Pragathi Nivedana Sabha
-
ఈ నెల 7న టీఆర్ఎస్ మరో భారీ బహిరంగసభ!
-
‘చెట్ల మీద విస్తరాకుల్లాగా వాగ్దానాలు చేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : మోస పూరితమైన వాగ్దానాలతో ముఖ్యంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ప్రగతి నివేదన సభలో కటింగ్ సెలూన్లకు డొమెస్టిక్ విద్యుత్ టారిఫ్ ఇచ్చానని కేసీఆర్ అబద్దం చెప్పారంటూ నాయి బ్రాహ్మణులు నిరసన తెలిపారు. గాంధీభవన్ ముందున్న గాంధీ విగ్రహం ముందు షేవింగ్ చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. నాయి బ్రాహ్మణుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయి బ్రాహ్మణులను మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా చేశానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 250 కోట్లతో నాయి బ్రాహ్మణుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్.. నిధి ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి వాగ్దానం చేస్తే రాజముద్రగా ఉండాలి కానీ.. కేసీఆర్ వాగ్దానాలు చెట్ల మీద విస్తరాకుల్లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోడ్రస్ సెలూన్లు ఎక్కడ నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ మరో భారీ బహిరంగసభ!
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి నివేదన సభ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న టీఆర్ఎస్ మరో బహిరంగ సభ ఏర్పాటుకు సిద్దం అవుతోంది. సెప్టెంబర్ 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, అక్కడి నుంచి ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్‌లో భారీ ఎత్తున ప్రగతి నివేదన సభను నిర్వహించి విజయవంతం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై మరింత దూకుడు పెంచారు. జెట్ స్పీడ్‌తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తూ.. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. హుస్నాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై ఈ రోజు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు సిద్దిపేటలో సమావేశం కానున్నారు. మరోవైపు ప్రభుత్వ సీఎస్ జోషితో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు భేటి అయ్యారు. దీంతో ఈ నెల 6న జరిగే కేబినేట్ మీట్ అనంతరం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
నిర్మానుష్యంగా కొంగరకలాన్
ఇబ్రహీంపట్నంరూరల్ : లక్షలుగా తరలివచ్చిన ప్రజలను ఆ గ్రామం అక్కున చేర్చుకుంది. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వేదికగా నిలిచిన కొంగరకలాన్ ప్రస్తుతం బోసిపోయింది. సభ ఏర్పాట్లు ప్రారంభమైన పది రోజుల నుంచి అక్కడ సందడి నెలకొంది. ప్రతి రోజూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకుల రాకపోకలతో రద్దీగా మారింది. సభకు తరలివచ్చిన జనంతో రహదారులు కిక్కిరిపోయాయి. జనం నినాదాలు, మైకుల శబ్ధాలతో హోరెత్తిన ఆ ప్రాంతం సోమవారం తెల్లారే సరికి మూగబోయింది. ఆదివారం ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడ్డారు. మరుసటి రోజు ఒక్క వాహనం కూడా కనిపించలేదు. కలెక్టరేట్ వద్దకు వెళ్లే వారు కూడా లేకుండా పోయారు. ప్రగతి సభ కోసం ఏర్పాటు చేసిన కార్పెట్‌ను తీసేశారు. గ్యాలరీల్లో ఏర్పాటు చేసిన కుర్చీలను ప్రాంగణం నుంచి తరలించారు. సభ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లను తొలగించే పనిలో పడ్డారు. సూమారు 2వేల ఎకరాల్లో చెత్త ఎత్తివేయడానికి టీఆర్ఎస్ పార్టీ పనులు చేపడుతోంది. పర్యావరణానికి ముప్పు రాకుండా శుభ్రం చేస్తున్నారు. మోబైల్ మూత్రశాలను ప్రాంగనం నుంచి తరలించారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో శుభ్రం చేసేలా చర్యలు చేపడతామని స్థానిక టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. -
ప్రగతి నివేదన సభపై ఇంటలిజెన్స్ నివేదిక?
కొంగరకలాన్‌కు తరలివెళ్లిన వాహనాలెన్ని, జనమెంత.. తక్కువ వెళ్లడానికి కారణాలేమిటీ? క్షేత్రస్థాయిలో నాయకులు జన సమీకరణ చేయలేదా..మరేమైనా కారణాలున్నాయా..? ప్రగతి నివేదన సభ జనసమీకరణపై నిఘా పెట్టిన ఇంటటిజెన్స్ వర్గాలు నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ పార్టీ నేతల్లోనూ అంతర్మథనం మొదలైంది. అనుకున్న మేర జనం రాకపోవడంపై కారణాలు విశ్లేషించే పనిలో పడ్డారు. సాక్షి, యాదాద్రి : టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభపై పోస్టుమార్టం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. జన సమీకరణ, తరలివెళ్లిన వాహనాల వివరాలపై నియోజకవర్గాల వారీగా ఇంటలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరించాయి. ప్రగతి నివేదన సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 20నుంచి 25వేల మందిని తరలించాలని టీఆర్ఎస్ అధినా యకత్వం నిర్ణయించింది. ఈ మేరకు సభకు పది రోజుల ముందు నుంచే పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎక్కడికక్కడ తిష్ట వేసి విస్త్రృత ప్రచారం చేశారు. ప్రతి గ్రామానికి వాహనాలు పంపించారు. కానీ, కొన్ని మం డలాల నుంచి జనం ఆశించిన స్థాయిలో రాకపోవడంపై నేతల్లో అంతర్మథనం మొదలైంది. జన సమీకరణలో క్షేత్రస్థాయి నాయకులు ఆసక్తి చూపలేకపోయారా..? మరే కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో అధ్యయనం చేస్తున్నారు. లెక్కల్లో తేడా.. ప్రగతి నివేదన సభకు జరిగిన జన సమీకరణకు సంబంధించి ఇంటలిజెన్స్ , టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు చెబుతున్న లెక్కలకు తేడా ఉన్నట్లు వెల్లడైంది. ఆదివారం జరిగిన సభకు వెళ్లిన జన సమీకరణపై ఇంటలిజెన్స్ వర్గాలు ప్రధాన రహదారులపై తిష్ట వేసి నిఘా పెట్టాయి. జిల్లాలోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి వాహనాల్లో తరలిన జనాన్ని లెక్కించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15వేల వరకు వెళ్లి నట్లు గుర్తించారు. బీబీనగర్, చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ల వద్ద వెళ్తున్న వాహనాల్లో జనాల సంఖ్యను లెక్కించడంతోపాటు మండల కేంద్రాలనుంచి స మాచారాన్ని రాబట్టారు. కదిలిన జనం ఇలా.. భువనగిరి నియోజకవర్గంలో బీబీనగర్, భువనగిరి రూరల్ మండలాల నుంచి ఆశించిన స్థాయిలో జనం రాలేదని ఇంటలిజెన్స్ వర్గాలు తేల్చాయి. పోచంపల్లి మండలం నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడం, చివరి నిమిషంలో వాహనాలు లేక కొందరు వెనుదిరగినట్లు గుర్తించారు. ఆలేరు నియోజకవర్గంలో పరిస్థితి మరోల గుర్తించారు. రాజాపేట, ఆలేరు, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల నుంచి ఆశించిన స్థాయిలో జనం సభకు తరలిపోగా గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాల నుంచి తక్కువగా వచ్చినట్లు గుర్తించారు. అయితే ఈ మండలాల్లో జిల్లాల, మండలాల పునర్విభజన ప్రభావం అధికంగా కనిపించింది. క్షేత్రస్థాయిలో సమీక్షలు.. ప్రగతి నివేదన సభ జనసమీకరణపై ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంచనా వేసిన దానికంటే అధికంగా జన సమీకరణ చేసినట్లు ప్రకటించినప్పటికీ ఇంటలిజెన్స్ నివేదికలు అం దుకు విరుద్ధంగా ఉండటంతో కారణాలు ఏమిటన్న విషయంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా జన సమీకరణ హెచ్చుతగ్గులపై పోస్టుమార్టం చేస్తున్నారు. సభకోసం జన సమీకరణకు పెద్ద ఎత్తున వాహనాలు గ్రామాలకు పంపించినప్పటికీ జనం అన్నిచోట్ల ఎందుకు రాలేకపోయారని చర్చ జరుగుతోంది. అయితే బోనాల పండుగ ఎఫెక్ట్ కూడా కొంత మేరకు ఉందని ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో చెప్పారు. నేతల్లో గుబులు ప్రగతి నివేదిక సభకు అనుకున్న మేరకు జిల్లా నుంచి జనం వెళ్లకపోవడంతో పార్టీ నేతల్లో గుబులు నెలకొంది. పార్టీ అధిష్టానం కూడా ఈ విషయమై అన్ని జిల్లాల నుంచి ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటుండడం, ఇప్పటికే నిఘా వర్గాలు నివేదిక సిద్ధం చేయడంతో ఏం జరగనుందోనన్న ఆందోళనలో గులాబీ నేతలు ఉన్నారు. -
టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన వెంకటరెడ్డి
సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం): అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో గందరగోళం నెలకొంది. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులు ఎవరికి వారుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ల కేటాయింపు పూర్తయ్యేలోగా గ్రూపు రాజకీయాలు మరింత విస్తృతమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగగా, ఇప్పుడు రాజీనామాల పర్వం ప్రారంభమైంది. తాజాగా అశ్వారావుపేట నియోజకవర్గంలో కీలకమైన నాయకులు రాజీనామాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయంగా అత్యంత కీలకమైన చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలను ప్రభావితం చేసే సీనియర్ నాయకుడు కొడకండ్ల వెంకటరెడ్డి టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు. ఆయనతో పాటుగా రెండు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అధికార పార్టీకి రాజీనామా చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న సమయంలో కొడకండ్ల రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అనుచరుడిగా వ్యవహరించారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కొత్తగూడెం నియోజకవర్గంలో చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలు ఉన్నాయి. దీంతో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో సైతం కొడకండ్ల కీలకపాత్ర పోషించారు. తరువాత కాలంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీకి చెందిన జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా గెలిచేందుకు సైతం కీలకంగా వ్యవహరించారు. తాటి వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీ నుంచి టీఆర్ఎస్లో చేరే సమయంలో నియోజకవర్గం నుంచి తన అనుచరులతో కొడకండ్ల కూడా వెళ్లారు. అయితే తాటి వెంకటేశ్వర్లు తనకు ప్రాధాన్యత తగ్గించారంటూ గత ఏడాది కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు రెండు రోజుల ముందు తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. దీంతో తాటి వెంకటేశ్వర్లుకు భారీ దెబ్బ తగిలినట్టయింది. వచ్చే ఎన్నికల్లో తాటికి గడ్డు పరిస్థితే అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొడకండ్లను కలిసిన జలగం ప్రసాదరావు.. ప్రగతి నివేదన సభకు వెళ్లినప్పటికీ.. తాటి వెంకటేశ్వర్లుకు ఆందోళన కలిగించే అంశం చోటుచేసుకుంది. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టు కలిగి ఉన్న మాజీ మంత్రి జలగం ప్రసాదరావు చంద్రుగొండకు వచ్చి కొడకండ్ల వెంకటరెడ్డిని కలిశారు. అత్యంత సీనియర్ అయిన వెంకటరెడ్డికి పూర్తిస్థాయిలో అండగా ఉంటానని ప్రసాదరావు తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చించారు. ప్రస్తుతం దేశానికి కాంగ్రెస్, రాహుల్ అవసరం ఉందని చెప్పిన జలగం ప్రసాదరావు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఉమ్మడి జిల్లాలోని ఎక్కడినుంచైనా పోటీ చేస్తానని కొడకండ్ల ఇంటి నుంచే ప్రకటించారు. దీంతో ఈ ప్రకటన కొత్తగూడెంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో వెంకటరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలపై పడే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. -
‘ప్రగతి’ సభకు వెళ్లి పరలోకానికి
తెలకపల్లి (నాగర్‌కర్నూల్): టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన ఎండీ జాంగీర్(45) టీఆర్ఎస్ ప్రభుత్వం కొంగరకలాన్‌లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు శనివారం సాయంత్రం ట్రాక్టర్లలో బయల్దేరారు. రాత్రి మైసిగండిలో బస చేసి ఆదివారం ఉదయం మరో వాహనంలో కొంగరకలాన్‌కు వెళ్లారు. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణంలో మైసిగండిలో తాము ఉంచిన ట్రాక్టర్ల వద్ద చేరుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో మైసిగండి వద్ద రోడ్డు దాటుతుండగా దేవరకొండ ప్రాంతంలోని మల్లెపల్లికి చెందిన క్రూయిజర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎండీ జాంగీర్, మండలి బాలపీరు గౌస్‌పాష తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మైసిగండిలో ఉన్న పోలీసులు క్షతగాత్రులను ఆమన్‌గల్ ఆస్పత్రికి తరలించారు. ఇందులో జాంగీర్, బాలపీరు పరిస్థితి విషమంగా మారడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపే మార్గమధ్యలో జాంగీర్ మృతిచెందాడు. బాలపీరుకు కాలు విరిగి తీవ్ర గాయం కావడంతో అక్కడే చికిత్స పొందుతున్నాడు. జాంగీర్‌కు భార్య రజియాబేగం, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో జాంగీర్ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు గ్రామస్తులు ఆస్పత్రికి వెళ్లారు. కల్వకుర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో గౌరారంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్థికసాయం అందజేత.. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డిలు సోమవారం నిమ్స్ ఆస్పత్రిలో గాయపడిన బాలపీరును పరామర్శించారు. జాంగీర్ కుటుంబానికి ఎమ్మెల్యే రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే నాగం జనార్దన్‌రెడ్డి జాంగీర్ కుటుంబానికి రూ.20 వేలు, బాలపీరు కుటుంబ సభ్యులకు రూ.10 వేలు అందజేశారు. గౌస్‌పాష అనే వ్యక్తికి కూడా గాయాలు కావడంతో నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి వెళ్లారు. జాంగీర్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. -
