Jaitley
-
లక్ష్యాన్ని అధిగమించిన డిజిన్వెస్ట్‌మెంట్: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా నిర్దేశించుకున్న నిధుల సమీకరణ లక్ష్యాన్ని అధిగమించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈసారి డిజిన్వెస్ట్‌మెంట్ నిధుల సమీకరణ రూ. 85,000 కోట్లకు చేరిందని, ఇది నిర్దేశిత లక్ష్యానికన్నా రూ. 5,000 కోట్లు అధికమని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 80,000 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకున్నాం. నిధుల సమీకరణ ప్రస్తుతం లక్ష్యాన్ని అధిగమించి రూ. 85,000 కోట్లకు చేరింది‘ అని ఆయన పేర్కొన్నారు. అయిదో విడత సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా కేంద్రం రూ. 9,500 కోట్లు సమీకరించగా, ఆర్ఈసీ–పీఎఫ్సీ డీల్‌తో మరో రూ. 14,500 కోట్లు వచ్చాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 90,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. -
బడ్జెట్ ‘హల్వా’ రెడీ..!
న్యూఢిల్లీ: సాంప్రదాయకంగా వస్తున్న ‘హల్వా’ తీపి రుచులతో 2019 కేంద్ర బడ్జెట్ పత్రాల ముద్రణా కార్యక్రమం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో సోమవారంనాడు ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో ‘బడ్జెట్ హల్వా’ రుచి చూడడానికి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రులు శివ్ ప్రతాప్ శుక్లా, పొన్ రాధాకృష్ణన్, ఆర్థికశాఖ ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఫైనాన్స్ సెక్రటరీ ఏఎన్ ఝా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, డీఐపీఏఎం కార్యదర్శి ఏ చక్రవర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ అధికారుల్లో ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఎన్డీఏ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 2019లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... కేంద్రం ఓట్–ఆన్–అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019–2020) పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఎన్నికల అనంతరం కేంద్రంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. బయటి ప్రపంచంతో సంబంధాలు కట్... కీలక హల్యా కార్యక్రమం అనంతరం బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరికీ... ‘ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ’ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ–మెయిల్‌తోగానీ మరే రకంగానూ మాట్లాడ్డానికి వీలుండదు. నార్త్ బ్లాక్ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది. అంత గోప్యత ఎందుకు? ఎంతో పకడ్బందీగా తయారయ్యే బడ్జెట్ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్ కింద ఉండే బడ్జెట్ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేస్తారు. అంతేకాక మొబైల్ ఆపరేటర్ల సమన్వయంతో ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి కాల్‌ను ట్యాప్ చేస్తారు. అలాగే ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేస్తారు. మధ్య మధ్యలో ‘మాక్ డ్రిల్’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరినిసమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ఇక బడ్జెట్‌రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. -
ఐటీ.. వైద్యం.. ఇంటి రుణం
ఈయన పేరు ఎండీ అజీమ్.. హయత్‌నగర్ ఎంపీడీవో ఆఫీసులో సూపరింటెండెంట్.. పెరుగుతున్న నిత్యావసర ఖర్చులు.. పిల్లల చదువులు.. ఇంటి అద్దె.. అన్నీ లెక్కేసుకుంటే వచ్చే జీతం వాటికే సరిపోతోంది..! వీటికితోడు వార్షికాదాయంపై పన్ను విధిస్తుండటంతో అజీమ్ దిగులు చెందుతున్నాడు. ఇది ఒక్క ఆయన బాధనే కాదు.. సగటు జీతభత్యాలను అందుకునే చిన్న ఉద్యోగులందరిదీ ఇదే సమస్య. అందుకే కేంద్ర బడ్జెట్ ఈసారైనా తమకు న్యాయం చేస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది. అదనంగా మరో రూ.1.5 లక్షల సేవింగ్స్‌పై పన్ను లేదు. మొత్తం రూ.4 లక్షల ఆదాయం దాటితే 20 శాతం పన్ను అమలవుతోంది. అందుకే ఈసారి బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని కనీసం రూ.5 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. సెక్షన్ 80(ఇ) కింద రూ.1.5 లక్షల సేవింగ్స్‌కు ఉన్న మినహాయింపును కనీసం రూ.3 లక్షలకు పెంచితే ఎక్కువ మందికి లాభం చేకూరుతుందని అంటున్నారు. ‘పిల్లల చదువులకు విద్యా రుణాలను వందశాతం ఇవ్వాలి. ప్రస్తుతం పిల్లలను ఉన్నత చదువులు చదివించాలంటే ఆషామాషీగా లేదు. ఇంజనీరింగ్ చదివించాలంటే ఏడాది జీతం చెల్లించినా సరిపోవడం లేదు’అని సగటు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే తనతోపాటు తన కుటుంబీకులకు వైద్య ఆరోగ్య ఖర్చులపై ఆదాయపు పన్ను మినహాయింపును ఉద్యోగులు ఆశిస్తున్నారు. వీటన్నింటికీ మించి సగటు, మధ్య తరగతి ఉద్యోగులందరూ సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటారు. అందుకే గృహరుణాలను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉంది. ‘గృహరుణాలపై వడ్డీ రేటును తగ్గించాలి. ప్రస్తుతం ఉద్యోగి వేతనంపై దాదాపు ఇరవై రెట్ల వరకు బ్యాంకులు గృహ రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ రుణ పరిమితిని పెంచాలి. ఆస్తి విలువకు తగినట్లు గరిష్ట రుణం మంజూరు చేసేలా సడలింపు ఇవ్వాలి. ఉద్యోగుల గృహ రుణాలపై వడ్డీ రేటు బ్యాంకుల్లో కనిష్టంగా 8.5 శాతం ఉంది. ఈ వడ్డీ రేటు తగ్గిస్తే సొంతింటి కల నెరవేరుతుంది’అని ఉద్యోగులు అంటున్నారు. మరి వారి ఆశలను జైట్లీ నెరవేరుస్తారా?.. -
అరకొర సంస్కరణలు
రాజకీయ పార్టీలకు ఎన్నికలలో ఖర్చు నిమిత్తం విరాళాలు ఇచ్చే పద్ధతిలో మార్పు తేవలసిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పలు సందర్భాలలో ఉద్ఘాటించారు. నిరుడు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెం టులో సమర్పించిన సందర్భంలో ఆర్థిక మంత్రి కొన్ని సూచనలు సైతం చేశారు. నగదు విరాళాలు రూ. 2,000 నుంచి రూ. 20,000లకు మించరాదనే నిబంధన విధించాలని ప్రతిపాదించారు. ఎలక్టొరల్ బాండ్లు జారీ చేసే విధానం ప్రవేశపెట్టా లని అనుకున్నట్టు కూడా చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారా నికి చేస్తున్న ఖర్చుపైన ఎటువంటి పరిమితి లేదు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి చేసే ఖర్చుపైన మాత్రం పరిమితి ఉంది. విరాళాలన్నీ నగదు రూపంలోనే రాజకీయ పార్టీలు స్వీకరిస్తున్నాయి. దాతల పేర్లు గుట్టుగానే ఉంచుతున్నాయి. పాలకులు రూపొందించే విధానాలను గమనిస్తే ఏ కార్పొరేట్ సంస్థ అధికార పార్టీకి అధికంగా విరాళం ఇచ్చిందో ఊహించుకోవడం కష్టం కాదు. కానీ ఆ విధానాన్ని చట్ట ప్రకారం ప్రశ్నించే అవకాశం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం ద్వారా కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినట్లయితే విరాళాల విషయంలో పారదర్శకత ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. ఏదైన వ్యవస్థను సంస్కరించే సమయంలో లోపాలు లేకుండా, తప్పుకునే అవకాశాలు లేకుండా పకడ్బందీగా చేయాలి. ఇప్పటి కంటే కొంత మెరుగైన విధానం ప్రవేశపెట్టాలని తలపోస్తున్నారే తప్ప ఆదర్శవంతమైన పక్కా విధానం రూపొందించే ప్రయత్నం జరగడం లేదు. జైట్లీ ప్రతిపాదిస్తున్న సంస్కరణల ప్రకారం 1934 నాటి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ను సవరించి ఎలక్టొర ల్బాండ్స్ జారీకి అవకాశం కల్పిస్తారు. కడచిన ఎన్నికలలో ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు సంపాదించిన పార్టీకి ఎలక్టొరల్బాండ్ ద్వారా విరాళాలు స్వీకరించే అర్హత ఉంటుంది. కొర్పొరేట్ సంస్థలు ఈ బాండ్లను ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ మాసాలలో ప్రతి మాసంలోనూ పది రోజుల పాటు కొను గోలు చేయవచ్చు. ప్రతి రాజకీయ పార్టీ ఒక బ్యాంకు అకౌంట్ వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి. ఆ ఖాతాలో దాత ఇచ్చే ఎలక్టొరల్బాండ్ను సొమ్ము చేసుకోవచ్చు. ఇందుకు 15 రోజుల గడువు ఉంటుంది. స్వీకర్త పేరు బ్యాంకులో నమోదు అవుతుంది. దాత పేరు కూడా బ్యాంకుకు తెలుస్తుంది. ఇతరులకు మాత్రం తెలియదు. ఈ సంస్కరణలో ఉన్న ఇబ్బంది ఏమంటే ఎవరు ఎవరికి ఎంత విరాళం ఇస్తున్నారో బ్యాంకులకు, వాటి ద్వారా ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలకు ఏ కార్పొరేట్ సంస్థ ఎంత విరాళం ఇస్తున్నదో తెలుసుకునే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది. అధికార పార్టీకి ఏ సంస్థ ఎంత విరాళం ఇస్తున్నదో తెలుసుకునే వీలు ప్రతిపక్షాలకు ఉండదు. అధికార పార్టీ తెలుసుకునే అవకాశం ఉన్నదనే ఎరుకే కార్పొరేట్ సంస్థలను ప్రతి పక్షాలకు దూరంగా ఉంచుతుంది. అధికార పార్టీకి వచ్చే విరాళాల కంటే ప్రతి పక్షాలకు చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. మార్చి 9న పార్లమెంటు బడ్జెట్ సమావేశం ద్వితీయార్థం ఆరంభం అవుతుంది. అప్పుడు ఆర్థిక బిల్లుపైన చర్చ జరిగే క్రమంలో ఈ అంశాలు పరిశీలనకు వస్తాయి. అన్ని పక్షాలు అన్ని కోణాలనూ సాకల్యంగా పరిశీలించి ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసు కుంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది. సాధారణ పౌరులు సైతం ఎన్నికల బరిలో నిలబడి గెలిచే అవకాశం ఉంటుంది. ఎన్నికల సంస్కరణలపైన సుదీర్ఘమైన అధ్య యనం చేసిన దినేశ్ గోస్వామి కమిటీ, ఇంద్రజిత్‌గుప్తా కమిటీ సిఫార్సులను అమలు చేసే ప్రయత్నం ఎన్డీఏ సర్కార్ చేయడం లేదు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఈ రెండు కమిటీలూ సిఫార్సు చేశాయి. అభ్యర్థులకు లేదా పార్టీలకూ ఉన్న ప్రజాదరణ ప్రకారం ఎన్నికల ఖర్చు కింద ఎంత మొత్తం ఇవ్వవచ్చునో నిర్ణయించేందుకు ఒక సూత్రాన్ని రూపొందించడం కష్టం కాదు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ఎన్నికల విరాళాలను ప్రభుత్వానికి అందజేయాలి. ఆ విధంగా జమ అయిన మొత్తానికి ప్రభుత్వ నిధులు జోడించి అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల కింద నిర్ణీత నిధిని అందించాలి. ఈ పద్ధతి జర్మనీలో అమలు చేస్తున్నారు. జైట్లీ ప్రతిపాదించినవి అరకొర సంస్కరణలు. అవి సైతం నిజాయితీగా అమలు జరుగుతాయన్న భరోసా ప్రజలకు లేదు. అధికార, ప్రతిపక్షాలకు ఈ విష యంలో చిత్తశుద్ధి లేదని అనేక సందర్భాలలో రుజువైంది. విదేశాల నుంచి విరాళాల సేకరణకు సంబంధించిన (ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్)యాక్ట్‌ను ఉల్లం ఘించి బీజేపీ, కాంగ్రెస్‌లు బ్రిటన్‌కు చెందిన వేదాంత కార్పొరేషన్ నుంచి 2014 ఎన్నికలలో భారీ విరాళం అందుకున్నాయి. లోగడ కూడా రూ. 20,000కు మించి ఎన్నికల విరాళం ఇచ్చినట్లయితే ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలనే నిబంధన 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 29 (సి) సెక్షన్లో ఉంది. ఎవరైనా లక్ష రూపాయల నగదు విరాళంగా ఇస్తే ఆ మొత్తానికి ఆరు రసీదులు ఇచ్చి ప్రతి రసీ దులోనూ రూ. 20 వేల కంటే తక్కువ మొత్తం ముట్టినట్టు బొంకుతారు. సంస్క రణలు చేయడం, చట్టాలను సవరించడం, కొత్త చట్టాలు చేయడంతో సరిపోదు. వాటిని మనస్ఫూర్తిగా అమలు జరపాలి. ఫిరాయింపుల నిరోధక చట్టం ఎంత దివ్యంగా అమలు జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ఈ చట్టాన్ని అన్ని పార్టీలూ కనికరం లేకుండా కుళ్ళ బొడు స్తుంటే అడిగే నాథుడు లేడు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా నిష్కర్షగా శిక్షించే వ్యవస్థ లేనంత వరకూ రాజకీయ పార్టీలు బుద్ధిగా వ్యవహరించవు. ‘మీ కంటే మేము పవిత్రులం’ అంటూ అతిశయానికి పోకుండా ఎన్నికలలో నల్లధనం పాత్రను అరికట్టేందుకు అన్ని పార్టీలూ, అందరు నాయకులూ కలసిరావాలంటూ నిరుడు ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. ప్రధాని సహా రాజకీయ నేతలందరూ ఈ వాక్కును శిరసావహించి ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించగలిగితే చరితార్థుల వుతారు. -
మీ ప్రసంగం ఒక ప్రహసనం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విటర్ వార్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా.. ఆర్థిక వృద్ధిరేటుపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. చెప్పిన ఆర్థిక వృద్ధిరేటు ఒక ప్రహసనంలా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఆర్థిక వృద్ధిరేటుపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. అంతేకాక గత మూడేళ్ల కాలంలో కేవలం జీడీపీ సగటు కేవలం 7.5గా ఉందని ఆయన చెప్పారు. అదేవిధంగా జీడీపీపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రికార్డులను కలిపి ఆయన ట్వీట్ చేశారు. Dear Mr. Jaitley, May the Farce be with you. pic.twitter.com/Dxb5jFCaEa — Office of RG (@OfficeOfRG) October 25, 2017 -
నేటి నుంచే జీఎస్టీ సమావేశాలు
రేపు హైదరాబాద్‌కు జైట్లీ సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నుంచే హైదరాబాద్‌లో అధికారిక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశ ఎజెండాపై చర్చించేందుకు గాను అన్ని రాష్ట్రాల వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శులు శుక్రవారం మధ్యాహ్నం నోవాటెల్ హోటల్లో సమావేశం కానున్నారు. శనివారం కౌన్సిల్ సమావేశంలో చర్చించేందుకు నిర్ధారించిన ఎజెండాను మరోసారి పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నారు. కాగా, కౌన్సిల్ చైర్మన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పర్యటన కూడా ఖరారైంది. శనివారం ఉదయం జైట్లీ హైదరాబాద్‌కు రానున్నారు. సమావేశానంతరం ఆయన రాత్రి తాజ్ఫలక్నుమాలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొని, అక్కడి నుంచి ఢిల్లీ తిరిగి వెళ్లనున్నట్టు సమాచారం. -
కుట్లు అల్లికలు చవక
► జౌళి రంగ జాబ్‌వర్క్‌పై జీఎస్టీ 5 శాతం ► ట్రాక్టర్ విడి భాగాలపై 18 శాతం న్యూఢిల్లీ: జౌళి రంగ జాబ్‌వర్క్(కుట్లు, అల్లికలు, నేత పని), ట్రాక్టర్ విడిభాగాలపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని తగ్గించారు. రవాణాకు ముందు ఆన్లైన్లో వస్తువుల ముందస్తు నమోదుకు సంబంధించి ఈ–వే బిల్లు నిబంధనలను సరళీకరించారు. ఆర్థిక మంత్రి జైట్లీ నేతృత్వంలో శనివారం ఇక్కడ జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. అన్ని జౌళి ఉత్పత్తులకు చెందిన జాబ్‌వర్క్‌పై పన్నును 5 శాతానికి కుదించారు. ఎంబ్రాయిడరీ నుంచి కుట్టుపని వరకు అన్నీ ఈ పన్ను పరిధిలోకి వస్తాయి .వస్త్రాలు, శాలువాలు, తివాచీలకు ఈ రేటునే అనువర్తింపచేస్తారు. వ్యవసాయ పరికరాల ధరలు తగ్గించేందుకు ట్రాక్టర్ విడి భాగాలు కొన్నింటిపై పన్ను రేటును 18 శాతానికి తగ్గించారు. జీఎస్టీ కింద ప్రభుత్వ పని కాంట్రాక్టులకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఇస్తూ 12 శాతం పన్ను విధించారు. వస్తువులను అమ్మడానికి ముందు ఆన్లైన్లో నమోదుచేసుకోవడానికి ఉద్దేశించిన ఈ–వే బిల్లుకు జీఎస్టీ మండలి ఆమోద ముద్ర వేసింది. పన్ను మినహాయింపు పొందిన వస్తువులు ఈ–వే బిల్లుకు ఆవలే ఉంటాయి. ఈ విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది. హౌస్‌కీపింగ్ సేవలందించే సంస్థలు రివర్స్ చార్జ్ మెకానిజం కింద జీఎస్టీ చెల్లించాలి. క్యాబ్ సంస్థలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో అయితే 12 శాతం , అది లేకుండా 5 శాతం పన్ను కట్టాలి. -
జైట్లీ ఉద్యోగాలెక్కడ?: కాంగ్రెస్
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుతో భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని ఉద్యోగాలెక్కడ? అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఓ బహిరంగ లేఖ రాసింది. నోట్లరద్దు వంటి సర్జికల్ దాడితో పేద ప్రజలను ఆర్థికంగా దెబ్బతీశారని విమర్శించింది. ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం ఎలా గట్టెక్కిస్తుందో సమాధానం చెప్పాలని జైట్లీని ప్రశ్నించింది. నోట్ల రద్దుతో కార్మిక శాఖ లెక్కల ప్రకారం దేశంలో 1.6 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని లేఖలో ప్రస్తావించింది. 15 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయారని పేర్కొంది. మీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పేదరికాన్ని మరింత పెంచిందని దుయ్యబట్టింది. నిరుద్యోగులకు సంబంధించి సర్వేలు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించింది. నోట్ల రద్దుతో ఉత్పాదక రంగంలో 9 ఏళ్లు వెనకబడ్డామని, ఎగుమతులు క్షీణించాయని , వడ్డీ రేట్లు బాగా పెరిగాయని తెలిపింది. కానీ పెట్టుబడులు మాత్రం పెరగడం లేదని ఎద్దేవ చేసింది. నిర్మాణ రంగంలో వృద్ధిలేక వేల ఉద్యోగాలు కోల్పోయామని పేర్కొంది. కరువుతో వ్యవసాయ రంగం కుదేలైందని, రైతులకు రుణాలివ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో అసంఘటిత రంగంలో చాల మంది యువత ఉపాధి కోల్పోయారని వెల్లడించింది. దీంతో యువత గ్రామాలకు తిరిగి వెళ్లి పనుల్లేక నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం కూడా తగ్గుతుందని పేర్కొంది. దేశ వ్యాప్తంగా అమలు చేయాలనుకున్న కనీస వేతం కూడా అమలు కావడం లేదని, వ్యాపార ఖర్చులు పెరగడంతో చాల ఉద్యోగాలు కోల్పోవల్సి వచ్చిందని విమర్శించింది. పేద రాష్ట్రాల్లో ఖర్చులు పెరిగి కార్మికులకు జీతాలు ఇవ్వలేక పరిశ్రమలు మూత బడుతున్నాయని ఆరోపించింది. -
రెండువేల నోట్లను రద్దుచేస్తారా?
► రాజ్యసభలో విపక్షాల ప్రశ్న ► స్పందించని ఆర్థిక మంత్రి జైట్లీ ► ఉభయసభల్లో ప్రతిపక్షాల ఆందోళన న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రూ.2వేల నోట్లను రద్దుచేస్తారా అని విపక్షం రాజ్యసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే సమాధానమివ్వాలని డిమాండ్ చేసింది. రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ‘ప్రభుత్వం రూ.2వేల నోట్లను రద్దుచేయాలని నిర్ణయించింది. ఈ నోట్ల ముద్రణను ఆపేయాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది. దీనిపై విధానమైన నిర్ణయమేదైనా తీసుకుంటే ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసే లోగా సభలో వెల్లడించాలి. రెండోసారి నోట్ల రద్దు చేపట్టాలన్న ఆలోచన ఉందా?’ అని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ పక్షనేత ఆజాద్ జోక్యం చేసుకుని ప్రభుత్వం వెంటనే బదులివ్వాలని డిమాండ్ చేశారు. ‘రూ.వెయ్యి నాణేలను తెచ్చే ఆలోచన ఉందా?’ అని ప్రశ్నించారు. అయితే దీనిపై జైట్లీ స్పందించలేదు. మౌనంగానే ఉన్నారు. దీంతో మరో సారి నోట్లరద్దు జరగొచ్చని.. జైట్లీ మౌనం దీనికి నిదర్శనమని విపక్ష సభ్యులు అన్నారు. జైట్లీ వర్సెస్ విపక్షాలు బుధవారం రాజ్యసభ ప్రారంభం కాగానే.. బీజేపీ కావాలనే గాంధీ, నెహ్రూ, ఇందిరలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోందని, దీనిపై చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ వాయిదా తీర్మానాన్నిచ్చారు. దీన్ని డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆమోదించా రు. ఈ దశలో జోక్యం చేసుకున్న రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి జైట్లీ.. ‘విపక్షాలు వాయిదా తీర్మానాలను దుర్వినియోగం చేస్తున్నాయి. టీవీ చానెళ్లలో ప్రచారం కోసమే వీటిని వాడుకుంటున్నాయి’ అని విమర్శించారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ కేసుపై చర్చించాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇచ్చిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌తోపాటుగా ఇతర సభ్యులిచ్చిన వాయిదా తీర్మానాలను చర్చించాలని జైట్లీ పట్టుబట్టారు. ‘ప్రచారం’ వ్యాఖ్యలపై భగ్గుమన్న విపక్షాలు జైట్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అటు, ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేయాలం టూ లోక్‌సభలో విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఇది కొనసాగుతుండగానే.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) బిల్లు– 2017 ఆమోదం పొందింది. -
అదృశ్య నిధులే నడిపిస్తున్నాయ్
♦ 70 ఏళ్లుగా వీటిని నియంత్రించడంలో విఫలమయ్యాం: జైట్లీ ♦ ఎలక్టోరల్ బాండ్ల యంత్రాంగం దిశగా చర్యలు న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అందే నిధులకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్ ల అమలు కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. పార్టీలకు అందే నిధులు పారదర్శకంగా ఉండటానికి ఉద్దేశించిన ఈ విధానానికి సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఒక్క ప్రతిపాదనా రాలేదన్నారు. గత 70 ఏళ్లుగా దేశ ప్రజాస్వా మ్యాన్ని అదృశ్య నిధులే నడిపిస్తు న్నాయని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వా లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల కమిషన్ వీటిని నియంత్రించడంలో విఫలమయ్యా యని అన్నారు. రాజకీయ పార్టీల కు వచ్చే విరాళాలకు సంబంధించి పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదనలు చేసిన జైట్లీ.. పార్టీలకు వచ్చే నగదు విరాళాలను రూ.2 వేలకు పరిమితం చేయడమే కాక ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుత విధానమే నచ్చిందేమో.. శనివారం ఢిల్లీ ఎకనామిక్స్ కాంక్లేవ్‌లో జైట్లీ మాట్లాడుతూ..‘నిధులకు సంబంధించి మెరుగైన ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా.. పార్టీలకు మౌఖికంగా.. రాతపూర్వకంగా కోరాను. ఇప్పటి వరకూ ఎవరూ ఒక్క ప్రతి పాదనతో ముందుకు రాలేదు. ఎందు కంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థతో వీరంతా సంతృ ప్తిగా ఉన్నట్టున్నారు’’అని అన్నారు. రాజకీ య వ్యవస్థలోకి వస్తున్న అదృశ్య నిధులకు అడ్డుకట్ట వేయలేకపోయామని, సంబంధించి ప్రతీ ప్రతిపాదనలో ఏదో లోపం ఉండటంతో ఈ రోజుకూ పరిష్కా రం దొరకలేదన్నారు. గత బడ్జెట్లో తాను ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించానని, ఈ దిశగా ప్రస్తుతం చర్యలు తీసుకుంటు మన్నారు. ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు.. బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం.. ప్రతిపాది త ఎలక్టోరల్ బాండ్లు వడ్డీ చెల్లించే రుణ పత్రాలుగా కాక.. ఒక ప్రామిసరీ నోటుగా ఉంటాయి. వీటిని అధీకృత బ్యాంకులు అమ్ముతాయి. వచ్చిన నిధులను సంబం ధిత రాజకీయ పార్టీలకు చెందిన ఖాతాల్లో నిర్దేశిత కాలానికి డిపాజిట్ చేస్తాయి. ఈ బాండ్లపై దాత పేరు ఉండదు. బ్యాంకుల ద్వారా నిధులు రావడం వల్ల పన్ను చెల్లిం చిన నగదు మాత్రమే రాజకీయ వ్యవస్థలోకి వస్తుంది. జీఎస్టీతో పన్ను పరిధి విస్తృతం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలులోకి రావ డంతో పన్నుల పరిధి విస్తృతమైందని, వీటి వల్ల నగదు లావాదేవీలు చేయడం కష్టంగా మారుతోందన్నారు. ఇది పన్నుల వ్యవస్థ పరిధిని పెంచడానికి.. పన్ను చెల్లిం పులను ప్రోత్సహించడానికి దోహదం చేస్తుందని చెప్పారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనంతో పాటు దేశంలోని వివిధ బ్యాంకుల్లోని నల్లధనాన్ని వెలికి తీసేం దుకు చట్టాల ను కఠినతరం చేశామని, డొల్ల కంపెనీలపైనా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో పన్ను చెల్లించవలసిన వారిలో అత్యధికులు ఆ పని చేయడం లేదని, వ్యవస్థకు బయటే భారీగా నగదు చలామణి అవుతోందని వివరించారు. ఆర్థిక బిల్లు ద్వారా కొన్ని మార్పులను ప్రకటిస్తున్నా.. వాటి ప్రభా వం స్వల్పంగా ఉంటోందన్నారు. -
కట్టేది వారైతే మీకెందుకు బాధ?
