవ్, గుర్రం హన్మంతు, రమేష్, హన్మంతు, పూర్ణచందర్ యాదవ్ పాల్గొన్నారు. -
తాజాగా పెద్ద ధన్వాడలో..
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు మొదలయ్యాయి. దీనిపై స్థానికంగా వ్యతిరేకత పెల్లుబికింది. కేవీపీఎస్ వంటి ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పక్షాలు స్పందించాయి. ఫ్యాక్టరీ నిర్మించొద్దని.. అనుమతులు రద్దు చేయాలంటూ సీపీఎం, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నిరసనల్లో పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్‌కి వెళ్లి వినతిపత్రం సైతం అందజేశారు. అధికార కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. కాగా..ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైతే భవిష్యత్‌లో పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసనూర్, మాన్‌దొడ్డి, తుమ్మిళ్ల, పచర్ల, అయిజ మండలంలోని చిన్న తాండ్రపాడు, వెనుసొంపురం గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
మార్మోగిన గోవింద నామస్మరణ
చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న అమ్మాపూర్ కురుమూర్తి స్వామి జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే వివిధ వాహనాల్లో వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు మార్మోగాయి. అలివేలు మంగమ్మ, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతర మైదానంలో దుకాణ సముదాయాలలో వివిధ వస్తువులను కొనుగోలు చేశారు. గాజుల దుకాణాలు, హోటళ్లు, కిటకిటలాడాయి. ● కురుమూర్తి స్వామి దర్శనానికిభక్తుల బారులు ● ఆలయంలో ప్రత్యేక పూజలు -
కాలుష్య కోరల్లో పాలమూరు!
● ఉమ్మడి జిల్లాకు పెను ముప్పుగా ఇథనాల్ కంపెనీల విస్తరణ ● ఇప్పటికే చిత్తనూర్ పరిసర ప్రాంతాలు కాలుష్యమయం ● 30 కి.మీ.ల మేర దుర్వాసన.. పంటలతోపాటు ప్రజారోగ్యంపై ప్రభావం ● వ్యతిరేకత పెల్లుబికుతున్నా హిందూపూర్‌లో వేగంగా సాగుతున్న పరిశ్రమ పనులు ● తాజాగా గద్వాల జిల్లా రాజోళి మండలంలో ఏర్పాటుకు సన్నాహాలు ● ప్రజా సంఘాల మండిపాటు.. స్థానికులతో కలిసి పోరుబాట సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జడ్చర్ల నియోజకవర్గం పోలేపల్లి సెజ్ పరిధిలో ఫార్మా పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో పరిసర ప్రాంతాల ప్రజల జీవనం నిత్యనరకంగా మారింది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి గ్రామాల్లో భూగర్భజలాలు కలుషితం కాగా.. పంటల సాగుతో పాటు తాగడానికి కూడా పనికి రాకుండాపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు చర్మ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. ఇది చాలదన్నట్లు ఉమ్మడి జిల్లాలో కాలుష్యకారక ఇథనాల్ పరిశ్రమల విస్తరణ కొనసాగుతుండడం ప్రజల్లో ఆందోళన రేపుతోంది. భవిష్యత్‌లో ఈ కంపెనీలు పెను ముప్పుగా మారే అవకాశం ఉండడం వారిని బెంబేలెత్తిస్తోంది. చిత్తనూర్.. నిశ్శబ్ద ఉద్యమం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూర్ గ్రామశివారులో 430 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్ల అంచనాతో నిర్మాణమైన జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఎల్ఎల్పీ (యూనిట్–1) ఇథనాల్ కంపెనీ ఆసియా ఖండంలోనే పెద్దది. చిత్తనూర్, జిన్నారం, ఎక్లాస్పూర్ గ్రామాల మధ్య ఈ కంపెనీ ఏర్పాటైంది. ఈ కంపెనీ ఏర్పాటు మూడు గ్రామాల్లో చిచ్చురేపగా.. పచ్చని పంట పొలాల్లో మంటలు పుట్టించింది. స్థానికులు తొలి నుంచి ఈ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. దీన్ని శాశ్వతంగా రద్దు చేయాలనే డిమాండ్‌తో స్థానికులు సుమారు రెండేళ్లు ఉద్యమించారు. గతేడాది అక్టోబర్‌లో కంపెనీ నుంచి ఇథనాల్‌తో ఓ ట్యాంకర్ బయటకు రాగా.. స్థానికులు దాన్ని నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగారు. ఒకరోజు మొత్తం సాగిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులపై కేసులతో ఉక్కుపాదం మోపగా.. సుమారు ఏడాదిగా నిశ్శబ్ద ఉద్యమం సాగుతోంది. పాలమూరు అధ్యయన వేదిక తదితర ప్రజాసంఘాలు వారికి మద్దతుగా గళమెత్తుతూ వస్తున్నాయి. హిందూపూర్‌లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు కొనసాగుతున్న పనులుఆ తర్వాత హిందూపూర్.. చిత్తనూరులో ఇథనాల్ కంపెనీ కార్యకలాపాలు మొదలు కాగా.. ఆ తర్వాత ఇదే నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని హిందూపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఈ కంపెనీ ఏర్పాటుపై ఇప్పటివరకు ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని స్థానికులు చెబుతుండగా.. మండల అధికారులు తమకేమీ తెలియదని సమాధానం ఇస్తున్నారు. కానీ కంపెనీ పనులు 50శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. 