Sakshi Editorial
-
ముందుకు కదలని ముచ్చట
మరో ఏడాది గడిచింది. మరో జీ20 సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల పెద్దలు కలిశారన్న మాటే కానీ, ఏం ఒరిగింది? బ్రెజిల్లో రెండు రోజులు జరిగిన సదస్సు తర్వాత వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ 20 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల కూటమి ఓ సమష్టి తీర్మానం చేసింది కానీ, తీర్మానంలోని భాషపై అర్జెంటీనా అభ్యంతరాలతో ఏకాభిప్రాయ సాధన కుదరలేదు. ఆకలిపై పోరాటానికి ఒప్పందం, ప్రపంచంలో అత్యంత సంపన్నులపై పన్ను లాంటి అంశాలపై సదస్సులో మాటలు సాగాయి. కానీ, ఉక్రెయిన్‌లో, మధ్యప్రాచ్యంలో... జరుగుతున్న ప్రధాన యుద్ధాల క్రీనీడలు సదస్సుపై పరుచుకున్నాయి. చివరకు సదస్సు చివర జరపాల్సిన విలేఖరుల సమావేశాన్ని సైతం బ్రెజిల్ దేశాధ్యక్షుడు ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. రష్యాపై ఉక్రెయిన్ క్షిపణి దాడులు, పరిమిత అణ్వస్త్ర వినియోగానికి మాస్కో సన్నద్ధతతో ఉద్రిక్తతలు పెరిగినా అమెరికా అధ్యక్షుడు ఏమీ మాట్లాడకుండానే పయనమయ్యారు. వెరసి, అధికారులు అంటున్నట్టు ఈ ‘జీ20 సదస్సు చరిత్రలో నిలిచిపోతుంది’ కానీ, గొప్పగా చెప్పుకోవడానికేమీ లేనిదిగానే నిలిచిపోతుంది. మాటలు కోటలు దాటినా, చేతలు గడప దాటడం లేదనడానికి తాజా జీ20 సదస్సు మరో ఉదాహరణ. నిజానికి, పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, నిధులు అనేవి ఈ సదస్సుకు కేంద్ర బిందువులు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, పరస్పర సహకార ప్రయత్నాలకు కట్టుబడినట్టు సదస్సు పేర్కొంది. కానీ, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి క్రమంగా పక్కకు మరలేందుకు స్పష్టమైన ప్రణాళికలేమీ చేయలేకపోయింది. పర్యావరణ పరిరక్షణ నిధులకు సంబంధించీ పురోగతి లేకుండానే ఈ జీ20 ముగిసింది. ప్రపంచ దేశాల నేతలు కృత నిశ్చయాన్ని ప్రకటిస్తూ, బలమైన సూచన ఏదో చేస్తారని ‘కాప్–29’ ఆశించినా, అలాంటిదేమీ జరగనేలేదు. కాకపోతే, ‘జీ20’ సదస్సు తుది తీర్మానంలో నిర్దిష్టమైన ఆర్థిక వాగ్దానాలేమీ లేనప్పటికీ, మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంకుల సంస్కరణలపై దృష్టి పెట్టినందున అది పరోక్షంగా పర్యావరణ నిధులకు ఉపకరిస్తుందని కొందరు నిపుణుల మాట. కాగా, ప్రపంచం నుంచి దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ జీ20 దేశాలు వచ్చే అయిదేళ్ళను కాలవ్యవధిగా పెట్టుకోవడం సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకపోయినా, సత్సంకల్పమని సంతోషించాలి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం వాషింగ్టన్లో జరిగిన జీ20 నేతల తొలి సమావేశానికి హాజరయ్యానని గుర్తు చేసుకుంటూ, పదహారేళ్ళ తర్వాత ఇప్పటికీ ప్రపంచం ఘోరమైన పరిస్థితిలో ఉందని బ్రెజిల్ అధ్యక్షుడన్న మాట నిష్ఠురసత్యం. ఆకలి, దారిద్య్రం ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయి. దీనికి తప్పుడు రాజకీయ నిర్ణయాలే కారణమన్న ఆయన మాట సరైనదే. ఆకలి, దారిద్య్రంపై పోరాటానికి ప్రపంచ కూటమి స్థాపన మంచి ఆలోచనే. కానీ, ఇన్నేళ్ళుగా ఇలాంటివెన్నో సంకల్పాలు చేసుకున్నా, ఎందుకు నిర్వీర్యమయ్యాయన్నది ఆలోచించాల్సిన అంశం. పేరుకు కూటమి అయినా జీ20లోని సభ్య దేశాల మధ్య యుద్ధాలు సహా అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్నా యన్నది సదస్సు ఆరంభం కాక ముందు నుంచీ తెలిసినదే. అందుకే, ఈ సదస్సును అతిగా అంచనా వేస్తే ఆశాభంగమే. కొన్ని విజయాలున్నా అధిక శాతం అంతర్జాతీయ శక్తుల మధ్య విభేదాలే సదస్సులో బయటపడ్డాయి. ఏ దేశాల పేర్లూ ఎత్తకుండా శాంతి సూక్తులకే జీ20 పరిమితమైంది. సమష్టి లక్ష్యం కోసం పలుదేశాలు కలసి కూటములుగా ఏర్పడుతున్నా, అవి చక్రబంధంలో చిక్కుకొని అడుగు ముందుకేయలేని పరిస్థితి ఉందని అర్థమవుతోంది. ఇటీవలి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు ‘కాప్29’, ఇరవై ఒక్క ఆసియా – పసిఫిక్ దేశ ఆర్థిక వ్యవస్థల వేదిక ‘ఆసియా – పసిఫిక్ ఆర్థిక సహకార మండలి’, జీ20ల్లో ఎదురైన ప్రతిష్టంభనలే అందుకు తార్కాణం. అవి ఇప్పుడు సమష్టి సవాళ్ళను పరిష్కరించే వేదికలుగా లేవు. వ్యాపార సంరక్షణవాద విధానాలు, భౌగోళిక – రాజకీయ శత్రుత్వాల యుద్ధభూములుగా మారిపోయాయి. ఈ వైఫల్యం వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు అశనిపాతం. అమెరికా, యూరోపియన్ యూనియన్ లాంటివి స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం నుంచి పక్కకు జరిగాయి. ఫలితంగా తక్కువ కూలీ ఖర్చు, సరళమైన పర్యావరణ ప్రమా ణాలున్న వర్ధమాన దేశాలకు మునుపటి సానుకూలత ఇప్పుడు లేదు. పారిశ్రామికీకరణ వేళ సరళ తర నిబంధనలతో లబ్ధి పొందిన పెద్ద దేశాలు, తీరా ఇప్పుడలాంటి ఆర్థిక అవకాశాలేమీ లేకుండానే వర్ధమాన దేశాలను సుస్థిరాభివృద్ధి వైపు నడవాలని కోరడం అన్యాయమే. ప్రపంచాన్ని పీడిస్తున్న అంశాలపై దృష్టి సారించడంలో జీ20 విఫలమవడం విషాదం. పర్యావరణ సంక్షోభం, దారిద్య్రం, ఉత్పాతాల లాంటి అనేక సవాళ్ళు కళ్ళెదుటే ఉన్నా, వాటి పరిష్కారం బదులు రష్యా, చైనాలను ఏకాకుల్ని చేయాలన్నదే జీ7 దేశాల తాపత్రయం కావడమూ తంటా. భౌగోళిక – రాజకీయ వివాదాలు అజెండాను నిర్దేశించడంతో జీ20 ప్రాసంగికతను కోల్పోతోంది. సమాన అవకాశాలు కల్పించేలా కనిపిస్తున్న బ్రిక్స్ లాంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు పలు దేశాలు మొగ్గుతున్నది అందుకే. జీ20 లాంటి బహుళ దేశాల వ్యవస్థల కార్యాచరణను ఇతరేతర అంశాలు కమ్మివేస్తే అసలు లక్ష్యానికే చేటు. పరస్పర భిన్నాభిప్రాయాల్ని గౌరవిస్తూనే దేశాలు సద్భావంతో నిర్మాణాత్మక చర్చలు జరిపితే మేలు. ఏ కూటమైనా శక్తిమంతులైన కొందరి వేదికగా కాక, అంద రిదిగా నిలవాలి. పశ్చిమదేశాలు ఆ సంగతి గ్రహిస్తేనే, జీ20 లాంటి వాటికి విలువ. విశ్వ మాన వాళికి ప్రయోజనం. వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరిగేనాటికైనా జీ20 వైఖరి మారుతుందా? -
విషతుల్య రాజధాని
భారత రాజధాని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతి శీతకాలంలానే ఈ ఏడాదీ పాత కథ పునరావృత్తం అయింది. ఒకపక్క పెరిగిన చలికి తోడు ధూళి నిండిన పొగ లాంటి గాలి, కాలుష్య ఉద్గారాలు, పొరుగున ఉన్న పంజాబ్ – హర్యానా లాంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో అక్రమంగా సాగుతున్న కొయ్యకాళ్ళ దహనం... అన్నీ కలిసి అతి తీవ్ర వాయు కాలుష్యంగా పరిణమించాయి. వారంగా అదే పరిస్థితి కొనసాగుతూ ఉండడం, వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) సోమవారం గరిష్ఠంగా దాదాపు 500 మార్కును చేరడంతో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్కూల్ పిల్లలకు భౌతికంగా తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. చివరకు బాకూలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు సైతం ఈ కాలుష్యాన్ని ఆందోళనకరంగా పరిగణించడం, నిపుణులు దీన్ని ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు తార్కాణం. ఢిల్లీలో సోమవారంæ కాలుష్య స్థాయి దీపావళి నాటి రాత్రి కన్నా దాదాపు 40 శాతం ఎక్కువంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి... భారతీయ ప్రమాణాల కన్నా 14 రెట్లు ఎక్కువ, అదే ఐరాస పర్యావరణ పరిరక్షక సంస్థ (యూఎస్‌ఈపీఏ) నిర్దేశించిన ప్రమాణాల లెక్కలో అయితే 55 రెట్లు ఎక్కువ నమోదైంది. వాయు నాణ్యత ఇంతలా క్షీణించడం పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులున్న వారికి ప్రమాదంగా పరిణమిస్తోంది. పీఎం 10 స్థాయిని బట్టి అంచనా వేసే ధూళి కాలుష్యమూ హెచ్చింది. ఆగ్రాలో కళ్ళు పొడుచుకున్నా కనిపించని దట్టమైన పొగ. తాజ్‌మహల్ కట్టడం విషవాయు కౌగిలిలో చేరి, దూరం నుంచి చూపరులకు కనిపించడం మానేసి వారమవుతోంది. మాస్కులు లేకుండా వీధుల్లోకి రాలేని పరిస్థితి. వెరసి, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమనే దుష్కీర్తి ఢిల్లీకి దక్కింది. స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ తేల్చిన ఈ నిష్ఠురసత్యం ఇన్నేళ్ళ మన బాధ్యతా రాహిత్యానికీ, పాలకుల నిష్క్రియాపరత్వానికీ నిదర్శనం. ఆ మాటకొస్తే, 2018లో కానీ, గడచిన 2023లో కానీ ఏడాదిలో ఏ ఒక్కరోజూ ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి లేదని రికార్డులు చెబుతున్నాయంటే ఏమనాలి? కాలుష్యం దేశవ్యాప్తంగా ఉందనీ, నివారణ బాధ్యత రాష్ట్రానిదే కాదు కేంద్రానిది కూడా అని ఢిల్లీ ‘ఆప్’ సర్కార్ వాదన. కానీ, ఏటేటా శీతకాలంలో రాజధానిలో పెరుగుతూ పోతున్న ఈ కష్టానికి చెక్ పెట్టడంలో పాలకులు ఎందుకు విఫలమయ్యారంటే జవాబు దొరకదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీ సర్కార్ కాలుష్య నిరోధానికి యంత్రాల ద్వారా నీటి తుంపర్లు జల్లడం లాంటి చర్యలు చేపడుతోంది. ఇవేవీ చాలక చివరకు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లలో కృత్రిమ వర్షాలకు అనుమతి ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మేఘమథనం జరిపేందుకు ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని అనుమతి కోరినా, జవాబు లేదన్నది ‘ఆప్’ ఆరోపణ. ఇలాంటి ప్రయోగాల వల్ల ప్రయోజనమెంత అనేది చర్చనీయాంశమే. అయితే, ప్రజలకు తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే ఇలాంటి ప్రయత్నాలకు కేంద్రం మొదటే మోకాలడ్డడం సరికాదు. వాయు కాలుష్యం ‘అతి తీవ్ర’ స్థాయులకు చేరిన నేపథ్యంలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్) నాలుగోదశ చర్యలను కఠినంగా అమలు చేయాలన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. పాఠశాలల్ని మూసివేయడం, ఆఫీసుకు రాకుండా ఇంటి వద్ద నుంచే పనిచేయడం, పరిశ్రమల మూసివేత లాంటి చర్యలన్నీ నాలుగో దశ కిందకు వస్తాయి. ముప్పు ముంచుకొస్తున్నా మూడో దశ, నాలుగో దశ చర్యల్లో అధికారులు ఆలస్యం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు షరతులు అమలు చేయాల్సిందేనని కోర్ట్ చెప్పాల్సి వచ్చిందంటే అధికార యంత్రాంగం అలసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నిద్ర లేచిన ప్రభుత్వం ఇప్పుడిక ‘గాప్’ నాలుగో దశ కింద వాహనాల రాకపోకలు, భవన నిర్మాణ కార్యకలాపాలపై షరతులు విధించింది. అయితే, దీంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో దాదాపు 34 లక్షల చిన్న, మధ్యశ్రేణి సంస్థల్లో ఉత్పత్తి దెబ్బతిననుంది. అంటే కాలుష్య పాపం ఆరోగ్యాన్నే కాక ఆర్థికంగానూ కుంగదీస్తుందన్న మాట. ఢిల్లీలో వాహనాల వల్ల అత్యధిక కాలుష్యం సంభవిస్తుంటే, ఎన్సీఆర్లో పరిశ్రమలు ప్రధాన కాలుష్య కారకాలని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (తెరి) 2021లోనే తేల్చింది. అనేకచోట్ల ఇప్పటికీ కట్టెల వాడకం కొనసాగుతోంది. ఇక, పొలాల్లో కొయ్య కాళ్ళ దహనం తాజా దురవస్థకు 40 శాతం కారణమట. అన్నీ కలిసి పీల్చే గాలే విషమయ్యేసరికి, ఢిల్లీ వాసుల ఆయుఃప్రమాణం సగటున ఏడేళ్ళు తగ్గుతోంది. రాజధాని, ఆ పరిసరాల్లోని 3 కోట్ల పైచిలుకు మంది వ్యధ ఇది. నిజానికి, స్వచ్ఛమైన గాలి ప్రాథమిక మానవహక్కని గత నెలతో సహా గత అయిదేళ్ళలో సుప్రీమ్ అనేకసార్లు స్పష్టం చేసింది. వాయునాణ్యతకు చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర, రాష్ట్రస్థాయి యంత్రాంగాలను ఆదేశించింది. అయినా జరిగింది తక్కువ. సరైన ప్రాణ వాయువు కూడా అందని ఈ పరిస్థితికి ప్రజల నుంచి పాలకుల దాకా అందరూ బాధ్యులే. కాలుష్య నివారణ, నియంత్రణలకు సృజనాత్మక ఆలోచనలు చేయలేకపోవడం ఘోరం. దాహమేసినప్పుడు బావి తవ్వకుండా ఏడాది పొడుగూతా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టడం అవసరం. ఆధునిక సాంకేతికత, ప్రజారవాణా, ప్రజల అలవాట్లలో మార్పులు సహా అనేక అంశాల్లో రాజకీయ కృత నిశ్చయంతో విధాన నిర్ణేతలు పనిచేయాలి. లేదంటే, సాక్షాత్తూ దేశ రాజధానే నివాసయోగ్యం కాక జనం తరలిపోతుండడం చూసి వికసిత భారత్, లక్షల కోట్ల ఆర్థికవ్యవస్థ లాంటివన్నీ వట్టి గాలి మాటలే అనుకోవాల్సి వస్తుంది. -
రగులుతున్న అగ్నిపర్వతం!
ఏణ్ణర్ధం దాటినా... మణిపుర్ మండుతూనే ఉంది. జాతుల మధ్య ఘర్షణ తగ్గకపోగా, అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా పదిరోజుల క్రితం ఓ కుకీ మహిళ అత్యాచారం – హత్య, దానికి ప్రతిగా మెయితీలపై కుకీ తీవ్రవాదుల దాడులు, చివరకు ఓ సహాయ శిబిరం నుంచి నవంబర్‌లో అపహరణకు గురైన ఓ పసిబిడ్డతో సహా ఆరుగురు అమాయక మెయితీలు ప్రాణాలు కోల్పోవడం... ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. సీఎం సహా రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల ఇళ్ళపై దాడులతో చివరకు రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ స్తంభన, వివాదాస్పదమైన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం విధింపు, కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపడం దాకా వెళ్ళింది. ప్రభుత్వ మనుగుడకు ముప్పేమీ లేకున్నా, బీజేపీ సర్కారుకు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్టు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించడం మిత్రుల్లోనూ బీజేపీ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. గత 2023 మేలో హింసాకాండ మొదలైనప్పటి నుంచి జాతుల ఘర్షణల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎంతసేపటికీ బాహ్య శక్తులు కారణమంటూ ఆరోపించడం, శుష్కవాగ్దానాలు చేయడమే తప్ప, రాష్ట్రం రావణకాష్ఠమైనా పరిస్థితిని అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. మణిపుర్ సామాజిక – ఆర్థిక జీవితంలో జాతుల ఉనికి అత్యంత కీలకమైనది. దాన్నిబట్టే ఆ ఈశాన్య రాష్ట్రంలో భూములపై హక్కులు, తదనుగుణంగా రాజకీయ సైద్ధాంతిక విభేదాలు రూపు దిద్దుకుంటూ వచ్చాయి. దాదాపు డజనుకు పైగా గిరిజన తెగలను కలిపి, బ్రిటీషు పాలనా కాలంలో కుకీలు అని పేరుపెట్టారు. విభిన్న జాతుల్లో ప్రధానమైనవైన మెయితీ వర్గానికీ, కుకీలకూ మధ్య పాలకులు తమ స్వార్థప్రయోజనాల కోసం అగ్నికి ఆజ్యం పోశారు. అదే అసలు సమస్య. జనరల్ వర్గానికి చెందిన మెయితీలు తమకు కూడా షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కల్పించాలని కోరు తున్నారు. అయితే, దానివల్ల తమ ప్రయోజనాలు దెబ్బ తింటాయని కుకీల ఆందోళన. మరోపక్క మిజోరమ్తోనూ, పొరుగున మయన్మార్‌లోని చిన్ రాష్ట్రంతోనూ జాతి సంబంధాలున్న కుకీల వాంఛ వేరు. మణిపుర్ నుంచి తమ ప్రాంతాన్ని విభజించి, ప్రత్యేక పాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు బలంగా వాదిస్తున్నారు. ఇది చాలదన్నట్టు మెయితీ వర్గానికి చెందిన మణిపుర్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, కుకీలను అణచివేస్తున్నారనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమయ్యాయి. కారణాలు ఏమైనా, రాష్ట్రంలోని బీజేపీ పాలిత ప్రభుత్వ సారథి అన్ని వర్గాలనూ ఒక తాటి మీదకు తీసుకురావడంలో విఫలమవడంతో బాధ్యత అంతా కేంద్రం భుజాల మీద పడింది. కేంద్ర హోమ్‌శాఖ మొన్న అక్టోబర్‌లో మెయితీ, కుకీల వర్గాల రాజకీయ ప్రతినిధులతో సమావేశం జరిపింది కానీ, శాంతిసాధన దిశగా అడుగులు పడలేదు. ప్రత్యేక శాసనవ్యవస్థతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం తమకు కావాల్సిందేనని కుకీలు భీష్మించుకు కూర్చున్నారు. మణిపుర్ విభజనతో మాత్రమే సాధ్యం. అయితే, కేంద్ర జోక్యంతో సమస్యను పరిష్కరించవచ్చని ఇప్పటికీ కుకీలు భావిస్తున్నారు. ఇంత సంక్షోభంలోనూ అది ఓ సానుకూల అంశం. ఢిల్లీ పెద్దలు దాన్ని వినియోగించుకోవాలి. కానీ, అలా జరుగుతున్నట్టు లేదు. విధానపరంగా, రాజకీయంగా సీఎం విఫలమయ్యారని తెలుస్తున్నా, గద్దె మీది బీరేన్‌సింగ్‌ను మార్చడానికి బీజేపీ, కేంద్రంలోని ఆ పార్టీ పెద్దలు ఎందుకు ముందుకు రావడం లేదో తెలియదు. బీరేన్‌పై అంత ప్రేమ ఎందుకన్నది బేతాళప్రశ్న. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ప్రగతి అంటే ఇదేనా? మణిపుర్‌ను దేశంలో అంతర్భాగమని వారు అనుకోవట్లేదా? ఈశాన్యంలో పార్టీ విస్తరణపై ఉన్న శ్రద్ధలో కాసింతైనా శాంతిస్థాపనపై కాషాయ పెద్దలకు ఎందుకు లేదు? అంతకంతకూ క్షీణిస్తున్న పరిస్థితులు ప్రభుత్వంతో పాటు రాజకీయ పక్షాలు సైతం బాధ్యతను వదిలేశాయనడానికి సూచన. ఈ సంక్షుభిత ఈశాన్య రాష్ట్రానికి ఇప్పుడు కాస్తంత సాంత్వన కావాలి. బాధిత వర్గాలన్నిటినీ ఓదార్చి, ఉపశమనం కలిగించే పెద్ద మనసు కావాలి. పౌరసమాజాన్ని కూడా భాగస్వామ్యపక్షం చేసి, సమస్యకు రాజకీయ పరిష్కారం చూడడమే మార్గం. అందుకు కేంద్ర సర్కారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో చొరవ తీసుకోవాలి. పాలకులు మణిపుర్‌ను వట్టి శాంతిభద్రతల కోణం నుంచే చూస్తే కష్టం. దాని వల్ల సామాన్య ప్రజానీకానికీ, ఈశాన్య ప్రాంతంలోని సాయుధ బలగాలకూ కష్టాలు పెరుగుతాయి. రాష్ట్రంలో చేజారిన పరిస్థితుల్ని ఇప్పటికైనా చక్కదిద్దేందుకు కేంద్రం ప్రయత్నించకపోతే, అది దేశ సమగ్రతకే ప్రమాదం. పొరుగున మయన్మార్, బంగ్లాదేశ్‌లలో సంక్షుభిత వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తత అత్యవసరం. అనేక సాయుధ తీవ్రవాద గ్రూపులతో, ఇట్టే చొరబాట్లకు చాలా అవకాశం ఉన్న సరిహద్దుల్లో మణిపుర్ ఉందని విస్మరించరాదు. కేవలం సాయుధ బలగాల మోహరింపుతో అక్కడ శాంతి సాధ్యంకాదు. హింసలో తాత్కాలిక విరామాన్ని చూపి, అదే శాంతి అని నమ్మబలకడం మూర్ఖత్వం. అన్ని వర్గాల మధ్య సామరస్యం, సహజీవనం సాగేలా రాజకీయ ఏర్పాటు చేయగలిగితేనే హింసకు తెర పడుతుంది. కేంద్రం ఇప్పటికైనా చిత్తశుద్ధితో అందుకు సర్వశక్తులూ ఒడ్డాలి. లేదంటే, అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నా అలసత్వంతో వ్యవహరిస్తున్నట్టే! దాదాపు 33 లక్షల సోదర భారతీయ జనాభాను స్వార్థ ఆర్థిక, అధికార ప్రయోజనాల కోసం గాలికి వదిలేస్తున్నట్టే! గుజరాత్, ముజఫర్ నగర్, ఢిల్లీ లాంటి అనేక చోట కొద్ది రోజుల్లో హింసకు ముకుతాడు వేయగలిగినచోట ఇన్ని నెలలుగా ఒక రాష్ట్రాన్ని మంటల్లో వదిలేయడం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ పాలకులకు సిగ్గుచేటు! -
సందిగ్ధ జ్ఞానం
జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉన్నది ‘అ’భేదమే కదా అనుకుంటాం కానీ, ఆ రెండింటికీ మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంది. అజ్ఞానమనే చీకటి ఒడ్డు నుంచి, జిజ్ఞాస అనే అలల మీదుగా, జ్ఞానమనే వెలుగుల తీరం వైపు సాగే ప్రయాణంలో ఆనందమే మనకు తెప్పవుతుంది. అందుకే జ్ఞానానందమనే మాట పుట్టింది. అయితే, ఆ ఆనందాన్ని అంటిపెట్టుకుని ఒక విషాదమూ ఉంటుంది. అది ఏమిటంటే... మన ఊహకు అందనంత వయసున్న ఈ అనంతవిశ్వంలో భూమి ఒక గోళీకాయ కన్నా కూడా చిన్నదనుకుంటే, దానిపై జీవించే మనిషి నలుసుపాటి కూడా చేయడు. అతని అస్తిత్వాన్ని కాలం కొలమానంతో కొలిస్తే అది కొన్ని క్షణాలను మించదు. కనుక అనంతవిశ్వం గురించిన జ్ఞానం సంగతలా ఉంచి, ఈ భూమి గురించి, ఈ భూమి మీద తన మనుగడ గురించిన జ్ఞానం మొత్తాన్నే ఒక మనిషి తన జీవితకాలంలో సంగ్రహించుకోవడం అసాధ్యం. అదీ అసలు విషాదం. మనిషిలో మెదడు ఎప్పుడు వికసించిందో అప్పుడే అతనిలో విశ్వం గురించిన జ్ఞానాన్వేషణ మొదలై, వేలసంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. చంద్రుడి వృద్ధి, క్షయాలను అనుసరించి కాలగణనాన్నీ, ఋతుభ్రమణాన్ని అనుసరించి వేటజంతువుల గుర్తింపునూ మనిషి ప్రారంభించి వాటిని ఒక పొడవాటి ఎముకపై నమోదు చేయడం నక్షత్రాలు, రాశులతో ముడిపడిన జ్యోతిర్విజ్ఞానానికి నాంది అయిందంటారు. ఆపైన మొక్కల సేకరణ నుంచి, పెరటిసాగుకు; అక్కడి నుంచి వ్యవసాయానికి సాగే క్రమంలో ఆహారవిజ్ఞానాన్ని బహుముఖాలుగా విస్తరించుకుంటూ వెళ్ళాడు. రాతిపనిముట్ల తయారీలో సాంకేతికజ్ఞానాన్ని, ఏదో అతీతశక్తి ఈ విశ్వాన్ని సృష్టించి నడిపిస్తోందన్న ఊహ నుంచి మత, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని; నియమ నిబంధనలు, కట్టుబాట్లతో కలసి జీవించడం నుంచి సంస్కృతిని సంతరిస్తూ, నిర్మిస్తూ వచ్చాడు. ఇందులో ప్రతిదీ జ్ఞానాన్వేషణలో మేలి మలుపే; జ్ఞానపు నిచ్చెన నధిరోహించడంలో నిశ్చయాత్మకమైన మెట్టే. నగరాల నిర్మాణం మీదుగా నాగరికతాదిశగా సాగిన ఈ యాత్రలో ఇంతవరకు మనిషి ఎక్కడా మడమ తిప్పింది లేదు; ఆకాశమే హద్దుగా ఆ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినా సరే, సంపూర్ణజ్ఞానం మనిషికి ఎప్పటికీ అందని ఎండమావిలా ఊరిస్తూనే ఉంది. కనిపించని జ్ఞానచంద్రుడి చీకటిపార్శ్వం అదే. సంకేతాల నుంచి లిపిని అభివృద్ధి చేసుకుని జ్ఞానాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం ఈ క్రమంలో మరొక మెరుపుల మజిలీ. మొదట్లో విశ్వసృష్టి, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానం, సాంకేతికజ్ఞానం వగైరా వింగడింపు లేకుండా తనకు తెలిసిన జ్ఞానం మొత్తాన్ని, తనకు తెలిసిన ప్రక్రియలో ఒకేచోట రాశిపోసిన ఉత్సాహం మనిషిది. అందుకే గణితశాస్త్రాన్ని కూడా పద్యాల్లో చెప్పిన పావులూరి మల్లన్నలు మన దేశంలో, మన సాహిత్యంలో కనిపిస్తారు. తర్వాత తర్వాత జ్ఞానం అనేక శాఖలు గల మహావృక్షంగా ఎదిగిపోయి, ఒక మనిషి తన జీవితకాలంలో ఏ ఒక్క శాఖనూ పూర్తిగా తేరి చూసే వీలుకుండా నిలువుగా అడ్డంగా విస్తరించిపోయింది. తన కళ్ళ ముందే ఉన్న, తన నిత్యజీవనంతో ముడిపడి ఉన్న, తన అనుభవంలోకి వచ్చే అనేక విషయాల ఆనుపానులు తెలియకుండానే మనిషి తన జీవితకాలాన్ని ముగించవలసి రావడం కన్నా పెనువిషాదం ఇంక ఏముంటుంది? ప్రసిద్ధ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ అనే కథలో ఈ విషాదాన్నే ఒకింత హాస్యగంభీరస్ఫోరకంగా చిత్రిస్తారు. అందులో రాజశేఖరం అనే వ్యక్తిని ఇంగువ ఎలా తయారవుతుందనే ప్రశ్న చిరకాలంగా వేధిస్తూ ఉంటుంది. అతను వృద్ధాప్యంలో మంచం పడతాడు. ఒక మిత్రుడు అతణ్ణి చూడడానికి వెడతాడు. రాజశేఖరం అతి కష్టం మీద నోరు తెరచి అదే ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానం తెలుసుకోకుండానే జీవితం చాలిస్తానేమోనన్న బెంగ అతని ముఖంలో కనిపిస్తుంది. మిత్రుడు వెంటనే వెళ్ళి ఇంకో మిత్రుని కలసి సమాధానం కనుక్కొని తిరిగి వస్తాడు. కానీ అప్పటికే రాజశేఖరం కన్నుమూస్తాడు. ఇప్పటిలా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, గూగుల్ శోధించి ఉంటే, ‘ఫెరులా’ అనే మొక్క నుంచి పుట్టే జిగురే గట్టిపడి ఇంగువగా తయారవుతుందనీ, ‘అసాఫోటిడా’ అనేది దాని శాస్త్రీయ నామమనీ, ఈ మొక్క ఎక్కువగా ఇరాన్ ఎడారుల్లో, అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పర్వతప్రాంతాలలో సాగవుతుందనీ రాజశేఖరం తెలుసుకుని ఉండేవాడు.అలాగని అతనికా అదృష్టం లేకపోయిందనడానికీ వీల్లేదు. ఇంటర్నెట్ ఆధారిత బహుళ మాధ్యమాలతో సమాచారవిప్లవం కొత్తపుంతలు తొక్కిందనుకునే ఈ రోజున కూడా చిన్న చిన్న సందేహాలు తీరకుండానే దేహం చాలించే రాజశేఖరాలు ఉంటూనే ఉన్నారు. జ్ఞానతీరానికి ఏ కొంచెమైనా దగ్గరవడానికి ఏ అత్యాధునిక సాధనాలూ సాయపడడం లేదు. పరిమిత జీవితకాలం అతని నిస్సహాయతను ఇప్పటికీ గుర్తుచేసి వెక్కిరిస్తూనే ఉంది. మరోవైపు సమాచార ఉల్బణం నుంచి నిక్కమైన సమాచారానికి బదులు అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు పుట్టుకొచ్చి జ్ఞానాన్వేషణను అజ్ఞానాన్వేషణగా మార్చివేశాయి. అలా వ్యాప్తిలోకి వచ్చినదే ‘ఫేక్’ లేదా నకిలీ సమాచారమనే మాట. నేటి రాజశేఖరాలను వేధిస్తున్నది కేవలం సమాచార రాహిత్యం కాదు, నిజమో, అబద్ధమో తెలియని సమాచార సందిగ్ధం. జ్ఞాన, అజ్ఞానాల మధ్య ఆ మాత్రపు అక్షరభేదాన్ని కూడా తుడిచేసి పూర్తి అభేదాన్ని స్థాపించే యుగంలో ఉన్నాం. అదీ విషాదం! -
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్‌లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్‌లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్‌గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్‌పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
ఓట్ల వేటలో వాగ్దానవర్షం
మహారాష్ట్రలో ఎన్నికల పర్వం ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఈ 20న జరగనున్న ఎన్నికల కోసం ఇటు బీజేపీ సారథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి, అటు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్ష ‘మహా వికాస్ ఆఘాడీ’ (ఎంవీఏ)... రెండూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపిస్తున్నాయి. దేశంలోని అత్యంత సంపన్న రాష్ట్రంలో ఇప్పుడు ఉచితాల పోరు సాగుతోంది. గృహాలకు 100 యూనిట్ల మేర కరెంట్ ఉచితం, గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఆడపిల్లలకు ఉచిత టీకాకరణ, మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా రెండు రోజులు ఋతుక్రమ సెలవుల లాంటి గ్యారెంటీలతో ఎంవీఏ ముందుకొచ్చింది. ఫలితంగా మహాయుతి సైతం మరింత ఎక్కువ వాగ్దానాలు చేయక తప్పలేదు. దాంతో, ఎన్నికల మేనిఫెస్టోలు కలకలం రేపుతున్నాయి. ఖజానాపై భారం రీత్యా పథకాల సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైంది. దేశాభివృద్ధికి ఉచితాల సంస్కృతి ప్రమాదకరమన్న మోదీ సొంతపార్టీ బీజేపీ సైతం ‘మహా’పోరులో ప్రతిపక్షం బాట పట్టక తప్పలేదు. అయితే, వైరిపక్షం వాగ్దానాలు సాధ్యం కావంటూ ప్రతి పార్టీ పక్కవారిపై ఆరోపణలు చేయడమే విడ్డూరం.మహిళలు, రైతులు, విద్యార్థులు – నిరుద్యోగులైన యువతరం, సీనియర్ సిటిజన్లు... ఇలా వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఇచ్చిన పోటాపోటీ హామీలు అనేకం. సమాజంలోని వెనుక బడిన వర్గాలను పైకి తీసుకురావడానికీ, అవసరంలో ఉన్నవారికి చేయూత అందించడానికీ సంక్షేమ పథకాలను హామీ ఇవ్వడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం తప్పు కాదు, తప్పనిసరి కూడా! అయితే, ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అమలు చేయడానికి వీలే కాని వాటిని హామీ ఇచ్చినప్పుడే అసలు సమస్య. అధికారంలో ఉండగా అవసరార్థులను పట్టించుకోకుండా, తీరా ఎన్నికల వేళ మేని ఫెస్టోలతో మభ్యపెట్టాలనుకోవడం మరీ దారుణం. ఎన్నికల వాగ్దానపత్రాలపై విమర్శలు వస్తున్నది అందుకే. ఆర్థికభారం సంగతి అటుంచితే, స్త్రీలకు తప్పనిసరి ఋతుక్రమ సెలవు లాంటివి పని ప్రదేశాల్లో వారికే ప్రతికూలంగా మారే ప్రమాదముందని జూలైలో సుప్రీమ్ కోర్ట్ అభిప్రాయపడింది. అయినా, ఆ అంశాన్ని పార్టీలు చేపట్టడం విచిత్రమే. పని గంటల్లో వెసులుబాటు, వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర ప్రత్యామ్నాయాలను పట్టించుకోకుండా, జపాన్, స్పెయిన్, ఇండొనేసియా లాంటి చోట్ల ఆదరణకు నోచుకోని పద్ధతిని తెస్తామని హామీ ఇవ్వడం ఒకింత ఆశ్చర్యకరం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే బలమైన ఓటరు వర్గంగా మహిళలు మారిన సంగతిని పార్టీలు గుర్తించాయి. స్త్రీలు స్వీయ నిర్ణయంతో ఓట్లేస్తున్న ధోరణి పెరుగుతోందనీ గ్రహించాయి. అందుకే, 4.5 కోట్ల మంది మహిళా ఓటర్లున్న మహారాష్ట్రలో రెండు కూటములూ వారిని లక్ష్యంగా చేసుకున్నాయి. లడకీ బెహిన్ యోజన కింద ఇస్తున్న నెలవారీ భృతిని పెంచుతామనీ, స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులకు ‘లఖ్పతీ దీదీ’ పథకంతో చేయూతనిచ్చి, 2027 కల్లా 50 లక్షల మందిని లక్షాధికారిణుల్ని చేస్తామనీ ‘మహాయుతి’ మాట. ఎంవీఏ కూటమి ఏమో ‘మహా లక్ష్మి పథకం’ ద్వారా నెలవారీ ఆర్థికసాయం, ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం వగైరా హామీలి స్తోంది. నిజానికి, పశ్చిమ బెంగాల్లో కన్యాశ్రీ, మధ్యప్రదేశ్‌లో లాడ్లీ బెహనా యోజన... ఇలా రక రకాల పేర్లతో మహాలక్ష్మి పథకం లాంటివి ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి. ఈ తీపి మాటల్ని అటుంచితే,, మహారాష్ట్రలోని 288 స్థానాలకు గాను రెండు కూటముల పక్షాన కలసి ఈ ఎన్నికల్లో 56 మంది మహిళలే బరిలో ఉన్నారు. లెక్కలు తీస్తే, మొత్తం అభ్యర్థుల్లో స్త్రీల సంఖ్య 10 శాతమే. వెరసి, ఆడవారికి ఉచితాలిచ్చి ఓటర్లుగా వాడుకోవడమే తప్ప, చట్టసభల్లో సరైన భాగస్వామ్యం కల్పించడంలో పార్టీలకు ఆసక్తి లేదు. మహిళా రిజర్వేషన్లను పైకి ఆమోదించినా, ఆచరణలో ఇదీ దుఃస్థితి.పార్లమెంట్‌కు అతిపెద్ద సంఖ్యలో రాజ్యసభ సభ్యుల్ని పంపే రాష్ట్రాల్లో రెండోది అయినందున మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ కీలకంగా భావిస్తోంది. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేక చట్టం చేస్తామంటూ కాషాయపార్టీ హిందూత్వ కార్డును విసురుతుంటే, ఓబీసీలు గణనీయంగా ఉన్న రాష్ట్రమైనందున కులగణన, ఉద్యోగాల రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి ఎత్తివేత లాంటి మాటలతో ఎంవీఏ సామాజిక న్యాయం నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది. ఇక, విభజనవాద నినాదాలైన ‘బటేంగే తో కటేంగే’ (హిందువులు విడిపోతే నష్టపోతాం), ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ (కలసివుంటే భద్రంగా ఉంటాం) మధ్య రైతాంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వగైరా అసలు అంశాలు వెనక్కిపోవడమే విషాదం. స్థూలంగా 6 జోన్లయిన మహారాష్ట్రలో ఆర్థికంగా వెనకబడ్డ విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహా రాష్ట్ర ప్రాంతానికీ – రెండు, మూడు రెట్లు తలసరి ఆదాయం ఎక్కువుండే ముంబయ్, థానే – కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలకూ మధ్య ఆలోచనలో తేడా ఉంటుంది. మొత్తం స్థానాల్లో నాలుగోవంతు పైగా సీట్లలో ఎప్పుడూ హోరాహోరీ పోరే. అలాగే, మూడోవంతు పైగా స్థానాల్లో విజేత మెజారిటీ కన్నా మూడోస్థానంలో నిలిచిన అభ్యర్థి ఓట్ షేర్ ఎక్కువ. కాబట్టి, ఫలితాల అంచనా అంత సులభం కాదు. రాష్ట్రాన్ని పాలించేది ఎవరన్నది ఒక్కటే కాదు... ఉద్ధవ్ ఠాక్రే, శిందే వర్గాలలో ఎవరిది అసలైన శివసేన అన్నదీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పునివ్వనున్నారు. వాగ్దానపర్వంలో ఏ పార్టీని ఎంత నమ్మిందీ చెప్పనున్నారు. తక్షణ ఆర్థిక సహాయం పట్ల గ్రామీణ ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం కనిపిస్తోంది కానీ, వచ్చే ఏడేళ్ళలో రూ. 2.75 లక్షల కోట్ల అప్పు తీర్చాల్సిన రాష్ట్రంలో రేపు ఏ కూటమి అధికారంలోకి వచ్చినా తమ హామీలను అమలు చేయగలుగుతుందా అన్నది ప్రశ్న. -
నయవంచనకు నకలు పత్రం!
దొంగ హామీలతో, వక్రమార్గంలో అయిదు నెలలక్రితం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటినుంచీ అనామతు పద్దులతో తప్పించుకు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సర్కారు ‘తప్పనిసరి తద్దినం’లా సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఘనమైన అంకెలు చూసి జనం నవ్విపోరా అన్న వెరపు లేకుండా రూ. 2,94,427 కోట్లతో ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ. 32,712 కోట్లు, ద్రవ్యలోటు రూ. 68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొన్నటి ఎన్నికల్లో భూమ్యా కాశాలను ఏకం చేస్తూ మోత మోగించిన సూపర్ సిక్స్ హామీల జాడ లేకుండా... అంచనా వేస్తున్న పన్ను రాబడి రూ. 24,000 కోట్లూ వచ్చే మార్గమేమిటో చెప్పకుండా ఆద్యంతం లొసుగులు, లోపాలతో బడ్జెట్ తీసుకురావడం బాబు సర్కారుకే చెల్లింది. ఈమాత్రం బడ్జెట్ కోసం అయిదు నెలలు ఎందుకు ఆగాల్సివచ్చిందో కూటమి నేతలే చెప్పాలి. 53.58 లక్షలమంది రైతులకు రూ. 20,000 చొప్పున రూ. 10,716.74 కోట్లు కేటాయించాల్సిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే విదిల్చి రైతు సంక్షేమమే లక్ష్యమంటూ బీరాలు పోవటం... 84 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 12,600 కోట్లు కావాల్సి వుండగా కేవలం రూ. 5,387.03 కోట్లు కేటాయించి ఊరుకోవటం దుస్సాహసానికి పరాకాష్ఠ.రైతులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకానికి ఈ ఖరీఫ్ సీజన్ తర్వాత మంగళం పాడుతున్నట్టు ప్రభుత్వమే చెప్పింది. ఇక రూ. 3 లక్షల వరకూ సున్నావడ్డీ రాయితీ, డ్రిప్ పరికరాలపై 90 శాతం సబ్సిడీ వగైరాల గురించి ప్రస్తావన లేదు. అలాగే ధరల స్థిరీకరణ నిధికీ, ప్రకృతి వైపరీత్యాల నిధికీ ఇచ్చిందేమీ లేదు! అయినా రైతు సంక్షే మానికి కట్టుబడివున్నారట! పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఇస్తామని చెప్పిన ‘ఆడబిడ్డ’ నిధికి రూ. 32,400 కోట్లు కేటాయించాల్సి వుండగా ఇచ్చింది సున్నా. ఏడాదిలో ఇంటింటికీ మూడు సిలెండర్లు ఉచితమని ఊదరగొట్టిన పథకం కింద కోటీ 54 లక్షల కుటుంబాల కోసం రూ. 4,000 కోట్లు అవసరం కాగా దానికోసం కేటా యించింది కేవలం రూ. 895 కోట్లు! ఈ అరకొర మొత్తంతో ఇంటికో సిలెండరైనా ఇవ్వగలుగు తారా? లబ్ధిదారుల జాబితాకు అడ్డగోలుగా కోత పెడితే తప్ప ఇది అసాధ్యం. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున ఏడాదిలో కోటిమందికి మొత్తం రూ. 36,000 కోట్లు కావాల్సి వుండగా దాని ఊసే లేదు! జాబ్ క్యాలెండర్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు వగైరాల గురించిన ప్రస్తావన లేదు. అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ. 10 లక్షల వరకూ సబ్సిడీ ఇస్తామని చెప్పిన వాగ్దానానికి సైతం చోటులేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి తగినన్ని నిధులు కేటాయిస్తే, చెప్పిన రీతిలో సబ్సిడీ సొమ్ము అందిస్తే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. కానీ వీటి గురించి మాట్లాడింది లేదు. ఆ రంగానికి బాబు హయాంలో పెట్టిపోయిన బకాయిలు కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో సైతం చెల్లించి ఆ పరిశ్రమలకు ఊపిరులూదిన జగన్ సర్కారుకూ, ఈ మాయదారి కూటమి ప్రభుత్వానికీ పోలికెక్కడ! యువతకు ఏటా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మాట దేవుడెరుగు – మూడు లక్షలమంది వలంటీర్లకు మంగళం పాడినట్టు బడ్జెట్ అధికారికంగా తేల్చి చెప్పింది. కాపు వర్గానికి సైతం మొండిచెయ్యి చూపారు.‘బడ్జెట్ అంటే అంకెల సముదాయం మాత్రమే కాదు... అది మనం పాటిస్తున్న విలువలు, ఆకాంక్షల వ్యక్తీకరణ’ అని ఒకనాటి అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ ల్యూ ఉవాచ. పీఠంపై పేరాశతో మొన్నటి ఎన్నికల్లో ఎడాపెడా వాగ్దానాలిచ్చినవారి నుంచి విలువలేమి ఆశించగలం? వారికి జనం ఆకాంక్షలెలా అర్థమవుతాయి? అందుకే– వంచనాత్మక విన్యాసాలు ఆగలేదు. బడ్జెట్లో అంకెల గారడీ సరే, బయట పారిశ్రామికవేత్తలతో సైతం బాబు అదే మాదిరి స్వోత్కర్షలకు పోయారు. రానున్న రోజుల్లో ఏకంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తారట! అవకాశాల కల్పనతో సంపద సృష్టించి, పేదల జీవన ప్రమాణాలు పెంచుతారట!! కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచీ పన్ను రాబడి మైనస్‌లోకి పోయిందని సాక్షాత్తూ కాగ్ చెప్పింది. జగన్ సర్కారు హయాంలో మొన్న ఏప్రిల్‌లో పన్ను రాబడిలో దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ తర్వాత తగ్గటం సంగతలా వుంచి మైనస్‌లోకి పోయింది. మే నెలలో –2.8 శాతం, ఆ తర్వాత వరసగా –8.9, –5.3, –1.9, –4.5 శాతాలకు పడిపోయిందని కాగ్ నివేదిక బయటపెట్టింది. వాస్తవం ఇలావుంటే పన్ను రాబడి కింద అదనంగా రూ. 24,000 కోట్లు వస్తాయని బడ్జెట్ నమ్మబలుకుతోంది. అంటే రానున్న కాలంలో అదనపు పన్నుల మోత మోగుతుందన్నమాట!జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గడచిన అయిదేళ్ళూ సాగించిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కూటమి నేతలు, వారి వందిమాగధ మీడియా నోటికొచ్చినట్టు రూ. 12 లక్షల కోట్లు, రూ. 14 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారాలు చేశారు. తీరా మొన్న మార్చి 31 నాటికి ఆ అప్పు రూ. 6.46 లక్షల కోట్లని తాజా బడ్జెట్ వెల్లడించింది. ఇందులో గ్యారెంటీల కింద తెచ్చిన అప్పు రూ. 1,54,797 కోట్లనూ తీసేస్తే నికరంగా ఉన్నది రూ. 4.91 లక్షల కోట్లు మాత్రమే! నిజానికి ఈ బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంలో గతంలో తప్పుడు ప్రచారం చేశామని క్షమాపణలు చెప్పాలి. కానీ ఆపాటి నిజాయితీ ఆశించటం అత్యాశే. మొత్తానికి నయవంచనకూ, నేల విడిచిన సాముకూ ఈ బడ్జెట్ అసలు సిసలు ఉదాహరణ. -
నిధులు రావాలి! నిశ్చయం కావాలి!