జీఎస్టీపై వర్తకుల ఆందోళన అర్థరహితం: జైట్లీ న్యూఢిల్లీ: జీఎస్టీ పన్నును అంతిమంగా వినియోగదారులు చెల్లిస్తుంటే కొందరు వర్తకులు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ఆర్థిక మంత్రి జైట్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన పన్ను రేట్ల అమలు వల్లే జీఎస్టీపై వినియోగదారులు ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదన్నారు. శనివారం ఒక కార్యక్రమంలో జైట్లీ ప్రసంగిస్తూ.. పన్ను చెల్లించకపోవడాన్ని ప్రాథమిక హక్కుగా ఈ దేశంలో ఎవరూ పేర్కొనలేరని చెప్పారు. ‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి అభివృద్ధి చెందిన వ్యవస్థకు దేశం రూపాంతరం చెందాలంటే మన ఆలోచనా తీరు, విధానం మారాల’న్నారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో సాయపడ్డాయని పేర్కొన్నారు. ఒకటి లేదా రెండంచెల పన్ను విధానం అమలు చేయాలన్న విజ్ఞప్తుల్ని జైట్లీ తిరస్కరిస్తూ.. భవిష్యత్తులో చేసే అవకాశముందని, 12, 18 శాతం పన్నుల్ని ఒకే కేటగిరిలోకి తేవచ్చని చెప్పారు. జీఎస్టీ సమష్టి నిర్ణయమని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి మద్దతిచ్చాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్ వ్యవస్థ వల్లే రాజకీయాల్లో అవినీతి కొనసాగుతోందని జైట్లీ అభిప్రాయపడ్డారు. పార్టీలకు ఎన్నికల నిధుల విషయంలో పారదర్శక విధానం లేదని, ఆ దిశగా సంస్కరణలు చేపట్టడం దేశం ముందున్న పెద్ద సవాలన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై స్పష్టమైన విధానం రూపొందిస్తామని, పన్ను చెల్లించిన డబ్బే రాజకీయ వ్యవస్థలోకి వచ్చేలా చర్యలు చేపడతామని జైట్లీ చెప్పారు. -
రుణాల జారీని వేగవంతం చేయాలి
ఆసియా అభివృద్ధి బ్యాంకును కోరిన జైట్లీ యోకోహమ: రుణాల ఆమోదం, జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)ను క్రేందం కోరింది. ఆసియా ప్రాంతంలోని వర్ధమాన దేశాలు మౌలిక సదుపాయాలు, సామాజిక రంగాలపై నిధులను వెచ్చించాల్సిన అవసరం దృష్ట్యా రుణాల ఆమోదానికి ప్రస్తుతం తీసుకుంటున్న సమయాన్ని కుదించాలని విజ్ఞప్తి చేసింది. జపాన్‌లోని యోకోహమ నగరంలో జరిగిన ఏడీబీ గవర్నర్ల బోర్డు సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ... దక్షిణాసియా దేశాలకు ప్రాంతీయ కేంద్రాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో రుణాలకు సంబంధించిన ప్రతిపాదనల పరిశీలనను వేగంగా నిర్వహించవచ్చని సూచించారు. ఏడీబీ కార్యకలాపాలు, వనరుల ప్రణాళిక విషయంలో వర్ధమాన దేశాల అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వాలని కోరారు. ఏడీబీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఇప్పటి వరకు సాధించిన విజయాలు, ఇంకా నెరవేర్చాల్సి ఉన్న మరిన్ని అవసరాలపై ఆలోచనకు అవకాశం కల్పించిందన్నారు. ‘‘ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి పేదరికాన్ని పారదోలడమే ఏడీబీ ఎంచుకున్న లక్ష్యం. ఇంధనం, పట్టణాభివృద్ధి, రవాణా రంగాలతో పాటు అందుబాటు ధరలకే పునరుత్పాదక ఇంధనంపైనా మనం దృష్టి సారించాల్సి ఉంది’’ అని జైట్లీ సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఏడీబీ ప్రెసిడెంట్ టకెహికో నకావోతోనూ జైట్లీ పలు అంశాలపై చర్చలు జరిపారు. భారత్‌లో తయారీ కేంద్రాలకు పిలుపు జపాన్ పర్యటనలో ఉన్న జైట్లీ ఆ దేశ ఆర్థిక మంత్రి టారో అసోతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రతిష్టాతక్మంగా భావిస్తున్న భారత్‌లో తయారీ కార్యక్రమం గురించి చేపడుతున్న చర్యల్ని వివరించారు. భారత్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం విషయంలో మరింత కలసి పనిచేయాలని ఇరు దేశాలూ నిర్ణయించినట్టు సమావేశం అనంతరం విడుదలైన ప్రకటనలో పేర్కొన్నారు. -
హెచ్1బీపై చర్చ
అమెరికా వాణిజ్య మంత్రి వద్ద ప్రస్తావించిన జైట్లీ వాషింగ్టన్: భారత ఐటీ రంగానికి షాకిచ్చిన హెచ్1బీ వీసా అంశాన్ని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ వద్ద ఆర్థిక మంత్రి జైట్లీ ప్రస్తావించారు. వీసాల అంశానికి సంబంధించి భారతీయుల ఆందోళనల గురించి అమెరికా దృష్టికి తీసుకెళ్లారు. అమెరికా అర్థిక వ్యవస్థ దూసుకెళ్లడానికి భారత నిఫుణులు చేసిన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయని జైట్లీ గుర్తుచేశారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మ«ధ్య కేబినెట్ స్థాయి చర్చల కోసం జైట్లీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య మంత్రిని జైట్లీ కలిశారు. అమెరికా అభివృద్ధికి భారత నిపుణులు ఎంతగానో తోడ్పాటును అందించారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా అధికార యంత్రాంగం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై రోజ్ స్పందిస్తూ.. హెచ్1బీ వీసాల విధానంపై సమీక్ష ప్రక్రియ మొదలైందని, వీటిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చర్చల సందర్భంగా దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై రోస్కు జైట్లీ వివరించారు. -
‘చిన్న హోటళ్లకు జీఎస్టీ వద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు వల్ల చిన్న హోటళ్లపై భారం పడకుండా చూడాలని ఆర్థిక మంత్రి జైట్లీని దక్షిణాది హోటళ్ల సమాఖ్య కోరింది. తెలంగాణలో 30 వేలు, ఏపీలో 40 వేలు వరకు చిన్న, మధ్యతరహా హోటళ్లు ఉన్నాయని, 80 శాతం మంది ప్రజలు వీటినే ఆశ్రయిస్తుంటారని పేర్కొంది. స్టార్ గుర్తింపు లేని హోటళ్లకు పన్ను ఐదు శాతం మించకుండా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం అధ్యక్షుడు వెంకట రెడ్డి చెప్పారు. -
నోట్లరద్దు నిర్ణయం దారుణం
రాజ్యసభలో ప్రభుత్వంపై చిదంబరం తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపరిచిందని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ ఎంపీ చిదంబరం రాజ్యసభలో ధ్వజమెత్తారు. 2017–18 బడ్జెట్‌పై మాట్లాడుతూ.. మోదీ నోట్లరద్దు నిర్ణయం అత్యంత దారుణమైనదని అభివర్ణించారు. ఈ నిర్ణయం వల్ల అవినీతి, నల్లధనం తగ్గకపోగా దేశ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపిందని మండిపడ్డారు. ‘తడబాటు, గందరగోళం, తలాతోకాలేని విధానం’తో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ‘ఎన్ ఎస్ఎస్ఓ లెక్కల ప్రకారం దేశంలో 40 కోట్ల మంది రోజూవారీ కూలీలున్నారు. మీ నిర్ణయంతో వీరి జీవితాలు అగమ్యగోచరంగా మారాయి’ అని విమర్శించారు. అటు లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వం తీసుకున్న విధానాల ద్వారా జరిగిన నష్టాలను జైట్లీ ఎండగట్టారు. -
అభ్యర్థులకు ప్రభుత్వ నిధులు అసాధ్యం
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసేవారికి ప్రభుత్వమే నిధులు సమకూర్చడం సాధ్యం కాదని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. దేశంలో ఉన్న పరిస్థితులకు ఆ విధానం సాధ్యం కాదని గురువారం లోక్‌సభలో చర్చలో అన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకే రాజకీయ పార్టీలకు నగదు రూపంలో ఇచ్చే విరాళాల పరిమితిని రూ. 20 వేల రూ. 2 వేలకు తగ్గించామని వెల్లడిం చారు. దీనిని మెరుగ్గా అమలు చేసేందుకు సూచనలు చేస్తే స్వాగతిస్తామన్నారు. ప్రజలు పార్టీలకు ఇచ్చే విరాళాలను చట్టబద్ధం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తే విరాళాలు ఇచ్చిన వారు, తీసుకున్న వారు పన్నుతో వచ్చిన లాభాన్ని పొందుతారని అన్నారు. -
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: జైట్లీ
న్యూఢిల్లీ : విజయ్ మాల్యా వ్యవహారంలో ఎన్డీయే ప్రభుత్వం, ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రస్థాయిల్లో ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. మాల్యాకు లబ్ది మీరు చేకూర్చారంటే, మీరే రుణాలు ఇచ్చారంటూ వాదించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం లోక్ సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో మోదీ ప్రభుత్వం విజయమాల్యాకు ఒక్క రూపాయి లబ్ది కూడా చేకూర్చలేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. యూపీఏ పాలనలోనే నార్త్ బ్లాక్ జోక్యంతో వ్యాపారస్తులకు భారీగా రుణాలు మంజూరు చేశారని ఆరోపించారు. లోక్‌సభలో జరిగిన చర్చ కార్యక్రమంలో రుణాల విషయాలపై అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానాలిచ్చారు. గత ప్రభుత్వమే బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తులకు భారీగా మినహాయింపులు ఇచ్చిందని మండిపడ్డారు. అడ్డుఅదుపు లేకుండా విచక్షణా రహితంగా కొంతమంది వ్యక్తులకు, పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరు చేసిందని చెప్పారు. ఎన్పీఏలకు మూల కారణం గత యూపీఏ ప్రభుత్వమేనని ఆరోపించారు. వారి దుశ్చర్యలకు తాము భరించాల్సి వస్తుందని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం విజయ్‌మాల్యాకు రూ.1,200 కోట్ల లబ్ది చేకూర్చిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన జైట్లీ, 2016 మేలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి లబ్ది కూడా మాల్యాకు అందించలేదని స్పష్టీకరించారు. 2016 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు రూ.6,30,323 కోట్లగా ఉన్నాయి. -
ఆర్బీఐ, సెబీలతో మంత్రి మంతనాలు
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, మార్కెట్ రెగ్యులేటరీ సెబీతో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ భేటీ కాబోతున్నారు. ఫిబ్రవరి 11న ఇరు బోర్డులతో జైట్లీ భేటీ కాబోతున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2017-18 కేంద్ర బడ్జెట్లో తీసుకొచ్చిన వివిధ ఆర్థిక రంగ సంస్కరణలపై జైట్లీ వారితో చర్చించనున్నారు. అదేవిధంగా 2018 మార్చిలోపల ద్రవ్యలోటును జీడీపీలో 3.2 శాతానికి తగ్గించాలనే విషయంపై కూడా బోర్డు సభ్యుల ముందు చర్చకు రానుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో ఆస్తి పునర్ నిర్మాణ కంపెనీలు జారీచేసిన సెక్యురిటీ రశీదులను లిస్టింగ్‌కు అనుమతివ్వాలనే ప్రతిపాదనపై కూడా బోర్డుల నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి రూ.10వేల కోట్ల నగదును చొప్పించాలని ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. అవసరమైతే మరింత పెంచుతామన్నారు. బ్రోకరేజ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, ఇతర మార్కెట్ మధ్యవర్తిత్వల రిజిస్ట్రేషన్‌కు కాగితరహిత ఆన్లైన్ మెకానిజంను మంత్రి ప్రకటించారు. ఆధార్‌తో డీమ్యాట్ అకౌంట్ల లింక్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ విషయాలన్నింటిపైన బోర్డులతో మంత్రి చర్చించనున్నారు. -
బడ్జెట్ కోసమే అలా చేశారు!
► ఎంపీ మృతిపై పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాల డిమాండ్ ► ముందే అహ్మద్ చనిపోయినట్లు సమాచారం ఉందన్న ఆజాద్ ► లోక్‌సభలో ‘పాతనోట్లుంటే శిక్ష–జరిమానా’ బిల్లు న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు శుక్రవారం గందరగోళంగా మారాయి. గుండెపోటుతో మాజీ మంత్రి, ఐఎంయూఎల్ చీఫ్, ఎంపీ ఈ అహ్మద్ మృతిచెందిన విషయంలో ప్రభుత్వం తీరు సరిగా లేదని, బడ్జెట్ కొనసాగించేందుకే వైద్యులతో తప్పుడు ప్రకటనలు చెప్పించారంటూ విపక్షాలు మండిపడ్డాయి. అటు రోజ్‌వాలీ చిట్‌ఫండ్ స్కాంలో తమ ఎంపీలను అరెస్టు చేయటంతోపాటు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభ వాయిదా పడింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. తృణమూల్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్రం తమ ఎంపీలపై సీబీఐ ద్వారా ఒత్తిడి పెంచుతోందని నినాదాలు చేశారు. ‘సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారింది. రాజకీయ అవసరాల కోసం కేంద్రం సీబీఐని వినియోగించుకుంటోంది’ అని తృణమూల్ ఎంపీలు విమర్శించారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే ఎంపీ, ఐఎంయూఎల్ అధ్యక్షుడు అహ్మద్‌కు సరైన చికిత్స అందలేదని.. ఆయన మృతిపై కూడా ప్రభుత్వ స్పందన సరిగా లేదని కేరళ ఎంపీలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేశారు. వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ గొడవ మధ్యే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆదేశించారు. కేంద్ర మంత్రి మహేశ్ శర్మ చర్చను ప్రారంభిస్తుండగానే మళ్లీ సభలో గందరగోళం నెలకొంది. రెండుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో.. స్పీకర్ సుమిత్ర మహాజన్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. లోక్‌సభ ముందు ‘పాతనోట్లుంటే శిక్ష’ బిల్లు నవంబర్8 నిర్ణయంతో రద్దుచేసిన పాతనోట్లను దాచుకున్నా, బదిలీ చేసినా, తీసుకున్నా క్రిమినల్ చర్యలతోపాటు రూ.10వేల జరిమానా విధించే బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కాగా ఈ బిల్లు అనైతికం, దేశ వ్యతిరేకమని తృణమూల్ కాంగ్రెస్ నేత సుగత రాయ్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై జైట్లీ కూడా ఘాటుగానే స్పందించారు. ఏ ప్రాతిపదికన తృణమూల్ దీన్ని వ్యతిరేకిస్తుందో చెప్పాలన్నారు. అయితే.. ఈ బిల్లు లోక్‌సభ నిబంధనలకు విరుద్ధమని జైట్లీ లోక్‌సభ సభ్యుడు కానందున ఆయనకు నిబంధనలేమీ తెలియవని సుగత రాయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. 70వేల మంది చిన్నారులకు మధుమేహం 2015లో భారతదేశంలో 70వేలకు పైగా చిన్నారులు మధుమేహం బారిన పడ్డారని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. అటు, ఉగ్రవాదానికి సహకరించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని ఆ దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని రాజ్యసభ ఎంపీ ఒకరు ఓ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలంటూనే.. ‘56 అంగుళాల ఛాతీ ఎక్కడికెళ్లింది’ అని విమర్శించారు. ప్రభుత్వానికి ముందే తెలుసు! జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగం జరుగుతుండగా సెంట్రల్ హాల్లోనే ఎంపీ అహ్మద్ కుప్పకూలిపోయారు. ఫిబ్రవరి 1న ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలున్నందున.. సమావేశాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయన ముందురోజే చనిపోయినా ఇంకా బతికే ఉన్నాడనే సందేశాన్ని ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయని ఖర్గే ఆరోపించారు. అహ్మద్ కూతురు, అల్లుడికి ఆసుపత్రి లోపలకు అనుమతించలేదన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే అతను మృతిచెందినట్లు కొందరు డాక్టర్లు తనతో చెప్పారని ఆజాద్ అన్నారు. -
జైట్లీకి ఎఫ్ఆర్బీఎం నివేదిక
న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ.. బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్ట సవరణలపై ఎన్కే సింగ్ కమిటీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలించిన మీదట ప్రభుత్వం తగు చర్యలు తీసుకోగలదని ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తం నాలుగు వాల్యూమ్స్‌గా నివేదికను అందించినట్లు సింగ్ తెలిపారు. మొదటిదానిలో ద్రవ్య విధానం, మార్గదర్శ ప్రణాళిక మొదలైనవి ఉన్నాయి. రెండో దానిలో అంతర్జాతీయ అనుభవాలు, మూడో వాల్యూమ్‌లో కేంద్రం–రాష్ట్రాల సంబంధిత ఆర్థిక అంశాలను ప్రస్తావించినట్లు సింగ్ పేర్కొన్నారు. నాలుగోదానిలో ద్రవ్య విధానంపై దేశ, విదేశ నిపుణుల అభిప్రాయాలు మొదలైన అంశాలు ఉన్నట్లు వివరించారు. ఎఫ్ఆర్బీఎం చట్టంలో సవరణలు సూచించేందుకు 2016 మేలో మాజీ రెవెన్యూ కార్యదర్శి సింగ్ సారథ్యంలో కేంద్రం అయిదుగురు సభ్యుల కమిటీని వేసింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుమీత్ బోస్, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, ఎన్ఐపీఎఫ్పీ డైరెక్టర్ రథిన్ రాయ్ ఇందులో ఉన్నారు. తమ వంతుగా నివేదిక సమర్పించడం పూర్తయ్యిందని, దాన్ని బహిర్గతం చేయాలా లేదా అన్నది ప్రభుత్వం చేతుల్లో ఉందని సింగ్ పేర్కొన్నారు. -
మరిన్ని రూ. 500 నోట్లు వస్తున్నాయ్!
-
మరిన్ని రూ. 500 నోట్లు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత భారీ ప్రయోజనాలు ఇపుడు కనిపిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. రీమానిటైజేషన్ ప్రక్రియం వేగం పుంజుకుందనీ రిజర్వ్ బ్యాంకు దగ్గర పెద్ద మొత్తంలో కరెన్సీ అందుబాటులో ఉందనీ పేర్కొన్నారు. ముఖ్యంగా రూ.500 నోట్ల చెలామణి పెరిగిందనీ, మరిన్ని నోట్లను అందుబాటులోకి తేనున్నామని ఆర్థికమంత్రి ప్రకటించారు. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో అశాంతి అలజడికి సంబంధించి ఒక్క సంఘటన కూడా నమోదు కాలేదని జైట్లీ స్పష్టం చేశారు. విమర్శకుల అంచనాలను తలదన్ని అన్ని రంగాలు అభివృద్ధిని సాధించాయాటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఈ మేరకు బ్యాంకుల్లో గుర్తించదగిన ప్రభావం ఇప్పటికే కనిపిందని జైట్లీ చెప్పారు. అన్ని విభాగాలలో పరోక్ష పన్నుల వసూలు గణనీయంగా పెరిగిందన్నారు. డిసెంబర్ 19 నాటికి డైరెక్ట్ టాక్స్ 14.4 శాతం, కేంద్ర పరోక్ష పన్నులు వరకు 26.2 శాతం, కేంద్ర వాణిజ్య పన్ను 43.3 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు చెప్పారు. అలాగే గత సంవత్సరంతో పోలిస్తే రబీ విత్తనాలు 6.3 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. -
కరెన్సీ కొరత నిజమే..కానీ..
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న నగుదు కొరత సంక్షోభంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కరెన్సీ కొరత ఉందని ఒప్పుకున్నారు. కానీ పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ నిర్ణయం సరైందేనని, పరివర్తన సమయంలో కొంత పెయిన్ తప్పదని చెప్పుకొచ్చారు. పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో డిశెంబర్ 5-7 తేదీల్లో నిర్వహించిన పెట్రోటెక్ 2016 సమావేశంలోఆర్థిక మంత్రి ప్రసంగించారు. నవంబర్ 8న ప్రభుత్వం ప్రకటించిన డీమానిటైజేషన్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించారు. పెద్ద నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయం తర్వాత కరెన్సీ నోట్ల కొరత నెలకొందని ఆయన అంగీకరించారు నగదు కొరత ఉన్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు, కానీ డిజిటల్ వైపు అడుగులు వేస్తున్న క్రమంలో ఈ కొరత తప్పదన్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రతి రోజు కేంద్ర బ్యాంకు ఆర్ బీఐ కొంత కరెన్సీ కొంత మొత్తాన్ని విడుదల చేస్తోందని వివరించారు. మీడియా సహా మిగతా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ, చివరికి మంచి ఫలితాలు రానున్నాయని చెప్పారు. స్వల్పకాలికంగా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలు సమకూరనున్నాయని జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరగడం ఆర్థిక వృద్దిగా దన్నుగా నిలుస్తుందన్నారు. లావాదేవీల్లో పారదర్శకత మూలంగా పన్నుల వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. తద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను ప్రభుత్వం క్రమంగా సమీక్షిస్తోందని తెలిపారు. ఈ విషయంలో బ్యాంకులు సక్రమమైన లావాదేవీల సులభతరం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని భరోసా ఇచ్చారు.అలాగే ఇటీవలి సంవత్సరాలలో డిజిటల్ చెల్లింపులకోసం బ్యాంకింగ్ టెక్నాలజీ అభివృద్ధి, మొబైల్ బ్యాంకింగ్ లాంటి వినూత్న సాంకేతిక సేవల ద్వారా ప్రతీ చిన్నలావాదేవీని సులభంగా నిర్వహిచడానికి వీలవుతోందని జైట్లీ చెప్పారు. -
మీరిస్తే ఫిఫ్టీ.. ఫిఫ్టీ, మేం పట్టుకుంటే..
