andhra odisha border
-
ఏవోబీలోకి మావోయిస్టులు?
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నమావోయిస్టులు షెల్టర్ కోసం ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని దండకారణ్యం ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని కేంద్ర పోలీసు బలగాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఏవోబీలోని దండకారణ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కొన్నేళ్లుగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. అయితే, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ దండకారణ్య ప్రాంతం మావోయిస్టు పార్టీకి అడ్డాగా మారింది. ఆ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న బస్తర్ అటవీ ప్రాంతం మావోయిస్టులకు సురక్షితంగా ఉంది. అక్కడి నుంచే మూడేళ్లుగా మావోయిస్టులు తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కేంద్ర పోలీసు బలగాల నిర్బంధంలో ఉంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో పోలీసు పార్టీలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ సుమారు 79మంది కీలక నేతలు, సభ్యులను కోల్పోయింది. కాంకేరు జిల్లాలోని మాడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఏకంగా 29మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మిగిలిన క్యాడర్ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి సరిహద్దులో ఉన్న ఏపీకి చెందిన అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు, ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల అటవీ ప్రాంతానికి వచ్చి తలదాచుకుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. మరోవైపు మావోయిస్టుల కార్యకలపాలను నియంత్రించాలనే లక్ష్యంతో అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఒడిశా పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. చింతూరుకు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంపై నిఘా పెట్టారు. అప్రమత్తంగా ఉన్నాం ఏవోబీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్కౌంటర్లు, మావోయిస్టుల మరణాలు తదితర పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. సరిహద్దులో పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా అధికంగా ఉంది. ఒడిశా> పోలీసు యంత్రాంగం సహకారం తీసుకుంటున్నాం. అన్ని ఔట్ పోస్టుల పరి«ధిలో రెడ్ అలర్ట్ అమలులో ఉంది. – తుహిన్ సిన్హా, ఎస్పీ, పాడేరు -
మావోయిస్టు అగ్రనేత జగన్‌కు మాతృవియోగం
సాక్షి, అల్లూరి: మావోయిస్టు అగ్రనేత కాకూరి పండన్న అలియాస్ జగన్, తల్లి సీతమ్మ కన్నుమూసింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే.. ఆ మధ్య ఆమె దీనస్థితి గురించి తెలుసుకున్న అధికారులు.. ఆమె ఇంటికి వెళ్లి మరీ చికిత్సకు సాయం అందించారు. అయినప్పటికీ వృద్ధాప్యరిత్యా సమస్యలతో నెల తిరగకుండానే ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. పండన్న అలియాస్ జగన్ స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ పరిధిలోని కొమ్ములవాడ గ్రామం. పండన్న ఉద్యమంలోకి వెళ్లిన నాటి నుంచి తల్లి సీతమ్మ స్వగ్రామంలో ఉంటోంది. అయితే.. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న సీతమ్మకు.. కిందటి నెలలో పోలీసులు చికిత్స సాయం అందించారు. ఆ సమయంలో ఉద్యమాన్ని వదిలి జనాల్లోకి రావాలని, వచ్చి వ్యవసాయం చేసుకోవాలని, అన్నింటికి మించి వృద్ధాప్యంలో ఉన్న తన బాగోగులు చూసుకోవాలని ఆమె తన కొడుకుకి పిలుపు ఇచ్చారు. ఇది జరిగిన నెలకే ఆమె కన్నుమూశారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రా-ఒడిశా ప్రత్యేక జోనల్ కమిటీ ప్రత్యామ్నాయ సభ్యుడైన జగన్, తన తల్లి అంత్యక్రియలకు హాజరవుతాడనే ఉద్దేశంతో పోలీసులు నిఘా పెంచారు. -
‘మత్తు’కు ముకుతాడు.. ఏపీ సర్కార్ చర్యలతో అడ్డుకట్ట
అది ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కొండల్లో 50 గడపలు ఉన్న గిరిజన గూడెం చిన వాకపల్లి. ఈ ఊళ్లోని గిరిజనులు ప్రస్తుతం 150 ఎకరాల్లో రాగులు, పసుపు, మొక్క జొన్న, వరి, కందులు తదితర సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే.. ఇక్కడ ఈ పంటలన్నీ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఈ ఏడాదే సాగు చేయడం. అక్రమం అని తెలిసినా నాలుగు దశాబ్దాలుగా బతుకుదెరువు కోసం గంజాయి సాగే వారికి ఆదరవుగా నిలిచింది. అప్పట్లో పోలీసులకు చిక్కి నెలల తరబడి జైళ్లలో మగ్గిందీ ఈ గిరిజన బిడ్డలే. అయితే అదంతా గతం. ప్రభుత్వ చర్యల వల్ల పచ్చటి పంటలతో ఏవోబీ ముఖ చిత్రం మారిపోయింది. (ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి వడ్డాది శ్రీనివాస్) : ‘ఏవోబీ’లో దశాబ్దాల పాటు సాగిన గంజాయి సాగుకు ప్రభుత్వ చర్యలతో అడ్డుకట్ట పడింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. గత మూడేళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో గంజాయి మత్తు దాదాపు వదిలింది. ప్రధానంగా ప్రభుత్వం రైతాంగ పరంగా అమలు చేస్తున్న పథకాలన్నీ గిరిజనుల దరికి తీసుకెళ్లడంతో వారు సగర్వంగా తలెత్తుకుని జీవించే పరిస్థితులను కల్పించింది. సంప్రదాయ, వాణిజ్య పంటల వల్ల కూడా లాభాలు కళ్లజూసేలా తగిన ప్రోత్సాహం ఇస్తూ.. అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యంగా దాదాపు 2.5 లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ (రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాలు, డీకేటీ పట్టాలు పంపిణీ చేయడం ద్వారా ‘ఇది మా భూమి’ అనే భరోసా కల్పించింది. ఈ పట్టాలు పొందిన వారికి, వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజనులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింప చేసింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ఇతరత్రా పథకాలన్నీ అందించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచింది. వీటికి తోడు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. వీటన్నింటి వల్ల గిరిజనుల జీవితాల్లో కొత్త శకం ప్రారంభమైంది. జి.మాడుగుల మండలం బొయితిలిలో గతంలో గంజాయి సాగు భూమిలో వరి సాగు చేస్తున్న గిరిజనులు ఆపరేషన్ పరివర్తన్ ఇలా.. ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ద్వారా పోలీసు శాఖ ఏవోబీలోని జి.మాడుగుల, జీకే వీధి, పెదబయలు, చింతపల్లి, కొయ్యూరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగూడ మండలాల్లో 7,515 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించింది. ► ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం దేశంలోనే తొలిసారి. 2021 నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు నిర్వహించిన ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా ఏకంగా 2 లక్షల కేజీలకు పైగా గంజాయి పంటను ధ్వంసం చేసింది. ఇదో రికార్డు. ఏవోబీలో గంజాయి సాగు విస్తరించడానికి ప్రధాన కారణమైన మావోయిస్టులు, ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలను పోలీసులు సమర్థంగా కట్టడి చేశారు. ► గతంలో గంజాయి పంట సాగు చేసే గిరిజన రైతుకు ఒక వంతు, ఇతర రాష్ట్రాల్లో ఉంటూ పెట్టుబడి పెట్టే స్మగ్లింగ్ ముఠాలకు ఇంకో వంతు, మావోయిస్టులకు మరో వంతు అనే విధానం అనధికారికంగా అమలయ్యేది. అపరేషన్ పరివర్తన్‌ను విజయవంతం చేయడంతో ఈ విధానానికి బ్రేక్ పడింది. ► ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం లేకుండా చేసిన పోలీసులు.. వారి సానుభూతిపరులు, మిలీషియా (వృత్తిపరంగా సైనికులు కాకపోయినా, సైనిక శిక్షణ పొందిన వ్యక్తుల సమూహం) ప్రభావాన్ని కూడా పూర్తిగా కట్టడి చేశారు. ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ ముఠాలు, వారి ఏజంట్లను ఏజెన్సీ నుంచి తరిమికొట్టారు. ఆర్బీకేల ద్వారా అడుగడుగునా అండ ► గంజాయి సాగు నిర్మూలనతో తన పని పూర్తి అయ్యిందనుకోలేదు ప్రభుత్వం. గంజాయి సాగు చేసిన గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది. పోలీసు శాఖ సహకారంతో ఐటీడీఏ సమగ్రంగా సర్వే నిర్వహించింది. ► వ్యవసాయ, ఉద్యానవన శాఖల భాగస్వామ్యంతో కార్యాచరణ చేపట్టింది. వరితోపాటు ప్రధానంగా వాణిజ్య పంటలపై అవగాహన కల్పిస్తోంది. రాగులు, వేరుశనగ, పసుపు, కందులు, మొక్కజొన్న, రాజ్మా, డ్రాగన్ ఫ్రూట్, లిచీ, అనాస, పనస, మిరియాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ తదితర పంటల సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తోంది. ► ఈ ప్రక్రియలో గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సాగు వివరాలను ఈ–క్రాపింగ్‌లో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో గిరిజనులు రెట్టించిన ఉత్సాహంతో ఏరువాక చేపట్టారు. ► గతంలో భయం భయంగా గంజాయి సాగు చేసిన గిరిజనులు ప్రస్తుతం దర్జాగా సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పొలాల్లో రాగుల పంటలో కలుపు తీయడం కనిపించింది. పసుపు పంటను, కాఫీ మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏవోబీలో వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా కొబ్బరి, జామ, అరటి, సపోటా, శీతాఫలం వంటి ఉద్యాన పంటలతోపాటు కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారట్, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటల సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. బొయితిలిలో వరి చేనులో పనులు చేస్తున్న రైతులు పచ్చటి పంటలతో కళ్లెదుటే మార్పు ► ఒకప్పుడు నిండుగా గంజాయి మొక్కలతో కనిపించిన ఏవోబీలోని కొండలు ప్రస్తుతం వరి, రాగులు, మొక్కజొన్న, పసుపు, కాఫీ, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలతో కళకళలాడుతున్నాయి. జి.మాడుగుల మండలం బొయితిలి లో ఏకంగా 343 ఎకరాల్లో గతంలో గంజాయి సాగు చేసేవారు. ప్రస్తుతం ఆ భూముల్లో సంప్రదాయ, వాణిజ్య పంటలు వేశారు. ► గతంలో 293 ఎకరాల్లో గంజాయి సాగు చేసిన నూరుమత్తి పంచాయతీలో ప్రస్తుతం ఒక్కగంజాయి మొక్క కూడా కనిపించడం లేదు. కోరపల్లిలోన 292 ఎకరాల్లో గంజాయి సాగన్నది గతం. ఆ భూముల్లో ప్రస్తుతం రాగులు, వేరుశనగ, మిల్లెట్లు, రాగుల సాగు మొదలుపెట్టారు. ► జీకే వీధి మండలం జెర్రిల గూడెంలో గతంలో 257 ఎకరాల్లో గంజాయి మొక్కలే కనిపించేవి. ఆ భూముల్లోనే ఇప్పుడు సపోటా, జామ, సీతాఫలం, స్వీట్ ఆరెంజ్ తదితర పండ్ల తోటలు వేశారు. మొండిగెడ్డ పంచాయతీలో గతంలో గంజాయి వేసిన 392 ఎకరాల్లో కొబ్బరి, ఆపిల్ బేర్, స్వీట్ ఆరెంజ్ మొక్కలు నాటుతున్నారు. ► దుప్పలవాడలో గత ఏడాది గంజాయి సాగు చేసిన 202 ఎకరాల్లో ప్రస్తుతం రాజ్మా పండించేందుకు గిరిజన రైతులకు ప్రభుత్వం 2,180 కేజీల విత్తనాలు 90 శాతం సబ్సిడీపై సరఫరా చేసింది. పెద బయలు మండలంలో రాగులు, కాఫీ సాగు మొదలు పెట్టారు. ► డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీలో గతంలో గంజాయి సాగు చేసిన 170 ఎకరాల్లో ప్రస్తుతం వేరుశనగ పండించేందుకు 2,400 కేజీల విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. చింతపల్లి మండలం అన్నవరంలో 75 ఎకరాల్లో సాగు కోసం 344 కేజీల చిరుధాన్యాల విత్తనాలు, 45 కేజీల రాగుల విత్తనాలు, 25,500 కాఫీ మొక్కలను పంపిణీ చేశారు. ► కొయ్యూరు మండలం బురదల్లులో 359 ఎకరాల్లో కాఫీ తోటల పెంపకం కోసం 2,52,800 కాఫీ మొక్కలను అందించారు. జోలాపుట్, దోడిపుట్టు, బుంగపుట్టు, బూసిపుట్టు, బాబుశాల, బరడ, బంగారుమెట్ట, తమ్మింగుల, బెన్నవరం, లొట్టుగెడ్డ, షిల్కరి, పోయిపల్లి, పెద్ద కొండపల్లి, పర్రెడ, లక్ష్మీపేట.. ఇలా ఏవోబీలో గతంలో గంజాయి సాగు చేసిన 7,515 ఎకరాలు.. ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటల సాగుతో కళ కళలాడుతూ నిజమైన మార్పునకు నిదర్శంగా నిలిచాయి. దేశంలోనే తొలిసారి గంజాయి, ఇతర డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పోలీసు శాఖ సమర్థవంతంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ను నిర్వహించింది. దేశంలోనే తొలిసారిగా గంజాయి సాగు నిర్మూలనకు ఇటువంటి ఆపరేషన్ నిర్వహించడం ద్వారా ఏపీ పోలీసు శాఖ రికార్డు సృష్టించింది. గిరిజనులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ చేపట్టింది. – కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గిరిజనుల జీవితాల్లో వెలుగు గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను స్పష్టంగా వివరించడంతో గిరిజనులు మాకు సహకరించారు. గతంలో వారు గంజాయి సాగు చేసిన భూముల్లోనే ప్రత్యమ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం రెవెన్యూ, ఐటీడీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమన్వయంతో పని చేస్తున్నాం. గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. – జె.సతీష్ కుమార్, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా రాగులు పంట వేశాను ఎన్నో ఏళ్లు మా పొలంలో గంజాయి మొక్కలే వేశాను. పోలీసువారు వచ్చి చెప్పడంతో గంజాయి మొక్కలు తీయించివేశాను. ఇతర పంటలు వేసుకోవాలని ఆఫీసర్లు వచ్చి చెప్పారు. ఇప్పుడు రాగులు వేశాను. విత్తనాలు ప్రభుత్వమే ఇచ్చింది. ఇక నుంచి మేము రాగులు, పసుపే పండిస్తాం. – పండమ్మ, గిరిజన మహిళా రైతు, బొయితిలి మా బిడ్డల భవిష్యత్ కోసమే మా బిడ్డలకు మంచి జీవితం అందించాలనే గంజాయి సాగు మానేశాం. పసుపు పంట వేశాం. ఈ పంటకు సరైన ధర కల్పిస్తే చాలు. ప్రభుత్వ పథకాల ద్వారా మా పిల్లల్ని బాగా చదివించుకుంటాం. – బేతాయమ్మ, రైతు, వాకపల్లి ప్రభుత్వంపై నమ్మకంతోనే మార్పు మా గూడేల్లో గంజాయి సాగును పూర్తిగా విడిచి పెడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న నమ్మకంతోనే గిరిజనులు గంజాయి సాగు మానేశారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మాకు సహకరిస్తున్నారు. గిరిజనుల పంటలకు మద్దతు ధర కల్పించాలి. – లసంగి మల్లన్న, సర్పంచ్, బొయితిలి ఈ–క్రాపింగ్ చేస్తున్నాం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్న విత్తనాలను గిరిజన రైతులకు సక్రమంగా పంపిణీ చేస్తున్నాం. వారు సాగు చేస్తున్న పంటల వివరాలను తెలుసుకుని ఈ–క్రాపింగ్ చేస్తున్నాం. తద్వారా వైఎస్సార్ రైతు భరోసా, ఇతర పథకాలు వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్.ప్రీతి, అగ్రికల్చర్ అసిస్టెంట్ -
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు.. ఏవోబీలో రెడ్ అలర్ట్
సాక్షి, పాడేరు/ముంచంగిపుట్టు/కొయ్యూరు: ఏజెన్సీలో మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు 50వ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల కిందట ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ పేరిట విడుదలైన లేఖలో వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు బలగాలు వారం రోజుల నుంచి కూంబింగ్ చేపడుతున్నాయి. చింతూరుకు సరిహద్దులో ఉన్న చత్తీస్‌గఢ్ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఆర్పీఎఫ్తో పాటు ఇతర పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆయా పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో కూడా తనిఖీలు జరిపారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు ముంచంగిపుట్టు నుంచి రాముల గ్రామం వరకు కల్వర్టులు, వంతెనలను బాంబు స్క్వాడ్‌తో పరిశీలించారు. జోలాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీల్లో బీఎస్ఎఫ్ బలగాలు నిఘా పెంచాయి. నాయకులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్లినా తమకు సమాచారం అందించాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. కొయ్యూరు మండలంలోనూ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో ఏవోబీ పరిధిలో 12 మంది మావోయిస్టులు మరణించారు. అలా మరణించిన వారికి వారోత్సవాల్లో మావోయిస్టులు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా యాక్షన్టీంలను రంగంలోకి దించే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. పాడేరు, చింతలవీధి, గబ్బంగి, కరకపుట్టు తదితర ప్రాంతాల్లో ఎస్ఐలు లక్ష్మణ్‌రావు, రంజిత్‌లు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. (క్లిక్: ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి) -