ప్రగతి సభకు పోస్టుమార్టం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రగతి నివేదనపై టీఆర్ఎస్ నాయకత్వం అంతర్గత మథనం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా భావించిన సభకు ఆశించిన స్థాయిలో జన సమీకరణ జరపకపోవడంపై పోస్టుమార్టం నిర్వహిస్తోంది. కొంగరకలాన్‌లో సభ నిర్వహిస్తున్నందున కనిష్టంగా ఐదారు లక్షల మందిని తరలించాలని జిల్లా నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదారు లక్షలు దేవుడెరుగు కనీసం మూడు లక్షల మందిని కూడా తరలించకపోవడంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రగతి నివేదన సభకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన గులాబీ బాస్.. ప్రజల తరలింపుపై లెక్కలు తీశారు. అలాగే నిఘావర్గాలిచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన అధిష్టానం.. ప్రగతి సభకు జన సమీకరణలో జిల్లా నాయకత్వం వైఫల్యం చెందినట్లు అంచనా వేసింది. నివేదన సభకు ఆతిథ్యమిచ్చిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలే కాకుండా షాద్‌నగర్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల సెగ్మె ంట్ల నుంచి నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జనాలను సమీకరించలేదని తేలింది. బహిరంగ సభకు ముహూర్తం ఖరారు కాగానే రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నివాసంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రత్యేక భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సెగ్మెంట్ నుంచి సగటున 35 వేల నుంచి 40వేల మందిని సభకు తరలించాలని నిర్ణయించారు. కేవలం ప్రజా ప్రతినిధులేగాకుండా ఆశావహులు సైతం బలప్రదర్శన చేసుకునేందుకు భారీగా జనాలను తీసుకొస్తారని అంచనా వేశారు. ఈ లెక్కలు తప్పడంపై తాజాగా గులాబీ నేతలు చింతిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి జనాలు పోటెత్తుతారని ఎవరికివారు మిన్నకుండడం కూడా ఈ పరిస్థితికి దారితీసిందని అంటున్నారు. ఆర్థిక వనరులు సమకూర్చినా ఆశించిన స్థాయిలో జన సమీకరణ చేయలేకపోవడాన్ని హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి నేతలపై క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్న గులాబీ దళపతి.. త్వరలోనే వీరికి క్లాస్ పీకనున్నట్లు తెలుస్తోంది. బాగా పనిచేశారు.. బహిరంగ సభ నిర్వహణలో విశేష కృషి చేసిన వారిని అభినందించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్వల్ప వ్యవధిలో ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పూర్తి చేసిన వారికి ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించిన ఆయన క్యాంపు ఆఫీసుకు రావాలని ఆహ్వానించారు. నిఘా విభాగం మల్లగుల్లాలు! ప్రగతి నివేదన సభకు హాజరైన ప్రజల సంఖ్య తేల్చడంలో ఇంటలిజన్స్ విభాగం తలమునకలైంది. మంగళవారం భేటీ అయిన నిఘా బృందాలు ఏయే జిల్లా, నియోజకవర్గాల నుంచి ఎన్ని వాహనాలు, ఎంతమంది వచ్చారనే అంశంపై సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. అదే సమయంలో రాష్ట్రం నలు దిక్కుల నుంచి ఒకేసారి జనప్రవాహం రావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోయినట్లు వివరించినట్లు తెలిసింది. సగం మంది సభకు రాకుండా రోడ్లపైనే నిలబడ్డారని, మరికొందరు ముందుకు రాలేక వెనక్కిపోయినట్లు పార్టీ వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం.. పోలీసుల బందోబస్తు నిర్వహించిన తీరుపై పెదవి విరిచినట్లు తెలిసింది. నిర్దేశిత మార్గాల గుండా వాహనాలను సభాస్థలికి చేర్చడంలో ఆ శాఖ వైఫల్యం ఉందని అన్నట్లు సమాచారం. -
‘ప్రగతి నివేదన’ అట్టర్ ఫ్లాప్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొంగరకలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, కొండను తవ్వి ఎలుకను తీసిన చందంగా బహిరంగ సభ ఉందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఘాటుగా విమర్శించారు. సోమవారం ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తామని, ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నామని కారాలు బీరాలు పలికిన టీఆర్ఎస్ నేతలు బహిరంగ సభ పేలవంగా సాగడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభ ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా తప్ప ఒరిగిందేమి లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వారం రోజులుగా చేసిన హంగామా అంతా ఇంతా కాదని, అధికార దర్పంతో, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు లెక్కలేసి జనాన్ని తరలించాలని సూచించిన ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు తగిన శాస్తి జరిగిందని అన్నారు. కొత్త నిర్ణయాలు, జరిగిన అభివృద్ధిపై బహిరంగ సభ వేదిక నుంచి సీఎం ప్రసంగిస్తారని పదేపదే వల్లేవేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ప్రసంగం పేలవంగా సాగడంతో గందరగోళంలో పడ్డారని అన్నారు. తెలంగాణ సాధనకు అమరులైన వారికి, బంధుమిత్ర కుటుంబాలకు వేదిక పైనుంచి ఏమి హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అమరులవీరుల స్మారకార్థం నిర్మిస్తామన్న స్మృతి వనం నిర్మించలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని, హుస్సేన్ సాగర్ శుద్ధి, హైదరాబాద్ డల్లాస్, కరీంనగర్ లండన్ లాంటి హామీలపై మాట్లాడకుండా కమ్యూనిటీ భవనాలు, గొర్రెలు, బర్రెలు, ప్రాజెక్టులపై మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు. విద్య, వైద్య రంగాలు నాలుగేళ్లలో మరింత వెనుకబాటుకు గురయ్యాయని, శాతవాహన యూనివర్సిటీకి వీసీని నియమించలేని దుస్థితి నెలకొందని అన్నారు. బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్నమల్లయ్య గురించి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని, ఆయన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాక, మరణించాక కుటుంబాన్ని కూడా పరామర్శించలేని కేసీఆర్ శవరాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్‌బాపూజీ, డాక్టర్ సినారెలు మరణించిన సమయంలో వారి స్మారకార్థం నిర్మిస్తామన్న విగ్రహాలు, ఘాట్లు ఏమయ్యాయని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు బోయిన్పల్లి వెంకటరామారావు మరణిస్తే ముఖ్యమంత్రి హోదాలో కరీంనగర్‌కు వచ్చి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన సమయంలో ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందని కేసీఆర్ తీరు ఓడ దాటాక ‘ఓడ మల్లన్న రేవు దాటాక బోడ మల్లన్న’ అన్న చందంగా ఉందని మండిపడ్డారు. టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నేతలకు లాగులు తడుస్తున్నాయని పదే పదే విమర్శించిన టీఆర్ఎస్ నేతలకు బహిరంగ సభ అట్టర్‌ఫ్లాప్ కావడంతో టీఆర్ఎస్ నేతల లాగులే తడుస్తున్నాయని అన్నారు. ప్రజాసంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో స్టేట్ అడ్వయిజరీ కమిటీ వేస్తామన్న పెద్దమనిషి ఇప్పటికీ దాని ఊసెత్తడం లేదని, నిన్నటికి నిన్న పొరుగు రాష్ట్రం పోలీసులు వరవరరావును అరెస్టు చేసి తీసుకెళ్తే కేసీఆర్ కనీసంగా మాట్లాడలేదన్నారు. ఇసుక దందాలో రూ.1900 కోట్ల ఆదాయం వచ్చిందంటున్న ఆయన తెరవెనుక ఆయన సన్నిహితుల జేబుల్లోకి వెళ్లిన రూ.1900 కోట్ల గురించి ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. దళితుల ప్రాణాలు బలిగొన్న గోల్డ్‌మైన్ పేరుతో ఇసుకదందా చేసిన సంతోష్‌రావుకు రాజ్యసభ సభ్యునిగా ప్రమోషన్ ఇస్తే ఈ ప్రభుత్వాధినేతను ఏమనాలని ప్రశ్నించారు. గులాబీ వాడిపోయిందని టీఆర్ఎస్ పార్టీ మాటలు ప్రజలు ఇక నమ్మబోరని, గారడి మాటలు కట్టిపెట్టకపోతే ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యరావు, ఆకుల ప్రకాష్, చాడగోండ బుచ్చిరెడ్డి, బాశెట్టి కిషన్, కటుకం వెంకటరమణ, బోనాల శ్రీనివాస్, పొన్నం శ్రీనివాస్, పడిశెట్టి భూమయ్య, శ్రీరాముల కిషన్, తదితరులు పాల్గొన్నారు. -
సభపై నివేదన!