30 కి.మీ.ల మేరదుర్వాసన.. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానికులు ఆందోళన చేయకుండా ఒత్తిడి తీసుకురాగా.. ఆ మూడు గ్రామాల్లో నిశ్శబ్దం అలుముకుంది. ఈ క్రమంలో కంపెనీ పనులు పూర్తయ్యాయి. తొలుత కాలుష్యంతో కూడిన వ్యర్థజలాలను మన్నేవాగుల్లో వదలడంతో చేపలు మృత్యువాత పడ్డాయి. వాగులో స్నానాలు చేసిన పిల్లలకు శరీరంపై దద్దులు వచ్చాయి. గ్రామస్తులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. కంపెనీ నిర్వాహకులు మన్నేవాగులోకి కలుషిత నీరు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అయితే కంపెనీ లోపల చెరువులా గుంతలు తవ్వి ఆ నీటిని అందులోకి వదులుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇథనాల్ కంపెనీ వల్ల భవిష్యత్‌లో మరికల్, నర్వ, చిన్నచింతకుంట, ఆత్మకూర్, మక్తల్ మండలాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నట్లు పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీ ప్రారంభమైన ఏడాదిలోపే చుట్టూ ఎటు చూసినా 30 కి.మీ.ల మేర దుర్వాసన వెదజల్లుతోంది. సుమారు 10 కిలోమీటర్ల వరకు పంటలపై ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు. -
భూసేకరణకు సమాయత్తం..
కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు బైపాస్ రహదారులు నిర్మించే ప్రాంతాల్లో భూములు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లింపులు చేపట్టారు. కల్వకుర్తి, కొల్లాపూర్‌లో పరిహారం చెల్లింపులు దాదాపుగా పూర్తయ్యాయి. నాగర్‌కర్నూల్‌లో మాత్రం ఇంకా చెల్లింపులు జరగాల్సి ఉంది. మొదటి ప్యాకేజీలో భాగంగా కొల్లాపూర్ సమీపం వరకు జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. రెండో ప్యాకేజీలో సోమశిల రోడ్డు నుంచి మల్లేశ్వరం వరకు రహదారి నిర్మించనున్నారు. అందుకు అవసరమైన భూసేకరణ, పరిహారం చెల్లింపుల ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. సోమశిల వద్ద ఐకానిక్ బ్రిడ్జి టెండర్లు ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. అటవీ భూముల్లో రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన అనుమతులకు చర్యలు చేపట్టారు. -
వడివడిగా..
కొల్లాపూర్: కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు చేపట్టిన జాతీయ రహదారి–167కే నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. రహదారి నిర్మాణంలో భాగంగా చేపట్టి న బైపాస్ పనులు ఊపందుకున్నాయి. నిర్ణీత గడువులోగా ఆయా పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో సంబంధిత అధికారులు ముందుకు సాగుతున్నా రు. అలాగే మల్లేశ్వరం– సంగమేశ్వరం ప్రాంతాల మధ్య కృష్ణానదిపై నిర్మించబోయే ఐకానిక్ సస్పెన్సివ్ కేబుల్ బ్రిడ్జి పనులకు సంబంధించిన టెండర్లు కూడా ఈనెలాఖరులో ఓపెన్ కానున్నాయి. గత సెప్టెంబర్‌లో టెండర్లు ఎన్‌హెచ్–167కేలో భాగంగా మల్లేశ్వరం నుంచి సంగమేశ్వరం వరకు కృష్ణానదిపై 87.360 కి.మీ., నుంచి 88.437 కి.మీ., వరకు ఐకానిక్ సస్పెన్సివ్ కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా.. అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే ఆయా కంపెనీల అర్హతలను పరిశీలించే ప్రక్రియను నేషనల్ హైవే అథారిటీ అధికారులు చేపట్టారు. ఈ నెల 29న టెండర్ ఓపెన్ చేయనున్నట్లు అధికారిక వెబ్సైట్లో పొందుపర్చారు. చౌటబెట్ల చౌరస్తా కోసం.. కొల్లాపూర్ నుంచి చౌటబెట్లకు వెళ్లే దారిలో చౌరస్తా ఏర్పాటు చేయాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడారు. చౌటబెట్లకు వెళ్లే దారిలో అండర్‌పాస్ బ్రిడ్జి కాకుండా చౌరస్తా ఏర్పాటు చేయాలని.. లేదంటే ఫ్లైఓవర్ నిర్మించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు చౌటబెట్ల దారిలో చౌరస్తా ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. రూ.436.91 కోట్లవ్యయంతో.. భారత్‌మాల పథకంలో భాగంగా కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు జాతీయ రహదారి–167కే నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. మొదటి ప్యాకేజీలో భాగంగా రూ.436.91 కోట్ల వ్యయంతో కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు 85 కి.మీ., మేరకు రహదారి నిర్మాణం చేపట్టారు. కల్వకుర్తి నుంచి తాడూరు వరకు, నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ వరకు రహదారి పనులు చివరి దశకు చేరుకున్నాయి. కల్వకుర్తి, కొల్లాపూర్ సమీపంలో నిర్మిస్తున్న బైపాస్ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాన చౌరస్తాల్లో ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టారు. మేడిపూర్ సమీపంలోని డిండి వాగుపై వంతెన నిర్మాణం 50 శాతం పూర్తయింది. కొన్నిచోట్ల కల్వర్టుల నిర్మాణాలు సాగుతున్నాయి. గ్రామాల్లో జాతీయ రహదారికి ఇరువైపులా ఇనుప కంచెలు.. మరికొన్ని చోట్ల డివైడర్లు ఏర్పాటు చేశారు. ఎన్‌హెచ్–167కేపనులు ముమ్మరం నిర్ణీత గడువులోగా బైపాస్ నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు చివరి దశకు మొదటి ప్యాకేజీ పనులు కృష్ణానదిపై ఐకానిక్ వంతెనకు ఈ నెల 29న టెండర్ల ఓపెన్ చౌటబెట్లకు వెళ్లే దారిలో చౌరస్తాఏర్పాటుపై స్పష్టత కరువు మార్కింగ్ చేశారు.. కొల్లాపూర్ సమీపంలో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లింపుల ప్రక్రియను పూర్తిచేశాం. సాంకేతిక కారణాల వల్ల కొందరికి పరిహారం చెల్లింపులో జాప్యం జరిగింది. సోమశిల రోడ్డు నుంచి మల్లేశ్వరం వరకు చేపట్టే జాతీయ రహదారి నిర్మాణ ప్రాంతంలో భూసేకరణ కోసం గతంలో మార్కింగ్ చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే భూసేకరణ ప్రక్రియ చేపడతాం. – భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్ -
ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసన
కృష్ణా: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మంగళవారం రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసనకు దిగారు. పలువురు రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం దాదాపు 2వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురాగా.. వ్యవసాయ అధికారులు తేమ శాతాన్ని పరిశీలించగా 17శాతం వచ్చిందన్నారు. గన్నీ బ్యాగులు త్వరలో ఇస్తామని చెప్పి తీరా మంగళవారం వచ్చేసరికి మీ ధాన్యంలో తాలు ఉందని వంకలు పెడుతున్నారని ఆరోపించారు. 20 రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ● అదేవిధంగా మురహర్దొడ్డిలోని ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు అవుతున్నా తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో తిప్పి పంపుతున్నారని రైతులు ఆరోపించారు. నేటికీ ఒక్క బస్తా ధాన్యం కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. -
లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం
నారాయణపేట ఎడ్యుకేషన్: లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటే కేసులు త్వరగా పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ.. డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని పోలీస్ అధికారులకు తెలిపారు. తమ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కారం పొందేలా చూడమని సూచించారు. జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను అడిగి తెలుసుకొని, ఈ లోక్ అదాలత్‌లో త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. ఈ పెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఎకై ్సజ్‌శాఖలో ఇలా మొత్తం 6500 కేసులను టార్గెట్‌గా నిర్దేశించారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో 80 నుంచి 90శాతం వరకు రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్, అడిషనల్ జూనియర్ జడ్జి సయ్యద్ జాకియా సుల్తానా, ఆర్డీఓ రామచందర్‌నాయక్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ లన్సమ్పతి గౌడ్, నాగేశ్వ, సురేష్ కుమార్ పాల్గొన్నారు. -
విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి
ఊట్కూరు: విద్యాభివృద్ధికి కృషి చేద్దామని డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు. మంగళవారం నిడుగుర్తిలోని ప్రాథమిక పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. పాఠశాలల మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు సుచి, శుభ్రతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, తల్లిదండ్రుల సమావేశాలను విధిగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధనుంజయ్య, ఆంజనేయులు, లక్ష్మారెడ్డి, మహమ్మద్తకీర్, హిదాయితుల్లా, సుజాత తదితరులు పాల్గొన్నారు. దాడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి నారాయణపేట: వికారాబాద్ జిల్లా లగచర్లలో సోమవారం కలెక్టర్,అధికారులపై జరిగిన దాడి సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రఘురామయ్యగౌడ్తో కలిసి మాట్లాడారు. అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. డిజిపి ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగినదని ప్రకటించడం వారి నిస్సహాయతను నిదర్శనన్నారు. ముందే తెలిసినప్పుడు నిఘా సంస్థలు, పోలీసులు ఎందుకు అరికట్టలేదని ప్రశ్నించారు. ఇక 12 రోజులైనా కొనుగోలు కేంద్రాలలో వరి కొనడం లేదని, రైతులకు న్యాయం జరగాలంటే మిల్లర్లనే కొనుగోలు కేంద్రాలకు పంపించి తేమ శాతం చూసుకుని ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో ఈజీఎస్ పనుల్లో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని, ఒక్క మరికల్ మండలంలోని 17 గ్రామాల్లో రూ.2 కోట్ల 70 లక్షల అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా విచారణ జరిపించి అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని, డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. దరఖాస్తుల ఆహ్వానం జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మహబూబ్‌నగర్‌లో స్టెనో కం టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాపిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టైపిస్ట్ ఒకటి (జనరల్– 1), రికార్డు అసిస్టెంట్ రెండు (ఓసీ మహిళ–1), (ఎస్సీ మహిళ– 1) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి అభ్యర్థులు రిజిష్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఈ నెల 28 సాయంత్రం 5 గంటలలోగా జిల్లా కోర్టు ప్రాంగణంలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కోర్టుల e-courtsవెబ్ సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. మున్సిపాలిటీలోవిలీనం చేయొద్దు.. మద్దూరు: మున్సిపాలిటీలో రెనివట్ల గ్రామాన్ని విలీనం చేయొద్దని గ్రామస్తులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాచేశారు. అక్కడ తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఎంపీడీఓ నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి మద్దూరు పాతబస్టాండ్ చౌరస్తా ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో ఎస్ఐ రాంలాల్ అక్కడి చేరుకొని ధర్నా విరమింపజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు శంకర్, సల్మాన్, తిప్పన్న, కన్కప్ప, హాజర్, సాయప్ప, రాములమ్మ, తిప్పమ్మ, నర్సింగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్ – 3 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట: గ్రూప్ – 3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఈనెల 17 ,18 తేదీలలో జరగబోయే గ్రూప్– 3 పరీక్షకు సంబంధించి నిర్వహించిన శిక్షణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూప్– 3 పరీక్షకు 13 సెంటర్లు ఏర్పాటు చేయగా, 4200 మంది అభ్యర్థులు పరీక్ష హాజరవుతున్నట్లు తెలిపారు. డిపార్ట్మెంటల్ అధికారులు 14, ఫ్లైయింగ్ స్వ్కాడ్ టీం 4, ఐడెంటిఫికేషన్ అధికారులు 45, రూట్ ఆఫీసర్స్ 4, చీఫ్ సూపరింటెండెంట్స్ 13 మంది... చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అబ్జర్వర్ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు తమ సెంటర్ నందు పరీక్ష నిర్వహణకు కావాల్సిన తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, సీసీ కెమెరాలు, శానిటైజేషపై దృష్టి సారించాలన్నారు. సెంటర్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని తెలియజేశారు. పోలీసులు పరీక్ష కేంద్రం చుట్టుపక్కల 144 సెక్షన్ విధించాలని, ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. కేంద్రాల్లోకి ఏ ఒక్కరిని ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లను అనుమతించకూడదని అధికారులు ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్ నాయక్ పాల్గొన్నారు. పక్కాగా సర్వే వివరాలునమోదు చేయాలి నారాయణపేట టౌన్: సమగ్ర కుటుంబ సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎన్యుమరేటర్లకు సూచించారు. జిల్లా కేంద్రంలోని 4, 5 వార్డుల్లో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటి సర్వేను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరు, నిర్ణీత ఫారంలో కోడ్ల వారీగా వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. సిబ్బందికి ప్రజలు సహకరించాలని, ఎలాంటి అనుమానం లేకుండా వివరాలు తెలపాలన్నారు. మున్సిపల్ కమిషనర్ సునీత, టీపీఓ కిరణ్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనేదెప్పుడు?
మరికల్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం పెడుతున్న కొన్ని నిబంధనలకు మిల్లర్లు ముందుకు రాకపోవడంతో ధాన్యం కొనుగోలు మరింత ఆలస్యం అవుతున్నట్లు కన్పిస్తుంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ పొలాల వద్ద ఆరబెట్టిన ధాన్యం రాశులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. వాటి దగ్గర రాత్రింబవళ్లు కాపాలా ఉండాల్సిన పరిస్థితులు రావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క వరి ధాన్యం సేకరణకు మారిన నిబంధనలు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 101 కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 96 కేంద్రాలను ప్రారంభించారు. 90 కేంద్రాలకు 5.50 లక్షల గన్నీ బ్యాగులను పంపించారు. ఇన్ని రోజులకుగాను కేవలం 48 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఆ కాస్త ధాన్యం కూడా బిల్లులకు చేరలేదు. ధాన్యం కొనుగోలు చేసే విషయంలో అధికారులు మరింత ఆలస్యం చేయడం వల్ల రైతులు కర్ణాటక ప్రైవేట్ వ్యాపారులకు ఎంతో కొంత ధరకు విక్రయించేస్తున్నారు. మరోపక్క కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు కల్పించకుండానే నిబంధనలను అమలు చేయడంపై రైతులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నాఉ. సడలింపులు లేకుండా నిబంధనలు పాటిస్తామంటే బోనస్ కింద ఇచ్చే రూ.500 వచ్చేలా లేవంటున్నారు. గతంలో నిబంధనలు ఇలా.. గతంలో ధాన్యం సేకరణకు అవసరమైతే లారీలను పొలాల వద్దకే పంపేవారు. అక్కడే తేమ శాతం చూసి తూకం వేసి గన్నీ బ్యాగుల్లో ఎత్తి లారీలకు నింపి మిల్లులకు తరలించేవారు. దీని వల్ల రైతులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండేవి కాదు. ఖర్చులు తక్కువగానే ఉండేవి. చిన్న రైతుల విషయానికి వస్తే నిర్వాహుకులు వారి కల్లాల వద్దకు వెళ్లి తేమ శాతాన్ని గుర్తించి తూకం చేసేవారు. సమీపంలోనే లారీ ఉంటే అక్కడికి ధాన్యాన్ని తరలించి మిల్లులకు పంపేవారు. మొత్తానికి పొలం దగ్గరి నుంచే మిల్లులకు ధాన్యాన్ని తరలించేవారు. కేంద్రానికే ధాన్యం తరలింపుతో తిప్పలు కొత్త ప్రభుత్వం రావడంతో ఽక్వింటాల్ ధాన్యం వెంబడి రూ.500 బోనస్ ప్రకటించడం వల్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ప్రతి రైతు తప్పనిసరిగా ధాన్యాన్ని వాహనాల్లో కొ నుగోలు కేంద్రాన్ని తీసుకురావాలి. అక్కడే ఆరబెడి తే ఏఈవోలు తేమ శాతంతో పాటు ఏ రకం ధాన్యం అనేది గుర్తిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధా న్యం నాణ్యతగా ఉంటేనే గన్నీబ్యాగులు అందజేస్తా రు. అక్కడే గన్నీ బ్యాగుల్లో నింపి లారీల ద్వారా మిల్లులకు తరలిస్తారు. లారీకి కూడా జీపీఎస్ విధాన్నాని ఏర్పాటు చేసి పంపిస్తారు. ఒక వేళ కేంద్రాల వద్ద ఆరబెట్టుకోవడానికి స్థలం లేదని భావి స్తే రైతు ఎక్కడైనా రవాణా సౌకర్యం ఉన్న చోట ఆరబెట్టుకొని కేంద్రానికి తీసుకరావాలి. ముఖ్యంగా పొ లాల నుంచి మళ్లీ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాలంటే ట్రాక్టర్‌తో పాటు కూలీలు అవసరం పడుతారని ఖర్చు తడిసి మోపెడు ఆవుతోందని రైతులు వాపోతున్నారు. ఇలా ఖర్చులు భరిస్తూ విక్రయించడం కన్నా బయట ప్రైవేట్ వ్యా పారులకు అమ్మడమే సులువని కొందరు రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. జిన్నారం శివారులో కర్ణాటక వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్న రైతులు మారిన నిబంధనలతోరైతుల పరేషాన్ నేటికీ ఎంపిక కాని మిల్లులు ఎక్కడి ధాన్యం రాశులు అక్కడే.. బోనస్‌పై ఆశలు వదులుకొని కర్ణాటక వ్యాపారులకు విక్రయిస్తున్న వైనం జిల్లాలో 101 కొనుగోలు కేంద్రాలకు 96 కేంద్రాలు ప్రారంభం ఇప్పటివరకు కొనుగోలు చేసింది48 మెట్రిక్ టన్నులే.. -
10 రోజుల నుంచిఎదురు చూస్తున్నా..
ధాన్యం కోతవేసి కొనుగోలు కేంద్రం వద్దకు ట్రాక్టర్ల ద్వారా తరలించాను. ఽమూడు రోజులు ధాన్యం ఆరబెట్టాను. ఽతేమ శాతం చూసి ఎంపిక చేశారు. ధాన్యం నింపడం కోసం గన్నీ బ్యాగులు ఇవ్వాలని అధికారులను కోరితే మిల్లులు ఎంపిక కాలేదు. కొనుగోలుకు ఆలస్యం అవుతుందని చెప్పారు. పది రోజుల నుంచి ఇక్కడే ధాన్యం రాశుల వద్ద రాత్రింబవళ్లు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే వరిధాన్యం కొనుగోలు చేయాలి. – అంజయ్య, రైతు, కన్మనూర్ కర్ణాటక వ్యాపారులకు అమ్మేశా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలుకు ముందుకు రాలేదు. అధికారులను అడిగినా గన్నీబ్యాగులు ఇవ్వలేదు. చేసేంది లేక బోనస్‌పై ఆశ పెట్టుకోకుండా ఆరటెట్టిన ధాన్యాన్ని కర్ణాటక వ్యాపారులకు విక్రయించాను. – నర్సింహులు, మరికల్ మిల్లులు ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నాం మారిన నిబంధనలకు మిలర్లు ఒప్పుకోలేదు. అందుకు ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుంది. జిల్లాలోని మిల్లులను ఎంపిక చేసే పనిలో ఉన్నాం. ఏఈవోలు ఎంపిక చేసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తాం. – సుదర్శన్, డీఎస్ఓ ● -
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు
నారాయణపేట/మరికల్: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో 366మంది, మరికల్లో 85 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నారాయణపేట మండలం లింగంపల్లి వద్ద ఉన్న భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో ఏర్పాటుచేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మరికల్లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఆడబిడ్డను భారంగా భావించవద్దని.. ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేపై ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తమన్నారు. సర్వేపై ప్రజలకు ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ రాంచందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, వైస్ చైర్మన్ కోణంగేరి హన్మంతు, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్‌చైర్మన్ హరినారాయణ భట్టడ్, కౌన్సిలర్లు ఎండీ సలీం, బండి రాజేశ్వరి, మహేష్, నాయకులు నరహరి, సూర్యమోహన్‌రెడ్డి, వీరన్న, హరీష్, రామకృష్ణారెడ్డి, కృష్ణయ్య, శ్రీకాంత్‌రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రుణమో రామచంద్రా..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రుణమాఫీ చిక్కులు.. బ్యాంకర్ల కొర్రీలు వెరసి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో రైతులకు పంట రుణాలు అందడం లేదు. రుణమాఫీ అయినా సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారడంతో వేలాది మంది కొత్త రుణాలకు దూరమయ్యారు. మరోవైపు అర్హులై ఉండి రుణమాఫీకి నోచుకోని వారు సైతం క్రాప్ లోన్ కోసం వెంపర్లాడక తప్పడం లేదు. పాతవి పూర్తిగా చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంక్ అధికారులు పెడుతున్న మెలికతో అన్నదాతలు విధి లేని పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.లక్ష్యం.. బహుదూరంప్రతి ఆర్థిక సంవత్సరం బ్యాంకర్లు ప్రకటిస్తున్న రుణ ప్రణాళికలు రికార్డుల ప్రకారం ఘనంగా ఉన్నప్పటికీ.. అమలులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2020 నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరాల వారీగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో వందశాతం రుణ లక్ష్యాన్ని చేరుకున్న దాఖలాలు లేవు. గరిష్టంగా 60 శాతానికి మించి రుణ లక్ష్యం చేరుకోలేదు. ప్రతి ఏటా లక్ష్యం బహుదూరంగానే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.కొత్తగా ‘సాంకేతిక’ ఇబ్బందులు..రుణమాఫీ వర్తించినా.. వివిధ సాంకేతిక కారణాలతో బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమకాని వారు ఉమ్మడి జిల్లాలో సుమారు 30వేల మంది ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆధార్, లోన్ అకౌంట్లకు పేరు సరిపోలకపోవడం, ఆధార్ నంబర్ కరెక్ట్ లేకపోవడం, ఫ్యామిలీ గ్రూప్‌లో వేరే వారి పేరు చేరడం, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండడం, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌లో పేరు సరిపోలకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం వంటి కారణాలతో వారి వారి ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. ఈ క్రమంలో వారికి కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలో సదరు రైతులు ఇటు రుణమాఫీ అమలు కోసం.. అటు పంట రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. -
రుణమాఫీ కాలే.. కొత్త లోన్ ఇవ్వలే..
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు మూసాపేట మండలం వేముల గ్రామానికి చెందిన కె.వెంకటయ్య. ఈయనకు 1.5 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. మూడేళ్ల క్రితం పోల్కంపల్లి సింగిల్ విండోలో రూ.45 వేల పంట రుణం తీసుకున్నాడు. ఎన్నికలకు ముందు వడ్డీ కట్టమని సింగిల్ విండో అధికారులు ఒత్తిడి తెచ్చారు. డబ్బులు లేక కట్టలేకపోయాడు. ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ చేయగా వెంకటయ్యకు కాలేదు. పాత బకాయి మాఫీ కాకుండా అలాగే ఉండిపోవడంతో కొత్తగా పంట రుణం ఇవ్వలేదు. దీంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పు చేసి.. పంట సాగు చేస్తున్నానని ఆ రైతు వాపోతున్నాడు. ఎవరూ పట్టించుకోవడం లేదు.. అమరచింతకు చెందిన రైతు రాజేశ్వర్‌రెడ్డికి రెండెకరాల 29 గుంటల పొలం ఉండగా.. బ్యాంకులో రూ.1.60 లక్షల పంట రుణం పొందారు. వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోషపడ్డాడు. కానీ ఇప్పటివరకు అతడి రుణం మాఫీ కాకపోవడంతో నిత్యం వ్యవసాయశాఖ కార్యాలయం, బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు. తనకు రుణమాఫీ పథకం వర్తింపజేయాలని కోరుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందుతున్నారు. -
ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను ఫలితాలను www.telanga naopenschool.orgలో చూసుకోవాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శివయ్య తెలిపారు. ఎస్సెస్సీ వారికి రీ కౌంటింగ్ రూ.350,రీ వెరిఫికేషన్‌కు రూ.1,200 చెల్లించాలని, ఇంటర్మీడియట్ వారికి రీకౌంటింగ్‌కు రూ.400, రీ వెరిఫికేషన్‌కు రూ.1,200 చెల్లించాలన్నారు. ఫీజులను ఈనెల 20 లోగా ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. -
రుణమో రామచంద్రా..!
వివరాలు 8లో uపంట రుణాలకుబ్యాంక్ అధికారుల కొర్రీలు ● రుణమాఫీ వర్తించినా.. అందని కొత్త రుణాలు ● సాంకేతిక సమస్యలతో వేలాది మంది దూరం ● మాఫీకి నోచుకోని వారు సైతం వెంపర్లాట ● పాతవి చెల్లిస్తేనే కొత్త వాటికి అర్హులని బ్యాంకర్ల మెలిక ● ఉమ్మడి జిల్లాలో ఐదేళ్లుగా లక్ష్యాన్ని చేరుకోని బ్యాంక్‌లు ● విధిలేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు ● నెలనెలా వడ్డీల భారం మోయలేక సతమతం అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదు.. నాకు రెండెకరాల 30 గుంటల వ్యవసాయ భూమి ఉండగా.. 2018లో రూ. 1.50 లక్షల రుణం తీసుకున్నాను. క్రమం తప్పకుండా రెన్యూవల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వడ్డీతో కలిపి రూ. 1.70 లక్షల అప్పు ఉంది. మొదటి, రెండు విడతల్లో రుణమాఫీ కాలేదు. ఈ విషయంపై అధికారులను సంప్రదిస్తే అన్నివిధాలా మీరు అర్హత కలిగి ఉన్నారు.. త్వరలోనే మీకు రుణమాఫీ వస్తుందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు రుణమాఫీ మాత్రం కాలేదు. – పవన్, యువ రైతు, మాగనూర్ అప్పు చేసి కట్టాను.. మా గ్రామంలో ముగ్గురు, నలుగురికి మినహాయిస్తే అందరి రుణాలు మాఫీ అయ్యాయి. నాకు, నా భార్య పేరుపై రూ.2లక్షలకు పైబడి రుణం ఉందని మాఫీ కాలేదు. రూ.2 లక్షల లోపు రుణం ఉంటే మాఫీ అవుతుందని అందరూ చెబితే, నెలరోజుల క్రితం రూ.91 వేలు అప్పు తెచ్చి, బ్యాంకులో కట్టాను. ప్రస్తుతం ఎవరూ రుణమాఫీ మాటే ఎత్తడం లేదు. బ్యాంకులో అడిగితే రుణమాఫీ కాని వారు చాలామంది ఉన్నారు.. వారికి అయినప్పుడు మీకు అవుతుందని అంటున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే, మిగిలిన డబ్బులు చెల్లించి కొత్త రుణం తీసుకునే వాళ్లం. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నాం. – పుట్ట చిన్నయ్య, రైతు, కొత్తరాంనగర్, ఉప్పునుంతల మండలం రుణమాఫీ ఊసే లేదు.. కేటీదొడ్డిలో నాకు రెండెకరాలు భూమి ఉంది. నేను గట్టు ఎస్బీఐలో రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాను. కానీ ఇప్పటివరకు నా రుణం మాఫీ కాలేదు. వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. వారు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. నాకు రుణమాఫీ వస్తుందో లేదోనన్న అయోమయంలో ఉన్నా. ఇప్పటికై నా ప్రభుత్వం రుణమాఫీ చేసి ఆదుకోవాలి. – చిన్నకొండయ్య, రైతు, కేటీదొడ్డి మండలం రైతు భరోసా లేక.. రుణాలు రాక.. గత ప్రభుత్వంలో రైతుబంధు కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు పర్యాయాలు మొత్తం రూ.12 వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యాయి. ఈ మేరకు అన్నదాతలకు పెట్టుబడి అవసరాలు కొంత మేర తీరేవి. కాంగ్రెస్ సైతం రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11 నెలలు అయినా.. ఇప్పటివరకు రైతు భరోసా అమలుపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ క్రమంలో బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలో వెనుకంజ వేస్తుండడంతో రైతులు పెట్టుబడి కోసం నానాతంటాలు పడాల్సి వస్తోంది. -
ధాన్యం సేకరణవేగవంతం
మక్తల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ బేంషలం అన్నారు. సోమవారం మండలంలోని జక్లేర్‌లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. మక్తల్‌లో మూడు మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు అనుమతి వచ్చినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట మండల అధికారులు ఉన్నారు. ఉపాధి పనుల్లోఅక్రమాలను తేల్చాలి మరికల్: మండలంలోని కన్మనూర్‌లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి, అక్రమాలను తేల్చాలని ఎంపీ డీకే అరుణ సంబంధిత అధికారులకు సూచించారు. మక్తల్ మండలం జక్లేర్‌లో ఎంపీ విలేకరులతో మాట్లాడుతూ.. గడిచిన మూడేళ్లలో చేపట్టిన ఉపాధి పనుల్లో దాదాపు రూ. 2.75 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. దీనిపై సాక్ష్యాధారాలతో సహా గ్రామస్తులు గత సెస్టెంబర్లో అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా జిల్లావ్యాప్తంగా జరిగిన ఉపాధి పనులపై కూడా సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. సమావేశంలో నాగూరావు నామాజీ ఉన్నారు. అబుల్ కలాం ఆజాద్ సేవలు మరవలేనివి నారాయణపేట: స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి దివంగత మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యరంగానికి చేసిన సేవలు మరవలేనివని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ జానియర్ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ సొసైటీ కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో ప్రతిభ కనబర్చిన అభితత్వర్, జిల్లాస్థాయి భోఖో టోర్నీలో సత్తా చాటిన నవీన్‌లను అభినందించి సత్కరించారు. అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ డే సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి సుదర్శన్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్య అందించాలి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని పీయూ వీసీ జీఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో బాపుబాటలో– సత్యశోధక యాత్ర పేరుతో ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్ర సోమవారం పీయూకు చేరుకుంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ మాట్లాడారు. బాపు చూపిన మార్గము నేటితరం యువతకు అనుసరణీయమన్నారు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల యువతలో మానవత్వపు విలువలు కొరవడాయని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న విజయ్‌కుమార్ మాట్లాడుతూ యువత గాంధీ మార్గంలో నడిచి బాపు కలలుగన్న శాంతియుత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యాత్రలో గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించాలని కోరు తూ వేలాదిమంది విద్యార్థులను కలిసి వివరించామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, భూదాన్ సుబ్బారావు, ప్రొఫెసర్ ప్రసాద్, సంపత్‌రెడ్డి, రవికుమార్, చిన్నాదేవి, గాలెన్న పాల్గొన్నారు. -
భూగర్భజల స్థాయిని పెంపొందిద్దాం
నారాయణపేట: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి, భూగర్భజల స్థాయిని పెంపొందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సేకరణ, నీటి సంరక్షణ పద్ధతులపై సోమవారం భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో భూగర్భజలాల లభ్యత, వినియోగం, వర్గీకరణ, జల్ సంచయ్ జన్ భగీదారి ప్రోగ్రాం లక్ష్యాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ నిర్మాణాలు, వాటి నిర్వహణ తదితర అంశాలపై ప్రదర్శించిన పోస్టర్లను తిలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి సంరక్షణను ప్రోత్సహించడంతో వాతావరణ స్థితిస్థాపకత మెరుగు పడుతుందన్నారు. జల్‌శక్తి అభియాన్ కింద జల్ సంచయ్ జన్ భగీదారి ద్వారా సహజ వనరు అయిన భూగర్భజలాలను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం భూగర్భజల అధికారి రమాదేవి మాట్లాడుతూ.. వ్యవసాయానికి భూగర్భజల వనరులపై ప్రధానంగా ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. నీటిని సృష్టించలేమని.. సంరక్షణే సాధ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వెలికితీయడం కాకుండా వాన నీటిని సాధ్యమైనంత ఎక్కువగా ఇంకింపచేసే విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సేకరణ, సంరక్షణ పద్ధతులను తెలియజేశారు. అనంతరం అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్స్, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ టెక్నికల్ అసిస్టెంట్లకు జలసంరక్షణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, జియాలజిస్ట్‌లు నరేష్, లావణ్య, దీరజ్ కుమార్, చైతన్య, జయమ్మ పాల్గొన్నారు. విద్యార్థుల మేధాశక్తిని పెంచాలి.. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం, మేధాశక్తిని పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టరేట్లో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతినెలా నిర్వహించే విద్యాశాఖ సమావేశానికి సంబంధించిన పూర్తి నివేదికలను సి ద్ధం చేసుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి, వారి సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠ శాలల తనిఖీలు తక్కువ ఉండటం, రిపోర్టు సమర్పించక పోవడానికి గల కారణాలను తెలుసుకు న్నారు. సమావేశంలో డీఈఓ అబ్దుల్ ఘని, సెక్టోర ల్ అధికారులు శ్రీనివాస్, విద్యాసాగర్ ఉన్నారు. ప్రజావాణికి 10 ఫిర్యాదులు.. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 10 ఫిర్యాదులు అందాయి. ప్రజల సమస్యలను కలెక్టర్ నేరుగా తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ బేంషలం, ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఏఓ జయసుధ పాల్గొన్నారు. నీటి సంరక్షణతో వాతావరణ స్థితిస్థాపకత మెరుగు కలెక్టర్ సిక్తా పట్నాయక్