E commerce
-
దేశంలో తొలి ఈ–కామర్స్ ఎగుమతుల హబ్.. త్వరలో కార్యకలాపాలు
దేశీయంగా తొలి ఈ–కామర్స్ ఎగుమతుల హబ్ ( E-Commerce Export Hub) ఈ ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసేందుకు అయిదు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.ఢిల్లీలో లాజిస్టిక్స్ అగ్రిగేటర్ షిప్‌రాకెట్, ఎయిర్ కార్గో హ్యాండ్లింగ్ సంస్థ కార్గో సర్వీస్ సెంటర్; బెంగళూరులో డీహెచ్ఎల్, లెక్స్షిప్; ముంబైలో గ్లోగ్లోకల్ ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ హబ్‌ల నిర్వహణ విధి విధానాలను రూపొందించడంపై వాణిజ్య, ఆదాయ విభాగాలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) కలిసి పని చేస్తున్నాయని సారంగి చెప్పారు.గేట్‌వే పోర్టుల్లో కస్టమ్స్ పరిశీలన నుంచి మినహాయింపులు, రిటర్నుల కోసం సులభతరమైన రీఇంపోర్ట్ పాలసీ మొదలైన ఫీచర్లు ఈ హబ్‌లలో ఉంటాయి. ఈ–కామర్స్ ఎగుమతులను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో వీటి ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం భారత్ ఈ–కామర్స్ ఎగుమతులు 5 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి వీటిని 100 బిలియన్ డాలర్లకు పెంచుకునే సామర్థ్యాలు ఉన్నాయనే అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ కనెక్ట్ ఈ-ప్లాట్‌ఫామ్ రెండవ దశను ప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కృషి చేస్తోందని సారంగి ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన మొదటి దశ ఎగుమతులు, దిగుమతులపై అవసరమైన సమాచారాన్ని అందించింది. రెండవ దశతో వాణిజ్య వివాదాలకు పరిష్కారం, వాణిజ్య విశ్లేషణలు, విదేశీ మిషన్ల నుండి ఇంటెలిజెన్స్ నివేదికలు, వాణిజ్య ఫైనాన్స్, బీమా ఎంపికలు వంటి అదనపు సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఏప్రిల్ 1 నుంచి డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ మరోవైపు డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ (DIA) పథకం ప్రారంభానికి సంబంధించిన ప్రణాళికలను కూడా డీజీఎఫ్టీ వెల్లడించింది. ఇది ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ స్కీమ్ నిర్దిష్ట పరిమితి వరకు కట్, పాలిష్ చేసిన వజ్రాలను సుంకం-రహిత దిగుమతికి అనుమతిస్తుంది. వజ్రాల ప్రాసెసింగ్, విలువ జోడింపునకు భారత్‌ను కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం. డైమండ్ ఇంప్రెస్ట్ లైసెన్స్ అర్హతగల ఎగుమతిదారులు గత మూడు సంవత్సరాల నుండి వారి సగటు టర్నోవర్‌లో 5 శాతం వరకు 10 శాతం విలువ జోడింపు అవసరంతో వజ్రాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. -
క్విక్ కామర్స్‌లోకి మ్యాజిక్‌పిన్
న్యూఢిల్లీ: హైపర్–లోకల్ ఈ–కామర్స్ సంస్థ మ్యాజిక్‌పిన్ తాజాగా ఫుడ్ డెలివరీ సేవలకు సంబంధించి క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. మ్యాజిక్నౌ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. చాయోస్, ఫాసోస్, మెక్‌డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి 2,000 పైచిలుకు ఫుడ్ బ్రాండ్లు, 1,000కి పైగా మర్చంట్లతో కలిసి పని చేయనున్నట్లు సంస్థ తెలిపింది.1.5 కి.మీ. నుంచి 2 కి.మీ. పరిధిలో వేగంగా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తామని పేర్కొంది. ముందుగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, పుణెల్లో ఈ సర్వీసులను ప్రారంభిస్తామని వివరించింది. ఫుడ్ డెలివరీకి ఇతరత్రా క్విక్ కామర్స్ సంస్థల తరహాలో డార్క్ స్టోర్స్ విధానాన్ని పాటించబోమని కంపెనీ పేర్కొంది.నవంబర్ 14 – డిసెంబర్ 15 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరులో నాలుగు వారాలపాటు పైలట్ ప్రాజెక్టు నిర్వహించినట్లు, 75,000 పైగా ఫుడ్ డెలివరీలు నమోదు చేసినట్లు తెలిపింది. ఫుడ్ డెలివరీ సేవల కోసం తమ లాజిస్టిక్స్ అగ్రిగేటర్ విభాగం వెలాసిటీని ఉపయోగించుకుంటామని మ్యాజిక్‌పిన్ తెలిపింది. ప్రస్తుతం కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్, ఐజీపీ గిఫ్టింగ్ వంటి బ్రాండ్లకు వెలాసిటీ సర్వీసులను అందిస్తోంది. -
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి: ఇది లాభామా? నష్టమా?
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (Buy Now Pay Later).. ఈ విధానం కేవలం ఈ కామర్స్ వెబ్సైట్లలో మాత్రమే కాకుండా, కొన్ని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కూడా అవలంబించాయి. ఈ విధానం ద్వారా ఏదైనా కొనుగోలు చేసే వ్యక్తి.. ముందుగా వస్తువును కొనుగోలు చేస్తాడు. ఆ తరువాత ఇన్స్టాల్మెంట్ రూపంలో చెలించాలి. ఇంతకీ దీనివల్ల వినియోగదారునికి ఏమైనా లాభం ఉందా? లేక్ నష్టం ఉందా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..ఏదైనా అత్యవసరమైన వస్తువులను.. చేతిలో డబ్బు లేని సమయంలో కొనుగోలు చేయాలంటే 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' అనేది ఉపయోగకరమైన విధానమే. అయితే వస్తువును కొనే ముందే ఎన్ని రోజుల్లో పే చేయాలి? సమయానికి చెల్లించకపోతే వచ్చే నష్టాలు ఏంటి? అనేవన్నీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి.మీరు సకాలంలో డబ్బు చెల్లిస్తే.. ఎటువంటి నష్టాన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ డబ్బు చెల్లించడంలో ఆలస్యం అయితే మాత్రం.. లేట్ పేమెంట్ ఫీజు, సర్వీస్ ఛార్జెస్ వంటివి ఎన్నో విధిస్తారు. కాబట్టి వీటన్నింటిని ముందుగానే తెలుసుకోవాలి.కొన్ని ఈ కామర్స్ కంపెనీలు అద్భుతమైన ఆఫర్స్.. డిస్కౌంట్స్ పేరుతో కస్టమర్లను ఆకర్షిస్తుంటారు. చేతిలో డబ్బు లేకపోయినా ఇప్పుడు కోనేయండి.. మళ్ళీ చెల్లించండి అంటూ ఊరిస్తుంటాయి. ఈ మాయలో పడ్డారంటే.. సమయానికి డబ్బు చెల్లించకపోత.. మీ చెబుకు చిల్లు పడ్డట్టే.ఇదీ చదవండి: జియో, ఎయిర్టెల్ కథ కంచికేనా?.. వచ్చేస్తోంది స్టార్లింక్మీరు ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి విధానంలో వస్తువులను కొనుగోలు చేయాలంటే మీకు సిబిల్ స్కోర్ వంటివి ఉండాల్సిన అవసరం లేదు. అయితే మీరు సకాలంలో డబ్బు చెల్లించకపోతే.. ఈ విషయాన్ని క్రెడిట్ బ్యూరోకు తెలియజేస్తుంది. ఆ తరువాత మీకు భవిష్యత్తులో లోన్ వచ్చే అవకాశం లేదు.ఆర్ధిక పరమైన విషయాల్లో తప్పకుండా క్రమశిక్షణ ఉండాలి. సకాలంలో తప్పకుండా నేను చెల్లించగలను అనే నమ్మకం మీకున్నప్పుడు, కొనుగోలు చేసే వస్తువు అత్యవసరమైనప్పుడు ''ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి'' ఎంచుకోవచ్చు. అయితే అప్పటికే ప్రతి నెలా ఏదైనా లోన్స్ వంటివి చెల్లిస్తుంటే.. ఈ సర్వీస్ ఉపయోగించుకోకపోవడం చాలా ఉత్తమం. -
ఎఫ్ఎల్ఐఎన్ మూడో కోహోర్ట్ కోసం ఐదు స్టార్టప్‌లు
స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో టెక్నాలజీ సహకారాన్ని పెంపొందించేందుకు రూపొందించిన 'ఫ్లిప్‌కార్ట్ లీప్ ఇన్నోవేషన్ నెట్వర్క్' (FLIN) ఫ్లాగ్షిప్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ మూడవ కోహోర్ట్ కోసం ఐదు స్టార్టప్‌లను ఎంపిక చేసింది. మునుపటి రెండు కోహోర్ట్‌ల విజయాన్ని అనుసరించి.. మూడవ రౌండ్ జెన్ ఏఐ, ఓమ్నీ ఛానల్, అనలిటిక్, వీడియో కామర్స్‌లో స్టార్టప్‌ల డ్రైవింగ్ పురోగతిని పరిచయం చేసింది.ఫ్లిప్‌కార్ట్ లీప్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అనేది ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్షిప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, ఇది ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది. 2022 జనవరిలో ప్రారంభమైన ఎఫ్ఎల్ఐఎన్.. భారతదేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడం, డ్రైవింగ్ సహకారం, లేటెస్ట్ రిటైల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం అంకితమైంది.ఎఫ్ఎల్ఐఎన్ ప్రోగ్రామ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్.. స్టార్టప్ వ్యవస్థలో ఆవిష్కరణలకు ఉత్ప్రేరకంగా మారుతోంది. ఇది స్టార్టప్‌ల మెరుగుదలకు ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ 'నరేన్ రావు' పేర్కొన్నారు. అంతే కాకుండా భారతదేశంలో ఈ-కామర్స్ భవిష్యత్తును రూపొందించగల పరిష్కారాలు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సాధ్యమవుతాయని ఆయన అన్నారు.ఈ కోహోర్ట్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఎంచుకున్న ఐదు స్టార్టప్‌లు•ఇంటెలిజెన్స్ నోడ్•ఇన్వెంజో ల్యాబ్స్•స్టోరీ బ్రెయిన్•ఫిలో•డీ-ఐడీ -
చిటికెలో చాయ్.. బిస్కెట్!
క్విక్ కామర్స్ రంగంలో పోటీ హీటెక్కుతోంది. దీంతో కంపెనీలు అధిక మార్జిన్ల కోసం సగటు ఆర్డర్ విలువ (ఏఓవీ)ను పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా టీ, కాఫీ, సమోసా, బిస్కెట్లు, ఇతరత్రా బేకరీ ఉత్పత్తులను కూడా కార్ట్‌లోకి చేరుస్తున్నాయి. ప్రత్యేకంగా కేఫ్ విభాగాలను ఏర్పాటు చేస్తూ... కస్టమర్లకు రెడీ–టు–ఈట్ ఆహారోత్పత్తులను ఫటాఫట్ డెలివరీ చేస్తున్నాయి. గ్రోసరీతో పాటు వీటిని కూడా కలిపి ఇన్‌స్టంట్‌గా అందిస్తున్నాయి. ఉదాహరణకు, జెప్టో ఈ ఏడాది ఏప్రిల్‌లో ముంబైలో ప్రయోగాత్మకంగా జెప్టో కేఫ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ బాగా క్లిక్ కావడంతో బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని అందుబాటులోకి తెచి్చంది. ఇతర ప్రధాన నగరాలకు క్రమంగా విస్తరించే ప్రణాళికల్లో ఉంది. ఇక స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సైతం పైలట్ ప్రాతిపాదికన బెంగళూరులో ఇన్స్టాకేఫ్ను తెరిచింది. ఇక్కడ ప్రధానంగా టీ, కాఫీతో పాటు సూపర్ మార్కెట్లలో రూ.30–300 రేంజ్లో లభించే రెడీ–టు–ఈట్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లకు భిన్నం... తక్షణం కోరుకునే ఆహారోత్పత్తులను కస్టమర్లకు అందించడం కోసమే క్విక్ కామర్స్ కంపెనీలు ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అమెరికాలో 7–ఎలెవన్ స్టోర్స్ మాదిరిగా కస్టమర్లు వెళ్తూ వెళ్తూ కాఫీ లేదా కొన్ని రెడీ–టు–ఈట్ స్నాక్స్‌ను తీసుకెళ్లడం లాంటిదే ఈ మోడల్ అని జెప్టో కో–¸ûండర్ ఆదిత్ పలీచా చెబుతున్నారు. అయితే, అక్కడ మనమే ఉత్పత్తులను తీసుకెళ్లాల్సి ఉంటే, ఇక్కడ ఇన్‌స్టంట్‌గా హోమ్ డెలివరీ చేయడం వెరైటీ అంటున్నారు. కస్టమర్ల నుంచి ఈ కొత్త ప్రయత్నానికి మంచి స్పందనే వస్తోందట! స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల మాదిరి కాకుండా, కిరాణా సరుకులతో పాటు స్నాక్స్, టీ, కాఫీ వంటి ఉత్పత్తులను కూడా ఒకేసారి ఆర్డర్ పెట్టుకునే ఆప్షన్ ఉండటం గమనార్హం. అదనపు ఆదాయం... ఇతర దేశాల్లో కూడా ఉదాహరణకు, అమెరికాలో గోపఫ్, యూకేలో డెలివరూ.. లాటిన్ అమెరికాలో రప్పీ వంటి యాప్‌లు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం స్నాక్స్‌ను కూడా డెలివరీ చేస్తున్నాయి. మన దగ్గర కూడా క్విక్ కామర్స్ సంస్థలు దీన్ని ఫాలో అవుతున్నాయి. కస్టమర్లు కార్ట్‌లోకి మరిన్ని ఉత్పత్తులను జోడించేలా చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ విలువను పెంచుకోవడమే వాటి లక్ష్యం. ‘పదేపదే, ఎక్కువ సంఖ్యలో వచ్చే ఇలాంటి ఆర్డర్ల వల్ల కస్టమర్లకు యాప్‌తో అనుబంధం కూడా పెరుగుతుంది. ఆఫ్‌లైన్ బేకరీలు, కాఫీ షాప్‌లను కూడా నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ల నుంచి కొంత వాటాను దక్కించుకోవడానికి వీలవుతుంది’ అని జిప్పీ ఫౌండర్, సీఈఓ మాధవ్ కస్తూరియా పేర్కొన్నారు. డార్క్ స్టోర్ల ద్వారా ఈ స్టార్టప్ దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ బ్రాండ్ల కోసం ఇన్స్టంట్ డెలివరీ సేవలు అందిస్తోంది.అధిక మార్జిన్లు... క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తమ రోజువారీ గ్రోసరీ విభాగానికి స్నాక్స్‌ను జోడించడం వల్ల వాటి స్థూల ఆర్డర్ విలువ (జీఓవీ) పెంచుకోవడానికి దోహదం చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రోసరీ ఉత్పత్తులతో పోలిస్తే రెడీ–టు–ఈట్లో మార్జిన్లు కూడా మెరుగ్గా ఉండటం మరో ప్లస్. ‘ప్రస్తుతం క్విక్ కామర్స్‌లో 60 శాతం ఆర్డర్లు కిరాణా ఇతరత్రా గ్రోసరీ విభాగం నుంచే వస్తున్నాయి. స్నాక్స్ ద్వారా 25–30 శాతం నమోదయ్యే అవకాశం ఉంది. అధిక విలువ గల ప్రోడక్టుల వాటా 10 శాతంగా ఉంటుంది’ అని ఆర్థా వెంచర్ ఫండ్ మేనేజింగ్ అనిరుధ్ దమానీ అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
క్విక్ కామర్స్..ఫ్యాషన్ షో!
కిరాణా సరుకులు.. కూరగాయలు.. మిల్క్ ప్రోడక్టులు.. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను 15 నిమిషాల్లో గుమ్మంలోకి చేరుస్తూ... శరవేగంగా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ మరిన్ని ఉత్పత్తులను కార్ట్‌లోకి చేరుస్తోంది. నగరాల్లో సూపర్ సక్సెస్ నేపథ్యంలో అపారెల్, ఫుట్‌వేర్ కంపెనీలు దీనిపై ఫోకస్ చేస్తున్నాయి. ఫాస్ట్ సెల్లింగ్ జాబితాలో ముందున్న దుస్తులు, షూస్ ఇతరత్రా ఫ్యాషన్ ప్రోడక్టులను సైతం క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించేందుకు సై అంటున్నాయి.జొమాటో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో.. ఈ క్విక్ కామర్స్ స్టార్టప్‌లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. తమ ప్లాట్‌ఫామ్‌లలో ఇటీవలే ఫ్యాషన్ ప్రోడక్టుల అమ్మకాలు మొదలు పెట్టడంతో కస్టమర్లకు మరిన్ని రకాలు ప్రోడక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. జాకీ, అడిడాస్ బ్రాండ్స్‌కు చెందిన బేసిక్ కలర్ టీ–షర్టులు, ఇన్నర్‌వేర్ వంటి ఉత్పత్తులను ఇన్‌స్టామార్ట్ సేల్ చేస్తోంది. ఇక బ్లింకిట్ జాకీ, పెపే, అడిడాస్ టీ–షర్ట్స్, కొన్ని రకాల ఫుట్‌వేర్, ట్రాక్ ప్యాంట్లతో పాటు లోదుస్తులను ఆఫర్ చేస్తోంది. జెప్టో కూడా నేను సైతం అంటూ రంగంలోకి దూకింది. దీంతో మరిన్ని ఆపారెల్, ఫుట్‌వేర్ బ్రాండ్స్ క్విక్ కామర్స్ అండతో అమ్మకాలు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అరవింద్ ఫ్యాషన్స్, ఫ్యాబ్ ఇండియా, ఉడ్ల్యాండ్తో పాటు ప్యూమా తదితర దిగ్గజాలు క్విక్ కామర్స్ కంపెనీలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వచి్చనట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. దేశంలోని 15 టాప్ నగరాల్లో కస్టమర్లు తమ నిత్యావసరాల కోసం క్విక్ కామర్స్ బాట పడుతున్నారు. దీంతో మరింత మందిని బుట్టలో వేసుకోవాలని చూస్తున్న ఈ ప్లాట్‌ఫామ్‌లు గ్రాసరీలు, ఎఫ్ఎంసీజీకి మించి తమ పరిధిని విస్తరించడంపై ఫోకస్ చేస్తున్నాయి. ఆ రెండు విభాగాలపై గురి... ప్రస్తుతం భారత ఈ–కామర్స్‌లో మార్కెట్లో ఎల్రక్టానిక్స్–స్మార్ట్ ఫోన్స్ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్నది ఫ్యాషన్ ఉత్పత్తులే. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 20–25 శాతంగా అంచనా. దీంతో ఫ్యాషన్ ప్రోడక్టుల అమ్మకం అటు బ్రాండ్లతో, ఇటు క్విక్ కామర్స్ సంస్థలకు ఉభయతారకంగా నిలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఎల్రక్టానిక్స్–స్మార్ట్ ఫోన్స్ విభాగంలోకి కూడా దూకేందుకు ఈ స్టార్టప్‌లు ఉవి్వళ్లూరుతున్నాయి. యారో, కాలి్వన్ క్లీన్, టామీ హిలి్ఫగర్, యూఎస్ పోలో వంటి టాప్ బ్రాండ్లను విక్రయించే అరవింద్ ఫ్యాషన్స్.. క్విక్ కామర్స్ ద్వారా ముందుగా టీ–షర్ట్లు, ఇన్నర్వేర్తో పాటు బెల్టులు, సాక్స్‌ల వంటి యాక్సెసరీలను క్విక్ కామర్స్‌లో విక్రయించనుంది. ఐపీఎల్ సీజన్లో టీమ్ జెర్సీలను ఈ ప్లాట్‌ఫామ్‌లలో జోరుగా విక్రయించిన ప్యూమా... ఇతర ప్రోడక్టులకు సైతం తమ భాగస్వామ్యాన్ని విస్తరించే సన్నాహాల్లో ఉంది. ‘ఇన్స్టంట్ డెలివరీని ఎంచుకుంటున్న వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫ్యాషన్ రంగంలో కూడా క్విక్ కామర్స్ సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ–కామర్స్‌లో మా కంపెనీ సేల్స్ 30 శాతానికి చేరుకున్నాయి’ అని ఉడ్‌ల్యాండ్ ఇండియా సీఈఓ హర్కీరత్ సింగ్ చెప్పారు. రిటర్న్‌లు చాలా తక్కువగా ఉండే బేసిక్ ప్రోడక్టులను తాము ఈ ప్లాట్ఫామ్లో విక్రయించనున్నట్లు ఫుట్‌వేర్ సంస్థ లిబర్టీ వెల్లడించింది. బాటా కూడా క్విక్ కామర్స్ రూట్లో వెళ్తోంది. ’10–15 నిమిషాల్లో డెలివరీ చేసేలా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొస్తాం’ అని బాటా ఇండియా సీఈఓ, ఎండీ గుంజన్ షా వెల్లడించారు. నో రిటర్న్ పాలసీ...