ఈ పిటిషన్లో జోక్యం చేసుకోం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొటియా గ్రామాలకు సంబంధించి ఏపీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆర్టికల్ 131 చెల్లుబాటుపై ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం పరిధిలో ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్లో జోక్యం చేసుకోబోమని పేర్కొంటూ విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది. -
కొటియా గ్రామాలపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని కొటియా గ్రామాలపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సరిహద్దు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సీటీ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. రెండు రాష్ట్రాల మధ్య అధికార పరిధికి సంబంధించిన ఆర్టికల్ 131 చెల్లుబాటును సవాల్ చేస్తూ ఒడిశా ఇప్పటికే ఓ వ్యాజ్యం దాఖలు చేసిందని ఆ రాష్ట్రం తరఫు న్యాయవాది వికాస్‌సింగ్ తెలిపారు. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఆదేశాలు కొనసాగించాలని లేదంటే ఆర్టికల్ 131పై ఒడిశా దాఖలు చేసిన వ్యాజ్యం సహా రెండు అంశాలనూ ఒకేసారి విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. న్యాయమూర్తులు స్పందిస్తూ.. ఆర్టికల్ 131పై ఒడిశా వ్యాజ్యానికి సంబంధించిన తీర్పు వచ్చిన తర్వాత విచారణ చేపడతామని స్పష్టం చేశారు. దీనిపై ఏపీ తరఫు న్యాయవాది నజ్కీ స్పందిస్తూ.. తమకు అభ్యంతరం లేదని చెప్పారు. -
‘కొటియా’ క్లస్టర్లో ఏపీ జెండా రెపరెప
సాక్షి, అమరావతి: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల మధ్య కోరాపుట్ జిల్లాలోని కొటియా పల్లెల ప్రజలు తాము ఏపీలోనే ఉంటామని బ్యాలెట్ ద్వారా ఒడిశా ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఒడిశా ప్రభుత్వం నిర్వహించిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా కొటియా క్లస్టర్ పరిధిలో పొట్టంగి జోన్–1 స్థానానికి ఫిబ్రవరి 18న పోలింగ్ జరిపించింది. అదే నెల 26న ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజున ఫలితం ప్రకటించారు. మహిళలకు కేటాయించిన ఈ స్థానం నుంచి ఒడిశా పాలకపక్ష పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ), ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మమతా జానీ అనే మహిళను ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించాయి. కొటియా గ్రామాల్లో గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును తారుమారు చేసేందుకు ఏకాభిప్రాయంతో ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించిన అక్కడి మూడు రాజకీయ పార్టీలు జానీ గెలుపు కోసం పెద్దఎత్తున ప్రచారం చేశాయి. అయినా ఫలితం దక్కలేదు. తెలుగు మాట్లాడే స్వతంత్ర అభ్యర్థిని టికై గెమెల్ 3,710 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెమెల్కు 10,354 ఓట్లు రాగా, మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థి జానీకి 6,644 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి అభ్యర్థి ఓటమి పాలవడంతో ఒడిశా రాజకీయ పార్టీలకు షాక్ తగిలింది. తెలుగు అభ్యర్థిని గెలిపించటం ద్వారా తాము ఏపీలోనే ఉంటామని అక్కడి ప్రజలు ఒడిశా ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేశారు. -
దైవం 'నైవేద్య' రూపేణా..
నిర్మలమైన నీలాకాశానికి మబ్బుతునకలు చుట్టపు చూపుగా వచ్చే వేళ.. నెర్రెలిచ్చిన నేలకు నింగి నుంచి మేఘ సందేశం అందే వేళ.. ఆ ఊరిలో టకోరం మోగుతుంది. సన్నాయికి జతగా డోలు లయబద్ధంగా ఉరుముతుంది. పడతుల చేతుల్లో కడవలు, ఆ కడవల్లో పసుపు నీరు ఎదురు చూస్తూ ఉండగా.. ఆ సందడిలో అమ్మ ఊరేగింపు మొదలవుతుంది. అనంతమైన ఆకాశాన్ని చూస్తూ అందమైన గజముద్ద ముత్తైదువుల నెత్తిపై అమ్మవారి ప్రతి రూపంగా కొలువై ఉంటుంది. ముత్తైదువుల పాదాలను పసుపు నీళ్లు తాకుతూ ఉంటే తల్లి ఊరేగింపు కన్నుల పండువగా సాగుతుంది. ఊరుఊరికీ అమ్మ పేరు మారినా ఉత్తరాంధ్రలో జాతర జరిగే తీరు మాత్రం ఇదే. ఉత్సవంలో ఊరేగింపు.. ఆనక ఆరగింపు ఇక్కడి ప్రత్యేకత. ఇంకాస్త లోతుల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం రూరల్: ఫిబ్రవరి నుంచి జూలై వరకు.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం నుంచి ఒడిశా ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో చల్లదనం ఉత్సవాలు మొదలవుతాయి. గ్రామదేవతలను ఇష్టంగా అర్చించుకుని సంబరం జరుపుకునే సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. వందల ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ అమ్మవారు.. అవును అచ్చంగా అమ్మవారే. నైవేద్యాన్ని దేవత రూపంలో కొలిచే అపురూప సంస్కృతి ఈ పల్లెలు మనకు పరిచయం చేస్తాయి. నెయ్యిలు లేదా పేలాలుగా పిలిచే ఆహార పదార్థంతో అమ్మవారి రూపాన్ని తయారు చేసి ఉత్సవ విగ్రహంలా పూజించి ఉత్సవం అయ్యాక ప్రసాదంలా ఆరగించే విశిష్టమైన పద్ధతి సిక్కోలు పల్లెల సొంతం. ఊరి అమ్మోరికి.. ప్రతి పల్లెను ఓ అమ్మవారి అంశ కాపాడుతూ ఉంటుందని స్థానికుల నమ్మిక. కాళీమాత, చింతామణి, భూలోకమాత, బాలామణి, అసిరిపోలమ్మ, నూకాలమ్మ, ధనరాజులమ్మ, స్వేచ్ఛావతి వంటి పేర్లతో గ్రామ దేవతలను పూజించుకుని ఏటా సంబరం చేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతి రూపంగా నెయ్యిలతో తయారు చేసిన ‘గజముద్ద’ను పుష్పాలు, బంగారం, కరెన్సీ నోట్లతో అందంగా, ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో ఊరేగిస్తారు. పాకంతో పసందు ధాన్యం నుంచి సేకరించిన పేలాలతో తయారు చేసే ఈ పదార్థం రుచి చెప్పనలవి కానిది. ముందుగా కట్టెల పొయ్యిపై పెద్ద కళాయిని వేడి చేసి అందులో నీటిని వేడి చేస్తారు. అందులో పంచదార లేక బెల్లంను వేసి పాకం రూపం ఎర్రగా వచ్చే వరకు వేడి చేస్తారు. అనంతరం సమకూర్చిన పేలాలను పాకంలో వేసి ప్రత్యేకంగా తయారు చేసిన తెడ్డు(గరిటె)తో జిగురుగా వచ్చే వరకు కలుపుతారు. పొయ్యిపై నుంచి కిందకు దించి వేడిగా ఉన్న పాకం ముద్దను చేతులకు మంచి నూనెను పూసుకొని వివిధ ఆకృతుల్లో గజముద్దను తయారు చేస్తారు. అచ్చం అమ్మవారి పోలికల్లో నేత్రాలు, చేతులు, హారం, కిరీటాన్ని తయారు చేస్తారు. ఇందులో బెల్లంతో తయారుచేసే ప్రతిమల ధర ఎక్కువ. పాకం పక్కాగా ఉంటే నెల వరకు ఇది నిల్వ ఉంటుంది. నైవేద్యం సులువుగా జీర్ణమయ్యేందుకు అందులో నిమ్మ, జీలకర్ర, వాము వంటి పోపులను వేస్తుంటారు. సైజును బట్టీ చక్కెరతో తయారు చేసిన గజముద్దలు రూ.1,000 నుంచి రూ.6వేల వరకు ధర పలికితే, బెల్లంతో తయారు చేసిన గజముద్ద రూ.2వేల నుంచి రూ.8వేల వరకు పలుకుతుంది. గజముద్దలకు కేరాఫ్ ఉద్దానం నెయ్యిలతో ప్రత్యేకంగా తయారు చేసే గజముద్ద ప్రసాదానికి కేరాఫ్ ఉద్దానం. ఇక్కడి పల్లెల్లో వీటిని అధికంగా తయారు చేస్తారు. గ్రామాల్లో చిన్నపాటి హొటళ్లు నడిపే గుడియాలు ఈ గజముద్దలను తయారుచేస్తారు. అమ్మవారి స్వరూపం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే గజముద్దను అమ్మోరు స్వరూపంగా భావించి పూజలు చేస్తాం. భక్తులు ఎంతో భక్తితో తలపై ధరించి ఊరేగిస్తారు. ఉద్దానం ప్రాంతంలో ఈ ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది. – డీబీ పురుషోత్తం, అమ్మవారి పూజారి తరాల నుంచి తయారీ మా కుటుంబం తరతరాల నుంచి అమ్మవారి నైవేద్యం గజముద్దను తయారు చేస్తోంది. నాణ్యమైన ధాన్యం పేలాలను సేకరించి పవిత్రంగా తయారు చేస్తాం. ఫిబ్రవరి నుంచి జూన్, జూలై నెల వరకు గిరాకీ ఉంటుంది. – ధ్రౌపతి గుడియా, ఈదుపురం, ఇచ్ఛాపురం మండలం -
‘మా ఆశలన్నీ జగన్‌పైనే.. మేము ఆంధ్రాలోనే ఉంటాం’