-
మీరిస్తే ఫిఫ్టీ.. ఫిఫ్టీ
మేం పట్టుకుంటే..85% డిపాజిట్లలో లెక్కతేలని సొమ్ముపై సర్కారు కన్ను ♦ స్వచ్ఛందంగా వెల్లడిస్తే పన్ను 50 శాతమే ♦ మిగిలిన 50 శాతంలో 25 శాతం వెనక్కి తీసుకోవచ్చు ♦ మరో 25 శాతంపై నాలుగేళ్ల లాకిన్.. వడ్డీ ఉండదు ♦ దాన్ని పేదరిక నిర్మూలనకు ఉపయోగిస్తామన్న ప్రభుత్వం ♦ ప్రధానమంత్రి గరీబీ కల్యాణ్ యోజన పేరుతో కొత్త పథకం ♦ స్వచ్ఛంద వెల్లడికి గడువు డిసెంబర్ 30 ♦ వెల్లడించకుండా అధికారుల సోదాల్లో దొరికితే 85% పన్ను ♦ ఆదాయ పన్ను చట్టంలో సవరణలకు పార్లమెంటులో బిల్లు ♦ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మోదీ సర్కారు కన్ను ఇప్పుడు బ్యాంకు డిపాజిట్లపై పడింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో వెల్లువలా వచ్చిపడుతున్న సొమ్ములో నల్లధనాన్ని బయటికి లాగేందుకు కఠిన చర్యలు ప్రకటించింది. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించడానికంటూ మరో అవకాశమిచ్చింది. ఇందుకోసం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సవరణలు చేస్తూ సోమవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పెద్దనోట్లు రద్దయిన తర్వాత నుంచి బ్యాంకుల్లో చేస్తున్న డిపాజిట్లలో.. ఆదాయ వివరాలను వెల్లడించని మొత్తాన్ని ప్రజలు డిసెంబర్ 30లోగా స్వచ్ఛందంగా ప్రకటిస్తే... దానిపై 50 శాతం వరకూ పన్ను (జరిమానా, సర్‌చార్జీతో కలిపి) చెల్లించి బయటపడొచ్చని కేంద్రం ప్రకటించింది. దీంతోపాటు ఈ లెక్కచెప్పని ఆదాయంలో 25 శాతాన్ని ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని నాలుగేళ్లపాటు వెనక్కి తీసుకోవడానికి వీలుండదు (లాకిన్). ఈ వ్యవధికిగాను కేంద్రం ఎలాంటి వడ్డీ కూడా చెల్లించదు. మిగిలిన 25 శాతం మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇక వివరాలు వెల్లడించని మొత్తాలను ఐటీ శాఖ గనుక తన సోదాలు, పరిశీలనలో పట్టుకుంటే దానిపై ఏకంగా 85 శాతం వరకూ పన్ను(జరిమానా, సర్‌చార్జితో కలిపి) కట్టాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా రూ.8 లక్షల కోట్ల జమ నల్లధనంపై యుద్ధాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ(డీమోనిటైజేషన్) ఈ నెల 8 రాత్రి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజలు తమ వద్దనున్న పాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో రూ.4 వేల చొప్పున మార్చుకోవడానికి మొదట డిసెంబర్ 31 వరకు గడువిచ్చిన సర్కారు (ఆర్బీఐలో మార్చుకోవడానికి మార్చి చివరిదాకా) ఆ తర్వాత దాన్ని ఈ నెల 24తో నిలిపివేసింది. అయితే ప్రజలు తమ వద్దనున్న పెద్దనోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికి మాత్రం డిసెంబర్ 31 వరకు గడువిచ్చింది. కాగా డీమోనిటైజేషన్ తర్వాత ఇప్పటివరకూ బ్యాంకుల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు జమైనట్లు అంచనా. పన్ను మీద పన్ను... జరిమానా! బ్యాంకుల్లో జమవుతున్న డిపాజిట్లలో (రూ.500; రూ.1,000 నోట్ల రూపంలో) నల్లధనాన్ని (ఆదాయ వివరాలు వెల్లడించని మొత్తం) స్వచ్ఛందగా వెల్లడించేలా ప్రభుత్వం ఐటీ చట్టాల సవరణ బిల్లులో ప్రతిపాదించింది. దీనికోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై)–2016 పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ కింద డిపాజిట్లలో నల్లధనాన్ని ప్రకటించినవారికి ఆదాయ వివరాల లెక్కచెప్పని మొత్తంపై 30 శాతం పన్ను విధిస్తారు. ఈ 30 శాతం పన్నుపై 33 శాతాన్ని పీఎంజీకే సెస్సు రూపంలో వసూలు చేస్తారు. ఇది మరో 10 శాతం పన్ను కింద లెక్క. అదనంగా మరో 10 శాతాన్ని జరిమానాగా కూడా చెల్లించాల్సి వస్తుంది. అంటే లెక్కచూపని మొత్తంపై 50 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. పీఎంజీఎస్‌కే స్కీమ్ ఇదీ... డీమోనిటైజేషన్ తర్వాత డిపాజిట్ చేస్తున్న సొమ్ములో నల్లధనం ఉన్నవారు దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించిన పక్షంలో అందులో 25 శాతాన్ని పీఎంజీఎస్‌కే స్కీమ్‌లో తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. ఈ సొమ్ముపై నాలుగేళ్ల లాకిన్ వ్యవధిని విధిస్తారు. అంటే నాలుగేళ్లపాటు వెనక్కి తీసుకునే వీలుండదు. అదేవిధంగా ఈ పథకంలో జమ చేసిన మొత్తంపై ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం వడ్డీని కూడా చెల్లించదు. రిజర్వ్ బ్యాంక్‌తో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం ఈ స్కీమ్‌ను నోటిఫై చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం వెచ్చించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. అంటే.. సాగునీరు, ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం ఇతరత్రా ప్రాజెక్టులపై ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. సొమ్ము ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పక్కర్లేదు: అధియా పీఎంజీకేవై స్కీమ్ వర్తింపు ఈ నెల 10 నుంచి జమ అయిన డాపాజిట్లకే వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు. చివరి తేదీని బిల్లు ఆమోదం పొందిన తర్వాత నోటిఫై చేయనున్నామని... దాదాపు డిసెంబర్ 30 వరకూ అవకాశం ఉండొచ్చని ఆయన చెప్పారు. ఫైనాన్స్ చట్టం–2016లో కొత్తగా చాప్టర్ 9 కింద పీఎంజీఎస్కేను చేర్చినట్లు వివరించారు. ‘పీఎంజీకేవై స్కీమ్ కింద వెల్లడించిన ఆదాయ వివరాలకు సంబంధించి ఖాతాలో డిపాజిట్ అయిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ వివరాలు చెప్పాల్సిందిగా ఐటీ శాఖ ప్రశ్నించదు. సంపద పన్ను, సివిల్ చట్టాలు, ఇతరత్రా పన్ను చట్టాల నుంచి దీనికి రక్షణ ఉంటుంది. అయితే ఫెమా, పీఎంఎల్ఏ, నార్కోటిక్స్, బ్లాక్‌మనీ చట్టాల నుంచి మాత్రం దీనికి ఎలాంటి రక్షణ ఉండదు’ అని అధియా వివరించారు. ఐటీ శాఖ పట్టుకుంటే గుల్లే... డిపాజిట్లలో బ్లాక్ మనీ ఉండి.. దాన్ని గనక ఐటీ శాఖ పట్టుకుంటే పన్ను, జరిమానా భారీగా విధించేలా ఐటీ చట్టాల్లో సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. దీనిప్రకారం పీఎంజీకేవై స్కీమ్ గడువు పూర్తయ్యాక ప్రజలు నల్లధనం వివరాలను వెల్లడించినా.. లేదంటే ఆ తర్వాత ఐటీ శాఖ బయటపెట్టినా.. సదరు నల్లధనంపై 60 శాతం పన్ను విధిస్తారు. ఈ పన్నుపై మరో 25 శాతం సర్‌చార్జి (అంటే 15 శాతం అదనపు పన్ను) ఉంటుంది. మొత్తం కలిపితే 75 శాతం పన్ను విధించనున్నారు. అంతేకాదు ఆదాయ పన్ను (ఐటీ) అసెసింగ్ అధికారి అవసరమైతే ఈ 75 శాతం పన్నుకు అదనంగా మరో 10 శాతం జరిమానాను కూడా విధించేలా చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు. అంటే పట్టుకున్న నల్లధనంలో 85 శాతం వరకూ ప్రభుత్వపరం అవుతుందన్నమాట. ప్రస్తుత నిబంధనలూ కొనసాగుతాయ్... ఆదాయాన్ని తక్కువ చేసి చూపించడం (అండర్ రిపోర్టింగ్), లెక్కలు తారుమారు చేయడం (మిస్‌రిపోర్టింగ్) వంటి సందర్భాల్లో ఐటీ శాఖ విధిస్తున్న ప్రస్తుత జరిమానా నిబంధనలు చట్టంలో యథాతథంగా కొనసాగుతాయని కేంద్రం వెల్లడించింది. వీటికి ఎలాంటి సవరణలు చేయడం లేదని తేల్చిచెప్పింది. అండర్ రిపోర్టింగ్‌కు సంబంధిత పన్నుపై 50 శాతం జరిమానా, మిస్ రిపోర్టింగ్‌కు పన్నుపై 200 శాతం జరిమానా ప్రస్తుతం అమల్లో ఉంది. ఇక ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన పన్ను చట్టాల (రెండో సవరణ) బిల్లు–2016లో ఐటీ చట్టంలోని 115బీబీఈ సెక్షన్‌ను సవరించేందుకు ప్రతిపాదించారు. దీనిప్రకారం వివరాలు వెల్లడించని డిపాజిట్లు, పెట్టుబడులు, నగదు, ఇతరత్రా ఆస్తులపై శిక్షాపూరిత పన్ను, సర్‌చార్జి, జరిమానా విధింపునకు ఈ సవరణలతో ప్రభుత్వానికి వీలవుతుంది. ఇక ఐటీ శాఖ సోదాలు–జప్తులకు సంబంధించిన కేసుల్లో పెనాల్టీ నిబంధనలను కూడా సవరించేందుకు తాజా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. దీని ప్రకారం బయటపడిన ఆదాయాన్ని నల్లధనంగా అసెసీ అంగీకరించి.. పన్ను రిటర్నులు వేసి, పన్ను చెల్లించేందుకు ఒప్పుకుంటే ఆ మొత్తంపై జరిమానాను ఇప్పుడున్న 10 శాతం నుంచి 30 శాతానికి పెంచనున్నారు. ఇతర కేసుల విషయంలో ఇప్పుడున్నట్లుగానే 60 శాతం జరిమానా కొనసాగుతుంది. మరో ఐడీఎస్ లాంటిదే.. నల్లధనం వెల్లడికి కేంద్రం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్) రెండు నెలల క్రితమే(సెప్టెంబర్ 30తో) ముగిసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం నల్లధనం ఉన్నవాళ్లు తమ సొమ్మును ఐటీ శాఖకు వెల్లడించి 45 శాతాన్ని పన్ను రూపంలో కట్టేస్తే చట్టబద్ధ నగదుగా మార్చుకోవడానికి వీలు కల్పించింది. ఈ స్కీమ్ కింద దాదాపు దాదాపు రూ.65,250 కోట్ల నల్లధనం బయటికొచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన పీఎంజీకేవై స్కీమ్ కూడా ఒకరకంగా ఇలాంటిదే. అయితే, ఇప్పుడు డిపాజిట్ చేసిన మొత్తంలో ఆదాయ వివరాలు లెక్కచెప్పని డబ్బుకు 50 శాతం పన్నును విధించనున్నారు. 25 శాతాన్ని ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయడం(నాలుగేళ్ల లాకిన్) దీనికి అదనం. -
చెబితే 50 %, దాస్తే 85 %
• నల్లధన కుబేరులు కట్టాల్సిన పన్నుమొత్తాలివి • స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50 శాతం పన్ను • దాడుల్లో స్వాధీనం చేసుకున్నదానిపై 85 శాతం • ఆదాయ పన్ను చట్టానికి భారీ సవరణలు • ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన జైట్లీ • నోట్ల రద్దుపై కొనసాగిన ఆందోళనలు • ప్రధాని సభకు వస్తారని ప్రకటించిన రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: నల్లకుభేరులకు మోదీ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. భారీగా జరిమానా చెల్లించి నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం ఆదాయపన్ను చట్టానికి భారీ సవరణలు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ సవరణల బిల్లును ప్రవేశపెట్టారు. సభలు వారుుదా పడేముందు తొలుత లోక్సభలోను, ఆ తర్వాత రాజ్యసభలో ఆయన ఐటీ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టారు. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. బిల్లులోని ప్రధానాంశాలు.. తమ వద్ద ఉన్న లెక్కల్లో చూపని ఆదాయాన్ని వెల్లడిస్తే 50 శాతం పన్నుగా చెల్లించాలి. మిగిలిన 50 శాతం కేంద్రం వద్ద ఉంటుంది. ఈ 50 శాతంలో వెంటనే 25 శాతం, నాలుగేళ్ల తర్వాత మరో 25 శాతం తీసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. 30 శాతం పన్ను, పది శాతం పెనాల్టీలపై 33 శాతం సర్‌ఛార్జి విధిస్తే దాదాపు 50 శాతం పన్ను అవుతుంది. అధికారులు దాడుల్లో నల్లధనాన్ని వెలికితీస్తే దానిపై ఫ్లాట్ 60 శాతం పన్ను విధిస్తారు. ఇందులో 25 శాతానికి సర్‌చార్జి (15 శాతం) కలిపితే మొత్తం దాదాపు 75 శాతం వరకూ పోరుునట్లే. దీనికి తోడు పన్ను అంచనా వేసే అధికారి మరో 10 శాతం పెనాల్టీ వేయాలని నిర్ణరుుంచే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా వచ్చిన ఆదాయాన్ని ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనకు మళ్లించి దేశంలో వివిధ పేదరిక నిర్మూలన పథకాలు చేపట్టనున్నారు. కొత్త చట్టసవరణ బిల్లుకు ఈ సమావేశాల్లోనే ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అన్ని పార్టీలతోనూ చర్చలు ప్రారంభించింది. స్వల్ప కాలంలోనే ఈ చట్టం కింద చర్యలు తీసుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజ్యసభలోనూ వారుుదాలు.. పెద్దనోట్ల రద్దు అంశంపై రాజ్యసభ కూడా అట్టుడికింది. ఈ అంశంపై చర్చ చేపట్టాల్సిందేనని.. ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేశారుు. సభ ప్రారంభమైనప్పటి నుంచే కార్యకలాపాలకు అడ్డుతగిలారుు. ఈ క్రమంలో పలుమార్లు సభను వారుుదా వేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కాగానే సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు బీజేపీ సభ్యుడిని ఉద్దేశించి ‘దలాల్’ (దళారీ) అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అనంతరం ఆందోళన పెద్దనోట్ల రద్దు అంశంపైకి మళ్లింది. ప్రధాని సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ ఆజాద్ డిమాండ్ చేశారు. పలువురు సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. పరిస్థితి సద్దుమణిగే అవకాశం కనిపించకపోవడంతో సభను రేపటికి వారుుదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. క్యాస్ట్రోకు ఉభయ సభల నివాళి గత రెండు రోజుల క్రితం కన్నుమూసిన క్యూబా విప్లవ వీరుడు, మాజీ అధ్యక్షుడు ఫెడరల్ క్యాస్ట్రోకు ఉభయ సభలు నిమిషం పాటు నివాళులర్పించారుు. ఈ సందర్భంగా రాజ్యసభలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాట్లాడుతూ క్యూబా నాయకుడి విజయాలను ప్రస్తుతించారు. ‘వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి గెలిచిన విజేత క్యాస్ట్రో... ఆయన మరణం క్యూబా ప్రజలకు, ప్రపంచానికి తీరని లోటు’ అని పేర్కొన్నారు. అనంతరం రాజ్యసభలో చర్చ ప్రారంభమవుతుండగానే... ప్రతిపక్ష సభ్యులు పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగించారు. ముఖ్యమంత్రులతో ప్రత్యేక కమిటీ అమరావతి: పెద్దనోట్ల రద్దు తరువాత ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలను సూచించడానికి ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి నేతృత్వం వహిస్తారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. రూ.500, రూ.1,000 వెరుు్యనోట్లను రద్దు చేయాలని కోరుతూ బాబు గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అరుుతే రూ.రెండు వేల నోటును ప్రవేశపెట్టడంపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉభయసభల్లో నోట్ల రద్దు రగడ పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లో వరుసగా ఎనిమిదో రోజు కూడా ఆందోళనలు కొనసాగారుు. ప్రధాని నరేంద్రమోదీ సభకు వచ్చిన పెద్దనోట్ల రద్దుపై చర్చలో పాల్గొనాలని విపక్షాలు డిమాండ్ చేశారుు. లోక్‌సభ సోమవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఆందోళన చేపట్టారుు. సభకు ప్రధాని వచ్చి చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేశారుు. ఈ ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభలో ప్లకార్డులు, పేపర్లు ప్రదర్శించొద్దని స్పీకర్ సభ్యులకు సూచించారు. అరుునప్పటికీ అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభను వారుుదా వేశారు. తిరిగి భేటీ అనంతరం కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నగదు కోసం ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారని, ఇది వరకే 70 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇచ్చిన వారుుదా తీర్మానాన్ని ఆమోదించి చర్చకు అనుమతివ్వాలని కాంగ్రెస్‌తోపాటు టీఎంసీ, ఎస్పీ సభ్యులు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రధాని సమక్షంలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అంతవరకు పరిస్థితి సద్దుమణగబోదన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ సుదీర్ఘ చర్చోపచర్చల తరువాతే నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పేదలకు ఇది మేలు చేస్తుందన్నారు. విపక్షాలు కోరుకుంటే దీనిపై ప్రధాని సభకు వచ్చి మాట్లాడుతారని చెప్పారు. దీనిపై ఏ నిబంధన కింద చర్చ జరపాలనేది స్పీకరే నిర్ణరుుస్తారని స్పష్టం చేశారు. -
జీఎస్టీ పరిధిపై వీడని ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికార పరిధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రతిష్టంభన వీడలేదు. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ ఏర్పాటు చేసిన అనధికారిక సమావేశంలో ప్రతిష్టంభనను తొలగించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎకై ్సజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ వంటి పన్నుల స్థానంలో వచ్చిన జీఎస్టీపై కేంద్రం, రాష్ట్రాల అధికార పరిధి ఎలా ఉండాలన్న దానిపై మూడు గంటల పాటు చర్చించినప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోరుునట్లు తెలిసింది. రూ. 1.5 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారాలకు సంబంధించిన జీఎస్టీపై పూర్తి అధికారం తమకే ఇవ్వాలని రాష్ట్రాలు పట్టుబడుతూ ఉన్న నేపథ్యంలో సోమవారం మళ్లీ ఒకసారి భేటీ జరగనుంది. ‘సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఈ నెల 25న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగేంతవరకూ దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉంటారుు’అని జైట్లీ చెప్పారు. ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి హృదయేష్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరాఖండ్, యూపీ, తమిళనాడు వంటి రాష్ట్రాలు రూ. 1.5 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన చిన్న వ్యాపారాల సరుకులు, సేవలపై పన్నులు వసూలు చేసే అధికారం తమకే ఇవ్వాలని కోరాయన్నారు. సేవలను మినహారుుంచి సరుకులపై పన్ను వసూలు అధికారం ఇచ్చేందుకే కేంద్రం అంగీకరిస్తోందన్నారు. ఈ నెల 25న మళ్లీ భేటీ: ఈటెల ఈ నెల 25న మళ్లీ సమావేశమయ్యేందుకు నిర్ణరుుంచామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రూ. 1.5 కోట్ల ఆదాయమున్న డీలర్ల నుంచి రాష్ట్రాలు, ఆపైన ఆదాయముంటే కేంద్రం వసూలు చేయాలనే ప్రతిపాదనలపై చర్చించామన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రాల్లో పరిస్ధితులను ఆర్థిక మంత్రులు జైట్లీకి వివరించారని చెప్పారు. పాత నోట్లతో బకారుుల వసూలు గడువును ఈ నెల 24 నుంచి మరి కొద్ది రోజుల పెంచాలని కోరామని, సానుకూలంగా స్పందించారన్నారు. -
బడ్జెట్లో ప్రజలకు భారీగా వరాల జల్లులు!
నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటించిన సంచలన నిర్ణయంతో బ్యాంకుల వద్ద, ఏటీఎం వద్ద ఎక్కడ చూసినా భారీ క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి.. మధ్యతరగతి ప్రజలు, పేదవారు పడుతున్న ఈ కష్టాలకు ఉపశమనంగా ఎన్డీయే ప్రభుత్వం అరుణ్ జైట్లీ ద్వారా వరాల జల్లులు కురిపించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబు రేట్లలో ఉపశమనం కల్పించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం వేతనాలు ఆర్జించే వారిలో కూడా బీజేపీ స్థానాన్ని మరింత సంఘటితం చేయనుందని వెల్లడవుతోంది. మరో వైపు నోట్ల రద్దుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఐదు రాష్ట్రాల్లో సమీపంలో జరుగబోయే ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి. 250 మిలియన్ ప్రజల మన్ననలు పొందాలంటే ఎలాగైనా బీజేపీ మరోకీలక స్టెప్స్ తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాలు ఎన్నికల పోలింగ్‌కు వెళ్లే ముందే బడ్జెట్ ప్రవేశపెట్టి దానిలో కురిపించాల్సిన వరాలన్నీ కురిపించనున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సైతం అరుణ్ జైట్లీకి బడ్జెట్‌ను ఓ ఆయుధంగా మరలుచుకుని, ప్రజలను మన్ననలు సంపాదించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. నోట్ల రద్దుకు వెల్లడవుతున్న వ్యతిరేకతను బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే ఈ పన్ను ప్రోత్సహకాల ద్వారా భర్తీచేసుకోవాలని కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రదాని నరేంద్రమోదీ నోట్ల రద్దు విషయంపై ఆదివారం కర్నాటక, బెల్గంలో జరిగిన సభలో వెల్లడించారు. ప్రస్తుతం కొంత కష్టాన్ని భరించాల్సి వస్తుందని, కానీ కొన్ని వారాల, నెలల్లోనే ప్రజలకు మరింత లాభం చేకూరుతుందని తెలిపారు. ప్రధాని మాటలు నిజం చేయడానికి బడ్జెట్‌ను ఓ సాధనంగా వాడుతారని బీజేపీ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనుందని, రుణమాఫీ వంటి పథకాలను ఉత్తరప్రదేశ్‌లో తీసుకురాబోతున్నారని వెల్లడించారు. ఈ ప్రణాళికలన్నీ నోట్ల రద్దుతో జమైన నగదుతోనే సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. బ్యాంకింగ్ సిస్టమ్‌లోని రూ.6 లక్షల కోట్ల అనధికారిక నగదు వచ్చిందని ప్రభుత్వం అంచనా వేస్తుందని, అదేవిధంగా ఇటీవల ప్రవేశపెట్టిన ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ కింద మరో రూ.65 కోట్ల లెక్కలో చూపని నల్లధనం బయటపడినట్టు ఓ టాప్ లీడర్ చెప్పారు. అంతేకాక మోదీ తదుపరి టార్గెట్‌గా బినామీ లావాదేవీలపై కన్ను వేయబోతున్నారని, ఒకపక్క ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని మోదీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు పదునైన ఆయుధాలుగా మారనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి . బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే పథకాలు కూడా ఎన్నికల కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అడ్డుగా ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే బడ్జెట్ తేదీల మార్పుపై అది కేంద్రానికి సంబంధించిన విషయమని ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అంతేకాక, దానిలో ప్రవేశపెట్టబోయే పథకాలు కూడా ఎన్నికల సంఘం కోడ్ కిందకు రావని ఓ టాప్ ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
మిస్త్రీకి దొరకని జైట్లీ అపాయింట్మెంట్..
• గొడవలో ప్రస్తుతానికి • తలదూర్చకూడదని ప్రభుత్వం నిర్ణయం! న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఆధిపత్య పోరులో ప్రస్తుతానికి జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి తన వాదన వినిపించడం కోసం సైరస్ మిస్త్రీ ఆయన అపాయింట్మెంట్ అడిగారు. దీనికి జైట్లీ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో అటు మిస్త్రీ, ఇటు రతన్ టాటా... ఎవరినీ ప్రస్తుతానికి కలవకూడదని ఆర్థిక మంత్రి నిర్ణయించినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘నాయకత్వ పోరులో ప్రభుత్వం ప్రస్తుతానికి వేలుపెట్టకూడదని భావిస్తోంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లేదా కోర్టులకు ఈ వివాదం చేరేవరకూ మంత్రులెవరూ మిస్త్రీ, టాటాలను కలిసే అవకాశం లేదు. ఒకరిపక్షాన నిలిచిందన్న ముద్ర పడకుండా ఉండటమే దీనికి ప్రధానకారణం. ఒకవేళ న్యాయపోరాటం మొదలైతే వివాదంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, టాటా-మిస్త్రీ వివాదంలో చోటుచేసుకుంటున్న సంఘటనలను నిశితంగా గమనిస్తున్నామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. -
జైట్లీకి స్వాగతం పలకనున్న యనమల,ఎంపీలు
-
జైట్లీ, ఉర్జిత్ పటేల్ భేటీ
న్యూఢిల్లీ: మానిటరీ పాలసి రివ్యూ సమావేశం త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తో భేటీ అయ్యారు. అక్టోబర్ 4 న ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష జరగనున్న క్రమంలో గురువారం ఆర్థిక మంత్రిని కలిశారు. ఆర్బీఐ గవర్నర్ గా సెప్టెంబర్ 4న పదవీ బాధ్యతలు చేపట్టిన ఊర్జిత్ కు గవర్నర్ గా ఇదే తొలి ద్రవ్య విధాన సమీక్ష . దీంతో రాబోయే ద్రవ్య విధాన సమీక్షపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ భేటీపై పటేల్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.ఆర్ధికవృద్ధి, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే లక్ష్యంతో 2015 నుంచి ఇప్పటివరకూ 150 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గించింది. ఈ సారి రివ్యూలో కూడా వడ్డీ రేట్ల కోత వుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం గత వారం మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు నియామకాన్ని కూడా పూర్తిచేసింది. అయితే తాజా వడ్డీరేట్లను గవర్నర్ నిర్ణయిస్తారా..లేకఎంపీసీ కమిటీ నిర్ణయిస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ప్రభుత్వం ఇటీవల కేంద్ర బ్యాంకు అధిపతిగా పదోన్నతి పొందిన ఉర్జిత్ పటేల్ స్థానంలో ఆర్ బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ ఎంపిక కోసం కసరత్తు మొదలు పెట్టింది. ఈ పదవి భర్తీకి ఆర్థిక శాఖ దరఖాస్తులు కోరుతోంది. కనీసం 25 సంవత్సరాలు , 60 సంవత్సరాల గరిష్ట వయస్సు ఉండాలని, ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 21లోపు దరఖాస్తు చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశం ప్రభుత్వం కార్యదర్శి లేదా సమానమైన స్థాయిలో అనుభవం సహా, ప్రభుత్వ పరిపాలనలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలని తెలిపింది. ప్రస్తుతం నలుగురు డిప్యూటీ గవర్నర్లకు గాను , ఆర్. మహాత్మా గాంధీ, ఎస్ ఎస్ ముంద్రా,ఎన్ ఎస్ .విశ్వనాథన్ ముగ్గురు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు. -
మొండిబకాయిలే సవాల్..
• బ్యాంకులకు మరిన్ని నిధులిచ్చేందుకు బడ్జెట్ పరమైన పరిమితులు... • సొంతంగా సమీకరణపై దృష్టిపెట్టాలి... • ఆర్థిక వ్యవస్థ మెరుగైతే ఎన్పీఏలు తగ్గుతాయ్.. • పీఎస్‌యూ బ్యాంక్ చీఫ్‌లతో భేటీ తర్వాత • ఆర్థిక మంత్రి జైట్లీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండిబకాయిలు(ఎన్పీఏ) సవాలుగా మారాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ)కు భారీగా నిధులను ఇచ్చే విషయంలో బడ్జెట్ పరంగా కొన్ని అడ్డంకులు ఉన్నాయని... సొంతంగా నిధుల సమీకరణకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన సూచించారు. శుక్రవారమిక్కడ పీఎస్బీ చీఫ్‌లతో బ్యాంకుల పనితీరు సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు. ‘బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లపై కొన్ని ఎన్పీఏలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల రుణాల మంజూరుకు అడ్డుకట్టపడుతోంది. ఎన్పీఏల సమస్య ఇలాగే కొనసాగడమో లేదంటే శాశ్వతంగా ఉండిపోయేది కూడా కాదు. అయితే, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే ఈ ఇక్కట్లు తగ్గుముఖంపట్టడంతోపాటు రుణాలిచ్చేందుకు నిధులు కూడా అందుబాటులోకి వస్తాయి. పీఎస్బీలకు మరిన్ని మూలధన నిధులను అందించేందుకు మేం సుముఖమే. కానీ, బడ్జెట్ పరంగా పరిమితులు ఉన్నాయన్న సంగతిని గుర్తుంచుకోవాలి’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, ఎన్పీఏల విక్రయానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడటం లేదని బ్యాంకుల చీఫ్‌లు ప్రస్తావించినట్లు ఆయన చెప్పారు. ఎన్పీఏల విక్రయానికి అవసరమైతే బ్యాంకులకు ఆర్థిక సేవల విభాగం సహకారం అందిస్తుందన్నారు. ఈ ప్రతికూలతలు సద్దుమణిగితే బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను మరింతగా తగ్గించేందుకు వీలవుతుందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని సాధిస్తాం... ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2014-15లో 5.43 శాతం(రూ.2.67 లక్షల కోట్లు) నుంచి 2015-16 నాటికి 9.32 శాతానికి(రూ.4.76 లక్షల కోట్లు) పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దివాళా చట్టం అమలు; సర్ఫేసీ, డీఆర్టీ చట్టాల్లో సవరణలు వంటి పలు చర్యలను ఇటీవల ఆర్బీఐ, ప్రభుత్వం తీసుకున్నాయని.. వీటిని సమర్ధంగా అమలు చేస్తే బ్యాంకులు ఎన్పీఏల సమస్యను ధీటుగా ఎదుర్కోగలవని జైట్లీ చెప్పారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై బ్యాంకులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాయని ఆయన పేర్కొన్నారు. కాగా, నిధుల కొరతను ఎదుర్కొంటున్న 13 పీఎస్బీలకు బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా తొలివిడత రూ.22,915 కోట్ల మూలధనాన్ని కేంద్రం ఇటీవలే సమకూర్చిది. బ్యాంకుల పనితీరు ఆధారంగా ఈ ఏడాది మరిన్ని నిధులను కేంద్రం అందించనుంది. గడిచిన నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం పీఎస్బీలకు రూ.70,000 కోట్ల మేర మూలధన నిధులను ఇచ్చింది. కాగా, వ్యవసాయ రుణాలపై మాట్లాడుతూ.. ఈ రంగానికి అత్యధిక రుణాలే తమ ప్రాధాన్యత అని చెప్పారు. ఈ ఏడాది రూ.9 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలిచ్చే లక్ష్యాన్ని సాధించగలమని జైట్లీ పేర్కొన్నారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి పూర్తి మద్దతు ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ... ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనానికి కట్టుబడిఉన్నామని, ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగువేసే ప్రసక్తే లేదని జైట్లీ తేల్చిచెప్పారు. ఐదు అనుబంధ బ్యాంకుల(స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, బికనీర్ అండ్ జైపూర్, ట్రావంకోర్, పాటియాలా, మైసూర్)తో పాటు భారతీయ మహిళా బ్యాంకు(బీఎంబీ)ను ఎస్బీఐలో విలీనం చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడం తెలిసిందే. ‘ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి మద్దతు పలికింది. కేబినెట్ కూడా ఓకే చెప్పింది. నిబంధనల ప్రకారమే విలీనం పూర్తవుతుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. అఖిలభారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ఐదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేయడం విదితమే. మరోపక్క, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్ విలీనం వద్దంటూ కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. కాగా, ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వానికి 73.98% వాటా ఉంది. దీన్ని దశలవారీగా 49%కి తగ్గించుకోవాలన్నది కేంద్రం యోచన. ద్రవ్యోల్బణం తగ్గుదలను ఆర్బీఐ పరిగణించాలి.. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలను(ఆగస్టులో 5.05 శాతం) దృష్టిలోపెట్టుకొని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రానున్న పాలసీ సమీక్ష(అక్టోబర్ 4న)లో వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో రేట్ల కోతకు ఆస్కారం ఉందా అన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి ఈ విధంగా బదులిచ్చారు. ‘వచ్చే నెలలో జరిగే సమీక్షలో ఆర్బీఐ/ఎంపీసీ(ఒకవేళ అప్పటికి మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటైతే) ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నా. ఆర్బీఐ అనేది అత్యంత బాధ్యతాయుతమైన నియంత్రణ సంస్థ. దాని నిర్ణయంకోసం మనం ఎదురుచూడటంతో పాటు విశ్వసించాలి కూడా’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనల నేపథ్యంలో గడిచిన సమీక్షలో ఆర్బీఐ పాలసీ రేట్లను యథాతథంగా కొన సాగించిన సంగతి తెలిసిందే. -
వీసా ఫీజులపై వివక్ష వద్దు..
• అమెరికాకు భారత్ స్పష్టీకరణ... • వాణిజ్యం, ప్రజా రవాణాపై ప్రభావం పడకూడదు • టోటలైజేషన్ ఒప్పందంపైనా సత్వర నిర్ణయం తీసుకోవాలి న్యూఢిల్లీ: హెచ్1బీ, ఎల్1 వీసాలపై భారీగా ఫీజుల పెంపు వంటి అంశాలు ఇరు దేశాల మధ్య ప్రజా సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే ఈ విషయంలో వివక్షకు తావు లేని నిర్ణయం తీసుకోవాలని అమెరికాకు కేంద్రం స్పష్టం చేసింది. సామాజిక భద్రతా (టోటలైజేషన్) ఒప్పందంపై కూడా త్వరగా తుది నిర్ణయానికి రావాలని కోరింది. మంగళవారం ఢిల్లీలో అమెరికా-భారత్‌ల మధ్య జరిగిన రెండో వ్యూహాత్మక, వాణిజ్య చర్చల సమావేశంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సుష్మాస్వరాజ్‌లు భారత వాణిని బలంగా వినిపించారు. భారత్‌కు విదేశీ నిధులు అవసరం: జైట్లీ భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా సీఈవోలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆహ్వానించారు. జీఎస్టీతోపాటు ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు వృద్ధికి ఊతం ఇస్తాయన్నారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా సీఈవోలతో జైట్లీ మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. మౌలిక రంగంలో భారీగా పెట్టుబడుల అవసరాల దృష్ట్యా భారత్‌కు విదేశీ నిధులు చాలా అవసరమని వారికి జైట్లీ వివరించారు. జైట్లీని కలసిన అమెరికా వ్యాపార ప్రముఖుల్లో అమెరికన్ టవర్ కార్పొరేషన్ సీఈవో జిమ్ టైక్లెట్, క్వాల్కామ్ చైర్మన్ పౌల్ ఈ జాకబ్స్తోపాటు యూఎస్ఐబీసీ ప్రెసిడెంట్ ముకేశ్ అగ్ని తదితరులు ఉన్నారు. అమెరికా భాగస్వామ్యం తప్పనిసరి: సుష్మాస్వరాజ్ ‘సామాజిక భద్రతా ఒప్పందం, హెచ్1బీ, ఎల్1 వీసాలపై ఫీజుల పెంపు అంశాలు రెండు దేశాల ప్రజల రాకపోకలపై ప్రభావం చూపుతాయి. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఈ అంశాలు కీలకం. వీటిపై వివక్ష చూపకుండా ఓ నిర్ణయం తీసుకోవాలి’ అని సుష్మాస్వరాజ్ చెప్పారు. పెట్టుబడులు పెట్టాలి: నిర్మలా సీతారామన్ భారత్‌ను తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని.. అమెరికన్లు పెట్టుబడులు పెట్టాలని భారత్-యూఎస్ సీఈవోల ఫోరం వేదికగా నిర్మలా సీతారామన్ కోరారు. ఈ కార్యక్రమంలో అమెరికా వాణిజ్య మంత్రి ప్రిట్జ్కెర్తోపాటు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు సైతం పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల్లో పండుగ వాతావరణాన్ని అపుడే నింపేసింది. గత రెండు సం.రాలుగా పెండింగ్ లో ఉన్న బోనస్ చెల్లించనున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రకటించారు. ఈ డబుల్ బొనాంజాతో దాదాపు 33 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తమ వార్షిక బోనస్ చెల్లించేందుకు అంగీకరించడంతో ఉద్యోగులు ఆనందోత్సాహాల్లో మునగనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన నిబంధనల ప్రకారం 2014-15 , 2015-16 సం.రాల బోనస్ విడుదల కానుంది. తరువాత ఇది 7 వ వేతన సంఘం కింద పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేఖరులకు చెప్పారు. -
పీవీ గొప్ప సంస్కరణవేత్త కాదు
- తప్పనిసరి పరిస్థితుల వల్లే సంస్కరణలు తెచ్చారు: జైట్లీ - పీవీ ప్రధాని అయినపుడు దేశం దివాలా తీసే పరిస్థితి ఉంది ముంబై : మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గొప్ప సంస్కరణవేత్తో, పెద్ద సరళీకరణవేత్తో కాదని, నెహ్రూ తరహా ఆర్థిక విధానాలు విఫలమవటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పీవీ సంస్కరణలను ప్రారంభించారని కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు. పీవీ ప్రధానిగా ఉండగా 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు. జైట్లీ శనివారం ముంబైలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పీవీ మీద రాసిన పుస్తకం (హాఫ్ లయన్: హౌ పి.వి.నరసింహారావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా)లో ప్రస్తావించిన ఒక ఘటనను ఉటంకిస్తూ.. ‘‘పీవీ ఏపీలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నపుడు ప్రైవేటు కాలేజీలన్నిటినీ రద్దుచేయాలని, ప్రభుత్వమే కాలేజీలు నడపాలన్నది ఆయన తొలి నిర్ణయం. కానీ ఆయన ప్రధాని అయినపుడు దేశ ఖజానాలో విదేశీ మారకద్రవ్య నిల్వలు లేవని ఆయన గుర్తించారు. దేశం దివాలా దిశగా పోతోంది. తప్పనిసరి స్థితి కారణంగా సంస్కరణలు తెచ్చారు.’ అని అన్నారు. తీవ్ర విమర్శల పాలైన ‘హిందూ వృద్ధి రేటు’ (ఆర్థిక సంస్కరణలకు పూర్వం 1950 - 1980ల మధ్య దేశంలో వృద్ధి రేటు)కు నెహ్రూ ఆర్థికవిధానాలే కారణమన్నారు. ‘‘1950, 60లలో మనకు పరిమిత వనరులు ఉన్నాయి. 70లు, 80లలో వృథా అయ్యాయి. అప్పుడు కొన్ని పనులు తామే చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. టెలికం రంగం ఇందుకు ఉదాహరణ. 1947-95 వరకూ ఫోన్ కనెక్షన్ ఇవ్వడం తమ పనేనని ప్రభుత్వాలు భావించాయి. తొలి 50 సంవత్సరాల్లో భారతీయుల్లో ఒక శాతం కన్నా తక్కువ మందికే టెలిఫోన్లు ఉన్నాయి. కానీ టెలికాం రంగంలోకి ప్రైవేటు రంగం ప్రవేశించాక కనెక్షన్ల సంఖ్య 20 ఏళ్లలో 80 శాతానికి పెరిగాయి. తప్పనిసరి పరిస్థితితో నెహ్రూ తరహా ఆలోచనా విధానం నుంచి బయటకు వచ్చాం’’ అని అన్నారు. -
మోదీ ప్రసంగిస్తుంటే హాయిగా నిద్రపోయారు!
న్యూఢిల్లీ: 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి గంభీరంగా ప్రసంగించారు. దాదాపు 94నిమిషాలపాటు ఆయన ప్రసంగం సాగింది. ఈ ప్రసంగాన్ని చాలామంది ఆహూతులు శ్రద్ధగా విన్నారు, కానీ నేతలు మాత్రం పార్టీలకతీతంగా ధ్యానముద్రలోకి దిగారు. ప్రసంగాన్ని ఈ చెవి నుంచి ఆ చెవికి వదిలేసి తాపీగా నిద్రలోకి జారుకున్నారు. మోదీ మాట్లాడుతున్నంతసేపు నిద్రమత్తులో జోగారు. ఒక్కరేమిటి.. ఇలా కునుకుపాట్లు పడుతూ కేంద్ర మంత్రులు, ఇతర నేతలు కెమెరాకు చిక్కారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, మనోహర్ పరీకర్, అనంత కుమార్, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. నిద్రలోకి జారుకున్నట్టు కనిపించారు. కళ్లుమూసి నిద్రమత్తులో ఉన్నట్టు కనిపించిన వారి దృశ్యాలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ కొత్త రికార్డు సృష్టించారు. గత ఏడాది కూడా ఆయన సుదీర్ఘంగా ప్రసంగించి.. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి, వ్యూహాలు, పాకిస్థాన్‌కు గట్టి సందేశం ఇలా పలు అంశాలపై ఈసారి ప్రధాని ప్రసంగం సుదీర్ఘంగా సాగి మరో రికార్డు సృష్టించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే విపాసన ధ్యానాన్ని పది రోజులు ప్రత్యేకంగా సాధన చేసి వచ్చారు. ఆ ప్రభావంతో కేజ్రీవాల్ ధ్యానముద్రలో మునిగిపోగా.. ఆయనను చూసి బీజేపీ నేతలు కాస్తా ధ్యానాన్ని నేర్చుకొని ఉంటారని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. -
మోదీ వ్యాఖ్యలకు పాక్ నుంచి మద్దతు!
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), బలూచిస్థాన్ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను బెలూచిస్థాన్ నాయకులు, హక్కుల కార్యకర్తలు స్వాగతించారు. పీవోకే, బెలూచిస్తాన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి తమకు అండగా నిలువాల్సిన అవసరముందని బలూచిస్తాన్ హక్కుల కార్యకర్త హమ్మల్ హైదర్ బలూచ్ కోరారు. పాక్ ప్రభుత్వం సింధీ రాజకీయ కార్యకర్తలను దారుణంగా హతమారుస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు రాజకీయ కార్యకర్తలను హత్యచేస్తూ మరోవైపు మతగ్రూపులకు మద్దతు పలుకుతున్నదని, ఇది ప్రపంచానికి ముప్పుగా మారే అవకాశముందని పేర్కొన్నారు. అంతర్జాతీయ నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా బలూచిస్థాన్ ప్రజలను పాక్ దారుణంగా పొట్టనబెట్టుకుంటున్నదని తెలిపారు. బలూచిస్థాన్ ప్రజలు భారత్‌తో ఉమ్మడి భావజాల అనుబంధాన్ని కలిగి ఉన్నారని, వారు లౌకిక, ప్రజాస్వామిక విలువలను విశ్వసిస్తారని చెప్పారు. బలూచ్ ప్రజలకు మద్దతునివ్వాలని భారత్ ప్రధానమంత్రి కోరుకోవడం ఇదే మొట్టమొదటిసారని, ఇదెంతో కీలక నిర్ణయమని హమ్మల్ ప్రశంసించారు. పీవోకే, బలూచిస్థాన్ ప్రజలకు మద్దతుగా ప్రధాని మోదీ మాట్లాడినందుకు ఆయనకు హక్కుల కార్యకర్త నైలా ఖాద్రి బలూచ్ కృతజ్ఞతలు తెలిపారు. బలూచిస్థాన్ ప్రజలైన తాము ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, తమ సమస్యను సెప్టెంబర్‌లో జరిగే ఐక్యారాజ్యసమితి సమావేశాల్లో భారత్ లేవనెత్తుతుందని తాము ఆశిస్తున్నామని ఆమె చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) కూడా మన జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగమేనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. బలూచిస్తాన్‌లో, పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో ఉన్న జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రాంతాల్లో పొరుగుదేశం అకృత్యాలను బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకు సంబంధించి దౌత్యపరమైన ఎదురుదాడి ప్రారంభించాలన్నారు. విదేశాల్లో స్థిరపడిన ఆ ప్రాంతాల ప్రజలతో సంబంధాలను ఏర్పర్చుకుని, అక్కడి దారుణ స్థితిగతులపై సమాచారం సేకరించాలని విదేశాంగ శాఖను ప్రధాని ఆదేశించారు. కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి, ఆందోళనలు, పాక్ మద్దతులో సాగుతున్న సీమాంతర ఉగ్రవాద ఫలితమేనని కుండబద్ధలు కొట్టిన మోదీ.. జాతీయ భద్రత, దేశ సమగ్రతకు సంబంధించి రాజీపడే ప్రసక్తే లేదన్నారు. -
పీఓకే కూడా మనదే!
అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ * అక్కడ పాక్ సాగిస్తున్న అకృత్యాలను ప్రపంచం దృష్టికి తేవాల్సి ఉంది * కశ్మీర్ ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం; లోయలో శాంతి సాధిస్తాం * దేశ భద్రత, సమగ్రతపై రాజీలేదు * కశ్మీర్ హింసకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదమే కారణం * అన్ని వర్గాలతో తక్షణం చర్చలు చేపట్టాలి: ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) కూడా మన జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగమేనని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. బలూచిస్తాన్‌లో, పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో ఉన్న జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రాంతాల్లో పొరుగుదేశం అకృత్యాలను బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకు సంబంధించి దౌత్యపరమైన ఎదురుదాడి ప్రారంభించాలన్నారు. విదేశాల్లో స్థిరపడిన ఆ ప్రాంతాల ప్రజలతో సంబంధాలను ఏర్పర్చుకుని, అక్కడి దారుణ స్థితిగతులపై సమాచారం సేకరించాలని విదేశాంగ శాఖను ప్రధాని ఆదేశించారు. కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి, ఆందోళనలు, పాక్ మద్దతులో సాగుతున్న సీమాంతర ఉగ్రవాద ఫలితమేనని కుండబద్ధలు కొట్టిన మోదీ.. జాతీయ భద్రత, దేశ సమగ్రతకు సంబంధించి రాజీపడే ప్రసక్తే లేదన్నారు. గత 35 రోజులుగా కశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు, వాటిలో 55 మంది ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ ఆందోళనలకు పరిష్కారం వెదికే దిశగా లోక్‌సభ లైబ్రరీ హాల్లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో శుక్రవారం మోదీ ప్రసంగించారు. రాజ్యాంగ పరిధిలో కశ్మీర్ సమస్యకు శాశ్వత, శాంతియుత పరిష్కారం వెదికేందుకు కేంద్రం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. అన్ని వర్గాల కశ్మీరీల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాలుగు గంటల పాటు కొనసాగిన భేటీలో కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు, జమ్మూకశ్మీర్‌లో అధికారంలో ఉన్న పీడీపీ పాల్గొన్నాయి. కశ్మీర్ సమస్యపై స్పందించడం ముదావహమన్న పీడీపీ.. అక్కడ విశ్వాస కల్పన చర్యలు చేపట్టాల్సిన తక్షణావసరం ఉందని పేర్కొంది. త్వరలోనే సాధారణ పరిస్థితులు: మోదీ ‘పౌర సమాజానికి దగ్గరవడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల్లో కశ్మీర్ యువత భాగస్వాములయ్యేలా చర్యలు వేగవంతం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరిగిన వేళ, పొరుగు దేశం ప్రోత్సాహంతో సాగుతున్న ఉగ్రవాదం చుట్టుముట్టిన సమయంలో ఈ పోరులో మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలి. ఈ విషయంలో నిర్మాణాత్మక మద్దతును ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం ఆశిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అంకితభావం, మీ పూర్తి సహకారంతో త్వరలోనే జమ్మూ కశ్మీర్లో సాధారణ జన జీవనం తిరిగి నెలకొల్పుతాం’ అని మోదీ అన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కశ్మీర్ అంశాన్ని ఎదుర్కొందన్నారు. వాజ్‌పేయి బాటలోనే పయనిస్తాం ‘అందరి భారతీయుల్లాగానే రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై తీవ్రంగా బాధపడ్డా. విద్యార్థుల చదువుకు ఆటంకాలు చూస్తే బాధగా ఉంది. కశ్మీర్లో పెద్ద ఎత్తున ఉత్పత్తయ్యే యాపిల్స్ మార్కెట్లకు చేరడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సంక్షేమ పనుల్ని కొనసాగించలేకపోతున్నాయి. ప్రజలు, భద్రత దళాలకు చెందిన ఎవరు మరణించినా సరే మనమంతా బాధపడాలి. వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలుపుతున్నా. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు, కశ్మీర్ లోయలో శాంతి నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నాం. అప్పుడే ప్రజలు వారి సాధారణ జీవనం గడపగలరు’ అని పేర్కొన్నారు. కశ్మీర్ చర్చలకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అనుసరించిన ఇన్సానియత్(మానవత్వం), జమ్హూరియత్(ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ మార్గంలోనే పయనిస్తామని చెప్పారు. వారి మనసు గెలవాలి: కాంగ్రెస్ ముఖ్య పార్టీలతో సహా చిన్న పార్టీలు, ఇతర వర్గాల్ని చర్చలకు పిలవాలని భేటీలో కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేశాయి. ‘గాయాల్ని నయం చేయడం ముఖ్యం, చర్చలకు ద్వారాల్ని మూయవద్దు. సామాన్యుల, యువత హృదయాన్ని, మనసుల్ని గెలవాలి’ అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ సూచించారు. అఖిలపక్ష ప్రతినిధుల బృందాన్ని కశ్మీర్‌కు పంపాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. కశ్మీర్‌పై రాష్ట్ర విధానం అంటూ లేదు: జైట్లీ భేటీ అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ... ప్రధాన పార్టీలతో చర్చలు ఇప్పటికే కొనసాగుతున్నాయన్నారు. కశ్మీర్‌పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అంటూ వేర్వేరుగా ఏవీ లేవని, కేవలం కేంద్ర విధానమే ఉందని, పరిస్థితి మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘కశ్మీర్‌కు రూ. 80 వేల కోట్ల ఆర్థిక సాయంపై కసర త్తు కొనసాగుతోంది. కొంత మొత్తం ఇప్పటికే ఇచ్చాం. మిగతా మొత్తానికి త్వరలో కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇస్తుంది’ అని రాజ్‌నాథ్ తెలిపారు. కశ్మీర్‌కు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపే ముందు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయి చర్యల్ని చేపట్టాల్సి ఉందన్నారు. అలాంటి చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలపగానే, బృందాన్ని పంపే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కశ్మీర్‌కు చెందిన అన్ని వర్గాలతో చర్చలు నిర్వహించాలని, పెల్లెట్ గన్స్ వాడకం ఆపాలన్న తమ డిమాండ్లపై కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని సీపీఎం పేర్కొంది. తమ డిమాండ్లను అంగీకరించడం లేదా నిరాకరించడం చేయలేదని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. భారత్‌తో చర్చల యోచన: పాకిస్తాన్ ఇస్లామాబాద్: కశ్మీర్ అంశంపై భారత్‌ను చర్చలకు ఆహ్వానించే ఆలోచనలో పాక్ ఉందని ఆ దేశ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. ఇటీవలి విదేశీ రాయబారుల సదస్సుపై మాట్లాడుతూ... చర్చల విషయమై భారత్‌కు పాక్ విదేశాంగ కార్యదర్శి అధికారికంగా లేఖ రాస్తారని చెప్పారు. కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై మాత్రమే చర్చిస్తామని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. లోక్‌సభలో తీర్మానం కశ్మీర్ హింసపై ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం లోక్‌సభలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. లోయలో శాంతి, భద్రతలు తిరిగి నెలకొనేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో దేశ ఐక్యత, భద్రత విషయంలో రాజీపడొద్దని కోరింది. కశ్మీరీల్లో, యువతలో నమ్మకం పెంపొందించేలా అన్ని వర్గాల ప్రజలు కృషిచేయాలని విజ్ఞప్తి చేసింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తీర్మానాన్ని చదివి వినిపించగా అన్ని పార్టీలూ ఆమోదించాయి. కశ్మీర్లో పరిస్థితి దిగజారుతున్నందున సభలో తీర్మానం చేయాలంటూ కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. అందుకు మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంగీకరించారు. అంతకముందే ఇదే అంశంపై ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రితో కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా చర్చించారు. లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడే కొద్దిసేపటి ముందే తీర్మానానికి ఆమోదం తెలిపారు. జమ్మూకు విస్తరించిన ఆందోళన శ్రీనగర్: కశ్మీర్ లోయలో గత 34రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు శుక్రవారం జమ్మూ ప్రాంతానికీ విస్తరించాయి. కశ్మీర్లో వేర్వేరు చోట్ల జరిగిన వేర్పాటువాదుల ఆందోళనలో శుక్రవారం ఒక్కరోజే 47 మంది గాయపడ్డారు. జమ్మూలోని దోడా జిల్లాలో నిరసనకారుల రాళ్లదాడిలో ఒక డ్యూటీ మేజిస్ట్రేట్, ఒక సీనియర్ ఎస్పీ, ముగ్గురు పోలీసు అధికారులు సహా 12 మంది గాయపడ్డారు. అనంత్‌నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్, బారాముల్లా, సోపోర్, కుప్వారా, బందిపురా జిల్లాల్లో ప్రాంతాల్లో నిరసనకారులు పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. మిలిటెంట్ల కాల్పుల్లో ఇద్దరి మృతి దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు, ఒక పౌరులు మరణించారు. చాన్సెర్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. -
జీఎస్టీ రోడ్‌మ్యాప్ విడుదల
-
జీఎస్టీ రోడ్‌మ్యాప్ విడుదల
♦ ఏప్రిల్ 1, 2017 నుంచి అమలయ్యేలా ప్రణాళిక ♦ వీలైనంత త్వరగా జీఎస్టీ అమలుకు ప్రయత్నం: జైట్లీ న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో వీలైనంత త్వరగా అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. జీఎస్టీ అమలుకు ఏప్రిల్ 1, 2017ను లక్ష్యంగా నిర్ణయించిన కేంద్రం అందుకు పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ను గురువారం విడుదల చేసింది. పన్ను రేటుపై అందరికీ ఆమోదయోగ్య నిర్ణయమే తమ లక్ష్యమని ప్రకటించింది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్లాడుతూ... రాబోయే 30 రోజుల్లో 50 శాతం రాష్ట్రాలు(దాదాపు 16) రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదిస్తాయని ఆశిస్తున్నామన్నారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును వచ్చేవారం ప్రారంభంలో లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బిల్లును లోక్‌సభ ఇంతకముందే ఆమోదించినా సవరణల నేపథ్యంలో మళ్లీ ఆమోదం పొందాలి. 60 వేల మందికి ప్రత్యేక శిక్షణ.. అధియా రూపొందించిన రోడ్ మ్యాప్ ప్రకారం.. 60 వేలమంది రెవెన్యూ అధికారులకు జీఎస్టీ నిబంధనలు, ఐటీ వ్యవస్థపై శిక్షణనిస్తారు. డిసెంబర్ 2016లోగా శిక్షణ పూర్తయ్యాక ఐటీ సంబంధ మౌలికసదుపాయాల ఏర్పాటును మార్చి 2017లోగా పూర్తిచేస్తారు. ఐటీ (సాంకేతిక అంశాలు)పై అధికారులకు జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్) శిక్షణనిస్తుంది. కేంద్ర, రాష్ట్రాలు ఏర్పాటు చేసే ఈ జీఎస్టీఎన్.. ఐటీ వ్యవస్థ, సేవలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పన్ను చెల్లింపుదారులు, ఇతర వర్గాలకు సాయం అందిస్తుంది. మార్చి చివరికి అనుసంధానం రోడ్ మ్యాప్ ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ), బ్యాంకులు, ఆర్బీఐ, రాష్ట్ర రెవెన్యూ విభాగాలు, రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ నెట్‌వర్క్‌ను డిసెంబర్, 2016 చివరికల్లా సిద్ధం చేస్తారు. జనవరి-మార్చి, 2017 మధ్యలో నెట్వర్క్ అనుసంధానంతో పాటు పరీక్షిస్తారు. ప్రస్తుత వ్యాట్, సేవా పన్ను , కేంద్ర ఎక్సైజ్ పన్ను డీలర్లు జీఎస్టీ కోసం కొత్తగా నమోదు చేసుకోనక్కర్లేదు. ప్రస్తుతమున్న సమాచారమే జీఎస్టీ వ్యవస్థలో పొందుపరుస్తారు. కొత్త డీలర్ల కోసం ఆన్లైన్లో ఒక్క దరఖాస్తు సమర్పిస్తే, మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. జీఎస్టీ రిటర్న్స్ విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేవలం ఒక్క దరఖాస్తు దాఖలు చేస్తే సరిపోతుంది. రిటర్న్స్ కోసం నాలుగు దరఖాస్తులే.. సగటు పన్ను చెల్లింపుదారులు సరఫరా రిటర్న్స్, అమ్మకాల రిటర్న్స్, నెలవారీ, వార్షిక రిటర్న్స్‌ల దాఖలుకు నాలుగు దరఖాస్తులు సమర్పిస్తే చాలు. సరఫరా రిటర్న్‌ను ప్రతి నెల 10న సమర్పించాల్సి ఉండగా, ఆ సమాచారాన్నీ పేర్కొంటూ అమ్మకపు రిటర్న్ ను ప్రతి నెలా 15న దాఖలు చేయాలి. ఈ మొ త్తం వివరాలు నెలవారీ, వార్షిక రిటర్న్స్‌లో పొందుపరుస్తారు. చిన్నస్థాయి పన్ను చెల్లింపుదారుల కోసం నాలుగు నెలలకోసారి రిటర్న్స్ దాఖలు చేసేలా పథకం రూపొందించారు. సరైన పరిమితి లేకపోతే ఆర్థిక లోటు జీఎస్టీ రేటుపై 18 శాతం పరిమితి విధించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై జైట్లీ మాట్లాడుతూ.. ‘తమ సొంత కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రాలకు ఆదాయం అవసరం. అదే సమయంలో రాష్ట్రాలకు ఇచ్చేందుకు కేంద్రానికి నిధులు అవసరం. సరైన పరిమితి లేకపోతే ఆర్థిక లోటుకు దారితీస్తుంది. తక్కువ ఆదాయం వసూలు చేసి, ఖర్చు పెంచమని ప్రస్తుత ఆర్థికమంత్రి చెప్పలేరు’ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం 27 నుంచి 32 శాతం పన్ను రేట్లు ఉండగా అవి దిగొస్తాయన్నారు. 22 శాతంతో ద్ర వ్యోల్బణ ప్రమాదం జీఎస్టీ రేటు 22 శాతంగా ఉంటే ద్రవ్యోల్బణం ముప్పు ఉందని, 27 శాతంగా నిర్ణయిస్తే ఆత్మహత్యా సదృశ్యమేనని ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ అన్నారు. జీఎస్టీ 17 నుంచి 19 శాతం మధ్య ఉండాలని, ఆదాయం కోసం పన్ను విధానంపై భారం మోపకూడద ని చెప్పారు. బిల్లు ఆమోదం రేసులో అస్సాం ముందంజ జీఎస్టీ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచేందుకు అస్సాం సిద్ధమవుతుంది. ఆగస్టు 13తో ముగిసే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. వస్తు, సేవల పన్ను అమలుకు క ర్నాటక ప్రభుత్వం సిద్ధమని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. మోదీది పార్లమెంటు ధిక్కారమే!: కాంగ్రెస్ న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు ఆమోదం సందర్భంగా ఉభయసభల్లో దేనికీ హాజరుకాకుండా ప్రధాని మోదీ పార్లమెంటు ధిక్కారానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రగతిశీలమైన బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు ప్రధానికి కనీసం 5 నిమిషాల తీరిక దొరకలేదా? అని పార్టీ ప్రతినిధి జైరాం రమేశ్ ప్రశ్నించారు. ‘ప్రధాని విదేశీ పర్యటనలో లేరు. పార్లమెంటులోని తన కార్యాలయంలోనే ఉన్నారు. అయినా చర్చలో పాల్గొనకపోవటం పార్లమెంటు ధిక్కారమే!. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం సందర్భంగా ప్రధాని పార్లమెంటుకు హాజరు కాకపోవటం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి’ అని తెలిపారు. రాజ్యాంగమే తన భగవద్గీత అన్న ప్రధాని.. ఇప్పుడు రాజ్యాంగాన్నే అవమానిస్తున్నారన్నారు. గతేడాది లోక్‌సభలో జీఎస్టీ బిల్లు ఆమోద సందర్భంలోనూ ప్రధాని సభలో లేని విషయాన్ని గుర్తుచేశారు. జీఎస్టీ రోడ్‌మ్యాప్ క్లుప్తంగా 1. సవరణ బిల్లుకు 30 రోజుల్లో కనీసం 16 రాష్ట్రాల ఆమోదం. 2. రాష్ట్రపతి సమ్మతి అనంతరం జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు. 3. నమూనా జీఎస్టీ నిబంధనలకు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు 4. సీజీఎస్టీ, ఐజీఎస్టీ(అంతరాష్ట్ర) చట్టాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 5. ఎస్జీఎస్టీ(రాష్ట్రాల జీఎస్టీ)కి అన్ని రాష్ట్రాల ఆమోదం. 6. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాల ఆమోదం. 7. డిసెంబర్‌లోగా కేంద్ర, రాష్ట్ర అధికారులకు శిక్షణ పూర్తి 8. డిసెంబర్ 2016 నాటికి జీఎస్టీ సాఫ్ట్వేర్ సిద్ధం. 9. జనవరి- మార్చి, 2017 మధ్యలో జీఎస్టీ సాఫ్ట్వేర్ పరీక్షించడం, అనుసంధానం చేయడం. 10. సంబంధిత వర్గాలతో మార్చి, 2017లోగా సంప్రదింపులు పూర్తి. 11. జీఎస్టీ నిబంధనలపై మార్చి 31, 2017లోగా నోటిఫికేషన్ 12. వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, కేంద్ర ఎక్సైజ్ పన్ను జీఎస్టీలో విలీనం అన్నింటిని దృష్టిలో పెట్టుకునే పన్ను నిర్ణయం: జైట్లీ వీలైనంత త్వరగా జీఎస్టీ అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘ఆర్థిక అవసరాలతో పాటు, పన్ను తక్కువ ఉండేలా అన్నింటిని దృష్టిలో పెట్టుకుని పన్నురేటుపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది’ అని తెలిపారు. అమలుకు తుదిగడువు ఏప్రిల్, 2017పై స్పందిస్తూ... దృఢలక్ష్యం పెట్టుకుంటే ఎప్పటికీ మంచిదేనన్నారు. ‘ఏళ్లు గడిచేకొద్దీ పన్ను రేట్లు దిగొస్తాయి. అనేక నిత్యావసరాల ధరలు తగ్గుతాయి. రోడ్ మ్యాప్‌ను పూర్తిచేయడంతో పాటు జీఎస్టీ అమలుకు ప్రయత్నిస్తాం. ఒకసారి జీఎస్టీ అమలైతే భారత్‌లో వ్యాపారం సులువవుతుంది. ఇది వర్తకులు, వ్యాపారవేత్తలు, ప్రజలకు ఉపయోగకరం. అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించాయి. చివరి దశ చర్చల్లో బిల్లులోని ప్రధాన అంశాలపై రాజీపడకుండా’ అని జైట్లీ చెప్పారు. -
'జైట్లీ ఏమి హామీ ఇచ్చారో వెల్లడించాలి'
హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై దేశంలోని 13 రాజకీయ పార్టీలో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటుంటే... చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ మాత్రం కేంద్రాన్ని అడగలేకపోతున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. తన అవినీతికి భయపడే కేంద్రం వద్ద హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆమె బుధవారమిక్కడ ధ్వజమెత్తారు. నిన్నటి వైఎస్ఆర్ సీపీ బంద్ విజయవంతం కావడం కేంద్రం దృష్టికి వెళుతున్న తరుణంలో టీడీపీ ఎంపీలు ధర్నా ఉపసంహరించుకోవడం సిగ్గుచేట్టు అన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఫోన్లో మాట్లాడరని ధర్నా ఉపసంహరించుకోవడం...ప్రత్యేక హోదా టీడీపీ సొంత వ్యవహారం కాదన్నారు. ప్రత్యేక హోదాపై జైట్లీ ఏమి హామీ ఇచ్చారు? ఎప్పటిలోగా పరిష్కరిస్తామన్నారో బహిర్గతం చేయాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. -
మభ్యపెట్టే మరో డ్రామా!
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ద్వంద్వ వైఖరి బట్టబయలు కేంద్రంలో కొనసాగడమంటే జైట్లీ ప్రకటనను సమర్థించినట్లేగా! ≈ ఇంగ్లీషులో మాట్లాడితే ప్రధాని మోదీకి తెలుస్తుందనా..? ≈ కేంద్రంపై, బీజేపీపై పరుష వ్యాఖ్యలూ లేకుండా జాగ్రత్త ≈ సహకరించడం లేదంటూ ప్రతిపక్షంపై బాబు ఎదురుదాడి ≈ విభజన గాయాలను మళ్లీ రేపే ప్రయత్నం.. ≈ ప్రజల దృష్టి మరల్చడమేనని విశ్లేషకుల వ్యాఖ్య ≈ మంత్రులను ఉపసంహరిస్తే బీజేపీపై ఒత్తిడి పెరగదా? ≈ అదే జరిగితే తనకు ఇబ్బంది అనుకుంటున్నారా? సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై కేంద్రంతో గట్టిగా పోరాడతారని, ప్రత్యేక హోదా సాధన దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తారని ఆశించిన ఐదుకోట్ల మంది తెలుగు ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కలసి ఎన్నికల్లో పోటీ చేసి, కలసి అధికారాన్ని అనుభవిస్తున్న చంద్రబాబు ఇపుడు కేంద్రం నుంచి తన మంత్రులను మాత్రం ఉపసంహరించుకోకుండా పూర్తి నెపాన్ని బీజేపీపై నెట్టే ప్రయత్నం చేయడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. ప్రత్యేకహోదా ఆకాంక్ష పెరగడం, వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో దాని నుంచి బైటపడడం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. తన అసమర్థత బైటపడకుండా కాపాడుకోవడంకోసం ఈ నెపాన్ని బీజేపీపై వేయడానికి అనుకూల మీడియా సహాయంతో వేస్తున్న ఎత్తుగడ అని విశ్లేషకులంటున్నారు. చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి వెంటనే మంత్రులను ఉపసంహరించేవారని వారంటున్నారు. రెండేళ్లుగా రకరకాల ప్రకటనలతో ఏమార్చుతూ వచ్చిన చంద్రబాబు ఈ ఒరవడిని ఇలాగే కొనసాగించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అసాధ్యమని కేంద్రం స్పష్టం చేసేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులంతా ఆగ్రహోదగ్రులవుతున్నారు. పోరాటమే భవిష్యత్ కార్యాచరణగా నిర్దేశించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఏదో కఠిన నిర్ణయం తీసుకుంటారని అంతా ఆశించారు. కానీ కేంద్రంలో కొనసాగుతూనే బీజేపీపై నెపం మోపడం, విభజన కష్టాలను ఏకరువు పెట్టడం, ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడం, వనరులు లేవంటూ వాపోవడం, నిరసనలను నివారించే ప్రయత్నం చేయడం చూస్తుంటే ప్రత్యేకహోదాపై ప్రజలను మభ్యపెట్టేందుకు మరోమారు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమౌతున్నదని విశ్లేషకులంటున్నారు. అసలు రాష్ర్టవిభజనకు తన లేఖే కారణమన్న సంగతిని దాచిపెట్టి.. రాష్ట్రాన్ని నాడు అడ్డగోలుగా విభజించారంటూ విభజన గాయాలను రేపడం ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడ అని వారంటున్నారు. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నామనడాన్ని బట్టి చూస్తే కేంద్రంలో తాము పదవులను వదులుకునేది లేదని పరోక్షంగా తేల్చిచెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. బీజేపీని పల్లెత్తుమాట అనకుండా.. నాడు విభజనకు కారణమైన కాంగ్రెస్‌పైనా, ప్రత్యేక హోదా కోసం ఆందోళనకు సిద్ధమౌతున్న ప్రతిపక్షాలపైనా, ప్రశ్నలడుగుతున్న విలేకరులపైనా విరుచుకుపడడం చూస్తుంటే చంద్రబాబు ఈ అంశాన్ని పక్కదారిపట్టించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకులంటున్నారు. బీజేపీ చేయడం లేదని ఇంగ్లిషులో చెప్పండి... ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీ కారణమని చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించడం చూస్తే నెపం పూర్తిగా వారిపైకి నెట్టేయడం ద్వారా ఈ సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చాలన్నది ఆయన ప్రయత్నంగా కనిపిస్తున్నదని అంటున్నారు. ఒకవైపు వారిపై నెపం నెట్టేస్తూనే బీజేపీపై వ్యక్తిగత విమర్శలకు పోవద్దని నాయకులకు నిర్దేశించడం చంద్రబాబు ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం ఏమీ చేయడంలేదని తెలుగుమీడియాలో మాట్లాడుతున్న చంద్రబాబు అవే విషయాలను జాతీయమీడియాతో మాత్రం చెప్పకపోవడానికి మోడీకి తెలుస్తుందన్న భయమే కారణమని వారు ప్రస్తావిస్తున్నారు. మభ్యపెట్టడంలో సరిలేరెవ్వరూ.. ప్రత్యేకహోదాపై ఎన్నికల ముందు నుంచి నేటి విలేకరుల సమావేశం వరకు వివిధ సందర్భాలలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఎన్నిరకాలుగా మభ్యపెడుతున్నారో తేలిగ్గా అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. ప్రత్యేక హోదా కనీసం పదిహేనేళ్లయినా ఉండాలి అనడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అదే చంద్రబాబు ఎన్నికలు అయిపోయిన తర్వాత హోదా సంజీవని కాదనడం, హోదా ఉన్న రాష్ట్రాలకు ఏం ఒరిగింది అని ఎద్దేవా చేయడం, కేంద్రం హోదా ఇస్తానంటే వద్దంటామా..? కోడలు మగబిడ్డను కంటానంటే ఏ అత్తయినా వద్దంటుందా అని వ్యంగ్యంగా ప్రశ్నించడాన్ని పేర్కొంటున్నారు. ఇపుడు ప్రజలు ప్రత్యేక హోదా సంజీవని అని గ్రహించారని, అందుకే తిరగబడుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో కనిపిస్తున్న ఈ చైతన్యం చూసే చంద్రబాబు మళ్లీ స్వరం మార్చారని, హోదా అవసరమే అని ఇపుడు చెబుతున్నారని వారు పేర్కొంటున్నారు. ఈ దశలో వినతిపత్రమా? ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటామని, పార్టీ ఎంపీలతో వినతిపత్రాన్ని పంపిస్తామని చంద్రబాబు చెబుతుండడాన్ని ప్రస్తావిస్తూ... ఇప్పటికి 37 సార్లు ఢిల్లీ వెళ్లారు.. ఒకటో రెండోసార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఇపుడు మరోమారు వినతిపత్రం ఇస్తామనడంలో అర్ధమేమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ప్రత్యేకహోదా సాధ్యం కాదని అంత స్పష్టంగా చెప్పినా ఇంకా వినతిపత్రం పంపిస్తామని చంద్రబాబు చెప్పడంలో అర్ధం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. తాను అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఇదేనా అని సామాన్యప్రజలకు సందేహం కలుగుతోందని పరిశీలకులంటున్నారు. ఈ దశలో వినతిపత్రం ఇస్తామని చెప్పడం మభ్యపుచ్చడానికి.. ఏమార్చడానికేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నో ఎత్తుగడలు.. ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటనతో తమ మనోభావాలు దెబ్బతినడం, ఉద్యమాలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో తమను మభ్యపుచ్చడం కోసమే చంద్రబాబు రకరకాల వ్యాఖ్యలు చేశారని ప్రజలు భావిస్తున్నారు. విభజన కష్టాలను ఏకరువు పెట్టడం, వనరులు లేవని వాపోవడం వాటిలో భాగమే. అలవిమాలిన దుబారా, ప్రత్యేక విమానాలలో ప్రయాణాలు, అనేక దేశాలకు టూర్లు, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు ప్రకటనలు, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామన్న వ్యాఖ్యలు చూసినవారెవరైనా వనరులు లేవన్న మాటలు నమ్ముతారా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక బంద్‌లు, ఆందోళనలు వద్దని, జపాన్ తరహాలో ఎక్కువ పనిచేసి నిరసన తెలపాలని చంద్రబాబు వారించడం కేంద్రంపై వత్తిడి పెరగకుండా చూడడం కోసమేనా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రత్యేకహోదాపై బాధను వ్యక్తంచేస్తూనే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కేంద్రం పక్కనపెట్టిందని ఆందోళనవ్యక్తం చేయడం ఆయన అసలు ఉద్దేశాన్ని తెలియజేస్తున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 20మంది ఎమ్మెల్యేలను 30నుంచి 40 కోట్లిచ్చి కొనుగోలు చేసిన చంద్రబాబు వారికి రాజకీయ పునరావాసం కల్పించలేకపోతామే అని బాధపడుతున్నారు తప్ప లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని విమర్శకులంటున్నారు. కేంద్రంలో కొనసాగడమంటే సమర్థించినట్లేగా..? ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో స్పష్టంగా చెప్పినా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కొనసాగడమంటే ఆ ప్రకటనకు మద్దతిస్తున్నట్లేనని విశ్లేషకులంటున్నారు. అరుణ్‌జైట్లీ ఆర్థికమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడమంటే ఆ ప్రకటనను సమర్థించినట్లేనని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం మంత్రులను ఉపసంహరించకుండా ఎన్ని చెప్పినా అవన్నీ మభ్యపుచ్చడానికి ఆడుతున్న నాటకాలుగానే భావించాల్సి ఉంటుందని విమర్శకులంటున్నారు. అసలే ‘ఓటుకు కోట్లు’ కేసులోనూ, అనేక అవినీతి ఆరోపణలతోనూ సతమతమవుతున్న చంద్రబాబు ఇపుడు మంత్రులను ఉపసంహరించడంపై బీజేపీ కన్నెర్ర చేస్తే తట్టుకునే స్థితిలో లేరని, అందుకే ఆయన కేంద్రంపై తాను వత్తిడి చేయకపోగా ఎవరూ ఒత్తిడి చేయకూడదని కోరుకుంటున్నారని వారంటున్నారు.ఎల్లోమీడియాలో ఎన్నో ప్రయాసలు.. ఒకవైపు కేంద్రంలో కొనసాగుతూనే, మరోవైపు కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నట్లుగా కనిపించేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకూల మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం చేయిస్తున్నారు. అరుణ్‌జైట్లీ హోదాపై ప్రకటన చేసిన అరగంటలోపే కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇపుడో ఇంకాసేపట్లోనో మంత్రులను ఉపసంహరించేస్తారని కథనాలు ప్రసారమయ్యాయి. ఆదివారం విలేకరుల సమావేశం తర్వాత కూడా చంద్రబాబు ఎంపీలపైనా, కేంద్రంలోని తమ పార్టీ ఇద్దరు మంత్రుల పైనా ఆగ్రహం వ్యక్తంచేశారని, ప్రత్యేక హోదాపై మరింత గట్టిగా పోరాడాలని క్లాస్ పీకారని కథనాలు వచ్చాయి. కావాలంటే మంత్రివర్గం నుంచి వైదొలగడానికి సిద్ధమేనని ఇద్దరు మంత్రులు చెప్పినట్లుగా కూడా చానళ్లు చెప్పేస్తున్నాయి. చంద్రబాబులో నిజంగా అలాంటి చిత్తశుద్ది ఉంటే ఈ సమస్య ఇంతవరకు వచ్చేదే కాదని, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాతనైనా వెంటనే మంత్రులను ఉపసంహరిస్తే ప్రజలు నమ్మేవారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
హోదా ఇవ్వాల్సిందే
-
హోదా ఇవ్వాల్సిందే
అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా హామీలను నెరవేర్చాల్సిందే.. రాజ్యసభలో ఏపీకి అన్ని పార్టీల మద్దతు ♦ నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీని అమలుచేయాలి ♦ ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు-స్థితిగతులు’పై ♦ రాజ్యసభలో స్వల్పకాలిక చర్చలో పార్టీల డిమాండ్ ♦ హోదాతోనే అన్నీ పరిష్కారం కావన్న వెంకయ్యనాయుడు ♦ ప్రత్యేక హోదా కోసం రెండేళ్లుగా తాము చేస్తున్న పోరాటాన్ని సభలో ప్రస్తావించిన వైఎస్సార్సీపీ ♦ కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకు సీఎం చంద్రబాబు మొహమాట పడుతున్నారని కాంగ్రెస్ విమర్శలు ♦ హామీలు అమలు చేస్తారా.. లేదా? చెప్పాలన్న ఏచూరి ♦ బిల్లులో అంశాలు, సభ హామీలు అమలు కావాలన్న కేకే ♦ విపక్షాలపై టీడీపీ విమర్శలు.. కేంద్రాన్ని నిలదీసేందుకు జంకు ♦ నేడూ కొనసాగనున్న చర్చ.. సమాధానం ఇవ్వనున్న జైట్లీ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్ని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం అమలు-స్థితిగతులు’ అన్న అంశంపై గురువారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అన్ని పార్టీలు ఏపీకి అండగా నిలిచాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, బీజేడీ, జేడీయూ, వైఎస్సార్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ తదితర అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. అయితే, చర్చలో బీజేపీ ఒంటరి అయ్యింది. ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... హోదాతోనే అన్ని సమస్యలు పరి ష్కారం కావని అన్నారు. ప్రత్యేక హోదా కోసం రెండేళ్లుగా చేస్తున్న పోరాటాన్ని వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి సభలో ప్రస్తావించారు. ప్రైవేట్ బిల్లును ద్రవ్య బిల్లు అనడం సహేతుకం కాదన్నారు. ఏపీ సీఎం ప్రత్యేక హోదా సంజీవని కాదం టూ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇక టీడీపీ సభ్యులు తమ ప్రసంగాల్లో విపక్షాలను విమర్శించడమే తప్ప ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోయారు. రాజ్యసభలో ప్రత్యేక హోదా పై జరిగిన స్వల్పకాలిక చర్చ శుక్రవారం కూడా కొనసాగనుంది. గురువారం సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 వరకు జరిగిన చర్చలో పలు పార్టీల నేతలు, కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడారు. చర్చలో మరో ముగ్గురు సభ్యులు మాట్లాడాల్సి ఉంది. చివరగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇవ్వనున్నారు. వెంకయ్య వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి అభ్యంతరం రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయని వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో పేర్కొనడంతో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ లేచి ‘‘2012 డిసెంబరు 28న అఖిల పక్ష సమావేశానికి ముందు వైఎస్సార్సీపీ లేఖ రాసింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలని వారు రాశారు’’ అంటూ లేఖ చదివి వినిపించారు. దీనికి విజయసాయిరెడ్డి బదులిస్తూ... ‘‘మేం సపోర్ట్ చేయలేదు. లేఖ సారాంశం చూడండి’’ అని అన్నారు. ఆగస్టు 5న సభలోకి ప్రైవేట్ బిల్లు: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆగస్టు 5న వస్తుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఈ బిల్లుపై ఓటింగ్ అంశాన్ని ప్రస్తావించినప్పుడు... ‘‘రాజ్యాంగం ప్రకారం నడుచుకుం టాం. బిల్లు పాసవుతుందా? లేదా? అనే అంశాన్ని నేనెలా చెప్పగలను’’ అని కురియన్ పేర్కొన్నారు. స్వల్పకాలిక చర్చలో ఎవరేమన్నారంటే.. ప్రత్యేక హోదాతోనే అన్నీ పరిష్కారం కావు ‘‘అప్పట్లో సీమాంధ్రకు ఎలాంటి రక్షణలు లేకుండా రాష్ట్ర విభజన జరుగుతోందన్న వేదనలో మేం కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపాం. మేం విభజన బిల్లుకు మద్దతిస్తాం, కానీ కొన్ని రక్షణలు కావాలని అడిగాం. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాంక్షించి మేం సలహాలిచ్చాం. కానీ అవి బిల్లులో రాలేదు. ఆ రోజు బిల్లు పాసయిన తరువాత మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా గురించి అడిగాయి. అందుకే బిల్లులో పెట్టి ఉండాల్సిందని అడిగాం. హోదాను బిల్లులో చేర్చితే మళ్లీ లోక్‌సభకు వెళ్లాల్సి వస్తుందన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఏపీకి న్యాయం చేయాలన్న తలంపుతో పనిచేశాం. రాష్ట్రంలో అనేక సంస్థలు ఏర్పాటయ్యాయి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర అవసరాలను బట్టి అన్నిరకాలుగా సాయం అందిస్తూనే ఉన్నాం. రెవెన్యూ లోటు అంశాన్ని పరిష్కరించాల్సి ఉంది. చట్టంలో ఇచ్చిన అన్ని హామీలు అమలవుతాయి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సాయం చేస్తుంది. కానీ, అన్నింటికీ అదే పరి ష్కారం కాదు. చట్టంలో ఉన్నవన్నీ నెరవేరుస్తాం. ఏపీ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇంత సాయం చేయలేదు’’ - వెంకయ్య నాయుడు, కేంద్ర సమాచార శాఖ మంత్రి హామీ అమలుపై గడువు చెప్పండి ‘‘ఏపీకి ఇచ్చిన హామీని సర్కారు నిలబెట్టుకుంటుందని రెండేళ్లుగా చూశాం. కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు తీరా ఓటింగ్‌కు వచ్చేసరికి ద్రవ్య బిల్లు అన్నారు. చివరకు స్వల్పకాలిక చర్చకు అవకాశం ఇచ్చారు. ప్రత్యేక హోదా యూపీకి, బిహార్‌కు, ఒడిశాకు ఇవ్వాలి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆంధ్రప్రదేశ్‌ను మిగిలిన రాష్ట్రాలతో పోల్చరాదు. హామీని ఎప్పటిలోగా అమలు చేస్తారో గడువు కూడా చెప్పండి’’ - గులాం నబీ ఆజాద్, ప్రతిపక్ష నేత ఆ హామీలు ఏమయ్యాయి? ‘‘చట్టంలోనిహామీలు, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీల అమలుపై స్పష్టంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. విభజన చట్టంలోని సెక్షన్ 93, 94(2), సెక్షన్84, 85, 90, 94ల అమలు ఏమైంది? సెక్షన్ 46, 46(2) అమలు ఏమైంది? మన్మోహన్సింగ్ ఆరు హామీలు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది? రెవెన్యూ లోటు ఏమైంది?’’ - జైరాం రమేశ్(కాంగ్రెస్) చంద్రబాబుకు మొహమాటమెందుకు? ‘‘ఏపీకి ప్రత్యేక హోదా అంశం భావోద్వేగాలతో కూడి ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాడేందుకు మొహమాటపడుతున్నారు. ఎందుకు ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవడం లేదు? చట్టంలోని హామీలను అమలు చేయాలని ఎందుకు అడగడం లేదు? ప్రధాని ఇచ్చిన హామీల అమలుపై ఒత్తిడి చేయకపోవడానికి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? లేక రాజకీయ అనుకూలత కోసమా?’’ - దిగ్విజయ్‌సింగ్(కాంగ్రెస్) ఎప్పుడు చేస్తారో చెప్పండి ‘‘రెండు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు పరుస్తారా? లేదా?ఎప్పుడు చేస్తారో చెప్పండి. ఇక్కడే ప్రకటించండి. లేదంటే రెండు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు తలెత్తుతాయి. నిర్ధిష్టంగా ఏవిధంగా అమలుపరుస్తారో ఒక ప్రణాళిక ప్రకటించండి. యూపీ, బెంగాల్, బిహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను కూడా పట్టించుకోవాలి’’ - సీతారాం ఏచూరి(సీపీఎం) ‘హోదా’ వ్యాధిలా మారింది ‘‘ఏపీకి ఆదాయ వనరులు లేకుండా పోయాయి. రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక హోదా ఒక వ్యాధిలా మారింది. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి’’ - సీఎం రమేశ్(టీడీపీ) ప్రైవేట్ బిల్లును ఉపసంహరించుకోను ‘‘నా వల్లే ఈ చర్చ వచ్చింది. ఈ చర్చకు అనుమతిస్తే నేను ప్రైవేట్ బిల్లును ఉపసంహరించుకుంటాని అన్నట్లు ప్రచారం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోను. ప్రధానమంత్రి ఇచ్చిన హామీకే ఇప్పుడు విలువ లేకుండా పోయింది. లోపాలు, సాకులు వెతక్కండి. ప్రత్యేక హోదాను పదేళ్ల పాటు అమలు చేయండి. మా హక్కులను కాపాడండి’’ - కేవీపీ రామచంద్రరావు(కాంగ్రెస్) ప్రధాని చెప్పింది అమలు చేయాలి ‘‘ప్రధాన మంత్రి చెప్పిన మాట అమలవ్వాలి. ప్రధాన మంత్రిగా మన్మోహన్సింగ్ ఉన్నా, మోదీ ఉన్నా.. వారు చెప్పింది అమలు కావాలి. లేదంటే ఇదొక చెడు సంప్రదాయం అవుతుంది. యూపీ, బీహార్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ - నరేష్ అగర్వాల్(సమాజ్‌వాదీ పార్టీ) హామీలను అమలు చేయాలి ‘‘ఈ రోజు ఒక పార్టీ అధికారంలో ఉంటే, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి రావొచ్చు. ప్రభుత్వాలు మారినా ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయా లి. మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీలను మీరు(బీజేపీ) నెరవేర్చాలి. తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలి’’ - డి.రాజా(సీపీఐ) పోలవరం ప్రాజెక్టును ఆపాలి ‘‘ఆంధ్రప్రదేశ్ విభజనను కేంద్రం సరిగ్గా డీల్ చేయలేదు. బీజేడీకి ఆంధ్రప్రదేశ్‌పై సానుభూతి ఉంది. ప్రత్యేక హోదాను పొందేందుకు ఒడిశాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అలాగే పోలవరం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకూడదు. దానిని వెంటనే ఆపాలి’’ - అనుభవ్ మొహంతీ(బిజూ జనతాదళ్-ఒడిశా) ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? ‘‘సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రధాన మంత్రి స్వయంగా ఇచ్చిన హామీలు అమలు చేయడం సత్సంప్రదాయం. అయితే యూపీ, ఇతర రాష్ట్రాల ఆర్థిక స్థితి ఏంటి? దానిపై కూడా దృష్టిపెట్టాలి’’ - సుఖేందు శేఖర్ రాయ్(తృణమూల్ కాంగ్రెస్) ఇతర రాష్ట్రాలనూ పట్టించుకోవాలి ‘‘సర్కారు మారినా అంతకుముందు ప్రభుత్వం ఇచ్చి న హామీలన్నీ నెరవేర్చాలి. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అలాగే వెనకబడిన రాష్ట్రాలను కూడా పట్టించుకోవాలి. బిహార్‌కు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిశాయి’’ - అలీ అన్వర్ అన్సారీ(జేడీయూ) తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడలేదు ‘‘ఇక్కడ ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడారా? చట్టం రెండు రాష్ట్రాలకు చెందిన అంశమైనా తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ మిత్రులు అడిగిన ప్రతి అంశానికి నా మద్దతు ఉంది. బిల్లులో ఉన్న అంశంగానీ, లేక సభలో ఇచ్చిన హామీలు కానీ అమలవ్వాలి’’ - కె.కేశవరావు(టీఆర్ఎస్) సాకులు వెతకొద్దు ‘‘ఆనాడు అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారు విభజనకు మద్దతు ఇచ్చారు. ఈ రోజు హామీలు ఎందుకు అమలు చేయడం లేదు. కేబీకే-బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ ఎందుకు ఇవ్వడంలేదు. హోదా ఎందుకు ఇవ్వడం లేదు? సాకులు వెతకొద్దు’’ - టి.సుబ్బరామిరెడ్డి(కాంగ్రెస్) టీడీపీ, బీజేపీ విడిపోవాలని చూస్తున్నారు ‘‘టీడీపీ, బీజేపీ కలిసి 2014 ఎన్నికల్లో పోటీచేశాయి. అన్నదమ్ములా కలిసి పోటీ చేశాం. మా ఇద్దరిని విడగొట్టాలనే భావన కాంగ్రెస్‌కు ఉన్నట్టు మాకు అనుమానం వస్తోంది. కానీ అలా జరగదు. మేం కలిసే పోరాడుతాం. బిల్లులో పెట్టిన అంశంపై పోరాటం చేస్తాం. మా ప్రయత్నంలో ఎక్కడా లోపం లేదు’’ - గరికపాటి రామ్మోహన్రావు(టీడీపీ) మేం అడుక్కుంటున్నామా? ‘‘మేమేమన్నా అడుక్కుంటున్నామా? రాజకీయ ప్రయోజనమా? లేక ప్రాంతీయ ద్వేషమా? తెలుగువాళ్లే కదా! ఏమవుతుందిలే అని తక్కువగా అంచనా వేయకండి. ఐదు కోట్ల ఆంధ్రుల పట్టుదల చూడండి. మంచితనం బలహీనత కాదని గ్రహిస్తారు మీరు. ద్రవ్య బిల్లు అని సాకులు చెబుతూ తప్పుకోవాలని చూస్తున్నారా?’’ - రేణుకా చౌదరి(కాంగ్రెస్) హామీలను నెరవేర్చాలి ‘‘ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. చిన్న రాష్ట్రాలే అభివృద్ధికి హేతువులని బీఎస్పీ నమ్ముతోంది. ఉత్తరప్రదేశ్‌ను కూడా విభజించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా అమలు చేయాలి’’ - వీర్‌సింగ్(బీఎస్పీ) -
పప్పుల ధరలు దిగేదెన్నడు?
తేదీని ప్రకటించాలంటూ లోక్‌సభలో రాహుల్ డిమాండ్ * ధరల అంశంలో ప్రధాని మోదీ మౌనంపై విమర్శలు * అప్పుడు హర హర మోదీ... ఇప్పుడు కందిపప్పు మోదీ * తేదీల కంటే విధానాలతోనే సమస్యల పరిష్కారం: జైట్లీ న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చాక ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఏమీ మాట్లాడలేదని, పప్పుదినుసుల ధరలు ఎప్పుడు తగ్గుతాయో తేదీ ప్రకటించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభలో డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలపై చర్చలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల వేళ హర హర మోదీ అని కీర్తిస్తే... ఇప్పుడు కందిపప్పు మోదీ అంటున్నారు’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వర్షాకాల సమావేశాల్లో మొదటిసారి పూర్తి స్థాయి చర్చలో పాల్గొన్న రాహుల్ ప్రసంగిస్తూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పప్పులు, కూరగాయల ధరలు చుక్కల్ని తాకాయని, ఆ పెరుగుదలతో రైతులు ఎలాంటి లబ్ధి పొందలేదు’ అని విమర్శించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 2014న హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభలో ‘తల్లి, బిడ్డ రాత్రంతా ఏడుస్తూ, తమ కన్నీళ్లను తాగుతూ నిద్రపోయారు’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గుర్తు చేశారు. తోచిన అర్థంలేని వాగ్దానాలు చేసినప్పటికీ, కందిపప్పు ధర ఎప్పుడు దిగివస్తుందో కచ్చితంగా చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో తనకు కాపలాదారు బాధ్యత ఇవ్వాలని చెప్పిన మోదీకి తెలిసే పప్పుదినుసుల దోపిడీ సాగుతోందని రాహుల్ ఆరోపించారు. ‘పారిశ్రామికవేత్తలకు రూ. 52 వేల కోట్ల రుణాల్ని ఈ ప్రభుత్వం మాఫీ చేసింది. ముడిచమురు ధరల తగ్గుదలతో లాభపడ్డ రూ. 2 లక్షల కోట్లతో రైతులు, గృహిణులకు ఏం చేశారు’ అంటూ రాహుల్ నిలదీశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేశాం: జైట్లీ రాహుల్ ఆరోపణల్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. ద్రవ్యోల్బణాన్ని ఎన్డీఏ ప్రభుత్వమే అదుపులోకి తెచ్చిందని, మంచి వానలు పడడంతో నిత్యావసర వస్తువుల ధరలు మున్ముందు తగ్గవచ్చని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీఏ హయాం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి అధిక ద్రవోల్బణం వారసత్వంగా సంక్రమించిందని, యూపీఏ హాయంలో ద్రవ్యోల్బణం, ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని పోల్చి చూడాలన్నారు. ‘తేదీలు ప్రకటించడం కంటే విధానాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయి. మరింత పప్పుధాన్యాల ఉత్పత్తి కోసం రైతుల్ని ప్రోత్సహించే విధానాలపై ప్రభుత్వం కృషిచేస్తోంది’ అని అన్నారు. నెలవారీ లెక్కల ప్రకారం పప్పుదినుసుల ద్రవ్యోల్బణం దిగివస్తోందని, ధరల పెరుగుదలలో అవినీతి కోణం చూడకూడదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కుంభకోణాలు యూపీఏ ప్రభుత్వంలో జరిగినవేనన్నారు. ఆధార్ తప్పనిసరిపై రాజ్యసభలో ఆందోళన ఎల్పీజీ, ప్రజా పంపిణీ వ్యవస్థ, పింఛన్లు వంటి పథకాల లబ్ధికి ఆధార్‌ను తప్పనిసరి చేయడంపై రాజ్యసభ కార్యకలాపాల్ని ప్రతిపక్షాలు గురువారం అడ్డుకున్నాయి. సభా కార్యకలాపాలను రద్దు చేసి ఆధార్ అంశంపై చర్చించాలంటూ తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, సమాజ్‌వాదీ పార్టీలు సభ ప్రారంభానికి ముందు చైర్మన్‌కు నోటీసులిచ్చాయి. కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలిపాయి. కాగా, అటవీకరణ నిధి బిల్లు, 2016ను రాజ్యసభ ఆమోదించింది. గతేడాది మేలో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో గత నాలుగేళ్లుగా ఖర్చుపెట్టకుండా ఉన్న రూ. 42 వేల కోట్లకు మోక్షం లభించింది. లోక్‌పాల్ చట్ట సవరణ బిల్లునూ రాజ్యసభ ఆమోదించింది. -
పన్ను రేటు సహేతుకంగా ఉండాలి: జైట్లీ
పన్ను ఎగవేత మార్గాలను మూసేస్తున్నామని వెల్లడి న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రేటును సహేతుక స్థాయిలో ఉంచడమే ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక శాఖలు సంయుక్తంగా శనివారం నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి జైట్లీ మాట్లాడారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచుకునే విషయమై ఆయన మాట్లాడుతూ... రిటర్నులు దాఖలు చేసే వారిని ఆదాయపన్ను శాఖ విశ్వసించడం ప్రారంభించాలని సూచించారు. గత కొన్ని నెలల కాలంలో విధానాలు సులభతరం అయ్యాయని, ఐటీ శాఖ రిటర్నులు దాఖలు చేసే వారి పట్ల ఇంత స్నేహపూరితంగా వ్యవహరించడాన్ని ఎప్పుడూ చూసి ఉండరని అభిప్రాయపడ్డారు. విధానాలను సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టిన పలు చర్యలను జైట్లీ ప్రస్తావించారు. ఎగవేత దారులపై కఠిన చర్యలు అదే సమయంలో పన్ను ఎగవేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జైట్లీ హెచ్చరించారు. తప్పించుకునే మార్గాలకు చెక్ పెడుతున్నట్టు తెలిపారు. హెచ్ఎస్బీసీలో అక్రమంగా ఖాతాలు కలిగి ఉన్నవారు విచారణ ఎదుర్కొంటున్నారని, పనామా పేపర్లలో ఉన్న వారు సైతం విచారణ ఎదుర్కొనక తప్పదన్నారు. మారిషస్‌తో ఉన్న ఒప్పందాన్ని సవరించామని, భారత్‌లో ఆర్జిస్తూ పన్ను ఎగ్గొట్టే అవకాశం ఇకపై ఉండబోదన్నారు. సైప్రస్‌తో ఉన్న ఒప్పందాన్ని కూడా సమీక్షించామని వచ్చే కొన్ని రోజుల్లో దీన్ని కేబినెట్ ఆమోదించనున్నట్టు వెల్లడించారు. సింగపూర్‌తో ఉన్న ద్వైపాక్షిక పన్ను ఒప్పందాన్ని సవరించే విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. దేశంలో పన్ను రేటు సహేతుక స్థాయిలో ఉండాలని, చెల్లింపుదారుల సంఖ్య భారీగా ఉండాలని, ఐటీ విభాగం పన్ను చెల్లింపు దారులను, రిటర్నులు దాఖలు చేసే వారిని విశ్వసించాలని జైట్లీ అన్నారు. తమ ఆదాయాన్ని దాచి పెట్టి ఉంచిన వారికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకం ఓ మంచి అవకాశంగా పేర్కొన్నారు. -
మానిటరీ పాలసీ కమిటీ పని మొదలు కానుందా?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ఏర్పాటు నేపథ్యంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ గురువారం సమావేశమైంది. ఆర్థిక మంత్రి నివాసంలో జైట్లీ ని కలిసిన రాజన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. వడ్డీ రేట్ల విధానంలో కొత్త విధానాన్నిత్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం, ఆర్బీఐ చర్చిస్తున్నాయన్నారు. ఆగస్టు 9 న నిర్వహించే వడ్డీ రేట్ల సమీక్షలో ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటి (మానిటరీ పాలసీ కమిటీ) మెకానిజం అమలుపై ఈ భేటీ జరిగిందని తెలిపారు. అయితే ఆగస్టు 9న సమీక్ష నుంచే కమిటీ పని మొదలు కానుందా అని ప్రశ్నించినపుడు దానికోసమే ప్రయత్నిస్తున్నామని.. ఎంత తొందరగా ఇది సాధ్యమవుతుందో చూడాలని చెప్పారు. ఇటీవల వడ్డీ రేట్ల విధానాలపై ఆర్బీఐ గవర్నర్ అధికారాలకు కత్తెర వేసిన కేంద్రం,మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, దానికి చట్టబద్ధత కల్పించింది. ప్రస్తుత విధానం ప్రకారం ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి ఆర్బీఐ నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా వడ్డీరేట్లపై నిర్ణయం జరుగనుంది అయితే, ఈ కమిటీ నిర్ణయాన్ని ఆమోదించడం లేదా తోసిపుచ్చే (వీటో) అధికారం మాత్రం ఆర్బీఐ గవర్నర్‌కే ఉంటుంది. అంటే తుది నిర్ణయం ఆర్బీఐ గవర్నర్‌కే ఉన్నట్లు లెక్క. ఎంపీసీ ఏర్పాటుతో గవర్నర్‌కు ఉన్న ఈ అధికారానికి బ్రేక్ పడుతుంది. అయితే, ఆరుగురు సభ్యుల నిర్ణయం టై (రెండు వాదనలవైపు చెరో ముగ్గురు ఉంటే ) అయితే, ఆర్బీఐ గవర్నర్ నిర్ణయాత్మక ఓటును వినియోగించుకోవడానికి ఈ కొత్త విధానం వీలు కల్పిస్తోంది. కాగా దేశంలో వడ్డీ రేట్లు ఏ మేరకు ఉండాలన్నది ఇకపై రిజర్వు బ్యాంకు పరిధిలో ఉండదు. ఇప్పటిదాకా ఆర్బీఐ గవర్నరు తీసుకుంటున్న ఈ నిర్ణయా న్ని ఇక ప్రభుత్వమే తీసుకోనుంది. కీలకమైన పాలసీ వడ్డీరేట్ల నిర్ణయంపై ఆర్బీఐ గవర్నర్‌కు ఉన్న విశేష అధికారాలకు కేంద్రం ముగింపు పలికిన సంగతి తెలిసిందే. -
ఇదే చివరి అవకాశం.. గడువు పొడిగించం
♦ నల్లధనం వెల్లడిపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ♦ వివరాలు గోప్యంగా ఉంచుతాం.. విచారణ ఉండదు ♦ వాణిజ్య సంఘాలు, సీఏలతో సమావేశం న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమంలో భాగంగా తమ రహస్య ఆస్తులు వెల్లడించిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, ఇతర సంస్థలతో పంచుకోబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. వాణిజ్య సంఘాలు, చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు), ఆదాయపన్ను వృత్తి నిపుణులతో మంగళవారం జైట్లీ ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం విషయంలో వారికున్న సందేహాలు తీర్చారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తమ నల్లధనం గురించి ఆదాయపన్ను విభాగానికి తెలియజేసి పన్ను చెల్లించేందుకు కేంద్రం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అప్రకటిత ఆదాయం కలిగి ఉండి, ఆదాయపన్ను వ్యవస్థకు దూరంగా ఉన్న వారు... తమ ఆస్తులను చట్టబద్ధం చేసుకుని ప్రశాంతంగా నిద్రించేందుకు ఇదే చివరి అవకాశమని సమావేశం అనంతరం జైట్లీ మీడియాతో అన్నారు. ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకాన్ని పొడిగించేది లేదని స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో ఇంకా గోప్యంగానే ఉంటే తదనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘పన్నులను విడతల వారీగా చెల్లించే అవకాశం కల్పించాలని వాణిజ్య సంఘాలు సూచించాయి. దీన్ని తప్పకుండా పరిశీలిస్తాం. ఈ మేరకు తదుపరి విడత సందేహాలను నివృత్తి చేస్తూ ఆదాయపన్ను శాఖ ప్రకటన జారీ చేస్తుంది’ అని జైట్లీ చెప్పారు. ఈ పథకానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఐటీ శాఖ మంగళవారం నిర్వహించిన సమావేశంలో వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు పీయూష్‌గోయెల్, ధర్మేంద్ర ప్రదాన్, జితేందర్ సింగ్ పాల్గొన్నారు. వివరాలు గోప్యం: ‘తమ రహస్య ఆస్తుల వివరాలు వెల్లడించి వాటి విలువపై పన్నులు, జరిమానా రూపంలో 45% చెల్లించాల్సి ఉంటుంది. తమ ఆస్తులు, ఆదాయ వివరాలను బయటపెట్టిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. ఎవరితోనూ పంచుకోం. ఏ చట్టం కింద కూడా విచారణ చేపట్టేది లేదు. ఆదాయం ఏ రూపంలో వచ్చిందో కూడా అడగబోము’ అని జైట్లీ స్పష్టతనిచ్చారు. నల్లధనంపై పోరాటం కష్టమే: రాహుల్‌బజాజ్ అణు సరఫరాదారుల బృందంలో భారత్‌కు సభ్యత్వం కల్పించే విషయంలో మద్దతిచ్చేందుకు స్విట్జర్లాండ్ వెనకడుగు వేసిన నేపథ్యంలో... నల్లధనం వెలికితీత అంశంలో ప్రభుత్వం ఏ విధంగా ప్రగతి సాధించగలదని బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ సందేహం వ్యక్తం చేశారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తప్పిదంగా అభివర్ణించారు. ‘బిలియన్ల కొద్దీ డాలర్లను తీసుకురాలేరు. అక్కడే ఏమీ లేవు’ అని అన్నారు. -
కొలిక్కి రాని జీఎస్టీ చర్చలు
కోలకతా: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి రాష్ట్రాల ఆర్థికమంత్రులతో మంగళవారం జరిగిన భేటీ లో మరోసారి నిరాశ తప్పలేదు. వివాదస్పద బిల్లుపై ఏకాభిప్రాయం సాధనకు తంటాలు పడుతున్న జైట్లీ ఇవాల్టి సమావేశంలో కూడా ఏకాభిప్రాయాన్ని సాధించ లేకపోయారు. జీఎస్టీ బిల్లు కు రాష్ట్రాల ఏకాభిప్రాయ సాధనలో భాగంగా 22రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఏడు రాష్ట్రాల ప్రతినిధులతో జైట్లీ సమావేశమయ్యారు. కోల్‌కతాలో జరిగిన ఈ సమావేశంలో ఆయన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జీఎస్టీపై చర్చించారు. అన్ని రాష్ట్రాలు వాస్తవంగా జిఎస్టీ బిల్లును బలపరిచాయనీ, తమిళనాడు రాష్ట్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందని జైట్లీ అన్నారు. రాజ్యంగ సవరణలతోపాటుగా రాష్ట్రాల మౌలిక మద్దతు కూడా అవసరమన్నారు. మరికొన్ని పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు వచ్చే నెలలో మళ్లీ భేటీ కానున్నట్టు జైట్లీ ప్రకటించారు. మీడియాతో మాట్లాడిన జైట్లీ జీఎస్ టీ బిల్లు ఆమోదంపై ఆశావహ దృక్పథంతో ముందుకుపోతామని ఏప్రిల్ 1 గడువుపై ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలమధ్య విరోధం, హాని కలిగించని రీతిలో రూపొందించేందుకు వీలుగా నిపుణులతో చర్చిస్తామన్నారు. ఇది వచ్చే ఆర్థిక మంత్రుల సమావేశానికి దోహదపడుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య శాంతియుతంగా , స్పష్టమైన విధానం రూపొందాలని జైట్లీ నొక్కి చెప్పారు. వస్తు సేవల బిల్లు(జీఎస్టీ)కు తమిళనాడు మినహా దాదాపు అన్ని రాష్ట్రాలూ మద్దతిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జీఎస్టీకి తమిళనాడు మద్దతు తెలపకుండా కొన్ని రిజర్వేషన్లు కావాలని పట్టుబడుతోందని చెప్పారు. ఆ అంశాల్ని పరిశీలించాల్సి ఉందన్నారు. ఇప్పటికే లోక్ సభలో పాసైన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. వర్షాకాల సమావేశాల్లో ఎగువ సభలోనూ ఈ బిల్లును పాస్ చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మరోవైపు సాధికారిక కమిటీ చైర్మన్, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి,మిత్ మిత్రా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రికార్డు స్థాయిలో కమిటీ సభ్యులు హాజరయ్యారని అమిత్ మిత్రా అన్నారు. మంత్రుల బాధ్యతాయుత పనితీరును కొనియాడారు. మళ్లీ ఈ సమావేశం జులై రెండో వారంలో ఉండొచ్చని అమిత్ తెలిపారు. 1947 స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ ఉన్న పాత పన్ను విధానాల్లో సంస్కరణల కోసం సిఫార్సు చేస్తామని చెప్పారు. -
ఇదో అస్థిర దశ అన్న జైట్లీ!
న్యూఢిల్లీ: రాజధాని నగరం ఢిల్లీలో ఇప్పటికే అమల్లో ఉన్న డీజిల్ వాహనాల అమ్మకాల నిషేధం దేశంలోని మరో పదకొండు నగరాల్లో అమల్లోకి రానుంది. ఇందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిర్ణయం తీసుకుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్ కత్తా, పాట్నా, అలహాబాద్, లక్నో, వారణాసి, పూనే, కాన్పూర్, నాగ్ పూర్, జలంధర్, లూధియానా, అమృత్ సర్ నగరాల్లో డీజిల్ వాహనాల నిషేధం అమల్లోకి తెచ్చేందుకు ఎన్జీటీ నిర్ణయించింది. ఆయా నగరాల్లోని కాలుష్యం ఆధారంగా ఎన్జీటీ నిషేధాన్ని అమల్లోకి తేనుంది. ఈనేపథ్యంలో తమ నిర్ణయం మార్చుకోవాలంటూ ఢిల్లీ భారీ పరిశ్రల శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను అభ్యర్థించింది. ఇప్పటికే వారం క్రితం పదేళ్ళు దాటిన డీజిల్ వాహనాలు కేరళ రాజధాని తిరువనంతపురం, పర్యాటక పట్టణం కోచీ సహా రాష్ట్రంలోని ఆరు నగరాల్లో రోడ్లపైకి రావడాన్ని నిషేధిస్తూ ఎన్జీటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలోని మరో 11 నగరాల్లో డీజిల్ వాహనాలు నిషేధించాలన్న గ్రీన్ ట్రిబ్యునల్ తాజా నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ముఖ్యంగా కార్ల తయారీ దార్లకు ఎన్జీటీ నిర్ణయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆరు రోజుల టోక్యో పర్యటనకు వెళ్ళిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశంలో ఆటోకంపెనీలపై మార్కెట్ ప్రతికూలత ప్రభావం, ఆటో పరిశ్రమల్లో పెట్టుబడుల అస్థిరత్వం వంటి విషయాలపై సుజికి మోటార్ ఛైర్మన్ ఒసామును కలసి చర్చించారు. భారతదేశంలో ఆటోరంగం అభివృద్ధి మార్గంలో నడుస్తుందని, ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు అశాశ్వతమైనవేనని అన్నారు. పైగా సుజికి వంటి భారీ పరిశ్రమలపై ఇటువంటి ప్రభావాలు పడే అవకాశం ఉండదని జైట్లీ అభిప్రాయ పడ్డారు. 2015 డిసెంబర్ నుంచి ఢల్లీ పరిసరప్రాంతాల్లో డీజిల్ వాహనాల అమ్మకాల నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. కాలుష్య సాకారంగా మారుతున్న హస్తినలో డీజిల్ కార్లు వినియోగం నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ డీజిల్ వాహనాల అమ్మకాలను నిలిపివేశారు. అనంతరం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కూడ నిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే భారీ డీజిల్ కార్లు, స్పోర్ట్ యుటిలిటీ వాహనాల అమ్మకాల నిషేధం వల్ల ఆటో పరిశ్రమ తీవ్ర నష్టాల బారిన పడటంతోపాటు, పెట్టుబడులను తీవ్రంగా కోల్పోవాల్సి వచ్చింది. అదే కారణంతో సుమారు పదకొండు వేల వాహనాల ఉత్పత్తికూడ నిలిచిపోయింది. అంతేకాక పరిశ్రమల్లో సుమారు ఆరువేలమంది వరకూ ఉద్యోగాలను కూడ కోల్పోయారు. డీజిల్ కార్ల నిషేధం దేశం మొత్తం అమల్లోకి తెస్తే సుమారు ఏభై వేల వరకూ ఉద్యోగాలను కోల్పోవాల్సివస్తుందని సియామ్ రిపోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు ఆటో పరిశ్రమల యజమానులు తిరిగి పెట్రోల్ వాహనాలు, చిన్న డీజిల్ ఇంజన్లను ప్రవేశ పెట్టే ప్రయత్నాలను చేస్తుంటే... నిషేధం పూర్తిగా ఏకపక్ష నిర్ణయం అని సుజికి ఇండియా ఛైర్మన్ సి భార్గవ అన్నారు. ఇటువంటి నిబంధనలు భారతదేశానికే తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ప్రపంచంలోనే అతి పెద్ద ఆటో సంస్థ టయోటా అభిప్రాయ పడింది. ఇకనైనా ఆటో పరిశ్రమల శాఖ విన్నపాలను స్వీకరించి ఎన్జీటీ నిర్ణయం మార్చుకుంటుందో, అనుకున్నట్లుగానే పదకొండు నగరాల్లో అమలు చేస్తుందో వేచి చూడాలి. -
జపాన్ చేరుకున్న జైట్లీ
టోక్యో: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం జపాన్ చేరుకున్నారు. పెట్టు బడులను రాజట్టడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాననుంది. ఇందులో భాగంగా జపాన్ అధ్యక్షుడు షింజొ అబేతో జైట్లీ సమావేశమవనున్నారు. సాప్ట్ బ్యాంకు సీఈఓ మసాయోసి సన్, భారతదేశంలో అతిపెద్ద మోటారు పెట్టుబడిదారు సజుకీ కంపెనీ చైర్మన్ ఒసామా సుజుకి, పలువురు పారిశ్రామిక ప్రముఖులతో ఆయన భేటీ కానున్నారు. రూ.40,000 కోట్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. -
‘రాహుల్ ఏదీ త్వరగా నేర్చుకోలేడు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేన్నైనా ఆలస్యంగా నేర్చుకుంటారనీ, అంత చురుకైన వ్యక్తి కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎద్దేవా చేశారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ మాత్రం చాలా వేగంగా అన్నీ నేర్చుకున్నారని, 1981లో రాజకీయాల్లోకి వచ్చి 1984లో ప్రధానమంత్రి అయ్యారని జైట్లీ వివరించారు. ప్రతిపక్షంలో రాహుల్‌కు పాత్ర ఉందని తాను అనుకోవడం లేదని జైట్లీ అన్నారు. మరోవైపు, కీలకమైన జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో అడ్డుకట్టపడిన నేపథ్యంలో జైట్లీ మరోసారి ఎగువసభపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్షంగా ఎన్నికైన లోక్‌సభకే ఎప్పటికీ అధిక ప్రాధాన్యం ఉండాలన్నారు. ఆర్థిక విధాన నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఇలా ఎంతకాలం రాజ్యసభను ఉపయోగించుకుంటారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పరోక్షంగా ఎన్నికైన రాజ్యసభ.. ప్రత్యక్షంగా ఎన్నికైన లోక్‌సభ విజ్ఞతను ప్రశ్నిస్తుండడంతో భారత ప్రజాస్వామ్యానికి సవాలు ఎదురవుతోందని జైట్లీ గతంలో అన్నారు. -
'అది ఉంటే.. వారికి నిద్ర పట్టదు'
న్యూ ఢిల్లీ: విదేశాల్లో అక్రమంగా డబ్బు దాచుకున్న వారికి రాత్రిళ్లు నిద్రపట్టదని భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. పనామా పేపర్స్ లీకేజ్ అంశంపై గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న భారతీయుల ఆర్థిక వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే ఈ నల్ల కుభేరుల బండారం అందరికీ తెలుస్తోందని అరుణ్ జైట్లీ వెల్లడించారు. విదేశాల్లో కంపెనీలు స్థాపించి పెట్టుబడులు పెట్టినవారిలో ఎంతమంది భారత చట్టాలకు లోబడి నడుచుకున్నారో విచారణ జరుపుతామన్నారు. 'ఆర్బీఐ అనుమతి తీసుకొని విదేశాల్లో కంపెనీలు పెడితే అది చట్టబద్ధం అని, లేనిచో అది చట్టవిరుద్ధం' అని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా జైట్లీ గుర్తుచేశారు. గత నాలుగు రోజులుగా పనామా పేపర్స్ లీకేజ్ అంశంపై మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధినేతలు సైతం ఈ వ్యవహారంలో తలలు పట్టుకుంటున్నారు. అయితే దీంతో ప్రమేయమున్న 500 మంది భారతీయుల్లో ఎంతమంది చట్టబద్ధంగా ఆర్బీఐ అనుమతితో లావాదేవీలు జరిపారనే విషయం తేలాల్సి ఉంది. -
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రభుత్వం!
న్యూ ఢిల్లీః ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ చర్యలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పార్టీ చర్యలు ఉంటున్నాయని, ప్రజలు తీవ్ర నిరాశ వ్యక్త పరుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీకి మంచి అవకాశం ఉందని, ప్రజల్లో సానుకూల స్పందన ఉందని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వంగా ఉందంటూ అరుణ్ జైట్లీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గత ఎన్నికట్లో ఢిల్లీలో బిజేపీ అతి తక్కువ శాతం ఓట్లతో అధికారాన్ని కోల్పోయి ఉండొచ్చుకానీ, ప్రస్తుతం తిరిగి ఆ మెజారిటీని సంపాదించుకున్నామని ఢిల్లీ బిజేపీ కార్యవర్గ సమావేశంలో జైట్లీ చెప్పారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదని, ఒక్క పని కూడ పూర్తి చేయలేదని అన్న ఆర్థిక మంత్రి... ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించని కేజ్రీవాల్ తీరును ప్రజలు గుర్తించారని, కాంగ్రెస్ లెక్కల్లోనే లేకపోగా, బిజెపి తిరిగి రాజకీయ స్థానాన్ని సంపాదించేందుకు ఇదే మంచి అవకాశం అని తెలిపారు. ప్రజల దగ్గరకు వెళ్ళేందుకు ఇదే సరైన సమయమని, వారు చాలా నిరాశలో ఉన్నారని మంత్రి చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించి, ఢిల్లీ ప్రభుత్వ చర్యలను కూడ ఎత్తి చూపాలని ఆయన కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిరాశకు దారి తీసిందని, దేశంలో అన్ని మూలలా రాజకీయ ఉనికిని పెంచేందుకు పోరాడాలని సూచించారు. దేశ వ్యతిరేక నినాదాలను అన్ని విధాలా మౌఖికంగా ఖండించాల్సిన అవసరం ఉందని, జాతి వ్యతిరేక అంశాలను సమ్మతిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వంపై అసమ్మతి తెలపాల్సిన అవసరం ఉందని జైట్లీ అన్నారు. తాముకూడ ఎన్నోసార్లు ప్రతిపక్షంలో ఉన్నామని, అయితే పార్లమెంట్ లో ప్రస్తుత పరిస్థితులు అపూర్వంగా కనిపిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు జైట్లీ ఆరోపించారు. -
మన వృద్ధి తీరుపై నవ్వే రోజులు పోయాయ్
సంస్కరణలతో వృద్ధి జోరు: ఆర్థికమంత్రిజైట్లీ న్యూఢిల్లీ: మన అత్యల్ప వృద్ధి తీరును చూసి ప్రపంచం అపహాస్యం చేసే రోజులు పోయాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. భారత్ స్వాతంత్య్రం పొందిన తర్వాత దీర్ఘకాలం పాటు సాధించిన కేవలం 2-2.5 శాతం సగటు వృద్ధి తీరును చూసి ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’గా ప్రపంచం అపహాస్యం చేసేదని, ఇప్పుడు ఇక ఆ రోజులు లేవని ఆయన ఇక్కడ జరిగిన స్కోచ్ 43వ సదస్సును ఉద్దేశించి పేర్కొన్నారు. భారత్‌లో 1991లో చేపట్టిన ఆర్థిక సరళీకరణ చర్యలు, సంస్కరణలు వృద్ధి రేటును వేగవంతం చేస్తున్నాయని అన్నారు. ఒక దశలో ఈ రేటు 10 శాతానికి చేరిందన్న విషయాన్ని గుర్తు చేశారు. 1991న ప్రారంభమైన సంస్కరణల ప్రక్రియ అంతకు 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైవుంటే... భారత్ మరెంతో ఆర్థికవృద్ధి సాధించి ఉండేదని అన్నారు. ఇప్పుడు సంస్కరణలను వ్యతిరేకించేవారికన్నా... అనుకూలంగా మాట్లాడేవారే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన పథకాల అమలుకు తగిన నిధుల కల్పనకు వీలుగా దేశం వేగవంతంగా వృద్ధి సాధిస్తోందన్నారు. కేవలం అధిక దేశాభివృద్ధి రేటు ద్వారానే ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి సామాజిక అంశాల్లో పురోగతికి వీలవుతుందని వివరించారు. భారత్ ఆర్థిక సంస్కరణల ప్రక్రియపై స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచర్ రాసిన పుస్తకాన్ని జైట్లీ ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇప్పుడు రాను.. ఏప్రిల్ లో వస్తా!
మనీలాండరింగ్ కేసులో ఈడీకి తెలిపిన మాల్యా ముంబై/న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో నేడు (శుక్రవారం) విచారణకు తాను హాజరు కాబోవడం లేదని రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా.. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)కి తెలియజేశారు. హాజరయ్యేందుకు తనకు ఏప్రిల్ దాకా సమయం ఇవ్వాలని కోరారు. విచారణకు రాకపోవడానికి మాల్యా చూపిన కారణాలను పరిశీలిస్తున్నామని, ఆయనకు మరింత సమయం ఇవ్వాలా వద్దా అనే విషయంలో తగు నిర్ణయం తీసుకుంటామని ఈడీ పేర్కొంది. దాదాపు రూ. 9,000 కోట్ల మేర రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో పాటు దాని ప్రమోటరు మాల్యా, యూబీ గ్రూపు ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా ఆరోపణలు ఎదుర్కొంటుండటం, పలు దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐడీబీఐ బ్యాంకు నుంచి పొందిన రూ. 900 కోట్ల రుణానికి సంబంధించి మనీ లాండరింగ్ కోణాన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే మార్చి 18న స్వయంగా విచారణకు హాజరు కావాలని మాల్యాను ఆదేశించింది. అయితే, మార్చి 2నే దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా.. నిర్దేశిత తేదీన తాను రాలేనంటూ తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్‌కు తెలిపారు. మాల్యా ఆస్తులు.. వేలంలో కొనేవారే కరువు .. రుణాల రికవరీ కోసం ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను బ్యాంకులు గురువారం వేలానికి ఉంచగా.. స్పందనే కరువైంది. ఉదయం 11.30 గం.లకు ప్రారంభమైన వేలం .. ఒక్క బిడ్డూ దాఖలు కాకపోవడంతో గంటలోనే ముగిసింది. విలే పార్లే ప్రాంతంలో దాదాపు 17,000 చ. అ. విస్తీర్ణంతో ఈ భవంతి ఉంది. ఎస్‌బీఐక్యాప్స్ ట్రస్టీ నిర్వహించిన వేలంలో ఈ ప్రాపర్టీకి రిజర్వ్ ధరను రూ. 150 కోట్లుగా నిర్ణయించాయి బ్యాంకులు. అయితే, ఒకవైపు లిటిగేషన్ భయాలు మరోవైపు ధర అధికమన్న కారణాలతో ఎవరూ బిడ్ చేయడానికి ముందుకు రాలేదు. ఈ ప్రాపర్టీకి ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ దాదాపు రూ.40-50 కోట్ల విలువను సిఫార్సు చేసినప్పటికీ.. బ్యాంకులు దాన్ని పక్కన పెట్టి రూ. 150 కోట్ల రిజర్వ్ ధరకు మొగ్గు చూపాయి. ప్రాపర్టీ ఉన్న ప్రాంతాన్ని, మార్కెట్ ట్రెండ్‌ను బట్టి చూస్తే బ్యాంకులు చాలా ఎక్కువగానే రేటు పెట్టాయని రియల్టీ కన్సల్టెంట్లు పేర్కొన్నారు. తాజా పరిణామంతో.. వేలం వైఫల్యానికి కారణాలను సమీక్షించేందుకు, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు ఎస్బీఐ సారథ్యంలోని 17 బ్యాం కుల కన్సార్షియం మార్చి 19న సమావేశం కానున్నట్లు సం బంధిత వర్గాలు చెప్పాయి. రేటును రూ.100-120 కోట్లకు కుదించే అవకాశాలను పరిశీలించవచ్చని వివరించాయి. యూబీ బోర్డు నుంచి వైదొలగాలి: హైనెకెన్ యునెటైడ్ బ్రూవరీస్ బోర్డు నుంచి కూడా వైదొలగాలని హైనెకెన్ సంస్థ మాల్యాను కోరే అవకాశం ఉందని సమాచారం. అలా కుదరని పక్షంలో ఆయన్ను తొలగించడంపై ఓటింగ్ కోసం షేర్ హోల్డర్ల సమావేశం నిర్వహించవచ్చని పేర్కొన్నాయి. యునెటైడ్ బ్రూవరీస్లో హైనెకెన్‌కు ప్రస్తుతం 42.4 శాతం వాటాలు ఉన్నాయి. మాల్యా ఇటీవలే యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ హోదా నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. ప్రతీ పైసా రాబడతాం: ఆర్థిక మంత్రి జైట్లీ మాల్యా సంస్థలు తీసుకున్న రూ. 9,000 కోట్లలో బ్యాంకులు ప్రతీ పైసాను రాబడతాయని గురువారం ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మాల్యా ఏయే చట్టాలను ఉల్లంఘించారో వాటన్నింటి విషయంలోను.. వివిధ ప్రభుత్వ విభాగాలు, దర్యాప్తు ఏజెన్సీలు తగు చర్యలు తీసుకుంటాయని ఆయన చెప్పారు. -
అది జాత్యహంకారం..
రాహుల్ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వ్యాఖ్యలపై జైట్లీ * నల్లధనంపై పథకం సంపూర్ణ క్షమాభిక్ష పెట్టదు * నగలపై ఎక్సైజ్ సుంకం ఉపసంహరణ కుదరదు * బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చకు ఆర్థికమంత్రి జవాబు న్యూఢిల్లీ: నల్లధనం వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చేసిన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ వ్యాఖ్యలు జాత్యహంకార మనఃస్థితిని ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తిప్పికొట్టారు. రాహుల్ పేరును ప్రస్తావించకుండానే.. ఆ వ్యాఖ్య రాజకీయంగా సరైనది కాదని, తెల్లగా (ఫెయిర్) లేని వారు ఆకర్షణీయంగా (లవ్లీ) ఉండబోరన్నది ఆ వ్యాఖ్యల మనఃస్థితిని పేర్కొన్నారు. నల్లధనంపై ప్రభుత్వం ప్రకటించిన పథకం సంపూర్ణ క్షమాభిక్ష పెట్టే పథకం కాదని ఉద్ఘాటించారు. నల్లధనం వెల్లడించే వారు 30 శాతం పన్ను, 15% సర్‌చార్జి, జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చకు జైట్లీ సోమవారం సాయంత్రం సమాధానం ఇస్తూ.. ఆటంకతత్వం లేకపోతే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందగలదన్నారు. జీఎస్టీ, దివాలా బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వాలని కోరారు. నగలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలన్న డిమాండ్లను తిరస్కరించారు. జీఎస్టీ అమలు చేయటానికి సన్నాహంలో భాగంగా ఈ సుంకం విధించినట్లు పేర్కొన్నారు. అలాగే.. రుణ బకాయిల చెల్లింపుల్లో విఫలమైన వాణిజ్యవేత్త విజయ్‌మాల్యా దేశం విడిచి వెళ్లటంపై విపక్షాల విమర్శలకు స్పందిస్తూ.. చట్ట వ్యవస్థ ఆ రుణాల వసూళ్లకు అడ్డంకిగా మారి, ఆయన తప్పించుకుపోవటానికి వీలు కల్పించిందా అన్న ప్రశ్న తలెత్తుతోందని వ్యాఖ్యానించారు. అనంతరం.. బడ్జెట్ కసరత్తులో తొలి దశను పూర్తిచేస్తూ వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అర్ధసత్యాల బడ్జెట్: విపక్షంఅంతకుముందు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. బడ్జెట్ అంతా ఎంతో బాగుందన్నట్లు చిత్రిస్తోందని.. అర్థసత్యాలతో నిండి ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ‘అచ్ఛే దిన్’ నినాదాన్ని గుర్తుచేస్తూ.. నిక్కర్ల నుంచి ప్యాంట్లకు ఎదిగిన ఆర్ఎస్ఎస్కు మాత్రమే మంచి రోజులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బడ్జెట్‌కు నూరు శాతం మార్కులు ఇవ్వటాన్ని ప్రస్తావిస్తూ.. పరీక్ష రాసే వారిగా, ఆ పరీక్షను పరిశీలించే వారిగా మోదీయే వ్యవహరిస్తున్నారని తారిక్ అన్వర్ (ఎన్సీపీ) విమర్శించారు. బడ్జెట్ మధ్యతరగతికి వ్యతిరేకమైనదని సంతోక్సింగ్చౌదరి (కాంగ్రెస్) ధ్వజమెత్తారు. బడ్జెట్‌కు దిశానిర్దేశమేదీ లేదని, అంతా డొల్ల అని ప్రకాశ్నారాయణ్యాదవ్ (ఆర్జేడీ) విమర్శించారు. బడ్జెట్లో దూరదృష్టి లేదని తపస్మండల్ (టీఎంసీ) తప్పుపట్టారు. రైతులను కాపాడటానికి ఏదైనా చేయాలని మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ విజ్ఞప్తిచేశారు. రైతుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం వద్ద ఏ మంత్రదండం ఉందని ధర్మేంద్రయాదవ్ (ఎస్పీ) ప్రశ్నించారు. బడ్జెట్ సంతులనంగా ఉన్నప్పటికీ.. కొన్ని లోపాలు ఉన్నాయని, నగలపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలని బుట్టా రేణుక (వైఎస్సార్ కాంగ్రెస్) ప్రభుత్వాన్ని కోరారు. పలువురు బీజేపీ సభ్యులు బడ్జెట్‌ను ప్రశంసించారు. -
రాహుల్ వ్యాఖ్యల్లో అజ్ఞానం కనిపిస్తోంది : జైట్లీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రేరేపించేవిగా ఉన్నాయని, ఫెయిర్ అండ్ లవ్లీ యోజన అంటూ ప్రభుత్వ పథకాలను రాహుల్ విమర్శించడంలో సమన్వయం కనిపించడం లేదని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సమంజసం కాదన్నారు. నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిర్ అండ్ లవ్లీ పథకాన్ని ప్రారంభించింది అంటూ రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... అటువంటి వ్యాఖ్యలు వ్యక్తుల్లోని అజ్ఞానాన్ని తెలియజేస్తాయని అన్నారు. 'ఫెయిర్ అండ్ లవ్లీ యోజన్' అంటూ రాహుల్ వాడిన పదబంధం రాజకీయ నాయకులు మాట్లాడే పద్ధతిలో లేదని, ఇది జాతి అభిప్రాయం అంటూ అరుణ్ జైట్లీ లోక్ సభ బడ్జెట్ చర్చ జరుగుతున్న సమయంలో పేర్కొన్నారు. -
రాహుల్.. పరిణతి ఏదీ?
న్యూఢిల్లీ: పార్లమెంట్లో రాహుల్ ప్రసంగంపై జైట్లీ స్పందిస్తూ.. ‘యువకుడి నుంచి మధ్యవయస్కుడిగా మారుతున్న సమయంలో వ్యక్తుల నుంచి కొంతపరిణతిని ఆశిస్తాం. కానీ రాహుల్ మాట్లాడుతుండగా విన్న ప్రతీసారీ ఆయన మానసిక పరిణితిపై నాకు అనుమానం వస్తుం టుంది’ అని వ్యంగ్యంగా ఫేస్బుక్లో వ్యాఖ్యానించారు. కాగా, నాగా శాంతి ఒప్పందం గురించి తనకు తెలియదంటూ పార్లమెంట్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. నాగా ఒప్పందం సమయంలో తాను ఆ సంప్రదింపుల్లో క్రియాశీలంగా వ్యవహరించానని ట్వీటర్లో తెలిపారు. -
ఎన్ఐఐఎఫ్ లో పెట్టుబడులు పెట్టండి
యూఏఈకి జైట్లీ వినతి... న్యూఢిల్లీ: భారత్ తొలి సావరిన్ వెల్త్ ఫండ్- ఎన్ఐఐఎఫ్లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ యూఏఈకి విజ్ఞప్తి చేశారు. యూఏఈ ఆర్థికమంత్రి సుల్తాన్ అల్ మన్సూరీ ఇక్కడ జరిగిన సమావేశం సందర్భంగా జైట్లీ ఈ విజ్ఞప్తి చేశారు. మౌలిక రంగ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఫండ్‌గా రూ.40,000 కోట్ల ఎన్ఐఐఎఫ్ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభుత్వ వాటా 49 శాతం వాటా కాగా మిగిలిన వాటా ప్రైవేటు ఇన్వెస్టర్లుగా నిర్దేశించడం జరిగింది. గల్ఫ్ ప్రాంతంలో ఇన్వెస్టర్ల నుంచి భారత్ మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులను తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో సన్నిహిత సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఇరువురు నాయకులూ నిర్ణయించినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. -
విదేశీ పెట్టుబడుల ఆక ర్షించేందుకు సంస్కరణలు: జైట్లీ
దావోస్: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచం భారత్‌ను వృద్ధి దేశంగా పరిగణిస్తోందన్నారు. ప్రపంచంలో కేవలం భారత్ మాత్రమే 7 శాతంపైగా వృద్ధిరేటును నమోదు చేస్తోందని చెప్పారు. ఇన్వెస్టర్లకు భారత్‌పై సానుకూల దృక్పథం ఉందని, వారు భారత్‌ను వృద్ధి అవకాశాల దేశంగా చూస్తున్నారని అందుకే అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ కార్యక్రమం ఆనంతరం ఆయన పీటీఐ ప్రతినిధితో మాట్లాడారు. తాము నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగిస్తామని, భారత ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతను పెంపొందిస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడుల పునరుద్ధరణకు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, అమెరికా కూడా కొన్ని సమస్యలతో సతమతమౌతోందని, యూరప్‌లో అస్థిరత పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. -
వృద్ధి అంచనాలు కట్..
► ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు ► 7-7.5 శాతమే ఉండొచ్చు: కేంద్రం ► పన్నులతో బడ్జెట్ లోటు పూడగలదని ధీమా ► రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపే ఉండొచ్చు ► అర్ధసంవత్సర ఆర్థిక విశ్లేషణలో వెల్లడి న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను కేంద్రం కుదించింది. ముందుగా 8.1-8.5 శాతంగా ఉండొచ్చని లెక్కలు వేసినప్పటికీ.. తాజాగా ఇది 7-7.5 శాతం స్థాయికి మాత్రమే పరిమితం కాగలదని పేర్కొంది. అయితే, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా వస్తాయనుకున్న నిధుల పరిమాణం తగ్గినా.. పన్నుల వసూళ్లు అధికంగా ఉండటం ద్వారా బడ్జెట్ లోటు కట్టడి లక్ష్యాన్ని సాధించగలమని తెలిపింది. శుక్రవారం పార్ల మెంటులో ప్రవేశపెట్టిన అర్ధ సంవత్సర ఆర్థిక విశ్లేషణ నివేదికలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 3.9 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొంది. అయితే, 7వ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల భారం గణనీయంగా పెరగనుండటం వల్ల వచ్చే ఏడాది దీన్ని 3.5 శాతానికి తీసుకురావాలన్న లక్ష్యం కొంత ఒత్తిడికి గురికాగలదని ఆర్థిక శాఖ వివరించింది. ‘సవాళ్లున్న నేపథ్యంలో మొత్తం సంవత్సరానికి గాను వాస్తవ జీడీపీ 7-7.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని అంచనా. రిజర్వ్ బ్యాంక్ లక్ష్యానికి అనుగుణంగానే రిటైల్ ద్రవ్యోల్బణం 6% దిగువనే ఉండొచ్చు’అని తెలిపింది. ప్రభుత్వం పాటిస్తున్న ద్రవ్య, ఆర్థిక విధానాలపరంగా ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని విశ్లేషణ సూచిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం.. ఆర్థిక వృద్ధికి చోదకాలుగా ఉంటున్నాయని, ఎకానమీలో కొన్ని అంశాలు మెరుగుపడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ.. స్థూలంగా చూస్తే భారత్ మెరుగ్గానే రాణిస్తోందని ఆయన వివరించారు. పరోక్ష పన్నుల వసూళ్లు బాగున్నాయ్... ప్రత్యక్ష పన్నుల వసూళ్ల కన్నా.. పరోక్ష పన్నుల వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని విశ్లేషణ నివేదిక పేర్కొంది. కార్పొరేట్ల లాభాలు ఆశించినంత స్థాయిలో లేకపోవడమే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కొంత తక్కువగా ఉండటానికి కారణం కావొచ్చని వివరించింది. 2016-17లో చమురు ధరలు మరిం త తగ్గకుండా బ్యారెల్ రేటు 50 డాలర్ల స్థాయి సమీపంలో తిరుగాడిన పక్షంలో ఈ ఏడాది ఎకానమీకి అదనంగా 1-1.5% మేర దోహదపడిన వినియోగ తోడ్పాటు తగ్గవచ్చని నివేదిక వివరించింది. ఒకవేళ వచ్చే ఏడాది రుతుపవనాలు మెరుగ్గా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరగడం ద్వారా ఎకానమీకి అదనంగా తోడ్పాటు లభించగలదని తెలిపింది. కార్పొరేట్ల రికవరీ మందకొడిగానే ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో ప్రైవేట్ పెట్టుబడులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపోవచ్చని నివేదిక వివరించింది. మిశ్రమ సంకేతాలతో గందరగోళం.. ఎకానమీ కోలుకుంటోందని, అయితే దీని పటిష్టత, విస్తృతి అనేది ఎలా ఉందనేది నిర్దిష్టంగా లెక్కించడం.. రెండు కారణాల వల్ల కష్టంగా ఉందని అర్ధ సంవత్సర ఆర్థిక విశ్లేషణ నివేదికను రూపొందించిన ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ... విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఎకానమీ నుంచి మిశ్రమ సంకేతాలు వస్తుండటం ఒక కారణం కాగా, జీడీపీ డేటాను ఏ విధంగా అన్వయించుకోవాలన్న దానిపై అనిశ్చితి నెలకొనడం మరో కారణమని ఆయన తెలిపారు. వివిధ రంగాల్లో చోటు చేసుకుంటున్న అనేకానేక పరిణామాలను అన్వయించుకోవడం కొంత కష్టంగా ఉంటోందన్నారు. ఎకానమీ నుంచి గందరగోళపర్చేవిగా, మిశ్రమంగా వస్తున్న సంకేతాల్లో డేటా అనిశ్చితి అన్నది ప్రతిబింబిస్తోందని అరవింద్ సుబ్రమణ్యన్ తెలిపారు. పర్సనల్ కన్జూ మర్ రుణాలు 15 శాతం మేర వృద్ధి చెందుతుండగా, పరిశ్రమ రుణాల వృద్ధి మందకొడిగా ఉండటం, అలాగే పరోక్ష పన్నుల వసూళ్ల భారీగా ఉండగా.. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు చెప్పుకోదగినట్లు లేకపోవడం దీనికి ఉదాహరణలుగా ఆయన చెప్పారు. మెరుగ్గా విదేశీ మారక నిల్వలు.. కరెంట్ అకౌంట్ లోటు, విదేశీ మారకద్రవ్యం వంటి అంశాలకు సంబంధించి అంతర్జాతీయ కోణంలో భారత్ ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని నివేదిక వివరించింది. కరెంటు అకౌంటు లోటు తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుతం కొంత సానుకూలంగా జీడీపీలో 1.2 శాతం స్థాయికి దిగివచ్చిందని తెలిపింది. అలాగే విదేశీ మారక నిల్వలు డిసెంబర్ 4 నాటికి గణనీయంగా 352.1 బిలియన్ డాలర్ల స్థాయికి పెరిగాయని పేర్కొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే చర్యల వల్ల తలెత్తే ఎటువంటి ఒడిదుడుకులనైనా తట్టుకోగలిగే స్థితిలోనే భారత్ ఉన్నట్లు కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఎకానమీ స్థిరపడుతోంది: జైట్లీ ప్రపంచ ఎకానమీ అనిశ్చితిలో ఉన్నప్పటికీ.. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్య లోటు, కరెంటు అకౌంటు లోటు మొదలైనవి అదుపులోకి వచ్చాయని ఆర్థిక పరిస్థితుల అంశంపై జరిగిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. గడిచిన 19 నెలలుగా విధానాలపరంగా, వ్యవస్థీకృతంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు ఇందుకు దోహదపడ్డాయని జైట్లీ చెప్పారని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. -
జైట్లీపై కేజ్రీ‘వార్’
పరస్పర ఆరోపణలు విమర్శలతో ముదురుతున్న రగడ జైట్లీ తప్పుకోవాలి.. లేదా తప్పించాలి: కేజ్రీవాల్ డిమాండ్ * జైట్లీ హయాంలో డీడీసీఏలో భారీ ఆర్థిక అవకతవకలు: ఆప్ * దృష్టి మరల్చేందుకు కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం: జైట్లీ * యూపీఏ హయాంలోనే జైట్లీకి ఎస్ఎఫ్ఐఓ క్లీన్చిట్: బీజేపీ న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాల నేపథ్యంలో ఢిల్లీ సర్కారుకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య రాజుకున్న రగడ ముదురుతోంది. కేంద్రమంత్రి జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్నపుడు భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని, అందుకు సంబంధించిన ఫైలు కోసమే సీబీఐ దాడులు జరిపిందని ఆరోపించిన కేజ్రీవాల్.. జైట్లీపై తన దాడిని ఉధృతం చేశారు. డీడీసీఏ అవినీతిపై నిష్పాక్షిక దర్యాప్తు జరగటానికి కేంద్ర మంత్రివర్గం నుంచి జైట్లీ తప్పుకోవాలని.. లేదంటే ప్రభుత్వమే ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఆరోపణలపై జైట్లీ ఎదురుదాడికి దిగారు. ఆయన అవినీతి అధికారిని రక్షిస్తున్నారని.. దృష్టి మరల్చేందుకు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ గళం పెంచగా, జైట్లీకి బీజేపీ వెన్నుదన్నుగా నిలిచింది. దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారు?: కేజ్రీవాల్ జైట్లీని ఉచ్చులో బిగించే డీడీసీఏ ఫైలు కోసమే సీబీఐ తన కార్యాలయంపై దాడులు నిర్వహించిందని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ‘‘తనపై ఆప్ చేసిన ఆరోపణలు నిరాధారమని, నిర్దిష్టమైనవి కావని జైట్లీ ఉద్ఘాటించటాన్ని పరమసత్యంగా పరిగణించరాదు.. ఆయనపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. భారీ మొత్తాలు ఉన్నాయి. ఆయన దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారు? జైట్లీ ఏమీ లేదని నిరాకరిస్తున్నారన్న ప్రాతిపదికతో ఆయనపై దర్యాప్తు జరపకుండా వదిలిపెట్టేట్లయితే.. బొగ్గు, 2జీ కేసుల్లో నిందులను కూడా అలాగే వదిలిపెట్టాలా? స్వతంత్ర దర్యాప్తుకు వీలు కలిగించేందుకు ఆయన పదవికి రాజీనామా చేయాలి.. లేదా ఆయన్ను తొలగించాలి’’ అని కేజ్రీవాల్ గురువారం వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు. భారీ మొత్తాలు దారిమళ్లించారు: ఆప్ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న 13 ఏళ్ల కాలంలో ఆ సంఘంలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. భారీ స్థాయిలో నిధులను నకిలీ సంస్థల ద్వారా దారి మళ్లించారని.. క్రికెట్ టీమ్ ఎంపికలు సహా ఇతర అక్రమాలు కూడా జరిగాయని పేర్కొంది. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్చద్దా, పార్టీ ఇతర నేతలతో కలిసి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ డీడీసీఏ అంతర్గత దర్యాప్తు సంఘమైన ఎస్ఎఫ్ఐఓ నివేదిక, ఢిల్లీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదికలను ఉటంకిస్తూ జైట్లీపై ఆరోపణలు గుప్పించారు. ‘‘ఢిల్లీ క్రికెట్ సంఘానికి జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న హయాంలో ఆ సంఘంలో భారీ అవినీతికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సమ్మతి తెలిపారని ధ్వజమెత్తింది. ఈ కేసులో దర్యాప్తు చేసే అధికారం గల కొన్ని దర్యాప్తు సంస్థలు ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నందున.. దర్యాప్తు నిష్పాక్షికంగా జరగటం కోసం జైట్లీ రాజీనామా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరాలి’’ అని డిమాండ్ చేశారు. జైట్లీది మచ్చలేని రాజకీయ చరిత్ర: బీజేపీ జైట్లీది నిష్కళంకమైన రాజకీయ చరిత్ర అని, ఆయనపై ఆరోపణలు దురుద్దేశంతో కూడుకున్నవని బీజేపీ ఖండించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అరుణ్జైట్లీది నిష్కళంకమైన రాజకీయ చరిత్ర. ఆయనపై ఆరోపణలు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పనిచేస్తున్న ఒక అవినీతి అధికారిపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజకీయ చిత్తచాంచల్యం వంటి దూషణాత్మకమైన అసంబద్ధ ప్రచారం. యూపీఏ హయాంలో డీడీసీఏ వ్యవహారాలపై దర్యాప్తు జరిపిన ఎస్ఎఫ్ఐఓ జైట్లీకి క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయటం ఆ పార్టీ రాజకీయ కపటత్వాన్ని బహిర్గతం చేస్తోంది. జైట్లీపై ఆరోపణల ద్వారా ప్రజా దృష్టిని మరల్చాలన్న ఆప్ దురుద్దేశాన్ని బీజేపీ బహిరంగంగా ఖండిస్తోంది. జైట్లీకి మద్దతుగా పార్టీ దృఢంగా నిలుస్తోంది’’ అని పేర్కొన్నారు. జైట్లీపై ఆరోపణలు నిరాధారం: డీడీసీఏ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నపుడు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆప్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డీడీసీఏ ఖండించింది. జైట్లీ క్రికెట్ క్రీడను మెరుగుపరచటం కోసం కృషిచేశారని, ఫిరోజ్‌షా కోట్లా స్టేడియాన్ని ప్రపంచ స్థాయికి పెంచారని.. ఆయనను ఈ వివాదంలోకి లాగటం అనుచితమని పేర్కొంది. ఈ సందర్భంగా.. స్టేడియం పునరుద్ధరణకు అయిన వ్యయానికి సంబంధించిన వివరాలను చదివి వినిపించారు. దృష్టి మరల్చేందుకు తప్పుడు ప్రచారం: జైట్లీ కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ జైట్లీ ఎదురుదాడికి దిగారు. ఆయన గురువారం ఇంటర్నెట్ బ్లాగ్‌లో రాయటంతో పాటు, ఢిల్లీలో మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. ‘‘ఈ ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదు. అసత్యాలు చెప్పటం, అపనిందలు వేయటాన్ని ఆయన విశ్వసిస్తున్నట్లు.. అపస్మారక స్థితికి దగ్గరైన భాషను ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. డీడీసీఏ ఉదంతం.. స్వయంగా తానే బోనులో ఉన్నపుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసే ప్రచార ఎత్తుగడలో భాగం. అవినీతి కేసులో దర్యాప్తు ఎదుర్కొంటున్న ఒక అధికారిని రక్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నేను క్రికెట్ పర్యవేక్షణను 2013 లో వదిలిపెట్టాను. గతంలో ఢిల్లీ క్రికెట్ వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)కు యూపీఏ సర్కారు అప్పగించింది. అది 2013 మార్చి 21న నివేదిక ఇచ్చింది. ఎటువంటి మోసం కనిపించలేదని స్పష్టంచేసింది. డీడీసీఏ అధ్యక్షుడిగా నా పాత్ర ఒక కంపెనీలో రోజు వారీ వ్యవహారాలకు సంబంధం లేని నాన్-ఎగ్జిక్యూటివ్ (నిర్వహణాధికారం లేని) చైర్మన్ పాత్ర వంటిది’’ అని పేర్కొన్నారు. ఆప్ ‘విరాళాల’పై సీబీఐ దర్యాప్తుకు ఢిల్లీ హైకోర్టు నో ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో విరాళాల సేకరణలో విదేశీ మాదకద్రవ్య నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న వినతిని ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన ఒక ఫిర్యాదును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేసిందని పేర్కొంది. -
ఓటమి ప్రభావం ఆర్థిక సంస్కరణలపై ఉండదు: జైట్లీ
న్యూఢిల్లీ: ఎన్డీయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఆర్థిక సంస్కరణలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘ఎన్నికల ఓటమి ఆర్థిక సంస్కరణల అమలుకు ఎదురుదెబ్బగా పరిణమిస్తుందని భావించడం లేదు. ప్రభుత్వపు నిర్మాణాత్మక సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుంది’ అని చెప్పారు. జీఎస్టీ అమలుకు బిహార్ మద్దతునిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే తమ ప్రభుత్వం బిహార్‌కు ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించిందని పేర్కొన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి తామెప్పుడూ చేయూతనందిస్తామని తెలిపారు. ప్రభుత్వం జీఎస్టీ రూపకల్పనకు సంబంధించిన సలహాల స్వీకరణకు తలుపులు తెరచే ఉంద ని చెప్పారు. జీఎస్టీ రేటు సాధ్యమైనంత తక్కువ స్థాయిలోనే ఉంటుందన్నారు. మోదీ తన బీజేపీ సభ్యులను నియంత్రణలో ఉంచుకోవాలని, లేని పక్షంలో ప్రజల విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉందన్న మూడీస్ విశ్లేషణతో జైట్లీ ఏకీభవించలేదు. ప్రపంచంలోనే భారత్ సహనమున్న, స్వేచ్ఛాయుత సమాజమని, ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే దాని ఆధారంగా భారత్‌ను అసహన దేశంగా చూడటం తగదన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలో పాలనా సంస్కృతిని మార్చిందన్నారు. భవిష్యత్తులో తలెత్తే రాజకీయ సమస్యలపై అవగాహన ఉందని, వాటిని పరిష్కరించుకుంటూ ముందకు వెళ్తామని తెలిపారు. -
పార్లమెంటు సమావేశాలు ప్రొరోగ్
జీఎస్టీపై ప్రత్యేక భేటీ లేదు: కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను మళ్లీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ (ముగిసినట్లు ప్రకటన) చేయాల్సిందిగా రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ(సీసీపీఏ) భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వాస్తవ రాజకీయ పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత నెలలో నిరవధిక వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలను జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మళ్లీ సమావేశపరచేందుకు వీలుగా ప్రొరోగ్ చేయని విషయం తెలిసిందే. లలిత్‌మోదీ, వ్యాపమ్ తదితర వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌లను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వర్షాకాల సమావేశాలు ఆద్యంతం పార్లమెంటును స్తంభింపచేసిన కాంగ్రెస్.. ఆ నేతలపై చర్యలు చేపట్టకుండా.. ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ బిల్లులో తాము కోరిన మూడు సవరణలు చేయకుండా.. పార్లమెంటును తిరిగి ప్రత్యేకంగా సమావేశపరచినా ఎటువంటి ఉపయోగం ఉండబోదని మంగళవారం తేల్చిచెప్పింది. దీంతో ప్రత్యేక సమావేశాల ఆలోచనను కేంద్రం విరమించుకుంది. భారీ ఆర్థిక సంస్కరణల్లో ఒకటిగా పరిగణిస్తున్న ఈ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో దీనిపై చర్చలు ఫలించకపోవటంతో.. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నామని జైట్లీ చెప్పారు. ‘ప్రయత్నాలు కొనసాగిస్తాం. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. కాంగ్రెస్ మినహా దాదాపు మిగతా పార్టీలన్నీ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. పార్లమెంటు తదుపరి సమావేశాలు మళ్లీ నవంబర్‌లో జరుగుతాయి. రాజ్యాంగ సవరణ అవసరమైన జీఎస్టీ బిల్లును ఇప్పుడు ఆమోదించని పక్షంలో 2016 ఏప్రిల్ 1 నుంచి దీనిని అమలులోకి తేవాలన్న లక్ష్యం సాధించగలరా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘మీరు ఎంత ఊహించగలరో నేనూ అంతే ఊహించగలను’ అని ఆయన బదులిచ్చారు. అంతకుముందు ద ఎకానమిస్ట్ మేగజీన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సృష్టిస్తున్న అవాంతరాల కారణంగా జీఎస్టీ అమలు జాప్యమవుతుందని వ్యాఖ్యానించారు. -
రైతు రుణాలు మాఫీ చేయండి
ప్రభుత్వానికి మాజీ సీఎం శెట్టర్ సూచన సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు అలుముకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతుల రుణాలను మాఫీ చేయాలని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు రూ.25వేల వరకు రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్టమంతటా పంటనష్టం, అప్పుల బాధతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే 200మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించారు. అంతేకాక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 100కంటే ఎక్కువ తాలూకాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే రైతుల రుణాలను వడ్డీతో సహా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక దానిమ్మ, చెరకు రైతులు దాదాపు రూ.500 వరకు అప్పుల భారాన్ని మోస్తున్నారని, వీరి అప్పులకు సంబంధించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం 25శాతం, కేంద్ర ప్రభుత్వం 75శాతం భరించాలని కోరారు. ఈ అంశంపై త్వరలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి వినతి పత్రాన్ని అందజేయనున్నామని తెలిపారు. అంతేకాక రైతులకు అవసరమైన ఎలాంటి చర్యలు చేపట్టేందుకైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. కరువు నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలను సబ్సిడీ ధరల్లో అందజేయాలని కోరారు. ఇక లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్‌రావు నియామకం సమయంలో శెట్టర్ అవకతవకలకు పాల్పడ్డారన్న మంత్రి టి.బి.జయచంద్ర వ్యాఖ్యలపై జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్‌రావు నియామకం తన హయాంలోనే జరిగినప్పటికీ ఆ నిర్ణయం కేవలం తనది మాత్రమే కాదని అన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతలతో సహా హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి, స్పీకర్ల సలహా మేరకే భాస్కర్‌రావు నియామకం జరిగిందని పేర్కొన్నారు. -
ఏకాభిప్రాయంతోనే సవరణలు
కార్మిక చట్టాలపై ప్రధాని మోదీ * సంఘాలతో సంప్రదింపులు కొనసాగుతాయని వెల్లడి * పెట్టుబడులు ఆగిపోతే ‘ఉపాధి’ ఉండదు: జైట్లీ న్యూఢిల్లీ: కార్మిక చట్టాల్లో సవరణల అంశంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. దీనిపై ఏకాభిప్రాయం ద్వారానే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాలం తీరిన, అనవసర చట్టాలను రద్దుచేయడం అవసరమన్నారు. సోమవారం ఢిల్లీలో 46వ జాతీయ కార్మిక సదస్సును మోదీ ప్రారంభించారు.అనంతరం ప్రసంగించారు. ‘‘కార్మికులు, కార్మిక సంఘాల ప్రయోజనాల మధ్య ఒక సన్నని రేఖ ఉంటుంది. దానిని గుర్తించాలి. ఏకాభిప్రాయం ద్వారా కార్మిక చట్టాలను సవరించడంపై దృష్టి పెడతాం. దీనికి సంబంధించి కార్మిక సంఘాలతో సంప్రదింపులు కొనసాగుతాయి..’’ అని అన్నారు. ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తూ పాలనను మెరుగుపర్చే చర్యల్లో భాగంగా అనవసరపు చట్టాలను రద్దుచేయాల్సి ఉందన్నారు. కార్మిక సంస్కరణలపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఆధ్వర్యంలో మంత్రిత్వశాఖలతో ఉన్నతస్థాయి కమిటీ వేశామని చెప్పారు. విభిన్న గ్రూపులైన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం, కార్మికులు, కార్మికుల ప్రయోజనాల మధ్య సన్నని విభజన రేఖ ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘‘ఒకరు పరిశ్రమను కాపాడాలంటారు, కానీ పారిశ్రామికవేత్తలకు రక్షణ అవసరం లేదంటారు. ఇలాంటి విభజన రేఖను గుర్తించి సమతూకంగా వ్యవహరించే విధానాన్ని అమలు చేసుకోవాల్సి ఉంది..’’ అని మోదీ పేర్కొన్నారు. పరిశ్రమలోని అన్ని స్థాయిల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన, గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉపాధి కష్టమవుతుంది: జైట్లీ వివిధ రంగాల్లోకి పెట్టుబడులు ఆగిపోతే, ఉపాధి కల్పన కష్టమవుతుందని కార్మిక సంఘాలను జైట్లీ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అంశాలపై పట్టుబట్టవద్దని సూచించారు. ‘‘ఒకవేళ పెట్టుబడుల ప్రవాహం ఆగిపోతే.. ఉపాధి కల్పన జరగదు. దాంతో ఆర్థిక కార్యకలాపాలు పెరగవు. దానివల్ల ఉన్న ఉద్యోగాలకు కూడా ఎసరు వస్తుంది..’’ అని అన్నారు. అవి తప్పుడు విధానాలు: బీఎంఎస్ కార్మిక ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలు చేయాలని చూస్తోందని బీజేపీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) జాతీయాధ్యక్షుడు బి.ఎన్.రాయ్ సోమవారం విమర్శించారు. ఈ సంస్కరణలకు కార్మిక సంఘాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోవని స్పష్టం చేశారు. పీఎఫ్ రుణంపై పన్ను, కనీస వేతనాలను కింది స్థాయి వేతనాలుగా మార్పు చేయడం వంటివి పూర్తి తప్పుడు విధానాలని విమర్శించారు. -
భూ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం
పునఃజారీని సవాల్ చేస్తూ ‘సుప్రీం’లో రైతు సంఘాల పిటిషన్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్‌ను పునఃజారీచేయటం రాజ్యాంగ విరుద్ధమంటూ పలు రైతు సంఘాలు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణంలో పారదర్శకత, న్యాయమైన పరిహారానికి హక్కు (సవరణ) ఆర్డినెన్స్ - 2015ను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని భారతీయ కిసాన్ యూనియన్, గ్రామ్ సేవా సమితి, ఢిల్లీ గ్రామీణ్ స్వరాజ్, చోగామ వికాస్ అవాం ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. పార్లమెంటులో చట్టం చేసే ప్రక్రియను కాదని.. వరుసగా ఆర్డినెన్స్‌లు జారీచేయటం రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించటమే కాక రాజ్యాంగాన్ని దగా చేయటమేనని ఆరోపించాయి. భూసేకరణ బిల్లు 2015 మార్చి 10 నుంచి 20 మధ్య లోక్‌సభలో ఆమోదం పొందాక.. దానిని ఉద్దేశపూర్వకంగానే రాజ్యసభలో చర్చకు పెట్టలేదని.. ఆ సభలో ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం లేకపోవటం, దానిపై ఏకాభిప్రాయం లేకపోవటం, రాజకీయ అభీష్టం లేకపోవటం దీనికి కారణమని వివరించాయి. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, హోంశాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలతో పాటు.. మంత్రివర్గ సచివాలయాన్ని ఈ వ్యాజ్యంలో ప్రత్యర్థులుగా చేర్చారు. ఆర్డినెన్స్‌లను కొనసాగించటం, వాటిని పునఃజారీచేయటం అనేది.. కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాన్ని బాహాటంగా వినియోగించటమేనని అభివర్ణించారు. యూపీఏ చట్టం రైతులపై కుట్ర: జైట్లీ యూపీఏ హయాంలో ఆమోదించిన భూసేకరణ చట్టం.. తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే ఉద్దేశంతో.. పల్లెలను అభివృద్ధికి దూరంగా ఉంచేందుకు, భూమిలేని వారిని నిరుద్యోగులుగానే మిగిల్చేందుకు చేసిన కుట్ర అని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. ఆయన భోపాల్‌లో మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో మాట్లాడారు. -
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకండి-జైట్లీ
వారణాసి: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్ నుంచి కీలక నేతలుయోగేంద్ర యాదవ్, ప్రశాంత్,భూషణ్ తొలగింపు పై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. రాజకీయ అపరిపక్వతతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సలహా ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఢిల్లీ ప్రజలు ఆప్ కు అధికారాన్ని అప్పగించారని.. దాని నిలబెట్టుకోవాలన్నారు. ఇదో కొత్త రకం రాజకీయాలంటూ కేజ్రీవాల్ సంభాషణను రికార్డు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం కాదన్నారు ఆమ్ ఆద్మీ పార్టీలో ని కీలకనేతల మధ్య రగిలిన విభేదాలు, బహిరంగ విమర్శలతో పతాక స్థాయికి చేరుకున్నాయి. నేతల మధ్య సయోద్యకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి శనివారం జరిగిన ఆప్ జాతీయ కౌన్సిల్ సమావేశంలో యోగేంద్ర యాదవ్, ప్రశాంత్,భూషణ్ తదితరులను తొంలగించిన సంగతి తెలిసిందే. -
పార్లమెంట్లో ‘భూ’కంపం
లోక్‌సభలో భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం వ్యతిరేకించిన విపక్షం; రైతు వ్యతిరేక బిల్లు అంటూ నినాదాలు నిరసనగా వైఎస్సార్సీపీ సహా విపక్ష పార్టీల వాకౌట్ బిల్లుపై రాజ్యసభలోనూ వ్యక్తమైన వ్యతిరేకత; పార్టీలతో చర్చించాలన్న ఎస్పీ భూసేకరణలో పాత విధానాన్ని అవలంబించే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందన్న జైట్లీ న్యూఢిల్లీ: ఊహించినట్లే భూసేకరణ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది. లోక్‌సభలో బిల్లు ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు.. కలసికట్టుగా వాకౌట్ చేశాయి. ఇది పేదలు, రైతుల వ్యతిరేక.. కార్పొరేట్ల అనుకూల బిల్లు అని, దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశాయి. మరోవైపు, రాజ్యసభకు బిల్లు చేరకముందే పెద్దల సభలో దీనిపై దుమారం రేగింది. బిల్లుపై అఖిలపక్ష భేటీ జరపాలన్న విపక్షాల డిమాండ్ గురించి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని సభానాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చిన అనంతరం సభా కార్యక్రమాలు కొనసాగాయి. ఎన్డీయే మిత్రపక్షం సైతం.. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సంబంధిత ఆర్డినెన్సు స్థానంలో వివాదాస్పద భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ‘న్యాయమైన పరి హార హక్కు, పారదర్శకతలతో కూడిన భూ సేకరణ పునరావాస(సవరణ) బిల్లు, 2015’ ను సభలో ప్రవేశపెట్టేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ స్పీకర్ సుమిత్ర మహాజన్ అనుమతి కోరిన వెంటనే.. వైఎస్సార్సీపీ సహా విపక్షాలన్నీ ఒక్కసారిగా లేచి నిల్చు ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తెలిపాయి. ఆ బిల్లు పేదలు, రైతులకు అన్యాయం చేసేలా ఉందంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్, వామపక్షాలు, టీఎంసీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఎన్డీయే మిత్రపక్షం స్వాభిమాని షేట్కారీ సంఘటన్ పార్టీ ఎంపీ రాజు శెట్టీ సైతం బిల్లును వ్యతిరేకిస్తూ, విపక్షాలతో జతకలవడం విశేషం. బిల్లులోని అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూ.. విపక్ష సభ్యులను శాంతపరిచేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విఫలయత్నంచేశారు. మొదట టీఎంసీ సభ్యుడు సౌగత్‌రాయ్ మాట్లాడుతూ.. ‘ఒక్క కలం పోటుతో రైతులు, నిరుపేదల పక్షాన ఉన్న నిబంధనలను తొలగించి వేశారు. సామాజిక ప్రభావానికి సంబంధించిన నిబంధనలను, రైతుల సమ్మతికి సంబంధించిన భాగాలను తొలగించివేశారు. అలాగే ఆహార భద్రత అంశాన్ని విస్మరించారు. ఈబిల్లును తేవడమంటే రైతులకు అంతిమ ఘడియలను తెచ్చినట్టే’ అన్నారు. ‘ఆర్డినెన్సును తీసుకురావడానికి బదులు, అన్ని పార్టీలను సంప్రదించి ముందుకు వెళ్లి ఉంటే.. అది వేరే సంగతి. కానీ ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకువచ్చి మొండి గా ముందుకెళ్లింది’ అని కాంగ్రెస్ నేత మల్లికార్జున్‌ఖర్గే వ్యాఖ్యానించారు. బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ టీఎం సీ.. బిల్లులోని కొన్ని కీలకాంశాలపై తమకు అభ్యంతరాలున్నాయంటూ బీజేడీ పేర్కొన్నాయి. ఈ సమయంలో తనకు మాట్లాడే అవకాశమివ్వాలన్న టీఆర్ఎస్ నేత బి.వినోద్‌కుమార్ విజ్ఞప్తిని స్పీకర్ తోసిపుచ్చారు. అయినప్పటికీ వినోద్ మాట్లాడుతూ ‘ప్రధానమంత్రి సమాఖ్య స్ఫూర్తి అంటున్నారు. కానీ ఈ బిల్లు తెచ్చేముందు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపనేలేదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒకసారి మాట్లాడండి. మాది కొత్త రాష్ట్రమైనప్పటికీ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే మేం భూసేకరణకు సంబంధించి చట్టం తెచ్చాం. రైతుల మన్ననలు పొందాం. అందువల్ల అందరినీ సంప్రదించడం మంచిది’ అని పేర్కొన్నారు. అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అనుమతించగానే.. వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వి.వరప్రసాద్‌రావు, బుట్టా రేణుక, వై.ఎస్. అవినాశ్‌రెడ్డి సహా విపక్ష సభ్యులంతా వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా.. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారని ప్రతిపక్షాలపై వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. మెజారిటీకి మైనారిటీ ఆజ్ఞలు జారీ చేయడం సాధ్యం కాదన్నారు. యూపీఏ హయాంలో భూసేకరణ చట్టంలో సవరణలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే అభ్యర్థించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 32 ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సవరించాలంటూ విజ్ఞాపనలు చేశాయన్నారు. కాగా, గనులు, ఖనిజాల చట్టం సవరణకు ఉద్దేశించిన బిల్లును బీజేడీ సభ్యుల నిరసనల మధ్య ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్సును గత నెలలో ప్రభుత్వం జారీ చేసింది. ప్రతిపక్షాలను సంప్రదిస్తాం: భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా రాజ్యసభలోనూ విపక్షాలు ఒక్కతాటిపై నిలిచాయి. ఆర్డినెన్సులోని అంశాలు రైతులకు అన్యాయం చేసి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, లెఫ్ట్, బీఎస్పీ, జేడీయూలు ధ్వజమెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా, అదే సమయంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఒక పరిష్కార మార్గాన్ని వెతికేందుకు అన్ని పార్టీలతో ప్రభుత్వం చర్చించాలని సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ సూచించారు. ఆర్డినెన్సు ద్వారా కాకుండా విపక్షపార్టీలను విశ్వాసంలోకి తీసుకుని ఉంటే బావుండేదన్నారు. అనంతరం సభానాయకుడు అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. సరైన స్ఫూర్తితో ఎస్పీ నేత మాట్లాడారని, ఆయన సూచనను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అన్ని పార్టీలను సంప్రదిస్తానన్న జైట్లీ వ్యాఖ్యను స్వాగతిస్తున్నామని, అదే సమయంలో సంప్రదింపులు పూర్తయ్యేంతవరకు ఆర్డినెన్సును సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ చేసిన డిమాండ్‌కు.. అది కుదరదనే అర్థం వచ్చేలా జైట్లీ చేయి అడ్డంగా ఊపడం కనిపించింది. బీజేపీ సహా అన్ని పార్టీలు ఆమోదించి, చట్టంగా రూపొందిన బిల్లుకు సవరణలు చేస్తూ.. పార్లమెంటును తోసిరాజని ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్సును తీసుకువచ్చిందన్న కాంగ్రెస్ విమర్శలపై జైట్లీ స్పందిస్తూ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 639 ఆర్డినెన్సులు వచ్చాయని, అందులో 80% కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయని గుర్తుచేశారు. పార్లమెంటును కాదని చట్టాలు చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. భూసేకరణ ఆర్డినెన్సు స్థానంలో రూపొం దించిన బిల్లు ప్రస్తుతం లోక్‌సభలో ఉందని, అక్కడ ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభకు వస్తుందన్నారు. బిల్లులో రైతుల పరిహారం 4 రెట్లు పెంచుతూ ప్రతిపాదనలున్నాయన్నారు. అయినప్పటికీ విపక్షాల విమర్శలు ఆగకపోవడంతో.. బిల్లు సభలోకి వచ్చాక విపక్షం అభ్యంతరాలు తెలప వచ్చన్నారు. ఈ భూ సేకరణ బిల్లు చట్టరూపం దాల్చినప్పటికీ.. పాత పద్ధ్దతే కొనసాగించుకునేందుకు రాష్ట్రాలకు అవకాశముందని జైట్లీ వివరించారు. జవహర్లాల్ నెహ్రూ పాలనలోనే ఎక్కువ ఆర్డినెన్సులు వచ్చాయన్న జైట్లీ ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ స్పందిస్తూ.. దేశ విభజన అనంతర విపత్కర పరిస్థితుల్లో ఆ ఆర్డినెన్సులు వచ్చాయన్న విష యం గుర్తుంచుకోవాలన్నారు. ‘యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టాన్ని కూడా మేం వ్యతిరేకించాం. కానీ, ఎన్డీఏ ఆర్డినెన్సును చూస్తుంటే వారు(యూపీఏ) దేవతల్లా కనిపిస్తున్నారు’ అని టీఎంసీ సభ్యుడు ఒబ్రెయిన్ అన్నారు. ఇరుకున పడ్డ ప్రభుత్వం: మూడు బిల్లులను రాజ్యసభ నుంచి ఉపసంహరించేందుకు చేసిన ప్రయత్నం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. ఇన్సూరెన్స్ బిల్లు, బొగ్గు గనుల బిల్లు, మోటారు వాహనాల బిల్లులను రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుని, మొదట లోక్‌సభలో ప్రవేశపెట్టాలనుకున్న ప్రభుత్వ ఉద్దేశాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. ఉపసంహరణ తీర్మానంపై చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. గత సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టామని, అనంతరం వాటికి సంబంధించిన ఆర్డినెన్సులను జారీ చేసినందున సభనుంచి వాటిని ఉపసంహరించాల్సి ఉందన్న జైట్లీ వివరణతో విపక్షం సంతృప్తి చెందకపోవటంతో తీర్మానాన్ని వాయిదా వేస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఆర్డినెన్సుల స్థానంలో తీసుకువచ్చిన బిల్లుల ఆమోదంలో విఫలమైన పక్షంలో బడ్జెట్ సమావేశాల అనంతరం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. లోక్సభలోమెజారిటీ ఉన్నప్పటికీ.. రాజ్యసభలో తగిన మద్దతు లేకపోవడంతో ఈ బిల్లుల ఆమోదం ప్రభుత్వానికి సమస్యగా మారింది. -
5.5-5.9 శ్రేణిలో జీడీపీ వృద్ధి: జైట్లీ
న్యూఢిల్లీ: ఆహారం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుదల ధోరణి ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదపడుతుందని ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.5 శాతం నుంచి 5.9 శాతం శ్రేణిలో నమోదుకావచ్చన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సంప్రదింపుల కమిటీ సమావేశంలో శుక్రవారం మాట్లాడిన మోదీ, అధిక స్థాయిలో వృద్ధి సాధనే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దీనితోపాటు పొదుపుల పెంపు, ద్రవ్య స్థిరత్వం, కరెంట్ అకౌంట్ లోటు కట్టడి, పెట్టుబడులకు ఊపునివ్వడం ప్రభుత్వ ఇతర ప్రాధాన్యతాంశాలని అన్నారు. తయారీ, మౌలిక, ఎగుమతుల రంగాలకూ ఊపునివ్వాల్సిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. అధిక పన్ను రిఫండ్స్ ద్రవ్యలోటు పెరగడానికి కారణమవుతోందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఆర్థిక శాఖ ఐదుగురు కార్యదర్శులు పాల్గొన్నారు. లక్ష్యంలో 83 శాతానికి ద్రవ్యలోటు...: కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం ద్రవ్యలోటు లక్ష్యంలో, ఈ పరిమాణం సెప్టెంబర్ ముగింపునకే 83 శాతానికి చేరినట్లు శుక్రవారం విడుదలైన గణాంకాలు తెలిపాయి. 2014-15లో ద్రవ్యలోటు బడ్జెట్ లక్ష్యం రూ.5.31 లక్షల కోట్లుకాగా (జీడీపీలో 4.1 శాతం), సెప్టెంబర్ ముగింపు నాటికే ఈ పరిమాణం రూ.4.38 లక్షల కోట్లకు చేరింది. -
ఇన్నేళ్లకు స‘పోర్టు’
- కాకినాడ డీప్ వాటర్, యాంకరేజ్ పోర్టులకు కేంద్ర బడ్జెట్లో చోటు - హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ - కార్మికులకు ఉపాధితో పాటు ఎగుమతులు పెరుగుతాయని పోర్టు వర్గాల హర్షం కాకినాడ క్రైం : ఇన్నేళ్లకు కాకినాడ పోర్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర సాధారణ బడ్జెట్లో కాకినాడ పోర్టు అభివృద్ధికి స్థానం కల్పించింది. పోర్టులో హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడలో డీప్‌వాటర్, యాంకరేజ్ పోర్టులు న్నాయి. వందేళ్లపైగా చరిత్ర కలిగిన యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం, మొక్కజొన్న వంటి వి, అత్యాధునిక వసతులతో ఏర్పాటైన డీప్ వా టర్ పోర్టు నుంచి క్రూడాయిల్, వంట నూనె, బొగ్గు, ఎరువులు, గ్రానైట్ రాళ్లు ఎగుమతవుతున్నాయి. యాంకరేజ్ పోర్టులో నెలకు సుమారు 10 ఓడల్లో, డీప్‌వాటర్ పోర్టులో రమారమి రో జుకు పది ఓడల్లో ఎగుమతి దిగుమతులు జరుగుతుంటాయి. కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతుండడంతో భారీ స్థాయి లో విదేశీ మారకద్రవ్యం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో యాంకరేజ్ పో ర్టు దాదాపు నిర్వీర్యమైపోయింది. కనీసం జట్టీలు కూడా లేక, రోడ్లు సక్రమంగా లేక ఎగుమతి దిగుమతులకు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. వందేళ్ల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి బీడు పాళీలు, పొగాకు కూడా ఎగుమతయ్యేవి. సౌకర్యాలు లేకపోవడంతో చాలా సరుకులు ముంబై, విశాఖపట్నం ఓడ రేవులకు తరలిపోవడంతో పోర్టుపై ఆధారపడిన వేల మంది కూలీల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రస్తుత కేంద్రం కాకినాడ పోర్టు అభివృద్ధిపై దృష్టి సారించడంతో వేల మందికి ఉపాధితో పాటు భారీస్థాయిలో వ్యాపారం జరిగే అ వకాశం ఉందని పోర్టు వర్గాలు పేర్కొంటున్నా యి. కాకినాడ పోర్టులో హార్డ్‌వేర్ పార్కు అభివృ ద్ధి చేయడమే కాక త్వరలోనే కస్టమ్స్ కమిషరేట్ కూడా ఇక్కడికి మారనుంది. కాకినాడ పోర్టును అనుసంధానం చేస్తూ విశాఖ- చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొం దించడంతో కాకినాడ పోర్టుకు మహర్దశ పడుతుందని భావిస్తున్నారు. ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఏర్పాటుకు కూడా కేంద్రం సుముఖంగా ఉండడంతో పోర్టు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని వ్యాపారులంటున్నారు.