ఈ–కామర్స్ మాదిరిగా క్విక్ కామర్స్‌లో ప్రోడక్టులు నచ్చకపోతే వెనక్కి తిరిగిచ్చేందుకు రిటర్న్ పాలసీ లేదు. తయారీపరమైన లోపాలకు మాత్రమే నగదును రీఫండ్ చేస్తున్నాయి. ఫ్యాషన్ రంగంలో సైజ్, రంగులు ఇతరత్రా కారణాలతో రిటర్న్ చేసే కస్టమర్లు ఎక్కువ. దీంతో ఉడ్‌ల్యాండ్ వంటి బ్రాండ్లు తమ స్టోర్స్ ద్వారా రిటర్న్ పాలసీని అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. కాగా, వివిధ ప్రదేశాల్లోని రిటైల్ స్టోర్లలో స్టాక్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లకు లింక్ చేసి, ఎక్కువ ప్రోడక్టులను కస్టమర్లకు అందించాలనేది క్విక్ కామర్స్ సంస్థల వ్యూహం. ఎందుకంటే ఫ్యాషన్ ఉత్పత్తులను తమ డార్క్ స్టోర్లలో (వేగంగా డెలివరీ చేసేందుకు ఏర్పాటు చేసే భారీ గోదాములు) నిల్వ చేసేందుకు తగినంత స్థలం లేకపోవడం వాటికి పెద్ద సమస్య అవుతుందనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. అయితే, ఫాస్ట్ సెల్లింగ్ ఉత్పత్తులైన ఇన్నర్‌వేర్, సాక్సులు, వైట్, సాలిడ్ కలర్ టీ–షర్ట్లు, బ్లాక్ ట్రౌజర్లు, బ్లూజీన్స్, కుర్తాలు, ఫార్మల్ బ్లాక్ షూస్, స్కూల్ షూస్, ఇంట్లో వాడే స్లిప్పర్స్, వాకింగ్ స్నీకర్స్ వంటివి తమ డార్క్ స్టోర్లలో నిల్వ చేయడం ద్వారా 15 నిమిషాల్లోనే డెలివరీ చేయొచ్చనేది క్విక్ కామర్స్ కంపెనీల యోచన.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈ-కామర్స్ షాపింగ్‌లో 25 ఏళ్లలోపు వారే ఎక్కువ
న్యూఢిల్లీ: తమ యూజర్లలో మూడింట ఒకవంతు 25 ఏళ్లలోపు వారు ఉన్నారని ఈ–కామర్స్ కంపెనీ మీషో తెలిపింది. సెన్సార్ టవర్‌తో కలిసి రూపొందించిన నివేదిక ప్రకారం.. నాలుగు, ఆపై శ్రేణి పట్టణాలకు చెందిన కస్టమర్లు తరచూ, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు జరుపుతున్నారు.వీరు ఫ్యాషన్, పాదరక్షలు, శిశు సంరక్షణ వంటి విభాగాల్లో ఉత్పత్తులను కొంటున్నారు. ఈ–కామర్స్ యూజర్ల వృద్ధిలో ఉత్తరప్రదేశ్, బిహార్ ముందంజలో ఉన్నాయి. ఆన్లైన్ షాపర్స్‌లో 80 శాతంపైగా ద్వితీయ, ఆపై శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని కస్టమర్లు ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ ఆధారంగా ఈ–కామర్స్ కొనుగోళ్లను ఎక్కువగా చేస్తున్నారు.మొత్తం ఆర్డర్లలో ఈ రాష్ట్రాల వాటా 40 శాతం ఉంది. గృహ, వంటింటి ఉపకరణాలకు 10 శాతం ఖర్చు చేస్తున్నారు. ఈ విభాగం 50 శాతం వృద్ధి చెందింది. చీరలు, సంబంధిత యాక్సెసరీస్ కొనుగోళ్లు కొత్త ట్రెండ్. -
USA Presidential Elections 2024: ‘ట్రంప్ ధిక్కార’ టీ షర్టుల జోరు
బ్యాంకాక్: అటు తూటాల వర్షం. ఇటు చెవి నుంచి చెంప మీదుగా బొటబొటా కారుతున్న రక్తం. అంతలోకే రక్షణ వలయంగా కమ్ముకున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది. అంతటి భీతావహ పరిస్థితిలోనూ పిడికిలి గట్టిగా బిగించి పైకెత్తి ‘పోరాటమే’నంటూ గొంతెత్తి నినాదాలు. ట్రంప్‌పై దాడి జరిగిన క్షణాలకు శాశ్వతత్వం కలి్పంచిన ఫొటో ఇది. హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డ క్షణాల్లో కూడా ట్రంప్ ఆత్మనిబ్బరానికి, ఆయన ప్రదర్శించిన సాహసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఫొటో అప్పుడే టీ షర్టులపైకి కూడా ఎక్కింది. అది కూడా దాడి జరిగిన రెండు గంటల్లోపే! అంత తక్కువ సమయంలోనే టావోబావో, జేడీ.కామ్ వంటి చైనా ఈ కామర్స్ దిగ్గజాలు ఆన్లైన్ దుకాణాలు ఆ ఫొటోలతో కూడిన టీ షర్టులను తయారు చేయడం, ఇ–కామర్స్ ప్లాట్‌ఫాంల్లో అమ్మకానికి పెట్టడం చకచకా జరిగిపోయాయి! వాటికి చూస్తుండగానే చైనా, అమెరికాల నుంచి 2,000 పై చిలుకు ఆర్డర్లు వచ్చాయి! -
మా చేతిలో ఉన్న పనికి.. సాంకేతిక పరిజ్ఞానం తోడైంది..!
‘‘ఇంట్లో మగ్గం ఉంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. నా గ్రామం నుంచి విదేశాలతో అనుసంధానం కావడానికి ఇవి చాలు. నేను నేసిన చీరను ఈ కామర్స్ వేదికల ద్వారా నేనే మార్కెట్ చేసుకోగలుగుతున్నాను. నా చేతుల్లో తయారైన చీరను ధరించే వారి చేతికి చేర్చే సాంకేతిక మార్గాలను నేర్చుకున్నాను. వందల మంది మహిళలం సంఘటితమయ్యాం. మాలోని నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాం. మేము గౌరవప్రదమైన ఉపాధిని పొందుతున్నాం’’ అంటోంది తమిళనాడుకు చెందిన ముత్తులక్ష్మి. ఆమె మాటలు అక్షరసత్యాలు.వైవిధ్యతే ఉపాధి..భాషలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లలో మాత్రమే కాదు మనదేశంలో ఉన్న వైవిధ్యత... కళలు, కళాత్మకతల్లోనూ ఉంది. దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఆ కళాత్మకత ఉంటుంది. స్థానికంగా లభించే వస్తువులతో మహిళల చేతిలో రూపుదిద్దుకునే అనేక వస్తువులు ఇప్పుడు వారికి ఉపాధిమార్గాలవుతున్నాయి. దేశంలో దాదాపుగా ఏడు కోట్ల మంది చేతిలో కళ ఉంది. ఆ చేతుల్లో అందమైన హస్తకళాకృతులు తయారవుతున్నాయి. అందులో సగానికి పైగా మహిళలే.ఒకప్పుడు ఆ పని తమకు ఉపాధినిస్తుందని, గుర్తింపును తెస్తుందని తెలియదు వాళ్లకు. తెలిసినా సరే, మధ్య దళారుల దోపిడీకి గురవుతూ అరకొరగా లభించే రుసుముతోనే సంతృప్తి చెందేవాళ్లు. ఇప్పుడు మహిళలు చురుగ్గా ఉన్నారు. తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశ పెట్టే మాధ్యమాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. హస్తకళాకృతులు తయారు చేసే కుటుంబాల్లోని మగవారు మెరుగైన ఉపాధి కోసం ఆ వృత్తులను వదిలేస్తున్న తరుణంలో ఆ ఇళ్లలోని మహిళలు తమ వారసత్వ కళను కొనసాగిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని, అదే స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.ముత్తులక్ష్మి ఇంట్లో పవర్లూమ్ ఉంది. ఆ మరమగ్గం మీద ఆమె నెలకు పది చీరలను నేయగలుగుతోంది. తమిళనాడులోని అరుపోకోటాయ్ బ్లాక్ చేనేత చీరలకు ప్రసిద్ధి. అక్కడ నేసే చీరలను కూడా అదే పేరుతో అరుప్పుకోటాయ్ చీరలుగానే పిలుస్తారు. ఆమె నేసిన చీరలను ఫొటో తీసి తానే స్వsయంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తుంది. ఉత్పత్తిదారులకు– వినియోగదారులకు మధ్య మరో వ్యక్తి అవసరం లేదని, సాంకేతికతను ఒంటపట్టించుకోవడానికి పెద్ద చదువులు అక్కరలేదని నిరూపిస్తోంది. సాధికారత సాధించాం!‘‘ఒక్కో ప్రాంతంలోని మహిళల్లో ఒక్కో కళ ఉంటుంది. మా దగ్గర మహిళలు చేనేతతోపాటు తాటి, కొబ్బరి ఆకులతో బుట్టలు అల్లుతారు. కర్ణాటక, రాయచూర్ వాళ్లు అందమైన దండలు, ఊలు, క్రోషియో వైర్‌తో ఇంటి అలంకరణ వస్తువులు అల్లుతారు. గుజరాత్, దహోద్ వాళ్లు ముత్యాల ఆభరణాలతోపాటు వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేయడంలో నిష్ణాతులు.వాళ్లందరికీ డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ, ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్‌తోపాటు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తే అద్భుతాలు చేయగలరని నమ్మాను. అది నిజమైంది కూడా. ఇప్పుడు మొత్తం తొమ్మిది వందల మందిమి నాస్కామ్ నిర్వహించిన పదిరోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సొంతంగా అన్ని పనులూ చక్కబెట్టుకోగలుగుతున్నాం. మహిళా సాధికారత సాధనకు మా చేతిలో ఉన్న పని, సాంకేతిక పరిజ్ఞానం తోడైంది’’ అన్నది ముత్తులక్ష్మి. -
ఈ భూగర్భ వాణిజ్య కేంద్రం గురించి మీరెప్పుడైనా విన్నారా!?