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో సాలూరు నియోజకవర్గ పరిధిలో ఐదు గ్రామ పంచాయతీల పరిధిలోని 34 కొటియా గ్రూపు గ్రామాలపై వివాదం దీర్ఘకాలంగా ఉంది. అక్కడ దాదాపు 15 వేల మంది జనాభా ఉన్నారు. వారిలో 3,813 మంది ఒడిశాలోనూ ఓటర్లుగా ఉన్నారు. 1936వ సంవత్సరంలో ఒడిశా రాష్ట్రం ఏర్పాటైనపుడు కానీ, 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైనపుడుగానీ అక్కడ సర్వే లేదు. ఏ రాష్ట్రంలోనూ అంతర్భాగంగా గుర్తించలేదు. దీంతో ఆయా గ్రామాల కోసం ఇరు రాష్ట్రాలు 1968వ సంవత్సరం నుంచి న్యాయపోరాటం చేస్తున్నాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు... ఈ వివాదాన్ని పార్లమెంట్లో తేల్చుకోవాలని, అంతవరకూ ఆక్రమణ చర్యలకు పాల్పడవద్దని సూచిస్తూ 2006 సంవత్సరంలో ఆదేశాలు ఇచ్చింది. కానీ వారంతా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారుగా గుర్తించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. భూమి శిస్తు చెల్లింపునకు సంబంధించిన తామ్రపత్రాలను ఇటీవల కొటియా గ్రామస్తులు ప్రదర్శించారు. వారి పిల్లలు కూడా సాలూరు మండలంలోని కురుకూటి, అంటివలస, కొత్తవలస గ్రామాల్లోనున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్‌కార్డులతో పాటు ఆంధ్రప్రదేశ్ చిరునామాతో ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. తమ పూర్వీకుల నుంచి ఆంధ్రా ఆచార సంప్రదాయాలను పాటిస్తున్న తమను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారుగా గుర్తించాలని ఇటీవలే 16 గ్రామాలకు చెందిన కొటియా ప్రజలు తీర్మానాలు చేశారు. మేము ఆంధ్రాలోనే ఉంటాం మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. మేము ఆంధ్రులం. ఒడిశా రాష్ట్రంలో చేరబోం. ఇన్నాళ్లకు ఒడిశాతో చర్చల్లో కొటియా చేరింది. ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌తో జగన్మోహన్రెడ్డి చర్చించడం, అక్కడ సానుకూల పరిణామాలు రావడం శుభపరిణామం. – కూనేటి గింద, కొదమ ఎంపీటీసీ, సాలూరు మండలం మా ఆశలన్నీ జగన్‌పైనే.. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో మా కొటియా గ్రామాల్లో సంక్షేమ పథకాలన్నీ అమలవుతున్నాయి. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మేము ఆంధ్రాలో ఉంటామని తీర్మానాలు చేశాం. వాటికి విలువ ఉంటుంది. మేము ఆంధ్రాలోనే ఉండాలన్న మా ఆశలు నెరవేర్చేది సీఎం జగన్ మాత్రమే. – కూనేటి బెతురు, పగులుచెన్నేరు సర్పంచ్, సాలూరు మండలం ఇద్దరు సీఎంలకు ప్రత్యేక కృతజ్ఞతలు ఇరు రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నలుగుతున్న సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు చర్చలు జరపడం సంతోషదాయకం. కొటియా, జంఝావతి, శ్రీకాకుళం జిల్లాలోని నేరడి ప్రాజెక్టు సమస్యలపై సానుకూల వాతావరణంలో చర్చించారు. వీరి హయాంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా. జగన్మోహన్ రెడ్డిని ఒడిశా సీఎం సాదరంగా ఆహ్వానించడం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగు ముందుకు వేయడం శుభదాయకం. – పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే -
గంజాయిపై ఉక్కుపాదం
పాడేరు/డుంబ్రిగుడ/జీకే వీధి/చింతపల్లి/కాకినాడ సిటీ/అనంతగిరి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగు, రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో యథేచ్ఛగా సాగుతున్న గంజాయి దందాను నామరూపాల్లేకుండా తుదముట్టించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు త్రిముఖ వ్యూహంతో ముందుకు కదులుతూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ఓ వైపు గంజాయి సాగు వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గిరిజనులకు అవగాహన కల్పిస్తూ గంజాయి తోటలను ధ్వంసం చేసే పనిలో కొన్ని బృందాలు నిమగ్నం కాగా.. మరికొన్ని బృందాలు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ఈబీ, పోలీస్ అధికారులు కార్యాచరణ కొనసాగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. విజయవంతంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేయగా.. పలుచోట్ల తనిఖీలు దాడులు నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న గంజాయిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం విశాఖ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో 217 ఎకరాల్లో సాగు చేస్తున్న 9.80 లక్షలకు పైగా గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. మరోవైపు ఒడిశా నుంచి స్మగ్లింగ్ అవుతున్న రూ.కోటిన్నరకు పైగా విలువైన 1,720 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకే పంచాయతీ పరిధిలో 217 ఎకరాల్లో పంట ధ్వంసం విశాఖ ఏజెన్సీ పరిధిలోని ఐదు మండలాల్లో సోమవారం 217 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది ఏడు బృందాలుగా ఏర్పడి జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి, డిప్పలగొంది, వడ్రంగుల గ్రామాల్లో 164 ఎకరాల్లో సాగవుతున్న సుమారు 7.40 లక్షల మొక్కలను నరికి నిప్పంటించారు. డుంబ్రిగుడ మండలంలోని కండ్రుం పంచాయతీ దండగుడ, బెడ్డగుడ, కండ్రుం గ్రామాల్లో 12 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను సోమవారం ఆ పంచాయతీ గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు. ఇకపై గంజాయి సాగుచేయబోమని తీర్మానం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలో మావోయిస్టు ప్రాంతమైన కుంకుంపూడికి సమీపంలోని 5 ఎకరాల్లో గంజాయి తోటలను గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేసి, మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ గాదిగొయ్యి గ్రామంలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. పాడేరు మండలం గొండెలి, కించూరు పంచాయతీల్లో 16 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, గిరిజన పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. పశువుల దాణా ముసుగులో తరలిస్తున్న టన్ను గంజాయి పట్టివేత తూర్పు గోదావరి జిల్లా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో రూ.కోటి విలువైన వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కాకినాడలో సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన వ్యక్తులు పశువుల దాణా ముసుగులో ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు లారీలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ లారీని చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని గోడ్లగూడెం జంక్షన్ వద్ద అటకాయించారు. పోలీసుల్ని చూసి ఒక వ్యక్తి పారిపోగా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా తికూరి గ్రామానికి చెందిన మన్మోహన్ పటేల్, అదే జిల్లా మౌరహా గ్రామానికి చెందిన మహమ్మద్ హారన్, ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా ఎంపీవీ–79 గ్రామానికి చెందిన రాబిన్ మండల్, ఎంపీవీ–75 గ్రామానికి చెందిన అమృతా బిశ్వాస్, నలగుంటి గ్రామంలోని ఎంపీవీ–36కు చెందిన బసుదేవ్ మండల్‌ను అరెస్ట్ చేశారు. ఒడిశాలో పండించిన గంజాయిని వారంతా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి రాజును ఒడిశా పోలీసుల సహకారంతో అరెస్ట్ చేస్తామన్నారు. చిలకలగెడ్డ వద్ద 720 కేజీల స్వాధీనం విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్‌పోస్టు వద్ద ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వ్యాన్‌లో తరలిస్తున్న 720 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం సంయుక్తంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ గణపతిబాబు, టాస్క్‌ఫోర్స్ హెచ్‌సీ శ్రీధర్ నేతృత్వంలోని పోలీసులు చిలకలగెడ్డ వద్ద కాపుగాసి పట్టుకున్నారు. గంజాయితో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబట్ట గంజాయి విలువ రూ.50 లక్షలకు పైగా విలువ చేస్తుందని అంచనా. ఈ దాడిలో ఎస్ఈబీ ఎస్ఐ దాస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కృష్ణప్రసాద్, నర్సింగరావు పాల్గొన్నారు. -
ఏవోబీలో ‘ఆపరేషన్ పరివర్తన్’