-
‘ప్రగతి నివేదన’లో అన్నీ అబద్ధాలే: పొన్నం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనపై ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ దగ్గర మోకరిల్లి ఆత్మగౌరవం లేకుండా వ్యవహరిస్తున్న కేసీఆర్.. ఫెడరల్ ప్రంట్ పేరిట కొత్త నాటకానికి తెర తీశారన్నారు. ప్రధాని మోదీని కలిసినప్పుడల్లా వంగి నమస్కారాలు చేసిన ఆయన.. జోనల్‌పై ‘ఇస్తావా చస్తావా’ అని నిలదీశానంటే ఎవరు నమ్ముతారని ప్రభాకర్ ప్రశ్నించారు. నిజంగా నువ్వు నిలదీసే వాడివైతే ముస్లిం మైనార్టీలు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఎందుకు అడగడం లేదన్నారు. మిషన్ భగీరథపై సీఎం పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని, ఒకసారి 11 వందల గ్రామాలు అన్నింటికి ఇచ్చామంటారు.. మరోసారి 40 శాతమే పనులు జరిగాయి అంటున్నారని విమర్శించారు. ప్రగతి నివేదన సభలో కనీసం అమరుల పేరెత్తకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. -
రికార్డు స్థాయిలో సభ: కర్నె, బాలమల్లు
సాక్షి, హైదరాబాద్: కేవలం పది రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో బహిరంగసభను నిర్వహించామని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌రావు అన్నారు. సోమవారం విలేకరులతో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ సభకు 25 లక్షల మంది వస్తారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని, వారి అనుమానాలను తలకిందులు చేస్తూ అన్ని రికార్డులను అధిగమించిందన్నారు. దీనికి అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాయన్నారు. ఈ సభపై కాంగ్రెస్ నాయకులు దివాళాకోరు తనంతో దిగజారుడు విమర్శలు చేస్తున్నారని, ఈ సభ దేశంలోనే రికార్డు అని కర్నె ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 42 ఏళ్లు పాలించినా ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. ట్రాఫిక్ జామ్ వల్లే రాలేకపోయారు: దానం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ జామ్ వల్ల వేలాదిమంది ప్రగతి నివేదన సభ జరుగుతున్న ప్రాంతానికి రాలేకపోయారని మాజీమంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, సభ విజయవంతమైనా కొందరు కాకి గోల చేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రగతి నివేదన సభ గురించి ఉత్తమాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ను గద్దెదించడం సాధ్యంకాదని, గాంధీభవన్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తొలగిస్తేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు కాకి గోల చేస్తున్నారని, ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్‌లో తలొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల అండ టీఆర్ఎస్కు ఉందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని నేరుగా ప్రధానమంత్రి మోదీకే కేసీఆర్ చెప్పాడని దానం వెల్లడించారు. ప్రగతి నివేదన సభలో అభివృద్ధి గురించి చెప్పడం తప్ప రాజకీయ విమర్శలు చేయలేదని, ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలను కేసీఆర్ కడిగి పారేస్తారని హెచ్చరించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ సాధ్యంకాదని ఉత్తమ్‌కు కాంగ్రెస్ నేతలే చెప్పారని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో ఉత్తమ్ ఎందుకు రహస్యంగా సమావేశం అయ్యారో చెప్పాలని దానం డిమాండ్ చేశారు. -
ప్రగతి నివేదన కాదు... కేసీఆర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రగతి నివేదన సభ నిర్వహించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గత పది రోజులుగా రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి భారీ ప్రచారం చేసి నా ఫలితం లేకపోయిందని విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభ కాస్త కేసీఆర్ ఆవేదన సభగా మారిందని, సభ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పారు. ఎన్నికల శంఖారావంలా, తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలని సీఎం కేసీఆర్ రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహించారని.. అది కాస్త ప్రజల ఆదరణ పొందని సభగా మిగిలిపోయిందని విమర్శించారు. ధనబలం, అధికారమదంతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జనాలను తరలించేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టినా.. ప్రజలను సమీకరించలేకపోయారన్నారు. టీఆర్ఎస్ తొత్తులుగా అధికారులు.. ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చకపోగా రాష్ట్రా న్ని టీఆర్ఎస్ అప్పులోకి నెట్టిందని లక్ష్మణ్ ఆరోపించారు. తాము ఫ్లెక్సీలు కడితే రాత్రికి రాత్రే తొలగించే జీహెచ్ఎంసీ అధికారులు, ఇప్పుడెందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారా రని మండిపడ్డారు. తమ అధినేత అమిత్‌షా కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారని, ప్రచారం కూడా చేస్తానని చెప్పారని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ప్రజల అభిమానం లేకపోతే ఏమవుతుందో ప్రగతి నివేదన సభతో తేటతెల్లమైందని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఉద్యోగాలు, ఎస్టీలకు రిజర్వేషన్లపై సభలో కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఆయన ప్రసంగం మొత్తం అబద్ధాలు, అసత్యాలేనన్నారు. కేసీఆర్ ప్రసంగానికి ఒక దశా దిశా లేదని విమర్శించారు. ట్విట్టర్లో స్పందించినంత సులువు కాదు.. బహిరంగ సభలను నిర్వహించడమంటే ట్విట్టర్లో స్పందిం చినంత సులువు కాదని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కుటుంబ పెత్తనం, అవినీతి సొమ్ముతో ప్రజల ను మభ్యపెట్టలేరని తేలిందని చెప్పారు. ఈ సభకు 3 లక్షల మంది కూడా రాలేదన్నారు. ముందస్తుతో టీఆర్ఎస్కు పరాభవం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టు కొని ప్రధాని నరేంద్ర మోదీ జోనల్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఆమోదిస్తే.. ప్రధానిని ఉద్దేశించి చులకనగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఎస్సీ వర్గీకరణ, హైకోర్టు విభజనను ఎందుకు సాధించలేక పోయారని లక్ష్మణ్ ప్రశ్నించారు. -
కాంగ్రెస్ నేతలకు కడుపుమంట