పర్యావరణ మార్పుల సమస్యపై ప్రపంచ దేశాలు మరోసారి చర్చకు కూర్చున్నాయి. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) శిఖరాగ్ర సదస్సు ‘కాప్–29’ అజర్‌బైజాన్‌లోని బాకూలో సోమవారం మొదలైంది. బొగ్గు, ముడిచమురు, సహజవాయువుల వినియోగం నుంచి దూరం జర గాలని చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన ఏడాది తరువాత జరుగుతున్న ఈ 12 రోజుల మేధామథనం అనేక విధాల ప్రాధాన్యం సంతరించుకుంది. గడచిన 2023, ఆ వెంటనే వర్తమాన 2024... ఇలా వరుసగా రెండో ఏడాది కూడా అత్యధిక వేడిమి నిండిన వత్సరంగా రుజువవుతున్న వేళ జరుగు తున్న సదస్సు ఇది. అలాగే, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన కొద్ది రోజులకే ఇది జరుగుతోంది. పర్యావరణ సంక్షోభం వట్టి నాటకమన్నది ఆది నుంచి ట్రంప్ వైఖరి కావడంతో మిగతా ప్రపంచమంతా బాకూ వైపు ఆసక్తిగా చూస్తోంది. నిజానికి, ఈ 2024 చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతా నామ సంవత్సరం కానున్నట్లు కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ లాంటి నివేదికలు సూచిస్తున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రత ఎక్కువైన తొలి ఏడాదే ఇదే కానుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్యవసానంగా కరవు, తుపానులు, వరదలు ప్రపంచమంతటిపై ప్రభావం చూపుతున్నాయి. ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాప్–29 జరుగుతుండడం గమనార్హం. గమనిస్తే, ప్రపంచ కాలుష్య ఉద్గారాలలో ఇప్పటికే చైనా ప్రథమ స్థానంలో, అమెరికా రెండో స్థానంలో ఉంటే, భారత్ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారి సదస్సుకు అమెరికా, చైనా, భారత్, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల అగ్రనేతలు హాజరు కావడం లేదు. అధ్యక్షుడు బైడెన్ రావట్లేదు. కొత్తగా ఎన్నికైన ట్రంప్ ఎలాగూ రారు. అయితేనేం, అమెరికా ప్రభావం ఈ కాప్–29పై అమితంగా ఉండనుంది. నిరుటి చర్చల్లో చేసుకున్న ప్రధాన వాగ్దానానికి కట్టుబడడంలో అనేక దేశాలు విఫలమయ్యాయి. ఉదాహరణకు, అన్ని దేశాల కన్నా అత్యధికంగా ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న అమెరికా తన పద్ధతి మార్చుకోనే లేదు. ఇప్పుడు ట్రంప్ గద్దెనెక్కినందున చమురు ఉత్పత్తి, వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గే సూచన లేదు. పర్యావరణ పరిరక్షణ చర్యల నుంచి అమెరికా పూర్తి దూరం జరిగినా జరగవచ్చు. ఇది ప్రమాద ఘంటిక. అగ్ర దేశాలు హాజరు కాకున్నా సమస్య తీవ్రతయితే మారదు. వాతావరణ సంక్షోభ నివారణకు మరిన్ని నిధులవసరం. అందుకే, కాప్–29 కొత్త వాతావరణ పరిరక్షణనిధిని ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. వర్ధమాన దేశాలు తమ ఉద్గారాల సమస్యను దీటుగా ఎదుర్కొని, పెరుగుతున్న వాతావరణ ముప్పును వీలైనంత తగ్గించాలంటే ఆ దేశాలకు తగినంత ఆర్థిక సహాయం అవసరం. అందుకు 100 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని 2009లోనే నిర్ణయించారు. 2020 కల్లా దాన్ని చేరాలని భావించారు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న వాతావరణ సంక్షోభ పరిస్థితుల మధ్య ఆ నిధులు ఇప్పుడు ఏ మూలకూ రావు. కాబట్టి, వర్తమాన పరిస్థితులకూ, అవసరాలకూ తగ్గట్టు దాన్ని ఇప్పుడు సవరించుకోవాల్సిన పరిస్థితి. భాగస్వామ్య పక్షాలైన 198 దేశాలకూ వీటో ఉన్న నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధన సులభమేమీ కాదు. అలాగే, ఈ మొత్తంలో ఎంత మేర ప్రజాధనం సేకరించా లనేది కూడా కీలక ప్రశ్నే. అనేక దేశాలు ఆర్థిక భారంతో ఉన్న వేళ దీని పైనా అందరి వైఖరీ ఒకేలా లేదు. అయితే, చర్యలు చేపట్టడం ఆలస్యమైన కొద్దీ మరింత భారీగా నిధులు అవసరమవుతాయి. నిధులెంత కావాలన్నదే కాదు... వాటిని ఎలా సేకరించాలి, పర్యావరణ మార్పుల కష్టనష్టాల నుంచి కోలుకొనేందుకు దేశాలకు ఎలా ఆ నిధుల్ని పంచాలి, సంక్షోభ పరిష్కారానికి రూపొందించాల్సిన ఆర్థిక వ్యవస్థ ఏమిటనేది కూడా సదస్సులో కీలక చర్చనీయాంశాలే. పర్యావరణ, ఆర్థిక, మానవ నష్టాలను నిరోధించాలంటే పరిస్థితి చేతులు దాటక ముందే ఉద్గారాల్ని తగ్గించడం కీలకం. వాతావరణ ఉత్పాతాలతో విస్తృతంగా నష్టం, పర్యవసానాలు తప్పవు. నష్టం పెరిగిన కొద్దీ ఆ దేశాల పునరుజ్జీవానికి మరింత ఖర్చవుతుంది. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుడమి పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండాలంటే, తక్షణ చర్యలు అవసరం. అభివృద్ధి చెందిన దేశాలు గతంలో కోవిడ్–19 సమయంలో తమ పౌరులకూ, వ్యాపారాలకూ అండగా నిలిచేందుకు 48 నెలల్లోనే దాదాపు 8 లక్షల కోట్ల డాలర్లను అందించి, ఆ సవాలును ఎదుర్కొన్నాయి. అప్పటి కోవిడ్లానే ఇప్పుడీ పర్యావరణ మార్పు సమస్యనూ అంతే అత్యవసరంగా చూడడం ముఖ్యం. ప్రజాధనంతో పాటు ప్రైవేట్ రంగ ఆర్థిక సాయం కూడా లేకుంటే కష్టమని కాప్–29 బాధ్యులు సైతం తెగేసి చెబుతున్నారు. హరిత పర్యావరణ నిధి అంటూ పెట్టినా, సమకూరింది తక్కువే. ఇప్పటికైతే ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్లు అవసరమంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తుండడంతో, వర్ధమాన దేశాల స్వచ్ఛ అభివృద్ధి, దారిద్య్ర నిర్మూలనకు గండి పడుతోంది. అసలు ఆ నిధుల్లోనూ 60 శాతం పైగా రుణాలైతే, 30 శాతం పైగా ఈక్విటీలు. కేవలం 5 శాతమే గ్రాంట్లు. అసలే కునారిల్లుతున్న అనేక పేద దేశాలకు ఇది మోయలేని భారమే. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, కాప్–29 చర్చించడం ముఖ్యం. బలమైన ఆర్థికవ్యవస్థగా రూపొందుతున్న భారత్ సైతం చొరవ తీసుకోవాలి. హరిత ఇంధన టెక్నాలజీ, పరిశోధన – అభివృద్ధి, తక్కువ ఖర్చు పరిష్కారాల వైపు ప్రపంచం దృష్టి సారించేలా చూడాలి. ఏమైనా, గండం గట్టెక్కాలంటే మరిన్ని నిధులు కావాలి. అదీ వేగంగా అందాలి. వనరుల సమీకరణ సాధ్యమేనని చరిత్ర చెబుతోంది గనక, ఇప్పుడిక రాజకీయ కృతనిశ్చయముందా అన్నదే ప్రశ్న. ఈ 12 రోజుల సదస్సులో దానికి సమాధానం స్పష్టం కానుంది. -
సుదీర్ఘ తగువుకు పాక్షిక ఊరట!
షష్టిపూర్తికి చేరువలో ఉన్న ఒక వివాదాస్పద కేసుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పాక్షికంగా ముగింపు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి నుంచి వైదొలగుతున్న చివరి రోజున ఆయన ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కు మైనారిటీ ప్రతిపత్తి అర్హతలేదన్న 1967 నాటి నిర్ణయాన్ని కొట్టేస్తూనే వేరే ధర్మాసనం దాన్ని నిర్ధారించాలని తెలిపింది. గత తీర్పుకు అనుసరించిన విధానం సరికాదని తేల్చింది. బెంచ్‌లోని ముగ్గురు సభ్యులు అసమ్మతి తీర్పునిచ్చారు. ఒక వివాదాన్ని ఏళ్ల తరబడి అనిశ్చితిలో పడేస్తే నష్టపోయే వర్గాలుంటాయి. ఏళ్లు గడిచేకొద్దీ సమస్య జటిలమవుతుంది కూడా. జేఎన్‌యూ మాదిరే ఏఎంయూ కూడా వివాదాల్లో నానుతూ ఉంటుంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఇవి మరింత పెరిగాయి. చిత్రమేమంటే ఈ రెండు యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైనవారిలో చాలామంది సివిల్ సర్వీసులకూ, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలకూ ఎంపికవుతుంటారు. పార్టీల్లో, ప్రభుత్వాల్లో, బహుళజాతి సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. ఏఎంయూది ఒక విషాద చరిత్ర. సమస్యలు కూడా భిన్నమైనవి. సర్ సయ్యద్ మహ్మద్ ఖాన్ అనే విద్యావంతుడు మదర్సాల్లో కేవలం ఇస్లామిక్ విలువల విద్య మాత్రమే లభించటంవల్ల ఆ మతస్తులు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని భావించి వాటితోపాటు ఆధునిక విద్యాబోధన ఉండేలా 1877లో స్థాపించిన ఓరియంటల్ కళాశాల ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. మౌల్వీలనుంచీ, మదర్సాలనుంచీ సర్ సయ్యద్‌కు ప్రతిఘటన తప్పలేదు. ఆధునిక విద్యనందిస్తే పిల్లల మనసులు కలుషితమవుతాయన్న హెచ్చరిక లొచ్చాయి. అన్నిటినీ దృఢచిత్తంతో ఎదుర్కొని ఆధునిక దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత విద్యాసంస్థపై 147 ఏళ్లు గడిచాక మత ముద్ర పడటం, దాన్నొక సాధారణ వర్సిటీగా పరిగణించా లన్న డిమాండు రావటం ఒక వైచిత్రి. చరిత్ర ఎప్పుడూ వర్తమాన అవసరాలకు అనుగుణంగా కొత్త రూపు తీసుకుంటుంది. అందు వల్లే కావొచ్చు... ఏఎంయూ చుట్టూ ఇన్ని వివాదాలు! 1920లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఓరియంటల్ కళాశాలనూ, ఆ ప్రాంతంలోనే ఉన్న ముస్లిం యూనివర్సిటీ అసోసియేషన్ సంస్థనూ విలీనం చేసి 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఆ చట్టంలోని 23వ నిబంధన యూనివర్సిటీ పాలకమండలిలో కేవలం ముస్లింలకు మాత్రమే చోటీయాలని నిర్దేశిస్తోంది. అయితే ముస్లిం విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధన లేదు. స్వాతంత్య్రానంతరం 1951లో ఆ చట్టానికి తెచ్చిన రెండు సవరణలు మతపరమైన బోధననూ, పాలకమండలిలో ముస్లింలు మాత్రమే ఉండాలన్న నిబంధననూ రద్దుచేశాయి. ఈ చర్య రాజ్యాంగంలోని 30వ అధికరణతోపాటు మత, సాంస్కృతిక, ఆస్తి అంశాల్లో పూచీపడుతున్న ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనంటూ పిటి షన్ దాఖలైంది. అయితే ఆ సవరణలు చెల్లుతాయని 1967లో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల బెంచ్ వెలువరించిన తీర్పే ప్రస్తుత వివాదానికి మూలం. వర్సిటీ స్థాపించిందీ, దాన్ని నిర్వహిస్తు న్నదీ ముస్లింలు కాదని ఆ తీర్పు అభిప్రాయపడింది. అయితే అలా మారటం వెనక ముస్లిం పెద్దల కృషి ఉన్నదని అంగీకరించింది. ప్రభుత్వం స్థాపించిన వర్సిటీకి మైనారిటీ ప్రతిపత్తి ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ 1981లో ప్రభుత్వం ఏఎంయూ చట్టానికి సవరణలు తెచ్చింది. తిరిగి మైనారిటీ ప్రతిపత్తినిచ్చింది. దాంతో మెడికల్ పీజీలో 50 శాతం సీట్లను ముస్లింలకు కేటాయించాలని పాలకమండలి 2005లో నిర్ణయించింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. నాటి యూపీఏ సర్కారు, పాలకమండలి 2006లో దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు స్వీకరించినా రిజర్వేషన్ల విధానంపై స్టే విధించింది. ఆనాటినుంచీ అనాథగా పడివున్న ఆ కేసు నిరుడు అక్టో బర్లో జస్టిస్ చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయటంతో ముందుకు కదిలింది. అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 30వ అధికరణను పరిమితార్థంలో చూసిందనీ, యాంత్రికంగా అన్వయించిందనీ తాజా మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ఏఎంయూ స్థాపన నేపథ్యం, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి తప్ప తర్వాతకాలంలో వచ్చిన చట్టాన్ని కాదని తెలిపింది. ఈ తీర్పుతో విభేదించిన ముగ్గురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు కూడా ప్రాధాన్యత గలవే. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై మరో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు ఎలా సిఫార్సు చేస్తుందని వారి ప్రశ్న. కేశవానంద భారతి కేసులో 1973 నాటి ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తీర్పుపై 15 మందితో ధర్మాసనం ఏర్పాటు చేయమని రేపన్నరోజు మరో బెంచ్ ఆదేశిస్తే పరిస్థితేమిటని నిలదీశారు. ఏదేమైనా ఆలస్యమైనకొద్దీ సమస్య ఎంత జటిలమవుతుందో చెప్పటానికి ఏఎంయూ కేసే ఉదాహరణ. ఈ వర్సిటీ స్థలదాత జాట్ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అని హిందూ సంస్థలూ... ఆయన నెలకు రూ. 2కు 1929లో లీజుకు మాత్రమే ఇచ్చారని ముస్లింలూ రోడ్డుకెక్కారు. హిందువు ఇచ్చిన స్థలమై నప్పుడు దానికి మైనారిటీ ప్రతిపత్తేమిటన్న ప్రశ్న తలెత్తింది. మైనారిటీ సంస్థలో చదువుకుని ఎదిగి నందుకు కృతజ్ఞతగా లీజుకిచ్చారని, అలా ఇచ్చిన వందమందిలో ఆయనొకరని అవతలి పక్షం వాదించింది. మొత్తానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల మహేంద్ర పేరిట అక్కడే మరో వర్సిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ ధర్మాసనం సూచించిన విధంగా ఏఎంయూ ప్రతిపత్తిపై మరో బెంచ్ ఏర్పాటై తీర్పు వస్తే ప్రస్తుత అనిశ్చితికి తెరపడుతుంది. -
లక్ష్య సాధన కోరుతున్న చిత్తశుద్ధి
కొన్ని నివేదికలు, గణాంకాలు పాలకులైనా, ప్రజలకైనా గట్టి మేలుకొలుపులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) నివేదిక’ అలాంటిదే. ప్రపంచవ్యాప్త టీబీ కేసుల్లో 26 శాతం భారత్‌లోనే ఉన్నాయట! ఒక్క గడచిన 2023లోనే మన దేశంలో 25.5 లక్షల కొత్త టీబీ కేసులు నమోదయ్యాయి. 1960లలో టీబీపై నియంత్రణకు ఉపక్రమించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఇది అత్యధికం. ఇది మన మత్తు వదిలించే మాట. దానికి తోడు పలు ఔషధాలకు లొంగకుండా తయారైన టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ – ఎండీఆర్ టీబీ) సరికొత్త ప్రజారోగ్య సంక్షోభంగా తయారైంది. ఆ కేసులూ మన దేశంలోనే ఎక్కువన్న సంగతి ఆందోళన కలిగిస్తోంది. పేరుకు 85 శాతానికి పైగా టీబీ రోగులకు చికిత్స చేరువైనా, ఖరీదైన మందులతో సామాన్యుల ఇల్లు, ఒళ్ళు గుల్లవుతున్నాయి. దాదాపు 20 శాతం మంది రోగులు తమ వార్షికా దాయంలో 20 శాతం పైగా ఈ చికిత్సకే ఖర్చు చేస్తున్నారట. దీనికి తోడు కొన్నేళ్ళుగా టీబీ నియంత్రణ నిధులు కూడా 13 లక్షల డాలర్ల మేర తగ్గడం శోచనీయం. ఈ చేదు నిజాలన్నీ అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని మన ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాయి. గడచిన 2023 లెక్కల ప్రకారం భారత్‌లో దాదాపు 27 లక్షల టీబీ కేసులున్నట్టు అంచనా. వాటిలో 25.1 లక్షల మంది రోగులు మందులు వాడుతున్నారు. అలా చూస్తే టీబీ సోకినవారిలో నూటికి 85 మందికి పైగా చికిత్స పొందుతూ ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. నిరుడు అత్యధిక కేసులు నమోదైన సంగతి పక్కన పెడితే... గత ఎనిమిదేళ్ళలో భారత్‌లో టీబీ కేసులు 18 శాతం తగ్గినట్టు డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం మేర కేసులు తగ్గితే, భారత్‌లో అంతకు రెట్టింపు కన్నా ఎక్కువగా కేసులు తగ్గాయట. సంతోషకరమే. కానీ, అది సరిపోతుందా అన్నది ప్రశ్న. 2025 నాటి కల్లా దేశంలో టీబీ లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ అనుకున్నది సాధించాలంటే ఇది సరిపోదన్నది నిపుణులు తేల్చిచెబుతున్న నిష్ఠురసత్యం. వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతుల్ని మరింత మెరుగుపరచడమే కాక, నిధుల కొరతను తీర్చడం, మరింత మందికి చికిత్స అందించడం లాంటివి చేసినప్పుడే టీబీ నిర్మూలన లక్ష్యం వైపు అడుగులు వేయగలం. ఈ వ్యాధిని కేవలం ఆరోగ్య సమస్యగానే చూడలేం. దారిద్య్రం, పౌష్టికాహార లోపం, అంతంత మాత్రపు ఆరోగ్య వసతులు లాంటి సామాజిక – ఆర్థిక కారణాలూ ఇది ముదరడానికి కారణమని విస్మరించలేం. నిజానికి, గత ఆరు దశాబ్దాల కాలంలో మన దేశంలో టీబీ నిర్మూలన కార్యక్రమం కింద లబ్ధి పొందిన రోగుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆ సంఖ్య పెరుగుతోంది. అయితే, ఆర్థికంగా బాగా వెనుక బడినవారికి అందుతున్న సాయం ఇప్పటికీ అంతంత మాత్రమే. టీబీ సోకినవారిలో అయిదోవంతు కన్నా ఎక్కువ మందికి సాయం అందడం లేదని ప్రభుత్వ గణాంకాలే ఒప్పుకుంటున్నాయి. అంత కన్నా విషాదం ఏమిటంటే, టీబీ నిర్మూలన లక్ష్యం గురించి పైకి గొప్పగా చెబుతున్నా, తీరా ఆచ రణలో అందుకు కేటాయించాల్సిన నిధుల్ని గణనీయంగా తగ్గించేస్తూ ఉండడం. లెక్క తీస్తే, 2019లో మన దేశంలో ఈ నిర్మూలన కార్యక్రమానికి 43.26 కోట్ల డాలర్ల కేటాయింపులు ఉండేవి. తీరా గడచిన 2023కు వచ్చేసరికి ఆ నిధుల మొత్తాన్ని 30.28 కోట్ల డాలర్లకు తగ్గించేశారు. ఆలోచనకూ, ఆచరణకూ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అచ్చంగా ‘దుత్తలో కూడు దుత్తలోనే ఉండాలి. చంకలో పిల్లాడు మాత్రం దుడ్డులా ఉండాల’న్నట్టుగా ఉంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటున్నది అందుకే. పైగా, కరోనా అనంతరం, గత ఏడాది ఒక్కసారిగా అన్ని కొత్త టీబీ కేసులు ఎందుకు నమోదయ్యాయో లోతుగా అధ్యయనం చేయాలి. టీబీని నిర్మూలన లక్ష్యం గొప్పదే అయినా అందుకు సవాళ్ళూ అనేకం. ప్రభుత్వం అందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కృతనిశ్చయంతో ఉన్నా ప్రజల్లో ఈ వ్యాధిపై తగినంత చైతన్యం తీసుకు రాలేకపోతున్నారు. మనకున్న వైద్య వసతులూ అంతంత మాత్రమే. ఇక, పౌష్టికాహార లోపం సైతం టీబీ నిర్మూలనకు పెను అవరోధంగా మారింది. కేవలం పౌష్టికాహార లోపం వల్లనే ఏటా వయోజ నుల్లో 35 నుంచి 45 శాతం మేర కొత్త టీబీ కేసులు వస్తున్నాయని నిరుడు ‘లాన్సెట్’ నివేదిక ఒకటి స్పష్టం చేయడం గమనార్హం. అలాగే, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల కీలక ఔషధాలకు పని చేయకుండా పోయిన ఎండీఆర్–టీబీ కేసుల్లోనూ కేవలం 44 శాతమే తగిన చికిత్సకు నోచుకుంటున్నాయి. అదీ మరింత ఖరీదైన, విషతుల్యమైన వాటిని దీర్ఘకాలం వాడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ సవాళ్ళను అధిగమించడానికి చర్యలు చేపట్టడం అవసరం. అందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కొత్తగా ఆలోచించక తప్పదు. సరికొత్త వైద్యవిధానాల్ని ఆశ్రయించడమూ ముఖ్యమే.ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాన్ని టీబీ రోగులకు, మరీ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారికి వర్తించేలా చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది మంచి సూచనే. దేశంలో టీబీ నిర్మూలనకు ఇది దీర్ఘకాలంలో బాగా ఉపకరించే ఆలోచన. రోగుల విషయంలో వ్యక్తి కేంద్రితంగా సమగ్ర వైఖరిని అవలంబించాలని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటకు చెవి ఒగ్గాలి. అలాగే, ఫార్మసీ రంగాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్న పాలకులు వైద్య, ఆరోగ్య రంగంలో కీలకమైన పరిశోధనలకూ, కొత్త ఔషధాలు, చికిత్సలకూ ఏపాటి ప్రోత్సాహమిస్తున్నారు? గణనీయంగా నిధులు కేటాయించి, సమన్వయంతో కృషి చేస్తేనే మన దేశంలో టీబీ నివారణ అయినా, నిర్మూలనైనా సాధ్యమవుతుంది. మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవాలంటే,ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా నిలబడడమే మార్గం. -
ట్రంప్‌కే అమెరికా పట్టం
అంచనాలను మించిన విజయం ఇది. హోరాహోరీ పోరన్న సర్వేల జోస్యాన్ని తలకిందులు చేసిన ఫలితం ఇది. నవంబర్ 5 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటు పాపులర్ ఓటులోనూ, అటు ఎలక్టోరల్ ఓటులోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తిరుగులేని ఆధిక్యం సంపాదించారు. ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు అందనంత దూరంలో నిలిచి, అమెరికా 47వ అధ్యక్షుడిగా పీఠం ఖరారు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరింత సమయం పట్టనున్నప్పటికీ, ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజ్‌లో కావాల్సిన 270 సీట్ల మెజారిటీని ఆయన దాటేశారు. పన్ను తగ్గింపు సహా ప్రజాకర్షక వాగ్దానాలు, కట్టుదిట్టమెన వాణిజ్య షరతుల విధానం, వలసదారులకు అడ్డుకట్ట లాంటి వాటితో అమెరికాను మళ్ళీ అగ్రస్థానానికి తీసుకువెళతానన్న ట్రంప్ మాటలను అమెరికన్లు విశ్వసించారు. అందుకే, గడచిన రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫలితాన్ని హైజాక్ చేశారంటూ గెలిచిన పార్టీపై ఓడిన పార్టీ చేస్తూ వచ్చిన ఆరోపణలకు ఈసారి తావివ్వకుండా అఖండ విజయం అందించారు. ఇక, తమిళనాడుతో బంధమున్న కమల గెలవకున్నా, తెలుగు మూలాలున్న మనమ్మాయి ఉష భర్త జె.డి. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం భారతీయులకు ఊరట నిచ్చింది. రెండుసార్లు అభిశంసనకు గురై, అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ, ఒక దశలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికీ అనర్హులవుతారనే ప్రచారం నుంచి పైకి లేచి, 900 పైగా ర్యాలీలతో తమ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టడం ట్రంప్ సృష్టించిన చరిత్ర. అలాగే, ఎప్పుడూ డెమోక్రాటిక్ పార్టీకే మద్దతుగా నిలిచే మైనారిటీ ఓటర్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించి, అమెరికా దేశీయ రాజకీ యాల్లో కొత్త రాజకీయ పునరేకీకరణకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ డెమోక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన భారతీయ అమెరికన్లు సైతం ఈసారి ఎక్కువగా రిపబ్లికన్ల వైపే మొగ్గడం విశేషం. పీడిస్తున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ట్రంప్ బయట పడేస్తారనే ప్రజా భావన కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నాల సానుభూతి సరే సరి. ఇలాంటివన్నీ ట్రంప్‌కు అనుకూలించి, కమల అధ్యక్ష పదవి ఆశలను తలకిందులు చేశాయి. ఉదారవాదులు ఎంత వ్యతిరేకించినా విజయం ట్రంప్‌నే వరించింది. మహిళల అబార్షన్ హక్కుకు అనుకూలంగా కమల నిలబడడంతో స్త్రీలు ఆమెకు బ్రహ్మరథం పడతారని భావించారు. అది కొంతమేర జరిగింది కానీ, అధ్యక్ష పదవి అందుకోవడానికి అదొక్కటే సరిపోలేదు. శ్వేత మహిళల్లో గతంతో పోలిస్తే కమలకు కొంత మద్దతు పెరిగింది. అయితే, ఆఖరికి ఆ వర్గంలోనూ ట్రంప్‌కే అధికశాతం ఓట్లు పడ్డాయి. మొత్తం మీద పురుషుల్లో అధికంగా ట్రంప్‌కూ, మహిళల్లో ఎక్కువగా కమలకూ ఓటు చేశారని తొలి లెక్క. మహిళా నేత ఏలుబడికి అమెరికా సమాజం ఇప్పటికీ సిద్ధంగా లేదనీ, గతంలో హిల్లరీ క్లింటన్కైనా, ఇప్పుడు కమలకైనా ఎన్నికల ఫలితాల్లో ఈ లింగ దుర్విచక్షణ తప్పలేదనీ వినిపిస్తున్నది అందుకే. ఇక, గతంలో పెద్దగా ఓటింగ్‌లో పాల్గొనరని పేరున్న యువ, పురుష ఓటర్ల వర్గం ఈసారి పెద్దయెత్తున వచ్చి ఓటేయడం,ముఖ్యంగా శ్వేత జాతీయుల్లో అత్యధికులు ట్రంప్‌కే పట్టం కట్టడం గమనార్హం. ఒక్క నల్ల జాతీ యుల్లో మాత్రమే 78 శాతం మంది పురుషులు, 92 శాతం మంది స్త్రీలు కమలకు ఓటేశారు. అమె రికన్ సమాజంలోని కనిపించని నిట్టనిలువు చీలిక, వర్ణవిచక్షణకు ఇది ప్రతిబింబమని ఓ వాదన. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం, సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ పూర్తి నియంత్రణ సాధించడం అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద మలుపు. 2016లో తెలియకున్నా ఇప్పుడు మళ్ళీ పట్టం కడుతున్నప్పుడు ఆయన వ్యవహారశైలి సహా అన్నీ తెలిసే అమెరికన్లు ఆ నిర్ణయం తీసు కున్నారు. ఇప్పుడిక సెనేట్‌పై పట్టుతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచానికి కట్టుబడిన అగ్రరాజ్య విధానం నుంచి పూర్తి భిన్నంగా అమెరికాను ట్రంప్ కొత్త మార్గం పట్టిస్తారని ఒక విశ్లేషణ. అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణం నుంచే ప్రపంచాన్ని చూడడం ట్రంప్ పద్ధతి. వాణిజ్య ప్రయోజనాలే గీటురాయిగా ఆయన ముందుకు సాగవచ్చు. అలాగే, ఉక్రెయిన్‌కు సైనిక సాయం ఆపి, ఆక్రమణ జరిపిన రష్యాతో శాంతి చర్చలు జరపాలన్న ట్రంప్ వైఖరి పర్యవసానం యూరప్ అంతటా ఉంటుందని అక్కడి దేశాలు బెంగపడుతున్నాయి.భారత్‌కు సంబంధించినంత వరకు ట్రంప్ ఎన్నిక శుభవార్తే. నిజానికి, ప్రస్తుత డెమోక్రాట్ల హయాంలోనూ అమెరికా – భారత సంబంధాలు బాగున్నాయి. అయితే, భారత ప్రధాని మోదీతో ట్రంప్ చిరకాల మైత్రి వల్ల రానున్న రిపబ్లికన్ ప్రభుత్వ ఏలుబడి మనకు మరింత సానుకూలంగా ఉంటుందని ఆశ, అంచనా. ఇతర దేశాల సంగతికొస్తే... ట్రంప్ ఎన్నిక ఇరాన్, బంగ్లాదేశ్ లాంటి వాటికి కష్టాలు తెస్తే, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ లాంటి వారికి ఆనందదాయకం. కమల గద్దెనెక్కితే బాగుండనుకున్న చైనా, ఉక్రెయిన్ల ఆశ నెరవేర లేదు. అమెరికాలోని దాదాపు 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ రానున్న జనవరిలో అధికారం చేపడుతూనే ఆ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్టు ఆయన అధికార ప్రతినిధులు బుధవారమే తేల్చేశారు. అంటే, ఆది నుంచి ట్రంప్ దూకుడు చూపనున్నారన్న మాట. అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ అధికార క్రమాన్నే మార్చేయాలని చూస్తున్న ఆయన ధోరణి అమెరికానూ, మిగతా ప్రపంచాన్నీ ఎటు తీసుకువెళుతుందో వేచి చూడాలి. సమస్యల్ని పరిష్కరి స్తానంటూ ఎన్నికల నినాదం చేసిన ట్రంప్ కొత్తవి సృష్టిస్తే మాత్రం కష్టమే! -
ఆగని ఆగడాలు
ఎంత గట్టిగా చెప్పినా, ఎన్నిసార్లు నిరసన తెలిపినా భారత్‌కూ, భారతీయులకూ వ్యతిరేకంగా కెనడాలో ఆగడాలు ఆగడం లేదు. ఈ ఉత్తర అమెరికా దేశంలో ఆదివారం జరిగిన సంఘటనలు అందుకు తాజా నిదర్శనం. టొరంటోకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని బ్రాంప్టన్‌లో హిందూ సభ ఆలయం వద్ద పసుపుపచ్చ ఖలిస్తానీ జెండాలు ధరించిన మూకలు హిందూ భక్తులతో, భారతదేశ జెండాలు ధరించినవారితో ఘర్షణకు దిగి, దాడి చేసిన ఘటన ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం. భారత దౌత్యాధికారులు ప్రార్థనా మందిరాన్ని సందర్శిస్తున్నప్పుడు జరిగిన ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. మన ప్రధాని, విదేశాంగ మంత్రి తమ నిరసనను కటువుగానే తెలిపారు. ఖలిస్తానీ మద్దతుదారులైన 25 మంది ఎంపీల అండతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఘటన ఖండించాల్సి వచ్చింది. అయితే, సాక్షాత్తూ ట్రూడో ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు చంద్ర ఆర్య ఇదంతా ఖలిస్తానీ తీవ్రవాదుల పని అనీ, వారు లక్ష్మణ రేఖ దాటారనీ పేర్కొనడంతో సమస్యకు మూలకారణం సర్కారు వారి సొంత వైఖరిలోనే ఉందని కుండబద్దలు కొట్టినట్టయింది. సీనియర్ సిటిజన్లయిన భారతీయ, కెనడియన్లకు లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి స్థానిక హిందూ సభ మందిరంతో కలసి భారత అధికారులు దౌత్య శిబిరం నిర్వహించిన సందర్భంలో తాజా ఘటనలు జరిగాయి. ఇది మరీ దుస్సహం. అటు బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిరం, ఇటు సర్రీ లోని లక్ష్మీనారాయణ ఆలయం వద్ద జరిగిన ఘర్షణల్ని చెదురుమదురు ఘటనలు అనుకోలేం. భారత, హిందూ ధర్మ వ్యతిరేక ధోరణితో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని అల్లరి మూకలు కొన్నేళ్ళుగా దౌర్జన్యాలకు దిగుతున్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. భారత్‌కు వ్యతి రేకంగా, ఖలిస్తాన్‌కు అనుకూలంగా మందిరాల వద్ద గోడలపై రాతలు రాస్తున్న వైనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. కెనడాతో భారత్ తన నిరసన తెలిపి, అక్కడి భారతీయులు, ఖలిస్తానీ అనుకూలే తరుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం కనిపించట్లేదు. ట్రూడో సర్కార్ చిత్తశుద్ధి లేమికి ఇది అద్దం పడుతోంది. కెనడాలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతధర్మాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా పాటించే హక్కుందని ఆ దేశ ప్రధాని పైకి అంటున్నారు. కానీ లోలోపల సర్కారీఅండ చూసుకొనే ఆ దేశంలో మందిరాలపై ఖలిస్తానీ దాడులు పెరుగుతున్నాయనేది చేదు నిజం. కెనడాలోని పరిణామాలు ఇతరులకేమో కానీ, భారత్‌కు మాత్రం ఆశ్చర్యకరమేమీ కాదు. నిజం చెప్పాలంటే కొంతకాలంగా, మరీ ముఖ్యంగా గడచిన నాలుగేళ్ళుగా వేర్పాటువాద ఖలిస్తానీ మద్దతుదారులకు కెనడా ఒక కేంద్రంగా తయారైంది. భారత వ్యతిరేకులైన ఈ తీవ్రవాదులకు కెనడా ఆశ్రయం ఇవ్వడమే కాక, వారికి రక్షణగా నిలుస్తోంది. భారత్‌లో హింస, భయాందోళనల్ని వ్యాపింపజేస్తూ, ఆయుధాలు అందిస్తున్నట్టుగా వీరిలో చాలామందిపై భారత అధికారులు ఇప్పటికే క్రిమినల్ కేసులు పెట్టారు. అయినా సరే, డిజిటల్ మీడియా సహా వివిధ వేదికలపై ఖలిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తూ, భారత వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నవారిని కెనడా ప్రభుత్వం ఇంటి అల్లుళ్ళ కన్నా ఎక్కువగా చూసుకుంటోంది. నిజానికి, భారత ప్రభుత్వం కరడుగట్టిన గ్యాంగ్స్టర్లు ఏడుగురి పేర్లను గత ఏడాదే కెనడాకు అందజేసింది. జస్టిన్ ట్రూడో సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. వీటన్నిటి పర్యవసానమే... ఇప్పుడు కెనడాలో హిందువులపై జరుగుతున్న దాడులు. అల్లరి మూకలకు ఆశ్రయం ఇవ్వడం వల్లనే ఇలాంటి హింసాత్మక ఘటనలకు కెనడా నెలవుగా మారిందని ఇప్పుడు ప్రపంచానికి తేటతెల్లమైంది. హిందువులందరూ భారత్‌కు తిరిగి వెళ్ళిపోవాలని ఖలిస్తానీ గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ గత ఏడాది బాహాటంగానే హెచ్చరించారు. మొన్నటికి మొన్న దీపావళి జరుపుకోరాదనీ బెదిరించారు. బ్రాంప్టన్, వాంకూవర్లలో ఖలిస్తానీ మద్దతుదారులు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యో దంతాన్ని ఉత్సవంలా చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ట్రూడో సర్కార్ మాటలకే తప్ప చేతలకు దిగలేదు. ఆగడాలను ఆపే ప్రయత్నం చేయనే లేదు. తాజా ఘటనల్లో ఖలిస్తానీ అల్లరి మూకలను ఆపే బదులు కెనడా స్థానిక పోలీసులు మౌనంగా చూస్తూ నిల్చొని, బాధిత హిందూ భక్తులపైనే విరుచుకుపడడం విడ్డూరం. కొందరు పోలీసు ఉద్యోగులు సాధారణ దుస్తుల్లో ఖలిస్తానీ జెండాలతో తిరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రక్షకభటులు ఓ వర్గానికి కొమ్ముకాయడం ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేకుండా జరిగే పని కాదు. ఇది భారతీయ కెనడియన్ల భద్రతపై ఆందోళన రేపే అంశం. ట్రూడో అధికారంలోకి వచ్చాక భారత, కెనడా సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తూ వస్తున్నా యనేది బహిరంగ రహస్యం. గత ఏడాది కాలంగా సాక్ష్యాధారాలు చూపకుండా భారత్‌పై కెనడా ఆరోపణలు, మన దేశ ప్రతి విమర్శలు, మొన్న అక్టోబర్‌లో దౌత్యాధికారుల పరస్పర బహిష్కరణ దాకా అనేక పరిణామాలు సంభవించాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడానికే మొగ్గు చూపడం చివరకు ద్వైపాక్షిక సంబంధాలు ఇంతగా దెబ్బతినడానికి కారణమవుతోంది. ప్రజాస్వామ్యంలో స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛ ఉండాల్సిందే కానీ, దాని మాటున తీవ్రవాదుల ఇష్టారాజ్యం సాగనిద్దామనే ధోరణి సరైనది కాదు. ఈ వైఖరి పోనుపోనూ భారత, కెనడా ద్వైపాక్షిక సంబంధాలకే కాదు... చివరకు భవిష్యత్తులో కెనడా సొంత మనుగడకే ముప్పు తేవచ్చు. పాలు పోసి పెంచిన పాము మన ప్రత్యర్థిని మాత్రమే కాటు వేస్తుందనుకోవడం పిచ్చి భ్రమ. ట్రూడో సర్కార్ ఆ సంగతి ఇప్పటికైనా తెలుసుకొంటే మంచిది. -
ఆత్మపరిశీలన అవసరం!