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కేరళ, మహరాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో ఏవోబీలో యథేచ్ఛగా నడుస్తున్న గంజాయి సాగును నామరూపాల్లేకుండా తుదముట్టించేందుకు ప్రత్యేక బృందాలను యాక్షన్‌లోకి దించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గంజాయి దందాను కట్టడి చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ను చేపట్టింది. ఈ తరహా ఆపరేషన్‌ను దేశంలో తొలిసారిగా ఏపీలో అమలు చేస్తున్నారు. గంజాయి దుష్పరిణామాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తూ..టెక్నాలజీ సాయం, భారీ స్థాయిలో బలగాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ద్విముఖ వ్యూహంతో విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. రంగంలోకి దిగిన బృందాలు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను ఆనుకుని ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ›5 రోజులుగా భారీగా గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ఈబీ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతోంది. మ్యాపింగ్‌తో నిర్దిష్ట ప్రాంతాల గుర్తింపు ‘ఆపరేషన్ పరివర్తన్’ను విజయవంతం చేసేందుకు ఎస్ఈబీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. మన్యంలో గంజాయి సాగుచేసే ప్రాంతాలను ముందుగా మ్యాపింగ్ చేశారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాలతోపాటు రాష్ట్ర సరిహద్దుకు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తృతంగా గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను నిర్దిష్టంగా గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ డ్రోన్ కెమెరాలతో వీడియో తీయించారు. ఐదు రోజుల్లో 550 ఎకరాల్లో.. ఏపీ పరిధిలోని గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు భారీ సంఖ్యలో బలగాలు, సిబ్బందిని ఎస్ఈబీ వినియోగిస్తోంది. పోలీస్, ఎస్ఈబీ సిబ్బందితో ఏర్పాటు చేసిన 66 ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఆ బృందాలకు వివిధ మండలాల బాధ్యతలను అప్పగించారు. గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు అవసరమైన యంత్రాలను సమకూర్చారు. అనంతరం ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గంజాయి తోటల్ని ధ్వంసం చేసి, పంటకు నిప్పు పెట్టే పని ఓ యజ్ఞంగా సాగుతోంది. గడచిన 5 రోజుల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి ఏకంగా 550 ఎకరాల్లో గంజాయి సాగును అధికారులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు 21 లక్షల గంజాయి మొక్కలు ధ్వంసం చేసి నిప్పు పెట్టినట్టు ఎస్ఈబీ వర్గాలు వెల్లడించాయి. వీటి విలువ రూ.104.25 కోట్లు ఉంటుందని ఎస్ఈబీ ఉన్నతాధికారులు అంచనా. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ.. రాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసేలా ఆ రాష్ట్ర పోలీసు అధికారులతో ఏపీ పోలీసులు ఇప్పటికే చర్చలు జరిపారు. ఏపీ వైపు చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ను ఆ రాష్ట్రాల్లోనూ చేపట్టనున్నారు. అందుకు అవసరమైన సాంకేతిక, ఇతరత్రా సహకారాన్ని ఏపీ ఎస్ఈబీ అధికారులు అందిస్తారు. విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి తోటల ధ్వంసం గూడెంకొత్తవీధి/కొయ్యూరు/చింతపల్లి/జి.మాడుగుల/అనకాపల్లిటౌన్: విశాఖ ఏజెన్సీలోని 3 మండలాల్లో శనివారం పెద్దఎత్తున గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని దామనపల్లి, రింతాడ పంచాయతీల్లోని డేగలపాలెం, ఇంద్రానగర్, కొత్తూరులో 56 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. జీకేవీధి పోలీసులు ఈ గ్రామాలకు చేరుకుని, గంజాయి తోటలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టి కాల్చివేశారు. కొయ్యూరు మండలంలోని మారుమూల అంతాడ పంచాయతీ పారికలలో రీముల చంద్రరావు ఆధ్వర్యంలో శనివారం గ్రామస్తులు 5 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి మండలంలోని గంజిగెడ్డ, బౌర్తి, కొత్తూరు గ్రామాల సమీపంలో 16 ఎకరాల గంజాయి తోటలను చింతపల్లి పోలీసులు ధ్వంసం చేశారు. జి.మాడుగుల మండలంలో ఎగమండిభ, పరిసర ప్రాంతాల్లో 158 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ మాదకద్రవ్యాల పని పట్టేందుకు విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్లో డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో శనివారం డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. 1, 2, 3 ప్లాట్‌ఫారాలపై, తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కూడా డాగ్‌స్క్వాడ్ తనిఖీలు జరిగాయి. 18 కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని కొత్తూరు బయలులో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల ద్రవరూప (లిక్విడ్) గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ ఎస్ఐ గణేష్ తెలిపారు. శనివారం రాత్రి కొత్తూరు బయలులో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి లిక్విడ్ గంజాయితో వెళ్తున్నాడని, దానిని పరిశీలిస్తుండగా అతడు పరారయ్యాడని ఎస్ఐ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
గంజాయి సాగుపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గంజాయి సాగుపై చేపట్టిన జాయింట్ ఆపరేషన్ విజయవంతమైంది. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), ఐటీడీఏ సంయుక్త భాగస్వామ్యంతో బుధవారం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు. చింతూరు సబ్ డివిజన్ మోతుగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒడియా క్యాంప్‌లో ఈ ఆపరేషన్ చేపట్టారు. అక్కడి క్యాంప్‌లో నివసిస్తున్న సుమారు 130 కుటుంబాల్లో ఎక్కువ మంది చాలాకాలంగా గంజాయి సాగు చేస్తున్నారు. చింతూరు మండలంలోని వలస ఆదివాసీ గ్రామం ఒడియా క్యాంపునకు చెందిన వలస ఆదివాసీలు గంజాయి స్మగ్లర్ల ప్రలోభాలకు లొంగి ఇరురాష్ట్రాల సరిహద్దుల్లోని కొండ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనా«థ్‌బాబు ఆ ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో మోతుగూడెం ఎస్సై సత్తిబాబు ఒడిశా క్యాంప్‌లో 10 ఎకరాల్లో గంజాయి సాగవుతున్నట్టు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు స్వయంగా ఆ గ్రామంంలో పర్యటించి ఆదివాసీలకు ‘పరివర్తన’ పేరిట కౌన్సెలింగ్ ఇచ్చారు. గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో ఎస్పీతో పాటు ఇతర అధికారులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గంజాయి పండిస్తున్న ప్రాంతానికి కాలి నడకన వాగులు, గుట్టలు దాటుకుంటూ వెళ్లి గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. ఎకరానికి 5 వేల మొక్కల చొప్పున పదెకరాల్లో నాటిన సుమారు రూ 2.50 కోట్ల విలువైన 50 వేల మొక్కలను నరికివేసి నిప్పు పెట్టారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ బి.రమాదేవి, చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ, రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పాటిల్, చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్, ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 60 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం గూడెం కొత్తవీధి: విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ పరిధిలోని రంపుల, తియ్యల మామిడి గ్రామాల్లో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 60 ఎకరాల్లో సాగు చేస్తున్న తోటలను ధ్వంసం చేసి నిప్పంటించామని సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఎస్ఈబీ, పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి గంజాయి సాగు చేస్తున్న గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ షమీర్, ఆర్ఎస్ఐ నరేంద్ర, ఏఈఎస్ బి.శ్రీనాథుడు, అటవీశాఖ అధికారి భూషణం పాల్గొన్నారు. -
గత ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా: పవన్
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర–ఒడిశా బోర్డర్లో గంజాయి మాఫియా రాజ్యమేలిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో తనకు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం పలు ట్వీట్లు చేశారు. ‘2018లో ఏవోబీలోని గిరిజన ప్రాంతాల్లో నేను పర్యటించాను. అక్కడ మాఫియా రూపంలో సాగుతున్న గంజాయి వ్యాపారం గురించి స్థానికులు భయపడుతూనే ఫిర్యాదులు చేశారు. దీన్ని అరికట్టడానికి కేంద్రం అంతర్రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి’ అని పవన్ కోరారు. ‘విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని యువకులు ఇందులో చిక్కుకుంటున్నారు. దీని వెనుక ఉండే కీలక వ్యక్తులు మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారు. ఆ పని వదిలి.. బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారు.’ అని పవన్ ట్వీట్ చేశారు. -
ఆంధ్రా పుణ్యంతోనే అన్నం తింటున్నాం..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రస్తుత ఆంధ్రా పాలకుల దయవల్ల ఆనందంగా జీవించగలుగుతున్నామని, తమను ఆంధ్రప్రదేశ్ వాసులుగానే పరిగణించాలని ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న అమ్మ ఒడి, వైఎస్సార్ రైతుభరోసా, జగనన్న చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి సంక్షేమ పథకాలు తమను ఎంతగానో ఆదుకుంటున్నాయని వారు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో వివాదాస్పదంగా మారిన కొటియా, గంజాయిభద్ర, పనికి, రణసింగి, దిగువశెంబి, ఎగువ శెంబి, సినివలస, కోనదొర తదితర కొటియా గ్రూపు 21 గ్రామాల నుంచి 50 మంది సోమవారం విజయనగరం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్ ఎ.సూర్యకుమారిని కలిసి తమ గ్రామాల సమస్యలను విన్నవించారు. తాము ఆంధ్రులమని, తమది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విన్నవించారు. 21 కొటియా గ్రామాలను ఆక్రమించేందుకే ఒడిశా ప్రభుత్వం హుటాహుటిన భవనాల నిర్మాణం చేస్తోందని తెలిపారు. ఇటీవల కాలంలో కోరాపుట్ ఎమ్మెల్యే, పోలీసులు తమపై రౌడీయిజం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూర్మనాథ్‌ను కూడా కొటియా గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. పూర్వం నుంచి తాము ఆంధ్రులమేనని, అందుకు సంబంధించిన భూమిశిస్తు తామ్రపత్రాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కొటియా ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం సమావేశ మందిరంలో కొటియా గ్రామప్రజలను కలెక్టర్ సత్కరించారు. వారితో కలిసి భోజనం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్లు జీసీ కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్, వెంకటరావు, మయూక్ అశోక్, డీఆర్వో గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. అన్నివిధాలా రక్షణ... కొటియా గ్రామాల ప్రజలకు అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక హామీ ఇచ్చారు. ఒడిశా పోలీసుల దౌర్జన్యాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కొటియా ప్రజలు ఆమెను కలిశారు. కొటియాలో త్వరలోనే పోలీసుస్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరినట్లు ఆమె చెప్పారు. వారికి నిత్యావసర వస్తువులను ఎస్పీ అందించారు. -
ఆంధ్రా అధికారిని ఘెరావ్ చేసిన ఒడిశా ఎమ్మెల్యే
సాలూరు: ఆంధ్రాకు చెందిన అధికారిని ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఘెరావ్ చేశారు. గిరిపుత్రులు ఎదురుతిరగడంతో పలాయనం చిత్తగించారు. ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లోని పగులు చెన్నేరు పంచాయతీలో ఆంధ్రా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనకు బుధవారం పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ వెళ్లారు. ఆంధ్రాలో కలిసిపోయేందుకు సుముఖత తెలిపిన పగులు చెన్నేరు, పట్టుచెన్నేరు పంచాయతీల ప్రజలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి ఎమ్మెల్యే పీతం పాడి ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ పీవోను ప్రశ్నించారు. ఇది ఒడిశా భూభాగమని చెప్పారు. దీనికి పీవో సమాధానమిస్తూ.. ఇది రెండు రాష్ట్రాల వివాదాస్పద భూభాగమని, సుప్రీంకోర్టులో వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. ఇది ఒడిశా భూభాగమని ఏమైనా ఆధారాలుంటే చూపించాలన్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినదించారు. ఇదంతా పరిశీలిస్తున్న గిరిజనసంఘ నాయకుడు చోడిపల్లి బీసు, గిరిపుత్రులు పీవోకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందజేస్తూ అండగా నిలుస్తోందని, తాము ఆంధ్రాలోనే ఉంటామని తేల్చి చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో గిరిపుత్రులను పీవో శాంతింపజేశారు. గిరిజనుల తిరుగుబాటుతో కంగుతున్న ఒడిశా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. -
ఏవోబీలో మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవ సభ
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవాన్ని మావోయిస్టుల మిలీషియా కమాండర్లు, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 21 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీలోని అత్యంత మారుమూల, దట్టమైన అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టు మిలీషియా కమాండర్లు, గ్రామ కమిటీల సభ్యుల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. మావోయిస్టుల స్తూపం వద్ద ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు నివాళులర్పించారు. అనంతరం తెలుగు, ఒడియా భాషలలో రాసిన బేనర్లు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులపై అణచివేత చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని నినాదాలు చేశారు. అనంతరం భారీ సభను ఏర్పాటు చేశారు. జననాట్య మండలి ఆధ్వర్యంలో తెలుగు, ఒడియా భాషలలో విప్లవ గీతాలను ఆలపించారు. సభా ప్రాంగణం అంతా ఎర్ర జెండాలు, బ్యానర్లతో నిండిపోయింది. సభలో ఆంధ్ర ఒడిశా గ్రామాలకు చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆంధ్ర–ఒడిశా ‘సరిహద్దు’పై చర్చలు జరపాలి
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు వివాదంపై ద్వైపాక్షిక చర్చలు జరపాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. కొటియా గ్రామాల సమస్య పరిష్కారానికి తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ సీఎంకు లేఖ రాశారు. ఒడిశా–ఏపీ రెండు రాష్ట్రాల నివాసితుల ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. చీఫ్ సెక్రటరీలు, డెవలప్మెంట్ కమిషనర్ల స్థాయిలో ఉమ్మడి–వర్కింగ్ గ్రూప్ చర్చలతో పాటు, సమస్యల పరిష్కారానికి భవిష్యత్ రోడ్ మ్యాప్ రూపకల్పనకు రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాలని సూచించారు. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్‌లోని కొటియా గ్రామ పంచాయతీల్లో కొన్ని నెలలుగా అనేక ఘర్షణలు జరిగాయని, అవి ఇప్పుడు గజపతిలోని ఇతర సరిహద్దు గ్రామాలకు విస్తరించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇటీవల కొటియాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా.. ఒడిశా ప్రభుత్వం పోలీసులను మోహరించిందని, కొటియా వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత
మందస: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట పంచాయతీలో ఉన్న మాణిక్యపట్నంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొద్దిరోజులుగా సమస్యాత్మకంగా మారిన ఈ గ్రామాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సందర్శించిన సమయంలో ఒడిశా అధికారులు వ్యవహరించిన తీరు విమర్శనీయంగా మారింది. మాణిక్యపట్నం అంగన్వాడీ కేంద్రానికి సీల్‌వేసి, కార్యకర్త సవర లక్ష్మి భర్త గురునాథాన్ని గారబంద పోలీసులు అరెస్ట్ చేయడం.. శ్రీకాకుళం, పర్లాకిముడి కలెక్టర్ల చర్చలతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమవడం తెలిసిందే. ఈ సమస్యను, సరిహద్దులను తెలుసుకోవడానికి మంత్రి అప్పలరాజు గురువారం మాణిక్యపట్నం వెళ్లారు. ఒడిశా అధికారులు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండగా.. ఆంధ్రా అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గారబంద తహసీల్దార్ ఆధ్వర్యంలో కేంద్రానికి సీల్ వేశారని, వెంటనే ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, సోంపేట సీఐ డీవీవీ సతీష్‌కుమార్, మందస ఎస్ఐ కోట వెంకటేశ్‌లను ఆదేశించారు. ఆంధ్రా సరిహద్దులోని గిరిజనులను తరచూ బెదిరిస్తూ.. కేసులు నమోదు చేయడం, బంధించడం ఏంటని ప్రశ్నించారు. గురునాథంపై అక్రమంగా కేసు పెట్టి, సమస్యను తీవ్రతరం చేయడానికే ఒడిశా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రా ప్రభుత్వం, అధికారులు సహనంతో వ్యవహరిస్తుండటం చేతగానితనంగా భావిస్తున్నారన్నారు. తమ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మంత్రి వెనుదిరగగానే మొదలైన బెదిరింపులు అక్కడి నుంచి బయలుదేరిన మంత్రి మందస వరకు వచ్చేసరికే.. ఒడిశాలోని గజపతి జిల్లా అదనపు మేజిస్ట్రేట్ సంగారాం పండా, బీడీవో రాజారంజిత్, పోలీసులు మాణిక్యపట్నం వెళ్లి మళ్లీ గిరిజనులను బెదిరించడం ప్రారంభించారు. ఈ విషయం తెలియడంతో మంత్రి అప్పలరాజు, సబ్ కలెక్టర్ వికాస్‌మర్మట్, తహసీల్దార్ బడే పాపారావు, ఎంపీడీవో వాయలపల్లి తిరుమలరావు, డీఎస్పీ, సీఐ, ఇద్దరు ఎస్ఐలు, పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే మళ్లీ సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. అయినా ఒడిశా అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో మంత్రి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవద్ద ఏవోబీకి సంబంధించిన రికార్డులున్నాయని చెప్పిన మంత్రి.. మీరు చూపించే ఆధారాలేంటని ఒడిశా అధికారుల్ని ప్రశ్నించారు. తమ వద్ద కూడా ఉన్నాయన్న వారు ఎటువంటి రికార్డులు చూపించలేదు. తాము ఆంధ్రాలోనే ఉంటామని గిరిజనులు చెప్పడంతో ఒడిశా అధికారులు అసహనంతో ఫోన్లో చిత్రీకరించడం ప్రారంభించగా.. ఓ మేజిస్ట్రేట్ స్థాయిలో ఇలా వ్యవహరించడం తగదని మంత్రి హెచ్చరించారు. దీంతో గిరిజనులంతా సీఎం జగన్ జిందాబాద్, మంత్రి అప్పలరాజు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఒడిశా అధికారుల చర్యలు హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని, ఆంధ్రా అధికారులు కూడా ఇదేస్థాయిలో వ్యవహరిస్తే పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీస్తుందని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ప్రకారం శాంతియుతంగా రెండురాష్ట్రాల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సాబకోట సర్పంచి సవర సంధ్యారాము, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి డొక్కరి దానయ్య, మండల అధ్యక్షుడు అగ్గున్న సూర్యారావు, యువజన కార్యదర్శి శానాపతి కిషోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టుల పట్టుతప్పుతోంది...
సాక్షి,విశాఖపట్నం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుతోపాటు విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల ఉద్యమం క్రమంగా నీరుగారుతోంది. పార్టీకి ఏవోబీ వ్యాప్తంగా గిరిజనుల నుంచి ఆదరణ కరువైంది. గతరెండేళ్ల వ్యవధిలో 9 ఎదురుకాల్పలు సంఘటనలుజరగగా.. 12 మంది మావోయిస్టులు, దళ సభ్యులను పార్టీ పోగొట్టుకుంది. 29 మందిమంది మావోయిస్టులు, దళ సభ్యులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు యంత్రాంగమంతా మారుమూల గ్రామాల్లో గిరిజనుల అభివృద్ధి నినాదాన్ని విస్తృతం చేసింది. రామ్‌గూడ అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్ కౌంటర్ మావోయిస్టులకు పెద్ద నష్టంగా చెప్పవచ్చు. ఈ ఘటనలో 33మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నాతోపాటు, అనేకమంది కీలక మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టు నేతలుఆర్కే, ఉదయ్, చలపతి, అరుణలు మరలా మావోయిస్టు పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకుప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఫలితం కనిపించడం లేదు. ఇటీవల కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లోను ఐదుగురు కీలక నేతలను పోగొట్టుకోవడంమావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ. అంతేకాక ఇటీవలఅమరవీరుల వారోత్సవాలు విఫలం కావడం..తాజాగా గురువారం డీజీపీ సమక్షంలో ఆరుగురుమావోయిస్టు కీలక నేతల లొంగిపోవడం పార్టీ ప్రాభవానికివిఘాతమే. తగ్గిన కార్యకలాపాలు ఏవోబీలో మావోయిస్టు దళాలు పట్టు తప్పుతున్నాయి. ఒడిశాలోని కలిమెల, నందపూర్,గుమ్మా, నారాయణపట్నం, పెదబయలు, కోరుకొండ దళాల్లో సభ్యుల సంఖ్య తగ్గడంతో దళాల కార్యకలపాలు తగ్గాయని సమాచారం. గాలికొండ దళంలో10మంది, పెదబయలు, కోరుకొండ దళాలకు చెందిన 25మంది, ఒడిశాలోని కటాఫ్ ఏరియాలో50మంది వరకు మావోయిస్టులు గతంలో పనిచేసేవారు.ఈ రెండేళ్ల వ్యవధిలో వారి సంఖ్య 50కి తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో దళాలు తగ్గి ప్రస్తుతం ఒడిశాలోని కటాఫ్ ఏరియా, ఏవోబీస్పెషల్ జోన్ కమిటీలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఏవోబీ వ్యాప్తంగా పోలీసునిర్బంధం అధికమైంది. విశాఖ ఏజెన్సీతోపాటు ఒడిశాలోని కోరాపుట్టు, మల్కన్ గిరి జిల్లాల్లో పోలీసుయంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకే పరిమితమవుతున్నారు.పోలీసులకు కలిసొచ్చిన అభివృద్ధి నినాదం మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొంతకాలంగా చేస్తున్న ప్రచారం పోలీసు యంత్రాంగానికి అనుకూలమైంది. ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రకృతిపరమైన సమస్యలున్నాయి. కష్టసాధ్యమైనా వీటిని అధిగమిస్తూ ప్రభుత్వ యంత్రాంగం సౌకర్యాలు కల్పిస్తోంది. పోలీసులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజనులకు దగ్గరవుతున్నారు. ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు గిరిజనులను హతమార్చడం కూడా పోలీసులకు ప్రధాన ఆయుధమైంది. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలలో గిరిజనులంతా బహిరంగంగానే మావోయిస్టులకు వ్యతిరేకంగా అభివృద్ధి నినాదంతో ర్యాలీలు చేస్తున్నారు. మావోయిస్టులకు గతంలో వలేమారుమూల గ్రామాల గిరిజనుల సహకారం తగ్గిందని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు కీలకనేతలు, మిలీషియా సభ్యులు కూడా ఇటీవల కాలంలో లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఆరుగురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు: ఏపీ డీజీపీ
సాక్షి,అమరావతి: ఏపీ-ఒడిశా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిరంతరం కూంబింగ్ సత్పలితాలనిస్తోంది. నిషేధిత మావోయిస్టు (సీపీఐ) పార్టీకి చెందిన ఆరుగురు కీలక సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. గత నెలలో మావోయిస్ట్ కమిటీ సభ్యుడు లోంగిపోయాడని.. ఈ రోజు మరో ఆరుగురు మావోయిస్టులు సరెండర్ అయ్యారని డీజీపీ గౌతమ్‌సవాంగ్ తెలిపారు. గతంలో సమస్యలపై మావోయిస్టులు వచ్చి స్థానికులతో మాట్లాడేవారు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో 20 వేల కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని,ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేస్తోంది డీజీపీ వివరించారు. మహిళలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ..ఆదివాసిగూడెంలకు సైతం చేరుతున్నాయని గౌతమ్‌సవాంగ్ వాఖ్యనించారు. గతంలో 8 మావోయిస్టు కమిటీలు ఉంటే ప్రస్తుతం నాలుగు ఉన్నాయి.. మావోయిస్టులు రక్తపాతం ద్వారా సాధించేదేమీ లేదని స్పష్టం చేశారు. అనేక మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ బాగా పని చేస్తోంది.. నేరుగా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గతంలో బాక్సైట్ సమస్య ఉండేది.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక బాక్సైట్ జీవోలను రద్దు చేసిందని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు.. -
మావోయిస్టు కీలకనేతలు అరెస్ట్..
సాక్షి,అమరావతి: మావోయిస్టుల కోసం పోలీసులు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో మావోయిస్టు కీలకనేతలు పోలీసులుకు చిక్కినట్టు తెలుస్తోంది. పోలీసులు చెపట్టిన స్పెషల్ ఆపరేషన్ ద్వారా కలిమెల దళ సభ్యులును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో కీలకంగా పనిచేసిన దళ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుండగా..అది ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. -
మా భూభాగంలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టొద్దు..
రాయగడ: ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వివాదాలు కొనసాగుతున్నాయి. రాయగడ సమితిలోని సనొలకుటి గ్రామానికి కూతవేటు దూరంలో విజయనగరం జిల్లాకు చెందిన బీరపాడు పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ ప్రజలు రాకపోకలకు ఒడిశా భూభాగంలోని సనొలకుటి గ్రామం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఐదు నెలల కిందట ఏపీ అధికారులు సనొలకుటిలో వంతెన, రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ఇరు రాష్ట్రాల ప్రజల రాకపోకలు మెరుగవుతాయని మన అధికారులు చెబుతుండగా.. ఒడిశా అధికారులు మాత్రం దీనికి అంగీకరించలేదు. తమ భూభాగంలో ఏపీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొద్దని తేల్చి చెప్పారు. దీంతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వంతెన, రోడ్డు పనులకు అనుమతివ్వాలని విజయనగరం అధికారులు ఈ నెల 16న రాయగడ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన యంత్రాంగం రాయగడ తహసీల్దార్ ఉమాశంకర్ బెహరా, బీడీవో లక్ష్మీనారాయణ సోబొతొ నేతృత్వంలో రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులు సనొలకుటిలో బుధవారం పర్యటించారు. ఏపీ అధికారులు కూడా సరిహద్దు గ్రామానికి వెళ్లారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు పరిస్థితిని అధ్యయనం చేశారు. అనంతరం గ్రామ పరిస్థితిపై కలెక్టర్ సరోజ్‌కుమార్ మిశ్రాకు నివేదిక సమర్పించారు. ఒడిశాకు సంబంధించిన భూభాగంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ ఏపీ అధికారులకు కలెక్టర్ లేఖ ద్వారా బదులిచ్చారు. ఎలాంటి ప్రజాహిత కార్యక్రమాలైనా తామే (ఒడిశా ప్రభుత్వం) చేపడతామని లేఖలో తెలియజేసినట్టుగా తెలిసింది. -
మా గ్రామాలను ఆంధ్రాలో కలపండి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత పాలకుల మద్దతు లభించక స్తబ్దుగా ఉన్న ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఇన్నాళ్లకు చైతన్యం వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అందిస్తున్న 24 రకాల సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నామని చెబుతున్నారు. తాము ఆంధ్ర ప్రాంతానికి చెందినవారమేనని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మంగళవారం మరోసారి బయటపెట్టారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని సారిక గ్రామ పంచాయతీ నేరెళ్లవలస సంత వద్ద గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని రాయిపాడు, బిట్ర, తొలిమామిడి, సీడిమామిడి, మెట్టవలస, గాంధీవలస, టడుకుపాడు, బొందెలుపాడు, సివర, బొరియమెట్ట, పొడ్డపుదొర తదితర 15 గిరిజన గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్‌ను కలిశారు. రాగి రేకుపై రాసిన పన్ను ఒప్పంద పత్రం తమ తల్లిదండ్రులు సాలూరు మండలం సారిక గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎంపీ డిప్పల సూరిదొరకు శిస్తు చెల్లించేవారని గుర్తు చేశారు. అందుకు ఆధారంగా రాగిరేకులపై రాసిన ఒప్పందాలను సభలో ప్రదర్శించారు. ఒడిశా ప్రభుత్వం ప్రేరేపించడంతో కొంతమంది నాయకులు, అధికారులు తమ గ్రామాలను ఒడిశా భూభాగంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పూర్తిస్థాయిలో ఆంధ్రా పౌరులుగా గుర్తించేలా చూడాలని కోరారు. దీనికి ఎమ్మెల్యే రాజన్నదొర స్పందిస్తూ.. ఒడిశా మాదిరిగా తాము దుందుడుకు చర్యలకు పాల్పడబోమని, ఆ రాష్ట్ర చర్యలను సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వారికి వివరించారు. -
రేపు ఏవోబీ బంద్
సీలేరు/పాడేరు: విశాఖ ఏజెన్సీలోని ఆంధ్రా– ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఉద్రిక్త పరిసితులు నెలకొన్నాయి. ఇటీవల కొయ్యూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా మావోయిస్టులు జూలై 1న ఏవోబీ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ అంతటా బాంబ్, డాగ్ స్క్వాడ్లతో ముమ్మరంగా తనిఖీలు చేస్తూ అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టుల కదలికల కోసం సమాచారం సేకరిస్తున్నారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారు. హిట్‌లిస్టులో ఉన్న నేతలకు నోటీసులు అందించారు. బంద్‌ను భగ్నం చేసేందుకు అడవుల్లో కూంబింగ్‌కు బలగాలు చేరుకున్నాయి. కాగా.. ఈ బంద్ ఏవోబీకి మాత్రమే పరిమితమని ఓఎస్డీ సతీష్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, విశాఖ ఏజెన్సీలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ శుక్లా, ఆ శాఖ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. జవాన్లంతా నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. -
శిక్షణకొచ్చి చిక్కారు!
సాక్షి, అమరావతి, కొయ్యూరు, పాడేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో క్యాడర్‌కు శిక్షణ తరగతులు నిర్వహించి పట్టు సాధించేందుకు మావోయిస్టులు రూపొందించిన వ్యూహం విఫలమైంది. ఒడిశాలో మూడు రోజుల నుంచి మొదలైన కూంబింగ్, ఎదురు కాల్పులు ఏపీలో ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యులు సందే గంగయ్య, రణదేవ్‌లతోపాటు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. నిస్తేజంగా ఉన్న క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు ఏవోబీ పరిధిలోని మల్కనగిరిలో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించినట్లు ఏపీ, ఒడిశా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో కూంబింగ్ చేపట్టారు. ఒడిశాలో తప్పించుకుని... మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్‌తోపాటు కొందరు అగ్ర నేతలు శిక్షణా తరగతులకు హాజరు కానున్నట్టు సమాచారం అందడంతో మూడు రోజుల క్రితం మల్కనగిరి, కొరాపుట్ జిల్లాల్లో ఒడిశా కోబ్రా పోలీసులు, బీఎస్పీ దళాలు కూంబింగ్ చేపట్టాయి. సోమవారం నుంచి విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. ఏవోబీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసు బలగాలకు కులబెడ గ్రామంలో మావోయిస్టులు తారసపడ్డారు. కొద్దిసేపు ఎదురు కాల్పులు అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. సంఘటన స్థలంలో ఇన్సాస్ రైఫిల్, ఏకే–47 మ్యాగజైన్, ఇన్సాస్ మ్యాగజైన్, డిటోనేటర్లు, బ్యాటరీలు, ఐఈడీ బాంబుల తయారీ పదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో అటు ఒడిశా ఇటు ఏపీలోనూ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. మన్యం అడవుల్లోకి సరుకులు తరలిస్తూ.. ఒడిశాలో ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల్లో కొందరు ఏపీలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో పెద్ద ఎత్తున సరుకులు కొనుగోలు చేసి అటవీ ప్రాంతంలోకి తరలిస్తుండటాన్ని గుర్తించారు. కూంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ బలగాలకు కొయ్యూరు మండలం తీగలమెట్ట ప్రాంతంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. యు.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్ట–పి.గంగవరం మధ్యనున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు సందే గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్, రణదేవ్ అలియాస్ అర్జున్, ఏరియా కమిటీ సభ్యుడు సంతు నచిక, మావోయిస్టు పార్టీ సభ్యులు లలిత, పైకే చనిపోయిన వారిలో ఉన్నట్లు గుర్తించారు. మరో మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఏకే–47తోపాటు తపంచా, నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి, మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బలిమెల ప్రాంతంలో డీసీఎంగా పనిచేసిన రణదేవ్ కూడా మృతుల్లో ఉన్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం హెలికాఫ్టర్‌తో గాలింపు చేపట్టారు. గాయపడి తప్పించుకున్న మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని విశాఖ రూరల్ ఎస్సీ బి.కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి.. ఒడిశాలో ఎదురు కాల్పుల ఘటనలో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఒడిశాలో ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టులు రెండు వర్గాలుగా విడిపోయి తప్పించుకున్నట్లు సమాచారం. వీరిలో ఏపీ వైపు వచ్చిన మావోయిస్టులు కొయ్యూరు మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. తప్పించుకుని ఒడిశాలో మరోవైపు వెళ్లినవారిలో ఉదయ్‌తోపాటు మరికొందరు అగ్రనేతలు ఉండవచ్చని భావిస్తున్నారు. వారి కోసం ఒడిశా పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.