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ బహిరంగసభ పెడితే కాంగ్రెస్ నేతలకు భయంతో, బాధతో కడుపు మం డుతున్నట్టు ఉందని ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం నాడిక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ, సభ విజయవం తం కావడంతో భవిష్యత్తు అంధకారమైన కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో కొత్త బిచ్చగాడు రేవంత్‌రెడ్డి, పాత బిచ్చగాడు మధుయాష్కీ, గడ్డం బాబా ఉత్తమ్, బొమ్మాళి డీకే అరుణ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సుమన్ విమర్శించారు. టీఆర్ఎస్ సభలలో పల్లీలు, వాటర్ పాకెట్లు అమ్ముకునే వారి సంఖ్యకన్నా ఇటీవల రాహుల్‌గాంధీతో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభలో తక్కువ జనం ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్పై తిట్లు, శాపనార్ధాలు ఆపకుంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అవుతుందని, చాలామందికి డిపాజిట్లు రావని హెచ్చరించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌కు అధికారంలో లేకుంటే నిరుద్యోగులు గుర్తుకువస్తారా అని సుమన్ ప్రశ్నిం చారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, సభ విజయవంతం కావడంతో వారికి భయం పట్టుకుందన్నారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతో ఇంత పెద్ద సభ పెట్టగలరా అని సవాల్ చేశారు. టీఆర్ఎస్ వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఐటీఐఆర్ విషయంలో కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని, వారి అసమర్థత వల్లనే ఐటీఐఆర్ రాకుండా పోయిందన్నారు. -
పదవీ విరమణ సభలా ఉంది
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ.. పదవీవిరమణ సభలా సాగిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆర్భాటంగా ప్రకటించినా సభ వెలవెలబోయిందన్నారు. సభలో ప్రగతి నివేదన, భవిష్యత్ దర్శనం లేదని, కేసీఆర్ ప్రసంగం పేలవంగా సాగిందని వ్యాఖ్యానించారు. మైక్ టైసన్లా గెలుస్తారని అనుకుంటే మొదటి రౌండ్లో ఎలిమినేట్ అయినట్లుగా కేసీఆర్ పరిస్థితి ఉందన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో కోదండరాం మాట్లాడుతూ.. ‘సభకు 25 లక్షల మంది వస్తారని, ముఖ్య ప్రకటనలు చేస్తారని, ఏదో జరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రకటించిన దాంట్లో 4వ వంతు జనం కూడా రాలేదు’అన్నారు. సభ పూర్తిగా విఫలమైందని, అన్ని శక్తులు ఉపయోగించినా జనాన్ని సభకు తీసుకురాలేకపోయారన్నారు. సీఎం ప్రసంగంలో మాటల తడబాటు ఉందని, మాటలు వెతుక్కోవాల్సి వచ్చిందని.. ప్రజలతో సంబంధాలు లేకపోవడం వల్లే మాటలు రాలేదని విమర్శించారు. సభతో పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోయారని చెప్పారు. అది బలప్రదర్శన, కేసీఆర్ గర్జన కాదని, ఆయన స్వీయ వేద నలా ఉందని ఎద్దేవా చేశారు. దీపం ఆరిపోయేముందు ఆఖరి తేజంలా కేసీఆర్ తీరు ఉందన్నారు. రాజకీయంగా, ప్రభుత్వపరంగా తన విధానం చెప్పుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. త్వరలో ఇంటింటికీ జన సమితి తెలంగాణ జనసమితిని బూత్ స్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని కోదండరాం వెల్లడించారు. త్వరలోనే ఇంటింటికీ జన సమితి ప్రచారం మొదలెడతామన్నారు. హైదరాబాద్, జిల్లాల్లో అమరుల స్మృతి చిహ్నం కోసం ఈ నెల 12న ఒకరోజు దీక్ష చేస్తామని చెప్పారు. చేరికలతో కాకుండా సొంతగా పార్టీ శక్తి సామర్థ్యాలు పెంచుకుంటామన్నారు. పార్టీ ప్రచారం కోసం రెండు విడతులుగా బస్సుయాత్రలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మహిళలు టీజేఎస్‌లో చేరారు. -
తిట్టలేదనే వారి బాధ: తలసాని
సాక్షి, హైదరాబాద్: ప్రగతి నివేదన సభలో తమని తిట్టలేదని కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నట్టున్నారని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ఎల్పీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిట్టలేదనే బాధతో కాంగ్రెస్ నేతలు నిరుత్సాహపడ్డారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు కళ్లుండి చూడలేకపోతున్నారని విమర్శించారు. వాస్తవాలు చూడటానికి రాష్ట్రంలో కంటివెలుగు శిబిరాల్లో కంటి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బుద్ధి, జ్ఞానం ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయ సభలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవడానికి నిబంధనలున్నాయనే విషయం కాంగ్రెస్ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. పొన్నాల లక్ష్మ య్యకు సొంత ఊరిలోనే పరపతి లేదన్నారు. కాంగ్రెస్ దిక్కూదివానం లేని పార్టీ అని, ఆ పార్టీ నేతలకు బుద్ధి లేదని విమర్శించారు. లెక్కలు తేల్చుకుందామా? మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదా, సాగుకు 24 గంటలు కరెంటు అందడం లేదో చెప్పాలని తలసాని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కాంగ్రెస్ హయాంలో ఎంతమందికి ఇచ్చారో, టీఆర్ఎస్ హయాంలో ఎందరికి ఇస్తున్నామో లెక్క తేల్చుకుందామా అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒకేసారి చెప్పడం సాధ్యం కానన్ని ఉన్నాయన్నారు. దళితులకు మూడెకరాల భూమి గురించి జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి సమాచారం తెప్పించుకుని చూడాలన్నారు. కేసీఆర్ హఠావో అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందా అని ప్రశ్నించారు. వీహెచ్‌ను కాంగ్రెస్ నేతలే పట్టించుకోరని, ఆయన టీఆర్ఎస్పై విమర్శలు మానుకోవాలని సూచించారు. డబ్బు మూటలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రేవంత్‌రెడ్డి నీతులు వల్లించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సభలన్నా, ఎన్నికలన్నా మీకు వణుకు.. కాంగ్రెస్ నేతలకు సభలన్నా, ముందస్తు ఎన్నికలన్నా భయమని తలసాని విమర్శించారు. ఎన్నికలు ముం దొచ్చినా, వెనుకొచ్చినా టీఆర్ఎస్దే విజయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నేతలే బాగుపడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అనుకున్నట్టు టీఆర్ఎస్ పాలిస్తుందా అని ప్రశ్నిం చారు. తెలంగాణలో ప్రజల కోసమే అప్పు చేస్తున్నామని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అప్పులు చేయడం లేదని ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల గుండెల్లో ప్రగతి నివేదన సభ రైళ్లు పరిగెత్తించిందన్నారు. కమీషన్లకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సేనని తలసాని విమర్శించారు. -
ఇక కేసీఆర్ శకం ముగిసింది..!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ ఫైర్ అయింది. అదో గ్రేట్ ఫ్లాప్ షో అని, ఇక సీఎం కేసీఆర్ శకం ముగిసినట్టేనని టీపీసీసీ నేతలు వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీమంత్రి డీకే అరుణ, గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడారు. టీఆర్ఎస్ సభ జనం లేక వెలవెల పోయిందని, 25 లక్షల మంది వస్తారని గొప్పలకు పోయి మూడు లక్షల జనాన్ని తరలించారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. జనం లేకపోవడంతోనే కేసీఆర్ ప్రసంగం చప్పగా సాగిందని, చెప్పిందే చెప్పి జనానికి ఏం సందేశం ఇచ్చారో కేసీఆర్‌కే అర్థం కాకుండా పోయిందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పని అయిపోయిందనేందుకు ఈ సభే నిదర్శనమని, ఇక రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసినట్టేనని ఆమె అన్నారు. తాను లేకుంటే ఇదంతా జరిగేదా అని కేసీఆర్ అంటున్నారని, అసలు ఆయన లేకపోతే ఇంతకంటే పదిరెట్లు ఎక్కువ అభివృద్ధి జరిగేదన్నారు. ముందస్తుకు పోతే ముందుగానే కేసీఆర్ కుర్చీ పోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. సభ పెట్టి పెద్ద షో చేయాలనుకున్న కేసీఆర్ ఆశలు నెరవేరలేదని, కేసీఆర్ సభ గ్రేట్ ఫ్లాప్ షోగా మిగిలిందని అన్నారు. జనం కూడా బలవంతంగా వచ్చారని పేర్కొన్నారు. గ్రామాల్లో బస్సులెక్కేందుకు జనం లేక స్థానిక నేతలు నానా తంటాలు పడ్డారని అన్నారు. ‘సభ ఎందుకు నిర్వహించారో వాళ్లకే అర్థం కాలేదు. కేసీఆర్ జనానికి ఏం సందేశం ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగం పేలవంగా సాగింది. చెప్పిన మాటలు పదే పదే చెప్పారు. జనం లేకపోవడంతో కేసీఆర్ స్పీచ్‌లో నిరాశ కనిపించింది. తన వెంట జనం లేరనేది కేసీఆర్‌కు అర్థమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏమైందో చెప్పలేదు. ఇంకా సెంటిమెంట్‌తోనే ఓట్లు వేయించుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. నేను లేకుంటే ఈ అభివృద్ధి జరిగేదా.. అని కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్ లేకుంటే ఇంకా ఎన్నో రెట్లు అభివృద్ధి జరిగేది. ఏ వర్గాలకు న్యాయం జరగలేదు. ఉద్యోగ సంఘాలు నోరువిప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ముందస్తుపై కేసీఆర్ ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ శకం ఇక ముగిసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌దే అధికారం’అని ఆమె అన్నారు. పగటి దొంగల నివేదిక సభ: మధుయాష్కీ అహంకారంతో కేసీఆర్ దొరల పాలన చేస్తున్నారని, తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఆస్తి ఎంతో, ఇప్పుడు ఎంతో లెక్క చెప్పాలని, కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని మధుయాష్కీ చెప్పారు. అది ప్రగతి నివేదన సభ కాదని, పగటి దొంగల నివేదిక సభ అని వ్యాఖ్యానించారు. బీసీలకు గొర్లు, బర్లు, నల్లానీళ్లు కాదని, ప్రగతిభవన్‌లో అధికారం కావాలన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, దేశిని చినమల్లయ్య లాంటి తెలంగాణ యోధుల పేరు పలికే అర్హత కేసీఆర్‌కు లేదని, ఎన్నికలు తొందరగా వస్తే పాపాత్ముడి పాలన తొందరగా పోతుందని ప్రజలు ఆశిస్తు న్నారన్నారు. ప్రధాని మోదీని చూస్తేనే కేసీఆర్ లాగు తడుస్తుందని, జోనల్ ఆమోదం కోసం చస్తవా.. చేస్తవా అని మోదీని అన్న కేసీఆర్, విభజన హామీలపై ఎందుకు అడగలేదని ప్రశ్నిం చారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌కు నోబెల్ బహు మతి ఇవ్వొచ్చని యాష్కీ ఎద్దేవా చేశారు. తాగుబోతుల సభలాగా సాగింది: దాసోజు టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ చెప్పిన దాంట్లో పావలా వంతు జనాలు కూడా ప్రగతి నివేదన సభకు రాకపోవడానికి ప్రజల్లో ఉన్న అసం తృప్తే కారణమన్నారు. రూ.500, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినా కనీసం 5 లక్షల మందిని సమీకరించలేకపోయారని ఎద్దేవా చేశారు. అది రాజకీయ సభలా లేదని, తాగుబోతుల సభ లాగా సాగిందని, ప్రజారవాణాకు ఉపయోగించే ఆర్టీసీ బస్సులను మొబైల్ బార్లుగా మార్చారని ఆరోపించారు. దసరా రోజు రావణాసురుడిని కూల్చినట్టు ప్రకృతి ప్రకోపంతో కేసీఆర్ కటౌట్‌ను కూల్చేసిందన్నారు. -
టీఆర్ఎస్కు నా ప్రగాఢ సానుభూతి..!
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభ విషయమై బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ సభ విఫలమైందని, కాబట్టి ఆ పార్టీకి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన అన్నారు. టీఆర్ఎస్ సభకు వచ్చింది కేవలం రెండున్నర లక్షల మందేనని, రేపు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు 20 సీట్ల కంటే ఎక్కువ రావని ఆయన జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో కారు అడ్డంగా బోర్లా పడుతుందన్నారు. ప్రధాని మోదీని జోనల్ వ్యవస్థపై చేస్తావా, లేక చస్తావా అనేంత సీన్ కేసీఆర్‌కు లేదని వ్యాఖ్యానించారు. -
‘ఈ సభతో ప్రజలకేం సందేశం ఇచ్చావ్’
సాక్షి, హైదరాబాద్ : ‘కేసిఆర్ నీ షో... ప్లాఫ్ షో. అసలింతకు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏమైనా సందేశం చేరిందా.. లేదా’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీ కే అరుణ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావ్ని ప్రశ్నించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభతో కేసీఆర్ ఆట ముగిసిందన్నారు. సభకు 25 లక్షల మంది జనాలు హాజరవుతారన్నారని ప్రచారం చేశారు.. కానీ కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే సభలో పాల్గొన్నారని తెలిపారు. సభ ప్రాంగణం కూడా నిండలేదు.. ఏదో విహార యాత్రకు వచ్చినట్లు వచ్చి వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించలేదు.. నిరుద్యోగ యువతను పట్టించుకోలేదు. అసలు ఈ సభతో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇచ్చారో తెలపాలంటూ ఆమె డిమాండ్ చేశారు. సెంటిమెంట్లతో ఎంతో కాలం మోసం చేయలేరనే విషయం నిన్న జరిగిన సభ చూస్తే అర్థమవుతోందని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ని తిరస్కరిస్తున్నారనే విషయం నిన్నటి సభతో స్పష్టంగా తెలిసిందన్నారు. కేసీఆర్ లేకుంటే రాష్ట్రం మరింత ముందుకు పోయేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ముందస్తు పెట్టి, నవంబర్‌లో చెక్కులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నారు.. కానీ ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆమె ఆరోపించారు. -
‘కాంగ్రెస్ నేతలు నిరుత్సాహపడ్డారు’
సాక్షి, హైదరాబాద్ : ప్రగతి నివేదన సభ విజయవంతం కావడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా సభ జరిగిందన్నారు. ఈ సభ విజయవంతంతో కాంగ్రెస్ నేతలు నిరుత్సాహపడ్డారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు సంక్షేమ కార్యక్రమాలు కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు. కడుపు కట్టుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అభివృద్ధి కోసం కష్ట పడుతున్నారని పేర్కొన్నారు. పల్లెల్లో ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని ఆలోచన ఏనాడైనా చేశారా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. పద్దతి ప్రకారమే ఆర్టీసీ బస్సులను వాడుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసమే అప్పులు చేస్తున్నామని, ఎక్కడా పన్నులు పెంచలేదన్నారు. -
‘ట్విటర్ అంత ఈజీ కాదు సభ నిర్వహించడం’
సాక్షి, హైదరాబాద్ : బహిరంగ సభలను నిర్వహించడం ట్విటర్లో స్పందించినంత సులువు కాదని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభపై స్పందించారు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. గత వారం పది రోజులుగా వందల కోట్లు ఖర్చుపెట్టి ఒక హైప్ క్రియేట్ చేశారని, కానీ కలెక్షన్ నిల్‌గా నిలిచిందన్నారు. అది కేసీఆర్ ఆవేదన సభగా జరిగిందని విమర్శించారు. ఎన్నికల శంఖారావంలాగా, తన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని వందల కోట్లు ఖర్చుపెట్టారన్నారు. కానీ ప్రజల ఆదరణ పొందని సభగా నిలిచిపోయిందన్నారు. ధనబలం, అధికారమదంతో ప్రజాధనం దుర్వినయోగం చేశారని మండిపడ్డారు. ప్రజలను తరలించే విషయంలో వందలు కోట్లు ఖర్చు పెట్టారు తప్పా ప్రజలను సమీకరించలేకపోయారన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగంలో బలం లోపించిందని, ఒక దశ దిశ లేదన్నారు. సభలో ఏం చెప్తారో అని ప్రజలు ఆశగా ఎదురుచూశారని, కానీ కేసీఆర్ ప్రసంగం వారిని నిరుత్సాహపరిచిందన్నారు. నాలుగున్నరేళ్లలో ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారని ఆరోపించారు. తాము ప్లెక్సీలు కడితే రాత్రికి రాత్రే జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారని, ఇప్పుడెందుకు అలా చేయలేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ అధికారులు అధికార పార్టీలకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. తమ అధినేత అమిత్‌షా కూడా ముందస్తు ఎన్నికలు సిద్దమని, ప్రచారం కూడా చేస్తానని చెప్పారని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. చదవండి: నూటొక్క తీరు.. శ్రేణుల హోరు -
‘ప్రగతి నివేదన సభ కాదు పుత్రుడి నివేదిక సభ’
సాక్షి, హైదరాబాద్ : ‘కేసీఆర్ రక్తం చిందకుండా తెలంగాణ తెచ్చిన అంటున్నావ్.. నువ్వు పార్టీ పెట్టిన ఆరు ఏండ్లకు కేటీఆర్ అమెరికా నుంచి వచ్చాడు.. ఆ తరువాత కవిత బతుకమ్మ అంటూ దిగింది.. కానీ తెలంగాణ కోసం 1200 మంది ఆత్మార్పణం చేసుకున్నారు.. మరి మీ ఇంటి నుంచి ఒక్కరైనా స్మశానానికి పోయారా’ అంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మీద నిప్పులు చెరిగారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. నిన్న జరిగింది ప్రగతి నివేదన సభ కాదని, పుత్రుడి నివేదిక సభ అని, తెలంగాణ ప్రజలపై జరిగిన దండయాత్రని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘నన్ను ముఖ్యమంత్రిని చేస్తావా లేదంటే మెత్త పెట్టి ఒత్తి చంపాలా’ అంటూ కేటీఆర్ తండ్రిని బెదిరిస్తున్నాడని, అందుకే కొడుకును మభ్యపెట్టడానికి కేసీఆర్ ముందస్తని హడావుడి చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సమైక్య పాలనలో తీసుకువచ్చిన పథకాలను కేసీఆర్ తనవిగా చెప్పుకుంటూ బీరాలు పోతున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంలో, కేసీఆర్ చేసింది ఏం లేదని ఆయన విమర్శించారు. పేదలు బతికున్నంత కాలం బర్లు, గొర్లు మేపుకుంటూ ఉంటే.. మీ కుటుంబం మాత్రం రాజ్యమేలుతూ ఉండలా అని మండిపడ్డారు. సామాజిక న్యాయం అంటే కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే న్యాయం చేయడం అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి కోసం 1200 మంది ఆత్మార్పణం చేస్తే వారి వివరాలు సేకరించడానికి మీకు 51 నెలల సమయ కూడా సరిపోలేదా అని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారుల్ని కూడా చిన్న చూపు చూస్తున్నారని, దాంతో వారు ప్రభుత్వం మీద తిరుగుబావుటా ఎగురవేశారన్నారు. పౌర హక్కుల కోసం పోరాడే వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారంటే తెలంగాణలో ఎలాంటి పాలన సాగుతుందో అర్థమవుతోందంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘గతంలో వార్తలు రాసి తరువాత పత్రిక అమ్మేవారు, కానీ ఇప్పుడు అమ్మిన తరువాత వార్తలు రాస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ తనకు వ్యతిరేకంగా రాసే పత్రికలను లాక్కొని.. జర్నలిస్టులను రోడ్డు మీద పడేస్తున్నారని’ ఆరోపించారు. వెయ్యికోట్లతో ప్రగతి భవన్, బుల్లెట్ ఫ్రూఫ్ బాత్రూమ్ నిర్మించుకున్న ముఖ్యమంత్రి.. అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం నిర్మించడంలో ఎందుకు ముందడుగు వేయడం లేదంటూ ప్రశ్నించారు. విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు ఉంటేనే తట్టుకోలేని కేసీఆర్ హరికృష్ణకు స్మారక చిహ్నం కడతాను అన్నాడంటే ఓట్ల కోసం ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నాడో అర్దం చేసుకోవచ్చన్నారు. నిన్న జరిగిన సభలో కేటీఆర్, హరీష్ రావ్, కేసీఆర్, కవిత మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని అందుకే ఆయనలో ఇంతకు ముందున్న ఆత్మ విశ్వాసం, వాడి, వేడీ తగ్గాయని తెలిపారు.10వేల కోట్ల అంచనా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును 80వేల కోట్లకు పెంచిన కేసీఆర్.. ఇంటింటికి నల్లా కనేక్షన్ చూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి సవాలు చేశారు. -
కదిలింది గులాబీ దండు
నిజామాబాద్‌అర్బన్: దారులన్నీ అటు వైపే.. వాహనాలన్నీ ‘ప్రగతి’ సభ వైపే.. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ బిజీబిజీగా కనిపించాయి. గులాబీ జెండాల రెపరెపలతో సందడిగా మారాయి. టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కంగరకొలాన్లో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభకు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివెళ్లారు. వందలాది వాహనాల్లో వారంతా తరలి వెళ్లడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి. 