Haritaharam
-
సింబలో మంచి సందేశం ఉంది
‘‘సింబ’ మూవీ ప్రారంభం కావడానికి కారణం ఉదయభాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆమె నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత కేసీఆర్, సంతోష్గార్లు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నాను. ఆ సమయంలోనే నేను ‘సింబ’ కథ విన్నాను. నవ్విస్తూనే అందరికీ కనువిప్పు కలిగేలా మంచి సందేశం ఉన్న సినిమా ఇది’’ అని డైరెక్టర్ సంపత్ నంది అన్నారు. అనసూయ, జగపతిబాబు లీడ్ రోల్స్‌లో మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సింబ’. సంపత్‌నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ పై సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనసూయ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల ప్రశంసలు, అభిమానం వల్లే నేను ‘సింబ’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయగలుగుతున్నాను’’ అన్నారు. ‘‘సంపత్‌గారి కథకు నేను దర్శకత్వం వహించాను. ‘సింబ’ ఓ కొత్త ΄ాయింట్‌తో రాబోతోంది’’ అన్నారు మురళీ మనోహర్. ‘‘కోటికిపైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, నటీనటులు దివి, భానుచందర్ తదితరులు మాట్లాడారు. -
మొక్కల లెక్కలు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన హరితహారం కార్యక్రమం కింద మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ స్వగ్రామాలు, ఎమ్మెల్సీ కె.కవిత అత్తగారి ఊరిలో నాటిన మొక్కలు ఎన్ని? ప్రస్తుతం ఎన్ని చెట్లు ఉన్నాయి? చేసిన ఖర్చు ఎంత? వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అటవీ శాఖను రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం హరితహారం ఫలితాలను సమీక్షించింది. హరితహారం కింద 2015–23 మధ్యకాలంలో రూ.10,822 కోట్ల ను వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా 273.33 కోట్ల మొక్క లు నాటినట్టు అటవీ శాఖ అధికారులు మంత్రివర్గానికి నివేదించారు. పదేళ్లలో ఇంత భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ రీతిలో పచ్చదనం ఎందుకు పెరగలేదని మంత్రివర్గం అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన ప్రముఖ ప్రజాప్రతినిధుల సొంత ఊళ్లలో పథకం అమలు తీరుతెన్నులపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీశాఖను ఆదేశించినట్టు తెలిసింది. వచ్చే ఆర్థిక ఏడాదిలో కొత్తగా ఎన్ని మొక్కలు నాటాల్సి ఉంది? ఎంత బడ్జెట్ అవసరం? వంటి అంశాలు సైతం నివేదికలో ఉండాలని మంత్రివర్గం కోరినట్టు తెలిసింది. వాస్తవ పరిస్థితి ఏమిటి? హరితహారం కింద 19,472 పల్లె ప్రకృతి వనాలు, 2,011 బృహత్ ప్రకృతి వనాలు, 1,00,691 కిలోమీటర్ల మేర రహదారి వనాలు. 12,000 కిలోమీటర్ల బహుళ రహదారి వనాలు, 13.44 లక్షల ఎకరాల అడవుల్ని పునరుద్ధరించినట్టు గత బీఆర్ఎస్ ప్రభు త్వం దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రకటించుకుంది. దీనిపై క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులతో సమగ్ర నివేదిక సమర్పించాలని అటవీ శాఖను మంత్రివర్గం కోరినట్టు తెలిసింది. -
పచ్చగా.. రెక్కలొచ్చెనా..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారం తోపాటు జీహెచ్ఎంసీలో చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పచ్చదనం పరిఢవిల్లుతోంది. వీటిని కొనసాగిస్తూనే మరిన్నింటితో ప్రజలకు మంచి వాతావరణం తోపాటు కాలుష్యాన్ని తగ్గించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా థీమ్, ట్రీ పార్కులతో పాటు ప్రధాన రహదారుల మార్గాల్లోని సెంట్రల్ మీడియన్లలోనూ పచ్చదనం కార్యక్రమాలను తలపెట్టింది. రూ.137 కోట్లు వెచ్చింది 57 థీమ్ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా చేపట్టిన పనుల్లో 6 పార్కుల పనులు పూర్తయ్యాయి. ట్రీపార్కులు.. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ప్రజలకు ప్రకృతిని ఆస్వాదించే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ట్రీపార్కుల ఏర్పాటు చేపట్టారు. ఇప్పటి వరకు 406 ట్రీ పార్కుల్ని ఏర్పాటు చేశారు. వీటిలో ఎల్బీనగర్ జోన్లో 104, చార్మినార్ జోన్లో 23, ఖైరతాబాద్ జోన్లో 86, శేరిలింగంపల్లి జోన్లో 97, కూకట్పల్లి జోన్లో 56, సికింద్రాబాద్ జోన్లో 40 ఉన్నాయి. సెంట్రల్ మీడియన్లలో సైతం.. వివిధ రకాల పార్కులతో పాటు రోడ్ల మధ్యన సెంట్రల్ మీడియన్లలో ఇతరత్రా ఖాళీ ప్రదేశాల్లోనూ మొక్కలు పెంచి పచ్చదనం పెంపు చర్యలు చేపట్టారు. వీటిలో పూలమొక్కలు సైతం పెంచుతున్నారు. మొక్కలతో వాహన కాలుష్యం తగ్గడంతో పాటు ఎదురుగా వచ్చే వాహనాల లైట్లు గ్లేర్ కొట్టకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 186 సెంట్రల్ మీడియన్ల లొకేషన్లలో 176 కిలోమీటర్ల మేర పచ్చదనం పెంచి అందంగా కనిపించేలా చేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. గత సంవత్సరం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా దశాబ్ద కాలానికి (2011–21) సంబంధించి వెల్లడించిన నివేదికలో దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే పచ్చదనం విస్తీర్ణం అత్యధికంగా 48.66 చదరపు కిలోమీటర్లు పెరిగింది. నగరంలో పచ్చదనం 5.23 శాతం నుంచి దాదాపు 13 శాతానికి పెరిగింది. ట్రీసిటీగా కూడా గుర్తింపు పొందడం తెలిసిందే. ఆ నివేదిక స్ఫూర్తితో పచ్చదనం పెంపునకు బల్దియా పాటుపడుతోంది. (చదవండి: పని మీది.. పరిష్కారాలు నావి!) -
శాంతిభద్రతల రక్షణలో దేశానికే ఆదర్శం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతి భధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆ దిశగా పోలీసుల భాగస్వామ్యాన్ని అభినందించారు. బుధవారం ప్రగతి భవన్లో జరిగిన రాష్ట్ర పోలీసు శాఖ, అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సామాజిక రంగాలలో నిత్యం శాంతిభధ్రతల పరిరక్షణ కోసం అహర్నిషలు కృషి చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహ్మద్ అలీ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, రేంజ్ డీఐజీలు, జోనల్ ఐజీలు, తెలంగాణ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల భధ్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తున్నదని, పోలీసులు మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముందన్నారు. సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను అరికట్టాలన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. కలప స్మగ్లింగును గత పాలకులు సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల కొందరికి అలుసుగా మారిందని, ఐతే దీన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. ఫారెస్టు స్మగ్లింగును అరికట్టడంలో కేవలం అటవీశాఖ అధికారులే కాకుండా సివిల్ పోలీసు వ్యవస్థ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరముందన్నారు. సమాజంలో భాగస్వామ్యమై నేరాలను అరికట్టినట్టు, ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా పోలీసులు అడవుల పట్ల అవగాహన పెంచుకుని, స్మగ్లింగు వంటి అటవీ నేరాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. అటవీశాఖ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని ఈ దిశగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. ఎప్పటికప్పుడు ఇరు శాఖల ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించుకుని కలప స్మగ్లింగు నివారణ చర్యల రూపకల్పనకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలన్నారు. తద్వారా మాత్రమే సమాజానికి మనం అనుకున్న విధంగా సేవ చేయగలుగుతామన్నారు. (చదవండి: అరవై ఏళ్లుగా గోస పడ్డాం...) దళితుల మీద దాడులు శోచనీయం తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘన విజయాల్లో గుడుంబా నిర్మూలన కూడా వుందన్నారు. ఇటీవలి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ గుడుంబా తయారీ జరుగుతున్నట్టు సమాచారముందని, దాన్ని కూడా తక్షణమే అరికట్టాలన్నారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజ్, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకుగాను రాష్ట్ర ఎక్సైజ్ శాఖతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలను ఏమార్చే గ్యాంబ్లింగ్ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు. దళితుల మీద దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని పోలీసులకు సీఎం వివరించారు. ఆ దిశగా ఎప్పటికప్పుడు అప్రమత్తతతో మెలగాలన్నారు. బలహీనుల మీద బలవంతుల దాడులు జరగకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసు వ్యవస్థకున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారుల దగ్గరనుంచి కిందిస్థాయి పోలీసు వరకు సమాజంలో ఒకరిగా భాగస్వాములు కావాలని, చిన్నా పెద్ద తేడా లేకుండా పౌరులందరికి గౌరవాన్ని ఇస్తూ ఫ్రెండ్లీ పోలీసు స్ఫూర్తిని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి పోలీసుకున్నదన్నారు కేసీఆర్. (చదవండి: దేవునితోనైనా కొట్లాడుతా!) కారుణ్య నియామకాల్లో ఆలస్యం తగదు తమ దగ్గరికి రక్షణకోసం వచ్చిన అభాగ్యుల పట్ల మానవీయ కోణంలో మెలగాలని సీఎం హితవు పలికారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాల మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అరికట్టాలని సీఎం చెప్పారు. కష్టపడి సాధించాల్సిన పట్టాలను తప్పుడు దారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుందని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. పోలీసు శాఖలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ సెటిల్ చేసి, సర్వీసు ఆఖరి రోజున గౌరవప్రదంగా ఇంటిదాకా సాగనంపాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి మరోమారు పోలీసు ఉన్నతాధికారులకు గుర్తుచేశారు. తన జీవితకాలం పాటు డిపార్టుమెంటుకు సేవలందించిన ఉద్యోగి రిటైరయితే, వారిని సత్కరించి కారులో ఇంటికాడ దించివచ్చే మంచి సంప్రదాయాన్ని కొనసాగించాలని అన్నారు. పోలీసు శాఖలో కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదన్నారు. డ్యూటీలో వుంటూ చనిపోయిన ఉద్యోగి వారసులకు, నిబంధనల ప్రకారం కారుణ్య నియామకానికి అర్హత కలిగిన వారసులకు, తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని, దీనిపై వెంటనే కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇతర శాఖల్లో ఖాళీలుంటే పరిశీలించి వెయిటింగ్ లిస్టులో వున్న అభ్యర్థులకు ఉద్యోగాలు అందేలా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. (చదవండి: దసరాకు ధరణి) మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వసతులు పోలీసు శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం మరింతగా కృషి జరగాల్సిన అవసరమున్నదని సీఎం తెలిపారు. పోలీసు ఉద్యోగ నియామకాల్లో మహిళల కోసం 33శాతం రిజర్వేషన్లను అమలు పరుస్తున్న నేపథ్యంలో, ఆ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నదన్నారు. అందులో భాగంగా మహిళలు పనిచేసే పోలీసు కార్యాలయాలు స్థలాల్లో ప్రత్యేకించి రెస్ట్ రూములు, వసతులు కల్పించాలన్నారు. హైదరాబాద్‌లో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని డీజీపీకి సీఎం సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలో సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలని తెలిపారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్‌లో నిర్మితమౌతున్న పోలీసు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. -
ప్రభుత్వం విప్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పుల్లెల
సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇచ్చిన ఛాలెంజ్‌ను ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్వీకరించారు. గ్రీన్ ఇండియా మిషన్ మూడో విడత కార్యాక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహోద్యమంలా సాగుతోంది. ఈ నేపథ్యంలో గువ్వుల ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి గచ్చిబౌలిలలోని తన అకాడమీ ప్రాంగణంలో పుల్లెల గోపిచంద్ శనివారం మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లతో రాష్ట్రంలో పచ్చదనం బాగా పెరిగిందన్నారు. అంతేగాక ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో కూడా పచ్చదనంపై చాలా అవగాహన పెరిగిందన్నారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సిక్కిరెడ్డి, మేఘన, అరుణ్, విష్ణులు మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు. -
చెట్టుని కూల్చినందుకు రూ. 9,500 జరిమానా
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా పెరిగి పెద్దదైన చెట్టును తన వాహనంతో ఢీకొట్టి కూల్చివేసిన వాహనదారుడికి రూ. 9,500 జరిమానా విధించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా పెరిగిన చెట్టును తన వాహనంతో రాకేశ్ ఢీ కొట్టడంతో పడిపోయింది. దీన్ని గమనించిన పోలీసులు హరితహారం అధికారి ఐలయ్యకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఆయన.. రాకేశ్‌కి జరిమానా విధించారు. హరితహారంలో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి కాపాడుతున్నామని, వాటికి ఎవరు హాని కలిగించినా జరిమానా చెల్లించాల్సిందేనని ఐలయ్య తెలిపారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. హరితహారం చెట్ల భద్రత విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ శాఖ ఉన్నతాధికారులకు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, డీఈలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
హరితహారం మొక్కా.. మజాకా!
సాక్షి, మహబూబ్‌నగర్: హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కను తొలగించినందుకు పట్టణంలోని కల్పన టెక్స్టైల్స్ యజమాని గోపాల్రావుకు మున్సిపల్ అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. ఇటీవలే అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ దుకాణం ఎదుట మొక్కలను నాటారు. అయితే గోపాల్‌రావు బట్టల దుకాణం ఎదుట నాటిన మొక్కను ఆయన తొలగించారు. చెట్టు తొలగించే దృశ్యాలను స్థానికులు వీడియో చిత్రీకరించి మున్సిపల్ అధికారులకు పంపించారు. దీంతో వారు వాల్టాచట్టం ప్రకారం సెక్షన్ 35, రూల్ నెం.26 నిబంధనల మేరకు రూ.10వేల జరిమానా విధించడంతో పాటు, తొలగించిన మొక్క స్థానంలోనే కొత్త మొక్కను నాటించారు. దాన్ని సంరక్షణ బాధ్యత బట్టల దుకాణం యజమానిదేనని కమిషనర్ వెంకటయ్య సూచించారు. పట్టణంలో కొందరు మేకలను రోడ్లపైకి వదులుతున్నారని, అవి చెట్ల ఆకులను తినడంతో పాటు, చెట్లను విరిచేస్తున్నాయని, హరితహారం మొక్కలు తింటే యజమానులకు కూడా జరిమానాలు విధిస్తామని తెలిపారు. మక్తల్‌లో మేక కట్టివేత మక్తల్: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నాటిన మొక్కలను ఓ మేక గురువారం మేయగా గమనించిన సిబ్బంది దాన్ని కార్యాలయంలో కట్టేశారు. అంతటితో ఆగకుండా మేక ఎవరిదో కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఆ యజమానికి రూ.2వేల జరిమానా వేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో మేక -
‘రెవెన్యూ విలీనంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’
సాక్షి, సంగారెడ్డి: రెవెన్యూ శాఖ విలీనంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఉద్యోగులు పత్రికల్లో వస్తోన్న వదంతులను నమ్మొద్దని టీఎన్జీవో సంగం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కోరారు. జిల్లాలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.20లక్షల మంది ఉద్యోగులు ఉన్నరన్నారు. ప్రతి ఉద్యోగి 10 మొక్కలు నాటాలని నిర్ణయించామని.. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి నుంచే శ్రీకారం చుట్టామని తెలిపారు. గతంలో కమల్‌నాథ్ కమిటీ చర్యల వలన ఉద్యోగ విభజనలో తెలంగాణ ఉద్యుగులే అధికంగా నష్టపోయారని తెలిపారు. దాదాపు 1200 మంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్లారని.. వారందరిని తిరిగి తెలంగాణకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్నేహపూర్వక ప్రభుత్వం ఏర్పడి.. విభజన సమస్యల్లో కదలిక వచ్చిందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులు సంఖ్య తగ్గి పని భారం పెరిగిందన్నారు. ప్రభుత్వం వీలైనంత తొందరలో కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచి వారికి 20 శాతం హెచ్ఆర్ కేటాయించాలని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
నల్లగొండ మున్సిపాలిటీలో నర్సరీలు..!