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ వాణిజ్యకేంద్రం. అమెరికాలోని కాన్సస్ నగరంలో మిస్సోరీ నదీ తీరానికి ఉత్తర ప్రాంతంలో ఉంది. నేలకు 150 అడుగుల లోతున 5.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భూగర్భ వాణిజ్య సముదాయంలో నిరంతరం వెయ్యిమందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు.ఈ ప్రాంతంలో 27 కోట్ల ఏళ్ల నాటి సున్నపురాతి నిల్వలు బయటపడటంతో, ఇక్కడి సున్నపురాతినంతా తవ్వి తీసి, సొరంగ మార్గాలను ఏర్పాటు చేసి ఈ భూగర్భ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు.హంట్ మిడ్వెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మించిన ఈ వాణిజ్య సముదాయంలో ఎన్నో సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థలు, ఆహార ఉత్పత్తుల సంస్థలతో పాటు కార్ల తయారీ సంస్థ ‘ఫోర్డ్’ కూడా ఇక్కడి నుంచి కొన్ని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థలతో పాటు అమెరికన్ ప్రభుత్వం కూడా ఇక్కడ కొన్ని కార్యాలయాలను నిర్వహిస్తోంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యాలయాల్లో ఒక పోస్టాఫీసు, ఆర్కైవ్స్ కార్యాలయం, రికార్డు స్టోరేజీ కార్యాలయం ఉన్నాయి. పేరుకు ఇది వాణిజ్య సముదాయమే అయినా, విస్తీర్ణం దృష్ట్యా, వసతుల దృష్ట్యా ఇది నగరాన్ని తలపిస్తుంది. ఇందులో సరుకుల రవాణాకు వీలుగా 3.4 కిలోమీటర్ల రైలుమార్గం, సరుకులతో పాటు మనుషుల రవాణాకు వీలుగా 17 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండటం విశేషం. బయటి వాతావరణం ఎలా ఉన్నా, ఇందులోని వాతావరణం మాత్రం ఏడాది పొడవునా 19–21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఇవి చదవండి: అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..! -
ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది. ప్రత్యేక సేల్ పేరుతో భారీ తగ్గింపులు ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో అత్యధికంగా ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. అయితే తమకు లోపాలతోకూడిన ఉత్పత్తులు డెలివరీ అవుతున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేయగా అది నకిలీ బ్యాటరీతో వచ్చింది. ఈ మేరకు తనకు వచ్చిన లోపభూయిష్టమైన ఐఫోన్ 15కు సంబంధించిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశాడు. నలికీ బ్యాటరీతో వచ్చిన ఈ ఐఫోన్ 15ను రీప్లేస్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ నిరాకరించిందని వాపోయాడు. “నేను జనవరి 13న ఫ్లిప్‌కార్ట్ నుంచి iPhone 15ని ఆర్డర్ చేశాను. జనవరి 15న డెలివరీ వచ్చింది. కానీ Flipkart మోసం చేసింది. లోపభూయిష్టమైన ఐఫోన్ 15ని పంపించింది. బాక్స్ ప్యాకేజింగ్ కూడా నకిలీదే. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడం లేదు” అని అజయ్ రాజావత్ అనే యూజర్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. దీనిపై యూజర్లు మిశ్రమంగా స్పందించారు. I ordered iPhone 15 from Flipkart on 13th Jan and I got it on 15th Jan but Flipkart has done fraud they have delivered defective iPhone15 and box packaging was also fake. Now they are not replacing OrderID-OD330202240897143100@flipkartsupport @jagograhakjago @stufflistings pic.twitter.com/dfLEh3FSnk — Ajay Rajawat (@1234ajaysmart) January 18, 2024 -
బధిర వినియోగదారులకు కోసం అమెజాన్ పే కొత్త సర్వీస్ - వివరాలు
అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో భాగంగా డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న అమెజాన్ పే, ఇటీవల వినికిడి, మాట లోపం ఉన్న భారతీయ వినియోగదారుల కోసం ఒక వీడియో సంకేత భాషలో కేవైసీ (KYC) సర్వీస్ ప్రారంభించింది. ఇందులో సైన్ లాంగ్వేజ్ల ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది. అమెజాన్ పే ఉద్యోగులు, వినియోగదారుల మధ్య సంకేత భాషలో టూ-వే వీడియో కమ్యూనికేషన్‌ను ప్రారంభించే ప్రయత్నాన్ని కంపెనీ రూపొందించింది. సంకేత భాషపై ఆధారపడే వారి కోసం కేవైసీ ప్రక్రియను సునాయాసంగా చేయడం, డిజిటల్ చెల్లింపులను మరింత సులువగా చేసే లక్ష్యంతో కంపెనీ దీన్ని రూపొందించింది. డిజిటల్ భారత్‌కు అనుకూలంగా అమెజాన్ ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టింది. డిజిటల్‌గా సాధికారత కలిగిన భారతదేశం కోసం విస్తృత దృష్టికి అనుగుణంగా, తన సేవలు అందరినీ కలుపుకొని, అందుబాటులో ఉండేలా నిర్ధారిస్తుంది. ఈ సర్వీస్ గురించి ఇన్ పేమెంట్స్, పేమెంట్స్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్.. డైరెక్టర్ 'వికాస్ బన్సాల్' మాట్లాడుతూ, సైన్ లాంగ్వేజ్ వీడియో కేవైసీ సర్వీస్ అబ్సెషన్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌పై అమెజాన్ పే దృష్టికి ఇది సహజమైన పొడిగింపు. మేము మా అవరోధ రహిత సేవ పరిధిలో అమలు చేసిన ఈ సేవతో, వీడియో కేవైసీ ద్వారా సులభంగా, సురక్షితంగా ప్రయోజనం పొందేందుకు వైకల్యాలున్న మా వినియోగదారులకు సేవలు అందుందుకునే చేస్తున్నాము. ఈ సేవ వారి రోజువారీ చెల్లింపు అవసరాల కోసం డిజిటల్ వాలెట్ మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది. మా ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయని, మా సేవలు, అనుభవాలు, కార్యాచరణ ప్రతి ఒక్కరికీ వారి సామర్థ్యంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉండేలా చూడాలని మేము కోరుకుంటున్నామని వివరించారు. భారతదేశంలోని వినియోగదారులకు వీడియో ఆధారిత కైవైసీ సేవలను అందించడానికి 120 మంది ఉద్యోగులకు అమెజాన్ పే భారతీయ సంకేత భాషపై శిక్షణ ఇచ్చింది. ఇంటరాక్టివ్ ట్రైనింగ్ మాడ్యూల్, వినికిడి, మాట్లాడలేని సమస్య ఉన్న వినియోగదారులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం ఈ ఉద్యోగులకు ఉంది. దివ్యాంగులైన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలకు అనుగుణంగా, దివ్యాంగులైన వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ ప్రత్యేక అవసరాల గురించి తెలుసుకునేందుకు అమెజాన్ భారతదేశంలోని వినియోగదారులకు ‘లిజన్-ఇన్స్ ఫర్ యాక్ససబిలిటీ’ పేరిట ప్రయోజనాన్ని చేకూర్చే పలు కార్యక్రమాలను ప్రారంభించగా, ఇందులో కస్టమర్ సర్వీస్ టీమ్‌లు అపరిచితులు చేసిన కాల్ రికార్డింగ్‌లను వింటాయి. అంతే కాకుండా అమెజాన్ డిజిటల్, డివైస్ అండ్ అలెక్సా సపోర్ట్ (D2AS) సంస్థ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మరియు జర్మనీలతో సహా ఎనిమిది మార్కెట్ ప్లేస్‌లలో వినియోగదారునికి మద్దతును అందించే యాక్ససబిలిటీ సపోర్ట్ బృందాలను అందుబాటులో ఉంచింది. ఈ యాక్సెసిబిలిటీ అసోసియేట్లలో అధిక మొత్తంలో భారతదేశం వెలుపల ఉన్నారు. అమెజాన్ తమ పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేసేందుకు ఉద్యోగులందరికీ సమాన అవకాశాలను అందించే సమగ్ర సంస్కృతిని పెంపొందించడానికి కట్టుబడి ఉంది. మహిళలు, LGBTQIA+ కమ్యూనిటీ, సైనిక అనుభవజ్ఞులు, విభిన్న సామర్థ్యం ఉన్న వారితో సహా వివిధ వర్గాలకు చెందిన వారందరికీ అవకాశాలను కల్పించేందుకు లింగ వైవిధ్యానికి మించి దృష్టి విస్తరించింది. అమెజాన్ విభిన్నమైన వర్క్‌ఫోర్స్ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. విభిన్న కస్టమర్ బేస్‌ను అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతూ, విభిన్న దృక్కోణాల ద్వారా నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. డీఈ & ఐ పట్ల కంపెనీ దాని నిబద్ధత దాని విధానాలు, ప్రోగ్రామ్‌లు మరియు కార్యాలయంలో వైవిధ్యం, ఈక్విటీ, చేరికను ప్రోత్సహించే లక్ష్యంతో చేసిన కార్యక్రమాలలో ఇది ప్రతిబింబిస్తుంది. -
ఈ–కామర్స్‌లో డార్క్ ప్యాటర్న్స్‌పై నిషేధం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కస్టమర్లను మోసపుచ్చేందుకు లేదా వారిని తప్పుదోవ పట్టించేందుకు ఈ–కామర్స్ సంస్థలు ఉపయోగించే ’డార్క్ ప్యాటర్న్స్’పై నిషేధం విధిస్తూ సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని ఉపయోగించడమనేది అనుచిత వ్యాపార విధానాలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలను ఇవ్వడం, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడం కిందికే వస్తుందని పేర్కొంది. ఇందుకు సంబంధిం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద జరిమానాలు ఉంటాయని తెలిపింది. యూజరు ఇంటర్ఫేస్ను లేదా మోసపూరిత డిజైన్ విధానాలను ఉపయోగించి వినియోగదారులను తప్పుదోవ పట్టించడం, కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడాన్ని డార్క్ ప్యాటర్న్స్‌గా వ్యవహరిస్తారు. బాస్కెట్ స్నీకింగ్, ఫోర్స్డ్ యాక్షన్లాంటివి ఈ కోవలోకి వస్తాయి. చెకవుట్ చేసేటప్పుడు యూజరు ఎంచుకున్న వాటితో పాటు వారికి తెలియకుండా ఇతరత్రా ఉత్పత్తులు, సర్వీసులు, విరాళాల్లాంటివి అదనంగా చేర్చడం ద్వారా కట్టాల్సిన బిల్లును పెంచేయడాన్ని బాస్కెట్ స్నీకింగ్ అంటారు. అలాగే ఒకటి కొనుక్కోవాలంటే దానికి సంబంధం లేని మరొకదాన్ని కూడా కొనాల్సిందేనంటూ బలవంతంగా అంటగట్టే వ్యవహారాన్ని ’ఫోర్డ్స్ యాక్షన్’గా వ్యవహరిస్తారు. సీసీపీఏ తన నోటిఫికేషన్లో ఇలాంటి 13 డార్క్ ప్యాటర్న్స్‌ను ప్రస్తావింంది. నోటిఫై చేసిన మార్గదర్శకాలతో అనుత వ్యాపార విధానాలపై అన్ని వర్గాలకు స్పష్టత వచ్చినట్లయిందని వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. -
భవిష్యత్‌నే మార్చేసిన స్టార్టప్ బిజినెస్.. విదేశాల్లోనూ పాపులర్
‘భవిష్యత్ అనేది రకరకాల వస్తువులతో కూడిన బాక్స్లాంటిది. మనం తీసినప్పుడు ఏ వస్తువు చేతికందుతుందో తెలియదు. కొన్నిసార్లు నిరాశపరిచే వస్తువు, కొన్నిసార్లు అత్యంత విలువైన వస్తువు చేతికి అందవచ్చు’... ఈ సినిమా డైలాగ్‌ను ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్లు విన్నారో లేదో తెలియదుగానీ ‘అన్‌బాక్స్’ రూపంలో వారికి బాక్స్ నుంచి విలువైన కానుక లభించింది. తమ భవిష్యత్‌నే మార్చేసిన స్టార్టప్ కానుక అది. లాజిస్టిక్ ఆటోమేషన్ స్టార్టప్ ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రమోద్, షాహీద్‌లు... ‘మన దేశంలో ఇ–కామర్స్ వేగం పెరిగింది’ అనే వార్త చదివి ‘ఓహో అలాగా!’ అనుకోవచ్చు. అద్భుతమైన ‘ఐడియా’ కూడా రావచ్చు. ఆ ఐడియా జీవితాన్నే మార్చేయవచ్చు. ప్రమోద్ గాడ్గే, షాహీద్ మెమన్‌ల విషయంలో జరిగింది ఇదే. మన దేశంలో ఇ–కామర్స్ స్పీడ్‌ను గమనించిన వీరు సప్లై చైన్ రోబోటిక్స్ స్టార్టప్ ‘అన్‌బాక్స్ రొబోటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇండియా దాటి యూఎస్, యూరప్ మార్కెట్లోకి కూడా అడుగు పెట్టనున్నారు.పుణే కేంద్రంగా మొదలైన ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ సప్లై చైన్ ఆటోమేషన్ సోల్యూషన్స్లో మార్పు తీసుకువచ్చింది. వినూత్న ఏఐ–ఆధారిత కంట్రోల్ సిస్టమ్ ద్వారా రోబోట్ల ఉత్పాదకతను పెంచింది. పనితీరును మార్చింది. ‘మావన శక్తి నుంచి రోబోట్స్ వరకు ప్యాకేజీలను క్రమబద్ధీకరించడం, రవాణా చేయడం... మొదలైన విధానాలు మన దేశంలో ఇ–కామర్స్ వేగాన్ని అందుకోలేకపోతున్నాయేమో అనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొబైల్ రోబోటిక్స్ సిస్టమ్‌ను నిర్మించాలనుకున్నాం. లాజిస్టిక్స్, రిటైల్ ప్లేయర్ల కోసం ప్యాకేజీ సార్టింగ్, ఆర్డర్ కన్సాలిడేషన్ ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి శక్తిమంతమైన రోబోటిక్స్ వ్యవస్థను నిర్మించాలనుకున్నాం’ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ సీయివో ప్రమోద్ గాడ్గే. ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’కు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో సార్టింగ్కు సంబంధించి ఆటోమేషన్ విభాగంలో, మన దేశంలోని తొలి రోబోట్–బేస్డ్ సార్టింగ్ ప్రాజెక్ట్‌లో పనిచేశాడు ప్రమోద్. ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ కో–ఫౌండర్, సీటీవో షాహీద్ రోబోటిక్స్. ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, స్వోర్మ్ ఇంటెలిజెన్స్‌లో మంచి అనుభవం ఉంది. రోబోటిక్స్, ఆటోమేషన్ ఫీల్డ్స్‌లో సీటీవోగా పనిచేశాడు. ‘అన్‌బాక్స్’కు ముందు ‘వనోర రోబోట్స్’ అనే స్టార్టప్ ప్రారంభించాడు. చిత్తశుద్ధి, కష్టపడే తత్వం, అంకితభావం లేకపోతే పేపర్ మీద రాసుకున్న కాన్సెప్ట్ అక్కడే నిలిచిపోతుంది. అయితే ఈ ఇద్దరు మిత్రులు వారి బృందం బాగా కష్టపడి ‘అన్‌బాక్స్’ను సూపర్ హిట్ చేశారు. స్టార్టప్ కాన్సెప్ట్‌లో సత్తా ఉంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేయరు. ‘అన్‌బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది. టీమ్‌ను విస్తరించడానికి, అంతర్జాతీయ స్థాయిలో కస్టమర్ల డిమాండ్‌ను నెరవేర్చడానికి, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై సమీకరించిన నిధులను వాడారు. 2021లో థర్డ్–పార్టీ లాజిస్టిక్స్, ఇ–కామర్స్ ప్లేయర్స్‌తో కంపెనీ బీటా పైలట్స్ లాంచ్ చేసినప్పుడే లీడింగ్ ఇ- కామర్స్ లాజిస్టిక్స్ కంపెనీల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది. ఇది భవిష్యత్ విజయానికి సూచికలా పనిచేసింది. ఇన్వెస్టర్ట్లలో మరింత నమ్మకాన్ని నింపింది. ‘అన్‌బాక్స్’ స్టార్టప్ ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్‌లాంటి సెక్టార్లలో ఏడు పెద్ద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. క్లయింట్ సబ్స్క్రిప్షన్ మోడల్ ‘రోబోట్ యాజ్ ఏ సర్వీస్’ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఇ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాలకు సంబంధించి రోబోటిక్–బేస్డ్ పుల్‌ఫిల్‌మెంట్, డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీలో ప్రత్యేకత సాధించిన ‘అన్‌బాక్స్ రోబోటిక్స్’ అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతుంది. స్టార్టప్ కాన్సెప్ట్‌లో సత్తా ఉంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేయరు. ‘అన్‌బాక్స్’ విషయంలోనూ అదే జరిగింది. -
ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్ కొత్త బిజినెస్.. సీఈవో కోసం అన్వేషణ!
Flipkart Co-Founder Binny Bansal Plans New Start-Up: ఈ-కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా దూసుకెళ్తోంది ఫ్లిప్‌కార్ట్. దాన్ని స్థాపించి విజయవంతంగా తీర్చిదిద్దిన బిన్నీ బన్సాల్ తాజాగా మరో ఈ-కామర్స్ బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లో తన మిగిలిన వాటాను కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ పూర్తిగా వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో బిన్నీ బన్సాల్ ఈ-కామర్స్ మార్కెట్లో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. భారతీయ, అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థలకు డిజైన్, మర్చండైజ్, లేబర్ వంటి సహాయపడే వ్యాపారాన్ని స్థాపించాలని బన్సాల్ చూస్తున్నారు. ఇది స్టార్టప్ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (KPO) కంపెనీగా పని చేస్తుంది. వాణిజ్య సంస్థలకు బ్యాకెండ్ కార్యకలాపాలతో సహాయం చేస్తుంది. సీఈవో కోసం అన్వేషణ సమాచార వర్గాల ప్రకారం, బిన్నీ బన్సాల్ తన కొత్త వ్యాపారంలో కేవలం తన సొంత డబ్బును మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. అయితే కంపెనీ రోజువారీ కార్యకలాపాలలో ఆయన నేరుగా పాల్గొనరు. వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి సీఈవో కోసం అన్వేషిస్తున్నారు. వాల్‌మార్ట్ 2018లో 16 బిలియన్ డాలర్లకు ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఫ్టిప్కార్ట్కు బిన్నీ బన్సాల్ దూరమయ్యారు. విక్రయ ఒప్పందంలో భాగమైన ఐదేళ్ల నాన్-కాంపిటేట్ నిబంధన గడువు ఈ సంవత్సరం ముగిసింది. ఫ్లిప్‌కార్ట్‌ను వీడిన తర్వాత బిన్నీ బన్సాల్ ఏంజెల్ ఇన్వెస్టర్‌గా చురుగ్గా ఉంటూ బహుళ వ్యాపారాలకు మద్దతు ఇస్తున్నారు. బన్సాల్ కొత్త వ్యాపారం స్వీయ-నిధులతో ఉంటుందని, బయటి నుంచి నిధులను స్వీకరించదని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్న ఈ-కామర్స్ సంస్థలకు కీలకమైన సహాయాన్ని అందించే గ్లోబల్ కంపెనీగా తన కొత్త సంస్థను బిన్నీ బన్సాల్ తీర్చిదిద్దనున్నారు. -
Narayanamma Niraganti: డాక్టరేట్ కలను ‘సెల్ఫ్ హెల్ప్’ నెరవేర్చింది
కుగ్రామం నుంచి ఈ కామర్స్ దాకా నారాయణమ్మ విజయగాధ నారాయణమ్మ నీరగంటి... ఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లాలోని ముష్టి కోవెల అనే చిన్న గ్రామంలో అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మహిళ. చదువంతా ప్రభుత్వ విద్యావ్యవస్థలోనే. ఆమె ఈ రోజు ఒక ‘ఈ కామర్స్’ సంస్థను స్థాపించి తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి పీహెచ్‌డీలో చేరారు. త్వరలో పట్టానందుకోనున్న నారాయణమ్మ తన ఆకాంక్షల సుమహారాన్ని సాక్షితో పంచుకున్నారు. డ్వాక్రా దారి చూపింది ‘‘మా నాన్న రైతు. పిల్లల్ని బాగా చదివించాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. ఐదవ తరగతి వరకు మా ఊరి బడిలో చదివాను. ఆరు, ఏడు తరగతులకు ఉదయం ఐదు కిలోమీటర్లు, సాయంత్రం ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అనంతపురంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని నన్ను, మా అన్నను చదివించారాయన. అలా ఎనిమిదవ తరగతి నుంచి నేను ఇంటిపని, వంట పని చేసుకుంటూ చదువుకున్నాను. అనంతపూర్‌లో డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంబీఏకి ఆళ్లగడ్డ వెళ్లాను. ఆ తర్వాత పెళ్లితో హైదరాబాద్ రావడం నా ఉస్మానియా కల నెరవేరడానికి మార్గం సుగమం చేసింది. అధ్యయనానికి విద్యాసంవత్సరంలో ‘సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ చాలెంజెస్’ అంశాన్ని తీసుకున్నాను. 2010–11 నుంచి రంగారెడ్డి, సత్యసాయి జిల్లాల్లో డ్వాక్రా సంఘాలను అధ్యయనం చేశాను. మొత్తం ఐదు వందల గ్రూపుల కార్యకలాపాలను తెలుసుకున్న తర్వాత గ్రామీణ మహిళల్లో ఉన్న నైపుణ్యాలు, అవకాశాల మీద ఒక అవగాహన వచ్చింది. ఆర్థిక స్వావలంబనను, స్వయంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ఆస్వాదిస్తున్నారు. దాంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా మెరుగైంది. అవకాశాలు అందివస్తే ఇంకా ఏదో సాధించాలనే తపన కూడా కొందరిలో ఉంది. అలాంటి అభిరుచి ఉన్న వాళ్లకు వనరులు, ప్రభుత్వ అధికారుల సహకారం ఉంటే అద్భుతాలు చేయగలుగుతారు కూడా. ఇలాంటి సమన్వయం కొన్ని చోట్ల లేకపోవడం కూడా గమనించాను. మొత్తానికి మార్కెటింగ్ గురించిన ఆందోళన లేకపోతే ఉత్పత్తి విషయంలో శ్రమించడానికి వాళ్లు వెనుకాడరు. నా అధ్యయనం ఇలా సాగుతున్న సమయంలోనే కరోనా వచ్చింది. కరోనా కొల్లగొట్టింది కరోనా సమయంలో హోటళ్లతో సహా అన్నీ మూత పడడంతో ఉద్యోగాలు లేక ఏదో ఒక పని దొరికితే చాలన్నట్లు చాలా మంది కనిపించారు. శ్రమించే చేతులున్నాయి, ఆ ఉత్పత్తి అవసరమైన వ్యక్తులున్నారు. వాళ్ల మధ్య కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అప్పుడు ఈ కామర్స్ రంగంలో ఓ ప్రయత్నం చేశాను. కర్పూరం తయారీ దారుల నుంచి కర్పూరాన్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇంటింటికీ చేర్చడంలో విజయవంతమయ్యాను. మీషోలో సరదాగా మొదలు పెట్టిన రీ సేల్ అనుభవమూ తోడైంది. నా మార్కెట్‌ను విస్తరించడానికి శాన్విస్ స్టోర్, భవిత శ్రీ ట్రేడింగ్, ఫ్యాషన్, లేజీ షాపింగ్ వాణిజ్య వేదికలతో సెల్లర్‌గా అమెజాన్‌తో అనుసంధానమయ్యాను. ఆ అనుభవంతో గత ఏడాది నవంబర్‌లో మీథాట్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంత కంపెనీ ప్రారంభించాను. ఏడాది కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుతుందని అంచనా. ఏడాదికి నికర లాభం ఏడెనిమిది లక్షలుండవచ్చు. గ్రామాలకు విస్తరించాలి ఇప్పటి వరకు నా నెట్వర్క్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అనంతపూర్, చిత్తూరు, గుంటూరు వంటి కొన్ని చోట్లలోనే ఉంది. ఇక గ్రామాల్లో ఉండే డ్వాక్రా మహిళలను అనుసంధానం చేయాలి. ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాజెక్ట్ గ్రామాల్లో పెట్టాలనేది నా ఆలోచన. ఒక కుటుంబానికి అవసరమైన ప్రతి వస్తువూ నా ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీద లభించేటట్లు పటిష్ఠం చేయాలి. అలాగే విదేశాలకు సీమంతం కిట్, ఒడిబియ్యం కిట్, గర్భిణి తినాల్సిన పిండివంటలను ఎగుమతి చేయాలి. ఈ సర్వీస్ ఈ కామర్స్‌లో లేదు. ఈ కామర్స్ వేదిక లైసెన్స్, ట్రేడ్‌మార్క్, కాపీ రైట్స్, పేటెంట్లు, ఫుడ్ లైసెన్స్, వెబ్సైట్ నిర్మాణం, ప్రమోషన్ కోసం మూడు లక్షల వరకు ఖర్చు చేశాను. ఇవన్నీ ఇందులోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నా ఈ ప్రయత్నంలో గృహిణులు, ఒంటరి మహిళలు, అరవై నిండిన పెద్దవాళ్లు కూడా ఉపాధి పొందుతున్నారు. ఉపాధినిస్తోంది మూడేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత పీహెచ్డీ కోసం ఉద్యోగం మానుకున్నాను. ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరతానని అప్పుడనుకోలేదు. లెక్చరర్‌గా భర్త సంపాదనకు తోడు నేనూ ఉద్యోగం చేసుకుంటూ , ఇద్దరమ్మాయిలను పెంచుకుంటూ ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ నేను చేసిన ఎంబీయే ఫైనాన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మీద పీహెచ్డీ నన్ను చిన్న పరిధిలో ఉంచడానికి ఇష్టపడలేదు. ఈ సాహసానికి ఒడిగట్టేలా ప్రోత్సహించాయి. మా గైడ్ శ్రీరాములు గారి పర్యవేక్షణలో నా పరిశోధన పూర్తయింది. డాక్టర్ నారాయణమ్మ అనే పేరు నా చిన్నప్పటి కల’’ అన్నారు నారాయణమ్మ. కల నెరవేరు తున్న ఆనందం ఆమె కళ్లలో కనిపించింది, ఆ మాట చెప్తున్నప్పుడు ఆ స్వరంలో ఆనందం తొణికిసలాడింది. ఎక్కడి ఆర్డర్‌కి అక్కడే పరిష్కారం ఆహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టాను. నగరాల్లో మహిళలందరూ ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటున్నారు. పిల్లలకు మన రుచులను ఇంట్లో చేసి పెట్టడం వాళ్లకు కష్టమే. అందుకే సౌత్ ఇండియన్ స్నాక్స్ హోమ్మేడ్వి అందిస్తున్నాను. నా నెట్‌వర్క్‌లో 30కి పైగా మహిళలున్నారు. ఒక ప్రదేశం నుంచి ఆర్డర్ రాగానే అదే ప్రదేశంలో ఉన్న మహిళకు ఫార్వర్డ్ చేస్తాను. మెటీరియల్ కొనుగోలు, ఆమె శ్రమకు వేతనం ఇస్తాను. ఆమె పిండివంటలు తయారు చేసి ప్యాక్ చేసి ఉంచుతుంది. మా కొరియర్ నెట్వర్క్ వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి పార్సిల్‌ను కలెక్ట్ చేసుకుని కొరియర్ ఆర్డర్ ఇచ్చిన వినియోగదారులకు చేరుస్తారు. దాంతో పిండివంటలు తయారు చేసిన రోజే అందుతుండడంతో బాగా క్లిక్ అయింది. – వాకా మంజులారెడ్డి -
అమెజాన్: భారత్‌లో ఊడిన ఉద్యోగాల సంఖ్య ఇది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సిబ్బందిని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీకి భారత్‌లో 1 లక్ష మంది ఉద్యోగులు ఉండగా సుమారు 1 శాతం సిబ్బందిపై ఉద్వాసనల ప్రభావం పడవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 18,000 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో భారత్‌లో 1,000 మంది సిబ్బందిపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా తమ అమెజాన్ స్టోర్స్, పీఎక్స్‌టీ (పీపుల్, ఎక్స్పీరియన్స్, టెక్నాలజీ) విభాగాల్లో ఎక్కువగా కోతలు ఉండనున్నాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2021 డిసెంబర్ 31 నాటికి అమెజాన్‌లో 16,08,000 మంది ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. -
కస్టమర్ కంప్లైంట్.. ఫ్లిప్‌కార్ట్‌కు షాకిచ్చిన వినియోగదారుల ఫోరం!
ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌కు వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. ఓ యూజర్ డబ్బులు చెల్లించినా మొబైల్ డెలివరీ చేయనందుకు రూ. 42,000 జరిమానా చెల్లించాలని బెంగళూరు అర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఫ్లిప్‌కార్ట్‌కు జరిమానా విధించింది. అందులో కస్టమర్ పేమెంట్ చేసిన రూ. 12,499 లకు 12 శాతం వార్షిక వడ్డీ, రూ. 20,000 జరిమానా, చట్టపరమైన ఖర్చుల కోసం రూ. 10,000 చెల్లించాలని అధికార యంత్రాంగం తెలిపింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని రాజాజీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యూజర్ ఫ్లిప్‌కార్ట్‌పై ఫిర్యాదు చేశారు. ‘తాను జనవరి 15, 2022న మొబైల్‌ని బుక్ చేసుకున్నాను. వెబ్సైట్లో పేర్కొన్న విధంగా పూర్తి నగదుని చెల్లించి రోజులు గడుస్తున్నా కంపెనీ తనకు మొబైల్ డెలివరీ చేయలేదు. సర్వీసు విషయంలో ఫ్లిప్‌కార్ట్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఫిర్యాదులో ’పేర్కొంది. కస్టమర్ కేర్ సెంటర్‌కు ఎన్ని సార్లు కాల్ చేసినా ఫలితం లేకపోయేసరికి చివరికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపింది. చదవండి: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్బీ! -
న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. కేవలం 2 రోజులే!
కొత్త కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో అప్డేట్ అవుతూ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో ఫోన్ లవర్స్ తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే కొందరు మంచి ఆఫర్ల కోసం వేచి చూస్తుంటారు. మీరు కనుక ఆ జాబితాలో ఉంటే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫాంలో ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. దీనిలో పలు ప్రాడెక్ట్స్పై భారీగా తగ్గింపులను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా ఇందులో వినియోగదారులకు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం అందులో స్మార్ట్ఫోన్ల విషయానికొస్తే Google Pixel 6a పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం! ఆఫర్ ఎంతంటే Google ఈ ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 29,999 ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ దీనిని రూ.43,999కి గ్రాండ్‌గా మార్కెట్లో ప్రారంభ ధరగా లాంచ్ చేసింది. దీని బట్టి చూస్తే ప్రస్తుతం రూ.14,000 డిస్కౌంట్‌తో గూగుల్ పిక్సెల్ 6ఏ లిస్ట్ అయింది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, మీరు రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ఫోన్ చాక్, చార్కోల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అన్ని డిస్కౌంట్ల తర్వాత, మీరు ఈ ఫోన్‌ను సగం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే బంపర్ ఆఫర్‌ని ఫ్లిప్‌కార్ట్ న్యూ ఇయర్ సందర్భంగా మీకు అందిస్తోంది. ఫీచర్లు ఇవే గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.14 ఇంచెస్‌తో పూర్తి HD + డిస్ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. హ్యాండ్సెట్ గూగుల్ టెన్సర్ చిప్‌సెట్‌లో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. దీనికి 5G వరకు సపోర్ట్ కూడా ఉంది. పరికరం 4410mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు వంటి లక్షణాలను కలిగి ఉంది. -
ఆన్లైన్ షాపింగ్ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు!
ఆదివారాలంటే విశ్రాంతి తీసుకోవడానికే అని భావించవచ్చు కానీ, అది ఒకప్పుడు భారతీయులు మాత్రం ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఆదివారమే అత్యంత అనువైన రోజుగా భావిస్తున్నారు. ఆ రోజున బిజీ బిజీగా కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఈ–కామర్స్ సంస్థ మీషో... తన డేటా ఆధారంగా జరిపిన ఇ షాపింగ్ 2002 అధ్యయనం ఇలాంటి పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. వీటిలో... ► ఈ ఏడాది ఈ కామర్స్ షాపర్స్.. ఆదివారం ఎక్కువగా కొనుగోళ్లు జరిపారు. అంతకు ముందు సంవత్సరం అత్యధిక కొనుగోళ్లు జరిపింది బుధవారం, అలాగే ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు షాపింగ్ ప్రైమ్‌టైమ్‌గా కొనసాగింది. గత 2021లో మధ్యాహ్నం 2–3 గంటలలో అధికంగా ఈ– ట్రాఫిక్ కనిపించేది. ►2022లో ఎక్కువ మంది వెదికిన రెండవ ఉత్పత్తిగా స్మార్ట్ వాచ్ నిలిచింది. ఇది శారీరక ఆరోగ్యంపై, వ్యాయామాల పట్ల పెరిగిన ఆసక్తికి అద్దం పడుతోంది. ► గ్రూమింగ్ ఉత్పత్తులపై పురుషులు అమితాసక్తి చూపుతున్నారు. తృతీయశ్రేణి, నాల్గవ శ్రేణి నగరాల మార్కెట్ల నుంచి 60% కు పైగా ఆర్డర్లు లభించాయి. ► ద్వితీయశ్రేణి నగరాల నుంచీ శానిటరీ న్యాప్కిన్స్కు ఆర్డర్లు 9 రెట్లు పెరిగాయి. ఇది మహిళలకు ఈ–కామర్స్ ఏ విధంగా చేరువవుతుందో తెలియజేస్తుంది. ► దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిమిషానికి 148 చీరలు కొనుగోలు చేశారు. అలాగే రోజుకు 93వేల టీషర్టులు, 51, 275 బ్లూ టూత్ ఇయర్ఫోన్లు, 21,662 లిప్స్టిక్స్ విక్రయం జరిగింది. ► వినియోగదారులు స్థానిక ల్యాండ్‌మార్క్‌లు అయిన పిపాల్ క పేడ్, బర్గాద్ కా పేడ్, అట్టా చక్కీ కీ పీచే నియర్ వాటర్ ట్యాంక్ వంటివి వినియోగించడం ద్వారా డెలివరీ పర్సనల్‌కు సహాయపడ్డారు. దేశీ నేవిగేషన్ టూల్ కచ్చితత్త్వం ముందు డిజిటల్ మ్యాప్స్ పోటీపడలేవని ఇది వెల్లడిస్తుంది. ► ఈ సంవత్సరం అమ్మకాల పరంగా ఆంధ్రప్రదేశ్ వినియోగదారులు కొనుగోలు చేయడానికి అమిత ఆసక్తిని కనబరిచిన ఉత్పత్తులలో స్మార్ట్ వాచ్‌లు, వైర్లెస్ హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్, బాడీ లోషన్స్ కుర్తీలు ఉన్నాయి. ఈ షాపింగ్.. పదనిసలు... ► గతంలో ఎన్నడూ లేనంతగా పురుషులు గ్రూమింగ్ మీద ఖర్చు చేశారు. ► జిమ్ ఎక్విప్ మెంట్‌కి సంబంధించిన ఆర్డర్స్ దాదాపుగా 3 రెట్లకు పైనే పెరిగిపోయాయి. ► అత్యధిక సంఖ్యలో యోగామ్యాట్స్ కొన్న నగరాల్లో బెంగుళూర్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లు ఉన్నాయి. ► ప్రతీ 10 పుస్తకాల్లో 8 పుస్తకాలకు ఆర్డర్స్ ద్వితీయశ్రేణి నగరాలు, మార్కెట్ల నుంచే వచ్చాయి. చదవండి: MNCs Quitting India: భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే! -
ఆన్లైన్లో హీరో సైకిల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైకిల్స్ తయారీలో ఉన్న హీరో సైకిల్స్ ఈ–కామర్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. కస్టమర్లు నేరుగా ఈ వెబ్సైట్ ద్వారా తమకు నచ్చిన సైకిల్ కోసం ఆర్డర్ చేయవచ్చు. తద్వారా ఉచితంగా ఇంటి వద్దనే ఉత్పత్తులను అందుకోవచ్చు. దేశవ్యాప్తంగా 3,000 పైచిలుకు డీలర్ల వ్యాపారం పెరుగుదలకు ఈ వేదిక దోహదం చేయనుందని కంపెనీ చెబుతోంది. ‘సైకిళ్లు, ఈ–సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నాం. ఈ దిశగా వెబ్సైట్ సేవలు అందిస్తుంది’ అని హీరో సైకిల్స్ డైరెక్టర్ ఆదిత్య ముంజాల్ తెలిపారు. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
నైకా సీఎఫ్‌వో అరవింద్ రాజీనామా
న్యూఢిల్లీ: నైకా బ్రాండ్ కింద కార్యకలాపాలు సాగిస్తున్న ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అరవింద్ అగర్వాల్ రాజీనామా చేశారు. డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ విభాగంలో అవకాశాలపై దృష్టి పెట్టేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త సీఎఫ్‌వో నియామకం ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. 2020 జూలైలో అగర్వాల్ అమెజాన్ నుండి నైకాలో చేరారు. కంపెనీ ఐపీవోను పర్యవేక్షించిన కీలక సిబ్బందిలో (కేఎంపీ) ఆయన కూడా ఒకరు. -
భారత్‌లో గ్యాలెరీ లాఫయేట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపార్ట్మెంట్ స్టోర్స్ కంపెనీ, ఫ్రాన్స్‌కు చెందిన గ్యాలెరీ లాఫయేట్ భారత్‌లో అడుగుపెడుతోంది. లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్లతోపాటు ఈ–కామర్స్ వేదిక ద్వారా దేశీయంగా ఉత్పత్తులను విక్రయించనుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఈ మేరకు గ్యాలెరీ లఫయట్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తొలి ఔట్లెట్ 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముంబైలో 2024లో, రెండవ స్టోర్ 65,000 చదరపు అడుగుల్లో ఢిల్లీలో 2025లో ప్రారంభం కానుంది. 200లకుపైగా బ్రాండ్స్‌కు చెందిన ఖరీదైన ఫ్యాషన్, యాక్సెసరీస్, ఫుడ్, అలంకరణ, కళాఖండాలను ఇక్కడ విక్రయిస్తారు. భవిష్యత్‌లో లగ్జరీ బ్రాండ్ల వృద్ధి కేంద్రంగా, ప్రపంచ విలాసవంతమైన మార్కెట్‌గా భారత్‌కు ఉన్న ప్రాముఖ్యతకు ఈ భాగస్వామ్యం నిదర్శనమని ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఎండీ ఆశిష్ దీక్షిత్ తెలిపారు. ‘భారత్ వంటి ప్రతిష్టాత్మక, పరిణతి చెందిన మార్కెట్లో విస్తరించడం గర్వకారణం. ఇక్కడ మా బ్రాండ్ ప్రయోజ నం పొందగలదని బలంగా విశ్వసిస్తున్నాము. 2025 నాటికి విదేశాల్లో 20 స్టోర్లను చేరుకోవాలనే మా ఆశయానికి ఇది నాంది’ అని గ్యాలెరీ లాఫ యేట్ సీఈవో నికోలస్ హౌజ్ వివరించారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన గ్యాలెరీ లాఫయేట్ ఫ్రాన్స్‌తోపాటు పలు దేశాల్లో 65 కేంద్రాలను నిర్వహిస్తోంది. చదవండి: అమలులోకి కొత్త రూల్.. ఆ సమయంలో ఎస్ఎంఎస్ సేవలు బంద్! -
పండుగ ఆఫర్లు.. ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతున్నారా?
పండుగ బోనస్‌లు, సరిగ్గా జీతాలు పడే టైంలో.. ఫెస్టివల్ ఆఫర్లు-ధమాకా సేల్స్‌తో ముందుకొచ్చాయి ఈ-కామర్స్ సంస్థలు. ఇప్పటికే చాలామంది ఆన్లైన్ కొనుగోళ్లతో బిజీగా గడిపేస్తున్నారు. అదే సమయంలో ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించి కొన్ని చేదు అనుభవాలు ఇంటర్నెట్ ద్వారా యూజర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి కూడా. ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో తొందరపాటు అస్సలు పనికి రాదు. కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. లేకుంటే.. మోసపోవడంతో పాటు కాలం వృధాకావడం, అనవసరమైన నష్టపోవడం వాటిల్లుతుంది కూడా. ఆన్లైన్ షాపింగ్‌లో లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా జరుగుతుంటాయి. ఒక్కోసారి అవి యూజర్లకు తెలియకుండానే జరిగిపోతుంటాయ్ కూడా. నమ్మదగిన సైట్ల నుంచే.. రోజుకో కొత్త ఆన్లైన్ షాపింగ్ సైట్ పుట్టుకొస్తోంది. డెడ్ చీపుగా ప్రొడక్టులు అందిస్తామని ప్రచారాలు చేసుకుంటున్నాయవి. అయితే.. అలాంటి వాటి గురించి క్షుణ్ణంగా ఆరా తీశాకే ప్రొడక్టులు కొనుగోలు చేయాలి. రివ్యూలతో సైతం బోల్తా కొట్టిస్తున్న ఈరోజుల్లో.. ప్రొడక్టు నాణ్యత గురించి అవగాహనకు రావడం కొంచెం కష్టమే. అయినా కూడా నష్టపోకూడదంటే నమ్మకం ఉన్న.. ఉత్తమ సర్వీసులు అందిస్తున్న సైట్ల నుంచే వస్తువులను కొనుగోలు చేసుకోవడం ఉత్తమం. ► యాప్‌లలో కాకుండా వెబ్ సైట్ల నుంచి గనుక ఆన్లైన్ షాపింగ్ చేస్తే.. పైన బ్రౌజర్ యూఆర్ఎల్లో సైట్లకు ముందు https లేదంటే http ఉందో లేదో గమనించాలి. అలా ఉంటే.. ఆ సైట్ ఎన్క్రిప్టెడ్ అన్నమాట. అంటే షాపింగ్ చేసుకునేందుకు అనుగుణంగా ఉంటుందని, తద్వారా మీ డివైజ్‌లోని డేటా సురక్షితంగా ఉంటుందని అర్థం. ► పెద్ద పెద్ద ఈ-కామర్స్ యాప్‌లు, వెబ్సైట్లలోనూ ఆర్థిక సంబంధిత విషయాల్లో బోల్తా పడుతుంటారు చాలామంది. అధిక ఛార్జీలు వసూలు చేయడం.. కొన్ని సందర్భాల్లో మాత్రమే క్యాష్ బ్యాక్ కూపన్లు ఉపయోగించే వెసులుబాటు కల్పిస్తుండడంతో.. కూపన్లను వాడుకోవడానికి చాలాకాలం ఎదురు చూడాల్సి వస్తుంది. లేదంటే ఒక్కోసారి అవి ఎక్స్పెయిర్ అయిపోతుంటాయి కూడా. కాబట్టి, క్యాష్ బ్యాక్‌లు ఎంత వరకు లబ్ధి చేకూరుతాయనేది బేరీజు వేసుకున్నాకే ముందుకు వెళ్లాలి. ఒకటి కంటే ఎక్కువ యాప్‌లు/వెబ్సైట్లు పరిశీలించాకే ఉత్పత్తులను కొనుగోలు చేసుకోడం ఇంకా మంచిది. తద్వారా సరైన ఆఫర్లను గుర్తించడంతోపాటు ఎక్స్ట్రా ఛార్జీలు, డెలివరీ ఛార్జీల తలనొప్పి నుంచి తప్పించుకోవచ్చు. ► డెబిట్‌కార్డులు ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే.. బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయ్యి ఉండడం వల్ల ఫైనాన్షియల్ వివరాలను, వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకింగ్ గురయ్యే అవకాశాలు ఉండొచ్చు. అందుకే క్రెడిట్ కార్డులను వీలైనంత వరకు షాపింగ్ కోసం ఉపయోగించాలి. లేదంటే.. మాస్టర్‌కార్డ్ సెక్యూరిటీ కోడ్ లేదంటే వెరిఫైడ్ బై వీసాలను ఉపయోగించడం వల్ల సురక్షితంగా షాపింగ్ చేసుకోవచ్చు. ► షాపింగ్ సీజన్లో రకరకాల యాప్‌లను, వెబ్సైట్లను మోసగాళ్లు టార్గెట్ చేస్తుంటారు. ఈ క్రమంలో భారీగా డిస్కౌంట్లంటూ లింకులను పంపడం ద్వారా యూజర్లను ఆకర్షించి.. డేటా చోరీకి పాల్పడుతుంటారు. అలాంటి సమయంలో తొందరపాటులో వాటిని క్లిక్ చేయకూడదు. సంబంధిత సైట్, యాప్‌లో ఆ ఆఫర్లు నిజంగా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి. ► తాజాగా.. ఓ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ నుంచి ల్యాప్‌ట్యాప్ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తికి బట్టల సబ్బుల పార్శిల్ షాకిచ్చింది. తీరా కంపెనీని బాధిత వ్యక్తి సంప్రదించగా.. తమ పరిధిలో అంశం కాదంటూ సమాధానం ఇచ్చింది. డ్రోన్ కెమెరా ఆర్డర్ పెట్టిన వ్యక్తికి బంగాళ దుంపలు పార్శిల్ వచ్చింది మరో వెబ్సైట్లో. ఇలాంటి సందర్భాల్లో.. ఓపెన్ బాక్స్ డెలివరీ కాన్సెప్ట్ ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. దేశంలో చాలామందికి తెలియని కాన్సెప్ట్ ఇది. కొన్ని ప్రొడక్టుల విషయంలో(ధర అధికంగా ఉన్నవాటి విషయంలో ప్రత్యేకించి జరుగుతుంటుంది) డెలివరీ బాయ్‌కు ఓటీపీ చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు ముందుగా బాక్స్‌ను డెలివరీ బాయ్‌ల సమక్షంలో తెరిచి.. అంతా పరిశీలించుకున్నాకే.. ఓటీపీ చెప్పడం కరెక్ట్. ఒకవేళ తొందరపాటులోనో, అవగాహన లేకనో, ఇతర కారణాల వల్లనో ప్రొడక్టును చూసుకోకుండా ఓటీపీ చెప్పేస్తే గనుక.. ఆ తర్వాత పరిణామాలకు సదరు కంపెనీలకు ఎలాంటి సంబంధం ఉండదు. కావాలంటే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించి.. న్యాయం కోసం పోరాడవచ్చు. ► ఇంతేకాదు.. ఆన్లైన్లో ఎలాంటి ప్రొడక్టును అయినా డెలివరీ బాయ్ నుంచి తీసుకున్నాక.. వీలైతే వాళ్ల సమక్షంలోనే వాటిని తెరిచి చూడడం మంచిది. ఒకవేళ డ్యామేజ్ ఉన్నా, ఇతర సమస్యలున్నా అప్పటికప్పుడే వెనక్కి పంపించాలి. కుదరదని గనుక సమాధానం వస్తే.. పరిహారం దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో.. ఫొటోలు, వీడియోలు తీయడం ద్వారా ఆధారాలను సేకరించి పెట్టుకోవడం అత్యుత్తమమైన పని. అన్నింటికి మించి.. అవసరం లేకున్నా ఆఫర్లలలో వస్తున్నాయి కదా అని ప్రొడక్టులు కొనడం తగ్గించుకుంటే.. డబ్బును, సమయాన్ని ఆదా చేసుకున్న వాళ్లు అవుతారు. -
బ్లాక్ బస్టర్ హిట్: రికార్డు సేల్స్, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు!
బెంగళూరు: పండుగ సీజన్ కావడంతో ఈ కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా సంస్థలు పోటీ పడి మరీ వినియోగదారులకు ఊహించని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో తమ మెగా బ్లాక్‌బస్టర్ సేల్ తొలి రోజున ఏకంగా 87.6 లక్షల ఆర్డర్లు నమోదు చేసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. మీషో స్పందిస్తూ.. ఒకే రోజున ఇంత భారీ స్థాయిలో ఆర్డర్లు రికార్డు చేయడం ఇదే తొలిసారని, గతేడాదితో పోలిస్తే 80 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. మెగా బ్లాస్టర్ సేల్ మూడు రోజులు పూర్తవగా ఇప్పటికీ కస్టమర్లు నిమిషానికి వేలల్లో ఆర్డర్లు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పండుగ సీజన్ ఆర్డర్లతో ఫుల్ బిజీగా ఉన్నట్లు ట్వీట్ చేసింది మీషో. కాగా ఈ సంస్థ ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించడంతో పాటు భారీ స్థాయిలో మెగా బ్లాక్‌బస్టర్ సేల్ గురించి ప్రచారం చేసింది. దీంతో అదే స్థాయిలో కస్టమర్ల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. 85 శాతం పైగా ఆర్డర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచే వచ్చినట్లు సంస్థ సీఎక్స్‌వో ఉత్కృష్ట కుమార్ తెలిపారు. ఫ్యాషన్, బ్యూటీ సాధనాలు, చీరలు మొదలుకుని వాచీలు, జ్యుయలరీ సెట్ల వరకూ 6.5 కోట్ల పైగా లిస్టింగ్స్‌ను అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. Customers are placing several thousand orders per minute during the #MeeshoMegaBlockbuster sale. ⏱️🚀 So our sellers have their hands full. 🙌#ecommerce For more seller stories: https://t.co/qyroCn4uxG pic.twitter.com/t9jbqYIX3b — Meesho (@Meesho_Official) September 26, 2022 చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్!