సొంతగడ్డపై చిరకాలంగా భారత క్రికెట్ జట్టు అజేయమైనదనే రికార్డు కుప్పకూలింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ చేతిలో మనవాళ్ళు మొత్తం 3 టెస్టుల్లోనూ ఓటమి పాలయ్యారు. స్వదేశంలో టెస్ట్సిరీస్ను ఇలా 0–3 తేడాతో చేజార్చుకోవడం భారత క్రికెట్చరిత్రలో ఇదే ప్రథమం. కాగా, ఈ సిరీస్ పరాభవంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానం ఆస్ట్రేలియాకు కోల్పోయి, ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమైనా, ఈ స్థాయి పరాజయం భారత జట్టు అత్యవసరంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. టీ20ల మోజులో పడి టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన కనీసపాటి సన్నద్ధత అయినా లేకుండానే బరిలోకి దిగిన మన ఆటగాళ్ళ నిర్లక్ష్యాన్ని నిలదీస్తోంది. ఆఖరుసారిగా 2012లో ఇంగ్లండ్‌కు చెందిన అలస్టయిర్ కుక్ చేతిలో ధోనీ సేన 2–1 తేడాతో టెస్ట్ సిరీస్‌లో ఓటమి పాలైన తర్వాత గత పుష్కరకాలంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఎన్నడూ మళ్ళీ సిరీస్‌ను కోల్పోలేదు. భారత జట్టు సారథులు మారుతూ వచ్చినా, 18 టెస్ట్ సిరీస్‌లలో విజయం మనదే. కివీస్‌పైనా ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగుతుందని అందరూ భావించిన నేపథ్యంలో ఇది ఊహించని ఎదురుదెబ్బ. గత నెలలో బెంగుళూరులో 8 వికెట్ల తేడాతో తొలి టెస్ట్, ఆ వెంటనే పుణేలో 113 పరుగుల తేడాతో మలి టెస్ట్ ఓడిపోయినప్పుడే సిరీస్ చేజారింది. అయితే, ముంబయ్‌లో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లోనైనా గెలిచి, భారత జట్టు పరువు నిలుపుకొంటుందని ఆశించారు. చివరకు ఆ ఆశను కూడా వమ్ము చేసి, కివీస్ ముందు మన ఆటగాళ్ళు చేతులెత్తేయడం ఇప్పుడిప్పుడే మర్చిపోలేని ఘోర పరాభవం. ముంబయ్‌లో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక ఆదివారం భారత జట్టు 121 పరుగులకే ఆలౌట్ అవడంతో, అవమానకరమైన రీతిలో 0–3 తేడాతో సిరీస్‌ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా ఇది భారత జట్టుకు మేలుకొలుపు. భారత జట్టు వ్యూహరచన లోపాలు కొల్లలు. కివీస్‌తో బెంగుళూరు టెస్ట్‌లో టాస్ గెలిచాక మన వాళ్ళు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం అలాంటిదే. బ్యాట్స్మన్ల ఆర్డర్లో అనూహ్య ప్రయోగాల సంగతీ అంతే. ఇక, అవసరం లేకున్నా పుణేలో బంతి సుడులు తిరిగేలా పిచ్ రూపొందించారు. అదీ ప్రత్యర్థి జట్టుకే లాభించింది. కాబట్టి, భారత జట్టులోని మేధాబృందం ఆగి, ఆలోచించాలి. సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీలో ఆడాలని చెప్పినా, మరిన్ని వసతుల కోసం అనంతపురం నుంచి బెంగు ళూరుకు వేదిక మార్చినా అగ్రశ్రేణి ఆటగాళ్ళు ముందుకు రాకపోవడం ఘోరం. వారిని అందుకు అనుమతించడం ఒక రకంగా క్రికెట్ బోర్డ్ స్వయంకృతాపరాధమే. దాని పర్యవసానం, సిరీస్ భవిత తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల అత్యల్పస్కోర్కి భారత్ అవుటైనప్పుడే అర్థమైపోయింది. స్పిన్ ఆడడంలో భారత ఆటగాళ్ళు దిట్టలని ప్రతీతి. కానీ, అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. జట్టులో బెస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లో తరచూ ఔటవుతున్నారనీ, 2021 – 2024 మధ్య సొంత గడ్డపైన స్పిన్ బౌలింగ్‌లో సాధించిన సగటు పరుగులు 30 మాత్రమేననీ విశ్లేషకులు లెక్కలు తీశారు. అసాధారణ స్పిన్నర్లు కాకున్నా, కివీస్ బౌలర్ల చేతుల్లో భారత ఆటగాళ్ళు టకటకా ఔటవడం చూస్తే, స్పిన్‌లో మనం మాస్టర్లం కాదని తాజా సిరీస్ ఎత్తిచూపినట్టయింది. అలాగే, ఎర్ర బంతితో ఆడే టెస్ట్‌లకూ, తెల్ల బంతితో నడిచే టీ20 లకూ మధ్య చాలా తేడా ఉందని ఆటగాళ్ళు గ్రహించాలి. అన్ని బంతులూ ఆడి తీరాలి, పరుగులు చేయాలనే టీ20ల ధోరణితోనే టెస్ట్‌లు ఆడితే చిక్కులు తప్పవు. 2021లో టెస్ట్ ఓపెనర్‌గా ఇంగ్లండ్‌లో సక్సెస్ సాధించిన రోహిత్ మార్చుకున్న టీ20 ధోరణితోనే కివీస్‌పై ఆడడం వల్ల ఇబ్బంది పడ్డారు. కెప్టెన్‌గా ఆయనే పరుగులు చేయకపోతే, జట్టు పైన, ఆయన సారథ్యంపైన ఒత్తిడి తప్పదు. గతంలో 2011–12 ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు నుంచి ద్రావిడ్, లక్ష్మణ్‌ల రిటైర్మెంట్కు దారి తీసింది. చరిత్ర పునరావృతమై, ఇప్పుడు రానున్న టూర్ కోహ్లీ, రోహిత్‌లకు చివరిది అవుతుందా? చెప్పలేం. అనూహ్యంగా వారిద్దరూ విఫలమైన కివీస్ సిరీస్ పరిస్థితే ఆస్ట్రేలియా టూర్ లోనూ ఎదురైతే, సీనియర్లు రిటైర్ కావాలంటూ ఒత్తిడి పెరుగుతుంది. ఇక, వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపి యన్ షిప్ విషయానికొస్తే, కివీస్ సిరీస్ దెబ్బతో వరల్డ్ టెస్ట్ ర్యాకింగుల్లో మన స్థానం పడిపోయినందున భారత్ ఫైనల్‌కు చేరడం కష్టమే. ఇంకా చెప్పాలంటే, ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపై 4–0 తేడాతో ఓడిస్తే కానీ, మన ఫైనల్ ఆశ పండదు. ఏ రకంగా చూసినా అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టూర్‌లోనైనా మన జట్టు మితిమీరిన ఆలోచనలు, అంచనాలు పక్కనబెట్టి కేవలం ఆడు తున్న టెస్టులపై ఒకదాని వెంట మరొకటిగా దృష్టి పెడితే మేలు. పరిస్థితులు, పిచ్ స్వభావాన్ని బట్టి అప్పటికప్పుడు ఆట తీరును మలుచుకోవాలే తప్ప, ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి దూకుడు చూపుదామనుకుంటే చిక్కే. మారకపోతే మళ్ళీ కివీస్‌తో సిరీస్‌లో లాగా బోర్లా పడక తప్పదు. నిజానికి, భారత్ ఇప్పటికీ మంచి జట్టే. ఆటగాళ్ళలో ప్రతిభకు కొదవ లేదు. అయితే, టాలెంట్ ఎంత ఉన్నా ఆటలో టెంపర్మెంట్ ముఖ్యం. వాటికి తోడు కింద పడినా మళ్ళీ పైకి లేచి సత్తా చాటే చేవ కీలకం. మన జట్టు ఇప్పుడు వీటిని ప్రదర్శించాలి. అందుకోసం తాజా సిరీస్ ఓటమికి కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 3–0 తేడాతో సిరీస్‌ను కోల్పోయి, ఈ అధఃపాతాళానికి ఎలా పడిపోయామో స్వీయ విశ్లేషణ జరుపుకోవాలి. టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన ఆనందాన్ని మర్చిపోక ముందే ఈ పరాజయాన్ని ఎలా కోరి కొని తెచ్చుకున్నామో విశ్లేషించుకోవాలి. ఎంతైనా, పరాజయాలే విజయాలకు మొదటి మెట్టు కదా! -
అజ్ఞాన జ్ఞానం
‘ఆదియందు అక్షరమున్నది’(జాన్ 1:1) అని బైబిల్ వాక్కు. అజ్ఞానం అనాది నుంచి ఉన్నది. సృష్టిలో అజ్ఞానానికి ముందు ఏముందో ఎవరికీ తెలీదు. అజ్ఞానం అమేయమైనది; అజ్ఞానం అప్రమేయమైనది; అజ్ఞానం అనాదినిధనమైనది; అజ్ఞానం అప్రయత్నలబ్ధమైనది; అజ్ఞానం అగాధమైనది; అజ్ఞానం అనంతమైనది; అజ్ఞానం అజరామరమైనది. విచిత్రంగా జ్ఞానాజ్ఞానాల నడుమ ఒక సారూప్యత ఉంది. ఇవి రెండూ అగోచరమైనవే! రెండింటికీ ఒక భేదం కూడా ఉంది. జ్ఞానానికి అవధులు ఉంటాయేమో గాని, అజ్ఞానానికి ఎలాంటి అవధులూ ఉండవు.అజ్ఞానం నుంచి మానవాళికి అప్రయత్నంగా దొరికే ఆస్తి– మూర్ఖత్వం. అజ్ఞానం నుంచి ఉద్భవించడం వల్ల మూర్ఖత్వమూ అనంతమైనదే! ‘అనంతమైనవి రెండే రెండు. ఒకటి: ఈ విశ్వం, రెండు: మనుషుల మూర్ఖత్వం; విశ్వం సంగతి నాకింకా పూర్తిగా తెలీదు’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్. మానవ మూర్ఖత్వానికి గల అనంత తత్త్వం అవగతమయ్యే నాటికి పాపం ఆయన తలపండితుడైపోయాడు. అనంతమైన అజ్ఞాన సాగరాన్ని ఈదులాడి ఒడ్డున పడితే తప్ప జ్ఞానమేమిటో తెలియదు. చాలామందికి అజ్ఞానసాగరంలో ఈదులాడుతూ ఒడ్డునున్న వాళ్ల మీదకు అజ్ఞాన తరంగాలను వెదజల్లుతుంటారు. వాళ్లకదో వేడుక!అజ్ఞానానికి గల అనేక పర్యాయపదాల్లో ‘మాయ’ ఒకటి. ఎవరి అజ్ఞానం వారికి తెలీదు. ఎదుటివారి అజ్ఞానాన్ని గుర్తించడంలో మాత్రం ప్రతి ఒక్కరూ జ్ఞానులే! ప్రవచన ప్రసంగాల్లో అజ్ఞానాన్ని నేరుగా ప్రస్తావిస్తే, శ్రోతల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రవచనకర్తలు అజ్ఞానాన్ని ‘మాయ’ అని సున్నితంగా చెబుతుంటారు. ‘తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన/ ఛిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత’– (4:42) అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు. అంటే, ‘అజ్ఞానం కలిగిన బుద్ధిలో నిలకడగా ఉన్న ఆత్మ గురించిన సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించి, తత్త్వజ్ఞానానికి సాధనమైన కర్మయోగాన్ని స్వీకరించు’ అని అర్థం. బుద్ధిలో అజ్ఞానం ఉన్నట్లు శ్రీకృష్ణుడు గుర్తించి చెప్పాడు. కాబట్టి ఆయన జ్ఞాని. అజ్ఞానాన్ని ఖండించడానికి జ్ఞానఖడ్గాన్ని ప్రయోగించాలని ఆయన ఉద్బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి గీతబోధ విన్న అర్జునుడు మొదలుకొని ఎందరెందరో జ్ఞానఖడ్గానికి పదునుపెట్టి అజ్ఞానాన్ని ఖండిస్తూనే ఉన్నారు. ఖండఖండాల అజ్ఞానం కొన్ని మెదళ్లలోకి చేరి, అఖండంగా పెరిగిపోతుండటమే విడ్డూరం. బహుశా, ఇదే మాయ కావచ్చు!‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, అజ్ఞానమే ఆనందమన్నమాట! ఈ నానుడినే కొంత విస్తరిస్తూ, ‘అజ్ఞానమే ఆనందం అంటుంటారు గాని, అజ్ఞానం మన విధికృతం’ అని చెప్పింది అమెరికన్ రచయిత్రి, పాత్రికేయురాలు గేయిల్ లైండ్స్. విధికృతమైన వాటిని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? కాబట్టి అజ్ఞానాన్ని కూడా ఎవరూ తప్పించుకోలేరు. అజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే, జ్ఞానులు ఎంతో ప్రయాసతో ప్రయత్నించవలసి ఉంటుంది. అజ్ఞానులకు ఆ బెడద లేదు. తమకు అప్రయత్నలబ్ధమైన అజ్ఞానానందాన్ని నిక్షేపంగా ఆస్వాదిస్తుంటారు. అజ్ఞానాన్ని గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి? అంటే, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అని చెబుతారు చాలామంది. పాపం వాళ్లు చాలా అమాయకులు. అసలు సిసలు ముదురు జ్ఞానులు కొందరు ఉన్నారు. వాళ్లు అజ్ఞానాన్ని గురించి నానా రకాల అధ్యయనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. జనబాహుళ్యంలో అజ్ఞాన విస్తరణకు పనికొచ్చే పద్ధతులకు రూపకల్పన చేస్తుంటారు. వాటిని జనాల మీద ప్రయోగిస్తుంటారు. ఇదొక ప్రత్యేక శాస్త్రం. ఇంగ్లిష్‌లో దీనినే ‘ఆగ్నటాలజీ’ అంటారు. అంటే, అజ్ఞానాధ్యయన శాస్త్రం అన్నమాట! మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద ఇంకా దృష్టి సారించలేదు గాని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. ‘ఆగ్నటాలజీ’ అనే అజ్ఞానాధ్యయన శాస్త్రానికి ఆ పేరుతో పిలవడం ఆలస్యంగా మొదలైంది గాని, అజ్ఞానానికి సంబంధి«ంచిన పరిజ్ఞానం అంతకంటే ముందు నుంచే ఆచరణలో ఉంది. స్కాటిష్ సామాజిక చరిత్రకారుడు అయాన్ బోల్ 1992లో తొలిసారిగా ‘ఆగ్నటాలజీ’ అనే మాటను ప్రయోగించాడు. అమెరికన్ సిగరెట్ తయారీ కంపెనీలు 1969లో ఉద్ధృతంగా చేసిన ప్రచారం ఆగ్నటాలజీకి ఉదాహరణగా నిలుస్తుందని శ్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ప్రోక్టర్ తేల్చిచెప్పాడు. కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీల వరకు నానా వర్గాలు ఆగ్నటాలజీ పద్ధతులను ఉపయోగించుకుంటూ, ప్రజల అజ్ఞానానికి జ్ఞాన ఖడ్గాల వల్ల ముప్పు లేకుండా కాపాడుతూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి.ఇది హైటెక్కు టమారాల యుగం. జ్ఞానం జనాలకు అందుబాటులో లేని సరుకేమీ కాదు. అందుబాటులో ఉన్నంత మాత్రాన జనాలందరూ జ్ఞానాన్ని పొందినట్లు కాదు. ఈ కృత్రిమ మేధ కాలంలో కూడా రాజకీయ, తాత్త్విక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని జనాలు విశ్వాసాలు, మతాచారాలు, ప్రచారం ద్వారా మాత్రమే పొందుతున్నారు. ఇది విపరీత అజ్ఞాన శకం. పత్రికలు, ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఆగ్నటాలజీ ప్రయోగాలకు సాధనాలుగా మారుతున్నాయి. ప్రజలను మాయలో ముంచెత్తుతున్నాయి. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ ఆశయం ఎక్కడ? అజ్ఞానంపై శాస్త్ర పరిశోధనలు సాగిస్తున్న నేటి పరిస్థితులెక్కడ? -
సిగ్గేస్తున్నది బాబూ!
అది మహారాజాధిరాజ రాజమార్తాండ రాజగండభేరుండ చక్రవర్తులు నివసించదగిన మహాప్రాసాదమట! ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లు దాని ముందు దిగదుడుపట! అంతోటి మహత్తరమైన ప్యాలెస్‌ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన నివాసం కోసం నిర్మించుకున్నారట! సామెతలు ఊరికే పుట్టవు. వినేవారు వెర్రివాళ్లయితే చెప్పేవారు చంద్రబాబు అనే నానుడి ఊరికే రాలేదు. చంద్రబాబు ఎప్పుడూ అబద్ధాలే చెబుతారు. ఎందుకంటే నిజం చెబితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందనే ముని శాపం ఉన్నదని వైఎస్సార్ విమర్శిస్తుండేవారు. క్లాస్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ (’78) బ్యాచ్‌మేట్స్ కదా! పూర్తి అవగాహనతోనే మాట్లాడి ఉంటారు.రిషికొండలో గత ప్రభుత్వం హయాంలో టూరిజం శాఖ నిర్మించిన భవనాలను శనివారం నాడు చంద్రబాబు సందర్శించారు. ‘ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి కట్టడాలుంటాయా!’ అంటూ బోలెడంత ఆశ్చర్యాన్ని మీడియా ముందు ఆయన గుమ్మరించారు. ఆ నిర్మాణాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని కూడా ఆయన చెప్పారు. ఆయనే చెప్పిన లెక్క ప్రకారం ఆ నిర్మాణాలకయిన ఖర్చు రూ.430 కోట్లు. ఈ భవనాల నిర్మాణాని కంటే ఏడెనిమిదేళ్ల ముందు అమరావతిలో చంద్రబాబు కొన్ని ‘తాత్కాలిక’ భవనాలను నిర్మించారు. అందులో తాత్కాలిక సచివాలయానికే సుమారు వెయ్యి కోట్లు ఖర్చయింది. రిషికొండ నిర్మాణాల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు. ఈ లెక్కన ఆ తాత్కాలిక భవనం అంబర్ ప్యాలెసో, మైసూర్ ప్యాలెసో అయుండాలి.మరి వెయ్యి కోట్ల తాత్కాలిక ప్యాలెస్‌ను చూసినప్పుడు ఎందుకని దిగ్భ్రాంతి కలుగలేదు? నిర్మాణ సంస్థవారు దిగ్భ్రాంతి కలిగించే హంగూ ఆర్భాటాలను ఇక్కడి నుంచి వేరేచోటుకు తరలించి లెక్క తాత్కాలికంలో రాసేశారా? ఆ లెక్కతో ఏ జూబిలీ హిల్స్ ప్యాలెస్కో నగిషీలు చెక్కారా? ఎందుకని ఆ వెయ్యి కోట్ల తాత్కాలిక భవనం ఏపీ ముఖ్యమంత్రిని నివ్వెరపాటుకు గురి చేయలేకపోయింది? భవనం లోపలికి కూడా వానచినుకులు ప్రవేశించగలిగే వర్ష పారదర్శకత మినహా మరే ప్రత్యేకతా ఈ తాత్కాలిక సచివాలయంలో ప్రజలకు కనిపించలేదు.ముఖ్యమంత్రికి మనస్తాపం కలిగించిన మరో అంశం పర్యావరణ విధ్వంసమట! రుషి పుంగవులు తపస్సు చేసిన రుషికొండను ధ్వంసం చేసి జగన్ సర్కార్ ప్యాలెస్‌ను కట్టిందట! అసలు రుషికొండకు గుండుకొట్టి పర్యాటకం కోసం ‘హరిత రిసార్ట్స్’ నిర్మించిందే టీడీపీ సర్కార్. పాతబడిన ఆ భవనాలను తొలగించి వాటి స్థానంలో ఈ కొత్త భవనాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే జగన్ సర్కార్ నిర్మించింది. ఈ భవనాలు తాత్కాలికం కాదు. శాశ్వత ప్రభుత్వ భవనాలు. అమరావతిలో ఐకానిక్ భవనాలు నిర్మించాలని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అదిగో అటువంటి ఐకానిక్ భవనాన్నే విశాఖలో జగన్ సర్కార్ నిర్మించింది. అమరావతికి లేని హంగు విశాఖకు ఎందుకని ఆయన భావిస్తున్నారేమో!పాత నిర్మాణాల స్థానంలో కొత్తగా ఏయే భవనాలను నిర్మిస్తున్నారో, ఎందుకోసం నిర్మిస్తున్నారో తెలియజేస్తూ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు వివరాలు అందజేసింది. కానీ, తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు మాత్రం జగన్మోహన్రెడ్డి నివసించడం కోసమే ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ ధనంతో సొంత భవనాన్ని ఎవరైనా ఎట్లా నిర్మించుకుంటారు? కనీస ఇంగిత జ్ఞానం కదా! కానీ, గోబెల్స్ దుష్ప్రచారాలకు ఇంగితంతో పనిలేదు. అవసరార్థం ఏ ప్రచారమైనా చేస్తారు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త అవసరం వచ్చిపడింది. కనుక చంద్రబాబు పనిగట్టుకొని అదే దుష్ప్రచారానికి రంగురంగుల రెక్కలు తొడిగి జనం మీదకు వదిలారు.అలవి కాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఐదు నెలలు గడిచిపోయాయి. ‘హామీల అమలు ఇంకెప్పుడ’ని పబ్లిక్ వాయిస్ ప్రశ్నించడం మొదలైంది. ఈ వాయిస్ వినిపించగూడదు. అందుకోసం ఇంకెక్కడో ఓ కృత్రిమ వివాదం చిటపటలాడాలి. డైవర్షన్ స్కీమ్ పాహిమాం! అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట వైఎస్ విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదం ఇప్పుడెందుకు వార్తల్లోకి వచ్చింది? తాయెత్తు మహిమ. షర్మిల ఆస్తుల వివాదం ఎందుకొచ్చింది? తిరుపతి లడ్డూలో కల్తీ ఆరోపణలు ఎందుకొచ్చాయి? కృష్ణా వరదల్లో బోట్ల వివాదం ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇలాంటివెన్నో తాయెత్తులు, ఎత్తులు ఈ ఐదు మాసాల్లో చూడవలసి వచ్చింది. టాపిక్ డైవర్షనే ఆ తాయెత్తు మంత్రం.పరిపాలన వైఫల్యాలనూ, వాగ్దాన భంగాలనూ ఈ ఎత్తులూ, తాయెత్తులూ ఎంతకాలం కప్పి ఉంచగలవు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన శాంతిభద్రతల పరిస్థితి ఎన్నడూ లేదన్న మాట జనం నోట వినబడుతున్నది. వాగ్దానాలు అటక మీద పడుకున్నాయి. నాణ్యమైన విద్యకు, వైద్యానికి పేద వర్గాలను దూరం చేశారు. మహిళా సాధికారత పథకాలను చాపచుట్టేశారు. ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును బరాజ్ స్థాయికి కుదించాలన్న కేంద్ర ఆదేశాలకు డూడూ బసవన్నలా తలూపి వచ్చారు. ఫలితంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సుదూర స్వప్నంగా మిగిలిపోనున్నది. విశాఖ ఉక్కు భవిష్యత్తు దినదినగండంగా మార్చేస్తున్న కేంద్రం ముందు జోహుకుం అంటున్నారు. అవమాన గాయాలతో ఉత్తరాంధ్ర ప్రజల్లో సెగ రగులుతున్నది. అందుకే విశాఖలో ఈ సరికొత్త డైవర్షన్ తాయెత్తు ప్రయోగం. వెయ్యికోట్లు ఖర్చు పెట్టి నీళ్లుకారే తాత్కాలిక భవనాన్ని నిర్మించిన వ్యక్తి 430 కోట్ల ఖర్చుతో ఐకానిక్ కట్టడాన్ని కడితే ఔరా అని ముక్కున వేలేసుకోవడాన్ని చూసి సిగ్గేస్తున్నది బాబూ! ఏపీలో ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్ సెవెన్ స్టార్ హోటల్లో కొద్దిరోజులు సకుటుంబ సపరివారంగా గడపడానికి 30 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టిన వ్యక్తి, క్యాంపు కార్యాలయాలకు, వాటి సెక్యూరిటీ ఏర్పాట్లకూ 126 కోట్లు ఖర్చు చేసిన నాయకుని నోట వినిపించిన మాట – రిషికొండలో బాత్ టబ్లకూ, కమోడ్లకూ, ఫ్యాన్లకూ లక్షలు ఖర్చు చేశారని! చచ్చేంత సిగ్గేస్తున్నది బాబూ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎట్టకేలకు కదలిక?!
నాలుగేళ్ళ జాప్యం తరువాత ఎట్టకేలకు రథం కదులుతున్నట్టుంది. దేశంలో పదేళ్ళకు ఒకసారి చేయాల్సిన జనగణన ఎలాగైతేనేం వచ్చే 2025లో ముందడుగేసే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కార్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వినిపిస్తోంది. 2026 మార్చి నాటికి ఆ గణాంకాలు అందుబాటులోకి వస్తాయట. 2011 తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు జరగనున్న ఈ జనగణన, అది అందించే సమాచారం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు కీలకం. అందుకే, ఇప్పటికైనా ఈ బృహత్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలనుకోవడం ఆహ్వానించదగిన విషయం. ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనతో పాటు పలు రాజకీయ నిర్ణయాలకూ ఈ జనగణన భూమిక కానుంది. జనగణనతో పాటు పనిలో పనిగా కులగణన కూడా జరపాలనే డిమాండ్ ఊపందుకుంది. అలాగే, ఇకపై 2025ను ప్రాతిపదికగా తీసుకొని ప్రతి దశాబ్దం మొదట్లో జరపాల్సిన జనగణన తాలూకు కాలరేఖను 2035, ’45... అలా మారుస్తారనే మాటా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అవసరమైతే అఖిలపక్ష భేటీ జరపాలనే వాదన వస్తున్నది అందుకే. 1881 నుంచి నిర్వహిస్తున్న ఈ జనాభా లెక్కల ప్రక్రియ అసలు 2021లోనే జరగాల్సింది. అయితే, రాజ్యాంగ రీత్యా కేంద్రం పరిధిలోని ఈ ప్రక్రియను కోవిడ్–19 కారణంగా సర్కారు వాయిదా వేసింది. ఆ పైన కరోనా పోయినా ఈ బృహత్తర బాధ్యత నెరవేర్చడానికి మోదీ సర్కార్ ఎందుకో ఉత్సాహం చూపలేదు. పాత కాలపు జనాభా లెక్కలతో ప్రస్తుత ప్రజా అవసరాలను ఎలా తెలుసుకుంటారన్న విమర్శలకూ గురైంది. ఎందుకంటే, కేవలం తలల లెక్కగా కాక జనాభా హెచ్చు తగ్గుల ధోరణులతో పాటు, సామాజిక, ఆర్థిక పరిస్థితులను సైతం అర్థం చేసుకోవడానికి జనగణన కీలకసూచిక. ప్రభుత్వ ప్రాధాన్యాల నిర్ణయం, వనరుల కేటాయింపు, సంక్షేమ పథకాల రూపకల్ప నకు ఉపకరించే సమగ్ర సమాచార సమాహారం. దేశంలోని సంక్లిష్టమైన సామాజిక సమస్యల పరిష్కారానికి ఓ కరదీపిక. కచ్చితమైన సమాచారం ద్వారానే విద్య, వైద్యం, గృహనిర్మాణం, ప్రాథమిక వసతుల్లో అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధికి సర్కారు జోక్యం చేసుకొనే వీలుంటుంది. అదే సమయంలో రాజకీయ పర్యవసానాలూ అనేకం. నియోజకవర్గాల పునర్విభజనకూ, జనాభా లెక్కలకూ లింకుంది. ‘‘2026 తరువాత జరిగే తొలి జనగణన’’ ఆధారంగా చట్టసభలలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని 2002లోనే అప్పటి వాజ్‌పేయి సర్కార్ నిర్ణయించింది. అందువల్ల రాజకీయాల రూపురేఖలను మార్చే జనగణన చర్చోపచర్చలకు కారణమవుతోంది. బీజేపీకి ఆది నుంచి దక్షిణాది కన్నా ఉత్తరాదిలోనే బలం, బలగం ఎక్కువ. జనగణన అనంతరం జనసంఖ్య ఆధారంగా పునర్విభజన జరిగితే... కట్టుదిట్టంగా జనాభా నియంత్రణ చర్యలు చేపట్టిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. పార్లమెంట్ స్థానాల సంఖ్య దక్షిణాదిలో తగ్గి, ఉత్తరాదిలో పెరుగు తుంది. అది కాషాయపార్టీకి అనుకూలంగా మారుతుందనే అనుమానం ఉంది. ప్రజాస్వామ్యమంటే ప్రజాసంఖ్యకు సిసలైన రీతిలో ప్రాతినిధ్యం వహించాలన్నది నిజమే. అంత మాత్రాన కుటుంబ నియంత్రణ పాటించనందుకు గాను అధికారం ఉత్తరాది వైపు మొగ్గడమూ సమర్థనీయం కాదు. 1951 నుంచి మన జనగణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా మిగతా కులాల లెక్కలు వేయడం లేదు. కానీ, కులాల వారీ జనాభా ఆధారంగా మెరుగైన ప్రాతినిధ్యం, వనరుల కేటాయింపు జరగాలన్నది దీర్ఘకాలిక డిమాండ్. ఈ న్యాయమైన ప్రజాకాంక్షను కేంద్రం ఇప్పటికైనా పట్టించుకొని తీరాలి. అలాగే, లెక్కల్లో ఆడవాళ్ళ సంఖ్య తేలడంతో చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు మెరుగైన ప్రాతిపదిక సిద్ధమవుతుంది. వీటి వల్ల సామాజిక న్యాయం, సమ్మిళిత ఆర్థిక పురోగతి, స్త్రీ – పురుష సమానత్వ స్పృహతో విధాన నిర్ణయానికీ వీలు చిక్కుతుంది. పైగా, ఈ పర్యాయం జనాభా లెక్కలు తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్నందున వివరాలు, విశేషాలు మరింత నిక్కచ్చిగా, వేగంగా అందవచ్చు. సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ముందస్తు పరీక్షగా జనాభా లెక్కల సన్నాహక ప్రక్రియ జరుపుతారు. మరుసటేడు ఫిబ్రవరిలో అసలు లెక్కలు జరుపుతారు. 2021 జనాభా లెక్కల కోసం 2019లోనే ఆ ప్రీ–టెస్ట్ జరిపినా, జాప్యమైనందున మళ్ళీ ప్రీ–టెస్ట్ జరపవచ్చు. అధికారిక ప్రకటనతోనే ఈ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. అత్యవసరం, అనివార్యమైనప్పటికీ, జనగణన అంశంలో దేశంలో చేపట్టాల్సిన చర్యలూ కొన్ని ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో ఒకరికి మోదం, వేరొకరికి ఖేదం కలగరాదంటే... అమెరికా ఫక్కీలో మన వద్దా వివిధ రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి నిమిత్తం అంతర్గత వలసలను ప్రోత్సహించడం జనసంఖ్య సమతుల్య పంపిణీకి ఒక మార్గమని నిపుణుల మాట. అదే సమయంలో స్థానిక భాష, సంస్కృతుల్లో వలసదారులు కలగలసిపోయేలా ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాష – అనే త్రిభాషా సూత్రాన్ని దేశవ్యాప్తంగా అనుసరించాలని మరో సూచన. హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల వారు సైతం కచ్చితంగా మరో భారతీయ భాష నేర్చుకోవాలనే నియమం ద్వారా భాష, ప్రాంతాలకు అతీతంగా అందరినీ దగ్గర చేయవచ్చు. వెరసి, సమతుల్య జనాభా పంపిణీ, సాంస్కృతిక స్నేహవారధి సాయంతో ఆర్థికంగా, సామాజికంగా సంతులిత ప్రాంతీయాభివృద్ధికి బాటలు వేయవచ్చు. ఈసారికి 2025లో చేసినా, ఇకపై మునుపటిలానే ప్రతి దశాబ్ది ఆరంభంలోనే ఈ ప్రక్రియ చేపట్టడం మేలు. ఏమైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రాంతీయ ప్రయోజనాల్లో సమతూకం పాటించాలి. పరస్పర విశ్వాసంతో పాటు పూర్తి చిత్తశుద్ధి అందుకు అవసరం. -
సైబర్ సవాలు
అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట. సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్ సాంకేతికత విసురు తున్న తాజా సవాళ్ళను చూస్తే అదే గుర్తొస్తుంది. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్ళు, పెచ్చుమీరు తున్న డిజిటల్ స్కామ్‌ల సంఖ్యే అందుకు తార్కాణం. ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ బారినపడి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ రూ. 75 లక్షలు, ఓ పారిశ్రామికవేత్త రూ. 7 కోట్లు నష్టపోయిన కథనాలు అమాయ కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువు లేని సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్న వైనం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా కొత్త రకం మోసాలూ అంతే వేగంగా ప్రభవించడం ఆది నుంచీ ఉంది. అయితే, అడ్డుకట్ట వేసినప్పుడల్లా మోస గాళ్ళు సైతం తెలివి మీరి కొత్త రీతుల్లో, మరింత సృజనాత్మకంగా మోసాలు చేయడమే పెను సవాలు. అనేక అంశాలతో ముడిపడ్డ దీన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే ఏకకాలంలో అనేక స్థాయుల్లో చర్యలు చేపట్టాలి. అందుకు ప్రజా చైతన్యంతో పాటు ప్రభుత్వ క్రియాశీలత ముఖ్యం. సాక్షాత్తూ భారత ప్రధాని సైతం తన నెల వారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో తాజాగా ఈ ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ గురించి ప్రస్తావించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బాధితులను ముందుగా ఫోన్లో సంప్రతించడం, మీ ఆధార్ నంబర్ – ఫోన్ నంబర్‌పై వెళుతున్న డ్రగ్స్ పార్సిల్‌ను పట్టుకున్నామనడం, ఆపై వాట్సప్, స్కైప్‌లలో వీడియో కాల్‌కు మారడం, తాము నిజమైన పోలీసులమని నమ్మించడం, నకిలీ పత్రాలు చూపి ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్టు బాధితులను భయపెట్టడం, ఆఖరికి వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టడం ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ వ్యవహారశైలి. మోసగాళ్ళు తమను తాము పోలీసులుగా, సీబీఐ అధికారులుగా, మాదకద్రవ్యాల నిరోధక శాఖకు చెందినవారిగా, రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా, చివరకు జడ్జీలమని కూడా చెప్పుకుంటూ... అమాయకులపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి వారి నుంచి లక్షల రూపాయల కష్టార్జితాన్ని అప్పనంగా కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్, ట్రేడింగ్ స్కామ్, పెట్టుబడుల స్కామ్, డేటింగ్ యాప్‌ల స్కామ్... ఇలా రకరకాల మార్గాల్లో సైబర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏటేటా ఈ మోసాలు పెరుగు తున్నాయి. ఒక్క ఈ ఏడాదే కొన్ని వేల డిజిటల్ అరెస్ట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్న ఈ సైబర్ నేరాల గణాంకాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వస్తే, 2022లో 9.66 లక్షలు, గత ఏడాది 15.56 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 7.4 లక్షల ఫిర్యాదులు అందా యని నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) కథనం.ఆర్థిక నష్టానికొస్తే జనవరి – ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాల వల్ల భారతీయులు రూ. 120 కోట్ల పైగా పోగొట్టుకున్నారు. అలాగే, ట్రేడింగ్ స్కామ్‌లలో రూ. 1420.48 కోట్లు, పెట్టుబడుల స్కామ్‌లలో రూ. 222.58 కోట్లు, డేటింగ్ స్కామ్‌లలో రూ. 13.23 కోట్లు నష్టపోవడం గమనార్హం. చిత్రమేమిటంటే, ఈ డిజిటల్ మోసాల్లో దాదాపు సగం కేసుల్లో మోసగాళ్ళు మయన్మార్, లావోస్, కాంబోడియాల నుంచి కథ నడిపినవారే!గమనిస్తే, గత పదేళ్ళలో భారతీయ మధ్యతరగతి వర్గం వార్షికాదాయం లక్షన్నర – 5 లక్షల స్థాయి నుంచి రూ. 2.5 – 10 లక్షల స్థాయికి మారిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక. సహజంగానే ఆర్థిక స్థాయితో పాటు మధ్యతరగతి అవసరాలు, ఆకాంక్షలూ పెరిగాయి. కాలంతో పాటు జీవితంలోకి చొచ్చుకువచ్చిన డిజిటల్ సాంకేతికతను అందరితో పాటు అందుకోవాల్సిన పరిస్థితి. డిజిటల్ అక్షరాస్యత లేకపోయినా డిజిటల్ చెల్లింపు వేదికలు సహా అన్నీ అనివార్య మయ్యాయి. అయితే, సౌకర్యంతో పాటు సవాలక్ష కొత్త సవాళ్ళనూ ఆధునిక సాంకేతికత విసిరింది. అవగాహన లేమితో సామాన్యుల మొదలు సంపన్నుల దాకా ప్రతి ఒక్కరూ మోసపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నది అందుకే. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఇలా మోసాల పాలవుతుండడంతో మధ్యతరగతి సహా అందరిలోనూ ఇప్పుడు భయాందోళనలు హెచ్చాయి. దీన్ని ఎంత సత్వరంగా, సమర్థంగా పరిష్కరిస్తామన్నది కీలకం. ప్రధాని చెప్పినట్టు ‘డిజిటల్‌గా అరెస్ట్’ చేయడమనేదే మన చట్టంలో లేదు. అసలు ఏ దర్యాప్తు సంస్థా విచారణకు ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా సంప్రతించదు. కానీ, అలా అబద్ధపు అరెస్ట్‌తో భయపెట్టి డబ్బు గుంజడం మోసగాళ్ళ పని. అది జనం మనసుల్లో నాటుకొనేలా చేయాలి. డిజిటల్ నిరక్షరాస్యతను పోగొట్టి, సాంకేతికతపై భయాలను తొలగించాలి. సరిగ్గా వాడితే సాంకేతికతలో ఉన్న లాభాలెన్నో గ్రహించేలా చూడాలి. క్షణకాలం సావధానంగా ఆలోచించి, అప్రమత్తమైతే మోస పోమని గుర్తించేలా చేయాలి. ఒకవేళ మోసపోతే, ఎక్కడ, ఎలా తక్షణమే ఫిర్యాదు చేసి, సాంత్వన పొందాలన్నది విస్తృత ప్రచారం చేయాలి. మోసాలను అరికట్టి, అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టాలి. మన సైబర్ భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు తాజా అవస రాలకు అనుగుణంగా నవీకరించాలి. అన్ని రకాల సైబర్ నేరాలపై చర్యల్లో సమన్వయానికి కేంద్రం ఇప్పటికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసీ4)ను నెలకొల్పింది. తీరా దాని పేరు మీదే అబద్ధాలు, మోసాలు జరుగుతున్నందున అప్రమత్తత పెంచాలి. అవసరంతో పని లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని అన్నిచోట్లా అడగడాన్నీ, అందించాల్సి రావడాన్నీ నివారించాలి. ఎంతైనా, నిరంతర నిఘా, నిర్దిష్టమైన అవగాహన మాత్రమే సైబర్ మోసాలకు సరైన విరుగుడు. -
ఒక ముందడుగు!
నాలుగేళ్ళ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు తొలి అడుగు పడింది. హిమాలయ సరిహద్దు వెంట కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత, చైనాల మధ్య అంగీకారం కుదిరింది. విస్తృతమైన సరిహద్దు వివాదం అలాగే అపరిష్కృతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయ ఘర్షణలకు ముందున్న పరిస్థితికి తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతోంది. చైనా సైతం పాల్గొన్న ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని వెళ్ళే ముందు గత వారమే ఈ ఒప్పందం గురించి వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ చర్యలు తుది రూపానికి వచ్చాయి. ఒప్పందంలోని మరిన్ని వివరాలు విశదం కావాల్సి ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ఫలితంగా నెలకొనే ప్రాంతీయ సుస్థిరతకు ఇది ఓ సానుకూల పరిణామమని చెప్ప వచ్చు. ఆసియా ఖండంలోని రెండు భారీ శక్తుల మధ్య రాజకీయ, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు మళ్ళీ మార్గం సుగమం కానుందని భావించవచ్చు.2020 జూన్‌లో చైనా సైనిక బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయి. భారత బలగాలు సైతం త్వరితగతిన అందుకు దీటుగా బదులిచ్చాయి. బాహాబాహీ సాగిన ఆ ఘర్షణల్లో రెండు పక్షాల నుంచి గణనీయమైన సంఖ్యలో సైనికులు మరణించారు. గాయపడ్డారు. 1975 తర్వాత రెండు దేశాల మధ్య మళ్ళీ అంతటి ఉద్రిక్తతకు అది కారణమైంది. సరిగ్గా ఆ ఘర్షణలు జరిగిన గాల్వాన్ లోయ ప్రాంతం వద్దే ఇప్పుడు శాంతి, సాంత్వన యత్నానికి శ్రీకారం చుట్టడం ఒక రకంగా శుభపరిణామం. నాలుగేళ్ళ ప్రతిష్టంభన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతో కొంత మెరుగయ్యేందుకు ముందడుగు వేసినందుకు ఇరుపక్షాలనూ అభినందించాల్సిందే. ఇరు పక్షాల మధ్య అనేక వారాలుగా సాగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా భారత, చైనా భూభాగాలను విభజించే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట, తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని దెప్సాంగ్, దెమ్ఛోక్ మైదాన ప్రాంతాల్లో భారత, చైనా సైనిక బలగాలను తగ్గించడం ఇప్పటికే మొదలైంది. అలాగే, గతంలో అంగీకరించిన పద్ధతిలోనే గస్తీ పునఃప్రారంభం కానుంది.వ్యూహాత్మకంగా ఇటీవల ‘బ్రిక్స్’ సమిట్ సమయంలోనే ఈ గస్తీ ఒప్పందాల గురించి బయటకు చెప్పడం గమనార్హం. తద్వారా రెండు దేశాల మధ్య వైషమ్యాలను దూరం పెట్టి, ఆర్థిక సహకార పునరుద్ధరణకు బాటలు పరవాలనుకోవడం మంచిదే. అందుకు తగ్గట్లుగా ‘బ్రిక్స్’ సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సుహృద్భావ పూర్వక భేటీ జరిగింది. సమావేశానికి కొద్ది రోజుల ముందే కుదిరిన ఈ సరిహద్దు గస్తీ ఒప్పందం, దరిమిలా ఆ భేటీ వల్ల ఉద్రిక్తతలు కొంత సడలడం ఖాయం. అలాగని ఈ ఒప్పందాన్ని కేవలం సైనిక సమన్వయ చర్యగా తక్కువ చేసి చూడడం సరికాదు. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాలనూ, అలాగే అంతర్జాతీయ స్థాయిలో దౌత్య సంబంధాలనూ పునర్ నిర్వచించే సామర్థ్యం కూడా ఈ ఒప్పందానికి ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందంతో భారత, చైనాల మధ్య రాత్రికి రాత్రి అపూర్వ సత్సంబంధాలు నెలకొంటాయని అనుకొంటే అత్యాశే. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నిజానికి, భారత – చైనాలది సుదీర్ఘమైన 3440 కిలోమీటర్ల మేర విస్తరించిన సరిహద్దు. నదులు, సరస్సులు, హిమఖండాలతో కూడిన ఆ దోవలో విభజన రేఖను నిర్దుష్టంగా పేర్కొనడమూ చిక్కే. ఈ పరిస్థితుల్లో భూటాన్ – నేపాల్‌ల మధ్య సిక్కిమ్‌లో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ఇరుపక్షాల సైనికులు ముఖాముఖి ఎదురుపడి, ఘర్షణకు దిగడం జరుగుతున్నదే. దానికి తోడు భారత భూభాగంలోకి పదేపదే జొరబడుతూ చైనా చూపుతున్న విస్తరణ కాంక్ష తెలియనిదీ కాదు. ఈ పరిస్థితుల్లో ఎల్ఏసీ వెంట రోడ్లు, నివాసాల సహా ప్రాథమిక వసతి సౌకర్యాలను ఇబ్బడిముబ్బడిగా పెంచి, ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనే ప్రయత్నం రెండు వైపులా సాగింది. ఆ నేపథ్యమే గాల్వాన్ ఘర్షణకూ దారి తీసింది. రెండు దేశాల మధ్య సాధారణ స్థితి రావాలంటే, తూర్పు లద్దాఖ్కే పరిమితమైన ఒప్పందంతో సరిపోదు. మొత్తం ఎల్ఏసీ వెంట సాధారణ పరిస్థితులకు కృషి సాగాలి. దానికి ఇరుపక్షాలలోనూ చిత్తశుద్ధి ముఖ్యం. డ్రాగన్ సైతం చెప్పేదొకటి, చేసేదొకటి విధానాన్ని ఇకనైనా మానుకోవాలి. భారత్, చైనాలు కేవలం పొరుగుదేశాలే కాదు, ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశాలు. కాబట్టి, పరస్పర స్నేహ సౌహార్దాల వల్ల రెండిటికీ లాభమే. భారత అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వా ముల్లో అమెరికాతో పాటు చైనా ఒకటి. సరుకుల నుంచి టెలికమ్యూనికేషన్ల హార్డ్‌వేర్, భారతీయ ఫార్మా రంగానికి ముడి పదార్థాల దాకా అనేకం భారత్‌కు అందించే అతి పెద్ద వనరు చైనాయే. గాల్వాన్ ఘటన తర్వాత చైనా పెట్టుబడులు, వీసాలు, యాప్‌లపై మన దేశం సహజంగానే తీవ్ర షరతులు పెట్టింది. అవన్నీ తొలగాలంటే, మళ్ళీ పరస్పరం నమ్మకం పాదుకొనే చర్యలు ముఖ్యం. గస్తీ ఒప్పందం కుదిరింది కదా అని నిర్లక్ష్యం వహించకుండా భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే. అవతలి పక్షాన్ని విశ్వసిస్తూనే, అంతా సజావుగా సాగుతున్నదీ లేనిదీ నిర్ధరించుకోవాల్సిందే. ఒప్పందాల మాట ఎలా ఉన్నా... సరిహద్దు వెంట సన్నద్ధతను మానరాదు. సరిహద్దులో ప్రాథమిక వసతి సౌకర్యాల నిర్మాణాలను కొనసాగించడమే దీర్ఘకాలంలో మన దేశానికి ఉపకరిస్తుంది. ఒకప్పటితో పోలిస్తే భారత్ బలీయంగా తయారైందని గాల్వాన్‌లో మన సైన్యాల దీటైన జవాబు రుజువు చేసింది. ఆ బలాన్ని కాపాడుకుంటూనే, డ్రాగన్‌తో బంధాన్ని పటిష్ఠం చేసుకోవడమే మార్గం. -
కాంగ్రెస్‌కు ‘హరియాణా’ దరువు!
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో ఆ రాష్ట్రాల్లో పార్టీలన్నీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒంటరిగా పోటీ చేసి నెగ్గేంత విశ్వాసం ఏ పార్టీకీ లేకపోవటంతో కూటములుగా కదులుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో సీట్ల సర్దుబాటు రెండురోజుల క్రితమే కుదరగా, విపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో బుధవారం సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. అయినా అరడజను సీట్లకు సంబంధించి ఇంకా పంచాయతీ తెగలేదు. జార్ఖండ్‌లో సైతం బీజేపీ, జేఎంఎం శిబిరాల్లో సర్దుబాట్లు ఒక కొలిక్కివచ్చాయి. కేంద్రంలో అధికారం ఉంది గనుక బీజేపీకి పెద్దగా దిగులేమీ లేదు. సొంత పార్టీలో అధిష్టానం మాట చలామణి అవుతుంది. కూటమి పక్షాలు సైతం కాస్త అటూ ఇటూగా బీజేపీకి తలాడిస్తాయి. ఎటొచ్చీ సమస్యంతా కాంగ్రెస్‌కే. కొత్తగా ఎన్నికలొచ్చి పడినప్పుడల్లా పాత ఖాతాలు ముందేసుకుని ఇంటా బయటా కూడా ఒత్తిళ్లు తెచ్చేవారు ఎక్కువే. మొన్నటి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కబోర్లా పడ్డాక, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ... సొంత పార్టీలో సరే సరి... కూటముల్లో కూడా కాంగ్రెస్ అధి నేతల మాటకు విలువుండటం లేదు. అందుకు తాజా సర్దుబాట్లు, ఆ సందర్భంగా వచ్చిన విమర్శలు తార్కాణం. హరియాణాలోని 90 స్థానాల్లో బీజేపీ 48 గెల్చుకోగా అంతర్గత పోరుతో సతమతమైన కాంగ్రెస్ 37తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది మొదలు కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ మొదలు కొని యూపీ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మిత్రుల వరకూ అన్నిచోట్లా ఆ పార్టీ పనితీరుపై, దురహంకారంపై విమర్శలు వచ్చిపడ్డాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు మిత్రుల ముందుపెట్టగానే వారు అంతెత్తున విరుచుకు పడటంతో కాంగ్రెస్ అధినాయకత్వానికి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. హరియాణా ప్రభావం ఏ స్థాయిలో ఉందో మహారాష్ట్ర పంపకాలే రుజువుచేస్తాయి. అక్కడి 288 స్థానాల్లో ఎంవీఏ ప్రధాన పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), ఉద్ధవ్ నేతృత్వంలోని యూబీటీ శివసేనలు సమానంగా అంటే 85 సీట్ల చొప్పున పోటీచేయటానికి బుధవారం అంగీకారం కుదిరింది. కూటమిలోని సమాజ్‌వాదీ, ఆప్, సీపీఐ, సీపీఎం, ఇతరేతర పార్టీల కోసం 18 స్థానాలు విడిచి పెట్టగా, ముంబైలో 3, విదర్భలో 12 స్థానాలు అనిశ్చితిలో ఉన్నాయి. ఈ 15 తమకే ఇవ్వాలన్నది కాంగ్రెస్ డిమాండ్. పాతకాలంలో వేరు. కాంగ్రెస్ మెజారిటీ సీట్లలో పోటీచేసేది. ఎన్సీపీ, ఇతర మిత్ర పక్షాలూ సరిపెట్టుకునేవి. గత అసెంబ్లీ ఎన్నికల సంగతే చూస్తే అప్పట్లో కాంగ్రెస్ 145 చోట్ల పోటీచేసింది. యూపీఏ కూటమిలోని ఎన్సీపీ 123, ఇతరులు 17 తీసుకున్నారు. మరో మూడు ఇతరులకిచ్చారు. అప్పుడు శివసేన బీజేపీతో చెలిమి చేసి 124 తీసుకోగా, బీజేపీ 152 చోట్ల పోటీ చేసింది. ఇలా ప్రతిచోటా హరియాణా భంగపాటు కాంగ్రెస్‌కు పెద్ద అడ్డంకిగా మారింది. అధినేతలు తమ వారికి హరియాణా సంగతి గుర్తుచేస్తుంటే... మిత్రులు సైతం కాంగ్రెస్‌కు ఆ బాణీయే వినిపించటం గమనించదగ్గది. తమకు అన్యాయం జరుగుతోందని అధిష్టానానికి మొరపెట్టుకున్న పార్టీ నేతల తరఫున పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మాట్లాడినా పెద్దగా ఫలించక పోవటంతో కూటమి నుంచి బయటకు రావాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందంటున్నారు. చివరకు పవార్ జోక్యం తర్వాతైనా ఉద్ధవ్ శివసేన ఆ 15 వదులుకోవటానికి సిద్ధపడటం లేదు. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి తిరుగుబాట్లు, కప్పదాట్లు సహజంగానే ఉంటాయి. కానీ బలంగా బేరసారా లాడే స్థితి కాంగ్రెస్‌కు లేదన్నది వాస్తవం.బీజేపీలో అసమ్మతి స్వరాలు అక్కడక్కడ వినిపిస్తున్నా అవి పట్టించుకోవాల్సినంతగా లేవని ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయానికొచ్చేయటం గమనించదగ్గది. మిత్రుల అసంతృప్తిని సైతం అది బేఖాతరు చేస్తోంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడూ, అనుకోని విజయాలు సైతం చేజిక్కించు కుంటున్నప్పుడూ సహజంగానే ఎవరినీ లెక్కచేసే పరిస్థితి ఉండదు. పాలక మహాయుతిలో కుదిరిన ఒప్పందం ప్రకారం బీజేపీ 152–155 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించగా, షిండే శివసేనకు 78–80 మధ్య, అజిత్ పవార్ ఎన్సీపీకి 52–54 మధ్య ఇవ్వాలన్న అవగాహన కుదిరింది. ఇప్పటికే వంద స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీలో అసంతృప్తి లేకపోలేదు. అలాగే మిత్రులనుంచి కూడా సణుగుడు జాస్తిగానే ఉంది. అయినా అందరినీ దారికి తేవొచ్చన్న అభిప్రాయంతోనే బీజేపీ పెద్దలుండటం గమనించదగ్గది.ఇప్పటికే మూడో జాబితా కూడా విడుదల చేసి మొత్తం 41 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసు కున్న జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నుంచి కాంగ్రెస్‌కు 29కి మించి వచ్చేలా లేవు. 81 స్థానా లున్న జార్ఖండ్ రాష్ట్రంలో ఆర్జేడీ, వామపక్షాలకు 11 స్థానాలివ్వాలని నిర్ణయించారు. 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న ఉత ్తరప్రదేశ్లో కనీసం మూడైనా సాధించుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్‌నుంచి సానుకూల స్పందన రాకపోవటం కూడా హరి యాణా షాక్ ఫలితమే. అక్కడ రెండు స్థానాలివ్వాలని ఎస్పీ నిర్ణయించినా అసలు పోటీకి దిగరాదని కాంగ్రెస్ అనుకోవటం ఆ పార్టీ దయనీయ స్థితికి నిదర్శనం. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అంటే ఏమిటో కాంగ్రెస్‌కు అడుగడుగునా అర్థమవుతోంది. అధికారంలో ఉన్నన్నాళ్లూ కన్నూ మిన్నూగానక వ్యవహరిస్తే ఏమవుతుందో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. తనను తాను సరిదిద్దుకోలేని నిస్సహా యత ఆ పార్టీని ఆవరించటంవల్ల మరోసారి అదే భంగపాటు ఎదురైంది. అందుకు ఎవరిని నిందించగలరు? చేసుకున్నవారికి చేసుకున్నంత! -
అధిక జనాభా వరమా!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకున్నా జనాభా అంశంపై చర్చ ఊపందుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరో ఏణ్ణర్థంలో ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ఎంతో అవసరమైనదీ, తప్పనిసరైనదీ. అయితే ఇందులో ఇమిడివున్న, దీనితో ముడిపడివున్న అనేకానేక ఇతర విషయాలను కూడా స్పృశిస్తే ఈ చర్చ అర్థవంతంగా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామూహిక వివాహాల సందర్భంగా సోమవారం కొత్త దంపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన పుణ్యమా అని చిన్న కుటుంబానికి బదులు ఎక్కువమంది సంతానాన్ని కనాలని ఆశీర్వదించే రోజులొచ్చేశాయి’ అని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. తెలుగునాట అష్టయిశ్వర్యాలు లభించాలని దంపతులను ఆశీర్వదించినట్టే తమిళగడ్డపై కొత్త దంపతులకు 16 రకాల సంపదలు చేకూరాలని ఆకాంక్షించటం సంప్రదాయం. ఆ ఆకాంక్షను పొడిగించి ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆశీర్వదించాల్సి వస్తుందన్నది ఆయన చమత్కారం. ఆ మాటల వెనక ఆంతర్యం చిన్నదేమీ కాదు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాక లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ అమాంతం 753కు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్కసారిగా 210 స్థానాలు పెరుగుతాయన్న మాట! ఆ నిష్పత్తిలో శాసన సభల్లో సైతం సీట్ల పెరుగుదల ఉంటుంది. జనాభా పెరుగుదల రేటులో తీవ్ర వ్యత్యాసాలు కనబడుతున్న నేపథ్యంలో అధిక జనాభాగల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ లోక్‌సభ స్థానాలూ... ఆ పెరుగుదల అంతగా లేని దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సంఖ్యలో స్థానాలూ వస్తాయన్నది ఒక అంచనా. మరో మాటలో చెప్పాలంటే జనాభా నియంత్రణపైనా, విద్యపైనా, ఆర్థికాభివృద్ధిపైనా పెద్దగా దృష్టి పెట్టని రాష్ట్రాలు లాభపడబోతున్నాయన్నమాట!దేశంలో చివరిసారిగా 1976లో పునర్విభజన జరిగింది. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా చేస్తే సమస్యలకు దారి తీయొచ్చన్న కారణంతో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పునర్విభజన ప్రక్రియను 2000 వరకూ స్తంభింపజేశారు. అయితే 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల హేతుబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. దాని ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య, వాటి పరిధి 2026 తర్వాత జరిగే జనగణన వరకూ మారదు. అయితే ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను హేతుబద్ధీకరించవచ్చు. దాని పర్యవసానంగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీలోని 294 స్థానాల సంఖ్య మారకపోయినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జిల్లాలవారీగా సీట్ల సంఖ్య మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాగే జరిగింది.ప్రతి రాష్ట్రానికీ దాని జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోక్‌సభలో ప్రాతినిధ్యం కల్పించాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదని కేంద్రం ప్రకటించింది. కనుక వాస్తవ జనాభా ఎంతన్నది తెలియకపోయినా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ సంఖ్యను 142 కోట్లుగా లెక్కేస్తున్నారు. రాష్ట్రాలవారీగా జనాభా ఎంతన్న అంచనాలు కూడా వచ్చాయి. దాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 80 కాస్తా 128కి చేరుతాయి. బిహార్‌కు ఇప్పుడు 40 స్థానాలున్నాయి. అవి 70కి ఎగబాకుతాయి. అలాగే మధ్యప్రదేశ్‌కు ఇప్పుడున్న 29 నుంచి 47కూ, రాజస్థాన్‌కు ప్రస్తుతం ఉన్న 25 కాస్తా 44కు పెరుగుతాయని అంచనా. మహారాష్ట్రకు ప్రస్తుతం 48 ఉండగా అవి 68కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ అదే సమయంలో జనాభా నియంత్రణలో విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. దేశ జనాభా వేగంగా పెరుగుతున్నదనీ, ఇదే కొనసాగితే భవిష్యత్తులో అందరికీ చాలినంత ఆహారం లభ్యం కావటం అసాధ్యమన్న అభిప్రాయం ఒకప్పుడుండేది. ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించిన ఉదంతాలకు లెక్కేలేదు. మొత్తంగా జనాభా పెరుగుతూనే ఉన్నా, ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మనదే అయినా గడిచిన దశాబ్దాల్లో పెరుగుదల రేటు తగ్గింది. ఈ తగ్గుదల సమంగా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా, ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా నమోదవుతోంది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్ కంటే స్వల్పంగా అధికం. 6 దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ!దక్షిణాదిన జనాభా పెరుగుదల పెద్దగా లేకపోవటానికి ఆర్థికాభివృద్ధి, స్త్రీలు బాగా చదువు కోవటం, దారిద్య్రం తగ్గటం ప్రధాన కార ణాలు. దేశ జనాభాలో 18 శాతంగల దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి 35 శాతం వాటా అందిస్తున్నాయి. కుటుంబాల్లో స్త్రీల నిర్ణయాత్మక పాత్ర ఉత్తరాదితో పోలిస్తే పెరిగింది. కీలకాంశాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం వరం కావటం న్యాయమేనా? స్టాలిన్ మాటల ఆంతర్యం అదే. మరికొందరు నేతలు జనాభా పెంచమంటూ ముసిముసి నవ్వులతో సభల్లో చెబుతున్నారు. ఇది నవ్వులాట వ్యవహారం కాదు. పునరుత్పాదక హక్కు పూర్తిగా మహిళలకే ఉండటం, అంతిమ నిర్ణయం వారిదే కావటం కీలకం. అసలు పునర్విభజనకు జనాభా మాత్రమే కాక, ఇతరేతర అభివృద్ధి సూచీలనూ, దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్రనూ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. ఈ విషయంలో విఫలమైతే దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి పెరగటం ఖాయమని కేంద్రం గుర్తించాలి. -
వట్టి బెదిరింపులేనా?
ఇది కనివిని ఎరుగని కథ. వారంరోజుల్లోనే మన విమానాలకు శతాధికంగా బాంబు బెదిరింపు కాల్స్... వివిధ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలను అర్ధంతరంగా దింపాల్సి రావడం, దారి మళ్ళించడం, చివరకు ఫైటర్ జెట్ల రక్షణ మధ్య తీసుకువెళ్ళాల్సి రావడం జరిగింది. ఈ–మెయిల్, సోషల్ మీడియా అజ్ఞాత పోస్టుల బెదిరింపులతో భారత వైమానిక రంగం ఉలిక్కిపడింది. ఏ బెదిరింపు వచ్చినా నిశితంగా పరీక్షించి, జాగ్రత్త చేపట్టాలన్నది నిబంధన కావడంతో విమానయాన పరిశ్రమపై తాజా బెదిరింపుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ సైతం ఎయిరిండియా విమానంపై దాడి చేస్తామనీ, నవంబర్ 1–19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించవద్దనీ హెచ్చరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పెరుగుతున్న భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బెదిరింపులకు పాల్పడినవారిపై తీవ్ర శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలనీ, దోషుల్ని విమానయానం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని భావిస్తున్నామనీ కేంద్ర మంత్రి మాట. భవిష్యత్తుకు పనికొచ్చే ఆ చర్యల మాటెలా ఉన్న వర్తమానంలో తక్షణ మార్గాంతరమేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.2014 – ’17 మధ్య అంతా కలిపి 120 బాంబు బెదిరింపులే రాగా, ఇప్పుడు ఒక్కవారంలోనే 100కు పైగా బెదిరింపులు రావడం గమనార్హం. విమానాల దారి మళ్ళింపు, తక్షణ ల్యాండింగ్ వల్ల అయ్యే ఇంధన వృథా ఖర్చు, వగైరాలతో ప్రతి బెదిరింపు కాల్ వల్ల ఎయిర్‌లైన్స్‌కు రూ. 3 కోట్ల పైగా నష్టమట! ప్రయాణికుల్లో భయాందోళనల్ని పెంచడంతో పాటు ప్రయాణంలో ఆలస్యంతో కీలకమైన పనులు దెబ్బతినడం లాంటివి సరేసరి. రద్దీ ఎక్కువగా ఉండే పండగ సీజన్ కావడంతో కష్టం, నష్టం ఎక్కువ. ఒక్క వారంలోనే వంద బెదిరింపులు వచ్చాయంటే భద్రతా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు ఒక మైనర్నీ, అతని తండ్రినీ మాత్రమే అరెస్ట్ చేసినట్టు వార్త. నింది తుల్ని వేగంగా కనిపెట్టి, కఠినచర్యలకు ఎందుకు దిగడం లేదు? అయితే ముష్కరులు, తీవ్రవాదులు వర్చ్యువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దాంతో, వారున్న లొకేషన్ కనిపెట్టలేని పరిస్థితి. ఈ సవాలును అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి. నిజానికి, విమాన సర్వీసులకే కాదు... కొద్ది నెలలుగా రైల్వేలకూ ఈ బెడద తప్పడం లేదు. రైల్వే ట్రాకుల మీద రాళ్ళు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ నింపిన సీసాల లాంటివి దుండగులు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య అనేక చోట్ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను లక్ష్యంగా చేసుకొని రాళ్ళు విసిరిన ఉదంతాలూ చూశాం. ఈ చర్యల వెనుక పెద్ద పన్నాగమే ఉందని విశ్లేషకుల మాట. దేశంలో విమానయాన రంగం వేగంగా దూసుకుపోతోంది. ఒక్క 2023లోనే 15.2 కోట్ల మంది దేశంలో విమానయానం చేశారు. అలాంటిది... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత వైమానిక రంగాన్నీ, రైల్వేలనూ గనక అప్రతిష్ఠ పాల్జేస్తే, ఆర్థిక నష్టంతో పాటు భూమి మీదైనా, ఆకాశంలోనైనా సురక్షితంగా ప్రయాణం చేయలేమనే భీతిని దేశ, విదేశీ ప్రయాణికుల్లో పెంచాలన్నది కుట్ర. భయం పెంచి, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి విద్రోహ చర్యలను తక్షణం అరికట్టాలి. చిత్రమేమిటంటే, ఐరోపా గగనతలంలోనూ భారత విమానయాన సంస్థలకు బెదిరింపులు వస్తున్నాయి. భారత ప్రభుత్వం, గూఢచర్య వ్యవస్థలు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే పెను ప్రమాదమే! భారత్‌కు తీరని నష్టం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొన్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామంటూ గత ఏడాది నవంబర్ లోనూ ఇలానే బెదిరింపులకు దిగాడు. అతను, అతని అనుచరుల ఆనుపానులు, దుశ్చర్యలు తెలిసినప్పటికీ అమెరికా గూఢచారి వ్యవస్థ ఎఫ్‌బీఐ లాంటివి కళ్ళు మూసుకొని, వారిని కాపాడుతూ వస్తుండడమే విషాదం. మరోపక్క దేశీయ విమానాల్లో సిక్కు ప్రయాణికులు కృపాణాలతో ప్రయాణించడాన్ని నిరోధించేందుకు సుప్రీమ్ కోర్టు సైతం నిరాకరించడంతో, పన్నూ లాంటి వారు దాన్ని అవకాశంగా తీసుకొంటే కష్టమే. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒకటికి రెండు తీవ్రవాద బృందా లను కలుపుకొనిపోతే పెను ప్రమాదమే. దాదాపు పాతికేళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11న తీవ్ర వాదులు విమానాల హైజాక్‌తో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల కూల్చి వేతతో సహా 3 వేల మంది మరణానికి కారణమైన ‘9/11’ ఘటనను విస్మరించలేం. ఈ పరిస్థితుల్లో ఈ ముష్కరమూకలకు పరోక్షంగా అండగా నిలుస్తున్న అమెరికా, కెనడాలకు పరిస్థితిని వివరించి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకొనే దిశగా భారత ప్రభుత్వం కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలి. మన ప్రయాణ వ్యవస్థలతో పాటు పౌరుల భద్రత అత్యంత ప్రధానమని తెలియజెప్పాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ, ఐరాస భద్రతా మండలినీ ఆశ్రయించాలి. అదే సమయంలో కొద్దివారాల పాటు టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ముష్క రులు ‘9/11’ ఘటనకు పాల్పడగలిగారని మర్చిపోరాదు. సాంకేతికంగా ముష్కర చేష్టలకు వీలు కల్పించే ట్రాన్సీవర్స్ లాంటి సాంకేతిక సామగ్రిని ఆన్లైన్లో అమ్మడాన్ని తక్షణం నిషేధించడం అవసరమని నిపుణుల సూచన. అన్నిటి కన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన మన విమాన, రైల్వే భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించి, సరికొత్త సవాళ్ళకు అనువుగా పటిష్ఠం చేయాలి. అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను (ఎస్ఓపీ) సిద్ధం చేయాలి. అదే సమయంలో అన్ని ఎయిర్‌లైన్స్, వివిధ దేశాల వైమానిక రంగాలు ఒక్కటై, సమాలోచనలు జరపాలి. పెరుగుతున్న ముప్పును పరస్పర సహకారం, సమన్వయంతో ఎలా ఎదుర్కోవాలో చూడాలి. -
మేధకు ‘కృత్రిమ’ గ్రహణం
మేధ మనిషికి ఒక వరం; అది ఒక్కోసారి గంద్రగోళంతో నిండడం ఒక శాపం. మేధ సవ్యంగా, స్పష్టంగా పనిచేసిప్పుడు మనిషి ఎన్నో అద్భుతాలు సృష్టించగలడు; అది అయోమయపు డొంకలా, బంకలా మారి వెర్రితలలు వేసినప్పుడు వాటిని తనే కూలదోసుకుని, తనూ పడిపోగలడు. కృత్రిమ మేధగా మనం అనువదించుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ మనిషి మేధ సృష్టించిన మహాద్భుతాలలో ఒకటి. ఆ కృత్రిమ మేధ తన సృష్టికి మూలమైన మనిషిలోని సహజ మేధను హరించి, తనే అసలు మేధగా మారబోతోందా!? ప్రస్తుతం మానవాళి ముఖాన వేలాడే ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఇది.‘కృత్రిమ మేధ’ ఈరోజున సర్వత్రా చర్చనీయమవుతున్న సాంకేతికాద్భుతం. ఆశాభావాన్ని మించి అది ఆందోళనను రేపడం చూస్తున్నాం. ఇంకోవైపు, అది ఆవిష్కరించే ఫలితాలకు ఆశ్చర్య చకితులమూ అవుతున్నాం. సృష్టికి ప్రతిసృష్టి అనే పౌరాణిక ఊహకు అత్యధునాతన ఉదాహరణ ఇదే. ఇది కృత్రిమమైన కాలో, చెయ్యో అమర్చుకోవడం కాదు, ఏకంగా కృత్రిమ మేధనే తెచ్చి అతికించుకోవడం. మనిషి తన మేధతో చేసే పనులన్నీ కృత్రిమ మేధతో చేయిస్తున్నాడు. సాహిత్య రంగంలోనే చూడండి... ఓ నాలుగైదు వాక్యాల కవితనిచ్చి దానిని కథగా మార్చమని అడిగితే కృత్రిమ మేధ క్షణాలలో మార్చి చూపిస్తోంది. గహనమైన ఓ బృహద్గ్రంథం పేరు మాత్రం ఇచ్చి అందులోని సారాంశాన్ని నాలుగైదు పేరాలలో చెప్పమని అడిగితే చటుక్కున చెబుతోంది. అంతే అవలీలగా, అవ్యవధిగా ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా చేసి అందిస్తోంది. ఆకాశమే హద్దుగా ఏదైనా చేయగలుగుతోంది. అదింకా పూర్తిగా నిర్దుష్టతను, నిర్దిష్టతను తెచ్చుకుని ఉండకపోవచ్చు. కానీ, తెచ్చుకునే రోజూ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అదే జరిగి, మనిషి కృత్రిమ మేధకు పూర్తిగా దాసోహమై క్రమంగా తన సహజ మేధను కోల్పోయే పరిస్థితి వస్తుందా; కృత్రిమ మేధే సహజ మేధగా మారుతుందా? ఆసక్తి కన్నా ఎక్కువగా భయాన్ని రేపుతున్న ప్రశ్నలివి. కృత్రిమ మేధే సహజ మేధ కన్నా నాణ్యమైనదయ్యే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే, సహజ మేధలో ఉండే గంద్రగోళం అందులో ఉండదు. అది ఎల్లవేళలా సూటిగా, స్పష్టంగానే కాదు; సహజ మేధకు సాధ్యం కానంత సత్వరంగా పనిచేస్తుంది. సహజ మేధలా అది అలసిపోవడం,మందగించడం లాంటివి ఉండవు. మనిషి అటువంటి కృత్రిమ మేధపై మరీ ఎక్కువగా ఆధారపడితే ఏమవుతుంది? లక్షల సంవత్సరాల మానవ అస్తిత్వంలో నిరుపయోగాలుగా మిగిలిన అపెండిక్స్, తోకఎముక లాంటి తొమ్మిది శరీర భాగాల సరసనే అతని సహజ మేధ కూడా చేరుతుందా?! ఇది మరీ విపరీత ఊహ అనుకున్నా, సహజ మేధ పదును తగ్గే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. వివిధ సాంకేతిక సాధనాల వినియోగం దరిమిలా ఇతర శరీరభాగాల విషయంలో ఇప్పటికే మనకది అనుభవంలోకి వచ్చింది కూడా! ఇటీవలి మరో సాంకేతికాద్భుతమైన ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలనే చూడండి; సహజ మేధకు పనీ, పదునూ తగ్గుతున్న ఆనవాళ్ళు వాటిలో ఇప్పటికే కనిపిస్తున్నాయి. నేటి శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలన్నీ యూరప్ వేదికగా మతనిర్బంధాల నుంచి సహజ మేధ బయటపడి సాంçస్కృతిక పునరుజ్జీవన రూపంలో సంపూర్ణ వికాసం చెందుతూ వచ్చిన ఫలితాలేనని మనకు తెలుసు. మన దగ్గర ఉపనిషత్తుల కాలం అలాంటి వికాసాన్ని చూసింది. ఏదైనా ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచీ కూలంకషంగా, సవిమర్శకంగా పరిశీలించడం, చర్చించడం, వ్యక్తీకరించడం అనే క్రమశిక్షణ అలా పాదుకుంటూ వచ్చింది. శ్రద్ధతోపాటు, తీరికా అందుకు అవకాశమిచ్చింది. పత్రికల వంటి ఆధునిక మాధ్యమాలలో స్థలకాల పరిమితులు ఆ క్రమశిక్షణను కొంత పలుచన చేసినా,గ్రంథముద్రణ ఆ లోటును చాలావరకూ పూరించగలిగింది. అదే సామాజిక మాధ్యమాలకు వస్తే, భావప్రకటన అనూహ్యమైన ప్రవాహవేగాన్ని తెచ్చుకోవడంతో ఆ క్రమశిక్షణ గణనీయంగా కొడి గట్టడం చూస్తున్నాం. వాటిలో అణువు నుంచి బ్రహ్మాండం వరకూ చర్చకు రాని అంశమే ఉండదు. కాకపోతే... లోతైన అధ్యయనమూ, అవగాహన, బహుముఖ పరిశీలనలకు బదులు రెండు, మూడు వాక్యాల అలవోక వ్యాఖ్యలకూ, పాక్షిక తీర్మానాలకూ, అపరిపక్వ నిర్ధారణలకూ అవి పరిమితమవు తున్నాయి. సహజ మేధలో తప్పిన ఆ క్రమశిక్షణను కృత్రిమమేధ అందిపుచ్చుకుంటున్నందుకు సంతోషించాలా, సహజ మేధ మొద్దుబారుతున్నందుకు విచారించాలా?! సామాజిక మాధ్యమాలు భావప్రకటనను అందరికీ అందుబాటులోకి తేవడం గొప్పే మేలే కానీ; సహజ మేధకు అది చేస్తున్న కీడు సంగతేమిటి? ఎలక్ట్రానిక్ మీడియా సహా అధునాతన మాధ్యమాలు ప్రజాస్వామికమైన చర్చనూ, అధ్యయనాన్నీ పలుచన చేస్తున్న తీరును నీల్ పోస్ట్‌మన్ అనే అమెరికన్ రచయిత ఎప్పుడో నలభై ఏళ్ల క్రితమే ఎత్తిచూపాడు. అబ్రహాం లింకన్ కాలం నుంచీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో గంటల తరబడి ఎంత కూలంకషంగా వాగ్వాదాలు జరిగేవో; ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక వాటి సమయం ఎలా హరించుకుపోయిందో ‘ఎమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్’ అనే పుస్తకంలో ఆయన వివరిస్తాడు. ఆయన ప్రభావం మరెందరి మీదో పడి ప్రచార మాధ్యమాలు సహా అత్యాధునిక సాంకేతిక విజ్ఞాన దుష్ప్రభావాల వైపు చూపు మళ్లించింది. ఆ క్రమంలోనే క్రిస్ హెడ్జెస్ అనే అమెరికా రచయిత ‘ఎంపైర్ ఆఫ్ ఇల్యూజన్’ అనే పుస్తకం వెలువరించాడు. మనం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం తోసుకువచ్చిందా?! -
ప్రమాదకర ప్రతిపాదన
విజ్ఞత మరిచినచోట విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేమీ లేదు. కావడ్ యాత్ర సందర్భంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మొన్న జూలైలో ఇచ్చిన తీర్పు అర్థం కాకనో లేక దాన్ని ధిక్కరించే ఉద్దేశమో... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఆహారంలో లేదా పానీయాల్లో ఉమ్మివేయటం లేదా మానవ వ్యర్థాలతో దాన్ని కలుషితపరచటం పదేళ్ల శిక్షకు అర్హమయ్యే నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించటం, విక్రయదారుల పూర్తి వివరాలు అందరికీ కనబడేలా చేయటం ఈ ఆర్డినెన్సుల ఉద్దేశం. ఇప్పుడున్న చట్టం ప్రకారం కల్తీ కారణంగా మరణం సంభవిస్తే బాధ్యులైనవారికి మూడేళ్ల కఠిన శిక్ష విధించవచ్చు. తినే ఆహారపదార్థం రుచిగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరు కుంటారు. అలాంటి ఆహారం దొరికేచోటకే వెళ్తారు. హోటళ్లు మొదలుకొని సైకిళ్లపై తిరుగుతూ అమ్ముకునే విక్రయదారుల వరకూ అందరూ కమ్మనైన ఆహారపదార్థాలు వడ్డించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరైనా లాభార్జనకు కక్కుర్తిపడి నాసిరకం పదార్థాలను అంటగడితే అలాంటివారి పనిబట్టడానికి రకరకాల చట్టాలున్నాయి. ఆహారకల్తీని అరికట్ట డానికీ, హానికరమైన, కాలంచెల్లిన పదార్థాల విక్రయాన్ని నిరోధించటానికీ హోటళ్లపై, ఇతర దుకాణాలపై విజిలెన్సు విభాగాలు దాడులు నిర్వహిస్తుంటాయి. కేసులు పెడతాయి. అయితే ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగటం లేదని, ప్రభుత్వాలు మొక్కుబడిగా ఈ పనిచేస్తుంటాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆహారం తిని అస్వస్థతకు గురయి పదుల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలైనప్పుడు ఆదరాబాదరాగా చర్యలు తీసుకోవటం కూడా కనబడుతుంటుంది. హఠాత్తుగా యూపీ సర్కారు ఈ చర్య తీసుకోవటం వెనక ఇలాంటి ఘటన ప్రభావం ఏమైనా ఉందా? పోనీ ఈ మాదిరి ఉదంతాల కారణంగా జనం తరచూ అస్వస్థులవుతున్న లేదా మరణిస్తున్న ఉదంతాలేమైనా గమనించారా? అసలు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకొచ్చాక ఎన్ని హోటళ్లపై, తినుబండారాల విక్రయ సంస్థలపై దాడులు నిర్వహించారు? అక్రమాలకు పాల్పడ్డారని తేలిన ఎంతమందిని శిక్షించారు? ఈ క్రమంలో ప్రస్తుత చట్టాలు నిరుపయోగంగా ఉన్నాయని భావిస్తే తగిన డేటాతో ఆ వివరాలు ప్రజల ముందు ఉంచొచ్చు. అప్పుడు ఒక సమగ్రమైన చట్టం అవసరమేనని అందరూ భావిస్తారు. కానీ యూపీలో జరుగుతున్నది అది కాదు. ఫలానా వర్గంవారు విక్రయించే పండ్లు లేదా ఇతర ఆహారపదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయని, వాటిని కలుషితం చేసి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. వాటి ఆధారంగా ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్టు కనబడుతోంది. దుశ్చర్యలకు పాల్పడేవారికి మతం, కులం ఉండవు. ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను వీడియో తీసి ఫలానా మతం వారంతా ఇలాగే చేస్తున్నారని వదంతులు వ్యాప్తిచేయటం విద్వేషాలు రెచ్చగొట్టడానికే తోడ్పడతాయి. ఇదే యూపీలోని ఘాజియాబాద్‌లో ఒక వ్యాపారి ఇంట్లో ఎనిమి దేళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న రీనా కుమార్ అనే యువతి రోటీల్లో మూత్రాన్ని కలుపుతోందని ఆరోపిస్తూ పోలీసులు బుధవారం ఆరెస్టు చేశారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ మధ్య తెలంగాణలో అధికారులు వరస దాడులు నిర్వహించినప్పుడు అనేక హోటళ్లు, తినుబండారాల దుకాణాలు పాచిపోయిన పదార్థాలను అమ్ముతున్నాయని తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిలో అన్ని మతాలకూ చెందినవారూ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరిగే కావడ్ యాత్ర సమయంలో ఆ మార్గంలోని దుకాణాల్లో విక్రయదారులు తమ పేర్లు, ఇతర వివరాలు కనబడే బోర్డులు ప్రదర్శించాలని పోలీసులు మొన్న జూలైలో నోటీసులిచ్చారు. కావడ్ యాత్రికులు ‘స్వచ్ఛమైన శాకాహారులు’ గనుక అపశ్రుతులు చోటుచేసుకోకుండా ఈ పని చేశామని సంజాయిషీ ఇచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దుకాణంలో నచ్చిన, నాణ్యమైన, రుచికరమైన ఆహారం దొరుకుతున్నదో లేదో వినియోగదారులు చూస్తారు తప్ప, వాటి విక్రయదారు ఎవరన్నది పట్టించుకోరు. అలా పట్టించుకోవాలని యూపీ ప్రభుత్వం తహతహలాడుతున్నదని తాజా నిర్వాకం గమనిస్తే అర్థమవుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని పరిరక్షించటమే ఆర్డినెన్సుల ఉద్దేశమన్న ప్రభుత్వ వాదన నమ్మదగ్గదిగా లేదు. ఆ పని విక్రయదారులది! వారిలో అక్రమార్కులుంటే చర్య తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. చెదురుమదురుగా జరిగిన ఉదంతాలను భూతద్దంలో చూపి జనాన్ని కలవరపెట్టడం సబబు కాదు.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనకున్న స్ఫూర్తి అర్థం చేసుకుంటే యూపీ ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్సుల ఆలోచన చేసేది కాదు. యూపీలో గోసంరక్షణ, లవ్ జీహాద్ తదితర ఆరోపణలతో గుంపు దాడులు, గృహదహనాలు, హత్యోదంతాల వంటివి జరిగాయి. నిందితుల ఇళ్లూ, దుకాణాలూ బుల్డోజర్లతో నేలమట్టం చేయటం కూడా రివాజుగా మారింది. ఎన్కౌంటర్లు సరేసరి. ఆర్డినెన్సుల ప్రతిపాదన ఆ క్రమంలో మరో చర్య కావొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి కరువైందని యువత... ధరలు ఆకాశాన్నంటాయని సామాన్యులు మొత్తుకుంటున్నారు. విద్య, వైద్య రంగాలు పడకేశాయని గగ్గోలు పెడుతున్నారు. వీటిపై సమర్థవంతంగా వ్యవహరించి ప్రజల విశ్వా సాన్ని పొందాల్సివుండగా, ప్రజల్లో పరస్పర అవిశ్వాసాన్ని కలిగించే ఇలాంటి పనులకు పూను కోవటం ఏం న్యాయం? అసలు నేరానికి తగ్గ శిక్ష ఉండాలన్న ఇంగితం కరువైతే ఎలా? ఆర్డినెన్సుల ప్రతిపాదనపై యూపీ సర్కారు పునరాలోచన చేయాలి. -
మరో మహా యుద్ధం!
మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత దేశంలో అత్యధికంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 13న, మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌కు నవంబర్ 13, 20లలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినా, సొంతకాళ్ళపై సర్కారు నడపలేని పరిస్థితి. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఇది కొంత ఊపు తెచ్చినా, తాజా హర్యానా ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కడంతో బ్రేకులు పడ్డాయి. ఇక, ఇప్పుడీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో ఎన్నికల గోదాలో ఈ ఏడాది ఆఖరి పంచ్ ఏ పార్టీది అవుతుందన్నది తేలనుంది. దేశానికి వాణిజ్య కూడలి లాంటి కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ సారథ్య మహాయుతి కూటమికీ, శివసేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) – జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ – శరద్‌పవార్) – కాంగ్రెస్‌ల మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమికీ మధ్య పోరు రసవత్తరమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలిచిన బీజేపీ – సేన కూటమి, 2024లో 17కే పరిమితమైంది. ఇంత దెబ్బ తగిలినా, కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి, సీఎం ఏక్నాథ్ శిండే రాష్ట్రంలో మళ్ళీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. అయితే, రెండేళ్ళలో రెండు పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజా భావన, అధికారపక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ప్రతిపక్షానికే అనుకూలిస్తాయని ఓ అంచనా. ఇక, స్థానిక పార్టీలైన శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలాక ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకొనేందుకు ఈ అసెంబ్లీ పోరు సిసలైన క్షేత్రస్థాయి పరీక్ష కానుంది. హర్యానాతో బీజేపీ పుంజుకుంటే, ప్రతిపక్ష కూటమిలో ఎక్కువ సీట్లు కోరి పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. మోదీ, అమిత్‌షాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యటిస్తున్న నేపథ్యంలో... విపక్ష కూటమి విభేదాలు మరిచి, సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చూపి, తమ వ్యూహానికి పదును పెట్టుకోకుంటే చిక్కులు తప్పవు. జార్ఖండ్ అసెంబ్లీకి జేఎంఎంతో కలసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇప్పటి దాకా చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. రెండు విడతల్లో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలు ఆసక్తికరమైనవి. వాజ్‌పేయి హయాంలో 2000లో రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జార్ఖండ్‌లో జేఎంఎం అయిదేళ్ళ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి. గతంలో ఆ పార్టీ అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినా, ప్రతిసారీ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును రాష్ట్రంలో కొనసాగించాలని ‘ఇండియా’ కూటమి ఉబలాటపడుతుంటే, హర్యానా ఫలితాల ఉత్సాహంతో ఈ గిరిజన రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాల ఆసరాగా అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ దక్షిణ బిహార్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ ఒకప్పుడు హేమంత్ తండ్రి, జేఎంఎం అధినేత శిబూ సోరెన్ ఉద్యమం చేసి, విజయం సాధించారు. ఆనాటి నుంచి గిరిజన ఓటర్లు ఆ పార్టీకి రాజకీయ అండ. హేమంత్, ఆయన కూటమి ఆ గిరిజన ఓటుబ్యాంకును నమ్ముకున్నారు. దానికి తోడు అక్రమ ఆస్తుల కేసులో హేమంత్ అరెస్ట్ వ్యవహారాన్ని చూపి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల ఆత్మగౌరవ అంశాన్ని లేవనెత్తాలని జేఎంఎం ప్రయత్నం. సంథాల్ పరగణా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి కాంగ్రెస్ సత్తా ఉపకరిస్తుందని ఆలోచన. ఇక, రాష్ట్రానికి తొలి సీఎం అయిన గిరిజనుడు బాబూలాల్ మరాండీ ప్రతిపక్ష నేతగా తమ వెంట ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2015 – 2020 మధ్య గిరిజనేతర నాయకత్వంతో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న కాషాయపార్టీ పాఠాలు నేర్చుకుంది. ఈసారి స్థానిక వర్గాలతో వ్యూహాత్మక సర్దు బాట్లకు దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో జట్టు కట్టి కుర్మీ ఓట్లపై కన్నేసింది. మాజీ సీఎం చంపాయ్ సోరెన్‌ను పార్టీలోకి తీసుకొని గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తోంది. వెరసి, జార్ఖండ్ ఎన్నికలు సైతం ఆసక్తికరంగా మారాయి. పార్టీల వ్యూహాలు అటుంచితే, ఈవీఎంలపై వివాదం, ఈసీ వ్యవహార శైలిపై అనుమానాలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 4 విడతల పోలింగ్‌కు సవాలక్ష కారణాలు చెప్పిన ఈసీ ఎక్కువ స్థానాలుండే అసెంబ్లీకి మాత్రం ఒకే విడత పోలింగ్ జరపడం విచిత్రమే. అలాగే, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించనున్నారని అస్సామ్ సీఎం హేమంత్ బిశ్వశర్మ ముందే ఎలా చెప్పగలిగారన్నదీ ప్రశ్నార్థకమే. ఇలాంటి వాటి వల్లే ఎన్నికల సంఘం స్వతంత్రత, పని తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పోలింగ్ శాతం నుంచి ఫలితాల ప్రకటనపైనా విమర్శలెదుర్కొంటున్న ఈసీ ఇకనైనా పారదర్శకత పెంచుకోవాలి. తన నిజాయతీని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం మిగులు తుంది. ఎందుకంటే, ఈ కీలక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... వచ్చే ఏడాదికి దిక్సూచి కానున్నాయి. వెంటనే వచ్చే ఢిల్లీ, ఆ పైన జరిగే బీహార్ ఎన్నికలకు భూమికను కూడా సిద్ధం చేస్తాయి. -
పొరలు ఒలిచే రచయిత
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది గెలుచుకోవడం ద్వారా ఆ గౌరవం పొందిన తొలి ఆసియా రచయిత్రిగా నిలిచింది దక్షిణ కొరియాకు చెందిన హాన్ కాంగ్ (సరైన ఉచ్చారణ: హన్ గాన్ ). ప్రతి ఏడాదీ జరిగినట్టుగానే ఈసారీ అందరి అంచనాలు తలకిందులైనాయి. చైనా రచయిత్రి కాన్ షుయె, ఆస్ట్రేలియా రచయిత జెరాల్డ్ మర్నేన్, జపాన్ రచయిత హరూకి మురకామి నుంచి భారత మూలాలున్న సల్మాన్ రష్దీ వరకు ఎవరిని వరించొచ్చనే విషయంలో బెట్టింగ్స్ నడిచాయి. కానీ ‘చారిత్రక విషాదాలను ప్రతిఘటించే, మానవ దుర్బలత్వాన్ని ఎత్తి చూపే తీక్షణమైన కవితాత్మక వచనానికి’గానూ హాన్ కాంగ్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించింది స్వీడిష్ అకాడెమీ. 2016లో తన కొరియన్ ఆంగ్లానువాద నవల ‘ద వెజిటేరియన్ ’కు ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రెజ్’ గెలుచుకున్న హాన్ కాంగ్ ఆ పురస్కారం పొందిన తొలి కొరియన్ రచయిత కూడా కావడం విశేషం.దక్షిణ కొరియా ప్రసిద్ధ రచయిత హాన్ సుయెంగ్–వొన్ కూతురిగా 1970లో జన్మించిన హాన్ కాంగ్ సాహిత్య ప్రయాణం– మనుషుల్ని మనుషులే పీక్కు తినే ఈ సమాజంలో దానికి విరుగుడు ఏమిటనే శోధనతో మొదలైంది. ‘మనుషులు మొక్కలు కావాల్సిందని నా నమ్మకం’ అంటాడు 28 ఏళ్లకే క్షయ వ్యాధితో మరణించినప్పటికీ కొరియన్ సాహిత్య రంగం మీద ప్రబలమైన ముద్రవేసిన యీ సంగ్. అదొక నిరసన! ప్రస్తుతం సుమారు ఐదు కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా చరిత్రలో మాయని మచ్చలైన జపాన్ దురాక్రమణ (1910–45), కొరియన్ యుద్ధం(1950–53) తర్వాత, అలాంటిదే– సైనిక పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన విద్యార్థుల తిరుగుబాటు (1980)ను అణచివేసే క్రమంలో జరిగిన ‘మే 18’ ఘటన. కాంగ్‌కు తొమ్మిదేళ్లున్నప్పడు ఆమె జన్మించిన గ్వాంగ్జు పట్టణం నుంచి వాళ్ల కుటుంబం సియోల్‌కు వెళ్లిపోయింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత అక్కడ వేలాది విద్యార్థులు, పౌరులు చనిపోయారు. తనకు ప్రత్యక్షంగా అనుభవం లేని ఈ ఘోరాలను పెద్దయ్యాక తెలుసుకునే క్రమంలో అంతులేని పశ్చాత్తాపానికి గురైంది కాంగ్. వాళ్ల కుటుంబం బతికుండటానికీ, ఇంకో కుటుంబం లేకుండాపోవడానికీ కారణమే లేదు. ఒక చిన్న నిర్ణయం వాళ్ల గతిని మార్చింది. గ్వాంగ్జు, ఆష్విట్స్, బోస్నియా– ప్రపంచమంతటా ఇదే హింస. అయితే, గాయాల పాలైనవారికి రక్తం ఇవ్వడం కోసం తమ భద్రతకు కూడా వెరవకుండా వేలాది మంది ఆసుపత్రుల ముందు వరుసలు కట్టిన ఫొటోలు కాంగ్లో ఉద్వేగాన్ని పుట్టించాయి. వర్తమానం గతాన్ని కాపాడుతుందా? బతికున్నవాళ్లు పోయినవాళ్లను కాపాడగలరా? ‘దొరక్కపోయినా జవాబుల కోసం రచయితలు వెతకడం మానరు’. ఎంతటి క్రౌర్యానికైనా మనిషి వెనుదీయడు; అదే సమయంలో, ‘రైల్వే ట్రాక్ మీద పడిపోయిన పసికందును కాపాడటానికి తన ప్రాణాలను సైతం లెక్కించడు’. మనిషిలోని ఈ రెండు ముఖాల ప్రహేళికను చిత్రిస్తూ ‘హ్యూమన్ యాక్ట్స్’ నవల రాసింది కాంగ్. రచనల్లో రాజకీయ ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా– మనిషిలోని అంతులేని క్రూరత్వాన్నీ, దాని మరుగునే ఉన్న మృదుత్వాన్నీ తవ్వి తీసింది.పుట్టిన రెండు గంటలకే చనిపోయి తన తల్లిదండ్రులు ఎన్నటికీ బయటపడలేని దుఃఖానికి కారణమైన తను ఎన్నడూ చూడని తన ‘అక్క’ హాన్ కాంగ్‌కు ఓ పుండులా మిగిలిపోయింది. ‘గాయం అనేది మాన్చుకోవాల్సిందో, బయటపడాల్సిందో కాదు; దాన్ని ఆలింగనం చేసుకోవాలి’ అంటుందామె. కాలం వల్ల, మరణం వల్ల, ఇతర విషాదాల వల్ల మనుషులు ఇతరులతో సంభాషించే శక్తిని కోల్పోతారు. అంధత్వం వల్ల రాయగలిగే, చదవగలిగే సామర్థ్యాన్ని కోల్పోయిన ఒక ప్రాచీన–గ్రీçకు బోధకుడు, తీవ్ర కుటుంబ విషాదాల వల్ల నోరు లేకుండాపోయిన ఆయన విద్యార్థిని పరస్పరం సమాచారాన్ని పంచుకోవడానికి చేరుకునే గౌరవపూరిత సామీప్యతను చిత్రించడానికి ‘గ్రీక్ లెసన్ ్స’ నవల రాసింది కాంగ్. మనిషికీ మనిషికీ మధ్య ఉండాల్సిన ‘నిరంతర మృదు స్పర్శ’ను నొక్కి చెప్పింది. తద్వారా భాషా సూక్ష్మతనూ, గెలుచుకోగలిగే జీవన సౌందర్యాన్నీ పట్టిచూపింది.హాన్ కాంగ్ ఎంత వేగంగా టైప్ చేయగలదంటే, ‘నమ్మండి నమ్మకపోండి’ లాంటి టీవీ షోలో పాల్గొనమని ఆమె మిత్రులు నవ్వుతూ అనేంతగా! ఆమె రచనల్లోని ధారకు సరితూగేట్టుగా టైప్ చేసే క్రమంలో పుట్టిన నొప్పులకు కొన్నాళ్లు వేళ్లు కదపలేని పరిస్థితి వచ్చింది. మణికట్టు నొప్పి వల్ల పెన్నుతోనూ రాయలేదు. కొంతకాలం పెన్నును తిరగేసి పట్టుకుని ఒక్కో అక్షరాన్ని నొక్కుతూ టైప్ చేసేది. కవయిత్రిగా మొదలైన కాంగ్‌కు సంగీతమూ తెలుసు. పాటలు రాసి, తానే స్వరపరిచి, ముందు వద్దనుకున్నా ఆ తర్వాత ఆ మొత్తం పాడి ఒక పది పాటల సీడీ విడుదల చేసింది. ఆమె రచనల్లోనూ ఈ సంగీతం మిళితమై ఉంటుంది. 1993లో మొదలైన కాంగ్ మూడు దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో నవలలు, నవలికలు, కథలు, కవితలు, వ్యాసాలు రాసింది. ఎన్నో పురస్కారాలను అందుకుంది. తరచూ వేధించే తీవ్రమైన తలనొప్పులు తనను అణకువగా ఉంచడంలో సాయపడుతున్నాయంటుంది. ఆమెకు ఒక కొడుకు. నోబెల్ వార్త తెలిసినప్పుడు అతడితో కలిసి కాఫీ తాగుతోందట. 2114 సంవత్సరంలో ప్రచురించనున్న ‘ఫ్యూచర్ లైబ్రరీ ప్రాజెక్ట్’ కోసం ‘డియర్ సన్, మై బిలవ్డ్’ సమర్పించిందామె. అందులో ఏం రాసివుంటుంది? మనిషి హింసను ఎదుర్కొనే సున్నిత ప్రతీకారం మరింత మానవీయతను చూపడమేనని మరోసారి నొక్కి చెప్పివుంటుందా!