1.10 లక్షల మంది తరలింపు.. ప్రగతి నివేదన సభకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 1.10 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు 53 వేల మంది సభకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర వాహనాల్లో ఉదయం నుంచే బయల్దేరి వెళ్లారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యలు, రాష్ట్ర నాయకులు జన సమీకరణ చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి 88 ఆర్టీసీ బస్సులు, 90 ప్రైవేట్ బస్సులు, 240 వరకు కార్లలో 8,700 మంది వరకు తరలివెళ్లారు. బాల్కొండ నుంచి 687 వాహనాల్లో 12,465 మంది, బోధన్ నుంచి 450 వాహనాల్లో 9,700 మంది, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో 425 వాహనాల్లో 11,400 మంది, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో 750 వాహనాల్లో 12,500 మందిని తరలించారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి 16 వేలు, బాన్సువాడ నుంచి 12 వేలు, ఎల్లారెడ్డి నుంచి 12 వేలు, జుక్కల్ నుంచి 11 వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులతో పాటు అద్దె వాహనాల్లో తరలి వెళ్లారు. మొత్తం కామారెడ్డి జిల్లా నుంచి 51 వేల మంది వరకు ప్రగతి నివేదన సభకు బయల్దేరి వెళ్లారు. రహదారులన్నీ గులాబీమయం.. జన సమీకరణ బాధ్యతలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో ఎమ్మెల్యేలు రెండు, మూడ్రోజులుగా తమ నియోజకవర్గాల్లోనే తిష్టవేసి జన సమీకరణకు సర్వశక్తులు ఒడ్డారు. జనాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 508 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. అలాగే, ప్రైవేట్ వాహనాలు, ట్రాక్టర్లు, సుమోలు అద్దెకు తీసుకుని జనాలను తరలించారు. 44వ జాతీయ రహదారి గులాబీమయంగా మారింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వాహనాలతో హైవే కిక్కిరిసింది. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాన ప్రాంతాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద సీపీ కార్తికేయ ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షించారు. హైవేతో పాటు జిల్లాకు అనుసంధామున్న రాష్ట్ర రహదారులు, వివిధ మండలాల నుంచి జిల్లాకు.. అక్కడి నుంచి జాతీయ రహదారికి వెళ్లేందుకు రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. ఒక్కో ప్రధాన ప్రాంతం వద్ద సీఐ స్థాయి అధికారి, ట్రాఫిక్ పోలీసులను నియమించారు. -
ప్రగతి నివేదన సభకు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు
భూపాలపల్లి (వరంగల్): జిల్లాలోని మండలాలు, గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రగతి నివేదన సభకు భారీగా తరలి వెళ్లారు. శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి పరోక్షంగా, మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే పుట్ట మధు వాహనాలను పంపించి జనాల తరలింపులో సఫలీకృతమయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి సుమారు 100 ఆర్టీసీ బస్సుల్లో 6 వేల మంది, 90 డీసీఎంలలో 5 వేలు, 75 స్కూల్ బస్సుల్లో 3 వేలు, 60 ట్రాక్టర్లలో 1,500, వంద కార్లలో 700 మందిని ప్రగతి నివేదన సభకు తరలించారు. అలాగే మంత్రి చందూలాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను భారీ మొత్తంలోనే తరలించారు. నియోజకవర్గం నుంచి 100 ఆర్టీసీ బస్సులు, 64 ప్రైవేట్ బస్సులు, 25 మినీ బస్సులు, 50 స్కూల్ బస్సులు, 49 డీసీఎంలు, 50 టెంపో టాక్సీలు, 151 టవేరా వాహనాల్లో సుమారు 18 వేల మందిని తరలించారు. అలాగే మంథని నియోజకవర్గంలోని కాటారం, మహముత్తారం, మల్హర్, మహదేవ్పూర్, పలిమెల మండలాల నుంచి 190 ప్రైవేట్ వాహనాలు, 20 స్కూల్, ప్రైవేట్ బస్సులతోపాటు ఇతర వాహనాల్లో సుమారు 3,500 మందిని ఎమ్మెల్యే పుట్ట మధు తరలించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 37,500 మంది ప్రగతి నివేదన సభకు తరలివెళ్లినట్లు సమాచారం. పోటాపోటీగా.. పనితీరు ఆధారంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం టీఆర్ఎస్లో ఊపందుకోవడంతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రగతి నివేదన సభను సవాల్‌గా తీసుకున్నారు. ఒకరి కంటే ఒకరు పోటీగా వాహనాలను సమకూర్చి జనాలను తరలించారు. ప్రజాప్రతినిధులతో పాటు టికెట్లు ఆశిస్తున్న వారు సైతం తమ బలాన్ని చూపించుకోవడం కోసం తాపత్రయపడ్డారు. అనుకూలంగా ఉన్న మండలాలు, గ్రామాలకు వాహనాలను పంపించి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలను తరలించారు. భూపాలపల్లి నియోజకవర్గంలో శాసన సభాపతి మధుసూదనాచారితోపాటు గండ్ర సత్యనారాయణరావు కూడా సభకు ప్రజలను తరలించినట్లు తెలిసింది. ఇబ్బందుల్లో ప్రయాణికులు.. సభ కారణంగా సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జిల్లాలో ఏకైక భూపాలపల్లి బస్‌డిపోలో 81 బస్సులు ఉండగా అందులో 71 బస్సులు సభకు వెళ్లాయి. -
సభకు వెళ్తూ.. మృత్యు ఒడికి..
వరంగల్/చిల్పూరు: ప్రగతి నివేదన సభకు వెళ్తూ మార్గమధ్యలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ పోచమ్మమైదాన్‌కు చెందిన గానుపు భిక్షపతి(40) ఆదివారం 29వ డివిజన్ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభకు బయలుదేరి వెళ్లారు. ఈక్రమంలో స్టేషన్ఘనపూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మూత్ర విసర్జన కోసం బస్సును నిలిపివేశారు. మూత్ర విసర్జన చేసిన భిక్షపతి తిరిగి బస్సు ఎక్కే సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో బస్సు ఢీకొట్టింది. దీంతో త్రీవగాయాల పాలైన ఆయనను స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మైరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్టానిక టీఆర్ఎస్ నాయకులు యెలుగం సత్యనారాయణ తెలిపారు. ఈవిషయాన్ని వెంటనే నగర మేయర్ నరేందర్‌కు తెలపడంతో ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకుపోగా భిక్షపతి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. మార్చురీ వద్ద మృతుడి బంధువుల రోధనలు కూలి చేసుకుని బతికేవాళ్లం. సభకు పోతే ఇండ్లు ఇస్తామంటే పోయాం. మీటింగ్‌కు పోతున్న క్రమంలో కాలకృత్యాల కోసం దిగి రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు ఢీ కొట్టింది. నాకెవరు దిక్కు అంటూ మృతుడి భిక్షపతి భార్య అనిత రోదించిన తీరు అందరిని కలిచివేసింది. రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు ఢీకొనడంతో భిక్షపతి అక్కడిక్కడే మృతిచెందాడని మృతుడి బంధువు సరోజన తెలిపింది. రూ.10లక్షలు చెల్లించాలి.. ప్రగతి నినేదన సభకు వెళ్లిన నిరుపేద భిక్షపతి కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ అర్బన్ పార్టీ అధికార ప్రతినిధి చిప్ప వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సభ విజయవంతం కోసం ప్రజలను తీసుకెళ్లిన నాయకులు సరైన జాగ్రత్తలు తీసుకోనందునే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈకుటుంబాన్ని ఆదుకునేందుకు స్థానిక టీఆర్ఎస్ నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు.