Funday
-
Choreographer: సొనాలీ భదౌరియా
డాన్సర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్. సొనాలీ సొంతూరు పుణే. ఆమెకు చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే పిచ్చి. అది ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాక కూడా కంటిన్యూ అయింది. అందుకే తాను జాబ్ చేస్తున్న కంపెనీలోని డాన్స్ క్లబ్ ‘క్రేజీ లెగ్స్’లో జాయిన్ అయింది. ఎన్నో డాన్స్ పోటీల్లో పాల్గొంది. ఆ ఉత్సాహంతోనే "LiveToDance with Sonali’అనే యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసింది. అందులో తన డాన్స్ వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. ఆమె చానల్‌కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూట్యూబ్ సిల్వర్ బటన్నూ సాధించింది. వేలల్లో ఫాలోవర్స్‌తో సొనాలీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. -
ప్రకృతి సాగుతో ప్రపంచ దృష్టికి..
అది కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామం. ఒక మారుమూల పల్లె. అదిప్పుడు చరిత్రకెక్కుతోంది. పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకుని, ఈ ఊరు చేపట్టిన సేంద్రియ సాగు విధానాలు రైతు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. పాడిపంట అనే పదానికి అసలైన అర్థం చెబుతున్నారు ఇక్కడి రైతులు. రసాయనాల వల్ల కలుషితమవుతున్న సాగు నేలకు పునర్జీవం తీసుకొస్తున్నారు. ఆ ఊరి పురుషులు పొలాలను పర్యావరణహితంగా మారుస్తుంటే.. మహిళలు ఇంటి పరిసరాలను పచ్చదనంతో నింపి అటు ఆదాయానికి, ఇటు ఆరోగ్యానికి లోటు లేకుండా చేస్తున్నారు. దేశానికే ఇంకా చెప్పాలంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్వం ఈ గ్రామాన్ని దుర్గా ఊడ, దుర్గా వాహిని అనే పేర్లతో పిలిచేవారు. ప్రాచీన కవి పుల్ల కవి 15వ శతాబ్దంలో ఇక్కడ నివసించారన్న చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనకు సంబంధించిన స్మారక చిహ్నాలు, భవనాలు కనిపిస్తాయిక్కడ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పొట్టి మిర్చి విత్తన తయారీ నుంచి అంతా ఇక్కడే పండిస్తారు. ఈ ఊళ్లో 50 శాతానికి పైగా ప్రజలకు వ్యవసాయమే ఆధారం. రైతులు తాము వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. భారతీయ రైల్వే, సాఫ్ట్వేర్, బ్యాకింగ్, టీచింగ్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, చార్టర్డ్ అకౌటెంట్లు, ఇంజినీర్లు ఉన్నారు. అతి పురాతన ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు గ్రామ దేవత వేగుళ్లమ్మ ఆలయం, మసీదు, చర్చిలతో మతసామరస్యానికి పెట్టింది పేరుగా ఉంది ఈ ఊరు. కరోనా చూపించిన దారిదుర్గాడలో ఎటు చూసినా పచ్చని పొలాలే. ప్రతి ఇంటా గోవులు దర్శనమిస్తాయి. ధాన్యం నుంచి కూరగాయలు, పళ్లు అన్నీ తామే పండించుకుంటూ ఆదాయాన్నే కాదు ఆరోగ్యాన్నీ పెంచుకుంటున్నారు. ఇక్కడ నదులు, కాలువలు లేకపోవడంతో భూగర్భ జలాలు, వర్షాలపై ఆధారపడే సాగు సాగుతోంది. సన్నకారు రైతులే ఎక్కువ. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, మామిడికాయ పచ్చళ్లు, కూరగాయలు, మిర్చి వ్యాపారాలూ అధికమే! అయితే కరోనా ముందు వరకు ఇక్కడ రసాయన ఎరువులనే వాడేవారు. కరోనా వల్ల సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరగడం, ఆం్ర«ధప్రదేశ్లో అప్పుడున్న ప్రభుత్వమూ సేంద్రియ సాగుకు పెద్దపీట వేయడంతో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిందీ ఊరు. తొలుత ఒక ఇంట్లో మొదలైన ఈ ఉద్యమం అనతి కాలంలోనే పల్లె అంతా విస్తరించింది. సేంద్రియ ఎరువుల ద్రావణాల తయారీ ఇక్కడ ఓ కుటీరపరిశ్రమగా మారిపోయింది. ఏటీఎం విధానంలో సాగువ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న భరోసా లేదు. ప్రకృతి దయ.. రైతుల ప్రాప్తం అన్నట్టు ఉంటుంది. దుక్కి దున్నిన నాటి నుంచి పంట కోసి, ధాన్యాన్ని ఎండబెట్టి మార్కెట్‌కి తీసుకెళ్లే వరకు ఆదాయం ఉండదు. ఈలోపు ప్రకృతి కన్నెర్రజేస్తే అంతే సంగతులు. అందుకే వ్యవసాయం గాలిలో దీపం లాంటిది అంటారు. అలాకాకుండా నారు వేసిన పదిహేను రోజుల నుంచి రోజూ ఆదాయాన్ని పొందే మార్గాన్ని పట్టుకున్నారు దుర్గాడ రైతులు. దాన్నే ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ సాగు అంటున్నారు. ఇందులో ప్రకృతి వ్యవసాయ శాఖాధికారుల చేత శిక్షణ తీసుకున్నారు. కొంత నేలను సిద్ధం చేసుకుని అందులో ఒకేసారి.. కూరగాయలు, ఆకు కూరలు, దుంపలు.. పూలు ఇలా 30 రకాలను వేస్తారు. పదిహేను రోజుల తర్వాత నుంచి ఏదో ఒక కాయగూరో.. ఆకు కూరో.. దుంపలో.. పూలో.. కోతకు వచ్చేస్తాయి. దాంతో ప్రతిరోజూ వాటిని కోసి అమ్ముతూ ఆదాయాన్ని గడిస్తున్నారు. అలా ఏటీఎం సాగు పద్ధతిలో రోజూ ఆదాయాన్ని ఆర్జిస్తూ జనాలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. దీనికయ్యే పెట్టుబడి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే! దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ సాగు మీదే పెట్టుబడిగా పెడుతున్నారు చాలామంది రైతులు. కోసిన పంట స్థానంలో మళ్లీ విత్తనాలు వేస్తూ! ఇలా కాలంతో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి, నిత్యాదాయం.. వైవిధ్యమైన పంటలుగా సాగుతోంది ఏటీఎం పద్ధతి.చేపలతో చేలకు వైద్యం..వ్యర్థ పదార్థాలతో పంటకు బలాన్నిచ్చే రసాయనాలను తయారు చేయడంలో దుర్గాడ రైతులకు సాటి,పోటీ లేదు. మత్స్యకారులు పక్కన పడేసిన కుళ్లిపోయిన చేపలతో చేలకు చేవనిచ్చే మీనామృతాన్ని తయారు చేసుకుంటున్నారు ఇక్కడి రైతులు. పచ్చి చేపలు, పాత బెల్లంతో తయారు చేసే ఈ మీనామృతం కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. దీనిని మొక్కల ఎదుగుదలకు, పూత, పిందె బలంగా మారడానికి వాడుతున్నారు. ఎకరానికి ఒక లీటరు సరిపోతుంది. దీన్ని తయారీదారులు లీటరు రూ.120 ధరకు విక్రయిస్తున్నారు. పురుగులు, తెగుళ్లపై యుద్ధంపంటలపై దాడి చేసే పురుగులు, తెగుళ్లపై నీమాస్త్రం, బ్రహ్మాస్త్రాలతో ఇక్కడి రైతులు యుద్ధం చేస్తున్నారు. ఆ అస్త్రాలన్నీ ఆకులు అలములే! నీమాస్త్రంతో చిన్న చిన్న పురుగులు చనిపోతే, బ్రహ్మాస్త్రంతో ఎంతటి తెగులైనా, పురుగైనా పరారవుతుంది. అంతేకాదు ఉల్లి, మిరప, మజ్జిగ, బెల్లం, గోమూత్రం వంటి వాటితో కషాయాలనూ తయారుచేస్తూ పలు ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. ఇలా పర్యావరణహితమైన ప్రయోగాలు, ప్రయత్నాలతో నిరంతర ఆదాయాన్ని గడిస్తూ ప్రకృతి సాగులో ప్రపంచానికి స్ఫూర్తి పంచుతోందీ గ్రామం. వ్యవసాయ పాఠశాలగా దుర్గాడ గ్రామం ప్రకృతి సాగుకు పాఠశాలగా మారింది. వ్యవసాయ శాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రకృతి సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులను బ్యాచులుగా విభజించి.. వ్యవసాయ క్షేత్రాలు, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాల్లోని రైతులతో వారికి ప్రకృతి సాగులో శిక్షణనిప్పిస్తున్నారు.గోమయంతో ప్రమిదల తయారీ..గోమూత్రంతో కషాయాలు, గోమయంతో ఘన జీవామృతంలాంటి ఔషధాలు తయారు చేస్తున్న దుర్గాడ రైతులు దేశీ ఆవుపేడతో ప్రమిదలు ధూప్‌స్టిక్స్ వంటివీ తయారుచేసి విక్రయిస్తున్నారు. ఈ ప్రమిదలలో ఆవునేతితో దీపం వెలిగిస్తే పరిసరాల్లో క్రిమి కీటకాలు నశిస్తాయి. స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉందంటున్నారు.తయారవుతున్న సేంద్రియ ఎరువులుబీజామృతం, జీవామృతం, మీనామృతం, దశపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, పంచగవ్య, చిల్లి స్పెషల్ కషాయం మొదలైనవి.పండిస్తున్న పంటలు ఉల్లి, బురియా మిర్చి (పొట్టి మిర్చి, చిన్న రౌండ్ బెల్ రకం మిర్చి), చెరకు, కొబ్బరి, ఆయిల్ పామ్, మామిడి, బొప్పాయి, మినప, పెసర, శనగ, అరటి, వరి, కూరగాయలు, పుచ్చ, నువ్వులు, మునగ మొదలైనవి.మా ఇంటి పంట పదిళ్లకు వంటమా పెరట్లోని ఒక సెంటు స్థలంలో ఏటీఎం పద్ధతిలో 20 రకాల కూరగాయలు, పండ్ల సాగు మొదలుపెట్టాను. నాట్లేసిన పదిహేను రోజుల నుంచి ఫలసాయం మొదలైంది. ఖర్చు తగ్గడం, నా ఆదాయానికి గ్యారంటీ ఉండటం, మా ఇంటి పంట చుట్టుపక్కల పదిళ్లకు వంట అవటం చూసి మా ఊళ్లోని చాలామంది మహిళలు నాలా ఇంటి పంటను మొదలుపెట్టారు. – ఆకుల కనక సూర్యలక్ష్మి, రైతు, దుర్గాడ.ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నాను..ప్రకృతి వ్యవసాయం మీదున్న ఆసక్తితో ఆరెకరాల పొలంలో సేంద్రియ సాగు స్టార్ట్ చేశాను. ఒకపక్క వ్యవసాయం చేస్తూనే ఇంటర్ పూర్తి చేశాను. నా పొలంలోని సేంద్రియ సాగు ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా అమ్ముతున్నాను. వీటికి మంచి గిరాకీ ఉంది. – జీలకర్ర భాను, యువ రైతు, దుర్గాడపరిశీలిస్తున్నారు.. తెలుసుకుంటున్నారుగత ఐదేళ్లలో ఇక్కడ ప్రకృతి సాగు బాగా పెరిగింది. ఇక్కడి రైతులు ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరారు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు, విదేశీ రైతులు దుర్గాడకు వచ్చి ప్రకృతి సాగును పరిశీలిస్తున్నారు. సేంద్రియ ఎరువులు, ద్రావణాల తయారీని తెలుసుకుంటున్నారు. – ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖాధికారి, కాకినాడ -
ఈవారం కథ: ధర్మం
వచ్చే పోయే జనాలతో, బస్సులతో బస్టాండ్ సందడిగా ఉంది. ఎండ చుర్రున కొడుతోంది. వైజాగ్ వెళ్లవలసిన బస్ కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాను. ‘ప్రయాణికులకు గమనిక’ అంటూ ఒకపక్క అనౌన్స్మెంట్, మరోపక్క టీవీలో ప్రకటనల హోరు. కలగాపులగంగా సంభాషణల జోరు. మొత్తానికి అక్కడ అంతా జాతరలా ఉంది. అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డ్‌లా ఉంది. విరిగిపోయిన కడలి అలల సద్దులా ఉంది. ‘అయ్యా! ఆకలేస్తుందయ్యా.. ధర్మం సేయండయ్యా’ హృదయ విదారకమైన వేదన విని తలతిప్పి చూశాను.సుమారుగా ఓ ముప్పై, ముప్పయి ఐదు సంవత్సరాలు ఉంటాయేమో ఆమెకు. జుట్టంతా తైలసంస్కారం లేక రేగిపోయి చిందర వందరగా ఉంది. మాసిపోయి, అక్కడక్కడ చిరుగులున్న చీర, స్నానం చేసి ఎన్నాళ్లయిందో అనేలా శరీరం మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. కళ్ళలో దీనత్వం, జోడించిన చేతుల్లో వినయం. ‘అయ్యా, ఆకలేస్తుందయ్యా’ నాభిలోంచి వస్తున్న ఆ చిన్న అరుపు గుండెను పట్టి పిండేస్తుంది అనడంలో సందేహమే లేదు. ‘అయ్యా ..’ మరోసారి ఆ బిచ్చగత్తె ప్రార్థనకు ఆలోచనలు ఆపి, ప్యాంట్ వెనుక జేబులో చెయ్యి పెట్టి చేతికి దొరికిన నాణెం తీసి ఆమె చేతిలో వేశాను. ఆమె ఆ నాణెం వైపు చూసి ‘వద్దయ్యా! ఆకలేస్తుందయ్యా, తినడానికి ఏమైనా పెట్టండయ్యా’ నా కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది.నా హృదయం ఒక్కసారిగా భారమయ్యింది. ఒక మనిషి మరో మనిషి కాళ్ళు పట్టుకోవడం అంటే ఎంత కష్టం వచ్చుండాలి. ఆత్మాభిమానం చంపుకోవాలి కదా.బస్టాండ్‌లో పక్కనే ఉన్న హోటల్‌పై నా దృష్టి పడింది. ‘పదమ్మా, టిఫిన్ కొనిస్తా’నంటూ దారి తీశాను. ‘టిఫిన్ వద్దయ్యా’ మెల్లగా, నీరసంగా అందామె. ‘మయూరోటల్లో బిర్యానీ కావాలేమో మేస్టారూ..’ ఆ పక్కనే బెంచిపై కూర్చొని మమ్మల్నే గమనిస్తున్న ఆసామి పెద్దగా నవ్వుతూ అన్నాడు. ఆయన మాటలకు కిసుక్కున నవ్వారు మరికొందరు.ఆ ఆసామి మాటలకు ఆమె తల మరింతగా భూమిలోనికి వంగిపోయింది.నాకు చాలా బాధేసింది. సాయం చెయ్యకపోయినా ఫర్వాలేదు గాని, ఇలా వెటకారం చేసే వారంటేనే నాకు ఒళ్ళు మంట. సగటు మనిషిని కదా. కోపం నాలోనే అణచుకొని ‘ఏం కావాలో చెప్పమ్మా’ ఆప్యాయంగా అడిగాను.బస్ కోసం వేచి ఉన్న జనాలకు ఇదో కాలక్షేప వ్యవహారం అయ్యింది. మన గురించి కాకుండా పక్కవారి బాగోగులు, యోగక్షేమాలు, ఏం చేస్తున్నారో? నవ్వుతున్నారా? అయితే ఎలా ఏడిపించాలి? ఏడిస్తే, నిజంగానే ఏడుస్తున్నారా? అనే ఆరాటం లేకపోతే మనం మనలా ఎలా ఉంటాం? ‘బిస్కట్టులు కావాలయ్యా’ మొహమాటం ఆమె కోరికలో.‘పదమ్మా కొంటాను..’నా మాటలకు ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. దీనుల ముఖంలో ఆ వెలుగు చూస్తే నాకు తెలియని ఆనందం, మనసు నిండా తృప్తీ! చుట్టూ ఉన్న కొంతమంది జనాల కళ్ళల్లో మెచ్చుకోలు. అదే నాకు తెలియని మత్తునిస్తుంది.అంతమంది అక్కడ ఉండగా ఒక ముష్టిదానికి నేనొక్కడినే దానం చెయ్యాలి అనుకోవడం నా మంచి మనసుకు తార్కాణం అని అక్కడ ఉండేవారు గుర్తించే ఉంటారు కదా. ఎందుకు గుర్తించరు? తప్పకుండా గుర్తిస్తారు. ఆమె ఆ పక్కనే ఉన్న షాప్ దగ్గర ఆగింది.‘ఆ ఐదు రూపాయల బిస్కట్ ప్యాకెట్ ఇవ్వండి’ షాపతన్ని అడిగాను.ఆమె ముఖంలో వెలుగు ఒక్కసారిగా తగ్గిపోవడం చూసి, ఆకలి ఎక్కువగా ఉంటే ఆ చిన్న బిస్కట్ ప్యాకెట్ ఏమూలకు సరిపోతుంది అనిపించింది.‘అది వద్దు, ఆ పది రూపాయలది ఇవ్వండి’ పది రూపాయలు నోటు అందిస్తూ ఆమె వైపు చూశాను.ఆమె ముఖం ఇంకా దిగులుగా ఉండటం చూసి ‘ఏం కావాలమ్మా నీకు?’ తెలియకుండానే విసుగు నాలో.చెయ్యెత్తి చూపించింది ఆమె. షాపతను నేను అడగకుండానే ఆ బిస్కట్ ప్యాకెట్ తీసి ఆమె చేతిలో పెట్టాడు.‘ఇంకో పదివ్వండి సార్, ఆ ప్యాకెట్ ఇరవై రూపాయలు.’పాపం ఆ ప్యాకెట్ తినాలని ఆశ గాబోలు అనుకుంటూ మరో పది అందించి ‘తినమ్మా, పాపం ఎప్పుడు తిన్నావో ఏమిటో..’ నా జాలి గుండె మాటలు. చెప్పాకదా నా మనసు వెన్న అని. ‘ఊహూ, అటెల్లి తింటాను’ ఆమె బస్టాండ్ వెనుక వైపు చూపించి అటు నడవసాగింది.బహుశా ఆమె పిల్లలు అక్కడ ఉండి ఉంటారు గాబోలు. తనకు ఆకలేస్తున్నా తినకుండా పిల్లల కోసం తీసుకెళ్ళడం నన్ను కుదిపివేసింది. అందుకే అంటారు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు ఏదీ సాటి రాదని! పిల్లలు చిన్నవాళ్ళా? పెద్దవాళ్ళా? ఆ ప్యాకెట్ వారికి ఏం సరిపోతుంది? ఆలోచనలతో పాటు కుతూహలం వెంటరాగా ఆమె వెళ్ళిన దిశకు వ్యతిరేక దిశలో బస్టాండ్ వెనుక వైపు వెళ్ళాను.జనసంచారం పెద్దగా లేకపోవడం వలన గాబోలు అక్కడంతా చెత్త చెత్తగా ఉంది. ముక్కు బద్దలవుతున్న వాసనలు. పిల్లల జాడ ఎక్కడా కనబడలేదు. ఆమెకు కనబడకుండా ఒక చెట్టు చాటు నుండి చూడసాగాను. గోడ వెనక్కి వచ్చిన ఆమె అటూ ఇటూ చూసి ఒక్కసారిగా తన చీరను కాస్తా పైకి లేపింది.సిగ్గుతో తలతిప్పుకొని అక్కడ నుండి రాబోయాను. కానీ నా కళ్ళకు ఏదో అసహజంగా అనిపించి తలతిప్పి చూశాను. ఆమె చీర కింద లంగాపై సంచుల్లాంటివి వేలాడుతున్నాయి. వాటినిండా బిస్కట్ ప్యాకెట్లు. నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.నేనిచ్చిన ప్యాకెట్‌ని కూడా వాటిలో పెట్టింది. చీరను కిందకి దించి సర్దుకొని అటువైపు ఆగి ఉన్న బస్సుల వద్దకు నడవసాగింది. బహుశా నాలాంటి బకరాని వెతకడానికి గాబోలు. ఉండేలు దెబ్బతిన్న కాకిపిల్లలా విలవిలలాడిపోయాను. ఇంత చదువుకొని కూడా అంత సులభంగా ఎలా వెధవనయ్యానో?గుండె మండిపోతుండగా ఆమెను నిలదిద్దామనేంత ఆవేశం వచ్చింది. చెడామడా కడిగేయాలన్నంత కోపం వచ్చింది. కానీ, అటువంటి వారితో గొడవపడటం సభ్యత కాదు, తన పాపానికి తనే పోతుందని తిట్టుకున్నాను. గుండెమంటతో నోరు ఎండిపోయినట్లు అనిపిస్తే, ఆ బిస్కట్ల షాప్ దగ్గరకు వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కున్నాను.‘రాములమ్మ మీలాంటి మెతకోరిని చూసి, నవరసాలు ఒలికించి నా షాప్‌లో బిస్కట్ ప్యాకెట్లు పెద్దవి కొనిపిస్తుంది. సాయంత్రమయ్యేసరికి ఆ బిస్కట్ ప్యాకెట్లను నాకే సగం ధరకు అమ్మేస్తుంది.’ మనసు ఇంకా ఉడికిపోసాగింది. ఇద్దరూ కలిసి ఇంత మోసం చేస్తున్నారా? షాపతను నన్ను చూసి జాలి పడుతున్నట్లు అనిపించింది. ఎదుటివారిపై జాలి చూపడం నాకు అత్యంత ఇష్టమైనది. కానీ నన్ను చూసి జాలి పడితే భరించలేను. ఆయన పెదవులపై ఎందుకనో కాస్త నవ్వు విరిసింది అసంకల్పితంగా. ‘ఎందుకు నవ్వుతున్నారు?’ ఆగలేక అడిగేశాను అప్పటికే మనసు కుతకుతలాడుతోంది మోసపోయాను అన్న భావనతో.‘ఏం లేద్సార్, మీరు రాములమ్మను అనుసరిస్తూ వెళ్ళడం గమనించాను. అక్కడ ఏం చూసుంటారో ఊహిస్తే నవ్వొచ్చింది అంతే. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. అందుకే చనువుగా నవ్వాను.’నిర్ఘాంత పోయాను. ఓహో ఆ మోసగత్తే పేరు రాములమ్మన్నమాట. ‘అంటే మీకు ముందే తెలుసా ఇలా చేస్తుందని’ విస్మయం నాలో.‘రాములమ్మ మీలాంటి మెతకోరిని చూసి, నవరసాలు ఒలికించి నా షాప్‌లో బిస్కట్ ప్యాకెట్లు పెద్దవి కొనిపిస్తుంది. సాయంత్రమయ్యేసరికి ఆ బిస్కట్ ప్యాకెట్లను నాకే సగం ధరకు అమ్మేస్తుంది.’మనసు ఇంకా ఉడికిపోసాగింది. ఇద్దరూ కలిసి ఇంత మోసం చేస్తున్నారా?నా ముఖంలో మారుతున్న రంగులను అణచుకుంటూ ‘మా దగ్గర డబ్బులే అడగొచ్చుకదా. ఎందుకిలా డొంకతిరుగుడు బిస్కట్ల వ్యవహారం?’ ఏదో తెలియని కుతూహలం నాతో అడిగించింది.చిన్న నవ్వు నవ్వి ‘మళ్ళేమైనా అంటే మీకు పుసుక్కున కోపం ఒచ్చేస్తాది గానీ మీరు ముష్టి వేస్తే రూపాయో, రెండ్రూపాయలో వేస్తారు. మహా అయితే ఐదు వేస్తారు. అంతేకదా..!’మౌనంగా తలూపాను.‘సాయంత్రం అయ్యేసరికి కనీసం పదిహేను, ఇరవై ప్యాకెట్లయినా నాదగ్గర మార్చుకొని రెండొందల వరకు తీసుకొని వెళ్తుంది. మధ్య మధ్యలో చిల్లర వేసేవారు ఎలాగూ ఉంటారు.’అంటే రూపాయికి రూపాయి లాభం. ఎంత దగా! పది రూపాయలకు కొని, ఇరవై రూపాయలకు అమ్మడం. ఛ! ఈ ప్రపంచంలోని మోసం అంతా ఈ బస్టాండ్‌లోనే ఉందనిపించింది. అంతలోనే నాకొక సందేహం తలెత్తింది.. అడగనా వద్దా? అనే సంశయంలో ఉండగానే..‘ఏదో అడగాలని తెగ మొగమాటం పడిపోతున్నారు. అడిగేయండి, పర్లేదు’ అభయం ఇచ్చాడా నవ్వులరేడు. ‘మరేం లేదు, మీరే అమ్మి, మీరే కొనడం వలన మీకేంటి లాభం? తర్వాతవి అమ్ముడవకపోతే?’ సంశయిస్తూనే అడిగేశాను. ఒక్కసారిగా మౌనం వహించాడతను. అతని కళ్ళల్లోకి చూస్తున్న నా ముఖాన్ని ఒకసారి పరిశీలించి, అటూ ఇటూ చూసి ‘మీరెవ్వరికీ చెప్పనంటే చెప్తాను’ లోగొంతుతో అన్నాడు.‘ఇక్కడ జరిగిందంతా ఇప్పుడే మర్చిపోతాను’ మాట ఇచ్చాను. ‘ఇంకేటీ లేదు. అవన్నీ పాడయిపోయిన బిస్కట్ ప్యాకెట్లు. అదేలెండి ఎక్స్పైర్ అయిపోయినవి. ఎట్లాగూ బయటపడేయ్యాలి. అవే రాములమ్మకు ఇస్తాను. వేరేవారికి అమ్మను. ఆ ప్యాకెట్లు తను ఎట్లాగూ తినదు, నాకే తిరిగిస్తుంది. ఆ ప్యాకెట్లు ప్రతిరోజూ నాకు డబ్బులు తెస్తున్నాయి. ఈ విషయం రాములమ్మకు కూడా తెలియదు.’విస్తుపోయాను.. కంటికి కనబడకుండా పన్నిన వల తెలిసి! ఏ బిజినెస్ మేనేజ్మెంట్ యూనివర్సిటీల్లో కూడా నేర్పని పాఠం. వ్యాపారంలో మెలకువలు ఉంటాయని తెలుసు గాని, ఒక చిన్న బస్టాండ్‌లో, అతి చిన్న దుకాణంలో, పెద్దగా చదువుకోని వ్యక్తి అంత చక్కగా ఆర్థిక వలనేయగలడు అని ఊహించలేదు. రాగాలాపన ఆపి, మరో డైలాగ్ చెప్పేలోపల ‘వన్స్ మోర్’ గట్టిగా వినబడిన ప్రేక్షకుల అరుపులకు పాడిన పద్యమే మరోసారి శ్రుతి తగ్గకుండా పాడటం ప్రారంభించాను.పద్యం ఆపగానే ‘ శ్రీకృష్ణుని పాత్రధారుని అభినందిస్తూ కనకారావు గారు పదిరూపాయలు చదివించారు. వారికి, వారి కుటుంబానికి ఆ పైడితల్లెమ్మ దీవెనలు అందివ్వాలి’ మైక్‌లో ఆర్గనైజర్ కంఠం వినయంగా పలికింది. నా ఆలోచనలను చెదరగొడుతూ అతని మాటలు వినిపించాయి. ‘మరోమాట సార్, పాపం రాములమ్మ భర్త రోగంతో మంచాన పడితే, పిల్లలతో పాటుగా మొగుడ్ని కూడా చంటిబిడ్డలా సాకుతూ, కుటుంబ పోషణ కోసం ఇలా చేస్తోంది. అందుకే నేను కూడా నావంతుగా ఇలా సాయపడుతున్నాను..’షాపతని మాటలు నన్ను ఆవేశంలోంచి ఆలోచనలోకి పడేశాయి. ఆర్థిక మోసానికి మానవత్వపు పూత.గీతా రహస్యం బోధించిన వాడిలా చిద్విలాసంగా నవ్వాడు షాపతను.∙∙ ‘బావా! ఎప్పుడు వచ్చితీవి? సుఖులే బ్రాతల్, సుతుల్, చుట్టముల్?నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మున్నీలున్ సుఖోపేతులే?’తన్మయత్వంతో తారస్థాయిలో రాగాలాపన చేస్తున్నాను. తలపై నెమలి పింఛంతో కిరీటం, ముఖానికి, మెడకు చిక్కని నీలపు రంగు మేకప్‌తో, మెడలో పూలహారంతో చేతిలో ముచ్చటైన పిల్లనగ్రోవితో మేకప్‌లో అచ్చం కృష్ణుడిలా ఉంటానని అందరూ అంటారు. నా గొంతు నాకొక వరం. మేకప్‌లో నన్ను చూసినవాళ్ళు నన్ను ఫలానా అని గుర్తుపట్టడం కష్టం. అంతగా కృష్ణుని పాత్రలో ఒదిగి పోతాను అని మా నాటకబృందం కితాబు. వందలమంది ప్రేక్షకులు నాటకంలో లీనమయి ఉన్నారు. మా వూరు పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్లే ఈ ఏడాది కూడా బుర్రకథలు, హరికథలు, నాటకాలు జరుగుతున్నాయి. రాగాలాపన ఆపి, మరో డైలాగ్ చెప్పేలోపల ‘వన్స్ మోర్’ గట్టిగా వినబడిన ప్రేక్షకుల అరుపులకు పాడిన పద్యమే మరోసారి శ్రుతి తగ్గకుండా పాడటం ప్రారంభించాను.పద్యం ఆపగానే ‘ శ్రీకృష్ణుని పాత్రధారుని అభినందిస్తూ కనకారావు గారు పదిరూపాయలు చదివించారు. వారికి, వారి కుటుంబానికి ఆ పైడితల్లెమ్మ దీవెనలు అందివ్వాలి’ మైక్‌లో ఆర్గనైజర్ కంఠం వినయంగా పలికింది.మరో ఇద్దరు ముగ్గురు చెరో పది, ఇరవై రూపాయలు కానుకగా అందించారు. ప్రేక్షకుల చప్పట్లు, అభినందనల మధ్య రెట్టించిన ఉత్సాహంతో, ఉవ్వెత్తునలేచిన కడలి తరంగంలా పాత్రలో లీనమయిపోయా. నాటకం రసవత్తరంగా సాగుతోంది. ‘మా మధ్యమ పాండవుని విక్రమంబు ఎట్టిదంటిరేని..’‘జెండాపై కపిరాజు ముందు సిత వాజి శ్రేణియుం గూర్చి నేదండంబున్ గొని తోలు స్యందనము మీదన్ ..’రాగం ఆపగానే ఆర్గనైజర్ గారి కంఠం మైకులో వినిపించసాగింది. ‘శ్రీకృష్ణుని పాత్రధారిని ఆశీర్వదిస్తూ కళాభిమానులందరి తరుపున అని చెప్పమంటూ మంచి మనసుగల ఒక తల్లి వంద రూపాయలను బహుమతిగా ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ చల్లని తల్లి పైడితల్లెమ్మ కరుణతో చూడాలని కోరుకుంటున్నాము.’నాకొక్కసారిగా ఆశ్చర్యం కలిగింది. అందరూ పదులు, ఇరవైలు చదివిస్తుంటే ఒక్కసారిగా వందరూపాయలు చదివిస్తూ కూడా తన పేరు చెప్పకోకుండా అందరి తరుపున అన్న ఆ గొప్ప వ్యక్తి ఎవరా? అని చూశాను.ఫ్లడ్ లైట్ల వెలుగులు నా కంటికి అడ్డం పడ్డాయి. చెయ్యి అడ్డుపెట్టుకొని మరీ చూశాను. ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను.. ఆర్గనైజర్‌కు డబ్బులు అందించిన ఆమెను చూసి! ఆ మధ్య బస్టాండ్‌లో నన్ను మోసం చేసిన బిచ్చగత్తే రాములమ్మ. ముష్టి ఎత్తి కుటుంబ పోషణకు సంపాదించిన డబ్బును, కళాపోషణకు ఇస్తూ, కనీసం తన పేరు కూడా చెప్పని ఆ నిరాడంబరత నా వీపున ఛెళ్ళున కొరడా దెబ్బ వేసింది. నాలో నాకే తెలియని మానసిక సంఘర్షణ. వృత్తికి, ప్రవృత్తికి మధ్యగల తేడాను, స్పష్టతను, నిర్మలత్వాన్ని, సున్నితత్వాన్ని , కళాపోషణను, కళారాధనను తెలుసుకోగలిగాను.తెలియకుండానే నా కన్నులు చెమ్మగిల్లుతుండగా రెండు చేతులు జోడించి ఆమెకు వందనం చేశాను. -
యువ కథ: చినుకుల అలజడి
జయరాం, తనకు కాబోయే అల్లుడు ప్రవీణ్ పక్కనే నిలబడి మాట్లాడతా వుండాడు.‘రేయ్ చిన్నోడా, ఇప్పుడేలరా ఈ పెండ్లిసూపులు. ఒకేసారి లగ్నపత్రిక రాయించుకోని ఒచ్చేద్దామంటే ఇనవు’ ప్రవీణ్ నవ్వతా ‘నా కోసరం గాదు. నీ ముద్దుల కూతురు ఉంది కదా, ఆయమ్మ ఆగిత్యమే’ అన్నాడు. ‘చిన్నప్పట్నించి అనుకున్న సంబంధానికి మళ్లీ పెళ్లిచూపులేంట్రా. ఏంటో ఈకాలం పిల్లలు’ అన్నాడు.దూరంగా ఉండి ఈ మాటలన్నీ వింటోంది శిరీష. ప్రవీణ్ మాటలకి కోపమొచ్చేసింది ఆమెకు. కానీ అది సమయం సందర్భం కాదని ఏం మాట్లాడకుండా గమ్మునే ఉండిపోయింది.అరగంటలో పెండ్లిచూపుల కార్యక్రమం అంతా అయింది. వచ్చే మంగళవారం లగ్నపత్రిక రాయించుకొద్దాం అని రెండు కుటుంబాలు అనుకునేశాయి. ఇద్దరూ ఉండేది అదే ఊళ్లో. జరగాలి కాబట్టి జరిపించినట్టుగా ఉంది తంతు.‘ఎల్దాం పదండి’ అంటా అమ్మాయి తరుపువాళ్లు బయల్దేరతా ఉంటే శిరీష ‘మీరు బొండి, నాకు పవిగాడితో కాస్త పాతబాకీల ముచ్చట ఉంది. తేల్చుకొనొస్తా’ అనింది. శిరీషకు ఎప్పుడూ ఎవురూ అడ్డు జెప్పింది లేదు. అట్లే కానియ్యమని బయల్దేరి పోయినారు. ప్రవీణ్ మిద్దె మీద ఎండబెట్టిన మిరక్కాయలని గోతాంలో ఏస్తాన్నాడు. వానొస్తాదని నమ్మకమొచ్చేలా ఇంకోసారి ఎక్కడో పిడుగు పడిన శబ్దం వినపడింది. ఎండ కూడా తన పెగ్గి తగ్గించుకుంటాంది.‘అత్తా.. పవీ ఏడా’ అనడిగింది శిరీష నవ్వతా. అత్త కూడా నవ్వతా పైకి చూపెట్టింది. మూటగట్టిన మిరక్కాయల గోతాంని లోపలికేసి కిందకు దిగిన ప్రవీణ్ చెయ్యి కడుక్కుని తుడుచుకుందామని అట్టా ఇట్టా చూశ్నాడు. శిరీష అగుపడ్నాది. దగ్గరకెళ్ళి చీర కొంగు బట్కోని తుడుసుకోబోయినాడు, శిరీష వెంటనే వెనక్కి జరిగి – ‘రేయ్.. కొత్త చీరరా’ అనింది. ప్రవీణ్ రెండు చేతులూ ఏసేసరికి చేతుల తడి నడుముకు తగిలింది. శిరీష వెంటనే ప్రవీణ్‌ను ఎనక్కి తోసేసి, ‘మండుతాది వాయ్’ అనింది కోపంగా. ‘లాస్టు మూడు నెలలుగా నాకు మండినట్టా?’ అనేసి బాల్కనీ వైపుగా నడిచి అక్కడ అలానే కింద కూర్చుండిపోయినాడు. ‘అబ్బా .. మళ్ళీ మొదలు పెట్నావా?’ అంటూ పక్కనే ఒచ్చి కూర్చొనింది శిరీష.ప్రవీణ్ తలవంచుకున్నాడు. వోని గెడ్డం పట్టుకొని పైకి లేపింది. వోని కండ్లు ఎర్రగా నరాలు తేలేసి ఉన్నాయ్. ‘దీనికి ఎందుకురా పవీ ఏడవడం? ఏమన్నా అంటే ఇట్టా ఆడపిల్లలా ఏడుస్తావ్..’ అనేసి కండ్లు తుడిచింది శిరీష. ‘ఏం, ఆడపిండ్లోల్లే ఏడసాల్నా? మొగపిండ్లోల్లు యాడ్సకూడదు అని యాడైనా రాసుండాదా ఏం..?’ అన్నాడు ప్రవీణ్ కండ్లు తుడుసుకుంటా. శిరీష నవ్వి ‘సర్లే , మళ్ళీ ఏడుద్దువులే గానీ, ఈ మూడు నెలలు ఎట్లున్నావ్రా నాతో మాట్లాడకుండా, నన్ను సూడకుండా?’ అనింది. ‘అదేమంత కష్టం కాదులేమే, నువ్వే మళ్లీ పలకరిస్తావ్ అని నాకు దెల్సు. అందుకే ఆ నమ్మకంతోనే ఉన్నా’ అన్నాడు ప్రవీణ్. ‘ఉద్యోగం మానేశ్నావంట ? ఏంది కత?’ ప్రవీణ్ చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది.‘అక్కడ టౌన్లో ఉండబుద్ధి గాట్లేదు మే. ఆ ప్రైవేట్ స్కూల్లో టీచరు ఉద్యోగం నావల్ల కాదు ఇంక. ఈసారి డీఎస్సీ నోటిఫికేషన్ పడనియ్. అప్పటిదాకా నువ్వున్నావ్‌గా, ఏం చూస్కోవా నన్ను?’ ‘నేను చూసుకుంటాలే గానీ, ఈలోపు నీ చేయి కంట్రోల్లో లేకుంటే ఇరగ్గొట్టి పొయ్యిలో పెడతా.’‘మరెట్టాగే? ఇంకెన్నాళ్ళు ఇట్టా దూరంగా ఉండాల నీతో?’‘రేయ్ తిక్క సన్నాసీ.. వయసు శానా ఆట్లే ఆడమంటాది. కొన్నిదినాలు ఆగు, పెండ్లైపోనీ’అని గట్టిగా ఒక ముద్దిచ్చి ఆడ నుంచి ఇంటికి బోయింది శిరీష.మూడు నెలల క్రితం శిరీష ఇంటికి వెళ్లిన ప్రవీణ్ ఏకాంతం చూసి చనువు చూపించబోయాడు. లాగిపెట్టి కొట్టింది. పద్ధతి ప్రకారం ఉండకపోతే పెళ్లీగిళ్లీ జాన్తానై అంది. ‘అసలు మూడు నెలలు కనపడకుండా వినపడకుండా నిష్టగా ఉంటేనే పెళ్లి’ అంది. ఆ మాటను అంత పట్టింపుతో అనకపోయినా ప్రవీణ్ సీరియస్‌గా తీసుకున్నాడు. ఇద్దరి వైఖరిలో మార్పు గమనించి పెద్దవాళ్లు ఇది ఎటుపోయి ఎటొస్తుందోనని పెళ్లికి వేగం తెచ్చారు. అది కూడా జనం కోసం జరిపించాల్సిన ఒక తంతే. ప్రవీణ్, శిరీష మానసికంగా ఎప్పుడో భార్యాభర్తలు. ఆ రేతిరి మిద్దె మీద చాప ఏస్కొని అటూ ఇటూ దొర్లుతున్నాడు ప్రవీణ్. నిద్ర పట్టక కింద వీధిలో కొచ్చి సిగరెట్ వెలిగించినాడు. శిరీష గుర్తుకొచ్చి ఉక్కిరిబిక్కిరిగా ఉంది. మొబైల్ చూస్కున్నాడు. గీత నుంచి మళ్ళీ మెసేజ్– ‘మేల్కొనే ఉన్నావా?’ అని. దాన్ని పట్టించుకోకుండా ‘డార్లింగ్’ అని ఉన్న నంబర్‌కి డయల్ చేశాడు.నిద్ర మత్తులో ఫోన్ ఎత్తినాది శిరీష. ‘ఏంది పవీ ఈ టైములో ఫోను’ ‘నిద్రపట్టట్లే మే’ ‘పడుకుంటే అదే వస్తాదిలే. పడుకో పవీ’ అంటూ ఫోన్ పెట్టేశ్నాది శిరీష. ఇంతలో గీత నుంచి మళ్ళీ మేసేజ్– ‘పడుకునేశ్నావా’ అని. ‘లేదు’ వెంటనే ఫోన్ రింగయ్యింది. గీత నుంచి ఫోన్.‘హలో’ అన్నాడు ప్రవీణ్. ‘ఏం చేస్తున్నావ్?’ ‘ఏం జెయ్యట్లా. నిద్రపట్టకపోతే అలా బయటకొచ్చినా’ ‘బయటికి అంటే మీ ఇంటి ముందుకా ?’‘అవును. అయినా యాడైతే నీకు తేడా ఏముందే, నువ్వుండేది బెంగుళూరులో గదా’‘రామాలయం వీధి వైపు నడుస్తున్నావా?’‘అవును. అంత కరెక్టుగా ఎట్టా జెప్పినావ్?’‘ఇంకొంచెం ముందుకి నడువు అలాగే’ అట్టాగే ముందుకి పోయిన ప్రవీణ్‌కి ఎదురుగా చెయ్యి ఊపుతూ ఎవరో కనబడ్డారు. ఈ టైంలో ఎవరా అని చూస్తే గీత! ‘ఒసేయ్, నువ్వేందే ఈడ ? బెంగుళూరు నుంచి ఎప్పుడొచ్చినావ్?’ అన్నాడు. ‘సాయంత్రం ఒచ్చినాన్లే గానీ, దా ఇక్కడ చలిగా ఉంది లోపలికెళ్దాం.’ ‘ఈ టైంలో ఎందుకులేమే, తెల్లార్నంక మాట్లాడుకుందాం’ అన్నాడు ప్రవీణ్. ‘అబ్బా, ఏంగాదు రా ప్రవీణ్’ అంటూ బలవంతంగా లోపలికి లాక్కెళ్ళింది గీత. ప్రవీణ్ ఇల్లంతా చూస్తూంటే ‘ఎవరూ లేరు. అందురూ పెండ్లికి ఎలబారిపోయినారు. నువ్వూ నేనే ఉండాం’ అనేసి సోఫాలో కూర్చునింది. బయట వర్షం మొదలైంది. మెల్లగా ఊపందుకుంది. ‘ఈ రేతిరికి వాన ఇంకా గెట్టిగా పడేట్టుగా ఉండాది మేయ్. ఇంకా పెరిగే లోపు నేను ఇంటికెళ్ళిపోతా’ అన్నాడు ప్రవీణ్.‘సర్లే ఎల్దువులే గానీ, కాసేపు ఉండు ప్రవీణ్’ అనింది. ప్రవీణ్ చేతిని తన చేతిలోకి తీసుకునింది. ప్రవీణ్ గుండె వేగం ఆ పిల్లకి కూడా తెలుస్తాంది.‘నువ్వంటే చిన్నప్పట్నుంచీ ఇష్టంరా ప్రవీణ్. కానీ నీకేమో ఆ శిరీష అంటే పిచ్చి. అందుకే ఎప్పుడూ జెప్పలా నీకు. కానీ నువ్వు కావాలి’ గీత కండ్లు మూసుకునింది. మొహాన్ని మొహానికి దగ్గిరగా తెచ్చాడు ప్రవీణ్. పెదాల మీద ముద్దు పెడతాడు అనుకునింది. అయితే ప్రవీణ్ నుదిటి మీద ముద్దు పెట్టాడు. ‘ఇట్టా చేయడం తప్పు మేయ్’అన్నాడు. వెంటనే కండ్లు తెరిచేశ్నాది గీత. ‘నా శిరీషకు నేను అన్యాయం చేయలేను. ఈ వయసులో మనందరికీ ఒకేలా ఉంటుంది. అదే మాట శిరీషతో అంటే– ఉంటుంది. నాకూ ఉంటుంది. కాని ఆగాలి కదా అని ఆగడం నేర్పింది. నీకూ అదే మాట చెప్తున్నా. వయసు ఆడించినట్టు మనం ఆడకూడదు’ అనేసి పైకి లేచాడు.‘అయితే రేతిరి దాని ఇంటికెల్నావ్, అయినా సరే ఇద్దరి మధ్యనా ఏం కాలేదు అంటావ్. అంతేనా ?’అవునన్నట్టు తలాడించాడు ప్రవీణ్. గీత ఏం మాట్లాడకుండా నిలబడింది. కండ్లు తుడుచుకొని, ‘నాదే తప్పు. మీ మధ్య దూరుండకూడదు. పెండ్లెప్పుడు అనుకుంటా ఉండారు?’ అనడిగింది.‘రెండు నెలల్లో. కానీ అంత దూరం మంచిది కాదనిపిస్తాంది’ అంటూ నవ్వినాడు ప్రవీణ్. గీత కూడా నవ్వింది. ‘సరే మేయ్ నేను పోతా’ అనేసి వానలోనే తడ్సుకుంటా ఇంటికి పోయి మిద్దె మీదకెల్నాడు ప్రవీణ్. అక్కడ చాప, దిండు రెండూ తడిసి ముద్దయిపోయున్నాయి. మరుసటి రోజు పొద్దున్నే శిరీష వొచ్చినాది. ఆరేసున్న బొంత, చాప, ఎండబెట్టిన దిండు అన్నిటినీ చూస్తూ నిలబడింది. ‘అయితే రేతిరి దాని ఇంటికెల్నావ్, అయినా సరే ఇద్దరి మధ్యనా ఏం కాలేదు అంటావ్. అంతేనా ?’అవునన్నట్టు తలాడించాడు ప్రవీణ్.‘ఇది. ఈ కంట్రోల్ ఉండాల్ననేరా మూడు నెలలు నన్ను కల్సొద్దు అని కండిషన్ బెట్టి కూర్సోబెట్టింది. కానీ నిన్ను నమ్మినా, ఈ వయసును నేను నమ్మలేను పవీ’ అంది. ‘మరేం చేద్దాం?’ అన్నాడు ప్రవీణ్. వారం తర్వాత ప్రవీణ్, శిరీషల పెండ్లి ఘనంగా జరిగింది.ఆ రేతిరి, దాదాపు ఒంటిగంట ప్రాంతంలో.. ‘ఏంది పవీ, ఇంకా ఒంటి గంట కూడా కాలేదు. అప్పుడే పడుకుంటే ఎట్టా?’‘అట్టా కాదు లెమ్మే, నాకు నిద్దొరస్తాంది’ అన్నాడు ప్రవీణ్. శిరీష నవ్వతా అనింది ‘నాకు రాట్లేదు’ -
Mystery: హంతకుడు ఏమయ్యాడు?
ఇది 44 ఏళ్ల క్రితం, మార్చిలో ప్రారంభమై, అదే ఏడాది సెప్టెంబర్‌లో ముగిసిన రొమాంటిక్ క్రైమ్ కథ. 1980 సెప్టెంబర్ 18, సాయంత్రం 5 కావస్తోంది. అమెరికా మిసూరీలోని కాన్సాస్ సిటీలో ఓ బిల్డింగ్ ముందు ఓ కారు వేగంగా వచ్చి ఆగింది. కారులోంచి 34 ఏళ్ల తాన్యా కోప్రిక్ అనే డాక్టర్ కాలు బయటపెట్టింది. ఆమె పూర్తిగా దిగకముందే ఏకధాటిగా తుపాకి తూటాలు ఆమె తలలోకి దూసుకెళ్లాయి. ఆ అలికిడికి బిల్డింగ్‌లోని కొందరు బయటికి పరుగు తీశారు. కారు దగ్గరకు వచ్చి చూస్తే, తాన్యా కారు ముందు సీటులో కుప్పకూలిపోయి ఉంది. కిల్లర్ అతి సమీపం నుంచి కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు డాక్టర్స్ తేల్చారు. తాన్యా చాలా అందగత్తె. ఆరేళ్ల క్రితమే యుగోస్లేవియా నుంచి అమెరికా వచ్చి, సొంతంగా ఆసుపత్రి పెట్టుకుని డాక్టర్‌గా సెటిల్ అయ్యింది. మరోవైపు పలు ఆసుపత్రుల్లో డాక్టర్‌గా, కాలేజీల్లో ప్రొఫెసర్‌గా చాలా విధులు నిర్వహించేది. ఆమె హత్య జరిగిన భవంతిలోనే ఆమెకు సొంతగా అపార్ట్మెంట్ ఉంది. కారు, ఇల్లు, కావాల్సినంత సంపాదన, చక్కని జీవితం క్షణాల్లో ముగిసిపోయింది. తాన్యా మరణవార్త యుగోస్లేవియాలోని ఆమె పేరెంట్స్‌కు తెలియడంతో వాళ్లు కూడా కాన్సాస్ సిటీకి హుటాహుటిన చేరుకున్నారు.అయితే కేసు దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు చాలా కీలక సమాచారం అందింది. అసలు తాన్యాను హత్య చేసింది ఎవరో కాదు మాజీ ప్రియుడు రిచర్డ్ గెరార్డ్ బోక్లేజ్ అని తెలుసుకున్నారు. తాన్యాను రిచర్డ్ చంపడం, పారిపోవడం స్వయంగా చూశామని ఇద్దరు సాక్షులు ముందుకొచ్చారు.యూనివర్సిటీ ఆఫ్ మిసూరీలో రిచర్డ్ ఫార్మసీ విద్యార్థిగా తాన్యాకు పరిచయం అయ్యాడు. అతడి కంటే తాన్యా పదకొండేళ్లు పెద్దది. వారి పరిచయం స్నేహంగా, తర్వాత ప్రేమగా మారడానికి నెలరోజులు కూడా పట్టలేదు. వారి బంధం ఎంత వేగంగా అల్లుకుందంటే 1980 మార్చిలో రిచర్డ్, హాస్టల్ ఖాళీ చేసి తాన్యా అపార్ట్మెంట్లోకి మారిపోయాడు. కాలక్రమేణా అతడికి చదువు మీద శ్రద్ధ తగ్గింది. తాన్యా చుట్టూనే ప్రదక్షిణలు చేసేవాడు. అతడి తీరును అతడి స్నేహితులు తీవ్రంగా విమర్శించినా పట్టించుకునేవాడు కాదు. కేవలం తాన్యా డబ్బు, ఆస్తి కోసమే ఆమెతో సాంగత్యం మొదలుపెట్టాడని చాలామంది గుసగుసలాడుకునేవారు. కానీ ఆ జంట ఎవరి మాటా వినలేదు. ఆరు నెలలు గడవకముందే నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాన్యా ధ్యాసలో రిచర్డ్ తన కెరీర్‌ని పక్కన పెట్టేశాడు. చదువు తగ్గిపోయింది. మార్కులు తగ్గిపోయాయి. అతడి తీరు గమనిస్తూ వస్తున్న ప్రొఫెసర్స్ అతడిపై రెడ్ మార్క్ వేశారు. జూలై వచ్చేనాటికి రిచర్డ్ డాక్టర్ కావడానికి అనర్హుడని, ఇక యూనివర్సిటీకి రావాల్సిన పనిలేదని నోటీసులిచ్చారు. దాంతో రిచర్డ్ రగిలిపోయాడు. ‘నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే’ అంటూ తాన్యాను వేధించడం మొదలుపెట్టాడు. ప్రొఫెసర్స్‌తో, యూనివర్సిటీ నిర్వాహకులతో గొడవలకు దిగడం ప్రారంభించాడు. అడ్మిష¯Œ ్స డిపార్ట్మెంట్లో తన తరపున మాట్లాడి, తిరిగి తనకు అర్హత పత్రాన్ని ఇప్పించాలని ప్రతిరోజూ తాన్యాతో గొడవకు దిగేవాడు. అతనితో పడలేక సెప్టెంబర్ 2న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది తాన్యా. అపార్ట్మెంట్లోంచి అతణ్ణి బయటికి పంపించేసింది. దాంతో అతడు మరింత ఉన్మాదిగా మారిపోయాడు.రెండు వారాల తర్వాత తన కేసును పునఃపరిశీలించాలని వేడుకుంటూ యూనివర్సిటీ అడ్మిషన్ల కార్యాలయంలోని అధికారులకు లేఖ రాశాడు రిచర్డ్. చివరకు సెప్టెంబర్ 18న మధ్యాహ్నం మూడుగంటలకు పరిశీలనలో భాగంగా రిచర్డ్‌ను విచారణకు ఆహ్వానించారు ప్రొఫెసర్స్. అయితే అక్కడ కూడా రిచర్డ్ తీరు నచ్చక అతడు తిరిగి జాయిన్ కావడానికి వీల్లేదంటూ వారంతా తీర్మానించారు. దాంతో అదే రోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న తాన్యాను రిచర్డ్ కాల్చి చంపేశాడు. అయితే ఆ రోజు విచారణకు రిచర్డ్ ఒక కవర్ తెచ్చాడు. తాన్యా హత్య తర్వాత ఆ కవర్‌ను చూసిన చాలామంది ప్రొఫెసర్స్.. అందులోనే తుపాకి ఉండి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అతడు కొన్ని వారాల ముందే ఆ పిస్టల్ని కొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య జరిగిన రోజు కొంత దూరం వరకూ రిచర్డ్ పరుగుతీస్తూ వెళ్లాడని డాగ్స్ స్క్వాడ్ గుర్తించింది. బహుశా అతడికి ఎవరైనా లిఫ్ట్ ఇచ్చి ఉంటారని, అందుకే తప్పించుకోగలిగాడని డిటెక్టివ్స్ ఊహించారు. హత్య జరిగిన వారంలోనే రిచర్డ్ నుంచి తాన్యా తల్లిదండ్రులకు ఓ లేఖ వచ్చింది. దానిలో ‘తాన్యాకు నేను మరణ శిక్ష విధించాను. ఆమెకు తగిన శిక్షే వేశాను’ అని రాశాడు. ఆ పోస్ట్‌కార్డు మీద 2 రోజుల ముందు తేదీ ఉంది. ప్రస్తుతం రిచర్డ్‌కి 67 ఏళ్లు దాటుంటాయి. అమెరికాస్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో అతని పేరు చేరింది. ఏళ్లు గడిచే కొద్దీ రిచర్డ్ ఎలా ఉండి ఉంటాడోనని పోలీసులు ఎన్నో ఊహాచిత్రాలు గీయిస్తున్నారు. అయినా అతను మాత్రం ఇప్పటికీ దొరకలేదు. దాంతో ఈ కేసు అపరిష్కృతంగానే మిగిలిపోయింది. రిచర్డ్ ఏమయ్యాడనేది నేటికీ మిస్టరీగానే ఉండిపోయింది.∙సంహిత నిమ్మన -
చవితి చంద్రుడు.. పున్నమి చంద్రుడు
అక్బర్ పాదుషా ఆస్థానంలో చేరిన అనతి కాలంలోనే బీర్బల్ ఆయనకు తలలో నాలుకలా మారాడు. బీర్బల్ చమత్కారాలను అక్బర్ పాదుషా అమితంగా ఇష్టపడేవాడు. తన తెలివితేటలతో బీర్బల్ ఎన్నో చిక్కు సమస్యలను పరిష్కరించి, మొఘల్ సామ్రాజ్యంలోనే అమిత మేధావిగా గుర్తింపు పొందాడు.బీర్బల్ తెలివి తేటలను అక్బర్ పాదుషా గుర్తించి, అతడిని తన ఆంతరంగికుడిగా చేసుకున్నాడు. మిగిలిన మంత్రులు చెప్పే మాటల కంటే బీర్బల్ మాటకు అక్బర్ పాదుషావారు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఇదంతా ఆస్థానంలోని మిగిలిన మంత్రులకు, ఇతర ఉన్నత రాజోద్యోగులకు కంటగింపుగా ఉండేది. అదను చూసి బీర్బల్‌ను దెబ్బతీయడానికి ఎప్పటికప్పుడు విఫలయత్నాలు చేస్తుండేవారు. అసూయపరుల ప్రయత్నాలు ఎలా ఉన్నా, బీర్బల్ పేరు ప్రతిష్ఠలు మాత్రం అంతకంతకు పెరగసాగాయి. మొఘల్ సామ్రాజ్యంలోనే కాదు, బీర్బల్ ప్రఖ్యాతి పొరుగు దేశాలకూ పాకింది. బీర్బల్ ప్రఖ్యాతి ఆ నోటా ఈ నోటా పర్షియా రాజు వరకు చేరింది. బీర్బల్ తెలివితేటలను ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన బీర్బల్‌కు తమ దేశానికి ప్రత్యేక అతిథిగా రావాలంటూ ఆహ్వానం పంపాడు. అక్బర్ పాదుషా అనుమతితో బీర్బల్ పర్షియాకు ప్రయాణమయ్యాడు. పర్షియా రాజ్యంలో అడుగుపెడుతూనే బీర్బల్‌కు ఘనస్వాగతం లభించింది. పర్షియా రాజు బీర్బల్‌కు ఘనంగా అతిథి మర్యాదలు చేశాడు. అడుగడుగునా చక్కని విడిది వసతులు, రుచికరమైన విందులు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ్యంలోకి అడుగుపెట్టినది మొదలుకొని, పర్షియా రాజభటులు, ఉద్యోగులు బీర్బల్‌ను అంటిపెట్టుకుని ఉంటూ ఆయనకు కావలసిన ఏర్పాట్లన్నీ సజావుగా జరిగేలా చూసుకున్నారు. దగ్గర ఉండి మరీ వారు బీర్బల్‌ను రాజధానికి తీసుకువచ్చారు. రాజధానికి చేరుకున్న రోజు బీర్బల్ విశ్రాంతికి విలాసవంతమైన అతిథిగృహంలో ఏర్పాట్లు చేశారు. మరునాడు బీర్బల్ రాజోద్యోగులు వెంటరాగా పర్షియా రాజు దర్బార్‌లోకి అడుగుపెట్టాడు. బీర్బల్‌ను పర్షియా రాజు తన పక్కనే ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని, కుశల ప్రశ్నలు వేశాడు.‘బీర్బల్గారు! మీ వంటి మేధావి మా మిత్రుడైన అక్బర్ ఆస్థానంలో మంత్రిగా ఉండటం మాకూ గర్వకారణమే! మీకు నచ్చినన్ని రోజులు మా రాజ్యంలో అతిథిగా ఉండండి. రాజ్యం నలుమూలలా మీకు నచ్చినట్లు సంచారం చేయవచ్చు. అందుకు తగిన ఏర్పాట్లు చేయిస్తాను. మా రాజ్యంలోని పరిస్థితులను గమనించి, మెరుగు పరచుకోవలసిన అంశాలేమైనా ఉంటే సలహాలు ఇవ్వండి’ అని అన్నాడు.పర్షియా రాజ్యంలో కొన్నాళ్లు గడిపాక, బీర్బల్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తన రాజ్యానికి తిరిగి బయలుదేరాలనుకుంటున్నానని పర్షియా రాజుకు తెలియజేశాడు. బీర్బల్ తిరుగు ప్రయాణానికి ముందురోజు అతడి గౌరవార్థం పర్షియా రాజు ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ దర్బారులోని మంత్రులు, సేనానాయకులు, ఉన్నతోద్యోగులు, రాజ్యంలోని కులీనులు, పెద్ద పెద్ద వర్తకులు ఆ విందులో పాల్గొన్నారు. విందులో కబుర్లాడుకుంటుండగా, పర్షియా మంత్రుల్లో ఒకరు వచ్చి బీర్బల్తో మాటలు కలిపాడు. ‘బీర్బల్ మహాశయా! మా రాజుగారి గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగాడు.‘మీ రాజావారికేం? ఆయన పున్నమి చంద్రుడు’ అని బదులిచ్చాడు బీర్బల్.‘మరి మీ రాజావారి గురించి ఏమంటారు?’ అడిగాడా మంత్రి.‘మా రాజావారు చవితి చంద్రుడు’ అన్నాడు బీర్బల్. అక్బర్ పాదుషాను చవితి చంద్రుడితోను, తనను పున్నమి చంద్రుడితోను పోలుస్తూ బీర్బల్ అన్న మాటలకు పర్షియా రాజు పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. సాగనంపేటప్పుడు బీర్బల్‌కు అనేక విలువైన కానుకలు ఇచ్చాడు. అక్బర్ పాదుషాకు అందజేయమంటూ మరిన్ని కానుకలనిచ్చాడు. వాటిని మోసుకుపోవడానికి గుర్రబ్బగ్గీలను, సేవకులను ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికాడు.బీర్బల్ ఢిల్లీకి చేరుకున్నాడు. అక్బర్ పాదుషా దర్బారులోకి అడుగుపెట్టాడు. అక్బర్ పాదుషా చిర్రుబుర్రులాడుతూ కనిపించాడు. బీర్బల్‌కు ఏమీ అర్థంకాలేదు.పర్షియా రాజు వద్ద బీర్బల్ అన్న మాటలు వేగుల ద్వారా అప్పటికే అక్బర్ పాదుషా చెవికి చేరాయి.అక్బర్ పాదుషా ఇక ఉక్రోషాన్ని అణచుకోలేక నేరుగా విషయంలోకి వచ్చేశాడు.‘మా గురించి ఏమనుకుంటున్నావు బీర్బల్? పొరుగు రాజు వద్ద పరువు తీస్తావా?’ అన్నాడు కోపంగా.‘పొరుగు రాజు వద్ద నేను మిమ్మల్ని పొగిడాను జహాపనా!’ అన్నాడు బీర్బల్.‘చాలు, చాలు! ఇక బొంకకు. అక్కడ నువ్వన్న మాటలన్నీ నాకు తెలుసు. పర్షియా రాజు పున్నమి చంద్రుడా? నేను చవితి చంద్రుణ్ణా? ఇదేనా నన్ను పొగడటం?’ మరింత కోపంగా అన్నాడు అక్బర్ పాదుషా.‘జహాపనా! నిజమే, ఆయన పున్నమి చంద్రుడు. పున్నమి తర్వాత చంద్రుడు క్షీణించడం ప్రారంభిస్తాడు. తమరు చవితి చంద్రుడు. భవిష్యత్తులో తమరు ఇంకా వృద్ధిలోకి వస్తారు. అందుకే అలా పొగిడాను. నా అదృష్టం బాగులేదు కనుక నన్ను తమరు అపార్థం చేసుకున్నారు’ అన్నాడు బీర్బల్.బీర్బల్ వివరణతో అక్బర్ సంతోషించాడు. తన మెడలోని హారాన్ని బహూకరించి సత్కరించాడు. -
అగస్త్యుడి చేతిలో రావణుడి ఓటమి
మేరు పర్వతంతో స్పర్థకు పోయిన వింధ్య పర్వతం ఆకాశాన్ని కమ్మేస్తూ పెరిగిపోవడంతో గ్రహగతులు తప్పి, ముల్లోకాల్లోనూ కల్లోలం ఏర్పడింది. దేవతలందరూ ప్రార్థించడంతో అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్య పర్వతం వైపుగా దక్షిణదేశ యాత్రకు బయలుదేరాడు. అగస్త్యుడు భార్యా సమేతంగా తనవైపు వస్తుండటంతో వింధ్యుడు ఆయన ముందు మోకరిల్లాడు. తాను దక్షిణదేశ యాత్రలకు వెళుతున్నానని, తాను తిరిగి వచ్చేంత వరకు అలాగే ఉండమని వింధ్యుణ్ణి ఆదేశించాడు. అలా వింధ్యుడిని అణచిన అగస్త్యుడు దక్షిణ భారత దేశంలోని తీర్థక్షేత్రాలన్నింటినీ దర్శించుకున్నాడు. తీర్థయాత్రలు ముగిశాక ఆయన కావేరీ తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, భార్యా సమేతంగా తపోజీవనం గడపసాగాడు.దక్షిణ భారత దేశానికి ఆవల సముద్రం నడిబొడ్డున ఉన్న లంకను అప్పట్లో రావణుడు పరిపాలించేవాడు. తన అన్న కుబేరుడిని అలకాపురి వరకు తరిమికొట్టి, అప్పటి వరకు అతడు పాలించిన లంకను, అతడి పుష్పక విమానాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత రావణుడు దేవతలను జయించాడు. అష్ట దిక్పాలకులను తన ఆజ్ఞలకు లోబడేలా చేసుకున్నాడు. నవగ్రహాలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు. అయితే, లంకకు చేరువలో ఉన్న దక్షిణ భారతదేశం మాత్రం అతడికి స్వాధీనం కాలేదు. ఆ ప్రాంతాన్ని కూడా ఎలాగైనా తన వశంలోకి తెచ్చుకోవాలని తలచాడు.దక్షిణ భారతదేశంలో పరిస్థితులు ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకుని రావాలని ముందుగా కొందరు దూతలను, వేగులను పంపాడు. వారు దక్షిణ భారతదేశం నలుమూలలా సంచరించారు. కొండలు, కోనలు, అడవులతో పచ్చని ప్రకృతి సౌందర్యంతో అలరారే దక్షిణ భారతదేశం అత్యంత ప్రశాంతంగా కనిపించింది. అడవుల్లో అక్కడక్కడా చక్కని పొదరిళ్లలాంటి రుషి ఆశ్రమాలు కనిపించాయి. వారు తిరిగి లంకకు చేరుకుని, తాము చూసిన పరిస్థితులను రావణుడికి వివరించారు.అంత ప్రశాంతంగా ఉన్న దక్షిణ భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడం తేలిక పనేనని అనుకున్నాడు. తాను కూడా ఒకసారి స్వయంగా పరిస్థితులను చూసి, అవసరమైనట్లయితే యుద్ధానికి తగిన ఏర్పాట్లతో తిరిగి వచ్చి, దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు.కొద్దిమంది అనచరులతో కలసి రావణుడు దక్షిణ భారతదేశానికి వచ్చాడు. కావేరీ తీరం మీదుగా సంచరిస్తూ, అగస్త్యుడి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు. ఆశ్రమం ఆవరణలోనే అగస్త్యుడు కూర్చుని ఉండటం చూసి, రావణుడు ‘మునీశ్వరా! ప్రణామాలు’ అంటూ నమస్కరించాడు.అగస్త్యుడు సాదరంగా స్వాగతం పలుకుతూ, ‘రావయ్యా లంకేశ్వరా! రా! లోపలికి పద’ అంటూ ఆశ్రమం లోనికి తీసుకుపోయి, ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘ఏం పని మీద ఇక్కడకు వచ్చావు?’ అని నేరుగా అడిగాడు అగస్త్యుడు.‘మునీశ్వరా! ఇప్పటికే నేను స్వర్గాన్ని కూడా నా అధీనంలోకి తెచ్చుకున్నాను. ఈ ప్రాంతం మాత్రం ఇంకా నా స్వాధీనంలో లేదు. దీనిని కూడా నా స్వాధీనంలోకి తెచ్చుకుందామనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను’ అని అసలు విషయాన్ని చెప్పేశాడు రావణుడు.‘అది సరే, నువ్వు రుద్రవీణ గొప్పగా వాయిస్తావుటగా! నువ్వు నాతో రుద్రవీణ వాయించి జయించావనుకో, నీ కోరిక నెరవేరుతుంది’ అన్నాడు అగస్త్యుడు.‘సరే, మునీశ్వరా!’ అంటూ అగస్త్యుడితో వీణా వాదన పోటీకి సిద్ధపడ్డాడు రావణుడు.అగస్త్యుడితో రావణుడు వీణా వాదన పోటీకి సిద్ధపడిన వార్త ముల్లోకాలకూ పాకింది. వారి పోటీని తిలకించడానికి దేవ గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ తరలి వచ్చారు. ఇద్దరికీ పోటీ ప్రారంభమైంది. మొదట మంద్రగతిలో ప్రారంభించారు. మధ్యమంలోకి వెళ్లాక పోటా పోటీగా అపురూపమైన రాగాలను పలికించారు. తారస్థాయిలో రావణుడు అగస్త్యుడి ధాటిని, వేగాన్ని అందుకోవడానికి నానా తంటాలు పడసాగాడు. అగస్త్యుడి వీణా వాదనకు చుట్టుపక్కల కొండలు నీరై ప్రవహించసాగాయి. వీణ వాయించడంలో అగస్త్యుడి నైపుణ్యానికి రావణుడు నిరుత్తరుడయ్యాడు. మారు మాట్లాడకుండా ఓటమిని అంగీకరించాడు.‘మహర్షీ! నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీరు సంచరిస్తున్న ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించను’ అని చెప్పి లంకకు వెనుదిరిగాడు.∙సాంఖ్యాయన -
భారత హాకీలో మహరాణి
దేశ రాజధానికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలోని హరియాణా రాష్ట్రంలో.. చారిత్రక గ్రాండ్‌ట్రంక్ రోడ్‌పై శాహాబాద్ పేరుతో ఒక చిన్న పట్టణం ఉంటుంది. దాదాపు 50 వేల జనాభా గల అలాంటి పట్టణాన్ని మామూలుగా అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ అక్కడి ఆడబిడ్డలు దానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అక్కడి అమ్మాయి ఆటలోకి అడుగు పెడితే హాకీ స్టిక్ అందుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఒక్క శాహాబాద్ నుంచే భారత జూనియర్, సీనియర్ మహిళల హాకీ జట్లకు 45 మంది ప్రాతినిధ్యం వహించారు. ఒక దశలో భారత సీనియర్ టీమ్‌లో 12 మంది ఇక్కడివారే కావడం విశేషం. అలాంటి చరిత్ర ఉన్న ఊరు నుంచి వచ్చిన అమ్మాయే రాణి రామ్‌పాల్. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా అరుదైన విజయాలు సాధించి భారత హాకీకి రాణిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తనకంటూ కొత్త చరిత్రను లిఖించుకుంది. రాణి.. జట్టులోకి వచ్చే సమయానికి పలువురు సీనియర్లు ఆట నుంచి తప్పుకుంటు న్నారు. అలాంటి సందర్భంలో తన ఆటతో టీమ్ బెస్ట్ ప్లేయర్‌గా ఎదిగి, తర్వాత 15 ఏళ్ల పాటు జట్టు భారాన్ని మోసింది. ఒంటి చేత్తో పలు కీలక విజయాలు అందించింది. అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత రష్యాలో జరిగిన చాంపియన్స్ చాలెంజ్ టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ సాధించడంతో పాటు యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలవడంతో ఆమె విజయప్రస్థానం మొదలైంది. మరుసటి ఏడాదే అర్జెంటీనాలో జరిగిన వరల్డ్ కప్‌లో 5 గోల్స్ కొట్టిన రాణి ఇక్కడా బెస్ట్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ కప్‌గా నిలవడం విశేషం. 19 ఏళ్ల వయసులో జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు తొలిసారి పతకం సాధించడం (కాంస్యం)లో కీలక పాత్ర పోషించిన ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా శిఖరాన నిలబడింది. అతి పిన్న వయస్కురాలిగా..కులాధిపత్యం, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఖాప్ పంచాయత్‌ల నియమ నిబంధనలు అన్నింటినీ బద్దలు కొట్టి.. షార్ట్ స్కర్ట్స్‌తో అమ్మాయిలు హాకీ ఆడగలగడమే శాహాబాద్లో పెద్ద ఘనత. అలాంటి వారిలో రాణి రామ్‌పాల్ తన అద్భుత ఆటతో మరెన్నో మెట్లు పైకెక్కి తన స్థాయిని పెంచుకుంది. ఆరేళ్ల వయసులోనే హాకీకి ఆకర్షితురాలైన ఆమె స్టిక్ చేతపట్టింది. మరో మూడేళ్ళ తర్వాత స్థానిక హాకీ అకాడమీలో చేరిన అనంతరం రాణి ఒక్కసారిగా దూసుకుపోయింది. హరియణా జట్టు తరఫున స్కూల్ నేషనల్స్, ఆపై జూనియర్ నేషనల్స్‌లో ఆమె అసాధారణ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత సీనియర్ జట్టు ఎంపిక జరుగుతున్న సమయంలో ఆమె పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇంత చిన్న అమ్మాయా.. అంటూ తీవ్రంగా చర్చ సాగినా ఆటలో మేటిగా గుర్తించి సెలక్టర్లు ఎంపిక చేయక తప్పలేదు. ఫలితంగా 14 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టు తరఫున రాణి అంతర్జాతీయ హాకీలోకి అడుగు పెట్టింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. అసాధారణ కెరీర్..మైదానంలో రాణి చూపించిన పదునైన ఆట, చురుకుదనం ఆమెను ఇతర ప్లేయర్లకంటే భిన్నంగా అగ్రస్థానాన నిలబెట్టాయి. ఫార్వర్డ్‌గా కీలక గోల్స్ చేయడంతో పాటు మిడ్‌ఫీల్డర్‌గా కూడా రెట్టింపు బాధ్యతతో ఆడింది. 254 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సాధించిన 120 గోల్స్ రాణిని ప్రపంచ అత్యుత్తమ హాకీ క్రీడాకారిణులలో ఒకరిగా నిలబెట్టాయి. 2009లో జరిగిన ఆసియా కప్‌లో రజతం సాధించిన భారత జట్టులో రాణి సభ్యురాలిగా ఉంది. ఆ తర్వాత 2017లో ఇదే టోర్నీలో జట్టు టైటిల్ సాధించడంలో కూడా ఆమెదే ప్రధాన పాత్ర. ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఆరేళ్ల వ్యవధిలో భారత జట్టు కాంస్య, రజత, స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఆ సమయంలో ప్లేయర్‌గా కెరీర్లో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాణి ప్రదర్శనే ఈ విజయాలకు కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన జట్టులో కూడా రాణి సభ్యురాలు. విజయసారథిగా..ప్రతి ప్లేయర్‌కి కెరీర్లో చెప్పుకోదగ్గ, అత్యుత్తమ క్షణాలు కొన్ని ఉంటాయి. రాణి రామ్‌పాల్ సుదీర్ఘ కెరీర్లోనూ అలాంటివి చాలా ఉన్నాయి. 2018 ఆసియా క్రీడల్లో రాణి సారథ్యంలో జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. అదే ఏడాది జరిగిన వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కి చేరిన జట్టు కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయింది. 1980 తర్వాత 36 ఏళ్లకు 2016 రియో ఒలింపిక్స్‌కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడంలో ప్లేయర్‌గా రాణిదే కీలక పాత్ర. ఆ ఈవెంట్లో టీమ్ విఫలమైనా.. జట్టుపై ఆమె ప్రభావం కొనసాగింది. ఈ క్రమంలో నాయకురాలిగా సమర్థంగా జట్టును నడిపించిన ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌కు టీమ్ అర్హత సాధించేలా చేయగలిగింది. ఈ ఒలింపిక్స్‌లో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రాణి ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేనిది. లీగ్ దశను దాటి హాట్ ఫేవరిట్ ఆస్ట్రేలియాపై క్వార్టర్ ఫైనల్లో సాధించిన సంచలన విజయంతో భారత్ సెమీస్‌కి చేరింది. కాంస్యపతక పోరులో చివరి వరకు పోరాడి 3–4తో బ్రిటన్ చేతిలో మన అమ్మాయిలు ఓడారు. అయితే ఈ నాలుగో స్థానం భారత మహిళల హాకీ చరిత్రలోనే అత్యుత్తమమైంది.ప్రతిభకు పట్టం..టోక్యో ఒలింపిక్స్ తర్వాత వరుస గాయాలు ఆమెను వరల్డ్ కప్‌కు, కామన్వెల్త్ క్రీడలకు దూరం చేశాయి. కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. దాంతో 15 ఏళ్ల అసాధారణ కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ రాణి ఇటీవల 29 ఏళ్లకే రిటైర్మెంట్ను ప్రకటించింది. తన ప్రదర్శనకుగాను అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకుంది. భారతీయ రైల్వే రాయ్‌బరేలీలోని కొత్త హాకీ స్టేడియానికి రాణి పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని ప్రదర్శించింది. రాణి ఘనకీర్తిని గుర్తిస్తూ ఆమె ధరించిన 28 నంబర్ జెర్సీని ఇకపై ఎవరూ వాడకుండా హాకీ ఇండియా దానికీ రిటైర్మెంట్ను ఇవ్వడం విశేషం. -
International Mens Day: మార్కెట్లో మగసిరులు
అందచందాలను కాపాడుకోవడంలో పురుషులు ఏమీ తీసిపోవడం లేదు. సౌందర్య సాధనాల ఖర్చులోను, సౌందర్య పరిరక్షణ సేవల కోసం చేసే ఖర్చులోను మహిళలతో పోటీ పడుతున్నారు. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ అంతర్జాతీయంగా వేగంగా విస్తరిస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్‌ను ముంచెత్తుతున్న కొత్త కొత్త సౌందర్య సాధనాలను కొనుగోలు చేయడంలో పురుషులు ముందంజలో ఉంటున్నారు. అలాగే, అందానికి తగిన అలంకరణ చేసుకోవడంలోను, ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఫ్యాషన్ దుస్తులను ధరించడంలోనూ ‘తగ్గేదే లే’ అంటున్నారు. పురుషుల సౌందర్య పోషణాభిలాష, ఫ్యాషన్ స్పృహ మార్కెట్లో సిరులు కురిపిస్తున్నాయి.అందచందాలను కాపాడుకోవడంలో మహిళలకు కొంత ఎక్కువ శ్రద్ధ ఉండే సంగతి వాస్తవమే అయినా, ఇటీవలి కాలంలో ఈ విషయంలో పురుషులు తామేమీ తీసిపోవడం లేదంటూ నిరూపిస్తున్నారు. నఖ శిఖ పర్యంతం అందంగా కనిపించడానికి తాపత్రయపడుతున్నారు. కేశ సంరక్షణ ఉత్పత్తులకు, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు, ఫ్యాషన్ దుస్తులకు భారీగా ఖర్చుపెడుతున్నారు. పురుషుల్లో సౌందర్య స్పృహ పెరగడం గమనించిన సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థలు కొత్త కొత్త ఉత్పత్తులతో ముందుకొస్తున్నాయి. పురుషుల అలంకరణ వస్తువుల తయారీ సంస్థలు, ఫ్యాషన్ దుస్తుల తయారీ సంస్థలు కూడా పురుషుల అందచందాలను ఇనుమడింపజేయడానికి ఇతోధికంగా పాటుపడుతున్నాయి. ఇటీవలి కాలంలో పురుషుల్లో పెరిగిన సౌందర్య స్పృహకు మార్కెట్ గణాంకాలే అద్దం పడుతున్నాయి.అంతర్జాతీయ గణాంకాల ప్రకారం 2023లో పురుషులు అలంకరణ వస్తువుల కోసం 53.46 బిలియన్ డాలర్లు (రూ.4.50 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 85.53 బిలియన్ డాలర్లకు (రూ.7.20 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. చర్మ సంరక్షణ వస్తువుల కోసం 13.56 బిలియన్ డాలర్లు (రూ.1.14 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 29.61 బిలియన్ డాలర్లకు (రూ.2.49 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. కేశసంరక్షణ వస్తువుల కోసం 32.90 బిలియన్ డాలర్లు (రూ.2.77 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. ఈ ఖర్చు 2032 నాటికి 67.20 బిలియన్ డాలర్లకు (5.65 లక్షల కోట్లు) చేరుకోగలదని అంచనా. పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ చాలాకాలంగా ముందంజలో ఉంటున్నాయి. ఈ దేశాల్లో మార్కెట్ నిలకడగా వృద్ధి చెందుతోంది. ఇటీవలి కాలంలో ఆసియా–పసిఫిక్ దేశాల్లో పురుషుల సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు సౌందర్య ఉత్పత్తుల వినియోగంలో అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నాయి.మన దేశంలో పురుషుల అలంకరణ, కేశసంరక్షణ, చర్మసంరక్షణ ఉత్పత్తుల విక్రయాలు 2023లో రూ.17,696 కోట్లుగా నమోదయ్యాయి. ఈ అమ్మకాలు 2032 నాటికి రూ.34,550 కోట్లకు చేరుకోగలవని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో ఏటా సగటున 7.2 శాతం వృద్ధి నమోదవుతోంది. ఈ వృద్ధి ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల మార్కెట్ వార్షిక సగటు వృద్ధి 6.8 శాతం వరకు నమోదవుతోంది. రానున్న కాలంలో మన దేశంలో పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్ వృద్ధి మరింత వేగాన్ని పుంజుకుని, 12.1 శాతానికి చేరుకోగలదని నిపుణులు చెబుతున్నారు.నవతరం కొత్తపోకడలుతర తరానికీ పురుషుల సౌందర్య సాధనాల వినియోగంలోను, ఫ్యాషన్లలోను మార్పులు సర్వసాధారణం. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే, ఇప్పటి నవతరం యువకులు సౌందర్య సాధనాలు, ఫ్యాషన్లలోను మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలకు పోటీగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెడుతున్నారు. ప్రస్తుత కాలంలో మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న నవతరాన్ని ‘జెన్ ఆల్ఫా’గా పిలుచుకుంటున్నారు. ఈ శతాబ్ది తొలినాళ్లలో పుట్టిన ఈ యువతరం ‘టిక్‌టాక్’ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ‘లుక్ మ్యాక్స్’ ట్రెండ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ముఖాలంకరణలు, వస్త్రాలంకరణలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ‘టిక్‌టాక్’లోనే ‘గెట్ రెడీ విత్ మీ’ అనే ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇందులో భాగంగా నవతరం యువకులు చక్కగా ముస్తాబైన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ, తమకు దీటుగా తయారవగలరా? తమ ఫాలోవర్లకు చాలెంజ్ విసురుతున్నారు. ఇదివరకటి కాలంలో పురుషులు వాడే సౌందర్య సాధనాలు చాలా పరిమితంగా ఉండేవి. సబ్బు, పౌడర్, షేవింగ్ రేజర్, షేవింగ్ క్రీమ్ ఉంటే చాలనుకునేవారు. ఆఫ్టర్‌షేవ్ లోషన్లు వాడేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇటీవలి యువకులు రకరకాల హెయిర్ స్టైల్స్ మారుస్తున్నారు. గడ్డం పెంచేవాళ్లు గడ్డాన్ని ఎప్పటికప్పుడు తీరుగా ట్రిమ్ చేయించుకోవడం, గడ్డానికి పోషణ అందించడానికి బీయర్డ్ వ్యాక్స్ పట్టించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇదివరకు జుట్టు నెరిసినవాళ్లు మాత్రమే జుట్టుకు రంగు వేసుకునేవాళ్లు. ఇటీవలికాలంలో జుట్టు నెరవకపోయినా, జుట్టుకు రకరకాల రంగులు వేసుకుంటున్నారు. శరీరమంతా నిగనిగలాడుతూ మెరిసిపోయేలా చూసుకునేందుకు పెడిక్యూర్, మ్యానిక్యూర్, వ్యాక్సింగ్, బ్లీచింగ్ వంటి సౌందర్యసేవలను పొందడానికి వెనుకాడటం లేదు. పురుషుల సౌందర్య సాధనాల జాబితాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వస్తువులు వచ్చి చేరుతున్నాయి. హెయిర్ జెల్, సన్‌స్క్రీన్ లోషన్, ఫేస్‌వాష్ క్రీమ్, డియాడరెంట్స్, ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్ వంటివి పురుషుల సౌందర్య సాధనాలలో తప్పనిసరి వస్తువులుగా మారుతున్నాయి. ఈ వస్తువులను కూడా ఎంపిక చేసుకోవడంలో ఇప్పటి యువకులు అమిత శ్రద్ధ తీసుకుంటున్నారు. అల్యూమినియం ఫ్రీ డియాడరెంట్, ఆర్గానిక్ ఫేస్‌వాష్ క్రీమ్, నేచురల్ హెయిర్ కలర్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. వీటి ఖరీదు ఎక్కువైనా ఖర్చుకు వెనుకాడటం లేదు. ఫ్యాషన్లపై పెరుగుతున్న శ్రద్ధశరీరాన్ని నిగనిగలాడేలా చూసుకోవడమే కాదు, శరీరానికి తగిన దుస్తులు ధరించడంలోను, వాటికి తగినట్లుగా ఇతర అలంకరణలను ధరించడంలోను ఈ తరం పురుషులు అమిత శ్రద్ధ చూపుతున్నారు. సమయానికి, సందర్భానికి, కాలానికి తగిన ఫ్యాషన్లతో ఆకర్షణీయంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో 537.31 బిలియన్ డాలర్లు (రూ.45.31 లక్షల కోట్లు) నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి 988.24 బిలియన్ డాలర్లకు (రూ.83.33 లక్షల కోట్లు) చేరుకోగల అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల ఫ్యాషన్ దుస్తుల మార్కెట్ వ్యాపారం 2023లో రూ.2.24 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ వ్యాపారం 2028 నాటికి రూ.3.30 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ నిపుణుల అంచనా. దుస్తులు, బెల్టులు, షూస్ వంటివి కొనాలంటే దుకాణాలకు వెళ్లేవారు. ఆన్లైన్ మార్కెట్లు అందుబాటులోకి వచ్చాక చాలామంది ఆన్లైన్లోనే కొనుగోళ్లు సాగిస్తున్నారు. మన దేశంలో ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్లైన్ కొనుగోళ్లలో మహిళల కంటే పురుషులే దూకుడు ప్రదర్శిస్తున్నారు. మహిళలతో పోల్చుకుంటే పురుషులు ఆన్లైన్లో ఫ్యాషన్ దుస్తులు, ఇతర వస్తువుల కొనుగోళ్ల కోసం 36 శాతం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం–ఏ) గత ఏడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. ఈ కొనుగోళ్ల కోసం పురుషులు సగటున రూ. 2.484 మేరకు ఖర్చు చేస్తే, మహిళలు సగటున రూ.1,830 మేరకు ఖర్చు చేసినట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. మరో విశేషం ఏమిటంటే, ఈ కొనుగోళ్లలో మెట్రో నగరాల్లో కంటే, రెండో తరగతి, మూడో తరగతి, నాలుగో తరగతి చిన్న నగరాల్లోని పురుషులే ముందంజలో ఉంటున్నారు. మెట్రో నగరాల్లోని పురుషులు ఫ్యాషన్ దుస్తులు, వస్తువుల ఆన్లైన్ కొనుగోళ్ల కోసం గత ఏడాది సగటున రూ.1,119 ఖర్చు చేస్తే, రెండో తరగతి నగరాల్లో రూ.1,870, మూడో తరగతి నగరాల్లో రూ.1,448, నాలుగో తరగతి నగరాల్లో 2,034 మేరకు ఖర్చు చేసినట్లుగా ఐఐఎం–ఏ అధ్యయనంలో వెల్లడైంది. పురుషుల సౌందర్య చరిత్రపురుషుల సౌందర్య చరిత్ర ఆధునిక యుగం నుంచి ప్రారంభమైందనుకుంటే పొరపాటే! పురాతన నాగరికతల కాలంలోనే పురుషులు తమ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించేవారు. ముఖంపైన, శరీరంపైన రోమాలను తొలగించుకోవడానికి, గోళ్లను కత్తిరించుకోవడానికి కంచు వంటి లోహాలతో తయారు చేసిన రేజర్లు, ట్వీజర్లు, కత్తెరలు, సన్నని చురకత్తులు వంటి పరికరాలను ఉపయోగించేవారు. శిరోజాలంకరణ కోసం రకరకాల సుగంధ తైలాలను, లేపనాలను ఉపయోగించేవారు. ముఖానికి, శరీరానికి చందనం వంటి చెట్ల బెరళ్లతో తయారు చేసిన చూర్ణాలను పూసుకునేవారు. ప్రాచీన ఈజిప్షియన్, రోమన్, గ్రీకు నాగరికతల ప్రజలు అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు.పురుషులు కూడా కళ్లకు రకరకాల వర్ణ లేపనాలను ఉపయోగించేవారు. కొందరు మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని, వాటిని తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునేవారు. మధ్యయుగాల కాలంలో కూడా పురుషులు మీసాలు, గడ్డాలు తీర్చిదిద్దినట్లుగా కత్తిరించుకునే పద్ధతి ఉన్నా, మీసాలు, గడ్డాలు నున్నగా గొరిగించుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా సైన్యంలో పనిచేసే యోధులు, రక్షణ విధులు నిర్వర్తించేవారు ఎక్కువగా మీసాలు, గడ్డాలను పూర్తిగా తొలగించుకునేవారు. అయితే, కళాకారులు, తత్త్వవేత్తలు, మేధావులు వంటి వర్గాల వారు మాత్రం మీసాలు, గడ్డాలు ఏపుగా పెంచుకుని కనిపించేవారు. బారెడు గడ్డం పెంచుకోవడాన్ని మేధావితనానికి చిహ్నంగా భావించేవారు. గడ్డానికి, మేధావితనానికి ఎలాంటి సంబంధం లేదనే సంగతి ఇప్పటి జనాలకు బాగా తెలిసినా, గడ్డాలు పెంచుకోవడం, వాటి పోషణకు నానా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పటికీ ఫ్యాషన్ రంగాన్ని ప్రభావితం చేస్తుండటం విశేషం. గడ్డాల విషయానికొస్తే, విక్టోరియన్ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. విక్టోరియన్ కాలంలో ఇంగ్లండ్‌లో పురుషులకు గడ్డాల పోటీలు జరిగేవి. అందమైన గడ్డాన్ని పెంచుకునేవాళ్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేవారు. గడ్డాలు, మీసాలు పెంచుకోవడం, శరీరానికి రకరకాల లేపనాలు పూసుకోవడం వంటివాటితో పాటు పురుషులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో దుస్తులు ధరించేవారు. రకరకాల టోపీలు, తలపాగాలు ధరించేవారు. నాగరికతల తొలినాళ్ల నుంచి మధ్యయుగాల చివరికాలం వరకు శరీర అలంకరణల్లోను, దుస్తుల ఫ్యాషన్లలోను మహిళలకు ఏమీ తీసిపోకుండా ఉండేవారు. అయితే, ఇరవయ్యో శతాబ్దం నుంచి ఈ ధోరణి మారింది. ఈ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఫలితంగా పురుషుల సౌందర్య సాధనాలు కనీస స్థాయికి చేరుకున్నాయి. సమాజంలోని ఉన్నతవర్గాల పురుషులు తప్ప సామాన్యులు ఫ్యాషన్లలో మార్పులను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇరవయ్యో శతాబ్ది ప్రథమార్ధం అంతా ఇలాగే గడిచింది. సినిమాలు పెరిగి, యుద్ధాలు సద్దుమణిగిన తర్వాత అగ్రరాజ్యాల్లోని ఫ్యాషన్ ప్రపంచంలో నెమ్మదిగా మార్పులు మొదలయ్యాయి. పురుషుల దుస్తుల ఫ్యాషన్లలో ఈ మార్పులు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి. ఈ శతాబ్ది తొలినాళ్ల నుంచి పురుషుల సౌందర్య పోషణ, ఫ్యాషన్ రంగాలు బాగా వేగాన్ని పుంజుకున్నాయి. స్పాలు.. సెలూన్లకు పెరుగుతున్న గిరాకీమహిళలకు ప్రత్యేకంగా బ్యూటీపార్లర్లు చాలాకాలంగా ఉన్నాయి గాని, పురుషుల కోసం హెయిర్ సెలూన్లు తప్ప వేరేవేమీ ఉండేవి కాదు. ఇటీవలి కాలంలో పురుషుల కోసం ప్రత్యేకంగా స్పాలు, బ్యూటీ సెలూన్లు పెరుగుతున్నాయి. పెద్దపెద్ద నగరాల్లోనే కాకుండా, చిన్న పట్టణాల్లోనూ వీటికి ఆదరణ పెరుగుతోంది. ‘కోవిడ్’ మహమ్మారి తర్వాత పురుషుల స్పా సేవలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ‘స్పాబ్రేక్స్’ సర్వే ప్రకారం 2019–23 మధ్య కాలంలో పురుషుల స్పా సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 346 శాతం మేరకు గిరాకీ పెరిగింది. పురుషుల సౌందర్య ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం చేయడం, సెలబ్రిటీలే స్వయంగా సొంత బ్రాండ్స్ ప్రారంభించడం వంటి పరిణామాలు కూడా ఈ వ్యాపారంలో అనూహ్యమైన వృద్ధికి కారణమవుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పురుషుల బ్యూటీ సెలూన్లు, స్పాల వ్యాపారం 2023లో రూ.88,800 కోట్ల మేరకు నమోదైంది. ఈ వ్యాపారం 2032 నాటికి రూ1.86 లక్షల కోట్లకు చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్‌లో పురుషుల స్పా, సెలూన్ల వ్యాపారం కనీసం 7.85 శాతం వార్షిక వృద్ధి సాధించగలదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
సింగర్ అవ్వాలి అనుకున్నా? యాక్టర్ అయ్యాను!
అన్నపూర్ణా సోనీ.. సింగర్ కావాలనుకుని యాక్టర్ అయింది. చక్కటి స్వరం ఒక్కటే ఆమె ప్రత్యేకత అనుకుంది. కానీ, కాలం ఆమెకు నటనపై ఆసక్తిని కలిగించి, వరుస అవకాశాలతో మంచి నటిని చేసింది. ఆ విషయాలే క్లుప్తంగా...మొదటిసారి నా గురించి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు.. మా ఇంట్లో వాళ్లు చాలా హ్యాపీగా ఫీలై, ఆ పేపర్ని ఇరుగు పొరుగు వారందరికీ గొప్పగా చూపించారు. నేనిప్పటికీ అదే ఉత్సాహంతో ఉంటాను. సింగర్ కంటే కూడా మంచి నటి అనే గుర్తింపునే ఇష్టపడతాను. అందుకే క్లిష్టమైన పాత్రల్లో నటించి, గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా! – అన్నపూర్ణా సోనీ.⇒ అన్నపూర్ణా సోనీ మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించింది. చిన్నప్పుడే సంగీతంలో శిక్షణ తీసుకుంది. సంగీతంతోపాటు నాట్యం, నటన, మైమ్.. ఇలా ఎన్నో కళల్లో ప్రతిభ చూపేది.⇒‘వివేచన రంగమండల్’ అనే నాటక సంస్థలో చేరిన తర్వాత అక్కడ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్నెస్డీ) గురించి గొప్పగా విని, ఎలాగైనా అందులో చేరాలని నిశ్చయించుకుంది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. కానీ, రెండో ప్రయత్నంలో సీటు సాధించింది. లఘు చిత్రాలు, స్టేజ్ షోలు చేస్తూ నటనకు మెరుగులుదిద్దుకుంది.⇒ఆమె తొలి లఘు చిత్రం ‘చీపటాకడుంప’ దేశీయంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ లఘు చిత్రాన్ని ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ‘జెండర్ సెన్సిటివిటీ’ అవార్డ్‌నూ గెలుచుకుంది.⇒షార్ట్ ఫిల్మ్స్‌లో ఆమె నటనను చూసిన బాలీవుడ్.. ‘గుడ్‌బై’, ‘ఢిల్లీ క్రైమ్ 2 ’, ‘ ఛపాక్’ వంటి సినిమాల్లో అవకాశాలను ఇచ్చింది. అవన్నీ విజయం సాధించాయి.⇒ఆ విజయాలతో అన్నపూర్ణా వెబ్ దునియా దృష్టిలోనూ పడింది. ‘సన్‌ప్లవర్ ’, ‘రంగ్‌బాజ్ ’, ‘ద రైల్వే మెన్’ అనే సిరీస్‌లతో ఆమె టాలెంట్‌కి వెబ్ స్క్రీన్ కూడా స్పేస్నిచ్చింది. ఆ సిరీస్‌లు జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. -
పిల్లల కథ: మారిన కల్పకి
రాజాపురంలో రంగయ్య ఆనే వర్తకుడు ఉండేవాడు. అతను కొత్తగా ఓ పెద్ద బంగళా కట్టించాడు. కిటికీలకు ఖరీదైన అద్దాలు పెట్టించాడు. అతని ఇంటి ముందు ఓ వేపచెట్టు ఉండేది. చెట్టుపైన కల్పకి అనే కాకి గూడు కట్టుకుంది.అది ఇతర కాకులతో కలవకపోగా, ఇంకో కాకి అటుగా వస్తే ముక్కుతో పొడుస్తూ తరిమేసేది. ఒకరోజు అది ఉదయాన్నే రంగయ్య ఇంటి గోడ మీద కూర్చొంది. యథాలాపంగా కిటికీ అద్దం వైపు చూసింది. అందులోని తన ప్రతిబింబాన్ని మరో కాకిగా భావించి.. ‘కావ్..కావ్’ మని అరిచింది. తన పదునైన ముక్కుతో కిటికీ అద్దాన్ని పొడవసాగింది. అదే చెట్టు మీద ఒక కోతి ఉండేది. అది కల్పకి అద్దాన్ని పొడవటం చూసి ‘మిత్రమా! అద్దాన్ని పొడవకు. పగిలి నీ ముక్కుకు గాయం కాగలదు’ అంటూ హెచ్చరించింది. కోతి మాటలను కల్పకి పట్టించుకోలేదు. కాకి చర్యను గమనించిన రంగయ్య.. పనివాడిని పిలిచి అద్దం మీద గుడ్డ కప్పమని చెప్పాడు. పనివాడు ‘ఉష్షో.. ఉష్షో..’ అని తరుముతూ కల్పకిని వెళ్లగొట్టాడు. అద్దాన్ని గుడ్డతో కప్పేశాడు. కొంతసేపటికి మళ్లీ వచ్చి గోడపై వాలింది కల్పకి. కిటికీ వైపు చూసింది. అక్కడ కాకి కనపడలేదు. దాంతో అది చెట్టు వైపు తిరిగి కోతితో ‘మన దెబ్బకు దడుచుకొని పారిపోయింది చూడు’ అంది గర్వంగా! ‘మిత్రమా.. అది అద్దం. అందులో కనిపించేది నువ్వే! ఇతర కాకులతో ఐక్యంగా ఉండాలి కానీ, ఇలా పోట్లాడకూడదు. పైగా మీ కాకులు ఐకమత్యానికి పెట్టిన పేరు. నువ్వొక్కదానివే ఇలా ఎందుకున్నావ్?’ అంది కోతి. ‘ఈ చెట్టు చుట్టుపక్కల నేనొక్కదాన్నే ఉండాలి. ఇంకో కాకి ఇటు దిక్కే రాకూడదు’ అంటూ ఎగిరి పోయింది కల్పకి. అలా కాకి ఎగిరిపోవడంతో అద్దం మీది గుడ్డను తీసేయమని పనివాడికి చెప్పాడు రంగయ్య. మరునాడు కల్పకి తిరిగి గోడపై వాలింది. అద్దంలో కాకి కనిపించేసరికి మళ్లీ కోపంతో ఠపీ ఠపీమంటూ అద్దాన్ని పొడవసాగింది. దాంతో అద్దం పగిలింది. ఆ గాజుముక్కలు కోసుకుని కల్పకి ముక్కుకు గాయమైంది. అది చూసిన కోతి గబగబా నాలుగాకులు తెచ్చి.. కాకికి పసరు వైద్యం చేసింది. బుద్ధొచ్చిన కల్పకి కోతికి కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత తన కాకుల గుంపును చేరి, క్షమించమని వేడుకుంది. తప్పు తెలుసుకున్న కల్పకిని మిగిలిన కాకులన్నీ క్షమించి తమ గుంపులో కలుపుకున్నాయి. మారిన కల్పకిని చూసి కోతి ఆనందించింది. -
Copenhagen: చికుబుకు చికుబుకు బకనే!
డెన్మార్క్ రాజధాని కోపన్హేగన్కు చేరువలో ఉన్న పిల్లల వినోద కేంద్రం బకన్. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అమ్యూజ్మెంట్ పార్కు. నాలుగు శతాబ్దాలకు పైగా ఇది కొనసాగుతోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అమ్యూజ్మెంట్ పార్కులో పిల్లల వినోదానికి అన్ని రకాల ఏర్పాట్లూ ఉన్నాయి. పచ్చని చెట్లు చేమలతో కళకళలాడుతూ కనిపించే ఈ పార్కు విస్తీర్ణం 75 వేల చదరపు మీటర్లు. ఇందులో ఐదు రోలర్ కోస్టర్లు, నాలుగు లిటిల్ ట్రెయిన్స్, ఒక వాటర్ రైడ్ సహా పిల్లల కోసం 33 క్రీడాకర్షణలు ఉన్నాయి. సుదీర్ఘ చరిత్ర కారణంగా దీనిని చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఏటా ఈ పార్కుకు దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది వస్తుంటారు. ఇందులోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. రకరకాల రైడ్స్, ఇతర వినోద క్రీడా సాధనాలను ఉపయోగించుకోవాలనుకుంటే మాత్రం విడి విడిగా కూపన్లను కొనుక్కోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో పలురకాల క్రీడాసాధనాల కోసం డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే తరచుగా ఇక్కడకు వచ్చే కోపన్హేగెన్ వాసులకు సీజన్ పాస్‌లు కూడా తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి.నీటిబుగ్గతో మొదలైంది..ప్రస్తుతం ఈ పార్కు ఉన్న ప్రాంతానికి అతి చేరువగా ఒక నీటిబుగ్గ ఉంది. పదహారో శతాబ్దిలో కిర్‌స్టెన్ పీల్ అనే స్థానికుడు ఒకరు ఈ నీటిబుగ్గను గుర్తించాడు. కోపన్హేగెన్ శివార్లలో పచ్చని అడవి మధ్యనున్న ఈ నీటిబుగ్గ అనతి కాలంలోనే జనాలను ఆకర్షించింది. కోపన్హేగెన్ నగరంలో సరఫరా అయ్యే నీటి నాణ్యత అప్పట్లో బాగుండేది కాదు. అందువల్ల ఎక్కువమంది జనాలు ఈ నీటిబుగ్గ నుంచి నీరు తీసుకుపోవడానికి ఇక్కడకు వచ్చేవారు. పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉండటంతో 1583లో నీటిబుగ్గకు చేరువగా అడవిలోని కొంతభాగాన్ని శుభ్రం చేసి, పార్కుగా మార్చారు. ఆ తర్వాత డెన్మార్క్, నార్వే ప్రాంతాలను పరిపాలించిన రాజు ఫ్రెడెరిక్–ఐఐఐ 1669లో ఇక్కడి అడవిలో జంతువుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన కొడుకు క్రిస్టియన్–V ఈ పార్కును దాదాపు నాలుగు రెట్లు విస్తరించి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా రూపొందించాడు. అప్పట్లో ఇక్కడ రాచవంశీకులు, కులీనుల పిల్లలు మాత్రమే ఆడుకునేవారు. ఫ్రెడెరిక్–V కాలంలో 1756 నుంచి ఇందులోకి సాధారణ ప్రజలకు కూడా అనుమతి కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్కు కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు చేసుకుంటూ వస్తున్నా, ఏనాడూ దీని తలుపులు మూసుకోలేదు. ‘కోవిడ్–19’ కాలంలో కలిగిన తాత్కాలిక అంతరాయం మినహా ఇది నేటికీ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. -
భక్త మార్కండేయుడు
మృకండు మహర్షి శివభక్తి పరాయణుడు. ఆయన భార్య మరుద్వతి పరమసాధ్వి. ఒక అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని, వారు సాత్విక జీవనం కొనసాగించేవారు. ఎంతకాలమైనా వారికి సంతానం కలగలేదు. ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు పరమశివుణ్ణి ఆశ్రయించాలనే ఉద్దేశంతో వారు కాశీకి చేరుకున్నారు. మృకండు మహర్షి, మరుద్వతి దంపతులు కాశీలోనే ఉంటూ, అక్కడ వెలసిన విశ్వేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండేవారు. ఆలయ సేవ తర్వాత వారు నిత్యం పరమేశ్వర ధ్యానంలోనే గడిపేవారు. కొన్నాళ్లు ఇలా గడిచాక వారి దీక్షకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమశివుడు వారిని పరీక్షించాలనుకున్నాడో, ఏమో: ‘మీకు పుత్రసంతానాన్ని ప్రసాదిస్తాను. అయితే, ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. దుర్మార్గుడై వందేళ్లు జీవించే దీర్ఘాయుష్కుడా లేక సన్మార్గుడై పదహారేళ్లు మాత్రమే జీవించే అల్పాయుష్కుడా?’ అన్నాడు. ‘దుర్మార్గుడైన కొడుకు ఎన్నాళ్లు బతికితేనేం? సన్మార్గుడు, గుణవంతుడు అయిన కొడుకు చాలు. అలాంటి వాడు పట్టుమని పదహారేళ్లు మా కళ్ల ముందు బతికినా అదే పదివేలు’ అన్నారు మృకండు దంపతులు.పరమశివుడి వర ప్రభావంతో మృకండు దంపతులకు ఒక కుమారుడు కలిగాడు. మృకండుడి కొడుకు కావడం వల్ల మార్కండేయుడిగా ప్రసిద్ధి పొందాడు. శివుడి మాట ప్రకారం మార్కండేయుడు ఊహ తెలిసిన నాటి నుంచి సద్గుణవంతుడిగా ఉండేవాడు. బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలనూ చదివేశాడు. ఇలా ఉండగా, ఒకనాడు సప్తర్షులు మృకండు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు అక్కడే ఉన్న మార్కండేయుని చూశారు. దివ్యదృష్టితో పరిశీలించిన వారికి త్వరలోనే ఆ బాలుడి ఆయుష్షు తీరిపోతుందని అర్థమైంది. వెంటనే వారు మార్కండేయుని బ్రహ్మదేవుడి వద్దకు తీసుకుపోయి, తరుణోపాయం చెప్పమని కోరారు.‘నిత్యం శివారాధన చేస్తూ ఉండు. అంతా శుభమే జరుగుతుంది’ అని మార్కండేయుడికి సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు. శివనామ స్మరణ వల్ల అకాలమృత్యువు దాపురించదని సప్తర్షులు కూడా మార్కండేయుడికి చెప్పారు. పెద్దలు చెప్పిన మాట ప్రకారం మార్కండేయుడు ఆనాటి నుంచి శివలింగం ముందు కూర్చుని శివనామ స్మరణ చేయసాగాడు. మార్కండేయుడికి పదహారో ఏడు వచ్చింది. ఒకవైపు అతడికి మృత్యు ఘడియలు సమీపంచసాగాయి. మరోవైపు మార్కండేయుడి శివనామ స్మరణ జోరందుకుంది.మృత్యుఘడియలు ఒక్కో నిమిషమే దగ్గరవుతున్న కొద్ది మార్కండేయుడి శివనామ స్మరణ ఉద్ధృతి తీవ్రంగా మారింది. మృత్యు సమయం ఆసన్నమైంది. మార్కండేయుడి ప్రాణాలను తీసుకు రమ్మని యముడు తన భటులను పంపాడు. యముని ఆదేశంతో వారు బయలుదేరారు. యమభటులు భూమ్మీదకు అడుగుపెట్టే సరికి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఏకధాటిగా శివనామ స్మరణ కొనసాగిస్తూ ఉన్నాడు. యమభటులు అతడు ఉన్నచోటకు అల్లంత దూరంలోనే నిలిచిపోయారు. శివనామ మహిమ ప్రభావంతో అతడిని సమీపించడానికి వారి అడుగులు ముందుకు పడలేదు. చేసేదేమీ లేక వారు వెనుదిరిగి, యముడికి జరిగినందా విన్నవించారు.ఈసారి యముడు తానే స్వయంగా మహిష వాహనంపై హుటాహుటిన బయలుదేరాడు. మార్కండేయుడు ఉన్న చోటుకు చేరుకున్నాడు. మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని, తదేక ధ్యానంలో మునిగి శివనామ స్మరణను నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాడు.‘మార్కండేయా! నీకు మృత్యువు సమీపించింది. ధ్యానం మాని బయటకు రా!’ అని యముడు బిగ్గరగా హుంకరించాడు. యముడి మాటలు విన్న మార్కండేయుడు బయటకు రాలేదు సరికదా, శివలింగాన్ని మరింత గట్టిగా వాటేసుకుని, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. యముడు మార్కండేయుడిని సమీపించలేక, అల్లంత దూరం నుంచే అతడి మీదకు తన పాశాన్ని విసిరాడు. యమపాశం మార్కండేయుడితో పాటు, మార్కండేయుడు గట్టిగా వాటేసుకున్న శివలింగాన్ని కూడా చుట్టుకుంది. శివలింగానికి యమపాశం తాకినంతనే శివుడు క్రోధావేశంతో ప్రళయరుద్రుడిలా అక్కడ ప్రత్యక్షమయ్యాడు.‘నా ఆశ్రయంలో ఉన్న నా భక్తుడి మీదకు, నా మీదకు నీ పాశాన్ని విసురుతావా? ఎంత ధైర్యం?’ అంటూ త్రిశూలంతో యముడిని ఒక్కపోటు పొడిచాడు. యముడు అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటనకు దేవతలందరూ దిగ్భ్రాంతులయ్యారు. హుటాహుటిన శివుడి వద్దకు వచ్చారు.‘యముడే లేకపోతే, జీవుల జనన మరణ చక్రం నిలిచిపోతుంది. దేవాదిదేవా! దయతలచి యముడిని మళ్లీ బతికించు’ అని ముక్తకంఠంతో ప్రార్థించారు. వారి ప్రార్థనలకు శాంతించిన శివుడు యముడిని పునర్జీవితుణ్ణి చేశాడు. ‘మరెప్పుడూ మార్కండేయుడి జోలికి రావద్దు. ఇక నుంచి మార్కండేయుడు చిరంజీవి. అంతేకాదు, ఇకపై శివభక్తులను నరకానికి తీసుకుపోవద్దు’ అని యముడిని హెచ్చరించి విడిచిపెట్టాడు శివుడు.పరమశివుడి అనుగ్రహంతో అల్పాయుష్కుడిగా పుట్టిన మార్కండేయుడు చిరంజీవిగా మారాడు. ∙సాంఖ్యాయన -
fishmonger: తీరిన కోరిక!
కీళ్లపూడిలో కృష్ణప్ప అనే ఓ చేపల వ్యాపారి ఉండేవాడు. చేపల చెరువులో రోజూ చేపలు పట్టుకుని ఓ పెద్ద గంపలో తీసుకెళ్లి పక్కనే ఉన్న రామగిరిలో అమ్ముకుని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేవాడు. వచ్చే ఆదాయంతోనే తన నలుగురు కూతుళ్లను చదివించుకుంటున్నాడు. తండ్రి కష్టాన్ని చూసి కూతుళ్లు బాధపడేవారు. ఈ కారణంగా చదువులపై శ్రద్ధపెట్టారు. ఓ రోజు కృష్ణప్ప గంప నిండా చేపలు పట్టి పక్క ఊరిలో సంతకు బయలుదేరాడు. దారిలో ఓ పెద్ద చేప గంపలో ఎగిరెగిరి పడుతుంటే కిందికి దించి చూశాడు. ఆ చేప దిగులుగా ఉంది. ‘అయ్యా.. నాకు జబ్బుపడ్డ చిన్నారి ఉంది. దాని బాగోగులు చూసుకోవాలి. నేను చూసుకోకుంటే అది బతకదు. అదంటే నాకు చాలా ప్రాణం. వెనక్కి వెళ్లి అది బాగయ్యే వరకు ఉండి వచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను ఎక్కడైనా అమ్ముకో!’ అంటూ కంట తడిపెట్టింది బంగారు చేప.దాని ఆవేదనకు కృష్ణప్ప మనసు కరిగి, వెనక్కి వెళ్లి దాన్ని చేపల చెరువులో విడిచిపెట్టాడు. వేయికళ్లతో ఎదురు చూస్తున్న పిల్ల చేప దగ్గరికి చేరింది ఆ తల్లి చేప. నాలుగురోజుల పాటు దానికి మంచి ఆహారం పెట్టాడు కృష్ణప్ప. వారం రోజులకు, తన పిల్ల చేప ఆరోగ్యం కుదుటపడిన తర్వాత.. గట్టు మీద కూర్చొని చేపలు పడుతున్న కృష్ణప్ప గంపలోకి వచ్చి పడింది బంగారు చేప.ఆశ్చర్యపోయాడు కృష్ణప్ప. ‘నీ బిడ్డ ఆరోగ్యం బాగైందా?’ అడిగాడు. ‘మీ దయ.. మంచి ఆహారం పెట్టడం వల్ల ఆరోగ్యం బాగుపడింది. నా కోరిక తీరింది. ఇక నన్ను ఎక్కడైనా అమ్ముకుని లాభం పొందు’ అంది బంగారు చేప. తీసుకెళ్లాడు కృష్ణప్ప. దాన్ని సంతలో అమ్ముతుండగా బతికున్న ఆ చేపను ఓ ధనవంతుడు చూశాడు. పాతికవేలు ఇచ్చి కొనుక్కుపోయాడు. తీసుకెళ్లి ఉడికించడానికి పెనం మీద వేస్తుండగా ఎగిరి కింద పడింది. ‘అయ్యా.. జబ్బుపడ్డ నా బిడ్డ ఎలా ఉందో ఓసారి చూసుకుని వస్తాను. ఆ తర్వాత వేయించుకుని తిందువు’ అని వేడుకుంది.దాంతో ఆ ధనవంతుడు బంగారు చేపను కృష్ణప్ప వద్దకు తీసుకెళ్లి, విషయం చెప్పాడు. ఆశ్చర్యపోతూ కృష్ణప్ప, ఆ బంగారు చేపను మళ్లీ చెరువులో వదిలిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత అది తన పిల్లతో చెరువు గట్టు మీదకి వచ్చింది. కృష్ణప్ప వద్దకు వెళ్లి ‘నా పిల్లతో సహా నన్ను ధనవంతుడి వద్ద విడిచిపెట్టు’ అంది. కృష్ణప్ప ఆ రెండిటినీ ధనవంతుడి వద్దకు తీసుకెళ్లాడు. దాని నిజాయితీని మెచ్చుకున్న ధనవంతుడు ‘వద్దు కృష్ణప్పా.. వీటిని నువ్వే సంరక్షించు’ అంటూ ఆ రెండిటినీ వెనక్కి పంపాడు. కృష్ణప్ప తన ఇంట్లోనే పెద్ద అక్వేరియాన్ని ఏర్పాటు చేసి ఆ తల్లి, పిల్లను అందులో ఉంచి, ప్రదర్శన ఏర్పాటు చేశాడు.ఆ ఊరి వాళ్లే కాక, ఇరుగు, పొరుగు ఊళ్ల వాళ్లూ వచ్చి ఆ బంగారు చేపల్ని చూసి ఆనందించసాగారు. అలా జనం పెరిగి కృష్ణప్ప ఇంట్లోని అక్వేరియం పెద్ద ప్రదర్శనశాలగా మారిపోయింది. దాంతో కృష్ణప్పకు రోజూ డబ్బులు రాసాగాయి. చేపలు పట్టే పని మానుకుని, చేపల ప్రదర్శనతో వస్తున్న ఆదాయంతో తన పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేశాడు కృష్ణప్ప. ∙బోగా పురుషోత్తం -
పిసినారి పుల్లయ్య
ముక్కామల అనే గ్రామంలో మల్లయ్య, పుల్లయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి ఇళ్లు పక్క పక్కనే ఉండేవి. పుల్లయ్య పిసినారి వాడు. ఉచితంగా వస్తుందంటే ఉరుక్కుంటూ వెళ్లి తెచ్చుకునే రకం. కానీ పుల్లయ్య భార్య ఎల్లమ్మ ఇంటి ముందుకు వచ్చిన భిక్షకులకు.. ఉన్నంతలో ఏదో ఒకటి ఇచ్చి పంపుతుంది. అది చూసిన పుల్లయ్య ఎప్పడూ భార్యతో గొడవకు దిగేవాడు. నేను రేయనక, పగలనక కష్టపడి సంపాదిస్తుంటే నువ్వేమో దానధర్మాలు చేస్తూ ఇంటిని సత్రంగా మారుస్తున్నావు’ అంటూ! ‘ఎందుకండీ.. ఇలా మాట్లాడుతారు. దానధర్మాలు చేస్తే పుణ్యం దక్కుతుంది. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం చేసిన ధర్మాలే మనల్ని కాపాడుతాయి’ అని బదులిచ్చేది ఎల్లమ్మ. ఒకసారి అలా ఎల్లమ్మ జవాబు విని, ‘ఎంత చెప్పినా అంతే! దాని మంకు దానిదే.. నా మాట ఎప్పుడు విన్నది గనుక’ అని విసుక్కుంటూ దొడ్లో ఉన్న పశువులను తీసుకుని చేనుకు వెళ్లాడు పుల్లయ్య.. వాటిని మేపడానికి. అక్కడే ఉన్న మల్లయ్య ‘ఏరా పుల్లయ్యా.. ఇంత పొద్దు పోయింది?’ అని అడిగాడు. ‘ఏముందిరా.. ఊళ్లో వాళ్లందరికీ నా ఇల్లే కనిపిస్తుంది. నా ఇల్లొక సత్రం అయింది. ఎంత చెప్పినా ఎల్లి వినిపించుకోదు. నేనేమో కష్టపడి పైసా పైసా పోగు చేస్తుంటే.. అదేమో దాన ధర్మాలకు ధారపోస్తోంది’ అని ఇంట్లో జరిగిన సంగతి అంతా చెప్పాడు పుల్లయ్య.‘సరే గానీ, ఎండాకాలం వస్తోంది. పక్కనే ఉన్న చెరుకుపల్లి అంగడిలో నాణ్యమైన కుండలు దొరుకుతున్నాయి అని విన్నాను. నేను రేపు వెళ్తున్నాను. నువ్వు కూడా రా.. వెళ్లి కుండలు తెచ్చుకుందాం’ అన్నాడు మల్లయ్య. ‘ఇప్పుడు కుండలకు ధరలు బాగా పెరిగాయి. పొలంలో, ఇంట్లో ఉన్న సిమెంటు గాబుల్లో నీళ్లు చల్లగానే ఉంటున్నాయి కదా? కుండలు అవసరమా! డబ్బులు దండగ కాకపోతే’ అని బదులిచ్చాడు పుల్లయ్య. ‘సరే రా.. నీ ఇష్టం! నేనైతే రేపు పొద్దున బయలుదేరుతాను’ అన్నాడు మల్లయ్య. ఇంటికి వెళ్లాక పుల్లయ్య భార్య కూడా కుండ తెమ్మని పోరు బెట్టడంతో మరుసటి రోజే మల్లయ్యతో కలిసి కుండలు కొనడానికి అంగడికి బయలుదేరాడు పుల్లయ్య. ఇద్దరూ అంగడిలో రకరకాల కుండలను చూశారు. మల్లయ్య ఒక కుండను కొన్నాడు. పుల్లయ్య మాత్రం ‘అమ్మో! ఈ కుండకు ఇంత ధరా! ఇంకా ముందుకు వెళ్తే తక్కువకు దొరుకుతాయి’ అన్నాడు మల్లయ్యతో. ‘నాకు ఓపిక లేదు. నువ్వు వెళ్లు. నేను ఇక్కడే కూర్చుంటాను’ అంటూ ఓ చెట్టు కింద కూర్చున్నాడు మల్లయ్య. పుల్లయ్య ఇంకాస్త ముందుకు వెళ్లాడు. అక్కడ కుండల వ్యాపారితో బేరం చేశాడు. బేరం కుదరలేదు. సంతలోనే ఉన్న ఒక వ్యక్తి ‘ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్లండి. అక్కడ తక్కువకు దొరుకుతాయి’ అని చెప్పాడు. వెంటనే ఒక మైలు దూరం నడుచుకుంటూ వెళ్లి అక్కడ కుండలయ్యతో బేరం సాగించాడు. ‘లేదండీ .. ఆ ధరకు మాకే రాలేదు’ అని అన్నాడు కుండలయ్య. అయినా సరే, పట్టువిడవకుండా అతనితో బేరం చేయసాగాడు. పుల్లయ్య పోరుబట్టలేక తక్కువ ధరకే కుండను ఇచ్చేశాడు ఆ వ్యాపారి. సంతోషంగా కుండను నెత్తిన పెట్టుకొని నడక సాగించాడు పుల్లయ్య. అప్పటికే ఎండ నెత్తిమీదకి ఎక్కడంతో కళ్లు తిరిగి, స్పృహ తప్పి పడిపోయాడు పుల్లయ్య. అందరూ గుమిగూడారు. చెట్టు కింద కూర్చున్న మల్లయ్య వెళ్లి చూడగా.. పుల్లయ్య కిందపడి ఉన్నాడు. వెంటనే ముఖంపై నీళ్లు చల్లి, మజ్జిగ తాగించాడు. స్పృహలోకొచ్చాడు పుల్లయ్య. కుండ పుటుక్కుమనడం చూసి, భోరున విలపించాడు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే, భార్య తిడుతుందేమోనని భయపడి పక్కనే ఉన్న కుండల వ్యాపారి వద్ద చెప్పిన ధరకే మరో కుండను కొన్నాడు. ‘మల్లయ్య మాట వినుంటే బాగుండేది. అనవసరంగా రెండు కుండలు కొనాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు’ అనుకుంటూ నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. విషయం తెలుసుకున్న పుల్లయ్య భార్య పొరకతో తరిమింది. -
ఈవారం కథ: గోపి వాళ్ళ నాన్నకు మంచి ఉద్యోగం
గోపి వాళ్ళ నాన్నకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇంట్లో అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఉద్యోగం కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో గోపికి తెలుసు. నాన్న రోజూ ఆఫీస్ నుంచి వచ్చాక చదువుకుంటూ ఉండేవాడు. ఒకసారి గోపి.. నాన్నతో ఆడుకోవడానికి కుదరట్లేదని పేచీ పెట్టాడు. అప్పుడు వాళ్లమ్మ ‘మన కోసమే నాన్న మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు. మనం ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆయన ప్రయత్నం. ఈ కొన్ని రోజులు నాన్నను చదువుకోనిస్తే, పరీక్ష అయిపోయాక నాన్నతో హాయిగా ఆడుకోవచ్చు’ అని సముదాయించింది. అప్పటి నుంచి గోపి కూడా నాన్నకు మంచి ఉద్యోగం రావాలని కోరుకోసాగాడు. నాన్నను ఇబ్బంది పెట్టకుండా, అమ్మతో ఆడుకోసాగాడు. పరీక్ష రోజున నాన్నతో పాటు గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించాడు. పరీక్ష పాసై, తాను కోరుకున్న ఉద్యాగాన్ని పొందాడు గోపి వాళ్ల నాన్న. ఆయన కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అందరూ అంటుంటే, తను కూడా నాన్నలాగే ఏదైనా సాధించాలి అనుకున్నాడు గోపి. నాన్న కొత్త ఉద్యోగానికి వెళుతున్నాడు. ప్రభుత్వ బడిలో చదివే గోపి కూడా ఇప్పుడు ఊళ్లో ఉన్న పెద్ద బడికి వెళుతున్నాడు. ఆ కొత్త బడి చాలా బాగుంది. బస్సులో వెళ్లడం, రావడం అంతా సరదాగా ఉంది. బట్టలు, భాష అంతా కొత్తగా ఉంది. ‘క్రమశిక్షణతో లేకపోతే ఇంటికి పంపించేస్తారుట. అందుకే జాగ్రత్తగా ఉండాల’ని గోపికి మరీ మరీ చెప్పింది అమ్మ. కొత్త స్నేహితుల పరిచయాలు, వాళ్ల గురించి తెలుసుకోవడం చాలా హుషారుగా ఉంది. నెమ్మదిగా కొత్త బడికి అలవాటుపడ్డాడు గోపి. పాత బడిలో కన్నా ఇక్కడ చాలా బాగుందనిపించింది అతనికి. ఓ ఆదివారం.. పాత బడిలోని స్నేహితులు తమతో ఆడుకోవడానికి గోపిని రమ్మన్నారు. వాళ్లను చూడగానే ఆ అబ్బాయికి చాలా సంతోషమనిపించింది. తన కొత్త బడి సంగతులన్నీ ఒక్కొక్కటిగా వాళ్లకు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభుత్వ బడిలో అవన్నీ లేకపోవడంతో వాళ్లు ఆశ్చర్యంగా వినసాగారు. వాళ్ల ముఖాల్లోని ఆశ్చర్యాన్ని చూస్తూ తనకు తెలియకుండానే మరిన్ని గొప్పలు చెప్పుకుపోసాగాడు గోపి. కాసేపటికి ఆ పిల్లలకు విసుగనిపించింది. దాంతో ఆడుకోకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు. గోపికి కోపం వచ్చింది. ఇంకెప్పుడూ వాళ్లతో మాట్లాడకూడదనుకున్నాడు. దిగులుగా కూర్చున్నాడు. ఇంతలో గోపికి ఎంతో ఇష్టమైన కిరణ్ మామయ్య వచ్చాడు. అతన్ని చూడగానే గోపి దిగులు ఎగిరిపోయింది. కిరణ్ మామయ్య, గోపి వాళ్ల నాన్నతో కలిసి పని చేసేవాడు. ఇరు కుటుంబాలు చాలా స్నేహంగా ఉంటాయి. కిరణ్ మామయ్యతో కొత్త బడి విశేషాలను చెప్తుండగా నాన్న వచ్చాడు. గోపి వాళ్ల నాన్న కూడా కిరణ్ మామయ్యను చూడగానే ఎంతో ఉత్సాహంగా పలకరించాడు. వాళ్ల పాత ఆఫీసులో సంగతుల గురించి, తన స్నేహితుల గురించి అడిగి తెలుసుకున్నాడు నాన్న. ఒకరిద్దరి స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. కొత్త ఆఫీసు గురించి పెద్దగా ఏమీ చెప్పలేదు. ఇదివరకటిలాగానే ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. నాన్న ఇప్పుడు కిరణ్ మామయ్య కన్నా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయినా ఎందుకు తన గురించి ఎక్కువ చెప్పుకోవట్లేదు? తను అలా ఎక్కువ చెప్పుకోవడం వలనే తన స్నేహితులు వెళ్లిపోయారా? ఆలోచించసాగాడు గోపి!∙డా. హారిక చెరుకుపల్లి -
Funday Story: మంత్రి గారి నేర్పు
సమీర రాజ్యాన్ని సమీరుడనే రాజు పరిపాలించేవాడు. ఒకరోజు ఆస్థానానికి ఇద్దరు యువకులతో కలిసి ఒక వ్యక్తి వచ్చాడు. ‘మహారాజా! నాపేరు సుమంతుడు. నేను కొన్ని ప్రశ్నలు అడిగి సభాసదుల తెలివిని పరీక్షించాలనుకుంటున్నాను. నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి పదివేల వరహాలిస్తాను. ఎవరూ చెప్పలేకపోతే మీ రాజ్యం తరుపున మీరు ఓటమిని అంగీకరించి పదివేల వరహాలివ్వాలి’ అన్నాడు. అది రాజ్యం పరువు, ప్రతిష్ఠలకు సంబంధించినది కావడంతో రాజు అంగీకరించాడు. ‘మహారాజా! ఈ యువకుల్లో వీడు సూర్యుడు, వాడు చంద్రుడు. ఈ ఇద్దరిలో ఒకడు మాత్రమే నా కుమారుడు. వారిని పలకరించకుండా నా కుమారుడు ఎవరో చెప్పగలరా?’ అని అడిగాడు. రాజు సభవైపు చూశాడు. ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో మంత్రి వైపు చూశాడు. మంత్రి ఆ యువకులను తన దగ్గరకు పిలిచి, కరచాలనం చేసి, వారి చేతులను తన చేతుల్లోకి తీసుకుని జాతకం చూసే వారిలాగా పరిశీలించి .. వాళ్ల స్థానాల్లోకి తిరిగి పంపించేశాడు. ‘సుమంతా! వీరిలో సూర్యుడు నీ కుమారుడు’ అన్నాడు మంత్రి.‘మహామంత్రీ.. మీరు చెప్పింది సరైన సమాధానం. ఈ ఇద్దరిలో ఒకరికి తల్లి లేదు. చిన్నప్పుడే చనిపోయింది. తల్లి లేని వారెవరో చెప్పగలరా?’ అడిగాడు సుమంతుడు. ‘సుమంతా! నీ కుమారుడు సూర్యుడే తల్లి్లలేని బిడ్డ’ చెప్పాడు మంత్రి.‘మీ సమాధానం సరైనదే. ఈ ఇద్దరిలో ఒకరు వైద్యరంగంలో, మరొకరు విలువిద్యలో ఆరితేరారు. ఎవరు ఏ విద్య నేర్చుకున్నారో చెప్పగలరా?’ అడిగాడు సుమంతుడు.మంత్రి చిరునవ్వు నవ్వి ‘సుమంతా! నీ కుమారుడు సూర్యుడు విలువిద్య, చంద్రుడు వైద్యవిద్య నేర్చుకున్నారు’ అని చెప్పాడు.‘మంత్రివర్యా! మీరు చెప్పింది సరైనదే. వీరిలో ఒకరికి మాత్రమే వివాహమయింది. ఎవరికో చెప్పగలరా?’అని మరో ప్రశ్న అడిగాడు. ‘సుమంతా! మీ కుమారుడికి వివాహమయింది’ అన్నాడు మంత్రి.సుమంతుడు తన ఓటమిని అంగీకరించి పదివేల వరహాలు మంత్రి చేతిలో పెట్టాడు. మంత్రి ఆ వరహాలను సుమంతుడికే తిరిగి ఇస్తూ మరో పదివేల వరహాలతో సత్కరించి పంపాడు.మంత్రితో రాజు ‘మంత్రివర్యా! నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు సరైన సమాధానాలు ఎలా చెప్పగలిగారు?’ అని అడిగాడు. సభాసదులందరూ మంత్రి మాటల కోసం చెవులు రిక్కించారు. ‘మహారాజా! ఆ యువకుల చేతులను ఒక్క నిమిషం పరిశీలించి పంపాను కదా! సూర్యుడి చేతిపై సుమంతుడి పేరు చిన్న అక్షరాల్లో పచ్చపొడిచి ఉంది. దాంతో సుమంతుడి కొడుకు అతడే అని గ్రహించాను. చేతిపై తండ్రి పేరు మాత్రమే ఉంది కాబట్టి తల్లి చిన్నతనంలోనే చనిపోయి ఉంటుందని భావించాను. విలువిద్య నేర్చినవారు వింటినారి లాగి అనేక బాణాలు సంధించడం వల్ల చూపుడువేలు, బొటనవేలు భాగాలు కంది ఉంటాయి. సూర్యుడి చేతివేళ్లు అలా ఉండడం చూశాను కాబట్టి సూర్యుడే విలువిద్య నేర్చుకున్నాడని, చంద్రుడు వైద్యవిద్య నేర్చుకున్నాడని గుర్తించాను. సూర్యుడి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో ఆ ఇంట్లో ఆడవారు లేకుండాపోయారు. కాబట్టి సూర్యుడికి వయస్సు రాగానే వివాహం చేసి ఉంటారని గ్రహించాను’ అంటూ వివరించాడు మంత్రి.‘చేతిపై పేరు లేకుంటే ఎలా గుర్తించేవారు?’ అడిగాడు రాజు. ‘అదేముంది మహారాజా! చాలా కుటుంబాల్లో పెద్దల పేర్లు, పిల్లల పేర్లు వారు నమ్మిన దైవం పేరులోని మొదటి అక్షరంతో ఉంటాయి. అలా పెట్టుకోవడం విశ్వాసం. ఇక్కడ తండ్రి పేరు సుమంతుడు, కనుక కొడుకు పేరులో మొదటి అక్షరం ‘సు’ ఉండాలి. కాబట్టి సుమంతుడి కొడుకు సూర్యుడని గ్రహించేవాడిని. మంత్రి సునిశిత పరిశీలనకు, నేర్పుకు రాజు ఆశ్చర్యచకితుడై అభినందించాడు. సభాసదులు హర్షధ్వానాలు చేశారు. ∙డి.కె.చదువులబాబు -
14 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పాల్గొని....
ఒలింపిక్స్.. ప్రపంచ క్రీడల్లో అత్యుత్తమ, అతి పెద్ద మెగా ఈవెంట్. ఆటలంటే ఇష్టం ఉండే మన చిన్నారులందరూ టీవీల్లో ఒలింపిక్స్ పోటీలను చూస్తూనే ఉంటారు. ఇటీవల.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 2024 ఒలింపిక్స్ పోటీలు జరిగాయి. స్పోర్ట్స్‌లోకి వచ్చిన వారందరికీ ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే లక్ష్యం ఉంటుంది. ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత బాగా ఆడితేనే ఒలింపిక్స్ వరకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కర్ణాటకకు చెందిన ధీనిధి డేసింగు అనే అమ్మాయి కూడా అలాగే కలలు కన్నది. స్విమ్మర్ అయిన ఈ అమ్మాయి ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు చాలా శ్రమించింది. ఎట్టకేలకు తన స్వప్నాన్ని నెరవేర్చుకుంది. అయితే ఈ క్వాలిఫికేషన్ సాధించడమే గొప్ప కాదు. దీంతో ఆమె మరో అరుదైన, ఆసక్తికరమైన ఘనతను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో ఆడే సమయానికి ధీనిధి వయసు ఎంతో తెలుసా.. కేవలం పద్నాలుగేళ్లు. బెంగళూరులో ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ వయసు పిల్లలు అందరూ స్కూల్లో పాఠాలు చదవడంలో బిజీగా ఉంటే ధీనిధి ఏకంగా ఒలింపిక్స్‌లో పాల్గొని తన ప్రతిభను రుజువు చేసుకుంది. చిన్న వయసులోనే ఆటల్లో రాణించాలనుకునే అందరికీ ఆమె స్ఫూర్తిగా నిలిచింది. తల్లిదండ్రులు అండగా ఉండి..ఒలింపిక్స్ వరకు చేరే క్రమంలో ధీనిధి తనను తాను మలచుకున్న తీరు చిన్నారులందరికీ ప్రేరణనిస్తుంది. ఆమెకు మూడేళ్లు వయసు వచ్చిన తర్వాత కూడా మాటలు రాలేదు. ఇంజినీర్లు అయిన తల్లిదండ్రులు శ్రీనివాసన్, జెసితలకు ఇది ఆందోళన కలిగించింది. డాక్టర్లను కలిసి చికిత్స అందించిన తర్వాత పరిస్థితి మెరుగైంది. అయితే వయసు పెరుగుతున్నా కొత్తవాళ్లతో కలవడంలో, వారితో మాట్లాడటంలో ధీనిధికి భయం పోలేదు. అందుకే అందరికీ దూరంగా, ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడేది. తన చదువు తాను చదువుకోవడం మినహా ఇతర విషయాలను పట్టించుకోకపోయేది. అయితే ఆ పరిస్థితి మారాలంటే ఏం చేయాలనే ఉపాయాన్నీ వైద్యులే సూచించారు. చిన్న పిల్లలకు ఆటలంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఆటలో చేర్పిస్తే కలివిడితనం పెరిగే అవకాశం ఉంటుందని వారు చెప్పారు. తల్లిదండ్రులిద్దరికీ బ్యాడ్మింటన్ అంటే బాగా ఇష్టం. అయితే దానిని నేర్చుకునేందుకు చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆ ఆలోచన మానుకొని తమ ఇంటి పక్కనే ఉన్న స్విమింగ్ పూల్‌లో ఈత నేర్చుకునేందుకు చేర్పించారు. ఆమె కొందరు స్నేహితులను సంపాదించుకుంటే చాలనేది మాత్రమే వారి ఆలోచన. అయితే తమ అమ్మాయి ఊహించినదానికంటే వేగంగా దూసుకుపోయి ఒలింపిక్స్ స్థాయి వరకు వెళుతుందని అప్పుడు వారికి తెలీదు. తొలి గెలుపు తర్వాత...తల్లిదండ్రులు స్విమింగ్‌లో చేర్పించినా.. అక్కడా ధీనిధి అంత ఇష్టం చూపించలేదు. ముందుగా నీళ్లంటే భయంతో పూల్‌లోకి దిగడానికే వెనుకాడింది. అయితే వాళ్లిద్దరూ అక్కడే ఉండి ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు తొలి అడుగు వేసింది. ఇలాంటి పిల్లలను తీర్చిదిద్దడంలో మంచి పేరున్న అక్కడి కోచ్ నెమ్మదిగా ఆమెకు ట్రైనింగ్ ఇవ్వడంతో స్విమింగ్ అంటే భయం పోయింది. ఆ తర్వాత ఆ కోచ్ మరింత శిక్షణతో స్థానిక పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అక్కడే ఒక రేస్‌లో గెలవడంతో ఆ అమ్మాయికి కొత్త ఉత్సాహం వచ్చింది. పూల్‌లో మరిన్ని సంచలనాలకు సిద్ధమైంది. వరుస విజయాలతో..ఎనిమిదేళ్ల వయసులో ధీనిధి స్విమింగ్ నేర్చుకుని, తర్వాత ఆరేళ్లలోనే ఒలింపిక్స్ స్థాయికి ఎదగడం విశేషం. బెంగళూరులో ఎంతో పేరున్న డాల్ఫిన్ అక్వాటిక్స్లో చేరడంతో ఒక్కసారిగా ఆమె ఆటలో పదును పెరిగింది. అన్నింటికంటే ముందుగా కర్ణాటక మినీ ఒలింపిక్స్‌లో స్విమింగ్‌లో అందుబాటులో ఉన్న అన్ని పతకాలనూ గెలుచుకొని తన రాకను ఘనంగా చాటింది. ఆపై జాతీయ సబ్‌జూనియర్ చాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డు నెలకొల్పి.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ పోటీల్లో 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో పాల్గొన్న ఆమె ఇప్పటికీ దానినే తన ప్రధాన ఈవెంట్‌గా కొనసాగిస్తోంది. ఆ తర్వాత జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో అందరి దృష్టీ పడగా.. 12 ఏళ్ల వయసులో జాతీయ సీనియర్ స్విమింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో ధీనిధి సత్తా అందరికీ తెలిసిపోయింది. గోవా జాతీయ క్రీడల్లో ఆమె ఏకంగా 7 స్వర్ణ పతకాలు గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో జరిగిన ఏజ్ గ్రూప్ పోటీల్లో కూడా పాల్గొని వరుసగా పతకాలు గెలుచుకుని, తన ప్రతిభకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ స్థాయిని పెంచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో...జాతీయ స్థాయిలో టాప్ స్విమ్మర్‌గా ఎదిగిన ధీనిధి తర్వాత లక్ష్యం సహజంగానే అంతర్జాతీయ పోటీలకు మారింది. భారత టాప్ స్విమ్మర్‌గా 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కింది. 13 ఏళ్ల వయసులో భారత బృందంలో అతి పిన్న వయస్కురాలిగా ఆమె ఒక మెగా ఈవెంట్లో తొలిసారి అడుగు పెట్టింది. ఆ తర్వాత దోహాలో జరిగిన వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొనడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇదే క్రమంలో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించడంలో సఫలమైంది. ప్రపంచ అగ్రశ్రేణి స్విమ్మర్లతో పోలిస్తే పతకాల విషయంలో ధీనిధి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో ఈ అమ్మాయి ప్రదర్శన చూసిన తర్వాత.. ఇంత చిన్న వయసులో ఇంతటి ప్రతిభను కనబర్చడం అసాధారణమని, భవిష్యత్తులో అగ్రశ్రేణికి ఎదిగే నైపుణ్యం, తగినంత సమయం కూడా ఆమె వద్ద ఉందని అక్కడి విదేశీ కోచ్‌లు, నిపుణులు వ్యాఖ్యానించడం ధీనిధి బంగారు భవిష్యత్తు గురించి తెలియజేస్తోంది. -
Manasvi Kottachi: బేబీ మనస్వి
వారసత్వంగా పరిచయమై కొంతమంది పేరు తెచ్చుకుంటే.. మరి కొంతమంది తమ ప్రతిభతో కుటుంబానికి వన్నె తెస్తారు. అలాంటి వారిలో బాల నటి మనస్వి కొట్టాచ్చి ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంటరై, తండ్రికే పోటీ ఇచ్చి, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ లిటిల్ స్టార్ గురించి∙ కొన్ని విషయాలు..⇒ నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. రకరకాల నాన్‌వెజ్ ఐటమ్స్ తినొచ్చనే నాన్నతో కలిసి షూటింగ్స్‌కు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు నటనపై ఇష్టం, ప్రేమతో పాటు సీరియస్‌నెస్ కూడా పెరిగింది.– మనస్వి కొట్టాచ్చి.⇒∙చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.⇒ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సినీ ప్రపంచంలోనే ఉంది మనస్వి. మూడేళ్ల వయసులో ‘సూపర్ డాడీ’ టీవీ షో ద్వారా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.⇒ చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.⇒ఈ చిన్నారి నటనకు ముచ్చటపడిన మలయాళ చిత్రపరిశ్రమా చక్కటి అవకాశాలను ఇచ్చింది. అందులో ఒకటే ‘మై శాంటా’ మూవీ. ఇందులో ఆమెది ప్రధాన పాత్ర. శ్రీమణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ చిత్రం ‘కన్మణి పాప’లోనూ ముఖ్య భూమికే! ⇒ తర్వాత ‘ఇమైక్క నొడిగళ్’ అనే చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో నయనతార కుమార్తెగా నటించింది. ఇది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆపై ‘దర్బార్’, ‘మామణిదన్’, ‘చంద్రముఖి–2’ వంటి సినిమాల్లోనూ నటించింది.⇒మనస్వి నటించిన ‘మామణిదన్’ను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దాని ఫలితంగా మనస్వికి బాలీవుడ్‌లోనూ చాన్స్ వచ్చింది. ఆమె నటించిన హిందీ సినిమా ‘బేబీ కాజల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
పిల్లలూ దేవుడూ చల్లని వారే
పాటలు హీరో, హీరోయిన్ల సొంత సొత్తు కాదు. ఒకప్పుడు సినిమాల్లో పిల్లల పాత్రలు ఉండేవి. వారికి పాటలు ఉండేవి. పిల్లలు కథను నడిపించేవారు. పాటలు పాడి కథను నిలబెట్టేవారు. పిల్లల పాటల కోసం సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయి. పిల్లల పాటలతో స్టార్స్ అయిన బాల నటీనటులు ఉన్నారు. కాని నేటి సినిమాల్లో పిల్లల పాటలు కనుమరుగయ్యాయి. వారి గొంతును వినపడనివ్వడం లేదు.పిల్లల పాట మళ్లీ బతకాలి. పిల్లల పాత్ర మళ్లీ నిలవాలి.‘లేరు కుశలవుల సాటి...సరి వీరులు ధారుణిలో’....‘లవ కుశ’లో లవుణ్ణి, కుశుణ్ణి చూడటానికి పల్లెల నుంచి జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు. వారి నోటి నుంచి రామాయణ గాథను పాటలుగా విని పరవశించి పోయేవారు. ఉద్వేగంతో ఆనందబాష్పాలు రాల్చేవారు. పెద్దలు రామాయణం చెప్తేనే ఎంతో రుచిగా ఉంటుందే, మరి పిల్లలు చెప్తే ఇంకెంత రుచి!శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా!ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా!చెప్పాలంటే మనవాళ్లు చాలా గొప్పోళ్లోయి! ఏమంటే 1934లోనే లవకుశ తీశారు. అందులోని బాలనటులను, వారి పాటలను చూసి డబ్బులు కుమ్మరించారు. దాంతో దర్శకుడు సి.పుల్లయ్య పిల్లలు ప్రధాన పాత్రలుగా అంటే పిల్లలే అన్ని పాత్రలు చేసేలా ‘సతీ అనసూయ’ (1936) సినిమా తీసి దాంతో పాటు మరో పిల్లల సినిమా ‘ధ్రువ విజయం’ తీసి ఒకే టికెట్ మీద ఈ రెండు సినిమాలు ప్రదర్శించి రికార్డు స్థాపించారు. ఇలా మరో భాషలో జరగలేదు. ఈ విషయం మనవారు ప్రచారం చేసుకోరు. అన్ని పాత్రలను బాలలే ధరించిన సినిమాను దేశంలో తొలిగా తీసింది మనమే.చిన్నప్పుడు పెద్దప్పుడు:పాఠకులు ప్రేక్షకులుగా మారుతున్న కాలం. చదివే కథ నుంచి చూసే కథకు మారాలంటే వారికి ‘సినిమా’ అనే మీడియం మెల్లగా అలవాటు చేయాలి. అందుకని దర్శకులు కథను మెల్లగా చెప్పేవారు. కథానాయిక, నాయకుల జీవితాన్ని బాల్యం నుంచి మొదలుపెట్టి వారు పెద్దయ్యాక ఏం జరుగుతుందో చూపేవారు. అందువల్ల నాటి సినిమాల్లో పిల్లల పాత్రలు తప్పనిసరిగా ఉండేవి. ‘మల్లీశ్వరి’ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్, చిన్నప్పటి భానుమతిగా నటించిన మాస్టర్ వెంకటరమణ, బేబీ మల్లిక –‘రావిచెట్టు తిన్నె చుట్టు రాతి బొమ్మలు చెక్కాలోయ్మంచి బొమ్మలు చెక్కాలోయ్ నీ మల్లి బొమ్మలు చెక్కాలోయ్’అని పాడుకుంటే చూడటం ముచ్చటగా ఉంటుంది. మరి ఇవాళ రావిచెట్టు ఎంతమంది పిల్లలకు తెలుసో, తిన్నె అనే మాట ఎంతమంది పిల్లలకు అర్థమవుతోందో!అక్కినేని ‘దేవదాసు’లో చిన్నప్పటి దేవదాసు, చిన్నప్పటి పార్వతి పాడుకుంటారు. స్కూల్ ఎగ్గొట్టి తిరిగే దేవదాసును పార్వతి ఆ పాటలో ఆట పట్టిస్తుంది.‘ఓ దేవదా.. చదువు ఇదేనాఅయ్యవారు నిదరోతే తమరు ఇలాగే దౌడుదౌడా’...ఇక నేటికీ నిలిచి వెలుగుతున్న ‘నిదురపోరా తమ్ముడా’ పాట సంతానంలో రెండు సందర్భాల్లో వస్తుంది. ఒకటి చిన్నప్పుడు, ఒకటి పెద్దప్పుడు. చిన్నప్పటి పాటలో లతా మంగేశ్కర్ మూడు చరణాలు పాడితే, పెద్దప్పటి పాటలో ఒక చరణం ఘంటసాల పాడారు. చిన్నప్పటి పాటలో లతా–‘కలలు పండే కాలమంతా కనుల ముందే కదిలిపోయేలేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిదురపోరా తమ్ముడా’... అని పాడుతుంటే కలత నిద్రలతో బతుకుతున్న వారంతా కన్నీరు కారుస్తారు.బొమ్మల పెళ్లి:నాటి సినిమాలు పిల్లల్నే కాదు పిల్లల ఆటపాటల్ని కూడా పట్టించుకున్నాయి. అప్పటి పిల్లలకు బొమ్మల పెళ్లి చేయడం ఒక పెద్ద సరదా. ఈ బొమ్మల పెళ్లిళ్లు పిల్లల మధ్య నిజం పెళ్లిళ్లుగా మారి కథలు మలుపు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వీడియో గేమ్‌లు ముంచెత్తే ఈ రోజుల్లో పిల్లలు బొమ్మలు అనే మాట ఎత్తడం లేదు. పెద్దలు కూడా సెల్‌ఫోన్ నే బొమ్మగా చేతిలో పడేస్తున్నారు. బొమ్మలు పిల్లలకు నేస్తాలు. వాటినే సర్వస్వంగా భావించి ఆలనా పాలనా చూసి పెళ్లిళ్లు చేసేవారు పిల్లలు. ‘కన్యాశుల్కం (1955)’లో బొమ్మల పెళ్లి కోసం పిల్లలు పాడే పాట చాలా బాగుంటుంది.చేదాము రారే కల్యాణము... చిలకా గోరింక పెళ్లి సింగారము...‘మాంగల్యబలం’ (1959)లో పిల్లలు పాడే బొమ్మల పెళ్లి పాట వైవాహిక జీవితానికి ఒక వ్యాఖ్యానం లాంటిది. ఈ పాటను శ్రీశ్రీ రాశారంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత సంప్రదాయ భావనలను ఇంత బాగా ఎలా రాశాడా అని.హాయిగా ఆలుమగలై కాలం గడపాలివేయేళ్లు మీరనుకూలంగా ఒకటై బతకాలి...తర్వాతి రోజుల్లో అక్కినేని పక్కన హీరోయిన్ గా ‘ప్రేమాభిషేకం’ వంటి సూపర్‌హిట్‌ను సాధించిన శ్రీదేవి బాలనటిగా అదే అక్కినేని ‘శ్రీమంతుడు (1971)’ లో బొమ్మల పెళ్లి పాట పాడింది. అంత చిన్న వయసులో ఆమె ఎక్స్ప్రెషన్ ్స చూడాలి ఇప్పుడైనా. భలే ఉంటాయి. మరి పాటో?చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలుబుల్లిబుల్లి రాధకు ముద్దుముద్దు రాజుకుపెళ్లండీ పెళ్లి ముచ్చటైన పెళ్లిమర్యాదలు చెప్తూ... అల్లరి చేస్తూ:పిల్లలు అల్లరి చేస్తే ముద్దు. అలాగే వారు బుద్ధిమంతులుగా ఉంటే మరీ ముద్దు. అల్లరి చేయడం పిల్లల హక్కు అనేది మర్చిపోయి, ఇవాళ వాళ్లను ఊపిరి సలపని హాస్టళ్లలో పడేసి తెగ తోమిస్తున్నారు తల్లిదండ్రులు. పరీక్షల భయం ఇవాళే కాదు ఆవాళ కూడా ఉంది. అందుకే ‘పెళ్లి చేసి చూడు’ (1952)లో స్టేజి నాటకంలో చిన్నారి బాలుడు పరీక్షలు ఎగ్గొట్టడానికి దొంగ కడుపునొప్పి తెచ్చుకుని పాడే పాట అల్లరి... చాలా వల్లరి.అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులేఫస్టుక్లాసులో పాసవుదామని పట్టుబట్టి నే పాఠాల్ చదివితేపరీక్షనాడే పట్టుకున్నదే బడికెట్లా నే వెళ్లేదే?ఇలా అల్లరి చేసే పిల్లలే సుద్దులు కూడా చెబుతారు. కె.వి.రెడ్డి తీసిన ‘దొంగరాముడు’ అల్లరి చేసే చిన్న అక్కినేనికి, చిన్న సావిత్రి సుద్దులు చెబుతుంది. ఎలా మసలుకోవాలో హితబోధ చేస్తుంది.తెలిసిందా బాబూ ఇపుడు తెలిసిందా బాబు అయవారు తెలిపే నీతులు ఆలించకపోతే వాతలే...కె.విశ్వనాథ్ తొలి సినిమా ‘ఆత్మగౌరవం’లో ఆయన ఎంత మంచి పాట పెట్టారంటే ఇంటికి వచ్చిన అతిథులను ఆ ఇంటి పిల్లలు ఎలా గౌరవించి ఆహ్వానించాలో అందులో ఉంటుంది. ఇంటి సంస్కారం పిల్లల ప్రవర్తనలోనే తెలుస్తుంది. ఇవాళ ఇంటికి బంధువులొస్తే పిల్లలు పలకరించనైనా పలకరించట్లేదు– నమస్కారం పెట్టే సంగతి తర్వాత. అంతే కాదు తమ గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులు వారిని అందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. కాని ఆత్మగౌరవంలో రేలంగి, గుమ్మడి అతిథులుగా వస్తే పిల్లలు ఎంత బాగా పాడతారో!మారాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారుమామంచి వారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు...భక్తి... దైవభక్తి:పిల్లలకు దేవుడు మంచి స్నేహితుడు. పిల్లలు దేవుని మీద సందేహం లేని భక్తి పెట్టుకుంటారు. పిల్లల ద్వారా భక్తిని చెప్పేందుకు ‘యశోదకృష్ణ’, ‘భక్త ప్రహ్లాద’, ‘భక్త ధ్రువ మార్కండేయ’లాంటి సినిమాలు వచ్చి ప్రజాదరణ పొందాయి. ‘యశోదకృష్ణ’తో శ్రీదేవి, ‘భక్త ప్రహ్లాద’తో రోజా రమణి పెద్ద స్టార్స్ అయ్యారు. ‘భక్త ప్రహ్లాద’లో ప్రహ్లాదుడు పాడిన పాటలు హిట్.నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనంమరోపాట–జీవము నీవే కదా...నేటికీ నిలిచి ఉన్నాయి.ఇక ‘లేత మనసులు (1966)’తో స్టార్ అయిన ‘కుట్టి పద్మిని’ పాడిన ఈ పాట 60 ఏళ్ల తర్వాత కూడా చల్లదనాన్ని కురిపిస్తూనే ఉంది.పిల్లలూ దేవుడూ చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులే...‘మూగనోము’లో–తల్లివి నీవే తండ్రివి నీవేచల్లగ కరుణించే దైవము నీవే....సంభ్రమం... సందేహం:పిల్లలకు సందేహాలు జాస్తి. అలాగే ప్రతిదానికీ వారు వింత పడతారు. ఇప్పటి పిల్లల్లా అన్నీ గుగుల్ ద్వారా తెలుసుకొని నిమ్మళంగా ఉండిపోరు. పెద్దలను విసిగించేవారు. అలా పిల్లలకూ పెద్దలకూ ఒక సంభాషణ జరిగేది. ‘బాలరాజు కథ’లో ఈ పాట చూడండి–అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయొద్దుఏమిటీ రహస్యం స్వామి ఏమిటీ విచిత్రంఆ రోజుల్లో ఫోన్ ఒక వింత. ఇంట్లో ఫోన్ ఉండటం ఒక హోదా. ఇరుగింటి పొరుగింటి వారికి అది పి.పి. నంబర్. ఇంట్లో పిల్లలకు ‘ట్రింగ్ ట్రింగ్’మన్నప్పుడల్లా సరదా. ఫోన్ రాకపోయినా రిసీవర్ చెవిన పెట్టుకుని మాట్లాడతారు. పాట పాడతారు ‘బడి పంతులు’లో బుల్లి శ్రీదేవి పాడింది.బూచాడమ్మ బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడుకళ్లకెపుడు కనపడడు కబురులెన్నో చెబుతాడు...అనుబంధాల పాట:పెద్దవాళ్ల సమస్యలు పిల్లలకూ కష్టాలు తెస్తాయి. పిల్లలు చలించిపోతారు. ఆ అనుబంధాల కోసం పరితపిస్తారు. తమ లోపలి భావాలను పాట ద్వారా చెబుతారు. తల్లిదండ్రులను కోల్పోయి చెల్లెలితో మిగిలిన అన్న పాడే ఈ జోలపాట ఎంత ఆర్ద్రమైనది... ‘చిట్టి చెల్లెలు’లో.అందాల పసిపాప అన్నయ్యకు కనుపాపబజ్జోవే... బుజ్జాయి... నేనున్నది నీ కొరకే...నీకన్నా నాకెవరే...‘భార్యాబిడ్డలు’ సినిమాలో కన్నతండ్రయిన అక్కినేనిని దూరం చేసుకుని అతణ్ణి వెతుకుతూ వీధుల్లో తిరుగుతూ అతడి పిల్లలు పాడే పాట... ఇందులో కూడా శ్రీదేవి ఉంది...చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావునీవు లేక దిక్కులేని చుక్కలయ్యాముఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లలకు జోకొడతారు. కాని ‘రాము’లో తల్లిదండ్రులకు జోకొడుతూ చిన్నారి కొడుకు పాడే పాట హిట్.పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండుపాటలు పాడి జోకొట్టాలి జోజోజో...ఇక పిల్లలకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం కదా. స్నేహంలో వారికి అంతరాలు ఉండవు, అభిమానం తప్ప! అందుకే స్నేహాన్ని నిర్వచిస్తూ ‘బాల మిత్రుల కథ’లోని ఈ పాట గొప్పగా ఉంటుంది.గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది...పాపం పసివాడు:ఒక పాట... అమ్మానాన్నల కోసం తప్పి పోయిన పిల్లవాడు పరితపిస్తూ పాడే పాట సినిమాను సూపర్‌హిట్ చేయగలదు. ‘లాస్ట్ ఇన్ ద డెజర్ట్’ అనే ఇంగ్లిష్ సినిమా ఆధారంగా తెలుగులో తీసిన ‘పాపం పసివాడు’ సినిమా చూసిన మహిళా ప్రేక్షకులు కన్నీరు మున్నీరయ్యారు. కారణం తప్పిపోయిన పిల్లాడిలో తమ పిల్లల్ని చూసి ఇలాంటి పరిస్థితి వస్తే అనుకోవడమే. మాస్టర్ రాము నటించిన ఈ పాట ఆత్రేయ రాసిన తేలిక మాటల పాట పిల్లల భావోద్వేగాన్ని గొప్పగా చూపుతుంది.అమ్మా చూడాలి... నిన్నూ నాన్నను చూడాలినాన్నకు ముద్దులు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి...అంజలి అంజలి అంజలి:ఆ తర్వాత కూడా పిల్లల పాత్రలు, వారి పాటలు కొనసాగాయి. ‘బాల భారతం’ తీశారు. టి.కృష్ణ ‘రేపటి పౌరులు’ సినిమా తీశారు. ‘మణిరత్నం ‘అంజలి’ తీసి హిట్ కొట్టారు. గుణశేఖర్ ‘బాల రామాయణం’ తీశారు. ‘లిటిల్ సోల్జర్స్’ పిల్లల కోసం తీసిన చివరి హిట్ సినిమాగా నిలిచింది. ‘స్వాతి కిరణం’లో మాస్టర్ మంజునాథ్ బాల సంగీతకారుడుగా ‘ఆనతినియ్యరా హరా’...లాంటి క్లాసిక్ ఇచ్చాడు. ‘మనసంతా నువ్వే’ సినిమాలోని ‘తూనీగా... తూనీగా’ పాట ఇంటింటి పాటైంది. ‘అమ్మ రాజీనామా’, ‘దేవుళ్లు’ తదితర చిత్రాల్లో పిల్లలు పాటలు పాడి మెప్పించారు.అయితే ఆ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలు వచ్చి తొడ గొట్టే పిల్లలు, కత్తి పట్టే పిల్లలు వచ్చారు. ఇవాళ టీవీల నిండా పిల్లలు అశ్లీల నృత్యాలు చేసే పెద్దల పాటలే తప్ప పిల్లల పాటలంటూ లేకుండా పోయాయి. కనీసం పిల్లలతో పాటు పెద్దలు పాడే పాటలైనా.పిల్లల పాటలు మళ్లీ బతకాలని కోరుకుందాం.ముద్దు ముద్దు నవ్వు... బజ్జోమ్మ నువ్వుతెలుగు సినిమాల్లో పిల్లలు తాముగా పాటలు పాడితే పిల్లల కోసం పెద్దలు తమంతట తాముగా పాడిన పాటలు చాలా ఉన్నాయి. అందరూ ఇష్టపడేవి ఉన్నాయి. ఆ పాటలు ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి. ‘బంగారు పాప’లో ఎస్వీ రంగారావు అంతటి నిలువెత్తు మనిషి ఒక చిన్నారి పాపను చూసి పాడే ‘తాధిమి తకధిమి తోల్బొమ్మ’ పాట ఎందరికో ఇష్టం. ఆర్ద్రమయం. ‘ఖైదీ కన్నయ్య’లో ‘ఈ నిజం తెలుకో తెలివిగా నడుచుకో’ ఇప్పుడు కూడా ప్రతి బాలబాలికలకు బోధ చేసే గీతం. తర్వాతి రోజుల్లో ‘మంచి మనుషులు’లో శోభన్‌బాబు పాడిన ‘ఇది నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట’ కూడా ఇదే కోవలో హిట్‌గా నిలిచింది. ‘పండంటి కాపురం’లో ‘బాబూ... వినరా అన్నాదమ్ముల కథ ఒకటి’ పాట పిల్లలకు అనుబంధాలు చెప్తే, ‘ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర’ అని బాల్యాన్ని అనుభవించాల్సిన వయసులో భవిష్యత్తు గురించి కోచింగ్‌లు తీసుకుంటున్న నేటి బాలల కోసం అన్నట్టుగా ‘అందాల రాముడు’లో అక్కినేని పాడుతారు. ఇక పిల్లల పుట్టిన రోజులకు అందరూ పాడేవారే. ‘వెలుగు నీడలు’లో ‘చిట్టిపొట్టి చిన్నారి పుట్టిన రోజు చేరి మనం ఆడిపాడే పండుగరోజు’లో సావిత్రి హుషారుగా పిల్లవాడితో పాటు గెంతడం కనిపిస్తుంది. ‘బంగారు కలలు’లో ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’, ‘తాత మనవడు’లో మనవడిని పట్టుకుని అంజలీ దేవి ఉద్వేగంగా పాడే ‘ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు’ గొప్ప ఆశీర్వాద వచనం. ఇక పిల్లలను బుజ్జగించే, ఊరడించే పాటలు సినిమాల్లో బోలెడు. గంభీరంగా ఉండే ఎన్.టి.ఆర్ కూడా పసిపిల్లాడిని చూసి ‘ఆడబ్రతుకు’లో ‘బుజ్జిబుజ్జి పాపాయి.. బుల్లిబుల్లి పాపాయి.. నీ బోసి నవ్వులలో పూచే పున్నవి వెన్నెలలోయి’ అని పాడతాడు. ఇదే పి.బి.శ్రీనివాస్ ‘ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజిమల్లె పువ్వు బజ్జొమ్మ నువ్వు’ పాట ‘సత్తెకాలపు సత్తెయ్య’లో చలం గొంతులో పాడతాడు. ఈ హీరో చలమే ‘సంబరాల రాంబాబు’లో చిన్నారి బాబుకు జోల పాడుతూ చందమామను సాయమడుగుతూ ‘మామా.. చందమామా.. వినరావా నా కథ’ అని అందుకుంటాడు. ‘జీవన తరంగాలు’లో శోభన్‌బాబు పాపకు జూ మొత్తం చూపుతూ ‘ఉడతా ఉడతా ఉచ్’ పాడటం రేడియో శ్రోతలు ఇప్పుడూ వింటారు. ‘స్వయంకృషి’లో చిరంజీవి ‘పారా హుషార్.. పారా హుషార్... తూరుపమ్మ ఉత్తరమ్మ పడమరమ్మ దక్షిణమ్మ పారా హుషార్’ అని పాడి వీపున కట్టుకున్న చిన్నారికి ఉల్లాసం కలిగిస్తాడు. ‘కలిసి పాడుదాం తెలుగు పాట కలిసి సాగుదాం వెలుగుబాట’ (బలిపీఠం), ‘భారత మాతకు జేజేలు బంగరుభూమికి జేజేలు’ (బడిపంతులు) అని పాడే ఉపాధ్యాయులు ఇప్పటి సినిమాల్లో ఎక్కడ? ఏమైనా ఆ రోజులే వేరు ఆ పాటలే వేరు. -
రామ్మా చిలుకమ్మా..
‘సత్యం సుందరం’ సినిమాలో అరవింద్ స్వామి.. ప్రతిరోజూ తమ ఇంటి టెర్రస్ మీద వందల కొద్ది చిలుకలకు దాణా వేస్తూ వాటితో ఆత్మీయానుబంధాన్ని అల్లుకుంటాడు! అలాంటి వ్యక్తులు రియల్ లైఫ్‌లోనూ ఉన్నారు. వాళ్లే నూర్‌బాషా బాబావలీ, లాల్‌బీ దంపతులు!ఆంధ్రప్రదేశ్, తెనాలిలోని గాంధీనగర్, ఎన్వీఆర్ కాలనీలో నివాసముంటారు నూర్‌బాషా బాబావలీ దంపతులు. వృత్తిరీత్యా నూర్‌బాషా టైలర్. తమ మేడ మీదకొచ్చి అరిచే కాకుల గుంపు కోసం నూర్‌బాషా భార్య లాల్‌బీ.. కాసిన్ని బియ్యం చల్లి.. ఓ గిన్నెలో నీళ్లనుంచడం మొదలుపెట్టింది. కాకులు ఆ దాణా తిని, నీళ్లు తాగి ఎగిరిపోయేవి. కొన్నాళ్లకు కొన్ని చిలుకలూ వచ్చి వాలాయి ఆ మేడ మీద.. ఇంచక్కా ఓ పక్క బియ్యం, మరోపక్క మంచి నీళ్లు కనిపించేసరికి సంతోషంగా బియ్యం గింజలు తిని, మంచినీళ్లు తాగి ఎగిరిపోయాయి. మర్నాడు మరిన్ని చిలుకలను వెంటబెట్టుకొచ్చి.. ఆ దాణాను ఆరగించసాగాయి. క్రమంగా అది వాటికి రోజువారీ కార్యక్రమం అయింది. వాటి సంఖ్యా వందల్లోకి పెరిగింది. ఒక్కపూట కాస్త రెండుపూటలకు మారింది. ప్రకృతి పంపుతున్న ఆ అతిథులను చూసి నూర్‌బాషా, లాల్‌బీ దంపతులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వాటికోసం ఉదయం, సాయంకాలం రెండుపూటలా దాణా చల్లుతూ చక్కటి ఆతిథ్యమివ్వసాగారు. క్రమంగా అది ఆత్మీయానుబంధంగా బలపడింది. ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య, సాయంకాలం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య చిలుకలు ఆ మేడ మీద వాలి.. దాణా తిని, నీళ్లు తాగి ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కొన్ని చిలుకలు దాణా తింటున్నప్పుడు మరికొన్ని గుంపులు గుంపులుగా అక్కడున్న దండేల మీద, లేదంటే పక్కనే ఉన్న చెట్ల కొమ్మల మీద వేచి చూస్తుంటాయి. తమ వంతు రాగానే టెర్రస్ ఫ్లోర్ మీద వాలి విందును ఆరగిస్తాయి. ఏటా గురు పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి దాకా ఇలా ఆ చిలుకలు నూర్‌బాషా కుటుంబమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాయి. అవి బియ్యం గింజల్ని తింటున్నప్పుడు నూర్‌బాషా కుటుంబీకులు కాక కొత్తవారెవరు కనిపించినా రివ్వున ఎగిరిపోతాయి. వీటి కోసం ఉదయం మూడు కిలోలు, సాయంత్రం రెండు కిలోల చొప్పున రోజుకు అయిదు కిలోల బియ్యాన్ని ఆహారంగా పెడుతోందా కుటుంబం. అంటే నెలకు 150 కిలోలు. చిలుకలను ఇంత ప్రేమగా ఆదరిస్తున్న నూర్‌బాషా, లాల్‌బీ దంపతులను చూసి ముచ్చటపడిన లాల్‌బీ స్నేహితురాలు అంజమ్మ .. నెలకు 20 కిలోల బియ్యాన్ని తన వంతు సాయంగా అందిస్తోంది. ‘ఇప్పుడు కాకులు, చిలుకలతోపాటు పావురాలు కూడా వచ్చి దాణా తినిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి తర్వాత చిలుకల సంఖ్య బాగా తగ్గుతుంది. మళ్లీ గురు పౌర్ణమి నుంచి వాటి సంఖ్య పెరుగుతుంది. అలా కొన్ని వందల చిలుకలు మా మేడ మీద వాలుతుంటే భలేగా ఉంటుంది!’ – నూర్‌బాషా బాబావలీ. -
మిస్టరీ.. బ్రయాన్ నిసెన్ ఫెల్డ్
స్టీవ్ గాఢనిద్రలో ఉండగా హాల్లో ఫోన్ మోగింది. అదే మత్తులో మెల్లగా నడిచి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి, కాస్త అసహనంగా ‘హలో?’ అన్నాడు స్టీవ్. ‘డాడ్.. డాడ్.. డాడ్! నాకు చాలా భయంగా ఉంది. నన్ను వాడు వదిలిపెట్టడు. కిడ్నాప్ చేస్తానంటున్నాడు. సేవ్ మీ డాడ్.. సేవ్ మీ డాడ్’ అని అరుస్తూనే ఉన్నాడు అవతలి నుంచి బ్రయాన్ నిసెన్ ఫెల్డ్. కొడుకు అరుపులు విని స్టీవ్‌కు గుండె ఆగినంత పనైంది. ‘ఏం అంటున్నావ్ బ్రయాన్? ఏమైందిరా?’ అన్నాడు కంగారుగా. ఆ అలికిడికి లేచిన అతని భార్య మరియాన్ . భర్త మాటలను బట్టి కాల్ చేసింది బ్రయాన్ అని అర్థం చేసుకుంది. బ్రయాన్ మాటల్లో తడబాటు, వణుకు స్టీవ్‌ను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. స్టీవ్ గట్టిగా ఊపిరి తీసుకుని, ‘బ్రయాన్ ఏమైంది నాన్నా! ఎందుకు అలా మాట్లాడుతున్నావ్? ప్లీజ్, నువ్వు వివరంగా చెబితేనే కదా నేనేదైనా చేయగలను’ అన్నాడు. దాంతో బ్రయాన్ కాస్త కూల్ అయ్యి ‘డాడ్ , జోష్ అని నా సీనియర్.. చదువు పూర్తి చేసుకుని ఈ క్యాంపస్ నుంచి వెళ్లిపోయాడు. కానీ వెళ్లేముందు మా మధ్య పెద్ద గొడవైంది. దాన్ని మనసులో పెట్టుకుని, ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. నన్ను కిడ్నాప్ చేసి చంపుతానంటున్నాడు. ఏ సమయంలోనైనా మా యూనివర్సిటీకి వచ్చి, నన్ను ఎత్తుకుపోతాడట! నా శవాన్ని కూడా ఎవరికీ కనిపించనివ్వడట! ప్లీజ్ నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్లిపో’ అని ఏడుస్తూ వణికిపోతూ చెప్పాడు బ్రయాన్. దాంతో స్టీవ్, తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ కొడుక్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉండి కంగారుపడుతున్న మరియాన్ కి కొద్దికొద్దిగా విషయం అర్థమైంది. ‘నాన్నా బ్రయాన్! భయపడకు, నువ్వు ఉన్నది పెద్ద క్యాంపస్‌లో. అలాంటి చోటికి వచ్చి ఒక మనిషిని ఎత్తుకెళ్లడం సాధ్యం కాదు. ముందు నువ్వు అక్కడి సెక్యూరిటీకి కాల్ చేసి అతడిపై కంప్లైంట్ చెయ్యి. తర్వాత నీ ఫోన్ నంబర్ మార్చేయ్, రేపు నేను వస్తాను’ అంటూ చాలాసేపు నచ్చజెప్పి ఫోన్ పెట్టేశాడు స్టీవ్. మధ్యలో ఫోన్ అందుకున్న మరియాన్ కూడా ప్రేమగా సర్దిచెప్పింది. అప్పుడు సమయం అర్ధరాత్రి రెండు కావస్తో్తంది. మరునాడు కొడుకుని చూసుకునేదాకా వారికి నిద్రపట్టలేదు.రోజర్ విలియమ్స్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ రెండో ఏడాది చదువుతున్న బ్రయాన్‌కి 18ఏళ్లు. సంగీతం నేర్చుకోవడమన్నా, వినడమన్నా, యూనివర్సిటీ సమీపంలోని టౌంటన్ నది మీదున్న వంతెనపై ఒంటరిగా కూర్చుని పుస్తకాలు చదువుకోవడమన్నా చాలా ఇష్టం. బ్రయాన్ కి మాటిచ్చినట్లే మరునాడు స్టీవ్ దంపతులు వెళ్లి కలిశారు. వాళ్లు చెప్పినట్లే ఫోన్ నంబర్ మార్చేశాడు. తన జాగ్రత్తలో తాను ఉండటం మొదలుపెట్టాడు. అయితే సరిగ్గా నెలకి బ్రయాన్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడంతో వారు మళ్లీ యూనివర్సిటీకి వెళ్లాల్సి వచ్చింది. కాని, బ్రయాన్ అక్కడ లేడు. యాజమాన్యంతో సహా ఎవరిని అడిగినా తెలియదనే చెప్పారు. దాంతో ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి పరుగుతీశారు. రంగంలోకి దిగిన పోలీసులు ‘బ్రయాన్ వారం క్రితం సంగీతం క్లాస్‌కి హాజరైన తర్వాత నుంచి ఎవరికీ కనిపించలేదు’ అని తేల్చారు. మరి బ్రయాన్ ఏమైనట్లు? ఈ ప్రశ్న రాగానే, జోష్ అనే పూర్వవిద్యార్థి గురించి స్టీవ్ పోలీసులకు చెప్పడంతో ఆ దిశగా విచారణ మొదలైంది.స్టీవ్ అనుమానించిన జోష్ అనే కుర్రాడితో బ్రయాన్ కి గతంలో గొడవ అయిన మాట నిజమేనని, వారిద్దరూ మొదట్లో మంచి స్నేహితులని, తర్వాత శత్రువులై కొట్టుకున్నారని తేలింది. అయితే జోష్ని పిలిపించి నిలదీస్తే, ‘నాకేం తెలియదు. గొడవ తర్వాత బ్రయాన్ ని నేను కలిసిందే లేదు’ అన్నాడు. అయితే కొన్నిరోజులకు ఆ యూనివర్సిటీ నుంచి ఒక గుర్తు తెలియని అమ్మాయి స్టీవ్ ఇంటికి కాల్ చేసి, బ్రయాన్ తల్లి మరియాన్ తో మాట్లాడింది. ‘బ్రయాన్ మిస్సింగ్ వెనుక చాలా పెద్ద కుట్రే ఉంది. దీని వెనుక ఇద్దరు అధ్యాపకులు ఉన్నారు’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. మరి అది నిజమా? కేసును పక్కదారి పట్టించే ప్రయత్నమా? అనే అనుమానంతోనే ఆ దిశగా కూడా విచారించారు. కానీ బ్రయాన్ ఆచూకీ తెలియలేదు.ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయాన్నే టౌంటన్ నది ఒడ్డున లోరీ వేల్స్ అనే 30 ఏళ్ల మహిళ తన కూతురితో కలిసి వాకింగ్ చేస్తుంటే, ఒక షూ దొరికింది. దగ్గరకు వెళ్లి చూస్తే అందులో మనిషి పాదం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పాదాన్ని డీఎన్ ఏ పరీక్షకు పంపారు. అది బ్రయాన్ దని తేలింది. రేపోమాపో దొరుకుతాడనుకున్న కొడుకు ఇక లేడు, రాడనే వార్త స్టీవ్ కుటుంబాన్ని అంతులేని దుఃఖంలో ముంచేసింది.బ్రయాన్ కి బ్రిడ్జ్ మీద కూర్చుని చదువుకునే అలవాటు ఉంది కాబట్టి, పొరపాటున కాలు జారి నదిలో పడుంటాడని, లేదంటే ఏవో భయాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అధికారులు అంచనా వేశారు. అయితే స్టీవ్, మరియాన్ లు మాత్రం నమ్మలేదు. ఆ యూనివర్సిటీలో స్వయంగా రహస్య సమాచార సేకరణ మొదలుపెట్టారు. అయితే వారికి తెలిసిన విషయాలు వారిని మరింత బాధపెట్టాయి.‘బ్రయాన్, జోష్లిద్దరూ స్వలింగ సంపర్కులు. బ్రయాన్ మొదటి సెమిస్టర్లో ఉన్నప్పుడు ఇద్దరూ ప్రాణమిత్రుల్లా ఉండేవారు. కొన్ని నెలలకు వారి బంధం ఎక్కడ బయటపడి పరువు పోతుందోనని బ్రయాన్ భయపడేవాడు. జోష్ మాత్రం బయటపడితే తప్పేంటి? అన్నట్లుగా ఉండేవాడు. అందుకే వారి మధ్య గొడవలొచ్చాయి’ అని చాలామంది చెప్పారు. బ్రయాన్ స్వలింగ సంపర్కుడని ప్రపంచానికి తెలిస్తే తన పరువుపోతుందని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కొందరు, జోష్ ప్రేమోన్మాదిగా మారి చంపేసి ఉంటాడని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే వేటికీ ఆధారాలు లేవు. జోష్ని మరోసారి విచారించినప్పుడు, ‘బ్రయాన్ కు కాల్ చేసి బెదిరించింది నేనే. కాని, అది ప్రాంక్. అతని మిస్సింగ్‌కి, నాకు ఏ సంబంధం లేదు’ అని చెప్పాడు.1997 ఫిబ్రవరి 6న బ్రయాన్ తన యూనివర్సిటీ నుంచి మిస్ అయినట్లు ఫిబ్రవరి 13న కేసు నమోదైంది. ఆరు నెలలకు నది ఒడ్డున తెగిపోయిన అతని పాదం దొరికింది. మృతదేహం ఇప్పటికీ దొరకలేదు. అసలు బ్రయాన్ కి ఏమైంది? జోష్, బ్రయాన్ ల మధ్య నిజంగానే రహస్య బంధం ఉందా? అది బయటపడకూడదనే బ్రయాన్ ఆత్మహత్య చేసుకున్నాడా? దూరంపెట్టడాన్ని భరించలేక జోష్ ఉన్మాదిగా మారి బ్రయాన్ ని చంపేశాడా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం స్టీవ్ కుటుంబం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. అయినా ఈ ఉదంతం మిస్టరీగానే మిగిలిపోయింది. సంహిత నిమ్మన -
ఇంకా ఇన్కా సంబరాలు
దక్షిణ అమెరికా భూభాగంలో ఒకప్పుడు వర్ధిల్లిన ఇన్కా నాగరికత స్పానిష్ దాడుల దెబ్బకు పదహారో శతాబ్ది నాటికి దాదాపుగా కనుమరుగైంది. అయితే, ఇన్కా నాగరికత అవశేషాలు ఇక్కడి జనాల్లో ఇప్పటికీ ఇంకా మిగిలే ఉన్నాయి. ఇన్కా నాగరికత నాటి సంస్కృతీ సంప్రదాయాలు ఇప్పటికీ ఇక్కడి ప్రజల వేడుకల్లో ప్రతిఫలిస్తుంటాయి. పెరులోని ప్యూనో ప్రాంతంలో జరిగే ప్యూనో వారోత్సవాలు నేటికీ పురాతన ఇన్కా సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగుతుండటం విశేషం. ఏటా నవంబర్ మొదటివారంలో ఈ వారోత్సవాలు జరుగుతాయి. ఈ వారం రోజుల్లోనూ నవంబర్ 5వ తేదీన ప్రత్యేకంగా ‘ప్యూనో డే’ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు.పెరు ఆగ్నేయ ప్రాంతంలో ప్యూనో ప్రావిన్స్ ఉంది. దీని రాజధాని ప్యూనో నగరం. టిటికాకా సరోవర తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో స్పెయిన్ అధీనంలోకి వచ్చాక, స్పానిష్ రాజప్రతినిధి పెడ్రో ఆంటోనియో ఫెర్నాండేజ్ డి క్యాస్ట్రో 1668లో ప్యూనో నగరాన్ని నెలకొల్పాడు. అంతకు ముందు ఈ ప్రాంతలో ఇన్కా నాగరికత ఉజ్వలంగా వర్ధిల్లింది. స్పానిష్ పాలకుల ప్రభావంతో స్థానిక కెచువా ప్రజలు క్రైస్తవ మతాన్ని స్వీకరించినా, తమ పూర్వ ఆచారాలను వదులుకోలేదు. ఇన్కా సామ్రాజ్య వ్యవస్థాపకుడైన మాంకో కాపాక్ జయంతి సందర్భంగా నవంబర్ 5న ‘ప్యూనో డే’ జరుపుకొనే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఇన్కా ప్రజలు ‘ఇన్టీ’గా పిలుచుకునే సూర్యుడి కొడుకు మాంకో కాపాక్. అతడే ఇన్కా ప్రజలకు మూలపురుషుడని చెబుతారు. ఇన్కా నాగరికత కాలంలో ఈ ప్రాంతంలో కూజ్కో నగరం ఉండేది. ప్యూనో వారోత్సవాలను ఇక్కడి ప్రజలు ఇన్కా సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరుపుకొంటారు. ఇన్కా సంప్రదాయ దుస్తులు ధరించి ఊరేగింపుల్లో పాల్గొంటారు. సంప్రదాయ వాద్య పరికరాలను మోగిస్తూ, వీథుల్లో తిరుగుతూ పాటలు పాడతారు. ప్యూనో నగర కూడళ్లలో ఏర్పాటు చేసిన వేదికలపై సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. టిటికాకా సరోవరంలో సంప్రదాయ పడవల్లో నౌకా విహారాలు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో మాంకో కాపాక్ జీవిత విశేషాలను ప్రదర్శిస్తారు. పురాతన పద్ధతుల్లో జరిగే ఈ ప్యూనో వారోత్సవాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. -
Dadhichi Maharshi: క్షువ దధీచుల వివాదం
దధీచి మహర్షి సరస్వతీ నదీతీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఇంద్రుడు అతడి వద్దకు వచ్చాడు. ‘మునీశ్వరా! నీకు నేను మహోత్తమమైన శాస్త్రాలను ఉపదేశిస్తాను. వాటిని నువ్వు ఇతరులకు చెప్పరాదు. ఒకవేళ ఇతరులకు చెబితే, నీ తల ఖండిస్తాను’ అని చెప్పాడు. దధీచి సరేననడంతో, ఇంద్రుడు అతడికి మహోత్తమ రహస్య శాస్త్రాలను ఉపదేశించాడు. ఈ సంగతి అశ్వనీ దేవతలకు తెలిసింది. ఇంద్రుడు బోధించిన రహస్య శాస్త్రాలను దధీచి నుంచి పొందాలనుకున్నారు. వెంటనే వారు దధీచి వద్దకు వెళ్లారు. ‘మహర్షీ! ఇంద్రుడు నీకు బోధించిన రహస్య శాస్త్రాలను మాకు ఉపదేశించు. అందుకు ప్రతిగా నీకు తగిన మేలు చేస్తాము’ అని అభ్యర్థించారు.‘ఇతరులకు బోధిస్తే, నా తల ఖండిస్తానన్నాడు ఇంద్రుడు. మీకు ఆ శాస్త్రాలు బోధిస్తే, నా ప్రాణమే మిగిలి ఉండదు. ఇక మీరు నాకు చేసే మేలు ఏముంటుంది?’ అన్నాడు దధీచి.‘మహర్షీ! భయపడకు. నీకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూసుకునే బాధ్యత మాది’ అని అశ్వనీ దేవతలు అభయం ఇచ్చారు.వారు దధీచి తలను తీసి, రహస్య ప్రదేశంలో భద్రపరచారు. అతడి మొండేనికి గుర్రం తలను అతికించారు. ఇంద్రుడి ద్వారా పొందిన రహస్య శాస్త్రాలను అతడి ద్వారా తెలుసుకున్నారు. ఇదంతా ఇంద్రుడికి తెలిసింది. కోపోద్రిక్తుడైన ఇంద్రుడు వచ్చి, దధీచికి ఉన్న గుర్రం తలను నరికేసి వెళ్లిపోయాడు. అశ్వనీ దేవతలు తాము భద్రపరచిన దధీచి తలను తీసుకువచ్చి, అతడికి అతికించి, ప్రాణం పోశారు. అశ్వనీ దేవతల ద్వారా పునర్జీవం పొందిన దధీచి తన బాల్యమిత్రుడైన క్షువ మహారాజు వద్దకు వెళ్లాడు. క్షువుడు దధీచిని ఆప్యాయంగా పలకరించి, ఆదరించాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకోసాగారు. ఈలోగా వారి మధ్య దీర్ఘ తపస్సులో ఎవరు శక్తిమంతులు అనే విషయమై విభేదం ఏర్పడింది. ‘దీర్ఘ తపస్సులో ఇతరుల కంటే బ్రాహ్మణుడే శక్తిమంతుడు’ అన్నాడు శివభక్తుడైన దధీచి. ‘కానే కాదు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించే రాజే శక్తిమంతుడు’ అన్నాడు క్షువుడు. అంతటితో ఆగకుండా, ‘రాజు సర్వదేవతా స్వరూపుడు’ అని శ్రుతులు చెబుతున్నాయి. కనుక నేను దేవతా స్వరూపుడను. అందువల్ల నువ్వు నన్ను పూజించాలి’ అన్నాడు.క్షువుడి మాటలతో దధీచికి సహనం నశించింది. ఎడమచేతి పిడికిలి బిగించి, క్షువుడి నెత్తి మీద బలంగా మోదాడు. దధీచి చర్యకు క్షువుడు మండిపడ్డాడు. వెంటనే కత్తి దూసి, దధీచిని చీల్చేశాడు. ‘ఇప్పుడు తెలిసిందా ఎవరు శక్తిమంతుడో?’ అని గర్జించాడు. నెత్తరోడుతూ నేలకూలిన దధీచి భృగువంశ తిలకుడు, అసుర గురుడైన శుక్రాచార్యుడిని స్మరించాడు. వెంటనే శుక్రాచార్యుడు అక్కడ ప్రత్యక్షమై, తన మృత సంజీవని విద్యతో చీలిన దధీచి శరీరాన్ని సంధించి, అతడిని బతికించాడు. దధీచి లేచి కూర్చున్నాక శుక్రాచార్యుడు అతడికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని జపిస్తూ శివుని గురించి తపస్సు చేయమని ఆదేశించాడు. దధీచి అక్కడి నుంచి బయలుదేరి, తన ఆశ్రమానికి చేరుకున్నాడు. శుక్రాచార్యుడి ఆదేశం మేరకు శివుడి గురించి తపస్సు ప్రారంభించాడు. దధీచి తపస్సుకు మెచ్చిన పరమశివుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! ఏం కావాలి?’ అని అడిగాడు. ‘సాంబ సదాశివా! నాకు వజ్రతుల్య దేహాన్ని. దైన్యరహిత జీవనాన్ని, స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించు’ అని కోరాడు దధీచి. ‘తథాస్తు’ అని పరమశివుడు అంతర్ధానమయ్యాడు.క్షువుడిపై కోపం చల్లారని దధీచి అతడి వద్దకు వెళ్లి, ఎడమకాలితో అతడి తలను తన్నాడు. కుపితుడైన క్షువుడు దధీచిపైకి కత్తి దూశాడు. కత్తి వేటు పడినా, దధీచికి ఏమీ కాలేదు. రకరకాల అస్త్ర శస్త్రాలను ప్రయోగించాడు. దధీచి వాటన్నింటినీ తిప్పికొట్టి, ‘ఇప్పటికైనా తెలిసిందా ఎవరు అధికుడో?’ అన్నాడు.దధీచి చేతిలో ఈ పరాభవానికి క్షువుడు కలత చెంది, మహారణ్యానికి వెళ్లి విష్ణువు గురించి తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. క్షువుడు తనకు దధీచి చేతిలో ఎదురైన పరాభవాన్ని చెప్పుకుని, అతడికి గుణపాఠం చెప్పాలని కోరాడు. క్షువుడిని వెంటబెట్టుకుని విష్ణువు దధీచి ఆశ్రమం వద్దకు వెళ్లాడు. విష్ణువు బ్రాహ్మణ వేషం ధరించి, దధీచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. దధీచి అతడికి అతిథి మర్యాదలు చేశాడు. ‘మహర్షీ! నువ్వు క్షువ మహారాజు ఎదుట నిలబడి, ‘నేను భయపడుతున్నాను’ అనే మాట చెప్పు చాలు’ అన్నాడు.వచ్చిన వాడు విష్ణువని దధీచి గ్రహించాడు. ‘శివ వరప్రసాదినైన నేను ముల్లోకాలలో దేనికీ భయపడను. అలాంటిది క్షువుడి ఎదుట నిలిచి, నేను భయపడుతున్నట్లు చెప్పాలా? కుదరదు’ అని ఖండితంగా చెప్పాడు. దధీచిని శిక్షించడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శనం అతడిని సమీపించలేక వెనుదిరిగింది. విష్ణువు అనేక అస్త్ర శస్త్రాలను ప్రయోగించాడు. అతడికి అండగా ఇంద్రాది దేవతలు ఆయుధాలతో వచ్చి, దధీచితో తలపడ్డారు. దధీచి గుప్పెడు దర్భలను మంత్రించి, వాటిని దేవతా బలగాలపైకి ప్రయోగించాడు. ఒక్కొక్క దర్భపోచ ఒక్కొక్క త్రిశూలంలా మారి నిప్పులు కక్కుతూ వెళ్లి దేవతలను దహించడం ప్రారంభించాయి. దేవతలు పలాయనం చిత్తగించారు. దధీచిని భయభ్రాంతుడిని చేయడానికి విష్ణువు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. పరమశివుని అనుగ్రహంతో దధీచి కూడా విశ్వరూపం ధరించి, విష్ణువు ఎదుట నిలిచాడు. ఈలోగా బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి, ఉభయులనూ శాంతింపజేశాడు. ‘సాక్షాత్తు పరమశివుని వరప్రసాది అయిన ఈ బ్రహ్మర్షిని భయపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.ఇదంతా ప్రత్యక్షంగా చూసినా క్షువ మహారాజు దీనంగా వెళ్లి, దధీచి మహర్షి పాదాల ముందు మోకరిల్లాడు. ‘మూర్ఖత్వం కొద్ది నీపై దుశ్చర్యలకు తెగబడ్డాను. దయచేసి, నన్ను క్షమించు’ అని అభ్యర్థించాడు. దధీచి ప్రసన్నుడయ్యాడు. బాల్యమిత్రుడైన క్షువుడిని లేవనెత్తి, అక్కున చేర్చుకున్నాడు.∙సాంఖ్యాయన -
యువ కథ.. లాయర్ నోటీస్
పేషంట్లు, నర్సులు, డాక్టర్లతో గైనిక్ వార్డంతా హడావిడిగా ఉంది. ఒక్కొక్కరి మొహంలో ఒక్కో భావం. కూతురి వైపు చూశాడు లాయర్ బ్రహ్మారెడ్డి. తల గోడకు ఆన్చి, నిద్ర పోతున్నట్టుగా ఉంది. ఆమెకిప్పుడు ఆరో నెల. తాత కాబోతున్న సంతోషం తొలి రెండు నెలలు మాత్రమే. మాటా మాటా పెరిగి, అల్లుడు చెయ్యి చేసుకున్నాడంట. నేరుగా ఇంటికి వచ్చింది కూతురు. కొత్త సంసారంలో చిన్న చిన్న మనస్పర్థలు మామూలే అనుకున్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ అర్థమైంది సర్దుకునేంత చిన్నది కాదని.చూస్తుండగానే మూడు దాటి, నాలుగో నెల వచ్చింది. వీళ్లు చూస్తే పంతంబట్టినట్టు ఎవరి లోకంలో వాళ్లున్నారు. రేపేదైనా తేడా జరిగితే పుట్టబోయే బిడ్డ ప్రధాన సమస్య అవుతుందని ఎన్నో కేసులు వాదించిన అనుభవం మెదడు తడుతోంది.బిడ్డ పుడితే కలవకపోతారా అనే దింపుడు కల్లం ఆశ కూడా లేకపోలేదు. తీరా బిడ్డ పుట్టేక వాళ్లు రాకుంటే? కూతురు ఇంకో పెళ్లి వద్దంటే? కూతురు ఒప్పుకున్నా బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? చేసుకున్నా కూడా కూతురు జీవితం సంతోషంగా ఉంటుందా? ఇవన్నీ లేకుండా కడుపులో బిడ్డకు ఏదో ఒక అవయవ లోపముంది అని డాక్టరే అబార్షన్ సూచిస్తే మేలనిపిస్తోంది. వాళ్లు చెప్పకుండా మనమే ఆ మాట అడిగితే బాగుండదేమో.పొంతనలేని ఆలోచనలు ఎటెటో తరుముతున్నాయి. చుట్టూ చూశాడు. ఎంతకూ తరగడం లేదు జనాలు. తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. న్యూస్, వీడియోలు, కోర్టు కేసులు దేని మీదా ధ్యాస కుదరక బయటికి నడిచాడు. లోపల స్థలం సరిపోనోళ్లంతా మెట్ల మీద, గేటు దగ్గర ఎక్కడపడితే అక్కడ కూర్చున్నారు.ఇంతలో గలగలా మాట్లాడుతూ బయటికొచ్చింది ఒక గుంపు. నడి వయస్కురాలి చేతిలో బెడ్, మధ్యలో చిన్న ఆకారం. పాపో బాబో గానీ అందరి మొహాల్లోనూ మురిపెం తెలుస్తోంది. చూస్తేనే చెప్పొచ్చు అబ్బాయి తరపు వాళ్లని. ఇలాంటివి చూసినప్పుడే అల్లుడి నుంచి గానీ, వాళ్ల తల్లిదండ్రుల నుంచి గానీ కనీసం ఇందులో పది శాతం కూడా అమ్మాయి మీద ఆపేక్ష లేదే అని బాధపడిపోతాడు బ్రహ్మారెడ్డి. వీటన్నింటి మధ్యన మరింత కుంగదీసేది కూతురి మౌనం. జీవితమంతా అయిపోయిన దానిలా ఎప్పుడూ దిగాలేసుకుని ఉంటుంది. ఇప్పుడు దిగులుపడితే మాత్రం చెయ్యగలిగేదేముందీ..!ఏదో పెళ్లిలో అమ్మాయిని చూశారంట. బాగా నచ్చింది, రూపాయి కట్నం వద్దు అని తెలిసిన మనిషిని పంపించారు. ఒక జిల్లా డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి కోరి కోడలిగా చేసుకుంటాం అని ఇంటికొస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. అబ్బాయి ఏ ఉద్యోగం చెయ్యకున్నా తండ్రి సంపాదించిన ఆస్తి దండిగా ఉంది. కూతురు భవిష్యత్తే కాదు, కలెక్టర్ వియ్యంకుడిగా సమాజంలో తనకెంత గౌరవం, పరపతి! అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇలా..! కూతురి పేరు అనౌన్స్మెంట్లో రావడంతో ఆలోచనలు ఆపి, లోపలికి నడిచాడు. ‘బేబీ గ్రోత్ బాగుంది. మదర్ కొంచెం వీక్‌గా ఉంది. హెల్దీ డైట్ మెయింటెయిన్ చెయ్యండి’ అంటూ జాగ్రత్తలు చెప్పింది డాక్టర్.రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. అల్లుడు రాలేదు.‘డెలివరీ అయ్యాకైనా వస్తాడా రాడా?’ అంటూ బెదిరిపోతున్నాడు బ్రహ్మారెడ్డి. అమ్మాయికి నార్మల్ డెలివరీ కుదరక, సీరియస్ అయ్యి, సిజేరియన్ చేసినారని తెలిసినా కూడా రాలేదు. అల్లుడే కాదు, వాళ్ల తరపునుంచి ఒక్కరూ రాలేదు. తెలిసిన వాళ్ల చేత మాట్లాడించాడు. పెద్దవాళ్లు అదీ ఇదని ఏదో చెప్పబోయారంట గానీ ‘నాకే పుట్టిందని గ్యారెంటీ ఏముందీ’ అన్నట్టు అన్నాడంట అబ్బాయి. ఇదే మాట ఎదురుగా అని ఉండుంటే తల పగలగొట్టాలి అనేంత కోపం వచ్చింది. కూతురితో చెప్పలేదు. భార్యతో అంటే ‘వానికి లేని చెడ్డలవాట్లు లేవంట. ఆ విషయం వాళ్లమ్మా నాయనకు ముందే తెలిసినా పెళ్లి చేస్తే అయినా దారికొస్తాడని చేశారంట. కొత్తవాళ్లతో సంబంధం మంచిది గాదని చెప్తున్నా వినకుండా పెద్ద వాళ్ల సంబంధం అని దాని గొంతు కోశావు’ అన్నాళ్లూ లోపల దాచుకున్న ఆక్రోశమంతా బయటికి వెళ్లగక్కింది.ఏదో ఫంక్షన్లో స్నేహితుడు కలిస్తే జరిగిందంతా చెప్పాడు.‘ఇలాంటి కేసులు నీ సర్వీసులో ఎన్ని చూసుంటావు! అయినా ఈ కాలంలో ఎవర్రా విడాకులకు భయపడేది?’ అన్నాడు.నిజమే. లాయర్ బ్రహ్మారెడ్డి అమ్మాయి తరపున వకాల్తా పుచ్చుకున్నాడంటే అబ్బాయి వాళ్లు, అబ్బాయి తరపునైతే అమ్మాయి వాళ్లు తలలు పట్టుకుంటారు. కానీ ఇది స్వంత కూతురి విషయం. మధ్యవర్తిత్వం ద్వారా కొంత ప్రయత్నం చేశాడు. కుదరలేదు.‘అందరికీ విడాకులు ఇప్పించి ఇప్పించి వాళ్ల ఉసురు కొట్టుకుని కూతురి జీవితం ఇలా చేసుకున్నాడని తలా ఒక మాట అంటారని ఇన్నాళ్లూ రాజీ కోసం చూశాను. అది నా అసమర్థత అనుకుంటున్నారు’ అనుకుంటూ ఆఫీసుకెళ్లి గృహహింస కేసు, వారం తర్వాత మెయింటెనె¯Œ ్స కేసు ఫైల్ చేశాడు. ఈ రెండింట్లో వీలైనంత వరకూ విసిగించి, వాళ్లే విడాకులకు అప్లై చేసేలా చేస్తే భరణం అడగొచ్చు అనుకుంటే ఎన్నాళ్లు చూసినా కేసు హియరింగ్‌కి రాలేదు. పంపించిన నోటీసులు వెనక్కి వచ్చాయి. ఏమైందని కనుక్కుంటే ఇచ్చిన అడ్రస్‌లో వాళ్లు లేరన్నారంట. క్లైంట్ల కోసం తను వాడే పోస్ట్ మ్యాన్ మేనేజ్మెంట్ టెక్నిక్‌ను తిరిగి తన మీదకే ప్రయోగిస్తున్నారని అర్థమైంది లాయర్ బ్రహ్మారెడ్డికి.మరో నెల చూసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కోర్టులో కేసు మొదలైంది. అయితే అనుకున్నట్టుగా సాగడంలేదు. చిన్న చిన్న విషయాలకు కూడా వాయిదాలు అడుగుతున్న అవతలి లాయర్‌ను చొక్కా పట్టుకుని కొట్టాలన్నంత కసి. లాయర్ అంటే పోనీ చంటి బిడ్డను తీసుకుని కోర్టుకు వచ్చే నా కూతురి గురించి ఒకసారి ఆలోచిస్తే అర్థం కాదా ఆ జడ్జికి..! ఆమె కూడా మహిళే కదా. తీర్పు దగ్గరకొస్తోంది అనంగా పై కోర్టుకు అప్లై చేశారు. అక్కడా అదే సాగతీత. చేసేదేం లేదు చట్టంలో వెసులుబాటు అలాంటిది. ఇన్నాళ్లూ క్లైంట్ తరపున ఇవన్నీ చూస్తుంటే తనేదో విజయం సాధిస్తున్నట్టుగా అనిపించేది గానీ ఇప్పుడు తనే ఒక పిటిషనర్‌గా అవి అనుభవిస్తుంటే ఆక్రోశంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు. కానీ ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. కేసును అంత సులభంగా వదలనని బ్రహ్మారెడ్డికీ తెలుసు గానీ, వాళ్లకున్న పలుకుబడి, డబ్బుతో తీర్పును ఎక్కడ అనుకూలంగా మార్చుకుంటారోనని చిన్న సంశయం.అదే జరిగితే శ్రమ, సంపాదన, జీవితం గురించి కనీసం ఆలోచన కూడా చెయ్యని కూతురి భవిష్యత్ ఏంటో అర్థం కాలేదు అతనికి. ఆరోజు కోర్టు కేసులు ఏమీ లేకపోవడంతో టీవీ పెట్టుకుని, సోఫాలో పడుకున్నాడు.‘పాప బర్త్‌డేకి లంగా జాకెట్ కుట్టించమని చెప్పొస్తాం. చూస్తూ ఉండు నాన్నా’ అంటూ కూతురు, భార్య బయటికి వెళ్లారు.మనమరాలి వైపు చూశాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ నేల మీదనే నిద్రపోయినట్టుంది. ‘కేసు గెలుస్తామో, ఓడిపోతామో? భరణం వస్తుందో, రాదో? విడాకులైతే తీసుకోవాలి. తీసుకుంటుంది సరే, కానీ కూతురి భవిష్యత్..! పాపను వదిలెయ్యి అంటే కూతురు ఒప్పుకుంటుందా? ఎక్కడెక్కడి ఆలోచనలన్నీ పాప దగ్గరే ఆగుతున్నాయి. అసలు ఆ పాపే పుట్టకుండా ఉండుంటే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు కదా! ఆరోజే అబార్షన్ చేయించాల్సింది.. తప్పు చేశాను’ అనుకుంటూ నిద్రకు, మెలకువకు కాని స్థితిలో కళ్లు మూసుకున్నాడు.మెలకువ వచ్చి చూసేసరికి పాప అక్కడ లేదు. వరండాలో పారిజాతం చెట్టుకింద రాలిపడిన పూలతో ఆడుకుంటోంది. పక్కనే వాటర్ సంప్ ఉంది. కొంచెం కదిలినా అందులో పడిపోతుంది.పక్కకు తీసుకొద్దామా, వద్దా..! చుట్టూ చూశాడు. తనను ఎవరూ గమనించలేదు అని అర్థమైంది. ఇదే అవకాశం. డోరు చాటుకు నక్కి, కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడు. అయిదు నిమిషాలు గడిచాయి. పాప కదలకుండా కింద పడిన పూలన్నీ ఏరి కుప్పగా పోస్తోంది.‘పాప పడిందా, రెండే రెండు నిమిషాలు చాలు. గమనించకుండా నిద్రపోయినందుకు కూతురు నన్ను తిట్టుకుంటుంది, వారం పది రోజులు మహా అయితే ఓ నెల రోజులు బాధపడుతుంది. పడనీ తర్వాత మెల్లిగా మరిచిపోతుంది. నిదానంగా పెళ్లి చెయ్యొచ్చు. ఒకవేళ పాప నీళ్లల్లో పడిన శబ్దం పక్కింటోళ్లో, దారిలో పొయ్యే వాళ్లో ఎవరైనా గమనించారా మన దరిద్రం’ రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి ఒక్కసారిగా.గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒళ్లంతా చెమటలు. పది నిమిషాలకు కదిలింది. చెయ్యి తీసి మరో చెయ్యి మారిస్తే చాలు పడబోతుంది అనంగా గేటు తీసిన శబ్దం. గట్టిగా కేకేసి పరిగెత్తుకుంటూ వచ్చి పాపను ఎత్తుకుంది కూతురు. మొహానికి పట్టిన చెమట తుడుచుకుని, ఏం తెలియనట్టు వెళ్లి సోఫాలో పడుకున్నాడు.‘ఒక్క అడుగు ఆలస్యమైనింటే..!’ కేకలేస్తూ ఇంట్లోకి వచ్చింది భార్య. ఆ అరుపులకు మెలకువొచ్చినట్టు లేచి ‘ఏమైందీ’ అడిగాడు అమాయకంగా.మనమరాలి ప్రాణాపాయం నుంచి మొదలు కోర్టు కేసు, విడాకులు, అత్తగారింట్లో కూతురి కష్టాలు, పెళ్లి మొదలు మొగుడి చేతగానితనం వరకూ అన్నీ చదువుతూనే ఉంది సాయంత్రం వరకూ. ఎలా తప్పించుకోవాలి అనుకుంటుండగా ‘స్టేషన్‌కి కొత్త ఎస్సై వచ్చిందంట. వెళ్లి ఫార్మాలిటీగా కలిసొద్దాంరా’ అని లాయర్ ఫోన్ చెయ్యడంతో వెళ్లాడు.యంగ్ ఆఫీసర్. ట్రైనింగ్ తర్వాత తొలి పోస్టింగ్. అందరూ పరిచయం చేసుకున్నారు. అవీ ఇవీ మాట్లాడి, కదలబోతుండగా నేమ్ ప్లేట్ చూశాడు. ఈ పేరు ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ మొహం చూశాడు. గుర్తుకొచ్చింది. నాలుగేళ్ల కిందట తాను వాదనలు వినిపించిన విడాకుల కేసులో ఆ అమ్మాయి రెస్పాండెంట్.లాయర్ బ్రహ్మారెడ్డి మనసులోని భావం గ్రహించినట్టు నవ్విందామె. ఇంటికొచ్చాడు. తిని పడుకున్నా కూడా అదే నవ్వు వెంటాడుతోంది. నిద్రపట్టలేదు. ఆ అమ్మాయి కేసు కళ్ల ముందు మెదిలింది. తిరిగి చూస్తే ఇప్పుడు తన కూతురిదీ అదే పరిస్థితి. మనసులో ఎంత సంఘర్షణ అనుభవించేదో గానీ బయటికి మాత్రం నిండు కుండలా ఉండేది. అంత బాధనూ దిగమింగుకుని, పడిలేచిన కెరటంలా ఇప్పుడు ఎస్సైగా రావడం చూసి తల తీసేసినట్టుగా ఉంది. ఏదో అపరాధభావం.నెల రోజులు గడిచాయి. ఒకట్రెండు సార్లు కలిసే అవకాశం వచ్చినా కూడా ఎదురుపడే ధైర్యం లేక కలవలేదు. కూతురి కేసు వాయిదా ఉంటే కోర్టుకు వచ్చాడు. ఏదో కేసు అటెండ్ అవ్వడానికి కోర్టుకొచ్చి, టైమ్ ఉండడంతో జీప్‌లో కూర్చుని ఉంది ఎస్సై.‘నేను నీ కేసు విషయంలో బాగా ఇబ్బంది పెట్టాను. ఆరోజు అలా చెయ్యాల్సింది కాదు’ అంటూ బాధపడ్డాడు. అతని మాటల్లో తేడా తెలుస్తోంది.అంతా విని, ‘ఇన్నాళ్లకు తెలిసిందా లాయర్ బ్రహ్మారెడ్డి గారూ. నేను మగాన్ని ఏమైనా అంటాను, నువ్వు ఆడదానివి పడాలి అన్నట్టు బిహేవ్ చేసేవాడు. నా వల్ల కాలేదు. విడిపోదాం అనుకునేంతలో కడుపులో బిడ్డ. తెలిసో తెలియకో పెళ్లి చేసుకున్న పాపానికి పుట్టబోయే బిడ్డనెందుకు ఒంటరి చెయ్యడం అని సర్దుకుపోదామనుకున్న ప్రతిసారీ వాళ్లమ్మొక మాట, నాన్నొక మాట, అక్కొక మాట. ఎంతకాలం పడాలి? అసలెందుకు పడాలి? విడిపోతాం. ఎవరి బతుకు వారిది. మరి పాప పరిస్థితి? పాప భవిష్యత్ కోసం మెయింటెనె¯Œ ్స, భరణం అడిగితే చట్ట పరంగా ఒకపక్క, నా క్యారెక్టర్‌ను తక్కువ చేస్తూ మరోపక్క ఎంతలా వేధించారు. నీకూ ఒక కూతురుండి, తనకు ఇలా జరిగినా కూడా ఇలాగే చేస్తావా అని అడుగుదామని ఆరోజు మీ దగ్గరికి రాబోతుంటే అద్దాల చాటున మీరు చూసిన చూపు గుర్తుందా?’ అతని వైపు చూసింది.ఆమె కళ్లల్లోకి చూసే ధైర్యం చాలక పక్కకు చూస్తూ నిలబడ్డాడు.‘ఏదోకరోజు కాళ్ల బేరానికి రాకపోదా అని మీరనుకున్నారు. నేను నాలా బతుకుతున్నా’ జీప్ దిగి, క్యాప్ సర్దుకుంటూ కదిలిపోయింది.ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె నోటి నుంచి వచ్చిన ఒక్కొక్కమాట ఒక్కో సూదిలా గుచ్చుతున్నాయి. నిజమే. ఆ అమ్మాయికి సమస్య వస్తే సమస్యను సవాలు చేసి గెలిచింది. మరి నేను..? పాప మరణాన్ని కోరుకున్నాను. తన అల్పత్వానికి వణికిపొయ్యాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీళ్లు తుడుచుకుని చుట్టూ చూశాడు. ఇంతకుముందు క్లైంట్లు, రెస్పాండెంట్లు కనపడేవాళ్లు. ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు.