mid-day meal
-
మధ్యాహ్న భోజనం తిని 100 మందికి అస్వస్థత
సాక్షి, హైదరాబాద్/మాగనూర్: మధ్యాహ్న భోజనం విషతుల్యం కావటంతో100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మాగనూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు వడ్డించారు. ఆహారం తిన్న కొద్దిసేపటికే సుమారు వందమంది విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. ఆ విషయం టీచర్లకు చెప్పగా ‘మీరు రోజూ ఇలాగే చెప్తున్నారు’అని బెదిరించినట్లు తెలిసింది. కానీ, కడుపునొప్పి మరింత తీవ్రం కావటంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొందరు విద్యార్థులు వాంతులు చేసుకొన్నారు. దీంతో టీచర్లు స్థానిక ఆస్పత్రికి సమాచారమిచ్చారు. స్థానిక ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు స్కూలుకు వచ్చి విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించినా కొందరి పరిస్థితి మెరుగుపడకపోవటంతో మండల వైద్యాధికారి అఫ్రోజ్‌కు సమాచారం అందించారు. ఆయన స్కూలుకు వచ్చి విద్యార్థులను పరీక్షించారు. తొలుత 10 మందిని మక్తల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి ప్రైవేట్ అంబులెన్స్‌లో మరో 9 మంది విద్యార్థులను మక్తల్ ఆస్పత్రికి పంపించారు. వీరిలో 15 మందిని మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రియాంక, అనిల్, నందిని పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి కొంచం మెరుగ్గా ఉన్న ఇతర గ్రామాల విద్యార్థులను టీచర్లు ఇంటికి పంపించివేశారు. ఇళ్లకు చేరుకున్న తర్వాత కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. తల్లిదండ్రులు వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మొత్తం వందమంది విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ అయినట్లు గుర్తించారు. కాగా, కడుపులో నొప్పిగా ఉందని చెప్పిన కొందరు విద్యార్థులను టీచర్లు కొట్టినట్లు చెపుతున్నారు. ఇక్కడ ఫుడ్‌పాయిజన్ మొదటిసారి కాదు! విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొన్న డీఈఓ అబ్దుల్ ఘనీ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఈ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం ఇది మూడోసారి అని విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓతో వాగ్వాదానికి దిగారు. వంట ఏజెన్సీ, పాఠశాల హెచ్ఎం (ఇన్చార్జ్ ఎంఈఓ) నిర్లక్ష్యం కారణంగానే ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఆరోపించారు.విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని వంట ఏజెన్సీని తక్షణమే మార్చాలని హెచ్ఎంతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా పాఠశాలకు చేరుకుని ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈఓను, ఎస్ఐ అశోక్‌బాబును ఆదేశించారు. ఎమ్మెల్యే తన వాహనంతోపాటు ప్రైవేట్ అంబులెన్స్‌లో విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. సీఎం సీరియస్: మాగనూర్ ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. విద్యార్థుల అస్వస్థత విషయం తెలియగానే వారి ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకొన్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సంఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని సీఎం హెచ్చరించారు. విద్యార్థుల అస్వస్థతపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠాలు నేర్చుకోవడం కాదు.. ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచి్చందని ఆరోపించారు. ‘గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా?’అని ప్రశ్నించారు. -
ఈ భోజనం తినేదెలా?
అఎస్.రాయవరం: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం యూపీ స్కూల్లో మధ్యాహ్న భోజనం అత్యంత దారుణంగా ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం వండాల్సిన సాంబారు కిచిడీని మాడ్చేసి వడ్డించడంతో విద్యార్థులు దాన్ని తినలేక పారబోశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వడ్డించిన భోజనాన్ని పరిశీలించారు. ఆరోగ్యంగా ఎదగాల్సిన పిల్లలకు ఇంత దారుణమైన భోజనం పెడతారా? దీన్ని తినేదెలా? అని మండిపడ్డారు. పేరెంట్స్ కమిటీ సమావేశం రోజే.. ఇక గురువారం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు భోజనం తినేసరికి మాడు వాసన రావడంతో పడేసి ఆందోళనకు దిగారు. అదే సమయంలో పేరెంట్స్ కమిటీ సమావేశం సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అందుబాటులో ఉండటంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను, ఉపాధ్యాయులను నిలదీశారు. తరచూ భోజనం నాసిరకంగా పెడుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారని ఆరోపించారు. పేరెంట్స్ సమావేశం ఉన్నప్పుడే ఇంత దారుణంగా ఉంటే సాధారణ రోజుల్లో ఇంకెలా ఉంటుందో తెలుస్తోందన్నారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు సంతోష్ స్పందిస్తూ.. విద్యార్థులకు మంచిగా ఆహారం మళ్లీ వండిపెట్టాలని నిర్వాహకులను ఆదేశించారు. తమకిచ్చే గుడ్లు కూడా బాగోలేవని విద్యార్థులు చెప్పగా, ప్రభుత్వం అలాంటి గుడ్లనే సరఫరా చేస్తున్నపుడు, తామేం చేయగలమని తల్లిదండ్రులతో హెచ్ఎం చెప్పారు. ఇక పాఠశాలలో వసతులూ బాగోలేవని, మైదానం దారుణంగా తయారైందని, ఇలా ఉంటే పిల్లల పరిస్థితి ఏంటని ప్రశి్నంచారు. చివరికి.. నిర్వాహకులు మళ్లీ భోజనం వండి పెట్టడంతో ఆందోళన ముగిసింది. -
మిడ్ డే భోజనంలో పాము కలకలం..విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మయూరేశ్వర్ బ్లాక్‌లోని ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల్లో అనూహ్యంగా మధ్యాహ్నా భోజనంలో పాము కనిపించినట్లు కలకలం రేగింది. ఇంతలో ఐతే అప్పటికే ఆ భోజనం తిన్న 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకోవడం జరిగింది. దీంతో వారిని హుటాహుటినా రామ్‌పూర్‌హట్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐతే పప్పు నింపిన కంటైనర్‌లో పాము కనిపించినట్లు భోజనం సిద్ధం చేసిన సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. వారిలో ఒక విద్యార్థి మాత్రం ప్రమాదం నుంచి బయటపడి.. డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. అదీగాక మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నట్లు ఆ పాఠశాలపై ఫిర్యాదు వస్తున్నట్లు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దీపాంజన్ జానా చెప్పారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆ పాఠశాల ఉపాధ్యాయుడిని ముట్టడించి, అతడి వాహానాన్ని ధ్వసం చేసినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: దారుణం: ఆకస్మికంగా ఓ వ్యక్తిపై దాడి.. చేయి నరికి..) -
ఉడుకుతున్న కూర బానలో పడి పాప మృతి
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా, రాంపూర్ అటారి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఘోరం జరిగిపోయింది. పిల్లల మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాట్లు జరగుతున్నప్పుడు ఉడుకుతున్న కూర బానలో ప్రమాదవశాత్తు మూడేళ్ల పాప పడిపోయి కాలిన గాయాలతో మరణించింది. ఆ సమయంలో వంటవాడు ఇయర్ ఫోన్లు పెట్టుకొని పాటలు వింటుండంతో పాప పడిపోయిన శబ్దంగానీ, ‘అయ్యో చెల్లె పడిపోయింది. పడిపోయింది. రక్షించండి’ అంటూ ఆ పాప సోదరుడు పెట్టిన అరుపులుగానీ వినిపించుకోలేదు. సోదరుడు వచ్చి వంటివాడిని కుదిపేస్తేగానీ జరిగిన ఘోరం వంటవాడికి అర్థం కాలేదు. పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే స్పందించి పాపను ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అప్పటికే ఒళ్లంతా కాలిపోవడంతో ఆ పాప మరణించింది. ఈ సంఘటనపై వెంటనే స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ సుశీల్ కుమార్ పటేల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో ఇలాంటి ఘోరం జరగడం ఇదే మొదటిసారి కాదు. తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాలో గత నవంబర్ నెలలో సురేశ్ అనే మూడేళ్ల బాలుడు ఉడుకుతున్న పప్పు బానలో పడి చనిపోయాడు. వంటకు సమీపంలో ఆ బాలుడు ఆడుకుంటున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నవంబర్ నెలలోనే ఆంధ్రపదేశ్‌లోని కర్నూల్ పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలుడు ఉడుకుతున్న సాంబారును చిన్న బకెట్లోకి తీయబోయి పొరపాటున బానాలో పడిపోయి మరణించాడు. -
పగతో భోజనంలో విషం కలిపిన విద్యార్థిని
గోరఖ్‌పూర్: తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకునేందుకు స్కూల్లోని మధ్యాహ్న భోజనంలో విషం కలిపిందో విద్యార్థిని. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు లాగే మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. ఇదే స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆ భోజనంలో విషం కలిపింది. భోజనంలో ఏదో కలిసిందని అనుమానం వచ్చిన వంట మనుషులు విషయాన్ని స్కూల్ టీచర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు పాఠశాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ చర్యకు పాల్పడిన ఆ బాలికతో పాటు ఆమె తల్లిని ప్రశ్నించారు. అయితే సదరు విద్యార్థిని మాత్రం తాను విషం కలపలేదని చెబుతోంది. భోజనం శాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపిన పోలీసులు.. రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, బాలిక విషం ఎందుకు కలిపిందని ఆరా తీయగా ఆశ్యర్యకర విషయాలు తెలిశాయి. మూడు నెలల క్రితం అదే స్కూల్లో చదువుతున్న బాలిక తమ్ముడ్ని మరో విద్యార్థి ఇటుక రాయితో దాడి చేశాడు. దీంతో అతను మృతిచెందాడు. ఇక అప్పటి నుంచి బాలిక పగ పెంచుకుందని కొంతమంది విద్యార్థుల అంటున్నారు. తమ్ముడి మృతికి ప్రతీకారంగానే భోజనంలో విషం కలిపి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఆధార్ లేకున్నా సబ్సిడీ ప్రయోజనాలు: కేంద్రం
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు లేనంత మాత్రాన ఎవరికీ ప్రభుత్వ సబ్సిడీ ప్రయోజనాలను నిరాకరించలేమని, ఇతర గుర్తింపు కార్డులనూ అంగీకరిస్తామని కేంద్రం స్పష్టతనిచ్చింది. ఉపకారవేతనాలు, మధ్యాహ్న భోజన పథకాలకు కేంద్ర మానవ వనరుల శాఖ ఆధార్‌ను తప్పనిసరిచేయడం పట్ల పలు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఆధార్ లేనందుకు ఎవరూ ప్రభుత్వ సబ్సిడీలకు దూరం కాకూడదు. ఆధార్ పొందే వరకూ ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల ద్వారా వారికి ప్రయోజనాలు అందుతాయి’ అని అధికార ప్రకటన వెలువడింది. మధ్యాహ్న భోజనం, సమీకృత పిల్లల అభివృద్ధి పథకాల కింద లబ్ధిదారుల ఆధార్ వివరాలు సేకరించాలని పాఠశాలలు, అంగన్వాడీలను కోరతామని, కార్డు లేనివారు అందుకు నమోదుచేసుకునేలా అధికారులు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. -
మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదని విద్యార్థుల ధర్నా
తిప్పర్తి మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించడం లేదని శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు వంటలను సరిగా వండటం లేదని, సరిపడా వడ్డించడం లేదని తెలిపారు. భోజనం పెట్టమని అడిగితే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరుకులను కూడా మాయం చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వరమూర్తి, జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి, సర్పంచ్ జాకటి మోష పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పి ఏజెన్సీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ అరుణశ్రీ,, ఈఓ పీఆర్డీ జగదీశ్‌రావు, తండు నర్సింహగౌడ్ పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో సుమారు 200 మంది పాల్గొన్నారు. -
అక్కడ..మధ్యాహ్న భోజనం హుళక్కే..
చంఢీఘర్ః పంజాబ్ లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కావడం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) తాజా నివేదికలు వెల్లడించాయి. బడి ఈడు పిల్లలను బడికి వచ్చేలా ప్రోత్సహించడం, పాఠశాలల్లో డ్రాపవుట్స్ ను తగ్గించడం, స్కూల్ పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రారంభించిన మిడ్ డే మీల్ స్కీమ్ (ఎండీఎంఎస్) ముఖ్యంగా చంఢీఘర్ లో కుంటుపడినట్లు కాగ్ నివేదికలు చెప్తున్నాయి. అమృత్ సర్, లూథియానాల్లోని 32 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 50,417 పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలు కావడం లేదని కాగ్ నివేదికలను బట్టి తెలుస్తోంది. పేద విద్యార్థులకోసం అమలు చేసే ఈ పథకంలో వంటకాలకు అయ్యే ఖర్చు 2010-15 సంవత్సరాలమధ్య సుమారు 810.82 కోట్ల రూపాయలు కాగా, అందులో 734.28 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం విడుదల చేసినట్లు కాగ్ లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే అక్కడి మొత్తం 180 పాఠశాలను పరిశీలించగా వాటిలో 40 వరకూ స్కూళ్ళలో వంట ఖర్చులు సరిపోక మధ్యాహ్న భోజన పథకం అమలు కావడం లేదని కాగ్ తెలిపింది. ముఖ్యంగా ఎండీఎంఎస్ కోసం విడుదల చేసిన నిథులు ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని కాగ్ చెప్తోంది. 2010-15 మధ్య కాలంలో విడుదలైన 7.77 కోట్ల రూపాయల నిథులను జిల్లాస్థాయిలో జీతాలు, రవాణా, ఇతర అనుకోని ఖర్చులు చేసినట్లు కాగ్ పరిశీలనలో తేలింది. 2012-14 సంవత్సరాల్లో పాఠశాలలకోసం ప్రభుత్వం విడుదల చేసిన నిథుల్లో 41 లక్షల రూపాయల వరకూ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన కేంద్రాల్లోని కార్యాలయ భవనాల (పీఎస్ఈబీ భవనం) అద్దెలు, మరమ్మతులకు వినియోగించినట్లు కాగ్ లెక్కలు చెప్తున్నాయి. అలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందించే పోషకాహార వంటకాలకు సంబంధించిన వివరాలపై స్కూళ్ళు, జిల్లా స్థాయిలో కూడా ఎటువంటి రికార్డులు నిర్వహించటంలేదని కాగ్ తెలిపింది. మధ్యాహ్న భోజన పథకంలోని వంటకాల్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు అందించే ఆహారంలో ప్రభుత్వ మార్గదర్శకాలను బట్టి 450 నుంచి 700 కేలరీలను, 12 నుంచి 20 గ్రాముల ప్రొటీన్లను చేర్చాల్సి ఉంది. కాగా 2013 ఆగస్టు, 2015 జనవరికి మధ్య ఎన్జీవోలు అందించిన ఆహార పదార్థాలను అధికారిక ప్రయోగశాలల్లో పరిశీలించగా సుమారు 1,41,523 మందికి నిబంధనలకు అనుగుణంగా ఆహారంలో పోషకాలను అందించలేదని కాగ్ వెల్లడించింది. -
మధ్యాహ్నం..స్పందన అధ్వానం!
కరువు నేపథ్యంలో సర్కారు బడిపిల్లలకు సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలనుకున్న ప్రభుత్వ ఆశయం తొలిరోజే నీరుగారింది. విద్యాశాఖ అంచనాల కంటే అతి తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 2,062 ప్రభుత్వ పాఠశాలల్లోని 80,329 మంది విద్యార్థులు భోజనం చేస్తారని అంచనా వేశారు. కానీ తొలిరోజైన బుధవారం కేవలం 42శాతం మందే హాజరయ్యారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా 14 పాఠశాలల్లో విద్యార్థులు నిల్ శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మండలంలో 71 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా కేవలం 57 పాఠశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. 7200 మంది విద్యార్థులకు కేవలం 1219 మంది మాత్రమే భోజనం చేశారు. పెద్దషాపూర్, పెద్దతూప్ర, మల్కా రం, ఇనాంషేరి, ఊట్పల్లి, కేఎల్.చారినగర్, బుర్జుగడ్డతండా తదితర గ్రామాల్లో విద్యార్థులు లేక భోజనం వండలేదు. తాళాలు కూడా తీయలేదు చేవెళ్లరూరల్ : ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా చేవెళ్ల మండలంలో వేసవి ప్రత్యేక మధ్యాహ్న భోజన పథకం బుధవారం పూర్తిస్థాయిలో కాలేదు. తొలి రోజు చాలా పాఠశాలలకు తాళాలు కూడా తీయలేదు. మండలంలో 63 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా 510 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా వీరిలో 50శాతం మంది వేసవి మధ్యాహ్న భోజన పథకానికి హాజరవుతారని అధికారులు అంఛనా వేశారు. కానీ కేవలం 400 మంది మాత్రమే భోజనం చేశారు. 30 పాఠశాలల్లో నామమాత్రంగా అమలు కాగా 33 పాఠశాలలు అసలు తెరచుకోలేదు. కొన్ని పాఠశాలల్లో బియ్యం లేకపోవడంతో మధ్యాహ్న భోజనం పెట్టలేక పోయామని అధికారులు పేర్కొన్నారు. దండోరా వేయించాం.. వేసవి సెలవుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నట్లు గ్రామాల్లో ఇప్పటికే దండోరా వేయించాం. అందుబాటులో ఉన్న విద్యార్థులకు కూడా సమాచారం అందించాం. తోటి విద్యార్థులకు తెలిసేలా చర్యలు తీసుకుంటున్నాం. మొదటి రోజు విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంది. - రాంరెడ్డి, ఎంఈఓ, శంషాబాద్ 588 మందికే భోజనం ఇబ్రహీంపట్నం రూరల్ : ఇబ్రహీంపట్నం మండల పరిధిలో 50 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా 5485 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో వేసవి ప్రత్యేక మధ్యాహ్న భోజనానికి 1,777 మంది వస్తారని అధికారులు గుర్తించారు. కానీ బుధవారం మండల వ్యాప్తంగా 588 మంది మాత్రమే భోజనం చేశారు. 24 పాఠశాలల్లో నామమాత్రంగా భోజనం చేయగా 26 పాఠశాలల్లో తలుపులు కూడా తెరవేదు. ఆసక్తి చూపని విద్యార్థులు ధారూరు : మండలంలోని 62 ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం వేసవి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. 4,952 మంది విద్యార్థులకు 1032 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేశారు. సమీప గ్రామాల విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో సంఖ్య తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. గోదంగుడ, సర్పన్‌పల్లి, మోమిన్‌కలాన్ గ్రామాల్లో మధ్యాహ్న భోజనాన్ని ఎంఈఓ బాబుసింగ్ పరిశీలించారు. -
కడుపు నిండా తిను.. బాగా చదువుకో!
రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మధ్యాహ్న భోజనాన్ని డిగ్రీ విద్యార్థులకూ అందుబాటులోకి తెచ్చింది రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం. శనివారం జిల్లావ్యాప్తంగా కూకట్పల్లి, మల్కాజిగిరి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, తాండూరు, వికారాబాద్‌లోని డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థులే సర్కారు కాలేజీల్లో చదువుతున్నారని భావించిన కలెక్టర్ రఘునందన్‌రావు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఒక పూట భోజనం పెట్టడం ద్వారా చదువుపై శ్రద్ధ పెరిగి, ఉత్తీర్ణతాశాతం పెరుగుతుందని అంచనా వేశారు. మధ్యాహ్నం వంట కోసం నిధులు కేటాయించారు. దీంతో జిల్లావ్యాప్తంగా 1200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందనుంది. -
మధ్యాహ్న భోజనం అమలుపై థర్డ్ పార్టీ తనిఖీలు
♦ హోంసైన్స్ కాలేజీ, సెస్, ఎన్ఐఎన్, ఎన్జీవో ప్రతినిధుల తో బృందం ♦ ఆహార నాణ్యతపైనా పరీక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం స్థితిగతులపై థర్డ్ పార్టీ తనిఖీలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. భోజనం వండటం నుంచి విద్యార్థులు తినే వరకు వండుతున్న తీరు, నాణ్యత, పాటిస్తున్న పరిశుభ్రత తదితర అన్ని అంశాలపై ప్రత్యేక బృందం నేతృత ్వంలో తనిఖీలు చేపట్టనుంది. హోంసైన్స్ కాలేజీ, సెస్, ఎన్ఐఎన్, ఎన్జీవో ప్రతినిధుల నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు చేపడుతున్న చర్యలు, అమలులో లోపాలు, మెనూ అమలు తదితర అన్ని అంశాలపై థర్డ్ పార్టీ (బృందం) తనిఖీలు చేసి నివేదికలు అందజేయనుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తనిఖీలను చేపట్టనుంది. ఆ నివేదిక అధారంగా మధ్యాహ్న భోజనం అమలును మరింత పటిష్టం చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. బిల్లుల చెల్లింపుపైనా కసరత్తు: మధ్యాహ్న భోజనం బిల్లుల చెల్లింపు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వాటి చెల్లింపులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. మూడో క్వార్టర్‌కు సంబంధించిన బిల్లులు ఇంతవరకు మంజూరు కాలేదు. దీనిపై విద్యాశాఖకు విజ్ఞప్తులు అందాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా డెరైక్టర్ జి.కిషన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ అధికారులతోనూ చర్చించారు. మరోవైపు బిల్లుల చెల్లింపు విషయంలో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. బిల్లుల చెల్లింపు విధానాన్ని ఆన్లైన్ చేయాలని భావిస్తోంది. విద్యాశాఖ మధ్యాహ్న భోజనం నిధులను ప్రభుత్వం నుంచి ఒకేసారి మంజూరు చేయించుకొని, ఆన్లైన్ విధానంలో నేరుగా ఏజెన్సీల అకౌంట్లలో వేసే అంశంపై కసరత్తు చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే బిల్లులు రాలేదన్న ఆందోళన ఏజెస్సీలకు ఉండదు. -
ఆకలితో విద్యార్థుల విలవిల
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కుప్పం బహదూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు మంగళవారం మధ్యాహ్న భోజనం కోసం అలమటించారు. మధ్యాహ్న భోజనం బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీకి ఆరు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో వారు మంగళవారం భోజనం వండలేదు.అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో 130 మంది విద్యార్థులు ఆకలితో విలవిలలాడిపోయారు. -
మధ్యాహ్న బోజనం సాంబార్లో ఎలుక
-
సురక్షితమేనా ..?
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో మధ్యాహ్నం భోజనం (మిడ్ డే మీల్) నాణ్యత ఎంత వరకు సురక్షితమనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పిల్లలకు ఉత్తమ విద్యతో పాటు పౌష్టికాహారంతో కూడిన భోజనం అందిస్తున్న కర్ణాటకలో శుక్రవారం డీజే హళ్లి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కలుషిత ఆహారం తిని ఉర్దూ పాఠశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. భోజనం తయారీ, రవాణా వంటి విషయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలో ఒకటి నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,113 పాఠశాలల్లోని 61.40 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం వల్ల లబ్ధిపొందుతున్నారు. గ్రామాలు, ఓ మోస్తరు పట్టణ పాఠశాలల్లో భోజనాన్ని అప్పటికప్పుడు వండి విద్యార్థులకు అందిస్తున్నారు. అయితే బెంగళూరు, మైసూరు వంటి నగరాల్లో, ఈ పథకంలో భాగస్వాములైన ఆయా స్వచ్ఛంద సంస్థలు ఒకే చోట మధ్యాహ్న భోజనాన్ని వండి వివిధ ప్రాంతాల్లోని పాఠశాలలకు రవాణా చేస్తున్నాయి. ప్రస్తుతం 93 స్వచ్ఛంద సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా 5,768 పాఠశాలల్లోని 10.66 లక్షల మంది విద్యార్థులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. పిల్లలకు అందజేసే ఆహార తయారీ, సరఫరా విధానాల్లో అనుసరించాల్సిన ప్రమాణాల విషయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం అమలు విషయమై మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ (ఎంహెచ్ఆర్డీ) గత ఏడాది చివర్లో సమీక్ష నిర్వహించి కొన్ని సూచనలను జారీ చేసింది. పాఠశాలకు, మధ్యాహ్న భోజనం వండే చోటికి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండకూడదని సూచించింది. విద్యార్థులకు అందించే ఆహారంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు 490 గ్రాముల క్యాలరీలు, 10 గ్రాముల ప్రోటీన్లు అదే ప్రాథమికోన్నత విద్యార్థులకు రోజుకు 720 గ్రాముల క్యాలరీలు, 16 గ్రాముల పోట్రీన్లు ఉండాలి. అయితే ఏ స్వచ్ఛంద సంస్థ కూడా ఈ నిబంధనలను పాటిస్తున్న దాఖలాలు లేవు. డీ.జే హళ్లి ఘటననే తీసుకుంటే ఆ పాఠశాలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న అక్షయపాత్ర సంస్థ నగరంలోని మరో 897 పాఠశాలకు కూడా మధ్యాహ్న భోజనాన్ని రవాణా చేస్తోంది. ఇందుకోసం వసంతపురలో కేంద్రీకృత వంటతయారీ కేంద్రం (సెంట్రలైజ్డ్ కిచెన్) ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ సెంట్రలైజ్డ్ కిచెన్‌కు దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు కూడా ఇక్కడి నుంచే భోజనాన్ని సరఫరా చేస్తున్నారని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మద్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్న మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇదే తరహాలో ఎక్కువ దూరం ఉన్న భోజనశాలల నుంచి ఆహార పదార్థాలను రవాణా చేస్తున్నాయి. భోజనాన్ని మధ్యాహ్నానికే ఆయా పాఠశాలలకు చేర్చాల్సి ఉండడంతో తెల్లవారుజామునే వండటాన్ని పూర్తిచేసి మూత ఉన్న పాత్రల్లో ఉంచి ఈ సంస్థలన్నీ సంబంధిత పాఠశాలలకు పంపిస్తున్నాయి. దూరం ఎక్కువకావడం, వాతావరణ పరిస్థితులు తదితర కారణాలతో ఆహారం చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా రవాణాకు ఉపయోగించే వాహనాలు అపరిశుభ్రత కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో డీ.జే హళ్లి తరహా ఘటనలు పునరావృతమవుతాయేమోననే ఆందోళనలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సమస్య పరిష్కారం కోసం ఆయా నగరాల్లోని కమ్యూనిటీ హాల్స్, కల్యాణమంటపాలతోపాటు ప్రభుత్వ స్థలాల్లో మినీ కిచెన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశమిస్తే ‘ఎంహెచ్ఆర్డీ’ ప్రమాణాలకు అనుగుణంగా ఆహారాన్ని వండటం, రవాణా చేయడానికి వీలవుతుందని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయమై అక్షయపాత్ర అధికార ప్రతినిధి భరత్‌దాస్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.... ‘పాఠశాల నుంచి భోజనశాలకున్న దూరం 20 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉండాలన్నది కేవలం సూచన మాత్రమే. ఖచ్చితంగా పాటించాలనే నిబంధన కాదు. మా కిచెన్‌కు ఐఎస్వో సర్టిఫికెట్ ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకునే మధ్యాహ్నభోజనాన్ని తయారు చేస్తున్నాం. ఆహారాన్ని అందించడం వరకే మా బాధ్యత. పాఠశాలల్లో ఏదైనా జరిగి ఉంటే మాకు సంబంధం లేదు. డీ.జే హళ్లి ఘటనకు సంబంధించి ఈ విషయంపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది’ అని పేర్కొన్నారు. -
నాణ్యతలేని భోజనం మాకొద్దు
పుల్లేటికుర్రు (అంబాజీపేట) :నాణ్యతలేని మధ్యాహ్న భోజనం పెడుతున్నారు.. ఉడకని కూరలు, ముద్దయిన అన్నం మాకొద్దంటూ 500 మంది విద్యార్థులు ఆందోళన చేశారు. ఉపాధ్యాయులకు, ఇంప్లిమెంట్ ఏజెన్సీ నిర్వాహకులకు నాలుగు నెలలుగా భోజనం బాగుండడం లేదని చెబుతున్నా పట్టించుకోలేదని విద్యార్థులు అన్నారు. మండలంలోని పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం భోజనం సమయంలో కూర, అన్నం బాగోలేదంటూ సెంటర్లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. అన్నంలో రాళ్లు, వడ్లు ఉంటున్నాయని, వంకాయ కూర తినేందుకు వీలుగా లేదని వంకాయ ముక్కలు ఉడకలేదని విద్యార్థులు అన్నారు. ఇంప్లిమెంట్ ఏజెన్సీ నిర్వాహకులను అడుగగా తింటే తినండి, లేకపోతే మానేయండని చెప్పడంతో విద్యార్థులు పుల్లేటికుర్రు సెం టర్కు చేరుకుని మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు. నాణ్యమైన భోజనం పెట్టాలని, ఇంప్లిమెంట్ ఏజెన్సీని మార్పు చేయాలని వారు నినాదాలు చేశారు. ఆర్ఐ బి.గోపాలకృష్ణ విద్యార్థులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాస్తారోకో విరమించిన విద్యార్థులు హైస్కూలుకు చేరుకుని ధర్నా చేశారు. ఎంఈఓ ఎం.హరిప్రసాద్, ఆర్ గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్ అందె వెంకట ముక్తేశ్వరరావులతో పాటు పలువురు విద్యార్థులతో మాట్లాడారు. నాలుగు నెలల నుంచి భోజనం తినేం దుకు రుచిగా లేక బయట పడేస్తున్నట్టు విద్యార్థులు తెలిపారు. ఈ విషయం ఉపాధ్యాయులకు చెప్పినా పరిస్థితిలో మార్పులేదని వారన్నారు. హాస్టల్స్ విద్యార్థులు 200 మంది ఆకలితో అలమటిస్తున్నట్టు వారు తెలిపారు. వంటకాలను ఎం ఈఓ రుచి చూసి కూరలు బాగోలేదని వంకాయి కూర చేదుగా ఉండి, ఉడకలేదన్నారు. అనంతరం ఎంఈఓ, స్థానికులు బయటి నుంచి పెరుగు, పచ్చడి తెప్పించి విద్యార్థులకు భోజనం పెట్టించారు. అనంతరం హెచ్ఎం. ఎస్.సుబ్బరాజును అధికారులు, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణలు ఆరాతీశారు. ఆఫీసు రూంలో ఉండగా విద్యార్థులు బయటకు వెళ్లిపోయారని హెచ్ఎం తెలిపారు. ఎస్ఎంసీ చైర్మన్, హెచ్ఎంలతో చర్చించి విద్యార్థుల నుంచి రాత పూర్వకంగా ఫిర్యాదు తీసుకోవాలని ఎంఈఓ అన్నారు. ఉన్నతాధికారులకు ఈ ఫిర్యాదు పంపి చర్యలకు సిఫార్సు చేస్తామని ఎంఈఓ తెలిపారు. -
అలారుదిన్నెలో.. మధ్యాహ్న భోజనం బంద్
దేవనకొండ: అవగాహన లోపం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని దూరం చేసింది. గ్రామంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి ఘర్షణల తో రెండు రోజులుగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. కొందరు విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక ఇళ్లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సంఘటన మండల పరిధిలోని అలారుదిన్నె ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. గ్రామంలో గత కొన్నేళ్లుగా వెంకటేశ్వర ఏజెన్సీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఆ ఏజెన్సీని రద్దుచేసి ఇతరులకు అప్పగించాలంటూ గతంలో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భోజనాన్ని తామే నిర్వహిస్తామని గ్రామసర్పంచ్ మహేశ్వరమ్మ ముందుకొచ్చారు. దీంతో సర్పంచ్, వెంకటేశ్వర ఏజెన్సీ గ్రూపు మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఫలితంగా గత రెండు రోజులుగా దాదాపు 160 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేక కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న తహశీల్దార్ జయప్రభ, ఎంపీడీఓ కృష్ణమోహన్‌శర్మ, ఎంఈఓ యోగానందం, ఐకేపీ ఏపీఎం వీరన్న గురువారం గ్రామంలో విచారణ చేపట్టారు. నాణ్యమైన భోజనాన్ని అందించే ఏజెన్సీలకే బాధ్యతలు అప్పజెబుతామని వారు పేర్కొన్నారు. -
పురుగుల బియ్యంతో భోజనంబు..!
మధ్యాహ్న భోజన పథకం దుస్థితి వంట ఏజెన్సీలకు ఇబ్బందులు పందిళ్ల కిందే వంటలు పురుగుల బియ్యం పంపిణీ హనుమాన్‌జంక్షన్‌రూరల్ : విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయడంలో అధికారులకు చిత్తశుద్ధి లోపించడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల లో వంట షెడ్లు లేక తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పందిర్ల కింద వంటలు వండలేక నిర్వాహకులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే ప్రాథమిక పాఠశాలలకు కొంతమంది నిర్వాహకులు ఇళ్లవద్దనే ఆహారపదార్థాలను తయారీ చేసి తీసుకువస్తున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సుమారు 300కు పైగా విద్యార్థులు ఉండటంతో పాఠశాల ఆవరణ లోనే వంటలు తయారు చేయాల్సి వస్తోంది. దీంతో పొగ వెదజల్లి విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ పొయ్యి పైనే వంటవండాలని నిబందనలు విధించినప్పటికి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయకపోవడంతో పుల్లల పొయ్యి వెలిగించక తప్పడంలేదు. బాపులపాడు మండలంలో ఆరుగొలను, కానుమోలు, రామన్నగూడెం, బాపులపాడు, వీరవల్లి, వేలేరు, రేమల్లె గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాల ల్లో మధ్యాహ్న బోజన పథకం అమలు... ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వీరవల్లి, వేలేరు పాఠశాలల్లో మాత్రమే వంట షెడ్డులు వున్నాయి. గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోవడంతో పుల్లల పొయ్యిలపైనే వంటలు తయారు చేస్తున్నారు. వంట ఏజెన్సీలకు 9,10 తరగతులకు సంబందించి రెండు నెలలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానుమోలు జిల్లా పరిషత్ పాఠ శాలకు సరఫరా చేసిన బియ్యంలో రాళ్లు, ఎర్రటి పెంకు పురుగు, తెల్లటి రంగులో ఉండే పురుగులు కనిపిస్తున్నారు. వీటినే మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాద్యాయురాలిని ఈ విషయమై వివరణ కోరగా బియ్యం మార్చినా మళ్లీ అలాంటి బియ్యం వచ్చాయని చెప్పారు. దీంతో బియ్యం జల్లించి, పురుగులు చెరిగి, నీటితో కడిగి వంటకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. నిత్యం 30కేజీలు బియ్యం నుంచి రాళ్లు, పురుగులు ఏరడం ఎలా సాధ్యమవుతుందని వంట ఏజెన్సీ నిర్వహకులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలు చివరకు పురుగుల అన్నం తినాల్సి వస్తోందని విద్యార్థుల తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పం దించి, మధ్యాహ్న భోజనపథకం సక్రమంగా అమ్చయ్యేలా చూడాలని కోరుతున్నారు. -
మధ్యాహ్న భోజనం బాధ్యతలు టీచర్లకు వద్దు
ముంబై: పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై ముంబై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ పథకం బాధ్యతలను టీచర్లకు అప్పగించరాదంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం బోధనేతర బాధ్యతని కోర్టు స్పష్టం చేసింది. విద్యా చట్టం 27వ సెక్షన్ ప్రకారం ఇలాంటి బోధనేతర పనులను ఉపాధ్యాయులకు అప్పగించరాదని న్యాయస్థానం పేర్కొంది. ఎన్నికలు, విపత్తులు, జనభా లెక్కలు వంటి బాధ్యతలు మినహా ఇతర పనులు అప్పగించరాదని వ్యాఖ్యానించింది. -
చదువులమ్మకు వెక్కిళ్లు
కామారెడ్డి, న్యూస్‌లైన్: పాఠశాలలలో తాగునీటి సమస్య సంవత్సరాలుగా ఉన్నా మధ్యాహ్న భోజన పథకం వచ్చిన తరువాత తీవ్రంగా మారింది. అన్నం తిన్న తరువాత విద్యార్థులు నీళ్లు తాగడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో అన్ని వసతులు కల్పిస్తున్నట్టు ప్రభుత్వాలు చె బుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే వెక్కిరిస్తున్నాయి. బెంచీలు, ఫ్యాన్లు ఏమో గాని కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేని బడులు ఎన్నో ఉన్నాయి. తాగునీటి వసతులు కల్పించేందుకం టూ ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నిర్వహణ లేకనే జిల్లాలో సగానికి పైగా పాఠశాలలలో తాగునీటి సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 1,594 ప్రాథమిక పాఠశాలలలో 99,921 మంది, 282 ప్రాథమికోన్నత పాఠశాలలలో 29,646 మంది, 509 ఉన్నత పాఠశాలలలో (36 కస్తూర్బా స్కూళ్లతో కలిపి) 1,22,529 మంది చదువుతున్నారు. మొత్తంగా 2,385 పాఠశాలలలో 2,52,145 మంది చదువుతున్నారు. వీరికి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు ప్రవేశపెట్టిన జలమణి పథకం ద్వారా జిల్లాలో కేవలం 143 పాఠశాలలలో మాత్రమే సౌకర్యాన్ని కల్పించా రు. చాలా చోట్ల అవి కూడా పనిచేయకుండా మూలనపడ్డాయి. 2,360 పాఠశాలలకుగాను వెయ్యికి పైగా పాఠశాలలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని చోట్ల బోరు, మోటార్లు, నీటి ట్యాంకులు ఉన్నా సరైన నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మరి కొన్ని చోట్ల నీటి ట్యాంకులు ఉన్నా పని చేయ డం లేదు. ప్లాస్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేసి నా, వాటికి నీటినందించే సిస్టం లేక వృథాగా ఉంటున్నాయి. నీటి వసతి ఉన్న చోటనే, అవసరం లేకున్నా బోర్లు తవ్వించడంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. అదే సమస్య ఉన్నచోట మాత్రం పట్టించుకునేవారు ఉండరని పలువురు విద్యాభిమానులు విమర్శిస్తున్నా రు. ఇప్పటికైనా నీటి సమస్య ఉన్న బడులను గుర్తించి సమస్య పరిష్కారానికి సరైన చర్యలు తీసుకోవాలని విద్యాభిమానులు కోరుతున్నారు. నీళ్లు లేక చానా ఇబ్బంది పడుతున్నం స్కూల్లో బోరు చెడిపోయింది. ఎన్నో రోజులుగా నీళ్లు లేవు. టాయ్‌లెట్‌కు వెళ్లాలంటే చానా ఇబ్బంది పడుతున్నం. బోరును మరమ్మతు చేయించి మా ఇబ్బందిని తొలగించాలి. అధికారులు దృష్టి సారించాలి -స్వప్న, ఏడో తరగతి, తిర్మన్‌పల్లి, సదాశివనగర్ మండలం పళ్లాలు కూడా కడుక్కోలేకపోతున్నాం అన్నం తిన్న తరువాత పళ్లాలు కడుక్కోవడం ఇబ్బంది అవుతోంది. బడికి దగ్గరలో ఉన్న మోటారు కరెంటు ఉంటేనే నడుస్తుంది. లేకుంటే కష్టమే. ఇళ్ల నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకోవాల్సిందే. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలి. -రమేశ్, ఏడో తరగతి, తిర్మన్‌పల్లి, సదాశివనగర్ మండలం -
మధ్యాహ్న భోజనం అంత అధ్వానమా?
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ‘‘పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అంత అధ్వానంగా ఉందా.. ఎందుకు ఈ విధంగా ఉంటోంది. ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలు ఏమి చేస్తున్నారు.. పాఠశాలలకు వెళ్లి చూడటం లేదా’’ అని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి. మధ్యాహ్న భోజన పథకం అమలు, కిచెన్ షెడ్ల నిర్మాణంలో జాప్యం తదితర వాటిపై సాక్షి ఇటీవల సమరసాక్షి శీర్షికన ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఇందుకు స్పందించిన కలెక్టర్ శుక్రవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక డీఈఓ, డిప్యూటీ డీఈఓలు నీళ్లు నమిలారు. ఈ నెలలో ఎన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు.. భోజనం నాణ్యత బాగుందా.. ఏఏ లోపాలు గుర్తించారు.. వాటిపై డీఈఓకు రిపోర్టులు ఇచ్చారా అనే దానిపై డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓల వారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎంఈఓలు ప్రతినెలా కనీసం 20 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తీరు తనిఖీ చేయాల్సి ఉందన్నారు. ఈ నెలలో ఇంత వరకు పలువురు ఎంఈఓలు నాలుగు, ఐదుసార్లు మాత్రమే తనిఖీ చేసినట్లు చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలో భోజనం నాణ్యత బాగా లేకపోతే ఏజెన్సీకి మెమోలు ఇవ్వండి.. ఇలా మూడు సార్లు మెమోలు ఇచ్చినా మార్పు రాకపోతే సంబంధిత ఏజెన్సీని తొలగించాలని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీటి వసతి, ఇతర ఏర్పాట్లపై తాను తనిఖీ చేసి చెబితే తప్ప స్పందించడం లేదని ఎంఈఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వివరాలతో రిపోర్టులు ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
విద్యార్థుల ఆకలి కేకలు
చీరాల రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొందరు అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నీరుగారుతోంది. చీరాల పట్టణంలోని మూడు ప్రభుత్వ పాఠశాలల్లో వారం రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే..చీరాల పట్టణంలోని ఆంధ్రరత్న మునిసిపల్ ఉన్నత పాఠశాల, ఎన్‌ఆర్‌అండ్‌పీఎం, కస్తూరిబా గాంధీ బాలికోన్నత పాఠశాలల్లో గతంలో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేది. ఆంధ్రరత్న మునిసిపల్ బాలికోన్నత పాఠశాలలోని 388 మంది విద్యార్థుల్లో 50 నుంచి వంద మంది రోజూ పాఠశాలలోనే భోజనం చేస్తారు. ఈ పాఠశాలకు అత్యధికంగా వాడరేవు, బుర్లవారిపాలెం, మరియమ్మపేట, జయంతిపేట, జాన్‌పేట, పేరాల, గాంధీనగర్, శృంగారపేట, ఆనందపేట, ప్రసాదనగర్లకు చెందిన పేద విద్యార్థులు వస్తుంటారు. అలానే కస్తూరిబా గాంధీ మునిసిపల్ బాలికోన్నత పాఠశాల లో కూడా ఇదే పరిస్థితి. ఈ పాఠశాలలో 600 మంది విద్యనభ్యసిస్తున్నారు. రోజూ 150 నుంచి 200 మంది విద్యార్థినులు పాఠశాలలోనే భోజనం చేస్తారు. ఎన్‌ఆర్‌అండ్‌పీఎం పాఠశాలలో వంద మంది భోజనం చేస్తారు. అయితే వారం రోజుల క్రితం కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులను తహసీల్దార్ రద్దు చేశారు. దీంతో ఆ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు రోజూ ఇంటి నుంచి భోజనం తెచ్చుకొని తింటున్నారు. పథకం నిలిచి వారం రోజులైనా సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. ఆయా పాఠశాలల్లో కుకింగ్ ఏజెన్సీలను కొన్ని రాజకీయ కారణాలతో తొలగించినట్లు సమాచారం. ఏజెన్సీల నిలుపుదల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. ఏదైనా కారణాలతో ఆగితే ప్రత్యామ్నాయం చూపించాలి. బియ్యం అందకపోయినా ప్రత్యామ్నాయంగా బియ్యం తెప్పించి భోజనం పెట్టాలనే నిబంధన ఉంది. దీనిపై తహసీల్దార్ బీ సాంబశివరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎంఈఓ, ఈఓఆర్డీ విచారణ చేపట్టి నివేదిక ఇచ్చిన తరువాతే దాని ఆధారంగా కుకింగ్ ఏజెన్సీలను రద్దు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో నూతన ఏజెన్సీలను ఏర్పాటు చేస్తామన్నారు. -
మధ్యాహ్న భోజనంపై నిఘా
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ :ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి విద్యాశాఖ ప్ర ణాళిక రూపొందించింది. ఇందుకోసం మండల, జిల్లా స్థాయిలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలను నియమించి నిఘా ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీల తగాదాలకు చెక్ పెట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడమే ఈ విజిలెన్స్, మా నిటరింగ్ కమిటీ ముఖ్య ఉద్దేశం. జిల్లా వ్యాప్తంగా 3301 ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. కాగా మధ్యా హ్న భోజనాన్ని 3.16 లక్షల మంది విద్యార్థులు ఆరగిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రాథమిక, ప్రా థమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.3. 45, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6 చొప్పున ఖర్చు చేస్తున్నారు. కానీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అం దడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి మధ్యాహ్నభోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయనున్నారు. ఇవీ కమిటీలు జిల్లాలోని అన్ని మండలాల్లో ముగ్గురితో కూడిన విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీలో మండల విద్యాధికారి, మండల అభివృద్ధి అధికారి, ఈఓఆర్డీలు ఉన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కమిటీకి చైర్మన్‌గా నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సభ్యులుగా జిల్లా కలెక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా విద్యాశాఖాధికారి ఉంటారు. మానిటరింగ్ చేసేది ఇలా.. మండల స్థాయిలో కమిటీలో పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల సూచనలు మేరకు భోజనం, కూరలు వండి పెట్టడంతో పాటు నాణ్యతగా ఉండేలా చూస్తారు. కమిటీలతో పాటు మండల విద్యాధికారి ప్రత్యేకంగా ప్రతి రోజు రెండు పాఠశాలలను సందర్శించి భోజన నాణ్యతను పరిశీలించాలి. ఏ రోజుకు ఆరోజు మండలంలోని మధ్యా హ్న భోజనం పరిస్థితిపై జిల్లా విద్యాధికారికి నివేదిక అందజేయాలి. అదే విధంగా జిల్లా స్థాయిలో వచ్చిన వివరాల ఆధారంగా వారంలో ప్రతి శుక్రవారం విద్యాశాఖ డెరైక్టర్‌కు జిల్లాకు సంబంధించిన వివరాలపై డీఈఓ నివేదిక అందజేయాలి. -
‘అంగన్వాడీ’లో మధ్యాహ్న భోజనం మిథ్యే!
పెడన/బంటుమిల్లి రూరల్, న్యూస్‌లైన్ : అంగనవాడీ కేంద్రాల్లో మధ్యాహ్నభోజన పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సరుకులు అందక చాలీచాలనీ మెతుకులతో కాలంవెళ్లదీస్తున్నారు. మొన్నటి వరకు పౌష్టికాహారం అందించిన చిన్నారులకు ఇక నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. జూలై ఒకటో తేదీ నుంచి నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. కానీ వనరుల లోపంతో క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చిన్నారులకు, గర్భీణీలకు, బాలింతలకు ఇటు పౌష్టికాహారం (ఎంటీఎఫ్)... అటూ మధ్యాహ్న భోజనం అందకుండా పోపొయింది.జిల్లా వ్యాప్తంగా 3,630 అంగనవాడీ కేంద్రాలు, 208 మినీ సెంటర్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలంటూ మాతా శిశు సంక్షేమ శాఖాధికారులు అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 1.23 లక్షల మందికిపైగా 3 నుంచి 6 ఏళ్లున్న పిల్లలు, బాలింతలు, గర్భీణీ లు లబ్ధిపొందనున్నారు. ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేయకపోవటంతో వారే స్వయంగా తమ సొంత నగదు వెచ్చించి సరుకులు కొని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులతో పథకాన్ని ప్రారంభింపజేశారు. ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలలో అధికారులు సరుకులు పంపిణీ చేయకపోవడటంతో ఆ రెండు మాసాలు మళ్లీ పౌష్టికాహారంతోనే సరిపెట్టారు. అరకొర సరుకులు పంపిణీ.... సెప్టెంబర్ మాసంలో మాతా శిశు సంక్షేమ శాఖాధికారులు ఆయా మండలాల పరిధిలో ఉన్న తహశీల్దార్లకు డీడీ కట్టి రేషన్‌ను అంగనవాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని కోరారు. దీంతో ఈ నెల నుంచి బియ్యం, పప్పు మాత్రమే పౌర సరఫరా అధికారులు ద్వారా అందజేశారు. పురుగులు పట్టిన బియ్యం, కంది పప్పు ఉడికి ఉడకనిది సరఫరా చేయటంతో, బాలింతలు, చిన్నారులకు, గర్భీణీలకు వాటితో ఏవిధంగా భోజనం వండి వార్చాలని అంగన్వాడీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వంటచెరకు మాటేంటి? ఒక్కో అంగనవాడీ కేంద్రంలో 15 నుంచి 20 మంది చిన్నారులుంటారు. వంట చెరకు నిమిత్తం ఒక్కోక్కరికి 20 పైసలు చోప్పున ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకు వచ్చింది. నెలలో 25 రోజులకు మాత్రమే ఇస్తుంది. ప్రస్తుతం గ్యాస్ ధర రూ. వెయ్యికు పైగా పలుకుతుంది. దీంతో ప్రభుత్వం ఇచ్చే రేటుకు మధ్యాహ్నభోజనం వండటం సాధ్యం కాదని అంగన్వాడీ కార్యకర్తలు వాపొతున్నారు. అసలే ఇరుకు గదులు... అంగనవాడీ కేంద్రాలు చాలా వరకు ఇరుకు గదుల్లో మగ్గుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వెయ్యి సెంటర్లకు సొంత భవనాలున్నాయి. మిగిలిన కేంద్రాలు అద్దే భవనాల్లో కొనసాగుతున్నాయి. మున్సిపాల్టీల్లో అంగనవాడీ కేంద్రాలకు స్థలాల కొరత వేధించటంతో ప్రైవేటు భవనాల్లో నామమాత్రంగా కొనసాగుతున్నాయి. మూడు నెలలుగా వేతనాల్లేవ్.... మూడు నెలల నుంచి వేతనాలందక సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు నెల నెలా అద్దె సకాలంలో చెల్లించకపోతే భవన యజమానులు ఖాళీ చేయాలని వత్తిడి చేస్తున్నారు. దీంతో అప్పు చేసి అంగనవాడీ కేంద్రాల అద్దెలు చెల్లిస్తున్నామని పెడన అంగనవాడీ కార్యకర్తలు వాపాతున్నారు. కాగా పోషకాహారం పంపిణీపై సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం పడింది. అంగన్వాడి కేంద్రాలకు నేటికీ సరుకులు సరఫరా కాకపోవడంతో సెప్టెంబరునెల రేషన్ లబ్ధిదారులకు అందలేదు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్న కారణంగా ఇండెంట్లు, బిల్లులు తయారుచేసేవారులేక సరుకుల సరఫరా నిలిచిపోయింది. -
మధ్యాహ్న భోజనానికి దూరమవుతున్న విద్యార్థులు
వేటపాలెం బీబీహెచ్ పాఠశాలలో 550 మంది విద్యార్థులుంటే 50 నుంచి 60 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వేటపాలెం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 600 మందికి 70 మంది మాత్రమే భోజనం చేస్తున్నారు. పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 600 మంది విద్యార్థులకు 75 మంది భోజనం చేస్తున్నారు. మిగిలిన విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లి భోజనం చేస్తున్నారు. దీన్ని గమనిస్తే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా ఉపయోగపడుతుందో అర్థమవుతోంది. రోజూ చారన్నం తినలేక విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకానికి దూరమవుతున్నారు. ఈ పరిస్థితికి కారణం కూరగాయలు, నిత్యవసరాల ధరలు పెరగడమే. మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. మెనూ ప్రకారం వండటం తమ వల్లకాదని కుకింగ్ ఏజెన్సీలు తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 100 గ్రాములు, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల చొప్పున బియ్యం సరఫరా చేస్తారు. భోజనంతో పాటు ఆకుకూర, పప్పు, కూరగాయలు, సాంబారు వడ్డించాలి. అంతేకాకుండా వారానికి రెండుసార్లు గుడ్డు ఇచ్చేలా విద్యాశాఖ మెనూ తయారు చేసింది. చీరాల మండలంలో మొత్తం 98 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. కుకింగ్ ఏజెన్సీల ద్వారా భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. బియ్యం మాత్రమే ప్రభుత్వం అందిస్తుండగా మిగిలిన వాటికి ఒక్కో విద్యార్థికి రూ. 4.40 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో మెనూ ప్రకారం భోజనాన్ని తయారు చేయలేకపోతున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కూరలకు బదులు చారన్నంతోనే విద్యార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు. మెనూ ప్రకారం వడ్డించాలంటే సాధ్యపడదంటూ కుకింగ్ ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. కూరగాయల ధరలు ఒక్కో రకం కేజీ రూ. 30 పైగా ఉంది. గ్యాస్, కోడిగుడ్డు ధర చుక్కలనంటడంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో మధ్యాహ్న భోజనం తయారు చేయలేక ఏజెన్సీలు అవస్థలు పడుతున్నాయి. చేసేది లేక కూరగాయలకు బదులు చారు, సాంబారుతోనే సరిపెడుతున్నారు. కూరగాయల ధరలు పెంచకూడదని అధికారులు వ్యాపారులకు చెబుతున్నా దిగుమతులు లేవంటూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కోడిగుడ్డు ఒక్కోటి రూ.4 వరకు ఉండటంతో వారానికి రెండు కోడిగుడ్లు కూడా భోజనంలో అందించలేమని చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఏజెన్సీలకు ఇచ్చే మొత్తం పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏజెన్సీలకు నగదు పెంచే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు భోజనం వండి పెట్టే బాధ్యతల నుంచి తప్పుకునేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. ఏజెన్సీలకు రావాల్సిన నెలవారీ బిల్లులు కూడా వాయిదాలు పడటంతో మధ్యాహ్న భోజన పథకం పాఠశాలల్లో కుదేలయ్యేలా ఉంది. మెనూ ప్రకారం బుధవారం పప్పు, ఆకుకూర వడ్డించాల్సి ఉండగా కేవలం సాంబారు మాత్రమే పెట్టారు. బడిఈడు పిల్లలు పౌష్టికాహార లోపంతో బడిమానేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం నేడు పెరిగిన ధరలతో నిర్వీర్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పథకం సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటే విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యనందించవచ్చు.