Annamayya District News
-
పోలీస్ శాఖలో ఎస్బీ కీలకం
రాయచోటి : పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) విభాగం కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. మంగళవారం రాయచోటిలోని జిల్లా పోలీసు సమావేశ మందిరంలో జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కచ్చితమైన సమాచారం వచ్చేలా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. ఇంకా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు పి.రాజ, రమేష్, ఏ సత్యనారాయణ, కె. రాజారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ
మదనపల్లె : ఓ వ్యక్తిపై జరిగిన దాడి ఘటనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కాగా, మంగళవారం డీఎస్పీ దర్బార్ కొండయ్యనాయుడు క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. పట్టణంలోని ఎస్టేట్‌కు చెందిన జయభారత్పై ఈ నెల7న పట్టణానికి చెందిన రెడ్డిశేఖర్, మధుబాబు, మునీంద్రనాయక్లు బెంగళూరు రోడ్డులో దాడికి పాల్పడ్డారు. వీరి మధ్య ఓ భూమికి సంబంధించి క్రయ, విక్రయాల్లో భాగంగా జయభారత్ కొంత నగదు వీరికి బాకీ పడ్డాడు. నగదు సకాలంలో చెల్లించకపోవడంతో వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు ఈనెల 13న వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ శివకుమార్ దాడి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా డీఎస్పీ బెంగళూరు రోడ్డులో ఘటన జరిగిన ప్రాంతంలో చుట్టుపక్కల వారిని విచారణ చేశారు. కోడిపందెం ఆటగాళ్ల అరెస్ట్ మదనపల్లె : కోడి పందెం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. పట్టణంలోని వీవర్స్ కాలనీ వద్ద కోడి పందెం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,840, రెండు పందెంకోళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం సిద్దవటం : మండల పరిధి టక్కోలు గ్రామ సమీపంలోని పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను కడపకు తరలిస్తున్న 10 ట్రాక్టర్లను మంగళవారం స్వాధీనం చేసుకున్నామని ఇన్చార్జి తహసీల్దారు మాధవీలత తెలిపారు. ఆ ట్రాక్టర్లను స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించామని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి దుర్మరణం రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు– శెట్టిగుంట జాతీయ ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి దుర్మరణం చెందాడు. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో చదువుతున్న అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నల్లమల్ల తండాకు చెందిన మహేంద్ర నాయక్ (21) బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. మృతుడి తల్లిదండ్రులు తులసీధర్ నాయక్, తిరుపాల్ భాయీలకు విషయం తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాగ్వాదం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి, నగర అధ్యక్షుడు అఫ్జల్ఖాన్ మధ్య మంగళవారం వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసేందుకు అఫ్జల్ఖాన్ ఏర్పాట్లు చేశారు. అప్పటికే నగరంలోని అశోక్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కో–ఆర్డినేటర్ బండి జకరయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమాలు ముగించుకొని పార్టీ కార్యాలయానికి చేరుకోగానే.. నగర అధ్యక్షుడు కేక్ కట్ చేసేందుకు పిలిచారు. తనకు ముందస్తు సమాచారం లేకుండా.. ఎలా కేక్ కట్ చేస్తానంటూ విజయజ్యోతి మండి పడ్డారు. డీసీసీ అధ్యక్షురాలు మహిళ అని కూడా చూడకుండా, గౌరవంగా పిలవకపోవడం ఏమిటని వాగ్వాదానికి దిగారు. అక్కడ వివాదం నెలకొనడంతో ఆమె వెళ్లిపోయారు. ఈ విషయంపై డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ నగర అధ్యక్షుడు అఫ్జల్‌ఖాన్‌కు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో సంబంధం లేదని అన్నారు. తనకు సమాచారం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వస్తుందన్నారు. నగర అధ్యక్షుడి తీరుపై అధిష్టానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తనకు, పార్టీ కార్యాలయానికి సంబంధం ఉందో లేదో అధిష్టానం తేలుస్తుందని నగర అధ్యక్షుడు చెబుతున్నారు. షర్మిల జన్మదిన వేడుకల్లో డీసీసీ, నగర అధ్యక్షుల మధ్య వివాదం -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బి.కొత్తకోట : మండలంలోని గుమ్మసముద్రం పంచాయతీ గుడ్లవారిపల్లెకు చెందిన విజయనిర్మల (34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సీఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుడ్లవారిపల్లెకు చెందిన జనార్దన్ భార్య విజయనిర్మల సోమవారం రాత్రి ఇంటిలో నిద్రిస్తున్నారు. రాత్రివేళ నిద్రలేచి చూడగా.. అపస్మారక స్థితిలో ఉండటం గమనించి కుటుంబీకులు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బి.కొత్తకోట సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు విజయనిర్మల అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో విజయనిర్మల తమ్ముడు హరీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యనా, ఆత్మహత్యనా తేల్చేందుకు వారు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు రైల్వేకోడూరు అర్బన్ : బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ ప్రొహిబిషన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎం.రవి హెచ్చరించారు. స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో సీఐ తులసీ, సిబ్బందితో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వేకోడూరు పరిధిలో బెల్టు షాపులు నిర్వహిస్తే ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మొదటిసారి దొరికితే కఠిన చర్యలు, రెండోసారి దొరికితే నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేసి భారీ జరినామాలు విధించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జహీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. -
హత్యా.. ఆత్మహత్యా?
కొండాపురం : మండల పరిధి లావనూరు–చెన్నమనేనిపల్లె గ్రామాలకు వెళ్లే రోడ్డులోని ఓ కల్వర్టు వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హత్యా.. ఆత్మహత్యా.. అనే విషయం పోలీసులు తేల్చాల్సి ఉంది. స్థానికులు, బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు గ్రామానికి చెందిన చిన్నగుల్లి ఓబన్నగారి బాలయ్య పెద్దకుమారుడు చిన్నగుల్లి ఓబన్నగారి సురేష్(36) మంగవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆయనకు చిలమకూరు గ్రామానికి చెందిన వీరకుమారితో 10 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీర కుమారి ఆశా వర్కర్‌గా పని చేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం. సురేష్ ఆటో నడుపుకొంటూ ఎల్లనూరులోనే నివాసం ఉంటున్నారు. సురేష్, వీరకుమారికి మనస్పర్థలు ఉన్నాయి. ఏడాది నుంచి వారు దూరంగా ఉంటున్నారు. కొండాపురం ఎస్ఐ విద్యాసాగర్ సురేష్ మృతదేహం వద్దకు చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి -
రాత్రికి రాత్రే ఇసుక డంప్‌లు ఖాళీ
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ, మర్రిపాడు గ్రామాల పరిఽధిలో ఉన్న రామానాయిని చెరువు, హరిహరాదుల చెరువు పరిసరాల్లో ఉన్న ఇసుక డంప్‌లను రాత్రికి రాత్రే ఇసుకాసురులు ఖాళీ చేశారు. కాగా ఒక చోట సగం ఉన్న ఇసుక డంప్‌ను పోలీస్, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ‘సాక్షి’ల ప్రచురితమైన ‘పగలు తోడేస్తూ.. రాత్రిళ్లు తోలేస్తూ’ అనే కథనంపై అధికారులు స్పందించారు. మంగళవారం రామానాయిని చెరువు పరిసరాల్లోని రుద్రావాండ్లపల్లె, పిల్లగోవులవారిపల్లె, చెరువుమొరవపల్లె, రేగడపల్లె, కొత్తపల్లె గ్రామాల సమీప పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్‌లపై పోలీస్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఇసుకాసురులు రాత్రికి రాత్రే ఇసుక డంప్‌లను ఖాళీ చేసేశారు. ఆయా గ్రామాల పరిధిలో సుమారు పది చోట్ల ఉన్న ఇసుక డంప్‌లను వారు సోమవారం రాత్రే జేసీబీలతో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా బయట ప్రాంతాలకు తరలించేశారు. ఉదయం అధికారులు దాడులు నిర్వహించే సమాయానికే డంప్‌లు ఖాళీ చేసేశారు. మంగళవారం ఉదయం హెడ్‌కానిస్టేబుల్ రమణ, వీఆర్వో నారాయణ తమ సిబ్బందితో కలసి డంప్‌లపై దాడులు నిర్వహించారు. పలుచోట్ల అప్పటికే ఖాళీ చేసిన ఇసుక డంప్‌లను గుర్తించారు. రుద్రావాండ్లపల్లెలో మాత్రం సగం ఖాళీ చేసిన ఇసుక డంప్‌ను గుర్తించి అందులోని నాలుగు ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు సదరు ఇసుకను ఎవరూ కూడా వినియోగించకూడదంటూ తహసీల్దార్ శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు. ఒక డంప్‌ను సీజ్ చేసిన అధికారులు -
‘ఏపీపీఎస్సీ’ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి యం.విశ్వేశ్వర నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ చాంబర్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలపై డీఆర్వో ఏపీపీఎస్సీ పరీక్షల జిల్లా ప్రత్యేక అధికారులైన పర్యవేక్షకులు జి.అశోక్ (అసిస్టెంట్ సెక్రటరీ, మానిటర్), యస్.కె. కాశింవల్లి (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్)తో కలిసి పరీక్షల విధులు కేటాయించిన లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పరీక్షలు ఈ నెల 18 నుంచి 23 వరకు రెండు సెషన్లలో ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా, ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా జరిగేలా చూడాలని సూచించారు. పోలీసు శాఖ ప్రతి సెంటర్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అభ్యర్థులు, వారి వెంట వచ్చే వారికి ఎలాంటి కొరత లేకుండా ఆయా పరీక్ష కేంద్రాల యాజమాన్యాలు అన్ని వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని కడప నగర పరిధిలో 1, చింతకొమ్మదిన్నె మండలంలో 3, ప్రొద్దుటూరు మండల పరిధిలో 1 పరీక్షా కేంద్రలతో కలిపి మొత్తం 5 కేంద్రాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు, లైజెన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
సురక్షిత విధానాలతో ప్రమాదాల నివారణ
కడప కార్పొరేషన్ : విద్యుత్ ప్రమాదాల నివారణకు సురక్షిత విధానాలు అనుసరించాలని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్.రమణ అన్నారు. భారత ప్రభుత్వ అధికార మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు ‘కార్యాచరణ భద్రత, విపత్తు నిర్వహణ’పై విద్యుత్ సిబ్బందికి రెండు రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. మంగళవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఎదుర్కోవడానికి తక్షణమే స్పందించి చర్యలు తీసుకునేలా సిబ్బంది సామర్థ్యాలను పెంపొందించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యుత్ భద్రత విధానాలు, ప్రమాద నివారణ పద్ధతులు, అగ్ని ప్రమాదాలపై లోతైన అవగాహన అవసరమని పేర్కొన్నారు. అధిక శాతం ప్రమాదాలు విపత్తుల వల్ల సంభవిస్తున్నాయని, బాధితులకు సాయం చేయడానికి ప్రథమ చికిత్స పద్ధతులు తెలుసుకోవాలన్నారు. వరదలు, తుపానులు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సంసిద్ధత గురించి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ దుర్గాప్రసాద్, యన్పీటీఐ డైరెక్టర్ కె.ముత్తుకుమార్, డీఈఈ క్రిష్ణదేవ, సిబ్బంది పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సిద్దవటం: సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజంపేట ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి విమర్శించారు. సిద్దవటం మండంలోని టక్కోలు పంచాయతీ డేనగవాండ్లపల్లి గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారన్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం అంటూ తల్లికి పంగనామాలు పెట్టారన్నారు. ప్రజలపై మరింత భారాన్ని మోపుతూ విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట వైఎస్సార్సీపీ నాయకుడు సౌమిత్రి, సిద్దవటం మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నారపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, మండల పార్టీ అధికార ప్రతినిధి ఉపాసి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెలరేగిన చైన్‌స్నాచర్స్
రాజంపేట : రాజంపేటలో చైన్‌స్నాచర్స్ చెలరేగిపోయారు. పట్టణంలోని పలు దారుల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలనే టార్గెట్ చేసుకున్నారు. మంగళవారం ఆర్ఎస్ రోడ్డులోని ఓ ప్రైవేట్చిట్స్ కంపెనీలో పని చేస్తున్న మహిళ నూనివారిపల్లె నుంచి తన కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా.. రాఘవేంద్రస్టోర్ వద్దకు రాగానే గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె గొలుసును గట్టిగా పట్టుకున్నారు. తెగి మెడకు గాయమైంది. దీంతో ఆ ప్రాంత మహిళలు చైన్‌స్నాచర్స్ గతంలో ఓమారు రెచ్చిపోయిన సంఘటనలు గుర్తుచేసుకున్నారు. పట్టణపగలే రోడ్డపై మహిళలు తిరగలేని పరిస్ధితులు నెలకొన్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. అలాగే బోయనపల్లె (రాజంపేట రూరల్ ఏరియా)లో కూడా చైన్స్నానర్స్ హల్చల్ చేశారు. పలువురు మహిళల గొలుసులు అపహరించేందుకు యత్నం చేశారు. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నిం చేయడంతో వారు పరారయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. నిర్మానుష్య ప్రాంతాలపై దృష్టి పట్టణంలో రద్దీగా లేకుండా ఉండి, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలపై చైన్‌స్నాచర్స్ దృష్టి పెడుతున్నారు. ఆ ప్రాంతంలో ఒంటరిగా వెళ్లే మహిళలను కొంత దూరం అనుసరించడం, అదనుచూసి బంగారు గొలుసులు లాక్కేళ్లడం జరుగుతోంది. గతంలో నూనివారిపల్లె, ఆర్ఎస్ఎస్రోడ్డుతోపాటు మహిళలు అధికంగా వచ్చే మార్కెట్ ఏరియా, బంగారు దుకాణాలు ఉండే బండ్రాళ్ల వీధి తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తుంటారు. మహిళలు అప్రమత్తంగా ఉండకపోతే.. మెడలోని బంగారుగొలుసులు కోల్పోవాల్సి వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఒకే రోజు రెండు చోట్ల యత్నం స్థానికులు అడ్డుకోవడంతో విఫలం -
గురుకుల ఉపాధ్యాయుల నిరాహార దీక్ష
రాయచోటి అర్బన్ : గిరిజన గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆ ఉపాధ్యాయుల అసోసియేషన్ నేతలు శ్రీనివాసులునాయక్, మహాదేవ్, సరోజ, హరిత మంగళవారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కాంట్రాక్టు టీచర్స్‌గా మార్పు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. వారి దీక్షలకు అంగన్వాడీ కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, కార్యదర్శి భాగ్యలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు సిద్దమ్మ, అరుణ, సునీత, రమీజా, సురేఖతోపాటు ఉపాధ్యాయులు విజయకుమారి, స్వర్ణ, లక్ష్మిదేవి, రెడ్డెమ్మ, ప్రదీప్, సౌజన్య, కాదంబరి, గీత, సుధాకర్, సమిత, ప్రకాష్, వనిత, త్రివేణి, కల్పన, సుభాషిణి, సుజాత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం లెక్కింపు
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం హుండీ ఆదాయం మంగళవారం టీటీడీ అధికారులు లెక్కించారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యేసరికి స్వామివారి హుండీ ఆదాయం 7 లక్షల, 7 వేల, 990 రూపాయలు వచ్చినట్లు ఆలయ టీటీడీ అధికారులు వెల్లడించారు. 18 నుంచి డిపార్టుమెంట్ పరీక్షలు రాయచోటి: ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న డిపార్టుమెంట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పరీక్షలకు అన్నమయ్య జిల్లా డీఆర్ఓ కె.మధుసూదన్ రావు పర్యవేక్షణ అధికారిగా కొనసాగనున్నారు. జిల్లాలోని అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజులపాటు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని డిపార్టుమెంట్లకు సంబంధించిన 1800 మంది ప్రభుత్వ ఉద్యోగులు పరీక్షలకు హాజరు కానున్నారు. పదో తరగతి విద్యార్థుల వివరాల సవరణకు అవకాశం రాయచోటి: పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ తదితర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే వాటిని సరిచేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం సూచించారు. మంగళవారం రాయచోటిలో పత్రికలకు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 2025 మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి గతంలో ఆన్లైన్లో వివరాలు తప్పుగా నమోదు చేసినట్లయితే పాఠశాల రికార్డులను అనుసరించి మార్పు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఈ అవకాశం ఉందన్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు గద్దల పవన్ రాజంపేట రూరల్: దేశ రాజధాని దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు తమ కళాశాలకు చెందిన డిగ్రీ చివరి సంవత్సరం బీకామ్ విద్యార్థి గద్దల పవన్ ఎంపికయ్యాడని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.పురుషోత్తమ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఎన్సీసీ ట్రైనింగ్ క్యాంప్‌లో ప్రస్తుతం పవన్ ఉన్నట్లు తెలిపారు. జనవరి 26వ తేదీ నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పాల్గొంటాడన్నారు. యాదవ ఎంప్లాయిస్ సొసైటీలో స్థానం రాయచోటి (జగదాంబసెంటర్): యాదవ్ ఎంప్లాయిస్ సొసైటీ (వైఈఎస్) రాష్ట్ర కార్యవర్గంలో అన్నమయ్య జిల్లా వాసులకు స్థానం లభించింది. గుంటూరులో ఆదివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో వైఈఎస్ రాష్ట్ర అదనపు కార్యదర్శిగా కుమార్‌యాదవ్(మదనపల్లి), ఉపాధ్యక్షుడిగా పుల్లయ్యయాదవ్(రాజంపేట), సంయుక్త కార్యదర్శిగా సంక రవికుమార్‌యాదవ్(రాయచోటి)లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేంద్రబాబు, వెంకటయ్య, ట్రెజరర్ దూల్లవారిపల్లె శ్రీనివాస్‌యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రఘుయాదవ్ తదితరులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. కరుణామయుడు ఏసుప్రభువు రాజంపేట: కరుణామయుడు, దయామయుడుగా ఏసుప్రభువు ఆరాధనలు అందుకుంటున్నాడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని జానీబాషాపురం డీసీఎంఎస్ మాజీ ౖచైర్మన్ దండు గోపి స్వగృహంలో మంగళవారం రాత్రి సపోస్ క్రిస్మస్ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు వాక్యాలు మనిషిని మంచిమార్గంలో నడిపించేందుకు దోహదపడతాయన్నారు. క్రైస్తవులకు ముందస్తుగా క్రిస్మిస్ శుభాకాంక్షలను తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్రైస్తవులంతా ఆశీర్వదించాలన్నారు. అనంతరం కేక్‌ను కట్ చేశారు. కాకతీయ విద్యాసంస్థల అధినేత పోలా రమణారెడ్డి, ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత దండుమణి, వైఎస్సార్సీపీ నేతలు పాపినేని విశ్వనాథరెడ్డి, జీవీ సుబ్బరాజు, నవీన్, మౌలా, జాకీర్, కళ్యాణరెడ్డి పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని వీఆర్ఓకు గాయాలు
మదనపల్లె : ట్రాక్టర్ ఢీకొని వీఆర్ఓ గాయపడిన సంఘటన మంగళవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. నిమ్మనపల్లె మండలం దిగువమాచిరెడ్డిగారిపల్లెకు చెందిన రాజగోపాల్(53) కురబలకోట మండలంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం విధులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా, నిమ్మనపల్లె–మదనపల్లె మార్గంలోని వశిష్ట స్కూల్ వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో రాజగోపాల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఎడమ కాలు విరిగింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. విద్యుత్ స్తంభం ఏర్పాటు బి.కొత్తకోట : స్థానిక బలిజవీధిలో విద్యుత్ స్తంభం కూలిపోతుంటే తాడుతో నిలిపారు. దీనిపై ‘విద్యుత్ స్తంభాన్ని తాడుతో నిలిపారు’ అనే శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. డిస్కం అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. డిస్కం ఏఈ గిరిబాబు, లైన్‌మ్యాన్ లక్ష్మినారాయణ, సిబ్బంది పాత విద్యుత్ స్తంభాన్ని తొలగించి కొత్త దాన్ని ఏర్పాటు చేయించారు. అలాగే ఇంతకు మునుపు విద్యుత్ తీగలు కిందకు వాలిపోయేవి. ఇప్పుడా పరిస్థితి లేకుండా తీగలు ఎత్తులో ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారమైంది. -
వైవీయూలో అకడమిక్ ఆడిట్
వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధుల బృందం సందర్శించింది. తొలుత ప్రతినిధుల బృందం హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సీఈఓ ఆలపాటి శివయ్య, ఆడిటర్ టి.సుమాదేవి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య కె. కృష్ణారెడ్డిని కలిశారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి, ఐక్యూఏసీ సంచాలకులు డా. ఎల్. సుబ్రహ్మణ్యం శర్మ, డిప్యూటీ డైరక్టర్ ఎం. సుభోష్ చంద్ర, గ్రీన్ అండ్ ఎనర్జీ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని హ్యుమానిటీస్ బ్లాక్, సైన్స్ బ్లాక్, గురుకులం భవనాలలోని డిపార్ట్మెంట్లను పరిశీలించారు. శాఖలలో జరుగుతున్న ప్రగతిని ప్రత్యక్షంగా గమనించారు. పరీక్షల నిర్వహ ణ, విద్యార్థుల ప్రయోజనార్థం పనిచేస్తున్న పలు విభాగాలు వాటి పనితీరును మదింపు చేశారు. బుధవారం కూడా విశ్వవిద్యాలయంలో పరిశీలన ఉంటుందని ఐక్యూఏసీ సంచాలకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి మాట్లాడుతూ హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రతిష్టాత్మక మైందని, అత్యున్నతస్థాయి విశ్వవిద్యాలయానికి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
డీఈఓ వెబ్సైట్లో సీనియారిటీ జాబితా
కడప ఎడ్యుకేషన్: ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు, పొద్దుటూరు మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎస్జీటీ, తత్సమాన కేటగిరీ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతలకు సంబంధించిన తాత్కాలిక సీనియారిటీ జాబితాను www.kadapadeo.in వెబ్‌సైట్‌నందు పొందుపరిచామని డీఈఓ మీనాక్షి తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటు 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తగిన ఆధారాలు, సర్వీసు రిజిస్టర్‌తో స్వయంగా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని ఆమె తెలిపారు. రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం ● మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సంబేపల్లె: మండల పరిధిలోని గుట్టపల్లె, శెట్టిపల్లె గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రాష్ట్ర మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ భూమి – మీ హక్కు రెవెన్యూ సదస్సులు ఈ నెల 6నుంచి జనవరి 8వరకు నిర్వహిస్తామన్నారు. గ్రామాలలో నెలకొన్న భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అనంతరం భూ సమస్యలపై వచ్చిన అర్జీలను మంత్రి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ నరసారెడ్డి, రవీంద్రారెడ్డి, ప్రభాకర్‌నాయుడు పాల్గొన్నారు. -
పెన్షనర్ల ఆశాజ్యోతి ‘నకారా’
కడప ఎడ్యుకేషన్ : పెన్షనర్ల పాలిట ఆశాజ్యోతి నకారా గారి అవిరళ అని కడప జిల్లా ట్రెజరీ అధికారి వెంకటేశ్వరావు అన్నారు. మంగళవారం కడప జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని పాత రిమ్స్‌లోని బీసీ భవన్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నకారా కృషి ఫలితమే నేడు విశ్రాంత ఉద్యోగులు పొందుతున్న పింఛన్ విధానమన్నారు. ఆయనను ప్రతి ఒక్క పెన్షనర్ గుర్తుంచుకోవాలన్నారు. ఉప ఖజానా అధికారి రవికుమార్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు జాతి నిర్మాణ సారధులని, వారి అనుభవం అపారమైనదని అన్నారు. వారి సూచనలు ఆచరిస్తే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో రాణిస్తుందన్నారు. కడప జిల్లాలోని పెన్షనర్స్‌కు ఎలాంటి సమస్యలు లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహ, వికలాంగుల, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ కడప పెన్షనర్స్ అసోసియేషన్ చేస్తున్న కృషి అమోఘమన్నారు. వారి న్యాయమైన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. జిల్లా ఎన్జీఓల సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు, పెన్షనర్స్ సంఘ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ 1982 డిసెంబర్ 17న జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు వల్ల నేడు విశ్రాంత ఉద్యోగులు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రామమూర్తి నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాల ఎల్లారెడ్డి జాతీయ పెన్షనర్ల దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. 30 ఏళ్లుగా సంఘ అభివృద్ధి, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమునిరెడ్డి, రాధాకృష్ణ, నగేష్, నారాయణ తెలిపారు. అనంతరం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న 46 మంది పెన్షనర్స్ ను సన్మానించారు. అనంతరం ముద్ర డ్యాన్స్ స్కూల్ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు గానుగపెంట హనుమంతరావు, యోగా మాస్టర్ చలపతి గౌడ్, నారాయణ, సుబ్బారెడ్డి, నాగయ్య, మల్లయ్య, దేవరాజ్, సుభాన్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మస్తాన్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మరో రెండు ప్రత్యేక రైళ్లు
కడప కోటిరెడ్డిసర్కిల్: అయ్యప్ప భక్తుల కోసం మరో రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్నట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు. విజయవాడ– కొల్లంల మధ్య డిసెంబర్ నెలంతా ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. 07177 నెంబర్ గల రైలు డిసెంబర్ 21, 28 తేదీల్లో శనివారం రాత్రి 10.15 గంటలకు విజయవాడలో బయలుదేరి కడపకు మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు చేరుకుని సోమవారం ఉదయం 6.20 గంటలకు కొల్లాంకు చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో (రైలు నెంబర్ 07178) డిసెంబర్ 23, 30 తేదీల్లో సోమవారం ఉదయం 10.45 గంటలకు బయలుదేరి కడపకు మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు చేరుకుని కాకినాడకు ఆరోజు రాత్రి 9 గంటలకు రైలు చేరుతుందన్నారు. అలాగే మరో రైలు నరసాపూర్ –కొల్లంల మధ్య నడుస్తుందన్నారు. -
రైల్వే అధికారులు.. నీళ్లు నములుతున్నారు!
రాజంపేట: గుత్తి–రేణిగుంట రైలుమార్గంలోని వివిధ రైళ్లకు నందలూరు స్టేషన్లో నీటి సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదన పట్టాలెక్కలేదు. రైళ్లకు నందలూరులో నీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన పనులకు రూ.34లక్షలకుపైగా వ్యయం అవుతుందని అంచనాలను రూపొందించినట్లు రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో అప్పట్లో ఈ ప్రతిపాదనను రైల్వే శాఖ అటకెక్కించింది. కరోనా మహమ్మారి ప్రభావం ముగిసి ఐదేళ్లయినా ఈ ప్రతిపాదనను అమలు చేయాలన్న దిశగా రైల్వే ఉన్నతాధికారులు ఆలోచించడం లేదు. అక్టోబరు 4న విజయవాడలో జరిగిన రైల్వే అధికారుల సమావేశంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిలు నందలూరురైల్వేకు పూర్వవైభవం కల్పించే అంశాలను ప్రస్తావించారు. నందలూరు నీళ్ల ప్రాముఖ్యత.. దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్లు డివిజన్లో నందలూరు నీళ్లకున్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఇటీవల ఇదే అంశంపై దిల్లీలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్‌ను నందలూరు ఐకేపీఎస్ నేతలు కలిసిన సందర్భంలో ఆయన కూడా నందలూరు నీళ్ల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. నందలూరు నీటితోనే రైల్వే పుట్టుక ఆరంభమైంది. 1864లో బ్రిటీషర్లు నందలూరులో నీటి లభ్యతను ఆధారం చేసుకొని స్టీమ్ ఇంజిన్ లోకోషెడ్ నిర్మించారు. ఈ నీటి వల్ల నీటి ఆవిరికి సంబంధించిన పింగాణి తుప్పు పట్టకుండా ఉంటుందని అప్పట్లోనే బ్రిటీషు రైల్వే పాలకులు నీటి నాణ్యతపై పరిశోధనలు చేశారు. రైల్వేకేంద్రానికి అవసరమైన నీటి కోసం యేటి నొడ్డున బావిని తవ్వించారు. నీటి కోసం ‘తిరుమల’ పరుగులు.. విశాఖ –తిరుపతి మధ్య నడిచే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నీటి కోసం కడప నుంచి కొండాపురం వరకు పరుగులు తీయకతప్పడంలేదు. ఫలితంగా రైల్వే వ్యయం వృథా అవుతోంది. అనవసర ఖర్చులు, భారం రైల్వేపై పడుతోందని రైల్వే వర్గాలు అంటున్నాయి. కేవలం రైల్వే అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల పరోక్షంగా నష్టం కలుగుతోందన్న విమర్శలు రైల్వేవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ మార్గంలో నడిచే రైళ్లకు నీళ్లు పట్టుకునేందుకు నందలూరు అనుకూలమని ఇప్పటి డివిజన్ ఉన్నతాధికారులకు తెలుసు. కడప నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు వాటరింగ్, క్లీనింగ్ పెట్టుకోకుండా కడప నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని కొండాపురం తీసుకెళ్లి, మళ్లీ కడపకు తీసుకొచ్చి నడిపించడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. రేణిగుంట, తిరుపతి రైల్వేస్టేషన్లపై భారం తగ్గుతుంది.. ఇటీవల ముంబయి–చైన్నె మధ్య నడిచే రైళ్లలో లెట్రిన్‌లో, వాష్బేసిన్లో నీళ్లు రావడంలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని రైళ్లలో దాదాపుగా ఉంది. నందలూరులో వాటరింగ్ ఏర్పాటుతో రేణిగుంట, తిరుపతి రైల్వేస్టేషన్లలో కొన్ని రైళ్లకై నా భారం తగ్గుతుంది. ఫలితంగా లైన్ల రద్దీ తగ్గుతుంది. గుత్తి–రేణిగుంట మార్గంలో నడిచే రైళ్లన్నింటికి నందలూరులో నీటిని నింపుకునేందుకు పుష్కలంగా వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు రైల్వేశాఖకు మంచి అవకాశం ఉంది. వాటరింగ్‌కు అనుకూలంగా నందలూరులో ఏడులైన్లు ఉన్నాయి. నందలూరు నుంచే వాటర్ ట్యాంకర్ రైళ్లు నడిచాయి.. స్టీమ్ ఇంజిన్ లోకోషెడ్ కొనసాగిన సమయంలో నందలూరు నుంచే వాటర్ ట్యాంకర్ రైళ్లు నడిచాయి. గుంతకల్ డివిజన్ ఉన్నతాధికారులు ప్యాసింజర్ రైళ్ల బ్రేక్‌లలో నీటి క్యాన్లతో సరఫరా జరిగేది. 1977లో గుంతకల్లు డివిజన్ సదరన్ రైల్వే నుంచి విడిపోయి దక్షిణ మధ్య రైల్వేలో విలీనం అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఉద్యోగులు ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారంటే నీళ్లే కారణంగా చెబుతున్నారు. రైళ్లకు నందలూరులో నీటి సౌకర్యం కల్పించే ప్రతిపాదన పెండింగ్‌లోనే.. అప్పట్లో రూ.34 లక్షలకుపైగా వ్యయంతో అంచనాలు నందలూరు నీళ్ల ప్రాముఖ్యతను విస్మరిస్తున్న రైల్వే శాఖ రైల్వే అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు రైళ్లలో నీటి సమస్య తీరుతుంది ఇప్పుడు ఈ మార్గంలో నడిచే ఏ రైలులో అయినా నీటి సమస్య తీవ్రంగా ఉంది. నందలూరు రైల్వే కేంద్రంలో వాటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే రైళ్లలో నీటి సమస్య తీరుతుంది. అంతేగాకుండా రేణిగుంటలో రైళ్లకు నీళ్లు పట్టాల్సిన అవసరం ఉండదు. కొన్ని రైళ్లకు నందలూరులో నీటిని నింపుకోవచ్చు. –ఫైజుల్లాఖాన్ లోడి, లోక్ అదాలత్ సభ్యుడునందలూరు నీళ్లకున్నప్రాముఖ్యతను రైల్వే గుర్తించాలి నందలూరు నీళ్లకున్న ప్రాముఖ్యతను రైల్వే యాజమాన్యం ఇప్పటికై నా గుర్తించాలి. నందలూరు నీళ్లు ఒక్కసారి తాగితే ఈ ప్రాంతాన్ని మరువలేరు. రైళ్లలో ప్రయాణించేవారు నందలూరు వస్తుందంటే నీళ్లు పట్టుకోవాలనే వారు. అది నందలూరు నీళ్లకున్న గుర్తింపు. – గానుగపెంట హనుమంతరావు, సాహితీవేత్త -
గుట్టకాయ స్వాహా!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవు అక్రమార్కుల భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. మదనపల్లె పట్టణ శివారు ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలపై కన్నేసి అందినకాడికి దండుకుంటున్నారు. యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగుతున్నా నియంత్రించాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అధికారుల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మదనపల్లె: పట్టణానికి ఆనుకుని ఉన్న బీకే.పల్లె పంచాయతీలో కబ్జాల పర్వం జోరుగా కొనసాగుతోంది. కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు ఆక్రమించుకుని, అనధికార విక్రయాలు చేసేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. మంగళవారం బీకే.పల్లె పంచాయతీలో రెవెన్యూ అధికారుల సమక్షంలో రెవెన్యూ సదస్సు జరుగుతుంటే, మరోవైపు భూ బకాసురులు సచివాలయానికి ఆనుకుని గుట్టలను యథేచ్ఛగా జేసీబీలతో చదునుచేస్తూ ఆక్రమణలకు పాల్పడ్డారు. దీనిపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో, ఆక్రమణలకు అధికారులే అండదండలు అందిస్తున్నట్లు స్థానికులు వాపోయారు.● బీకే.పల్లె పంచాయతీ అనంతపురం–కృష్ణగిరి జాతీయ రహదారికి ఆనుకుని గుట్ట ప్రాంతాల్లో ఉండటం అక్రమార్కులకు బాగా కలిసివచ్చింది. 2005–06లో సర్వే నంబర్.548, 440 పార్ట్‌లో 291 ప్లాట్లను ఇందిరమ్మ కాలనీకి కేటాయిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేఅవుట్ వేశారు. ఈ సర్వే నంబర్లకు ఆనుకుని పది ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. అప్పట్లో ఊరికి ఈ స్థలం కొంత దూరంగా ఉండటంతో చాలామంది పట్టాలు తీసుకున్నప్పటికీ ఇళ్లు నిర్మించుకోలేదు. కొందరు పునాదులు వేసుకుని ఆపేస్తే, మరికొందరు అలాగే వదిలేశారు. పట్టణ జనాభా రోజురోజుకీ విస్తరిస్తుండటం, భూముల విలువలు అమాంతం ఆకాశానికి చేరడంతో మధ్యతరగతి ప్రజల దృష్టి శివారు ప్రాంతాల భూములపై పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు బీకే.పల్లె పంచాయతీలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి, వాటికి దొంగ పట్టాలు సృష్టించి తమ ఆధీనంలో ఉన్నాయని అమాయకులను నమ్మించడం మొదలుపెట్టారు.నీరుగట్టువారిపల్లెలో చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందడంతో అనంతపురం, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల నుంచి పలువురు బతుకుతెరువు కోసం మదనపల్లెకు వచ్చి, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపారు. బీకే.పల్లెలో గుంట స్థలం ఉన్న ప్లాట్లు రూ.4 నుంచి 6 లక్షలకు దళారులు విక్రయించారు. ఖాళీ స్థలాలన్నీ అమ్ముడైపోవడంతో దళారుల కన్ను గుట్టలపై పడింది. రెవెన్యూ అధికారుల సహకారంతో గుట్టలను చదును చేస్తూ, ఏర్పడిన ఖాళీ స్థలాలకు అధికారుల ముందరే బేరం కుదుర్చుకుని, ఇళ్లు నిర్మించి, కరెంటు కనెక్షన్ వచ్చేంతవరకు తమదే బాధ్యత అన్నట్లుగా అన్నీ చూసుకుంటున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. బీకే.పల్లె పంచాయతీలో ప్రభుత్వ స్థలాల కబ్జాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఉక్కుపాదం మోపి అన్నింటినీ తీసివేయించారు. అనర్హులను ఏరిపారేశారు. దీంతో దళారులు తోకముడిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి దళారులు విజృంభించడం మొదలుపెట్టారు. కోట్లు విలువైన ప్రభుత్వస్థలాలు కబ్జాలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
మదనపల్లె: మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఖాళీగా ఉన్న రేషన్‌షాపులకు డీలర్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు. సోమవారం సబ్ కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రేషన్ డీలర్ల భర్తీ ప్రక్రియకు సంబంధించిన రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ...మదనపల్లె డివిజన్లో 445 రేషన్‌షాపులు ఉన్నాయన్నారు. వీటిలో 74 షాపులు డీలర్లు లేక ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే...1,000 కార్డులకు పైబడి 1,500 కార్డుల వరకు కలిగి ఉన్న షాపులను విభజించేందుకు ప్రతిపాదనలు తయారుచేస్తే 45 షాపులు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతో మొత్తం 119 షాపులకు డీలర్ల నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. రెవెన్యూ డివిజన్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఖాళీలకు సంబంధించిన వివరాలు నోటీసుబోర్డులో ప్రదర్శిస్తామని తెలిపారు. రేషన్‌షాపులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండి 18–40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. ఖాళీగా ఉన్న రేషన్‌షాపు ఉన్నటువంటి వార్డులో కానీ, గ్రామంలో కానీ నివాసం ఉండాలన్నారు. డిసెంబర్ 21వతేదీ సాయంత్రం 5 గంటలలోపు పూర్తిచేసిన దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులకు డిసెంబర్ 28వతేదీ ఉదయం 10 గంటలకు 80 మార్కులకు రాతపరీక్ష ఉంటుందని, అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:15 నిష్పత్తిలో డిసెంబర్ 30, 31 తేదీల్లో 20 మార్కులకు వినియోగదారుల సంబంధాలు, నిర్వహణ సామర్థ్యము, ఆర్థిక స్తోమత తదితర అంశాలపై ఇంటర్వూలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. మదనపల్లె మండలం, అర్బన్ ఖాళీల వివరాలు అంకిశెట్టిపల్లె(ఓసీ–మహిళ), మందబండ(ఓసీ–మహిళ), వలసపల్లె(ఓసీ), కాకరకాయలపల్లె(ఓసీ), డ్రైవర్స్‌కాలనీ, పుంగనూరురోడ్డు, గంగమ్మగుడి(బీసీ–ఏ), పప్పిరెడ్డిగారిపల్లె(బీసీ–బీ మహిళ), సైదాపేట(ఓసీ), గుండ్లూరువీధి(ఓసీ), సిపాయివీధి(ఓసీ), గొల్లపల్లె క్రాస్(ఓసీ), ఇందిరానగర్(బీసీ–ఈ) సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ రాయచోటి: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు డీఆర్ఓ మధుసూదన్‌రావు, కలెక్టరేట్ ఎస్డీసీ రామసుబ్బయ్యలు పాల్గొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అర్జీదారుల నుంచి అందిన సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన అర్జీలోని అంశంపై దృష్టి పెట్టాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు రీ–ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు. అలాగే రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కోర్టు కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వ శాఖలలో కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్ ఫైల్ చేయాలని లేని పక్షంలో సంబంధిత అధికారులపై అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఇటీవల హైకోర్టు ఆదేశించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కోర్టు కేసులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కనీసం 15 రోజులు ముందుగానే కౌంటర్‌ను సిద్ధ చేయాలని, నిర్ణీత కాల వ్యవధిలో కౌంటర్ పైల్ చేయని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జిల్లా, మండలస్థాయి అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఏడుగురు కార్పొరేటర్లు సస్పెన్షన్
కడప కార్పొరేషన్: వైఎస్సార్‌జిల్లా కడప నగరపాలక సంస్థలో ఏడుగురు కార్పొరేటర్లు, నలుగురు పార్టీ నాయకులను సస్పెండ్ చేసినట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2వ డివిజన్ కార్పొరేటర్ ఎం.సుబ్బారెడ్డి, 3వ డివిజన్ కార్పొరేటర్ ఎం.మానస, 6వ డివిజన్ కార్పొరేటర్ నాగేంద్రప్రసాద్, 8వ డివిజన్ కార్పొరేటర్ ఎ.లక్ష్మీదేవి, 32వ డివిజన్ కార్పొరేటర్ ఎస్బీ జఫ్రుల్ల, 42వ డివిజన్ కార్పొరేటర్ సి.స్వప్న, 50 డివిజన్ కార్పొరేటర్ కె.అరుణ ప్రభ, పార్టీ నాయకులు ఎం.సుదర్శన్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, చల్లా రాజశేఖర్, కె.రాజ శేఖర్‌రెడ్డిలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆయా డివిజన్లకు కొత్త ఇన్చార్జిలను నియమిస్తామని వివరించారు. -
‘గుడ్ గవర్నెన్స్ వీక్’ను విజయవంతం చేయండి
కడప సెవెన్‌రోడ్స్: ‘ప్రశాసన్ గావోన్ కి ఓర్–2024’ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 24 వరకు జరిగే గుడ్ గవర్నెన్స్ వీక్ (జీజీడబ్ల్యూ) క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని డీఆర్వో విశ్వేశ్వర్ నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏర్పీజీ) కార్యాలయం నుంచి గుడ్ గవర్నెన్స్ వీక్ (జీజీడబ్ల్యూ) క్యాంపెయిన్ ప్రచార ప్రణాళికపై.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాల మేరకు స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి డీఆర్వోతోపాటు జిల్లా పరిషత్ సీఈవో ఓబులమ్మ, ఇన్చార్జి సీపీవో హజరతయ్య, డీఐఓ విజయ్‌కుమార్, డీఐపీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ‘ప్రశాసన్ గావోన్ కి ఓర్’ – 2024 కార్యక్రమం నిర్వహణకు జిల్లాలో విస్తృతమైన ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భారత ప్రభుత్వ పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి, పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని వివరించారు. డీఆర్వో విశ్వేశ్వర్ నాయుడు -
అక్రమ కట్టడాలను సహించేది లేదు
రాయచోటి అర్బన్ : రాయచోటి పట్టణంలో అక్రమ కట్టడాలను నిర్మిస్తే సహించేది లేదని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖమంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎగువ అబ్బవరం దళితవాడలో అక్రమకట్టడాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాయచోటిలో గతంలో భూ ఆక్రమణలు, అక్రమ కట్డడాలు అధికంగా జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వంలో పార్టీలకతీతంగా ఆక్రమణలను తొలగించి పేదలకు న్యాయం చేస్తామని చెప్పారు. కొంతమంది ప్రభుత్వానికి నష్టం కలిగించే విదంగా అప్రూవల్ లేకుండా ఆరు అంతస్తుల అపార్టుమెంట్లు కడుతున్నారన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం మంచిది కాదన్నారు. అనంతరం ఆయన నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లను మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించి తగు సూచనలు చేశారు.రాష్ట్ర మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి -
కోడిగుడ్డు అధరహో!
రాయచోటి: కోడిగుడ్డు ధరలు మాత్రం వేడి చేయకుండానే ఉడికిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.7.50లకు విక్రయిస్తున్నారు. కూరగాయలతో పాటు కోడ్డి గుడ్డు ధరలు కూడా కొండెక్కడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పెంపకం అధికం కావడంతో పాటు కోడిగుడ్ల రేటు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేది. అయితే పక్క రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వడంతో పౌల్ట్రీ ఫామ్స్ పెరిగిపోయాయి. ఫలితంగా ఏపీ నుంచి ఎగుమతులు తగ్గిపోయినట్లు సమాచారం. కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో చాలా చోట్ల మన రాష్ట్రంలో పౌల్ట్రీ ఫామ్స్ మూసివేశారు.ఫలితంగా కోడిగుడ్డు రేటు పెరిగిపోయింది. పెరిగిన భారం వినియోగదారుడి నెత్తినపడటంతో గుడ్డు రేటుకు రెక్కలు వచ్చాయి. ఉత్పత్తికి పెరిగిన ఖర్చు: ఒక గుడ్డు ఉత్పత్తికి పౌల్ట్రీలలోనే రూ.5 వరకు ఖర్చవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల నుంచి మన ప్రాంతాలకు గుడ్ల సరఫరా జరుగుతుంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి చేరుకొని వినియోగదారునికి అందడానికి రూ.7.50 పడుతోందని చెబుతున్నారు. ఆగస్టులో గుడ్డు రేటు రూ.5.70గా ఉంటే ప్రస్తుతం అది రూ.7.50కి చేరింది. ఈజీగా చేసుకోవడంతో పాటు బలవర్ధకమైన ఆహారం కావడంతో చాలా మంది గుడ్డుని ప్రిఫర్ చేస్తారు. బేకరీ ఫుడ్స్‌లో కూడా కోడిగుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దాంతో వాటి రేట్లు కూడా పెరిగిపోతున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. విద్యార్థులకు కష్టమే పెరిగిన ధరలతో విద్యార్థులకు గుడ్డు అందుతుందన్న ఆశలు కనిపించడం లేదు. అనుకూలమైన ధరలు ఉన్న సమయంలోనే గోళీల సైజులో ఉన్న గుడ్లనైనా అందించేవారు. నేడు పెరిగిన ధరల కారణంగా ఆ చిన్న గుడ్లు కూడా విద్యార్థులకు అందకుండా పోతున్నాయన్న భయం నెలకొంది.