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం కింద ఇకనుంచి మున్సిపాలిటీలో కూడా నర్సరీలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీలగిరి మున్సిపాలిటీలో ఈ ఏడాది నర్సరీల ద్వారా ఒక లక్ష మొక్కలు పెంచేందుకు మున్సిపల్ అధికారులు ప్రతిపానదలు రూపొందించారు. మెప్మా పర్యవేక్షణలో సమభావన సంఘాల మహిళల ద్వార నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. నీలగిరి పట్టణంలో ఉన్న సమభావన సంఘాల్లోని ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే వారిచే నర్సరీల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. సమభావన సంఘాల మహిళలు ఏర్పాటు చేసే నర్సరీలలో మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేయనుంది. గత ఏడాది వరకు ఇతర నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి హరితహారం కింద మొక్కలు నాటే వారు. ఒక్కో మొక్కకు రూ.10 చెల్లింపు నర్సరీలు ఏర్పాటు చేయాలంటే తగినంత స్థలం, నీటి వసతి, వాటి రక్షణ అవసరం ఉంటుంది. ఈ సౌకర్యాలు ఉన్న వారిని గుర్తించి వారికి మాత్రమే నర్సరీలు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తారు. నారు కొనుగోలు చేయడంతో పాటు ఎర్రమట్టి, కవర్లు, ఎరువు తదితర వాటిని సంబంధిత మహిళలే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నారు గింజలను కూడా మెప్మా సిబ్బంది కొనుగోలు చేయిస్తారు. దాదాపు నాలుగున్నర నెలల పాటు నర్సరీలలో మొక్కలు పెంచాల్సి ఉంటుంది. 2నుంచి 3 ఫీట్లు పెంచిన మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేసి పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో నాటుతారు. నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచిన సంబంధిత మహిళలకు ఒక్కో మొక్కకు రూ. 10 ల చొప్పున మున్సిపాలిటీ చెల్లిస్తుంది. మహిళలు ఎన్ని మొక్కలు పెంచినా వాటిలో బతికిన వాటికి మాత్రమే మున్సిపల్ అధికారులు డబ్బులు ఇస్తారు. బ్యాంకు రుణ సౌకర్యం... నర్సరీలను ఏర్పాటు చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే సంబంధిత మహిళలకు బ్యాంకు రుణం ఇప్పించాలని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. మహిళా సభ్యులు వ్యక్తి గతంగానైనా, గ్రూపుగానైనా నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి బ్యాంకుల ద్వారా మొక్కలను బట్టి రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మొక్కలు విక్రయించిన తర్వాత బ్యాంకులో చెల్లించే విధంగా సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడాలని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. నర్సరీల ద్వారా లక్ష మొక్కలు నీలగిరి పట్టణంలో మొక్కల సరఫరాకు ఇబ్బం ది లేకుండా ఇక్కడే నర్సరీలు ఏర్పాటు చేయాలని సీడీఎంఏ అధికారులు ఆదేశించారు. మహిళా సంఘాల వారి ద్వార నర్సరీలు ఏర్పా టు చేసి లక్ష మొక్కలు పెంచడానికి నిర్ణయిం చాం. వారు పెంచిన మొక్కలను మున్సిపాలిటీ కొనుగోలు చేస్తుంది. – దేవ్‌సింగ్, మున్సిపల్ కమిషనర్ -
హరితహారానికి సిద్ధంకండి
సాక్షి, హైదరాబాద్: ఐదో విడత హరితహారం కోసం అన్ని జిల్లాలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సూచించారు. గురువారం సచివాలయంలో కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పెంచుతున్న మొక్కల్లో కచ్చితంగా 25 నుంచి 30 శాతం అటవీ పండ్ల జాతులు, మరో పది శాతం ఇళ్లలో పెంచుకునే మొక్కలు ఉండాలన్నారు. ప్రాంతాల వారీగా వాతావరణ పరిస్థితులు, ప్రజలు కోరుకున్న మొక్కలు అందించేలా అటవీ, గ్రామీణాభివృ ద్ధి, మున్సిపల్ శాఖలు సిద్ధం కావాలని సూచించారు. ఇంకా వెయ్యి పంచాయతీల్లో నర్సరీలను సిద్ధం చేయాల్సి ఉందని, వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో నర్సరీల పెంప కానికి స్వయం సహాయక బృందాలను భాగస్వామ్యం చేయాలన్నారు. 66 లక్షల ఎకరాల అటవీ భూమికి సంబం ధించి ఇప్పటికే సమారు 54 లక్షల ఎకరాల పరిశీలన, రెవెన్యూ రికార్డుల్లో గుర్తించడం పూర్తయిందని, మిగతావి కూడా వివిధ దశల్లో ఉన్నాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీఆర్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘కేసీఆర్’మొక్క నరికివేత
అల్గునూర్ (మానకొండూర్): మొదటి విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కరకట్ట దిగువన నాటిన మొక్కను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారు. మూడేళ్లలో మొక్క పెద్దగా పెరిగి చెట్టయింది. బుధవారం రాత్రి వరకు బాగానే ఉన్న చెట్టు గురువారం ఉదయం నరికి ఉండగా.. దాని సమీపంలోనే వినాయకుడి ప్రతిమ కనిపించింది. సమీపంలోని ఇతర చెట్లను కూడా నరికివేశారు. దీంతో కావాలనే కొందరు ఇలా చెట్టును నరికి వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు. -
గోదాములు, యార్డుల్లో లక్ష మొక్కలు నాటండి
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని గోదాములు, మార్కెట్ యార్డుల్లో లక్ష మొక్కలు నాటాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఒకటిన్నర మీటర్ల నుంచి రెండు మీటర్ల ఎత్తుండే పండ్ల మొక్కలు నాటాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అల్వాల్ రైతు బజార్ ఆధునీకరణ పనులు చేపడుతామన్నారు. ఇందుకు అవసరమైన స్థల సేకరణ కోసం రైల్వే, కంటోన్మెంట్, ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కూకట్పల్లి రైతుబజార్‌ను పది కోట్లతో ఆధునీకరణ పనులకు శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు. తాత్కాలికంగా ప్రస్తుతం ఉన్న రైతు బజార్‌ను హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ వద్ద ఏర్పాటు చేస్తామని చెప్పారు. గడ్డిఅన్నారం మార్కెట్‌కు మెట్రోస్టేషన్ సమీపంలో ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. హయత్‌నగర్ మండలం కోహెడ వద్ద 178 ఎకరాల్లో, రూ.164 కోట్ల అంచనా వ్యయంతో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. -
ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఎస్.కె.జోషి పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో హరితహారం కార్యక్రమంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థలు, 12751 గ్రామపంచాయతీలలో భూమి గుర్తింపు, అవసరమైన మౌలిక సదుపాయాలు, మొక్కలు తదితర వివరాలను వారంలోగా పంపాలన్నారు. అర్బన్ పార్కుల్లో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ నర్సరీల పర్యవేక్షణకు అర్బన్ ఫారెస్ట్రీ, ఎంఏయూడీ ఓఎస్డీ కృష్ణను నోడల్ అధికారిగా నియమించినట్లు సీఎస్ తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హరితహారానికి.. ‘బొగ్గు బట్టీ’ల పొగ
సాక్షి, యాదాద్రి : రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని చేపట్టింది. కోట్ల కొద్దీ మొక్కలు నాటిస్తూ వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపడుతోంది. కానీ మరోవైపు అక్రమార్కుల కక్కుర్తి రాష్ట్రాన్ని ‘నల్ల’బరుస్తోంది. బాగా ఎదిగిన వేలాది చెట్లు ‘బొగ్గు’పాలవుతున్నాయి. పొలాలు, రహదారుల వెంట ఉన్న పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తూ.. వాటి కలపను బొగ్గుగా మార్చి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధి నుంచే ఏకంగా నెలనెలా వెయ్యి లారీలకుపైగా బొగ్గు ఇతర రాష్ట్రాలు, ప్రాం తాలకు రవాణా అవుతోంది. నల్లగొండ జిల్లా పరిధిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తం గా ఎన్ని వేల చెట్లను నరికేస్తున్నారనే ఆందో ళన నెలకొంది. దీంతో పర్యావరణానికి విఘాతం కలగడంతోపాటు.. కలపను కాల్చే బొగ్గు బట్టీల కారణంగా వెలువడే పొగ, విష వాయువులతో భారీగా కాలుష్యం తలెత్తుతోంది. ఆకుపచ్చని అభివృద్ధికి విఘాతం! రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24 శాతం నుంచి 33 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో ఈసారి 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారీ సంఖ్యలో నాటడంతోపాటు వారి సంరక్షణకూ చర్యలు చేపట్టింది. కానీ ఈ స్ఫూ ర్తికి విఘాతం కలిగించేలా పలు జిల్లాల పరిధిలో చెట్ల నరికివేత విచ్చలవిడిగా సాగు తోంది. బొగ్గుబట్టీల కాంట్రాక్టర్లు వాటి కలపను కాల్చి, బొగ్గుగా మార్చేసి అమ్ముకుంటున్నారు. వందల ఏళ్ల వయసున్న చెట్లు కూడా కర్రబొగ్గు కోసం కాంట్రాక్టర్ల గొడ్డలి వేటుకు నేలకూలుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల పరిధిలోని.. అటవీ భూములు, పొలాలు, రహదారుల వెంట ఉన్న చెట్లను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. వాటి కలపను బొగ్గుబట్టీల్లో కాల్చి బొగ్గుగా మార్చుతున్నారు. అధికారుల కమిటీలు ఎక్కడ? సహజ వనరులను సంరక్షించేందుకు గతంలో రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు, గ్రామ కమిటీలతో ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. వాల్టా చట్టానికి అనుగుణంగా సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యతను ఆయా కమిటీలకు అప్పగించారు. కానీ ఈ కమిటీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నారు. చాలా గ్రామాల్లో బొగ్గు బట్టీలు పలు జిల్లాల్లోని చాలా గ్రామాల్లో బొగ్గు బట్టీలు నడుస్తున్నాయి. సర్కార్ తుమ్మ చెట్లను నరికి.. వాటితో బొగ్గు తయారుచేసుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ సర్కారు తుమ్మతోపాటు చింత, వేప, మర్రి, రాగి, తుమ్మ చెట్ల కలపను కూడా బొగ్గుబట్టీల్లో వాడుతున్నారు. ఇలా విచ్చలవిడిగా నరికేస్తుండడంతో పచ్చదనం మాయమైపోతోంది. గనుల్లోంచి తవ్వి తీసే నేలబొగ్గు (రైల్వే బొగ్గు) కంటే తక్కువ ధరకు, సులువుగా లభిస్తుండడంతో కర్ర బొగ్గుకు భారీగా డిమాండ్ ఉంది. చెట్ల కలపను కాల్చి బొగ్గుగా మార్చాక.. సంచుల్లో నింపి హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు లారీల్లో తరలిస్తున్నారు. నెలకు వెయ్యి లారీలు! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బొగ్గు తరలింపు కోసం నెల నెలా సగటున వెయ్యి లారీలకు అటవీ శాఖ అధికారులు అనుమతి ఇస్తున్నారు. ఒక్కో లారీలో 135 క్యూబిక్ మీటర్ల బొగ్గును తరలిస్తారు. అంటే జిల్లా పరిధి నుంచే ప్రతినెలా ఏకంగా 1,35,000 క్యూబిక్ మీటర్ల బొగ్గును తరలిస్తున్నారు. ఇందుకోసం వందలాది చెట్లు నరికి కాల్చి బొగ్గుగా మార్చుతున్నారు. ఒక్కో బస్తాలో 40 కిలోల బొగ్గు చొప్పున సుమారు 200 బస్తాలను లారీల్లో నింపి ఒడిశాకు తరలిస్తున్నారు. ఒక పర్మిట్ తీసుకుని దానిపై పదుల సంఖ్యలో లారీల్లో బొగ్గు రవాణా చేస్తున్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో బొగ్గు తరలిస్తున్న లారీని స్థానిక అ«టవీ శాఖ అధికారులు పట్టుకుని విచారించగా.. నల్లగొండ జిల్లా అటవీ శాఖ అధికారులు ఇచ్చిన పర్మిట్ ఉంది. జిల్లాల విభజన జరిగి ఏడాది కావస్తున్నా ఇలా ఇంకా అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. -
పచ్చటాకుల పెంపకంలో పండుటాకులు
ఎవర్గ్రీన్ వయసుడిగిపోయింది. ఊరు పొమ్మంటుంది.. కాడు రమ్మంటుంది.. అంటూ ఇంటి అరుగుల మీదనో, వసారాలోనో మునగదీసుకుని పడుకుని, పైవాడి పిలుపుకోసం ఎదురు చూస్తూ రోజులు వెళ్లదీయడం చాలామంది వృద్ధులు చేసేదే. అయితే.. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ వృద్ధులు ఇందుకు భిన్నం. ‘రేపటి తరం కోసం మేము సైతం’ అంటూ కమిటీగా ఏర్పడి.. హరిత హారంలో భాగంగా నాటిన చెట్లకు నీళ్లు పోస్తూ.. అవి ఏపుగా పెరుగుతుంటే చిన్నపిల్లల్లా సంబరాలు పడుతూ యువతరానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. చెట్లను పెంచేందుకు... చెట్లను సంరక్షించేందుకు ఇబ్రహీంపూర్ గ్రామంలోని వృద్ధులు కమిటీలుగా ఏర్పడ్డారు. 367 కుటుంబాలు, 1228 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 70 నుండి 85 సంవత్సరాల వయస్సున్నవారు దాదాపు వందమందిదాకా ఉన్నారు. వీరు ఇద్దరిద్దరు ఒక జట్టుగా ఏర్పడి, ఒక్కో జట్టు 20 నుండి 50 మొక్కలకు రోజూ ఉదయం, సాయంత్రం నీళ్లు పోస్తున్నారు. చుట్టూ కంచెవేసి, వాటిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామంలో మూడు విడతల హరిత హారంలో భాగంగా 3 లక్షల మొక్కలను నాటారు. వీటిల్లో గ్రామ అంతరంలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత వృద్ధులదే.. గ్రామంలో ఉన్న నీటి పంపులు, ఇండ్లలో ఉన్న బోర్ల వద్ద నుండి పైపులు వేసి, లేదా చిన్న చిన్న బకెట్లతో నీటిని తీసుకొచ్చి మొక్కలకు పెడతారు.. దీంతో పని చేసిన తృప్తి ఉంటుందని గ్రామ వృద్ధులు చెబుతున్నారు. ఊరు పచ్చగా ఉండాలని మా చిన్నప్పుడు ఊరంతా చెట్లు ఉండేవి. ఎక్కడ చూసినా.. నీడగా ఉండేది.. రాను రాను వివిధ అవసరాల రీత్యా ఇష్టం వచ్చినట్లు చెట్టు కొట్టేయడంతో మా బోటి వాళ్లకు కూచునేందుకు నీడ కూడా కరువైంది. ఊరు పచ్చగా ఉండాలనే ఆలోచనతో వృద్దుల కమిటీ లుగా ఏర్పడ్డాం. ఈ వయస్సులో ఖాళీగా ఉండలేక.. చెట్టును సాదుకుంటున్నాం.. పొద్దుగాల, పొద్దూకీ నీళ్లు పోస్తున్నాం.. – వెంకట రాజిరెడి(84) చిన్నపిల్లల లెక్క సాదుకుంటున్నాం మా ఊరు పచ్చగుండాలని సార్లు చెట్లు నాటిండ్రు.. వాటిని సాదుకుంటే చల్లగా ఉంటుంది.. కొడుకు, కోడలు అందరు పనికి పోతరు. ముసలోల్లం ఏం చేయాలి. ముచ్చట్లు పెట్టుకుంటూ.. చెట్లకు నీళ్లు పోస్తం. మొక్కలను చిన్నపిల్లల లెక్క సాదుకుంటున్నాం. అవి పెరుగుతుంటే సంబురం అవుతుంది. – చిలుకల లచ్చవ్వ (68) చెట్లకు నీళ్లుపోయడమే పని మాకేం పని ఉంటది బిడ్డా.. ఇంత తినుడు.. అరుగుల మీద కూసునుడే.. పనిలేక పొద్దుపోక లేని రోగాలు వచ్చేవి. ఇప్పుడు పొద్దున, పొద్దూక చెట్లకు నీళ్లు పోసుడే పనిగా పెట్టుకున్నం.కసె అటీటు తిరుగుతుంటే.. పానం నిమ్మలంగా ఉంటున్నది. చెట్లు పెరుగుతున్నయి. – మల్లారెడ్డి (82) ఇంటి ముందు నీడ వస్తుంది ఇంటి ముందు రోడ్ల దగ్గర చెట్లు లేకపోతే బోసిపొయినట్లు ఉండేవి. ఇప్పుడు నాటిన మొక్కలకు నాతోపాటు, మా బజారులో ఉండే ముసలోల్లం అందరం చెట్లకు నీళ్లు పోసిసాతుకుంటున్నాం. చెట్లు పెరిగి నీడను ఇస్తున్నయి. పూలు పూస్తున్నయి. వాటిని చూసినప్పుడు సంతోషంగా అన్పిస్తుంది. – శ్రీరాం గంగరాం (70) గ్రామ పచ్చదనానికి పెద్ద్దల సేవలు ముసలోల్లు ఏం పనిచేయరు అంటారు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. వారికి చేతనైన పని చేయవచ్చు అనడానికి మా ఊరి పెద్దోల్లే నిదర్శనం. చేతనై.. చేతకాకున్నా.. దగ్గరలోఉన్న చెట్లకు చెంబులతో నీళ్లు పోస్తాండ్రు. గ్రామం పచ్చగా చేస్తాండ్రు. వారికి పొద్దుపోవడం లేదనే ప్రసక్తే లేదు.. – కుంబాల లక్ష్మి, గ్రామ సర్పంచ్ అన్ని రంగాల్లో ఆ గ్రామం ఆదర్శం ఇబ్రహీంపూర్ గ్రామం ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో ముందుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి ఇంటికి 24 గంటలూ నీరు వచ్చే పంపు, ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు, గ్రామంలో ప్రతి బడీడు పిల్లవాడు బడిలోనే. అదీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే. పన్నుల వసూళ్లు నూరుశాతం, ప్రతి ఇంటిలో సోలార్ విద్యుత్ ప్లాంట్, అందరికీ గ్యాస్ కనెక్షన్లు, సంపూర్ణ అక్షరాస్యత ఇలా ప్రతి విషయంలో ఆ గ్రామం ఆదర్శమే. దీనిని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... స్వశక్తి కిరణ్ అవార్డు, గౌరవ గ్రామసభ పురస్కారం, భూగర్భజలాల పెంపు అవార్డు, నిర్మల్ పురస్కార్, స్వచ్ఛ భారత్ పురస్కార్‌లతో గౌరవించాయి. – ఈరగాని భిక్షం, సిద్దిపేట, సాక్షి -
సీఎం నాటిన మొక్క ఎండింది!
కరీంనగర్ క్రైం: మూడో విడత హరితహారంలో భాగంగా కరీంనగర్‌లోని ఎల్ఎండీ డ్యామ్ సమీపంలో సీఎం కేసీఆర్ నాటిన మొక్క ఎండిన ఘటనలో 8 మందిపై కేసు నమోదైంది. గత జూలై 12న సీఎం హరితహారం ప్రారంభోత్సవం సందర్భంగా ‘మహగని’ మొక్క నాటారు. అçప్పటి నుంచి ఈ మొక్క సంరక్షణ బాధ్యతలను కరీంనగర్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుడు కొండ్ర సురేశ్ చూస్తున్నారు. ఈ నెల 9న రాత్రి మొక్కను పరిశీలించేందుకు సురేశ్ వెళ్లగా.. గుర్తు తెలియని వ్యక్తులు మొక్కతోపాటు కంచెను తీసేందుకు యత్నిస్తున్నారు. సురేశ్ వారించడంతో చంపుతామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. తిరిగి శనివారం ఉదయం చూడగా మొక్క ఎండిపోయి కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు మొక్కను పీకడం వల్లే ఎండిపోయిందని, అడ్డుకున్నందుకు తనను చంపుతామని బెదరించారని సురేశ్ కరీంనగర్ టూటౌన్లో ఫిర్యాదు చేశారు. సురేష్ ఫిర్యాదుతో ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మహేశ్‌గౌడ్ తెలిపారు. -
నాటుతున్నారు.. నరుకుతున్నారు
►దశాబ్దాల నాటి వృక్షాలకు కాలం చెల్లు ►రోడ్డు వెడల్పులో నేల కూలుస్తున్న వైనం ►కూల్చిన ఒక చెట్టు స్థానంలో10 మొక్కలు నాటాలని డిమాండ్ నెహ్రూ సెంటర్(మహబూబాబాద్): తెలంగాణకు హరితహారం పేరిట రాష్ట్ర ప్రభుత్వం విధించిన టార్గెట్‌తో ఓ వైపు లక్షలాది మొక్కలు నాటుతున్న అధికారులు.. మరోవైపు రోడ్డు వెడల్పు పనుల్లో దశాబ్దాల కాలం నాటి భారీ వృక్షాలను నేల కూలుస్తున్నారు. మరికొన్ని చోట్ల విద్యుత్ సరాఫరాకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ప్రజలను చైతన్యపరిచి మొక్కలు నాటించే అధికారులే ఇలా వృక్షాలను తొలగిస్తున్న తీరును చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి తాళ్లపూసపల్లి గ్రామం వరకు ఫోర్‌లైన్ రోడ్డు వెడల్పు పనులను ఇటీవల చేపట్టారు. రోడ్డు వెడల్పులో వందలాది వృక్షాలు నేలకూలుతున్నాయి. ఇందులో శతాబ్దం కాలం నాటి చింతచెట్లు, వేపచెట్లు, కానుగ చెట్లను జేసీబీలతో కూకటివేళ్లతో పెకిలించి బయటపడేస్తున్నారు. ఇలా పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో 30 వేప చెట్లు, 10 చింతచెట్లు, 50 కానుగ వృక్షాలను తొలగించారు. ఇంతకాలం తోడునీడగా ఉన్న వృక్షాలను తొలగించడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన ఒక్కో వృక్షం స్థానంలో సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్ 10 మొక్కలు నాటాలని డిమాండ్ చేశారు. అందుకు తనకు సంబంధం లేదని ఏదైనా ఉంటే అధికారులకు చెప్పాలని కాంట్రాక్టర్ తెలిపారన్నారు. రోడ్డు పనులు పూర్తయిన వెంటనే రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలని కాలనీవాసులు కోరుతున్నారు. విద్యుత్ తీగలకు అడ్డువస్తున్న చెట్లను తొలగించకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలే తప్పా చెట్లను నరకొద్దని విద్యుత్‌శాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు. -
ఖతర్‌లో హరితహారం
జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జగిత్యాలకు చెందిన ప్రముఖ డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఖతర్‌లో తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారిని డాక్టర్ ఎల్లాల శ్రీనివా స్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ సమితి అధ్యక్షుడు రవిగౌడ్, సుందరగిరిగౌడ్, మహిపాల్, తిరుపతి, గోపాల్, శ్రీధర్‌గౌడ్, ఎండి.ఖాజా, మహేందర్, గంగసాయి, తిరుపతి, చారి, నర్సింహులు, నర్సయ్య, శ్రావణ్ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మారుస్తా
-
అర కోటికి చేరువలో..
నాటిన మొక్కల సంఖ్య 46 లక్షలకు పైగా.. ► జిల్లాలో జోరుగా హరితహారం కార్యక్రమం ► గుంతల తవ్వకం, నీళ్లు పోసేందుకు ‘ఉపాధి’ నిధులు ► సుమారు రూ.3.77 కోట్ల చెల్లింపులు.. సాక్షి, నిజామాబాద్: జిల్లాలో హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతోంది. నాటిన మొక్కల సంఖ్య ఇప్పటికే అర కోటికి చేరువైంది. శనివారం నాటికి అన్ని శాఖలు కలిపి 46 లక్షల మొక్కలు నాటినట్లు అటవీశాఖ అధికారులు రికార్డు చేశారు. మూడో విడత హరితహారంలో భాగంగా 1.85 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. ఈ మేరకు జూన్ మొదటి వారం నుంచే జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12న కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ.. జిల్లాలో అక్కడక్కడ వర్షపాతం నమోదవుతుండటంతో ముందస్తుగానే మొక్కలు నాటారు. దీంతో ఇప్పటికే నిర్దేశిత లక్ష్యంలో సుమారు 25 శాతం మేరకు మొక్కలు నాటడం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌డేను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ పాఠశాలల ఆవరణలో, గ్రామంలో మొక్కలు నాటించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురవక పోయినప్పటికీ, నాటిన మొక్కలు బతికేందుకు అవసరమైన వాతావరణం ఉండటంతో మొక్కల నాటే కార్యక్రమాన్ని ఉద్ధృతంగా కొనసాగిస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి నాటిన మొక్కలు మనుగడ సాగించేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. మొక్కల చుట్టూ ముళ్ల కంచె వేయడం, ఎండిపోకుండా నీళ్లు పోయడం వంటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రానున్న రోజుల్లో డ్రై స్పెల్ (10–15 రోజులు వర్షాల్లేక పోతే) నమోదైతే మొక్కలు చనిపోకుండా ఉండేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని పోయాలని భావిస్తున్నారు. రూ.3.77 కోట్ల చెల్లింపులు.. హరితహారం కార్యక్రమం అమలుకు అవసరమైన నిధులను ఉపాధి హామీ పథకం ద్వారా వెచ్చిస్తున్నారు. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తవ్వినందుకు గాను ఒక్కో గుంతకు రూ.21 చొప్పున, ఆ గుంతలో మొక్క నాటితే ఒక్కో మొక్కకు రూ.3 చొప్పున, మొక్క చుట్టూ కంచె నాటితే కంచెకు రూ.140 చొప్పున చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ నిధుల నుంచి ఈ బిల్లులు ఇస్తున్నారు. డీఆర్డీఏ (డ్వామా) ఆధ్వర్యంలో ఈసారి 70 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు సుమారు 36 లక్షల మొక్కలు నాటినట్లు రికార్డు చేశారు. నాటిన ఈ మొక్కలకు ఉపాధి హామీ నిధులను ఖర్చు చేస్తున్నారు. 36 లక్షల మొక్కల్లో ఇప్పటివరకు 17.5 లక్షల మొక్కలకు సంబంధించి రూ.3.77 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. విజయవంతానికి ఏర్పాట్లు జిల్లాలో మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా అటవీ శాఖాధికారి ప్రసాద్ పేర్కొన్నారు. మొక్కలు నాటడంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. హరితహారం కింద మొక్కలు నాటడం, వాటిని సంరక్షించేందుకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. గత నెలలో బిల్లుల చెల్లింపుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ, ఇప్పుడా సమస్య లేదని చెప్పారు. -
హరితహారంలో భాగస్వాములు కావాలి: దత్తాత్రేయ
రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో కలసి గ్రీన్‌డే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పిలు పునిచ్చారు. ‘హరిత పాఠ శాల– హరితతెలంగాణ’ నినాదంతో విద్యా శాఖ నిర్వహిస్తున్న గ్రీన్‌డేను శని వారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో కలసి ఆయన రాజ్‌భవన్ ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. విద్యార్థు లను చిన్నప్పటి నుంచే మొక్కలు నాటేలా ప్రోత్స హించాలని, మొక్కలు నాటడమే కరువుకు సరైన పరిష్కారమని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ఈసారి రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. ఇందులో వంద కోట్ల మొక్కలు అటవీ ప్రాంతంలో, 120 కోట్లు ఇతర ప్రాంతాల్లో, 10 కోట్లు హైదరాబాద్‌లో నాటాలని నిర్ణయించామన్నారు. మొక్కలు నాటడంతో పాటు హరితహారం, పర్యావర ణంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీ విజేతలకు ఆగస్టు 15న అవార్డులు అందిస్తామని కడియం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
చెట్టుంటేనే మనుగడ
డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): హరితహారంలో జిల్లాలో కోటీ 85 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గతేడాదిలాగే ఈసారీ లక్ష్యాన్ని అధిగమించి, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు సాధించాలని సూచించారు. బుధవారం జిల్లాలో మూడో విడత హరిత హారం కార్యక్రమాన్ని మంత్రి పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవనగర్‌లోని సాయిబాబా ఆలయంతో పాటు డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడడం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుందన్నారు. 22 శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ప్రతి మనిషి 12 నుంచి 13 మొక్కలు నాటాలన్నారు. జిల్లా జనాభా 15 లక్షలు ఉందని, ప్రతి ఒక్కరూ ఈ ప్రకారం మొక్కలు నాటితే 2 కోట్ల మొక్కలు అవుతాయన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కోటీ 20 లక్షలు టేకు స్టంపులు నాటాలన్నది లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ప్రతి రైతు పేరు నమోదు చేసుకుని, టేకు స్టంపులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కబడిగా నిర్వహించవద్దన్నారు. ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కాకుండా, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురియాలంటే చెట్లు ఎక్కువగా ఉండాలన్నారు. హరిత సంకల్పం తీసుకోవాలి.. హరితహారం ఆశయం మంచిదని, గ్రామ సభల ద్వారా అందరికీ అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. అటవీ సంపదను 35 శాతానికి అభివృద్ధి చేస్తే వర్షం పిలిస్తే వస్తుందన్నారు. సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రభుత్వాధికారులు ప్రతి ఒక్కరూ హరిత సంకల్పం తీసుకోవాలన్నారు. మొక్కలను సంరక్షించడానికి.. మొక్కలు నాటేందుకు గుంత తవ్వడానికి రూ. 18.75, మొక్క నాటడానికి రూ. 3.60, మొక్కను సంరక్షించడానికి నెలకు రూ. 5 చొప్పున ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీ.గంగాధర్‌గౌడ్, కలెక్టర్ యోగితారాణా, డీఐజీ శివశంకర్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, జేసీ రవీందర్‌రెడ్డి, డీఎఫ్‌వో ప్రసాద్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీపీ దాసరి ఇందిర, జెడ్పీటీసీ సభ్యురాలు కూరపాటి అరుణ, సర్పంచ్‌లు విజయ, అంజయ్య, ఒలింపిక్ సంఘం జిల్లా చైర్మన్ గడీల రాములు, తహసీల్దార్ శేఖర్, మండల ప్రత్యేకాధికారి భరత్, ఎంపీడీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులతో మొక్కలు నాటించండి హరితహారం కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటికి కనీసం పది మొక్కలైనా నాటించాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. బుధవారం టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్‌లో హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్.. డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులతో కొంతసేపు ముచ్చటించారు. కలెక్టర్ తమ వద్దకు రావడంతో విద్యార్థినులు ఆమెతో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్ల ప్రాధాన్యత, హరితహారం లక్ష్యాన్ని తల్లిదండ్రులకు వివరించి, వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. కలెక్టర్ వెంట బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య, ఏసీపీ ఆనంద్‌కుమార్, డిచ్పల్లి సీఐ తిరుపతి, ఎస్సై కట్టా నరేందర్‌రెడ్డి, ఇందల్వాయి ఎస్సై రాజశేఖర్ తదితరులు ఉన్నారు. ప్రతిగ్రామంలో 40 వేల మొక్కలు.. మోపాల్(నిజామాబాద్ రూరల్): హరిత హారంలో భాగంగా ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. పాంగ్రా గ్రామంలోని సాయిబాబా మందిరంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్టు అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది మొక్కలు నాటించాలని కోరారు. పంట పొలాల్లో టేకు మొక్కలు నాటాలన్నారు. గీత కార్మికులు ఈత మొక్కలు నాటాలని సూచించారు. -
హరితహారం పేరిట పబ్లిసిటీ: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: హరితహారం పేరుతో ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటోందని, ఇది టీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త కార్యక్రమమని హంగామా చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు బుధవారం విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయో సర్కార్ లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానిది ఆర్భాటం: పొన్నం హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో ప్రజానిర్బంధం కొనసాగిందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హరితహారంలో ప్రజలను భాగస్వామ్యం చేయకుండా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఆర్భాటం చేస్తోందన్నారు. ఉస్మానియా వర్సిటీలో ప్రభుత్వ నిర్బంధం సరికాదని, వర్సిటీ ఉత్సవాల్లో కేసీఆర్‌ను మాట్లాడనీయనందుకే ఈ తరహా నిర్బంధం అమలు చేస్తున్నారని విమర్శించారు. -
ప్రతీ మొక్కను బతికించాలి..
► పక్కా ప్రణాళికతో హరితహారం ► మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి ► గతానుభవాలు పునరావృతం కాకూడదు ► 50 శాతం బతికితే మొక్కకు 5 రూపాయలు ► నిధుల విషయంలో రాజీలేదు.. ► అటవీశాఖదే పెద్దన్న పాత్ర ► 12న లక్ష మొక్కలతో హరితహారం ప్రారంభం ► అధికారులతో సమీక్షించిన మంత్రులు జోగురామన్న, ఈటల రాజేందర్ రెండేళ్లలో పట్టణాల్లో మినహా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా 67 శాతం మొక్కలు బతికాయి.. అందుకే ముఖ్యమంత్రి పట్టణాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మండలస్థాయిలోనూ మొక్కల లెక్కలు పక్కాగా రావడం లేదు. పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. పక్కా ప్రణాళికలు రూపొందించుకుని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలి. మొక్కలు నాటడమే కాకుండా వాటి ని సంరక్షించేందుకు బాధ్యతగా వ్యవహరించాలి. – జోగురామన్న, అటవీశాఖ మంత్రి గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలి. ఈ ఏడాది వంద శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలి. జిల్లాలో ఎన్ని మొక్కలు పెట్టామని కాదు.. ఎన్ని బతికాయన్నదే ముఖ్యం. మొక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సంఖ్య కో సం, ఫొటోలకు ఫోజుల కోసం కాకుండా మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే అంతా సిద్ధం కావాలి. – ఈటల రాజేందర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి సాక్షి, కరీంనగర్/కరీంనగర్‌సిటీ: ముఖ్యమంత్రి మానసపుత్రికగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో విజ యవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. సో మవారం కరీంనగర్ కలెక్టరేట్లో మూడో విడత హరితహారం అమలుపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి అటవీశాఖ మంత్రి జోగు రామన్న అధికారులతో సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మొక్కల నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 12న కరీంనగర్‌కు రానున్నట్లు వెల్లడించారు. ఆ రోజు కరీంనగర్ పట్టణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంతో హరితహారాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మూడో విడతగా 1.10 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతోపాటు కరీంనగర్ పట్టణంలో లక్ష మొక్కలు నాటే ప్రణాళికలు, పనుల ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెం డేళ్లుగా రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మొదటి సంవత్సరంలో 16 కోట్లు, రెండో సం వత్సరంలో 32 కోట్లు మొక్కలు నాటామని తెలిపారు. అందులో 67 శాతమే రక్షించుకున్నామని వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మూడో విడత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించామని తెలిపా రు. పాఠశాలలో మొక్కల నిర్వహణకు ఉపాధిహామీ నిధులిస్తామని స్పష్టం చేసినప్పటికీ విద్యాశాఖ విని యోగించడం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మొక్కల నిర్వహణకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ప్రతీ శాఖ ద్వారా నాటే మొక్కల నిర్వహణకు నిధులున్నాయని తెలిపారు. మండల స్థాయి నుంచే మొక్కల లెక్కలు పక్కాగా తెలియడం లేదని, అది పునరావృతం కాకుండా సమగ్ర నివేదికలు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్ని ఇళ్లున్నాయి? ఎన్ని కిలోమీటర్ల రోడ్లు? సంస్థలు? అందులో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు? గతంలో తీసుకున్నదెంత? ఇప్పుడెంత? అనే సమగ్ర వివరాలతో ముందుకుపోవాలన్నారు. ఎంపీడీవోలు మండలస్థాయిలో ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆమ్లెట్ గ్రామాలకు కూడా హరితరక్షణ కమిటీ బాధ్యతలు అప్పగించాలన్నారు. రోడ్డు వెడల్పు, పైపులైన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి పనులు పూర్తయిన రోడ్ల వద్దనే మొక్కలు నాటాలన్నారు. పట్టణాల్లో కూడా హరితరక్షణ కమిటీలను బలోపేతం చేస్తున్నామని, అందుకు తగిన నిధులను, నీటి వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. రాబోయే తరాలకు ఆకుపచ్చని పరిసరాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాటిన మొక్కల రక్షణకు నిధుల కొరత లేదని, మొక్కల రక్షణ బాధ్యతలను అప్పగించాలన్నారు. మండలస్థాయిలోనే ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం మొక్కలు బతికితే ఉపాధిహామీ కింద ప్రతీ మొక్కకు నెలకు రూ.5 చొప్పున అందజేస్తామన్నారు. జిల్లాలో గుట్టలు, ప్రభుత్వ స్థలంలో నీటి కోసం బోర్లతో నీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తామన్నారు. హరితహారంలో అటవీశాఖ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటితే 100 కోట్ల మొక్కలు అటవీశాఖ ద్వారా నాటామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. హరితహారం ప్రతిష్టాత్మకం..: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చే పట్టిందన్నారు. ఈ ఏడాది హరితహారం గొప్పగా ఉం టుందన్నారు. హరితహారానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని, నిధుల విషయంలో రాజీలేదని స్ప ష్టం చేశారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రతి మొక్కనూ కాపాడుకునేలా ముందుకు పోవాలని సూచించారు. ఎల్ఎండీ డ్యాం, శ్మశానవాటికలు, రోడ్లు, దేవాలయాలు, ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల వద్ద విరివిగా మొక్కలు నాటవచ్చన్నారు. రెండేళ్ల క్రితమున్న భూములు ఇప్పుడూ ఉన్నాయన్నారు. నగరంలోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలోని ఖాళీస్థలంలో ట్రీగార్డుల బదులు ట్రీగార్డుల బదులు ప్రహరీ నిర్మిస్తే కొన్ని వేల మొక్కలు బతికించే అవకాశముందని, అందుకు తగిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. లెక్కలే ఉన్నాయి గాని మొ క్కలు లేని అనుభవాలు ఎదురయ్యాయన్నారు. రెండేళ్లలో ఆశించినంత సాధించలేకపోయామన్నారు. గత ప్ర భుత్వాలకు భిన్నంగా సం క్షేమంతో పాటు హరితహారా న్ని ప్రాధాన్యతగా తీసుకున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. నిరంతర సమీక్షలతో బాధ్యతాయుతంగా కృషి చేయాలని, కార్పొరేషన్ అధికారులు బాధ్యతగా వ్యవహరించి లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను ఆకుపచ్చ నగరంగా తీర్చిదిద్దుతామన్నా రు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌బాబు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధి కారుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో హ రితహారం విజయవంతం కావాలన్నారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే ఝా, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మ ద్, నగర పాలక సంస్థ కమిషనర్ శశాంక, హరితహారం స్పెషలాఫీసర్ ఆంజనేయులు, ఏసీపీ జె.రామారావు, డీఆర్డీవో వెంకటేశ్వర్రావు, డీఈవో రాజీవ్, డీపీవో నారాయణరావు, జైలు సూపరింటెండెంట్ శివకుమార్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజన, ఎక్సైజ్ ఈఎస్ శంకర య్య, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులున్నారు. -
సిద్దిపేట.. ఆకుపచ్చ తోట
రాష్ట్రానికి ఆదర్శంగా మున్సిపాలిటీ.. - మంత్రి హరీశ్ సంకల్పం, ప్రజల సహకారంతోనే.. - పట్టణంలోని రహదారుల వెంబడి 2 లక్షల మొక్కలు - ‘మూడో విడత’లో మొక్కలు సంరక్షించే వారిపేరిట సైన్ బోర్డులు సాక్షి, హైదరాబాద్: కాలుష్య రహిత పట్టణంగా, 100 శాతం మరుగుదొడ్లు ఉన్న నియోజకవర్గంగా రాష్ట్ర స్థాయిలో ప్రశంసలందుకున్న సిద్దిపేట మున్సిపాలిటీ.. హరితహారంలోనూ అదే తరహాలో ముందుకు సాగుతోంది. మంత్రి హరీశ్ ప్రత్యేక చొరవ, అధికారుల పనితీరు, ప్రజల సహకారంతో ఆకుపచ్చని తోటలా మారింది. పట్టణంలో 5 ప్రధాన చౌరస్తాలు కలిపి 14.8 కిలో మీటర్ల పొడవుండగా దాదాపు 2 లక్షలకు పైగా మొక్కలు ఈ రహదారుల వెంట కనిపిస్తాయి. ఆత్మీయులకు చిహ్నంగా.. చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్టణంలో మొదలుపెట్టారు. గతించిన వారి జ్ఞాపకార్థం శ్మశాన వాటిక స్థలంలో మొక్క నాటుకోవచ్చు. నామమాత్రపు రుసుంతో ఏడాదిపాటు మొక్క సంరక్షణ బాధ్యతలను మున్సిపాలిటీ తీసుకుంటుంది. వర్ధంతి రోజున మొక్క వద్ద కాసేపు సేదతీరేలా పరిసరాల్లో వసతులను మున్సిపాలి టీనే ఏర్పాటు చేస్తుంది. భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఆలోచనల్లోంచి రూపుదిద్దు కున్న ఈ కార్యక్రమం సిద్దిపేటలో ఆచారంగా మారింది. సంరక్షించే వారి పేర్లతో సైన్ బోర్డులు ఈ ఏడాది పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించేలా కార్యాచ రణ రూపొందించారు. మొక్క నాటి సంరక్షించే వారి పేర్ల మీద సైన్ బోర్డులు పెడుతున్నారు. ఉద్యోగుల ముంగిట్లో కార్పొరేట్ వైద్యం సిద్దిపేటజోన్: దేశంలో ఎక్కడా లేని విధంగా వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వీటి ద్వారా ఉద్యోగులకు, జర్నలిస్టులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో జరిగిన పలు సభల్లో మాట్లాడారు. కులవృత్తులను పరిరక్షించే క్రమంలో ఎంబీసీ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీల అభివృద్దికి రూ. వెయ్యి కోట్లను కేటాయిం చిందని, మంత్రి వివరించారు. పెఱిక కులస్తులను ఎంబీసీలో చేర్చడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 26 వేల పోలీసు ఉద్యోగాల పోస్టులను ప్రకటించామని, ఈ యేడు పదివేలు, వచ్చే యేడు మరో పదివేలు తర్వాత ఆరువేల చొప్పున భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పుడు వాట్సాప్ మంత్రిగా హరీశ్‌రావు హరీశ్‌రావుకు గతంలో కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే అని పేరుంది. ఇప్పుడు ఆయన్ను వాట్సాప్ మంత్రి అని పిలుస్తున్నారు. రోజుకు 18 గంటలు వాట్సప్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పుట్టిన రోజు, పర్వదినాల్లో ప్రజలు మొక్కలు నాటి ఫొటోలు వాట్సప్‌లో పెడితే ఆయన అభినందించడమే కాకుండా పుట్టిన రోజున చెట్లు నాటిన చిన్నారులకు స్వయంగా ఫోన్ చేసి ఆశీర్వదిస్తారు. సిద్దిపేటకు చెందిన సువర్ణ లక్ష్మి.. ఇటీవల హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో రోడ్డు పక్కన చెట్లు వంగిపోయి కనిపించాయి. వెంటనే ఆమె కారు ఆపి వంగిన మొక్కలన్నిటికీ నీళ్లు పోసి, సరిచేసి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను ఆ కారు డ్రైవర్ వాట్సప్ గ్రూప్‌లో పెట్టగా మంత్రి చూసి నేరుగా లక్ష్మికి ఫొన్ చేసి అభినందించారు. -
ఒక్క మొక్కలేదు
► నాటేంత వరకే పరిమితం ►గత హరితహారంలో నాటింది 60,550 మొక్కలు వికారాబాద్ అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం పథకం వికారాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది. గత సంవత్సరం వర్షకాలంలో నిర్వహించిన హరితహారంలో మున్సిపల్ పరిధిలోని 28 వార్డుల్లో 60,550 మొక్కలు నాటినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కాని ఎక్కడ ఒక మొక్క పెరిగి పెద్దగైనట్లు లేదు. హరితహారం కార్యక్రమం సమయంలో స్థానిక కౌన్సిలర్లు, అధికారులు కలిసి హఠహాసంగా కార్యక్రమం నిర్వహించారు. నర్సరీల నుంచి ట్రాక్టర్ల కొలది మొక్కలను తెప్పించి నాటారు. కాని వాటి సంరక్షణ మర్చిపోయారు. ఈ వేసవిలో తీవ్ర ఎండలు ఉండటంతో ఆయా వార్డుల్లో నాటిన మొక్కలు మొక్కల దశలోనే ఎండిపోయాయి. మొక్కలు నాటి చేతులు దులిపేసుకున్న అధికారులు అటుగా చూడలేదు. రికార్డుల్లో మాత్రం రాసారు.. వికారాబాద్ పట్టణం చుట్టూ ఉన్న, ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీల నుండి 60,550 మొక్కలు తెచ్చినట్లు మున్సిపల్ రికార్డుల్లో పేర్కొన్నారు. తెచ్చిన ప్రతి మొక్కను నాటినట్లు, వాటి పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఓ నివేదికను సైతం పంపించారు. నివేధిక పంపడంతోనే తమ పని పూరై్తదనుకున్న అధికారులు మొక్కలకు నీరు పోయడం మర్చిపోయారు. మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న గాంధీ పార్కులో నాటిన మొక్కలు సైతం ఎండిపోయాయంటే హరిహారంపై అధికారుల చిత్తశుద్ది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది నామమాత్రంగా మొక్కలు నాటడంతో వారం రోజులకే ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. నాటిన కొన్ని మొక్కలకు కనీస రక్షణ కల్పించడంతో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపనలు ఉన్నాయి. గత సంవత్సరం హరితహారం మొక్కల కార్యక్రమం పేరుమీద సుమారు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. -
నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి
ఘట్కేసర్ టౌన్: హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కనూ బతి కించాలని జిల్లా అటవిశాఖాధికారి కృష్ణ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో హరితహారంపై గురువారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం ద్వారా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయని, భవిషత్ తరాలకు పచ్చద నం కానుకగా అందించాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా, విద్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో ఉద్యమంలా మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. పంచా యతీల వారిగా కావాలసిన మొక్కల వివరాలను ముందుగా అందజే యాలన్నారు. మొక్కల నాటే విధానం, పెంపకం, రక్షణ విధానం అందుకు అందజేసే ఆర్థిక వనరులపై వివరించారు. సమావేశంలో డీఆర్డీఓ పీడీ కౌటిల్యరెడ్డి, డీపీఓ సురేష్‌మోహన్, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు గ్యార లక్ష్మయ్య, జెడ్పీటీసీ సంజీవరెడ్డి, ఎంపీడీఓ శోభ స ర్పంచ్‌లు అబ్బసాని యాదగిరియాదవ్, బట్టె శంకర్, స్టీవెన్, గొంగల్ల మా ధవి, జాదవ్‌శేషారావ్, నాగరాజు, రమేష్, చిలుగూరి పావని, స్వర్ణలత పం చాయత్రాజ్ కార్యదర్శులు, వీఆర్వోలు, బిల్ కలెక్టర్లు, అంగన్వాడీ టీచర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కోటి మొక్కలు.. కొంటె లెక్కలు
ఇదీ భాగ్యనగరంలో హరితహారం కథ - నాటిన మొక్కల ఆలనాపాలన గాలికి.. - ఎండుతున్న మొక్కలు.. రక్షణ లేక పశువుల పాలు - నర్సరీల్లోనూ కానరాని నిర్వహణ - చాలాచోట్ల కలుపు మొక్కలు.. ఖాళీ బ్యాగులే - హరితహారం మూడో దశ కింద 2.5 కోట్ల - మొక్కలు నాటుతామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: కాలుష్యం.. భాగ్యనగరాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య ఇది! నానా రకాల కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న నగరానికి పచ్చదనం అద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టింది. కోట్లలో మొక్కలు నాటించింది. మూడోదశ హరితహారంలో ఏకంగా 2.5 కోట్ల మొక్కలు నాటుతామని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) చెబుతోంది. కానీ ఇప్పటిదాకా రెండు దశల కింద నాటిన మొక్కల ఆలనాపాలనా మాత్రం గాలికొదిలేసింది! క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను చూస్తుంటే.. అధికారుల ప్రకటనలకు, మొక్కల పెంపకానికి సంబంధమే లేదన్న సంగతి తేటతెల్లమైంది. గతేడాది మిగిలిన మొక్కలతో పాటు ఈ ఏడాది నర్సరీల్లో కొత్తగా పెంచుతున్న 1.5 కోట్ల మొక్కల నిర్వహణ తీరు అధ్వానంగా ఉంది. హెచ్ఎండీఏకు చెందిన 22 నర్సరీలను ‘సాక్షి’పరిశీలించింది. వాటిల్లో చాలా నర్సరీల్లో మొక్కల పెంపకం, నిర్వహణ తీరు అధ్వానంగా ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో పెద్దదైన జవహర్‌నగర్ నర్సరీలో 35 ఎకరాల్లో 50 లక్షల వరకు మొక్కలున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే అందులో కేవలం తొమ్మిదెకరాల్లోనే మొక్కల పరిస్థితి బాగుంది. మిగతా విస్తీర్ణంలో కలుపు మొక్కలు, ఖాళీ మట్టి బ్యాగ్‌లే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ 50 లక్షల వరకు మొక్కలున్నాయని చెబుతున్నా 20 లక్షలకు మించి ఎక్కువ లేవన్న సంగతి స్పష్టమైంది. నర్సరీలో మొక్కల బ్యాగులను ఒకేచోట ఉండకుండా తరచూ మార్చాలి. మొక్కలకు నీళ్లు పట్టాలి. వేర్లు భూమిలో పాతుకుపోకుండా చూడాలి. కానీ హెచ్ఎండీఏకు చెందిన అటవీ విభాగం మేనేజర్లు మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కడికక్కడ మొక్కలు వాలిపోతున్నాయి. మరికొన్ని బ్యాగుల్లో కలుపు మొక్కలు ఏపుగా పెరిగాయి. నాటిన మొక్కల్ని పట్టించుకునేవారేరి? హరిత హారంలో మొక్కలు నాటినప్పుడు కనిపించిన ఉత్సాహం.. ఆ తర్వాత కనిపించడం లేదు. నాటిన ప్రాంతాల్లో అనేకచోట్ల మొక్కలు ఎండిపోవడమే ఇందుకు నిదర్శనం. నిమ్స్‌లో సీఎం, ఇతర వీఐపీలు నాటిన మొక్కలపై తీసుకున్న శ్రద్ధ ఇతర ప్రాంతాల్లో తీసుకోవడం లేదు. అనేకచోట్ల వీఐపీలు నాటిన మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. – ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున కుత్బుల్లాపూర్ సర్కిల్లో గాజులరామారం చౌరస్తా నుంచి జగద్గిరిగుట్ట పైపులైన్ రోడ్డులో 5 వేల మొక్కలు నాటారు. నేడు అక్కడ పట్టుమని పది మొక్కలు కూడా కనిపించడం లేదు – చాంద్రాయణగుట్టలో కెప్టెన్ లక్ష్మీకాంత రావు నాటిన మొక్కలు ఆనవాళ్లు లేకుండా పోయాయి – బొటానికల్ గార్డెన్ జంక్షన్ నుంచి మసీద్‌బండ వరకు రోడ్డు మధ్యలో, ఇరువైపుల మొక్కలు నాటారు. మాధవ మైల్ స్టోన్ జంక్షన్ నుంచి మసీద్‌బండ వరకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«ధీ మొక్కలు నాటించారు. వాటిల్లో చాలా మొక్కలు ఎండిపోయాయి. – నల్లగండ్లలోని చెరువు కట్టపై గతేడాది హరితహరం కింద నాటిన మొక్కలను పశువులు తినేశాయి – మంత్రి తలసాని జాతీయ రహదారి సలీంనగర్లో నాటిన మొక్కకు ఎలాంటి రక్షణ లేదు. శాలివాహననగర్ పార్కులో మేయర్ బొంతు రామ్మోహన్ నాటిన మొక్క బాగా మాత్రం పెరిగింది. – పార్శిగుట్ట శ్మశానవాటికలో 1200, సీతాఫల్మండి ప్రభుత్వ పాఠశాల ప్రాంతంలో 723 మొక్కలు, లాలాగూడ, రైల్వే వర్క్‌షాపు, సీతాఫల్మండి, పార్శిగుట్ట, గంగపుత్రకాలనీ, అడ్డగుట్ట, ఈస్ట్ మారేడుపల్లి శ్మశానవాటికల్లో 1040 మొక్కలు నాటించారు. ఈ ప్రాంతాల్లో నాటిన మొక్కలు నామరూపాలు లేకుండా పోయాయి. -
విత్తన బంతి.. హరిత కాంతి..!
- విత్తన బంతులతో గుట్టలు, పర్వతాలకు ఆకుపచ్చ తోరణం - హరితహారంలో వినూత్న పద్ధతికి వరంగల్ పోలీసుల శ్రీకారం - కర్ణాటక రిటైర్డ్ ఐఏఎస్ స్ఫూర్తితో అమలు - 10 లక్షల విత్తన బంతుల తయారీ లక్ష్యం - వచ్చే వర్షాకాలంలో విస్తృతంగా సీడ్‌బాల్స్ వినియోగం సాక్షి, వరంగల్: హరితహారం.. తెలంగాణకు ఆకుపచ్చ తోరణం కట్టేందుకు ఉద్దేశించిన పథకం.. రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనం పరుచుకోవాలని.. పల్లెలు, పట్టణాలు, నగరా లు పచ్చికతో కళకళలాడాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షకు ప్రతిరూపం. ఇందుకోసం అహ ర్నిశలు శ్రమిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈనేప థ్యంలో వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోనే కాక.. గుట్టలు, పర్వత ప్రాంతాల్లోనూ విస్తారంగా అడవులను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం వీరు ఎన్నుకున్న మార్గం విత్తన బంతులు(సీడ్‌బాల్స్). ఈ విత్తన బంతులతో ఒకేసారి ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కడిదీ ఆలోచన.. కర్ణాటకలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి కె.అమరనారాయణ విత్తన బంతుల ఆలోచనను వరంగల్ పోలీస్ కమి షనర్ జి.సుధీర్‌బాబుకు వివరించారు. సుధీర్ బాబు ఈ ఆలోచనను అమలు చేయాలని నిర్ణయించి కమిషనరేట్ పరిధిలోని పోలీసు శిక్షణ కేంద్రం(పీటీసీ)లో శిక్షణ పొందుతున్న 218 కానిస్టేబుళ్లతో సీడ్ బాల్స్ తయారీని మొదలు పెట్టారు. వరంగల్ పీటీసీ ఆధ్వర్యంలో 10 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే లక్ష సీడ్ బాల్స్ తయారు చేశారు. హరితహారంలో భాగంగా వచ్చే వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. సీడ్ బాల్స్‌ను వరంగల్ అర్బన్, జనగామ తదితర జిల్లాల్లో వినియోగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏమిటీ విత్తన బంతులు.. ప్రత్యేకంగా సంరక్షణ అవసరం లేకుండా, ప్రకృతి సిద్ధంగా త్వరగా పెరిగే చెట్ల రకాలకు విత్తనబంతుల పద్ధతిని అమలు చేస్తారు. మన రాష్ట్రంలో కానుగ, వేప, అల్లనేరేడు, సీమరూప, రావి, మర్రి, నమిలినార రకాలను సీడ్ బాల్స్ పద్ధతిలో పెంచా లని నిర్ణయించారు. అటవీ శాఖ ఈ రకాల విత్తనాలను భారీగా సేకరించి వరంగల్ పోలీసులకు ఇచ్చింది. జల్లెడ పట్టిన ఎర్రమట్టిని సరఫరా చేస్తోంది. 75 శాతం ఎర్రమట్టి, 25 శాతం పేడ ఎరువును మిశ్రమంగా చేస్తారు. ఈ మిశ్రమాన్ని కలిపి వారం పాటు మురుగబెడతారు. అనంతరం జీవామృతం (ఆవుమూత్రం, ఆవుపేడ, బెల్లం, శనగపిండి)తో మిశ్రమాన్ని ముద్దలుగా తయారు చేస్తారు. ఈ మట్టిముద్దల్లో విత్తనాలను పెట్టి ఆరబెట్టి.. గట్టిపడిన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది తీసుకెళతారు. తొలకరి వర్షాలు పడిన తర్వాత వీటిని కందకాలు, గుట్టలు, పర్వతాలు, సాగుకు పనికిరాని భూముల్లో విసురుతారు. అటవీ జాతి మొక్కలే కావడంతో సీడ్ బాల్స్ నుంచి మొక్కలు సులువుగా మొలకెత్తుతాయి. మంచి ఫలితాలు.. హరితహారంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు, రహదారుల వెంట మాత్రమే మొక్కలు నాటుతున్నారు. వేసవిలో వీటిసంరక్షణ కష్టతరం. ఎండల తీవ్రత, నిర్వహణ లోపాలతో భారీగా మొక్కలు చనిపోతున్నాయి. మరోవైపు మొక్కల సంరక్షణలో ఇబ్బందులులేని గుట్టలు, పర్వత ప్రాంతాల్లో కొత్తగా మొక్కలు నాటడం తక్కువగా ఉంటోంది. రిటైర్డ్ఐఏఎస్ అధికారి అమరనారాయణ దీనిని గమనించి సీడ్ బాల్స్ ఆలో చన అమలు చేశారు. తన సర్వీసులో మూడేళ్లపాటు పాఠశాల విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలసి సీడ్‌బాల్స్‌ను బోడి గుట్టల్లో వేయించి మంచి ఫలితాలు సాధించారు. పచ్చదనం పెరగాలి.. సీడ్‌బాల్స్‌ను మన రాష్ట్రంలో తొలి సారి మేమే అమలు చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కువ స్థాయిలో వర్షాలు రావాలని మా ఆకాంక్ష. ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పచ్చదనం పెరిగితేనే ఇది సాధ్య మవుతుంది. – జి.సుధీర్‌బాబు,వరంగల్ పోలీస్ కమిషనర్ -
జూన్ 2 నుంచి ఒంటరి మహిళలకు పెన్షన్లు
- ప్రణాళికను నిర్దేశించిన సీఎస్ ఎస్పీ సింగ్ - వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల పెన్షన్ల ను జూన్ 2 నుంచి పంపిణీ చేసేందుకు జిల్లా కలెక్టర్లు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. ఒంటరి మహిళల పెన్షన్ల మార్గదర్శకాలు జారీ చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహించా లన్నారు. బుధవారం సచివాలయం నుంచి సీఎస్ ఎస్పీ సింగ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్. మీనా, సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియంకా వర్గీస్, పంచాయతీరాజ్ కమిష నర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని సీఎస్ అన్నారు. ఈ నెల 8 నుంచి 13 వరకు గ్రామ సభల్లో, మున్సిపల్ వార్డులలో మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీక రణను ప్రారంభించాలని సీఎస్ ఆదేశించారు. 9 నుంచి 18 వరకు దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి, 19 నుంచి 21 వరకు దరఖాస్తుదారుల జాబితాలను గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డు లలో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించా లన్నారు. 22న లబ్ధిదారుల జాబితాను ప్రకటించి ప్రదర్శించాలన్నారు. 23 నుండి 25 వరకు డేటాను అప్లోడ్ చేయాలన్నారు. కలెక్టర్లు శ్రద్ధ వహించి ఈ పథకం అమలుపై జిల్లా యంత్రాంగానికి తగు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలోను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పెన్షన్ల పంపిణీ జరగాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో అర్హుల ఎంపికకు ప్రత్యేక వ్యూహం రూపొందించుకోవాలన్నారు. ఈ పథకానికి సంబంధించి సెర్ప్ కార్యాలయం లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా మన్నారు. రాష్ట్రంలో వచ్చే సీజన్లో హరిత హారం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వ హించడానికి తగు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. -
పచ్చని చెట్లపై ‘హైవే’ వేటు
నేలకొరుగుతున్న భారీ వృక్షాలు ⇒ హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి విస్తరణతో వృక్ష సంపద కనుమరుగు ⇒ ‘ట్రాన్స్ ప్లాంటేషన్’పై దృష్టిసారించని అధికారులు సాక్షి, జనగామ: హరితహారం పేరిట ప్రభుత్వం ఓ వైపు మొక్కలు నాటి హరితాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. జాతీయ రహదారి విస్తరణ కోసం మరోవైపు భారీ వృక్షాలను నేలకూలుస్తున్నారు. దీంతో ఒకప్పుడు పచ్చని చెట్లతో కనిపించే రోడ్డు ఇప్పుడు చెట్లు లేక బోసిపోతోంది. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిని యాదా ద్రి భువనగిరి జిల్లా రాయగిరి నుంచి వరంగల్ వరకు నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. రూ.1,905 కోట్ల వ్యయంతో 99 కిలో మీటర్ల మేర 163వ రహదారిని విస్తరిస్తున్నారు. ఈ నిర్మాణ పనులను ఎల్అండ్టీ కంపెనీ నిర్వహిస్తోంది. 30 నెలల్లో పనులను పూర్తి చేయనున్నారు. అయితే రోడ్డు విస్తరణ కారణంగా ఇరువైపులా వేప, తుమ్మ, మర్రి, చింత, సుబాబుల్, జామాయిల్ వంటి 5 వేల చెట్లు ఉన్నాయి. దశాబ్దాల వయస్సు ఉన్న చెట్లు ఈ విస్తరణ పనుల కారణంగా తొలగిస్తున్నారు. ట్రాక్టర్లకు కటింగ్ మెషిన్లను అమర్చి కేవలం ఐదు నిమిషాల్లోనే చెట్టును నరికివేస్తున్నారు. చెట్టు మొదలు, కొమ్మలను తొలగించి అప్పటికే తెచ్చుకున్న లారీల్లోకి ఎక్కించి హైదరాబాద్‌లోని సామిల్లులకు తరలిస్తున్నారు. ఒక చెట్టు పెరగడానికి సంవత్సరాల సమయం పడుతుండగా తొలగించడం మాత్రం నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. కాం ట్రాక్టు సంస్థకు చెట్ల పేరుమీద రూ.5 కోట్ల ఆదాయం సమకూరినట్లుగా సమాచారం. ఊసేలేని ‘ట్రాన్స్ ప్లాంటేషన్’ రోజు రోజుకు అంతరించిపోతున్న అడవులను కాపాడాలని, అడవుల శాతాన్ని పెంచడం కోసం 1994లో ‘ట్రాన్స్ ప్లాంటేషన్’చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. తప్పని సరి పద్ధతిలో చెట్లను తొలగించవలసి వస్తే ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం అలాంటి ప్రయోగాలు ఏమాత్రం చేయకుండానే చెట్లను తొలగించడం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మొక్కంటే.. ‘లెక్క’లేదు..
నాటిన మొక్కలకు సంరక్షణ కరువు ఎండిపోతున్న వైనం.. రక్షణ పేరిట నిధులు దుర్వినియోగం డివైడర్ల మధ్య మళ్లీ మొక్కలు నాటేందుకు నిధులు మంచిర్యాల టౌన్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం అమలుచేస్తోంది. భవిష్యత్తు సంక్షేమ దృష్ట్యా ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచిస్తోంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కానీ.. ఏం లాభం జిల్లాలకు వస్తే ఆ పరిస్థితి తారుమారు అవుతోంది. జిల్లాలో లక్షకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించారు. గుంతలూ తవ్వారు. లక్ష్యాన్ని మించి మొక్కలు నాటినట్లు రికార్డుల్లోనూ రాశారు. కానీ.. ఎక్కడ చూసినా మొక్కలు కనిపించడం లేదు. మొక్కల కోసం తవ్విన గుంతలు మాత్రం ఖాళీగా దర్శనమిస్తూ.. అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. కనిపించని మొదటి విడత మొక్కలు.. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో హరితహారం అపహాస్యం పాలవుతోంది. గత ఏడాది నాటిన మొక్కలు ఎండిపోయి కనిపించకుండా పోగా.. ఈ ఏడాది లక్ష్యాన్ని పెంచి ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వామ్యులను చేసినా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటినట్లు కనిపించడం లేదు. మొదటి విడతలో నాటిన మొక్కలు ఎక్కడా – మిగతా 2లోu కనిపించకుండా పోయాయి. దీంతో రెండో విడత లో మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించడమూ అంతే ముఖ్యమన్న నినాదం తో ముందు నుంచి ప్రభుత్వం రెండో విడత హరితహారానికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ శాఖలను హరితహారంలో సమన్వయం చేయడంతో, నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువగానే మొక్కలు నాటేందుకు ఉత్సాహం చూపారు. అం దుకు అనుగుణంగానే మున్సిపాలిటీ పరిధిలో మొ క్కలు నాటేందుకు గుంతలను సైతం తవ్వారు. మున్సిపాలిటీకి మొదట 70 వేల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించగా.. మంచిర్యాల పోలీసులే పది వేలకు పైగా మొక్కలు నాటారు. వీరికి తోడు మహిళా సంఘాల సభ్యులు 50 వేలకు పైగా మొ క్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. దీంతో మున్సిపాలిటీ లక్ష్యాన్ని 1,13,417గా నిర్ణయించారు. అం దుకు అనుగుణంగా మొక్కలు నాటేందుకు మున్సిపల్ అధికారులు గుంతలు తవ్వారు. 1,36,542 మొక్కలు నాటినట్లు రికార్డుల్లోనూ రాశారు. కానీ.. తవ్విన గుంతలే దర్శనమిస్తున్నాయి. కానరాని ట్రీగార్డులు : మొక్కలను కాపాడేం దుకు మున్సిపల్ అధికారులు 90 బెండెల్స్ ప్లాస్టిక్‌తో కూడిన 1500 ట్రీగార్డులు, తడకలతో చేసిన 4,357 ట్రీగార్డులను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. లక్షల మొక్కలు నాటినట్లు చెబుతున్న అధికారులు, ట్రీగార్డుల ఏర్పాటులో మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదోనని, పట్టణ ప్రజలు ఆశ్చ ర్యం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటడంతోనే సరిపోదు.. దానికి రక్షణ ఏర్పాటు చేయాలి. మొ క్క సంరక్షణకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాల్సి ఉ న్నా, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనా ర్హం. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి, నీరందించి వాటి ఎదుగుదలకు దోహదపడే చర్యలు చేపట్టడం లేదన్న ఆరోపణలు మున్సిపల్ సిబ్బంది మూటగట్టుకుంటున్నారు. దీంతో రెండో విడతలో నాటినా అవి ఎంతవరకు దక్కుతాయో తెలియదు. సంరక్షణ గాలికి.. : 1.13 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని అధిగమించి 1.36 లక్షల మొక్కలు నాటామని చెబుతున్న మున్సిపల్ అధికారులు, వాటిలో ఎన్ని మొక్కలు ప్రస్తుతం బతికి ఉన్నాయన్న లెక్కలను మాత్రం చూపడం లేదు. ఉద్యమంగా తీసుకుని మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో మొక్క లు నాటినా.. వాటిలో ఇప్పటికే చాలా వరకు మొక్కలు ఎండిపోయాయి. మొదటి విడత హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోగా, వాటికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయి. కనీసం రెండో విడతలోనైనా, ప్రభుత్వం హరితహారానికి కేటాయించిన నిధులు, మొక్కలు ఎండిపోవడంతో దుర్వినియోగం అవుతున్నాయి. మొ క్కలను సంరక్షించేందుకు ప్రతిరోజూ రెండు ట్యాంకర్లతో నీటిని పోస్తున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నా, మొక్కలు ఎందుకు ఎండిపోతున్నాయో వారికే తెలియాల్సి ఉంది. నాటిన మొక్క నాటినట్లుగా ఎండిపోతుండగా, రికార్డుల్లోనూ ఎ క్కువ మొక్కలు నాటినట్లుగా అధికారులు చూపిస్తున్నారు. మరి లక్షలాది నిధులను ఖర్చు చేసి నా టుతున్న మొక్కలను ఎందుకు సంరక్షించడంలేదో అధికారులకే తెలియాలి. ‘మొక్కలను సంరక్షించేం దుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ట్రీగార్డుల ఏర్పాటులో జరిగిన ఆలస్యంతో కొన్ని మొక్కలు పశువుల పాలయ్యాయి. హరితహారంపై నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని మున్సిపల్ చైర్పర్సన్ వసుంధర అన్నారు. -
మెుక్కలకు రక్షణేది ?
సంరక్షణ మరిచిన అధికారులు ట్రీగార్డులు కరువు ఎండిపోతున్న మెుక్కలు పట్టించుకోని బల్దియా యంత్రాంగం కరీంనగర్ కార్పొరేషన్ : లక్ష్యం కోసం లక్షకు పైగా మెుక్కలు నాటారు. అయితే వాటి సంరక్షణమాత్రం మరిచారు. ఫలితంగా మెుక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. పచ్చగా పెరిగిన వాటికి ట్రీగార్డులు లేక పశువుల పాలవుతున్నాయి. జూలై 18న తెలంగాణకు హరితహరంలో భాగంగా నగరంలో లక్షకు పైగా మెుక్కలు నాటారు. పలు డివిజన్లలో నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయకపోవడంతో పశువులు, పందులు తినిశాయి. కొన్ని వాడిపోగా, మరికొన్ని ఎండిపోయి మెుండాలు ఎక్కిరిస్తున్నాయి. ట్రీగార్డుల కొనుగోలు జాప్యం నగరపాలక సంస్థ పరిధిలో ట్రీగార్డుల కొరత ఏర్పడింది. మొక్కలు నాటిన నెల రోజుల వరకు ట్రీగార్డులను సమకూర్చలేకపోయారు. దాతలు సహకారం అందించినా సరైన సమయానికి స్పందించకపోవడంతో లక్ష్యం నీరుగారిపోయింది. దాతల నుంచి సేకరించిన నిధులను బల్దియా అకౌంట్‌కు జమచేస్తే టెండర్ల ప్రాసెస్ ఆలస్యమవుతుందని, నేరుగా ట్రీగార్డుల తయారీకి ఉపయోగించారు. రెండు వేలకు మించి ట్రీగార్డులు కూడా అందించలేకపోయారు. మొక్కలు నాటిన తర్వాత అధికారులు మళ్లీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో నీరు లేక మొక్కలు ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానికులే ట్రీగార్డులు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటికి నీరు దొరకని పరిస్థితులు ఎదురయ్యాయి. నగరాన్ని జోన్లుగా విడదీసి అధికారులను బాధ్యులుగా నియమించినా మెుక్కల సంరక్షణ మాత్రం మరిచారు. ఆలస్యంగా వర్షాలు జూలైలో మొక్కలు నాటితే ఆగస్టు నెలంతా వర్షాలు లేకపోవడంతో మెజారిటీ మొక్కలు ఎండిపోయాయి. ఆలస్యంగా వర్షాలు కురుస్తున్నా, సరైన సమయంలో నీరు లేకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. జియో ట్యాగింగ్‌తో మొక్కల లెక్కలు ఖచ్చితంగా చెబుతామని అప్లికేషన్ తయారు చేసినప్పటికీ దాని ఉపయోగం శూన్యం. గుంతల బిల్లులు స్వాహా మొక్కల పరిస్థితి ఇలా ఉంటే గుంతల తవ్వి వాటి బిల్లులు మాత్రం వెంటనే తీసేసుకున్నారు. కొన్ని డివిజన్లలో అసలు గుంతలు తవ్వకుండానే బిల్లులు నొక్కేశారు. 82 వేల గుంతలు తవ్వినట్టు లెక్కలు చూసి హడావిడిగా రూ.16.5 లక్షల బిల్లులు పొందారు. ఈ విషయం తెలిసిన పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలో అసలు గుంతలే తవ్వలేదని, వందల సంఖ్యలో రికార్డు చేయడం విడ్డూరంగా ఉందని విస్తుపోయారు. హరితహారం మహోద్యమంలా సాగాలని ప్రభుత్వం భావిస్తే, కొందరి జేబుల్లోకి నిధుల వరద సాగింది. -
ముమ్మరంగా మొక్కలు నాటాలి
కలెక్టర్ నీతూప్రసాద్ ముకరంపుర : వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున ముమ్మరంగా మొక్కలు నాటాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులకు సూచించారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులతో గురువారం హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 35 లక్షల టేకు స్టంపులను అన్ని మండలాలకు పంపించామని, రెండు, మూడురోజుల్లో నాటాలని ఆదేశించారు. అన్ని మొక్కలకు రిజిస్టర్, జియోట్యాగింగ్ చేయాలని సూచించారు. మెుక్కల సంరక్షణకు బోర్‌వెల్స్ మంజూరు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ నుంచి డ్వామా ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటిన తర్వాత 3 రోజుల్లో కూలీలకు డబ్బులు చెల్లించాలని తెలిపారు. ఇంకుడుగుంతలు, ఐఎస్ఎల్ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్, ఏజేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య పాల్గొన్నారు. -
వచ్చే ఏడాదికీ ప్రణాళికలు
హరితహారంపై సమీక్షలో కలెక్టర్లకు సీఎస్ ఆదేశం సాక్షి,హైదరాబాద్: హరితహారం లక్ష్యాలను సాధించడానికి కలెక్టర్లు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. కార్యక్రమం అమలుపై మంగళవారం కలెక్టర్లతో జరిపిన సమీక్షలో సీఎస్ మాట్లాడుతూ.. లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించడానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. వచ్చే ఏడాదికి కూడా ఇప్పట్నుంచే ప్రణాళికలు రూపొందించుకొని మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మొక్కల సంరక్షణకు అవసరమైన నిధుల వివరాలను నెలవారీగా పంపాలని కోరారు. మొక్కలు నాటిన ప్రాంతాలకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రతి మొక్కను జియో రిఫరెన్సింగ్ ద్వారా ట్యాగ్ చేయాలన్నారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ప్రాంతాల్లో వెంటనే మొక్కలు నాటాలని, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటాలని ఆదేశించారు. భూసేకరణ వేగిరం చేయండి రాష్ట్రంలో నిర్మించనున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ తొందరగా పూర్తి చేయాలని, ఇబ్బంది తలెత్తితే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. రైల్వే, జాతీయరహదారుల విస్తరణపై ప్రధాని నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్సీ గణపతిరెడ్డి, రైల్వే, ఎన్హెచ్ఏఐ అధికారులు పాల్గొన్నారు. -
నేడు ఎంపీ కవిత జిల్లా పర్యటన
చంద్రశేఖర్‌కాలనీ : నిజామాబాద్ ఎంపీ కవిత సోమవారం జిల్లాలో పర్యటిస్తారని టీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కంuó శ్వర్ బైపాస్‌రోడ్డులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే హరితహరం కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం శ్రద్ధానంద్‌గంజ్‌లో నిజామాబాద్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవంలో, నిజామాబాద్ మండలం నర్సింగ్‌పల్లి సమీపంలో గల కస్బాగ్ తండాలో తీజ్ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. -
పెద్దోళ్ల’ ప్రయోజనాలకే హరితహారం
విప్లవ కవి వరవరరావు ఇల్లెందు: పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీల ప్రయోజనాల కోసమే హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విప్లవ కవి వరవరరావు విమర్శించారు. తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) చేపట్టిన బస్సు యాత్ర బృందం బుధవారం ఇల్లెందు మండలంలోని ఒంపుగూడెం, కొమురారం, బద్రూతండాలో పర్యటించింది. పోడు భూముల్లో అటవీ శాఖ ధ్వంసం చేసిన పంటలను పరిశీలించింది. అనంతరం.. మాణిక్యారం, కొమురారం సభల్లో బృందం సభ్యుడు వరవరరావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలోగల విశాలమైన అటవీ ప్రాంతానికి సమీపంలో రైల్వే లైన్ ఉంది. గోదావరి నీళ్లు ఉన్నాయి. అందుకే ఇక్కడి అటవీ భూములను పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఇందులో భాగంగానే అడవిని తన స్వాధీనంలోకి తీసుకునేందుకు హరితహారం పేరుతో పోడు భూముల నుంచి గిరిజనులను గెంటేస్తోంది’’ అని విమర్శించారు. రాజ్యాంగం 5వ, 6వ షెడ్యూల్ ద్వారా ఆదివాసీలకు సంక్రమించిన హక్కులను కాలరాస్తోందన్నారు. హరితహారం అసలు లక్ష్యం... పర్యావరణ పరిరక్షణ కాదని, బహుళజాతి సంస్థలు, బడా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు చేకూర్చడమేనని ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో రెండు పేపర్ పరిశ్రమలు.. ఒకటి– సిర్పూర్ కాగజ్‌నగర్‌లో, రెండవది– బూర్గంపాడులో ఉన్నాయి. ప్రభుత్వాధీనంలోగల సిర్పూర్ కాగజ్‌నగర్ పరిశ్రమ మూతపడింది. బడా పారిశ్రామిక సంస్థ ప్రయోజనాలో ఇమిడి ఉన్న బూర్గంపాడులోని ఐటీసీ పరిశ్రమను మాత్రం ప్రభుత్వం నడుపుతోంది’’ అని అన్నారు. ‘‘ప్రజల భూములకు రక్షణగా ఉన్న చట్టాలను ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. ఏజెన్సీపై ఆదివాసీలకు సర్వ హక్కులు కల్పిస్తున్న 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. మల్లన్నసాగర్లో భూనిర్వాసితుల పరిహారానికి సంబంధించి 2013 చట్టాన్ని పక్కకునెట్టి, 123 జీఓ తీసుకొచ్చింది. ప్రజల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సాగిస్తున్న కుతంత్రాలకు ఇవి ఉదాహరణలు మాత్రమే’’ అని అన్నారు. రానున్న కాలంలో రైతు కమతాలు ఉండవని, సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లే ఉంటాయని అన్నారు. రాష్ట్రంలోని మైదాన ప్రాంతంలోగల రెండులక్షల ఎకరాలను, అటవీ ప్రాంతంలోగల మూడు లక్షల ఎకరాలను సర్వే చేసి పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ.. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం దాడులను తప్పించుకునేందుకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలోకి వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని కేసీఆర్ ప్రభుత్వం గెంటేస్తోంది. గుజరాత్, అమెరికా, ఫ్రాన్స్‌కు చెందినకంపెనీలకు మాత్రం ఇక్కడి అటవీ భూమిని అప్పగిస్తోంది’’ అని విమర్శించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ (చంద్రన్న) రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ (రాయల) నాయకులు గుమ్మడి నర్సయ్య, జగ్గన్న, ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిచంద్ర, జిల్లా కార్యదర్శి మెంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా, ప్రజాఫ్రంట్ ముద్రించిన ‘అడవిపై ఆదివాసీలకే సర్వ హక్కులు’ అనే పుస్తకాన్ని వరవరరావు, నారాయణరావు ఆవిష్కరించారు. ప్రజాఫ్రంట్ కళామండలి ఆటా–పాటా ప్రదర్శించింది. -
వాడిపోయిన మెుక్కలు ఇస్తారా ?
కొడకండ్ల : హరితహారం కార్యక్రమంలో భాగం గా డ్వాక్రా సంఘాల మహిళలకు పంపిణీ చేసేం దుకై వచ్చిన దానిమ్మ మొక్కలన్నీ వాడిపోయి ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తీవ్ర వర్షాభావం నెలకొని వానలు కురువకపోవడంతో నాటిన మొక్కలే ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాడిపోయిన మొక్కలనునాటడం వలనఎలా బతుకుతాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామ పంచాయతీ వద్ద మొక్కలను పంపిణీ చేస్తామని పంచాయతీ ఆధ్వర్యంలో చాటింపు వేయగా మొక్కల కోసం వచ్చిన వారు వాడిపోయిన మొ క్కలను చూసి విస్తుపోయారు. చనిపోయే దశ లో ఉన్న ఈ దానిమ్మ మొక్కలను తీసుకెళ్లేందు కు చాలా మంది నిరాసక్తత వ్యక్తం చేసారు. -
జిల్లాకు హరితమిత్ర అవార్డులు
నిజామాబాద్ అర్బన్ : జిల్లాకు హరితమిత్ర అవార్డులు వరించాయి. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితమిత్ర అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాకు రెండు అవార్డు దక్కాయి. సదాశివనగర్ మండలం గిద్ద జిల్లా ప్రజాపరిషత్, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ఆర్మూర్లు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోనున్నారు. ఈ అవార్డులను గిద్ద మాజీ ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ తరఫున డాక్టర్ శరత్ డైరెక్టర్ ఏఎంసీ అందుకోనున్నారు. కలెక్టర్ యోగితారాణా హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా చేపట్టారు. ప్రతి గ్రామం, మండలం, పట్టణ కేంద్రాలతోపాటు కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేశారు. దీంతో రాష్ట్రంలో హరితహారంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు కలెక్టర్ కృషి వల్ల హరితమిత్ర రెండు అవార్డు లభించాయి. ఈ అవార్డులకు సంబంధించి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.ఆర్.మినా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నేటి నుంచి రెండో దశ మెగా ప్లాంటేషన్
కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలంలో గురువారం నుంచి 15 వరకు రెండో దశ మెగా ప్లాంటేషన్ చేపడుతున్నట్లు ఆర్డీవో చంద్రశేఖర్ తెలిపారు. మండల పరిషత్‌లో బుధవారం హరితహారం నిర్వహణపై నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 15 వరకు 5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి విడతలో నాటిన 4లక్షల మొక్కలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంపీడీవో దేవేందర్‌రాజు, ఈవోపీఆర్డీ దేవకిదేవి, ఈజీఎస్ ఏపీవో శోభ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తిలో 500 గన్నేరు మొక్కలు రేకుర్తిలో రాజమండ్రి నుంచి తెప్పించిన 500 గన్నేరు మొక్కలను నాటే కార్యక్రమాన్ని సర్పంచ్ నందెల్లి పద్మ ప్రారంభించారు. శాతవాహన యూనివర్సిటీ నుంచి జగిత్యాల ఆర్అండ్బీ రోడ్డు వరకు గల డివైడర్ల మధ్య ఈ మొక్కలు నాటారు. ఉపసర్పంచ్ ఎస్.కష్ణకుమార్, ఎంపీటీసీ శేఖర్, పీఆర్ ఏఈ, నోడల్ అధికారి జగదీశ్, వార్డుసభ్యులు ఎస్.నారాయణ, మాజీద్ తదితరులు పాల్గొన్నారు. -
పచ్చదనమే నా లక్ష్యం: సీఎం
* తెలంగాణను భూతలస్వర్గం చేద్దాం * అందుకు ఏ చర్యకైనా వెనుకాడను * హరితహారంపై సమీక్షలో సీఎం * నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ‘‘పచ్చదనానికి నేను గాఢమైన ప్రేమికుడిని. రేపు మనం లేకపోయినా భావితరం ఉంటుంది. వారి కోసం మనం నాటే మొక్కలుంటాయి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి ఏ చర్యలకైనా వెనుకాడబోను. అంతిమంగా తెలంగాణలో అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడమే నా లక్ష్యం’’ అని పునరుద్ధాటించారు. ‘‘తెలంగాణ ఒకప్పుడు అడవులు, పచ్చదనం, వనసంపదతో తులతూగేది. పర్యావరణ సమతుల్యతతో భూతల స్వర్గంగా ఉండేది. ఆ స్వర్గాన్ని మళ్లీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి. కాంక్రీట్ జంగిల్స్‌గా మారిన నగరాలు, పట్టణాల్లో వాతావరణాన్ని చల్లబరి చేందుకు, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేం దుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోవాలి. జనావాసాల్లో మొక్కల పెంపకంతో సామాజిక అడవులను అభివృద్ధి చేయాలి. అటవీ ప్రాంతంలో మళ్లీ దట్టమైన చెట్లు పెరిగేలా చూడాలి. వనసంపదను రక్షించడంతో పాటు కనుమరుగైన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు పెంచాలి’’ అని ఆదేశించారు. హరితహారం కార్యక్రమంపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. వానాకాలంలోనే కాకుండా ఏడాదిలో పది నెలలూ మొక్కలు నాటవచ్చన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా సాగాల న్నారు. పట్టణ ప్రాంత ఫారెస్టు బ్లాకులు, ఖాళీ జాగాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ‘‘రాష్ట్రంలో 45 శాతం ప్రజలు నగరాలు, పట్టణాల్లో నివసిస్తుండటంతో జనసాంద్రత పెరిగిపోతోంది. సరిపడా పచ్చదనం లేకుంటే విపరిణామాలు తప్పవు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొక్కల పెంపకానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. దాని అమలుకు గ్రీన్ సెల్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ సెల్‌కు కార్పొరేషన్లలో ఐఎఫ్ఎస్లను, మున్సిపాలిటీల్లో అటవీ శాఖ అధికారులను ఇన్చార్జిలుగా నియమించండి. మొక్కలు నాటడం, రక్షించడం, వచ్చే ఏడాదికి మొక్కల కోసం నర్సరీలు సిద్ధం చేయడం గ్రీన్ సెల్ ఆధ్వర్యంలో జరగాలి. మొక్కలు నాటిన వారికే ఇళ్ల ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ చేసే విధానం తేవాలి’’ అని ఆదేశించారు. హైదరాబాద్‌లో ఇలా... హైదరాబాద్ శివార్లలో హరిణ వనస్థలి, నారపల్లి, గుర్రంగూడ, బొంగులూరు, మంగల్‌పల్లి, తుర్కయాంజాల్, రావిర్యాల, మాదన్నగూడ, నాగారం, మైసారం, నందుపల్లి, మజీ ద్గడ్డ, పల్లెగడ్డ, సిరిగార్పూర్, తిమ్మలూరు, శ్రీనగర్ తదితర అటవీ బ్లాక్‌లను దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలని సీఎం సూచిం చా రు. ఔటర్ రింగ్‌రోడ్డు వెంట అందమైన పూల మొక్కలు నాటాలి. ఇందుకు నీటి ట్యాంకర్లు కొనుగోలు చేయాలి’’ అని సీఎం అన్నారు. స్మగ్లర్లపై పీడీ యాక్టు ‘అడవులను నరికేవారిపై, కలప స్మగ్లర్లపై పీడీ యాక్టు ప్రయోగించండని సీఎం అన్నారు. కలప స్మగ్లింగ్‌కు ఆస్కారమున్న చోట్ల నిఘా పెట్టాలని, అవసరమైన సిబ్బంది నిస్తామన్నా రు. ఐఎఫ్ఎస్ అధికారులు, అటవీ సబ్బందిని అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవాలన్నారు. ఈ విషయంలో రాజకీయ జోక్యముండదని, రిటైర్డ్ అటవీ సిబ్బంది సేవలనూ వినియోగించుకోండని సీఎం అన్నారు. నివేదిక సమర్పించండి పట్టణాలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, వర్సిటీలు తదితర చోట్ల ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని బతికాయి, చెట్ల పెంపకానికి ఎలాంటి వ్యూహం అమలు చేస్తున్నారు వంటి వివరాలతో నివేదిక సమర్పించాలని సీఎస్ రాజీవ్ శర్మను సీఎం ఆదేశించారు. సమీక్షలో మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు, అటవీ మంత్రి జోగు రామన్న, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, పీసీసీఎఫ్ పీకే ఝా, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. -
నామమాత్రంగా హరితహారం
కొండాపూర్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం నామమాత్రంగానే కొనసాగుతున్నది. ప్రతి గ్రామానికి 40 వేల మొక్కలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి దానికనుగుణంగానే హంగూ ఆర్భాటంతో హరితహారం కార్యక్రమం ప్రారంభించింది. అయితే ఫలితం మాత్రం శూన్యం.మొక్కలను నర్సరీల ద్వారా గ్రామాల్లోకి పంపిణీ చేసినప్పటికీ వాటిని చెత్తకుప్పల్లోనూ, పంచాయతీ కార్యాలయ వెనుకభాగంలోను దర్శనమిస్తున్నాయి. గుంతలను తవ్వి 20 రోజులు దాటినా మొక్కలను మాత్రం నాటడంలేదు. దీంతో వర్షాలకు గుంతలు పూడ్చుకుపోతున్నా కనీసం పట్టించుకునే మండల అధికారులే కరువయ్యారు. మండలంలోని 22 గ్రామాలకు 8 లక్షల 80 వేల మొక్కలను ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఇప్పటి వరకు మండలంలో కేవలం 3 లక్షల 33 వేల మొక్కలను మాత్రమే నాటారు. అనంతసాగర్‌లో 4,910, దొబ్బకుంటలో 5,150, గారకుర్తి 1,095, తొగర్పల్లి 4,510, తేర్పోల్‌లో 8,100, సైదాపూర్‌లో 4,960, మారేపల్లిలో 3,520, మాందాపూర్‌లో 6,560, గిర్మాపూర్‌లో 7,330 మొక్కలను నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి అయితే కేవలం ఇవి పేపర్ ప్రకటనలకే పరిమితమవుతున్నాయని, ఇప్పటివరకు ఏ గ్రామంలో కూడా కనీసం 5 వేల మొక్కలను కూడా నాటలేదని పలువురు పేర్కొంటున్నారు. పలు గ్రామాలలోని ప్రజలు విమర్శిస్తున్నారు.తేర్పోల్ గ్రామంలో నర్సరీల ద్వారా తెచ్చిన మొక్కలు సుమారు 150కి పైగా పంచాయతీ కార్యాలయం వెనుక వున్న ముళ్ల పొదల్లో పడేశారు. ఈ విషయంపై గ్రామస్తులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. మారేపల్లి గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొక్కలను నాటేందుకు గ్రామ శివారులో గల కొత్తకుంట కాలవ క్రింది భాగంలో గుంతలు తీసి 20 రోజులు దాటినా ఇప్పటి వరకు మొక్కలు నాటలేదు. వర్షం వచ్చి గుంతలన్ని మూసుకుపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా మండల అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ నాటిన మొక్కలైనా వాటిని సంరక్షిస్తే చాలనీ పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
మిరుదొడ్డి: హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విధిగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. శనివారం మిరుదొడ్డి, చెప్యాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను హరితహారం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొక్కలను నాటి సంరక్షిస్తేనే మానవ మనుగడ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పంజాల కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు లింగాల జయమ్మ, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంట బాపురెడ్డి, వైస్ చైర్మన్ వంజరి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు గొట్టం భైరయ్య, ధార స్వామి, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలసత్వం వహిస్తే సహించేది లేదు ఇంకుడు గుంతల నిర్మాణంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో మండల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యపు ధోరణి వీడి ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేయాలన్నారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఏడుపాయల దుర్గమ్మ సేవలో శ్రీకాంత్
పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం మహాయజ్ఞంలా కొనసాగుతోందని, ప్రతి మొక్క భూమాతకు పచ్చని బుట్టులా మారాలని సినీ నటుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం ఏడుపాయలకు వచ్చిన ఆయన దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. ముందుగా ఈఓ వెంకట్‌కిషన్‌రావు, విష్ణువర్దర్‌రెడ్డి, ఆయల సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏడుపాయలను దర్శించుకోలేదన్నారు. దట్టమైన అడవి మధ్యన మంజీరా, ప్రహరీలా ఉన్న రాతి గుట్టల్ని చూస్తుంటే మనస్సు పులకించిందన్నారు. హరితహారంలో యావత్ సినీ పరిశ్రమ పాల్గొని మొక్కలు నాటిందన్నారు. ఆయన వెంట బంధువులు, ఆలయ సిబ్బంది గోపాల్, రవి, శ్రీనివాస్, అచ్చన్నపల్లి శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, పూజారులు శంకరశర్మ, పార్థివశర్మ ఉన్నారు. సెల్ఫీల కోసం ఆరాటం తమ అభిమాన నటుడితో సెల్ఫీలు తీసుకునేందుకు యువకులు, మహిళలు పోటీపడ్డారు. చిరుజల్లులు పడుతున్నా శ్రీకాంత్ ఓపిగ్గా అందరినీ పలకరించి, ఫొటోలు దిగడం విశేషం. -
5 లక్షల మెుక్కలు నాటాం
రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా హరితహారంలో పోలీస్ అమరవీరుల కుటుంబాలు వరంగల్ : హరితహారంలో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు, ఆదివాసీలు, మహిళలు, ప్రజల సహకారంలో ఇప్పటివరకు 5లక్షల మెుక్కలు నాటినట్లు రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ తెలిపారు. హన్మకొండలోని భీమారం శ్రీశుభం కళ్యాణ వేదిక లో పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం హరితహారంలో ఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీ స్ అమరవీరుల సేవలు వెలకట్టలేనివన్నారు. హరితహారంలో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు భాగస్వాములు కావడం అభినందనీ యమన్నారు. సీఆర్పీఎఫ్ కమాండెంట్లు అరవింద్‌కుమార్, విజయ్‌కుమార్, వరంగల్ ఏఎ స్పీ జాన్‌వెస్లీ, ఏఆర్ ఏఎస్పీ ప్రవీణ్‌కుమార్, డీఎస్పీలు పద్మనాభరెడ్డి, మురళీధర్, రాజమహేంద్రనాయక్, రాంచందర్‌రావు, పీపీ సరా ్ధర్, అమరవీరుల కుటుంబ సభ్యులు రమాదే వి, శ్రీదేవి, స్వరూపరాణి, రేణుక, లత, అహ ల్య, లక్ష్మి, రాధ, చంద్రకళ పాల్గొన్నారు. -
‘హరితహారం’లో భాగస్వాములు కావాలి
పెద్దవూర : హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై విస్తృతంగా మొక్కలు నాటాలని జెడ్పీ ఈసీఓ మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గేమ్యానాయక్‌తండా రోడ్డు వెంట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెట్లతోనే జీవకోటి మనుగడ సాధ్యమని.. ఇప్పుడు మెుక్కలు నాటి సంరక్షిస్తేనే చెట్లుగా ఎదుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె.పాండునాయక్, ఎంపీడీఓ రఫీఖున్నిసా, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, సర్పంచ్ రమావత్ శంకర్‌నాయక్, కార్యదర్శి డేవిడ్‌రాజు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సైదులు పాల్గొన్నారు, -
హరితహారానికి 20 రోజులు
రాష్ట్రవ్యాప్తంగా 17 కోట్ల మొక్కలు నాటించిన సర్కార్ సాక్షి, హైదరాబాద్: రెండోవిడత హరితహారం బుధవారంనాటికి 20వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 కోట్లకుపైగా మొక్కలు నాటారు. తొలి రెండు వారాల్లోనే 46 కోట్ల మొక్కలు నాటనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తొలుత ప్రకటించినా ఆశించినంత వేగంగా సాగడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఈ కార్యక్రమాన్ని వేగంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వర్షాకాలం ముగిసేలోగా లక్ష్యానికి అనుగుణంగా 46 కోట్ల మొక్కలు నాటనున్నట్లు అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. మొక్కల సంరక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ విభాగాలు, గ్రామ కార్యదర్శులు, హరిత రక్షణ కమిటీలకు అప్పగించడంతో ఫలితాలు మెరుగయ్యాయి. మొక్కలు నాటడంలో నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు 2 కోట్ల మార్కు దాటాయి. మంగళవారం నాటికి నిజామాబాద్ జిల్లాలో 2.55 కోట్లు, ఆదిలాబాద్‌లో 2.42 కోట్లు, ఖమ్మంలో 2.29 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీశాఖ తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో తక్కువ సంఖ్యలో 75 లక్షల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. సరిపడాలేని పండ్ల మొక్కలు ప్రజల నుంచి పండ్ల మొక్కలకు భారీగా డిమాండ్ ఉండడంతో సరిపడా అందించలేక అధికార యంత్రాంగం సతమతమవుతోంది. 9 జిల్లాల నుంచి 60 లక్షల పండ్ల మొక్కల డిమాండ్ వచ్చినప్పటికీ, 28 లక్షల మొక్కలు ఇవ్వడానికి అటవీశాఖ అంగీకరించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ 18 లక్షల మొక్కలు మాత్రమే సరఫరా చేయగలిగింది. రాష్ట్రంలోని సుమారు 300కుపైగా ఉన్న నర్సరీల్లో 1.40 కోట్ల పండ్ల మొక్కలు అందుబాటులో ఉండగా, తొలివిడత 51 నర్సరీల నుంచి 10 లక్షల మొక్కలు పంపిణీ చేయాలని వచ్చిన ఆదేశాలు అమలు చేసేందుకు తంటాలు పడుతున్నారు. -
1.71 కోట్ల మొక్కలు నాటాం
కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 1.71 కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కరుణ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు నాటిన బ్లాక్ ప్లాంటేషన్ మొక్కలకు కంచె ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వర్షాలు బాగా కురుస్తున్నం దున నాటిన మొక్కలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. జిల్లాలో గ్రీన్ ఫండ్ బడ్జెట్‌ను అత్యవసరాల కోసం వినియోగిస్తున్నామన్నారు. వర్షాభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇ¯Œæస్టిట్యూషన్ ప్లాంటేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వరం గల్ సీపీ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, హరితహారం జిల్లా ప్రత్యేక అధికారి పృథ్వీరాజ్, కమిషనర్ సర్ఫరాజ్అహ్మద్, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఒకే రోజు 10 వేల మొక్కలు నాటిన విద్యార్థులు
సంగారెడ్డి మున్సిపాలిటీ :రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ హరితహరం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల అవరణలో హాస్టల్ విద్యార్థులు ఒకే రోజు 10 వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్చార్జి కమిషనర్, ఎజేసీ, వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతుగా కనీసం 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఇప్పటికే పట్టణంలో 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా తాము 90 వేల మొక్కలు నాటామన్నారు. అగస్టు 15 నాటికి పట్టణంలోని మున్సిపల్ పార్కులు, స్కూల్ గ్రౌండ్లతో పాటు శ్మశానవాటిక స్థలాలతో పాటు పంచాయతీరాజ్, ఆర్ండ్బీ మున్సిపల్ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతామన్నారు. మున్సిపల్ చెర్‌పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ హరిత తెలంగాణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా సేవా కార్యక్రమంగా చూసి ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. కార్యక్రంలో డిప్యూటీ ఇంజినీర్ ధర్మారెడ్డి, ఏఈ మహేష్, వార్డు కౌన్సిలర్ యాకుబ్‌అలీతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
హరితహారాన్ని పూర్తిచేయాలి
శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. హన్మ కొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం రాత్రి వివిధ శాఖల అధికారులతో హరితహారం కార్యక్రమం ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీరోజు లక్ష్యాన్ని ఎంచుకుని మొక్కలను నాటాలన్నారు. రాష్ట్రస్థాయి అధికారుల నుంచి అందిన నమూనా ప్రకారం నివేదిక సమర్పించాలని సూచించారు. పండ్ల మొక్కలకు సంబంధించిన టెండర్ పూర్తయిందని, ఈనెల 30 నుంచి సరఫరా జరుగుతుందన్నారు. డీ గ్రేడెడ్ ఫారెస్టులో విరివిగా మొక్కలను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అటవీ సంరక్షణ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారానికి సంబంధించిన మొక్కలతో కూడిన వనాలను పెంచాలని సూచించారు. సమీక్షలో ఆర్అండ్బీ, డీఆర్డీఏ, పంచాయతీరాజ్, దేవాదాయశాఖ, విద్యాశాఖ, డ్వామా, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. లక్ష్యాన్ని చేరుకోవాలి హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులతో హరితహారం కార్యక్రమంపై కలెక్టర్ కరుణ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉన్నందున మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ పాంట్లేషన్ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సోషల్ ఫారెస్టు డీఎఫ్ఓ శ్రీనివాస్, సీపీఓ రాంచంద్రరావు, డీఆర్ఓ శోభ, పీఓ ఐటీడీఏ అమయ్‌కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ ఎస్.విజయ్‌గోపాల్, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘హరితహారంతో’ రైస్ ఇండస్ట్రీకి లాభం
హాలియా: హరితహారం కార్యక్రమం ద్వారా రైస్ పరిశ్రమలకు లాభం చేకూరనుందని జిల్లా పౌరసరఫరాల అధికారి అమృతారెడ్డి పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం హాలియాలోని బాలాజీ రైస్ మిల్లులో మొక్కలను నాటారు. చెట్లు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుసి పంటలు పండుతాయని, దీంతో బియ్యం పరిశ్రమలు నిరంతరం నడుస్తాయన్నారు. జిల్లాలో రైస్ మిల్లులు, గ్యాస్ గోడౌన్లలో ఇప్పటి వరకు 63 వేల మెుక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ప్రేమ్‌కుమార్, డీటీసీ ఎస్‌లు రంగారావు, లక్ష్మణ్‌బాబు, సర్పంచ్ ఉడ్తూరి వెంకట్‌రెడ్డి, హాలియా ఉపసర్పంచ్ పాంపాటి శ్రీనివాస్, మిల్లర్లు చిట్టిప్రోలు యాదగిరి, గార్లపాటి మట్టపల్లి, చిట్టిప్రోలు వెంకటేశ్వర్లు, పేలపూడి బాలకృష్ణ, ప్రసాద్, శ్రీనివాస్, రమేష్, కరుణాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
వెంకటాపురం : ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని వరంగల్ రేంజి డీఐజీ డాక్టర్ టి.ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు. హరితహా రంలో భాగంగా శని వారం మండలంలోని రామప్ప ఆలయ గార్డెన్లో ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో వరంగల్ రేంజి పరిధిలో కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో 50లక్షల మొ క్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నారు. అనంతరం రామప్ప ఆలయంలోని రామలింగేశ్వరస్వామికి డీఐజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ములుగు సీఐ శ్రీనివాస్‌రావు, వెంకటాపురం ఎస్సై భూక్య రవికుమార్ ఉన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా 45లక్షల ఈత మొక్కలు
చిట్యాల: హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఈత మొక్కలను నాటనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామ శివారులో శనివారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జీవన్‌సింగ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ దత్తురాజ్‌గౌడ్, సీఐ నర్సిరెడ్డి, ఎంపీడీఓ బి.లాజర్, తహసీల్దార్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మనమే ఫస్ట్!
♦ హరితహారంలో జిల్లాకు మొదటి స్థానం ♦ 55 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసిన జిల్లా ♦ సీఎం కార్యాలయం నుంచి ప్రశంసలు ♦ అధికారుల కృషి వల్లేనన్న కలెక్టర్ యోగితా రాణా ♦ బాధ్యతా రహితంగా ప్రవర్తించే ఏపీవోలపై చర్యలకు ఆదేశం ఇందూరు : అన్ని కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తున్న నిజామాబాద్ జిల్లా మరోసారి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలో నిజామాబాద్ జిల్లాకు 3 కోట్ల 35లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను, ఇప్పటి వరకు 2 కోట్ల 10 లక్షల 28 వేల మొక్కలను నాటి, 55 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసిన మొదటి జిల్లాగా నమోదైంది. గురువారం ఒక్క రోజే 19.56 లక్షల మొక్కలు నాటారు. ఇందుకు సీఎం కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి ప్రశంసలు అందాయి. కలెక్టర్ యోగితా రాణా, ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని ఖితాబునిచ్చారు. అయితే కలెక్టర్ డాక్టర్ యోగితారాణా గురువారం జిల్లాలోని 36 మండలాల తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, చేంజ్ ఏజెంట్లు, ఏపీవోలతో హరితహారం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడారు. జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని చేరేందుకు అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతి నిధుల శ్రమ వల్ల సీఎం కార్యాలయం నుంచి అభినందిస్తున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. అయితే ఈ కార్యక్రమాన్ని మరింత వేగం చేసేందుకు అధికారులు ఇదే ఉత్సాహంతో పని చేయాలని, బాధ్యతారహితంగా ప్రవర్తించే అధికారులపై, ఏపీవోలపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో వివిధ మొక్కలను నాటాలని, ఇళ్ల వద్ద వారికి కావాల్సిన మొక్కలను అందజేయాలని తెలిపినా, ఇంత వరకు లక్ష్యాన్ని పూర్తి చేయకుండా కాలయాపన చేయడం తగదన్నారు. జిల్లాలో గల 718 గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీల వారీగా 4వేల ప్రకారం అందించే టేకు స్టంపులను నాటించాలన్నారు. టార్గెట్ పూర్తికాని గ్రామ పంచాయతీలకు స్టంపులను ఇచ్చి వారి టార్గెట్‌ను పూర్తి చేయించాలని సంబంధిత మండలాధికారులకు సూచించారు. 30 వేల లక్ష్యం దాటిన గ్రామ పంచాయతీలకు 2 వేల 500 పండ్ల మొక్కలను అందజేయాలని తెలిపారు. జిల్లాలో ఆర్మూర్, పిట్లం, బీర్కూర్, నిజామాబాద్ మండలాలు హరితహారం కార్యక్రమంలో భాగంగా లక్ష్యాన్ని చేరుతున్నందుకు అధికారులను అభినందించారు. మిగిలిన గ్రామ పంచాయతీల్లో రెండు రోజుల్లో పనులను పూర్తి చేయించాలని తెలిపారు. జిల్లాలో ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 40 వేల లక్ష్యాన్ని పూర్తి చేసి మొదటి మండలంగా నమోదు అయినందుకు ఆ టీం సభ్యులను అభినందించారు. కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డి, అదనపు సంయుక్త కలెక్టర్ రాజారాం, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, పీడీ డీఆర్డీఏ చంద్రమోహన్, జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్, సోషల్ ఫారెస్టు అధికారిణి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
నాటిన ప్రతి మొక్కను బతికించండి
చౌటుప్పల్: హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు ముళ్ల కంచెను ఏర్పాటు చేసి బతికించాలని సీఎం అదనపు కార్యదర్శులు స్మితాసబర్వాల్, ప్రియాంకవర్గీస్‌లు అధికారులకు సూచించారు. గురువారం నల్లగొండ జిల్లాలో పర్యటించారు. చౌటుప్పల్‌లోని అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటి, నీళ్లు పోశారు. అనంతరం హరితహారం కార్యక్రమంపై ఆరా తీశారు. హైవే వెంట నాటిన మొక్కలపై నిఘా ఉంచాలని సూచించారు. నాటినవి ఎన్ని, బతికినవి ఎన్ని అని ఆరా తీశారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 20నుంచి 40వేల మొక్కలు నాటాలని, ఈ నెల 30వ తేదీ వరకు హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరారు. హరితహారంలో ప్రజల భాగస్వామ్యం బాగుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, డీఎఫ్ఓ సుదర్శన్‌రెడ్డి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, తహసీల్దార్ షేక్‌అహ్మద్, ఎంపీడీఓ రజిత, సర్పంచ్ బొంగు లావణ్య, ఎం.దయాకరాచారి, ఆల్మాసుపేట కష్ణయ్య, అటవీ శాఖ అధికారిణి సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు పెంచకుంటే భవిష్యత్‌లో నష్టం: గవర్నర్
రాజ్‌భవన్‌లో హరితహారంలో పాల్గొన్న నరసింహన్ దంపతులు హైదరాబాద్ : మానవుడి మనుగడకు ప్రాణాధారమైన మొక్కలు, చెట్లను విరివిగా పెంచి పర్యావరణాన్ని కాపాడాలని.. లేకుంటే భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. బుధవారం రాజ్‌భవన్ ప్రాంగణంలో నిర్వహించిన హరితహారంలో తన సతీమణి విమలా నర్సింహన్‌తో కలసి ఆయన మొక్కలు నాటారు. ముంచుకొస్తున్న గ్లోబల్ వార్మింగ్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మొక్కలు పెంచడం మినహా మరో మార్గం లేదని, ప్రతి ఒక్కరు శుభకార్యాల్లో ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం అలవాటు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, సలహాదారులు ఏకే మొహంతి, ఏపీవీఎన్ శర్మ, జాయింట్ సెక్రటరి బసంత్‌కుమార్, పలువురు సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. -
మొక్కల సంరక్షణకు.. ‘ఉపాధి’ కూలీలు
మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: హరితహారంలో నాటిన మొక్కల్ని సంరక్షించేందుకుగాను ఉపాధి హామీ కూలీలను వినియోగిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున పంచాయతీరాజ్ రోడ్లకు ఇరుపక్కల ఒకే రోజు 10 వేల మొక్కలు నాటాలని తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హరితహారంలో నాటిన ప్రతీ మొక్కను రక్షించేందుకు ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుందన్నారు. ప్రైవేటు స్థలాల్లో నాటిన టేకు మొక్కలకు ఒక్కోదానికి నెలకు రూ. 1, పండ్ల మొక్కలైతే రూ.15, ఇతర ఒక్కో మొక్కకు రూ. 1 చెల్లిస్తామన్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థల్లో నాటిన ఒక్కో మొక్కకు నెలకు రూ. 11.20 పైసలు చెల్లిస్తామన్నారు. రోడ్ల పక్కన నాటిన ఒక్కో మొక్కకు రూ. 12, ఈత చెట్లకు ఒక్కో దానికి రూ. 5, చెరువు గట్లు, ప్రభుత్వ భూముల్లో నాటిని ఈత చెట్లయితే ఒక్కో దానికి రూ. 11.20పైసలు చెల్లించనున్నట్లు వివరించారు. -
ప్రజాహితం కోసం మొక్కలు నాటాలి
పిలుపునిచ్చిన శాసనసభ స్పీకర్ సాక్షి, హైదరాబాద్ : ప్రజా హితం కోసం ప్రజలందరూ మొక్కలు నాటాలని శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి పిలుపునిచ్చారు. ‘ మొక్కలు నాటాలి.. అడవులను ప్రేమించాలి. సాంకేతికత పెరిగే కొద్దీ ప్రజాహితాన్ని మరిచిపోతున్నారు..’ అని ఆయన అన్నారు. శాసనసభ, శాసనమండలి ఆవరణలో మంగళవారం ఆయన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కొనసాగించడానికే సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారని, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. వెయ్యేళ్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం హరిత హారం ప్రారంభించారని, ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ప్రపంచంలో తొలిసారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రజలంతా భాగ స్వాములు కావాలని కోరారు. హరితహారంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదిరులు పాల్గొని మొక్కలు నాటారు. -
సతతం... హరితం
కొనసాగుతున్న హరితహారం మొక్కలు నాటుతున్న విద్యార్థులు, అధికారులు పలు సేవాసంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చెన్నూర్(కోటపల్లి) : కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జనమైత్రి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు హరితహారంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడారు. ప్రాణ కోటికి ప్రాణ వాయువు నిచ్చే మొక్కలను పెంచాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యదాస్, విద్యార్థులు పాల్గొన్నారు. -
సుద్దముక్కపై ‘హరిత’ నినాదం
‘అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం’ అన్నాడో కవి. ఇదే తరహాలో మరిపెడ మండలంలోని అబ్బాయిపాలేనికి చెందిన అనుముల హరినాథ్, ఉమ దంపతుల కుమారుడు నరేష్ కళా హృదయంతో స్పందించాడు. తనలోని సృజనాత్మకతను చాటుకునేందుకు సుద్దముక్కలపై హరితహారం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు రాశాడు. – మరిపెడ -
హరితహారం పేరుతో హక్కుల ఉల్లంఘన
భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య విమర్శ సీపీఎం ఆధ్వర్యంలో పోడు రైతుల ర్యాలీ గూడూరు : హరితహారం పేరుతో ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని భద్రాచలం ఎమ్మెల్యే, సీపీఎం శాసనసభా పక్ష నేత సున్నం రాజయ్య అన్నారు. వరంగల్ జిల్లా గూడూరులో ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో పోడు రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. 2005 ముందు నుంచి సాగు చేస్తున్న పోడు రైతులందరికీ పత్రాలు ఇస్తున్నట్లు గత పాలకులు ప్రకటించారని, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో ఆ భూములను ఆక్రమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖాధికారి లక్ష్మీకాంతరెడ్డి పోడు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీఎం కేసీఆర్ సూచించినా, అధికారులు సీఎం, మంత్రుల మాటలు వినకుండా హక్కుపత్రాలు ఉన్న పోడు రైతుల భూములను ఆక్రమించడం బాధాకరమన్నారు. పోడు సమస్యపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతానన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకుడు సూడి క్రిష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు సాదుల శ్రీనివాస్, కుర్ర మహేశ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఆంగోతు వెంకన్ననాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, రిజర్వేషన్ సాధన సమితి కన్వీనర్ దస్రూనాయక్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పాషం సాంబయ్యమాదిగ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటిన విదేశీయులు
డోర్నకల్ : వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస, రాయిగూడెం గ్రామాల్లో ఆదివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా విదేశీయులు మొక్కలు నాటారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన స్వచ్ఛంద సంస్థ పీపుల్స్ ఎయిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన తొమ్మిది మంది మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పెరుమాళ్లసంకీసలో సర్పంచ్ శెట్టి వెంకన్నతో కలిసి, రాయిగూడెంలో బంజారా సేవా సమితి ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బృందం ప్రతినిధి రే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం తదితర కార్యక్రమాల గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. వరంగల్‌లో హిజ్రాలు.. కరీమాబాద్ : కరీమాబాద్‌కు చెందిన తెలంగాణా హిజ్రాల సమితి ఆధ్వర్యంలో సుమారు 140 మంది హిజ్రాలు ఉర్సు శివారు ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వద్ద ప్రభుత్వం తమకు కేటాయించిన ఎకరం భూమిలో 500 మొక్కలు నాటారు. నాటిన ప్రతి మెుక్కను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో హిజ్రాల నాయకురాలు ఓరుగంటి లైలా, గౌతమి, రంజిత, సరిత, దీప, రమ్యమ్మ, అశ్విని, సుధ పాల్గొన్నారు. -
గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం
‘సాక్షి’ చొరవ భేష్ - ఉద్యమంలా హరితహారం - చిట్టాపూర్ బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు - సీఎం కేసీఆర్ దృష్టికి గౌడల సమస్యలు: స్వామిగౌడ్ సాక్షి, సంగారెడ్డి : గీత కార్మికులు, గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామమైన చిట్టాపూర్‌లో శనివారం ‘సాక్షి’ హరితహారాన్ని నిర్వహించింది. 5 ఎకరాల విస్తీర్ణంలో ఈత మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. గీతకార్మికులు, గౌడ కులస్తులు హరితహారంలో పాల్గొని ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు ఆధ్వర్యంలో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎక్సైజ్ కమిషనర్‌తో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటామన్నారు. కొత్త ఎక్సైజ్ విధానంపై అభిప్రాయాలు స్వీకరించి సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గీత వృత్తిని ప్రభుత్వాలు ధ్వంసం చేశాయి గత ప్రభుత్వాలు గీత వృత్తిని పూర్తిగా ధ్వంసం చేశాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో కల్లుగీత వృత్తికి మళ్లీ జీవం పోశారన్నారు. జంటనగరాల్లో కల్లు దుకాణాలను తెరిపించి 50 వేల మంది గీత కార్మికులకు ఉపాధి కల్పించారన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందే గీత కార్మికులకు రూ. 5 లక్షల వరకు పరిహారం చెల్లించేందుకు అంగీకరించారన్నారు. గీత కార్మికులకు పరిహారంగా అందాల్సిన రూ.16 కోట్ల బకాయిలను విడుదల చేశారన్నారు. గీత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గీతకార్మికులు, గౌడకులస్తులు సైతం సహకరించాలని కోరారు. హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున ఈత, ఖర్జూరం చెట్లు నాటి హరిత ఉద్యమానికి ఊపిరిపోయాలని పిలుపునిచ్చారు. ఈత, తాటి చెట్ల సంరక్షణకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలన్నారు. చెట్లు ఉన్నప్పుడే గీత కార్మికులకు ఉపాధి ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అందుబాటులో ఉన్న సొసైటీ భూములతోపాటు చెరువు గట్లపైన ఈత మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. జిల్లాలో మొత్తం కోటి ఈత మొక్కలు నాటాలన్నారు. ఆదిలాబాద్‌లో 37 శాతం, ఖమ్మంలో 42 శాతం అటవీప్రాంతం ఉంటే మెదక్ జిల్లాలో మాత్రం ఆరు శాతం మాత్రమే ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే కెనడాలో ప్రతి వ్యక్తికి 8,538, అమెరికాలో 716, రష్యాలో 4,416, చైనాలో 102, భారతదేశంలో అత్యల్పంగా 28 చొప్పున మొక్కలు ఉన్నట్లు చెప్పారు. మరో మూడు నెలల్లో దుబ్బాక నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకువస్తామన్నారు. మరో హరిత ఉద్యమాన్ని తెద్దాం గీతకార్మికులు, గౌడకులస్తులు పెద్ద సంఖ్యలో ఈత, తాటి మొక్కలు నాటి మరో హరిత ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. గీతకార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ‘సాక్షి’పై ప్రశంసల జల్లులు హరితహారంలో భాగంగా ‘సాక్షి’ దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో శనివారం పెద్ద ఎత్తున ఈత మొక్కలు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడాన్ని అన్నివర్గాలు ప్రశంసించాయి. హాజరైన మంత్రి హరీశ్‌రావు ‘సాక్షి’ చొరవను ప్రశంసించారు. హరితహారంలో మొక్కలు పెంచే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ‘సాక్షి’ సామాజిక బాధ్యతతో వ్యవహరించటంతోపాటు గౌడ కులస్తులు, గీత కార్మికులకు మేలుచేసేలా చిట్టాపూర్‌లో 5 ఎకరాల్లో ఈత మొక్కలు నాటించటం చరిత్రాత్మకమైన ఘట్టమని కొనియాడారు. గీత కార్మికులను ఒక వేదిక మీదికి తీసుకురావటం మంచి ఆలోచన అన్నారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరితహారం ద్వారా 2 కోణాలు ప్రస్ఫుటమయ్యాయన్నారు. హరితహారం విస్తరింపజేయటం మొదటిది కాగా, కులవృత్తులను పరిరక్షించుకోవటానికి సమీకరణ చేయటం రెండోదిగా అభివర్ణించారు. -
ప్రజాప్రతినిధుల పాత్ర తక్కువే..
హరితహారానికి హాజరు అంతంత మాత్రమే శనివారం పాల్గొన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీనే స్థానిక ప్రజాప్రతినిధులూ కొందరే.. రోజువారీగా ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదు. మంత్రుల నుంచి సర్పంచ్ల వరకు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఈ నెల 8న మొదలైన హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తిగా భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం సైతం ఇదే చెబుతోంది. అధికారులు, సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధుల పనితీరుకు హరితహా రం నిర్వహణను కొలనమానంగా తీసుకుంటోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహా రంలో పాల్గొనేందుకు ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపడం లేదు. హరితహారం కార్యక్రమంపై రోజువారీ నివేదికను జిల్లా కలెక్టర్... రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం హరితహా రం కింద జిల్లాలో 3.50 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. శుక్రవారం వరకు 86,40,537 మొక్కల ను నాటగా శనివారం జిల్లా వ్యాప్తంగా 6,83,396 మొక్కలను నాటారు. హరితహారం మొదలైనప్పటి నుంచి శని వారం వరకు జిల్లాలో మొత్తం 93,23,933 మొక్కలను నాటినట్లు నివేదికలో పేర్కొన్నారు. 398 గ్రామాల్లో వంద శాతం లక్ష్యం పూర్తయింది. వీటిలో ఎంపీడీఓల ఆధ్వర్యం లో లక్ష్యం పూర్తయిన గ్రామాలు 238 ఉన్నారుు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో పూర్తయినవి 160 ఉన్నాయి. శనివారం జరిగిన హరితహారం కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదేవిధంగా 16 మంది జెడ్పీటీసీ సభ్యులు, 16 మంది మండల పరిషత్ అధ్యక్షులు, 24 మంది ఎంపీటీసీ సభ్యులు, 32 మంది సర్పంచ్‌లు శనివారం నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే హరితహారంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
అంచనా ప్రకారమే మొక్కల పంపిణీ
డ్వామా పీడీ హరిత యాలాల: హరితహారంలో భాగంగా మొక్కలు నాటే ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మొక్కలు పంపిణీ చేస్తామని డ్వామా పీడీ హరిత స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, మండలస్థారుు అధికారుల తో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా నాటే ప్రతి మొక్క వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. ఉపాధి హామీలో భాగంగా నాటే ప్రతి మొక్క ఎదుగుదల వరకు నిర్వాహణ ఖర్చులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం దుర్వినియోగం కాకుండా ఇకపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చిన నివేదికతోపాటు సంబం దిత శాఖ ఏఈ ధ్రువీకరణపత్రాన్ని పరిశీలించి మొక్కల పంపిణీతోపాటు నిర్వాహణ ఖర్చులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఖర్చులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దీనిపై స్పందించిన పీడీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఎంపీపీ సాయన్నగౌడ్, తహసీల్దార్ అబిద్ అలీ, ఏపీడీ అప్పారావు, ఇన్ చారర్జి ఎంపీడీఓ ఉమాదేవి ఉన్నారు. సంరక్షణ బాధ్యత అధికారులదే... తాండూరు రూరల్: హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత కూడా స్థానిక అధికారులదేనని డ్వామా పీడీ హరిత అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో, పట్టణాల్లో హరితహారం కింద పెద్దఎత్తున మొక్క లు నాటడం సంతోషకరమన్నారు. నాటి న మొక్కలను కూడా సంరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. గ్రామా ల్లో పండ్ల మొక్కలు నాటాలని సూచించారు. సిమెంట్ ఫ్యాక్టరీతోపాటు, పాలిషింగ్ యూనిట్లు, నాపరాతి గనుల్లో మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షించాల్సిన బాధ్యత యాజమానులదేన న్నారు. తూతూ మంత్రంగా చేపడితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సెక్టోరియల్ అధికారులు గ్రామాల్లో విసృ్తతంగా తిరిగి మొక్కల సంరక్షణకు సంబంధించి క్షేత్రస్థారుులో తెలుసుకోవాలన్నారు. ఎంపీపీ లక్ష్మమ్మ, ఎంపీడీఓ జగన్మోహన్రావు, తహసీల్దార్ రవీందర్, ఏఓ రజిత, ఏపీఏం వెంకన్న, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఖాంజాపూర్‌లో మొక్కలు నాటిన పీడీ హరిత మండలంలోని ఖాంజాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో డ్వామా పీడీ హరిత మొక్కలు నాటారు. ఏపీడీ అప్పారావు, ఏపీఓ శారద, ఈసీ పాండుచ ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటిస్తున్నాం
♦ హరితహారంలో అందరూ పాల్గొనాలి ♦ లక్ష్యానికి మించి మొక్కలు నాటేందుకు చొరవ చూపాలి ♦ జారుుంట్ కలెక్టర్ -2 ఆమ్రపాలి కీసర: హరితహారం పథకంలో భా గంగా ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటిస్తున్నామని జేసీ-2 ఆమ్రపాలి తెలిపారు. శుక్రవారం కీసర తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ వెంకట ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీఓ వినయ్‌కుమార్, ఎంపీపీ సుజాత, సర్పంచ్ గణేష్‌లతో కలిసి ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పచ్చదనంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని.. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. చెట్లు సమృద్ధిగా ఉంటేనే వర్షాలు విస్తారంగా కురుస్తాయని.. దీనివల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యానికి మించి మొక్కలు నాటేలా అధికారులు, ప్రజాప్రతిని దులు చొరవ చూపాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ స్థలాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయా లు, కాలనీలు, రహదారుల వెంట మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కీసర మండలంలోని గ్రామాల్లో ఇప్పటివరకు నాటిన మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొక్కలను సమీపంలోని యాద్గార్పల్లి, కీసర నర్సరీల నుంచి తీసుకురావాలని జేసీ ఎంపీడీఓ వినయ్‌కుమార్‌కు సూచించారు. అరుుతే గ్రామాల్లో ప్రజలు మామిడి, తదితర పండ్ల మొక్కలను అడుగుతున్నారని కీసర, యాద్గార్పల్లి నర్సరీలో ఈ పండ్ల మొక్కలు అందుబాటులో లేవని ఎంపీపీ సుజాత జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పండ్ల మొక్కలను పక్క నర్సరీల నుంచి వెంటనే పండ్ల మొక్కలను తెప్పిస్తామని.. ప్రతి ఇంటికి 4నుంచి 5 చొప్పున పండ్ల మొక్కలను సరఫరా చేయాలని ఆమె అధికారులకు సూచిం చారు. మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోకుండా వాటి పరిరక్షణ బాధ్యత కూడా అధికారులదేనన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి మొక్కలకు పోసేలా ఏర్పాట్లు చేయాలని జేసీ అధికారులకు ఆదేశించారు. అనంతరం కీసర, యాద్గార్‌పల్లిలోని నర్సరీలను ఆమె పరిశీలించారు. -
మొక్క నాటగానే సంబురం కాదు
సాక్షి, హైదరాబాద్ : మొక్క నాటగానే సంబురం కాదని, అవి పెరిగి పెద్దగా అవడం ముఖ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మొక్కలను బతికించడం కోసం జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను బతికించి, పెరిగేందుకు తగిన కార్యాచరణను అనుసరించాలని సూచించారు. హరితహారంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఇతర అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న హరితహారం కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలంతా ఇందులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘హరితహారం కింద పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. వాటిని కాపాడే విషయంలోనూ అంతే శ్రద్ధగా వ్యవహరించాలి. కలెక్టర్లతో సీఎస్ సమన్వయం చేసుకుని రాష్ట్రవ్యాప్త కార్యాచరణ తయారు చేయాలి. ప్రతి ప్రభుత్వ శాఖ పరిధిలో నాటుతున్న మొక్కలకు నీళ్లు పోయడం, రక్షించడం కూడా సంబంధిత అధికారులే తీసుకోవాలి..’’ అని సీఎం సూచించారు. ప్రతి జిల్లాలో హరితహారాన్ని కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, కార్యాచరణ రూపొందించి అమలు చేయడంతో పాటు ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు.. హరితహారం కార్యాచరణపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కలెక్టర్లకు ప్రత్యేక మెమో జారీ చేశారు. జిల్లాను సెక్టార్లుగా విభజించి సూక్ష్మస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. వర్షాలు కురవని రోజుల్లో మొక్కలకు నీరెలా అందిస్తారో కార్యాచరణ రూపొందించి, దానిని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపించాలని ఆదేశించారు. దీనిపై వారానికోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామని తెలిపారు. మొక్కలను బతికించడానికి జిల్లాలు, డివిజన్లలో అందుబాటులో ఉన్న ఫైరింజన్లను కూడా వినియోగించుకుని నీళ్లు పోయాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోని మంచినీటి ట్యాంకర్లను కూడా మొక్కలకు నీరు పోసేందుకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. పోలీస్ శాఖ సైతం మొక్కలను బతికించేందుకు వర్షాలు లేని సమయంలో నీటి సదుపాయం కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డీజీపీని కోరారు. 10 జిల్లాలో 7.50 కోట్ల మొక్కలు వారం రోజుల హరితహారంలో ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో శుక్రవారం నాటికి కోటీ ఎనిమిది లక్షలకు పైగా మొక్కలు నాటారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ప్రాతి నిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్ అగ్రస్థా నం దక్కించుకోవడం గమనార్హం. రెండోస్థానంలో నిజామాబాద్ జిల్లా నిలవగా, రంగారెడ్డి జిల్లా, గ్రేటర్ హైదరాబాద్‌లు చివరి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా 10 జిల్లాల్లో కలిపి 7.5 కోట్లకు పైగా మొక్క లు నాటినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. -
నిర్లక్ష్యం చేస్తే వేటే!
♦ ఐదుగురు నోడల్ అధికారుల సస్పెన్షన్ ♦ మరో ఐదుగురికి షోకాజ్ నోటీసులు ♦ కలెక్టర్‌తోపాటు అధికారుల సుడిగాలి పర్యటన ♦ హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి ♦ కలెక్టర్ యోగితారాణా అధికారుల్లో ఆందోళన రెంజల్ : హరితహారంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు పడింది. బుధవారం కలెక్టర్ యోగితారాణాతోపాటు జిల్లాస్థారుు అధికారులు క్షేత్రస్థారుులో పరిశీలించారు. స్వయంగా లోపాలను పరిశీలించిన కలెక్టర్ యోగితారాణా హరితహారం గ్రామనోడల్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. మరి కొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బుదవారం ఉదయం కలెక్టర్ యోగితారాణా రెంజల్ మండలం సుడిగాలి పర్యటన నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును పరిశీలించారు. విధులపై నిర్లక్ష్యం వహించిన ఐదుగురు హరితహారం నోడల్ అధికారులను సస్పెండ్ చేశారు. మరో ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హరితహారం నోడల్ అధికారులు తమ గ్రామాల్లో మంగళవారం రాత్రి బస చేయాల్సి ఉండగా ఏ ఒక్కరు ఆదేశాలు పాటించకపోవడంతోపాటు బుధవారం తమ గ్రామాల్లో మొక్కల నాటే కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం పథకాన్ని అమలు చేస్తుండగా క్షేత్రస్థాయిలో షెడ్యుల్ ప్రకారం సెక్టార్ అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయకపోవడంతో ఈ చర్యకు ఉపక్రమించారు. మండలంలో సెక్టార్ అధికారులుగా పనిచేస్తున్న ట్రాన్స్‌కో ఏఈ బాల్‌చందర్, ఆర్అండ్బీ ఏఈ దనేష్, పీఆర్ ఏఈ నిఖిత, ఇరిగేషన్ ఏఈ నగేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అభిలాష్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాగే ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో సంజీవ్‌రెడ్డి, వ్యవసాయాధికారి సిద్ధి రామేశ్వర్, సాక్షరభారత్ మండల సమన్వయకర్త వినోద్, ఈవోపీఆర్డీలకు షోకాజ్ నోటీసులు కలెక్టర్ జారీ చేశారు. మండలంలో హరితహారంపై ఇంత నిర్లక్ష్యం జరుగుతున్నా దృష్టిసారించని మండల ప్రత్యేకాధికారి కీర్తికాంత్‌ను మందలించారు. నీ పరిధిలోని అధికారులు ఇప్పటి వరకు 2,3 వేల మొక్కలు నాటించలేదని నిలదీశారు. ఎంసీడీవోకు షోకాజ్ నోటీస్‌తో సరి : ఎంపీడీవో చంద్రశేఖర్‌పై కలెక్టర్ సీరియస్‌గా వ్యవహరించారు. తీవ్రస్థాయిలో మందలించడంతో ఆయన ఖంగుతున్నారు. ఇలాగే వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. అలక్ష్యం వద్దు.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ యోగితారాణా అన్నారు. బుధవారం రెంజల్ మండలం నీలా, బాగేపల్లి, కూనేపల్లి, వీరన్నగుట్ట, రెంజల్ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లోని తెలంగాణ హరితహారం నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 3.35 కోట్ల మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామానికి 40 వేల మొక్కలు నాటాలని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి 11 మొక్కలు నాటాలన్నారు. రైతులకు రూపాయి భారం లేకుండా అడిగిన మొక్కలను పొలం వద్దకు నేరుగా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆవరణలు, పంట పొలాలు, స్మశాన వాటికలు, ఇతర ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని అన్నారు. రైతులు కోరిన మొక్కలను ఉచితంగా అందిస్తామన్నారు. 2,3 రోజుల్లో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. హరితహారం పూర్తయ్యే వరకు అధికారులు ఇతర పనులకు ప్రాధాన్యం ఇవ్వ వద్దన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు కమిటీలను నియమించినట్లు తెలిపారు. మొక్కలు నాటిన కలెక్టర్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో కలెక్టర్ యోగితారాణా మొక్కలు నాటారు. గ్రామస్తులు బాధ్యతగా గుర్తించాలన్నారు. వర్షాలు సమృద్ధిగా పడి రైతులు కరువును జయించేందుకు మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. మొక్కలను సంరక్షించినందుకు అవరమైన నగదును అందించడం జరుగుతుందన్నారు. హరితహారంతో కరువును జయించడంతోపాటు ఉపాధి కూ లీల వలసలను నివారించవచ్చన్నారు. అనంతరం గ్రా మస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. మొక్కల పెంపకానికి ముందుకు వచ్చే ఏ ఒక్కరిపైనా భారం పడకుండా చూస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటయ్య, ఎంపీడీవో చంద్రశేఖర్, బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై ప్రసాద్‌లు ఉన్నారు. -
నేనొస్తున్నా... మీరంతా రండి..
♦ గీత కార్మికులకు పిలుపు.. ♦ 16న చిట్టాపూర్‌లో ‘సాక్షి’ హరితహారం ♦ ఇదో మంచి ప్రయత్నం ♦ ప్రశంసించిన మంత్రి పద్మారావుగౌడ్ గజ్వేల్ : ‘ విరివిగా ఈత వనాలు పెంచాల్సిన అవసరాన్ని ‘సాక్షి’ గుర్తుచేసింది. హరితహారంలో భాగంగా ఈనెల 16న దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో ఈత మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చింది. ఈత వనాలు నాటే కార్యక్రమానికి నేను వస్తున్నా.. మీరంతా రండి’ అంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ గీత కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్ మండలం పిడిచెడ్‌లో ఈత మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరైన మంత్రి ‘సాక్షి’ తో మాట్లాడుతూ... చిట్టాపూర్‌లో ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న హరితహారంలో ఈత వనాల పెంపునకు ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి ‘సాక్షి’ తమతో కలిసిరావడం ఆనందంగా ఉందన్నారు. గీత కార్మికుల ఉపాధి కోసం హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం 50 వేల కల్లు దుకాణాలు ప్రారంభించినట్టు చెప్పారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పరిహారం బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం స్పెషల్ గ్రాంటు నిధులు మంజూరు చేయనుందన్నారు. -
జోగిపేట కమిషనర్ సస్పెన్షన్
హరితహారంపై నిర్లక్ష్యం టెండర్ల అవకతవకలు కూడా కారణమే! ఉత్తర్వులు జారీ చేసిన డీఆర్ఓ తీసుకోవడానికి నిరాకరించిన కమిషనర్ జోగిపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జోగిపేట నగర పంచాయతీ కమిషనర్‌పై మంగళవారం సస్పెన్షన్ వేటు పడింది. నగర పంచాయతీలో టెండర్ల ఖరారులోనూ అవకతవకలకు పాల్పడడం కూడా ఈ చర్యకు కారణమని తెలుస్తోంది. ఈనెల 8న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హరితహారాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే. జోగిపేట నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఒక్క మొక్క కూడా నాటకపోగా 300 మొక్కలు నాటినట్టు జోగిపేట నగర పంచాయతీ కమిషనర్ సీవీ రవీందర్రావు వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీడీఓ ద్వారా తప్పుడు సమాచారమిచ్చారు. ఈ ఇదే విషయమై నియోజకవర్గ ప్రత్యేక అధికారి యాష్మిన్బాషా సోమవారం నగర పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. ఒక మొక్క కూడా నాటకపోగా ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదనే విషయం వెలుగు చూసింది. ఈ విషయమై ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్ఓ దయానంద్ మంగళవారం కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్లలో అవకతవకలు కూడా కారణమే? నగర పంచాయతీకి మంజూరైన 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన రూ.29.82 లక్షలతో 15 పనులకు ఈ ప్రొక్యూర్మెంట్ కింద టెండర్లను పిలిచారు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5 నుంచి 27వ తేదీ ఉదయం 10 వరకు మాత్రమే ఆన్లైన్లో ఉంచి తొలగించారు. దీంతో టెండర్ల దాఖలుకు ఎవరికి కూడా అవకాశం దక్కలేదని, ఈ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించారని కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే పి.బాబూమోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఈ విషయాన్ని అప్పట్లోనే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. టెండర్లలో జరిగిన గోల్‌మాల్‌పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఏజేసీ వెంకటేశ్వరరావు, సంగారెడ్డి మున్సిపాలిటీ డిప్యూటీ ఈఈలకు విచారణ బాధ్యతలు అప్పగింఆచరు. మార్చి 17న ఏజేసీ నేతృత్వంలోని అధికారుల బృందం జోగిపేట నగర పంచాయతీకి వచ్చి విచారణ జరిపింది. ఆర్థిక సంఘ నిధులకు సంబంధించిన టెండర్లలో గోల్మాల్ జరిగినట్లు విచారణలో తేలడంతో కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా కూడా కమిషనర్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వులు స్వీకరించని కమిషనర్ కలెక్టర్ ఆదేశానుసారం డీఆర్ఓ మంగళవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ సూచన మేరకు ఆర్ఐ నగర పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఉత్తర్వు ప్రతిని కమిషనర్‌కు ఇచ్చేందుకు ప్రయత్నించగా అందుకు ఆయన నిరాకరించినట్టు తెలిసింది. ఉత్తర్వులు వచ్చినట్టు తెలుసుకున్న కమిషనర్ వెంటనే కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. హౌసింగ్‌బోర్డులో ఆయన నివాసం ఉంటున్న ఇంటికి ఉత్తర్వు ప్రతిని అతికించారు. చుట్టుపక్కల వారిచే సాక్షి సంతకాలు తీసుకున్నట్టు తహసీల్దార్ తెలిపారు. -
హరితహారం మొక్కలకు రక్షణ కరువు
-
చెట్లతోనే వర్షాలు
♦ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన వాస్తవం ♦ మొక్కలు నాటడం అందరి బాధ్యత ♦ మూడేళ్లలో జిల్లాలో 10 కోట్ల మొక్కలు లక్ష్యం ♦ కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి ♦ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ♦ వీడియో కాన్ఫరెన్స్, సమీక్షలలో మంత్రి పోచారం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కరువును, దుర్భిక్షాన్ని ఎదుర్కొనేందుకు పచ్చదనాన్ని పెంచడమే ఏకైక మార్గమని వ్యవసాయ, ఉద్యానవన, సహకారశాఖల మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్కసారి మనం ఇటీవల కురుస్తున్న వర్షాలు, వర్షపాతం గమనిస్తే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అడవులున్న ప్రాంతాల్లో ఎక్కువ, చెట్లు లేని చోట తక్కువ వర్షం కురుస్తోందని, వర్షాభావానికి కేవలం అంతరించిన పచ్చదనమే కారణమన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారాని అన్నారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక హరితహారం విజయవంతం చేయడం అందరి బాధ్యతని అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల, జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరితహారం అమలులో కొందరు అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హరితహారం అమలు కోసం రెండు గ్రామ పంచాయతీలకు ఒక క్లస్టర్‌గా అధికారిని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నోడల్ అధికారిని, మున్సిపాలిటీలకు కమిషనర్లను నియమించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలో 40 వేలు... ప్రతి గ్రామ పంచాయతీలో 40 వేల మొక్కలను నాటించాల్సిన బాధ్యత నోడల్ అధికారులు, క్లస్టర్ అధికారులదేనని మంత్రి పోచారం అన్నారు. గుంతలు తవ్విన తర్వాతనే నర్సరీల నుంచి మొక్కలు విడుదల చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కకు ఖచ్చితమైన లెక్కలతో, మొక్కలను బతికించాలని ఆదేశించారు. ఈ పనులకు ప్రభుత్వ పరంగా చెల్లించే సొమ్ము గురించి రైతులు, గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. నోడల్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అందరికీ అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో చెట్లు తక్కువగా ఉన్న లింగంపేట, తాడ్వాయి, బాన్సువాడ, కమ్మర్పల్లి మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని ఉదహరించారు. మూడేళ్లలో జిల్లాలో 10 కోట్ల మొక్కలను నాటించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 1.7 లక్షల హెక్టార్ల అడవులను కారడవులుగా మార్చేందుకు ఒక కోటి మొక్కలను, పొలాల గట్లు, నివాస ప్రాంతాల్లో 9 కోట్ల మొక్కలు పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. సుడిగాలి పర్యటన.. ‘తెలంగాణ హరితహారం పథకం భావి తరాల బాగు కోసం... మన ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు... మన దగ్గర మబ్బులు పైనుంచి పోతున్నా... వర్షాలు పడటలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి.. చెట్లున్న ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి... ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా భావించండి... భావితరాల భవిష్యత్‌ను దష్టిలో పెట్టుకుని మొక్కలు నాటుదాం’’ అంటూ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హరితహారం ప్రారంభం నుంచి బిజీ బిజీగా ఉన్నారు. ఈ నెల 11న బాన్సువాడలో మొక్కలు నాటి అధికారికంగా హరితహారం ప్రారంభించిన ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షలు జరుపుతూ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్.. ఇలా అన్ని నియోజకవర్గాల్లో కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శాఖల వారిగా సమీక్షలు చేస్తున్నారు. అంతటా పర్యటించిన మొక్కలు నాటుతున్నారు. బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ఆయన సోమవారం కూడ కలెక్టరేట్ నుంచి మండల, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ చైర్మన్ దపేదార్ రాజు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, సంయుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డి, ముఖ్య అడవీ సంరక్షణ అధికారి ఎస్కే గుప్త, డీఎఫ్‌వోలు, డ్వామా పీడీ తదితరులు పాల్గొన్నారు. -
హరితహారానికీ ‘ఉపాధి హామీ’
- రూ.800 కోట్లతో గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళికలు - మొక్కలను సంరక్షించే ఉపాధి కూలీలకు దినసరి వేతనాలు సాక్షి, హైదరాబాద్ : హరితహారానికి ఉపాధి హామీ నిధులను వెచ్చించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం నుంచి సుమారు రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఉపాధిహామీ చట్టంలోని కేటగిరి -ఎ ప్రకారం అడవులు, రహదారులు, చెరువు గట్లు, ప్రభుత్వ విద్యా, పారిశ్రామిక సంస్థలు, కమ్యూనిటీ స్థలాలు తదితర ప్రదేశాల్లోనూ, కేటగిరి-బి మేరకు ఇళ్లు, పంట పొలాలు తదితర వ్యక్తిగత స్థలాల్లో మొక్కలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకం, రవాణా, మొక్కల పెంపకం, వాటిని సంరక్షించేవారికి దినసరి వేతనాలను కూడా ఉపాధి హామీ నుంచే కేటాయించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొత్తం 15 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మూడు కోట్లకుపైగా మొక్కలను పెంచుతున్నారు. ఆయా నర్సరీల్లో ఇప్పటికే సుమారు 60 లక్షల ఈత మొక్కలు, 40 లక్షల పండ్లు, పూలు, 6 లక్షల టేకు మొక్కలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 13 వేల కిలోమీటర్ల మేర రహదారుల వెంట మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది పొడవునా ఉపాధిహామీ పథకం కింద హరితహారాన్ని కొనసాగించాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. కోటి మొక్కల హరితహారం నేడే హరితహారంలో భాగంగా మంగళవారం ఒక్కరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలను నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దామరగిద్ద గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల క్షేత్రస్థాయి అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. కోటి మొక్కల హరితహారంలో 4.15 లక్షల స్వయం సహాయక గ్రూపుల నుంచి 47.21 లక్షల మంది మహిళలు పాల్గొంటారని మంత్రి తెలిపారు. సమావేశంలో కమిషనర్ అనితారాంచంద్రన్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో పౌసమీ బసు తదితరులు పాల్గొన్నారు. -
అభిమానులూ.. మొక్కలు నాటండి
హరితహారంలో పాల్గొన్న సినీ నటుల పిలుపు - విజయానర్సరీ ఆవరణలో మొక్కలు నాటుతున్న చిరంజీవి - జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటుతున్న హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాలుపంచుకున్నారు. సోమవారం వేర్వేరుచోట్ల తారలు మొక్కలు నాటి సమాజంలో తమ వంతు బాధ్యతను గుర్తు చేశారు. మానవ మనుగడకు మొక్కలు ప్రాణాధారమని తెలుపుతూ తమ అభిమానులు సైతం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం. 10లోని ఎమ్మెల్యే, ఎంపీల కాలనీలో ఉన్న విజయా నర్సరీలో హీరో చిరంజీవి మొక్కలు నాటారు. బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో హీరో నాగార్జున మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో హీరో అల్లు అర్జున్, తన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, తండ్రి అల్లు అరవింద్, కుమారుడితో కలసి మొక్కలు నాటారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో సినీ నటి రెజీనా, హీరోలు శ్రీకాంత్, రాజ్‌తరుణ్, మా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి, శివాజీరాజా తదితరులు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విశేషంగా ప్రశంసించారు. కేబీఆర్ పార్కులో మొక్కలు నాటుతున్న తనికెళ్ల భరణి, శివాజీరాజా, నటి రెజీనా, మేయర్ బొంతు రామ్మోహన్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, ఎన్.శంకర్, రాజ్‌తరుణ్ తదితరులు -
నిర్దేశిత లక్ష్యాన్నిపూర్తి చేయాలి
♦ భూ పరిపాలన కమిషనర్ రేమండ్ పీటర్ ♦ హరితహారం, సాదాైబైనామాలపై సమీక్ష ♦ మొక్కల సంరక్షణ అవసరం: కలెక్టర్ వికారాబాద్ : హరితహారం కింద మొక్కలు నాటడంలో నిర్ధేశించిన లక్ష్యాలను వందకు వంద శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమీషనర్ (సీసీఎల్ఏ) రేమండ్‌పీటర్ అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రవీంద్ర మండపంలో హరితహారం, సాదాదైనామాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కింద మొక్కలు నాటేందుకు గాను సరిపడా మొక్కలు అందుబాటులో ఉన్నాయని ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలన్నారు. సాదాదైనామాలపై సమీక్షిస్తూ ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్లు, వీఆర్ఓలు దృష్టి సారించాలన్నారు. అసైన్ ్డ భూముల పరిశీలన ప్రక్రిను పూర్తి చేయాలని తహసీల్దార్లకు సూచించారు. కలెక్టర్ రఘునందన్ రావు మాట్లాడుతూ.. హరితహారం కింద నిర్ధేశించిన కార్యాచరణ ప్రణాళికల మేరకు మొక్కలు నాటే లక్ష్యాలను సాధించాలని సూచించారు. వచ్చే పది రోజుల్లో మొక్కలు నాటే ప్రక్రియతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ గ్రామాల్లో మొక్కలు నాటిన అనంతరం సాయంత్రం నలుగురు సెక్టోరల్ అధికారులైన తహసీల్దారు, ఎంపీడీఓ, ఎంఈఓచ మండల వ్యవసాయాధికారి ఆ రోజు జరిగిన వివరాలు పంపడంతో పాటు సమస్యలేవైనా ఉంటే సమీక్షించుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పార్కుల్లో ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టి మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్‌కు సూచించారు. ఈ సందరర్భంగా హరిత హరం కార్యక్రమం పురోగతిపై మండలాల వారిగా సమీక్షించారు. కార్యక్రమంలో జారుుంట్ కలెక్టర్ ఆమ్రపాలి, సబ్‌కలెక్టర్ శ్రుతిఓజా, అసిస్టింట్ కలెక్టర్ ప్రమేల సత్పతి, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీఎఫ్ఓ శ్రీనివాస్, డ్వామా పీడీ హరిత, వికారాబాద్ డివిజన్ కు సంబంధించిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఏపీఓ, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమంలా హరితహారం
♦ జిల్లాలో జోరుగా సాగుతున్న కార్యక్రమం ♦ ఒక్కరోజులో నాటిన మొక్కలు 10.27లక్షలు ♦ అన్ని వర్గాల నుంచి భారీ స్పందన టపలుచోట్ల పాల్గొన్న మంత్రులు జీవకోటికి మొక్కలే జీవనాధారం. హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలి. భవిష్యత్ తరాలకు నీరు కావాలంటే ఇప్పటి నుండే మొక్కలు నాటాలి. హరితహరం కార్యక్రమాన్ని ఊరూరా సామాజిక ఉద్యమంగా చేపట్టాలి. అడవులను సంరక్షించు కోకపోవడం వల్లే ప్రస్తు తం వర్షాలు లేక ఇబ్బందు లు పడుతున్నాం. నాటిన ప్రతి మొక్కను సంరక్షించు కోవడం చాలా ముఖ్యం. ఇక ముందు ప్రతి యేడు 46 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించాం. - ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సాక్షి, రంగారెడ్డి జిల్లా : పచ్చలహారంగా మార్చేందుకు జిల్లా యావత్తు పరుగులు పెడుతోంది. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని వర్గాలు ముందుకు కదులుతున్నారుు. సోమవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 10.27లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలతోపాటు సామాన్య ప్రజలు కూడా భాగస్వామ్యమయ్యారు. ఈనెల 8 నుంచి రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టగా.. ఇప్ప టివరకు జిల్లాలో మొత్తంగా 21.17లక్షల మొక్కలు నాటినట్లు అటవీశాఖ గణాంకాలు చెబుతున్నారుు. ప్రముఖుల హడావుడి.. హరితహారం కార్యక్రమానికి ప్రముఖుల రాక మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని టీసీఎస్ క్యాంపస్‌లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బీహెచ్ఈఎల్ టౌన్ షిప్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గవర్నర్ నరసింహన్ తోపాటు రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, మహేందర్‌రెడ్డి తదితరులు మొక్కలు నాటారు. అదేవిధంగా వి కారాబాద్లో సీసీఎల్ఏ రేమండ్‌పీటర్, యాచారంలో ఇం టెలిజెన్ ్స ఐజీ శివధర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కలెక్టర్ రఘునందన్ రావు, జేసీ ఆమ్రపాలి, ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ ఈస్ట్ జోన్ కమిషనర్ మహేష్‌భగవత్ మొక్కలు నాటారు. పరిశ్రమల శాఖ ‘లక్ష’ణంగా ముందుకు.. హరితహారం కింద ఈసారి పరిశ్రమల శాఖ దూసుకుపోతోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 21.17లక్షల మొక్కలు నాటగా.. ఇందులో పరిశ్రమల శాఖ తరఫున ఏకంగా 1.07లక్షల మొక్కలు నాటి ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 91వేల మొక్కలు నాటి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ రెండో స్థానంలో నిలవగా.. 90వేల మొక్కలతో గచ్చిబౌలి ఐటీ పార్క్ మూడోస్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా నాటిన మొక్కల్లో 39,910 రిజర్వ్ ఫారెస్ట్‌లో నాటగా.. 20,77,680 మొక్కలు ఇతర ప్రాంతాల్లో నాటినట్లు జిల్లా సామాజిక అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. -
సిటీ నుదుట పచ్చబొట్టు
సిటీలో మెగా హరితహారానికి అద్భుత స్పందన లభించింది. గ్రేటర్ నలుమూలలా.. ఒకే రోజు 29 లక్షల మొక్కలు నాటి సిటీజనులు పచ్చదనంపై మక్కువ చూపారు. గవర్నర్, సీఎం, మంత్రులతో పాటు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వలంటీర్లు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. సిటీబ్యూరో: మెగా హరిత హారంలో భాగంగా గ్రేటర్లో సోమవారం ఒక్కరోజే దాదాపు 29 లక్షల మొక్కలు నాటారు. వీటిని కనీసం మూడు నాలుగేళ్లు కాపాడగలిగితే నగర పచ్చదనం పెరగడంతోపాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం లభిస్తుంది. దే శ చరిత్రలోనే.. బహుశా మానవచరిత్రలోనే నభూతో నభవిష్యతి అన్న చందంగా ఒకేరోజు 29 లక్షల మొక్కలు నాటడం ద్వారా హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఒకే ఒక్కరోజు నాటిన ఇన్ని మొక్కలు/చెట్లను బతికించడమే ఇప్పుడు సవాల్. వీటిని కనుక కాపాడగలిగితే ఈ ఒక్కరోజు చేసిన ప్రయత్నం ఎన్నో ఏళ్లుగా పెంచిన పచ్చదనానికి సమానం కానుంది. గ్రేటర్ విస్తీర్ణం 1,50,000 ఎకరాలు కాగా, దాదాపు 6,590 ఎకరాల ప్రదేశంలో వీటిని నాటారు. ఇది దాదాపు 16 కేబీఆర్ పార్కులతో సమానం. ఇవి పెరిగి పెద్దవైతే గ్రేటర్లో ఇప్పుడు 5 శాతంగా ఉన్న పచ్చదనం, అదనంగా మరో 4.3 శాతం పెరిగి 9.3 శాతానికి చేరుకోనుంది. జనాభాకు త గిన విధంగా 33 శాతం పచ్చదనం ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో భాగంగా ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటాలనే దీక్షతో పనిచేసి లక్ష్యాన్ని అధిగమించారు. ఇదే దీక్షను కడదాకా కొనసాగించాల్సి ఉందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. మూడు నాలుగేళ్లు వీటిని సంరక్షిస్తే.. గ్రేటర్‌లోని దాదాపు కోటి మంది జనాభాకు కాలుష్యం కొంత తగ్గి కొత్త ఊపిరి అందుతుందని అంచనా. మొక్కలు ఎక్కువగా నాటిన ప్రదేశాలు.. జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం అధికారుల అంచనా మేరకు ఎకరాకు దాదాపు 440 మొక్కల వంతున నాటారు. వీటిల్లో ఎక్కువ మొత్తాల్ని ఆయా సంస్థల్లోని ఖాళీ ప్రదేశాల్లో నాటారు. వీటిల్లో ప్రగతి రిసార్ట్స్ , లహరి రిసార్ట్స్, జన్వాడ, డీఆర్డీఎల్ (దుండిగల్), ఇక్రిశాట్ , సెంట్రల్ యూనివర్సిటీ తదితరమైనవి ఉన్నాయి. వీటితోపాటు పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. సంప్రదాయ మొక్కలకే జై .. దాదాపు వంద జాతుల మొక్కల్ని ఈ కార్యక్రమంలో నాటారు. పెల్టోఫామ్ (కొండ తంగేడు) చెట్లు ఇటీవల వేల సంఖ్యలో గాలివానలకు నేలకొరగడంతో వాటి జోలికి పోలేదు. వేప, మర్రి, రావి,మద్ది, మేడి, మోదుగ, తెల్లమద్ది, రెడ్ఫౌంటెయిన్, బూరుగు, మల్బరీ వేప, చీమచింత, జువ్వి, జామ, సైకస్, సీమ తంగేడు, ఆకాశమల్లి, బారింగ్టోనియా, జిట్రేగి, దానిమ్మ, సువర్ణ గన్నేరు, పచ్చగన్నేరు, వెదురు, కృష్ణ తులసి తదితర రకాలకు ప్రాధాన్యమిచ్చారు. ప్రజలు తమ రాశి కనుగుణంగా ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఏడాది నిర్వహణకు రూ. 98 కోట్లు .. నాటిన మొక్కల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ ఈ సంవత్సరం రూ. 22.50 కోట్లు కేటాయించింది. అయితే ఆయా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎవరు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతల్ని వారే నిర్వహించనున్నారు. ఒక్కో మొక్క నిర్వహణకు రూ. 340 వంతున సంవత్సరానికి దాదాపు రూ. 98 కోట్లు ఖర్చు కానుంది. హరితం లెక్క ఇదీ.. గ్రేటర్ విస్తీర్ణం: 625 చదరపు కిలోమీటర్లు..(1.50 లక్షల ఎకరాలు) మెగా హరితహారంలో నాటిన మొక్కలు: సోమవారం ఒకేరోజు 29 లక్షలు వినియోగమైన భూమి: సుమారు 6,590 ఎకరాలు పెరగనున్న హరితం శాతం: 4.39 ప్రస్తుతం గ్రేటర్లో హరితం శాతం: 5 తాజా హరితహారంతో పెరగనున్న హరితం : 9.39 శాతం నాటేందుకు, ఏడాది పాటు బతికించేందుకు అయ్యే వ్యయం: ఒక్కో మొక్కకు దాదాపు రూ.340... 29 లక్షల మొక్కలకు 98.60 కోట్లు -
గ్రేటర్లో గ్రీన్ విప్లవాన్ని చాటాలి - మేయర్ బొంతు
గేటర్ ప్రజలంతా సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని, హరిత హారం కార్యక్రమంలో భాగంగా నగరమంతా ఏకమై ఒక శక్తిగా గ్రీన్ విప్లవాన్ని చాటాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే ఊహించిన దానికంటే అధికసంఖ్యలో పలు సంస్థలు మెగా హరితహారంలో భాగస్వాములవుతున్నాయని, ప్రజలు కూడా ఉత్సాహంగా కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సోమవారం మెగా హరిత హారంలో భాగంగా ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పురస్కరించుకొఆదివారం డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు సంవత్సరాల్లో 10 కోట్ల మొక్కలు నాటాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనకనుగుణంగా నిర్వహిస్తున్న మెగా హరితహారంలో పాఠశాల విద్యార్థుల నుంచి మిలటరీ బ్రిగేడియర్ల దాకా ఎందరెందరో భాగస్వాములవుతున్నారన్నారు. మెగా హరితహారంలో ఒకేరోజు 25 లక్షల మొక్కల లక్ష్యాన్ని మంత్రి కేటీఆర్ నిర్దేశించారని చెబుతూ, ప్రస్తుత పరిస్థితి మేరకు 35 లక్షల మొక్కలు నాటే అవకాశం ఉందన్నారు. ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రై వేట్ సంస్థలతోపాటు ఖాలీ ప్రదేశాలు,ఇళ్లల్లో అన్నిచోట్లా మొక్కలు నాటేందుకు భారీ స్పందన కనబడుతోందని చెప్పారు. గ్రీన్ హైదరాబాద్ వెబ్‌సైట్‌ను వినియోగించుకోవడం ద్వారా అందరికీ సమాచారం వెళ్లిందని, ఎందరో మొక్కల్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నారన్నారు. ఆ సదుపాయాన్ని వినియోగించుకోని వారు, నర్సరీలు ఎక్కడున్నాయో తెలియని వారి కోసం వందప్రాంతాల్లో స్టాళ్ల ద్వారా మొక్కల్ని పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రేటర్ పరిధిలోకొచ్చే మెదక్జిల్లాలో 6 లక్షలకు పైగా,రంగారెడ్డిజిల్లాలో 4 లక్షలకు పైగా మొక్కలు నాటనున్నట్లు సంబంధిత కలెక్టర్లు తెలిపారన్నారు. మిలటరీ విభాగం ఆధ్వర్యంలో 1.50 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 80 శాతం పైగా మొక్కలు నిర్ణీత ప్రదేశాలకు చేరాయనాక్నరు. -
లష్కర్లో మహాహరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లు
సికింద్రాబాద్ సర్కిల్ జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం మహాహరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం 21 ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల పర్యవేక్షణ కోసం 21 మంది నోడల్ అధికారులను నియమించారు. మహా హరితహారం సందర్భంగా సర్కిల్ పరిధిలో ఒక్కరోజే 7188 మొక్కలు నాటేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. మహాహరితహారంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారంతా సమీపంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఈడీ విజయరాజు చెప్పారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి